ఉరి తాడే ఎందుకు?

 

 

  • హెచ్చార్కె

 

దిగులు పడ్డానికి భయమేసి నవ్వుతుంటావు

 

మనుషుల కోసం వెదుకుతూ అడివంతా గాలిస్తావు

ఒక్కోసారొక తీగె తనతో పాటు నిన్నొక చెట్టు చుట్టూ తిప్పుతుంది

త్వర త్వరగా నడిచి ఎక్కడికీ వెళ్లేది లేదు లెమ్మని

నువ్వు అక్కడక్కడే తిరుగుతుంటావు, ఏవేవో డొంకలు కదిలిస్తూ

 

మనసులో కాడ తెగిన పువ్వు పరిమళిస్తుంది

రెప్పల చివర తడి నక్షత్రంగా మారక ముందే తుడుచుకుంటావు

నీ దిగులు నువ్వు పడడం అంటే భయం నీకు

బదులు మెచ్చుకుంటారని చిన్న చిన్న జోకులకూ నవ్వేస్తావు

 

ఎప్పుడూ ఏదో ఒక రూపాన్ని కోరుకుంటావు

కుదరకపోతే రూపాల్ని దొంగిలిస్తావు, ఇంకా నిన్ను పట్టుకోలేదు

గాని, నువ్వు శిక్షణ లేని సముద్ర చోరుడవు

లేదా ఒకరికి తెలీకుండా మరొకరు అందరూ దయ్యాలే అయిన

 

రెక్కలు లేని, రెక్కలక్కర్లేని లేని పక్షులలో

ఒక విపక్షానివి, నీ ఎదిరింపు ఓ నటన, ప్రత్యేకం నువ్వున్నట్టు

ఒప్పించడానికి నువ్వు కట్టిన విచిత్ర వేషం,

నీకు ఎప్పుడేనా అనిపించిందా నువ్వు కేవలం ఒక ఊహవని?

 

ఒక వూహ వూహించిన వూహ ఈ కవిత

క్షూ హాంఫట్, అబ్రకదబ్ర, సారీ విమర్శించాను యండమూరీ!

ఆ అమ్మాయి మాత్రమే కాదు ఆత్మహత్య

చేసుకున్నది, ఆత్మహత్యకు ఉరితాడేనా? చాల దార్లున్నయ్

*

మీ మాటలు

  1. మనసులో కాడ తెగిన పువ్వు పరిమళిస్తుంది

    రెప్పల చివర తడి నక్షత్రంగా మారక ముందే తుడుచుకుంటావు… ఎంత అందమైన పద చిత్రమో !! మీరు రాస్తున్న మానసిక విశ్లేషణ కి చెందిన కవితలు చాలా బాగుంటున్నాయి అవి నిజాలైనా సరే .

  2. Indus Martin says:

    ఇంగ్లీష్ లో ఒక ఫ్రేజ్ వుంది ‘ కొలేట్రల్ డేమేజ్ ‘ …. హెచ్చార్కె , మీ పజ్జెం నిండు స్టేడియం లోపేలిన గ్రెనేడ్ లా … మనుషుల్ని … మనసుల్ని … ముసుగుల్ని … అన్నిట్నీ .. అందర్నీ ఒక రౌండ్ రేలగొట్టింది ! మీ పదును రోకురోజుకూ పెరిగిపోతుంది , మీయవ్వనంలా !

  3. బ్రెయిన్ డెడ్ says:

    రోజు జరిగే మానసిక హత్యల మధ్య నిజమే అత్మహత్యలకి ఉరితాళ్ళే అక్కర్లేదు కదా

  4. Krishna Veni Chari says:

    >నీ దిగులు నువ్వు పడడం అంటే భయం నీకు<
    వావ్‍

  5. Krishna Veni Chari says:

    >నీ దిగులు నువ్వు పడడం అంటే భయం నీకు<
    చాలా నిజం.

  6. చాల సంతోషం. నిజం చెప్పొద్దూ కవిత లోని ఉద్వేగం పఠితకు చేరదేమోనని సందేహం వుండింది. దీన్ని అచ్చుకు పంపుతూ అఫ్సర్ కు అదే రాశాను. నచ్చితేనే ప్రచురించాలని. పద్యం అచ్చయ్యే ముందు కనీసం ఒక్కరికైనా అందాలని, నచ్చాలని. ఆ సందేహం పూర్తిగా తీరింది. నేను మీకు అందాను. ఈ విషయం చెప్పినందుకు చాల థాంక్స్. నా పద్యాల కోసం ‘మానసిక విశ్లేషణ’ అనే మాట వుపయోగించినందుకు భవానికి అదనంగా ఇంకో ‘థాంక్యూ’. :-)

  7. ఏంటో చాలా రాద్దామనుకున్నాను కానీ మెదడూ చేతులూ కూడా ఆ తీగ చెట్టు చుట్టూనే గిరికీలు కొడుతున్నై. పైన ఇండస్ మార్టిన్ గారి మాటే నాదీనూ. కాపోతే ఆ క్షుద్ర మాంత్రికుడి పేరు ప్రస్తావించకుండా ఉంటే పోయేదేమో .. ఆ నాలుగు అక్షరాల్ని చదివినందుకు ఇప్పుడు కాసిని కన్నీళ్ళు కార్చి కళ్ళు ప్రక్షాళనం చేసుకోవాలి. పర్లేదులే, చుట్టూ చూస్తే సవాలక్ష కారణాలు కళ్ళు చిప్పిల్లడానికి!

  8. ఆత్మ హత్య చేసుకోవడానికి ఉరితాడే అవసరం లేదు. ఒక ఊహలా, జీవమే లేకుండా, స్వేచ్ఛే లేకుండా, తాను తనలా లేకుండా..ఎస్కేపిస్టుగా నిజ జీవితానికి దూరంగా, మనుషులకు దూరంగా ఊహలోని కవితలాగా వర్చువల్ వరల్డ్ లో బతికేయటం కూడా ఆత్మ హత్యే. ఆధునిక మనిషి యొక్క పాథటిక్ కండీషన్ ని కవిత్వంలో చెప్పినట్టనిపించింది. బతికున్నామనుకునే శవాలు, ఆత్మహత్య ఇంకెవరో చేసుకుంటే చూసి అసహ్యించుకొంటూనో..నవ్వుకుంటూనో ఉండే దృశ్యమొకటి ఎదురయింది ఈ కవితలో. ఎజ్రా పౌండ్ కి ఎక్జాక్ట్ కాపీలా కనిపిస్తున్నారు ఈ కవితలో మీరు. ఫ్రాయిడ్ నో, మోడెర్న్ లైఫ్ లోని లైఫ్నెస్ నెస్ నో తెలిసుకోలేక పోతే, కవిత అర్థం కాని పరిస్థితే ఇది. మీ హైలీ స్పెషలైజ్డ్ కవిత, హైలీ స్పెషలైజ్డ్ పాఠకున్ని ఎన్నుకుంటోంది హెచ్చార్కే గారూ.

  9. Narayana Swamy. Thanks a lot for those words. Well, I had to mention the name; the trend he represents is one of the contexts for the poem, the other side of imagination poem talked about, the trend of cashing upon the fear, horror, greed and avarice.

    And, Virivinti Virinchi, ‘copy’ isn’t much desirable a word (smiles), but, am really happy to see that the poem reminds you of that great man of poetry and poetics. Loves

మీ మాటలు

*