వివాహం జరిగింది…విషాదం మిగిలింది

స్లీమన్ కథ-8

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు, అష్ట్రఖాన్ కాలర్ తో లాంగ్ కోటు, తార్తార్ తరహా మీసకట్టు, చేతిలో నల్లమద్దికర్రతో చేసిన బెత్తం…విజయశిఖరాలకు ఎగబాకిన ఒక వ్యాపారవేత్తకు ముమ్మూర్తులా సరిపోయే వేషం అతనిది!

[అష్ట్రఖాన్ కాలర్:  నైరుతి రష్యాలో, ఓల్గా డెల్టాలోని ఒక నగరం అష్త్రఖాన్. ఇక్కడి ‘కేరకుల్’ గొర్రెలు మంచి బిగువైన, వంకీలు తిరిగిన ఉన్నికి ప్రసిద్ధి. కొన్ని రోజుల వయసు మాత్రమే ఉన్న గొర్రెనుంచి తీసిన ఉన్ని మరింత శ్రేష్ఠం.  పిండదశలో ఉన్నప్పుడే ఉన్ని తీయడమూ జరుగుతుంటుంది. అలాంటి ఉన్నితో చేసిన కాలర్ ను అష్ట్రఖాన్ కాలర్ అంటారు. ఆ కాలర్ తో కోటు ధరించడాన్ని సంపన్నవర్గాలు హోదాకు, ప్రతిష్టకు చిహ్నంగా భావిస్తాయి]

అతనికి సొంత గుర్రపు బండి ఉంది. సువిశాలమైన అతని నివాసం, సెయింట్ పీటర్స్ బర్గ్ లోని ఓ అత్యుత్తమ వీధిలో ఉంది. అందులో రెండు డ్రాయింగ్ రూములు, ఏడు పడగ్గదులు, అయిదు ఇతర గదులు, ఓ పెద్ద వంటగది, గుర్రపుశాల, ఓ పెద్ద నేలమాళిగ, గుర్రపు బండి ఉంచడానికి ఒక గ్యారేజి…! అత్యంత శ్రేష్ఠమైన అన్ని రకాల మద్యాలూ ఆ నేలమాళిగలో అందుబాటులో ఉంటాయి. ఎంతో ఖరీదు చేసే మూడు జాతిగుర్రాలు ఆ గ్యారేజిలో సిద్ధంగా ఉంటాయి.

అతను కాలిఫోర్నియా బంగారం భూములనుంచి ఓ పెద్ద సంపదను కొల్లగొట్టుకొచ్చాడన్న ప్రచారం నగరమంతటా మోతెక్కిపోయింది. దాంతో, సాహసికుడైన ఈ వ్యాపారవేత్తనుంచి ఆహ్వానం అందుకోడానికి రాచకుటుంబీకులు, వ్యాపార ప్రముఖులు తహతహలాడారు.  అతనిలో డాబుకూ, దర్పానికీ లోటులేదు. ఉన్నతవర్గాలలో కలసిపోవడానికి అవసరమైన నాజూకు పద్ధతులను అప్పటికే అలవరచుకున్నాడు. ఒక్కోసారి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు. ఒకే ఒక్క అతిథి గదిని అలంకరించడానికి ఓసారి వెయ్యి రూబుళ్ళు వెచ్చించాడు. సెయింట్ పీటర్స్ బర్గ్ మొత్తంలో అతనంత అదృష్టవంతుడు, అంత స్నేహయోగ్యుడు ఇంకొకరు లేరని అందరూ అనుకుంటున్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు అధ్యక్షుడు కాదగిన వాళ్ళ జాబితాలో అతని పేరు కూడా ఉంది!

ఇదంతా పైకి కనిపించే మనిషి గురించి. కానీ లోపలి మనిషి వేరు. ఇద్దరి మధ్యా పోలిక లేదు. అతని లోపల జ్వాలలు రేగుతున్నాయి. తీరని లైంగికేచ్ఛ అతనికి పిచ్చెక్కిస్తోంది. ఇల్లు అమరింది కానీ, ఇల్లాలు, పిల్లల కోసం తపిస్తున్నాడు. గతంలో ఓసారి ఎకతెరీనా లిషిన్ ముందు పెళ్లి ప్రతిపాదన చేశాడు. అప్పటికే తను సంపన్న వర్తకులలో ఒకడు. కానీ లిషిన్ ఇష్టపడలేదు. అయినా అతనిలో ఆశ చావలేదు.

Ikaterina Lishin

సెయింట్ పీటర్స్ బర్గ్ కు వచ్చిన మరునాడే ఆమె ఇంటికి వెళ్ళాడు.  ఆ తర్వాత కూడా కొన్ని వారాలపాటు తరచు ఆమెను కలసుకుంటూనే వచ్చాడు. రాను రాను ఆమెను తను గాఢంగా ప్రేమిస్తున్నట్టు అనిపించింది. తన జీవితాంతం ఆమెను ప్రేమిస్తూనే ఉండాలని కూడా అనుకున్నాడు. మంచితనం, దయ, నిరాడంబరత, ఏం చెప్పినా శ్రద్ధగా వినే తత్వం సహా తను కోరుకునే సుగుణాలు అన్నీ ఆమెలో అతనికి కనిపించాయి. తన ఇంట్లో ఉన్నా, వర్తకప్రముఖుల ఇళ్ళల్లో విందు వినోదాలలో పాల్గొంటున్నా ఆమె ఒకే తీరుగా నిండుకుండలా ఉంటుందనుకున్నాడు. అతనామెను అమితంగా ఆరాధించాడు. ఆమె సంతోషం కోసం ఏమైనా చేస్తానని వాగ్దానం చేశాడు.

ఆమె పెళ్ళికి ఒప్పుకుంది!

ఆ క్షణంనుంచీ అతను భూమికి ఆమడ ఎత్తున ఊరేగాడు. 1852 అక్టోబర్ 12- పెళ్లిరోజున ఇంటికి ఇలా ఉత్తరం రాశాడు:

ఈరోజు ఎకతెరీనా లిషిన్ అనే ఒక రష్యన్ యువతికి భర్తనయ్యే సంతోషం నాకు దక్కింది. శారీరకంగా, మానసికంగా కూడా నా భార్య ఓ పరిపూర్ణస్త్రీ. మంచితనం, నిరాడంబరత, తెలివి, వివేకం మూర్తీభవించినది. ఆమెపై నా ప్రేమ, గౌరవాలు రోజు రోజుకీ ఇనుమడిస్తున్నాయి. ఈ సంతోషభరితమైన వివాహాన్ని పురస్కరించుకుని జీవితాంతం సెయింట్ పీటర్స్ బర్గ్ లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను.

అయితే, తన వివాహం గురించిన ఇంత అందమైన ఊహా ఇసుకగూడు కావడానికి ఎన్నో రోజులు పట్టలేదు. “ఈ పెళ్లి పూర్తిగా ఒక తప్పుడు నిర్ణయం. నాకిప్పుడు పిచ్చెక్కేలా ఉం”దని…ఆ తర్వాత కొన్ని వారాలకే తోబుట్టువులకు ఉత్తరం రాశాడు. కొంతమందిలో కోరికల మంట మృదువుగా, కనిపించీ కనిపించని జ్వాలలా ఉంటుందనీ, కానీ నాలోని తీరని కోరికల మంట దావాగ్నిలా మారి నన్నే దహించివేస్తోందనీ ఆవేదన చెందాడు.

భార్యనుంచి అనురాగపు వెచ్చదనాన్ని ఆశించాడు. కానీ ఆమె దేనికీ లొంగని జడపదార్థం అయింది.  అంతమంది రష్యన్ యువతుల నుంచి తను ఏరికోరి వరించిన ఈ యువతి; స్త్రీ సహజమైన ఎలాంటి సున్నితత్వమూ, స్పందనా లేని పరమ గయ్యాళి అతనికి అర్థమైంది. అతనితో పడకను పంచుకోవడానికి ఆమె నిరాకరించింది. మాటి మాటికీ అతన్ని సూటిపోటి మాటలతో హింసిస్తూవచ్చింది. ఆమె కేవలం డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకుందనీ, తను చస్తే ఆస్తిని ఎగరేసుకుపోవడానికి చూస్తోందనే భావన అతనిలో బలపడిపోయింది.

మిన్నా మెయింక్ తో అతని ప్రేమ, పెళ్ళికి దారితీయలేదు. ఎకతెరీనా లిషిన్ తో పెళ్లి, ప్రేమకు దారితీయలేదు. మొత్తానికి ప్రేమా, పెళ్లీ…రెండూ అతనికి కలసి రాలేదు!

ఈ పెళ్లి అతనికి ఎంతటి ఆఘాతం అయిందంటే; సలహాను, ఓదార్పునూ కోరుకుంటూ తోబుట్టువులతోపాటు మిత్రులకు కూడా వరసపెట్టి ఉత్తరాలు రాయడం ప్రారంభించాడు. అయితే ఎవరి నుంచీ ఎలాంటి ఓదార్పూ దొరకలేదు. “నువ్వన్నట్టు ఎకతెరీనాకు నీ మీద ప్రేమ లేదనే అనుకుందాం. అయినాసరే నిన్ను పెళ్లాడిన మేరకు ఆమె తన జీవితాన్ని త్యాగం చేసిందన్న వాస్తవాన్ని నువ్వు మరచిపోకూడదు” అని ఏమ్ స్టడామ్ నుంచి ఒక మిత్రుడు రాశాడు. “బహుశా ఆమె మరీ అంత చెడ్డది కాకపోవచ్చు, నీ పిసినారితనం చూసి భయపడి ఉంటుంది, ఆమె పట్ల మరింత ఉదారంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఆమె నీపై ప్రేమాభిమానాలు చూపవచ్చు”అని  సలహా ఇచ్చాడు. తోబుట్టువుల నుంచి వచ్చిన స్పందన కూడా ఇదే ధోరణిలో ఉంది. “నువ్వో పెద్ద జడపదార్థానివి కనుకే నీ భార్య అలా అయుంటుంది, కాస్త మనిషిలా ప్రవర్తించడం నేర్చుకొ, నువ్వు ఒకరికి ప్రేమ ఇస్తేనే ప్రేమ పొందగలుగుతా”వని హితవు చెప్పారు.

అయితే, మనిషిగా జీవించడం ఎలాగో నేర్పే స్కూలు ఏదీ అతనికి దొరకలేదు!

దాంతో చేసేది లేక పూర్తిగా తన వ్యాపారప్రపంచంలో కూరుకుపోయాడు. ఆ ప్రపంచానికి తనే యజమాని. అక్కడ ఎలా వ్యవహరించాలో, ఎలా రాణించాలో అతనికే బాగా తెలుసు, ఎవరూ నేర్పనక్కర్లేదు.

స్వభావరీత్యానే అతనిలో ఓ జూదగాడు ఉన్నాడు. రష్యాకు తిరిగొచ్చాక తన సంపదనంతటినీ నీలిమందు వ్యాపారం మీద పెట్టేసాడు. మార్కెట్ ను తనే నియంత్రించే స్థాయికి వెళ్ళాడు. పెళ్ళైన కొన్ని వారాలకే మాస్కోలో తన కార్యాలయ శాఖను తెరిచి దాని నిర్వహణ బాధ్యతను మిత్రుడు అలెగ్జీ మద్వీవ్ కు అప్పగించాడు. ఇప్పటికీ రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పనిచేస్తున్నాడు. ఇంటికి వెళ్లడం చాలా అరుదైపోయింది. ఎప్పుడూ ధుమధుమలాడుతూ పెడసరపు మాటలతో నొప్పించే భార్యకు ఎదుట పడడానికి జంకి, సెయింట్ పీటర్స్ బర్గ్ లోని తన ముఖ్యకార్యాలయంలోనే ఎక్కువగా గడుపుతున్నాడు. మధ్య మధ్య దేశదిమ్మరిలా రష్యా చుట్టివస్తున్నాడు.

మనసుకింత ఆనందాన్నీ, విశ్రాంతినీ కలిగించే ఇతరేతర ఆసక్తులేవీ అతనికి లేకుండా పోయాయి. చిన్నప్పటినుంచీ తను అభిమానిస్తూ వచ్చిన హోమర్ కూ; గ్రీకు, రోమన్ పురాతన చరిత్రకూ కూడా దూరమైపోయాడు. ఇప్పుడతనికి పూర్తిగా వ్యాపారమే మత్తుమందూ, వ్యసనమూ  అయిపోయింది. క్రోన్ స్టట్ షిప్పింగ్ జర్నల్  ప్రతులను తండ్రికి పంపడంలో మాత్రం ఆనందం పొందేవాడు. అందులో; వచ్చి పోయే సరకు రవాణా నౌకల పేర్లు; ఆ సరకు యజమానులు, దానిని అందుకోబోయే వాళ్ళ పేర్లు ఉంటాయి. వాటన్నింట్లోనూ హెచ్. స్లీమన్ & కోకు నీలిమందు తీసుకువెడుతున్న నౌకల జాబితాయే పెద్దది. 1853లో ఆ కంపెనీకి పదమూడు నౌకల్లో నీలిమందు రవాణా జరిగినట్టు, ఆ కంపెనీ నుంచి మూడు నౌకలు బయటికి వెళ్ళినట్టు అప్పటి నివేదిక చెబుతోంది.

అయితే ఇది పాక్షిక సమాచారం మాత్రమే. ఇంకా వేలాది వాహనాల్లో కోనిగ్స్ బర్గ్ నుంచీ, మేమల్ నుంచీ అతని కంపెనీకి సరకు రవాణా అవుతుండేది. తన వ్యాపార పరిమాణం ఇప్పుడు నెలకు పది లక్షల సిల్వర్ రూబుళ్లనీ, అంతూపొంతూ లేకుండా అది ఇంకా పెరుగుతూనే ఉందనీ, డబ్బు సంచుల మీద డబ్బు సంచులు, బంగారం మీద బంగారం వచ్చిపడుతున్నాయనీ తండ్రికి ఉత్తరం రాశాడు. అయినాసరే, జీవితంలో తను కోరుకున్న సంతోషం కనుచూపు మేరలో ఎక్కడా కనిపించని సంగతినీ బయటపెట్టుకున్నాడు.

వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతజీవితం గడపాలన్న పాత కల ఇప్పుడు కొత్తగా తిరగబెడుతోంది. అయితే ఒక తేడా: మెక్లం బర్గ్ కు బదులు అమెరికా వెళ్ళిపోయి, అక్కడో వ్యవసాయకభూమిని కొనుక్కుని అక్కడే ఉండిపోవాలని  ఇప్పుడు అనుకుంటున్నాడు. “పల్లె జీవితాన్నే నేను ఎక్కువ ఆనందించగలననిపిస్తోంది. వ్యవసాయంలోనూ, దానిని అభివృద్ధి చేసుకోడంలోనూ చేతినిండా పని ఉంటుందనే నేను నమ్ముతున్నాను” అని అమెరికాలోని ఓ మిత్రుడికి రాశాడు.

నిజానికి ఒక వ్యవసాయదారునిలో ఉండవలసిన లక్షణాలేవీ అతనిలో లేవు. ముఖ్యంగా విత్తు నాటి అది పంట అయ్యేవరకూ ఓపికగా ఎదురుచూడడం అతనివల్ల కాదు. ఉరుకులూ పరుగుల జీవితం అతనిది. ఊపిరి సలపనంత వేగంగా నిరంతరం పని చేస్తూ ఉండవలసిందే. రోజులో ఏ కొన్ని క్షణాలైనా వ్యాపార సంబంధమైన పనిలో గడపకపోతే అతనికి వల్లమాలిన కోపం వస్తుంది. వ్యవసాయం గురించిన ఊహల్లో మరోసారి మునిగి తేలుతున్న ఈ రోజుల్లోనే తండ్రికి ఉత్తరం రాస్తూ, “ఇక వ్యాపారం కట్టిపెట్టి ప్రశాంత జీవితం గడపమని మంచి ఉద్దేశంతోనే నువ్వు సలహా ఇచ్చావు కానీ, దానిని నేను పాటించలేను. క్షణం తీరిక లేని కార్యకలాపాల్లో కూరుకుపోవడానికి నేను అలవాటు పడిపోయాను. ఎలాంటి అనుకూల పరిస్థితుల్లోనైనా సరే, కాస్సేపు స్తబ్ధంగా గడిపితే పిచ్చాసుపత్రిలో చేరాల్సివస్తుంది” అన్నాడు.

అప్పటికే అతను ఒక్కొక్కసారి పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఉద్యోగులు, పనివాళ్లు ఏ చిన్న పొరపాటు చేసినా ఆగ్రహంతో ఊగిపోతూ కేకలు లంకించుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఏజంట్లు తన ఆదేశాలను వెంటనే అమలు చేయనప్పుడు వాళ్ళకు రాసే ఉత్తరాల్లో కూడా ఓ రాక్షసుడిలా విరుచుకుపడుతున్నాడు.

అమెరికాకు పారిపోవాలన్న ఊహ అతన్ని వెంటాడుతూ వచ్చింది పెళ్ళైన ప్రారంభ సంవత్సరాలలో! అయితే, 19వ శతాబ్ది మధ్యకాలంలో రష్యాలో ఉంటూ అమెరికా కలలు కనడమంటే విధ్వంసాన్ని కొని తెచ్చుకోవడమే. ప్లేటో (క్రీ.పూ. 428-348)సృష్టించిన ఊహాద్వీపం ‘అట్లాంటిస్’లానే అప్పటికింకా అమెరికా చాలామంది దృష్టిలో ఒక పౌరాణిక ఊహా ప్రదేశమే. అక్కడి జనం సంపూర్ణ స్వేచ్ఛతో జీవిస్తూ ఉంటారు. కోపమూ, క్రౌర్యమూ నిండిన అధికారవర్గపు నిఘా చూపుల కింద నిరంతరం జీవించే దుస్థితి వారికి ఉండదు. దోస్తోయెస్కీ రాసిన ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ నవలలో స్విద్రిగైలోవ్ అనే పాత్ర అమెరికా వెళ్లాలని ఎప్పుడూ కలలు కంటూ ఉంటాడు. సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఓ శీతాకాలం రోజున అతను ఓ పెద్ద అధికార భవనం దగ్గర తచ్చాడుతూ ఉంటాడు. ఆ భవనం కాపలాదారుకూ, అతనికీ ఇలా సంభాషణ జరుగుతుంది:

schliemann

కాపలాదారు: ఇక్కడ నీకేం పని?

స్విద్రిగైలోవ్: అవును, నాకిక్కడ పనేం లేదు.

కాపలాదారు: అయితే ఎందుకొచ్చావ్?

స్విద్రిగైలోవ్: వెళ్లిపోతున్నాను.

కాపలాదారు: ఎక్కడికి?

స్విద్రిగైలోవ్: అమెరికాకు.

కాపలాదారు:  అబ్బో, అమెరికాకే!?

స్విద్రిగైలోవ్ రివాల్వర్ తీస్తాడు. కాపలాదారు నిర్ఘాంతపోతాడు.

కాపలాదారు: వద్దు, వద్దు, నువ్విక్కడ ఇలాంటి పని చేయకూడదు. ఏం, వేళాకోళంగా ఉందా?

స్విద్రిగైలోవ్: నేను చేస్తున్నది మంచిపనే.

కాపలాదారు: కాదు, కచ్చితంగా కాదు.

స్విద్రిగైలోవ్: ఇందువల్ల ఎవరికీ ఎలాంటి అపకారం లేదు. ఇదీ మిగతా చోట్ల లాంటిదే. వాళ్ళు నిన్నేమైనా ప్రశ్నిస్తే, అతను అమెరికా వెడుతున్నాడని చెప్పు.

స్విద్రిగైలోవ్ రివాల్వర్ ను తన కణతలకు గురిపెట్టుకున్నాడు.

కాపలాదారు: వద్దు, వద్దు, ఆ పని చేయద్దు. ఇది నిజంగానే తగిన చోటు కాదు.

స్విద్రిగైలోవ్ ట్రిగ్గర్ నొక్కాడు.

రష్యన్ సాహిత్యం మీద కానీ, అక్కడి తాత్విక వాతావరణంలో సంభవిస్తున్న కల్లోలం మీద కానీ స్లీమన్ ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు. కాకపోతే రష్యన్ భావోద్రేకాలలో అనివార్యంగా అతనూ పాలుపంచుకుంటున్నాడు. రష్యన్లలానే అతను కూడా అమెరికా తరహా స్వేచ్ఛను కోరుకుంటున్నాడు. కాలిఫోర్నియాలో కొన్ని మాసాలపాటు దానిని చవి చూశాడు కూడా. అదే సమయంలో రష్యన్లలానే అమెరికా జీవన విధానాలను కొన్నింటిని ఏవగించుకుంటున్నాడు. అమెరికా గురించిన కలల్ని తన ఉత్తరాలలో అతను యధాలాపంగా ప్రస్తావిస్తూ రావడం వెనుక వివాహ వైఫల్యం తాలూకు విషాదం ఉంది.

ఇప్పుడైతే వ్యాపారం ఒక్కటే అతన్ని పట్టుకుని నడిపిస్తోంది. ఆందోళనతో అప్పుడప్పుడు ఉన్మాదం అంచులు తాకుతూ, భార్యను ద్వేషిస్తూ, ఏజంట్లతో గొడవ పడుతూనే; తన ఆవర్జాల(లెడ్జర్లు)ను ముందేసుకుని కూర్చోడంలో భద్రతను, ఓదార్పును పొందుతున్నాడు. సంపద పెరుగుతున్న కొద్దీ, అతనికి దాని అవసరం తగ్గిపోతోంది. అయినప్పటికీ, అతనికి ఉనికీ, ఊపిరీ అన్నీ వ్యాపారమే అయింది. అదే అతని ధ్రువతార. అతని చూపు పడిన ప్రతిదీ లాభంగా మారాల్సిందే. చాలా అరుదైన తీరిక సమయాల్లో మాత్రం తండ్రికి, తోబుట్టువులకు ఉత్తరాలు రాస్తూ, వాటిలో నీతులూ, నిత్యసత్యాలూ బోధిస్తూ, అన్నింట్లోనూ మితంగా జీవించవలసిన అవసరాన్ని నొక్కి చెబుతూ ఉపశమనం పొందేవాడు. అతని ఉత్తరాల్లో తప్పనిసరిగా పుల్ల విరుపు ధోరణి ఉండేది. అయినాసరే, అతను పంపే స్వల్ప మొత్తాలకు వాళ్ళు ప్రతిసారీ కృతజ్ఞతలు చెప్పేవారు. ఓసారి తండ్రికి ఇలా ఉత్తరం రాశాడు:

నీ ఖాతాలో 500 టేలర్లు జమ చేయమని ఈరోజే పోస్ట్ లో ఉత్తర్వులు పంపించాను. హైన్ రిచ్ స్లీమన్ తండ్రిగా నీ హోదాకు తగినట్టు డేంజింగ్ లోని నీ కొత్త నివాసంలో అన్ని హంగులూ సమకూర్చుకోడానికి వినియోగిస్తావన్న అత్యంత ఆశాభావంతో ఈ మొత్తం పంపుతున్నాను.

ఈ డబ్బును పంపడంలో నా ఉద్దేశం, నీ ఇంట్లో చక్కని పరిశుభ్రతను పాటిస్తూ, భవిష్యత్తులో ఒక యోగ్యుడైన సేవకుణ్ణీ, యోగ్యురాలైన సేవకురాలినీ నువ్వు నియమించుకునితీరాలనే. నీ పళ్లేలూ, పాత్రలూ, కప్పులూ, కత్తులూ, ఫోర్కులూ అన్నీ శుభ్రంగా, మెరిసిపోతూ ఉండాలనీ; ఇంటి నేలను వారానికి మూడుసార్లు శుభ్రంగా కడిగిస్తావనీ, ఇప్పటి నీ వయోభారానికి తగినట్టుగా టేబుల్ మీదే భోజనం చేస్తూ ఉంటావనీ ఆశిస్తున్నాను.

కోట్లకు పడగెత్తిన అతని ఆదాయంతో పోల్చితే తండ్రికి పంపిన ఈ 500 టేలర్లు చిల్ల పెంకులతో సమానం. అదలా ఉంచితే, ఏ ఒక్క అవకాశాన్నీ విడిచిపెట్టకుండా తన వ్యాపారాన్ని శాఖోపశాఖలుగా అతను విస్తరిస్తున్నాడు. జార్ కొత్త శిక్షాస్మృతిని జారీ చేయబోతున్నట్టు అతనికి తెలిసింది. దాని ముద్రణకు తప్పనిసరిగా మంచి నాణ్యమైన కాగితం వాడతారనీ, వేలాది ప్రతులు అచ్చువేస్తారనీ అతనికి వెంటనే స్ఫురించింది. దాంతో అందుబాటులో ఉన్న నాణ్యమైన కాగితాన్ని కొనేసి ప్రభుత్వానికి అమ్మజూపాడు. ప్రభుత్వం అతని ప్రతిపాదనను అంగీకరించింది.

అయితే, అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యమూ కుప్పకూలి, అతన్ని మళ్ళీ బికారిగా మార్చగల భయోద్విగ్నక్షణాలూ త్వరలోనే ఎదురయ్యాయి…

                                                                                                                         (సశేషం)

 

 

 

 

 

మీ మాటలు

*