స్త్రీలున్నంత కాలం స్త్రీవాదమూ ఉంటుంది: ఓల్గా

IMG_1530

తెలుగు సాహిత్య లోకం లో స్త్రీవాదం లో తనదంటూ ఒక ముద్ర వేసుకున్న ఓల్గా గారిని కలవడానికి వెళ్ళడం అతి ముఖ్య విషయంగా మూడు వారాలుగా నాలో నేను తర్కించుకుంటూ, నాకు నేను సలహాలిచ్చుకుంటూ గడిచింది. హైదరాబాద్ లో ఈస్ట్ మారేడ్ పల్లి లోని ‘అస్మిత’ కు వచ్చి కలవమంటూ ఓల్గా గారు ఫోన్ లో టైం ఇచ్చాక,  మొదటిసారిగా ఆమెను కలుస్తున్న అనుభూతి కొంచెం భయపెట్టిన మాట నిజమే. అస్మిత కు వెళ్ళే ఓల్గా గారి గురించి వెయిట్ చేస్తు, ఎంత గంభీరంగా వుంటారో, ఎలా ప్రశ్నలు వెయ్యాలో, యేం చెపుతారొ అన్న గుంజాటన మనసులో !

ఎప్పుడు లిఫ్ట్ తెరుచుకున్నా చేతిలోని ప్రశ్నల పేపర్ సరి చేసుకుంటూ, ఆమే నేమో అని అటన్షన్ లోకి రావడం… వేరే ఎవరో రావడం… ఒక అరగంట గడిచాక, ఓల్గా గారిని లిఫ్ట్ లోనుండి రావడం చూసి, సాహితీ వనంలో విచ్చుకున్న గులాబి గుర్తొచ్చింది. విష్ చేశాను. ఇంటర్వ్యూ ఎంత సేపు పడుతుంది అన్నారు. ఒక గంట పట్టొచ్చన్నాను. నా చేతిలో అప్పటికే వున్న పేపర్ తీసుకుని, చూసి, “ఓ ప్రిపేర్డ్ గా వచ్చారా?” అని చిన్నగా నవ్వి, ప్రశ్నలన్నీ చూసి, లోపలికి వెళ్ళి ఆఫీస్ రూం లో కూర్చుందామన్నారు. అలా మొదలైన ఇంటర్వ్యూ శీతల సెలయేరులా ప్రశ్న తరువాత సమాధానం లా సాగిపోయింది.

ప్రతి పదం లోనూ ఒక పట్టుదల, జీవితాన్ని చదివిన అనుభవం, పదాల్లో పలుకుతున్న ఉద్విగ్నత, స్త్రీవాదం పట్ల విపరీతమైన నిబద్ధత — వీటి ప్రతి రూపమే ఓల్గా గారి సాహితీ సృష్టి అనిపించింది. ఆమె జవాబులు చదివితే మీరు కూడా నాతో అంగీకరించక తప్పదు.

 

Q ఒక రచయిత్రిగా మీది సుదీర్ఘమయిన ప్రయాణం. ఈ ప్రయాణం మొదలు పెడ్తున్నప్పుడు సాహిత్యం పట్ల వున్న అభిప్రాయాలూ, ఆకాంక్షలూ ఇప్పుడు ఏ విధంగా మారాయి?

అపుడు ఇప్పుడు కూడా మౌలికమైన తేడాలు లేవు. నేను రాయడం మొదలుపెట్టినప్పుడు సమాజం సాహిత్యం పై ప్రభావం చూపిస్తుంది,  సాహిత్యానికి ఒక ప్రయోజనం వుంది,  ఆ ప్రయోజనం నెరవేర్చడం కోసం రచయితలు రాయాలి అనే ఒక సామాజికమైన అవగాహనతోనే వుండేదాన్ని. నేను చదువుకునే రోజుల్లో కూడా సమాజం తో ముడివేసుకున్న సాహిత్యం ఎక్కువ ఇష్ట పడే దాన్ని. కేవలం కాల్పనిక నవలలే కాకుండా వాస్తవిక జీవితం, సమాజం, వాటిలో రావాల్సిన మార్పులు, వీటిని గురించి ఆలోచించే సాహిత్యాన్నే ఇష్ట పడేదాన్ని.

అటువంటి సాహిత్యాన్ని రాయాలనే నా రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టాను. ఇప్పుడుకూడా అదే కొనసాగుతోందీ.  ఈ ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుండీ అప్పటికీ ఇప్పటికీ సాహిత్యం పట్ల నాకున్న అభిప్రాయాల్లో  మౌలికమైన భేదాలేమీ లేవు

Q మీరు వొక మార్క్సిస్టు శిబిరం నించి వచ్చారు. ‘నేను స్త్రీవాదిని కావాలి ’ అనే భావన మీలో బలంగా ఎప్పుడు కలిగింది?

నేను మొదటి నుంచి మార్క్సిస్ట్ ని .  విద్యార్థి గా వున్నప్పుడు  స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తర్వాత CPM CPML PARTY వీటితోటి సంబంధాలు కలిగి వుండటం ఇవన్నీ నన్ను మార్క్సిస్ట్ దారిలో నడిచేలా చేశాయి. వాటినన్నింటిని  తలుచుకుంటే ఇప్పటికీ ఇష్టమే. నాకు ఆ పునాది చాలా ఉపయోగపడింది.

ఆరోజుల్లోని సమాజాన్ని అర్థం చేసుకోవడానికి నాకు మార్క్సిజం చాలా ఉపయోగపడింది. విప్లవ రచయితల సంఘం లో గానీ, జనసాహితీ సంఘం లో పనిచేసినపుడు గానీ విప్లవ పార్టీల్లో వున్న వాతావరణాన్ని చూసినప్పుడు కానీ అక్కడ కూడా స్త్రీల సమస్యల పట్ల అవగాహన సరిగ్గా లేదని అర్థమయింది . స్త్రీ పురుష సమానత్వమనేది ఆ సంఘాలలో కూడా లేదు. మొత్తం సమాజాన్ని ఒక సమ సమాజం వైపు నడిపించాలనే ఆశయం తో బయల్దేరినటువంటి పార్టీలలో గానీ సంఘాలలో గానీ సమానత్వాన్ని గురించిన స్పృహ లేకపోతే వాళ్ళు యేం చేయగలుగుతారు అని నాకు ఆలోచన కలిగింది. అప్పుడు నేను,  నాలాంటి కొంతమంది ఈ విషయాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టాం.

ఆ ప్రశ్నల్ని వాళ్ళూ సహించలేక పోయారు. పురుషాధిపత్యం వంటి పదాలను కూడా అక్కడ వాడకూడదు. ” అలాంటి మాటలు వాడటం వల్ల  ప్రధాన విప్లవం అంతా పెడత్రోవ పడుతుంది. మనం ముందు విప్లవం తెస్తే తర్వాత స్త్రీ పురుష సమానత్వం దానితో పాటే వస్తుంది”  అనే సమాధానాలు తప్ప, స్త్రీల సమస్య ఒక ప్రత్యేకమైనటువంటిదనీ, స్త్రీల అణచివేత పితృస్వామిక సమాజం లో ఎలా జరుగుతుందన్న చర్చగానీ, అసలిది పితృస్వామిక సమాజమనే గుర్తింపు గాని, ఇవేమీ అస్సలు లేవు. అటువంటి సమయం లో నేను వాటి గురించి ప్రశ్నించాను.  వాళ్ళ సమాధానాలతో తృప్తి పడకపోవడంతో అక్కడ ఇమడలేకపోయాను. రాజీనామా చేసి ఆ సంఘాలు అన్నిటి నుంచీ బయటకు వచ్చాను.

అలా విడిగా వచ్చిన తర్వాత, నాకు ఒకసమస్య. నేనేమిటి అనే నా అస్తిత్వ సమస్య . ఇంతకాలం నేను ఒక సిద్ధాంతానికి పని చేశాను. ఒక పార్టీని ఇష్టపడ్డాను. కొన్ని సంఘాల్లో పని చేసాను. వాటన్నిటినుంచీ బైటకు వచ్చి నిలబడ్డాను. మామూలుగా నా ఉద్యోగాన్నిచేసుకుంటూ.. మామూలు గా బ్రతికేసెయ్యొచ్చు. లేదా  స్త్రీల సమస్యల పునాదులు అన్వేషిస్తూ, విశ్లేషణ గురించి ఆలోచిస్తూ నా దారి నేను వేసుకోవాలా ? అనే ఆలోచనలు. దాదాపు ఒంటరితనమే వుంది. ఏది యేమైనా స్త్రీల సమస్యల ను గురించి దాని విశ్లేషణా పద్ధతుల గురించి ఆలోచించాను. వున్న మార్గాలన్నిటిలోంచి స్త్రీ వాదాన్ని ఎంచుకున్నాను. అంతకు ముందుఉన్నది  వామపక్ష రాజకీయాలైతే,  బయటకు వచ్చాక నేను స్త్రీ వాద రాజకీయాల వైపు వచ్చాను. స్త్రీ వాదిగానిలబడ్డాను.

అది ఒక సంఘర్షణ. అది ఒక రోజులో అకస్మాత్తుగా వచ్చింది కాదు. సంఘాల్లో పనిచేసిన రోజుల్లోనూ సంఘర్షణ వుంది. బైటికి వచ్చాకా సంఘర్షణ వున్నది. స్త్రీవాదిగా మారుతూ.. క్రమంగా ఆ రాజకీయాల్లోకి లోతుగా వెళుతూ వుండటం లోనూ ఆ సంఘర్షణ వున్నది. అది ఒక ప్రాసెస్. ఆ క్రమం లో నేను స్త్రీ వాదినయ్యాను.

Q రచన విషయంలో స్త్రీ-పురుష తేడా పనిచేస్తుందని మీరనుకుంటున్నారా?

స్త్రీలు తమ వేదనల్ని చాలా కాలం పాటూ వ్రాయ లేదు. పురుషులే స్త్రీల తరుఫున చాలా కాలం పాటు వ్రాశారు. ఒక్క సారి స్త్రీలు గొంతు విప్పిన తరువాత స్త్రీలు రాస్తే ఎలా వుంటుందీ అనేది తెలిసింది కదా. పురుష రచయితల్లో కూడా స్త్రీల పట్ల చాలా సానుభూతితో రాసిన వాళ్ళున్నారు. మన చలం గారు, గురజాడ, కొడవటిగంటి ఇలా అనేకమంది వున్నారు. అలాగే స్త్రీ రచయితలూ చాలా మంది వున్నారు. ఐతే వీళ్ళల్లో చూసినప్పుదు స్త్రీలు తమ స్వీయానుభూతిని చెప్పుకునేటప్పుడు వచ్చే  ఒక ఆర్తి,  తమకేం కావాలో స్వయంగా ఆలోచించుకుని వ్యక్తం చేస్తున్నప్పుడు ఆ తేడా వుంటుంది. ఒక్కొక్కసారి పురుషులు కూడా ఆ తేడాను జయించి రాసినటువంటి సందర్భాలూ కొన్ని రచనల్లో వుంటాయి.

స్త్రీలు తాము స్త్రీలుగా కాకుండా పురుషులు ఆలోచించినట్లు రాసిన సందర్భాలూ వుంటాయి.

స్త్రీ వాదిగా రాస్తున్నామా లేక పోతే మామూలు రచయితగా రాస్తున్నామా – అలాంటప్పుడు మామూలుగా పురుషులుగా రాస్తున్నట్లే రాయొచ్చు. మామూలు నవలలు రాసే రచయిత్రులుంటారు కదా! వాళ్ళకీ పురుష రచయితలకీ పెద్ద తేడా లేదు. వాళ్ళు స్త్రీని అర్థం చేసుకుంటూ వర్ణించినట్లే వీళ్ళు కూడ వుంటారు. స్త్రీ వాది గా రాసినప్పుడు, రాసినది స్త్రీ అయినా పురుషుడైన ఒక స్త్రీ వాది రాసినట్టుగా తెలుస్తుంది. పురుషులు కూడా స్త్రీ వాదులు కావొచ్చు. ఫెమినిస్ట్ అనేది స్త్రీలే అవ్వాలని లేదు. పురుషులు కూడా ఫెమినిస్టులు అవ్వొచ్చు. అలా ఫెమినిస్ట్ దృక్పథం తో రాసినప్పుడు ఆ రచన ఒక ప్రత్యేకమైన రచనగా కనపడుతుంది.

Qమీరు మొదట కవిత్వం రాశారు, తరవాత వచనంలోకి మళ్ళాలి అన్న ఆలోచన మొదట ఎప్పుడు కలిగింది?ఎందుకు కలిగింది?

రాయడం కవిత్వం తోనే ప్రారంభమైనా, నేనేదో గొప్ప సాహిత్య కారిణి కావాలని నాకెప్పుడూ వుండేది కాదు. సాహిత్యం అంటే ఇష్టం.  ఏదో రాసేస్తాను. నేను నమ్మినది స్త్రీ వాదాన్ని. అప్పట్లో ఆంధ్ర దేశంలో స్త్రీవాదమంటే పెద్దగా తెలియదు. ఎనభయ్యవ దశకం లో అప్పుడప్పుడే స్త్రీవాద ఆలోచనలు మొలకెత్తుతున్నాయి. ఎప్పుడైతే నేను బయటకు వచ్చేసి స్త్రీ వాదిగా నిలబడ్డానో నాకుగా నేను సమాధానాలు వెతుక్కుని, దొరికిన సమాధానాలు నలుగురితోటి పంచుకోవాలి. అందుకు సాహిత్యం మంచి సాధనం. అందులో నాకు ప్రవేశమూ వుందీ. ఆసక్తీ వుందీ. అభినివేశమూ వుంది. కాబట్టి, దాన్ని ఒక సాధనం గా తీసుకుని పని చెయ్యాలనే ఆలోచన కలిగింది. అప్పుడు నేను ఎన్నుకున్నది వచనం. కవిత్వం రాస్తున్నా కూడా వచనం ఎన్నుకోవడానికి కారణం నేనెన్నుకున్న పని చాలా పెద్దది. స్త్రీ వాద సిద్ధాంత ప్రతి పాదన చెయ్యాలి. సిద్ధాంతాన్ని తెలుగులో తీసుకురావాలి. అప్పటికింకా తెలుగులో స్త్రీవాద సిద్ధంతాన్ని ప్రతిపాదించే పుస్తకాలు లేవు.

ఇంకొకటి స్త్రీ వాద సాహిత్య విమర్శ చెయ్యాలి. స్త్రీ వాద నవలలూ కథలూ రాయాలి. ముఖ్యంగా సిద్ధాంత రచనకీ, సాహిత్య విమర్శకీ వీటన్నిటికీ వచనం బాగా ఉపయోగ పడుతుంది. అందువల్లే కవిత్వం ప్రక్కన బెట్టి, వచనం లో కథలు, నవలలూ, సాహిత్య విమర్శ, సిద్ధాంత రచన ఇంకా రకరకాల రచనా ప్రక్రియలనన్నిటినీ వాడుకున్నాను. వచనమంటే ఇష్టమని కాదు. అసలు నాకు కవిత్వమంటే ఇష్టం. వచన ప్రక్రియలోని విభిన్న అవకాశాలు నన్ను అటు మొగ్గు చూపేలా చేశాయి. అందులో ఒక సిద్ధాంత వ్యాసం రాయొచ్చు, ఒక సాహిత్య వ్యాసమూ రాయొచ్చు. ఇంకా సామాజిక విషయాల మీద వ్యాసాలు రాయొచ్చు. కథలూ నవలలూ రాయొచ్చు. ఇలా వీటన్నిటి కోసం నేను వచనాన్ని వాడుకున్నాను కాబట్టి నేను వచనం లో ఎక్కువ వ్రాసినట్టు కనబడుతుంది.

Qకథ, నవల; ఈ రెండు ప్రక్రియల్లో ఏది మీకు సౌకర్యంగా అనిపించింది?

నవల కన్నా కథ ఎక్కువ సౌకర్యవంతం గా ఫీలయ్యాను.

Qనవలలో కంటే కథలో మీరు మీ సైద్ధాంతిక వాదనని ఎక్కువ బలంగా పెడ్తున్నారని ఇటీవలి ‘విముక్త’ కథల్ని బట్టి అర్థమవుతోంది? అంటే, కథని మీరు మీ సైద్ధాంతిక వాదనకి సాధనంగా చూస్తున్నారా?

‘విముక్త’ కథలు చూస్తేనే అనిపించనవసరం లేదు. విముక్త కథలు ఇటీవల వచ్చినవి. నా మొట్ట మొదటి కథా సంకలనం రాజకీయ కథలు చూశారా? అందులో నా సైద్ధాంతిక ప్రతిపాదనకు రాజకీయ కథలను శక్తివంతమైన ప్రక్రియగా వాడుకున్నాను. అవి స్త్రీ శరీరాన్ని పితృస్వామిక సమాజం ఎలా అణచి వేస్తుందో, స్త్రీ శరీరం లో ఒక్కొక్క భాగం — జుత్తు, కళ్ళు, ముక్కు, నోరు, స్తనాలు, యోని — అన్నిటినీ ఎలా అణిచి వేస్తుందో ఒక్కొక్క భాగానికీ ఒక్కొక్క కథ రాసుకుంటూ వచ్చాను.

పునరుత్పత్తి రాజకీయాల గురించి భిన్న సందర్భాలనే కథా సంకలనం తీసుకొచ్చాను. అందులో కూడా పునరుత్పత్తి రాజకీయాలేమిటి, పునరుత్పత్తి ప్రక్రియ స్త్రీని అణిచివేయడానికి ఎలా ఉపయోగించబడింది, మాతృత్వం అంటే,  లైంగికత్వం అంటే యేమిటి, మానభంగాలు, ఇంకా చిన్నపిల్లల మీద అత్యాచారాలు, కుటుంబ నియంత్రణ పేరుతో జరిగే రాజకీయం వీటన్నిటినీ ఎక్స్ ప్లోర్ చేస్తూ రాసిన కథలే ‘భిన్న సందర్భాలు ‘. అప్పటి నుండీ విముక్త వరకు కూడ ఒక్కొక్క అంశాన్నే ఎక్స్ ప్లోర్ చేస్తూ రాయడానికి నాకు కథా ప్రక్రియ బాగా తోడ్పడింది.

రాజకీయ కథలు నుండీ విముక్త వరకూ ఒక ప్రయాణం. ఒక కథా ప్రయాణం. దానిలో అప్పటి నుండీ ఒక్కో కథా సంకలనంలో నా కథా సిద్ధాంతాన్ని ఒక్కో కోణం లో బలపరుచుకుంటూ వస్తున్నా.

Q సమకాలీన స్త్రీవాద సాహిత్యం నిశ్శబ్దంలోకి వెళ్లిందని అనుకుంటున్నారా? మీ తరం రచయిత్రులు, కవయిత్రులూ వున్నంత బలంగా ఇప్పటి రచయిత్రులు ఎందుకు రాయడం లేదు?

ఏం తగ్గలేదు . స్త్రీ వాద సాహిత్యం చాలా బలంగా వస్తోంది. అటు కవిత్వం లోనూ, కథల్లోనూ వస్తోంది. నవలలు ప్రచురించేందుకు చోటు లేకపోవడం , పెద్ద కధకి అవకాశం లేకపోవడం వేరే ఇతరేతర కారణాల వల్ల నవలలు జనరల్ గానే తగ్గినాయి. కథలూ కవిత్వం వ్రాసే కొత్త రచయిత్రులు చాలా మందే వస్తున్నారు. అనేక వర్గాల నుండి వస్తున్నారు. అంతకు ముందు అగ్ర వర్ణస్తులు రాసే వారు. ఇప్పుడలా లేదు. దళిత స్త్రీలు రాస్తున్నారు

అంటే స్త్రీ వాదం చాలా విస్తృతమౌతోంది. ఒకప్పుడు స్త్రీ పురుష తేడాల గురించే స్త్రీ వాదం ఎక్కువ పట్టించుకుంది. ఇప్పుడు అలా కాకుండా దళిత స్త్రీ వాదం, మైనారిటీ స్త్రీల గొంతులేమిటీ, వాళ్ళ అణచివేత ఎలా వుంటుంది, వీటన్నిం టి కీ వున్న తేడా ఏమిటి, వీళ్ళందరూ ఎవరి అస్తిత్వాలను నిరూపించుకుంటున్నారు. ఇవన్నీ ఇప్పుడొచ్చినాయి. అనేక పాయలుగా విస్తరించింది. ఇప్పుడే పవర్ ఫుల్ గా వుందీ అనిపిస్తోంది. చాల మంది దళిత కవయిత్రులు రచయిత్రులూ చాలా పవర్ ఫుల్ గా రాశారు. గోగు శ్యామల కవితా సంకలనం చూస్తే అనేక మంది దళిత కవయిత్రులు రాశారు. వాళ్ళు రాసింది ఒకటి రెండు కవితలైనా వాళ్ళ గొంతు వినిపిస్తున్నారు. సుభద్ర, శ్యామల, షాజహాన మొదలైన వాళ్ళ గొంతులు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఇలా వీళ్ళందరూ రావడానికి స్త్రీ వాదం దోహదం చేసింది. దళితవాదమూ, అస్తిత్వ స్పృహ రావడానికి కూడా స్త్రీ వాదం తోడ్పడింది.

Q ఈ తరం రచయిత్రుల్లో మీకు కనిపిస్తున్న బలమూ, బలహీనతా ఏమిటి?

ఇప్పటి రచయిత్రుల్లో తమను తాము గుర్తించుకోవాలన్న తపన, సమాజం లో తమ అస్తిత్వాన్ని గుర్తించాలన్న తపన — అదీ వాళ్ళ బలం. బలహీనత ఏమిటంటే, తమ అస్తిత్వాన్ని గురించిన తపన తో పాటు, సమాజం లో వున్నటువంటి ఇతర అస్తిత్వాల గురించిన ఆసక్తి, వాటిని తమ అస్తిత్వం తో సరి చూసుకుని (బాలెన్స్ చేసుకుని) తమతో కలిసి వచ్చే శక్తులేంటీ అనే విషయాన్ని గమనించి ఇంకా తమ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించవచ్చు.

అది బలహీనత అని కూడా అనను. బలహీనతలని చెప్పుకోవడానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు. అవన్నీ బలహీనతలా కావా అని నేను చెప్పలేను. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ వాళ్ళ పరిస్థితులూ, నేపథ్యం, సామాజిక అస్తిత్వం, స్వీయ అస్తిత్వం ఇన్ని వుండీ అన్నిట్లోనుండి రాస్తున్నారు. అన్ని సంఘర్షణల్లోంచీ రాస్తున్నరు. అలా రాసేటప్పుడు వాళ్ళ ప్రయాణం లో ఒక్కొక్క సారి బలాలు బలహీనతలవుతాయి. అలాగే బలహీనత అనుకున్నది బలమూ కావొచ్చు. అందువల్ల మనం ఈ విషయాల్లో జడ్జిమెంటల్ గా వుండకూడాదు. ఇలాంటి పరిస్థితుల్లో బలహీనత ఎప్పుడైన బలహీనపడిపోతుంది. బలం ఇంకా పెరుగుతూ పోతుంది.

Q ఈ సుదీర్ఘ సాహిత్య యాత్ర మీకు తృప్తినిచ్చిందా? వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదయినా నిరాశగా అనిపిస్తున్నదా?

నా సాహిత్య ప్రయాణం నాకు తృప్తి గానే వుంటుంది.నేను కేవలం రచనే కాదు విడిగా సమాజం లో స్త్రీల కోసం పని చేస్తున్న సంస్థలు — ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్, ఇంకా స్త్రీల కోసం పని చేసే అనేక సంఘాల్లో కార్యకర్తని. అందువల్ల నాకు దొరికిన సమయంలో ఇంతే రాయగలిగాను అన్న తృప్తి వుంది. ఇంకా సమయం దొరికి వుంటే ఇంకా రాసివుండేదాన్ని.

ఒక్కో సారి అవసరం అలా రాయిస్తుంది. ఒక విషయం మీద ఫలానా వ్యాసం రాసి పంపాలీ అంటే రాసేయడం. దాన్ని చెక్కడం, శిల్పం ఇలా చూడటానికి సమయం వుండదు. కథలు అంటే రీడర్స్ ఆసక్తిగా చదవాలి అని వుంటుంది. ఎవరినుంచీ ఈ కథ ఆసక్తిగా చదివించ లేదు అన్న ఫిర్యాదు రాలేదు. ఎప్పుడూ మీ కథ మొదలు పెడితే ఆపలేము, అనే అందరూ అన్నారు  కానీ ఫలాని కథ చదవలేకపోయాము అని ఎవ్వరూ అనలేదు. నా రచనలని చూసుకుని చాలా బాగా రాశాను అనే తృప్తి కంటే నాకు దొరికిన సమయానికి తగినట్లు రాయగలిగాను అన్న తృప్తి ఉంది.

నా కథల్ని హాయిగా చదువుకోగలిగారు, ఆలోచించగలిగారు, మారగలిగారు. అది నాకు చాలా తృప్తినిచ్చిన విషయం.

Qమీ రచనల్ని గురించి క్లుప్తంగా ‘ఇదీ’ అని అడిగితే ఏమంటారు?

నా రచనల గురించి నేనేం చెప్పుకుంటాను…(నవ్వు)

నాకు స్త్రీ వాదమే సందర్భం. స్త్రీ వాద ఉద్యమమే సమయం. అదే సమయం అదే సందర్భం. అదే నేపథ్యం. స్త్రీ వాదాన్ని తెలుగు సాహిత్యం లోనూ తెలుగు సమాజం లోనూ బలమైన వేళ్ళూనాలి అనే సంకల్పంతోనే నా రాజకీయ కథలు, స్త్రీల అణచివేత, పునరుత్పత్తిరాజకీయాలు, పురుషాహంకారం, లైంగిక సంబంధాలూ, ఇలా వీటన్నిటి గురించీ, స్త్రీల పౌరసత్వ భావనలూ, వాళ్ళ మానవ హక్కులు, వీటన్నిటి గురించి రకరకాల రూపంలొ రాయడం అనేది నాకు అవసరం. కథలూ నవలలూ రాస్తే అవి చదువుకునే వాళ్ళకే చేరతాయి. అలాకాకుండా మామూలు పల్లెటూరి వాళ్ళ కోసం జానపద ట్యూన్స్ తో పాటలు,వీధి నాటికలు , రాశాను. సినిమా స్క్రిప్ట్స్ రాశాను. యుద్ధమూ-శాంతీ, లక్ష్మణ రేఖ, ద్రౌపది వంటి నృత్య నాటికలు, పిల్లలకు వుండే సమస్యల్ని చూపించే బాలల చిత్రాలకు మాటలు  రాశాను. ఉషా కిరణ్ సంస్థ లో  పని చేస్తున్నప్పుడు స్త్రీల సమస్యల్ని చూపించే సీరియల్స్ రాశాను.

కొకు బకాసుర కథని తీసుకుని దాన్ని నాటకం చేశాను. చలం గారి నవలల్లోని ఆరు పాత్రలు తీసుకుని వాళ్ళు ఒకచోట కలిస్తే ఎలా వుంటుందీ అన్న భావన ఆధారంగా రాసినది “వాళ్ళు ఆరుగురు.”

కథ, నవలలు, సినిమా, పాటలు, నృత్యం, రూపకం – ఇట్లా నేను ఉపయోగించుకోని ప్రక్రియ లేదు. ఇది నాకు తృప్తిగా కూడా వుంటుంది. చాల కష్టపడ్డాను, సంతోష పడ్డాను, బోలెడన్ని విమర్శలూ ఎదుర్కొన్నాను. కొన్నిసార్లు నా రచనల్లో నా వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడం జరిగింది. ఇట్లాంటివి జరిగినపుడు బాధగా వుంటుంది. కానీ సమాజాన్ని ఎదుర్కొని , సంస్కృతికి భిన్నంగా చూడాలనుకున్నప్పుడు రచయిత్రులు ఇట్లాంటివి ఎదుర్కోవాల్సి  వుంటుంది. ఇలాంటి సమస్యను ప్రపంచం లోని అన్ని భాషల్లోని రచయిత్రులూ ఎదుర్కోన్నారు. నేను కూడా అందులో భాగమనుకుని అలా ముందుకు సాగిపోతున్నాను.

మీ మాటలు

 1. “నాకు స్త్రీ వాదమే సందర్భం. స్త్రీ వాద ఉద్యమమే సమయం. అదే సమయం అదే సందర్భం. అదే నేపథ్యం. ” బ్రిల్లియన్ట్ …ఈతరంలో ఈ అస్తిత్వస్పృహ, ఈ నిబద్ధత కావాలి. అప్పుడే తెలుగు సాహిత్యం మరో మలుపు తిరుగుతుంది. ఎన్నో మలుపులకోసం ఎదురుచూస్తుంది.

 2. mercy margaret says:

  బాగుంది ఇంటర్వ్యూ .. అప్పుడే అయిపోయిందా అనిపించేట్టు , ఓల్గా గారి పరిచయం , వారి భావాలూ ఇలా పరచియం చేసినందుకు ధన్యవాదాలు

 3. renuka ayola says:

  వ్యక్తిగా రచయిత్రిగా నేను అభిమానించే ఓల్గతో పరిచయం చాలా బాగుంది జయశ్రీ నాయుడు గారితో మరిన్ని కప్పు కాఫీ కబుర్లు వినాలని అశిస్తూ అభినందనలు….

 4. మంచి ఇంటర్వ్యూ జయశ్రీ గారు..కీప్ గోయింగ్

 5. ఓల్గా గారితో లోతైన పరిచయం. స్త్రీ వాదం పట్ల వారి నిశ్చితాభిప్రాయం, ప్రస్తుతం వస్తున్నసాహిత్యం గురించి ఆమె అభిప్రాయం అన్నీ ఆసక్తిగా, విపులంగా ఉన్నాయి.
  రెండు దశాబ్దాలుగా స్త్రీల సాహిత్యం గురించి ఓల్గా గారు చెపుతున్న విషయం ” ప్రతి ఒక్కరికీ వాళ్ళ పరిస్థితులూ, నేపథ్యం, సామాజిక అస్తిత్వం, స్వీయ అస్తిత్వం ఇన్ని వుండీ అన్నిట్లోనుండి రాస్తున్నారు. అన్ని సంఘర్షణల్లోంచీ రాస్తున్నరు ” అన్నది వాస్తవం.
  బలం – బలహీనతల తో నడుస్తున్న స్త్రీ వాదం కి ఓల్గా గారి మరింత కృషితో అందరి సహకారం తో సంపూర్ణత్వం రావాలని కోరుకుంటూ ..
  ఓల్గా గారిని పరిచయం చేసిన జయశ్రీ నాయుడు గారికి ధన్యవాదములు

 6. ఓల్గా గారు తను చెప్పదలుచుకున్నది ఎంత ఖచ్చితంగా రాస్తారో
  మాటల్లో మాత్రం సుతిమెత్తగా మాట్లాడతారు ….
  మిగతా స్త్రీ వాద రచయతలకు , ఓల్గా గారికి నాకు కనిపించిన డిఫరెన్స్ ఏంటంటే
  ఒక మూల కుర్చుని రాయకుండా ఓల్గా గారు
  కమ్యునిస్ట్ సంఘాలతో కలిసి సమాజంలో పని చేసారు ….
  మనుషులను చదివారు , స్త్రీల కష్టాలను స్వయం గా చూసారు , …
  భద్రతగా కూర్చొని ఊహించి రాసినవి కాదు ఆమె రచనలు ..
  అందుకే ఆవిడ రచనలలో ఒక రిచ్ నెస్ ఉంటుంది….
  కళ్ళు అక్షరాలవెంట పరిగెడతాయి …
  నాకు చాలా చాలా ఇష్టమైన రచియిత్రే కాదు ఒక మంచి మనిషి …
  ఆవిడ భావాలు నాకు ఆదర్శం …
  మంచి ఇంటర్వు చేసారు జయశ్రీ గారు ….

 7. buchireddy says:

  కాఫే—అయిపోయింధీ తోంధ ర గా—ఇంకా
  కొంత సేపు— ఇంటర్‌వ్యూ—చేస్తే బాగా ఉండు–
  జయ శ్రీ గారు ఇంటర్‌వ్యూ బాగుంధీ— సగం లో నే ఆపి వేశారు
  ఇంకా వోల్గా గారిని అడుగాలిసిన వి — ఎన్నో ఉన్నాయి అనుకుంటా—
  నా ఆ బి మాన రచయిత్రి వోల్గా గారు—–
  బుచ్చి రెడ్డి గంగుల

  • muvva srinivasarao says:

   ఓల్గా గారి గురించి అన్నీ తెలిసిన విషయాలేఅయునా ..మళ్ళీ వింటుంటే…కొత్తగానే వుంది …నిజం చెప్పేందుకు గొంతును ఎంత బలంగా విప్పాలో ..ఎంత తఫస్సు చెయ్యాలో …అమె జీవితం ఓ ఉదాహరణ …సాహిత్యాన్ని ..ఓ సామాజిక ప్రయోజనం కోసం ఎంతగా వాడుకోవాలో …తెలుసుకోవాలంటే అమె రచనలు ..చదవాల్సిందే …అందుకే అమెకు ఇంత గౌరవం …మార్క్సిటు శిబిరం నుండి బయటకు వచ్చినా ..వాళ్ళకు ఓల్గా గారిపట్ల ఏమాత్రం గౌరవం తగ్గక పోవడానికి ఆమె నిబద్దతే కారణం …..ఏదేమయునా ఓ మంచి ఇంటర్వ్యు చదివించినందుకు ..ధన్యవాదాలు …

 8. muvva srinivasarao says:

  ఓల్గా గారి గురించి అన్నీ తెలిసిన విషయాలేఅయునా ..మళ్ళీ వింటుంటే…కొత్తగానే వుంది …నిజం చెప్పేందుకు గొంతును ఎంత బలంగా విప్పాలో ..ఎంత తఫస్సు చెయ్యాలో …అమె జీవితం ఓ ఉదాహరణ …సాహిత్యాన్ని ..ఓ సామాజిక ప్రయోజనం కోసం ఎంతగా వాడుకోవాలో …తెలుసుకోవాలంటే అమె రచనలు ..చదవాల్సిందే …అందుకే అమెకు ఇంత గౌరవం …మార్క్సిటు శిబిరం నుండి బయటకు వచ్చినా ..వాళ్ళకు ఓల్గా గారిపట్ల ఏమాత్రం గౌరవం తగ్గక పోవడానికి ఆమె నిబద్దతే కారణం …..ఏదేమయునా ఓ మంచి ఇంటర్వ్యు చదివించినందుకు ..ధన్యవాదాలు …

 9. ఇంటర్వ్యూ చాలా బాగుంది,.ఓల్గా గారి అంతరంగాన్ని స్పృశించిన జయ శ్రీ గారికి అభినందనలు,.

 10. RammohanRao thummuri says:

  గత సంవత్సరం న్యూజెర్సీ లోని ఓ గ్రంధాలయానికి వెళితే ఓల్గా గారి కథల సంపుటి దొరికింది.తీసుకెళ్ళి చదివాను .మా సదాశివ మాస్టారు గారన్నట్లు ఒక ఎమోషన్ లో రాస్తే శిల్పం వగైరాలన్నీ వాటంతట అవే వస్తాయి.ఏ కథా విసుగనిపించలేదు .1998 లో వచన కవితా శిబిరం కార్యక్రమం లోవారితో ప్రత్యక్షంగా చర్చించిన సందర్భం గుర్తుకు తెచ్చిన మీ ఇంటర్వ్యూకి
  అభినందనలు.

 11. ఆ ఫోటోలో ఎవరు జయశ్రీ గారో ఎవరు వోల్గా గారో చెప్తే బాగుండేది :)

  • Jayashree Naidu says:

   నమస్తే యాజి గారు ! ఫోటో లో పింక్ కలర్ సారీ కట్టుకున్న మహిళే మన ప్రఖ్యాత రచయిత్రి ఓల్గా గారు.

   మీరు మంచి హాస్య ప్రియులనుకుంటా :)

 12. Y RAJYALAKSHMI says:

  ఇంటర్వు బావుంది. ఓల్గా గారు నా అభిమాన రచయిత్రి.

 13. kothapalli ravibabu says:

  నిజంగా కమ్మునిష్టులు పితృస్వామిక సమాజంలో స్త్రీల అణచివేత గురించి పట్టించులోలేదా? స్త్రీల సమస్యల గురించి ఆలోచించ లేదా? చర్చించాల్సిన అన్యాయమైన ఆరోపణ ఇది .

 14. Olgagaritho interview gave immense satisfaction and happiness.she is my favourite person. Thank you Jayashrigaru.

  • Jayashree Naidu says:

   సుశీల గారు

   ఇంటర్వ్యూ మీకు మీకు నచ్చినందుకు చాలా సంతోషం

 15. Rajendra Prasad Chimata says:

  ఆ ప్రశ్నల్ని వాళ్ళూ సహించలేక పోయారు. పురుషాధిపత్యం వంటి పదాలను కూడా అక్కడ వాడకూడదు. ” అలాంటి మాటలు వాడటం వల్ల ప్రధాన విప్లవం అంతా పెడత్రోవ పడుతుంది. మనం ముందు విప్లవం తెస్తే తర్వాత స్త్రీ పురుష సమానత్వం దానితో పాటే వస్తుంది” అనే సమాధానాలు తప్ప, స్త్రీల సమస్య ఒక ప్రత్యేకమైనటువంటిదనీ, స్త్రీల అణచివేత పితృస్వామిక సమాజం లో ఎలా జరుగుతుందన్న చర్చగానీ, అసలిది పితృస్వామిక సమాజమనే గుర్తింపు గాని, ఇవేమీ అస్సలు లేవు. అటువంటి సమయం లో నేను వాటి గురించి ప్రశ్నించాను. వాళ్ళ సమాధానాలతో తృప్తి పడకపోవడంతో అక్కడ ఇమడలేకపోయాను. రాజీనామా చేసి ఆ సంఘాలు అన్నిటి నుంచీ బయటకు వచ్చాను.
  ఈ ఆరోపణలకు విరసం, జనసాహితీ వగైరా లు జవాబివ్వాలి

మీ మాటలు

*