ఆ పూట మున్నేరు పాడలేదు!

(మహాకవి దాశరథి జయంతి) 

అఫ్సర్ 

 ఆరో తరగతి సెలవులకి ముందే మా ఇంట్లో హడావుడి మొదలయ్యింది.

“మనం ఖమ్మం వెళ్లిపోతున్నాం” అని ఆ సెలవుల ముందే నాన్నగారు ఇంట్లో చెప్పారు.

ఆ ఎండాకాలం చింతకానిలో నాకు చివరి ఎండాకాలం అవుతుందని తెలియదు. నా చదువు మొదలయ్యింది చింతకానిలో! వీధిబడిలో పంతులయ్య గారి మొదటి బెత్తం దెబ్బ తిన్నది చింతకానిలో! తరవాత ప్రైమరీ స్కూలు. ఆరో తరగతి దాకా అక్కడే! బాల్యం దానికదే వొక ప్రపంచం అనుకుంటే, నా ప్రపంచానికి మొదలూ చివరా చింతకానే!

అక్కడే  మా నాన్న గారు బడి పిల్లల కోసం నడిపిన గోడ పత్రిక “మధుర వాణి” లో నేను మొదటి కవిత రాశాను . నాన్నగారికి “కన్యాశుల్కం” కంఠతా వచ్చేది. అప్పుడప్పుడూ స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఆ సంభాషణలు అలా అప్పచెప్పేసే వారు. మధురవాణి ఆయనకి నచ్చిన పాత్ర. అందుకనే, మా గోడ పత్రికకి ఆయన ఆ పేరు పెట్టారు.

మా బడి వార్షికోత్సవానికి ఆ ఏడాది దాశరథి గారిని తీసుకు వచ్చారు నాన్నగారు. అంతకు ముందు రాత్రే నాన్నగారు ఖమ్మం వెళ్ళి, అక్కడ బస చేసి వున్న దాశరథి గారిని చింతకాని పిలుచుకు వచ్చారు.

నాన్నగారు ఎక్కడ పని చేస్తే అక్కడ బడి పిల్లలకి కవుల గురించి చెప్పీ, వాళ్ళ కవిత్వాలూ, పద్యాలూ పాడి వినిపించి సాహిత్యం మీద వొక అంతులేని ప్రేమని పుట్టించే వాళ్ళు.  దాశరథి గారు స్టేషనులో దిగగానే మా బడిలో ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి పిల్లలతో పాటు దాదాపు వంద మంది పైనే అక్కడ ఎదురుచూస్తూ కూర్చున్నాం “మహాకవికి స్వాగతం” అని పోస్టర్లు పట్టుకొని – దాశరథి గారు స్టేషన్లో దిగగానే, అందరం వొక పెట్టున “ దాశరథి జిందాబాద్” అని నినాదాలిస్తూ ఆయన్ని స్టేషన్ బయటికి తీసుకువచ్చాం. (మా వూళ్ళో కమ్యూనిస్టులు ఎక్కువే కాబట్టి, అలాంటి నినాదాలూ, ఊరేగింపులు మాకు కొట్టిన పిండి)

అప్పుడు స్టేషను నించి చింతకాని వూళ్ళోకి పావు గంట పైనే నడిచి వెళ్లాల్సి వుండేది. దాశరథి గారిని ఎడ్ల బండి మీద కూర్చోబెట్టి, ఆయన వెనక మా బడి పిల్లలంతా నినాదాలు ఇస్తూ వూళ్ళోకి తీసుకువచ్చాం. మా ఇంటి దగ్గిర బండి ఆగింది. మా ఇంటి ముందు పెద్ద కోలాహలం. “సాయంత్రం దాశరథి గారు బళ్ళో మాట్లాడతారు. అందరూ అక్కడికి రండి.” అని నాన్నగారు మిగిలిన బడి పిల్లల్ని వెళ్లిపొమ్మన్నారు. దాశరథి గారు అందరికీ వందనం చేస్తూ “ మిమ్మల్ని చూస్తే చాలా ఉత్సాహంగా వుంది నాకు, మీ కౌముది సార్ ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు. అందరినీ సాయంత్రం కలుస్తాను.” అని దాశరథి గారు అందరికీ అప్పటికి వీడుకోలు చెప్పారు.

పిల్లలంతా వెళ్లిపోయాక దాశరథి గారి తో కలిసి మేం మా ఇంటి  ముందు గదిలో కూర్చున్నాం. మాది ఇరుకు కొంప. రెండు గదుల ఇల్లు. ఆరుగురు పిల్లలు.ఒకరు అడుగు పెట్టాలంటే ఇంకొకళ్లు ఖాళీ చెయ్యాలి. అంత ఇరుకు!  మొదటి గది నిండా పుస్తకాలు; నాన్నగారి రాత కుర్చీ, అంటే పడక కుర్చీ.

అయినా అప్పటికే ఇల్లు బాగా సర్ది పెట్టి వుంచింది అమ్మ. అయినా ఇబ్బంది పడుతూ  వుంది. అది గమనించి దాశరథి గారు “ఇల్లు అద్దంలా పెట్టావు బహెన్-జి! నాకేం కావాలే, ఇదిగో కూర్చోడానికి ఈ చోటు చాలు. ఏడీ మా అఫ్సూర్యుడు?” అంటూ ఆయన పడక కుర్చీలో శరీరం వెనక్కి వాల్చి ఆరాంగా కూర్చుని నన్ను దగ్గిరకి తీసుకున్నారు. “నీ పేరులో చంద్రుడు(కౌముది) వున్నాడు కాబట్టి, వీడి పేరులో సూర్యుడు వుండాల్రా!” అని నాన్నగారికి చెప్పి నా పేరుకి ఆ తోక తగిలించారు ఆయన.

(ఆ తరవాత రుబాయిలు రాసే కాలంలో నాన్నగారికి రాసే వుత్తరాల్లో ఈ పేరు మీద ఆయన చాలా రుబాయిలు రాశారు. నాకు గుర్తుంది ఇది:

“ఖమ్మం లో ఎండలు మండిపోతున్నాయని విన్నా. అయినా , కౌముదీ! రేయెండ నువ్వుండ/ ఇంకేల మండుటెండ?)

“బేటా! షాయరీ చదువుతున్నవా?” అని అడిగారు.

లేదు అని తలూపాను, సిగ్గు పడుతూ. అదొక్కటే అప్పుడు తెలిసిన భాష కాబట్టి.

“అరె, యే క్యా హై బేటా! నువ్వు షాయర్ బిడ్డవి!’ అంటూ ఆయన నాన్నగారి వైపు తిరిగారు.

“వాడు రహస్య కవిలే..దాశరథీ!” అని నాన్నగారు అనడం గుర్తు!

ఆ సాయంత్రం దాశరథి గారి సభ బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పటికీ చింతకానిని తలచుకున్నప్పుడల్లా ఆ సాయంత్రపు సభ గుర్తొస్తుంది. కానీ, అది చింతకానిలో నా చివరి స్కూలు వార్షికోత్సవ సభ!

అదే మొదటి సారి నేను దాశరథి గారిని చూడడం! చింతకానిలో అలా ఎంత మంది కవులూ రచయితలూ మా బడికి / మా ఇంటికి వచ్చారో లెక్క లేదు, వచ్చిన వాళ్ళంతా మా ఇంటికి రావడం గొప్పగా వుండేది. చింతకాని వదల్లేకపోవడానికి వున్న అనేక కారణాల్లో ఆ గొప్ప అనుభూతి పెద్ద కారణం!

* * * * * *

Dasarathi_Portrait

మేం ఖమ్మానికి మారడం నాకు పెద్దగా నచ్చలేదు.

“వీడొట్టి పల్లెటూరి మొహం రా!” అని చాలా కాలం బడి పిల్లలు ఎడ్పిస్తూ వుండడం వల్ల ఆ అయిష్టం ఇంకా పెరిగేది అప్పట్లో!పల్లె నించి రావడం వల్ల నాకు పెద్దగా దోస్తులూ ఏర్పడ లేదు. ఆ ఖాళీని భర్తీ చెయ్యడానికి నేను కవిత్వంలో మొహం దాచుకోవడం లేదా తలదాచుకోవడం మొదలు పెట్టాను.

కానీ, కొద్ది రోజుల్లోనే ఖమ్మానికి అలవాటు పడిపోయాను. ఆ రోజుల్లో దాశరథి గారు దాదాపూ ప్రతి నెలా ఖమ్మం వచ్చే వారు, ఆయనంటే ఖమ్మం వాళ్ళకి వున్న విపరీతమయిన గాఢాభిమానం వల్ల!

దాశరథి గారు వచ్చినప్పుడల్లా నన్ను తోడు బెట్టుకొని ఆయన దగ్గిరకి తీసుకు వెళ్ళే వారు నాన్నగారు. లేకపోతే, ఆయనే మా ఇంటికి వచ్చి మా అందరినీ వొక సారి చూసి వెళ్ళే వాళ్ళు. ఖమ్మం రావడం వల్ల ఇదే నాకు జరిగిన మేలు.

దాశరథి గారికి స్నేహితులంటే మహా ప్రేమ!ఒకసారి  స్నేహం కుదిరిందంటే ఇక వాళ్ళు ఆయనకి కుటుంబ సభ్యుల కిందనే లెక్క! ఆయన “యాత్రాస్మృతి” చదువుతుంటే ఆయన ఎంత స్నేహజీవో ఇట్టే అర్థమవుతుంది. లేకపోతే – ఆళ్వార్ గురించి అంత గొప్పగా రాయడం సాధ్యమా?

అసలు ఆళ్వార్లు పన్నెండు మందే

పదమూడో ఆళ్వార్ మా వట్టికోట ఆళ్వార్ స్వామి!

దేవునిపై భక్తి లేకున్నా

జీవులపై భక్తి వున్నవాడు

శరీరంలో ప్రతి అణువూ

ఆరోగ్య స్నానం చేసే రీతిని

నిష్కల్మషంగా నవ్వగలవాడు

రాముడి తెలివితేటలు లేని

అమాయకుడు ఆళ్వార్!

అతను పోయినప్పటి నుంచీ

అమృత హృదయం విచ్చి

నవ్వగలవాడు లేకుండా పోయాడు లోకంలో.

ఈ కవిత నాకు చాలా సార్లు గుర్తొచ్చేది. నిజానికి అది ఆళ్వార్ కంటే బాగా దాశరథి గారికే సరిపోతుందని అనిపిస్తుంది, ఆళ్వార్ నాకు వ్యక్తిగతంగా తెలియదు కాబట్టి!

ఖమ్మంలో వుండగా ఆయన మా ఇంటికి రాగానే మొదట నన్ను పలకరించే వాళ్ళు.“జనాబే ఆలం! క్యా హాల్ హై?” అని నవ్వుతూ అడిగే వారు.

అలా అనేక యేళ్ళు, అనేక  సాయంత్రాలు, అనేక  గంటలు ఆయనతో నాన్నగారి సమక్షంలో  చాయ్ పానీ కబుర్లు నడిచేవి. (వాళ్ళిద్దరూ మద్యసేవనం చేసే వాళ్ళు కానీ, ఇంట్లో ఎప్పుడూ నేను చూడలేదు. మా ఇంట్లో చాయ్ అయిన తరవాత వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళే వాళ్ళు. అప్పుడు నాన్నగారు ఆలస్యంగా ఇంటికి రావడమే నాకు గుర్తు) వాళ్ళ మాటలు ఏమీ అర్థం కాకపోయినా నేను అక్కడే చెవులు రిక్కించుకుని కూర్చునే వాడిని. ఆయన పద్యమో/కవితో పాడితే వినాలని! వొక చుక్క చాయ్ గొంతులో పడగానే, ఆయన చప్పున వొక రుబాయీనో, గజల్నో ఎత్తుకుని తీయగా పాడేవారు.

అలా గాలిబ్ గీతాలు ఆయన గొంతులో విన్నాను. అప్పుడే ఆయన రాయడం మొదలు పెట్టిన తెలుగు రుబాయిలూ విన్నాను. అప్పట్లో నాకు ప్రాచీన సాహిత్యం మీద విపరీతమయిన ఆసక్తి వుండడం వల్లా, అదే సాహిత్యం అనే భ్రమల్లో బతుకుతూ వుండడం వల్లా, తెల్లారి లేస్తే పద్యాలు బట్టీయం పాడుతూ, వృత్తాలతో కుస్తీ పాట్లు పడుతూ వుండడం వల్లా – ఆ రోజుల్లో ఆయన వచన కవిత్వం అప్పట్లో పెద్దగా నచ్చేది కాదు. ఆయన వచన కవిత్వం మొదలు పెట్టగానే నా మనసు యాంత్రికంగా స్విచ్ ఆఫ్ అయ్యేది.

కొన్నాళ్ళ తరవాత – అప్పటికి నేను కాలేజీకి వచ్చేశాక –  ఆ ముక్క దాశరథి గారిని ముఖం మీద అడిగేశాను, మా నాన్నగారు నావైపు కాస్త కోపంగా చూస్తూ వుండగా-

దాశరథి గారు నవ్వి,నా భుజమ్మీద చెయ్యి వేసి:

“మంచిదే, బిడ్డా! కానీ, ఎంత పద్య కవి అయినా ఏదో వొక నాడు వచన కవిత్వం రాయాల్సిందే.   పద్యం గొప్ప పద్యానిది, వచనం గొప్ప వచనానిది. నువ్వు ఇప్పటి దాకా కవిత్వంలో ఒక రకమయిన లయకే అలవాటు పడ్డావు. పైగా నువ్వు వృత్తాల మాయలో వున్నావు కనుక, నీకు వచన కవిత్వంలో వుండే కొత్త లయ తెలియడం లేదు. ఎందుకూ, ఉర్దూలో ఘజల్ అంత గొప్ప సంప్రదాయం కదా! ఇప్పుడు వాళ్ళు కూడా ఫ్రీవర్సు కి వచ్చేస్తున్నారు. వొక్కటే గుర్తు పెట్టుకో – ఇదే అద్భుతం అనుకోని వొక్క చోటే ఆగిపోవద్దు. కాలం నిన్ను ఎటు తీసుకువెళ్తుందో చూడు. వీలయితే కాలం కంటే ముందు వెళ్ళు, లేదా, కాలం వెంట వెళ్ళు. అంతే కానీ, కాలం ఎక్కడో నువ్వెక్కడో వున్నావనుకో – నీ కథ ముగిసినట్టే!” (అంట రాని వారెవరంటే/ మన వెంట రాని వారే! అని అప్పట్లో దాశరథి పాట కొంచెం పాప్యులర్ కూడా!)

బాగా గుర్తు- దాశరథి గారికి ఖమ్మం వూరి బయట పారే మున్నేరు అంటే చాలా ఇష్టం. ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ దాని చుట్టే తిరిగాయి. ఆ మున్నేరు మా ఇంటికి దూరంలో వుండేది. బ్రిడ్జి దాటి వెళ్ళాలి.

వొక సారి  ఆయన అడిగారు “నువ్వు ఎప్పుడయినా మున్నేరు వొడ్డుకి వెళ్ళావా?” అని.

“లేదు” అన్నాను నేను అప్పుడే కొంచెం మాట్లాడడం నేర్చుకుంటున్న వాడినై-

‘అరె…సాయంత్రం వూరికే అట్లా నడుచుకుంటూ వెళ్ళు. అక్కడ కాసేపు కూర్చొని రా…ఆ రాత్రి నువ్వు కనీసం వొక్క లైను అయినా రాస్తావ్ తప్పక!”

“నిజమా?’

“అవును, మంచి కవిత్వం రాయాలంటే నువ్వు మంచి ప్రకృతిలో వుండాలి. కాస్త నీళ్లూ, కాసిని చెట్లూ, కొన్ని పక్షులూ…వీటితో నీకు దోస్తీ కుదరాలి.”

తరవాత చాలా వుత్తరాల్లో/ సంభాషణల్లో  ఆయన మున్నేరు గురించే రాసే వారు/ చెప్పే వారు. ‘ఈ మధ్య వెళ్ళావా?లేదా?” అని గుచ్చి గుచ్చి అడిగే వారు. “ఈ మున్నేరు లేకపోతే నాకు కవిత్వమే తెలియదు” అన్నారు వొక వొక సారి !

ఆ రోజుల్లో ఎందుకో, నాకు అటు వెళ్లాలని అనిపించేది కాదు. అక్కడ పక్కనే శ్మశాన వాటిక వుండేది. నేను వెళ్ళిన రెండు మూడు సార్లు అక్కడ శవాలు తగలబెట్టడం చూశాను. బహుశా, అది నా మనసులో నాటుకు పోయి వుండాలి. ఆయన తన చిన్నప్పటి మున్నేరు అలానే వుందని అనుకుని ఎప్పుడూ అలా అడుగుతూ వుంటారులే అని వూరుకున్నా.

కానీ,దాశరథి గారు  చనిపోయారని  తెలిసి నాన్నగారు హడావుడిగా బ్యాగ్ సర్దుకొని కన్నీళ్ళ  పర్యంతం అవుతూ హైద్రాబాద్ వెళ్ళిన సాయంత్రం నేను మున్నేరు వొడ్డుకి వెళ్ళాను.

ఆ సాయంత్రం మున్నేరు అలసిపోయిన తల్లిలా ప్రశాంతంగా పడుకుని వుంది.

దాని గలగలలు నాకు వినిపించక కాసేపటికి వెనక్కి మళ్లాను!

–      మళ్ళీ ఎప్పుడూ నేను మున్నేరు దాకా వెళ్లనే లేదు!

 

(దాశరథి గారితో ఇంకా అనేక స్మృతులున్నాయి. అవి తరవాత)

ఆవకాయ సౌజన్యంతో 

 

మీ మాటలు

  1. Aranya Krishna says:

    దాశరధిగారి వ్యక్తిత్వాన్ని కూడా పరిచయం చేసిన నివాళి ఇది. ఆయనతో తన ఇంటరాక్షాన్ని, ఆయన తనమీద చూపిన ప్రభావాన్ని తెలియచేయటం బాగుంది. అఫ్సర్ తన బాల్యం, అత్యంత పరిమిత వనరులతో కూడిన అప్పటి కుటుంబ పరిస్తితులు, అయినా సాహిత్యం పట్ల ఉన్న నిబద్ద్గత … చదువుతుంటే టచింగ్ గా అనిపిస్తుంది. అఫ్సర్ బాల్య స్మృతుల్లో సాహిత్యం, సాహితీవేత్తలు అంతర్భాగం కావటం హృద్యంగా ఉంది.

  2. మేము దాచుకున్న మీ మెమోరీస్ లో మరీ ఎక్కువ స్పష్టంగా మా కళ్ళ ముందే అప్పుడెప్పుడో జరిగిన జ్ఞాపకంలా నిలబడిపోయిన వ్యాసం ఇది , మళ్ళీ చదవడం కాస్త ఉద్వేగంగా కూడా వుంది. TQQ Sir

  3. దేవరకొండ says:

    నా అభిమాన కవులు చాలా మందే ఉన్నారు. నా ఆరాధ్య కవి మాత్రం ఒక్క దాశరథి కృష్ణ మాచార్యులు గారొక్కరే! సినిమా సాహిత్యం నుండి గాలిబ్ గీతాల వరకు ఆయన కవిత్వమంతా కేవల కవిత్వం. కవిగానే జీవించిన మహాకవి ఆయన! ‘దాశరధీ కవితా పయోనిధీ’ అని సమకాలికుల చేతనే (శ్రీశ్రీ) అనిపించుకున్న అగ్ర శ్రేణి కవి మన దాశరధి గారు. ఆ మహామనీషిని, మానవతామూర్తిని, కుల మత ప్రాంతీయ దురభిమానాలకతీతంగా తన దేశ ప్రజల్ని హృదయపూర్వకంగా ప్రేమించిన మహాకవిని ఈరోజు ఈ విధంగా స్మరించుకునే అవకాశాన్ని చ్చిన మరో మహా కవికి కృతజ్ఞత. తెలంగాణా ప్రభుత్వ సచివాలయంలో లేదా అసెంబ్లీలో శ్రీ దాశరధి విగ్రహం నిలిపితే ప్రభుత్వం తనను తానూ మరియు తెలంగాణాతో కూడిన భారత ప్రజల్ని గౌరవించినట్లే! తెలంగాణా ప్రభుత్వం విరివిగా వాడే కవితా పంక్తి ‘నా తెలంగాణా కోటి రతనాల వీణ’ అన్న మహాకవి దాశరధి గారికి అంతకన్నా ప్రభుత్వం ఇంకేమైనా చేయగలదా? ఉర్దూతో పాటు మరో తీయని భాష తెలుగు వుందని, ఆ భాషలో కూడా రాయాలని, విశ్వ కవి గాలిబ్, దాశరధి గా జన్మించి వుంటాడని అనుకోవడంలో మూఢ నమ్మకం వున్నదనుకున్నా అలా అనుకోవడం నేను మానలేను!

  4. మీ ఈ సజీవ స్మరణ, ఆ మహానుభావుడిని మున్నేటిలోని నీరంత పారదర్శకంగా చూపింది . ధన్యవాదాలు

  5. అఫ్సర్ గారు మీకు దాశరధి తో ఉన్న అనుబంధాన్ని బాగా చెప్పారు .బాగుంది
    .

  6. దాశరథి గారి నివాళిలో నీ బాల్యం తో పాటూ ఆయన పై నీకున్న అవాజ్య మైన ప్రేమ కూడా కనిపించింది అఫ్సర్ . మాటల్లేవ్ – ఆయన గొప్ప కవి. అన్నట్టు ఈ నివాళి నా కౌమార్యాన్ని తట్టి లేపింది – ఒకసారి (1980, నవంబర్ ) ఆలంపూర్ వెళ్ళాను. అక్కడ సికరాజు తో పాటు దాశరథి గారు కనిపించారు . ఇంకేముంది – “మదిలో వీణలు ” మ్రోగినయ్ – మా దగ్గరున్న డబ్బా కెమరాతో రెడీ అయిపోయాం – నేను దూరంగా నిల్చుంటే దగ్గరగా రమ్మన్నారు – ఆ మాటకు నేను రెచ్చిపోయి ఆయన భుజం మీద చెయ్యి వేసి ఫోటో దిగాను ( ఆ వయసులో అలా చెయ్యి వెయ్య కూడదన్న జ్ఞానం కూడా లేదు నాకు ) . ఇప్పటికీ మా ఆల్బం లో ఆ ఫోటో ఉంది . మరొకసారి వారిని గుర్తు చేసినందుకు థాంక్యూ అఫ్సర్ .

  7. VB Rao M says:

    మంచి జ్ఞాపకాలు గుర్తు చేసారు అఫ్సర్ గారు, దాశరధి గారికి నివాళి

  8. చందు తులసి says:

    దాశరథితో అంత చక్కని అనుబంధమున్న మీరు అదృష్టవంతులు అఫ్సర్ గారు….
    – అవును మున్నేరు వెంట ఒక్క సారి నడిచినా హృదయం పరవశిస్తుందనేది నిజం
    -దాశరథి గారికే కాదు….యండమూరికీ మున్నేరుతో అనుబంధముంది..

  9. Sudha Srinath says:

    మీకు దాశరథిగారు అంత దగ్గరగా తెలిసుండేవారని చాలా సంతోషమయ్యింది. ఎంత అదృష్టవంతులండీ మీరు! మీ అనుబంధాన్ని, అనుభూతిని మా అందరితో పంచుకొన్నందుకు ధన్యవాదాలండి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు.

  10. Dr.Vijaya Babu Koganti says:

    మరోసారి కృతజ్ఞతలు అఫ్సూర్య కౌముదీ!

  11. మీ మూగవోయిన మున్నేరులో మా పెన్నేరును చూసుకున్నా. దాశరథితో మీ అనుభవాలు, వాటి చిత్రణ అపురూపం. దాశరథి ‘ఆ చల్లని సముద్రగర్భం..’ పాటను స్కూలు, కాలేజీ రోజుల్లో ఏ ఐఎస్ఎఫ్ వాళ్లు పాడుతుంటే ఏదో ట్రాన్స్ లోకి వెళ్లేవాడిని. ఇప్పటికీ అంతే, శ్రీశ్రీ కలగన్న మరో ప్రపంచం దిశగా పోతున్నట్లు ఉంటుంది.
    మీ వ్యాసంతో సంబంధం లేకపోయినా ఒక మాట. దాశరథి కవితా కమ్చీలతో బాదిన నిజాం పిశాచాన్ని పొడుగుతున్న పాలకులు అవే కంపునోళ్లతో దాశరథినీ పొగడ్డం చారిత్రక విషాదం.

  12. balasudhakarmouli says:

    దాశరథి గారితో, అప్పటి జీవితంతో మీ అనుభవాలు చాలా నచ్చాయి.

  13. Rajendra Prasad Chimata says:

    ఇది పై వ్యాసానికి కామెంట్ కాదు, కానీ ఈ వ్యాసం ఎక్కువ మంది తొందరగా చదవాలని పోస్ట్ చేస్తున్నా గమనించ గలరు

    ఈ శిక్ష సమాజానికి మంచి చేస్తుందా? (23-Jul-2015)

    భారతదేశానికి కావలసింది ముంబై హింసాకాండలూ పేలుళ్లూ గుజరాత్‌లూ పునరావృత్తం కాని పరిస్థితి. దేశంలో విధింపబడిన అవాంఛనీయమైన వాతావరణాన్ని పటాపంచలు చేసే సామరస్యం. ఈ శిక్షలూ కక్షలూ వాటిని సాధిస్తాయా? నేరానికి పాల్పడిన ముఖ్యవ్యక్తులు విదేశాల్లో భద్రంగా ఉంటే, దొరికిన వాడెవడో ఒకడిని ఉరితీయడం శిక్షావాదులకు మాత్రం మనోస్థైర్యాన్నిస్తుందా?… అభిప్రాయభేదాలతో నిమిత్తం లేకుండా ఉరిశిక్ష పడ్డ వారందరి తరఫునా మాట్లాడేవారెవరూ దేశంలో లేరు.

    పదిహేనేళ్ల కిందట వచ్చిన హృతిక్‌రోషన్‌-కరిష్మాకపూర్‌ సినిమా ‘ఫిజా’ పెద్దగా ఆడలేదు కానీ ప్రశంసలు మాత్రం పొందింది. సంక్లిష్టమయిన పరిస్థితుల మధ్య సోదరుని కోసం అన్వేషిస్తూ వెళ్లిన ముస్లిం యువతిగా కరిష్మా నటన ఒక ఎత్తు అయితే, ఆ పరిస్థితుల చిత్రణలో కనిపించిన కించిత్‌ ధైర్యమూ వాస్తవికతా మరొక ఎత్తు. 1992-93లో జరిగిన ముంబయి హింసాకాండలో బాధితుడై తరువాత మాయమై టెర్రరిస్టుగా మారిన వ్యక్తి ఆ సినిమా కథానాయకుడు (హృతిక్‌రోషన్‌). సినిమా చూసిన వారికి దేశంలోని సంఘటనలు, వాటి స్పందనలు, స్పందనల ప్రతిస్పందనలు ఎటువంటి పరిణామాలను సృష్టిస్తున్నాయో స్ఫురిస్తుంది. 2007లో సంచలనం సృష్టించిన ‘బ్లాక్‌ ఫ్రైడే’ సంగతి చెప్పనక్కరలేదు. 1993 మార్చి 12 నాడు ముంబయిలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఇతివృత్తంగా నిర్మించిన, డాక్యుమెంటరీ అనదగ్గ చిత్రం అది. కార్యకారణ సంబంధాలను, నేరానికి పాల్పడిన, చిక్కుకుపోయిన వ్యక్తుల డోలాయమానస్థితిని, అనివార్యతలను కథనం చేసింది ఆ సినిమా. ముంబై పేలుళ్ల తీర్పును ప్రభావితం చేయగలదేమోనని మూడేళ్లపాటు ఆ సినిమా ప్రదర్శనను నిలిపివేశారు కూడా.
    నిజాన్ని ఏ కొంచెం చెప్పినా కృతజ్ఞతగా ఉండవలసిన పాడు కాలం కాబట్టి కానీ, సినిమాల ప్రస్తావనా సహాయమూ అనవసరం. అంతా కళ్లకు కట్టినట్టు గుర్తున్నది. దలాల్‌సీ్ట్రట్‌ పేలుడుతో అప్పుడప్పుడే రంగం మీదకు వచ్చిన కేబుల్‌ టీవీ రంగుల్లో కంపించిపోవడం గుర్తున్నది. నడుస్తున్న చరిత్రకు నిర్ఘాంతపోవడమే తప్ప అర్థం చేసుకోగలిగిన తెరిపి ఇవ్వకుండా పదమూడు పేలుళ్లు వరుసగా గుండెల్లో పేలడం గుర్తున్నది. సాయంత్రానికల్లా వందల కొద్దీ మరణాల లెక్క తేలడమూ గుర్తున్నది. మొత్తం మీద మూడువందల పై చిలుకు చావులు, వెయ్యిమందికి పైగా క్షతగాత్రులు. అక్కడ నెత్తురోడినవారే కాదు, దృశ్యాలను చూసినవారు, వార్తలను చదివినవారూ అందరూ బాధితులే. ఎక్కడో ఏదో తెగింది. పెంచిపోషించిన వ్రణాలు ఏవో పగలిపోతున్నాయి. కొత్తకొత్త రణక్షేత్రాలు పురుడుపోసుకుంటున్నాయి.
    ఎవరు మాత్రం దీన్ని సహిస్తారు? పొగిలిన దుఃఖం ఆగ్రహం కావలసిందే కదా? దేశంలో మునుపెన్నడూ తెలియని బీభత్సం అది. తొలిసారి ఆర్డీఎక్స్‌ వాడిన పేలుళ్లు అవి. లక్ష్యం అంటూ లేకుండా వీలయినచోట్లల్లా మానవహననానికి ఉద్దేశించిన దుర్మార్గం అది. అమాయక జనాన్ని ఉద్దేశించి జరిగిన తొలి ఉగ్రదాడికి ఇరవైరెండేళ్ల వయస్సు. అది ఆరంభమే కానీ అంతం కాదు, జరుగుతూనే ఉన్నాయి. హాహాకారాలూ ఆర్తనాదాలూ దేశవ్యాప్తం అయిపోయాయి. యాకుబ్‌ మెమన్‌కు ఉరిశిక్ష దాదాపుగా ఖాయం అయి పోయింది. ముంబై పేలుళ్ల కేసులో మరణశిక్ష ఖాయపడిన ఏకైక నిందితుడు. ‘స్వయంగా విధ్వంసంలో పాల్గొనలేదు కానీ చేసిన వాళ్ల వెనుక ఇతనున్నాడు’ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్రపతి క్షమాభిక్ష నిరాకరించారు. రివ్యూపిటిషన్‌ను కొట్టివేసింది. విచారణలోనో నిర్ధారణలోనో లోపాలూ అసమగ్రతలు ఉంటే శిక్ష నుంచి ఉపశమనం కలిగించే క్యూరేటివ్‌ పిటిషన్‌ను కూడా ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మహారాష్ట్ర గవర్నర్‌ కూడా క్షమాభిక్షను కాదంటే, జులై 30 నాడు మెమన్‌ను భారత రాజ్యం మరణింపజేస్తుంది. మెమన్‌ ఉరికంబం ఎక్కితే, ఎంతో కొంత న్యాయం జరిగిందని మూడువందల బాధిత కుటుంబాలు, కాళ్లూ చేతులూ పొగొట్టుకుని నిత్యనరకం అనుభవిస్తున్నవారూ సంతోషిస్తుండవచ్చు. వారిలో అతి కొద్ది మంది అయినా, న్యాయాన్యాయాలకు అతీతమైన నిర్వేదానికో, వైరాగ్యానికో, క్షమాగుణానికో లోనై ఇటువంటి శిక్షను కోరుకోకపోయీ ఉండవచ్చు. సాధారణ మానవ స్పందనకే అధికారం లభిస్తే కంటికి కన్ను పంటికి పన్ను మాత్రమే న్యాయం అవుతుంది. కానీ వేల ఏళ్ల నాగరికతా ప్రస్థానం, న్యాయశాస్త్ర పురోగమనం శిక్షల విచారణకు కూడా ఒక వ్యవస్థను, సర్వసమానతను, సభ్యతను అలవరిచాయి. అటువంటి న్యాయవ్యవస్థే మెమన్‌ను దోషిగా నిర్ధారించింది. కోర్టులకు ఏ రాగద్వేషాలూ ఉండవు. అవి సాక్ష్యాన్ని, చట్టాన్ని, దేశ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని తీర్పులు రాస్తాయి. కానీ ప్రాసిక్యూషన్‌లకు అంతటి పవిత్రతను ఆపాదించలేము. వ్యవస్థాంగాల కంటె మించి, ప్రజాస్వామిక శక్తులు, శ్రేణుల సముదాయాలు దీర్ఘకాలికమైన, సవ్యమయిన ఫలితాలను ఇచ్చే విశ్లేషణలకు, నిర్ధారణలకు రాగలగుతాయి. వారు మెమన్‌ ఉరితీత సందర్భాన్ని ఎట్లా చూస్తారు?
    సమస్య ఎక్కడంటే, యాకూబ్‌ మెమన్‌తోనే ఈ నేరం .మొదలయిందా? జరిగిన నేరంలో ఇతని పాలు ఎంత? యాకూబ్‌ మెమన్‌ దోషనిర్ధారణ లోపరహితంగా జరిగిందా? యాకూబ్‌ మెమన్‌ ఉరితీత నేరవాతావరణాన్ని కొనసాగింపజేస్తుందా, సమసిపోయేట్టు చేస్తుందా? మరణశిక్ష వేయదగినంత నేరం మెమన్‌ చేయకపోయి ఉంటే, అప్పుడు కూడా బాధిత కుటుంబాలు హర్షిస్తాయా? అతను నిజానికి నిర్దోషిగానో ప్రాసిక్యూషన్‌కు సహకారిగానో వదిలివేయవలసిన వ్యక్తి అయితే కూడా అతని శిక్షను అతివాద ఉరితీతవాదులు సంతోషిస్తారా? ఇరవైమూడేళ్ల ఏకాంతవాస సుదీర్ఘ నిర్బంధం తరువాత అయినా సరే అతనిని వదిలివేయడం భారతదేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తుందని తెలిస్తే కూడా దేశభక్తులు అతనిని చంపేయమనే అనగలరా? సుప్రీంకోర్టు తుది నిర్ధారణ తరువాత కూడా ఇంకా మెమన్‌ తరఫున వాదనలు సమాధానాలు దొరకక మిగిలే ఉంటే జులై 30కి అతన్ని శిక్షించవలసిందే అనగలమా? భారతదేశానికి కావలసింది ముంబై హింసాకాండలూ పేలుళ్లూ గుజరాత్‌లూ పునరావృత్తం కాని పరిస్థితి. దేశంలో విధింపబడిన అవాంఛనీయమైన వాతావరణాన్ని (ఫిజా అంటే వాతావరణమే) పటాపంచలు చేసే సామరస్యం. ఈ శిక్షలూ కక్షలూ వాటిని సాధిస్తాయా? నేరానికి పాల్పడిన ముఖ్యవ్యక్తులు విదేశాల్లో భద్రంగా ఉంటే, దొరికినవాడెవడో ఒకడిని ఉరితీయడం శిక్షావాదులకు మాత్రం మనోస్థైర్యాన్నిస్తుందా?
    ఆపరేషన్‌బ్లూస్టార్‌కూ ఇందిర దారుణ హత్యకు వేలాది సిక్కుల ఊచకోతకూ పంజాబ్‌ ఉగ్రవాదం విస్తరణకూ సంబంధం లేదనగలమా? ఐపీకేఎఫ్‌కూ రాజీవ్‌గాంధీ విషాదనిష్క్రమణకూ లంకె ప్రత్యేకంగా పెట్టాలా? ప్రతిసమస్యకూ సంఘటనకూ మూలకారణాలుంటాయి. ముంబై పేలుళ్ల దుఃఖాన్ని గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు అంతకు మూడు నెలల ముందు 1992 చివర-1993 మొదట జరిగిన ముంబై హింసాకాండ కూడా గుర్తుకు రావాలి. 1992 డిసెంబర్‌ 6న జరిగిన బాబ్రీమసీదు విధ్వంసం కూడా స్ఫురించాలి. బాబ్రీమసీదు కూల్చివేతకు నిరసనలపై పెద్ద ఎత్తున జరిగిన పోలీసుకాల్పులు, అనంతరం అది పౌరహింసగా పరిణమించి జరిగిన వేయి మరణాలు దేశచరిత్రలో మచ్చ వంటివి. ఆ క్రమంలోనే ముంబై పేలుళ్లు జరిగాయి. ఉద్వేగాలు, ప్రతీకారాలు ఏ నేరాన్ని మాఫీ చేయవు, నిజమే. కానీ ప్రతి నేరానికి పూర్వాపరాలుంటాయి. బాబ్రీమసీదు సంఘటనపై ఇంకా విచారణే పూర్తి కాలేదు. ముంబై హింసాకాండలో ఏ ఒక్క దోషికీ మరణశిక్ష పడలేదు. జస్టిస్‌ శ్రీకృష్ణ కమిషన్‌ చేసిన సూచనలను, సిఫార్సులను ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. అనేక నేరాల వరుసలో ఒక నేరానికి మాత్రమే శిక్ష విధిస్తే, అది ఎటువంటి అర్థాలను ఇస్తుందో తెలియదా? యాకూబ్‌ మెమన్‌ సాంకేతికంగా దోషి అనో నిర్దోషి అనో చెప్పడం లేదు. శేషప్రశ్నల గురించి మాత్రమే చర్చ. ఆ ప్రశ్నలు అందరికీ సంబంధించినవి. టైగర్‌ మెమన్‌కు సోదరుడయినందుకు మాత్రమే అతన్ని శిక్షిస్తున్నారని అతని కుటుంబం అనుకుంటోంది. యాకూబ్‌ మెమన్‌ లేకపోతే ముంబై పేలుళ్ల కేసులో టైగర్‌ మెమన్‌-దావూద్‌ పాత్ర నిర్ధారణ అయ్యేదే కాదని విచారణను దగ్గరగా పరిశీలించినవారు చెబుతున్నారు. ముంబై పేలుళ్లకు ముందే దేశం విడిచిపెట్టి వెళ్లిన మెమన్‌ కుటుంబంలో యాకూబ్‌ ఒక్కడే దేశం తిరిగి వచ్చి, నేరంలో తన భాగాన్ని కడిగేసుకోవడానికి సిద్ధపడ్డాడు. పాక్‌ నుంచే తాను సీబీఐని సంప్రదించానని, అప్రూవర్‌గా మారడానికి సిద్ధపడి నేపాల్‌ సరిహద్దులో లొంగిపోయానని, కానీ భారత హోంశాఖ తనను ఢిల్లీలో అరెస్టు చేసినట్టు ప్రకటించిందని మెమన్‌ న్యూస్‌ట్రాక్‌ ఇంటర్వ్యూలో చెప్పాడు. అతని వాదన అరణ్యరోదనే అయింది. నిజంగానే భారతీయ ప్రాసిక్యూషన్‌ అతని సాయం తీసుకుని, తరువాత అతనినే దోషిగా నిలబెట్టిందా? అదే నిజమయితే దేశానికి అది గౌరవమా? ‘‘పెద్ద గాంధేయవాదిలాగా ఇండియాకు వెడుతున్నావు, వాళ్లు మాత్రం నిన్ను టెర్రరిస్టుగానే చూస్తారు’’ అని టైగర్‌ మెమన్‌ తన సోదరుడితో అన్నాడట. అదే నిజమయిందా? తన పిల్లలను భారతీయులుగానే పెంచాలనుకుంటున్నానని యాకూబ్‌ మెమన్‌ చెప్పాడు. అట్లా అనుకోవడం పొరపాటు అయిందా? దేశంలో మరణశిక్ష పడిన ఖైదీలలో నూటికి 75 శాతం మంది బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలవారేనని లెక్కలు చెబుతున్నాయి. లెక్కలే కాదు, దేశ లా కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎ.పి. షా మాట్లాడుతూ సాధారణంగా పేదలూ బలహీనులే ఉరికంబం ఎక్కుతారని అన్నారు. దేశంలో మరణశిక్ష విధింపును సమీక్షించవలసిన అవసరం ఉందని కూడా వ్యాఖ్యానించారు. వ్యవస్థను ఏరకంగానూ ఒత్తిడి చేయలేని వారే అంతిమశిక్ష దాకా వెడతారు. దేశంలోని ఏ ఒత్తిడి బృందమూ మెమన్‌ తరఫున వాదించే పరిస్థితి లేదు. నేరానికి కఠిన శిక్షలు వేయడమే భద్రమైన సమాజాన్ని సృష్టిస్తుందని నమ్మేవారు చాలా మంది ఉంటారు. ఎంతటి దుర్మార్గమైన నేరం చేసిన వారికైనా మరణశిక్ష విధించగూ డదని, నేరాలను శిక్షలు నిరోధించలేవని నమ్మేవారూ లోకంలో ఉన్నారు. గాంధీజీని నాథూరామ్‌ గాడ్సే హత్య చేసినప్పుడు, హంతకుడికి మరణశిక్షను వ్యతిరేకించినవారిలో గాంధీగారి ఇద్దరు కుమారులూ ఉన్నారు. అంతే కాదు, జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా ఉన్నారు. వారెవరూ గాడ్సేవాదులు కారు. నేరస్థుడికి క్షమ అడిగినవారిని నేరానికి సమర్థుకులుగా చిత్రించే రోజులు అప్పటికి రాలేదు. ఇవాళ యాకూబ్‌ మెమన్‌ మరణశిక్ష గురించి భారతీయ పౌరసమాజం గంభీరమైన మౌనాన్నే ప్రదర్శిస్తుంది. అభిప్రాయభేదాలతో నిమిత్తం లేకుండా ఉరిశిక్ష పడ్డ వారందరి తరఫునా మాట్లాడేవారెవరూ దేశంలో లేరు.

  14. Rajendra Prasad Chimata says:

    ఇది రాసింది ఆంధ్ర జ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్ గారు. పేస్ట్ చేసినప్పుడు అది పడ లేదు

  15. Mythili Abbaraju says:

    ఈ మీ మాటలు చదివే ఆనందం ఆలస్యంగా దొరికింది.
    మొత్తం…మీ జ్ఞాపకాలన్నిటినీ కొల్లగోట్టుకోవాలని ఆశ….దయచేసి తరచుగా చెప్పి పూర్తి చేయండి…..

  16. అఫ్సూర్య నమస్కారాలు !!

    మీరు వాల్చిన – దాశరధీ ‘జత’కం – అనే జ్ఞాపకాల పడక కుర్చీ … అనుభవించాల్సిన , నేర్చుకోవాల్సిన సంగతులు ఎన్నో చెప్పింది !!!
    మీ బాల్యస్మృతులు ఓ తరం సాహితీవేత్తల చరిత్ర కావడం …..
    మీ మనసు వాటిని ఆర్ద్రం గా నెమరేయడం ….
    మీ పెన్ను వాటిని అందం గా మెమరేయడం….
    ఆనందం మున్నేరవడమే !!!

    భవదీయుడు ..రామ్

  17. Dr. Vani Devulapally says:

    అఫ్సర్ గారూ! మహా కవి దాశరధి గారి తో మీ అనుబంధపు రెమినిసెన్సెస్ బావున్నాయి. మిగతా వాటి కోసం ఎదురు చూస్తూ –

మీ మాటలు

*