ప్రతి పాఠంలో చేరా ముద్ర !

10534397_326754877475156_564669077665495274_n

అప్పటి అకడమిక్ స్టాఫ్ కాలేజీ, ఒకప్పటి భాషా శాస్త్ర విభాగం. లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్. అన్నయ్య ఎం.ఏ. లింగ్విస్టిక్స్ చదువుతున్న రోజులు. నేను పదవ తరగతిలో ఉన్నాను. అన్నయ్య తన డిపార్ట్మెంట్కు తీసుకుపోయాడు. అప్పటివరకూ పల్లెటూర్లో చదువుకున్న నాకు ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ చూడడమే ఒక గొప్ప అనుభూతి. మొదటిసారిగా యూనివర్శిటీ క్యాంపస్ను చూడడం, మొట్టమొదటి పరిచయం చేకూరి రామారావుగారితో. ఆయనను మొదట చూడగానే భయమేసింది. ఇంత పెద్ద యూనివర్శిటీలో పెద్ద టీచరంట అనుకున్నాను. ఆయన గంభీరమైన రూపం వెనక చిన్న చిర్నవ్వు. అంతే, ఆ మొదటి పరిచయం తర్వాత మళ్ళీ పెద్దగా చూసింది లేదు.

మళ్ళీ నేను ఎం.ఏలో పరీక్షలకు చదవడానికి పుస్తకాలు లేవు. అప్ప్పుడు అన్నయ్య చెప్పాడు. చేకూరి రామారావు గారి దగ్గర మంచి లైబ్రరీ ఉంటుంది వెళ్ళమని, అప్పటికే వాళ్ళమ్మాయి సంధ్య ఆంధ్ర మహిళా సభ కాలేజీలో నాకు ఫ్రెండ్. ఆ పరిచయంతో, కొంచెం బెరుకు బెరుకుగా భయం భయంగా, ఆరాధన సినిమా థియేటర్ వెనక ఉన్న యూనివర్శిటీ క్వార్టర్స్కు వెళ్ళాను. ‘‘ఆ ఏం అన్నారు’’ పుస్తకాలు కావాలి అన్నాను. ‘‘ఇక్కడే కూచుని చదువుకో సరేనా’’ అన్నారు.

అప్పటికే సంధ్యతో ఉన్న పరిచయంతో వాళ్ళింట్లో చనువుగా తిరిగేదాన్ని. పొద్దంతా నేనూ, సంధ్య చదువుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ గడిపేవాళ్ళం. వాళ్ళింట్లో తినేదాన్ని. పుస్తకాల గురించో, పుస్తకంలోని విషయాల గురించో మాట్లాడాలంటే భయమనిపించేది. ఆయన బీరువాల నిండా పుస్తకాలు చూసి, అమ్మో ఏం మాట్లాడితే ఏమంటారో అని భయమేసింది.

అట్లా ఎం.ఏ. అయిపోయింది. ఆ తర్వాత ఎం.ఫిల్., పి.హెచ్డి. చేసేటప్పుడు, అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. పెద్దగా సాహిత్యం గురించో, పుస్తకాల గురించో మాట్లాడేదాన్ని కాదు. ఊరికే గుర్తుపట్టినట్టు ఒక నవ్వు నవ్వేవారు.

ఆ తర్వాత అప్పుడప్పుడూ సభల్లో కనిపించేవారు. దాదాపు 15 ఏండ్ల తర్వాత, నేను మొదటిసారి ఓపెన్ యూనివర్శిటీలో అడుగుపెట్టినప్పుడు అంటే 2007లో ఆయన గురించి నాకు తెలిసింది. సార్వత్రిక విశ్వవిద్యాలయంలో సులువైన తెలుగు పాఠాలను ఆయనే రూపకల్పన చేసారని అర్థమైంది. మేము ఎం.ఏ తెలుగు పుస్తకాలు తయారుచేస్తున్న క్రమంలో చేకూరి రామారావు గారికి ఈ మెటీరియల్ ఇచ్చి రావాలమ్మా అని రమణగారు పంపించారు. అప్పటికే ఆయన ఆరోగ్యం అంత బాగాలేదు. అయినా ఓపికగా నేనిచ్చిన మెటీరియల్ అంతా చదవడానికి ఒక వారం రోజుల టైమ్ అడిగారు. ఆ తర్వాత ఆయన అన్న టైముకి మెటీరియల్ తిరిగి ఇచ్చారు. అంతేకాదు, ఆరోజు భాష గురించి, వాక్యాల గురించి, పెద్దాయన తనకున్న అభిప్రాయాలను నాతో చెప్పారు. అంత నాతో మాట్లాడటం చాలా బాగా అనిపించింది. పైగా ఓపెన్ యూనివర్శిటీ సిలబస్ ఎంత సరళంగా ఉండాలి అన్న విషయాన్ని కూడా ఆరోగ్యం బాగాలేకపోయినా వివరించారు.

ఆరోజు తర్వాత నుంచి ప్రతిసారీ మా యూనివర్శిటీ పుస్తకాలు తిరగేస్తున్నప్పుడల్లా చేకూరి రామారావుగారి వాక్యమో, వారి పేరో కనిపిస్తూనే వుంటుంది. ఆయన చనిపోయే ముందురోజు పరిష్కృత పాఠ్య ప్రణాళికా బృందంలో ఆయన పేరు రాస్తుంటే రమణగారు గుర్తొచ్చారు. చేకూరి రామారావుగారు మన పుస్తకాలకు ఎప్పుడూ గౌరవ సభ్యుడే అంటుండేవారు. ఇప్పుడు కొత్తగా వచ్చే పుస్తకాలలో వారి జతన చేకూరి రామారావుగారు కూడా చేరారని బాధగా ఉంది.

ప్రాథమిక విద్య కూడా లేని వారి కోసం ఏర్పరచిన అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఒక కొత్త దృష్టి కోణాన్ని తెలుగంటే పద్యాలు కాదు, తెలుగంటే ఒక భాషా శాస్త్రమని, దాన్ని ఎంత సులువుగా అందజేస్తే అంత ఉపయోగమనే దూరదృష్టితో కొత్త విషయాలను రూపకల్పన చేసిన ఉన్నత వ్యక్తి చేకూరి రామారావు గారు. వారు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి చేసిన సేవలు మరపురానివని వారిని స్మరిస్తూ వారికిదే నా నివాళి.

వ్యక్తిగత పరిచయమా, సాహిత్య పరిచయమా, కుటుంబ పరిచయమా ` ఏ పరిచయమైనా ఆయనతో మాట్లాడిన సందర్భాలు అతి కొద్ది అయినా, నామీద వారి ప్రభావం మాత్రం చాలా ఎక్కువ. ప్రతి పుస్తకంలో, ప్రతి పాఠంలో వారి ముద్ర కనిపిస్తూనే ఉంటుంది.

` డా॥ ఎన్. రజని

rajani

చిత్రరచన: రాజు

మీ మాటలు

  1. bhasker.koorapati says:

    చేరా గారితో మీ జ్ఞాపకాలు,అనుభూతులూ చదివాను. చాలా ఆర్ద్రంగా ఉంది.
    మొదటిసారిగా చేరాని చూసినప్పుడు మీరు ఎంత ఆనందానికి గురి అయ్యారో చదివినప్పుడు ఇక్కడ నాకొక చిన్న సంఘటన గుర్తుకొస్తుంది. చాలా ఏళ్ల క్రితం చేరా గారు ఓసారి నాతో స్కూటర్ మీద మా రామంతపూర్ ఇంటికి వచ్చారు, అటునుంచి ఎన్.గోపి ని కూడా కలవోచ్చని.సరే ఇంట్లో కూచున్నారు.నా సహచరిణి, పిల్లల్ని పరిచయం చేస్తూ తను చేకూరి రామారావు మాస్టర్ అని చెప్పాను మా చిన్నమ్మాయి సహజ విప్పారిన కళ్ళల్లో వెల్లివిరిసిన ఆనందాన్ని చూసాను. తనకి అంత ఆనందం ఎందుకంటే తన తెలుగు పాట్యపుస్తకమ్ లో చేరా గారి భాషా శాస్త్రానికి సంభందించిన పాట్యం ఉందిట. తను అప్పుడు ఎనిమిదవ తరగతి చదువుతున్దనుకుంటాను. తను స్కూల్ కు వెళ్లి స్నేహితులతో నేను చేరా గారిని మా ఇంట్లో చూసాను, తను ఎంతో కలుపుగోలుగా మాట్లాడాడు అని తెగ సంబరపడిపోయింది.
    చేరా మాస్టర్ అంటే అది. పండితులతోనూ, పామరులతోనూ కలిసిపోయే వ్యక్తిత్వం.
    మీ రచన నన్ను కదిలించింది, రజని గారు. స్వోత్కర్ష రాసాను అని మాత్రం అనుకోకండి.
    –భాస్కర్ కూరపాటి.

  2. Dear Dr.Rajani,ji, Adaab,
    I have gone through your article, it is amazing, I have met CHERA alongwith Prof.Kethu Viswantha Reddy and Prof.KS.Ramana, his contribution to academic programmes of Dr.BRAOU are highly commendable, I use to read his CHERATHALU from time to time, your perception about the poet,critic and teacher a linguist who has done a great contribution to Telugu language and literature. I congratulate you ,AFSAR and his editorial team for bringing such a nice literary magazine. How to procure the books published by SARANGA Publications in INDIA,please email me so that I can place order.
    With best wishes
    M.S.HAYAT
    Head Department of URDU,
    Dr.BRAOU,Hyderabad-500 033
    email: mshayat10@gmail.com
    040-23680433,23680494, 9866589785

  3. buchireddy gangula says:

    మీ జ్ఞాపకాలు బాగా చెప్పారు — రజిని గారు

    ——————————————-
    బుచ్చి రెడ్డి గంగుల

  4. గుడ్ ఆర్టికల్ రజని.. congratulations …..కీప్ రైటింగ్

  5. రజనీ ,
    నీ
    చేరా గారి తో జ్ఞాపకాలు నన్ను బాగా కదిలించింది.ఒక్కసారిగా మూడు ధశాబ్దాల వెనక్కి నన్ను ఇష్టం గా నెట్టి ఆ రోజుల్లో క్యాంపస్ లో నా జీవితాన్ని,ఆ మహాద్భుత వ్యక్తులని, పరిచయాలని నా ముందు నిలబెట్టింది. ఆ మహోపాధ్యాయుల పరిచయం,వారితో నాకు ఏర్పడ్డ సాన్నిహిత్యం కూడా.నీ ఆర్టికల్ ఎప్పటికీ మరిచి పోకుండా చేసింది.చెల్లే……థాంక్స్ ఏ లాట్.కీప్ ఇట్ అప్.———-నీ అన్నయ్య.

మీ మాటలు

*