ఆవు అంబా అనును!

 

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

అఖ్లాక్.. రోహిత్.. యింకా ఆ‘నలుగురికి’!

అనామకులకి.. అనేకానేకులకి!…

చూసారా? దెయ్యాలు వేదాలు వల్లించడం చూసారా?..

“మీరు తూటాలు పేల్చాలనుకుంటే నన్ను కాల్చండి.. ఇప్పటికైనా ఈ దాడులు ఆపేయండి..”

“నా దళిత సోదరులపై దాడులు ఆపండి. కావాలంటే నాపై దాడి చేయండి.. నాతో యుద్ధం చేయండి..”

ఈ వేద మంత్రాలు విన్నారా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయనేమో? ఆవేశం చూసారా? ఆ-వేషం చూసారా? ఆ వేగమూ వుద్వేగమూ చూసారా? దేశ ప్రజలే నా హైకమాండ్ అంటున్నాడు! నూటా యిరవై అయిదు కోట్లమంది నా అధిష్టానం అంటున్నాడు! వారి ఆశలూ ఆకాంక్షల మేరకే.. మార్గదర్శకత్వం మేరకే ప్రభుత్వం నడుస్తోందంటున్నాడు! ఓటు వేసి అధికారము అందివ్వడంతోనే అయిపోలేదంటున్నాడు! నన్నూ నిలదీయండంటున్నాడు! ప్రధానినీ ప్రశ్నించే వ్యవస్థ రావాలంటున్నాడు!

అందుకైనా ప్రశ్నిద్దాం! ప్రశ్నించమన్నందుకైనా ప్రశ్నిద్దాం! మన చావులు వొక ప్రశ్న కాదా? మన వొంటి మీది గాయాలు ప్రశ్నల గుర్తులుకాక మరేమిటి? ప్రశ్నిస్తే మాత్రం వాడు జవాబుదారి కాగలడా? అయినా కాకపోయినా మనం ఈ దేశ ప్రజలమే కదా? మనల్ని అధిష్టానం అని అన్నందుకైనా.. నిలదీయమన్నందుకైనా.. నిలదీద్దాం! నిగ్గదీద్దాం!

నిన్న నిన్న ఢిల్లీ టౌన్ హాల్లో- భిన్నత్వంలోనే భారతదేశం బలం దాగుందని సెలవిచ్చాడే? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలో తీవ్ర వివక్ష యెదుర్కొన్నారని, విదేశాల్లో గౌరవం పొందారని, అయినా ఆయన భారతీయుడుగానే వున్నారని, ఆయన స్ఫూర్తి ప్రతివొక్కరిలో వుండాలని విన్నవించాడే?..

మరి ఆ స్పూర్తి చెప్పేవాడిలో చిగురంతయినా వుందా? ఏలేవాడిలో పూచిక పుల్లంతయినా వుందా? ఉంటే దేశమిలా వుంటుందా? అంబేద్కర్ యెదుర్కొన్న తీవ్ర వివక్ష వారి జాతి జనులమైన మనకు యింకా వారసత్వంగా కొనసాగుతూనే వుందే? స్వాతంత్ర్యం వొచ్చి యేడు దశాబ్దాలు గడుస్తున్నా సామాజిక రుగ్మతలు కొనసాగడం, అంటరానితనం వుండడం, దళితులు వివక్షకు గురికావడం సిగ్గుచేటని మళ్ళీ ఆ నోటితోనే అన్నాడు! మొట్ట మొదట దేశ ప్రధానిగా సిగ్గుపడాల్సింది తను కాదూ?!

వివక్ష! కక్ష! కక్ష గట్టి కత్తిగట్టి చంపుతున్నారే?, ఆయనగారు అధికారంలోకి వచ్చాకనే కదా.. పంతొమ్మిది శాతం దాడులు యెక్కువయ్యింది? ఆయనగారు అధికారంలోకి వచ్చాకనే కదా.. ఈ రెండేళ్లలో నలభైయ్యేడు వేల అరవైనాలుగు దాడులు జరిగింది? లెక్కలకందినవే.. లేనివి లేవే?, యెక్కడికక్కడ యెప్పటికప్పుడు వుసుళ్ళు తీస్తున్నారే? జీవాలార్పేస్తున్నారే? మాది మతం కాదు, జీవన విధానం అంటున్నారే.. మరి యెవరి జీవన విధానాన్ని యెవరు డిజైన్ చేస్తున్నారు? సంస్కృతి మాత్రం అందరికీ వొక్కటే వుంటుందా? ఒకవైపు భిన్న సంస్కృతుల సమాహారం అంటున్నారే.. మరోవైపు సహనం తప్పి సంహారం చేస్తున్నారే..?

జీవమంటే గోవుదీ ఆవుదేనా? మనిషి.. సాటి మనిషి జీవి కాడా? ప్రాణి కాడా? జంతు వధశాలలు దేశంలో పదహారువందల యిరవైమూడేనని వాడనుకుంటున్నాడు! మహారాష్ట్రలో మూడొందల పది, ఉత్తరప్రదేశ్ ల రెండువందల యెనభై అయిదు, ఏపీ తెలంగాణాల కలిపి నూటా యెనభై మూడు.. జంతు వధశాలలు లెక్కలు చూపుతున్నారే! మరి యెక్కడికక్కడ దళితుల్ని చంపుతున్నారే, ఆదివాసీలను చంపుతున్నారే, మైనార్టీలను చంపుతున్నారే.. వధిస్తున్నారే.. మనిషి కూడా జంతువే కదా? వేటాడుతున్నారు కదా? వెంటాడి చంపుతున్నారు కదా? మరి ఈ వధ శాలల లెక్కల మాటేమిటి? అయినా జంతుమాంసం వుత్పత్తిలో భారతదేశానిదే అగ్రస్థానం కదా, ఆ స్థానం నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా? ముప్పై మూడు వేల నూటా యిరవై యెనిమిది కోట్ల రూపాయల ఆదాయం వొస్తోందే? ఒక్క యేడాదికే వొచ్చిన ఆదాయం అది. అందులో పశుమాంసమే యిరవైతొమ్మిది వేల రెండువందల యెనభై రెండు కోట్ల రూపాయలు. ఆడబ్బుతో పరిపాలిస్తున్న వాళ్ళకీ జబ్బేమిటి? జాడ్యమేమిటి?

మరోవైపు నిస్సిగ్గుగా ఆయనగారు లండన్ లో అంబేద్కర్ నివసించిన భవనాన్ని భారత ప్రభుత్వం కొనుగోలు చేసిందని గొప్పగా చెపుతున్నాడు. చివరి రోజుల్లో ముంబైలో అంబేద్కర్ నివసించిన భవనాన్ని స్మారక చిహ్నంగా అభివృద్ధి చేస్తున్నట్టు మహగొప్పగా చెపుతున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా స్మారక భవనం యేర్పాటు చేస్తున్నాడట! అయ్యవారు చేస్తున్నదానికి అంబేద్కర్ ఆనందపడతాడా? మన నోట్లో మలమూ మూత్రమూ పోసి దేశాన్ని స్వచ్చభారత్ చేస్తున్నారే? గో మూత్రము తాగించి.. పేడ తినిపించి.. అక్కడితో ఆగక హత్యలు చేస్తున్నారే? ఆనవాళ్ళు కావాలా? హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, పంజాబ్.. యెక్కడికి వెళ్ళినా శవాలు సాక్ష్యం చెపుతాయి! గాయాలే కావాలా.. ఆమడదూరం అక్కర్లేదు.. నిన్నటి తూర్పుగోదావరి ఉప్పలగుప్తం మండలం.. భీమనపల్లి శివారు సుధాపాలెం శ్మశానమే సాక్ష్యం! ఎలీషా, లాజర్ యిద్దరూ చనిపోయిన గోవుల చర్మం వొలిచారు! చేసిన నేరానికి శిక్షగా వాళ్ళిద్దర్నీ చావుబతుకుల్లోకి తోసేసారు! ఊనా లో జరిగిందే ఊళ్ళోనూ జరిగింది! యిప్పుడు ప్రతి వూరు ఊనా నే! ‘ఆ నలుగురినీ’ కారుకి కట్టి తొక్కుతొక్కు పొట్టుపొట్టు కొట్టారే.. అదే విధము.. అదే పథము..

కులవృత్తికి కట్టు బానిసలని చేసారు. కుల వృత్తి చేస్తే నేరం. చెయ్యకుంటే నేరం. పుట్టుకే నేరం చేశారే? పుట్టకముందే నేరస్తులను చేశారే? అరే.. వీళ్ళకు వీళ్ళే న్యాయ మూర్తులు! వీళ్ళకు వీళ్ళే తీర్పరులు! వీళ్ళకు వీళ్ళే పోలీసులు! ఎన్నడూ లేనిది వీళ్ళకు యింత కండకావరం యెలా వొచ్చింది? వీళ్ళకు వీళ్ళే కత్తులు కర్రలు గొడ్డళ్ళు పట్టుకొని వుగ్రమూకల్లా వురికురికి మీద పడుతున్నారే?

గోరక్షకుల ముసుగులో కొందరు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన పడడానికి అల్లాటప్పావా ప్రధానివా అని అడగాలని వుంది. ఆ మొసలికన్నీరు చూసి నిజంగానే మొసలి కన్నీరు పెట్టుకుంటుంది. గోపరిరక్షక దళాల పేరుతో సంఘవిద్రోహక శక్తులు దుకాణాలు తెరిచారు, వారి చర్యలపట్ల నాకు ఆగ్రహం కలుగుతోంది అంటున్నావే?, వారి చర్యలు యివాల్టికి యివాలే మొదలు కాలేదు, నువ్వు అధికారంలోకి వొచ్చినప్పటి నుండి జరుగుతున్నాయే? రోజు రోజుకీ మితిమీరుతున్నాయే? ఎంత విదేశాలలో తిరిగితే మాత్రం అంత మాత్రము కూడా దేశం గురించి పట్టదా? దొంగలు పడ్డ ఆర్నెల్లకి కుక్కలు మొరిగినట్టు లేదూ?

అడగాలని వుంది! అగ్గితో కడగాలని వుంది! నిలదియ్యాలని వుంది! నిప్పుతో వొడి కట్టుకోకు అని చెప్పాలని వుంది!

అయ్యా దాద్రీ మొదలు ఊనా వరకు దేశం రెండేళ్లుగా దద్దరిల్లిపోతూనే వుందే.. వొక్కనాడు వొక్కమాట మాట్లాడావా? వొక్క భాదితున్ని పలుకరించావా? విషం తాగి దళితులు ఆత్మహత్యలకి పాల్పడబోతే వద్దన్నావా? వారించావా? శవాలు లేచిన వొక్క యింటికయినా వెళ్లి కనీసం సానుభూతి చూపించావా? కన్నీళ్ళయినా తుడిచావా? కనీసం ఖండించావా? హంతకులు రోజుకి రోజూ చెలరేగిపోతుంటే ఆగమన్నావా? ఆపమన్నావా? అరెస్టులు చెయ్యమన్నావా? కఠినంగా వున్నావా? వుండమన్నావా? వాళ్ళని ఆపే శక్తి నీకు లేదా? మీ సంఘ్ పరివారమనే వెసులుబాటు యిచ్చావా? గోరక్షక దళ్ దాని తోక అనో.. తొండం అనో.. చూసి చూడనట్టు వున్నావా? వూరుకున్నావా? అందరం ఆ బళ్ళో చదివినోల్లమే అని మూకల్ని వెనకేసుకు వచ్చావా? ఆనాడే ఆపివుంటే యెన్ని ప్రాణాలు దక్కేవి? రాజ్యాంగ వ్యతిరేక శక్తులపట్ల అంత రాగమూ అనురాగమూ నీకెందుకయ్యా? పిర్ర గిల్లేది నువ్వే.. జోల పాడేది నువ్వే.. నువ్వు మా కానోడివి.. అని ముఖం మీద అడగాలని వుంది!

చేపల కోసం కొంగ జపం చేసినట్టు దళిత జపం! దళితులు యెప్పటికీ కళ్ళు తెరవని చేపపిల్లల్లాగే వుంటారా? నేను చావనైనా చస్తాను గాని నీకు గులాం కాను, ఆహారం అంతకన్నా కాను.. అని బలవంతంగా వెళ్ళిపోయిన రోహితా నువ్వు తిరస్కరించిన గడ్డమీద మాట్లాడాడు. నీ హత్యకు కారకుడైన వీసీ పొదిలి అప్పారావు మీద యింతవరకూ చర్య లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానితో మాట్లాడి రెండుమూడు రోజుల్లోనే చక్కదిద్దుతానని అసెంబ్లీ సమావేశాల్లో చెప్పిన మాట యెన్నడో యాది మరిచిపోయాడు. విద్యార్థులను వెక్కిరించి, రెచ్చగొడుతున్న వాన్నే తెచ్చి తిరిగి పెట్టారు. అడిగిన యిద్దరు ప్రొఫెసర్లని సస్పెండ్ చేసారు. ఇరవయ్యేడు మంది విద్యార్థులను అరెస్టు చేసారు. కేసులు పెట్టినవి పెట్టినట్టే వున్నాయి! బెయిల్లూ జెయిల్లూ యివే విశ్వవిద్యాలయాలు! అటు హంతకులకి అధికారమిచ్చి యిటు దళితులు నా సోదరులు అనడం నోటితో పిలిచి నొసటితో వెక్కిరించడం కాదా అని అడగాలని వుంది. నిజంగా నీకు దళిత సానుభూతి కావాల్సి వస్తే మానవ వనరుల మంత్రిత్వ శాఖ నీ చేతుల్లో లేదా? నిప్పు రాజేయకూడదని నువ్వు అనుకొని వుంటే ఈపాటికే చల్లార్చేవాడివి కాదా? నీ చేతొక తీరు.. నీ మాటొక తీరు.. అని నిలబెట్టి అడగాలని వుంది! అడగనా?

గుండెలు జలదరించే గుజరాత్ అల్లర్లు మేం మర్చిపోలేదు.. నీవు మాదేశం రావటానికి వీల్లేదని అమెరికా కూడా అభ్యంతరం చెప్పడం మేం మరిచిపోలేదు.. ఢిల్లీ బీహార్లో నువ్వు వోడిపోయావని మేం మర్చిపోలేదు.. పంజాబ్ లాభం లేదు.. యూపీ గుజరాత్ లో నీవు వోడిపోతావన్న భయంతోనే యిదంతా నువ్వు మాట్లాడావని మేం మరిచిపోలేదు.. ఎన్నికలు వస్తే యెలా అయినా మాట్లాడతారని మేం మరిచిపోలేదు.. అందుకే నిన్ను నమ్మలేదు.. మాటుగాసిన నీ మాటలు నమ్మలేదు..

అని రాజుకి చెప్పాలా? చెప్పకుండానే గ్రహించాడు! అందుకే అంతలా నటించాడు!

అయ్యగారు అధికారంలోకి వొచ్చింది మొదలు నల్ల రంగు నిషేధించబడింది! నల్లని చర్మాలు ఫెటిల్లున పేలిపోతున్నాయి! ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి! మనం తినే తిండి.. పీల్చే గాలి.. కట్టే బట్ట.. అన్నిటా వాడే! వాడి కాషాయమే! పైగా కాషాయం విప్లవమంటున్నాడు! విద్యుత్ వెలుగులంటున్నాడు! విడ్డూరం గుడ్డెడితే తెల్లుల్లిపాయ పిల్లెట్టినట్టుగా లేదూ?

అఖ్లాక్.. వాళ్ళు మనిషి మాంసాన్ని తప్ప గొడ్డు మాంసాన్ని చూడలేరు! అంతటి దయామయులు!

గురూ.. మీ నలుగురూ చూసారు కదా? కాశారు కదా? మీ వొంటి మీద పడ్డ దెబ్బల్ని లెక్కపెట్టండి! వడ్డీతో సహా రేపోమాపో మన సహ దళితులు తీర్చేస్తారులే! తిరుగులేదులే! తిరగ రాస్తారులే!

మన పక్షం వహించిన మన ప్రధాని మీద వొట్టు!

యిట్లు

‘అధిష్టానం’లో వొకడు!

మీ మాటలు

  1. అవును, ఆవు అంబా అనును…

  2. THIRUPALU says:

    చాలా గొప్ప రాజకీయ సెటైర్ . అయినా వీళ్ళు నేరుగా మాట్లాడటం 1947 పంద్రాగష్టుకు ముందే మరిచి పోయారు. అంతా ఇండెరెక్టే కానీ డైరెక్ట్ అంటూ ఏమీ లేదు . నయవంచనకు మించిన సంచలనం లేదు.

  3. కె.కె. రామయ్య says:

    “దేశ ప్రజలే నా హైకమాండ్ అంటున్న ప్రధానిని
    అడగాలని వుంది! అగ్గితో కడగాలని వుంది! నిలదియ్యాలని వుంది!
    నిప్పుతో వొడి కట్టుకోకు అని చెప్పాలని వుంది! ” బజరా గారూ

  4. కె.కె. రామయ్య says:

    నాయనా బజరా! ఆ యప్ప వినేవాళ్ళ గుండెలు చెరువయ్యేలా చెప్పిన డవిలాగులు వింటుంటే ఉత్తి పుణ్యానికి మనం పెద్దాయన్ని అనుమానిస్తున్నామా అని నాకో సిన్న డౌటింగ్ ….

    Coming down heavily on the perpetrators of violence on dalits, Prime Minister Narendra Modi on Sunday said, “If you want to attack, attack me, not dalits. If you want to shoot, shoot me”.

    “We are the people who talk about ‘Vasudhaiva Kutumbakam’ (the entire world is a family) and if we cannot embrace our dalit brothers and sisters, the world will not forgive us,”

    “What right do we have to ill-treat our dalit sisters and brothers”
    “We have to protect the marginalised and the dalits. It is our duty”

  5. కె.కె. రామయ్య says:

    బజరా గారూ, ఆవు అంబా అనును! ఏ అర్ధంలో వాడారో దయచేసి వివరించరా.

    ఆవు దూడ కొఱకు ‘అంబా’ అనును అనే అర్ధంలో వాడారా?
    లేక ఆకలేసినా, ఏదైనా కష్టం కలిగినా అంబా అని మొరెట్టటం తప్పించి కొమ్ములు విసరటం రాని గంగిగోవులు లాంటి వాళ్ళు ఆ దళితులు ( గోరక్షకుల ముసుగులోని సంఘవిద్రోహక శక్తుల బాధితులైన ఆ దళితులు ) అనే అర్ధంలో వాడారా?
    లేక అంబా అనే గంగి గోవును హింసించే గ్రామ సింహాల అకృత్యాలు గమనానికి రావడానికి వాడారా.

    మీ రచనను మెచ్చుకుంటూ పైన వ్యాఖ్య రాసిన చోరగుడి జాన్సన్ ( “చివరి చర్మకారుడు లేడూ” కథకులు ) గారి వద్దా ఈ సందేహం వెలిబుచ్చాను. ఇక మీరే శరణ్యం.

    సెటైర్, పదునైన వ్యంగ్యం తో రాసే మీరు ఈ సారి డైరెక్ట్ ఎటాక్ ఇస్తూ రాశారు అంటే ఈ విషయం మిమ్మలెంతగా బాధించిందో అర్ధం అవుతున్నది.

  6. బమ్మిడి జగదీశ్వరరావు says:

    ఆవు అంబా అనును! పిల్లి మ్యావ్ మ్యావ్ మనును! కుక్క భౌ భౌ మనును! కాకి కావ్ కావ్ మనును! పిచ్చుక కిచ కిచ మనును! బాతు బెక్ బెక్ మనును!

    అరుపు సహజం!

    స్వభావం సహజం!

    అరుపుకూ స్వభావానికీ సంబంధం లేదు!

    గోమాంసము తిన్నవాడు గోవును పూజించమనును! దొంగతనము చేసినవాడు దొంగా దొంగా అని అరుచును! హింస చేయువాడు అహింస గొప్పదనును! అధర్మము చేయువాడు ధర్మము గెలుచును అనును! అన్యాయము చేయువాడు న్యాయము గెలుచును అనును! అవినీతి చేయువాడు నీతి గురించి గొప్పగా బోధించును!

    ఇదంతా చూచుటకు ‘ఆవు అంబా అనును!’ అన్నంత సాధు స్వభావముతో మృదు మధురముగా కనిపించును!

  7. కె.కె. రామయ్య says:

    శ్రమ తీసుకుని వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు బజరా గారు.

    రాజ్యాంగ స్ఫూర్తికి, లౌకిక తత్వానికి విరోధమంటూ గోవధ నిషేధాన్ని జాతిపిత మహాత్మా గాంధీ కూడా వ్యతిరేకించారు.

    రైతుల ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా, పశువుల స్థితిగతుల దృష్ట్యా పశువులను విక్రయించే వెసులుబాటు లేకుండా చెయ్యడం రైతులను మరింత కుంగదీస్తుంది. కేరళ నుండి కాశ్మీర్ వరకు, నార్త్ ఈస్ట్ లో ప్రజలకు బీఫ్ తినే అలవాటును ఎలా నేరమంటాము. గోమాంసం సాకుతో నిరుపేద దళితులు, ముస్లిమ్స్ మీద జరుగుతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట వెయ్యడంలో ప్రభుత్వం విఫలమయ్యింది.
    ఈ సందర్భంలో మీకు కలిగిన ధర్మాగ్రహానికి వొందనాలు.

    http://www.visalaandhra.com/essays/article-73220 ~ కె. శ్రీనివాసమూర్తి

    “భారతదేశ ప్రజలమైన మేము భారత దేశాన్ని ”సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా” నిర్మించుకోవడానికి పౌరులందరికి సాంఘీక, ఆర్థిక రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలతో స్వాతంత్య్రాన్ని, అంతస్తు ల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చి వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రా తృత్వాన్ని పెంపొందించడానికి మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకుని చట్టంగా రూపొందించు కున్నఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం.” ఇదీ మన రాజ్యాంగ ప్రవేశిక.

    ప్రజల ఆశలను, ఆశయా లను, అవసరాలను ప్రతిబింబించే విధంగా, విభిన్న జాతుల సంస్కృతికి, సంస్కారానికి అద్దంపట్టేలా సమాజ జీవన ప్రణాళికగా రాజ్యాంగాన్ని రూపొందించారు రాజ్యాంగ నిర్మాతలు.

    అభివృద్ధి ఫలాలు సగటు జీవులకు మరీ ముఖ్యంగా దారిద్య్ర రేఖకు దిగువున వున్న వారికి చేరవేయడంలో వెనుకబడే ఉన్నాం. అవినీతికి వ్యతిరే కంగా సమర్థవంతంగా ప్రభుత్వం పోరాడటం లేదని నిరుద్యోగయువత అభిప్రాయ పడుతున్నది. అన్ని రంగా లను అవినీతి, అనైతికత, అవకాశవాదం ఆవహించి వున్నాయి. అరాచక, అసాంఘీక, అనైతిక అశ్లీల భావాలు ప్రజలలో విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. అన్ని రంగాల్లోనూ కృత్రిమత చోటు చేసుకుంది. మన రాజ్యాంగ వ్యవస్థలు సంకుచిత రాజకీయాలకు నిలయాలుగా మారాయి.

    ”రాజ్యాంగం ఎంత ఉత్తమమైనదైనా-పనిచేసే వ్యక్తులు దుష్టులైనప్పుడు- ఆ రాజ్యాంగం కూడా చెడ్డగానే మారిపోతుంది”- రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌.

మీ మాటలు

*