జయహో జైపూర్!

 

సత్యం మందపాటి

 

satyam mandapati మేము మూడేళ్ళ క్రితం భారతదేశం వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశంతో పాటూ ఢిల్లీ, అమృత్సర్, వాఘా, జైపూర్, ఆగ్రా వెళ్లామని చెప్పాను.  ఢిల్లీ, అమృత్సర్, వాఘాల గురించి ఇదే శీర్షికలో మా యాత్రా విశేషాలు వ్రాశాను కూడాను. ఈసారి జైపూర్ గురించి మా అనుభవాలు చెబుతాను.

ఢిల్లీ నించీ ట్రైన్ తీసుకుని జైపూర్ వెళ్లి అక్కడ ఒక మంచి హోటల్లో దిగాం.

జైపూరులో చూడవలసినవి చాల వున్నాయి. వాటిల్లో మాకు బాగా ఇష్టమైనవి, చూడాలనుకుని చూసినవి ఏమిటో చెబుతాను.

ముందుగా జైపూర్ చరిత్ర, అక్కడి మహారాజులు చరిత్రా కొంత చెబుతాను. తర్వాత మా విహార యాత్రా విశేషాల గురించి మాట్లాడుకుందాం.

నాకు మొదటినించీ భారతదేశ చరిత్రా, మిగతా దేశాల చరిత్రా, ఆయా దేశాల సాంస్కృతిక మానవ శాస్త్రం (Cultural Anthropology) గురించి చదవటం, తెలుసుకోవటం సరదా అని ఇంతకుముందే చెప్పాను. కాకపొతే ఆ చరిత్ర వ్రాసినవారి బట్టి రకరకాలుగా వుంటుంది. ఉదాహరణకి భారతదేశ స్వతంత్ర పోరాటం గురించి పాకిస్తాన్ చరిత్రకారులు వ్రాసిన దానికీ, మనవాళ్ళు వ్రాసినదానికీ ఎంతో తేడా వుంటుంది. అందుకని, ఒక పుస్తకంతో సరిపెట్టుకోకుండా, కొంచెం లోతుగా చదవటం అవసరం.

ఆ నేపధ్యంలోనే జైపూర్ మహారాజుల గురించీ చదివాను. ఇప్పుడు జైపూర్ వెళ్లేముందు, కొంచెం ఎక్కువగానే చదివి, ఈ మహారాజులు ఎలాటివారో, వారి నిజ స్వరూపం ఏమిటో తెలుసుకున్నాను.

అలా చదివిన తర్వాత తెలుసుకునే నిజాలు చాల ఆశ్చర్యంగా కూడా వుంటాయి. ఉదాహరణకి అలెక్జాండర్ ది గ్రేట్.. గ్రేట్ కానే కాదు. ఎంతోమంది చేత చావుదెబ్బలు తిన్న యుద్ధ పిపాసి. కొలంబస్ ఒక సముద్రపు దొంగ. అతను అమెరికాని కనుక్కోక ముందే, అమెరికా లక్షణంగా మా ఇంటి ముందరా, వెనకా వుండనే వుంది. సుబ్బారావుగారింటికి బయల్దేరి, అప్పారావుగారింటికి వెళ్లి, అదే సుబ్బారావుగారి ఇల్లు అనుకున్న వెర్రి మాలోకం. ఇండియా వెళ్లి, అక్కడి నించీ సిల్కు, బంగారం, రత్నాలు, మిరియాలు తెస్తానని స్పానిష్ మహారాణిని వూరించి, ఆవిడ దగ్గర ప్రయాణ ఖర్చులు కొట్టేసి, తూర్పు తిరిగి దణ్ణం పెట్టకుండా పడమటి దేశాలకు వచ్చిన, దిక్కూ దివాణం తెలియని మనిషి. మొదటిసారి బహామా ద్వీపాలకి వచ్చి అదే ఇండియా అన్నాడు. రెండోసారి వెనిజువేలా వచ్చి అదే ఇండియా అన్నాడు. మూడోసారి మధ్య అమెరికా వచ్చి అదే ఇండియా అన్నాడు. వాళ్ళని ఇండియన్స్ అన్నాడు. అందుకే ఇక్కడ ఆ రోజుల నించీ వున్న ప్రజలని ఇండియన్స్ అంటారు. కొలంబస్ మాత్రం అమెరికాని ‘కనుక్కున్న’ గొప్పవాడిగా మా అమెరికా చరిత్ర చెబుతుంది. సంవత్సరంలో ఒక రోజు కొలంబస్ డే అనే పేరుతో సెలవు కూడావుంది. అలాగే అక్బర్ జీవితం.  అక్బర్ భారతదేశాన్ని ఉద్ధరించటానికి రాలేదు. మొగలాయీల దోపిడీలో పెద్ద భాగస్వామి. వారి సామ్రాజ్య విస్తరణకి, ఎంతో కృషి చేసి భారతదేశంలో కొంత భాగాన్ని, తన కాళ్ళ క్రింద పెట్టుకున్న పెద్దమనిషి. జోదాని పెళ్లి చేసుకున్నది, హిందూమతానికి దగ్గరయి, తన సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించుకోవటానికి. ఈనాటి మన సినిమాల్లో చూపిస్తున్నట్టు, పరమత సహనంతో కాదు. అలాగే సంస్కృత భూయిష్టమైన హిందీ భాషలో, ఎన్నో పర్షియన్ మాటలు తీసుకువచ్చి, సంస్కృతాన్ని లేకుండా చేసిన భాషా ప్రియుడు. ఇప్పుడు ఇండియాలో రోడ్డు మీద మాట్లాడే జనవారీ హిందీలో, మీకు వినపడేవి ఎన్నో పర్షియన్ పదాలే. మహాభారత్, రామాయణ్ లాటి సీరియల్స్ చూస్తేనే మనకి హిందీలో సంస్కృతం మళ్ళీ వినిపిస్తుంది.

అలాటి అక్బర్ మహారాజు ఏం చేశాడో చూద్దాం.

రాజపుత్ మహారాజు మాన్ సింగ్ (మొదటి మాన్ సింగ్) గురించి మొదలుపెడదాం. అతను అంబర్ రాజ్యానికి రాజు. మొగలాయీలకి తొత్తుగా మారి, వాళ్ళ కాళ్ళు వత్తటం మొదలుపెట్టాడు. దానితో అక్బర్ సంతోషించి అతన్ని తన సభలో నవరత్నాలలో ఒకడిగా గుర్తించాడు. అంతేకాదు, అంతటి రాజుగారినీ కాళ్ళ క్రింద తొక్కిపెట్టి, తనకి సైనికాధికారిగా చేసుకున్నాడు. మాన్ సింగుకి జోధాబాయి అత్త అవుతుంది.

మాన్ సింగుని, రాణా ప్రతాప్ సింగ్ దగ్గరకి రాయబారం పంపించి ఆ రాజ్యాన్ని కూడా దక్కించుకోవాలని చూశాడు అక్బర్. ‘నేను యుద్ధం చేసి చావటానికయినా సిద్ధమే కానీ, నా భారతదేశాన్ని ఆక్రమించి, విస్తరించాలనుకుంటున్న ఈ మొగలాయీలకి తొత్తుగా మాత్రం మారను’ అన్నాడు ప్రతాప్ సింగ్.

అలాగే చివరి శ్వాస వదిలేవరకూ, పోరాడి యుద్దంలో చనిపోయాడు రాణా ప్రతాప్ సింగ్. అందులో ప్రధాన పాత్ర వహించింది మాన్ సింగ్.

మాన్ సింగ్ తర్వాత, జగత్ సింగ్, మహా సింగ్, జై సింగ్ 1, తర్వాత కొంత కాలానికి జైసింగ్ 2.. ఇలాటి రాజపుత్ తొత్తుల కాలచక్రం ఇక్కడ తిరుగుతుంటే, అక్కడ అక్బర్ తర్వాత షాజహాన్, ఔరంగజేబ్.. అలా నడిచింది మొగలాయీల దురాక్రమణ.

మరాఠీ వీరుడు ఛత్రపతి శివాజీ ఏడుసార్లు మొగలాయీల మీదకు దండయాత్రకు వచ్చినా, తమ బలగాల సహాయం మొగలాయీలకి పూర్తిగా ఇచ్చి, శివాజీని ఏడుసార్లూ ఓడించిన ఘనత కూడా ఈ తొత్తు రాజులదే!

ఈనాటి జైపూర్ రెండవ జైసింగ్ (సవాయ్ జై సింగ్) 1727లో స్థాపించాడని అంటారు. రాజస్థాన్ రాష్ట్రంలో వుంది. ప్రస్తుత జనాభా ఆరున్నర లక్షలు. దీనికి పింక్ సిటీ అనే పేరు కూడా వుంది.

లెక్ఖలు, నక్షత్ర శాస్త్రం, జ్యోతిష్యం మీద సరదా, నమ్మకం వున్న జైసింగ్, బెంగాల్ నించీ విద్యాధర్ భట్టాచార్య అనే వాస్తుశిల్పిని పిలిపించి, ఈనాడు మనం చూస్తున్న ఎన్నో రాజకోటలని, భవనాల్ని నిర్మించాడు. ఇక మిగతా చరిత్ర వెండి తెరమీద, బుల్లి తెరమీద కాకుండా, మంచి పుస్తకాల్లో చదువుకోండి.

ఇహ ఈనాటి జైపూర్ గురించి చూద్దాం.

ఇక్కడ చూడవలసిన వాటిల్లో ముఖ్యమైనది, నేను ఇంజనీరుని కనుక, జంతర్ మంతర్. ఇక్కడ ఎన్నో నక్షత్ర శాస్త్ర ప్రాతిపదిక ఆధారంగా కట్టిన యంత్రాలు వున్నాయి. ఒక్కొక్కటీ ఒక్కొక్క విషయాన్ని చూపిస్తుంది. ఒకటి సమయాన్ని చూపిస్తే, ఇంకొకటి గ్రహణాలు ఎప్పుడు వస్తాయో చూపిస్తుంది. ఇంకొకటి రకరాల గ్రహాలు మనం చూస్తున్న ఆ సమయంలో ఎక్కడెక్కడ వున్నాయో చూపిస్తుంది. ఇలా ఎన్నో వున్నాయి. వాటిల్లో అన్నిటిలోకి స్పష్టంగా కనపడేలా నుంచునేది, 90 అడుగుల ఎత్తుగల సామ్రాట్ యంత్ర అనే సూర్య గ్రహ సూచిక. ఇక్కడ ఇంకా చక్ర యంత్ర, దక్షిణ భిట్టి యంత్ర, రామ యంత్ర, దిశ యంత్ర, ధ్రువ దర్శక్ యంత్ర, రాశి వలయ యంత్ర, కపాల యంత్ర….  ఇలా ఎన్నో వున్నాయి.

 

jantar1

 

తర్వాత చూడతగ్గది సిటీ పాలస్. అంతా గులాబీ రంగుతో కట్టబడినది. ఇదే కాదు, ఈ పాలస్ బయట వున్న రోడ్లూ, భవనాలూ, షాపులూ అన్నీ గులాబీ రంగువే. రాజుగారు ఎంత ధనికులో చూపించేదే ఈ పాలస్. ఎంతో పెద్ద భవనాలూ, చుట్టుతా సరోవరాలు, ఉద్యాన వనాలూ. అద్దాలు పొదిగిన నెమలి ద్వారం. ఒక పక్క రాజస్థానీ అలంకారాలు, ఇంకో పక్క మొగలాయీల అలంకారాలు. ఇక్కడే మ్యూసియం, చిత్రకళా క్షేత్రం కూడా వున్నాయి.

 

నాకు అన్నిటిలోకి బాగా నచ్చింది హవా మహల్. 1799లో కట్టిన ఈ భవనం, రాణీవాసపు స్త్రీలు బయట వారికి కనిపించకుండా, అక్కడ కూర్చుని షాపులూ, రోడ్ల మీద వెళ్ళేవారిని చూడటానికి కట్టారుట. అది వేడి ప్రదేశం కనుక, గాలి చక్కగా వేచే విధంగా ఎన్నో కిటికీలు కట్టి, దానికా పేరు పెట్టారు. క్రింది ఫోటో చూడండి.

అంబర్ కోట, పాలస్ కూడా చాల బాగుంటుంది. అక్కడే గుర్రాల మీద, ఒంటెల మీద సవారీ కూడా చేయవచ్చు.

 

fort1

అలాగే ఇంకా జైఘర్ కోట, నహర్ ఘర్ కోట, కోతుల గుడి (ఈ కోతుల గుడిలో వున్న సరోవరం దగ్గర కొన్ని వేల కోతులు వుంటాయిట), జల్ మహల్, రాంబాగ్ పాలస్…  ఇలా ఎన్నో వున్నాయి.

ఓపిగ్గా చూడాలే కానీ, రాజుగారు తలుచుకుంటే.. భవనాలకీ, కట్టడాలకీ కొదువా?

౦                 ౦                 ౦

మీ మాటలు

  1. రమణ says:

    మీరు అలెగ్జాండర్, కొలంబస్, అక్బర్ లనే విమర్శించడం అన్యాయమండి. మనం గొప్పగా చెప్పుకునే మన రాజులపై కూడా ఇలాంటి విమర్శలు ఉన్నాయి. శివాజీ మొగలాయీలతో రాజీ పడ్డాడని, లేకపోతే భారత దేశ చరిత్ర మరోలా ఉండేదనీ ఓ పుస్తకంలో చదివిన గుర్తు. మన రాజులు రాజ్యాలను నిర్మించింది కూడా దోపిడీలు, దొంగతనాల మీదే. పిఠాపురం, పెద్దాపురం సంస్థానాలు ఖజానా నింపుకోడానికి ఒకరి సంస్థానంలో ఒకరు దోపిడీలు, దొంగతనాలు చేయించేవారని వీరేశలింగం గారి రచనల్ని బట్టి తెలుస్తుంది. చరిత్ర మీద ఆసక్తి అన్నారు కనుక కాస్త ఆబ్జెక్టివిటీ కూడా అవసరమేమో ఆలోచించండి.

  2. Satyam Mandapati says:

    రమణగారు,
    నేను చెప్పింది, మీరు చెప్పిందీ ఒకటే. కాకపొతే ఈ వ్యాసంలో వచ్చిన రాజుల పేర్లు మాత్రమే ఇక్కడ ప్రస్తావించాను. ఇంతకు ముందు అమృత్సర్ గురించి వ్రాసినప్పుడు, బ్రిటిష్ వారి అక్రమాలు వ్రాయటం జరిగింది. అలా అంటే ఫ్రాన్స్, స్పెయిన్ రాజులు గొప్పవారని కాదు. నేను సిలికానాంధ్రవారి సుజనరంజనిలో, సెప్టెంబర్ సంచిక కోసం ఒక వ్యాసం వ్రాసాను, ఏది చరిత్ర అని. అది ఇంకో పదిరోజుల్లో ప్రచురింపబడుతుంది. దయచేసి ఆ వ్యాసం కూడా చదివి నా అభిప్రాయాలు ఏమిటో తెలుసుకోండి. సమయం చేసుకుని చదవటమే కాక, మీ స్పందన కూడా తెలిపినందుకు చాల ధన్యవాదాలు. ఉంటాను మరి,
    సత్యం

మీ మాటలు

*