కనువిప్పు

 

  కరుణాకర్

~

 

మొన్న మేడమ్ గారి రౌద్రోపన్యాసం విన్నపటినుండి నాలో చిన్న భయం మొదలైంది. కొంపతీసి నేనుగాని దేశద్రోహుల లెక్కలోకి రాను గదా అని. ఇదే మాట మా ఝాన్సీతో( అంటే మా ఆవిడ)అన్నాను. దీనికి కారణం లేకపోలేదు.

అపుడెప్పుడో ఎన్టీయార్ దానవీరకర్ణ సినిమాలో దేవతలు దేవుళ్ళ జుగుప్సాకర పుట్టుపూర్వోత్తరాల్ని గుక్కతిప్పుకోకుండా తూర్పాలు పట్టగావిని, ఓ నాలుగు ముక్కలు బట్టిబట్టి నోరూరుకోక వాళ్ళదగ్గరా వీళ్ళదగ్గరా వాగేసి ఉన్నాను కదా. వీళ్ళల్లో ఎవరన్న ఉప్పందిస్తే నాగతి ఏంగాను.

“ముందు ఆ డైలాగులు రాసినోళ్ళు, పలికినోళ్ళ తర్వాత కదా మీ వంతు” అని ధైర్యం చెప్పబోయింది మా ఆవిడ. “వాళ్ళిద్దరూ ఇప్పుడు లేరు కదా “అని అంటుండంగానే ఎదురుగా ఉన్న పుస్తకాలా ఆరమరలో అడ్డంగా నిలబడి తాపిధర్మారావు దేవాలయాల మీదబూతుబొమ్మలు కనబడ్డాయి.

పెరుమాళ్ మురుగన్ మనసులో మెదిలాడు. ఒక్క పరుగున వెళ్ళి తీసి వంటగదిలో మచ్చుబల మీద పెట్టేశాను. హమ్మయ్య అనుకునేలోపు మొన్ననే కొన్నఇదండీ మహాభారతం గుర్తొచ్చింది. అది సరే అసలు అప్పుడెప్పుడో కొని అందరిచేతా చదివించిన రామాయణ విషవృక్షం? రావణాసురుడు ఉత్తముడనీ రామూడే అల్పుడనీ…వామ్మో రంగనాయకమ్మకి ఏమన్నా అవనీ. ముందు మన సేఫ్టీ ముఖ్యం. లోపలెక్కడో ఉన్న ’విషవృక్షాన్ని’ బయటకులాగాను.

ఇలా కాదని పాతలుంగీలో మూటకట్టాను.  మధ్యలో ఎక్కడో త్రిపురనే ని రామస్వామి చౌదరి తగిలాడు. పురాణ పాత్రలను తిరగేసి, బోర్లేసి చీల్చిచెండాడాడు కదా. పక్కనే పెరియార్. వీళ్ళందరికీ ఇట్లాంటి అలోచనలకు కారణమైన కోశాంబీ..అందర్నీ కట్టకట్టి మూటలోకి తోసాను. ఇంతలో వంటగదిలోనుంచి ఝాన్సీ గొంతు ’దేశమును ప్రేమించుమన్నా…’ పిల్లలకి నేర్పించడానికి ప్రాక్టీసు చేస్తున్నట్లుంది. ఎక్కడో ఏదో తేడా కనిపిస్తోంది…అ,,,దొరికింది. దేశమును ప్రేమించుమన్నా అన్నడు కానీ భారతదేశమును ప్రేమించుమన్నా అనలేదు.

ఇక్కడ కొండల్నీ గుట్టల్నీ…ప్రవహించే పుణ్య నదుల్నీ మాటలైనా తలవనేలేదు కదా. ఇన్నాళ్ళూ ఎందుకు తోచలేదు. ’మతములన్నియు మాసిపోవును మానవత్వమే నిలిచి వెలుగును. మతములన్నీ మాసిపోతాయా…ఒక మతం కాదు అందరూ కట్టకట్టుకోని వస్తారేమో….మూటకు అర్హుడే. మతమంటే గుర్తొచ్చింది. సైన్సు నా మతమన్నడు కదా సి.వి.రామన్. సైన్స్ అరకేసి చూశాను. భౌతికశాస్రం, రసాయనశాస్త్రం ఈ శాస్త్రాలన్నీ కలసి విశ్వాసాలను వెక్కిరించినట్లనిపించింది. సైన్స్అర ఖాళీ అయింది. ఆ మాటకొస్తే ఆలోచన, వివేకమూ కలిగించే పుస్తకాలన్నీ ఏదో ఒకమేరకు విశ్వాసాలను కాదనేవే. రిఫరెన్స్ కోసం కొన్న భగవద్గీత, ఏవో యోగాసనాల పుస్తకాలూ తప్ప అన్నీ ప్రమాదంగానే తోచాయి. లుంగీ చాల లేదు.

అనవసరంగా పుస్తకాలకోసం ఒక అరకట్టించి తప్పుచేశా. ఈసారి విష్ణుసహస్రనామాలు, హనుమాన్ చాలీసాలాంటి పుస్తకాలన్నా కొనాలి. విశాలాంద్రకూ ప్రజాశక్తికీ కాదు. రామకృష్ణ మఠానికో టిటిడికో పోవాలి. ఈ ఆలోచనతో మనసు కాస్త కుదుట పడింది. ఒక నిముషం సోఫాలో కూలబడ్డాను.

~

              

మీ మాటలు

  1. ఏమి కుదుట పడడమో ఏమో సార్. సి. కె. గారు చెబితే, తగుదునమ్మా అని కోశాంబీ వ్యాసాలు అనువదించాను, ఒక్కొక్క పేజీ కండ్ల ముందు తిరుగుతోంది. ముఖ్యంగా భగవద్గీత మీది వ్యాసం. ఈ మధ్యనే గీతమ్మను అడిగి మలి ముద్రణల మీద అనువాదకుడినిగా పేరేయించుకున్నా ముచ్చట పడి. యాడ దాక్కోన్రా బగమంతుడా!

  2. మీరు జాగ్రత్త పడు తున్నారు బాగుంది. ఓటర్ లిస్టులో మీ పేరుంటే చాలదు. దానిమీద మాముద్ర ఉండాలి. మా వైపు ఉండాలి. అదిగుర్తుంచు కొండి! ( దాన్ని గూడా తీసెయాడానికి ప్రయత్నం చేస్తున్నామను కొండి! ఇది ఉండబట్టే కదా ఇన్ని కష్టాలూ ! … అయినా ఆ హక్కునిచ్చినా వారిని అనాలి ) లేక పోతే మీ పేరు పలాని చోట……. ఉండటం కాయం . :) :) :) :)

  3. :)

  4. బ్రెయిన్ డెడ్ says:

    అనవసరంగా పుస్తకాలకోసం ఒక అరకట్టించి తప్పుచేశా. ఈసారి విష్ణుసహస్రనామాలు, హనుమాన్ చాలీసాలాంటి పుస్తకాలన్నా కొనాలి. విశాలాంద్రకూ ప్రజాశక్తికీ కాదు. రామకృష్ణ మఠానికో టిటిడికో పోవాలి << పంచెలూడగొట్టిన పంచ్ . మేము సైతం ( అమ్మో ఇదియున్ను అరాచకమే సుమీ )

  5. p.sambasiva rao says:

    సారూ! మీకు తెలీదేమో, విశాలాంధ్రలో కూడా ఆధ్మాత్మిక సాహిత్యం విస్తారంగా దొరుకుతుంది. ప్రజాశక్తిలో ఇప్పటికయితే ఒక యోగి ఆత్మకథ …. రేపటికయితే అన్నీనూ!

  6. p.sambasiva rao says:

    “….. అది సరే అసలు అప్పుడెప్పుడో కొని అందరిచేతా చదివించిన రామాయణ విషవృక్షం? రావణాసురుడు ఉత్తముడనీ రాముడే అల్పుడనీ…వామ్మో రంగనాయకమ్మకి ఏమన్నా అయితే….”
    కరుణాకర్ గారు! రావణాసురుడే ఉత్తముడని , రంగనాయకమ్మ గారు ఆ పుస్తకం లో ఏ పేజీలో అన్నారో చెబితే… చాలా సంతోషిస్తాం!

  7. raghava raghava says:

    హాహాహా……సుపర్బ్ …

  8. raghava raghava says:

    సాంబశివరావు గారూ! పాపం అంత కంగారులో ఆ పేజీ లూ అవీ ఏం గుర్తుంటాయండీ… అసలు ఆ అన్నదేమిటో కూడా మరిచిపోయుండొచ్ఛు కూడా..

  9. కరుణాకర్ says:

    స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. నిజమే విశాలాంధ్ర ప్రజాశక్తిల విషయంలో ఆశ వాస్తవాన్ని విస్మరించింది. ఇక రంగనాయకమ్మ రామాయణ విషవృక్షంలో రావణుడిని better personality చిత్రించినట్లు చిన్నప్పుడు మనసులో పడిన ముద్ర. పేజీలడి గితే ఇప్పడికిప్పుడు చేప్పలేను.

  10. కె.కె. రామయ్య says:

    ” దేశమును ప్రేమించుమన్నా అన్నడు కానీ భారతదేశమును ప్రేమించుమన్నా అనలేదు ” అవును సుమీ ఈ ముద్రారాక్షస దోషాన్ని సరి దిద్దాల్సిన గురుతర భాద్యత మనందరి మీదా ఉంది సుమీ.

    పెద్దలు శ్రీ హెచ్చార్కె గారూ, అదేందో ఇసిత్రం! తెల్ల దొరల నుండి నల్ల దొరల వరకూ నాటికి నేటికీ పాలక ప్రభువులకు పుస్తకాలు ప్రమాదకరంగా అనిపించడం. అట్లని అనువాదకుడిగా, అస్మదీయుడిగా ఉండటం మానీయకండి. కావాలంటే మారు పేరుతో నైనా పని కానివ్వండి.

  11. పెద్దలు మీరందరు అలా కంగారు పడుతూ ఉంటె మిమ్ముల్ని అనుసరించే పిల్లలం మా గతి ఏమి కాను …… వామ్మో

మీ మాటలు

*