నేను గాక ఇంకెవరని?

రేఖా జ్యోతి 
నేను గాక నిన్ను తెలిసిందెవరని ?
ఒక్క మాట చెప్పు

నిన్ను చూసిందెవరని ?

నిన్ను నిన్నుగా నేను గాక చూసిందెవరని ?

ఈ నీ కనిపించే ముఖాన్ని
దానిమీద అతికించిన ఓ నవ్వునీ చూసినవారే కానీ,
నీ అంతర్ముఖాన్ని, దాని సౌందర్యాన్ని
నాలా ఆరాధించినది ఎవరని?
నీ మౌనాన్ని వినగల వారు ,
నీ మాటల్ని మూటకట్టి దాచుకొనే వారు
నీ శూన్యాన్ని  వర్ణించగల వారు
నీ ఒక్కచూపుతో పద్యం రాయ గలవారు
నీ నవ్వుల తరగలలో ఊయలలూగే వారు
నీ గమ్యాన్ని నీకంటే ముందు సవరించే వారు
నేను గాక ఇంకెవరని?
నీ చేతిలోని తెల్లని కాగితాన్ని పదే పదే చదువుకొని మురిసి పోయింది
నేను గాక ఇంకెవరని?
నిన్న నీవు స్వాతి చినుకై  ఎక్కడ కురిశావో
ఇవాళ కన్నీటి చుక్కై ఎందుకు కుములుతున్నావో
నేను గాక నిన్ను తెలిసిందెవరని ?
ఒక్క పరుగులో వచ్చి ఎందుకు వాలిపోతావో
ఏదో  మలుపులో కాలాల తరబడి ఎందుకు ఆగిపోతావో
నేను గాక నిన్ను సమర్ధించిందెవరని ?
ఒక్క మాట చెప్పు
నా నుంచి దాగిపోవడానికీ నా జ్ఞాపకాన్నే కప్పుకున్నావని
నాకుగాక ఇక వేరే తెలిసిందెవరికని ??
కారణాలు ఏవైతేనేం ?
ఇదేదీ వద్దనుకొని ఎగిరిపోవడానికి నీవు  రెక్కలు తొడుక్కున్నప్పుడు
నేనొక్కదాన్నీ హర్షిస్తే ఇక నిన్ను ఆపేదెవరని ?
అయినా,
నిన్ను అంతగా తెలియని లోకంలోకి ఏం పోతావులే బంగారూ !!
హాయిగా ఉండిపోరాదూ,  నీదైన ఈ ప్రియాంకంలో !

*

     పునరుద్ధరణ

 

 

జి.వె౦కటకృష్ణ

 

వర్తమానమే ర౦గస్థలమై

చరిత్ర నర్తనకు దృశ్యమవుతు౦ది.

 

కాల కాలాల పాత్రలు

వెలసిన ర౦గులతోనో

పులుముకున్న వన్నెలతోనో

కొత్త హ౦గులే ప్రదర్శిస్తాయి.

 

దృశ్య౦లో ప్రగతి ప౦డుతు౦దో

స౦ప్రదాయమే జీవిస్తు౦దో

అవగతమయ్యే లోపు

ముగిసిన నాటకమై తెర పడుతు౦ది.

* * * *

తెర తీసిన చరిత్ర ఘట్టాల ను౦డీ

ఏవేవో వ్యక్తిత్వాలు విగ్రహాలై

వ్యవస్థాగత వొడ్డున

బొరవిడిచి నిలబడతాయి.

 

ఒక కాల౦లో వెలసిన పాత్రలు

రాములై కృష్ణులై రాజ్యపక్షాన

కాలకాలానికి చొచ్చుకువస్తారు.

 

ఒక చరిత్రలో వెలిగిన పాత్రలు

చార్వాకులై శ౦భూకులై

ప్రజల పక్షాన నిలిచిన వాళ్లు

అ౦కుశాలై చరిత్రను గుచ్చుతు౦టారు.

 

ఒక ఘనతలో నిలిచిన రూపాలు

ఒక విఘటనకు విరిగిపోతారు.

 

ఒక వ్యూహ౦లో మలచిన పాత్రలు

అవతారాలై పునరుజ్జీవిస్తు౦టారు.

* * * *

ఇతిహాసపు తెరమీద

ఏవేవో తోలుబొమ్మలు

ర౦గప్రవేశ౦ చేస్తు౦టాయి.

 

ఒక వల్లభుడు విగ్రహమై

మాయామోళీ చేతుల్లోకి వెళ్తు౦టాడు.

 

ఒక ప్రతీఘాత పుర్రెకు మొలిచిన

ఆలోచనతో ఆర్యుడు నిద్రలేస్తాడు

నమో నమో అ౦టూ సైతాన్ ను

పునరుత్తేజ౦ చేస్తాడు.

 

కొరతల వర్తమాన చరిత్ర

కొలతలతో గతిశీలమో

జడమో తిరోగమనమో

తేల్చుకోవలసిన సమయమిది.

 

వేదికనూ

వేదిక మీది పాత్రలనూ

పాత్రలనాడి౦చే సూత్రధారులనూ

ఒక క౦ట కనిపెట్టవలసిన

తరుణమిది.

 

పునరుద్ధరణను

ప్రజల పక్షాన నిలపాల్సిన

అవసరమిది.

 

* * *

venkata krishna

 

 

 

 

నదిలో వొదిలిన పాదం..

 

అఫ్సర్ 

 

1

యింకేమీ చెప్పలేను ఆట్టే-

యెన్ని సార్లయినా నది చుట్టూ తిరుగుతాను.

అదే ఆకాశాన్నీ, అదే నీటినీ,

నడుమ యెక్కడో మెరిసే తడి నేలనీ

మళ్ళీ మళ్ళీ కొన్ని మెటఫర్లలోనో ప్రతీకల్లోనో దాచేసుకుంటాను,

మొత్తంగా నదిని నాదైన అనుభవంగా మార్చుకునే మాయా దర్పణమేదీ దొరక్క-

 

2

చాలా వాట్ని విదిలించుకొని

బహుశా నన్ను నేను కూడా వదిలించుకొని

నది భుజమ్మీద చేతులేస్తూ

యెన్ని వందల అడుగులైనా నడిచే వెళ్ళిపోతాను,

ప్రతి అడుగులో నది నన్నేమేం అడుగుతూ వచ్చిందో

వాటికి కొన్ని సమాధానాలు గాల్లో రాస్తూ వెళ్ళిపోతాను.

అన్ని సమాధానాలూ నీలోనే వున్నాయి కదా,

ఎందుకలా దిక్కుల్ని తడుముకుంటూ వుంటావని అడుగుతూనే వుంటుంది  నది,

విడిపోయే అడుగు దగ్గిర కాసేపు నిలబడి వెనక్కి చూపిస్తూ.

 

ఆ సమాధానాలన్నీ మళ్ళీ నీలోనే రాలిపోయాయని అంటాను నిస్సహాయంగా-

 

3

అప్పటిదాకా లేని వొంటరి తనమేదో

తను వెళ్ళిపోయాకే నన్ను చుట్టేస్తుంది,

వెళ్ళిపోయిన తన రెండు చేతుల మధ్యనే యింకా నేను వున్నానని తనకూ తెలుసు.

 

అప్పటిదాకా నేను విదిలించుకొని వచ్చేసిన

అన్ని బెంగలూ, అన్ని చీకట్లూ మళ్ళీ నన్ను అలుముకుంటాయి,

యింకా మిగిలిపోయిన ఆ సాయంత్రపు చీకట్లోకి జారిపోతాను,

యింక ఈ రాత్రిని యెట్లా గట్టెక్కాలా అని లోపలా బయటా మసకబారుతుంది లోకమంతా.

 

4

అప్పుడొక్క అరక్షణం వెనక్కి తిరిగి

నన్ను వదిలి వెళ్ళిన నదిని

తడిసిన కళ్ళతో చూస్తాను,

“అంతా బాగుంది కానీ,

నీలోకి నన్ను వొంపుకోవడం యెలానో నీకు యింకా తెలియలేదు.

నీలోపల తడి వున్నంత మేరా నేనే వున్నాను, వొక్క సారి తడిమి చూసుకో.”

అంటుంది నది.

 

5

బహుశా,

నాలోకి ప్రవహించిన తన అడుగులు కనిపించకే అనుకుంటా,

మళ్ళీ మళ్ళీ నది దగ్గిరకి వస్తాను,

అలా వచ్చిన ప్రతి సారీ యింకొన్ని నీటి దీపాలు వొంట్లో

వెలిగించుకొని వెళ్ళిపోతాను,

నాలోపలి చీకటి వొడ్డు మీదికి.

*

Painting: Cartoonist Raju

 ప్రేమ మటుకే…

 

ఆకెళ్ళ రవి ప్రకాష్

నేను నిరాశగా
ఆనందం నించీ బహిష్క్రుతుణ్ణయి వున్నపుడు
ఎల్లపుడూ
ప్రేమ మటుకే
తనదారుల్ని తెరిచింది.
అందుకే నేననుకుంటాను
ప్రేమ మటుకే బ్రతికించగలదని.

బిడియాలని
సంకోచాలని విడిచి
ప్రేమలోకి ఎగరడానికి
ధైర్యం చేయగలిగితే
మనమంటే ఏమిటొ
వెలుగంటే ఏమిటొ
ప్రేమ మటుకే తేటతెల్లం చేస్తుంది

నిజానికి ప్రేమించడం అంటే
మన చుట్టూ మనం నిర్మించుకున్న
కారాగారాల గోడల్ని కూల్చడమే!

akella

ప్రకంపనం..

 

కృష్ణుడు 

 

జీవితం ప్రకంపిస్తోంది
ఎక్కుతున్న మెట్లపై నుంచి
రాలిపడుతున్న
తెగిన తీగల స్వరాలు

తెరుచుకున్న తలుపులోంచి
జలదరిస్తున్న గాలి
కదులుతున్న మంచం నుంచి
రోదనకూ, మూలుగుకూ మధ్య
సంఘర్షిస్తున్న గొంతు

ఎత్తిన విశాల నేత్రాలనుంచి
గుండెల్ని చీల్చేసే చూపు
రాలుతున్న అశ్రువుల్లో
కదులుతున్న కలల ప్రపంచం

లేవలేని శరీరంలో
పేరుకున్న గత స్మృతుల భారం
అప్రమేయ కదలికల మధ్య
నిస్సహాయంగా నడుస్తున్న కాలం

నిన్నటినీ, రేపటినీ
కప్పేసే నల్లటి భయంకర తెర రాత్రి
కనురెప్పలు మూతపడుతున్న వేళ
తడుముతున్న అస్వస్థ కరాంగుళులతో
నిక్కబొడుచుకున్న రోమాలు
వణుకున్న పెదాల స్పర్శలో
జీవన నాదపు దేహార్తి
అర్థనిమీలిత నేత్రాలతో
శ్మశానసౌందర్య ఆలింగనం

పుచ్చిపోయిన చీకట్లను
చేధించి
బయటపడ్డ నెత్తుటి పిండంలా సూర్యుడు
ఆర్తనాద సుప్రభాతం తర్వాత
జీవితం
అసిధారనుంచి బొట్లుబొట్లుగా కారుతున్న నెత్తురు
బతుకు
మొదళ్లతో కూల్చివేయబడ్డ చెట్ల వ్రేళ్ల తడి
ప్రాణం నిత్య ప్రకంపనల మధ్య
దగ్ధమవుతున్న దేహంలో
చిటపటల మృతధ్వని..

*

krishnarao

కొనాలి

మొయిద శ్రీనివాస రావు

 

పొద్దున్నే… పదిగంటలకే

పండు మిరపకాయలా

ఎండమండిపోతుంటే

అంతవరకూ … ఆ ఊరిలో

కాకిలా తిరిగిన నేను

తాటికమ్మల కింద

తాబేలులా వున్న

ఓ బడ్డీ కాడ

కాసేపు కూర్చున్నాను

ఎండిన రిట్టకాయ రంగున్న

ఓ పిల్లాడు

ఒత్తైన జుత్తు బొమ్మలున్న

రెండు ‘చిక్’ షాంపూలు పట్టుకెళ్ళాడు

పలచగా పలకర్రలా వున్న

ఓ పిల్ల… డొర్రి పల్లెల్లబెట్టి నవ్వుతూ

‘క్లోజప్’ లా కదిలిపోయింది

శొంటి కొమ్ములాంటి

ఓ ముసలాయిన

‘నవరత్న’ ప్యాకెట్ లా నడిచిపోయాడు

సగముడికిన కూరలాంటి

ఓ ముసాలామె

‘ప్రియా’ పచ్చడి ప్యాకెట్టై

వడివడిగా ముందుకు సాగిపోయింది

లేగదూడకు సైతం పాలివ్వలేని

గోమాతలాంటి ఒకామె  ‘విశాఖ డైరీ’

పాల ప్యాకెట్టై పరుగులు తీసింది

నోట్లోంచి నువ్వుగింజే నాననట్టున్న

ఒకాయిన

‘రిలయన్స్’ రీచార్జ్ కార్డై

రింగుటోనులా రివ్వున పోయాడు

పల్లె కొట్లలో… చిన్న ప్యాకెట్లలో దాగిన

వ్యాపార సూత్రం వడగాలై తాకి

నా గొంతెండిపోతుంటే

‘ఇప్పుడన్నీ చిన్నవేలాగున్నాయ’న్న  నా ప్రశ్నకు

‘అందరూ కొనాలి కద సార్’ అన్న సమాదానం

ఓ స్మాల్ ‘కోలా’ డ్రింకై

కూలుగా నా చేతిలో వాలింది

       * * *

Moida

కవిత్వం, కొన్ని ప్రశ్నలు మరియు ఓ మరణానుభవం……

           మామిడి హరికృష్ణ 
mamidi harikrishna
1. కవిమిత్రులెప్పుడు కలిసినా అడిగే ప్రశ్న
పుస్తకం ఎప్పుడు తెస్తున్నావ్ ?
సాహితీ పెద్దలనెప్పుడు పలకరించినా అడిగే లెక్క
ఎన్ని పుస్తకాలు తెచ్చావ్?
అభిమానులెక్కడ తారసపడినా వెల్లడించే కుతూహలం
మీ రచనలన్నీ ఎక్కడ దొరుకుతాయ్?
అక్షర ప్రేమికులెక్కడ ఎదురైనా వెదికే సమాధానం
కొత్తగా ఏం రాయబోతున్నారు ?2. గట్లలో, హద్దులలో ఇమడలేని వాణ్ని
టెరేస్ గార్డెన్ లలో, ఎస్టేట్ లలో, ఫామ్ లలో, ఫీల్డ్స్ లో
Bonsaiలా కుంచించుకుపోలేని వాణ్ని
డ్రాయింగ్ రూమ్ లోని షెల్ఫ్ లో
hard bound bookలా  ఒద్దికగా కూచోలేని వాణ్ని
Branding ముద్రలను నుదుటిపై దిద్దుకోలేని వాణ్ని
Identityల శిలువను భుజంపై మోయలేని వాణ్ని
Miniature గా మారలేని వాణ్ని
3. భూగోళ మంతటినీ నా క్షేత్రమని నమ్మి
ఖగోళాలు అన్నిటినీ నా స్తోత్రం లా జపించే వాణ్ని
Between the lines మాత్రమే కాదు
Beyond the lines చదివే వాణ్ని

నాకు ఆకాశమంత canvass
సముద్రమంత paper కావాలి
విశ్వమంత wall – అంతరిక్షమంత screen కావాలి

అమ్మ కళ్ళంత dreams
అమ్మాయి హృదయమంత space కావాలి4. నేనూ రైతునే కదా-
అక్షరాల విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళడమే తెలుసు
సేద్యకారున్ని కదా-
దారి వెంట వాక్యాల మొక్కలు నాటడమే తెలుసు
భూమి బిడ్డను కదా-
పదాల చెమట చుక్కలకి అంటు కట్టడమే తెలుసు
కావ్య పొలానికి నాట్లు పెట్టడం- నీరు పట్టడమే తప్ప
పంట నూర్చడం – ఏమార్చడం తెలీని వాణ్ని కదా
భద్ర జీవితపు కుక్కకి మాలిమి కాలేను
శిలా ఫలకాల గార్డెన్ కు తోటమాలిని కాలేను
5. ఇలా అయితే
నీ పద్యం ఎలా బతుకుతుంది?
నీ అక్షరం “అక్షరం”గా ఎలా మారుతుంది ?
నీ కవిత్వం పది కాలాల పాటు ఎలా నిలుస్తుంది?
నీ సాహిత్యం తరతరాల దాకా ఎలా కొనసాగుతుంది?అయినా–
పది కాలాలు-తరాల పాటు ఎందుకు బతకాలి?
మన అంతిమ ఘడియ అనంతరం కూడా
ఇంకా జీవించాలనే అత్యాశ ఎందుకుండాలి?
మనతో పాటే మన సమస్త సృజన-సృష్టి అంతం కాకూడదా?
చచ్చినా, ఇంకా బతుకు hanger కె వేళ్ళాడుతూ ఉండాలా?
చచ్చినా చావకుండా చింకి పాతలలోనే దొర్లుతూ ఉండాలా ?
6. అందరూ  ప్రసవ వేదన అంటారు
కానీ,కవిత్వ రచన ఓ మరణానుభవం
జనించేది ఏదైనా మృత శిశువే
జన్మ నిచ్చేది ఎవరైనా విస్మృత కళేబరమే
7. కవిత్వం నన్ను ఆవహిస్తున్న క్షణాలలోనే
నన్ను ఆసన్న మరణ లక్షణాలు ఆక్రమిస్తాయి
అక్షరాన్ని రాయడం మొదలెట్టినప్పటి నుండి
నేను నా హోం లోంచి hospice కి షిఫ్ట్ అవుతాను
మరణ భీభత్సాన్ని అనుక్షణం అనుభవిస్తూ
నాలోంచి నేను విముక్తం కావాలని పెనుగులాడతాను
ప్రతీ సృజనలో నేను మరణిస్తాను
ఆఖరి అక్షరం తడి ఆరక ముందే చచ్చి పోతాను8. నేను అల్లిన భావాలు – నే రాసిన ఉద్వేగాలు
నే చెక్కిన భావనలు – నే చిత్రించిన కవితలు
అన్నీ ఎప్పటికప్పుడు
గాలిలో కలిసిపోవాలనుకుంటాను
పూలు వెదజల్లిన పరిమళం లాగా…
ఎప్పటికప్పుడు మబ్బుల్లో కరిగిపోవాలనుకుంటాను
వర్షం కురిపించిన చినుకుల్లాగా….
ఎప్పటికప్పుడు నదిలో నిమజ్జనం కావాలనుకుంటాను
ప్రవాహం చెక్కిన రాళ్ళలాగా…..
ఎప్పటికప్పుడు చెరిగిపోవాలనుకుంటాను
సముద్రపు అల కలిపేసుకున్న ఇసుకలాగా…9. frame లలో – పీథాల దిగువన ఒదగలేని వాణ్ని
ism నీ, సంకుచిత prism నీ ధ్వంసం చేద్దామనుకున్న వాణ్ని
stereotype నీ- hypocrisy ని బద్దలు చేద్దామనుకున్న వాణ్ని
చచ్చి పోయిన తర్వాత కూడా జీవించాలనీ-
గగనమెక్కి ధ్రువ తారగానో
జఘనమెక్కి Tattoo గానో,
భవనమెక్కి సువర్ణాక్షరం గానో
పాటక జన నాల్కల మీద మంత్ర పుష్పం గానో కావాలని
కోరుకోను గాక కోరుకోను10. జీవితమే కవిత్వం
జీవితాంతం కవిత్వం
అంతే కానీ, జీవితానంతరం కూడానా?
11. మన కవిత్వాన్ని
మనతో పాటే సహయానం చేయించ కూడదా …
బొందితో కైలాసం లాగా !
మనతో పాటే బొంద పెట్టకూడదా….
పిరమిడ్ – రాకాసి గుళ్ళ లాగా !
మనతో పాటే దహనం చేయకూడదా…
సతీ సహగమనంలో లాగా!

జీవితం లోనే Mendelian భావజాలం చెంప చెల్లుమనిపించి
వారసత్వ సహజాతానికే ఫుల్ స్టాప్ పెట్టిన వాణ్నికదా

నేను ఇలాగే ఆలోచిస్తాను12. కవి మిత్రమా- సాహితీ స్రష్టా – అక్షర ప్రేమికా – అభిమానీ

మరణానంతర కొత్త జీవితంలో
పాత కవిత్వపు పురావాసనలేల?కొత్త కవితలో మళ్ళీ పునర్జన్మిస్తాను!
*

కవిత్వంలో ఉన్నంతసేపూ…

 

అరణ్యకృష్ణ

కవిత్వమెప్పుడూ ఓ అనుభూతుల వర్ష సమూహమే
సమాంతరంగా రాలే చినుకులన్నీ నేలజేరి
ఒకదాన్ని మరొకటి
ఘర్షిస్తూ కౌగిలిస్తూ సంగమిస్తూ ప్రవహించినట్లు
ఇష్టపడే ముద్దాడే వేటాడే వెంటాడే
జ్ఞాపకాల తాలూకు అనుభూతులన్నీ
నా ఉనికి మీద కురిసి నేనో కవితనై ప్రవహిస్తాను
అంతరంగ గర్భంలో నీళ్ళింకి
కుతకుతా ఉడుకుతున్న మట్టి మీదకి
నీటిమబ్బులు ఘీంకారధ్వానంతో
కుంభవృష్ఠిగా జారిపోతూ దబ్బున పడ్డట్లు
ఏ సుషుప్తి గర్భంలోనో సెగలు కక్కుతున్న విచలితదృశ్యాలేవో
నన్నో కవిసమయంగా పెనవేసుకొని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి
నా దేహం మీద వర్షం
నా ఉనికి మీద కవిత్వం కురిసి
రెండింటినీ పరిశుద్ధం చేస్తాయి
నిజం!
కవిత్వంలో ఉన్నంతసేపూ
వర్షంలో తడుస్తున్న భూమిలా
నేనూ అమలినంగా ఉంటాను
పేడపురుగుల మీద పూలచెట్ల మీద
సమానదయతో కురిసే వర్షంలా
నా కవిత్వం నిష్కల్మషంగా ఉంటుంది
కురవని మేఘాల్లాంటి దాచుకున్న కన్నీళ్ళన్నీ
మట్టి వాసనతో నెత్తుటి రంగుతో
కవిత్వమై విప్పారుతాయి
గుండె మీది ఆకురాలు కాలాల్ని తుడిచిపారేసి
కవిత్వం వానచెట్టులా ఎదుగుతుంది.
*
aranya

ఒంటరి సమూహం

ప్రసాదమూర్తి

 

ఒంటరిగా సమూహాన్ని శ్వాసించు

సమూహంలో ఒంటరితనాన్ని ధ్యానించు

కళ్ళలోంచి అడవుల్ని విదిలించు

వేళ్ళలోంచి జలపాతాలు ఉరికించు

నరాల్లోంచి సైన్యాలుగా కవిత్వాన్ని కదిలించు

 

నీలో నవ్వులుంటే

అవి చిన్నారులకు తీసిచ్చేయ్

నీలో రెక్కలున్నాయి

అవి పిట్టల ఆస్తి రాసిచ్చేయ్

 

నువ్వు బతికున్నావని చూడ్డానికి

నాడి పట్టుకుంటే కాదు

నిన్ను ప్రేమించే చేయి పట్టుకో

నీ చుట్టూ నువ్వే వుంటే

మధ్యలో నువ్వు లేనట్టే

అందరినీ అల్లుకుని నువ్వుంటే

అందరూ నీలో వున్నట్టే

 

చెయ్యి..యుద్ధమే చెయ్యి

కత్తి పట్టకుండా కూర్చుండే కాలం కాదు

నువ్వు కూర్చునే కుర్చీ కూడా

యుద్ధభూమిలో రథం కావచ్చు

సారథివీ రథివీ నువ్వే కావచ్చు

నీతో అంతమవ్వుడానికి

ఈ యుధ్ధం నీతో మొదలు కాలేదు

 

చిన్ని పురుగును చూడు

పురుగులో బతుకు పరుగును చూడు

నీ  యుద్ధం నీ బతుకు నీ పరుగు

నీవి కావనుకో

ఇంకెవరి యుద్ధమో ఎవరి బతుకో

ఎవరి పరుగో నీదవుతుంది

నీ స్వార్థాల హెల్మెట్ తీసి పక్కన పెట్టు

వందలుగా కిరీటాలు నీ నెత్తిన వాలతాయి

నువ్వు కప్పుకున్న భయాల రెయిన్ కోటు తీసెయ్

జల్లులు జల్లులుగా మనుషులు

నిన్ను తడిపేసినప్పుడు

ఆ మానవస్పర్శ మహానుభూతిలో

ముద్ద ముద్దయిపోతావు

 

ఒంటరిగా సమూహాన్ని శ్వాసించు

సమూహంలో ఒంటరితనాన్ని ధ్యానించు

*

prasada

నల్ల దివిటీ 

 తిలక్ బొమ్మరాజు

 

 వొక యేకాంతం పాయలు పాయలుగా చీలి
కొంత అన్వేషణ మొదలు పెడుతుంది
కొన్ని మౌనాలు మాటలుగానూయింకొన్ని మాటలు సంభాషణలుగానూ రూపాంతరం చెందుతాయి

 

నువ్వో నేనో వో ప్రచ్చన్న దిగ్భందంలోనే వుండిపోయినప్పుడు

యిక స్వప్నాలెలా దొర్లుతాయి

కాస్త వర్షమూ మనలో కురవాలి

మరికొంత చినుకుల చప్పుడూ మనమవ్వాలి

 

మన ఆత్మలు దేహపు వంతెనల కింద కొన్నాళ్ళు మగ్గాక యెక్కడ స్థిరపడగలవు

మళ్ళా నీలోనో నాలోనోనేగా వుండిపోవాలి

 

విశ్వరూపానికి ప్రతీకల్లా యెన్నాళ్లు నిలబడి వుండగలం

యిప్పుడో ఆ పిదపో వొకళ్ళలో మరొకళ్ళం యింకిపోవాల్సిందేగా

అస్తిత్వాలు వొక్కటిగా కాస్త మానవత్వాన్నీ తోడుకుంటాంగా

వదిలి వెళ్ళకుండా

 

పయనాలు నీళ్ళలోని ప్రతిబింబాలే మనకెప్పుడూ

వొకరి ముఖంలో యింకొకరం వెన్నెల చిహ్నాల్లా వెలుగుతుంటాం

వెళదాం యిక మరో ప్రాకారంలోకి-

15-tilak

రెండు సమయాల్లోంచి..

బాలసుధాకర్ మౌళి

 

ఈ మంచు కురుస్తున్న ఉదయప్పూట –
చన్నీళ్ల స్నానం చేసి
టవల్ వొంటికి చుట్టుకుని
ఆ పిల్లాడు చేస్తున్న నాట్యం
ఏ నాట్యాచార్యుని నాట్యం కన్నా
తక్కువ కాదు –

నాట్యం వికసించాలంటే
ఏ గొప్ప వేదికో
వేలాది మంది కొట్టే చప్పట్లో
పొగడ్తలో
అవసరం లేదు
నాట్యంతో తన్మయత్వం చెందాలి –

నాట్యం వికసించడానికి
చిన్న పూరిపాకలోని చిన్న స్థలమే చాలు –

ఆ రైల్వే గేటు పక్కన
ఆ చిన్న పూరిపాకలో
వాళ్లమ్మ
పొయ్యి దగ్గర కూర్చుని టీ కాస్తుంది
నాన్న
మంటని ఎగేస్తాడు
ఆ పిల్లాడు నర్తిస్తూ వుంటాడు
టీ కొట్టుకి
వొచ్చిపోయేవాళ్లంతా
ఉదయం అప్పుడే ఉదయించడాన్ని
కళ్లారా
తన్మయత్వంతో
అక్కడే చూస్తుంటారు –

ఒకానొక వేసవి మధ్యాహ్నం
అక్కడ
ఆ రైల్వేగేటు పక్కన
పూరిపాక ఉండదు
పసిపాదాల పరవళ్లతో పరవశించిన
ఆ టీ ప్రియులూ ఉండరు
రోడ్డుని తవ్వి పోశాక
ఆ టీ కొట్టు బతుకులోంచి
ఉదయం మాయమైపోతుంది

*

కలత కలతగా ఉంది
ఆ పిల్లాడి నృత్యం
తెల్లారి అనుభవం
దూరం దూరం జరిగిపోతున్నట్టే ఉంటుంది
ఈ నేల మీద
మళ్లీ ఉక్కుపాదాల బరువే
మోపబడుతున్నట్టూ
అనిపిస్తూ అనిపిస్తూ ఉంది !

బాలసుధాకర్ మౌళి

*

ఘర్ వాపసీ

కొండేపూడి నిర్మల

 

ఇంతకీ నా పౌరసత్వం దేశంలో వుందా ? మతంలో వుందా?

నేనిప్పుడు దిగజారిన మానవ విలువల్ని గురించి బెంగెట్టుకోవాలా

బండరాయికి పొర్లు దండాలు పెట్టాలా

ప్రప౦చ నాగరిక దేశాల సాక్షిగా మన రాజ్యాధినేత ఘర్ వాపసీ అని గర్జించినప్పుడు-

అలా వాపసు వచ్చిన వాళ్ళకే రేషను కార్డులు అని ప్రకటీంచినప్పుడు

లెక్క ప్రకారం మనమంతా ఏ ఆఫ్రికా చీకటి అడవుల్లోకో  వలస పోవాలి కదా

భూమి కంటే ముందు  హిందూత్వ పుట్టినట్టు ఈ ప్రగల్భాలేమిటి ?

 

ఇంతకు మించిన కొమ్ములూ కోరలూ వున్న ఎన్ని మతాలు, ఎందరు దేవుళ్ళు కాలగర్భంలో కలిసిపోలేదు|

చరిత్ర అంతా రాజులు చెక్కిన రాళ్ళ ముచ్చటే అని తెలుసు కాని

తాను చెక్కిన రాయితోనే సర్వజనులూ తల బాదుకోవాలని చెప్పిన రారాజు ఇతడేనేమో

మాట వినని వాళ్ళకి మరణ దండన అనే  మాట ఒక్కటీ అనలేదు తప్ప

అంతకంటే ఎక్కువే చెయ్యగలడని మనకి తెలుసు , గుజరాత్ కి తెలుసు

రాయిని పగలదీయడమే తెలిసిన  చెమట సూర్యుడికి

ఇప్పుడు రాజు  బుర్రలో ఏ రాయి వుంటే  దానికి  మొక్కాల్సిన పని పడింది.

 

రాజ్యాంగం రాసుకున్న ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా

దేవుడనే వాడొక్కడే అని , అన్ని మతాల సారాంశమూ మానవత్వమేనని

ప్రాధమిక అవహాగాహన అయినా పె౦చని ప్రజాస్వామిక దేశంలో

ఆర్టికల్ 25  ఒక నోరు లేని గులకరాయి

మానవ హక్కులు గాలికి ఎగిరిపోయే చిత్తు కాయితాలు

మనిషిని బతకించడానికయితే   నాలుగైదు రక్త నమూనాలు సరిపోతాయి.

చంపడానికి ,చావడానికే కదా చచ్చినన్ని మత అంధ రాజ్యాలు

భక్తుల మీదనో, వారి గూళ్లలో కొలువున్న రాళ్లమీదనో , వారు సమర్పించే చీనీ చక్కెర ప్రసాదాలమీదనో

వ్యతిరేక౦తో నేనీ మాట చెప్పడంలేదు.

 

అసలు ఈ నమ్మకాలతో, అపనమ్మకాలతో ప్రమేయం లేకుండా బతకుతున్న

కోట్లాడి కష్టజీవుల చిరునామా ఏమిటని  అడగదల్చుకున్నాను.

మత౦ మరక లేకుండా  మనకొక  ముఖం వుండచ్చా  లేదా తెలుసుకోవాలనుకు౦టున్నాను

 

ఎన్ని అవమానాలు, ఎన్ని అసంబద్దతలు, ఇంకెన్ని పరాధీనతలు

మన నిత్యజీవితంలో భాగమై పోయాయో  ఎప్పుడయినా ఆలోచీంచారా?

కన్నవాళ్ళు కూడా బిడ్డల్ని  మత చిహ్నాలుగా  పెంచి పోషించారు తప్ప

మనిషిగా ఎప్పుడయినా చూశారా ?

ఇష్టమో కాదో తెలుసుకోకుండా పుట్టీన పదోరోజున నాకొక దేవుడి పేరు తగిలించడమేమిటి?

 

పసిదనపు  నుదిటి మీద  మత సంకేతాన్ని తిలకంగా  దిద్దడమేమిటి?

పంట కాలవలాంటి  బాల్యానందాల పలక మీద ఆ ఆల కంటే ముందు

అడ్డదిడ్డంగా శ్రీకారాలు చుట్టడమేమిటి

వద్దని గింజుకుటున్నకొద్దీ    తలనీలాల్ని

ఒక దేవుడి ముందు తరిగి  పరాభవింఢమేమిటి?  .

అమ్మ కడుపున పుట్టడం ఒక్కటే నాకు  తెలిసిన వాస్తవమైతే

కులాల వారీగా మనుషుల౦తా దేవుడి తొడల్లో౦చీ, భుజాల్లోంచి , పాదాల్లోంచీ పుడతారనే

అశాస్త్రీయ, అశ్లీలపు కధలు చెవులు మూసుకునేదాకా వినిపించడమేమిటి?

 

సూర్య నమస్కారాల ప్రచారం కోసం యోగాసనాల్ని  మార్కెట్ చేయడమేమిటి?

భిన్న మత సంస్కృతులున్న  దేశానికి భవద్గీతను ప్రామాణిక  చేయడమేమిటి?

ఏమిటిదంతా?

పరిపాలన ఆ౦టే ప్రజలకు శిరో ముండన చేయడమేనా ?

రాజులు రద్దయినా రాతలు మారతాయని నమ్మకం లేదు కదా

రేపు ఇంకోక రాజు  ఇంకొన్ని  కుట్రలతో  తన కుల మతాన్ని  మన నెత్తిమీద గుమ్మరించడని చెప్పలేం

ఇంత జరిగాక  మనకిప్పుడు  freedom of religion వద్దే వద్దు

Freedom from religion కావాలి

రహదారిని ఆక్రమిస్తున్న ఈ దేవుళ్ళ నుంచి, దెయ్యాలనుంచీ

తాయెత్తుల నుంచీ , విబూది నుంచీ , శని యంత్రాలనుంచీ, శవ పూజలనుంచీ

నడవటానికి ఒక దారి వేసుకోవాలి.

nirmala*

 

 

‘నాహం త్వమేవ’

డా. విజయ బాబు, కోగంటి

 

 

నీకువలె నా లోనూ

నిశ్శబ్దంగా విచ్చుకునే సుమ స్వప్నాలున్నై.

నీలో సప్తవర్ణాలు, సజీవ శుకపిక ధ్వానాలు!

నాలో లెక్కకు అందని రంగులు,

అనుక్షణం ఆరి మెరిసే అందని ఆశల మిణుగురులు!

నీలో గభీర సంగీత నాదాలు!

నావి నిరంతర కల్లోలిత నిస్పృహా నిస్సహాయతల

నిట్టూర్పులు,

నిబిడానలపు టుసూరు చిటపటలు!

నీకు మాటి మాటికీ

వసంత రాగాలు, గ్రీష్మాసవాలు,

వర్షస్నానాలు, శరచ్చంద్రికలు,

హేమంత శిశిరాల దాగుడుమూతలు,

రంగురంగుల ఆకుల దుశ్శాలువలు,

పూల కౌగిళ్ళు!

మరి నావో, కోరికల మృగతృష్ణలు,

నిత్య గ్రీష్మాలు,కామోద్రేక వర్షాలు,

పశ్చాత్తాపాల వరద వెల్లువలు,

అడియాసల శిశిరాలు.

నీకు ఎటుచూసినా షడృతువులే

మరి నాకో? నీ ఊహకే అందని చిత్ర ఋతుహేల!

కామం తో మొదలై మాత్సర్యం దాకా!

ఇవికూడా ఎపుడంటే అపుడే, వరసా వావీ లేకుండా, నాకే తెలియ కుండా!

నీవు సృష్టి కూడా తెలిసిన  ప్రకృతివి మాత్రమే,

నేను వికృతిని, మనిషిని,

నవ్వే తోడెలును, నవ్వలేని రాబందును కూడా.

అండజ, బిడజ తిర్యకులన్నీ నీలో విడివిడిగా నైతే

అన్నీ నాలో కలివిడిగా!

నేను అరాచకాన్ని, అవకాశవాదాన్ని కూడా!

నేనో భయచరాన్ని, అభయ చరాన్ని,

అర్ధం మారిన ఉభయ చరాన్ని కూడా!

అందుకే, నా2హం త్వమేవ!

koganti

 *

నాదాన్ పరిందే… ఘర్ ఆజా !

నిశీధి 

 

వాడు

వక్రాసనమో

వామనావతారమో

వంచనల రాజకీయ కులటై

వాచస్పతులని వాగ్బంధనంలో బిగదీస్తూనే ఉంటాడు

 

అప్పుడే

అమ్మల వడిలో

ఆడుకోవాల్సిన కొన్ని పసిగుడ్లు

అండా సెల్లోనో ఆకురాలని ఆడవుల్లోనో

అకారణంగా అదృశ్యమై అనంతమైపోతూ ఉంటాయి

 

అక్కడ

రిథింలెస్

రేవ్పార్టీల్లో నలిగిన

యూనివర్సిటీ కారిడార్లిప్పుడు

కుడిఎడమలు మరచి  మొత్తంగా మునగదీసుకున్న

గుండు సున్నాల్లా సర్కిల్స్లో  సపసాలు మరచి

కాక్టెయిల్ వ్యర్ధగీతాలు ఆవేశంలేని ఆక్రోశంతో  ఆలపిస్తూ ఉంటాయి

 

ఇక్కడ

గాఢసల్ఫ్యూరిక్ ఆమ్లంలో

వేసినా కరగని కాఠిన్యాలు

కనిపించని మానసికరోగపు

మనోభావాలై పూచికపుల్లల్లా విరుగుతూ

సీరియల్ కన్నీళ్ళలోనో సిగారు ధూపంలోనో

ఎండిపోయిన బానిసల కళ్ళు చెమర్చడం మానేసి వట్టిపోతాయి

 

అప్పటికీ ,

కొన్ని హృదయాల్లో

ఖేదరాగాల భారంతో దాచిన నిప్పురవ్వ

బండబారిన అమానవత్వపు మంచుల్లో ఇరుక్కొని

అచేతనావస్థకి అనియంత్రిత జాగృతావస్థకి మధ్య వ్యధవాక్యంగా మిగిలిపోతుంది

 

కానేందుకో

నరజాతి చరిత్ర సమస్తం

పరపీడన పరాయణత్వమని

తేల్చి చెప్పిన కవి ఆత్మ మరో ఎర్రబడ్డ ఉదయానికి

కలవరపడుతూ సమాధిలోతుల్లో అస్థిమితంగా కదులుతూనే ఉంటుంది

 

నాదాన్ పరిందేలని

అన్యాయంగా మింగేసిన మరో రోజు

ఘనవారసత్వాల ఘర్ వాపసీలే తప్ప

ప్రియమయిన ఘర్ ఆజా పిలుపివ్వలేని

ఆశక్తతకి ఆచారంగానో విచారంగానో సిగ్గుపడుతూ

పరదా వేసుకున్న అబద్ధంలా తడబాటుగానో పొరపాటుగానో కొనసాగుతూనే ఉంటుంది

*

 

ఓ గుల్మొహర్ పువ్వంత..                                    

 

ప్రసూనా రవీంద్రన్ 

 

పూరించమని నువ్వొదిలేసిన ఖాళీల్లో ఇవన్నీ నే రాసుకున్న వాక్యాలు.

నువ్వు చెప్పిన సశేష కథల్లో నేనూహించుకున్న ముగింపులూ ఇవే.

 

వాకిలి తట్టి మరీ ఏ కలలూ రావు గానీ, కల మీద సంతకమంటూ చూశాక, కొన్ని గుర్తుల్ని రెప్పలకే వేలాడదీయడంలో ఆనందం కూడా ఇలాగే ఉంటుంది. ఇక ఆ మిగిలిన రాత్రంతా , సగం తెరిచుకున్న తలుపులోంచి లోపల దూరే ఊహల కువకువలూ అచ్చం ఇలాగే ఉంటాయ్.

 

ఆకాశాన్ని పిలిచి ఆనందమంతా దింపుకున్నాక, ఎక్కడిదక్కడ సర్దేటప్పుడు నుదిటికి పట్టే చెమటలు సరిగ్గా ఇలాగే నవ్వుతాయ్.  మౌనంలోంచి మొదలై మధ్యలోనే తెగిపడితే, ఏరుకుని మబ్బుల కింద మడిచిపెట్టిన మాటలన్నీ ఇక్కడ రాలితే ఇలాగే పరాగాలవుతాయ్. ఆ పరాగాన్నే కళ్ళకి కాస్త రాసుకుని చూడు. తెలియటంలేదూ? వ్యతిరేక భావాలన్నీ వెలేయబడే లోకంలో, నీకూ నాకూ మధ్య దూరం ఓ గుల్మొహర్ పువ్వంత. 

 

PrasunaRavindran

 

అరణ్య  రహస్యం

 రామా చంద్రమౌళి

Ramachandramouli

అంతస్సంబంధమేమిటో  తెలియదు  కాని

రాత్రి కురిసిన  ముసురులో  తడుస్తూ  సూర్యుడుదయిస్తూంటాడుగదా

అరణ్యం  నిద్రిస్తున్న  నాలోకి  మెల్లగా  ప్రవేశిస్తూ  ఒక  మెలకువగా  మారుతుంది

పాదాలను  అడవిలోని  దారి  పిలుస్తూంటుంది

ఇటు  లోయ .. అటు  శిఖరం .. ఎవరు  పెట్టారో పేరు .. గార్నెట్ వ్యాలీ

ఇల్లేమో.. వుడ్స్  ఎడ్జ్ .. అడవి  అంచుపై  ఒక  వీధి

మనుషులెవరూ  కనబడరు .. ఎప్పుడో  ఒకరిద్దరు  వృద్ధ  దంపతులు

అమెరికన్స్ .. చేతిలో  కాఫీ  కప్పులు .. మరో  చేతిలో  కుక్క గొలుసు

ముఖంపై  పొంగిపొర్లే  చిరునవ్వు ..’ హై ‘ అని  ఆత్మీయ పలకరింత

ఎవరో  అపరిచితులే .. కాని  మనందరం   ప్రాథమికంగా  మనుషులంకదా  అన్న  ప్రాణస్పర్స

తప్పకుండా  ఎప్పటికైనా  విడిపోవలసిన  మనుషులమైన   మనం

కలుసుకున్న ఈ  మధుర  క్షణాన్ని ‘సెలబ్రేట్ ‘ చేసుకుందాం  అన్నట్టు  నవ్వుమెరుపు

ఎదురుగా యాభై  అడుగుల  ఎత్తుతో  ఆకుపచ్చని  స్వర్గాన్ని  మోస్తూ .. చిక్కగా  చెట్లు

ఒంటరిగా  నడుస్తూంటాను. . వెంట పక్షుల సంగీతాన్నీ .. సెలయేరు  శృతినీ .. ఒక  అభౌతిక  నిశ్శబ్దాన్నీ   వెంటేసుకుని

నా లోపలినుండి.. నాకే  తెలియని  ఎవరో  పురామానవుడు  ఆవులిస్తూ .. మేల్కొంటూ.. పరవశిస్తూ

నేనుకాని  నేను  నడుస్తూ

హద్దులనూ.. ఎల్లలనూ.. చెరిపేస్తూ.. ఒకే  ఆకాశంకింది  జీవసంపదనంతా  ఆలింగనం  చేసుకుంటున్నట్టు

ఒక  నీటిబాతు  ధ్వని .. పిచ్చుక  కిచ కిచ .. పక్షుల  రెక్కల చప్పుడు –

ఎక్కడి  పెన్సెల్వేనియా.. ఎక్కడి  వరంగల్లు .. ఐనా  భూమి  ఒక్కటే కదా  అన్న  ఆదిస్పృహ

మొదటిరోజు.. మెల్లగా  నడుస్తూ  బాటలొకొచ్చి  చిన్ని తాబేలు .. గోధుమరంగు డిప్పతో..తలపైకెత్తి

పలకరిస్తోందా.. అది .. ఏ భాష

అటుప్రక్క  కళ్ళు  మిటకరిస్తూ .. చెవులు  రిక్కించి  జింక .. నిలబడి .. ఆ  చూపులదే భాష

వెళ్ళిపోతూంటాను  వృక్షాలను  దాటుకుంటూ.,

జ్ఞాపకమొస్తూంటుంది .. పెన్సెల్వేనియా.. ద  స్టేట్  ఆఫ్  వాల్లీస్  అండ్  హిల్స్ .. అని

అన్నీ కొండలూ..శిఖరాలే మనిషిలోలా..కనబడనివీ..కనబడేవీ..చూడాలంతే కనబడేదాకా

ఒంటరిగా ఒక కర్ర బెంచీ..సన్నని సెలయేరు ప్రక్కన..ఎవరు పెట్టారో మహాత్ముడు

పిలుస్తోంది..రా కూర్చోమని..అతిథినికదా

చుట్టూ  మనుషులు  ప్రకృతిని  పదిలంగా  సంపదలా  దాచుకున్నట్టు .. పచ్చని  గడ్డితివాచీ

నగ్న పాదాలకు నేలను తాకాలనీ.. గడ్డిని  ముద్దాడాలని  ఎంత  తహతహో

పురా దాహం .. యుగయుగాల  అలసట .. ప్రకృతిలోకి  పునర్విముక్తకాంక్ష

నగ్నంగా  వచ్చినవాడా .. మళ్ళీ  నగ్నమైపోవడమే  అని ..హెచ్చరిక

మధ్య  ఈ  బూట్లొకటి .. అడ్డు ..  తొలగించాలి

కోడిపిల్లకూ.. గాలికీ మధ్య ..పెంకు.. ఛేదనం.. అనివార్యమేకదా

అరగంట .. ముప్పావు .. ఉహూ.. విడిచి వెళ్ళలేను

నెల్సన్  డి  క్లేటన్ స్మారక వనం .. అని బోర్డ్

అక్షరాలను  తడుముతాను  ప్రేమగా.. ఎందుకో  కళ్ళలో  నీళ్ళు  చిప్పిళ్ళుతాయి.

నాకు  తెలియకుండానే  ఆ  అరవై  అడుగుల  మాపెల్  చెట్టు   కాండాన్ని  చేతితో  స్పర్శిస్తాను

ఎవరో  యుగాలుగా  తస్సిస్తున్న  మునిని  తాకినట్టు  విద్యుత్  జలదరింత

2

మర్నాడు  మళ్ళీ వెళ్తాను

ఎప్పుడు  తెల్లవారుతుందా  అని  ఎదురు  చూచీ చూచీ

మంచు కురుస్తున్న  రాత్రంతా  అడవి  పిలుపే

ఆకులు  పిలుస్తాయి .. కొమ్మలు  పిలుస్తాయి . . నేల  పిలుస్తూంటుంది .. ఆకాశం  పిలుస్తూంటుంది

నా  తాబేలు .. నా జింక  .. నా  పిచ్చుక .. నా  నీటిబాతు .. నా కుందేలు

నా సెలయేరు .. నా  నిశ్శబ్ద  సంగీతం .. నా  మాపెల్ చెట్టు

ఒడ్డున  నా   ఖాళీ  కర్ర   బెంచీ

నా  అడుగులకోసం  ఎదురుచూచే  నా  కాలిబాట

నా  లోయ . . నా  శిఖరం..నాలో  నేనే  ప్రతిధ్వనిస్తున్నట్టు  నాతోనే  నేను

పేరుకు  ఉదయపు  నడకే .. మార్నింగ్  వాక్

వ్యసనమైపోతోంది  అడవి .. అల్లుకుపొతోంది  అరణ్యం

మనిషినీ ..  మనసునూ.. హృదయాన్నీ ..  అత్మనూ

ప్రతిరోజూ

పిలిచినట్టే  బాటపైకి  తాబేలు  నడిచొస్తుంది ..  జింక  దిబ్బపై  నిలబడి   పలకరిస్తుంది

గడ్డిపై  అల్లరల్లరి  చేస్తూ  పిచ్చుకలు  కచేరీ  చేస్తాయి

సెలయేరు  వేగాన్ని  పెంచుకుని  ఉరికొస్తుంది  నా  కుర్చీ దగ్గరికి

పైనుండి  అకాశమేమో.. నవ్వుతూంటుంది .. పిచ్చి అడవీ .. పిచ్చి మనిషీ .. అని

ఔను .. జీవితాన్ని  జీవవంతంగా  జీవించడం  ఒక  పిచ్చేగదా

3

వెళ్ళిపోవాలిక

వచ్చినవాడెప్పటికైనా  వెళ్ళిపోవాలికదా

వీడ్కోలు .. నా  స్నేహితుల్లారా.. నా  వృక్షాల్లారా.. నా  నేలా.. నా   పెన్సెల్వేనియా   గాలీ

ఇన్ని  రాత్రులు   నన్ను  అల్లుకుని

ప్రతి  ఉదయం  మేల్కొలిపి  తల్లి  పిలిచినట్టు   నన్ను   స్వాగతించిన   అరణ్యమా  నీకు  వీడ్కోలు

చివరి  రోజు .. చివరి  నడక .. చివరి స్పర్శ

చూపులు  తాబేలును  వెదుకుతాయి . .  జింక  కోసం  తహ తహ

సెలయేటి  పాటేది  .. నీటిబాతు  చప్పుడేది

నన్ను  ఒడిలో  కూర్చోపెట్టుకున్న  నా   ఖాళీ   కర్ర కుర్చీ  ఏది

వెదుకులాట .. తడుములాట .. తండ్లాట

అడవిలోకి  వెళ్ళిన   నాలోకి  అడవే  ప్రవేశించి .. ఆక్రమించిన  తర్వాత

అడవిని  పిడికెడు  గుండెల్లో   ధరించివస్తున్న . . దాచుకుని  వస్తున్న  నాలో

ఎంత  దుఃఖమో.. ఎంత  శూన్యమో.. సముద్రమంత .. ఆకాశమంత –

 

   ( అమెరికా..  పెన్సెల్వేనియాలోని   గార్నెట్ లోయ .. వుడ్స్   ఎడ్జ్ లోని  నా  కూతురు ‘ పవన ‘ ఇంట్లో పదిహేను రోజులుండి .. ప్రక్కనున్న   అడవితో  పెంచుకున్న   అద్భుతానుబంధాన్ని  దుఃఖోద్వేగంతో  స్మరించుకుంటూ )

 

 

 

 

 

 

ఎప్పటికప్పుడు నిన్ను….

ప్రవీణా కొల్లి
నాకు  తెలిసిన మహా   అద్భుతానివి  నువ్వు
ఏ క్షణంలో ఎలా  ఆసీనమవుతావో
మరుక్షణానికి  ఎప్పుడు వీడ్కోలు చెపుతావో
తెలీనట్టే ఉంటుంది నీ గమనం.
నీ ఛాయలను తడిమితే చాలు
జీవించిన కాలాలు కళ్ళలో  మెదులుతూ
తెరలుతెరలుగా రెపరెపలాడతాయి.
అంచులలో నుంచీ  జారిపోబోతున్న చుక్కలా
నిలిచిన  నిన్ను
ఒడిసి పట్టుకోనూ  లేను
నిన్ను  వదిలిపోనూ లేను.
నీలోనే  తచ్చాడుతూ
నన్ను  వెతుక్కుంటూ  ఉంటాను.
దొరికినదేదీ  నిలకడైనది కాదని
స్థిరమైన  అర్థాలేవీ జీవితంలో ఉండవని
రేపటి  శోధనను వదలవద్దని చెప్పి పోతావ్.
రావొద్దని  నిన్ను ప్రాధేయపడిన క్షణాలను
నిర్దాక్షిణ్యంగా  పక్కకు  తన్నేస్తావ్
పెద్ద పెద్ద అంగలతో నా  వాకిలిని  చిత్తడి చిత్తడి చేస్తావ్
అల్లకల్లోలాలను  నాలో నింపి
ఎండుటాకులపై అడుగులేస్తూ
నింపాదిగా వెళ్లిపోతావ్
ఆకారాలను నాలో చెక్కిన
నిరాకార శిల్పివి  నువ్వు.
ఉలి  పోటులకు నిన్ను ద్వేషించనూలేను
కొన్ని  ఆకృతులకు  నిన్ను  ప్రేమించనూ  లేను.
 సూత్రధారివీ   నువ్వే
మహమ్మారివీ  నువ్వే
గొప్ప  స్నేహానివి  నువ్వే
అంతుపట్టని  శేషానివీ  నువ్వే.
ఎప్పటికప్పుడు  నిన్ను హత్తుకోగలిగితే
జీవితాన్ని ప్రేమించకపోవటానికి  ఒక్క కారణమన్నా మిగలదు  కదూ!
వేళ్ళ  సంధుల్లో  నుంచీ జారిపోతున్న నీకు వీడ్కోలు చెప్పగలిగితే
లోతుగా జీవించిన క్షణాలెన్నో మిగులుతాయి కదూ!
praveena

మషాల్చి

పరేశ్ ఎన్ దోశి

 

కవిత్వమింకా ఐపోలేదు
జీవితమింకా మిగిలేవుందిగా!

నువ్వు కవిత్వం పరచుకొంటూ
వాగులు, వంకలు,
వూళ్ళు, వాడలు,
కొండలు, కోనలు,
సందులు, గొందులు,
అరణ్యాలు, సాగరాలు,
యెండలు, వానలు,
పువ్వులు, ముళ్ళు,
యిన్ని దాటుకొచ్చి యిప్పుడు
యీ పొగమంచులో నిల్చున్నావు.

యిక్కడి నుండి ప్రయాణం
నాది!

(మషాల్చి: Torch-bearer)

 

స్వగతం

 

నువ్వు అల్లుతున్న పొడుపు కథను
నేను విప్పటం కాదేమో

నువ్వు నీ బాల్యం నాటి వర్షపురాత్రిని వర్ణిస్తే
నేను నా బాల్యం లో కురిసిన వానలో తడిసి తెచ్చుకున్న జలుబు గుర్తుకొచ్చి
విక్స్ కోసం తడుముకోవడం

తల దువువుకోడానికి నువ్వు అద్దం ముందు నుంచుంటే
అందులో నా ముఖం కనబడటం
నువ్వు వొక బొమ్మ గీస్తావు
సరిగ్గా రాలేదని
అందులో ప్రతి గీతమీదా
మరిన్ని గీతలు దిద్దుతావు
దూరంగా జరిగి చూసుకొని
ఇప్పుడు బాగుందని
మురుస్తావు.

గాఢమైన పదచిత్రాలూ ప్రహేళికలూ రెఫరెంసులూ
ఇన్ని గందరగోళాల ముందు
నువ్వు మొడట వేసిన బొమ్మే
గదిని పరిమళంతో నింపేస్తుంది.
మల్లెలెక్కడ వున్నాయా అని వెతకడం నా వంతు.
ఇంకోసారి —

యెడుస్తున్నా
పాపాయికి నీళ్ళు పోసి
సాంబ్రాణి పొగ పెట్టి
పౌడరు రాసి
దిష్టి కాటుక పెట్టి
బట్టలు వేసి
మురిపెంగా ముద్దు పెట్టుకుంటావు.
ఆ పసిపాపను నా చెతులలో తీసుకుంటే
యేడుపు మరచిపోయి మరి బోసినవ్వులే
కవిత్వమంటే.

paresh

రెండే ఋతువులు నాకెప్పుడూ!

నిషిగంధ 

సరే కానీ, ఇక్కడున్నట్టు వచ్చేయకూడదూ..

దిగుల్లేని తీరిక అస్సలుండదని తెలిసి
తలుపులన్నీ బార్లా తెరిచి
ఆ మూలా ఈ మూలా రెపరెపలాడుతున్న చీకట్లని
ఊడ్చి తుడిచేసి,
సగం రాసిన ఉత్తరాలన్నీ సర్దిపెట్టి,
వాకిట్లో గాలితెరలు వరుసగా వేలాడదీసుకుంటూ
అదేపనిగా ఎదురుచూడలేను కానీ..
గుమ్మానికి కనురెప్పల్ని అతికించి వదిలేస్తాను!

ఆకాశం ఆ కనిపించే నల్లటి కొండల వెనగ్గా వెళ్ళి
నీలాన్నికొంచెం కొంచెంగా ఒంపేసుకోకముందే
వచ్చేశావనుకో..
వస్తూ వస్తూ..
రహస్య రాత్రుళ్ళకి మనం
రాసీ పూసీ మిగిల్చేసిన రంగులూ తెచ్చేశావనుకో
కిటికీ అవతల ముడుచుకు కూర్చున్న సుదీర్ఘ శిశిరానికి
కాసిని ఊగే పూవులూ, ఎగిరే గువ్వలూ అద్దేస్తాను!

నువ్వొచ్చాక ఒకటి.. వచ్చి వెళ్ళాక మరొకటీ
రెండే ఋతువులు నాకెప్పుడూ!
గుర్తుంచుకుందామనుకుని కూడా మర్చిపోతావెందుకో !!

పచ్చిక పొరల మధ్య నించి ఓ పిల్లగాలి
చాలా సేపట్నించే కాళ్ళావేళ్ళా పడుతోంది
పొద్దుటి ఎండ తరపున క్షమాపణలు అడుగుతోంది
వెలుతురు నవ్వులు మోసుకుంటూ ఇక నువ్వు వచ్చేయొచ్చు!

అనుకున్నంత కష్టమేం కాదు కూడా!
అడగాలనిపించని ప్రశ్నల్నీ, అడుగులు పడనీయని అలసటనీ
కాస్త కాస్తా దాటుకుంటూ
కాసేపలా వచ్చి కూర్చుంటే చాలు..

బాకీ ఉన్న జీవితంలోంచి
మనవే అయిన పాటల్లో విచ్చుకునే పూల తోటల్నీ,
వాటినే అంటిపెట్టుకున్న ఇంకొన్ని మసక రాత్రిళ్ళనీ రాసిచ్చేస్తాను!
*

painting: Anupam Pal

టియర్స్ గ్యాస్

 

మోహన్ రుషి

 

Mohan Rushi

 

 

 

 

 

అతడు ఆమెకు చాలా దూరంలో నుంచి దగ్గరగా

వున్నాడు. లేదా అతను మాత్రమే అలా అనుకోవడం

లోని ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. సంతోషం సగమే

బలం. దుఖ్ఖం శాశ్వత  భారం. ఒక ఖాళీ తాకడానికి

ఎంత సమయం కావాలి? ఇక దిగులు మేఘం ఆవరించి

కళ్ళు దుఖ్ఖాశ్రువులతో చిప్పిల్లడానికి ఏ మరో కారణం

కావాలి?!

 

ఆమె అతడికి చాలా దగ్గర్లో నుంచి దూరంగా వుంది. లేదా

ఆమె మాత్రమే తనకు తాను ఒక ప్రశ్న అవ్వడంలోని

సందిగ్ధ సందర్భాన్ని తీవ్రంగా ఎదుర్కొంటోంది. లోలకాన్ని

నిశ్చలం చెయ్యడానికి ఎంతమాత్రం నిబ్బరం అవసరం? ఒక

స్థిరమైన నిశ్చయంతో హృదయాన్ని గడ్డకట్టించుకుని

వెనక్కి చూడకుండా వెళ్ళిపోవడానికి ఇంకే కొత్త వేదన

కారణం కావాలి?!

*

సముద్ర తీరంలో..

 పి.మోహన్ 

P Mohan

 

 

 

 

 

సముద్రం నిన్ను అడిగింది

ఒడ్డున నన్నొక్కన్నే చూడ్డం బాగోలేదట

పిచ్చి అలలు ఘోష పెడుతున్నాయి

కన్నీటితో మరింత ఉప్పు చేయొద్దని!

 

సూర్యపుష్పమింకా వికసించలేదు

అంతా మసకమసక.. అర్థం కాని నీ చూపుల్లా

తెల్లారగట్ట తీరాన ఈ వెర్రి నడక

సౌందర్యారాధనా కాదూ, కాలక్షేపమూ కాదు

నిర్నిద్ర రాత్రిని ఇలాగైనా తప్పించుకుందామని

 

కాళ్లకు శంఖస్పర్శలు.. నీ మునివేళ్ల చిలిపి చేష్టల్లా

ఆనాడు ఇక్కడే కదా సరిగంగ స్నానాలూ, తనువుల తాడనాలూ

ఇసుక తడిలో, అలల నురగలో ఒదిగిన జ్ఞాపకాలూ..

వెర్రి సముద్రం.. అవన్నీ ఇప్పుడూ కావాలట!

 

అనాటిలా ఇసుక గూడెలా కట్టను

చేతుల్లో రవంతైనా నీ ప్రేమతడి లేదే!

మెత్తని తీరాన మన పేర్లెలా రాయను

చేతిలో ఒక్క ప్రణయాక్షరమూ లేదే!

 

మంచుతెరల్లో ఒక్కన్నీ కదలిపోవడం

తీరాన్ని ఈడ్చుకుపోతున్నంత బరువుగా ఉంది

 

లోకసాక్షి తూరుపు తలుపు నెడుతున్నాడు

బెస్తపల్లెలు నిద్రలేస్తున్నాయి

పీతలు బొరియల్లోకి వెళుతున్నాయి

 

ఒంటరి ప్రయాణం ఎక్కడో ఒకచోట ఆగాల్సిందే

ఆనాడు మనం కూర్చున్న నల్లపడవ పక్కన

ఇప్పుడిలా దిష్టిబొమ్మలా నిల్చున్నాక

వెనకేముందో తెలియదు

ముందు మాత్రం కళ్లు చెదిరే ప్రభాత బింబం

సూర్యుడి ముద్దుతో ఎర్రబారిన కడలి చెంప

అనంత జలరేఖపై పూచే తెరచాపలు

తీరం, కెరటాల కౌగిళ్లతో పోటెత్తిన సౌందర్యం

దిష్టి తగలొద్దు

ఇలాంటి చోట ఒకడు తోడు లేకుండా తిరిగాడని

ఎవరికీ తెలియొద్దు

తడి ఇసుకపై ఒంటరి పాదముద్రలు చెరిగిపోవాలి!

 

*

 

 

ఆకురాలు కాలం

                  సుధా కిరణ్

  • Sudha Kiran_Photo

 

 

 

 

ప్రలోభమై వచ్చిందో

ప్రహసనమై వచ్చిందో

అబద్ధపు చిరునవ్వై వచ్చిందో

ఆత్మీయ స్పర్శలేని కరచాలనమై వచ్చిందో

ఆకురాలు కాలం వచ్చింది

 

శిధిలాల మధ్య ఆకాశ హర్మ్యపు కలలా నేలకు దిగిందో

చితిమంటల కన్నీటిపై, సమాధుల పై నడుచుకుంటూ వచ్చిందో

చిగురుటాకులను చిదిమివేస్తూ, పత్రహరితాన్ని మెలమెల్లగా కబళిస్తూ వచ్చిందో

చెట్లని కుదిపి ఆకులని రాలుస్తూ, సుడిగాలిలా వడివడిగా పరుగులు పెడుతూ వచ్చిందో

ఆకురాలు కాలం వచ్చేసింది

 

రక్తసిక్తమైన చిమ్మచీకటి రాత్రిలా వచ్చిందో

రహస్యంగా పొంచి, చుట్టుముట్టిన వేకువజామున వచ్చిందో

ద్వేషపు తూటాలు కసితో పొట్టనబెట్టుకున్న పట్టపగలు వచ్చిందో

నెత్తురుకక్కుతూ, నిస్సహాయంగా వొరిగిపోయిన సంధ్య వేళలో వచ్చిందో

ఆకురాలు కాలం రానే వచ్చింది

 

సంకెళ్ళు తగిలించిన చేతులతో వచ్చిందో

శవాల చేతులలో దొరికిన ఆయుధమై వచ్చిందో

చెల్లాచెదురుగా పడిన కూలీల కళేబరాలతో వచ్చిందో

అడవిలో నరికిన మానులపై అంకెల సాక్ష్యమై వచ్చిందో

గుర్తుపట్టే లోపులోనే ఆకురాలు కాలం వచ్చేసింది

 

(ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత ‘ఏక్ దిన్ యూఁ ఖిజా ఆ గయీ’ కి కృతజ్ఞతలతో…ఆ కవితకి తెలుగు అనువాదం కూడా ఇక్కడ..)

 

 మూలం: ఫైజ్ అహ్మద్ ఫైజ్

అనువాదం: సుధా కిరణ్

 

ఒకానొక రోజున ఆకురాలు కాలం రానే వచ్చింది

పొరలుపొరలుగా బెరడు సైతం వూడిపోయి

నల్లని మోడులన్నీ నగ్నంగా వరుసలో నిలబడ్డాయి

రాలిపోయిన పసుపుపచ్చని పండుటాకుల హృదయాలు

దారిపొడవునా పరుచుకున్నాయి

రాలిన ఆకులని కాలరాసి  చిదిమి ఛిద్రం చేసినా

గొంతెత్తి అడిగే వాళ్ళు లేరు

 

కొమ్మలపై కలల్ని గానం చేసే పక్షుల

గొంతులకి వురితాడు బిగించి

పాటలని ప్రవాసంలోకి తరిమి వేశారు

రెక్కలు విరిగిన పక్షులన్నీ తమకుతామే నేలకూలాయి

వేటగాడు యింకా విల్లు ఎక్కుపెట్టనే లేదు

 

ప్రభూ! వసంతుడా, కనికరించు

పునర్జీవించనీ మరణించిన యీ దేహాలని

తిరిగి ప్రసరించనీ గడ్డకట్టిన గుండెలలో రక్తాన్ని

చిగురించనీ వొక మోడువారిన  చెట్టుని

గొంతెత్తి గానం చేయనీ వొక పక్షిని

(మూలం: ఏక్ దిన్ యూఁ ఖిజా ఆ గయీ)

 

 

 

మరీ రహస్యమేం కాదు గానీ…!

 మోహన తులసి 

 

 

మబ్బు పుట్టలేదనో, చినుకు రాలలేదనో,
ఆకు కదలలేదనో, నువు పలకరించలేదనో
చివరకి నీతో మిగిలే
ఒంటరి సాయంకాలం గురించనో
జీవితం బాధిస్తూనే ఉంటుంది
 

తన నుదుటి మీద
నెమలీకల్నో, నివురు కప్పిన క్షణాల్నో
ఘనీభవించిన మౌన ఘడియల్నో
నిర్ణయించుకోకుండానే కాలం వచ్చేస్తుందనుకుంటా
ఆనవాలు చూపించని వానలా.
 

గతం నీడలో గోడవ పడటం రోజూవారీ రివాజే
అయినా
వాడిపోయే పూల వెనకాల
దాటెళ్ళిపోయే వెన్నెలనీడల వెనకాల
జీవితం సాగిపోతూనే ఉంటుంది

 
జీవన రాగ రహస్యం తెలియాలంటే
ఒక్కోసారి గుండె తడయ్యేలా ఏడవాలి
ఒక్కోసారి పొర్లి ఏడ్చేంత నవ్వాలి
 

ఒక్కసారైనా చచ్చిబ్రతికినంత ప్రేమించాలి
 

ఒకే ఒక్కసారైనా
నీరెండ మెరుపులో ఉరికే వాగునీళ్ళల్లో
గులకరాళ్ళ నడుమ గుండెని విసిరేయాలి.

*

Painting: Anupam Pal

w r i t e r ’s  b l o c k                        

ఊడుగుల  వేణు 

 

ఎండావాన కలసివస్తోంది

అక్కడ కుక్కకు నక్కకు పెళ్లి జరుగుతోంది

ఆ వేడుక చూడ్డానికి నేనూ వెళ్లొచ్చాను!

మర్నాడుదయం నిద్రలేచాక తెలిసొచ్చింది

నారెండు చేతుల్ని అక్కడే మరిచొచ్చిన సంగతి!

ఒక్కసారి వెళ్ళిచూడు…

ఆ చేతివేళ్ళ సందుల్లో నీ భావాశ్రిత ఆనవాలు కనిపిస్తాయి!

*

వైకుంఠపాళి నిచ్చెనమెట్ల నడుమ

కాటగలిసిన నా గుండెకాయ

విషసర్పం కడుపులో భానిసత్వం చేస్తోంది

దాని పదబంధశబ్ధాలను డీకోడ్ చేసిచూడు

పుట్టపగిలి చీమలొచ్చినట్టు

మార్మిక పదచిత్రాలన్నీ తిరిగిలేస్తాయి!

*

నేను ద్రవీభవించి సముద్రంలో కలిసిపోయాను

కెరటాలపై ఎగిరిపడే చేపలని చూస్తున్నాను!

dopamine,oxytocin,serotonin

మరియు endorphins…

మెదడులో టన్నులకొద్దీ కెమికల్స్ ఉత్పత్తి …

నా లోలోన ఒక కవిత పురుడుపోసుకుంటోంది

అక్కడిక్కడే somersaults  కొట్టాను

ఉరుముల మెరుపులతో ఆకాశం శివమూగింది

వాయువేగంతో నలువైపులనుండి  pirates…

నాగొంతులోని పసివాక్యాలన్నీ దొంగిలించబడ్డాయి !

నేను పరుగెత్తుకొచ్చి గుజ్జెనగూళ్లలో కూర్చుండిపోయాను

సముద్రం వర్షంలోతడుస్తూ అక్కడే ఉండిపోయింది

చినుకులు కొన్ని నా పాదాలపై రాలిపడగానే

మృతులైన నా అభిమాన కవులంతా

నాకేదో సందేశమివ్వటానికి ప్రయత్నిస్తున్నట్లనిపించింది !

సంతలో,రోడ్డు మీద,ఎక్కడపడితే అక్కడ

Writing pills అమ్మితే ఎంత బాగుండు !

Writing – Writing

Now I am living in one single word : Writing!

లేఖిన్,క్యా ఫైదా…

జహెన్ మే పూల్ నహీ ఖిల్ రే !

*

ఆధునిక వదశాలను నువ్వు చూసి ఉండకపోతే

నా శిరస్సులోపలికి తొంగిచూడు

ఊచకోతలో నెత్తురొడుతోన్న పదాలు కనిపిస్తాయి

పద్యాలలో ఒదగలేక పీనుగలైన అక్షరాలు

అర్ధరాత్రి ఆత్మలై నన్ను పీక్కుతింటాయి

నేనలా నిద్రపోతానో లేదో

నా కనుపాపలురెండు నిన్ను వెతకటానికై పరుగెడుతుంటాయి !

నీకు గుర్తుండే ఉంటుంది “కీట్స్” చెప్పిన మాట…

“only a poem can record the dream”

*

నా చెవిలో ఒకమాట చెప్పివెళ్ళు…

ఈ లోకానికి  నేను కావల్సిన వాడినైనప్పుడు

మరి నీకెందుకంత  కానివాడినయ్యాను !

నిన్ను గాజు సీసాలో బందించి

గ్రహాల అవతలికి విసిరేసిందెవరో చెప్పు

కాలుతోన్న చితి నుండి  – రాలుతోన్న బూడిదలో

నిన్ను కలిపేసిందెవరో చెప్పు

ఇన్నిమాటలెందుకు ,ఓసారిలా వచ్చిపో…

ఒక్క నెత్తుటి చుక్కతో నా గొంతు తడిపి

ఒక్క వేలితో నన్నుతాకి

నా ధర్మాగ్రహాన్ని ఆవాహనం చేసుకునిపో

నాకోసమిప్పుడేమీ లేదు – బతుకు శూన్యమైంది

ప్రపంచాన్ని నడిపే పవిత్రమర్మానివి కదా

నా గుండెకాయను తిరిగి నా దేహంలోకి ప్రవేశపెట్టి చూడు

132 వ గడిని దాటి…

స్వర్గధామం పై పాదం మోపుతాను!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

కలల దిక్కు

నారాయణ స్వామి వెంకట యోగి



తొలిపొద్దు కరస్పర్శకు
రెక్కల్ని విచ్చుకున్న
పిట్టల  కొత్త  రాగాల
పాటలు.

యుగాల  యెడబాటులోంచి

గరుకు కొమ్మల చేతులు చాచిన
ఫోర్సీథియా పసుపు పచ్చని పూల
మెత్తని కౌగిళ్ళు.

పచ్చని గడ్డి  వొడిన
వెచ్చగ నిలిచిన
నీటి బిందువుల
ఆత్మీయత.

నింగిన మెరిసే నెమలీకల
వెల్తురు పింఛాల నులివెచ్చని
వింజామరలు.
సుదీర్ఘ శీతల  రాత్రుల
కఠోర తపస్సు లోంచి

డాఫడిల్స్
తొలిపొద్దు గాలులపై వర్షించే
పరాగపు పెదవుల ముద్దులు.

వాకిట్లో
మొండి మంచు కరిగిపోయి,

పూలు విదిల్చిన మాగ్నోలియా
ఆనంద నృత్యం.

యెడతెరిపిలేకుండ  వొణికించిన  చలిలో
ఆపుకున్న యెన్నాళ్ల దుఃఖమో,
జుట్టు విరబోసుకున్న వీపింగ్ చెర్రీ
పూల శోకమై కలబోసుకునే
శతాబ్దాల ముచ్చట్లు.

అస్తి పంజరాల్లా భయపెట్టిన
చెట్ల చేతివేళ్ళకు చిగుర్లతో,
హృదయాల  కాలింగ్ బెల్ మోగిస్తుంది
వసంతకాలం.

పిట్టకూర్పులు వదిలించుకుని
రెక్కలు టపటపలాడించి
కొత్త కలలదిక్కుగా యెగిరిపోతుంది
యిల్లు.

*

swamy1

నేల కంపిస్తుందని తెలియని నీకు…

అఫ్సర్ 

1.

నీ కాళ్ళ కింద భూమి ఎప్పుడూ వణికి పోలేదు కాబట్టి, లేదూ  కాస్తయినా జారిపోలేదు కాబట్టీ,  నీకు యింకా చాలా తెలియవ్. నిజానికి ఈ వివర్ణ ముఖాల నగరపు చలి  తప్ప యింకే జీవన్మరణ ప్రకంపనలూ తెలియవు కాబట్టి నీకు నువ్వో ఆ అవతలి ఇంకొక ముఖమో తెలియనే తెలియదు.

చలిలో ఎండాకాలాన్నీ, ఎండలో చలికాలాన్నీ అందంగా పునఃసృష్టించుకునే తెలివో తేటదనమో నీకు ఉండనే వుంది కాబట్టి అసలే జీవితం ఎలా తెల్లారుతుందో, అంత హటాత్తుగానే ఏ మరణం ఎందుకు దాపురిస్తుందో నీకు యెప్పటికీ తెలియకనే పోవచ్చు.

కాని, అసలవేవీ జీవితమే కాదంటావే, అదిగో అక్కడే నీ రహస్యం అంతా నిద్రపోతూ వుంటుంది, వొళ్ళూపై  లేకుండా!

 

2.

యెప్పటి నించి ఆలోచించడం మొదలు పెట్టావో నువ్వు, యెప్పటి నించి దేన్ని యెలా అనుభవించడం మొదలెట్టావో నువ్వు, వొక బాధలో యింకో వొంటరితనంలో మరింకో చావు కన్నా పీడలాంటి బతుకులో యేది యెందుకు యెలా కమ్ముకొస్తుందో యెవరిని యే క్షణం యెలా కుమ్మేస్తూ పోతుందో ఏదీ ఏదీ  నీ వూహకి కూడా అందదు.

నువ్వొక అద్దాల గదిలోపల గదిలో సమాధి తవ్వుకుంటూ వుంటావ్! దాన్ని  తెరిచే సూర్యకిరణపు తాళం చేయిని యెక్కడో పారేసుకుని వుంటావ్!

నువ్వు పడుకున్న గదిలో కాస్త చలిగా వుందనో, నీ పక్కన పడుకున్న దేహంలో కొంత  వెచ్చదనం చచ్చిపోయిందనో, నువ్వు ఎక్కాల్సిన మెట్టు చూస్తూ చూస్తూ వుండగానే చప్పున జారిపోయిందనో రాత్రీ పగలూ గుండెలు బాదుకొని యేడుస్తూ వుండిపోతావ్ తప్ప, యింకో గుండెలోకి  ప్రవేశించి అక్కడి గాయాన్ని పలకరించి రాలేవ్ నువ్వు.

వొక కోరిక నించి యింకో కోరికలోకి వలసెళ్ళే ఏమరుపాటులో తొందరపాటులో కూడా అన్ని స్థలాలూ, కాలాలూ, వూహలూ చెక్కుచెదరని అందమైన అమరిక  నీకు.

మహా బలిదానాలే చేయక్కర్లేదు, కాని కనీసం వొక అరచుక్క కంట తడిని ఎవరికోసమూ రాల్చలేవు కదా నువ్వు.

 

3

ఇవాళ నేలా వణికి పోతుంది గజగజ.

రేపు ఆకాశమూ తొణికిపోతుంది వానచుక్కలా.

యీ సూర్యుడూ యీ చంద్రుడూ యింకేవీ నిలబడవ్ యింత ఠీవిగా యిప్పటిలాగానే.

జీవితం కొన్ని చేతుల్లోంచి యెట్లా పట్టుతప్పి పోతుందో

అలాగే కచ్చితంగా అలాగే ఇవన్నీ నెలవు తప్పి ఎటేటో రాలిపోతాయి,

నీకేమీ చెప్పకుండానే.

 

4.

నిజంగా

నీకు యింకా చాలా జీవితం తెలియనే తెలియదు,

నీ కాళ్ళ కింద భూమి ఎప్పుడూ వణికి పోలేదు కాబట్టే!

*

 

చిగురించే… చేతివేళ్లు

  మొయిద శ్రీనివాసరావు

 

చింతనిప్పుల్లా మండే …
మా నాన్న కళ్ళలోకి
సూటిగా చూడలేని నేను
చెట్టు వేళ్ళు లాంటి

ఆయన చేతివేళ్లను

అదేపనిగా చూసేవాడిని

శ్రమని  పంచిన  వేళ్ళు
నన్ను నడిపించిన వేళ్ళు
ఊయలై ఊగించిన వేళ్ళు

ఆ వేళ్ళలోంచి… నిత్యం పని ప్రవహించేది
గిజిగాడి నిర్మాణ కౌశలం కనిపించేది
మానవ జీవన పరిణామక్రమం అగుపించేది

పల్లెలో… పిడికెడు మట్టిని
గుప్పెడు గింజలగా మలిచిన  ఆ వెళ్ళే
మిల్లులో… నారపోగులను
పంచదార గోనెలుగా మలిచాయి
చెమట చేతికి… ఆకలి నోటికి మద్య
దూరాన్ని కొలిచాయి

ఏ అవసరమో… అసహనపు పామై
బుర్రలో బుసలుకొట్టినప్పుడు
కాసింత ఖాళీ సమయాన్ని చుట్టగ చుట్టి
కాల్చేయగలిగిన ఆ చేతి వేళ్ళలో
ఓ రెండు మొండు వేళ్ళు కనిపించేవి

మా అమ్మ చిరుగుల చీరను

పైటగ చేసుకొని
గోడకు కొట్టిన పసుపు ముద్దలా

మా చెల్లి  చాపపై కూర్చున్నప్పుడు

యంత్రం నోటిలో పడి తెగిన … ఆ వేళ్ళే

అయిన వాళ్లకు నాలుగాకులేసి

చెల్లి నెత్తిన రెండక్షింతలేసి లేవదీసాయి

ఆ వేళ్ళే…
అక్షరమ్ముక్క

నాకు ఆసరా కావాలని
నా వేళ్ళ మద్య

నిత్యం కలం కదలాడేలా చేసాయి

ఎక్కడైనా…
వేళ్ళు నరికితే పచ్చని చెట్టు కూలుతుంది
సగం తెగిన మా నాన్న చేతి వేళ్ళపైనే
ఆశల పతాకమై  చిగురించాల్సిన
మా బతుకు చెట్టు  మొండిగా నిలిచింది
* * *

(నెల్లిమర్ల జ్యూట్ కార్మికులు తమ కుటుంబ అత్యవసర ఆర్దిక అవసరాలకై మిల్లు యంత్రంలో చేతివేళ్ళు పెట్టడాన్ని కన్నీళ్ళతో తలుచుకుంటూ…)

Moida

 

 పది అంకెల ఇంద్రధనస్సు 

రేఖా జ్యోతి 

నీకూ నాకూ మధ్య
చాన్నాళ్ళ విరామం తర్వాత ‘ మొదటి మాట ‘
కాస్త నెమ్మదిగానే మొదలవుతుంది

నిశ్శబ్ధం లో నుంచి శబ్దం ప్రభవించడం
స్పష్టంగా అవగతమవుతుంది

‘ వర్షం మొదలైందా ! ‘ అని చాచిన అరచేతిలో
బరువుగా ఒక చినుకు రాలుతుంది
పొడినేల తడిచిన పరిమళం
ఊపిరిని వెచ్చగా తాకుతుంది

అటునుంచి ఒక పలకరింపు
ఇటు నుంచి ఒక పులకరింపు
చినుకు చినుకూ కలిసి వర్షం పెద్దదవుతుంది
కురిసి కురిసి మమత ప్రవహిస్తుంది

అటుపక్కని కొన్ని పెద్ద పెద్ద తరంగాలు
ఇటువైపు తీరం మీద కట్టిన ఓటు పడవని
ప్రయాణం లోకి మళ్ళిస్తాయి

‘ నిన్న ఏమైందో తెలుసా! ‘
‘ మొన్న ఒక రోజు కూడా ఇలానే …!’
‘ పోయిన యేడు ఇదే రోజు గుర్తుందా …!’
ఒక్కో అడుగూ వెనక్కి వేసి వేసి ఆఖరుగా
చేతిలోని వెన్న చేజారిన చోట సంభాషణ ఆగుతుంది

ఒక్కసారిగా ఒకే జ్ఞాపకం
నాలుగు కళ్ళల్లో సుడులు తిరుగుతుంది

అటువైపు నిశ్శబ్ధం
ఇటువైపూ బలహీన పడిన తుఫాను
ఇప్పుడిక ఎటు తవ్వినా కన్నీరే పడుతుంది

కాసేపు నిశ్శబ్ధమే అటునీ ఇటునీ హత్తుకొని ఓదారుస్తుంది
‘ సరే మరి , ఉండనా !’
తెలుసు అడుగుతున్న ఆ వైపున ఏమవుతోందో!
ఇక ఇటువైపు బదులులో అక్షరమేదీ ఉండదు కాస్త ‘ శబ్దం’ తప్ప!

ఆరుబయట వర్షం వెలసిపోతుంది
ఆకాశం వెలవెలబోతుంది !!
ఎండా వానల ఆశలమీద మెరిసిన
పది అంకెల ఇంద్రధనస్సు మాయమవుతుంది !!

నువ్వేనా ?

తిలక్ బొమ్మరాజు

ఓ క్షణం ఆగి చూడు
ఇక్కడేంటి ఇవి ?
నీ ఆనవాళ్ళేనా
ఇలా నువ్విప్పుడు ప్రకృతిలో మరణించడం కొత్తగా వుంది
రాత్రుళ్ళను కౌగిలించుకునే నీ ఆ చేతులేవి
యే మూలన పారేసుకున్నావు
చూడోసారి సరిగ్గా ఇక్కడే ఎక్కడో వదిలి ఉంటావు
ఇవన్నీ నీకేం కొత్త కాదుగా!
శవాల గుట్టలూ
దుమ్ము పట్టిన సమాధులూ
వాటి కింద నువ్వు
ఒక సుఖం అనుభవిస్తూ
మోసి తెగిన భుజాలు
ఇప్పుడు తెగుతూ మోస్తున్న నీ ఆలోచనలూ
ఆ పక్కగా గమనించావా ?
నీలాగే ఇంకో నువ్వు
ముందుకీ వెనక్కీ కళ్ళ చిహ్నాలు
ఇవి కూడా నువ్వేనా
ప్చ్ అసలేంటిది అచ్చు ఇలా ఎలా ఉన్నావు
దిగంబరుడిలా చీకట్లలో తచ్చాడే వెన్నెల బైరాగివి
ఇప్పుడేమిటిలా నిన్ను నువ్వు కోల్పోయావు
ఈ రాతి బండల కిందా
చెరువుగట్టు పక్కన ఉన్న నాచులోనూ
పచ్చగా మెరిసే నీ నవ్వు
స్వచ్ఛత నీదా?
నీ దేహానిదా?
వానపువ్వులను పేర్చుకోకలా
ముసురు ముగియగానే రాలిపోతాయి
మట్టి వాసనై మిగులుతాయి
నిన్న కాంచిన నువ్వు
నీలోని నువ్వు
బయట తడుస్తున్న సముద్రకెరటంలా
లోనుండి విసిరికొట్టే శూన్యంలా
ఇక్కడ యిసుకగూళ్ళు కడుతున్నాయి నీ మునివేళ్ళు
కన్నీళ్ళు  ఊరుతూనే వున్నాయి
నువ్వేనా మళ్ళా…
*
15-tilak

బుక్‌మార్క్

 వాసుదేవ్

 

ఇవన్నీ ఇంతే

అందమైన బుక్‌మార్క్ గా సిధ్ధమే

కన్నీళ్ళకథలు పర్చుకున్న పొడుగాటి పగలూ

అలసిపోయిన ముగ్ధ రాత్రీ

సోక్రటీస్ పెదవుల దగ్గరి హెమ్‌‌లాక్ విషపు గిన్నె

జీవిత గాయాల కథల తిన్నె

సిధ్ధమె!

బుక్మార్క్ గా రూపాంతరానికి సిధ్ధమే

 

ఆరొందలేళ్ళ ఫినిక్స్ పాటలూ

పదిరోజుల పసి ప్రాయపు పలకరింతలూ

హఠాత్తుగా, ఏదో జ్ఞానోదయమైనట్టు

ఎగురుకుంటూ పోయే పక్షులూ

నిక్కచ్చిగా పొడుచుకొచ్చిన గడ్డిమొలకలూ

కాలపు సన్నికాళ్లలో నలిగిపోయి, బతుకుపుస్తకంలో ఇమిడిపోయిన

ఆ అందమైన పువ్వులూ, రావాకులూ,

అపురూపమైన బుక్‌మార్క్ గా సిధ్ధమే!

 

చూరునుంచి బధ్ధకంగా వేళ్లాడుతున్న వర్షపు చుక్కల్లోంచొ

జలతారు పరికిణీ వెన్నెల పరదాల్లోంచో

పాతపుస్తకం లోంచి జారిపడ్డ చాక్లెట్ రేపర్లోంచో

ఖాళీజీవితంనుంచి క్రిందపడ్డ  అపురూప క్షణాల్లోంచో

ఓ బుక్‌మార్క్ సిధ్ధమే!

****

 

అప్పుడెప్పుడో  బతుకు పుస్తకంలో  దాచుకున్న ఆ పాతపువ్వులేమన్నాయి?

 

vasu