బాబన్న ప్రశ్న

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

–      సుధా కిరణ్

~

Sudha Kiran_Photo

ఎందుకోసమీ కవిత్వం?

విద్వేషం కసితో  కత్తిదూసిన ఆ రాత్రి కోసంఆ రోజు కోసం కాకుంటే

వీధి మలుపున హృదయం గాయపడిన మనిషి

చరమ ఘడియలకి చేరువౌతున్న

మలిసంధ్య క్షణాల కోసం కాకుంటే

ఎందుకోసమీ కవిత్వం?

 

రాత్రిఅన్నింటికీ పైన ఆకాశం

రాత్రిఆకాశంలోఅనంతకోటి నక్షత్రాలు

………

అదిగోఅక్కడ నెత్తురోడుతున్న కళ్ళులేని మనిషి

      పాబ్లో నెరూడా

1

‘ఎవరు వాళ్ళు?

ఎవరు వాళ్ళు ?

ఎవరి కోవకు చెందినోళ్ళు?

ఎవరికోసం వచ్చినోళ్ళు?’

కంజిరపై కలవరించే కాలం కవాతు

‘కళ్ళులేని మనిషి’ కంటిచూపు పాట.

వసంత మేఘమై, మెరుపు నినాదమై

చీకటి ఆకాశాన్ని వెలిగించిన

కబోది కలల కాగడా పాట.

2

ఒక ఆకాశం
ఎర్రజెండాయై ఒదిగి

ఒక భూమి
కన్నీటి గోళమై ఎగసి

ఒక నక్షత్రం
అగ్నికీలయై రగిలి

ఒక మేఘం
పెను విషాదమై పొగిలి

ఏం చూడగలడు కళ్ళులేని మనిషి?

ఎక్కుపెట్టిన ఆయుధంలో
ఎర్రని ద్వేషాన్నా?

చుట్టుముట్టిన చావులో
నల్లని చీకటినా?

ఏం చూస్తాడు కళ్ళులేని
మనిషి చరమ క్షణాలలో?

పాట  పెఠిల్లున పగిలిన
మౌనాన్నా?
చూపు చిటుక్కున చిట్లిన
నెత్తుటి దృశ్యాన్నా?

ఏం చూస్తారు కళ్ళున్న
కలలులేని మనుషులు?

కమురు వాసనలో కాలిపోయిన కలలనా?
బొట్టు బొట్టుగా నెత్తురు యింకిన
ఇసుక రేణువులలో ఎండిపోయిన వేసవి నదినా?

3

అవును, మనవాళ్ళే
మనకోవకు చెందినోళ్ళే, మనకోసం వచ్చినోళ్ళే!

కత్తి మనది
కత్తి వాదరకు తెగిపడిన కంఠమూ మనదే

నిప్పురవ్వ మనది
అస్థికలు మిగలని చితాభస్మమూ మనదే

కాలిబాట మనది
దారితప్పిన బాటసారులమూ మనమే

4

శవపేటికలతో ఖననం కాని
జీవిత రహస్యం

ఎగసిన చితిమంటలతో
దహనం కాని సత్యం

నెత్తుటి నదిలో మరుగుపడని జ్ఞాపకం .

తెగిపడిన గొంతులో ఆగిపోని పాట

5

కళ్ళులేని కలల మనిషి
ప్రశ్నిస్తాడు.

“అనంతాకాశంలో

కనిపించీ కనిపించని

అంతిమ నక్షత్రాలనెవరు చూస్తారు?

అమరత్వపు అరుణ పతాకపు రెపరెపలలో

భ్రాతృ హననాలని గుర్తు చేసుకునేదెవరు?

కలల వెలుగులో

ఒకానొక చీకటి రాత్రి పీడకలలాంటి

చావులనెవరు నెమరు వేసుకుంటారు?

‘నలుగురు కూచొని నవ్వే వేళల’

మాపేరొకపరి తలచేదెవరు?”

కళ్ళులేని కలల మనిషి ప్రశ్నిస్తాడు

“మా జ్ఞాపకం

తలుపులు శాశ్వతంగా మూసివేసిన

చీకటిగది అవుతుందా?”

*

babanna

  1. బాబన్న (తలసిల నాగభూషణం)వరంగల్ జిల్లా సిపిఐ(ఎం.ఎల్) విమోచన విప్లవ గ్రూపు రైతు కూలీ సంఘం నాయకుడు. కళ్ళు లేకున్నా అన్ని వుద్యమాలలో చురుకుగా పాల్గొనేవాడు. లెక్కలేనన్ని సార్లు అరెస్టులు, చిత్రహింసలకి గురయ్యాడు. ‘గుడ్డివాడా నిన్ను కాల్చిపారేస్తాం’ ‘అడివిలో వదిలి వేస్తా’మని పోలీసులు చాలాసార్లు బెదిరించేవాళ్ళు. విప్లవ గ్రూపుల చీలిక తగాదాలలో, ఏప్రిల్ 26, 1990 న ఖమ్మం  పగిడేరు దగ్గర బాబన్నలక్ష్మణ్భాస్కర్ఘంటసాల నాగేశ్వర రావులను మరొక గ్రూపు దళం కాల్చి చంపింది. బాబన్నని ఇసుకలో తలదూర్చి, తొక్కి, తర్వాత అత్యంత క్రూరంగా కాల్చి చంపారు. తనని చంపుతామని ఆ గ్రూపువాళ్ళు ప్రకటించిన తర్వాత, బాబన్న చావుకు మానసికంగా సిద్ధ పడ్డాడు. ‘రాజ్యం చేతిలో చనిపోయిన వాళ్ళని అమర వీరులుగా ఎప్పుడూ గుర్తు చేసుకుంటారు. చీలిక ఘర్షణలలో చనిపోయే మాలాంటి వాళ్ళ సంగతేమిటి? ఇవాళ చీలిక ఘర్షణలలో మేం చనిపోతే, రేపు తిరిగి అందరూ ఐక్యమయ్యాక మమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా తలచుకుంటారా?’’ అని బాబన్న తన సహచరులని ప్రశ్నించాడు. తెలంగాణా, ఆంధ్ర, బీహార్ రాష్ట్రాలలో వివిధ విప్లవ సంస్థల ఘర్షణలలో కనీసం వందమందికి పైగా చనిపోయి వుంటారు. ఘర్షణ పడి, పరస్పర హననాలకి పాల్పడిన తర్వాత, కొన్ని సంస్థలు తిరిగి ఐక్యం అయ్యాయి కూడా. బాబన్న ప్రశ్న విప్లవకారులందరూ వేసుకోవాల్సిన ప్రశ్న.
  2. బాబన్న పాటలు పాడేవాడు.‘ఎవరు వాళ్ళు?/ఎవరు వాళ్ళు ?/ఎవరి కోవకు చెందినోళ్ళు?/ఎవరికోసం వచ్చినోళ్ళు?’ అనే జనసేన పాటని బాబన్న అన్ని సభలలో, సమావేశాలలో పాడేవాడు. 

మీ మాటలు

  1. M .viswanadhareddy says:

    నువ్వొక చీకటి వెలుగు నిన్నొక వెలుగు చీకటి కభలించింది

  2. Narayanaswamy says:

    కిరణ్ – చాలా మంచి కవిత – చాలా మంచి ప్రశ్న – నిజానికి రాజ్యానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అమరులయ్యే వారిని అందరూ తలుస్తారు. కానీ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళ మధ్య ‘ఆధిపత్య’ పోరులో నేలకొరిగిన వారిని యెవరు తలుస్తారు? ఓడిపోయిన వాళ్ళు యెటూ మిగలరు. గెలిచి మిగిలిన వాళ్ళు చిరిగి శిథిలమైన చరిత్ర పుటలని యెటూ పట్టించుకోరు. అప్పటికి గెలిచినా యిప్పుడింక మిగలని వాళ్ళ స్మృతులకు కూడా బహుశా ఆనవాళ్ళుండవు. ప్రతి సారీ ఒక అభాసు గా ‘పునరుజ్జీవించే’ మన విప్లవోద్యమాల ఘర్షణ ల విషాద చరిత్ర ఇది. రాజ్యం కోర్ల్లో చిక్కి బలైపోతున్న వందలాది నామవాచకాలే సర్వనామాలవుతున్న సందర్భంలో విప్లవ పార్టీల ఘర్షణల్లో నేలకొరిగిన బాబన్న లాంటి వాళ్ళను గుర్తు చేస్తున్న నీ కవిత ఒక చారిత్రిక అభాస నూ అది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చింది.

మీ మాటలు

*