నాస్తికోద్యమ మేరుపర్వతం లవణం…

రాలిపోయింది.
నాస్తికోద్యమ మేరుపర్వతం నేలకొదిగి పోయింది.
ప్రజాస్వామిక విప్లవకారుడి ప్రస్థానం ఆగిపోయింది .
స్వాతంత్ర సమరయోధుడే కాదు సాంఘిక సమర సైనికుని  జీవితం ముగిసింది. కానరాని సుదూరతీరాలకు పయనమై వెళ్లిపోయింది.
నిత్యం నూతన సాధనాల అన్వేషణ చేసే ఆ శ్వాస నిలిచిపోయింది.
నవయువకుడిలా ఆలోచించే ఆయన జీవితం ముగిసిపోయింది.
మేమంతా నాన్నగారు అని గర్వంగా చెప్పుకునే, అభిమానంతో పిలుచుకునే  గోపరాజు లవణం ఇకలేరు.  మరణం అనివార్యం అని తెలుసు. అయినా ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది.  కానీ తప్పదుగా…భారత్‌ కే కాదు  ప్రపంచ దేశాలకు మహత్మాగాంధీజీ మార్గాలు, నియమాలు సూక్తులు సర్వదా అనుసరణీయమని నమ్మిన గాంధేయవాది,  మానవతావాది లవణం గారితో నాకున్న పరిచయం, అనుబంధం తక్కువేమీ కాదు. ఆయన్ని మేమంతా (సంస్కార్ కార్యకర్తలు )అంకుల్ అనీ,  నాన్నగారూ అని పిలుచుకుంటాం.

లవణం గారితో నా పరిచయం ఈనాటిది కాదు. ముప్పై ఏళ్ళ క్రితం 1985లో మొట్టమొదటి సారి ఆయన్ని కలిశాను. అయితే , అంతకు ముందే మా నాన్న నోట ఆయన గురించి విని ఉండడం వల్లేమో మొదట చూసినప్పుడు ఒకింత ఎగ్జైట్ అయ్యాను.   తిరుపతిలోని  శ్రీ వెంకటేశ్వరవిశ్వద్యాలయం వారు అంతర్జాతీయ జాతీయ సేవాపథక కార్యక్రమం  శ్రీకాళహస్తి లో నిర్వహించారు. ఆ కార్యక్రమంలో నేనూ శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం నుండి కార్యకర్తగా పాల్గొన్నాను. అది పది రోజుల కార్యక్రమం. ఆ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ , అంతర్జాతీయ వాలంటీర్ లనుద్దేశించి ప్రసంగించడానికి ఓ రోజు  స్పీకర్ గా వచ్చారు లవణం దంపతులు.

అంతకు కొద్దిగా  ముందే యూరోప్ లో పర్యటించి వచ్చిన లవణం యువతని ఉత్తేజితం చేసే  ప్రసంగం చేశారు. అదే రోజు సాయంత్రం నుండి పొద్దుపోయే వరకూ మా మిత్ర బృందం లవణం గారితో నాస్తికత్వంపై వాదప్రతివాదనలు. తన వదనా పటిమ, వాక్చాతుర్యంతో ఎదుటివారిని తన వాదనని ఒప్పుకునేలా చేసే అద్భుతమైన తీరు, ఏ విషయమైనా అనర్ఘళంగా మాట్లాడగల శక్తిని, వ్యక్తిని చూడడం అదే మొదటిసారి. నాస్తికత్వం గురించి చేసిన వాదనలు ఎంతోకాలం వెంటాడుతూనే ఉండేవి. ఆ తర్వాత పదేళ్ళ కాలం గడచిపోయింది. విచిత్రం ఏంటంటే నేను వివాహానంతరం నిజామాబాద్ జిల్లా వర్నికి వెళ్ళాను.  అప్పటికే అక్కడ నాస్తిక మిత్రమండలి కార్యక్రమాలు , జోగినీ దురాచార నిర్మూలన కార్యక్రమాలు చేపట్టారు లవణం దంపతులు. అదిగో అప్పుడు మళ్లీ కలిశాను. అప్పటి నుండీ కలుస్తూనే ఉన్నాను . కారణం వారి సంస్థ సంస్కార్ కార్యకలాపాల్లో నేనూ భాగస్వామిని కావడమే. లవణం గారెప్పుడూ తమ దగ్గర పనిచేసే కార్యకర్తగా  చూడలేదు. ఓ కూతురుగానే చూసేవారు.  నేను సంస్కార్ లో చేరడానికి కొద్దిగా ముందు నా కన్న తండ్రి వల్లూరిపల్లి రంగారావు గారు పోవడం వల్లేమో లవణం గారితో మాట్లాడుతుంటే మా నాన్న గుర్తోచ్చేవారు.  బహుశా ఆ లోటు భర్తీ లవణంగారితో చేసుకున్నానేమో !

lavanam2005 అక్టోబర్ వరకూ ఆయన సంస్కార్ చైర్మన్ గానూ, నాస్తికోద్యమ నాయకుడిగానూ,  నాన్నగారిగానూ  మాత్రమే చూశాను. ఆతర్వాత CIDA/KRIS ఆహ్వానం మేరకు ఆయన నేతృత్వంలో  స్వీడెన్ , ఫిన్లాండ్ దేశాల పర్యటనకు బృందంలో నేనూ ఉండడంతో  ఆయన్ని లోతుగా చూసే, పరిశీలించే అవకాశాన్నిచ్చింది.  సమాజాన్ని ఆయన చూసే దృక్కోణం ఏమిటో కొద్దిగా నైనా అర్ధం చేసుకునే అరుదైన సమయం దొరికింది.

లవణం గారు  ఓ మానవతావాదిగా, నాస్తికుడిగా , దేశ గౌరవం ఏమాత్రం తగ్గకుండా చేసే ఉపన్యాసాలు , అక్కడి మిత్రులతో జరిపిన సంభాషణలు ,గాంధీ అంటే రాట్నం – మార్క్స్ అంటే తుపాకినేనా ? కాదంటూ చేసిన ప్రసంగాలు అక్కడి పత్రికలలో చోటుచేసుకోవడం, Political violence in India – A Gandhian Approach to Peace అనే అంశంపై స్వీడెన్ లోని ఐక్యరాజ్యసమితికార్యాలయంలో చేసిన ప్రసంగం, ఫిన్లాండ్ లోని  హెల్సింకి, కార్హులా, తుర్కు పట్టణాలలోను  చేసిన ప్రసంగాలు, నక్సలైట్లతో చర్చలకు సిద్దం అంటూ ఆయన వేసిన కరపత్రాలపై అక్కడిమిత్రులతో చేసిన చర్చలు ఆయనలో నాకు తెలియని ఎన్నో కోణాలని చూపాయి.  నా ఆలోచన విస్తృతం కావడానికి,  విశాలమవడానికి మార్గం దోహదం చేశాయి.

విప్లవం ,ప్రజాస్వామ్యం  రెండూ ప్రజల కోసమే అయినప్పుడు రెండూ కలసి ప్రజల కోసం పనిచేసే అవకాశాలు రావాలని కోరుకున్నారు లవణం.  ప్రతి పౌరుడు ఒక ప్రజాస్వామిక విప్లవవీరుడు అయితే ప్రజాస్వామిక పద్దతిలో విప్లవాత్మక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు తప్పక ఉంటాయని అయన ఆలోచన.మారుతున్న సమాజంలోని సమస్యలకు అనుగుణంగా నూతన సాంఘిక విప్లవ సాధనాలు వెతకాలన్న ఆలోచనలోంచే, కొత్తబాటలు వేయాలన్న కలల్లోంచే పదేళ్ళక్రితం  నక్సలైట్లకు బహిరంగలేఖ రాసి ఉండవచ్చు. సర్వోదయ నాయకుడిగా , గాంధేయవాదిగా ప్రపంచానికి తెలిసిన లవణం తుపాకీ తమ అవయవాల్లో అంతర్భాగంగా ప్రకటించుకున్న నక్సలైట్లతో కలసి నూతన విప్లవ మార్గాలు వెదుకుదాం అంటూ పిలుపు నివ్వడం, వారితో కలసి చర్చించడానికి వారెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని ప్రకటించడం చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుందెవారికైనా .  రెండు విభిన్న మార్గాల్లోని వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య సమన్వయం ఎలా కుదురుతుందని సందేహం కలుగుతుంది. కానీ లవణం గారు మాత్రం గాంధీ – మావోల మధ్య సమన్వయము కోరుకున్నారు. అందుకు తనవంతుగా కృషి చేస్తానని ప్రకటించారు.
IMG_1450
గుంటూరు జిల్లాలోని స్టువార్టుపురం నేరస్తుల సంస్కరణ, నిజామాబాద్ , మెదక్ జిల్లాల జోగినీ వ్యవస్థ నిర్మూలన , పునరావాస కార్యక్రమాలతో లవణం దంపతులు స్వాతంత్ర్యానంతర సంఘ సంస్కర్తలు గానే కాక సాంఘిక విప్లవకారులుగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. రహస్యం కంటే బహిరంగంలో ఎక్కువ శక్తి ఉందేమొనని వివిధ కార్యక్రమాలు చేసిన అనుభవంతో అంటారు లవణం గారు.  తను చైర్మన్ గా ఉన్న సంస్కార్ లో తీవ్ర  సంక్షోభం తలెత్తినప్పుడు ఎదుటివారితో ఆయన వ్యవహరించిన తీరు మరచిపోలేనిది. ఆ సమయంలో ఆయనలో ఉక్కుమనిషిని చూశాను.
స్వీడన్ పర్యటనలోను, మనదేశంలోనూ  ఫండింగ్ ఏజెన్సీస్ తో ఆయన నిక్కచ్చిగా వ్యవహరించిన తీరు నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది. తమ సంస్థలకి  విదేశీ నిధులు సంపాదించడం కోసం దేశాన్ని అత్యంత పేదరికంలో మగ్గుతున్న దేశంగా , ఇక్కడి పేదరికాన్ని భూతద్దంలో చూపించి నిధుల వేట సాగించే సంస్థలు ఎన్నో ఉన్న సమయంలో తన గౌరవాన్ని , సంస్థ గౌరవాన్ని , దేశ గౌరవాన్ని తాకట్టుపెట్టని అయన గొప్పదనం, వారితో వ్యవహరించిన ఖచ్చితమైన తీరు నన్ను అబ్బురపరిచాయి. ఆనందపరిచాయి.లవణం గారిపై తండ్రి గోపరాజు రామచంద్ర రావు గారి ప్రభావం ఎంత ఉందో అంతే ప్రభావం గాంధీ , మార్టిన్ లూథర్ కింగ్ లదీ ఉన్నట్లుగా అనిపించేది. 1966-67లలోనూ ఆ తర్వాత అమెరికా వెళ్లినప్పుడు మూడుసార్లు మార్టిన్ లూథర్ కింగ్ ను కలసి మాట్లాడానని చెప్పేవారు.   అహింసకు సత్యాన్వేషణ ముఖ్యమైనప్పుడు సత్యాన్వేషణ ఆస్తికుల సొంత హక్కు కానప్పుడు, నాస్తికులు కూడా సత్యాన్వేషణ చేస్తున్నారని అంగీకరించినప్పుడు తమ ఆస్తికత్వాన్ని చూసుకునే పద్ధతిలో పెద్ద మార్పు వస్తుంది. అది గాంధీజీలో వచ్చింది. గాంధీని ఆయుధంగా స్వీకరించిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌లో కూడా అటువంటి ఆలోచనే వచ్చింది. అందుకే ఆయన ప్రపంచ శాంతికొరకు నా వంటి నాస్తికులతో కలసి పనిచేయాలని అనుకున్నారు. దురదృష్టం కొద్దీ కింగ్‌ హత్య వల్ల నాకు ఆ అవకాశం లేకుండా పోయింది అనడం చాలా  సార్లు విన్నాను.గత శతాబ్దాన్ని నాలుగు భాగాలుగా విభజించి మొదటి అర్ధభాగాన్ని age of active morality అనీ, ఆ తర్వాతి ఇరవై ఎళ్ళని Age of passive morality అనీ, ఆ తర్వాతి పది పదిహేనేళ్ళ కాలాన్ని Age of passive immorality అనీ , ప్రస్తుతం మనం జీవించేది Age of  active immorality అని చాలా సార్లు చాలా సందర్భాలలో చెప్పేవారు.  సాంఘిక విప్లవంలో ఎంత చిన్న త్యాగమైనా వృధా పోదు . ఎంత పెద్ద త్యాగమైనా సరిపోదు . అసమర్ధతతో పెద్ద త్యాగాలు చేయలేక, అహంకారంతో చిన్న త్యాగాలు చేయక సమాజంలో అన్యాయాలు , అక్రమాలు, దోపిడీని మనమే కొనసాగిస్తున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేసేవారు లవణం.

IMG_1499

కుల మత రహిత వ్యవస్థ ప్రగాధంగా కోరుకునే వారు నాన్నగారు. కులాంతర, మతాంతర వివాహం చేసుకున్నారు. మానవతావాదం వైపు నడిచిన అయన వర్ణాంతర వివాహాలు చేసుకున్న వేలాదిమంది ముందుకువచ్చి తాము కులరహిత మతాతీత సమాజానికి పునాదులమని నిర్భయంగా చెప్పుకోవలసిన అవసరముందని అనేవారు. అందుకు మనం ఒక సామాజిక శక్తిగా రూపొందాలి. వివాహం ఒకప్రక్క వ్యక్తిగత విషయమైతే, మరొకప్రక్క సమాజానికి పునాది అయిన కుటుంబ వ్యవస్థకి శుభారంభం. అందుకే  మా వివాహం వ్యక్తిగతం అనడానికి వీల్లేదు. వివాహంతో కుటుంబాన్ని ప్రారంభిస్తున్నాం. కుటుంబం సమాజ వ్యవస్థకి మూలం. సమాజ వ్యవస్థ విలువల నుంచి పతనమవుతున్నప్పుడు కుటుంబం కూడా దిగజారిపోతుంది అని చాలా సందర్భాల్లో చెప్పేవారు.  మనం కులాల వేర్పాటు మనస్తత్వం నుంచి బయటపడాలి. ప్రస్తుతం ప్రతి కులంలోని ధనికులని ఆ కులంలోని పేదలే రక్షిస్తున్నారు అంటే ప్రతి కులంలోని దోపిడీ దారులను ఆకులంలోని దోపిడీకి గురవుతున్నవాళ్ళే రక్షిస్తున్నారు. అదే ఈ దేశపు ముఖచిత్రం అంటూ పరిస్థితిని విశ్లేషించేవారు.

గత మే లో అనుకుంటా ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతూ – రాజకీయాలు కార్పొరెట్‌ చేతికి వెళ్లిపోవడంతో  వాటిలో మానవ విలువలు తగ్గిపోతున్నాయి .  రాజకీయాలలో తగ్గిపోయిన మానవ విలువలను మత విలువలతో నింపాలన్న ప్రయత్నం జరుగుతోంది. ఇలాగే సాగితే  సెక్యులర్‌ వ్యవస్థ రానురాను మతవ్యవస్థగా మారిపోతుందని ఆవేదన చెందిన లవణం గారి మాటలకి అర్ధం చేసుకుంటూ పరిస్థితుల్ని అన్వయించుకుంటూ ఉన్నా .  చాలా కాలమయింది నాన్నగారితో మాట్లాడి అనుకుంటూనే ఫోన్ చేయడంలో జాప్యం. నాన్నగారికి ఫోన్ చేయడమంటే కాస్త సమయం చూసుకుని చేయాలి. ఆయన చెప్పేవన్నీ వినాలి అప్పుడప్పుడూ ప్రశ్నలు వేయాలి . ఆయన చేసే సామాజిక విశ్లేషణల వెంట పరుగులు పెట్టాలి.

అందలోనే పిడుగులాంటి వార్త . లవణం గారి ఆరోగ్యం బాగుండలేదని. పరిస్థితి క్లిష్టంగా ఉందని. ఆ వార్త తెలియగానే గత నెల 29 న వెళ్లి చూసి వచ్చా. ICU లో ఉన్న ఆయన్ని చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది. దాన్ని అలానే అణచివేస్తూ చూస్తూ నుంచున్నా.   నా చేయి పట్టుకుని నేను బాగానే ఉన్నానురా .. మన వాళ్ళందరికీ చెప్పు. అక్కడ అందరూ బాగున్నారా .. పిల్లలు ఎట్లా ఉన్నారు కుశల ప్రశ్నలు వేసి ప్రమాదం దాటేశానులే ఇక పర్వాలేదు అంటూ మాట్లాడడం మొదలు పెట్టారు.  మాట్లాడుతోంటే కొద్దిగా ఆయాసం వస్తోంది. మీరు ఎక్కువగా మాట్లాడకండి అంటే వింటేనా మాట్లాడుతూనే ఉన్నారు.  నిత్యచైతన్య శీలి అలా మాట్లాడుతూనే ఉంటారని ఓ 15 నిముషాల తర్వాత బయటికి వచ్చేశా.  లవణంగారి చిన్న చెల్లెలు నౌ గోరా గారితో కలసి నాస్తికకేంద్రంకి వెళ్ళాను. వాళ్ళు చెప్పారు పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం, డాక్టర్ల అబ్సర్వేషన్ లోనే ఉండాలని.   లవణంగారు హాస్పిటల్ నుండి తిరిగివస్తారని  ఆశతో వెనుదిరిగా.

ఎవరికీ లేని విధంగా ఉప్పు సత్యాగ్రహసమయంలో పుట్టినందుకు ‘లవణం ‘ చాలా భిన్నంగా ఆలోచించడం చిన్నపుడే అబ్బింది. పదిపన్నెండేళ్ళ వయస్సులోనే 7వతరగతిలో ఉండగా బ్రిటిష్ విద్యావిధానంలో చదవనని బడి మానేశారు. కానీ నడుస్తున్న ఎన్సైక్లోపీడియాలాగా ఆయనకి తెలియని అంశంలేదు. ఏ విషయమైనా ధారాళంగా మాట్లాడేవారు.  పన్నెండేళ్ళ వయస్సులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1944 – 46 లో మహాత్మాగాంధీ వెంట సేవాగ్రాం ఆశ్రమంలో ఉన్నారు. వినోభాభావే , జయప్రకాశ్ నారాయణ్ లతో కలసి భూదానోద్యమంలో పాల్గొన్న లవణం సహచరి విశ్వనరుడు గుర్రం జాషువా కుమార్తె హేమలత.  ఇద్దరూ కలసి అనేక సాంఘిక సమస్యల, రుగ్మతల పరిష్కారం కోసం నూతన మార్గాల్లో పయనించారు.

ఎనిమిదేళ్ళ క్రితం వెళ్ళిపోయిన హేమలత దగ్గరకి వెళ్ళిపోయారు లవణం.  లవణం దంపతులు చేసిన కృషి వృధా పోదు. వారు నాటిన స్పూర్తి బీజాలు ఎందరిలోనో అంతర్లీనంగా  ఉన్నాయి. అవి మరెన్నో బీజాలకు ప్రాణంపోస్తాయి. లవణం గారి ఆశయాలకు జవం , జీవం ఇస్తాయి. వారి నైతిక వారసత్వాన్ని, సామాజిక విప్లవాన్ని ముందుకు తీసుకుపోతాయి. అలా చేయడమే ఆయనకి మనమిచ్చే అసలైన నివాళి.

*

మీ మాటలు

  1. చందు తులసి says:

    నిజం మేడం గారూ….
    గోరా గారు….ఆయన వారసులు చేసిన కృషి తప్పకుండా భవిష్యత్ తరాలకి మార్గదర్శనంగా
    నిలుస్తుంది.మూఢనమ్మకాలు పెరిగిపోతున్న ఈ కాలంలో లవణం గారి లాంటి వారి అవసరం చాలా ఉంది..

    • v. shanti prabodha says:

      మీ స్పందనకి ధన్యవాదాలండీ చందు తులసి గారు, మూఢ నమ్మకాలు పెంచి పోషించే ప్రభుత్వాలు ఉన్న కాలం ఇది. ఇలాంటి సమయంలో లవణం గారి లాంటి అవసరం ఈ సమాజానికి ఎంతో ఉంది. కాని ఇప్పుడాయన లేరు. అలాంటి లవణం లు ఎందఱో తయారవ్వాలి.

  2. buchireddy gangula says:

    తులిసి గారి కామెంట్ తో నేను ఎకబవిస్తాను —
    గోరా గారు — లవణం గారు — లాంటి వాళ్ళు — యీ రాజకీయ దోపిడి వ్యవస్థ కు
    ఎప్పుడూ అవసరమే —
    శాంతి గారు — చక్కగా చెప్పారు —
    లేని పోనీ వారి ఆత్మ కథ ల కన్నా — యి లాంటి వారి జీవితాల ను చదవడం
    అవసరం — ముఖ్యం కూడా —-
    ———————————————————————-
    బుచ్చి రెడ్డి గంగుల

    • v. shanti prabodha says:

      అవునండి గంగుల బుచ్చిరెడ్డిగారు చాలా కరెక్ట్ గా చెప్పారు . ధన్యవాదాలు

  3. sivalakshmi says:

    “వర్ణాంతర వివాహాలు చేసుకున్న వేలాదిమంది ముందుకువచ్చి తాము కులరహిత మతాతీత సమాజానికి పునాదులమని నిర్భయంగా చెప్పుకోవలసిన అవసరముందని అనేవారు”. ఇది నిజం.అలా చెప్పడానికొక వేదిక తయారు కావాలి!
    నువ్వు లవణం గారితో పని చేశావని తెలియదు శాంతీ!
    వ్యాసం బాగుంది.ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి.

  4. shanti prabodha says:

    థాంక్ యు శివలక్ష్మి

  5. Delhi Subrahmanyam says:

    చాలా కొత్త వోశాయలు తెలిపారు. 2013 లో వారిని డిల్లి లో వున్నా ఆంధ్ర విద్యా సంస్థ వారు సన్మనించినప్పుడు వారిని మనకలవాటయిన హిందూ శాస్త్రోక్తం గా సన్మానిస్తే, నాస్తికులయిన వారు ఆ సన్మానం లో తన వ్యతిరేకత చూపలేదు. అది వారి గొప్పతనం. తర్వాత మాట్లాడుతూ తను నాస్తికుడని తెలిసి కూడా అలా సన్మానించినన్దుకు సరదాగా వ్యతిరేకత చూపారు. ఆయన గురించి శాంతి గారు ఎన్నో కొత్త సంగతులు చెప్పారు.అభినందనీయులు. మత రాజకీయాలు ఉధృతం గా చెలామణి అవుతూ, మన ఆలోచనా పద్ధతినే శాసిస్తు, మానవత దృక్పధానికి క్రమంగా తిలోదకాలు ఇస్తున్న ఈ రోజుల్లో లవణం గారు శ్రమ పడిన మానవత వాదం కోసం అందరూ దృష్టి మరల్చాలి. ఎప్పుడూ సామజిక మంచి కోసం రాస్తున్న శాంతి ప్రబోధ గారికి మరొక్క సరి నా హార్దిక అభిననదనలు.

  6. Delhi Subrahmanyam says:

    చాలా కొత్త విషయాలు తెలిపారు. 2013 లో వారిని డిల్లి లో వున్న ఆంధ్ర విద్యా సంస్థ వారు సన్మనించినప్పుడు వారిని మనకలవాటయిన హిందూ శాస్త్రోక్తం గా సన్మానిస్తే, నాస్తికులయిన వారు ఆ సన్మానం లో తన వ్యతిరేకత చూపలేదు. అది వారి గొప్పతనం. తర్వాత మాట్లాడుతూ తను నాస్తికుడని తెలిసి కూడా అలా సన్మానించినన్దుకు సరదాగా వ్యతిరేకత చూపారు. ఆయన గురించి శాంతి గారు ఎన్నో కొత్త సంగతులు చెప్పారు.అభినందనీయులు. మత రాజకీయాలు ఉధృతం గా చెలామణి అవుతూ, మన ఆలోచనా పద్ధతినే శాసిస్తు, మానవత దృక్పధానికి క్రమంగా తిలోదకాలు ఇస్తున్న ఈ రోజుల్లో లవణం గారు శ్రమ పడిన మానవత వాదం కోసం అందరూ దృష్టి మరల్చాలి. ఎప్పుడూ సామజిక మంచి కోసం రాస్తున్న శాంతి ప్రబోధ గారికి మరొక్క సరి నా హార్దిక అభిననదనలు.

మీ మాటలు

*