Archives for February 2016

మూలస్వరం మూగపోకూడదు: గౌరి

 

     – వారణాసి నాగలక్ష్మి

~

 

varanasi nagalakshmi

ఈ సంవత్సరం అనువాదరంగంలో ఇద్దరు ప్రవాసులకి సాహిత్య అకాడెమీ పురస్కారాలు రావడం తెలుగువాళ్ళందరికీ సంతోషాన్నిచ్చింది. ఒకరు తెలంగాణలో పాతికేళ్లు పెరిగి చెన్నైకి తరలి వెళ్ళిన గౌరీకృపానందన్. మరొకరు కేరళలో పుట్టి పెరిగి ఆంధ్రలో స్థిర నివాసమేర్పరచుకున్న ఎల్ ఆర్ స్వామి.‘సూఫీ చెప్పిన కథ’ని తెలుగువారందరికీ చెప్పిన స్వామి గారికీ, ఓల్గా ‘విముక్త’ని ‘మీట్చీ’గా తమిళులకి పరిచయం చేసిన గౌరీ కృపానందన్ కీ,  తెలుగు రాష్ట్రాలు రెండిటికీ  సాహిత్య ఎకాడమీ పురస్కారాలు సంపాదించి పెట్టినందుకు మనం ధన్యవాదాలు తెలుపుకోవలసిందే.

‘జాటర్ ఢమాల్’ అంటే ఏమిటో ఆ పిల్లల భాషని అనువదించగల ముళ్ళపూడి పుణ్యమా అని మనకి తెలిసింది గాని లేకపోతే  బుడుగు మనకి అర్ధమయ్యేవాడే కాదు.   ఉత్తర భారతీయుల్లో బెంగాలీలు మనకి అర్ధమయినంతగా మిగిలిన వాళ్ళు అర్ధంకారంటే దానికి కారణం విస్తృతంగా మనకి చేరిన బెంగాలీ సాహిత్యమే. ఒక ప్రాంతాన్ని కూలంకషంగా అర్ధం చేసుకుందుకు దోహదం చేసేది అక్కడి సాహిత్యమే. ఒక ప్రాంత సాహిత్యం ఆ ప్రాంతానికే పరిమితమైపోకుండా నలుగురికీ అందుబాటులోకి తెచ్చే అనువాద ప్రక్రియ ప్రతిభావంతంగా సాగాలంటే మూల భాషా, లక్ష్య భాషా నేర్చుకుంటే సరిపోదు. ఆ ప్రాంతపు సామాన్య జనానీకంలో మమేకమై జీవిస్తే తప్ప ఆ అనువాదం సహజంగా పరిమళభరితంగా సాగదు.

ఇంట్లో తమిళం, గడప దాటగానే తెలుగు వాతావరణం..   గోదారి రెండు తీరాల మధ్య తిరుగాడే నావలా గౌరి  భాషాధ్యయనం ఆట పాటల మధ్య సాగింది. తెలంగాణలోని తెలుగు మీడియం పాఠశాలల్లో చదువుకుని, ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన  గౌరి, వివాహానంతరం చెన్నైకి తరలి వెళ్లినా, తెలుగుని తన మాతృ భాషగా భావిస్తూ, గత రెండు దశాబ్దాలుగా ‘చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు’ రుచిని తమిళ సోదరులకి  చవి చూపిస్తున్నారు.

కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం అందుకోబోతున్నందుకు హార్దికాభినందనలు గౌరీ! వార్త వినగానే ఎలా అనిపించింది? మీ కుటుంబ సభ్యుల స్పందన ఏమిటి?

మీ అభినందనలకి ధన్యవాదాలు. నిజంగా ఇది నా జీవితంలో మరిచిపోలేని తరుణం. ‘దినమణి’ దినపత్రికలో ఉన్న ఒక సాహితీ మిత్రులు  సమాచారం వచ్చిన వెంటనే అభినందనలు తెలియ చేస్తూ ఈ మెయిల్ పంపారు. మొదట అది నిజమేనా అని సందేహం కలిగింది. వెంటనే సాహిత్య అకాడమి వారి వెబ్ సైట్ కి వెళ్లి చూసినప్పుడు అందులో ప్రెస్ నోట్ కనబడింది. ఆ తరువాతే నమ్మకం కలిగింది. వెల్లువలా వచ్చే ఫోన్లు,  సందేశాల మధ్య మా వారు, కొడుకులు, కోడళ్ళు  అనుకోని ఈ శుభ వార్తకి ఎంతగానో సంతోషించారు.

unnamed

మీకు లభించిన ఇతర పురస్కారాల గురించి చెప్పండి.

‘లేఖిని’ సంస్థలో కామేశ్వరిగారి పురస్కారం, తిరుప్పూర్ లయన్స్ క్లబ్ వారి ‘శక్తి’ పురస్కారం అందుకున్నాను.

2014 లో కుప్పం ద్రావిడ  యూనివర్సిటీకి  అతిధిగావెళ్లాను.  అనువాదరంగంలో నా అనుభవాలు పంచుకున్నాను. అదే విశ్వవిద్యాలయంలో 2015 మార్చ్ లో జరిగిన పది రోజుల వర్క్ షాప్ లో అనువాదం లో ఉన్న సాధక బాధకాలు విద్యార్దులతో ముచ్చటించాను.

మీరు పుట్టిన కుటుంబ వాతావరణం, మీరు పెరిగిన పరిసరాలు ఎలాంటివి?

మాది మధ్య తరగతి కుటుంబం. మాతృభాష తమిళమే అయినా నాన్నగారి ఉద్యోగ రీత్యా ఆంధ్రప్రదేశ్ లో (ఇప్పటి తెలంగాణా) ఇరవై ఏళ్ల దాకా పెరిగాను. చదువు పూర్తిగా తెలుగు మీడియం లోనే సాగింది. (హైదరాబాద్, భువనగిరి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, వరంగల్) చిన్నప్పుడు స్కూల్ నించి ఇంటికి రాగానే అమ్మ పెట్టింది తిని వెంటనే ఆడుకోవడానికి బైటికి పరిగెత్తే వాళ్ళం. పిల్లలందరూ తెలుగులోనే మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పటిలా కాన్వెంటు చదువులూ, ఇంగ్లీషు లో మాట్లాడుకోవడాలు ఆ రోజుల్లో లేవు. చదువు గురించిన వత్తిడి, మార్కుల బెడద అప్పట్లో అంతగా లేవు. ఇప్పుడు ఎల్కేజీ  చదువుతున్న పిల్లలకి కూడా తలమీద కొండంత బరువు ఉంటోంది

ఈ మధ్య తెలుగు విశ్వ విద్యాలయంలో జరిగిన సాహితీ సదస్సులో దక్షిణాది భాషల మధ్య రావలసినంతగా అనువాదాలు రాలేదన్న భావన వ్యక్తమయింది. అందువల్ల ప్రాంతీయంగా సాంస్కృతికంగా ఎంతో సారూప్యతలున్నా ఒక భాషలోని సాహిత్యం గురించి మరో భాష వారికి పెద్దగా తెలియకుండా పోతోందన్న వాదనతో మీరు ఏకీభవిస్తారా?

ఇండియాలో ఉన్నన్ని భాషలు ఏ ఒక్క దేశం లోనూ లేవు. ప్రాంతీయంగా సారూప్యతలు ఉన్నా ఒక భాషలోని సాహిత్యం మరోభాష లోని వారికి అందకుండా పోతూ ఉంది అన్నవాదనని ఒక విధం గా ఒప్పుకున్నా, దానికి మూల కారణాలను అన్వేషించి, వాటిని పరిష్కరించే మార్గాలు చూడాలి. ఎలాంటి రచనలు ఇంకో భాషలోకి వెళ్ళాలి అన్న దాంట్లో ప్రామాణికం అంటూ ఏమీ లేకపోవడం, మంచి అనువాదకులు లేకపోవడం, అనువాదాలు చేసినా ఆ రచనలు ప్రచురణ కి నోచుకోక పోవడం ఇలాంటి అవరోధాలు ఎన్నో ఉన్నాయి. సాహిత్య అకాడమీ, నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు కొంతవరకు కృషి చేస్తున్నా పూర్తి స్థాయిని అందుకోలేక పోతున్నాయి.

అనువాద రంగంలోకి మీ ప్రవేశం ఎలా జరిగింది?

వివాహానంతరం చెన్నై వెళ్లాక తెలుగు పుస్తకాలు దొరక్క తమిళపుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. అలా ఒకసారి తెలుగు నించి అనువదించబడ్డ నవల చదవడం తటస్థించింది. ఆ అనువాదం ఎంత హీనంగా ఉందంటే కోపం పట్టలేక వెంటనే ఆ అనువాదకులకి ఉత్తరం రాశాను. అప్పుడు మీరే అనువాదం చేసి చూడ మన్న సవాలే జవాబుగా వచ్చింది. దాన్ని స్వీకరించి నా మొదటి అనువాద రచన మొదలుపెట్టాను.

ఆ రచన ఎవరిదో చెప్తారా?

యండమూరి వీరేంద్రనాథ్ గారిది. ఆయన రచనలని నేను 1995 లో చదవడం ప్రారంభించాను. అవి ఎంతగా నన్ను ప్రభావితం చేసాయంటే, పుస్తకం చేతిలోకి తీసుకోగానే గబ గబా చదివేయాలి అనిపిస్తుంది. మళ్ళీ అలా చదువుతూ ఉంటే త్వరగా ముగిసి పోతోందే అని బాధగానూ అనిపిస్తుంది. ఇలాంటి ద్వైదీ భావం నాకు అంతకు ముందు ఎవరి రచనల పట్లా కలగ లేదు. ఆయన వ్రాసిన “పందెం” అన్నకధను వారి అనుమతితో తమిళంలోకి అనువదించాను. అది ‘కుంకుమ చిమిళ్’ అన్న పత్రికలో ప్రచురితమయింది.

మీ వివాహం ఎప్పుడు జరిగింది? ఎవరితో? వివాహంతో మీ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది?

నా వివాహం 1976లో జరిగింది. మా అత్తయ్య కొడుకుతోనే. ఇరవై ఏళ్ల దాకా తెలంగాణా లో పెరిగిన నేను ఒక్క సారిగా చెన్నైకి రావడం తో నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. ముఖ్యంగా చదువుకోవడానికి తెలుగు పత్రికలు, నవలలు అందుబాటులో ఉండేవి కావు. అప్పుడే తమిళ పత్రికలు, నవలలు చదవడం ప్రారంబించాను. మాతృ భాష తమిళమే అయినా అప్పటి వరకు తమిళంలో చదవడం తక్కువ. ఉత్తరంముక్క కూడా తమిళంలో రాసింది లేదు. ఇప్పటి లాగా కంప్యూటర్లు, ఇంటర్ నెట్ అప్పుడు లేవు.

సాధారణంగా ప్రతి వ్యక్తి విజయం వెనుక ఆ వ్యక్తికి స్ఫూర్తినో, శక్తినో, సాధించాలన్న కసినో అందించే వ్యక్తి ఒకరుంటారు. మీ జీవితంలో ఆ వ్యక్తి ఎవరు?

ఇరవై ఏళ్ల దాకా పట్టుమని ఒక్క పేజీ కూడా తమిళం లో నేనురాసింది లేదు. అలాంటిదిడెబ్బై నవలల దాకా అనువాదం చేశాను. వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేనా అని ఒక్కో సారి ఆశ్చర్యం కలుగు తుంది. మన విజయాన్ని కుటుంబంలో అందరూ గుర్తిస్తే, ముఖ్యంగా జీవిత భాగస్వామి నుంచి ఆ గుర్తింపు దొరికితే ఆ సంతృప్తి వేరు. ఆ విషయంలో నేను అదృష్ట వంతురాలిని. మా వారికీ సాహిత్యంలో మంచి అభిరుచి ఉంది.”విముక్త” అనువాదం లో మా వారు కంటెంట్ ఎడిటింగ్ చేసారు.”విముక్త” కధలో భాష స్థాయి వేరు. ఆ స్థాయి అనువాదంలోనూ ఉండాలని సూచించారు.

మీ గురించి మీరు గర్వపడిన సందర్భం?

గర్వపడక పోయినా, ఒకసారి బెంగళూరులో నిడమర్తి ఉమా రాజేశ్వరరావుగారింట్లో జరిగిన సాహిత్య సమావేశానికి వెళ్ళినప్పుడు నేను ముందుగా వెళ్లాను. అప్పుడు ఎవరో ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఆయన “అవును అవును. ఐదు గంటలకే సమావేశం మొదలవుతుంది. చీఫ్ గెస్ట్ కూడా వచ్చేశారు” అని అన్నారు. అప్పుడు హాల్లో నేనూ ఆయన మాత్రమే ఉన్నాము. ఎవరినో చీఫ్ గెస్ట్ అంటున్నారు అని నా వెనక ఒకసారి తల తిప్పి చూశాను. ఒక్క క్షణం తరువాతే నేనే అని అర్ధం అయ్యాక కాస్త సిగ్గుగా అనిపించింది. అంతకు ముందు నెలలోనే కవనశర్మ గారి “విడాకులు” తమిళ అనువాదం “Kanaiyazhi”అన్న పత్రికలో వెలువడింది. కవనశర్మ, వివిన మూర్తి గార్ల పరిచయ భాగ్యం ఆ సమావేశంలోనే కలిగింది.

నేను పంపిన అనువాద కధను ప్రచురించే ముందు, ఆయా పత్రికల సంపాదకులు నాకు ఫోన్ చేసి కధనూ, నా అనువాదాన్ని మెచ్చుకున్న సందర్బాలు రెండు మూడు ఉన్నాయి.

మీ జీవితపు మరపురాని మధుర సన్నివేశం?

తొలిసారి మాతృమూర్తి అయినప్పుడు. “అంతర్ముఖం” నవల మొదటి ప్రతిని అందుకున్నప్పుడు.

మీరు చేయాలనుకుని ఇంతవరకు చేయలేకపోయిన పని?

తమిళంలో ప్రపంచన్ గారి “vaanam vasappadum”నవలను తెలుగులో తేవాలని, అశోకమిత్రన్ గారి సికింద్రాబాద్ కధలను ఒక సంపుటిగా తెలుగులో తేవాలని.

మిమ్మల్ని గాఢంగా ప్రభావితం చేసినవ్యక్తి ఎవరు?

ప్రత్యేకించి ఒక వ్యక్తి అని చెప్పలేను. మాటలు, చేతలు ఒక్కటిగా ఉండేవాళ్ళు, ఎదుటి మనిషిని మాటలతో కూడా గాయపరచని వాళ్ళు, స్నేహ శీలులు నాకు మార్గదర్శులు.

రచన?

తెలుగులో యండమూరిగారి ‘అంతర్ముఖం’. ఓల్గా గారి ‘తోడు’ కధ.

నా రచనలు కొన్ని మీ అంతట మీరే అడిగి అనువదించారు. సాధారణంగా మూల రచనల్ని మీరే ఎన్నుకుంటారా? రచయితలే మిమ్మల్ని సంప్రదిస్తారా అనువాదాల కోసం?

సాధారణంగా, నాకు నచ్చిన కధలను ఆయా రచయితల అనుమతి తీసుకుని మరీ చేస్తాను. యండమూరి, యద్దనపూడిగారి రచనలను అన్నింటినీ తమిళంలో చేయాలని నా తపన. కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ‘నిర్జనవారధి’ని తమిళంలో అనువాదంచేసి ఇవ్వగలరా అని ‘కాలచువడు’ అన్న ప్రముఖ పబ్లిషర్స్ నన్ను అడిగినప్పుడు కొంచం సంకోచించాను. ఎందుకంటే అంతవరకు నేను కధలు, నవలలు మాత్రమే చేసి ఉన్నాను. నిర్జనవారధి లాంటి ఆత్మకధను అదే స్వరంతో తేవాలి. అప్పుడే దానికి సార్థకత. ఆ పుస్తకం తమిళ అనువాదం “Alatrapalam” అన్నటైటిల్ తో వెలువడింది. పాఠకుల ఆదరణ పొందింది.

ఇప్పటి వరకూ ఎన్ని పుస్తకాలు అనువదించారు? ఎన్ని విడి రచనలు, పుస్తక రూపంలో రానివి, అనువదించారు?

ఇంతవరకు తమిళంలో డెబ్బై నవలలు వచ్చాయి. ప్రచురణలో పది నవలల దాకా ఉన్నాయి. తమిళంలో నుంచి తెలుగులోకి ముప్పైఐదు కధలకి పైగా అనువదించాను. ఈ బుక్ గా కినిగెలో ‘తమిళ కధలు-ఆణిముత్యాలు’ రెండు భాగాలుగా ఉన్నాయి. పుస్తక రూపంలో రావాల్సి ఉంది. అలాగే తెలుగు నుంచి తమిళంలో అనువదించిన కధలు పుస్తక రూపంలో రావలసి ఉంది.

సాహిత్య అకాడెమి వారి కోసం కు. అళగిరి సామి గారి “Anbalippu” అన్న కధా సంపుటిని తెలుగులో “బహుమతి” పేరిట అనువదించాను. స్క్రిప్ట్ అప్రూవ్ అయింది. పుస్తకరూపంలో రావలసి ఉంది.

ఒక రచన చదివాక అది మిమ్మల్ని వెంటాడి వేధిస్తేనే అనువాదాలు చేస్తారని విన్నాను, నిజమేనా?

నిజమే. కొన్ని కథలు మనసులో ముద్రించుకుని ఉండిపోతాయి. వాటిని అనువాదం చేసేటప్పుడు కలిగే సంతృప్తి మాటలకి అందనిది.

మీ అభిరుచులు? మీ దిన చర్య?

ఎక్కువగా చదువుతాను. రోజుకి ఎనిమిది గంటలైనా కంప్యూటర్ లో చదవడం, అనువాదం చేయడం నా అలవాటు. మంచి పుస్తకం చదువుతూ ఉంటే విందు భోజనం చేసినంత తృప్తి కలుగుతుంది. నచ్చిన పుస్తకాలను కొని చదివి, నా సొంత గ్రంధాలయంలో ఉంచుకుంటాను. సాహిత్య సమావేశాలు ఎక్కడ జరిగినా నేనూ, మావారూ కలిసి వెళతాం.

IMG_3836 (2) (2)

మీ కుటుంబ సభ్యుల గురించి నాలుగు మాటలు?

మా వారు బాంక్ నుంచి రిటైర్ అయ్యారు. ముగ్గురు కొడుకులు. అందరికీ పెళ్ళిళ్ళు అయి పిల్లలు ఉన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగస్థులు(Seattle, US).

మీరెన్నుకున్న రంగం గురించి, అందులోని సాధక బాధకాల గురించి చెప్పండి.

అనువాదం నేను ఎంచుకున్న రంగం కాదు. ఆ రంగమే నన్ను ఎంచుకుంది. తెలుగు నించి తమిళం లోకి, తమిళం నించి తెలుగు లోకి అనువాదం చేయడం నా మనస్సుకి నచ్చిన ప్రక్రియ. వృత్తి, ప్రవృత్తి ఒక్కటిగా ఉండటం నా సుకృతం.

కొన్ని రచనలను చదవగలం. కాని అనువదించడం కష్టం. అందరికీ కాక పోయినా చేయి తిరిగిన రచయితలకి ఒక స్వరం ఉంటుంది(tone). అనువాదంలో ఆ స్వరాన్ని తేగలిగితేనే ఆ అనువాదం పూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. ఒక భాష నుంచి నేరుగా ఇంకో భాషకి అనువాదం వెళ్ళినప్పుడే బాగా ఉంటుంది. మన దేశంలో పలు రకాల భాషలు ఉండటం వల్ల మొదట హిందీలో లేక ఆంగ్లం లో అనువాదం చేయబడి, వాటి నుంచి ప్రాంతీయ భాషలకి అనువాదం చేయడం ఆచరణ లో ఉంది. ఒక అనువాదానికి మళ్ళీ అనువాదం చేసినప్పుడు విషయం పలచబడిపోయే ప్రమాదం ఉంది. వీలైనంత వరకూ నేరుగా అనువాదాలు జరిగితే మంచిది. అనువాదకులకి మూలభాష, లక్ష్యభాషలమీద మంచి పట్టు ఉండాలి. రెండు భాషల యొక్క సంస్కృతి, ఆచార వ్యవహారాల పట్ల అవగాహన ఉండాలి.

గొప్ప స్పందన లభించిన మీ అనువాద రచన?

కథల్లో పి.సత్యవతిగారి “సూపర్ మాం సిండ్రోం”, వి.విజయలక్ష్మి గారి “మాతృత్వానికి మరో ముడి.”

మీకేవి ఎక్కువ ఇష్టం- కథలా నవలలా?

రెండూనూ.

మీ అభిమాన రచయితలు?

తెలుగులోయద్దనపూడి సులోచనారాణి, యండమూరి వీరేంద్రనాథ్, ఓల్గా. తమిళంలో అశోకమిత్రన్, D.జయకాంతన్, ఇందిరా పార్థసారథి.

తమిళ, తెలుగు సాహిత్యాల మధ్య పోలికలూ వైరుధ్యాలూ ఎలా ఉన్నాయంటారు?

కథల విషయానికి వస్తే తమిళంలో నిడివి తక్కువగా ఉంటుంది. ఒక సమస్య గురించి మాత్రమే ఉంటుంది. తెలుగులో సంభాషణలు, వర్ణనలు కాస్త ఎక్కువగానే ఉంటాయనిపిస్తోంది. తమిళంలో చారిత్రాత్మిక నవలలు వ్రాసే రచయితలు చాలా మంది ఉన్నారు. వాటిని తీవ్రంగా అభిమానించే పాఠకులు ఉన్నారు. కల్కి వ్రాసిన “పోన్నియిన్ సెల్వన్” ఇప్పటికీ మొదటి స్థానంలో ఉంది. తెలుగులో విశ్వనాధ సత్యనారాయణ గారి రచనలను చదివి అర్థం చేసుకునే ఓపిక  కొత్త తరం పాఠకులకి కొంచెం తక్కువే. పెద్ద రచయితలను వదిలేస్తే మిగిలిన రచయితలు తమ రచనలను తామే సొంత ఖర్చులతో ప్రచురించుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాలి. మంచి రచనలను ప్రోత్సహించే విధంగా పబ్లిషర్స్ ముందుకు రావాలి.

తమిళ సాహిత్యాన్ని విస్తృతంగా చదివిన వ్యక్తిగా  తెలుగు కథకులకి మీరిచ్చే సూచన?

వీలైనంత వరకు తక్కువ మాటల్లో ఎక్కువ అర్ధం వచ్చేలా చూసుకోండి. ప్రతి విషయాన్ని విపులంగా పాఠకులకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు తెలివైనవాళ్ళు. అర్థం చేసుకోగలరు. కధలనువ్రాసిన వెంటనే పత్రికలకి పంపించకుండా రెండు మూడు రోజుల తరువాత మళ్ళీ మళ్ళీ చదివి చూడండి. అనవసరమైన పదాలు, వర్ణనలు తగ్గించండి. సమాజం పట్ల, మనిషి మనుగడ పట్ల బాధ్యతతో రచనలు చేయండి.

ప్రస్తుతం ఎలాంటి రచనల ఆవశ్యకత ఎక్కువగా ఉందంటారు?

ఎలాంటి సమాజం ఉండాలని ఎదురు చూస్తున్నామో, అటువంటి సమాజాన్ని రూపొందించ గలిగే రీతిలో మార్గ నిర్దేశం చేసే రచనలు.

అత్యంత శక్తివంతమైన టీవీ మాధ్యమాన్ని మెరుగైన సమాజ రూపకల్పనకి వాడుకోవాలంటే ఏం చెయ్యాలంటారు? ఇవాళ పెరిగిపోతున్న హింసకీ , సినిమాల్లో, టీవీల్లో కనిపిస్తున్న దృశ్యాలకీ సంబంధం ఉందంటారా? 

టి.వి. సీరియళ్ళ గురించి నాకు చాలా అసంతృప్తి ఉంది. ఒక ఇంట్లో ఎలాంటి సంభాషణలు ఉండకూడదో అలాంటి డైలాగులు, వయసుకి మించిన మాటలు మాట్లాడే పిల్లలు ….. చూసే వాళ్ళ ఇంట్లో ఒక ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని నా భావన. సినిమాల్లో ఆడపిల్లలని తక్కువ చేసి చూపించడం, చులకనగా చిత్రీకరించడం.. వీటిని బహిష్కరిస్తేనే సమాజం బాగు పడుతుంది. సంస్కరణ మన ఇంట్లో నించే మొదలవ్వాలి.

                                   *

శ్రీకాంత్ కవితలు మూడు…

 

-శ్రీకాంత్
~
 
1.
రాత్రికి ముందు కాలం
రాత్రికి ముందు కాలం:

లోపల, ఎవరో అప్పుడే వీడ్కోలు పలికి వెళ్ళిపోయిన నిశ్శబ్ధం.
ఖాళీతనం –
***
ఇంట్లో నేలపై పొర్లే, గాలికి కొట్టుకు వచ్చిన ఆకులు:పీల గొంతుతో –
ఒక అలజడి. దాహంతో పగిలిపోయిన మట్టి.
రోజూవారీ జీవనంతో పొక్కిపోయిన హృదయం –

బల్లపై వడలిన పూలపాత్ర. మార్చని దుప్పట్లు. బయట, ఇనుప
తీగపై ఆరి, ఒరుసుకుపోయిన దుస్తులు. ఇక
ఎవరో అద్దంలో చూసుకుంటూ నొసట తిలకం

దిద్దుకుంటున్నట్టు, నెమ్మదిగా వ్యాపించే చీకటి. రాళ్లు. ఇసిక –
గాజుభస్మాన్ని నింపాదిగా తాగుతున్నట్టు, ఒక
నొప్పి. తపన. ఒంటరిగా జారగిలబడే చేతులు –

ఇంటికి చేరే దారిలో, ఎవరిదో పాదం తగిలి పగిలి పోయిందీ మట్టికుండ.
ఇక
***
అల్లల్లాడే
పగిలిన పెదాలకు, ఒక్క నీటి చుక్కయినా దొరకక, పిగిలిపోతూ
ఈ రాత్రి

ఎలా గడవబోతుందో, నాకు ఖచ్చితంగా
తెలుసు.

 
2.

బొమ్మలు

విరిగిన బొమ్మలని అతక బెట్టుకుంటూ కూర్చున్నాడు
అతను –
***
బయట చీకటి. నింగిలో జ్వలిస్తో
చందమామ. దూరంగా ఎక్కడో చిన్నగా గలగలలాడుతూ

రావాకులు –

వేసవి రాత్రి. ఎండిన పచ్చిక.
నోరు ఆర్చుకుపోయి, నీటికై శ్వాసందక ఎగబీల్చె నెర్రెలిచ్చిన
మట్టి వాసన –

ఇక, లోపలేదో గూడు పిగిలి
బొమ్మలు రాలి, విరిగి కళ్ళు రెండూ రెండు పక్షులై పగిలిన

గుడ్ల చుట్టూ

రెక్కలు కొట్టుకుంటూ
ఎగిరితే, అడుగుతుంది తను అతనిని చోద్యంగా, దిగాలుగా
చూస్తో –

“ఎప్పటికి అతికేను ఇవి?”
***
అతికీ, మళ్ళీ ముక్కలుగా
చెల్లాచెదురయిన హృదయాన్ని తన అరచేతుల్లో జాగ్రత్తగా
ఉంచి

విరిగిన వాక్యాలనీ, అర్థాలనీ
అతి జాగ్రత్తగా జోడిస్తూ, అతక బెట్టుకుంటూ మారు మాట్లాడకుండా

అక్కడే కూర్చుని ఉన్నాడు
అతను –

3

రాతి పలకలు

నిస్సహాయంగా వాళ్ళ వైపు చూసాడు అతను: లోపల
గ్రెనైట్ పలకలుగా మారిన
వాళ్ళ వైపు-
***
వేసవి రాత్రి. నేలపై పొర్లే ఎండిన పూల సవ్వడి. తీగలకి
వేలాడే గూడు ఇక ఒక వడలిన
నెలవంకై –

దాహం. లోపల, నీళ్ళు అడుగంటి శ్వాసకై కొట్టుకులాడే
బంగారు కాంతులీనే చేపపిల్లలేవో:
చిన్నగా నొప్పి –

సుదూరంగా ఎక్కడో అరణ్యాల మధ్య ఒక జలపాతం
బండలపై నుంచి చినుకులై చిట్లే
మెత్తటి స్మృతి –
***
నిస్సహాయంగా వాళ్ళ వైపు, పాలరాయిలాంటి తన వైపూ
చూసాడు అతను: ఆ రాళ్ల వైపు –
ఇక, ఇంటి వెనుకగా

ఇసుకలో ఉంచిన మట్టికుండ చుట్టూ చుట్టిన తెల్లటి గుడ్డ
తడి ఆరిపోయి, నెమ్మదిగా కుండను ఎప్పుడు
వీడిందో

ఎవరికీ తెలీలేదు.

భయంలేని స్వరం – శీతల్ సాథే

 

vinodగత శనివారం హైదరాబాద్ లమాకాన్ లో ఒక మరాఠీ ప్రజాగాయకురాలి ప్రోగ్రాము జరిగినది. ఆవిడ పేరు “శీతల్ సాథే”. చాలా రోజుల క్రితం ఆవిడ పాడిన మరాఠీ పాటలు కొన్ని నేను ఇంటర్నెట్ లో విన్నాను. భయం లేని ఆవిడ స్వరం, నిజాయితీ నిండిన ఆవిడ పాటలు నాకు చాలా కాలం వరకు గుర్తున్నాయి. ఇప్పుడు స్వయంగా చూసే అవకాశం దొరికింది. అదే ప్రోగ్రాముకి ప్రముఖ డాక్యుమెంటరీ దర్శకులు ఆనంద్ పట్వర్ధన్ కూడా వచ్చారు.

లమాకాన్ లో జరిగిన ఆ ప్రోగ్రాము లో జరిగిన విశేషాలని ఇక్కడ రాస్తున్నాను.

శీతల్ సాథే గురించి:

మహారాష్ట్ర లో పేద దళితులపై జరుగుతున్న అత్యాచారాలకి వ్యతిరేకంగా పోరాడుతున్న “కబీర్ కాలా మంచ్” అనే కళాకారుల బృందంలో శీతల్ ఎన్నో సంవత్సరాలు పని చేసారు. ఆ బృందాన్ని మతతత్వ సంఘాలూ, పోలీసులూ కలిసి చిన్నాభిన్నం చేసారు. నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని తప్పుడు కేసులు పెట్టి వేధించారు.

2013 ఏప్రిల్ లో శీతల్, ఆవిడ భర్త, కవి, సచిన్ మాలీ కలిసి మహారాష్ట్ర అసెంబ్లీ ముందు పాటలు పాడుతూ సత్యాగ్రహం చేసారు. పోలీసులు వారినీ, బృందంలోని ఇతర కళాకారులతో సహా అరెస్టు చేసారు. అప్పటికే గర్భవతిగా ఉన్న శీతల్ కి మూడు నెలల తర్వాత ముంబాయి హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇది జరిగి ఇప్పటికి దాదాపు మూడు సంవత్సరాలు అవుతోంది. సచిన్ మాలీతో సహా మిగిలిన వారందరూ ఇంకా జైలులోనే ఉన్నారు. ఇంతవరకూ విచారణ కూడా మొదలవ్వలేదు. రెండు సార్లు బెయిల్ నిరాకరించబడింది. ఇప్పుడు సుప్రీం కోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేస్తున్నారు. శీతల్ కి ఇప్పుడు రెండేళ్ల బాబు ఉన్నాడు.

ప్రస్తుతం శీతల్ కొంత మంది కళాకారులని కలుపుకుని సొంత బృందాన్ని ఏర్పాటు చేసుకుని మహారాష్ట్ర మొత్తం తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తున్నారు. జైలులో సచిన్ మాలీ రాసిన పాటలని కూడా శీతల్ పాడుతూ ఉంటారు.

ఎన్నో వేల సంవత్సరాలుగా అణగదొక్కబడిన వర్గాల ప్రజలని represent చేస్తూ, ఒక సెక్యులర్, డెమోక్రాటిక్ సమాజాన్ని నిర్మించుకోవాల్సిన అవసరాన్ని చాటి చెప్తూ, చాలా సూటిగా ఆత్మని తాకేలా ఉంటాయి శీతల్ పాటలు.

గత కొంత కాలంగా, శీతల్ ప్రదర్శన ఇచ్చిన ప్రతి చోటా ABVP గ్రూపులు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ దళిత కళాకారులని “దేశద్రుహులు” అని వాళ్ళనడం యాదృచ్చికం కాదు.

 

ప్రదర్శన గురించి:

శీతల్ ముఖ్యంగా మరాఠీ గాయకురాలు. ఆవిడ తన పాటలని మరాఠీలోనే పాడుతూ, ప్రతి వాక్యానికీ తనకి వచ్చిన హిందీలో explain చేస్తూ పాడారు. భాష వేరయినా పాటలలోని భావం ప్రేక్షకులని ఖచ్చితంగా చేరుతుంది. ఆ పాటలలోని నిజాయితీ, ప్రశ్నించే తత్వం నాకు బాగా నచ్చాయి. ఆవిడ చెప్పిన కొన్ని మాటలు ఆలోచింపజేసేవి గా ఉన్నాయి.

పాటలు ఎందుకు పాడాలి అని చెప్పే పాట ఒకటి పాడుతూ “పాటలు మనిషిలో ఉన్న అమానవవత్వాన్ని పోగొట్టడానికి పాడాలి. ఇంకా ఉన్నతమయిన మనిషిగా చెయ్యడం కోసం పాడాలి.” అన్నారు.

ఆవిడ భర్త సచిన్ మాలీ రాసిన ఒక హిందీ పాట ఇలా సాగింది.

“इनसान को अछूत और गुलाम किया है

कैसा ये करम है

कैसा ये धरम है”

తెలుగులో

“మనిషిని అంటరాని బానిసని చేసింది

ఇదేమి కర్మం. ఇదేమి ధర్మం”

మొత్తం పాటని ఈ కింద వీడియోలో వినండి.

ఆ బృందం తమ పాటలతో కబీర్ ని, తుకారాం ని తలుచుకున్నారు. అంబేద్కర్ ని, భగత్ సింగ్ ని గుర్తుచేసుకున్నారు. కుల వ్యవస్థని ప్రశ్నించారు, మతతత్వాన్ని విమర్శించారు. మొత్తం ప్రదర్శనని ఈ కింద వీడియోలో చూడవచ్చు.

 

పాటల కార్యక్రమం ముగిశాక ఆనంద్ పట్వర్ధన్, శీతల్ గార్లతో కొద్దిసేపు చర్చ జరిగింది. ప్రేక్షకులలో కొద్దిమంది అడిగిన ప్రశ్నలకి వాళ్ళు సమాధానాలు ఇచ్చారు.

ఆనంద్ పట్వర్ధన్ మాట్లాడుతూ ఇలా అన్నారు. “దేశానికి సంబంధించిన విషయాలలో మనం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఎవరు Nationalistలు ఎవరు anti-nationalist లు.. మీలాంటి, నా లాంటి, శీతల్, రోహిత్ వేముల లాంటి వాళ్ళని, దేశ ప్రజల్లో చాలా మందిని anti-nationals అంటున్నారు. ఇలా అంటున్న వారు ఎవరో కాదు. దాదాపు వంద సంవత్సరాలుగా ఈ దేశాన్ని ఒక Religious country గా మార్చాలని ప్రయత్నం చేస్తున్న వారు. దాదాపు వంద సంవత్సరాల పాటు ఈ దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనని వారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం నడుస్తున్నప్పుడు ముస్లిం లీగ్ తో చేతులు కలిపి బ్రిటీష్ ప్రభుత్వాన్ని సమర్థించిన వారు. మన జాతీయ పతాకాన్ని వాళ్ళెప్పుడూ ఆమోదించలేదు. కాషాయ జెండానే కావాలన్నారు. భారత రాజ్యాంగాన్ని వద్దని మనుస్మృతి నే రాజ్యాంగంగా కావాలన్నారు. అలాంటి వాళ్ళు ఇవ్వాళ మనల్ని anti-nationals అంటున్నారు. దీన్ని మనం ప్రశ్నించాలి.”

 

ప్రశ్న: “కబీర్ కాలా మంచ్” తో మీ ప్రయాణం ఎలా మొదలయ్యింది?

ఆనంద్: “1997 వ సంవత్సరంలో ముంబైలోని రమాబాయి కాలనీలో కొందరు అంబేద్కర్ విగ్రాహానికి చెప్పుల దండ వేసి అవమానపరిచారు. దానికి నిరసన తెలుపుతూ రోడ్డు మీదకి వచ్చిన నిరాయుధులు అయిన ఆ జనం మీద పోలీసులు  కాల్పులు జరిపి పది మంది ప్రాణాలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆ చనిపోయిన వాళ్లకి న్యాయం జరగాలని మహారాష్ట్ర ప్రజలు కోరుతూనే ఉన్నారు. ఆ సంఘటన జరిగిన పది సంవత్సరాల తర్వాత 2007లో నేను రమాబాయి కాలనీలో శీతల్ ప్రదర్శన చూశాను. అప్పటి నుంచి వాళ్ళు నాకు తెలుసు.

2011 లో పోలీసులు వీళ్ళ మీద కేసులు పెట్టి, వీళ్ళలో ఒకరిని అరెస్టు చేసి చిత్ర హింసలు పెట్టారు. అప్పుడు కొన్నిరోజులు వీళ్ళంతా అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఈ సమయంలో నేను రమాబాయి కాలనీ లో జరిగిన సంఘటనల ఆధారంగా దళితుల మీద జరుగుతున్న అత్యాచారాల మీద “జై భీమ కామ్రేడ్” అనే సినిమా పూర్తి చేసాను. అందులో కబీర్ కాలా మంచ్ గురించి కూడా చూపించడం జరిగింది. ఆ సినిమా ద్వారా ప్రజలకి వీళ్ళ గురించి తెలిసింది. Civil Society నుంచి మద్దతు దొరుకుతుండటంతో వీళ్ళు అజ్ఞాతం నుంచి బయటికి వచ్చి స్వచ్చందంగా లొంగిపోయారు. మేము మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాము. ఒకటి రెండు నెలల్లో జైల్లోంచి బయటపడి మిగతా కళాకారుల్లాగే ప్రదర్శనలు ఇచ్చుకోవచ్చు అనుకున్నాము. కానీ ఇప్పటికీ వీళ్ళలో ముగ్గురు జైల్లోనే ఉన్నారు.

ఎవరైతే రోహిత్ వేములని దేశద్రోహి అన్నారో వాళ్ళే ఇప్పటికీ శీతల్ ని కూడా దేశద్రోహి అంటున్నారు. తను ఇచ్చే ప్రదర్శనలని అడ్డుకుంటూనే ఉన్నారు.”

ప్రశ్న: నాకు తెలిసిన వాళ్ళలో కొంతమంది హిందుత్వవాదులు, మనువాదులు ఉన్నారు. వాళ్ళు రకరకాల వాదనలు చేస్తారు. వాటిని ఎలా counter చెయ్యాలి?

ఆనంద్: “వాళ్ళ వాదనలకి వ్యక్తిగతంగా సమాధానాలు చెప్పడం అన్నది అంత ఉపయోగకరం కాదు. ఎందుకంటే 5, 6 ఏళ్ల వయసు నుంచి చెడ్డీలు వేసుకుని శాఖలలో పెరిగిన వాళ్లకి ఆ భావజాలం మెదడులో నిండిపోయి ఉంటుంది. అటువంటి వాళ్ళ మెదడులోకి కొత్త ఆలోచనలు ఎక్కించడం అనేది దాదాపు అసాధ్యం. దానికి బదులు మనం తటస్థంగా ఉన్న మామూలు జనంతో మాట్లాడితే మంచిది. మామూలు జనం దేశానికి ఏదో ఆర్థికంగా మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతో వాళ్ళని సమర్థిస్తున్నారే తప్ప వాళ్ళ మతతత్వ భావజాలాన్ని సమర్థించి కాదు. ఇప్పటికీ తటస్థంగా ఉన్న జనమే ఎక్కువ. వాళ్ళతో మాట్లాడి విషయాలు విడమర్చి చెప్పడం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి.”

శీతల్: “కొంచం తేలిక భాషలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. Ideology ని Ideology తోనే ఎదుర్కోగలం. ఎందుకంటే అన్నిటికీ మూలం Ideology లోనే ఉంటుంది. మనల్ని అణిచివేసే వాళ్ళకి కూడా ఒక Ideology ఉంటుంది. వాళ్ళు వాళ్ళ Ideology ని ముందుకు తీసుకువస్తుంటే, దానిని ఎదుర్కోగల ఒక counter Ideology ని నిలబెట్టడం మనం చెయ్యాల్సిన పని. వాళ్ళ Ideology చెప్పే ప్రతి విషయాన్ని తిప్పికొట్టగల సత్తా ఉన్న Ideology లు మనకు తయారుగానే ఉన్నాయి. వాటిని బాగా అధ్యయనం చేసి, బలపరిచి, ప్రచారం చెయ్యడం ద్వారానే వాళ్ళ Ideology ని అడ్డుకోగలము.”

ఆనంద్: “అంతే కాకుండా, మన దేశంలో చాలా అద్భుతమయిన Rationalist Tradition ఉంది. ఉదాహరణకి బుద్ధుడు, చార్వాకుడు తో మొదలు పెట్టొచ్చు. దానిని మనకి స్కూళ్ళలో కాలేజీలలో నేర్పించడం లేదు అంతే. నేడు చరిత్రని తిరగరాసే ప్రయత్నాలని మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు మనం ఒక విచిత్రమయిన సందర్భంలో ఉన్నాము. దేశంలో మధ్య యుగాల భావజాలం, so called Free market economy రెండూ ఒకే సారి నడుస్తున్నాయి.”

ప్రశ్న: ప్రగతిశీల (Progressive) వాదులని అందరినీ Anti-Nationalist లు అని ముద్ర వేసి Corner చేస్తున్నారు. దీనిని ఎలా ఎదుర్కోవాలి?

ఆనంద్: ఇది చాలా విస్తృతమయిన కుట్రలో భాగంగా జరుగుతోంది. మామూలు జనానికి రచయితలు, కవులు, కళాకారులు, విద్యార్థుల పట్ల అవిశ్వాసాన్ని కలుగజేసి తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నం ఇది. ఎవరు ఏ లక్ష్యం కోసం పని చేస్తున్నారో ప్రజలకి అర్థమయ్యేట్టు చెప్పడం ద్వారానే దీన్ని అడ్డుకోగలం.

శీతల్: ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. “ఎవరైతే దేశాన్ని కులాల వారీగా, మతాల వారీగా, జాతుల వారీగా విభజించాలి అనుకుంటున్నారో వాళ్ళు తమని తాము దేశభక్తులమని చెప్పుకుంటున్నారు. ఎవరైతే కులాలు పోయి, మత భేదాలు పోయి, జాతి వివక్ష పోవాలి అంటున్నారో వాళ్ళని దేశద్రోహులు అంటున్నారు.” ఈ తేడా మనం బాగా అర్థం చేసుకోవాలి.

ముగింపుగా ఆనంద్ పట్వర్ధన్ ఇలా అన్నారు. “మన దేశం ఫాసిస్టు దేశం అని నేను అనను. కాని ఆ దిశగా అడుగులు వేస్తోంది. దీనిని మనం ఆపాలంటే మనం చాలా విస్తృతంగా Alliances చేసుకోవాలి. సంకుచితమయిన భావజాలాలో ఇరుక్కుని దీన్ని సాధించలేము. అంబేద్కర్ వాదులు, మార్క్స్ వాదులు, గాంధీ వాదులు ఎవరైనా సెక్యులర్ భావాలు ఉన్నవాళ్ళు, మానవ విలువలని సమర్ధించేవారంతా ఒక్కటవ్వాలి.”

శీతల్ మాట్లాడుతూ.. “నేను నా పాటల్లో కుల వ్యవస్థని అర్థం చేసుకోవాలనీ, కుల వినాశనం జరగాలనీ విరివిగా చెప్తుంటాను. తుపాకి ద్వారా వ్యవస్థని మార్చవచ్చు అని Dogmatic communist లు, నక్సలైట్లు అనుకుంటారు. కాని హింసకి సమాధానం హింసతో ఇవ్వలేము. ఒక మనిషిని చంపడం ఏ సమస్యకి పరిష్కారం కాదు. రాజ్య హింస, నక్సలైట్ హింస, ఫాసిస్టు హింస.. ఏ హింసయినా ఒక్కటే. దానిని మనం వ్యతిరేకించాల్సిందే.”

ఈ మొత్తం చర్చని ఈ కింద విడియోలో చూడవచ్చు.

 

కొసమెరుపు:

లమాకాన్ నిర్వాహకులు మాట్లాడుతూ ఇలా అన్నారు. “నిన్న నన్ను పోలీస్ స్టేషన్ కి రమ్మన్నారు. మీ దగ్గర మావోయిస్టుల ప్రోగ్రాము ఏదో జరుగుతోందట కదా అని C.I. నన్ను అడిగారు. వాళ్ళు ప్రజల గీతాలు పాడతారు అని చెప్పాను. “వాళ్ళు కబీర్ పాటలు పడతారు కదా? వాళ్ళు ముస్లిములు కదా? అసలు ఇలాంటి లెఫ్టిస్టుల ప్రోగ్రాములు మీరు ఎందుకు పెడతారు లమాకాన్ లో?” అని అడిగారు. నేను కూడా లెఫ్టిస్టునే అని చెప్పాను. వాళ్లకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. పోలీస్ స్టేషన్ లో ఉన్న భగత్ సింగ్ ఫోటో చూపించి ఆయన కూడా లెఫ్టిస్టే అని చెప్పాను. ఇదిగోండి ఇప్పుడు కూడా పోలీసులు బయటే ఉన్నారు. లోపలికొచ్చి టీ తాగుతూ పాటలు వినమని చెప్పాను. రాలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే.. We are actually under a fair amount of attack. It’s coming from everywhere, not just from a couple of parties we are talking about.”

శీతల్ పాడే పాటల లోని గంభీరత్వం వేదిక అంతా ఆవరించి ఉండగా, శీతల్ గారి అబ్బాయి – రెండేళ్ల బుడత – స్టేజీ మీద ఆడుకుంటూ, అటూ ఇటూ తిరుగుతూ, అమాయకంగా నవ్వుతూ ఉంటే… రాబోయేది పసి పిల్లల ప్రపంచమే అనే ఆశ కలిగింది.

*

 

 

Lamakaan Website – www.lamakaan.com

Anand Patwardhan website – www.patwardhan.com

Sheetal Saathe Wikipedia page – https://en.wikipedia.org/wiki/Sheetal_Sathe

 

 

పురాస్మృతుల స్వర్ణ మధూళి

 

 

 

-సాంత్వన చీమలమర్రి

~

 

sant3అనుకోకుండా ఒక ఉదయం ఏటవాలు గా పడుతూన్న యెండ ఎప్పటి గుర్తుల్నో మెరిపిస్తుంది. ఊరికే తోచక రెపరెపలాడే రోజూవారీ గాలి సరిగ్గా అప్పుడే పది వేసవుల పరదాల్ని కదిలిస్తుంది. అలవాటయిపోయిన దారుల్లో కాళ్ళు తిరుగుతూన్న మలుపులు ఇప్పటివే. మనసు చూసే దృశ్యం ఎక్కడిదో, ఎప్పటిదో. వర్తమానాన్ని మర్చిపోగలగడమే గొప్ప intoxication అయితే nostalgia ని మించిన మధువెక్కడుందీ?

ఎంత గమ్మత్తో పసితనం అసలు. నేర్చుకొమ్మని గట్టిగా అరిచి చెప్పినవేవీ తర్వాత గుర్తుండవు. మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేవల్లా ఎవరూ చూడని చోట్ల ఎవరి కోసమూ కాదన్నట్టు పూసే గడ్డిపూల్లాంటి అల్పత్వాలూ, లేతదనాలే. అలాంటి పసితనం వసంతం అయితే, ఆ పూసే పూలకి తామేంటో తెలిసి తలలు ఎగరేసే కాలం వేసవి. ఇంకా మగత వదలని ఆకాశాల ధూసరవర్ణ ఛాయల్ని తన గులాబీతనం తో కడిగేసే వేసవి. వచ్చే ప్రతీ రోజునీ బంగారపు కెంపు సంధ్యల మధ్య పొదివిపట్టుకునే వేసవి. వేసవంటే బాల్యానికి చివర. కౌమారపు తొలి గడప. యవ్వనానికి Passage way. అంత అందాన్నీ conscious గా అనుభవించడానికి ఆ వయసూ, పరిణతీ చాలా మందికి సరిపోవు. కావాల్సినదానికంటే ఎక్కువే సరిపోయే అదృష్టవంతుడొకడు, పన్నెండేళ్ళ డగ్లస్ స్పాల్డింగ్స్, రచయిత Ray Bradbury ప్రతిబింబం.

తెంపిన తక్షణమే వడలే గడ్డిపూలని ఎలా దండ గుచ్చడం? అదిగో అని తాకి చూపించగానే ఆవిరయ్యే సబ్బు బుడగల రంగుల్ని ఎలా రాశిపోయటం? అందుకు తెచ్చుకున్నారు Bradbury ఈ రంగురంగుల అక్షరాల అద్దం ముక్కల్ని. ఈ పుస్తకం మనల్ని మనకే వంద fragments గా విడగొట్టి చూపించే తళుకుటద్దాల mosaic.

నీలం ఆకుపచ్చా కలిపి అల్లిన అడవి నీడల కింద, రెండు చెవుల్లో వినపడే గుండె చప్పుడు లో, గాయమయ్యి ఉబికే రక్తపు ఎరుపు లో, పని చేసి వచ్చిన అలసట లో, ఆ అలసటని ఒప్పుకోని అహం లో తను జీవించి ఉన్నాననే స్పృహ ఒక వెలుతురు జలపాతం లా డగ్లస్ ని ముంచెయ్యటమే మొదలు ఈ పుస్తకానికి. జీవించి ఉండటాన్ని గుర్తించటమంటే తెలిసిన లెక్కల్లో సాగే మొనాటనీల మధ్య మోగే అభౌమ సంగీతపు nuances వినిపించుకోగలగటం.  ఆ మొనాటనీలని కూడా వాటికోసం వాటిని ప్రేమించగలగడం. ఆ యెరుక ఓసారి పుట్టిందా, ఇంక కనిపించేదంతా అద్భుతమే. ప్రతి రోజూ పేజీల మధ్య నెమలీకే.

కాస్త ఏమరుపాటుగా ఉంటే పచ్చిక పెరిగి ఊరిని ముంచేస్తుందా అనిపించే 1928 నాటి గ్రీన్ టౌన్ లో ని కొందరు మనుషుల  జీవితాలూ, వాటి మధ్య అన్నిటినీ లోతు గా అనుభవించగలిగే అదృష్టమూ ఆపదా ఉన్న డగ్లస్ వేసవి అనుభవాలూ ఈ Dandelion Wine పుస్తకం నిండా.  వేసవంటే వాళ్ళకి ఎవరూ పైకి గుర్తించని కొన్ని ఆనవాయితీలు. లెమనేడ్ తయారు చేసుకోవడం, ఐస్ క్రీం తెచ్చుకోవడం, కొత్త టెన్నిస్ షూస్ తొడుక్కుని తోక చుక్కల్లా పరిగెత్తడం, గడ్డి లో పూసే డాండీలియాన్ పూల నుంచి వైన్ తయారు చేసుకుని సోమరి తూనీగల రెక్కల్లోని సూర్య కిరణాలనీ, తేనెటీగల కాళ్ళకంటిన వెయ్యి పూల సౌరభాల్నీ సీసాల్లో  దాచుకోవడం. ఇంకా ఎండ తగ్గి చల్లబడే సాయంకాలాలు వాకిట్లో ఊగే కుర్చీల్లో, చెక్క బల్లల మీదా పెద్దవాళ్ళంతా కూర్చుని ముసురుతూన్న చీకట్లకి చిక్కు తీసి జడలల్లుతూ చెప్పుకునే కబుర్లు. మరునాటికి మర్చిపోయి అందరూ మళ్ళీ మొదలెత్తుకునే కబుర్లు. అతిప్రియమైన ఆ కబుర్లకి అర్థం లేదు, శబ్దం మాత్రమే ఉంది. ఎంత నిశ్చింత!

sant2

 

జూన్ మాసపు ఆగమనం తోనే వినబడే లాన్ మూవర్ శబ్దమంటే తాతగారికి ప్రేమ. అది వినపడితే ఆయన నిద్ర లో నవ్వుతాడు. ఊరిలో అన్ని లాన్ మూవర్ల నాదాలూ కలిసి సింఫనీ పాడినట్టు ఊహించుకుంటాడు. అసలు కత్తిరించాల్సిన అవసరమే లేని టైం సేవర్ లాన్ జాతి ని అమ్మేందుకు వచ్చిన బిల్ ఫారెస్టర్ తో అంటాడు కదా “అసలు అన్ని పనులూ త్వరత్వరగా చేసి ఏం సాధిస్తాం? మిగిలిపోయే సమయం లో చెయ్యటానికి కొత్త పనులు కల్పించుకునేందుకు బుర్ర బద్దలుగొట్టుకోవడం తప్ప? దారివెంట ఎదిగే మొక్కల్ని చూస్తూ, వాసనలు పీలుస్తూ నడిచే కాస్త దూరం కార్లో యాభై మైళ్ళ వేగం తో వెళ్ళటం కంటే ఎందుకు బావుంటుందో కొంచెం అర్థం చేసుకోడానికి ప్రయత్నించరాదూ?” అని.  ఆ ఆలోచనల్లోకి వెళ్ళి వచ్చే లోపు బిల్ కి డబ్బులిచ్చేసి సరుకంతా లోయలో పడేయిస్తాడు. ఆ తర్వాత బిల్ కూడా లాన్ మూవర్ని ప్రేమ గా బయటికి తేవటం ఒక తియ్యటి ఆశావాదపు కొసమెరుపు.

సంతోష యంత్రాన్ని కనిపెట్టాలనుకునే లియోది ఓ కథ. ఎప్పటికీ చెయ్యలేమనుకున్న పని ఒక్కసారే చెయ్యటంలో సంతోషం ఉందా లేక అశాంతా? క్షణికమైన సౌందర్యాలు- సూర్యాస్తమయాలు, ఇంద్రధనుస్సులూ… క్షణికం కనుకే అపురూపం కాదూ? అవన్నీ నిత్యమూ నిరంతరమూ అయితే అవి అలవాటు అయిపోవటాన్ని తట్టుకునీ నిలబడగలిగేంత సంతోషం పుడుతుందా మనకి? Now and Here ని మించిన సంతోషముందా? ప్రశ్నలు. వినపడీ వినపడనట్టుండే జవాబులు.

పుస్తకం చివర్న వచ్చే అమ్మమ్మ వంటల్లాగా ఈ సంతోషానిక్కూడా ఓ రెసిపీ లేదేమో. వంటగది ఎంత చిందరవందరగా అయినా ఉండనీ. డబ్బాల్లో దినుసులన్నీ ఏకమైపొనీ. చివరికి చేసే వంట మాత్రం దివ్యంగా ఉండాలి. యేది యెంత వేస్తే రుచో, ఆ మారిపోతూ ఉండే పాళ్ళ రహస్యం ఏమిటో తెలిసిన పెద్దవాళ్ళ దగ్గర శిష్యరికం చెయ్యాలి. అప్పటికీ వాళ్ళు చెప్పగలిగే algorithm యేదీ ఉండదు. తోచినంత వేసుకుంటూ పోతే ఎప్పుడో ఒక రోజుకి epiphany.

ఈ బంగారపు వెలుతురుకి అవతల యేముంటుంది? గాఢమైన ఈ వెలుతురు దాచే నీడలు ఎంత నల్లటివో! వేసవి లో కూడా అమావాస్యలుంటాయి. తీతువులూ కూస్తాయి. ఎప్పుడూ పక్కనే ఉండే మనవాడు ఓ మధ్యాహ్నం వేరే ఊరికి వెళ్ళిపోతున్నానంటాడు, ఆ సాయంత్రం ఏం ఆడుకోవాలో ముందే అనుకున్నా కూడా. వాడేం మామూలు మనిషా? మన దృష్టి లో సగం దేవుడు. మన భాష అర్థమయ్యే ఒక్కగానొక్కడు. అన్నాళ్ళూ చెప్పుకున్నా మిగిలిపోయినవన్నీ గుర్తొస్తాయి. ఆ పైన జరగబోయేవన్నీ ఎవరితో చెప్పాలి? భయమేస్తుంది. ఒకరినొకరు మర్చిపోయే రోజు వస్తుందేమో అని. వెళ్ళిపోతాడు వాడు. ఊరూ వాడా, పచ్చికా చీకటీ అన్నీ అలాగే ఉంటాయి. వాడు మాత్రం అక్కడ ఉండడు. కలుస్తూ ఉండొచ్చు లెమ్మనే సగం నిజం మాత్రం ఉంటుంది. కోపమే వస్తుంది వాడిమీద. పసి గుండె కొంచెం ఎదుగుతుంది. ఒకింత మొద్దుబారుతుంది. కళ్ళ ముందే కట్టిపడెయ్యగలిగితే ఎంత బావుండు ఇష్టమైన వాళ్ళందరినీ!

sant4

మర్రి చెట్లలాంటి మనుషులు హఠాత్తుగా మాయం అయిపోతారు. జీవించి ఉన్నట్టు తెలిస్తే జీవించి లేకపోవటం అంటే ఏంటో కూడా తెలుస్తుంది నెమ్మదిగా. దిగులు పట్టుకుంటుంది. ఒంటరితనం ముంచేస్తుంది. అసలు ఎవరినైనా యే హామీ మీద ప్రేమించాలి? ఎన్నాళ్ళు మనతో ఉంటారని ప్రేమించాలి? అనిపిస్తుంది. అవును కొందరంతే. ఇంకా పెద్దరికం మీద పడకుండానే చప్పున విషాదం పాలైపోగలరు. గాఢంగా ప్రేమించగలరు. గాయపడి యేడవగలరు. ఎరువు మూటల్లో కూడా పూల తోటల్నే చూడగలరు. స్ఫటికాలకి మల్లే ప్రపంచాన్ని వర్ణాల్లోకీ, పదాల్లోకీ, స్వరాల్లోకీ విప్పార్చగలరు. ఓ చిన్న ఆకుపచ్చని పడవమీద కాలం లో వెనక్కి తీసుకుపోయి ఇదీ అని చెప్పలేనివన్నీ ఇక్కడే ఇప్పుడే చూపించగలరు. “ప్రేమ భ్రమ కదూ?”  అని అడిగితే… “మంచు ఆవహించేవేళ సూర్యుడూ భ్రమే అనిపిస్తాడు” అని మార్మికంగా నవ్వేయనూగలరు.

చివరి పేజీ మూస్తూనే తరుముకొస్తాయన్నీ. ఆకాశమంతా నిండే చందమామ నేరేడు చెట్ల వెనకనించీ తేలి వస్తోంది… చుక్కలు మాత్రమే మెరుస్తోన్న ఇంకో రాత్రి- గాజు పగిలినట్టు కారణం లేకుండా కలిసి నవ్వుతున్నారంతా. వేడి చల్లారుతున్న గచ్చు మీద, మొక్కలు తాగి మిగిల్చిన నీళ్ళ మీద మార్చి మార్చి అడుగులు వేస్తున్నాయి సైజ్ ఫైవ్ పాదాలు. నిద్రగన్నేరుల మీద ఎవరిదో నిర్దయ తెలిసి గొంతు లో ఏదో అడ్డుపడుతోంది. ఎపుడో విడిపోయిన వారి మాట వినపడి వాగ్దానాలు చేస్తోంది. తురాయి పూలు రాల్తూనే ఉన్నాయి. అన్నీ- అలాగే- అక్కడే… సరిగ్గా అప్పటిలాగే… ఎందుకంటే? గుర్తున్నాయి కదా మరి!

peepal-leaves-2013

 

 

మిడ్ నైట్ బ్లూస్

 

 

-బ్రెయిన్ డెడ్ 

~

 

 

ప్రామిస్డ్ ల్యాండ్ రిమోట్లెక్కడో

ప్రాపంచిక భంగిమల మధ్య కోల్పోయి

 

అర్త్ధరాత్రి హౌరబ్రిడ్జ్కింద గుర్రం గజ్జెల్లా

మిడిల్ క్లాస్ ముషాయిరా

పరాకులు పలకరింపులు

జీవితాంతం ఒకరికొకరి ఏడ్పుల గుస్థాకీ

కల ఇదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే

బుల్షిట్  ప్రేమ లేదంటారేమిటిరా

తూరుపు సింధూరపు ముఖారవిందాన

చెమటల ఉప్పులూరుతూ

నాన్ స్టిక్ ప్యాన్లో రిలేషన్షిప్ స్టిక్ చేసుకోవడానికి

తిరగబడుతున్న  హాఫ్ అండా ఫ్రై

వెలిగారుతున్న వైబ్రేటర్ మసకల్లో

గర్ల్ ఫ్రెండ్కో ముద్దు గ్లాస్ ఫ్రెండ్కో హద్దు పెడుతూ

జ్వరంతో బెంగటిల్లిన బేబీ డైపర్లో బ్రతుకర్ధం వెతుక్కుంటూ

ఎండిపోయిన ఎర్ర మిరపగాయ ముఖాన నిలబడిన

ఏకాకితనాన కానరాలేదా

ఏక్ చుట్కీ సింధూర్కి కీమత్ ఎంతో రమేష్బాబు

 

నిజమేన్రోయి !

సిగరెట్‌ తాగనోడు దున్నపోతై పుట్టున్‌

సిగరెట్బట్లు మారుతూ ఉంటాయి యాష్ ట్రేలలో

బట్లు మారుతూ ఉంటాయి బాంబే డైయింగ్ నేతల నునుపుల్లో

ఒకరికొకరు తోడై ఉండిన అదే స్వర్గపు పానుపుల్లో

పరంతూ ,గాలుల్లో కలుస్తున్న పొగలు

ఉక్కిరిబిక్కిరి చేసే సంభందాలంత స(అ)తీ సహజమేగా

మై డియర్ గిరీశం , మైండ్ యా  రిలేషన్షిప్ స్టేటస్ ఆల్వేస్ కాంప్లికేటెడేనోయి

 

సబ్జెక్టివిటీ కరువైన కథలు డామిట్!  అనేసి అడ్డం తిరిగినప్పుడు

ఆదర్శాల అబ్జేక్టివిటీ  వెతక్కువాయి ముదుర్రాయి

పళ్ళుడగొట్టుకున్న శతకోటి బోడిలింగాలలో నీదో

పగిలిన హృదయం మాత్రమే

ప్రేమెందుకు లేదరాభై

పడకింటి పవళింపు సేవలలో  అనుకోకుండానో ,

అనితరసాధ్యంగానో కారిన

ఆ నాలుగు చుక్కలు  ప్రేమకేగా లైఫోటి క్యారుమన్నది

ఓపెన్ మైండెడ్ బైయాస్డ్ జిందగీలలో చివరకిమిగిలేది అదే సుమీ

 

డార్న్

అటు తిరిగిపడుకోవడంలోను నిరాశేనా

అసహనపు ధర్మయుద్ధం చివరాకరు ఆయుధం కాబోలు

బయటెక్కడో ఎవడో ఫ్రస్త్రేటెడ్ సోల్ కోక్ టిన్ను లాగిపెట్టి తన్నిన శబ్దం

దునియా కా క్యా సునేగారే  భాయ్ జరా ఖుద్కా ధర్డ్ సునో

కోక కోసమో కొకైన్ కోసమో ఫటక్ ఫటక్ మని గుండెపగలగొట్టుకొని బయటికోస్తున్న ఎమోషన్నో క్షణం మోసిన తుది సెకండ్లో

జబ్ కోయి బాత్ బిగడ్జాయే జబ్ కోయి ముష్కిల్ పడ్జాయే

తుం దేనా సాత్ మేరా ఓ హం నవా !

 

ఒకేమారు ఇటు తిరిగి హత్తుకోవా ప్రియా

మరెప్పుడు మౌనాన్నే కాదు మరణాన్ని సైతం మన మధ్యకి రానివ్వనని మాటిస్తాను

 

 

ప్రామిస్డ్ ల్యాండ్ రిమోట్లెక్కడో

ప్రాపంచిక భంగిమల మధ్య కోల్పోయి

 

నిశీ !! 23 /02/ 16

 

గజ్జెల పొంగు 

 

-బ‌త్తుల ప్ర‌సాద్
~

prasadమానాయన దానంమామ పెద్ద శింత శెట్టు కింద కూకోని ఉండిరి… మా నాయన నుల‌క పేనుతా ఉంటే దానం మామ మాత్రం బీడీ ముట్టిచ్చుకోని దాని పొగ పెరుకుతా ఉండాడు. బీడి పొగను గుండె కాడికి పీకి దాన్ని అప్పుడింత ఇప్పుడింత బయటకు ఇడుచ్చా మా నాయన్ను చూసి మామా నువ్వు నుక బో పేనుతావు లేబ్బా అన్నాడు.దానికి మా నాయన ఊరుకోకుండా ఏదో శెతురు మాట వేసినాడు.

అప్పుటికే బీడి పొగ గుండెల్లోకి లాగి ఉన్నె దానం మామకు పొరపోయింది. దాంతో నవ్వడం దగ్గడం తిరుక్కున్నెడు కాసేపటికి దగ్గి దగ్గి ఊపిరి పీల్చుకోని  నీ యెక్క నీ నోట్లో నోరు పెట్టగుడ్దు మామ ….అని ఆరిపోయిన బీడీని మల్లీ ఎలిగిచ్చి ఓ రెండు దమ్ములు కొట్టి నేల‌ మీద ఎంగిలి ఊసి ఆ ఎంగిట్లో బీడీని ఆర్పినాడు.మా నాయన మాత్రం ముసి ముసి నవ్వు నవ్వుకుంటా అదే పని శేచ్చాన్నాడు.

దానం మామ మా నాయనతో  ‘కాదు మామా దీనెక్క కూరాకు తినక శానా దినాు కాలా’ అన్నాడు దానికి మా నాయన అవునోయి ఈ మధ్యన ఎవురు గాని పల్లెల్లో కోయక పోయిరి నాగ్గూడా నాలిక పీకుతాంది అన్నాడు..

ఇట్ట మాట్లాడుకుంటా ఉండగానే ఆ దావన పక్క పల్లె వాళ్ళు  ఒక జీవాన్ని తోలు కోని పోతాంటే .. దానం మామ మా నాయనతో ‘ మామా ఆ జీవం దానికే ఉన్నెట్టు ఉందే’ అన్నాడు. దానికి మా నాయన ‘అవును దాన్ని సూచ్చాంటే అట్టనే ఉంది’ అన్నాడు.. దాంతో దానం మామ ‘ఓబ్బి ఆగండ్రి’ అని వాల్ల‌ను  అనేర్కల్లా వాళ్ళు  ఆగినారు.

దానం మామ నాలుగు అంగల్లో ఆడికి చేరుకోని వారితో యవ్వారం మొదు పెట్టి నాడు. ఇంత లోపల‌ మా నాయన నుల‌క పేనడం పక్కన పెట్టి తుండు గుడ్డ ఇదిలిచ్చు కుంటా వాళ్ళ కాడికి పోయినాడు. మా నాయన పోయార్కనే దానం మామ వాల్ల‌తో  అసలు విషయం కనుక్కోని .. మాకు అమ్మి పోండి అని అడుగుతాంటే .. మేము మారు బేరం చేసే వాల్లం  కాదు .. మేము కూడా కోసుకోని తినడానికే తీసక పోతాండాము అన్నారు. మా నాయన్ను ఆ మనుషు గుర్తు పట్టి నారు .. ఏమయ్యా బాగుండావా అన్నారు.. సరే మా నాయన కూడా వాళ్ళ‌తో  మాటు కలిపినాడు.. ఇంగ అందరూ అసు విషయానికి వచ్చినారు.. జీవాన్ని ఇయ్యడానికి వాళ్ళు  ఒప్పుకున్నారు గాని లెక్క కాడనే   మధ్యన వంద రూపాయలు  వారా  వచ్చింది. అట్టిట్ట చేసి బేరం యాభై రూపాయల‌ వారాతో కుదుర్చుకున్నారు.

దాంతో జీవాన్ని తీసకచ్చి మా ఇంటి పక్కన ఉండే  గురువు (పాస్టరయ్య) ఇంటి ఎనకా ఆడోళ్ళు  కక్కసుకు పొయ్యే దారిలో ఉండే యాపమాను ఏరుకు కట్టేసినారు.

మా నాయన బకెటలో కడుగు నీళ్ళు  తీసకచ్చి పోసినాడు …దానం మామ యాడిదో ఇంత వరిగడ్డి తీసకచ్చి వేసినాడు. అది ఎప్పుడు తిన్నెదో ఏమో గాని శానా ఆత్రంగా గడ్డి తిని కడుగు నీళ్ళు  తాగింది.

మా నాయన దానం మామ ఇద్దరూ జీవం ఎనకాల‌ పక్క నిబడుకోని దాని ఎనక కాల‌ తిట్టు చూసి దాని కూరాకు ఎన్ని పడ్లు  పడతాదో లెక్క చెయ్యడం తిరుక్కుండిరి. ఆ జీవం కొన్న రేటును బట్టి అది ఎంత కూరాకు పడతదో దాన్ని బట్టి కుప్ప ఎంత రేటుకు అమ్మాలి అనేది .. ఒక రేటు పెట్టుకుంటారు. మా నాయన దానం మామ ఇద్దరూ కాసేపు అట్టిట్ట మాట్లాడు కోని ఒక రేటు అనుకుండిరి. ఇది ఎట్ట లేదన్నా కూడా యాభై పడుల‌కు పైగా అరవై పడుకు లోపల‌ పడ్తది అనుకుండిరి.

రేపు ఎవరికి ఎన్ని కువ్వలు  కావాలో అడగడానికి పట్టీ కడదాము అనుకునిరి.. పోయిన తూరి ఇట్టనే కూరాకు కోసినప్పుడు  మల్లిచ్చలే అని రెండు కువ్వలు  తీసక పొయి ఆ లెక్క కోసం శానా సార్లు తిప్పిన ఫలానా మనిషిని తప్ప అందరినీ అడుగుదామనుకునిరి.

ఆ రోజు శనివారం తెల్లార్తే ఆదివారం… మల్లారోజు పండగ సందడి …జీవం వచ్చిందాన శనివారం నుండే తిరుక్కున్నెది. కక్కసుకు పొయ్యే ఆడ్లోళ్ళు ఆ దోవన పోతా ఆడ కట్టేసి ఉన్న జీవాన్ని చూసి ఓహో రేపు తెల్లారే సరికల్లా శియ్యలు ఇండ్లకు వచ్చాయన్న మాట అనుకుంటా పోయిరి.

కాలేజీలు  సదువుకుంటా సెల‌వుకు ఇండ్లకు వచ్చిన ఎడ్మాస్టర్‌ కూతురు. గురువు కూతురు ఇద్దరూ ఆ జీవం కాడ నిబడి దాన్ని చూసి ‘అయ్యోదీన్ని కోస్తారా ’ అని ఒక్కరవ్వ ఎచ్చల‌ తనం చూపిస్తా ఉంటే …ఈ మాటలు ఇన్నె మా సంతోష శిన్నమ్మ ..‘ఏమ్మామీరు తినరా’ అని అడిగింది.. ఆ శిన్నమ్మ వాళ్ళ ఇండ్లల్లో పని శేచ్చాది కాబట్టి వీళ్ళు తినేది తినంది ఆమెకు తెలుసు.. ‘ ఆ తింటాములే’ అనిరి.. మరి తినేప్పుడు దాన్ని జూసి అట్ట అనుగుడ్దు ..దేవుడు కొన్నింటిని మన జాతి వాల్ల‌కు  తినడానికే పుట్టిచ్చినాడు…మన జాతి వాళ్ళు  తర తరాుగా వీటిని తినే బతుకుతుండాము అని వాళ్ళ‌కు  ఒక్కరవ్వ ఇవరంగా చెప్పే తలికల్లా వాల్ల‌కు  ఎచ్చులు  వదిలి పెట్టి కుచ్చల్లు  ఊపుకుంటా ఎల్లబారిరి.

అక్కడుండే మిషనరీ కాంపౌండు లో అందరూ ఒకే కులానికి చెందిన వారు ఉండటం.. ఎవరు ఎన్ని రకా కూరలు తిన్నా కూడా అందరూ ఈ కూరను మాత్రం  ఇష్టపడి తింటారు.అందుకే దీన్ని ‘కులం కూరాకు’ అని కూడా అంటారు. అక్కడ ఉండే వారుకాకుండా ఊర్లో శానా మంది ఈ కులానికి చెందిన వారు ఉంటారు.

వాళ్ళ‌లో  దాదాపు అందరూ ఈ కూరాకు తినడానికి ఇష్ట పడే వారే.. ఈ కూర ఇంటికి పోతే ఆ ఇంట్లో పండగ సందడి ఉన్నెట్టే.అందరికీ బాగా ఇష్టమైన కూరాకు ఇది. ఊర్లో ఉండే వాల్ల‌కు  ఆ చర్చి లో సభ్యులే ప్రతి ఆదివారం చర్చికి వచ్చినపుడు అందరూ కలుసుకుంటుంటారు.

మామూలుగా ఈ కూరాకు పక్కనే ఉండే పల్లె నుండి అందరి ఇండ్లకు అప్పుడప్పుడు వస్తుంది. తెల్ల‌ వారు జామున గంప కెత్తుకోని తీసకచ్చి ఇచ్చిపోతారు. ఆ పల్లెలో వాళ్ళు  తీసుకురానప్పుడు .. ఎప్పుడన్నా ఇట్టా జీవాలు  కనపన్నెప్పుడు మా నాయన దానం మామ ఇద్దరు కలిసి ఇట్ట జీవాల‌ను చర్చి కాంపౌండు లో ఎవ్వురికీ తెలియకుండా కోపిస్తుంటారు. ఇది వాల్ల‌కు  యాపారం కాదుగాని శియ్యల‌ కూరాకు మీద వారికుండే మునాస..ఒక్కోసారి పెట్టిన పెట్టుబడి రాక పోయినా గూడా ఇట్ట చెయ్యడం మానుకోరు.

ఆ రోజు ఆ కాంపౌండు లో ఉండే చర్చి పనులు చేసే మనిషి కాడికి పోయి ‘ఎట్టా నువ్వు రేపు చర్చి టైము గురించి చెప్పడానికి అందరి ఇండ్లకు పోతావు కదా అట్ట పోయినప్పుడు ఎవురికి ఎన్ని కుప్పలు  కూరాకు కావాల్నో పట్టీ రాయించుకోని రా’ అని పురమాయించినారు. అట్ట పట్టీ రాయించుకోని వచ్చినందుకు నీకు ఏదో ఒకటి ఇచ్చాం లే అనారక ఆ మనిషి సరే రాపిచ్చుకోని వచ్చాలే అని ఒప్పుకున్నాడు..ఎందుకంటే ఆ మనిషి కి కూడా ఈ కూరాకు అంటే బో మునాస కాబట్టి.

daliచీకటి పడినాక ఆ గుడిలో పని చేసే ఆయప్ప కూరాకు పట్టీ కట్టిచ్చుకోని వచ్చినాడు.. దానం మామ మా నాయన అది చూసుకోని కూరాకు పడేంత మంది అయినారులే .. ఇంగ ఎవురన్నా ఇప్పుడు వచ్చినా కూరాకు దొరకదు…కూరాకు అంతా మిగకుండా అమ్ముడు పోతాంది లే అని ఇద్దరూ కుశా పడిరి. ఆ కుశాలో ఇద్దరూ గూకోని మందు తాగి .. జీవానికి దగ్గర్లోనే మంచం వేసుకుని పండుకున్నారు.. ఇంగొక రవ్వ పొద్దు పొయ్యారక పక్క పల్లె నుండి జీవాన్ని కోయడానికి కత్తులు ..గొడ్డేళ్ళు  తీసుకోని రెండు మూడు గంపలు  ఉత్తుకోని నల‌గరు మనుసు వచ్చినారు..వాల్ల‌కు  కూడా జీవాన్ని కట్టేసిన శెట్టు కిందనే సాపలు  గోనే సంచులు పర్సుకోని పండుకునిరి.

తొలి కోడి కూచ్చానే అందరూ లేసిరి.. కొందరు పెట్రమాక్స్‌ లైటు ఎలిగిచ్చే కొందరు రాత్రి తగ్గించి పెట్టు కోనున్న లాంతరు ఒత్తును పెంచిరి.. ఎంత పెట్రమాక్స్‌ లైట్‌ అయినా ఆ మబ్బుకు ఎలుగు సరిపోవడం లేదు. ఒక్కరవ్వ మసక మసక గానే ఉంది. ఆ పాటికే అక్కడికి చేరుకున్న కొందరు ఒగిసి ఒగిసి పిల్లోళ్ళు కంపమండలు ..శిదుగు తీసుకోని వచ్చి మంట ఎలిగిచ్చినారు. శానా రోజులు  అయింది జీవాన్ని కోసి …అందుకే శానా ఆత్రంగా…ఎవరు శెప్పకుండానే  పనులు చేస్తా ఉండారు.

 

జీవాన్ని పడేసి పని మొదలు  పెట్టినారు.కూతకాయ తెంపి అన్నిండి వచ్చాన్న నెత్తరను బేసినితో పట్టి ఒక పెద్ద డబారాలో పోసినారు. ఆ జీవం తోలు  కొన్న మనిషి ఆ తోలు ఒలుచకోవడానికి తయారు అయినాడు.తోలు  తీసేప్పుడు శానా ఒడుపుగా తీయాలి .. పొరాపాటున ఎక్కడన్నా బొక్క పడితే అది దేనికీ పనికి రాదు.. ఆ తోలు అందరికీ తీయడానికి రాదు అది తెలిసిన పనోళ్ళు  ఉంటారు.. వాల్లేవచ్చి తీస్తారు. ఆ తోలును ఏదేదో చేసి అమ్ముకుంటారు.. తోలు  తీసే మనిషి తోుకు అంటుకున్న అవయవాలు  అన్నీ ఒకదాని తరువాత ఒకటి తీసి ఇచ్చాఉంటే .. దానికి పక్కనే కింద పరిసిన తడికె మీదికి  చేరేచ్చాండారు… ఇక్కడ ఇద్దరిద్దరు మనుషులు  కూచ్చోని కూరాకు… ఎంకలు  దేనికదే వేరు శేచ్చాండారు..ఇంగిద్దరు ఎంకలు  నరుకుతాండారు.. ఎవురి పనుల్లో వాళ్ళు ఉండారు. ఇట్ట శరాపురిగా పనులు  శేచ్చాంటే మా సంతోష శిన్నమ్మ వచ్చి ఇంత జల‌బర, కొంత కొవ్వు పెట్టిచ్చుకోని పోయినాది.

ఒక అరగంటకు తోలు  మొత్తం ఒలిసినాడు.. ఆ మనిషి .. తోలు ను ఎడ‌ల్పుగా  పర్సి దాని మీద కూరాకు కుప్పలు  ఎయ్యడం తిరుక్కుండిరి.. ముందు నరిడె..ఈరిగ.. దొమ్మ.. ఉల‌వకాయ.. శిగురెంకలు  .. బర్రెంకలు ..ముడ్సులు .. పొట్ట పేగులు  అన్నీ ఒకదాని ఎనక ఒకటి కుప్ప పేరుచ్చాండారు.కుప్పలు  ఏసేటాయప్ప అడిగినాడు ఎన్ని కుప్పువేయాల్నో …వాళ్ళు  చెప్పినదాన్ని బట్టి కుప్పకు కూరాకు సర్దుతాండారు.

తోలు  మీద ఆడాడ కొంత కూరాకు అతుక్కోని ఉంటే అది చూసి దానం మామ తోలు  తీసినాయనను అడిగినాడు ‘ఏమబ్బా ఆమోసు కూరంతా తోలుకు అట్టనే ఇడ్సి పెట్టినావే’  అని… దానికాయప్ప ‘ఆ మాత్రం ఇడ్సక పోతే తోలు  బొక్క పడిందనుకో దమ్డికి పనికి రాకుండా పోతాది’ అన్నాడు.

ఇట్ట శరా పురిగా ఎవురి పనులు వాళ్ళు  చేసుకుంటా ఉంటే సంతోష శిన్నమ్మ నెత్తర పొడి చేసుకోని వచ్చినాది..ఆమె వచ్చీ రాంగానే అందరూ నోర్లలో బొగ్గులు  వేసుకోని ఉదరా బదరా పండ్లు తోముకోని .. సంతోష శిన్నమ్మ కాడికి పోయి గొంతు కూకుండిరి.. ఆ శిన్నమ్మ అందరికీ మోడపాకుల్లో ఎవురికి ఎంత కావాంటే అంత పెద్ద కూరాగ్గంటె తో ఏసిచ్చే   అందరూ పాంకుండిరి.

ఈ లోపల‌ కూరాకు పట్టీ లో తమ పేర్లు రాపిచ్చిన వాళ్ళు ఒక్కరొక్కరే ఆడికి శేరుకుంటా ఉండారు.వాళ్ళలో చాలా మంది తొందరగా తీసుకోని ఎల్ల‌బారదామ‌ని  అని వచ్చినోల్లే ఏమబ్బా ఇంగా కాలేదా ..ఇంత లేటు అయితే ఎట్ట తెల్లారితే ఇంటికి ఎత్తక పోడం కుదరదు అని గొనుగుతాంటే ..‘ఆ…ఈడ మేము ఆడుకుంటా ఉండాము.. రాత్రి అంతా నిద్దర మేలు కోని పని  శేచ్చేనే ఈడికి అయింది .. ఇంత సేపు ఇంట్లో స‌ల్ల‌గా  పడుకుని వచ్చి ఇప్పుడు వల్లో పెడుదునా దల్లో పెడుదునా అని అంటే ఎట్ట .. కాసేపు ఆగు ఎత్తుకుని పోదువు గాని’ అని ఘాటుగా సమాధానం ఇచ్చినారు. శియ్యలు కోసేవాళ్ళు  దాంతో ఏమీ మాట్లాడక పాయ ఆ ఆసామి…కొందరు మాంసం కుప్పల‌ మీద వాళ్ళు  ఎంట తెచ్చుకున్న బ్యాటరీ లైటువేసి కూర ఎట్టుంది కొవ్వు ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా లేకుంటే సరిపోయేమైన ఉందా అని తొసుకుంటాండిరి.. కొందరు అయితే బాగుంది అని మెచ్చుకునిరి..

మంచోని బుద్ది మాంసం కాడ తెలుచ్చాది అన్నెట్టు ఎట్టాటి మనిషి గాని కూరాకు కాడికి వచ్చినాక వాళ్ళ  అసలు  బుద్ది బయట పడతది. మా ఊరికి పక్క ఊరిలో మత బోధకుడిగా పని చేసే ఒకాయప్ప వచ్చినాడు .. ఆ మనిషి ప్రసంగం చేసేప్పుడు  తెలుగు రాని వాడు తెలుగు  మాట్లాడితే ఎట్ట ఉంటదో అట్ట మాట్లాడుతుంటాడు…ఓ మ‌హా  ప్రభు కనికరము గ తండ్రి …మీరు ఈ బిడ్డను కాపాడండి నాయనా .. అని అదొక రకంగా మాట్లాడుతుంటాడు…. ఆ మనిషి ఆ రోజు వచ్చి తాను ఎప్పుడు ప్రసంగంలో మాట్లాడిన భాష మాట్లాడకుండా ..‘యాంది ఇట్ట కూరాకు అంతా జబర జబరగా ఉందే …కండలు  ఏంది ఇంత లూజుగా ఉండాయే..’ ఆయాలు అన్నీ ఏసినారా లేదా అని అంటాండాడు. అది ఇన్నె దానం మామ ..మేము దాన్ని తయారు చెయ్యలా కోసినాము… ఎట్టుంటే అట్ట తీసక పోవాల నచ్చకుంటే ఇడ్సిపెట్టి పోవాల‌..అయినా అందరికీ బాగా కనిపిచ్చిన కూరాకు నీకు ఒక్కడికే అట్ట కనిపిచ్చాంది ఎందుకు ప్రసంగాలు  శేచ్చాంటావు నీకు ఇదేం బుద్ది అనే సరికి ఆ మనిషి నోరు ఎత్తలేదు.

పట్టీలో రాసినట్టు వర్సగా పేర్లు పిలిచి వాళ్ళ‌కు  ముందు తోలు లో ఏసి పెట్టి ఉన్న కువ్వ ఎత్తి పడితో కండలు  కొల్స‌డం తిరుక్కుండిరి… శానా మటుకు అందరూ లెక్కిచ్చే తీసక పోతాండిరి .. కొందరు ఏ కువ్వ ఏచ్చే అదే  తీసకపోతాంటే… కొందరు అద్దో అద్దో  ఆ కువ్వ ఎయ్యమని కోరి ఏపిచ్చుకుంటాంటే ..ఇంగ కొందరు కువ్వలో ఏలు  పెట్టి అన్నీ ఆయాలు  ఉండాయా లేదా అని చూసుకోని తీసుకుంటా ఉండిరి.. ఆయాలు  అన్నీ మా హక్కు అన్నెట్టుగా ఉండాయా లేదా అని ఏరపంచుకుని చూసి మరీ తీసక పోతాండిరి.

పట్టీలో ఉన్నె అందరికీ కూరాకు ఇవ్వంగా మిగిలిన కూరాకు లో కింద వేసుకోవడానికి తడిక ఇచ్చిన వాళ్ళ‌కు  .. మాంసం కొలిచే పడి ఇచ్చిన వాళ్ళ‌కు ..ఎంకలు  కొట్టే గొడ్డేలు ను ఇచ్చిన వాళ్ళ‌కు  ..పట్టీ కట్టించుకోను వచ్చిన ఆయప్పకు తలా ఎవురి బాగం వాళ్ళ‌కు  ఇచ్చి మిగిలిన కూరాకు ఇంటికి తీసకపోయినారు మా దానం మామ మా నాయన…

అంతకు ముందు ఆయాు కోసే వాళ్ళ  కాడ నిల‌బడి ఒరే నీ పాసుగుల‌ నాకు అద్దో ఆ తోకమొట్టె అంటే ఇష్టం ఇద్దో ఈ శిగురు ఎంకంటే ఇష్టం .. అద్దొ ఆ ముద్ద ముడుసు అంటే ఇష్టం… అని ఒక పెద్ద డేక్ష నిండా కూర ఎత్తి పెడతా ఉంటే మా నాయన అది చూసి ఏంది దొరా అన్ని ఆయాలు  నీకు ఇష్టమని తీసుకుంటివి .. మేము నీ ఆయం తినాల్నా అనారక కాదు మామ అయి మనిద్దరికి అని అయి కూడా పంచినాడు ఇంటికి తీసకచ్చి మా దానం మామ.

ఆ రోజు ఆదివారం అయినా కూడా జనం గుడికి శానా ప‌ల్చ‌గా  వచ్చినారు. గురువు కూడా ఏదో గబాగబా ముగిజ్జాము అని ఉదరా బదరా ముగించినాడు.. ఎందుకంటే ఆయనకు కూడా ఈ కూరాకు మీద మునాస ఉంటది కాబట్టి .. అక్కడ కోసినందుకు గురువుకు సగం గుండెకాయ.. ఉల‌వకాయ.. నరిడె..ఇట్ట మెత్త మెత్తని కూరాకు అట్ట నోట్లో పెట్టుకుంటే కరిగి పోయే మంచి శిగురెంకలు అందు ఇచ్చారు.. పొద్దన్నే మొకం కడుక్కోని ఇన్ని కాపీ నీళ్ళు  తాగి వచ్చింటాడు .. ఇంటికి తొందరగా పోతే గోధుమ రొట్టె శియ్యల‌ కూరాకు తినచ్చు అని అనుకుని ఉంటాడేమో గాని ఇట్టాటప్పుడు శానా పెద్దగా గుడి నడపడు.

మా ఇంటి కాడ సూడాలా ఆదివారం పండగ అంతా ఆన్నే ఉంటది.. మా కుసిని లో మా దొడ్డాకిలి ని పీక్కచ్చి ఏసి దాని మీద కూరాకు పోసినారు.. మా యమ్మ మా నాయన దేనికదే ఏరపంచినారు.. తలా ఒక శెయ్యి ఏసి కత్తి పీటలు  తీసుకోని కండలు  వాలికలు  శేచ్చాంటే .. మా యమ్మ ఆ యా కూరాకు శెయ్యడానికి రెండు కండలు  ..కొన్ని శిగురు ఎంకలు  …ఆయాలు  ఒక కుండలో వేసి దాంట్లో ఒక శెంబు నీళ్ళు  పోసి దాంట్లో ఇంత పసుపు ఉప్పు కరెప్పాకు వేసి ఒక ఉల్లిగడ్డ కోసి వేసి పొయ్యిమీద పెట్టి కింద మంట ఎలిగిచ్చింది.

పక్క పొయిమీద పెంకు పెట్టి వట్టి మిరపకాయు..దనియాలు  ..జీల‌కర్ర ..గసగసాలు  వేసి ఏయించి పొయికాన్నే ఉన్నె రోట్లో దంచుతాంది .. ఇంగోపక్క తెల్ల‌బాయ‌లు  వ‌లుచ్చాఉంది.. రెండు పొయిల్లో మంట సరిగా ఉందా లేదా అని సూచ్చా ఉంది. ఇన్ని చేస్తాన్న మా యమ్మ … ఒక బంటు లాగా అనిపిస్తా ఉన్నెది.. పని జేచ్చా నోటికి పని చెప్పకుండా ఉంటదా అంటే అది లేదు .. అదట్ట చెయ్యండి ఇదిట్ట చెయ్యండి అని అందరికీ పురమాయిచ్చాఉంటాది. అట్ట మాట్లాడతానే శరా పురిగా మసాల‌ నూరి పెట్టింది.. మసాల‌ వాసన ఘమాయిచ్చాఉంది.

ఇంత లోపల‌ కూరాకు కుండలోనుండి గజ్జెల‌ పొంగు వచ్చింది. గజ్జెల‌ పొంగు అని దాన్ని ఎందుకు అంటారో మా యమ్మ నాకు చెప్పింది..కూరాకు ఇట్ట ఉడక పెట్టినప్పుడు వచ్చే తొలి పొంగులో చిన్న చిన్న బుడగలు  బుడగలు  వస్తాయి అవి గజ్జల‌ మాదిరి ఉంటాయి కాబట్టి దానికి గజ్జెల‌ పొంగు అని పేరు వచ్చింది ఈ పొంగు వచ్చిందంటే ..ఇంగ కూరాకు బెన్నా ఉడుకుతాది అని ..తొసు కోవచ్చు అని మా యమ్మ చెప్పింది.. దీనికి నువ్వు పెట్టినవా ఆ పేరు అని మా యమ్మను అడిగితే లేదు ..ఇది పూరో కాలం నుండి వచ్చాఉంది. మీ జేజి కూడా ఇదే మాట అంటాన్నెది అని చెప్పింది. గజ్జల‌ పొంగు వచ్చినప్పుడు వాసన ఘమా ఇస్తది.. ఆ వాసనకే సగం కడుపునిండి పోయినట్టు ఉంటాది. కానీ ఆకలి మాత్రం దంచి కొడతది.. ఈ మసాల‌ వాసన ఆ గజ్జెల‌ పొంగువాసన తో ఇండ్లంతా గుమాయిచ్చాంది.

శియ్యలు ముందేసుకుని వరికిల్లు  చేసి వల‌ కట్టమీద వాటిని యాలాడ తీసి మంచం పైకి లేపి ఆ మంచం కోళ్ళ‌మీద‌ ఈ వల‌ కట్టెను పేర్చి ..ఆ వరికిల్ల‌ను  కాకులు  ఎత్తక పోకుండా ఉండటానికి దాని మీద రెండు మూడు కంపమండలు  వేసి ఇంట్లో శిన్నోడిని అయినందుకు ఒక మంచం నిలువుగా పైకి ఎత్తి దానికి ఒక కట్టె ఊతం పెట్టి ఆ మంచం మీద దుప్పటి కప్పి కింద సాప పర్సి ఆ శియ్యల‌ కాడ నన్ను కాపలా పెట్టినారు.. నేను ఒక వల‌ కట్టె తీసుకోని కాకు రాకుండా అదిలిచ్చా కూకున్నాను.

వరిక్లిల్లు  కొయ్యడం అయిపొయ్యారక గజ్జెల‌ పొంగు రాడంతో మా నాయన గబగబా లేసి దొడ్లోకి పోయి నాుగు చెంబుల నీళ్ళు  పోసుకోని వచ్చి వేరే గుడ్డలు  ఏసు కోని …పొయ్యి కాడికి వచ్చి ‘ఏం గజ్జెల‌ పొంగు ఇంగా రాలేదా’ అని అడిగారక అప్పటి దాంక ఒక పక్క మసాల‌ నూరుకుంటా ఇంగో పక్క సంగటికి ఎసురు పెట్టి రెండు పొయ్యిల్లో కొరువులు ఎగదోసుకుంటా ఉన్నె మా యమ్మ మా నాయన అట్ట అడిగే తలికి ఇంత ఎత్తు ఎగిరింది   ‘పొద్దన్నుండి పనెంబడి పని శేచ్చాఉండాను నేను గమ్మునేమన్నా ఉండానా  కాసేపు ఆగలేవా పదురుతుండావే’ అని మా యమ్మ తిట్టడం  తిరుక్కున్నెది..మా యమ్మకు సందు దొరికితే చాలు  మా నాయన్నే కాకుండా వాళ్ళ‌ వంశాన్ని మొత్తం తిడ్తది …‘శియ్యల‌ కూరాకు కోసం భూములు అమ్ముకున్న జాతి’ నిన్నని ఏం లాభం లే శిన్న కొడుకు శిన్న కొడుకు అని మీ అమ్మ నిన్ను అట్ట తయారు చేసి నా ఎదాన తోసి పోయింది అని మా జేజి మీదికి లేసింది. అట్ట తిడతానే మా నాయనకు ఉప్పుతో ఉడికేసిన శియ్యలు  ఒక రెండు గంటెలు  ఏసింది.అట్ట తిడతానే మా నాయన వాళ్ళ‌మ్మ  ఇట్టనే మా నాయనకు ఏసిచ్చేది అనే విషయాన్ని కూడా మా యమ్మ  ఇవరిచ్చింది.

అది తిన్నెంక కాసేపటికి మా నాయన కాలు  కాలిన పిల్లి లాగా పొయి సుట్టే తిరుగుతాన్నెడు. మా యమ్మ సంగటి కుండకు పంగల‌ కట్ట ఆనిచ్చి దాని మీద కాలు  వేసి అది కదల‌కుండా తొక్కోని సంగటి గబ గబా గెలుకుతాంటే .. శియ్యల‌ కూరాకు లోనుండి వచ్చే వాసనకు గెలికిన రాగి సంగటి లో నుండి వచ్చే వాసనకు ఎవ్వరికైనా నోట్లో నీళ్ళు ఊరాల్సిందే …మా నాయన ఒక పక్క సాప పర్సుకోని పెద్ద చెంబుతో నీళ్ళు  పెట్టుకోని సాప మీద సక్కల బెల్లం వేసుకోని కూకోని ..ఎప్పుడెప్పుడు సంగటి వచ్చదా గుటుక్కున మింగుదామా అని ఎదురు సూచ్చాండాడు.. మా యమ్మ పొయ్యిమిందనుండి సంగటి కుండను దించి .. సంగటిలోనుండి తెడ్డు తీసి దాన్ని ఉదరా బదరా తుడిసి ఒక బేసిని లో ఒక్కరవ్వన్ని నీళ్ళు  సల్లి హస్తం గంటె తీసుకోని రెండు హస్తం గంటె నిండా సంగటి దీసి ఆ బేసినిలో వేసి ఒక చేత బేసిని పట్టుకుని మరో చేత్తో ఆ సంగటిని ముద్ద చేసి ఓ పెద్ద తెల్లెలో వేసింది. ఇంగొక కూర గిన్నె నిండా కూర వేసి రెండూ తీసకపోయి మా నాయన ముందు పెట్టి ‘కాసేపు ఉంటే కనేట్టు ఉండావు ఇంగ మింగు’ అని ఒక శెతురు మాట వేసి మల్లా పొయికాడికి పోయింది. మా నాయన కు తిరిగి మాట ఇయ్యడానికి మనసు ఒప్పినట్టులేదు పొగలు  కక్కుతాన్నె ఉడుకుడుకు రాగి సంగటి ఉన్నె తెల్లెను దగ్గరికి లాక్కోని సంగటికి ముందు ఇంత కూర ఏసుకోని .. చెంబు నీళ్ళ‌లో  చెయ్యి అద్దుకోని రాగి సంగటి మీద దాడి చేయడం తిరుక్కున్నాడు..

ఒక తుంట తుంచడం .దాన్ని కూరాకులో ఒక పక్క అద్దుకోవడం ఒక శియ్య తునక తీసుకోని నోట్లో పెట్టు కోవడం దాన్ని మింగుతానే కూరాకులో అద్దిన సంగటి నాలిక మీద రాపాడిచ్చి  గుటుక్కున మింగడం.. అట్ట మా నాయన సంగటి తునకలు  తుంచి కూరాకులో ముంచి గుటుక్కు గుటుక్కున మింగి అట్టనే తెల్లెను ఒనికిచ్చినాడు. మా నాయనకు సంగటి పెడతానే .. ఆయన తరువాత శియ్యల‌ కాడ కాపలా కాచ్చాన్నె నా కాడికి తీసుకోని వచ్చినాది మా యమ్మ పొగలు  కక్కుతాన్నె సంగటి… ఆ సంగటి ఎట్టుందంటే బడికి పోయే పిల్లోని కి తల‌ నిండా ఆందెం పూసి తకాయ దువ్వితే ఎట్టుంటదో అట్ట కనిపిచ్చినాది. అప్పుటి దాంకా ఈ వాసనతో ఎప్పుడెప్పుడు సంగటి వచ్చదా అని ఎదురు సూచ్చాన్నె నేను నీళ్ళ‌ చెంబులో చెయ్యి తడుపుకోని పొడ ఎండ మింద పడతాన్నా కూడా లెక్క చెయ్యకుండా సంగటి కూరాకు అట్టనే ఇదిలిచ్చి తెల్లెలోనే చెయ్యి కడిగి తెల్లె ఒక పక్కకు పెట్టి నిక్కరుకు శెయ్యి తుడుసుకున్నాను.

నా మాదిరే మా పక్కన ఉండే ఇండ్లలో వాళ్ళ‌/  కూడా వాల్ల వాల్ల  ఇండ్ల కాడ శియ్యల‌కు కాపలా ఉండే వాళ్ళ‌కు  కూడా ఇట్టనే బువ్వనో సంగటో తీసకచ్చి ఇచ్చినారు.. అందరం సంగటి శియ్యల‌ కూర నా మాదిరే తిని ఇంగ పాటలు  పద్యాలు  పాడ్డం తిరుక్కుఉండిరి .. అంతే కడుపు నిండితే నక్క ఊల‌ ఏసినట్లు మనిషి గూడా కడుపు నిండే దాకా ఒక రకంగా కడుపు నిండినాక ఒక రకంగా ఉంటారు..

మా నాయన సంగటి అనామొత్తు గబ గబా మింగి శివరాకర్న కూరాకులో ఇంగొక రవ్వ ఉప్పు పడింటే బాగుండు అన్నాడు..అందరు పిల్లోల్ల‌కు  సంగటి పెట్టి అందరు తిన్నాక మిగులు తగులు గిన్నెలో ఏసుకోని తింటాన్న మా యమ్మ మా నాయన మాటలు  విని ఈ కూత ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడే కూయాల్సింది. పెట్టింది పెట్టినట్టు అనా మొత్తు యారకతిని శెయ్యి కడుక్కునే తప్పుడా శెప్పేది.. అని మా యమ్మ మా వంశాన్ని తిట్టడం తిరుక్కుండార్క మా నాయన ఆకు వక్కా సున్నం కాయ తీసుకోని పొట్ట నిమురుకుంటా అరుగు మీదికి పొయినాడు.. ఈ లోపల‌ మా నాయన మాదిరే సంగటి శియ్యల‌ కూరాకు దుమ్ము లేపి వచ్చిన మా దానం మామ గూడా మా అరుగు మీదికి వచ్చినాడు …. మా నాయన శేతిలో ఉండే ఆకు జూసి నాలుగు ఆకులు  ఇయ్యిమామ ఆ బాసేలుకు ఆకు తెప్పియ్యమంటే అస్సలు  పకలేదు.. అని వాళ్ళ‌ బార్యను తిట్టడం తిరుక్కున్నాడు. మా నాయన పోనీలేవోయి నా కూతురు ను ఎందుకు తిడతావు నేను ఇచ్చాలే ఆకులు  అని కొన్ని ఆకులు  దానం మామ శేతికి ఇచ్చినాడు ఇద్దరు కలిసి తమల‌ పాకులు ఈనె తీసి సున్నం రాసుకుంటా ఆ రోజు కోసుకున్న శియ్యల‌ గురించి ఎన్ని కువ్వలు పడింది.. ఎంత బాగున్నెది శెప్పుకుని ఆకు వక్క నముకుంటా బీడిలు  ఎలిగిచ్చి బో సుకపడిరి .. అయన్నీ గ్నాపకాలుగా మిగిలి పోయినాయి మారిన కాలం లో గజ్జెల‌ పొంగు కుక్కర్ల కూత కింద పడి నలిగి పోయి కరిగి పోయింది. మా నాయ‌న జ్ఞాప‌కం మాదిరి.

*

వ్యాఖ్యానాలు vs గతమెరుపులు vs చట్రబద్ధాలు

 

 

నవలా రచయితకి ఉన్నది, కథా రచయితకి లేనిది ఏమిటి?

ప్రధాన పాత్రల జీవితాలని విస్తారంగా చిత్రీకరించే వెసులుబాటు నవలా రచయితకుంది, కథా రచయితకి లేదు. కథల నిడివి పూర్తిస్థాయి జీవితాల చిత్రీకరణకి అడ్డుపడుతుంది. అందువల్ల “కథ అను పదార్ధమును నిర్వచింపుడు” అనే ప్రశ్న ఎవరన్నా వేస్తే “ప్రధాన పాత్ర జీవితాన్ని ప్రభావితం చేసిన ఓ కీలక సంఘటన, దానికి దారి తీసిన పరిణామాల సమాహారం” అని చింపొచ్చు. సాధారణంగా కథల్లో ఒకే ఒక ప్రధాన పాత్ర ఉంటుంది. ఆ పాత్ర జీవితంలోని కొద్ది రోజులు లేదా గంటల మీద మాత్రమే కథ కేంద్రీకరించబడుతుంది. పాత్ర నిర్మాణం కూడా ఆ మేరకే ఉంటుంది. ఏ కొద్ది కథల్నో మినహాయిస్తే ఎక్కువ శాతం కథలు ఇలాగే ఉంటాయి.

పై నిర్వచనాన్ని దృష్టిలో ఉంచుకుని – ఈ క్రింది కథాంశాన్ని కథగా మలిచే క్రమంలో ఏమేం అంశాలు పరిగణలోకి తీసుకోవాలో చూద్దాం.

అనగనగా ఓ బాలుడు. చిన్నతనంలో ఎదురైన కొన్ని సంఘటనల కారణంగా వాడి బుర్రలో ఏవో ప్రశ్నలు మొలకెత్తాయి. వాటికి సమాధానాలు అన్వేషిస్తూండగానే దశాబ్దాలు దొర్లిపోయాయి. ఆ అన్వేషణే వాడి జీవితాన్ని రూపుదిద్దింది; పెద్దయ్యాక వాడు ఏమయ్యేదీ నిర్దేశించింది. ఆఖరుకి, నడివయసులో, అతనికి సమాధానాలు లభించాయి.

ఈ ఇతివృత్తంతో రెండు విధాలుగా కథ రాయొచ్చు.

మొదటి పద్ధతిలో –  కథానాయకుడి బాల్యప్రాయంలో కథ మొదలు పెట్టి, సంఘటనలు జరిగిన కాలక్రమంలో (chronological order) చెప్పుకుంటూ పోవటం. అయితే ఇందులో రెండు సమస్యలున్నాయి.

1: ఎత్తు పల్లాలు, ఎటువంటి మలుపులూ లేని తిన్నని నున్నని రహదారిపై సాగే ప్రయాణంలా ఈ కథనం నడుస్తుంది. కథలో కొన్ని కీలకమైన వివరాలు తొక్కిపట్టి అదను చూసి బయటపెడితేనే పాఠకుడిలో ఉత్సుకత కలుగుతుంది, ఉత్కంఠ పుడుతుంది. లీనియర్ విధానంలో చెప్పే కథల్లో  ఇలా వివరాలు తొక్కిపట్టే అవకాశం పెద్దగా ఉండకపోవటంతో అవి నీరసంగా సాగుతాయి.

  1. బాల్యం నుండి మొదలు పెట్టి కథానాయకుడు నడివయసుకి చేరేవరకూ చెప్పుకుంటూ పోతే కథ పొడుగు పెరిగిపోతుంది. అంతకంటే ముఖ్యంగా, అది మనం చెప్పుకున్న కథ నిర్వచనంలోకి ఇమడదు.

రెండో పద్ధతిలో – కథని ముగింపుకి వీలైనంత దగ్గర్లో మొదలుపెట్టాలి. అంటే, కథానాయకుడి ప్రశ్నలకి సమాధానాలు లభించబోయే దశలో అన్నమాట. ఆ తర్వాత సందర్భానుసారం నేపధ్యాన్ని విడమరుస్తూ పోవాలి. అలా సమాచారాన్ని తొక్కిపట్టటం వల్ల కథకి ఉత్కంఠ జతపడుతుంది. లీనియర్‌గా కాకుండా ముందువెనకలుగా, గతమెరుపులు మెరిపిస్తూ చెప్పటం వల్ల పొరలు పొరలుగా రూపుదిద్దుకుని, కథ లోతు పెరుగుతుంది. పాత్రల్ని లోతుగా చిత్రీకరించేంత నిడివి లేకపోవటం కథలకున్న పరిమితి అని మొదట్లో చెప్పుకున్నాం. ఆ లోటుని కొంతలో కొంత ఈ లోతుద్వారా పూడ్చేయొచ్చు.

గతంలో జరిగిపోయిన సంఘటనలు చెప్పటానికి – ఆ విధంగా కథ లోతు పెంచటానికి – ప్రధానంగా రెండు మార్గాలున్నాయి: వ్యాఖ్యానం (exposition) మరియు ఫ్లాష్‌బాక్. గతించిన విషయాలు ‘చెబితే’ అది వ్యాఖ్యానం అవుతుంది. ‌చాలా కథల్లో పాత్రలు గతానుభవాలో, ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలో నెమరేసుకోవటం కనిపిస్తుంది. ఇవన్నీ వ్యాఖ్యానం కోవలోకే వస్తాయి. ‌చాలామట్టుకు కథల్లో గతాన్ని చెప్పటం ఇలాగే జరుగుతుంది. చాలామంది పాఠకులు (కొందరు కథకులు కూడా) ఇలా చెప్పటాన్నే ఫ్లాష్‌బాక్‌గా పొరబడతారు. ఫ్లాష్‌బ్యాక్ ద్వారా రచయిత గతంలో జరిగిపోయిన సంఘటనలు చెప్పడు; ‘చూపుతాడు’. వ్యాఖ్యానానికి, ఫ్లాష్‌బాక్‌కి ఉన్న ముఖ్యమైన తేడా అది.

వ్యాఖ్యాన పద్ధతిలో గడచిపోయిన కథ చెప్పటంలో ఓ వెసులుబాటుంది. ఇది సహజంగా అనిపిస్తుంది. నిజజీవితంలో ఎవరైనా గడచిన విషయాలు చెప్పాలంటే ఇలాగే చేస్తారు. కాబట్టి పాఠకులు వ్యాఖ్యానాన్ని అనుసరించటం తేలిక. అదే ఫ్లాష్‌బ్యాక్ విధానంలోకొచ్చేసరికి – గడచిపోయిన సంఘటనలు, సన్నివేశాలు పాఠకుడి కళ్లకి కట్టేలా ‘చూపాలి’. అంటే, ప్రస్తుతం నడుస్తున్న కథని కాసేపు ఆపేసి పాఠకుడిని గతంలోంకి లాక్కుపోవాలి. నిజజీవితంలో ఎవరూ ఇలా గతంలోకి ప్రయాణించటం జరగదు. కాబట్టి ఈ విధమైన కథనం పాఠకులని గందరగోళపరిచే అవకాశం ఉంది. ఈ కారణంవల్ల కొందరు కథకులు ఫ్లాష్‌బ్యాక్స్ వాడకాన్ని ఇష్టపడరు. అవి కథాగమనానికి అడ్డొస్తాయని వాళ్ల అభిప్రాయం. అందులో నిజం లేకపోలేదు. అంతమాత్రాన వాటికి ఆమడ దూరంలో ఉండాల్సిన అవసరమూ లేదు. ఈ క్రింది జాగ్రత్తలు పాటిస్తే ఫ్లాష్‌బాక్స్ పండుతాయి. సరిగా రాస్తే ఇవి వ్యాఖ్యానం కన్నా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి.

– కథలోకి ఫ్లాష్‌బ్యాక్ ఊహించని చుట్టంలా ఉన్నట్లుండి ఊడిపడకూడదు. ప్రస్తుతం నడుస్తున్న కథలో ఓ బలీయమైన కారణమేదో గతాన్ని తట్టి లేపాలి. వర్తమానం నుండి గతానికి తరలటం అతి సహజంగా జరగాలే తప్ప బలవంతాన పాఠకుడి నెత్తిన రుద్దినట్లుండకూడదు. అలాగే, గతం నుండి వర్తమానానికి మరలటమూ అంతే సహజంగా ఉండాలి. నేపధ్యంలో చెప్పాల్సింది ఐపోయింది కాబట్టి, చెప్పటానికి ఇంకేమీ లేదు కాబట్టి తటాలున ఫ్లాష్‌బ్యాక్ ముగించేయకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కథనంలో కుదుపులొస్తాయి.

– కథ మొదలెట్టీ పెట్టగానే పాఠకుల ముఖాన రింగులరాట్నం తిప్పేసి ఫ్లాష్‌బ్యాక్‌లోకి ఈడ్చుకుపోకూడదు. వాళ్లు కాస్త కుదురుకునే సమయమీయాలి. సాధారణంగా, ఫ్లాష్‌బ్యాక్‌ని ఎంత ఆలస్యంగా మొదలు పెడితే అంత ప్రభావశీలంగా వస్తుంది.

– ఫ్లాష్‌బ్యాక్ ఎప్పుడు ముగించాలనేదీ ముఖ్యమే. ఫ్లాష్‌బ్యాక్ పూర్తైన వెంటనే రెండు మూడు వాక్యాల్లోనే కథ పూర్తైపోకూడదు. అలాగే, గతమెరుపుల ముందు అసలు కథ వెలవెలపోకూడదు. ఫ్లాష్‌బ్యాక్ అనేది ఉపకథ మాత్రమే. అది గొప్పగా ఉండటం ముఖ్యమే కానీ, అది ప్రధాన కథని మింగేయకూడదు. అసలు కథ పిసరంతే ఉండి ఫ్లాష్‌బ్యాక్ దృశ్యాలే ప్రధానమయ్యాయంటే, ఫ్లాష్‌బ్యాకే అసలు కథన్న మాట. అప్పుడు దాన్ని ఫ్లాష్‌బ్యాక్‌లా కాకుండా ప్రధాన కథలానే చెబితే మెరుగు.

– కథనం ఫ్లాష్‌బ్యాక్‌లోకి మారటమూ, తిరిగి అందులోనుండి బయటకు రావటమూ పాఠకుడు తేలిగ్గా గమనించేలా ఉండాలి. లేకపోతే వాళ్ల బుర్ర తిరుగుతుంది.

– ఒక ఫ్లాష్‌బాక్‌లో మరో ఫ్లాష్‌బ్యాక్ విప్పే ప్రయోగానికి వీలైతే దూరంగా ఉండండి.

ఈ వ్యాసం మొదట్లో ఉదాహరణగా రాసిన ఇతివృత్తం నా తొలికథ ‘నాగరికథ’కి ఆధారం (goo.gl/H3lAsq). అది నేను ఫ్లాష్‌బాక్ వాడిన ఒకే ఒక కథ. అందులో పైన చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకోవటం మీరు గమనించొచ్చు. ఆ కథలో ఒక ఫ్లాష్‌బ్యాక్‌లో మరో ఫ్లాష్‌బ్యాక్ చెప్పాల్సిన అవసరం పడింది. అలాచేస్తే పాఠకులు గందరగోళానికి గురయ్యే అవకాశముంది కాబట్టి మొదటి గతాన్ని ఫ్లాష్‌బ్యాక్ రూపంలోనూ, దానిలోపలి గతాన్ని వ్యాఖ్యానం రూపంలోనూ చెప్పేసి నెట్టుకొచ్చాను. ఆ కథకి మొదటి డ్రాఫ్ట్ రాశాక తిరిగి చదివితే ఏదో లోపం కనబడింది. మరోమారు చదివాక కానీ అదేంటో అర్ధం కాలేదు: ఆ కథలో ఫ్లాష్‌బ్యాక్ మెరుపులు ఎక్కువైపోయాయి, పతాక సన్నివేశాలు తేలిపోయాయి. ఆ లోపం సరిచేయటానికి కథ ముగింపుని తిరగరాయాల్సొచ్చింది. ‘నాగరికథ’ ఆఖర్లో ఉండే ట్విస్ట్ అలా వచ్చిచేరింది.

ముక్తాయింపు:

కొన్ని కథల్లో మొదట్లో రెండు పేరాగ్రాఫులు, చివర్లో మరో రెండు పేరాగ్రాఫులు వర్తమానంలోనూ; మిగిలిందంతా ఫ్లాష్‌బ్యాక్‌గానూ నడవటం మీరు గమనించే ఉంటారు. సాధారణంగా ఇలాంటి కథల్లో ఆ మొదలు, చివర కలిపి కథ నిడివి పెంచటం తప్ప ప్రత్యేక ప్రయోజనమేమీ ఉండదు. ఇక్కడ ‘రెండు పేరాగ్రాఫులు’ అనే నిడివి కారణంగా అవి అనవసరమైనవిగా నేను తీర్మానించటంలేదని గ్రహించగలరు. పాఠకుడు కథలో కుదురుకోకముందే ఫ్లాష్‌బ్యాక్ మొదలైపోవటం, అది పూర్తైన వెంటనే కథ కూడా ఐపోవటం – ఈ రెండూ మాత్రమే నేనిక్కడ ఎత్తిచూపదలచుకున్నది.

అయితే, కొన్ని రకాల కథలు ఇలా రాయాల్సిన అవసరం పడొచ్చు. వర్తమానంలో కథ మొదలు పెట్టి, వెంటనే గతంలోకి జారుకుని, చివర్లో అందులోనుండి బయటికొచ్చేయటం. ఇందులో కథంతా గతంలోనే జరుగుతుంది. వర్తమానంలో జరిగేదానికి ఆ గతపు గాధతో ఏదో లంకె ఉంటుంది. దీన్ని framing the story అంటారు. దీన్ని ‘కథని చట్రబద్ధం చేయటం’ అని మనం తెనిగిద్దాం. ఇది ఫ్లాష్‌బ్యాక్ విధానం కిందకి రాదు. ఈ చట్రబద్ధీకరించటం  అనేది పురాణాలంత పాత టెక్నిక్. ఒకసారి మహాభారతాన్ని గుర్తుచేసుకోండి.

————

ఈ వ్యాసాల్లో నా సొంతవే కాకుండా ఇతరుల కథలనీ ఉదహరించమని హితుల, సన్నిహితుల సూచన. ఆ పని చేయలేకపోవటానికి పలు కారణాలున్నాయి. తెలుగులో గొప్ప కథలు లెక్కలేనన్ని వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. కానీ వాటిలో నా అభిరుచికి సరిపడేవి తక్కువ. క్రైమ్, థ్రిల్లర్, డిటెక్టివ్, ఫాంటసీ, హారర్ వగైరా ‘లొల్లాయి’ కథలకే నా ఆసక్తి పరిమితం. ఆ తరహా కథలు – అందునా నాణ్యమైనవి – తెలుగులో దాదాపుగా రావటం లేదు. అస్థిత్వ వాదాల కథల్లాంటి ‘భారమైన’ సాహిత్యానిదే ప్రస్తుతం హవా. అటువంటివి నేను దాదాపుగా చదవను. అడపాదడపా చదివినా వాటిని ఇలాంటి వ్యాసాల సందర్భంగా తవ్వి తీసి ఉటంకించేస్థాయిలో గుర్తుపెట్టుకోలేను. అరుదుగా ఏ కథనైనా గుర్తంచుకున్నా, ఉదహరించాలనుకున్నప్పుడు అది చేతికి అందుబాటులో ఉండకపోవచ్చు – దాని కాపీ నా దగ్గర లేకపోవచ్చు. నా కథలైతే నాకెప్పుడూ అందుబాటులోనే ఉంటాయి కదా. అన్నిటికన్నా ముఖ్యంగా – నా కథల్లో ఎక్కడ ఏది ఎందుకు రాశాననే దానిపైన నాకు పూర్తిగా అవగాహన ఉంటుంది కాబట్టి ఆ విశేషాలు ప్రస్తావించటం తేలిక. ఇతరుల కథల విషయంలో అంత సాధికారికంగా వ్యాఖ్యానించే అవకాశం నాకు లేదు. అదీ సంగతి.

*

 

 

 

 

 

ఇది ఆకలి కత కాదు – అవమానాల వెత

 

 -ఎ . కె . ప్రభాకర్

~

 

ఒక్కో కథ చదివాకా ఆ  కథ లో పాత్రలు చాలా కాలం గుర్తుండిపోతాయి.  కొన్ని పాత్రలైతే వెంటాడతాయి. పాత్ర పేరు చెప్పగానే కథంతా స్ఫురణకి వస్తుంది. కొన్ని కథల్లో సంఘటనలు కథని మరచిపోనివ్వవు. ఏక వాక్య కథలుగా కొన్ని మనసులో పాతుకుపోతాయి ; సారం చెప్పగానే కథ యాదికొస్తుంది. కొన్ని కథలు రచయిత శిల్ప కౌశలం కారణంగా కేవలం విలక్షణమైన టెక్నిక్ ద్వారా  మెదడు పొరల్లో జ్ఞాపకాలుగా కదులుతూ వుంటాయి. చాలా తక్కువ కథలు మాత్రమే శీర్షిక పేరు చెప్పగానే కథలోని పాత్రలూ వాటి ప్రవర్తన సంఘటనలూ సన్నివేశాలూ సంభాషణలూ యితివృత్తం దాని నిర్వహణా కథనపద్ధతీ భాషా వాటిని వాహికలుగా మలచుకొన్న రచయిత దృక్పథం అన్నీ వొక దాని వెంట మరొకటి కళ్ళముందు దృశ్యమానం అవుతాయి. అటువంటి అరుదైన కథల్లో వొకటి ఎమ్ ఎమ్ వినోదిని రాసిన

(తొలి ముద్రణ : అరుణతార  – జనవరి, 2015 ,  ‘బ్లాక్ ఇంక్’ సంపుటిలో పునర్ముద్రితం). ఆ కథ అరుదైనది కావడానికి మొదటి  కారణం స్వీకరించిన వస్తువు. రెండోది చెప్పిన వైనం.

***

చానాళ్ళ కిందట వూరినుంచి పనిమీద నగరానికి వచ్చి అక్కడ అభివృద్ధి చెందిన రాజపథాల్లో వుచ్చ పోసుకోడానికి మరుగు దొరకక విలవిల్లాడిన మహిళ  క్షోభని కథగా చదివి క్రోధంతో రగిలిపోయిన జ్ఞాపకం వుంది. దశాబ్దాలు నడిచి వచ్చాకా  యిప్పుడు వినోదిని కట్ట చదివినప్పుడూ అదే అనుభూతి. జపాన్ సింగపూర్ నమూనాల వర్తమాన చరిత్ర కూడా అంతే సంబడంగా వుందని గుండె జలదరించేలా ‘కట్ట’ మరోసారి నిరూపిస్తుంది.

దళితవాడ నుంచి పై చదువుకోసం హాస్టల్లో చేరి అక్కడ లెట్రిన్ సౌఖ్యం అనుభవించే పదహారు పదిహేడేళ్ళ అమ్మాయి ‘సొరూప’ సెలవలకి యింటికి వచ్చినప్పుడు మరుగుదొడ్డి సదుపాయం లేక రైలు పట్టాల మీదకి ‘దొడ్డికి’ పోవాల్సినప్పుడు అనుభవించిన బాధల పరంపర కట్ట.

ఆస్టల్లో వుప్పూకారం లేని కూరలు తినటం మూలాన నాలికంతా చప్పబడిపోయిన సొరూప అమ్మ చేసిన ‘గోంగోర పచ్చిమిరగాయాలు వుడకబెట్టి నూరిన పచ్చడి’ వేసుకొని యిష్టంగా రెండు ముద్దలు అన్నం యెక్కువే తింది. ఫలితంగా తెల్లారక ముందే ‘దొడ్డి నెప్పి’. కూర్చుంటే రెండు మడాలూ తడిసి పోయేంత పెద్ద యిరోచనం. ఇక తెల్లారుతూనే మొదలైంది నరకం.

కరుణామయుడు సినిమాలో ‘యేసయ్య సిలవ మీద చచ్చిపోయినపుడు – కొండరాళ్ళు దొర్లుతయ్ , సముద్రాలు వుప్పొంగుతయ్ , అగ్నిపర్వతాల కుండ మీద మూత పేలిపోయి , మంట యెక్కువైతే పప్పుచారు పొంగినట్టు లావా పొంగిపోద్ది . అట్టా వుంది నా కడుపులో.’  స్వరూప తన  శారీరిక బాధని తనకు తెలిసిన భాషలోకి తర్జుమా చేయడానికి పడడిన అవస్థ యిది.

తలమీద ముళ్ళకిరీటం బెట్టి లోపలికేవరో గట్టిగా వొత్తుతున్నట్టున్న సొరూప పడ్డ బాధని ఆమెతో పాటు కథ చదివే వాళ్ళు కూడా అనుభవిస్తారు. కానీ అసలు సమస్య – పగటి పూట పదే పదే కట్ట మీదకి పోవాల్సి రావడమే.

‘చెంబు తీసుకొని యిళ్ళ మజ్జ నడుచుకుంటా బోవాల. ‘యెప్పుడొచ్చావమ్మాయ్?’– అని అందరూ పలకరిస్తావుంటారు. దానికి తోడు కట్టకి పొయ్యొచ్చే మా గేరి మొగోళ్ళు యెదురవుతావుంటారు. అన్నయ్యలూ , అంకుళ్ళు. నాతోపాటు మా లూథరన్ హైస్కూల్లో చదువుకున్న సీనియర్లు , జూనియర్లు కూడా వుంటారు. వీటన్నిటికీ మించి పగలు ఆడోళ్ళు కట్టమీద కూర్చోడానికి లేదు! కట్ట పక్కన డవున్లో వున్న ముళ్ళ కంచెల్లోపలికి వొంగొంగి నడుచుకుంటాబోయి కూర్చోవాల. అసలే పెంటలరొచ్చు. రోతగా వుంటది. దానికి తోడు రాత్రంతా వానబడివుంది. కుప్పలన్నీ చింది, చుట్టూ చెల్లాచెదరుగా యెగిరిపడి వుంటాయ్. యెంత కష్టమో నడవడం. తావు వెతుక్కోవడం.’

అందుకే సెలవలు వస్తే లేటుగా లేస్తామని చెప్పుకొనే వాళ్ళని చూస్తే స్వరూపకి అసూయ.  ‘తెల్లగా తెల్లవారడం’ గురించి పంచుకోలేని  భయం , చెప్పుకోలేని ఆందోళన.

‘స్వచ్ఛ భారత్’ ప్రాంగణాల్లో కెమెరాల ముందు చీపుర్లతో దర్శనమిచ్చి  ‘నమో’ వాక్యాల భజన చేసే రాజకీయ దుర్గంధ నాయుళ్ళందరూ కట్ట మీదినుంచి వీచే యీ గవులును వొక్కసారి పీల్చి సిగ్గుపడాల్సిన అవసరాన్ని గుర్తుచేసే యీ కథలోని  వస్తువుతో కొందరికి పేచీ అయితే రచయిత సొరూప ముఖత: వర్ణించిన చీదర కొంతమందికి కడుపులో కెలికినట్టు చేసింది.

‘నా యెడం పాదం ముందు నుంచి – నలుపు మీద నాలుగు యర్ర మచ్చలున్న పురుగు పోతావుంది. అది ముందుకాళ్ళతో కుంకుడు గింజంత పియ్యి వుండని దొర్లించుకుంటా పోతావుంది. దొర్లించుకుంటా పోటం వలనేమో , వుండ బో గుండ్రంగా , చూట్టానికి చిన్నసైజు లడ్డులాగా వుంది.

‘ … పాదాల్నిండా పియ్యి. కజాబిజి తొక్కానేమొ , అతుక్కుపోయింది. యేళ్ళ మజ్జ నుంచి పొడుచుకొచ్చి , అంచుల్లోకెల్లకొచ్చి …! చెప్పుల్లేకుండా నల్లమట్టి పొలంలో నడిస్తే మట్టి బూట్లొస్తాయే , అట్లొచ్చినయ్ పియ్యబూట్లు!’

యిటువంటి వర్ణనలు చాలా మంది కథా శిల్ప ప్రేమికులకి , సమీక్షకులకి మింగుడు పడలేదు. ఇది కథ కాదు అని కంగారు పడ్డారు. ఇన్నాళ్ళూ కథలకి గీసుకొన్న కొలతల్లో యిమడని  రచనా శైలి యిది. ఈ శైలే  ప్రధాన స్రవంతి పత్రికలకు ఈ కథ పట్ల అసహ్యం కలిగి ప్రచురించకపోటానికి కారణమయింది. మన యీ సభ్య నాగరిక సమాజం లోపలి – బయటి  కల్మషాన్నంతా పై నుంచీ కిందకి ‘చేపని కడిగినట్టు సుబ్బరంగా రుద్ది’ కడిగి పారేయడానికే రచయిత కావాలనే యీ ముళ్ళ దారిలో నడిచిందని  గ్రహించాలి. నిజానికి మనం యింకా  యిటువంటి సమాజంలో బతుకుతున్నందుకు దిగులుతో  సిగ్గుతో బెంగతో  ‘సిరిసెవట్లు’ పుట్టాలి గానీ పీతుర్ల వర్ణనల పట్ల అసహ్యం కలగనేల?

నాకైతే కథ చదివాకా చదివిన ప్రతిసారీ రోజుల తరబడి నిద్ర పట్టలేదు. కారణం యిదంతా – యీ చీదరంతా – చెరువు గట్టున పందుల కుమ్ములాటలోనో , కాలవ వొడ్డున రెల్లు దుబ్బుల చాటునో , రోడ్డు వార కంచె తుమ్మ కంపల మధ్యనో   కాలేజీ చదువు పూర్తయ్యేదాకా నేనూ అనుభవించా. అది కేవలం  స్వీయానుభవం మాత్రమే కాదు; నా చెల్లీ తల్లీ అక్క అవ్వ కుటుంబ స్త్రీలు మా వాడకట్టులోని ఆడవాళ్ళందరూ అనుభవించారు. వాళ్ళందరికీ చెంబట్టికొని వెళ్ళే ఆ చీకటి కార్యక్రమం యెంత అవమానాస్పదమైనదో యెంత లజ్జాభరితమైనదో యెన్ని యిబ్బందులకు హేళనలకు నెలవో యెంత హింసకు పాదో  ఆ వయసులో నాకు తెలీదు. ఆ తర్వాత తెలిసొచ్చింది. కానీ  వినోదిని కట్ట చదువుతుంటే ఆ అవమాన గాయాల్ని మళ్ళీ మళ్ళీ కెలికినట్టయింది. చాలా డిస్టర్బ్ అయ్యా.  అయాం అగైన్ యిన్  డీప్ షిట్ !

ఈ బహిర్భూమి కార్యక్రమం స్త్రీలకు అనునిత్యం చిత్రహింసే. కూర్చొని వుండగా అంతదూరంలో రైలు బండి వస్తుందంటే , యెవరైనా ‘మొగమనిషి కనబడ్డాడంటే లేచి నిలబడాల్సిందే!’. ఆడవాళ్ళకి మాత్రమే యీ  హింస. ‘యిట్లా మజ్జలో లేచి  నిలబడే అవసరముండ’ని మగపుటకకి ఆడజన్మలో లేని గొప్ప వెసులుబాటు వుందని అనుకొన్న స్వరూప పాయింట్ లోని చేదు ‘అనుభవించినోళ్లకే తెలుస్తది’.

అంతేకాదు అక్కడ పియ్యి తినడానికొచ్చే పందులతో కుక్కలతో యుద్ధమే చెయ్యాలి. అన్నిటికీ మించి తమ లేకి చూపులతో గాలి మాటలతో వెకిలి చేష్టలతో అత్యాచారానికి పూనుకొనే మగకుక్కల బారిన పడకుండా కాపాడుకోడానికి అనుక్షణం అప్రమత్తంగా వుండాలి.  ఒక విధంగా యిన్ని అవమానాల మధ్య ఆడదానికి  కాలకృత్యం తీర్చుకోవడం దినదిన గండమే , జీవన్మరణ సమరమే.

పగటి పూట కట్ట పక్కన ముళ్ళ కంచెల్లో సిగ్గుతో నొప్పితో సతమతమవుతున్న స్వరూప వొక పోకిరీ వేధింపుకి భయపడి ముళ్ళ కంచెల్లో పరుగెత్తినపుడు ఆమె అనుభవించిన శారీరిక – మానసిక క్షోభ మాటల్లో చెప్పలేనిది. పాపం అరికాళ్ళలో గుచ్చుకొన్న ముళ్ళని తీయగలిగినన్ని తీసి (యిరిగి లోపలే వుండిపోయినవి కాక యిరవైమూడు) పొట్లం కట్టి అమ్మకి చూపించిన సందర్భంలో స్వరూప యేడుపుకి కరగని పాఠకులుండరేమో! ఇక  ‘సెవిటి కరుణమ్మదొడ్డికెల్లి రైలు కిందబడి’ చనిపోయే ముగింపు అయితే హృదయవిదారకం.

***

జీవితాన్ని వున్నది వున్నట్టుగా యథాతథంగా చిత్రిస్తే అది కళ కాదు ; కేవల వాస్తవానికీ కళకీ మధ్య వున్న రేఖని స్పష్టంగా గుర్తించడంలోనే రచయిత మెళకువ చూపాలి – అని చెప్పే రొట్టకొట్టుడు విమర్శ సూత్రాలకి అందని కథ యిది. జీవిత సత్యావిష్కరణ కంటే మించిన కళ వుండదన్న స్పృహతో చెక్కిన మొరటు శిల్పం యిది. ఎటువంటి మేలి ముసుగులు అలంకారాల తొడుగులు లేకుండా వొక దు:ఖ భాజనమైన – అవమాన భరితమైన పేద దళిత జీవన పార్శ్వాన్ని సామాజిక బీభత్సంతో అన్వయించిన కథనం యిది. నోట్లో వెండి చెంచాల్తోనూ యింట్లో అటాచ్డ్ ప్రాచ్య – పాశ్చాత్య స్నానాగారాల ఫ్లషవుట్లతోనూ పుట్టి బతికే నాగరికులకు అర్థంకాని దుర్భరమైన వేదన యిది.

జుగుప్స కలిగించే పియ్యి పీతుర్ల వర్ణనల్లేకుండా యీ కథ రాయడం యిదే కథలో తెనాలి రామలింగడు వొకానొక విద్వాంసుడితో చాలెంజ్ చేసినట్టు పాస్ పొయ్యకుండా దొడ్డిక్కి కూర్చోవడమంత కష్టం అని రసజ్ఞులైన భావుక విమర్శకులు తెలుసుకోవాలి (ఈ చీదరని భరించలేని తనం నుంచి బయట పడటానికే జీవితంలో , కథలో దొడ్డికి చుట్టూ జోకులూ పిట్టకథలూ చోటుచేసుకొన్నాయేమో!).

అయితే రైలు కట్ట పట్టాల పక్కన పెంటలు ‘చూడ్డానికి ఇరగబూసిన బంతిపూల్లగా, చేమంతి పూల చెండుల్లాగా కనపడతయ్’ అని రచయిత వొకచోట చేసిన  ఆలంకారిక వర్ణన శుద్ధ కళా వాదుల ముఖమ్మీద రచయిత ఐచ్ఛికంగా విసిరి కొట్టిన అశుద్ధమే. సాహిత్య భావుకులకీ  సౌందర్య పిపాసువులకీ కళారాధకులకీ  చెంప పెట్టులా గబ్బిల దౌత్యం నెరపిన మహాకవి గుర్రం  జాషువా వారసత్వమిది. పదాల మాటునో అంతరార్థాల వెనకో దాక్కోకుండా ముక్కుసూటిగా మాట్లాడే దళిత తత్త్వమిది. కళ్ళముందు కనపడే వాస్తవాలతో  యెటువంటి దాపరికాలకీ తావులేని యింత సాదాసీదా కథని నేనిటీవల చదవలేదు.

కేవల యథార్థ జీవిత చిత్రణకి ప్రలోభపడి  వినోదిని కథానిర్మితి విషయంలో యెక్కడా యే మాత్రం అశ్రద్ధ చూపలేదు. కథ చెప్పేది యింటర్మీడియట్ చదివే అమ్మాయి. ఆమె సామాజిక నేపథ్యం పేద దళిత క్రైస్తవ జీవితం.  పదహారేళ్ళ ఆ  పిల్ల మౌఖిక కథనంలో అనేక  ఆర్ధిక – సాంస్కృతికాంశలనీ , వాటితో ముడివడి వున్న భాషనీ  అతి సహజంగా తీసుకువచ్చే విషయంలో  రచయితగా వినోదిని చూపిన నేర్పు ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది.  కథా గమనంలో అనేక సామాజికాంశాలు ప్రస్తావనకొస్తాయి. ఆ యా సందర్భాల్లో రచయిత  దృక్పథం కూడా స్పష్టంగానే తెలుస్తుంది. కథ ప్రారంభమే అందుకు మంచి వుదాహరణ.

కాలేజికి సెలవలని వినగానే  స్వరూపకి అందరిలా సంతోషం కలగలేదు. ‘గుండెల్లో రాయి పడింది. ఆస్టల్ అన్నంలో దొరికేంత చిన్నసైజు కాదు. రైలుకట్ట మీదుంటదే , చేతిలో సరిపోయేంతది, అంతది.!’

మొదటి పంక్తుల్లోనే కథాంశం , కథా సారం రెండూ వొకేసారి  వ్యక్తమయ్యాయి. రచయిత ప్రతిపాదించదల్చుకొన్న విషయం హాస్టల్ అన్నం , అన్నంలో రాళ్ళ సమస్య కాదు – వాటిని మించిన భీతావహమైన సమస్య యింట్లోనో బయటో మరుగుదొడ్డి లేకపోవడం అని తెలుస్తుంది.  అందువల్ల యిది ఆకలి కత కాదు – అవమానాల వెత . ఆకలికే కాదు అవమానాలకి కూడా పాదు పేదరికమేనన్న స్పృహ  రచయిత  యే సందర్భంలోనూ మర్చిపోలేదు.

యూరియా సంచులు కలిపి కుట్టి నాలుగు మూలలా పాతిన బొంగుల ఆసరాతో మూడు గోడల్లా చుట్టి , తలుపు బదులు పాత చీర అడ్డంగా కట్టిన బాత్రూం , నున్నగా అలికిన నేలమీద బొంతేసుకొని పొణుకోవడం ,  ఇంటి తాటాకు కప్పులోంచి కురిసే వానకి కప్పుకున్న దుప్పటి తడవడం , నీళ్ళు కారిపోయే చిల్లు రబ్బరు చెంబు , కిరసనాయిలు దీపం బుడ్డీ , చిన్న చిన్న బట్టల సబ్బు ముక్కల్తో వొళ్ళు రుద్దుకోవడం , బయటుండి చదువుకొనే గేరి పిల్లలు సెలవలకి యిళ్ళకొచ్చినపుడు కూలి పనులకి పోయి పుస్తకాలకీ బట్టలకీ నాలుగు డబ్బులు సంపాదించడం … యిలా   కథావరణానికి అవసరమైన సామగ్రి యేదీ  ఆమె దృష్టి నుంచి తప్పించుకుపోలేదు.

నిజానికి వాస్తవ జీవిత చిత్రణ దానికదే కథ అయిపోదు. యథార్థతని గ్రహించడానికి , గ్రహించినదాన్ని సరైన మాధ్యమంలో ఆవిష్కరించడానికీ సమ్యగ్ దృక్పథంతో కూడిన సునిశితమైన పరిశీలన అవసరం. అది వినోదినిలో నిండుగా వుందని కట్ట నిరూపిస్తుంది. ఆమె కన్ను కెమెరా కన్ను. చూపు మైక్రోస్కోపిక్ చూపు. చిత్రణ మల్టీ డైమన్షనల్. వాడిన రంగులు సహజ సిద్ధమైనవి. కాన్వాస్ జీవితమంత విశాలమైనది.

అందుకే – బొట్టు బొట్టుగా యింట్లోకి కారే వాన నీళ్ళు గిన్నెలోకి పడుతున్నప్పుడు చేసే శబ్దానికి నిద్ర చెడకుండా వుండడానికి గిన్నెలో బన్నీ (బనియన్) వేయడం , కట్ట మీదకెళ్ళినపుడు చిల్లు చెంబులో నీళ్ళు కారిపోతే పక్కవాళ్ళనుంచి పంచుకోవడం , పీతుర్ల మధ్య చెంబు పెట్టడానికి బెత్తెడు చోటులేక పాదమ్మీదే పెట్టుకోవడం , దొడ్డిక్కూడా వొక్కచెంబులోనే నీళ్ళు తీసకపోయే సావాసాలు , పక్కపక్కనే కూర్చుని చెప్పుకొనే కతలు – కబుర్లు , దసరా సంక్రాంతి పండగలప్పుడు స్కూల్లకీ కాలేజీలకీ అన్నేసి రోజులు సెలవలిచ్చి క్రిస్టమస్ కి వొక రోజు సెలవివ్వడంలో కనిపించే ఆధిపత్య మత భావన గురించిన ప్రస్తావన , కూర్చుంటంటేనే తినడంకోసం కాసుకున్న పందుల ఆరాటం , కట్ట మీద నుంచి తిరిగొచ్చేటప్పుడు చెంబు కుడి చేత్తోనే పట్టుకురావాలని గుర్తుచేసుకోవడం , చెంబు మళ్ళీ గాబులో ముంచేముందు అడుగు కడగడం , యిరోచనాలు కట్టుకోడానికి మాత్తర్లేసుకొనే సొంత వైద్యాలు – సగ్గుబియ్యం గంజి తాగడం – పంచాదారేసుకొని యిడ్లీ తినడం , కాకెత్తక పోద్దని వొంటి సబ్బు యింట్లో దాచిపెట్టుకోవడం  … వంటి నిర్దిష్ట జీవితానికి సంబంధించిన అనేక సూక్ష్మాంశాలు కథలోకి అలవోకగా వొచ్చి చేరాయి. వాటితోబాటు యింటా బయటా గేరీ మనుషుల్లో మాటల్లో కనిపించే వినిపించే క్రైస్తవ సంస్కృతి కథకి మరింత సహజ పరిమళాన్ని అందించింది.

అయితే వీటిలో యేవీ రచయిత దృష్టికోణం నుంచి చూపినవి కావు. ఇంటర్ చదివే టీనేజి అమ్మాయి చూపు ద్వారా కథలోకి యెక్కినవే ( ఇస్లాం పేట మసీదు నుంచీ విన్పించే అజా తప్ప). ఆ వయసు పిల్లల ఆలోచనలు , భయం ఆందోళన సంతోషం దు:ఖం వంటి మానసిక వుద్వేగాలు , వాటి వ్యక్తీకరణ రీతులు , అందుకు వుపయోగించిన భాష – పదజాలం , వుచ్చారణా పద్ధతులు – అన్నిటినీ అపూర్వమైన నైపుణ్యంతో రచయిత ఆవిష్కరించి ఆత్మకథాత్మక  కథనానికి విశ్వసనీయతని సాధించింది. అదే యీ కథలో అంతర్గతంగా కనపడని శిల్పం. అదే ఈ కథలోని బలం కూడా. గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రాంతపు గేరీల భాషని వినోదినిలా యింత అద్భుతంగా సాహిత్యంలోకి యింతకుముందు యెవరూ తీసుకొచ్చిన దాఖలాలు లేవు. అందుకే అపూర్వమనడం.

***

నీళ్ళులేని కమ్యూనిటీ టాయిలెట్లకి సంబంధించిన విషయాన్ని యితివృత్తం చేసుకొని తీవ్ర క్రోధంతో  శాంతి నారాయణ రచించిన  ‘అసలవి లేనప్పుడు …’ కథ  దీని తర్వాతి  కాలంలోనే ( ప్రజాసాహితి , జూలై – 2015) వచ్చింది. మధ్యాహ్నం పూట చెంబు పట్టుకొని జొన్నతోట్లోకి వెళ్లి ఎలుగుబంటి కి చిక్కి చచ్చిపోయిన  మండల ప్రెసిడెంటు మాదిగ మారెక్క వుదంతాన్ని పేర్కొంటూ  ‘ఒక ఆడడానికి ఈ దేశంలో స్వేచ్ఛ కంటే మరుగుదొడ్డి చాలా ముఖ్యమని’ ఆత్మ గౌరవ ప్రకటన చేసిన పద్మావతి , ‘సాగునీల్ల కత దేవుడెరుగు , కడాకు తాగడానికి గుటికెడు మంచినీల్లూ ముడ్డి కడుక్కోడానికి చెంబెడు నీల్లూ ఈలేనప్పుడు ఈ రాట్రం బంగారుదైతే మాకేమొత్తది , యెండిదైతే మాకేమొత్తది?’ అని రాష్ట్రాన్ని సింగపూరో జపానో చైనానో చేస్తామని వూదరగొట్టే నాయకుల్ని ప్రశ్నించి రాజకీయ చైతన్యం చూపిన రామన్న , ‘నీల్లు ఎటూ దొరకవు , దినామూ బయటికి ‘దొడ్డికి’ పోయినంక ముడ్డి తుడుసుకుందేకి’ గులకరాళ్ళు పంపించమని కలెక్టర్ ని నిలదీసి అధిక్షేపించి హేళన చేసిన సుబ్బమ్మ యీ కథలో గొప్ప పోరాట యోధులుగా దర్శనమిస్తారు.

‘కట్ట’ కథలో యిటువంటి పాత్రలు లేవు. రాత్రిపూటే కావొచ్చు రోడ్డు పక్కనే కూర్చోవాల్సి వచ్చినప్పుడు యెల్తుర్లో ఆ యిబ్బంది నుంచి అవమానాల నుంచి తప్పించుకోడానికి ‘కరెంటు స్తంబం మీద లైటు పగల్నూకిన’  అంజమ్మత్త చేతిలోని రాయి కేవలం గౌరవం కాపాడుకొనే సాధనంగానే కాకుండా తమ దురవస్థకి కారణమైన వ్యవస్థపై ఆయుధంగా మార్చుకొంటే బాగుండుననిపిస్తుంది.

కథ మధ్యలోనో చివరనో  ఒక చూపుడు వేలి కోసం వెతుక్కోవడం తప్పుకాదేమో! సూచ్యంగానో వాచ్యంగానో అటువంటి భరోసానివ్వని కథ కంప్లైంట్ కథగా మిగిలిపోయే ప్రమాదముంది. దాన్నుంచి తప్పించడానికే రచయిత కరుణమ్మ మరణాన్ని కథకి ముగింపుగా మలచినట్టు అనిపిస్తుంది. చీకట్లో మొదలై చీకట్లోనే ముగిసే రోజువారీ బతుకు వెతలపై నిరసనే ఆగ్రహ ప్రకటనే ఆ అవ్వ మరణం. ఈ దేశంలో దొడ్డికెళ్ళడం కూడా చచ్చేచావు అన్న పచ్చినిజం కోపానికి కారణమవుతుంది. కట్ట మీద దొడ్డిక్కూర్చోడానికెళ్ళిన సెవిటి కరుణమ్మవ్వ రైలు కింద పడి చనిపోవడం పాఠకుల్లో ‘పెద్ద రైలుకూతలా  గుండెల్లో దుఖ్ఖాన్ని’ మాత్రమే కలిగించదు ;  ఆగ్రహాన్నీ ఆవేశాన్నీ సైతం  రగిలిస్తుంది.

ఫిర్యాదు కథల ముద్రకి గురికాకుండా వినోదిని తీసుకొన్న యిటువంటి జాగ్రత్తల గురించి పి. సత్యవతి స్పష్టంగానే గుర్తించారు. అందుకే  ‘కన్నీళ్లు  తెప్పించడం ఈ  కథల ప్రయోజనము లక్ష్యము ఏ మాత్రం కాదు … నిలవ నీటిలో ఆనందం పొందే మొద్దు చర్మాలని అంకుశంతో పొడవాల్సిందే – ఆ అంకుశాన్ని తన కలం చేసుకుంది వినోదిని’ ( ‘బ్లాక్ ఇంక్’ పుస్తకానికి ముందు మాటలో) అంటారామె. నిజానికి కథ పొడవునా రచయిత ప్రాపంచిక దృక్పథం పరచుకొని వుండడం వల్ల కూడా వినోదిని కథలు కేవలం ఫిర్యాదు కథల్లా మిగిలిపోవు. దళిత సామాజిక వాస్తవికత వినోదిని కథలకి ఆయువుపట్టు. దానికి క్రైస్తవ సంస్కృతీ , స్త్రీ చైతన్యం జోడించడంతో ఆమె కథలు విశిష్టతనీ  ప్రత్యేకతనీ అనితరతనీ సాధించుకొన్నాయి.

ఇళ్ళలో సరైన టాయిలెట్ల సదుపాయం లేని ‘గరీబు ముస్లిం ఆడోల్ల బతుకు’ దైన్యంలోని భిన్న కోణాన్ని పదేళ్ళ కిందే షాజహానా కథగా రాసింది( వతన్ – 2004). అప్పుడు అదేదో ఘోషాలోని మైనార్టీల కడుపు నొప్పి అని యే కొందరో వుపేక్షించారేమో గానీ   ‘ఊర్ల ముస్లింలు కానోల్లంతా ఊరి బైటికెల్తరు గదా .. వీళ్లు గూడ ఎల్తేంది ??’ అని సోచాయించే కొత్త దుల్హన్ , నయీ బహూ షమీమ్ బాధకి కారణమైన సామాజిక – ఆర్థిక నేపథ్యం చాలామందిని ఆలోచింపజేసింది.  సండాస్ లో షమీమ్ అనుభవించిన వేదన , కట్ట మీద స్వరూప పడిన యాతన వొకటే. రెండుచోట్లా అందుకు కారణం పేదరికమే.

ఇటువంటి  నిజాల్ని దాచిపెట్టి బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాలు చేసినందుకు హేళనగా చప్పట్లు కొట్టే అడ్వర్టైజ్మెంట్ వొకటి యీ మధ్య టీవీ లో వస్తుంది. యెంత శాడిజం! మరుగుదొడ్డి లేని యింట్లో పిల్లనివ్వవద్దని చెప్పే విద్యాబాలన్ మరుగుదొడ్లు కట్టివ్వని పాలకులకు వోటెయ్యొద్దని ప్రచారం చేస్తే బావుణ్ణనిపిస్తుంది. కాంట్రాక్టర్లు అధికారులు రాజకీయ దళారులు లక్షలు స్వాహా చేసి కట్టిన పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ యెంత గొప్పగా వుంటుందో చూస్తే మొత్తం వ్యవస్థ మీదే రోతపుడుతుంది. పెయిడ్ పబ్లిక్ టాయిలెట్ల బాగోతం మళ్ళీ వేరే.

అంతర్జాతీయ మార్కెట్లో మెకిన్ యిండియా నినాదంతో  వూదరకొడుతోన్న పాలకులకి కట్ట , సండాస్ , అసలవి లేనప్పుడు … వంటి కథలు గొంతులో పచ్చి వెలక్కాయల్లా మింగుడు పడక పోవచ్చు. కంట్లో నలుసుల్లా మెరమెరలాడవచ్చు. దేశమంతటా వీస్తోన్న యీ గవులు వారికి పెద్ద విషయం కాకపోనూవచ్చు. కానీ సామాన్యుడికివ్వాళ కావాల్సింది – డిజిటల్ ఇండియా కాదు  టాయిలెట్స్ ఇండియా అని యీ కథలు ముక్కు మీద గుద్ది మరీ చెబుతున్నాయి. దేశభక్తుల పన్నులతో నడిచే వొక విశ్వ విద్యాలయంలో పనిచేస్తూ దేశ గౌరవాన్ని మంటగలిపే యిటువంటి కథ రాసినందుకు వినోదినిని  దేశద్రోహనేరం కింద విచారణ లేకుండానే అసహనంతో శిక్షిస్తారేమోనని అనుమానంగా వుంది. సృజనాత్మకతనే ఆచరణగా మార్చుకొన్న వినోదిని నిబద్ధతకు (దీన్నేFawzia Afsal-Khan ‘artivism’  అంటారు) సంఘీభావం ప్రకటించాల్సిన సందర్భమే యిది.

తాజా కలం : స్మార్ట్ సిటీల విశ్వ నగరాల అంచుల్లో కొత్తగా వెలిసే వెలివాడల్లో సిగ్గులేకుండా దొడ్డికి కూర్చోడానికి యెక్కడెక్కడ సదవకాశాలున్నాయో స్మార్ట్ ఫోనుల్లో క్షణాల్లో తెలుసుకొనేందుకు వీలుగా ‘మహిళా బహిర్భూమి యాప్’ తయారీకోసం  స్టార్టప్ మేధావులకి ప్రభుత్వాలు లోన్స్ సాంక్షన్ చేస్తాయనీ , అందులో భాగంగా పల్లె పల్లెకీ వాడవాడకీ వై ఫై సదుపాయం కలగజేస్తారనీ   మన్ కీ బాత్ లో ప్రధాని వరమివ్వబోతున్నట్టు యిప్పుడే  వార్త అందింది. ఇక  కూర్చున్నప్పుడు ‘పిర్రలమీద దోమలు కుట్టి దద్దుర్లు కట్టడానికి’ ఆస్కారం యివ్వని ఎ సి వాష్ రూమ్ ల కోసం గూగుల్ మేప్ లో వెతుక్కొని  చూడ్డమే యిప్పుడు మన ముందున్న తక్షణ కర్తవ్యమ్. అంత వరకూ కట్టల మీద సెవిటి కరుణమ్మవ్వల సహజ / అసహజ  మరణాలు తప్పవు. ఆధునికీకరణ లో రూపాంతరం చెంది రైలు కట్టలన్నీ  బుల్లెట్ ట్రైన్ ట్రాక్ లుగా మారిపోబోతున్నాయి కాబట్టి  అటువంటి బహిరంగ ప్రదేశాల్లో మల/మూత్ర విసర్జనలు చేసినందుకు లోకల్ బాడీ అధికారులు విధించే జరిమానాలు కట్టుకోడానికి సిద్ధంగా వుండక తప్పదు. ఇతి శమ్ … బే షరమ్.

*

 

 

 

సౌందర్యమంతా సంద్రమై..

1_Sripathi Letter

             శ్రీపతి,     బి-22  రవీంద్రనగర్,    హబ్సిగూడా,      హైద్రాబాదు – 500 007

                                                                                      డిసెంబర్ 30, 1988

 

ప్రియమైన త్రిపుర గారూ,

 

నమస్కారం.  కొత్త సంవత్సరం కధా కాంక్షలు !

ఈ మధ్య కధలు చదువుతున్నాను.  కొంత వరకు వరదరాజేశ్వర రావు గారు  కారణం.

మార్తాండం ( శ్రీనివాస్ రాయప్రోలు )  పెంగ్విన్ వాళ్లకు కధలు అనువాదం చేస్తున్నాడు.

మీకు నచ్చిన కొన్ని కధలు ఇవ్వండి అని పని అప్పజెప్పారు. దాంతో కధా సంపుటాలన్నీ తిరగేసినప్పుడు మిత్రులు అత్తలూరి ఇచ్చిన ‘త్రిపుర కధలు’ చదవటం – మరోసారి జరిగింది.

అట్లాంటి కధలు చదివినప్పుడల్లా, ఆ రచనల్లోని సృజనాత్మక కళాసౌందర్యం సముద్ర ప్రమాణంలో ప్రత్యక్షమై ఆ సంతోషంతో తన్మయులం అయిపోతాము.  నాకు దొరికిన కొద్ది కధలు ఆయనకు అందజేశాను.  వాటిలో మీ ‘జర్కన్’ కధ ఆయనకు నచ్చి దాన్ని అనువాదం చేసారు.  ఆ సందర్భంగా మీ వివరాలు తెలుసుకుని ఎంతో ఆసక్తి చూపించారు.

త్రిపుర, అజంతా, రాయప్రోలు శ్రీనివాస్ – ఒక కోవ కళాకారులనిపించింది.  వారం దినాల క్రితమే అజంతా దర్శనం అయిందిక్కడ.  ఈ సరికి ఆయన విశాఖ లోనే ఉండాలి.

నా వరకు కధా రచన కొనసాగింపు మొదలయినట్టే అనిపిస్తోంది. ఢిల్లీ   నేపధ్యంలో ఓ చిన్న నవల ప్రస్తుతం మెల్లగా సాగుతోంది. నాలుగైదు  కధలు – తిప్పి రాసి – పత్రికలకు ఇవ్వాలనుకుంటున్నాను.  పాత కధలు పునర్ముద్రిస్తుంటే సిగ్గొచ్చి కొత్త కధలు రాయాలనిపిస్తోంది.

మీ ఆరోగ్యం బాగుందా?  జవాబు రాస్తే సంతోషం.

 

మీ

 

శ్రీపతి

2_Sripathi Letter

అన్నగారూ.. వాటీజ్ దిస్?

   

-బమ్మిడి జగదీశ్వరరావు

~

 

bammidi అన్నగారూ.. అన్యాయం అన్నగారూ.. యిది పూర్తిగా అసందర్భ సందర్భం అన్నగారూ.. యిప్పుడో- యిందాకో- మీరందించిన మీ చేతి చెమట నా అరచేతులకు అంటుకొని యింకా ఆరనే లేదు?! నాపక్కనున్న మీకు నేను మౌనం పాటించడం.. శ్రద్ధాంజలి ఘటించడం.. వర్తమానాన్ని గతం చేస్తూ జ్ఞాపకం చేసుకోవడం దుర్మార్గాలలోకెల్లా దుర్మార్గం కాదూ?

బుక్ రిలీజుల దగ్గరో- బరెల్ గ్రౌండ్ ల దగ్గరో కలుస్తూనే వున్నాం! అన్నగారూ అంటే అన్నగారూ.. అని పలుకరించుకుంటూనే వున్నాం! నా వురుకుల్లో నేను! మీ పరుగుల్లో మీరు! మాట్లాడుకుందామని మళ్ళీ యెప్పటిలాగే వాయిదాపడినప్పుడు వుపశమనంగా గుండెకు గుండె హత్తుకొని ఆలింగనం చేసుకొని పారిపోయేవాళ్ళం! ఈసారి మీరు మహా ప్రస్థానం దగ్గర ఆలింగనం చేసుకోకుండానే ఆగిపోయారు!

క్షమించు బాసూ.. నేనింకా పరిగెత్తుతూనే వున్నాను!

‘ఆగాలని వుంది.. అన్నగారూ.. ఈ రన్నింగ్ యెక్కువ కాలం చెయ్యలేం.. మానెయ్యాలని వుంది.. బయటికి మీలా వచ్చేయాలని వుంది.. ఫ్రీ అయిపోవాలని వుంది..’ తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో చెట్ల కింద మీరు చెపుతునే వున్నారు! ‘ఫ్రీ యెక్కడన్నగారూ.. మీరు బందీ అయి- చీకట్లోంచి వెలుతురులోకి రావాలనుకుంటున్నారు! నేనేమో పరిగెత్తీ పరిగెత్తీ వెలుతురెక్కువై లోపలకి వొచ్చి కూర్చోవాలనుకుంటున్నాను. అతి చీకటిలోనూ అతి వెలుతురులోనూ మన చూపు మనకు చిక్కదు!’ చెప్పాలనుకున్నాను. చెప్పలేదు! అన్నీ వాయిదా వేసినట్టు యెవరెవరివో పలుకరింపుల నడుమ ఆడే మాట కూడా వాయిదా వేసాను! అప్పుడూ అందరిలో వున్నా మన ఒంటరి పరుగులు మనం పరిగెత్తుతూనే వున్నాం.. కూర్చున్నా! నిల్చున్నా! నిద్రపోతున్నా!

రన్నింగ్ అన్ ఎండింగ్ కావచ్చు.. ఎండింగ్ అబ్రెప్ట్ గా వుంది! పోయెమ్ అబ్రెప్ట్ గా వుంటేనే వొప్పుకోరే మీరు! అలాంటిది యిది లైఫ్ కదా? ఎందుకిలా?

కారణాలు వెతికారు! తో’రణాలు’ కట్టారు! ‘నౌ అయామ్ వోకే’ అన్నారు! ‘రెడీ టు ఫైట్’ అన్నారు!…

ఆగండి అన్నగారు.. ప్లీజ్.. మీకే గదా మౌనం పాటిస్తా.. యెందుకిలా డిస్టర్బ్ చేస్తారూ.. వొక్క నిమిషం కూడా వొదలరా?

వొదినేడుస్తోంది.. పాపేడుస్తోంది.. వొదల్లేని మిత్రులూ కొలీగులూ యేడుస్తున్నారు.. యేడవడమూ చేతకాని నాలాంటి వాళ్ళు యెడంగా పోయి యేడుపుగొట్టు ముఖాలేసుకు నవ్వుతున్నారు!

చీమూ నెత్తురూ గడ్డకట్టి యెంచక్కా మీడియా నిన్ను షూట్ చేస్తూనే వుంది! డ్యూటీ చేస్తోంది! లైవ్ యిస్తోంది!

”వాళ్ళు నాకు కావాలి! డెడ్ ఆర్ లైవ్!” నే రాస్తున్న సినిమా డై‘లాగు నన్ను తొడుక్కుంటోంది. డెడ్డూ నువ్వే! లైవూ నువ్వే! నేనే నువ్వు.. నువ్వే నేను.. లేనిచో ఈ జగమే లేదూ..’ సాంగు కనెక్ట్ అయింది.. ఆవహిస్తోంది మీ శైలిలా! మీరే కాదు, నన్ను నేనూ డిస్టర్బ్ చేసుకుంటున్నానా..?

ఆత్మకు శాంతి చేకూరిందా? నీవిచ్చిన నీ మరణ వాగ్మూలం రాముడికి అందిందా? పాపికొండలమీద పడి రోదిస్తున్నావా? రెవెన్యూ రికార్డులనుండి తొలగించడం ఆపే పని కాదని- రెవెన్యూ రికార్డులనే తగలబెట్టాలని చూస్తున్న ఆదివాసీ అంతరాత్మలో నీ ఆత్మ ఐక్యమయ్యిందా? అరే రోహిత్ సరే, జేఎన్ యూ మీద అర్టికల్ రాయాలని వుంది కదూ? లవర్స్ డే కి యెప్పటిలాగే భజరంగ్ దళ్ పోలీసింగ్ చేస్తోంది.. పోయెం యేది గురూ?

సీన్ మారింది! స్క్రీన్ మారింది! లొకేషన్ షిఫ్ట్! ఇంటినుండి మీ tv5 ఆఫీసుకి! పరుగులతోనే చేరాను! మధ్యలో ఫోన్లు! నా కథ బాలేదు, మరో కథ బాగు చేద్దామని బయల్దేరి విజయవాడ వెళ్ళా.. స్టోరీ సిటింగ్.. వొచ్చేసా.. చేరిపోయానని చెప్పా! నిజంగా నిన్ను చేరానా? యిప్పటికిప్పుడు చేరేంత దూరమా నువ్వు వెళ్ళింది?

గాఢ నిద్రలో నువ్వు!

వాసాంసి – జీర్ణాని – యథా – విహాయ – నవాని – గృహ్ణాతి – నరః – అపరాణి

తథా – శరీరాణి –  విహాయ – జీర్ణాని – అన్యాని – సంయాతి – నవానీ – దేహీ

అన్నగారూ.. మీ బాడీని పెట్టుకొని భగవత్ గీతేంటి అన్నగారూ? అంత యేడుపులోనూ నవ్వొచ్చింది! చెప్తే వొళ్ళు తిమురనుకుంటారు.. అని ఆగ లేదు, అదే అన్నా.. ‘తను వినడం లేదు కదా అని సరిపెట్టుకో’మన్నారు మన మిత్రులు! పోని.. నా మాట వింటున్నారా?

శ్రీశ్రీ మహాప్రస్థానం మాత్రమే తెలుసు నాకు. ఈ మహాప్రస్థానం కూడా వుంటుందని యెరుక లేదు నాకు. ‘వల్లకాడు’లా వుంది బతుకు అని యికమీదట అనలేను! అంత బాగుంది.. రిచ్ గా! కాని యిక్కడ కూడా మతముంది గురూ.. ఘంటశాలగారు పాడిన గీతలోని పద్యాలన్నీ గోడలమీద చెక్కినవి చదువుకున్నా! మార్క్సిజమే కాదు, మతం కూడా బలమైందేననిపించింది! ‘పెట్టుబడి’ బలం పెరిగింది.. సారీ.. పెట్రేగింది బాసూ? వొగ్గలేదు, ఈ బరేల్ గ్రౌండూ లోకి చొచ్చుకొచ్చింది చూడు! ‘థర్టీ పర్సెంటు గవర్నమెంటూ.. ప్రవేటేమో సెవెంటీ పర్సెంటూ’ కోలాబిరేసను.. మిత్రుల మాట! నోరుండదు కదా.. ‘యిదేటి యిలగుంది?’ అంటే- కథ యెలగుందో బోధపడిపోయింది! వల్లకాల్లకీ వర్గముంటుందని మార్క్సే వొచ్చి చెప్పాలా? పంజాగుట్ట శ్మశానం చూసారు గదా? మన జీవితాలంత యిరుకు! ఇరుకులో సర్దుకోకుండా ఎలక్ట్రిక్ బర్నర్ కి యెడ్జెస్టయిపోయారా? బాడీ అంటే ఫిజిక్స్ కాదు, కెమిస్ట్రీ అన్నారే! మూలకాల సమ్మేళనం విద్యుత్తుకాంతిలో కరిగి కలిసిపోయిందా?

ప్రెస్ క్లబ్.. మీరు తిరిగిన చోటే- మీ జ్ఞాపకాలతో తిరుగుతున్నారు! మీ రూటే సపరేటు అంటున్నారు..

నాకు తెలుసు మీరు అందరిలా కాదు! అందరూ వొరుసలో నిల్చుంటే మీరు వొరుస తప్పి పక్కకి వెళ్లి నిల్చుంటారు! నిలబడ్డ చోటునే నిల్చుంటే ‘నిలువ’కు విలువలేదని మీకు తెలుసు! అందుకే నలుగురు నడిచిన దారి నాది కాదని వుద్దేశపూర్వకంగానే తప్పిపోతారు! తగువుపడ్డ వారిని తగుమాత్రం పట్టించుకోరు! మనం నిలబడ్డ చోటు మారితే చూసే దృశ్యం మారుతుందని మీకు తెలుసు! అందుకే మీరు మారుతుంటారు! అందరూ అటు వుంటే మీరు యిటు వుంటారు! అందరూ అమ్మ అంటే మీరు నాన్నంటారు! ఫెమినిజం పెల్లుబుకుతున్న రోజుల్లో మేల్ కొలుపులు పాడతారు! వి(మి)యార్ మేల్ అంటారు! మ్యాగ్జిమమ్ రిస్క్ తీసుకుంటారు! మ్యూజిక్ డైస్ అని మరణ మృదంగం వినిపిస్తారు! సామూహిక బృందగానంలో వుంటూనే మీ స్వరం మీరు వినిపిస్తారు! మీరు అపస్వరంగానైనా వుంటారే తప్ప అస్తిత్వావాన్ని కోల్పోరు!

ఇప్పుడు అందరూ మీ ముఖమ్మీది చిరునవ్వు గురించే మాట్లాడుతున్నారు! నేనేమో పదిహేనేళ్ళ వెనక్కి వెళ్ళా.. పంజాగుట్ట పక్కనున్న దుర్గానగర్లో ప్లాట్లో మనంపడ్డ పాట్లో? అప్పటికి ఆంధ్రజ్యోతి రీవోపెన్ కాలేదు! నేను ఆగ్రో నుంచి అప్పటికే రిటైర్ అయ్యాను! మానాన్నకన్నా ముందు నేనే రిటైర్ అయ్యానని గొప్పగా చెపితే- గొప్పల వెనక వున్న తిప్పలు తెలిసి- మీరు నడిపిన ‘వాసంతి’ మాస పత్రికలో ‘ఉడుతా ఉడుతా ఊచ్!’ పిల్లల శీర్షిక నాతో నడిపించారు. రెండుచేతులతో పేజీలు నింపే వాళ్ళం! చాలక జోగీబ్రదర్స్ కృష్ణంరాజు డైరెక్ట్ చేసిన ‘మధురం’ సీరియల్ కు స్క్రీన్ ప్లే మీరు, డైలాగులు నేనూ రాసాం! పచ్చామధు కెమెరా. అడవి శ్రీనివాస్ ఎగ్జిక్యుటీవ్ ప్రొడ్యూసర్. బల్లారివాళ్ళు ప్రొడ్యూసర్లు. అంతలోనే- కష్టమన్నగారూ.. అని అన్నీ నాకే అప్పగించారు. అప్పటికి రవిప్రకాష్ గారు జెమునిలో వుండి మన ఆఫీసుకు వొచ్చి కూర్చొనేవారు..

‘మీరు మాట్లాడండీ’ పక్కనున్న మిత్రుడు కదిపితే ఆలోచనలు చెదిరిపోయాయి! తలడ్డంగా వూపాను!

అన్నగారూ.. మీరు ఎడిటర్, సియ్యీవో యేవేవో అయ్యేక- పరిగెత్తినా పట్టుకోలేనంతగా మీ టైం యిరుకైపోతుందని తెలిసి కలిసేవాన్నే కాదు! మీరు నన్ను పట్టుకెళ్ళి హలీం తినిపించి ‘కారు కొనుక్కున్నానన్నగారూ’ అన్నారు! నేను యెప్పుడు హలీం తిన్నా మీరే గుర్తుకువస్తారు! ఎందుకంటే నేను ఫస్ట్ టైం హలీం తిన్నది మీతోనే! అప్పుడు నాముఖం చూసి నచ్చలేదా? అని అడిగారు.  నేను ఔనూ కాదూ అన్నట్టు అన్ని రకాలుగా తలవూపాను! ‘వేడి మీద తినండి బావుంటుంది.. అలవాటైతే వొదలరు’ అన్నారు! నిజమే!

మీరు ఫోన్ చేస్తూ వుండండన్నగారూ.. అన్నారు. అవసరమయినప్పుడే ఫోన్లు చేసాను. ఎవరో వూరినుండి వొచ్చి యిక్కడ సిటీలో యాక్సిడెంటయి పోతే శవాన్ని వూరు పంపించాలని మిత్రుడు సాయమడిగితే నేను మిమ్మల్ని అడిగాను! క్రైం రిపోర్టరుతో ఆ యేరియా రిపోర్టరుకు ఫోన్ చేయించితే- గుద్దిన ట్రక్ కంపెనీ వాడు.. శవాన్ని పెట్టుకు గేట్లో గొడవ చేసినా వినని వాడు.. దిగొచ్చి నష్టపరిహారం యివ్వకపోయినా యిచ్చిన ఆరువేలుతో శవం యింటికి చేరింది. మీ సాయం యిలాగే వేరే వేరే ప్రొబ్లెమ్స్ లో మళ్ళీ మళ్ళీ అడిగా, మీ పరిమితులు చెప్పారు! స్కూళ్ళ మీదా కాలేజీల మీదా సెల్ టవర్లు.. రేడియేషన్ ప్రొబ్లెమ్స్ దృష్టికి తెస్తే.. ‘కష్టం అన్నగారూ.. మాకు యాడ్స్ వొచ్చేది వాళ్లనుండే.. అప్పటికీ స్టోరీ చేసాం.. బట్..’ ఖాళీలను నేనూ పూరించుకున్నా, చాలా ఖాళీలు మిగిలిపోయాయి! యిలాగే మా వూళ్ళో విత్తనాలు అమ్ముకుంటున్న అగ్రికల్చర్ డిపార్టుమెంటు గురించి చెపితే – ‘మా వాళ్ళకీ.. రిపోర్టర్లకీ.. అందుతాయి.. అంచేత..’ యెప్పటిలా ఖాళీలను నేనూ పూరించుకున్నా.. పూరించినకొద్దీ ఖాళీలు! నేను కొత్తగా ప్రపంచాన్ని చూస్తున్నట్టు మాట్లాడితే – యిదెంత పాత ప్రపంచమో.. రోత ప్రపంచమో చెప్పి మనమెంత చేతకాని వాళ్ళమో చెవి తిప్పకుండా చెప్పి- ‘యింకేంటి అన్నగారూ కబుర్లు?’ మాట మార్చి అసంతృప్తినంతా అక్షరాల్లోకి యెత్తి పొగలు కక్కుతున్న కొత్త పోయెమ్ చేతిలో పెట్టేవారు మీరు.. అప్పుడు మీరు సారీ చెప్పారు. యిప్పుడు నేను సారీ చెపుతున్నా..

ఆగండి అన్నగారూ.. మీకు  ట్రీట్ మెంట్ యిచ్చి మీ ప్రాబ్లం ఫస్ట్ రికగ్నైజ్ చేసిన డాక్టర్ శాస్త్రిగారు మాట్లాడుతున్నారు..

‘అరుణ్ సాగర్.. రికవర్ అయ్యాడు! సర్జరీ అయ్యాక కేర్ గా వుండాలి! తనకా అవకాశం లేదు. విపరీతమైన వొత్తిడి, బహుశా తనున్న ప్రొఫెషన్ వల్ల కావచ్చు! తను జాగ్రత్తగా లేడు, కొంత స్వయంకృతం కూడా వుంది, సో..’ నేను తెగిపోయాను!

అన్నగారూ.. టీవీ ఛానెల్ రేటింగ్ అప్ అండ్ డౌన్ అయినప్పుడల్లా మీ పల్స్ రేట్ అప్ అండ్ డౌన్ అవడం బాలేదు! తెలుగులో అరవయ్యారు న్యూస్ ఛానెళ్ళు! పార్టీకో ఛానెల్! ఎవడి వెర్షన్ వాడిదే! మధ్యలో టీఆర్పీ పెంట! రోజూ పోటీయే! పూట పూటా పోటీయే! గంట గంటకూ పోటీయే! పోగ్రాము పోగ్రాముకీ పోటీయే! నిమిష నిమిషానికీ పోటీయే! ఎవ్విర్ సెకన్ కౌంటబుల్ యిక్కడ! దీనెమ్మా.. సారీ .. దీనెబ్బా జీవితం! దీనెబ్బా రేటింగ్! దీనెబ్బా టీఆర్పీ! ఛానెల్ వుంటే యెంత? పోతే యెంత? మనం ప్రాణాలతో వుండాలి గదా? మనోళ్ళు మిమ్మల్ని చూసయినా గ్రహించాలిగదా? అన్నగారూ.. ‘నాలాగ చావకండ్రా’ అని మీ మిత్రులకి మీరన్నా చెప్పండన్నగారూ.. దీనెబ్బా కెరీర్? మనల్ని తినేసే కెరీర్ యెందుకన్నగారూ? పులి మీద సవారీ లాగుందే!?

అన్నగారూ.. మీరు పోయిన వార్త- మీరు పనిచేసే ఛానెల్లో మొదట వొచ్చింది! వెంటనే ఓ మిత్రుడు అది చూసి తనూ తను పనిచేసే  ఛానెల్లో బ్రేకింగ్ న్యూస్ స్క్రోల్ చేసాడు! మీ ఛానెల్లో మీ మరణ వార్త అంతలోనే ఆగిపోయింది! ఇక్కడ వీడి గుండె ఆగిపోయింది! న్యూస్ అతి వేగం.. రోడ్డు మీద వాహన అతి వేగం కన్నా ప్ర్రమాదమైనది! వార్త నిజమా? కాదా? వేగంలో స్లిప్ అయితే ప్రమాదం మనకే! వుద్యోగం వుంటుందో పోతుందో? హమ్మయ్యా.. నువ్వు నిజంగానే పోయావ్.. తను బతికిపోయాడు!

ఏమిటిది అన్నగారూ.. మీరు టీవీ ఛానెల్లకు లైఫ్ యిచ్చారు! బట్ మీ లైఫ్ వాళ్ళు తీసేసుకున్నారు! చూడండి అన్నగారూ.. మీకు సంతాపం చెప్పేవాళ్ళే.. మీ హత్యలో భాగం పంచుకున్నారు అని నాలాంటివాడు అంటే నేరమవుతుంది! అసహనమవుతుంది! రాజ్య అసహనాన్ని అర్థం చేసుకుంటారు.. ఎటొచ్చీ నా అసహనమే అర్థం కాదు! కానట్టు వుంటారు! మీకుగాక యెవరికి చెప్పుకోను?

బాసూ.. మీరు గొప్పోళ్ళు బాసూ.. మీ వొత్తిడిని ముసుగేసి దాచేసి నవ్వితే- మీ నవ్వు బాగుంది అనుకున్నాం గాని కనిపెట్టలేకపోయాం.. క్షమించు!

ఈ ప్రెస్ క్లబ్ తాగుబోతుల అడ్డా కాదూ? రోజూ తాగి చచ్చేదేగా? ఆఫీసుల్లో బుర్ర పాడుచేసుకొనేది.. యిక్కడికొచ్చి పూటుగా తాగేది! మన కవులూ రచయితలూ తక్కువా? తాగి చచ్చేవాళ్ళే యెక్కువ! అన్నగారూ.. మానేసానన్నారు! మానేయ్యడాన్ని మానేసారా? ‘స్వయంకృతం కొంత’ అని డాక్టరుగారు అన్నారు! మీ మీద కూడా కోపంగా వుంది అన్నగారూ! అన్నగారూ.. యిక నన్నెవరు పిలుస్తారు ‘అన్నగారూ..’ అని?  పొండి అన్నగారూ.. మీతో జట్టు కట్! కట్ పీస్!

నేనింక మీతో మాట్లాడను!

సారీ అన్నగారూ.. ఎక్సుట్రీమ్లీ సారీ..

మీ

అన్నగారు

కొంత కదలిక…కొంత గలగల!

 

-రామతీర్థ

~

 

ramateerthaఒట్టాప్ళాక్కన్ నీలకండన్  వేలు కురుప్ గా జన్మించి (27.05.1931 – 13.02.2016)  ఎనభై నాలుగేళ్ల ఒ.ఎన్.వి.కురుప్ శనివారం 13.02.2016న మరణిస్తే,  కేరళ శాసన సభ ఆయన పట్ల గౌరవ సూచకంగా, ఈ ఒక్క విషయాన్నే ప్రస్తావించి, మరుసటి పనిదినానికి వాయిదా పడ్డది. ఒక్క శాసన సభ్యులకే  దక్కే ఈ గౌరవాన్ని, కేరళ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు తొలిసారిగా ఒక మహాకవికి ప్రకటించింది. 2011-12 సంవత్సరపు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు, కేరళ ఆర్థిక శాఖ మంత్రి “దినాంతం” అన్న  కురుప్ దీర్ఘ కవిత నుంచి ప్రారంభ చరణాలు చదివి  తన బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టారు.

 మలయాళ కవిత్వంలో గేయ ఫణితి లయాత్మకత, గాన లక్షణం,  సాహిత్యంలో ఇప్పటికీ అంతర్భాగాలే. వాటిని తన కవిత్వపు అంతర్భాగాలుగా మలుచుకుంటూనే, కురుప్ “నేను ప్రాచీన కవినే” అని చెప్పే వారు, ఎంతలా  ఆధునిక విషయాలపై రాసినా. కురుప్ ఉన్నత విలువలతో రాసిన సినిమా పాటలు ఆయనను, ఈ తరం యువ మలయాళీలకు కూడా  చిర పరిచితుడిని  చేసాయి. ఒకింత శృంగార సన్నివేశాలకు కూడా, మనోహర గేయాలు రచించిన ఖ్యాతి కురుప్ దే. మొదటి సారిగా “కాలం మారున్ను” 1954 సినిమాకు పాటలు రాసిన కవిగా కురుప్,   పలు దశాబ్దాలు అటు సాహిత్య రంగంలో, ఇటు సినిమా రంగంలో కూడా, తన సృజన ప్రమాణాలను రాజీ పడకుండా నిలబెట్టుకున్నారు.

 సినిమా రంగపు హడావిడి, రాత్రుల పార్టీలు, అవసరానికి మించి సినీ రంగపు వ్యాపార వేత్తలతో  కలిసి మెలిసి తిరగడాలు వీటన్నిటికీ, కురుప్ ఎప్పుడూ దూరంగా ఉండే వారు. ఒక యువ దర్శకుడు ఒక సారి, కొని పదాలు వాడి ఆయనను  పాట  రాయమంటే, అలాంటివి కుదరవని నిక్కచ్చిగా చెప్పిన  కళాకారుడు ఆయన. అయినా, “వ్యాపార రంగంలో  మేం డబ్బులు పెడుతున్నాము కనుక, సరకును మా ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటాము” అనే ఈ కాలపు పద్ధతి అయిన  లాభాల పంట పండించుకునే బండ వాదన ప్రభావంలో పడ్డ, ఆ యువ దర్శకుడు, పాట  రికార్డింగ్ సమయంలో ఏ మాటలైతే, కురుప్ రాయలేదో, వాటిని చేర్చిన విషయం  తెలిసి, పెద్ద  యెత్తున  అభ్యంతర పరిచిన వేళ , ఆ దర్శకుడు, ఆ మాటలను తొలగించడమే  కాక, కురుప్ కు బహిరంగ క్షమాపణలు కూడా చెప్పిన సంఘటన, కురుప్ సాహిత్య నైతిక స్థాయి పట్ల కేరళ సమాజంలో ఎంతటి గౌరవాదరాలు ఉన్నాయో తెలియ చేస్తుంది.  రెండు వందల ముప్ఫై రెండు సినిమాలకు రాసిన తొమ్మిది వందలు పైగా సినీ గీతాలు కురుప్ కలం  నుంచి వెలువడ్డాయి.

 ముణ్ణోట్టు ( ముందుకు) అనే కవితను తన పదహారేళ్లకే రాసిన ఈ కవి “దాహికున్న పానపాత్రం” కవితా సంపుటి తో  మొదలై, ఇరవైఒక్క సంపుటాలు రచించారు.  ఆరు  వచన రచనలు కూడా వీరు వెలువరించారు. “భూమిక్కొరు చరమ గీతం” పేరిట, వెలువడ్డ కురుప్ రచన గానయుక్త లక్షణంతో, మలయాళ  సమాజంలో ఎక్కువ ప్రాచుర్యం పొందింది.  రష్యా దేశపు పుష్కిన్ పురస్కారం, మన దేశపు పద్మశ్రీ , పద్మ విభూషణ్, కేరళ విశ్వవిద్యాలయపు డాక్టరేట్,  కమలా సురయ్య పురస్కారం, జ్ఞానపీఠ పురస్కారం ఇలా ఎన్నో గౌరవాలు కురుప్ ను వరించాయి. “వైశాలి”  చలన చిత్రానికి, జాతీయ స్థాయిలో ఉత్తమ గీత రచయిత గా(1989)  పురస్కారం పొందారు. కేరళ రాష్ట్ర చలన చిత్ర పరిషద్  కురుప్ ను పదమూడు సార్లు ఉత్తమ సినీ గీత రచయితగా పలు వార్షిక గౌరవాలను అందచేసింది.

 2013లో గోర్కీ ఇన్స్టిట్యూట్  ఈయన  రాసిన యాభై కవితలను రష్యన్ భాషలోకి అనువాద ప్రచురణ గా ఆ దేశ ప్రజలకు అంద చేసింది. రష్యా దేశం “పుష్కిన్  ఆఫ్ కేరళ” అని గౌరవప్రదంగా సంభావించింది కూడా. రాజకీయాలు, విభేదాలు ఎన్ని ఉన్నా కేరళ సమాజం మౌలికంగా ఒక సాంస్కృతిక విలువల సమాజం. అది  కురుప్ విషయంలో, అసెంబ్లీ ఆయన మృతికి సంతాప సూచకంగా ఒక రోజు మూత పడితే, అటు  ఆయన అంత్యక్రియల్లో, సంగీతం ప్రధాన పాత్ర వహించింది. ఆయనే పేరి పెట్టిన కేరళ ప్రభుత్వ  శ్మశానవాటిక “శాంతికవాటం” లో, ఆయన  వయసు ఎనభై నాలుగేళ్ల సంఖ్యకు సరిపోయేట్టుగా, ఎనభైనాలుగు మండి గాయకులు, కురుప్ రచించిన గీతాలను ఆలపిస్తుండగా, ఆయన  పంచభూతాల్లో లీనమయాడు. కూచుని అంత్యక్రియలను తిలకించిన వారిలో కేరళ ముఖ్య మంత్రి ఊమెన్ చాండీ ముందు వరసలో ఉన్నారు.

కేరళ సాంఘిక రంగంలో ప్రముఖులు, ప్రఖ్యాతులు, భిన్న భిన్న రంగాలనుంచి, ఆయన కడసారి  చూపులకు తరలి వచ్చి, తమ ప్రేమ, గౌరవం, తెలుపుకున్నారు.భాషా  రాజకీయాల్లో పడి , మాతృభాషలను అలక్ష్యం చేయవద్దన్నది, కురుప్  హెచ్చరిక. విశాల వామపక్ష చింతనకు నెలవైన ఆయన రచనల్లో ఏదో ఒక రకంగా మనుషులను వేరులు పెట్టే  వివక్షల, ఆధిపత్య సంస్కృతుల పట్ల ఆగ్రహ ప్రకటన ఒక కేంద్ర స్వభావంగా కనిపిస్తుంది. అశాంతిపర్వం అనే కవితలో, ఆయన మందలింపు చాలా తీవ్రమైనది. “ కొయ్యి, ముక్కలు చెయ్యి, విడగొట్టు, వేరుపరచు, పల్లెనూ,పట్నాన్ని, తెగలనూ, నగరాన్నీ, భాగాలుగా ఎడం పెట్టు, వాటాలుగా ఎడ పెట్టు, ఒప్పందాలుగా పంచేసుకో – మృగాల్లా బతకండి, చంపుకుంటూ, కబళిస్తూ, పీక్కుంటూ, పులుల్లా, సింహాల్లా – ఒక్క  క్షణమైనా మనుషులుగా బతకవద్దు – మృగత్వానికి  పట్టం  కట్టి పండుగ చేసుకోండి”

 తన కవిత్వ రచన పట్ల కురుప్ విశ్వాసం  ఇది –

 “కవిత్వం నాకు అలా కలుగుతుంది అంతే. ఏది దాన్ని ఎగసన  తోస్తుందో నాకు అవగతం కాలేదు. అలాగని అదేదో కాలక్షేపపు ఆలోచన అని అనుకోలేను. ఒక స్ఫూర్తి అయితే తప్పకుండా ఉన్నది. మనం జీవితాన్ని గాఢంగా జీవిస్తాము. అన్నిటి పట్లా అదే గాఢ  భావన కలిగి ఉంటాము. జీవితమే నాకు ఒక కవిత్వ దోహద కారి. అదే నా స్ఫూర్తి, నాకు మరింకే ఆలంబనలూ లేవు. సూర్యుడి కింద ఉన్నదేదీ, కవిత్వానికి అతీతం కాదు.  లోకపు సంఘటనలన్నీ, కవి పట్టించుకోదగ్గవే. ప్రతీ రాత్రీ కొన్ని పీడకలలు మన తలల చుట్టూ తిరుగుతుంటే మనం నిదురిస్తాము. చెట్లు నరికే గొడ్డళ్ళ  చప్పుడో, బాంబులు పేలుతున్న బీభత్సారావాలో,  ఆడపడుచుకో, అవని తల్లికో, నిర్దయా  హైన్యంలో జరిగే మాన భంగాలో, అవి ఆందోళన కలిగించి మెదడులో ఉత్పాతాలకు కారణమవుతాయి. ప్రతీ విషాదంలో, ఇంకా తీవ్రమైన మరుసటి విషాదపు బీజాలు ఉండనే  ఉంటాయి. ఒక దుర్ఘటన, మరొక దుర్ఘటనకు పురిటి పక్క అవుతుంది. అవి అలా రెట్టింతలవుతాయి. ఒక నగరం అంతా  మత విద్వేషాల మంటల్లో మాడి  మసి అయితే, అది కవిత్వాన్ని, సాహిత్యాన్ని తప్పక ప్రభావితం చేస్తుంది. కవిగా నా కర్తవ్యం ఏమిటని నేను అనుకుంటున్నానంటే, ఈ దుఖాల, పెనుగులాటల, తీవ్ర వేదనల ఒడ్డు నుంచి, స్వేఛ్చ  అనే మరొక ఒడ్డుకు, వంతెనలు కట్టడమే. ఎక్కడో ఒక చోట, నా పాట  కొంత కదలిక,  కొంత గల గల,   కలిగిస్తే నేను గర్వ పడతాను. గౌరవం దక్కిందని భావిస్తాను, ఇదే నా పని అని కొనసాగిస్తాను. కవిత్వం పట్ల నా దృష్టి ఇది.”                          

 కురుప్ కవితలు రెండు 

క్షణికమే కానీ –
మంచుబిందువును నేను

ఆకుకొస నా ఆకుపచ్చ సింహాసనం

నింగి నిమ్మళమైన నీలం కరిగిపోతుంది నాలో

నా శిరసు పై సూర్య కిరణాలుశిలువ గుర్తులు గీస్తాయి

ఉదయ రవిబింబ మూర్తినా ఒళ్ళో  కిలకిలా నవ్వుతాడు

రొమ్ము తాగుతున్న అల్లారు ముద్దు బిడ్డలా –

కొంచెం ఒంగి చూసుకో ఒక సారి

నీ చిన్నదయిన ప్రతిబింబం స్పష్టంగా ప్రతిఫలించడం లేదూ  నాలో –

అయినప్పటికీ

నన్ను పొదివి పట్టుకున్నా ఆకు కొస

ఒకింత రవంత కదిలినా

ఏ అలికిడీ లేకుండా ముగిసిపోతుంది నా కథ

రాలిపోతూ కటిక నేలపై –

నాలో కరిగిపోయిన  సూరీడూ, ఆకాశమూ,

నావయినవన్నీ అంతరిస్తాయి – అప్పుడిక శూన్యమే –

ఆవిరై ఆ ఎగువనున్న స్వర్గాలకు వెళ్లాలనుకోను  నేను

అవసరమైతే నా చెమ్మను అంద చేస్తా

ఈ నేల  మట్టి రేణువుకు.

 

 

 పల్లె పదం

పల్లెటూరి కవులమయ్యా మరలా పాట  పాడమా

పాడిన పాటలు బాట తప్పి పోయాయి

నడిరేయి కాక గళం ఒరిసి అరుస్తున్నది

ఆ కాకిగోలలా  పదే పదే  పాడమా పాడమా

కను తెరవని వేకువలకు స్తుతి సంగీతాలూ

పిట్టలకు ముంగిలినా గింజలు జల్లేసి

పావురాళ్ల రాకకై పిట్ట పాట  పాడమా

లేని మావి చెట్టుకు ఊహ మావి కొమ్మకు

ఊగి ఊగేలా ఉయ్యాల పాట  పాడమా

ఎండిన వాగుల నెర్రెల  పర్రల బీడులా

హైలెస్స హైలెస్సా కాగితపు పడవలై

ఎండిన గొంతులా మేము పాటలు  పాడాలా

పాడాలా పాటలు తడి లేని మబ్బులకు

ఎత్తాలా గొంతులు మనసు లేని వానలకు

నిదరలు నటించే లేవని  వారిని లేపేలా

మేము డప్పులు మోగిస్తూ చప్పుడై రేగాలా

అలనాటి విందుల ఆ నిండు కథలన్నీ

చెప్పాలా పిల్లలకు కడుపుకోత జోలలుగా

ఆకొన్న బిడ్డలకు చేత లేని ముద్దలుగా

పాడాలా తీయగా పాడాలా  హాయిగా

ఆ పట్టు పుట్టాల సుతిమెత్తందనాలను

ఆ రాజు, ఈ రాజు ఎక్కినా  రథాలను

పాడాలా  జోరుగా, పాడాలా హోరుగా

ఈ నేల పాలకుల దిస మొల దర్పాలూ

ఊరేగే డాబులా ఆ బట్టబయలులూ

మునుపు పాడిన పాటలన్నీ ఏక మొత్తంగా

బాట తప్పి పోయాయి, దారి ఎరుగకున్నాయి

చెప్పండి అన్నలూ, చెప్పండి నాన్నలూ

పల్లెటూరి కవులమయ్యా మరలా పాట  పాడమా..

 

జింబో బొంబాయి నగర ప్రవేశం

 

 

-వంగూరి చిట్టెన్ రాజు

~

 

chitten rajuకాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో డిగ్రీ ఫైనల్ పరీక్షలు రాశాక..ఆ మాట కొస్తే రాయడానికి కొన్ని నెలల ముందే “తరవాత ఏమిటీ?” అనే ప్రశ్న మా క్లాస్ మేట్స్ అందరినీ వేధించేది. కొంత మంది పై చదువుల కోసం ఆలోచిస్తూ ఉంటే మరి కొందరు ఉద్యోగాల వేట మొదలుపెట్టే వారు. ఆ రోజుల్లో పై చదువులు అంటే.ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ నాకు తెలిసీ మొత్తం ఆంధ్రాలో ఎక్కడా లేదు. హైదరాబాద్ ఉస్మానియాలో ఉందేమో కానీ అందరి దృష్టీ బెంగుళూరు ఐ.ఐ.ఎస్.సి లేదా మద్రాసు, ఖరగ్ పూర్ ఐ.ఐ.టి. ల మీద మాత్రమే ఉండేది. చాలా తక్కువ సీట్లు ఉండే వాటిల్లో అడ్మిషన్ కావాలంటే డిగ్రీ పరీక్ష లో ఫస్ట్ క్లాస్ వస్తే చాలదు. అందరి కంటే ఎక్కువగా డిస్టిన్క్షన్ కూడా వస్తే ఇంటర్వ్యూ కి అర్హులు అయ్యే చాన్స్ ఉంది. ఆ తరువాత ఆ ఇంటర్వ్యూ లో నెగ్గాలి. ఇక ఉద్యోగాల విషయాల కొస్తే..ముఖ్యంగా మెకానికల్ ఇంజనీర్ గా ఉద్యోగం కావాలంటే యావత్ ఆంధ్ర ప్రదేశ్ లో ఏవో అర డజను పంచదార ఫేక్టరీలు, వైజాగ్ లో కోరమాండల్ ఫెర్టిలైజర్స్ ….ఇలా వేళ్ళ మీద లెక్క పెట్టుకోవలసిందే. సివిల్ ఇంజనీర్స్ కి నాగార్జున డామ్ లో జూనియర్ ఇంజనీరింగ్ లాంటివి ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి రావచ్చును. ఆ మాట కొస్తే సివిల్ ఇంజనీర్లకి తప్ప ఇతర బ్రాంచ్ వాళ్ళెవరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు లేనే లేవు….బహుశా ఇప్పుడు కూడా…అంచేత అటు ఉద్యోగానికి కానీ, పై చదువులకి కానీ రాష్ట్రం విడిచి వెళ్ళిపోవలసినదే.

నా విషయంలో నేను అప్పటికీ పై చదువులు చదవాలి అని నిశ్చయించేసుకున్నాను కానీ మా కుటుంబం ఆర్ధిక పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవు. ఎలాగా ఫస్ట్ క్లాస్ వస్తుంది కదా, ఎక్కడో అక్కడ స్కాలర్ షిప్ రాకపోతుందా అనుకున్న నాకు రిజల్ట్స్ పెద్ద అశనిపాతంలా తగిలాయి. నా పేరు సెకండ్ క్లాస్ లో ఉంది. నా జన్మలో అలాంటి అనుభవం అదే మొదటి సారి. అప్పటి దాకా చిన్నప్పటి నుంచీ నేను ఏ నాడు ఏ పరీక్ష రాసినా నూటికి 60 % తప్పకుండా వచ్చేవి. అలాంటిది ఇంజనీరింగ్ ఫైనల్స్ లో మార్కులు వచ్చాక చూస్తే నేను ఏ నాడూ ఊహించనట్లుగా రెండు సబ్జెక్ట్ లో 40 శాతం..అంటే పాస్ మార్కులు…వచ్చాయి. ఇండస్ట్రియల్ ఎడ్మినిష్త్రేషన్ & మెటలర్జీ… ఆ రెండూ కూడా నేను చాలా బాగా రాసిన పేపర్లే. కేవలం పాస్ మార్కులే వేశారూ అంటే ఎక్కడో, ఏదో తేడా ఉంది అనిపించి ఆ పేపర్లు ఎవరు దిద్దారూ అని కాలేజ్ కి వెళ్లి ఆరా తీశాను. అప్పుడు తెలిసింది ఆ పేపర్లు దిద్దిన ఇద్దరు లెక్చరర్లు దగ్గర స్నేహితులు. అందులో ఒకాయన మాకు బంధువే కానీ ఎందుకో మా కుటుంబం అంటే పడదుట. మాకు ఆయన పాఠాలు చెప్పేటప్పుడు నన్ను కొంచెం చులకన గానే చూసేవాడు కానీ నేను ‘నలుగురిలో నారాయణా’ బాపతే కాబట్టి అసలు పట్టించుకోలేదు. అంచేత అంతా బాగా రాసినా నాకు అత్తిసరుగా పాస్ మార్కులు వెయ్యడానికి ఇతర కారణాలు ఏమీ కనపడక ఆయన వ్యక్తిగతంగా ఈ పని చేశాడు అనే అనుకోవలసి వచ్చింది. కానీ చేసేది ఏమీ లేదు. రివాల్యుయేషన్ కి అప్లై చెయ్య వచ్చును అని ఎవరో సలహా ఇచ్చారు కానీ అదేం జరిగే పని కాదు అని తెలుసును. ‘ఎప్పటికైనా బ్రాహ్మడికి బ్రాహ్మడే శత్రువు’ అని కూడా ఎవరో అన్నారు. యాభై ఏళ్ల తరువాత అమెరికాలో ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది.

BE V Marks Sheet

ఆ రోజుల్లో ఈ ఫస్ట్ క్లాస్ ..అంటే 60% శాతం మొత్తం అన్ని మార్కులూ కలిపి రావాలి. నాకు ప్రాక్టికల్స్ లో 61.5%, సెషనల్స్..అంటే వైవా పరీక్షలలో 65 శాతం వచ్చాయి. కానీ పైన చెప్పినట్లు రెండు సబ్జెక్టులలో   జరిగిన అన్యాయం వలన థీరీ లో 57.12 శాతం వచ్చాయి. మూడూ కలిపి మొత్తం మీద చూస్తే మార్కుల ప్రకారం నా సగటు మార్కులు 60.37 శాతం. కానీ దురదృష్టవశాత్తూ అప్పటి రూల్స్ ప్రకారం థీరీ, ప్రాక్టికల్స్ మాత్రమే కలిపి చూశారు. ఆ సగటులో నాకు 58.22శాతం వచ్చి, కేవలం 1100 లలో 1.78 మార్కు తక్కువ లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకోలేక పోయాను. అలాంటి నాకు నలభై ఏళ్ల తరవాత 2006 లో మా కాలేజ్ వజ్రోత్సవాలలో నన్ను “Distinguished Alumni” అని చిరు సత్కారం చేసినప్పుడు నాకు చాలా సిగ్గు వేసింది.

ఆ రోజుల్లో క్లాసులో ఒకరిద్దరికి మాత్రమే వచ్చే దిష్టింక్షన్..అంటే 70 శాతం మార్కులు…తెచ్చుకున్న వాళ్ళకీ,  ఫస్ట్ క్లాస్ వచ్చిన వారికి కూడా ఐఐటిలు, ఐఆఎస్ సి ల లో పై చదువు, లేదా మద్రాసు, బెంగుళూరు లలో పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు బాగానే వచ్చేవి కానీ, నా లాంటి వారికి ఎదరంతా ఎడారే!. ముఖ్యంగా రాజకీయ పలుకుబడి కానీ, వ్యాపార వారసత్వాలు కానీ లేని అగ్రకుల సంజాతుడి పరిస్థితి అధోగతే అనిపించేది. ఎటు నుంచి ఎటు చూసినా రాష్ట్రం వదలి వెళ్లి పోవడం తప్ప గత్యంతరం లేనే లేదు. ఏ రాష్ట్రం లో అయినా ఉన్నత విద్యావకాశాలు కానీ, ఉద్యోగాలు ఉన్నాయి అంటే అవి కేవలం ఆయా రాష్ట్రాల నుంచి వెలువడే ఇంగ్లీషు దిన పత్రికలలో ప్రకటనలు మాత్రమే ఏకైక ఆరాధం. లేదా, పెట్టే, బేడా సద్దేసుకుని ఏ మహా నగరంలో మనకి బంధువులో, స్నేహితులో ఉంటే అక్కడికి వెళ్లి పోయి గుమ్మాలు తొక్కి వెతుక్కోవడమే! ఆ రోజుల్లో బొంబాయి నుంచి వెలువడే టైమ్స్ ఆఫ్ ఇండియా, మద్రాస్ నుంచి ది హిందూ, ఇండియన్ ఎక్స్ ప్రెస్….ముచ్చటగా మూడే మూడు ఇంగ్లీషు పేపర్లు కాకినాడలో కనపడేవి. వాటిల్లో ఆదివారం నాడు స్థానిక రాష్ట్రాల ప్రకటనలు ఎక్కువగానే ఉన్నా, దేశం మొత్తానికి సంబంధించిన ప్రకటనలు ఈ మూడింటి లోనూ ఉండేవి.

ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది కానీ ఆ రోజుల్లో పై చదువులకి అమెరికా వెళ్ళవచ్చును అనే ఆలోచనే అస్సలు రాలేదు. ఆ మాటకొస్తే ఆ ఆలోచన మా కాలేజ్ లో చాలా తక్కువ మందికి ఉండేది. ఇంజనీరింగ్ డిగ్రీ చేతికొచ్సినా, జీవితంలో ఏం చెయ్యాలో తెలియక ఆయా పత్రికలలో నేను గమ్యం వెతుక్కుంటున్న ఓ శుభ సమయంలో బొంబాయిలో ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో మాస్టర్స్ డిగ్రీ కోర్స్ లో దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం దరఖాస్తులు కోరుతూ ఒక ప్రకటన చూశాను. నాకున్న డిగ్రీ కి నేను ఎటువంటి ఐఐటి అర్హుడిని కాదు అని అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన నేను దాన్ని కాదని వెంటనే అప్లికేషన్ పంపించి ఆ సంగతి మర్చి పోయాను. కానీ అదే విషయంలో మరో సంగతి ఖచ్చితంగా గుర్తు ఉంది. అదేమిటంటే గోవిందరాజులు కూడా నాతో బాటే బొంబాయి ఐఐటి కి అప్ప్లై చేశాడు.

మా క్లాస్ లో ఇద్దరు గోవింద రాజులు  ఉండే వారు. వారిలో ఆర్. గోవిందరాజులు ఎలెక్ట్రానిక్స్ చదివి ఆ తరువాత వరంగల్ కాలేజీ కి వెళ్లి అక్కడ పి.జి. చేశాడు. ఆ తరువాత అక్కడే ప్రిన్సిపాల్ గా కూడా పని చేశాడు అని విన్నాను కానీ 1966లో మా కాలేజ్ రోజుల తరవాత అతన్ని ఇప్పటి దాకా చూడ లేదు. ఇక రెండో వాడు ఎన్. గోవిందరాజులు కాకినాడ వాడే. జగన్నాధ పురంలో ఉండే వాడు. అతని నాన్న గారు మైన్ రోడ్ లో మసీదు పక్కన చుట్టలు చుట్టే వ్యాపారం చేసీవారు. ఇతనూ, ఇతని అన్నయ్యలూ మంచి బాడీ బిల్డర్స్. కండలు తిరిగిన శరీరంతో మా ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్న ఐదేళ్ల పాటూ అతనే మిస్టర్ కాలేజ్. మిత భాషి. అతనికి తెలిసిన తిట్టు అల్లా “సంపేత్తాను”. అలా అనడమే కానీ ఎప్పుడూ ఎవరిమీదా చెయ్యి చేసుకునే వాడు కాదు. ఒక సారి మటుకు మా కాలేజ్ వాళ్ళు ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్ లో రంగరాయ మెడికల్ కాలేజ్ టీమ్ తో కోకో ఆట ఆడుతున్నప్పుడు ఇతను పరిగెడుతూ కేవలం గట్టిగా వీపు మీద “ముట్టు” కోగానే పాపం ఆ దెబ్బకి డాక్టర్ చదువుతున్న ఒకానొక అర్భకుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇతను కావాలనే కొట్టాడు అని వాళ్ళ టీమ్ నానా గొడవా చేసి ప్రిన్సిపాల్స్ దాకా తీసుకెళ్ళారు. అది ఇంకా పెద్ద గొడవ అవును కానీ గోవిందరాజులు హాస్టల్ లో ఉండే పై ఊరి వాడు కాక స్థానికంగా కాకినాడ వాడే కాబట్టి సరిపోయింది. ఏమైతేనేం, నాకు మటుకు అతను చాలా మంచి స్నేహితుడు. నాతోబాటే అతను కూడా బొంబాయి ఐఐటి కి అప్ప్లై చేశాడు. నాకంటే మంచి మార్కులు వచ్చాయి కాబట్టి బెంగుళూరు ఐఐఎస్ సి కి కూడా అప్లై చేశాడు.

ఓ రోజు అనుకోకుండా ఆ ఐఐటి నుంచి మా ఇద్దరికీ ఇంటర్వ్యూ ఆహ్వానం వచ్చింది. గోవిందరాజులు కి అది రావడంలో ఆశ్చర్యం లేదు కానీ నాకు కూడా ఒక ఐఐటి …అందునా ఎక్కడో అవతలి తీరాన్న ఉన్న బొంబాయి ఐఐటి నుంచి మాస్టర్స్ డిగ్రీ కి ఇంటర్వ్యూ రావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. నేను ఎగిరి గంతేశాను కానీ మా నాన్న గారు “అంత దూరం పై చదువులకి పంపించడానికి డబ్బు లేదు.” అని చెప్పేశారు. అప్పుడు నాకు కావలసిన మొత్తం డబ్బు కాకినాడ నుంచి  బొంబాయి రానూ, పోనూ రైలు టిక్కెట్టు 60 రూపాయలు, నాలుగు రోజులు తిండికీ, ఇతర ఖర్చులు 50 రూపాయలు, ఒక వేళ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయితే వంద రూపాయలు ఫీజు వెరసి సుమారు 200 రూపాయలు. మా పెద్దన్నయ్య ని అడగగానే ఎప్పటి లాగానే పొలం పనులు ఉన్నాయి అంటూ పొలం పారిపోయాడు. అప్పుడే లాయర్ ప్రాక్టీస్ మొదలుపెట్టినా ఇంకా ఆదాయం లేని మా చిన్నన్నయ్య “ఇది చాలా మంచి చాన్స్ రా. వదులుకోకు.” అని ఓ వంద రూపాయలు ఇచ్చాడు. నా పై అన్నయ్య సుబ్రహ్మణ్యం మణిపాల్ లో మెడిసిన్, మా తమ్ముడు కాకినాడ లోనే ఇంజనీరింగ్ మూడో ఏడు చదువుతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు ఉండే అవకాశం లేదు. మొత్తానికి నేనూ, గోవిందరాజులూ కలిసి ఇద్దరికీ కావలసిన మొత్తం మూడు, నాలుగు వందలు పోగేసి బొంబాయి వెళ్ళడానికి రైలు ఎక్కేశాం. రాత్రి కాకినాడలో ఎక్కి, మర్నాడు పొద్దున్న హైదరాబాద్ లో దిగి, అక్కడ మా అక్కా, బావ గార్లని పలకరించి, రాత్రి బొంబాయి రైలు ఎక్కి మర్నాడు మధ్యాహ్నం ఒంటి గంట కి బొంబాయి దాదర్ స్టేషన్ లో దిగాం నేనూ, గోవిందరాజులూనూ.

అంతకు ముందుటేడు మేము ఇంజనీరింగ్ ఫైనల్ సంవత్సరం లో ఎడ్యుకేషనల్ టూర్ లో మా బేచ్ అంతా బొంబాయి వచ్చి, చాలా ఫేక్టరీలు చూసినా, మాకు అక్కడ ఎవరూ తెలియదు. దాదర్ స్టేషన్ లో దిగి “ఇక్కడ ఏదైనా హోటల్ ఉందా?” అని అడగగానే “పక్కనే మాటుంగా లో మద్రాసీ హోటల్స్ ఉంటాయి” అని ఓ టాక్సీ వాడు మా ఇద్దరినీ మాటుంగా తీసుకెళ్ళి ఓ అయ్యర్ హోటల్ దగ్గర దింపాడు. 48 గంటల రైలు ప్రయాణంలో ఒళ్లంతా బొగ్గు నుసితో నీరసంగా ఉన్న మమ్మల్ని చూసి రూములు ఖాళీ లేవు కానీ స్నానం చేసి బట్టలు మార్చుకోడానికీ, కావాలంటే రాత్రి వరండాలో పడుకోడానికి మడత మంచాలు ఇస్తాను అన్నాడు ఆ అయ్యర్ గారు. ఆ చుట్టుపక్కల అంతా అచ్చు మద్రాసు అడయార్ వాతావరణమే. అందరూ లుంగీలతోటే, నిలువు బొట్లూ, అడ్డ వీభూతులతోటే ఉన్నారు.

ఇక భాష ఎలాగా తమిళమే….బొంబాయి నడిబోడ్డులో తమిళుల ఒయాసిస్ ఆ మాటుంగా అనే ప్రాంతం. మొత్తానికి నేనూ, గోవిందరాజులూ స్నానాలు చేసి రెడీ అయి, ఆ మర్నాడు ఇంటర్వ్యూ లు కాబట్టి ముందే అక్కడికి వెళ్లి చూసి వద్దాం అని మా అయ్యర్ గారిని పవయ్ అనే ప్రాంతం లో ఉండే ఐఐటికి ఎలా వెళ్ళాలో కనుక్కుని, లోకల్ రైలు ఎక్కి, విక్రోలి స్టేషన్ లో దిగి అక్కడ బస్సు ఎక్కి సాయంత్రం ఐదు గంటలకి ఐఐటి మైన్ గేట్ దగ్గర దిగాం. అక్కడ కాపలా ఉన్న సెక్యూరిటీ వాళ్ళని చూసి కొంచెం భయం వేసింది కానీ వాళ్ళు కార్లలో వెళ్ళేవాళ్ళనే ఆపి వివరాలు అడిగి అప్పుడు పెద్ద గేటు తియ్యడం చూసి ధైర్యంగా నడిచి చిన్న గేటు లోంచి లోపలకి వెళ్ళిపోయాం. సిమెంట్ రోడ్డుకి అటూ, ఇటూ పోక చెట్లతో ఎంతో హాయిగా ఉన్న రోడ్డు మీద భయం భయంగా నడుస్తూ ఒకాయన కనపడగానే మా వివరాలు చెప్పి మెకానికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ ఎక్కడో చెప్పగలరా అని అడిగాం. ఆయన చెప్పినట్టు ముందు పచ్చటి తివాసీ లా పరుచుకున్న అందమైన లాన్ లో ఓ పెద్ద బిల్డింగ్ కనపడగానే ఆనందంతో తబ్బిబ్బు అయిపోయాం. అదే నాలుగంతస్తుల మైన్ బిల్డింగ్.  లోపల ఆహ్వానం పలుకుతూ ఈ ఐఐటి అనే అత్యున్నత స్థాయి సాంకేతిక విద్యాలయాల ఆలోచనకి మూల పురుషుడూ, ఆ భవనానికి శంఖుస్థాపన చేసిన జవహర్లాల్ నెహ్రూ గారి ఫోటో, స్వాగత వచనాలు మాలో మరింత హుషారు పెంచాయి. 1958 లో నెహ్రూ గారు శంఖుస్థాపన కోసం వచ్చిన ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. అందులో ఆయనతో కరచాలనం చేస్తున్న ఆయన బ్రిగేడియర్ బోస్ గారు, పక్కన ఉన్నాయన ఎ.కె. కేల్కర్ గారు.

Nehru-Bose Handshake నేను ఐఐటి లో ఉన్న మొదటి మూడేళ్ళు బోస్ గారు’, ఆ తరువాత మూడేళ్ళు కేల్కర్ గారు డైరెక్టర్లుగా పని చేశారు. బొంబాయిలో నిరంతరం కురిసే వర్షాలలో తడవ కుండా అన్ని డిపార్ట్ మెంట్ ల భవనాలనీ కలుపుకుంటూ ఒక పొడుగాటి కారిడార్ ఐఐటి భవన సముదాయాల ప్రత్యేకత. వాటిల్లో ఒకటయిన మెకానికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ కి మేము వెళ్లినా అప్పటికే చీకటి పడింది కాబట్టి అక్కడ కూడా కాపలా ఉన్న సెక్యూరిటీ వాడు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వ లేదు. మొత్తానికి ఆ మర్నాడు ఇబ్బంది లేకుండా ముందు రోజే అన్నీ చూసుకుని, నేనూ, గోవిందరాజులూ వచ్చిన దారినే వెనక్కి మాటుంగా వెళ్లి ఆ రాత్రి మడత మంచాల మీద వరండాలో పడుకున్నాం. మా ఇద్దరి పెట్టెలూ ఆ మంచాలకే గొలుసులతో తాళం వేసుకోమని ఆ అయ్యర్ గారు ఇచ్చిన సలహా పాటించాం.

ఆ మర్నాడు నా జీవితాన్నే మార్చేసిన ఇంటర్వ్యూ  తతంగం గురించి….వచ్చే సారి ….నమ్మండి, నమ్మకపొండి, ఆ రోజు తరువాత నేను ఇప్పటి దాకా..అంటే గత యాభై ఏళ్లలో గోవిందరాజులుని మళ్ళీ చూడ లేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాడని విన్నాను.

గమనమే గమ్యం

 

volgaజైల్లోకి వార్తలొస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలలో చైతన్యవంతులైన యువతరం, పాతిక ముప్ఫై సంవత్సరాల వయసున్న యువతరం ప్రాణాల్ని వదులుతోంది. పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు. ముఖ్యమైన కార్యకర్తలను కోల్పోతున్నా నాయకులకు ప్రమాదం ఎందుకర్థం కావటం లేదనే ప్రశ్న శారదను వేధిస్తోంది. ఈ సమయంలో, ఈ సందర్భంలో చేయదగిన పోరాటం ఇది కాదనే విషయం గట్టిగా మాట్లాడుతున్న వాళ్ళను శత్రువులుగా ఎందుకు చూస్తున్నారు. పైనుంచి కిందివరకూ చర్చించటం లేదెందుకని? పోరాటం ఆపమన్న వాళ్ళను ప్రాణత్యాగాలకు భయపడే పిరికివాళ్ళలా చూసే ధోరణిని పెంచుతున్నదెవరు? సమాధానం లేని ప్రశ్నలు.

ప్రదర్శనలో అరెస్టు చేసిన వారిలో పదహారుమంది మీద కేసులు పెట్టి మిగిలిన వారిని షరతులతో విడుదల చేశారు. శారదను, సూర్యావతిని వెల్లూరు పంపి మిగిలినవారిని బెజవాడలోనే ఉంచారు. కేసు విచారణ బెజవాడలోనే, విచారణకు బెజవాడ వెళ్ళేరోజు కోసం తహతహలాడుతూ ఒంటరితనంలో మగ్గిపోతోంది శారద.

బెజవాడలో కేసు విచారణకు ముందురోజే శారదను సూర్యావతిని అక్కడికి చేర్చారు. ప్రయాణమంతా మౌనమే. ఇద్దరు మంచి మిత్రులు శత్రుత్వం లేకుండా మాట్లాడుకోకపోవటం శారదకు ఇంతవరకూ అనుభవంలో లేదు. శత్రువులతో సహితం మాట్లాడి వాళ్ళను ఎదిరించటమో, ఒప్పించటమో, మందలించటమో చేసే స్వభావం శారదది. బెజవాడలో శారదకు ప్రత్యేకంగా ఒక గది ఇచ్చారు. ఒద్దని అందరితో పాటు ఉంటాననీ అన్నా వినలేదు. తన గదిలోకి వెళ్తూ మిగిలినవారి వంక ఆశగా చూసింది శారద. అందరూ తలలు పక్కకు తిప్పకున్నారు. శారద గుండెల్లో నొప్పి మొదలయింది. ఆ రోజు తిండి నిద్రా లేకుండా నీళ్ళు కూడా రాని కళ్ళతో జైలు గోడలను చూస్తూ గడిపేసింది. మర్నాడు పదిగంటల ప్రాంతంలో అందరినీ వ్యాను ఎక్కించారు. అందరినీ నవ్వుతూ పలకరించబోయింది శారద.

“ఎలా ఉన్నారోయ్ – అందరూ చిక్కిపోయారు. ఇక్కడి తిండి మీకెవరికీ సరిపడటం లేదల్లే ఉంది. పిల్లలకు పాలైనా ఇస్తున్నారా జైలు వాళ్ళు” కోటేశ్వరమ్మ “లేదు” అని చిన్నగా అన్నదో లేదో ఉమాదేవి “అనవసరమైన ప్రశ్నలకు ఎవ్వరూ జవాబులివ్వకర్లేదు” అని గట్టిగా అరిచింది. అందరి ముఖాలూ నల్లబడ్డాయి. శారదకు మొహం తిప్పేసి కూర్చున్నారు. గుండెల్లోకి రాబోతున్న కుంగుబాటుని బలంగా వెనక్కు నెట్టి “మీరు చేస్తున్నది సరి కాదోయ్” అని తనూ బైటికి చూస్తూ కూర్చుంది. కోర్డు విచారణ రొటీన్ గా జరిగింది. నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వాయిదా. ఆ నాలుగు రోజులూ శారదకు, ఆమె స్నేహపూరిత స్వభావానికీ సవాలు.

సుబ్బమ్మ చూడటానికి వస్తానంటే ఒద్దంది. హాస్పిటల్లో పనిచేసిన మంగమ్మ, సుందరమ్మ వచ్చారు.

శారదను చూసి ఒకటే ఏడుపు. వారిని సముదాయించటం శారదకు కష్టమై పోయింది. నవ్వించి, బతిమాలి, బెదిరించి వాళ్ళ ఏడుపుని ఆపి విషయాలన్నీ కనుక్కుంది.

సుబ్బమ్మ ఆరోగ్యం బాగోలేదు. కానీ ఆమె ధైర్యంగానే ఉంది. పోలీసులు హాస్పిటల్ మొత్తం ఎట్లా ధ్వంసం చేశారో చెప్తూ మళ్ళీ ఏడవసాగారు. వాళ్ళను సముదాయించి పంపి జైలర్తో మాట్లాడాలని బైటికి వచ్చింది.

సూర్యావతికి ఆరోగ్యం బాగోలేదనీ హాస్పిటల్కు తీసికెళ్ళాలనీ నలుగురు జైలరు చుట్టూ చేరి అడుగుతున్నారు. జైలరు వాళ్ళ మాటలు వినిపించుకోకుండా ‘అవసరమైనపుడు మేం తీసుకువెళ్తాం మీరు చెప్పాల్సిన అవసరం లేదని తీసి పారేసినట్లు మాట్లాడుతున్నాడు,

“మిస్టర్ – వీళ్ళంతా సమాజంలో గౌరవంగా బతికే కుటుంబాల నుండి వచ్చినవాళ్ళు. మీరు ఎట్లా అంటే అట్లా మాట్లాడితే మీ సంస్కారమే బైటపడుతుంది గౌరవం ఇచ్చి పుచ్చుకోవటం తెలియదా మీకు? నేను డాక్టర్ని ఆమెను ముందు నేను చూసి హాస్పిటల్కు తీసికెళ్ళాలో లేదో చెబుతాను” అంటూ సూర్యావతి నుంచిన గదిలోకి వెళ్ళింది. కోటేశ్వరమ్మ, రాజమ్మ, కమల, సుగుణ ఆమె వెనకాలే వెళ్ళారు.

“ఉమాదేవి లేదు నయం. ఉంటే గొడవ చేసేది. సూర్యావతిని చూడనిచ్చేది కాదు” అంది రాజమ్మ

మిగిలినవాళ్ళు ఔనన్నట్లు తలలూపారు.

శారద సూర్యావతి దగ్గరకు వెళ్ళేసరికి ఆమె ఒళ్ళు తెలియకుండా నిద్రపోతోంది. నుదుటి మీద చేయివేసి చూస్తే వేడిగా ఉంది. తన గదిలోకి వెళ్ళి ధర్మామీటర్ తెచ్చి రాజమ్మ కిచ్చి నిద్రలేచాక టెంపరేచర్ చూడండి. జ్వరం ఉంది. ఈ మందు వేసి నుదుటి మీద తడిగుడ్డ వేస్తూ ఉండండి. ముందు తడిగుడ్డ వేయండి. మెలకువ వచ్చాక నే చెప్పినట్లు చేయండి. మందు పడిన గంటలో జ్వరం తగ్గకపోతే నాకు చెప్పండి. హాస్పిటల్కి పంపి రక్తపరిక్షలు చేయిద్దాం” అని చెప్పి పదడుగులు వేసి మళ్ళీ వెనక్కు వచ్చి

“సూర్యావతికి నేను వచ్చి చూశానని చెప్పకండి. జైలరు డాక్టర్ని పిలిపించాడని చెప్పండి” అని వెళ్ళిపోయింది.

మరుసటి వాయిదా రోజు కూడా శారదతో ఎవరూ మాట్లాడలేదు. కోర్టు దగ్గర వ్యాను దిగుతుంటే రాజమ్మ కూతురు విమలను ఎవరో తీసుకొచ్చారక్కడికి. రాజమ్మ కూతుర్ని ఎత్తుకుని ముద్దులు పెట్టి, ఏడుస్తున్న పిల్లను సముదాయించి గుండెలకు హత్తుకుంది. అందరి మనసుల్నీ కలచివేసింది ఆ దృశ్యం. శారదే రాజమ్మకు పురుడు పోసి ముందుగా ఆ పాపను ఎత్తుకుంది. ఆ వాత్సల్యం పొంగుకొచ్చింది శారద గుండెల్లో “రాజమ్మా – నీ కూతురెంత బాగుందే – ఇలా ఇవ్వు” అంటూ చేతులు సాచింది.

రాజమ్మ సంతోషంగా పాపను శారద చేతులకందించింది. శారద ఆ పాపను గుండెలకు హత్తుకుని ముద్దుపెట్టి “రాజమ్మా” అని ఏదో చెప్పబోతోంది. ఇంతలో ఉమాదేవి ఎక్కడినుంచి వచ్చిందో డేగలా వచ్చి శారద చేతిలోంచి పాపను లాక్కుని రాజమ్మ చేతుల్లో పెట్టి,

“రాజమ్మా నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా. అడ్డమైనవాళ్ళతో రాసుకు పూసుకు తిరుగుతావు. మనవాళ్ళు మనకు ఆదేశాలు పంపించారా లేదా? వాటి ప్రకారం నడుచుకుంటారా లేదా? లేకపోతే ద్రోహులతో కలిసిపోతారా? ఇంకోసారి ఇట్లాంటివి జరిగితే పార్టీకి రిపోర్టు చెయ్యాల్సి వస్తుంది జాగ్రత్త అని చరచరా అవతలి వైపుకు వెళ్ళిపోయింది. అందరూ నిర్ఘాంత పోయారు. కోటేశ్వరమ్మ కళ్ళవెంట నీళ్ళు.

“డాక్టర్ గారి వయసు, అనుభవం, ఆమె మనసు, మంచితనం, ఎందులోనూ సమానం కాలేని ఉమాదేవి ఇట్లా మాట్లాడొచ్చా పిల్లను ఎత్తుకున్నంత మాత్రాన కొంపలంటుకుంటాయా? ఉమాదేవికి ఇంత అధికారం ఎవరిచ్చారు?” అంది రాజమ్మకే వినిపించేటట్లు,

“ఎవరూ ఇవ్వలేదు. పార్టీ పేరుతో అధికారం చలాయిస్తోంది. అట్లా చలాయించే వారే పార్టీకి అసలైన ప్రతినిధులని పార్టీ అనుకుంటున్నంత కాలం ఉమాదేవి ఇట్లాగే మాట్లాడుతుంది” అంది రాజమ్మ

olga title

శారద మనసు పూర్తిగా విరిగిపోయింది. ముక్కలు ముక్కలయింది.

మాట్లాడకుండా కోర్టు లోపలికి వెళ్ళి తన స్థానంలో కూర్చుంది.

ఈ సారి విచారణ కొంత బాగానే సాగింది. నెల తర్వాత తీర్పు ఇస్తానన్నాడు మేజిస్ట్రేటు.

మళ్ళీ వెల్లూరు ప్రయాణం కమ్మన్నారు శారదను, సూర్యావతిని. సూర్యావతి జ్వరంతో నీరసించి ఉంది. ప్రయాణం చేయలేననీ, కొన్నాళ్ళు బెజవాడలోనే ఉంటాననీ అడిగితే జైలు అధికారులు ఒప్పకోలేదు. జైల్లో ఉన్న స్త్రీలందరూ సూర్యావతికి అడ్డుగా నిలబడ్డారు. జైలు సిబ్బంది వాళ్ళను నెడుతూ తిడుతూ సూర్యావతిని ముందుకు లాగుతున్నారు. శారద ప్రయాణానికి సిద్ధమై వచ్చినది, ఇదంతా చూసి ఆవేశంతో అటు పరిగెత్తింది. జైలు సిబ్బందిని అటూ, ఇటూ లాగి సూర్యావతికి అడ్డంగా నిలబడి “ఖబడ్డార్, మావాళ్ళ మీద చేయి వేశారంటే మీరు ఉద్యోగాలలో ఉండరు. ఆవిడ నాలుగు రోజుల్నించీ జ్వరంతో ఉంది. మీరు హాస్పిటల్కి కూడా పంపలేదు, నేను మందులిచ్చి ఈ మాత్రం నిలబడేలా చేశాను. మీరామెను చంపదల్చుకున్నారా? నీరసించి ఉన్న రోగిని బెజవాడ నుంచి వెల్లూరు దాకా ప్రయాణం చేయమంటారా? దారిలో జ్వరం తిరగబడితే, ఎమర్జెన్సీ వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? మీరు మనుషులేనా? మీకు మంచి మాటలు చెప్పిన వాళ్ళను కొడతారా? తిడతారా? రండి నన్ను కొట్టండి. నన్ను దాటి వచ్చి సూర్యావతి గారిని తీసుకెళ్ళండి.”

శారద మాటలకు సిబ్బందంతా భయపడిపోయారు. అక్కడ్నించి వెళ్ళి జైలరుతో ఏం చెప్పారో మొత్తానికి సూర్యావతి మరో నాలుగు రోజులు బెజవాడలో ఉండేందుకు ఒప్పకున్నారు.

సూర్యావతికి పాలు, పళ్ళు, మెరుగైన ఆహారం ఇస్తే తప్ప నాలుగు రోజులకైనా ఆమె కోలుకోదని చెప్పి ఇవ్వవలసిన ఆహారం, మందులు వేళ ప్రకారం కాగితాల మీద రాసి ఒక కాగితం జైలరుకి ఒక కాగితం రాజమ్మకు ఇచ్చింది.

“ధైర్యంగా ఉండండోయ్. సూర్యావతి కొచ్చింది మామూలు జ్వరమే. కాస్త బలమైన తిండి పడితే నీరసం తగ్గిపోతుంది” అని చెప్పి తను వెళ్ళి వ్యానులో కూర్చుంది.

ఇది జరిగినంత సేపూ ఉమాదేవీ, మరో నలుగురూ చిటపటలాడుతూ ఉండటం శారదతో సహా అందరూ గమనించారు.

రైలు స్టేషన్కి సుబ్బమ్మను తీసుకుని నర్సు లక్ష్మి, మంగమ్మ వచ్చారు.

సుబ్బమ్మతను కళ్ళనీళ్ళు పెట్టుకుంటే శారద తట్టుకోలేదనీ, ఎట్టి పరిస్థితులలోనూ తను ఏడవకూడదనీ గట్టిగా నిర్ణయించుకుని వచ్చింది.

“ఎట్లా ఉన్నావమ్మా” అని అడిగిన శారదకు “నాకేం. శుభ్రంగా తిని తిరుగుతున్నాను. నువ్వెట్లా ఉన్నావు. అక్కడి తిండీ, నీళ్ళూ సరిపడినట్లు లేవు. చిక్కిపోయావు. నల్లబడ్డావు”.

“జైలుకి వెళ్ళినవాళ్ళు చిక్కిపోకపోతే చాలామంది జైళ్ళకెళ్తారమ్మా తిండి మరీ అన్యాయంగా లేదులే – అక్కడ నువ్వు లేవుగా”,

“నేను లేకపోతే ఏం, మన వాళ్ళంతా ఉన్నారుగా, వెల్లూరులో సూర్యావతి ఉందంటే నేనున్నట్టే కాదూ? ఇక్కడ అందరూ ఉండనే ఉన్నారు. మీ పాటలు మీటింగులు, సరదాలు దేనికీ లోటుండదని నాకు తెలుసులే.”

“అమ్మా నటాషా ఎలా ఉంది?”

“దానికేం బాగానే ఉంది. అక్కడ విమలత్త పిల్లలు దీని ఈడు వాళ్ళేగా, అందరూ జతగా జట్టుగా బడికెళ్తున్నారు. బాగా చదువుతున్నదట. మొన్నొక రోజు ఫోనులో మాట్లాడి అమ్మమ్మా – అమ్మ వచ్చిందా? శలవల్లో నేనొచ్చే సరికి అమ్మని రమ్మని చెప్పు” అన్నది. పిచ్చితల్లి, దానికేం తెలుసు మీ గొడవలు? మూర్తి కూడా వెల్లూరేగా?”

“ఆ – వారం వారం ఇంటర్వ్యూ దొరుకుతోంది. బాగానే ఉన్నాడు”.

“పాపం పార్టీ కుర్రాళ్ళంతా చచ్చిపోతున్నారే” అంటూ ఇక ఆపుకోలేక పెద్దగా ఏడ్చింది సుబ్బమ్మ,

తల్లిని రెండు చేతుల్తో దగ్గరకు తీసుకుని శారదా ఏడ్చింది.

“బంగారంలాంటి కుర్రాళ్ళు – ఆడవాళ్ళనూ కాల్చేస్తున్నారు. ఇది మంచికి రాలేదు. ఇంతకింతా అనుభవిస్తారు ఈ కాంగ్రేసు వాళ్ళు”.

“ఊరుకోమ్మా అంతా సరవుతుంది. మేమంతా బైటికి వస్తాం. సరేనా?”

“సరేనమ్మా సరే, ఆరోగ్యం జాగ్రత్త, నా గురించీ, నటాషా గురించీ దిగులు పెట్టుకోకు. నువ్వున్నచోట నవ్వులే తప్ప దిగులుండదని నాకు తెలుసులే” అని బలవంతంగా నవ్వబోయి విఫలమైంది సుబ్బమ్మ.

రైలు కదిలే టైమయింది. ఎక్కమన్నారు పోలీసులు. మరొకసారి తల్లీ కూతుళ్ళు ఒకరినొకరు కళ్ళారా చూసుకున్నారు.

శారద వెళ్ళి రైలెక్కింది. లక్ష్మీ, మంగమ్మ, సుబ్బమ్మకు చెరోవైపు నిలబడి నెమ్మదిగా నడిపించుకుంటూ వెళ్ళారు.

శారద వెల్లూరు చేరింది.

ఒంటరితనం. చుట్టూ మనుషులు లేని ఒంటరితనం కాదు. తనవాళ్ళంటూ ఎవరూ లేని ఒంటరితనం, మానసికమైన ఏకాకితనం.

వెలి ఎలా ఉంటుందో శారదకు ప్రత్యక్షంగా అనుభవమైంది. బ్రాహ్మణ కులంలో వెలి వెయ్యటం, ప్రాయశ్చిత్తాలు జరపటం, మళ్ళీ కలుపుకోవటం వీటి గురించి చిన్నప్పుడు తండ్రి చెప్పాడు. పెద్దయ్యాక పుస్తకాల్లో చదివింది. రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మను వెలివేశారు బంధువులందరూ. వీరేశలింగం తాతయ్య వితంతు వివాహాలు చేయించేటప్పడు అందరూ వెలివేశారు. ప్రాణ స్నేహితులు కూడా సమాజానికి భయపడి దూరమయ్యారు. ఎలా భరించారు వాళ్ళు ఆ దుర్మార్గమైన ఫ్యూడల్ పద్ధతిని, అదే పద్ధతిని కమ్యూనిస్టు పార్టీ ఎలా ఆచరిస్తోంది? వెలి – కులంతో వేళ్ళూనుకుని, ముడిపడిన పద్ధతి. తమ కులానికున్న ఏ మూర్థపు కట్టుబాటుని ప్రశ్నించినా, ఎదిరించినా, ఆచరించక పోయినా, తాము గీసిన లక్ష్మణరేఖలలో ఏ రేఖను దాటినా కులపెద్దలు వెలి వేస్తారు. ఆ కుల ముద్ర పద్ధతిని కమ్యూనిస్టులూ అమలు చేయటమేమిటి? తన అభిప్రాయాలు రాసి పంపించింది. అవి పొరపాటైతే పొరపాటని మాట్లాడవచ్చు సంభాషణ కొనసాగితే గదా మంచిచెడ్డలు బైటికొచ్చేది, పొరబడితే వెలేనా? తనే సరిగా ఆలోచిస్తున్నదనీ, వారిది పొరపాటనీ తేలితే ఏం చేస్తారు? ప్రాయశ్చిత్తం ఎలా చేసుకుంటారు? ఏ బ్రాహ్మణ కులాచారం అమలుచేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు? తమ తోటి స్త్రీలను ఈ పొరపాటు అభిప్రాయాలతో ప్రభావితం చేస్తానని భయపడుతున్నారా? తన అభిప్రాయాలు చెప్పినంత మాత్రాన వాళ్ళు మారిపోతారా? రెండోవైపు ఒకటుందని తెలియకుండా చూపే విధేయతకో, కట్టుబాటుకో విలువేముంటుంది?

ఈ విషయాల గురించి వాళ్ళతో చర్చించవద్దని తనకు సూచించవచ్చు. అలా కాకుండా శారద ద్రోహి అనీ, ఆమెతో మాట్లాడవద్దనీ, తాకవద్దనీ తన సహచరులను ఆజ్ఞాపించటం ఏ విలువల ఆధారంగా జరిగింది? ఇందులో కరడుగట్టిన కులాచారం తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడుంది? శారద మనసు భగభగ మండుతోంది.

ఏం చెయ్యాలి? అనే ప్రశ్న వెంటాడుతూనే ఉంది. ఒక ఉద్యమం కోసం జైల్లో ఉండటం వేరు. జరుగుతున్న ఉద్యమంలో, పోరాటంలో భాగం కాకుండా ఎందుకిట్లా నిరర్థకంగా జైల్లో ఉండటం?

కానీ బహిరంగంగా పార్టీతో విబేధించటం మామూలు విషయం కాదు. కానీ తను రహస్యంగా రాసి పంపిన సమాచారం పార్టీ సభ్యులకూ సానుభూతి పరులకూ తెలిసిపోయింది. దానిని కూడా సహించక బహిరంగ ప్రకటన చేసినట్లే ప్రవర్తిస్తున్నారు. తనకూ పార్టీకి మధ్య గోడ కట్టేశారు. ఆ గోడ ఎంత బలంగా ఉందో ఇప్పట్లో తేలేలా లేదు.

పట్టుమని పాతికేళ్ళ లేని ఉమ ముందూ వెనకా ఆలోచించకుండా ద్రోహి అన్నది. ఆ అనటంలో ఎంత అధికారం చూపించింది. ఎలా వచ్చింది ఆమెకు ఆ అధికారం, ఆ అధికారానికి తను తలవంచిందా? ఉమకు సమాధానమైతే చెప్పలేదు. సహించింది. ఆ మాటలు అన్యాయమైనవని తెలిసినా, ఆ ధోరణి ప్రజాస్వామికం కాదని తెలిసినా తాను మాట్లాడలేదు. ఉమను వారించలేదు. పార్టీ ఆదేశం అని ఉమ అంటుంటే “ఎవరిచ్చారు ఆ ఆదేశం, నేను పార్టీ సభ్యురాలిని కాదన్నట్లు ఎందుకు మాట్లాడుతున్నావు? ఏమిటి నీ అధికారం?” అని అడగలేదు. ఎందుకంటే అంతరాంతరాలలో తనకు కూడా తెలుసు అది పార్టీ ఆదేశమని. ఎవరు నిర్ణయించి ఉంటారు? ఒకరిద్దరా? కమిటీ అంతా సమావేశమైందా? ఎలా నిర్ణయం తీసుకున్నారు తనను సంప్రదించకుండా – తన వాదన పూర్తిగా వినకుండా.

కలకత్తా మహాసభలో నెహ్రూ ప్రభుత్వాన్ని సాయుధ పోరాటం ద్వారా పడగొట్టాలనే తీర్మానానికి తను మనసా వాచా అంగీకరించలేదని చాలామందికి తెలుసు. తనే కాదు మరికొందరు పెద్దలకు కూడా సంపూర్ణాంగీకారం లేదు. వారి మీద ఈ వైఖరి తీసుకోలేదు, వారు తిరుగుబాటు చేసినట్లో, ద్రోహం చేసినట్లో ఎవరూ మాట్లాడం లేదు. కానీ తనమీద ఈ నింద ఏమిటి “ఆడదాన్ననా?” ఆ ఆలోచనకు ఉలిక్కిపడింది శారద.

ఈ పదిహేనేళ్ళలో అనేకసార్లు ఈ ప్రశ్న వచ్చింది. ప్రతిసారీ ఏదో ఒక సమాధానంతో సరకుంటోంది. ఇంకెంత కాలం ఇలా సర్దుకోవాలి? కమ్యూనిస్టులయినంతమాత్రాన ఎంతో కాలం నుంచీ అలవడిన భావాలు పోవు. కానీ నాయకత్వమైనా తమని తాము మార్చుకోవటానికీ ప్రయత్నం చేయవద్దా? సమాధానం చెప్పేదెవరు?

పురుషుల జైలులో రోజూ ఏదో ఒక కలకలం. నిరాహార దీక్షలు, అధికారులను ఎదిరించటాలు. గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మూర్తి వారానికోరోజు ఇంటర్వ్యూ తీసుకుని శారదను కలుస్తున్నాడు. ఇద్దరికీ పోరాట విరమణ జరగాలని ఉంది. తమలాగా ఆలోచిస్తున్న వాళ్ళున్నారనీ తెలుస్తోంది. రాయలసీమ కామ్రెడ్ ఒకరు తను పార్టీతో విబేధించి బైటికి వస్తున్నానని చెప్పి విడుదలయ్యాడు.

అలా చేద్దామనే ఆలోచన కొందరిలో ఉంది.

“మూర్తీ – మనం ప్రస్తుతం పార్టీ అనుసరిస్తున్న పంధాను వ్యతిరేకిస్తున్నాం. ఆ మాట నేను వివరంగా పార్టీకే ఉత్తరం ద్వారా చెప్పాను. అందుకే అందరూ నన్ను శత్రువులా చూస్తున్నారు. నిన్నూ అంతే – అలాంటప్పుడు మనం అటు పార్టీకీ కాక, ఇటు మన కుటుంబాలకూ, వృత్తులకూ కాక ఈ జైల్లో ఎందుకుంటున్నట్టు. మనం ఈ పోరాటాన్ని వ్యతిరేకిస్తున్నామని బహిరంగంగా ప్రకటించి విడుదలై మన జీవితాల్లోకి వెళదాం

మూర్తి ఆశ్చర్యంగా శారద వంక చూశాడు.

“ఆ పని చేస్తే ఇక శాశ్వతంగా పార్టీకి దూరమైనట్లే, పార్టీకి దూరమై నువ్వు బతకగలవా?’

పార్టీ ఎప్పటికైనా ఇదంతా తప్పని గ్రహిస్తుందని నాకు నమ్మకం ఉంది. సమయం పట్టవచ్చు. కానీ గ్రహిస్తుంది. అప్పడు మనం, పార్టీ ఒకటవుతాం. ఈ లోపల డాక్టర్ అవసరం బెజవాడకు ఎంతైనా ఉంది. రంగనాయకమ్మ గారు చనిపోయారని చెప్పానుగా. ఆమే, నేనూ ఇద్దరం లేకపోతే ఆడవాళ్ళకు చాలా కష్టం. ఒకవైపు మన యువకులంతా చచ్చిపోతున్నారు. ఇంకోవైపు ఆడవాళ్ళు నేను లేనందువల్ల చచ్చిపోతారనుకుంటే చాలా కష్టంగా ఉంది నా మనసుకి. నాకు ప్రాణాలు నిలబెట్టటం అనేదే కర్తవ్యం అనిపిస్తుంది.

నిజానికి ఇవాళ మనం కమ్యూనిస్టులుగా చేయాల్సిందెంతో ఉంది. నిజమే – ఆ పని చేస్తుంటే ప్రభుత్వమే నిర్బంధం విధించింది, దాన్ని మనం వేరే రకంగా ఎదిరించి ఉంటే ఇంత నష్టం తప్పేదని గట్టిగా అనిపిస్తుంది. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలి నిర్బంధానికి వ్యతిరేకంగా – డానికి సృజనాత్మకత వ్యూహాలు రచించుకోవాల్సింది. అది కాకుండా “కంటికి కన్ను పంటికి పన్ను అంటే ఇప్పడేమయింది. మన వేలితో మన కన్నే పొడుచుకున్నట్లయింది. అంతా చీకటయిపోయింది,

ఒక చిన వెంకట్రాయుడు తయారవ్వాలంటే, ఒక చలసాని శ్రీనివాసరావు, వాసుదేవరావు, ఒక జగన్నాధరావు తయారవ్వాలంటే అది మామూలు విషయమా? అలాంటివాళ్ళు వందలు పోయారు. వాళ్ళు బతికుంటే మార్చేవాళ్ళు సమాజాన్ని – మనం ఊహించలేనట్లు – ఇప్పటికైనా మనం బహిరంగంగా ఇది తప్పని చెబితే మన వెనక వచ్చే వాళ్ళుంటారేమో, కొందరైనా మిగులుతారేమో.

మూర్తీ – నేను నిర్ణయించుకున్నాను. నీ సంగతి తేల్చుకో”

మూర్తికి కూడా మనసులో అదే ఉంది. ఈ జైలు జీవితంలో అర్థం පීඨාදිංයි. తన అంగీకారాన్ని తెలిపాడు.

శారద మూర్తి చేతులను తన చేతుల్లోకి తీసుకుంది.

“ఇక మన జీవితాలు కొన్నేళ్ళ పాటు చాలా మారతాయి. కానీ మూర్తీ నేను కమ్యూనిస్టుని, పార్టీకి దూరమైనా కమ్యూనిస్టులాగే జీవిస్తాను. నాకు నమ్మకముంది పార్టీ మళ్ళీ మనల్ని కలుపుకుంటుంది. ఈ వెలి తప్పని తెలుసుకుంటుంది”.

శారద కళ్ళల్లో మెల్లిగా నిరాశ తొలిగి ఆశ పాకుతోంది. కొన్నాళ్ళుగా నవ్వటం మర్చిపోయిన ఆమె పెదవుల మీద అతి సన్నని చిరునవ్వు మొలకెత్తింది,

*****

బెజవాడకు ఒంటరిగా తిరిగి వచ్చింది శారద. పార్టీతో విభేదిస్తున్నానని బహిరంగంగా ప్రకటించానని శారద అనుకుంది. అది పార్టీ పరిభాషలో “అండర్టేకింగ్”, “లొంగుబాటు”. ఆ పదం ఒక మనిషి జీవితాన్ని ఎలా మార్చెయ్యగలదో శారదకు క్రమంగా అర్థమవుతూ వచ్చింది. పార్టీ ఆదేశానుసారం డాక్టరుగా ప్రాక్టీసు చేస్తూ కృష్ణాజిల్లా పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు కొన్నేళ్ళక్రితం వచ్చినపుడు శారదకు ఘన స్వాగతం దొరికింది. ఇపుడు స్వాగతం దొరుకుతుందనీ, దొరకాలనీ శారద అనుకోలేదు గానీ ఇంత తిరస్కారం ఎందుకుండాలో అర్థం కాలేదు. ಇಲ್ಲ, ಅಮ್ಮಿ శిధిలావస్థలో ఉండటం చూసి శారదకు గుండె చిక్కబట్టింది, నిత్యం నలభై యాభై మంది వస్తూ పోతూ, తింటూ, పాడుతూ, ఆడుతూ హాస పరిహాసాలతో కళకళలాడే ఇల్లు. కళా కాంతీ లేక దుమ్ముకొట్టుకుపోయి ఉంది. సుబ్బమ్మ ఒక్కతే ఓపికున్నపుడు ఇంత ఒండుకు తింటోంది. ఓపిక లేనపుడు మంచినీళ్ళు తాగి పడుకుంటోంది.

ఇల్లంతా తిరిగి చూసింది శారద. చూసిన కొద్దీ పట్టుదల పెరిగింది. ఇల్లు మళ్ళీ ప్రాణం పోసుకోవాలి. దానికి తను ఈ క్షణం నుంచీ పూనుకోవాలి. సుబ్బమ్మకు శారదను చూస్తూనే ప్రాణం లేచొచ్చింది.

అమ్మకు తన చేతుల్తో అన్నం తినిపించి, తను కూడా కడుపు నిండా తిని పనిలో పడింది శారద. నలుగురు మనుషుల కోసం కబురంపితే నర్సులిద్దరూ వాళ్ళను తీసుకుని వచ్చారు. హాలు, వంటిల్లు, పడకగది మళ్ళీ మామూలు స్వరూపానికి తేవటానికి సాయంత్రం దాకా పట్టింది.

సాయంత్రం పని ఆపి ధైర్యం కూడగట్టుకుని హాస్పిటల్కి వెళ్ళింది. శారద చాలా దారుణమైన దృశ్యాన్నే ఊహించుకుంటూ వెళ్ళింది గానీ అక్కడి పరిస్థితి శారద ఊహను మించిపోయింది. సర్వం నాశనమై పోయింది, తనెంతో ప్రేమగా తీర్చిదిద్దుకున్న జీవితమంతా చిందరవందరై పోయింది. చెంపలు కన్నీళ్ళతో తడిసి ఎండిపోయాయి.

ఎక్కడ మొదలు పెట్టాలి, ఎండిన కన్నీటిని చల్లని నీళ్ళు చల్లి తుడుచుకుని కాగితాలు తీసుకుని మళ్ళీ ఆ శిథిలాలయాన్ని పునరుద్ధరించటమెలాగో అనే ప్లాను వివరంగా రాసుకుంది. కావలసిన వస్తువులు, పరికరాలు జాబితా వివరంగా రాసుకుంటుంటే సుందరమ్మ ఒక్కొక్కటీ చెబుతూ సాయపడుతోంది. రాత్రి పొద్దుబోయేదాకా ఆ పనే సరిపోయింది.

ఇదంతా చేయటానికి డబ్బు? ఎంతో సంపాదించింది డాక్టర్ గా – ఒక్కరూపాయి లేదిప్పడు. ఎప్పడు వచ్చినదప్పుడే పార్టీకీ, పార్టీ ఆఫీసనదగిన ఇల్లు నడపటానికీ ఖర్చు పెట్టేసింది. ఇప్పుడు మొదలుపెట్టటానికి వెదుకులాట తప్పదు. శారదేమిటి పార్టీ కోసం సర్వం ఇచ్చినవాళ్ళెందరో శారదలాగే అందరూ దానికి గర్వపడేవారేగాని బాధపడేవారు కాదు.

శారదకు గర్వం కూడా లేదు. అది తనది అనే ఆలోచనే తప్ప ఇంకో భావం లేదు. పార్టీ, తనూ వేరని శారద అనేకమంది సభ్యులలాగానే ఒక్క క్షణం కూడా అనుకోలేదు. వ్యవస్థాపకురాలిగా పార్టీని ఏ ఇబ్బందులూ లేకుండా నడిపించే బాధ్యత తనదనీ, దానికి తన సర్వశక్తులూ ఒడ్డాలని అనుకుంది. ప్రత్యేకంగా అనుకోవాల్సిన అవసరం లేకుండానే అది శారద రక్తంలో కలిసిపోయింది. ఇప్పడు కూడా శారదకు ఒక్క క్షణం కూడా వేరే ఆలోచన రాలేదు. డబ్బు సమకూర్చి ఆసుపత్రిని బాగుచేసుకుంటే మళ్ళీ అంతా మామూలవుతుంది – అని డబ్బు కోసం ఎవరినడగాలి, ఎలా సమకూర్చాలి అనే ప్రయత్నాలు మొదలు పెట్టింది.

రెండవ రోజు సాయంత్రం ఎండిన పూల మొక్కలు పీకేసి, గడ్డీ గాదాన్ని ఏరేసి నేలంతా మళ్ళీ విత్తనాలు చల్లటానికి సిద్ధం చేస్తుండగా సరస్వతి వచ్చింది.

శారద కు మట్టి చేతులను కడుక్కునే వ్యవధానం కూడా ఇవ్వకుండా కౌగిలించుకుంది. శారద చాలా నెలల తర్వాత గలగలా నవ్వింది.

సరస్వతి కళ్ళు తుడుచుకుంటూ “ఇప్పట్లో నిన్ను చూస్తాననుకోలేదు” అంటుంటే శారద ఆప్యాయంగా సరస్వతిని లోపలికి తీసుకెళ్ళింది.

ఇన్ని నెలలుగా ఒక్క స్నేహ పూరితమైన పలకరింపు లేక ఎండిపోయిన శారద మనసు మీద సరస్వతి పలకరింపు తొలకరి జల్లులా పనిచేసింది.

“పిల్లలెలా ఉన్నారోయ్. మనోరమ పెళ్ళయిన తర్వాత వాళ్ళను చూసే అవకాశం దొరకలేదు. అసలు పెళ్ళెలా జరిగిందో తెలుసుకునే వీలు లేకుండా ఈ నిర్బంధం, నిషేధాల పనులతోనే సరిపోయిందోయ్. నటాషా విశాఖ పట్నంలో ఉంటోంది. వచ్చేవారం వెళ్ళి చూసి రావాలి. ఈ సంవత్సరం మధ్యలో బడి మార్చటం ఒద్దంటున్నారు. వచ్చే సంవత్సరం ఇక్కడకు తెచ్చుకుంటాను. అమ్మ ఆరోగ్యం అసలు బాగోలేదు. లవణం, సమరం, నౌ అందరూ ఎట్లా ఉన్నారోయ్ – రేపాదివారం పిల్లలందరినీ తీసుకుని మా ఇంటికి రారాదూ – మా ఇల్లు బోసిగా ఉంటే ఏమీ బాగోలేదోయ్ – ఎలా ఉండే ఇల్లు ఎలా అయిందో చూశావుగా – ”

శారద గలగలా మాట్లాడుతుంటే సరస్వతి ఆమె చేతుల్ని ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకుని సవరిస్తూ ఆదివారంనాడు పిల్లలందరినీ తీసుకుని వస్తానని చెప్పింది.

“నువ్వు మంచిపని చేశావు శారదా గోరా గారూ, నేనూ ఇద్దరం అదే అనుకున్నాం”.

“నేనూ అలాగే అనుకుని వచ్చేశాను. ఎంత గొప్పవాళ్ళయినా ఒకోసారి పొరపాట్లు చేస్తారోయ్ – అలాగే మా పార్టీ కూడా – కానీ దానికి చెల్లించాల్సిన మూల్యం చాలా ఎక్కువగా ఉందోయ్ – అదే బాధ తొలిచేస్తుంది. ఎలాంటివాళ్ళు చచ్చిపోతున్నారో చూశావుగా ఇద్దరూ తమకు తెలిసిన కమ్యూనిస్టులలో చనిపోయిన వారి గురించి, జైల్లో ఉన్నవారి గురించీ మాట్లాడుకోవటంలో కాలాన్ని మర్చిపోయారు. ఆ రోజు సరస్వతిని భోజనం చెయ్యకుండా పంపించే ప్రసక్తే లేదని శారద, సుబ్బమ్మ పట్టుబట్టారు. సుబ్బమ్మతో పాటు సరస్వతి కూడా వంటకు పూనుకుంటే శారద

వాళ్ళిద్దరినీ చూస్తూ గుండెలనిండా గాలి పీల్చుకుంది.

శారదకూ సరస్వతికీ క్రొసరి క్రొసరి వడ్డిస్తుంటే సుబ్బమ్మకు మళ్ళీ జీవి తం మూమూలుగా నడుస్తుందనే నమ్మకం కలిగింది.

బాగా పొద్దు బోయాక సరస్వతి కొడుకు సమరం వచ్చి తల్లిని తీసికెళ్ళాడు. ఆ రాత్రి గాఢనిద్ర పోయింది శారద.

తెల్లవారి పనులు ముగించుకుని ఆసుపత్రికి పోదామనుకుంటుంటే అన్నపూర్ణ వచ్చింది. వెనకాలే అబ్బయ్య.

శారద ఆనందానికి అవధులు లేవు. సుబ్బమ్మను అన్నపూర్ణ అపుడపుడూ వచ్చి చూస్తూనే ఉంది.

ఒకరినొకరు ఇంతకాలం తర్వాత చూసుకుంటుంటే వాళ్ళను చూడాలని కన్నీళ్ళు గబగబా కళ్ళ నుంచి బైటికురుకుతున్నాయి.

శారద జైల్లో తనతో ఎవరూ మాట్లాడని సంగతి చెప్పి బాధపడింది. “బహుశ ఇక మీరు మీ పార్టీని, ఆ మిత్రులను మర్చిపోవాలనుకుంటానండీ” అన్నాడు అబ్బయ్య.

“ఎందుకట్లా అంటున్నావు? ఇపుడు జరుగుతున్నది పొరపాటని మావాళ్ళు ఎన్నటికీ గ్రహించరా?”

“వాళ్ళు గ్రహించవచ్చు. కానీ తమకంటే ముందు గ్రహించిన వాళ్ళను వాళ్ళు క్షమించరు. అందులో మీవంటి నాయకులను అసలు క్షమించరు”.

“నువ్వు ఎంత కాంగ్రెస్ వాడివయినా మావాళ్ళనిట్గా మాట్లాడటం బాగోలేదోయ్”

“నేను కాంగ్రెస్వాడిగా, కమ్యూనిస్టు వ్యతిరేకిగా మాట్లాడటం లేదు డాక్టర్ – పార్టీ యంత్రాంగపు స్వభావాన్ని అర్ధం చేసుకుని మాట్లాడుతున్నాను.”

“పార్టీ అంటే మనుషులు కాదా? యంత్రాంగం తయారయ్యేది మనుషులతోనే గదా?”

“ఔను. కానీ పార్టీ యంత్రాంగం, నియమ నిబంధనలు, క్రమశిక్షణ ఇవి వాటిని వాడుకోదల్చుకున్నపుడు మనుషులు తమ మానవత్వాన్ని విచక్షణను, హేతుబుద్ధిని అన్నిటినీ పక్కన పడేసే అవకాశాన్ని యంత్రాంగం కల్పిస్తుంది. అది అన్ని పార్టీలకంటే కమ్యూనిస్టు పార్టీలో అధికం. ఎందుకంటే అక్కడ వారు చేసే త్యాగాలూ అధికం. అబ్బయ్య మాటల గురించి ఆలోచించటానికి ఉందనిపించింది శారదకు. జైల్లో ఉన్నపుడు శారద కూడా పార్టీ యంత్రాంగం గురించి ఆలోచించింది.

“అబ్బా – మీ రాజకీయ చర్చలు ఆపండి. దానికి చాలా సమయం ఉంది. శారదా – ఆస్పత్రి మళ్ళీ ఎప్పడు తెరుస్తావు?”

“నెల నుంచీ రెండు నెలలు పట్టొచ్చు. ముందు కొంత బాగు చేసుకుని పని మొదలు పెడతాను. నెమ్మదిగా అంతా బాగవుతుంది’.

“మూర్తిగారు రాలేదేం?”

“ఆయన జైల్లో నుంచి రేపు బైటికి వస్తాడు. వెల్లూరు నుంచి మద్రాసు వెళ్ళి ఆ కుటుంబపు మంచి చెడ్డలు చూసి వచ్చేసరికి పది పదిహేను రోజులు పట్టొచ్చు. ఎల్లుండి నేను విశాఖపట్నం వెళ్తున్నాను. నటాషాను చూసి వస్తాను.”

“తీసుకు రావా?”

“మధ్యలో బడి మార్చటం ఎందుకు? వచ్చే ఏడు ఇక్కడి బళ్ళో చేర్పిస్తా,

“అదే నయంలే. నీ ప్రాక్టీసు మీద పూర్తిగా దృష్టి పెట్టి మళ్ళీ పుంజుకోటానికి బాగా కష్టపడాలి”.

“ఔను. డాక్టరమ్మ ఇంకెక్కడికీ పోదనే నమ్మకం కలగాలి” నవ్వింది శారద. అబ్బయ్య బెజవాడలో తన స్నేహితులను కలిసి వస్తానని వెళ్ళాడు.

అన్నపూర్ణ సుబ్బమ్మకు వంటలో సాయం చేస్తానంటే శారద ఆసుపత్రికి వెళ్ళింది.

ఆ రోజంతా ఉండి మర్నాడు ఉదయం గుంటూరు వెళ్ళిపోయారు అన్నపూర్ణ అబ్బయ్యలు.

నెమ్మదిగా అన్నీ స్వాధీనంలోకి వస్తున్నాయి శారదకు, డబ్బు అప్పగా దొరికింది. ఆస్పత్రికి ఒకొక్కటీ సమకూరుతున్నాయి.

శారద సాయంత్రాలు ఇంటింటికీ వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందీ కనుకుని, అవసరమైన వైద్యం చేసి వస్తోంది. ఒకసారి శారదను చూసి, వైద్య సహాయం పొందినవాళ్ళు ఆమెను మర్చిపోలేరు. వాళ్ళకు బోలెడంత ధైర్యం శారదను చూస్తే. మెల్లిగా ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. పది, పదిహేను రోజుల్లో వస్తాడనుకున్నమూర్తి నెలరోజులకు గానీ రాలేదు. మద్రాసులో ఉండవలసి వచ్చిందని మూర్తి చెబితే శారద విని ఊరుకుంది. దేనిని ఎవరినీ ప్రశ్నించకుండా తన పనిలో మునిగిపోతేనే శాంతిగా ఉంటోంది.

మధ్యాహ్నం రెండు గంటల వరకూ పేషెంట్లు వస్తూనే ఉన్నారు. సంక్రాంతి పండగ వెళ్ళిన దగ్గరనుంచీ మామూలుగా డాక్టర్ల దగ్గర రద్దీ పెరుగుతుంది. శారద దగ్గిర మరింత పెరిగింది. చివరి పేషెంటుని చూసి పంపించి ఇంటికి వెళ్ళటానికి లేచింది. లక్ష్మి మెల్లిగా దగ్గరకు వచ్చి ఏదో చెప్పాలన్నట్లు నిలబడింది.

“ఏంటి లక్ష్మీ డబ్బేమైనా కావాలా?

“కాదు డాక్టర్ గారూ – ఇవాళ సాయంత్రం నేను రాను. మీరేమి అనుకోకపోతే నాలుగు రోజులు శలవు తీసుకుంటాను.”

“ఎందుకు? ఎక్కడికి వెళ్తావు?” కుతూహలంగా అడిగింది శారద. “చలం గారింటికమ్మా వాళ్ళు ఊరొదిలి వెళ్ళిపోతున్నారంట. నాలుగు రోజులు వాళ్ళకు సాయంగా ఉండొస్తాను.”

శారద లక్ష్మి ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. డాక్టర్ రంగనాయకమ్మ శారద జైల్లో ఉండగా చనిపోయారు. శారద విడుదలై వచ్చాక వెళ్ళి చలంగారిని, పిల్లలను పరామర్శించి రావాలని అనుకుంటూనే ఉంది. మొదటి రెండు నెలలూ ఆస్పత్రిని బాగు చేసుకోవటంలో అన్నీ మర్చిపోయింది. తర్వాత వెళ్దాం వెళ్దాం అనుకుంటూనే రోజులు గడిపేసింది. వెళ్ళి వాళ్ళ బాధను చూడగలిగే ధైర్యం లేకపోయిందా? ఇంత ఆలస్యం చేశానేమిటి? అనుకుంటూ

“ఎక్కడికి వెళ్తున్నారట?”

“తిరువణామలై వెళ్తారటమ్మా” అంది లక్ష్మి

“సరే నేనూ వస్తాను సాయంత్రం. నువ్వెళ్ళు. వెళ్ళి వాళ్ళకు కావలసినన్ని రోజులు అక్కడ ఉండు. ఇక్కడ పనుల గురించి మేం చూసుకుంటాంలే ఏం మంగమ్మా – చూసుకోలేమా?”

మంగమ్మ నవ్వి “ఎందుకు చూసుకోలేం. వెళ్ళి రా లక్ష్మీ” అంది. సాయంత్రం ఐదుగంటలకు తనకు తోచిన పళ్ళూ ఫలహారాలూ పట్టుకుని చలం గారింటికి వెళ్ళింది శారద.

చలంగారొక్కరే వరండాలో కూర్చుని ఉన్నారు. వాతావరణమంతా నిశ్శబ్దంగా ఉంది. శారద వెళ్ళి దూరంగా ఉన్న కుర్చీని ఆయనకు దగ్గరగా లాగి కూర్చుంది.

ఆయన చిరునవ్వు నవ్వి “డాక్టరు గారు లేరుగా” అన్నారు. శారదకు దు:ఖం ముంచుకొచ్చింది. దానిని నిర్ధాక్షిణ్యంగా వెనక్కి నెట్టి “అప్పడు నేను జైల్లో ఉన్నాను” అంది అంతకంటే ఏమనాలో తెలియక,

“నేనూ జైల్లోనే ఉన్నాను” అన్నారు చలం.

శారద అదేమిటన్నట్టు చూసింది.

“మీరంతా ఉన్న జైలు కాదు. ఇంకో జైలు. ఈ ప్రభుత్వాలు కట్టించినవే జైళ్ళనుకుంటారు. చాలా జైళ్ళన్నాయి. డాక్టరుగారు ఏ జైలుకీ దొరకుండా తప్పించుకుని పోయారు” మళ్ళీ చిన్నగా నవ్వి

“కమ్యూనిస్టులందర్నీ చంపేస్తున్నారటగా. నాకూ కమ్యూనిస్టవాలనుంది. ఎట్లాగో చెప్తావా?”

శారద మాట్లాడలేదు కాసేపు.

“మీరు తిరువణామలై వెళ్తున్నారట”.

“ఔను, రమణ మహర్షి పిలుస్తున్నారు రమ్మని. అందరం వెళ్తున్నాం. ఈ ఆంధ్రదేశంలో ఉండలేను నేనిక”.

“మళ్ళీ ఎప్పడొస్తారు?” “నేనా? నేనిక ఈ దేశం రాను. ఏముందిక్కడ? ఎవరున్నారు?”

“అక్కడ మాత్రం ఎవరున్నారు? ఆశ్రమంలో ఆ నియమాల్లో మీరుండలేరు”.

అక్కడ ఎవరూ లేరనేగా వెళ్ళేది. నేను ఆశ్రమంలో ఉంటానని మీరెందుకనుకున్నారు?”

“స్త్రీల విషయంలో అంత హేతుబద్ధంగా ఆలోచించే మీరు రమణమహర్షి ఫిలాసఫీనెలా అంగీకరిస్తారు?”

“భగవాన్ గురించి మీకు తెలియదు. ఆయన చూపే హేతువుని మీరు అంగీకరించరు కాబట్టి అది హేతుబద్ధం కాదంటారు. నాకు ఆయన అర్థమవుతాడు.

మీకు అర్థం కాడు. మనం మాట్లాడుకోవటం ఎందుకు?”

“మీరు లేని బెజవాడ – ”

“బెజవాడకు నేను తగను. ఐనా పాపం ఇన్నాళ్ళు భరించింది. నిజానికి నీకూ ఇది తగినది కాదు. ఇద్దరం ఇరుకుపోయాం. నేను తప్పించుకుని పోతున్నాను. నువ్వు తప్పించుకోలేవు. నీకు రాజకీయాలు కావాలి గదా”

“రాజకీయాలు అందరికీ కావాలి”.

“అందరినీ అలా అనుకోనివ్వండి, మీరు కొందరే ఎందుకు ఆక్రమించుకుంటారు” శారదకు ఆ సంభాషణ కొనసాగించాలనిపించలేదు.

“డాక్టర్ గారి గురించి చెప్పండి”

“గొప్ప మనిషి ఉన్నతం ఆమె. ఆమెకు మీరంటే ఇష్టం. చెబుతుండేది మీ గురించి” శారద ముఖంలో విషాదం చూసి,

“బాధపడవద్దు ఆమె కోసం, మన కోసం మనం బాధలు పడక తప్పదు. ఆమె గురించి ఇంకా మాట్లాడాలంటే లోపలికి వెళ్తే  వాళ్ళూ ఉన్నారు.”

శారద ఆ మాటల అర్థం గ్రహించి లేచి లోపలికి వెళ్ళింది. ఇల్లంతా ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లుగా ఉంది. ఏవో మూటలు, పెట్టెలు ముందు పెట్టుకుని కూర్చున్నారు పౌ, నర్తకి.

శారదకు వాళ్ళతో అంత పరిచయం లేదు. వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంది. పౌ డాక్టర్ రంగనాయకమ్మ చివరి ప్రయాణం గురించి చెప్పింది.

“నాన్నకు పెద్ద దెబ్బ తగిలినట్లయింది. అందుకే భగవాన్ దగ్గరకు వెళ్తున్నాం” అంది. వాళ్ళిద్దరినీ చూస్తే చలంగారి గురించి దిగులు పడనవసరం లేదనిపించింది.

వీళ్ళ ప్రేమ ఆయన్ని కాపాడుతుంది అనిపించింది. కానీ వీళ్ళేం చేస్తారు అక్కడ? ఆ ప్రశ్నకు సమాధానం కాలం చెప్పాల్సిందే. కాసేపు ఆ మాటా, ఈ మాటా మాట్లాడి, ఏం కావాలన్నా తనకు లక్ష్మితో కబురు చెయ్యమని చెప్పి బైటికి వచ్చింది.

చలంగారు అలాగే కూచుని ఉన్నారు శూన్యంలోకి చూస్తూ, ఆయనకు నమస్కారం చేసింది. చిరునవ్వే సమాధానం, వీడ్కోలు కూడా.

వేసవి శలవులకు నటాషా బెజవాడ వచ్చింది. ఎదిగే వయసులో తల్లికి దూరంగా ఉండటం వల్లనేమో నటాషాకు శారద దగ్గర అంత చనువు లేదు. శారదక్షిప్పుడు క్షణం తీరిక లేదు. ప్రాక్టీసు విపరీతంగా పెరిగింది. సాయంత్రం తనే ఇళ్ళకు వెళ్ళి వైద్యం చేయటం మానకపోవటంతో రాత్రిళ్ళు కూడా ఆలస్యం అవుతోంది. కాన్పు కేసులుంటే రాత్రంతా ఆస్పత్రిలో గడిపేస్తోంది. మూర్తి మళ్ళీ ప్రాక్టీసు పెడదామా అని ఆలోచిస్తున్నాడు, శారదకు చాలా ఇష్టమైన రాజమ్మ, కోటేశ్వరమ్మ, సూర్యావతి అందరూ జైలు నుంచి విడుదలై అట్నించి అటే అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఎవరైనా వస్తారేమో అని ఎదురుచూడటం మానలేదు శారద, తనతో కలిసి పనిచేసిన వారి మరణ వార్తలు విన్నరోజు ఏ పనీ చెయ్యలేని నిస్సత్తువ కమ్ముతుంది.

“ఎందుకు ఆపరు ఈ పోరాటాన్ని?” సమాధానం చెప్పేవాళ్ళు లేరు. రామస్వామి తనలాగే పార్టీతో విబేధిస్తున్నానని చెప్పి జైలునుంచి విడుదలయ్యాడు. ఆయనను పార్టీ బహిష్కరించిందని చెప్పి బాధపడ్డాడు. విబేధాలున్నపుడు చెప్పకుండా ఎట్లా? నేను రహస్య సమాచారాలేమీ చెప్పలేదే నన్ను ఇట్లా చెయ్యటం ఏమిటి అని ఆయన దుఃఖిస్తుంటే “ఒకసారి ఇదంతా ముగిశాక మనందరం మళ్ళీ పార్టీలో పనిచేస్తాం. బాధ పడకండి” అని ధైర్యం చెప్పింది.

ఒకరోజు మూర్తి ఒక వార్తతో వచ్చాడు.

“మనవాళ్ళు రష్యా వెళ్ళారట”.

“ఎందుకు?” ఆశ్చర్యపోయింది శారద.

“స్టాలిన్తో మాట్లాడి అ ప్పుడు తేల్చుకుంటారట పోరాట విరమణ చెయ్యాలా లేదా అని”

శారద నిర్ధాంతపోయింది. “స్టాలిన్కెలా తెలుస్తుంది. పోరాటం మొదలుపెట్టి, నిండా దానిలో మునిగి, దానిని

నడిపిస్తున్న వీళ్ళకు తెలియనిది స్టాలిన్కెలా తెలుస్తుంది?”

“ఏమో – వెళ్ళిన మాట మాత్రం నిజం”,

“నాకు నమ్మాలనిపించటం లేదు. ఇదంతా ప్రభుత్వ ప్రచారమేమో”. “కాదు శారదా, నాకు నమ్మకంగా తెలిసింది. స్టాలిన్ ఏం చెబుతాడో ఏంటో?”

‘అది పోరాటం గురించి వీళ్ళు చెప్పే దాని మీదనే ఆధారపడుతుంది. ఆయన ఇక్కడి వార్తలను రోజూ చదివి, పోరాటాన్ని అధ్యయనం చేసేంత తీరికగా ఉన్నాడా? యుద్ధం ముగిసిన తర్వాత దేశ నిర్మాణంలో మునిగి ఉండడూ? ఆయన ఏం చెబితే అది చేస్తారా? నవ్వాలా? ఏడవాలా? తెలియటం లేదు. శారదకు కోపంగా ఉంది. బాధగా ఉంది. నిజంగా ఏడవాలని ఉంది. అన్ని ఉద్వేగాలనూ అణుచుకుని తన పనిలో తను మునిగిపోయింది. కొద్దికాలంలోనే పోరాట విరమణ గురించిన ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన రావటంతో శారదకు కాస్త తెరిపి చిక్కినట్లయింది. నెమ్మదిగా పరిస్థితి చక్కబడుతుంది. అజ్ఞాతంలో ఉన్న కామైడ్స్ తిరిగి వస్తారు. జైళ్ళలో ఉన్నవారు విడుదలవుతారు. మళ్ళీ ఒక అంతర్గత చర్చ మొదలవుతుంది. సంవత్సరంలో పరిస్థితి చక్కబడి మళ్ళీ పార్టీలో పనిచేయవచ్చు అనుకుంటే ఒక వంక ఆనందం మరో వంక దు:ఖం. అమ్మా అంటూ వచ్చిన నటాషాను దగ్గరగా తీసుకుని రెండు చెంపలూ ముద్దు పెట్టుకుంది. నటాషా అడిగిన వాటికన్నీ ఒప్పకుంది. మూర్తి కోసం ఎదురుచూస్తూ కూర్చుంది.

* : * :

శారద అనుకున్న సంవత్సరం గడిచింది గానీ, మిత్రులెవరూ కలవలేదు. శారదను మూర్తిని చర్చలకో మీటింగులకో పిలవలేదు. అజ్ఞాతం నుండి తిరిగొచ్చిన వాళ్ళు కూడా శారదతో మాట్లాడేందుకు రాలేదు. పార్టీ విధానాన్ని తప్పుబట్టిన చాలామందిని ఆత్మ విమర్శ చేసుకోమని తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. శారద విషయంలో అలా జరగలేదు. రామస్వామి గారిని కూడా చేరమన్నారనీ ఆయన తన ఆత్మాభిమానానికి దెబ్బ తగిలిందని తిరిగి పార్టీలోకి వెళ్ళలేదని తెలిసింది.

కొన్ని రోజుల తర్వాత ఆయనే స్వయంగా వచ్చాడు. రామస్వామికి శారదంటే చాలా అభిమానం, గౌరవం. ఆయన తన నిర్ణయూన్ని శారదకు వివరించాలనుకున్నాడు.

శారద ఆయన చెప్పింది విని ఆయన చేసింది సరైనదైనని గట్టిగా చెప్పింది. “మీరు మీ నిర్ణయం స్వతంత్రంగా తీసుకున్నారు. దానితో తప్పేమీ లేదు. మీలాంటి వాళ్ళను పోగొట్టుకున్న పార్టీ నష్టపోతుంది”.

“మీలాంటి వాళ్ళను పోగొట్టుకోలేదా? మీ విలువ తెలుసుకోలేదు గదా”

“వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉండి ఉంటాయి” పేలవంగా నవ్వింది శారద.

“మీ వృత్తి మీద మీరు కేంద్రీకరించండి. అది తక్కువ ప్రజాసేవ కాదు.”

‘అది నేనెప్పడూ ఆపలేదు. ఇప్పడు మరింత సమయం దొరికింది. మరింత పని పెంచుకోకపోతే నేను బతకలేను” జైళ్ళలో ఉన్నవారి గురించీ, చనిపోయిన వారి గురించీ మాట్లాడుకుంటుంటే కాలమే తెలియలేదు.

శారదకు ప్రసూతి కేసు ఉందని కబురొచ్చింది. రామస్వామి గారికి వీడ్కోలు చెప్పి శారద ఆస్పత్రికి వెళ్ళింది.

:* ::: *** ***

1952 జనవరిలో ఎన్నికలనే నోటిస్ వచ్చింది. రాజకీయ పార్టీలన్నీ రంగంలోకి దిగాయి. కమ్యూనిస్టులకు పోరాట విరమణ చేశామనే నిస్పృహ లేకుండా ఎన్నికలలో గెలిచి తమకు ప్రజాబలం ఉందని నిరూపించుకోవాలనే ఉత్సాహం పెరిగింది.

కాంగ్రెస్ లో గ్రూపులు ఎక్కువైపోయాయి. ప్రకాశంగారు నిండా సంవత్సరం పని చేశాడో లేదో ఆయనను దించి ఒమండూరు రామస్వామి రెడ్డియారుని ముఖ్యమంత్రిని చేసేవరకూ కామరాజ్ నిద్రపోలేదు. వాళ్ళిద్దరికీ కూడా సంవత్సరం కన్నా పొసగలేదు. కాంగ్రెస్ పార్టీ లోపలే ఆయన మీద విశ్వాస రాహిత్య తీర్మానం పెట్టి నెగ్గించి కుమారస్వామి రాజాను ముఖ్యమంత్రిని చేశారు. ఆ మంత్రి వర్గం మీద ప్రజలకు అసలు విశ్వాసం లేకుండా పోయింది. దాంతో కాంగ్రెస్ వాళ్ళు చాలా రకాల ప్రయత్నాలు చెయ్యందే గెలవలేమనుకున్నారు. ఆంధ్ర ప్రాంతంలో ప్రజలలో కమ్యూనిస్టుల మీద చాలా సానుభూతి వచ్చింది. పైగా 1952లో మొదటిసారిగా రైతు కూలీలు హరిజనులు ఓటర్లయ్యారు. జమిందార్లకు, ధనిక రైతులకు వ్యతిరేకంగా పనిచేసే కమ్యూనిస్టులంటే వారికి అభిమానం ఉండటంలో ఆశ్చర్యం లేదు. గెలవటానికి కావలసిన ప్రచార దళాలు, సాహిత్యం, అన్నీ సమరోత్సాహంతో నిండి ఉన్నాయి. శారద ఎన్నికలను దూరం నుంచి చూస్తూ తన దగ్గరకు వచ్చేవారిలో కొందరికి ప్రత్యక్షంగా మరికొందరికి పరోక్షంగా కమ్యూనిస్టులకు ఓటెయ్యమని చెబుతూ వైద్యం మీద మనసు లగ్నం చేసింది. నటాషా చదువు ఉండనే ఉంది. ఏ కొంచెం సమయం దొరికినా నటాషాతో ఆటలు పాటలు చదువులు వీటితో ఆనందంగానే ఉంటోంది. మూర్తి అసంతృప్తిగా ఉండటం శారదకు తెలుస్తూనే ఉంది. అతనికిప్పడు పని లేదు. పార్టీ కోసం మద్రాసులో ఉన్న కాస్త ప్రాక్టీసు ఒదులుకుని బెజవాడ వచ్చేశాడు. ఇప్పుడు పార్టీ పని లేదు. మళ్ళీ మద్రాసు ప్రాక్టీసంటే – ఒకవైపు ఆంధ్ర రాష్ట్రం కావాలనే ఉద్యమం ఊపందుకుంది. తీరా మద్రాసులో

కోర్టు కెళ్ళటం మొదలు పెట్టగానే హైకోర్టు బెజవాడకే రావొచ్చు మరింకెక్కడికైనా రావొచ్చు. అప్పడు మళ్ళీ కథ మొదట్నించీ మొదలుపెట్టాలి. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరూ ఇవ్వగలిగినవి కావు. పుస్తక పఠనంతో ఎంత కాలం గడపాలా అని మధన పడటం శారద గమనించింది. అందువల్లే అతను మద్రాసు తరచు వెళ్తున్నా అతని పరిస్థితి అర్ధం చేసుకుంది. మూర్తికి బెజవాడలో కంటే మద్రాసులో స్నేహితులెక్కువ. వృత్తిపరమైన చర్చలకు కూడా అదే అనువైన ప్రదేశం. “నాకీ ప్రాక్టీసు లేకపోతే ఏమయ్యేదాన్ని పిచ్చెక్కిపోయేది. పాపం మూర్తి” అని అతనికి తన సహకారం పూర్తిగా ఇచ్చింది.

దుర్గాబాయి ఎన్నికలలో పోటీ చేస్తుందంటే శారదకు చాలా సంతోషమనిపించింది. దుర్గ గెలిచి కేంద్రంలో మంత్రయితే దేశానికి చాలా మేలు జరుగుతుందని అనేకమంది లానే శారదా ఆశపడింది. దుర్గ ఎన్నికల ప్రచారంలో తాను కూడా పాల్గొందామంటే దుర్గకు పోటీగా కమ్యూనిస్టు పార్టీ తన అభ్యర్థిగా కంతేటి మోహనరావుని నిలబెట్టింది. కమ్యూనిస్టుకి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యలేననిపించింది శారదకు, దుర్గ గురించి రాజమండ్రిలో ఎవరు చేసే ప్రచారం మాత్రం ఏముంటుంది. రాజమండ్రిలో ఎన్ని చైతన్య దీపాలు వెలిగించింది దుర్గ, అక్కడికి తను వెళ్ళి దుర్గను గురించి మాట్లాడటం అనవసరం అనుకుంది. రాజమండ్రిలో దుర్గ గెలవకపోతే మరింకెవరు గెలుస్తారు. ఈ ఆలోచనలతోనే దుర్గకు తన అభినందనలు తెలుపుతూ ఉత్తరం రాసింది.

అన్నపూర్ణ రాజమండ్రిలో ప్రచారానికి సిద్ధమై వచ్చింది.

దుర్గాబాయి గారితో నీకున్నంత స్నేహం నాకు లేదుగదా. కాస్త రికమెండేషన్ లెటర్ సిఫారసు చేస్తూ ఉత్తరం ఇస్తావేమోనని వచ్చాను” అంది నవ్వుతూ,

“నువ్వూ పోటీ చెయ్యాల్సింది అన్నపూర్ణా అంది శారద, అన్నపూర్ణ విరగబడి నవ్వింది. నవ్వి నవ్వి ఆయాసపడి ఆగి

“ఎన్నికలంటే ఏంటనుకున్నావు? డబ్బు, పెద్ద నాయకుల అండ ఇవన్నీ కావాలి.”

“దుర్గాబాయి డబ్బు ఖర్చు చెయ్యనవసరం లేదు. ప్రజలు ఆమె పేరు చూసి ఓటేస్తారు కదూ – ఆమె అంటే రాజమండ్రి ప్రజలకు కన్న కూతురు లాంటిది, తోడబుట్టిన చెల్లెలివంటిది. ఎన్ని పనులు చేసింది. ముఖ్యం రాజ్యాంగ సభ సభ్యురాలిగా నెగ్గుకు వచ్చింది.”

“నాకూ చాలా గౌరవం. అందుకే ఎన్నికల వరకూ రాజమండ్రిలో ఉండి దుర్గాబాయమ్మ గారికి కావాల్సిన సహకారం అందించి వద్దామని బయల్దేరా”.

“అవసరమైతే నాకూ కబురు చెయ్యవోయ్ నేనూ వస్తానోయ్”,

“అంత అవసరం రాదు. ఒక కమ్యూనిస్టు మీద పోటీ చేస్తున్న దుర్గాబాయి తరపున మరొక కమ్యూనిస్టు ప్రచారం చేయటం వింతగానే ఉంటుందనుకో – నవ్వింది అనుపూర్ణ

శారద కూడా నవ్వింది. ఆ నవ్వులో కొంచెం విషాదం కలగలిసింది.

“బాధపడకు శారదా – ”

“బాధ లేకుండా ఉండడోయ్. దాదాపు పాతికేళ్ళు ఊపిరిగా పీల్చుకున్న విశ్వాసాలు, పెంచుకున్న ఆశయాలు ఎలా తుడిచివేయగలం? ఒక్కోరోజు రాత్రి అంతా గుర్తొచ్చి గుండె నీరయిపోతుంది. అందరూ గుర్తొస్తారు. అసలేమీ అర్థం కానట్లుంటుంది. ఎందుకిలా ఎందుకిలా అని పిచ్చిగా ప్రశ్నిస్తాను. కానీ సమాధానం చెప్పేదెవరు? కాలం ఒకటే – కాలం చెప్పింది. నేననుకున్నది సరైనదని. పోరాట విరమణ చెయ్యాలని అందరూ అనుకున్నారు. చేశారు. అదే మాట వాళ్ళకంటే ముందు చెప్పటం నేరమెలా అవుతుందో దానిని వాళ్ళెలా సమర్ధించుకుంటున్నారో నాకు తెలియదు. సరే – పోనీ – నేను ఒక కమ్యూనిస్టుగానే జీవిస్తున్నాను. సభ్యత్వం పార్టీలో లేదేమో. కానీ ఆ విలువలు, పాటించే వారిలో నేనూ సభ్యురాలినే, సహచారినే. నడుస్తూనే ఉంటాను. నడక ఆపకపోవటం ముఖ్యం. నడకే ముఖ్యం. ప్రయాణమే అసలు విషయం. సారాంశం” ఆవేశంగా మాట్లాడుతున్న శారద చేతులను ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకుంది అన్నపూర్ణ

“సాయంత్రం రైలుకి మా అమ్మాయి స్వరాజ్యం వస్తుంది శారదా. ఈ నెల రోజులూ నీతో ఉంటుంది.

“ఔనా – మరి చెప్పవేం ఇంతసేపూ. స్వరాజ్యం వస్తే ఇల్లు కళకళలాడుతోంది. నటాషాకూ బాగుంటుంది”.

“మన స్నేహం పిల్లలకు అర్థం కావాలనే స్వరాజ్యాన్ని బతిమాలి ఒప్పించాను. గుంటూరు ఒదిలి ఎక్కడికీ వెళ్ళదు. శారదానికేతన్లో పాఠాలు చెబుతుంది గదా – అదే కాలక్షేపం, పెళ్ళి చేసుకోమంటే ఒద్దంటుంది. వచ్చే ఏడు విశాఖపట్నం పంపి ఎమ్మే అన్నా చదివించాలంటున్నాడు వాళ్ళ నాన్న

“ఔ నోయ్. బియ్యేతో ఆపటం ఏంటి? అవకాశాలు లేని వాళ్ళు లేక చదవటం లేదు. స్వరాజ్యం చదవక పోవటమేమిటి?”

“అది చదువుతాననే అంది – పోయినేడాది చేరవలసింది. సరిగ్గా అదే సమయానికి ఆరోగ్యం పాడయి సంవత్సరం వృధా అయింది. పెళ్ళి – ?”

“అన్నపూర్ణా – నువ్వు కూడా పెళ్ళంటావేమిటోయ్ – హాయిగా చదువుకుని ఉద్యోగంలో చేరి అప్పడాలోచించవచ్చులే — ” అన్నపూర్ణ కూతురు తన దగ్గర నెల రోజులుంటుందంటే శారదకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది.

ఆ రాత్రి కూతురిని శారదకప్పగించి రాజమండ్రి రైలెక్కింది అన్నపూర్ణ, శారదంటే స్వరాజ్యానికి ఇంతకు ముందు గౌరవంతో పాటు భయం కూడా ఉండేది. ఆ భయంతోనే తల్లి రమ్మంటే వెంటనే ఒప్పకోలేదు. ఇరవై ఏళ్ళ స్వరాజ్యం శారదను చాలా తక్కువసార్లే చూసింది. చూసినపుడు శారద చొరవ, ఠీవి, ఎవరితోనైనా సూటిగా మాట్లాడే తీరూ ఇవన్నీ స్వరాజ్యానికి కొంత బెరుకు కలిగించాయి, అదంతా రెండు రోజుల్లో పోయేలా చేసింది శారద. స్వరాజ్యం శారదను పెద్దమ్మా అని పిలవటం మొదలుపెట్టింది. నటాషా అక్కా అక్కాఅంటూ స్వరాజ్యాన్ని ఒదలటం లేదు. ఇద్దరికీ పదకొండేళ్ళ తేడా. స్వరాజ్యం వెనకాలే తిరుగుతూ ఏవో కబుర్లు చెప్పటం అలవాటయింది నటాషాకు. శారద దగ్గరున్న పుస్తకాలు స్వరాజ్యానికి ప్రధానాహారం, చిరు తిండి కూడా అయిపోయాయి. సుబ్బమ్మగారు “ఈ స్వరాజ్యం చూడు. అన్నం తింటూ కూడా పుస్తకం వదలదు” అని చెప్తే “భేష్ అని మెచ్చుకున్నారు మూర్తి, శారదలు.

అబ్బయ్య దగ్గర ఇన్ని పుస్తకాలు, ఇంత వైవిధ్యమైన సాహిత్యం లేదు. ముఖ్యంగా ఆంగ్ల సాహిత్యం ఇంత లేదు. స్వరాజ్యం ఆ పుస్తకాల మీద పడింది.

మూర్తి రోజూ కాసేపు ఎవరో ఒక రచయిత గురించి స్వరాజ్యానికి చెప్తున్నాడు.

ఆ రోజు శారద పెందలాడే హాస్పిటల్ నుండి వచ్చింది. వరండాలో చల్లగాలి వీస్తోంది. అక్కడ కూర్చుని మూర్తి షేక్స్పియర్ నాటకాల గురించి స్వరాజ్యానికి చెబుతుండగా శారద వచ్చింది. తనూ కాసేపు వింటూ కూచుని పైకి వెళ్ళి హామ్లెట్ పుస్తకం తెచ్చింది,

“హామ్లెట్ గురించి అంత చెప్పాము. కాస్త చదివి రుచి చూపిద్దామోయ్ మనమ్మాయికి. మనం చదివి కూడా చాలా రోజులయింది కదా” మూర్తి ముఖం వికసించింది. అది వరకు ఎంత ఒత్తిడి పనిలోనూ కాసేపయినా కలిసి ఒక పుస్తకంలో కొన్ని పేజీలైనా చదివేవారు. కలిసి ఒక పాటైనా పాడుకునేవారు. రెండేళ్ళుగా స్తబ్దత – ఏ పని మీద ఆసక్తి లేకుండా ఎవరి పని వారిదన్నట్లు బతుకుతున్నారేమో స్వరాజ్యం పుణ్యమా అని మళ్ళీ సాహిత్యం వారి మనుగడలోకి వచ్చింది.

ఒఫీలియా, హామ్లెట్ ల సంభాషణలున్న భాగం తీసి పక్కపక్కనే కూచుని భావయుక్తంగా నాటకంలా చదువుతుంటే స్వరాజ్యానికి ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది. వాళ్ళిద్దరూ ఆ పిల్లకు మానవమాత్రులుగా కనిపించలేదు. ఆ రాత్రివేళ హామ్లెట్ ఒఫీలియాలు నిజంగానే మాట్లాడుకుంటుంటే తను వింటున్నాననిపించింది. ఆ ఘట్టం చదివాక మూర్తి హామ్లెట్ సోలిలోక్వి తనొకడే చదివాడు. ఆ రాత్రి అతని గంభీరమైన కంఠస్వరం హామ్లెట్ సందిగ్ధతను పలికించిన తీరుకి పులకించింది శారద.

“ఎన్నాళ్ళయిందోయ్ నువ్విలా చదివి అని అతని చేయి పట్టుకుని భుజం మీద తలవాల్చింది.”

మూర్తి కూడా వివశుడయ్యాడు.

వారిద్దరినీ వారి ఏకాంతానికి ఒదిలి స్వరాజ్యం మెల్లిగా లేచి లోపలికి వెళ్ళింది. చల్లని ఆ రాత్రి వెన్నెల వారి మనసులలోని అశాంతిని చల్లబరిచింది. ఎంతోసేపూ వారిద్దరూ అలా కూచుని వుండిపోయారు, ఇద్దరి చెంపలూ తడిసి, గాలికి ఆరిపోతూ, మళ్ళీ తడుస్తూ ఆ రాత్రి గడిచిపోయింది.

తమ తమ ఒంటరితనాల నుంచి బైటపడేసిన స్వరాజ్యాన్ని ఎంతగానో ప్రేమించారు ఇద్దరూ. స్వరాజ్యానికి వాళ్ళిద్దరంటే ఆరాధన వంటి భావన కలిగింది. ముగ్గురూ నటాషాతో కలిసి ఆడుతూ పాడుతూ రోజులు గడుపుతుంటే నెల ఎట్లా గడిచిందో తెలియనే లేదు.

మధ్యలో అన్నపూర్ణ ఉత్తరం కొంత ఆందోళన కలిగించినా శారద ఈ ఆనందంలో దాన్ని పక్కకు నెట్టింది. ఒక రోజు సరస్వతీ, గోరాలను, వాళ్ళ పిల్లలను, మెల్లీని, లక్ష్మణరావుగారిని తను ఇంటికి భోజనానికి పిలిచింది. ఆదివారం పూర్వపు సందడంత కాకపోయినా ఇల్లు పెద్దల రాజకీయ చర్చలతో పిల్లల సాహిత్య చర్చలతో నటాషా ఆటలతో గడిచిపోయింది.

అప్పటికే లక్ష్మణరావు గారు అతడు — ఆమె నవల రాయటం, అది శారద

చొరవతో ప్రచురించటం జరిగిపోయింది. ప్రచురణ బాధ్యత కూడా శారదే తీసుకుంది. ఆ నవల మీద సమీక్షలు రాలేదని లక్ష్మణరావు గారు బాధపడుతుంటే – “దానిని సమీక్షించటం అంత తేలిక కాదు. మీరు తొందరపడొద్దు. ఆంధ్రదేశం ఆ నవలను నెత్తిన పెట్టుకుంటుంది. దానికి న్యాయం చేసే విమర్శలూ వస్తాయని” శారద, సరస్వతి, మూర్తి ఓదార్చారు. మెల్లీ నవ్వుతూ తనూ అదే అనుకుంటున్నానన్నది. అందరూ స్వరాజ్యాన్ని కూచోబెట్టి అభిప్రాయం చెప్పమన్నారు. ఆ అమ్మాయి కిందటి వారమే ఆ నవల చదివింది. స్వరాజ్యం చటుక్కున “పెద్దమ్మ, పెదనాన్నలను గురించి రాసినట్టుంది” అన్నది.

అందరూ నవ్వారు.

“మరీ నేను శాస్త్రంత లౌక్యుడినా” అన్నాడు మూర్తి

“అదంతా కాదు మీరలా ప్రేమగా ఉంటారు” అంది స్వరాజ్యం సిగ్గుపడుతూ,

“వీళ్ళిద్దరూ నాకు ఇన్స్పిరేషనే – క్రాకపోతే నవలలో కల్పన పాలు ఉండాలి కదా – ” అన్నారు లక్ష్మణరావుగారు.

“మా శారద మీ శాంతం కంటే గొప్పది. రాజీపడదు” అంది సరస్వతి,

“నిజం” అంది మెల్లి.

అంతలో సాయంత్రం ఫలహారాలొచ్చాయి. చర్చ కూడా దారి మళ్ళి ఎన్నికల వైపు తిరిగింది.

“ఉండండి. అన్నపూర్ణ రాసిన ఉత్తరం చదువుతాను” అంటూ లోపలికి వెళ్ళి ఉత్తరం తెచ్చింది శారద, అందరూ ఆసక్తిగా సరుకుని కూర్చున్నారు.

ప్రియమైన శారదా –

ఇక్కడికి వచ్చి పదిహేను రోజలవుతున్నది. మొదటి వారం ఉత్సాహంగా నియోజక వర్గాన్ని చేయాల్సిన పనుల్ని తెలుసుకోటానికే సరిపోయింది. కమ్యూనిస్టు అభ్యర్థి కంతేటి మోహనరావుకి మంచి పేరే ఉంది గానీ దుర్గాబాయి పోటీ చేసినపుడు ఆమెను కాదని ప్రజలు ఇంకెవరికి ఓటేస్తారు అనుకుని చాలా ఉత్సాహంగా పనిలో పడ్డాను. కానీ వారం తిరక్కుండానే ఎన్నో లోతులు చూపించారు. ఇప్పుడు నాకు భయంగా ఉంది. దుర్గాబాయి గెలుపు అంత తేలిక కాదనిపిస్తోంది.

కేవలం కమ్యూనిస్టుల బలమే అయితే నాకు భయం ఉండేది కాదు. జయాపజయాలు దైవాధీనాలు అనుకునో, కమ్యూనిస్టులు ప్రజల్లో అంతగా పాతుకుపోయారనో అనుకుని ఉండేదాన్ని కానీ ఇక్కడ జరుగుతున్నదేమిటంటే కాంగ్రెస్ వాళ్ళే దుర్గాబాయికి ఓటెయ్యవద్దని చెబుతున్నారు. లోపల లోపల చాలా కథలు జరుగుతున్నాయి. అసలు కారణం దుర్గాబాయి ఆడది. కేవలం ఆడది మాత్రమే కాదు. అఖండ మేధా సంపత్తి, అపారమైన దేశభక్తి, అంకితభావం, నిజాయితీ, ప్రజాసేవ తప్ప ఇంకొక ధ్యాస లేకపోవటం, నెహ్రూగారికి దుర్గాబాయి గారంటే ఉన్న గౌరవం వీటన్నిటివల్లా స్థానిక కాంగ్రెస్ పెద్దలు దుర్గాబాయి ఓడిపోవాలని కోరుకుంటున్నారు. దుర్గాబాయి గెలిస్తే మంత్రి పదవి తప్పదు. నెహ్రూ గారు ఆ సంకేతాలు ఇచ్చారు. జిల్లా నుంచి ఆవిడ మంత్రయితే జిల్లాలో ఈ మగపురుషుల అవినీతి పనులను సాగనిస్తుందా? ఆవిడ నిజాయితీతో జిల్లా బాగుపడుతుంది గానీ ఈ పెద్దలు నష్టపోతారు. ప్రజలు అందరూ నేరుగా ఆమెనే కలుస్తారు. సమస్యలు చెప్పకుంటారు. సమర్థురాలైన ఆమె పరిష్కరిస్తుంది. ప్రజలు మళ్ళీ మళ్ళీ ఆమెనే ఎన్నుకుంటారు. ఆమె తనవంటి నిజాయితీ పరులతో ఒక గ్రూపు తయారు చేసుకుంటుంది, ఇప్పటి ఆషాడ భూతులకూ, అవినీతి పరులకూ ఇక భవిష్యత్తు ఉండదు. వాళ్ళు వెధవలని వాళ్ళకే తెలుసు. వాళ్ళే జిల్లాలో అధికారం కావాలనుకుంటున్నారు. దాంతో వెనకనుంచి గోతులు తవ్వుతున్నారు. ఆ ప్రచారాలు ఆ మాటలు నేను రాయదగ్గవి కాదు, మొత్తం మీద ఇవన్నీ తెలిసి నా తల తిరిగి పోయింది. కానీ ప్రజల మీద నమ్మకం పెట్టుకున్నాను. ఇద్దరు అభ్యర్ధులూ మంచివాళ్ళే. కానీ మోహనరావు గారు దుర్గాబాయమ్మ ముందు నిలవలేడు.

కానీ శారదా, ఆడవాళ్ళు ఎన్నికల రాజకీయాలలో ప్రవేశించి గెలిచి చట్టసభల్లో సగభాగమవటం ఇంకొక వందేళ్ళకయినా జరగదు. ఈ మగవాళ్ళు అలా జరగనివ్వరు. దుర్గాబాయమ్మకున్న సద్గుణాలన్నిటితో ఒక మగవాడు పోటీచేసి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండదు. నిజంగా ఇది దారుణం. కాని వాస్తవం. ఆడవాళ్ళు ఉద్యమాల్లో జండాలు మోయ్యుటానికి, వండి వార్చటానికి, సత్యాగ్రహులకు సేవలు చెయ్యటానికి, జైళ్ళు నింపటానికి పనికొస్తారు గానీ ఎన్నికై చట్ట సభలలోకి వెళ్ళి పదవులు పొందకూడదు. హిందూకోడ్ బిల్లు మీద ఉన్నంత వ్యతిరేకత ఉంది ఆడవాళ్ళ ఎన్నికల్లో పోటీ చేయటం మీద, దుర్గాబాయి ఒకవేళ ఓడిపోతే అది కాంగ్రెస్ వారి వల్లనే గాని కమ్యూనిస్టుల బలం వల్ల కాదు. నా మాట నమ్ము కాంగ్రెస్ లోని నీచమైన దారులు, పద్ధతులూ నాకు చాలా తెలుసు గానీ ఇంత నీచత్వం ఉందనుకోలా – ఇంక ఎంత రాసినా ఇదే – ముగిస్తాను. శక్తి వంచన లేకుండా పని చేస్తున్నాం. మహిళా దళం వాళ్ళం. ఫలితం గురించి ఆలోచించటం అనవసరం. మరో పదిహేను రోజుల్లో అంతా తేలిపోతుంది.

నీ ప్రియమైన

అన్నపూర్ణ.

అందరూ నిశ్శబ్దమై పోయారు.

గోరా గారు లేచి “సరస్వతీ – నువ్వూ పిల్లలూ తర్వాత రండి. నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోయారు. ఆయన చాలా అలజడి చెందాడని అందరికీ అర్థమయింది. దుర్గాబాయి ఆయన విద్యార్థిని. ఆయన ఆందోళన సహజం.

“ఈసారి ప్రతి పార్టీ ఆడవాళ్ళనే అభ్యర్థులుగా నిలబెట్టాలని అడుగుదాం” సరస్వతి కోపంగా అంది.

అందరూ నీరసంగా నవ్వారు.

“అసలీ ఎన్నికల్లో ఇంత దుర్మార్గాలుంటే పోటీ చెయ్యటం సరే ఓట్లు కూడా వెయ్యకూడదు” అంది స్వరాజ్యం ఆవేశంగా.

“మరి ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది. మనది ప్రజాస్వామ్యం గదా” అంది మైత్రి.

అందరూ ఇద్దరిద్దరుగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. నటాషాకు విసుగుపుట్టి తనతో ఆడాలని పేచీ పెట్టింది. స్వరాజ్యం, మైత్రి, ఆమె చెల్లెళ్ళు నటాషా చెప్పినట్లు ఆట మొదలుపెట్టారు. అందరిలో మెల్లీ ముఖం బాగా వాడిపోయి వుండటం శారద గమనించింది. మెల్లీ భుజం తట్టి “నిరాశ పడకు. ప్రజలు ఉన్నారు. వాళ్ళమీద నమ్మకం ఉంచు” అంది.

“నాకు మోహనరావు గెలవాలనే ఉంది. కానీ ఇలా కాంగ్రెస్ ద్రోహం వల్ల కాదు” అంది మెల్లి

“నాకు అర్థమైంది” అని ఆమె భుజం చుట చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంది శారద,

రాత్రి భోజనాలు చేసి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు. అన్నపూర్ణ ఉత్తరం గుర్తొస్తే చేదుమాత్ర నోట్లో చప్పరించాల్సి వచ్చినట్లు అనిపిస్తోంది అందరికీ. ఎన్నికలు పూర్తయిన రోజే అన్నపూర్ణ రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చింది.

*

          కనువిప్పు

 

  కరుణాకర్

~

 

మొన్న మేడమ్ గారి రౌద్రోపన్యాసం విన్నపటినుండి నాలో చిన్న భయం మొదలైంది. కొంపతీసి నేనుగాని దేశద్రోహుల లెక్కలోకి రాను గదా అని. ఇదే మాట మా ఝాన్సీతో( అంటే మా ఆవిడ)అన్నాను. దీనికి కారణం లేకపోలేదు.

అపుడెప్పుడో ఎన్టీయార్ దానవీరకర్ణ సినిమాలో దేవతలు దేవుళ్ళ జుగుప్సాకర పుట్టుపూర్వోత్తరాల్ని గుక్కతిప్పుకోకుండా తూర్పాలు పట్టగావిని, ఓ నాలుగు ముక్కలు బట్టిబట్టి నోరూరుకోక వాళ్ళదగ్గరా వీళ్ళదగ్గరా వాగేసి ఉన్నాను కదా. వీళ్ళల్లో ఎవరన్న ఉప్పందిస్తే నాగతి ఏంగాను.

“ముందు ఆ డైలాగులు రాసినోళ్ళు, పలికినోళ్ళ తర్వాత కదా మీ వంతు” అని ధైర్యం చెప్పబోయింది మా ఆవిడ. “వాళ్ళిద్దరూ ఇప్పుడు లేరు కదా “అని అంటుండంగానే ఎదురుగా ఉన్న పుస్తకాలా ఆరమరలో అడ్డంగా నిలబడి తాపిధర్మారావు దేవాలయాల మీదబూతుబొమ్మలు కనబడ్డాయి.

పెరుమాళ్ మురుగన్ మనసులో మెదిలాడు. ఒక్క పరుగున వెళ్ళి తీసి వంటగదిలో మచ్చుబల మీద పెట్టేశాను. హమ్మయ్య అనుకునేలోపు మొన్ననే కొన్నఇదండీ మహాభారతం గుర్తొచ్చింది. అది సరే అసలు అప్పుడెప్పుడో కొని అందరిచేతా చదివించిన రామాయణ విషవృక్షం? రావణాసురుడు ఉత్తముడనీ రామూడే అల్పుడనీ…వామ్మో రంగనాయకమ్మకి ఏమన్నా అవనీ. ముందు మన సేఫ్టీ ముఖ్యం. లోపలెక్కడో ఉన్న ’విషవృక్షాన్ని’ బయటకులాగాను.

ఇలా కాదని పాతలుంగీలో మూటకట్టాను.  మధ్యలో ఎక్కడో త్రిపురనే ని రామస్వామి చౌదరి తగిలాడు. పురాణ పాత్రలను తిరగేసి, బోర్లేసి చీల్చిచెండాడాడు కదా. పక్కనే పెరియార్. వీళ్ళందరికీ ఇట్లాంటి అలోచనలకు కారణమైన కోశాంబీ..అందర్నీ కట్టకట్టి మూటలోకి తోసాను. ఇంతలో వంటగదిలోనుంచి ఝాన్సీ గొంతు ’దేశమును ప్రేమించుమన్నా…’ పిల్లలకి నేర్పించడానికి ప్రాక్టీసు చేస్తున్నట్లుంది. ఎక్కడో ఏదో తేడా కనిపిస్తోంది…అ,,,దొరికింది. దేశమును ప్రేమించుమన్నా అన్నడు కానీ భారతదేశమును ప్రేమించుమన్నా అనలేదు.

ఇక్కడ కొండల్నీ గుట్టల్నీ…ప్రవహించే పుణ్య నదుల్నీ మాటలైనా తలవనేలేదు కదా. ఇన్నాళ్ళూ ఎందుకు తోచలేదు. ’మతములన్నియు మాసిపోవును మానవత్వమే నిలిచి వెలుగును. మతములన్నీ మాసిపోతాయా…ఒక మతం కాదు అందరూ కట్టకట్టుకోని వస్తారేమో….మూటకు అర్హుడే. మతమంటే గుర్తొచ్చింది. సైన్సు నా మతమన్నడు కదా సి.వి.రామన్. సైన్స్ అరకేసి చూశాను. భౌతికశాస్రం, రసాయనశాస్త్రం ఈ శాస్త్రాలన్నీ కలసి విశ్వాసాలను వెక్కిరించినట్లనిపించింది. సైన్స్అర ఖాళీ అయింది. ఆ మాటకొస్తే ఆలోచన, వివేకమూ కలిగించే పుస్తకాలన్నీ ఏదో ఒకమేరకు విశ్వాసాలను కాదనేవే. రిఫరెన్స్ కోసం కొన్న భగవద్గీత, ఏవో యోగాసనాల పుస్తకాలూ తప్ప అన్నీ ప్రమాదంగానే తోచాయి. లుంగీ చాల లేదు.

అనవసరంగా పుస్తకాలకోసం ఒక అరకట్టించి తప్పుచేశా. ఈసారి విష్ణుసహస్రనామాలు, హనుమాన్ చాలీసాలాంటి పుస్తకాలన్నా కొనాలి. విశాలాంద్రకూ ప్రజాశక్తికీ కాదు. రామకృష్ణ మఠానికో టిటిడికో పోవాలి. ఈ ఆలోచనతో మనసు కాస్త కుదుట పడింది. ఒక నిముషం సోఫాలో కూలబడ్డాను.

~

              

తెలుగులో రాయడమే గొప్ప తృప్తి!

 

 

– జగద్ధాత్రి

~

 

తమిళం మాతృ భాష , మలయాళం విద్యాభ్యాసం చేసిన భాష , తెలుగు నేర్చుకుని పట్టు సాధించిన భాష . అందుకే నాకు ముగ్గురమ్మలు అని చెప్తారు స్వామి గారు. తెలుగు భామనే కాక తెలుగు భాషను కూడా స్వంతం చేసుకుని , అందులో మంచి రచనలు చేసి తనకంటూ ఒక ముద్ర వేసుకోగలిగిన వారు స్వామి గారు. అలాగే అనువాదకునిగా తెలుగు భాషలో సాహిత్య అకాడెమీ పురస్కారం సాధించడం  ఆనందదాయకం ఆశ్చర్యకరం కూడా. ఈ సందర్భంలో  రండి ఆయన మనసు విప్పి చెప్పే నాలుగు మాటలు విందాం. నిరంతర కృషీవలుడు , నిగర్వి ఎన్ని సాధించినా , ఎన్ని అవార్డులు వచ్చినా నిర్మమంగా తన పని చేసుకుంటూ పోయే స్వామి గారు మనందరికీ ఆదర్శంగా నిలుస్తారనడం లో అతిశయోక్తి లేదు. 2015 కు గాను “సూఫీ చెప్పిన కథ “ రామన్ ఉన్ని నవల తెలుగు అనువాదానికి సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారాన్ని స్వామి గారికి ప్రకటించింది. ఇది మన తెలుగు వారికి అందరికీ గర్వ కారణం. నేనెప్పటికీ తెలుగు రచయితగానే ఉంటాను అని చెప్పే స్వామి గారి మనో భావాలు మనం కొన్ని ఇక్కడ తెలుసుకుందాం.

1 . కధకుడిగా మీ ప్రారంభాలు, అనువాదకుడిగా ప్రారంభాలు ఒకే సారి జరిగాయా ?

       లేదు. ఒకే సారి జరగలేదు. నా మాతృభాష కాని తెలుగులో సాహిత్య రచన చేయాలని నేనెప్పుడూ అనుకోలేదు.   కధకుడిగా ఆరంగేట్రం చేసిన పది సంవత్సరాల తరువాతనే అనువాదకుడి పాత్ర ధరించాను. నిజం చెప్పాలంటే ఒక అనువాదాలు చేయటం మొదట్లో నాకు ఇష్టం లేని పని గానే వుండేది. విశాఖలో స్దిరపడ్డాక తెలుగు నేర్చుకుంటే నా మిత్రులతో,  సహోద్యోగులతో కలసి మెలసి తిరగటం సుళువుగా వుంటుందనుకొని  తెలుగు నేర్చుకున్నాను. భాషా పరిజ్ఞానంతో తెలుగు సాహిత్యం చదివి ఆనందించేవాడ్ని. దీనికి ఒక కారణం ఉంది. నేను పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టీ సమాజాన్ని బట్టి సాహిత్యం చదవటం బాగా అలవాటైంది. విశాఖలో ఆ రోజుల్లో మలయాళ పుస్తకాలు దొరికేవి కావు . నాకు ఆంగ్ల సాహిత్యం చదివే అలవాటు అప్పుడు –ఇప్పుడు కూడా లేదు –అందువల్ల తెలుగు సాహిత్యమే అందుబాటులో వుండేది. 1980 తరువాతనే తెలుగు బాగా చదవటం నేర్చుకున్నాను. అయినా కధలు వ్రాయాలని కానీ సాహిత్య రచన చేయాలని కానీ అనిపించలేదు.1988 ప్రారంభంలో ఒకానొక సందర్భమున  పోటీలో బహుమతి పొందిన ఒక కధ గురించి మా సహోద్యోగుల మధ్య జరిగిన వేడి వేడి చర్చ , తద్ఫలితంగా వాళ్ళు  విసిరిన సవాలు వల్ల తెలుగులో మొదటి కధ వ్రాసాను –నన్ను నా భాషా పరిజ్ఞానాన్ని రుజువు చేయటం కోసం –అదే నా మొదటి తెలుగు కధ –జవాబులేని ప్రశ్న –ఆ కధకి అలనాటి ఆంధ్రజ్యోతి వార పత్రిక నిర్వహించిన కధల పోటీలో బహుమతి వచ్చింది [1988 ]. ఆ హుషారులో ఎన్నో కధలు వ్రాసాను . అప్పుడే కొందరు పత్రికా సంపాదకులు మలయాళ కధలు తెలుగులోకి అనువాదం చేయమని నన్ను అడగటం జరిగింది. కాని ఒక సృజనాత్మక రచయితగా కొనసాగాలనుకునే నేను ఏ అనువాదమూ చేయలేదు. ఆ తరువాత 2000 ప్రాంతంలో కే. అయ్యప్పపనికర్ సంకలనం చేసిన మలయాళ జానపద గేయాలను తెలుగులోకి అనువదించమని   సాహిత్య అకాడెమి కోరటం వల్ల తప్పనిసరిగా ఒప్పుకున్నాను. ఆ పని పూర్తి అవగానే ప్రముఖ మలయాళ కవి కే. సచ్చిదానందన్ తన 96 కవితలను తెలుగులోకి అనువాదం చేయమని కోరారు [శరీరం ఒక నగరం]సమయాభావం వల్ల కొంత ఆలస్యం చేసినా మొత్తానికి అనువాదం పూర్తి చేసాను. నా అనువాదాలు బాగున్నాయనే పేరు రావటం వల్ల అనువాదాలు చేయమనే ఒత్తిడి పెరిగింది.మరో రెండేళ్ళు తరువాత పదవి విరమణ చేసాను కనుక ,సమయం అందుబాటులో వచ్చి,  వరసగా అనువాదాలు చేసి తెలుగులోకి 17 పుస్తకాలనూ మలయాళంలోకి 13 పుస్తకాలనూ అనువాదం చేసాను; ఇంకా చేస్తున్నాను.

swami 1

2 –    మలయాళ భాషలో మీరు రచనలు చేసారా ?మీ చిన్నతనం లో అటువంటి విశేషాలు వివరించండి

నేను విశాఖ రాక ముందు మలయాళంలో ఎన్నో రచనలు చేసాను. చిన్నప్పటినుంచి అంటే ఎనిమిదో తరగతి చదివే రోజుల్లోనుంచి మలయాళం లో కవిత్వం వ్రాసేవాడ్ని. కాని అచ్చైన మొదటి మలయాళ రచన నేను వ్రాసిన ఏకాంక నాటిక. ఈ నాటిక నేను పదో తరగతి చదివేటప్పుడు [1960] వ్రాసాను. ప్రముఖ మలయాళ వార పత్రిక వారు విద్యార్ధులకోసం [కాలేజీ స్కూల్ పిల్లలకోసం ] నిర్వహించిన ఏకాంక నాటక రచన పోటీలో మొదటి బహుమతి పొందింది ఈ నాటిక. 1960 నుంచి 1970 వరకు సుమారు 100 కవితలు వ్రాసి వుంటాను ,మలయాళంలో. కవితలు మాతృభూమి మలయాళ మనోరమ మొదలగు పత్రికల్లో వెలుబడ్డాయి. జాతీయ చంధసులో వ్రాయబడిన భావ కవితలే వాట్లో ఎక్కువ.

  1. మీరు ఎరిగిన, జీవించిన, మలయాళ సమాజంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన వారి గురించి చెబుతారా ?

అలనాడు నేను జీవించిన మలయాళ సమాజం మొత్తం నన్ను ప్రభావితం చేసిందనే నేను అనుకుంటున్నాను. గుండెలో కవిత్వపు బీజం దాగివుంటే మొలకెత్తి చిగురించి విస్తరించడానికి అనువైన సామాజిక వాతావరణం సమాజంలో వుండేది. ప్రతి పల్లెలోని గ్రంధాలయం, అక్కడ చేరేవాళ్ళ చర్చలు, ఏదో ఒకటి వ్రాస్తే దాన్ని సరిదిద్ది ప్రోత్సాహించే పెద్దలు ,రచయితకి ఇచ్చే గౌరవం వగైరాలు చెప్పుకోదగ్గవి. అంతే కాదు మలయాళ భాషా భోదకులు [స్కూల్ లోనూ కాలేజీలో కూడా ] భాషా సాహిత్యాల పట్ల ఆసక్తి పెరిగేలా పాఠాలు చెప్పేవారు . ఇక రచనల విషయానికి వస్తే నేను మౌలికంగా కవిని. కవి హృదయం కలిగినవాడని నేను భావిస్తున్నాను. మలయాళం లో కవిత్వమే వ్రాసే వాడ్ని.ఆధునిక మలయాళ సాహిత్యం  మహాకవి పి. కుంజీరామన్ నాయర్ నన్ను కొంతవరకు ప్రభావితం చేసాడనే చెప్పాలి , కవిత్వ రచనలో-

4 . తెలుగులో కధలు వ్రాసినప్పుడు, అనువాదకులుగా మీకొక  భవిష్యత్తు ఊహించారా ?

  కధకుడిగా కాని అనువాదకుడిగా కాని ఏదో ఒకటి సాధిద్దామనుకొని రచన కాని అనువాదం కాని చేయలేదు. ఎవరూ ఎవరినీ రచన చేయమని బలవంతం చేయరు ఇష్టమైతే చేస్తారు అంతే. Just for the pleasure చేస్తారు. అలాంటప్పుడు ఆశలు పెట్టుకోవటం అనవసరం.

SufiBookFrontCover

5 . మలయాళం లోని సూఫీ పరంజ కధ అనువాదానికి ఎంచుకున్నారు –ఈ నవల వివరాలు చెప్పండి

1993 లో వెలుబడిన సూఫీ చెప్పిన కధ అనే నవల మలయాళ సాహిత్యంలో గొప్ప సంచలనం రేపింది. వస్తు పరంగానూ భాషా పరంగానూ కొత్త పోకడలతో కూడిన ఈ నవల పాఠకుల హృదయాన్ని ఆకట్టుకుంది. 2010 వరకు పది ముద్రణలు పొందింది. అంతే కాదు ఆంగ్ల, ఫ్రెంచ్,  హింది తమిళ్ కన్నడ భాషల్లోకి అనువదింపబడి పాఠకుల మన్ననలు కూడా పొందింది. మానవ జాతికి ఉమ్మిడి పైతృకం ఉందనేది చక్కగా గుర్తు చేస్తుంది ఈ నవల. గతంలో రెండు సంస్కృతుల మధ్య నిలిచిన సమన్వయాన్ని కూడా గుర్తు చేస్తుంది గతం సలిపే గాయాల పుట్ట కాదు ఇక్కడ. దయార్ద్రమైన స్నేహ శిలలు –సంఘర్షణా భరితమైన ఈ కాలం లో అది ఒక ఔషదంగా పరిణమిస్తుంది. గుడి అయినా మసీదు అయినా మానవుని అధ్యాత్మిక అవసరాలను తీర్చే మార్గమేననే స్పృహ కలుగుతుంది. విగ్రహారాధనను గౌరవించని వారు కూడా విగ్రహారాధన పట్ల వున్న వైమనస్యపు పట్టు సడలిస్తున్నారు. తెలియని ఒక సత్యం గురించిన ఆలోచన మనసులో ఒక వెలుగు రేఖగా కదులుతుంది కత్తులు నూరి గొడవ పడటానికి సిద్ధంగా నిలిచిన రెండు మతాల మధ్య అతి ప్రాచీనమైన సహవర్తిత్వం ఉండేదని సూఫీ చెప్పినప్పుడు ఏవేవో అడ్డుగోడలు కూలిపోతున్నాయి . ఈ సూక్ష్మ స్వరాన్ని మనకు వినబడే విధంగా వినిపించ గలిగింది ఈ నవల. ఈ నవలను అనువాదం చేయాలనుకోవడానికి ఇదొక్క కారణమైతే, ఈ నవలలో కనబడే అతి సుందరమైన కావ్యాత్మకమైన భాష. ఈ పుస్తకాన్ని నేను అనువాదం చేసి ప్రచురణ కోసం ఎదురు చూస్తున్నప్పుడు అనుకోకుండా కల్పనా రెంటాల గారు ఈ పుస్తకాన్ని పంపమని,  చదివి వెంటనే తమ సారంగా బుక్స్ వారే ఈ పుస్తకాన్ని ప్రచురిస్తామని మాట ఇచ్చారు. అంతే కాకుండా ఈ పుస్తకం ఇంత వేగం వెలుగు చూసేలా చేయడం, దానికి ఇలా అవార్డ్ రావడం రెండు నాకు చాలా ఆనందం కలిగించాయి. ఇందుకు కల్పన గారికి నా కృతజ్ఞతలు. తెలుగు లో కూడా ఈ పుస్తకం మంచి పేరు తీసుకొచ్చింది.

6 మలయాళం నుంచి తెలుగులోకి, తెలుగునుంచి మలయాళం లోకి ఎన్ని రచనలు వెలుబడ్డాయి ఏ ప్రముఖ రచయితలను అనువదించారు ?

మలయాళం నుంచి తెలుగులోకి 17 పుస్తకాలనూ తెలుగునుంచి మలయాళంలోకి 13 పుస్తకాలనూ అనువదించాను. నేను అనువదించిన రచయితలు ,మలయాళం నుంచి తెలుగులోకి  మహాకవి అక్కితం నంబూద్రి “ఇరవయ్యవ శతాబ్దం” [ ఒక దీర్ఘ కవిత ], ఆధునిక మలయాళ కవి సచ్చిదానందన్ [రెండు కవితా సంపుటాలు ], జ్ఞానపీఠ అవార్డ్ గ్రహీత ,కవి ,ఓ.ఎన్.వి . కురుప్ [ఒక కవితా సంపుటం ],  నారాయణన్ [ ఒక నవల .ఒక కధా సంపుటి ], సేతు [ మూడు నవలలు ,20 కధలు ], శ్రీనారాయణ గురు,  సి . రాధాకృష్ణన్ [నవల ],  జెక్కేరియా [97 కధలు ],  తకలి, బాషీర్, కారుర్, హరికుమార్, సంతోష్ ఎచ్చికాణం, వైశాఖన్, కె .ఆర్ . మీర, పొంకున్నం వర్కి మొదలైనవారి కధలు

తెలుగు నుంచి మలయాళం లోకి, ఇక తెలుగు నించి  గోపి ,శివారెడ్డి ,కేతు విశ్వనాధ రెడ్డి ,సలీం ,జయంతి పాపారావు గురజాడ వారి కధలు , దివాకర్ల వేంకటావధాని గారి ఆంధ్ర వాగ్మయ చరిత్ర ,శ్రీ శ్రీ మోనోగ్రాఫ్ ,చక్రపాణి మోనోగ్రాఫ్  చాగంటి సోమయాజులు వగైరా.

స్వామి గారితో జగద్ధాత్రి

స్వామి గారితో జగద్ధాత్రి

7 .కధకుడిగా ఒక కధ మీరు వ్రాసినప్పుడా మంచి కధను అనువాదం చేసినప్పుడా మీకు ఎక్కువ సంతృఫ్తీ కలిగింది ?

కచ్చితంగా మంచి కధ వ్రాసినప్పుడే నాకు సంతృప్తి కలుగుతుంది.

8 తెలుగు సాహిత్య అనువాద రంగపు అభివృద్ధికి మనం ఎటువంటి చర్యలు చేపెట్టాలని మీరు భావిస్తున్నారు ?

 పూర్వంకన్నా ఇప్పుడు తెలుగునుంచి ఇతర భాషల్లోకి ఇతర భాషల్లోనుంచి తెలుగులోకి చేసే అనువాదాల సంఖ్య పెరిగింది . ఎప్పుడైనా ఎన్ని అనువాదాలు చేసివున్నా ప్రతి సారి అనువాదం ఒక సవాలే, మూల లక్ష్య భాషల సంస్కృతుల పట్ల మంచి పట్టు లేనివాడు మంచి అనువాదం చేయలేరు. తెలుగు  మాతృభాష గలవాడు హింది నుంచి తెలుగులోకి అనువాదం చేసినప్పుడు మూల భాషా సమాజం గురించి సరైన అవగాహన లేకపోవటం వల్ల అనువాదం మూల కృతికి న్యాయం చేయకపోవచ్చు. అందువల్ల అనువాదాన్ని ఒక సాధనగా భావించి మూల లక్ష్య భాషల సమాజాల గురించీ వాళ్ళ సంస్కృతుల గురించి వాట్లో చోటు చేసుకునే పరిణామాల గురించి నిరంతరం అధ్యయనం చేస్తూ వుండాలి-దానికి తగిన వాతావరణం వుండాలి, లేకపోతే కల్పించాలి.

  1.  మలయాళ సాహిత్య రంగం, పాఠకుల అభిరుచి ఇటువంటి రంగాల్లో తెలుగు సంస్కృతిక సమాజం అలవర్చుకోవలసిన ముఖ్యమైనవేమన్నా గమనించారా ?

గమనించాను. మలయాళీలకు సాహిత్యం పుస్తక పఠనం జీవితంనుంచి విడదీయలేని ఒక భాగం. చిన్నప్పటినుంచి పిల్లలకు సాహిత్య పుస్తకాల పఠనం అలవాటు చేస్తారు.  మలయాళ రచనలు బాగా చదివించేవిగా  ఎక్కువగా ఆర్ద్రంగా వుంటాయి. 300 –400 వందల పేజీల నవలలు కూర్చుని ఏకదాటిగా చదివేస్తారు. అందుకే అలాంటి నవలలు లక్షల  కాపీలు అమ్మకమవుతున్నాయేమో !

10 . అనువాద రంగంలో ప్రస్తుతం మీరు చేస్తున్న, అకాడెమి అప్పగించిన కర్తవ్యాలు గురించి చెప్పండి

   2013 లో అకాడెమి అవార్డు పొందిన కే . సచ్చిదానందన్ గారి మలయాళ కవితా సంపుటి MARANNU VECHA VASTHUKKAL AND OTHER POEMS  అనే పుస్తకం తెలుగులోకి అనువాదం చేస్తున్నాను . అంతే కాక ఒక మలయాళం తెలుగు నిఘంటువు  కూడా తయారు చేస్తున్నాను

  1.  కధకుడిగా అనువాదకుడిగా మీ సాహిత్య జీవితం మీకు సంతృప్తి నిచ్చిందా ?

 కొంత వరకు…పూర్తిగా సంతృప్తి పొందినవాడు తరువాత పని చేయడు.  నేను ప్రస్తుతానికి సంతృప్తి పొందినా ఇంకా ఈ రంగంలో కృషి చేయాలననుకుంటున్నాను కనుక మానసికంగా పూర్తి సంతృప్తి పొందానని చెప్పలేను . ఇంత క్రితం పలు మార్లు చెప్పినట్లు నాకు ప్రత్యేకమైన టార్గెట్ లేదు సాహిత్యంలో. ఒక టార్గెటు అంటూ వుంటే అది అందగానే సంతృప్తి చెందుతారు. ఆ తరువాత కొందరు నిష్క్రమిస్తారు కూడా. నాది నిరంతర సాధన.

  1. సమాజం లో సాహిత్యం పాత్ర ఎంతవరకు ఉందని మీరు అభిప్రాయపడుతున్నారు ?

 సాహిత్యం తాలూకు పాత్ర ఎంతో ఉంది –ముఖ్యంగా అనువాద సాహిత్య పాత్ర –ఎక్కువ భాషలు నేర్చుకోవటం వల్ల ఇతర భాషా సాహిత్యం చదవటం వల్ల,భిన్న సంస్కృతులు తెలుసుకోవటం వల్ల మనిషి మనోభావాలు వాడు ఎక్కడున్నా ఒకటేనని అర్ధం చేసుకోగలుగుతారు. మనిషి తన లోపల వున్న మనిషిని డిస్కవర్ చేస్తాడు. భాషా ,వేషం ఆహారం కళా రూపాలు బ్రతుకుతున్న వాతావరణాన్ని బట్టి వచ్చేవేనని అవి కేవలం బాహ్యమేనని తెలుసుకోగలుగుతాడు. అలా తెలుసుకున్నప్పుడు ప్రాంతాల మధ్య మనుషుల మధ్య సఖ్యత పెరిగి మనుషులందరూ కలసి మెలసి బ్రతికే అవకాశం ఉంది.

peepal-leaves-2013

 

 

భైరవ నాదం అను మిస్టర్ అండర్ డాగ్ లైఫ్ స్టోరీ!

 

కుక్క- శునకము-  విశ్వాసమునకు మొదటినోరు. నమ్మికకు మారుపేరు. ఆటపాటలందు ఆరితేరు. ఎప్పటి విశ్వాసం. ఎప్పటి కుక్క. భారత కాలం నాటిది. కుక్క లేకపోతే ఏకలవ్యుడు ఈ ప్రపంచానికి తెలిసేవాడా?

అసలు ఏకలవ్యుడెవరు ? నిషాద రాజ కుమారుడు. కిష్టప్పకు వరసకు సహోదరుడు అని కథ. నిషాదులకు దత్తతకే వెళ్ళాడని ఒక కథ. నిషాదులంటే అప్పట్లో అందరికీ చిన్నచూపు.  నిషాదులకు రాకుమారుడు కానీ బయటి ప్రపంచానికి పనికిరానివాడు. ఇంటికి పులే కానీ బయటకు  ఏదోనని ఒక సామెత. ప్రపంచానికి అలుసు.

 

అలా ద్రోణుడికి కూడా అలుసే.

అవును, ఆచార్యుడికి కూడా అలుసే.

నీకేమి, నా శిష్యరికమేమి అని వెళ్ళగొట్టినాడు.

వెళ్ళగొడితేనేమి?

ఏకలవ్యుడికి గురువులంటే అభిమానం.

గురువులంటే గౌరవం.

పెద్దలంటే ఆదరణ.

 

అలా ఒక బొమ్మ చేసుకుని కూర్చున్నాడు.

ఎక్కడ ?

మగధ రాజ్యం సరిహద్దుల్లో.

 

ఎందుకు ?

ఆ రాజ్యంలో వాళ్ళ పెంపుడు నాన్న సామంతుడు.

 

జరాసంధుడు సామంతుల్ని సైన్యాధిపతులుగా చేసి ఊడిగం చేయించేవాడు.

అవును, జరాసంధుడి కొలువులో నిషాదులు సైన్యాధిపతులు.

అలా ఏకలవ్యుడు మగధలో పెరిగాడు.

మరి పెరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ తిరిగాడు.

అడవులు ఔపోసన పట్టినాడు.

అవసరం వచ్చినప్పుడు, విద్య నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆ అడవినే ఆశ్రయించినాడు.

 

సరే ఇదొక కథ, దీనికి ఇంకో కతా రూపం కూడా ఉన్నది.

మహానుభావుడు ఆరుద్ర రాసిన ఒక కథలాటి వ్యాసంలో, వ్యాసంలాటి కథలో.

ఆయనంటాడూ – ఏకలవ్యుడు జరాసంధుడి సేనాధిపతి.

ద్వారకమీదికి 18 సార్లు జరాసంధుడు దండెత్తినప్పుడు ఏకలవ్యుడు సేనాధిపతి అని.

ధర్మజుడు చేసిన రాజసూయంలో ప్రముఖ పాత్ర వహించినాడని తెలియచేస్తాడాయన.

 

పుట్టుపూర్వోత్తరాలకు వస్తే కిష్టప్ప, ఏకలవ్యుడు మేనత్త మేనమామ బిడ్డలని చెప్తాడు కూడాను.

 

సంస్కృత హరివంశంలో

దేవశ్రవా: ప్రజాతస్తు

నైషాదిర్య: చ్రతిశృత:

ఏకలవ్యో మహారాజ

నిషాదై: వధివర్థిత:

అని ఉన్నది

 

సరే అది అంతా పక్కనబెట్టి అడవిలోకి వచ్చేద్దాం.

ఏకలవ్యుడు బొమ్మ చేసినాడు అని చెప్పుకున్నాం కదా

ఇంతకీ ఆ బొమ్మ ఎవరిదీ ?

ద్రోణుడిది. ఆచార్యుడిది. పరమవిద్య పారంగతుడిది.

బొమ్మతో మాట్టాడుకుంటూ విల్లెక్కుపెట్టి దదదడలాడించేవాడు.

బొమ్మని కాదండి, బాణాలను, విల్లుని, మొత్తం విలువిద్యని.

అలా కళ్ళు మూసుకొని బాణం వేసాడంటే జేజమ్మ దిగిరావల్సిందే!

అంత గురి.

 

ఓ రోజు ఆటాడుకుంటున్నాడు.

విద్యకు సానపెట్టుకుంటున్నాడు.

ఇంతలో పాండవులూ పాండవులూ తుమ్మెదా అయ్యింది.

అంటే వాళ్ళంతా కలిసి మగధ అడవుల్లోకొచ్చారు.

ఎందుకు?

అదేం ప్రశ్న?

వాళ్ళూ రాచబిడ్డలే

అప్పట్లో వేటలూ, వేటపోతులు వాళ్ళకు చాలా కామను.

 

రాచకుమారులకు వేట ఒక ఆనందం

అందుకని వచ్చారు.

 

అర్జునుణ్ణి నువ్వు వీరా కాబట్టి బాణం వెయ్యరా అని ఓ పొగిడి ఆయన వేటాడుతుంటే చోద్యం చూస్తున్నారు.

ఆ ఆటలో వీళ్ళెక్కిన గుర్రాలు ఏకలవ్యుడున్న ప్రాంతానికి వచ్చినై.

వేటకొచ్చినప్పుడు కుక్కలు వెంటబెట్టుకుపోవటం మరింత సాధారణం.

పాండవుల దగ్గరున్న కుక్కొకటి దారితప్పో, దారిచేసుకునో ఏకలవ్యుడి దగ్గరికొచ్చింది.

దానికేమో పాండవులంటే విశ్వాసం.

ఈ ఏకలవ్యుడెవరో తెలవదు.

కొత్తవాడు కనపడగానే పళ్ళికిలించి అరవటం మొదలుపెట్టింది.

ఈయన చూశాడు.

విద్య భంగం అవటం మొదలెట్టింది.

 

కుక్క అరవటం చూసి అర్జునుడొచ్చాడక్కడికి.

యజమానిని చూసి మరింత రెచ్చిపోయింది ఆ కుక్క.

అరుపులు మెరుపులుగా కురిపిస్తోంది

ఈ ఎదవ గోలంతా ఏమిట్రా నాయనా అనుకున్నాడు ఆయన.

 

అర్జునుణ్ణి, ఒరే నాయనా నువ్వెవరు, ఈ కుక్కేంది, ఈ కతేంది అన్నాడు.

నేనెవరా? నన్నే అడుగుతావా, ముందు నువ్వెవరు చెప్పు అన్నాడు ఫల్గుణుడు.

నేను ఏకలవ్యుణ్ణి, ఇదీ సంగతి, అదీ సంగతి అని మొత్తం కతంతా చెప్పినాడు కోపం తెచ్చుకోకండా.

 

కుక్కేమో అరుస్తూనే ఉన్నది.

ఈయన చెప్పేది అర్జునుడికి సగం వినపడీ వినపడక గోల గోల

ఈ కుక్క అరుపులు తగ్గే మార్గం కనపట్టల్లా

సరే ఇట్లా కాదని విల్లందుకున్నాడు

నారి సవరించాడు

కన్నుమూసి కన్ను తెరిచేలోగా గుప్పెడు బాణాలు ఆ కుక్క నోట్లో కొట్టాడు.

విచిత్రంగా దానికి దెబ్బా తగలకుండా, గొంతులోకి వెళ్ళిపోకుండా నోరంతా నిండిపోయినాయ్ ఆ బాణాలు

 

అంతే ఆ కుక్క మౌనవ్రతం దాల్చింది

అరుపులు ఆగిపోయినై

ఇప్పుడు ప్రశాంతంగా మాట్టాడుకోవచ్చు అబ్బాయ్, ఏమిటి సంగతి అన్నాడు అర్జునుడితో

కుక్క పరిస్థితి చూసి అర్జునుడికి ఆల్రెడీ కళ్ళు బైర్లు కమ్మినై

కుక్క నోరు కన్నుమూసేలోగా మూసేయించాడు ఈయనెవడండీ అని విభ్రమంగా చూస్తున్నాడు

అవును, సాక్షాత్ కిరీటి నోట్లో కూడా మాట పడిపోయింది

ఒక రెండు నిముషాలకు తేరుకున్నాడు

బాబూ, స్వామీ, నాయనా నీకు దణ్ణం పెడతా, ఈ విద్య ఏందండి, ఎక్కడ నేర్చుకున్నా ఇందాక ఏదో అనుకున్నా, నా పేరు అర్జునుడు, నువ్వెవరో ఇప్పుడు చెప్పు అన్నాడు

 

ఓ నువ్వు అర్జునుడివా? అంటే కుంతి కొడుకువేనా అన్నాడీయన

అవును అన్నాడు బీభత్స బాబాయ్

నా పేరు ఏకలవ్యుడు, మా అమ్మ పేరు శ్రుతదేవ మీ అమ్మ పేరు పృథ

ఇద్దరూ తోడబుట్టిన అక్కాచెల్లెల్లు కాబట్టి నువ్వు నాకు కజినువి అన్నాడు

 

అటు చేసి ఇటు చేసి నా అన్నవా నువ్వు, ఆనందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అన్నాడు అర్జున్

బయటకైతే ఆనందం అన్నాడు కానీ లోపల బెంబేలు, కుతకుత

వీరుడికి తనకన్నా ఒక మెట్టు పైనున్నవాణ్ణి చూస్తే అలానే ఉంటుంది

సరే పిచ్చాపాటీ అయిపోయినాక, అర్జునుడు వెళ్ళిపోతూ – అన్నా ఆ కుక్క సంగతేంది అన్నాడు

ఆ బాణాలు ఊరకే చేత్తో సుతారంగా తాకితే వొచ్చేస్తయ్ కానీ ఖంగారు పడమాక అన్నాడు అన్న.

అర్జునుడు సుతారంగా తాకినాడు.

ఏదీ రాలేదే? ఊహూ బాణాలు రాలా! కుక్క నోట్లో ఇరుక్కున బాణాలు రాలా!

దిగాలుగా చూచినాడు అన్న వంక.

 

తమ్మీ ఇంతేనా నువ్వూ నీ సుతారం ఇంతేనా అని నవ్వి తన సుతారం ఉపయోగించి బాణాలన్నీ బయటపడేసాడు

ఒక్క రక్తం బొట్టు లేదు, ఒక్క గాయం లేదు, ఒక్క పన్ను ఊడలేదు

కుక్క, నాలిక బయటపెట్టి రింగులా తిప్పుతూ మూతి అంతా తడిమి తడిమి చూసుకుంది

తర్వాత ఆనందంతో గంతులేసింది

నాయనా ఇంకోసారి నీ దగ్గర అరిస్తే ఒట్టు అనుకుంటూ ఏకలవ్యుడి కాళ్ళని నాకి నాకి వదిలి పెట్టింది

అడవిలో ఉన్నాడు, దుమ్ము కొట్టుకుపోయున్నాడు, కాళ్ళు సుబ్బరమైపోయినై ఈ నాకటంతో

నాకింది చాల్లే అని అర్జునుడు ఆ కుక్కను తీసుకుని బై బై చెప్పి అన్నకు వీడ్కోలు పలికినాడు

 

వేట ముగిసింది. రాత్రయ్యింది.

అందరూ నిద్రపొయ్యేవేళ.

గుడారాల్లో గురకలు గుర్రుగుర్రుమంటూ వినపడుతున్నయ్

ఒక్కడు మటుకు నిద్దరోవట్లా.

ఆ ఒక్కడు ఎవరు ?

అర్జున్

కన్ను మూస్తే కుక్క

కన్ను తెరిస్తే బాణం

కన్ను మూస్తే విల్లు

కన్ను తెరిస్తే ఏకలవ్యుడు

పక్క మీద ఎటు తిరిగినా కుక్క నోట్లో బాణాలే గుర్తుకొస్తున్నయ్

ఈ బాణాల గోల తట్టుకోలేక లేచి పక్కనే ఉన్న గుడారంలోకి పొయ్యాడు

 

ఆ గుడారం ఎవరిది? ద్రోణుడిది

గుర్రుపెడుతున్న ఆయన్ని లేపాడు

నాయనా బీభత్స్, ఈ అర్థరాత్రి నాకు అంకమ్మ శివాలు ఏమిటి అన్నాడు

కాదు ఆచార్యా, ఇవి ఏకలవ్య శివాలు అన్నాడు అర్జున్

 

అదేమి శివాలు, కొత్తగా ఉన్నాయి, కథేమిటి చెప్పు అన్నాడీయన

 

కత చాలా ఉన్నది కానీ ఆచార్యా, ఇప్పుడే మిమ్మల్ని చూశాక, ఒక సంగతి గ్యాపకం వచ్చిందన్నాడు ఫల్గుణ్

 

నాయనా కతలకోసం ఏడ్చే పసిపిల్లాణ్ణి కాను, నీ గ్యాపకాల కోసం తపించే ఆడపిల్లనూ కాను – అర్థరాత్రి నాకు ఈ చిత్రహింస ఏమిటి నాయనా అన్నాడు గురువుగారు

 

ఆచార్యా మీరు ఆరోజు గురుకులంలో ఏమన్నారు ?

ఏ రోజు ?

ఆ రోజు, ఆ రోజు పేద్ద విష్ణుయాగం జరిగిన రోజు

ఏమన్నాను ?

ఈ అర్జునుడికి సరిజోడీ ఈ ప్రపంచంలోనే లేకుండా చేస్తానని అందరి ముందు చెప్పారా లేదా?

అవును చెప్పాను

ఈరోజు మీ మాట నిలబెట్టుకోలేకపోయినారు

అంతే, ఆ మాట వినగానే ఉగ్రుడైనాడు కుంభసంభవుడు

నేను మాట తప్పానని అభాండం వేస్తావా అని భాండం మీద ఉన్న విల్లు అందుకున్నాడు

అభాండం కాదు సార్, మీకు ఋజువు చూపిస్తాను అని ఈల వేసాడు అర్జున్

తోక ఊపుకుంటూ కుక్క వచ్చింది

ఋజువు చూపిస్తానని కుక్కను పిలుస్తావా అని మరింత ఆగ్రహోదగ్రుడైనాడు ద్రోణుడు

దీని నోట్లో ఏముందో చూడండి అన్నాడు కిరీటి

నిద్ర లేపింది కాక, మాట తప్పానని చెప్పి చిమ్మచీకట్లో నల్లకుక్కనోరు చూడమంటావా! ఇక లాభం లేదు అని వింటినారి ఠక్ ఠక్ లాడించాడు

అది కాదు ఆచార్యా ఓ సారి చూడండి మీరు అన్నాడు అర్జున్

ఈ చీకట్లో ఏం కనపడుతుంది ఆ దివిటీ ఇటు తీసుకురా అన్నాడు కుంభసంభవుడు

ఆ తర్వాత దివిటీలో ఆ నోరు చూసి ఆశ్చర్యపోయాడు

అర్థమైపోయింది ఆయనకు

 

 

నేను చిన్నప్పుడు నేర్చుకున్న విద్య, నేను తప్ప ఈ ప్రపంచకంలో ఎవరూ వెయ్యలేని బాణవిద్య ఎవరు ఉపయోగించారు అని తల గిర్రున తిరిగింది ఆయనకు

ఈ విద్య తెలిసినవాడికి ప్రపంచకంలో తిరుగు లేదు, ఎవరు ఈ పని చేసింది అన్నాడు

మీ శిష్యుడే అని అర్జున్ సమాధానం

నా శిష్యుడా? నాకు తెలియని శిష్యుడా? ఎవడు వాడు అన్నాడీయన

ఏకలవ్యుడు, వరుసకు మా అన్న, మీరు విద్యనేర్పనని పంపేసిన నిషాదుడు, మీ బొమ్మ పెట్టుకొని మిమ్మల్ని గురువుగా పూజిస్తూ అడవుల్లో కుక్కనోట్లో బాణాలు కొట్టి నాకు మాట రాకుండా చేసినవాడు అనె అర్జున్

ఇది చాలా ప్రమాదకరం! నా మాట నిలబడాలంటే ఏదో ఒకటి చెయ్యాల్సిందే! ద్రోణుడు మాట తప్పాడంటే ఇంకేమన్నా ఉందీ? నువ్వు పో, రేప్పొద్దున్నకల్లా సంగతి తేల్చేస్తా! ఆ కుక్కని కూడా తీసుకుపో నీతోపాటు అని ఆలోచనలో పడిపోయాడు

కుక్కను తీసుకుని అర్జున్ వెళిపోయె

తెల్లవారగానే అడవుల్లోకి ద్రోణుడు వెళిపోయాడు

ఏకలవ్యుణ్ణి పట్టుకున్నాడు

ఏకలవ్యుడి బొటనవేలు తీసేసుకున్నాడు

అర్జునుణ్ణి ధనుర్విద్యలో ఏకవీరుడిగా నిలబెట్టినాడు

అలా కుక్క, దాని అరుపులు చేసిన సాయంతో అర్జునుడు ఏకవీరుడిగా నిలబడిపోయినాడు

అయ్యా, అమ్మా – అందువల్ల కుక్క లేకపోతే మనకు తెలిసిన భారతం మరోలా ఉండేది అన్న సంగతి మీకు ఇప్పటికి తెలిసిపోయుండాలి.

అయితే కుడిచేతి బొటనవేలు లేకుండా కుడిచేత్తో బాణాలెయ్యలేమోమో కానీ, ఎడం చేత్తో వెయ్యొచ్చు. అదికాకుంటే ఎడమ చేత్తో కత్తియుద్ధం చెయ్యొచ్చు, ఇంకా బోల్డు చెయ్యొచ్చు. అందువల్ల ఏకలవ్యుడిని సేనాధిపతి పదవి నుంచి పీకెయ్యలా జరాసంధుడు

అలా ఎన్నో ఏళ్ళు ఆ జరాసంధుడి దగ్గర పంజేసి రిటైరు అయిపోదాం అనుకుని తన నిషాద రాజ్యానికి రాజుగా వెళ్ళిపోయాడు.

ఇంతలో ధర్మరాజు రాజసూయం వచ్చి పడింది.

రాజసూయం మొదలైపోతోంది.

ఎవరూ ఏకలవ్యుణ్ణి జయించడానికి రాలేదు.

రాజసూయానికి రాజులంతా ఓడిపోవాలి.

ఆ తర్వాత ఆ యాగానికి రావాలి.

ఇదేమి సంగతండి అని రాజసూయానికి వచ్చినప్పుడు కిష్టప్పని అడిగినాడు

కిష్టప్ప చిరునవ్వి నవ్వి, అయ్యా – రాజులెవ్వరూ నీతో పోట్టాడరు అన్నాడు

ఎందుకు అన్నాడు ఈయన

 

రెండు కారణాలు – ఒకటి నువ్వు నిషాదుడివి కాబట్టి నీతో పోట్టాడితే వాళ్ళకు తలవంపు, రెండు నీతో యుద్ధంలో నిలబడి గెలవటం అంత సులభం కాదు కాబట్టి

ఈ లెక్కన రాజైనా ఉపయోగమేమీ లేదన్నమాట అని నిట్టూర్చి, పరమాత్మా ఈ జీవితమ్మీద విరక్తి పుట్టేసింది, ఇన్ని యుద్ధాల తర్వాత  శాంతి కావాలి నాకు, మన:శ్శాంతి కావాలి నాకు, నీ మీదకు అన్నిసార్లు యుద్ధానికి వచ్చినా ఎప్పుడూ ఏమీ అనకుండా వదిలేసావే నన్ను. నాతో నువ్వుపోట్టాడతావా ఒక్కసారి అన్నాడు ఏకలవ్యుడు

అదే నీ కోరికైతే అలాగే కానివ్వు అన్నాడు కిష్టప్ప

ఎప్పుడు ? ఎప్పుడు ? ఎప్పుడు ? పరమాత్మా ఎప్పుడు ? అని ఆనందభాష్పాలు కారుస్తూ కరిగిపోయినాడు ఏకలవ్యుడు

తొందరెందుకు నాయనా వస్తా! ఇంతలో నువ్వెళ్ళి ఆ ధర్మరాజుకి బంగారు పాదరక్షలు ఇచ్చిరా అన్నాడీయన

అంతా అయిపోతూండగా, పనీపాట లేని శిశుపాలుడు లేచి గావుకేకలు పెడుతుంటే, నాయనా టైమొచ్చింది, ఓ సారి వాడి పని చూడు అని కిష్టప్ప సుదర్శన్ కి ఆర్డరిచ్చాడు.

వాడి ఖేల్ ఖతం చేసి మళ్ళీ వేలెక్కి కూర్చునె సుదర్శన్.

అది చూసి అంతా గప్ చుప్ అయిపోయి ఇంటికి పోయినారు.

ఏకలవ్యుడు కూడా వెళ్లిపోయినాడు కానీ, శిశుపాలుణ్ణి అలా చంపెయ్యటం నచ్చలా ఆయనకు

మానవుడుగా మరి! అంతే! ఓ క్షణం ఆనందభాష్పాలు, ఓ క్షణం రక్తభాష్పాలు! ఏం చేస్తాం!

కొద్ది రోజులు, కొన్ని ఏళ్ళు గడిచిపోయినయ్

కిష్టప్ప ప్రామిస్ చేసినవిధంగానే ఈయన టైమొచ్చినప్పుడు వచ్చి యుద్ధం చేసి ఖతం చేసినాడు

ఇదంతా భారత యుద్ధం మొదలవ్వకముందే

మొదలయ్యాక జరాసంధుడు, ఏకలవ్యుడు, శిశుపాలుడు వీళ్ళంతా బతికుంటే యుద్ధానికొచ్చేవాళ్ళు

అప్పుడు వీళ్ళను ఆపటం పాండవుల వల్ల ఏమవుతుందీ అని ప్లానేసి అందరినీ ఖతం చేసేసాడు పరమాత్మ

అదీ లెక్కన్నమాట

ఉద్యోగ పర్వంలో సంజయుడి సందేశంలో ఇలా చెప్పించాడని కథ

అయం స్మ యుద్ధే మన్యతేఽన్యైరజేయం

తమేకలవ్యం నామ నిషాదరాజం।

వేగేనైవ శైలమభిహత్య జంభః శేతే స కృష్ణేన హతః పరాసుః ॥ 5-48-77 (33649)

 

అలా కిష్టప్ప చేతిలో హతమైనాడు.

కోరుకున్న విధంగానే హరీమన్నాడు.

భగవంతుడి మీదకు యుద్ధానికి పోయి, చివరకు సత్యం తెలుసుకుని ఆయన చేతిలోనే హతమైనాడు

అరివీర భయంకరుడు, అఖిలబాణవిద్యా పారంగతుడు, ప్రపంచంలోనే మేటి శూరుడు ఏకలవ్యుడు

అలా భారతంలో కుక్క ప్రాధాన్యం మనకు పూర్తిగా తెలిసింది.

కుక్క మూలాన ప్రపంచానికి ఒక వీరుడు పరిచయమైనాడు.

అదే కుక్క మూలాన ఆ వీరుడి బొటనవేలూ తెగిపోయింది.

అదే కుక్కను తీసుకొని పాండవులు స్వర్గారోహణానికి వెళ్ళినారు

అలా భారతంలో ఎన్నో వింతలు, ఎన్నెన్నో వింతలు.

 

భారతం పక్కనబెడితే తెలుగువాళ్ళకు కుక్కతో ఎంతో అనుబంధం

సామెతలలో (1)కనకపు… (2)కరిచే కుక్క….(3)కుక్కకు సయ్యాట….

వృక్షవిశేషాల్లో (కుక్కతులసి….)

భక్ష్యాల్లో (కుక్కగొడుగు…..)

పద్యాల్లో (జాగిలములు మొఱసడములు…)

జనజీవనంలో (కుక్కజట్టీ…..)

అలా అలా ఎన్నో విధుల్లో, విధానాల్లో, జీవనాల్లో ఉన్నది కుక్క.

అందువల్ల మీరు తెలుసుకొనవలసినది – కుక్క అంత గొప్ప జంతువు ఈ ప్రపంచకంలోనే లేదు అని!

*

 

పేరడీ Thoughts

 

కుంపాటి తీపించి డియ్యాలో

బొగ్గులే పోయిస్తి డియ్యాలో

రాజేస్తి నిప్పే డియ్యాలో

లేసింది అగ్గే డియ్యాలో

గంటెలే గల్లాని వాయిస్తి డియ్యాలో

పొయ్ మీదా పెనముంచి డియ్యాలో

గంతంత నీళ్ళోస్తి ఉయ్యాలో

నీళ్ళన్నీ సుయ్యానె ఉయ్యాలో

గిన్నిలో గరిటేసి డియ్యాలో

ఓ తిప్పు తిప్తీనె డియ్యాలో

పుల్లాటి వోసనా డియ్యాలో

గుండెల్కు తగిలేసే డియ్యాలో

గంటెడు పిండిని డియ్యాలో

సర్రూన పోస్తీనె డియ్యాలో

నూనేను తీస్తీని డియ్యాలో

సుట్టంతా తగిలిస్తి డియ్యాలో

ఆనూనె ఈపిండి డియ్యాలో

సక్కంగ కాల్నెమ్మ డియ్యాలో

పిండీను పెనమూను గలిసె డియ్యాలో

బెమ్మదేవుడి అట్టిచ్చే డియ్యాలో

డియ్యాలో డియ్యాలో

డియ్యాలో డియ్యాలో

*

చమత్కారాలూ మిరియాలూ 

నిజంగా భట్రాజే!

Portrait of Dr. Pattabi Sitaramayya.

జాతీయవాది, దేశభక్తుడు అయిన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని ఒక సారి బందరులో ఘనంగా సన్మానించారట.

ఆ సభకు వక్తగా విచ్చేసినవారిలో శ్రీ పి.పి.భట్ గారు ఒకరు. ఆయన పట్టాభి గారిని గురించి చెపుతూ – భోగాన్ని అనుభవించడంలో ఆయన భోగరాజు, ధర్మగుణంలో ఆయన ధర్మరాజు, దానం చేయడంలో దానరాజు, త్యాగశీలతలో త్యాగరాజు అని ఇలా పొగడడం మొదలెట్టారట.

పొగడ్తలంటే అసలే గిట్టని పట్టాభి గారు ఆయన ప్రసంగం అయ్యాక “నా గురించి భట్ గారు చెప్పింది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ భట్ మాత్రం నిజంగా భట్రాజే” అన్నారట.

*

peepal-leaves-2013

ఎవరోహో..

radio 1

 శ్రీ నండూరి సుబ్బారావు గారి పర్సనల్ అల్బం నుండి 

అపురూప చిత్ర సౌజన్యం : సర్వ శ్రీ నండూరి శశిమోహన్, నండూరి ప్రభాకర్, తుర్లపాటి స్వాతి

ఈ ఛాయాచిత్రం వివరాలు శ్రీ నండూరి శశిమోహన్ గారి మాటల్లో

ఒక నాటకంలో పాల్గొన్న నిలయ కళాకారులు – సి.రామమోహనరావు, కూచిమంచి కుటుంబరావు, నండూరి సుబ్బారావు, ఎం.వాసుదేవమూర్తి, వి.బి.కనకదుర్గ, ఎ.బి.ఆనంద్, ఎం.నాగరత్నమ్మ, ఆమంచర్ల గోపాలరావు (ప్రొడ్యూసర్), నారాయణమూర్తి.

peepal-leaves-2013

 

ఉత్తరం: రెండు మనసుల సంగమం!

     

  -గొరుసు

~

(ఉత్తరాలు – చేత్తో రాసుకున్న ఉత్తరాలు- ఎప్పటికీ చెరిగిపోవు జ్ఞాపకాల్లోంచి! అవి జ్ఞాపికలు గతానికి, నిన్నటి విలువలకీ, తపనలకీ, బంధాలకీ! అవి ప్రముఖులు రాశారా, ఆత్మీయ మిత్రులు రాశారా  వ్యక్తిగతంగా రాశారా అందరి  కోసం రాశారా అన్నది కాసేపు పక్కన పెట్టండి. ఇదిగో ఇదీ  జీవితం ఇవీ  ఆలోచనలు ఇదీ నా  లోపలి అలజడి అనే ప్రతి  ఉత్తరమూ  ఇక్కడ ప్రస్తావించ దగిందే…ఆత్మీయంగా తలచుకోవాల్సిందే..అలాంటి ఉత్తరాలకు  ఆహ్వానం. ఉత్తరం స్కాన్ ఫోటో, యూనికోడ్ లో తిరిగి టైప్ చేసిన ప్రతీ రెండూ పంపండి. ప్రముఖ కథకుడు  గొరుసు జగదీశ్వర రెడ్డి  ఈ  వారం  ఈ లేఖాయణానికి శ్రీకారం చుడుతున్నారు. వచ్చే వారం…?!)

~

                                 Gorusu     ‘నీ చూపులు తుమ్మెద బారులు కట్టి

నీ కోర్కెలు గజ్జెలవలె ఘలంఘలించి

వీథి  వీథి నంతా మేల్కొలుపుతున్నాయి

వీథి వీథి నంతా కలియ చూస్తున్నాయి

అడుగో – పోస్ట్ మాన్!’

పై మాటలు తిలక్ ఎవరికోసం రాశారో కాని…అన్వయించుకుంటే నా గురించేనేమో అనిపిస్తుంది. అచ్చంగా అలాగే పోస్ట్ మాన్ కోసం నా చూపులు తుమ్మెద బారులయ్యేవి. టెలిఫోన్ తో పాటు, అంతర్జాలం నా జీవితంలోకి చొచ్చుకు రానంత కాలం అదొక అద్భుత నిరీక్షణ పర్వం. ఉత్తరాల్లో మనసు విప్పుకున్న మధుర గడియలు ఎన్నెన్నో.

ఉత్తరం: రెండు మనసుల సంగమ కూడలి; లింగ భేధమెరుగని పరిష్వంగ కేళీ వినోదం. రెండు వందల పై చిలుకు మిత్రులు – ఎవరి ఉత్తర బాణం ఏ దిశ నుండి నా గుండెను తాకబోతోందనేది ఓ ఉత్కంఠ . చదివిన అక్షరాలనే మళ్ళీ మళ్ళీ చదివి భావోద్రేకంతో చెంపలు చెలమలయ్యేవి.

మనిషికి తిక్క ఎప్పుడైనా పుడుతుంది కదా – అలా పుట్టినప్పుడు గాలి పువ్వులై శూన్యంలోకి ఎగిరిపోగా అటకెక్కినవి  దాదాపు వెయ్యి లేఖలు. వాటిలోంచి రెండు ఉత్తరాలు ఏరడమంటే మెదడు మోకాల్లోకి జారింది. చివరకు జ్యోతిష్యం చెప్పే చిలకలోకి పరకాయ ప్రవేశం చేసి ముక్కుతో లాగక తప్పింది కాదు.

సరిగ్గా 40 ఏళ్ల క్రితం, నూనూగు మీసాల నా  యౌవ్వన ప్రాయంలో పరిచయమైన కలం మిత్రుడు ప్రదీప్. ఆయన రాసే ఉత్తరాలు అర్ధం చేసుకునే స్థాయి నాకప్పటికి లేకపోయినా మేకపోతు గాంభీర్యంతో సాహిత్యాన్ని వడబోసినట్టు జవాబులు రాసేవాన్ని. చివరికి నాకేమీ తెలియదని నిర్ధారించుకుని…అలా…అలా…అలా…పొగమంచులా అదృశ్యమయ్యాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో మరి!

 

__

pradeep -3

secunderabad

27th Dec, ‘76

23.20hrs

వెల్! జగదీశ్వర్ గారూ,

మీ ఉత్తరం చూసి నవ్వు వచ్చింది. నా చేతి రాత బావుందేమో కాని… నేను మాత్రం మీరూహిస్తున్నట్లు ‘ఎంతో అందంగా’ లేను. అయినా రాత ఎప్పుడూ మనిషి స్వభావాన్ని తెలియజేస్తుంది గానీ, భౌతిక రూపాన్ని కాదు. మరో సంగతి, స్త్రీలకూ అందం ఉంటే అందమేనేమో కాని పురుషులకు శక్తిసామర్ధ్యాలు, అన్న మాట నిలుపుకోవటం, నీతి నిజాయితీ లనే ఆత్మసౌందర్యమే అందం. స్త్రీలకూ ఆత్మ సౌందర్యంతో పాటు సౌకుమార్యమే అసలైన అందం. ఇక తెలుపు నలుపు, కనుముక్కు తీరు ఇవన్నీ ‘అందానికి ప్రకృతి దిద్దిన తుదిమెరుగులు’. ఏవంటారు?

ఇంకా… మీ ఉత్తరంలో “నేను హృదయస్పందనకే ప్రాధాన్యతనిస్తాను కాని బాహ్య సౌందర్యానికి కాదు” అని చదివి కాస్త ఆలోచనలో పడ్డాను. ’స్పందన’ అనే చోట సౌందర్యం ఉండాలేమో?

అసలు స్పందన అంటే ఏమిటి? ”తాము ఆరాధించే గుణగణాలు మొదటిసారిగా, తమకు తెలియకుండానే ఎదుటి వారిలో (అంటే స్త్రీలు పురుషుల్లో, పురుషులు స్త్రీల్లో) దర్శించినపుడు ‘ఉవ్వెత్తున లేచి పడే కెరటం’ లాంటి ఉద్వేగపూరితమైన భావానుభావమే స్పందన’. అద్భుతమూ, అనిర్వచనీయమూ అయినా ఈ అనుభవం మనస్సుపై ముద్రించే ఆనవాలు శాశ్వతమై తలచుకొన్నప్పుడల్లా మనసును పరవశింపచేస్తుంది.

ఓ మూడు నాలుగు సంవత్సరాల క్రితం చదివిన, ‘బసవరాజు అప్పారావు’ గారి గేయం జ్ఞాపకం ఉన్నంత వరకు (చాలా వరకు కరక్టే) రాస్తున్నాను చూడండి.

దేహమున  బుల్కలివి  సందేహమేల

భారమైనది హృదయము బ్రతుకుపైన

మనుట కొరకయి పుట్టిన మనుజు నెడద

తీయతీయని తలపులు ప్రేయసి గద

ఎవ్వరితెవు దేవీ?!! నన్నీ లీల విలపింప

జేతువు సుంతైన కరుణ లేక???…

చివురుటాకుల దిన్న కూజిత రవమ్మే

మధుర మధుభాషిణీ కంట రవమ్ము

ఎప్పుడో విన్న గుర్తుగా నిపుడు విందు

నీదు నడకల కవ్వింపు నాట్య బర్హిపద

నేర్పరులరయ ఎక్కడో కన్నగుర్తుగా

నిపుడు గందు! ఏల దేవీ నన్నీ లీల

విలపింపజేతువు సుంతైన కరుణ లేక

తెలుపుమీ ‘………..’ ఏలనో!!!

ఇలాంటి గేయాలు చదివినప్పుడు హృదయాంతరాల్లో చెలరేగే భావానుభూతిని ఏమని వర్ణించగలం. కళ్ళల్లో చిలికే రెండు కన్నీటి చుక్కలు తప్ప ఈ అద్భుతమైన భావనను పైకి చెప్పటానికి ఏభాషలోనూ తగిన పదజాలం లేదేమో! నిర్మలమైన స్నేహం, మమతామమకారం, ఆత్మీయతానురాగాలు…ఓహ్!…వీటిని పొందగల్గటం ఎంత అదృష్టం. కాని ఒక్కోసారి అనిపిస్తూంటుంది, భరించరాని ఒంటరితనంలో మగ్గిపోతున్న నేను, నేను కోరే ఈ స్నేహ మాధుర్యం గూర్చి ఎంతో గొప్పగా ఊహించుకుంటూ ఈ స్వార్ధపూరిత ప్రపంచంలో నిజంగా అలాంటి మమతానురాగాలు ఉన్నాయనుకుని మోసపోతున్నానా? నో! నెవ్వర్!! అలా జరగటానికి వీల్లేదు. …దైవమే నిజమైతే ఈ నిర్మల స్నేహానుబంధాలుకూడా నిజమే. కాని…భగవద్దర్శనం ఎంత దుర్లభమో, ఈ మధురమూ, మహత్తరమూ అయిన నిర్మల స్నేహ సంబంధాలు ఆప్యాయతానురాగాలు పొందటం కూడా అంత కష్టతరమే.

మననుండి ఏదో అందకుండా చేసి భగవంతుడు మనని ఏడిపిస్తాడు అనిపిస్తుంది. మన జ్ఞానం, విజ్ఞానం కూడా భగవంతుడి అనుమతి మేరకు పరిమితమై ఉంటాయేమో! మనుషులు వట్టి మూర్ఖులు తెలుస్తూనే భ్రమలో పడతారు.

ప్చ్! ఇలా మనసు విప్పి చెప్పుకుంటే ఎన్ని పేజీలైనా రాయొచ్చు…గాని…ఆ…మీరు లెటర్ పాడ్ పంపమని రాశారు కదూ, తప్పకుండా పంపుతాను. కాని బహుశా వారంలోగా టర్మ్ హాలిడేస్ మొదలైతాయేమో!? రిజిష్టర్ పోస్టులో పంపితే, ఏ అడ్రసుకు పంపాలో రాయండి.

త్వరలో మీ అభిప్రాయం రాస్తారు కదూ!

మరిక ఉండనా…

ప్రదీప్ కుమార్

ఇంకా లాంగ్ డ్రైవ్ లోనే వున్నాం, అరుణ్!

 

-ప్రసాద మూర్తి

~

 

మనసు నిండ లేదురా. నీ స్నేహాన్ని పూర్తిగా..తృప్తిగా కడుపు నిండా నింపుకోనే లేదురా. ఉదయించే సూర్యుణ్ణి మన ధిక్కార అక్షరాలతో ఇంకా ఇంకా కవ్విస్తామని, అస్తమయాలను ఇంకా ఇంకా రెప్పవాల్చని మన యవ్వన స్వప్నాలతో నవ్విస్తామని ఎంతో ఆశపడ్డాను. ఆ ఆకాశం గోడ మీద నీడలమై మనం ఎన్ని నినాదాలు రాసుకున్నాం. ఏ చెట్టూ నీ కంటే పచ్చగా వుండలేదని మేమంతా ఎంత మురిసిపోయే వాళ్ళం? తనివి తీరలేదురా తమ్ముడూ. నీతో కలిసి వేసిన అడుగుల కడుపులో పూచిన చెలిమి మొగ్గల తొడిమలు ఇంకా తడితడిగా కదులుతున్న చప్పుడే వినిపిస్తోందిరా.

అన్నయ్యా నీ పెళ్ళికి(1985) నిక్కరు వేసుకుని విజయవాడ ప్రజాశక్తి కార్యాలయం మీటింగ్ హాల్లో కూర్చున్నానని అనేవాడివి. కావాలంటే చూసుకో అని అప్పట్లో నేను ప్రజాశక్తిలో రాసిన కవితల కటింగులు చూపించి నా కళ్ళల్లో చిరుబొట్టువై మెరిసేవాడివి. కాని కవిత్వంలో కొమ్ములు తిరిగిన వాళ్ళని కూడా నిక్కరు వేయించి నీ ముందు కూర్చోబెట్టుకునేంత ఎత్తుకు ఎదిగిపోతావని నీ మొదటి వాక్యం దగ్గరే పసిగట్టాను. ఆ మాట చాలాసార్లు నీతో అంటే నువ్వేమనేవాడివి? ఊరుకో అన్నయ్యా మరీ చెప్తావు అని నవ్వేసే వాడివి గుర్తుందా? నిన్నింకా పూర్తిగా స్పష్టంగా తేరిపార చూడనేలేదురా. నిద్దట్లోంచి అదాటున లేచి..నిన్ను చూసి..చాచిన నీ చేతుల్ని చూసి నిన్ను వాటేసుకొని ఇంకా నీ కౌగలి విడిపించుకోనేలేదురా. ఇంతలోనే అంత మాయ చేస్తావా తమ్ముడూ.

ఇంకా నీతో కలసి లాంగ్ డ్రైవ్ లో వున్నట్టే వుంది తమ్మీ. కింద మిత్రులు..పైన పగటి పూట సూర్యుడు, రాత్రి చంద్రుడితో కలిసి రయ్ రయ్ న తుపాకీ గొట్టంలోంచి వచ్చే అక్షరాల్లా దూసుకుపోతున్నట్టే వుంది. అదిగో అలా నువ్వింకా స్టీరింగ్ తప్పుతూ ఎక్సలేటర్ తొక్కుతూ ఇంకెంత దూరం అన్నా వచ్చేసాం. ఇదిగో ఈ పాట విని అంటూ ఏ రాజేష్ ఖన్నా షర్మిలా టాగూర్ ల మధ్య నలిగిన ఏ పూల గుత్తినో రేకులు రేకులుగా తుంపి నా చెవుల్లోనువ్వు పిండుతున్నట్టే వుంది. ఏంటో నీ మాటలు ఆగిపోయాయని..ఈ  చెవులు తుడిచేసుకోవాలని అనిపించడమే లేదు.

నీకు స్క్రీన్ మీద ఫ్రేములు బిగించడం తెలుసు. దృశ్యాలను ఫ్రేముల్లోపెట్టే రహస్యాలు తెలుసు. మాటలను కూడా ఫ్రేముల్లో దృశ్యాలను చేసే మాంత్రికుడివని మరి మాలాంటి వాళ్ళకు తెలుసు. నువ్వు మాగ్జిమమ్ రిస్క్ చేసినప్పుడే అనుకున్నాను వీడు మా తొక్కలో లెక్కల్లో ఒదిగేవాడు కాదని. నీ రెండో కవితా సంపుటి మియర్ మేల్ కి చిన్న ముందు మాట రాయమన్నావు. రాస్తే అన్న వాక్యం అని ఎంతో గౌరవంగా వేసుకున్నావు. అది నాకు దక్కిన గొప్ప గౌరవం అని నేననుకున్నాను. అప్పుడే అన్నాను నీ మీద అసూయగా వుందిరా అని. అప్పుడు కూడా పో అన్నా నువ్వు మరీనూ అని నవ్వేశావు. నువ్వు నవ్వుతావురా. నీ నవ్వు వినడం కాదు చూడాలి. ఒరేయ్ ఇంకా నీ నవ్వు చూడ్డంలో వున్న హాయి తీరలేదురా. నీ నవ్వుల్లో ఏవో కెరటాలు కెరటాలుగా కాంతి గోళాలు కనిపించేవి మరి. రాజేష్ ఖన్నాని వర్ణించేవు చూడు.  అంత కంటె అందగాడిగా కనిపించేవాడివి. అవును మరి అమ్మాయిల్ని ఎలా కళ్ళతో పడేయాలో రాజేష్ ఖన్నాని చూసి తెలుసుకోవాలనేవాడివి. ఆ మర్మ విద్య నీకు తెలిసిందా అంటే చెప్పీ చెప్పక తప్పించుకునేవాడివి. చెవి దగ్గరగా పెడితే చాల్లే అన్నా అని సిగ్గుపడే వాడివి.

నువ్వు చెప్పని రహస్యాలు చాలా వున్నాయిరోయ్. నీ వయసెంతో మాకింకా పజిల్ గానే మిగిల్చావుకదా. అందరినీ అన్నా అనే పిలిచేవాడివి కదా. టీవీ 9 ఆఫీస్ బాయ్ దాసు గుర్తున్నాడా? వాడు నీకంటె పదేళ్ళుపైనే చిన్నోడు. అయినా దాసన్నా అని పిలిచేవాడివి. ఇదేం అన్యాయంరా అంటే ఏంటన్నా నేనింకా పోరగాడినేగా అని కొంటెగా కొట్టిపారేసే వాడివి. లోకంలో అందరిలోనూ నువ్వే చిన్నవాడివనిపించుకోవాలని నీ ఆశచూసి మేం నిన్నెంత ఉడికించేవాళ్ళం? ఎప్పుడో నలభై గీత దాటక ముందే నీ వయసు ఆగిపోయింది. అదేంటంటే సర్టిఫికెట్ దొంగ లెక్క అనేవాడివి. ఫార్టీప్లస్ అనిపించుకోవడమే ఎలర్జీ. మరి ఫిప్టీకి దగ్గరపడ్డాన్ని నువ్వెలా తట్టుకోగలవులే. లోపల్లోపలే అవయవాలు ఎదురు తిరుగుతున్నా శరీరాన్ని మాత్రం నలభై దగ్గరే అట్టిపెట్టి వుంచావు. ఇంకా వుంటే మేమంతా నీ వయసు కనిపెట్టేస్తామని అనుకున్నావో ఏమో నీతోపాటే నీ వయసునూ మాయం చేద్దామనే ఇలా మాయమైపోయి వుంటావు.

bandaru

పూలండోయ్…పూలు!

నువ్వు కులం గురించి నాకు చెప్పిన మాటలు ఎవరికీ చెప్పనులే తమ్ముడూ. నిన్ను కౌగలించుకుని గట్టిగా హత్తుకున్నచేతుల్లో కూడా కులం ఏ రంగులో ప్రవహిస్తుందో చూడగలిగిని వాడివి. నీ వయసులానే నీ కులం విషయం కూడా ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేశావు.తెలుసుకోడానికి ఎందరు ఎన్ని రకాల అంజనాలు వేశారో..ఎన్నిరహస్యోద్యమాలు నడిపారో తెలిసి మనం ఎంత గట్టిగా నవ్వుకున్నాం. వాళ్ళకి తెలిస్తే ఆ నవ్వుకి బట్టలూడి  పరుగులు తీసేవారేమో. కమ్యూనిజంలో నిజం వుందని గట్టిగా నమ్మినవాళ్ళం కదా. ఆఫ్టరాల్ అవర్ హార్ట్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ అని కదా నీ లెక్క. అవును నీ అక్షరాక్షరం వామపక్షమే. కానీ కమ్యునిజంలో వున్న నిజం నాయకుల్లో లేదని నువ్వెంత బాధపడేవాడివి?

ఉద్యోగం నిమిత్తం నేను రాష్ట్రాలు పట్టి తిరిగి తిరిగీ 2000లో హైద్రాబాద్ చేరుకున్నది మొదలు ఇప్పటిదాకా మనం కలుసుకోని రోజులు తక్కువే. ఒకరినొకరం తలుచుకోని క్షణాలూ తక్కువే. ఏది రాసినా ముందు నాకే చూపించే వాడివి. దగ్గర లేకుంటే ఫోనులో వినిపించేవాడివి. వయసైపోతోంది. నీలా నేనెప్పటికి రాస్తాన్రా అంటే పో అన్నా నువ్వలా నన్ను పెద్దోణ్ణి చెయ్యకు. ఆయుక్షీణం అనేవాడివి. నిజంరా అంటే నమ్మేవాడివి కాదుకదా. ఇప్పటికీ నేను అదే మాటమీదున్నాను. నువ్వు డిఫెరెంట్. నీ స్టయిల్ డిఫెరెంట్. నీ కలం డిఫెరెంట్. నీ కవిత డిఫెరెంట్. నీ కంటెంట్ విషయంలోనే నేనప్పుడప్పుడూ గొడవపడేవాడిని.

నీకు గుర్తుందో లేదో నీ లంగ్ ఆపరేషన్ చేసినప్పుడు నా ఊపిరితిత్తుల మీద కత్తెర్లు పడినట్టు గిలగిల్లాడాను. లంఘించరా తమ్ముడా ఉల్లంఘించరా ఒక్క ఛలాంగ్ తో ఈ లంగ్ జంగ్ జయించరా అని రాశానే. మరి నువ్వలాగే అన్నావుగా. అదో వేలంవెర్రిగా నిన్ను చుట్టేసుకునే నీ చేలాగాళ్ల ఊపిరి కూడా పోసుకుని పయనించరా తమ్ముడా ప్రస్థానించరా..నిండు నూరేళ్ళూ హాయిగాజీవించరా అని అన్నాను కదా. మాటిచ్చావుగా. ఎందుకిలా ఇంత తొందరగా నీ మాటను కూడా ఉల్లంఘించిపోయావురా?

నువ్వు పదికాలాలు బతికుంటే తెలుగు కవిత్వం పదికాలాలు బతికుండే జవసత్వాలు పుంజుకుంటుందన్న ఆశతోనే నిన్ను చాలా చాలా తొందరపెట్టాను. నువ్వు జేగురు రంగు జ్ఞాపకాలు రాస్తే నీ అక్షరాల్లో అసలు రంగు అదే అన్నాను. నువ్వు యాన్ ఆఫ్టర్ నూన్ యట్ చట్టి అంటే నీలో మండుతున్న మధ్యాహ్నాలు చాలా వున్నాయి. వాటినే బయటకు తీయమన్నాను. భద్రాచలం రాముడి పాదాలు ముద్దాడే పాపికొండలకు నువ్వు తలబాదుకుంటే రానీయ్ రానీయ్ నీలోంచి లక్షల క్యూసెక్కుల ఉధృతిలో అక్షరాలను ఉరకనీయ్ అన్నాను. అన్నీ పక్కన పెట్టి పోలవరం ముంపు గ్రామాల కంటె ముందు వందల సార్లు మునిగి తేలి మునిగి తేలి ఊపిరాడక కొట్టుకుంటున్న నీ కవితల్ని ఒక్కచోట చేర్చి పోగుపెట్టమన్నాను. నా మాట కాదనలేదు. అలాగే అన్నా అన్నావు. అలాగే చేశావు. నా మాటదేముందిలే నీకు మిగిలిన టైం నిన్నలా తొందరపెట్టి వుంటుంది. ఇంక ఈ సాగరానికి అడ్డూ ఆపూ లేదనుకున్నాను. నేనే కాదు.

నీ మరణ వాంగ్మూలం అనబడే మ్యూజిక్ డైస్ చూసిన ప్రతివాడూ ఆ మృత్యు సంగీతం విన్నవారంతా వందల అడుగుల నీటి లోతులో సమాధైన గ్రామాల్లా దు:ఖించడం ప్రారంభించారు. ఎవడూ నాకు ఒక్క అవార్డన్నా ఇవ్వలేదేంటన్నా అనేవాడివి. ఒకటేంట్రా వందలొస్తాయి అనేవాడిని. ఆ రోజులు వచ్చేశాయిక అని అన్నాను కదా. నువ్వే తొందరపడ్డావు. ఆ రోజులు చూడకుండానే తొక్కలో అవార్డులు నాకెందుకు..నేనే మీకో అవార్డు అని ప్రకటిస్తూ వెళ్ళిపోయావు. కొందరు కాలం కంటె ఎప్పుడూ ముందే వుంటారు. తమ్ముడూ నిన్ని అర్థం చేసుకునే కాలంలోకి మమ్మల్ని నడపకుండానే ఎలా వెళ్ళిపోయావురా?

నేను చెబుతున్నానుకదా నీ డిక్షన్..నీ కవన కుతూహల రాగం తెలుగు కవిత్వ విద్యార్థులకు..విరాట్టులకూ ఒక తప్పనిసరి పాఠం అవుతుందిరా. నీ పదాల్లో మార్మికత లేని మంత్రధ్వని వుంది. నీ ముందు కూర్చోడానికి అందరం పలకాబలపం పట్టుకుని కూర్చునే టైమొచ్చినప్పుడే నువ్విలా అదృశ్యమైపోవాలా? నిన్ను ఎవరు అనుకరించినా ఇట్టే దొరికిపోయేట్టు పోయెం పోయెం మీదా నీ పేరును వాటర్ మార్క్ గా వేసిపోయావు.ఎంతైనా టీవీవోడివి కదా. అసాధ్యంరా నిన్ను చూసి పొంగిపోవలసిందే తప్ప నిన్ను దొంగిలించడం అసాధ్యం. ఇంగ్లీషు చదువుకున్న తెలుగు కవులున్నారు.

కానీ తెలుగు కవిత్వం ఇంగ్లీషు చదుకునే దశ నీతోనే మొదలైందనుకుంటా. ఆంగ్లమా..ఆంధ్రమా లాంగ్వేజి కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా చూడమన్నావు. నువ్వు భలే తుంటరోడివిరోయ్.  నువ్వొక పక్క..మిగిలిందంతా ఒక పక్క రెండు పాయలుగా తెలుగు కవిత్వం అలా వుండిపోతుందేమో అని అనుకునే వాడిని. ఆ స్థాయికి నువ్వు ఎదిగే దశలోకి రాగానే ఉన్నట్టుండి నీ ప్రయాణం దిశ మార్చేశావు. నిన్నింకా చదువుకోవడం పూర్తికానేలేదురా. పొయిట్రీని ప్రోజ్ చేసి పోజుకొట్టే  మనోపాజ్ ఘనాపాటీలున్నారిక్కడ. నువ్వేమో ప్రోజ్ ని కూడా పొయిట్రీగా పొర్లించవచ్చని నిశ్శబ్దంగా నిరూపించావు. అన్నట్టు నిశ్శబ్దమంటే గుర్తొచ్చింది వ్యూహాత్మకంగా నిశ్శబ్దాన్ని పాటించే శబ్దాడంబరులున్నారిక్కడ. నీ నిష్క్రమణతోనైనా నిన్నలముకున్న నిశ్శబ్దం బద్దలవుతుందేమో చూడాలి.

నీ నరనరంలో టీయార్పీ మందుపాతర పేలిన సంగతులు నాకు తెలుసు. చేసే ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం కోసం నువ్వు రోజురోజూ శకలాలు శకలాలుగా విఛ్చిన్నమైన విషయాలూ తెలుసు. టీవీ రేటింగ్ నీ హార్ట్ బీటింగ్ ని ఎలా కొంచెం కొంచె కొరుక్కు తినేసిందో తెలుసు. నిన్ను లొంగదీసుకుని..కుంగదీసిన అసలు జబ్బు నీ ఉద్యోగమే అదీ తెలుసు. నీ శరీరంలో మృత్యు కవాతులు నువ్వే చూస్తూ మాకు మాత్రం నిత్యం నవ్వుల కవిత్వపు కబాబులు తినిపించావు. ఈ మిగిలిన లైఫ్ అంతా బోనస్ అన్నా అనేవాడివి. కాని నువ్వే మా బోనస్ కదరా. మా బోనస్ ని మేమింకా పూర్తిగా అనుభవించక ముందే వెనక్కి తీసేసుకున్నావా?  సావాసగాళ్ళతో తిరుగుళ్ళంటే నీకెంత ఇష్టం. కారు నడపడం..కవిత్వం రాయడం..దోస్తులతో సూర్యాస్తమయాలను కోసుకోవడం..అడవినీ గోదావరినీ కొండలనీ ప్రవహించే రాత్రులనీ  స్నేహితుల చేతలన్నీ నీవే చేసుకుని వాటేసుకోవడం నీ నుండి ఇంకా మేం నేర్చుకోలేదురా. అందరూ తాగుతుంటే నువ్వందరినీ తాగేవాడివి. అయినా ఇంటిదగ్గర మల్లెపూదండనీ బంగారు కొండనీ అశ్రధ్ధ చేయలేదుగా. నీ మత్తు మాకింకా దిగకుండానే ప్రయాణాల మత్తులోపడి ఎటో కొట్టుకుపోయావు కదా. పోరా పో.

నీకు నేనంటే ఎంతిష్టమో నాకు తెలుసు. నీ చివరి మెసేజ్ నాకొక అత్యున్నత అవార్డు సైటేషన్ అనుకుంటాను. ఫిబ్రవరి 1 న ఆంధ్రజ్యోతి వివిధలో అచ్చయిన నా కవిత చూసి నువ్వేం రాశావు? “ poem adbhutam. Maatallo cheppalenanta adbhutam.very touching, very deep, very poetic. And highly dense. You have shown how a poem should be. Congrats for setting high standards.”  మరి నేనేమన్నాను. ఇటీజ్ యువర్ హైనెస్ అన్నాను. నా మీద ప్రేమతో నువ్వెక్కువ చెప్పావేమో. కానీ ఈ మాటలు నీ  ప్రతి వాక్యానికీ  వర్తిస్తాయి.

ఎన్ని వందలమందికో నువ్ జీతాన్ని జీవితాన్నీ ఇచ్చావు. నువ్వు ఒకసారి వెళ్ళొస్తా బాస్ అని అందరి దగ్గారా సెలవు తీసుకున్నప్పుడు..నీ ఇంటి నుండి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం స్మశానవాటిక దాకా రోడ్డంతా వందలాది కళ్ళు కురిపించిన కన్నీటి వర్షం మమ్మల్ని ఎప్పటికీ తడుపుతూనే వుంటుంది. నువ్వెంత ధన్య  జీవివో మాకు తెలుపుతూనే వుంటుంది.

అందరూ నీ తమ్ముడు ఎక్కడున్నాడని అడిగితే వాడు టీవీ5 కి వెళ్ళాడు నేను 10టీవీలోనే వున్నానని అనేవాడిని. ఇక ఇప్పుడెవరైనా అడిగితే వాడు పైకి వెళ్ళిపోయాడు. నేను కిందే వుండిపోయానని చెప్తాను. తమ్ముడూ నీతో అన్నయ్యా అని పిలిపించుకున్న గర్వాతిశయం నా మీదా నా అక్షరాల మీదా ఎప్పుడూ వెలుగు రేఖై వెలుగుతుందిలే. అయినా ఏమోరా  మనసు నిండ లేదురా. అంతా అధూరాగానే మిగిలిపోయినట్టుందిరా. మన మాటలు..మన పాటలు..మన చెలిమి అంతా సగం సగంగానే ముగిసిపోయినట్టుందిరా. కడుపు నిండలేదురా. సాగరా. సాగరా. సోదరా.

 

ముసుగు

 

 

-భువన చంద్ర

~

bhuvanachandra (5)‘సుమీ ‘ అంటే చలనచిత్ర పరిశ్రమలో ఎవరికీ తెలియదు. ‘సుమీ ‘ అసలు పేరు ‘సుమిత్ర ‘.

‘నల్లమణి’ అంటే ‘ ఆవిడా ‘ అని అందరూ అంటారు. తెలుగులో ‘నల్ల ‘ అంటే నలుపు. తమిళంలో ‘ నల్ల ‘ అంటే ‘మంచి’ అని అర్ధం. సుమీని ‘నల్ల మణి ‘ అనడం కేవలం ఆమె మంచితనాన్ని గుర్తించడానికే. అలాగని సుమీ అరవ పిల్ల కాదు. పదహారణాల తెలుగు పిల్ల.  పిల్ల అనడం తప్పే. ఆవిడ వయసు ఎట్టా చూసినా ముప్పై అయిదుకి తగ్గదు … ముప్పై ఆరుకి మించదు.

ఆమె ఉత్సాహం చూస్తే మాత్రం పదహారేళ్ళ పడుచుపిల్లలు కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిందే.

‘తలలో నాలుక ‘ అంటారే  అలా వుంటుంది అందరికీ. కార్తవరాయన్ పెళ్ళానికి పురుడొచ్చినప్పుడు వాడు వూర్లో లేకపోతే తనే హాస్పటల్ లో జేర్పించి, డిశ్చార్జ్ అయ్యే వరకు తోడుండి మరీ ఇంటికి తీసుకొచ్చి దిగబెట్టింది.

“గాజులేమయ్యాయి?” అనడిగిన  ‘తాలాట్టు  సరళ ‘ కి “హాస్పటల్ బిల్లు కింద మారినై ” అని సమాధానం చెప్పిందిట.

“ఆ తాగుబోతు చచ్చినాడు నీకు గాజులు కొనిచ్చినట్టే! ” అని తాలాట్టు సరళ దెప్పిపొడిస్తే “వాడో సిగ్గోసిరి .. వాడివ్వడని నిండుచూలాల్ని రోడ్డు మీద వదుల్తామా? ” అని నవ్విందిట.

కోడంబాకం మొత్తంలో ఏనాడూ తలుపు మూయని ఇల్లు ఏదైనా వుంటే అది సుమీదే. అదేమీ ఆవిడ సొంతిల్లు కాదు. నెలకి ఏడొందలకి తీసుకున్న మేడ మీద పాకలో ఓ గది. ఆ పాకలో మొత్తం ఐదు పోర్షన్లు . అవన్నీ కొబ్బరాకుల తడికల్తో  సెపరేటు చేసినవే కానీ, గోడలతో కాదు. స్నానానికీ, టాయిలెట్టుకీ కింద వుండే రెండు బాత్ రూమ్ లు , టాయిలెట్లే గతి. అవి కామన్వి కనుక ఎవరూ కడగరు. రోజుకి రెండుసార్లైనా వాటి అతీగతీ  చూసేది సుమీనే.

“నీకెందుకే? ” అని పక్క పోర్షన్ లో వుండే కాటరింగ్ సావిత్రి అడిగితే ” ఆ.. ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా అందరం చస్తాము. సౌతాఫ్రికాలో గాంధి గారు అనుసరించిన మార్గాన్నే నేనూ అనుసరిస్తున్నాను. ” అన్నదట. అదీ ‘సుమీ ‘ అనబడే సుమిత్ర వ్యక్తిత్వం.

ఈ ‘ట ‘ లు ఎందుకంటే సుమిత్ర మొదట్లో నాకూ తెలియదు. ఆరుద్ర గారి ఇంటి ఎదుట వున్న ‘భగవతీ ‘ విలాస్  దగ్గర కనబడేది. అక్కడ ‘ప్రొడక్షన్ ‘ డిపార్టుమెంటు’ వాళ్ళుండే వాళ్ళు. పొద్దున్నే సినిమా కంపెనీలకి టిఫిన్లు ‘భగవతి ‘ విలాస్ నుంచే ఎక్కువగా సప్లై అయ్యేవి. గిన్నెలు అవీ కడగడానికి ‘కార్డు’ వున్న ఆడవాళ్లని ప్రొడక్షన్ వేన్ లలో ఎక్కించుకొని పోతూ వుండేవాళ్ళు. మొదట్లో సుమిత్ర కూడా అదే బాపతు అనుకున్నాను. కానీ కాదు.

ఆవిడ ఓ హీరోయిన్ కి “టచప్  విమెన్ “. సదరు హీరోయిన్ గారు సుమిత్ర ని పాండీబజార్ కారు ఎక్కించుకునేది. ఆ కారు వచ్చే వరకు సుమిత్ర ప్రొడక్షన్ వాళ్ళతో కబుర్లాడుతూ మంచీచెడ్డ తెలుసుకుంటూ వుండేదిట. అక్కడా సాయం చేయడమే లక్ష్యం.

మామూలుగా అయితే పరిచయం అయ్యే అవకాశం లేదు. ఎవరు ఎవరికి ఎప్పుడు తారస పడతారో అప్పుడే వారు తారసపడతారని మా అమ్మగారనేది. “ఇంతమంది అన్నల్ని, అక్కల్ని వదిలి నువ్వు ఇంత దూరంగా ఢిల్లీలో   ఎందుకున్నావో తెలుసా? ఏ జన్మలోనో అక్కడి నేలా, నీరు, గాలీ నీకు ఋణమున్నాయి. ఎప్పుడో నువ్వక్కడ పుట్టి వుండకపోతే అక్కడకి ఎన్నడూ పోలేవు. ” అన్నది ఢిల్లీ నుండి వచ్చిన రోజున. ఎడార్లో వున్నప్పుడు అదే మాట అనేది.

సుమిత్ర నాకు తారస పడటం ” —–  గెస్టు హౌస్ ‘ లో నేను పాట రాయడానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు, నన్నా గెస్టుహౌజ్  లో పెట్టారు. రూంస్ చాలా కాస్ట్లీ. కానీ బ్రహ్మాండంగా  వుండేది. భోజనం రుచిగానూ, శుచిగానూ వుండేది.  హీరోయిన్ కూడా అక్కడే దిగేది. విశాలమైన గదులు, చక్కని గార్డెన్.

రెండో రోజు మెట్లెక్కుతూ జారిపడ్డాను. కాలికి మెట్టు కొట్టుకొని విపరీతమైన బాధ. ఆ శబ్ధానికి ఎదుటి గదిలో నుంచి బయటకు వచ్చింది సుమిత్ర. చెయ్యి ఆసరా ఇచ్చి పై అంతస్తులో వున్న నా గది దాకా నడిపించింది. భుజం కూడా ఆసరా అయ్యింది.

గంటలో మా వాళ్ళు వచ్చి  ఏక్స్ రే అవీ తీయించారు. ఏదీ విరగలేదు కానీ మజిల్ రప్చర్ అయ్యిందన్నారు. మళ్ళీ నా గదిలో ‘బెడ్ రెస్ట్ ‘ అంటూ దిగబెట్టారు. న్యాయంగా నాకు సేవ చేయాల్సిన అవసరమో , నన్ను చూసుకోవాల్సిన బాధ్యతో ఆమెకి లేదు.

కానీ తనంతట తానే వచ్చి కాలుకి కాస్త కాపడం పెట్టడం , డాక్టర్ ఇచ్చిన లిక్విడ్స్ పూయడం , నేను వీలుగా పడుకుంటే టిఫిన్ ప్లేట్లో, భోజనం ప్లేట్లో చేతికివ్వడం, మంచి నీళ్ళు తాగాల్సి వచ్చినప్పుడు ఆ ప్లేట్లు తను పట్టుకొని నాకు మంచినీళ్ళు తాగే వీలు కల్పించడం లాంటి సేవలు చేసేది.  నేను మొహమాట పడితే ” ఇందులో ఏముందండీ? అయినా మీ పాటలంటే నాకు ఇష్టం… పోనీ ఏ పాటలోనైనా నా పేరు ఇరికించండి. ” అనేది నవ్వుతూ.

ఆ ‘హీరోయిన్ ‘ కూడా వచ్చి పలకరించేది. వస్తూ పళ్ళు అవీ తీసుకొచ్చేది. “ఎందుకివన్నీ ” అని నేను మొహమాట పడితే “, “నాకో సూపర్ హిట్ సాంగ్ ఇస్తారని కాకాపడుతున్నా ” అనేది.

వారంలోగా రెండు పాటలు పూర్తి చేశాను. కాలూ బాగుపడింది. సాయంత్రాలు ముగ్గురం కాఫీ తాగుతూ కాసేపు కబుర్లు చెప్పుకునేవాళ్ళం. పాటలు రాశాను కనక వెళ్ళిపోవచ్చు. కానీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇద్దరూ మరో నాలుగు రోజులు వుండమన్నారు. కారణం ఇంకో రెండు ట్యూన్లు రెడీ అవుతున్నాయిట.

“మీదేవూరండీ?” అడిగింది సుమిత్ర ఓ ఉదయమే. “ఫలానా ” వూరని చెప్పాను. పకపకా నవ్వి “చూశారా! నేను అనుకున్నదే నిజమయ్యింది. నిన్న మీరు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ సరదాగా “చేద్దాం.. చూద్దాం ” అంటూ యాసలో మాట్లాడారు. ఆ యాస మా పక్కదే.”

“అంటే?” నవ్వాను

“మీ వూరి దగ్గరే మా వూరూనూ! అయినా పొట్ట చేత పట్టుకున్నవాళ్ళకి ఏ వూరైతేనేం. కానీ, ఏదో పాశం పుట్టిన గడ్డకి లాగుతూనే వుంటుంది. ” మామూలుగా అన్నా ఓ చిన్న బాధ ధ్వనించింది.

“సుమిత్ర గారు! నేను చాలా కాలం నుండి  మిమ్మల్ని చూస్తున్నాను… భగవతీ హోటల్ దగ్గర. మా వూరి దగ్గరే మీ వూరు అన్నారు కనక అసలు మద్రాస్ ఎలా వచ్చారో  చెప్తారా? కేవలం కుతూహలంతో అడుగుతున్నా! ” అన్నాను.

“అందరూ నన్ను ‘మణి ‘ అనో, ‘నల్లమణి ” అనో, పిలుస్తారు. తెలిసిన వాళ్ళు సుమీ అనో, సుమిత్ర అనో లేకపోతే ఒసేయ్ సుమిత్ర అనో పిలుస్తారు. మీరు మాత్రం ‘గారూ ‘ అన్న గౌరవవాచకం తగిలించి నా నెత్తిన కిరీటం పెట్టారు. మొదట మనిషిగా చూసినందుకు థాంక్స్. ఇక నా కథ అంటారా… కోడంబాకంలో వున్న నాలాంటి వాళ్లందరిదీ ఒకటే కథ. మరీ ప్రత్యేకమైనది ఎమీ లేదులెండి. ” తేలిగ్గా నవ్వేసింది.

“చూడటానికి, వినడానికి అన్నీ ఒకేలా వున్నా , ఎవరి కథ వారిదేనండీ. ఎవరి కథ ఎవరిని ఎలా మార్చగలదో ఎవరికి తెలుసు? నేనూ ఒకరి జీవితాన్నించి స్ఫూర్తి పొంది మద్రాసుకి వచ్చాను. కుతూహలంతోనే అడిగాను సుమిత్ర గారు. ఇందులో బలవంతం ఏమీ లేదు ” అనూనయంగా అన్నాను.

“చెప్పకూడదని ఏమీ లేదండి. చెప్పినా నష్టం లేదు. నిజం చెబితే చెప్పాలనే వుంది. అన్నట్లు మీరు “చినరాయుడు’ లో “చెప్పాలనుంది సుందరి … కథ విప్పి చెబుతాను సుందరీ ” అని పాట కూడా రాశారుగా. నేనూ చెబుతా. .. అయితే నాకు  కొంచం టైం ఇవ్వాలి. ” చిన్నగా నవ్వి అన్నది.

“ఓ పదేళ్ళు తీసుకోండి ” నవ్వి దిండు మీదకు వాలాను.

“హి.. హి.. మరీ అంత తక్కువ టైమా? సరే! చిన్నప్పటి నుంచీ ‘ప్రేమ ‘ అంటే నాకు అసహ్యం. నా ఫ్రెండ్స్  లో ‘ప్రేమ ‘ పేరుతో చాలా మంది కన్యత్వాన్ని సమర్పించుకున్నారు. కొంతమందైతే రహస్యంగా డాక్టర్లని కూడా బ్రతిమాలుకొని ‘బుద్ధి ‘ తెచ్చుకున్నారు ” ఆగింది. నేను పడుకున్నవాడిని కాస్తా మళ్ళీ వీలుగా కూర్చున్నాను. మరింత అటెంటివ్ గా.

“నాకు తెలియని విషయం ఏమిటంటే ‘ప్రేమ’ ని కంట్రోల్ చేసుకోవడం తేలికేగానీ ‘పెళ్ళి’ ని కంట్రోల్ చేయడం కష్టం అని. మగాళ్ళలో ఓ మాదిరి తెలివిగలవాళ్ళు ‘మూర్ఖులు ‘ , ‘ప్రేమ ‘ పేరుతో ఆడదాన్ని ప్రలోభ పెట్టే పద్ధతి ఎన్నుకుంటే, మహా  తెలివైనవాళ్ళూ , ప్రేమకు ‘సొడ్డు ‘ కొట్టడం తెలిసినవాళ్ళు ‘పెళ్ళి ‘ పేరుతో వలవేస్తారు. నా విషయంలో జరిగింది వేరు. ” ఓ క్షణం ఆగి కళ్ళు మూసుకుంది. బహుశా గతపు నీడల్లోకి పయనించి వుండొచ్చు.

“అతని పేరు సుధాకర్. నేను డిగ్రీ రెండో సంవత్సరం , అతను అప్పటికే బ్యాంక్ ఉద్యోగి . నేను కాలేజీకి వెళ్ళినప్పుడు చాలాసార్లు ఎదురుపడ్డాడు కానీ , ఎప్పుడూ వెకిలిగా బిహేవ్ చేయ్యలా! అలాగే నేను చామనఛాయ కంటే కొంచం తక్కువ. అతనేమో ‘ఫారన్ ‘ కలర్. అంటే గోల్డన్ బ్రౌనన్న మాట. ఓ రోజు సడన్ గా “సుమిత్ర గారు… మిమల్ని చాలా రోజుల నుంచీ గమనిస్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. మీకు నేనంటే మంచి అభిప్రాయం వుంటే ‘పెళ్ళి ‘ చేసుకుందాం.. మీరెప్పుడు ఓ.కే అంటే ఆ క్షణాన్నే మీ ఇంటికొచ్చి మీ వాళ్లతో మాట్లాడుతా. పెళ్ళైంది కదా అని మీరు చదువు మానక్కర్లేదు. డిగ్రీనే కాదు.. పోస్ట్ గ్రాడ్యేషన్ కూడా నేనే చేయిస్తా… నో కట్నం. ఆలోచించుకొని చెప్పండి. ” అని వెళ్ళిపోయాడు. నాకు షాకు. అసలు నా పేరు అతనికి ఎవరు చెప్పారో కూడా నాకు తెలియదు. ” మళ్ళీ ఆగింది సుమిత్ర. కొన్ని క్షణాలు మౌనం పాటించాము.

“తరవాత” కుతూహలంగా అడిగాను.

“అతను డైరెక్ట్ గా అడిగిన విధానం నచ్చి నేను ఓ.కే. చెప్పాను. అతనూ మాట తప్పకుండా మా ఇంటికి వచ్చాడు. అయితే అతను వచ్చిన రోజు ఇంట్లో నేను వదినా తప్ప పెద్దవాళ్ళు ఎవరూ లేరు. కారణం మా నాయినమ్మ చనిపోవడం. అతను చెప్పదలచుకున్నది మా వదినతోటే సూటిగా స్పష్టంగా చెప్పాడు. ” మళ్ళీ ఓ బ్రేక్.

“మీ కులం ఏమిటి? ” ఒకే ఒక ప్రశ్న అడిగింది మా వదిన. మా ఒదిన అంటే చాలా పెద్దదని అనుకునేరు. ఆవిడ నాకంటే కేవలం ఐదేళ్ళే పెద్దది. ” సుమిత్ర పెదవుల మీద చిరునవ్వు.

“ఊ.. ” అన్నాను.

“అవసరమా? సరే.. నా కులం ఏమిటో నాకే తెలియదు. ‘ఫలానా ‘ కులం వాళ్ళు నన్ను పెంచుకున్నారు గనక నా కులం ‘ఫలానా ‘ దే అనుకోవచ్చు” అన్నాడతను.

“అయితే.. ఈ జన్మకి మావాళ్ళు ఒప్పుకోరు. మీ కులానికి మా కులానికి పురాణ వైరం వుంది. మా వాళ్ళు

ప్రాణాలన్నా  వదులుకుంటారు కానీ కులాన్ని వదులుకోరు ” స్పష్టంగా చెప్పింది మా వదిన. ఆవిడ అన్న మాట తప్పు కాదు. మా వాళ్లకి ‘కులం ‘ అంటే చెప్పలేనంత అభిమానం ” నిట్టూర్చింది సుమిత్ర.

“అదీ నిజమేలెండి. ఇవాళ మనిషిని సంస్కారాన్ని బట్టి ఎవరూ గుర్తించడం లేదు. గుర్తించేది కేవలం కులంతోటే ” నవ్వాను నేను.

“అంతేగా! ఆ తరవాత మా వదిన ఒక సలహా ఇచ్చింది! ” నవ్వింది

“ఏమని? ”

“లేచిపొమ్మని!” నవ్వింది

“లేచిపోతే మా ప్రేమని దక్కించుకున్నట్టు అనడమే కాక, ఎప్పుడో ఒకప్పుడు మావాళ్ళు ఒప్పుకోవచ్చు . ఒప్పుకుంటే వేరీ గుడ్, ఒప్పుకోకపోతే ప్రేమైనా దక్కుతుంది గదా.. అదీ ఆవిడ రీజనింగు ” మళ్ళీ నవ్వింది సుమిత్ర.

“నవ్వుతారెందుకూ? మంచి సలహానేగా? “అన్నాను.

“మంచి సలహానే. రెండు నెలల క్రితం వాళ్ళ చెల్లెలు ఇదే సమస్య తో మా వదినని సలహా అడిగితే “పెద్దవాళ్ళని క్షోభపెట్టి మీరేమి బావుకుంటారు, నోరు మూసుకొని అమ్మానాన్న కుదిర్చిన సంబంధం చేసుకో. ప్రేమా గీమా అంటూ పిచ్చివాగుడు వాగకు ” అని నానా తిట్లు తిట్టింది ” ఈ సారి పగలబడి నవ్వింది  సుమిత్ర.

“ఇంత నవ్వెందుకంటారా? నేను ప్రేమ పేరుతో లవ్ మారేజ్ చేసుకుంటే నా పెళ్ళి ఖర్చు తప్పుతుంది. ఆస్తిలో కూడా చిల్లిగవ్వ ఇవ్వక్కర్లేదు. మొత్తం మా అన్నవదినలకే దక్కుతుంది. ఇంత దూ(దు) రాలోచన వుంది…. ఆ సలహా వెనుక.

“మరేం చేశారు? ” కుతూహలంగా అడిగాను

“సుధాకర్ కి సారీ చెప్పాను. కానీ..” నిట్టూర్చింది…

“ఊ…”

“నెలరోజుల పాటు ఆలోచించి ఆలోచించి అతని దగ్గరకే వెళ్ళి “మీకు ఓ.కే అయితే నాకూ ఓ.కే ” అని చెప్పాను.

దానికతను నవ్వి ” సారీ సుమిత్ర గారు! మీరెప్పుడైతే నో అన్నారో అప్పుడే నేను మావాళ్ళు చెప్పిన సంబంధం ఓ.కే అని చెప్పాను, ప్రేమ గొప్పదా?.. కాలం గొప్పదా? అనడిగితే నా దృష్టిలో కాలమే గొప్పది . ప్రేమించినవాళ్ళు ప్రేమించిన వారి కోసం కొన్నాళ్ళు ఆగొచ్చు. కానీ కాలం క్షణం సేపు కూడా ఆగదు అన్నాడు ” ఈ సారీ సుధీర్ఘంగా  నిట్టూర్చింది సుమిత్ర.

“తరవాత?”

“మా వదిన చెడ్డది కాదు, అలాగనీ మంచిదీ అనలేను. సుధాకర్ విషయం మా వాళ్ళతో చెప్పింది. అప్పటినుంచి నా బ్రతుకు ఘోరమైంది.

“ఎందుకు చెప్పావు? ఆల్రెడీ అతనికి పెళ్ళి కుదిరింది కదా ‘ అని అడిగితే ” ఏమో మీవాళ్ళూ సరే అంటే నీ ప్రేమ సఫలం అవుతుందని ఊహించాను.   అందుకే మీ అన్నయ్యకి చెబితే, మీ అన్నయ్య మీ అమ్మానాన్నకు చెప్పారు. ఇలా అవుతుందనీ నాకేం తెలుసు ” అని దీర్ఘం తీసింది.

నేను ఎవరితో లేచిపోతానో అనే భయంతో నా కాలేజి చదువు మానిపించారు. అంతే కాదు రోజంతా ‘నడవడిక ‘ గురించీ పరువూ- ప్రతిష్టల గురించీ క్లాసులు! ” మొహంలో నైరాశ్యంతో కూడిన నవ్వు కానీ నవ్వు.

“ఊ…” అన్నాను. ఓ ఎమోషన్ లో వున్నవారిని మాటల్తో విసిగించేకంటే ‘ఊ..ఊ… ‘ల భాష ఉపయోగించడమే మంచిది.

“సార్… పెద్దవాళ్ళు ఒకరకంగా మూర్ఖులు.. పిల్లలకేదో ‘బుద్ధి ‘ చెబుతున్నామనకుంటూ ‘పిచ్చి ‘ పుట్టిస్తారు. చెప్పిందే వందసార్లు చెప్పి విసిగిస్తే ఏమౌతుందీ? మెదడూ, మనసూ కూడా మొద్దుబారతాయి. నాకు జరిగిందీ అదే! ‘తిక్క ‘ పుట్టుకొచ్చింది. చదువు మాన్పించడంతో ‘కచ్చ ‘ పుట్టుకొచ్చింది. ఆ సమయంలో పరిచయమయ్యాడు బదిరీ… అంటే బదిరీనారాయణ ” మళ్ళీ మౌనంలోకి జారిపోయింది.

రాలిపోయిన క్షణాల్ని ఏరుకోవాలంటే మౌనం ఒక్కటే ఆయుధం “అతను అందగాడు కాదు. అనాకారి. కానీ గొప్ప మనిషి. ఒకసారి  మా అమ్మతో పాటు గుడికెళ్తే అక్కడ పరిచయమయ్యాడు. మా అమ్మని “మీరు ఫలానా కదూ ” అనడిగి పరిచయం చేసుకున్నాడు. అతనిదీ అమ్మ వాళ్ళ వూరే. నాకంటే పదిహేనేళ్ళు పెద్దవాడు. ఓ రోజు నా బాధలు అడిగి తెలుసుకున్నాడు. మావాళ్ళు అతన్ని మాయింటికి రానివ్వడానికి కారణం అతను మా కులం వాడే. మెల్లగా మా వదిన రాజకీయం నడిపింది , నాకు అతన్ని ‘పెళ్ళికొడుకుగ్గా ‘ మాట్లాడేట్లు మా వాళ్ళని వొప్పింది.

ఇదో కొత్త ట్విస్ట్ .. అయితే అసహజమైనది కాదూ. ఘనత వహించిన భారతీయ సగటు తల్లిదండ్రులకి ‘పిల్లలకంటే, వాళ్ళ భవిష్యత్తు కంటే, ‘పరువు-ప్రతీష్టలే ‘ ముఖ్యం అని పురాణకాలం నుంచీ స్పష్టమైన ఆధారాలు మనకున్నాయి.

‘చచ్చినా సరే.. పెళ్ళి చేసుకొని చావు ‘ అనేది ఇంగ్లీషు రాజ్యంలా , అన్ రిటెన్ కాన్స్టిట్యూషన్.

“నా వాళ్ళ దగ్గర వుండే కంటే నరకంలో వున్నా గొప్పగానే వుంటుందని నేను పెళ్ళికి ఒప్పుకున్నా.

“సుమిత్రా.. కాలం మనకోసం ఆగదు. ఆగని దాన్ని మనమెందుకు గుర్తించాలి? ప్రేమ ఆగుతుంది… ఎన్నాళ్ళయినా.. ఎన్నేళ్ళయినా .. అందుకే నువ్వు నీ మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించేవరకూ నేను ముట్టుకోను. రేపే కాలేజీలో చేరు… ట్యూషన్ తీసుకో. డిగ్రీ తెచ్చుకొని తీరాలి! ” అన్నాడాయన శోభనం రోజు ! ”

సుమీ దీర్ఘంగా నిట్టూర్చింది. ప్రతి నిట్టూర్పు వెనకాల కొన్ని వేల ఆలోచనలు సమాధుల్ని చీల్చుకొని బయటకొస్తున్నాయని నాకు అర్ధమయింది.

“టైమ్‌కి విలువిచ్చి సుధాకర్ వేరేదాన్ని పెళ్ళిచేసుకుంటే, ప్రేమకి విలువిచ్చి బదరీ నాకు స్వేచ్చనీ, చదువునీ ప్రసాదించాడు. అందం ‘వయసు ‘ తోనూ ‘తనువు ‘ తోనూ వుండదనీ , అందుండేదీ ‘ మనసు ‘ లోనేననీ నాకు అర్ధమవడానికి సంవత్సరం పట్టింది.

పట్టుపట్టి పరీక్షలు పాస్ అయ్యాను. డిగ్రీ చేతికొచ్చిన రెండో సంవత్సరానికల్లా  ఓ బిడ్డకి తల్లినయ్యాను ” ఓ చిన్న నిట్టూర్పు..

“ప్రతి కష్టం ఓ సుఖానికి పునాదే అని ఎవరూ చెప్పరు. కానీ అది నిజం. ఉద్యోగం చేస్తున్న బదిరి, సడన్ గా పోవడంతో భయంకరమైన శూన్యం నన్ను ఆవహించింది.అదృష్టం ఏమిటంటే, అతను చేస్తున్న ఉద్యోగమే ఆ కంపెనీ వారు నాకు యిచ్చి నన్ను ఆదుకున్నారు ” మళ్ళీ మౌనం.

“అయ్యా జరిగింది జరిగినట్టుగా, వరుస క్రమంలో చెప్పాలంటే , ఓ నవల తయారవుతుంది. ఒకటి మాత్రం నిజం ఆడకానీ మగ కానీ ఒంటరిగా వుండటం చాలా కష్టం. యవ్వనం ఎటువంటిదంటే ఎంతకైనా తెగింపచేస్తుంది. బదరీ వాళ్ళ అమ్మ వచ్చి ఓ రోజున నాతో దెబ్బలాట పెట్టుకుంది… మాకు పుట్టిన పిల్లాడిని తనకు ఒప్పజెప్పాలని. మొదటి నుంచీ నా విషయంలో ఆమె దురుసుగానే వుంది. కారణం నేను అంతకు ముందే ‘ప్రేమ ‘ లో పడ్డానని ఆమెకు ఎవరో ‘ఉప్పు ‘ అందించడమే. ఓ పక్కన భర్త పోయిన బాధ, రెండో పక్క అత్తగారితో దెబ్బలాటలు నా మనశ్శాంతిని  వంచించాయి. అప్పటికే ‘ఓదార్పు ‘ పేరుతో నాతో కొంచం సన్నిహితంగా వచ్చిన  ‘వినోద్ ‘ నాకు ధైర్యం చెప్పాడు. వినోద్ నిరుద్యోగి.. కానీ గొప్ప నటుడు. అతని డ్రామాలు నాలుగైదు అంతకు ముందే మా వారితో  కలిసి చూశాను. ఓ విధంగా అతను మా వారికి ఓ మాదిరి స్నేహితుడే! ” గుక్క తిప్పుకోవడం కోసం ఆగింది.

“ఎందుకు .. ఎలా అనేదాని కంటే , బిడ్డను అత్తగారికిచ్చేసి వినోద్ తో నేను మద్రాస్ వచ్చేశాను. నాలుగేళ్ళపాటు పాండీబజారులో ‘ఫలానా ‘ షాప్ లో సేల్స్ గార్ల్ గానూ, ఆ తరవాత ఎకౌంటెంట్ గా, ఆ తరవాత ‘ఫలానా ‘ హోటల్లో హౌస్ కీపింగ్ ఎగ్జిక్యూటివ్ గా , బోలెడు అవతారాలెత్తాను. నిజం చెపితే వినోద్ అవకాశాలు వెతుక్కోడానికి అవకాశం కల్పించాను. ”

“వినోద్ అంటే? ”

“తొందరెందుకు సార్ , మామూలు ఎగస్ట్రా వేషాల్నించి ‘హీరో ‘ గా ఎదిగిన ‘ఫలానా ‘ వ్యక్తి గురించే నేను చెప్పేది ” నవ్వింది.

“మై గాడ్ కోట్ల మీదేగా అతని సంపాదన? ” షాక్ తిన్నాను.

“అవును నిచ్చెన ఉపయోగపడేది మేడ ఎక్కడానికే. ఎక్కాక నిచ్చెనతో పనేముంది? ” నిట్టూర్చింది.

“మొదట్లో చాలా బాధపడ్డాను. కానీ తరవాత అర్ధమయింది. ‘వినోద్ ‘ అనే రాయిని ‘శిల్పం’ గా మార్చాలనేది నా కోరిక. నిచ్చెనగా ఉపయోగపడమని అతను నన్ను అడగలేదు.  శిల శిలగా ఉన్నప్పటి కథ వేరు. శిల శిల్పమైతే? దాని అసలైన స్థానం ఏమిటో అక్కడకి అది చేరి తీరుతుంది. వినోద్ కూడా అతని చేరాల్సిన స్థానానికి చేరాడు. అతని తప్పేముంది? “మళ్ళీ ఓ సుదీర్ఘ నిట్టుర్పు. నిజంగా నాకు షాక్. వినోద్ (అసలు పేరు వాడలేదు) అంత ఎత్తుకి ఎదుగుతాడని మేము ఎన్నడూ వూహించలేదు. అతని టాలెంట్ కాక అదృష్టమూ అతని తలుపు తట్టింది. అదే, సుమిత్ర తలుపు మూసేసింది.

“తరవాత?” మౌనాన్ని ఛేదిస్తూ అడిగాను.

“ఏ ‘మగవాడి ‘ దగ్గర పనిచేసినా వాడి చూపులు “శరీరం” మీదే వుండేవి. కోరికకీ – అందానికి సంబంధం పెద్దగా వుండదేమో. ఒకరు నన్ను ప్రేమించి వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారు. ఇంకొకరు నన్ను పెళ్ళి చేసుకొని ప్రేమించారు. మరొకరు నన్ను ఓదార్చే ప్రయత్నంలో దగ్గరై మరో స్థాయికి చేరారు. నేనూ మాత్రం ఏం చెయ్యనూ? నా అత్తమామలకి వారసులు లేరు గనక , నా బిడ్డని వాళ్ళ వారసుడిగా వారికే వప్పచెప్పాను. ప్రేమ మీద నమ్మకం లేని నాకు ప్రేమే కరువయ్యింది. కానీ , ఆ ప్రేమ కోసం శరీరాన్ని తాకట్టు పెట్టలేదు. ఈ హీరోయిన్ నాకు చాలాకాలం నుండి పరిచయం వున్న వ్యక్తే. అందుకే ఆమె దగ్గర “టచప్ వుమెన్ ” గా చేరాను. నన్ను చాలా ప్రేమగా ఆదరిస్తోంది. ఇక కంఫర్ట్ అంటారా? అంతెక్కడా? ” మళ్ళీ ఆగింది.

“మరి.. ” ఓ ప్రశ్న వెయ్యబోయి ఆగాను.

“ఇప్పటి జీవితం గురించా? నిజం చెబితే చాలా ఆనందంగా వున్నాను. గురూజీ.. ‘ఫలానా ‘ది కావాలని అని కోరుకున్నంత కాలం నేను అనుభవించింది క్షోభే. కానీ ఇప్పుడు ‘నాకేదీ వద్దు ‘ అనుకున్నాను కనక హాయిగా వుంది. అసలేం కావాలి డబ్బా? పదవులా? పెద్ద ఉద్యోగమూ, జీతమూ పరపతి అవా? అవన్నీ వుంటే సౌకర్యం వుంటుందే కానీ ‘సుఖం ‘ దక్కుతుందా? ఇలా.. ఎన్నో ప్రశ్నలు నన్ను చాలా కాలం వెంటాడాయి. ఇవన్నీ వున్నవాళ్ళు సుఖపడుతున్న దాఖలాలేవీ నాకు కనిపించలేదు.

డబ్బు సంపాదన పెరిగే కొద్ది అనవసరమైన వస్తువులు  కొనడం, అర్ధం లేని ఆడంబరాలకు పోవడం, తప్ప ‘నిజమైన సుఖం ‘ నాకు అవగతం కాలేదు. ‘రేపటి మీద ‘ ఆశలతో మనిషి ‘ఈనాడు’ ని నిర్వీర్యం చేసుకున్నాడని అనిపించింది. అందుకే, అన్నీ వదిలేసి అతిసామాన్యులు వుండే పాకలో వుంటున్నా. నాకు తోచినంతగా పదిమందికీ వుపయోగపడే ప్రయత్నం చేస్తున్నాను ” ఆగింది.

“సరే.. పాకలో వుంటే ఏమి తెలిసిందీ? ” కుతూహలంగా అడిగాను

పకపకా నవ్వింది సుమిత్ర “కవిగారూ.. మీలో ఇంకా ఆ ‘సైనికుడి ‘ మనస్తత్వమే వుంది కానీ, సినిమా మనస్తత్వం రాలేదు. అయ్యా, తాజ్ మహల్లో వున్నా, పూరి గుడిసెలో వున్నా మనుషుల ‘ నిజమైన ‘ మొహాల్ని ఎప్పటికీ చూడలేమని అర్ధమయ్యింది. గొప్పవాళ్ళు ఒక రకం ‘ముసుగులు ‘వేసుకొని కృత్రిమంగా జీవితం గడుపుతుంటే , పేదవాళ్ళు మరోరకం ముసుగులు తగిలించుకొని కృత్రిమమైన జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు. నాకు నిజంగా అర్ధమైనదేమిటంటే , పేదా గొప్ప తేడాలు ‘ఆస్తిపాస్తుల్లో ‘ లేవని కేవలం ‘మనసుల్లో ‘ మాత్రమే వున్నాయని అర్ధమైంది! ” అన్నది.

బహుశా పేద గొప్పలకి ఇంత పెద్ద నిర్వచనం ఇచ్చింది సుమిత్ర ఒకతేనేమో! మనిషి యొక్క గొప్పతనము, పేదతనమూ నిజంగా డబ్బుతో కాదు , మనసు బట్టి ఆధారపడి వుంటుందన్న మాట ఆ తరవాత 72 గంటల్లో ఋజువైంది.

ఈ సంభాషణ జరిగిన రోజే నేను చెన్నై వచ్చేశా యీవినింగ్ ఫ్లైట్ లో. కారణం ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా కంపోజింగ్ రికార్డింగ్ చెన్నై లో చేద్దామనుకోవడం వల్ల.

రెండు రోజుల తరవాత పాండీబజారు లో ‘సుమీ ‘ కనిపించింది.

“అదేంటీ? ఈ నెలాఖరు వరకు మీ షెడ్యూల్ వుందన్నారుగా? క్యాన్సిల్ అయ్యిందా? “ఆశ్చర్యంగా అడిగాను.

సన్నగా నవ్వింది సుమిత్ర.

“షెడ్యూల్ మామూలుగానే వుందండీ.. నాకే పని “ఊడిపోయింది! ” అన్నది.

“అదేంటీ? మీకూ హీరోయిన్ కి …. ” ఆగాను..

“ఊహూ.  సినిమాహిరో గారితో ప్రాబ్లం వచ్చింది. మొన్నటి వరకు అన్నీ హీరోయిన్ ఓరియంటెడెడ్ సీన్లు , మిగతా సీన్లు షూటింగ్ జరిగాయి.  మొన్న హీరో గారు ఎంటర్ అయ్యారు. వారు నన్ను చూసి ఇబ్బంది పడ్డరనుకుంటాను. ‘సెట్ ‘ నుంచి నన్ను తప్పించమని వారు డైరెక్టర్ కి చెబితే , డైరెక్టర్ ప్రొడ్యుసర్ కి, ప్రొడ్యుసర్ హీరోయిన్ గారికి చెప్పారుట. చివరికి హీరోయిన్ గారు నన్ను పిలిచి “సారీ సుమీ.. నిన్ను చూసి బహుశా హీరోగారికి మొహం చెల్లలేదనుకుంటా… ఏమైనా, అతనా టాప్ హీరోలలో ఒకడు. నేనింకా అంతగా నిలబడిపోలేదు. నువ్వే అర్ధం చెసుకొని.. ” అంటూ చెక్కుబుక్కు తీసింది. ఇంకేం చెస్తా, నాకు రావల్సిన మొత్తం మాత్రం తీసుకొని ట్రైనెక్కాను ” నిట్టూర్చింది సుమిత్ర.

“మరి.. ఇప్పుడు… “ఆగిపోయాను “అంటే ఆ హీరో వినోదేనా?” ఆత్రంగా అడిగాను.

“అవును.. ఒకప్పుడు నా మీద ఆధారపడ్డవాడు నన్ను ఆఫ్ట్రాల్ ఓ టచప్ విమెన్ గా ఎలా చూడగలడూ? అందుకే… ” పకపకా నవ్వింది.

“మరి.. ఇప్పుడు ” ఇందాకటి ప్రశ్నే మళ్ళీ అడిగాను.

“జీవితం చాలా విశాలమైనది సార్.. ఎన్ని తలుపులు మూసుకుపోయినా ఏదో ఒకటి మళ్ళీ తెరుచుకుంటుంది. అయినా యీ మాత్రం సస్పెన్సు లేకపోతే జీవితం నిస్సారంగా నడుస్తుంది కదూ! ” నవ్వీ నడక సాగించింది సుమీ అనబడే సుమిత్ర ఉరఫ్ నల్లమణి. నేను అక్కడే నిలబడ్డా.. చాలా సేపు.. నడిచే సినిమా చూస్తూ…

గాయం ఒక ట్యాగ్ లైన్..

– శ్రీకాంత్ కాంటేకర్

~

చినుకూ, చిగురాకూ
నీ పెదవులపై తడిసీ తడవని నీటిబొట్టూ

కాలిగజ్జె ఘల్లుమన్న..
జీవనశ్రుతీ.. లయతప్పి..
ఓ పూలరథోత్సవం.. పరిసరా!!
ఈ గుండె మీది నుంచి వెళ్లిపోయింది
సంతాపంగా చినుకు పూలు చల్లి..

లోపలంతా చీకటికూకటి నృత్యం
పగళ్లపై బృందావనీ సారంగి పరవళ్లగానం
నీ గుండె నా శరీరంలో

నిస్సహాయపు నీటిచినుకు
నీ కొనవేలిపై కొనకాలపు
కోటి ఊసుల ఊగిసలాటలో
నీ కొంగు చిక్కుముడిలో
నీ చూపు మెరుపు ఒంపులో

గాయం ఒక ట్యాగ్ లైన్
దేహం ఒక హెడ్ లైన్
ఎవరిని దాచుకున్నానో
గాయం, దేహం మధ్య
నేనొక మిడ్ లైన్

తడిలేక తపస్వించి
టప్పున రాలిపోయిందో చినుకు
చివరాఖరి చూపు నుంచి..
పరిసరా..!!
నేనెవరి బతుకులో తప్పిపోయిన క్షణాన్నో..
తలుచుకోని మాటనో..
రాయని నిశ్శబ్దాన్నో..
రాతి గుండెపై నక్షత్రాన్నో..

*

నీ పర్యాయ పదం నేను…

 

-మిథిల్ కుమార్

~

1.
ఇలా ఓ తప్త ప్రవాహం,

నీలోకి నేను బట్వాడా అవ్వడం
నన్ను నువ్వు అనువదించుకోవడం
పరస్పరంగా గుండె చప్పుళ్ళని పంచుకోవడం,
ఒక రాప్చిక్ క్షణమే  కదూ…

ఒకలాంటి లిప్తకాంతి
ఇరు మనసుల రాపిడిలో వెలిగి,
నీలిమంటొకటి రాజుకుంటుంది.
అదొక వింటేజ్ దృశ్యం.

2.
కొన్ని ఉద్వేగాలు విరహంలో
ఊగిసలాడుతూ,
తడి పలకరింపుల తచ్చాటలో
తనువుల గుసగుసలు.

భావ సంపర్కాల జుగల్బందిలో
రేయింబవళ్ళు క్షణాల్లో ఇమిడిపోయే యుగాలే మరి

అలా
వ్యాప్తమవుతున్న విరహ కంపనాల్ని
పుట్టించే మది లోలకం.

తెలిసమయాన
మంచుదుప్పటి కప్పుకున్న
పత్తిపువ్వులం మనమిప్పుడు

ఆహ..! ఎంత బావుంది ఇలా చెప్పుకోవడం….

3.
నీ ఉనికి,
చిక్కటి మంచు తెరల్లో
నగ్నదేహపు విహారంలాంటిది నాకు.

మబ్బు నురగల్లో
మునిగి తేలుతున్నట్టి
ఒక రప్చర్  ఇది.

ఇక నా పిడికిలిలోనున్న
సింధూరప్పొడిని
నీ నొసటన పూయడానికి ఆయత్తమవుతున్నాను…….

inamorata..!!!

నేను రాసుకునే స్వప్నలిపిలో
సుధీర్ఘ అధ్యాయానివి నువ్వు,
నీకొక పర్యాయపదాన్ని నేను…….

*

ఇంకా అవే భ్రమల్లో ఎందుకు?!

 

 

– నంబూరి పరిపూర్ణ

~

ఆదిమానవుల సామూహిక జీవనదశలో- మాతృస్వామిక వ్యవస్థ ఒక సహజ ప్రాకృతధర్మంగా సుదీర్ఘకాలం కొనసాగింది. తదనంతర కుటుంబవ్యవస్థలో స్త్రీకి బదులు పురుషుడు కుటుంబానికి యాజమాన్యం వహించాడు. పర్యవ సానంగా పురుషస్వామ్య, పురుషాధిక్య సమాజం అస్థిత్వంలోకొచ్చి, ‘మాతృ స్వామ్యం’ అంతమయ్యింది. నేటికీ అదే పురుషస్వామ్య వ్యవస్థ అస్తిత్వంలో ఉన్నదన్న చారిత్రక మానవ సమాజ పరిణామ వాస్తవం- విజ్ఞులందరూ ఎరిగిన విషయమే.

పురుషస్వామ్యంగా రూపొందిన సమాజ వ్యవస్థ- స్త్రీ పురుష సంబంధాన్ని- ‘స్వామి-సేవక’ సంబంధంగా మార్చిన విషయమూ తెలిసిన నిజమే. సమస్త కుటుంబ వ్యవహారాలతో పాటు, సమాజ వ్యవహార పోకడల్ని కూడా శాసించే స్థాయికి చేరిన పురుషుడు- భార్యస్థానపు స్త్రీనేగాక యావత్‌ స్త్రీజాతినీ శాసించే స్థితికొచ్చాడు. స్త్రీని- అశక్త, ఆశ్రిత ప్రాణిగా దిగజార్చి అదుపులో పెట్టుకో సాగాడు. ఆమె మేధో, ఉత్పత్తి శక్తుల్ని బలహీనపరిచి, తనకు సేవలందించే ‘సేవిక’గా మార్చాడు.

ఎన్నో పౌరాణిక స్త్రీల గాథలు- యిందుకు తిరుగులేని నిదర్శనాలు. అవి మనకు  సుపరిచితాలు.  ఆనాటి పతివ్రతల సదాచార, త్యాగ మహాత్మ్యాల ఉదంతాల్ని తెలియజేసే గాథలవి. యుగాల కాలానికి చెందిన సీత, ద్రౌపది, శకుంతల మొదలైన రాజవంశ స్త్రీలు సైతం అనేకానేక కష్టనష్టాలకూ, అవమాన విద్రోహాలకూ బలి అయిన తీరును- హృదయాలు ద్రవించేలా వివరించే గాథలవి.
కానీ, యుగాలు గడిచి, ఎంతో ఆధునికత చోటు చేసుకున్న ప్రస్తుత కాలంలోని అధిక సంఖ్యాక సాంప్రదాయిక మహిళల్లో- యిప్పటికీ పాతివ్రత్య సతీత్వం పట్ల ఆరాధన, విశ్వాసాలు మెండుగానే వుంటున్నాయి. ఆనాటి పురుషవ రేణ్యులు తమ స్త్రీలకు కలిగించిన కష్టాలు, క్రూర అవమానాల్ని నిరసించి, ద్వేషించే బదులు- ఆ కష్టాలు ఎదురవ్వడం వల్లనే- ఆ వనితలంతా అంత గొప్ప సతీమణులుగా, పతివ్రతామతల్లులుగా నిరూపించుకోగలిగారు, ఆదర్శనీయులయినారని- పాతతరం గృహిణులు ఆనందపడుతూ వుండడాన్ని చూస్తున్నాం. మరొకపక్క ఆ యువతుల పట్ల పురుషులు జరిపిన కుటిల చర్యల్నీ, దురంతాల్నీ, తీవ్ర ఆవేశంతో ఖండించే యువతులకూ ప్రస్తుత కాలంలో కొదవలేదు. నేనూ ఆ కోవకు చెందిన స్త్రీగా- ఆనాటి మువ్వురు పౌరాణిక స్త్రీల గాథలకు సంబంధించిన మంచిచెడ్డల్ని, న్యాయ అన్యాయాల్ని విశ్లేషించే ప్రయత్నం చేశాను.

అతి స్వల్ప కారణంతో- అగ్నిపునీత సీతను శ్రీరాముడు మభ్యపరిచి, అడవులకు తోలడం; జూదవ్యసనంతో- ధర్మజుడు భార్యను సైతం పణంగా పెట్టి, నిండు సభామధ్యంలో ఆమె వలువలూడ్చేంతటి అవమానానికి గురి చెయ్యడం; మున్వాశ్రమ, అనాథ అమాయిక బాలిక శకుంతలను గాంధర్వ విధిని పెండ్లాడి, ఆమె గర్భవతిగా ఉన్న స్థితిలో- దుష్యంతుడు ఆమెను వెడలగొట్టడం- యివి మచ్చుకు కొన్ని. పురుషుల విద్రోహ, కపట చర్యలు నాలో అగ్నినీ, నిరసనజ్వాలల్నీ రగిల్చి- నాదైన దృష్టితో- ఆ ఉదంతాల గాథల పునశ్చరణానికి పురికొల్పాయని సవినయంగా తెలియపరుస్తున్నాను.

పురాతన సాంప్రదాయక ఆచారాల్ని భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తూ- హింసించి, వేధించే భర్తల పట్ల విధేయత, అణకువ చూపే వనితల్ని చూస్తున్నప్పుడు- మనసు  వికలమవుతుంటుంది.  భర్తల క్షేమం  కోసం-  ఎన్నెన్నో  పూజలు, ఉపవాసాలు, వ్రతాలు చేస్తున్న మహిళలు చాలామంది కనబడుతుంటారు. కొందరు ఉన్నత విద్యలు చదివిన స్త్రీలు కూడా- ఈ తంతుల్ని సదాచారాలుగా భ్రమిస్తుండడం- వింతైన విషయం. మార్కెట్‌ సరుకులై, లక్షలు గుమ్మరిస్తేగాని భర్తలుగా దొరకని యువ విద్యావంతుల వ్యాపార సంస్కృతిని అర్థం చేసుకో లేని మనస్తత్వమే స్త్రీలది యిప్పటికీ! ఉన్నత, సాంకేతిక, వైద్యవృత్తుల్లో రాణిస్తున్న విదుషీమణులు కూడా యిందుకు మినహాయింపుగారే!!

కుటుంబ, సామాజిక స్థితుల్లో- సమాన ప్రతిపత్తి, వ్యక్తిత్వహక్కుల సాధనకు ప్రేరణ కాగలవన్న ఆశతో వ్రాసిన నా వ్యాసాలను- నాటి ఆంధ్రజ్యోతి ‘నవీన’ స్త్రీల అనుబంధం తరచుగా ప్రచురించి, వెలుగులోకి తేవడం ఎంతో తృప్తిని కలిగించిన విషయం. అలాగే వార్త, ప్రజాతంత్ర, విజేత పత్రికలు కూడా- తమ సహకారమందించాయి.

పలురకాల స్త్రీల సమస్యల్నీ, వారెదుర్కొంటున్న సాంఫిుక దురన్యాయాల్నీ- శాస్త్రీయంగా విశ్లేషించి ఖండించే వైఖరినీ, శక్తినీ- దేశభక్తీ, ప్రజల ప్రగతీ కేంద్రంగా కలిగిన రాజకీయ నేపథ్యమున్న మా కుటుంబం నాకు కలిగిం చింది. మార్క్సిస్టు, భౌతికవాద సిద్ధాంత బలం- మరింత తోడ్పడింది. ఇందుకు తోడు- మహిళాసంక్షేమ శాఖలో నా ఉద్యోగ నిర్వహణ- గ్రామీణ మహిళలను నా శక్తిమేర చైతన్యపరిచే సదవకాశాన్ని నాకు గొప్పగా కలిగించింది.

గత ఐదారు దశాబ్దాల నుంచీ విద్య, ఉద్యోగ, పారిశ్రామిక రంగాల్లో సమర్థ నిర్వాహకులుగా స్త్రీలు ముందుకొస్తున్నకొద్దీ- అనేక కొత్త సమస్యల్నీ, హింసల్నీ ఎదుర్కొనవలసి వస్తున్నది. అయినప్పటికీ- అన్ని రంగాల్లో స్త్రీల పురోభివృద్ధి కొనసాగుతూనే వుంది. స్త్రీల ప్రత్యేక హక్కుల పరిరక్షణ, ప్రగతి- ఆశయంతో రచనలు చేస్తున్న రచయిత్రుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అనేక మహిళాసంస్థలూ దీక్షతో కృషి చేస్తున్నాయి.

‘వేయిపూలు వికసించనీ’ అన్న నినాదంతో అభ్యుదయ రచయిత్రులూ, మహిళా సామాజిక కార్యకర్తలూ- నిర్మాణాత్మక కృషి సల్పుతూ ముందుకు సాగుతూ ముందడుగు వెయ్యగలరన్న ఆకాంక్ష నాది.

*

 

రోహిత్ వొక సాంస్కృతిక ప్రశ్న

 

-రాణీ శివశంకర శర్మ
~

రాణీ శివశంకర శర్మ

ఈనాడు మనం యేది మాట్లాడాలన్నా “రోహిత్” నామస్మరణతో మొదలుపెట్టాల్సివస్తుంది. అతడొక గాఢమైన స్మృతిగా మారిపోయాడు.దళిత సాంస్కృతిక స్మృతిగా మారిపోయాడు.

నిజానికి విద్యార్దుల మరణాలు మన రాష్ట్రంలో మరీ కొత్తేమీ కాదు. అందులో దళిత విద్యార్దుల మరణాలు కూడా సర్వసాధారణమై పోయాయి. సాధారణంగా ఆత్మహత్యలు మౌనంలో ముగుస్తాయి. అవి తీవ్ర పరాజయ రూపంగా ఉంటాయి. కానీ రోహిత్ మరణం వట్టి ఆత్మహత్యేనా?
కానే కాదు. అతడి మరణం చీకట్లోకి మౌన నిష్క్రమణగా కాక, అక్షరాలుగా మార్మోగింది. ఆ అక్షరాలు అశక్తతనీ, వుడుకుమోత్తనాన్నీ, ద్వేషాన్నీ వెదజల్లేవి కావు. యీ వ్యవస్థ బోలుతనాన్ని స్పష్టం చేస్తూనే, వొక ప్రత్యామ్నాయ తత్వాన్ని చెప్పి పోయాయి. అందు వల్ల రోహిత్ మరణానికి ఎంతో మంది బతుకు కంటే ప్రాముఖ్యత ఏర్పడింది. అది రోహిత్ మరణాన్నికాక, చాలా మంది జీవించి వున్నామని భ్రమిస్తున్న వాళ్ళు నిజానికి జీవించి లేరని, యిప్పటికే మరణించారని నిర్ధారించింది. కృత్రిమత్వం, స్వాభావికత లోపించడం, ఆత్మ వంచన, పర వంచనల్ని కవితాత్మకం చేసింది.
యిది అగ్ర వర్ణాలకి పెద్ద తలనొప్పి. యెందుకంటే అధికారం ద్వారా, ధన బలం ద్వారా మాత్రమే అగ్ర వర్ణాలు బతికి బట్టకట్టకలుగుతున్నాయి. అవి సాంస్కృతికంగా మరణించాయి. రోహిత్ చనిపోయి, పూర్తిగా మౌనంలోకి జారిపోకుండా అగ్ర వర్ణాల మరణాన్ని నిర్ధారించే శాసనాన్ని లిఖించి పోయాడు. అందుకే అంత అలజడి. యిప్పుడు అగ్రవర్ణాలు పూర్తిగా ఆత్మ రక్షణలో పడిపోయాయి. తమ నైతిక పతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మరణించిన వ్యక్తిపై బురద చల్లుతున్నాయి.
నిజానికి అగ్రవర్ణాలు సాంస్కృతికంగా యెప్పుడో స్తబ్ధతకు గురయ్యాయి. అక్షరం వారి దగ్గర నుంచి యెప్పుడో ఎగిరి పోయింది. “నను వరించిన శారద లేచిపోవునే” , అని జాషువా ప్రశ్నించాడు. యిప్పుడా శారద పూర్తిగా వాడలలోనే నివాసం ఉంటుంది. అగ్రహారం వైపు కన్నెత్తి చూడడం లేదు. పూర్వం బ్రాహ్మణులలో, అగ్రవర్ణాలలో ఉన్న గొప్ప కవులూ, మేధావులూ ఇప్పుడూ కరువయ్యారు. యిందుకు తెలుగు సాహిత్యమే మంచి ఉదాహరణ.
దానికి కారణమేమిటి? ధన సంపాదన, అధికార లాలస యివే ప్రధానం కావడం వల్ల అగ్రవర్ణాలు అక్షరంపై మక్కువ వదిలి వేసాయి. అందుకే అక్షరం కూడా వాళ్ళని వదిలేసింది. అగ్రవర్ణాలు నిరక్షరాశ్యులుగా మారిపోయారు. పుస్తకాల పురుగులుగా కాక కంప్యూటర్ పురుగులుగా మారారు. యంత్రాల్లో యంత్రాలుగా మారిపోయారు. అందుకే శ్రీపాద, చలం, విశ్వనాధ, శ్రీశ్రీ, భైరాగి లాంటి కవులూ, రచయితలూ వారి నుండి ఆవిర్భవించడం మానేశారు. హృదయ స్పందన కలిగించే అక్షరాలు వారి నుంచీ అదృశ్యమయ్యాయి.
దీనికి కారణం, బ్రిటీష్ వారి కాలం నుంచీ ఆధునికత వల్ల వచ్చే ప్రయోజనాల మీద దృష్టి  వారిలో అధికమైంది. యెప్పుడైతే ఆ ప్రయోజనాన్ని వారు అంది పుచ్చుకోవడం మొదలు పెట్టారో, ఆ ప్రయోజనాలే వారికి సర్వస్వమై పోయాయి. వారికి సాంప్రదాయకంగా వస్తున్న కళలూ, శాస్త్రాలూ, కవిత్వమూ, వాఙ్మ్ యాల పట్ల ఆసక్తి సన్నగిల్లింది. ముఖ్యంగా బ్రాహ్మణుల పరిస్థితి ఇది.
దీనితో బౌద్ధికంగా,  సాంస్కృతికంగా క్షీణించి పోయిన బ్రాహ్మణులలో అగ్రవర్ణ దురహంకారం మాత్రమే మిగిలింది. అక్షరం వలస పోయింది. బ్రాహ్మణులు నిరక్షరాస్యులుగా మారిపోయారు.
నిజానికి ఆధునికత అక్షరాస్యతను పెంచడంలేదు. నిరక్షరాస్యతను పెంచుతోంది. అక్షరం నిజానికి చాలా గాఢమైనది. అది మౌఖికంగా కానీ, లిఖిత రూఫంలో కానీ గాఢమైన ముద్ర వేస్తుంది. అటువంటి ముద్ర వేసే శక్తిని కోల్పోయినప్పుడు అక్షరం మరణించినట్లే. నిరక్షరాస్యత రాజ్యం చేస్తున్నట్లే.
భాష కేవలం సమాచార సాధనం కాదు. అది కమ్యూనికేషన్ స్కిల్ కాదు. భాష కమ్యూనికేషన్ స్కిల్‌గా మిగిలి పోవడం అంటే నిరక్షరాస్యత వ్యాపించినట్లే.  భాష రక్త ప్రవాహం వంటిది. అది సమాజంలో సంబంధాలను ప్రభావితం చేస్తుంది.
కానీ నేటి కళా రూపాల్ని చూడండి. టీవీలో ప్రోగ్రాములు, సినిమాలు చూడండి. అటువంటి లక్షణమేమీ కనపడదు. యెటువంటి ప్రభావాన్నీ కలిగించకపోవడానికే “వినోదం” అని పేరు. యాంత్రికంగా చూస్తాం, మరచి పోతాం. సినిమాలలో దృశ్యాలూ, పాత్రలూ రిచ్‍గా కనపరచడం రివాజుగా మారిపోయింది. మన దరిద్రపుగొట్టు మొహాల్లో కొద్ది సేపు సంతోషాన్ని పోలిన దాన్ని అది కలుగ జేస్తుంది. మన జీవితంలోని లోపలి బయటి దారిద్ర్యాల్నీ, శూన్యాల్నీ మనం ఈ దృశ్యాల ద్వారా పూరిస్తున్నాం. రోహిత్ ప్రస్తావించిన శూన్యం రోహిత్‍కు మాత్రమే సంబంధించినది కాదు, మొత్తం సమాజానికి సంబంధించింది.
ఈ సమాజం యెటువంటిది? యాంత్రికమైనది, సంపదనీ, అధికారాన్నీ ఆరాధించేదీ, స్పందన శూన్యమైనది, వెరసి నిరక్షరాస్యమైనది.
ఆధునిక యంత్ర నాగరికత విశాల దృక్పథాన్ని పెంచింది అనేది భ్రమ మాత్రమే. నిజానికి అది మనుషులలో సంకుచిత మనస్తత్వాన్ని  పెంచింది. స్థలకాలాలకు సంబంధించిన విశాల దృక్పథాన్ని బలహీనపరిచింది. యిటీవల నోమ్ చాం‍స్కీ అనే అమెరికా మేధావి మాట్లాడ్తూ అమెరికాలో కొన్ని వేల సంవత్సరాల క్రిందట మాత్రమే విశ్వం ఆవిర్భవించిందని విశ్వసిస్తారని అన్నాడు. సుదీర్ఘమైన కాలం గురించి భారతీయ పురాణ గాధలు దిగ్భ్రాంతి కలిగించేట్టుగా ఊహించగలిగాయి. ఉదాహరణకి- బ్రహ్మకాలం. ప్రముఖ సైన్స్ రచయిత కార్ల్ సాగాన్ స్థలకాలాల గురించి భారతీయ పౌరాణిక దృష్టిని కొనియాడారు. రోహిత్ తన చివరి లేఖలో ప్రస్తావించినది యీయన గురించే. అనంత స్థల కాలాల గురించి యీ వైఙ్ఞానిక పౌరాణిక ఊహల వల్లనే తన మరణాన్ని కూడా నక్షత్ర లోకాల్లో అంతులేని గమనంగా ఊహించగలిగాడు. మరణం గురించిన ఆలోచనలు కూడా అతనిలో అంత ఊహాశక్తిని మేల్కొలిపాయి. కానీ ఆధునిక జీవితం సంకుచిత వలయాల్లో తిరుగుతోంది. మానవ అస్తిత్వం యిరుకుగానూ, ఖాళీగానూ తయారుకావడాన్ని రోహిత్ పసిగట్టాడు. అందుకే మనుషులు ప్రకృతిని ప్రేమింఛలేకపోతున్నారనీ, కృత్రిమత్వం పెరిగిపోయిందని బాధపడ్డాడు.
అంబేద్కర్ మనవడు ఆనంద్ తేల్‍తుంబ్డే ఆధునికతలోని మానవ కేంద్రక దృష్టిని విమర్శించాడు. మితిమీరిన సంపద వుత్పత్తి సామ్యవాదానికి దారితీస్తుందన్న మార్క్స్ భావంలోనే ఖాళీ వుందన్నాడు. అధిక వుత్పత్తి అనర్ధదాయకం అన్నాడు. అది ప్రకృతిని నిర్విచక్షణగా కొల్లగొట్టడంగా మారిపోయిందన్నాడు.
పాశ్చాత్య అభివృద్ధి నమూనాపై దళిత బహుజన మేధావుల్లో కూడా సందేహాలు మొదలయ్యాయి. యీ సందేహాలు పురోగతి అనే భావంలోని లోపాన్ని బట్టబయలు చేస్స్తున్నాయి. వెనక్కి తిరిగి దళిత స్మృతులని వెతికి పట్టుకొనవలసిన అవసరాన్ని కర్ణాటక బహుజన మేధావి డి ఆర్ నాగరాజు స్పష్టం చేస్తున్నారు. “పల్లె కన్నీరు పెట్టింది” గేయంలో గోరటి వెంకన్న  కుల వృత్తుల, కుల సంస్కృతుల ప్రాచీన స్మృతుల చప్పుడులో తాను మునిగి, మనని ముంచెత్తాడు.
అగ్ర వర్ణాలు ప్రకృతికీ, సంస్కృతికీ దూరంగా జరిగి పోతుంటే, దళిత బహుజన మేధావుల ప్రయాణం దానికి పూర్తి వ్యతిరేక దిశలో సాగుతోంది. దీన్ని మన అగ్ర వర్ణ మేధావులు కూడా గుర్తించలేక పోతున్నారు. అరిగి పోయిన అభ్యుదయ, నాస్తిక సిద్ధాంతాల్ని వల్లిస్తున్నారు. రోహిత్ సైన్స్ దృక్పథం పరిశీలిస్తే యీ సంగతి స్పష్టమవుతుంది.
రోహిత్ స్టీఫెన్ హాకింగ్‍ని కాక, కార్ల్ సాగాన్‍ని అభిమానించాడు అనే విషయం చాలా ప్రధానమైందని మిత్రుడు నరహరి అన్నాడు. నిజమే, స్టీఫెన్ హాకింగ్ దృక్పథం పూర్తిగా ప్రాగ్మాటిక్. ఐన్‍స్టీన్ నుంచీ కార్ల్ సాగాన్ వరకూ వొక మత పర దృక్పథం కొనసాగుతూ వొస్తుంది. అది స్టీఫెన్ హాకింగ్ దృక్పథానికి పూర్తిగా వ్యతిరేకం. హాకింగ్ యీ ప్రపంచాన్ని సృష్టించిన “గాడ్ ఫ్యాక్టర్” గురించి యిటీవల ప్రస్తావించారు. సైంటిస్టులు వ్యతిరేకించారు, కానీ దాని వల్ల స్టీఫెన్ హాకింగ్‍కి మత పర దృక్పథం ఉందని చెప్పలేం.
అసలు మతపర దృక్పథం అంటే ఏమిటి ? యిక్కడ నేను ఐన్‍స్టయిన్ ప్రతిపాదించిన కాస్మిక్ రెలిజియన్ గురించి ప్రస్తావిస్తున్నాను. విశ్వాన్నీ, ప్రకృతినీ పరిశీలించడంలో మనిషి తన అహాన్ని అధిగమించడం. అది ఐన్‍స్టీన్ ప్రస్తావించిన మత దృక్పథం. కార్ల్ సాగాన్ కూడా కాస్మిక్ రెలిజియన్ గురించి మాట్లాడాడు. మరింత ముందుకు వెళ్ళి హిందూ పురాణాల్లోని స్థలకాల దృక్పథంలోని విశాలత్వానికి దిగ్భ్రాంతి చెందాడు. యిక్కడ సైన్సూ, పురాణమూ యేకమయ్యాయి. అరలు అరలుగా విడిపోయిన మానవ ఙ్ఞానం వొకచోట సంగమించే నదీ సంగమాన్ని కార్ల్ సాగాన్ కలగన్నాడు. రోహిత్ హృదయం కూడా అక్కడనే విహరించింది. కార్ల్ సాగాన్ సహ రచయిత్రి, సహచరి నుంచి రోహిత్ మరణాంతరం అతనికి మద్ధతుగా లేఖ రావడం విధి వైచిత్రి. ఙ్ఞాన మహా సాగరాన్ని మధించడంలో కార్ల్ సాగాన్ చూపిన విఙ్ఞత ఐన్‍స్టీన్ చూపిన దృక్పథానికి కొనసాగింపే. క్రీస్తూ, బుద్ధుడూ వంటి మత ప్రవక్తలూ, రుషుల అంతర్దృష్టి, ప్రయోగాల మీద ఆధార పడిన సైంటిస్టుల దృక్పథం కన్నా గొప్పది అని ఐన్‍స్టీన్ అంటాడు.
“వాట్ షుడ్ బీ”, ప్రపంచానికి వొక లక్ష్యాన్ని మతమే యిస్తుందని ఆయన భావించాడు. మొత్తంగా మతమంటే మనిషి తన అహాన్ని త్యజించి ప్రకృతి ముందు పసిపిల్లవాడిలా నిలబడడం అనే అర్థాన్ని ఐన్‍స్టీన్ ఆశ్రయించాడు. ఙ్ఞానం ఙ్ఞానం కోసమేనన్నాడు. కార్ల్ సాగాన్ ఐన్‍స్టీన్ దృక్పథాన్ని ప్రశంసించాడు. ఆనంద్ తేల్ తుంబ్డే బౌద్ధాన్ని  మానవకేంద్రక దృష్టి నుంచి విముక్తం చేసే దృక్పథంగా కీర్తించినపుడు మతం అంటే దేవుడు, దెయ్యం అతీంద్రియ శక్తి అనే భావాల కంటే విశాలమైన దృక్పథం కనబడ్తుంది.
కానీ స్టీఫెన్ హాకింగ్ దృక్పథం సంకుచితమైనది. దుందుడుకుతనం, విశ్వంలోకి విస్తరించడం అనేవి ప్రాగ్మాటిక్ దృక్పథంలోని ప్రధానమైన అంశాలు.  గ్రహాంతర జీవుల పట్ల భయాందోళనలు కూడా ఆయనకు యెక్కువ.  కారణం దుందుడుకుతనం.  దురాక్రమణ దృక్పథం నుంచే అమెరికా నాగరికత ఏర్పడింది. నాగరికత ఆవిర్భావంలో భాగంగా అనేక జాతులు అంతరించాయి. అలాగే గ్రహాంతర వాసులవల్ల మానవ జాతి కూడా అంతరించవచ్చునన్న భయం ఆయనకి వుంది. అదే సమయంలో దురాక్రమణ, దుందుడుకుతనంలేనిదే మనిషి మనుగడ అసాధ్యమన్న దృక్పథం ఆయనకు ఉన్నాయి. అహాన్ని జయించడం అనే మత దృక్పథం ఆయనలో శూన్యం. విశ్వాన్ని నడిపే అతీంద్రియ శక్తి గురించి మాట్లాడినా ఆయనది మత దృక్పథం అనలేం. ఆయనది పాశ్చాత్య కేంద్రక దృక్పథం. పాశ్చాత్య విస్తరణ కాంక్షకి ఆయన చెప్పే కాస్మిక్ సిద్ధాంతం అద్దం పడ్తుంది. యింక భూమి నివాస యోగ్యం కాదు. వేరే గ్రహాన్ని వెతుక్కోవాలి అనడంలో యీ విస్తరణ కాంక్ష్యే విస్తృత రూపంలో కనబడ్తుంది.
భూమినే తల్లిగా పూజించడం, భూమిని కేంద్రంగా భావించడం వర్ధిల్లిన ప్రాచీన సమాజాల్లో భూమినీ, మానవ సమాజాన్నీ మెరుగు పరచడం యెలా అనే దృక్పథం ఉండేది. కానీ విశాల విశ్వమంతా ఆక్రమించాలనే భావన మనిషిలో మరింత దుందుడుకుతనాన్ని పెంచే అవకాశాలే కనిపిస్తున్నాయి. దీనికి భిన్నమైనదే విశాల విశ్వభావన. మనిషిలోని యీగోని తగ్గించి, ప్రకృతిని ఆరాధించే స్థితికి తీసుకు వెళ్తుందనే దృక్పథం . యీ దృక్పథమే రోహిత్ దృక్పథం కూడా. రోహిత్, స్టిఫెన్ హాకింగ్‍లా కాక హేతువునీ, కల్పననీ(ఊహనీ) ఏకం చేసాడు. అతనిలో కలలూ, నక్షత్ర లోకాలూ ఐక్యమయ్యాయి.
యింత విశాలంగా, గాఢంగా పరిశీలించిన వ్యక్తిని గౌరవించే స్థాయిలో మన సమాజం లేదు. ప్రాచీన భారతీయ విశ్వ దృక్పథంలోని విశాలత్వం, యిక్కడి మనుషులలోని యిగోని తగ్గించలేక పోయింది. దానికి కారణమేమిటి?
నిజానికి మన సమాజాలు ప్రాచీన సమాజాల కన్నా సంకుచితంగా మారిపోయాయి. పురాణ కథనాలు మనుషుల మీద గాఢమైన ముద్ర వేయగలిగేవి. కుల పురాణాలు కూడా అటువంటి గొప్ప పాత్రని నిర్వహించేవి. నేటి మన కళలు కానీ, చదువులు కానీ పూర్తిగా కృత్రిమత్వాన్ని సంతరించుకున్నాయి. అవి మన దృక్పథాన్ని విశాలం చేసే అవకాశం సన్నగిల్లింది. దీన్నే ఆధునిక నిరక్షరాశ్యత అంటాను.
ప్రాచీన కాలంలో కంటే మనలో సహనం తగ్గిపోయింది. చిందు ఎల్లమ్మ అంటుంది – బ్రాహ్మణ నింద ఉన్నప్పటికీ పూర్వం బ్రాహ్మణులు జాంబపురాణాన్ని చూసేవాళ్ళు. యిప్పుడు మమ్మల్ని తిడుతున్నారంటూ చూడడానికే నిరాకరిస్తున్నారని చిందు ఎల్లవ్వ చెప్పారు. అంటే విమర్శని సహించే శక్తి ఆధునిక
 యుగంలో సన్నగిల్లింది.
టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది చదువుకి అర్థాన్ని మార్చేసింది. భాషని కుదింపజేసింది. అంతిమంగా సంకుచిత దృక్పథాన్ని పెంచింది. నిజానికి, ఆధునిక పూర్వయుగాల్లోని దళితులు నిరక్షరాస్యులు అనే నిర్ధారణ ఆలోచించకుండా చేసిన నిర్ధారణగా కనిపిస్తుంది. కుల వృత్తులూ, కుల విద్యలూ, కుల పురాణాలూ, పటం కథలూ, యింతేకాక దళిత కళాకారుల్లో మాతృభాషని చదవడం, రాయడం వచ్చేవి. అంతే కాదు కఠినమైన సంస్కృత పదబంధాల్ని వుపయోగించేవారు. మీరు ఎప్పుడైనా తెలంగాణా వెళ్ళి చిందు భాగవతుల్నీ, ఢక్కలి జాంబపురాణ కళాకారుల్నీ కలిస్తే వాళ్ళూ ఏ మాత్రం నిరక్షరాశ్యులని పిలవలేమని తెలుస్తుంది. వొక విధంగా చెప్పాలంటే తెలంగాణా దళిత అంతశ్చేతన అనవచ్చు. శుభ కార్యాలు జరపడానికి  మేము బ్రాహ్మణుల్ని పిలవం. యెందుకంటే  మేం చదువుకున్న వాళ్ళం అంటుంది చిందు ఎల్లవ్వ. దళిత జీవితాన్ని నిరక్షరాశ్యతతో నిండిన చీకటిగా వర్ణించడం కుదరదనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే.
తెలంగాణాలో ఢక్కలి మొగిలిని నేను కలిసాను. అతడు అనేదేమిటంటే  అసలు వేదాలు మా దగ్గరే ఉన్నాయి. వాటిని మీ బ్రాహ్మణులు( వశిష్టుడు) దొంగిలించారు అంటారు. అంటే అసలైన ఙ్ఞానం దళితుల వద్దే వుందన్న మాట.
కానీ ఆధునిక యుగం ప్రాచీన సమాజ కథనాల్నీ పురాణాల్నీ వెర్రి పురాణ గాధలుగా తిరస్కరిస్తుంది. కానీ కార్ల్ సాగాన్ శివతాండవంలో విశ్వరహస్యాన్ని చూసాడు. బ్రహ్మ జీవితంలో కాల విస్తృతిని చూసాడు. అంటే ప్రాచ్య పురాణాల్ని ఙ్ఞాన చరిత్రలో ప్రధాన భాగం చేసాడు. అతడే మన రోహిత్‍కి ఆదర్శప్రాయుడు.
హిందూ వాదులు పాశ్చాత్య నాగరికతా శాపగ్రస్తులు. అందుకే రోహిత్‍కి ఉండే విశాల దృష్టి వారికి లేదు. కార్ల్ సాగాన్ కాదు, స్టిఫెన్ హాకింగ్, అతని పాశ్చాత్య  దుందుడుకు తనం వారికి ఆదర్శం.
రోహిత్ పాశ్చాత్య మానవ కేంద్రిత ఆధునికతని నిరసిస్తూ చివరి లేఖలో కూడా ప్రకృతి ప్రేమని చూపాడు. మార్పు, అభివృద్ధి పేరుతో పెరుగుతున్న కృత్రిమత్వాన్నీ, విధ్వంసాన్నీ నిరసించాడు.
పాశ్చాత్య ఆధునిక నాగరికతకి నిరంతరం వొక  శత్రువు అవసరం. ఎందుకంటే విస్తరణ, దుందుడుకు తనాలే దాని స్వభావం. ప్రస్తుతం దాని శత్రువు ముస్లీంలు (హిందువులు ప్రచ్చన్న క్రైస్తవులు, ప్రచ్చన్న అమెరికన్లు, కనుక విడివిడిగా వారి గురించి చెప్పడం వ్యర్ధం). యీ ఆధునికతనే ఆదర్శంగా తీసుకోవడం వల్ల దళిత ముస్లీం ఐక్యత యింతవరకూ సాధ్యం కాలేదు. దళిత ముస్లీం ఐక్యతతో కూడిన విద్యార్ధి ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా యీ ఆధునిక సామ్రాజ్యవాదానికి ముప్పుగా పరిణమించాడు రోహిత్.
పౌరాణిక యుగంలోనైనా, సైన్స్ యుగంలోనైనా కాస్మిక్ దృక్పథానికీ, సామాజిక దృక్పథానికీ మధ్య తాత్విక సంబంధం ఉంటుంది.
స్థలకాలాల్లో దురుసుగా విస్తరిస్తూ పోవడమే ,మానవ జాతి లక్ష్యం అనేది వొక భావన. యిది ఙ్ఞానాన్ని ఆధిపత్యంగా మారుస్తుంది.
అనంతమైన స్థల కాలాలలో మనిషి స్థానం చాలా స్వల్పమని, అందువల్ల మనిషి ప్రకృతినీ తోటి మనుషుల్నీ జీవుల్నీ ప్రేమించడమే మానవ ఙ్ఞానపు అంతిమ లక్ష్యమనీ మరో దృక్పథం. యీ కాస్మిక్ కల్చరల్ దృక్పథమే రోహిత్ దృక్పథం. యీ దృక్పథాన్ని మొగ్గలోనే తుడిచేయాలని చూస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాదపు వికృత శిశువే హిందూయిజం.
రోహిత్ మరణం గ్రహణం మాత్రమే. అతని తాత్విక సందేశం అమరం.
peepal-leaves-2013

అరుణ్ కాలింగ్ అరుణ్!

 

– అరుణ్ తోట

~

arun tota

ఏ సంవత్సరమో గుర్తు లేదు కాని ఆంధ్రజ్యోతిలో ‘నవీన’ అన్న కాలమ్ లో మొదటిసారి తన పేరు చూసినట్టు గుర్తు. కాలమ్ చదివిన వెంటనే అడిగాను అమ్మని, “ఎవరమ్మా ఈ అరుణ్ సాగర్? ఇంత బాగా ఎలా వ్రాస్తున్నారు?”

ఇక అప్పటి నుంచి ప్రతీ వారం అయన కాలమ్ కోసం ఎదురుచూడడం, ఆయన్ని కలవాలని తపించటం, కలవటం. అయన వ్రాసిన ప్రతీది పనిగట్టుకుని చదవడం, చదివించడం – కొద్ది కాలానికి ఫేస్బుక్ లో మా యాదృచ్ఛిక చర్చలు, ఆయనతో వ్యక్తిగత సంభాషణలు – తిరిగి చూసుకుంటే ఇప్పుడు అనిపిస్తుంది, అన్ని సంఘటనలు ఒక సహేతుక కారణంతోనే జరిగినట్టు.

తనకి ముందే తెలుసేమో ఇలా జరగబోతుంది అని. జీవితంలోని విషాదాన్ని “యు నో, ఐ డోంట్ హావ్ టైం ఫర్ యు” అని తన్నితరిమేసి, చేతనైనంత కాలం మాన్ వాచింగ్ చేసి, మనల్ని కాచి వడబోసి, పనికిరాని చెత్తను తన రచనలతో అలా పక్కకి తోసేసి, జీవిత గడియారంలో సమయం చూసుకుని “చలో, మేరా వక్త్ ఆగాయ” అని నిష్క్రమించారు.

ఎలా వ్రాస్తున్నారు అనే దానికంటే ఎలా వ్రాయగలిగారు అనేది ఒక శేష ప్రశ్నగానే మిగిలిపోయింది. తనని ఏ సంఘటనలు, అనుభవాలు ప్రేరేపించాయో ఇంకొంచెం సన్నిహితం అయినప్పుడు అడగాలనుకున్నా, కానీ ఆ అవకాశం లేకుండా ‘మ్యూజిక్ డైస్’ అని సైన్ ఆఫ్ చేసి వెళ్ళిపోయారు. ఏ జ్ఞాపకాల కొలిమి ఆయన గుండెల్ని సమ్మెట కొట్టి, కాల్చి ఇంతగా సానపెట్టిందో కదా?

అరుణ్ సాగర్ – ఆ పేరు తలుచుకుంటేనే ఏదో పులకరింపు, లేక జలదరింపా? తన కవితలు, రాతలు, వ్యాఖ్యలు, ఫేస్బుక్ పోస్టులు ఏవైనా కాని, చదువుతుంటే ఆ పదాల నుంచి అరుణ్ సాగరే ఒక్కసారిగా బయట కొచ్చి మన భుజాల్ని పట్టుకుని ఆపాదమస్తకం ఊపినట్టు ఉంటుంది. మాటలా లేక అక్షర తూటాలా అవి? కళ్ళు అక్షరాల వెంట పరుగుతీస్తుంటే నికోటిన్ , కేఫైన్, ఇథనాల్ మరే ఇతర ఉద్దీపన అవసరంలేని హిజ్(అరుణ్ సాగర్) హైనెస్ ఎఫెక్ట్ కి గురౌతాం.

 

చట్టబద్ధమైన హెచ్చరిక: ఈయన రచనలు చదువువారు వెంటనే వారికీ వీరాభిమనులవుదురు. జాగ్రత్త!

 

ఈయన ధరించే ఒక సాధారణ జీన్స్ ప్యాంటు నీల్ కమల్ అని సోల్ ఫుల్ ఆటిట్యూడ్ చూపెడుతుంది. తాటి తోపు కాడ తాటాకుల పరుపు, కల్లుకుండతో జతకట్టి ఆయనను ఊర్ధ్వలోకపు అంచులకి తీసుకెళ్తుంది. విశాఖ గాని దుబాయ్ కానీ మరే సాగరతీరం కాని, అరుణ సాగర ఆలోచనా తరంగాల ముందు అ కడలి కెరటాలు కూడా ‘మన కంత బలమేక్కడిదిలే బాస్’ అని చిన్నబుచ్చుకుని నెమ్మదిగా వెనక్కు జారిపోతాయి. సగటు మగాడిని ‘రోబోసేపియన్’ అని వెటకరించినా, బాహర్ నికల్ రే భై, నికల్కే నిన్ను నీవు తెలుసుకొనుము అని జిడ్డు గారి ఇష్టైల్లో ‘మేల్’ కొల్పినా ప్రతిదానిలో హిజ్ హైనెస్ ఎఫెక్ట్ నిను వీడని నీడను నేనే అంటుంది.

 

డిస్క్లైమర్: ఈయనను అనుసరించు వారు కార్పొరేట్ కొలిమిలో ఊపిరాడక, సాలెగూట్లో చిక్కుకున్న కిటకంలా గిలగిలా కొట్టుకుందురు.

 

అయన వ్రాతలలో ఒక్కోసారి కవితావేశం కొంచెం ఎక్కువై పిచ్చితనం లాగ (భావోన్మాదం అనాలా?) అగుపడచ్చేమో. కాని అరుణ్ సాగర్ మాటలలో మనల్ని మనం చూసుకోగలిగినప్పుడు మాటలలో వ్యక్తపరచ లేని, చేతలతో చూపెట్టలేని భావ సంచలనానికి గురి కావడం, అది బయటకు పిచ్చితనంగా కనపడడం సహజం. అసలు అలా కనపడక పోవడమే నిజమైన పిచ్చితనమేమో! అలా కాలేదు అంటే మన జీవిత పరిణామ క్రమంలో ఏర్పడ్డ మానసిక కాలుష్యం మనల్ని కుళ్ళపొడిచేసిందని అర్ధం. ఆయన రాతలు ఒక్కసారి చదివితే అర్ధం కావట్లేదా? ఒకటికి పదిసార్లు, ఇంకా కావాలంటే వంద సార్లు చదవండి, చదివిన ప్రతీసారి ఒక కొత్త కోణం ఆవిష్కృతమౌతుంది.

 

ఇంతకీ ఆయనదే శైలి? సర్రియలా, అబ్స్త్రాక్టివా, హైకూనా లేక ఇంకేదైనానా? ఆయన ఎంచుకునే అంశాలు, భావజాలం ఎటువంటిది? రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ లేదా లిబరల్? బహుశా ఆయననే అడిగి వుంటే, తన మార్కు చిరునవ్వుతో భుజాలు చిన్నగా ష్రుగ్ చేసి “యు డిసైడ్ అండ్ టెల్ మీ డ్యూడ్” అనేవారేమో. తన భావజాలాన్ని ఏ గాటన కట్టలేం. అదొక స్వచ్చమైన నీటి లాంటి స్థితిలో వుంటుంది. వరద ప్రవాహమయ్యి ఏమీ మిగుల్చకుండా సమస్తాన్ని తనతో తుడిచిపెట్టుకు పోగలదు, బావిలో నీటి ఊట లాగ ఉండుండి ఉబికుబికి విస్తారించవొచ్చు లేదా నీటితో నిండివున్నకుండలా నిశ్చలంగా ఉండి కదలక – ఎప్పుడో భళ్ళున బ్రద్దలవనూ వొచ్చు. ఆయన ప్రభావం ఇలాగే ఉండబోతుంది అని ఖచ్చితంగా ఏమీ చెప్పలేం. ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ‘హిజ్ హైనెస్’ హిప్నొటైజ్ చేస్తుంది.

కాని ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలం. అరుణ్ సాగర్ వ్రాతల్ని అంచనా వేయాలంటే ఇంకో అరుణ్ సాగర్ కావాలి. నాకున్న (కొద్దిపాటి) పరిజ్ఞానంలో ఈయన లాగ వ్రాయగలిగిన సమకాలీకులు ఎవరూ లేరు. బహుశా ఏ శ్రీశ్రీ కాలంలోనో పుట్టి వుంటే ఈయన, శ్రీశ్రీ గారి అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి కొన్ని కొత్త పిడివాదాల్నితెలుగు ప్రజలకి రుద్దేవారు. వారిద్దరూ మాత్రం ఒక చోట కూర్చుని చాయ్ సిప్పుతూ చిద్విలాసంగా ఒకరినొకరు చూసుకుని నవ్వుకునేవారు. ఇప్పుడు కూడా వారు ఆ పని చేయ్యటం లేదని చెప్పలేం సుమా – కాకపోతే , చాయ్ బదులు అమృతం – అంతే తేడా.

ఏమైనప్పటికీ, ఐ టిప్ మై టోపీ టు అరుణ్. నేను తెలుగువాడి ఒంటి మీద వున్నాను అని నా నీల్కమల్ డెనిమ్ కాలరెగరేసిందంటే అది అరుణ్ లాంటి వారి రచనలని చదవగల్గినందుకే. తెలుగు సాహిత్య ప్రపంచంలో ఆయనొక అలజడిని, భిన్నమైన శైలితో-బిగువైన మాటలతో కొత్త ఒరవడిని, తన వైబ్ అందుకో ప్రయత్నించిన వారికి గుండెతడిని మిగిల్చి – బాబ్ డైలాన్ పాట గాలిలో ఊదుకుంటూ (‘బ్లోయింగ్ ఇన్ ద విండ్’) వెళ్ళిపోయారు. బాబ్ డైలాన్ అంటే గుర్తుకువోచ్చింది, తను పీటర్ సీగర్ పాటల్ని చింతూరు ఏజెన్సీ కోయలకు వినిపించారో లేదో.

అయన నాకు ప్రత్యేకంగా సంతకించి పంపిన కొత్త పుస్తకం ఇంకా నా చేతికి రానే లేదు, పక్షం రోజుల క్రితం దాని గురించి ఫేస్బుక్ లో అయనతో మాటలు ఇంకా స్మృతి నుంచి చెరగనేలేదు. ఈలోగానే ఆయన్ను “లగజా గలే” అంటూ ఒకానొక దేవత – క్వశ్చన్, మియ్యర్ మేల్స్, పురుషులు, “షు” అక్షరం పీకగా వొచ్చిన పురుగులు అక్కడ కూడా వున్నారా? – చుపా రుస్తుంలా వొచ్చి అసలు సిసలైన ఆండ్రోమెడ పబ్లిషింగ్ యూనిట్ కి తీసుకెళ్లింది.

ఇంతకీ అక్కడ ఎలా వుంది ప్రభు? ఆ గాలక్సీ కూడా మీ మాటల తూటాలకి మేధోవిస్ఫోటం చెందుతుందా? చెందే వుంటుంది లెండి, మాకిక్కడి నుంచి రాత్రివేళ ఆకాశవీధిలో కొత్త పాలపుంత అలజడి కనపడుతుంది.

– అరుణ్ తోట

peepal-leaves-2013

 

అరుణ్ ఇదిగో ఇక్కడే!

 

 -నర్సిం

~

 

narsim“అన్నా! నేను సాగర్ని, రేపు 27న నా కొత్త పుస్తకం మ్యూజిక్ డైస్ ఆవిష్కరణ, ఖమ్మంలో- రాకూడదు”

“చంపేశావ్ ఆరుణ్, నేను ఛెన్నై వెళ్తున్నాను,  ట్రైన్లో  ఉన్నాను – వరదలొచ్చాక వెళ్ళనేలేదు, వారం దాక రానేమో. మనం తీరిగ్గా కలిసే ఛాన్స్ మిస్స్ అవుతున్నానే!”

తీరికగానే కాదు అసలుకే కలవలేమని, మొత్తంగా మిస్స్ అవుతానని, ఆ మాటలే ఆఖరి మాటలని కల్లో కూడా అనుకోలేదు. కాని అరుణ్ కు అన్ని తెలిసే,  చివరిసారిగా మిత్రులందరినీ కలుసుకునే  అన్ని ఏర్పాట్లను నిబ్బరంగా   చేసుకున్నాడు.

ఏబీకే  గారు పిలిస్తే సుప్రభాతం  మేగజైన్లో చేరడానికి ఆంధ్రజ్యోతి నుంచి నేను, కె. శ్రీనివాస్, సురేంద్ర  రాజు, జింకా నాగరాజు,  రవి అనే లే అవుట్ ఆర్టిస్ట్, ఇంకా కొంతమంది సీనియర్లం వెళ్లాం. అర్టిస్ట్ చిత్ర కూడా చేరాడు.  అప్పుడే జర్నలిజంలోకి అడుగుపెడ్తున్న కొత్తతరం చాకులాంటి కుర్రాళ్ళ గ్యాంగ్ కూడా మాతో పాటు జాయినయ్యింది. అందులో రవిప్రకాష్ (ఇప్పటిTV9 CEO), చంద్ర మౌలి, MV రామిరెడ్దిలతో పాటు అరుణ్ సాగర్ కూడా ఉన్నాడు. ఏబీకే  తర్వాత వాసుదేవ రావు గారు టీం లీడర్. రవిప్రకాష్ రిపోర్టింగ్ లొ ఉంటే అరుణ్, మిగతా వాళ్లు  డెస్క్ లో ఉండేవాళ్లు. మల్లెపల్లి లక్ష్మయ్య, ప్రభంజన్ కుమార్ లు రిపోర్టింగ్ లో తిరిగే వాళ్లు. తెలుగు ‘ఇండియా టుడే’ కు పోటీగా వస్తున్న మేగజైన్ అని మొదటి నుంచే ప్రచారం లో ఉన్నందునా సీనియర్లు, జూనియర్లతో పూర్తిస్థాయి టీంతో బాబూఖాన్ ఎస్టేట్లోని  సుప్రభాతం  ఆఫీస్ కళ కళ లాడేది.

అప్పుడే కాలేజి నుంచి బయటకొచ్చిన జోష్ తో బక్క పల్చగా ఉండే అరుణ్ సాగర్ చేసే అల్లరి,  వేసే జోకులతో ఆఫీస్ నిండా ‘వార్తా’వరణం నవ్వుల పువ్వులు పూచేది. ఈ కొత్త పిల్లలంతా టీలు, బిస్కట్లే కాదూ, మా టిఫిన్  బాక్సులకెగబడి షేర్ చేసుకునేవాళ్లు. అరుణ్ మాటి మాటికి నా టేబిల్ దగ్గరికొచ్చి, “అన్నా! సోనాలి బింద్రే-మళ్లీ నా గుండె తలుపు  తట్టేసిందన్నా-ఘంట కొట్టేసిందన్నా, హే భగవాన్! మై క్యా కరూం” అంటూ ఓ భగ్న ప్రేమికుడులాగా ఓ ఫోజు పెట్టేవాడు. అందరికంటే నాతో, చిత్రతో చాలా చనువుగా ఉండే వాడు. నేనూ అదే అదనుగా  రయ్యుమని ఓ క్యారికేచర్ గీసిచ్చే వాణ్ణి. (అవన్నీ దాచి పెట్టుకున్నాడని తర్వాత  తెలిసింది). అలా సీనియర్లతో జోవియల్ గా ఉంటూనే రాతను, ఆలోచనా విధానాన్ని పదును పెట్టుకున్నాడు. ఆర్నెళ్ల తర్వాతేమో -అంతగా  గుర్తుకు లేదు –  ఆంధ్ర జ్యోతి మళ్లీ తెరిచారు, కె. శ్రీనివాస్ జాయిన్ అయ్యారు.

 

ఒకరోజు నాదగ్గరికొచ్చి “అన్నా! కె.శ్రీనివాస్ గారు, ఆంధ్ర జ్యోతి కి రమ్మంటున్నారు, ఏం చెయ్యమంటావ్? ఏమి అర్ధం కావట్లేదు” అని చేతులు నలుపుకుంటుంటే, “నీకు జర్నలిజంలోనే కంటిన్యూ కావాలనుకుంటే ఇంకేమి ఆలోచించకుండా, వెంటనే మూటా ముళ్లే సర్దుకుని ఆంధ్ర జ్యోతికెళ్లిపో, కెరీర్ బాగుంటుంది” అని చెప్పడం, తను వెళ్లి ఆంధ్ర జ్యోతిలో చేరిపోవడం అన్నీ చక చకా జరిగిపోయాయి. ఆ తర్వాతి ఏడాది నేను ఇండియా టుడే  కోసం మద్రాస్  కెళ్లిపోవడం..అలా కొంత గ్యాప్ వచ్చినా, ఆరుణ్ అంచెలంచెలుగా ఎదగడం చూస్తూనే ఉన్నాను.

సుప్రభాతం లో నాకు తెలిసిన యువకెరటం అరుణ్, ఆంధ్ర జ్యోతి మీదుగా టీవీ 9 లో ఉత్తుంగ తరంగమై ఎగిసిపడడం కళ్లింతలు చేసుకుని చూసేలా చేసింది. రవిప్రకాష్, తను TV 9 CEO గా వెళ్తూ, అరుణ్, చంద్రమౌలి తో పాటు  స్పార్క్ ఉన్న తన సుప్రభాతం మిత్రులందరినీ తీసుకెళ్లాడు. నవన్వోన్మేష భావ సారుప్యత కలిగిన తన ఈ టీం తో రవి TV9 ను టాప్ లో నిలబెట్టాడు. అరుణ్ సెకండ్ పొజిషన్లో ప్రదర్శించిన  దూకుడు, ఆ ఛానెల్ కొక ప్రత్యేకతను తీసుకొచ్చింది. 23 ఏళ్లు నేను దూరంగా మద్రాస్ లో ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాం, మాట్లాడుకుంటూనే ఉండే వాళ్లం, కార్టునిస్టులకు, ఆర్టిస్టులకి సంబందించి ఎదైయినా బైట్ కావలిస్తే తప్పకుండా ఫోన్ చేసేవాడు. 10టీవీ లోగో మ్యూజిక్ ఇళయరాజాతో చేయించుకోవడం కోసం మద్రాస్ వచ్చినప్పుడు, టైం కెటాయించుకుని ప్రత్యేకంగా నన్ను కలవడానికి ఇండియా టుడే ఆఫీస్ కొచ్చాడు. టీవీ 9 నుండి 10 టీవీ  సియీఓ గా జాయిన్ అయ్యానని చెప్పాడు,  అదే అన్నాను- తొమ్మిది తర్వాత పది- “నంబర్స్ కూడా కూడా నీ విలువను పెంచుతున్నాయి ఆరుణ్” అని.

అలా ప్రింట్ మీడియా నుండి ఎలక్ట్రానిక్ మీడియాకు ఒక మెరుపులా దూసుకొచ్చి ‘వీడెవడ్రా బాబూ, దడ దడ లాడించేస్తున్నాడూ అని ప్రత్యర్ధులు విస్తుపోయి చూసే రేటింగ్ ను సాధించిన అరుణ్ ను తలచుకుని  పొంగి పొవడం నాకింకా గుర్తుంది. ఇక పదిమందిలో ప్రత్యేకంగా తనను తాను పోతపొసుకొడంలో అరుణ్ తడబడం మన చూడం. సొనాలి బింద్రేను చూసి గుటకలు మింగే అల్లరి పిల్లడు అరుణ్ సాగర్, ఎదుగుతూ ఎదుగుతూ ఫెమినిజానికి ధీటుగ మగవాణ్ని అంతెత్తున నిలబెట్టాలనుకునే లక్ష్యం తో మేల్ ఛావనిస్ట్ గా  పెద్దమనిషయ్యాడు. తన సొంత డిక్షనొకటి తయారు  చేసుకుని, ‘మేల్’ కొలుపంటూ నిటారుగ నిలబడ్దాడు. తెలుగులో మొదటిసారి ఆ వైపు నుంచి దూసుకొచ్చిన ప్రోజ్-పోయెట్రి, తెలుగూ-ఇంగ్లీష్ కలగలిసిన అరుణ్ రాతలు మర్యాదగ రాసుకునే వాళ్లలొ అలజడి రేపింది. (ఈ మేల్ కొలుపు ను ఇండియా టుడే తెలుగు లో నేను రివ్యూ చేశాను-అసలే అరుణ్ సాగర్ లాగ నిట్ట నిలువుగా ఉన్న పుస్తకం-తలకిందులుగ తపస్సు చెయ్యాల్సొచ్చింది.)

Arun (1)

ఇక మియర్ మేల్, మ్యాగ్జిమం రిస్క్…  మిగత కవిత్వ సంకనాలు అదే దారిలో సాగాయి. ఆ  తర్వాత సామాజిక అంశాల మీద కూడా అనేక వ్యాసాలూ రాసి, అవగాహన, బాధ్యత కలిగిన జర్నలిస్ట్ గా, పౌరుడిగా మారాడు అరుణ్. అవతార్ సినిమాను ఒక సాంకేతిక అద్భుతం గా అందరూ కీర్తిస్తున్న సందర్భం లో, అది ప్రక్రుతి బిడ్డలైన ఆదివాసుల జీవన వనరుల్ని కొల్లగొట్టడానికి బలిసిన సంపన్న దేశాలు చేస్తున్న కుట్రని, టెక్నాలజీ అట్టడుగున దాగిన విశయాన్ని తెటతెల్లం చేస్తూ వ్యాసం రాశాడు, పోలవరం ముంపు, పాపి కొండలు మాయం కావడం మీద “మ్యుజిక్ డైస్” రాసి, పుస్తకాన్ని  నిన్న మొన్ననే రిలీజ్ చేశాడు. ఇలా తనను తాను సాన పట్టుకుంటూ ఒక పరిపూర్ణ మనవుడుగా, విజయుడుగా రూపుదిద్దుకుంటున్న సమయంలో ఈ విస్ఫోటనాలేమిటీ?

రెండేళ్ల క్రితం – మద్రాస్ నుంచి హైద్రబాద్ వచ్చినప్పుడు కలిశాను, తను 10TV CEOగా ఉన్నాడు. ఆఫీస్, స్టుడియో అంతా తిప్పి చూపింఛాడు- “ఇదంతా నేను దగ్గరుండి నా టేస్ట్ కు తగ్గట్టుగ  చేయించుకున్నానన్నా” అంటూ మురిసిపోయాడు. అరుణ్ ఈ వర్టికల్ ఎదుగుదలలో పక్కనే లేకున్నా, నిరంతరం  ఎరుకలోనే ఉన్నాననిపిస్తుంటుంది.  “మ్యుజిక్ డైస్” రిలీజ్  సందర్భాన్ని మిస్స్ కావడం వల్లనేమో, అరుణ్  ఇక మనకు లేడు, ఉండడు, మాట్లాడడు అనేది ఇంకా నా మైండ్ లో రిజిస్టర్ కావట్లేదు.  ఆ అరుణ్ స్రుజన  అయిన 10TV ఆఫీస్,  నేను కార్టూన్ ఎడిటర్ గా ఉన్న నవతెలంగాణ ఆఫీస్ ఒకే బిల్డింగ్ లో ఉన్నాయి . అరుణ్ నాకేమి దూరం కాలేదు, అరుణ్ 10TV కోసం తయారు చేయించిన ఆ లోగో లోను, అట్ట కెమెరా పట్టుకున్న ఆ బుడ్డోడిలోనూ, News is people లోనూ రోజూ తనను చుస్తూనే ఉంటాను. నేను ఇండియా టుడే లో మియర్ మేల్ రివ్యూ కు వేసిన క్యారికేచర్ అరుణ్ కు చాల ఇష్టం, అదే ఈ క్యారికేచర్.

*

 

దాస్ ఈజ్ మై బాస్‌!

 

-శ్రీచ‌మ‌న్

~

madhu“దాస్ ఈజ్ ఫోర్త్ ఫ్లోర్ బాస్‌“ అని పిలిస్తే ఉలిక్కిప‌డ్డాడు ఆఫీస్ బోయ్ దాస్‌. అలా పిల‌వొద్దు సార్ అన్నాడు. గ‌తంలో రెండు మూడు సార్లు పిలిస్తే న‌వ్వి ఊరుకునేవాడు. ఇప్పుడేంటి ఇలా చివుక్కుమ‌న్నాడు.

అనుకున్న‌లోపే..అలా పిలిస్తే..అరుణ్ సాగ‌ర్ సార్ గుర్తొస్తాడు.  ఆయ‌న ఎప్పుడూ అలాగే పిలిచేవాడు అని చెప్పుకొచ్చాడు. అలా పిల‌వొద్దు సార్ అని చికాగ్గా స‌మాధానం చెప్పాడు. ఎందుకు అని అడుగుదామ‌నుకున్నా! కానీ దాసులో అరుణ్ సాగ‌ర్‌పై ప్రేమ స‌న్న‌ని క‌న్నీళ్ల పొర‌లా క‌నిపించింది.

ఆఫీస్ బాయ్ దాస్ అరుణ్‌సాగ‌ర్‌కు బాసెందుకు అయ్యాడు?  బాస్ ఎలా వుండాలో తెలియ‌ని అరుణ్ సాగ‌ర్‌కు ఆఫీస్ బాయ్ దాసు కూడా బాసులాగే క‌నిపిస్తాడు. ఇది నిజం కావాలంటే దాస్‌ని అడ‌గండి. మీలో ఎవ‌రైనా, పోనీ మీరైనా అమెరికా వెళ్లొస్తే..పెళ్లాంకి ఓ గిఫ్ట్‌. పిల్ల‌ల‌కు చాక్లెట్లు, ఫ్యూచ‌ర్‌లో మ‌న‌కు ఏమ‌న్నా ప‌నికొచ్చే పైర‌వీగాళ్ల‌కు ఓ గిఫ్ట్  కొని తెస్తారు. అమ్మెరికా నుంచి తెచ్చామ‌ని గొప్ప‌లు చెబుతారు. కంటోన్మెంట్ గోడ వార‌గా పేవ్‌మెంట్ మీద కొన్నా యూఎస్ క‌ల‌రిచ్చి కానుక‌గా ఇస్తారు.

కానీ అరుణ్ సాగ‌ర్ అలా కాద‌ని దాసు చెబితే తెలిసింది. అమెరికానో, ఇంకో దేశ‌మో వెళ్లొచ్చిన సాగ‌ర్‌. దాసు అన‌బ‌డే ఆఫీస్ బోయ్‌..దాస్ ఈజ్‌ బాస్‌కు ఓ టీష‌ర్ట్ తెచ్చాడ‌ట‌. ఈ విష‌య‌మూ దాసే చెప్పాడు. పండ‌క్కి బ‌ట్ట‌లు తీసుకోమ‌ని డ‌బ్బులు కూడా ఇచ్చేవాడ‌ట‌. బాస్‌ను అదేనండి ఆఫీస్‌బోయ్ దాసును ఇలా గౌర‌వించుకున్న ఎడిట‌ర్లు , మ‌హా క‌వులు, మ‌హా ర‌చ‌యిత‌లను..మీరు మ‌హా అయితే సినిమాల్లో చూసుంటారు. లేదంటే మ‌న త‌రం ప్ర‌ముఖులు రాసిన క‌థ‌ల్లో చ‌దివి ఉంటారు. అరుణ్ సాగ‌ర్ కు  త‌న బాసు, దాసు ఒక్క‌టే. ఎందుకంటే ఇద్ద‌రూ మ‌నుషులే కాబ‌ట్టి. ఒక్క దాసునే కాదు. ప్ర‌తి ఒక్క‌రినీ త‌మ్ముడూ! అని గాఢంగా పిలిచే ఆత్మీయుడు అరుణ్‌సాగ‌ర్‌.

ఏ గాడ్‌ఫాద‌ర్ లేకుండా జ‌ర్న‌లిజంలోకి వ‌చ్చిన కొంద‌రికి దేవుడిచ్చిన అన్న‌య్య. అరుణ్ సాగ‌ర్ చ‌నిపోయిన నుంచీ బాగా డిస్ర్ట‌బ్ అయ్యాను. ఆయ‌నతో పెద్ద‌గా పరిచ‌యం లేదు. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయాలనే కోరిక బ‌లంగా ఉండేది. 2003లో ఆంధ్ర‌జ్యోతి జ‌ర్న‌లిజం క‌ళాశాల‌లో మాకు లైఫ్‌స్టైల్ జ‌ర్న‌లిజం పాఠాలు చెప్పిన‌ప్ప‌టి నుంచే నాకు ఆయ‌నంటే ఒక అభిమానం.

ఫీచ‌ర్ రైటింగ్ గురించి మాకు అరుణ్‌సాగ‌ర్ చెప్పిన క్లాసు ఇప్ప‌టికీ గుర్తే. ఎవ‌రు ఏ అంశంపై రాస్తారు అని అడిగాడు. ఒక్కొక్క‌రు ఒక్కోటి చెప్పారు. ఆయ‌న కూడా క‌లాం హెయిర్ స్టైల్ మీకు ఫీచ‌ర్ రైటింగ్‌కు ప‌నికి రాదా? అని అడిగాడు. అప్ప‌టిక‌ప్పుడు క‌లాం వెండి జ‌ల‌తారు జుత్తుపై ఇన్‌స్టంట్‌గా ఏదో ఒక‌టి రాసి చూపించి నా ఆస‌క్తిని బ‌య‌ట‌పెట్టాను. ఆ త‌రువాత టీవీ9లో చేరాల‌ని మా మిత్రుడి రిక‌మెండేష‌న్‌తో ఒక‌సారి క‌లిశాను.

క‌ర్నూలులో ఆంధ్ర‌జ్యోతి ఎడిష‌న్ ఇన్‌చార్జిగా ఉన్న‌ప్పుడు క‌ప్ప‌ట్రాళ్ల వెంక‌ట‌ప్ప‌నాయుడు హ‌త్య ఘ‌ట‌న గురించిన స‌మాచారం కోసం ఫోన్ చేశారు. నెక్ట్స్ ఆంధ్ర‌జ్యోతి ఎడిట‌ర్ కె శ్రీనివాస్ పుస్త‌క ప‌రిచ‌య స‌భ కోసం ఖ‌మ్మం వ‌చ్చిన‌ప్పుడు క‌లిశాను. ఇంతే! ఇంత‌కుమించిన ప‌రిచ‌యం లేదు. 10 టీవీలో ఉద్యోగం కోసం వెళ్లాను. మ‌ధు నీకు ఉద్యోగం క‌న్‌ఫ‌ర్మ్. జీతం మాత్రం హెచ్ ఆర్ వాళ్ల‌తో మాట్లాడుకో అని చెప్పాడు. వాళ్ల‌తో బేరం కుద‌ర్లే! చెప్పి వ‌చ్చేశా! ఇంకెప్పుడూ క‌ల‌వ‌లే!

ఓ నెల‌రోజుల క్రితం ప్రెస్‌క్ల‌బ్‌లో ఎదురుప‌డితే న‌మ‌స్తే సార్ అన్నా! ఎవ‌రు నువ్వు అని అడ‌గ‌లేదు. తాగిన మ‌త్తులో ఉన్న నేను సార్‌! న‌న్ను గుర్తుప‌ట్టారా? అని అడిగా. నువ్వు చ‌మ‌న్‌వి క‌దా! అన్నాడు. ఉద్యోగం ఇవ్వ‌క‌పోయినా, గుర్తుంచుకున్నారు చాలా సంతోషం అని చెప్పి..మ‌త్తుగా ఒత్తుల‌తో కూడి వ్యాక‌ర‌ణ దోష సంభాష‌ణ‌కు దిగినా..చిరాకు ప‌డ‌ని స‌హ‌న‌శీలి. ఆ రోజు ప్రెస్‌క్ల‌బ్ నుంచి వెళ్లిపోయాడు. నాకిష్ట‌మైన క‌విని చూడ‌టం అదే చివ‌రిసారి. నాకిష్ట‌మైన జ‌ర్న‌లిస్టుతో మాట్లాడ‌టం అదే ఆఖ‌రిసారి. అరుణ్‌సాగ‌ర్ ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నే కోరిక నెర‌వేర‌లేదు. ఆయ‌న రాసే క‌విత‌ల‌కు కామెంట్‌గా మ‌రో క‌విత రాస్తే.. గో ఎ హెడ్ అంటూ ప్రోత్స‌హించిన మ‌న‌త‌రం మ‌హా మ‌నీషితో నా పుస్త‌కానికి ముందుమాట రాయించుకోవాల‌నే ఆశ తీర‌లేదు.

బ‌య‌టి ప్ర‌పంచంలో దృష్టిలో అరుణ్ సాగ‌ర్ అత్యంత ఆధునికుడు. బాగా ద‌గ్గరున్న వారి దృష్టి కోణంలో సున్నిత మ‌న‌స్కుడు.

అరుణ్ సాగ‌ర్ నాకు తెలిసి ఆదివాసీల‌ ఆత్మ‌బంధువు. గాడ్‌ఫాద‌ర్ లేని వాళ్ల‌కు గాడ్ బ్ర‌ద‌ర్‌. క‌విత్వాన్ని ప్రేమించేవాళ్ల‌కు ఓ తాజ్‌మ‌హ‌ల్ లాంటి వాడు. న‌మ్మ‌క‌ద్రోహుల‌పై క‌క్ష తీర్చుకోవాల‌నే క‌సి లేని చేత‌గానివాడు. స్నేహం అరుణ్‌సాగ‌ర్ బ‌ల‌హీన‌త‌. మంచిత‌నం అరుణ్ సాగ‌ర్ మ‌రో వీకెనెస్‌. ఓవ‌రాల్‌గా మ‌నిషిత‌న‌మ‌నే దీర్ఘ‌కాల వ్యాధితో బాధ‌ప‌డుతూ ..స‌మాజ‌మ‌నే వైద్యాల‌యంలో చికిత్స పొందుతూ క‌న్నుమూశాడు.

దాస్ ఈజ్ మై బాస్‌..అన్న మంచిత‌నం, మ‌నిషిత‌నం వున్న అరుణ్‌సాగ‌ర్ ద‌గ్గ‌ర ప‌నిచేసే అవ‌కాశం ఒక్క‌రోజు కూడా రాక‌పోయినా ..అరుణ్ సాగ‌ర్ ఈజ్ మై బాస్‌. అరుణ్‌సాగ‌ర్ బాస్ మాత్రం దాసే.

*

అంతా కాల కోలాహలమే!

 

-జయశ్రీ నాయుడు

~

 

తన సిరాను తనే తయారు చేసుకుని

జీవితపు కాగితాల మీదకు వొంపుతుంది

వ్యక్తి వాదమై జీవిస్తుంది

ప్రతి కలమూ కాలమే అయినా

సిరాల రంగులు రాతల రీతులూ వేరు వేరవుతాయి

రీతులన్నీ పరుగులు తీస్తూ

కొన్ని దారులు చేస్తాయి

ఇక మాటల గోదారి ఉరకలేస్తుంది

మాగాణి పైరులా పచ్చని బంధాలు

కొన్ని కోతల కరుకు గరుకు గళాలు

మరి కొన్ని అంతా కాల కోలాహలమే

బిందువులా జాలువారుతూ

అక్షరాల గళం లా కాగితం పై పరుచుకుంటు

జీవిత సేద్యం చేస్తావు

దెన్ హాపెన్స్

ది కాల్ బాక్

కొత్త కలాన్ని సిద్ధం చేసిందేమొ

పెన్ డౌన్ చేసి

ప్రపంచానికి శెలవు ఇవ్వమంటుంది

ఇంకి పోయిన సిరాని

తిరిగి కలం లోకి ఇంజెక్ట్ చెయ్యలేక

జ్ఞాపకాలైన అక్షరాల్నే చదువుకుంటూ

వ్యక్తి గా నిలబడే రూపాన్ని

మనసు మీద ప్రతి పూట కొత్తగా చిత్రించుకోవడం ఇదే…

మా ఆలోచనల కాన్వాస్ లకు

నువ్వు అరువిచ్చిన మేల్కొలుపు

ది మ్యూజిక్ నెవర్ డైస్!

*

మంత్ర పుప్పొడి

 
-కె. గీత
~
ఒక తొలి చిరునవ్వు లేని
చివరి వీడ్కోలు
నన్ను నిద్దట్లోనూ
కుదుపుతూంది
కవికి మరణం ఉందేమో
కవిత్వానికి మరణం లేదు కదూ!
భూమిపై సజీవంగా ఉండే
అక్షరానికి అంతం లేదు కదూ!!
ఆకాశం నించి
మంచు పుష్పాలు రాలినట్లు
శరీరం జీవితం నించి
వీడిపోవచ్చు-
జ్ఞాపకాలు పునర్జన్మలై
మిరుమిట్ల మంచు పర్వతాలై
పెరుగుతూనే ఉంటాయి
సముద్రం నించి
కొన్ని అలలు సగమే లేచి పడిపోవచ్చు-
అనంతాకాశం నించి
ప్రాణాధార చినుకులై
మరోచోట కురుస్తూనే ఉంటాయి
అయినా
రచయిత కాల గర్భంలో
కుంచించుకు పోతున్న
నీటి బొట్టు
చివరి ఊపిరి చిత్రం
నన్ను  మెలకువలోనూ
వెంటాడుతూంది
జీవితం వెనుక
జ్ఞాపికల్ని అమాంతం మింగేస్తున్న
కృష్ణ బిలమేదో
నన్ను అపస్మారకంలోనూ
జలదరింపజేస్తూంది
మరణం మూసి వేస్తూన్న
తలుపుల్ని ఎవరైనా
ఎప్పుడైనా తడితే బావుణ్ణు
తెగిపోతున్న ఆలాపనా
తంత్రుల్ని ఎవరైనా
అంది పుచ్చుకుంటే బావుణ్ణు
అక్షరానికి ఆధారమైన
అనుభవైక వేదననీ
అనుభూతుల వెల్లువని
అనుక్షణం అక్షరీకరించే
కవి హృదయాన్ని
ఇక సజీవీకరించవలసిందే-
అందని చోటునా జల్లి
చెరిగిపోతున్న
కాలాక్షరాల్ని
సాక్షాత్కరింపజేసే
మంత్ర పుప్పొడేదో
కనిపెట్టాల్సిందే-
—–
(అరుణ్ సాగర్ కి-)

ఒక విస్థాపితుడి స్వగతం

 

 

-గుర్రం సీతారాములు

~

gurramఅరుణ్ సాగర్ తెలుగు బుద్దిజీవుల్లో ఒక మర్యాదగల పాత్రికేయుడు. చూడడానికి అత్యాదునికునిగా కనిపించే అతను ఆరణాల అచ్చం ఆదివాసీ. అకస్మాత్ గా అయన గుండె పనిచేయడం ఆగింది. అరుణ్ తండ్రి  టి.వి.ఆర్ చంద్రం అంటే గోదావరీ నదీలోయ పరీవాహక ప్రాంతం లో, పోడుకోసం గూడుకోసం, తునికాకు రేటుకోసం జీవితం త్యాగం చేసిన ఒక నికార్సయిన, నిబద్దత కలిగిన సాధారణ కార్యకర్త . ఉమ్మడి కమ్యునిస్ట్ పార్టీ నుండి మార్క్సిస్ట్ పార్టీ దాకా బద్రాచలం ప్రాంత పార్టీ నిర్మాతల్లో ఒకడుగా ఆయన  తాను నడిచిన నేలంతా పోరాటాల విత్తనాలు చల్లి ప్రజల జ్ఞాపకాల్లో మిగిలే ఉన్నాడు.

ప్రపంచ  వ్యాప్తంగా భూమి ఇరుసుగా అనేక సాయుధ, విముక్తి పోరాటాలు జరిగినవి. అవి వలసవాదుల కబ్జానుంచి భూమిని విముక్తి చేసుకునే క్రమం లో, స్వతంత్రం ఒక మేడిపండు అని, అది కేవలం అది ఒక అధికార మార్పిడీ అని అనేక ప్రత్యామ్నాయ, అస్తిత్వ వాద ఉద్యమాలు నడిచాయి. ఆ క్రమం లో  అంతులేని రక్తపాతాలు  జరిగినవి. వీటేనక  టి.వి.ఆర్ చంద్రం తరం చేసిన త్యాగాలూ ఉన్నవి. బద్రాచలం, బస్తర్ నేలలు  దశాబ్దాల పోరు భూమిగా పోరాట వారసత్వాన్ని కలగన్నది, దాని పొరల్లో పేరుకు పోయిన రక్తపు మరకల తడి ఆరని చిత్తడి నేలలు అవి . ఒక నాడు మహోజ్వలంగా వెలిగిన స్థానిక సంచార జాతుల రాజ్యాలు, రాజులు వర్తమాన  పోరాటాల మూలంగా కనుమరుగు అయ్యాయి . ఆధునికత పేరుతో జరిగిన అభివృద్ధి కోట్లాది మంది అత్మగౌరవంగా బ్రతికిన నేలనుంచి విడదీయ బడుతున్నారు . ఇలా వలస పాలన నుంచి విముక్తి పొందిన అనేక దేశాలలో దాదాపు ఇరవై కోట్లకు పైగా విస్తాపనకు తాకిడికి చిద్రం అయ్యారు అని లెక్కలు చెబుతున్నాయి.ఇంత విద్వంశం జరుగుతున్నా ‘నాగరికతకు’ ఆవడ కారడవుల్లో నాగరికం అని పిలవబడుతున్న ప్రపంచానికి  వేల ఏళ్ళ దూరంలో, సెలయేటి నీరంత  ప్రశాంతంగా, తమదయిన, అవధులు లేని, ఆంక్షలు లేని, దోపిడీ, పీడన లేని అసలు రేపు ఏంటి ? స్వంత ఆస్తి ఏంటి ? అనే ఆధునిక భావనల గాలి సోకనంత స్వచ్చంగా బ్రతుకుతున్న కోట్లాది మంది గోదావరి పరీవాహక  ఒడ్డున ఉన్నారు.

తాళ్లూరి అరుణ్ సాగర్ ఉరఫ్ చంద్రం గారబ్బాయి నాలుగున్నర దశబ్దాల కింద కొంట అనే చిన్న గిరిజన గ్రామం లో  కుడివైపు సీలేరు (ఆంధ్రప్రదేశ్ ) ఎడమవైపు శబరి (చత్తీష్ ఘడ్) దాని నడుమ కాసింత నేల  ఒడిసా లో బాగం అయిన ఆయన రాసుకున్నట్లు ‘ సరిగ్గా కొమ్ముబూర లా వంపుతిరిగిన చోట’ తన ఇంటి కిటికీ లోంచి  శబరీ గోదారీ సంగమస్థలి లో  కడంచున, ఆధునికత, పురాస్మ్రుతుల జ్ఞాపకాల సంగర్షణ ల మధ్య, భారత కల్లోల విస్పోటనల, ఖాకీ పద ఘట్టనల , ప్రత్యామ్నాయ భావ స్రవంతుల మధ్య ఆయన బాల్యం పురుడు పోసుకుంది. అలా కడగొట్టు నాగరికత విలసిల్లిన ప్రాంతాన అయన కవిత్వ మూలాలు ఉన్నాయి. అక్కడే ఒక మైదాన వాసి- మూలవాసీ నిర్వాశితుడు అవడం ఒక్కటి కాదని అన్నాడు.

అరుణ్ సాగర్  కవిత్వం లో కాసింత ఆంత్రోపాలజీ, నల్లజాతీ సంగీత సొబగు, అత్యాధునికమైన జీవితం లో ఒక మెట్రోపాలిటన్ జీవితం లో ఉన్న సందిగ్ధత, ఇన్ని వైరుధ్యాలు ఉన్నా త్యాగానికి  లింగ వివక్ష వద్దనీ తండ్రుల త్యాగాలు కొనియాడుతూ ప్రతి కొడుకూ తన తండ్రి జన్యు విశేషణగా, ఆయన కొనసాగింపుగా చేసిన అభివ్యక్తి తెలుగు సాహిత్య లోకాన ఒక కుదుపు. ‘పత్తి కాయలా గుండె పగిలిపోతుంటే పురుగు మందు తాగిన’ తండ్రుల గుండె కోతను ఆయన  లాగా చెప్పే సాహసం ఎవరూ చేయలేదు. అరుణ్ సాగర్ పుట్టిన పెరిగిన నెలలో ఉన్న ఆదిమ జాతుల  నడకకు ఒక లయుంది, ప్రకృతిలో బాగం అయి పరవశం తో పాడుకున్న రేల పాటలు గానం చేసుకున్న  గొంతుకు ఒక శ్రుతి ఉంది.  ఒక సామూహిక బృందగానం ఉంది. మట్టితో పెనవేసుకున్న వేల ఏళ్ళ జ్ఞాపకాల బరువూ ఉంది. ఒకప్పటి రాజులు ఒకప్పటి మూలవాసులు , ఇప్పటికీ గుడి బడికి దూరం అయ్యి గుడ్డి దీపాల వెలుగుల్లో కునారిల్లుతున్నారు. ఇప్పుడు  బస్తర్, నల్లమల లో గోండు, కోలం జాతులు  చిన్న మాత్రకు కూడా నోచుకోకుండా దోమకాటుకు, పాముకాటుకు బలవుతూ ప్రకృతితో యుద్ధం చేస్తున్నారు. ఇప్పడు అడివి మనాదితో  మంచం ఎక్కింది. నాగరికతకు దూరం అయినా నమ్మిన నేల కపాడుద్ది అనే బరోసా తో పోడు తో ఏటికి ఏతం పెట్టి ఎట్టి మనుషుల నుండి భూమిని గుంజుకునే ఆధునిక రాజ్యాన్ని ఎదిరించ లేక పోతున్న బడుగు జీవులకు అరుణ్ సాగర్ ధైర్య వచనం అయ్యాడు.

అరుణ్ సాగర్ పుట్టిన ఊరులో కుమ్మూరు ఇరపా సీతక్క తన నుదుటున ముద్దేట్టి ‘కలెట్టరయ్’ రావాలి బిడ్డా అని దీవించింది ఆమె ఆకాంక్ష వినడానికి బాగానే ఉన్నా, ఆయన దృష్టిలో అది కేవలం అధికార దర్పానికి తప్ప కడగొట్టు జీవితం లో వెలుగును నింపదనీ, ‘కలెట్టరయ్’ అనపకాయ బుర్రలూ వెదురునార విల్లులూ, ఎద్దు పుర్రెలో గుదిగుచ్చిన నెమలి పించాలు ఇంట్లో అలంకరణ కు పెట్టుకోవడం తప్పా వాళ్ళ తలరాతలు మార్చని అభివృద్దిని ఈసడించుకున్న అరుణ్ పాత్రికేయుడిగా వాళ్ళకు ఏదన్నా చేయాలి అని ఎన్ని కలలు కన్నాడో. స్వతంత్రం, అభివృద్ధి, స్వయం ప్రతిపత్తి లాంటి లాబొరేటరీ లో తయారు చేయబడుతున్న ఆధునిక పదజాలం ఆ అలగా జనాల విముక్తికి ఏనాటికీ ఉపయోగ పడదనీ  ఆయనకు తెలుసు. ‘సమీకృత అభివృద్ధి-సాంస్కృతిక పృధక్కరణ-సామాజిక సమగ్రత’ వినడానికి గొప్పగా ఉన్నా అవన్నీ డొల్ల పదాలనీ ఎరిగిన వాడు , ఆరున్నర దశాబ్దాల అభివృద్ధి గిరిజన సంక్షేమ సూత్రాలూ ‘అప్లయిడ్ ఆంత్రోపాలజీ పరిశోదనలో వాడేసుకుని అలగా జనాల బతుకుల్ని మాత్రం నట్టనడి జలాశయాల్లో ముంచేస్తారా, అని అక్రోశించడం కూడా తెలుసు.ఇంత లోతయిన జీవితం ఆచరణ ఉన్న కవి నాడి అంచనా వేయడం లో తెలుగు మేధో సమాజం మరుగుజ్జు తనాన్ని నిరూపించు కుంది. కవితా వాకిళ్ళలో ఇమడని ఆయన వచనం చానా ఆలస్యం గా కవిత్వం గా చర్చించ బడ్డది. తండ్రుల వ్యధలూ సీదర సేంద్రయ్య లు అర్దంతర నిష్క్రమనలూ, ఆధునిక పద బందాల్లో తెలుగు కవిత్వానికి కాసింత ఆసరా అయ్యాయి.

చివరిరోజుల్లో అయన జీవితం అయ్యలనుండి వచ్చిన చైతన్యం ఎక్కిరించిన వైనాన్ని మౌనంగా స్వీకరించాడు. అది ఆయన్ను ఎంత బాదపెట్టిందో ఆయనకు దగ్గరగా ఉన్న మిత్రులకు నాకన్నా బాగా తెలుసు. సిరలు ధమనులు పగిలి నెత్తురు చిమ్మెంతగా’ విలవిల్లాడు అతను. ఆయన జేవితం లో అదో విషాదం. ఈ విషాదాల వికట్ట హాసాల ఉక్క పోతల మధ్య ఇమడలేని ఆయన తన మృత్యు శాసనాన్ని ముందే రాసుకుండు.

ఒక మనిషి పుడతాడు పోతాడు. కానీ పోయే లోపు నిన్నుకన్న నేల చెర బడుతున్నప్పుడు కాస్తంత కన్ఫెషన్ అవసరం. కానీ అరుణ్ సాగర్ ఎకంగా కోల్పోతున్నరేల పాటకోసం మరణ వాగ్మూలం రాసుకుండు. నేలకోసం , పలవరిస్తూ, మళ్ళీ ఒక సారి ఎనభై అడుగుల లోతులో సమాధి కాబోతున్న తన ఆనవాళ్ళు దూరంగా తన బిడ్డకు చూపించి అగొ అక్కడే నీ తాతలు తండ్రులు ఒకప్పుడు ప్రాణం తో ఉన్న మనిషి జ్ఞాపకం అని కడసారి చూపిస్తూ, మనందరి సామూహిక వైపల్యాల మీద అల్లుకున్నచిన్న పిచ్చిక గూడు మ్యూజిక్ డైస్ లా చిట్టచివరి అగ్రహ ప్రకటన చేసాడు .

బహుశా తెలుగు కవిత్వ చరిత్రలో ఒక వలపోతను మరణ వాంగ్మూలం గా రాసుకున్నది అయన ఒక్కడే కావొచ్చు. జీవిక కోసం కన్న ఊరును వదిలి రావాల్సి వచ్చినప్పటికీ అయనను  ప్రతి క్షణం బాల్యపు గుర్తులు వెంటాడాయి. అందుకే తప్పించుకోలేక కవిత రాసి దుఖాన్ని కడిగేసుకొనే ప్రయత్నం చేయలేదు. కొట్టుకొచ్చిన శవాలమీద నాలుగు వాక్యాలు ఏరుకొనే బ్రతకనేర్చిన తనాన్ని, కనీసం ఒక లాఠీ వైపు తేరిపార చూడలేని దౌర్భాగ్యాన్ని ఆయన చిన్న గుండె తట్టుకోలేక పోయింది. ఆచరణలో ఆయన నిజంగా నిలువెత్తు నిదర్శనం. ఆయన పుట్టిన కుటుంబంకు ఉన్న నిబద్దత, త్యాగమయ జీవితం కావొచ్చు. పెరిగిన నేలలో ఉన్న పోరాటాల వారసత్వం కావొచ్చు, వృత్తిలో, ప్రవృత్తిలో, స్నేహం లో, సహచర్యం లో అయన చుట్టూ ప్రాణంఇచ్చే స్నేహ సంపద కావొచ్చు, ఇవన్నీ ఆయన్ని పరిపూర్ణ మానవునిగా మార్చాయి. మార్కెట్ శాసించే  మానవ విలువలను తూకంలో వేసి బాగిస్తుంటే ఆ ఒరవడిలో కొట్టుకొని పోకుండా, తానెక్కడ ఉన్నా తన అంతరంగం లో ఒక వెతుకులాట తో ఉండేవాడు. నిజానికి  వేసవికాలం కాలం లో గోదావరిలా పైకి కనిపించే అయన లోలోపల వానాకాలంలో గోదారి వరద ఉదృతిలా అలజడి తో అల్లాడిపోయే వాడు . అలాంటి గోదావరి ప్రవాహానికి అడ్డంగా కడుతున్న ‘గాలికట్ట’ అయన గుండె కవాటాలను ఎంత ఉక్కిరిబిక్కిరి చేసిందో. అందుకే కాసింత విశ్రాంతి కోరుకుంది. ఆ  విశ్రాంతి శాశ్వతంగా అరుణ్ సాగర్ ని మన నుండి దూరం చేసింది.

దశాబ్దాల పోరాటాల తర్వాత మిగిలిన తెలంగాణా పంపకాల్లో అయనకు తెలియ కుండానే ఆయన నడయాడిన నేల మారకపు విలువగా మారడం మూలాన ఎంత క్షోభను అనుభవించాడో. ఒక నాగరికతను బలవంతంగా బట్వాడా చేయడాన్ని ఎంతగా నిరసించాడో. బహుశా  నిర్వాశిత సమష్య ను అత్యంత మానవీయంగా ఆయన లాగా ఎవరూ రాయలేదు. ‘కంకర తేలిన పదును, ఎర్ర మట్టి చదును, పెంచి పెద్ద జేసిన వీధి, వంటినిండా పాదముద్రలు వేసుకొని నడిచిన జాడలను మరవని వాడు’.      అందుకే తన తాతల తండ్రుల వారసత్వంగా వచ్చిన పోరాడుతున్న ఆకలి కేకల కోసం కనీసం గొంతయినా కలపక పోవడం నేరం అని భావించాడు. కవిత ఆచరణకు సాటి రాదు అని తెలిసీ ఒక నినాద రచనగా ఒక విధాన అనుసరణగా  కనుమరుగు అవుతున్న రేల పాటకోసం నినాదం అయ్యాడు.

పాత్రికేయ ప్రపంచం లో అరుణ్ సాగర్ జీవితాన్ని ఒక నమూనాగా చూడాలి. తన నాలుగున్నర దశాబ్దాల మొత్తం జీవితం లో రెండు దశాబ్దాల పాత్రికేయ వృత్తి, విభిన్న మాధ్యమాలు, విభిన్న సంస్కృతుల కలబోత.  వృత్తిలో అంత నిబద్దత నమ్మిన విలువలకోసం బ్రతకడం కోసం శరీరాన్ని ప్రయోగ శాల మార్చుకొని, శస్త్రచికిత్స తో, వడలిన శరీరంతో ఎక్కడికి పోయినా తనతో ఒక ‘మినీ డిస్పెస్సరి’ లా ఉండేది ఆయన జీవితం. అరుణ్ జీవించింది చానా తక్కువ కాలమే అయినప్పటికీ ఇంత మందికి ఇంత దుఖాన్ని మిగిల్చి మబ్బులా మాయం అయ్యాడు. అరుణ్ సాగర్ ఈ కల్లోలాలను మనసారా అక్షరీకరించాడు. మన అందరం అపరాధ రుసుము ఎప్పటికయినా చెల్లించాలి అని ఒక వార్నింగ్ ఇచ్చిమరీ పోయాడు. అరుణ్ ! మల్లెప్పుడు కనబడతావ్  బాస్ ?  నీతో మళ్ళీ లోయపల్లి, భద్రాచలం, చట్టి, కుంట, మారేడు మిల్లి, లంబసింగి, విశాక ఒడ్డు తిరగాలని ఉంది. అయినా నా పిచ్చిగానీ కొంత కాలానికి అవీ కాలగర్భంలో కనుమరుగు కాబోతున్నాయి. అవును మనందరి సామూహిక వైఫల్యాల సాక్షిగా వాగు కొమ్ముబూరలా వంపు తిరిగిన చోటు నీ పాదముద్రలూ, దమ్మక్క రోదనలాగా కనుమరుగు కాబోతున్నాయ్. కానీ నువ్విచ్చిన స్పూర్తీ కవిత్వమూ బ్రతికే ఉంటాయి అన్నా ..

*

 

 

అరుణ్ సాగర్ రాసిన ఏకైక నవల!

 

-ఝాన్సీ  పాపుదేశి

~

jhansi papudesiసమాజ చీకటి  కోణాల పై సీరియస్ రచనలు చేసిన అరుణ్ సాగర్ అంతర్లీనంగా హాస్యప్రియుడు. అందుకే అతడి కవితల్లో ఎంతటి ఆలోచింపజేసే విషయం ఉన్నా దాన్ని ప్రకటించిన విధానం పెదాలపై చిరునవ్వును రప్పిస్తుంది. కవితల్లో సినిమా పాటలు రాసినా, వాణిజ్య ప్రకటనలు వినిపించే విధంగా తన వాక్యాలను చదువుకోవాలని చెప్పినా ఒక వెక్కిరింత చదువరులను నవ్విస్తుంది.

సమాజం నడిచే తీరుపై తనలో ఉన్న అసహనాన్ని ప్రకటించే తీరులో అరుణ్ సాగర్ వొక వైవిధ్య కెరటం.  ఎప్పుడూ కవిత్వమేనా…కథలు రాయొచ్చు కదా..అంటే చాలా ఏళ్ళ  క్రితం తాను రాసుకున్న ఒక పెద్ద కథో ..చిన్న నవలో..కామెడీ సినిమా నో చెప్పలేని ఒక “లస్కుటపా” ను నాకు పంపించారు.  నేను తన అభిమాని అయినా…పదే పదే నేను చదివానో లేదో అడిగేవారు. ఇంకా చదవలేదని చెబితే తొందరగా చదివి అభిప్రాయం చెప్పమన్నారు. నా సహజమైన లేజీనెస్ నన్ను ఇప్పటిదాకా చదవనీయలేదు.

నిజం చెప్పాలంటే ఆయన సహజ శైలికి పూర్తి భిన్నంగా ఈ కథ ఉండటం…నన్ను చదవనీయలేదు. అరుణ్ సాగర్ లేరన్న షాక్ లో కన్నీళ్ళతో అర్దాంతరంగా ఆపిన ఈ హాస్య రచన చదవడం  పూర్తి చేశాను.

నైంటీన్ నైంటీఫోర్ …ఎ లవ్ స్టోరీ .

సూరీ.. కిట్కీ గళ్ భాగీల ప్రేమ కథ.

పదిహేడు రీళ్ళుగా రాసిన ఈ కథ సూరి చందుల స్నేహంతో ప్రారంభమవుతుంది. ఇద్దరు స్నేహితులే కాబట్టి స్నేహనౌక కాస్తా స్నేహ డింగీ గా మారి హుస్సేన్సాగర్ లో సాగిపోతోంది. వాళ్ళిద్దరూ అమ్మాయిల విషయంలో ఎంత ఉద్దండులంటే డాక్టర్ ఆఫ్ బీట్, సైటు రత్న అవార్డులు అందుకునేంత. అలాంటి స్నేహితులు  విధి ఆడిన వింత నాటకంలో విడిపోయారు. సూరి నాన్నకు ఆంధ్రప్రదేశ్ లో ఆఫ్రికా లాంటి వూరికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. రేకుల షెడ్డులతో, విరిగిపోయిన బల్లలతో పశువుల కొట్టంలా సీతకోకచిలుకల్లాంటి స్టూడెంట్స్ తో అలరారే కాలేజ్ నుంచి సూరి టిసి తీసుకున్నాడు.

తన స్నేహం గురించి ఆలోచిస్తూ ఆటోలో కూర్చుని  తను వదిలిన నిట్టూర్పు విని స్కూటర్లో వెళ్తున్న వ్యక్తి హారన్ అనుకుని ఆటో డ్రయివర్ తో గొడవ పడటం , ఆగిపోయిన ట్రాఫిక్ మీద దయతలిచి తన బాధను రాత్రికి ఫోన్లో వివరిస్తానని సూరి చెప్పడం కథలో పెద్ద ట్విస్టు.

చేసిన ప్రామిస్ ను నిలుపుకోవడానికి ఆ రాత్రి ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి స్కూటరిస్టుకు ఫోన్ చేసి 48 గంటల తన స్నేహ వియోగాన్ని చెప్పడం, ఆ ఇంట్లోనుంచి తన కథకు కోరస్లో వెక్కిళ్ళు వినిపించడంతో సూరి మనసు కుదుటపడినా  అతిపెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. బూత్ లోంచి బయటకు రాగానే సమయానికి తన గర్ల్ ప్రెండ్ కి ఫోన్ చెయ్యలేక బ్రేకప్ అయిన ఆనంద్, పక్కింటి కిట్కీ గాళ్ ఫ్రెండ్ భాగీ ప్రేమను తట్టుకోలేక గట్టిగా గెంతిన గెంతుకు ఫ్యాన్ ఊడి పడి సంసారానికి పనికి రాకుండా పోయిన ఇంటి వోనర్ రాఘవేందర్ సూరిపై పగబట్టడమే ఆ అతి పెద్ద ప్రమాదం.

ఆంధ్రా యూనివర్సిటే లో ఆంథ్రోపాలజీ చదువుతున్న రోజుల్లో ల్యాబ్ నుంచి ఆస్ట్రలోపితికస్ పుర్రెను కొట్టేసి కోట్లు సంపాదించి విలన్ గా అవతారమెత్తిన రాఘవేందర్ క్లాస్మేట్  జబ్బల్ భాయ్ ను పగతీర్చుకోవడం కోసం పిలిపించడం తో క్లైమాక్స్ ప్రారంభమవుతుంది. ఇదే సమయానికి అన్నిరోజుల విరహం తట్టుకోలేని చందూ , సూరి దగ్గరకు రావడం.. ఇద్దరూ కలిసి జబ్బల్ భాయ్ కిడ్నాప్ చేసిన భాగీ ను విడిపించడం, భాగీ నాన్న తనకు మేనమామే అని తెలియడంతో కథ సుఖాంతం అవుతుంది.

నా మేనమామే నా మామా! అని సూరి ఆశ్చర్యపోవడం నవ్విస్తుంది.

క్యుములోనింబస్ మేఘాలను గన్ తో కాల్చి విలన్ వెళ్ళే సెకండ్ హ్యాండ్ హెలీకేప్టర్ లోకి నీళ్ళు రప్పించడం క్లైమాక్స్ హాస్యం.

ఈ రచన ప్రారంభం నుంచీ మనల్ని విపరీతంగా నవ్విస్తుంది. అరుణ్ సాగర్ రచనల్లో సాధారణంగా కనిపించే సీరియస్ నెస్ ఇందులో వెదికినా కనిపించదు. ప్రతి పదంలో కామెడీ నర్తిస్తుంది. ఆంత్రోపాలజీ సబ్జెక్ట్ పై తనకున్న మొహం మాత్రం అన్ని రచనల్లో కనిపించినట్టే ఇందులో కూడా విలన్ బ్యాక్ గ్రౌండ్ గురించి వివరించేటప్పుడు కాస్త కనిపిస్తుంది. కళ్ళనిండుగా నీళ్ళను…కడుపులో నొప్పిని తెప్పించే ఈ రచన అరుణ్ సాగర్ మరణం తరువాత కన్నీళ్ళతో పూర్తిచేయడం, ఆయన రాసిన ప్రతి అక్షరాన్ని ప్రేమించే అభిమానిగా మనసునిండుగా ఈ కథలో నవ్వుతూ కనిపించే అరుణ్ సాగర్ ను మీకు కొత్త కోణంలో పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తాను.

“తప్పు తనది కాదు నీది.. ఎప్పటికైనా వీడ్కోలు చెప్పక తప్పదని తెలిసీ…నువ్వే అపరాధి”…వీడ్కోలు మిత్రమా!

నవల లింక్: http://saarangabooks.com/retired/wp-content/uploads/2016/02/laskutapa.pdf

 

peepal-leaves-2013