Archives for March 2014

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 13 వ భాగం

15

( గత వారం తరువాయి)

13

పంచాయితీరాజ్‌ మంత్రి వీరాంజనేయులకు ముచ్చెమటుల పట్టి నిప్పుల ప్రవాహంవంటి జ్ఞాపకం తెగిపోయింది.
పచ్చని అడవి నడుమ.. విశాలమైన చదునైన గడ్డిమైదానం.. చుట్టూ గుట్టలు.. దూరాన నీలివర్ణంలో కనిపిస్తున్న చెరువు.. అంతా ప్రశాంతమైన ప్రకృతి.
ఆ రోజు ప్రక్కఊరు మహదేవ్‌పూర్‌లో గిరిజన సంత., ముగిసి.. సాయంకాలం.. చుట్టూ పదూళ్ళ ప్రజలు ఎక్కడివాళ్లక్కడికి ఇండ్లకు చేరపోయే ప్రయాణంలో.. మధ్య కావాలని.. ఆ ప్రాంతంలో ‘పంతులుగారు దేవుడు’ అని పేరున్న రామన్న పిలుపు మేరకు అందరూ ఆ ఆకుపచ్చని గడ్డిమైదానంలో సమావేశమై,
వందలమంది గిరిజనులు.. పెద్ద, చిన్న, ముసలి, ముతక.. ఒంటిపైన సగం బట్టలు.. సగం బరిబాత.. దాదాపు అందరి చేతుల్లో ఓ కంక కర్ర.
అందరిచూపుల్లోనూ సెలయేటి నీటిలోని నిర్మలత్వం.. స్వచ్ఛత
జనం మధ్య.. ఎత్తుగా వేదిక.
”జనసేన.. ధన్యవాద సభ..” అని వెనుక పెద్ద పెద్ద అక్షరాలు.
గిరిజనబాంధవుడు పంచాయితీరాజ్‌.. మంత్రి శ్రీ వీరాంజనేయులు గార్కి, గిరిజన అభివృద్ధికి నిరంతరం శ్రమించే భగవత్‌ స్వరూపులు చీఫ్‌ ఇంజినీర్‌ బొలుగొడ్డు గురువయ్య గార్కి, సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ రమణగార్కి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ముత్యాలు గార్కి, డివిజినల్‌ ఇంజినీర్‌ మహమ్మద్‌ ఇస్మాయిల్‌ గార్కి, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ జాన్సన్‌గార్కి.. న్యవాద మరియు అబినందన సభ. అధ్యకక్షులు మానవహక్కుల కమీషన్‌ చైర్మన్‌ జి. విశ్వనాథరావు గారు ప్రారంభకులు డాక్టర్‌ కె. గోపీనాథ్‌ గారు. నిర్వహణ.. భద్రాచలం గోదావరీ పరీవాహ ప్రాంత గిరిజన మూలవాసీ సంఘం మరియు జనసేన.
”అరె నీయమ్మ.. ఈ సభ వద్దుపో అని మొత్తుకున్నగదరా గుర్వయ్యా.. నాకెందుకో యిదంత చూస్తూంటే అదెందో ఉందని అప్పుడే అన్పించింది. యిప్పుడుసూడు ఈ ప్లాట్‌ఫాంమీద ఎవరెవరున్నరో, ఏం జర్గబోతోందో.. ఇగ తప్పించుకపోలేం.. ఉంటే ఇరుక్కపోయేటట్టున్నం.. నీయమ్మ. భూమిపుండుల చిక్కినంగాదుర..” మంత్రి వీరాంజనేయులు చీఫ్‌ ఇంజినీర్‌ గురవయ్య చెవిలో గుసగుసగా అంటూండగానే.. ఎవరో గిరిజన ఉపాధ్యాయుడు ”యిప్పుడు మూడవ తరగతి చదువుతున్న నీలమ్మ మంత్రిగారికి అడవి మొగలిపూల గుచ్ఛం అందిస్తుంది” అని మైక్‌లో ప్రకటించాడు. వెంటనే ఓ నల్లని పాముపిల్లలా తళతళలాడ్తున్న ప్రాథమిక పాఠశాల అడవిపిల్ల మెరుపులా వేదికమీదికొచ్చి మంత్రిగారికి పెద్ద మొగలిపూల గుత్తినందించింది.
చుట్టూ మధురమైన సువాసన గుప్పుమని.,

”గుర్వయ్యా.. నాకు భయమైతాందిరా.. గీ అడవి సభల గిన్ని మన తెలుగుల ఉన్న అన్ని టి.వి. చానళ్లెందుకచ్చినై. గిన్ని పత్రికలోళ్ళెందుకచ్చిండ్లు.. గీ మేధావులలెక్క కన్పించే మనుషులు ఎందుకు గీ అడవిజనంల కల్సి ఉన్నరు.. ఏంటిదిదసలు..” మంత్రికి చెమటలు పోస్తున్నాయి.
దొంగ అందరికన్నా ముందు ప్రమాదాన్ని పసిగడ్తాడు.
”ఆగుండ్లి.. మీరనవసరంగా హైరాన పడకుండ్లి..” చీఫ్‌ ఇంజినీర్‌ గురవయ్య గుంభనంగా అన్నాడు. గాని.. లోలోలప అతనికీ ఉచ్ఛపడ్తోంది.

పుష్పగుచ్చాలు.. స్వాగతవచనాలు.. ముగిసి.. సభానిర్వహణను సభాద్యకక్షులు, మానవ హక్కుల సంఘం చైర్మన్‌ విశ్వనాథరావుకు అప్పగించగానే.. ఆయన మొట్టమొదలుగా లేచి నిలబడి.. ప్రారంభవాక్యాలు చెప్తూండగా.,
”ఏదో అర్జంట్‌ పనుందని తప్పించుకుపోతే..” అన్నాడు మంత్రి సి.ఇ చెవిలో.
”అస్సలే బాగుండది.. అసలే ఆ అధ్యకక్షుడు హుమన్‌ రైట్స్‌ కమీషనోడు. .. వాసన చూత్తడు..”

”ఊఁ.. ” మంత్రి అసహనంగా.. భయంభయంగా కదుల్తూ.. ”నీ తల్లి ఏం సభరో ఇది.. గింతగనం జనం.. యింకా వత్తాండ్లు” అని గొణుక్కుంటూ, ఒంటినిండా చెమటతో అంగి తడిచిపోయింది. దూరంగా ఎక్కడో తన కార్ల కాన్వాయ్‌..పోలీసులున్నారు.. వెనుక ఒక నల్లయూనిఫాం గన్‌మన్‌ ఉన్నాడు నిలబడి నల్లని రాతివిగ్రహంలా.,
”.. నాకు ఈ గిరిజనులు మధ్య ఈ పూట గడపడం ఎంతో ఆనందంగా ఉంది.. ఒక ప్రత్యేక ధన్యవాద సభకు తప్పకుండా రావాలని ఈ మూలవాసీ నాయకులు నన్ను అడిగితే ఈ అడవి బిడ్డలతో జీవితాన్ని పంచుకుందామని..” అలా ఓ ఐదునిముషాల అధ్యకక్షుని ప్రసంగం సాగి సాగి.. ”ఇప్పుడు అసలు ఈ సభ ఎందుకు.. ఈ ధన్యవాదాలు ఎందుకు.. ఎవరికి.. గిరిజన జీవితాలను ఉద్దరించేందుకు ఈ వేదికపైనున్న ప్రముఖులు ఎలా ఈ వెనుకబడ్డ ఆదివాసీల బ్రతుకులను బాగుచేస్తున్నారు. ఈ విషయాలను మీకు పరిచయం చేసేందుకు భద్రాచలం గోదావరీ పరీవాహ ప్రాంత గిరిజన మూలవాసీ సంఘం అధ్యకక్షులు, వృత్తిరీత్యా ఉపాధ్యాయులు శ్రీ వినోభా తుట్టె గారిని ఆహ్వానిస్తున్నాను..” అని హెచ్‌ఆర్‌సి చైర్మన్‌ విశ్వనాథరావు ప్రకటించి కూర్చున్నారు. వెంటనే విపరీతమైన ఆనందాతిరేకాలతో చప్పట్లు.. ఒక సముద్రం పొంగినట్టు.
మైక్‌ముందుకు వినోబా తుట్టె.. మెల్లగా గంభీరంగా నడుచుకూంటూ వస్తూండగా .. ఇంకా ఇంకా ఆగని.. ఎడతెగని చప్పట్లు.
”వీనికెంత ఫాలోయింగుందిరా గుర్వయ్యా..” అన్నాడు మంత్రి అప్రయత్నంగానే.
”అధ్యక్షులు, పెద్దలు మానవ హక్కుల కమీషన్‌ చైర్మన్‌ శ్రీ విశ్వనాథరావుగారు. పంచాయితీరాజ్‌ మంత్రివర్యులు శ్రీ వీరాంజనేయులుగారు. ప్రియాతిప్రియమైన ప్రజలారా.. ఈ రోజు ఎంతో సుదినం.. ఎందుకంటే అతికీలకమైన కొన్ని విషయాలు ఈ రోజు బయటికి ప్రపంచానికి తెలియజేయబడి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక ప్రధాన మలుపుకు కారణభూతం కాబోతున్న సభ యిది. మిత్రులారా మీరు చాలా జాగ్రత్తగా నేను చెప్పబోతున్న విషయాలను విని అర్థం చేసుకుని కళ్ళు విప్పాలె యికనైనా.. ఈ దేశం దాదాపు మొత్తం అవినీతి రాజ్యం, లంచగొండి రాజ్యంగా మారిపోయింది. కోట్లకు కోట్ల ప్రజాధనాన్ని నిస్సిగ్గుగా ఎవనికి అందిందివాడు తింటూంటే దాన్ని కట్టడిచేసే నాథుడేలేడు..” వినోబా ప్రసంగం అగ్గి అంటుకున్న అడవిలా మొదలైంది. వేదిక ముందు మీడియా కెమెరాలు ఒళ్లు విరిచాయి. అంతా డాక్యుమెంటవుతోంది.

”సమాచార చట్టం – 2005 ప్రకారం.. మూడు సంవత్సరాల క్రితం ప్రపంచబ్యాంకునుండి తీసుకున్న వందలకోట్ల అప్పును గిరిజన, ఆదివాసీ తెగల అభివృద్ధి గురించి ప్రభుత్వం అనేక పథకాలను ప్రకటించి వినియోగించమని నిధులను విడుదలచేసింది. ఆ వందలకోట్ల రూపాయల నిధులను మంత్రులు, శాసనసభ్యులు, ప్రాజెక్ట్‌ డైరెక్టర్లు, ఇంజినీర్లు.. ఎలా విచ్చలవిడిగా భోంచేసి హాంఫట్‌ చేశారో.. మీరే స్వయంగా చూడండి..”
అప్పుడే చీకటిపడ్తున్న సాయంసంధ్యా సమయంలో.. వేదిక ప్రక్కనే ఉన్న తెరపై ఒక ఎల్‌సిడిలోనుండి ప్రొజెక్షన్‌ మొదలైంది.
”మన బర్లగూడెంనుండి తత్తరిపల్లెదాకా.. అంటే దాదాపు నాల్గున్నర కిలోమీటర్ల పొడవు డాంబర్‌ రోడ్‌ను పదిహేడు లక్షల రూపాయలు పెట్టి ఈ మంత్రిగారు, ఈ చీఫ్‌ ఇంజినీర్‌, ఈ ఇ.ఇ, డి.ఇ. ఎ.ఇ సార్లు మనకోసం వేశారట.. అది మొన్న వచ్చిన వరదల్లో కొట్టుకుపోయిందట. మీలో ఎందరు ఆ రోడ్డుమీద నడిచిండ్రో.. ఎన్నాళ్లు  ఆ రోడ్డు అక్కడ ఉందో.. దాన్ని ఎవరైనా మీరు చూచిండ్రో.. కాస్త చూచి, ముచ్చట్లు విని చెప్పుండ్రి..”
మస్త్‌ తాగి.. గెస్ట్‌హౌజ్‌లో మాట్లాడ్తున్న మంత్రి వీరాంజనేయులు.. ప్రక్కన చీఫ్‌ ఇంజినీర్‌ గురవయ్య, ఎస్‌.ఇ రమణ.. అందరూ.. వాళ్లు మాట్లాడ్తున్న మాటలు.. మైకుల్లో అందరూ వినేట్టు.. అడవి దద్దరిల్లిపోయేట్టు..,
”ఏయ్‌.. నాకిప్పుడు నాల్గు లక్షలు క్యాష్‌ కావాలె.. నీయవ్వ. మీ ఎస్టిమేషన్‌ ఎంతనో. ఆ రోడ్డు ఎక్కడ్నో .. కాంట్రాక్టరెవ్వడో.. అదంత నాకు తెల్వది.. టర్మ్స్‌ ఇన్‌ క్యాష్‌.. క్యాష్‌.. యిచ్చి నాతోని ఎక్కడెక్కడ కావాల్నో అక్కడ అన్ని సంతకాలు తీస్కోండి.. గంతే..” మంత్రిగారి గొంతు. బొమ్మ.. స్పష్టంగా.,

కాంట్రాక్టర్‌ రామలింగం ఐదు లక్షల రూపాయల వేయి నోట్ల కట్టలు హాండ్‌ బ్యాగులోనుండి తీస్తూ..
అందరూ చూస్తున్నారు.. కిమ్మనకుండ.. ఓ సినిమావలె.. అడవిజనం.. రికార్డు చేస్తున్న మీడియా, పోలీసులు.. ప్రెస్‌ పాత్రికేయులు.,
గాలి స్తంభించిపోయినట్టు నిశ్శబ్దం.

తర్వాత.. సినిమా నడచి, నడచి.. సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ రమణ గొంతు.. ”కాంట్రాక్టర్‌ రామలింగం జూన్‌ మొదటివారంలో బిల్‌ డ్రా చేసుకుంటాడు.. ఫైల్‌ క్లోజ్డ్‌.. డి.డిస్‌.. మళ్ళీ సెప్టెంబర్‌లో.. రోడ్‌ కొట్టుకుపోయిందనే నోట్‌ అప్రూవల్‌తో ఫైల్‌ క్లోజ్డ్‌ ఎల్‌.డిస్‌.. అర్ధమైందా..” క్లిప్పింగు కట్టయింది.

”అర్ధమైందా మిత్రులారా.. వేయని రోడ్‌కు.. పదిహేడు లక్షలు.. రాజీరా నుండి మోత్కుపల్లె దాకా లేని రోడ్డుకు ఇరవై లక్షలు.. అప్పనంగా తిని.. గిరిజనుల సొమ్మును వంతులవారీగా భోంచేసిన వేదికపైనున్న పెద్దలకు మనం ధన్యవాదాలు చెప్పి సన్మానం చేయాలెగదా.. ఏమంటారు.”
”చేయాలె చేయాలె..”
వందలమంది ఒంటిమీద సరిగ్గా బట్టల్లేనివాళ్లు.. డొక్కలెండిపోయినవాళ్ళు. ఆడ, మగ, పిల్లలు.. చేతుల్లో పాత, చీకిపోయిన చెప్పులను చేతుల్లోకి తీసుకుని.. ”సన్మానం చేయాలె..” అని అరుస్తున్నారు.

క్షణాల్లో వాతావరణం బీభత్సంగా మారిపోయింది.
”స్టాప్‌ ద ప్రొజెక్షన్‌..” అని అరిచాడు మంత్రి వీరాంజనేయులు..పిచ్చికుక్కలా మొరుగుతూ
ఐతే ఆ అరుపు చీఫ్‌ ఇంజనీర్‌ గురవయ్యకు తప్పితే ఎవరికీ వినబడలేదు.
జనం ఎగిసిపడ్డ కెరటంలా లేచి వేదికవైపు పరుగెత్తుకొస్తున్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామానికి ఉలిక్కిపడ్డ మంత్రివెంట వచ్చిన ఓ పదిపన్నెండుమంది పోలీసులు గబగబా వేదికముందుకు పరుగెత్తుకొచ్చి., సరిగ్గా.. మంత్రిగారి వెనుక నిలబడ్డ పర్సనల్‌ సెక్యూరిటీ గన్‌మన్‌ అంజయ్య మాత్రం కదలకుండా, గన్‌ను సవరించుకోకుండానే ఊర్కే జర్గుతున్నదాన్ని అలా బొమ్మలా చూస్తూ.. ”మంచిపనైంది ముండాకొడుక్కు.. థూఁ..” అనుకుంటూండగా, నిశ్చింతగా, కదలకుండానే,
”మిత్రులారా.. మీరు సంయమనంతో కూర్చోండి.. యిక్కడ అన్నీ ఋజువులతో ఉన్నాయి.. హింస దేనికీ పరిష్కారం కాదు.. మేము జనసేన తరపున యిచ్చిన కంప్లెయింట్‌ను స్వీకరించి ఆంటీ కరప్షన్‌ బ్యూరోవాళ్లు ఈ మంత్రిగారి, చీఫ్‌ ఇంజినీర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌.. వీళ్ళందరి, వీళ్ల బంధువుల ఇండ్లపై సోదాలు ప్రారంభించారు కొద్దిగంటల క్రితమే. వీళ్ళకు సెల్‌ఫోన్‌లు రాకుండా మేము ముందే అన్నీ జామ్‌ చేశాం కాబట్టి వీళ్ళకీ విషయం తెలియదు. యిప్పటికే వీళ్ళందరి కొంపల్లో ఒక్కొక్కని దగ్గర కనీసం పదిహేను కోట్లకంటే ఎక్కువ నగదు.. కిలోలకొద్ది బంగారం, భూముల రిజిష్ట్రేషన్‌ కాగితాలు, ఎఫ్‌డీలు… అన్నీ బయటపడ్డాయి. యింకా బయటపడ్తున్నాయి.. పెద్దలు.. విజ్ఞులు.. మానవ హక్కుల చైర్మన్‌ విశ్వనాథరావుగారి సమక్షంలో సమాచారా చట్టం క్రింద మేం తీసుకొచ్చిన ఈ రెండు రోడ్ల నిర్మాణం తాలూకు సర్టిఫైడ్‌ కాపీలున్నాయి. వీటి ఫైల్‌ కాపీ ఉంది.. రోడ్లు అసలు వేయనేవేయకుండా డబ్బు తిన్నట్టు సంభాషణలు రికార్డయిన సి.డిలున్నాయి. ఇప్పుడు ఈ వందలమందిమి.. ఈ అవినీతిని ప్రతిఘటిస్తూ వందలసంఖ్యలో దరఖాస్తులనిస్తం.. వీటిని సుమోటో కేస్‌గా స్వీకరించి.. ప్రజలకు న్యాయం చేయవలసిందనీ, న్యాయాన్ని రక్షించవలసిందనీ.. లంచగొండితనంతో కుళ్ళిపోతున్న ఈ సమాజాన్ని ప్రక్షాళన చేసే సుదీర్ఘ ఉద్యమ కార్యక్రమంలో మొదటి అడుగుగా జనసేన ప్రారంభించిన ఈ పోరాటయాత్రను ఆశీర్వదించవలసిందనీ విశ్వనాథరావుగార్ని ప్రార్థిస్తున్నాం. జైయ్‌ జనసేన.. జైజై జనసేన..జై జనసేన….”

నినాదాలు ఉప్పెనై ఆకాశం దద్దరిల్లిపోతోంది.. ప్రజావెల్లువ.. ఒక చైతన్య దీప్తి.
విశ్వనాథరావుకు ఎందుకో పరమానందమైంది.. అబ్బా.. ఇన్నాళ్ళకు.. ఎక్కడో ఈ మారుమూల.. ఈ అడవిలోనుండి ఒక ప్రతిఘటన ప్రారంభమైంది.. యిది యింకా యింకా అంటుకున్న అడవిలా విస్తరించి విస్తరించి పట్టణాలను, నగరాలను ఆవహించి విజృంభిస్తే ఎంత బాగుండు.. అని అనుకుంటూండగా..,

”సర్‌.. అదంతా ఒట్టి బూటకం సర్‌..” అంటున్నాడు ప్రక్కన మంత్రి వీరాంజనేయులు.. చీఫ్‌ ఇంజనీర్‌ గుర్నాదం మాత్రం తన నూటా పదికిలోల శరీరం చెమటముద్దయి తడిసిపోతూండగా అవాక్కయి..
”మంత్రిగారూ.. మిగిలిన ఇంజనీర్లందరూ.. మానవ హక్కుల ఉల్లంఘన క్రింద ఘోరమైన అపరాదం చేశారు.. మిమ్మల్ని సుమోటోగా నేను స్వీకరిస్తున్న ఈ కేసును విచారించే వరకు పోలీస్‌ కస్టడీలో ఉండేందుకు ఆదేశిస్తున్నాను…” అని విశ్వనాథరావు వేదికపైనున్న తన కుర్చీలోనుండి లేచి.. వేదికపైకి దూసుకువస్తున్న జనాన్ని అదుపులో ఉంచేందుకు మైక్‌ను స్వయంగా తీసుకూని..
”మిత్రులారా..నేను చెప్పేది వినండి..” అని అరుస్తూంటే,
”పందికొక్కులు లంజకొడ్కులు.. రోడ్లు.. చెర్వులు, కల్వర్టులు, చెక్‌డ్యాంలు.. ఎన్ని తింటర్రా.. ” అని అరుస్తున్నారెవరో.
వాతావరణం బీభత్సంగా ఉంది.
అడవి నుండి కార్చిచ్చు మీడియాద్వారా.. జిల్లా కేంద్రానికి.. హైద్రాబాద్‌కు.. జనసేన కార్యాలయం రామంకు, టి.వి.లను వీక్షిస్తున్న లక్షల జనాల్లోకి.. ప్రాకి ప్రాకి.,
”బ్రేకింగు న్యూస్‌.. అవినీతి ఉచ్చులో మంత్రి వీరాంజనేయులు. ఐదుగురు ఇంజనీర్లు..”
”పకడ్బందీ వ్యూహంతో అవినీతి భాగోతం బట్టబయలు చేసిన జనసేన”
”ఎవరీ జనసేన.. ఏమిటి వాళ్ళ లక్ష్యాలు”
”మంత్రి.. ఇంజినీర్లు మానవహక్కుల కమీషన్‌ అధీనంలోకి”

టి.వి. ఛానళ్ళన్నీ ఒకదానిపై ఒకటి పోటీపడి త్రోసుకుని త్రోసుకుని ప్రసారాలను చేస్తూనే ఉన్నాయి.
అడవి గర్భంలోనుండి ఒక అగ్నిబీజం మొలకెత్తి,
ఒక పిడికిలి వేల పిడికిళ్ళుగా, వేల వేల పిడుగులుగా విస్తరిస్తున్న క్షణం,
జనం మెదళ్ళల్లో.. ఒక ఆలోచన లక్షల ఉప్పెనలై.,

కనుగొంటి కనుగొంటి…

drushya drushyam-23తీసిన కన్నే అయినా కొన్ని చిత్రాలు జరూరుగా మళ్లీ కళ్లల్లో పడి కలవరపెడతాయి. గుండెను కలుక్కుమనిపిస్తాయి.
‘మో’ అన్నట్టి “బతికిన క్షణాల’ను యాతనకు గురి చేస్తూ ఉంటాయి. ‘అజంతా’లా ఒకే కవితను పదే పదే చెక్కినట్టు, ఒక ఫొటోయే మనిషిని గతం కోసం వర్తమానం కోసం భవిష్యత్తు కోసం కూడా కొద్దికొద్దిగా చెక్కి విడిచిపెడుతుంది! కనాలని, వినాలని!

‘వెన్నుపూస’ కనిపిస్తున్న ఈ ముసలమ్మ ఫొటో నావరకు నాకు అలాంటి జలదరింపే.
ఉదయం లేవగానే నా పాదాలకు నేను నమస్కరించుకున్నాననే కవి సమయం వంటిదే!
ఒక ప్రాతఃస్మరణీయ అస్తిత్వం.

చివరాఖరికి ఎవరి చిత్రమైనా ఇదే.
అనాధగా ఉన్న స్థితిని చెప్పే ఈ ఫొటో, అదే సమయంలో-తానే కాదు, ఎవరికి వారు ఆత్మస్థైర్యంతో నిలబడతారనీ చెబుతుంది. చెప్పక తప్పక చూపడం. అంతే!

+++

ఎందుకనో తిరిగి తిరిగి ఈ చిత్రం వద్దకే వచ్చి నా చూపు ఆగిపోతుంది.
మన బుగ్గలని తన గరుకు చేతులతో తడిమిన ముసలమ్మలు ఒకరొకరుగా గుర్తుకు వస్తారు, చూస్తూ ఉంటే.

అంతెందుకు చూస్తూ ఉంటే, మా ఇంట్లో మా తాతమ్మ రమణమ్మ యాదికొచ్చి ఆమె దేవుడి అర్ర తలుపు తెరుచుకుంటుంది. లేదంటే తన పాన్ దాన్ తెరుచుకుంటుంది, ఆ వెన్నుపామును కన్ను తడుముతుంటే!
చూడగా చూడగా ఆ రయిక, ఎర్రెర్రని చీర. వయసు పెరుగుతుంటే మెలమెల్లగా బాబ్డీ హెయిర్ అయిన జుట్టు…అట్లట్ల మనుషులు తప్పుకుని, గొడ్డో గోదో…పశుపక్ష్యాదులో రక్షణగా లేదంటే జీవస్పర్శగా మారిన వైనం తెలిసి వస్తంది. లోపలి చీకట్లని చీల్చే ఒక బైరాగి తత్వాన్ని ఆలపిస్తుంది.

+++

అట్లా చూస్తూ ఉంటే, తెలిసిన ముసలివాళ్లు, వాళ్ల జీవన వ్యాపకాలన్నీ కళ్లముందు తారాడి, వాళ్ల దగ్గరి తంబాకు వాసనో, పాన్ వాసనో…ఇంకేవో ముసురుకున్న జ్ఞాపకాలై మెదిలే ఏదో పచ్చటి జీవధాతువు స్పర్శ….
మనిషిని పొయ్యిమీంచి పెనంపైకి చేర్చినట్లాంటి ఒక చిత్రమైన కల్పన…
నేను తీసిన చిత్రమే ఒక అధివాస్తవిక చిత్రంగా మారిపోతుంది చిత్రంగా,.

చాలాసార్లు మనిషి ఉండడు. తప్పుకుంటాడు, ఏదో కారణంగా.
కానీ, ఒక వెన్నుపామైతే ఉంటుంది, బతికినంత కాలం, ఎవరికైనా, జీవచ్ఛవంగా బతికినప్పటికీ!
దానిపై చూపు నిలపడం అన్నది నా చేతుల్లో లేదు. నా ప్రణాళికలో లేదు. కానీ ఇదెలా వచ్చింది?
అదే చిత్రం.

ఒక స్థితీ గతీ ఆవిష్కరిస్తూ, ఎలాగో ఎలా తెలియదు. కానీ, హఠాత్తుగా ఒక దృశ్యం నా చేతుల్లో అలా బందీ అయి నన్ను విడుదల చేస్తుంది, గతంలోకి! తద్వారా నాతో మీరు, మీతో నేను. మనందరం ఒక చిత్రం వద్ద ఆగి ‘ఓ హెన్రీ’ కథలోలా ‘ఆఖరి ఆకు’ను చిత్రించాలేమో ఇలా. ఈ ముసలమ్మలు దీనంగా చావకుండా.

+++

నిజానికి, ఎలా బయలుదేరుతాం? చిన్నప్పుడు కాదు, పెద్దయ్యాక. చాలా మామూలుగా బయటకు బయలు దేరుతాం. మనసులో ఎన్నో తిరుగుతాయి. ఆయా పనుల గురించి, ఎటునుంచి ఎటు వెళ్లి ఆ పనుల్ని చక్కబెట్టుకోవాలో కల్పించుకుంటూ బయలుదేరుతాం. అలాగే పనిచేసే చోటుకు వెళ్లాక అక్కడ కూచుని ఏం పనులు చక్కబెట్టుకోవాలో కూడా సోంచాయించుకుంటం. దానికి తగ్గట్టు బయట ఎవర్ని కలవాలో ముందుగానే కలుసుకుంటూ వెళతాం. అయితే, ఇదంతా ఇంట్లోంచి వెళ్లడానికి ముందు మనసులో చేసుకునే గునాయింపు. కానీ, అడుగు బయట పెట్టగానే లోకంలో అప్పటిదాకా మనమెంత మాత్రం ఊహించనివి మనకు కానవస్తాయి.

అంతా మంద. గుంపు. అందులో ‘కాటగలవకుండా ఉండేందుకా’ అని ఇంట్లోనే కొన్ని అనుకుని బయలు దేరుతాం. కానీ ఏమవుతుంది? కొత్తవి కనబడతాయి. పాతవే సరికొత్తగా తారసపడతాయి. తెలియకుండానే అవి మళ్లీ పరిచయం అవుతాయి. మెలమెల్లగా మరింత సన్నిహితం అవుతాయి. కొన్ని పరిచయాలు ఇంకాస్త దగ్గర అయి మనతో ఉంటాయి. కొన్నేమో అలా వచ్చి ఇలా వెళతాయి. కానీ, ఏదీ మనం ప్లాన్ చేసుకోం. నిజానికి మనం ప్లాన్ చేసుకున్నవి సఫలమయ్యాయో, విఫలమయ్యాయా విచారించుకుంటే నూటికి తొంభై లేదంటే యాభైశాతం ఫెయిల్ అవుతాయి. మొత్తంగా ప్లానింగ్ వృథాయే అవుతుంది. కానీ, అంగీకరించం. వేరే కొత్తవేవో ముందుకు వచ్చి పడతాయి. వాటితో ఆ క్షణాలు, ఘడియలు సరికొత్త గంతులేసుకుంటూ అట్లా దొర్లిపోతాయి. కానీ ఆ కొత్తవాటిని సరిగ్గా చూసి, అభిమానంగా దర్శించుకుంటే ఎన్నో పాత విషయాలు. నా వరకు నాకు, అందులో ఈ వృద్ధతేజం కూడా ఉంటుంది.

సరిగ్గా చూస్తేగానీ తెలియదు. అప్పటిదాకా మన నాయినమ్మని మనం సరిగ్గా చూడం. మన తాతమ్మను మనం సరిగ్గా కానం. కానీ, బయట చూసింతర్వాత లోపలికి చూసుకోవడం పెరిగిందా అది మళ్లీ కొత్త జీవితానికి చిగుర్లు తొడుగుతుంది.
అందుకు దారిచూపేది కళే.

+++

నృత్యమా గానమా సంగీతమా సారస్వతమా ఛాయాచిత్రమా అని కాదు, ఏదో ఒక కళ.
జీవితం ఆవహించిన కళ.

కళ ఒక సూక్ష్మ దర్శిని.
ఇందులో చూడగా కలగలసి పోతున్న, కాటగలసి పోతున్న జీవనదృశ్యాలన్నీ వేరుపడతయి.
మళ్లీ నిర్ధిష్టమై మనల్ని మనకు అప్పజెప్పుతయి.

ఈగలు ముసిరిన కొట్టమే కాదు, అక్కడొక శునకమే కాదు, ఆవు మాత్రమే కాదు, వెనకాల మనిషి మాత్రమే కాదు, మన నాయినమ్మ కూడా కనబడుతుంది.
నాయినమ్మో తాతమ్మో ఆమె తనని తాను నిలదొక్కుకునే చేవను కోల్పోయినప్పటికీ, వొంగి నడుస్తున్నప్పటికీ- ఆమె వెన్నుపూస తళుక్కున మెరుస్తుంది, క్షణమాత్రమే!
ఆ క్షణం కెమెరాకు చిక్కడం ఎప్పుడు జరిగుతుందీ అంటే బయటకు వెళ్లినప్పుడు! ఇల్లు దాటి బయటకు వచ్చినప్పుడు! మనలో మనమే ఉండకుండా ఏమీ కాకుండా, ఊరికే ప్రయాణిస్తూ ఉండినప్పుడు. అదే కళ.

+++

మనకెన్నయినా పనులు ఉండనీ, పనిలో పనిగానైనా మనల్ని చకితుల్ని చేసే జీవన ధాతువుకోసం విరామంలో ఉండాలి. లక్ష్యం కన్నా గమ్యంలో, గమనంలో ఉండటమే కళ. అలా అనుకున్నప్పుడు, ఈ చిత్రం నా నిర్లక్ష్య అసంకల్పిత యానంలో ఒకానొక క్షణభంగుర రహస్యం. హైదరాబాద్ లోని లోయర్  టాంక్ బండ్ దిగువన ఉన్న మార్వాడీ గోశాల దగ్గర ఆఫీసు ఎగ్గొట్టి ఒక పూట ఉండిపోయినప్పటి చిత్రం ఇది. ఏవేవో మనసులో అనుకుని బయలుదేరి,  ఇక్కడి స్థల మహత్యానికి నేను బలహీనుడ్ని అయిపోయి, ఈ బలమైన శక్తివంతమైన జీవితాన్ని కనుగొన్నాను. అందుకు ధన్యుణ్ని.

-తొలుత కెమెరా ప్రపంచాన్ని చూపిన నాన్నకు, అటు తర్వాత జీవితంలో ఉండేందుకు అలక్ష్యంగా ఉండటమే మేలని నేర్పిన రఘురాయ్ గారికి, నా ‘వెన్నుతట్టిన’ ఇటువంటి ఎందరో తల్లులకూ వందనాలు, అభివందనాలు.

మొదటికి, మళ్లీ మళ్లీ జీవితాన్ని కనుగొనాలనే ఇదంతా.

~ కందుకూరి రమేష్ బాబు

మనం చూడని మరో ఆదివాసీ కోణం!

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

బ్రాహ్మణుల మధ్య ఉంటూ, బ్రాహ్మణ వేషంలో కూడా ఉన్న అర్జునుడనే ఒక మైదాన ప్రాంత వాసికి-

క్షత్రియులు బ్రాహ్మణునీ, అగ్నిహోత్రాన్నీ ఎప్పుడూ వెంట ఉంచుకోవాలని…ఒక ఆదివాసీ గంధర్వుడు బోధించడం!!!

తమాషాగా లేదూ?!

ఇందులోని మర్మం ఏమిటా అని ఆలోచించిన కొద్దీ నాకు ఆశ్చర్యం కలుగుతోంది. ఒక కీలకమైన ప్రశ్ననూ ముందుకు తెస్తోంది. అంతే కుతూహలం కలిగిస్తున్నది ఏమిటంటే, ఈ తమాషాకు సంప్రదాయపండితులు ఎలాంటి భాష్యం చెబుతారని. బహుశా ఒక సమర్థన ఇలా ఉండచ్చు: పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు. అందులోనూ బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. తమ ఉదరపోషణకే భిక్షాటన మీద ఆధారపడుతున్నారు. కనుక ఇంకొక బ్రాహ్మణుని పోషణను వాళ్ళు తలకెత్తుకోవడం కష్టం. అదీగాక, వాళ్ళే బ్రాహ్మణ వేషంలో ఉన్నారు కనుక పురోహితుని రూపంలో ఇంకో బ్రాహ్మణుని వెంట బెట్టుకోవలసిన అవసరమూ లేదు…

గంధర్వుడి సమస్య గంధర్వుడిది. బ్రాహ్మణుడూ, అగ్నిహోత్రమూ వెంట లేరు కనుక వారు క్షత్రియులన్న సంగతి అతనికి తెలిసే అవకాశం లేదు. పైగా వాళ్ళు బ్రాహ్మణ వేషంలో కూడా ఉన్నారు. కాకపోతే తెలిసిన బ్రాహ్మణులు కారు, కొత్తగా కనిపిస్తున్నారు. ఏమైనా బ్రాహ్మణులే కనుక, భయపెట్టి దూరంగా తరిమేయడానికి ప్రయత్నించాడు. అర్జునుడు ధిక్కరించి యుద్ధానికి దిగిన తర్వాతా, అతని చేతిలో తను ఓడిపోయిన తర్వాతే వాళ్ళు పాండవులన్న సంగతి అతనికి తెలిసింది.

ఆ తర్వాత అర్జునుడి ప్రశ్న చూడండి…’మేము పరమ ధార్మికులము, పరమ బ్రహ్మణ్యులము కదా, మొదట్లో మమ్మల్ని అదిలించి ఎందుకు మాట్లాడావూ’ అని! ‘ఎందుకంటే, మీ వెంట అగ్నిహోత్రమూ, పురోహితుడూ లేరు కనుక’ అని గంధర్వుని జవాబు!

అర్జునుడి ప్రశ్న దగ్గరనుంచీ సాగిన సంభాషణ క్రమాన్ని జాగ్రత్తగా పరిశీలించండి…తమ వెంట అగ్నిహోత్రమూ, పురోహితుడూ లేరు కనుక గంధర్వుడు తమను పాండవులుగా గుర్తించలేకపోయాడనే సంగతి అర్జునుడికి ఆపాటికే తెలిసి ఉండాలి. కానీ అతని ప్రశ్నను గమనిస్తే, అతనికి ఆ విషయం…అంటే, క్షత్రియుడి వెంట అగ్నిహోత్రమూ, పురోహితుడూ ఎప్పుడూ ఉండాలన్న విషయం … తెలియదని అర్థమైపోతోంది. ఆపైన గంధర్వుడు క్షత్రియుని వెంట పురోహితుడు ఎప్పుడూ ఎందుకు ఉండాలో వివరించిన తీరులో కూడా అర్జునుని తెలియని తనమే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

ఒక క్షత్రియుడికి తప్పనిసరిగా తెలియవలసిన ఒక సంప్రదాయం, లేదా ఆనవాయితీ అర్జునుడికే కాక పాండవులందరికీ అప్పటికి తెలియకపోవడం అనేది దేనిని సూచిస్తుంది?! కొంపదీసి వారిది అనుమానాస్పద నేపథ్యం అన్న సంగతినా? అటువంటి వాదనలూ ఉన్న సంగతి మనకు తెలుసు. అయితే,  అది ప్రస్తుతాంశం కాదు కనుకా, నేనింకా దానిపై సాధికార పరిశీలన చేయలేదు కనుకా ఒక సందేహార్థకంగానే దానిని ఇంతటితో వదిలేస్తాను.

ఇంతవరకూ పరిమితమై చూసినప్పుడు ఇంకో సమర్థనకూ అవకాశం ఉందని అనిపించవచ్చు. అదేమిటంటే, క్షత్రియుని వెంట బ్రాహ్మణుడూ, అగ్నిహోత్రమూ ఉండాలన్న సంగతి పాండవులకు తెలియకేం, తెలుసు. కానీ తాము ఇప్పుడున్న పరిస్థితిలో ఆ అవసరం లేదని వాళ్ళు అనుకుని ఉండచ్చు. గంధర్వుడికి ఆ సంగతి అంత వివరంగా తెలియదు కనుక, ఆ లోపాన్ని ఎత్తి చూపి ఉండచ్చు. లేదు, మేము ఫలానా కారణం వల్ల బ్రాహ్మణుని, అగ్నిహోత్రాన్ని వెంట ఉంచుకోలేదని ముక్కూ మొహం తెలియని ఓ ఆదివాసీ గంధర్వుడికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది?

అయితే, ఇంకొంచెం ముందుకు వెడితే, ఈ సమర్థన కూడా పేలపిండిలా ఇట్టే ఎగిరిపోతుంది. ఎందుకంటే, తమకు ఒక మంచి పురోహితుని సూచించమని అర్జునుడే గంధర్వుని అడుగుతాడు. గంధర్వుడు సూచిస్తాడు కూడా. కనుక క్షత్రియుని వెంట బ్రాహ్మణుడూ, అగ్నిహోత్రమూ ఉండాలన్న సంగతి పాండవులకు తెలియదనే అనంతర కథాక్రమం కూడా వెల్లడిస్తోంది.

గమనించండి, పాండవులకు ఇదొక్కటే కాదు, మరో విషయం కూడా తెలియదు. అది, తాము ‘తాపత్య వంశీకుల’మన్న సంగతి! ‘మేము కౌంతేయులం కదా, తాపత్య వంశీకుల మెలా అయ్యా’ మని అర్జునుడు గంధర్వుని అడగనే అడిగాడు.

ఎలా అయ్యారో చెప్పుకునే ముందు గంధర్వుడి తీరు గురించి, అతని మాటల్లో దొర్లిన ఇతర విశేషాల గురించి చెప్పుకుందాం.

***

Back-To-Godhead-Mahabharat

అర్జునుడు గంధర్వుని కొప్పు పట్టుకుని ఈడ్చుకు వచ్చి  ధర్మరాజు ముందు పడేసిన దృశ్యాన్ని ఓ సారి ఊహించుకోండి: బహుశా అతనికో పెద్ద కొప్పు ఉండి ఉంటుంది. ఆడవాళ్ళతో కలసి అర్థరాత్రి అతను జలక్రీడలాడడానికి వచ్చాడు కనుక అతను మంచి విలాసపురుషుడన్న మాట. పైగా ఆ అడవంతా తనదన్న ధీమా అతనిది. ఇక్కడ ఎప్పుడెలా విహరిస్తేనేం? అందుకే, ఊహించని విధంగా పాండవుల రూపంలో పరపురుషుల ఉనికి కనిపించేసరికి అతనికి వల్లమాలిన కోపం వచ్చింది.

గంధర్వుని మాటల్ని చూడండి: వాటిలో లోతుకన్నా డాంబికమే ఎక్కువ. కింద పడ్డా పై చేయి నాదే నన్నట్టుంటాయి. అర్థరాత్రి వేళ, సంధ్యాసమయాల్లో మేము ఎంతటి వాళ్లనైనా ఒడించేస్తామని అతను చాలా దర్పంగా చెప్పినా, బహుశా అందులో కొంత వాస్తవం ఉండచ్చు. తీరా అర్జునుడు తనను ధిక్కరించి యుద్ధానికి సిద్ధమవడం, చిటికెలో తన రథాన్ని దగ్ధం చేయడం, తన కొప్పు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ధర్మరాజు ముందు పడేయడం, భార్య పతిభిక్ష పెట్టమని ప్రార్థించడం అతనికి  ఊహించని ఉత్పాతాలు.  అయితే, ఈ ‘షాక్’ అతని మనసులో పూర్తిగా ఇంకినట్టు కనిపించదు. కారణం, అతని మనసుకు దానిని ఇంకించుకునే శక్తి లేదు కనుక. అతని బుద్ధి కన్నా మాటే చురుగ్గా ఉంది. వెంటనే అట్టు తిరగేశాడు. నీ చేతుల్లో ఓడి పోయిన తర్వాత, ఈ అంగారపర్ణత్వం ఇంకా నాకెందుకు, మరీ అంత సిగ్గులేని వాణ్ణా, నేను పేరు మార్చుకుంటా నన్నాడు. ఆ అనడంలో కూడా చూడండి, నా రథం దగ్ధమైనా, నా దగ్గర చాలా మాయలున్నాయి, అనేక రత్న విచిత్రితమైన రథాన్ని పొంది ఇకనుంచి చిత్రరథుడి నవుతానని గర్వంగా ప్రకటించుకున్నాడు.

ఆ వెంటనే గమనించండి, నీ పరాక్రమాన్ని ‘మెచ్చాను’, నీతో స్నేహం చేయాలని ఉందన్నాడు. అంతేకాదు, నా దగ్గర చాక్షుషి అనే విద్య ఉంది, ఆ విద్యతో మూడులోకాల్లో ఏం జరుగుతోందో చూడచ్చు, అయితే, అది అందరికీ పని చేయదు, నువ్వు తాపత్య వంశీకుడివి కనుక నీకు పనిచేస్తుంది అన్నాడు. మూడు లోకాలనూ చూడగలిగిన విద్య తన దగ్గర ఉన్నా, అర్జునుణ్ణి గుర్తించలేక ఓటమిని ఎందుకు కొని తెచ్చుకున్నాడో తెలియదు. పైగా, ఈ విద్యను తీసుకునేటప్పుడు ఆరుమాసాలపాటు ఒక వ్రతం పాటించాలని షరతు పెట్టాడు. మందుల వాళ్ళు, స్వాములు, పూజారుల బాణీని ఈ మాటల్లో మీరు పోల్చుకోవచ్చు. అంటే, వారి మూలాలు కాలగర్భంలో ఇంత లోతున ఉన్నాయన్నమాట.

మొత్తంమీద ఈ ఘటనలో అతణ్ణి ఆకర్షించింది బహుశా ఒకే ఒకటి, అది ఆగ్నేయాస్త్రం! తన దగ్గర ఎన్నో మాయలున్నాయంటున్న అతనికి అదే ఓ పెద్ద మాయగా కనిపించినట్టుంది, నీ ఆగ్నేయాస్త్రం నాకు ఇస్తే మీకు గుర్రాలు ఇస్తానని బేరం పెట్టాడు.

మొత్తానికి అతని వ్యవహారం అంతా చిన్నపిల్లల తంతులా ఉంది…

అసలు సంగతేమిటంటే; ఎంతో లోతు, గాంభీర్యం, భిన్నమైన జీవన శైలి ఉన్న మైదానవాసి ముందు ఈ అడవిమనిషి తేలిపోతున్నాడు. అతనికి ఈ అనుభవం ఓ సాంస్కృతిక అఘాతం(cultural shock) అయిందేమో తెలియదు. ఒక ధోరణిలో ఏదేదో మాట్లాడేస్తున్నాడు. అతను ఆ అడవిలో చెట్టులో పుట్టలో పిట్టలో ఒక సహజ భాగంగా అమరిపోయి తనదైన ప్రపంచంలో గడిపేవాడు. అతనిప్పుడు ఈ మైదానవాసుల ముందు ఒకవిధమైన న్యూనతతో బయటపడిపోతున్నాడు. తన వ్యక్తిత్వం జారిపోతున్నా లేని బింకం తెచ్చుకుని కూడదీసుకునే ప్రయత్నం-లేదా విఫలయత్నం- అతని మాటల్లో బొమ్మ కడుతూ ఉండచ్చు. ఈ ఘట్టంలో అతనెంత కళవళ పడ్డాడో, తనకు తెలియకుండానే ఎంత మథన పడ్డాడో అనిపిస్తుంది.

ఈ గంధర్వుడి రూపంలో మహాభారత కథకుడు మన ముందు అచ్చమైన ఒక ఆదివాసీని ప్రదర్శిస్తున్నాడు. ఈ కోణం నుంచి ఈ ఘట్టాన్ని ఎవరైనా ఇంతవరకు వ్యాఖ్యానించారో లేదో నాకు తెలియదు. గంధర్వులే కాక, సిద్ధులు, సాధ్యులు, యక్షులు వగైరా పేర్లతో మరి కొందరు కూడా కనిపిస్తూ ఉంటారు. ఏవో మహిమలూ, మాయలూ ఆపాదించి చెప్పే వీళ్ళందరూ కూడా అడవుల్ని ఆశ్రయించుకుని జీవించే ఆదివాసీ గణాలే కావచ్చు. వీరిలో కనిపించే మహిమ, మంత్రం, మాయ అనేవి ఇంకొకరిని మోసగించడానికే ఉద్దేశించినవి కాకపోవచ్చు. అవి వీరి జీవన తాత్వికతలో విడదీయలేని భాగాలు. వీరి జీవితాలను మాంత్రిక వాస్తవికత(magical realism) నిరంతరం అంటిపెట్టుకుని ఉంటుంది. (అడవిలో) ఒక చెట్టు చిగురించడం, ఒక పూవు వికసించడం ఎలా స్వాభావికాలో వీరిలో మాయలూ, మంత్రాలూ, మహిమలూ అంతే స్వాభావికాలు. మాంత్రిక వాస్తవికతను అత్యద్భుతంగా చర్చించిన జార్జ్ థాంప్సన్ ను ఇక్కడికి తీసుకురావాలనిపిస్తోంది కానీ ప్రస్తుతానికి వాయిదా వేస్తాను.

ధర్మరాజు విడిచిపెట్టమని చెప్పిన తర్వాత గంధర్వుని తీసుకెళ్లి అర్జునుడు ‘మంద’లో విడిచిపెట్టాడని కథకుడు చెబుతున్నాడు. ఇక్కడ ‘మంద’ అనడంలో ఆదివాసుల పట్ల మైదానవాసులలో ఉండే న్యూనతాభావం వ్యక్తమవుతోందేమో తెలియదు. ఇక్కడ మంద అనే మాటను సొంత జనం, లేదా గుంపు అనే సామాన్యార్థంలోనే కథకుడు వాడినా వాడి ఉండచ్చు. పదప్రయోగ సరళిని మరింత వివరంగా పరిశీలిస్తే తప్ప ఏ అర్థంలో వాడారన్నది నిర్ధారణగా చెప్పలేం.

ఇంకో తమాషా చూశారోలేదో….గంధర్వుడు తన దగ్గర ఉన్న గుర్రాలు ఎలాంటివో చెబుతూ, ఇంద్రుడు విసిరిన వజ్రాయుధం వృత్రాసురుని శిరస్సు మీద పడి పది ముక్కలైందనీ, ఆ ముక్కల్లోనే కొన్ని వరసగా బ్రాహ్మణునికి వేదమూ, క్షత్రియునికి ఆయుధమూ, వైశ్యుడికి నాగలి(వ్యవసాయం మొదట్లో వైశ్యుల వృత్తి), శూద్రుడికి సేవ అయ్యాయంటూ అర్జునుడికి నాలుగు వర్ణాల వ్యవస్థ గురించి కూడా బోధిస్తున్నాడు! ఇందులో తమాషా ఏమిటంటారా…ఈ జాబితాలో తను…అంటే ఆదివాసీ లేడు! ఎందుకు లేడంటే, ఆదివాసీలు ఆదివాసులుగా ఉన్నంత కాలం వర్ణ, లేదా కుల, మతవ్యవస్థల కిందికి రారు. బ్రాహ్మణులు, క్షత్రియులూ కూడా ఆదివాసులతో సంబంధాలు కలుపుకోవడానికి అదీ ఒక వెసులుబాటు అయింది. కథకుని గదసుదనం ఏమిటంటే, నాలుగువర్ణాల వ్యవస్థ కిందికి రాని ఒక ఆదివాసీతో ఆ వ్యవస్థ గురించిన చిలుక పలుకులు పలికిస్తున్నాడు. వర్ణవ్యవస్థకు సాధికారత కల్పించడంలో అది భాగమని తెలిసిపోతూనే ఉంది.  కుల, మతాల పరిధిలోకి రాని ఆదివాసీలను నాలుగువర్ణాల వ్యవస్థలోకి (కాకపోతే వాటికి మరో వర్ణం అదనంగా చేర్చి) తీసుకొచ్చే ప్రయత్నం చరిత్ర పొడవునా జరుగుతూనే రాగా; వారిని మతాల పరిధిలోకి పోటీ పడి మరీ తీసుకొచ్చే నేటి ప్రయత్నాలకు మనం ప్రత్యక్షసాక్షులమే. సరే, అది వేరే కథ.

గంధర్వుడు ఇంకోటి అన్నాడు చూడండి…గర్వం అణగిపోయేలా యుద్ధంలో ఓడిపోయినవాడు కూడా వెనకటి పేరే ఉంచుకుంటే ‘సత్సభ’ల్లో అతన్ని మెచ్చుకుంటారా అన్నాడు. ఇక్కడ అతను రెండు సూచనలు చేస్తున్నాడు: మొదటిది, సత్సభలు;  రెండోది, యుద్ధంలో ఓడిపోయినవాడు పేరు మార్చుకోవడం. సత్సభలంటే పండితసభలో, మరో సభలో కావు. గణం అంతా సమావేశమై ప్రజాస్వామిక విధానంలో నిర్ణయాలు తీసుకునే సభలు.

యుద్ధంలో ఓడిపోయాను కనుక పేరు మార్చుకుంటాననడం మరింత ఆసక్తికర వివరం. గణవ్యవస్థకు చెందిన ఒక ఆనవాయితీనే గంధర్వుడు ఇక్కడ సూచిస్తున్నాడు. ఇప్పటికీ చూడండి…‘నేను ఫలానా పని చేయకపోతే, లేదా ఫలానా వ్యక్తి మీద ప్రతీకారం తీర్చుకోలేకపోతే పేరు మార్చుకుంటాను, లేదా ఫలానా పేరువాణ్ణే కాదు’ అనే తరహాలో  శపథాలు చేసేవారు మనకు కనిపిస్తూ ఉంటారు. అంటే, ఈ మాటల మూలాలు ఒకనాటి గణవ్యవస్థలో ఉన్నాయన్నమాట. ఇంతకంటే విశేషం ఏమిటంటే, గణదశలో ఉన్నప్పుడు దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఈ ఆనవాయితీ ఉండడం.  గణవ్యవస్థలో పేర్లకు గల ప్రాధాన్యం గురించీ, ప్రత్యేకించి ‘యుద్ధంలో ఓడిపోయినప్పుడే’ నని అనకపోయినా   కొన్ని సందర్భాలలో పేరు మార్చుకోవడం గురించీ లూయీ హెన్రీ మోర్గాన్ తన ‘పురాతన సమాజం’ (Ancient Society) అనే రచనలో చర్చించారు. అమెరికన్ ఇండియన్ తెగల గురించిన సందర్భంలో ఆయన ఈ చర్చ చేయడం మరింత ఆసక్తికరం.

మనం పేరులో ఏముందనుకుంటాం కానీ, గణసమాజం అస్తిత్వం అంతా పేరులోనే ఉంది. ఎందుకంటే, ఆటవికులలోనూ, అనాగరికులలోనూ కుటుంబాలకు పేర్లు లేవు. వ్యక్తుల పేర్లను బట్టే వారి గణం ఏదో తెలుస్తుంది. కనుక గణం తను ఉపయోగించే పేర్లను ముందే ప్రకటించుకుంటుంది. అంటే, ఆ పేర్లను ఇంకో గణం ఉపయోగించకూడదన్న మాట.  ఆవిధంగా, భూమి హక్కు, నీటి హక్కు వగైరాలు ఎలాగో ఆ పేర్లు కూడా గణానికి ఒక హక్కుగా, ఆస్తిగా సంక్రమిస్తాయి.

బిడ్డ పుట్టాక తల్లి మొదట గణంలో వాడుక లేని పేరును దగ్గరి బంధువుల ఆమోదంతో ఎన్నుకుంటుంది. అయితే, వివిధ గణాలు సభ్యులుగా ఉన్న తెగ సమితి సమావేశమై ఆ పేరును ధ్రువీకరించిన తర్వాతే వాస్తవంగా బిడ్డకు నామకరణం జరిగినట్టు లెక్క. ఒక వ్యక్తి మరణించినప్పుడు, అతని పేరును అతని పెద్ద కొడుకు అనుమతిస్తే తప్ప అతను జీవించి ఉండగా ఇంకొకరు ఉపయోగించకూడదు. పెద్ద కొడుకు తండ్రి పేరును వేరే గణంలోని మిత్రుడికి ఎరువు ఇవ్వవచ్చు. అయితే ఆ వ్యక్తి చనిపోతే ఆ పేరు మళ్ళీ ఈ గణానికి వచ్చేస్తుంది. తనకు నచ్చిన వేరే గణంలోని పేరును తల్లి బిడ్డకు పెట్టే ఆనవాయితీ కూడా కొన్ని గణాలలో ఉంది. అప్పుడు ఆ బిడ్డ, ఆ పేరుమీద హక్కు ఉన్న గణానికి చెందుతుంది.

పేర్లలో కూడా రెండు తరగతులు ఉంటాయి: చిన్నప్పుడు పెట్టేవి, పెద్దయ్యాక పెట్టేవి. ఈ పేరు మార్పుకు కూడా పెద్ద తతంగం ఉంటుంది. పదహారు, లేక పద్దెనిమిదేళ్ళ వయసు వచ్చాక గణ నాయకుడే కొత్త పేరు పెడతాడు. ఆ తర్వాత తెగ సమితి సమావేశంలో ఆ పేరు ప్రకటిస్తారు. పేరు మార్పుతోనే ఆ కుర్రవాడికి పెద్దరికం వస్తుంది. అతనికి పెద్దవాళ్ళ బాధ్యతలను నిర్వర్తించే అర్హత లభిస్తుంది. మన ప్రస్తుతాంశానికి సంబంధించి ముఖ్య వివరం ఏమిటంటే, ఒక వ్యక్తి యుద్ధంలో గొప్ప ప్రతాపం చూపించినప్పుడు కూడా పేరు మార్చుకోవచ్చు. దీనినిబట్టి యుద్ధంలో ఓడిపోయినప్పుడు కూడా పేరు మార్చుకోవడం అనే ఆనవాయితీ ఉండడంలో ఆశ్చర్యంలేదు. గంధర్వుడు చేసింది అదే. అలాగే, కొత్త హోదాను అందుకున్నప్పుడూ,  పెద్ద జబ్బు చేసినప్పుడూ, వృద్ధాప్యంలోనూ కూడా పేరు మార్చుకునే ఆనవాయితీ గణవ్యవస్థలో ఉంది. అయితే, ఎప్పుడు పేరు మార్చుకోవాలన్నా అది గణంలోని స్త్రీలు, నాయకుల ఇష్టంతోనే జరగాలి తప్ప వ్యక్తిగత ఇష్టంతో కాదు.

ఇప్పటికీ మనదేశంలో కొన్ని కులాలలో ఉన్న ఉపనయన సంస్కారంలోనూ, దత్తత స్వీకారం వంటి ఇతర తంతులలోనూ ఒకనాటి ప్రపంచవ్యాప్త గణసమాజ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటాయి. ఉపనయనం అనేది ఇప్పుడు మనదేశంలో కొన్ని కులాలలోనే కనిపిస్తున్నా, గణదశలో అది అందరికీ ఉండేదన్న సంగతిని ప్రత్యేకించి గమనించాలి.

***

ప్రస్తుతానికి వస్తే…

కౌంతేయులమైన తాము తాపత్యవంశీకులము ఎలా అయ్యామన్న అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా గంధర్వుడు తపతీ-సంవరణోపాఖ్యానం చెప్పడం ప్రారంభించాడు. దాని గురించి తర్వాత….

 

 

 

 

 

 

మాయజలతారు వలల్ని తెంపే కథ!

p-satyavathi

“కధల్ని,గొప్ప కధల్ని తిరిగి చెప్పుకోవడమంత రోతపని మరొకటి లేదు.డిసెక్షన్ అందాన్ని చంపుతుంది” అంటాడు శివారెడ్డి సత్యవతి గారి కధల పుస్తకం ’మెలకువ’ కి ముందుమాటలో.

అయినా అలాంటిపనే చేయకుండా ఉండలేని అశక్తత లోకి ఈ పుస్తకం లోని ప్రతి కధా నెట్టివేస్తోంది. మరీ మరీ డిస్టర్బ్ చేసి,కలవరపరిచి,అవసరమైన లోచూపు కు పురిగొల్పి,ఏ అగాధాల్లోకి ఎంత గమనింపు లేకుండా జారిపోతున్నామో చెప్పి, ఒకానొక మెలకువ లోకి నను నడిపించిన ఓ కధనిక్కడ కృతజ్ఞత తో తల్చుకోవాలనిపిస్తున్నది.

కధ పేరు “నేనొస్తున్నాను”.

ఈ కధ లో ఒక సఖి ఉంది. ఎలాంటిదామె?ముద్దొచ్చే మొహమున్నది.సమస్త జీవన కాంక్షలతో ఎగిసిపడే మనసున్నది.ఉత్సాహం తో ఉరకలు వేసే వయసులో ప్రపంచమంతా తనదేనన్న ధీమాతో వెలుగు దారాలతో రంగురంగుల పూలు కుట్టిన మూడు సంచులను(స్నేహాల,అభిరుచుల,జ్ఞాపకాల సంచులవి)భుజాన వేసుకుని,తన పాటనేస్తాన్నెప్పుడూ పెదాలపైనే ఉండేలా ఒప్పించుకుని జీవితం నది ని దాటడానికి బయలుదేరి ఈ ఒడ్డున నిలబడి ఉన్నది.

ఒక సఖుడున్నాడు.అందమైన పడవేసుకుని అలా వచ్చాడు.ఎలా ఉన్నాడు?ముసిముసినవ్వులతో ఉన్నాడు.ముచ్చటగా ఉన్నాడు.పడవెక్కమని చెయ్యందించాడు.ఆశల దీపాలు వెలిగే కళ్ళతో స్వాగతం చెప్పాడు.తన పాటనీ తన సంచుల్నీ తనతోపాటూ తెచ్చుకోమన్నాడు.

మొదలైంది ప్రయాణం. పచ్చదనం. నీలాకాశం. ఈలలు పాటలు మాటలు ఆశయాలు అభిప్రాయాలు కోరికలు చతుర్లు…ఈ ప్రయాణమిలా సాగిపోనీ ఎంతకాలమైనా అనుకుంటూ తన సహ ప్రయాణీకుడ్ని,పడవ నడిపే ఆ చిన్నవాడ్ని తన ఆంతరంగిక ప్రపంచం లోకి మనసు చాచి స్వాగతించింది.

ఆవలి ఒడ్డుకు కలసిమెలసి ప్రయాణం చేద్దామని పండువెన్నెల్లో మనశ్శరీరాల సాక్షిగా ప్రమాణం చేసుకున్నారు.చెరి కాసేపు తెడ్డు వేశారా.. “బాగా అలసిపోయావు,విశ్రమించు ప్రియా..నీ కళ్లలో మెరుపు తగ్గేను” అన్నాడు.ఎంత అపురూపమో ఆమె తనకు!

-క్రమంగా దృశ్యం మారింది.సుఖవంతమైన జీవితం కోసమంటూ,నాణ్యమైన జీవనం గడపాలి గదా అంటూ పడవ నడిపే యంత్రం తయారీ తో మొదలుపెట్టి చెట్టులెంటా పుట్టలెంటా తిరిగి ఏవేవో తెచ్చి పోగేసే పనిలో పడిపోయాడతను.ఇప్పుడతనికి ఆమె పాట వినే తీరిక లేదు.ఆరాధన గా చూసే సమయం లేదు.

ఎంతలో ఎంత మార్పు!ఎంత బాధ పెట్టే మార్పు..ఎంత భయపెట్టే మార్పు.వర్తమాన జీవన సౌరభాల్ని విస్మరించి..భవిష్యత్ భద్రజీవనం కోసమంటూ,  “వస్తువు” కిందపడి మరణిస్తూ అసలా స్పృహే లేకుండా నిశ్శబ్దంగా అతను ఏ లోయల్లోకి ఎప్పుడు జారిపోయాడో!

అయితే ఆమె దీన్నెలా తీసుకున్నది?అతని కార్యదీక్షకి,సమర్ధత కి అబ్బురపడి మరింత ఆరాధనతో  అన్నీ అమర్చిపెడుతూ ఇష్టం గా,సంతోషం గా సేవలు చేస్తూ అతనితో పాటు ఆమె కూడా తనను తాను మర్చిపోయింది.

కొంతకాలానికి ఒకరోజు ఉలిక్కిపడి చూసుకుంటే పాట ఏదీ?హోరు భరించలేక పారిపోయింది.గట్టిగా పిలిస్తే వచ్చింది గానీ,ఎప్పుడూ ఆ హోరులో ఆమెను వెన్నంటి ఉండడం తనవల్ల కాదంది.అతనేమో తిండివేళ తప్ప కనిపించడమే లేదు.నవ్వుల్లేవు.ముచ్చట్లు లేవు.

ఇక అతనితో కాదని తన పూర్వ స్నేహాలు,అభిరుచులు,సరదాలతో కొనసాగాలనుకుని తన వెలుగుపూలసంచులకోసం చూస్తే ..ఎక్కడున్నాయవి? “మనం సేకరించిన సంపదనంతా నింపే క్రమం లో అడ్డమొచ్చి ఉంటాయి.గిరాటేసి ఉంటాం ఎటో” తేలిగ్గా జవాబిచ్చాడతను.

పడవ బరువెక్కుతోంది.శబ్దాల హోరు ఎక్కువైపోయింది.పాటమ్మ ఏమయిందో అయిపు లేదు.సఖుని దర్శనమే అపురూపమై పోయింది.-“అసలు నేనెక్కడికి బయల్దేరాను? ఏ గమ్యం కోరుకున్నాను?ఇతను పిలిచీ పిలవగానే సమ్మోహితురాలినై ఈ పడవలో ఎందుకు ప్రవేశించాను?తామిద్దరూ కలిసిపంచుకున్న అనుభవాలు,చెప్పుకున్న ఊసులు ఇప్పుడేవీ?ఎక్కడకు అదృశ్యమైపోయాయి? అసలు అతనేడీ?తను ఆత్మను,శరీరాన్ని అర్పించుకున్న వాడు,తనకోసం ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టిస్తానన్నవాడు ఇప్పుడెక్కడ?

అబ్బా,ఏం ప్రశ్నలివి?ఎలాంటి ప్రశ్నలివి?ఎంత కలవరపెట్టే ప్రశ్నలివి? మనల్ని గురించి మన వాళ్ళు వేసుకునేవో,మన వాళ్ళగురించి మనం వేసుకునేవో..బోలెడు వూసులు చెప్పుకుని,బోలెడు వాగ్దానాలు చేసుకుని ప్రయాణం మొదలుపెట్టి సహజీవనచారుల్నే కాదు,మనల్ని మనమే మర్చిపోయి ఎంతమందిమి ఎలా ఎడారులమైపోతున్నామో!

కధలోని సఖుని పాత్రలాగా వస్తువ్యామోహం కావచ్చు,లేక పదవి,కీర్తి మరొకటీ,మరొకటీ లాంటి నెగటివ్ వ్యామోహాలు కావచ్చు…ఫేస్ బుక్ లాంటి కాలక్షేపం కావచ్చు..చదువుకోవడం,రాసుకోవడం,కొత్తస్నేహాలు,కొత్త అభిరుచులు లాంటి పాజిటివ్ వ్యామోహాలైనా కావచ్చు.మనల్ని స్నేహిస్తూ,మోహిస్తూ,ప్రేమిస్తూ,మనతో కలిసి నడుస్తోన్న సహచరుల్నే కాదు,మనల్ని మనమే పట్టించుకునే తీరిక సైతం లేకుండా..మనమీదెక్కి కూర్చుని మనల్ని పరుగులు పెట్టిస్తున్న సవాలక్షబరువుల్ని స్పృహకు తెచ్చి దిగులు పుట్టిస్తుంది ఈ కధ.మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి కావలసిన దినుసులేవో అందిస్తుంది.

ఇలాంటి ఇతివృత్తం తో.. సంపాదనలోనో,వృత్తిలోనో,వ్యాపారం లోనో,ఉద్యోగం లోనో మరెందులోనో కూరుకుపోయి జీవనం తాలూకు ఆనందాన్ని చేజార్చుకోవడం వస్తువుగా చాలా కధలు,అపుడపుడు సినిమాలు కూడా చూసుంటామేమో.

కానీ ఈ కధ అలా పైపైన తాకి వెళ్ళిపోయేది కాదు.ఇలా చూసి అలా పక్కనపెట్టేది అంతకంటే కాదు.ఆలోచింపజేసేది.అంతర్నేత్రాలను తెరిపించేది,ఒక ఉలికిపాటుకు గురి చేసేది,ఒక మెలకువ లోకి నడిపించేది,మాయజలతారు వలల్ని తెంపిపారేయాలనే కృత నిశ్చయాన్ని ప్రోది చేసేది,’వస్తువు’ కిందపడి మరణిస్తోన్న మనిషిని ఒక ఆత్మీయస్పర్శతో బతికించేది .అమ్మా!సత్యవతీ!మా చల్లని తల్లీ! ఇంత మంచి సాహిత్యాన్నిచ్చినందుకు, ఇస్తున్నందుకు ఎలా నీకు కృతజ్ఞతలు చెప్పడం?

 – రాఘవ రెడ్డి

1044912_497904126944760_602611104_n

 

 

అలుక కతమును తెలుపవు..?

radha-in-viraha
“ఘాటైన ప్రేమకు అసూయ ధర్మామీటర్ లాంటిది” అయితే, ఆ ప్రేమ లోతు ఎంతుందో తెలిపేది అలుకే మరి!
ఎందుకంటే ఎవరిమీదైనా అలిగినప్పుడే కదా అవతలివారి ఓపిక, సహనం ఏపాటివో తెలిసేది. స్నేహితులైనా, ప్రేమికులైనా, తల్లీపిల్లలయినా, భార్యాభర్తలయినా, చివరికి కొత్తల్లుడయినా సరే అలకపాన్పు ఎక్కగానే విసుక్కోకుండా బ్రతిమాలి, బుజ్జగించి అలక తీర్చి తిరిగి మచ్చిక చేసుకోవడంలోనే అలుకతీర్చేవారి ఓర్పు, నేర్పూ దాగి ఉంటుంది. అలుక కోపానికి చెల్లెలే అయినా గుణగణాల్లో మాత్రం పూర్తిగా భిన్నం. అడక్కుండా వచ్చేది కోపమైతే, కావాలని తెచ్చిపెట్టుకునేది అలుక. ఇదీ సరససల్లాపాల్లో ఉపయుక్తమైనది. కోపం దూరాన్ని పెంచితే, అలుక విరహాన్ని పెంచి మనసుల్ని దగ్గర చేస్తుంది. మరి మన సినీకవులు అలిగినవారి మీదా, అలుకలు తీరినవారి మీదా, అలుక తీర్చేవారి మీదా ఎటువంటి పాటలల్లారో తెలుసుకుందామా…
“ఉరుములు మెరుపులు ఊరుకే రావులే
వానజల్లు పడునులే మనసు చల్లబడునులే”
అంటూ  ఓ అమ్మాయి పాడితే దిగిరాని అబ్బాయి ఉంటాడా? అలుకెందుకో తెలియకపోయినా, దానికి తగిన కారణమేదో ఉండే ఉంటుందని అర్థం చేసుకుని బుజ్జగించే మనసు తోడైతే ఇక కావలసినదేమి ఉంటుంది?!
” గోరొంక కెందుకో కొండంత అలక
అలకలో ఏముందో తెలుసుకో చిలకా..” అంటూ సాగే ‘దాగుడుమూతలు’ చిత్రం లోని పాటను చూసేద్దామా..
అనగనగా ఓ గౌరి.. ఆమె మనసు దోచుకున్న ఓ మావ! అంత మనసైనవాడు అలిగేస్తే ఆ చిన్నది ఊరుకుంటుందా? “ముక్కు మీద కోపం నీ మొఖానికే అందం” అంటూ తన ఆటపాటలతో కవ్వించి నవ్విస్తుంది.  అలా సల్లాపాలాడుతూనే “అడపదడప ఇద్దరూ అలిగితేనే అందం… అలకతీరి కలిసేదే అందమైన బందం” అంటూ మౌలికమైన ప్రేమ సిధ్ధాంతాన్ని కూడా చెప్పేస్తుంది. అల్లరిగోదారిలా పరుగులెడుతూ, కొండపల్లి బొమ్మని గుర్తు చేసే గౌరి ఇంకా ఏమేమంటుందో చూద్దామా..
“అలుక కతమును తెలుపవూ? పలుకరించిన పలుకవూ?
ఏల నాపై కోపమూ ఏమి జరిగెను లోపమూ?”
 అని “పెళ్ళి సంబంధం” చిత్రంలో సుశీల పాడిన ఓ చక్కని గీతం ఉంది. అలుక కు కారణం తెలుసుకునే ప్రయత్నంలో ఈ పాటలో గాయని వేసే ప్రశ్నలు గమ్మత్తుగా ఉంటాయి.. మీరూ వినండి..
ఆ లింక్ లో వినబడకపోతే క్రింద లింక్లో మూడవ పాట:
“సత్యాపతి” అనే లోకనిందను మోసినా, ఆ భామగారి రుసరుసలను, అలుకలను తప్పించుకోవడం కృష్ణపరమాత్ముడికే తప్పలేదు! విరహాన్ని భరించలేక చివరికి..
” అలిగితివా సఖీ ప్రియా అలకమానవా?
ప్రియమారగ నీ దాసుని ఏలజాలవా?..”
అంటూ ప్రియమైన సత్యభామను ప్రసన్నం చేసుకోవడానికి ఎన్ని తంటాలు పడ్డాడో పాపం కృష్ణుడు…!
ఇదే సన్నివేశానికి “శ్రీ కృష్ణతులాభారం” చిత్రంలో సత్యభామాకృష్ణులకు మరో పాట కూడా ఉంది.. “ఓ చెలీ కోపమా.. అంతలో తాపమా…
సఖీ నీవలిగితే నే తాళజాల…” అని! కానీ రెంటిలోనూ “శ్రీకృష్ణార్జున యుధ్ధం” చిత్రం లోని ఈ పాటే నాకు ఎక్కువ నచ్చుతుంది…
అలిగితే అందంగా ఉంటారని ఆడవారిని పొగిడే మగవారే కాదు, అలిగిన భర్తల అందాలను పొగిడే భార్యలు కూడా ఉన్నారండోయ్! అలిగిన భర్తను చిన్ని కృష్ణుడితో పోలుస్తూ, అతడి అందాలను మురిపెంతో భార్య పొగడుతూ ఉంటే.. పైకి బెట్టు చూపిస్తూ లోలోపల మురిసిపోతాడొక పతిదేవుడు. తల్లిలా, అనునయంగా స్తుతిస్తున్న ఆమె ప్రేమకు లొంగిపోక ఏమౌతాడు? గాఢమైన పరస్పరానురాగాలున్న ముచ్చటైన ఆ జంట క్రింది పాటలో…
పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత పాడిన హాస్యభరితమైన యుగళగీతమొకటి “శాంతినివాసం” చిత్రంలో ఉంది. హాస్య నటులు రేలంగి, సురభి బాలసరస్వతి నటించారందులో. అలుక మానమని అతడు, అతడ్ని నమ్మనంటూ ఆ చిన్నదీ దాగుడుమూతలు ఆడుతూ పాడతారు.
ఈ సరదా పాటని క్రింద లింక్లో చూడండి..
“జల్సారాయుడు” సిన్మా లో పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కీ పాడిన మరొక సరదా పాట ఉంది.
“అరెరెరె…తెచ్చితిని ప్రేమ కానుక
అలుక ఎందుకే? అది నీ కోసమే…
అమ్మగారు అలిగినా భలే వేడుక.. ” అని అబ్బాయి అంటే,
నీవెవరివో నేనెవరో… నీ మాయ మాటలు నేను నమ్మను.. అని అమ్మాయి అంటుంది. అమ్మాయిని నమ్మించాలనే తాపత్రయంతో అబ్బాయి, అతని మాటలన్నీ తోసిపుచ్చుతూ అమ్మాయి మాటలతో బాగానే షటిల్ ఆడుకుంటారు. ఆరుద్ర రచన ఎంత బాగుందో అనిపిస్తుంది పాట వింటుంటే..!
క్రింద లింక్ లో రెండవ పాట:
“కంటి కబురూ పంపలేను
ఇంటి గడప దాటలేను
అ దోర నవ్వు దాచకే
నా నేరమింక ఎంచకే..
అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక.. అలక చాలింక! “
అంటున్న ఓ అమ్మాయి నిస్సహాయపు నివేదన విని మనసు ఆర్ద్రంగా మారిపోతుంది..!
జంధ్యాల తీసిన “శ్రీవారి శోభనం” చిత్రంలో ఎస్.జానకి పాడిన ఓ అపురూపమైన గీతం లోవీ వాక్యాలు. ఓ ముసలావిడగా, ఆమె మనవరాలుగా ఇద్దరి అనుకరణా తానే చేస్తూ ఎస్.జానకి పాడే ఈ పాట గాయనిగా ఆవిడ చేసిన ఓ గొప్ప ప్రయోగమే అనాలి! మేడ పైనున్న ప్రియుడిని ఉద్దేశిస్తూ మనవరాలు పాడితే, శీతాకాలపు చలికి వణుకుతూ ముసలావిడ కూడా తన గొంతు కలుపుతుంది. చిత్రకథ తెలీకపోయినా పాట చూస్తూంటే ఆ అమ్మాయి తెగువకూ, ధైర్యానికీ ఆశ్చర్యం కలిగి, మేడపైనున్నతడు అలక చాలించి ఆమె ప్రేమను స్వీకరిస్తే బాగుండునని కోరుకుంటాం మనం కూడా. తాను స్వరపరిచిన ఏ పాటతోనైనా మనకు అంతటి దగ్గరితనాన్ని ఇచ్చే మహత్తు రమేష్ నాయుడు బాణీలకు ఉంది మరి!
ప్రేమికుల అలకలు తీరాకా కూడా చెప్పుకునే ఊసులు కొన్నుంటాయి. ఏవో కథలు, గాధలూ, వలపులూ, మాధుర్యాలు అంటూ ఈ ప్రేమికులు పరవశులై ఏమని పాడుకుంటున్నారో క్రింద పాటలో విందామేం..
‘మానాన్న నిర్దోషి’ చిత్రం లో పాట ఇది..
“అలకలు తీరిన కన్నులు ఏమనె ప్రియా
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా”
(అలకలు తీరాయిగా! మరో నేపథ్యంతో మరోసారి మళ్ళీ కలుద్దాం…)

– తృష్ణ

raji

ఆ ఎండాకాలాలు రమ్మన్నా రావు కదా మళ్ళీ!

Photo0025

ఇటీవల దొంతమ్మూరులో నేను, మా అన్నయ్య, మేనల్లుళ్ళు భాస్కర్, చినబాబు

నా కంటే 13 ఏళ్ళు పెద్ద అయిన మా పెద్దన్నయ్య, పదేళ్ళు పెద్ద అయిన మా చిన్న అన్నయ్య ఇద్దరూ తెలివైన వాళ్ళే. అందుచేత మా తాత గారూ, బామ్మా గారూ వాళ్ళిద్దరినీ, కలిసి పెరుగుతున్న మా మేనత్తల కొడుకు అయిన  హనుమంత రావు  బావనీ చాలా గారాబం చేసే వారు.  అంచేత ఆ ముగ్గురూ కలిసి నానా అల్లరీ చేసే వారు… ట….అందులో నాకు బాగా జ్జాపకం  ఉన్న సంఘటనలు కొన్ని ఉన్నాయి. ఒకటేమో మా చిన్నన్నయ్య ఎప్పుడూ సరిగ్గా మధ్యాహ్నం భోజనం సమయంలో మా నాన్న గారి గది పక్కనే ఉన్న ఒక పెద్ద నేరేడి చెట్టు ఎక్కి కూచునే వాడు. (ఈ మధ్య కాలంలో నేను ఎక్కడా అస్సలు నేరేడి చెట్టు అనేదే చూడ లేదు. ఔట్ ఆఫ్ ఫేషన్ అనుకుంటాను.) ఎవరు పిలిచినా భోజనానికి వచ్చే వాడు కాదు.

ఇక అందరి భోజనాలు అయిపోయాక, మా బామ్మ గారు ఒక బంగారం తాపడం చేసిన వెండి గిన్నెలో పులుసూ, అన్నం కలిపి “ఒరేయ్ చిన్న బుజ్జీ,  రారా,  నీ కోసం బంగారం పులుసు చేశాను ..అంటే గుమ్మడి కాయ పులుసు అన్న మాట …నాకు ఆకలి వేస్తోంది రారా.” అని బతిమాలే వారు. మా తాత గారు “ఒరేయ్ ఇదిగో రా నీ కోసం సరి కొత్త అర్ధణా కాసు తెచ్చానురా” అని లంచం చూపించే వారు. అప్పుడు మా చిన్నన్నయ్య కిందకి దిగి భోజనం చేసే వాడు.

ఇక వాళ్ళు ముగ్గురుకీ..అంటే మా పెద్దన్నయ్య, చిన్నయ్యా, హనుమంత రావు బావా…  దీపావళి అంటే భలే ఇష్టం. ఇంట్లో తెలిస్తే మా నాన్న గారు తిడతారని మెయిన్ రోడ్డు  లో అప్పటి కాకినాడ లాండ్ మార్క్ అయిన సిటీ ఎంపోరియం ఎదురుగుండా ఉన్న వానపల్లి ప్రకాశ రావు కొట్టులో ఖాతా మీద .. ఐదారు వందలు పెట్టి బాంబులు, టపాసులు, తారాజువ్వలు వగైరాలు తిన్నగా బస్సులో దొంతమ్మూరు పట్టుకెళ్ళి పోయే వారు.  ఒక సారి, బహుశా తన పదిహేనేళ్ళప్పుడు,  ఒక పెద్ద బాంబుని , ఒక పెద్ద ఇత్తడి బిందె లో పెట్టి వైరు బయటకి కనెక్ట్ చేసి చెరువు గట్టు మీద పెట్టి పేల్చగానే ఆ చుట్టు పక్కల పాకల్లో ఉన్న నాలుగైదు ఆవులు, గేదెలు ఠపీమని గుండె ఆగి చచ్చి పోయాయి. మా పెద్దన్నయ్యకి రెండు చెవులూ గళ్ళు పడిపోయాయి. ఆ తరువాత జన్మంతా  వినికిడి లోపంతో ఇబ్బంది పడ్డాడు. నాకూ ఒక చెవి కి వినికిడి లోపం ఉంది కానీ ఎందుకో తెలియదు. అందుకే నేను ఎవరినీ మాట్లాడనియ్యకుండా. నేనే గడ, గడా వాగుతూ ఉంటాను….అని అనుకుంటాను.

మరొక విశేషం ఏమిటంటే, తను తెలివైన వాడే అయినప్పటికీ మా పెద్దన్నయ్య ఎస్.ఎస్.ఎల్.సీ లో ఒక సబ్జెక్ట్ లో పరీక్ష తప్పాడు. ఇక చస్తే మళ్ళీ చదవను అనీ, మళ్ళీ రెండో పరీక్షలకి వెళ్ళమని  బలవంతం చేస్తే గన్నేరు కాయలు తిని ఆత్మహత్య చేసుకుని చస్తాను అనీ అందరినీ బెదిరించాడు. అప్పటి యింకా మా తాత గారు, బామ్మ గారు బతికే ఉన్నారు. మా నాన్న గారు ఐదు వందల ఎకరాల వ్యవసాయం చేస్తూ, ప్రతీ వారం కాకినాడ-జేగురు పాడు-దొంతమ్మూరు-చిన జగ్గంపేట తిరగ లేక అలిసి పోతూ ఉన్నారు. అంచేత వారి సలహా మా నాన్న గారు మా పొలాలన్నీ మా పెద్దన్నయ్యకి అప్పగించేసి విశ్రాంతి తీసుకున్నారు. ఇది సుమారు 1950 ప్రాంతాలలో జరిగింది. ఆ తరువాత 1983 లో ఆయన పోయే వరకూ మా నాన్న గారు మా “లోకారేడ్డి వారి చెరువు ఇస్తువా పంపు అనే శేరీ పొలం” వెళ్ళ లేదు.  పొలం యాజమాన్యం అంతా మా పెద్దన్నయ్య చేతిలో పెట్టేశారు.

నేను ఎస్.ఎస్.,ఎల్. సి లో ఉండగా ..అంటే 1960 లో కరప కరణం గారు శ్రీ చాగంటి సుబ్బారావు గారి రెండో కూతురు సుబ్బలక్ష్మి తో  మా పెద్దన్నయ్య పెళ్లి జరిగింది. మా ఇంట్లో జరిగిన, నాకు బాగా గుర్తున్న, అతి సరదా అయిన మా పెద్దన్నయ్య పెళ్లి ఫోటో ఇందుతో జత పరుస్తున్నాను. ఇప్పుడు (2014) మా పెద్దన్నయ్య పోయి ఏడాది దాటింది. మా పెద్ద వదిన గారు అప్పుడు ఎంత సౌమ్యంగా, అమాయకంగా, ఆప్యాయంగా, పొడుగ్గా ఉండే వారో ఇప్పుడూ అంతే! వారి పెళ్లి అయి కాపురం పెట్టేంత వరకూ మేము వేసవి శలవులకి ఎప్పుడు మా మేనత్త రంగక్కయ్య ఇంటికే దొంతమ్మూరు వెళ్ళే వాళ్ళం. నాకు అస్సలు జ్జాపకం లేదు కానీ బాగా చిన్నప్పుడు దొంతమ్మూరు లో రోజూ పొద్దున్నే నాకు స్నానం చేయించి మా బామ్మ గారి వంద కాసుల బంగారం గొలుసు వేసి గోడ మీద  నుంచి పక్కింటి వెలమ దొరల రాణీ గారికి అప్పజెప్పేవారుట.  ఎందుకంటే తెల్లగా, బొద్దులా ఉండే నేనంటే ఆవిడకి   చాలా ఇష్టంట. పైగా నా పేరే రాజా కదా! వాళ్లకి ఘోషా కాబట్టి ఎప్పుడూ బయటకి వచ్చే వారు కాదు. కానీ సాయంత్రం దాకా నన్ను వాళ్ళింట్లోనే  ఉంచేసుకునే వారుట.  పెద్దబ్బాయి, చిన్నబ్బాయి, బుల్లబ్బాయి,   చంటబ్బాయి, బోడబ్బాయి అని వాళ్ళు అయిదుగురు అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉండే వారు. వారింటి పేరు పోశిన వారో, పడాల వారో నాకు ఇప్పటికీ తెలియదు.   ఇటీవల కాకినాడ వెళ్ళినప్పుడు పని కట్టుకుని దొంతమ్మూరు వెళ్ళి, కూలిపోయిన మా  మేడ అవశేషాలతో ఉన్న స్థలమూ, చిన్నప్పుడు వెలమ దొరల రాణీ గారి ముచ్చట తీర్చడానికి నన్ను దాటించిన ఆ  గోడ దగ్గర  నేను మా సుబ్బన్నయ్య, ఆ మేడ/స్థలం నలుగురు వారసులలో ఇద్దరు … అనగా..మా హనుమంత రావు  బావ రెండో కొడుకు ప్రకాశు అనే చిన్న బాబు (అవును…మా తాత గారి పేరే!), ఆఖరి వాడు భాస్కర్ ల తో తీయించుకున్న ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను. ఆ గోడ వెనకాల కనపడుతున్న ఆధునిక మేడ నన్ను పెంచిన రాణీ గారి ముని మనుమరాలిదిట. ఆ తలుపు తట్టే ధైర్యం నాకు లేక “మళ్ళీ ఇక్కడికి వస్తే గిస్తే అప్పుడు చూద్దాం లే” అని ఆ ప్రయత్నం విరమించుకున్నాను.

పాత మకాం

పాత మకాం

నాకు అప్పటికి అక్షరాభ్యాసం జరిగిందో లోదో తెలియదు కానీ, ఒక సంగతి  మటుకు ఇప్పటికీ భలే గుర్తుంది నాకు. అప్పుడు దొంతమ్మూరు లో  నిజమైన పాఠశాల లేదు. కానీ చింతా జగన్నాథం అనే ఆయన అసలు ఉద్యోగం ఏమిటో తెలియదు కానీ ఊళ్ళో నలుగురు పిల్లలనీ ఇప్పుడు కూలి పోయిన అప్పటి రాముల వారి కోవెల ఎదురుగుండా ఉన్న కుంటముక్కల నరసింహం గారి ఇంటి పెద్ద అరుగుల మీద కూచో బెట్టి “దుంపల బడి” నడిపే వారు. ఒక రోజు ఊళ్ళోకి మలేరియా నివారణ వారో, టీబీ కో టీకాలు వేసే వాళ్ళు వచ్చారని తెలియగానే పిల్లలందరూ కకావికలై పారిపోయారు. అలా పారిపోలేక వెర్రి మొహం వేసుకుని దొరికిన వాడిన నేనే.  అందు చేత ఆ రోజు ఊరి మొత్తానికి నాకే టీకాలు పడ్డాయి. మాములుగా ఆ టీకాలు నుదిటి మీద వేస్తారు. జన్మంతా ఆ మచ్చ  మిగిలి పోతుంది. కానీ ఆ టీకాలబ్బాయి  ఎర్రగా, బొద్దుగా ఉన్న నన్ను చూసి పోనీలో పాపం అని టీకాలు నా నుదిటి మెడ కాకుండా భుజాల మీద వేశాడు.  దాని తాలూకు మచ్చ కూడా ఇప్పుడు లేదు. కానీ నా మొహం మీద ఇప్పుడు చూసిన వాళ్ళు  నాకు చిన్నప్పుడు మశూచికం వచ్చిందనుకుంటారు. అవి మశూచికం తాలూకు కాదనీ, యవ్వన దశ ప్రారంభంలో ఎడా, పెడా వచ్చిన మొటిమలకి మందు వాడకుండా గిల్లేసుకోవడం  వలన మిగిలిన అవశేషాలు అనీ  మనవి చేసుకుంటున్నాను. చిన్నపుడు చికెన్ ఫాక్స్ వచ్చే ఉంటుంది కానే, నాకు గుర్తు లేదు. ఈ తరం వారికి తెలియదేమో కానీ టీకాలు అంటే నిజానికి ఒక పెద్ద సూది మందు. ఆ రోజులల్లో కొందరు ఒక కాల్తున్న పెద్ద చుట్టని నుదుటి మీద పెడితే మశూచికం రాదు అని కూడా అనుకునే వారు. దాని తాలూకు మచ్చ జన్మంతా ఉంటుంది మరి.

అన్నట్టు ఆ కుంట ముక్కల వారు (పెద్దబ్బాయి గారు అనే వారు ఆయనని) జమీందారులు. మా మేనత్త కుటుంబం వారూ కుంటముక్కల వారే! ఆ జమీందారుల (నరసింహం గారు & రామాయమ్మ గారు) రెండో కూతురు రాజా ని మా చిన్నన్నయ్య చిన్న వయసులోనే ప్రేమించి పెద్దదయ్యాక పెళ్లి చేసుకున్నాడు.

ఇక వేసవి శలవులలో మా పొలంలో అతి ముఖ్యమైన పనులు వేసిన కోతలయ్యాక వేసిన కుప్పలు  నూర్చడం, నూర్చిన ధాన్యం ఆరబెట్టి బస్తాలలోకి ఎక్కించి కుట్టడం, కాటా తూచి ధాన్యం మిల్లులకీ, వ్యాపారులకీ అక్కడికక్కడే అమ్మడం. ఊళ్ళో  మకాం ఉన్నప్పుడు రాత్రి జరిగే కుప్ప నూర్పులకి మా చిన్న పిల్లలని తెసుకెళ్ళేవాడు కాదు మా పెద్దన్నయ్య. కానీ పొద్దున్నే లేచి చద్దన్నం తిని, పొలం గట్ల మీద నుంచి మూడు కిలో మీటర్లు మా బావా వాళ్ళ మిరాసీ మీదుగా నడిచి  శేరీ చేరుకునే వాళ్ళం. మా ఉద్దార్డుడు నాగులో, మరొక   పాలికాపో కూడా  ఉండే వాడు.  ఇప్పటిలా అప్పుడు ట్రాక్టర్లు ఉండేవి కాదు. కుప్ప నూర్పులంటే పొలం లో ఒక కళ్ళం చేసి , పేడతో అలికి , మధ్య లో ఒక రాట పాతి, అంచెలంచెలుగా పాతిక పశువుల చేత కళ్ళం లో పరిచిన వరి ధాన్యం మొక్కలని తొక్కించే వారు. ఒక యాభై బస్తాల కుప్పకీ సుమారు ఒక రాత్రి అంతా పట్టేది. కుప్ప మీద నుంచి మొక్కలు కళ్ళెం లో వెయ్యడం, కళ్ళం పడిన లో ధాన్యాన్ని బండి మీద ఎక్కి పెద్ద చేటలతో గాలి లోకి ఆరేసి, రాలిన ధాన్యాన్ని  వేరే కుప్పగా వెయ్యడం మొదలైన పనులన్నీ మా పెద్దన్నయ్య అజమాయిషీ లో యాభై మంది  పాలికాపులు పది రోజుల పాటు పని చేసే వారు. ఇప్పుడు పాలికాపుల బదులు వారిని వ్యవసాయ కూలీలు అనడం వింటున్నాను.  ఇక పొద్దున్నే ఏ పది గంటలకో పొలం చేరుకున్న మా కుర్ర కారు సాయంత్రం దాకా చెరువు గట్ల మీదో, కళ్ళం లో ఉన్న ధాన్యం కుప్పల చాటునో ఆడుతూ, పాడుతూ గడిపేసే వాళ్ళం. మాతో సాయం వచ్చిన పాలికాపులు మమ్మల్ని మా అన్నయ్యకి అప్పగించేసి వెనక్కి మళ్ళీ ఊళ్ళోకి వెళ్లి, మా మేనత్త రంగక్కయ్య సద్దిన రెండు కేరియర్ల భోజనం పట్టుకుని తిరిగి వచ్చే వారు.  మధ్యాహ్నం నిప్పులు చెరుగుతున్న వేసవి కాలం ఎండలో చెరువు గట్టు మీద కూచుని అన్నాలు తినే వాళ్ళం.  రాత్రి అంతా కుప్ప నూర్పులు నూర్చిన పాలికాపులు ఇళ్ళకి వెళ్ళిపోతే, మిగిలిన పనులకి కొత్త బేచ్ వచ్చే వారు.  మా పెద్దన్నయ్య పనులు చూసుకుంటూ ఉంటే మేము పొలం గట్లమ్మట తిరుగుతూ, తాటి ముంజెలు జుర్రుకుంటూ, తేగలు కాల్చుకుని తింటూ, కొబ్బరి నీళ్ళు తాగుతూ, జిగురు కోసం తుమ్మ చెట్లకి గంట్లు పెట్టుకుంటూ, చెరువు గట్టు మీద మామిడి కాయలు కోసుకుని, ముక్కలు చేసి ఉప్పూ, కారం నల్చుకుని తింటూ “శుభ్రంగా పాడై పోయే వాళ్ళం”.  సాయంత్రం చీకటి పడే లోపుగా మళ్ళీ ఇంటికి వెళ్లి పోయేవాళ్ళం.

ఇక నా  జీవితంలో  సాహిత్య పరంగా చెప్పాలంటే నేను వేసవి శలవులకి పదిహేనేళ్ళు వచ్చే దాకా దొంతమ్మూరు వెళ్ళినప్పుడు  అక్కడ చదివిన “చందమామ” పత్రికలనే చెప్పాలి. ఎందుకంటే, అక్కడ మేడ మీద రెండు    పెద్ద గదులు ఉండేవి, ఒక గదిలో రెండు, మూడు భోషాణం నిండా కొన్ని వందల “చందమామ” పత్రికలు ఉండేవి. ఇవి ఖచ్చితంగా మా హనుమంత రావు బావ కలెక్షన్ అయి ఉండాలి. మేము శేరీలో కుప్ప నూర్పులకి వెళ్ళకుండా ఊళ్ళోనే ఉన్నప్పుడు 1950- 1960 లలో వచ్చిన ఈ చందమామలు చదవడమే అద్భుతమైన కాలక్షేపం.  అప్పుడు అది కేవలం కాలక్షేపమే. కానీ నాకు కాస్తైనా  బుద్ది వికసించింది అని ఎవరికైనా అనిపిస్తే దానికి బీజాలు అప్పటివే!

ఆ నాటి కాల భంజకా, కంకాళా, చతుర్నేత్రుడు, మంత్రాల దీవి,  పక్కనే జిల్లేళ్ళ దిబ్బ, చుట్టూ భయంకరమైన మొసళ్ళతో ఉన్న మందాకినీ సరస్సు, దాని ఒడ్డున ఊడల మర్రి, ఏకాక్షి, తోకచుక్క, మకర దేవతా, పొట్టి రాక్షసుడూ, గీక్షసుడూ, దొంగముచ్చూ, పరోపకారి పాపన్నా, బండ రాముడూ, శూరసేన మహరాజూ, జిత్తుల మారి నక్కా, తెనాలి రామలింగడూ, కీలు గుర్రం, పట్టువదలని విక్రమార్కుడూ, అతనికి మౌనభంగం కలగగానే శవంతో సహా మాయమయిన బేతాళుడూ, అమర సింహుడూ మొదలైనవి మహత్తరమైన కాల్పనిక సాహిత్య సృష్టి. మహా భారతమూ, రామాయణమూ, ఇంచుమించు అన్ని ఇతిహాసాలూ నీతి కథలూ నేను చందమామలోనే ఎక్కువగా చదువుకున్నాను. అప్పుడు రచయితల పేర్లు చూసి చదివే వయసు కాదు. కొ.కు. గారు, దాసరి గారు వ్రాసే వారు అని తెలియదు, కానీ వ.పా గారు, చిత్రా గారు బొమ్మలు వేసే వారు అని తెలుసు. ఎందు కంటే ఆ బొమ్మలు చూస్తూ, మేము మేకప్పులు చేసుకుని, కిరీటాలు, కత్తులూ, ఇతర జానపద, పౌరాణిక, కాల్పనిక పాత్రలన్నింటినీ ధరించి ఆటలాడుకునే వాళ్ళం.

పెద్దన్నయ్య పెళ్లి 1960

పెద్దన్నయ్య పెళ్లి 1960

ఈ వయసు దాటాక, మా పెద్దన్నయ్య పెళ్లి అయ్యాక, పొలం పనుల మీద కాకినాడ నుంచి వచ్చినప్పుడు ఎప్పుడైనా రాత్రుళ్ళు ఉండిపోవలసి వస్తే దొంతమ్మూరు వెళ్ళకుండా పొలంలోనే ఉండడానికి వీలుగా మా అన్నయ్య ఒక మకాం కట్టుకున్నాడు. అంటే ఒక మూడు గదుల పెద్ద పాక అన్నమాట. అందులో ఒక వంట గది, ఒక పడక గది, మధ్య గది. ముందు వరండా, ఆ వరండాకి అటు, ఇటూ సామాను గదులు ఉండేవి. తాత్కాలింగా ఇది కట్టుకుని, తరువాత పెంకుటిల్లు కదదామనుకున్నాడో లేదో తెలియదు కానీ,  అప్పటి నుంచీ ఆ “పాత మకాం”  ప్రతీ వేసవి కాలం లోనూ మాకు విడిది గృహమే! ఆ మకాం ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. ఈ ఫోటో లో ఆ మకాం “నీరసం” గా, నిర్మానుష్యంగా ఉంది కానీ నా చిన్నప్పుడు , ముఖ్యంగా వేసవి కాలంలో, కళ, కళ లాడుతూ ఉండేది. ఆ “కళాకారుల” బృందంలో ప్రధాన భాగస్వాములం  నేనూ, మా తమ్ముడూ, నా పైవాడు సుబ్బన్నయ్య, మా ఆఖరి మేనత్త కొడుకు అబ్బులు బావ, మా పెద్ద వదిన పెద్ద తమ్ముడు వెంకట్రావు, రెండో తమ్ముడు కంచి రాజు, అప్పుడప్పుడు మా అందరికంటే పెద్దవాడే అయినా చిన్నవాడిలా మాతో కలిసిపోయే మా అమలాపురం పెద్ద బావ ఇలా చాలా మంది అ పాత మకాం లోనే రెండు, మూడు నెలలు ఉండిపోయే వాళ్ళం.  అక్కడ కరెంటు ఉండేది కాదు. రాత్రి అవగానే కిరసనాయిల్ లాంతర్లు, పెట్రో మేక్స్ లైట్లే !

ఆ పెట్రో మాక్స్ లైట్ల వెలుతురు లో రాత్రుళ్ళు  కుప్పలు నూరుస్తూ మా పాలికాపులు పాడుకున్న పాటలు నాకు యింకా వినపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా “తాచు” అనే వాడు రాగం ఎత్తుకుంటే ఒళ్ళు గగుర్పొడిచేది. వాడు “గోంగూర” పాట పాడితే  పది సార్లు పాడించుకునే వాళ్ళం. సగం మగ కూలీలు, సగం ఆడ కూలీలు పోటాపోటీ గా నిఘం గానే సరసాలాడుకుంటూ,  ఆడుతూ, పాడుతూ పని చేసుకుంటూ కళ్ళారా చూసిన వాణ్ణి నేను.  పక్కనే ఉన్న గడ్డి మెట్ల మీద పై దాకా నిచ్చెన వేసుకుని ఎక్కి, నా దగ్గర ఉన్న ఒక పెద్ద నక్షత్రాల పటం పరిచి, చిన్న బేటరీ లైట్ వేసి, పైన ఆకాశం లో ప్రతీ నక్షత్రాన్నీ, క్రింద ఈ మ్యాప్ లో గుర్తించి అక్కడ ఉన్నన్నాళ్లు కొన్ని గ్రహాలూ, నక్షత్రాల గమనాన్ని కాగితాల రాసుకుని  అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందిన చిన్నవాణ్ణి నేను.  ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక కొన్ని రోజుల పాటు ఏ ప్రతీ రాత్రీ నేను చూసిన ఒక అతి పెద్ద  తోకచుక్క నీ, మొత్తం ఆకాశంలో బహుశా మైళ్ళ కొద్దీ పొడుగ్గా ఉన్న అద్భుతమైన ఆ దృశ్యాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను.

ఒక్క పేరాలో చెప్పాలంటే …..పైన ఆకాశంలో ప్రస్ఫుటంగా ఒక తోక చుక్క, చుట్టూ దూరంగా నక్షత్రాలు, క్రింద భూమి మీద ప్రేమగా, పల్లెపడుచులు పేడతో అల్లిన కళ్ళం లో తాళ్ళతో కట్టేసిన రాట చుట్టూ తిరుగుతూ, కాళ్ళతో తొక్కుతూ కింద వరి కంకుల నుంచి ధాన్యం గింజల్ని వేరు చేస్తున్న మా పాడి పశువులు, ఆ ధాన్యాన్ని దగ్గరకి చేర్చి కుప్పగా వేస్తూ, కొత్త వరికంకుల్ని వేస్తున్న మా పాలికాపులు, పైన ఎక్కడో గడ్డి మేటు మీద ఆకాశం, నక్షత్రాల పటం చూస్తూ, అందరికీ వివరిస్తూ నేను, ఎక్కడైనా పాటలు వస్తాయేమో అని మా ట్రాన్సిస్టర్ రేడియో తో తంటాలు పడుతున్న వెంకట్రావో, మరొకరో….ఎవరికైనా కాఫీలు కావాలా అని అడుగుతూ మా పెద్ద వదిన గారూ, ధాన్యం కుప్పల మీద సెక్యూ రిటీ కోసం “ఆంజనేయ స్వామి” మట్టి ముద్ర లు వేస్తూ మా తమ్ముడూ, మా సుబ్బన్నయ్యా,  పెట్రోమేక్స్ లైట్ వెలుగులోనే పేక ముక్కలూ పంచుతూ మా అబ్బులు బావా ..ఈ మొత్తం సీనరీ అంతటినీ అజమాయిషీ చేస్తూ “ఆవకాయ ..నా బెస్ట్ ఫ్రెండ్ “ అని ఆ మాత్రం భోజనానికే అఖండంగా ఆనందించే మా పెద్దన్నయ్యా…ఇదే “లోకారెడ్డి వారి చెరువు ఇస్తువా పంపు అనే  శేరీ” లో నేను గడిపిన మా చిన్నప్పటి వేసవి శలవుల తీరుతెన్నుల కి నేను ఇవ్వగలిగిన పరిమితమైన అక్షర రూపం.

– వంగూరి చిట్టెన్ రాజు

గింజలు

47x37_custom_two_birds_in_a_cherry_blossom_branch_original_painting_42b066fd

అక్కా, చెల్లెలూ.

గూటిలోంచి దూకి కొమ్మ మీద వాలాయి.

ఇంకా పొద్దు పొడవలేదు.

చెట్టు చుట్టూ నిశ్శబ్దం.

తూర్పున ఎరుపుముసుగు లేస్తుంది.

ఆకలిగా ఉందక్కా అంది చెల్లెలు.

నేనెళ్ళి గింజలు వెతుక్కొస్తానంది అక్క.

ఒద్దు, పోవొద్దు, అమ్మ లేస్తే, నువ్వు లేక పోతే… అమ్మ భయపడుతుంది, అంది చెల్లులు.

తొందరగా వస్తాగా, గింజలు తెస్తాను. అమ్మకు పని తప్పుతుంది, అంది అక్క.

చిన్ని రెక్కలు విప్పుకుని ఎగిరిపోయింది.

పడమటిగా.

 

ఎండుపొలాలు దాటి,

కొండలు దాటి,

వాగులు దాటి,

పెద్ద వన భూమికి చేరింది అక్క.

అబ్బా, ఎన్ని గడ్డిమొక్కలో!

ఎన్ని గింజలో!

ఆకలి తీరా తిన్నది అక్క.

చెల్లికీ అమ్మకూ గింజలు తీసుకెళ్ళాలి.

పెద్ద కంకి నోట గరిచి కొమ్మెక్కింది.

ఇది రెండురోజులకు సరిపోతుందేమో.

మళ్ళా గింజల కోసం బతుకాట.

 

కొమ్మ మీద గూడు కట్టింది అక్క.

ఒక్కొక్క కంకి తెచ్చి గూట్లో దాచింది.

అమ్మ ఎంత గర్వ పడుతుందో నా బిడ్డ ఇన్ని కంకులు పోగుచేసిందని.

గింజలు పోగుచేస్తూ వచ్చిన కారణం మర్చిపొయింది అక్క.

 

రోజులు గడిచాయి.

అక్క ఒంటరైంది.

చుట్టూ ఎన్నో పక్షులున్నా,

వాటి పలుకు వేరు.

రూపాలు వేరు.

తమ చెట్టు పక్షి ఒక్కటీ లేదిక్కడ.

ఒంటరై పోయింది అక్క.

అయ్యో, గింజల గోల్లో పడి ఇలా అయిపోయానే అనుకుంది.

అప్పుడప్పుడూ తూర్పు వైపు చూస్తుంటుంది.

 

వెళ్ళి పోదామనుకుంది చాలా సార్లు.

కానీ, ఇన్ని గింజలు వదిలేశా? మనసొప్పలేదు.

వీటికోసమేకదా అమ్మ వెతికేది రోజూ?

మరో రోజు ఆగి పోయింది అక్క.

 

అమ్మను కనిపెట్టుకుని ఉంది చెల్లెలు.

ఒక్కో రోజు ఆకలిగానే పడుకుంటుంది.

కాని అమ్మను వదిలేసి వెళ్లలేక పోయింది.

తనుకూడా గింజలకోసం వెళ్తే?

కానీ, భయం.

పాపం ఒక్కతే అయిపోతుంది అమ్మ.

పైగా ఈ వయసులో.

అక్క తప్పకుండా వస్తుంది.

మళ్ళా అందరూ బాగుండే రోజు వస్తుంది.

ఆశగా పడమటి వైపు చూస్తూ ఉంటుంది చెల్లెలు అప్పుడప్పుడూ.

 

రోజులు గడుస్తునాయి.

అక్క ఇంకా రాలేదు.

అమ్మేమో రేపో మాపో అంటుంది.

చుట్టుపక్కల పక్షులు వచ్చిపోతున్నాయి అమ్మను చూట్టానికి.

తల్లికి గింజలు సంపాయించి పెట్టలేని పనికిమాలిన దానివి అంటున్నాయి కొన్ని పక్షులు.

దద్దమ్మను చూసినట్లు చూస్తున్నాయి.

పెద్ద కూతురే ఉంటేనా… ఆమెకీ కష్టాలొచ్చేయి కాదు, అందొక పక్షి.

 

ఇప్పటికీ ఏదో ఒక బంధువు పక్షి ఆమాటలు అంటూనే ఉంటుంది.

విన్నప్పుడల్లా చెల్లి చూపుల్లో ఓ నవ్వు తళుక్కు మంటుంది.

కానీ నవ్వులా ఉండదు.

అది సంతోషమో,

విషాదమో,

అసూయో,

ఉన్మాదమో

ఎవరికి తెలుసూ?

కొమ్మ మీద కూర్చుని దూరంగా చూస్తూ ఉంటుంది చెల్లెలు.

 

-ఆరి సీతారామయ్య

photo

 

 

 

 ఆరి సీతారామయ్య గారు వృత్తిరీత్యా బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్. కథకుడిగా తెలుగు సాహిత్యజీవులకు బాగా తెలిసిన పేరు. పదేళ్ళ కిందట ఆయన రాసిన కథలు “గట్టు తెగిన చెరువు” శీర్షికగా ప్రచురితమయ్యాయి. త్వరలో మరో కొత్త కథ సంపుటి రాబోతోంది.

కాగితమ్మీద వొలికిన జీవితం ఇది!

Mohan Rushi

“Poetry is the essence of life, life is the truth of I-awareness. Essence is the reflection of the universe in the truth of his individuality” అని ఎవరో అన్నట్టు మోహన్ రుషి కవిత్వమంతా మిర్యాల గూడ గతంలో తెలీని భవిష్యత్తును హైద్రాబాద్ భవిష్యత్తులో మర్చిపోలేని గతాన్ని ఎప్పటికప్పుడు పోల్చుకుని తన అస్తిత్వాన్ని తను తవ్వుకోవడం , ఆ పై చొక్కా పైగుండీ విప్పి గతుకులరోడ్లమీద ఈదడం, చివరగా రెండు కన్నీటిబొట్లు గొంతులోకుక్కుకుని నవ్వుకోవడం..ఒక విధంగా ఈ కవిత్వమంతా కన్ఫెషనల్ కవిత్వమే..(అసలు కవిత్వమంటేనే కన్ఫెషనల్) కానీ తెలుగునాట ఇలాంటి దుఃఖసహిత కన్ఫెషనల్ కవిత్వం రావడం అరుదాతి అరుదు..

దేశభక్తిగీతాలు ప్రకృతిపాటలు పక్కనపెడితే ఆధునికత వికటించినప్పుడల్లా కాందిశీక దేహానికీ నీడకీ జరిగే వైయుక్తిక సంఘర్షణే కవిత్వ కారకమౌతుంది..నగరజీవనం సుఖభరితం ఔతున్నకొద్దీ జీవితం అంత నిర్లిప్తంగా తయారౌతుంది, ఐతే చాలాసార్లు ఈ అంతర్బాహిర్ యుధ్దం కవిత్వానికి అస్పష్టతను ఆపాదిస్తుంటుంది సహజంగా, కానీ మోహన్ రుషి కవిత్వం అలా దారితప్పకుండా నడిచొచ్చిన దార్లూ నడిపించిన వేర్లూ మర్చిపోలేని అమాయకత్వం తోడై అకస్మాత్తుగా పాతమిత్రుడు కనిపించి కౌగిలించుకునే ఒక ప్రేమాస్పద స్పర్శగా చదువరుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది..

1

కవిగా మోహన్ రుషి “తల్లి”ని కన్నాడు.. –అమ్మలంతా ఒకవైపు– రెండుగా విభజించవలె, ఆమె రాత్రి దుఃఖాన్ని, లేదూ, రెండింటా ఉన్నది , కావొచ్చు, ఒకే దుఃఖము, విశ్లేషించడం మన తెలివి/తక్కువతనం-..

డయాబెటిస్ తో అమ్మ వేలిగోళ్ళు వాచి ఊడిపోయే ఒకానొక బాధామయ క్షణాల్ని ఏరుకుని గొంతులో గుచ్చుకుంటూనే ఇలా అంటాడు,

–అమ్మల కన్నీళ్ళు అబధ్దం కాదు– వాళ్ళ గురించి వాళ్ళు అడిగే పాపాన వాళ్ళెన్నడూ పోరు వాళ్ళు అనుభవిస్తున్న దుఃఖం అందుకు ఆనవాలు అమ్మల కన్నీళ్ళు అబధ్దం కాదు అన్నాక

–లెక్కలేదు పత్రం లేదు– ఆమె యుధ్దం చరిత్ర గాలే ఆమె బత్కు లెక్కలకు రాలే ఒక మిశ్నిలెక్క/ ఒక కట్టెలెక్క/ ఒక దండెం లెక్క/ ఉన్నదా అంటె ఉన్నది నామ్ కెవాస్తె బత్కలేక సావురాక ….. అని బహురూప స్త్రీ దుఃఖాన్ని నిర్నిమిత్తంగా మనకు బదిలీ చేస్తాడు..

ఇంట్లో రెండు పెద్దబీరువాల పుస్తకాల్ని పోషిస్తూనే పుట్పాత్ మీది అక్షరాన్ని కళ్ళకద్దుకుంటాడిలా మోసం చేసే మనుషులుండొచ్చేమో కానీ/ మోహం కుదిరాక/ పాతబడిపోయిన పుస్తకాల్లేవ్….

రుషి పదాల వాడకంలో ప్రదర్శించే పీనాసిత్వం తన కవిత్వానికి చాలా పదును తీసుకొస్తుంది.. ఎంతో మంచి శూన్యం/ జీవితం… ప్రేమ లేదని కాదుగానీ/ తేపకోసారి తేమను నిరూపించడం నా వల్ల కాదు…

నువ్వు మొదలూ కాదు/ కథ నేటితో ముగిసేదీ కాదు, ఈ ప్రయాణం / రాత్రి తెల్లారేవరకు కాదు/ నీ బతుకు తెల్లారేవరకూ తప్పదు..

అని ఎలాంటి పదాల ఆర్భాటమూ ( ప్రచారార్భాటం కూడా) లేకుండా అనేసి సభ వెనకకుర్చీలో సాగిలబడి జరుగుతున్న సామాజిక సర్కస్లను చూస్తూ చిర్నవ్వుకోగలడు

మనలో చాలామంది కనీసం గుర్తించడానికైనా ఇష్టపడని మనుషులు రుషి కవిత్వంలో రక్తమాంసాలు నింపుకుంటారు,

–విజేతలు వాళ్ళు– అల్కాపురి వీధుల్లో ఆకుకూరల్తో ఆప్యాయంగా నవ్వుతూ/ ఆమె అడిగింది ఒక్కటే ” గంప కిందికి దించాలి సారూ”..

–నేర్చుకోవాలి– షేరింగ్ ఆటోగుండా ప్రయాణిస్తాం/ అమ్మలు కూర్చున్నారిద్దరు ఎదురుగా/ ప్రేమైకమూర్తులు, సాయిబాబాగుడి దగ్గరి గుంతల్లో ఆటో కిందామీదా/ అయినప్పుడు. ” రోడ్లు సల్లంగుండ” అంటూ, కోపంలోనూ నోరు జారని/ వాళ్ళు, పాఠాలు తెలియనివాళ్ళు, పాటలను మించినవాళ్ళు..

ఇలాగే “బస్ ఇత్నాసా ఖ్వాబ్ హై”, “ఇల్లు సమీపిస్తున్నప్పుడు”, “కమ్యూనిటీ హాల్ మూలమడ్త మీద”, “ఒక్క అమ్మకు పుట్టలేదంతే”, “పునఃదర్శన ప్రాప్తి రాస్తూ”, “దిల్షుక్ నగర్ చౌరస్తా” వంటి కవితల నిర్మాణం మూసని బద్దలుకొడుతూ ఆశ్చర్యానికీ ఆనందానికీ గురిచేస్తాయ్,

ఇదేకవి “మీన్ కాంఫ్” అన్న కవితలో ఏమాటకామాటే చెప్పుకోవాలి/ ఎవరూ పాడని గీతంగా మిగిలిపోవాలి/ అతిథిలా ఆగడం/ ముసాఫిర్ లా ముందుకు సాగడమే ఇష్టం/ బంధం గంధం పూసుకు తిరగలేను/ ఎవరెంత చెప్పినా భవిష్యత్తులో బ్రతకలేను అని,

“ఒక కరుత్తమ్మ కోసం” కవితలో ఆమె వస్తదనే ఇప్పటిదాంక ఆగిన/ వచ్చినంక నాతోటే ఉంటదా పోతదా/ తర్వాత ముచ్చట, ఊరుపేరు తెల్వదుగానీ/ యాడ్నో బరాబర్ ఉంటదని నమ్మకం/ ఇయ్యాల గాకపోతే రేపైనా/ రాకపోద్దా అని ఆశ, ఆమె వస్తదనే ఇప్పటిదాంక ఆగిన/ లేకపోతె ఈడ నాకేం పని, అనడం కాస్త అసంబధ్దంగా అనిపించినా కాలానుగుణంగా కవిలో కలిగే మార్పు తాలూకూ భావచైతన్యంగానే ఊహకందుతుంటుంది.. ..

Mohan Rushi

2

“Tragedy is a joy to the man who suffers”

బాధపడే మనిషికి విషాదం మరింత ఆనందాన్ని కల్గిస్తుందని తెలిసిన ఈ కవి అందుకేనేమో స్వీయ నిరానందాన్నే ఎక్కువగా కవితాంశగా తీసుకుంటాడిలా..

–3.47A.M– బైటకూ వెళ్ళలేక, లోపలికి వెళ్ళే ధైర్యం చెయ్యలేక, నిద్రరాక, మెలకువ/ లేక, ఈ ధాత్రిపై ఇది ఎన్నవ రాత్రి? ఏమి నేర్చుకుని? ఏ అసంబధ్ద/ అల్పానందాల తీవ్ర ఫలితాల్లోంచి నిన్ను నువ్వు పురుడు పోసుకుని? ..

మాండలికాల్లో మాట్లాడ్డమే అవమానకరం అనుకునేంత ఙ్నానం ప్రబలిన గ్లోబలైజేషన్లో తియ్యటి తాటిముంజలాంటి తెలంగాన మాండలికంలో మన “దూప” తీరుస్తాడు మోహన్ రుషి..

ఒక తెల్లార్ గట్ట లేశినోన్ని లేశినట్టు పక్కబట్టల్ గిట్ట మడ్తబెట్టకుండ అసల్ పక్కకే జూడకుండ నడుసుడు మొదల్ బెడ్త నడుస్త…/ ఉరుక్త../ ఎండ గొట్టదు/ వాన దాకదు/ సలి దెల్వదు/ పట్నం మొకమ్మీద కాండ్రిచ్చి ఊంచుకుంట నడుస్త/ ఉరుక్త/ నేను మా మిర్యాలగూడెంల బడ్త…

3

తన జీవితాన్నే ఎలాంటి మొహమాటాల్లేకుండా కవిత్వీకరించుకున్న “రాబర్ట్ లోవెల్” లాగానే ఇది ఉట్టి కవిత్వం కాదు, జీవితం.. మోహన్ రుషి జీవితం ఇదంతానూ.. మిర్యాల్ గూడ టు హైద్రాబాద్ వయా జీరో డిగ్రీ…

 

– వంశీధర్ రెడ్డి

vamshi

రాయకుండా ఉండలేనితనం వచ్చేదాక రాయను: పెద్దింటి

ప్రతి నెల వచ్చిన కథలన్నీ చదివి, మేము నిర్ణయించుకున్న ప్రాతిపదికల ఆధారంగా మిగిలిన కథలకన్నా ఉత్తమంగా వున్న కథను ఎంపిక చేసి మీకు పరిచయం చేసే ప్రయత్నం ఇది. అంటే మేము ప్రకటించే కథ ఉత్తమకథా లక్షణాలన్నింటినీ పుణికిపుచ్చుకుందని కాదు. కేవలం సాపేక్షంగా మిగిలిన కథల కన్నా బాగుందని మాత్రమే దాని అర్థం. ఇందులో మరో కోణం వుంది. మేము నిర్ణయించుకున్న ప్రాతిపదికలు కొంత మారిస్తే మరో కథ మంచి కథగా అనిపించే అవకాశం వుంది. అలాంటి ఇబ్బంది లేకుండా బాగున్నాయనిపించిన కథలను అన్నింటినీ ప్రకటిస్తున్నాము. అందువల్ల ఏ ప్రాతిపదికన చూసినా ఆ నెలకి ఉత్తమ కథ ఏదైనా ఈ లిస్టులో వుండే తీరుతుందని మా నమ్మిక. మా అభిప్రాయంతో విభేదించి, విశ్లేషణలతో మరో మంచి కథని పాఠకులు పరిచయం చేయగలిగితే మా ప్రయత్నం మరింత సఫలవంతమైందని మేము భావిస్తాము. అలాంటి చర్చకు తలుపులు తెరవడమే మా ముఖ్యోద్దేశ్యం.

img3

 

గతవారానికి కొనసాగింపుగా – జనవరి నెల కథగా ఎన్నికైన ‘ప్లాసెంటా’ (రచయిత: శ్రీ పెద్దింటి అశోక్ కుమార్)  గురించి చర్చిద్దాం.

ఉమ్మడి కుటుంబాలు అరుదైన నేపథ్యంలో – భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు కావడం, తమ తమ ఉద్యోగం నిలబెట్టుకోవడానికి లేదా ఉద్యోగస్థాయి పెంచుకోవడటానికి వాళ్ళు పడే తాపత్రయం ఒక స్త్రీ జీవితంలో ఎలాంటి సమస్య సృష్టించింది ఆ సమస్యనుంచి బయటపడటానికి ఆమె ఏ మార్గాన్ని ఎన్నుకున్నది, దాన్ని ఎలా అమలు పరచిందీ అన్నది కథా వస్తువు. అంతేకాకుండా, వ్యక్తిగత స్థాయిలో తీసుకునే ఇలాంటి నిర్ణయాలకి ఫేస్ బుక్ లాంటి వేదికలలో గుంపు మనస్తత్వాల ప్రోత్సాహం ఎలా ఉంటోందో చెప్పిన కథ కూడా. ఇతివృత్త పరంగా సమకాలీనత ఉన్న ప్రధాన సమస్యలని అనుసంధానించి నడిపిన కథ కనుక, ‘ప్లాసెంటా’ ఒక విభిన్నమైన కథగా అనిపించింది.

పరిష్కారం కచ్చితంగా చెప్పలేని కథలని నడపడం అంత తేలికైన పని కాదు. ఇలాంటి కథల్లో వస్తువు తాలూకు విభిన్న పార్శ్వాలని ప్రతిభావంతంగా చూపించి, పాఠకులు ఒక సమగ్ర అవగాహనకి రాగలిగిన పరిస్థితిని కలగజేయాలి. కానీ, కథ మళ్ళీ చర్చలాగానో, వ్యాసంలాగానో అనిపించకూడదు. వస్తువులోని గాంభీర్యతకీ, పఠనీయతలోని సౌకర్యానికీ మధ్య సరైన బ్రిడ్జ్ ఉంటేనే ఇలాంటి కథలు నప్పుతాయి. గుర్తుండిపోతాయి. మరి ఈ కథ ఎంతవరకూ ఈ విషయంలో సఫలమైంది?  చూద్దాం.

మంచి కథ ప్రారంభంలోనే కథ పట్ల ఉత్సుకతని కలిగించి పాఠకుడిని తనతో కథ చివరిదాకా ప్రయాణానికి మానసికంగా ఆయత్తం చేయగలగాలి. ప్లాసెంటా కథ ఎత్తుగడ, కొన్ని గందరగోళాల మధ్య దురదృష్టవశాత్తూ పాఠకుడికి ఈ సౌకర్యం కల్పించలేక పోయింది.

సమస్యని ఎదుర్కొనే వ్యక్తి మనస్తత్వాన్ని బట్టి, ఆ వ్యక్తి జీవన పరిస్థితిని బట్టి ఎన్నుకొనే పరిష్కారాలు మారుతుంటాయి.  ‘ఈ పరిష్కారం ఆమోదయోగ్యం కాదు’, ‘ఫలానా పరిష్కారమే సరైనది’ అని కచ్చితంగా నిర్ణయించటం కష్టం. సుజన ఉద్యోగపరంగా విదేశాలకి పోవటం ఒక అరుదైన అవకాశంగా భావించింది. శైశవదశలో ఉన్న కన్నబిడ్డకి దగ్గరగా ఉండటంకన్నా అతడ్ని విడిచి వెళ్లటం వైపే ఆమె మనసు మొగ్గు చూపింది. కానీ బాబుని దూరం చేసుకోవటం కోసం ఆమె ఎన్నుకున్న మార్గం, అది అమలు పరచిన తీరు చాలా క్రూరంగా ఉంది.

కథనంలో ఎక్కడ కూడా సుజన బాబుని వదిలిపెట్టటానికి బాధ పడినట్లు మానసిక సంఘర్షణ అనుభవించినట్లు కనపడదు. వదిలించుకోవడానికి పడ్డ బాధే కనపడుతుంది. అవసరం బాధ్యతని ఎంత మర్చిపోయేలా చేసినా,  ఒక స్త్రీ తన మాతృత్వలక్షణాలని పూర్తిగా విస్మరించి ప్రవర్తించిన తీరు ఆమోదయోగ్యమా అన్నది ప్రక్కన పెడితే – అసహజంగా, నమ్మశక్యంగా అనిపించకపోవడం కథలో కొట్టొచ్చినట్లు కనపడే లోపం.  ఓ పాత్రని సహజత్వానికి దూరంగా కర్కశంగా చిత్రీకరించడం ద్వారా అనుకున్న ముగింపు వైపు కథని నడపడం అనేది రచయిత తనకి అనువుగా కథని డిజైన్ చేసుకోవడమే!

కథ చెప్పడంలో ఇలాంటి లోటుపాట్లు ఉన్నప్పటికీ, పాఠకుడిలో ఆలోచన రేకెత్తించడంలోనూ, ఓ వర్తమాన సమస్యని చర్చకి తీసుకురావడంలోనూ ఈ కథ మిగిలిన (జనవరి) కథలకన్నా ముందు వుండటం వల్ల ఈ కథని ఉత్తమ కథగా నిర్ణయించడం జరిగింది. ఈ కథ విషయమై రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారితో సంభాషణ జరిపినప్పుడు ఆయన ప్రస్తావించిన అనేక కోణాలు ఇలాంటి చర్చకు సంబంధించినవే. అయితే – ఈ సంభాషణలో ఉన్నంత స్పష్టంగా ఆ అంశాలు కథలో ప్రతిఫలించి ఉన్నట్టయితే, ఈ కథ ఇంకొంత మంచి కథ అయివుండేది!

peddinti

ప్లాసెంటా కథా రచయిత శ్రీ పెద్దింటి అశోక్ కుమార్ గారితో సంభాషణ:

ఈ కథా నేపధ్యం వివరించండి. ముఖ్యంగా ఈ ఆలోచన ఎలా వచ్చింది అది కథగా ఎలా రూపు దిద్దుకుంది?

 

ఇది ప్రస్తుతం అన్ని కుటుంబాల్లో ఉన్న సమస్య. ఏ ఇంటికి వెళ్ళినా ఎదురయ్యే సమస్య. ఎవరైనా రిటైర్మెంట్ తీసుకుని తీరిగ్గా ఉన్నారంటే వారింట్లో ఓ చిన్నపిల్ల తప్పకుండా ఉంటుంది. ఉద్యోగం చేసే మహిళలకు ఇది తప్పనిసరి. మెటర్నిటీ సెలవులు ఎక్కువగా ఉండవు. సెలవు పెట్టే వీలుండదు. ఉద్యోగం చేయక తప్పని పరిస్థితి. అందుకని ఈ పరిస్థితి.

 

నేను టీచర్ ను. మా కొలీగ్ ఒక అమ్మాయి మెటర్నిటీ లీవ్ నుంచి స్కూల్లో జాయిన్ అయింది. స్కూల్ కు బాబును తీసుకొచ్చింది. రెండు వారాల తరువాత బాబును తీసుకురాలేదు. ఎందుకని అడిగితే అమ్మ వద్దకు పంపానని చెప్పింది. కారణం అడిగితే DL కోసం ప్రిపేర్ కావాలంది. ఆ నేపధ్యంలోంచి ఈ కథ పుట్టుకొచ్చింది.

 

ఈ కథలో మీరు రాసిన సమస్య ఈ తరానికి చాలా అవసరమైనది, ప్రస్తుతాన్వయం (relevant) చేయతగినది కూడా .మీ కథా వస్తువులో సమకాలీనత వుండేలే మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు.

 

పరిశీలన చేస్తాను. అధ్యయనం చేస్తాను. వర్తమాన సమస్యలనే వస్తువుగా స్వీకరిస్తాను. సమస్య ఎక్కడుందో అక్కడ నిలబడి విశ్లేషణ చేస్తాను.

 

వస్తువు విషయంలో చాలా వర్తమానతని పాటించే మీరు, కథ నిర్మాణ వ్యవహారంలో తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉంటాయి? కథ డిజైన్ ని పూర్తిగా ముందే ప్లాన్ చేసుకుంటారా, లేక మనసుకి తోచింది రాసుకుంటూ పోతారా?

 

కథ మెదటి నుండి చివరి వరకు టైటిల్ తో సహా మనసులో అనుకున్నాకనే కథను రాస్తాను. అది కూడా అనుకోగానే కాదు. మనసులో ఉడికి ఉడికి కథను రాయకుండా ఉండలేనితనం వచ్చేదాక కథ గురించే ఆలోచిస్తుంటాను. రాసేప్పుడు కొత్త ఆలోచనలు వస్తే చిన్న చిన్న మార్పులు చేస్తాను. ఇంత ప్లాన్ వేసుకున్నా సింగిల్ సిటింగ్ లో ఎప్పుడూ కథను రాయలేదు. కనీసం రెండు మూడు రోజులైనా పడుతుంది.

 

ఇక కథలోకి వద్దాం –

సుజన మీద పాఠకులకి కొంత విముఖత ఏర్పడేటట్టుగా కథనాన్ని నడిపించారు. ఆమె వ్యవహరశైలి, ఆమెకు ఇతర మిత్రుల ప్రోత్సాహంఇదంతా ఒక కర్కశమైన లక్షణాలను ప్రదర్శించింది. ఇలా ఎందుకు చేశారు?

 

సబ్జెక్ట్ అలాంటిది. ఆమె కెరీర్ కోసం అమెరికా వెళ్లాలి. ఇంట్లో చిన్నబాబు ఉన్నాడు. అతనితో బాగా attachment ఉన్నది. ఇది నేటి ఆధునిక మహిళలకు జీవన్మరణ సమస్య. దేనిని ఎంచుకోవాలనే దాని మీద సంఘర్షణ. ఇది ఎవరికి వారే నిర్ణయించుకోవాల్సిన సమస్య. అయినా సామాజిక సమస్య. సుజనను వ్యతిరేకించిన తండ్రి ఉన్నాడు. అంటి ముట్టనట్టు ఉన్న భర్త ఉన్నాడు. ప్రోత్సహించిన మిత్రులు ఉన్నారు. ఎవరి ఆలోచనా పరిణితిలో వారి దీనిని విశ్లేషించారు. ఇదంతా కథా వస్తువులో ఒక భాగం.

 

సుజన తను చేసిన పనిని ఫేస్ బుక్ లో పెట్టినపుడు పలువురు లైక్ చేసినట్లు, అభినందించినట్లు రాశారు. సోషల్ నెట్ వర్కింగ్ ఆచారాలు అలవాటుగా, దురలవాటుగా, వ్యసనంగా మారిపోతున్న ఈ రోజుల్లో ఒక “లైక్” వెనకాల నిజమైన స్ఫూర్తి, సమర్థన ఉందని మీరు అనుకుంటున్నారా

అనుకుంటున్నాను. కొంతయినా స్పూర్తి ఉంటుంది. వ్యసనంగా కాక అవసరంగా చూసేవాళ్ళు కూడా చాలా ఉంటున్నారు. సోషల్ నెట్ వర్క్ అలవాటుగా కాకుండా అవసరంగా మారింది ఈ రోజుల్లో. వంద లైక్ ల వెనకాల ఆకతాయితనం ఉన్నా సగమైనా నిజమైన స్పందన ఉందనుకుంటున్నాను. ఒక అభ్యర్థికి రక్తం కావాలని పోస్ట్ చేస్తే ఇవ్వడానికి వందల మంది ముందుకువచ్చారట. ఆర్థిక సహాయం కావాలని టీవీల్లో ప్రకటిస్తే వెల మంది స్పందించి విరాళాలు అందించిన సందర్భాలున్నాయి. చదువుకోలేని ఆర్థిక పరిస్థితి గురించి జిల్లా ఎడిషన్ పేపర్లో వచ్చినా విరాళాలు ఇస్తున్నారు. అందుకని ఒక లైక్ వెనక ఎంతో కొంత నిజమైన స్పందన ఉందనే అనుకుంటున్నాను.

 

స్త్రీలు కూడా సమానావకాశాలు అందిపుచ్చుకుంటున్న ఈ రోజుల్లో – వాళ్ళు కెరీర్ నీ, ఫామిలీ లైఫ్ నీ ఎలా బాలెన్స్ చేసుకోవాలి అని మీరు అభిప్రాయపడుతున్నారు. ఒకదానికోసం మరొకటి నిర్లక్ష్యం చేయాల్సిన పరిస్థితే వస్తే…?

స్త్రీ అప్పటికీ ఇప్పటికీ బాధితురాలే. సమాన అవకాశాలు అనేది వాస్తవం కాదు. ఈ రోజు అన్ని రంగాలో స్త్రీలు ప్రవేశిస్తున్నారని ఇదే సమాన అవకాశాలని మనం అనుకుంటున్నాం. కానీ అవకాశాల పేరున ఆమె మీద మరింత పీడనను పెంచుతున్నాం. ఇంట్లో నిశ్చింతగానో (పురుషుడు ఉన్నంతగా) ఇవతల భద్రంగానో ఆమె ఉంటుందని చెప్పగలమా? ఒక పురుషుడు జీవించినంత స్వేచ్ఛగా, రంధి లేకుండా స్త్రీ బతుకుతుందని చెప్పగలమా? అలాంటప్పుడు సమాన అవకాశమెలా అవుతుంది. అవకాశమంటే పొదటం ఒకటే కాదు. పొందినదాన్ని సమానస్థాయిలో అనుభవించడం కూడా.

 

వాళ్ళకూ కెరీర్ ముఖ్యమే. కానీ మాతృత్వమనే ఒక సమాజ నిర్మాణ బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇది చాలా సున్నితమైన సమస్య. చట్టాలో, నిర్బంధాలో ఈ సమస్యని పరిష్కరించలేవు. పురుష సమాజం అంతా ఆమెకు సహకరించాలి. బాధ్యత కొంతైనా పంచుకోవాలి. ఒకదాని కోసం ఒకటి అన్నప్పుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలన్న క్రమాన్ని సమస్యను బట్టి వారే నిర్ణయించుకోవాలి.

 

ప్రస్తుత యువతరం – వాళ్ళ బాధ్యతలని మర్చిపోయి కేవలం డబ్బు సంపాదన ధ్యేయాలతో తమ ఉనికిని కోల్పోతున్నారని మీరు అనుకుంటున్నారా?

లేదు. సమాజంలో మంచి – చెడు, బాధ్యత లేకుండా తిరగడం – బాధ్యతతో ఉండడం ఎప్పుడూ ఎక్కువనో తక్కువనో ఉన్నదే. కాకుంటే ఇప్పటి యువతరం కొంత ఎక్కువగానే బాధ్యతా రాహిత్యంగా డబ్బు మత్తులో ఉన్నారు. అందుకు కారణాలు అనేకం. వేగవంతమైన ప్రపంచం, అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానం, డబ్బు అవసరం ఇలాంటివి. ముఖ్యంగా పిల్లలకు విలువలు నేర్పే ఇల్లు, పాఠశాలలు ఆరోగ్యంగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఈ కథకు మూలం అదే.

 

పసి పిల్లల మనసు తెల్లకాగితం లాంటిదని శాస్త్రవేత్తలంటారు. పైగా శిశువు మూర్తిమత్వానికి పునాదులు తల్లి గర్భంలో ఉన్న ఆరు నెలలు, బయటకు వచ్చాక రెండేళ్ళ కాలమే ముఖ్యం. ఈ కాలంలో మెదడులో ఫీడయిన అంశాలతోనే శిశువు వ్యక్తిత్వ నిర్మాణం మొదలవుతుంది. ఇక్కడ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ నిర్లక్ష్యంగా తల్లిదండ్రులూ, సమాజం వ్యవహరించి బాధ్యత గల యువతరం కోసం చూస్తే వేప చెట్టు నాటి మామిడి పండ్ల కోసం ఎదురు చూసినట్లే.

 

ఈ కథలో ప్రథాన సమస్యతో పాటు మీరు మరి కొన్ని ప్రస్తావించారు. పాల సీసాల కుట్ర, కులం-జండర్ వగైరాలు. ఇవి మీరు చెప్పదలచుకున్న విషయానికి అడ్డంకుల్లాగానీ, లేకపోతే బలవంతపు జస్టిఫికేషన్లు అని కానీ అనిపించలేదా?

లేదు. కథలో ఒక భాగమే. ముందే చెప్పుకున్నట్టు నవజాత శిశువు, శిశువు దశలోనే అనేక అంశాలు పిల్లల మెదట్లో స్ఠిరపడిపోతాయి. అవి పరిసరాల వల్ల, కుటుంబం, తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి వల్ల జరిగే ప్రక్రియలు. మేం స్కూల్లల్లో మూడు నాలుగేళ్ళ పిల్లలను చూస్తాం. ఆ వయసులోనే ఆడపిల్లలు ఒదిగి ఉంటారు. మగపిల్లలు స్వేచ్ఛగా ఉంటారు. అలవాట్లలో కూడా తేడా ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏ సామాజిక వర్గం నుంచి వచ్చారు, ఏ కుటుంబాల నుంచి వచ్చారు అన్నది అద్దంలా కనిపిస్తుంది. అది వారికి ఎవరూ అంతవరకు బోధించలేదు. కానీ పరిసరాల నుంచి వారి మెదట్లో ఫీడయిన అంశలు అవి. భవిష్యత్ లో ఆ పిల్లలను నడిపించే అంశాలు అవి. తండ్రి కూతుళ్ళ మధ్య ఆలోచనా, పరివర్తనలో తేడాలను చూపిస్తున్నప్పుడు సమాజం, బహుళజాతి కంపెనీలు తల్లి బిడ్డలను ఎలా వేరు చేసి వ్యాపారం చేస్తున్నాయని చెప్పే క్రమంలో పాలసీసా అంశం వచ్చింది.

 

ఒక సరదా ప్రశ్న – ఇదే వస్తువుని, మనకన్నా ఓ రెండు మూడు తరాల ముందున్న రచయిత/త్రులలో (వారిప్పుడు మనమధ్యన లేకున్నా…) – ఎవరైతే బాగా రాయగలరని మీ ఉద్దేశం? అదే – వర్తమాన రచయిత/త్రులలో?

ఈ సమస్యను ఒక్క కోణంలో కాదు. అనేక కోణాల్లోంచి చూడవచ్చు. ఒకరు సెంటిమెంట్ గా చూడవచ్చు. ఒకరు స్త్రీ హింస కోణంలోంచి చూడవచ్చు. ఈ సమాజ నిర్మాణమనేది ఒక స్త్రీ మూర్తి ప్రసాదించిన భిక్షనే కాబట్టి ఒకరు త్యాగమే కోణం లోంచి, మరొకరు స్త్రీ చైతన్య కోణంలోంచి, ఇంకొకరు పురుషుడికి ఈ బాధ్యతలు ఏవీ లేవు కాబట్టి ఆ కోణంలోంచి, ఇంకో అడుగు ముందుకు వేసి తల్లి బిడ్డల మధ్య జరిగిన కుట్రల కోణంలోంచి మరొకరు ఇలా అనేక మంది గొప్పగా ఆవిష్కరించవచ్చు. కొత్తతరంలో అయితే గీతాంజలిగారు, కుప్పిలి పద్మగారు, ప్రతిమగారు ఇంకా చాలా మంది ఈ సున్నితమైన సమస్య గురించి అద్భుతంగా రాయగలరు.

 

ఇందులో చర్చించిన సమస్యని అధిగమించే దిశగా మనం ఏం చెయ్యాలి?

సమస్త మానవాళికి, సమాజ నిర్మాణానికి తొలి అడుగు తల్లి. అది ప్రకృతి సిద్ధం. చెట్టు మీద పువ్వు పూసి కాయ కాసినంత ప్రశాంతంగా తల్లిబిడ్డల మధ్య సంబంధం ఉండాలి. అందుకు తగిన విధంగా చట్టాలు, సమాజం రూపొందాలి. పురుషుడు మారాలి. నవజాత శిశుదశ శిశువు వ్యక్తిత్వ నిర్మాణంలో అత్యంత కోలకమైనది కాబట్టి ఈ వయసులో పిల్లలు తల్లిదండ్రులతోనే ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల భవిష్యత్ కోసమే కష్టపడి డబ్బు సంపాదిస్తున్నామన్న తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ అనేది తమ పెంపకం వల్ల కూడా ఉంటుందన్న విషయం గుర్తించాలి.

రాత్రి జీవితాన్ని గెల్చిన వాళ్ళ కథలు – “ Tales of Night Fairies ”

                  

     ‘తాను శవమై ఒకరికి వశమై, తనువు పుండై, మరొకరికి పండై’ …. అలిశెట్టి ప్రభాకర్.

ఆమెను ‘వేశ్య’ అని నాజూకుగా పుస్తకాల భాషలో పిలుస్తారు. ఇంకా కస్టమర్లు ఎక్కడికక్కడ రకరకాల మాండలీకాల్లో మొరటుగానూ, ముద్దుగానూ కూడా పిలుస్తారు.  ఈ రోజు ఆమెనే ‘సెక్స్ వర్కర్’ అంటున్నారు.  ఆ పేరు వినగానే మన కళ్ళముందు చకచకా కొన్ని దృశ్యాల్లో ఆమె జీవితచక్రం గిర్రున తిరిగేస్తుంది. ప్రియుడు మోసంచేసి వేశ్యాగృహాల్లో అమ్మెయ్యటం, బలవంతంగా ఆ ఊబిలోకి దిగటం, కొన్ని అబార్షన్లూ, ఒకరిద్దరు పిల్లలూ, చివరకు రోగాలపాలై ఒళ్ళు శిధిలమై, దిక్కు ఉండో లేకో చావటం… ఇదీ ఆ జీవిత చక్రం.  సమాజపు అంచులలో ప్రమాదకరమైన జీవితాలు గడిపే వీళ్ళకు పోలీసుల, రౌడీల చేతుల్లో తనువు పుండైపోకుండా చూసుకోవటమే ఒక నిరంతర పోరాటం. ఇలా మరకలు పడ్డ జీవితాలక్కూడా మెరుగులు పెట్టుకునే గడుసర్లు లేరా? అంటే … ఉన్నారు. “Tales of Night Fairies” అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ లో సెక్స్ వర్కర్లు హక్కుల పోరాటంతో తమ జీవితాల్ని ఎలా బాగుచేసుకున్నారో  చూడవచ్చు.

“సోనాగచ్చి”- కలకత్తా లోని మూడువందలేళ్ళనాటి రెడ్ లైట్ ఏరియా. అక్కడ మామూలు కుటుంబాలుండే ఇళ్ళతో పాటు, పక్కనే ‘లైన్ ఇళ్ళు’ అనే వేశ్యాగృహాలు కూడా ఉంటాయి. ఇక్కడుండే సెక్స్ వర్కర్ల  గురించి  డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయాలనే ఆలోచన ‘సోహినీ ఘోష్’ కు చిన్నతనంనుంచే ఉందట. సోహినీ ఘోష్ తల్లి తన ఉద్యోగరీత్యా కలకత్తా అంతా తిరుగుతూ ఉండేదట. ఆవిడ సోనాగచ్చిలో తిరిగేటప్పుడు కొన్ని ఇళ్ళ గోడలమీద “ఇది మర్యాదస్తుల ఇల్లు” అని రాసి ఉండటం చూసిందట. తల్లి తనకు ఈ విషయం చెప్పినప్పటి నుంచీ ఇది తనలో కుతూహలాన్ని రేపిందని చెప్తుంది సోహినీ.

డాక్టర్ స్వరజిత్ జానా ‘సోనాగచ్చి ప్రాజెక్ట్’ పేరుతో  హెచ్.ఐ.వి. ని  అదుపు చేసే కార్యక్రమాన్ని ఇక్కడ 1990 లలో చేపట్టారు. ఇక్కడుండే సెక్స్ వర్కర్లను ఈ పనిలో భాగస్వాములను చెయ్యటం ఈయన చేసిన గొప్ప పని. ఈ క్రమంలోనే 1995 లో సోనాగచ్చిలో దుర్బర్ మహిళా సమన్వయ కమిటీ (DMSC) ఏర్పడింది. ‘Adult sex work’ ను నేరంగా పరిగణించకుండా దానికి ఒక సామాజిక గుర్తింపునిచ్చి, సెక్స్ వర్కర్లకు శ్రామిక సంఘాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు ఇవ్వాలంటూ ఈ కమిటీ పోరాడింది.  ఈ కమిటీలో 60,000 మంది సభ్యులున్నారు. ఈ విధంగా కమిటీ ఏర్పాటు చేసుకోవటం వల్ల పోలీస్ దాడులు పూర్తిగా ఆగకపోయినా, కొంతయినా తేడా వచ్చిందని చెప్తుంది సాధనా ముఖర్జీ అనే సెక్స్ వర్కర్.  “ఒకసారి ఒక అమ్మాయిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళి బంధించి, డబ్బులిస్తేనే వదులుతామని చెప్పారు. అప్పుడు మేము అక్కడ ధర్నా చేసి ఆఫీసర్ ను సస్పెండ్ చేయించాం. అలాగే రేప్ కేసులు కూడా తీసుకొనేవారు కాదు పోలీసులు.  పైగా “మిమ్మల్ని ఎవరైనా రేప్ చెయ్యటం ఏమిట”ని తేలిక మాటలు మాట్లాడేవారు. అలాంటిది ఈ రోజు మేం పోలీస్ స్టేషన్ లో కుర్చీలో కూర్చోగల్గుతున్నాం”… అంటుంది శిఖా దాస్.

ఈ చలిచీమలన్నీ ఒకచోట చేరి ఇంత బలంగా తయారవటమే కాక, కలకత్తాలో మార్చ్ 2001 లో సెక్స్ వర్కర్స్ మిలీనియం కార్నివాల్ ను ఏర్పాటు చేసి, ఘనంగా నిర్వహించి, మర్యాదస్తుల్ని నివ్వెరపరిచారు. సెమినార్లు, వర్క్ షాప్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు .. అన్నీ నిర్వహించారు. ఈ కార్నివాల్ ను అడ్డుకుందుకు ఢిల్లీ మహిళా సంఘాలు చాలా ప్రయత్నించాయట. “మాలో చాలా మందికి చదువు రాదు. కార్నివాల్ లో సరదాగా అందరూ పాల్గొంటారు. ప్రపంచానికి “మేమూ నవ్వుతాం. ఆడుకుంటాం, పాడుకుంటాం” అని చూపించాలని మా ప్రయత్నం. మీరు అనుమతి ఇవ్వకపోతే వేలాదిమందిమి అందరం కలిసి రోడ్లమీద కూర్చుంటాం” అని బెదిరిస్తే గానీ మాకు ఈ పండగ జరుపుకుందుకు చివరి నిముషం వరకూ అనుమతి దొరకలేదు” అంటుంది మాలా సింగ్.  ఈ కార్నివాల్ కు వచ్చి చూసి “మీరు ఇలాంటి పండుగ ఎప్పుడు జరుపుకున్నా మాకు అభ్యంతరం లేద”ని చెప్పిన వాళ్ళ నుంచి వీళ్ళు సంతకాలు కూడా సేకరించారు.  సోనాగచ్చిలో వీళ్ళు బృందాలుగా ఏర్పడి, తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలా అందరినీ ప్రోత్సహించటం, హెల్త్ క్యాంప్స్ నిర్వహించటం, కండోమ్ వాడకం, వ్యక్తిగత శుభ్రత వంటి విషయాలు బోధించటం … చేస్తుంటారు.

సోహినీ ఘోష్ వీళ్ళలో ఒకరుగా కలిసిపోయి రాబట్టిన విషయాలేమిటో చూడండి….

ఉమా మండల్ :  అరవైలలో ఉన్న ఈమె గొడవలు పడకుండా కస్టమర్లను ఎలా ఆకట్టుకోవాలో అమ్మాయిలకు సలహాలిస్తుంది. హెల్త్ క్యాంపుల్లో చురుగ్గా తిరిగి అందరితోనూ పని చేయిస్తుంది.

ఉమా మండల్

“ఒక సెక్స్ వర్కర్ మాత్రమే ఇంకో సెక్స్ వర్కర్ తో సులభంగా కలిసిపోయి మాట్లాడగలదు. బైటివాళ్ళు ఈ పని చెయ్యటం కష్టం. అందుకే మాలో మేమే బృందాలుగా ఏర్పడి అందరినీ చైతన్యవంతుల్ని చేస్తున్నాం”.

“కోమల్ గాంధార్ … ఇది మా థియేటర్ గ్రూప్ పేరు. ‘కోమల్’ అంటే సున్నితం. ‘గాన్’ అంటే పాటలు. ‘ధార్’ అంటే కత్తికున్న పదును. సున్నితంగా పాడుతూ ఆడుతూ పదునుగా మా పరిస్థితిని వివరిస్తాం. మనుషుల ఆలోచనల్లోని  సంకోచాలను వదిలిస్తాం”.

“శ్రమచేసి వస్తువుల్ని సృష్టించే వాళ్ళను శ్రామికులంటారు. ‘మీరేం సృష్టిస్తున్నారు?’ అని మమ్మల్ని అడుగుతారు. మేం జనం మనసుల్లో ఆనందాన్ని సృష్టిస్తున్నాం”.

సాధనా ముఖర్జీ :  దుర్బర్ మహిళా సమన్వయ కమిటీ ఏర్పాటు కాకముందు కూడా సోనాగచ్చిలో సమస్యలు పరిష్కరించిన ధైర్యస్తురాలు.

మాలా సింగ్                                                                                                            సాధనా ముఖర్జీ

“నేను ఈ పనిలో ఉన్నానని మా ఇంట్లోవాళ్ళకు చాలాకాలం వరకూ తెలియదు. నా భర్త చాలా డబ్బున్నవాడని చెప్పి, మా నాన్నకు డబ్బు పంపిస్తూ ఉండేదాన్ని. ఒకసారి మా నాన్న నా దగ్గరకు వచ్చినపుడు ఆయనకు వీధి వాతావరణంలోనే తేడా తెలిసిపోయి నన్ను నిలదీశాడు. నిజం చెప్పాక కన్నీరుమున్నీరయిపోయాడు. కానీ నన్ను వదులుకోలేకపోయాడు”.

“ఇంతకుముందు మేము కూడా ఈ పని చెడ్డ పనీ, అనైతికమూ అనుకునేవాళ్ళం. అలాగని మనకెలా తెలుసు? పుడుతూనే ఈ ఆలోచనలతో మనం పుట్టలేదు. పెరిగి పెద్ద అవుతున్నకొద్దీ ‘తప్పుడు ఆలోచనలు’, ‘దిగజారిన ఆడవాళ్ళు’, ‘నిషిద్ధ స్థలాలు’ అనే పరిభాష నేర్చుకుంటాం. ఇవన్నీ గొప్ప మేధావులు, గౌరవనీయులు సృష్టించినవే!!

“ఇంతకుముందు ఆడవాళ్ళను బలవంతంగా ఇందులోకి దించేవాళ్ళు. నేనూ అలా వచ్చినదాన్నే. కానీ నా సంపాదనతో నా కుటుంబం మొత్తం బతుకుతోంది కాబట్టి దీన్ని నేను విడిచిపెట్టలేను. ఇప్పుడు కొందరు వాళ్ళంతట వాళ్ళే వస్తున్నారు”.    

“ఇంట్లోకి ఎవరిని రానివ్వాలీ ఎవరిని రానివ్వొద్దన్నది మా నిర్ణయమే. ‘నేనూ డబ్బులిస్తానుకదా’ అన్నా సరే మా ప్రాంతంలోనే ఉండే మగవారిని మేము రానివ్వం”.

మాలా సింగ్:  ఢిల్లీ లో తిరిగి అక్కడి జీ.బీ.రోడ్డు సెక్స్ వర్కర్లను కూడా చైతన్యపరచే పని చేస్తూ, వీధి నాటకాల్లో పాల్గొని మాట్లాడుతూ అందరికీ పెద్ద దిక్కులా ఉండే ఈమె కమిటీలో అతి చురుకైన వ్యక్తి.

“తొమ్మిదేళ్ళ వయసులో నన్ను ఈ పనిలోకి బలవంతంగా దించారు. రెస్క్యూ హోం నుంచి ఒక పోలీసు నన్ను పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్ళి చెప్పలేనంత హీనంగా అత్యాచారం చేశాడు. నా తొడల్ని కత్తులతో చీల్చాడు. పోలీసు స్టేషన్లో కంటే మా సెక్స్ వర్కర్ కాలనీలోనే ఎక్కువ భద్రంగా ఉంటాం”.

“ఈ పని తప్పని మొదట్లో అనుకునేదాన్ని. ఇప్పుడు నా ఆలోచన మారింది. నాకూ మా అమ్మకూ పెద్ద తేడా నాకేం కన్పించటం లేదు. మాకు తిండీ, బట్టా అమర్చటం కోసం మా అమ్మ మా నాన్నతో పడుకుంది. నేనూ అదే పని కొంతమందితో  చేస్తున్నాను. తేడా ఏమిటంటే నేనీ పనికి డబ్బు తీసుకుంటున్నాను. ఆ డబ్బుతో నా పిల్లలకు తిండీ, బట్టా ఇస్తున్నాను”.  

“నేను అడుక్కోవటం లేదు. దొంగతనం చెయ్యటం లేదు. కష్టపడి బతుకుతున్నాను.  నాకు జబ్బు చేస్తే ఎవరూ పట్టించుకోరు.  నా డబ్బులు తింటూ ఈ పోలీసులు నన్ను కొడుతున్నారు. పోలీసులను ఎప్పుడూ అసహ్యించుకునేదాన్ని. అవకాశం వస్తే వీళ్ళ పని పట్టాలని ఉండేది. ఒకసారి తాగినమత్తులో ఒక పోలీసు మా వాడకు వచ్చి ఆడవాళ్ళను బాగా కొట్టాడు. వెంటనే వాళ్ళను ఆసుపత్రికి తీసుకెళ్ళి, పరీక్షలు చేయించి, డాక్టర్ల దగ్గర అవసరమైన  పత్రాలు తీసుకున్నాను. మరునాడు ఈ ఆడవాళ్ళను, డాక్టర్ ఇచ్చిన పత్రాలను పోలీసు స్టేషన్ కు తీసుకెళ్ళి కేసు పెడతానన్నాను. పోలీసులు బ్రతిమాలటం మొదలెట్టారు.  మా మీదకు తాగి రాబోమనీ, రైడ్స్ చెయ్యబోమనీ ఉదయం తొమ్మిది లోపు మా ఇళ్ళకు రాబోమనీ రాతపూర్వకంగా ఇమ్మని అడిగి, అలాగే రాయించుకున్నాను. పోలీసు ఆఫీసర్, నేనూ ఆ కాగితం మీద సంతకాలు చేశాం. ఒక కాపీని మా ఆఫీసులో ఉంచాను. కలానికున్న బలం చూడండి. అంతకు ముందెప్పుడూ ఈ కలంపోట్ల తోనే మేము ఇబ్బంది పడ్డాం. ఈ రోజు మేమూ వాళ్ళ ఆటలోనే వాళ్ళను చిత్తు చెయ్యటం నేర్చుకున్నాం”.

 “ప్రభుత్వం సెక్స్ వర్కర్ల ఉద్ధరణ గురించి చెప్పినప్పుడు నాకైతే నవ్వు వచ్చింది. ఒక్కసారిగా మా మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందనుకున్నారు? మానవ హక్కులూ, శ్రామిక హక్కులూ అడుగుతున్నాం కదా!  ఏమీ అనలేక, పునరుద్ధరణ పేరుతో మమ్మల్ని అదుపు చేద్దామని చూస్తున్నారు. అసలు నన్ను ఉద్ధరించే అవకాశమే వాళ్ళకు లేదు. ఎందుకంటే నేను పని చేస్తూ నా బతుకు నేను బతుకుతున్నాను. బెంగాల్లో ఒక నలభై వేలమందిని ఉద్ధరించారని అనుకుందాం. మనది పేద దేశం. మరో నలభై వేలమంది ఇందులోకి రారని నమ్మకమేమిటి? ఢిల్లీలో స్త్రీల జాతీయ కమిషన్ లో మోహినీ గిరిని కలిసి ప్రస్తుతం మాతోనే ఉంటున్న ఒక 500 మంది వయసు మళ్ళిన వాళ్ళ పేర్లు ఇచ్చాను. ‘వీళ్ళకు పని లేదు. ఎవరూ పనిమనుషులుగా కూడా తీసుకోవటం లేదు. వీళ్ళకు ఆధారం కల్పించమ’ని అడిగాను. ఆ తరువాత అక్కడినుంచి ఏ జవాబూ లేదు. మాటకీ చేతకీ ఇంత తేడా ఉంటుంది”. 

శిఖా దాస్ :  శిఖా ఈ వృత్తిలోకి రాకుండా ఉందామని చాలా ప్రయత్నించింది. చదువుకుందామని అనుకుంది. రెండు సార్లు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంది. పని మనిషిగా చేసింది. ప్లాస్టిక్ ఫ్యాక్టరీ లో పని చేసింది. చెత్త కాగితాలు ఎత్తింది. కానీ సెక్స్ వర్కర్ కూతురనే ముద్రా తప్పలేదు. చివరకు ఆ వృత్తీ తప్పలేదు.  తెలివిని కూడా కలబోసుకున్న ఈ బెంగాలీ అందం, డాక్టర్ జానా ప్రోత్సాహంతో 1999లో జమైకా వెళ్లి, అక్కడి సభలో పదిహేను నిముషాలు జంకూ గొంకూ లేకుండా మాట్లాడి అందర్నీ ముగ్ధులను చేసిందట.

సోహినీ ఘోష్ తో  శిఖా దాస్.                                                                                    దీప్తి పాల్, సాధనా ముఖర్జీ

“నేను సోనాగచ్చిలోనే పుట్టాను. అమ్మ ఒక సెక్స్ వర్కర్. నన్ను బళ్ళో వేసింది. అక్కడ అందరూ ‘మీ నాన్న కనిపించడేమ’ని అడిగేవారు. నేను జవాబు చెప్పలేక అమ్మను అసహ్యించుకునేదాన్ని. ఈ రోజు అమ్మను అలా తిట్టుకున్నందుకు సిగ్గు పడుతున్నాను. నాకూ బడికి వెళ్తున్న ఒక పాప ఉంది. బోర్డింగ్ స్కూల్ లో వేశాను. అక్కడి కాగితాల్లో నా వృత్తి ‘సెక్స్ వర్కర్’ అని రాశాను. పాపకు అన్నీ అర్ధం అవుతున్నాయి. ఏదేమైనా తానెవరో దాచవద్దని చెప్పాను”. 

“ప్రభుత్వం మాకు శ్రామిక హక్కులు ఇవ్వటం లేదు. చిన్న పిల్లలు ఇందులోకి రాకుండా చేసుకొనే ‘self regulatory boards’ కావాలి మాకు. కొత్తవాళ్ళు దీనిలో చేరేముందు మేం పరీక్షించాలి. 18 సంవత్సరాల లోపు పిల్లలైతే వాళ్ళ ఇళ్ళకు పంపించేస్తాం. కుటుంబం ఆమెను ఆదరించకపోతే ఎక్కడో ఒకచోట ఆశ్రయం కల్పిస్తాం”.

“కస్టమర్లను కండోమ్ వాడమని అడిగే ధైర్యం రావాలంటే ముందు మా శరీరాలమీద మాకొక్కరికే అదుపు ఉండాలి”.

తన విదేశయానం గురించి చెప్తూ శిఖా ఇలా అంటుంది. “విమానం ఫ్రాంక్ ఫర్ట్ లో ఆగింది. చలికి బిగుసుకుని నా దుపట్టాను చుట్టూ కప్పుకున్నా. ఫ్రాంక్ ఫర్ట్ దాటాక హిందీ తెల్సిన వాళ్ళు ఎవరూ కనిపించలేదు. సిగరెట్టు వెలిగించా. ఆల్కహాల్ ఇస్తున్నారు విమానంలో…  బీర్ నాకెంతో ఇష్టం…  కానీ ఎక్కువగా  తాగేస్తే,  ‘ఒక్కదాన్నే వెళ్తున్నా కదా నన్నెవరు చూసుకుంటార’ని భయం వేసి తాగలేదు. పైగా విమానంలో టాయిలెట్ కి వెళ్తే తలుపు బిగుసుకుని లోపలే ఉండిపోతానని మరో భయం”.

“సమావేశంలో నాకు అయిదు నిముషాలు కేటాయిస్తే, నేను పదిహేను నిముషాలు మాట్లాడేను. అది అవగానే అందరూ నన్ను కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నారు. నా మాటలు బాగా నచ్చాయని చెప్పారు. చదువు రాని ఒక భారతీయ సెక్స్ వర్కర్ ఇంత పెద్ద ఉపన్యాసం ఇస్తుందని వాళ్ళు ఊహించలేదు. అక్కడ ఎవరో నాకో నెక్లెస్ బహుమతిగా ఇస్తే నకిలీదేమో అనుకున్నా. ఎవర్నీ నమ్మకపోవటం ఈ వృత్తిలో అలవాటయింది”.

“నేను చచ్చిపోయేక నా పిల్లలు ఈ జమైకా ఫోటోలు చూసి ‘జీవితంలో కొంతైనా సాధించింది. చెప్పుకోదగ్గ మనిషి’ అని నా గురించి  అనుకుంటారు”.

ఇవీ సోహినీ ఘోష్ తన ఫిల్మ్ లో బంధించిన Night Fairies  చెప్పిన కథలు…

***

ఎనభైల్లో శ్యాం బెనెగల్ ‘మండీ’ అనే సినిమా తీశాడు. ఈ వృత్తిలో ఉన్న వాళ్ళను ఓ పక్క వాడుకుంటూనే…  అవసరమైతే తరిమి కొడుతూ, మళ్ళీ దగ్గరకు తీస్తూ సమాజం ఎలా ఆడిస్తుందో చూపిస్తాడు బెనెగల్. అలాగే ఎంత చావగొట్టినా ఈ పురాతన వృత్తి చావదని కూడా నిష్కర్షగా, హాస్యంగా చెప్పేస్తాడు. ప్రపంచంలో డబ్బు, సెక్స్  అవసరాలూ, స్త్రీలూ, పురుషులూ ఉన్నంత కాలం ఈ వృత్తి కూడా నిలిచే ఉంటుందనిపిస్తుంది. దీనిని ఆపటం ఎవరివల్లా కాదు కాబట్టి, ఈ ‘adult sex work’ ను చట్టబద్ధం చేసి, ప్రాంతాలవారీగా ‘మేము సెక్స్ వర్కర్లం’ అని చెప్పుకునే వాళ్ళకు భద్రత కల్పించి, వేధింపులు లేకుండా చెయ్యటమే సమాజమూ, ప్రభుత్వమూ చేయదగ్గ పని.  పూర్తి స్థాయి సెక్స్ వర్కర్లు, అదీ చదువులేని పేదవారికి ఎటువంటి భద్రతా లేదనటంలో ఏ సందేహమూ లేదు.  ‘సెక్స్ వర్కర్’ అనే మాటను మనం వాడుతున్నామంటేనే, వారిని పనిచేసేవారిగా గుర్తిస్తున్నాం. కాబట్టి అన్ని రకాల పనివారికీ ఇచ్చే భద్రతా, రక్షణా వీరికి కూడా ఇవ్వవలసిన అవసరం ఉందనే అర్ధం కదా!  ‘ఇది మా వృత్తి’ అని చెప్పుకోకుండా వీలైనంత రహస్యంగా డబ్బుకోసం, ఉన్నతస్థాయి జీవన విధానం కోసం  ఒంటిని అమ్ముకుంటున్న అమ్మాయిలూ, గృహిణుల సంఖ్య కూడా సమాజంలో ఇవాళ పెరుగుతోంది. అలాగే మగ సెక్స్ వర్కర్ల సంఖ్య కూడా. సరే ఇదంతా మరో సామాజిక సమస్య.

ఈ ఫిల్మ్ లో సెక్స్ వర్కర్లను ఒక అర్ధవంతమైన ప్రశ్న అడుగుతుంది ఒక సంఘసేవిక. “మీ వాదనలతో ‘నీతి’ అనేది ప్రమాదంలో పడింది. నా ఉద్దేశ్యంలో వేశ్యావృత్తి అంటే  ఆడవాళ్ళమీద జరిగే హింస. మీరేమంటారు?”  ఈ ప్రశ్నకు సుదీపా బిశ్వాస్ అనే ‘DMSC’ సభ్యురాలి జవాబు ఇది-  “మేము పనిచేసే చోటు అందరికీ తెలుసు. అది స్పష్టంగా హద్దులు గీసి ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ఈ వృత్తి జరుగుతుందని తెలిసి, అవసరమైన వాళ్ళు వాళ్ళ కోరికలు తీర్చుకోవటం కోసం వస్తారు. వాళ్ళ జీవితాల్లోని ఇరుకుదనాన్నుంచి కొంతసేపు తప్పించుకోవటానికి మా దగ్గరకు వస్తే, అది తప్పని నాకు అనిపించటం లేదు. ఇతరులకు సంతోషాన్నిచ్చి మేం డబ్బు తీసుకుంటున్నాం. అదే సమయంలో మేమూ ఆనందాన్ని పొందుతున్నాం. ఇది  హింసాత్మకమైన వృత్తిగా మేము భావించటం లేదు. ఇది  బాధాకరమైనదే అయితే, ఇన్ని వేల ఏళ్ళుగా నిలిచి ఉండేది కాదు”.

   ఈ వృత్తి బాధాకరమైనదైనా కాకపోయినా, దానిచుట్టూ బాధల విషనాగులు చుట్టుకుని కాటేయడానికి సిద్ధంగా ఉంటాయనటం అబద్ధం కాదు. పోలీసులు, రౌడీలు, మేడమ్ లు, గుప్త రోగాలు, తాగుడు, సిగరెట్లు … ఇవేమీ అబద్ధం కాదు. దీప్తి పాల్ ఇలా అంటుంది. “మొదట్లో ఇంత కలిసికట్టుగా ఉండేవాళ్ళం కాదు. ఒకసారి ఒకడు శాంతి దీ మెడమీద కత్తి పెట్టి “అయిదు వందలు ఇస్తావా, కత్తి దించమంటావా?” అని బెదిరించాడు. అందరం నిశ్చేష్టులమైపోయాం. మరోసారి ఒకడు ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నాడు. నేనప్పుడు బాగా తాగి ఉన్నాను. తాగితే నేను ఎవరికీ భయపడను. వాడిని నాలుగు తన్నేను. అంతే.. ఆ తరువాత వాడు రెండు చేతులతో రెండు బాంబులు తీసుకొచ్చి నా మీద విసిరేస్తానన్నాడు. ఇంతలో సాధన వెనుకనుంచి నెమ్మదిగా వచ్చి వాడిని గట్టిగా పట్టుకొని, ‘విసురు. అందరం చచ్చిపోదాం’ అంది”.

ఈ దీప్తి పాల్, సాధనా ముఖర్జీ.. ఇద్దరూ కలిసి వీళ్ళ దగ్గర డబ్బు వసూలు చేసే గూండాలను ఎదిరించారు. లట్టూ అనే గూండా రేజర్ తో దీప్తి ముఖాన్ని చీరేశాడట. అతన్ని ఎదుర్కోవటానికి సాధన మిగతా సెక్స్ వర్కర్స్ అందరినీ కూడగట్టింది. ఇన్ని అపాయాలనూ అన్యాయాలనూ ఎదుర్కొన్న తరువాత DMSC ఏర్పడి, బలోపేతమయింది.

2002 లో సోహినీ ఘోష్ తీసిన ‘Tales of Night Fairies’లో ఉన్నది ‘సెక్స్ వర్కర్ల సాధికారత’ అనే అంశం ఒక్కటే కాదు.  వాంఛల గురించి ఏ అరమరికలూ లేకుండా ఈ సెక్స్ వర్కర్లు మాట్లాడటం కూడా ఉంది. నితాయ్ గిరి ఒక మగ సెక్స్ వర్కర్. అతనికి జుట్టూ, గోళ్ళూ పెంచుకుని ఆడపిల్లలా తయారవటం ఇష్టం.  తన మగ శరీరంలోని ఆడ కోర్కెల్ని అర్ధం చేసుకొని, అంచనా వేసుకొని ఈ వృత్తిలోకి దిగటానికి ముందు అతను సమాజంతోనూ, ఇంట్లో వారితోనూ, పేదరికంతోనూ, తనతో తాను కూడా ఎంతో పెనుగులాడేడు. DMSC, కోమల్ గాంధార్ అతనికి పెద్ద ఆసరాగా, జీవితానికో ధ్యేయంగా నిలిచాయంటాడు.  అలాగే చిన్నప్పుడే హింసాత్మకమైన అత్యాచారానికి గురైనా, ఆ అనుభవంతో మనసును వంకరలు పోనివ్వకుండా  “జీవితంలో చక్కని విషయాలు రెండే. ఒకటి మంచి తిండి. రెండోది సెక్స్” అని మాలా సింగ్ చెప్పగలగటం కూడా నాకు విశేషంగా అనిపించింది.

 నితాయ్ గిరి                                                                                                

ఈ నిషేధ ప్రాంతాల గురించీ, నిషిద్ధ స్వప్నాల గురించీ మాట్లాడుతూ “చిన్నప్పుడు నన్ను మా అమ్మానాన్నలు చాలా సినిమాలకు తీసుకెళ్ళే వారు. కానీ,  కొన్ని సినిమాలకు మాత్రం నన్ను ఎందుకు తీసుకు వెళ్ళరో నాకు అర్ధం అయేది కాదు. వాటిగురించి చాలా కుతూహలంగా ఉండేది. నా కౌమారప్రాయంలో నేనూ నా స్నేహితురాళ్ళూ కలిసి ఒక ఊహాలోకంలో విహరించేవాళ్ళం.  “Prostitute’s Paradise” అనే ఊహాత్మక హోటల్లో, అందర్నీ మోహంలో ముంచెత్తే దేవకన్యల్లా మమ్మల్ని మేం ఊహించుకుంటూ ఉండేవాళ్ళం” అంటుంది సోహినీ ఘోష్.  అంటే … స్త్రీలు తమ ఫాంటసీలనూ, sexuality నీ కొంచెం లోతుగా వెదికి, నిర్భయంగా బైటకు చెప్పగల్గితే, పాతివ్రత్యం, వ్యభిచారం .. అనే భావజాలాల మధ్య ఉన్న సన్ననితెర కదిలి, లక్ష్మణ రేఖలు చెరిగిపోతాయేమో!  ఇంతగా ఎరుసు లేకుండా సోహినీ వీరితో కలిసిపోయి కెమెరా పట్టుకుంది కాబట్టే ఈ స్త్రీలంతా అరమరికలు లేకుండా తనతో మాట్లాడగలిగారు. ఫలితంగా ఒక మంచి సినిమా వచ్చింది. ఎనభైల్లోనే స్త్రీ వాదులు ధైర్యంగా శరీర భాష గురించి రాసిన కవితలను ‘ఒళ్ళు కొవ్వెక్కి’ రాసే తీరిక రాతలుగా పరిగణించిన ఒక ప్రపంచం మనకు తెలుసు.  అలాగే, ట్రాన్స్ జెండర్, లెస్బియన్, హోమో, ఇంకా రకరకాలైన  తమ లోపలి ముఖాలను దర్శిస్తూ, ‘మేం ఇదీ.. మాకిది కావాలి’ అని ధైర్యంగా చెప్పే సమూహాలున్న మరో ప్రపంచం కూడా మన పక్కనే ఉండటాన్ని ఈరోజు చూస్తున్నాం.

మొత్తానికి ‘Tales of Night Fairies’ సెక్స్ వర్కర్ల జీవితాల్లోని వెలుతురు కోణాలను మెరిపించి, వీరి చరిత్ర ఇంకెన్ని రకాల మలుపులు తిరుగుతుందో.. అనిపించేలా చేస్తుంది.

         lalitha parnandi  ల.లి.త.

కోరుకున్న సంభాషణ

1461640_10201799207174515_2052934506_n
  వేళ్ళలోతులలో రంగులు ముంచి
  మనసు గుమ్మాలకి కుంచెలు ఆనించి
  ఉదయం నుంచి అర్దరాత్రి వరకు రంగులలో నానిన చిత్రం
   ప్రదర్శనలో
   గోడ గుండెల మీద నిల్చోగానే
   సముద్ర అగాడత్వం, ఆనందం, ఆత్మపిలుపు   చూస్తారని
   ఎదురుచూడడం మొదలు పెట్టింది
   ఎన్నో జతల కళ్ళు నీరెండమెరుపులా వాలి
   సౌందర్యాన్ని దిగులులో ముంచి చర్చిస్తూ
   అర్దంకాని సమూహాలుగా
పక్షుల గుంపులై ఎగిరిపోయాయి
ashok12
   దేహాన్ని ఆవరించిన ప్రేమ నేత్రాలలో ప్రకాశించడం
   తామరపూలు వికసించి నవ్వడం
   ప్రేమించిన స్త్రీ పెదవులమీద
మోహరించిన నవ్వుని చూస్తారని
    వెతకడం మొదలుపెట్టింది
   పడకగది గోడలమీద ఆనుకుని వాళ్ళనే చూస్తూ
    రంగులతో ఎప్పటికైనా సంభాషిస్తారని
  రంగులలో ముఖాలు స్పర్శలు వెతుకుతారని
   కళ్ళువిప్పార్చి చూస్తూనే ఉంది
     ఒక మాటకోసం
     ఒక ముఖం కోసం
     ఒక సంభాషణ కోసం….
(కృ ష్ణ ఆశోక్  గారి చిత్రాలు చూసాక)
– రేణుకా అయోల

ఈకలు రాలుతున్నాయి

అబ్బా నిద్ర పట్టేసింది.

 

ఇంకా చెబుతూనే ఉన్నావా? ఇన్నిరాత్రులుగా నా చెవిలో గుసగుసగా చెబుతున్న అవే మాటలు. రేపు మాట్లాడుకుందాం ఇక పడుకోవూ! ఊహూ, అస్సల్లేపను. భయమేస్తే ఏడుపొస్తే కూడా. నిద్రలో ఉలిక్కిపడి లేస్తానేమో అని ఎన్నేళ్ళు ఇలా మేల్కొని, మేల్కొని ఉండటం కోసం మాట్లాడుతూ ఉంటావ్, అవే అవే మాటల్ని? ఇదేగా చెబుతున్నావు ఇవ్వాళ కూడా-

1384107_10153291089355363_299593426_n

“బుజ్జి పిట్ట గూట్లోకి దూరి గడ్డి పరకలు అడ్డం పెట్టుకుంది. అన్నీ భ్రమలే దానికి, ఎప్పుడూ ఒకేలాంటివి, దాన్ని ఎవరో పిలుస్తున్నట్టు, కొన్నాళ్లకి అలవాటు పడింది. కొమ్మల్లో చప్పుడైనా అది తన లోపలి అలికిడి అనే నమ్ముతుంది. వర్షం వెలిసిన పూట కూడా తలుపు తియ్యడం మానేసింది. ఏమయిందో తెలీదు చెట్టు కాలిపోయిందో రోజు. నిప్పు ఉప్పెనలా కమ్ముకొస్తే కూడా తలుపు తియ్యడం ఎలానో, తను కాలిపోకుండా ఎందుకుండాలో తెలీలేదు పాపం. అప్పుడందట- రోజూ ఇదే కల నాకు. నిద్రపట్టేస్తుందిలే మళ్ళీ అని”

 

ఇదే కథని ఎన్నాళ్ళు చెబుతావింకా? పోనీ కొత్తగా ఏమైనా చెప్పు. పిట్ట సంగతి మర్చిపో. ఏదోటి చెప్పు, చెరువులో నీరంతా కలువపూలుగా మారేలోపు రాలేకపోయావనో, వచ్చేలోగా ఋతువు మారిపోయిందనో, దారిలో అడ్డంగా అడవి నిద్రపోయి లేవకపోతే మోకాళ్లకి అడ్డుపడి ఆగిపోయావనో. ఇవేం కాదా? దార్లో కనపడ్ద ప్రతీ గూడు దగ్గరా ఏదో వెర్రిఆశతో ఆగుతూ జారిపడ్డ ఒక్కో గడ్డిపరకనీ ఏరుకుంటూ వచ్చావా!

 

చూడు! రాత్రిని తొనలుగా వలిచి చెరిసగం చేసుకోవడం వీలు కాదు. తెల్లారితే నిన్ను చూసే తీరికా ఉండదు. రోజంతా గుట్టలెక్కుతూ గడపాలి. నీకు రూపం లేదు నిజమే, ఐనా భుజాన మొయ్యలేను. అప్పట్లాగా రెక్కలు చాచలేకనే అడిగావు నన్ను. నువ్వు పిట్టగా ఉన్నరోజుల్లో ఐతే, అప్పుడే నా దగ్గరకొచ్చి ఉంటే హాయిగా కలిసి ఎగిరేవాళ్లం కదూ! ఇప్పుడేం చెయ్యగలను. బలం చాలదు ఆజన్మాంతం వెంటాడే నీ దుఃఖపు బరువుని మోసుకు తిరగడానికి. బుజ్జిపిట్టా! వెళ్ళిపో ఎటైనా…

-స్వాతి కుమారి బండ్లమూడి

Artwork: Mandira Bhaduri

ఛందోబందోబస్తులన్నీఛట్‌ ఫట్‌ ఫట్‌మని త్రెంచిన…శ్రీశ్రీ !

muraliఛందోవిరహితమైన శబ్దం లేదనీ, శబ్దవర్జితమైన ఛందస్సు ఉండదనీ కవిత్వరచన వ్యవస్థితమైన పూర్వపు రోజులలో “ఛందస్సు లేని కవిత్వ”మన్న ఊహకే ఉపాధి ఉండేది కాదు. గద్యబంధంలో కూడా వృత్తగంధాన్ని సంవీక్షించి గద్యాన్ని ఛందోభేదంగానే పరిగణించిన ఒకనాటి లాక్షణికుల కావ్యశాస్త్రనిర్దేశపు ముత్యాలగొడుగుకింద మన కవులకు ముక్తచ్ఛందమన్న తిరుగుబాటు ఆలోచన రావటానికి అవకాశం లేకపోవటం సహజమే. ఆ అవకాశం మధ్యయుగాలను దాటి ఆధునికయుగంలో ప్రప్రథమంగా పందొమ్మిదవ శతాబ్దంలో ఫ్రెంచిభాషలో సంచయించి, గతితార్కికభౌతికవాద ప్రభావం వల్ల సోవియట్ రష్యాలో బోల్షెవిక్కుల విజయానంతరం ప్రపంచకవితారంగంలో చోటుచేసుకొన్న విప్లవాత్మకమైన పరిణామాల కారణంగా వివిధరీతుల విస్తరించింది. ఛందోనియమాలతోపాటు కనీసం గుర్తింపదగిన గతివిధానమైనా లేని కేవల భావలయాత్మకవచనంలో వృత్తరీతి లేని అసమగణాల సంవిధానంతో పదపంక్తులను రూపొందించుకొని కవిత్వరచన చేయవచ్చుననే స్వచ్ఛందధోరణి సరిక్రొత్తగా ప్రచారంలోకి వచ్చి, అచిరకాలంలో ఆ వ్యవస్థ విశ్వమంతటా ప్రాచుర్యాన్ని పొందింది. అందువల్ల వచనానికి చైతన్యస్రవంతి శిల్పం ఎటువంటిదో – పద్యానికి ఛందోముక్త “వెర్స్ లిబర్” అటువంటిదని పాశ్చాత్య లాక్షణికులు భావించారు.

తనకాలం నాటికే ప్రభావశీలమై, భారతీయ కవిత్వంలోకి ప్రవాహవేగంతో చొచ్చుకొనివస్తున్న ఈ ప్రయోగవాదం అవ్యవస్థావాద సిద్ధాంతకర్తల ప్రాయౌగికదృష్టితో ముగ్ధుడై ఉన్న శ్రీశ్రీ దృష్టిని ఆకర్షించటం సహజమే.

 

కమ్యూనిస్టు మేనిఫెస్టో చల్లని గొడుగునీడలో కర్తవ్యస్ఫూర్తిని పొందిన శ్రీశ్రీ ఆ భాషాకవుల మార్గంలో కొత్తదీపాల వెలుగులను చూశారు. దాని ఫలితమే మహాప్రస్థానం కావ్యసృష్టి. ఆ తర్వాతిది ఖడ్గసృష్టి.

 

ఖడ్గసృష్టిలో “ఛందోబందోబస్తు లన్నీ, ఛట్‌! ఫట్‌ ఫట్‌మని త్రెంచి” పారేయాలన్న వచనకవిత్వ మౌలికసూత్రీకరణను శ్రీశ్రీ ‘కొంటెకోణాలు’ గేయంలో అలవోకగా చెయ్యలేదు. శబ్దస్ఫూర్తిని మించిన భావవ్యక్తి అందులో ఉన్నది. శ్రీశ్రీ విశాలమైన వైదుష్యనేపథ్యం ఉన్నది.

 

1928లో శ్రీశ్రీ తొలి పద్యకవితా సంకలనం ‘ప్రభవ’ వెలువడింది. భాషపై ఎంతో ప్రభుత్వాన్ని సంపాదించి, పద్యరచనలో కొంత పరిణతిని సాధించినా – స్వీయవిమర్శ చేసుకోగలిగిన శ్రీశ్రీకి ఆ ప్రస్థానం సంతృప్తి నివ్వలేదు. ఆ సంపుటిలో చేర్చిన

అలఘుధ్వాంతవితానసంభరితరోదోంతర్మహాగహ్వర

స్థలి యంభోనిధి యయ్యె; సంతతజలస్రావాతిరేకంబునన్

విలయాంభోధరఘోషసమ్మిళితగంభీరాట్టహాసధ్వనీ

చలితప్రాకటదిగ్గజుండ వగుచున్ సంప్రీతి నర్తింపుమా శంకరా!

వంటి రచనల కూర్పు వస్తువివేకసాధనకే తప్ప ఆయన అంతరాత్మ అందులో ధ్వనింపలేదు. అందులోని “ధ్వనీచలిత” వంటి వాచకదోషాలను గుర్తింపగల వివేకబోధ ఉన్నవాడు. పౌర్వికుల నీడలో నిలిచి ఉండే నిస్తేజస్వి కూడా కాదు. దానికితోడు తన భావోద్వేజనకు సంప్రదాయకవిత్వంలో ఉన్న పరిమితి కూడా శ్రీశ్రీ గుర్తింపుకు వచ్చింది. ఆ పరిణామవయోవస్థలోని సందిగ్ధావస్థను ఆ తర్వాత ఆయన తన ‘సుప్తాస్థికలు’ కవితలో పరిష్కరించే ప్రయత్నం చేశారు. అప్పుడే మార్క్సిస్టు దర్శన కవితాదర్శనపు మహానిధి ఆయన చేతికి వచ్చింది. సరికొత్త ఛందోవిచితి సాక్షాత్కరించింది. ఆ అభిజ్ఞానం తోనే ఆయన నిగళాలను ఛేదించాలని నిశ్చయించుకొన్నారు.

 srisri

రష్యన్ భాషాచ్ఛందోనైపథ్యం

శ్రీశ్రీకి ఆంగ్లభాషాముఖంగా సోవియట్ సాహిత్యపరిచయం కలిగేనాటికే ఐరోపీయభాషాకుటుంబంలోని రష్యన్ ఛందోరీతులలో సంప్రదాయానువర్తన యుగం ముగిసి ఆధునిక ప్రయోగశకం పరాకాష్ఠకు చేరుకొన్నది. ఫ్రెంచి, జర్మను భాషానువాదాలతోనూ, జానపద సంగీత పరిచయంతోనూ అలెగ్జాందర్ పుష్కిన్ నూతన విద్యాద్వారాలను తెరిచి రష్యన్ ప్రజాజీవితాలలోకి ఆంగ్లేయులకు బైరన్ లాగా ఐరోపీయమారుతపోతాలను ఆహ్వానించాడు.  గెటే కవిత్వంలోని కాలాతీతమైన సౌందర్యదీధితి, షిల్లర్ ఆశావాదంతోడి ఆధ్యాత్మికభావసౌగంధ్యం,  షెల్లీ లలితభావవాదకల్పనాశిల్పంలో భావివిప్లవాల క్రాంతదర్శిత, బైరన్ శృంగారభంగీభణితిలోని అపురూపమైన రాజసం, బ్రౌనింగు ఆత్మాశ్రయధోరణి, హ్యూగో చిత్రణలోని విషాదకిర్మీరాలు, బార్బియర్ కవితలలోని అంతరంగసంగీతం పుష్కిన్ ఆవిష్కరించిన నూత్నచ్ఛందోగతులలోకి అడుగుపెట్టాయి. షేక్స్పియర్ సానెట్టుల విశ్వజనీన కావ్యవిశిష్టపదరచనారీతిని దెల్విగ్, ఓదోవ్‌స్కీ, పోలెజాఫ్‌లు; షెల్లీ కాల్పనికవాద లలితగీత సరణిని లెర్మొంతోవ్ ప్రవేశపెట్టి రష్యన్ ఛందోగతులకు నవీన యుగకర్త లయ్యారు. గొగోల్ నేర్పిన ధ్వన్యాత్మకవిప్లవశీలితను కవిత్వంలో ప్రవేశపెట్టి – పాతబడిన ఛందస్సులలో పరివర్తనను తీసుకొనిరావాలనీ, లేదా వాటిని పూర్తిగా పరిహరించి నవగతినిర్మితిలో స్వేచ్ఛాగానఝరుల సంగీతభంగీతరంగాలను నినదింపజేయాలనీ తుర్గెనీవ్, తొల్‌స్తోయ్ (టాల్‌స్టాయ్)లు ప్రయత్నింపసాగారు. పాశ్చాత్య విద్యాభ్యాసం చేసివచ్చిన నవకవుల ప్రభావంతో చెహొవ్ సమకాలీన జీవితంలోని నైరాశ్యాన్నీ, పాలకుల పతనావస్థనూ, సమాజంలో లోపిస్తున్న ఆదర్శాలనూ గుర్తించి సాహిత్యానికి స్వతంత్ర దిశానిర్దేశం చేయాలని సంకల్పించుకొన్నాడు. అక్షరసంహతిలో ఛందోనియమరహితమైన నవ్యపథాన్ని అభిమానించాడు. ఆ సమయంలో రష్యన్ ఛందోగ్రంథాలలోనూ, ఆంగ్లచ్ఛందస్సులను వివరించే రష్యన్ పాఠ్యపుస్తకాలలోనూ సంప్రదాయచ్ఛందస్సులకు నిరసనగా ప్రొక్రూస్టియన్ బెడ్ అనే కొత్త వైమర్శిక పదబంధం వచ్చి చేరింది.  తనకు మార్గదీపకులైన క్రొపోత్కిన్, బకూనిన్ వంటి అరాచకవాద సామాజిక సిద్ధాంతకర్తల ప్రబోధాల మూలంగా శ్రీశ్రీకి దీని పరిచయం కలిగి ఉంటుంది.

 

ప్రొక్రూస్టియస్ తల్పం

గ్రీకు పౌరాణికగాథల నుంచి సాహిత్యక్రియాకల్పంలోకి ప్రవేశించిన ఆధునిక పదబంధం ఇది. ఏథెన్సు నుంచి ఎల్యూసిస్‌కు వెళ్ళే పవిత్రమార్గంలో ఉన్న కొరిడల్లాస్ పర్వతశ్రేణికి రాజు పొసైడాన్ కొడుకు ప్రొక్రూస్టియస్. వట్టి కుతంత్రపరుడు. అతని వద్ద ఒక మాయాతల్పం ఉండేది. అది ఎటువంటివాళ్ళకైనా సరిగ్గా సరిపోతుందని, దానిమీద పడుకొనేవారికి ఆహ్లాదం కలుగుతుందని అతను ఆ దారిని వచ్చినవాళ్ళను మభ్యపెట్టి దానిపై పడుకోమనేవాడు. ఆ ఆగంతుకులు మంచం కన్నా పొడుగ్గా ఉంటే కట్టుతాళ్ళు బిగించి, వాళ్ళ కాళ్ళుచేతులు అందుకు సరిపడేట్లు నరికి ప్రొక్రూస్టియస్ పైశాచికానందం పొందేవాడు. పొడుగ్గా లేనివాళ్ళ కాళ్ళుచేతులు సాగలాగి తెగనరకటం మాత్రం తప్పేది కాదు. పొట్టివాళ్ళు పడుకొంటే ఆ మంచం మరీ పొట్టిదయ్యేది. కాళ్ళుచేతులు తెగగొయ్యటం తప్పేది కాదు. కాళ్ళుచేతులు నరికినా తప్పులేదు కాని అవి మంచాన్ని మించకూడదని అతని వాదన.

రష్యన్ లాక్షణికులు ఛందస్సును ఈ ప్రొక్రూస్టియన్ మంచం తోనూ, వ్యతిక్రమాన్ని సహింపని ఛందోనియమాలను కట్టుతాళ్ళతోనూ సరిపోల్చటం శ్రీశ్రీ దృష్టిని ఆకర్షించి ఉండాలి. అంతకు మునుపే మయకోవ్‌స్కీ కాల్పనికవాదుల ఆత్మాశ్రయ కృత్రిమాదర్శాలు ఆగామి సామ్యవాద సమాజంలో ప్రొక్రూస్టియన్ శయ్యాగతికి నోచుకోక తప్పదని విమర్శించటం మనకు తెలిసిన సంగతే.

 

గ్రీకువీరుడు థెస్యూస్ వచ్చి ప్రొక్రూస్టియస్‌ను మాటల్లో పెట్టి అదే మంచానికి కట్టి చంపినపుడు – నిజానికి అతని వద్ద రెండు మంచాలున్నాయని, బాధితుల ఒడ్డుపొడుగులను బట్టి వాటిని మారుస్తుండేవాడని రహస్యం బయటపడుతుంది.

 

ఛందోవ్యవస్థలో ఈ రెండే గద్యం, పద్యం అని సంకేతితా లన్నమాట. పద్యానిర్మాణం చేసేవారు పాదాక్షర గణానుసారం సిద్ధిసాధనకు శబ్దంలోని దీర్ఘానికి లేని లఘిమను, లఘువుకు కూడని దీర్ఘిమను కల్పించినా తప్పులేదు కాని, ఛందోభంగాన్ని మాత్రం సహించేందుకు వీలులేదన్న నియమం – “అ‌పి మాషమ్ మషమ్ కుర్యాత్, ఛందోభంగం న కారయేత్” అన్నది ప్రొక్రూస్టియన్ శయ్యాసంస్థితమైన భాష దుఃస్థితికి అద్దం పడుతుంది.

 

లాటిన్ భాషాచ్ఛందోవిధానంలో ఇది మరొక విధంగా ఉన్నది. పాదాంతంలో పదచ్ఛేదం వల్ల సాధించే భావలయకు ప్రొక్రూస్టియన్ లయ అని పేరు. ఇది మన ఛందోనిబంధంలోని అంత్యప్రాస విధివిధానంలో ఉన్నదే. “అందంగా మధురసని / ష్యందంగా …”, “జాతి జాతి నిర్ఘాత పాత సం / ఘాత హేతువై …”, “జగతి మరపు, స్వప్నం, ని / శ్శబ్దం, ఇది …” వంటి పాదాలు ఈ అంత్యప్రాస నియతిలోని వివిధ భావగతులకు ఉదాహరణాలు.

 0148

ఇంగ్లీషులో దీనినే డ్రోలరీ (శబ్దడోలిక = తూగు) అంటున్నాము.  శ్రీశ్రీ ప్రయోగాలలో ఇది విస్తృతంగా కనుపిస్తుంది.

 

శ్రీశ్రీని ప్రభావితం చేసిన మహాకవులలో ఒకరైన ఎడ్గార్ ఆలెన్ పో “ది పర్లాయిన్‌డ్ లెటర్” అన్న కథలో పారిస్ నగర రక్షకభటులు నేరపరిశోధనసమయాలలో సడలింపు లేని చట్టాలకు ఒదిగి, పరిశోధనలో స్వేచ్ఛాసంచారం లేక చేతులు కట్టి పడవేసినట్లు ఉండవలసి రావటాన్ని ప్రొక్రూస్టియన్ తల్పంతో ఉపమించటం కూడా పో అభిమాని అయిన శ్రీశ్రీ దృష్టిపథంలో ఉండే ఉంటుంది.

 

కానీ రష్యన్ లాక్షణికులు పై దృక్కోణాలను అనుసరింపక ప్రొక్రూస్టియన్ తల్పాన్ని కేవలం ఛందోబందోబస్తుల ఏర్పాటుకు పర్యాయపదంగా మాత్రమే పరిగణించారు. ఆ సాహిత్యప్రభావమే శ్రీశ్రీ అమోఘమైన వాక్కులో ఛందోబందోబస్తు లన్నీ, ఛట్‌! ఫట్‌ ఫట్‌మని త్రెంచి  అన్న వచనకవితాగతినిర్దేశక మార్గదీపక పదబంధంగా రూపుదిద్దుకొన్నది.

ఛందస్సుకు అక్షరగతులు, మాత్రానియమాలు కట్టుతాళ్ళన్న ప్రసక్తి లేకపోతే “ఛందో-బందోబస్తు” లన్న రూపణకు పద్యంలో స్థానం లేదు.

 

ఛందోరీతుల కల్పనలో సమకాలీన  తెలుగు కవుల ప్రభావం శ్రీశ్రీపై ఏమీ లేదని ఫలితార్థం. శ్రీశ్రీ సాధించిన ఛందోవిజయవిలాసం వల్ల తెలుగు సాహిత్యం మరింత ప్రజాసన్నిహితమై విశ్వతోముఖంగా వికసించిందనేది చర్వితార్థం.

 

 ఏల్చూరి మురళీధరరావు

సముద్రం మోసపోతున్న దృశ్యం!

 

 

3211225569_b8f3b4b541

సముద్రం – ప్రపంచ కవులందరూ సొంతం చేసుకున్న గొప్ప కవితా వస్తువు.

సముద్రం నాకు – పోరాటానికి,  తిరుగుబాటుకు ప్రతీకగా కనిపిస్తుంది. ఉత్సుంగ కెరటాలతో వర్థిల్లే సముద్రాన్ని చూసినప్పుడల్లా నాకు గొప్ప ఉత్సాహం కలుగుతుంది. కవితావేశం కలుగుతుంది. రాళ్లను వొరుసుకుంటూ మహా చైతన్యంతో కెరటాలు ముందుకు వస్తుంటే.. కాసిన్ని గవ్వలు వొడ్డుల వొడిలోకి చేరుతుంటే – ఆ అనుభూతిని సొంతం చేసుకోవటం నాకు మరిచిపోలేనిది.

గవ్వల్లో, శంఖాల్లో కూడా సముద్రమే. సముద్రపు ఘోషే ..

కవులు – సముద్రాన్ని ఆసరాగా చేసుకుని బతుకుతున్న శ్రమజీవులను, శ్రమ సౌంధర్యాత్మకతనూ కవిత్వం చేసారు. సహజ సిద్ధమైన వాళ్ల జీవన విధానం -భయాందోలనకు గురవుతున్నప్పుడు – ఎదురుతిరగడాన్ని ప్రవచించారు.

సముద్రం – ఉత్తరాంధ్రాకు గొప్ప వనరు. సముద్ర తీరప్రాంత ప్రజలు – ముఖ్యంగా మత్స్యకారులు సముద్రం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏ వనరైనా ప్రజల ఉమ్మడి ఆస్తి. కానీ యిప్పుడు ఏ వనరును చూసినా వొకే వ్యక్తికి ధారాదత్తమౌతున్న స్థితి.
సముద్రం మీద పెట్టుబడిశక్తులు కన్నేసినప్పుడు.. ఆర్థిక సంస్కరణల మాయా ముసుగు పొర కమ్మేసినప్పుడు..  ప్రజల జీవన స్థితి ధ్వంసమైనప్పుడు – ఒకరిద్దరు వర్తమాన ఉత్తరాంధ్రా కవులెలా స్పందించారన్నది ఈ చిన్న వ్యాసం ఉద్దేశం.

సిరికి స్వామి నాయుడు

సిరికి స్వామి నాయుడు

‘మంటిదివ్వ’ కవితాసంపుటితో ఉత్తరాంధ్రా మట్టిపరిమళపు కవిత్వ సొబగును ప్రపంచానికి తేటపరిచిన  కవి – సిరికి స్వామినాయుడు –

‘ యీ సముద్ర గర్భాన చేపపిల్లలై ఈదులాడుతున్న వాళ్లు
పోటెత్తిన తరంగాల మీద పురుడోసుకున్న వాళ్లు
అలల పయ్యాడ కొంగుపట్టి ఉయ్యాలలూగినవాళ్లు
తీరాన్ని తలకెత్తుకుని……… సాగరగీతమైన వాళ్లు ‘

అని.. వాళ్ల సహజమైన జీవన విధానాన్ని కవితామయం చేస్తారు. సముద్రాన్ని తల్లిగా భావించి, అలలను పయ్యాడ ఉయ్యాలగా చేసుకుని.. నిష్కల్మసంగా బతుకుతూ  బతుకు జీవన పోరాటంలో వాళ్లు తీరాన్ని తలకెత్తుకుని సాగరగీతమవుతుంటారు-
అని అంటారు.

మరో ఉత్తరాంధ్రా కవి-  ఇటీవలనే ‘అస్తిత్వం వైపు’ కవిత్వ సంపుటితో ముందుకొచ్చిన- పాయల మురళీకృష్ణ ‘రేపటి సూర్యోదయానికి ముందు..’ కవితలో… మత్స్యకారులు వేటకి దిగినప్పుడు జరిగే కోలాహలాన్ని కవిత్వం చేస్తూ..

‘ తెప్పల మీదకు చేరిన వలలన్నీ
నడి సముద్రంలో
నడి రాత్రి కూడా చైతన్యాన్ని రెక్కలుగా తగిలించుకుని
ఎంతో విలువైన జల పుష్పాలనందిస్తుంటే
అక్కడెక్కడో అతని హస్త నైపుణ్యం
ఎన్నెన్నో గర్భ గోళాల మీద
పరోక్షంగా తన సంతకాన్ని ముద్రించుకునేది ‘

వొక మత్స్యకార సృజనశీలిని కేంద్రబిందువుని చేస్తారు. యిక్కడ వొక సంఘటనను వొకే దృశ్యశకలంగా కవిత్వం చేయడం గుర్తించొచ్చు.

యీ యిద్దరు ఉత్తరాంధ్రా కవులూ మత్స్యకారుల జీవన పరిశ్రమను వొకింత ప్రేమతో, వొకింత ఆర్తితో కవిత్వం చేసారు.

‘ పుట్టెడు ఆశతో వెళ్లిన తెప్పలన్నీ
కలుషిత జలదేవత విదిల్చిన
అనంతమైన శూన్యాన్ని ఎత్తుకొస్తుంటే
సమస్తాన్నీ కోల్పోయిన
బెస్త బతుకులు పస్తు బతుకులయ్యాయి ‘

– అని ‘మురళీకృష్ణ’ దుఃఖపడితే…..

‘ వాళ్లు కట్టుకున్న గుజ్జన గూళ్ల మీదా
నురగల పరవళ్ల తెల్లని చిరునవ్వుతీరం మీదా
ఓ రాకాసి నీడ కమ్మేసింది
తూరుపు సముద్రపు తరంగాల మీద
తుళ్లిపడే బంగారు బొచ్చెపరిగె సూరీడ్ని
రాహువేదో మింగేసింది’

– అని స్వామినాయుడు కలవరపడతారు.

యిద్దరూ తమ తమ కవితల్లో పోరాట అవసరాన్ని వ్యక్తం చేయడం సున్నితంగా గుర్తించొచ్చు.

‘రేపటి సూర్యోదయం
వాళ్లకు వాళ్ల అస్తిత్వాన్ని ప్రసాదించడమే చూడాల్సి వుంది’
ఇది మురళీకృష్ణ యిచ్చిన ముగింపు.

‘పల్లె వాళ్ల ఆల్చిప్పల కళ్లలోంచి కురిసే కన్నీళ్లు – సముద్రం
చందమామ-
వాళ్ల సామూహిక సమాధి మీద దీపం’
ఒక జీవిత దుఃఖాన్ని ముగింపుగా పలికించారు. లోలోపల అంతర్గతంగా
జ్వలితమౌతున్న కసే – నాకైతే ఈ ముగింపులో కనిపించింది.
దిగులు నుంచే దుఃఖం నుంచే పీడన నుంచే పోరాట పుష్పం విరుస్తుంది.

పైడిరాజు

పైడిరాజు

నేటి ఉత్తరాంధ్రా కవుల వారసత్త్వాన్ని అందుకుంటూ..  పద్నాలగేళ్ల కవి- ఎస్. పైడిరాజు ‘నీళ్లు’ కవితలో ఏమంటున్నాడో చూడండి.

‘విశాలంగా
విన్నూత్నంగా వున్న ఆ నీళ్లలో
జలకాలాడేం వొకప్పుడు..
మరి యిప్పుడో
ఆ నీటి వొడ్డుకు వెళ్లడానికి ఆలోచిస్తున్నాం
ఆ నీరు అనేక ఫ్యాక్టరీలకు ఆధారమయ్యింది

కానీ ఆ ఫ్యాక్టరీ వాళ్లు విశ్వాసం మరిచారు’

వొక  స్పృహని కల్గి వుండడమంటే బహుశా యిదే అనొచ్చు. వర్తమాన సామాజిక స్థితిని అర్థం చేసుకొని కవిత్వం చేయడంలో రేపటి మలితరం సిద్ధంగా తయారౌతుందనడానికి యిదొక రుజువు. మొత్తానికి కవిత్వం ప్రజల కోసం- అనే విషయాన్ని ప్రస్తుతం అన్ని ప్రాంతాల నుంచి వస్తున్న కవిత్వంలాగానే ఉత్తరాంధ్రా కవిత్వమూ నిరూపిస్తుంది.

బాలసుధాకర్ మౌళి

అన్వేషి

టాక్సీ ఆగిన కుదుపుకి  కళ్ళు తెరిచింది క్రిస్టీనా. సిగ్నల్ పడినట్టుంది . ఏవో గుస గుసగా మాటలు వినిపిస్తే, కిందకి దింపి ఉన్న అద్దంలోంచి బయటకి  చూసింది. బైక్ మీద తండ్రి వెనుక కూర్చున్న ఇద్దరు పిల్లలు తనని విచిత్రం గా చూస్తూ  చెవులు కొరుక్కుంటున్నారు . స్కూల్  యూనిఫాం లో ఉన్నారు . నవ్వి చిన్నగా చెయ్యి ఊపింది. వాళ్ళు  కూడా ఉత్సాహంగా చేతులూపారు. పదినిమిషాల తర్వాత ఒక ఇంటిముందు ఆగింది టాక్సీ .

 అడ్రస్ సరిచూసుకుని టాక్సీ కి డబ్బులిచ్చి పంపేసి , తలుపు మీద మెల్లగా తట్టింది.  రెండు  నిమషాల తర్వాత తలుపు  తెరుచుకుంది . ఓ ముసలాయన తల బయటకి పెట్టి చూసి ఏదో అన్నాడు . క్రిస్టీనా కి అర్ధం కాలేదు . సిద్ధార్ధ్  ఉన్నాడా అని ఇంగ్లీష్ లో అడిగింది .ఆయన ఒకసారి  ఆమెని ఎగా దిగా చూసి అడ్డు తప్పుకున్నాడు . లోపలి రమ్మన్నట్టుగా . “నువ్వు కూర్చోమ్మా , నేను అర్జెంట్ పని మీద బయటకి వెళ్తున్నా . మా కోడలితో మాట్లాడు ”  ఈసారి ఇంగ్లీష్ లో  అన్నాడాయన సోఫా చూపిస్తూ. ఓసారి లోపలికి వెళ్లి వచ్చి  బయటకి వెళ్ళిపోయాడు.
లోపల్నించి ఏవో  చప్పుళ్ళు వినిపిస్తున్నాయి . ఏం చెయ్యాలో అర్ధం కాక సోఫా లో  ఇబ్బందిగా కదిలి గదంతా కలియ జూసింది . గోడ మీద ఉన్న ఒక ఫోటో వెంటనే ఆమె దృష్టిని ఆకర్షించింది . ఒక్క నిమిషం ఆమెకి గుండె ఆగినంత పనైంది. దిగ్గున లేచి ఫోటో దగ్గరగా వెళ్లి పరికించి చూసింది .
ఇంతలో వెనుక నుండి ఎవరో వస్తున్న అలికిడికి వెనక్కి తిరిగింది . అక్కడ ఒకామె నిలబడి ఉంది . ఆమె ముఖం నిండా విషాదం అలుముకుని ఉంది . ఒక రకమైన దైన్యం , నిరాశ ఆమె ముఖంలో స్పష్టం గా కనిపిస్తున్నాయి . పాతికేళ్ళ లోపే ఉంటుంది ఆమె వయసు .
క్రిష్టీనా కొంచెం తడబడింది  ” సిద్ధూ అదే సిద్ధార్ధ్ ఫ్రెండ్ ని నేను . తన కోసం వచ్చాను “
 ఆమె ఆశ్చర్యంగా చూసింది . సిద్ధూ కోసం మీరు  యు . స్ నించి వచ్చారా ! “
“అవును. మీరు…. “అని ఆగిపోయింది క్రిస్టీనా.
“ఆ ఫోటో లో వ్యక్తి నా భర్త , సిద్ధూ అన్నయ్య  గౌతమ్. వాళ్ళిద్దరికీ చాలా పోలికలు ఉంటాయి . అందుకే  కంగారు పడినట్టున్నారు “ఆమె ఇంగ్లీష్ స్పష్టం గా ఉంది
“అవునండీ , ఎప్పుడు జరిగింది . నాకు తెలీదు . అయాం రియల్లీ సారీ ” జాలిగా చూస్తూ అంది క్రిస్టీనా
ఒక్కసారిగా ఆమె లో దుఃఖం పెల్లుబికింది. అణుచుకోవడానికి క్రింది పెదవిని మునిపంటి తో నొక్కి పెట్టింది . ఏమీ మాట్లాడలేకపోతోంది. అంతటి శోకం  కూడా  ఆమె సౌందర్యాన్ని దాచలేకపోవడం  క్రిస్టీనా చూడగలుగుతోంది
” నా పేరు క్రిస్టీనా లీ , మీ పేరు?” టాపిక్ మార్చడం అవసరమనిపించింది.
” వైష్ణవి ”  కొంచెం ఆగి  అడిగిందామె   ” కాఫీ, టీ ఏమైనా తీసుకుంటారా?”
“ఇప్పుడేమీ వద్దు . సిద్ధూ ఎక్కడున్నాడో చెప్పగలరా “
క్రిస్టీనా ని తేరిపార చూస్తూ అడిగింది వైష్ణవి ” ముందు సిద్ధూ మీకెలా పరిచయమో చెప్పండి  “
  ***
పక్క ఫ్లాట్ లోంచి  భళ్ళున ఏదో పగిలిన శబ్దానికి మేలుకుంది  క్రిస్టీనా. టైం చూస్తే ఐదు  కావస్తోంది . ఇంత ఉదయాన్నే ఏమిటా శబ్దం!
ఒక్క నిమిషం మనకెందుకులే అనిపించినా ఉండబట్టలేక లేచి బయటకి వచ్చింది . పక్క ఫ్లాట్  దగ్గరకి వెళ్లి ఏం  చేద్దామా అని  ఆలోచిస్తుండగానే తలుపు తెరుచుకుంది. ఆ ఫ్లాట్ లో ఎవరుంటారో తెలీదు ఆమెకి . కానీ విచిత్రంగా తలుపు ఎవరు తీసారో కూడా ఆమెకి అర్ధం కాలేదు .
“లోపలి రండి” అని ఒక మగ గొంతు మాత్రం వినిపించింది . సంకోచిస్తూనే లోపలి అడుగు పెట్టింది . డ్రాయింగ్ రూం మధ్యలో ఒక వ్యక్తి తెల్లని దుస్తులు ధరించి కూర్చొని ఉన్నాడు . తనని చూసి చిన్నగా నవ్వాడు. సౌత్ ఈస్ట్ దేశాలకి చెందిన వాడిలా ఉన్నాడు.
“ఏదో పెద్ద చప్పుడు వినిపిస్తే, ఏమిటో అని …” సంజాయిషీ ఇవ్వడానికి ప్రయత్నించింది .
“ఏమీ లేదు లెండి . దయచేసి వచ్చి కూర్చోండి “అన్నాడు .
“తలుపు ఎవరు తీసారు ” నాలుగువైపులా కలియ జూసింది . ఓ పక్కగా పగిలి పోయిన గాజు ముక్కలు కనిపించాయి .అవి పగిలిన  చప్పుడే  తన నిద్ర పాడుచేసినట్టుంది.
“నా కళ్ళు ” అన్నాడతను .
ఏమిటితను! తనని ఆట పట్టిస్తున్నాడా? అతని ముఖ కవళికలు చూస్తే అలా అనిపించలేదు
“మీకు సరిగా నిద్రపట్టదు కదూ . ఏదో అశాంతి.  ఎందుకో తెలుసుకునే ప్రయత్నం చేసారా ఎప్పుడైనా  “
ఆమె ఉలికి పడింది.  ఇతనికి ఎలా తెల్సు. ఆ విషయం తెలుసుకోవాలనే సాయంత్రానికి  సైకియాట్రిస్ట్ దగ్గర అప్పాయింట్ మెంట్ కూడా తీసుకుంది
అతను లేచి వెళ్లి బుక్ షెల్ఫ్ లోంచి ఒక పుస్తకం తీసి తనకి ఇచ్చాడు .
“ఇది చదవండి . మీ సమస్యకి పరిష్కారం  దొరకచ్చు”  అప్పుడు చూసిందామె, అతని బుక్ షెల్ఫ్ నిండా చాలా పుస్తకాలున్నాయి
అయోమయంగా అతనిచ్చిన పుస్తకం  అందుకుంది  . “యు ఫరెవర్” అనే పుస్తకం అది . లోబ్సాంగ్ రాంపా అనే ఆయన రాసారు .
“మీరు టిబెటన్లా  లేరే?”
“కాదు, ఇండియన్ “
“మెజీషియన్ నా మీరు? “
అతను పెద్దగా నవ్వాడు. అతని ముఖం పై  వింత తేజస్సు అలుముకుని ఉంది  ” కాదండీ , నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న మామూలు మనిషిని  “
అలా జరిగింది వాళ్ళ పరిచయం. రోజూ ఉదయం నాలుగు గంటలకి నిద్ర లేచి అతను యోగ సాధన చేస్తాడట . తను కూడా ఆ టైం కి  అతని ఫ్లాట్ కి వస్తానని రిక్వెస్ట్ చేసింది . అతని  చర్యలని  ఆసక్తి తో గమనించేది . కొన్ని కొన్ని సందేహాలు అడుగుతుండేది . అతను తనకి తెలియని ఎన్నో విషయాలు చెబుతూ ఉండేవాడు. అతను తన చూపులతో వస్తువుల్ని కదపడానికి చేసే ప్రయత్నాన్ని క్రిస్టీనా ఆసక్తి తో గమనించేది .
కొన్నాళ్ళ తర్వాత ఆమె  అడిగింది  “నేను ఎందుకో ఎవరితోనూ గట్టి మానసికమైన సంబంధాన్ని ఏర్పరుచుకోలేక పోతున్నాను . తండ్రి లేకుండా గడిపిన బాల్యం, ఒంటరితనం  అందుకు  కారణం అంటావా సిద్ధూ “
“నీది నిర్లిప్తత అని నువ్వు అనుకుంటున్నావు . కానీ అది  మనసుకి ఉన్న నిశ్చలత అని నీకు త్వరలోనే తెలుస్తుంది. ఏదో ఒక రోజు నీకు కావాల్సింది ఏమిటో  నీకు అర్ధం అవుతుంది . నువ్వే అప్పుడు దాన్ని వెతుక్కుంటూ వెళతావు  “
ఆ రోజు ఉదయం సిద్ధూ ఫ్లాట్ కి వెళ్ళే సరికి అది ఖాళీ గా కనిపించింది. రెండు రోజుల్నించీ లేట్ నైట్ వరకు పని చెయ్యడం వల్ల ఆమె సిద్ధార్ధ ని కలవలేకపోయింది . సడన్ గా ఏమీ చెప్పకుండా అతను ఎక్కడికి మాయం అయిపోయాడో అర్ధం కాలేదు . చివరి సారి అతన్ని కలిసినప్పుడు అతను కొంచెం నిరాశగా ఉండటం గుర్తొచ్చింది
“చేస్తున్న ఈ సాఫ్ట్ వేర్ జాబ్ నాకు సంతృప్తిని ఇవ్వడం లేదు . ఇంకా ఏదో చెయ్యాలి అనిపిస్తోంది ” అన్నాడు అతనప్పుడు.
ఆ తర్వాత ఎంతో ప్రయత్నం మీద సిద్ధార్ద్  ఇండియా వెళ్లిపోయాడని అతని కొలిగ్ ద్వారా తెలుసుకుంది . అడ్రస్ కనుక్కుని ఇండియా కి బయలుదేరింది .
 ***
url
 క్రిస్టీనా తన మరిది గురించి చెబుతుంటే అతనికీ , తన భర్త కీ  ఆలోచనల్లో ఎంత సారూప్యం ఉందో వైష్ణవి కి అర్ధం అవుతోంది
మూడు నెలల క్రితం ఆ రాత్రి ఎక్కడినుండో మాటలు వినిపిస్తుంటే మెళకువ వచ్చింది వైష్ణవి కి . చూస్తే పక్కన భర్త కనిపించలేదు . ఎప్పుడూ తాళం వేసి ఉండే మరిది రూం తెరిచి ఉంది . ఆ రూం లో తన భర్త తో మాట్లాడుతున్న వ్యక్తి ని చూసి  ఆశ్చర్య పోయింది . ఇతను యు. ఎస్. నించి ఎప్పుడు వచ్చాడు! వస్తున్నానని చెప్పనైనా చెప్పలేదే?
 లోపలికి వెళ్ళ బోయిన వైష్ణవి, తన భర్త అన్న మాటకి గుమ్మం  దగ్గరే ఆగిపోయింది .
“నాకు మాత్రం ఇక్కడ ఇలా ఈ జీవితాన్ని గడపడం ఇష్టం అనుకుంటున్నావా?” భర్త గొంతు గంభీరంగా పలికింది .
“నీ సంగతి వేరు అన్నయ్యా ” అంటున్నాడు  సిద్ధూ
“వేరు ఏమీ లేదు రా , నాక్కూడా నీ లాగే ఇంకా  తెలుసుకోవాల్సిందీ , చెయ్యవలిసిందీ  చాలా ఉంది ఆనిపిస్తుంది . అదలా ఉంచు , అమ్మ , నాన్న గురించి ఆలోచించావా?”
“వాళ్ళని చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా అన్నయ్యా, నీకంటే  బాగా  వాళ్ళని ఎవరు చూసుకోగలరు “
“ఇలా చెయ్యడం మన స్వార్ధం మనం చూసుకోవడం అవుతుంది రా ,బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించక పోవడం చాలా తప్పు “
తన భర్త ఇంకా ఏదో చెబుతున్నాడు .
 ఆధ్యాత్మిక పరమైన వాళ్ళ సంభాషణ మీద నుండి దృష్టి మరలిన వైష్ణవికి  తన పెళ్లి చూపుల్లో భర్త అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చాయి
“నేను నీకు నచ్చానా, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నిర్మొహమాటం గా చెప్పమ్మా”   ఒంటరిగా వేరే గదిలో మాట్లాడమని పెద్దవాళ్ళు పంపినప్పుడు అడిగాడు గౌతమ్ .
సిగ్గుతో తల దించుకుని ఉన్న వైష్ణవి తన ఆశ్చర్యాన్ని దాచుకోలేక పోయింది . ఎవరో పెద్ద వాళ్ళ లా తనని అమ్మా అని పిలుస్తాడు ఏంటి !
అతని వైపు చూడాలన్న కోరికని బలవంతం గా అదిమిపెట్టి ఇష్టమేనన్నట్లుగా తల ఊపింది
పెళ్లి తర్వాత  తెల్సింది అతని మంచితనం ఆమెకి . ఎప్పుడూ  ప్రశాంతం గా ఉండటం ,ఎంత పెద్ద విషయానికి అయినా కోపం తెచ్చుకోకపోవడం , తనని చిన్న పిల్లని చూసినంత అపురూపం గా చూడటం ఆమెని అమితమైన ఆనందాన్ని కలిగించేవి.
కానీ ఒక్కోసారి గంటల  తరబడి ధ్యానం లో ఉండిపోవడం చూస్తే భయమేసేది . ఏంటి ఈయన వాలకం అని
అలాగే ఓ సారి చుట్టపు చూపుగా  వచ్చిన ఒక పెద్దావిడ , తమ ఇంట్లో ఉన్న నిలువెత్తు శివుడి పటం  చూసి ” అంత పెద్ద  శివుడి పటం  ఇంట్లో పెట్టుకోకూడదమ్మా ” అన్నప్పుడు కూడా చాలా  ఆందోళన కలిగింది . భర్త తో చెబితే నవ్వి ఊరుకున్నాడు .
తన ఆందోళన గమనించిన అత్తగారు ఒక రోజు తనని దగ్గర కూర్చోబెట్టుకుని కొన్ని విషయాలు చెప్పారు
“అమ్మా , వాళ్ళకి  వంశ పారంపర్యం గా వచ్చిన లక్షణాలు ఇవి . గౌతమ్ తాతగారి తాతగారు అంటే మా మామగారి తాతగారు బాలా త్రిపుర సుందరి ఉపాసన చేసేవారట . ఆ తల్లి అయన కి కనిపించేదనీ,మాట్లాడేదనీ చెబుతారు . ఆ రోజుల్లో వాళ్ళ ఇంట్లో రాత్రి వేళ గజ్జెల మోత వినిపించేదట . వాళ్ళ వశం లో తరం వదిలి తరం మీద తన ప్రభావం ఉండేలా చేయమని అయన ఆ తల్లిని వరం కోరుకున్నారని అంటారు . మా మామగారు కూడా చాలా ఆధ్యాత్మికమైన భావాలతో, తీవ్రమైన భక్తి భావంతో  జీవితాన్ని గడిపారట . కానీ అయన తన ముప్ఫైయవ ఏట ….. “అని అర్ధోక్తి గా ఆవిడ చెప్పడం ఆపేసారు . తర్వాత ఎన్ని సార్లు అడిగినా ఆ విషయం గురించి ఆవిడ మాట్లాడలేదు .
అసలు గౌతమ్ కి తనని పెళ్లి చేసుకోవడం ఇష్టమే లేదేమో !వైష్ణవి  ఆలోచన ల్లోంచి  తేరుకుని చూసింది
గదిలోంచి ఇంకా అన్నదమ్ముల మాటలు విసిపిస్తూనే ఉన్నాయి  . నెమ్మదిగా  బెడ్ రూం లోకి వచ్చేసింది.
***
ఎవరో పిలిచినట్టు  అనిపిస్తే తుళ్లిపడి  లేచింది వైష్ణవి . ఎదురుగా హాస్పిటల్ బెడ్ మీద భర్త మెల్లగా కదులుతున్నాడు . ఒక్కసారిగా అల్లకల్లోలం చేసే నిజం ఆమె  కళ్ళ ముందు కనిపించి కలవరపాటు కి లోనైంది .
ఎవరెంత చెప్పినా వినకుండా సిద్ధార్ధ ఇల్లు విడిచి వెళ్ళిపోవడం ,అతని మీద బెంగ తో అత్తగారు మంచం పట్టి , నెల రోజులకే కన్ను మూయడం , కాశీ రామేశ్వరం అన్ని చోట్లా  సిద్ధార్ధ కోసం వెతికించి  అతని జాడ తెల్సుకోవడంలో తాము  విఫలం కావడం , అత్తగారు చనిపోయినప్పటి నుండీ భర్త ఉదాశీనం గా ఉండటం , పది రోజుల క్రితం మొదలైన జ్వరం ఎంతకీ తగ్గకుండా అతన్ని హాస్పటల్  పాలు చెయ్యడం అన్నీ ఆమె జ్ఞాపకాల్లోకి ఒక్కసారిగా తోసుకొచ్చాయి.
బాధ గా భర్త వైపు చూసింది . అతను మెల్లగా నవ్వాడు . ఒక్కసారిగా ఆనందంతో ఉక్కిరి  బిక్కిరైంది . రెండు రోజులుగా అతను మూసిన కన్ను తెరవలేదు. గౌతమ్ కి  నయమవ్వాలని  ఆమె చెయ్యని పూజలు లేవు . మొక్కని మొక్కులు లేవు . చివ్వున   లేచింది .
” ఆగు వైషు , నే చెప్పేది విను “
“ఎక్కువ మాట్లాడకండి . డాక్టర్ ని పిలుస్తాను “
“వద్దు , ఆగు , నేను చెప్పేది  జాగ్రత్త గా విను . ఇలా జరుగుతుంది అన్న విషయం నాకు ముందే తెలుసు. అయినా రాసిపెట్టి ఉన్నదాన్ని ఎవ్వరు మార్చలేరు కనుక మన వివాహాన్ని ఆపలేక పోయాను . నా జ్ఞాపకాలు నిన్ను బాధిస్తాయి తప్పదు , కానీ ఆ  బాధ తాత్కాలికమే . ఈ సమయం లో ఇలా చెప్పడం సరి కాకపోవచ్చు . కానీ తర్వాత నాకు చెప్పే అవకాశం ఉండదు కనుక చెప్పాల్సిన బాధ్యత ఉంది కనుక చెబుతున్నాను . ప్రశాంతం గా విను . నేను దూరమయ్యాక నీకు అన్యాయం జరగదు . నా తర్వాత నీ జీవితంలోకి వచ్చే వ్యక్తి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు “
“అయ్యో, ఏమిటండీ ఆ మాటలు, నాకోసం  ఇప్పుడిప్పుడే నాలో రూపుదిద్దుకుంటున్న మన బిడ్డ కోసం మీరు బాగుండాలండీ  ” దుఃఖాన్ని అపుకోలేకపోతోంది వైష్ణవి “బెంగ పడకు వైషూ , మన బిడ్డ కి ఏ లోటూ ఉండదు . వాడికి మంచి భవిష్యత్తు ఉంది “
అవే అతను ఆమెతో మాట్లాడిన చివరి మాటలు . ఆ తర్వాత మూసుకున్న అతని కనురెప్పలు ఇక  విడలేదు. అ మరుసటి రోజు ఉదయమే అతను  తన కోరుకున్న లోకానికి పయనమయ్యాడు .
***
అరె! నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా ?” క్రిస్టీనా అడుగుతుంటే వర్తమానం లోకి వచ్చిన వైష్ణవి భర్త జ్ఞాపకాలతో తన కళ్ళు విపరీతం గా వర్షించడాన్ని గమనించుకుంది
” లేదు, లేదు , మీరు అంత దూరం నుండి శ్రమ పడి  వచ్చారు . కానీ నాకు  సిద్ధార్ధ ఎక్కడున్నాడో తెలీదు. మా అత్తగారు చనిపోయినప్పుడు మా వారు సిద్ధూ కోసం చాలా  వెతికించారు . అతను ఆఖరి సారి కాశీ లో కనిపించాడట కొందరికి . తర్వాత ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలీదు . ఇల్లు వదిలి వెళ్ళాక ఒకటి రెండు సార్లు మాత్రమే ఫోన్ చేసాడు . తాను హిమాలయాలకి వెళ్ళ దలుచుకున్నట్టు, ఎవరూ తనని వెతికే ప్రయత్నం చెయ్యొద్దనీ  మాత్రం చెప్పాడట “
క్రిస్టీనా ముఖం తెల్లగా పాలిపోవడం చూసిన వైష్ణవి చెప్పడం ఆపింది .
రెండు నిముషాలు మౌనం గా ఉండిపోయిన క్రిస్టీనా దీర్ఘంగా నిట్టూర్చింది ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా .
“చివరి సారి గా సిద్ధూ ని చూసిన వాళ్ళ అడ్రస్ గానీ ,ఫోన్ నెంబర్ గానీ ఇవ్వగలరా “
తను వెతికి ఇచ్చిన అడ్రస్ తీసుకుని థాంక్స్ చెప్పిన క్రిస్టీనాని జాలిగా చూసింది వైష్ణవి.
“నా ప్రేమని నేను ఎలాగూ కాపాడుకోలేకపోయాను , నీ ప్రేమ అయినా నీకు లభించాలి అని కోరుకుంటున్నాను “
 ఆ మాటలకి క్రిస్టీనా కొంచెం ఇబ్బంది పడింది.  తన ఫోన్ నెంబర్ ఆమెకి ఇచ్చి, సిద్ధూ గురించి ఏమైనా తెలిస్తే తనకి తెలియజేయమని చెప్పి , వైష్ణవి దగ్గర సెలవు తీసుకుని ఆ ఇంట్లోంచి బయటపడింది .
తను  సిద్ధూని ప్రేమిస్తున్నానని  వైష్ణవి అనుకుంటోందా! సిద్ధూని తను ఆ దృష్టితో  ఎప్పుడూ చూడలేదు . సిద్ధూ సామీప్యం లో తన మానసిక అలజడి  మటుమాయ మయ్యేది . అతని  మాటలు తనని ఎంతో ప్రభావితం చేసాయి . అతను  ప్రయాణించే మార్గమే తనని కూడా తన గమ్యానికి చేరుస్తుంది అనే నమ్మకం తోనే అతన్ని వెతుక్కుంటూ వెళుతోంది.
కనుచూపు మేర వరకు క్రిస్టీనాని చూస్తూ నిలబడిన  వైష్ణవి తలుపులు వేసే ప్రయత్నం చేస్తుండగా  ఓ అపరిచిత వ్యక్తిని  ఎదురుగా చూసి కంగారు పడింది
“క్షమించాలి. మిమ్మల్ని భయపెట్టినట్టున్నాను.   నా పేరు విష్ణు . గౌతమ్ నా ప్రాణ స్నేహితుడు. ఒక స్వఛ్చంద సంస్థ లో పని చేస్తూ రెండు  సంవత్సరాలు గా రుమేనియా లో ఉండిపోవటం  వల్ల  మీ పెళ్లి కి కూడా రాలేకపోయాను “
తేరుకున్న వైష్ణవి పక్కకి తొలగి అతన్ని లోపలి కి ఆహ్వానించింది .
        ***
bhavaniphani   -భవానీ ఫణి
(భవానీ ఫణి మొదటి కథ ఇది.  తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీ పోలవరం ఆమె స్వస్థలం. ప్రస్తుతం బెంగుళూర్ లో ఉంటున్నారు. అప్పుడప్పుడు కవితలు రాస్తూ ఉంటారు. )

అడవుల్లోకి వెళ్లడానికి బ్రాహ్మణుడే ‘పర్మిట్’

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

దారపు ఉండను వేలాడుతున్న అనేక కొసల్లో దేనిని పట్టుకోవాలన్న సమస్య మళ్ళీ వచ్చింది!

ఇంతకుముందు వ్యాసాలలో,  ముఖ్యంగా గత నాలుగు వ్యాసాలలో కొన్ని ప్రస్తావనలు చేశాను. కొన్ని పేర్లు ఉటంకించాను. కొన్ని పరిణామాల గురించి, ఘటనల గురించి చెప్పాను. వీటిలో దేనినైనా  పట్టుకోవచ్చు. అయితే, సమస్యే అది… దేనిని పట్టుకోవాలి?!

ఉదాహరణకు, మగధ ఒక మహాసామ్రాజ్యంగా అవతరించడం గురించి చెప్పాను. ఆ కొసను పట్టుకుని నిరభ్యంతరంగా  ముందుకు వెళ్లచ్చు. అదే సమయంలో, పురాచరిత్ర, చరిత్ర అనేవి వర్తమానంలోకి ఎలా ప్రవహిస్తాయో చెప్పాను. దానిని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం కనిపిస్తోంది.

అలాగే, దీర్ఘచరాయణుడు, వస్సకారుల గురించి చెప్పాను.  ఇలాంటివారే మనకు తెలిసిన వ్యక్తులు కొందరు ఉన్నారు… చాణక్యుడు, రాక్షసమంత్రి; చరిత్ర కాలంలో యుగంధరుడు, తిమ్మరసు తదితరులు. దీర్ఘచరాయణుడు, వస్సకారుడు వీళ్ళకు మాతృక(proto-type)లుగా మీకు కనిపించి ఉండాలి. కానీ మనకు చాణక్యుడు తదితరుల గురించి మాత్రమే తెలుసు. వాళ్ళకు మాతృకలు ఉన్న సంగతి తెలియదు.  కనుక పట్టుకోదగిన కొస ఇక్కడ కూడా ఏదో ఉంది.

చాణక్యుడు, ముఖ్యంగా అతని అర్థశాస్త్రం, చాణక్యుని శిష్యునిగా చెప్పుకునే మౌర్య చంద్రగుప్తుడి మనవడు అశోకుని గురించి మాట్లాడుకునేటప్పుడు మన చరిత్ర విస్మృతికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ముచ్చట్లు ఉన్నాయి. ఆ కొసను కూడా పట్టుకోవచ్చు. అసలు అర్థశాస్త్రం గురించే చెప్పుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. అదీ ఒక మంచి కోసే.

క్రీ.పూ. 6వ శతాబ్దం; మనదేశంలోనే కాక, దాదాపు ప్రపంచవ్యాప్తంగా మత,సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో ఎన్నో పోలికలు గల  మార్పులు సంభవించిన కాలంగా చెబుతారు. అది కూడా పట్టుకోదగిన కోసే.

ఇక, చాణక్యుడు తదితరులకు దీర్ఘచరాయణుడు, వస్సకారులు మాతృకలు అయినప్పుడు, దీర్ఘచరాయణుని అలా ఉంచినా, వస్సకారునికి మాతృక లెవరన్న మరో ఆసక్తికరమైన ప్రశ్నను మీ ముందుకు తేవాలని ఉంది. అది కూడా ముఖ్యమైన కొసే. పురాచరిత్ర, చరిత్ర వర్తమానంలోకి ప్రవహించడం అనే కొసతో దగ్గరి సంబంధం ఉన్న కొస కూడా అది.

ఇక ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి రాక తప్పదు… ఈ చివరి కొసను పట్టుకుంటే ఎలా ఉంటుంది?!

***

విచిత్రం ఏమంటే, చాణక్యుడు మొదలైనవారి మాతృక ఎవరో మనకు అంతగా తెలియకపోవచ్చు కానీ, వస్సకారుడి మాతృక ఎవరో గుర్తించడం చాలా తేలిక. కాకపోతే, మనం పౌరాణిక కాలానికి వెళ్ళాలి. మన పురాణ, ఇతిహాసాల నిండా వారు కనిపిస్తారు. మనకు చరిత్ర కన్నా పురాణాలే బాగా తెలుసుననీ, మన దృష్టిలో పురాణాలే చరిత్ర అనీ అనడానికి ఇది కూడా బహుశా ఒక నిదర్శనం.

ఇక్కడ ఇంకో విశేషాన్ని కూడా చెప్పాలి. పురాణ, ఇతిహాసకాలం పురాచరిత్రలోకీ, చరిత్రలోకీ అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తున్న సందర్భాలలో ఇదొకటి అన్నప్పుడు; నేటి 21 వ శతాబ్దాన్ని కూడా అందులో చేర్చి మరీ చెబుతున్న సంగతిని మీరు ప్రత్యేకించి గమనించాలి. ఈ కోణం మొత్తం నా వ్యాస పరంపరకు జోడించే అతి ముఖ్యమైన ‘అదనపు విలువ’ల్లో ఒకటి!

స్థూలంగా చెబితే, పురాణ, ఇతిహాసాలలో కనిపించే మునులే వస్సకారునికి మాతృకలు. వాళ్లందరికీ ప్రతినిధిగానూ, వాళ్ళలో ప్రముఖునిగానూ వశిష్టుని చెప్పుకున్నా; అగస్త్యుడు, జరత్కారువు మొదలైన మునులు చాలామంది ఉన్నారు. మునులు అరణ్యాలలో ఆశ్రమాలు కట్టుకుని ఉంటారన్న సంగతి మనకు బాగా తెలుసు. ఆ అడవుల్లో ఆదివాసీ తెగలు ఉంటాయని తెలుసు. అంటే, మునులు ఆదివాసీ తెగల మధ్య జీవించగలరన్నమాట. అంటే, వాళ్ళు ఆదివాసీ తెగల మధ్యకు సునాయాసంగా వెళ్లగలరన్న మాట… అదీ సంగతి!

వస్సకారుడు చేసింది అదే. అయితే, వస్సకారుడు ఒక రాజకీయ కుట్రను అమలు చేయడానికి తెగల మధ్యకు వెళ్ళాడు. కనుక అడవుల్లో ఉండే మునులందరూ వస్సకారునికి మాతృకలని నేను అనడం లేదు. కొందరు మునులు వేరే ప్రయోజనాలకోసం కూడా అడవుల్లో ఉంటూ ఉండచ్చు. కానీ, మునులు ఆదివాసీ తెగల మధ్యకు సునాయాసంగా వెళ్లగలగడమే చూడండి…అది రెండంచుల కత్తి. ఒక అంచును రాజకీయ అవసరాల కోసం కూడా వాడుకోవచ్చు.

ఇప్పటి భాషలో చెప్పుకోవాలంటే, అడవుల్లోకీ, ఆదివాసీ తెగల మధ్యకీ వెళ్లడానికి ‘పర్మిట్’, లేదా ‘లైసెన్స్’ ఒక్క మునులకే ఉంది. ఈ రోజుల్లో మనకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు కానీ, ఆరోజుల్లో ఆ పర్మిట్ లేదా లైసెన్స్ చాలా విలువైనది. మునులు, లేదా బ్రాహ్మణుల విలువను, ప్రతిపత్తిని పెంచిన వాటిలో ఇది కూడా ఒకటి కావచ్చు. బ్రాహ్మణులకే ఈ పర్మిట్ ఎందుకు ఉందో ఊహించడం కష్టం కాదు. వాళ్ళు నిరాయుధులు! వాళ్ళ నోట మంత్రమే కాదు, ఎదుటివారిని మంత్రించే మాట కూడా ఉంది. వ్యవసాయ విస్తరణ దాహంతో అడవుల్లోకి చొచ్చుకువస్తున్న సాయుధ క్షత్రియులతో ఆదివాసులది సహజవైరం. కనుక క్షత్రియులు నేరుగా అడవిలోకి ప్రవేశించే అవకాశం లేదు. క్షేమం  కాదు. ఆవిధంగా అడవుల్లోకి క్షత్రియుల ప్రవేశానికి బ్రాహ్మణుడు టార్చ్ లైట్ లేదా లైసెన్స్ అయ్యాడన్న మాట. బ్రాహ్మణ-క్షత్రియ అన్యోన్యత మరింత గట్టిపడదానికి  బహుశా అదే ప్రారంభమూ కావచ్చు.

బ్రాహ్మణులు అడవుల్లోకీ, ఆదివాసుల మధ్యకూ  వెళ్లడం మాత్రమేనా…? కాదు, వాళ్ళతో సంబంధాలు కలుపుకున్నారు. కొందరైనా వాళ్ళలో కలసిపోయారు, లేదా వాళ్ళను తమలో కలుపుకున్నారు.  బ్రాహ్మణ-క్షత్రియ అన్యోన్యతనే కాక, బ్రాహ్మణ-ఆదివాసీ సంబంధాలను వెల్లడించే ఉదంతాలు పురాణ, ఇతిహాసాలలో అసంఖ్యాకంగా ఉన్నాయి. రాజు-పురోహితుల సంబంధం ఎలాంటిదో జనమేజయుడు-సోమశ్రవసుల(సోమశ్రవసుడి తల్లి నాగజాతీయురాలు, తండ్రి బ్రాహ్మణుడు. ఆవిధంగా అది  కూడా బ్రాహ్మణ-ఆదివాసీ సంబంధమే) ఉదంతంతోనూ, బ్రాహ్మణ-ఆదివాసీ వివాహ సంబంధాలను జరత్కారుడు-జరత్కారువుల ఉదంతంతోనూ నా సర్పయాగ వ్యాసాలలో చర్చించాను. కనుక ఇప్పుడు వాటిలోకి వెళ్లకుండా ఒక ఉదంతానికి పరిమితమవుతాను. అది, క్షత్రియుల అటవీ ప్రవేశానికి బ్రాహ్మణుడు ‘పర్మిట్’ అన్న సంగతిని చాలా స్పష్టంగా, ఆశ్చర్యకరంగా వెల్లడించే అపురూపమైన ఉదంతం.

***

VanaParva

మహాభారతం, ఆదిపర్వం, సప్తమాశ్వాసంలో ఉన్న ఆ ఉదంతంలో చెప్పుకోదగిన విశేషాలు చాలా ఉన్నాయి కనుక దానిని కొంత వివరంగా ఇవ్వదలచుకున్నాను:

పాండవులు తొలి విడత అరణ్యవాసం చేస్తున్నారు. అప్పటికి వారికింకా వివాహం కాలేదు. ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషంలో ఉండి వేదాధ్యయనం చేస్తూ, యాయవారం చేసుకుంటూ తల్లి కుంతితోపాటు ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఉంటున్నారు. ఓ రోజున ఓ బ్రాహ్మణ బాటసారి అటుగా వెడుతూ పాండవులు ఉన్న ఇంట్లో విశ్రాంతి తీసుకోడానికి ఆగాడు. అతడు పాంచాలరాజు ద్రుపదుని రాజధాని కాంపిల్య నుంచి వస్తున్నాడు. అతనికి పాండవులున్న ఇంటి యజమాని ఆతిథ్యమిచ్చాడు. పాండవులు కూడా మర్యాదలు చేశారు. ఆపైన-

‘మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏయే దేశాలు బాగుంటాయి, ఏయే రాజులు ఉత్తములు?’  అని పాండవులు అతన్ని అడిగారు.

‘ద్రుపదుని దేశంతో సాటి వచ్చే దేశమే లేదు. ద్రుపదుని కంటే ఉత్తముడైన రాజే లేడు’ అంటూ అతను ద్రుపదుని చరిత్ర చెప్పాడు. ఆ తర్వాత ద్రౌపదికి స్వయంవరం ప్రకటించిన సంగతిని చెప్పాడు.

పాండవులకు ఆ స్వయంవరానికి వెళ్లాలని అనిపించింది. కొడుకుల మనసు తెలుసుకున్న కుంతి, ‘ఇక్కడే ఎక్కువ కాలం ఉండిపోయాం. ఇలా ఎంతకాలం ఉన్నా ఏమిటి ఉపయోగం? అదీగాక పరుల ఇంట్లో ఎంతకాలమని ఉంటాం? దక్షిణ పాంచాలం మంచి వాసయోగ్యమనీ, పాంచాల రాజు ధార్మికుడనీ విన్నాం కనుక అక్కడికే వెడదాం. అక్కడి గృహస్థులు బ్రాహ్మణులకు అడగకుండానే భోజనం పెడతారట కూడా’ అంది.

ఆరుగురూ బయలుదేరారు. పెద్ద పెద్ద సరస్సులు, మహోగ్రమైన పర్వతాలు, కీకారణ్యాల గుండా వారు నిరంతరం నడక సాగించారు. మధ్యలో ఒకచోట వారికి వేదవ్యాసుడు కనిపించి, ‘ద్రుపదపురం వెళ్ళండి, మీకు మేలు జరుగుతుం’దని చెప్పి ఆశీర్వదించాడు.

రాత్రనక, పగలనక అలా నడుస్తూ వెళ్ళి ఆ ఆరుగురూ ఒకనాటి అర్థరాత్రి సమయానికి గంగానదిలోని సోమశ్రవతీర్థానికి చేరుకున్నారు. వారికి అందులో స్నానం చేయాలనిపించింది. దారిచూపడానికీ, రక్షణ కోసమూ ఒక కొరివి చేతిలో పట్టుకుని అర్జునుడు ముందు నడుస్తుండగా అతని వెనకే మిగిలిన వారు నదిని సమీపించారు. సరిగ్గా అప్పుడే ఒక గంధర్వుడు తన ఆడవాళ్ళతో కలసి జలక్రీడలాడడానికి అక్కడికి వచ్చి ఉన్నాడు. పాండవుల అడుగుల చప్పుడు విని వారి వైపు చూశాడు. అతనికి కోపం ముంచుకొచ్చింది. వెంటనే విల్లు తీసుకుని పెద్దగా నారీధ్వని చేశాడు.

‘అర్థరాత్రీ, సంధ్యలూ- భూత, యక్ష, దానవ, గంధర్వులు సంచరించే సమయాలు. ఈ సమయాలలో మనుషులిక్కడ  తిరగడానికి భయపడతారు. ఇలాంటి వేళల్లో ఎంతటి బలవంతులైనా, రాజులైనా సరే మేము ఓడించేస్తాం. దగ్గరికి రావద్దు, దూరం తొలగండి. నేను అంగారపర్ణుడనే గంధర్వుణ్ణి. కుబేరుడికి మిత్రుణ్ణి. ఈ ప్రదేశంలో నేను ఎప్పుడూ విహరిస్తూ ఉంటాను. నన్నే ఎరగరా మీరు? ఈ అడవీ, గంగాతీరమూ అంగారపర్ణాలుగా జగత్ ప్రసిద్ధాలు. మనుషులు ఇక్కడికి రావడానికి భయపడతారు’ అన్నాడు.

అప్పుడు అర్జునుడు, ‘చేతకాని మనుషులైతే అర్థరాత్రి, సంధ్యాకాలాల్లో తిరగడానికి భయపడచ్చు. కానీ మేము ఎప్పుడైనా, ఎక్కడైనా తిరుగుతూనే ఉంటాం. ఎందుకంటే, మేము చాలా శక్తిమంతులం. ఈ అడవులు, ఏరులు నీ సొంతమా? ఈ భూమి మీద ఉన్న జనులందరూ సేవించుకోదగిన ఈ పుణ్య భాగీరథి నీదేమిటి? మేము ఈ నదిలో స్నానం చేయడానికి వచ్చాం. నువ్వు వద్దంటే మానే వాళ్ళం కాదు. నీ మాటలకు మేమెందుకు భయపడతాం?’ అంటూ ముందుకు నడిచాడు.

అప్పుడు అంగారపర్ణుడు అతని మీద వాడి బాణాలు ప్రయోగించాడు. కోపించిన అర్జునుడు అవి తనకు తగలకుండా కాచుకుంటూ తన చేతి కొరివితోనే వాటిని చెదరగొట్టాడు. ‘ఈపాటి భయపెట్టడాలూ, మాయాలూ అస్త్రవిదులమైన మమ్మల్ని ఏంచేస్తా’యంటూ అతనిమీద ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం అప్పటికప్పుడు అంగారపర్ణుని రథాన్ని దగ్ధం చేసేసింది. తను కూడా దగ్ధమైపోతానన్న భయంతో అంగారపర్ణుడు కిందికి దూకేసాడు. అప్పుడు అర్జునుడు అతని కొప్పు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ధర్మరాజు ముందు పడేసాడు. దాంతో అతని భార్య కుంభీనస అనే ఆమె పెడబొబ్బలు పెడుతూ తనకు పతిదానం చేయమని వారిని ప్రార్ధించింది. ధర్మరాజు జాలిపడి, ఓటమి చెందిన ఈ హీనుణ్ణి  విడిచిపెట్టమని అర్జునుడికి చెప్పాడు. ‘కురుకులేశ్వరుడైన ధర్మరాజు నిన్ను విడిచిపెట్టమన్నాడు. ఇక భయపడకు’ అంటూ అర్జునుడు అతనితో అని, తీసుకెళ్లి అతని ‘మంద’లో విడిచిపెట్టాడు.

ఆ తర్వాత అంగారపర్ణుడికీ, అర్జునుడికీ మధ్య ఇలా సంభాషణ జరుగుతుంది:

అంగారపర్ణుడు: నీ చేతిలో ఓడిపోయిన తర్వాత ఈ అంగారపర్ణత్వం నాకెందుకు? ఇంకా దీనిని ధరించడానికి నేను మరీ అంతా సిగ్గుమాలిన వాణ్ణా? గర్వం అణిగిపోయేలా యుద్ధంలో ఓడిన తర్వాత కూడా వెనకటి పేరు చెప్పుకుని గర్వించేవాణ్ణి హాస్యాస్పదుడిగా చూస్తారు తప్ప సత్సభల్లో ఎవరైనా మెచ్చుకుంటారా? నీ ఆగ్నేయాస్త్రం వల్ల నా రథం దగ్ధమైనా, నా గంధర్వమాయతో అనేక రత్నాలతో అలంకృతమైన విచిత్ర రథాన్ని పొంది ఇక నుంచి చిత్రరథుడనే పేరుతెచ్చుకుంటాను.

అదలా ఉంచి, నీ పరాక్రమాన్ని మెచ్చాను. నీతో స్నేహం చేయాలని ఉంది. నేను తపస్సు చేసి చాక్షుసి అనే విద్యను పొందాను. ఈ విద్యతో మూడు లోకాల్లోనూ ఏం జరుగుతోందో చూడచ్చు. ఈ విద్య వల్లే మేము మనుషులకంటే గొప్పవాళ్ళమై, దేవతల శాసనం కిందికి కూడా రాకుండా ఉండగలుగుతున్నాం. అయితే, ఈ విద్య దుర్మార్గుల పరమైతే ఫలించదు. నువ్వు తాపత్య వంశ వర్ధనుడివి, మహాపురుషుడివి కనుక నీకు ఫలిస్తుంది. ఈ దివ్యవిద్యను నీకు ఇస్తాను, తీసుకో. అయితే దీనిని స్వీకరించేటప్పుడు షణ్మాసవ్రతం చేయాలి. ఆపైన, నీ ఆగ్నేయాస్త్రాన్ని నాకు ఇస్తే, మీ అయిదుగురికీ నూరేసి చొప్పున మహాజవసత్త్వాలు కలిగిన గంధర్వ హయాలు ఇస్తాను.

ఈ గుర్రాలు ఇంకా ఎలాంటివో చెబుతాను, విను. పూర్వం వృత్రాసురునిపై ఇంద్రుడు వజ్రాయుధం విసిరాడు. అది వజ్రంలా కఠినమైన వృత్రుని శిరస్సు మీద పడి, పతన వేగం వల్ల పది ముక్కలైంది. ఆ ముక్కలే వరసగా బ్రాహ్మణునికి వేదమూ, క్షత్రియుడికి ఆయుధమూ, విట్(విశ్-వైశ్యుడు)కు నాగలి, శూద్రులకు సేవ, వాహనాలలో వేగమూ అయ్యాయి. అటువంటి వేగం కలిగిన వాటిలోనూ సాటి లేని గుర్రాలు అయ్యాయి.

అర్జునుడు: ఎంత మిత్రుడైనా సరే, ఇంకొకరినుంచి విద్యను, వేదాన్ని, విత్తాన్ని తీసుకోను. అంతగా నీకు ఇష్టమైతే, నా ఆగ్నేయాస్త్రాన్ని తీసుకుని, నీ గుర్రాలు ఇయ్యి. ఇకనుంచి నీతో గాఢస్నేహం చేస్తాను. అది సరే కానీ, పరమ ధార్మికులం, పరమ బ్రహ్మణ్యులమైన మమ్మల్ని మొదట్లో అదిలించి ఎందుకు మాట్లాడావు?

అంగారపర్ణుడు: త్రిలోకాలలోనూ చెప్పుకునే మీ నిర్మలగుణాల గురించి నారదుడు మొదలైన మునీశ్వరులు, సిద్ధసాధ్య గణాల ద్వారా ఎప్పుడూ వింటూనే ఉంటాను. భూభార దురంధరులు, గుణోదారులు, ధీరులు, భరతవంశోత్తములు అయిన పాండవుల గురించి తెలియనివారు ఎవరు? అయినా సరే, పరుషవాక్యాలు ఎందుకు పలికానంటావా? మీరు అగ్నిహోత్రంతోనూ, బ్రాహ్మణునితోనూ లేరు కనుక-

ఎంత వివేకం ఉన్నవాడికైనా ఆడవాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు మదమెక్కుతుంది. ధర్మం తప్పుతాడు. మంచీ చెడూ విచక్షణ కోల్పోతాడు. నేను కూడా ఎంత వివేకినైనా సరే, ఆడవాళ్ళ మధ్యలో అలా మాట్లాడాను. అందులో ఆశ్చర్యం ఏముంది? మన్మథుణ్ణి గెలవడం ఎవరి తరం?

బ్రాహ్మణులను ముందు పెట్టుకునే పుణ్యాత్ములైన రాజులను ధిక్కరించడానికి దేవతలు, గరుడులు, నాగులు, యక్షులు, రాక్షసులు, పిశాచులు, భూతాలు, గంధర్వులు కూడా చాలరు. వేదవేదాంగవేత్త, జపహోమ యజ్ఞ తత్పరుడు, సత్యవచనుడు, సదాచారుడు అయిన బ్రాహ్మణుని పురోహితుని చేసుకున్న రాజు ఈ భూమండలం మొత్తాన్ని ఏలగలగడమే కాదు, పుణ్యలోకాలు కూడా పొందుతాడు. బ్రాహ్మణుడు వెంట లేకుండా స్వశక్తితో రాజ్యం సంపాదించడం ఏ రాజుకు సాధ్యం? మీరు యమ, వాయు, ఇంద్ర, అశ్వినుల వరప్రభావంతో పాండురాజుకు, కుంతికి పుట్టినవాళ్లు; ధర్మం తెలిసినవారు, భారద్వాజ శిష్యులు, సమస్త లోకాల మేలు కోరేవారు. కనుక మీరు పురోహితుడు లేకుండా ఉండకూడదు.

నువ్వు బ్రహ్మచర్యవ్రతంలో ఉన్నావు కనుక మన్మధావేశంతో ఉన్న నన్ను ఓడించగలిగావు. అదే బ్రాహ్మణునితో ఉన్న రాజైతే, భోగలాలసుడైనప్పటికీ అన్ని యుద్ధాలూ గెలుస్తాడు. కనుక మీ గుణోన్నతికి తగిన ధర్మతత్వజ్ఞుని, పవిత్రుని పురోహితునిగా చేసుకోండి.

అప్పుడు అంగారపర్ణుని అర్జునుడు అడిగాడు… ‘మేము కౌంతేయులం కదా, మమ్మల్ని తాపత్యులని ఎందుకు అన్నా’వని.

అప్పుడు అంగారపర్ణుడు తపతీ-సంవరణోపాఖ్యానం చెప్పడం ప్రారంభించాడు…

***

అంతకంటే ముందు, అర్జున-అంగారపర్ణ సంభాషణలో దొర్లిన అనేక విశేషాలను స్పృశిస్తూ ఆ ఉపాఖ్యానంలోకి  వెడదాం.  అది వచ్చే వారం…

 

 

 

ఘోష!

Kadha-Saranga-2-300x268
కూతురు చేసొచ్చిన నిర్వాకం తెలుసుకుని, అంజని నిర్ఘాంత పోయింది.
“నీకు మతి కాని పోయిందా ఏమిటే, సింధూ?” ఎంత మెత్త గా మందలిద్దామనుకున్నా, పట్టలేని ఆవేశం ఆమె మాటల్లో పొంగుకు రానే పొంగుకొచ్చింది.
ఆగ్రహపు రొప్పు వల్ల, ఆమె యెద ఎగసెగసి పడటాన్ని, గమనిస్తూనే వుంది సింధు.
ఆవిడే కాదు, తన తల్లి స్థానం లో ఏ స్త్రీ వున్నా, అంతే  ఉద్రేక ప డుతుందన్న  సంగతి ఆమెకు తెలుసు.
ఎందుకంటే, కూతురి కాపురం పట్ల ఒక తల్లి పడే ఆవేదన అది. తన వైవాహిక జీవితం చిద్రమై పోతుందన్న

ఆందోళన. ఈ నిజం బయట పొక్కాక, సమాజం తననొక  సిగ్గు లేని దానిగా చూస్తుందన్న  భయం. అన్నీ కలసి  ఆవిణ్ణి వొణికించేస్తున్నాయనీ అమెకి తెలుసు. .
అయినా,  సింధు చలించ లేదు.
“అసలీ బుధ్ధి నీకు పుట్టిందేనా?, లేక ఎవరైన నూరి పోసారా? ఆ?.  హవ్వ! కాపురం  ఏవౌతుందన్న జ్ఞానమైనా లేకుండా, కట్టుకున్న మొగుడి మీద  కాసింత గౌ రవ మైనా వుంచకుండా.. ఇంత అఘాయిత్యపు పని చేసొస్తావ్?
కన్న వాళ్ళం, మేమింకా ‘ బ్రతికి చచ్ఛే’  వున్నామన్న సంగతయినా నీకు గుర్తుకు రాలేదుటే సింధూ, ఇంత పరువు తక్కువ పని చేసేటప్పుడు?”
మొహం వాచేలా తల్లి పెడుతున్న  చివాట్లన్నీ తలొంచుకుని మౌనంగా వింటూండిపోయింది   సింధు- నిర్లిప్తంగా!
తను చెప్పింది వినగానే, తల్లి – తనని  యెదకి హత్తుకుని, ‘ నా తల్లే, నీకెంత కష్ట మొచ్చిందే సింధూ?” అంటూ కన్నీరు మున్నీరు అవుతుందని ఆమె ఆశించ లేదు.
ఎందుకంటే, తల్లి గురించి సింధూ కి బాగా తెలుసు. నిజంగా చెప్పాలంటే, ఆవిడ గురించి ఆవిడ కి కంటే, తనకే బాగా తెలుసు. ఆమె జస్ట్ ఒక సగటు మనిషి. మావూలు  స్త్రీ. సాధారణ గృహిణి. అందరి లాటి సామాన్య ఇల్లాలు. సమాజానికి భయపడి,  రోజుకో సారైనా ఆ నాలుగు గోడల మధ్య సమాధి అయిపోతూ,  నోరు విప్పకుండా లోలోన  కుమిలిపోవడం వల్లే కుటుంబ పరువుప్రతిష్టలన్నీ మిగులుతాయని  ఆవిడ ప్రగాఢ విశ్వాసం. గట్టి నమ్మకం.
తన ఊహ తెలిసినప్పట్నుంచి, తల్లిని   చదువుతూనే వుంది. ఏ ఆడపిల్లకైనా,  తల్లి మొదటి గురువు అని అంటారు. కానీ తనకి మాత్రం తల్లి – మొట్టమొదటి జీవిత పాఠం. ఎంత చదివినా అర్ధం కాని పుస్తకం.  నిజం.  ఆవిడ తనకెప్పుడూ అర్ధం కాలేదు. ఇంకా చెప్పాలీ అంటే, రాను రాను ఆమె తనకొక పరిశీలనా గ్రంధమై పోయింది. అన్వేషణాంశంగా మారిపోయింది.
తరచి తరచి పరిశోధిస్తున్న కొద్దీ – ఎన్నో ప్రశ్నలు..మరెన్నెన్నో సందేహాలు..కలిగేవి. తనెంత ప్రయత్నించినా, ఒక్క దానికీ  సరైన జవాబు దొరకలేదు.
ఎప్పుడడిగినా, ” నీ మొహం. నువ్వు అలాంటి ప్రశ్నలేయ కూడదు.’ అనో, ” ఏమిటే, ఇంతున్నావో లేదో..అప్పుడే  నీ విపరీతపు ఆలోచనలూ, నువ్వునూ? ఊ?” అంటూ మందలిస్తూనో..తన నెక్కువ గా మాట్లాడకుండా నోరు మూయించేసేది అమ్మ.
ఆవిడ లోకం ఆవిడది.  ఇల్లు, మొగుడు, పిల్లలు.
పిల్లల్ని  ఒకింటి వాళ్ళ ని చేసేస్తే..స్త్రీ గా పుట్టినందుకు తన జన్మ కి అర్ధం పరమార్ధం   చేకూరినట్టే ననేది  ఆవిడ జీవన సూత్రం.
నిజానికి, అమ్మ మంచిది. నాన్నకి మంచి  భార్య. తమకు  మంచి తల్లి. కాదనే ప్రశ్నే లేదు.
కాని, నాన్న? చెడ్డ భర్త. చాలా చెడ్డ భర్త.
అమ్మంత  నిజాయితీ పరుడు కాడు. తన సంపాదన గురించి కానీ, చేస్తున్న ఖర్చులు గురించి కానీ, ఇంట్లో పెళ్ళాం తో చెప్పడు. ఆడదాని చేతికి నీ జుట్టు అయినా ఇవ్వు కానీ, జీతం డబ్బు మాత్రం ఇవ్వకు.నీ బ్రతుకు పులుసులో ముక్కయి పోతుంది.  అనేది ఆయన  పాలసీ.
‘నాకేం కావాలో, ఇంటికి ఏమేం తేవాలో అన్నీ ఆయనకి తెలిసినప్పుడు ఇక నా కెందుకే ఆయన జీతం వివరాలు. తప్పు. ఆయన్ని అడగ కూడదు.’ ఇదీ, అమ్మ జవాబు. కాదు కప్పిపుచ్చే ధోరణి.
ఆ విషయాన్ని పక్కన పెడ్దాం.
ఆఫీస్ అయిపోగానే,  నేరుగా  ఇంటి కొస్తాడా అంటే,  రాడు.
క్లబ్ కెళ్తాడు. పేకాటాడ్తాడు. ఫుల్ల్ గా మందు కొట్టి అర్ధ రాత్రి  ఇల్లు చేరతాడు. తనొక సారి –  వూరి చివరుంటున్న  స్నేహితురాలింటికెళ్ళి వస్తుంటే..నాన్న కారు కనిపించింది.  ఆయన పక్కన,  సరసా లాడుతున్న  స్త్రీని చూసింది. ఆయన చనువుగా ఆమె మీదకి వొరగడం, ఇద్దరూ పకపకా నవ్వుకోవడం..చూడంగానే తనకి నచ్చలేదు. దుఖం తన్నుకొచ్చింది.
ఇంటికి రాగానే అమ్మకి చెప్పింది రోష పడుతూ.
అమ్మ ఏమంది? కంగారు పడింది. తొట్రుపడుతూ..”ఈ సంగతి ఇంకెవరికీ చెప్పకే?,  నా బంగారు తల్లి వి కదూ?” అంటూ తన గడ్డం పట్టుకుని బ్రతిమలాడింది.
కథ అంతటితో కాలేదు.
ఆ అర్ధ  రాత్రి – అమ్మ గది లోంచి మాటలు వినిపించాయి.ఆయన అరుపులు   బిగ్గరగానే వినొచ్చాయి.  తిడుతున్నాడు. అమ్మని బండ బూతులు తిడుతున్నాడు. చెవులకు ఘోరంగా వినొస్తున్నాయి.
ఎప్పుడూ లేనిది, అమ్మ ఆయన్ని నిలదీస్తోంది. ఆయన అహం దెబ్బ తింది. చేయి లేచింది. అమ్మ మీద పిడి గుద్దులు పడుతున్నాయి..అవి తన వీపుకి తాకాయి. బలంగా. కెవ్వుమంది బాధగా.
ఆమ్మ  ఏడుస్తోంది..-  వింటుంటె ..తన కళ్ళు వరదలయ్యాయి.
వున్నపళాన వెళ్ళి, ఆ కిరాతకుని చేతుల్లోంచి అమ్మని విడిపించుకొచ్చేయాలనిపించేది. తెచ్చుకుని తన వొడిలో బజ్జో పెట్టుకుని లాలి పాడాలనిపించేది.
అమ్మా, నా దగ్గరకి రా!  నీ గాయాలకు చంద నాలు పూసి, నా కన్న తల్లి వైన నీకు అమ్మనై జోల పాడి నిద్ర బుచ్చుతాను. రా, అమ్మా’ అని అమ్మని పిలవాలనిపించేది. చెప్పాలనిపించేది. వోదార్చాలనిపించేది.
కానీ అమ్మకి అర్ధమౌతుందా తన భాష? తను పడుతున్న బాధ?
చాలా సేపు రాధ్ధాంతం జరిగి, ఆగి  పోయాక, ఆయన గురక వినిపించేది. అమ్మ వెక్కిళ్ళు మాత్రం ఆగేవి కావు.
తెల్ల వార్లూ..ఆ గదిలో  లైట్ అలా వెలుగుతూ వుం డేది.
వెంటిలైటర్ వైపు  చూస్తూ..గుబులు గుబులు గుబులుగా ఎప్పుడో నిద్ర పో యేది తను.
మర్నాడు పొద్దున అమ్మ నిద్ర లేస్తునే, చీపురు పట్టుకుని వాకిలి చిమ్మి,  పెరట్లో – కట్టెల పొ య్యి  వెలిగించి నీళ్ళ కాగు పడేసేది.  వంటింటి వసారాలో రెండు కుంపట్లు రాజేసి, ఫిల్టర్ లో కాఫీ డికాషన్ వేసి,  కత్తి పీట ముందు కూర్చుని చక చకా అల్లం,  పచ్చి మిరపకాలు,  ఉల్లి పాయలు తరిగి పెట్టుకునేది ఉప్మా చేయడం కోసం.
అరటి చెట్ల గుంత  దగ్గర పళ్ళు తోముకుంటూ   గమనిస్తూనే వుండేది అమ్మని.
ప్రతిరోజులా నవ్వుతూ, ఆనందం గా కనిపించేది కాదు. చెప్పలేనంత బాధ తో  ముఖం mlaaనమై వుండేది.  కళ్ళు వాచి, ముఖం ఉబ్బి,  చెంపల మీద తేలిన వాతలతో కమిలిపోయిన పద్మం లా, అవమానం తో, ‘ గాయడిన  హృదయం అంటే ఈమెనా’ అన్నట్టు గుండెని కదిలించేసేది – ఆ రూపం.
అమ్మని ఒక్క సారి దగ్గరికి తీసుకుని, ” అమ్మా! అంత జరిగాక కూడా నువు  రాత్రం తా  ఆ గదిలో ఎలా పడుకున్నావమ్మా?”  అని అడగాలనిపించేది. చాలా నిజాయితీ గా అడగాలనిపించేది .
కానీ అడగకూడదు. తప్పు. అమ్మ కోప్పడుతుంది.
ఇంతలో నాన్న లేచి, మొహం కడుక్కుని, పెళ్ళాం   ఇచ్చిన కాఫీ తాగి, పెళ్ళాం – చేతికం దించిన ఉప్మా తిని, ఆఫీస్ కెళ్ళి పోయే వాడు.
ఇదంతా చాలా నిశ్శబ్దం గా జరిగిపో యేది. ఇల్లంతా, మనసంతా తనకి  భరించలేనంత కటిక నిశ్శబ్దంగా తోచేది. పెరట్లో బాదం చెట్టు కదలకుండా అట్టానే నిలబడి చూస్తున్నటుండేది. ఒక్క పత్రమూ నోరు విప్పక, జాలి పడుతున్నట్టు తోచేది.

Sa12
ఆయన వెళ్ళాక, అమ్మ వంట చేస్తూ, అలా ధారగా ఏడుస్తూ..మధ్య మధ్య లో  చీర చెంగుతో  కళ్ళు తుడుచుకుంటూ కనిపించేది.
మొగుడికి అక్రమ సంబంధం వుందన్న సంగతి  తెలిసిన ఏ ఇల్లాలికైనా ఆ బాధ ఎలా వుంటుందంటే – నిప్పుల మీద కాల్చిన కత్తిని గుండెల మీద ఆnchiనంత బాధ గా వుంటుంది. స్త్రీలు అనుభవించే  ఎన్ని మానసిక  గాయాలకూ  మందుంది కానీ, ఈ నరక బాధ కు  మాత్రం మందులుండవు. కన్నీళ్ళే వుంటాయి. ఈ కన్నీళ్ళు ఎద మంటలను ఆర్పగలవా?
ఆవిడ దుఖానికి గల మూల కారణం ఏవిటో తనకి మాత్రమే  బాగ తెలుసు. అందుకే,  ఆయన చేసిన తప్పుకి ఎలాటి శిక్ష వేయొచ్చో తను చెప్పగలదు. కానీ, అమ్మ వినదు. కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది  కోపంగా.   ‘చిన్న పిల్లవి. నువ్వు చూడకు. నీకేం తెలీదు. అవతలకు ఫో.’ అని అంటుంది.

అమ్మ నిప్పు లాంటిది.  కాబట్టి, ఆయన చేస్తున్న అన్యాయానికి ఆవిడ కాలిపోవడం కాకుండా, ఆయన  పాపాన్ని నిలువునా కాల్చొచ్చు.
నిజానికి మనం నిజాయితీ గా వుండేది ఎదుటివాని అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కోడానికే కదా! ఆయన చేసిన ఆ తప్పుడు పనిని, అదే కనక వాళ్ళావిడ చేస్తే అమ్మలా ఊరుకునేవాడా?   ఊహు. చస్తే ఊరుకునే వాడు కాదు. ఈ  ఉత్త నరసిం హం  కాస్తా ఉగ్ర  అయిపోయేవాడు. అమ్మని వాయిట్లోకి ఈడ్చి, పదిమందిలో తూర్పారబెట్టే వాడు. రామాయణం లో పాపం సీత, ఏ తప్పు చేయకుండానే అంతగా  అవమానింపబడినప్పుడు, తప్పు చేసిన పెళ్ళాన్ని ఈ నరసిం హం  క్షమిస్తాడని ఎలా ఊహించగలం? ఈ నిజం చెబితే, అమ్మ ముక్క చివాట్లేస్తుంది.  అలాటి పాపపు మాటలు మాట్లాడ కూడదంటూ కేకలేస్తుంది.
నిజానికి, అమ్మ నీతిమంతు రాలు.  కాబట్టి, నీతి తప్పిన మొగుణ్ణి పది మంది లో నిలబెట్టి కడిగేయొచ్చు. సిగ్గొచ్చేలా బుధ్ది చెప్పొచ్చు.
అమ్మ – దేవత.  కాబట్టి దుర్మార్గుణ్ని శిక్షించొచ్చు.
ఇన్ని అర్హతలు వుండి..ఏమి లేని దానిలా..అసలేమీ చేత కాని దానిలా..ప్ర తి ఘటించకుండా..ఎదురాడకుండా.. అమ్మ ఎలా వూరుకుండి పోతుంది? నిస్సహాయు రాలిలా ఎందుకని  విలపిస్తుంది?
సమాధా నం దొరికేది కాదు.
మరో చిత్రం ఏమిటంటే –  నాన్న వింత ప్రవర్తన! ఆయన హఠాత్తుగా మంచి బాలుడైపోవడం.
తలమునకలైపోయేంత ఆశ్చర్యకరమైన విషయం.
అసలాయన ఎలాటి వాడంటె..
తన సంతోషాల కోసం, విలాసం కోసం ఎన్ని హద్దులైనా దాటేస్తాడు. ఎలాటి తప్పు చేయడానికీ  వెరవడు. ఐతే, ఆయన  ‘తప్పు’ చేసినప్పటి కంటే, అది పెళ్ళానికి తెలిసి నప్పుడు మాత్రం భలే రంగులు మార్చేసే వాడు. అసలు రూపానికి ముసుగు తొడిగేసేవాడు కొన్నాళ్ళు. ఆయన ప్రవర్తనలో ఆ తేడా – ఎంత గా కొట్టొచ్చినట్టు కనిపించేదంటే –   అలాటి  సంఘటనలు జరిగిన – ఆ తర్వాతి  నాలుగు రోజులూ… ఆయన ఆఫీస్ నించి నేరుగా తలొంచుకుని ఇంటికొచ్చేసే వాడు.
సాయం కాలాలు వస్తూ వస్తూ మల్లెపూల దండలు,  జిలేబీ పొట్లాలు, మొక్కజొన్న కండెలు.. చేతుల్లో మోసుకొస్తూ..పెందళానే ఇంటికొచ్చేసేవాడు.
అదేమిటో! ఆయన్నలా చూసే సరికి అమ్మ ముఖం ట్యూబ్ లైట్ లా వెలిగి పోయేది.  ఎంత ఆనంద పడి పోయేదనీ!
ఆయన “ఏమేవ్” అని పిలిచేవాడు. ఈవిడ ఇంతై పోయేది..
“కాస్త తల పడ్తావ్?” గోముగా అడిగే వాడు.  అమ్మ పొంగి పొర్లి పోయేది.
ఆ తర్వాత మాటలు కలిపే వాడు. సరసాలాడే వాడు. అమ్మ  గల గలామనేది.
ఆ మర్నాడు, మందు సీసాలు తెచ్చుకునే వాడు. అందులో కి నంజుకోను పకోడీలు చేయమనే వాడు. చేసేది. కోడి కూర వండమనే వాడు. వండేది. అదే తన భాగ్యమన్నట్టు సేవ చేసేది.
తనకి అమ్మ ఏ మాత్రం అర్ధమయ్యేది కా కున్నా, ఆవిడ ముఖం లో ఆనందం చూసి ఆయన్ని క్షమించేసేది. అంతా మరచి పోయినట్టు నటించేది.
కాని, నాన్న లోని మగాడు మాత్రం స్పష్టం గా.. ఎక్కడా సందేహమనేది లేకుండా, మిగల కుండా,  పరిపూర్తిగా అర్ధమై పోయే వాడు. ఆయన లోని పురుషహంకారానికి   నిలువెత్తు అద్దం పట్టి చూపించేది –  తన మనసు.
అలా..ఆయన  మంచి భర్త గా ఎంతో కాలం నటించలేడన్న సంగతి అమ్మ కంటే తనకే  తెల్సి రావడం బహుశా తన  దురదృష్తమేమో!
రెండు రోజులు కాగానే, ఆయన ధోరణి మళ్ళీ మొదటి కొచ్చేది. నూటికి నూరు పాళ్ళు ఆయనొక అవ కాశ వాది. జల్సా పురుషుడు.
ఆయన దృష్టి లో – క్లబ్బు, పేకాట, రేసులు, సిగరెట్టు, మందు.. ఇవన్నీ మగాడికి వుండే  సహజ లక్షణాలు, వాటిని చెడిపోవడంగా ఎవరన్నాఅంటే వూరుకోడు. ఆ దేవుడు అడ్డొ చ్చినా  సరే సహించడు. పర స్త్రీ వ్యామోహం  కూడా తప్పు కాదు కాబట్టే, స్వేచ్చగా తిరిగొస్తాడు.
ఆడ స్నేహాలు ఎన్నుంటే ఏం?, ఆలి మాత్రం ఒకత్తే కాబట్టీ, తనూ శ్రీ రాముడ్నేనని, ఆ జమ లోకే చేరతానని  వాదిస్తాడు. అవకాశాలు లేక, రాక, లేక చేతకాక కొంతమంది మగాళ్ళు మంచి వాళ్లు గ చలామణి ఔతారని చెబుతాడాయన.
అలా, ఆయన తన సిధ్ధాంతానుసరణా విధాన ప్రకారం ఆ  తప్పు చేయ డానికి ఏ మత్రం వెరచే వాడు కాడు.
కాకుంటే, ఆ విషయం  ఈ నోటా , ఆ నోటా  తల్లికి తెలిసినప్పుడు ఇంట్లో తుఫాను రేగేది.  అందులో అమ్మతో బాటు తనూ  చిక్కుకుపో తూ వుండేది. దారి  తెలియ క ఆవిడా, తెలిసినా చెప్పలేక తనూ..
తను పెరిగి పెద్దౌతున్న కొద్దీ..అమ్మ తన కి ఇంకా బాగా అర్ధ మౌతూ వచ్చేది. అర్ధ మౌతున్న కొద్దీ..అమ్మ- త న  జీవితం లో ఏం కోల్పోతోందో అవగతమౌతున్న కొద్దీ.. ..గుండెంతా ఆమె మీద జాలి తో నిండిపోయేది.
సరిగ్గా ఈ భావన్ని ఆమెకి చెప్పాలనిపించినా..అమ్మ చెప్పనిచ్చేదా?
” నీ మొహం. నీకేం తెలుసు? నాన్న గారి గురించీ? ఏదో అప్పుడప్పుడు అలా చేసినా..నాకు ఏ లోటూ రానీయరు.  కోపమొచ్చినప్పుడు నాలుగు తిట్టినా, కొట్టినా…బయట వాళ్ళెవరైనా నన్నొక్క  మాటంటే వూరుకుంటారనుకుంటు న్నావా? ఎన్ననుకున్నా మొగుడూ పెళ్ళాలం  తప్పదు. తప్పు లేదు. కలసి వుండాల్సిందే. లేకపోతే, ఈ ఇల్లు, సంసారం, పిల్లలు ఆగమై పోరూ..ఇంకెప్పుడూ  నాన్న కి ఎదురు తిరగమని నాకు చెప్పకు.
తెలిసిందా?” అంటూ తనకి చివరి హెచ్చరిక జారీ చేసేది.
అలాంటి అమ్మ తను చేసిన ఈ  పని ని సమర్ధిస్తుందని కానీ, తనని అర్ధం చేసుకుని  అక్కున చేర్చుకుంటుందని కానీ తను అనుకో గలదా? ఆశించ గలదా?
అందుకే, మౌనంగా వుండిపోయింది సింధు, గతాన్నంతా  గుర్తు చేసుకుంటూ!
కూతురు తప్పు చేసొచ్చినందుకే,  తలొంచుకుని, కూర్చుందని భావించిన అంజని  తన వాక్ర్పవాహాన్ని తిరిగి కొన సాగించింది.
“లోకం లో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి.   టీవీలలో, పేపర్లలో..ఎంతమంది ఆడ పిల్లల జీవితాలు –  ఎలా నాశనమౌతున్నాయో  చూస్తున్నాను. చదువుతున్నాను.
వాళ్ళ కష్టాలకీ, కన్నీళ్ళకి  బలమైన కారణం వుంది.
కట్న పిశాచమో, అనుమాన భూతమో, బ్రతికుండం గానే మొగుడు మరో పెళ్ళి చేసుకున్నాడనో, పిల్లలు పుట్టడం లేదనో, ఆడపిల్లని కన్నదనో..మగాడు పెట్టే హింసలని వాళ్ళు కళ్ళకి కట్టినట్టు చెబుతున్నారు. సా క్ష్యాధారాలు చూపిస్తున్నారు. జనం –‘పాపం’ అంటున్నారు.
ఎవరొచ్చి ఏ న్యాయం  చేసినా చేయకపోయినా,  ఆ అబలల మీద లోకులకు  జాలి కలుగుతుంది. సానుభూతి మిగులుతుంది.
కానీ, నువ్వు చెబుతున్న కారణాన్ని నేనెక్కడా విన్నే  లేదు. పైగా, పెద్ద ఆరిందాలా,  పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా పడేసి  వస్తావూ? రేపు ఈ సంగతి నలుగురికీ తెలిస్తే,?
“తెలియాలనే ఇచ్చానమ్మా కంప్లైంట్” – చివ్వున తలెత్తి,  జవాబిచ్చింది సింధు.
“ఆ?” ఆవిడ కళ్ళు మరింత పెద్దవి చేసుకుని చూసింది. “అంటే నలుగురూ ఏమైనా అనుకుంటారని సిగ్గైనా లేక పోయిం దా నీకు?”
“నాకెందుకమ్మా సిగ్గు? వుంటే అతనికి వుండాలి” స్థిరం గా అంది.
“ఈ విషయం నీ మొగుడికి తెలిస్తే?”
“తెలియనీ, మనిషైతే సరిదిద్దుకుంటాడు. కాని వాడితో నేనెలానూ కలసి వుండలేను  కదమ్మా!”
“అంటే, ఒక భార్య గా నువ్వు చేయాల్సిన పనే అనుకుంటున్నావా?”
“భర్త గా ఆయన చేయకూడని పని ఇది అని  మాత్రం ఖచ్చితం గా అనుకుంటున్నాను.”
“ఏమిటే చేయ కూడని పని? ఆ? అయినా, మాన మర్యాదలు  లేకుండా పడకింటి సంగతుల్ని ఇలా బట్ట బయలు చేసుకుని, బ్రతుకు ని బజారు కీడ్చుకుంటామా ఎవరమైనా? విని  లోకం నవ్వి పోతుందని కానీ, ఆ తర్వాత నలుగురిలో తలెత్తుకుని తిరగలేమని కానీ, నీకేమైనా తెలుస్తోందా?
“తెలుస్తోందమ్మా. ఇప్పుడిప్పుడే అంతా తెలుస్తోంది.
మనమిలా నలుగురి  కోసం భయపడతామని, మనకు జరిగే అన్యాయాలని చెప్పుకుంటే, లోకం లో మరింత చులకనైపోతామని,  ఆ పైన అపహాస్య పాలై పోతామన్న నిజం మనకంటే మనల్ని మోసం చేసే మగాళ్ళకే బాగా  తెలుసని తెలుస్తోందమ్మా!
అందుకే,  ఈ ఒక్క మన బలహీనతని ఆయుధం గా చేసుకుని మొగుడి స్థానం లో మగాడు సయితం యముడుగా మారుతున్నాడమ్మా!  నువ్వంటున్నావ్ చూడు..పడకింటి గుట్టు అనీ..
నిజమే నమ్మా, నేనూ గుట్టు గానే కాపురం చేసుకోవాలనుకున్నా.
తాళి కట్టిన వాడికి మాత్రమే నా వొంటి మీద చేయి వేసే హక్కునిచ్చాను. జీవితమతా ఈ శరీరం మీద అతనికి సర్వాధికారాలు రాసిచ్చాను.  అందుకు ప్రేమ పేరుతో ఎక్కడ మోసపోతానో అని,  నువ్ చూసిన సంబంధమే చేసుకున్నా. అగ్నిసాక్షి గా వివాహమాడిన వాడు  భద్రత ని నమ్మమన్నావు. నమ్మాను.
అతనితో గడప బొయే కొన్ని అపురూప క్షణాల గురించి కలలు కన్నాను. దాంపత్య జీవితం. గురించి కొన్ని అందమైన కలలు కన్నాను కానీ, నా భర్త కి నా ఆశలతో సంబంధం లేదు.
పుష్ప సౌగంధాన్ని ఆస్వాదించడం కంటేనూ, పూల రేకులని తుంచేయడమంటేనే అతనికిష్టం.
కేవలం తాళి కట్టిన పాపానికి, మొగుడేం చెబితే అది చేయాలా అమ్మా, పడక గదిలో?
కానీ చేసాను.
ఎందుకంటే, ఎదురు తిరిగి తే, నీ మాటల్లో చెప్పాలంటే..’కాపురం చెడి పోతుందని.’
అయినా తృప్తి లేదా మనిషికి.
రాత్రిళ్ళు తాగి, నా పక్కనే,  బుసలు కొడుతూ పడుకున్నప్పుడు..
ఆ మందు వాసన కడుపులో తిప్పుతూ వుంటే..ఏ ఝాము నాడో మత్తు పోయి, కామపు మైకం  కమ్ముకుంటే,  వొళ్ళు తెలీని పశుత్వంతో నా శరీరం గాయమౌతూంటే..
నువ్వన్నట్టు..కేవలం భర్త అనే,  ఆ సలపరింతల జ్వరాలు భరించాను.
సొగసుగా ముడుచుకోవాల్సిన శరీరాన్ని..మసక చీకటిలో ముచ్చట్లు పోవాల్సిన శృంగార చేష్టల్ని..సొమ్మసిల్లి సేద తీర్చుకోవాల్సిన కౌగిళ్లనీ.. అన్నిట్నీ వదిలేసుకున్నాను.
భార్యా భర్తల మధ్య సెక్స్ – అనురాగానికి గుర్తు గా కాకుండా…పశువాంఛకి ఒక సాధనమనే పచ్చి నిజాన్ని తెలుసుకున్నాను.
సెక్స్ అంటే ఇంత హింసాత్మకం గా వుంటుందని, ఈ హింసని రోజూ తట్టుకోవాల్సి వుంటందని నాకు తెలీదమ్మా. తెలిసాక, ఏం చేయాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలీక నాలో నేనే కుమిలిపోయాను.
కానీ.
ఆ రోజు నీలి చిత్రాలు చూడమని నన్ను బలవంతం చేశాడు.
నేర్చుకోవాలన్నాడు. అలా ప్రవర్తిస్తేనే పెళ్ళాన్నౌతా నన్నాడు.
అసహ్యం..చీదర..జుగుప్స..అన్నీ కలిసి,  ఆవేశం ఆపుకోలేక..ఎదిరించాను. ఛీ కొట్టాను. గదిలోంచి బయటకు పారిపోయే ప్రయత్నం చేసాను.
అప్పుడేం జరిగిందో తెలుసా అమ్మా, ఆ తాగుబోతు నన్ను బలంగా మంచం మీదకు తోసి..నా ఇష్టానికి వ్యతిరేకంగా..” ఆమె పూర్తి చేయలేక పోయింది.
రెండు చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది సింధు.
అంజని నిర్ఘాంత పోయింది. నోట మాట రాని దానిలా బిగుసుకుపోయింది. అచేతునురాలైపోయింది.
తన అనుభవం గుప్పున గుర్తుకొచ్చింది.  మొగుడి అక్రమ సంబంధాలు తెలిసినప్పుడు ..ఆ మనిషి ని చూస్తేనే అశుద్దం చూసినంత రోత పుట్టేది.
ఆ శ్వాసలోంచి కుమ్ముకొచ్చే విస్కీ, బ్రాంది కంపులు భరించలేక అటు తిరిగి పడుకునేది.
అతనితో సంపర్కం, అంతరంగానికి నచ్చేది కాదు. మంచం మీంచి తోసి పడేయాలనిపించేది. ఈ నర పిశాచం నించి ఎటైనా పారిపోవాలనిపించేది.
ఏదీ చేయలేక ఆత్మ వంచన చేసుకుంటు..మానసిక నరకాన్ని అనుభవిస్తూ…ఆ కాసేపు శవమౌతూ..జీవచ్చమౌతూ..గడిపేది.
కారణం.. పైకి చెప్పుకోకూడదని. తను బయట పడితే, రేపు పిల్ల జీవితాల మీద అది చెడు  ప్రభావం చూపుతుందని, భయపడేది. తన కారణంగా తన కూతురి భవిష్యత్తు పాడవకూడదని తలచేది. ఓర్పు వహించేది.
కానేం జరిగింది?  సింధూ కూడా తనలానే..అదే నరకాన్నికాదుకాదు అంతకుమించిన నరకాన్ని అనుభవించిందన్న సంగతి ఇప్పుడే..ఇప్పుడే..తెలుస్తోంది.
కూతురి వైపు కరుణ గా చూసింది. మొట్ట  మొదటి సారిగా ఆ  తల్లి – ఒక సాటి  స్త్రీలా కరిగింది. తల్లడిల్లింది.
మెల్లగా సింధు దగ్గరకెళ్ళి, ప్రేమగా దగ్గరికి తీసుకుని,  తల మీద చేయి వేసింది, ఓదార్పుగా.
ఆ స్పర్శ కి ఉలిక్కి పడిన సింధు –  తల్లి మొహం లోకి చూసి,  చటుక్కున తల్లి  గుండెల్లో  ముఖం దాచుకుని వెక్కెక్కి ఏడ్వసాగింది సింధు.
“ఊరుకో నానా, ఊరుకో. నువ్వు మంచి పనే చేశావ్. నా లాంటి పిరికి  ఇల్లాళ్ళు  చేయలేని పని నువ్ ధైర్యంగా చేశావు. నువ్వనుభవించిన ఈ హింస ఈ లోకం లో ఒకరికి కాదు, నలుగురికి కాదు..ఈ ప్రపంచానికి మొత్తం తెలియాల్సిన అవసరం వుంది. నిన్ను అర్ధం చేసుకోవాల్సింది పోయి,  మాటలతో నిన్ను బాధ పెట్టానా తల్లీ? ఇంకెప్పుడూ, ఈ బంగారు తల్లిని ఏమీ అనను సరేనా..” అంటూ, మరింత గా హత్తుకుంది, పసి బిడ్డను హత్తుకున్నట్టు.
తల్లి లాలనలో సింధు ధుఖం  తుఫాను లా మారి పోయింది.
తను ఎప్పుడు ఎరగని  అమ్మ..ఆ క్షణం లో ఒక దేవతా స్వరూపిణిలా అగుపించింది.
ఎప్పటికైనా, ఎన్నటికైనా ఒక స్త్రీ రోదనని, గాయపడిన హృదయాన్నీ కేవలం మరో స్త్రీ మాత్రమే సంపూర్ణం గా అర్ధం చేసుకో గలదేమో!

****

“సింధు వున్నారాండి?”
లోపలకొస్తున్న ఆ అపరిచిత స్త్రీలని  ని పరికించి చూస్తూ..”మీరెవరు” అడిగింది అంజని. కూతురి కోసం వచ్చిన వీళ్లెవరా  అని!
వాళ్ళ చేతుల్లో ఆ రోజు వార్తా పత్రికలు వున్నాయి.
“మేమందరం, ఆమెని అభినందించడం కోసం వచ్చిన అభిమానులమండి.
ఒక భార్య ధైర్యం గా ముందుకొచ్చి, తన భర్త తనని రేప్ చేశాడని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం ఎంతో సాహసం తో కూడిన విషయం.
ఎంత మంది ఇల్లాళ్ళో  పైకి చెప్పుకోలేని లోని బాధని ఆమె నిర్భయంగా  బహిర్గతం చేసి, చాలా మంది బాధితుల కన్నీళ్ళకి గొంతునిచ్చారు.  మన సమాజంలో ఇలాటి మగ పిశాచులు  మొగుడి రూపంలో నూ వుంటారు. తస్మాత్ జాగ్రత్త అంటూ  లోకం కళ్ళు తెరిపించారు.
లైంగిక సుఖం కోసం భార్య నైనా  సరే,బలవంతం చేసి కోర్కే తీర్చుకోవడం కూడా  రేప్ లాంటిదే. – అని తెలియ చెప్పిన ధైర్య వంతు రాలు సింధు.
‘నాలుగు గోడల మధ్య , చట్ట రీత్య వివాహమైన భార్య భర్తల మధ్యజరిగే  ఈ బలవంతపు కార్యాన్ని ‘రేప్’ అని అనలేం..’ అని ఎంత మంది మేధావులు ఘోషించినా..
ఈ సంఘటన ఎందరి సామాన్యులనో  ఆలోచింప చేస్తుంది. పరిష్కారం వెదకమంటుంది. భద్రతనిచ్చే కొత్త చట్టాన్ని తెచ్చిస్తుంది. సింధు ఇచ్చిన ఈ కంప్లైంట్ వల్ల  బాధితులకు ఉపశమనం కలుగుతుంది.  ఆత్మస్థైర్యాన్నిస్తుంది. భార్య లపై సెక్స్యువల్ దాడులు, హింసలు తాగ్గుతాయి.
ఒక మంచి మార్పు కి  అవకాశాన్ని కల్పిస్తూ..స్త్రీ చైతన్యానికి శ్రీకారం చుట్టిన సింధు ని..మేము చూడాలి. అభినందించాలి. ఎక్కడ సింధు?” – అంటూ ఆశ గా, ఆత్రం గా చూస్తున్న  వాళ్ళ మాటలకు పొంగిపోతూ ఉద్వేగ భరితురాలైంది అంజని
–  అక్కడి సందడి అర్ధం కాక ” ఎవరమ్మా ?” అంటూ అప్పుడే అక్కడికొచ్చిన కూతురి  వైపు – పట్టలేని ఆనంద నయనాలతో చూస్తు.. “మీరు చూడాలనుకుంటున్న సింధు..ఇదిగో ఈమే. నా కూతురు.” అంటూ చెప్పింది అంజని వాళ్ళతో.
అలా, చెబుతూ  తన వైపు గర్వంగా చూస్తున్న తల్లి చూపులకి సింధు కళ్ళు ఆనందంతో మెరిసాయి.
స్త్రీలపై జరుగుతున్న అనేక  రకాల అఘాయిత్యాలకు,  అత్యాచారాలకు –   సంపూర్ణ న్యాయం జరగక పోవచ్చు. లేదా  కఠిన చర్యలు తీసుకునే చట్టాలుగా రూపొందడానికి కొంత సమయమూ  పట్టొచ్చు.
కాని, పైకి తేలకుండా నిశ్శబ్దంగా కొరికేసే ఎన్నో  అన్యాయాలను నోరు విప్పి చెప్పడం వల్ల స్త్రీ లు తమ అస్తిత్వాన్ని కాపాడుకున్న వా రౌతారు.
తమ గౌరవాన్ని తాము నిలబెట్టుకున్న వారౌతారు.
అందుకు ప్రతీకగా, ప్రత్యక్ష సాక్షి గా నిలుస్తుంది – సింధు.

   *****

        – ఆర్.దమయంతి

(నా గురించి:
పుట్టిందీ, పెరిగిందీ – మచిలీపట్నం.
స్థిరపడింది –హైద్రాబాద్ లో.

కొన్నాళ్ళు వివిధ దిన, వార, మాస పత్రికలలో పనిచేసాను.
అప్పుడప్పుడు కొన్ని కథలు అచ్చు అయినా, సీరియస్ గా రాస్తోంది మాత్రం ఈమధ్యే. అంటే 2011 నించి. మొదట్లో పోటీలకు మాత్రమే రాసేదాన్ని. ఇప్పుడు ఎక్కువగా ఈ మాగజైన్స్ కి రాస్తున్నాను. ఇప్పటి దాకా సుమారు 150 కవితలు 75 కథలు రాసాను.

అభిరుచులు:
ఇప్పటికి, రాయడం కంటెనూ, చదవడమంటేనే  ఇష్టం. ప్రకృతి సౌందర్యాన్ని తిలకించడం.చిన్న పిల్లలతో మాట్లాడటం.,
నాకెప్పటికీ గుర్తుండిపోయే కవి, ఆరాధ్య రచయిత ఇద్దరూ ఒక్కరే.- తిలక్.

కృతజ్ఞతలు:
నన్నెంతగానో ప్రోత్స్చహిస్తూ, ఆదరిస్తూ, గౌరవిస్తున్న ఈ మాగజైన్స్ సంపాదకులందరకీ ఈ సందర్భంగా అనేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నా.
సారంగ లో ఇంతకు ముందు వచ్చిన hypothesis  అనే కథకు అందుకున్న పాఠకుల స్పందన కానీ, లభించిన ఆదరణ కానీ  నే మరువ లేనిది.
ఎందరో మహాను భావులు..అందరకీ వందనాలిడుతూ..
వినమ్రతతో..}

బుజ్జిపిల్ల-తెల్లపిల్ల

ఈ మధ్య ఒక పాట వినాల్సి వచ్చింది.  బుజ్జిపిల్ల, తెల్లపిల్ల, ఐలవ్యూ పిల్లా అనే పాట.  సినిమా పేరు కూడా తెలుగు సినిమావాళ్ల ఊత పదం మాదిరి ఎరైటీగా ఉంది. పోటుగాడు. వెరీ ఇంటరెస్టింగ్‌!

యువార్‌ సో టైటూ, ఐయామ్‌ నాట్ వైటు, ఇట్స్‌ ఆల్‌ రైటూ అనే దివ్యమైన చరణం ఈ పల్లవిని అనుసరిస్తుంది. కొలవెర్రి తగ్గింది  కానీ పాటల శైలిపై ఆ ప్రభావం మిగిలే ఉంది. ఇది సినిమా పాట మాత్రమే కాదు. స్ర్తీలకు సంబంధించి, రంగుకు సంబంధించి మన సమాజంలో వ్యాపించి ఉన్న వ్యాధులకు దర్పణం.  భారత్‌లో కొంతకాలంగా రేసిజం మీద చర్చ జరుగుతూ ఉంది. ఈశాన్య రాష్ర్టాల అమ్మాయిలమీద వివక్షగురించి లైంగిక దాడులు ఎక్కువవడం గురించి కొన్ని రోజులుగా మీడియాలో చాలా విశ్లేషణలే వస్తున్నాయి. 90ల తర్వాత ఈశాన్యం నుంచి  ‘మెయిన్‌ల్యాండ్‌’కు వలసలు పెరిగాయి. ఎక్కువగా సర్వీస్‌ రంగంలో ఉపాధి పొందుతున్నారు.  బ్యూటీపార్లర్లకు వెడితే అక్కడ మసాజ్‌ చేసేది ఎక్కువగా  వారే. హోటల్‌ రంగంలోనూ వారే. పెళ్లిళ్లలో బొమ్మల్లాగా నుంచోబెట్టేది వారినే. ఇంగ్లిష్‌ వల్ల ఆధునిక రూపమెత్తినప్పటికీ సారాంశంలో ఆదివాసీలు వారు. మనకు సేవలు చేయువారిని చులకనగా  చూచుట సంప్రదాయం. దీనికి తోడు వారు వేసుకునే దుస్తులు,  తిండితిప్పలు,  ఇతరులతో వ్యవహరించడంలో చూపే చొరవ లాంటివన్నీ కలిసి వారిపై చులకనభావం పెరిగేట్టు చేస్తున్నాయని అది నేరాలకు దారితీస్తోందని విశ్లేషణ. ఈ పోకడ కొత్తదేమీ  కాదు. పాతికేళ్ల క్రితం మన సినిమాల్లో లూసీలు, లౌసీలు రిసెస్పనిస్టులు, నర్సులుగా ఉండేవారు. మళయాళీలపై ఇలానే  చిన్నచూపు కనిపించేది. సినిమా వాళ్లు ఆ పాత్రలకు తొడిగే  చిట్టి పొట్టిగౌన్లు, ఇంగ్లీష్ కలగలపి కొట్టే తెలుగులు, అపుడపుడు వాళ్ల చేతుల్లో బ్రాందీ బుడ్లు, సిగరెట్‌ బట్లూ, వెరసి వారంటే అందుబాటులో  ఉండే సరుకు అనే చులకన. చదువుకున్న వారి భాషలో ”ఈజీ గోయింగ్ పీపుల్‌”. స్టీరియోటైపింగ్‌ మనకు కొత్తదేమీ కాదు.  అవకాశముండాలే కానీ దాన్ని ఎంత వికారమైన స్థాయికైనా తీసికెళ్లగల సాధనం తెలుగు సినిమా.
వికార ప్రదర్శనకు   ‘మనం’ కాకుండా ఇంకెవరో ఒక సమూహం కావాలి. మనమూ వాళ్లూ అనే పరిభాష కావాలి.

racism
ఈ ‘మనం’ అనేది మారుతూ ఉంటుంది. కొన్ని సార్లు ఈ ‘మనం’ ప్రాంతం అవుతుంది. అపుడు ‘వాళ్లు’ నేపాలీయులో ఈశాన్యం  వాళ్లో కేరళ వాళ్లో అవుతారు. హైదరాబాద్‌లో బ్యూటీపార్లర్‌కు పరిమితం కాకుండా మన ఎక్స్‌పోజర్‌ పెరిగి ఏ ఢిల్లీలోనే నాలుగు రోజులు  ఉండాల్సి వస్తే ఈ జ్ఞానం ఇంకాస్త పెరిగి “అమ్మో పంజాబీ ఆడవాళ్లా, వాళ్లు చాలా ఫాస్ట్‌ గురూ,  ఎగేసుకుని పోతారు అని జోకొచ్చన్నమాట.  అలా కాకుండా బావి మరీ చిన్నదైపోయి జిల్లా స్థాయికొచ్చేశామనుకోండి. అపుడు ‘వాళ్లు’ పెద్దాపురం పాపలయిపోతారు.
పేట చిలకలయిపోతారు. కొన్ని సార్లు ఈ ‘మనం’ కులం అవుతుంది. అపుడు వాళ్లు భోగం వాళ్లో దళితులో అవుతారు. అయితే వ్యవస్థలో  వచ్చిన మార్పులు ఇక్కడ కులాన్ని తీసేసి మార్కెట్‌ను పెట్టడం వల్ల ఈ కోణం తగ్గిపోయింది. ఇవాళ మసాజ్‌ పార్లర్లు, రిసార్టులు, హోటళ్లమీద దాడుల్లో పట్టుబడుతున్నవాళ్లలో అన్ని కులాల వాళ్లు ఉంటున్నారు. పెట్టుబడి అక్కడ  కులాన్ని దాదాపు తీసేసింది. మిగిలిన చాలా రంగాల్లాగే ఫ్లెష్‌ మార్కెట్‌ కూడా వేరే రూపం తీసుకుంది. కాబట్టి ఈ ‘మనం’ అనేది కులాన్ని ఆశ్రయించడం తగ్గిపోయింది. కొన్ని సార్లు ఈ ‘మనం’ మతం అవుతుంది.  అపుడు ‘వాళ్లు’ క్రైస్తవులో ఇంకెవరో అవుతారు. ముస్లింలయితే చాదస్తులు. క్రైస్తవులైతే మరీ ఫాస్ట్‌ పీపుల్‌. మనం మాత్రమే కరెక్టన్నమాట. వి  ఆర్ ఆల్వేస్‌ నార్మల్‌. దే ఆర్‌ ఆల్వేస్ అబ్‌నార్మల్‌. అది ఎవరూ కాదనరాని గీత. కానీ పౌరుషేయమే.  బుజ్జిపిల్ల-తెల్లపిల్ల మనలో  కాకుండా మనకు విడిగా ఉంటేనే అందరూ వికారాలు బాహాటంగా ప్రదర్శించుకోవడానికి వీలుంటుంది. ఏ లోపమైనా వికారమైనా మనలో  కాకుండా బయట చూడడం చాలా సుఖం.
ఇంతకీ ఈ గొడవకు ఈ బుజ్జిపిల్ల-తెల్లపిల్లా పాటకు సంబంధమేటి? మన లైంగిక సారస్వతంలో అమ్మాయి కన్నె పిల్లగా ఉండవలె.  అబ్బాయి ఎంత ముదురైనప్పటికీ ఇబ్బందేమీ లేదు. కన్యాదానమే చేయవలె. తొలిరేయి నెత్తురు కళ్ల చూడవలె. యువార్‌ సో టైటూ  అనే పవిత్రమైన చరణరాజంలో ఇలాంటి విషయం దాగున్నది. ఈ టైట్‌ లూజూ అనే పదాలు ఇటీవల  లైంగిక పరిభాషలో ఎక్కువగా  వినిపిస్తున్నాయి. మన టెన్త్‌ క్లాస్‌ ప్రేమ సినిమాలన్నింటా వీటితో ముడిపడిన బూతు జోకులు, అమ్మాయి-ఆంటీ విభజనలు చాలానే  ఉంటున్నాయి. కన్యాసంభోగంతో యవ్వనం తిరిగొస్తుంది లాంటి దారుణమైన నమ్మకాలు చాలా సమాజాల్లో ఉన్నాయి. ఆ రకంగా బుజ్జిపిల్ల లాంటి రోగాలన్నీ పాత కాలపు రోగాలు.  గంభీరమైన పరిభాషలో చెప్పుకుంటే ఫ్యూడల్‌ సమాజం నుంచి  కొనసాగుతున్న రోగాలు. లైంగిక చర్యలో పొందే ఆనందంలో  దాని  పాత్ర ఏమీ ఉండదని చాలా అధ్యయనాలే తేల్చినా తలల్ని మట్టిలో పాతేసుకున్న ఉష్ర్టపక్షులు ఆపాత చూరును పట్టుకుని  వేలాడుతున్నాయి. యంగ్‌ ఫ్లెష్‌ పట్ల వ్యామోహం చిన్నపిల్లల అమ్మకాలను ప్రేరేపిస్తున్నది. భయానకమైన సెక్స్‌రాకెట్‌ను, హింసను ప్రేరేపిస్తున్నది. .  బుజ్జిపిల్లా తెల్లపిల్ల లాంటి పాటలు ఇలాంటి రోగాలను వ్యాపింపజేయడంలో వైరస్ లాంటి పాత్రను పోషిస్తున్నాయి. ఇదొక విషవలయం.

ఎప్పటికప్పుడు తిరగబెడుతున్న బుజ్జిపిల్లా అనే పాత రోగానికి తోడుగా తెల్లపిల్ల రోగం మధ్యలో వచ్చి చేరిపోయింది. అది వారసత్వపు రోగం కాదు.  పెట్టుబడి తెచ్చిన రోగం. మన సంప్రదాయ సుందరులు తెల్లనివారు కాదు. క్రిష్ణలు. మార్కెట్‌  వ్యాపింపజేసిన ఆధునిక వ్యాధి ఇది. అయితే ఫ్యూడల్‌ ఆధిపత్య లక్షణం మాదిరి ఈ ఆధిపత్యానికి ఆరాధనీయమైన లక్షణం అన్నివేళలా ఉండదు. అదొక యావ, అంతే.  ఆరాధనే నిజమైతే తెలుపే ఆరాధనీయమైతే ఈశాన్యం అమ్మాయిలు, నేపాలీ అమ్మాయిలు, ఉక్రెయన్‌ అమ్మాయిలు అంత చులకనైపోరు. ఇక్కడ ఆధిపత్యం- చులకన అనేవి మార్కెట్‌ అవసరాన్ని బట్టి మార్కెట్‌లో వారున్న స్థితిని బట్టి ఉంటుంది.  సాపేక్షకమైన తేడాలతో గ్రడేషన్స్‌ ఎక్కువగా ఉండే భారత్‌లో వర్ణాధిక్య భావన పశ్చిమదేశాల రేసిజం కంటే ఒకింత భిన్నమైనది. ఉత్తరాది వారు అక్కడి సాపేక్షకమైన తెల్ల తోలుతో సరిపెట్టుకోలేక నేపాలీ మాంసం మీదుగా ప్రయాణించి ఇటీవల సోవియెట్‌ దేశాల ఆడమాంసం కోసం ఎగబడుతున్నారు. హైదరాబాద్లో కూడా బలిసినోళ్లు సోవియెట్‌ శరీరాల్నే దిగుమతి చేసుకుంటున్నారు.  ఎక్కడెక్కడ తెల్లగా ఉండే నిరుపేద అమ్మాయిలు దొరికితే అక్కడక్కడకు మార్కెట్‌ పరుగులు పెడుతోంది. తెలుపు ఒక మార్కెట్‌ లక్షణం, అంతే. సహజసిద్ధంగా వచ్చే లక్షణానికి లేని ఆధిపత్యాన్ని ఆపాదించడం దాన్ని కొనుగోలు చేయొచ్చు అని అవాస్తవికమైన భ్రమల్ని ప్రచారం చేయడం మార్కెట్‌ మాయ.

ఈ కొనుగోలులో సౌందర్య సాధనాలుఉంటాయి. తెల్ల ఆడశరీరాలూ ఉంటాయి. అది ఆధిపత్యానికి చిహ్నం అని భావించాక అలాంటి లక్షణం ఉన్న శరీరాన్ని పొందడం అనేది కూడా ఆ యావలో భాగమవుతుంది. బలిసినోళ్లకు డ్రైవర్‌గా పనిచేస్తూ వాళ్లలాగే తానూ రష్యన్‌ అమ్మాయిని పొందాలన్న యావలో పడిన ఒక కుర్రాడి విషాద ఘట్టాన్ని అరవింద్‌ ఆదిగ తన వైట్‌ టైగర్‌లో అద్భుతంగా చిత్రించాడు. అందానికి తెలుపును పర్యాయపదం చేసి దాని చుట్టూ ఎన్ని వేల కోట్ల మార్కెట్‌ని అభివృద్ది చేశారో చూస్తూనే ఉన్నాం. ఫెయిర్‌ అండ్‌ లవ్లీ యాడ్స్‌ మన బానిసత్వానికి పరాకాష్ట. ఈ రోగాన్ని ఎంతగా ఇంటర్నలైజ్‌ చేసుకున్నామంటే  ఉష్ణదేశంలో నివసించే మనం, సగటు శరీర వర్ణం నలుపుగా ఉండే మనం మన సినిమాల్లో నల్లవాళ్లని బపూన్లని చేసి వారిమీద జోకులు  వేసేస్తున్నాం.

నల్లవాళ్లు మెజార్టీగా ఉండే సమాజాల్లో నలుపు మీద అంత దుర్మార్గమైన క్రూరత్వం దేనికి సంకేతం? నలుపులో కూడా నికార్సైన నలుపుకు పెట్టింది పేరైన దక్షిణాదిన తమిళంలో వడివేలు, తెలుగులో బాబూమోహన్‌  పాత్రలు దేనికి సంకేతం? పార్తీపన్‌, విజయ్‌ లాంటి వారు  హీరోలుగా ఉండే తమిళసినిమా రంగంలో వడివేలు పాత్రలు అలా ఉండడం విచిత్రాల్లోకెల్లా విచిత్రం.  మన దేశంలో భూస్వామ్య సమాజం కులాధిపత్యాన్ని న్యూనతను ఎలా ఇంటర్నలైజ్‌  చేసుకున్నదో  పెట్టుబడి దారీ సమాజం వర్ణాధిపత్యాన్ని న్యూనతను అలా ఇంటర్నలైజ్‌ చేసుకుంటున్నది. మొదటిది సాంఘికపరమైన  ఆధిపత్యానికి అవసరమైన వ్యవహారం అయితే రెండోది మార్కెట్‌కు అవసరమైన ఆధిక్యభావన.
మళ్లీ పాట దగ్గరకు వద్దాం. ఇక్కడ పాటపాడుతున్నది దక్షిణాది హీరో పాత్రధారుడు.  ఎంత తెల్ల వ్యామోహమున్నా  దక్షిణాది హీరో ఎంతో కొంత  నల్లగా ఉండక తప్పదు. హీరోలు పెట్టుబడితో సంబంధమున్నవారు, లేదా వారి వారసులు.  వాళ్లు కథానాయకులుగా ఉండడం అనివార్యం. అందువల్ల జనంలో ముఖ్యంగా అబ్బాయిల్లో  తెల్ల తోలు పట్ల ఉన్న వ్యామోహాన్ని సొమ్ము చేసుకోవడానికి ఉత్తరాది అమ్మాయిలను దిగుమతి చేసుకోవాలి.  వాళ్లు సాధ్యమైనంత లిబరల్గా ఒళ్లు చూపించేవాళ్లై ఉండాలి. వాళ్లకు మిల్కీ బ్యూటీ లాంటి కుర్రాళ్లను ఊరించే పేర్లు పెట్టాలి. ప్రదర్శన అనేది యుగలక్షణమైన కాలంలో ఉన్నాం కాబట్టి ‘అందాల్ని’ ప్రదర్శించడానికి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. ఇట్సే మార్కెట్‌ నీడ్!  ఆస్తులైనా అందాలైనా ప్రదర్శించుకోకుండా మార్కెట్‌ చేసుకోలేని దశ ఇది. అయితే శరీరం చూపించడంలో లిబరల్‌గా ఉండగలిగే వాళ్లందరూ నటించడంలో లిబరల్‌ ఉండలేరు కాబట్టి ఆ పాత్ర నామ్‌కే వస్తే అయిపోవాలి. నాలుగైదు పాటలు, రెండు రోమాన్స్‌ సీన్లు వగైరాలకు పరిమితం కావాలి. మనమెలాగూ ఉన్నట్టుండి రంగు మార్చుకోలేం కాబట్టి యువార్‌ సో టైటూతో పాటు ఐయామ్‌నాట్‌ వైటూ, ఇట్స్‌ ఆల్‌ రైటూ అని లిబరల్‌గా అనేయొచ్చు. అక్కడ మనలాంటి హీరో ఒకడు తెల్లతెల్లగా ఉన్న చిన్నఅమ్మాయి మీద అక్కడా ఇక్కడా చేతులు కాళ్లూ వేస్తూ వికారాలు చూపిస్తా ఉంటే అదేదో మనమే చేస్తున్నట్టుగా మన యువత ఆనందించే వీలుండాలి. ఈ తెల్లతోలు వ్యామోహం వల్ల తొలుత తెలుగులోనూ ఇపుడిపుడే తమిళనాట కూడా ఉత్తరాది తారలు దూసుకుపోతున్నారు. స్థానిక అమ్మాయిలకు అవకాశమే లేకుండా చేస్తున్నారు. మన హీరోల వయసును, రంగును ఎంత మేకప్‌తో నైనా పూర్తిగా మార్చలేం కాబట్టి వారి సరసన చిట్టిపొట్టి తెల్లతెల్లని అమ్మాయిలను తెచ్చిపెట్టి వారి ఒళ్లు చూపించుట, వారి ఒంటిని వర్ణించుట, అందులో లైంగికపరమైన టిటిలేటింగ్‌ భాషను ఉపయోగించుట అవశ్యమన్నమాట. ఈ అడ్డదారి మార్కెట్‌  ఇప్పటికే  స్థిరీకృతమవుతున్న దుర్మార్గమైన విలువలను మరింత పెంచిపోషించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. మన సినిమా ఈ సాంస్కృతిక కాలుష్యవాహికగా పనిచేస్తున్నది. దానికి సూచికే  బుజ్జిపిల్ల-తెల్లపిల్ల. సాంస్కృతికంగా మన మహిళలు మోస్తున్న రెండు పర్వతాలకు పోలిక. కాదంటారా!

జి ఎస్‌ రామ్మోహన్‌

లోపలి లోకం…..

                              
ఈ ఋతువుకి రాలాల్సిన ఆఖరి ఆకు ఏదో
నేల తాకిన నిశ్శబ్దశ్శబ్దం..
ఏవీ కాకపోడానికీ.. అంతా అయిపోడానికీ మధ్య
కనురెప్పలు ఒకట్రెండు సార్లు కొట్టుకుంటాయంతే!

విరిగిపడిన మహానమ్మకం శకలాలన్నీ సెలయేట్లో గులకరాళ్ళల్లా
గుండె లోతుల్లో సర్దుక్కూర్చున్నాక
మిగిలేది సుదీర్ఘ మౌనం!

ఆఖరి శ్వాస తోటే అంతమయ్యే శిక్ష
ఒకటి విధించబడ్డాక
అదృష్టరేఖలెన్ని ఉన్నా అర్ధరహితాలే!
224870_513475185340722_815911299_n

వద్దనుకున్న ప్రయాణంలో తోవ తప్పినా
మధ్యలో మజిలీ ఏదో ఇష్టమౌతుంది..
పొగమంచు వదలని రహదారి పక్కన్నించి
లిల్లీకాడల చేతులు రెండు
పట్టి లాగి కూర్చోబెట్టుకుంటాయి..
కాస్త శాంతినీ.. కొంచెం ఆశనీ
నుదుటి మీద దయగా అద్దుతుంటే
నొప్పేసిన నిమిషాలన్నీ ఈసారి నవ్విస్తాయి…
తర్వాతెప్పుడో
తూరుపు జ్ఞాపకాలన్నీ
కాగితప్పడవలోకి ఎక్కించి
ఒక్కళ్ళమే వాన వింటున్న క్షణాల్లోకి జారవిడిచామా

నీరెండ నిర్మలత్వం
లోపలి లోకాన్ని
ఆదరంగా అలుముకుంటుంది!

     ~ నిషిగంధ

పర్వతాలూ పక్షులు

hrk

 

 

 

నేనొక పల్చని రెక్కల పక్షిని, గర్వం నాకు, ఎగర గలనని.

నువ్వొక పర్వతానివి, గగన సీమల యొక్క వినయానివి.

నువ్వూ నేను ఒకటే గాని ఒకటి కాదు. నువ్వు నేనూ

అణువుల వలలమే. కణుపులు వేరు చెణుకులు వేరు.

 

ఆకాశం శూన్యం కాదు. అహంకార ఓంకారం అంతటా అన్నిటా.

కాస్మిక్ ధూళి. పాముల వలె మొయిళ్లు. నెత్తి మీద చంద్రుడు.

ఆకాశ చిరు శకలాన్ని నేను. కాస్త అహంకారం నా అలంకారం.

నక్షత్రాలతో సంభాషణ… లేదు నిఘంటువు, విన గలిగితే విను.

 srinivas1

ఎగురుతాను, లో లోపల రగిలి, వున్న కాసిని కండరాల్రగిలి.

వియద్గంగలో దప్పిక తీర్చుకుంటాను వూహల దోసిళులెత్తి.

పర్వతాగ్రపు చెట్టు చిఠారు కొమ్మన కూర్చుంటాను కాసేపు

ఒక చిన్ని బిందువులా లో లోపలికి రెక్కలు ముడుచుకుని.

 

ఎగిరెగిరి రాలిపోతాను, రాలిపోయే వరకు ఎగురుతూనే వుంటాను.

 

నువ్వు ఎక్కడ పుట్టావో అక్కడే వుంటావు బహుశా చివరి వరకు.

క్రియా రాహిత్యం నువ్వు పెదిమ విప్పి ప్రకటించని నీ పెను గర్వం.

నాకు నాదైన స్థలం లేదు. ఇక్కడ వుండిపోడానికి రాతి వేర్లు లేవు.

కాసేపుంటానికి వచ్చానని తెలుసు. శాశ్వతత్వం మీద మోజు లేదు.

 

ఇంతకూ ఎందుకు చెబుతావు పద్యాలు పద్యాలై ఏమీ లేకపోవడం గురించి,

ఎగిరి పడడం గురించి, రాలిపోవడం గురించి? ఓ పర్వత సదృశ అవకాశమా!

వుండూరు వదలక్కర్లేని శాశ్వతత్వమా! శిఖరమా! ఆకాశం నీది కాదు, నాది.

ఎగర వలసిన అవసరం నాది. రాలిపోవలసిన ఆవశ్యకత నాది, సవినయంగా.

 

                                                                                       – హెచ్చార్కె

చిత్రం: అన్నవరం శ్రీనివాస్

కలవక కలవక కలిసినప్పుడు నిజమైన ముఖాముఖి…

drushya drushyam -22అవును. మీకు తెలుసు. ‘ముఖాముఖి’. ఇది పాత్రికేయంలోని ఒకానొక అంశం. అది ఇద్దర్ని చూపిస్తుంది. కానీ, ఒకరు ఒకర్ని ప్రశ్నించి అవతలి వ్యక్తిని ఆవిష్కరించే అంశంగానే ధ్రువ పడింది. కానీ, మనిషి ఒక మనిషిని కలవడం, ముఖాముఖి. ఇరువురూ ఆత్మీయంగా పరస్పరం అవలోకించుకునే సౌజన్యం ముఖాముఖి. ఒకరినొకరు ఆదరించుకుని విడిపోవడమూ ముఖాముఖే. కానీ, ఇది రిపోర్టు చేసే విషయం అయినప్పుడే ముఖాముఖిగా మన తెలివిడిలో పడిపోయింది. ఆ లెక్కన మళ్లీ ‘ముఖాముఖి’లోకి రావాలంటే ఏ కమ్యూనికేషన్ మీడియా లేకుండా, కనీసం మీ సెల్ ఫోనుకూ పని చెప్పకుండా, నేరుగా మీరు ఒక మనిషిని కలవడం…కలిసినప్పుడు కడుపునిండా మాట్లాడుకోవడం… తర్వాత కార్యక్రమం ఏమిటీ? అని అడగకుండా, నిరంతరాయంగా ఆ క్షణాలను ఆస్వాదించడం… అట్లే నిలబడి లేదా కూచుని కాదంటే నడుచుకుంటూ  ఏ వాణిజ్య ప్రకటనల అంతరాయం లేకుండా, పక్కన ఏమున్నా పట్టించుకోకుండా… ఒకరికొకరు ఒకే లోకంగా ఉండటం….ఒక అంశంపై లోలకంలా రెండు హృదయాలూ కదలాడటం…ముఖాముఖి.ఇది ఇప్పటి అత్యవసర పరిస్థితి. ప్రసారాల్లో నిమగ్నమై ప్రేక్షకులుగా మారిన ప్రజారాశులంతటికీ, మనకే…మనందరికీ ఆ సాధనాల నుంచి విడివడి ముఖాముఖిలోకి దిగవలసిన అనివార్య స్థితి.ఇది వాక్ ది టాక్  కాదు, హార్డ్ టాక్ కాదు, ఎన్ కౌంటరూ కాదు. ఇది కేవలం మీ కోసమే. ప్రత్యక్ష ప్రసారాల కోసం మాత్రం కాదు, రేటింగుల కోసం అసలెంత మాత్రమూ కాదు. మీ లోవెలుపలి నదుల్ని స్పర్శించుకునేందుకు… మీ అంతరాయాల్ని అధిగమించేందుకు… మీ అంతర్లోకాల్లో అంతులేని బడబాగ్నులను ఆర్పివేసేందుకు…మనుషుల్లా నిర్మలంగా నవ్వేందుకు, అందుకు దారిచూపే దృశ్యాదృశ్యం ఈ చిత్రం – ఒబి వ్యాను దగ్గరి అమ్మలక్కలు.

+++

ఒట్టి కలయిక. పనిమీద పోతూ పోతూ అట్ల నిలబడి చివరకు ఆ పనినే మర్చిపోయేంతటి కలయిక. ఒక భాషణం. దేహం కూడా చేతులు ముడుచుకుంటుంది. పెదాలపై వేలుంచుకుని విస్మయం వ్యక్తం చేస్తుంది. అంత సూటిగా, నిశితంగా సాగే ముఖాముఖి.

ఇరువురూ మాటలాడుతూ ఉండగా ఒకింత బీరిపోయి, వింటూ వింటూ కొంగుతో కన్నీళ్లు తుడ్చుకుని లేదంటే ఆ కొంగునే నోట్లో దోపుకుని దుఃఖాన్ని ఉగ్గబట్టుకోవడం, అదీ కాకపోతే ఎవరేమనుకుంటున్నారో చూడనైనా చూడకుండా గొడగొడ ఏడ్వడం,  అల్మిచ్చుకుని వెన్నుతట్టడం,…ఇట్లా ముఖాముఖిలోనే అన్నీనూ…

+++

‘ఓసినీ’  అని అశ్చర్యపడేందుకు, “ఏ పోవే…’ అని పరాష్కాలు ఆడుకునేందుకు, “సుప్పనాతి’ అని చురచుర తిట్టుకునేందుకు కూడా ఈ ముఖాముఖి.

+++

పక్కపక్క గల్లిలోనే ఉంటాం. కానీ కలిసినప్పుడు ఇట్లా ముఖాముఖి.
కావలసి కలసినప్పుడూ ఇట్లా ముఖాముఖి.
వీలైనంత వరకూ కలవక కలవక కలిసినప్పుడు నిజమైన ముఖాముఖి…
ఎన్నో రకాలుగా ముఖుమాఖిగా అదొక సుఖం దుఃఖం.

ఇది జగను ఓదార్పు కాదు. మరొక రాజకీయ విజయోత్సవ సభా కాదు. సిసలైన సామాజికం ఇట్లా ఎదురుపడటం. కలవడానికి విరామంలేని జీవితంలో అట్లా కలయిక. అంతే.

గన్ మైకూ లేదు. టెలీ ప్రాంప్టర్ లేదు. టేకులూ లేవు. నేరుగా ప్రసారం. ప్రత్యక్ష ప్రసారం.
ఒకరి మనసులో ఇంకొకరి స్థానంతో జరిగే నిజమైన జీవన ప్రసరం.

ఇదంతా బహిరంగం. మాట్లాడుతున్నప్పుడే రహస్యం. ఎంత వాల్యూం పెంచాలో మరెంత తగ్గించాలో, ఎలా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలో ఆ అక్కలకు తెల్సినంత మనకెవరికైనా తెలిస్తే అది నిజమైన ముఖాముఖి.

+++

ఈ ఇద్దరి ఏకాంత ప్రపంచం అంతా చుట్టూ ఉన్న రణగొణ ప్రపంచంలోనే!  అదే నిజమైన కమ్యూనికేషన్. మిగతాదంతా గాలివాటం. అదే ముఖాముఖి.

ఇది ఎక్కడంటారా?
హైదరాబాదులోని పార్సిగుట్టలో దండోరా కేంద్ర కార్యాలయం ఉన్నది. అక్కడ మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణ మాదిగ తరచూ పెద్ద ఎత్తున్న పత్రికా సమావేశాలు ఏర్పాటు చేస్తుంటాడు. ఆ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి టెలివిజన్ చానళ్లు తమ ఒబి వ్యాన్లను కూడా పంపుతాయి. అవన్నీ ఆ ఇరుకు రోడ్డులో… నాలుగైదు, ఒక్కోసారి ఐదారు నిలిచి ఉంటై.  చిత్రమేమిటంటే, ఒక వర్షం వెలిసిన ఉదయం ఒక వ్యాను పక్కన ముచ్చట్లలో మునిగిపోయిన ఈ అమ్మలక్కలను చూశాను. చూస్తే! ఈ వారం దృశ్యాదృశ్యం.

+++

ఒక చిన్న తుంపర కురిసి వెలిసింది. అప్పుడీ ముఖాముఖి.
మనసులోని రందిని పెంచే ఒక తుంపర. అలాగే మనసును పంచుకున్నాక వెలిసిన తుంపర కూడా.
ఇది కవిత్వం కాదు, కళా కాదు- సమస్తం. అది కనుల ముందు తారాడి వెలసిపోకుండా ఒక దృశ్యంగా ఉంచేందుకే ఛాయచిత్రణం. అదే నా ముఖాముఖి.

ధన్యవాదాలు, అమ్మలక్కల్లా కలిసిన మనందరికీ.

~ కందుకూరి రమేష్ బాబు

కాందిశీకుడి ప్రేమ

 kurma

రెండునెలలుగా ప్రయత్నిస్తున్నాను తప్పించుకోడానికి. కానీ, ఇక తప్పింది కాదు. అఫ్సర్ పట్టుదలముందు నా ప్రయత్నాలు ఫలించలేదు. కాలమ్ రాయడమంటే సాహసమే కదా. నెలా నెలా రాయాలంటే ఎంత కష్టం. డెడ్ లైన్లను అసహ్యించుకునే అనేకానేక జర్నలిస్టులలో నేను కూడా ఒకడిని. పీకమీదకొచ్చేదాకా అక్షరం కదలదు. అట్లని రాయడానికి ఏమీ లేదని కాదు. కేవలం రాయడం వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ తప్పని సరిగా రాయాలి. తమకు మాత్రమే తెలిసిన, తాము మాత్రమే చూసిన, అర్ధం చేసుకున్న ప్రపంచాన్ని తప్పనిసరిగా అందరూ రాయాలి.

ఇంత సంక్లిష్టమైన, విశాలమైన, సుందరమైన, నీచమైన, ప్రేమాస్పదమైన లోకాన్ని గురించి ఎంతెంత మంది, ఎన్నెన్ని తీర్ల చెప్తే తప్ప ఎలా పూర్తిగా వర్ణించగలం?

పతంజలిగార్ని ఏదైనా సభలో మాట్లాడమంటే అనేవారు, మాట్లాడడం ఎందుకండీ అని. “ఏవో నాలుగు ముక్కలు రాసుకోవడం సులభం కదండీ. మాట్లాడే పని ఎందుకు మనకి” అనేవారు.

నన్నోసారి అడిగారు, ఈ మధ్య ఏం రాసేరండీ అని. నేనన్నాను, “రాయడం ఎందకండీ, రాయడం కంటే చదవడం సులభం కదండీ,” అని. గురువుగారికి తనమాటల్నితనకే అప్పచెప్తున్న విషయం అర్ధం అయి నవ్వేరు. ఆయన నవ్వే అందమైనది.

తప్పించుకోడానికి అంటాం కానీ, జర్నలిస్టులకు రాయడం తప్ప ఇంకేం చేతనవుతుంది? కొందరు జర్నలిస్టులు (రచయితలు కూడా అయిన పతంజలిగారి లాటి వాళ్ళ గురించి చెప్పనే అక్కర్లేదు) గొప్పగా రాస్తారు. ఇంకొందరు ఓ మోస్తరు రాస్తారు. కానీ, రాయడం రాయాలి కదా ఏదో ఒకలాగా. జర్నలిస్టు సాక్షి కదా — సమస్త వైతరణీ నదులకూ, హింసా-ప్రతిహింసలకూ, వింతలకీ, వినోదాలకీ, చారిత్రక సంక్షోభాలకీ, వేదనలకీ, ప్రేమలకీ, వంచనలకీ. ఏదో ఒకటి రాస్తూనే వుండాలి, ప్రతిరోజూ.

అందుకే మొత్తానికి రాద్దామనే నిర్ణయించుకున్నాను. నాకళ్లతో చూసింది, నాకు అవగతమైంది, నాకు సాధ్యమైనంతమేర రాద్దామని. సరిగ్గా రాద్దామనుకున్న సమయానికి తెలంగాణా వచ్చేసింది. ఇక తెలంగాణ గురించి కాకుండా ఈ ఉద్వేగభరితమైన సందర్భంలో ఎవరైనా ఇంకేం రాయగలరు? జరిగేది అధికారమార్పిడి మాత్రమే. రాత్రికి రాత్రి ఏదో స్వర్గం వచ్చేస్తుందని కాదుకాని, ఇది ఒక తప్పనిసరి పోరాటం. ఒక అనివార్యమైన మజిలీ.

charminar

నా జీవితంలో దాదాపు సగం హైదరాబాద్ లోనే గడిచిపోయింది. పుట్టి పెరిగి, చదువుకున్న ఉత్తరాంధ్రలో ఎన్ని సంవత్సరాలు వున్నానో, ఇక్కడ కూడా అన్నే సంవత్సరాలు వున్నాను. ఇరవై ఏళ్ల పాటు చాలా దగ్గరి నుంచి చూశాను తెలంగాణాని, ఇక్కడ ప్రజల్ని. జిల్లాల్లో ఎన్నో సార్లు తిరిగాను, రైతులతో మాట్లాడాను. కేవలం జర్నలిస్టు కళ్ళతో మాత్రమే కాదు, విప్లవోద్యమం దృక్కోణంతో కూడా చూశాను. ఇక్కడి అమ్మాయిని చేసుకున్నాను కాబట్టి తెలంగాణా ప్రజలు ఎదుర్కొనే కనిపించని దాడిని కూడా చూశాను. మా బంధువులు కొందరు, “అదేవిట్రా, వీడికి తెలంగాణా భాష వచ్చేసింది,” అని మొహం మీదే అనడం చూశాను.

“మదర్ టంగ్ కదా, వస్తుంది,” అని అప్పటికైతే వాడు సమాధానం ఇచ్చాడు. కానీ, వాడి మనసు విరిగే వుంటుంది.

ఇలాటి ఎన్నో సందర్భాలకి సాక్షి అయినవారెవరైనా తెలంగాణాకు బేషరతు మద్దతు ఇవ్వకపోతేనే ఆశ్చర్యం గాని, ఇస్తే ఏం ఆశ్చర్యం. ఇక ఈవాదనల్ని చేస్తున్నందుకు అక్కల దగ్గర్నుంచి, కజిన్ల దగ్గర్నుంచి, ప్రాణమిత్రుల్నించి ఎదుర్కొన్న ప్రశ్నలు అన్నీ ఇన్నీ కాదు. ఆస్తికి సంబంధించిన, ఆధిపత్యానికి సంబంధించిన ఎవరివో వాదనల్ని మనం మీదేసుకుంటున్నామని వాదించేను. కొందరు నిజంగానే కలిసివుంటే మంచిది కదా అన్న మానవ సహజమైన, న్యాయబధ్ధమైన వాదన చేశారు. మా ఫాదర్ కూడా అన్నారు, కలిసి వుండాలి అనుకోవడం తప్పెలా అవుతుందని.

అవును, కలిసి వుండాలనుకోవడం తప్పెలా అవుతుంది? మనం మనుషులం కదా. ప్రేమికులం కదా. నలుగురు మనుషులు కలిసి జీవించడాన్ని కలగన్న వాళ్ళం కదా. కానీ, మరి కలిసి వుండడానికి మనం అర్హులం అయివుండాలి కదా. అంటే, కలిసివుండాలి అనుకునేవారు అందరూ అర్హులుకాదని కాదు. ఒక జాతిగా మరో జాతిని ఎలా చూసేం అన్నదాని బట్టి వుంటుంది కదా ఆ అర్హత.

అందుకే, తెలంగాణా వచ్చిన రోజున విజయనగరం నుండి మా ఫాదర్ ఎస్ ఎమ్ ఎస్ ఇచ్చారు, “అభినందనలు” అని. అవును, మాది ఉత్తరాంధ్రనే. మా శుభాకాంక్షలు మా పిల్లలకి, పోరాడినవాళ్ళకి, తెలంగాణకి. వాళ్ళు ఇక మానవీయ, ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాటం కొనసాగించాలి. మొన్నటి లాగానే, రేపు కూడా మా మద్దతు వుంటుంది.

– కూర్మనాథ్

ఇప్పుడిక జరగాల్సింది కొత్త చరిత్ర రచన!

గతవర్తమానం 1

venu

‘వర్తమాన కాలమూ గత కాలమూ

బహుశా భవిష్యత్కాలంలో మనుగడ సాగిస్తుంటాయి

భవిష్యత్కాలం గత కాలంలో నిండి ఉంటుంది

కాలమంతా శాశ్వతంగా వర్తమానమే అయితే

కాలానికెప్పుడూ విడుదల లేదు’ అన్నాడు కవి టి ఎస్ ఇలియట్.

 

‘చరిత్రంటే గత వర్తమానాల మధ్య నిరంతర సంభాషణే’ అన్నాడు చరిత్రకారుడు ఇ ఎచ్ కార్.

 

గతమూ వర్తమానమూ భవిష్యత్తూ ఒక కలనేత. ఒక పిచికగూడు. వినీలాకాశంలో రకరకాల చిత్తరువులు గీసే మేఘమాల. తెలంగాణలోనైతే దసరా పండుగరోజున శమీవృక్షం మీది నుంచి ఆయుధాలు దించే ప్రాచీన గతమూ, ఊరేగింపులో అటూ ఇటూ ఊగుతున్న, అప్పటికప్పుడు కోసిన జొన్న కర్రల వర్తమానం. పీరీ ఎత్తుకుని ఊగుతున్న అబ్బాసలీ కాళ్ల మీద బిందెడు నీళ్లు గుమ్మరించిన పెద్దింటి హిందూ అగ్రవర్ణ ముత్తైదువు కన్నీటి బిందువుగా రాలుతున్న ఆశన్న – ఊశన్నల అమరత్వం, ఇవాళ్టి గునుగు తంగెడు కట్ల బంతి గొట్టం రకరకాల పూల బతుకమ్మల ముందర ఏడేడు తరాల గాథల పాటల చప్పట్లు తవ్విపోస్తున్న సబ్బండవర్ణాల అక్కచెల్లెళ్ల ఆనందహేల. ఏ వర్తమాన దుఃఖానికైనా తాతముత్తాతల శోకాన్ని ప్రవహించే మా ఇంటి ముందరి చాకలి లచ్చవ్వ రోదన… ఎన్నెన్నో దృశ్యాలు అల్లుకుపోతున్న తెలంగాణ వర్తమానంలో, కాదు గతవర్తమానభవిష్యత్తుల మధ్య విభజన లేని లిప్తలో ఇది రాస్తున్నాను.

 

‘సారంగ’కు ఏదైనా శీర్షిక రాయమని అఫ్సర్ అడిగినప్పుడు, నేనేదో రాయగలనని కాదు గాని, తనతో ముప్పై ఏళ్లకు పైబడిన గాఢమైన స్నేహం వల్ల మాట తీసేయలేక ఒప్పుకున్నాను. తెలుగు సాహిత్య ప్రపంచంలో గత వర్తమానాల సంభాషణ గురించి రాయడానికి ఈ శీర్షికలో ప్రయత్నించ వచ్చుననుకున్నాను. గతమూ వర్తమానమూ కేవలం కాలసూచికలు మాత్రమే కాదు, నిరంతర చలనశీలతకు చిహ్నాలు. ఇవాళ వర్తమానమైనది రేపటికి గతమైపోతుంది. గతమూ నిశ్చలం కాదు. ఇవాళ గతం అనుకున్నదాన్ని కొత్తగా చూసే ఆకరాలు, ఆధారాలు ఆవిష్కృతమై గతం మారుతూనే ఉంటుంది. కాగా వర్తమానం అనే మాటకే కాలసూచికగా మాత్రమే కాక, వార్త, సమాచారం, సందేశం, వృత్తాంతం అనే అర్థాలు కూడ ఉన్నాయి. అందువల్ల కాలానికీ, సమాచారానికీ, వృత్తాంతానికీ, విశ్లేషణకూ, మరో చూపుకూ, కొత్త చూపుకూ అవకాశమిచ్చే ‘గతవర్తమానం’ శీర్షిక ఎంచుకున్నాను.

 

ప్రస్తుత ప్రకాశం జిల్లాలో ఉన్న ఒక గ్రామంలో ఇరవయో శతాబ్ది తొలిరోజుల్లో జరిగిన ఒక మతాంతరీకరణ మీద అప్పుడే వెలువడిన ఒక పుస్తకాన్ని ఇప్పుడు కొత్తగా చూసి ఏమి ఆలోచించవచ్చునో రాయడంతో ఈ శీర్షిక ప్రారంభిద్దామనుకున్నాను. కాని ఈలోగా నిరంతర గతమూ, నిరంతర వర్తమానమూ, అనంత భవిష్యత్తూ అయిన నా కన్నతల్లి తెలంగాణ లేతమొగ్గలా పువ్వులోకి విచ్చుకుంటున్న సందర్భం, భవిష్యత్తులోకి గెంతుతున్న సంరంభం నా ఈ శీర్షికకు నాందీప్రస్తావనగా మారాయి.

కుటుంబరావు గారి ‘చదువు’లో మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండ్ ఓడిపోయి జర్మనీ గెలిస్తే ఏం జరుగుతుందనే ప్రశ్నకు “ఏమవుతుందీ? … ఇంగ్లీషు మానేసి జర్మన్ భాష నేర్చుకోమంటారు” అని జవాబు చెప్పించినట్టు, తెలంగాణ ఎన్నడూ ఓడిపోకుండానే తనది కాని మరొక భాషలో, కాకపోతే మరొక మాండలికంలో, మరొక యాసలో పాఠాలు చదువుకోవలసి వచ్చింది. ఇప్పుడిక్కడ నేను రాస్తున్న భాష, కనీసం అతి ఎక్కువ పదాలు, క్రియాంతాలు నేను మాట్లాడే భాషవి కావు. ఈ దేశంలో పాలకవర్గాలు బలప్రయోగం అవసరం లేకుండానే పాలితులను లొంగదీయ గలిగాయని కొశాంబీ అన్నట్టు, బలప్రయోగం అవసరం లేకుండానే, ఏ యుద్దంలోనూ ఓడిపోకుండానే నా భాష నాకు దూరమైపోయింది. కనుమరుగైపోయింది. నా భాష మాత్రమే కాదు, తెలుగు భాషలోని అద్భుతమైన మాండలికాల సొగసులన్నీ అణగిపోయాయి. తన కాలానికీ, సుదూర భవిష్యత్తుకూ కూడ గొప్ప ప్రజాస్వామిక స్ఫూర్తిని వ్యక్తం చేసిన గురజాడ అప్పారావు కూడ “…ప్రామాణికమైనదిగా గుర్తింపుపొందిన ఒక వ్యవహార భాష ఉందని ప్రసిద్ధ పండితులూ, తెలుగుదేశ ప్రజలూ అంగీకరిస్తున్నారు. అది కృష్ణా, గోదావరి జిల్లాల తెలుగు తప్ప మరొకటి కాదు” (డిసెంట్ పత్రం) అని, ఈ “ప్రామాణిక” భాష పెత్తందారీతనానికి లొంగిపోయారంటే ఈ అంకుశం ఎంత మెత్తనిదో, ఎంత పదునైనదో అర్థం చేసుకోవచ్చు.

 

ఆ మాట అన్నందుకు ఆయనకు ఏదో దురుద్దేశాన్ని, స్వార్థ ప్రయోజనాన్ని అంటగట్టనక్కరలేదు. ఏ దురుద్దేశమూ, స్వార్థ ప్రయోజనమూ లేకుండానే భావజాలపు మత్తు తన పాత్ర నిర్వహిస్తుంది. ఆ భావజాలపు మత్తే తెలంగాణ భాష ప్రామాణికమైనది కాదన్నది. అసలు తెలంగాణకు భాష లేదన్నది. సాహిత్యం లేదన్నది. చరిత్ర లేదన్నది. మర్యాద తెలియదన్నది. తెలంగాణలో పుట్టి పెరిగి సాహిత్య సృజించారని తేలినవారి స్వస్థలాల గురించి కూడ అపనమ్మకం ప్రకటించింది. సర్ ఆర్థర్ కాటన్ పుణ్యమా అని కాలువలు వచ్చి, కాలువల కింద వ్యవసాయం వచ్చి, వ్యవసాయంలో మిగులు వచ్చి, ఆ మిగులు సాహిత్య, సాంస్కృతిక, కళారంగాలకు, ముద్రణ, ప్రచురణ, ప్రచార మాధ్యమాల రంగాలకు, సినిమాకు వ్యాపించి తన భాషే ప్రమాణం, తన జీవన విధానమే ప్రమాణం అని స్థిరీకరించింది.

 

ఒక బహుళ సమాజంలో, వైవిధ్య భరిత సమాజంలో మిగిలిన అంశాలన్నిటినీ తోసివేసి, అణచివేసి, ఒకేఒక్క “ప్రమాణాన్ని” నిర్ణయించడం రెండు దుష్పరిణామాలకు – అనుకరణకైనా, న్యూనతకైనా – దారి తీస్తుంది. అణచివేతకు గురైన సమూహాలన్నీ తామూ ఆ “ప్రమాణాన్ని” అందుకోవాలని వెంపరలాడతాయి, అనుకరిస్తాయి. అనుకరణ సంస్కృతి ప్రబలుతుంది. తమ మూలాలను మరచిపోయి, తొక్కివేసి “ప్రమాణాన్ని” అనుకరించాలని ప్రయత్నించేవారు పెరుగుతారు. మరి ఆధిపత్య ప్రమాణం ఇలా చేరవచ్చేవారందరినీ చేర్చుకోజాలదు గనుక ఆ “ప్రధానస్రవంతి” లోకి కొందరికే ప్రవేశం దొరుకుతుంది. కాగా అణచివేతకు గురైన అసంఖ్యాకులు తాము ఆ ప్రమాణాన్ని అందుకోలేమని, తమకు అది అందుకునే అర్హత, యోగ్యత, సామర్థ్యం లేవని ఆత్మ న్యూనతా భావానికి గురవుతారు. అందువల్ల “ప్రమాణపు” బలం మరింత పెరుగుతుంది.

kancharlagopana

తెలంగాణలో పుట్టిన సాహిత్యకారులలో, తెలంగాణ సాహిత్య సంప్రదాయంలో కనీసం ఇరవయో శతాబ్ది తొలిరోజులనుంచీ ఈ అనుకరణనైనా, న్యూనతనైనా గుర్తించవచ్చు. హైదరాబాదులో తెలుగు గ్రంథాలయం ఏర్పాటు చేస్తూ (శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, 1901), స్థానిక ప్రభువైన మల్కిభరాముడినో (ముల్క్ ఇబ్రహీం కుతుబ్ షా), ఆ గోల్కొండ రాజ్యంలోనే తొలి అచ్చ తెలుగు కావ్యం రాసిన పొన్నగంటి తెలగానార్యనో, ఆ ప్రాంతంలోనే అద్భుతమైన వాగ్గేయకారుడిగా ఎదిగిన కంచర్ల గోపన్ననో కాకుండా ఆ ప్రాంతంతో ఎన్నడూ సంబంధం లేని, ప్రామాణిక తెలుగు సాహిత్య చరిత్ర కీర్తించిన శ్రీకృష్ణదేవరాయల పేరు పెట్టడం ఈ అనుకరణ – ఆత్మ న్యూనతా సంస్కృతికి చిహ్నమే. అలాగే హనుమకొండలో ఏర్పడిన రెండో తెలుగు గ్రంథాలయానికి (రాజరాజ నరేంద్రాంధ్ర భాషా నిలయం, 1904), తెలుగు జాతినంతా ఏకం చేసిన స్థానిక ప్రభువంశం కాకతీయుల పేరు కాకుండా, స్థానిక కవి పోతన పేరు కాకుండా ఒక చిన్న తెలుగు ప్రాంతాన్ని పాలించిన, హనుమకొండతో ఏ సంబంధమూ లేని రాజరాజ నరేంద్రుని పేరు పెట్టడమూ ఈ అనుకరణ-ఆత్మన్యూనతల ఫలితమే. ఈ సంప్రదాయమే ఇవాళ నేను వాడే భాష దాకా, నా భాష వాడడానికి బెరుకు పడేదాకా కొనసాగుతున్నది.

అయితే ఈ సంప్రదాయాన్ని తోసిరాజని తన ప్రత్యేక అస్తిత్వాన్ని, తన సంస్కృతిని, తన భాషా సాహిత్యాలను, తన ఉజ్వల వారసత్వాన్ని ఎత్తిపట్టిన సంప్రదాయం కూడ కనీసం 1930ల నుంచీ ఉంది. తెలంగాణలో తెలుగు కవులు లేరన్న వ్యాఖ్యకు స్పందనగా 1934లో సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వం వహించి ప్రచురించిన గోల్కొండ కవుల సంచిక 354 మంది తెలంగాణ కవులను చూపింది. అయినా ఇరవై సంవత్సరాల తర్వాత వట్టికోట ఆళ్వారుస్వామి తన తొలి నవల ప్రజల మనిషి వెలువరిస్తూ, అందులో తెలంగాణ జనసామాన్యం వాడే భాష వాడినందుకు “చాలా భయంతో ఈ నవలను బైటికి తెస్తున్నాను” అని ప్రకటించారంటే తెలంగాణ సాహిత్యకారులు అనుభవించిన ప్రత్యక్ష, పరోక్ష ఒత్తిడి ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు.

విలీనం తర్వాత, సోదరులనీ, ఒకే భాషకు చెందినవారనీ చెప్పిన తర్వాత ఆధిపత్య, ప్రామాణిక భాషతో పోల్చుకుని ఈ “భయం” తగ్గలేదు సరిగదా పెరిగింది. తెలంగాణ భాష, “ప్రామాణిక” భాషకు, “ప్రామాణిక” నిఘంటువులకు తెలియని తెలంగాణ పదాలు ఇంకా అవహేళనకూ, అవమానానికీ గురవుతూనే వచ్చాయి. తెలంగాణ భాష అయితే తౌరక్యాంధ్రమో, కాకపోతే అలగా జనాల మొరటు భాషో అయిపోయింది. దాదాపు సగం ప్రాంతంలో జనవ్యవహారంలో ఉన్న మాటలు కేవలం తమకు తెలియనందువల్ల, తమ నిఘంటువుల్లోకి ఎక్కనందువల్ల అవమానించదగినవని మహాఘనత వహించిన కోస్తాంధ్ర సాహిత్యకారులు అనుకున్నారు. కోస్తాలో కొన్ని కులాల, చిన్న చిన్న ప్రాంతాల భాషను, చిన్న సమూహాల నుడికారాన్ని తెలంగాణ పాఠకులు చదువుతూ, నేర్చుకుంటూ, ఆనందిస్తూ, తమ పదజాలంలో భాగం చేసుకుంటూ ఉన్న సమయంలోనే తెలంగాణ మాండలికం విస్మరణకు, అవహేళనకు  గురయింది.

 

ఇటువంటి అవహేళనలకు లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. తన మొదటి కవితాసంపుటం ‘చలినెగళ్లు’ లో ఒక కవితలో ‘శ్మశానంలో కోర్కెలు తీరని బొక్కల వలె’ అని వరవరరావు రాస్తే, ఒక సుప్రసిద్ధ కోస్తా సాహిత్య విమర్శకుడు తెలంగాణలో ‘బొక్కలు’ అంటే ఎముకలు అని తెలుసుకోకుండా, తనకు తెలిసిన ‘రంధ్రాలు’ అనే అర్థమే సర్వస్వమైనట్టు ఇంత అశ్లీలం రాయడమా అని విమర్శించారు. ఎమర్జెన్సీ తర్వాత పునః ప్రారంభమైన సృజన లో కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగపోరాటాల వెల్లువలో కరీంనగర్ మాండలికంలో అల్లంరాజయ్య కథలు వెలువడుతున్నప్పుడు చాల మంది ప్రగతిశీల రచయితలు కూడ మాండలిక రచన సరైనది కాదంటూ, సృజన అల్లం వాసన వేస్తున్నదంటూ చర్చోపచర్చలు నడిపారు.

D98571616a copy ఆ మాటకొస్తే తెలుగు సాహిత్యంలో అత్యధిక భాగం కాళోజీ చెప్పినట్టు “రెండున్నర జిల్లాల రెండున్నర కులాల దండిబాస” లోనే ఉంది. ఆ భాషను అందరూ ఆదరించారు. ఉత్తరాంధ్ర మాండలికంలో వచ్చిన రచనలనూ తెలుగు సాహిత్యమంతా సాదరంగా ఆహ్వానించింది. కాని తెలంగాణ మాండలికంలో సాహిత్య సృష్టి మాత్రం అపరాధమైపోయింది. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ఎన్నో కార్యక్రమాలకు గొంతు ఇవ్వడానికి ప్రయత్నించి ‘మీ వాయిస్ కల్చర్ సరిగా లేదు’ అని తిరస్కారానికి గురైన తెలంగాణ పాత్రికేయులు, రచయితలు ఎందరో ఉన్నారు. 2002లో వెలువడిన నా కవితా సంపుటానికి పావురం (పక్షి కాదు, తెలంగాణలో ప్రేమ, నెనరు, వాత్సల్యం) అని పెట్టాలనుకున్నప్పుడు ఏ ఒక్క “ప్రామాణిక” నిఘంటువులోనూ ఆ మాట చేరలేదని గుర్తించాను. “ఎన్నో తెలంగాణ మాండలిక పదాలకు ప్రాచీన కావ్యాల్లో ప్రయోగాలు కనిపిస్తున్నాయి. ఐనా ఇవి ఇంకా నిఘంటువుల్లోకి ఎక్కలేదు” అంటూ శబ్దరత్నాకరంలో స్థానం పొందని శబ్దాల జాబితా 1988లోనే ఒక పుస్తకం రాశారు రవ్వాశ్రీహరి. ఆ కృషినే కొనసాగించి ప్రధానంగా తెలంగాణ పదాలతో ఒక నిఘంటువు తయారుచేశారు. నలిమెల భాస్కర్ కూడ ఆ ప్రయత్నం చేశారు.

ఇది కేవలం భాష విషయంలో, కొన్ని పదాల విషయంలో మాత్రమే జరిగినది కాదు. తెలంగాణ సాహిత్య చరిత్ర, సాహిత్యకారుల ప్రతిపత్తి, తెలంగాణ చరిత్ర వంటి అన్ని విషయాలలోను ఈ చిన్నచూపు, వివక్ష, నిర్లిప్తత, లోతైన పరిశోధన లేకుండానే తీర్పులు చెప్పడం వంటి తప్పులు, పొరపాట్లు జరిగాయి.

ఉదాహరణకు కాకతీయుల మీద చాల సమగ్రమైన పరిశోధన చేసిన పి వి పరబ్రహ్మ శాస్త్రి 1978లో ప్రచురితమైన తన గ్రంథాన్ని ‘తెలంగాణ నిజాం పాలనలో ఉండడం వల్ల శాసన పరిశోధన కష్టమయింది’ అనే అర్ధ సత్యంతో ప్రారంభించారు. కాని అప్పటికి డెబ్బై ఏళ్లుగా కొమర్రాజు లక్షణరావు, లక్ష్మణరాయ పరిశోధనా మండలి, మారేమండ రామారావు, శేషాద్రి రమణకవులు, ఆదిరాజు వీరభద్రరావు, యాజ్దాని వంటి ఎంతో మంది పరిశోధకులు సాగించిన కృషిని ఇలా ఒక్కమాటతో కొట్టివేయడం ఆశ్చర్యమే గాని అసహజం కాదు.

ఇటువంటిదే మరొక ఉదాహరణ చెప్పాలంటే 1944లో హైదరాబాదులో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటు చేయడంలో కీలకశక్తి, ప్రచురణకర్త, స్వయంగా రచయిత, బ్రిటిషాంధ్ర లో నిర్బంధ పరిస్థితులవల్ల హైదరాబాదు నుంచి తెలుగుతల్లి పత్రిక తేదలచినప్పుడు దాన్ని నిర్వహించినవాడు, 1945 మహాసభల్లో కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైనవాడు వట్టికోట ఆళ్వారుస్వామి. కాని 1947లో ఆయనను నిజాం ప్రభుత్వం నిర్బంధించినప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి అధ్యక్షతన అభ్యుదయ రచయితల సంఘం ఆ నిర్బంధాన్ని ఖండిస్తూ తీర్మానం చేయడానికి నిరాకరించింది. ఆయనను రచయితగా అరెస్టు చేశారనడానికి ఆధారం లేదని తీర్మానాన్ని తోసిపుచ్చారు. తెలంగాణ రచయితల సాహిత్య ప్రతిపత్తి గురించి కోస్తా రచయితల వైఖరి అది.

ఇక బమ్మెర పోతన వరంగల్ జిల్లా బమ్మెర గ్రామానికి చెందినవాడని సకల ఆధారాలూ ఉన్నప్పటికీ ఆయనను కడపకు తరలించడానికి ఒక శతాబ్దం పాటు సాహిత్యకారులనుంచి రాజకీయ నాయకులదాకా ఎందరెందరో ఎంత ప్రయత్నించారో చెప్పనక్కరలేదు.

రెండు తెలుగు భాషల మధ్య, రెండు సాహిత్య సంప్రదాయాల మధ్య, “ప్రామాణిక”, ప్రామాణికేతర సాహిత్య ధారల మధ్య కొన్ని దశాబ్దాలుగా సాగిన సంబంధంలో ఒక పార్శ్వం ఇది. దీన్ని ధిక్కరిస్తూ స్వాభిమానాన్ని ప్రకటించిన పార్శ్వం కూడ అంతే బలమైనది. ఒకరకంగా సురవరం ప్రతాపరెడ్డి ప్రారంభించిన ఆ స్వాభిమాన కాంక్ష, వాస్తవచరిత్ర రచనాకాంక్ష తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో బలోపేతమయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో సాహిత్య చరిత్ర పునర్లేఖనం – వాస్తవ లేఖనం – జరగవలసి ఉంది. వర్తమానం గతంతో సంభాషించవలసి ఉంది. వర్తమానం ప్రసరించే కొత్త వెలుగులో గతం భాసిల్లవలసి ఉంది. గతవర్తమానాల మేలుకలయికగా భవిష్యత్తును సంపద్వంతం చేయవలసి ఉంది.

 

మంచి కథల కోసం ఒక అన్వేషణ!

2 (1)

ఇది ప్రస్తుతం వస్తున్న కథల గురించి మాటా మంతీ. ఒక నెలలో వచ్చిన కథలన్నీ పరిశీలించి, అందులో కొన్ని ఉత్తమమైన కథలని ఎన్నుకోవడం, ఆ కథలను, కథకులను అభినందించుకోవడం ఈ శీర్షిక ప్రధాన ఉద్దేశ్యం.

ఈ పనిని మేము నిర్వహించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి.

వాటిల్లో ముఖ్యమైనదీ, మొట్టమొదటిదీ – ఇలాంటి ప్రయత్నం ఈ మధ్య ఏ పత్రికలోనూ జరగకపోవడం! ఏడాది తరువాత కొన్ని పత్రికలు ఒక సింహావలోకనాన్ని వెయ్యడం, కొన్ని సంవత్సర సంకలనాలలో సమీక్షా వ్యాసాలు రాయడం జరిగినప్పటికీ వాటికి ఎక్కువ కథలను స్పృశించే అవకాశం తక్కువ.

ప్రస్తుతం ఉన్న రకరకాల ప్రింట్ పత్రికల్లోనూ, ఆన్‌లైన్ పత్రికల్లోనూ కలిపి సగటున నెలకి దాదాపు నూట యాభై కథల దాకా వస్తున్నాయి. ఏ కథలో ఏముందో, ఏ కథ ఎవరు రాశారో, ఏ మంచి కథ ఎందులో వచ్చిందో, అసలు ఏ పత్రిక ఎప్పుడు వస్తోందో – ఈ విషయాలన్నీ పాఠకులకి ఓ పద్ధతి ప్రకారం చేరడం లేదని కొంతకాలంగా గమనిస్తూనే ఉన్నాం. అసలు పత్రికలు దొరకబుచ్చుకోవటమే ఓ శ్రమగా మారిన తరుణంలో మంచి కథ వచ్చిందని తెలియడం, ఆ పత్రిక కోసం ప్రయత్నం చేసి చదవడం పాఠకుడు చేస్తాడని అనుకోవడం అత్యాశే అవుతుంది. అదీగాక, ఇన్ని వందల కథలని దాటుకునిగానీ ఒక మంచి కథని అందుకునే దాకా పాఠకుడికి ఓపిక ఉంటుందా? అన్నది మరో ప్రశ్న. ఓ మంచి కథ పాఠకుడికి తెలియకుండానే మరుగున పడిపోవడం ఆ కథకీ, రచయితకే కాదు సాహిత్యానికీ సమాజానికి కూడా చెడు చేసినట్లే కదా? అలాంటి ఒక వెలితిని పూరించడం మా ప్రయత్నం తాలూకు మరో లక్ష్యం.

అంతే కాదు – కథల గురించిన మంచీ చెడ్డా మాట్లాడటం ఎవరో ఒకరు మొదలెడితే, అలాంటి సంప్రదాయాన్ని మిగతా పత్రికలు కూడా అనుసరిస్తే – ‘మంచి కథ’ గురించి ఆలోచనా, అవగాహనా, స్పృహా, అభిరుచీ అటు రచయితల్లోనూ, ఇటు పాఠకులలోనూ పెరిగి – మంచి కథలు మరిన్ని రావడానికి దోహదపడగలదన్న ఒక చిరు ఆశ కూడా మా ఈ ప్రయత్నానికి ఒక కారణం.

మంచి కథల వార్షిక సంకలనాలని ప్రచురిస్తున్నవారు, ఆన్‌లైన్ పత్రికల్లో వస్తున్న కథలని ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదు. రాసిన కథకి డబ్బు రూపంలో ప్రతిఫలాన్ని ఆశించకుండా ఈ పత్రికలకి రాస్తున్న రచయిత/త్రులకి కనీసం గుర్తింపు రూపంలోనైనా సరైన న్యాయం జరగడం లేదన్న ఉద్దేశంతో, వాటిని కూడా మేము పరిశీలించాలీ అన్న సదుద్దేశంతో కూడా ఈ శీర్షిక ప్రారంభిస్తున్నాం.

***

 

ఇలాంటి ప్రయత్నాన్ని ఏ ఒక్కరో చేస్తే, వ్యక్తిగతమైన మమకారావేశాల వల్ల నిర్ణయాల్లో కొన్ని లోటుపాట్లు జరిగే అవకాశం వుంటుంది. అలాంటి అవాంఛనీయమైన పరిస్థితులు తలెత్తకుండా ఉండటం కోసం ముగ్గురం కలిసి కథలని విడివిడిగా చదివి; వస్తువు, కథానిర్మాణం, శైలి వగైరా అంశాల మీద మార్కులు వేసుకొని; తుది దశలో కథల బాగోగులు చర్చించుకొని మరీ మంచి కథలని నిర్ణయించడం జరుగుతోంది. ఈ మొత్తం ప్రక్రియలో – సబ్జెక్టివిటీ అనే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్టేనని మేము భావిస్తున్నాం!

ఇంత చేసినా ఇది ముగ్గురి సమిష్టి అభిప్రాయమే తప్ప ఏ విధంగానూ యావత్ పాఠకలోకానికో, సాహితీ ప్రపంచానికో ప్రాతినిధ్యం వహించే నిర్ణయం కాకపోవచ్చు. అలాగే కొన్ని పరిమితుల కారణంగా ఏదైనా మంచి కథ/పత్రిక మా పరిశీలనలోకి రాకపోయే అవకాశం లేకపోలేదు. అంచేత మీ దృష్టిలోకి వచ్చిన మంచి కథ/పత్రికలను మాకు ప్రతిపాదించి మా ప్రయత్నాన్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాము.

 

***

జనవరి కథలు

జనవరి నెలకు గాను దాదాపు 140 కథలని పరిశీలించడం జరిగింది. ఈ క్రింది పత్రికల్లోని కథలని పరిగణనలోకి తీసుకోవడం జరిగింది:

ఆదివారం అనుబంధాలు: ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, విశాలాంధ్ర, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, సాక్షి, వార్త

 

వారపత్రికలు: జాగృతి, ఆంధ్రభూమి, స్వాతి, నవ్య

 

మాసపత్రికలు: రచన, నది, ఆంధ్రభూమి, చినుకు, తెలుగు వెలుగు, పాలపిట్ట, మిసిమి, స్వాతి, చిత్ర, విపుల, ప్రస్థానం, స్వప్న, ఆంధ్రప్రదేశ్

 

అంతర్జాల పత్రికలు: కౌముది, సారంగ, ఈమాట, వాకిలి, విహంగ, కినిగె, గోతెలుగు

 

కథలన్నీ చదివితే ముందు మన దృష్టిని ఆకర్షించేది – విభిన్నమైన వస్తువులని ఎంచుకోవడంలో రచయితలు చూపిస్తున్న ఆసక్తి. ఈ పరిణామం ముదావహం. సామాజిక నేపథ్యాలు నిరంతరం మారుతూ ఉండే పరిణామక్రమంలో తరచి చూస్తే, కొత్త కొత్త సామాజికాంశాలూ, వైరుధ్యాలూ, మానసిక కోణాలూ కనిపించక మానవు. అలాంటి వస్తువులని ఎన్నుకొని కథల చట్రంలో ప్రతిభావంతంగా బిగించగలిగిననాడు ‘కథ’ అనేది వర్తమానాన్ని అర్థవంతంగా విశ్లేషించుకోవడానికి ఉపయోగపడగల మాధ్యమం అవుతుంది. అలాగే వస్తువు పాతదైనా అందులో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం కూడా గుర్తించతగినదే.

చిత్రం: కృష్ణ అశోక్

చిత్రం: కృష్ణ అశోక్

ఇప్పుడున్న సంక్లిష్టమైన, సందిగ్ధమైన సామాజిక నేపధ్యం అలాంటి వస్తువులనే ఇస్తుంది. అందువల్ల అవి రచయిత అధ్యయనశీలతనీ, శిల్ప సామర్ధ్యాన్నీ పరీక్షకు పెడుతున్నాయి. అయితే, చాలా మంది రచయితలు కొత్త కథాంశాలను అందిపుచ్చుకుంటున్నా, పూర్తిస్థాయి అధ్యయనం లేకపోవడం వల్లో, అనివార్యమైన మమకారావేశాల వల్లనో ఆ కథాంశాలను చిక్కగా, సమగ్రంగా అందిచలేకపోతున్నట్లుగా తోస్తోంది.

 

ఈ నెల వచ్చిన కథలలో చెప్పుకోదగ్గ కథలను విశ్లేషిస్తే –

 

“ప్లాసెంటా” – పెద్దింటి అశోక్ కుమార్ (అమెరికా ఉద్యోగం కోసం చంటి బిడ్డను వదిలించుకోవాలని ప్రయత్నం చేసే తల్లి), “సహజాతాలు” – విహారి (చదువులు, దొరకని ఉద్యోగాలు వల్ల డిప్రెషన్ లు, కొన్ని తప్పని నిర్ణయాలు)  “డేగలు తిరిగే ఆకాశం” – అరిపిరాల సత్యప్రసాద్ (పీడోఫైల్ ప్రపంచంలో ఓ తండ్రి ఆవేదన), “ఇద్దరు బిడ్డల తల్లి” – వేంపల్లె షరీఫ్ (ప్రాంత, మత జనిత ఉచ్ఛారణా దోషాలు కూడా వివక్షకి కారణమే) ఇవన్నీ వస్తువైవిధ్యాలకి ఉదాహరణలుగా నిలిచే కొన్ని కథలు.

 

కథ ప్రయోజనాల అంశాలని కాసేపు పక్కన పెట్టగలిగితే, ప్రశంసార్హమైన కథనశైలితో కథను నడిపిన ఉదాహరణలు కూడా కొన్ని కనిపించాయి. “సాంత్వనములేక” – తాడికొండ కె శివకుమార్ శర్మ (ముక్తపదగ్రస్త అలంకారంలా దుమికే కథనం), “నిద్రకు మెలకువకూ మధ్య” – పలమనేరు బాలాజీ (మిస్టిక్), “అసమయాల అమావాస్య” – సాయిపద్మ (మాంత్రిక వాస్తవికత), “మంచు” – మూలా సుబ్రమణ్యం (మిస్టిక్ మనిషి ప్రధానపాత్రగా). ఈ కథలలో శైలిశిల్పాలు ఎంత బలంగా వుండి చదివించాయో కథాంశం కూడా అంతే బలంగా వుండుంటే అద్భుతమైన కథలుగా మారే అవకాశం వుండేది. శివకుమార్ శర్మ కథ గొప్ప కథకు అడుగు దూరంలో ఆగిపోయింది. ఎంచుకున్న అంశాలను అన్నింటిని ముడి పెట్టడంలో కాస్త జారు ముడి పడిందని మా అభిప్రాయం.

 

కేవలం కథా కథనాలే కాకుండా సామాజిక/వ్యక్తిగత ప్రయోజనం రీత్యా ప్రస్తావించతగ్గ కథలు కొన్ని ఈ నెలలో కనిపించాయి. “ఆకలి” – పెద్దింటి అశోక్ కుమార్, “వారసులు” – జి. ఉమామహేశ్వర్, “ఇదేన్రీ హింగాయ్తూ” – ఓలేటి శ్రీనివాసభాను మెదలైనవి ఈ కోవకు చెందినవే. పాత కథా వస్తువు, సాధారణమైన కథనం ఉన్నప్పటికీ “సొంత సౌఖ్యము కొంత చూసుకు” – సింగరాజు రమాదేవి, (నవ్య, జనవరి 8), “పర్ణశాల” – దర్భా లక్ష్మీ అన్నపూర్ణ (స్వప్న మాసపత్రిక)  వంటి కథలలో పరిష్కారాన్ని కొత్త పుంతలు తొక్కించారు.

 

మొత్తం మీద చాలా కథలు ఆశావహ దృక్పధంతో ముగిసినట్లు, జనవరి కథలు ఆశావహంగానే అనిపించాయని చెప్పి ముగిస్తున్నాం.

 

జనవరి కథలని అనేక అంశాల ప్రాతిపదికన బేరీజు వేసుకుంటూ పోతే, ఈ కథ మా సమిష్టి అధ్యయనంలో జనవరి-2014 కథలలో ఉత్తమమైన కథగా నిలిచింది!

 

ప్లాసెంటా

తెలుగు వెలుగు

రచయిత: పెద్దింటి అశోక్ కుమార్

ఈ కథ గురించి మా విశ్లేషణ, రచయితతో ముఖాముఖి వచ్చే వారం…

 

మంచి ప్రయత్నం చేసిన ఇతర కథలు, పాఠకులు చదివి విశ్లేషించుకోగల వీలుగల మరికొన్ని కథలు:

  • సాంత్వనము లేక తాడికొండ కె. శివకుమార్ శర్మ (వాకిలి, జనవరి)
  • ఆకలి పెద్దింటి అశోక్ కుమార్ (నవ్య 22, జనవరి)
  • నిద్రకు మెలకువకూ మధ్య పలమనేరు బాలాజీ (నవ్య, 22 జనవరి)
  • డేగలు తిరిగే ఆకాశం అరిపిరాల సత్యప్రసాద్ (ఆదివారం ఆంధ్రజ్యోతి, 26 జనవరి)
  • అసమయాల అమావాస్య సాయిపద్మ (ఈమాట, జనవరి ఫిబ్రవరి సంచిక)
  • వారసులు జి. ఉమామహేశ్వర్ (ఆదివారం ఆంధ్రజ్యోతి, 19 జనవరి)
  • ఇద్దరు బిడ్డల తల్లి వేంపల్లె షరీఫ్ (నవ్య, 8 జనవరి)
  • ఇదేన్రీ హింగాయ్తూ ఓలేటి శ్రీనివాసభాను (నవ్య, 15 జనవరి)
  • సహజాతాలు విహారి (నవ్య, 1 జనవరి)
  • మంచు మూలా సుబ్రమణ్యం (ఈమాట, జనవరి-ఫిబ్రవరి)

– అరిపిరాల సత్య ప్రసాద్, ఎ.వి. రమణ మూర్తి, టి. చంద్ర శేఖర రెడ్డి.

   (లోగో :మహీ బెజవాడ)

02. T Chandra Sekhara Reddy03. Aripirala01. Ramana Murthy

” సారంగ ” రెండో అడుగు!

1

 Saaranga_Logo

 

ఇవాళ “సారంగ” రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టింది.

ఈ రెండో అడుగు వేసే ముందు నిన్నటి అడుగుని కాసేపు తరచి చూసుకోవాలన్న తపనే ఈ నాలుగు మాటలూ!

“నెలకీ, రెండు నెలలకీ వచ్చే పత్రికలే నడవడం కష్టంగా వుంది. మీరేమిటి వార పత్రిక అంటున్నారు? చాలా కష్టం! చాలా పని! అసాధ్యం!”

సారంగ “వార” పత్రిక అనే ఆలోచనని మొదటి సారిగా నలుగురితోనూ పంచుకున్నప్పుడు తక్షణమే వచ్చిన ప్రతిస్పందన అది. అలాంటి ప్రతిస్పందనలో ఆశ్చర్యమేమీ లేదు.

ఇంకో వెబ్ పత్రిక నిర్వహణ కష్టం అని మిత్రులు హెచ్చరించడం వెనక – సారంగకి ముందే అనేక వెబ్ పత్రికలు  వుండడం వొక కారణం. గత కొన్ని దశాబ్దాలుగా  సమకాలీన వెబ్ పత్రికలు   చేసిన/ చేస్తున్న కృషికి అప్పటికే మంచి గుర్తింపు వుంది.  2000 సంవత్సరం తరవాత పుస్తక పఠనం వొక మంచి అభిరుచిగా స్థిరపడడంలో ఈ- పత్రికలు తోడ్పడ్డాయి. అదనంగా బ్లాగులు చేస్తున్న కృషి కూడా చిన్నదేమీ కాదు. బ్లాగుల వల్ల రచయితకి కొత్త అభివ్యక్తి స్వేచ్చ దక్కింది. ఏది సాహిత్యం ఏది కాదు అన్న మౌలికమైన ప్రశ్నతో సంబంధం లేకుండా, అభివ్యక్తి వుంటే చాలు అనే భావన ప్రధానమైంది. అత్యాధునిక సాహిత్యానికి సంబంధించి ఇది చాలా ముఖ్యమైన మార్పు. అలాగే, తెలుగు సాహిత్యంలో ప్రయోగ దృక్పథం పెరగడానికి కూడా ఈ అభివ్యక్తి స్వేచ్చ అవసరం.

దీనికి తోడు, అచ్చు పత్రికల ప్రాముఖ్యం, ప్రాచుర్యం కూడా పెరిగింది గతంతో పోలిస్తే! అచ్చు పత్రికలూ గతంలో పెట్టుకున్న మూసల్ని తొలగించుకొని, కొత్త వ్యక్తీకరణలకు స్వాగతం పలకడం మేలు మలుపు.  అన్నిటికీ మించి,  పుస్తకాల అందుబాటు చాలా అంటే చాలా పెరిగింది. ఇటీవలి కాలంలో  అచ్చు పుస్తకాల అమ్మకాలు పెరిగాయని రచయితలూ చెప్తున్నారు, పుస్తకాల వ్యాపారులూ చెప్తున్నారు. అంతర్జాలం వాహికగా ఈ-పుస్తకాల వ్యాప్తికి  కొన్ని సంస్థలు నడుం బిగించడం  ఇంకో మలుపు.

అంతర్జాలం వల్ల ఇతర భాషా సాహిత్యాల గురించి తెలుసుకునే/ నేర్చుకునే వనరులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇంతకూ ముందెన్నడూ లేనంతగా తెలుగు రచయితకి పరభాషా రచయితలతో సమాచార బంధం ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్ లో వెలువడిన ప్రతి పుస్తకం ఆఘమేఘాల మీద తెలుగు రీడర్ కి అందుతోంది. “రీడర్” అంటే- చదువరి – స్వభావంలో కూడా మార్పు వచ్చిందని ఇటీవలి సర్వేలూ, అధ్యయనాలూ చెప్తున్నాయి. ఆ మాటకొస్తే, సాహిత్య సిద్ధాంత పరిభాషలో “రీడింగ్” అనే ప్రక్రియకి  అర్థమే మారిపోయింది, అది వేరే సంగతి!

ఈ నేపథ్యంలో ‘సారంగ’ వొక వారపత్రికగా చేయాల్సిందేమైనా వుందా అన్న ప్రశ్నతో మా ప్రయాణం మొదలయింది. వ్యక్తులుగాని, సంస్థలు గాని, పత్రికలు గాని చేయాల్సింది ఎప్పుడూ ఎదో వొకటి వుండనే వుంటుంది. కొన్ని సార్లు ఈ లక్ష్యాలు  స్పష్టంగా  వుండకపోవచ్చు, మరికొన్ని సార్లు బల్లగుద్ది చెప్పినంత స్పష్టంగానూ వుండవచ్చు.  వొక అడుగు వేసినప్పుడు ఆ అడుగు ఎటు వెళ్తుందని ముందే అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు. కొన్ని సార్లు కొన్ని అడుగులు మాత్రమే వొక  మొత్తం ప్రయాణపు అనుభవాన్ని ఇవ్వచ్చు.

అలాంటి చిన్ని అడుగుల ప్రయాణ అనుభవాల్ని మాత్రమే నమ్ముకొని  “సారంగ” మొదటి అడుగేసింది. ఈ తొలి అడుగు  తన హృదయంపై చెరగని ముద్ర వేసిందని మాత్రం  ఇప్పటికిప్పుడు ఖాయంగా నమ్ముతోంది “సారంగ”.

163172_1692339581282_7888317_n                                                      

   2                                          

వొక ఏడాది కాలంలో సాధించేది ఎంత వుంటుందో లెక్కలు తెలియవు ‘సారంగ’కి!

సాహిత్యం ఎంత కాదన్నా- ప్రసిద్ధ విమర్శకుడు రాచమల్లు రామచంద్ర రెడ్డి గారన్నట్టు- ‘హృదయ వ్యాపారం’! ఎంత హృదయగతమైన పని అయినా, తీరికలేని వృత్తి వ్యాపకాల మధ్య పత్రికని వారం వారం వివిధ శీర్షికలతో, నిండుగా  తీసుకురావడం కష్టమే. అయినా, ఈ ఏడాది కాలంలో వొక్క వారం కూడా “సారంగ” గైర్ హాజరీ లేదు. ఇలా ప్రతి  గురువారం  “మై హూ” అనుకుంటూ వేళ తప్పక మీ ముందు వుండడమే ఈ ఏడాది ‘సారంగ’ సాధించిన పెద్ద విజయం!

అయితే, ఈ విజయం ‘సారంగ’లో భాగస్వాములైన మీ అందరిదీ. ముఖ్యంగా, ఎప్పటికప్పుడు సారంగ గడువుల్ని దాటకుండా రచనలు పంపిన ప్రతి వొక్కరిదీ. ఈ ఏడాది కాలంలో ఎంతో మంది పాత కొత్త రచయితలు ‘సారంగ’ లో రాశారు. రచయితలకు వాళ్ళకి అంతకుముందే వున్న కీర్తికిరీటాల్ని బట్టి కాకుండా కేవలం “రచన” మాత్రమే ఏక ప్రమాణంగా “సారంగ” రచనల్ని ఆహ్వానించింది. కొత్త కాలమిస్టులని తెలుగు పత్రికాలోకానికి పరిచయం చేసింది. కొన్ని సందర్భాల్లో ఉత్తమ పాఠకుల్ని రచయితలుగా అరంగేట్రం చేయించింది.  మంచి పుస్తకాలు కనిపించినప్పుడల్లా భేషజం వీడి, ఈ పుస్తకం గురించి మీరు  రాయచ్చు కదా అని వుత్సాహపరచింది. ఇది రచన అవుతుందా కాదా అన్న సత్సంశయంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు “అవును, అది రచనే!” అని వెన్ను తట్టింది.  సకాలంలో రచనలు పంపుతూ, తోటి రచయితల రచనల మీద వ్యాఖ్యానాలు చేస్తూ, సారంగని నలుగురితోనూ పంచుకుంటూ, చర్చల్లో సారంగకి కాస్త చోటిస్తూ మీ అందరూ చూపించిన అభిమానం…వీటన్నిటినీ లెక్కలు కట్టే కొలమానాలు  మన దగ్గిర లేవు, కనీసం మా దగ్గిర లేవు!

3

ఏడాది కిందట సారంగ తొలి సంపాదకీయంలో ఇలా రాసుకుంది:

రచయితలకు అనువయిన ప్రచురణ వాతావరణాన్నీ, సంస్కృతినీ ఏర్పరచాలనీ, లాభాలు ఆశించని, రచయిత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయని, పఠిత ఆకాంక్షలకు అనువైన ప్రచురణ రంగం ‘సారంగ’ కల.

తెలుగు సమాజం ఎన్నో వొడిదుడుకుల్ని, వొక ప్రాంతీయ  విభజననీ ఎదుర్కొన్న ఈ ఏడాది తరవాత కూడా ‘సారంగ’ కల అదే!

నిజంగా చెప్పాలంటే, తెలుగు సమాజం, సాహిత్యం  ఇంతకుముందెన్నడూ అనుభవంలోకి రాని అచ్చంగా వొక సవాల్ వంటి పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కొంటోంది. ఇప్పటిదాకా తెలుగు అంటే వొకటే రాష్ట్రం, ఇక నించి తెలుగు అంటే రెండు రాష్ట్రాలు.

మనలో చాలా మంది వొకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో బతికిన వాళ్ళమే! ఇప్పుడు ఎవరి కుటుంబం వాళ్ళదే! మారుతున్న ఆర్ధిక, సాంస్కృతిక, సామాజిక అవసరాల వల్ల ఇప్పుడు అందరమూ కలిసే వుంటాం అంటే కుదరదు. కలిసి వుండాలి అనుకోవడం అందమైన కల! నిజమైతే బాగుణ్ణు అనిపించే కల. కానీ, విడిపోవాలి అన్న భావన వచ్చిన తరవాత బలవంతంగా కలిపి వుంచాలనుకోవడం వాస్తవికతని అర్థం చేసుకోలేక పోవడమే అవుతుంది. ఇది కుటుంబాల విషయంలోనే కాదు, సమాజాలు, వాటి  సాంస్కృతికత విషయానికి వస్తే ఇంకా బలంగా కనిపించే భావన. విడిగా వుండడం అనేది వొక పాలనా సౌకర్యం అనీ, అందులో ఇద్దరికీ వొద్దికైన  వెసులుబాట్లు వుంటాయని ఇంకా మనం అర్థం చేసుకోవాల్సి వుంది. ఈ అర్థం చేసుకునే క్రమం (process) లో చాలా దుఃఖం వుంది. అయినా, వాస్తవికత మన అన్ని దుఃఖాల కన్నా బలమైన శక్తి. మరీ ముఖ్యంగా, తెలుగు రచయిత ఇక నించి తనని కేవలం “ఆంధ్ర” రచయితగానే కాకుండా  తెలంగాణా రచయితగా కూడా ఎట్లా చూసుకోవాలో వొక పెద్ద సవాల్! రాజకీయ విభజనని సాంస్కృతిక, సాహిత్య ‘విభజన’గా ఎట్లా అవగాహనకి చేసుకోవాలో మనకి అనుభవంలో లేని విషయం. ఈ విభజన అసలు సాహిత్య రంగంలోకి ఎట్లా అనువాదమవుతుందో కూడా జీర్ణం కాని విషయం.

కాని, ఈ అనుభవంలోంచి మనం నేర్చుకోవాల్సిన సాంస్కృతిక పాఠం వొకటి వుంది. స్త్రీవాదం వచ్చేంత దాకా  మనలోపల స్త్రీ/పురుష ప్రపంచాలు విడిగా వుండవచ్చు అన్న నిజాన్ని మనం జీర్ణించుకోలేక పోయాం. స్త్రీ ‘స్వరాన్ని’ పురుషుడు కాకుండా స్త్రీ మాత్రమే వినిపించినప్పుడు ఆ అనుభవం ఎంత బలంగా వుండవచ్చో మనకి స్త్రీవాద సాహిత్యం నిరూపించింది. అలాగే, దళితులూ ముస్లింలూ వాళ్ళ వాళ్ళ గొంతు విప్పే దాకా వాళ్ళ సమస్యల తీవ్రత మనకి అర్థం కాలేదు. ఆ అస్తిత్వాలు మన సాహిత్యాన్ని ఎంతగా మార్చాయో ఇప్పుడు చరిత్ర చెప్పక్కరలేదు. తెలంగాణా ప్రాంతీయ అస్తిత్వం దీనికి భిన్నమైనదేమీ కాదు. ఆ అస్తిత్వాలు ఆత్మ గౌరవం నిలుపుకోవడానికి కొన్ని సార్లు తీవ్రంగా పోరాడాల్సి వుంటుంది. ఇవాళ తెలంగాణా పడుతున్న వేదన కూడా అదే! ఈ వేదనని ఎవరైనా అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా ప్రపంచ  బాధని తన బాధగా పలికించగల సాహిత్య లోకం! ఈ అస్తిత్వ ఉద్యమాల స్వరాన్ని నిరాకరించడం మన సాహిత్య చరిత్రని మనమే అవమానించడం! మనలో వస్తున్న మార్పుని మనమే నిరాకరించడం!  అస్తిత్వ ఉద్యమాల విలువని ‘సారంగ’ వార పత్రిక గౌరవిస్తుంది,  అవి సాహిత్య చరిత్రని మంచి మలుపు తిప్పేంత వరకూ! మన సంస్కారాల్ని వీలయినంత ఉత్తమ స్థితికి నడిపించేంత వరకూ!

375519_2750719010296_83144504_n

4

వారపత్రిక అనగానే నిజంగానే బోలెడు పని!

నిజమే, ఇది ఏదో మూడు చేతుల మీదుగా – అవీ ఇతర రోజువారీ పనుల మధ్య వుండి – తీరిక చిక్కించుకొని పని చేస్తున్న చేతులు. అందుకే, రచయితల్ని మేం పదే పదే కోరింది వొక్కటే- వీలయినంత మటుకు దోషరహితమైన ప్రతులు పంపించమని! ఇప్పటికీ కొన్ని రచనల్లో అక్షరదోషాలు వస్తూనే వున్నాయి. వాటిని తొలగించడంలో రచయితల సహకారాన్ని కోరుతున్నాం.

రెండో సంవత్సరంలోకి అడుగుపెడుతూ “సారంగ” కొన్ని కొత్త శీర్షికలని మీ ముందుకు తీసుకు రాబోతోంది.

1. ముఖ్యంగా ఇప్పుడొస్తున్న కథల మీద తగినంత చర్చా, విశ్లేషణ ఇంకా జరగాల్సే వుంది. ఈ కథా చర్చకి నాందిగా అరిపిరాల సత్యప్రసాద్, డి. చంద్రశేఖర రెడ్డి, బీ.వీ. రమణ మూర్తి లు “నడుస్తున్న కథ” శీర్షికలో ఏ నెలకి ఆ నెల వెలువడుతున్న కథల మీద చర్చ చేయబోతున్నారు. ఈ చర్చలో మీరూ పాల్గొనండి. కొత్త కథల మీద, వాటి బలాలూ బలహీనతలు చెప్పే విధంగా మీ విమర్శక గొంతు వినిపించండి. ఈ శీర్షిక నిర్వహణకి ఎంతో సమయమూ, వోపికా, ఆలోచనా పెడ్తున్న ఈ ముగ్గురు కథాప్రేమికులకు “సారంగ” ధన్యవాదాలు చెప్పుకుంటోంది.

2. ఒక కథా రచయిత సమకాలీన జీవితం గురించి, మారుతున్నసాంస్కృతిక జీవనం గురించి డైరీ రాసుకుంటే ఎలా వుంటుంది? అన్న ఆలోచనలోంచి పుట్టిన శీర్షిక ప్రముఖ కథకుడు కూర్మనాధ్ కాలమ్ “My Space.”

౩. రెండు తెలుగు రాష్ట్రాల ముందు వున్న ప్రస్తుత సాహిత్య సమస్య: తెలుగు సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం. ప్రముఖ సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు ఎన్. వేణుగోపాల్ అందిస్తున్న శీర్షిక “గత వర్తమానం.”

4. యాత్రా స్మృతుల గురించి, ప్రత్యామ్నాయ సినిమాల గురించి, ఇంకా అనేకానేక సమకాలీన విషయాల గురించి లలిత కలం నుంచి రానున్న ” చిత్ర యాత్ర” .

5. సున్నితమైన ఆలోచనా, స్పందించే మనసూ వున్న వ్యక్తికి ప్రతి సంఘటనా ప్రతి అనుభవమూ వొక చిన్న యుద్ధమే. అలాంటి సంవేదనల చిత్తర్వు ప్రముఖ సాహిత్య విమర్శకుడు జీ. యస్. రామ్మోహన్ అందిస్తున్న కానుక ఈ సంచికతోనే ప్రారంభం.

ప్రస్తుతానికి ఇవి కొన్ని మాత్రమే! ఇంకా  కవిత్వ, వచనప్రక్రియలకు సంబంధించిన కొన్ని శీర్షికలు రూపు దిద్దుకుంటున్నాయి. వాటి గురించి వీలు వెంబడి వివరాలు అందిస్తాం.

ఇక ఇప్పటి వరకూ వున్న పాత శీర్షికలు యథాతధంగా కొనసాగుతాయి.  కథా సారంగ 2013 నిర్వహణలో మాకు పూర్తి సహాయసహకారాలు ఇచ్చి  కొన్ని మంచి కథల్ని అందించడంలో మాకు తోడ్పడిన వేంపల్లె షరీఫ్ కి ధన్యవాదాలు. ప్రతి ఏడాది వొక రచయితకి కథా సారంగ నిర్వహణ పూర్తి బాధ్యతలు అప్పజెప్పాలన్నది మా నిర్ణయం. కథా సారంగ 2014 కొత్త ఎడిటర్ పేరుని త్వరలో ప్రకటిస్తాం.

*

(చిత్రాలు: అన్నవరం శ్రీనివాస్, ఏలే లక్ష్మణ్)