Archives for November 2015

ఉరి తాడే ఎందుకు?

 

 

  • హెచ్చార్కె

 

దిగులు పడ్డానికి భయమేసి నవ్వుతుంటావు

 

మనుషుల కోసం వెదుకుతూ అడివంతా గాలిస్తావు

ఒక్కోసారొక తీగె తనతో పాటు నిన్నొక చెట్టు చుట్టూ తిప్పుతుంది

త్వర త్వరగా నడిచి ఎక్కడికీ వెళ్లేది లేదు లెమ్మని

నువ్వు అక్కడక్కడే తిరుగుతుంటావు, ఏవేవో డొంకలు కదిలిస్తూ

 

మనసులో కాడ తెగిన పువ్వు పరిమళిస్తుంది

రెప్పల చివర తడి నక్షత్రంగా మారక ముందే తుడుచుకుంటావు

నీ దిగులు నువ్వు పడడం అంటే భయం నీకు

బదులు మెచ్చుకుంటారని చిన్న చిన్న జోకులకూ నవ్వేస్తావు

 

ఎప్పుడూ ఏదో ఒక రూపాన్ని కోరుకుంటావు

కుదరకపోతే రూపాల్ని దొంగిలిస్తావు, ఇంకా నిన్ను పట్టుకోలేదు

గాని, నువ్వు శిక్షణ లేని సముద్ర చోరుడవు

లేదా ఒకరికి తెలీకుండా మరొకరు అందరూ దయ్యాలే అయిన

 

రెక్కలు లేని, రెక్కలక్కర్లేని లేని పక్షులలో

ఒక విపక్షానివి, నీ ఎదిరింపు ఓ నటన, ప్రత్యేకం నువ్వున్నట్టు

ఒప్పించడానికి నువ్వు కట్టిన విచిత్ర వేషం,

నీకు ఎప్పుడేనా అనిపించిందా నువ్వు కేవలం ఒక ఊహవని?

 

ఒక వూహ వూహించిన వూహ ఈ కవిత

క్షూ హాంఫట్, అబ్రకదబ్ర, సారీ విమర్శించాను యండమూరీ!

ఆ అమ్మాయి మాత్రమే కాదు ఆత్మహత్య

చేసుకున్నది, ఆత్మహత్యకు ఉరితాడేనా? చాల దార్లున్నయ్

*

షరీఫూ, నేనూ – మా చమ్కీ పూల జ్ఞాపకాలు

 

 

‘చమ్కీ పూల గుర్రం’ కథ ఆంధ్రజ్యోతిలో వచ్చి రెండు వారాలైంది. ఏదో అనువాదం పనిలో వుండి నిన్న రాత్రి దాకా చదవడం కుదరలేదు. తీరా చదవడం మొదలు పెడితే నా కథ చెబుతున్నట్టనిపించింది. అవును ఇది నా కధా, జీవితంలో నా మొట్టమొదటి స్నేహితుడు షేక్ షరీఫ్ కధా, లేదా మా ఇద్దరి కథ. మున్నీయే షరీఫ్. నేను అపూ. తేడా అల్లా, అపూ వాళ్ళ నాన్న సురేష్ లా కాకుండా మా నాన్న ఏనాడూ మా స్నేహానికి అడ్డుతగల్లేదు. నిజానికి మా జీవితాల్లో, మా వూళ్ళో అప్పటికి మతం మనుషుల్ని విడదీయలేదు.

మా కుటుంబాల మధ్య ఎప్పుడూ మతం ఓ చర్చ కాలేదు, మా స్నేహానికి ఎప్పుడూ అడ్డం కాలేదు. మా కుటుంబాలు ఎన్నడూ మా స్నేహానికి అడ్డు చెప్పలేదు కానీ, మతమే నేరుగా ఆ పని చెయ్యబోయింది. కానీ, మేమిద్దరం ఆ ఎత్తుల్ని సాగనివ్వలేదు. అందుకే, దాదాపు 38 ఏళ్ల క్రితం నాలుగో క్లాసులో మొదలైన మా స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. వేరే వూరినుంచి వచ్చి నాలుగో క్లాసులో చేరిన నాకు ఏర్పడిన స్నేహితులు మల్లి, షరీఫ్. ఆ తర్వాత డేనియల్, పూర్ణా. షరీఫ్ కీ నాకూ ఎంత స్నేహామంటే, పుస్తకాలపై మా పేర్లు షేక్ కూర్మనాథ్ అనీ, కంచి షరీఫ్ అని రాసుకునేంత. స్కూలు అయిపోయినంత వరకూ స్కూల్లోనూ, స్కూల్ అయిపోయాక వాళ్ళ ఇంట్లోనూ గడిపేవాళ్లం. మల్లీ, నేనూ, షరీఫూ, డేనియల్ తిరగని వంశధార రేవులేదు. మేం తిరగని తోటల్లేవు. మేం ఆడని ఆటల్లేవు. అప్పటికప్పుడు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించి మాకో సినిమా కథ చెప్పేసే వాడు ఖాళీ పీరియడ్లలో, స్లో మోషన్ షాట్లతో సహా. అన్నిట్లో క్రిష్ణే హీరో, ప్రభాకర రెడ్డి విలన్. అనకాపల్లి నూకాలమ్మ గుడి దగ్గరి నూతిలోంచి పాతాళ లోకానికి వున్న మార్గం గురించీ, అక్కడి ప్రజల జీవితం గురించి కథలెన్నో చెప్పేవాడు.

మేం ఆరోక్లాసులోనో ఏదో క్లాసులోనో వున్నపుడు మా వూళ్ళోకి (హీరమండలం, శ్రీకాకుళం జిల్లా) ఆరెసెస్ ప్రవేశించింది. ఎక్కడో మారుమూల, ‘నాగరికత’కి దూరంలో, కొండల నడుమ వున్న ఆ చిన్న వూళ్ళోకి మత పరంగా మనుషుల్ని విడదీయగల ఆరెసెస్ ప్రవేశించింది. అప్పటికే అనకాపల్లిలో మా పెదనాన్నగారి పిల్లలు ‘శాఖలకి’ వెళ్తుండడం వల్ల, సెలవుల్లో అక్కడికి వెళ్ళినపుడు నాకూ పరిచయం అయింది ‘శాఖ’. అందువల్ల మా వూళ్ళో ‘శాఖ’ పెట్టినపుడు అక్కడికి నేను వెళ్ళడం సహజంగానే జరిగిపోయింది. అంతే కాదు, షరీఫ్ ని కూడా చేర్పించా. బలిష్టుడైన, చురుకైన షరీఫ్ తొందర్లోనే కలిసిపోయాడు మాతో (ఇప్పటికీ బలిష్టుడే. గంటసేపు ఆగకుండా ఈత కొట్టగలడు). ఎక్కడో కిలోమీటర్ దూరంలో జరిగే ‘శాఖకి’ వెళ్ళేవాళ్ళం. ఇలా ఓ రెండు సంవత్సరాలు గడిచేక బీజేపీ మొట్టమొదటిసారి హిందూ సెంటిమెంటుని ప్రచారం చెయ్యడానికి గంగాజల యాత్ర మొదలుపెట్టింది. టీవీలు, ఇంటర్నెట్లూ అస్సలే లేని రోజుల్లోనే దానిగురించి ఈనాడు వంటి పత్రికలు విపరీతంగా రాశాయి.

ఆ గంగాజల యాత్ర ఎక్కడికెక్కడికొచ్చిందో, ఆ తర్వాత ఎక్కడికి వెళ్తుందో వివరంగా రాసేవి పత్రికలు. అలా ఆ గంగాజలం శ్రీకాకుళం వచ్చినపుడు దానికి రక్షణగా వుండడానికి ఏర్పాటు చేసిన బాల రక్షక దళంలో నేనూ, షరీఫూ సభ్యులం. అలా ఎన్నో ఆరెసెస్ కార్యక్రమాల్లో పాల్గొన్న షరీఫ్ క్రమంగా దూరమవడం మొదలుపెట్టేడు. దేశభక్తి గురించి మాట్లాడి మమ్మల్ని రప్పించిన శాఖల్లో తనులేని సంధార్భాల్లో విచిత్రమైన భాష వినబడేది. మనం వేరు, వాడు వేరు అన్న టోన్ వినబడేది.

బహుశా, తానక్కడ unwanted అని పోల్చుకుని వుంటాడు షరీఫ్. వాళ్ళు చెప్తున్నది మనుషుల్ని విడదీసే భాష అని గ్రహించి వుంటాడు. బాధితుడు కాబట్టి తను తొందరగా గుర్తించి వుండొచ్చు. దళితులైనా, మైనారిటీలైనా స్త్రీలైనా – బాధితులు కాబట్టి అవమానాల్ని, అసహనాల్ని, అంతర్యాల్ని లేశమంత వున్నా గుర్తించగలుగుతారు. ఎంత సహానుభూతి చెందినవాళ్ళైనా, ఆ అవమానాల, అసహనాల వల్ల కలిగిన వేదనల లోతుల్ని తెలుసుకునే అవకాశమే లేదు. ఆ లోతులు తెలిసే అవకాశం లేదుగాని సహానుభూతి చెందేవాళ్ళకి ఆ వేదన ఎంతోకొంత అర్ధం కాకుండా పోదు. వాళ్ళు దగ్గరవాళ్ళైనపుడు ఇంకొంచెం ఎక్కువే అర్ధమవుతుంది, మనసుపెడితే.

తనని ఏం గాయపరిచిందో షరీఫ్ అప్పుడు నాకు అప్పుడూ చెప్పలేదు, ఇప్పుడూ చెప్పలేదు. నేనూ అడగలేదు. కానీ, తను లేని సందర్భాల్లో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ జరిగిన సంభాషణల్లో నాకు అర్ధం అయ్యేది, ఆరెసెస్ దేశభక్తిలో ముస్లింలకు ప్రవేశం లేదని. వున్నా, అది వాళ్ళతో మమేకం అయినంతవరకూ మాత్రమేనని.

షరీఫ్ ‘శాఖ’కి దూరం కావల్సిన పరిస్థితులే మొదటి సారిగా నాలో ఆరెసెస్ పట్ల సందేహాలు కలగడానికి కారణమయ్యాయి. ఆ తర్వాత మా father బదిలీ వల్ల నేను చోడవరానికి వెళ్ళడం, అక్కడ నారాయణ వేణూ, వర్మల పూనికతో ఏర్పడ్డ ‘లైబ్రరీ స్టడీ సర్కిల్’ వల్ల ఆరెసెస్ నిజస్వరూపాన్ని పూర్తిగా అర్ధం చేసుకోగలిగేను. దానివల్ల pluralityకి హానే కానీ మేలు లేదని అర్ధం అయ్యింది. ఈ మొత్తం transformation పూర్తికావడానికి ఓ అయిదారేళ్లు పట్టింది. Undoing takes much longer time. అయితే మార్పు మొదలవడానికి కారణం మాత్రం చిన్నపుడు షరీఫ్ ఎదుర్కొన్న పరిస్థితే.

నిన్న రాత్రి అఫ్సర్ కధ చదువుతుంటే ఒక్కసారి నలబై ఏళ్ల క్రితంనాటి సంగతులు గుర్తొచ్చాయి. I felt like reliving my childhood.

మనుషుల వ్యక్తిగతమైన ప్రేమానురాగలని శాసించడానికి రాజ్యం ప్రయత్నిస్తే మన జీవితాలు ఎలా అల్లకల్లోలమవుతాయో ‘మల్లీశ్వరి’ సినిమాలో చూస్తాం. మనుషుల మధ్యలోకి మతం ప్రవేశిస్తే మనసుల్లో ఎలాటి హింస జరుగుతుందో ‘చమ్కీపూల గుర్రం’లో చూస్తాం. As it is, we make the lives of kids miserable by denying them the time they deserve to play. మత వైషమ్యాలతో సృష్టించే హింస దీనికి అదనం. నాకైతే మున్నీ, అపూలు మళ్ళీ ఎప్పటివలెనే ఆడుకోవాలని ఆకాంక్ష. ఒక్క నాకేంటి, అది చదివిన వాళ్ళందరికీ బహుశా అలాటి కోరికే కలిగివుంటుంది. ఆ సామూహిక ఆకాంక్షే, కృషే మనల్ని నిలబెడుతున్నది.

చదివేక, ఇంట్లో అందరికీ ఈ కధ చెప్పేను. “అసలు ఈ కధ నిజంగా జరిగిందా,” అని ఆరేళ్ళ మా పాప అల పదే పదే అడిగింది. ఎప్పుడూ బొమ్మలకి పేరుపెట్టుకు ఆడే అలకి సందేహం – మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఆడుకుంటారా అని. “వాళ్ళ అమ్మ రేపు తీసుకెళ్తుందట మున్నీ వాళ్ళింటికి,” అని చెప్తే గాని సమాధానపడలేదు.

అసలు ఆ ప్రశ్నే ఇవ్వాళ దేశంలో అందర్నీ కలచివేస్తుందని, కోట్లమందికి నిద్రలేకుండా చేస్తోందని అల కి ఇప్పుడే ఎలా తెలుస్తుంది? మతం పేరుతో మనుషుల్ని విడదీసే మూకలు పెట్రేగిపోతున్నాయని, అవి మనుషుల మధ్య విద్వేషాన్ని రగిలించేపనిలో వున్నాయని అప్పుడే ఎలా అర్ధం అవుతుంది?

ఇప్పటి సందర్భం రక్తసిక్తమై వున్నది. వ్యధా భరితంగా వున్నది. ఈ దేశంలోని కొందరు పౌరులు భయం గుప్పిళ్ళో బతుకుతున్నారు. ఆటవికపాలన రాజ్యం చేస్తున్నది. ఇప్పుడు ఇలాటి కధలు ఇంకేన్నో రావాలి. అనుమానపు బీజాల్ని ఎవరు వేస్తున్నారో, అసహనపు జ్వాలల్ని ఎవరు ఎగదోస్తున్నారో, ద్వేషగీతాల్ని ఎవరాలపిస్తున్నారో రాయాలి. వాటి గురించి పిల్లలకి చెప్పాలి. వాళ్ళ మధ్య ఎవరెవరు ఎలాటి చిచ్చు పెడుతున్నారో వివరించి చెప్పాలి. పిల్లల మనసులు విరగకుండా కాపాడుకోవాలి.

 

PS: ఈరోజు పొద్దున్నే షరీఫ్ కి ఫోన్ చేశా. ఈ కథ అది మనగురించేనని, నువ్వు చదివితీరాలని.

పాత కత మొదలైంది!

 

-అన్నవరం దేవేందర్
~
***
 devendar
తరతరాలుగ  తనువుల ఎట్టి కనికట్టు
అంతులేని అమానవీయకరణ
చెప్పులు గొంగళ్ళు కొడవండ్లు
వశపడక ఎదురు తిరిగినయ్
నోట్లె  నాలికె లేనోళ్ళు నిప్పులు కక్కిండ్రు
సంఘాలు జెండాలు ర్యలీలై సాగినయి
శ్రమ జీవుల జబ్బలకు
అనివార్యంగా తుపాకులు చేరినయి
పెత్తనాల మీసాలు ,బొర్రహంకారాలు
పాణ భయంతో పట్నం బాట పట్టినయి
నైజాం  రాజ్యం వాళ్ళకు నీడనిచ్చింది
అప్పుడే విలీనమైన
యూనియన్ జెండా అండనిచ్చింది
మురిసిపోయిన జాగీరుదార్లు
గాంధీ టోపీలు పెట్టుకొని మల్లా పల్లెల సోచ్చిండ్రు
*                 *                     *
పాత కత మొదలైంది
ఎట్టి బానిసత్వం ఏర్పడకుంట సాగుతంది
చిదిమితే రాలేట్టుగ అయినయి ఆ అహంకారాలు
అడిలిచ్చుడు బెదిరిచ్చుడు బుసకొట్టుడు
బక్క ప్యాదోల్ల ఉసురు తీసుడు
కాలం ముప్పైఎండ్లుగా  నడుస్తూనే ఉన్నది
మల్లా  ఊరూరా సంఘాలు జెండాలు
జైకొట్టే జైత్ర యాత్రలు
ఎక్కడికక్కడ దళాల కదలికలు
సంకలల్లకు చేరిన ఏ .కె .నలబై ఏడులు
భూమి లోపల పుట్టిన విస్పొటనాలు
జెండాలు పాతిన భూములు జాగలు
పెద్ద పెద్ద డంగు సున్నం భవంతులు వదిలి
మల్లోసారి  పట్నం బాట  పట్టిండ్రు
సర్కారుకు స్వయానా సుట్టాలైండ్రు
*     *     *      *
పల్లెలు పచ్చని అడవులు కాకవికలమైనయి
వాగుల్ల వంకల్ల నెత్తురు పారింది
మొసమర్రక  దళాలు దూరం జరిగినయి
పాతిన జెండాల జాగల కనీలు  నిలిచినయి
భూములకు రెక్కలచ్చి పచ్చ నోట్లుగ  విచ్చుకున్నయి
భూస్వామ్యం రాజకీయం అల్లిబిల్లిగ అల్లుకున్నాయ్
ఎగిసిపడిన అస్తిత్వ ఉద్యమము కలిసివచ్చింది
సూస్తుండగా పదిహేనేడ్లు గిర్రున తిరిగినయి
పల్లె ఆకాశం నిండా పాత పక్షుల చక్కర్లు
పాత గడీలకు కొత్త గులాల్ రుద్దుకున్నది
*      *    *
చక్రం గిర గిర తిరిగినట్టు  అనిపిస్తంది
ఏర్పడకుంట  కనికట్టు కొత్త రూపం తీసుకున్నది

మడిమ

 

– కందుకూరి రమేష్ బాబు
~
Kandukuri Rameshనొప్పి. బాధ.
కాలు తీసి కాలు వేయాలంటే వశం కాని స్థితి.
ఒక చెప్పు వదిలి ఒకే చెప్పుతో నడిచే స్థితి.
ఒక వేలుకి మరో వేలు తగిలితేనే ఓర్చుకోలేనంతటి యాతన.
నిజం.
అంత తేలిక కాదు, చూడాలంటే.
పొందాలంటే.
అనిపిస్తుంటుంది!
అనుభవంలో ఉన్నవే అనుభూతిలోకి వస్తాయని!
కాలు తీసి కాలు వేయాలంటే,
గడప దాటి వాకిట్లోకి రావాలంటే,
ఒక్కో అడుగు వేసి అలా కాస్త రోడ్డుమీంచి వెళ్లాలంటే,
,
,
,
ఎంతో బాధ.
చెప్పలేనంతటి నొప్పి, యాతన,
.
ఒకామె అంటుంది. కొడుకు చనిపోయాక ఘోరమైన బాధతో తండ్రి కుమిలిపోయాడని!
‘ఘోరమైన’ అన్నపదం ఇంకో స్థితిలో అయితే సరిగ్గా అర్థం కాక పోయేది గానీ, ఆ తండ్రి మనోవ్యధని అర్థం చేసుకోవడం వల్ల, అతడి మౌన రోదనని లోలోతుల్లోకి మొత్తం శరీరాన్ని మనసునూ కుదిపేసిన ఆ విలయం ఒకటి తెలిసినందువల్ల ‘ఘోరమైన’ అన్న పదం తాను ఎందుకు వాడిందో అర్థమైంది.
అరిచి చెప్పలేనంత బాధ
మౌనం దాలిస్తేనూ వినిపించే శబ్విదం.
లోవెలుపలా విచారం. చచ్చిపోవాలన్నంతటి నొప్పి.
నరకం.
అర్థం కాదు.
స్వర్గం అర్థంకానట్టే నరకమూ పూర్తిగా అర్థం కాదు మనిషికి.
అందుకే బాధ. నొప్పి.
కొన్ని నొప్పులు, బాధలు అసలేమీ అర్థం కావు.
అర్థం అయ్యేదంతా కూడా అనుభవంలో ఉన్నది మాత్రమే అనీ అనిపిస్తుంది.
అందుకే ప్రతిదీ చిత్రం కాదు.
మనకు తాకిన దెబ్బ ఎంతటిదో అంత బాధను మాత్రమే ఫీలవ్వగలం.
అదే చిత్రం!
ఫీలైన కొద్దీ ఆయా మనుషులు తమ శక్తి కొద్దీ తమ బాధకొద్దీ ఆ బాధను కవిత్వంలోనో కథలోనో నవలలోనో ఇంకా ఏదైనా రచనా ప్రక్రియలోనో వ్యక్తం చేస్తారు. లేదంటే ఆత్మీయులని ఎవరినో కావలించుకుని నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకోగలరు. ఎవరూ లేకపోతే చిమ్మ చీకట్లో ‘నా కర్మ’ అని తిట్టుకుని బాధనుంచి నిర్లిప్తతలోకి జారిపోతారు. కానీ ఆ మనిషి ఫొటోగ్రాఫర్ అయితే ఇట్లా చిత్రమై  నొప్పి పెడతాడు. ‘ఆ నొప్పి నాదే’ అని అతడి అడుగులో అడుగై…ఆ కట్టును తానే కట్టుకుంటాడు కూడా.
అదే ఈ చిత్రం.
కానీ, దయవుంచి మీ జీవితంలోకి తరచి చూసుకొండి.
నొప్పి.
బాధ.
అది తగ్గాక ఆ నొప్పిని పూర్తిగా మర్చిపోతారని కూడా ఈ చిత్రం.
జ్ఞాపకం తెచ్చుకొండి.
బాధను, దుఃఖాన్ని. లేబర్ పేన్స్ ను.
మడిమతో నడిచిన ఒకానొక క్షణం అనే యోజనాన్ని,
దాని సుదూర దుఃఖాన్ని.
లేకపోతే ఈ చిత్రం ఎందుకు పుట్టినట్టు!
మడిమ.
*

లేదులే, నేనలాంటి విముక్తి కోరట్లేదు!

 

నువ్వెళ్తున్న సంగతి పాపం నీక్కుడా తెల్సుండదులే! వెళ్తూ వెళ్తూ హడావిడిగా బుద్దుడి విగ్రహం దగ్గర నాలుగు నందివర్ధనాలు పెట్టి, కాళ్ళల్లో చెప్పులు దూర్చి కూడా ఎందుకో ఆగి క్షణ కాలం ఆ మౌనినీ, వెనువెంటనే నన్నూ ఆప్తంగా చూశావు.

ఆ రోజు సాయంత్రం పార్టీకి వేసుకుందామనుకుని బయటపెట్టిన బట్టలూ, ఎలాగైనా ఆరోజుకి ముగించేస్తానని అనుకున్న పుస్తకంలోని ఆఖరి పది పేజీలూ ఇవాళ్టి రోజున కూడా చాలా ఓపిగ్గా ఎదురుచూస్తున్నాయి.

నేనూ.. ఆ నందివర్ధనాలూ మాత్రం ఒకేలా మిగిలాం!

పువ్వులంటూ నువ్వు, కాయలంటూ నేనూ కావాలని ఇష్టంగా తెచ్చుకున్న నారింజ చెట్టు కోసం తవ్విన గొయ్యి మాత్రం చాలా అసహనంగా చూస్తోంది. చాలా సార్లు దాని పక్కనే కూర్చుని బొమ్మా బొరుసు వేస్తుంటాను.. నేనా, నారింజ చెట్టా అని!

కాసేపేలే!

నువ్వు పెంచుకునే పిట్టలకి గింజలు వేయాలన్న నెపంతో చివాలున లేచి వచ్చేస్తాను!
అప్పటివరకూ ముద్దగా, ముగ్ధంగా నవ్వుతున్న పువ్వు రేకలన్నీ ఒక సన్నగాలి స్పర్శతోనే ఊగి, రాలి పడిపోయాక స్థాణువైపోయే తొడిమని చటుక్కున నువ్వు తుంచేసేప్పుడు విసుక్కున్నాను కానీ, ఒక మహా దిగులు నించి తప్పించడమని ఇప్పుడిప్పుడే అర్ధం అవుతుంది.

లేదులే, నేనలాంటి విముక్తి కోరట్లేదు!

వెళ్ళాల్సిన దూరం ఇంకా ఉంది కానీ, మొదలూ చివరా కూడా కూడానే ఉంటావనుకుంటే.. కాస్త వరకూ తోడొచ్చినట్లు వచ్చి, ఒంటరిగా వదిలేస్తే ఎలా!?
తోవ కనబడుతూనే ఉంది కానీ, ముందుకెళ్ళాల్సినప్పుడల్లా మాత్రం కాస్త వెనక్కెళ్ళి నువ్వు వేసిన అడుగుల్ని కొన్ని అప్పుగా తెచ్చుకుంటూ ఉంటాను!

 

~

satya

నువ్వొదిలి వెళ్ళిన రోజులు…

*

 

నువ్వొదిలి వెళ్ళిన రోజులు ఇంకా లాన్‌లో వైర్ మీద వేళ్ళాడుతున్నాయి
అవి పాతబడనూ లేదు, అలా అని రంగు వెలిసిపోలేదు
ఎక్కడా కూడా ఏ కుట్టూ చెక్కుచెదరలేదు!

యాలకుల మొక్క పక్కనే ఉన్న రాయి మీద
కాస్తంత త్వరగా అయితే నీడ పరుచుకుంటోంది
ఆ మొక్క మాత్రం ఇంకొంచెం గుబురుగా పెరిగింది
నేను ఆ కుండీని కొంచెం కొంచెం జరుపుతూ ఉంటాను..
ఫకీరా ఇప్పుడు కూడా నా కాఫీని అక్కడికే తెస్తాడు
ఉడుతలని పిలిచి బిస్కట్లు తినిపిస్తుంటాను
అయినా అవి నా వంక అనుమానంగా చూస్తుంటాయి
నీ చేతి పరిమళం వాటికి బాగా పరిచయమనుకుంటా!

అప్పుడప్పుడూ సాయంత్రమవుతూనే ఒక డేగ పైకప్పు నించి వాలుతుంది
అలసటగా కాసేపు లాన్‌లో ఆగి,
బత్తాయి చెట్టు వైపుకి ఎగిరి, తెల్లని గులాబీ పూల మధ్యలో మాయమైపోతుంది
అచ్చు ఐస్ ముక్క విస్కీలో కలిసిపోయినట్టుగా!

ఇవాళ్టి రోజుని నా మెడలోంచి స్కార్ఫ్‌లా తీసి వేసి,
నువ్వొదిలి వెళ్ళిన రోజుల్ని చుట్టుకుంటాను
నీ పరిమళంలో ఎన్నో రోజుల్ని గడిపివేస్తుంటాను!

నువ్వొదిలి వెళ్ళిన రోజులు ఇంకా లాన్‌లో వైర్ మీద వేళ్ళాడుతున్నాయి
అవి పాతబడనూ లేదు, అలా అని రంగు వెలిసిపోలేదు
ఎక్కడా కూడా ఏ కుట్టూ చెక్కుచెదరలేదు!

*

మూలం:

 

Tere Utaare Hue Din Tange Hain Lawn Mein Ab Tak..

*

Tere utaare hue din tange hain lawn mein ab tak,
na woh puraane hue hain, na unka rang utra..
kahin se koi bhi seevan abhi nahin udhadi …!

Elaichi ke bahut paas rakhe patthar par,
zara si jaldi sarak aaya karti hai chhanv..
Zara sa aur ghana ho gaya woh paudha,
main thoda thoda woh gamla hatata rehta hun.
Fakeera ab bhi wahin meri coffee deta hai..
gilhariyon ko bula kar khilata hun biscuit.
Gilahariyaan mujhe shaq ki nazar se dekhti hain..
woh tere haathon ka maans jaanti hongi …!

Kabhi kabhi jab utarti hai cheel shaam ki chhat se..
thaki thaki si zara der lawn mein ruk kar,
suffeid aur gulaabi masumbe ke paudhon mein hi ghulne lagti hai..
ki jaise barf ka tukda pighalta jaaye whiskey mein …!

Main scarf din ka gale se utaar deta hun..
tere utaare hue din pehen ke ab bhi main,
teri mehak mein kayi roz kaat deta hun …!

Tere utaare hue din tange hain lawn mein ab tak,
na woh puraane hue hain, na unka rang utra..
kahin se koi bhi seevan abhi nahin udhadi!!

***

 

చిత్రం

 

గుర్తుందా ఒకరోజు?
నా బల్ల మీద కూర్చున్నప్పుడు
సిగరెట్ డబ్బా మీద నువ్వు
చిన్న మొక్కలాంటి
ఒక చిత్రాన్ని గీశావు…

వచ్చి చూడు,
ఆ మొక్కకి ఇప్పుడు పూలు పూస్తున్నాయి!

మూలం:

Sketch

Yaad Hai Ik Din?
Mere Maze Par Baithe Baithe
Cigartte Ki Dibiya Par Tumne
Chhote Se Ek Paudhe Ka
Ek Sketch Banaya Tha

Aakar Dekho,
Us Paudhe Par Phool Aaya Hai

————————–

Artwork: Satya Sufi

పదుగురికీ తెలియాల్సిన నడత – వికర్ణ

cover page and back page quark4.qxd

కొల్లూరి సోమ శంకర్

కొల్లూరి సోమ శంకర్

పురాణాలలోని కొన్ని పాత్రల గురించి చాలామందికి సమగ్రంగా తెలియదు. ముఖ్యంగా పురాణగాథలని పునః కథనం చేసేడప్పుడు ఆ యా పాత్రల స్వరూప స్వభావాలు మార్పులకు లోనవుతుంటాయి. కొన్ని పాత్రలు ప్రజల నోట్లో నానుతాయి, మరికొన్ని మరుగున పడిపోతాయి. వందల మందిలో ఒకడిని గుర్తుంచుకోవాలంటే ఆ వ్యక్తి గుణవంతుడైనా అయ్యుండాలి లేదా పరమ నీచుడైనా అయ్యుండాలి. దుష్టుల దుష్కార్యాలను ఎక్కువగా ప్రాచుర్యంలోకి తేవడం వల్ల, కొందరు మంచివాళ్ళు చేసిన  సత్కార్యాలు, చూపిన తెగువ వెలుగులోకి రావు. మహా భారతంలోని పాత్రలలో చాలా మటుకు ఇలా విస్మృతికి గురైనవే ఎక్కువ. దుస్సల కాకుండా, మిగిలిన నూరుగురు కౌరవ సోదరులలో మహా అయితే నలుగురు లేదా అయిదుగురు పేర్లు గుర్తుంటాయేమో. మిగతావారి ప్రస్తావన చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటివాడే వికర్ణుడు. అతడు గాంధారి పుత్రుడు. కౌరవులలో పదిహేడవవాడు. వికర్ణుని జీవితానికి కాల్పనికతను జోడించి నవలగా సృజించారు డా. చింతకింది శ్రీనివాసరావు. రచయితకి ఇది తొలి నవల.

మహాభారతంలో ద్రౌపదిని అవమానించిన దుర్యోధన దుశ్శాసనులను – నేటికాలంలో మహిళలను అగౌరవపరిచేవారికి ప్రతీకలుగా వ్యవహరిస్తున్నారు. “దేశంలో సందుకో గాంధారి సుతుడు”న్నాడనే నానుడి ఏర్పడిపోయింది. దేశ రాజధానిలో జరిగిన నిర్ఘయ ఘటన పౌరులందరినీ కలచివేసింది. అదే ఈ నవల వ్రాయడానికి ప్రేరణగా మారింది. ‘‘అక్కడా ఇక్కడా అని లేదు. వారూవీరూ అని తేడాలేదు. ప్రతీ వీధిలోనూ, వాడలోనూ, కోటలోనూ, పేటలోనూ స్త్రీలమీద దాడులు దారుణంగా సాగిపోతున్నాయి. వీటన్నింటి గురించి బాగా ఆలోచిస్తున్నప్పుడే మహాభారతంలోని వికర్ణుణని ఘట్టం గుర్తుకువచ్చేది. ద్రౌపది చీర వొలిచేయాలని తలచిన దుర్యోధనునికి వికర్ణుడే అడ్డుతగలటం ఆశ్చర్యమనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ గాంధారీ సుతులు. ఏకోదరులు అప్పుడనిపించింది. అప్పటి భారతంలో ఒక వికర్ణుడున్నాడు గానీ, ఇప్పటి భారతావనిలో వీధికో వికర్ణుడుంటేనే కానీ కాంతల కష్టాలు తీరబోవని. అలా వికర్ణుడు నా మటుకు నాకు హీరో అయిపోయాడు’’ అంటారు రచయిత. అధర్మాన్ని ఎదిరించి, ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించేవారే నేటి భారతావనికి అవసరం. అటువంటి ఋజువర్తన కలిగినవాడే మహాభారతంలోని వికర్ణుడు.

వికర్ణుడంతటి నిజాయితీపరుడు బాల్యంలో ఎలా ఉండి ఉంటాడు. కాస్త పెద్దయ్యాక మరెలా ఉంటాడు. ఇంకాస్త పెరిగాక ఇంకెలా ఉంటాడు… వంటి అంశాలను నాలో నేనే తర్కించుకున్నాను. ఆ విధంగా ఈ పుస్తకానికో రూపం వచ్చింది” అంటారు రచయిత.

వికర్ణుడి జీవితం విలక్షణమైనది. అతని ధీరోదాత్తమైన జీవితానికి – “మహోదయం, విషభేది, ప్రతిభకు పట్టం, నీతిబాట, కణికవ్యూహం, గురి..సిరి.., తప్పిన శిక్ష, రాజ(అ)సూయం, బహిష్కరణ, పూరుడు.. పూర్వజన్మ, త్రివిష్టపం కొండల్లో, యుద్ధం యుద్ధం, పునరాగమనం, మహాభినిష్క్రమణం” అనే అధ్యాయాలతో నవలారూపమిచ్చారు రచయిత.

వికర్ణుడి జననం, తోటి సోదరుల కంటే విభిన్నంగా పెరగడం, దుర్యోధనుడి కుతంత్రాలకు అడ్డు చెప్పడం, ధృతరాష్ట్రుడికి సుఖదకు పుట్టిన యుయుత్సుని మర్యాద కోసం సభలో వాదించడం, ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో దుర్యోధనుడిని ఎదిరించి రాజ్య బహిష్కరణ శిక్షకి గురవడం, తుదకు గాంధారి మాటకు కట్టుబడాలన్న ‘ధర్మానికి’ బద్ధుడై కురుక్షేత్రంలో కౌరవుల పక్షాన పోరాడి తనువు చాలించడం వరకూ సాగుతుంది కథ.

ధర్మాధర్మ విచక్షణ ఏ యుగంలోనైనా మానవులకు అవసరమైనదే. తాను తప్పు చేస్తున్నాడా ఒప్పు చేస్తున్నాడా అనేదీ ప్రతీ మనిషికి తెలుస్తునే ఉంటుంది. కానీ ఆ క్షణంలో మనిషిని ఏదో ఉన్మత్తత్తో లేదా దురావేశమే ఆవరిస్తుంది. ఒక్క క్షణం పాటు తనని తాను నిలవరించుకుని ఆలోచిస్తే.. ధర్మమార్గంలో చరించడానికి అవకాశం లభిస్తుంది. తనది కాని దానికి ఆశపడడం, బలవంతంగా చేజిక్కించుకోవాలనుకోవడం, విపరీతంగా కూడబెట్టాలనుకోవడం, ఎదిరించినవారిని అడ్డు తొలగించుకోవాలనుకోవడం, కుయుక్తులు పన్ని అప్రతిష్ఠ పాలు చేయడం, శారీరకంగా… కుదరకపోతే మానసికంగా వేధించడం, రాజనీతి పేరుతో తాము చేసేవాటిని సమర్థించుకోడం, పలుకుబడి సాయంతో తాము చేసిన నేరాలకు శిక్షను తప్పించుకోడం వంటివి ప్రతీ యుగంలోనూ ఉన్నాయి. ఇలాంటివి చేయకూడదు, తప్పు అని చెప్పేవాళ్ళూ అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు. అయితే ఆ కాలంలో వారి గొంతులు దృఢంగా వినబడేవి. ఈనాడు బలహీనమయ్యాయి. మంచి మాటలు చెబుదామన్నా, సమాజపు పోకడలకు వెరచి మాకెందుకులే అనుకునేవాళ్ళు ఎక్కువైపోయారు. మంచితనం చేతకానితనమైన కాలంలో వికర్ణుడిలాంటి వారి అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నారు రచయిత.

ఓ ధర్మపరుడి కథని సులభమైన శైలిలో, తేలికపాటి పదాలతో ఆసక్తిగా చదివించేలా వ్రాశారు రచయిత. పౌరాణిక కథకి తగ్గట్టుగా సంభాషణలున్నాయి.

‘‘సమయం వచ్చినపుడు మాట్లాడగలగాలి. వేళ మించిపోకుండా బలం చూపగలగాలి. కలసిరాని కాలంలో సైతం మంచివైపు నిలవగలగాలి. ధర్మం మాట్లాడగలగాలి. అదీ మనిషి జీవితానికి అర్థం. మానవ జీవితానికి పరమార్థం’’ అని నిండుసభలో ధర్మరాజుతో వికర్ణుడు పలికిన మాటలు ఏ కాలంలోనైనా ఆచరించదగ్గవే.

యుద్ధం ఎటువంటి వినాశనానికి దారితీస్తుందో వికర్ణుడు గాంధారితో చెప్పిన ఈ మాటలు – యుద్ధపిపాసులందరికీ ఓ హెచ్చరిక లాంటివి. “గౌరవం యుద్ధాల వల్ల రాదమ్మా. ధర్మం వల్ల వస్తుంది. నీతి నిజాయితీల వల్ల వస్తుంది. సమరం అంటే ఏమనుకుంటున్నావమ్మా. అది కలిగినవారి కొంగుబంగారం. లేనివారి దౌర్భాగ్యం. రాజులు చేసే యుద్ధంలో ఓడిపోయేది ఎవరమ్మా. పేదలే కదా. మహా అయితే కొందరు రాకుమారులు ఈ పోరులో చనిపోవచ్చు. కానీ, అక్షౌహిణీల కొద్దీ మరణించే సైనికులు బీదలు కాదూ. మీ వద్ద సేవకులుగా పనిచేస్తున్నవారూ కాదూ. రాజ్యకాంక్ష ఎంతటి ప్రమాదకరమో తెలుసా అమ్మా. అది కన్నవారిని, తోబుట్టువులను, బంధుమిత్రులను కూడా పాము తన పిల్లల్ని తానే తిన్నట్లు కబళిస్తుంది…”.

యుద్ధం తర్వాతి పరిణామాలు ఎంత వేదనాభరితంగా ఉంటాయో అద్భుతంగా చెప్పారు రచయిత. “ఇరుపక్షాలవారు ఒక్కలానే ఉన్నారు. యుద్ధానికి ముందు వారిలో ఎన్నయినా తేడాలుండవచ్చు. ఇప్పుడు మాత్రం వారిలో సమానతలు చాలానే ఉన్నాయి. కన్నీరు. బాధ. బెంగ. యాతన… ఇవీ ఇప్పుడు వారు సాధించుకున్నవి.”

“పోరాటంలో ఓడేవాడు మనిషి, ఓడించేవాడు మనిషే. మనిషి అనగానే ఎక్కడో ఒక మూల మానవత ఉండకపోదు. అది ఏదో ఒక క్షణాన బహిర్గతం కాకనూపోదు.” అంటారు రచయిత. ఆ మానవతకి వెలికితీయడానికి దోహదం చేసే వ్యక్తుల గురించి తెలుసుకోవడం అవసరం. అటువంటి వాడే వికర్ణుడు. వికర్ణుడి జీవితాన్ని తెలియజెప్పే ఈ పుస్తకం ఆశించిన ప్రయోజనం గొప్పది.

‘‘రాజ్యాన్ని సక్రమంగా పాలించడానికి, పేదలను ఆదుకోవడానికి కొన్ని సందర్భాల్లో శాస్త్రాలు ఉపకరించకపోవచ్చు. ధర్మగుణం, నీతి నిజాయితీలు తప్పక ఉపయోగపడతాయి. స్త్రీలు గౌరవాన్ని అందుకునేచోట మానవత ప్రకాశిస్తుంది. మహిళల ఔన్నత్యాన్ని కాపాడగలిగేది వికర్ణుని వంటివారే. వీరి సంఖ్య ఎంత పెరిగితే ప్రపంచానికి అంత ప్రయోజనం. వికర్ణుని చరితను ఔదలదాల్చగల సమాజం అమ్మలను గౌరవించగలదు. ఆరాధించగలదు. అందుకే వికర్ణుని నడత పదుగురికీ తెలియజేయండి. అతని గుణగానం చేయండి. ఇదే నేను ప్రధానంగా చేయగల ధర్మబోధ. ఈ యుగానికైనా, రేపటి కలియుగానికైనా…’’అని భీష్ముడి ద్వారా నవల చివరలో పలికించిన మాటలకు క్రియారూపం ఈ నవలే.

వృత్తిరీత్యా విలేఖరి అయిన డా. చింతకింది శ్రీనివాసరావు గారు రచించిన అలివేణీ ఆణిముత్యమా, దాలప్ప తీర్థం, నవ్య కవితారూపం నానీ – వివేచన, స్వరూపసుధ పుస్తకాలు కూడా ప్రఖ్యాతిగాంచినవే.

శ్రీనిజ ప్రచురణలు, విశాఖపట్నం వారు ప్రచురించిన ఈ 160 పేజీల నవల వెల 110/- రూపాయలు. ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది. ఈబుక్ కినిగెలో లభ్యం.

కొల్లూరి సోమ శంకర్

ప్రచురణకర్త చిరునామా:

శ్రీనిజ ప్రచురణలు,

6-60/1, రవీంద్రనగర్, పాత డెయరీ ఫారం

విశాఖపట్నం-40

అక్షరాల పడవ మీద ఊరేగే ఆకాశం ఈ ‘కవిత్వం’ గ్రూప్!

-భవాని ఫణి

~

 

bhavani-phani.అక్కడ ప్రతీ భావావేశం సెలయేటి నీటిలా గలగలా ప్రవహిస్తుంది . అక్కడ ప్రతీ ఆలోచనా రెక్కలు విప్పార్చుకుని స్వేచ్ఛగా రివ్వు రివ్వున ఎగురుతుంది . అక్కడ సర్రియలిజం  నిజజీవితంలోకి సర్రున దూసుకొస్తుంది. అక్కడ పదాల్లోంచి సజీవ పదార్థం పుట్టుకొస్తుంది . రాశి పోసిన మంచి ముత్యాల వంటి, హేమంత తుషారపు తునకల వంటి విలువైన, స్వచ్ఛమైన కవిత్వం అక్కడ కుప్పలు తెప్పలుగా పేరుకుంటుంది . అదే కవిత్వం గ్రూప్.
‘కవిత్వం’ అనే పేరుతో, ‘కవిత..కవిత..కవిత’ అనే సింపుల్ ట్యాగ్ లైన్ తో  ఎటువంటి భేషజాలూ లేని హుందాతనంతో, ఏడాది క్రితం ‘తిలక్ స్వీ’ అనే కవిత్వ ప్రేమికుడి ద్వారా  ఈ గ్రూప్, ఫేస్బుక్ లో ప్రాణం పోసుకుంది . ఆ యువకుడు ఒక మంచి ఆశయంతో అప్పట్లో ఏర్పరిచిన ఈ డొంక దారి, అనుభవజ్ఞులైన, రసజ్ఞులైన అనేకమంది కవుల ప్రోత్సాహంతో, సలహాలతో, సూచనలతో ఇప్పుడు రహదారిగా రూపుదిద్దుకుంది . ఈనాటి నవ యువ కవుల కవిత్వ ప్రయాణానికి అనువైన మార్గమైంది .  రాకెట్లా ఆది నుండీ అత్యంత వేగవంతమైన గమనాన్ని ప్రారంభించిన ఈ గ్రూప్, ఇప్పటికీ అంతే తీవ్రమైన వేగంతో దిగంతాల అంచుల్ని వెతుక్కుంటూ అనంతం వైపుకి సాగిపోతూనే ఉంది . గ్రూప్ లో ఉండే స్నేహపూర్వకమైన ,ఆహ్లాదకరమైన అనుకూల వాతావరణం వల్లనేమో , రాళ్లబండి కవితా ప్రసాద్ గారు ,హెచ్చార్కె గారు , శ్రీధర్ నామాడి గారు, ఎం ఎస్ నాయుడు గారు,అరణ్య కృష్ణ గారు, కుప్పిలి పద్మ గారు వంటి మహామహులంతా వచ్చి ఇక్కడ తమ తమ కవితల్ని ప్రకటించారు. ప్రకటిస్తున్నారు . ‘పదండి ముందుకు పదండి తోసుకు’ అంటూ యువ కవుల్ని ఉత్సాహపరుస్తున్నారు.
గ్రూప్ అభివృద్ధికి తన భుజాన్ని బోటుగా నిలబెట్టిన గౌతమి (నిశీధి) గారు కూడా అభినందనీయురాలు . ఇంకా గ్రూప్ ని అనుక్షణం గమనిస్తూ , తాము అందివ్వగల సహాయ సహకారాల్ని అందిస్తున్న సహృదయులు మరెందరో ఉన్నారు. వీరందరి నిస్వార్థ సేవకు కారణం, వారికి కవిత్వంపై గల అవ్యాజమైన అనురాగమే. ఇప్పుడు ఈ గ్రూప్, కవిత్వానికి ఒక మెరుగైన వేదికగా మారింది . కొత్తగా రాయడం మొదలుపెట్టిన వారిని ఉత్సాహపరిచే ఉత్ప్రేరకమైంది .కవిత్వం మీద ప్రేమ కలిగిన ప్రతి వ్యక్తీ ఈ గ్రూప్ ని తమదిగా భావించి ఆదరిస్తున్నారు . కవిత్వం గ్రూప్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ మంచి కవిత్వాన్ని అందిస్తున్న  సాయి పద్మ,శారద శివపురపు , మమత కొడిదెల, అన్వీక్ష నీలం, వాణి, ఇండస్ మార్టిన్ , ఛీ ఛీ, సత్య గోపి , మిథిల్, వినీల్ కాంతి కుమార్ , విజయ్ కుమార్ ఎస్వీకె , నరేష్ కుమార్ , సుభాషిణి పోరెడ్డి ,లాస్య ప్రియ , స్వాతి రెడ్డి, సిద్దార్థ కట్టా, నవీన్ కుమార్ , కిరణ్ పాలెపు, రవీందర్ విలాసాగరం….. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందఱో ఇటువంటి యువ కవుల, కవయిత్రుల  కృషి, ప్రతిభ ప్రశంసార్హమైనవి.  .
ఉత్తమ కవిత్వమే తిలక్ తోడూ నీడా!

ఉత్తమ కవిత్వమే తిలక్ తోడూ నీడా!

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో , కవిత్వాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడే దారుల్ని వెతుకుతూ ఎన్నో నవ్య నూతనమైన శీర్షికల్ని ప్రారంభించే ప్రయత్నాలు చేస్తోంది ఈ గ్రూప్. అలా మొదలుపెట్టిన “ప్రశ్నలూ-జవాబులూ” శీర్షిక అద్భుతమైన విజయాన్ని సాధించి , పాఠకుల నుండి గొప్ప ఆదరణ పొంది ఎందరికో ఉపయోగకరంగా, మార్గదర్శకంగా నిలిచింది . ఆ శీర్షికని నిర్వహించిన అరణ్య కృష్ణ గారు , హెచ్చార్కె గారు , ఇప్పుడు నిర్వహిస్తున్న నారాయణస్వామి వెంకటయోగి గారు  తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి, వారి వారి అపారమైన అనుభవాన్నీ, బోలెడంత ఓర్పునీ చమురుగా చేసి ఈ కవిత్వ మార్గాన కోట్ల కొద్దీ దీపాలు వెలిగిస్తున్నారు. ఎన్నో హృదయాల్ని కాంతిభరితం చేస్తున్నారు . మరో కొత్త ప్రయోగం కవితాంత్యాక్షరి కూడా అందరి మనసుల్నీ ఆకట్టుకుంటోంది .అంతేకాక, ఇంచుమించుగా కవిత్వం గ్రూప్ తో పాటుగానే ఊపిరి పోసుకున్న “కవిత్వం పోయెట్రీ పేజ్” కూడా ఇప్పటికే రెండువేలకి పైగా అభిమానుల్ని సంపాదించుకుంది.
మరింతమందికి  కవిత్వ లేఖనంపై ఆసక్తి కలిగించడం , మరికొందరు అనుభవజ్ఞుల సూచనలు ,సలహాలు ఈ కవిత్వ ప్రయాణానికి ఉపయోగపడేలా చెయ్యడం  ద్వారా తెలుగు భాషకీ , కవిత్వానికీ ఎంతో కొంత సేవ చేసే అదృష్టాన్ని పొందాలన్న కోరిక మాత్రమే ఈ ఆర్టికల్ రాయడం వెనకనున్న స్వార్థం.  విజయవంతంగా ఏడాది సమయాన్ని పూర్తి చేసుకుని, మొదటి పుట్టిన రోజు జరుపుకున్న సందర్భంగా కవిత్వం గ్రూప్ నీ, గ్రూప్ సభ్యుల్నీ అభినందిస్తూ , కవిత్వానికి మరింత ఆదరణ లభించే విధంగా కృషి చేయమని వారిని సవినయంగా కోరుతూ ఇదిగో కవిత్వం గ్రూప్ లింక్ ఇక్కడ
 
ఆర్టికల్ పూర్తి పాఠం యు ట్యూబ్ వీడియో లింక్ ఇక్కడ 

మేమూ మీరూ…ఇదే అసలు గొడవ!

 

-అల్లం కృష్ణ చైతన్య 

చిత్రం: అక్బర్

~

2014 సెప్టెంబర్. నిస్సహాయుడైన మనిషి, ప్రాణాలు అరచేతిల పెట్టుకుని ప్రాధేయ పడుతున్నడు. ఆకలికి కులం, మతం లేదు. ముందున్నది మనిషా, జంతువా అన్న సమాలోచన లేదు. మంచి, చెడు అన్న విచక్షణ లేదు. ముందున్నది ఆహారం మాత్రమే. వీడియో చూసిన దేశం అంతా దిగ్భ్రాంతికి గురైంది. పులిని చంపేయ్యాలన్నరు కొందరు. ఎక్కువ మంది అది క్రూర జంతువు, వేట దాని స్వభావం, దాని తప్పేమున్నది అన్నరు. చివరకు ప్రకృతి గెలిచింది. పులి నిర్దోషిగ నిలిచింది.

ఇక్కన్నే వాదం మొదలవుతది. మృగానికీ, మనిషికీ తేడా లేదా అని. మృగం-మనిషి అనీ, క్రూరత్వం మానవత్వం అనీ వాద ప్రతివాదాలు మొదలయినై. నిజమే. తేడా ఉన్నది. కానీ స్వభావం? వేట మనిషి స్వభావం. సహజ సిద్ధమైన ప్రాకృతిక లక్షణం. వేల సంవత్సరాలు మనిషి వేటాడిండు. జీవ రాశులన్నీ ఆహార చక్రంలో తమ తమ భాగాలని పంచుకున్నై. అది ప్రకృతి. అది స్వభావం. చరాచర భూప్రపంచం మీద మనిషి ప్రాథమిక మనుగడలో అంతర్భాగం వేట, మాంసాహారం.

అనాగరిక ప్రపంచం నుండి నాగరికతలు రూపు దిద్దుకోవడం మొదలయ్యింది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, మనుగడ, సంఘటిత జీవనం లాంటి వాటికి కొత్త అవధులు, ప్రమాణాలు సృష్టించబడ్డాయి. గీతలు గీసుకోవడం మొదలయ్యింది. రోజు రోజుకూ మనం నుండి నువ్వు-నేనులు పుడుతూనే ఉన్నై. నేను గొప్ప నుండి, నాది గొప్ప అనే పరిణామం నువ్వు, నీ పుట్టుక, అసలు నీ అస్తిత్వమే తక్కువ అనే స్థాయిని దాటినంక బలమైన సంఘాలు బలాన్ని కాపాడుకోవడం కోసం బల ప్రదర్శన చేస్తనే ఉన్నై. ఎన్నుకునే అంశాల పేర్లు వేరు కావచ్చు జరిగేది మాత్రం బల ప్రదర్శనే. నేను-నువ్వుల నుండి మేము మీరులు ఏర్పడ్డంక నా వాదన మా వాదనయ్యింది. ఆల్ఫాలు, బీటాలు అదే భావజాల వ్యాప్తిని కొనసాగించిన్లు. కొన్ని తరాల తరవాత పూర్తి స్థాయి మేము, మీరుల సమాజాలు తయారయినై. దేవుడు పుట్టిండు. కులాలు పుట్టినై. మతాలూ పుట్టినై. అలవాట్లూ, నాగరికతలకు అనుగుణంగా సంఘటిత జీవనం అనేకానేక రకాలుగా వేరు పడుతూనే ఉన్నది.

జంతు హింసని వ్యతిరేకించడం మంచి విషయం. అసలు హింసనే వ్యతిరేకించడం ఇంకా గొప్ప విషయం. సమస్త జీవజాలాన్ని(తోటి మనుషులతో సహా) ప్రేమించమని చెప్పడం మంచితనం, మహానీయత్వం, మానవత్వం. ఇవి ఉన్నవాళ్ళు సంఘంతో కలిసి పని చేస్తరు. నచ్చని విషయాన్ని పెటాలు, యానిమల్ షెల్టర్లు పెట్టి ప్రేమని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందింప చేస్తరు. అయినా, సహజ సిద్ధమైన స్వభావాన్ని వదులుకోలేని వాళ్ళు అలవాట్లు మార్చుకోరు. ఒకరి ఆహారం వాళ్ళ ఇష్టం. తినని వాళ్ళు, తినే వాళ్ళు ఇద్దరూ చెడ్డ వాళ్ళు కాదు. కానీ ఇక్కడ సమస్య అది కానే కాదు. నేను మాత్రం కోళ్ళనీ, చేపలనీ, మేకలనీ తింటా, నువ్వు ఆవుల్ని తినద్దు. నేను కరెక్టు, నువ్వు తప్పు. నేను తినను కాబట్టి నువ్వు తింటే నరుకుతా. ఇందులో ప్రేమ, సౌభ్రాతృత్వం, మానవత్వం ఎక్కడ ఉంది? సరే ప్రేమతో అన్నావనుకుందాం, అని ఊరుకోవడం లేదే. వ్యతిరేకించిన కుత్తుకల తెగ్గోసి కారుతున్న రక్తాన్ని మీద పోసి చూడు నీకు ఇదే శాస్తి పడుతుందన్న వాడి మాటల్లో ప్రేమ ఎక్కడుంది? మానవత్వం ఎక్కడుంది? ధర్మం ప్రసక్తి ఎక్కడ వచ్చింది? సమస్య ఆహారం కాదు. మేము మీరుల మధ్య. సరిగ్గా ఇప్పుడే మళ్ళీ అదే ప్రశ్న. ఈ సారి వేరే మనుషుల మీద. మృగానికి, మనిషికి తేడా లేదా?

*

పెనుచీకటి నిమిషంలో వెలుగు రవ్వ ఆలూరి బైరాగి!

 

‘చాయ’ సాంస్కృతిక సంస్థ ఆరవ సమావేశం ఆదివారం నవంబెర్ 1న హైదరాబాద్ ప్రెస్ క్లబ్, సోమాజిగూడ లో “కవి బైరాగి” రచనల మీద జరిగింది. అంబటి సురేంద్ర రాజు, తెలిదేవర భానుమూర్తి, ఆదిత్య కొర్రపాటి, అనంతు చింతలపల్లి “కవి బైరాగి” గురించి ఎన్నో కొత్త కోణాలు ముందుకు తెచ్చారు . ఈ ముచ్చట్లన్ని youtube  లో “Chaaya Conducts Chikati Thovalo Prasnala Jadi” link  లో మీరు చూస్తూ వినవచ్చు. సభకి వచ్చిన వారందరికి వందకు పైగా బైరాగి సంపూర్ణ రచనలు కానుకగా ఇవ్వడం జరిగింది. గత మూడు దశాబ్దాలలో బైరాగి మీద హైదరాబాద్ లో సభాముఖంగా చర్చించలేదన్నది మిత్రుల మాట. ఈ కార్యక్రమం కోసం బి. యల్. నారాయణ తెనాలి నుంచి రాసిన ప్రత్యేక వ్యాసం మీకందిస్తున్నాం.

 

BLఆలూరి బైరాగి .. ద్వితీయ సహస్రాబ్ది మహాకవి. ప్రపంచానుభుతితో తన స్వీయానుభూతిని మేళవించి ఆధునిక తెలుగు కవిత్వంలో తనదైన ముద్ర వేసుకున్నాడు. జీవుని వేదనకు స్వరమిచ్చిన కవి ఆయన. జీవించింది తక్కువ కాలమే.. ఆ సమయంలోనే త్రికాల మానవ వేదనను కవితార్చన చేసాడు. జీవతంలో రాజీపడకుండా ‘బైరాగి’ జీవితాన్ని గడిపి, ఈ ప్రపంచంతో కూడా పేచీపడ్డట్టుగా అనిపించిన బైరాగి, కవిగా పూర్నాయుష్కుడనని నిరూపించుకున్నారు. నిరాశావాదిగా, సంశయాత్మక కవిగా ఆయనను విమర్శించేవారున్నా, ‘ఆగబోదు తుపాను’ అని గర్జించిన బైరాగి నిరాశావాది ఎలా అవుతారని ప్రశ్నించేవారూ లేకపోలేదు.

తెనాలిలోని అయితానగర్ లో 1925 సెప్టెంబర్ 5న జన్మించిన ఆలూరి బైరాగి చౌదరి, అమ్మ ఒడిలోంచి చదువుల బడిలోకి అడుగిడినా అనుదిన విద్యావ్యాసంగం ఆయనకు రుచించలేదు. తండ్రి వెంకట్రాయుడు జాతీయాభిమానంతో బైరగికి హిందీ అక్షరాభ్యాసం చేయించారు. గాంధేయవాది యలిమించిలి వెంకటప్పయ్య తెనాలిలో 1935లొ ప్రారంభించిన హిందీ పాఠశాలలో మధ్యమ చదివాడు. అప్పటికి బైరాగికి పదేళ్ళు. మరో గురువు   ప్రజనందన శర్మ వద్ద రాష్ట్రభాష, విశారద పూర్తి చేశాడు. అప్పటికే పుస్తకాలంటే ఆశక్తి కలిగిన బైరాగి, కనిపించిన పుస్తకన్నల్లా చదువుతూ జ్ఞాన తృష్ణను తీర్చుకునేవాడు. 13వ ఏట హిందీ లో ఉన్నతవిద్య కోసమని బీహార్ లోని  ముజాఫర్ ఫూర్ కు వెళ్లి నాలుగేళ్ళు హిందీ, సంస్కృతం నేర్చుకున్నాడు. అక్కడే తన 15వ ఏట తొలిసారిగా హిందీ కవిత రాసి, కవి సమ్మేళనంలో పాల్గొని ప్రశంసలు పొందాడు. 1941 లో స్వస్థలం తిరిగొచ్చాడు. తల్లి సరస్వతి మరణం ఆయనను కుంగదీసింది. క్విట్ ఇండియా ఉద్యమానికి ఆకర్షితుడై రహస్యంగా కరపత్రాలను పంచాడు. ఎం ఎన్ రాయ్ ప్రారంభిన రాడికల్ డెమోక్రాటిక్ పార్టీ నాయకులతో పరిచయాలేర్పడి, బైరాగి జీవతంలో ముఖ్యమైన మలుపుకు దారితీసింది. మార్కిస్టు తత్వశాస్త్రం, ఎం ఎన్ రాయ్ సిద్ధాంతాలు బైరాగిని ఒక విలక్షణమైన దార్శ కునిగా, విశ్వ మానవ ద్రుష్టి పథగామిగా తీర్చి దిద్దాయి.

ఇరవై ఏళ్లకే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, సంస్కృతం, బెంగాలీ భాషల్లో పాండిత్యాన్ని సంపాదించిన బైరాగి, 1946 లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని హై స్కూల్ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ఆరంభించాడు. అక్కడనుంచి తన తెలుగు కవితా సంకలనం ‘చీకటి నీడలు’ వెలువరించాడు. సినీనిర్మాత, తన పినతండ్రి చక్రపాణి కోరిక ప్రకారం మద్రాసుకు మకాం మార్చాడు. హిందీ ‘చందమామ’ సంపాదకుడిగా మరో మజిలీని ప్రారంభించిన బైరాగి, కమ్మని నీతి కథలను గేయరూపంలో అందిస్తూనే, హిందీ కవితా సంకలనం ‘పలాయన్’ తెచ్చారు. పిల్లల కోసం అయన రాసిన నీతి కథలు బాలసాహిత్యంలో వాటికవే సాటి అంటారు. తెలుగులో రాయని వైయుక్తిక ప్రేమ కవిత్వాన్ని అయన హిందీ లో అద్భుతమైన సౌందర్య ద్రుష్టిలో వెలువరించారు. స్వేచ్చాప్రియుడైన బైరాగి, చందమామ పత్రిక నుంచి కొద్దికాలానికే బయటకొచ్చేసాడు. తన కవితా ప్రస్థానంలో ముఖ్యమైన ‘నూతిలో గొంతుకలు’ తో మానవ సహజవేదనకు గాఢమైన అభివ్యక్తిని ఇచ్చారు. ‘దివ్యభవనం’ కథ సంపుటిని తీసుకొచ్చాడు. మహాజలపాతం వంటి పద గుంభనం, అనన్యమైన భావోద్వేగం, అనితర సాధ్యమైన ధారాశుద్ధి కలిగిన బైరాగి ఎప్పుడూ సమూహంలో ఒంటరిగానే ఉండేవాడు. అతడి కవితల్లోని నిరాశను చూసి విరాగి అనేవారు. అయినా బైరాగి జీవతంలో తలమునకలు కాలేదు. ప్రవాహంలో పడికొట్టుకుపోలేదు. వీక్షణంతో పరికించి జీవితాన్ని వివిధ కోణాల్లో చూశాడు.  ఎక్స్-రే కళ్ళతో చీకటిని చీల్చి వెలుగు చూశాడు. తనకంటూ ప్రత్యేకంగా నిర్మించుకున్న సాహితీ జగత్తులో నివసించిన బైరాగి, సమాజంలోని పీడిత, తాడిత ప్రజల బాధామయ జీవిత గాధలను తన కవిత్వపు ప్రతి పంక్తిలోను జీవింప జేశాడు.

బైరాగికి 14వ ఏడూ వచ్చేసరికి స్వాతంత్ర్య సమరం ముమ్మరంగా సాగుతోంది. రెండో ప్రపంచయుద్ధం ఆరంభమైంది. విపరీతంగా జననష్టం జరుగోతోంది. అందుకు స్పందించిన బైరాగిలోని కవి హృదయం, ఈ హత్యలకై జవాబు ఏ ద్రోహుల నడగాలో/ ఈ రుధిరం చేసిన మరకలు ఏ రుధిరం కడగాలో‘ అంటూ పలికింది. ఇదే దశలో తెలుగునాట కవితా ధోరణుల్లో మార్పు వచ్చింది. భావ విప్లవ జ్వాలలకు ప్రభావితుడైన కవుల్లో బైరాగి కూడా ఒకరు. సమాజాన్ని మార్చటమెలాగని ఆరాటపడ్డ బైరాగి, ‘శబ్దం లేదు గాలి లేదు / చీకటికి జాలి లేదు / చూపులేని రూపులేని / రేపులేని మాపులేని / ఈ పెనుచీకటి నిముసం/బ్రతుకుల నల్లని కుబుసం‘ అని నిస్పృహ వెలిబుచ్చారు.

మరో చోట ప్రగల్భ నిరీక్షణతో నిండిన పండిన ఈ నిశ్శబ్దంలో / వేచివున్నవాడే ప్రతి ఒక్కడు / మార్పుకొరకు తీర్పుకోరకు/ఓర్పుగలిగి/ చరమ ఘంటారావం కొరకు / తప్పిపోయిన భావం కొరకు‘ అంటూ ఆశావాదం ప్రకటించాడు. ‘వినతి’ అనే కవితలో ‘ప్రతి అక్షరమొక భటుడు / ప్రతి పదమూ ఒక శకటూ/ ప్రతి ఊహ ఒక వ్యూహం / జీవన శకాంతక సంకుల సమరంలో కవితను, ఏమనుకున్నావు? అని కవి గమ్యాన్ని నిర్దేశించాడు. బైరాగి రాసిన ప్రతి వాక్యంలో పాతమీద తిరుగుబాటు, కొత్త కోసం ఆరాటం కనిపిస్తాయి. సంఘంలోని ఏ ఒక్క అనాచరమూ, అనర్థమూ అయన ద్రుష్టిని తప్పుకోలేదు. అవినీతి, అక్రమాలతో నిండిన ఈ జీవితపు చీకటి నుంచి ఆకాశపు వెలుతురులోకి చొచ్చుకుపోయే విహంగ స్వేచ్చ బైరాగి జీవితం, కవిత్వమంతటా ప్రసరించింది. అయన కవిత్వాన్ని అందంగా రాయలనుకోలేదు. ఆవేశం తో రాసాడు .

హైదరాబాద్ లో జరిగిన ఈ సభ బైరాగి పునః సమీక్షకి కొత్త ఆగమ గీతి.

హైదరాబాద్ లో జరిగిన ఈ సభ బైరాగి పునః సమీక్షకి కొత్త ఆగమ గీతి.

రాజకీయ ప్రత్యర్థులను వేలాదిగా జైళ్ళలోకి పంపిస్తున్న 1965లొ వీరులు నీలఖంటులు మృత్యుంజయులు /వేదనల విషం త్రాగి జనతకు /మహితకు / సమతామృతం పంచుతారు / మృత్యువు వారికీ వంగి చేస్తుంది జోహారు/ వగపు వలదు ‘ అంటూ ఆశారేఖలు చిందిచాడు. వర్తమాన సమాజంలో ఆశించిన ఫలితాలు మృగ్యమైనపుడు ఉన్న సమాజాన్ని మార్చాలని ఆరాట పడటం సహజమే. అలాగని, బైరాగి పడక కుర్చీలో పడుకుని కలల్లోకి పలాయనం చేయలేదు. చీకటి, తుపాను, విధ్వంసం, నెత్తురు బైరాగి కవిత్వమంతటా అలుముకున్నాయి. వినాశ సుందరరుపం వీక్షించిన వాడెవడూ వికాస జడస్తూపం రక్షింప బూనడెవడూ, జగుప్స మన ఆదర్శం, ప్రేయసి మన విద్వంసం’ అంటాడు. సమాజంలోని లోటుపాట్లను, సామాన్యుల జీవితాల్లోని ఒడిదుడుకులను, పీడితుల పాట్లను చూసి హృదయం ద్రవించి, ఆ వేదననే కవిత్వంగా హృదయానికి హత్తుకునేలా చెప్పారాయన. ‘కిర్తికనక సౌధపు తలవాకిట పడిగాపులు’ అయన ఎన్నడూ కాయలేదు. మేధకు, క్రియకు మధ్య, ఆశయానికి సంశయానికి మధ్య, సాధనకు, సాధ్యానికి మధ్య పడిన నీడలు తుడిచేందుకు నడుం బిగించి నడిచాడు.

వేదన నుంచి సంశయానికి, సంశయం నుంచి హేతుబద్దతతో బతుకు బాటలోకి పయనం సాగించాడు. నిస్సహాయ మానవ జీవితాలను అవలోకిస్తూ, ఆకలి! తన శిశువులనే చంపే తల్లుల ఆకలి / పూటకూటికై శీలం అమ్మే కన్యల ఆకలి‘  అంటూ ఆకలి కేకల అర్థం చెప్పాడు. దిక్కు లేక వ్యభిచార వృత్తిలోకి దిగిన వారిని, అణాపూలు/కానీ తాంబూలం / నలిగిన చీరలు / చీకటి ముసుగులు / ఇదా నీకు జివతమిచ్చిన బహుమానం’ అని జాలిచూపుతూ, ప్రపంచపు ఫార్సు పైన నీ బతుకు వ్యంగ్య చిత్రం’ అంటాడు.

అనిల్ అందరికీ కానుక చేసిన బైరాగి పుస్తకాలు

అనిల్ అందరికీ కానుక చేసిన బైరాగి పుస్తకాలు

పీడిత జనావళికి ప్రతినిధిగా బైరాగి వెలువరించిన గ్రంథాలు తక్కువే అయినా అవే ఆయనను తెలుగు, హిందీ సాహిత్యంలో ధ్రువతారగ నిలిపాయి. అయన రాసిన ‘ఆగమగీతి’ కావ్యానికి రాష్ట్ర సాహిత్య అకాడమి, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డులు లభించాయి. ‘చీకటి నీడలు’, ‘నూతిలో గొంతుకలు’ తెలుగు కవితా సంకలనాలు, ‘పలాయన్’ హిందీ  కవితా సంకలనం, ‘దివ్యభవనం’, ‘త్రిశంకు స్వర్గం’ తెలుగు కథా సంకలనాలు. తెలుగులో ఆధునిక కవితా, ప్రముఖ ఆధునిక తెలుగు కవితల హిందీ కావ్యానువాదం, ఇంకా అనేక కవితలు పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ‘వినతి’, ‘రంగులతోట’, ‘పగిలిన అద్దం’, ‘నైశ్యగీతి’, ‘పుడమికి కన్నెరికం’, ‘కెందామర’, ‘మూడు సంకేతాలు’, ‘అరచిత కవితా’ వంటి కవితలు అయన భావుకతను, కల్పనాశక్తికి ప్రతీకలు. ‘నాక్కొంచం నమ్మకమివ్వు’ కవిత ఆయనకు బాగా పేరు తెచ్చి పెట్టింది. ఈ కవితను శ్రీ శ్రీ ఇంగ్లిష్ లోకి అనువందించారు. ‘ముఝె కించిత్ విశ్వస్ దేవ్’ శిర్షికతో దీనిని నిఖిలేశ్వర్ 1962 లోనే హిందీలోకి అనువందించగ, స్వయంగా బైరాగి, ఆ తర్వాత యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ కూడా ఈ కవితను హిందీ లోకి అనువందించారు.

తన రచనలతో సాహితీ సమాజంలో ఎంతగా ఎదిగినా బైరాగి జీవితాన్ని చాలా నిరాడంబరంగా గడిపారు. పరిస్తితులను బట్టి అవసరాలను తగ్గించుకొన్నాడు. కవిత్వం, కథలు, వ్యాసాలతో వచ్చే అదాయంతోనే కాలక్షేపం చేశాడు. అతడికి ముగ్గురు సోదరులు ఎదిగివచ్చి, బైరాగి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దపడినా, ఎందుచేతనో ఒంటగారిగానే జీవించాడు. ఆరోగ్యం క్రమంగా క్షిణించిన ఆహార నియమాలు పాటించలేదు. 1978 సెప్టెంబర్ 9న కన్నుమూశారు.

 *

 

 

 

గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ -19

 

[ Anne Of Green Gables By L M Montgomery ]

 

పెద్ద పెద్ద విషయాలతో చిన్నవీ కలిసి వస్తుంటాయి. ఘనత వహించిన కెనడా ప్రధానమంత్రి తన పర్యటన లో ప్రిన్స్ ఎడ్వర్డ్ దీవిని సందర్శించాలని మొదట అనుకోలేదు ..ఆ రాజకీయ పర్యటన కీ ఆన్ అదృష్టానికీ సంబంధం ఉండనక్కర్లేదు , కాని ఉండటం సంభవించింది.

ఆయన జనవరిలో వచ్చారు…చార్లెట్ టౌన్ లో గొప్ప బహిరంగసభ జరిగింది.  సమర్థించేవారితోబాటు కొందరు వ్యతిరేకించేవారు కూడా  గుమిగూడారు అక్కడ.  అవొన్లియా జనం లో చాలా భాగం ఆయన పక్షం వారే – అందరు మగవాళ్ళూ చాలా మంది ఆడవాళ్ళూ బయల్దేరి    ఆ ముప్ఫై మైళ్ళూ పడి వెళ్ళారు. మిసెస్ రాచెల్ లిండ్ కూడా ప్రయాణం కట్టింది – అసలైతే ఆవిడ అవతలి పక్షం మనిషే గాని, తను లేకపోతే అంత పెద్ద సభా బోసిపోతుందని ఆవిడ అభిప్రాయం. వాళ్ళాయన థామస్ నీ బయల్దేరదీసింది – లేకపోతే గుర్రాన్ని కనిపెట్టి ఉండేదెవరు మరి ! మెరిల్లానీ తనతో రమ్మంది . పైకి తేలదు గానీ , రాజకీయాల మీద మెరిల్లాకి కాస్త ఆసక్తే. ఒక ప్రధానమంత్రిని ప్రత్యక్షంగా చూసే అవకాశం మళ్ళీ ఎప్పుడొస్తుందిలే అనుకుని , ఆన్ కీ మాథ్యూకీ మర్నాటివరకూ ఇల్లప్పగించే సాహసం చేసింది మొత్తానికి.

అలాగ- మిసెస్ రాచెల్ , మెరిల్లాలు తమ రాజకీయోత్సవం లో ఉండగా ఇక్కడ ఆన్ , మాథ్యూ లు తమ స్వాతంత్రోత్సాహం లో  తలమునకలవుతున్నారు-  ఇల్లంతా వాళ్ళదేనాయె ! చక్కగా భగభగమంటూ పొయ్యి మండుతోంది. వంటింట్లో పాతకాలపు వాటర్ లూ స్టవ్వూ  , గోడలకి వేసిన తెలుపూ నీలం పింగాణీ  పలకలూ తళతళలాడుతున్నాయి. మాథ్యూ తీరుబడిగా సోఫాలో జేరబడి ‘ రైతు వాది ‘ పత్రిక తిరగేస్తున్నాడు. ఆన్ మహా బుద్ధి గా చదువుకునే ప్రయత్నం లో ఉంది , మధ్య మధ్యన కాస్త అవతలగా పెట్టుకున్న నవల కేసి చూసుకుంటోంది.  జేన్ ఆండ్రూస్ దగ్గర్నుంచి కిందటిరోజు తెచ్చుకుంది దాన్ని- బోలెడంత ‘ ఉత్కంఠ ‘ గా  ఉంటుందట అది  , జేన్ చెప్పింది.  దాన్ని అందుకుని తెరవాలని ఆన్ చెయ్యి లాగేస్తోంది…కాని రేపు పరీక్ష  యుద్ధం లో గిల్బర్ట్ ముందు ఓడిపోతే ఎలాగ ? అది అక్కడ లేదని ఊహించుకునే ప్రయత్నం చేస్తోంది.

” మాథ్యూ ! నువ్వు స్కూల్ కి వెళ్ళేప్పుడు జామెట్రీ చదువుకున్నావా ఎప్పుడన్నా ? ”

జోగుతూన్న మాథ్యూ ఉలిక్కిపడి లేచి – ” అబ్బే- లేదు- ఎప్పుడూ లేదు ”

” హు. నువ్వు చదువుకుని ఉంటే బావుండేది , నా కష్టం నీకు పూర్తిగా అర్థమయేది …ఏం జామెట్రీ ఇది మాథ్యూ ! నా జీవితాన్ని అంధకారబంధురం చేసేస్తోంది – నేనొట్టి మొద్దుని తెలుసా ఇందులో ? ”

” నువ్వు మొద్దువేమిటి ఆన్ ? కిందటివారం కార్మొడీ వెళ్ళానా – అక్కడ బ్లెయిర్ వాళ్ళ స్టోర్ దగ్గర మిస్టర్ ఫిలిప్స్ కనిపించి మాట్లాడాడు. నువ్వు బళ్ళోకంతా తెలివైనదానివట, అన్నీ ‘ గబా గబా ‘ నేర్చేసుకుంటున్నావట . ఆ టెడ్డీ ఫిలిప్స్ అంత మంచి మేష్టరేం కాదనేవాళ్ళున్నారులే గాని , నాకైతే అతను బుర్ర ఉన్నవాడేననిపించింది ”

ఆన్ ని మెచ్చుకున్నవాళ్ళెవరైనా తెలివిగలవాళ్ళే మాథ్యూ ప్రాణానికి.

” ఏమో. మిస్టర్ ఫిలిప్స్ జామెట్రీ లో అక్షరాలు మార్చెయ్యకుండా ఉంటే ఇదీ బాగానే నేర్చుకోగలనేమో. అంటే – గీతలతో బొమ్మలు వేసేప్పుడు గుర్తుకి ఎ, బి , సి అని అక్షరాలు పెట్టుకుంటామన్నమాట. ఎలాగో కుస్తీ పట్టి అన్నీ గుర్తు పెట్టుకుంటానా..మిస్టర్ ఫిలిప్స్ బోర్డ్ మీద రాసేప్పుడు అన్నీ కలగాపులగం చేసేస్తారు..నాకేమో బొత్తిగా తికమక అయిపోతుంటుంది. ఎంత మేష్టారైతే మాత్రం..అలా చెయ్యచ్చా చెప్పు ?

మెరిల్లా, మిసెస్ రాచెల్ ఏం చేస్తూ ఉండిఉంటారో ? అటావా లో పరిస్థితి ఏమీ బాగోవట్లేదనీ ఇదే గనక కొనసాగితే ప్రధాన మంత్రికి వచ్చే ఎన్నికల్లో కష్టమేననీ మిసెస్ రాచెల్ అంటున్నారు…అసలు ఆడవాళ్ళకి  కూడా ఓటు హక్కు ఉంటే మొత్తం మారిపోతుందట..ఆవిడే చెప్పారు. అవునూ నువ్వే పార్టీ కి ఓట్ వేస్తావు మాథ్యూ ? ”

” కన్ జర్వేటివ్ పార్టీ కి ” అనుమానం లేకుండా చెప్పాడు – ఆ పార్టీ మాథ్యూ జీవితం లో భాగం- చర్చికి వెళ్ళటం లాగా.

” అయితే నేనూ అదే ” ఆన్ నిర్ణయించేసుకుంది. ” నీది ఆ పార్టీ అవటం నాకు సంతోషమే ..ఎందుకంటే గిల్ – అదే , స్కూల్లో కొంతమందిది గ్రిట్స్ [  లిబరల్ ] పార్టీ. మిస్టర్ ఫిలిప్ కూడా ‘ గ్రిట్ ‘ నే అనుకుంటా, ఎందుకంటే ప్రిస్సీ ఆండ్రూస్ వాళ్ళ నాన్న ఆ పార్టీ యే కదా. ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తుంటే వాళ్ళమ్మ వెళ్ళే చర్చి కే  వెళ్ళాలట , వాళ్ళ నాన్న పార్టీ కే ఓట్ వెయ్యాలట- రూబీ గిల్లిస్ చెప్పింది. నిజమేనా మాథ్యూ ? ”

” ఏమో. తెలీదు ”

anne19-2

” నువ్వెవరైనా అమ్మాయిని ప్రేమించావా మాథ్యూ ? ”

” లేదు. ఎప్పుడూ లేదు ” – జన్మలో అలాంటి బుద్ధి పుట్టలేదు మాథ్యూకి.

ఆన్ అరచేతుల్లో గడ్డం ఆనించుకుని తలపోసింది –

” అదంతా  సరదాగానే ఉంటుందేమో కదా. రూబీ చెప్పిందీ – తను పెద్దయాక తన కి బోలెడంతమంది అబ్బాయిలు ఆరాధకులు గా అయిపోతారట, అందరూ పెళ్ళి చేసుకోమని అడుగుతారట ..తనకైతే పిచ్చెక్కి పోతుందిట..అంత మంది ఎందుకులే గాని, సరైనవాడు ఒకడుంటే బావుంటుంది. రూబీ కి ఇలాంటి విషయాలు బాగా తెలుసు , ఎందుకంటే తనకి చాలా మంది అక్కలు ఉన్నారు గదా. గిల్లిస్ వాళ్ళ అమ్మాయిలు హాట్ కేకుల్లాగా చలామణీ అవుతారుట –  మిసెస్ రాచెల్ అన్నారు. మిస్టర్ ఫిలిప్స్ రోజూ ప్రిస్సీ ఆండ్రూస్ వాళ్ళింటికి వెళ్తారు – పాఠాల్లో సాయం చేసేందుకని. మరైతే మిరండా స్లోన్ కూడా ఆ పరీక్షకే కదా చదువుతోంది..ప్రిస్సీ అంత బాగా కూడా చదవదు తను- వాళ్ళింటికీ  వెళ్ళి సాయం చెయ్యచ్చుగా..ఏమిటో ! అర్థం కాదు ..”

” నాకూ అలాంటివి అర్థం కావు ” మాథ్యూ ఒప్పుకున్నాడు.

” సరేలే. చదువుకోవాలి నేను..చాలా ఉన్నాయి పాఠాలు. ఆ జేన్ ఇచ్చిన నవల  తీసుకు చదవాలని ఎంత అనిపిస్తోందో..వీపు అటువైపు తిప్పి కూర్చున్నా అది నాకు కనిపిస్తూనే ఉంది. జేన్ అది  చదువుతూ ఏడ్చేసిందట తెలుసా..అలా కన్నీళ్ళు తెప్పించే పుస్తకాలు నాకు బాగా నచ్చుతాయి. హ్మ్..లాభం లేదు , దాన్ని పట్టుకుపోయి జామ్ అల్మైరా లో పెట్టి తాళం వేసి తాళం చెవి నీకు ఇచ్చేస్తానూ..నా చదువు పూర్తయేదాకా తాళం చెవి నాకు ఇవ్వకేం ! నేనెంత అడిగినా.. ప్రాధేయపడినా కూడా ! ఆకర్షణ  లని నిగ్రహించుకోమంటారు కదా , తాళం చెవి దగ్గర లేకపోతే ఆ పని చెయ్యటం కొంచెం తేలిక. నేలమాళిగ లోకి వెళ్తున్నా- రస్సెట్స్ [ తొక్క ముదురు రంగులోకి తిరిగిన ఆపిల్స్ ] కావాలా నీకు అక్కడినుంచి ?”

” నాకొద్దులే. నువ్వు తెచ్చుకో కావాలంటే ” ఆన్ కి అవి ఇష్టమని మాథ్యూ కి తెలుసు.

ఒకచేత్తో కొవ్వొత్తీ ఇంకో చేత్తో పళ్ళెం నిండుగా రస్సెట్స్ పట్టుకుని నేల మాళిగ నిచ్చెన మెట్లెక్కుతూ పైకి వస్తోంది ఆన్. బయట మంచు కట్టిన బాట మీద చక చకా నడిచే అడుగుల చప్పుళ్ళు . వంటింటి తలుపు చటుక్కున తెరుచుకుంది. చలిగాలికి పాలిపోయిన మొహం తో , రొప్పుకుంటూ- ఆదరాబాదరా తలమీంచి చుట్టుకున్న శాలువా తో – అక్కడ – డయానా బారీ !! ఆన్ చేతుల్లో ఉన్నవన్నీ రెప్పపాటులో కిందపడిపోయాయి…..[ నేలమాళిగ నేల మీద గ్రీజ్ పేరుకుని ఉంది- మరసటిరోజు మెరిల్లా అన్నీ శుభ్రం చేస్తూ మొత్తమంతా తగలబడిపోనందుకు హర్షం వ్యక్తం చేసింది ].

” ఏమైటి- ఏమైంది డయానా ?? మీ అమ్మగారు ఒప్పుకున్నారా ?? ”

 

” లేదు- అది కాదు. నువ్వు తొందరగా రా..మిన్నీ మే కి అస్సలు ఒంట్లో బాలేదు. అమ్మా నాన్నా ఊరెళ్ళారు..తనకి డిఫ్తీరియా అంటోంది మేరీ జో  – ఎక్కువగా వచ్చేసిందట..ఏం చెయ్యాలో తెలీట్లేదు ”  మిన్నీ మే డయానా చెల్లెలు- మూడేళ్ళుంటాయి. మేరీ జో పిల్లల్ని చూసుకుందుకూ ఇంట్లో సాయం చేసేందుకూ ఉంటుంది.  ఆమెకి పదహారేళ్ళు , ఫ్రెంచ్ అమ్మాయి.

మాథ్యూ తన టోపీ కోటూ తీసుకుని ఒక్క మాట మాట్లాడకుండా చీకట్లో పడి బయటికి వెళ్ళాడు.

” కార్మొడీ వెళ్ళేందుకు గుర్రబ్బండి సిద్ధం చేసుకుంటున్నాడు , డాక్టర్ కోసం – నాకు తెలుసు ” – ఆన్ తన కోటూ టోపీ వెతుక్కు తీసుకుంటూ అంది. ” వేరే చెప్పక్కర్లేదు,  తెలుసు ”

” కార్మొడీ లో ఎవరూ ఉండరు ” డయానా వెక్కిళ్ళు పెట్టింది ” డాక్టర్ బ్లెయిర్ మీటింగ్ కి వెళ్ళారట… డాక్టర్ స్పెన్సర్ కూడా వెళ్ళే ఉంటారు.. మిసెస్ రాచెల్ కూడా లేరు. మేరీ జో ఎప్పుడూ చూళ్ళేదట డిప్తీరియా వచ్చిన వాళ్ళని –

అయ్యో ! ఆన్ – ఏం చెయ్యాలి !!! ”

” వద్దు. ఏడవకు డయానా . మిసెస్ హమ్మండ్ కి మూడు జతల కవల పిల్లలు , నేను వాళ్ళింట్లో ఉండేదాన్ని – గుర్తు లేదూ ? ఎవరో ఒకరికి డిప్తీరియా వస్తూనే ఉండేది , నాకు తెలుసు ఏం చెయ్యాలో. ఇపికాక్ అని మందు ఉంటుంది , తీసుకొస్తా ఉండు – మీ ఇంట్లో ఉండి ఉండదేమో ” –  ఆన్  ధైర్యమిచ్చింది.

ఇద్దరు పిల్లలూ చేతులు పట్టుకుని చుట్టుదారిలో గబ గబా నడుస్తూ డయానా ఇంటికి బయల్దేరారు. దగ్గరిదారినిండా మోకాళ్ళ లోతున మంచు పేరుకుపోయిఉంది, అటు వెళ్ళేందుకు లేదు. మిన్నీ మే కి జబ్బు చేసినందుకు ఆన్ కి బాధ లేదని కాదుగానీ మళ్ళీ డయానా తో కలిసి ఉన్నందుకూ ఎంతో కొంత సాయపడబోతున్నందుకూ ఆనందంగా కూడా ఉంది .

రాత్రి శీతలనిర్మలంగా ఉంది. నల్లటి నున్నటి నీడలు, వెండిలాగా మెరుస్తూన్న కొండలు. నక్షత్రాల వెలుతురు. అక్కడా అక్కడా పొడుగ్గా కొమ్మలు చాచుకున్న ఫర్ చెట్లు , వాటి ఆకుల్లోంచి పొడి పొడి గా రాలే మంచు , వాటిలోంచి వినబడే గాలి ఈలలు. ఆన్ హృదయం ఆ మార్మిక సౌందర్యానికి మేలుకునే ఉంది .

మిన్నీ మే కి పాపం నిజంగా బాలేదు. జ్వరం మండిపోతోంది . సోఫా మీద పడుకోబెట్టారు గానీ నిమ్మళంగా ఉండ పోలేకుండా ఉంది. ఊపిరి పీల్చి వదుల్తుంటే గరా గరా శబ్దం- ఇల్లంతా వినిపిస్తోంది. మేరీ జో కి ఏమీ పాలుపోవటం లేదు – అటూ ఇటూ ఊరికే తిరుగుతోంది .

ఆన్ చురుగ్గా పనిలోకి దిగింది.

” మిన్నీ కి డిప్తీరియానే , ఎక్కువగానే వచ్చింది – కాని ఇంకా ఎక్కువ వచ్చినవాళ్ళని చూశాను నేను. మనకి ముందు బాగా కాగిన వేణ్ణీళ్ళు కావాలి- డయానా, చూడు – ఆ కెటిల్ లో ఉన్నట్టున్నాయి ? ఆ. ఇప్పటికి సరిపోతాయిలేగాని , మేరీ జో ! పొయ్యి లో ఇంకాసిని పుల్లలు వెయ్యి , మండటం లేదు అది. ఏమీ అనుకోకుగాని నువ్వు ఈ పాటికే ఆ పని చేసి ఉండాల్సింది. ఫ్లానల్ దుప్పట్లు ఉన్నాయా డయానా ? నాలుగైదు పట్టుకు రా. మిన్నీ బట్టలు వెచ్చగా లేవు, అవి విప్పేసి పక్కమీద పడుకోబెట్టి దుప్పట్లన్నీ కప్పాలి. ముందు ఇపికాక్ తాగించాలి , ఉండు ”

anne19-1

మిన్నీ ఆ చేదు మందు మింగేందుకు బాగానే మొరాయించిందిగానీ ఆన్ కి మూడు జతల కవలపిల్లల్ని చూసుకున్న అనుభవం- ఊరికే పోతుందా ? మందు దిగింది గొంతులోకి – అప్పుడే కాదు , ఆ రాత్రంతా చాలా సార్లు. ఆన్, డయానా ఓర్పుగా , శ్రద్ధగా మిన్నీ ని  కాచుకున్నారు. మేరీ జో కూడా చెప్పింది చెప్పినట్లు చేసుకుపోయింది. పొయ్యి బ్రహ్మాండంగా మండింది , ఒక హాస్పిటల్ నిండుగా ఉన్న డిప్తీరియా పిల్లలకి సరిపోయేంత వేణ్ణీళ్ళు సిద్ధమయాయి.

డాక్టర్ కి నచ్చజెప్పి అంత దూరమూ చలిలో తీసుకొచ్చేసరికి తెల్లారగట్ల మూడైంది.  కాని ఆ పాటికి గండం గడిచినట్లే ఉంది – మిన్నీ మే ప్రశాంతంగా నిద్రపోతోంది .

” ఇంచుమించు ఆశ వదిలేసుకున్నాను డాక్టర్ గారూ ” ఆన్ వివరించింది ” అంతకంతకీ పరిస్థితి క్షీణించింది –  మిసెస్ హమ్మండ్ పిల్లల కి వచ్చిందానికనా బాగా ఎక్కువ గా వచ్చినట్లుంది. ఇక తనకి ఊపిరి అందదేమోననిపించింది. సీసాలో ఉన్న ఇపికాక్ మొత్తం విడతలు విడతలు గా ఇచ్చేశాను. ఆఖరి మోతాదు  పోస్తూ అనుకున్నాను – అంటే డయానా కీ మేరీ జోకీ చెప్పలేదనుకోండీ , నాకు నేను చెప్పుకున్నానంతే – ‘ ఐపోయింది , ఇది గనక పని చెయ్యకపోతే నేను చేయగలిగిందింకేమీ లేదు ‘ అని . కాని మూడు నిమిషాలలో పెద్ద దగ్గు తెర వచ్చి చాలా కఫం బయటపడింది , అప్పట్నుంచీ ఊపిరి ఆడటం మెరుగుపడిందండీ. నాకు ఎంత ఊరట కలిగిందో చెప్పలేను, కొన్నిటిని మాటల్లో పెట్టలేం , కదండీ  ? ”

” అవును, నాకు తెలుసు ” డాక్టర్ తల ఊపాడు. ఆన్ వైపు చూస్తుంటే ఆయనకీ కొన్నిటిని మాటల్లో పెట్టలేమనిపించింది. అయితే ఆ తర్వాత మిసెస్ బారీ కీ వాళ్ళాయనకీ చెప్పకుండా ఉండలేకపోయాడు .

”  కుత్ బర్ట్ వాళ్ళింట్లో ఉండే ఆ ఎర్రజుట్టు అమ్మాయి – అక్షరాలా మీ పాపని బతికించింది. లేదంటే నేను వచ్చేవేళకి పరిస్థితి చెయ్యిదాటిపోయిఉండేది. అంత చిన్న వయసులో ఆ పిల్లకి ఎంత వివేకం, ఎంత సమయస్ఫూర్తి ! తనేమేం చేసిందో ఎలా చేసిందో ఎంత బాగా చెప్పింది నాకు ! ”

ఆ అద్బుతమైన ఉదయం లో ఆన్ మాథ్యూ తో కలిసి ఇంటికి బయల్దేరింది. నిద్రలేమితో కళ్ళు మూతలు పడుతున్నాయి గానీ ఆపకుండా మాట్లాడుతూనే ఉంది. మంచు కప్పిన తెల్లటి పొలాల మీదుగా , మెరిసిపోయే మేపుల్ చెట్ల కిరీటాల కిందుగా – ఇద్దరూ నడుస్తున్నారు.

” మాథ్యూ , ఎంత బావుందో కదా ? దేవుడే ఊహించుకుని సృష్టించినట్లుంది ఇవాళంతా. ఆ  మంచు ధూళి చూడు – ఉప్ఫ్ అని ఊదితే దాంతోబాటు చెట్లే ఎగిరిపోయేట్లున్నాయి కదూ ? మిసెస్ హమ్మండ్ కవల పిల్లల్ని పెంచి ఉండటం ఎంత మంచిదైందో – అప్పుడప్పుడూ తిట్టుకుంటుండేదాన్ని గాని ! నిద్రొచ్చేస్తోంది మాథ్యూ – స్కూల్ కి వెళ్ళలేనేమో , వెళ్ళి నిద్రపోతే  బుర్ర తక్కువ గా ఉంటుంది. కానీ వెళ్ళకపోతే ఎలా – గిల్ – అదే వేరేవాళ్ళు నా కంటే చదువులో ముందుకి వెళ్ళిపోతారు. మళ్ళీ అందుకోవటం కష్టం , కాని ఏ పనైనా ఎంత కష్టమైతే అంత తృప్తి , కదా ? ”

” ఏం పర్వాలేదులే , తేలిగ్గానే అందుకుంటావు నువ్వు ” ఆన్ చిట్టి మొహాన్నీ కళ్ళ కింద నీలి వలయాలనీ చూస్తూ ఆదుర్దా గా అన్నాడు మాథ్యూ – ” ఇంటికి వెళ్ళగానే పడుకుని హాయిగా నిద్రపో. పనులన్నీ నేను చూసుకుంటాను ”

ఆన్ అలాగే వెళ్ళి మంచి నిద్ర తీసింది. లేచేప్పటికి మధ్యాహ్నం దాటిపోతోంది. మెట్లు దిగి వస్తూంటే మెరిల్లా వచ్చేసి ఉంది , కూర్చుని ఊలు అల్లుకుంటోంది.

” వచ్చేశావా మెరిల్లా ! ప్రధానమంత్రి ని చూశావా – ఎలా ఉన్నారు ఆయన ? ”

” ఆయన అందం బట్టి  కాదు గా ప్రధానమంత్రి అయింది….ఆ బుర్ర ముక్కూ ఆయనానూ. కాని బాగా మాట్లాడారు , నేను కన్ జర్వేటివ్ అయినందుకు గర్వమనిపించింది. రాచెల్ లిండ్ లిబరల్ కదా , తనకి పెద్ద ఎక్కలేదులే ఆయన ఉపన్యాసం ! నీ భోజనం ఓవెన్ లో పెట్టాను చూడు , బ్లూ బెర్రీ ప్రిజర్వ్  తెచ్చుకో లోపల్నుంచీ. బాగా ఆకలేస్తుండి ఉంటుంది నీకు. మాథ్యూ అంతా చెప్పాడు – నీకు డిప్తీరియా గురించి తెలిసి ఉండటం ఎంత అదృష్టమో , నేనైతే ఏమీ చెయ్యగలిగిఉండేదాన్ని కాదు. అదిగో , మాటలు తర్వాత , ముందు తిను – తర్వాత ఎంతసేపైనా చెప్పచ్చు ”

మెరిల్లా ఏదో చెప్పదల్చుకుంది గానీ ముందే చెప్పేస్తే ఆన్ ఉద్రేకపడి భోజనం వంటి సాధారణ విషయాలని పట్టించుకోదని భయపడి ఊరుకుంది . ఆఖరి బ్లూ బెర్రీ ఆన్ పొట్టలోకి వెళ్ళిపోయాక అప్పుడు చెప్పింది –

” ఇందాక మిసెస్ బారీ వచ్చింది . నువ్వు నిద్రపోతున్నావు , లేపలేదు నేను. నువ్వు వాళ్ళ పాప ప్రాణాన్ని రక్షించావనీ నీకు చాలా చాలా కృతజ్ఞతలనీ చెప్పింది. నీ మీద కోపం పెట్టుకున్నందుకు బాగా నొచ్చుకుంది. ఆ వైన్ విషయం లో నువ్వు కావాలని చెయ్యలేదనీ డయానా తాగేసి వెళ్ళటానికి నువ్వు కారణం కాదనీ తెలుసుకుందట. ఎప్పట్లాగా డయానా తో స్నేహంగా ఉండమని నీకు చెప్పమంది. డయానా కి రాత్రి నుంచీ జలుబు చేసి ఉందట, ఈ చలిలో బయటికి పంపలేననీ నిన్నే వాళ్ళింటికి రమ్మనీ చెప్పి వెళ్ళింది. అరే – ఆగు – ఆన్- అలా గెంతకూ ..”

ఆన్ గాల్లో తేలుతూ లేచింది – మొహం ఆనందం తో వెలిగిపోతోంది.

” నేను వెళ్తాను మెరిల్లా..వెళ్ళద్దా , ఇప్పుడే ? గిన్నెలు తర్వాతొచ్చి కడుగుతాను…వచ్చాక ఇంకేం చెయ్యమన్నా చేస్తాను  ”

” సరే, సరేలే ” ముద్దుగా అంటూన్న మెరిల్లా నోట్లో మాట నోట్లో ఉండగానే ఆన్ ఒక్క పరుగు తీసింది . మెరిల్లా గాబరా పడింది ” తలకి టోపీ లేదూ ఒంటిమీద కోటు లేదు – అలాగే వెళ్ళిపోయింది పిల్ల. దీనికీ చలిగాలికి ఏమైనా

పట్టుకుంటే …”

ఆ మునిమాపు ఊదా రంగు కాంతిలో ఆన్ నృత్యం చేసుకుంటూ ఇంటికొచ్చింది. నైఋతి దిక్కున దూరంగా మొదటి చుక్క పొడుస్తోంది – లేత బంగారపు సంధ్యాకాశం మీదికి స్వర్గం లోంచీ  జారుతూన్న ముత్యంలాగా , చీకట్ల తోటల కి అవతల  మిలమిలమిలమంటోంది. మంచు కొండల దారుల్లోంచి వెళ్ళే స్లెడ్జ్ బళ్ళ గంటల ధ్వని ఏదో కిన్నెరల సంగీతం లా ఉంది – కాని అంతకన్న ఆన్ గుండెలోపలి పాట మధురంగా ఉంది , అది ఆమె పెదవుల్లోంచి ప్రవహిస్తోంది.

” నీ  ముందు నిలబడి ఉన్న వ్యక్తి పరిపూర్ణమైన ఆనందం తో నిండి ఉంది మెరిల్లా ” – ప్రకటించింది-  ” నాకు ఎర్ర జుట్టు ఉన్నాసరే , ఏం పర్వాలేదు. నా ‘ ఆత్మానందం ‘  ఎర్ర జుట్టు స్థాయిని దాటిపైకి వెళ్ళిపోయింది ! మిసెస్ బారీ నన్ను ముద్దు పెట్టుకుని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. నా ఋణం ఎన్నటికీ తీర్చుకోలేననీ అపార్థం చేసుకున్నందుకు క్షమించమనీ అడిగారు. నాకేమిటో ఇబ్బందిగా అనిపించిందిగానీ – వీలైనంత గంభీరంగా జవాబు చెప్పాను – నాకు ఆవిడ మీదేమీ కోపం లేదనీ నేను  బుద్ధిపూర్వకంగా డయానా కి సారా తాగించలేదని ఆవిడ నమ్మితే చాలనీ గతాన్నంతా జరగనట్లే మర్చిపోగలననీ …

డయానా నేనూ బోలెడంత మాట్లాడుకున్నాం. కార్మొడీ లో వాళ్ళ అత్తయ్య నేర్పిన క్రాషె కుట్టు నాకు నేర్పించింది – తెలుసా , అవొన్లియా లో ఇంకెవ్వరికీ రాదు అది. ఇంకెవ్వరికీ నేర్పించకూడదని ఒట్లు పెట్టుకున్నాంలే. డయానా నాకొక అందమైన కార్డ్ ఇచ్చింది..దాని మీద చుట్టూరా  రోజా పువ్వులు . మధ్యలో ఇలా ఉంది

‘ నేను ప్రేమిస్తున్నంతగా నువ్వు నన్ను ప్రేమిస్తే మనల్ని మృత్యువు తప్ప మనల్నేదీ విడదీయలేదు ‘

మిస్టర్ ఫిలిప్స్ ని మా ఇద్దర్నీ పక్క పక్కన కూర్చోబెట్టమని అడుగుదామనుకుంటున్నాం. గెర్టీ పై పక్కన మిన్నీ ఆండ్రూస్ కూర్చోవచ్చులే కదా [ ఇప్పుడు వాళ్ళిద్దరూ మా పక్కన కూర్చుంటున్నారు ] ? మిసె బారీ వాళ్ళింట్లో కెల్లా మంచి పింగాణీ టీ సెట్ ని బయటికి తీశారు నాకోసం ..నేనేదో గొప్ప అతిథిని అన్నట్లు – ఇదివరకెవ్వరూ అలా చెయ్యలేదు నా కోసం , ఎంత సంతోషమనిపించిందో ! ఫ్రూట్ కేకూ పౌండ్ కేకూ డో నట్ లూ రెండు రకాల ప్రిజర్వ్ లూ పెట్టారు. మిస్టర్ బారీ పక్కన కూర్చున్నాను నేను , మిసెస్ బారీ ఆయనకి నాకేం కావాలో చూస్తూ ఉండమని చెప్పారు. బిస్కెట్ లు తింటానా అనీ టీ లోకి పంచదార కావాలా అనీ ..నాకెంత మర్యాద చేశారో ! నన్ను నిజంగా పెద్దదానిలాగా , మంచిదానిలాగా చూశారు ”

” నువ్వు పెద్దదానివయానంటావా , ఏమో..” – మెరిల్లా కొంచెం దిగులుగా నిట్టూర్చింది.

” కొంచెం అయ్యాలే ” – ఆన్ చెప్పింది -” చిన్న పిల్లలతో నేనూ ఇక మీద అలాగే ఉంటాను,  వాళ్ళు పెద్దవాళ్ళన్నట్లే ! వాళ్ళు పెద్ద పెద్ద మాటలు వాడితే నవ్వెయ్యను, పాపం వాళ్ళూ నొచ్చుకుంటారు , తెలుస్తోంది. టీ తర్వాత డయానా నేనూ టాఫీ తయారు చేశాం. అంటే అంత బాగా రాలేదనుకో..పొయ్యి మీద గిన్నె లోది నన్ను గరిటె తో తిప్పుతూ ఉండమని డయానా, తను పళ్ళెం మీద వెన్న రాసి సిద్ధం చేస్తోంది. నేను మాటల్లో పడి తిప్పుతూ ఉండటం మర్చిపోయాను, అదేమో మాడిపోయింది. దాన్నే చల్లారబెట్టేందుకు పళ్ళెంలో పోసి ఉంచితే దాని మీంచి పిల్లి నడుచుకుంటూ పోయింది – పారేశాం, తప్పదు కదా ! అయినా చాలా సరదాగా ఉండింది.  వచ్చేస్తూంటే మిసెస్ బారీ  వీలైనప్పుడల్లా  నన్ను వస్తూండమన్నారు, డయానా కిటికీ లోంచి నాకు చెయ్యి ఊపుతూ గాల్లోకి ముద్దులు విసిరింది.

ఇవాళ రాత్రి ఒక కొత్త ప్రార్థన తయారు చేసి చెప్పుకుంటాను మెరిల్లా, ఈ ఆనందకరమైన సందర్భంలో ! ”

 

                                                               [ ఇంకా ఉంది ]

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

సమాజాన్ని ఇరుకున పెట్టిన ఇస్మత్‌ చుగ్తాయి

 

-కె.బి.గోపాలం 

~

GopalamKB 1మహానటుడు శశికపూర్‌ సొంత ఖర్చుతో, సొంత ఆలోచనతో తీసిన సినిమా ఒకటి ఉంది. అది అర్థంలేని ప్రేమ గురించిన సినిమా. అందులో నాయకుడు ఒక బ్రిటిష్‌ ఆఫీసర్‌ కూతురిని మరీ మరీ ప్రేమించేస్తాడు. మనకికక్కడ ఆ సినిమా ముఖ్యం కాదు. హీరోయిన్‌ తల్లి పాత్రలో శశికపూర్‌ భార్య జెనిఫర్‌ కనిపిస్తుంది. ఆమెకు తల్లిగా ముగ్గుబుట్టలాంటి తల ఉన్న ఒక ముసలావిడ కనిపిస్తుంది. ఆమె సినిమా మొత్తంలోనూ మాట్లాడదు. కానీ, కథలో బలమయిన భాగంగా మిగులుతుంది. నిజానికి ఆ పాత్రలో కనిపించిన వ్యక్తి సినీ నటి కాదు! ఆమె ప్రసిద్ధ రచయిత్రి ఇస్మత్‌ చుగ్తాయి!  సాహిత్య రంగంలో అందరూ ఆమెను ఇస్మత్‌ ఆపా అంటారు. ఉర్దూలో ఆపా అంటే అక్కయ్య. సినిమాలో చూచినవాళ్లకు ఆ వ్యక్తి గురించి అభిప్రాయాలు ఏర్పడే వీలే లేదు. మహా కలిగితే, జాలి కలుగుతుంది. కానీ, ఇస్మత్‌ ఫయర్‌ బ్రాండ్‌ రచయిత్రి. ఆమె క్రూరులకే క్రూరుడయిన చంగేజ్‌ ఖాన్‌ వంశంలో పుట్టిందని ఎక్కడో చదివినట్టు గుర్తు.

ఇస్మత్‌ చుగ్తాయి పుట్టుకతోనే తిరుగుబాటు స్వభావం గల మనిషి. మగరాయుడులాగ బతికింది. తన యిష్టం వచ్చినట్టు బతికింది. ఆవిడ కథలు, నవలలు, వ్యాసాల్లో కూడా అదే పద్ధతి బలంగా కనిపించింది. సమకాలీనుడు సాదత్‌ హసన్‌ మంటో కూడా ఈ రకం మనిషే. అతను బతుకంతా కష్టపడ్డాడు. ఇస్మత్‌ మాత్రం బతుకంతా పోరాడుతూనే ఉన్నది.

ఇస్మత్‌ చుగ్తాయి 1915లో పుట్టిందన్నారు. ఈ మధ్యన మాత్రం 1911లో అంటున్నారు. ముస్లిం కుటుంబాలో ముఖ్యంగా ఆడపిల్లలకు చదువు అవసరం లేదని గట్టి కట్టుబాట్లు ఉన్న ఆ కాలంలోనే, ఇస్మత్‌ ఎదురుతిరిగింది. బడికి వెళ్లింది. అక్కడితో ఆపకుండా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది. సుమారు మూడు సంవత్సరాల పాటు వేరు వేరు చోట్ల పంతులమ్మగా పనిచేసింది. ఇంకా పైకి చదువుకున్నది. ఏకంగా ఇన్‌స్పెక్టర్‌ ఆప్‌ స్కూల్స్‌ ఉద్యోగానికి ఎక్కింది. ఆ కారణంగా ఆమె బొంబాయి వెళ్లవలసి వచ్చింది. అక్కడ ఇస్మత్‌ పెళ్లి కూడా చేసుకున్నది. ఇద్దరు అమ్మాయిలను కన్నది.  ఉద్యోగం మానేసి రచనతోనే కాలం గడుపుతూ, చివరి దాకా అక్కడే బతికింది.

ఇస్మత్‌ చుగ్తాయి రచనారంగంలోకి రావడానికి బొంబాయిలోని వామపక్ష అభ్యుదయ రచయితల బృందం కారణం అంటారు. నిజానికి ఆ బృందంలో సభ్యురాలయిన రషీద్‌ జహా అనే గైనకాలజిస్ట్‌ ఇస్మత్‌ మీద నిజమయిన ప్రభావం కనబరచిన వ్యక్తి. ఆ డాక్టరమ్మ ఆదర్శభావాన్నింటినీ పొందుపరుస్తూ కథలు రాసేది. ఆ ప్రభావంతోనే ఇస్మత్‌ కూడా నాటకాలు, కథలు, వ్యాసాలు రాయడం మొదుపెట్టింది. 1945లో ఆమె రాసిన నవల ఉర్దూ సాహిత్యంలోనే గొప్ప రచనల్లో ఒకటిగా పేరు పొందింది. నవల పేరును తెలుగులో ‘వంకర గీత’ అని చెప్పుకోవచ్చు. ఆ నవల నిజానికి రాసిన తరువాత యాభయి సంవత్సరాలకు అచ్చయింది. అందులో ఆమె ఆడవారి లైంగికతను, ఆ విషయంగా వచ్చే సమస్యలను జంకు లేకుండా చర్చించింది. అయితే, అది అసలు సిసయిలన నవల. వ్యాసాల పోగు కాదు. చెప్పదలచుకున్న విషయాన్నీ బలంగా చిత్రించిన ఒక పాత్రలోనుంచే వస్తాయి. ఆ పాత్ర బహుశా స్వయంగా ఇస్మత్‌ అన్నారు పరిశీలకలు.  పాత్రలో ఇస్మత్‌ వ్యక్తిత్వంలోని మిగతా అంశాలు లేకపోవచ్చు. ఈమె రచయిత్రి. నవలలోని కథా నాయిక మాత్రం పుస్తకాలు పట్టని మనిషి. అసలు కళంటేనే ఆసక్తి లేని మామూలు అమ్మాయి. కనుకనే ఆ పాత్ర, ఆమె చుట్టూ అల్లిన కథ, చివరికి నవల, చాలా సహజంగానే కనిపిస్తాయి. చర్చకు అసలు ఆధారం కథానాయిక షంషాద్‌ పెళ్లి. ఆమెకు దొరికిన మొగుడు ఇంగ్లీషు మనిషి. అప్పట్లో అదొక పద్ధతి. రెండవ ప్రపంచయుద్ధం కారణంగా ఆ మొగుడు షంషాద్‌ను వదిలి వెళిపోతాడు. ఆమెకు మొత్తం కంపెనీ మీద బ్రిటీష్‌వారి మీదా కోపం వస్తుంది. మొగుణ్ణి ఆమె చీదరించుకుంటుంది. వదిలేస్తుంది కూడా!

Akkadi MeghamFeatured

ఈ నవల రాసేనాటికి చుగ్తాయికి పెళ్లయింది. భర్త షాహిద్‌ కూడా కలంబలం మనిషి. ‘నేను మామూలు ఆడమనిషిని కాదు. నా వల్ల కష్టాలు కలగవచ్చు. నేను బతుకులో బంధనాన్నీ తెంపుకున్నాను. మళ్లీ ఒకసారి కట్టుబాట్లకు లొంగేది లేదు. బుద్ధిగా భార్యగా, జీవించడం, నటించడం నావల్ల కాదు’ అని ఆమె భర్తతో చెప్పిందట. చుగ్తాయి పెళ్లి తరువాత కూడా రచనలు కొనసాగించింది. దుప్పటి అనే కథలో అప్పటికి ఎవరూ నోరు విప్పి మాట్లాడని లైంగిక సమస్యను గురించి రాసింది. ఆడమనిషి మరో ఆడమనిషితో సెక్స్‌ అనుభవించడాన్ని చర్చించింది. కనుక ఇస్మత్‌ కోర్టు పాలయింది.  కన్నబిడ్డను చంకనెత్తుకుని ఆమె కోర్టు చుట్టూ తిరగవసి వచ్చింది. ఆ తరువాత జీవితంలో ఇటువంటి అపభ్రంశపు సంఘటనలు ఎదురు కాలేదుగానీ, కుటుంబ జీవితం సాఫీగా సాగింది లేదు. రచన కారణంగా ఆమెకు గొప్ప పేరు వచ్చింది. ఆమె తీరు అలాగే కొనసాగింది. భయం లేకుండా ఆమె కలం ముందుకు సాగింది. బతుకు కూడా భయం లేకుండానే ముందుకు సాగింది. అయినా, గొప్ప ఒడిదుడుకులు మాత్రం ఎదురు కాలేదు.

కుటుంబ జీవితం గుంభనంగా సాగింది. అయినా, ఏ భర్తకు భార్య ఖ్యాతి నచ్చదు. ఇస్మత్‌ పేరు పెరుగుతున్నకొద్దీ, భర్త ఆమె నుంచి దూరం కాసాగాడు. ఈమె మాత్రం ఎక్కడా భర్త గురించి ఒక్క ముక్క రాయలేదు. అవసరం వచ్చిన చోట  ఆయన తన నేస్తము, సహచరుడు, సముడు, అని మాత్రమే అంటూ వచ్చింది. మామూలుగా రచనల్లో కల్పన పేరుతో నిజాలు కనపడతాయి. అనుభవాలు కనపడతాయి. ఆలోచనకన్నా, ఈ అనుభవాలే బలంగా కనపడతాయి. అయినా, ఇస్మత్‌ చుగ్తాయి తన రచనల్లో ఎక్కడా తన వైవాహిక జీవితం గురించి, భర్త గురించి లోతుగా రాసిన సందర్భాలు కనిపించలేదు.

ఈ దేశంలో నాటికీ నేటికీ ముస్లిం స్త్రీ జీవితాలు తెర వెనుక వరకే పరిమితమయి ఉన్నాయి. ఇస్మత్‌ మాత్రం ఆ తెరలను చింపేసింది. అది తొలగించడం కాదు. కథన్నింటిలోనూ ఆడవాళ్ల కష్టాలను గురించి అలవిమాలిన ధైర్యంతో  గొప్ప సత్యాలను చెప్పింది. ముఖ్యంగా సినీపరిశ్రమలోని అమ్మాయిల కష్టాలను వర్ణించిన తీరు దేశాన్ని కుదిపింది. చెప్పకుండా జరిగే వ్యభిచారం ఆమె కథల్లో చాలా చోట్ల వస్తువుగా మారింది. అయినాసరే, ఆ కథలేవీ సంచనాత్మకంగా మాత్రం లేవు. లైంగిక పరంగా మనుషులను కిత కితలు పెట్టేవి కూడా కావు. భయంకర సత్యాలను అంత భయంకరంగానూ  బయటపెట్టి భయపెట్టే రచనలవి!

ఇస్మత్‌ పేరు చెప్పగానే ‘లిహాఫ్‌’ అనే పేరుగల ఆమె కథ అందరికి గుర్తు వస్తుంది. తెలుగులో చెప్పాలంటే శీర్షిక ‘దుప్పటి’. ‘ద క్విల్ట్’  అనే పేరును వెదికితే నెట్‌లో ఈ కథ దొరకవచ్చు. కథ తనకు తెలిసిన ముస్లిం జనానా పరిస్థితుల్లో నడుస్తుంది. అక్కడ సెక్స్‌ కోరికను తీర్చుకోవడానికి ఆడవాళ్లు ఆడవాళ్లనే వాడుకోవడం గురించి ఇస్మత్‌ ఆ కాలంలోనే రాసిందంటే, అది ఆశ్చర్యం మాత్రమే కాదు, అద్భుతం అనవచ్చు. కథ గొప్ప దుమారాన్ని రేపింది. కానీ సరదాగా సాగుతుంది. చాలాకాలంగా చర్చకు, కోర్టు కేసుకు ఆధారమయిన ఈ కథ చాలామందికి తెలిసే ఉంటుంది.

ఇస్మత్‌ రాసిన కథలో ‘పవిత్ర ధర్మం’ అనే అర్థం వచ్చే పేరుగల మరో కథ గొప్పది. ఈ కథ అంతగా చర్చకు గురి కాలేదేమో! దిల్లీలోని ఒక ముస్లిం కుటుంబం, గౌరవం కలది. ఇంటి ఆడకూతురు సమీనాకు తగిన సంబంధం చూచి పెళ్లి చేయాలనుకుంటారు. సరిగ్గా లగ్నానికి ముందు రోజు అమ్మాయి అలహాబాద్‌కు చెందిన ఒక త్రివేదీ, బ్రాహ్మణ కుర్రవాడితో  లేచిపోతుంది. అనుకున్నట్టుగానే వాళ్లు అలహాబాద్‌ చేరుకుంటారు. అబ్బాయి కుటుంబంవాళ్లు సమీనాను హిందువుగా మారుస్తారు. కొంతకాలానికి అమ్మాయి ధైర్యం చేసి అమ్మానాన్నలకు ఉత్తరం రాస్తుంది. వెంటనే తల్లి తన భర్తతో అన్నట్టు రాసిన మాట ఏమిటో తెలుసా? ‘పదండి, అలహాబాద్‌ వెళ్లి ఇద్దరినీ షూట్‌ చేద్దాం’ అని! కథ తల్లిదండ్రుల దృష్టి నుంచి నడుస్తుంది.

కొంతకాలం గడుస్తుంది. కోపతాపాలు కొంత తగ్గుతాయి. సమీనా తండ్రి అలహాబాద్‌ పోతాడు. కూతురు అల్లుళ్లను  దిల్లీకి పిలవాలని, ఒక రకంగా సంధి చేసుకోవాలని అక్కడ ఉద్దేశం. అతని తీరు చూచిన త్రివేదీలు అభ్యంతరం చెప్పరు.  ఇక్కడ దిల్లీలో మాత్రం ముస్లిం పద్దతిలో ఆ జంటకు మరోసారి పెళ్లి చేయాలని ఏర్పాట్లు జరుగుతాయి. అంటే, అబ్బాయి  మతం పుచ్చుకోవాలి. సమీనా కూడా తిరిగి మతంలోకి రావాలి. చిత్రంగా సమీనా భర్త ఒప్పుకుంటాడు. అమ్మాయి మాత్రం ఎదురు తిరుగుతుంది. ఇక అక్కడ గొప్ప చర్చ జరుగుతూ కథ ముందుకు సాగుతుంది. సమీనా, భర్త తాషార్‌ ఇద్దరూ ఎక్కడికో పారిపోతారు. రెండు వేపులా కుటుంబాలు వేసిన పథకాలు అర్థంతరంగా ఆగిపోతాయి. పారిపోయిన తరువాత  సమీనా తన తల్లిదండ్రుకు ఒక ఉత్తరం రాస్తుంది. అది కథకు ప్రాణం.

‘అయితే, నాన్నా, అంతలో నీవు రంగం మీదికి దిగావు. నువ్వు చాలా గొప్ప నటుడివి. మామగారిని మెప్పించి నీవు ఒప్పించిన తీరుతో నేను కదిలిపోయాను. మా మామగారు గొప్ప మనసున్న మనిషని నాకు నేను నచ్చచెప్పుకున్నాను.  ఆయన నిజానికి తన మనుషులను వాడి మమ్మల్నిద్దరినీ బనారస్‌ చేర్చాడు. మా మీద మొట్టమొదట మంత్రదండం ప్రయోగించింది ఆయనే! ఇక నీవు వచ్చి క్షమిస్తున్నానంటూ చల్లగా చెప్పి మమ్మల్ని దిల్లీ చేర్చావు. అయితే ఆ తరువాత నీ అసలు రూపం బయటపడింది. బజారులో బిచ్చగాడు కోతులను ఆడిరచినట్టు నీవు నన్ను, నా భర్తను ఆడింపజూచావు. మేమిదంతా సరదాగా ఉందనుకుని చూస్తూ ఉండిపోయాము. అయితే భయపడకు, నీ రహస్యాన్ని మేము అంత సులభంగా బయటపెట్టము. రేపు పొద్దున పత్రికలో విషయం చూస్తే, మా మామగారి మనసులో బాంబు పేలుతుంది, తప్పదు. ముస్లిం పెళ్లి సంగతి వాళ్లకు తెలిసిపోతుంది. మేము వాళ్లను వదిలి వచ్చేశాము. ఇక మీకు కూడా సెలవు. మేము ఎక్కడికి పోతున్నది నీకు పట్టకూడదు. మా వల్ల బాధ కలిగితే, క్షమించండి. కాదు, మేము మిమ్మల్ని బాధపెట్టింది లేదు. మీరే మమ్మల్ని కష్టపెట్టారు. నిజానికి క్షమాపణ చెప్పవలసింది మీరే! మమ్మల్ని మీరు నవ్వుపాలు చేశారు. మీకు నచ్చిన విధంగా మీ పాటకు మమ్మల్ని కోతుల్లాగ ఆడించదలిచారు. మీరు అమ్మానాన్నలేనా? ’

చెప్పా పెట్టకుండా లేచిపోయి పెళ్లి చేసుకున్నది తాను. కానీ, ఎదురుతిరిగి తప్పంతా తలిదండ్రుల మీద రుద్దే చోటికి వచ్చిందంటే రచయిత్రి ఇస్మత్‌ ఆపాను మెచ్చుకోకుండా ఉండలేము. మతాలు రుద్దాలని రెండు వేపులా తల్లిదండ్రులు చేసిన  తప్పుడు ప్రయత్నాలను ఆధారంగా తీసుకుని అక్కయ్య ఈ పని చేయగలిగింది. కుటుంబ గౌరవం, అన్ని రకాల గౌరవం  నిలిస్తే చాలు, మిగతా ఎన్ని తప్పులు చేసినా ఫరవాలేదనుకున్న పెద్దల తప్పులను ఈ కథలో ఆమె ఎత్తి చూపింది. ఉత్తర భారతదేశంలో ఈమధ్యన జరుగుతున్న ‘గౌరవ హత్యలు’ ఈ సందర్భంగా మనసులో మెదిలితే తప్పు కాదు. ఇన్నేళ్లయినా,  పరిస్థితి మారలేదు. ఇస్మత్‌ చుగ్తాయి లాంటి రచయిత్రులు ఇంకా రావాలన్న భావం మనసుల్లో బలపడుతుంది. పెళ్లి అనే వ్యవస్థ మీద రచయిత్రి ఫెడీలుమని కొట్టిన చెంపదెబ్బ ఈ ‘పవిత్ర ధర్మం’.

ఈ రచయిత్రి కథలు ఇంచుమించుగా అన్నీ ఇదే పద్ధతిలో సాగుతాయి. సమాజంలోని సమస్యల మీద చక్కని చెణుకులను విసురుతాయి. ఈమె కలంలాగే మాటలు కూడా చాలా పదునుగలవి.

కథను ఎత్తుకుంటే చాలు వెతకనవసరం లేకుండా, ఆలోచలను ముప్పిరిగొంటాయి. వాటికి తగినట్టే వెల్లువల్లాగ మాటలు కూడా ప్రవహిస్తాయి. ఎక్కడా ప్రయత్నించి, తడుముకుని రాసిన తీరు కనిపించదు. ఆమె మాట్లాడుతూ ఉంటే కూడా అంతే వేగంగా ఉండేదట! నిజానికి మాటు దొర్లేవట. వంట గదిలోకి వచ్చిందంటే, గోల చేసేసేదట. అంటే, కొంచెం తొందరపాటు మనిషి అని అర్థంచేసుకోవచ్చు. పిండి పిసకకముందే పెనం మీద రొట్టె కాల్చ గలిగిన మనిషి ఇస్మత్‌!   ఆలోచనల్లోనే వంటంతా ముగించే ఈ రచయిత్రి రచనల్లో దూకుడు కనిపించడంలో ఆశ్చర్యం లేదు. అది అప్పటి పాఠకును, విమర్శకులను అందరినీ అదరగొట్టిన తీరు. ఒక తోటి రచయిత్రి ఈమె స్వభావాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ,  చక్కని మాట చెప్పింది. ఇస్మత్‌ వంట ఇంట్లోకి వెళుతుంది, తన ఆలోచనలతోనే కడుపు నింపుకుని బయటకు వచ్చేస్తుంది, అన్నారావిడ.

ఇస్మత్‌ చుగ్తాయి తన స్వంత కథను కూడా రాసింది. అందులో మొగమాటం లేకుండా తన తీరు గురించి, తిరుగుబాటు మనస్తత్వం గురించి వివరించింది. చిన్నప్పటి తీరు, పెళ్లినాటిదాకా సాగిందని చెప్పేసుకున్నది. ఆ సంఘటను చదివేవారికి ఆమె మాటలోని చమత్కార ధోరణి, మనసులోని విషయం చెప్పడానికి హాస్యాన్ని వాడుకున్న తీరు చక్కగా ఎదురవుతాయి. చకితులను చేస్తాయి. మొత్తానికి మంచి మాటలతోనే ఇస్మత్‌ తాను చెప్పదలచుకున్న సంగతులు చెప్పేస్తుంది.  అమ్మాయి పెద్దదవుతున్నదని వాళ్ల నాన్న వంట నేర్చుకోమన్నాడట. బడికి వెళ్లడం అవసరం లేదేమో అని కూడా అన్నాడట.

‘ఇస్మత్‌! అమ్మాయిలు వంట చేస్తారమ్మా. అత్తవారింటికి వెళ్లిన తరువాత అక్కడ వాళ్లకు ఏం పెడతావు?’ అని నచ్చజెబుతూ, మెత్తగా చెప్పాడట వాళ్ల నాన్న! ఆమె మాత్రం ‘నా మొగుడు లేనివాడయితే, కిచిడీ మాత్రం వండుకుని తింటాం. ఇక కలిగినవాడయితే, వంట వాడిని పెట్టుకుంటాం’ అన్నది. ఆ దెబ్బతో ఆ తండ్రికి సంగతి అర్థమైపోయి ఉండాలి. అయినా, పట్టలేక ‘అయితే నీవేం చేస్తావు?’ అని అడిగాడు. ‘నా అన్నదమ్ముల్లాగ నేను కూడా చదువుకుంటాను’ అన్నది ఆ గడుగ్గాయి అమ్మాయి మొండిగా.

తండ్రికి ఇక తప్పలేదు. ఒక బంధువును అమ్మాయికి చదువు చెప్పమని నియమించాడు. నాలుగయిదు నెలలు పగలు, రాత్రీ ట్యూషన్‌ సాగింది. ఆ తరువాత బడికి పోతే, పరీక్ష పెట్టి ఏకంగా ఆమెను నాలుగవ తరగతిలో చేర్చుకున్నారు.  అక్కడ డబుల్‌ ప్రమోషన్‌ దొరికింది. అంటే, అయిదు అవసరం లేకుండానే ఆరవ క్లాసుకు చేరింది. ఆమె తెలివి గురించి  చెప్పడానికి ఈ రెండు మాటలు చాలు. ఆమె నాకు స్వతంత్రం కావాలి. చదువు లేకుండా ఆడదానికి స్వతంత్రం అందదు,  చదువుకోని అమ్మాయికి పెళ్లయితే, వాళ్ళాయన ఆమెను ‘చదువురాని దానివి’ ‘మొద్దువు’ అంటాడు! మగమహారాజు పనిలోకి వెళితే, ఆయన మళ్లీ వచ్చేదాకా ఆ మొద్దు వేచి ఉండక తప్పదు. నేను మాత్రం అట్లా ఉండదచుకోలేదు. కనుకనే చేతనయినంత వేగంగా చదువుకుంటాను, అన్నది ఇస్మత్‌.

ఇస్మత్‌ కుటుంబంవాళ్లు అభ్యుదయ భావాలుగల వాళ్లేమీ కాదు. అయినా, ఆమె పట్టు వదలలేదు. చదువుకుని తీరాలన్నది. గడపదాటి బయటకు రాగలిగింది. చివరకు పెళ్లి కూడా తన ఇష్టం వచ్చిన మనిషినే చేసుకున్నది.

ఇస్మత్‌ గురించి, ఆమె స్వభావం గురించి మరింత తెలుసుకోవడానికి ఆమె కోర్టు కేస్‌ వివరాలను చదివితే అర్థమవుతుంది. ఆ వివరాలను ఆమే రాసి అందించింది. చాలా గొప్ప రచనలు చేసినవాళ్లు కూడా, పొందని కీర్తి కోర్టు కేసులో చిక్కుకున్న రచయితలు పొందుతారు! సల్మాన్‌ రుష్దీ అందుకు ఒక ఉదాహరణ. లిహాఫ్‌ అంటే, దుప్పటి అన్న ఆడవాళ్ల మరుగు వ్యవహారాలను గురించిన కథలో బూతు ఎక్కువయిందని ఆమె మీద కేసు వేశారు. ఇస్మత్‌ మాత్రం పరిస్థితికి కదిలిపోయిన దాఖలాలు కనిపించవు. ఆ సమయంలో ఆమె లాహోర్‌లో  సాదత్‌ హసన్‌ మంటో ఇంట్లో భర్తతో సహా విడిది చేసింది. అక్కడ జరిగిన సరదా సంగతులు, అంత సరదాగానూ కోర్టు వ్యవహారం గురించి కూడా చెప్పింది.  అసలు కథలో బూతు ఉందా? అన్న చర్చ కూడా ఇంట్లోనే బాగా జరిగింది, అంటుంది ఇస్మత్‌. వాళ్లకు అక్కడ సాదత్‌ హసన్‌ మంటో ఆతిథ్యం ఇచ్చాడు. అతను ఈమె కన్నా ధైర్యం గల రచయిత. కనీసం ఈమెతో సమానంగా ధైర్యం గల రచయిత. రచనలు, కోర్టు కేసు, బెదిరింపు కారణంగానే అతను లాహోర్‌ చేరాడు.

కథ గురించి కోర్టులో జరిగిన వాటికన్నా, సభ్య సమాజంలోనే ఎక్కువ చర్చలు జరిగాయి. భర్త మిత్రుడు అస్లమ్‌ ఈమె కథను తీవ్రంగా విమర్శించాడు. ఇస్మత్‌ మాత్రం గౌరవంగా ఎదురుతిరిగి ‘ఈ కథ రాయడం పాపంగా పరిగణింప బడుతుందని నాకు ఎవ్వరూ చెప్పలేదు. ఈ దుర్మార్గపద్ధతి గురించి రాయకూడదని ఎక్కడా చదివిన గుర్తూ లేదు. నేనేమో బొమ్మగీయగల కళాకారిణిని కాదు. నా మెదడు కేవలం మామూలు కెమెరా వంటిది. దానికేదయినా కనిపిస్తే, చెప్పకుండానే పనిలోకి దిగుతుంది. నా చేతులు అప్రయత్నంగా పనిలోకి దిగుతాయి. కలానికి పని చెపుతాయి. నా కలానికి పని చెప్పేది నా మెదడు. ఆ రెంటి మధ్యకు వచ్చే ధైర్యం నాకు ఉండదు’ అంటూ జవాబిచ్చింది. అది ఎదురులేని జవాబు. గౌరవం గల కుటుంబాలు అనుకొనే చోట్ల కూడా తెరమరుగున జరుగుతున్న తప్పులు నిజానికి పాపాలు అని ఇస్మత్‌ గట్టిగా నమ్మింది.  కథ చదివితే, పాఠకులకు కలిగే భావాలు వేరు. రచయిత్రి అనుకున్నది అంతకన్నా బలంగా ఉందేమో! కొన్ని సంగతులు మన దృష్టిలోకి వస్తే, పట్టనట్టు ఉండడం మంచిది కాదు, అంటుంది ఈ రచయిత్రి. అంటే, కథకు ఆధారమయిన సంగతి ఈమె కళ్ల ముందుకు వాస్తవంగానే వచ్చిందని, అది క్పన కాదని, అర్థమవుతుంది. కనుకనే, ఆమె కదిలిపోయి తన ప్రతిక్రియను కథ రూపంలో చెప్పింది.

కోర్టులో జరిగిన నాటకాన్ని కూడా ఇస్మత్‌ చుగ్తాయి చక్కగా వివరించి చెప్పింది. చాలామంది ఆ దంపతులకు క్షమాపణలతో లేదా అపరాధ రుసుముతో తప్పించుకుంటే మంచిదని సలహా ఇచ్చారట. కానీ, వీళ్లు ఒప్పుకోలేదు. కేసు సాగింది. ఒకరి తర్వాత ఒకరుగా సాక్షులు వచ్చి కథను బూతుగా నిలబెట్టేందుకు ఏవో చెపుతున్నారు. రచయిత్రి పక్షం లాయరు వేసిన ఎదురుప్రశ్నతో వాళ్లంతా వెనుదిరగవలసి వచ్చింది. ఒక పెద్ద మనిషి ఒక వాక్యాన్ని ఎత్తుకుని, ‘ప్రేమికులను  ఎంచుకుంటున్నది’ అన్న మాట బూతు అన్నాడు. లాయర్‌ ఎదురుతిరిగి, ‘అందులో ఏమిటి బూతు? ప్రేమికులా? ఎంచుకోవడమా?’ అని అడిగాడు. ఆ దెబ్బతో ఆ సాక్షి, అట్లాగే కేసు వీగిపోవడం మొదలయింది.

లిహాఫ్‌ గురించి కేసు జరుగుతున్నది. అప్పట్లో ఆ వివరాలను వార్తాపత్రికల వారందరూ ఎప్పటికప్పుడు అచ్చు వేశారు. ఇస్మత్‌ మామగారు అప్పుడొక ఉత్తరం రాశారు. ‘కోడలికి కొంత సలహా ఇవ్వండి. ఆమె అల్లా గురించి, ప్రవక్త గురించి రాస్తే బాగుంటుందని చెప్పండి. అప్పుడయినా, ఆమెకు ఆశీర్వచనాలు అందుతాయేమో! కోర్టు కేసు, అందునా,  బూతు గురించి` ఇదంతా మాకు బాధగా ఉంది. దేవుడు అందరినీ కాపాడుగాక!’ అని ఆయన అందులో రాశారు.

లాహోర్‌లో వీళ్లు సాదత్‌ హసన్‌ మంటోతో ఉన్నారు. ఆ సమయంలోనే మంటో మీద కూడా అదే అభియోగంతో  కేసు మొదయింది. అదే రోజున, అదే సమయానికి అతనికి కేసు కూడా చర్చకు వస్తుంది. ఇంటికి వచ్చిన మంటో అదేదో  విక్టోరియా క్రాస్‌ అంటే, ఇప్పటి పద్మ అవార్డు లాంటిది అందినంత ఆనందంగా ఉన్నాడట! ఇస్మత్‌కు మాత్రం ఆయన గురించి బాధగా ఉంది. అయినా బయటకు కనపరచలేదు.

కోర్టు కేస్‌ కన్నా, విమర్శిస్తూ వచ్చిన ఉత్తరాలు ఇస్మత్‌ను ఎక్కువగా కష్టపెట్టాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె రాసిన తీరు ఒక్క ఇస్మత్‌కే తగును. ‘నాకు బురద, బల్లి, ఊసరవెల్లులంటే చచ్చే భయం. కొంతమంది మహా ధైర్య వంతులమంటూ, బోర విరుచుకుని తిరుగుతారు. చచ్చిన ఎలుక కనిపిస్తే మాత్రం వాళ్ల అసలు సంగతి బయటపడుతుంది.  నాకు ఉత్తరాలను చూస్తే అంత భయమూ అయ్యేది. వాటిలో పాములు, తేళ్లు, పైథాన్‌లు ఉన్నాయన్నంత భయం! అనుమానంగా విప్పిన ఉత్తరంలో ఆ పాములు, తేళ్లు కనిపించినా, తప్పకుండా చదివేదాన్ని. అప్పుడు వెంటనే వాటికి అగ్గి పెట్టేదాన్ని. ఉత్తరాలు షాహిద్‌, అంటే, మా ఆయన కంటపడితే మరోసారి విడాకుల వ్యవహారం చర్చకు వస్తుంది.

సంచలనం పుట్టించిన ఆ కథను రాసినప్పుడు ఇస్మత్‌ తన అన్నగారి ఇంట్లోఉండేది. కథను ఆమె రాత్రిపూట రాసింది. మరుసటినాడు వదినగారికి చదివి వినిపించింది. ఆమె కథ గురించి వ్యాఖ్యానించలేదు. కానీ, అది ఎవరి గురించి రాసిందో అర్థం చేసుకుంది. ఆ తరువాత కథను ఇస్మత్‌ మరొక బంధువు అమ్మాయికి చదివి వినిపించింది. ఆమె ‘ఏం రాశావు? నాకేమీ అర్థం కాలేదు’ అన్నది. కథను అందుకున్న పత్రిక సంపాదకుడు ఏమాటా అనకుండా, వెంటనే దాన్ని అచ్చువేశాడు. అప్పటికి ఇస్మత్‌కు పెళ్లి కాలేదు. కాబోయే భర్త షాహీద్‌ కథను చదివాడు. అది తనకు నచ్చలేదన్నాడు.  ఆ తరువాత కొంత చర్చ కూడా జరిగింది. అయినా పెళ్లి జరిగింది.

అసలు బూతు అన్నది నిర్వఛనానికి అందని సంగతి. ఇవాళ సినిమా, అందునా, తెలుగు సినిమా చూస్తున్నవాళ్లకు  బూతు, పచ్చిబూతు కూడా అవాటయిపోయినయి. ఆడ, మగ పిల్లలతో కలిసి ఆ రకం సినిమాను చూస్తున్నారు. పిల్లలు  కళ్లార్పకుండా బూతు మాట్లాడుతున్నారు. ఇక రచనలో రతి గురించి చెప్పినా, అది వివరంగా లేకుంటే బూతు కాదు.  ఈమధ్యన కూడా ఎన్నో పుస్తకాల గురించి చర్చలు జరిగాయి. ఆడ, మగ సంబంధాలను పచ్చిగా వివరించడం వేరు. వెచ్చగా సూచించడం వేరు అంటున్నారు. మతకల్లోలాలను గురించి కూడా ఇంచుమించు ఈ రకం వాదనలే వినిపించాయి.   ఒక మతాన్ని గొప్ప చేసి చూపితే తప్పు, ఒక మతం అంటూ ఎంత రాసినా తప్పులేదు అన్నది ఇప్పటి పంథా.

ఇస్మత్‌ చుగ్తాయి ఆ కాలంలోనే మతం సమస్యను కూడా మర్మంగా చెప్పే ప్రయత్నం చేసింది. ఈ ప్రపంచంలో అందరికీ తెలిసిన సత్యాలు కొన్ని ఉంటాయి. కానీ కొందరు మాత్రమే వాటిని గురించి బాహాటంగా చెప్పగలుగుతారు. కొందరు రచయితలు మాత్రమే ఈ రకం సంగతును గురించి రాయగలుగుతారు. ఇస్మత్‌ చుగ్తాయి  ఈ రకం మనుషులో అందరికన్నా ముందుంటారు. ఆమె రాసిన కథలో ఒక ‘స్ట్రాంగ్‌ వాయిస్‌’ వినిపిస్తుంది. ఒక బేగం అఖ్తర్‌, ఒక నూర్జహాన్‌, ఒక మల్లికా ఫుఖ్‌రాజ్‌ గళంలోని బలం ఇస్మత్‌ కథల్లో కూడా కనిపిస్తుంది.

ఇస్మత్‌ రాసిన కథల్లో మొదట్లో ఉన్న గట్టి గొంతుక, తరువాత కొంచెం మెత్తబడిందని పరిశీకులు అన్నారు. అయినా, ఆమె ఆడవారి కష్టాలను గురించి, వర్గ విభేదాలను గురించి, మిగతా అందరికన్నా చాలా బాగా రాశారు. కొన్ని కథలో కూలీవాళ్లను గురించి రాసిన తీరు గొప్పగా ఉంటుంది. ‘ఈ చేతులకు చట్టాలు తెలియవు. ఇవి కేవలం చేతులు.  మురికిని కడిగే చేతులు, ముసలితనాన్ని మోసే చేతులు, మకిలిబారిన ఈ చేతులు భూమి ముఖానికి మెరుగులు అద్దుతున్నాయి’ అంటూ కవితాధోరణిలో ఆమె చెప్పిన మాటలు బీదతనానికి పాడిన హారతిగా వినిపిస్తాయి. అరవయ్యేళ్లనాడే అంత ధైర్యంగా కడగండ్ల బతుకును కథలుగా చెప్పి సమాజం మకిలిని కడగబూనిన ఇస్మత్‌ గురించి ఎంత చెప్పినా చాలదు.

నా సృజన, నా బంధనాలు నేను కోరి తెచ్చుకున్నవి. అవి నా అదుపులోనే ఉన్నాయి. నేను వేసిన పెయింటింగ్‌లు  నా గదిలో వేలాడుతూనే ఉన్నాయి. పచ్చని చేలు, ఆడుకుంటున్న పిల్లలు, ఎగిరే పక్షులు, నిట్టూర్పు,నవ్వు, దూరాన మొగుళ్లు మరెన్నింటినో నేను పట్టేసుకున్నాను అంటుంది ఆవిడ ఒకచోట. వర్గ విభేదాలు, వాటి హద్దులు ఈమె కథలో  కనిపించే వస్తువు. వాటి గురించి చెప్పడానికి ‘ధనిక గౌరవ కుటుంబాలు’ ఎంతగా పనికివచ్చాయో, అంతగానూ బీద బతుకులు కూడా ఆమె కథకు ఆసరా అయ్యాయి.

చుగ్తాయి వర్ణించిన ప్రపంచం ఇప్పుడు లేకపోవచ్చు. అది లేకుండా కావాలన్నదే, ఆమె కోరిక. కథలో ఆమె వంటి వారు అప్పటి పరిస్థితును కంటికి కట్టి చూపకపోతే, అవి కలకాలం నిలిచేవేమో! నిలవకూడదు అనుకున్న ఇస్మత్‌ వంటి రచయిత కోరిక ఫలించింది. కనుకనే, ఆమె హాయిగా వెళ్లి పోయింది. చివరి రోజుల్లో, తనను తిరిగి తన చోటికి చేర్చమని కోరుకున్నది ఆమె. అంటే, ఆమె మనసునిండా గతం నిండి ఉన్నదన్నమాట!  ఆమె కథల్లో చదివి మనం ఇప్పుడు అప్పటి సమాజాన్ని మనసులోనే చిత్రించుకోవాలి. అప్పుడు సమాజంలో వచ్చిన మార్పు మనకు అర్థమవుతాయి. మిగిలి ఉన్న కొన్ని సమస్యలు కూడా మనకు మరింత బాగా మనసుకు ఎక్కుతాయి.

ఉర్దూతో పరిచయం ఉన్నవాళ్లకు ఆమె శైలిలోని ప్రత్యేకత బాగా అర్థమవుతుంది. కానీ, ఆమె కథను అనువాదాల ద్వారానే ఎక్కువగా చదివారు. అనువాదాలు ఎంత బాగా వచ్చిందీ చెప్పగలగడం మరో కష్టం. కవితలాగ గల గలా పారే ఆమె మాటలు అవసరమయిన చోట చటుక్కున ఆగిపోతాయి. చిన్న వాక్యం ఒకటి పడుతుంది,  చదువరిని  ఆశ్చర్యంలో ముంచుతుంది.

ఇస్మత్‌ మరణం తరువాత నివాళి రాస్తూ, మరొక మంచి రచయిత్రి ఖుర్రతులైన్‌ హైదర్‌ అన్న మాటలు వినదగ్గవి.  ‘ఇస్మత్‌ పుట్టిన వంశానికి పూర్వజులలో చంగేజ్‌ఖాన్‌ ఒకరు. అతను ఒక గుడారంలో బతికాడు. ఆ గుడారానికి బంగారం శిఖరం ఉండేది. ఖాన్‌ సైన్యం గుర్రాలమీద కదులుతూ ఉండేది. వాళ్ల గుడారాలన్నింటిమీదా బంగారు పై కప్పులు ఉండేవి. ఆ సైన్యానికి ‘బంగారు సైన్యం’ అని పేరు. ఉర్దూలో దాన్ని ‘ఉర్దూ`ఎ`ముతల్లా’ అనేవారు. సైన్యంలో పుట్టిన భాష కనుక అది ఉర్దూ అయింది. ఇస్మత్‌కు సైన్యం భాష ఉర్దూ అసలయిన ఆడపడుచు పద్ధతిలో అందింది. కత్తిలాంటి వాడి, మెత్తనయిన హాస్యం కలగలిసి అది ఆమె చేత భావచిత్రాలు గీయించింది. ఆమె కథలన్నీ అనుకోకుండా అటువంటి చిత్రాలుగా పాఠకులకు అందాయి. మరొకరికి వీలుగాని శైలి, ఇస్మత్‌కు సొంతమయింది. ఆమెను ఇస్మత్‌ ఖానమ్‌ అంటాను నేను. అంటే, ఆమె ‘ఆడ చంగేజ్‌ఖాన్‌’!

ఇద్దరి మీదా కేసు నడుస్తున్న సమయంలోనే, ఇస్మత్‌, మంటోతో ఒక మాట అన్నది ‘మంటో సాహిబ్‌, క్షమాపణ చెప్పేస్తే పోతుందా? వచ్చిన పైసలతో హాయిగా షాపింగ్‌ చేయవచ్చు’ అన్నది. మంటో మాత్రం కళ్లు పెద్దవిగా తెరిచి, ‘చెత్త’ అన్నాడట! మంటో ఒప్పుకోడుగాక ఒప్పుకోడు. ‘నీవు ఒక్కర్తివి క్షమాపణ చెప్పవచ్చుకదా?’ అన్నారు చుట్టూ ఉన్నవారు. ‘మీకు మంటో గురించి తెలియదు. నన్ను ఇక బతకనివ్వడు. అతని కోపం ముందు వీళ్లు వేసే శిక్షను భరించడం సులభమని పిస్తుంది’ అన్నది ఇస్మత్‌.

ఆశ్చర్యంగా చివరకు వీళ్లకు శిక్ష లేకుండానే కేసు ముగిసింది. జడ్జ్‌ ఇస్మత్‌ను తన ఛాంబర్‌లోకి పిలిపించి, గౌరవంగా మాట్లాడాడు. ‘నేను మీ కథలన్నీ చదివాను. వాటిలో ఎక్కడా బూతు లేదు. లిహాఫ్‌లో అసలే లేదు. మంటో కథలు మాత్రం కంగాళీగా ఉంటాయి’ అన్నాడు. ‘ఈ ప్రపంచమంతా కంగాళీయే కదా?’ అన్నది ఇస్మత్‌. ఆ పెంటనంతా  ఎత్తి వెదజ్లడం అవసరమా అని జడ్జ్‌ అడిగాడు. ఆ పనిచేస్తే, అది అందరికీ కనపడుతుంది. కనుక ఏదో చేయాలన్న భావం కలుగుతుంది అన్నది ఇస్మత్‌. జడ్జ్‌ నవ్వి ఊరుకున్నాడు. కేస్‌ గెలిచినందుకు ప్రత్యేకించి సంతోషపడింది లేదు అంటుంది ఇస్మత్‌. తనదయిన పద్ధతిలో, మళ్లీ లాహోర్‌కి రావడానికి అవకాశం ఉండదేమోనని బాధ కలిగింది అని మాత్రం అంటుంది.

 

(ఇస్మత్ చుగ్తాయి కథ తెలుగు తర్జుమా వచ్చే గురువారం)

గమనమే గమ్యం – 22

 

olgaఆంధ్రప్రాంత నాయకుల సమావేశం గంభీరంగా జరుగుతోంది.

‘‘యుద్ధం గురించి మాట్లాడుతున్నాం. ప్రజా యుద్ధమని బలపరుస్తున్నాం . కానీ యుద్ధం అంటే నాశనం. నిర్మాణం కాదు. ఏదో ఒక నిర్మాణం చెయ్యకుండా ప్రజా నాశనాన్ని పట్టుకు కూచోటం సరికాదు. రైతులు నీళ్ళు లేక పంటలు పండక చచ్చిపోతున్నారు. కాలవన్నీ పూడిక పట్టిపోయాయి. వాళ్ళకు ఒట్టి ఉపన్యాసాలు తప్ప ఏమీ ఇవ్వలేమా?’’ శారద ఆవేదనగా అన్నది.

‘‘ఏం చెయ్యగలం? బందరు కాలవ పూడిపోయి రైతులకు నీళ్ళందటం లేదు. ప్రభుత్వాన్ని అడిగాం – అడిగితే కూలీలకు దొరకటం లేదు. ఐనా ఇప్పుడది ముఖ్యం కాదు అన్నారు. యుద్ధం రోజుల్లో ఆహారానికి కరువుండకూడదంటారు. పంటల గురించి పట్టించుకోరు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఏమీ చెయ్యకూడదు గాబట్టి ఆందోళన కూడా చెయ్యం. ఇక నిర్మాణ కార్యక్రమం ఏం చేస్తాం’’ వెంకట్రావు నిస్పృహ గా మాట్లాడాడు. కాసేపు అందరూ మౌనంగా ఉన్నారు . పదినిమిషాలు అలాగే గడిచాయి . రామకృష్ణయ్య మెల్లిగా అయినా ధృడం గా అన్నాడు .

‘‘నిర్మాణమే చేద్దాం. బందరు కాలవ పూడిక మనమే తీస్తే ’’ అందరి కనుబొమ్మలు పైకి లేచాయి శారదది తప్ప.

‘‘అద్భుతం – నిజంగా అద్భుతం. మనం ఆ పని చేద్దాం’’ అంది విప్పారిన ముఖంతో.

‘‘మనమా? ఎలా?’’

‘‘కూలి పనులు చేద్దామా?’’

‘‘మనమంటే ఎవరం? ఇక్కడ కూచున్న పదిహేను మందా?’’

‘‘డాక్టరు గారూ మీరు పార పట్టుకుంటారా? ’’

ప్రశ్నలు , నవ్వులు , వ్యంగ్య బాణాలూ శరపరంపరగా కురిసిన తరువాత శారద అంది.

‘‘అందరం కలిసి చేద్దాం. మనం పదిహేనుమందిమి కాదు. రైతు సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం అందరం కలిస్తే ఎంత సేపు – చెయ్యగలం . ఎంత పొడవుంటుంది పూడిక’’

‘‘బెజవాడ ఆనకట్ట నుంచి యనమలకుదురు దాకా నన్నా తియ్యాలనుకుంటాను. కనీసం నాలుగైదు మైళ్ళుంటుంది.’’ సుబ్బారావు గారికి బందరు కాలవ పుట్టు పూర్వోత్తరాలు బాగా తెలుసు .

‘‘ప్రజా సంఘాలన్నీ పని చేస్తే మరీ అసాధ్యం కాదనుకుంటా’’

‘‘రైతులకు మేలు జరుగుతుందంటే అందరూ వస్తారు ’’

‘‘ప్రభుత్వం చెయ్యాల్సిన పని మనమెందుకు చెయ్యాలి?’’

‘‘ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? చెయ్యనిస్తుందా?’’

‘‘యుద్ధం రోజుల్లో ఉత్పత్తిని పెంచే ఏ పనినీ ప్రభుత్వం అడ్డుకోదు. ప్రభుత్వం చెయ్యని పని మనం ప్రజల కోసం చేస్తున్నాం గనుక ప్రజలలో మనమీద సానుభూతి కలుగుతుంది. ప్రజాయుద్ధం అంటున్నామని మనమీద కొంత వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత తగ్గుతుంది’’.

‘‘ఒట్టి కబుర్లు కాదు కమ్యూనిస్టులు గట్టిగా పనిచేసి చూపిస్తారనే నమ్మకం కలుగుతుంది’’.

అందరిలో ఏదో తెలియని ఉత్సాహం కమ్ముకుంటోంది. నిర్ణయాలు వేగంగా జరిగిపోతున్నాయి. ప్రజా సంఘాల బాధ్యులకు ఉత్తర్వులు చేరుతున్నాయి. అందరిలో ఒక సంచలనం.

‘‘బందరు కాలవ పూడిక తీస్తారంట’’ మండుటెండలే మోసుకెళ్తున్నాయి ఆ వార్తను.

యువకులు , యువతులు మాత్రమే రావటం లేదు. పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చి చేరుతున్నారు. కాలవలో వారి స్వేద జలం ప్రవహించి పంటలు పండేలా ఉన్నాయి .

శారద, రామకృష్ణయ్య, మెల్లీ వంటి పెద్ద నాయకులు కూడా తట్టలతో మట్టి మొయ్యటం చూసిన సామాన్యుల ఉత్సాహానికి అంతు లేదు. జన సంద్రం ముందు కాలవ వినయంగా వంగింది. లొంగింది. కుంగింది.

ప్రతిరోజూ పని చేసిన వారికి మధ్యాహ్నం కడుపునిండా భోజనం తప్ప డబ్బేమీ ఇచ్చే పరిస్థితి లేదు.

భోజనానికి కరువు లేదు. పాటలు , నవ్వులు , దు:ఖాలు , దెబ్బలు , గాయాలు అన్నీ మట్టిలోనే –

మహిళా సంఘంలోని ఆడవాళ్ళకు అది అలవాటు లేని పని – ఐనా డాక్టరు గారు చేస్తుంటే మనం చెయ్యలేమా? ఐనా ఈ పని ఎవరిది? మనది. కోటేశ్వరమ్మ, రాజమ్మ పాటలు ఎత్తుకున్నారంటే కృష్ణానదే తుళ్ళి పడేది. అందరి గొంతులూ కలిస్తే ఆకాశం కిందికి దిగాలని చూసేది . ఈ పని చేసేవాళ్ళు చేస్తుంటే చూసేవా ళ్ళు ప్రవాహంలా వచ్చి పోతుండే వాళ్ళు. ఇంతపని స్వచ్ఛందంగా జరగటం వాళ్ళు ఇంతకు ముందెన్నడూ చూడలేదు. శ్రమదానం ఇంత పెద్ద ఎత్తున జరగటమూ చూడలేదు. సమూహంగా, సమిష్టిగా పని చెయ్యటంలో ఎంత ఆనందముంటుందో వాళ్ళకు తెలియదు. ఇప్పుడు జరుగుతున్నది ఏదో స్వప్నంగా ఉంది వాళ్ళకు. కానీ అది యదార్థం.

రెండు నెలల పాటు వందమంది పనిచేస్తే కాలవ జల ప్రవాహ యోగ్యమైంది. వానలు కురిస్తే చాలు , కృష్ణమ్మ కాస్త నాలుగు బారలు సాగితే చాలు కాలవ నిండుగా ప్రవహిస్తుంది. అవతల పంట పొలాలకు ఈ వార్త చేరి అదునుకు పదునెక్కి నిరీక్షిస్తున్నాయి .

‘‘కమ్యూనిస్టులంటే ఇదా’’ అనుకున్నారు కొందరు.

‘‘కమ్యూనిస్టులంటే ఇది ’’ అనుకున్నారు మరికొందరు.

ఆ రెండు నెలల కాలం ఆ పనిచేసిన వారి జీవితాల్లో మర్చిపోలేనిదయింది. దేశంలో కాలవన్నీ బాగుచేద్దాం. కొత్త కాలువలు తవ్వుదాం. నీటి కొరత లేకుండా చేద్దాం అనిపించింది అందరికీ.

అందరి కోసం పనిచెయ్యటంలోని ఆనందం, గర్వం, త్యాగ భావనతో మనసు నిండి కష్టమన్నదే తెలియలేదు.

‘‘నువ్వు కూడా రావోయ్‌’’ అని అన్నపూర్ణకు కబురంపింది శారద.

‘‘రాలేను. యుద్ధ కాలం లో ప్రబుత్వానికి సహకరించటం నాకు సమ్మతం కాదు. మీరు చేస్తున్న పని మంచిదే. కానీ చేస్తున్న సమయం, సందర్భం మాత్రం మంచివి కావు. నేనెంత మాత్రం ఈ పనిలో కలిసి రాను’’ అని సమాధానం పంపింది అన్నపూర్ణ. శారద నవ్వుకుంది. రైతులకు సహాయం చెయ్యటానికీ, పంట పండించేందుకు సమయానికి నీరివ్వటం కంటే మంచి సమయం ఏముంటుంది? కానీ రాజకీయాలు ఒకే సమయాన్ని ఎట్లా మార్చేస్తాయో గదా అనుకుంది. అన్నపూర్ణ దేశం కోసమే కాలువ తవ్వే పని నుంచి దూరంగా ఉంది. తనూ దేశం కోసమే కాలువ తవ్వే పనిలో మునిగిపోయింది. ఇద్దరం సమాంతర రేఖల్లా ప్రయాణిస్తున్నాం. గమ్యం ఒకటే – దేశ స్వాతంత్య్రం. అక్కడ కలుస్తాం. సమాంతర రేఖలన్నీ కలిసే చోటు దేశ స్వాతంత్రం. అన్నపూర్ణకు కాలువ తవ్వే దృశ్యాన్ని కళ్ళకు కట్టిస్తూ రాసిన న ఉత్తరాల్లో ఈ వాక్యాలు రాసింది శారద.

కృష్ణాజిల్లాలో మొదలైన ఈ పూడిక తీ స పని గోదావరి జిల్లాకూ పాకింది. అక్కడ కార్యకర్తలు బ్యాంకు కాలవ పూడిక తీశారు.

***

olga title

కృష్ణాజిల్లా కాటూరులో మహిళా సంఘం మహాసభ తలపెట్టినప్పటి నుంచీ శారదకు ఊపిరి పీల్చుకునే సమయం కూడా దొరకకుండా ఉంది. కాటూరు కమ్యూనిస్టు గ్రామంగా అప్పటికే ప్రసిద్ధి పొందింది. అక్కడ మహిళా సంఘం సభలు జరిపితే ఎక్కడా ఏ ఆటంకమూ ఉండదు. ఆ ఊరి ప్రజలే కాదు యిరుగు పొరుగు గ్రామాల ప్రజలు కూడా సహకరిస్తారు.

శారద, మెల్లీ, సూర్యావతి రాష్ట్ర నాయకులతో కలిసి కార్యక్రమమంతా నిర్ణయిస్తున్నారు. కావలసినవి చెబితే ఏర్పాట్లు చేసే యువ కార్యకర్తలకు లోటు లేదు.

ఆ రోజు శారదకు తమ్ముడు వరసయ్యే లక్ష్మీపతి నుంచి ఫోను వచ్చింది.

‘‘మీ సభలకు సరోజినీ నాయుడ గారిని ఆహ్వానించకూడదూ?’’ అంటూ

‘‘ఎందుకు కూడదోయ్‌ – ఆహ్వానించాలనే ఉంది గానీ ఎలా చెప్పు. ఆవిడ నా కంటే పెద్దావిడ. నువ్వు ఫోన్‌ చేసినట్లు ఆవిడకు ఫోన్‌ చేసి మా సభలకు కాటూరు రండి అని చెప్పలేను గదా! ఆవిడ ఎప్పుడు ఎక్కడుంటారో కూడా తెలియదు. వెళ్ళి పిలుద్దామంటే. పోనీ మా తరపున నువ్వు ఆహ్వానించకూడదటోయ్‌ – ఖర్చులన్నీ ఇస్తాం’’.

‘‘కాదక్కా – నువ్వే ఆహ్వానించు. ఆవిడ రేపు రాత్రి విజయవాడలో అరగంట ఆగుతారు. రైలు స్టేషన్ లో – విశాఖ నుండి సికింద్రాబాదు వెళ్తున్నారు. నువ్వు వెళ్ళి కలిసి ఆహ్వానించు. నువ్వంటే ఆవిడకు చాలా ఇష్టం. వాళ్ళ తమ్ముడు హరీన్‌ చెప్పాడట నీ గురించి. చాలా గౌరవంగా మాట్లాడింది నీ గురించి. నువ్వే వెళ్ళి అడిగితే కాదనదు’’.

‘‘మంచి మాట చెప్పావోయ్‌ – ఈ సారి మనింటికి వచ్చినపుడు నీకేం కావాలో అడుగు ఇస్తాను. రేపు రాత్రి ఆవిడను కలుసుకుంటానోయ్‌ ’’

శారద ఫోను పెట్టి వెంటనే పార్టీ ఆఫీసుకి వెళ్ళింది. అక్కడ నుంచి బెజవాడలో మహిళా సంఘంలో సభ్యులందరికీ కబురు వెళ్ళింది. మర్నాడు రాత్రి రైల్వే స్టేషన్ కి రావాలని . కొందరు ఊళ్ళో లేని వాళ్ళు తప్ప దాదాపు ముఖ్యులందరూ పాతికమంది దాకా వచ్చారు . అందరిలో ఉత్శాం ఉరకలేస్తోంది.

ఉప్పు సత్యాగ్రహం లో స్త్రీలు కాస్త వెనక్కు తగ్గండి అని గాంధీ అంటే వెంటనే ఆ మాటను ధిక్కరించి వెళ్ళి మొదటి దళం సత్యాగ్రహుల్లో ముందు నిలబడిన సరోజినీ దేవి అంటే ఇష్టం లేనిదెవరికీ – గాంధీతో సహా ఎవరితోనైన పరిహాసమాడగల చొరవ, సమయస్ఫూర్తీ, తన ఉపన్యాసాలతో జనాలను తట్టి లేపగల శక్తి, సున్నితమైన కవి హృదయం , త్యాగబుద్ధీ – సరోజినీ నాయుడు గురించి వినని వారెవరూ లేరు ఆ మహిళా సంఘంలో `

‘‘ఆమె రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మ, తన మేనత్త శారదాంబ వలే ఈ దేశంలో ఎన్నదగిన స్త్రీ. నాన్న ఆమెను చూశాడా? విన్నాడా? తెలియదు. తమ మధ్య ఆమె గురించి మాటలు జరగలేదా? తను మర్చిపోయిందా? ఇప్పుడు నాన్న ఉంటే నన్ను చూసి సంతోషించే వాడా? డాక్టరుగా, కమ్యూనిస్టుగా నాన్న కల, , తన కల కూడా నిజం చేసుకున్న తనను చూసి సంతోషించేవాడు. తండ్రి గుర్తొచ్చి కళ్ళు చెమర్చాయి . తండ్రి తో పాటు రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మా గుర్తొచ్చింది. ఆవిడే తన భవిష్యత్తుకు అక్షరాభ్యాసం చేసింది. వీరేశలింగం తాతయ్య మాట తీసుకున్నాడు డాక్టర్‌ కావాలని – ఇవాళ ఎందుకు అందరూ గుర్తొస్తున్నారు – తన పక్కన ఇంతమంది ఆడవాళ్ళున్నారు . కాటూరులో వేలమంది వస్తారు. ఒక్కతే ప్రయాణం ప్రారంభించింది. సమూహంలో కలిసింది.

కోటీశ్వరమ్మ, సత్యవతి, రాజమ్మ వంటి వాళ్ళంత సరోజినీ నాయుడిని కలుస్తామనే సంతోషంతో తలమునకలవుతున్నారు.

రైలు వచ్చింది.

కంపార్టుమెంటులోకి అందరూ ఎక్కారు.

శారద వెళ్ళి సరోజినిదేవికి నమస్కారం చేసి తనను రాను పరిచయం చేసుకుంది నవ్వుతూ.

సరోజినిదేవి ఆనందంగా శారదను ఆలింగనం చేసుకుంది.

‘‘హరీన్‌ చెప్పాడు నీ గురించి – నీలాంటి వాళ్ళే కావాలి దేశానికి. వీళ్ళంత మహిళా సంఘం సభ్యులా ? ’’ అందరినీ ఆప్యాయంగా పలకరించింది.

సమయం ఎక్కువ లేదు. వచ్చిన పని చెప్పింది శారద.

‘‘తప్పకుండా వస్తాను. మంచి అవకాశం. ఒదులుకుంటాన ? నేనొక వారం రోజులు హైదరాబాదులోనే ఉంటాను. రెండురోజులాగి ఫోను చెయ్యి. ఏం లేదు. మర్చిపోతానేమోనని’’.

ఇద్దరూ దేశంలో మహిళా ఉద్యమం చేయాల్సిన పనుల గురించి మాట్లాడుకుంటుండగానే సమయం లేదని గార్డు వచ్చి అందరినీ దిగమన్నాడు.

శారద ఆమెకు నమస్కరించింది.

అందరూ కోలాహలంగా మాట్లాడుకుంటూ స్టేషను బైటకు వచ్చారు. శారద అందరూ జాగ్రత్తగా ఇళ్ళు చేరేలా జట్లుగా వారిని పంపి తను కూడా ఇంటికి వెళ్ళింది.

అందరూ నిద్ర పోతున్నారు. నటాషా నిద్రలో నవ్వుతోంది. పాపను మెల్లిగా ముద్దు పెట్టుకుంది.

ఇప్పుడిక నిద్ర రాదు . గర్భిణీ స్త్రీ ఆరోగ్యం గురించి తను రాస్తున్న పుస్తకం తీసింది.

ఈ పుస్తకం రాస్తున్నాని తెలిస్తే నాన్న ఎంత సంతోషించేవాడో. తగిన సమయం దొరకటం లేదు. త్వరగా పూర్తి చేయాలి. ప్రజల్లో ఎన్ని మూఢ నమ్మకాలు – వాళ్ళ శరీరాల   గురించి వాళ్ళకే మాత్రం తెలియదు. శరీరం విూదా మనసు విూదా అధికారం సంపాదించినపుడే మనకో వ్యక్తిత్వం వస్తుంది. అది స్త్రీలు సాధించాలనే ఈ పుస్తకం రాస్తోంది తను.

పది నిముషాల్లో వ్రాత లో మునిగిపోయింది. రెండు గంటల పాటు రాసి తృప్తి గా కలం మూసి వచ్చి పాప పక్కన పడుకుని నిద్రపోయింది.

***

కంచెలు తుంచే మనిషితనం!

 

-ఫణీంద్ర

~

phaniసిరివెన్నెల “కంచె” చిత్రానికి రాసిన రెండు అద్భుతమైన పాటలు పైకి యుద్ధోన్మాదాన్ని ప్రశ్నిస్తున్నట్టు కనిపించినా నిజానికవి నానాటికీ మనందరిలో కనుమరుగౌతున్న మనిషితనాన్ని తట్టిలేపడానికి పూరించిన చైతన్యశంఖాలు. ఇక్కడ “మనిషితనం” అంటే ఏమిటి అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఓషో చెప్పిన ఓ కథ మనిషితనాన్ని చక్కగా విశదీకరిస్తుంది. ఓ ఇద్దరు వ్యక్తులు నది ఒడ్డున ఉన్నారు. ఇంతలో ఎవరో నదిలో మునిగిపోతూ – “రక్షించండి, రక్షించండి” అని అరిచారు. ఆ ఇద్దరిలో మొదటి వ్యక్తి తలెత్తి చూశాడు. అతని విశ్వాసం ప్రకారం ప్రతి మనిషీ తన కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. పక్కవాడి కర్మలో మనం తలదూర్చడం కన్నా అవివేకం మరోటి లేదు. అంతా భగవదేచ్చ!  కాబట్టి ఇక్కడో మనిషి మునిగిపోతున్నాడంటే అదతని కర్మఫలమే! ఇందులో చెయ్యగలిగినది ఏమీ లేదు. ఇలా ఆలోచించి అతను ఏమీ పట్టనట్టు ఉండిపోతాడు. రెండో మనిషీ ఈ అరుపులు వింటాడు. ఇతని నమ్మకం ప్రకారం మనిషి పోయాక స్వర్గ-నరకాలు అంటూ ఉంటాయి. పుణ్యకర్మలు చెయ్యడం వలన దేవుని కృపకి పాత్రులమవుతాం, స్వర్గం సిద్ధిస్తుంది. కాబట్టి ఇప్పుడీ మునిగిపోతున్న మనిషిని రక్షించడమంటే స్వర్గప్రవేశాన్ని ఖాయం చేసుకోవడమే! ఇలా ఆలోచించి అతను వెంటనే నదిలోకి దూకి ఆ వ్యక్తిని రక్షిస్తాడు. కథలో నీతి ఏమిటంటే, మనం మనుషుల్లా స్పందించడం మరిచిపోయాం. ఏవో ఆలోచనలూ, సిద్ధాంతాలు, భావజాలాలూ తలలో నింపుకుని వాటి వలన మనుషులను రక్షించగలం, చంపగలం కూడా! ఇలా కాక మనిషిలా కరిగి, గుండెతో స్పందించే గుణం మనిషితనం అవుతుంది.

ఒక ఊరిలో రెండు వర్గాలు కులం పేరుతోనో, మతం పేరుతోనో, లేక ఇంకేదో కారణం చేతనో విద్వేషంతో రగిలి తలలు తెగనరుక్కునే దాకా వస్తే, అది చూసిన మన స్పందన ఏమిటి?  ఇద్దరిలో ఎవరిది ఎక్కువ తప్పుందీ, గతంలో ఎవరు ఎక్కువ దారుణాలు చేశారు, ఏ శక్తులు ఎవరికి సహాయపడుతున్నాయి, అవి మంచివా చెడ్డవా – ఇవన్నీ బేరీజు వేసుకుని అప్పుడు గానీ స్పందించలేకపోతే మనలో మనిషితనం చచ్చిపోయినట్టే లెక్క! ఒక మనిషిలా కనుక స్పందిస్తే, మన గుండె ద్రవించాలి, మనసు తల్లడిల్లిపోవాలి.యుద్ధం పేరుతో ఓ మనిషి ఇంకో మనిషిని ఎందుకు చంపుకుంటున్నాడు? ఏమి సాధించడానికి? మృదువైన కోరికలూ, తీయని కలలలో తేలే మన హృదయ పావురాన్ని ఏ చీకటి బోయవాడు పాపపు బాణం వేసి నేలకూల్చాడు? హృదయాన్ని మరిచి, తెలివి మీరి, పగలతో సెగలతో రాక్షసులుగా మారిన మన మానవజాతిని చూసి పుడమి తల్లి గుండె తీవ్రమైన వేదనతో తల్లడిల్లిందే! ఆ తల్లి చేష్టలుడిగి నిస్సహయురాలై నిట్టూర్చిందే! ఆ తల్లి గుండెఘోషని చూస్తున్నామా, చూస్తే ఏమైనా చేస్తున్నామా? ఇంతటి మహా విషాద వృక్షాన్ని పెంచిన విషబీజాలేమిటి? పూలతోటల బదులు ముళ్ళచెట్లని పూయిస్తున్న ఆ ఆలోచనలేమిటి –

నిశి నిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం

మృదు లాలస స్వప్నాలస హృత్ కపోత పాతం

పృథు వ్యథార్త పృథ్విమాత నిర్ఘోషిత చేతం

నిష్ఠుర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం

ఏ విష బీజోద్భూతం ఈ విషాద భూజం?

ఈ మనసూ, హృదయస్పందనా, మనిషితనం లాంటివి వినడానికి బానే ఉంటాయి కానీ ప్రాక్టికల్‌గా చూస్తే ఒక మంచిని సాధించడానికి కొన్నిసార్లు దారుణాలు జరగక తప్పవని కొందరి భావన. ఉదాత్తమైన గమ్యం కోసం వక్రమార్గం పట్టినా ఫర్వాలేదు (The end justifies the means) అనే ఈ ఆలోచన చేసిన వినాశనానికి చరిత్రే సాక్ష్యం. తాను దుర్మార్గుణ్ణని విర్రవీగి విధ్వంసం సృష్టించిన వాడి కంటే, తానెంతో మంచివాణ్ణనీ, మహోన్నత ఆశయసాధనకే ప్రయత్నిస్తున్నాననీ నమ్మినవాడి వలన జరిగిన మారణహోమాలే ఎక్కువ! మనని మనం తగలబెట్టుకుంటే ఏ వెలుగూ రాదనీ, కత్తుల రెక్కలతో శాంతికపోతం ఎగరదనీ, నెత్తుటిజల్లులు ఏ పచ్చని బ్రతుకులూ పెంచవనీ ఇప్పటికైనా మనం నేర్వకపోతే మన భవిత అంధకారమే –

భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో?

ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో?

ఏ పంటల రక్షణకీ కంచెల ముళ్ళు?

ఏ బ్రతుకును పెంచుటకీ నెత్తుటి జల్లు?

ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు

ఏ దాహం తీర్చవు ఈ కార్చిచ్చులు

ప్రాణమే పణమై ఆడుతున్న జూదం

ఇవ్వదే ఎపుడూ ఎవరికీ ఎలాంటి గెలుపు

చావులో విజయం వెతుకు ఈ వినోదం

పొందదే ఎపుడూ మేలుకొలుపు మేలుకొలుపు!

 

ఒకప్పుడు ఎంత స్నేహం, సౌభ్రాతృత్వం వర్ధిల్లినా మనసులో మొలకెత్తే ఒక విషబీజం చాలు ఆ చెలిమిని అంతా మరిచిపోవడానికి. ప్రచండ సూర్యుణ్ణి సైతం మబ్బు కప్పేసినట్టు, ద్వేషం, పగా దట్టంగా అలముకున్నప్పుడు ఏ వెలుగురేఖలూ పొడచూపవు. అపార్థాల వలన చెదిరిన అనుబంధాలకీ, స్వార్థం వలన సమసిన స్నేహాలకీ, ద్వేషం వలన దగ్ధమైన పూదోటలకీ లెక్క లేదు. ఈ పగలసెగల వలన ఏర్పడిన ఎల్లలతో పుడమి ఒళ్ళు నిలువెల్లా చీలాల్సిందేనా –

 

అంతరాలు అంతమై అంతా ఆనందమై

కలసి మెలసి మనగలిగే కాలం చెల్లిందా

చెలిమి చినుకు కరువై, పగల సెగలు నెలవై

ఎల్లలతో పుడమి ఒళ్ళు నిలువెల్లా చీలిందా!

 

ఇలా గుండె రగిలిన వేదనలోంచి ఓ వెలుగురేఖ ఉద్భవించి మనలోకి మనం తరచి చూడగలిగితే ఓ సత్యం బోధపడుతుంది. నేనూ, నా వాళ్ళు అని స్వార్థంతో గిరిగీసుకుని, నా వాళ్ళు కానివాళ్ళందరూ పరాయివాళ్ళనే అహంకారపు భావనే అన్ని సమస్యలకీ మూలకారణం అని. పక్కవాడు కూడా నాలాగే మనిషే, వాడికీ నాలాగే కన్నీళ్ళూ, కోపాలూ, ద్వేషాలూ, ప్రేమలూ ఉంటాయని గ్రహించగలిగినప్పుడు మాత్రమే ఈ స్వీయవినాశనానికి దారితీసే వైపరీత్యం నుంచి మనం బైటపడే వెసలుబాటు ఉంటుంది –

 

నీకు తెలియనిదా నేస్తమా?

చెంత చేరననే పంతమా?

నువ్వు నేననీ విడిగా లేమనీ

ఈ నా శ్వాసని నిన్ను నమ్మించనీ

sirivennela

మన హృదయస్పందనని పట్టుకుని, మనలోని మనిషితనాన్ని మేల్కొలిపి, నేనొక్కణ్ణీ వేరుకాదు మనమంతా ఒకటే అనే భావనని మొలకెత్తించగలిగినప్పుడు మనం యుద్ధం అనే సమస్యకి సామరస్యమైన, శాశ్వతమైన పరిష్కారాన్ని దర్శించగలుగుతాం. మనమంతా మనుషులం, ఈ భూగోళం మనది! విద్వేషంతో పాలించే దేశాలూ, విధ్వంసంతో నిర్మించే స్వర్గాలు ఉండవు, ఉంటే అవి మనుషులవి కాబోవు అని నిక్కచ్చిగా చెప్పగలుగుతాం. యుద్ధం అంటే శత్రువుని సంహరించడం కాదు, మనలోని కర్కశత్వాన్ని అంతమొందించడం అని అర్థమైనప్పుడు మన ప్రతి అడుగూ ఒక మేలుకొలుపు అవుతుంది. సరిహద్దుల్ని చెరిపే సంకల్పం సిద్ధిస్తుంది –

 

విద్వేషం పాలించే దేశం ఉంటుందా?

విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా?

ఉండుంటే అది మనిషిది అయ్యుంటుందా?

అడిగావా భూగోళమా! నువ్వు చూశావా ఓ కాలమా?

 

రా ముందడుగేద్దాం.. యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ

సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం!

 

ప్రేమ గురించి గొప్పగొప్ప కల్పనలు చెయ్యొచ్చు, ప్రేమే జీవితమనీ, ప్రేమే సమస్తమనీ ఆకాశానికెత్తెయ్యొచ్చు. ఇలా ఆలోచనల్లో భూమండలం మొత్తాన్ని ప్రేమించడం చాలా ఈజీ, కానీ మనకి నచ్చని మనిషి ఎదురుగా ఉంటే ప్రేమించడం చాలా కష్టం. యుద్ధంలో ఉండీ, చేతిలో ఆయుధం ఉండీ, ఎదురుగా ఉన్న శత్రువుని సంహరించగలిగే సామర్థ్యం ఉండీ, ఆ శత్రువూ సాటి మనిషే అని జాలి కలిగితే అప్పుడు మనం నిలువెత్తు ప్రేమకి నిదర్శనం అవుతాం. అలాంటి ప్రేమ బ్రహ్మాస్త్రం సైతం తాకలేని మనలోని అరిషడ్వర్గాలను నాశనం చెయ్యగలుగుతుంది. రాబందలు రెక్కల సడుల మధ్య సాగే మరుభూముల సేద్యం నుంచి మనని మరల్చి జీవనవేదాన్ని అందిస్తుంది.”రేపు” అనే పసిబిడ్డని గుండెకి పొదువుకుని తీపి కలలను పాలుగా పట్టే అమ్మతనానికి మనమంతా ప్రతినిధులమనీ, మనని మనమే నాశనం చేసుకునే ఈ ఉన్మాదం వలన భవితంతా ఆ పాలుదొరకని పసిబిడ్డడి ఏడ్పుల పాలౌతుందనీ గుర్తుచేస్తుంది –

 

ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా?

ఆయువు పోస్తుందా ఆయుధమేదైనా?

రాకాసుల మూకల్లే మార్చదా పిడివాదం!

రాబందుల రెక్కల సడి ఏ జీవన వేదం?

సాధించేదేముంది ఈ వ్యర్థ వినోదం?

ఏ సస్యం పండించదు మరుభూముల సేద్యం!

రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం

ఈ పూటే ఇంకదు అందాం, నేటి దైన్యానికి ధైర్యం ఇద్దాం!

 

ఇదంతా పాసిఫిజమనీ, ఐడియలిజమనీ, దుర్మార్గం ఎప్పుడూ ఉంటుందనీ, యుద్ధం తప్పదనీ కొందరు వాదించొచ్చు. కావొచ్చు. అయితే ఈ అందమైన భూలోకం మనదనీ, మనందరం దానికి వారసులమనీ, ఒకరు ఎక్కువనే ఆధిపత్యం చెల్లదనీ మనమంతా నమ్మినప్పుడు, అరిష్టాలపై అంతా కలిసికట్టుగా చేసే యుద్దం యొక్క లక్షణం వేరేగా ఉంటుంది. అప్పుడది పంటకి పట్టిన చీడని నిర్మూలించే ఔషదం అవుతుంది, పచ్చదనాన్ని పెకిలించే ఉన్మాదం అవ్వదు. అప్పుడు లోకకళ్యాణాల పేరుతో కల్లోలాలు జరగవు, మానవ సంక్షేమం కోసం మారణహోమాలు జరగవు. అప్పుడు మనం భౌగోళికంగా ఖండాలుగా, దేశదేశాలుగా విడిపోయినా మానసికంగా అఖండమైన మానవత్వానికి ప్రతినిధులమవుతాం. మన చొక్కాపై ఏ జెండాని తగిలించుకున్నా మన గుండెల్లో ప్రేమజెండానే ఎగరేస్తూ ఉంటాం. ఈ సదాశయమే నిజమైన గెలుపు, లోకానికి అసలైన వెలుగు –

 

అందరికీ సొంతం అందాల లోకం

కొందరికే ఉందా పొందే అధికారం?

మట్టితోటి చుట్టరికం మరిపించే వైరం

గుర్తిస్తుందా మనిషికి మనిషితోటి బంధం!

ఏ కళ్యాణం కోసం ఇంతటి కల్లోలం

ఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం

ఖండాలుగా విడదీసే జెండాలన్నీ తలవంచే తలపే అవుదాం

ఆ తలపే మన గెలుపని అందాం

 

“సిరివెన్నెల ఎంత అద్భుతంగా చెప్పారండీ! ఏం కవిత్వమండీ! నిజమే సుమండీ, లోకంలో హింసా ద్వేషం పెరిగిపోతున్నాయి! దుర్మార్గులు ఎక్కువైపోతున్నారు!” అంటూ మనని మనమే మంచివాళ్ళ జాబితాలో వేసేసుకోకుండా, ఈ పాటని అద్దంగా వాడుకుని మనలోని లోపాలను మనం చూసుకోగలగాలి. ఎందుకంటే యుద్ధమంటే ఇరు దేశాల మధ్యో, ఇరు వర్గాల మధ్యో జరిగే మహాసంగ్రామమే కానక్కరలేదు. మన దైనందిన జీవితంలో, మన సంబంధ బాంధవ్యాలలో జరిగే సంఘర్షణలనీ యుద్ధాలే. అరిషడ్వర్గాల సైన్యంతో చీకటి మనపై దాడి చేసే యుద్ధంలో, మన తెలివితో మనిషితనాన్ని వెలిగించుకోవాలి, ప్రేమని గెలిపించుకోవాలి. ఆ యుద్ధంలో ఈ పాటని రథంగా, సిరివెన్నెలని రథసారధిగా వినియోగిస్తే జయం మనదే!

అనుబంధం:

  1. కంచె చిత్రంలోని ఈ రెండు పాటలనీ యూట్యూబ్‌లో ఇక్కడ వినొచ్చు – భగభగమని & నీకు తెలియనిదా
  2. ఈ పాటల గురించి సిరివెన్నెలే స్వయంగా వివరించిన వీడియో – సిరివెన్నెల వివరణ

*

 

ఏమో!

–  కందుకూరి రమేష్ బాబు
~
Kandukuri Rameshదృశ్యానికీ
దృశ్యాదృశ్యానికీ తేడా
మెల్లగా తెలుస్తూ వస్తున్నది.
నిజం.
మీకు తెలుసు.
మనిషి చూపుల అర్థం మనకు తెలుసు.
చప్పున కాకపోయినా
కాసేపట్లో ఆ చూపులను పోల్చుకోగలం.
ఊహించగలం. భావించగలం.
కానీ, పశువు?
అర్థం కాని ప్రశ్న.
ఏం అనుకుంటాయో అవి!
!
?
మొన్న రొట్టమాకురేవులో తీశాను దీన్ని.
సారి.
తనను.
ఎవరని చూడటమా?
ఏమిటని చూడటమా?
ఎందుకని చూడటమా?
తన డొమైన్ లోకి వచ్చిన ఈ అపరిచితుడు, వాడి దృశ్యం ఏమిటనా?
ఏమో!
ప్రశ్నార్థకమైన ప్రశ్న.
సందేహస్పదమైన సందేహం.
ఈ దృశ్యం
లేదా చూపు
లేలేదా సానుబూతితో కూడిన ‘చూపరా’మర్శ.
+++
ఇదొక్కటే కాదు,
మరొకటీ చూడండి.
ఈ శునకాలను చూడండి.
ఇది హైదరాబాద్ లోని పద్మానగర్ కాలనీలో చేసిన పిక్చర్.
ఇందులోనూ చూపులే.
సందేహస్పదంగా.
అనుమానస్పదంగా.
మనం వెళ్లిపోయిన తర్వాత అవి ఏమని మాట్లాడుకుంటాయో?
ప్రశ్నార్థకం.
నిజం.
కొన్నిసార్లు తీసిన ఆయా చిత్రాలను మళ్లీ చూస్తుంటే వాటికి ఏదో చెప్పాలనిపిస్తుంది.
నేను ఎవరో చెప్పాలనిపిస్తుంది లేదా మీ తరఫున జవాబివ్వాలనీ అనిపిస్తుంది.
రాంగ్ ఇంప్రెషన్స్ వాటి మనెఫలకంపై పడితే తుడిపేవారెవరూ?
ఆలా బలంగా అనిపించి బాధగా ఉంటుంది.
అందుకే
నేనెవరో వాటికి పరిచయం చేసుకోవాలనిపిస్తుంది.
కానీ,
ఎలా?
second picture
మనుషులను తీస్తున్నప్పుడు వారు స్వయంగా నోరు తెరిచి అడుగుతారు.
లేదా ఘాటుగా చూస్తారు.కానీ వారికి ఎలాగోలా తెలియజేయగలం.మాటల్తో.
 చెబుతాం లేదా చెప్పాక తీస్తాం.
కానీ పశుపక్ష్యాదులను చిత్రిస్తున్నప్పుడు కూడా వాటికి జవాబు చెప్పే కదలాలనీ అనిపిస్తుంది.
ఇలాంటి చిత్జరాలు చేశాక వాటిని పదే పదే చూస్తున్నప్పుడు అవీ మనల్ని పదే పదే పరిశీలనగా చూస్తూ ఉన్నట్టు అనిపించినప్పుడు జవాబు చెప్పాలనే అనిపిస్తుంది.
ఉన్నాయి గనుక.
నిజంగానే జవాబులు ఉన్నాయి.
తొలిసారిగా మనిషిని చిత్రిస్తున్నప్పుడు చెప్పుకొని కదలడంలేదా…అలాగే వాటితోనూ సంభాషించాలనీ ఉంటుంది.
అందుకోసం అవశ్యమైన మాధ్యమాలు సృష్టించుకోవాలి తోస్తున్నది.
అప్పుడు చిరునవ్వులు చిందిస్తూ అవి తప్పక మనతో సంభాషిస్తాయా?
ఏమో!
అంతదాకా పై చిత్రం లేదా ద్వితీయ చిత్రం…అవి ప్రశ్నార్థకంగా చూస్తూనే ఉంటాయి కదా!
అవును.
ఆ చూపులు లోలోపలికి కూడా తాకుతుంటై.
అందుకే చిత్రం అంటే చిత్రమే.
కదిలిస్తాయి.
ఆ చూపులు హాంట్ చేస్తాయి.
మనిషి కన్నా మరింత సున్నితమైన సెన్సిబిలిటీస్ పెంచుకోమనీ పోరు పెడతయి.
మీరూ ఆ చూపులను చూడండి.
తాకుతున్నాయా?
లేకపోతే వదిలేయండి.
మీరు ధన్యులు.
సమస్య చూపులు తాకే వాళ్లకే!
నిజం.
అయినా
బహుశా ఒక మాటతో ముగించాలేమో!
నిజానికి ప్రతీదీ దృశ్యం కాదేమో!
మలి పరిచయం ‘దృశ్యం’ అనిపిస్తున్నది.
తొలి పరిచయం ‘దృశ్యాదృశ్యం’ కాబోలనీ అనిపిస్తుంది.
*

ఇంకా భూమి కోలుకోనేలేదు!

 

జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అవగాహన కలిగేది సినిమాల వల్లనే అనుకుంటా, నా మట్టుకూ!
చిన్నప్పుడెప్పుడో ‘కాశ్మీర్ కీ కలీ’ సినిమా పాటలు చూసినప్పుడనుకుంటా మొదటిసారి ఆ ప్రాంతం మీద ఆసక్తి కలిగి ఎక్కడా, ఏమిటీ అనే ప్రశ్నలు ఉదయించాయి.
తెల్లని పర్వత శ్రేణులూ, పచ్చని లోయలూ, సరస్సులూ, అన్నిటినీ మించిన కాశ్మీరీ అమ్మాయిల అందం, అమాయకత్వపు నవ్వు… ఇదేదో పెద్దయ్యాక పదే పదే వెళ్ళాల్సిన ప్రదేశం అని తీర్మానించుకున్న రోజులవి!

‘రోజా’ సినిమాతో ఆ ఆశలన్నీ పటాపంచలయ్యాయి, అది వేరే విషయం! అసలు కాశ్మీరు సంక్షోభంలో ఎవరి పాత్ర ఎంత అనే వాదోపవాదాలు పక్కన పెడితే కాలేజీ రోజుల్లో నా హాస్టల్ రూమ్మేట్, కాశ్మీరీ అమ్మాయి కళ్ళల్లో నిరంతరం కనిపించిన భయం ఇంకా గుర్తుంది.
వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి సమయంలో ఊరు వదిలి రావాల్సి వచ్చిందో చెప్పాలంటే ఒక పెద్ద కధ అవుతుంది, కానీ తను అన్న ఒక మాట ఎప్పటికీ గుర్తుంటుంది, ‘ఇప్పుడు ఎక్కడ ఉన్నా, క్షేమంగానే ఉన్నా కానీ ఏదో కార్నివాల్ లో తప్పిపోయినట్టు భయం, ఆందోళన! ఏదో ఒక రోజు మన ఊరుకి, మన వాళ్ళ దగ్గరకి వెళ్ళిపోతామనే ఆశ. ‘

ఆ మధ్యనెప్పుడో ఈ కింది చిట్టి గుల్జార్ కవిత చూడగానే మళ్ళీ ఆ అమ్మాయి ముఖం కళ్ళ ముందు నిలిచింది.

కాశ్మీరు నించి వచ్చిన పండిట్‌లు
తమ పేరుతో ఇంటికి ఉత్తరాలు రాస్తుంటారు
తాము వదిలివచ్చిన ఇంటికి కనీసం
ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉంటారని!

gulzar

కాశ్మీరు లోయ

ఎంతో ఉదాశీనంగా ఉంటుంది ఈ లోయ
ఎవరో వేలితో బలవంతంగా గొంతుని నొక్కిపెట్టినట్టు

ఇది ఊపిరి తీసుకోవాలి, కానీ ఊపిరి అందనీయనట్టు!

మొక్కలు మొలవడానికి ఎంతో ఆలోచిస్తూ అనుమానపడుతుంటాయి
మొదట పెరిగిన తల అక్కడికక్కడే తీసివేయడుతుందని
మబ్బులు తలలు వంచుకుని వెళ్తుంటాయి, నపుంసకుల్లా

వాటికి తెలుసు రక్తపు మరకల్ని కడిగివేయడం తమకి చేతకాదని!

చుట్టూ పరిసరాల్లో పచ్చదనమే కానీ, గడ్డి మాత్రం ఇప్పుడు పచ్చగా లేదు
బుల్లెట్లు కురిసిన గాయాలనించి ఇంకా భూమి కోలుకోనేలేదు!
ఎప్పుడూ వచ్చే వలస పక్షులన్నీ
గాయపడిన గాలికి భయపడి వెనుతిరిగి పోయాయి
ఎంతో ఉదాశీనంగా ఉందీ లోయ.. ఇది కాశ్మీరు లోయ!
* *
మూలం:

Vaadii-E-Kashmiir

Badii udaas hain vaadii
Galaa dabaayaa huaa hain kisii ne ungalii se

Ye saans letii rahen, par ye saans le na sake!

Darakht ugate hain kuch soch-soch kar jaise
Jo sar uthaayegaa pahale vahii kalam hogaa
Jhukaa ke gardane aate hain abr, naagim hain

Ki dhoyen jaate nahii khoon ke nishaan un se!

Harii-Harii hain, majar ghaans ab harii bhii nahii
Jahaan pe goliyaan barsii, jamiin bharii bhii nahin
Vo migratory panchii jo karate the
Vo saare jakhmii hawaavon se dar ke laut gaye

Badii udaas hai vaadii – ye vaadii-E-Kashmiir!!

————————————-
చిత్రం: సత్యా సూఫీ

కలాలన్నీ కలిసి నడిస్తే…

 

 

-వి . శాంతి ప్రబోధ

అక్టోబర్ 25 వతేదీ
మధ్యాహ్న సమయం
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని తెలంగాణా ప్రజా సంస్కృతిక కేంద్రం హాలు.
రచయితలూ , కవులూ , సాహిత్యకారులూ, సాహితీ సంఘాల ప్రతినిధులు, పత్రికా సంపాదకులూ ఒకొక్కరూ అక్కడ చేరారు. ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది అయ్యారు.   విభిన్న నేపథ్యాలు, వివిధ అస్తిత్వాలు, వర్గాలకు, సంస్థలకు చెందిన  సాహితీ సాంస్కృతిక సృజనశీలురు  ఒకే  చోట చేరిన అపూర్వ సన్నివేశం అది. ఈ సందర్భంలో అంతా కలసి కలబోసుకున్న ఆలోచనల విషయం ఒకటే.
ప్రస్తుత సమాజంలో పెచ్చరిల్లి పోతున్న మతతత్వవాదం, అందులోంచి మొలకెత్తి నాటుకుపోతున్న విషబీజాలు,  నియంతృత్వ ధోరణులు, హింస మర్రి ఊడల్లా విస్తరిస్తూ  సామాన్య ప్రజలనుండి రచయితలు , కళాకారులు , మేధావులు అందరినీ తన కబంధహస్తాల్లో బందీ చేయాలని చూడడం, లేదంటే నామరూపాలు లేకుండా చేయడం జరుగుతోంది. పరమత సహనం నశించి మతమౌడ్యం వెర్రితలలు వేస్తున్న తరుణంలో ప్రజాస్వామ్య విలువలు మంటకలిసి లౌకిక ప్రజాతంత్ర వ్యవస్థకు ముప్పు వాటిల్లుతున్న పరిస్థితులు కలిగిస్తున్న  ఆందోళన అందరినీ ఒక దగ్గర చేర్చాయి. అందుకు  “వర్తమాన సామాజిక సంఘర్షణలు- రచయితల బాధ్యత” అన్న అంశంతో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక నిర్వహించిన చర్చాగోష్టి దోహదం చేసింది.వివిధ సంఘాలుగా, సమూహాలుగా వ్యక్తులుగా విడివడి ఉన్న సృజన కారులు, సాహితీవేత్తలు ఒకటవ్వాలన్న ప్రయత్నం ఎనబయ్యో దశకంలో కొంత జరిగింది.
మారిన ఆనాటి పరిస్తితులతో సద్దుమణిగింది .  తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో. విభిన్న నేపథ్యాలతో,  అస్తిత్వాలలోని సృజన శీలురు, కలం యోధులు ఒక్కటవ్వాల్సిన  అవసరం ఇప్పుడు ఏర్పడింది.  అందుక్కారణం ఇప్పటివరకూ  ప్రజాస్వామిక, లౌకికవాదుల మౌనమే. అలసత్వమే అని చెప్పక తప్పదు.  మన శత్రువు చాపకింద నీరులా విస్తరిస్తూ పోతున్నా చూసి చూడనట్లు ఉండడం వల్లే  నేడీ దుస్థితి.  శత్రువు అది అవకాశంగా తీసుకుని పెచ్చరిల్లిపోవడం, ఆధిపత్య ప్రదర్శనలు చేయడం, అహంకారంతో  తన భావజాలాన్నిప్రజలపై  బలవంతంగా రుద్దాలన్న ప్రయత్నం చేస్తున్నాడు.

ఒకప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా సమాజం అంచులలో ఉన్నవర్గాలపైన, మహిళలపైన  దాడులు జరిగేవి. ఇప్పుడు వారితోపాటు మైనారిటిలపైనా దాడులు పెరిగిపోయాయి.  వారి ఆహారం, అబిరుచులపై నియంత్రణ మొదలైంది. వ్యక్తి స్వేచ్చ స్వాతంత్ర్యాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. అది అక్షీకరించే  కలంయోధులపై దాడులు ఒక పథకం ప్రకారం జరిగిపోతున్నాయి. పెరుమాళ్ మురుగన్ పై దాడి,  కల్బుర్గి హత్య, దాద్రి సంఘటన వంటివి ముందు ముందు జరగబోయే అనర్ధాలకి  మచ్చు తునకలు మాత్రమే.   మనం మౌనం వీడక పొతే , నిరసన తెలపక పొతే, శత్రువు పై యుద్ధం ప్రకటించక పొతే  పరిస్తితి మరింత విషమిస్తుంది. ఈ నేపథ్యంలోనే హిందూత్వ ఛాందస వాదానికి, సంకుచిత్వానికి, అసహనానికి, ఉన్మాదానికి ప్రజాస్వామ్యం బలి అవుతుంటే చూడలేని ప్రజాస్వామిక వాదులు ప్రగతి కాముకులు ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను నిరసనగా తిరిగి ఇవ్వడం మొదలైంది.  అది ఒక నిరసన రూపం మాత్రమే.

అంతకు మించి మరెన్నోవీలయినన్ని  మార్గాలలో మన నిరసనని తెలపాల్సిన అవసరం ఉందని సాహితీప్రపంచం అభిప్రాయపడింది.అసలు ఈ సమాజంలో ఏం జరుగుతోందో, రచయితలు అవార్డులు ఎందుకు తిరిగి ఇస్తున్నారో నేటి యువతకు తెలియని అయోమయ స్థితిలో ఉన్నారనీ,  వాస్తవ పరిస్థితిని వివరిస్తూ భవిష్యత్తులో జరగబోయే విపత్తు గురించి, ప్రజాస్వామిక విలువల వినాశనం గురించీ, విధ్వంసం గురించీ తెల్పుతూ యువతరంలోకి నవతరంలోకి వెళ్ళాలి.  లౌకిక భావజాల వ్యాప్తి విస్తృతంగా  జరగాలి. ఆదిశగా ప్రచారం జరగాలి.  విస్తృతంగా రచనలు రావాలి.  ఎవరికి వారుగా ఉన్న వ్యక్తులపై, సంస్థలపై శత్రువు దాడి చేయడం సులువు.   కాబట్టి సంఘటితంగా ఎదుర్కోవాలని, విశాల ఐక్యవేదిక ఏర్పాటు చేయడం అవసరం అని ఈ చర్చావేదికలో పిలుపునిచ్చారు వక్తలు. ఒక వైపు విధ్వంసం పెద్ద  ఎత్తున జరిగిపోతోంది. దాన్ని నిలువరిస్తూ నమ్ముకున్న విలువల్ని కాపాడుకోవడానికి మనం నిర్మాణాత్మకంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.  దాడులు ఎక్కువగా మహిళలపై జరుగుతున్నాయనీ వాటిని ఎదుర్కొంటూ నూతన సంస్కృతీ నిర్మాణం జరగాలనీ, వాదాలను , విభేదాలను పక్కన  పెట్టి ఒక్క తాటిపై ముందుకు సాగాలనీ అభిలషించారు వక్తలు.

సమాజంలో పెరిగిపోతున్న అసహనం , మత  దురహంకారం, నియంతృత్వం  అసలు సమస్యని తప్పుదారి పట్టించడం జరుగుతోంది. దేశాన్ని అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేస్తోంది.   ప్రగతిశీల శక్తుల పై ప్రభుత్వ అనుకూల  బృందాలు దాడులు చేయడం , .ఏకీభవించని వాడి  పీక నొక్కేయడం వ్యక్తి స్వేచ్చని హరించడం సాధారణం అయింది . మతం వ్యక్తిగతం అన్న స్థితి మారింది. దాన్ని  ప్రభుత్వం స్వీకరించింది, పండుగలు పబ్బాలు నిర్వహిస్తోంది.  అందుకు ప్రజా ధనం విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ మతాన్ని వ్యవస్థాగతం చేస్తోంది. మత దాష్టీకం కనుసన్నల్లోకి వెళ్ళిన రాజ్యం  వ్యక్తిగత ఇష్టాయిస్టాల్లోకి చొచ్చుకొచ్చి లౌకిక శక్తులపై దాడులకు పాల్పడుతూ భయబ్రాంతులను చేస్తోంది, మానవహక్కులను హరించివేస్తోందని అభిప్రాయపడ్డారు. సమాజాన్ని అంధకారంలోకి నెట్టివేసే ఇలాంటి ధోరణుల్ని రచయితలూ, కవులూ , సాహితీవేత్తలు , సృజనకారులు తీవ్రంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంలో జరిగిన  చర్చలో కార్యాచరణకు వచ్చిన నిరసన రూపాలు ఇవి:

* భిన్న నేపథ్యాల్లోని అన్ని అస్తిత్వ ఉద్యమాలు కలసి కట్టుగా  శత్రువుని ఎదుర్కోవడం

*  మౌనం వీడి కలాలకు , గళాలకు పదును పెట్టడం.
* హిందూ పాసిజానికి వ్యతిరేకంగా విస్తృతంగా రచనలు చేయడం.
* లౌకిక వాద భావ ప్రచారం చేయడం
* కళాశాల స్థాయిలో లౌకిక వాద భావ ప్రసారం, ప్రచారం జరిగే .కార్యక్రమాలు చేపట్టడం

*  రచయితల మార్చ్ పెద్ద ఎత్తున హైదరాబాద్ లో జరపడం

*నిరసన ప్రదర్శనలు , రౌండ్ టేబుల్ సమావేశాలు , చర్చా గోష్టులు , సభలు జరపడం
* జాతీయ స్థాయిలో రచయితలంతా ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉంది
*  నిరసన తెలపడానికి వివిధ రకాల టూల్స్  ఎంపిక చేసుకోవడం
* నిరసన కార్యక్రమాలు ఒక ఉద్యమంలా చేయడం
* సోషల్ మీడియాని లౌకిక వాద భావప్రసారానికి సాధనంగా వాడుకోవడం
* చిన్న చిన్న బుక్లెట్స్ వేయడం

* కరపత్రాలు పంచడం

* వివిధ జానపద  కళారూపాల ద్వారా లౌకిక భావ వ్యాప్తితో పాటు వాస్తవ పరిస్తితుల పట్ల అవగాహన కలిగించడం
* సామూహిక స్వరం వినిపించడం
* రచయితల డిక్లరేషన్ ప్రకటించడం
* జిల్లాలలో , పట్టణాలలో నిరసన కార్యక్రమాలు జరపడం
* భావప్రకటన స్వేచ్చ కాపాడుకోవడం
* మత కలహాలు జరిగే ప్రాంతాల్లో , గ్రామాల్లో లౌకిక వాద ప్రచారం జరపడం
* ట్రేడ్ యూనియన్ ల్లోకి , విద్యార్థులలోకి , ప్రజల్లోకి వెళ్ళడం
* జాయింట్ ఆక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం
* ప్రజల ఆహారపు అలవాట్లని శాసించదాన్ని ధిక్కరించడం
* వీధుల్లోకి వచ్చి నిరసన తెలపడం
* ఖండనలు , ప్రకటనలకి మాత్రమె పరిమితం కాకుండా ప్రత్యక్ష ప్రణాళిక ఏర్పాటుచేసుకోవడం
* సంతకాల సేకరణ రూపంలో నిరసన తెలపడం
* రచయితల భద్రత కోరుతూ ముందే పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయడం

రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడుకుంటూ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళడం కోసం         ” లౌకిక, ప్రజాస్వామిక సాహితీ సాంస్కృతిక వేదిక” ఏర్పాటైంది.  ఈ వేదిక తరపున కొండవీటి సత్యవతి, యాకూబ్ , బమ్మిడి జగదీశ్వ రావు, పసునూరి రవీందర్ కన్వీనర్లు గా ఒక కమిటీ ఏర్పాటయింది.  ఆ కమిటీ లో  వీరితో పాటు ఉష. s. డానీ, స్కై బాబా , అరుణోదయ విమల , G. S. రామ్మోహన్ , కాత్యాయనీ విద్మహే , శివారెడ్డి , తెలకపల్లి రవి , రెహనా, రివేరా  సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన చేసి అమలు చేస్తుంది.

దాదాపు 200 వందల మంది పైగా  కలం యోధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో  ప్రో . హారగోపాల్ , వరవరరావు , తెలకపల్లి రవి , అల్లం నారాయణ , కె. శ్రీనివాస్ , నందిని సిధారెడ్డి , రమా మెల్కోటే,  వీణ శత్రుఘ్న, విమల, అనిల్ అట్లూరి , నాళేశ్వరం శంకరం ,  N. వేణుగోపాల్ , కుప్పిలి పద్మ ,  వాసిరెడ్డి నవీన్ , కాకరాల , వేంపల్లి షరీఫ్ , కత్తి మహేష్ , దేవి , జ్వలిత , తిరునగరు దేవకీదేవి, రమాసుందరి, అరణ్య కృష్ణ, సుమిత్ర , ఇంద్రవెల్లి రమేష్ , శిలాలోలిత, తారకేశ్వర్ , రామారావు  , కృష్ణుడు , వినోదిని , యలవర్తి  రాజేంద్రప్రసాద్ , అలీ సిద్దికి , వర్మ , వనజ .C,  గోపరాజు సుధ, రజని , ధనలక్ష్మి ,రాజ్యలక్ష్మి , కందుకూరి రాము , ప్రరవే సభ్యులు కాత్యాయనీ విద్మహే , మల్లీశ్వరి , శాంతిప్రబోధ , భండారు విజయ , మెర్సీ మార్గరెట్ , పి. రాజ్యలక్ష్మి, కొండేపూడి నిర్మల ,తాయమ్మ కరుణ , కవిని ఆలూరి , కొమర్రాజు రామలక్ష్మి , బండారి సుజాత , సమతా రోష్ని , శివలక్ష్మి, , హేమలలిత, లక్ష్మి సుహాసిని  తదితరులు పాల్గొన్నారు .

ఈ కార్యక్రమం తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం సహకారంతో జరిగింది

వి. శాంతి ప్రబోధ , భండారు విజయ

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక , తెలంగాణ

శివ‌లెంక రాజేశ్వ‌రీదేవి క‌విత‌ల కోసం…

 

తెలుగులో మేలైన క‌విత‌లు రాసి,
ఇటీవ‌ల కాలం చేసిన క‌వ‌యిత్రి శివ‌లెంక రాజేశ్వ‌రీదేవి.
ఆమె స్వీయ క‌వితా సంపుటిని మిత్రులం ప్ర‌చురించ‌ద‌ల‌చాం.
రాజేశ్వ‌రీదేవి ర‌చ‌న‌ల రాత‌ప్ర‌తులు, ప‌త్రికా ప్ర‌చురితాలు త‌మ వ‌ద్ద వున్న‌ట్ల‌యితే
అవి ఈ కింది చిరునామాకు పంపించ‌మ‌ని కోరుతున్నాం.

నామాడి శ్రీ‌ధ‌ర్‌, # 3 – 129, అంబాజీపేట, తూర్పు గోదావ‌రి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.
పిన్ : 533214. ఫోన్ : 9396807070. ఈమెయిల్‌ : namadisreedhar@gmail.com

కథలు కావివి…..పంచదార గుళికలు

-మనోజ్ఞ ఆలమూరు

~

manognaమధురాంతకం రాజారాం అబ్బ ఈ పేరు అంటే నాకెంతిష్టమో చెప్పలేను. ఎందుకో తెలియదు మొదటిసారి ఈ పేరు వినగానే అర్రె భలే ఉందే అనుకున్నాను. నేను చదివిన పుస్తకాల తాలూకా రచయితలను వారి వారి రచనలను బట్టి గుర్తుంచుకున్నాను. కానీ ఒక్క మధురాంతకం వారిని మాత్రం పేరు నచ్చి గుర్తు పెట్టుకున్నాను. దాదాపుగా నేను ఎమ్మేలో ఉన్నప్పుడు అనుకుంటాను నాకు ఈయన పేరుతో పరిచయం కలిగింది. అయితే ఆయన కథలు చదవడం మాత్రం ఇప్పటికి కుదిరింది. చదివిన వెంటనే రాయకుండా మాత్రం వుండలేకపోయాను. రాజారాం గూర్చి కొత్తగా చెప్పేదేముంది అని అనిపించవచ్చును. కానీ కొంత మంది పుస్తకాలు చదివినా, వారి గురించి చెప్పకున్నా నిత్య నూతనంగానే అనిపిస్తాయి. పైగా ఈ కథలు నాకు కొత్త అద్భుతమైన అనుభవం, నవ్యనూతనమూనూ… అందుకే చెప్పకుండా ఉంలేకపోతున్నాను.

మధురాంతకం రాజారాం కథలు 3వ సంపుటం అట్టమీద ఒక స్త్రీ కూర్చుని ఏదో వడ్డిస్తున్నట్టు ఉంటుంది. ఎవరు గీసారో కానీ ఆ బోమ్మను ఎంతబాగా గీసారో. పుస్తకంలోని కథలకు ఆ బొమ్మకు ఎంత బాగా జోడీ కుదిరిందో. రాజారాం గారి కథలు సాహిత్యాభిమానులకు అమృతాన్ని పంచుతాయి. దాన్నే సింబాలిక్ గా స్త్రీ రూపంలో సరస్వతీ దేవి అమృతాన్ని పంచినట్టు చిత్రీకరించారేమో అని అనిపిస్తుంది. ఇంక కథల విషయానికి వస్తే రాయలసీమ రచయితల కథలు, రచనలు ఇంతకు ముందు చాలానే చదివినా…రాజారాం కథలు ఒక ప్రత్యేక అనుభవమనే చెప్పాలి. రాయలసీమ యాసలో ఒక వింత అందం ఉంటుంది నాకైతే. నామిని గాని, ఖదీర్ బాబువి కానీ మంచి చిక్కని సీమ యాసలో ఉంటాయి. మిగతావారివి కూడా ఇంచుమించుగా అలాగే ఉన్నాయి. కానీ రాజారాం గారి యాస మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంది. అది పూర్తిగా రాయలసీయ యాస కాదు….కానీ పదాల వారీగా చూసుకుంటే మాత్రం చాలా వరకు సీమ పదాలే. రాజారాం గారి కథల్లో తెలుగు బహుమధురంగా అనిపించింది నాకు. చదవడానికి అత్యంత అందంగా…సరళలంగా ఉండడమే కాక మంచి తియ్యగా కూడా అనిపించింది. అందులోనూ వారు రాసిన విధానం దానికి మరింత అందాన్ని చేకూర్చింది. మధ్యమధ్యలో సామెతలు, జాతీయాలు కలగలిసి రాజారాం గారి కథలకు వింత సొబగును అద్దింది ఆయన భాష. తెలుగు సామెతలను అత్యంత సమర్ధవంతంగా వాడుకున్న వారిలో మధురాంతకం రాజారాం గారు ఒకరు. సందర్భానుసారంగా సామెతలను వాడుతూ తన కథలకు మరింత వన్నెలను అద్దారు రాజారాంగారు. ఒక్కోసారి సామెతలను ముందు చెబుతూ తర్వాత కథలను మొదలుపెట్టడం, సామెతల ద్వారా పాత్రలను పరిచయం చేయడం వంటివి రాజారాం గారి ప్రత్యేక శైలి. అందుకే కీ.శే. బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు గారు రాజారాం కథలు చదివి ఇలా అన్నారుట.” రాజారాం గారి కథల్లో అతి సుందరపదాలను, నుడికారాలను, ఇదివరలో వెలుగు చూడని సామెతలను – పరిశోధకులు ప్రోది చేసి భద్రపరచవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని.”

రాజారాం గారి కథలు చక్కగా కూర్చోబెట్టి, ప్రేమగా పాఠం చెబుతున్నట్టు ఉంటాయి. అన్నట్టు అసలు విషయం మర్చేపోయాను. రాజారాం గారు వృత్తిరిత్యా ఉదాపాధ్యాయులు కదూ. అదీ సంగతి ఆయన ప్రవృత్తిలోకి వృత్తి చొచ్చుకొని వచ్చేసిందన్నమాట. అందుకే ఆయన కథలు పాఠకులకు పాఠం చెబుతున్నట్టు ఉంటాయి. మొదటసారి ఈయన కథలు చదువుతున్నప్పుడు ఒక కొత్తదనం పలుకరించింది. అరే ఇదేమిటీ గమ్మత్తుగా ఉందే అనుకున్నాను. తర్వాత్తర్వాత చదవగా చదవగా ఆ గమ్మత్తు ఆయన కథనరీతి అని అర్ధం అయింది. రాజారాం గారు ఎంచుకునే కథాంశాలు కూడా అలానే ఉంటాయి. ఒక రకమైన స్థిరత్వం కలిగి ఉండి, విశ్వాసం కలిగిస్తున్నట్టు ఉంటాయి. మానవుడిలో ఉన్న అభద్రతాభావాన్ని పక్కకు నెట్టేసి భరోసాను కలిగిస్తాయి. ఉపాద్యావృత్తిలో ఆయన తిరిగిన ప్రదేశాలు, తరచిన అనుభాలూ, కలిసిన మనుషులు, వారి భిన్న మనస్తత్వాలు వారి రచనలకు ఎంతగానో ఉపకరించాయి. ఊహూ…ఉపకరించడం కాదు వాటినే ఆయన తన కథా వస్తువులుగా తీసుకున్నారు అంటే ఇంకా బావుంటుంది.

రాజారాంగారు వృత్తి రిత్యా ఎక్కువగా పల్లెల్లోనే తిరిగారు. అందుకే వారి కథలు 80% పల్లెల చుట్టూరానే తిగుతాయి. గ్రామీణ జీవితంలో మధ్యతరగతి మనుషులు వారి మనో వికారాలు, ప్రవృత్తులు, సమస్యలు ఆయన కథల్లో మనకు దర్శనమిస్తాయి. రాజారాం కథలకు మునిపల్లెరాజుగారు ముందుమాట రాస్తూ…..సామాజికి ఆర్ధ్రత లేని చోట సామాజిక స్పృహ అన్న పదానికి అర్థం ఉండదని ఈయన కథలు చదివిన పాఠకులందరూ గ్రహిస్తారు అని చెబుతారు. ఇది అక్షరసత్యం. రాజారాం గారి కథల్లో ఎక్కడా పలాయనవాదం కనిపించదు. సామాన్య మానవులు వారి చిత్తప్రవృత్తులు, వారి సమస్యలు, వాటి పర్యవసానం అన్నింటినీ కళ్ళకు కట్టినట్టు చెబుతూ వాటికి పరిష్కారాను చూపిస్తూ జీవితం అంటే ఇదే అంటూ భుజం తట్టినుంటాయి వీరి కథలు.వ్యక్తుల్ని,సన్నివేశాల్ని,రాగద్వేషాల్ని,ఈతిబాధల్ని,జీవనదృక్పథాన్ని ఇంత అద్బుతంగా,ఇంత కూలంకషంగా విశదపరిచిన తెలుగు రచయితల్లో రాజారాం గారు ఒకరని ఢంకా బజాయించి మీరీ చెప్పవచ్చును.

పెద్దబాలశిక్ష లా ప్రపంచ జ్ఞానాన్ని బోధిస్తూ,పంచతంత్రం లా చిన్న చిన్న కథలలో జీవితసారాన్ని వడ్డిస్తాయి ఈయన కథలు. ఆ అనుభవాలనే సాకల్యంగా ప్రతి ఒక్క విషయమూ క్షుణ్ణంగా పరిశీలించి, అనేక కోణాలను చక్కగా పరిశీలించి ఆవిష్కరిస్తున్నట్టుంటాయి రాజారాంగారి కథలు. ఆధునికయుగంలో కులాంతర, మతాంతర, విజాతివివాహాలు, కుటుంబనియంత్రణలు అన్నీ ఆయనకి కథావస్తువులే. తమకి ఇబ్బంది కలిగించే అంశాలు –అసభ్యసాహిత్యంవంటివి- తీసుకోక మానరు కానీ అది తమకి అప్రియమని తెలియజేయడానికి వ్యంగంగా వాటిని తన కథల్లో ఉటంకిస్తారు. ఉప కథల్తో పిట్ట కథల్తో, మధ్య మధ్య వర్ణనలతో సావధానంగా కబుర్లు చెబుతున్నట్లుండి, కథల్లో కథ ‘చెప్పే’ పద్ధతిలో ఉంటాయి రాజారాం గారి కథలు.

చాలా కథలలో రచయితే సూత్రధారై కథను నడిపిస్తాడు. ఆగని వేగం అనే కథలో జీవితాంతం నడుస్తూ శ్రమించిన వ్యక్తితో రచయిత చెప్పించే జీవనగీతోపదేశం అద్బఉతంగా ఉంటుంది. ఆ కథ చదువుతుంటే బతుకు మీద విశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది. జీవించిన చివరి క్షణం వరకు బతకాలి….బతికుండగానే చనిపోకూడదు అని అనిపిస్తుంది. అలాగే యుగారంభం అనే కథలో పద్యరచన, వచన రచన గురించి చెబుతూ రెండూ కాలగమనంలో నుంచి వచ్చినవే కదా అంటారు. రెండింటినీ స్వీకరించి వాటిని గమనాన్ని బట్టి నడుచుకోవాలని హితబోధ చేస్తారు. అలాగే పంచవర్ష ప్రణాలికలన్నవి కుగ్రామాల నుంచే మొదలు కావాలని, గ్రామాభివృద్ధే అసలైన అభివఋద్ధి అని ధర్మయ్య కల ద్వారా శక్తివంతంగా చెప్పిస్తారు. ఒక సామెతని యదాలాపంగా కథలో చొప్పించడం ఒక ఎత్తు. దాన్ని కథలో ఒక ప్రధానాంశంగా మార్చుకోడం మరొక ఎత్తు.

“ఒక ఆడబిడ్డకు వివాహ సంబంధం కుదర్చాలంటే మునుపు ఏడు జతలజోళ్ళు అరిగిపోయేవిట.” అంటూ అనామకుడు కథలో రచయిత కథను ఎత్తుకుంటారు. అయితే దాన్ని అక్కడతో వదిలేయకుండా ఆ సామెతను కథకి ఆయువు పట్టుగా మలుచుకుంటారు. సామెతకు అనుగుణంగా ఆధునీకరిస్తారు. “కాలేజీలెక్కువై అబ్బాయిలు అమ్మాయిలు పరస్పరం ప్రేమించుకోడమంటూ ఒకటి ప్రారంభమైన తరవాత ఇప్పుడా బెడద చాలావరకు తగ్గిపోయినట్టే ఉంది…” అంటారు. ఇది కథలో ఒక కీలకమయిన అంశమని మనకి చివరికి గానీ స్పష్టం కాదు. మొత్తం కథంతా ఈ అంశంమీద కేంద్రీకృతమై, పాఠకుడిని ఆందోళనకు గురిచేస్తుంది. అంటే రాజారాంగారు ప్రేమకథలకి వ్యతిరేకి అని కాదుకానీ మానవసంబంధాలు ఆధునికయుగంలో ఎలా మార్పులకు లోనయ్యాయో, వాటి ఫలితాలేమిటో చిత్రించి చూపించారు ఈ కథలో. ఇక రుద్రభూమి అన్న కథలో….కథకులకు సున్నితంగా, సూక్ష్మంగా సలహాలిస్తారు.

“మీరెలా రాస్తారండీ” అని అడిగితే, ఆయనజవాబు, “అదెంత పని లేవోయ్ కన్నారావ్! వ్రాయగలిగిన పేనా ఒకటి చేతిలో ఉండాలి. అందులో సిరా ఉండాలి. ఎవరైనా రాసి పారెయ్యొచ్చు.” ఆ తరవాత మాత్రం ఆయనకి చిన్న బెదురు కలుగుతుంది. “ఈ కన్నారావు కరపత్రాలు, ఆకాశరామన్న ఉత్తరాలు మొదలైనవి రాసేవాళ్ళకున్నూ, కథలు, నవలలు మొదలైనవి వ్రాసేవాళ్ళకున్నూ స్వభావంలో తేడా ఏమాత్రముండదన్నట్టు భావిస్తున్నాడు!” అంచేత వెంటనే, “ఏదైనా వ్రాయాలంటే దండిగా చదవాలోయ్, కన్నారావ్.” అని హెచ్చరిస్తారు. ఎంత బాగా చెప్పారో కదా….ఎంత చదివితే అంత బాగా రాయొచ్చు అని అనిపిస్తుంది ఈ వాక్యాలు చదివాక.

ఇక రాజారాం గారి కథల్లో మరో ముఖ్యమైన అంశం స్త్రీ పాత్ర చిత్రణ. రాజారాం కథల్లో కనిపించే ప్రధాన స్త్రీ పాత్రలన్నీ ఏదో స్ఫూర్తి నిచ్చేవిగానే వుంటాయి. కక్షలు, కార్ఫణ్యాలు మానవ జీవితాలకు ఆంటకాలే కానీ….అభివృద్ధి కావంటూ కొండారెడ్డి కూతురు కథలో నాగతులసి, గాలివీడు నుంచి న్యూయార్క్ దాకాలో సీరజ పాత్రల చేత చాలా చ్క్గా చెప్పిస్తారు రాజారాం గారు. మంచి మాటలు, మంచి మనసులతో ఎటువంటి కరడుగట్టిన వారినైనా మార్చవచ్చిన నిరూపిస్తాయి నాగతులసి, నీరజ పాత్రలు. తనను చంపడానికి వచ్చిన ఇద్దరికి బుద్ధి చెప్పి మంచి వారిగా చేసి…వారికో నూతన జీవితాన్నిస్తుంది నాగ తులసి. అలాగే ఒక ఊరిలో ఇద్దరు పెద్ద మనుషుల మధ్య ఉన్న అగాధాలను తన మాటకారితనంతో మూసుకుపోయేలా చేస్తుంది నీరజ.

ఇద్దరు వ్యక్తులు కొట్టకోవడం వల్ల వచ్చిన నష్టం ఏమిటో అతి తెలివిగా, సున్నితంగా చెప్పి…వారు తప్పు తెలుసుకునేలా చేస్తుంది. ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని ఆటుపోటులెదురైనా తను అనుకున్నది సాధించి పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోనే తెలివైన పాత్ర సబల లోని విశాల పాత్ర. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తను కోరుకున్న వాడినే ఏరికోరి పెళ్ళి చేసుకుంటుంది. అలాగే మిస్ ఎమరాల్డా కథలో తల్లిదండ్రుల ప్రేమకు దూరమై, అనాథలా బతికినా….ఎక్కడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా, విలువలతో కూడిన జీవితాన్ని జీవించాలకునే విదేశీ యువతి ఎమరాల్డా అంతరంగాన్ని చాలా బాగా ఆవిష్కరిస్తారు. ఇంకా ఇలాంటి మంచి పాత్రలు ఎన్నో ఆయన కథల్లో ఉన్నాయి. రాజారాం కథల్లో ఎన్నో స్త్రీ పాత్రలు మనల్ని పలకరించినట్లు వుంటాయి. మనతో కలిసి జీవించినట్లు వుంటాయి. మనల్ని సుతిమెత్తగా మందలించి , ప్రేమానురాగాల్ని పంచిపెట్టి అనుబంధాలతో అల్లుకుపోయినట్లు అనిపిస్తాయి. ఎందుకంటే అవి సమాజంలో నుంచీ తీసుకోబడిన పాత్రలే కాబట్టి. ఒక్క మాటలో చెప్పాలంటే మన చుట్టూ వున్న స్త్రీ రాజారాం కథల్లో విభిన్న రూపాల్లోకి , పేర్లలోకి పరకాయప్రవేశం చేసాయా అనిపిస్తాయి.
మొత్తానికి ప్రతి ఒక్క విషయమూ క్షుణ్ణంగా పరిశీలించి, అనేక కోణాలను చక్కగా పరిశీలించి ఆవిష్కరిస్తున్నట్టుంటాయి రాజారాం గారి కథలు. ఎత్తుగడలో, పాత్రచిత్రణలో, సన్నివేశాలు ఆవిష్కరించడంలో, ముగింపులో – ప్రతి పదంలోనూ ప్రతి అక్షరంలోనూ రాజారాంగారి ముద్ర కనిపిస్తుంది. ఇతరులకు సాధ్యం కానిది, తనకు మాత్రమే సొంతమైన…అద్భుతమైన ముధ్ర అది. ఇతివృత్తాల్లో వైవిధ్యం, పాత్రచిత్రణలో పరిపూర్ణత, కథనరీతిలో అసదృశమైన పోకడలు రాజారాంగారి కథలని తెలుగు కథాసాహిత్యంలో ప్రత్యేకంగా, విడిగా నిలబెడతాయి. ఆధునికతకు పట్టం కడుతూనే… స్నేహ ధర్మాన్నీ , మానవధర్మాన్ని మర్చిపోవద్దు అంటూ తన కథల ద్వారా మధురంగా చాటి చెప్పారు మధురాంతకం రాజారాం గారు.

*

నువ్వూ – నేనూ

-శారద శివపురపు
 ~
sarada shivapurapu
నేనలా కబుర్లు చెప్తూనే ఉంటాను
నువు ఊ కొడుతూనే ఉంటావు
నవ్వుతూనే ఉంటావు
కోప్పడుతావు, ఇంతలోకే ప్రేమిస్తావు
ముద్దుపెడతావు, లాలిస్తావు
నా ధైర్యం నువ్వేననుకుంటాను
ఎంత బాగుంటుంది అలా అనుకోవటం
ఎప్పటికీ నా పక్కనే ఉన్నావని,
ఉంటావని అనుకోవటం….
అమరత్వపు ఆశలెప్పుడూ లేవు కానీ
జీవితపుటధ్యాయాలన్నీ కలిసి చదవాలన్న
కాంక్ష తీరకుండా, ఎందుకు నీకంత తొందర?????
నువు నాటిన విత్తుల్లోని మొలకల్లోనే
నీ నవ్వులు వెతుకాలేమో ఇక నేను
నువ్వతి ప్రియంగా చదివిన పుస్తకాల్లోని
అక్షరాలను ప్రేమించాలేమో ఇక నేను
నువ్వెంతో సున్నితంగా లాలించిన మొక్కలన్నీ
కృతజ్ఞతతో రోజు రోజుకీ ఎదుగుతుంటే
వాటి పచ్చదనంలోనే నీ వెచ్చదనం పొందాలేమో.
నీకసలు తెలియదు, తెలియనివ్వను,
ఒక క్షణం గురించి………
నేను నవ్వుతున్నా, నడుస్తున్నా, పడుకున్నా,
ఆ ఒక్క క్షణం గురించి ఆలోచిస్తున్నానని
నీకస్సలు తెలియదు నేనలా ఆలోచిస్తున్నానని
నిన్ను, నన్నూ రెండు కాలాల్లోకి విసిరేసే
ఆ క్షణం………
మానవ ప్రయత్నం నీవెళ్ళడం ఆపలేదని తెలిసాక,
విధి లిఖితమో, దైవ సంకల్పమో, అనుకుంటూ
కలిసుండాలన్న మన కోర్కె కన్నా,
కలిసుంటామని చేసుకున్న ప్రమాణాలకన్నా,
అగ్నిసాక్షిగా కలిసి నడిచిన ఏడడుగుల కన్నా,
దీర్ఘాయుష్మాన్ భవా అనీ, సౌభాగ్యమస్తూఅనీ
దీవించిన పెద్దల నోటి మాట కన్నా,
బలమైనదేదో నీచేయి బలంగా పట్టుకుందని
కుండపోతగా వర్షించే మేఘాలేవో
నా జీవితాకాశంలో కమ్ముకుంటున్నాయని తెలిసాకా
నా కళ్ళల్లో కన్నీరింకితే ఆశ్చర్యమేముంది?
మన అందమైన జ్ఞాపకాల తడి మాత్రం
ఆరనివ్వననుకోవడం తప్ప నీకివ్వగలిగేదేముంది??
నాకనిపిస్తూంటుంది, నీకేం నువ్వు బాగానే ఉంటావని
ఏకాలమైనా, ఏ క్షణమైనా,
నా బెంగ, నా భయం, నీ మీద ప్రేమా
అన్నీ కలిసిపోయి, విడదీయలేనంతగా
ఏది ఏదో తెలియనంతగా
నే సతమతమవుతుంటాను,
ఎప్పుడో, ఆఒక్క క్షణంలో అంతా అయిపోతుందని
దట్టంగా కమ్ముకున్న మేఘం ఉరుములతో హెచ్చరిస్తుంటుంది
ఓ వాన చుక్క పయనం ముగించి సముద్రంలో కలిసిపోతుంది.
నిన్నూ నన్నూ వేరు చేసిన కాలం
రెండు కాలాలలోకి నిన్నూ నన్నూ విసిరే క్షణం
వికటాట్టహాసం చేస్తూంటుంది
దూరంగా ఓ ఒంటరి నౌక సముద్ర మధ్యంలో
కనపడని ఒడ్డు కోసం భయం భయంగా వెతుకుతుంటుంది
అప్పుడూ నువ్వు నవ్వుతూనే ఉంటావు
నవ్వుతూ నవ్వుతూనే జ్ఞాపకంగా ఘనీభవిస్తావు
నాకుమాత్రం తెలియదా నువ్వెంత బాధపడుతున్నావో
నానుంచి దాచడానికెంత కష్టపడుతున్నావో
కొన్ని కొన్ని చిరు చేదు సంఘటనలు
జ్ఞాపకాలైనప్పుడు తీపిగా ఉంటాయనీ తెలుసు
అప్పుడు నీ కోపం చిరాకు నాకు విసుగనిపించవు
అన్నీ నవ్వు పుట్టిస్తాయి
అదేంటో నీ నవ్వే……….. ఏడుపు తెప్పిస్తుంది
నువు మాత్రం అలా కన్నర్పకుండా చూస్తుంటావు
నిశ్శబ్దంగా నవ్వుతుంటావు
నేనేడుస్తున్నానని కూడా చూడవు
ఇంకా, ఇంకా అందంగా….
నిర్వేదంగా…..
ఎటు చూసినా…… ఎవరికీ కనపడకుండా
ఎవ్వరికీ వినపడకుండా నాలో ప్రతిధ్వనిస్తుంటావు
నేను మాత్రం ఎప్పుడూ ఒకటే కోరుకుంటాను
నీవున్న చోట నేను, నేనున్న చోట నువ్వుండచ్చుకదాని
ఓకన్నీటి చుక్క బతుకు వేడికి ఆవిరై నింగికెగసిపోతోంది
ఎవరి పయనం ఎక్కడ మొదలయి,
ఎక్కడ అంతమయినట్టో …..ఏమో…….
*

భోక్త 

~ ఇంద్రగంటి మాధవి 
 
*

Madhavi indragantiఅసలు తను కిందటేడాదే అనుకుంది ఇలా చేద్దామని. సౌదీ అరేబియా కొడుకు దగ్గరకి వెళ్లి,  పిల్లల బలవంతం మీద మరో రెండు నెలలు వైశాఖం వరకూ వుండిపోయినపుడు. దేశమంతా ముస్లిమ్లైనప్పుడు, తెలుగువాళ్ళే  కష్టం, అందులో ఇంకా మనవాళ్లే తద్దినానికి దొరకాలంటే మాటలా…   పాపం వాడు కూడా తన ప్రయత్నం తానూ చేసాడుగా.. జెద్దా నుంచి రియాదుకి ఫ్రెండ్ ని పిలిపిద్దామని టిక్కట్టు కూడా కొన్నాడుగా … ఆఖరి నిముషంలో అతను దుబాయిలో మీటింగుందని రానంటే వీడు మాత్రం ఏం చేస్తాడు… కోడలూ మనవలూ తామేదో తప్పు చేసేసినట్లు ఎంత ఇదయి పోయేరు…

వదినా, రేపు అన్నయ్య తిథికి మొన్నటి మాటు వొచ్చారే, వాళ్లని పంపిస్తాను. మంత్రం కానిచ్చి, భోంచేసి పోతారు. సరేనా ?
నువ్వు ముందు కూరలు తే… పొద్దెక్కి పొతే ఎండ…
తొందరగా చెప్పకపోతే వాడు వేరెక్కడైనా వొప్పుకుంటాడు మరి…

భోజనం చేసి బాంకుకీ వెళ్లాలి. ముందు మార్కెట్టుకెళ్లి రా…

లేటైతే మనిషి దొరకడం కష్టం. ఆనక మీ ఇష్టం…
భోక్తల సంగతి తరవాత చూద్దాం…
సరే. నేవచ్చే సరికి తయారు గా వుండండి. బాంకుకెళ్లచ్చు…
కదలక పొతే వొదిలేట్లు లేదని అయిష్టంగానే కదిలేడు. అరవై అయిదేళ్లు వుంటాయేమో. వెడల్పాటి జరీ అంచు గోధుమరంగు పంచె. కుంకుడు గింజంత బొట్టు. మెడలో బంగారంతో చుట్టిన రుద్రాక్షలు. ఎర్ర రాయి చెవిపోగులు. చిన్న పిలక. ధృడంగా చేపాటి మనిషి. నాలుగిళ్ల అవతలుంటాడు.
వంట చేస్తూ కూర తరుగుతోంది. మొన్నపొలం కొలతలు తీయించాలని కరణం రమ్మంటే తను వెళ్లింది. రైతు ముంజెలు దించి ఇస్తూ  చెప్పేడు. ఈ ఏడాదీ మక్తా సగంలో సగవే ఇయ్యగలనని. మూడేళ్ళ బట్టీ వానలు లేవు మరి. బోరు నీళ్లు సగానికే వొస్తున్నట్లున్నాయి, మిగతా చెక్క ఎండిపోయి నెర్రెలు తీసింది. బొంబాయికి డైరక్టు బస్సు పడిందిగా, కొడుకులిద్దరూ కూలికి పోయేరు. వొస్తే ఏడాదికోమాటు వొస్తారేమో. ఆఖరు కొడుకునీ  టౌన్లో ఇంటరు మానేసి బొంబాయి పొమ్మంటే పోనంటున్నాడు… డాక్టరీ చదువుతాట్ట…  తిండికే కష్టంగా వుంటే, ఇంట్లో ఆడదాని కళ్లజబ్బు సంగతెవరిక్కావాలి… తన కొడుకుల వయసు వాడు… డొక్కలెండి పోయి శవంలా వున్నాడు…ముక్క సంగతి దేవుడెరుగు. ఇంత పప్పు ముద్ద కూడా రోజూ పడుతున్నట్లు లేదు.
టౌన్ మార్కెట్ నించి  తెచ్చిన కూరలన్నీ కుప్ప పోసేడు.
కాళ్లు కడుక్కో, భోం చేద్దువు గాని…
వదినా, భోజనం తరవాత, ముందు బాంకుకి పదండి…
—-
మానేజరుతో నేను మాట్లాడతాను. నువ్విక్కడే కూర్చునుండు…
వయసు మళ్లినా మనిషి సన్నగా నిటారుగా ధీమాగా వుంది. జేగురు రంగు జరీ చీరలో నిండుగా కప్పుకుని. మెడలో సన్నపాటి గొలుసు, చేతులకి ఓ జత గాజులు, చెవులకి చిన్న కమ్మలు. కూడా పూలు కుట్టిన చిన్న గుడ్డ సంచీ.
అతనికి కొంచం ఆశ్చ్యర్యం.
నాకిపుడు అయిదు లక్షలు కావాలి. మిగతా ఎఫ్ డీ లు మార్చి ఆర్నెల్లకోసారి లక్ష వొచ్చేటట్లుగా తిప్పి వెయ్యండి…
అంత కాష్ ఒకేసారంటే కష్టం. రెండు రోజులవుతుంది. తెప్పిస్తాను. ఎందుకంత కాష్?
చెప్పిందావిడ.
ఇప్పుడో లక్ష కాష్ తీసుకోండి. మిగతాది డీడీ ఇయ్యచ్చు…
అంత డబ్బెందుకు? రేపటి కార్యానికి కిందటి మాటొచ్చిన కుర్రాళ్లని రమ్మంటానొదినా…
పట్టు పంచె కట్టి భోజనానికి కూర్చుని అపోశన పడుతున్నవాడల్లా ఆగి ఫోనందుకుని.
ముందు భోంచెయ్యి. నీకిష్టమని దుంపలు వేయించేను. ఉట్టిపప్పూ, పులుసూ…
ఈవిడకి అర్ధం అవదేంటి..  తనకేమో అవతల బోల్డన్ని పనులు. అసలే మినిస్టరు గారింటికి కూడా పోవాలి. ఏడాది పాటు వాళ్ల పౌరోహిత్యం గుత్తకి దొరికేలా వుంది. భూమి పూజనుంచీ బారసాలల వరకూ, అన్ని కార్యాలూ. అధమం అయిదు పది లక్షలైనా వొస్తాయి, దానాలవీ పోనూ. వొదినగారు ఎంతకీ తేల్చదు…
కూరలో ఉప్పు సరిపోయినా చప్పగా అనిపించింది.
అవతల వాళ్ళందరూ వేరే కర్మో కార్యవో దొరికి పోతే, మరోణ్ణి వెతకలేక మనకే ఇబ్బంది వదినా…
మన రైతుకీ, అతని తమ్ముడికీ  చెప్పేను. రేపు రమ్మనమని …
వాళ్లెలాగో వచ్చి సాయంత్రం తినిపోతారుగానీ, భోక్తలకింద ఆ కుర్రాళ్లని పిలుస్తున్నాను …
ఇంకెవరూ అక్కర్లేదు. వాళ్లే భోక్తలు…
ఏవిటీ???
శూద్రాళ్లు భోక్తలేంటి? మీకేవైనా మతిపోయిందా? మజ్జిగాన్నం తినకుండానే ఉత్తరాపోశన పట్టేస్తూ.
నేను కిందటేడాదే అనుకున్నాను…
అసలీవిడ రియాదునించి రాగానే అడగ వలసింది. అన్నయ్య తిథి ఎలాచేసేరని? టీ వీ ఛానెల్లో  కొత్తగా కుదిరిన ప్రవచనం పనుల్లో పడి.. వాడున్నాడుగదా చూసుకుంటాడనుకుంటే… ఈ ముసల్దాని వాలకం చూస్తోంటే ఆ తురక దేశంలో ఏ దారేపోయ్యే దానయ్యకో తిండి పెట్టి అదే తిథనిపించి వుంటుంది.  గద్దించేడు. స్వరం మారుతోంది-
ఏమని? ఏం చేసేరక్కడ??
డ్రైవర్నీ, ఇంట్లో పనివాణ్ణీ రమ్మన్నాను. సుష్టుగా తిని వెళ్లేరు. చెరో అయిదొందల రియాళ్లు దక్షిణా, తాంబూలం… ఇది జరిగి ఏడాదయింది. నేనేం జిర్రున చీదలేదు…పైనున్న మీఅన్నగారి సంగతి మనకి తెలీదు…
తను ఎప్పటిలానే కిందటేడాదీ చేసింది నాలుగు కూరలూ, పచ్చళ్లూ, పిండివంటలూ.  పాపం రోజూ వాళ్లకి టైమెక్కడిది. లేచింది మొదలు రాత్రి నడుం వాల్చే వరకు పనే పని. ఒకళ్లకి ఇళ్లల్లో చాకిరీ. ఇంకోళ్లకి ఊరంతా కార్లో తిప్పే తిరుగుడు. గుక్కెడు కాఫీ నీళ్లు తాగే సందు లేదు. పొద్దున్న ఇంత తిని బయలుదేరితే ఇంక రాత్రి పదకొండు దాటేకే నాలుగు వేళ్లూ లోపలికి వెళ్లడం. తిథి సెలవురోజు శుక్రవారం పడింది కాబట్టి సరిపోయింది. పెట్టినవన్నీ ఓపిగ్గా తిన్నారు. తననుకున్నది ఒకటే. ఎవరైతేనేం కడుపు నిండా తినడం కావాలి. ఆయన పేరు మీద. మనవాళ్లెవరు, పరాయివాళ్లెవరు…
హవ్వ! ఇంతా బతుకు బతికి మీ కిదేం పాడుబుద్ధొదినా? మీ  కొడుకుల వల్ల కాకపొతే నాతో చెప్పచ్చుగా?
నాకు ఎనభైయేళ్లు. కొడుకులు నలుగురు డాక్టర్లు, నలుగురు ప్రొఫెసర్లు! ఎనిమిది దేశాల్లో. నాకు నీ దయేం అక్కరలేదు…
ఎందుకు నువ్విలా నానా జాతుల్నీ శ్రార్ధానికి పిలిచేడవడం? ఎంత ధర్మభ్రష్టత్వం? ఈ మాత్రం తద్దినం నేను పెట్టలేనా?
కళ్లు ఎరుపెక్కేయి. ఆవేశం ఆగ్రహమైనప్పుడు ఏకవచనం లోకి దిగడానికి వయసూ వావీ వరసా అడ్డం రాలేదు. ఈవిషయం నలుగురిలోకీ వెళితే ఎంత సిగ్గుచేటు… తను టీవీల్లో, కొడుకులు పెద్ద మీటింగుల్లో ఉపన్యాసాల్లో కుదురుకుంటోంటే…  తనింట్లో వాళ్లకే వైదీకం మీద నమ్మకం లేదని జనానికి తెలిస్తే ఇంకేవైనా ఉందా? సందు చిక్కితే పెద్దింటి పౌరోహిత్యాలు  తన్నుకు పోవడానికి వందమంది రెడీ గా వున్నారు… ఇంట్లో పెట్టిన దేవీ పీఠం గతేంగాను? జాతకాలూ, ప్రశ్నలూ, కుంకం పూజలూ… ఎంతాదాయం?  తన కొడుకుల్నీ, ఇంటిదాన్నీ వెంటనే రమ్మనాలి. ముసలమ్మ తలకెక్కట్లేదు…  వెలుతురుగా వున్న వసారాలోనే కూర్చున్నా చీకటి చీకటి గా అనిపిస్తోంది.
ఫోనందుకున్న వెంటనే పెళ్లాం కొడుకులూ పరిగెత్తుకొచ్చేరు.
ఎవరిది ధర్మభ్రష్టత్వం? కిందటిమాటు తద్దినానికి పంపేవే, వాళ్లేం చేసేరో నాకు తెలీదనుకోకు! డబ్బులెక్కువొస్తున్నాయని, కరణం గారింట్లో తద్దినం భోజనం  చేసొచ్చి మనింట్లో తూతూ మంత్రంగా కానిచ్చేరు! కడుపునిండినవాడికి పెట్టేం ఫలితం?  అవతల వాడ్ని చూడు. నీ కొడుకుల యీడు వాడు. కంకాళం లా వున్నాడు…
వాడేదో నాలుగురాళ్లకాశ పడితే, ఏంటిట? వాళ్ల బావని పంపిస్తాను…
వాడి బావ సంగతెత్తకు. బళ్లో పంతులు గారింట్లో అపరానికి పోయి దానాలకి డబ్బులైపోతే రెండు గంటల కర్మ ఇరవై నిముషాల్లో ముగించేసేడు…
అయితే? అడ్డమైన వాళ్లనా పిలవడం??
అంతెందుకు? మొన్న నీ బామ్మర్ది  కొడుకులేం చేసేరో నీకు తెలీదా? చినకాపింట్లో పెళ్లికి గణపతి పూజ చేయించి సరిపెట్టేరు. కాపుకి తెలీదనేగా? ఇదంతా శిష్టాచారమా?
వొదినా! నువ్విలా చేస్తే పుట్టగతులుండవు, చెప్తున్నాను!
మళ్లీ పుట్టినప్పటి సంగతి దేవుడెరుగు. రైతు ఆ మందు చేలోకి బదులు గొంతులోకి పోసుకొంటే, నీకూ నాకూ ఇప్పుడే గింజలకి గతుండదు. పుట్టగతుల్ట… హు…
 ఆఖరిసారి చెప్తున్నానొదినా! నీ కొడుకులు దేశాంతరాలు పోయేరు. అలగాజనం తో అంటగాగితే .. ముసిల్దానివి. రేపొద్దున్న హరీ మంటే తీసుకుపోవడానిక్కూడా ఆ నలుగురు రారు!
ఎపుడూ చల్లగా వుండే పదిగదుల పాతకాలం రాతి మిద్దైనా ఇపుడతనికి ఉడికి పోతోంది.
పరవాలేదు. నేను పొతేనంటావా, టౌన్లో మెడికల్ కాలేజీలో ఇయ్యమని నా పిల్లలకి చెప్పేను. నీక్కూడా చివరిసారి చెప్తున్నాను. ఆ షావుకారుతో కల్సి మిత్తి మీద మిత్తి కట్టమనీ, శిస్తుగట్టమనీ మీ వతందార్ని పీక్కు తినడం ఆపు. వాడే బొంబాయో, బావో చూసుకుంటే నీ అయిదెకరాలూ నిన్ను పాతిపెట్టడానికి తప్ప ఎందుకూ కొరగావు…
పెద్దమ్మా, మీరిలా కులద్రోహం చేస్తే మా గతేంగాను?
ఇంకా ఊరుకుంటే లాభం లేదని కొడుకందుకున్నాడు.
పొండిరా! గిరాకీ తగ్గితే వేరే పని చేసుకోండి! ఆ వడ్డెరాళ్లు పోలా, ఊళ్లూ పూళ్లూ పట్టి… ఆచారం పేర్నఈ వెర్రిబాగుల్ని వందేళ్లు వెనక్కి తోలకండి…
భ్రష్టుదానా….
గొణుక్కుంటూ గుమ్మం కేసి నడిచేడు. వెనకాలే పెళ్ళాం పిల్లలూ.
తలుపులు దగ్గరగా జరిపి డబ్బు కట్టలుగా పెట్టుకుంటోందావిడ మర్నాటి కార్యం కోసం.
చెరో ముప్ఫై వేలూ సంభావన. వాళ్ల పొలం ఖర్చులకుంటాయి. నలభై వేలు రైతు కొడుక్కి మొదటేడాది డాక్టరీ సామాన్లకి. నాలుగు లక్షలు వాడి కాలేజీ ఫీజు. దరిమిలా పైచదువులకీ ఆస్పటలు పెట్టుకోడానికీ మిగతా ఎఫ్ డీ లు. కుర్రాడు నా దగ్గరుండి చదువు కుంటాడు… వాడి కోసం రాతి గోడకి పెద్దకిటికీ పెట్టడానికి వడ్డెరతన్ని వెతకాలి…

బొరుసు

 

 

-భువన చంద్ర

~

చిత్రం: సృజన్ రాజ్ 

bhuvanachandra (5)“ఈ అమ్మాయి పేరు శ్రావణి. వాళ్ల కాలేజీ నాటకంలో చూసా. అద్భుతం అనుకో..” ప్రసాద్‌తో అన్నాడు మాజేటి.  మాజేటి చాలా సీనియర్ నటుడే కాక చాలా మంది సీనియర్ దర్శకుల దగ్గర అసోసియేట్‌గా కూడా పని చేశాడు. ఎన్ని సినిమాల్లో నటించినా నాటకాల పిచ్చి పోలేదు. అవకాశం దొరికినప్పుడల్లా ఎక్కడ నాటకం జరుగుతుంటే అక్కడికి వెళ్లిపోతాడు. నటీనటుల్లో ‘స్టఫ్’ వుంటే తెలిసిన దర్శకులకి పరిచయం  చేస్తాడు. ఇహ ఆపైన వాళ్ల అదృష్టం.

“అన్ని పాత్రలకీ, నటులకి అడ్వాన్సులిచ్చేశా బాబాయ్.. అడ్రస్ తీసుకుని నీ దగ్గరుంచుకో.. నెక్స్ట్ ఫిలింకి అవకాశం ఏదన్నా వుంటే చూద్దాం.” శ్రావణి వంక ఓ క్షణం చూసి మాజేటితో అన్నాడు ప్రసాద్..

ప్రసాద్ ఓ ట్రెండ్ సెట్టర్. ఓ పర్పస్ కోసం సినిమా తీసేవాళ్ల లిస్టు గనక తయారు చేస్తే అతని పేరు మొదటి మూడు స్థానాల్లో వుంటుంది. అంతేకాదు ఒక్కసారి అతను గనక ‘బడ్జెట్’ చెబితే  ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క పైసా కూడా బడ్జెట్ గీతని దాటనివ్వడు. అలాగే ఇన్ని రోజుల్లో సినిమా పూర్తి చేస్తానని చెప్పి అంతకంటే తక్కువ రోజుల్లోనే సినిమా పూర్తి చేసిన సంఘటనలు ఎన్నో వున్నాయి.

అతనికి పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహమే. భార్య అదో టైపు. అతనికి ఎంత పేరొచ్చినా ఆవిడకేం పట్టదు. ” ఏమిటో పిచ్చి జనాలు.. సినిమా అంటేనే కల్పన. జనాలు సినిమాలంటూ ఎందుకు పడి చస్తారో నాకు అర్ధం కాదు. అయినా మీరు తీసిన ఆ ‘తిరుగుబాటు’ సినిమా నేనూ చూశాగా! ఏవుంది అందులో? ఓ ఆడది మొగుడు చస్తే ముండమొయ్యనని భీష్మించుకుని కూర్చుంటుంది. బొట్టూ, గాజులూ తియ్యనంటుంది. కావాలంటే తాళి తీసిపారేస్తానని తీసి పారేస్తుంది. ఇంటి పేరు కూడా మార్చుకుంటానంటుంది. ఆ పిచ్చి మాటలు విన్న సినిమాలోని కుర్ర పాత్రధారులందరూ వెర్రెత్తినట్లు చప్పట్లు చరుస్తారు. ఏవుందీ నా బొంద.. అంత వెర్రెత్తడానికీ?” ప్రసాద్‌తోనే అన్నది ఆవిడ. కాఫీ తాగుతూ భార్య ‘సినీ సమీక్ష’ విన్న ప్రసాదుకి పొలమారింది. ఏం చెబుతాడూ? ఆకాశంలోకి చూసి పైవాడికో దండం పెట్టి బయటపడ్డాడు. చిత్రమేమింటంటే ఆ సినిమాకి మూడు ‘నందులూ’, రెండూ ఫిలింఫేర్ అవార్డులూ వచ్చాయి.

ఒక విధంగా ప్రసాదు అదృష్టవంతుడే. తన పనీ, పిల్లల పనీ తప్ప ఆవిడకేమీ పట్టదు. టైంకి తినేసి నిద్రపోతుంది. ఎందుకూ, ఏది అని ఎప్పుడూ అడగదు. అందువల్ల ప్రసాద్ తెల్లవార్లూ పని చేసుకోవడానికి వీలవుతుంది. ప్రసాదూ యీ పద్ధతికి అలవాటు పడిపోయాడు. అతనికి ఆ ‘యావ’ పుట్టినా, ” ఛా..ఛా…. పిల్లలు పుట్టాక యీ వెధవ పనులెందుకూ?” అని అవతలికి తిరిగి పడుకోవడం వల్ల అదేదో పిక్చర్లో అన్నట్టు అతనిలో ‘రసస్పందన’ కూడా ఇంకిపోయింది. ప్రస్తుతం ప్రసాద్ జీవితంలో ‘పని’కి తప్ప మరి దేనికీ స్థానం లేదు.

శ్రావణితో బయటికొచ్చాక అన్నాడు మాజేటి..”అమ్మాయ్ .. సారీ.. ప్రసాద్ అబద్ధం చెప్పడు. అన్ని కేరక్టర్లూ ఫిల్ అయిపోయి వుంటై. అతను తరవాత పిక్చర్‌కి తప్పకుండా కబురు చేస్తాడు. నేనంటే అతనికి అంత గౌరవం. అప్పటిదాకా నువ్వు మీ వూరికి వెళ్లి రావచ్చు” అన్నాడు.

“అలాగే సార్. సాయంత్రమే వెళ్ళిపోతా” అని చెప్పటమే కాదు సాయంత్రమే ‘మెయిల్’ ఎక్కింది శ్రావణి. రావడం అయితే చెన్నై వచ్చింది గానీ ఓ పక్క ఫైనలియర్ ఎగ్జామ్స్ గురించిన టెన్షన్ ఆవిడ బుర్రలో వుండనే వుంది. అదీ మంచిదే. డిగ్రీ చేతికొస్తే ఇంకా బాగుంటుంది. శ్రావణి . BA సినీ నటి అని కార్డ్స్ మీద వేసుకోవచ్చు” అని నవ్వుకుంది. సినిమా క్రేజంటే దాన్నే అంటారు.

కొందరు మొదట్లో చాలా సామాన్యంగా వుంటారు. పర్సనాలిటీలూ అంతే. వాళ్లకు మేకప్ వేసి, కాస్ట్యూమ్స్ తగిలిస్తే మొత్తం మారిపోతుంది. పిచ్చ గ్లామరొస్తుంది.

ఇంకొందరుంటారు. చూడటానికి పిచ్చెక్కించే పర్సనాలిటీ . నిలబెట్టే సౌందర్యమూ కొట్టవచ్చినట్టుంటారు. అంత అందగత్తెలూ కెమెరా ముందు నిలబెడితే ఎంత మేకప్ వేసినా వెలవెలాబోతూనే వుంటారు. సినిమాకి కావలసింది బ్యూటీఫుల్ ఫేస్ కాదు ‘ఫోటోజెనిక్’ ఫేస్.

నాటకం సంగతి వేరు. మనిషికంటే కెమెరా కన్ను చాలా సూక్ష్మమయింది. అందుకే అన్ని లోపాల్నీ ఠక్కున పట్టేస్తుంది. కెమెరా కన్ను ఎంత తీక్షణమైనదంటే దాని కంటికి చిక్కని అంశమే లేదు.. అందమూ లేదు!!

*****

A21‘స్టార్ట్ ఇమ్మీడియట్లీ’ టెలిగ్రాం అందింది. శ్రావణికి పరీక్షలు అయిన మరుసటి రోజునే. ఇచ్చింది మాజేటి. వెంటనే బయలుదేరింది శ్రావణి. శ్రావణి తల్లిదండ్రులు శ్రావణి ఆశయాలకీ, ఆశలకీ ఏనాడూ అడ్డు రారు. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం అది. శ్రావణి చిన్నప్పుడే ఆస్తులన్నీ కరిగి అంతంతమాత్రంగా మిగిలారు. పెంకుటింటి మీద వచ్చే అద్దె ఏపాటిది?? వాళింట్లో వున్నది నారాయణగారనే  హార్మోనిస్టు. ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హార్మోనిస్టు. నాటకాల్లో ‘కీ’బోర్డు ప్రవేశించని కాలంలో. ఇప్పుడు అతని డిమాండ్ తగ్గలేదు. నాటకాలే తగ్గాయి. నాటకాలాడే నటీనటులే కరువయ్యారు. పెళ్లికాని ఆడపిల్లలకి హార్మోనియం నేర్పుతూ రోజులు నెట్టుకొస్తున్న నారాయణ కొన్ని నాటకాలకై చిన్న పిల్ల కావాల్సి వచ్చి ‘శ్రావణి’ తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ఆ పిల్లని స్టేజీ ఎక్కించాడు. అద్భుతంగా చేసింది. దాంతో పదో, పరకో ఇచ్చి పంపేవాళ్లు. అది పులుసు ముక్కలకి సరిపోయినా సరిపోయినట్టేనని శ్రావణి తల్లిదండ్రులు అనుకునేవాళ్లు. అదే కంటిన్యూ అయి, కాలేజీలో కూడా ‘మహా నటి’ అనిపించుకుని శ్రావణి.

“అమ్మాయ్… అదృష్టం తలుపు తట్టడం అంటే దీన్నే అంటారు. ప్రసాద్ సినిమాలొ సెకండ్  హీరోయిన్ వేసే అమ్మాయి కాలు విరిగింది. షూటింగ్ ఎల్లుండినించే ప్రారంభం. స్క్రిప్టు పక్కా రెడీ. అతను నన్ను సలహా అడిగితే నీ పేరు సజెస్ట్ చేశాను. ఆల్ ద బెస్ట్” అన్నాడు మాజేటి  శ్రావణితో. చెన్నై సెంట్రల్‌లో రిసీవ్ చేసుకుంటూ (అప్పుడది మద్రాస్ సెంట్రల్)

శ్రావణిని చూసి చిన్న చిరునవ్వు నవ్వాడు ప్రసాద్. సినిమా ప్రేక్షకులు సినిమాల్ని ఎంతైనా ఎంజాయ్ చెయ్యగలరుగానీ, షూటింగ్ చూడ్డాన్ని మాత్రం ఎంతో సేపు భరించలేరు. కారణం ‘షూటింగ్’ అనేది మరో లోకం. అందులో ఇన్వాల్వ్ అయినవాళ్లకి తప్ప దానిలో వున్న మజా ఏమిటో ఇతరులకు అర్ధం కాదు. మొదటిమూడు రోజులూ ‘షూటింగ్’ ఎలా జరుగుతుందో, పాత్రధారులు కెమెరాముందు ఎలా పాత్రలోకి ఒదిగిపోతారో బాగా గమనించమని ప్రసాద్ శ్రావణికి చెప్పాడు. అంతేగాదు. మిగతా పాత్రధారులందరికీ శ్రావణిని పరిచయం చేసి, ఆమెకి అవసరమైన సలహానివ్వమని కూడా చెప్పాడు. చాలా చిత్రంగా శ్రావణి ఫస్ట్ సీన్ మొదటి టేక్‌లోనే ఓ.కె అయిపోయింది. ఎంత అద్భుతంగా చేసిందంటే ‘కొత్త’ అంటే ఎవరూ నమ్మలేనంతగా.. అప్పుడు చూశాడు ప్రసాద్ శ్రావణిని బాగా పరికించి. షాక్‌తో సైలెంటైపోయాడు.

“శ్రావణి’ని చూస్తున్నకొద్దీ అతనికి ‘ప్రవీణ’ గుర్తొస్తుంది. ప్రవీణని పిచ్చిగా ఆరాధించిన వాళ్లలో ప్రసాద్ ఒకడు. ప్రసాద్ చదివిన కాలేజీలో ప్రవీణ కాలేజ్ బ్యూటీ. కొన్ని నెలలపాటు ప్రవీణ ప్రసాదు నిద్రని కనురెప్పల నించి దొంగిలించింది.

‘అప్పటి’ మధురోహాలు ఇప్పుడు మళ్లీ రెక్కలు విప్పుకున్నాయి శ్రావణిని చూస్తుంటే. నేల మీద పడ్డ విత్తనం వర్ష రుతువులో భూమిని చీల్చుకుని మొలకలా అవతరించినట్టు అప్పుడెప్పుడో మనసు పొరల్లో దాగిపోయిన ప్రేమ ఇపుడు చివురు తొడిగినట్లనిపించింది  ప్రసాద్‌కి.

అయితే శ్రావణికి ఇవేం తెలీదు. రోజురోజుకీ ఆమెకి ప్రసాద్ అంటే గౌరవం పెరుగుతోంది. కారణం అతను చూపే అటెన్షన్. హీరోయిన్ ‘శ్రమా విశ్వాస్’ బెంగాలీది. అయినా ప్రసాద్‌లోని అలజడిని అవలీలగా పసిగట్టింది. అయితే ప్రసాద్ మీద ‘శ్రమ’కి అపారమైన నమ్మకముంది. అతను సున్నితమనస్కుడనీ, చాలా సంస్కారవంతుడనీ సినిమా స్టార్ట్ కాకముందే ఎంక్వయిరీ చేసి తెలుసుకుంది.

శ్రావణిది చిత్రమైన అందం. చూసే కొద్దీ ఆమె అందం చూసేవాళ్ల కళ్లల్లో విరబూస్తూ ఉంటుంది.  ప్రేమలో పడ్డ ప్రతి ప్రేమికుడిలాగే ప్రసాద్ శ్రావణితో ఎక్కువసేపు గడపటం కోసం ఆమె ‘రోల్’ కొద్ది కొద్దిగా పెంచసాగాడు.

ఒక్కోసారి అనుకోనివి జరుగుతుంటాయి. అవి ఇతర్లకి ఎలా వున్నా కొందరికి అపరిమితానందాన్నిస్తాయి. ‘శ్రమా విశ్వాస్’ని పెంచిన అమ్మమ్మ అకస్మాత్తుగా కన్ను మూసింది. శ్రమని కలకత్తా పంపక తప్పలేదు. ఒక్క రోజు ఆమెకి ‘హాలిడే’ ఇవ్వగలిగాడు ప్రసాద్. కలకత్తా వెళ్లాక ఆమెకి జ్వరం వచ్చిందని ఫోన్ వచ్చింది. మూడోరోజున ఆమెకి ‘చికెన్ గున్యా’ అని డాక్టర్లు తేల్చారని వాళ్ల నాన్నగారు ఫోన్ చేసారు. ప్రసాద్ పన్నెండు గంటలు కూర్చుని కథలో ఆమె పాత్రని ‘అర్ధాంతరంగా’ ముగించేలా ప్లాన్ చేసి , మిగతా కథలో శ్రావణి మెయిన్ హీరోయిన్ అయ్యేట్టు మార్చాడు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అతను చెప్పిన డేట్‌కల్లా పిక్చరు పూర్తి చేసే కమిట్‌మెంట్ కలవాడు గాబట్టి.

శ్రావణి తెలివైంది. నవలలూ అవీ తెగ చదివింది. జ్ఞాపకశక్తీ ఎక్కువే. దానితో ప్రసాద్‌కి చిన్న చిన్న సలహాలు ఇచ్చేది. స్క్రిప్టులో ఎవరి జోక్యాన్నీ అతడు అంతకు ముందు ఏనాడూ సహించలేదు. కానీ ఇప్పుడు ఆమె సజెషన్స్‌ని పాజిటివ్‌గానే తీసుకుంటున్నాడు. ఇదీ ఓ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. చిత్రం ఏమంటే యీ విషయాలు అటు ప్రసాద్‌కి, ఇటు శ్రావణికీ తెలీవు.

మాజేటికి తెలిసి, ప్రసాద్‌ని హెచ్చరిద్దామనుకున్నాడుగానీ, ప్రసాద్‌లోగానీ, శ్రావణిలోగానీ ‘మోహం’ కనపడలేదు. అదీగాక అతనికి ప్రసాద్ మీద అపార నమ్మకం. ప్రసాద్ ‘కేరక్టర్’కి విలువిస్తాడని తెలుసు. ఓ పక్క డబ్బింగ్ ఎప్పటికప్పుడు జరుగుతోంది. నైట్ 9 నించి 11 వరకూ ప్రసాదే పర్యవేక్షిస్తున్నాడు. ఆ రోజు శ్రావణి చెప్పాలి. ఆ ప్రక్రియ ఆమెకు కొత్త. ఫస్ట్ డైలాగ్ ఓకే చెయ్యడానికే 20 నిమిషాలు పట్టింది. మనసు మనసే.. వర్కు వర్కే.. ప్రసాద్ చాలా అసహనంగా వున్నాడు. “పోనీ వేరేవాళ్లు చెప్పేటప్పుడు యీ అమ్మాయిని అబ్జర్వు చెయ్యమని చెబుదాం సార్..” మెల్లిగా అన్నాడు సౌండ్ ఇంజనీర్.

“ఇప్పటికే నేను బిహైండ్ ద షెడ్యూల్. ఇలా జరుగుతుందని తెలిస్తే…” బలవంతంగా మాట ఆపేశాడు ప్రసాద్..

‘టాక్‌బాక్’లో వింటున్న శ్రావణికి ‘మిగతా మాట’ అర్ధమైంది. ‘ప్లీజ్ ఒక్క అవకాశం’ అన్నది వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ.

సరే అన్నట్టుగా సౌండ్ ఇంజనీర్ వైపు చూశాడు ప్రసాద్.

ఓడినప్పుడే మనిషికి పట్టుదల పెరిగేది. అవమానంలోంచే మనిషి ఎదుగుతాడు ‘సన్మానం’ దాకా. నేలకి కొట్టిన బంతే ఎత్తుకి ఎగురుతుంది. ‘ఒక్క అవకాశం’ అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఆమె కొత్తది గనక రెండు రోజులు కాల్‌షీట్ (డబ్బింగ్‌కి) వేసుకున్నాడు ప్రసాద్. ఏకబిగిన మూడు గంటల్లోనే ఫస్టాఫ్ మొత్తం పూర్తి చేసింది శ్రావణి. అదీ మామూలు డైలాగులు కాదు. వేరు వేరు సన్నివేశాల్లో వేరు వేరు ఎమోషన్స్‌లో వచ్చే సంభాషణలు. వాయిస్ మాడ్యులేషన్ పర్ఫెక్టుగా వుంటేగానీ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్‌కి అతకదు. అలాంటివి అవలీలగా శ్రావణి పూర్తి చెయ్యడం ప్రసాద్‌కి షాక్ అనిపించింది.

ఎందరో హీరోయిన్లని చూసాడు. ఎంతో సీనియర్ నతీమణి అయినా ఇంత ఫాస్ట్‌గా కావల్సిన మాడ్యులేషన్‌తో చెప్పలేదు.

కొన్ని విషయాలు జస్ట్ జరుగుతాయి. (విషయం అనడం కన్నా సంఘటనలు అనడం కరెక్టు). ఫస్ట్ హాఫ్ లాస్ట్ డైలాగ్ అవగానే ప్రసాద్ ఓ ఉద్వేగంతో శ్రావణి ఉన్న కేబిన్‌లోకి వెళ్లి గట్టిగా హగ్ చేస్కుని “ఐయాం రియల్లీ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ యూ శ్రావణి” అని చాలా ఎమోషనల్‌గా అన్నాడు. అలాగే ఆ కౌగిట్లో ఒదిగిపోయింది శ్రావణి. గడిచింది కొద్ది నిమిషాలైనా కొన్ని గంటలు గడిచినట్లు అనిపించింది. నిద్రకళ్లతో ‘వెయిట్’ చేస్తున్న సౌండ్ ఇంజనీరుకి.

“ప్రేమలో ఏ క్షణాన ఏది చూసి పడ్డావూ?” అని ఏ ప్రేమికుడిని అడిగినా స్పష్టమైన సమాధానం ఇవ్వలేరు. అలాగే శారీరకమైన సంబంధం ఏర్పడటానికి కారణం ఎవరూ   స్పష్టంగా చెప్పలేం. ఒక్కోసారి స్త్రీ కావొచ్చు. ఎక్కువసార్లు పురుషుడు కావొచ్చు. చాలా రేర్‌గా ‘ఇద్దరూ’ కావొచ్చు. ఆనాడు ‘పార్క్ షెరటన్’లో వారిద్దరి కలయికా అంత అరుదైనదే.

ఆమెకి చక్కని భోజనం ఇప్పిద్దామని తీసికెళ్లాడు. టైము ఒంటిగంట దాటింది. అతనికి హోటళ్లో పెద్దగా అలవాటు లేదు. తీరా వెడితే భోజనాలు లేవు. మిడ్‌నైట్ ‘స్నాక్స్’ మాత్రం వున్నాయి. అవి తింటూ “ఇప్పటికిప్పుడు నేలమీదైనా హాయిగా పడుకొవాలని వుంది” అన్నది శ్రావణి.

ఆ తరవాత రూం బుక్ చెయ్యడం, అతనూ ఆ గదిలోనే మంచానికి అవతలి వైపున పడుకోవడం .. ఎవరు ముందు ఇటువైపు తిరిగారో తెలీదుగానీ … ద్వితీయ విఘ్నం లేకుండా రెండో కౌగిలి నిర్విఘ్నంగా అమరింది. ఆ తరవాత కొన్నేళ్లుగా అతనిలో పేరుకుపోయిన ‘జడత్వం’ ఒక్క క్షణంలో పగిలి ముక్కలై ఆమెని సంపూర్తిగా ఆక్రమించింది.

ఆమెకది మొదటి అనుభవం.

అతనికది ‘నిజమైన’ శోభనం.

ఆహార, భయ, నిద్రా, మైధునాలు సర్వజీవ లక్షణాలంటారు. ఇక్కడ ‘భయ’ అంటే భయం కాదు. ‘రక్షణ, స్వీయరక్షణ’ అని అర్ధం. ఈ నాలుగు లక్షణాలు చీమనించి ఏనుగు దాకా,  మనుషులకీ, మృగాలకీ కూడా సమానంగానే వున్నాయి. ఎటొచ్చీ జంతువులకి ‘సీజన్’ అనేది వుంటుంది. మనిషి దాన్ని పట్టించుకోడు. ఏనాడైతే పార్క్ షెరటన్‌లో శారీరకంగా కలిశారో ఆ క్షణం నించే వాళ్లు ఒక్కటైపోయారు.

ప్రేమకీ, శృంగారానికీ వయసు లేదు. వయసులు అడ్డం రావు. ప్రేమలో పడినా, శృంగారపు రుచి తెలిసినా, ‘సిగ్గూ ఎగ్గు’లలోనూ ‘పరువూ ప్రతిష్ట’లతోనూ సంబంధం వుండదు. ప్రేమా, శృంగారం.. యీ రెండూ ఎంత గొప్పవంటే అతి బలహీనుడ్ని కూడా సాహసవంతుడిగా మార్చేస్తాయి. అత్యున్నతుడ్ని కూడా ‘సర్వ సామాన్యుడి’గా మార్చగలవు.

‘చర్చ’ జరిగితే ఎవరెలా స్పందిస్తారో తెలీదు గానీ, మాజేటి మత్రం ఒకే ఒక్క మాటన్నాడు. “నిన్నటిదాకా ప్రసాదు కేవలం బతికాడు. కానీ ఇవాళ నిజంగా జీవిస్తున్నాడు.!! ‘టు హెల్ విత్ ప్రెస్టీజ్” అని.

ఒకటి  నిజం. శరీరాలు దగ్గర కానంతవరకే మర్యాద మర్యాద. గౌరవం గౌరవం అనేవి. ఒక్కటయ్యాక ‘ఫలానా’ అని స్పష్టంగా చెప్పలేని ఓ చనువూ. ఓ ప్రేమతోనో, చనువుతోనో కూడుకున్న అధికారమూ గౌరవం మర్యాద ఉండే చోటుని ఆక్రమిస్తాయి. ఆ చనువు మొదట్లో ఎంత అద్భుతంగానూ, అబ్బురంగానూ వుంటుందంటే, జన్మలో దాన్ని వదులుకోలేనంత.

ఇప్పుడు జరుగుతున్నదదీ అదే. తనకి  తెలీకుండానే శ్రావణి ప్రసాదు హృదయాన్నీ, ఆఖరికి వృత్తిని కూడా ఆక్రమించేసింది.

రీరికార్డింగ్ జరిగే సమయంలో ప్రతి బిట్టూ మ్యూజిక్ డైరెక్టర్ రిహార్సల్‌లో చూపడం, అది చూసిన వెంటనే ప్రసాద్ శ్రావణి వంక చూడటం, శ్రావణి తలాడించగానే ప్రసాద్ ఓకె అనడం మ్యూజీషియన్స్ అందరూ గమనించారు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రసాద్ ఫ్రెండు. శ్రేయోభిలాషి కూడా.

“భయ్యా.. ఏ రిలేషన్ అయినా పెట్టుకో. తప్పు లేదు. అందరూ అన్నీ తెలుసుకునే ఇక్కడికి వస్తారు. లేకపోతే తెలుసుకుంటారు. కానీ ఒక్కటి. నీ వృత్తిని మాత్రం నిర్లక్ష్యం చెయ్యకు. ఇందాకటి టేక్ నువ్వు ఓకే అన్నావు. కానీ జాగ్రత్తగా చూస్తే అది చాలా ‘odd’గా వచ్చింది. కళ్లు ఎప్పుడూ తెరుచుకునే వుండాలి యీ పరిశ్రమలో నిలబడాలంటే” అని హెచ్చరించాడు. అనడమే కాదు ఓకే చేసిన బిట్‌ని మళ్లీ స్క్రీన్ మీద చూపించాడు. అప్పుడు అర్ధమైంది ప్రసాదుకి. తన కాన్సంట్రేషన్ తగ్గిందనీ, శ్రావణి మీదే ఆధారపడుతున్నాననీ.

శ్రావణిని ఇంటికి పంపుతూ అన్నాడు. “శ్రావణి ఈ సినిమా కానీ, నెక్స్ట్ సినిమాకి నిన్ను అన్ని శాఖల్లోనూ ఎక్స్‌పర్ట్‌ని చేస్తాను”.

చిత్ర పరిశ్రమలో జరిగినన్ని విచిత్రాలు ఎక్కడా జరగవు. అఫ్‌కోర్స్.. ఈమధ్య రాజకీయాల్లో కూడా జరుగుతున్నాయనుకోండి.

ప్రసాద్, శ్రావణిల రొమాన్స్ గురించి రూమర్లు(నిజాలే) వ్యాపించిన కొద్దీ సినిమామీద క్రేజ్ పెరగటం మొదలెట్టింది.

“టేబుల్ ప్రాఫిట్ మామూలుగా కాదు. బంపర్‌గా రావడం ఖాయం” అన్నాడు ప్రొడ్యూసర్ మందేస్తూ మాజేటితో. ఆ రొమాన్స్ గురించి అందరికీ ‘లీక్’ చేయించింది కూడా ఆ నిర్మాతగారే.

“అఫ్‌కోర్స్. క్రేజ్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుందనుకోండీ కానీ, ప్రసాద్ లైఫ్ ఏ చిక్కులో పడుతుందా అని భయంగా వుంది!” అన్నాడు మాజేటి.

“ఇదిగో మాజేటి… ఎవడేమయితే మనకెందుకయ్యా? ముందర మనం బాగుండాల. అయినా.. ఎవడి బాగు వాడు చూసుకోవాలి గానీ, మంది బాగు మనకెండుకూ? హాయిగా మందేసుకో.. ముక్కు దాకా తిను. ఆ తరవాత కళ్లారా తొంగో…! ” మాజేటి భుజం తట్టి అన్నాడు నిర్మాత.

నిర్లిప్తంగా నవ్వుకున్నాడు మాజేటి. ప్రసాద్ భార్య సౌజన్య ఎంత నిర్లిప్తురాలో అంత గయ్యాళిదని ఆయనకి తెలుసు.

“ఏంటిటా? ఎవత్తో సెకండ్ హీరోయిన్‌తో శృంగారం వెలగబెడుతున్నావుటా? నువ్వెటు పోయినా, ఎలా పోయినా నీ చావు నీది. కానీ గుర్తుంచుకో.. ఒక్క పైసా దానికి పెట్టావని తెలిస్తే మాత్రం పిల్లల్ని నూతిలోకి తోసేసి నేనూ దూకి చస్తా. చచ్చేముందు నా చావుకి నువ్వేకాక ఆ దగుల్బాజీదీ కూడా కారణమేనని ఇద్దరినీ ఇరికిస్తా” అని ఆల్‌రెడీ సౌజన్య ప్రసాద్‌కి వార్నింగిచ్చిందని మాత్రం మాజేటికి తెలీదు.

ప్రసాద్ కూడా మౌనంతోనే ‘అంగీకారం’ అన్నట్టుగా తలాడించాడు. గుడ్డికంటే మెల్ల బెటర్ కదా. మామూలుగా సెకెండ్ హీరోయిన్‌కిచ్చే రెమ్యూనరేషన్, అదీ ఫస్ట్ సినిమాలో  అంతగా వుండదుగానీ, మెయిన్ హీరోయిన్ ప్లేస్‌లో ఇప్పుడు శ్రావణి వొదిగింది గనక లక్షా వెయ్యి నూట పదహార్లు ఇప్పించాడు ప్రసాద్. శ్రావణి వూహించని అమౌంట్ అది.

చెక్కు అందుకున్న వెంటనే తల్లినీ, తండ్రినీ పిలిపించుకుంది.

“అదేమిటి అమ్మాయీ..ఆ ప్రసాద్‌తోనే పగలంతా షూటింగులో వుంటావు గదా.. మళ్లీ సాయంత్రాలు కూడా ఎందుకొస్తున్నాడు?” ఆరా తెసింది శ్రావణి తల్లి. ఏం చెబుతుందీ..

“అమ్మా.. తియ్యబోయే కొత్త పిక్చరు గురించి డిస్కస్ చేస్తున్నాం. డిస్త్రబెన్శ్ ఉండకూడదని మేడ మీది నా గదిలొ కూర్చుంటున్నాం. అంతే. నువ్వేమీ ఊహాగానాలు చెయ్యమాకు..” మెత్తగా అన్నా స్ట్రిక్టుగా అన్నది శ్రావణి.

కూతురికి సినిమా ‘పాత్ర’ బాగా వంటబట్టిందని తల్లికీ తండ్రికీ అర్ధమైంది. అయినా చేసేదేముందీ? గమనించనట్టుగా కూర్చోవడానికీ లేదు. పోనీ వూరెళ్లి పోదామన్నా అక్కడ వున్న ఇల్లు అద్దెకిచ్చి వచ్చారు. ఒక రోజున పెద్దావిడ మేడ మీదకు వెడుతున్న ప్రసాద్‌ని ఆపి “బాబూ.. ఏమనుకోవద్దు. మేమూ బతికి చెడ్డవాళ్లమే. నా కూతురు ఎంత బుకాయించినా మీ మధ్య వున్న బంధం ఏమిటో మాకు అర్ధమవుతూనే వుంది. ఒక్క చిన్న సహాయం చెయ్యి. చాలు.. నీకు ఆల్రెడీ పెళ్ళయిందనీ, పిల్లలున్నారని తెలిసింది. అందువల్ల నీ భార్యకి విడాకులిచ్చింతరవాతే మా గుమ్మం తొక్కమని అనను. ఏదో, కొద్దో గొప్పో సాంప్రదాయం కలిగినవాళ్లం గనక, గుళ్ళో అయినా నా కూతురి మెడలో మూడు ముళ్ళు వెయ్యి. అదీ కుదరదంటే కనీసం మా కళ్లముందరే దానికో పసుపు తాడు కట్టు. ఇవి చేతులు కావు కాళ్ళు..” అన్నది. అనటమే కాదు సిద్ధంగా పెట్టిన పసుపు తాడు కూడా చేతికిచ్చింది.

పెళ్లికి ప్రేమ పునాది అయితే పెళ్ళి ప్రేమకి సమాధి. ఇది మాత్రం నిజం. నిన్నటిదాకా సినీ నటిగా ప్రసాదు దగ్గర మెలిగిన శ్రావణికిప్పుడు భార్య హోదా రాగానే (ఉత్తుత్తి హోదా అయినా) ఓ రకమైన ‘అధికారం’ ఆమె మనసులో (హక్కు రూపంలో) స్థిరపడింది. అలా అని ప్రసాద్‌ని ప్రేమించడం లేదన్నది కాదు. అప్పటి  ప్రేమ గుండెల్లో పుట్టిన ‘తొలి ప్రేమ’ ఇప్పటి ప్రేమ ‘పొజెసివ్‌నెస్’ తో కూడిన విపరీత ప్రేమ.

శ్రావణి తల్లిదండ్రులు ఇప్పుడు ప్రసాద్‌ని స్వంత అల్లుడిలాగా సగౌరవంగా చూసుకుంటున్నారు. అతనూ అత్తయ్యా, మామగారూ అంటూ చాలా ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు.

‘పిక్చర్’ సూపర్ హిట్టయింది. ఎంత పెద్ద హిట్ అంటే ఇండస్ట్రీ మొత్తం ప్రసాద్ వెంటా, శ్రావణి వెంటా పడేంత. తనకి వచ్చిన ఆఫర్స్‌కి శ్రావణి ఓ కండీషన్ పెట్టింది. ప్రసాద్ డైరెక్షన్లో అయితేనే హీరోయిన్‌గా చేస్తానని. ఇంకేం కావాలీ..

A21

అర్జంటుగా ఓ పది సినిమాలకి ఇద్దరూ ‘సైన్’ చేశారు. పెద్ద హీరోలతో 3 సినిమాలు నెలరోజుల గ్యాప్‌తో మొదలయ్యాయి. ఒక్కొక్కరికీ నెలకి 10 రోజుల కాల్‌షీట్లు.

కారొచ్చింది.. బంగళా వచ్చింది. నగలొచ్చాయి. అన్నిటికీ మించి పేరొచ్చింది. శ్రావణి ఇప్పుడు టాప్ 5 లో ఒక హీరోయిన్.

మరో రెండు వరస హిట్లు. హేట్రిక్ హీరోయిన్ అని బిరుదిచ్చాడు ఓ సీనియర్ జర్నలిస్టు. ఆయన ఆసలు పేరు పాపారావయితే  మిగతా పాత్రికేయులు కాకారావంటారు.  ఊరందరికంటే మొదట పొయ్యి వెలిగించే కాకా హోటల్లాగా, కాకారావు కూడా రేపటి న్యూస్ ఇవ్వాళే గాలం వేసి పట్టగలడు.

“కాకా.. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ ప్రసాద్‌వీ, శ్రావణివీ కాల్‌షీట్లు కావాలి..” ఫుల్‌బాటిల్ ఎదురుగా పెట్టి అన్నాడు సీనియర్ మోస్టు ప్రొడ్యూసర్ దశరధనాయుడు.

“ఓ పనిజెయ్యండి. ప్రసాద్ సొంతింట్లో వుండేటప్పుడు మీ స్టోరీ రైటర్ని పంపండి. ఆ తరవాత కథ తెర మీద చూడండి” ఆత్రంగా సీలు తీసి అన్నాడు కాకారావు.

“సీసాకి సీలూ పిల్లకి శీలం ఎప్పుడో అప్పుడు ఊడక  తప్పదు!” ఒకే గుక్కతో గ్లాసు ఖాళీ చేసి కుళ్ళు జోకు వేశాడు కాకారావు. “అదీ..! డ్రింకు చెయ్యడం అంటే…” మరో పెగ్గు పోశాడు నాయుడు.

రెండు లక్షల డబ్బు చెయ్యలేని పనిని అక్షరాలా ఓ ఫుల్ బాటిల్ క్షణాల్లో చేయించగలుగుతుంది. ప్రసాద్‌కీ, శ్రావణికీ మధ్య రిలేషనేగాక శ్రావణి మొత్తం వివరాల్ని రాబట్టాడు కాకారావు.

శ్రావణి తండ్రితో మెల్లిగా పరిచయం పెంచుకున్నాడు. మెల్లిగా ‘మందు’లోకి దింపాడు. యధాలాపంగా అన్నట్టు “అయ్యా!! మీరేమో గొప్పగా బతికినవాళ్లు. మధ్యలో కాస్త డౌన్ అయినా ఇప్పుడు డబ్బుకీ, గౌరవానికీ, ఆస్థిపాస్తులకీ కొదవలేదు గదా… మీ అమ్మాయేమో ఆ ప్రసాదుగార్ని పట్టుకుని కూర్చున్నారు. ఎంత గొప్ప హీరోయినైనా యీ రోజుల్లో పదేళ్లకి మించి చెయ్యలేదు. ఆ తరవాత  దొరికేవి అమ్మ వేషాలూ, అక్క వేషాలూ. దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనీ, ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలనీ పెద్దలు ఊరికే అన్నారా? డిమాండున్నప్పుడే నాలుగు కాసులు కూడబెట్టుకోవాలి. పెద్ద హీరోలూ, పెద్ద బేనర్లూ వచ్చినప్పుడు గిరి గీసుకుని కూర్చోకూడదు. ఆపైన మీ ఇష్టం!!” అన్నాడు కాకారావు. లోఫల్నించి అటు శ్రావణి వాళ్ల అమ్మా, శ్రావణీ కూడా వింటున్నారని తెలిసే!!

“ఇలాంటి చెత్త కథని డైరెక్టు చెయ్యను పొమ్మన్నాడటయ్యా ఆ ప్రసాదు. వాడికి అన్నీ లాజిక్కులూ, రియాలిటీలూ కావాల్ట. టాప్ హీరో సినిమాకి లాజిక్కెందుకూ? అయినా నా బేనర్‌లో చెయ్యాలంటే పెట్టి పుట్టుండాలి. చా.. రైటర్ని ఆ వెధవ దగ్గరికి పంపి ఇడియట్‌నయ్యాను..” కోపంగా అన్నాడు దశరధ నాయుడూ.

“అయ్యా.. మీ రైటర్ కోటేశ్వరరావుకి కథలు బాగా వండటం తప్ప చెప్పడం సరిగ్గా రాదని నాకు తెలియబట్టే ప్రసాదు దగ్గరికి పంపమన్నాను. ఇప్పుడు, అంటే.. ఇప్పటికిప్పుడు మీరూ, కోటేషూ, మీ అసిస్టెంటు డైరెక్టరు సంజీవీ హీరోయిన్ శ్రావణిగారి దగ్గరికి వెళ్లండి. సంజీవి చేత కథ చెప్పించండి. ఆ తరవాత ఏం జరుగుతుందో మీరే చెబ్దురు గాని..” అన్నాడు కాకారావు.

******

“పది లక్షలమ్మా.. నా బేనర్‌లో ఇంత డబ్బివ్వడం ఇదే ఫస్ట్ టైం. ఏ హీరోయినైనా నా పిక్చర్‌లో యాక్ట్ చేస్తే చాలనుకుంటూంది. ఎనీవే..  యూ ఆర్ ద ఫస్ట్ హీరోయిన్ టు టేక్ అవే టెన్ లాక్స్!” అంటూ చెక్కు చేతికిచ్చాడు దశరథనాయుడు.

“థాంక్యూ సార్! ఆనందంగా పాదాలు టచ్ చేసి అన్నది శ్రావణి. ఆవిడా విన్నది. దశరధనాయుడు గొప్ప ప్రొడ్యూసర్, ఇచ్చేది కొద్ది మొత్తమే అయినా ఠంచనుగా ఇస్తాడనీ, హీరోయిన్‌కి ఎక్స్‌పోజర్ అద్భుతంగా ఇస్తాడనీ.

*****

“నేను వద్దన్న సినిమాని నువ్వెలా వొప్పుకున్నావ్ శ్రావణీ…!”చిరాగ్గా అన్నాడు ప్ర సాద్.

“అది కాదు ప్రసాద్ … డైరెక్టర్‌కి ఏజ్ పెరిగేకొద్దీ క్రేజ్ పెరుగుతుంది. హీరోయిన్‌గా నా విషయం అలా కాదే! అయినా డైరెక్టరుగా నువ్వే  వుండాలనే షరతు మీదే అంగీకరించాగా…!: ఓ మాదిరిగా నచ్చచెబుతున్నట్టంది శ్రావణి..

*****

“ఏమిటమ్మా.. యీ ఇంట్లో.. ‘చెయ్యనుపో’ అన్నవాడు ఆ యింట్లో ‘OK.. చేస్తా’  అని ఎలా అన్నాడూ? అంటే ఆవిడ కథ విని OK అంటేగానీ మీ ఆయన సినిమా తియ్యడా?” కోపంగా అన్నాడు కోటేశ్వరరావు. తన కథని అసిస్టెంటుగాడితో చెప్పించడం అతనికి అవమానంగా తోచింది. అంతే కాదు. ప్రసాదు కూడా సంజీవితోనే ఎక్కువగా ‘డిస్కస్’ చేస్తున్నాడుగానీ తనతో కాదని బాధ.

“నిజమా?? అక్కడిదాకా వచ్చిందీ? దాన్ని చెప్పుచ్చుకు కొట్టకపొతే నా పేరు సౌజన్య కాదు.” రౌద్రంగా  లేచింది సౌజన్య. భయపడ్డాడు కోటేష్. “అమ్మా… నా పేరు మాత్రం బైటికి రానీకు. ఏదో కథలు చెపుకు బతికేవాడ్ని..!” అంటూ బతిమాలాడాడు. “రానీను లేవయ్యా. ముందు వాళ్లెక్కడున్నారో చెప్పు…” ఇంటికి తాళమేస్తూ అడిగింది సౌజన్య.

 

*****

“లాబ్‌లో హీరోయిన్ని చెప్పుతో కొట్టిన దర్శకుని భార్య… ఏడుస్తూ హీరోయిన్ నిష్క్రమణ” అదీ సాయంత్రపు పేపర్లోని హెడ్‌లైన్స్. (చెన్నైలో ఇప్పటికీ యీవెనింగ్ ఎడిషన్లు వున్నాయి). ఏ స్టూడియోలో విన్నా ఇదే కబురు. అడ్డొచ్చిన ప్రసాద్‌కి కూడా చెప్పు దెబ్బలు బాగా తగిలాయనే మరో వార్త కూడా గుప్పుమంది.

ప్రసాద్ విడాకుల కోసం అప్లై చేశాడని మరుసటి రోజున ప్రచారం జరిగింది.

*****

 

‘హిట్’ అవగానే అడ్వాన్సులు ఇచ్చేవాళ్లందరూ చివరిదాకా నిలబడరు. దశరధనాయుడుగారి సినిమా పెద్ద హిట్టు. కారణం హీరోయిన్ కేరక్టర్‌ని,  హీరోని ప్రేమించిన మరో ఫీమేల్ కేరక్టర్ చెప్పుతో కొడుతుంది. దాన్ని జనాలు ‘రియల్’ సీన్‌గా పరిగణించి అత్యుత్సాహంగా చూశారు. ప్రసాద్‌కి జ్వరం వచ్చి ఓ రోజు షూటింగ్‌కి రాకపోతే, శ్రావణి డూప్‌ని సైడ్‌నించి చూపిస్తూ అసిస్టెంట్ (సినిమా అసోసియేట్) డైరెక్టర్ సంజీవి ఆ షాట్ తీశాడు. ఇది సెన్సార్ కాపీ చూపినప్పుడు మాత్రమే ఆడ్ చెయ్యబడిందని ప్రసాదుకీ, శ్రావణికి కూడా తెలీదు. రిలీజయ్యాక చేసేదేం లేదని వాళ్లకీ తెలుసు.

*****

“ఇంతకీ తప్పెవరిది?” అడిగాడు సూర్యంగారు ఆంధ్ర క్లబ్‌లో. నేనూ కుతూహలంగా వింటున్నా. మాజేటి ఏం చెపుతాడో అని. “అయ్యా ప్రొఫెషనల్‌కీ, పర్సనల్‌కీ లింకు పెట్టకూడదు. శ్రావణి తెలివైందే. కాదనను. కానీ, కథ వినడం దగ్గర్నించీ, కేస్టింగ్ విషయం వరకూ ఆవిడే నిర్ణయించడం ఎంత సబబూ? ఆవిడ మీద ప్రేమతో వచ్చిన పేరునంతా పోగొట్టుకోవడం ప్రసాదు తప్పు.

ఒక్క మాట చెప్పనా? సక్సెస్‌ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఎంత గొప్పవాడైనా సక్సెస్‌ని హేండిల్ చెయ్యాలంటే చాలా కష్టపడక తప్పదు. ఓడలు బళ్లూ – బళ్లు ఓడల్లా మారడం ఎలానో ఇక్కడ బొమ్మలు బొరుసులుగా, బొరుసులు బొమ్మలుగా మారడమూ అంతే సహజం.

ద లాస్ ఆఫ్ ప్రసాద్ యీజ్ ద గెయిన్ ఆఫ్ సంజీవి..” అంటూ గ్లాసు పూర్తి చేశాడు మాజేటి.

ప్రసాద్ ఇప్పుడు లేడు. హార్ట్ ఎటాక్‌తో పోయాడు. అయినా చివరి రోజుల్లో సంపాదన బాగానే ఉంది గనక భార్యా,పిల్లలు బాగానే వున్నారు.

శ్రావణి కొంత కాలం అక్క వేషాలూ, ప్రత్యేక వేషాలు వేసింది. ఒంటరిగా  ఉన్నా తల్లిదండ్రుల్ని పెద్దగా పట్టించుకోలేదని జనం అంటారు. నిజం ‘ఆవిడకీ, దేవుడికే’ తెలియాలి.

 

*

 

 

గ్రీకు పెళ్లి కూతురు అన్వేషణలో…

స్లీమన్ కథ-15     

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ప్రముఖులకు, హోదాలో ఉన్నవారికి ఇచ్చే పురస్కారాలు స్లీమన్ కు ఎంతో విలువైనవిగా కనిపిస్తూ వచ్చాయి. అతనికీ బిరుదులు, సత్కారాల యావ పట్టుకుంది. తనను ఎవరైనా “హెర్ డాక్టర్” అని సంబోధిస్తేచాలు, అంతకన్నా తను కోరుకునేదేమీ ఉండదనుకున్నాడు. తను పారిస్ లో మకాం పెట్టి, సర్బాన్ యూనివర్సిటీలో చేరడానికి డాక్టరేట్ తెచ్చుకోవాలన్న తపన కూడా ఒక ప్రధాన కారణం. అయితే దురదృష్టవశాత్తూ, సర్బాన్ యూనివర్శిటీ నిబంధనల ప్రకారం అతను అతిథి విద్యార్థే తప్ప నిత్యవిద్యార్థి కాడు. కనుక, ఆ యూనివర్సిటీనుంచి డాక్టరేట్ పొందే అవకాశం లేదు. దాంతో యూనివర్సిటీ ఆఫ్ రాష్టాక్ కు దరఖాస్తు చేసుకున్నాడు. ఏ విషయం మీద సిద్ధాంతవ్యాసం సమర్పిస్తారని ఆ యూనివర్సిటీ అడిగినప్పుడు, తన జీవితకథనే ప్రాచీన గ్రీకుభాషలో రాసి సమర్పిస్తానని చెప్పాడు. విచిత్రం!-విశ్వవిద్యాలయాల చరిత్రలోనే అపూర్వం, అసాధారణం అయిన ఈ ప్రతిపాదనను ఆ యూనివర్సిటీ ఆమోదించింది.  ఆవిధంగా స్లీమన్ సొంతకథను రాసి డాక్టరేట్ తెచ్చుకున్నాడు. తన పేరుకు ముందు ఎవరైనా ‘డాక్టర్’ తగిలించకపోయినా, తనను ‘డాక్టర్ స్లీమన్’ అని సంబోధించకపోయినా  చాలా బాధ పడేవాడు.

పారిస్ లోని తన అపార్ట్ మెంట్ లో ఒంటరిగా ఉంటూ పురావస్తు విషయాల రచనతోనూ, ఆత్మకథా రచనతోనూ నవంబర్, డిసెంబర్ మాసాలు గడిపాడు. ఆ తర్వాత ట్రాయ్ తవ్వకాల వ్యవహారం అతని బుర్రను మళ్ళీ తొలవడం ప్రారంభించింది. అసలు పురావస్తు తవ్వకాల గురించి తనకు ఎంత తెలుసు? ఎక్కడ, ఎలా ప్రారంభించాలి? ఎంతమంది పనివాళ్లను పెట్టుకోవాలి? ఎంత ఖర్చవుతుంది? బందిపోట్ల బెడదను ఎలా ఎదుర్కోవాలి? చివరికి…తవ్వకాలు జరిపేటప్పుడు ఎలాంటి టోపీ ధరించాలి?-ఇలా అనేక ప్రశ్నలు, సందేహాలు అతని ముందు వేళ్లాడాయి.

ఓ పందొమ్మిది ప్రశ్నలను దండగుచ్చుతూ, వెంటనే సమాధానం రాయమని అర్థిస్తూ 1868, డిసెంబర్ చివరిలో ఫ్రాంక్ కల్వర్ట్ కు ఉత్తరం రాశాడు:

  1. పని ప్రారంభించడానికి ఏది అనువైన సమయం?
  2. వసంతంరాగానే వీలైనంత త్వరగా ప్రారంభించడం మంచిదా?
  3. నాకు తరచు జ్వరం వస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలో వసంతకాలంలో జ్వరాలు వచ్చే అవకాశం ఉందా?
  4. నాతో ఏయే మందులు పట్టుకెళ్లాలి?
  5. ఇక్కడినుంచే ఓ నౌకరును తీసుకుని వెళ్లనా? లేక ఎథెన్స్ లోనే నమ్మకస్తుడు ఎవరైనా దొరుకుతాడా? టర్కిష్ మాట్లాడగలిగే నమ్మకస్తుడైన గ్రీకు అయితే మంచిదనుకుంటాను.
  6. ట్రాయ్ ప్రాంతంలోని అన్ని ఇళ్ళలో పురుగూపుట్రా ఎక్కువ కనుక, మార్సే (Marseille: ఫ్రాన్స్ లోని ఒక పురాతన రేవు పట్టణం)నుంచే ఓ గుడారాన్ని, ఇనపమంచాన్ని, దిండును తీసుకెళ్ళమంటారా?
  7. నాతో ఏయే పరికరాలు, అత్యవసరాలు పట్టుకుని వెళ్ళాలో దయచేసి వివరంగా రాయగలరు.
  8. పిస్టల్స్, బాకు, రైఫిల్ దగ్గరుంచుకోవాలా?
  9. కొండమీద తవ్వకాలు జరపడానికి ఆ స్థలయజమానులు అభ్యంతరం చెబుతారా?
  10. అవసరమైనంతమంది పనివాళ్లు దొరుకుతారా? వాళ్ళను ఎక్కడినుంచి తెచ్చుకోవాలి, ఎంత కూలి ఇవ్వాలి?
  11. ఎంతమందిని తీసుకోవాలి? గ్రీకులో, టర్కులో అయితే మంచిదా?
  12. ఆ కొండను తవ్వడానికి ఎంత సమయం పట్టచ్చని మీరు అనుకుంటున్నారు?
  13. ఎంత ఖర్చవుతుంది?
  14. మొదట ఓ సొరంగాన్ని తవ్వమని మీరు సూచించారు. అదంత ఆచరణయోగ్యం కాదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అక్కడ పురాతన ఆలయాలు, ఇతర కట్టడాల శిథిలాలు ఉంటే అవి దెబ్బతినే ప్రమాదముంది.
  15. ఆ కొండ సహజంగా ఏర్పడింది కాదనీ, కృత్రిమమైనదనీ మీరు ఎలా నిర్ధారణకు వచ్చారు?
  16. ఆ కొండ విస్తీర్ణం 700 చదరపు అడుగులు ఉంటుందని మీరు సూచించారు. ఫ్రెంచివాళ్ళ లెక్క ప్రకారం అది 26.5 అడుగుల పొడవూ, అంతే వెడల్పూ అవుతుంది. మీ ఉద్దేశం, 700 అడుగుల పొడవూ, అంతే వెడల్పూ ఉంటుందని చెప్పడం అనుకుంటున్నాను. ఫ్రెంచి లెక్కలో అప్పుడది 4,90,000 చదరపు అడుగులు అవుతుంది. కానీ నా పుస్తకంలో దాని పొడవు, వెడల్పులు 233 మీటర్లని రాశాను. అప్పుడది 54,000 చదరపు మీటర్లు అవుతుంది.
  17. ఆ కొండ మీద ఎంత ఎత్తున తవ్వాలి?
  18. కాన్ స్టాంట్ నోపిల్ బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడం మంచిదని నాకు అనిపిస్తోంది. అప్పుడు దర్దనెల్స్ లోని ఆ బ్యాంక్ శాఖ ద్వారా రుణం పొందే వెసులుబాటు నాకు ఉంటుంది.
  19. మండుటెండలో పని చేసేటప్పుడు ఎటువంటి టోపీ పెట్టుకుంటే మంచిది?

ఫ్రాంక్ కల్వర్ట్ వెంటనే ఎంతో ఓర్పుతో సమాధానం రాశాడు.  మెత్తని చురకలు వేస్తూనే జాగ్రత్తలు చెప్పాడు. ఆయన పురాతత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసిన వ్యక్తి. నినవా(ప్రాచీన మెసొపొటేమియా నగరం. అసీరియన్ల రాజధాని. నేటి ఇరాక్ లో టైగ్రిస్ నది తూర్పుతీరంలో ఉంది)ను తవ్వి తీసిన ఆస్టెన్ హెన్రీ లయర్డ్(క్రీ.శ 1817-1894)ను విస్తృతంగా చదివినవాడు. కందకాలను ఎలా తవ్వాలో తన ఉత్తరంలో పూస గుచ్చినట్టు స్లీమన్ కు బోధించాడు. వసంతం ప్రారంభానికీ, వేసవికీ మధ్య తవ్వకాలను చేపడితే మంచిదన్నాడు. పనివాళ్లను ఎక్కడినుంచి తెచ్చుకోవాలో, ఎంత కూలి చెల్లించాలో కూడా రాశాడు. హిస్సాలిక్ కొండలో సగభాగం తన ఆస్తి అనీ, అక్కడ తవ్వకాలు జరపడానికి తన అనుమతి తప్పనిసరిగా ఉంటుందనీ మరోసారి గుర్తుచేశాడు. మిగిలిన సగభాగంలో తవ్వకాలు జరపాలనుకుంటే దాని యాజమానులను ఒప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని మాట ఇస్తూ, ఆ విషయంలో పెద్ద ఇబ్బంది ఉండదనే అనుకుంటున్నానన్నాడు.  స్లీమన్ కు ఉన్న తేనీటి వ్యసనం గురించి తనకు తెలుసు కనుక; తేయాకును వెంట తీసుకుని వెడితే మంచిదనీ, అక్కడ కాఫీ, చక్కెర మాత్రం పుష్కలంగా దొరుకుతాయనీ రాశాడు. అవసరమైన సంబారాలన్నీ దర్దనెల్స్ నుంచి తీసుకువెళ్లచ్చన్నాడు. ఆపైన, ఆ ప్రాంతం పొడవు, వెడల్పులకు సంబంధించిన స్లీమన్ లెక్కలను సరిదిద్దాడు. పిస్టల్స్, బాకుల్లాంటి కాల్పనిక ఆయుధాలేవీ అవసరం లేదనీ, తుపాకులు వెంట ఉంటే చాలనీ అన్నాడు. ఇక వసతి విషయానికి వస్తే, సిప్లక్(టర్కీలో ఒక పట్టణం)లో ఇల్లు అద్దెకు తీసుకోమనీ, దానికి వెల్ల వేయిస్తే పురుగూ పుట్రా సమస్య ఉండదనీ సలహా ఇచ్చాడు. చివరిగా, టర్కులు ధరించే తెల్లని మజ్లిన్ తలపాగా మండుటెండ నుంచి తలకు మంచి రక్షణ ఇస్తుందన్నాడు.

కల్వర్ట్ లేఖలోని అంశాలను మననం చేసుకుంటూనే స్లీమన్ ఓసారి చుట్టం చూపుగా జర్మనీ వెళ్ళాడు. తను పచారీ కొట్టు నౌకరుగా పనిచేసిన పస్టెన్ బర్గ్ ను సందర్శించి, డాక్టరేట్ తీసుకోడానికి రాష్టాక్ వెళ్ళాడు. తన పుస్తకం ప్రచురణకర్తల చేతుల్లో ఉంది, ట్రాయ్ తవ్వకాలకు సమయం ఉంది కనుక, విడాకుల పని మీద ఇక ఇండియానాపోలిస్ కు వెళ్ళడమే తరవాయి అనుకుని అమెరికాకు ప్రయాణం కట్టాడు. వెంటనే విడాకులు లభిస్తాయని ఆశించాడు కానీ, తీరా వెళ్ళాక అదంత త్వరగా తెమిలే వ్యవహారంలా కనిపించలేదు. చట్టంలో కొన్ని ముఖ్యమైన సవరణలను సూచించాడు కానీ, చట్టసభ వాటిని తిరస్కరించింది. హోటల్ జీవితంతో విసుగెత్తి ఇండియానాపోలిస్ లోని ఓ సంపన్న ప్రాంతంలో ఇల్లు కొనుక్కున్నాడు. ఇంట్లో ఆఫ్రో-అమెరికన్ పనివాళ్లను, వంటమనిషిని పెట్టుకున్నాడు. అయిదుగురు న్యాయవాదులను నియమించుకున్నాడు. తన విడాకుల కేసును తనే వాదించుకుంటున్నాడా అన్నట్టుగా అందులో పూర్తిగా కూరుకుపోయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన పరిచితులైన న్యాయనిపుణులకు సుదీర్ఘమైన ఉత్తరాలు రాశాడు.  జూన్ లోగా విడాకులు పొందే అవకాశం కనిపించడం లేదనీ, ట్రాయ్ తవ్వకాలను వచ్చే వసంతానికి వాయిదా వేయవలసిరావచ్చనీ ఏప్రిల్ 14న కల్వర్ట్ కు ఉత్తరం రాశాడు.

అవే రోజుల్లో అతనోసారి న్యూయార్క్ లో స్ట్రీట్ కార్ లో ప్రయాణం చేస్తుండగా, ఓ ఎనిమిదేళ్ళ కుర్రాడు పుస్తకాలు అమ్ముతూ కనిపించాడు. “రెండు సెంట్లకు ఒక పుస్తకం” అని అరుస్తూ, ప్రయాణికుల చేతుల్లో పుస్తకాలు పెట్టాడు.  “అయిదు సెంట్లకు మూడు పుస్తకాలు” అని వాళ్ళ చెవిలో చెబుతున్నట్టు చెప్పి, ఆ తర్వాత అందరినుంచీ పుస్తకాలో, డబ్బులో వసూలు చేసుకున్నాడు. స్లీమన్ కు ముచ్చటేసి ఆ కుర్రాడి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఏడాది క్రితం తండ్రి చనిపోయాడనీ, తల్లి జబ్బుమనిషి అనీ, తాము ఆరుగురు సంతానమనీ, కుటుంబానికి సాయంగా తనిలా పుస్తకాలు అమ్ముతున్నాననీ అతను చెప్పాడు. అయ్యో అనుకున్న స్లీమన్ అతని చేతిలో ఓ డాలర్ ఉంచబోతే, తిరస్కరించాడు. “నా దగ్గర మీరు అరవై పుస్తకాలు తీసుకుంటేనే మీ డబ్బు తీసుకుంటాను. నేను వ్యాపారిని, బిచ్చగాణ్ణి కాదు” అన్నాడు పౌరుషంగా. ముగ్ధుడైపోయిన స్లీమన్ అతనికి డాలరిచ్చి అరవై పుస్తకాలు తీసుకున్నాడు. ఆ తర్వాత, “రేపు నీకు పట్టబోయే అదృష్టానికి ఈ డాలరే పెట్టుబడి కావాలని ఆశిస్తున్నాను. నువ్వు ఏదో ఒక రోజున గొప్ప ధనవంతుడివి కావాలనీ; నీలాంటి ఉత్తమపౌరుల కారణంగా ఆత్మగౌరవంతోనూ, వైభవంతోనూ వెలిగిపోయే ఈ ఘనతవహించిన దేశం, చరిత్రలోని మహోజ్వల సామ్రాజ్యాలను అన్నింటినీ మించిపోవాలనీ కోరుకుంటున్నాను” అంటూ చిన్న ఉపన్యాసం ఇచ్చాడు.

స్లీమన్ తనదైన పద్ధతిలో ఇండియానాపోలిస్ లో బిజీ అయిపోయాడు. అతని పిండి పదార్థాల ఫ్యాక్టరీ బాగా నడుస్తోంది. ఎప్పటిలా మనీ మార్కెట్ ను అధ్యయనం చేస్తున్నాడు. బ్రదర్స్ ష్రోడర్స్ కు సుదీర్ఘమైన వ్యాపార నివేదికలు పంపిస్తున్నాడు. తన అరబ్బీ పరిజ్ఞానానికి మెరుగులు దిద్దుకుంటున్నాడు.The Arabian Nights Entertainment  పై చిన్న పుస్తకం రాశాడు. ‘వివిధ భాషలను త్వరగా నేర్చుకోవడం ఎలా?’ అన్న అంశం మీద ఒక పెద్ద వ్యాసం రాసి పకిప్సీ(న్యూయార్క్ రాష్ట్రంలోని ఒక నగరం)లో జరుగుతున్న అమెరికా భాషాశాస్త్రవేత్తల సదస్సుకు పంపించాడు. ట్రాయ్ ను తాత్కాలికంగా పక్కన పెట్టేశాడు. నార్త్-వెస్ట్ పాసేజ్(ఉత్తర అట్లాంటిక్ ను ఆర్కిటిక్ సముద్రం మీదుగా పసిఫిక్ తో కలిపే మార్గం) మీదా, ఉత్తర ధృవాన్ని కనుగొనడం మీదా ఉత్సుకతను రంగరిస్తూ వరసపెట్టి ఉత్తరాలు రాయడం ప్రారంభించాడు. వీటి అన్వేషకులకు ఆర్థికసాయం చేయడానికి కూడా ముందుకొచ్చాడు. ఇవన్నీ అలా ఉండగా, విడాకుల కేసు నానుతూ ఉండగానే, ఎకతెరీనా స్థానంలో కొత్త వధువు కోసం తనూ అన్వేషణ మొదలుపెట్టాడు. అది కూడా అసాధారణ రీతిలో!

గ్రీకు అమ్మాయిని చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. గ్రీకు భాషలోని శ్రావ్యత అతన్ని కట్టి పడేయడమే కాకుండా, ఆడవాళ్ళు మాట్లాడితే అది మరింత శ్రావ్యంగా అనిపించింది. అయితే గ్రీకు వధువును ఎలా వెతికి పట్టుకోవాలనేది ప్రశ్న.  స్వయంగా గ్రీస్ కు వెళ్ళి, క్షుణ్ణంగా గాలించి యోగ్యమైన వధువును గుర్తించడం ఒక మార్గం. అంతలో, అంతకన్నా తేలిక మార్గం అతనికి తట్టింది. ఫిబ్రవరిలో అతని గ్రీకుయాత్రా గ్రంథం తాలూకు బౌండ్ చేయని ప్రతులు కొన్ని అందాయి. రెండు ప్రతులను తన మిత్రుడు థియోక్లిటస్ విమ్పోస్ కు పంపిస్తూ, అందులో ఒకటి అతన్ని తీసుకోమనీ, రెండోది ఎథెన్స్ యూనివర్సిటీ గ్రంథాలయానికి ఇవ్వమనీ కోరాడు. వాటిని బైండ్ చేయడానికి అయ్యే ఖర్చు కోసం 100 ఫ్రాంకులకు చెక్కును జతపరిచాడు. అందులో ఏమైనా మిగిలితే ఎథెన్స్ లోని బీదలకు వెచ్చించమని కోరాడు.

ఆ తర్వాత హఠాత్తుగా విషయానికి వచ్చాడు. దయచేసి ఒక గ్రీకు అమ్మాయి ఫోటో పంపగలరా అని అడిగాడు. ఆమె ఎవరైనా సరే, అందగత్తె అయితే చాలన్నాడు. ఫొటో స్టూడియోల అద్దాలపై ప్రదర్శించే ఫోటోలైతే మంచిదనీ, అప్పుడామె ఏ ఫ్రెంచ్ యువతో అయే ప్రమాదం తప్పుతుందనీ, ఫ్రెచ్ యువతులు ప్రమాదకారులన్న సంగతి అందరికీ తెలిసిందేననీ అన్నాడు. మొదట తటపటాయిస్తూనే ఈ విషయం ఎత్తుకున్నాడు కానీ, పోను పోను ధైర్యం చిక్కి తన మనసులోని అసలు కోరికను బయటపెట్టాడు. దయచేసి విమ్పోస్ స్వయంగా తనకు ఓ గ్రీకు వధువును చూసి పెట్టాలన్నదే ఆ కోరిక. ఆమెకు ఉండాల్సిన అర్హతల విషయానికి వస్తే, ఆమె అందగత్తే కాక, పేద కుటుంబానికి చెందినదై ఉండాలి. నల్లని జుట్టు, మంచి చదువు, ప్రేమించగల హృదయంతో పాటు; హోమర్ మీద ఆసక్తి కలిగినదై ఉండాలి. విమ్పోస్ సోదరి అయితే అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఆమెకు పెళ్లైపోయింది. బహుశా ఓ అనాథనో, ఒక పండితుని కుమార్తెనో, ఎవరింట్లో నైనా పిల్లలకు చదువు చెబుతూ నాలుగు రాళ్ళు తెచ్చుకుంటున్న అమ్మాయినో గుర్తించడం కష్టం కాకపోవచ్చు. చివరగా, మనసు విప్పి మాట్లాడడానికి ప్రపంచంలో మీరు తప్ప నాకు ఇంకెవరున్నారంటూ, ఎథెన్స్ లోని పేదల కోసమని చెప్పి మరో 100 ఫ్రాంకులకు చెక్కు జోడించాడు.

ఆ ఉత్తరానికి విమ్పోస్ కోపగించలేదు. వెంటనే ఎథెన్స్ కు వెళ్ళి ఫొటోలు సేకరించి స్లీమన్ కు పంపించాడు. వాటిలో ఒక ఫొటో స్లీమన్ ను ఆకట్టుకుంది. ఆమె పేరు సోఫియా ఎంగస్త్రోమెనస్. నల్లని జుట్టు, లేతగా ఉన్న కోలముఖం, పెద్ద కళ్ళు, దట్టమైన, ఒంపు తిరిగిన కనుబొమలు… అసాధారణమైన అందం ఉట్టిపడుతోంది. ఆ ముఖంలో గాంభీర్యం ఉంది కానీ, చిన్నపిల్లల తరహా చిరునవ్వుతో అది చటుక్కున కాంతిమంతమయ్యే చిన్నెలూ తొంగి చూస్తున్నాయి. స్లీమన్ ఆ ఫొటోకు పన్నెండు కాపీలు తయారు చేయించి ఒక కాపీని వెంటనే తండ్రికి పంపిస్తూ, దానికి ఒక ఉత్తరం జతపరిచాడు. ఈ ఫొటోలోని అమ్మాయి నీకు నచ్చుతుందనుకుంటున్నాననీ; అయితే, ఆమెలో చదువుసంధ్యలపట్ల ఉత్సాహం కనిపించకపోతే పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాననీ అందులో రాశాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జులై లో తను ఎథెన్స్ కు వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకుని జర్మనీకి తీసుకోస్తానని అన్నాడు.

కానీ విడాకుల కేసు ముందుకు సాగకపోవడంతో అతను జులైలో ఎథెన్స్ కు వెళ్లలేకపోయాడు. కాకపోతే, కేసు తనకు అనుకూలంగా పరిష్కారం కాదన్న భయం ఇప్పుడతనికి లేదు. మార్చిలో అతనికి అమెరికా పౌరసత్వం లభించింది. విడాకుల పత్రంపై సంతకాలు జరిగే రోజుకోసం ఓపికగా ఎదురుచూడడం మాత్రమే తనిప్పుడు చేయవలసింది. ఎట్టకేలకు జులై చివరిలో అతనికి విడాకులు మంజూరయ్యాయి. వెంటనే న్యూయార్క్ కు వెళ్ళి, అందుబాటులో ఉన్న మొదటి ఓడలో గ్రీస్ కు బయలుదేరాడు.  సోఫియాను పెళ్లి చేసుకునే విషయంలో అప్పటికీ అతను ఒక నిర్ణయానికి రాలేదు. ఓడ లోంచే ఒక మిత్రుడికి ఉత్తరం రాస్తూ, దేవుడు దయదలిస్తే గ్రీస్ లో తనకు వధువు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయనీ, అక్కడి అమ్మాయిలు ఈజిప్టు పిరమిడ్లలా అందంగా ఉంటారనీ అన్నాడు. తనను అలా పిరమిడ్ తో పోల్చడం సోఫియాకు నచ్చే అవకాశం లేదు.

అతను ఆగస్టులో, సెయింట్ మెలిటస్ ఫీస్టు రోజున గ్రీస్ చేరుకున్నాడు. ఎథెన్స్ కు వాయవ్యంగా మైలుదూరంలో కొలొనస్ అనే చిన్నపట్టణంలో ఎంగస్త్రోమెనస్ కుటుంబానికి ఒక తోట ఇల్లు, దానికి దగ్గరలో ఓ చిన్న చర్చి ఉన్నాయి. సెయింట్ మెలిటస్ ఆ చర్చికి పోషకుడు. కొలొనస్- గ్రీకు సంగీత, నాటక కర్త సోఫోక్లీస్ జన్మస్థలం కూడా. ఈడిపస్ అనూహ్యంగా అంతర్ధానమైన చోటు కూడా ఇదేనని చెబుతారు. “మంచు బిందువులతో తడిసి కొలొనస్ తెల్లగా మెరిసిపోతూ ఉంటుందనీ, ద్రాక్షమద్యం రంగులో ఉన్న మొక్కల లోంచి స్వచ్చమైన గొంతుతో నైటింగేళ్ళ పాట వినిపిస్తూ ఉంటుం”దనీ సోఫోక్లీస్ వర్ణిస్తాడు.

థియోక్లిటస్ విమ్పోస్ తో కలసి కొలొనస్ లోని ఆ చర్చి దగ్గరికి స్లీమన్ వెళ్ళేసరికి అక్కడ అనూచానంగా వస్తున్న మెలిటస్ పండుగ జరుగుతోంది. అమ్మాయిలు పూలదండలు తీసుకుని చర్చికి వస్తూ కనిపించారు. ఇంతకన్నా పునీతమైన ప్రాంగణం, పవిత్రమైన రోజు ఉండదనుకుని స్లీమన్ సంతోషించాడు.

సోఫియా ఓ అనాథా కాదు, ఆమెకు ఎవరింట్లోనో పిల్లలకు చదువు చెప్పి నాలుగు రాళ్ళు తెచ్చుకోవలసిన అవసరమూ లేదు, ఆమె కుటుంబం పేదదని చెప్పడానికీ లేదు. ఆమె తండ్రి ఒక వస్త్రవ్యాపారి. ఎథెన్స్ లొ అతనికో దుకాణమూ, ఇల్లూ ఉన్నాయి. మంచి శారీరక దారుఢ్యంతో, గ్రీకుశిల్పంలా ఉన్న అతను స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని పతకం తెచ్చుకున్నాడు. స్లీమన్ వెళ్ళేసరికి సోఫియా చర్చిలోనే ఉంది. ఒక స్టూలు మీద నిలబడి పూలదండలు కడుతోంది. అంతలో “జర్మన్ వచ్చా”డని కేకలు వినిపించాయి. అంత త్వరగా వస్తాడని ఊహించని సోఫియా వెంటనే స్టూలు మీంచి దూకి దుస్తులు మార్చుకోడానికి ఇంట్లోకి పరుగెత్తింది.

(సశేషం)

 

 

 

మహాలక్ష్మి

-రాజ్యలక్ష్మి

~

 

rajyalakshmi“ఈ ఏడాదైనా పిల్ల పెళ్లి చేస్తారా లేదా?  అమ్మమ్మకి కాస్త ఓపిక ఉండగానే ఆ శుభకార్యం కాస్తా అయిందనిపిస్తే బావుంటుంది కదే.  చూసి సంతోషిస్తుంది.  అయినా అదేమైనా చిన్నపిల్లా? ఇరవైనాలుగోయేడు రాలా?” మా అమ్మ నన్ను అడుగుతోంది.   సాయంకాలం వాకిట్లో కూర్చుని సన్నజాజి పూలు మాల కడుతూ మాట్లాడుకుంటున్నాము.  మా అమ్మమ్మ వైపు చూసాను.  “నా కోసం ఎమీ చేయనక్కరలేదు.  చూసి సంతోషిస్తాననుకో. కానీ అది కాదు ముఖ్యం.  పెళ్లంటే హడవుడి పడకుండా మంచీ చెడూ అన్నీ విచారించాలి” అంది మా అమ్మమ్మ.    అదేమిటో మా అమ్మమ్మ ఎప్పుడూ ప్రపంచానికి విరుద్ధంగానే మాట్లాడుతుంది.  ఎవరైనా పెద్దవాళ్లు, వాళ్లు కాస్త ఓపికగా ఉన్నప్పుడే మనవళ్ల, మనవరాళ్ల పెళ్లిళ్లు చూడాలనుకుంటారు.  మా అమ్మమ్మేమో ఇలా!

మా మామయ్య, అత్తయ్య తీర్థయాత్రలకి వెళ్తూ అమ్మమ్మని మా ఇంట్లో దింపారు.  ఎలానూ అమ్మమ్మ ఉన్నన్ని రోజులు సెలవు పెట్టాను కదా అని అమ్మని కూడా వచ్చి ఉండమన్నాను, ఈ పదిరోజులు.  వచ్చిన రెండోరోజే మా అమ్మ మొదలు పెట్టింది, మా అమ్మాయి పెళ్లి గురించి.

ఇంతలో మా అమ్మాయి వచ్చింది.  ఎవరో ఫ్రెండ్ కారులో డ్రాప్ చేసి వెళ్లాడు.  “ఎవరే ఆ వచ్చింది?  ఐనా నీ బండి ఏమైంది?” మా అమ్మ అడిగింది అనుమానంగా.  “ఫ్రెండ్ అమ్మమ్మా, వెహికల్ ప్రోబ్లం ఇస్తే సర్వీసింగ్‌కి ఇచ్చాను” అంది మా అమ్మాయి లోపలికి వెళ్తూ.

ఆడపిల్లల్లు, మగపిల్లలు తేడా లేకుండా దాని ఫ్రెండ్సు ఇంటికి రావడం అలవాటే.  ఎప్పుడైనా అవసరమైంతే, ఎవరైనా ఇలా డ్రాప్ చేయడమూ అలవాటే. కానీ దాని మొహంలో వెలుగు, పెదవులమీద చిరునవ్వు చూస్తుంటే అంతకన్నా ఎక్కువే అనిపించింది. “ఇదివరకు ఎప్పుడూ చూడలేదే?” అన్నాను దానికి కాఫీ ఇస్తూ.  నాలోని అమ్మ ప్రోబింగ్  మొదలుపెట్టింది.

అది కూడా ఈ అవకాశం కోసమే చూస్తున్నట్టుంది, ఎక్కువ బెట్టు చేయకుండా “అభిరాం అమ్మా.  చార్టెడ్ ఎకౌంటెంట్, ఓన్ ఫర్మ్ ఉంది.  వాళ్ల నాన్నగారు కూడా చార్టెడ్ ఎకౌంటెంటే” అంది తలవంచుకుని.  అర్థమైపోయింది. ఆడపిల్ల అంతకన్నా ఏం చెప్తుంది?  ఎంత చదువుకున్నా ఆడపిల్లలకి, మగపిల్లలకి కూడా పెళ్లి అనేటప్పటికి ఈ డెలికసి తప్పదేమో!

“మనవాళ్లేనా” అంది మా అమ్మ ఆత్రంగా.  “ఆ, మనవాళ్లే.  ఐనా కాకపోతే పనికిరారా? ఏం తాతమ్మా?” అడిగింది మా అమ్మాయి.  మా అమ్మ మొహంలో పెద్ద రిలీఫ్!  నాక్కూడా!

అబ్బాయి బాగానే ఉన్నాడు.  చదువు, ఫామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా బావుంది. కారు కూడా మెయిన్‌టైన్ చేస్తున్నట్టున్నాడు.  పైగా మనవాళ్లే!  అమ్మలోని మరో కోణం కాలిక్యులేట్  చేస్తోంది.

“ఎందుకు పనికిరారూ! ఈ రోజుల్లో అందరూ పనికి వస్తారు. మీకేమైనా సంధ్యావందనాలా? దేవతార్చనలా?  మంచివాళ్లైతే చాలు”  అంది మా అమ్మమ్మ.   తొంభైయేళ్ల మా అమ్మమ్మంత  మోడ్రన్‌గా నేనెప్పుడు ఆలోచించగలుగుతానో!  ఆలోచనలు ఇలా ఉంటాయి, మళ్లీ కాసాపోసి చీర కట్టుకుంటుంది.  రెండు పూట్లా మడితోనే భోజనం చేస్తుంది.

“నువ్వు డాక్టరువి కదే, నీకెట్లా పరిచయం?” అడిగాను.  మళ్లీ ప్రోబింగ్.

“రెండేళ్లక్రితం నేను హౌస్‌సర్జన్ చేసే రోజుల్లో అభిరాం చెల్లెలు శ్రావణి మీద ఆసిడ్ అటాక్ జరిగింది.  మా హాస్పిటల్‌లోనే ట్రేట్‌మెంట్ జరిగింది. అప్పుడు అభిరాం ఆ సిట్యుయేషన్‌ని హాండిల్ చేసిన విధానం నాకు నచ్చింది. అలా పరిచయం.”  ఒక్కసారి ఒళ్లు జలదరించింది.  ఈమధ్య ఆడపిల్లల మీద అత్యాచారాలు మరీ ఎక్కువ అయిపోయాయి. బయటకి వెళ్తే తిరిగి వచ్చేవరకూ భయమే.  సతీ సహగమనం, కన్యాశుల్కం, వరకట్నం, …  ఇప్పుడు ఈ అత్యాచారాలు!  భగవంతుడా! ఆడపిల్లలను రక్షించు తండ్రీ!

“మీ ఆసుపత్రిలో ఎందుకు చేరింది?” మా అమ్మమ్మకి అర్థమైనట్లులేదు, అడుగుతోంది.  “అది కాదు తాతమ్మా,  శ్రావణిని వాళ్ల కాలేజిలో ఒక అబ్బాయి పెళ్లి చేసుకోమని వెంటపడ్డాడు.  తను ఒప్పుకోలేదు.  అప్పటికే శ్రావణికి యు.యస్.లో ఎం.యస్.కి అడ్మిషన్ వచ్చింది.  ఎంగేజ్‌మెంట్ కూడా అయింది.  పెళ్లికొడుకుకి కూడా యు.యస్. లోనే జాబ్.  ఇది తెలిసి ఆ రోగ్ శ్రావణి మీద ఆసిడ్ పోసాడు”  ఆవేశపడిపోయింది.

“శ్రీరామరామ! వాడికిదేం పోయేకాలమే!  రావణాసురుడు కూడా అలా చేయలేదు కదే!” అంది మా అమ్మమ్మ బాధగా.  మనసంతా వికలమైంది.  కాసెపటివరకూ ఎవ్వరం మాట్లాడలేదు.

“ఇప్పుడు ఎలా ఉంది? రికవర్ అయిందా?” అడిగాను నెమ్మదిగా.  “మొహంలో ఒక వైపు చాలా భాగం కాలిపోయింది. నాలుగు సర్జరీలు అయ్యాయి.  ఇంకా చేయాలి, కానీ ఇదివరకటిలాగా రావడం కష్టం.  ఈమధ్యనే జాబ్ లో జాయిన్ అయింది ఈ ఊళ్లోనే” అంది.

“మరి పెళ్లి, అమెరికా?”  మా అమ్మ మనసులో అనుమానం.  “పెళ్లికొడుకు వాళ్లు ఎంగేజ్‌మెంట్ బ్రేక్ చేసారు.  అభిరాం, వాళ్ల పేరెంట్స్ ఈ టైంలో శ్రావణిని ఒక్కదాన్ని యు.యస్.కి పంపడానికి ఇష్టపడలేదు” అంది.

“మంచిపని చేసారు.  కాస్త కుదుటపడేవరకూ అమ్మాయిని ఒక్కదాన్నే వదిలిపెట్టకూడదమ్మా.  వేయి కళ్లతో కనిపెట్టుకుని ఉండాలి.”  అంది మా అమ్మమ్మ.  కనీసం కళ్లతోనైనా చూడని మనిషి గురించి ఎంత కన్సర్న్!

“అయితే ఇక్కడే ఉంటుందన్నమాట” అంది మా అమ్మ.  అలాంటి ఆడపడుచు ఇంట్లో ఉంటే మనవరాలి కాపురం ఎలా ఉంటుందో అని భయం.  “ఇంకెక్కడ ఉంటుంది?” మా అమ్మాయి విసుక్కుంది.

“ఆ ఆసిడ్ పోసిన వాడినేం చేసారు?” అడిగాను.  “అరెస్ట్ చేసారు.  కేస్ నడుస్తోంది.  వాడు ఒక రిచ్‌కిడ్.  పెళ్లి కాన్సిల్ అయిందని తెలిసి కేస్ విత్‌డ్రా చేసుకుంటే శ్రావణిని పెళ్లి చేసుకుంటానని బేరం పెట్టాడు – రాస్కెల్!  కానీ అభిరాం వాళ్లు ఒప్పుకోలేదు.”  మళ్లీ ఆవేశపడింది.

“ఆ త్రాష్ఠుడికి పిల్లనిస్తాముటే!  పెళ్లికాకపోతే పీడాపాయె!  వాడిని జైల్లో పెట్టించాల్సిందే – వదలకూడదు”  అంది మా అమ్మమ్మ కూడా ఆవేశపడిపోతూ.  ఈవిడ ఏ ఫెమినిస్ట్ కి తీసిపోతుంది?

“ఇంతకీ అభిరాంకి ఏం చెప్పావు?”  ఈ డిస్టర్బెన్స్‌తో అడగకూడదనుకుంటూనే అడిగాను.  “మీతో మాట్లాడి చెప్తానన్నాను” అంటూ ఖాళీ కప్పు లోపల పెట్టడానికి వెళ్లింది.   ఇలా చెప్తోంది కానీ, దీని ఉద్దేశ్యం తెలుస్తూనే ఉంది.  లేకపోతే అతని కారులో ఎందుకు వస్తుంది?  పైగా రెండేళ్ల పరిచయం!

“దీనికి మీ అమ్మమ్మ పోలిక వచ్చిందేమిటే?  ఆ పిల్లకి పెళ్లి అవుతుందా? అలాంటి పిల్ల ఇంట్లో ఉంటే ఇదేమి సుఖపడుతుంది?”  మా అమ్మ మాటలకి నాకేమి చెప్పాలో తెలియలేదు.  అన్నీ బాగానే ఉన్నాయనుకుంటే – ఈ అపశ్రుతి!  మా అమ్మమ్మ వైపు చూసాను.  ఆవిడ ఏమీ మాట్లాడలేదు.

“ఏమిటి అమ్మమ్మా! పోలిక అంటున్నావు” మా అమ్మాయి వస్తూ అడిగింది. “అదికాదమ్మా! ఆ పిల్లకి పెళ్లి కావడం కష్టం.  అలాంటి పిల్ల ఇంట్లో ఉంటే ఎంత కష్టమో నీకేం తెలుసు? చిన్నపిల్లవు. అలా ఇంట్లో ఇద్దరు ఆడపడుచులతో మీ తాతమ్మ ఎన్ని కష్టాలు పడిందో నీకు తెలీదు”  అంది మా అమ్మ.

“అవునా తాతమ్మా? నాకు తెలీదే! చెప్పవూ!” అడిగింది మా అమ్మాయి.  “ఏముందే!  చెప్పడానికీ,  వినడానికీ!  ఇదేమన్నా రమాయణమా?  భారతమా?” అంది అమ్మమ్మ.  “పోనీలే తాతమ్మా, చెప్పు.  వింటాను.”  మా అమ్మాయి బలవంతం చేస్తే “సరే” అని అమ్మమ్మ చెప్పడం మొదలుపెట్టింది.

. . .

 

నాకు ఎనిమిదో ఏట పెళ్ళైంది.  పద్నాలుగో ఏట కాపరానికి వచ్చాను.  నాకు ఇద్దరు ఆడపడుచులు.  పెద్దావిడ సుబ్బలక్ష్మి, సుబ్బమ్మ అనేవాళ్లు. నాకన్నా పదేళ్లు పెద్ద.  నలుగురు పిల్లలు.  చిన్నావిడ మహాలక్ష్మి.  నా ఈడుదే.  ఇంకా కాపురానికి వెళ్లలేదు.  ఇంట్లో ఆయన, నేను, అత్తగారు, మామగారు, మహాలక్ష్మి – అంతే.

నాకు, మహాలక్ష్మికి తొందరగానే స్నేహం కుదిరింది. ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ, చలాకీగా ఉండేది. చివరిపిల్ల అవడంతో గారాబం కూడా ఎక్కువే.  రోజూ పొద్దున్నే వాకిలి, దొడ్డి చిమ్మి ముగ్గులు పెట్టేవాళ్లం.  ఎవరు పెద్ద ముగ్గు వేస్తారా అని ఇద్దరికీ పొటీ.  స్నానం చెసిన తర్వాత తులసమ్మ దగ్గర దీపారాధన చేసి సుబ్రహ్మణ్యాష్టకం, లక్ష్మీఅష్టోత్తరం, కృష్ణాష్టకం, అన్నపూర్ణాష్టకం, మీనాక్షీపంచరత్నం పారాయణ చేసేవాళ్లం.

వంట మడితో మా అత్తగారు చేసేవారు.  మగవాళ్లిద్దరి భోజనాలు అయినతర్వాత ఆడవాళ్లం భొంచేసేవాళ్లం.  మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత చింతపిక్కలో, అష్టాచెమ్మానో ఆడుకునేవాళ్లం. లేకపోతే ఏవైనా పద్యాలో, పాటలో పాడునేవాళ్లం.  నాకు కుమారీశతకం, సుమతీశతకం, రుక్మిణీకళ్యాణం మాత్రమే వచ్చుకానీ, మహాలక్ష్మికి దాశరథీశతకం, నరసింహశతకం, గజేంద్రమోక్షం,  ప్రహ్లాదచరిత్ర , వామనచరిత్ర కూడా వచ్చు.  ఎన్ని పాటలు పాడేదో –  మేలుకొలుపు పాటలు, ఊర్మిళదేవి నిద్ర, లక్ష్మణస్వామి నవ్వు, పద్మవ్యూహం, శివకళ్యాణం, నౌకాచరితం, అధ్యాత్మ రామాయణ కీర్తనలు, తరంగాలు – ఎన్నో!   సౌందర్యలహరి ఎంత బాగా పాడేదనీ!  కౌసల్యకల, కృష్ణజననం పాడితే ఆనందమో, దుఃఖమో తెలియని పారవశ్యంతో కళ్లంబట నీళ్లుకారేవి.  తన గొంతులో ఏపాటైనా ఎంతో బాగుండేది.

పెద్ద దొడ్డి.  అందులో అరటి, జామ, బాదంలాంటి చెట్లు;  కాయకూరల, ఆకుకూరల మళ్లు;  పారిజాతం, మందార, గన్నేరు,  సన్నజాజి, కనకాంబరం, మల్లె, చేమంతిలాంటి పూలమొక్కలు ఉండేవి.  రోజూ సాయంకాలం పూలు కోసి పెద్ద పెద్ద మాలలు కట్టుకుని జడలో పెట్టుకునేవాళ్లం.  ఏపనైనా ఇద్దరం కలిసే చేసేవాళ్లం.  గుడికి, పేరంటానికి – ఎక్కడికెళ్లినా ఇద్దరం కలిసే వెళ్లేవాళ్లం.  ఇంక మా కబుర్లకి అంతే ఉండేది కాదు.  అదేమిటో బావిలో నీళ్లలాగా ఊరుతూనే ఉండేవి.  ఎప్పుడూ నవ్వుకుంటూ, సన్నగొంతుకతో  మాట్లాడుకుంటూనే ఉండేవాళ్లం.  మా అత్తగారు “ఏముంటాయే అన్ని కబుర్లు!” అనేవారు నవ్వుతూ.  మేము ఒకళ్ల మొహం ఒకళ్లు చూసుకుని మళ్ళీ నవ్వుకునేవాళ్లం.

నేను కాపురానికొచ్చిన రెండేళ్లకి సుబ్బమ్మవదిన భర్త జ్వరంవచ్చి పోయారు.  పదోరోజు ఆవిడని చూస్తే ఏడుపొచ్చింది.  మూడునిద్రలకి ఆయనతో పాటు వచ్చినప్పుడు ఎలా ఉండేది!  ఎర్రంచు ఆకుపచ్చ పట్టుచీర, తలలో కనకంబరాలు, ఎర్రటి కుంకుమ బొట్టు, ఎర్రరాయి ముక్కుపుడక, చేతినిండా గాజులు –  పూసిన తంగేడులా!   ఇప్పుడు ఈ తెల్లని సైనుపంచె, తలమీద ముసుగు, బోసి మొహం, మెడ,  చేతులు –  ఆ సుబ్బమ్మవదినేనా అనిపించింది.   మూడో నెలలో సుబ్బమ్మవదినని, పిల్లలని మా ఇంటికి తీసుకొచ్చేసారు.  పిల్లల్ని ఇక్కడే బళ్లో చేర్పించారు.

నాకు నెల తప్పింది.  మహాలక్ష్మికి పదహారో ఏడు వచ్చింది.  ముహూర్తం చూసి మహాలక్ష్మిని కాపురానికి పంపించాము.  వెళ్లేటప్పుడు ఇద్దరం ఒకరిని ఒకరు కావలించుకుని ఒకటే ఏడుపు.  మా మామగారి అక్కయ్య “శుభమా అని పిల్ల కాపురానికి వెళ్తుంటే ఏమిటే మీ ఏడుపులు” అంటూ కోప్పడ్డారు.   మహాలక్ష్మి వెళ్లిపోయాక దాదాపు నెలరోజులపాటు ఎమీ తోచలేదు నాకు.  ఒక్కోసారి భోజనానికి మాతోబాటు మహాలక్ష్మికి కూడా విస్తరి వేసేదాన్ని.   మా అత్తగారు “ఏమిటే నీ పరధ్యానం” అని నవ్వేవారు.

పిల్లలతో కాస్త కాలక్షేపం అయ్యేది కాని, సుబ్బమ్మవదిన ఎక్కువ మాట్లాడేది కాదు.  పైగా ఆవిడకి ఈమధ్య కోపం, విసుగు ఎక్కువయ్యాయి.  ఎప్పుడూ ఎదో విషయం మీద విసుక్కుంటూనే ఉండేది, నన్నే కాదు అందరినీ!  నేను మాత్రం తిరిగి సమాధానం చెప్పేదాన్ని కాదు.  నాకన్న బాగా పెద్దది, పైగా కష్టంలో ఉంది!  మా అత్తగారు “ఏదో పిల్లలతో లక్షణంగా కాపురం చేసుకుంటోందనుకుంటే, ఆ భగవంతుడు చిన్న చూపు చూసాడు. ఈ యోగం పట్టింది.  దీని బతుకిలా బండలైంది.  ముప్ఫైయ్యేళ్లన్నా లేవు, ఎప్పటికి వెళ్లేను దీని జీవితం” అని బాధపడేవారు.

దసరా పండక్కి రెండు రోజుల ముందే వెళ్లి మా మామగారు మహాలక్ష్మిని తీసుకువచ్చారు.  లోపలికి వస్తూనే నన్ను కావలించుకుని “నీకోసం ఏం తెచ్చానో చూడు” అంటూ, సంపంగి పూలమాల తీసి తలలో పెట్టింది.  “అదేంటి మొత్తం నాకే పెట్టావు, నీకు లేకుండా” అన్నాను.   “మా ఇంట్లో పెద్దచెట్టు ఉంది.  నేను రోజూ పెట్టుకుంటూనే ఉన్నానులే” అంది.  “అప్పుడే అది మీ ఇల్లయిపోయిందా?” అని వేళాకోళం చేసాను.   ఆ రోజు మా కబుర్లకి అంతే లేదు.  మా అత్తగారు “పొద్దుపోయింది ఇంక పడుకో”మని కోప్పడేదాకా మా కబుర్లు సాగుతూనే ఉన్నాయి.  “ఆడపడుచు వస్తే నన్నిక పట్టించుకోవా ఏమిటి” అని ఆయన వెక్కిరించారు.  మహాలక్ష్మి ఉండగానే మా అమ్మ వచ్చి సీమంతం చేసి నన్ను పురిటికి తీసుకెళ్లింది.

నాకు మగపిల్లవాడు పుట్టాడు.  మూడోరోజు పథ్యం పెట్టిన తర్వాత మా నాన్నగారు మా మామగారికి మనవడు పుట్టాడని ఉత్తరం రాసారు.  పిల్లవాడిని చూడడానికి ఆయన కానీ, మా అత్తగారు కానీ రాలేదు.  ఎందుకో అర్థం కాలేదు.  పెద్ద దూరభారం కూడా కాదు.  మూడునాలుగు గంటల ప్రయాణం, అంతే!  మా అమ్మతో అంటే “కుదరద్దూ!” అంది.   కానీ పిల్లవాడిని చూసుకుంటే నాకెందుకో చాల గర్వంగా, ప్రపంచంలో ఎవరూ చేయలేని పని నేను చేసినట్లు, అందరూ నన్ను అభినందించాలని, అపురూపంగా చూడాలని అనిపించేది.

మూడో నెల వచ్చింది.  బారసాల నాటికి వచ్చారు ఆయన, ఒక్కరే!  మనిషి బాగా డస్సిపోయి, నల్లకప్పేసినట్లు ఉన్నారు.  మొహంలో కళే లేదు.  పిల్లవాడిని చూసిన సంతోషం ఎక్కడా కనపడలేదు.  చాలా ముభావంగా ఉన్నారు.  మా అత్తగారు, మహాలక్ష్మి వస్తారనుకున్నాను, రాలేదు.  మహాలక్ష్మి ఎందుకు రాలేదో! పురుడు వచ్చిన తర్వాత వాళ్ల అత్తగారింటికి ఉత్తరం రాయించాను కూడా!  అడుగుదామంటే  ఆయనతో ఏకాంతంగా మాట్లాడడానికి వీలు కాలేదు.  పిల్లవాడికి కనీసం ఒక గొలుసు కానీ, మురుగులు కానీ తేలేదు!  మొత్తానికి బారసాల అయిపోయింది.  ‘రామం’ అని పేరు పెట్టాము.  మంచిరోజు చూసి నన్ను, పిల్లవాడిని పంపించమని చెప్పి భోజనాలు అవుతూనే ఆయన బయలుదేరి వెళ్లిపోయారు.  అదే సంగతి మా అమ్మతో అంటే, “గొలుసు, మురుగులు చేయించటానికి డబ్బు సర్దుబాటు అవ్వద్దూ!  అంతమంది ప్రయాణం అంటే ఎంత ఖర్చు!  ఒంటిరెక్క మీద అంత సంసారం లాగడమంటే మాటలా!  అందులోనూ ఇప్పుడు సంసారం మీద సంసారం వచ్చి పడిందాయె!” అంది.  ఏమైనా, నా అనందాన్ని పంచుకోవడానికి మహాలక్ష్మి పక్కన లేకపోవడం నాకు వెలితిగానే ఉంది.

మంచిరోజు చూసి మా అమ్మ నన్ను, పిల్లవాడినీ మా అత్తగారింట్లో దింపింది.  నాకు, పిల్లవాడికి గుమ్మంలో దిస్టి తీసి మా అత్తగారు నా చేతిలోంచి పిల్లవాడిని అందుకుని లోపలికి తీసుకెళ్లారు.  లోపలి గదిలో మహాలక్ష్మి కనిపించింది తెల్ల సైనుపంచెలో!  తలమీద ముసుగుతో!  అక్కడే నిలబడిపోయాను.  నాకు పురుడు వచ్చిన పదోరోజు మహాలక్ష్మి భర్త పాము కరిచి చనిపోయాడుట!  మా అత్తగారు కళ్లుతుడుచుకుంటూ ఎమిటేమిటో చెప్తున్నారుగానీ నాకేమీ వినపడ్డంలేదు.  మా అమ్మ కూడా అయోమయంగా చూస్తోంది.  పట్టుకుచ్చులా నిగనిగలాడుతూ ఇంత బారుజడ, గలగల్లాడుతూ చేతిగాజులు, గల్లుగల్లుమంటూ కాళ్లపట్టీలు – ఏమైనాయి?  ఎన్నిరకాల జడలు వేసుకునేది!  ఎన్ని పూలు పెట్టుకునేది!  ఎన్నెన్ని రంగుల చీరెలు కట్టుకునేది!   కళకళ్లాడుతుండే మొహం, వెలుగులు చిమ్మే కళ్లు, చిరునవ్వు చిందే పెదవులు – ఏవీ?  అసలు అక్కడ ఉన్నది మహాలక్ష్మేనా?  ఈ ప్రపంచంలోని ఆనందమంతా తన స్వంతమైనట్లు ఉత్సాహంగా తుళ్ళుతూ ఉండే మహాలక్ష్మి ఇప్పుడు చైతన్యం లేకుండా తలవంచుకుని ఈ గదిలో ఒక మూల కూర్చుని ఉంది!

నేను, మహాలక్ష్మి ఒకళ్లని ఒకళ్లు పట్టుకుని ఏడుస్తూ ఎంతసేపు ఉండిపోయామో తెలీదు. మా అత్తగారు “ఇలా నువ్వు హైరాన పడతావనే నీకు కబురుచేయలేదు.  తమాయించుకో.  అసలే బాలింతరాలివి.   పిల్లవాడు ఏడుస్తున్నాడు చూడు.  లేచి పాలు పట్టు” అని నన్ను బలవంతంగా అక్కడినుంచి తీసుకెళ్లారు.

పెద్దమ్మాయి విషయంలో తట్టుకోగలిగిన మా అత్తగారు చిన్నమ్మాయి విషయంలో తట్టుకోలేకపోయారు.  ఆ దిగులుతోనే ఆర్నెల్లు తిరక్కుండా పోయారు.  మా అత్తగారు పోయినప్పుడు వచ్చిన మా అమ్మ వెళ్తూ “మీ అత్తగారు కూడా లేదు, నిన్ను కడుపులో పెట్టుకు చూసుకోవడానికి.  మీ ఆడపడుచులకు వచ్చిన కష్టం సామాన్యమైనది కాదు.  ఎవరికీ రాకూడని కష్టం వచ్చింది.  ముఖ్యంగా మహాలక్ష్మికి.  దాన్ని ఎవ్వరు తీర్చలేరు.  ఆ బాధలో వాళ్లు ఏదైనా పరుషంగా మాట్లాడినా, నువ్వు మటుకు మాట తూలకు.  నీకు నీ పిల్లలెంతో సుబ్బమ్మ పిల్లలంతే. ఆ తేడా ఏనాడూ కలలోకి కూడా రానీయకు.  మీ మామగారు పెద్దవారు, కనిపెట్టుకుని చూసుకో తల్లీ!” అన్నది.  అది ఒక తారకమంత్రంలాగా ఎప్పటికీ నా మనసులో నిలిచిపోయింది.

సుబ్బమ్మవదినకి పగలంతా పిల్లల పనితో సరిపోయేది.  సాయంకాలాలు ఏదైనా హరికథకి కానీ, పురాణానికి కానీ ఏ పిల్లనో వెంటపెట్టుకుని వెళ్లేది.  మహాలక్ష్మి మాత్రం ఇంట్లోంచి బయటకి వచ్చేదే కాదు. ఎప్పుడూ అశాంతితో రగిలిపోతున్నట్టు ఉండేది. అంతులేని దుఃఖంతో దహించుకుపోతూ ఉండేది.  మా అత్తగారు పోయిన తర్వాత ఈ దుఃఖం మరీ ఎక్కువైంది.  నవ్వడం ఏనాడో మర్చిపోయింది.  ఎప్పుడూ పద్యాలో, పాటలో పాడుతుండే ఆ గొంతు మూగబోయింది.  రాత్రిపూట ఏడుస్తూ కూర్చునేది.  తెల్లవార్లూ తనతో పాటే కూర్చునేవాళ్లం – సుబ్బమ్మవదినకానీ, నేనుకానీ.  అద్దం చూసుకుని ఒక్కోసారి ఏడుస్తూ ఉండేది.  తనకున్న రంగురంగుల చీరలన్నీ తగలబెట్టేసింది.   తన నగలన్నీ బావిలో పడేయబోతే అడ్డుకుని, దాచేసాము.

అదివరకు ఇద్దరం ఒకే ప్రాణంలా ఉండేవాళ్లమా! ఇప్పుడు నన్ను చూస్తే అసలు గిట్టదు.  కాల్చేసే చూపులతో నావైపు చూసేది. ఎంతో ప్రేమతో చూసే ఆ కళ్లల్లో ఇప్పుడు ద్వేషం, అసహ్యం!  “నాకు చిన్నది చాలు వదినా” అని తను చిన్నపూలమాల పెట్టుకుని, పెద్దమాల నా జడలో పెట్టే మహాలక్ష్మి – ఇప్పుడు నేను పూలమాల కట్టుకుంటే పూలన్నీ తుంపి పోస్తుంది!  “ఈ రంగు నీకు బావుంటుంది వదినా” అని నాకోసం చీరలు ఏరే మహాలక్ష్మి – ఇప్పుడు నేను కొత్తచీర కట్టుకుంటే, దానికి కాటుక మరకో, సిరా మరకో పూస్తుంది!  ఎప్పుడైనా కొఱ్ఱుపట్టిన చీర కట్టుకుంటే అది మార్చుకునేవరకూ గొడవచేసే మహాలక్ష్మి – ఇప్పుడు నా చీరలన్నిటికీ చిల్లులు పెట్టింది!  “మనిద్దరం ఇలా పొద్దుపోయేవరకూ కబుర్లు చెప్పుకుంటూంటే అన్నయ్య తిట్టుకుంటాడు వదినా” అని వేళాకోళం చేసే మహాలక్ష్మి – ఇప్పుడు రాత్రిపూట మా పడకగది కిటికీలోంచి తొంగి చూస్తుంది!  నా సీమంతానికి పూలజడ వేసి, సీతమ్మవారి సీమంతం పాట పాడిన మహాలక్ష్మి – ఇప్పుడు రామాన్ని చూసి మొహం తిప్పుకుంటుంది; దగ్గరకు వెళ్తే తోసేస్తుంది!  తనని చూస్తే  “కమలములు నీట బాసిన … ” [*] పద్యం గుర్తు వచ్చేది.

ఒకరోజు సుబ్బమ్మవదిన కూతురు జయ, తెలిసినవాళ్ల దొడ్లోంచి సంపంగిపూలు తెచ్చుకుంది.  మాల కడదామని వచ్చి చూద్దును కదా, మహాలక్ష్మి రేకులని ఒక్కక్కటిగా తుంపి నేలపై పోస్తోంది.  పసిపిల్ల తెచ్చుకున్న పూలు పాడుచేసిందని కోపంగా “ఏం పని ఇది వదినా!” అని అనబోయి, తన మొహం చూసి ఆగిపోయాను.  ఆ కళ్లల్లో అనంతమైన దుఃఖం!  ఆ దుఃఖం  పోగొట్టడానికి ప్రాణాలైనా ఇవ్వాలనిపించింది ఆ క్షణంలో.  మా అమ్మ అన్నట్టు ఆ దుఃఖం ఏనాటికైనా తీరేదా? ఎవరైనా తీర్చగలిగేదా?

జయ పెళ్లి కుదిరింది.  పెళ్లి హడావిడి ఉన్నన్ని రోజులు మహాలక్ష్మి మాత్రం ఇవతలికి రాలేదు. మా పెళ్లిలో ఎన్నో పాటలు పాడింది.  స్నాతకం పాటలు, తలంబ్రాల పాటలు, సదస్యం పాటలు, వియ్యాలవారి  పాటలు, మంగళహారతులు, పన్నీరు పాటలు, బంతులాట పాటలు, పేరుచెప్పే పాటలు, ఆఖరికి అప్పగింతల పాట కూడా మహలక్ష్మే పాడింది ఆ ఐదు రోజుల పెళ్లిలో.  ఎప్పుడూ నావెంటే ఉండేది కబుర్లు చెప్తూ.  అప్పుడు పెళ్లిపందిట్లో సందడంతా తనదే!  ఇప్పుడు కనీసం పెళ్లికొడుకునన్నా చూడలేదు!

పెళ్లి హడవిడి అయిపోయింది.  పెళ్లివారు, బంధువులు వెళ్లిపోయారు.  అందరం బాగా అలసిపోయి నిద్రపోతున్నాము.  ఒక రాత్రివేళ బావి గిలక శబ్దానికి మెలకువ వచ్చింది.  “ఆత్మహత్య మహాపాతకమని కానీ, లేదంటే ఏనాడో బావిలో దూకేదాన్ని” అన్న మహాలక్ష్మి మాటలు గుర్తుకు వచ్చి, ఉలిక్కిపడి బయటకి పరిగెత్తాను.  మహాలక్ష్మి బావిలోంచి నీళ్లు తోడుకుని చన్నీళ్ల స్నానం చేస్తోంది!  అక్కడే దొడ్డిగుమ్మంలో నిలుచుని అలా చూస్తూ ఉన్నాను.  ఎన్ని చేదలు తోడి పోసుకుందో!  ఎన్ని బావులలో నీళ్లు పోసుకుంటే ఆ హృదయంలోని మంట చల్లారుతుంది?   అంతలో వీధి వసారాలో పడుకున్న మా మామగారు లేచి వచ్చారు. నేను చటుక్కున పక్కకి తప్పుకున్నాను.  ఆయన నన్ను చూసారేమో తెలీదు.  మహాలక్ష్మి లోపలికి వచ్చింది, తలవంచుకుని.  ఎవ్వరం ఎమీ మాట్లాడలేదు.

మర్నాడు  మా మామగారు వాళ్లబ్బాయితో “నేను చిన్నమ్మాయిని తీసుకుని కొంతకాలం కాశీలో ఉందామనుకుంటున్నాను. ఏర్పాట్లు చూడు” అన్నారు.  పదిరోజుల్లో మా మామగారు, మహాలక్ష్మి కాశీకి బయలుదేరి వెళ్లిపోయారు.  కనీసం కాశీలో అన్నా మహాలక్ష్మికి మనశ్శాంతి దొరికితే బావుండునని ఆ విశ్వేశ్వరుడికి దణ్ణం పెట్టుకున్నాను.

అలా వెళ్లిన వాళ్లు ఏడాది తర్వాత తిరిగి వచ్చారు.  మహాలక్ష్మి “నీకోసం తెచ్చాను వదినా” అని పెట్టెలోంచి బెనారసు చీర, “దారిలో కనబడ్డాయి, నీకిష్టం కదా” అంటూ సంపంగిపూల పొట్లం నా చేతిలో పెట్టింది.  సంతోషంతో కావలించుకున్నాను.   నేను మడి కట్టుకుని వంట చేస్తుంటే సన్నగా పాడుతున్నట్టు మహాలక్ష్మి గొంతు వినిపించింది.  రామాన్ని ఒళ్లో కూర్చోపెట్టుకుని రామాయణం శ్లోకాలు చదువుతోంది.  నన్ను చూడగానే “నాన్న నాకు రామాయణం పాఠం చెప్తున్నారు వదినా.  అయోధ్యకాండ వరకూ అయింది” అన్నది.  ఆ కళ్లల్లో తేజస్సుకి, మొహంలో ప్రశాంతతకి అర్థం తెలిసింది.

. . .

అమ్మమ్మ చెప్పడం పూర్తి చేసింది.  అందరి మనసులూ భారమయ్యాయి.  చీకటిపడుతూంటే  లేచి లైట్ వేసాను.  “తర్వాతేమైంది?” మా అమ్మాయి అడిగింది. ” ఏముంది!  మీ అమ్మమ్మ పుట్టింది. అందరి చదువులు, పెళ్లిళ్లు అయ్యాయి. సుబ్బమ్మవదిన పిల్లల దగ్గరకు వెళ్లింది.  మా మామగారు, సుబ్బమ్మవదిన, మహాలక్ష్మి, మీ ముత్తాత – అందరూ వరసగా వెళ్లిపోయారు.  నేనొక్కదాన్నే మిగిలాను, నీ పెళ్లి చూడడం కోసం” అంటూ మునిమనవరాలిని దగ్గరకు తీసుకుని మా అమ్మమ్మ నవ్వింది.

“అందుకే చెప్తున్నాను.  విన్నావుగా! తాతమ్మ ఎన్ని కష్టాలు పడిందో! నీకింతకంటే రాజాలాంటి సంబంధం వస్తుంది. ఈ సంగతి మర్చిపో.”  మనవరాలిని కన్విన్స్ చేయటానికి యథాశక్తి ప్రయత్నిస్తోంది మా అమ్మ.

“అదే పరిస్థితి నాకొస్తే ఏం చేస్తారు అమ్మమ్మా?”  విసురుగా అంది మా అమ్మాయి.  “అపభ్రంశపు మాటలు మాట్లాడకు” అంటూ అరిచింది మా అమ్మ.

“అదలా మొండిగా మాట్లాడుతుంటే నువ్వలా చూస్తూ ఊరుకుంటావేమిటే?  ఇదిలాగే వాళ్ల నాన్న కూడా దగ్గర వాగుతుందేమో?  అసలే ఇది తాన అంటే ఆయన తందానా అంటాడు” అంటూ నా వైపు చూసింది అమ్మ.

నిజమే!  దానికి నాకన్నా వాళ్ల నాన్న దగ్గర చనువు ఎక్కువ.  దీని మాటలు చూస్తుంటే ఇది ఆ కుటుంబంతో చాలా అటాచ్‌మెంట్ పెంచుకున్నట్టుంది.  పోనీ, ఇన్‌ఫాచ్యుయేషన్ అనుకుందామా అంటే ఇదేమీ టీనేజ్‌లో లేదు, ఇరవైనాలుగేళ్ల పిల్ల, పైగా ఎం.డి. చేస్తోంది.  నేనెటూ తేల్చుకోలేకుండా ఉన్నాను.  అంత ఇష్టంగానూ లేదు, అలా అని దాని అభిప్రాయానికి విరుధ్ధంగా వెళ్లాలనీ లేదు.  డెసిషన్ దానికీ, వాళ్ల నాన్నకీ వదిలిపెట్టాలనుకున్నాను.

ఇంక తట్టుకోలేక మా అమ్మ “నువ్వన్నా చెప్పమ్మా! నువ్వు పడ్డ కష్టాలన్నీ అది కూడా పడాలా?” అంది మా అమ్మమ్మతో.

“నేనేం కష్టాలు పడ్డానే?  కష్టాలు, బాధలు అన్నీ సుబ్బమ్మవదినవీ, మహాలక్ష్మివీ!  నావి చిన్న చిన్న ఇబ్బందులే.  అయినా వాళ్లేమన్నా పరాయివాళ్లా?”  అంది అమ్మమ్మ.  మా అమ్మమ్మ ఎప్పటికైనా నా అలోచనలకి అందుతుందా!

న్యూక్లియర్ ఫామిలీస్ వచ్చాక కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు అన్న ఆలోచనకి అలవాటుపడిపోయింది మా తరం.   అటు పుట్టింటివాళ్లనీ, ఇటు అత్తగారింటివాళ్లనీ కూడా తన కుటుంబంలో భాగంగా చూసి, వాళ్ల కష్ట సుఖాలని తనవిగా భావించే మా అమ్మమ్మ తరంలోని సంస్కారం తిరిగి మా అమ్మాయి తరంలో ప్రవేశిస్తోందా!

“మీ నాన్నని ఊరునించి రానీయమ్మా మాట్లాడుదాము.  అన్నీ కుదరాలి కదా!” అంటోంది మా అమ్మమ్మ.  “థాంక్స్ తాతమ్మా!” అంటూ మా అమ్మాయి వాళ్ల తాతమ్మని కావలించుకుంది.

***

 

[*]  – కమలములు నీట బాసిన,  కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్,  దమ దమ నెలవులు తప్పిన,  దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!

అశోక్ : తెలంగాణా కవిత్వంలో కొత్త గొంతుక

-నారాయణ స్వామి వెంకట యోగి 

~

swamy1

అదో అందమైన అబద్దాల ఆదివారం సాయంత్రం. అంతర్జాలంలో ఆంధ్రజ్యోతి వివిధ చూద్దామని తెరిచా.
(ఓ పది రోజుల కింద సౌత్ కెరోలైనా లో చార్లెస్టన్ లో ఒక చర్చ్ లో 9 మంది నల్లజాతి వాళ్ళని ఒక తెల్ల జాతీయుడు నిష్కారణంగా (వాడి కారణమొక్కటే – నల్ల జాతి వారి పట్ల కరడు గట్టిన ద్వేషం) , నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేసిండు.)
 ‘ఓ ప్రభువా హంతకుడిని క్షమించు’ అనే పద్యం కనబడింది. యెవరో అశోక్ కుంబం రాచెస్టర్ మినెసోటా అని ఉంది.
ఓ ప్రభువా
హంతకుడిని  క్షమించు
వాడు అగ్నాని
అహంకారి
మనిషి రంగు తప్ప
మనిషి తనం యెరుగనోడు
జెండాల మీద ప్రేమే తప్ప
జనంతో కలిసి బ్రతుకనోడు
వాడు నీ బిడ్డడే
కాకపోతే మానవవేటకు మరిగినోడు
మనుషుల కాల్చి కుప్పేయడం నేర్చినోడు
వాడిని దయతో దీవించి
కరుణతో లాలించు
ఓ ప్రభువా
మేము హంతకున్ని క్షమిస్తున్నాము
ప్రపంచాన్ని మా చేతులచుట్టూ తిప్పే
మా పిల్లల పోగొట్టుకున్నాము
అలసటొచ్చినప్పుడో ఆపదొచ్చినప్పుడో
తలనిమిరి ధైర్యమిచ్చే
అమ్మా నాన్నల పోగొట్టుకున్నాము
గత వర్తమానాల  కష్టసుఖాల తలపోస్తూ
అభద్రమైన భవిష్యత్తుపై సహితం ఆశలు రేపే
తాత అవ్వల పోగొట్టుకున్నాము
తరతరాల వంతెనలన్నీ ధ్వంసమైపోయి
పారుతున్న నెత్తురు
పొంగుతున్న దుఃఖం
కారుతున్న కన్నీళ్ళు
గడ్దకట్టుకుపోయాక
ఇక చివరకు మిగిలింది
హంతకుడిని క్షమించుడే కదా!
విలువ లేని బతుకులు
ఎప్పుడు పోతవో తెలియని ప్రాణాలు
మృత్యు  రూపాన్ని కనిపెట్టలేని జీవితాలు
ఇవేవీ ముఖ్యం కావు
మేము మనుషులమా కాదా అని అంచనా వేయడానికి
ఇప్పుడు పరీక్షకు నిలిచింది మా మా మానవత్వ నిరూపణే
వాడు శిక్షించాలి
మేము క్షమించాలి
అదే కదా ధర్మం ప్రభూ!
పద్యం మొత్తం ఒక్క సారే ఊపిరి తీసుకోకుండా చదివా . ఒక ప్రార్థనలా బిగ్గరగా చదివా . ఒక కెరటం ఛెళ్ళున చరిచింది ముఖాన్ని. చివరి మూడు వాక్యాలు కుదిపేసాయి. అవును, మళ్లా ఒక నాలుగు నెలల తర్వాత చదివినా  ఈ వాక్యాలంతే కుదిపేస్తున్నాయి. మరింతగా చరుస్తున్నాయి ముఖమ్మీద.
మొత్తం పద్య నిర్మాణం చూస్తే ఈ పద్యంలో అశోక్,  క్రైస్తవ ప్రార్థనా పద్దతి ఉపయోగించినట్టు తెలుస్తూనే ఉంది. అయితే జాలీ కరుణలతో పద్యాన్ని నడిపి చివరికొచ్చేసరికల్లా ఒక రకమైన వ్యంగ్యంతో కూడిన చిరు కోపాన్ని అదీ అశక్తతలోంచీ, మరీ ఎక్కువ అసహనపు కోపమనిపించని సహనత్వంలోంచీ తమకు బోధించబడిన ‘ధర్మాన్ని’  గుర్తు చేస్తూ పలికాడా వాక్యాలను. మా మానవత్వాన్ని నిరూపించుకోవాలంటే వాడెన్ని సార్లు శిక్షించినా మేము క్షమించాల్సిందే కదా ప్రభువా అని అడుగుతున్నాడు చంపబడ్డ ఆ నల్ల జాతీయుల్లోకి పరకాయ ప్రవేశం చేసి. పిల్లలనీ, అమ్మానాన్నలనీ పోగొట్టుకున్నామని చెప్తూ  ‘తరతరాల వంతెనలు ధ్వంసమై’ అన్న వాక్యంతో ఆ మొనొటొనాసిటీ కి కళ్ళెం వేసి యెందుకు హంతకులను క్షమించడం మాత్రమే మిగిలిందో చెప్తాడు. అక్కడ పద్యాన్ని ఒక అద్భుతమైన మలుపు తిప్పాడు. అగ్నానీ అహంకారీ అయిన హంతకుడిని క్షమించడం తప్ప యేమీ మిగలనోళ్ళం అని పాపులను క్షమించమనే నీతిని అభాసు చేసాడు. నల్ల జాతీయులు  మనుషులుగా గుర్తింపబడాలంటే వారికి  న్యాయం జరగడం కన్నా వారు  క్షమించడమే ముఖ్యం చేస్తున్న జాత్యహంకార వ్యవస్థ మీద పదునైన కత్తుల్లాంటి కవితా వాక్యాలను దూసాడు అశోక్. మొత్తం పద్యం సూటిగా ఉన్నట్టనిపించినా అంతా సులభంగా అర్థమయినట్టనిపించినా మళ్లా మళ్లా చదువుతున్న కొద్దీ కొత్త అర్థాలు పరిస్థితి పట్ల కొత్త క్రోధాల్నీ కలుగజేస్తుందీ పద్యం. మొత్తం పద్యం చాలా సూటిగా ఉత్ప్రేక్షలూ, ఉపమానాలూ లేకుండా సాగుతుంది.  కానీ జాగ్రత్తగా చూస్తే మొత్తం పద్యమే ఒక ఉత్ప్రేక్ష. ఈ సమాజంలో మేము మనుషులుగా గుర్తింపబడాలి అంటే మాకు జరిగిన అన్యాయానికి న్యాయం అడగడం కాక, హంతకున్ని క్షమించడం తప్ప మరో మార్గం లేని నిస్సహాయతను చాలా బలంగా సూచించే ఉత్ప్రేక్ష (metaphor). అందుకే పద్యం బలంగా చదివిన కొద్దీ కొత్తగా ఉంటుంది.
పద్యం చదివాక అశోక్ తో మాట్లాడాలనిపించింది. మినెసోటా లోని రాచెస్టర్ లో ఒక వైద్య కళాశాల లో బయోయెథిక్స్ బోధించే ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు తను. తెలంగాణా లో నల్గొండ జిల్లా ఆజంపూర్ లో పేద రైతాంగ కుటుంబంలో పుట్టి హైదరాబాదు నిజాం కళాశాల లో తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రం మానసిక శాస్త్రం లో బీయే చేసి, నెదర్లాండులో పోస్టు గ్రాడుయేషన్, కెనడా లో పీయెఎచ్ డీ, డాక్టొరల్ ఫెలోషిప్  చేసినంక యిప్పుడు మేయో క్లినిక్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బోధిస్తున్నాడు. పలకరించగానే యెంతో ఆప్యాయంగా మాట్లాడి తన ఆసక్తుల గురించి వివరంగా చెప్పిండు. తన ఇతర పద్యాలను కూడా ఒక చోట చేర్చి పంపిండు.
అన్ని పద్యాలూ బాగున్నయి. పద్యాలు కావాలని రాసినట్టో, అందంగా రాయాలని ప్రయత్నించి రాసినట్టో కృతకంగా లేవు. అన్నింటి లోనూ ఒక సహజ త్వం ఉన్నది. అదే వాటి సౌందర్యం. అన్నీ సూటిగా డొంక తిరుగుడు లేకుండ ఉన్నయి.   అన్నీ సామాజిక సమస్యల పట్ల స్పందనలే. అశోక్ తాను అన్యాయమని అనుకున్న వాటికి, సమాజంలో అధికారపు ఆజమాయిషీ దుర్మార్గాల ఫలితాలనుకున్నవాటికీ  వెంటనే స్పందిస్తున్నాడు. క్రౌంచపక్షి మరణానికి వెంటనే స్పందించే వాల్మీకి లాగా. బాధా, దుఃఖమూ వేదనా పరిస్థితుల పట్ల ఆగ్రహ ప్రకటనా, పరిస్థితులు మారాలనే బలమైన ఆకాంక్ష వెంటనే పద్యాల రూపంలో బలంగా సూటిగా డొంకతిరుగుడు లేకుండా ప్రకటిస్తున్నాడు. నీళ్ళు నమలడం లేని, యెక్కువ ఉపమానాలూ ఉత్ప్రేక్షలూ లేని కవితా పద్దతినెంచుకున్నాడు. భాషనూ, వాక్యాలనూ తన ఉద్వేగంతో నింపి కవితా వాక్యాలు చేసి సంధిస్తున్నాడు. పద్య నిర్మాణం లోనూ చెప్పే పద్దతిలోనూ ఉద్వేగాన్ని నింపి తను చెప్పదల్చుకున్న దానిని బలంగా చెప్తున్నాడు. గుర్తుంచుకునేటట్టు చెప్తున్నాడు.
తెలంగాణ ప్రభుత్వం చీప్ లిక్కర్ తీసుకురావాలనుకున్నప్పుడు, ‘బంగారు తెలంగాణ బలికోరుతున్నది/  బలవంతమేమీలేదు/  బారులు తీరండి’ అని అంటాడు. ‘బలవంతమేమీ లేదు’  అని పాదం విరిచి ‘బారులు తీరండి’ అనడంలో ప్రతిభ చూపిస్తాడు. అంతకు ముందే “పుష్కరాలను మించిన పుణ్యకార్యమిది/  ప్రతి పూట మరువకుండ/  మత్తుల,  మందుల / మునిగి తేలండి’ అని వ్యంగ్యం ప్రకటిస్తాడు. అట్లే నల్లజాతీయుల అభద్రత గురించి కూడా ‘మై డియర్ బ్లాక్ అమెరికా’  అని ఒక పద్యం. ‘చేతులెప్పుడూ గాలిలోనె ఉంచు / జీసస్ శిలువ మీద ఉన్నట్టు / అల్లాని వేడుకున్నట్టు/ .. నల్లని నీ రూపం సహితం వాడికి మారణాయుధంగానే కనబడుతుంది / అందుకే నీ చావుకి నువ్వా కారణమని ముందే ప్రకటించు … వాడి నిఘంటువు లో నువ్వొక తప్పిదానివి దారి తప్పిన జీవితానివి పొంచిఉన్న ప్రమాదానివి …’ అంటూ రాస్తాడు.
తెలంగాణ రాష్ట్రం యేర్పడి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో చురుగ్గా పాల్గొని తర్వాత మావోయిస్టులలో చేరి బూటకపు ఎంకౌంటర్ లో కాల్చి చంపబడిన నిండా ఇరవై నిండని వివేక్ కోసం రాసిన పద్యంలో
 ‘నువ్వెవరో నాకు తెలిసింది/
నీ అమరత్వం బ్రేకింక్ న్యూస్ అయినప్పుడే కదా/ అయినా నువ్వొక గ్నాపకమై నన్ను యెందుకు వెంటాడుతున్నవు? /…నువ్వు నడిచిన దారి పొడువున / నీ పాదముద్రలు వెతికే పనికై/ నా మనసు యెందుకు వెంపర్లాడుతున్నది?/ భద్ర జీవితపు సరిహద్దులు చెరిపి/ యాంత్రిక జీవనాన్ని/మాంత్రిక కాలాన్ని / శాసిస్తున్న నీ త్యాగం/ ఒక మరణాన్ని కాదు / ఒక సమన్యాయ విలువను గుర్తు చేస్తుంది ..అని అంటాడు ఉద్వేగంగా. యాంత్రిక జీవనమూ మాంత్రిక కాలమూ – అశోక్ వాడిన ఈ పదచిత్రాలు సమకాలీన సమాజమూ, కాలమూ, జీవితాన్నీ అద్భుతంగా చిత్రిక పడుతున్నయి.
రైతుల ఆత్మహత్యలగురించి రాస్తూ ‘ఇక ఈ తంతు నాపి నాకు స్వేచ్ఛనివ్వండి / సాలు మీద సాలు దున్నే / ఆ బక్క రైతు / బుడ్డగోసినై రుణం తీర్చుకుంట’  అని తన సంఘీభావాన్ని ప్ర కటి స్తడు.
అశోక్ బలమైన కవి. గొప్ప ఉద్వేగం ఉన్న కవి. సమాజం పట్ల దోపిడీ పీడన, అణచివేతలకు కు గురవుతున్నవారి పట్ల సంఘీభావం ఉన్న కవి. ఉన్న పరిస్థ్తి మారాలనీ కోరుకునే కవి. అది యెట్లా మారుతుందో కూడా స్పృహ ఉండి తెలిసిన కవి. అశోక్ ఇంకా రాయాలి. ఇంకా బలంగా రాయాలి. పద్యాన్ని ఒక శిల్పంలా చెక్కడం పట్ల శ్రద్ద పెట్టి యింకా రాయాలి. ఆవసర వాక్యాలూ, పదాలూ పద్యంలో ఉండకూడదన్న స్పృహ ఉన్న అశోక్ అవి లేకుండా ఇంకా శ్రద్ద పెట్టాలి. వాక్య నిర్మాణమూ, పద్య పాదాలని విరవడమూ, పదాల యెంపికా , సూటిదనం అన్ని సార్లూ పని చేయని చోట ఉపమా నాలూ,  ఉత్ప్రేక్షలూ, allusions, సూచనలతో  పద్యాన్ని బలోపేతం చేయవచ్చు అని బాగా తెలిసిన అశోక్  ఆ పని మరింత చైతన్యయుతంగా చేస్తాడని ఆశ!  తనలో ఉన్న ఉద్వేగ తుఫానులకు సరైన పద్య రూపమిచ్చి మరింత విరివిగా రాయాలని కోర్కె.

*

తీరాన్ని చెరిపేసి..

-వర్మ.కలిదిండి
~

కె.ఎన్.వి.ఎం.వర్మ

తీరపు ఇసుక రేణువులన్నీ
లోకం ఒకప్పుడు
నా మీదకు విసిరిన రాళ్ళే…
ఆకాశంగుండా ప్రయాణించి
వనాలని అభిషేకించి
పూలెన్నో పూయించి
మన్నులో నిన్ను వెదికి అలసిపోయాను
వికృతమనో వైపరీత్యమనో
ప్రపంచం ఆడిపోసుకున్నా పర్వాలేదు
హృదీ!…వెన్నలా!!
తీరాన్ని చెరిపేసి నన్ను స్వాధీనపరుచుకో..

ఫత్వాలని వెక్కిరించిన ఆమె..

–సాయి పద్మ 

~

ఫహ్మీదా రియాజ్ గురించి రెండు మాటల్లో లేదా బ్రీఫ్ గా చెప్పటం కష్టం. దేని గురించి చెప్పాలి? ఆమె కవిత్వపు మెరుపు గురించా? లేదా , వోకప్పటి అఖండ భారతంలో పుట్టి (సింధ ప్రాంతం ) పాకిస్తాన్ మెట్టి, నాలుగేళ్ల ప్రాయం నుండే కవిత్వం రాస్తూ, తన కవిత్వానికి ఫత్వా తో సహా జారీ చేయించుకున్న స్ట్రాంగ్ ఫెమినిస్ట్ కవయిత్రి గురించా ?
తన షాయరీల చైతన్యంతో, ప్రభుత్వాల్లో కదలిక తెప్పించి, రాజ్యపు ఆగ్రహానికి గురి అయి .. తన ముగ్గురు పిల్లలతో, భర్తతో, ఇండియా లో తల దాచుకోన్నప్పటికీ , మరింత పదునెక్కిన ధర్మాగ్రహపు వ్యంగ్యపు జ్వాల గురించా.. ?
చెప్పటం కష్టం.. ఆమె కవిత్వంతో ప్రేమలో పడకుండా ఉండటం ఇంకా కష్టం .. ఇన్ని కష్టాల మధ్య , ఆమె కవిత్వం చదువుకోవటమే ఇష్టం .. నేను చదువుకుంటున్నాను ఆమెని.. ఐచ్చిక బురఖాలు వేసుకున్నవాళ్ళు, డిస్క్రిమినేషన్ లేదు అనేవాళ్ళు, ఎల్లలు లేవంటూ ఎలుగెత్తి చాటేవాళ్ళు.. ఆమెని , ఆమె కవిత్వాన్ని చదవాలి .. వాళ్లకి నచ్చిన ఉటోపియా నుండి , నిజంలోకి నిర్భయంగా నడవాలి .. కనీసం ప్రయత్నించాలి.. ఫహ్మీదా  కోసం కాదు.. మన మానసిక ఆరోగ్యం కోసం..!!
* *

నువ్వచ్చం నాలానే తయారయ్యావు కదూ

ఎక్కడ దాక్కున్నావోయ్ ఇన్నాళ్ళూ

అదే మూర్ఖత్వం, ఆదే గర్వం

అందులోనే వో  యుగం కోల్పోయాములే  

చివరికి అవి నీ గుమ్మం దాకా వచ్చాయి

హార్దిక శుభాకాంక్షలోయి

మతపు జెండా నర్తిస్తోంది

హిందూ రాజ్యం స్థాపిస్తావా ఏంటి?

నీ పూలతోటని తొక్కుకుంటూ

అవకతవకలనే దారి చేసుకుంటూ

 

నువ్వు కూడా తీరిగ్గా అలోచిస్తావేమో

నిర్వచనాలతో సహా అంతా తయారయింది

ఎవరు హిందూ ? ఎవరు కాదని

నువ్వు కూడా ఫత్వా జారీ చేసే సమయం వచ్చింది

ఇక ఇక్కడ బ్రతకటం ఎంతో కఠినం

స్వేదంతో ప్రతీ రాత్రీ భయం

ఎలాగో వోలాగ జరిగే తీరుతుంది జీవితం

ప్రతీ వొక్క శ్వాసా వేదనా భరితం

దుఖం ఎక్కువై అలోచించేదాన్ని వొకప్పుడు

అదే ఆలోచనకి  భలే నవ్వొస్తుంది ఇవాళ

నువ్వచ్చం నాలానే తయారయ్యావు

మనం ఇక రెండు జాతులు కామోయీ

 

చదువూ చట్టుబండలూ పోతే పోనీ

అజ్ఞానపు గుణాలే కీర్తించనీ

ముందు గోతులున్నాయని ఆలోచించకు

గత వైభవాల మురుగును మళ్ళీ వెలికితీద్దాం

కష్టపడి నేర్చుకో వచ్చేస్తుందిలే

వెనుకకు నడవటం బాగానే

రెండో ఆలోచన మనసులోకి రానీకు

గట్టిగా గతంలోకే నీ దృష్టి పెట్టుకో

వొక జపం లా క్రమంగా చేస్తూ ఉండు

చర్విత చర్వణంలా అదే చేస్తూ ఉండు

ఎంత వీర మహత్వం మన  భారతం

ఎంత ఘనమైనది మా భారతం

అప్పటికి చేరుకుంటారు మీరా ఉన్నత స్థానం

అప్పటికి చేరుకుంటారు ఊర్ధ్వ లోకం

మేమక్కడే ఉన్నామోయ్ మొదటినుండీ

నువ్వూ సమయం గడుపుదువు గాని,

నువ్వున్న నరకం నుండి

ఉత్తరం గట్రా రాస్తూ ఉండవోయీ ..!!

–ఫహ్మీదా రియాజ్

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

సంభాషణలకు ముగింపు మాటలు  

 

మిగతా విషయాల్లో ఎలా ఉన్నా … ఆహార నిద్రా భయ మైధునాలు మనిషి మౌలిక జీవలక్షణాలనే అంశంలో ప్రపంచమంతటా ఏకాభిప్రాయం ఉంది. ఇవి జీవ లక్షణాలే కాదు, జీవి చైతన్య లక్షణాలు కూడా. వీటి ఉనికిలోని హెచ్చుతగ్గులే జీవుల కార్మిక విధానాన్ని ప్రభావితం చేస్తాయి.

సంపాదించడం, నిల్వ చేయడం… ఆహార సంబంధ క్రియలు గానూ,

రాజకీయాలూ, కొట్లాటలూ, సాహసాలూ, అధికార కాంక్షలూ… భయ సంబంధులు గానూ,

పునరుత్పత్తి, జీవన పరంపర, వగైరాలను మైధున సంబంధులుగానూ…

విశ్రాంతిని, పునరుత్తేజాన్నీ, ఊహాశక్తినీ చేకూర్చే లలిత కళల వంటి ప్రక్రియలను నిద్రా సంబంధులు గానూ స్థూలమైన వర్గీకరణ చేయవచ్చు.

ఆహారం కావాలంటే ఎవరినైనా పోయి అడగవచ్చు, లేదా స్వంతంగా ఏదైనా ప్రయత్నం చేసి సంపాదించు కోవచ్చు. భయం కలిగితే రక్షణ కోసం ఎవరినైనా ఆశ్రయించవచ్చు లేదా స్వయంగానే తగు రక్షణ ఏర్పాట్లు చేసుకోవచ్చు. నిద్ర కోసం ఎక్కడైనా ఇంత నీడను కోరవచ్చు.

మైధున క్రియకు ఇలాంటి సౌకర్యం లేదు. ఒకప్పుడుండేది. ఇంటికి అతిథిగా వచ్చిన వాడికి కామతృష్ణను తీర్చడం గృహిణి ధర్మంగా ఒకప్పుడు భావించేవారు. ఈ ధర్మాన్ని ఉద్ధాలక మహర్షి కుమారుడైన శ్వేతకేతువు తీవ్రంగా వ్యతిరేకించి కొత్త ధర్మాన్ని ప్రతిపాదించినట్టు మనకు మహాభారతం ద్వారా తెలుస్తుంది. శ్వేతకేతువు గమ్యాగమ్యాలను నిర్దుష్టంగా నిర్వచించాడు. అంటే ఎవరు ఎవరితో గమించవచ్చు, కూడదు అనేవి స్పష్టం చేశాడు. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసే ప్రక్రియలో భారతీయ సమాజం వేసిన తొలి అడుగుగా దీన్ని మనం భావించవచ్చు. ఈ మార్పు తర్వాత లైంగికావసరాలకు వివాహ వ్యవస్థ ఒక్కటే సర్వామోదమైన వ్యవస్థగా రూపుదిద్దుకుంది.

వివాహ వ్యవస్థకు ఆవల ఉన్న వారికి, అందులో ఉండి కూడా మైధునానందం పొందలేని వారి అవసరాలు తీర్చే మార్గంగా బహుశా వేశ్యావృత్తి ఏర్పడి ఉండవచ్చు. ఈ ఊహకు అనేకమైన ఆధారాలు ఆరుద్ర రాసిన గుడిలో సెక్స్ అనే పుస్తకం లోనూ, తాతాజీ రాసిన దేవాలయాలపై బూతుబొమ్మలెందుకు అనే పుస్తకం లోనూ మనకు కనిపిస్తాయి. అంతే కాదు, కుటుంబ వ్యవస్థ స్త్రీ సౌశీల్యం మీద ఆధారపడి ఉందని నమ్మిన సనాతనులు వేశ్యావృత్తిని సమర్ధించారు. కుల స్త్రీల శీలం కాపాడు కోవడానికి ఈ వ్యవస్థ అవసరమని వాళ్ళు నమ్మారు. భారతదేశంలో దేవదాసీ వ్యవస్థను రద్దు పరిచి నప్పుడు, ఆ చర్య వల్ల కుటుంబ వ్యవస్థకు తీరని ప్రమాదం ఏర్పడుతుందని ఆనాటి సనాతనులు వాదించారు.

వేశ్యల పట్లా, ఆ వ్యవస్థ పట్లా నేటి సమాజంలో చాలా చిన్నచూపు ఉన్నప్పటికీ 19వ శతాబ్దం వరకూ ఆ వృత్తిలోని వారు గౌరవాదరాలతోనే జీవించారని చెప్పవచ్చు. భారతదేశంలోని ఎన్నో రాజవంశాల మూల పురుషులు, ప్రసిద్ధి చెందిన అనేక మంది ఋషులు వేశ్యల సంతతి వారే. వేశ్యలు కళాకారులుగా పండితులుగా గొప్ప కీర్తి నార్జించారు. వారు దేశంలో ఒక గొప్ప సాంస్కృతిక వ్యవస్థను నిర్మించారు. అనేక దేవాలయాలకు, సమాజ సంక్షేమ కార్యాలకు వారు భూరి విరాళాలిచ్చారు.

మనుషులు ఎంచుకొనే పనులు, వృత్తులు వ్యవస్థీకృతం కావడాన్ని భారత దేశంలో కులం అనే పేరుతో వ్యవహరిస్తారు. అలాగే వేశ్యావృత్తి కూడా తొలినాళ్ళలో కులం లేనిదిగా వ్యవహరించబడినా వ్యవస్థీకృతమయ్యే కొద్దీ కులం రూపు సంతరించుకుంది. ఐతే సంతానాన్ని పొందే విషయంలో ఉన్న పరిమితులవల్ల ఇతర కులాలనుంచి ఈ కులంలోకి ఆదానాలు బహుళంగా జరుగుతూనే వచ్చాయి.

దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం బలపడ్డాక, బ్రిటిష్ భావజాలం ఇక్కడి మేధావుల మనసులు చూరగొన్నాక, ‘సామాజిక స్వచ్ఛత’ అనే అంశం బలంగా ముందుకొచ్చింది. వ్యభిచారం వ్యవస్థీకృతం కావడం సామాజిక స్వచ్ఛతను కళంకితం చేస్తుందని బ్రిటిష్ వారూ, నాటి సంఘ సంస్కర్తలూ ప్రచారం చేశారు. దేవదాసీల వంటి కొన్ని కులాలు సామాజిక స్వచ్ఛతకు భంగకరంగా ఉన్నాయని భావించి ఆయా వ్యవస్థలను నిషేధించారు. వేశ్యావృత్తి పురుషుల కామప్రవృత్తి వల్ల రూపుదిద్దు కుందనీ, స్త్రీలను అణిచివేసే భారతీయ సమాజపు దుర్లక్షణాలలో ఇది కూడా ఒకటనే వాదం కూడా ఈ నిషేధానికి కారణమయ్యింది.

1999లో నళినీ జమీలా రాసిన ‘ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ’ అనే పుస్తకం ఇలాంటి అభిప్రాయాలకు భిన్నంగా మాట్లాడింది. జమీలా సెక్స్ వర్కర్ గా పనిచేస్తూ వారికి సంబంధించిన ఒక స్వచ్ఛందసంస్థను నడుపు తున్నారు. ఆవిడేమంటుందంటే ‘సెక్స్ అనేది కేవలం మగవాళ్ళ అవసరం మాత్రమేనని, స్త్రీలకు దాని అవసరం లేదనీ అందరూ భావిస్తుంటారు. చాలామంది ఫెమినిస్టుల ఆలోచన కూడా అందుకు భిన్నంగా లేదు. ఇది తప్పు. మాకు కావాల్సింది మీ దయాదాక్షిణ్యాలు కాదు. మా అస్తిత్వానికి గుర్తింపు.’

ఏది ఏమైనా వేశ్యావృత్తి ఉండటం మంచిదా కాదా అని చర్చించడం నా ఉద్దేశ్యం కాదు. స్త్రీ పురుష సంబంధాలూ, కుటుంబ వ్యవస్థా తీవ్రంగా ఒడుదొడుకులకు గురవుతున్న కాలమిది. లెస్బియనిజమూ, హోమోసెక్సువాలిటీ పుంజుకుంటున్న కాలమిది. బాలికలపైనా, స్త్రీలపైనా మునుపెన్నడూ లేనంతగా లైంగిక వేధింపులు జరుగుతున్న కాలమిది. ఈ నేపధ్యంలో మానవుల మౌలికావసరాల్లో ఒకటైన సెక్సు గురించి, మనుషుల లైంగిక ప్రవృత్తుల గురించి విస్తృతంగా చర్చ జరగాల్సి ఉంది. కానీ సెక్స్ అనేది మర్యాదస్తులు బహిరంగంగా మాట్లాడదగ్గ అంశం కాదనే భావన నేటి సమాజంలో బలంగా ఉంది. అదేదో అధోజగత్సంబంధి అనే అభిప్రాయంతో ఈ అంశంపై ఉదాశీనతను, మౌనాన్నీ ఆశ్రయించడం జరుగుతోంది. కావచ్చు. కానీ, మిత్రుడు రాణీ శివశంకర శర్మ ఒకచోట చెప్పినట్టు ‘అధోజగత్తును అధ్యయనం చెయ్యనిదే ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థను అర్ధం చేసుకోవడం అసాధ్యం.’

మనుషుల లైంగిక ప్రవృత్తులపై ఒక చర్చను ఆహ్వానించడమే సానివాడల సంభాషణల కూర్పు వెనక ఉన్న ఉద్దేశ్యం. క్రీస్తు శకం 1వ శతాబ్ది నుండి 19వ శతాబ్ది వరకు ఆ వ్యవస్థ పొందిన పరిణామం ఏమిటనేది, ఆ వ్యవస్థ ద్వారా మనుషుల లైంగిక ప్రవృత్తులు ఎలా వెల్లడయ్యాయనేది ఈ సంభాషణల ద్వారా చూచాయగా వ్యక్తమౌతోంది. ప్రసిద్ధులైన రచయితల సాహిత్యం నుండే వీటిని తీసుకోవడం జరిగింది. వీటిని ప్రచురణకు తీసుకుంటూ ఈ సంభాషణలు మంచి అధ్యయనానికి దారితీయాలని అఫ్సర్ ఆకాంక్షించారు. వీటిపై వచ్చిన స్పందన నిరాశాజనకంగా ఉన్నా పట్టువదలకుండా పూర్తయ్యేదాకా వీటిని ప్రచురించారు. వారికి ధన్యవాదాలు.

 

హస్తినలో ఉత్తరాంధ్ర కథల జెండా!

ఫోటో: గంగా రెడ్డి

ఫోటో: గంగా రెడ్డి

-దేవరకొండ సుబ్రహ్మణ్యం

~

devarakondaఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో ఉత్తరాంధ్ర సాహిత్యం ఒక విశిష్ట అధ్యాయం. ఆధునిక యుగం  తొలినాళ్లలో ప్రగతిశీల సాహిత్యానికి నారుపెట్టి, నీరుపోసిన వైతాళికులు ఉత్తరాంధ్ర సాహితీ వేత్తలే. అటు కళింగసీమలో వికాసవంతమైన కొండగాలులు పీల్చుకుంటూ,  జీవమిచ్చే  నాగావళి నది తరంగాలలో తేలుకుంటూ, విజయనగర కోట గుమ్మాలు దాటుకుంటూ యారాడకొండంత ఎత్తులో నిలబడి రోజురోజుకూ సరికొత్త చైతన్యం పుంజుకుని  విశాఖ సముద్రం సాక్షిగా  ముందుకు వస్తోంది  ఉత్తరాంధ్ర సాహిత్యం.

ఆధునిక తెలుగు కథకి ఆద్యురాలు బండారు అచ్చమాంబ కారైనట్టి ఉత్తరాంధ్ర లో ఆధునిక తెలుగు కథ కు 1910 లో వచ్చిన  గురజాడ వారి ‘దిద్దుబాటు”   శ్రీకారం చుట్టింది.

స్వాతంత్ర్యానంతర కాలంలో మానవ సంబందాలలోను, మానవ విలువలలోనూ జరుగుతున్న పరిణామాలను,  రాజ్యము రాజ్యవ్యవస్థగా ఉన్న కోర్టులు, పోలీసులు,ప్రభుత్వ కార్యాలయాలలోని డొల్లతనాన్ని ఉత్తరాంధ్ర కథలు ప్రతిభావంతంగా వెలుగులోకి తెచ్చాయి. తెలుగు కథ సాహిత్య వికాసంలో విశిష్టమైన పాత్ర  ఉత్తరాంధ్ర కథలది.

ప్రముఖ తెలుగు రచయిత చాసో గా అందరికీ సుపరిచితులు అయిన చాగంటి సోమయాజులు గారు తన కథల్లో పీడిత ప్రజల బాధలు, సమస్యలు, ధన స్వామ్య వ్యవస్థ  ప్రధానంగానే చూపెట్టరు. ఆ రకంగా గా కూడా అభ్యుదయ భావాలకు ఉత్తరాంధ్ర  సాహిత్య కారులు ఒకడుగు ముందే ఉన్నారు.

అలాగే పేదల బడుగుల సమస్యలనే కథలుగా మలిచిన రావిశాస్త్రి గారు ఉత్తరాంధ్ర, తెలుగు సాహిత్యానికి ఇచ్చిన మరో  గొప్ప రచయత. ఆయన 1960 లో రాసిన ఆరు సారా కధలు తెలుగు సాహిత్యం లో ఒక మరుపు లేని కొత్త మలుపు.  రాజ్యము రాజ్యవ్యవస్థగా ఉన్న కోర్టులు, పోలీసులు, ప్రభుత్వ కార్యాలయాలలోని డొల్లతనాన్ని ప్రత్యక్షంగా చూపించిన ఘనత ఆరు సారా కధలకే దక్కుతుంది . ఇదే మాట ఇక్కడ డిల్లీ లో ఒక సాహిత్య సభలో మాట్లాడుతూ సుప్రీం కోర్టులో జడ్జి గౌరవనీయులు  శ్రీ యెన్.వి.రమణ గారు చెప్పారు. అలా చెప్పటమే కాక ఆ సభలో ఉన్న శ్రోతలందరికీ ఆరు సారా కధల పుస్తకాన్ని పంచిపెట్టారు. ఈ ఒరవడిలో కొన్ని  మంచి కధలు రాసి ఈ కుర్రాడు యెంతో గొప్ప రచయిత అవుతాడని అందరూ ఆశిస్తుండగా  అకాలంగా చనిపోయిన శ్రీరంగం రాజేశ్వరావు గురించి  తప్పక చెప్పుకోవాలి.

తెలుగు కథా  సాహిత్యం లో 1966 లో ప్రచురించిన తన యజ్ఞం కథ  ద్వారా ఇంకో ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత శ్రీ కాళీపట్నం రామారావు గారు తెలుగు సాహిత్యం మీద తమ ముద్రా వేసుకున్నారు. 1960 ల ఆఖరులలో  శ్రీకాకుళం లో  మొదలయిన నక్సల్బరి ఉద్యమం లోంచి అద్భుతమయిన కథకులు,  శ్రీపతి,  భూషణం,  అట్టాడ అప్పలనాయుడు,  యెన్.యెస్.ప్రకాశరావు తదితరుల కధలతో ఉత్తరాంధ్ర తెలుగు కథకు ఇంకో ఒరవడి, ఉద్యమ  ఒరవడి వచ్చింది.

తెలుగు కథకు హాస్య చతురత నేర్పిన భరాగో ,  వ్యంగ్యానికి ఒరవడులు చుట్టిన పతంజలి గార్లు ఉత్తరాంధ్రా వారే. పతంజలి గారి గోపాత్రుడు   అందరూ గొప్పగా చెప్పుకునే తెలుగు కథల్లో ఒకటి. ఇప్పటికీ ఈ ఒరవడి లో రాస్తున్న అనేక రచయితలున్నారు, ఉత్తరాంధ్ర లో.

సామాజిక పరిస్థితుల ఆధారంగా రాసిన రచయిత లు బలివాడ కాంతారావు, అంగర  సూర్యారావు,  రచయిత్రులు, ద్వివేదుల విశాలాక్షి ,రంగనాయకమ్మ, చాగంటి తులసి, కుప్పిలి పద్మలు ఉత్తరాంధ్ర కథ కు వన్నె తెచ్చారు.

ప్రస్తుత సామాజిక పరిస్థితుల  ఆధారంగా రాస్తున్న ఇప్పటి రచయిత(త్రు)లు బమ్మిడి జగదీష్, మల్లీశ్వరి గార్లు ఉత్తరాంధ్ర సాహిత్య వొరవడిని గట్టిగా నిలపెడుతున్నారు. వీళ్ళే కాక ఇంకా యెంతో మంది రచయితలకూ రచయిత్రులకీ ఉత్తరాంధ్ర నేపథ్య మే ఆధారమయింది.

ఉత్తరాంధ్ర తెలుగు కధ గురించి మాట్లాడినప్పుడు , శ్రీకాకుళం లో కాళీపట్నం మాస్టారు నెలకొల్పిన కథానిలయం గురించి తప్పక చెప్పుకోవాలి. కతా నిలయం లో  తెలుగు సాహిత్యం లో (ఒక్క ఉత్తరాంధ్ర సాహిత్యమే కాదు) ఉన్న అన్నీ రచనల వివరాలు పొందు పరిచారు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం దేశం లోనే చెప్పుకోదగ్గ గొప్ప సాహిత్య ఘటన .

ఇంత గొప్ప తెలుగు కథ  సాహిత్య సంపద గురించి డిల్లీలో ఉన్న తెలుగు మిత్రులకు తెలియచేయ,  డిల్లీ తెలుగు వారి సాహిత్య – సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఆంధ్రా అసోసియేషన్ “ఉత్తరాంధ్ర తెలుగు కధ పరిణామం” పైన ఒక సదస్సు నవంబర్ 8, 2015  న డిల్లీ తమ భవనం లో జరుపుతోంది.

గమనిక: మా సదస్సును పరిచయడం కోసం కొంత మంది  ప్రముఖ రచయితలనే   గురించే రాసాను. నిజానికి ఉత్తరాంధ్ర  లో ఇంకా ఎంతో  మంది  పేరున్న రచయితలూ రచయిత్రులూ ఉన్నారు. వారి గురించి రాయక పోవడం నా తప్పే. సహృదయంతో మన్నించాలి.

 

ఆహ్వానం 

ఆంధ్రా అసోసియేషన్,  డిల్లీ

ఉత్తరాంధ్ర (కళింగాంధ్ర) తెలుగు కథ పరిణామం

(గురజాడ గారి దిద్దుబాటు (1910) నుంచి ఇప్పటిదాకా) సదస్సు కు మిమ్మల్నందరినీ సాదరం గా ఆహ్వానిస్తోంది

స్థలం : ఆంధ్ర అసోసియేషన్ భవనం (సాయి మందిరం పక్కన)

లోధి రోడ్,  న్యూ డిల్లీ

తేదీ: 8 నవంబర్ , 2015 (ఆదివారం)

సమయం : ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 5.30 గం

ముఖ్య అతిథి : శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

ప్రత్యేక అతిథి : శ్రీ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు –సి ఐ సి

పాల్గొను రచయతలు: క్రీ వివిన మూర్తి, శ్రీ అట్టాడ అప్పలనాయుడు , శ్రీ గంటి గౌరి నాయుడు, డా.కె.యెన్.మల్లీశ్వరి, శ్రీ బమ్మిడి జగదీశ్వర రావు , శ్రీ ప్రసాద వర్మ, శ్రీ దుప్పల రవి కుమార్

కోటగీరి సత్యనారాయణ                                                 ఆర్.మణినాయుడు                     ప్రధాన కార్యదర్శి                                                     అధ్యక్షులు