స్వేచ్ఛగా మాట్లాడుకునే జాగా కోసం….!

 

నారాయణ స్వామి వెంకట యోగి 

 

అన్ని సార్లూ నువ్వు
నేను మాట్లాడిందే మాట్లాడనక్కరలేదు.
అన్ని సార్లూ సరిగ్గా  నేనూ
నువ్వనుకున్నట్టుగానే చెప్పాల్సిన పనీ లేదు.

నువ్వు వూహించినట్టే ,
నిన్ను మెప్పించేట్టుగానే
నేనుంటేనే నీ వాణ్ణనీ,
లేకుంటే నీ పగవాడిననీ నిర్దారించకు.

అడుగులో అడుగు వేయడం,
మాటలు ప్రతిధ్వనించడం
అచ్చం ఒక్క లాగానే ఆలోచించడం
అయితే దానికి ఇద్దరం, ఇందరం  యెందుకు?

నువ్వు చెప్పేది నాకు నచ్చక పోయినా,
నేను మాట్లాడేది నువ్వు అసహ్యించుకున్నా
మనిద్దరం ఒకర్నొకరిని వినడం ముఖ్యం.
పరస్పరం గౌరవంగా విభేదించగలగడం ముఖ్యం.
అన్నింటికన్నా,
యింతమందిమి ఒప్పుకోవడానికో విభేదించడానికో,
నిలబడి స్వేచ్చగా మాట్లాడుకునేటందుకు
వుక్కిరి బిక్కిరి చేసే యిరుకుసందుల అంతర్జాలంలో
యింత జాగా ని కాపాడుకోవడం
మరింత ముఖ్యం.

 

యిటీవల జరిగిన కొన్ని సంఘటనలు,  వాటి మీద కొందరు చెప్పిన అభిప్రాయాలు, అభిప్రాయాల మీద జరిగిన వేడి వాడి చర్చలు,చర్చల్లో విసురుకున్న రాళ్ళూ రప్పలూ, దూసుకున్న కత్తులూ బాణాలూ, వాటన్నింటికీ ఈ యిరుకైన సువిశాల అంతర్జాలం లో మనందరికీ ఒనగూరిన ఈ జాగా –  చాలా అమూల్యమైనది.

సాధారణంగా మన చుట్టూ జరుగుతున్న వాటి గురించి మనం స్పందిస్తాం. కవులు కవిత్వం తోనో ,కథకులు కథల్తోనో , వ్యాస రచయితలు వ్యాసాలతోనో,  యెవరికి చేతనైన విధంగా వారి చైతన్యాన్ని వ్యక్తీకరిస్తారు. స్పందించడం ముఖ్యం. సకాలంలో స్పందించడం ముఖ్యం. యెట్లా స్పందించామన్నదీ ముఖ్యం. మన వ్యక్తీకరణలు మౌలికంగా ఉన్నాయా లేదా, శక్తి వంతంగా  ఉన్నాయా లేదా మన రచన సత్తా యెంత, దాని ప్రభావమెంత అనేది తెలివైన పాఠకులు వారి వారి అభిరుచులమేరకు, అభిప్రాయాల మేరకు నిర్ణయిస్తారు. బేరీజు వేస్తారు.

అందరికీ అన్నీ నచ్చాలనీ యెక్కడా లేదు. అట్లే అభిప్రాయాలు కూడా. ఒకరు వెలిబుచ్చిన అభిప్రాయాలతో అందరూ పూర్తిగా ఏకీభవించాలనీ లేదు – నిజానికి అభిప్రాయలతో విభేదించకపోతే, చర్చించక పోతే, ఘర్షించకపోతే (యిక్కడ ఘర్షించడం అంటే భౌతికంగా దాడులు చేయడమని కాదు) కొత్త అభిప్రాయాలు జనించవు, ఉన్నవి వృద్ధి చెందవు. భావాలూ, అభిప్రాయాలూ శిలా శాసనాలు కావు, కాకూడదు. ప్రజాస్వామ్యబద్దంగా చర్చించబడాలి. సహనమూ సంయమనమూ కోల్పోకుండా చర్చ జరగాలి. ఇతరులను నొప్పించేలా , యిబ్బంది పెట్టేలా మాటలు తూలకుండా, తమకు నచ్చని వారిని  అవమానించకుండా, అగౌరవపర్చకుండా , తూలనాడకుండా విషయం మీద కేంద్రీకరించి చర్చ కొనసాగిస్తే అది కొత్త అభిప్రాయాలూ, భావాలూ జన్మించడానికీ , వృద్ధి చెందడానికీ ఉపయోగపడతుంది. అట్లే మనం అంగీకరించని అభిప్రాయలతో గౌరవంగా విభేదించడానికీ అంగీకరించవచ్చు.
చర్చలో దుందుడుకుతనం ప్రదర్శిస్తూ , తమ వాదనే గెలవాలనే యేకైక లక్ష్యం తో వీరావేశంతో యితరులమీద బండరాళ్ళు వేస్తూ వితండవాదన చెయ్యడం వలన యెవరికీ,  ముఖ్యంగా విషయానికి ఒరిగిందేమీ ఉండదు. అట్లాంటి వితండ వాదన వల్ల, అప్రజాస్వామ్య చర్చల వల్ల మన మధ్య  మనస్పర్థలూ , వైమనస్యాలూ యేర్పడి అవి బురద జల్లుకునేదాకా పోయే ప్రమాదముంది. అయితే ఇటీవలి కాలంలో జరుగుతున్న సంఘటనల పట్ల స్పందిస్తున్న వారి మధ్య సహనం కోల్పోతున్న వాతావరణం కనబడుతున్నది.

తమకు నచ్చని అభిప్రాయాల పట్ల ప్రజాస్వామికంగా స్పందించి చర్చించాల్సింది పోయి దూషణలూ , అవమానించడాలూ, బెదిరింపులూ, దాడులూ చెయ్యడం దారుణమైన విషయం. దూషిస్తేనో, అవమానిస్తేనో, బెదిరిస్తేనో, దాడి చేస్తేనో అభిప్రాయాలు మార్చుకుంటారని, తమకు అనుకూలంగా వత్తాసు పలుకుతారనీ, లేదూ భయపడి పూర్తిగా మాట్లాడ్డం మానేస్తారని అనుకోవడం అమాయకత్వమూ, పైపెచ్చు  వెర్రి తనమూ కూడా! తెలుగు నేలమీద విస్తారంగా జరిగిన అనేకానేక ప్రజాస్వామ్య ఉద్యమాల భావజాల వారసత్వమూ, ప్రేరణా పుణికిపుచ్చుకున్నవారు అట్లా బెదిరిపోయి నోరు మూసుకుంటారనుకోవడం మూర్ఖత్వం.

అయితే ఈ అప్రజాస్వామిక సంస్కృతి ఇవాళ యెల్లెడలా వ్యాపించి బలపడడానికి ఒక నేపథ్యమున్నది. ప్రజాస్వ్యామ్య వాదులపైనా ,ప్రగతిశీల భావజాలం మీదా ఈ దాడులు – రాజ్యం చేసేవీ కావచ్చు, రాజ్యేతర శక్తులు చేసేవీ కావచ్చు –  గత అయిదేళ్ల కాలంగా యెక్కువైతున్నవి (అంటే అంతకు ముందు లేవని కాదు). ఇతరుల అభిప్రాయాలని సహనంతో, ప్రజాస్వామ్య దృక్పథం తో స్వీకరించి , చర్చించడానికి సిద్దంగా లేని అప్రజాస్వామ్య నియంతృత్వ శక్తులు ప్రపంచవ్యాప్తంగా బలపడినవి. ఈ శక్తులు తమకి నచ్చని అభిప్రాయాలని అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నవి.

దాడి చేసి నోరు మూయించాలనే నిర్ణయించుకున్నవి. ప్రపంచవ్యాప్తంగా  గ్లోబలైజేషన్ విఫలమై తనను,  తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి శాయశక్తులా అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్న సందర్బంలో, దానికి  ఆలంబనగా నిలబడుతూ , దాని అండతో తమ ప్రాబల్యం పెంచుకోవడానికి   ప్రయత్నిస్తున్న నియో కన్జ ర్వేటివ్ (నూతన సంప్రదాయవాద)  శక్తులివి. ఇవి ప్రపంచవ్యాప్తంగానూ,  తమ తమ దేశాల్లోనూ, గ్లోబలైజేషన్ కొనసాగిస్తున్న నిరాఘాట దోపిడీ పీడనలకు తమ శాయశక్తులా వత్తాసు పలుకుతూనే, అండదండలిస్తూనే, ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాల ముసుగులో  తమ అప్రజాస్వామిక నియంతృత్వాన్ని అమలుచేస్తున్నాయి.

ప్రజాస్వామిక చర్చలు జరగకుండా అణచివేస్తూ,ప్రశ్నించే గొంతులని నోరు నొక్కుతూ, యెల్లెడలా ప్రకటిత అప్రకటిత , రాజ్య , రాజ్యేతర నియంతృత్వాన్ని అమలు చేస్తూ ఈ నూతన సంప్రదాయ శక్తులు యేకీకరణమౌతున్నాయి. చర్చలు జరిగే జాగాలన్నింటినీ బలవంతంగా ఆక్రమించుకుని,  అయితే తమకనుకూలంగా మార్చుకోవాలనో లేదా శాశ్వతంగా మూసెయ్యాలనో తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగమే ఈ బెదిరింపులూ దాడులూ అవమానాలూ. చాలా మందికి ఇవి కొత్తకాకపోవచ్చు కానీ, ఇవి వేస్తున్న యెత్తుగడలూ, వస్తున్న మార్గాలూ, అవలంబిస్తున్న పద్దతులూ (కొన్ని సార్లు మనకు తెలీకుండా చాప కింద నీళ్ళలా , రకరకాల ముసుగులు వేసుకుని ) మరింత నవీనంగా ఉంటాయని మాత్రం చెప్పొచ్చు .

యిటువంటి పరిస్ఠితుల్లో ప్రజాస్వామిక చర్చా వాతావరణాన్నీ, అభిప్రాయాల ఘర్షణనూ, అందరం కూడి ఒక చోట చర్చించుకునే జాగాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిమీదా ఉంది. వినడానికి ఒక పునరుక్తి (cliché ) లాగా ఉండొచ్చేమో కానీ,  ఇది ప్రజాస్వామ్యవాదులందరి భాద్యతా తక్షణ కర్తవ్యమూనూ. సహనమూ, యితరుల అభిప్రాయల పట్ల గౌరవమూ  కోల్పోకుండా, సంయమనంతో  వస్తుగతంగా (objective) చర్చ చేయడం యివాళ్ల యెంతో అవసరం. అట్లాంటి చర్చల్లోంచి యెదిగే అభిప్రాయాలే, భావజాలమే అప్రజాస్వామిక తిరోగమన శక్తులకు సరైన సమాధానం చెప్తాయి.

*

swamy1

మీ మాటలు

  1. Thirupalu says:

    /ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ విఫలమై తనను, తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి శాయశక్తులా అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్న సందర్బంలో, దానికి ఆలంబనగా నిలబడుతూ , దాని అండతో తమ ప్రాబల్యం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న నియో కన్జ ర్వేటివ్ (నూతన సంప్రదాయవాద) శక్తులివి./
    చాలా బాగా చెప్పారు సార్ ! ఇవి వానా కాలం వస్తే కప్పలు బెకబెక లాడినట్లు తమకు తిరుగు లేదన్నట్లుగా రెచ్చి పోతున్నాయి.
    ప్రజా స్వామ్య వాదులు అప్రమత్తంగా ఉండాలి.

  2. Krishna murthy Daripally says:

    Knowledge acquire enter

  3. N Venugopal says:

    చాల చాల బాగుంది స్వామీ….

  4. Aranya Krishna says:

    నీ కవిత బాగుంది. ఈ దాడాగిర్లు మనకెం కొత్తకాదు. ప్రతి ప్రగతిశీల ఆలోచనకి సంప్రదాయ ఆలోచనతో ఘర్షణ తప్పదు. అయితే విస్తృతమైన చర్చ కొంతమందిలో మార్పు తీసుకురావోచ్చు.

  5. Delhi Subrahmanyam says:

    గొప్పగా చెప్పారండీ. మీ మాటలతో నేను పూర్తి గా ఎఖీభావిస్తున్నాను నారాయణ స్వామి గారూ.

    ” తమకు నచ్చని అభిప్రాయాల పట్ల ప్రజాస్వామికంగా స్పందించి చర్చించాల్సింది పోయి దూషణలూ , అవమానించడాలూ, బెదిరింపులూ, దాడులూ చెయ్యడం దారుణమైన విషయం. దూషిస్తేనో, అవమానిస్తేనో, బెదిరిస్తేనో, దాడి చేస్తేనో అభిప్రాయాలు మార్చుకుంటారని, తమకు అనుకూలంగా వత్తాసు పలుకుతారనీ, లేదూ భయపడి పూర్తిగా మాట్లాడ్డం మానేస్తారని అనుకోవడం అమాయకత్వమూ, పైపెచ్చు వెర్రి తనమూ కూడా! తెలుగు నేలమీద విస్తారంగా జరిగిన అనేకానేక ప్రజాస్వామ్య ఉద్యమాల భావజాల వారసత్వమూ, ప్రేరణా పుణికిపుచ్చుకున్నవారు అట్లా బెదిరిపోయి నోరు మూసుకుంటారనుకోవడం మూర్ఖత్వం.”

  6. appalnaidu says:

    నారాయణ స్వామి గారు,చాల మంచి వ్యాసం. నూతన సాంప్రదాయవాదం …ఇది కరెక్ట్ .ఆధునికతను తమ సాంప్రదాయ భూమికను బలపరచడానికే చాల తెలివిగా వాడుకుంటున్నారు…రాజకీయాల్లో,సాహిత్యంలో,సంస్కృతిలో…అన్నిటా ఇదే…ఇది చేసే దాడిని మీ వ్యాసం ఎరుక పరచింది..

  7. Narayanaswamy says:

    డియర్ తిరుపాల్ వేణూ, అరణ్యా, సుబ్రహ్మణ్యం గారూ,అప్పలనాయుడు గారూ – మీ ఆప్త వాక్యాలకు నెనర్లు! అప్రజాస్వామిక ‘కొత్త సంప్రదాయ’ వాదుల్ని యెదుర్కోవడానికి మనం కలిసి కట్టు గా సంసిద్ధం కావాలన్నది ఇవాళ్టి సత్యం.

  8. Delhi Subrahmanyam says:

    అవునండీ. ఇది చాలా అవసరం. ఇలాగే ఈ ఫాసిస్ట్ నియంత్రపు ధోరణుల మీద మీరూ, వేణూ, అప్పలనాయుడు గారు,అఫ్సర్ గారూ రాస్తూనే ఉండాలి.

  9. విలాసాగరం రవీందర్ says:

    కవిత . విశ్లేషణ గొప్పగా ఉన్నాయి. నిజాలు జీర్ణించుకోవడం కష్టమే

  10. Kranthi Srinivasarao says:

    మీ అభిప్రాయం తో. నేను. ఏకిభవిస్తున్నాను …

  11. చాలా బాగుంది!

  12. v. shanti prabodha says:

    “నువ్వు చెప్పేది నాకు నచ్చక పోయినా,
    నేను మాట్లాడేది నువ్వు అసహ్యించుకున్నా
    మనిద్దరం ఒకర్నొకరిని వినడం ముఖ్యం.
    పరస్పరం గౌరవంగా విభేదించగలగడం ముఖ్యం.” చాలా బాగా చెప్పారు.
    అప్రజాస్వామిక, నియంతృత్వ ధోరణులు వ్యక్తిలోనూ, వ్యవస్థలోను పెచ్చరిల్లిపోతున్న ఈ సమయంలో వాటిని ఎదుర్కోవడం ఎంత ముఖ్యమో స్వేచ్చగా మాట్లాడుకునే జాగాను కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం. వాటిని కలసికట్టుగా ఎదుర్కోవడం నేటి అవసరం

  13. శివారెడ్డి గారి కవిత ఆ మధ్య వచ్చిందండి. మాటలను ఎలా వాడాలో చెబుతూ. గుర్తొస్తే బాగుణ్ణు.

  14. చాలా అద్భుతంగా ఉందండి

మీ మాటలు

*