ఈ ఆదివాసీ కంట తడి కనిపిస్తోందా మీకు?!

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా …

adivasi

సమాజంలో జరుగుతున్న దాడులు , అసమానతలు ,అవినీతి వంటి అంశాల పై సామాజిక ఉద్యమకారులతో పాటు రచయితలు కూడా అంతే బాధ్యతతో బాధితులకి అండగా నిలవడం నైతిక బాధ్యత .ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలకు రచయితలు తమ కలాలకు పదును పెట్టి ఉద్యమాల విజయానికి కారకులయ్యారు . భారత దేశపు ఆదివాసీయుల సంస్కృతి , పోరాటాలు వారి కన్నీటి గాధలు పరిచయం చేస్తూ రచనలు చేసి రచయిత్రి మహాశ్వేతాదేవి సాహిత్యలోకానికి స్పూర్తిగా నిలుస్తుంది .

ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోక చీకట్లో మగ్గి పోతున్న సామాజిక వర్గాలలో ఆదివాసీలు ఇంకా అట్టడుగున వున్నారు . ఆదివాసీ దినాలు వస్తున్నాయి పోతున్నాయి గానీ వాళ్ళ జీవితాల్లో మార్పు కనిపించట్లేదు . ఇంక ఆదివాసీ మహిళల జీవితాలు , సొంత సమాజంలో వారి స్థానం ,వారిపై జరుగుతున్న హింసాకాండ ,అంతు చిక్కని న్యాయవ్యవస్థ  ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తాయి.

మన రాజ్యంగంలోని ఆర్టికల్ 46 గిరిజనులపై జరిగిన అన్ని రకాల అన్యాయలనుంచి కాపాడాలని, 275(1)  ప్రకారం వీరి అభివృద్ధికి నిధులను కేంద్రప్రభుత్వం విడుదల చేయాలనీ తెలియజేస్తుంది .350(2)ఆదివాసుల జనాభా, అధికారం,గిరిజన రక్షణ చట్టాలను కల్పిస్తుంది.ఇది కాకుండా అట్రాసిటి చట్టం,ల్యాండ్ ట్రాన్సఫర్ ఆక్ట్ ,పిసా ఆక్ట్ ,RNR ప్యాకేజ్ ,ఆటవిక సంరక్షణ హక్కు వంటి చట్టాలు మన రాజ్యాగంలో వున్నాయి.మనదేశంలో 600 కు పైగా  , మన రాష్ట్రoలో 33 కు పైగా ఆదివాసీ  తెగలు గుర్తించబడ్డాయి . భారత జనాభాలో 8%వున్న ఆదివాసీల పట్ల ప్రభుత్వం న్యాయం చేయటం లేదు.

ఆదివాసీ మహిళల ఆక్రందన 

2007 లో ఇదే నెలలో విశాఖ జిల్లా వాకపల్లి లో  జరిగిన ఆదివాసీ మహిళలపై పోలీసుల అత్యాచార సంఘటన మనసుల్ని కదిలిస్తుంది. నక్సలైట్ల కూంబింగ్ కోసం వెళ్ళిన పోలీసులు వారి స్త్రీలపై జరిపిన ఈ అవమానకరమైన సంఘటన ,ప్రాంతాలతో సంబంధం లేకుండా కదిలించి వేసింది.న్యాయం చేయాల్సిన పోలీసు వ్యవస్థ చేసిన అన్యాయాన్ని ఎదుర్కోవటం పెద్ద సవాల్ గా మారింది. ప్రజా సంఘాలు,బాధితులు కలిసి చేసిన పోరాటంలో 21 మంది నిందితులుగా నమోదయ్యారు.చివరికి అందులో 13 మంది మాత్రమే మిగిలారు.తొమ్మిది ఏళ్ళు గడచిన ఈ సంఘటనని  జనం మరచిపోయినా, బాధితుల మనసులు భగభగ మండుతూనే వున్నాయి .వారిలో ఇద్దరు మహిళలు ఆహార పానీయాలు మానేసి బలవంతపు చావుని ఆహ్వానించారు.తమకు న్యాయం జరగాలని రాజధానుల వెంట నడిచిన రోజుల్ని గుర్తు తెచ్చుకుని తమ తెగలోని మహిళల మధ్యకూడా తాము అవమానాల పాలయ్యామని బాధపడుతున్నారు. ఐదేళ్ళ క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ  న్యాయానికి  నోచుకోలేదు. ఖాకీల కర్కశ పాదాల కింద నలిగిన స్త్రీ మూర్తుల జీవితాలు   బాగుపడనేలేదు.  ఈచట్టలు  గిరిజనుల  కోసం   ఏర్పాటు  చేయబడ్డ నిబంధనలు ఎంతవరకు అమలౌతున్నాయో ప్రశ్నార్థకంగానే మిగిలిపోతున్నాయి.

చత్తీస్ ఘడ్ లో ఇటువంటి సంఘటనలెన్నో జరుగుతూనే వున్నాయి.అక్కడి ఆదివాసీ మహిళల సమస్యలపై పోరాడుతున్న ‘సోనీసోరి’ బస్తర్ జిల్లా ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ నాయకురాలు.ఆమె మీద పోలీసు దాడులు జరపడం అప్రజాస్వామికం.ఆమె ముఖంపై ఒక అజ్ఞాత ముఠా రసాయన పదార్థాన్ని  చల్లి పారిపోవటం ఆమెను శారీరకంగా కుంగదీసినట్లు భావించవచ్చునేమో కానీ ఆమె మానసికంగా దృఢ నిశ్చయంతో అన్యాయాన్ని ఎదిరించటానికి ముందుకు వెళ్ళటానికి ఈ సంఘటన సహాయపడింది.

ఆదివాసీలు – ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక అధ్యయనం

సామాజికంగా సాంఘికంగా స్త్రీలు రకరకాల నేపథ్యాలలో అణిచివేతకు, అన్యాయానికి గురౌతున్న సందర్భంగా ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక స్త్రీల అస్తిత్వ సమస్యలను అధ్యయనం చేస్తూ పలు కార్యక్రమాలను నిర్వహించింది.

2013 సెప్టెంబర్ 26 న ఆదిలాబాదులోని మంచిర్యాల చుట్టు పక్కల గ్రామాల ఓపెన్ కాస్ట్ గనుల ప్రాంతాన్ని పర్యటించిన ప్రజాస్వామిక రచయిత్రుల  వేదిక సభ్యులు ఎన్నో యదార్ధ బాధితుల గాధలని రికార్డ్ చేశారు.సింగాపూర్ లో తవ్వుతున్న బొగ్గు గనుల ప్రాంతాన్ని వర్ణిస్తూ రచయిత్రి శివలక్ష్మి తన ఆవేదన వెలిబుచ్చిoది.’’ఈ గనుల కోసం తవ్విపోస్తున్న ఇసుక గుట్ట ఒక చిన్న ఊరంత జాగాని ఆక్రమించి బొగ్గు తవ్వే కొద్ది అది పాపంలా పెరిగిపోతూనే వుంటుంద”ని చెప్పింది.  880 ఎకరాలలో 19 గ్రామాలను సర్వ నాశనం చేస్తూ ఊళ్ళను బొందలగడ్డలుగా మారుస్తున్నారని గ్రామస్తులు తెలియజేసారు.

ప్రరవే సభ్యురాలు శాంతి ప్రబోధ, భండారు విజయ , తాయమ్మ కరుణ , హేమలలిత    కలిసి ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రాంతంలోని ఎర్ర చెలక , పునుకుడు చెలక , తోక బందల గ్రామాలకు  పర్యటించారు  . అక్కడి కోయ , గిరిజన గ్రామాలలో  కొత్త గూడెం విమానాశ్రయం కోసం జరుగుతున్న భూసేకరణ కార్యక్రమాన్ని నిరసిస్తూ అక్కడి ఉద్యమకారులకి గిరిజనులకు మద్దతు తెలిపారు .

మెదక్ జిల్లా సింగూర్ ప్రాంతాలలోని తండాల ప్రజలు సందర్శించిన ప్రరవే సభ్యురాలు కవిని ఆలూరి వారి సమస్యల పై అధ్యయనం చేసింది . ఒక్క పూటైనా తినడానికి కష్టంగా ఉన్న వాళ్ల పరిస్థితిని వివరించింది . చెరకు కర్మాగారాలకు నీరు లేకపోవడం వలన వలసలు ఎక్కువగా జరుగుతున్నాయి . కర్ణాటక , తెలంగాణ సరిహద్దుల నుంచి పుల్కల్ మండలం బస్సాపూర్ గ్రామానికి చెరకు కొట్టడానికి వచ్చిన జూకల్ తండా , తడ్కల్ తండా స్త్రీలను కలిసి వారి జీవన గాథల్ని తెలియజేసింది . ప్రపంచీకరణ విధానాల అమలుతో గ్రామాలలో చేతి వృత్తులు ధ్వంసమై ,ప్రజలు జీవనాధారం లేక వలసలకు వెళుతున్నారని , వెళ్ళిన చోట పనులు దొరకక ఇబ్బంది పడుతున్నారని కవిని వివరించింది .  తండాలలో వలసపోయే ముందు రోజు తండావాసులoదరు కలసి పoడగ చేసుకొని ఆ రాత్రి గతంలో వలస సమయంలో ఎదుర్కొన్న కష్టాలను తలచుకుంటూ విలపిస్తుంటారు . వృద్ధులను చూస్తే చాలా దయనీయంగా అనిపిస్తుంది .

పోలవరం ప్రాజెక్ట్ ఆర్డినెన్సు వచ్చిన దగ్గరనుంచి ప్రజా  సంఘాలు , ఉద్యమకారులు,రచయితలు కూడా పర్యావరణానికి, గిరిపుత్రులకి అండగా నిలిచి ఆందోళన చేపట్టారు .తెలంగాణా ఆంధ్రాప్రాంతాల ముంపు గ్రామాలను దర్శిస్తూ వారి బాధల్ని  పంచుకున్నారు.ఈ ప్రాజెక్ట్ వల్ల సుమారుగా ఏడు లక్షల ఎకరాలకు పైగా పొలాలను పండించవచ్చు . అదే సమయంలో ఆదివాసీల అటవీ ప్రాంతం మూడున్నర లక్షల హెక్టార్ల భూమిని కోల్పోతున్నారు.నిర్బoధoగా ఆదివాసీల జీవన సౌధాలను కొల్లగొట్టి పట్టణాలకి పరుగులు తీయించడం , సంస్కృతిని అంతంచేయటం వంటిది .

ఇందులో భాగంగానే తెలంగాణా విభాగం నుంచి  ప్రజాస్వామిక  రచయిత్రుల  వేదిక సభ్యులు అనిసెట్టి రజిత, భండారు విజయ ,కొలిపాక శోభారాణి, కందాళ శోభారాణి,బండారి సుజాత ,కొమర్రాజు రామలక్ష్మి జూన్ 10 , 2014 న ఈ ప్రాజెక్ట్ వల్ల నష్టపోతున్నగ్రామాలకు వెళ్ళారు .కుకునూరు , కోకుళ్ళపాడు , టేకుపాక మొదలైన గ్రామాల గుండా కూనవరం వెళ్ళారు . బలవంతంగా తమ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాలో కలపటాన్ని నిరసిస్తూ ‘’మా పంటలు , మా గొడ్డు గోదా , మా అడవి తల్లి సంపద అన్నింటినీ వదిలేసి మేం ఎందుకు వెళ్ళాలి ‘’అని ప్రశ్నిస్తున్న ఆ ప్రాంతపు స్త్రీల మనోవేదనని తెలియజేశారు .

‘’కూనవరం, వీ. ఆర్. పురం , చింతూరు మండలాలలో దాదాపుగా 85 వేల   మంది గిరిజనులు , గిరిజనేతరులు నివసిస్తున్నారు . నిత్యావసర వస్తువుల కోసం గుట్టలు , పుట్టలు దాటి సరుకులు కొనుగోలు చేస్తారు . కొన్ని సందర్భాలలో నిల్వ ఉంచిన ఆహారాలు తిని రోగాల బారినపడి చావుకు దగ్గర అవుతున్నారు . విషపురుగుల బారిన పడి వైద్యసదుపాయం లేక నాటు మందులతో ప్రాణాలమీదకి తెచ్చుకుంటున్నారు . రాష్ట్రాల విభజనవల్ల నష్టపోయే ఆదివాసుల అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోకపోవటం వలన  సంస్కృతిని కోల్పోతున్నారు ‘’అని భండారు విజయ తెలియజేసింది   .

కందాల శోభారాణి  ప్రజలందరూ సమానమని భారత రాజ్యాంగంలోని 14 వ అధికరణంలో పొందుపరుచుకున్నాం కాని , పర్యావరణానికి , ఆదివాసీ జీవనానికి తీవ్ర హాని జరుగుతున్నా కూడా పాలకులు పట్టించుకోవటం లేదని ఆదివాసుల ఆస్తిత్వాన్ని రద్దు చేసి వారి జీవితాన్ని విధ్వంసం చేస్తూ పరాయీకరణకు గురి చేస్తున్నారని , కొమరంభీం , బేర్సా  ముండా , మన్యం తిరుగుబాటు సందర్భంలో ఆదివాసులు చురుకైన పాత్ర వహించారని గుర్తుచేసింది .

బండారు సుజాత , కొమ్రరాజు లక్ష్మి తమ కవితలలో ఆదివాసుల కష్టాలను కవితల్లో చెప్పారు .

ధనసరి అనసూయ ’ ముంపు’ దీర్ఘ కావ్యాన్ని కోయ భాషలోనికి అనువదించింది .

కాత్యాయనీ విద్మహే వరంగల్ చుట్టు ప్రక్కల ప్రాతాలలోని లంబాడీ తండాలకు వెళ్లి వారి జీవన విధానాన్ని , ఆ స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాయాలని , హక్కుల గురించి అధ్యయనం చేసింది .

ఈ ముంపు  గ్రామాలలో ‘’వ్యవసాయ ఆధారిత జీవన విధానాన్ని సమూలంగా ధ్వంసం చేసే విపత్తు అంతర్భాగంగా ఉందని,  ఆoధ్రప్రదేశ్ లో  275 గ్రామాలు , ఒరిస్సా లో 13 గ్రామాలు , ఆoధ్రప్రదేశ్ కలిసిన  ఖమ్మం జిల్లాలోని 205 గ్రామాలు మొత్తం 27 వేల  కుటుంబాలు , లక్ష పదిహేడు వేల మంది  ప్రజలు నిర్వాసితులు అవుతార’’ని అనిసెట్టి రజిత తన ఆవేదనని  వ్యక్తం చేసింది .

కొలిపాక శోభారాణి శ్రీకాకుళం నుంచి నెల్లూరు  తీర ప్రాంతం వెంబడి నిర్మించబడుతున్న భారీపరిశ్రమలకి నీటి అవసరాన్ని తీర్చడానికి మాత్రమే పోలవరం ప్రాజెక్ట్ నిర్మించబడుతుందని , ఈ పరిశ్రమలన్నీ జాతీయ బహుళ  ప్రైవేటు కంపెనీలే అని అభిప్రాయపడింది .    గిరిజనలు కోల్పోయే భూములకి సమానమైన భూమి ప్రాజెక్ట్  ఆయకట్టు కింద ఇవ్వాలనే ఒప్పందం పైన గిరిజన మంత్రిత్వ శాఖ 2007  లో ప్రాజెక్ట్ పనులకి అనుమతినిచ్చిందని కానీ యిప్పటి వరకు ఒక్క ఎకరం భూమి కూడా ఇవ్వలేదని తెలిపింది .

 

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (A.Pశాఖ) ఆదివాసీ స్త్రీల అస్తిత్వ సమస్యల పై ఎన్నో కార్యక్రమాలు చేసింది .యువ గిరిజన సంక్షేమ హాస్టళ్ళలో బాలికల స్థితిగతుల మీద అధ్యయనం గిరిజనుల సాంస్కృతిక జీవనం మీద అధ్యయన కార్యక్రమాలను నిర్వహించింది .

 

2016 ఏప్రిల్ లో సంస్కృతీ గ్లోబల్ స్కూల్ ,మహిళాచేతనతో కలసి నవతరంతో యువతరం అనే కార్యక్రమంనిర్వహించింది. ఇందులో భాగంగా ప్రకృతి సోయగాల్ని ,విరజిమ్మే అందాల విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంతంలోని సుంకరమెట్టలో జరుగుతున్న బాక్సైట్ తవ్వకాలు ఆదివాసీల జీవనానికి ముప్పుగా మారింది.

బాక్సైట్ తవ్వకాలపై అవగాహన కోసం విద్యార్థులు, రచయితలు పర్యావరణ ప్రేమికులతో కలిసి ఒక పర్యటన నిర్వహించింది. విశాఖపట్నం జిల్లాలోని సుంకర మెట్ట ప్రాంతంలోజరుపుతున్న బాక్సైట్ తవ్వకాలు ఆదివాసీల జీవనానికి ముప్పుగా మారింది.

బాక్సైట్ తవ్వకాలవల్ల అక్కడి గిరిజన  ప్రాంతాల ప్రజలకి, చుట్టుపక్కల ప్రాంతాలవారికీ కలుషిత పర్యావరణం కలిగించే విషప్రభావం ఎంతగా వుంటుందో భావి పౌరులకి తెలియజేసింది.స్వార్ధ పూరిత ప్రభుత్వ విధానాలు అందమైన ప్రకృతిని నాశనం చేస్తూ ఆదివాసీల మనుగడకి ప్రమాదం ముంచుకు రావటం తీవ్రంగా ప్రతిఘటిoచవలసిన విషయాలు.

***                                    ***                                    ***

విహంగ మహిళా సాహిత్య పత్రిక ఆధ్వర్యంలో నేను , రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి , ప్రముఖ బ్లాగర్ రసజ్ఞ  , పోలవరం మండలం లోని ఆదివాసీ గ్రామాల పై పరిశోధన చేస్తున్న ఎం .ఫిల్ విద్యార్ధి, విహంగ పాఠకులు జొన్నకూటి రవికిరణ్ , సందీప్ ఒక బృందంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం మండలం ముంపు గ్రామాల సందర్శనకు వెళ్ళాము .

పోలవరం ,ఎర్రవరం ప్రాంతంలో అతివేగంగా జరుగుతున్న ప్రాజెక్ట్ నిర్మాణo,పనిచేస్తున్న మరయంత్రాలు భూమాత గుండెల్ని కర్కశ ఇనుప చేతులతో పెళ్ళగిస్తున్న  ప్రొక్లైనర్లు, గుoడెల్ని తూట్లు పొడిచే డ్రిల్లింగ్ యంత్రాలు… అక్కడక్కడ కన్నీటి ధారలుగా ప్రవహిస్తున్న నీటిపాయలు… మనసుని వికలం చేస్తుండగా ప్రాజెక్ట్ నిర్మాణం మధ్య వేసిన తాత్కాలిక రహదారుల మీద మా ప్రయాణం కొనసాగింది.పచ్చని ప్రకృతి మధ్య గోదావరి నదిపై జరుతున్న ఆ మహానిర్మాణం సిరిసంపదలు తెచ్చి పెడతాయని భావిస్తుంటే గిరిజనుల మానసిక పరిస్తితి,అలజడి, మనోభావాలు ఏవైపుగా ఆలో చిస్తున్నాయో ఈ ప్రయాణం నాకు  తెలియజేసింది.

మేము పర్యటించిన ప్రాంతంలో యర్రవరం ,మాధవవరం,పైడాకుల మామిడి సరుగుడు, టేకూరు,శివగిరి ,కొండ్రకోట,సింగన్నపల్లి గ్రామ ప్రజలు ఎన్నెన్నో కబుర్లు చెప్పారు.

యర్రవరం గ్రామస్తురాలు ఎండిపల్లి నాగమ్మ ఎంతో సేపు నాతో ముచ్చటించింది.వాళ్ళ మాటల్లో అడవి, కొండలు,ప్రకృతిని దాటి వేరే విషయాలు రాలేదు.తమ జీవనాధారమైన కొండ ప్రాంతాలకు వెళ్ళటాన్ని నిషేధించటం  ఎంత బాధను కలిగించిందో ఇలా చెప్పారు.

బుట్టాయగూడెం మండలంలోని చంద్ర వంక గ్రామంలో పోలవరం ప్రాంతపు ఆదివాసీలకు ఇళ్ళస్థలాలు ఇచ్చారు .కానీ ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా అక్కడ కొండలు కనిపిచవు.వీరి ఆవేదనకు ముఖ్యకారణం కొండలు లేవనేదే.వారితో మాట్లాడినంత సేపు కొండలు లేవు లేవు లేవు అని ఎన్నో సార్లు ఎంతో బాధతో చెప్పారు .ప్రకృతితో విలీనమైన వారి జీవితాలు ఆ వాతావరణాన్ని వదలలేనివారి అమాయకం  అర్థమయ్యాక లేగదూడని  తల్లి నుండి విడదీస్తున్న భావంతో మనసు బరువెక్కిపోతుంది.

‘’కొండ ఎక్కుతుoటే ఎక్కటానికి వీల్లేదన్నారు కట్టె పుల్లల కోసం కూడా వెళ్ళటానికి వీల్లేదన్నారు  మాకు గ్యాస్ వాడకం రాదు కదమ్మా చిన్నప్పటి కాడ నుండి పుల్లలమీద  వండుకోవటం అలవాటు , అందరూ రాయించుకున్నారు కానీ మేము గ్యాస్ రాయించుకోలేదు .’’

వాళ్ళకి పునరావాసం కల్పించిన చంద్రవంక కాలనీ గురించి అడిగితే ఎంతో అసంతృప్తిని వ్యక్తం చేసారు. “ ఏమో అక్కడ ఎలాగున్నదో మేముకూడా చూడలేదు అని నాగమ్మ అంటే- పామా బుచ్చిరాజు వెంటనే ఇలా అన్నాడు “అక్కడేం బాగాలేదండి .కొండల్లేవ్ ఏమ్లెవ్” అని పెదవి విరిచాడు .

“మీరు ఈ కొండలమధ్యే  ఉండటానికి ఇష్టపడుతున్నారా  అన్న ప్రశ్నకి అవునని ఖరాఖండిగా సమాధానం చెప్పారు.

‘’మీరు ఈ ఊర్లో ఉంటే సమయానికి బస్సు సౌకర్యం ,వైద్యం వసతులు వంటివి వుండవు కదా!’’అని నేను ప్రశ్నించినప్పుడు దానికి సమాధానంగా నాగమ్మ మాట్లాడుతూ ‘’మనుషులందరూ ఒకే స్థితిలో వుండరు కదా!నేనున్నట్లు నువ్వు వుండవు నువ్వు  వున్నట్లు నేను ఉండను.మాకు పది తోకల దూడలు వున్నాయనుకోండి .ఇక్కడైతే ఖాళీ స్థలంలో తిరుగుతాయి .మేము  కూడా ఇక్కడ ఖాళీ స్థలంలో తిరుగుతాము.మేము అక్కడికెల్లాక ఏ ఖాళీ స్థలంలో తిరుగుతాము?

మా పశువులు ,మా దూడలు ఎవరి చేలోకెల్లి మేస్తాయి? ఇక్కడైతే వాటికి నచ్చిన చోట మేస్తాయి.కట్టె  పుల్లలు తెచ్చు కోవాలంటే ఇక్కడైతే అడవుల్లోకి వెళ్తాం .అక్కడ ఎక్కడ నుండి తెచ్చుకుంటాం? మాకు అక్కడికి వెళ్ళటానికి ఇష్టం లేదు .కాని మీకు డబ్బులిచ్చేసాం మీరిక బయలు దేరండని మమ్మల్ని పంపేస్తున్నారు .పోక్లేనర్లతో గుడిసెలు కూలగొడుతున్నారు  పిల్లలమీద పడిపోతాయనే భయం తో అందరు ఊళ్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు .ఇటువంటి పరిస్థితుల్లో మేమేం చేయాలి .ఇవన్ని పగలైతే మేమేదైనా చేసే వాళ్ళం .ఇదంతా రాత్రి చేసారు.

ఇంక ఆస్పత్రి అంటే పోలవరం కాని కొండ్రుగూడ కానీ వెళ్లి చూపించుకుంటాం .ఇంకా మెరుగైన వైద్యం కావాలంటే రాజమండ్రి లేదా కాకినాడ వెళ్ళాల్సిందే .’’

 

పోలవరం ప్రాజెక్ట్ కడితే మీకు లాభకరంగా ఉంటుందని అనుకుంటున్నారా? అని అడిగితే నాగేశ్వరరావ్ ,రామ కృష్ణ , లింగరాజు అందరు ఒకే మాట చెప్పారు. ‘’ఏం  ఉపయోగo ఉంటుందమ్మా? మా కొంపా గోడు చెల్లా చెదురై పోయాక మమ్మల్నిక్కడనుంచి పంపేసి అక్కడ ఏమిస్తారో ఏమివ్వరో? తెలీదు’’ అన్నారు .

‘’ప్రాజెక్ట్ కడితే పొలాలకి నీళ్ళందుతాయి.పంటలు బాగా పండుతాయి .మన రాష్ట్రo బాగా అభివృద్ధి చెందుతుంది అంటున్నారు కదా? ‘’ అన్న ప్రశ్నకి

‘’లాభపడే వాళ్లకి బాగానే వుంటుంది .మేం ఇక్కడ మా నివాసాలను,పుట్టి పెరిగిన ప్రాంతాన్ని, మాకున్న అతి కొద్ది భూమిని మాకు నచ్చిన చోట కోల్పోతున్నాం . మేం కోల్పోయిన దానికి సరిపడ నష్ట పరిహారం ఇవ్వాలి .మాకు స్వేచ్ఛగా బతికే మంచి ప్రదేశంలో నివాసాలేర్పాటు చేయాలనీ కోరుకుంటున్నాం.అది కూడా అడవిలోనే మేం వుండాలని కోరుకుంటున్నాం.వాళ్ళు పట్టణ  ప్రాంతాలకి దగ్గరగా నివాసం ఇస్తున్నారు. అక్కడికెళ్ళి బ్రతకటం మావల్ల కాదు . అక్కడ మా వాతావరణం వుండదు.ఇక్కడున్న జీవితం అక్కడ రావాలంటే కొన్ని సంవత్సరాలు అలవాటుపడితే కానీ రాదేమో. కొండలు లేవు . పనులు దొరకవు. ఇది మాకు అలవాటైన ప్రాంతం కాబట్టి ఏపనైనా చేసుకుని బ్రతుకుతాం.ఊర్లో కుర్రోళ్ళు అడవికి వెళ్లి వేటాడుకొస్తుంటారు.కుందేళ్ళు ,కొండ గొర్రెలు, అడవి పందులు వంటివి వేటాడుతారు‘’ అని సామా బుచ్చి బాబు అన్నాడు .

జానకి, కుమారి  మాట్లాడుతూ తమ కుటుంబంలో ఐదు మంది సభ్యులుండగా మొత్తం కుటుంబానికి లక్షరూపాయల పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకున్నట్లు చెప్పారు .

ఉమ్మడి కుటుంబాలుగా వున్న ఇళ్ళకి కూడా ఈ లక్షరూపాయలే వర్తిoచటంతో ఈ మొత్తం ఎంత మందికి నష్ట పరిహారంగా  మారుతుంది?కుటుంబంలోని ఇద్దరు లేదా ముగ్గురు అన్నదమ్ములకు విడివిడిగా ఇళ్ళ స్థలాలు ఇస్తారా లేదా అన్నది అటు ప్రభుత్వం తేల్చి చెప్పకపోవటంతో గ్రామస్తులు అయోమయంలో వున్నారు. ఉన్న చోట పోడు  వ్యవసాయం, పశువుల మందలు ,ఇల్లు,వాకిలి కోల్పోయి  తెలియని ప్రాంతాల్లో ఎలా బతుకును వెళ్ళదీసుకోవాలో అర్థం కాని స్థితి లో ఉన్నట్టుగా వారి మాటల్ని బట్టి తెలుస్తుంది .

పునరావాసం కల్పించిన చోట మీకు పొలాలు కూడా ఇచ్చారా? అన్న ప్రశ్నకి – ‘’ఇక్కడ మా చేలల్లో పండిన పంటలు చేతికి అందాక చంద్రవంక కాలనీలో గవర్నమెంట్ మమ్మల్ని ఏం వుద్దరించారో  అని అడగటానికి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక కాని మా కోసం ఏం వుందో ఏం లేదో తెలుస్తుంది .ఒక్కప్పుడు మాకిక్కడ పొలాలు ఉండేవి .మా పెద్దోళ్ళు అవన్నీ కోల్పోయారు .ఆ తర్వాత కొంత కాలానికి మా ప్రాంతపు ప్రజలంతా భూపోరాటం చేసి భూములు సంపాదించుకున్నాం. నాకో 70 సెంట్ల పొలం వచ్చింది ఈ భూమిని ఇక్కడ పోగొట్టుకున్నట్టే .అక్కడ ఇస్తారో లేదో తెలియదు.

పండిన పంట  మాకు కావలిసినంత మేం వుంచుకొని మిగిలినవి ఇచ్చేస్తాం .మా వూళ్ళో  వరి ,శనగలు,మినుములు ,పెసర్లు ,కందులు ,దనియాలు అన్నీ  పండిస్తాం . .’’ అన్నారు .

‘’అవి అమ్మితే ఎంత ధర వస్తుంది ?’’

‘’ ఏమో మాకు తెలియదు. అవి మేము కేజీల లెక్కన అమ్మం. కాటాకి  ఇచ్చేస్తాం. బస్తాల లెక్కన అమ్మేస్తాo.నాల్గు ముంతల పెసర్లు పండితే  ఇచ్చేసాం  ’’

‘‘దానికి మీకు ఎంత డబ్బు వచ్చింది ?

‘’ఇంకా లెక్క తేలలేదు ‘’

ఇంతకీ ఎవరికి ఇచ్చారుమీ ధాన్యం ? మీ  లెక్కలెవరు చూస్తారు ?

‘’సెట్టిగారు అని ఒకాయన వున్నారు.నాగలి దున్నటానికి,విత్తనాలకి, మందులకి అన్ని ఖర్చులు ఆయనవే. దున్ని పంట పండించిన తర్వాత తీసుకెళ్ళి ఆయనకిస్తే  ఆయన పెట్టిన ఖర్చుల లెక్కలు చూసుకొని మిగిలింది మాకిస్తాడు. అన్ని లెక్కలు చూసి ఇంతవరకు తీర్మానం అయిoదని ఆయన డబ్బులు   ఆయన తీసుకుంటాడు.  మిగిలింది మాకిస్తాడు ‘’అని చెప్పారు .

 

పై సంభాషణని పరిశీలిస్తే ఇంకా మారుమూల   ఆదివాసీల ప్రాంతాలలో వున్న నిరక్ష్య రాస్యత ,పేదరికం ,అమాయకత్వం,పట్టణ  ప్రాంతపు దళారీల చేతులో చిక్కుకున్న వారి జీవితాలు అర్థమౌతా యి .

శ్రీకాకుళ ప్రాంతం లో జరుగుతున్న భూమి పోరాటాలు, పోలవరం ప్రాజెక్ట్ కి సంబందించిన ఆదివాసీ ప్రాంతాలలో బలవంతంగా జరుపుతున్న వలసలు, ఆదివాసీయుల సొంత  అస్థిత్వానికి గౌరవం  లేకుండా చేస్తున్నారు . పర్యావరణ పరిరక్షణ చట్టాల ప్రకారం గిరిజనులకు,ప్రకృతికి విడదీయరాని అనుబందం వున్న దృష్ట్యా వారి హక్కులకు భంగం కలిగించకూడదు. యాభైవేల కంటే ఎక్కువగా ఆదివాసీ జనాభా ఉన్నట్లయితే ఆప్రాంతాలలో ప్రాజెక్ట్ల నిర్మాణం చేయరాదని 2006 లో జాతీయ గిరిజన ముసాయిదా చట్టం చేయబడింది.

యిప్పుడు పోలవరం ప్రాంతంలో జరుగుతున్న ప్రాజెక్ట్ నేపథ్యంలో జలసమాధి కాబోతున్న భూముల్లో నివసించే   ఆదివాసీయులను పట్టణ ప్రాంతాలకు తరలించడం వల్ల ప్రకృతితో మమేకమైన వారి జీవితాలను శరీరం నుండి ప్రాణాన్ని వేరుచేసినట్లుగా వారు భావిస్తున్నారు.

నాగమ్మ  స్వచ్ఛ మైన నవ్వు, మనసు విప్పి మాట్లాడిన మాటలు హృదయాన్ని తాకుతుండగా ‘’నువ్వు భలే నవ్వుతున్నావు’’ అన్నాను.

నాగమ్మ నవ్వుతూ ‘’మరింకేం చేస్తామమ్మా నవ్వాలి కదా !’’అన్నది.

ఉన్నదంతా కళ్ళముందే పోతూ ఉన్నా అడవి బిడ్డలుగా పుట్టటంలో వున్న సంతృప్తి వాళ్ళ మొఖంలో కన్పించింది నాకు .

మేము ఆగ్రామాన్ని విడిచి వస్తుంటే మళ్ళీ కొంత కాలానికి మళ్ళీ మేము అక్కడికి వెళ్ళే అవకాశం లేదని అనిపించే సరికి హృదయం భారం అయింది . అక్కడి వాళ్ళు కూడా ఏ సమయానికి గ్రామాన్ని వదిలి పెట్టాల్సివస్తుందో మాకే తెలియదు అన్నారు .   కొన్ని వందల  అడుగుల లోతున జల సమాధి కాబోయే ఆ ప్రాంతాల్ని మా కళ్ళలోకి నింపుకుంటూ తిరిగి ప్రయాణం అయ్యాo.

ప్రకృతి బిడ్డలను స్వేచ్ఛగా జీవించే హక్కు ఆనందంగా తమకు నచ్చినట్టుగా జీవించేలా నాగరికులు సహకరించటం అత్యవసరమైన విషయాలు. వారి హక్కుల్ని వారి సంపదను వారినే అనుభవించనిద్దాo .

*

 

మీ మాటలు

  1. Nityaa V says:

    కొండ ప్రాంతాల నుంచి…వారి ప్రాణాధారం నుంచి వాళ్ళనే దూరం చేయడం దారుణమైన విషయం. ఇన్ని కోట్ల జనాభాలో కనీసం మీరంతా ఐనా ఇలా స్పందించడం అభినందనీయం…స్ఫూర్తిదాయకం.

  2. పద్మ వంగపల్లి says:

    ప్రరవే కృషి అభినందనీయం..

  3. Sivalakshmi says:

    చాలా వివరంగా బాగుంది హేమా,
    “మా కొండలు మా కొండలు” అంటున్న వారి ఆవేదన అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించదు అధికార యంత్రాంగం . మాహా సౌధాలు నిర్మిచుకునే వాళ్ళను,ఇద్దరు మనుషులకి 30 అంతస్తులు కట్టుకున్నవారిని, ఇంటి ఆవరణలోనే వేలాది ఎకరాల్లో విమాన యానానికి రన్ వే లు ఏర్పాటు చేసుకున్న వారి జోలికి పోదు ! ఇదంతా క్లాస్ నేచర్ !! దిక్కూ,మొక్కూలేని జనం మీదే జులుం చూపిస్తుంది!

  4. Perumaalla ravikumar says:

    పుట్ల హేమలత గారు వ్యాసం లో ఆదివాసీల గురించి చక్కగా చెప్పారు.వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా తయారయ్యాయి.మీ ప్రరవే బృందం చేసిన పర్యటన వాళ్ళ చాలా విషయాలు పాఠకుల ముందుకు తెచ్చారు.”ప్రకృతి బిడ్డలను స్వేచ్ఛగా జీవించే హక్కు ఆనందంగా తమకు నచ్చినట్టుగా జీవించేలా నాగరికులు సహకరించటం అత్యవసరమైన విషయాలు. వారి హక్కుల్ని వారి సంపదను వారినే అనుభవించనిద్దాo .”ఈ ముగింపు వాక్యాలు అందరిని ఆలోచింపజేస్తున్నాయి.

    *

    • పుట్లగారు అద్భుతంగా మన ప్రరవే కృషిని తెలియచేసారు. ప్రకృతి బిడ్డలైన ఆదివాసులు, గిరిజనుల జీవితాలను ఇంకా లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా వుంది. వారి జీవన విధానం, వారు హరితాహరణం పేరా పోడు భూముల ఆక్రమణ, అభివృద్ధి పేరా పెట్టుబడి దారులకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల భూములను ధారాదత్తం చేయటాన్ని వారు నిరసిస్తూ పోరాడుతున్న తెగువను , వారు కోల్పోబోతున్న సంస్కృతులను, సంప్రదాయాలను నిశితంగా అధ్యయనం చేసి మరింత వెలుగులోనికి తెచ్చి వారికి న్యాయం జరగటంలో మనవంతు కృషి జరపటానికి ప్రయత్నాలు చేసే దిశగా మన అడుగులు ఉండాలని మనవి. చాలా కాలం తర్వాత స్పందించి నందులకు మన్నించగలరని కోరుతూ …. మీ భండారు విజయ

మీ మాటలు

*