ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 9 వ భాగం

( గత వారం తరువాయి)

9

ఒక స్వరం కావాలిప్పుడు..ఒక గొంతు కావాలిప్పుడు. ఒక అంతర్ఘర్షణతో నిత్యం కుతకుత ఉడికిపోయే మనిషి తన అంతఃచేతనలో నుండి, తన ప్రజ్వలిత అంతర్లోకాల్లోనుండి భువి నుండి దివికి ఒక నభోపర్యంత కాంతిస్తంభమై ప్రకాశించగల వ్యక్తిత్వంతో భాసిల్లే ఒక ఆత్మధ్వని కావాలిప్పుడు.
కాలానికి ఒక ధర్మం ఉంది..ఒకే ఒక ధర్మం…దేన్నయినా సరే వృద్ధిపరచడం, క్షయింపజేయడం..యివి భౌతికంగా బయటికి కనిపించేవి.. చెట్టు చిగురించడం..మళ్ళీ ఆకులు రాలడం..కాలం గడుస్తున్నకొద్దీ ఏదైనా ఉదయించడం..ఒక నియమితకాలం గడవగానే అస్తమించడం..ఐతే అభౌతికంగా, అదృశ్యంగా నిరంతరం కాలం ప్రకృతి ధర్మాలకనుగుణంగా సకల చరాచర స్పష్టినంతా నియంత్రిస్తూ పోతూండడం..ఈ అతి ప్రధానమైన క్రియ అసలే కంటికి కనబడకుండా పూర్తి  ఒక అజ్ఞాత జీవచర్యగా కొనసాగుతూండడం..లేకుంటే..సరిగ్గా..కోడిగ్రుడ్డును పొదిగిన ఇరవై ఒకటవ రోజునే ఎందుకు కోడిపిల్ల  జీవాన్ని పోసుకుని కళ్ళుతెరుస్తుంది..ఇరవైయవ రోజో, ఇరవై రెండవ రోజో ఎందుకు ఈ జననం సంభవం కాదు. కాలం..కాలం.. విలువైన, శక్తివంతమైన, ఎవరికీ ఎప్పుడూ బోధపడని అతి విచిత్రమైన ఒక మితి..డైమెన్షన్‌..సర్వ సృష్టినీ శాసించే శక్తి.
రెండు కార్లు పోతున్నాయి..ఒక దానివెంట ఒకటి. ముందు రామం కారు. వెనుక క్యాథీ ఆడి కారు..బయట కుండపోతగా వర్షం. జర్మన్‌టౌన్‌ సెంటర్‌ బార్నెస్‌ అండ్‌ నోబుల్‌ నుండి ఓవల్‌నెస్ట్‌ సర్కిల్‌లో ఉన్న రామం ఇంటికి డ్రైవ్‌.. ఎదురుగా ఎర్రగా సిగ్నల్‌..
”ఆగుము..వేచి చూడుము..పొమ్ము”
‘దారి తెలుసుకుని..దారి స్పృహ కలిగి..నియమిత వేగంతో..ఆగి..చూచి..వేచి..సాగి..పొమ్ము..’
కావడి కొయ్యేనోయ్‌..కుండలు మన్నేనోయ్‌..కనుగొంటే సత్యమింతేనోయి,’
అసలీ కనుగొనడమేమిటి..జీవితాన్ని కనుగొనడం, దారిని కనుగొనడం, చీకటిని కనుగొనడం, వెలుగును కనుగొనడం.. చివరికి ఎవరివారు తనను తాను కనుగొనడం.. కనుగొనలేకపోవడం..కనుగొనలేక దుఃఖించడం.,
బుద్దుడు, అశోకుడు..సోక్రటీస్‌, ప్లేటో..పైథాగరస్‌..గెలీలియో..కోపర్నికస్‌..మహాత్మాగాంధీ..అందరూ ఎన్నోసార్లు.. ఎన్నో సందర్భాల్లో అరచి అరచి నినదించి అనేకానేక పరమసత్యాలను చెప్పినా..ఎవరూ వినకుండా..ఎవరిదారిన వాళ్ళు విముఖులై పారలౌకిక ప్రపంచం నిషాలో నిద్రిస్తున్నపుడు..మేల్కొలిపి..మేల్కొలిపి..అలసి.,
దుఃఖించడం..నిస్సహాయంగా, నిరామయంగా, అనివార్యమై దుఃఖించడం ఏమిటిది.. ?
మళ్ళీ మేనేజ్‌మెంట్‌ గురు స్టీపెన్‌ కోవె జ్ఞాపకమొచ్చాడు క్యాథీకి..అద్భుతమైన పుస్తకం ‘ఎనిమిదవ అలవాటు’ – ది ఎయిత్‌ హాబిట్‌..ఏమంటాడంటే..తనను తాను తెలుసుకోమంటాడు మనిషిని. ఐతే కోవె చెప్పిన కొత్త విషయాలేవీ కావివి.. అన్ని యిదివరకు తెలిసినవే..అన్నీ ఇదివరకు చెప్పబడ్డవే. అన్నీ జ్ఞానులైన మహానుభావులు ఇదివరకే గ్రంథస్థంచేసి ఒక ఆధ్యాత్మిక సంపదగా మనకందించి ఉంచినవే.
ఐతే.. పాతవాటినే..మళ్ళీ జ్ఞాపకంచేసి, మళ్ళీ తవ్వితీసి..మళ్ళీ వ్యాఖ్యానించి..మళ్ళీ మెరుగుపరిచి…రిటోల్డ్‌.. రీసర్చ్‌.. రీ కామెంట్‌..రి…రి….రీ పెయిర్‌.,
మనుషులందరూ దుఃఖిస్తున్నారు.. ఔనా, దుఃఖమునకు మూలం కోరిక..’ అనికదా బుద్ధుడు చెప్పింది..
ఇప్పుడు..ఎవరినడిగినా.,
‘నేను సంతోషంగాలేను..నాకు ఉద్యోగం లేదు.’
‘నాకు చాలినంత డబ్బులేదు’
‘నాకు అధికారం లేదు’
‘నేను చేస్తున్న వృత్తి నేను చేయదగిందికాదు. కాని విధిలేక చేస్తున్నాను.. షిట్‌’
‘నేను ఎంతో ప్రతిభావంతున్ని-కాని నన్నెవరూ గుర్తించట్లేదు’
‘అబ్బా నేను అలసిపోయాను-నా జీవితమంతా ధ్వంసమైపోయింది. ఇప్పుడెలా’
‘నాకవకాశాలు లేవు.. ఉంటే నా ప్రతాపం చూపించేవాణ్ణి’
‘నా భార్య నా మాట వినదు-నా ఇల్లొక నరకం’
‘నా పిల్లలు దరిద్రులు-ఎంతో కష్టపడి పెంచితే విశ్వాసఘాతకులై మిగిలారు’
‘అన్నీ ఒట్టి కలలే..అవి సాకారమయ్యే అవకాశాలే లేవు’
‘ఈ అవినీతికర భారతదేశంలో హాయిగా అందరూ చేతికందినంత మేరకు దోచుకుంటూ, తప్పించుకు తిరుగుతూ రాజాలా బ్రతుకుతున్నారు.. నేనేమిటి ఈ దరిద్రం’
అన్నీ ఇవే.. ఎక్కడ విన్నా యివే గొంతులు..యిటువంటివే అందరి అసంతృప్తి స్వరాలు.. యివే ఆరోపణలు.. యివే ఆత్మఘోషలు.
వీటన్నిటికీ మూలం..నొప్పి..పెయిన్‌..వేదన..అసంతృప్తత..ఫలితం అశాంతి..దుఃఖం
ఈ దుఃఖాన్ని అధిగమించి మనిషికి శాశ్వతమైన స్వాంతనను చేకూర్చగల శాంతికావాలి..ఎక్కడుందది..ఎలా దొరుకుతుందది.
అన్వేషణ..ఎడతెగని అన్వేషణ..నిరంతరాన్వేషణ.
కోవె అంటాడు ‘ఇప్పుడొక గొంతుకావాలి..మనిషి తనను..తన ఆత్మికమైన అంతరంగాన్ని, హృదయాన్ని తెలుసుకుని తననుతాను వ్యక్తీకరించుకోగలిగే ఒక స్వరం కావాలి..ది ఎయిత్‌ హాబిట్‌..తనను తాను నిరంతరం స్పృహలో ఉంచుకుంటూ, సచేతనంగా పదునుపెట్టుకుంటూ కొనసాగుతూనే..ఆత్మను ఒక స్వరంగా వ్యక్తీకరించుకోగల అద్భుతమైన అలవాటును మనిషి నేర్చుకోవాలి..ఒక తన స్వరాన్నే కాదు ఎదుటి మనిషి హృదయాన్ని కూడా స్వరంగా వినగల సహనంతో కూడిన సంస్కారంకావాలి.’
ఆకుపచ్చలైటు వెలుగుతూండగా..కార్లు దూసుకుపోతూ..క్యామ్‌ ఫ్రీ..రాయల్‌ క్రౌన్‌..మైల్‌స్టోన్‌ డ్రైవ్‌..
ఎదురుగా బ్రూక్‌ ఫీల్డ్‌..ఓవల్‌ నెస్ట్‌ సర్కిల్‌.,
పెద్ద.. విశాలమైన..అట్టహాసాలేవీ లేని ఒక ఇంటిముందు..గ్యారేజ్‌ ఎదుట రెండు కార్లు ఆగి.,
‘నిరాడంబరత అనేది మనిషి తనను తాను పరిత్యాగించుకోవడానికి మొదటి సాధనం క్యాథీ’ అని ఎన్నోసార్లు రామం చెప్పిన వాక్యం జ్ఞాపకమొచ్చిందామెకు.
క్రమక్రమంగా దేన్నైయితే మనిషి మక్కువపడి మోహంతో, ఒక అలవాటును స్వంతంచేసుకున్నాడో దాన్ని ఉద్దేశ్యపూర్వకంగా వదులుకోవడమే పరిత్యాగమైతే..దేన్నయినా పరిత్యాగించడం అంత సుళువైన విషయమేమి కాదు. సుఖాలు, ఆడంబరాలు, అలంకారాలు, ధన, కామ, జిహ్వసంబంధ సర్వకామనలన్నీ మనిషిపై రాక్షస సమూహంలా దాడిచేసి ఆవహించిన తర్వాత లొంగి వివశమైపోవడంతప్ప ఒక్కోదాన్ని త్యజించి బయటపడడం దుర్లభం.
రామం. దేనికీ ఆధీనుడైపోయినట్టుగానీ, వశుడై లొంగిపోయినట్టుగానీ, బానిసైపోయినట్టుగానీ ఏనాడూ కనిపించలేదు సరికదా.. అన్నింటికీ అతీతుడై స్థిరపడినట్టే అనిపిస్తుందెప్పటికప్పుడు.
కారు దిగి.. తలుపులు తెరిచి..లైట్లు వేసి..క్యాథీకోసం స్వింగు డోర్‌ను ఇంకా తెరిచి పట్టుకున్నాడు.
క్యాథీ ప్రక్కనున్న ఎగ్జిక్యూటివ్‌ బ్రీఫ్‌ను చటుక్కున తీసుకుని..క్షణకాలంలో ఒత్తుగా కురుస్తున్న వర్షపు చినుకుల్లోనుండి లోపలికొచ్చేసింది.
రామంది విశాలమైన యిల్లు..ఎంతో యిష్టపడి..తను చేసే ప్రతిపనికి ఉత్తేజాన్నందించే వాతావరణాన్ని సమకూర్చేటట్టుగాపెద్ద హాల్‌లోని ప్రతి వస్తువునూ అమర్చుకున్నాడు.
అంటాడు..”మనకు తెలియకుండానే మనం పనిచేస్తున్న ప్రాంత వాతావరణయొక్క ప్రభావం మన మీద చాలా గణనీయంగా ఉంటుంది క్యాథీ. మంచి సాధకుడెప్పుడూ తన పరిసరాల్ని తను చేయబోయే పనికి అనుగుణంగా రూపొందించుకోవాలి.” అని.
ఏదో చిత్రమైన మోహకమైన పరిమళం అనుభవంలోకొచ్చింది. అన్నింటికంటే శక్తివంతమైన నిశ్శబ్దం.. సన్నని వానచినుకుల చప్పుడు.. పల్చని లేత వెలుగు.. హాయిగా ఉంది.. అంతా.
తెగిపోయిన ఒక ఎగ్జిక్యూటివ్‌కు ఉండవలసిన ఎనిమిదవ అలవాటు ‘మనిషికి ఉండవలసిన స్వంతగొంతు’ గురించి మళ్ళీ జ్ఞాపకమొచ్చిందామెకు. నిజానికి ప్రతి మనిషియొక్క వేలిముద్ర, ప్రతి జీవియొక్క నాడీస్పందన తాలూకు తరంగం భిన్నభిన్నంగా ఉన్నట్లే ప్రతి మనిషి యొక్క స్వరం కూడా భిన్నంగా ఉంటుందనీ, ఏ ఇద్దరి స్వరాలూ ఒకేరకంగా ఉండవనీ, స్వరం ఎవరిదైనా వాని అనివార్యతతోకూడిన అవసరం, ప్రతిభ, కాంక్షాతీవ్రత మరియు ఆత్మలయొక్క సమీకృత సంకేతంగా వెలువడ్తుందని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. స్వరం, స్వభావం, తీవ్రత, ప్రభావం సందర్భాన్నిబట్టి మారుతాయి కాని మూల లక్షణం మారదు. దాని మాడ్యులేషన్‌ మారదు.
చాలా ఉద్విగ్నంగా ఉంది క్యాథీకి.
రామం ఎదురుగా ఉన్న సింగిల్‌సీటర్‌ సోఫాలో కూర్చున్నాడు. కూర్చున్న మరుక్షణమే చేతికిందున్న స్విచ్‌ను ఆన్‌ చేయడంవల్ల హాల్లో ఒకేసారి రెండుమూడు లైట్లు వెలిగాయి. వాతావరణం కూడా చిక్కని, తెల్లని పాలనురుగువంటి కాంతితోనిండి  జీవవంతమైంది.
సరిగ్గా అతనికి ఎదురుగా ఉన్న మరో విలువైన సింగిల్‌ సీటర్‌ సోఫాపై క్యాథీ కూర్చుని మోకాళ్ళపై తన బ్రీఫ్‌ను పెట్టుకుని తెరిచింది.
ఎంతో ప్రధానమైతే తప్పితే రామం ఎవరినీ యింటికి ఆహ్వానించడు. తనకు తెలిసి ఒకసారి లయన్‌బ్రిడ్జ్‌ సిఇఓ పీటర్స్‌ రాండ్‌, కాగ్నిజెంట్‌ విపి విలియం చుఫ్‌ను ఒక్కోసారి విడివిడిగా పిలిచాడు. అతి విలువైన వ్యక్తులు అతి ఖరీదైన కార్లలో తెగిన చుక్కల్లా అప్పుడప్పుడు రామం ఇంటికి వస్తూండడం, ఆ కాలనీ వాసులను ఆశ్చర్యపర్చడం క్యాథీకి తెలుసు.
”క్యాథీ.. ఈ వర్షంకురుస్తున్న రాత్రి నీకూ, నాకూ..మనిద్దరి భవిష్యత్తుకూ ఎంతో ప్రధానమైంది. చారిత్రాత్మకమైంది. నీకు ఇప్పటికే నేనిచ్చిన ఎజెండా ప్రకారం మనం చర్చించబోయే అంశాలు ఎంతో విలువైనవి. కీలకమైనవీ.. ఒక దేశానికి చెందిన కోట్ల ప్రజల జీవితాలను సమూలంగా ప్రభావితం చేసేవి. ఇప్పుడు నువ్వు జీవానివి.. ప్రాణానివి.. చేతనవు.. నడిపే మార్గదర్శివి..నేను శ్రోతను. శరీరాన్ని..ఆయుధాన్ని..కర్తను..నీవు పూర్ణ స్ఫూర్తివి..ఊఁ..కానీ..”అన్నాడు.
ఆ క్షణం రామం ముఖం అప్పుడే ఉదయిస్తున్న శిశుసూర్యునిలా ఉంది.
సరిగ్గా అప్పుడు ఎనమిది గంటల పన్నెండు నిముషాలైంది. ఒకగంట తమ సమాగమం. క్యాథీ ఒక ప్లాస్టిక్‌ ఫైల్‌ను బయటికితీసి మోకాళ్ళపై పెట్టుకుని..తెరిచి…కొన్ని కాగితాలను చదివేందుకు అనువుగా సర్దుకుని అంది…
అప్పుడు తెల్లని కాంతితో ఎదురుగా నిర్మలహృదయంవల్ల వెలిగిపోతున్న క్యాథీ ముఖాన్ని ఓ లిప్తకాలం చూచి.. రామం గంభీరంగా కనురెప్పలను మూసుకున్నాడు. ఆ క్షణం అతనిలో ఏదో వెలుగు పొటమరించి..మొలకై…విప్పారి.. విస్తరించి.,
యోగ సూత్రాలను ప్రవచించిన పతంజలి ఏమన్నాడంటే..’ఒక అసాధారణమై సాధించవలసిన లక్ష్యం గొప్ప బాధ్యతగా మనను ఉత్తేజపరుస్తున్నప్పుడు మనిషియొక్క సర్వచింతనలూ శకలాలు శకలాలుగా విడిపోయి హద్దులనధిగమించి మగ్నమైన మనసు సమస్తావధులను అతిక్రమిస్తుంది. అప్పుడు ఆత్మ బహుముఖమైన అన్ని దిశల్లో విస్తరించి ఒక కొత్త మహోన్నతమైన అద్భుతప్రపంచాన్ని కనుగొనేలా మనిషిని ఉద్యుక్తుణ్ణిచేస్తుంది. అని..ఇప్పుడు మనకు ఈ ప్రాణతుల్యమైన ప్రవచనమే మార్గదర్శి రామం’ అంది ఒక అశరీర వ్యవస్థ మాట్లాడ్తున్నట్టుగా.
రామం సమాధిలో ఉన్న వ్యక్తిలా ”అవును” అన్నాడు.
”ఇంకో ప్రధానమైన విషయాన్ని చెబుతాను రామం..మనలో కొద్దిమంది మాత్రమే గొప్ప పనులు చేయగలరు. కాని మనందరం గొప్పవికాని ఎన్నో మామూలు పనులను తప్పకుండా చేయగలం..గొప్ప ప్రేమతో..అంది మదర్‌ తెరేసా. ఇది మన భవిష్యత్‌ కార్యకలాపాలకు ప్రాతిపదిక..”
‘అవును..”
”నువ్వు అమెరికాకు టిసిఎస్‌ ఉద్యోగిగా వచ్చి ఈ నేలపై అడుగుపెట్టింది జూన్‌ ఇరవై ఆరు పందొమ్మిదివందల తొంభైఏడు. మొదట మేరీల్యాండ్‌ ఆఫీస్‌లో రిపోర్ట్‌చేసి కార్యకలాపాలను ప్రారంభించావు. నువ్వు అతిగోపనీయమైన కొన్ని నాసా ప్రొడక్ట్స్‌ను, అప్పుడే ఎస్‌ఎపీతో అద్భుతాలు ప్రదర్శిస్తూ వాల్‌మార్ట్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహణను పర్యవేక్షిస్తూండేవాడివి. నాన్న..నేను అమెరికా వ్యాపారవ్యవస్థను శాసించే వాల్‌మార్ట్‌, కాట్స్‌కో, టార్గెట్‌, హోమ్‌ డిపోవంటి సంస్థలకు కొన్ని ఉత్పత్తులను సరఫరా చేసేవాళ్ళం..ఆ క్రమంలో మొట్టమొదటిసారిగా నాన్న జేమ్స్‌కోవె, నేను మీ రాక్‌విల్లే ఆఫీస్‌కువచ్చాం. అది అగస్ట్‌ ఇరవైరెండు..ఉదయం పదకొండుగంటల ఇరవై ఒక్క నిమిషం. ఆ క్షణమే నేను నిన్ను చూశాను. పలకరించాను. పరిచయం చేసుకున్నాను. భారతీయ ముహూర్తశాస్త్రం మీద విశ్వాసం గల వ్యక్తిగా ఆ మహత్తర క్షణాల్ని నాకు ప్రసాదించినందుకు కాలానికి నా ధన్యవాదాలు..”
”ఊఁ …”రామం మౌనంగా వింటున్నాడు కళ్ళుమూసుకునే.
”ఒక ఏడాది కాలంలో మనం పదకొండుసార్లు కలుసుకున్నాం. కలుసుకున్న ప్రతిసారీ మన మధ్య ఒక మౌన సంభాషణ జరిగేది. నాకైతే గత ఎన్నో జన్మల నుంచి మన మధ్య ఓ అపూర్వమైన, ఈ సైన్స్‌కు అందని అదృశ్య అజ్ఞాత బంధముందని అనిపించేది. మొట్టమొదటిసారి ఎంతో ధైర్యంచేసి, భయంభయంగా నిన్ను ఓ రోజు రాత్రి ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు డిన్నర్‌కు ఆహ్వానించాను. అది జూలై ఎనిమిదవ తేది. నేను తెలుగు నేర్చుకునేందుకు కొన్ని పుస్తకాలు కావాలని అడిగాను. నువ్వు నవ్వి తెలుగు నేర్చుకోవడం అంత అవసరమా అని అన్నావు..నేను ఔనన్నాను. ఆశ్చర్యంగా మూడురోజుల్లో ఇరవై ఎనిమిది తెలుగు పుస్తకాలను భారతదేశంనుండి తెప్పించి ఇచ్చావు. తద్వారా నా పట్ల నీకున్న శ్రద్ధ అర్థమైంది.”
వింటున్న రామం పెదవులపై చిరునవ్వు వెలిగి మాయమైంది.
”ఆగస్ట్‌ పన్నెండవతేది, తొంభై ఎనిమిదిన అనూహ్యంగా డాడీ హార్ట్‌ ఎటాక్‌తో కన్ను మూసారు. అది ఒక పెద్ద షాక్‌ నా జీవితంలో. అకస్మాత్తుగా ఈ ప్రపంచంలో ఒంటరినైపోయాను. నా ఇరవై ఎనిమిదేళ్ళ జీవితంలో ఒక తండ్రిగానే తెలిసిన వ్యక్తి ఓ స్నేహితునిగా, సహచరునిగా, శ్రేయోభిలాషిగా, ఆత్మీయునిగా అనేక రూపాల్లో ఎంత బలంగా నాలోనాన్న ముద్రించుకుపోయాడో అప్పుడు ఏర్పడ్డ శూన్యం తెలిపింది. యిక నేను శూన్యం గురించీ, శూన్యానికి ముందు శూన్యం, తర్వాతి శూన్యం గురించీ ఆలోచించడం మొదలుపెట్టాను. సున్నా ఒంటరిగా ఉన్నంతసేపు దాని విలువ సున్నాయే కాని దానికి అటో ఇటో ఒక ఒక్కటి చేరితే అది తప్పకుండా ఒక సంఖ్యయి కొత్త విలువను పొందుతుంది. అందుకే నా సంఖ్య ఒక అంకెగా చేరి నాకు విలువను సంపాదింపజేయగల వ్యక్తిగురించి అన్వేషించడం ప్రారంభించాను.”
”……”
”ఎందుకో భగవంతడు నిన్ను స్ఫురింపజేశాడు.. ఐ బిలీవ్‌ ఇన్‌ గాడ్‌. అనేక సిద్ధాంతాలు, వాదనలు ఘర్షణలతో వాదులాడుకునే అనేక ప్రపంచదేశాలు.. ఇండియాతో సహా ఎక్కడా భగవంతుడున్నాడని బహిరంగంగా.. రాజ్యాంగబద్దంగా ప్రకటించలేని వర్తమానంలో.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో, సైనిక మరియు యుద్ధ పాటవాల్లో అగ్రదేశమైన అమెరికా  మాత్రం రాజ్యాంగబద్ధంగా కరెన్సీపైనా, ప్రమాణ పత్రాల్లో సహా..ఇన్‌ గాడ్‌ వియ్‌ ట్రస్ట్‌’ అంటుంది. ఇది ఒకరకంగా మనిషి ఒట్టి నిమిత్తమాత్రుడనే పరమసత్యాన్ని అంగీకరించడమే..సరే..ఐతే, ఆ భగవంతుడే మనమధ్య ఓ వారధిగా ప్రవేశించి సంధానం చేశాడని నేను నమ్ముతాను మనస్పూర్తిగా..మూడు పెద్ద ఫ్యాక్టరీలు, విస్తృతమైన వ్యాపార సామ్రాజ్యం, దాదాపు పది బిలియన్‌ డాలర్ల అసెట్‌ వాల్యూ ఉన్న నేపథ్యం నాదప్పటికి. వాటి నిర్వహణ, రక్షణ, భవిష్యత్తు..ఇవన్నీ నన్ను ఎంతో కలవరపెట్టేవి. కొద్దికాలం..’కిం కర్తవ్యం’ అనే ఆత్మశోధనతో గడిపాను. పిచ్చిగా, నిరామయంగా..నిర్వ్యాపారంగా..దేశమంతా తిరిగాను. ఈ విశాల దేశంలో నాకు తెలిసిన ప్రశాంతతను కలిగించే ఎన్నో ప్రదేశాల్లో శాంతికోసం వెదికాను. ఫిలడల్ఫియా, న్యూయార్క్‌, టెక్సాస్‌, ఫ్లోరిడా.. కొలరాడో..ఒరెగాన్‌, ఫిట్స్‌బర్గ్‌.. ఇంగ్లాండ్‌, భారతదేశం, సింగపూర్‌..ఎన్నో ప్రాంతాలను సందర్శించాను. ఐతే.. మనిషి ఎప్పుడూ తన బయటఉన్న ప్రపంచంలో అన్వేషిస్తాడు తప్ప..తనలోనే నిక్షిప్తమైఉన్న అంతరిక ప్రపంచాన్ని గుర్తించడు.. ఈ క్రమంలో ఎన్నెన్నో ప్రసిద్ధ పుస్తకాలను అధ్యయనం చేశాను. ఉహు.. బయట ఏమీ లేదని అర్థమైంది. ఏదైనా ఉందంటే అది జీవిలోపలేఉందనీ, అంతిమంగా మనిషి తనకోసం కాకుండా తనులేని ఇతర ప్రపంచాన్ని ప్రేమించగలిగినప్పుడే బోధపడ్తుందనీ తెలిసింది. అందుకే…ఇఫ్‌ యు రిమెంబర్‌, మూడు నెలలు నీకు కనిపించకుండా అప్పుడు నేనుమరుగైపోయాను..అప్పుడు నీతో పాటు రాక్‌విల్లేకు దగ్గర్లోనే ఉన్న ఇన్‌ఫోసిస్‌లో పనిచేసే హెచ్బార్‌ మేనేజర్‌ లీల నీతో సన్నిహితంగా ఉండేది. లీల తెలివికి, చొరవకు, చొచ్చుకుపోయే తత్వానికీ నేను ఎంతో అశ్చర్యపోయేదాన్ని. తమ క్లెయింట్స్‌తో ఆమె ఇంటరాక్టయ్యే పద్ధతికూడా ఎంతో విలక్షణంగా, ప్రత్యేకంగా ఉండేది. సడెన్‌గా..ఒక ప్రత్యేకమైన సందర్భంలో వాల్‌మార్ట్‌ డీలింగులో ఏర్పడ్డ స్టాగ్నేషన్‌ వల్ల నీవద్దకు టిసిఎస్‌కు వచ్చాను. కాని నువ్వు లేవు. ఉద్యోగానికి రాజీనామా చేశావని చెప్పారు..ఇదంతా మననం చేసుకోవడం ఇప్పుడెందుకంటే..స్పష్టమైన భవిష్యత్తును నిర్మించుకోవాలనుకుంటే స్పష్టంగా ఒకసారి గతంలోకి తొంగి చూచుకొమ్మని శాస్త్రం చెబుతోంది.”
”……..” రామం నిగ్రహంగా వింటున్నాడు కళ్ళుమూసుకునే.
”పోలీస్‌లా నా మనుషులతో నీ గురించి పూర్తి వాకబు చేయించి డెట్రాయిట్‌లో నిన్ను కలిశాను మళ్ళీ. అప్పుడు ఉద్యోగి స్థితినుండి ఒక ఎంటర్‌ప్రున్యూర్‌్‌గా ఎదుగుతున్నావు నువ్వు. రిస్క్‌ తీసుకోకుండా ఒక డిపెండెంట్‌గా పనిచేసి జీతం తీసుకుని ఆనందంగా వెళ్ళిపోయేవాడు ఉద్యోగి. ఒక నిర్దుష్ట లక్ష్యాన్ని చేరే క్రమంలో రిస్క్‌ను, చాలెంజ్‌స్‌ను స్వీకరిస్తూ అవరోధాలను ఎదుర్కుంటూ ముందుకు సాగేవాడు ఔత్సాహికుడు.. నీలో అప్పటికి పరిణతి చెందుతున్న ఎంటర్‌ప్రున్యుర్‌ కనిపించాడు నాకు. జ్ఞాపకముందా..ఆ రోజు మనం డెట్రాయిట్‌ మారియట్‌్‌ హోటల్‌లో కలిశాం.”
”ఊఁ …”
బయట వర్షం ఉధృతి పెరిగినట్లు కురుస్తున్న చినుకుల పెరిగే ధ్వని చెప్తోంది.

10
”అప్పటికి లీల అమెరికాలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియాకు వెళ్ళిపోయింది…ఆమె గురించి నువ్వు నాకు అప్పుడు చెప్పిన రెండు వాక్యాలు బాగా గుర్తున్నాయి. ఆమె…’ఈ అమెరికా ఉద్యోగం..ఈ చిన్నచిన్న లావాదేవీలు నాకు తృప్తి నివ్వడం లేదు రామం..తిమింగలం  మహాసముద్రంలో ఉండాలిగాని చెరువులోకాదు అని అన్నట్లు నువ్వు నాకు చెప్పావు. ఐతే తిమింగలానికి చెరువనేది ఒకటుంటుందనే విషయమే తెలియదనే విషయం ఆమెకు తెలియదని తెలిసి ఆమెపై నాకు జాలి కల్గింది. మనిషి తనను తాను అతిగా అంచనా వేసుకోవడం పతనానికి మొదటి థ.. సరే.. ఆ రాత్రి నిజానికి మనం.. కాదు నేను నిన్ను నీవేమిటో తెలుసుకున్నాను. నువ్వు నా ఊహకందని ఒక కొత్త నీ  మనోప్రపంచం గురించీ,  నీ  మూలాలు ఎక్కడైతే..ఆంధ్రదేశంలో ఉన్నాయో అక్కడి ప్రజల గురించిన తపనా..అక్కడి పతనమౌతున్న మానవతా నైతిక విలువల గురించీ, అరాచకంగా ప్రబలుతున్న విచ్చలవిడితనం గురించే, హింసాత్మక ఉద్యమాల గురించీ, జనంలో వెర్రి తలలు వేస్తూ విజృంభిస్తున్న దోపిడిగురించీ చర్చించావు. ఒక మానవ సమాజంలో తేవలసిన సామాజిక పెనుమార్పులను నీ వ్యూహాత్మక కార్యాచరణతో ఎలా సాధించాలనుకుంటున్నావో కూడా చెప్పావు.. అక్కడ పడింది బీజం..”
”ఊఁ..”
”సరే..అదలా పెడ్తే..ఒక రోజు మనం పిట్స్‌బర్గ్‌లో కావాలని ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని, గుళ్ళో ప్రత్యేక పూజలు జరిపించి..ఒక లగ్జరీ రిక్రియేషన్‌ వెహికిల్‌ను తీసుకుని రెండు రోజులు అవగాహన యాత్ర చేశాం..పిచ్చి పిచ్చిగా, స్వేచ్ఛగా అమెరికా అంతా తిరుగుతూ..నిజమైన నిన్ను నేను..అసలైన నన్ను నువ్వు స్పష్టంగా తెలుసుకున్నాం..జ్ఞాపకముందా ఆరోజు పెన్సెల్వేనియాలో వన్‌ ఫిప్టీ నైన్‌ ఎగ్జిట్‌ వద్ద ఉన్న రెస్ట్‌ ప్లాజా పార్కింగు ఏరియాలో..ఆ రాత్రి.. ఇదేవిధంగా ఒక భోరుమని వర్షం కురుస్తున్న రాత్రి..ఆర్‌విలో..బెడ్‌పై నువ్వు పడుకున్నావు..నేను ఎదురుగా కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుని.. సమాధిలో ఉన్న మనిషిలా ధ్యానముద్రలో..అప్పుడు మన మధ్య ఒక గాఢ గంభీర నిశ్శబ్దం మాత్రమే ఉంది.. మనిషి అప్పుడప్పుడు ఏదో ఒక అంతర్‌కల్లోలంలో మునిగిఉన్నపుడు..శరీరం ఒట్టి నిమిత్తమై చుట్టూ ప్రపంచం ఒక హేతువుగా మిగిలి అంతా మిథ్యాగత వస్తువుగా గోచరిస్తుంది..ఆ స్థితిలో..నువ్వు అంతర్లోకాల్లోనుండి..మహాభాగవతంలోనుండి ఒక పద్యాన్ని స్వగతంలోలా చదివావు..అది ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు భగవంతుడెక్కడున్నాడని గుచ్చిగుచ్చి ప్రశ్నించినపుడు.. తండ్రిని పిచ్చివాడా..భగవంతుడు ఇక్కడ..ఇక్కడ..అని ఎక్కడ చూపించగలను..ఎక్కడ వెదికితే అక్కడ..ఎక్కడ దర్శించగలిగితే అక్కడే ఉన్నాడు..అని చెప్పిన అద్భుతమైన పద్యం..”కలడు అంభోధి, కలండు గాలి, కలడు ఆకాశంబునన్‌, కుంభినిన్‌ గలడు, అగ్నిన్‌ దిశలన్‌..”చదివావు. పోతన రాసిన ఆ ధారాపాతమూ, ఆపాత మధురమూ ఐన ఆ పద్యాన్ని ధ్యాన ముద్రలో ఉండి విన్న నేను..నువ్వు ఆ పద్యాన్ని చదవడం పూర్తి చేయగానే..ఒక పారవశ్యమాధుర్యంలో సమాధియై ఆ పద్యాన్ని ఉన్నదున్నట్టుగా మొదటి అక్షరంనుండి చివరదాకా గడగడా రాగయుక్తంగా చదివి వినిపించాను.
నువ్వు ఆశ్చర్యంతో కొయ్యబారిపోయావు..అసలేం జరిగిందో నీకర్థం కాలేదు..పోతన అసాధారణమైన, ప్రాణప్రదమైన పదాల కూర్పుతో రాసిన, పలకడానికే కష్టమైన ఆ పద్యాన్ని..అసలు తెలుగు భాషే రాని నేను ఒట్టిగా ఒక్కసారే విని ఉన్నదున్నట్లుగా పునరుత్పత్తి చేయడం నిన్ను అప్రతిభుణ్ణి చేసింది. అప్పుడు మొదటిసారిగా నాలో ఉన్న అసమాన జ్ఞాపక శక్తిగురించి తెలిసింది నీకు. నా మెదడు ఒక టేప్‌రికార్డర్‌ వంటిది..ఒకసారి దానికి ‘రికార్డ్‌’ కమాండ్‌ ఇస్తే అర్థం చేసుకోవడంతో నిమిత్తం లేకుండా మెదడులో అంతా ముద్రించబడ్తుంది. ఒక మిగిలింది రివైండ్‌ అండ్‌ ప్లే..మళ్ళీ చదువు క్యాథీ అని అడిగావు నువ్వు ఆ షాక్‌లోనుండి కోలుకుంటూ..నేను మారు మాట్లాడకుండా ఆ పద్యాన్ని మళ్ళీ మొదట్నుండి చివరిదాకా చదివి వినిపించాను. ఉక్కిరిబిక్కిరైన నువ్వు చటుక్కున నీ బెడ్‌పైనుండి లేచివచ్చి నన్ను గట్టిగా ఆలింగనం చేసుకుని పెదవులపై గట్టిగా ముద్దుపెట్టుకున్నావు. అది మన మధ్య మొదటి..పవిత్రమైన చుంబనం.” ఆగి..మాట తడబడి..గద్గదమైపోయి.. చలించిపోతూ,
అప్పటిదాకా కళ్ళుమూసుకుని వింటున్న రామం..ఆమె చెబ్తున్న దృశ్యాన్ని మననం చేసుకుని..ఆనాటి జ్ఞాపకంలో తడిచి.,
మధ్య ఒక మాటలులేని మౌనం పెల్లుబికింది.
”తెలుగు బాషపట్ల ఎందుకో నాకు వ్యామోహం కలిగింది. నాన్న పోయిన తర్వాత ఆ దుఃఖాన్ని మరిచిపోయేందుకో, నన్ను నేను సంభాళించుకునేందుకో, లేక నన్ను నేను మరిచిపోయేందుకోగాని నేను చేసిన అతి ప్రయోజనకరమైన పని తెలుగును సమగ్రంగా నేర్చుకోవడం, తెలుగు వారసత్వ సాహిత్యాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకోవడం. ఆముక్తమాల్యద వంటి మహాకావ్యాన్ని స్వయంగా చదివి అర్థంచేసుకునే స్థితిని సాధించడం మామూలు విషయంకాదు. మనిషికి భగవంతుడు ప్రసాధించిన ప్రజ్ఞ ఒక వరమైతే దాన్ని ఎప్పటికప్పుడు పదునుపెట్టుకుంటూ నిర్మాణాత్మకంగా ఉపయోగించుకోవడం అదృష్టం. నేను అదృష్టవంతురాలిని. అందుకే ఎప్పుడూ సానుకూలధోరణే నన్ను నడిపిస్తూంటుంది. తెలుగు సాహిత్యంలో నన్ను వహ్వాయిది ఎంత అద్భుతం అని అనిపించిన వచనం మహాభాగవతంలో నరసింహావతార అవిర్భావ సందర్భంలో.. విష్ణుమూర్తి స్తంభాన్ని చీల్చుకుని వెలువడే మహాభీకర సందర్భాన్ని వర్ణించిన రెండున్నర పేజీల ఎవరైనా ఏకబిగిన చదువలేని వచనధార ఉంది.. అది ఒక అద్భుతం. దేశంలో ఏ ఒకటోరెండో శాతం అక్షరాస్యత ఉన్న కాలంలో పామరజనం కేవలం మౌఖికంగా విని అర్థంచేసుకుని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ధారణచేయగల అతిసాధారణ అలతి అలతి పదాలతో జీవితసత్యాలను సజీవ ఉపమానాలతో ఆటవెలదులుగా తెలుగుజాతికీ, ప్రపంచానికీ అందించిన ఏకైక తెలుగు మహాకవి యోగి వేమన. యిందరు మహానుభావులను కన్న పవిత్రనేలపై రామం అనబడే ఈ వ్యక్తి కూడా జన్మించడం ఎంత అదృష్టమో అని పరవశించిపోతాన్నేను.. రామం నువ్వు నా దృష్టిలో కారణజన్ముడవు..నువ్వు మాత్రమే నిర్వర్తించవలసిన కొన్ని ఘనకార్యాలు నీకోసం వేచి ఎదురుచూస్తున్నాయి. యిక సమయం ఆసన్నమైంది. ఒక సువర్ణ ఆధ్యాయానికి తెరలేవబోతోంది..ఒక కొత్త చరిత్రకు అంకురార్పణ జరుగబోతోంది..అందుకు ముహూర్తం నిర్ణయించాను రామం. అందుకు సర్వరంగాలనూ సన్నద్ధం చేశాను. సకల శక్తులనూ సమీకరించి ఉంచాను..యిక నువ్వు శంఖాన్ని పూరించడమే తరువాయి..”
రామంకు ఆ ముహూర్తం సంగతీ..కార్యక్రమ రూపకల్పన సంగతీ..అన్నీ తెలుసు. కాని..అన్నాడు..”ఎప్పుడు క్యాథీ” అని.
”ఈ రోజు ఆగస్ట్‌ పది..మనం యుఎస్‌ఎలో ఉన్న మన అన్ని లావాదేవీలనూ జీరో చేయడమో, కొన్నింటిని మనం మళ్ళీ యిక్కడికి ఫిజికల్‌గా తిరిగివచ్చి నిర్వహించవలసిన అవసరం లేకుండా రీషేప్‌ చేయడమో చేశాను. వాటి వివరాలు చెప్పనా.”
”ఊఁ..”
”నువ్విక్కడికి వచ్చి భవిష్యత్తులో ఆంధ్రదేశంలో నువ్వు నిర్వర్తించవలసిన భావికార్యక్రమాల నిర్వహణ దృష్ట్యా కొన్ని నిధులు అవసరమనే వాస్తవిక సత్యాన్ని గ్రహించి పదేళ్ళ కాలంలో మెరుగైన ఫలితాలనివ్వగల కొన్ని కంపెనీలను స్థాపించావు. అవి ఆర్‌వి కన్‌స్ట్రక్షన్స్‌, న్యూ ల్యాండ్‌స్కేపింగు పీపుల్‌, రామం రియల్‌ రిఆల్టర్స్‌, ఎబిసి లాగిస్టిక్స్‌, సిన్సియర్‌ కన్‌సల్టెంట్స్‌, రామం సిస్టమ్స్‌. ఇవి కాక ఎనిమిది రాష్ట్రాల్లో ఎనిమిది ఇండియన్‌ స్టోర్స్‌ అటాచ్డ్‌విత్‌ ఇండియన్‌ రెస్టారెంట్స్‌.. చెయిన్‌. వీటి విలువ ఎస్టాబ్లిష్‌మెంట్‌ టైంలో ఇరవై మిలియన్‌ డాలర్లు. దీంతో నువ్వు నీ స్నేహితులద్వారా నీకున్న మేనేజ్‌మెంట్‌ స్కిల్సన్నీ ఉపయోగించి పెట్టుబడి పెట్టిన క్యాపిటల్‌ మూడు బిలియన్‌ డాలర్స్‌. మిగతావన్నీ వివిధ బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలు.మనకు ఎక్కువగా సహకరించి డబ్బును సమకూర్చిన బ్యాంక్స్‌ బ్యాంకాఫ్‌ అమెరికా, సిటిగ్రూప్‌, మోర్గాన్‌ స్టేన్లే, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, సన్‌ట్రస్ట్‌, క్యాపిటల్‌ వన్‌ ఫిన్‌.. వీటితో చాలా బ్యాంకులకు నాన్నకు చెందిన హోల్డింగ్సును మొదట సెక్యూరిటీగా చూపాం. తర్వాత బెస్ట్‌ పర్‌ఫార్మింగు కంపెనీస్‌ క్రింద మన సంస్థలకన్నింటికీ ఈ పైనాన్సియల్‌ ఇన్‌స్టిట్యూషన్లలో పరపతి పెరిగింది.
మన ప్రణాళిక పకడ్బందీగా ఉంది కాబట్టి డెడ్‌లైన్‌ను దృష్టిలో పెట్టుకుని కార్యకలాపాలనను నిర్వహిస్తూ వచ్చాం. మొన్నటి మార్చి ఫైనాన్షియల్‌ ఇయర్‌ నాటికి మన సంస్థల పర్‌ఫార్మెన్స్‌ను ఖచ్చితంగా మదింపుచేశాను. యిప్పుడు మన నెట్‌ అసెట్‌ వ్యాల్యూ ఇరవైరెండు బిలియన్‌ డాలర్స్‌. నా తరపున ఉన్న హోల్డింగ్సు విలువ ఎనిమిది బిలియన్‌ డాలర్స్‌. మనం చెల్లించవలసిన లయబిలిటీస్‌ మొత్తం ఆరు బిలియన్‌ డాలర్స్‌. మన ఆర్థికస్థితిగతులు ఎంతో ఆరోగ్యంగానే ఉన్నట్టు లెక్క”.
రామం తదేకంగా క్యాథీవైపు చూస్తున్నాడు.
ఒక పెద్ద ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తన బోర్డాఫ్‌ డైరెక్టర్స్‌ మీటింగును జరుపుతున్నప్పుడు జరిగే ప్రధాన తతంగాన్నంతా క్యాథీ ఒక్కతే ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తోందీ..అనుకున్నాడు..ఈ ఒక్క మనిషి పదిమంది సమర్థులైన మేనేజర్లతో సమానం అనికూడా అనుకున్నాడు. కాగా విశ్వసనీయత సంగతో..ఆమెను నమ్మడమంటే తనను తాను, తన నీడనుతాను, తన ఆత్మనుతాను విశ్వసించినట్టే.
ఒకసారి క్యాథీతో తను చర్చించిన చిత్రమైన విషయం జ్ఞాపకమొచ్చింది రామంకు.
”క్యాథీ..ఒక మనిషి ఒక జీవితకాలంలో రెండు మూడు జీవితాలను జీవించడం, ఒక మనిషి యాభై ఏండ్లకాలంలో వందేళ్ళకాలం జీవించడం, మనిషి ఎన్నేండ్లయినా జీవిస్తూకూడా మరణిస్తూనే ఉండడం తెలుసా నీకు”. అన్నాడొకసారి తామిద్దరూ ఒక కంపెనీతో ప్రధాన వ్యాపార విషయాలను చర్చించడానికి, ఒక అగ్రిమెంట్‌ను సంతకం చేయడానికి డల్లెస్‌ వెళ్తున్నపుడు కార్లో.
”చెప్పు” అంది ఆసక్తిగా.
”ఒకతను ఉద్యోగరీత్యా ఒక ఉపాధ్యాయుడు..ఉపాధ్యాయునిగా అద్భుతంగా పాఠాలు చెప్పడం, ఉద్యోగానికి న్యాయం చేయడం..దాన్ని అలాగే నియమితకాలం వరకు కొనసాగించడం ఒక జీవితాన్ని జీవించడం. ఐతే ఆ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూనే ఒక రచయితగా, ఒక పెయింటర్‌గా లేదా ఇంకేదోరంగంలో నిపుణునిగా తనను తాను మలచుకుని రాణించడం..అంటే మనిషి ఏకకాలంలో ఒకటికంటే ఎక్కువ జీవితాలను జీవించడం. కాగా మనిషి తన జీవితకాలంలో యిరవై ఐదేండ్లవరకు చదువు, తర్వాత ముప్పయి ఏండ్లు ఉద్యోగం చేస్తూ కొంత డబ్బు సంపాదించి కొన్ని బాధ్యతలు నిర్వర్తించి, కొన్ని విజయాలు సాధించి..మొత్తం సమగ్రతను ఎనభైఏండ్లలో పూర్తిచేయగలిగినట్టయితే..అవే పనులను దాదాపు నలభై ఏండ్లలో సాధ్యంచేసినట్టయితే అది ఏభై ఏండ్లలో వందేండ్ల జీవితాన్ని జీవించడం వంటిది. ఒకడు అరవై ఏండ్లకు మంత్రికాగలిగితే మరొకడు ముప్పయ్యేండ్లకే మంత్రి ఐనట్టు..ఒకడు పుట్టి ఏ రంగంలోనూ రాణించక, దేన్నీ సాధించలేక ఒక ప్రాణమున్న వ్యర్థ పదార్థంగా మిగిలిపోవడం అంటే జీవిస్తూకూడా మరణిస్తూండడం..ఐతే మనం ఏ రకంగా జీవిద్దాం అనేదాన్ని మనిషి ఎవరికివారు ముందే నిర్వచించుకొని ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతే బాగుండేది. కాని యిప్పటికీ అరవై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలోని ముప్పావుకన్న ఎక్కువ జనాభా. జీవిస్తున్నామంటే..బస్‌ అంతే.. అలా జీవిస్తున్నాం..అని ఉబుసుపోకకోసమే జీవిస్తున్నారు. చాలామంది దురదృష్టవశాత్తు సాధ్యమైనంత ఎక్కువ డబ్బును సంపాదిస్తే అంత బాగా జీవిస్తున్నట్లుగా భావిస్తున్నారు. ముఖ్యంగా చదువుకున్న మూర్ఖులు. ఈ భావనే భారతదేశాన్ని కకావికలు చేసి అస్థిరపరుస్తూ ఎదగకుండా చేస్తోంది..”
”ఔను…ఈ విషయాన్ని నేను గ్రహించాను రామం” అంది క్యాథీ.
క్యాథీ ఏ విషయాన్నైనా సూక్ష్మస్థాయిలో అర్థంచేసుకుని తొందరగా ప్రతిస్పందించడంలో ఎంతో చురుకైంది. అదొక అసాధారణ ప్రతిభ.
”మనం సెప్టెంబర్‌ ఐదవతేదీన భారతదేశంలో ఉండేట్టుగా..అంటే మూడవతేదీ రాత్రి పది గంటల యాభై నిముషాల కతార్‌ ఏర్‌వేస్‌ ప్లయిట్‌ క్యుఆర్‌ టుఫిఫ్టీలో హైద్రాబాద్‌ బయలుదేరబోతున్నాం. మన భావి నిరాడంబర కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఈ పర్యటనతో యిక ముందు ఎకానమీ తరగతుల్లోనే మన ప్రయాణం. ఆ రోజు మన ఇద్దరితోపాటు యిక్కడమనం తయారుచేసిన పదిమంది యువతీయువకుల బృందంకూడా యిక అమెరికాలో తమ కార్యకలాపాలను మూసేసి మన భావి రాజకీయ కార్యకర్తలుగా మనవెంట ఉంటారు. వీళ్ళందరూ గత మూడేళ్ళుగా మనతో భవిష్యత్తుగురించి లోతుగా చర్చిస్తూ, మన ఆలోచనలతో, మన లక్ష్యాలతో పూర్తిగా ఏకీభవించే వాళ్ళు. ఏడ్గురు యువకులు. ముగ్గురు యువతులు. యువకుల గ్రూప్‌కు శివ నాయకత్వం వహిస్తారు. కౌస్తుభ యువతులకు నాయకత్వం వహిస్తుంది. వీళ్ళు మన ప్రధానాంగాలు. యిప్పటికే ఈ మధ్య నువ్వు అనేక సార్లు హైద్రాబాద్‌ వెళ్ళి గోపీనాథ్‌ గారితో చర్చించావుగదా. కాగా ఆయనకూడా రెండుసార్లు యిక్కడికి స్టేట్స్‌ వచ్చి మనతో విపులంగా మనం చేపట్టవలసిన పంథా గురించి ఆలోచనలను పంచుకున్నారు. చాలాలోతుగా విశ్లేషించి మన భావి కార్యక్రమాలకు డాక్టర్‌ గోపీనాథ్‌ గారిని మన సిద్ధాంతకర్తగా, గురువుగా స్థిరీకరించాం. మనం స్థాపించబోయే సంస్థపేరు ‘జనసేన’. ఇది ఒక సామాజిక సంస్థ. రాజకీయ పార్టీకాదు. యిప్పటికే దీన్ని మనం హైద్రాబాద్‌లో రిజిష్టర్‌ చేశాం. నంబర్‌ 2305 అబ్లిక్‌ టు జీరో జీరోనైన్‌. గోపీనాథ్‌గారు దాదాపు ఆరు పేజీలుగల జనసేన మానిఫెస్టోను రాసి మనకు సబ్‌మిట్‌ చేస్తే మనం దాన్ని అంగీకరించి ప్రచురించి మన సభ్యులందరికీ పంపిణీ చేశాం. తర్వాత దానికి విపులమైన వివరణాత్మక పాఠాలను మరో పుస్తకంగా ప్రచురించాం. అది నూటా నలభైపేజీలు ఉంది. అది ‘జనసేన లక్ష్యాలు-కార్యాచరణ’ అనే పేరుతో మన మిత్రులందరికీ అందింది.”
రామంకు తను అనేక సందర్భాలలో క్యాథీతో చర్చించిన భవిష్యత్‌ కార్యాచరణ పథకాలను, సంస్కరణ తాలూకు చింతనను, తేవలసిన నిశ్శబ్ద విప్లవం తాలూకు పెనుమార్పుల మూలాలను చర్చించడం..ఆమె వాటిని ఒక క్రమంలో కూర్చడం..ఒక రూపురేఖనిచ్చి డాక్టర్‌ గోపీనాథ్‌ ద్వారా దానికి సిద్ధాంత స్వరూపాలను కల్పించడం..ఇదంతా ఒక పవిత్రమైన గురుతర బాధ్యతగా జ్ఞాపకమొచ్చి.,
”చెప్పు క్యాథీ..నువ్వు అసలైన మన కార్యరంగం గురించి చెబుతూంటే..నాకు నాలోకి నేను చూచుకుంటున్న అనుభూతి కలుగుతోంది. కాగా కార్యోత్సాహంకూడా ఉరకలేస్తోంది. నువ్వన్నట్టు ఇక మన శక్తివంతమైన ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. ప్రాతఃసమయం ఆసన్నమౌతున్నప్పుడు సూర్యోదయాన్ని ఎవడాపగలడు..ప్లీజ్‌ కంటిన్యూ..మనం ఇంత విపులంగా మనల్నిమనం సమీక్షించుకోవడం మున్ముందు సాధ్యంకాకపోవచ్చుకూడా..ఈ సన్నివేశం యిప్పుడెంతో ప్రధానమైంది..”
క్యాథీ సాలోచనగా రామం ముఖంలోకి చూచింది. అతను యోగముద్రలో ఉన్న ఋషిలా నిర్మలంగా ఉన్నాడు.
ఆమెకు ఎందుకో పుచ్చలపల్లి సుందరయ్య జ్ఞాపకమొచ్చాడు. ఒక బనారస్‌ హిందూ యూనివర్సీటీ స్థాపించిన మదన్‌మోహన్‌ మాలవీయ జ్ఞాపకమొచ్చాడు.
”మన కార్యక్షేత్రం వరంగల్లు. మనం ఏది చేసినా ప్రజలు మనను మొదట స్కాన్‌ చేస్తారు. త్యాగాల గురించీ సిద్ధాంతాల గురించీ, ఆదర్శాల గురించీ నీతులు చెప్పే నాయకులు తమ నిజజీవితంలో ఎంతవరకు వాటిని పాటిస్తున్నారు, ఆచరిస్తున్నారు..అని ప్రశ్నించుకుంటారు. ప్రశ్నిస్తారుకూడా. అందుకని.. మనం వరంగల్లు నగరంలో..కాశిబుగ్గ నుండి మొగిలిచెర్ల పోయే రోడ్డుకు అనుకుని రెండు ఎకరాల స్థలంలో..బాలసంత గూడేనికి  యివతల..ఒక ఆశ్రమంవంటి కుటీరాన్ని నిర్మిస్తున్నాను. అందుకోసం భూసేకరణ, నిర్మాణం కూడా ప్రారంభమైంది..నీతో పాటు ప్రక్కనున్న చిన్న కుటీరంలోనీ అనుచరిగా.. సహచరిగా కాదు..”చటుక్కున ఆగింది క్యాథీ.,
”ఊ.. ఈ రెండూ వేర్వేరు కదా..కాని నా దృష్టిలో..మనిద్దరికి సంబంధించి ఈ రెండూ ఒక్కటే.. క్యాథీ.. శరీరం ఆత్మ వేర్వేరుగా మనలేవు. ఆ రెండూ తమ సంయుక్తతను విడిచిపెట్టడాన్నే మరణం అంటారు.” అన్నాడు రామం.
బయట వర్షం ఇంకా ఉధృతంగా కురుస్తూనే ఉంది.
”పక్క కుటీరంలో అహర్నిశలు శరీరంవెంట ఆత్మలా, వస్తువు వెంట నీడలా నేను నివాసముంటాను”
”ఊఁ..”
”భారతదేశంలో..ప్రధానంగా ఆంధ్రదేశంలో గత యాభై సంవత్సరాల రాజకీయ నేపథ్యాన్ని అనేక రాత్రులకు రాత్రులు మేల్కొని సమగ్రంగా అధ్యయనం చేశాను రామం. బ్రిటిష్‌ పరిపాలనలో ఉన్న కోస్తా జిల్లాలకు అధికారిగా వచ్చిన సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి నది సంస్పర్శతో ఎంత పులకించి అపర భగీరథునిగా నాల్గు జిల్లాలకు శాశ్వత సాగునీటి వసతిని ప్రసాదించి ఒక దేవునిగా మిగిలిపోయాడు, చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ ఒక బ్రిటిష్‌ అధికారిగా తెలుగు భాషపట్ల నావలెనే మోహావేశంతో కడపకేంద్రంగా తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు..తెలంగాణా జిల్లాలు నిజాం దుర్మార్గ దురహంకార పాలన క్రిందఅమానుషంగా ఎలా దోచుకోబడ్డాయి..తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం..తదనంతర కమ్యూనిస్ట్‌ ఉద్యమ విఫలం..చీలికలు..రజాకార్లు..తర్వాత భూస్వాములే కాంగ్రెస్‌ నాయకులుగా రూపాంతరంచెంది..దాశరధి రంగాచార్య చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలలో చెప్పినట్టు ప్యూడల్‌ వ్యవస్థ ఎలా ప్రజాస్వామిక ముసుగులోకి మారిందీ..ఇవన్నీ సవివరంగా అధ్యయనం చేశాను రామం. కాలం ఉరుముకుంటూ, గర్జించుకుంటూ ఆంధ్రదేశాన్ని ఒక కుదుపు కుదిపి విడిచిపెట్టింది భారత స్వాతంత్య్ర ప్రకటన నాటికి.. ఐతే అసలు నిజమైన విషాదమంతా ఆగస్ట్‌, 15-1947 తర్వాతనే ప్రారంభమైంది. ఒక విషయం చెబుతే నువ్వు ఆశ్చర్యపోతావ్‌ రామం. 1955లో జవహర్‌లాల్‌ నెహ్రూచే శంకుస్థాపన చేయబడ్డ అతిపెద్ద మాసనరీ డామ్‌ ఐన నాగార్జునసాగర్‌ అప్పటి ప్లానింగు కమీషన్‌ చేత 80 కోట్ల రూపాయల ప్రాజెక్టుగా ప్రారంభించబడి చివరికి 1967లో ఇందిరాగాంధీచే ప్రారంభించబడ్డప్పుడు 91 కోట్ల రూపాయల నిధులతో పూర్తిచేయబడింది. అదే ప్రాజెక్టును యిప్పుడైతే నలభై వేల కోట్ల రూపాయలతో యిప్పటి దుర్మార్గులైన ఇంజినీర్లు నిర్మిస్తారు.. అందులో కనీసం పదిహేను వేల కోట్ల రూపాయలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపిటీసిలు, కార్పొరేటర్లు, చీఫ్‌ ఇంజినీర్లు, ఇఇలు, డియిలు, ఎయిలు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు.. ఇలా అందరూ వాటాలు వేసుకుని పంచుకు తింటారు. ప్రాజెక్ట్‌ పదిసంవత్సరాలు కాకుండానే తప్పకుండా కొట్టుకుపోతుంది. ఏమిటీ మార్పు. ఈ నిర్లజ్జతనానికి ప్రతీకలైన ఈ ప్రభుత్వాల, ప్రజల నీతిహీనత ఏ శాస్త్రానికీ అంతుబట్టడంలేదు. ఐతే ప్రజల ప్రవర్తన విషయంగా ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త అరిస్టాటిల్‌ ఏమన్నాడంటే..”
”…..” రామం వింటున్నాడు..ఓ పాఠాన్ని ఆసక్తిగా వింటున్న విద్యార్థిలా.
”ప్రజలెప్పుడూ అవకాశవాదులు. ఒక చిన్న పిల్లవాన్ని ఏ కాపలాలేని మిఠాయి దుకాన్లో కూర్చోబెడితే అవకాశముంది కాబట్టి జిహ్వాచాపల్యంతో దొంగతనంగా మిఠాయి తింటాడు. ఏదైనా నిఘా ఉంటే దొంగతనానికి శిక్ష తప్పనిసరిగా ఉంటుందంటే అదే పిల్లవాడు మిఠాయి స్వాహా చేయడు సరికదా తనూ ఓ కాపలాదారుడుగా వ్యవహరిస్తాడు. ఈ అతి సున్నితమైన తేడాను ప్రజాపరిపాలనతో సంబంధమున్న ప్రతివ్యక్తీ ప్రాథమికంగా గమనించాలని చెప్పాడాయన.. అందుకే యధా రాజా తధా ప్రజా నానుడి పుట్టింది. యిప్పుడు ఈ సామెతను యథా ప్రజా తథా రాజాగా మార్చి విచ్చలవిడి దౌర్జన్యాన్ని కొనసాగిస్తున్నారు. ఈ దౌర్జన్యం యిక భరించలేని గరిష్ఠస్తాయికి చేరింది. దీన్ని ధ్వంసం చేయాలి. లేకుంటే యిక వ్యవస్థ ఎవరూ బాగుచేయలేని అథమాథమ స్థితికి చేరుకుంటుంది.”
”…..” రామం కళ్ళు ఆమెను నిశితంగా అధ్యయిస్తున్నాయి. ఆమె అప్పుడు మహాభారత రణక్షేత్రంలో అర్జునునికి తత్వబోధను చేస్తున్న కృష్ణుని ముఖంలా ఉంది పరిపూర్ణంగా.
”యిక్కడ పరిపాలనకు సంబంధించిన ఒక ప్రధాన విషయాన్ని మనం కూలంకశంగా పరిశీలించాలి రామం. దేశం ఏదైనా.. ప్రజలు..ఆమాటకొస్తే మనుషులు ఏ పరిస్థితుల్లో తప్పకుండా చెప్పినమాట వింటారు..అంటే జవాబు..దేశభక్తి.. దేశంపట్ల ప్రేమ..మనిషికి మనిషి పట్ల గౌరవం..మానవత్వం..మానవతా విలువలు..గాడిద గుడ్డు..ఇలా కోటి సమాధానాలొస్తాయి – కాని సత్యమేమిటంటే..భయం. నేను ఈ చేయకూడని పనిచేస్తే ఎవరో తప్పకుండా తనను శిక్షించి కష్టమో, నష్టమో కలుగజేస్తాడని గ్యారంటీ ఉన్నప్పుడు మాత్రమే మనిషి తప్పకుండా ఎదుటి మనిషి చెప్పినమాట వింటాడు. అంతిమంగా మనిషిని ఋజుమార్గంలో పెట్టేదీ, సరియైన మార్గంలో నడిపించేదీ ‘భయం’ ఒక్కటే. ఏదో ఒక భయం లేనిది మనిషి చెప్పినమాట వినడు. ఒకసారి ‘భయం’ పేరుతో మనిషిని సరియైన దారిలో పెట్టగలిగితే, తర్వాత కౌన్సిలింగు చేసి, బుజ్జగించి, బుద్దిచెప్పి, నిజమైన నీతి వాక్యాలను, విలువలను బోధపరిచి యిక వ్యక్తిని ఉత్తమునిగా, ఉన్నతునిగా మార్చవచ్చు. యిది ఒక సంక్లిష్టమైన సందిగ్థ స్థితి.. పాలకులకు తెలియాల్సిన పరిపాలనా రహస్యం.
మనిషిలో పాదుకొల్పాల్సిన భయానికి మారుపేరు ‘బ్లాక్‌మెయిలింగు’ పరిపాలనలో, రాజకీయాల్లో, అధికారిక వ్యవహారాల్లో, కార్పొరేట్‌ కల్చర్‌లో ‘బ్లాక్‌మెయిలింగు’ అనేది అతిశక్తివంతమైన ఒక టూల్‌. వెనుకటి భారత రాజకీయాల్లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఒక తిరుగులేని నియంతను తలపింపే పటిష్టమైన పాలనను కొనసాగిస్తున్న కాలంలో ఒక ప్రచారం బలంగా వినిపించేది. అమె గురించిన పాలనాపరమైన పుస్తకాలను చదివినా ఈ విషయం తెలుస్తుంది..ఏమిటంటే ఎవరైనా తనకు ఎదురుతిరిగినప్పుడు, తోక జాడించినపుడు, నక్‌రాలు చేసినప్పుడు ఒంటరిగా తన చాంబర్‌లోకి పిలిపించుకుని వాని చరిత్రభూగోళాన్ని విప్పే ఫైల్స్‌ను ముందుంచేదని. యికవాడు కిక్కురుమనకుండా నోరు మూసుకుని ‘కింనాస్తి’ అయ్యేవాడని.. యిది ఒక అతిప్రధానమైన అంశం. కాబట్టి ఒక ఉద్యమాన్నిగానీ, పరిపాలననుగానీ కొనసాగిస్తున్న ప్రతి సమర్థవంతుడైననాయకుడు తన ప్రధాన శత్రువు యొక్క , తన ఆంతరంగికుల యొక్క, అతి సన్నిహిత మిత్రులయొక్క ఆంతరంగిక ప్రవర్తనల రికార్డును ఎప్పటికప్పుడు తయారుచేసుకుని పెట్టుకోవాలి. ఎప్పుడుకూడా ఎదురుతిరిగేవాడెవడయ్యా అంటే మన రహస్యాలను ఎక్కువగా తెలుసుకోగలిగే మన దగ్గరి మిత్రులే. వాళ్ళే ద్రోహులుగా, కోవర్టులుగా మారుతారు. పురాణాల్లో యింటిదొంగ విభీషణుడు కోవర్ట్‌గా మారాడు, మహాభారత యుద్ధంలో శల్యుడు ఇన్‌ఫార్మర్‌గా మారాడు. శకుడు మిత్రుని రూపంలో ఉన్న శత్రువుగా ప్రవర్తించాడు. వీళ్ళ గురించి తగు జాగ్రత వహించకపోతే అసలు లక్ష్యాలు దెబ్బతిని అంతా మిస్‌ఫైర్‌ ఔతుంది. ఐతే ఈ మనుషులను సరిగ్గా గుర్తించే వ్యవహారాన్ని అత్యంత విశ్వసనీయమైన వ్యక్తిమాత్రమే నిర్వహించాలి. అందుకే దీన్ని.. పరిశీలన.. నివేదన.. చర్య.. అనే ప్రధానమైన భాగాలుగా గల ఇంటెలిజెన్స్‌ బాధ్యతను నీకు ప్రథమ వలయ రక్షకులుగా ఉండే నేనూ, శివ తీసుకుంటాం. అత్యంత గోపనీయంగా ఈ మాడ్యూల్‌ ఉంటుంది. డైరెక్ట్‌ రిపోర్టింగు టు యు ఓన్లీ”…ఒక క్షణం ఆగి.,
”క్యాథీ మన జనసేన సంస్థ నిర్మాణ వివరాల్లోకి పోయేముందు..ఒకసారి స్థూలంగా ఈ అరవై సంవత్సరాల భారత రాజకీయ వ్యవస్థ యొక్క రూపురేఖలను మననం చేద్దాం..నువ్వన్నట్టు ఒక కీలకమైన గతం యొక్క చరిత్రను పునశ్చరణ చేసుకుంటే భవిష్యత్‌ ప్రణాళిక స్పష్టంగా మన కళ్ళముందు రూపుకడ్తుంది. ఐతే..ఏ కాలంలోనైనా ఎప్పుడూ దేశక్షేమం గురించి తీవ్రంగా స్పందిస్తూ ఆలోచించిన ఒక మేధోవర్గం ఉంటూనే వచ్చింది. వాళ్ళకు అధికారవ్యామోహం లేదు. స్పృహమాత్రమే ఉంది. ప్రగతికాంక్ష మాత్రమే ఉంది..” ఆగాడు రామం..ఎక్కడోతనను తాను కోల్పోతూ.
”భారత స్వాతంత్య్రం ప్రకటించబడ్డ కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే సంఘ స్వార్థపరశక్తులు విషకోరలతో విజృంభించడాన్ని శుద్ధ జాతీయవాదులందరూ గమనించారు. అప్పుడు ఓ వేయి పేజీల గ్రంథం చెప్పగల సారాంశాన్ని మహాకవి శ్రీశ్రీ ఒక్క పాటతో ప్రజానీకానికి నిద్రమత్తు విదివిస్తూ గర్జించాడు. అంటాడు.
‘స్వాతంత్రంవచ్చెననీ సభలే చేసి
సంబరపడగానే సరిపోదోయీ
సాధించినదానికి సంతృప్తిని పొందీ
అదే విజయమనుకుంటే పొరపాటోయీ’ అని  కర్తవ్యబోధను చేస్తూనే అప్పటికే విజృంభించిన రుగ్మతలను ఏకరువుపెట్టి ఒక హెచ్చరికను చేశాడు..చూడు
”ఆకాశం అందుకునే ధరలొకవైపు
అంతులేని నిరుద్యోగమింకొక వైపు
అవినీతి, బంధుప్రీతి, చీకటిబజారు
అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు” అని వాపోయాడు. ఈ స్థితి ఈ అరవై ఏళ్ళలో ఏకొంచెమైనా మెరుగుపడలేదు సరికాదా యింకా యింకా కుళ్ళిపోయి, క్షీణించి శుభ్రంచేయలేనంత మురుగుగా నరనరాన వ్యాపించింది. అప్పుడే జాతీయ, రాష్ట్రస్థాయిలో దేశానికి భంగం కలిగించే పాలసీలనూ, విధానాలనూ ఎండగడ్తూ కామ్రేడ్‌ తరిమెల నాగిరెడ్డి 1978లో ‘ఇండియా మార్టిగేజ్డ్‌’ పుస్తకాన్ని వెలువరించి ఒక షాక్‌ ట్రీట్‌మెంటిచ్చాడు. ఏం జరిగింది..ఒంటరిగా ఒకే ఒక యోధుని ప్రతిఘటన.. పుస్తక నిషేదం. ఎన్నో సార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డ వ్యక్తి ఈ దుర్మార్గ సూడో ప్రజాస్వామిక వ్యవస్థలో ఇమడలేక మార్సిస్ట్‌-లెనినిస్ట్‌ కానూసన్యాల్‌ విభాగం పేరుతో పోరాటం చేసీచేసీ..యిక్కడ ఓ విషయం జాగ్రత్తగా గమనించాలి రామం.. పాలకుల దమనకాండకు, అణచివేతకు, విచ్చలవిడి దోపిడీకి వ్యతిరేకంగా గత నలభై ఏండ్లకు పైగా తెలుగు నేలపై జరుగుతున్న తీవ్రవాద ఉద్యమాలన్నీకూడా ఎందుకు విఫలమైపోయాయంటే..వాటిలో మెజారిటీ సందర్భాల్లో సామాన్య ప్రజల భాగస్వామ్యం లేకపోవడమే. నక్సల్‌బరీలో ఓ భూపోరాట శక్తిగా..చిన్న మొక్కగా పొటమరించి నక్సలైట్‌ ఉద్యమంగా విస్తరించి, ఎదిగి శ్రీకాకుళ సాయుధ పోరాటంగా వెంపటాపు సత్యం, పంచాది నిర్మల, అధిభట్ల కైలాసం..వంటి అమరవీరుల నేతృత్వంలో అంటుకున్న అగ్నిలా ఉత్తర తెలంగా జిల్లాల గుండెల్లోకి విప్లవాగ్నియై విజృంభించినా..మొదట్లో మెడికల్‌, ఇంజనీరింగు విద్యార్థుల సామూహిక ప్రవేశంతో విద్యుత్తులా అడవుల్లోకి ప్రవహించినా..పీపుల్స్‌వార్‌గా మారి..అటు తర్వాత మావోయిస్ట్‌లుగా పేరుమార్చుకుని అనేక అంతర్గత కుమ్ములాటతో వర్గపోరాటంపేరుతో శత్రునిర్మూలనను చేపట్టి చివరికి పార్టీలోని వ్యక్తిగత కక్షలసాధింపు యంత్రాంగంగా పరిణమించి, అర్థంపర్థంలేని హింసలతో, హింసాత్మక చర్యలతో.. నిజంగా ద్రోహులుగాహిరంగంగా ముద్రపడ్డ ఏ ఒక్క రాజకీయ నాయకున్నీ, ఏ ఒక్క లంచగొండి ప్రభుత్వ అధికారినీ చంపకుండా చివరికి మావోయిస్ట్‌ ఉద్యమమంటే పోలీసులకూ, అడవుల్లో ఉండే ఎవరికో నడుమ జరిగే పాశవిక పరస్పర నిర్మూలనచర్యగా సామాన్యజనం అర్థంచేసుకునే స్థితికి చేరింది. ఐనా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టబడిన ఏ సిద్దాంతమైనా ఓ నలభై ఐదేండ్ల సుదీర్ఘకాలంలో తనముద్రను ప్రజల్లో వేయలేకపోయిందీ, జనాదరణను పొందలేకపోయిందీ, ప్రజల ఆమోదాన్ని పొందలేకపోయిందీ అంటే అది ఒక విఫలంకిందే లెక్క. ప్రతి ప్రయోగానికీ కొంత కాల అవధి ఉంటుంది… యిప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో గిరిజనులు ఆదివాసీలు అరణ్యవనరుల దోపిడీకి ప్రతిఘటన పేరుతో అర్ధవంతమైన ఉద్యమాలు మధ్య భారతంలో జరుగుతున్నా..అవి ప్రధానంగా ప్రజాబాహుళ్యంలో నైతికపరమైన పరివర్తననూ, విచ్చలవిడిగా పెరిగిపోతున్న అవినీతి, లంచగొండితనం నిర్మూలన దిశగా ఆలోచిస్తూ పనిచేయడం లేదు. అవి దారి తప్పాయి. అందుకే విద్యావంతులూ, అభ్యుదయవాదులెవ్వరూ ఈ ఉద్యమాలపట్ల ఆసక్తి చూపడంలేదు. కాడర్‌ రిక్రూట్‌మెంట్స్‌ బాగా తగ్గిపోయాయి. గత నెల నేను చత్తీస్‌గడ్‌, ఒరిస్సా లోతట్టు ప్రాంతాల అనేక గ్రామాల్లో పర్యటించినపుడు కొన్ని వందలమంది ఆదివాసీ పౌరులతో మాట్లాడాను. వాళ్ళు నిజానికి ఒకవైపు ప్రభుత్వ అనధికార ఏజన్సీ సాల్వజుడుం, పోలీసులు, సిఆర్‌పిఎఫ్‌ దళాలు మారోవైపు అజ్ఞాత మావోయిస్ట్‌ దళాలమధ్య మింగలేక చావలేక నలిగిపోతున్నారు. వాళ్ళిప్పుడు అందరూ తమను విడిచిపెట్టి వెళ్ళి యిదివరకటిలా తమదారిన తమను ప్రశాంతంగా అడవిలో బ్రతకనిస్తే చాలు మహాప్రభో అన్న దుఃఖంనిండిన విసుగుదలతో ఉన్నారు. వాళ్ళకు ఈ దిక్కుమాలిన దోపిడీ రాజకీయాలపట్ల, రక్తపాతంపట్ల, పరస్పర హింసపట్ల, తనవాళ్ళను తామే నిర్మూలించుకోవడం పట్ల ఏమాత్రం ఆసక్తిలేదు. ఈ ‘హిట్‌ అండ్‌ మిస్‌’ సిద్ధాంతానికి కాలం చెల్లింది. యిప్పుడు ‘స్టే అండ్‌ హిట్‌’ సూత్రం కావాలి. ప్రజల్లోకివెళ్ళి ప్రజలతో కలిసి జీవిస్తూ ప్రజలతో మమేకమై, ప్రజలను విద్యావంతులను కాకుండా నైతికవంతులను చేసే ఒక వినూత్న నిశ్శబ్ధ విప్లవ పంథా యిప్పుడు కావాలి. ఈ ప్రభుత్వాలు అవినీతి, అధికారం, డబ్బు, లంచగొండితనం, మద్యం, మీడియా, వ్యామోహల సరఫరా అనే అదృశ్య ఉచ్చును ప్రజలపై విసిరి వాళ్ళను నిద్రబుచ్చి, బందీలను చేసి దుర్మార్గమైన పాలనను కొనసాగిస్తున్నాయి. దీనిని పునాదితో సహా పెకిలించి సమూలంగా నిర్మూలించాలి.. అలా చేయడం అసాధ్యంకాదు. ఈ స్థితి కుళ్ళి కుళ్ళి, ఆ దుర్వాసన చుట్టు ప్రక్కకు వ్యాపించి యిక భరించలేని స్థాయికి క్షీణించిపోయింది. పీతికంపులో ఎవరైనా ఎంతకాలం ఉండగల్గుతారు. నిజమైన ప్రజలు విసిగి విసిగి, అలసి అలసి ఏదో ఒక నిజాయితీగా సంస్కరించ సంకల్పించే ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. స్వతంత్రం అరాచకత్వంగా, స్వేచ్ఛ విశృంఖలత్వంగా మారి గుండాయిజం, నేరం, మాఫియా చట్టసభల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, శాసనకర్తలుగా మారి రాక్షస హాహాకారాలు చేస్తున్న వర్తమానం ఎంత చెడిపోయిందో..ఈ రోజు దినపత్రికలోని ఈ న్యూస్‌ ఐటం చదివితే తెలుస్తుంది.
‘ఇక కిక్కేకిక్కు…మద్యం ఆదాయం ఏడువేల కోట్లు. ఈ సంవత్సరం తాజా మద్యం టెండర్ల ద్వారా నలభై ఎనిమిది కోట్లు ప్రభుత్వానికి లభించాయి. దీనికి లైసెన్స్‌ ఫీజుమొత్తాన్ని కలిపితే మద్యం టెండర్లపై లభించిన ఆదాయం మొత్తం రూ|| 7 వేల కోట్లకు చేరుకుంది. రాష్ట్రం మొత్తం మీద 650  మద్యం దుకాణాలకు 48,602 టెండర్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లా దాచేపల్లి, నడికుడి గ్రామం రూ|| 5,21,11,111 షాపు ధర పలికింది కాగా ఈ సంవత్సరం
యిదివరకు మద్యం వ్యాపారంలో ఉన్న వ్యక్తులకు గాక కొత్తగా ఈ వ్యాపారంలోకి వచ్చిన 60 శాతం మందికి కొత్త షాపులు దక్కాయి. కోస్తా జిల్లాలలో మద్యం వ్యాపారంలోకి మంత్రులు, శాసనసభ్యులు కూడా రంగప్రవేశం చేసి షాపులు దక్కించుకున్నారు.. ఐతే కొసమెరుపేమిటంటే.. మొన్నెన్నడూ కనీవిని ఎరుగని విధంగా వేలం పాటలో వందమంది మహిళలకు మద్యం షాపులు దక్కడం.
క్రిందనే ఇంకో న్యూస్‌ ఐటం ఉంది.
‘ఆదాయంకోసం ప్రభుత్వం వ్యభిచార గృహాలనుకూడా నడుపుతుందా’ అని హెడ్డింగు.
‘రాత్రి ఏడుగంటలు దాటిందంటే మహిళలు రోడ్లమీద నడచి క్షేమంగా ఇంటికి చేరలేకపోతున్నారు. రోడ్‌కు యిరువైపులా బహిరంగంగా నిస్సిగ్గుగా తాగుతూ దారినపోతున్న ఆడవాళ్ళపై నానా కారుకూతలు కూస్తున్నారు. దుర్‌వ్యాఖ్యలతో బూతులు మాట్లాడ్తున్నారు. ప్రభుత్వమే స్వయంగా కాలేజీల ప్రక్కన, దేవాలయాల పక్కన బార్లకు, బ్రాందీషాపులకు పర్మిషన్‌ యిచ్చి విద్యార్థులనుకూడా తాగుబోతులుగా, అసాంఘికశక్తులుగా మారుస్తోంది. మహిళలను, యువతరానికి రక్షణ కల్పించి భాద్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దవలసిన ప్రభుత్వమే పూర్తిగా అనైతికంగామారి వెనుకటి పురాణకాలం నాటి రాక్షస పాలనను తలపిస్తోంది’ అని అల్వాల్‌ ప్రాంతంలోని పలుమహిళలు వాపోయారు. ఒకరైతే ఆగ్రహవేశాలతో ఊగిపోతూ ఈ ప్రభుత్వానికి పోయేకాలం దాపురించింది..ఆదాయమే ప్రధానమైతే ప్రభుత్వమే వ్యభిచార గృహాలనూ, జూదగృహాలనుకూడా నడపొచ్చుగదా అని వ్యాఖ్యానించారు’.
”వింటున్నావా రామం..స్త్రీ శక్తి స్వరూపిణీ అనీ, ఆదిశక్తి అనీ భారతదేశంలో భావిస్తారు గదా. అటువంటి పుణ్య భూమిపై ప్రభుత్వాలచేతనే స్త్రీ అవమానించబడి, అగౌరవపరచబడి ప్రవర్తిస్తూంటే..మంత్రులూ, శాసన సభ్యులూ మద్యం వ్యాపారంలో మునిగిపోతే..అసలు ఏం జరుగుతోంది. ఎవరు ఎక్కడ్నుండి ఎక్కడికి పతనమైపోతున్నారు. యింత జరుగుతూంటే ప్రజాసంఘాలు, మేధావులు, ఉద్యమకారులు, నక్సలైట్లు..మహిళాసంఘాలు..ఏంజేస్తున్నాయి. ప్రతిఘటించవలసిన వీరనారి మహిళ కూడా వంద బ్రాండీషాపులను నడుపడానికి సిద్ధపడ్తే…కనీసం సుమోటో కేస్‌గా స్వీకరించన్నా ఏ హైకోర్ట్‌ న్యాయమూర్తయినా ఈ దురాగతాలను ఆపవచ్చుగదా.” అంది క్యాథీ ఆవేశంగా, బాధగా.
”ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే ప్రభుత్వపరమైన అకృత్యాలలో ఇది ఒకటి మాత్రమే క్యాథీ. ఇలాంటి అకృత్యాలు ఇంకెన్నో కోకొల్లలున్నాయి. ఐతే అవి మద్యంవలె నేరుగా ప్రజాసంబంధాన్ని కలిగి ఉన్న వ్యవహారాలు కావు. నైన్త్‌క్లాస్‌, ఊర్మిళ టీచర్‌.. చెబుతుంది, ఆంటీ ఐ లౌయు వంటి బాలల మనసులను విషపూరితంచేసే సినిమాలకు అనుమతి, బ్లూ వెబ్‌సైట్లతో యువతను దోపిడీచేసే ఇంటర్‌నెట్‌ పార్లర్లు, రాత్రి పదకొండున్నర దాటితే మిడ్‌నైట్‌ మాసాలాలతో దాదాపు బూతు ఛానల్స్‌గా మారే అన్నీ టి.వి.ఛానళ్ళు, విచ్చలవిడి క్లబ్బులు, పబ్బులు…యివన్నీ సమాజం శరీరంమీద వెలసిన పుట్టకురుపులే. కేన్సర్‌రోగం బహుముఖీన దిశల్లో ఎంతోవేగంగా విస్తరిస్తోంది. దీనికి అతి త్వరలో భరించలేని నొప్పి కలిగినా సరే ఒక శాశ్వత శస్త్రచికిత్స జరగాలి.” రామం స్థిరంగా, నిశ్చలంగానే అన్నాడు.
ఇద్దరి మధ్య ఒట్టి నిశ్శబ్దం నెలకొంది కాస్సేపు..భాషలేని దుఃఖం ఎప్పుడూ మౌనంగానే పొగిలిపోతుంది.
బయట వర్షం కురుస్తూనే ఉంది.
”చాలా దుఃఖంగా, ఆందోళనగా…వేదనగా ఉంది క్యాథీ..సరే ఒకసారి ఫైనల్‌గా మన ‘జనసేన’ సంస్థాగత నిర్మాణ స్వరూపం, వివిధ అంగాలు, మూల విధానాలు..వీటి గురించి చెప్పు..నన్ను నేను ఒకసారి ట్యూన్‌ చేసుకుంటా చివరగా.. లెట్‌ ద ఫైనల్‌ పిక్చర్‌ ఎమర్జవుట్‌..”అన్నాడు రామం యోగనిద్రలో ఉన్నట్టు.
”యస్‌.. నేనూ అదే అనుకుంటున్నా రామం. మన సంస్థకు శిఖరాయనూనమైనవ్యక్తి సిద్ధాంతకర్త.. ఆయనను మనం ఆచార్య అని పిలుస్తాం. చంద్రగుప్తమౌర్యునికి చాణక్యునివలె, ప్రతాపరుద్రునికి యుగంధర మంత్రివలె, రాయలకు తిమ్మరుసువలె అతనే సంస్థకు అంతిమ మార్గదర్శి. మనకు ఆ స్థానంలో డాక్టర్‌ గోపీనాథ్‌ ఉంటారు. అతను జీవితాంతం ఒక కరుణార్థ్ర హృదయుడైన డాక్టర్‌గా, మెడికల్‌ కాలేజి ప్రొఫెసర్‌గా ఆదర్శ జీవితాన్ని జీవించారు. ఎక్కడా మచ్చలేని చరిత్ర అతనిది. సమాజం గురించీ, మానవ సమాజ వికాసం గురించీ ఎన్నో పుస్తకాలు రాశారు. ఎన్నో ప్రజాసంఘాల్లో చురుకైన పాత్రపోషించారు. ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని నాయకత్వం వహించారు. గంభీరమైన వ్యక్తి. ఎంతో దీర్ఘమైన, లోతైన అధ్యయనంచేసి నువ్వే రెండున్నర సంవత్సరాల క్రితం ఆయనను ఎంపిక చేశావు. మొట్టమొదట అతన్ని వరంగల్లులో కలిసి ఒక రోజంతా విపులంగా చర్చించి.. తర్వాత్తర్వాత దాదాపు ఇరవై రెండుసార్లు గోపీనాథ్‌గారు నీకు కలిశారు. సంస్థయొక్క మానిఫెస్టో రాసేందుకు రెండు దఫాలుగా రెండు నెలలు అమెరికా వచ్చి మనతో గడిపారు. చర్చించారు.. ఆలోచనలను కాగితంపై అక్షరబద్ధం చేశారు. ఐతే ప్రధానంగా మనది ఒక రాజకీయ పార్టీ కాదు. ఇది ఎన్నికల్లో పోటీచేయదు. రాజకీయ అధికారంకోసం ప్రాకులాడదు. కాని అతి శక్తివంతమైన ఒక ప్రజావేదికగా అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వచర్యనైనా వాచ్‌ డాగువలె గమనిస్తూ, పరిశీలిస్తూ ఒక ఇన్‌స్పెక్టర్‌వలె ప్రవర్తిస్తుంది. ఈ రకమైన పరిశీలకునిగా మన సంస్థ పనిచేయడానికి మనకున్న అధికారాలేమిటి.. అన్నది ఒక ప్రాథమిక ప్రశ్న…దానికి జవాబేమిటంటే ..భారత రాజ్యాంగం ప్రసాదించిన పౌర హక్కులు. ఈ దేశంలో శాసనబద్ధమైన ఎన్నో హక్కులు, బాధ్యతలు, విధులు, విధానాలూ అన్నీ సక్రమంగానే ఉన్నాయి. తప్పు జరుగుతున్నపుడు ఏ రాజకీయ చర్యనైనా, ఏ నాయకున్నైనా నిలదీసి ప్రశ్నించే అధికారం ప్రతి ఓటర్‌కు, పౌరునికే ఉంది. ఐతే యిప్పుడు ఏ ఓటరూ ఎవర్నీ ప్రశ్నించడం లేదు. ఎందుకంటే వ్యక్తి ఒంటరిగా బలహీనుడు. నిస్సహాయుడు. ప్రశ్నించడానికి భయపడ్తాడు. యిప్పుడు ప్రశ్నించడం మనిషికి నేర్పి వాడి వెనుక ‘జనసేన’ నిలబడి బలమైన గొంతుతో ప్రశ్నింపజేస్తుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతిపనికీ అకౌంటబిలిటీ.. అంటే జవాబుదారీతనం క్రింద ఏ పౌరుడడిగినా సరియైన సమాచారాన్నందించాలని ‘సమాచార చట్టం – 2005’ ఘోషిస్తోంది. అసలు మన ప్రజా ఉద్యమానికి ఈ ఒక్క సమాచార చట్టం దన్ను చాలు. ఇటీజ్‌ ఎ పవర్‌పుల్‌ టూల్‌.. విచీజ్‌ నాటెటాల్‌ యూజ్డ్‌ ప్రాపర్లీ బై ఎనీవన్‌, ఎనీటైం, ఎట్‌ ఎనీ ఇన్‌స్టెన్స్‌. ఉదాహరణకు ఒక యంపీ తనకు వచ్చిన రెండుకోట్ల రూపాయల యంపీ ల్యాడ్స్‌ ఫండ్స్‌ సంగతేమిటి, అవి ఎప్పుడు ఏ విధంగా ఏఏ పనులకు ఖర్చుచేయబడ్డాయో చెప్పమని ఒక ఓటరు..ఒక పౌరుడు యంపీని అడిగితే.. అతను తప్పకుండా వివరాలను కాగితంపై లిఖితపూర్వకంగా చెప్పాలి. చెప్పకపోవడం, చెప్పననడం శాసనోల్లంఘన. ఒక కాంట్రాక్టర్‌ ఓ రోడ్డును వేస్తున్నపుడు దాని ఎస్టిమేటెడ్‌ కాస్ట్‌, అలాటెడ్‌ కాస్ట్‌, నిర్మాణం పూర్తిచేయవలసిన కాలం, ప్రమాణాల వివరాలు ఇతరేతర అమలుచేయవలసిన వివరాలన్నీ ఒక బోర్డుపై రాసిపెట్టి ప్రజల సమాచార నిమిత్తం పనిజరుగుతున్నచోట ఉంచాలి. దాన్ని ధైర్యంగా ఏ పౌరుడు ప్రశ్నించినా కాంట్రాక్టర్‌ సమాధానం చెప్పాలి…కాని యిప్పుడెవరూ ఎక్కడా అటువంటి బోర్డు పెట్టడంలేదు.. ఎవరూ అడగడం లేదు. ఎవడూ ప్రశ్నించడం ఏదు..ప్రశ్నింపబడడమూ లేదు.
అన్నీ ఉల్లంఘనలే. విస్మరణలు దబాయింపులు..బలుపు ఎక్కువైన గుండాలు, అధికారులు, మాఫియాలు అన్నీ కలిసి ప్రజాప్రయోజన చట్టాలను పీకపిసికి ఉల్లంఘించి బహిరంగంగా దౌర్జన్యం చేస్తున్నారు..ప్చ్‌…మనకెందుకులే అని ప్రతి పౌరుడూ లోలోపల ఎంత కుతకుతలాడి కుమిలిపోతున్నా ఎదిరించలేక భయంతో ఎక్కడా ధైర్యం చేసి ప్రశ్నించడం లేదు.
మనిషిని ఒక బలమైన, సజీవమైన బాధ్యతాయుతమైన ప్రశ్నగా మార్చడమే మన ఉద్యమం. మన లక్ష్యం. మన గమ్యం.
మనం ముందే ప్రకటిస్తాం..మనకు వ్యక్తిగతమైన ఆస్తులు లేవని..మున్ముందుకూడా ఉండవని. ఇప్పుడు సమకూర్చుకున్న ఆస్తులనే సంస్థను నడపడానికి నిర్మాణాత్మకంగా పనిచేస్తున్న వ్యక్తుల పోషణకోసం, నిర్వహణకు మాత్రమే ఖర్చుచేస్తాం. యిక్కడ ప్రజలకు మనం ‘నిస్వార్థం’గా పనిచేస్తున్నామని చాలా విశ్వసనీయంగా చెప్పడమే మన నిజాయితీతో కూడిన ఉద్దేశ్యం. ఎటువంటి ఆడంబరమూలేని అతిసాధారణ జీవితాన్ని గడిపి చూపడం, దిక్కుమాలిన మండలాధ్యకక్షుని స్థాయిలోకూడా గన్‌మెన్‌ను ఫ్యాషన్‌గా పెట్టుకుని అట్టహాసంగా తిరగడం ఒక ఆనవాయితీఐన వర్తమాన సందర్భంలో మనం ఎప్పుడూ ఏ ప్రత్యేక భద్రతనూ అంగీకరించం. ఐతే రేపు మనకు ఎంతమంది అభిమానులూ, అనుచరులూ ఏర్పడ్డా కొంతమంది శత్రువులుకూడా తప్పకుండా తయారవుతారు కాబట్టి రహస్యంగా డేగకళ్ళతో నిన్నూ, నన్నూ, డాక్టర్‌ గోపీనాథ్‌నూ కనుపాపలకంటే పదిలంగా కాపాడే ఒక రహస్య, మనదే ఐన ప్రత్యేక రక్షక దళం ఒకటుంటుంది. అదెప్పుడూ మనవెంటే మనతోనే కదుల్తూంటుంది అదృశ్యంగా…నిరంతరంగా.
ఐతే..ఒక యంత్రంగానీ, ఒక వ్యవస్థగానీ, ఏదీ వంథాతం దక్షత కలిగి ఆదర్శంకానట్టే ఏ వ్యవస్థగానీ పూర్తిగా సున్నా శాతం దక్షతతో, పూర్తిగా నిరర్థకంకూడా కాదు..ఈ కోణంలో ప్రస్తుతం సమాజంలోని చాలామంది జనం ఈ దుర్మార్గ, నీతిహీన రాజకీయ నాయకులు పెట్టే ప్రలోభాలకు లొంగి తాగుబోతులుగా, సోమరిపోతులుగా, పనిదొంగలుగా  మారుతున్నారో..ఆ మూలాలను విశ్లేషించుకుంటూ అయ్యో ఈ దుస్థితి నుండి ఎలా బయటపడాలి, ఈ వ్యవస్థ మళ్ళీ ఎలా  ఆరోగ్యదాయకమౌతుంది..అని తపిస్తూ, క్షోభపడ్తూ, నిజాయితీగా, బాధ్యతగా ఆలోచిస్తున్న ఒక వర్గంకూడా సమాజంలో ప్రచ్చన్నంగా ఉంది. వాళ్ళలో స్పృహ ఉంది. స్పందన ఉంది. కసిఉంది. ముందు మనం వాళ్ళను గుర్తించి మనలో కలుపుకోవాలి. లేదా మనమే వాళ్ళలో కలిసిపోవాలి.
ఈ క్రమంలో ముందు నువ్వు యుఎస్‌ఎలో ఉన్నప్పుడూ, నీతో సహ విద్యార్థులుగా నీ తత్వం తెలిసిన వాళ్ళలో ఎనిమిదిమంది మెరికల్లాంటి సహచరులను తయారుచేశావు. తర్వాత అనేక సార్లు ఇండియా వెళ్తు, ఆంధ్రదేశం విస్తృతంగా పర్యటిస్తూ ఒక స్పేడ్‌వర్క్‌వలె డాక్టర్‌ గోపీనాథ్‌గారి సంపర్కంతో మేధోసంపన్నులైన దాదాపు ఋషులవంటి నూటా ఎనభైరెండు మంది రిటైర్డ్‌ ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు, రచయితలు, కళాకారులనుండి సీనియర్‌ సిటిజన్లను తయారుచేశారు. వీళ్ళందరూ ఒక్కొకరు ఒక జ్ఞాననిధి. జీవితాన్ని ఎంతో లోతుగా చూచినవాళ్ళు. సమాజంపట్ల అవగాహన కలిగిన వాళ్ళు. స్వాతంత్య్ర పూర్వ కాలంలో భారత సమాజంలో నెలకొని ఉన్న ఉన్నత మానవ విలువలు, అప్పటి నైతిక ఉజ్జ్వలత తెలిసిన వాళ్ళు. వీళ్ళందరూ మన డ్రైవింగు ఫోర్స్‌. కాగా యువతలో సరియైన ఆటిట్యూడ్‌, సమాజంపట్ల బాధ్యత ఉండాలి తప్పకుండా అన్న తత్వంగల దాదాపు ఎనిమిది వందలపైచిలుకు యువకులను మనం వివిధ విశ్వవిద్యాలయాలు, కాలేజిలు, కార్పొరేట్‌విద్యాసంస్థలు. వీటినుంచి ఎంపిక చేశాం. యిది మన కోర్‌ గ్రూప్‌. వీళ్ళందరూ బంగారం లోహం వంటివారు. వీళ్ళకు నువ్వు మన సీనియర్‌ సిటిజన్స్‌ ఫోర్స్‌ను జోడించి లోహాన్ని అగ్ని స్పర్శతో, సుత్తిదెబ్బతో ఆభరణంగా మార్చినట్టు ఒక శక్తివంతమైన మానవ సంపదగా మార్చాలి. తర్వాత వీళ్ళందరూ అతి సాధారణ జనాన్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని భారీ ఎత్తున ఉద్యమంగా చేపడ్తారు. ఈ కార్యమ్రం ఒక అగ్నిజలవలె అంటుకుని విస్తరిస్తున్న థలో నువ్వు మన కార్యాచరణ ప్రణాళికలో అనుకున్నట్టుగా మీడియా..ప్రభుత్వంలో కూడా మనం ఈలోగా గుర్తించగలిగిన నిజాయితీగల ఆఫీసర్స్‌, అధికారులతో కలిసి యిక ‘ప్రక్షాళన’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. యింతవరకు ప్రభుత్వ యంత్రాంగంలో ఐఎఎస్‌ స్థాయిలో పూర్తిగా పారదర్శకత, నీతి నిజాయితీ కలిగిన అధికారులు ఒక్క ముప్పదిరెండుమంది మాత్రమే ఉన్నారు. ఎస్పీలు పన్నెండుమంది మాత్రమే. ప్రభుత్వ యంత్రాంగంలో కరప్షన్‌ తారాస్థాయికి చేరిఉంది. ప్రతిరోజూ టి.విలో చూస్తున్నట్టు ఏ ఒక్క పట్టుబడ్డ అధికారిపై దాడిచేస్తేనో కోట్లు దొరుకుతున్నాయి. పట్టుబడకుండా, దాడికి గురికాకుండా తప్పించుకు తిరుగుతున్న లంచగొండి మహానుభావులు దేశంనిండా అన్ని ప్రభుత్వ శాఖల్లో కిక్కిరిసి ఉన్నారు. యిక ప్రక్షాళన ప్రారంభంకావాలి.
ఐతే.. యిక్కడ అతి ప్రధానమైన అంశం స్త్రీ, పురుష లింగ భేదం లేకుండా ఏ పౌరుడైనా లంచం తీసుకోవడం ‘తప్పు’ అనే స్పృహ లేకపోవడం. ఒకర్ని చూచి ఒకరు ఎటువంటి భయమూ లేక అవకాశముంటే చాలా తెగబడి దోచుకోవడమే. దానికి ప్రజాప్రతినిధుల అండ నిండుగా, దండిగా ఉంది. ఎందుకంటే వీడికి వాడు వానికి వీడు పరస్పరం అండ. ఒక రెసిడెన్షియల్‌ కాలేజి మహిళా ప్రిన్స్‌పాల్‌ లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్తుంది. ఒక మహిళా ఉద్యోగి నకిలీ పోస్టల్‌ స్టాంపులమ్ముతూ పట్టుబడ్తుంది. సరసాదేవి కోట్లకు కోట్లుస్కాం చేసి పట్టుబడ్తుంది. రోడ్లు భవనాల శాఖ క్వాలిటీ కంట్రోల్‌ చేయవలసిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఇష్టమొచ్చినట్టు నాసిరకం పనులు చేసినా లక్షలకు లక్షల లంచాలు మెక్కి పెండ్లాం పేర తనే బినామీ కాంట్రాక్టులు చేస్తూ, బార్లు నడుపుతూ పట్టుబడ్తాడు, ఎసిబిలో పనిచేసే ఉద్యోగే అవినీతితో లంచంతీసుకుంటూ దొరికిపోతాడు. హైకోర్టు జడ్జీలు కొందరు మ్యామ్యా తిని ఎవనికైనా బెయిల్‌ మంజూరు చేస్తారు..న్యాయరక్షకులుగా ఉండవలసిన కొందరు జడ్జీలను రెడ్‌హ్యాండ్‌గా పట్టుకుని సుప్రీంకోర్టు ఆదేశించిన ఉదంతాలు కోకొల్లలు.. యిన్ని కేసులు ప్రతిదినమూ వెలుగులోకి వస్తూంటే ప్రభుత్వం మొద్దునిదురలో ఉందిగాని..చట్టం తనపని తాను చేసుకుపోతుందనే బుద్దిహీనమైన ఒక మాట చెప్పడం తప్పితే ఎప్పుడూ కఠినమైన క్రమశిక్షణాచర్యలు చేపట్టిన ఉదంతాలు లేనేలేవు. ఈ ఉదాసీనత వల్ల.. ప్రభుత్వంకూడా ఈ లంచగొండితనంలో భాగం కావడంవల్ల వ్యవస్థ అంతా నిర్వీర్యమై, అసమర్థమై, ఒట్టి శవప్రాయమై మిగిలిపోయింది. ఈరకంగా పట్టుబడ్డ వాళ్ళంతా తర్వాతర్వాత గుట్టుచప్పుడు కాకుండా మళ్ళీ విధుల్లోచేరి ఏరియర్స్‌తో సహా జీతాలను పొంది మళ్ళీ మళ్ళీ లంచాలు మెక్కుతున్నారు. అలా మళ్ళీ విధుల్లోచేరి తిరిగి రేచుకుక్కల్లా ఎగబడి దోచుకుతింటున్నవాళ్ళ వివరాలు తెలిస్తే గుండెలవిసిపోతాయి. యంత్రాంగమంతా పూర్తిగా చెదలుపట్టిపోయింది రామం.. ప్రజాధనమంతా ఈ పందికొక్కులపాలై వ్యవస్థ రోగగ్రస్తమైంది. యుద్ధప్రాతిపదికన ఈ అవినీతినీ, లంచగొండితనాన్నీ
రూపుమాపేందుకు ఒక ఉద్యమాన్ని అత్యవసరంగా నిర్మించాలి. ప్రభుత్వాలకు ఫండ్స్‌ ఎక్కడినుండి ఎన్నివచ్చినా దొంగలు దొంగలు పంచుకుని దండుకున్నట్టే మరుక్షణంలో మటుమాయం..ఇలా ఐతే ఎలా అని బుద్ది జీవులందరూ హడలిపోయి అవాక్కయిపోతున్నారు. లక్షలకోట్ల రూపాయలను ప్రపంచబ్యాంక్‌, ఐఎమ్‌ఎఫ్‌ వంటి సంస్థలనుండి అనేకానేక అభివృద్ధి పనులకోసమని అప్పుచేసి వాటాల వారిగా పంచుకోవడమే నిస్సిగుగా అర్థంచేసుకుంటూనే.. దేశాన్నంతా పర్యటిస్తూ ప్రజల స్థితిగతులను అధ్యయనం చేస్తున్న రాహుల్‌గాంధీకూడా ఒక సందర్భంలో ఈ దరిద్రపు లంచగొండితనపు తీవ్రతను గ్రహించి ప్రభుత్వ పథకాలనుండి ఒక రూపాయి విడుదలైతే అది ఐదు పైసలుగా లబ్దిదారులకు చేరుతోందని వాపోయాడు. ఇది ఈనాటి అడ్డూ అదుపూ లేని అవినీతి సామ్రాజ్యపు ముఖచిత్రం. యిక చదువుకున్న పౌరులు చేస్తున్న అకృత్యాలకైతే లెక్కేలేదు. ఎవడైనా టాక్స్‌లు ఎగ్గొట్టేవాడే. ప్రభుత్వరూల్స్‌లో ఉండే లొసుగులను వాడుకుని బొక్కసాన్ని ఖాళీచేసేవాడే. వ్యాపారాల్లో నిస్సిగ్గుగా ప్రభుత్వాన్నీ, ప్రజలనూ దగా చేసేవాడే. దేశంలో వాటర్‌ప్రైస్‌ కూపర్‌వంటి అంతర్జాతీయ ఆడిటర్ల నుండి మొదలుపెడ్తే స్థానిక ఆడిటర్లందరూ ప్రభుత్వ అధికారులకు బ్రోకర్లే తప్ప నిజాయితీగా లెక్కలను అప్పజెప్పేవారేలేరు. ‘ఆరోగ్యశ్రీ’ వంటి పథకాలద్వారా డాక్టర్లందరూ ప్రజాధనాన్ని భోంచేసేవారే.. వీడు వాడని, స్త్రీ పురుషుడని తేడా లేకుండా దేశాన్ని ప్రతివాడూ దోచుకుతినడమే. ఇదొక విరాట్‌స్వరూపమై వికృత విలయతాండవం చేస్తోంది. దీన్ని అర్జంటుగా అరికట్టాలి. ఫస్ట్‌ ప్రయారిటీ మనకిదే.” క్యాథీ చెబుతున్నప్పుడు గొంతులో ఆవేశం, బాధ, దుఃఖం..అన్నీ కలగలిసి ఆదోరకమైన జీర స్పష్టంగావినబడ్తోంది..పాపం, పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయి గిలగిల్లాడుతున్న భారత వ్యవస్థపట్ల వేదన ధ్వనిస్తోందామెలో.
రామం అన్నాడు..”నువ్వన్నట్టు యిది ఒక మహాపర్వతంలా పెరిగి వ్యాపించిన రుగ్మత క్యాథీ.. దీన్ని తెలుసుకుని నిర్మూలించేందుకు ఒక సుళువైన మార్గముంది..యిక్కడ ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రజలకు జవాబుదారీ ఐన ప్రభుత్వ ప్రతినిధి.. ప్రజాప్రతినిధి అంటే ప్రజలపక్షాన ప్రభుత్వాన్నీ, ప్రభుత్వాధికారులనూ న్యాయంకోసం, ప్రజావసరాలకోసం ప్రశ్నించి ప్రజోపయోగమైన సంక్షేమ కార్యక్రమాలను చేయించవలసినవాడు. ఈ రెండు వ్యవస్థలూ ఇంటర్‌ డిపెండెంట్‌గా కలిసి ముందుకు సాగాలి న్యాయంగా ఒకరిని ఒకరు చెక్‌ చేసుకుంటూ ప్రజల ప్రగతికోసం పాటుబడాలి. కాని వాస్తవంలో అలాకాకుండా ఈ ఇద్దరూ ఇద్దరు కుమ్మక్కయిన దొంగల్లా కంచే భూమీ ఒకటై చేనును తిన్నట్టు తెగబడ్డారు. ది ఈజీ ఫార్ములా ఈజ్‌.. ఒక వ్యక్తి.. ఒక ప్రభుత్వ అధికారి లేదా ఒక ప్రజా ప్రతినిధి, లేదా ఒక ఆడిటర్‌, డాక్టర్‌, ఐఎఎస్‌, ఐపిఎస్‌ ఉద్యోగి వంటి వ్యక్తి..వీళ్ళ ఒక పదిసంవత్సరాల కాలాన్ని తీసుకుని..మొదట్లో వాళ్ళ ఆస్తిపాస్తులెన్ని..వీళ్ళు ప్రతిసంవత్సరం ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు సబ్‌మిట్‌ చేస్తున్న రిటర్న్‌లో ఎంత ఆదాయం చూపుతున్నారు..ప్రస్తుతం వీళ్ళ దగ్గర అనధికారికంగా పోగుపడ్డ ఆస్తుల విలువెంత..వీటి తేడాఎంత..ఆ తేడాను ప్రభుత్వం ఏక్షణాన్నైనా స్వాధీనం చేసుకోవచ్చు.. అని అనుకుంటే.. యిక ఆలోచించు..ఎన్ని..ఎన్ని లక్షల కోట్ల రూపాయలు బైటికొస్తాయో. ప్రభుత్వం నిజాయితీగా ఉండి జనానికి..ఐచ్ఛికంగా మీరే మీ నల్లడబ్బును డిక్లేర్‌ చేయండి లేకుంటే కఠినాతి కఠినమైన శిక్ష ఉంటుందని ఒకరోజును డెడ్‌లైన్‌గా ప్రకటిస్తే బయటికొచ్చే డబ్బుతో ఈ దేశపు రోడ్లన్నీ నిండిపోతాయి. డబ్బు వెల్లువై పారుతుంది. ఐతే ఇది సాధ్యంకాదు. దీన్నే మనం సాధ్యం చేయాలి. ఏ పొలిటికల్‌ గవర్నమెంట్‌కూడా ఈ రకంగా ప్రవర్తించదు. ఎందుకంటే యిక్కడి రాజకీయవ్యవస్థ ‘ఇంటర్‌ డిపెండెంట్‌’. ముఖ్యమంత్రిని పార్టీ నామినేట్‌ చేస్తుంది. ప్రధానమంత్రిని పార్టీ నియమిస్తుంది. పార్టీ ఎమ్యెల్యేలను, ఎంపీలను తృప్తిపర్చేందుకు దిక్కుమాలిన సహాయాలపేరుతో దోపిడీకి పర్మిషనిస్తుంది. యిక విషప్రవాహం ప్రారంభమై దేశాన్ని ముంచెత్తుతుంది. అందుకే కీలక పదవులకు అంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రివంటి స్థానాలకు ప్రజలచే ప్రత్యక్షెన్నిక జరిగితే వెనుకఉండి కీలుబొమ్మను ఆడించే తరహా రాజకీయాలుండవు. స్థిరత్వముంటుంది. దేశగతి అటో ఇటో తేలిపోతుంది”. అని సాలోచనగా ఓ క్షణమాగి..”చూద్దాం..మనమేమి చేయగలమో..” అన్నాడు.
”ఇంకో విషయముంది రామం..అమెరికానుండి మొదలుకొని ఏ యితర దేశాల న్యూస్‌ ఛానల్స్‌నైనా గమనించు.. కొద్ది రాజకీయాలు ఉంటాయి. మిగతా అంతా రిపోర్టింగు ఉంటుంది. ఎడ్యూకేటివ్‌ ప్రసారాలు ఉంటాయి తప్ప.. ఈ తెలుగు ఛానల్స్‌లో ఉన్నట్టు ఇరవై నాల్గుగంటలు రాజకీయాలే ఉండవు. మీడియా కూడా అనవసరంగా పొద్దస్తమానం కుక్కల కొట్లాటను తలపించే చర్చలపేరుతో, వేదికలపేరుతో, ప్రతిస్పందనలపేరుతో, లైవ్‌ టెలికాస్ట్‌పేరుతో రాజకీయాలు..రాజకీయాలు. రాజకీయాలగురించే ఊదరగొట్టీ అదరగొట్టే ప్రజాజీవితాలను ధ్వంసం చేస్తున్నాయి. ప్రజలను ప్రయోజకులుగా తీర్చిదిద్దే దిశలో శక్తివంతమైన మీడియా ప్రయత్నంచేయడంలేదు సరికదా అనవసరంగా మామూలు జనజీవితాల్లోకి చొరబడి మానసిక అనారోగ్యకారకాలైన ప్రసారాలతో కాలుష్యం స్పష్టిస్తోంది.. ఒకసారి మీడియాతో జనం తరపున మాట్లాడి బ్రహ్మస్త్రాన్ని బ్రహ్మస్తంగానే వాడాలన్న స్పృహను కల్గించవలసిన అవసరముంది. లేకుంటే ప్రజోపయోగమైన న్యూస్‌ ఛానల్‌ ఎలా ఉండాలో చూపించేందుకు ఒక నమూనాగా మనమే ఒక వార్త ఛానల్‌ను ప్రారంభించాలి.. అది అవసరమేమో అనిపిస్తోంది.” అంది క్యాథీ.
”ఔను..”
”ఇక మన ఈనాటి సమావేశం ముగింపుకొచ్చింది రామం..ఈ సందర్భంగా రెండు ముఖ్య విషయాలు..ఒక మేనేజ్‌మెంట్‌ వ్యక్తిగా చెప్పాలి..”అంది క్యాథీ గంభీరంగా..కొద్దిగా ప్రకంపిస్తూ పూర్తిగా వ్యక్తిగతమైన సంస్పందనతో.
”చెప్పు క్యాథీ..”
”ఎందుకు కలిశామో మనం తెలియదు. ఈ భూమిపై ఎక్కడెక్కడో భిన్న ఖండాల్లో జన్మించిన మనం చాలా యాదృచ్ఛికంగా తటస్థపడి ఒకరి హృదయాన్ని ఒకరం అర్థం చేసుకుంటూ ఏకరీతి ఆలోచనా ధోరణివల్ల..బహుశా అనుకుంటూ..మార్క్స్‌ అండ్‌ ఎంగెల్స్‌ వలె..సన్నిహితమై, ఒకరికోసమొకరిమై, ఇద్దరమూ ఒకరేమోకూడా ఐ ప్రేయసీ ప్రియుడు, భార్యాభర్త, స్నేహితులు, ఆత్మీయులు, ఆత్మబంధువులువంటి పదనిర్వచనాలన్నింటికీ అతీతంగా ఎదిగి ఒక అపూర్వబంధంలో ఒదిగి జీవితాన్ని ఓ మహత్తర అనుభవంగా మలచుచున్నాం..ఐతే దీనికి సామాజిక నియమాల అంగీకారం లేదు. ఉండదు. నా దృష్టిలో అవసరంకూడా లేదు. యిది కేవలం నీకూ, నాకూ మాత్రమే సంబంధించిన హృదయానుగత బాంధవ్యం. దాన్ని మనం ఎంత పవిత్రంగాపదిలంగా కాపాడుకుంటాం, పరిరక్షించుకుంటాం అనేది మన వివేకంపై ఆధారపడి ఉంటుంది. నా తరపున సహజమైన స్త్రీ సహనశీలతతో భూమిలా నేను ప్రవర్తిస్తా. నువ్వు విశాల హృదయంతో భూమినికూడా రక్షణకవచంలా అవరించిఉండే ఆకాశంలా నన్ను నీలో దాచుకోవాలి. నిజానికి పంచభూతాత్మకమైన ఈ చరాచర విశ్వంలో స్థూలంగా భూమీ, ఆకాశం వేర్వేరు కావచ్చు.. కాని సూక్ష్మంగా అవన్నీ ఒకటే.. అదే జీవితం..”
”……” శూన్యంగా ఆమెవంక చూస్తున్నాడు రామం.
”……” ఆమెకూడా శూన్యంగానే అతన్ని చూస్తోంది
‘పూర్ణమదః పూర్ణమిదః’.. ఎక్కడ్నో యిద్దరి ఆత్మల్లో ధ్వనిస్తోంది.
కలయిక నిమిత్తం..జీవితం సత్యం.
నడవడం సత్యం..దూరం మిథ్య
ఉదయం జననం..అస్తమయం మరణం
విచ్ఛిత్తి, సమ్మేళనం..స్థిరఅస్థిరాలు..అన్నీ జీవవ్యాపారాలు
విముక్తి అంతిమం.
”క్యాథీ నువ్వు ఆత్మవు..నేను శరీరాన్ని” అన్నాడు రామం.
”నాకు తెలుసు..కాని నీ నోట వినాలని పిచ్చికోరిక”
వర్షం బయట ఇంకా కురుస్తూనే ఉంది. ఫెళాఫెళార్భటులతో ఎక్కడో చటుక్కున పిడుగు పడింది. ఉలిక్కిపడ్డారిద్దరూ.
క్యాథీ బ్రీఫ్‌కేసును సర్దుకుని..లేచి నిలబడి..టైం చూచుకుంది.
పదీ పది.
”సి యు.. సి యు రామం” బయటికి నడిచిందామె.
యిక ఈ గదినుండి వెలుగు నిష్క్రమిస్తోంది..తర్వాతంతా ఒక వెలితి విస్తరిస్తుంది అనుకున్నాడు. కాని బయటికేమీ అనలేదు. నిండుగా, లిప్తంగా నవ్వాడు.
ఆమె చినుకుల్లో గబగబా నడచి వెళ్లి తన ఆడి కార్లో కూర్చుని స్టార్ట్‌ చేసింది.
కారు కదుల్తూండగా..రామం చేయూపాడు. కాని అది ఆమెకు కనిపించలేదు. వర్షం చినుకులు అడ్డొచ్చాయి.
కారు వీధిమలుపు తిరుగుతూండగా..రిక్తమైన హృదయంతో నిట్టూర్చి..ఎందుకో కళ్ళనిండా నిండిన సన్నటి నీటిపొరను స్పృహించకుండానే..ఆమె మనసునిండా పరుచుకున్న రామం స్మరణలో నిమీలితయై ఎక్కడనుండో..అంతరాంతరంగాల్లోకి వినిపిస్తున్నట్టుగా.,
‘రామం నిశాచర వినాశకరం..’
కారు వేగంగా ఫ్రెడరిక్‌ రోడ్‌పై ఇంటర్‌స్టేట్‌ 249పై వెళ్తూ వేగాన్నందుకుంది.

***

(సశేషం)

ramachandramouli–రామా చంద్రమౌళి

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 8 వ భాగం

( గత వారం తరువాయి)

8

9

కతార్‌ ఎయిర్‌వేస్‌ విమానం క్యూఆర్‌ 51లో..మొదటి తరగతి విశాలమైన, సౌకర్యవంతమైన క్యాబిన్‌లో..కుర్చీని బెడ్‌వలె అడ్జస్ట్‌ చేసుకుని..వెనక్కి వాలి, కళ్ళు మూసుకుని గంభీరంగా అలా మౌనంగా, ధ్యానంలో సమాధి ఐపోయిన స్థితిలో అలా ఒరిగి.,
లీల మనసులో ఒక గర్జిస్తున్న సముద్రముంది.
దూసుకుపోతున్న విమానం కింద ప్రళయిస్తున్న అట్లాంటిక్‌ మహాసముద్రముంది.
ఏ మహా సముద్రమైనా మనిషి హృదయంకంటే విశాలమైంది కాదు..లోతైందీకాదు అని తన అభిమాన కవి రాబర్ట్‌ ఫ్రాస్ట్‌ చెప్పిన కవిత్వపాదాలు స్ఫురించాయెందుకో అప్పుడామెకు.
తను గాయపడిందా…పడితే ఎందువల్ల..రామం వల్లనా.
అసలు రామం తనను ఏమీ అనలేదు కదా.
అతను తనను ఏమీ అనకపోవడమే గాయపర్చడమేమో..అప్రత్యక్షంగా తను అతన్నుండి ఒక రసస్పర్శనూ, రవ్వంత  ప్రేమనూ, ఓ అనునయింపునూ కోరుకుంటోందా. కోరుకోకుంటే అతని స్మరణరాగానే మనసు ఎందుకింత శూన్యంగా మారి ఎడారి తుఫానులా సుళ్ళు తిరుగుతూ క్షోభిస్తోంది.
ఆమెకు చటుక్కున ఒడ్డునపడి గిలగిలా తన్నుకుంటున్న చేప జ్ఞాపకమొచ్చింది. తన స్థితి యిప్పుడదేనా. రామం విషయం రాగానే తను సాధించిన అపూర్వ విజయాలు, డబ్బు దర్పం, అహం…అన్నీ ఎక్కడివక్కడ మటుమాయమైపోయి.. ఒట్టి బేలగా, నిస్సహాయంగా అతి సాధారణ స్త్రీగా కుమిలిపోతోందెందుకు..ఏమిటీ అనిమిత్తత.
‘లెర్న్‌ టు బి సైలెంట్‌
లెట్‌ యువర్‌ ్వయట్‌ మైండ్‌
విజన్‌ అండ్‌ అబ్జార్బ్‌..’అని పైథాగరస్‌ నిశ్శబ్దం గురించి ఎంత అద్బుతంగా చెప్పాడు. ప్రతిరోజు ఆరువేల ఆలోచనలు చేసే మనిషి మెదడు రెండు ఆలోచనల నడుమ ఖాళీ లేకుండా సాగుతూ నిరంతరం సముద్ర కెరటాలవలె మనిషిని బాదుతూఉంటే నూతన మేధో జవసత్వాలను పొందేందుకు సాధ్యమైనంత ధ్యాన నిశ్శబ్ధాన్ని పాటించి ఉత్తేజాన్ని సాధించమని పాస్కల్‌ చెప్పాడు.
నిశ్శబ్దం.. నిశ్శబ్దం.,
చాలాసేపటినుండి లీల నిశ్శబ్దంగా ఉంది..కళ్ళుమూసుకుని. తనకు రామం అర్థం కావడంలేదా..లేక రామం గురించి అర్థం కావడం లేదా. ఆత్మసంబంధం అనేది భగవంతుని గురించి తెలుసుకోవడానికీ, భగవంతున్ని తెలుసుకోవడానికీ మధ్య ఉన్న తేడా అనికదా మహాత్మాగాంధీ చెప్పింది.
తనకు రామం గురించి తెలియడం లేదా..అసలు రామమే తెవియడం లేదా.
ఒక్క విమానం వేగంగా వెళ్తున్న శృతివంటి మోత తప్పితే విమానంలో అంతా బహుప్రశాంతంగా ఉంది. కొద్ది చలిగాకూడా ఉంది. తను గాడ నిద్రలో ఉందనుకుందేమో ఏర్‌ హోస్టెస్‌  అలికిడి లేకుండా మెల్లగా వచ్చి సుతారంగా పైనున్న పింక్‌కలర్‌ ఊలు శాలువాను మెడల వరకు సర్థి వెనక్కి వెళ్ళిపోవడం లీలకు లీలామాత్రంగా తెలుస్తోంది.
అరగంట క్రితం కొద్దిగా…అరపెగ్గు..సోడాతో కలపి సిప్‌ చేసిన గ్రీన్‌ లేబుల్‌ విస్కీ..ఎక్కడో గుండెల్లో నీలిమంటలా వ్యాపిస్తోంది.
మంట..మంట..మంట కనిపించకుండానే..అదృశ్యంగా ఉంటూనే కూడా మనిషిని దహిస్తుందికదా.
అన్నీ జ్ఞాపకమొస్తున్నాయి ఆక్షణం లీలకు ఎందుకో..లోలోపల ఎక్కడో వడగళ్ళవాన కురుస్తున్నట్టు
నిర్మల..ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన తన నెట్‌వర్క్‌..దాదాపు ఎనభై ఎనిమిదిమంది సుశిక్షితులైన సైనికులవంటి ప్రజ్ఞావంతులైన తన అనుచరులు..సాధారణ వ్యక్తులనెవ్వరికీ సాధ్యంకాని వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్‌..ఎందరెందరో ఎన్నెన్ని రంగాలకో చెందిన క్లెయింట్స్‌…ఒక చూపుతో ఏ కార్పొరేట్‌ సంస్థనైనా తన పాదాక్రాంతం చేసుకోగల ప్రతిభ.. గుప్తంగా తనపై దాడికి ప్రయత్నించే శత్రువర్గం..తన రక్షణను నిరంతరం పర్యవేక్షించే తన రహస్య సెక్యూరిటీ..నెలకు దాదాపు ఆరుకోట్ల రూపాయల ఖర్చుతో మనగలిగే తన సిబ్బంది..అంతా వర్చువల్‌..అంతిమంగా వర్చువల్‌ రియాలిటీ.
” యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌..”విమానంలో ప్రకటన ప్రారంభమైంది.
ఇంకో పావుగంటలో విమానం డిస్టినేషన్‌..వాషింగ్టన్‌ డి.సి. డల్లెస్‌ ఏర్‌పోర్ట్‌లో దిగబోతోంది…అదీ సారాంశం.  మెల్లగా కనురెప్పలను విప్పి..ప్రశాంతంగానే.. ఒంటిపైనున్న శాలువాను సరిచేసుకుని..నెమ్మదిగా లాప్‌టాప్‌ను ఒళ్ళోపెట్టుకుని బూట్‌చేసి.. మెయిల్‌ తెరిచింది.
నిర్మలనుండి మూడు మెసేజెసున్నాయి.
ఒకటి..యిదివరకు చెప్పిందే..అన్నెపోలిస్‌ దగ్గరి లోఎస్‌ ఫైవ్‌స్టార్‌ ఇంటర్‌ కాంటినెంటల్‌ హోటల్‌లో తొంభై ఒకటో నంబర్‌ డీలక్స్‌ కింగు సూట్‌ ఏర్పాటు.
తమ మేరీల్యాండ్‌ అపరేటర్‌, డిల్లయిట్‌ కంపెనీ లావాదేవీలు చూచే రాబర్ట్‌ కోవె ఏర్‌పోర్ట్‌కొచ్చి రిసీవ్‌ చేసుకుంటాడని రెండవది.
రాబర్ట్‌కు తెలియకుండా సెక్యూరిటీని ఇన్‌విజిబుల్‌ మోడ్‌లో మెక్సికన్‌ టీంకు చెందిన ముగాబే చూసుకుంటాడనీ, ఒక పావుగంటతర్వాత ముగాబే ఎక్స్‌ఎక్స్‌ఫైల్‌ టు టు నంబర్‌తో కాంటాక్ట్‌లోకొస్తాడని సూచన.. మూడవది.
ఈ మెసేజెస్‌తో నిర్మల స్కిప్పయిపోతోంది. తననుండి యిక ఆమెకు సెలవు. ఆమె డ్యూటీ ఐపోతుంది. గంట విరామం తర్వాత ఢిల్లీనుండి అఫ్జల్‌ తన సర్వీస్‌ గురించి డ్యూటీలోకొస్తాడు.
చటుక్కున దోహానుండి తను బయల్దేరుతున్నప్పుడు మెక్సికన్‌…కంపెనీ మనుషుల నుండి తనకు ప్రమాదంఉందని నిర్మల చేసిన హెచ్చరిక  జ్ఞాపకమొచ్చింది.
నవ్వుకుని..మళ్ళీ మెయిల్‌లోకి చూచింది. అరగంట క్రితం తను రామంకు చేసిన మెయిల్‌కు జవాబేమైనా వచ్చిందా అని వెదుకులాట..ఎదురుచూపు. ఆమె ఊహించినట్టుగానే రామం నుండి జవాబులేదు. రాదని ఆమెకు తెలుసు.
ఎందుకో ఆమెకు క్యాథీ జ్ఞాపకమొచ్చింది.
తామిద్దరిదీ ఒకటే వయసు..ఇద్దరూ అసాధారణ ప్రజ్ఞావంతులే. ఇద్దరూ డిస్టింక్షన్‌లో ప్రంపంచలోనే ప్రసిద్ధిచెందిన ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లోనుండి ఎంబిఎ పట్టాలు పొందినవాళ్ళే..ఇద్దరూ ఒకరిని మించి ఒకరు అందగత్తెలే. ఇద్దరూ దైర్యశాలులుకూడా. నిశ్శబ్దంగా వ్యూహాత్మక కదలికలతో జీవితాన్ని చదరంగం ఆటలా కొనసాగించగల ప్రతిభాశీలులు.. కాగా డబ్బుక్కూడా కొదువలేని సంపన్నులే ప్రస్తుతం.
ఐతే క్యాథీ తనకు పోటీయా.. తనకు స్నేహితురాలా..తనకు శత్రువా..ఆమె తన దారికి ఒక అడ్డంకా..లేక ఏమీ కాదా..?
విమానం ఆగి..కారియర్‌ బస్‌ వచ్చి షంట్‌ఐ..విమానంలోని జనం, కదలికల్తో సంచలనం మొదలై ఫస్ట్‌క్లాస్‌లో ఉన్నదే యిద్దరు ప్రయాణీకులు. తను, యింకో అమెరికన్‌ కాన్సలేట్‌ ఆఫీస్‌ ఉద్యోగి. హాస్టెస్‌ వచ్చి ఎదుట వినమ్రంగా నిలబడి..’వెల్‌కం మేం’ అంది బస్‌లోకి..యిద్దరు ప్రవేశించగానే కదిలి.. రెండు నిముషాల్లో ఏర్‌పోర్ట్‌ చేరి..ఇమ్రిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగి ఎవరో ఎదురొచ్చి ఫింగర్‌ ప్రింట్‌, ఐ బాల్‌ ఫోటోగ్రాఫింగు..అంతా ఓ ఐదునిమిషాల్లో కానిచ్చి.
డబ్బు..డబ్బు..డబ్బుతో హోదా..హోదాతో గౌరవం..గౌరవంతో మనిషిలో పొంగే ఉత్తేజం, ఉత్సాహం..దర్పం.. అహం…పర్వతం దగ్గరికి మనిషి …మనిషి దగ్గరికే పర్వతం.. అదీ తంతు,
బయటికి నడిచింది లీల.
ఎగ్జిట్‌ దగ్గర రాబర్ట్‌ కోవె రెడీగా ఉన్నాడు. తెల్లనివాడు, రాగి వెంట్రుకలవాడు. వినయము ఉట్టిపడువాడు..తమ భృత్యుడు
”వెల్‌కం మేం..”చేతుల్లో ఓ పెద్ద అందమైన పుష్పగుచ్ఛం,
”థ్యాంక్యూ”
సరిగ్గా అప్పుడే కనిపించాడు…మెరుపులా…అప్పుడెప్పుడో బాగ్దాద్‌లో మెక్సికోకు చెందిన జెన్‌రోవర్‌ కంపెనీ బిడ్‌ ఆఫర్‌ దగ్గర ఓ లిప్తకాలం చూచిన ఓ ముఖం..నల్లనిది. క్రూరమైంది…వికృతమైంది.
కార్పోరేట్‌ ప్రపంచంలో కత్తిమొనపై జీవించే ప్రతి ఉన్నత వ్యక్తి అనుక్షణం డేగకళ్ళతో పరిసరాలను గమనిస్తూ ముందుకు సాగుతాడు అనుక్షణం…రక్షణ.. ఆత్మరక్షణ..ప్రాణరక్షణ లేకుంటే ప్రాణహరణ.
ప్రాణం కోల్పోవడానికీ, ప్రాణం తీయడానికీ నడుమ తేడా ఒక సన్నని కంటికి కన్పించని గీత .. అది ఎప్పుడు చెదిరిపోతుందో ఎవరికీ తెలియదు.
ఆ నల్లని ముఖం కన్పించిన మరుక్షణమే ఆమె సెల్‌ఫోన్‌లో ఓ ఎస్సెమ్మెస్‌ ప్రత్యక్షమైంది. þþ522 నంబర్‌. నల్లని ముఖాన్ని తోసుకుంటూ వెళ్తున్నట్టే ఇద్దరు దృఢమైన వ్యక్తులు వాని పైపైకి చొచ్చుకొస్తూ.. ఓవర్‌ ర్యాపింగు.
రెండు క్షణాల్లో స్పెషల్‌ ఎగ్జిట్‌ దగ్గర సుతిమెత్తగా నల్లని పొడవాటి ఇరవైరెండు ఫీట్ల బెంజ్‌  లిమో కారు వచ్చి ఆగింది. రాబర్ట్‌ వినయంగా ఒక తెరుచుకుంటున్న డోర్‌ వద్ద నిలబడి స్వాగతించి..లీల లోనికి ఎక్కగానే..మెరుపు వేగంతో తనూ ఎక్కి.. కారు మెరుపులా కదిలి.
లిమో కారును చూస్తూ చుట్టూ ఉన్న జనం..కొద్దిగా షాక్‌ ఔతూండగా.,ఐదు నిముషాల్లో..లిమోలో రాబర్ట్‌ కాన్ఫరెన్సింగు ప్రారంభించాడు.
గత రెండు నెలలుగా డిల్లయిట్‌ కంపెనీతో జరిపిన లావాదేవీలు, ఐబియంతో వాల్‌మార్ట్స్‌ సప్లయ్‌ చెయిన్‌ ప్రాజెక్ట్‌ విషయాలు, నాసాతో ఉన్న మోస్ట్‌ కాన్ఫిడెన్షియల్‌ ఆపరేషన్స్‌..కొత్తగా డిఫెన్స్‌ ఆపరేషన్స్‌కు సంబంధించిన మిలియన్‌ డాలర్ల ప్రాజెక్ట్‌ ప్రయత్నాలు, రిట్జ్‌-కార్టన్‌ హోటల్‌ కంపెనీతో ఒప్పందాలు..చెప్పుకుపోతున్నాడు.
లీల కళ్ళు మూసుకుని మౌనంగా వింటోంది.
మాట్లాడ్తున్నప్పటికంటే మాట్లాడవలసినప్పుడు మాట్లాడకుండా మనిషి పాటించే మౌనం ఎదుటి మనిషిని భయంకరంగా భయపెడ్తుంది. ఆ విషయం లీలకు తెలుసు.
లిమో కార్‌ ఇంటర్‌స్టేట్‌ 395 ద్వారా జోహాన్సన్‌ హైవేపై నుండి పరోల్‌ దిక్కు పరుగెడ్తోంది. మూడు సంవత్సరాలు తను అమెరికాలో ఉన్నప్పుడు ఎంతో సుపరిచితమైన రోడ్లే అవన్నీ. ఎదురుగా స్క్రీన్‌పై జిపియస్‌ రూట్‌ మ్యాప్‌ కదుత్తోంది.. సరిగ్గా యిరవై ఎనిమిది నిముషాల తర్వాత బెంజ్‌ లిమో హోటల్‌ లోయిస్‌ విశాలమైన అవరణలోకి ప్రవేశించింది.
కారుడోర్‌ తెరుచుకోగానే డ్రైవర్‌, రాబర్ట్‌..ఇద్దరూ తలపంకించి వినయంగా నిలబడి ఉండగా లీల దిగి..రిసిప్షన్‌ కౌంటర్‌ వైపు నడుస్తూండగా..
ఆమె మొబైల్‌ ఫోన్‌ మ్రోగింది.
స్క్రీన్‌పై రామం నంబర్‌.
అప్పటినుండీ ఒక మృత వాహకంగా ఉన్న రాగితీగలోకి చటుక్కున విద్యుత్తు ప్రవేశించనట్లయి.. ఆమె ముఖం వేయి వాట్స్‌ బల్బులా వెలిగి…
”హలో రామం” అంది చిన్నపిల్లలా..హుషారుగా..అప్పుడే రెక్కలు మొలిచి మొట్టమొదటిసారి ఎగుర్తున్న పక్షిపిల్లలా.
అట్నుంచి రామం ”హలో..”అన్నాడు.

(సశేషం)

–రామా చంద్రమౌళి

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 7 వ భాగం

(గత వారం తరువాయి)

7

బయట వర్షం కురుస్తూనే ఉంది…ఎడతెగకుండా
రామం గబగబా వచ్చి ఎప్పట్నుండో బార్నెస్‌ అండ్‌ నోబుల్స్‌ బుక్స్‌లో ఎదురుచూస్తున్న క్యాథీ ఎదురుగా కూర్చుని.. ”ఎక్స్‌ట్రీమ్లీ సారీ…ఫర్‌ లేట్‌..”అని గొడుగును ప్రక్కన డస్ట్‌బిన్‌పైపెట్టి.. అమె ముఖంలోకి చూచి.,
”ఎగ్జిక్యూటివ్స్‌ ఎప్పుడూ సమయపాలన చేస్తారుగదా” అంది..అని ”ఎప్పుడో కాఫీ చెప్పా..అరగంటయింది. తెస్తానుండు” అని లేచి కాఫీ కౌంటర్‌వద్దకు నడిచిపోయింది.

క్యాథీని చూస్తే వర్తమాన తరంలో సాధారణ అమెరికన్‌ యువతులు చేసే వెర్రిమొర్రి లక్షణాలేవీ కన్పించవెప్పుడూ. రోజురోజూకూ ప్రపంచవ్యాప్తంగా వెర్రితలలు వేస్తున్న విషసంస్కృతికి కొనసాగింపుగా అమెరికన్‌ విద్యార్థుల్లో కూడా విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోయింది. శరీరాన్ని గరిష్టంగా బహిరంగపర్చే వస్త్రధారణ…అసలు ఒంటిపై వస్త్రాలే లేనట్టు..బికినీకంటే కొద్డిగా మెరుగైన కురుచ నిక్కర్‌, పైన ఒక బ్రాను తలపించే అప్పర్‌.. మిగతా అంతా బహిరంగమే. ఎండాకాలమైతే మరీ నగ్నవిహారం. ఒంటిపై టట్టూలు శరీరంపై అక్కఅక్కడా  మెరిసే హాంగింగ్సు, ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన నఖ సౌందర్యం., ఐతే ఇదంతా విద్యావిషయంగా ఉండవలసినంత శ్రద్దలేని ఎక్కువమంది స్థానిక అమెరికన్లలో. మరీ హద్దులు మీరి నల్ల అమెరికన్‌ యువతలో, ఎందుకో వీళ్ళలో చదువుపట్ల సహజంగానే ఆసక్తి తక్కువ. పాఠశాలలోకూడా విద్యా విషయక అంశాలకంటే నాన్‌ కర్రికులర్‌ యాక్టివిటీస్‌…పెయింటింగు, ఫీల్డ్‌ విజిట్స్‌, లెర్నింగు త్రూ లైబ్రరీ, అర్ట్‌ అండ్‌ మ్యూజిక్‌, వాచ్‌ అండ్‌ లెర్న్‌ విధానాలే ఎక్కువ. ఎకడమిక్‌ పాఠ్యాంశాల సాంద్రత, లోతు తక్కువ. తను పరిశీలించినంతవరకు యిక్కడ తయారవుతున్న విద్యార్థుల్లో ఎనభైశాతం సగటుకన్నా తక్కువ ప్రమాణాలు, మిగతావాళ్ళలో ఐదు నుండి పదిశాతం నాణ్యమైన పిల్లలు కనిపిస్తున్నారు. వీళ్ళది స్లో అండ్‌ స్టడీ ప్రాసెస్‌. భారతదేశంలో క్విక్‌ అండ్‌ రన్‌ విధానం. అమెరికా జనాభాలో ఒక శాతం ఉన్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల్లో బాలలు యిక్కడి అనేక విద్యా విషయక రంగాల్లో ప్రతిభావంతులుగా రాణిస్తూండడం ఒక చిత్రమైన విశేషం…ఉదాహరణకు ప్రతి సంవత్సరం జాతీయస్థాయిలో యిక్కడ నలభైవేల డాలర్ల నగదు, జ్ఞాపికతో గౌరవిస్తూ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘నేషనల్‌ స్పెల్లింగు బీ అవార్డు’ పోటీల్లో గత పన్నెండేండ్ల కాలంలో ఎనిమిదిసార్లు భారతీయ బాలలే విజేతలు కావడం ఎంతో ప్రతిభావంతమైన సాధనగా అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది.
ఐతే భారతదేశంలో అనుకుంటున్నట్టు యిక్కడి సంస్కారవంతులైన యువతులెవ్వరూ అర్థనగ్న వస్త్రధారణ చేయరు. మోకాళ్ళదాకా స్కర్ట్‌, పైన బుష్‌షర్ట్‌పై ఓవర్‌కోట్‌..అలా చూడ్డానికి గంభీరంగా, గౌరవనీయంగా ఉండే పద్ధతిలోనే కనిపిస్తారు.
క్యాథీ తనకు మొట్టమొదట పరిచయమైననాటినుండి ఎప్పుడూ పరిపూర్ణమైన వస్త్రధారణతోనే కనిపించింది..అంటుంది… రామం పాత అమెరికా సినిమాలు చూడు గాడ్‌ ఫాదర్‌, గాన్‌ విత్‌ ద విండ్‌, సౌండాఫ్‌ మ్యూజిక్‌..అమెరికన్‌ స్త్రీ వేషభాషలు ఎంత ముచ్చగా ఉంటాయో..ఐ లైకిట్‌…అని.
నిజంగానే ప్రత్యేకమైన అభిరుచి, తత్వంగల స్త్రీ ఈమె. రెండు చేతుల్లో రెండు పొడవాటి కాఫీ కప్స్‌తో, రాపర్స్‌తో, నాప్‌కిన్స్‌తో సహా తీసుకుని వస్తూ,”ఏయ్‌” వై డోన్ట్‌ యు హెల్ప్‌ మీ..”అంది దగ్గరగా వస్తూ,
ఉలిక్కిపడ్డ రామం ”సారీ..”అంటూ ఆమె చేతిలోని సరంజామాను అందుకుంటూండగా,
”నువ్వు అబ్సెంట్‌మైండెడ్‌గా ఉన్నావెందుకో’ ఈరోజు” అందామె.
”ఔను క్యాథీ..ఐ లాస్ట్‌ మైసెల్ఫ్‌ టుడే..హైలీ డిస్టార్టెడ్‌..ఎందుకో నా గతం ప్రొద్దట్నుండీ నన్ను వెంటాడ్తోంది.
”అది తుపానుముందటి అలజడి…ఎ గేల్‌ బిఫోర్‌ ది హర్రికేన్‌”
”ఔననిపిస్తోంది నాక్కూడా”..ఎంత ఖచ్చింగా మనిషిని చదువుతుందీమె అనిపించింది రామంకు.
”అమృతం కురిసిన రాత్రి జ్ఞాపకముందా..”
”ఊఁ…తిలక్‌ కవిత్వంకదా..”
”ఔను..వెన్నెల్లో….”
‘వసుధైక గీతం’ లో అంటాడు,
‘భూమధ్యరేఖ నా గుండెలోంచి పోతోంది
భ్రుకుటి లోపల నక్షత్రగోళం తిరుగుతోంది
ఈ వేళ నన్నానవాలు పట్టలేవు నువ్వు
సూర్యుడుని చూడు నా తలమీద పువ్వు
అట్లాంటిక్‌ కల్లోల తరంగాల మేను వాల్చింది నేను
పసిఫిక్‌ లోతులలో రత్నాల్ని వెదికి తీసింది నేను
ఉత్తర ధృవాన ఒక పాదం దక్షిణ ధృవాన మరోపాదం
సర్వంసహా చక్రవర్తి పదవి సంపాదించుకున్నాను నేను-‘
”…వలె మన జీవితంలో కూడా ఎంతో ప్రధానమైందీ వర్షం కురుస్తున్న రాత్రి..జ్ఞాపకముందా..మనం మొట్టమొదట కలుసుకున్నది వర్షం కురుస్తున్న రాత్రే..మనం తర్వాత సన్నిహితంగా దగ్గరైన ప్రతి కలయికా వర్షం కురుస్తున్న సందర్భమే.. హైద్రాబాద్‌లో మన ‘రామం’ కంపెనీని ప్రారంభించిందీ ఎడతెగని వర్షం కురుస్తున్న రోజే..యిప్పుడు అత్యంత కీలకమైన మనిద్దరి జీవితాల దిశను నిర్ణయించుకుందామనుకుని సమావేశమైన ఈ రాత్రి..ఇప్పుడుకూడా వర్షం కురుస్తున్న రాత్రే.. ఐ లైక్‌ రెయి..చిన్నప్పుడు రైన్‌ రైన్‌ గో ఎవే అనే పాటను రైన్‌ రైన్‌ కంకం, డోన్ట్‌ గో ఎవే బట్‌ అల్వేస్‌ స్టే అని పాడేదాన్ని..”

8
”ఊఁ…”    నిజంగా రామంకు కూడా చాలా ఉద్వేగంగా ఉంది..ఈ రాత్రి తామిద్దరూ కలిసి తమ భవిష్యత్తును, సాధించవలసిన కఠోరమైన యాత్ర తాలూకు పథకాల రూపకల్పననూ పూర్తి చేయాల్సిఉంది. అందుకే గతవారంనుండి క్యాథీకి ఈనాటి ఈ కలయిక గురించి ప్రత్యేకంగా చెబుతూ వస్తున్నాడు. తను తన మనసులో ఉన్న ఆలోచనలన్నింటినీ క్యాథీ సమగ్రంగా చదివింది. నిజానికి తన గురించి తనకంటే ఎక్కువ క్యాథీకే తెలుసు. అందుకే ఒక అనుచరురాలిగా ప్రణాళికారచన బాధ్యతను ఆమెకే అప్పగించాడు.
ఐతే.. జరుగవలసిన చర్చకు…లోతుగా ఆలోచించి తీసుకొనవలసిన నిర్ణయాల తాలుకు తుది రూపమివ్వడానికి ఈ బార్నెస్‌ పుస్తకశాల వేదిక  కాదు..కలుసుకోడానికి మాత్రమే క్యాథీని యిక్కడికి రమ్మన్నాడు రామం..ఐతే..డిస్టర్బయి.. మనసంతా వికలమై.,
రామం ఎంత దాచుకుందామన్నా..యిక సాధ్యంకాక బయటికి తన్నుకొచ్చే జీవిస్తున్న ”లీల” తాలూకు జ్ఞాపకం మనసుతెరపై ప్రత్యక్షమైంది.
వద్దు..వద్దు..వద్దు..లీల బాపతు ఏ జ్ఞాపకాలూ వద్దు..ఆమెకు సంబంధించిన ఏ సంఘటనలూ స్మతిపథంలో వద్దు.. తను భరించలేడు..లీలయొక్క ఏ ప్రస్థావన హృదయంలో పొటమరించినా ఎందుకో శరీరమంతా ఒక కల్లోల సముద్రమై కంపిస్తోంది. చలించిపోతున్నాడు తను. బలవంతంగా లీల జ్ఞాపకాల్ని పక్కకు జరిపి.. నెట్టి.. మూసేసి,
”క్యాథీ..మనింటికి పోదాంపద ”
”… ఎందుకలా డిస్టర్బ్‌గా ఉన్నావ్‌ రామం..యువార్‌ నాట్‌ స్టేబుల్‌”
”యువార్‌ రైట్‌..ఎట్‌ లెటజ్‌ గో..” లేచాడు రామం ఆమె జవాబు కోసం ఎదురుచూడకుండా…అప్పటికి వాళ్ళు కాఫీ టబ్స్‌లోనుండి సగంకూడా తాగలేదు. అతనికి క్యాథీ కాఫీ తాగుతోందా..తాగిందా అన్న గమనింపుకూడా లేదు చకచకా తెచ్చుకున్న గొడుగును కూడా అక్కడే వదిలి బయటికి నడిచాడు. క్యాథీ అతనివైపు చిత్రంగా, కొద్ది ఆందోళనగా చూచి.. ఏమైందితనికివ్వాళ అనుకుంది. రామం గొడుగును ఆమె చేతిలోకి తీసుకుని బయటికి…అతని వెనకాల నడిచింది.

(సశేషం)

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? -6 వ భాగం

ekkadi-7

6

ఆ రోజు జూన్‌ 3వ తేదీ..గురువారం.
రామం మనసు ఉద్విగ్నంగా ఉంది. ఎందుకో దుఃఖంగా కూడా ఉంది. పొద్దటినుండీ మనసులో ఒక ప్రళయగర్జనై వినిపిస్తున్న పదం.. సిటిజన్‌షిప్‌..పౌరసత్వం. యిక కొద్దిసేపట్లో తను అమెరికా పౌరసత్వం స్వీకరించబోతున్నాడు..ఆరోజు.
మనిషి ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి..ఎక్కడికో ఉపాధికోసం వలసవచ్చి..ప్రాంతాలు, దేశాలు మారి..పుట్టినదేశం, పెరిగిన దేశం, బ్రతుకుతున్న దేశం.. కన్నతల్లి, పెంచిన తల్లి, ఏమీకాని దయామయియైన ప్రేమను పంచుతున్న తల్లి.. తల్లి.. తల్లి హృదయమున్న స్త్రీ ఎవరైన ఎంత అద్భుతమైన జీవి. మాతృప్రేమ ఎంతో పవిత్రమైంది. మాతృమూర్తి..మాతృస్పర్శ..మాతృ క్షమ-
”వై ఆర్‌ యు సో సైలెంట్‌..సో డీప్‌” అంది క్యాథీ..ప్రక్కసీట్లోనుండి. కారు అప్పుడు అమెరికా మొట్టమొదటి రాష్ట్రమైన డిలావర్‌ నగరంలో యూనివర్సిటీ ఆఫ్‌ డిలావర్‌ కాంపస్‌లో, క్లేటన్‌ హాల్‌ ముందు పార్కింగు ఏరియాలోకి ప్రవేశిస్తోంది.
ఎర్రగా ఎండ..పచ్చగా చెట్లు చుట్టూ..ఒంటిని తడుముతున్న లేత, పల్చని గాలి.
”ఎందుకో క్యాథీ..మనసు చాలా భారంగా ఉంది..”అన్నాడు రామం కారును పార్క్‌ చేస్తూ.
క్యాథీ తనతో ఈ ఆరేండ్ల సాంగత్యంలో పట్టుబట్టి ఎంతో శ్రద్ధతో తెలుగు నేర్చుకుంది. భారతదేశం నుండి ఇరవై ఒక్క రోజుల్లో తెలుగు, గాజుల సత్యనారాయణ పెద్దబాలశిక్ష నుండి మొదట బాలల బొమ్మల రామాయణం, మహాభారతం, మహాభాగవతం నుండి అనేక పుస్తకాలను అపోషన పట్టింది. క్యాథీ అంటే దీక్ష – క్యాథీ అంటే ఏకాగ్రత. క్యాథీ అంటే కఠోర సాధన. ఇప్పుడు క్యాథీ ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిపెరిగిన చాలామంది తెలుగు వాళ్ళకంటే శ్రేష్టమైన తెలుగు, అర్ధవంతమైన వ్యక్తీకరణ, మంచి భాష, ఉత్తమమైన ఉచ్ఛారణతో సంభాషించగలదు.
”నాకు తెలుసు.. ఒక భారతదేశ పౌరుడు ఈ అమెరికా గడ్డపై అనేక అర్హతలను సాధించి అమెరికా పౌరసత్వాన్ని స్వీకరిస్తున్న ఈ ఉద్విగ్న సందర్భంలో సున్నితమైన హృదయంగల నీవంటి మనిషి ఎంత తీవ్రంగా చలించిపోతాడో నాకు తెలుసు.. ఐనా అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించడమంటే భారత పౌరసత్వాన్ని కోల్పోతున్నట్లు కాదుగదా రామం.. ఒసిఐ కింద ఉభయ పౌరసత్వ చట్టానికి లోబడి భారత పౌరునిగా కూడా నువ్వు కొనసాగుతావు కదా రామం.’
”ఔననుకో క్యాథీ.. కానీ..”
రామం కార్లోనుండి కిందికి దిగి..క్యాథీ ఒక ప్లాస్టిక్‌ ఫోల్డర్‌లో ఉన్న రామం తాలుకు కాగితాలన్నింటినీ పొదివి పట్టుకుని వెంట నడుస్తూ,
మౌనమే ఇద్దరి నడుమ.
ఎదురుగా యిటు మారియట్‌ హోటల్‌..అటు క్లేటన్‌ హాల్‌..యూనివర్సిటీ ఆఫ్‌ డిలావర్‌. చెక్‌ ఇన్‌ కౌంటర్‌లో రిపోర్ట్‌ చేయగానే.. క్యూ ‘బి’ అని చెప్పిందొకామె. లోపల పెద్దహాల్లో ఎ,బి,సి,డి. నాల్గు పెద్ద వరుసలు..అప్పటికే జనం ఎప్పుడో చేరి వరుసల్లో నిలబడి ఉన్నారు. ఓత్‌ టేకింగు సెరిమొనీకి సరియైన వస్త్రధారణతో రావాలని ఒక నిబంధన ఉంది కాబట్టి దాదాపు అందరూ ‘జెంటిల్‌డ్రెస్‌’ లో ఉన్నారు. స్త్రీలు, పురుషులు, అక్కడక్కడ పిల్లలు. కొందరి వెంటవచ్చిన క్యాథీవంటి స్నేహితులు, తల్లిదండ్రులు. అంతా కోలాహలంగా ఉంది. ఐతే దాదాపు అందరి ముఖాల్లోనూ తృప్తితో కూడిన వెల్లివిరుస్తున్న ఆనందం. ఎందుకంటే ప్రపంచం మొత్తంమీద సంపన్నమైన, బలమైన, పటిష్టమైన సర్వసత్త్వాక సార్వభౌమాధికారంగల అమెరికా దేశ పౌరసత్వాన్ని పొందబోతున్న చారిత్రక సందర్భమది.
యు.ఎస్‌. డిపార్ట్‌మెంటాఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ తరపున యుఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ వాళ్లు అతిక్రమశిక్షనాయుతంగా, దాదాపు నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణంలో కొత్తగా పౌరసత్వం స్వీకరించబోతున్న అందరికీ చకచకా ఒక ప్రోగ్రాం షీట్‌ను అందించారు.
రామం ‘బి’ క్యూలో కొద్ది నిముషాలు నిలబడగానే..కౌంటర్‌ చేరువైంది. కౌంటర్లో ఉన్న అమెరికన్‌ యువతి ఒకామె వినమ్రంగా ‘గుడ్మానింగు’ చెప్పి చేయి చాపింది.
రామం తన కాల్‌లెటర్‌, గ్రీన్‌కార్డ్‌ అని పిలవబడే పర్మనెంట్‌ రెసిడెంట్‌ కార్డ్‌ను ఆమెకందించాడు. ఆమె వెంటనే ఒక ప్లాస్టిక్‌ ఫోల్డర్‌ను. చేతికందించింది అందులో ఫిలడల్ఫియా డిస్ట్రిక్‌కు చెందిన న్యూట్రలైజేషన్‌ సెరిమొనీకి సంబంధించిన ఓత్‌ ఆఫ్‌ అల్లెజిఎన్స్‌ ప్లెడ్జ్‌ ఆఫ్‌ అల్లెజిఎన్స్‌. కాన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ యుఎస్‌ఎ వంటి కాగితాలన్నీ ఉన్నాయి.
దాదాపు రెండువందల యాభైమంది ఆ రోజు కొత్తగా అమెరికా పౌరసత్వం స్వీకరిస్తున్నారు. వివిధ దేశాలకు చెందినవాళ్ళు..చైనా, జపాన్‌, అరబ్‌ దేశాలు, భారతీయులు, కెనెడియన్స్‌, ఇంగ్లిష్‌, మెక్సికన్స్‌, ఆఫ్రికన్స్‌ ఎందరో. భిన్న దేశాలు, భిన్న మతాలు, భిన్న జాతులు, భిన్న వర్ణాలు,..విభిన్న తత్వాలు..ఏవేవో కారణాలవల్ల, దాదాపు ఎక్కువమంది జీవనోపాధి వెదుక్కుంటూ వచ్చినవాళ్ళు ఒక దేశపు గడ్డపై గత థాబ్దికాలం గడుపుతూ, యిక్కడి మనుషులతో, యిక్కడి జీవనవిధానంతో, సంస్కృతితో మమేకమై, లీనమై., ఇప్పుడిక..ఈ అగ్రరాజ్య వారసులు కాబోతున్న భావోద్విగ్న సందర్బం..,
ఒక గంటలో దాదాపు కొత్తగా ప్రతిజ్ఞ తీసుకునేవాళ్ళందరూ రిపోర్ట్‌ చేసిన తర్వాత..
అందర్ని సెంట్రల్‌హాల్‌లో కూర్చొమ్మని సూచన. రామం లోపలికి నడిచి ముందు నుండి మూడవ వరుసలో కూర్చున్నాడు. క్యాథీ ప్రక్కనున్న అతిథులకోసం ఉద్దేశించిన బ్లాక్‌లో కూర్చుంది. అంతా గంభీర నిశ్శబ్దం.
సరిగ్గా పదకొండు గంటల ముప్పది నిముషాలకు వెంట ఐదారుగురు వయసు మళ్ళిన వ్యక్తులు వెంటవస్తూండగా చీఫ్‌ జస్టిస్‌, యుఎస్‌ బ్యాంక్‌ రప్టసీ కోర్ట్‌ కెవిన్‌ జె. కారీ ప్రవేశించాడు. వేదికపైనున్న నియమిత కుర్చీల్లో అందరూ ఆసీనులు కాగానే..వాళ్ళ వెనుక ఉన్న విశాలమైన తెల్లని తెరపై..”ఫేసెస్‌ ఆఫ్‌ అమెరికా” పేరుతో ఒక వీడియో చిత్ర ప్రదర్శన ప్రారంభమైంది. వందల ఏండ్ల క్రిందటి అమెరికా, కాలంతో..జీవితంతో..పోరాటం..పారిశ్రామికాభివృద్ధి.. ఎదుగుదల..వందల వేలమంది అమెరికా దేశంపట్ల అంకితభావంతో చేసిన అకుంఠితమైన కృషి..చివరకు సగర్వంగా నీలి గగన వీధుల్లో రెపరెపలాడుతూ అమెరికా జాతీయపతాకం..పదమూడు ఎరుపు, నీలి పట్టీలు..యాభై నక్షత్రాలు..జెండా ధగధగలు.
చీఫ్‌ జస్టిస్‌చే కొత్తగా పౌరసత్వం స్వీకరిస్తున్న అందరికీ స్వాగతవచనాలు..సంక్షిప్తంగా పౌర ప్రాముఖ్యత..అభినందనలు. వెంటనే యుఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్రిగేషన్‌ సర్వీస్‌ అధికారిచే ”మోషన్‌ ఫర్‌ అడ్మిషన్‌”..తర్వాత సంప్రదాయంగా చీఫ్‌ జస్టిస్‌చే అంగీకారం, ఆమోదం..ఆ తర్వాత..అందరూ లేచినిలబడి, అప్పటికే అందరికీ అందజేయబడ్డ చిన్న అమెరికా జెండాలను చేతుల్లో ధరించి, చేతులను ముందుకు చాచి, జాతీయ పతాకానికి వందనం చేస్తూ..ప్రతిజ్ఞ..”అదృశ్యుడైన దేవుని సన్నిధిలో అందరికీ స్వేచ్ఛా, న్యాయము సంప్రాప్తించాలని వేడుకుంటూ సార్వభౌమ అదికారాలకు ప్రతీకఐన అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయపతాకం సాక్షిగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను..”ఇలా సాగుతోంది.
అంతా గంభీర వాతావరణం..అందరి హృదయాల్లో ఎవరికివారికే అనుభవమౌతున్న మౌన సంఘర్షణ..తన శరీరంలోనుండి ఏదో భాగం విడిపోతున్నట్టు..కొత్తగా తన దేహంలోకి  ఏదో లీనమైపోతున్నట్టు..ఏదో ఒక ప్రాణసమానమైన పరివర్తన జరుగుతున్నట్టు..,
నా దేశం..నా భారతదేశం..నా ప్రజలు..నా సోదరులు..నా మాతృభూమి..నా నేల..నా గాలి..నా నీరు..నా ఆత్మ.,
ఎందుకో దుఃఖం..ఎందుకో గొంతుపెగలని ఉద్వేగం..కళ్ళలో ఎవరికీ తెలియని సన్నని కన్నీటి పొర. లోపల చేతులతో కడుపులో ఎవరో దేవుతున్నట్టు బాధ.,
ఏమైందిప్పుడు..రెండు దేశాల్లోనూ పౌరసత్వమేగదా..,అని ఓ ఆత్మ సమాధానం. స్వ స్వాంతన. అమెరికా జెండావందనం కాగానే..జాతీయగీతం..అందరూ నిలబడిఉండగానే..లెఫ్ట్‌నెంట్‌ కెవిన్‌ పీర్స్‌, రిటైర్డ్‌ పెన్సిల్వేనియా స్టేట్‌ పోలీస్‌ అధికారిచే ఉచ్ఛైస్వరంలో మహోత్తేజంగా అమెరికా జాతీయగీతాలాపన..ప్రౌడ్‌ టుబి ఎన్‌ అమెరికన్‌..’
సమాంతరంగాఎక్కడో..గుండెల కొండల్లో..’జనగణమణ..జయ జయ జయహే’..’వందేమాతరం..వందేమాతరం..’
చటుక్కున కట్టలు తెంచుకుంటోంది దుఃఖం రామంలో, జాతీయ గీతాలాపన ముగియగానే అందరితోపాటు రామం కూడా కూర్చుని.,
మరొకసారి చీఫ్‌ జస్టిస్‌ నూతన పౌరసత్వం స్వీకరించిన వ్యక్తులందరికీ అభినందనలు తెలిపి.. ఒక ప్రకటన చేయగానే హాలంతా చీకటై..,
జార్జ్‌ డబ్ల్యు బుష్‌ వైట్‌హౌజ్‌నుండి అభినందనలు తెలియజేస్తూ ఉత్తేజకర వీడియో సందేశం..స్పష్టమైన గంభీర ప్రదర్శనతో..అంటాడు..”వియ్‌ ఎడ్మిట్‌ యు ఏజ్‌ ఎ న్యూ సిటిజన్‌ ఆఫ్‌ అవర్‌ మదర్‌ లాండ్‌ అండ్‌ వియ్‌ వెల్‌కం యు టు ది అమెరికా ఫామిలీ.”
లైట్లు వెలిగి..ఒక నిశ్శబ్ద గంభీరత చెదిరి..,
అందరూ బయటికి హాల్లోకి రాగానే..యిదివరకటి. బి వరుస క్యూలోనే..ఒక విలువైన ప్లాస్టిక్‌ ఫోల్డర్‌లో ఉంచి.. ‘సర్టిఫికేట్‌ ఆఫ్‌ నాచురలైజేషన్‌’ అందజేసి.,
అందరిలోనూ ఏదో తెలియని ఆనందం..వెల్లివెరిసే తృప్తి..ఏదో ఒక అద్భుతమైన స్థాయిని సాధించామనే విజయఛాయ.
నాచురలైజేషన్‌..సహజీకరణ..ఏది సహజం..జీవించే ప్రతి జీవికీ జీవించేహక్కు ఉండాలనీ, జీవించే స్వేచ్ఛ, సహజంగా, ప్రకృతిసిద్ధంగా ఎదిగే హక్కూ ఈ సృష్టినీ ప్రకృతినీ నియంత్రించే సర్వ భగవత్‌దత్త నియంత్రణలన్నింటినీ గౌరవిస్తూ, పాటిస్తూ.. ప్రకృతిలో ఒక భాగమై మాత్రమే కొనసాగుతానని..ఒక ధృవీకరణ..నాచురలైజేషన్‌.
అమెరికన్లలో అన్నింటికంటే గొప్పగా రామంకు నచ్చే సుగుణం..వాళ్ళ దేశంపట్ల వాళ్ళకున్న పవిత్రమైన ప్రేమ..భక్తి. దేశంకోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించగల త్యాగశీలత..మాతృభూమి పట్ల అపారమైన గౌరవం. అంకిత భావం. వాళ్ళ రక్తంలోనే దేశంపట్ల ప్రాణాలకంటే ఎక్కువగా ద్యోతకమయ్యే ఆత్మార్పణ తత్వం.
భారతదేశంలో..,
ఒకప్పుడు ప్రపంచాన్నే ఆశ్చర్యచకితుల్ని చేసిన స్వతంత్ర భారత పోరాట ఐక్యత. భారత భూభాగంపై ఎక్కడికక్కడ పొటమరించి, పెల్లుబికి, వెల్లువై నినందించిన బ్రిటిష్‌ వ్యతిరేక తిరుగుబాటు..జాతి, మత, వర్ణ, వర్గ, లింగ, వయో భేదాలు లేకుండా ఏక త్రాటిపై కొనసాగిన స్వతంత్ర యుద్ధం.,
ఇప్పుడు..ఈ అరవై మూడు సంవత్సరాల తర్వాత ఏమైపోయాయి ఆ బంగరు రోజులు..’ఒక్కనికోసం అందరు – అందరి కోసం ఒక్కడు’గా నింగికి పొంగి ఎగిసిన ఆ ఐక్యతా శక్తులిప్పుడేవి. అసలీ తరానికి దేశ స్పృహ, దేశభక్తి, దేశ స్వతంత్ర పోరాట ధ్యాస..దేశ బాధ్యతల పట్ల ఆలోచన..నిబద్ధత..ఇవేవైనా ఉన్నాయా..ఎందుకీ తరం..శ్రీశ్రీ అన్నట్టు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు వలె పూర్తిగా నిర్వీర్యులై, పథభ్రష్టులై ఎందుకు మిగిలిపోతున్నారు. సమాజంలో దేశం గురించి ఆలోచింపజేసే విధానం ఈ తరానికి ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యార్జనలో.. ఏస్థాయిలోనూ లేక.. అంతా కాగితపు పువ్వు వికసించినచందంగా. మిథ్య.. నైరూప్యత..ఉందా అంటే ఉంది, లేదంటే లేదు రకం అనిమిత్తత ఏర్పడి, వ్యాపించి..అంతా అస్తవ్యస్తత..చిందరవందర.. రిక్తత..వెరసి..ఎవరికివారే యమునాతీరే,
ఇక ఇప్పుడు..ఏదో ఒక భారీస్థాయి పరివర్తన జరగాలి..ఒక షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలి ఎవరొఒకరు దారితప్పిపోతున్న ఈ తరాన్ని ఎవరో ఒకరు మళ్ళీ దారిలోకి మళ్ళించి పునస్సంధానం చేయాలి..లేకుంటే..ఒక నది..ఒక సముద్రం దారితప్పిపోయినట్టు..ఒక వ్యవస్థ. ఒక సమాజం, ఒక ఉజ్జ్వల వారసత్వంగల చరిత్ర భ్రష్టుపట్టిపోతుంది..ఐతే..
ఎలా..ఎలా..ఎలా..?

ekkadi-6
రామంకు గత కొన్నేళ్ళుగా భారతీయ వ్యవస్థ స్థితిగతులను అధ్యయనం చేస్తున్న బాపతు ఎన్నో జ్ఞాపకాలు కురుస్తున్న చినుకుల్లా మస్తిష్కంనిండా ఆవరించినై. అతనికి చాలా స్పష్టత ఉంది..గతం గురించి, వర్తమానం గురించి..సాధించి రూపుదిద్దవలసిన భవిష్యత్తు గురించి..అందుకే ఒకే సుదీర్ఘ యజ్ఞసదృశమైన ప్రణాళికాబద్ధ క్రతువును కొనసాగిస్తూ వస్తున్నాడు తను.
మౌనంగా యూనివర్సిటీ క్లేటన్‌ హాల్‌నుండి బయటికి నడుస్తున్న రామం వెంట అడుగులు వేస్తూ..అతని చేతిలోని ప్లాస్టిక్‌ ఫైల్‌ను తీసుకుని..సర్టిఫికేటాప్‌ నేచురలైజేషన్‌ను చూస్తూ అంది క్యాథీ..”బాధపడ్తున్నావా రామం..యుఎస్‌ఎ పౌరునిగా మారినందుకు” అని.
”ఉహుఁ..జన్మతః భారతదేశ పౌరున్నయి నా విధులను ఇదివరకు సక్రమంగా నిర్వహించనందుకు బాధపడ్తూనే .. భవిష్యత్తులోనైనా మనం అనుకుంటున్నట్టుగా నా మాతృభూమికోసం ఆ చారిత్రాత్మక కార్యక్రమాన్ని అమలు చేయగల్గుతానా అని ఓసారి ఆత్మవలోకన చేసుకుంటున్నాను క్యాథీ..”
”యుఆర్‌ డెఫ్‌నెట్లీ గోయింగు టు డు సంథింగు వండ్రఫుల్‌..”
”చేయాలి..ఏదో ఒకటి చేయాలి..”
కార్లో కూచున్నాక క్యాథీ అంది..”కారును..మహాలక్ష్మి టెంపుల్‌ దిక్కుపోనీ రామం..వుహావ్‌ టు డిస్కస్‌ సంథింగు సిగ్నిఫికెంట్‌..”
మౌనంగానే క్యాథీ దిక్కు చూశాడు రామం..కార్‌ను రివర్స్‌ చేసుకుంటూ. ఆమె అప్పుడు ఏ మేఘాలూలేని ఒట్టి నీలి ఆకాశంలా గంభీరంగా, గుంభనంగా ఉంది.
”ఏమిటో అది..”
”చెప్పాలా ఇప్పుడు”
”నీ యిష్టం”
”రామం..మన పరిచయమై, స్నేహితులమై ఎన్నేళ్ళవుతోందో జ్ఞాపకముందా”
‘ఉహు..చెప్పు నువ్వు”
”సరిగ్గా ఎనిమిది సంవత్సరాల నాల్గునెలల పదిరోజులైంది.”
”ఓ..సో ఆక్కురేట్‌”
”మరి..జీవితమంటేనే ఆక్కురేట్‌గా గడపవలసిన ఒక బృహత్కార్యం అనుకుంటాన్నేను.”
మళ్ళీ మధ్య మౌనం..అతని మనసు ఆ ఎనిమిదేళ్ళ సాంగత్యాన్ని స్కాన్‌ చేస్తూ వస్తోంది నిప్స్‌ వేగంతో..అంతిమంగా క్యాథీ దిక్కు అప్రయత్నంగా, ఆరాధనాపూర్వకంగా చూచి ‘ఒక అద్భుతమైన మనిషి’ అనుకున్నాడు లోలోపల.
”తామరతీగ నీట్లోనే పుట్టి నీట్లోనే పెరిగి నీటిలోనే అంతరించి పోతుంది. కదా..కాని జీవితాంతం నీరు తనను తాకకుండానే అతీతంగా ఉంటుంది. కలిసి ఉంటూకూడా ఏ సంబంధమూ లేక పరాయిగా జీవించడాన్ని ఏమంటారు రామం.” అంది.
కారు వేగాన్ని అందుకుని ఆటోమొబైల్‌ షోరూంలతో కిక్కిరిసి ఉన్న వాషింగ్టన్‌ రోడ్‌ మీదినుండి జారిపోతోంది.
”క్యాథీ.. వర్చువల్‌ లివింగు అండ్‌ రియల్‌ లివింగు..అని రెండు. ఏ సమాజంలోనైనా అది అమెరికాకానీ, భారతదేశంకానీ ఇంకేదైనా దేశంకానీ..మనుషులు కలిసి సుదీర్ఘకాలం జీవించినంత మాత్రాన నువ్వన్నట్టు నీరూ తామరాకులా వాళ్ళమధ్య అనుబంధమే ఏర్పడదు.ఎందరో ఉన్నారు నా అధ్యయనంలో..భార్యాభర్తలుగా కలిసి జీవితాంతం జీవించినా వాళ్ళు ఆత్మీయులు, స్నేహితులు కాదుకదా కనీసం పరిచయస్తులుకూడా కాలేకపోయినవాళ్ళు. నిజానికి పెళ్లి అనేది ఒక యాక్సిడెంట్‌. ఎవరో చెప్పినట్టు ఈ ప్రపంచంలో అన్నింటికంటే హాస్యపూరితమైన తతంగం పెళ్లిచూపుల పేరుతో ఒకమ్మాయి ఒకబ్బాయి ఎదురెదురుగా కూర్చుని ఒకర్నొకరు చూచుకోవడం. వాళ్ళు చూడగల్గింది. ఒట్టి బాహ్య రూపురేఖలనూ, చర్మసౌందర్యాన్నీ, వికారాలనేకదా. హృదయం ఎలా కనబడ్తుంది. యిక పెళ్ళి తతంగం పేరుతో ఒకటైన ఇద్దరు వాళ్ళవాళ్ళ వ్యక్తిగత తత్వాలు, అభిరుచులు, ప్రతిభావిశేషాలు, లక్ష్యాలు ఆధారంగా తమ తమ జీవితాలను ప్రారంభిస్తారు. అసలు అవగాహన యిక అప్పుడు బయటపడ్తుంది. ఆర్థిక పరమైన అంశాలు యిక ప్రతిభాశీలంగా పనిచేయడం మొదలౌతాయి. అతనుసంపాదిస్తున్నాడా, ఆమె సంపాదిస్తోందా. ఎవరు ఎంత సంపాదిస్తున్నారు. ఎవరు ఎవరిపై ఎంతవరకు ఆధారపడి జీవిస్తున్నారు..ఈ మీమాంస మొదలౌతుంది. ఆర్థిక స్పష్టత ఏర్పడ్డ తర్వాతనే మనుషుల అసలురంగు బయటపడ్తుంది. మౌన ఘర్షణ..అంతరంగ వైరుధ్యాలు, తత్వవైరుధ్యాలు.. అనివార్యతలు.. క్రమక్రమంగా ఒకరితో ఒకరు రాజీపడడాలు.. మొదలై..ఈ లోగా పిల్లలు.. పిల్లలపట్ల అనివార్యమై పొటమరించే బాధ్యతలు, సంరక్షణ..రాజీ..రాజీ..రాజీ..చాలా రాజీపడి..బస్‌ జీవితాన్ని జీవించడమే తప్ప అర్థవంతంగా బతకడం ఉండదు. ఓ వందమందిని సర్వేచేసి..నీ జీవితంలో ఏం సాధించావ్‌..అని ప్రశ్నిస్తే, పెరిగిపెద్దయిన..ఏదో ఓ ఉద్యోగం చేసిన..పెళ్ళి చేసుకున్న..పిల్లలను కన్న..సాధ్యమైనంత ఎక్కువ డబ్బు సంపాదించే ప్రయత్నం చేసిన, ముసలోన్నయి చచ్చిపోయిన. ఇంతే..ఇంతకన్న ఎక్కువ ఎవడూ చెప్పడు..ఈ రొటీన్‌కంటే తొంభైశాతం మంది అదనంగా ఏమీ చెప్పరు. ఎందుకంటే అంతకంటే ఎవరూ ఏమీ చేయరుకాబట్టి..ఐతే..జీవిత చరమథలో..నీ భార్య, నీ ప్లిలలు, నీ స్నేహితులు.. వీళ్ళతో నీ మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి అని ఎవరైనా ప్రశ్నిస్తే..వ్చ్‌..అని పెదవి విరిచి..అంతా మిథ్యవంటి శూన్యపూరిత జవాబే వస్తుంది కాని..ఓహో అని పొంగిపోయే స్ఫోరకమైన జవాబేదీ రాదు. ఈ నిర్లిప్తతకు కలిసి దాదాపు నలభై ఏభై ఏండ్లు జీవించిన భార్యాభర్తలుకూడా అతీతం కాకపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది..యిక్కడ బంధం సిమెంట్‌రోడ్‌పై ప్రవహించే నీరులా ముగుస్తుందిగాని..నగ్ననేలపై యింకే వానచినుకుల్లా మమేకం కాదు.
ఐతే.. ఏ పురుషునికి ఏ స్త్రీ భార్యగా లభించి వాళ్ళు జీవితరథానికి రెండు సమానమైన చక్రాల్లా గమనం సాగిస్తారో ముందుగా ఎవరికీ తెలియదు. పరస్పరం అనుకూలవతియైన భార్యో అనుకూలుడైన భర్తో లభించడం కేవలం వాళ్ల అదృష్టంగానే భావించవలసివస్తుందనే అన్ని అధ్యయనాలూ తెలియజేస్తున్నాయి. ఈ అనుకూలత అనేది ఒక హృదయ సంబంధమైన వ్యవహారం..అదే అంతిమంగా జీవితస్వరూప స్వభావాలనూ, సాఫల్యతనూ నిర్ధారిస్తుంది.” రామం ఏదో ఒక ఆంతరికలోకంనుండి మాట్లాడ్తున్నట్టుగా చెప్పుకుపోతున్నాడు.
చటుక్కున అంతరాయం కలిగిస్తూ..”సంగతించే ఇద్దరు స్త్రీ పురుషులు ఒకరి తత్వాన్ని మరొకరు పరిపూర్ణంగా అర్థంచేసుకుని ఒకరికోసం ఒకరు తమలో మార్పులను చేసుకోవచ్చుగదా. సర్దుబాటు, పరివర్తన, రీషేపింగు ఇవి మనుషులకు కొత్తజీవితాన్నీ, దాంపత్యంలో కొత్త స్ఫూర్తిని అందించగలవుగదా రామం..ఎందుకు మనుషులు తమ తత్వాన్నిపునరాకృతీకరించుకునే నిర్మాణంకోసం ప్రయత్నించరు. కలిసి నడవడం తప్పదని స్పష్టంగా తేలిపోయిన తర్వాత.. ఆ నడకను నిర్మాణాత్మకంగా, అర్ధవంతంగా మనుషులు మార్చుకుంటే బాగుంటుందిగదా..”అంది క్యాథీ.
”తప్పకుండా బాగుంటుంది. నిజానికి దాంపత్య వికాసం భార్యాభర్తల పరస్పర అవగాహన, ఎదుటి వ్యక్తిని భరించే సహనశీలత, త్యాగతత్వం, సర్దుబాటు.. వీటిపైన్నే ఆధారపడి ఉంటుంది క్యాథీ..ఇది మనిషి..ఇగో..అహంకు సంబంధించిన సున్నిత విషయం. ఎవరికోసంవారు కాకుండా ఒకరికోసం ఒకరం జీవిద్దాం, కలిసి నడుద్దాం, కలిసి సాధిద్దాం…కలిసి జీవితాన్ని సంయుక్తంగా పంచుకుందాం..కలిసే జీవితంలో విజయాలను సాక్షాత్కరింపజేసుకుందాం అన్న మూల భావన యిద్దరిలోగనుక ఉన్నట్టయితే యిక ఆ ప్రయాణం అద్భుతంగా సాగుతుంది. కాని ఎడ్లబండిని ఒక ఎద్దు ఒకవైపు ఇంకోఎద్దు మరోవైపు గనుక లాగుతున్నట్టయితే..బండి ముందుకు సాగదుసరికదా అక్కడే కూలబడి విరిగిపోతుంది కూడా..”
”ఎడ్లు ఏకశక్తిగా ఏర్పడి బండిని, అనుకున్న బాటలో సాఫీగా లాగడం నువ్వన్నట్టు అతి ప్రధాన విషయమైతే బండి రెండుచక్రాలూ ఒకే వ్యాసంతో అనుసంధానమై ఏకవేగంతో భ్రమించడం కూడా యింకో ముఖ్యమైన విషయంగా నువ్వు గుర్తిస్తున్నావా.”
యథాలాపంగా స్టీరింగు చేస్తున్న రామం ఉలిక్కిపడ్డట్టు క్యాథీ ముఖంలోకి చూశాడు. ఆమెయొక్క లోతైన దృష్టికి ఆశ్చర్యపోయాడు.
”అటువంటి పరస్పరానుకూలమైన రెండు చక్రాలు బండికి అమరడం ఆ బండియొక్క దక్షతకు దోహదపడ్తుంది. దాన్నే అదృష్టమందామా..”
”మే బీ..” నవ్వింది క్యాథీ గలగలా..ముత్యాలు రాలిపడ్డట్టు.
ఇంతకూ క్యాథీ ఎందుకిప్పుడు ఈ మహాలక్ష్మి గుడి ప్రోగ్రాం పెట్టినట్టు. కారు లైమ్‌స్టోన్‌ రోడ్‌పైనుండి వ్యాలీరోడ్‌లోకి ప్రవేశించింది. ఈ రోజు కారుకూడా క్యాథీదే. ఆడి. హైఎండ్‌. గాలిలో విడిచిన బాణంలా సర్రున..,
”వాటీద స్పెషాలిటీ టుడే క్యాథీ..వై డు యు అరేంజ్‌ దిస్‌ స్పెషల్‌ విజిట్‌..”
”జస్ట్‌ లైక్దట్‌’
ఏమై ఉంటుందబ్బా..ఉహు..ఊహకందట్లేదు..ఊర్కే ఆమెవైపు చూశాడు. చెరగని నవ్వు..అలసిపోని ముఖం. తాజా మల్లెపువ్వువలె..మెరిసే నీలికళ్లు నక్షత్రాల వలె.
ప్రతిష్టాత్మక హార్వర్డ్‌ యూనివర్సిటీనుండి ఎంబిఎ చేసిన ఈ పిల్ల యింత నిబ్బరంగా, వినమ్రంగా, ఆత్మవిశ్వాసం నిండిన పూర్ణత్వంతో ఎప్పుడూ స్థిరంగా ఎలా ఉండగలుగుతుందో అని రామం యిప్పటికి వేయిన్నొక్కసారి ఆశ్చర్యపడ్డాడు. అది గమనించి.
”వై..దట్‌ లుక్‌..”అంది చిలిపిగా.
”ఉహు..” అని చిన్నగా నవ్వి..కారు లంకాస్టర్‌ పైక్‌ పైకి వచ్చి..హాకిస్సిన్‌ హిల్‌ మార్గంలోకి ప్రవేశించి దూసుకుపోతోంది. కొండపైప్రాంతం కాబట్టి..చల్లగా, ఆహ్లాదంగా, ప్రశాంతంగా, గంభీరంగా కూడా ఉంది. కార్లో నిశ్శబ్దంగా పనిచేసే ఎ.సి.. అంతా ఏదో ఉత్సుకిస్తున్న పారవశ్యం.
క్యాథీ..అప్పుడప్పుడు చటుక్కున జీవితానికి అన్వయిస్తూ మేనేజ్‌మెంట్‌ విషయాలను అద్బుతంగా ఉటంకిస్తుంది. మొన్న మొన్న తనకిష్టమైన ప్రపంచ ప్రఖ్యాత మేనేజ్‌మెంట్‌ సైన్స్‌ రచయిత స్టీఫెన్‌ ఆర్‌.కోవె కొత్త పుస్తకం ”ఎనిమిదవ అలవాటు..ఫ్రమ్‌ ఎఫెక్టివ్‌నెస్‌ టు గ్రేట్‌నెస్‌” గురించి మహోద్వేగంతో చెప్తూ ఆ రచయిత ఎంతో స్ఫూర్తిని పొంది ఆ పుస్తకంలో ప్రస్తావించిన మహాత్మాగాంధీ కొటేషన్‌నొకదాన్ని చెప్పింది. ‘మనం చేస్తున్న పనికీ మనం చేయగల పనికీ గల తేడా దాదాపు ఈ ప్రపంచ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందేమో’ అన్నది ఆ సూక్తి.
నిజంగాఎంత అద్భుతమైన మేనేజ్‌మెంట్‌ పనిముట్టో అది.
”రామం.. నీకిది తెలుసా.. మనిషి అనే ఒక వస్తువుకాని ఈ జీవికి నాల్గు మితులు ..ఫోర్‌ డైమైన్షన్స్‌ ఉన్నాయి. ఒకటి మెదడు (మైండ్‌) రెండు శరీరం (బాడీ) మూడు హృదయం (హార్ట్‌.. గుండె కాదు) నాల్గు..వీటి సమిష్టి సమీకృత పదార్థమైన ఆత్మ (స్పిరిట్‌). ఎప్పుడూ ఏదో ఒకదాన్ని నేర్చుకోవడం మెదడు చేస్తే భౌతికంగా జీవింపజేసే ఉత్కృష్ట క్రియను శరీరం నిర్వహిస్తూంగా, ప్రేమతోనిండిన మానవ సంబంధాల నిర్వహణను హృదయం చేస్తూంటుంది. ఈ మూడు మహోన్నతమైనచర్యలను సమన్వయపరుస్తూ మనిషి ఆత్మ అర్థవంతమైన మానవపాత్రను నిర్దేశిస్తుంది. ఈ అవగాహన అద్భుతంగా ఉందిగదా రామం..” అంది క్యాథీ..కారు కొండపై నుండి మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి మెల్లగా ఆగుతూండగా.
రామం పులకించిపోయాడు. ఆమె చెబ్తున్న గాఢగంభీర విషయాన్ని వింటూ..ఈమెకు ఇంత లోతైన దృష్టి ఎలా అలవడిందో అని ఆశ్చర్యపోతూ..”ఊ” అన్నాడు కారును ఆఫ్‌చేసి..దిగుతూ.
అటువైపు నుండి క్యాథీకూడా కిందికి దిగింది.
చుట్టూ చాలా కార్లు పార్క్‌ చేసి ఉన్నాయి. అమెరికాలో నివాసముంటున్న భారతీయులు, తెలుగువాళ్లు రెండు మూడు రంగాల్లో గణనీయమైన తమదైన ముద్రను సామాజికంగా ఏర్పర్చారు. ఒకటి అనేక ప్రధాన నగరాల్లో దేవాలయాలను నిర్మించి నిర్వహిస్తూ అందర్నీ సంఘటితపర్చడం. రెండవది భారతీయ సంస్కృతిని శ్రద్ధగా కాపాడ్తూ కొండొకచో యితర దేశవాసులు ఆశ్చర్యపడే రీతిలో కళలను ప్రదర్శించడం, అనేక సందర్భాల్లో కూచిపూడి, కథక్‌, మణిపురివంటి నృత్యప్రదర్శనలు, సంగీత కచేరీలు. ప్రత్యేక పండుగరోజుల్లో ప్రవాస భారతీయులను ఎంతో విశేషంగా అలరిస్తూండడం. మూడవది.. తమ మూలప్రాంతాలకు దూరంగాఎక్కడో ఖండాంతరాల్లో జీవిస్తున్నామన్న స్పృహతో తమ పిల్లలకు ప్రత్యేక శ్రద్ధతో సంగీతం, నృత్యం వంటి ఏదో ఒక అదనపు కళారంగాల్లో శిక్షణనిప్పించడం..ఈ క్రమంలో అనేక తెలుగు కుటుంబాలు తరుచూ కలుసుకోవడం, అనుభవాలను పంచుకోవడం, చేరువకావడం, ఇదంతా ఒక సామాజిక ఐక్యతా సాధన.
రెండేళ్ళక్రితం ఈ మహాలక్ష్మి దేవాలయం స్థాపించబడ్డప్పటినుండి ఎందుకో క్యాథీ బాగా ఆకర్షితురాలైంది. ఈ దేవాలయాన్ని ఒక తెలుగువ్యక్తి శర్మ స్వయంగా పూనుకుని వనరులన్నింటినీ సమీకరించి నిర్మించడం ప్రారంభించి తర్వాత్తర్వాత ఇంకొందరి సహకారంతో పూర్తి చేశాడు. ఒక ట్రస్ట్‌ను ఏర్పరిచి ఆయనే చైర్మన్‌గా ఉండి పూర్తి అంకితభావంతో మందిరాన్ని నిర్వహిస్తున్నాడు. ట్రస్ట్‌లో క్యాథీకి కూడా ఒక ప్రముఖస్థానం ఉంది. ఆలయ నిర్మాణంలోకూడా ఆమె కాంట్రిబ్యూషన్‌ కొంత ఉంది. ధార్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఆమెకు ఎంతో ఇష్టమైన పని.
చకచకా గుడిలోకి నడిచింది. ఆ రోజు గుడిలోని మూర్తికి ‘సరస్వతీ’ అలంకారం చేసి ఒడిలో అందంగా వీణను అలంకరించారు. ఎందరో అప్పటికే కూర్చుని నిష్టగా థసహస్ర కుంకుమ నామార్చన చేస్తున్నారు. ఐదవ రౌండ్‌ కొనసాగుతోంది. గంభీరమైన సామూహిక పఠనంతో సర్వస్వతీ స్తుతి..స్తోత్రం.
ఇద్దరూ ప్రధాన ఆలయం ముందుకు నిశ్శబ్దంగా చేరి..అక్కడే ఉన్న దాదాపు అరవై ఏళ్ళ వయసున్న శర్మగారు క్యాథీని, రామంను గమనించి దగ్గరగా వచ్చి..సాదరంగా పలకరించి..మౌనంగానే ఆయన చేసిన సూచనమేరకు పూజారి.. విగ్రహానికి హారతిచ్చి, ఇద్దరికీ హారతిని అందించి శఠగోపంతో ఆశీర్వదించి..,
చుట్టూ.. సుగంధ ద్రవ్యాల పరిమళం..గాలినిండా సామూహిక పఠన పవిత్రత ..ఏదో మంగళకర వాతావరణం..,
క్యాథీ చేతిలో ఒక కొబ్బరిముక్కను, కొద్దిగా పూలను ఉంచి..ఘంటధ్వని..గణగణ.,
మరో రెండు మూడు నిముషాల్లో అంతా ముగిసి..ప్రక్కన హాల్లో క్రింద ఆడిటోరియంలో ఏవో కార్యక్రమాలు నడుస్తున్నాయి. శాస్త్రీయ సంగీతం తాలూకు ఏదో గాత్రం శ్రావ్యంగా, సన్నగా వినబడ్తోంది.
”రా..” అని మళ్ళీ బయటికి దారితీసింది క్యాథీ.
మొత్తంమీద ఏదో ఓ ప్రధాన విషయాన్ని తన ముందు ప్రస్తావించేందుకు క్యాథీ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది రామంకు.
బయటికి రాగానే..పచ్చగా, విశాలంగా ఉన్న గడ్డిపై కూర్చుంటూ,
”రామం.. నీకు చెప్పకుండా ఒక బృహత్తర కార్యక్రమాన్ని గత మూడు నెలలుగా నిశ్శబ్దంగా నిర్వహిస్తూ వస్తున్నాను. సడెన్‌గా చెప్పి సర్‌ప్రైజ్‌ చేద్దామని ఓ పిచ్చికోరిక. అందుకు నువ్వు అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించిన ఈ రోజే సరియైందేమోనని ఈ టైంను ఎంచుకున్నా. సరిగ్గా నువ్వు భారత ఉపఖండంనుండి అమెరికాలోకి అధికారికంగా పౌరునివై ప్రవేశించిన, ఈరోజే .. నేను.. కాదు మనం యిటు ఈ అమెరికానుండి అధికారికంగా భారతదేశ వ్యాపారవ్యవస్థలోకి శక్తివంతంగా ప్రవేశిస్తున్నాం. ఈ రెండూ ఒకరోజే సంభవించడం యాదృచ్ఛికమే ఐనా చిత్రమే..”
”ఏమిటి క్యాథీ..వై యు ఆర్‌ సో ఎక్సైటెడ్‌”
”యస్‌..యామ్‌ రియల్లీ ఎక్సైటెడ్‌ టుడే..బికాజ్‌..వుయార్‌ నౌ రీచింగు టు స్టార్ట్‌ది మిషన్‌ విచ్‌ యు వర్‌ హిథర్‌ టు డ్రీమింగు.. ప్రపంచంలో అత్యున్నత అంతర్జాతీయ బహుళజాతి సంస్థల్లో ఒకటైన అసెంచుర్‌కు ఒక బిపిఓ ఔట్‌లెట్‌గాభారతదేశంనుండి ఆపరేషన్స్‌ నిర్వహించేందుకు నేను అధీకృత కంపెనీ ఒకదాన్ని స్థాపించి గత నాల్గునెలలుగా ఆ కంపెనీ సిఇవో.. విలియమ్‌ డి. గ్రీన్‌తో చర్చలు జరుపుతూ వస్తున్నాను. అవి ఫలించి ఒక అంగీకారం కుదిరింది. ఈరోజు అమెరికా టైం ప్రకారం సాయంత్రం మేరీల్యాండ్‌ హోటల్‌ మెరియట్‌లో ఎంఓయుపై సంతకాలు చేయాలి. మనకు యుఎస్‌ఎ కు చెందిన నాల్గు ప్రాజెక్ట్స్‌.. మొత్తం నాల్గు మిలియన్‌డాలర్స్‌ విలువగలవి అప్పజెప్పబడ్తాయి. వాటితో ఆర్థికంగా పదునైన ఖడ్గంవలె మనం తయారై కార్యరంగంలోకి ప్రవేశిస్తాం.. ది ఫస్ట్‌ స్టెప్‌ విల్‌బి ఫర్మ్‌, రిజిడ్‌, స్టర్డీ అండ్‌ సాలిడ్‌. దీంతో మనం ఆంధ్రదేశంలో తేవాలనుకుంటున్న పెనుమార్పుకు శ్రీకారం జరుగుతుంది. యుద్ధం జరపాలనుకుంటున్నప్పుడు ఒక సమర్థవంతమైన వాహనం కావాలి. అది గుర్రమా, ట్రక్కా, హెలికాప్టరా, ఎఫ్‌ సిక్స్‌టీన్‌ కంకార్డా.. ఏదో ఒకటి. కావాలి మొత్తానికి. సరంజామాను సమకూర్చుకుంటున్నాం..  కంపెనీ పేరు..” ఆగింది క్యాథీ. గాఢ తపస్సులో ట్రాన్స్‌లో ఉన్న మనిషి మాట్లాడ్తున్నట్టుగా ఉందామె అప్పుడు.
”….” రామం వింటున్నాడు అభావంగా.
”కంపెనీ పేరు..రామం..”అంది ఒక్కక్షణం ఆగి.,
మళ్ళీ ప్రారంభించింది.
”పూర్ణమదః పూర్ణమిదః పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే, పూర్ణస్య, పూర్ణమాదాయ, పూర్ణమేవావ శిష్యతే..” దటీజ్‌ అబ్‌సొల్యూట్‌  దిసీజ్‌ అబ్‌సొల్యూట్‌, అబ్‌సొల్యూట్‌ ఎరైజెస్‌ ఔటాఫ్‌ అబ్‌సొల్యూట్‌. ఇఫ్‌ అబ్‌సొల్యూట్‌ ఈజ్‌ టేకెనెవే ఫ్రమ్‌ అబ్‌సొల్యూట్‌.. ఆల్వేస్‌ అబ్‌సొల్యూట్‌ రిమైన్స్‌..అందుకే మన రామం కంపెనీ లోగో ఒట్టి శూన్యానికి ప్రతీకైన సున్నా..కాంతివంతంగా వెలుగుతూ ప్రజ్వలిస్తున్న సున్న..ఎ గ్లిట్టరింగు రింగు. ఇక స్లోగన్‌ టాగు..”చెప్పుకుపోతూనే ఉంది.
రామం ఆశ్చర్యపడ్తూ, ఆనందపడ్తూ, ఆమె దృష్టిలో తనే ఒక కేంద్రకమై కొనసాగుతున్నందుకు గర్విస్తూ.. పులకించిపోతూండగా.,
”ట్యాగు ఏంటంటే..”ఓ క్షణం ఆగి, అతనివంక చిలిపిగా, కవ్వింతగా చూచి
నిశ్శబ్దంగా సాధిస్తూపోయే నీ తత్వాన్ని ప్రతిబింబించే రెండే రెండు పదాలు..రేపు చరిత్రను సృష్టించబోతున్న రెండే రెండు బీజాక్షరాలతో కూడిన నినాదం..ప్రాణం, ప్రణవం..ప్రపంచం..”
”…” రామం ఆ క్షణం క్యాథీలో ప్రళయిస్తున్న స్త్రీ శక్తిని చూస్తున్నాడు.
ఏమిటీమెలో ఈ ఉద్ఘోష..అనుకున్నాడు
”చెప్పు” అన్నాడు అనూహ్యంగానే.
మళ్ళీ ఆమె వికసిస్తున్న పువ్వులా నవ్వి అంది..”జస్ట్‌ పర్‌ఫార్మింగు” అని..స్పష్టంగా, నిశ్చితంగా, స్థిరంగా చెప్పింది కంపెనీ తత్వాన్ని ప్రతిబింబించే ట్యాగులైన్‌ను.
ఔను.. జస్ట్‌ పర్‌ఫార్మింగు హియరాఫ్టర్‌..యిక సంచలనాత్మకంగా పనులను నిర్మాణాత్మక రీతిలో నిర్వహిస్తూ పోవడమే.. మడమ తిప్పకుండా, వెనక్కి తిరిగిచూడకుండా..ఏకోన్ముఖంగా,
ఐతే ఈ ‘రామం’ పేరేమిటి.. ఈమెకు తనపై ఈ అచంచలమైన విశ్వాసానీకీ, ఇష్టతకూ, ప్రేమకూ పునాది ఏమిటి.. నమ్మకం..ఒట్టి నమ్మకమేనా..అంతేనా.,
మనిషిపై మరో మనిషికి గట్టి నమ్మకం ఏర్పడ్డం మామూలు విషయము కాదు. మానవ సంబంధాలన్నీ వ్యాపారాత్మక ఆర్థిక సంబంధాలుగానే చెలామణి ఔతున్న స్వార్ధపూరిత వర్తమాన సందర్భంలో..మనిషిని మనిషి నమ్మడం.. అదీ ఈ స్థాయిలో నమ్మడం నిజంగా అపూర్వమే.
”రామం..నువ్వు స్వతహాగా లక్ష్యించిన గమ్యాలు గొప్పవి. ఒక అద్బుతమైన నూతన సమాజాన్ని సృష్టించాలని సంకల్పంచిన కాంక్ష గొప్పది…ఆ మహోన్నతమైన సాధనలో నీ వెంట ఒక స్నేహితురాలిగా పాలుపంచుకోవాలన్నది నా కోరిక..యిక్కడికి వచ్చిన్నాటినుండి నీ అన్ని సాహసోపేతమైన కార్యక్రమలూ నాకు తెలుసు..నీ వ్యూహాలు,  క్రమశిక్షణ, నిబద్ధత..నిర్వహణ..వీటన్నింటిలోనూ నీ నిజాయితీ..యివన్నీ యిన్నేళ్ళ నీ సాంగత్యంలో నాకు చాలా స్పష్టంగా తెలుసు.. అందుకే..యిక విమానం టేకాఫ్‌ కావలసిన సమయం ఆసన్నమైంది. నాకు తెలిసి ఒక మేనేజ్‌మెంట్‌ విద్యార్థిగా..ఈ ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేసిన ఎందరో మహానుభావుల్లో ఉన్న అతి ప్రధానమైన జ్ఞానాలు నాల్గువిధాలు. ఒకటి మేధోసంబంధమైనదార్శనికత, రెండు శారీరక ప్రవర్తనను నియంత్రించే క్రమశిక్షణ, మూడు..హృదయ సంస్పందనలను కార్యోన్ముఖం చేసే కాంక్ష, నాల్గవది..అతి ప్రధానమైందీ ‘స్పృహ’ అనబడే ఆత్మ సంబంధియైన అంతఃచేతన. లూసియస్‌ సెనేకా అనే తత్త్వవేత్త ఏమన్నాడంటే..”మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ఈజ్‌ హి హు హాజ్‌ హిమ్‌సెల్ఫ్‌ ఇన్‌ హిజ్‌ పవర్‌..’అని..మనిషి తనకున్న శక్తితో తనను తాను గుర్తించగలిగిననాడే నిజమైన శక్తిమంతుడు..”
క్యాథీ ఒక మనిషిగా ద్రవించి ప్రవహిస్తున్నప్పుడు రామం ఎప్పుడూ ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదెన్నడూ. ఆమె ఓ జలపాతమౌతుంది అప్పుడప్పుడు.
”రామం.. అందరూ అడిగే ప్రశ్న ఒకటుంది..అది..నీవంటి లీడర్స్‌ పుడతారా లేక తయారుచేయబడ్తారా అని.. దీనిపైన ఎందరో విశ్లేషణాత్మక అధ్యయనాలను జరిపారు విపులంగా. ఐతే చివరికి చాలామంది అంగీకరించిన సత్యమేమిటంటే.. లీడర్స్‌ ఆర్‌ సెల్ఫ్‌ మేడ్‌ అని. ఒక నాయకుడు వాణ్ణివాడు మాత్రమే రూపొందించుకోవాలి. శిల ఉలితో తనను తానే చెక్కుకుని శిల్పంగా మలచుకొన్నట్టు. ఐతే యిక్కడ ఒక ప్రధానమైన విషయముంది రామం..లీడర్‌ ఎప్పుడు ఒకమేనేజర్‌ కాదు. నీకా విషయం తెలుసనుకో. ఐనా సందర్భం ఔచిత్యమైంది కాబట్టి మరోసారి చెబుతున్నా. డబ్ల్యు.బి. బెన్నిస్‌ ఏమన్నాడంటే ‘లీడర్సార్‌ పీపుల్‌ హు డు ది రైట్‌ థింగ్సు – మేనేజర్సార్‌ పీపుల్‌ హు డు థింగ్సు రైట్‌” సరియైన పనులనే చేయడం వేరు. పనులను సరిగా చేయడం వేరు…కదా” అని చటుక్కున ఆగి..నాలుక్కరుచుకుని., సిగ్గుపడ్తున్నట్టు తలవంచుకుని.,
”యువార్‌రైట్‌ క్యాథీ..” అన్నాడు రామం ప్రశంసాపూర్వకంగా.
”ఎనీ ఓవర్‌ యాక్షన్‌”
”నాటెటాల్‌..నెవర్‌ యువర్‌ ఓవర్‌”
”సో..రామం అనే కంపెనీకి సిఇఓ గారూ..యిక హైద్రాబాద్‌లో మన కంపెనీని స్థాపించే ప్రణాళికను యుద్ధప్రతిపాదికపై ప్రారంభిస్తారా. ఎట్‌ ది సేమ్‌ టైం..నా ఆఫర్‌ను అంగీకరించినందుకు ధన్యవాదాలు..” అంది ఆత్మీయత ఉట్టిపడ్తున్న స్వరంతో.
”థ్యాంక్యూ క్యాథీ..నిజానికి నువ్వు నా ఆత్మకు ఒక భౌతిక రూపానివి..ఈ ఒక వాక్యంకంటే ఇంక ఏమీ చెప్పలేను” అన్నాడు రామం కృతజ్ఞతాభావంతో పులకించిపోతూ అతనికాక్షణం  రెక్కలు మొలుస్తున్నప్పటి శిశుపక్షిలో కలిగే ఉద్వేగభరిత వివశత ఉండి.
”సాయంత్రం యిద్దరం మేరీల్యాండ్‌ మారియట్‌లో ఎంఒయుపై సంతకం చేద్దాం.. ఎ సెంచ్వుర్‌ సిఇఓ విలియమ్‌ డి. గ్రీన్‌తో…వెళ్దామా యిక…”
”దేవీగారి అజ్ఞమరి” నవ్వాడతడు ప్రసన్నంగా.
సరిగ్గా అప్పుడే మహాలక్ష్మి దేవాలయం నుండి  గుడిగంటలు మంగళప్రదంగా మ్రోగాయి..చుట్టూ గుంపులుగుంపులుగా ఉన్న ఎత్తైన చెట్లలోనుండి పకక్షుల గుంపులు నీలి ప్రశాంత ఆకాశంలోకి ఎగిరి నిష్క్రమించడం మొదలైంది. దార్శనికత, రెండు శారీరక ప్రవర్తనను నియంత్రించే క్రమశిక్షణ, మూడు..హృదయ సంస్పందనలను కార్యోన్ముఖం చేసే కాంక్ష, నాల్గవది..అతి ప్రధానమైందీ ‘స్పృహ’ అనబడే ఆత్మ సంబంధియైన అంతఃచేతన. లూసియస్‌ సెనేకా అనే తత్త్వవేత్త ఏమన్నాడంటే..”మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ఈజ్‌ హి హు హాజ్‌ హిమ్‌సెల్ఫ్‌ ఇన్‌ హిజ్‌ పవర్‌..’అని..మనిషి తనకున్న శక్తితో తనను తాను గుర్తించగలిగిననాడే నిజమైన శక్తిమంతుడు..”
క్యాథీ ఒక మనిషిగా ద్రవించి ప్రవహిస్తున్నప్పుడు రామం ఎప్పుడూ ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదెన్నడూ. ఆమె ఓ జలపాతమౌతుంది అప్పుడప్పుడు.
”రామం.. అందరూ అడిగే ప్రశ్న ఒకటుంది..అది..నీవంటి లీడర్స్‌ పుడతారా లేక తయారుచేయబడ్తారా అని.. దీనిపైన ఎందరో విశ్లేషణాత్మక అధ్యయనాలను జరిపారు విపులంగా. ఐతే చివరికి చాలామంది అంగీకరించిన సత్యమేమిటంటే.. లీడర్స్‌ ఆర్‌ సెల్ఫ్‌ మేడ్‌ అని. ఒక నాయకుడు వాణ్ణివాడు మాత్రమే రూపొందించుకోవాలి. శిల ఉలితో తనను తానే చెక్కుకుని శిల్పంగా మలచుకొన్నట్టు. ఐతే యిక్కడ ఒక ప్రధానమైన విషయముంది రామం..లీడర్‌ ఎప్పుడు ఒకమేనేజర్‌ కాదు. నీకా విషయం తెలుసనుకో. ఐనా సందర్భం ఔచిత్యమైంది కాబట్టి మరోసారి చెబుతున్నా. డబ్ల్యు.బి. బెన్నిస్‌ ఏమన్నాడంటే ‘లీడర్సార్‌ పీపుల్‌ హు డు ది రైట్‌ థింగ్సు – మేనేజర్సార్‌ పీపుల్‌ హు డు థింగ్సు రైట్‌” సరియైన పనులనే చేయడం వేరు. పనులను సరిగా చేయడం వేరు…కదా” అని చటుక్కున ఆగి..నాలుక్కరుచుకుని., సిగ్గుపడ్తున్నట్టు తలవంచుకుని.,
”యువార్‌రైట్‌ క్యాథీ..” అన్నాడు రామం ప్రశంసాపూర్వకంగా.
”ఎనీ ఓవర్‌ యాక్షన్‌”
”నాటెటాల్‌..నెవర్‌ యువర్‌ ఓవర్‌”
”సో..రామం అనే కంపెనీకి సిఇఓ గారూ..యిక హైద్రాబాద్‌లో మన కంపెనీని స్థాపించే ప్రణాళికను యుద్ధప్రతిపాదికపై ప్రారంభిస్తారా. ఎట్‌ ది సేమ్‌ టైం..నా ఆఫర్‌ను అంగీకరించినందుకు ధన్యవాదాలు..” అంది ఆత్మీయత ఉట్టిపడ్తున్న స్వరంతో.
”థ్యాంక్యూ క్యాథీ..నిజానికి నువ్వు నా ఆత్మకు ఒక భౌతిక రూపానివి..ఈ ఒక వాక్యంకంటే ఇంక ఏమీ చెప్పలేను” అన్నాడు రామం కృతజ్ఞతాభావంతో పులకించిపోతూ అతనికాక్షణం  రెక్కలు మొలుస్తున్నప్పటి శిశుపక్షిలో కలిగే ఉద్వేగభరిత వివశత ఉండి.
”సాయంత్రం యిద్దరం మేరీల్యాండ్‌ మారియట్‌లో ఎంఒయుపై సంతకం చేద్దాం.. ఎ సెంచ్వుర్‌ సిఇఓ విలియమ్‌ డి. గ్రీన్‌తో…వెళ్దామా యిక…”
”దేవీగారి అజ్ఞమరి” నవ్వాడతడు ప్రసన్నంగా.
సరిగ్గా అప్పుడే మహాలక్ష్మి దేవాలయం నుండి  గుడిగంటలు మంగళప్రదంగా మ్రోగాయి..చుట్టూ గుంపులుగుంపులుగా ఉన్న ఎత్తైన చెట్లలోనుండి పకక్షుల గుంపులు నీలి ప్రశాంత ఆకాశంలోకి ఎగిరి నిష్క్రమించడం మొదలైంది.

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ? – 5వ భాగం

Ekkadi(1)

(గత వారం తరువాయి )

5

మొబైల్‌ మ్రోగింది.
మనిషి తనను తాను ఎక్కడో పోగొట్టుకుని అవ్యవస్థితమై ఏదో ఒక ఆలోచనలో సమాధియైపోవడం, శవప్రాయమై అనిమిత్తమైపోవడం ఎప్పుడో ఒకప్పుడు అందరికీ అనుభవమయ్యే విషయమే. అప్పుడు ఏ కొద్ది అంతరాయమైనా మనిషిని ఉద్విగ్నుణ్ణి చేస్తుంది..ఉలిక్కిపడ్డాడు రామం.
మనసు సుడిగాలిలో కాగితపు ముక్కలా ఉంది.. ఒకరకంగా..యుద్ధంలో పాల్గొనబోయేముందు దీక్షాబద్ధుడైన సైనికునిలా ఉంది..యిక ప్రయాణం ప్రారంభించాలి.
‘హాలో..” అన్నాడు
”హై..” అటునుండి క్యాథీ.
”ఓ.”
”ఐయామ్‌ వెయిటింగు ఫర్యూ ఎట్‌ బార్నెస్‌ అండ్‌ నోబుల్‌..యుహావ్‌ గినెన్‌ టైం. హావ్యూ ఫర్గాట్‌”సారీ…ఐ ఫర్గాట్‌.. కమింగు నౌ..”
ఉన్నపళంగా లేచి..టకటకా బయటికి వచ్చి తన ఇన్ఫినిటీ, కారును స్టార్ట్‌ చేశాడు రామం.. వాటర్‌హాలో, డార్సీ స్ప్రింగు, అబ్జర్వేషన్‌ డ్రైవ్‌, కాంఫ్రీ, రాయల్‌ క్రౌన్‌.. కారు సర్రున జారిపోతోంది. బయట సన్నగా వర్షం.,
జ్ఞాపకాల వర్షం.. చినుకులు చినుకులుగా ఘటనలు,
జీవితంలోకి క్యాథీ అనే ఈ అమెరికన్‌ యువతి యొక్క ప్రవేశం యాదృచ్ఛికమే ఐనా..పోను పోను ఓ ప్రభావశీలమైన అనుబంధంగా మారడం..మనుషుల ప్రాంతాలు, మూలాలు, దేశాలు, నేపథ్యాలు..వీటితో ఏ సంబంధమూ లేకుండానే ఒక హృదయానుగతమైన అనురాగంతో చేరువై ఆత్మీయులుగా మారుతూండడం.. ఇదంతా ఓ చిత్రమైన ఏ నిరూపణకూ, తత్వానికీ, తత్వజ్ఞానానికీ అందని అంతరిక రహస్యమై.,
తను మొదట టిసిఎస్‌ స్టాఫ్‌గా రాక్‌విల్లీలో చేరిన తర్వాత రెండు నెలల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు ఒక వారం రోజుల తేడాతో పరిచయమైన విశిష్టమైన వ్యక్తిత్వం గల వ్యక్తులు ఇద్దరు. ఒకరు లీల. మరొకరు క్యాథీ. లీల తను చేరిన పదిరోజుల తర్వాత భారతదేశంనుండే టిసిఎస్‌స్టాఫ్‌గా మేనేజ్‌మెంట్‌ మాడ్యూల్‌లో హైద్రాబాద్‌ బ్రాంచ్‌నుండి వచ్చి చేరిన వ్యక్తి. ఆమె ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, బెంగళూర్‌ నుండి బంగారు పతక గ్రహీత. క్యాంపస్‌ ఇంటర్వూలో తన వలెనే ఎంపిక చేయబడి చాలా మంచి జీతంతో ప్రవేశపెట్టబడ్డ వ్యక్తి. అప్పటికే ఆమెకు గొప్ప ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. విద్యార్థిగా ఉన్నపుడే ఎన్నో సంస్థలతో సంబంధాలు పెట్టుకుని అనేక విజయాలను సాధించి పెట్టిన మనిషి. ప్రధానంగా బిజినెస్‌ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగు కార్యకలాపాలను విస్తరించే ప్రత్యేక విధులకోసం ఆమెను రాక్‌విల్లీ ఆఫీస్‌కు పంపారు.
లీల..ఒక వ్యక్తే..కాని ఒక వ్యవస్థతో సమానం. మనిషి చేతలు, కదలికలు, నిర్ణయాలు, ఒక కేస్‌ను అధ్యయనం చేసే విధానం చాలా విలక్షణమైంది. ఆమె ఆలోచనలు పోలీస్‌లవి. చూపులు డేగవి. వ్యూహాలు సింహానివి. తెలివి చాణక్యునిది. వెరసి లీల అంటే విజయానికి ప్రతీక.
ఐతే.. లీల అందగత్తె.. లీల అహంకారి..లీల పొగరుబోతు.
అంటుంది..’నా అహంకారమే నాకు అలంకారం’ అని.

”ఐ లైక్‌ మెన్‌ ఆఫ్‌ మల్టిట్యూడ్స్‌.. బహుముఖ ప్రజ్ఞాశాలులంటే నాకిష్టం..”అంది మొదట తన్ను తాను పరిచయం చేసుకుంటూ. అంతకుముందు ఒక వారంరోజులు తనను ఆమె అతి వివరంగా పరిశీలించి అధ్యయనం చేసినట్టు తనకు తెలుసు. తను ఒక అసాధారణ ప్రతిభగల మెకానికల్‌ ఇంజనీరే కాకుండా, కాడ్‌కాం రంగంలో, ఫ్లెక్సిబుల్‌ మెషినింగు సిస్టమ్స్‌లో, స్పేస్‌ అప్లికేషన్‌ బేరింగ్సు రూపకల్పనలో సాప్‌ సాఫ్ట్‌వేర్‌ను సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌లో వాడడం.. ఈ రంగాల్లో తన అసమాన ప్రతిభను లీల అద్భుతంగా పసిగట్టింది.
ఒకరోజు ‘స్టార్‌బక్‌ కాఫీ షాప్‌’ లో కలుసుకుందామని ప్రపోజ్‌ చేసి పర్సనల్‌గా ఒక గంటసేపు మాట్లాడింది. ఆ సంభాషణ తర్వాత కొంత చేరువైనట్టనిపించింది. మనిషి ఎంతో డైనమిక్‌ ఐనా చాలా లోతైన తాత్విక ఆలోచనలు గల సున్నితమైన దృఢసంకల్పంగల మనిషి..ఆమెకు తనదైన ఒక వ్యవహారశైలి ఉంది. చొరవ ఉంది. సింహంవలెనే పట్టువిడువకుండా వేటాడే గుణముంది. అన్నింటినీమించి అద్భుతమైన ధైర్యముంది.
ఐతే లీల గురించి అర్ధంగానిది ఆమె యొక్క ‘పాదరసం’ వంటి చంచల స్వభావం. దాన్ని అస్థిరత అనే వీలేలేదుగాని, అస్పష్టమైన సందిగ్ధతగా అర్థం చేసుకోవచ్చునేమో. మంచి ఇంగ్లీష్‌. మంచి వ్యక్తీకరణ..ఎదుటి మనిషిని రెండు నిముషాల్లో ఆకట్టుకునే దేహభాష.
ఎందుకో ఆమెతో పరిచయం పెరుగుతున్నకొద్దీ ఏదో తెలియని ఆకర్షణకూడా పెరుగుతూ వచ్చింది తనలో. ఆమెను తరుచూ కలుసుకోవాలనీ, సాధ్యమైనంత ఎక్కువసేపు మాట్లాడాలనీ, ఎక్కవకాలం సాంగత్యాన్ని అనుభవించాలనీ అనిపించేది.
ఆమె అభిరుచులుకూడా తనను ఎంతో ఆకట్టుకున్నాయి. తనవలెనే ఆమెక్కూడా మధురమైన సంగీతాన్ని వినాలని కోరిక. ప్రకృతిని ఆరాధించే తత్వం..ముఖేశ్‌ పాటలను తను తదేకంగా వింటున్నపుడు ఓ చరణాన్ని అందుకుని హమ్మింగు చేసేది. ఒంటరితనాన్ని యిష్టపడ్తుంది. విపరీతంగా పుస్తకాలను చదువుతుంది. ఏ కారణంవల్లనైనా  డిస్టర్బ్‌ ఐనపుడు ఎటో ఏకాంతంలోకి వెళ్ళిపోతుంది. ‘హిట్‌ అండ్‌ మిస్‌ కాకుండా..హిట్‌ అండ్‌ స్టే..అండ్‌ ఫేస్‌’ తత్వం ఆమెది.
‘జీవితం ఓ యుద్దం. పోరాడి గెలవాలి’ అనేది ఆమె సిద్ధాంతం. కారు మైల్‌స్టోన్‌ సెంటర్‌ మలుపు తిరిగింది..వర్షం ఉధృతమై చినుకులు చిక్కబడ్డాయి.
ekkadi -5

క్యాథీది లీలకు పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వం. లీల జలపాతమైతే క్యాథీ మైదానథలో ప్రవహించే నది. నిండైన మనిషి. తొణకకుండా గంభీరంగా ఏ సమస్యనైనా తట్టుకుని శాంతంగా పరిష్కరించగల నేర్పరి. వెన్నెల ముద్దతో చేసిన మనిషిలా అతి సున్నితమైన, నాజూకైన సౌందర్యం ఆమెది. తేనెరంగు కళ్ళు, రాగిరంగు వెంట్రుకలు, గోధుమరంగు శరీరం. కళ్ళలో తొణికిసలాడే జీవకాంతి. అన్నింటినీ మించి క్రమశిక్షణతో కూడిన ప్రతిభ. చేస్తున్న పనిలో నిజాయితీ.
జన్మతః మంచి ఆర్థిక నేపథ్యం ఉన్న కుటుంబంలోనుండి వచ్చింది క్యాథీ. తండ్రి జాన్సన్‌ మంచి ఇండస్ట్రియలిస్ట్‌. ఫోర్డ్‌, జియంసి, టయోటా కంపెనీలకు కొన్ని కారు విడిభాగాలను ‘జస్ట్‌-ఇన్‌-టైం’ పద్ధతిలో సరఫరా చేసే పరిశ్రమ ఉందతనికి. జీవితకాలమంతా ఆ పరిశ్రమను ఉన్నతీకరించడంలోనే గడిపిన వ్యక్తి. తల్లి మేరీ గృహిణి. ఒక్కతే కూతురు క్యాథీ. తన తర్వాత తన పరిశ్రమను నిర్వహించగల సమర్థను క్యాథీలో పాదుకొల్పేందుకు క్యాథీతో బి.ఎస్‌ ఇన్‌ ఆటోమొబైల్‌ చేయించాడు. అందులో ఆమె యూనివర్సిటీ ఫస్ట్‌ వచ్చింది. అనెహర్బర్‌లో ఉండేవాళ్లు మొదట. తర్వాత డెట్రాయిట్‌కు మారి.,

పదేళ్ళక్రితం క్యాథీ పరిచయమైనపుడు తండ్రితో కలిసి తూర్పుతీరంలో, వాషింగ్టన్‌ డి.సి. మాంగోమెరీ, గేథర్‌ బర్గ్‌, మేరీల్యాండ్‌, వీటన్‌.. అటు వర్జీనియా ప్రాంతాల్లో ఔట్‌లెట్స్‌ తెరిచి వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌కోసం సాఫ్ట్‌వేర్‌ కావాలని తనదగ్గరికొచ్చారు. అప్పుడే మొదట ఆమెను చూడడం. తర్వాత్తర్వాత నాల్గయిదు సార్లు పనులకోసమే పదేపదే తనను కలిసింది. కలిసిన ప్రతిసారీ ఏదో తెలియని ఆకర్షణ ఆమె వైపు లాగేది. మనిషిలో ఏదో ప్రత్యేకత కనిపించేది. సహజమైన అమెరికన్‌ యువతుల్లో ఉండే ఫ్యాన్సీనెస్‌, శరీరాన్ని బహిరంగంగా ప్రదర్శించే లౌల్యం కొద్ది అతిగా అనిపించే ప్రవర్తనగానీ ఏవీ ఆమెలో లేవు. పద్ధతైన అణుకువతో నిండిన వినమ్రత, అవధుల్లోనే ఉంటూ ఎదుటిమనిషిపై జరిపే తెలివైన దాడి.. యివన్నీ తనను ఎంతో ఆకట్టుకునేవి.

ఎందుకోగానీ తనపట్ల ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని పెంచుకుని..”ఐయామ్‌ ఫీలింగు టు బి ఎ ఫ్రెండాఫ్‌ యు” అంది క్యాథీ అకస్మాత్తుగా..ఓసారి..
ఆమె కళ్ళలోకి చూశాడాక్షణం తను. ఏదో అనిర్వచనీయమైన లాలస.
తనక్కూడా అలాగే అనిపించింది. ఐతే క్యాథీతో అనిపించిన ఈ ఉద్విగ్నానుభవం లీల విషయంగా అనిపించలేదు.
లీలలో ఒట్టి ఆకర్షణ ఉంది. కాని క్యాథీలో దాన్ని మించిన ఇంకేదో భాషకందని నిజాయితీకి, నిర్మలత్వానికి సంబంధించిన బలమైన ఉన్మీలన శక్తి ఉంది.
క్రమక్రమంగా క్యాథీ ఇంకా ఇంకా చేరువై..ఒకరి వ్యక్తిత్వంలోకి మరొకరు తొంగి చూచుకుని, ఒకరిగురించి మరొకరు ఇంకా వివరంగా, లోతుగా తెలుసుకుని ఒకర్నొకరు చదువుకుని,
”దీన్నేమంటారు” అని అడిగాడు తను ఒకరోజు పార్క్‌లో కూర్చున్నపుడు.
క్యాథీ అంది ”మె బి లవ్‌” అని.
”ఈజిట్‌”
స్పష్టాస్పష్టంగా, ద్వైదీభావంగా, ఒక్కోసారి డోలాయమానంగా..మనిషికి ఏది కావాలో ఏది వద్దో..ఆ కావలసింది ఏమిటో, వద్దనేది కూడా ఏమిటో..మోహానికీ, కామానికీ, ప్రేమకూ తేడా తెలియకుండా గాలిలో దూదిపింజవలె తేలిపోతున్నట్టనిపించే వయసులో.,
ఎక్కడో విన్నాడు తను..’జవానీమే సువ్వర్‌ భీ సుందర్‌ లగుతా హై’ అని
వయసువల్ల వస్తున్న పరితపనా ఇది. శారీరకంగా ఉధృతమౌతున్న భౌతిక వాంఛనా ఇది. మౌనంగా యుక్తతవల్ల అంతరాంతరాల్లో రగులుతున్న యవ్వనాగ్నా ఇది.
..ఐతే..ఈ పరితపన లీలపై ఎందుక్కలగట్లేదు.
లీల కూడా..స్పష్టంగా సంకేతాలిచ్చింది తనకు చేరువకావాలని..స్నేహం కావాలని..సాంగత్యం కావాలని..కాని.. అది ప్రేమా?..వ్చ్‌..ఏమో. ఆమె కూడా దాన్ని ప్రేమ అనిగానీ మనం ప్రేమించుకుందామనిగానీ..అంతకుమించి ఇంకేదైనా అనిగానీ అనలేదు తనతో.
కాని ఏదో ఉంది లీలకు తనపట్ల..ఆ ఏదో ఏమిటి..పోనీ తనక్కూడా లీలపట్ల ఆ ఏదో ఉందా..?
అప్పుడు తనకు ఇరవై తొమ్మిదేండ్లు..అమెరికాకు వచ్చి మూడవ సంవత్సరం.
టిసిఎస్‌నుండి రాజీనామా చేసి..కొన్నేళ్ళ తర్వాత భారతదేశం తిరిగివెళ్ళి ప్రజాజీవితంలోకి వెళ్లవలసిన లక్ష్యాలనుస్పష్టంగా నిర్వచించుకుని ఒక ఎంటర్‌ప్రునర్‌గా మారాలనీ, సర్వశక్తులనూ ఒడ్డి యిక సాధ్యమైనంత ఎక్కువ డబ్బు సంపాదించాలనీ, తనవంటి ఆలోచనా ధోరణే కలిగిన వ్యక్తులను ఇక్కడ అమెరికాలో, అక్కడ భారతదేశంలో గుర్తించి సమీకరించాలనీ నిర్ణయించుకుని ఒక్కసారే ఒక నెలరోజుల్లోనే మూడు స్వతంత్ర వ్యాపారసంస్థలను ప్రారంభించిన సందర్భంలో,
ఒకసారి.. చాలా సూటిగా తను లీలతో ఒకనాడు, క్యాథీతో మర్నాడు జీవితంగురించి చర్చించాడు.
లీల స్పష్టంగా చెప్పింది..’మన అభిరుచులు ఒక్కటే..కాని మన గమ్యాలు వేరు’ అని. తనకు పరిచయమై రెండున్నర మూడేళ్ళు గడిచేసరికి లీల ఆలోచనల్లో, ఎత్తుగడల్లో జీవితాన్ని వ్యూహాత్మకంగా జీవించాలని సరికొత్తగా నిర్వచించుకోవడంలో ఎంతో మార్పు కనిపించింది. ఉద్యోగరీత్యాగానీ, స్వంత ఆసక్తులవల్లగానీ లీల ఆ కాలంలో ఎన్నో దేశాలను, ముఖ్యంగా భారతదేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో, కేంద్ర ప్రభుత్వంతో ఏర్పడ్డ, ఉద్యోగరీత్యా సంభవించిన సంబంధాల వల్ల చాలా విస్తృతంగా పర్యటించింది. అనేకమంది ప్రముఖులతో కాంటాక్ట్‌ ఏర్పడింది. సంపన్న వర్గాల్లో  బయటికి కనిపించని అనేక అంతర్గత రహస్యాలనూ, వ్యాపార మూలాలనూ, లావాదేవీలనూ, మనుషులను లోబర్చుకునే అనేకానేక మార్గాలనూ చాలా లోతుగా అధ్యయనం చేసింది. ఎవరిని ఎలా టాకిల్‌ చేయాలి, ఎవరిని ఎక్కడ ఎలా లోబరచుకుని పనిచేయడానికి ఒప్పించాలి.. ఎవరిని ఎక్కడ భయపెట్టి ఎలా బ్లాక్‌మెయిల్‌ చేయాలి వంటి రాజకీయ, కార్పొరేట్‌ విధానాలన్నింటినీ సుళువుగా అలవర్చుకుంది. ఈ చీకటి వ్యాపారాత్మక ప్రపంచంలో లోలోతులకు దిగుతున్నకొద్దీ లీల వ్యక్తిత్వంలో ఎంతో గుణాత్మకమైన మార్పులు కొట్టొచ్చినట్టు కనబడేవి. ఒక్కోసారి తనను అతిక్రమించి నియంతలా మాట్లాడేది. ప్రవర్తించేది.
”వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి రామం.. మనందరం బురదలో కూరుకుపోయి ఉన్నాం. యిక స్వచ్ఛత గురించి ఆలోచించి లాభంలేదు. బస్‌.. వర్రీ ఎబౌట్‌ యువర్‌ సెల్ఫ్‌.. అంతే. ఇదే జీవితం.. విజయం సాధించినవాడే గౌరవింపబడ్తాడు. విజయం ఎలా సంభవించిందన్నది ముఖ్యం కాదు. సాధించింది విజయమా కాదా అన్నదే ప్రధానం.”
”అంటే..”
”అంటే..ఎర్న్‌..సంపాదించు..ఇంకా సంపాదించు..ఎదుగు.. ఎదుగు..అంతే..”
”ఎంత సంపాదించు..ఎంత ఎదుగు..”
షాకై చూచింది..తుపాకీ గుండు తాకిన జంతువులా.
”ఉహు..రామం..నువ్వు మారవు. నీకు సిద్ధాంతాలు కావాలి”
”నేనదే అంటున్నాను. నువ్వు మారవు. నీకు కేవలం డబ్బే కావాలి..నీకు డబ్బు పిచ్చిపట్టింది.”
”కాదు..నాకు ఈ కార్పొరేట్‌, కరెప్టివ్‌ పొలిటికల్‌ బాస్టర్డ్స్‌, బ్రూరోక్రటిక్‌ ప్రభుత్వ అధికారులు. వీళ్లందరి మీద కసి ఉంది..రామం నువ్వు నన్ను స్టడీ చేయలేకపోతున్నావు..విశ్వనాథన్‌ ఆనంద్‌ అద్భుతంగా చెస్‌గేమ్‌ ఆడి ప్రత్యర్థిని మట్టికరిపిస్తాడు. అలా ఎదుటిమనిషిని ఓడించడంలో ఒకరకమైన అద్భుతానందముంటుంది. నాకు ఆ ఆనందం కావాలి. ఆనందం నేను గెలుస్తున్నందుకు కాదు.. ఎదుటివాన్ని ఓడిస్తున్నందుకు..”
”నీ దగ్గర అద్భుతమైన ప్రతిభ ఉంది లీలా..ఐతే దాన్ని పరిమితమైన నీ వ్యష్టి అభివృద్ధి గురించీ, నీ స్వంత వికాసం గురించి మాత్రమే వెచ్చించాలనుకుంటున్నావు. అంతకంటే ఇంకాస్త విశాలంగా సమిష్టివృద్ధి గురించి ఆలోచించగలిగితే..”
”స్టాపిట్‌..సమిష్టి ఎక్కడుంది రామం..ఒకప్పటి భారతీయ జీవన వ్యవస్థలో ‘ఒక్కరికోసం అందరు..అందరికోసం ఒక్కడు ‘ విధానం ఉండేది. కాలం గడుస్తున్నకొద్దీ మనుషుల్లో నైతిక పతనం సంభవిస్తూ సంభవిస్తూ ఇప్పుడు ఎవరికివారే యమునాతీరే తరహాలో దిగజారిపోయి అసలు మానవతా విలువల స్పృహే లేక ఒక సంకక్షుభిత వాతావారణంలో కూరుకుపోయి..నువ్వు ఏ రంగమైనా తీసుకో..రాజకీయాలు..పచ్చి వ్యభిచారంకంటే హీనం. అత్యున్నత స్థాయిలో ఉన్న ఏ పార్టీ అధినేతనైనా తీసుకో. వేల, లక్షల కోట్లను గోడౌన్లలో నగదురూపంలో కట్టలకట్టలను గోనెసంచులో నింపుకు పెట్టుకుని కదూ రాజకీయాలు చేస్తున్నది. కార్పొరేట్‌ సెక్టార్‌లో సిఇవో అన్నా, ఎమ్డీ అన్నా, వైస్‌ ప్రెసిడెంట్‌ అన్నా ఏమిటి.. ఏ జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్ట్‌నైనా కిక్‌బ్యాక్‌లతో స్వంతం చేసుకోవాలని ప్రయత్నించే వెధవకదా. శివుని శిరసుపైనుండి గంగ ప్రవహిస్తూ ప్రవహిస్తూ చివరికి మున్సిపల్‌ మురుక్కాలువలోకి ప్రవహించినట్టు ఈ దిక్కుమాలిన అవినీతి సమాజంలో మున్సిఫల్‌కార్పొరేటరంటే వీధిస్తాయి కాంట్రాక్టరై, ఎమ్మెల్యే అంటే జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి కాంట్రాక్టరై, ఎంపీ అంటే జాతీయస్థాయి కాంట్రాక్టరై, మంత్రులందరూ అంతర్జాతీయ స్థాయి బ్రోకర్లయి, దళారులై, ముఖ్యమంత్రులు మధుకోడాలుగా నేరచరితులై.. ప్రభుత్వ యంత్రాంగమంతా చిలుంపట్టి, భ్రష్టుపట్టి, ఒక కార్పొరేషన్‌ వర్క్‌ ఇన్‌స్పెక్ష్టర్‌పై ఎసిబి దాడిచేస్తే కనీసం ఇరవై కోట్లు బయటపడే స్థితి, జాయింట్‌ కలెక్టరైతే కనీసం వందకోట్లు, ఐఏఎస్‌ అయితే వందలకోట్లు.. ఏమిటి.. ఏమిటదిది.. ప్రజలైతే ఇంకా నీచంగా పతనమై తమను తాము అమ్ముకునే స్థితిలో చచ్చిపోతున్నారు. ఉచితంగా యిస్తే పేడను కూడా తినే తత్వాన్ని అలవర్చుకుంటున్నారు. ఓట్లకోసం ఈ దిక్కుమాలిన రాజకీయనాయకులు ఉచితంగా కలర్‌ టి.విలు యిస్తే తీసుకుంటారు. విస్కీ సీసాలు తీసుకుంటారు. నగదు బదిలీ ప్రలోభాలు కలిగిస్తే తలలూపుతారు. ఉచిత కరెంటు,  ఉచిత బియ్యం, ఉచిత విద్య, ఉచిత్య ఆరోగ్యం, ఉచిత బట్టలు, ఉచిత ఆహారం, ఉచిత మోటార్‌ సైకిల్‌. ఉచిత పెళ్లాం, ఉచిత మొగుడు..నీయమ్మ…ఈ ఉచితాలు ఎక్కడ్నుండిస్తావ్‌రా వెధవా అన్నీ నీస్వంత ఆస్తుల్లోంచి యివ్వరా చవటా అని ఏ ఒక్కడైనా ఎవెర్నైనా నిలదీసి ప్రశ్నిస్తున్నారా. నలభై రూపాయలకు కిలో బియ్యం అమ్ముతున్న మార్కెట్‌నుండి రెండ్రూపాయలకు కిలో బియ్యం అసలెలా పుడ్తాయి. ఇవి జన సంక్షేమ పథకాలా, జన సంక్షామ పథకాలా..ఎవరి డబ్బును దోచి ఎవరు ఎవరికి పెడ్తున్నారు. ఎవరు ఎవరిని మభ్యపెట్టి మాయచేసి నిద్రపుచ్చుతున్నారు. పౌరులను అత్యుత్తమ బాధ్యతలతో కూడిన సామాజిక కార్యకర్తలుగా తీర్చిదిద్దవలసిన ప్రభుత్వాలు నిస్సిగ్గుగా ప్రజాకర్షక పథకాలతో జనాన్ని సోమరిపోతులుగా, బిచ్చగాళ్లుగా, పరాన్నభుక్కులుగా మారుస్తూంటే ప్రశ్నించే ఒక్క మేధావైనా ఈ దేశంలో ఉన్నాడా. ఎన్నికల్లో సూటిగా ‘నగదు బదిలీ’ ..అంటే నేరుగా డబ్బునే లంచంగా యిస్తా ఓటర్లకు అని ఒక నాయకుడు ప్రణాళికగా ప్రకటిస్తే దాన్ని ఒక ఆర్థిక శాస్త్రవేత్త భలే భేషయిన ఆలోచనగా ప్రశంసించి పరమ కుచమర్థన స్థాయిలో  శ్లాఘిస్తే..అసలీ దేశం, ఈ వ్యవస్థ ఏమైపోతోంది. ఎక్కడికి పోతోంది. ఎట్నుండి ఏదిశలోకి ప్రయాణిస్తోంది.
దేశానికి వెన్నెముకవంటి యువత ఈ దేశంలో ఏ కార్యకలాపాల్లో మునిగి ఉందో చెప్పు రామం. ఏ స్థాయి యువతీ యువకుణ్ణయినా తీస్కో..చేతిలో సెల్‌ఫోన్‌, చేయిచాచితే బూతు వెబ్‌సైట్లతో విరాజిల్లే ఇంటర్నేెట్‌, టి.వి. ఆన్‌ చేయగానే ఒక సముద్ర కెరటంలా పైనబడే బూతురోత, దిక్కుమాలిన కుక్కలకొట్లాటవంటి ‘మేధావుల’ చర్చలు, అడ్డూ ఐపూలేని అవసరానికి మించి లెక్కకు మిక్కిలి ఆరువందల ఎనభై ఇంజినీరింగు కాలేజీలు, రెండున్నర లక్షలకు పైగా చెత్తవలె ప్రతి సంవత్సరమూ తయారై ఈ దేశపు రోడ్లమీద వ్యాపించే నాన్‌ ఎంప్లాయబుల్‌ ఫేక్‌ ఇంజనీర్ల కంపు. అసలు పాఠాలే చెప్పని ప్రొఫెషనల్‌ కాలేజీలు, ప్రమాణాలు, నాణ్యత అంటే ఏమిటో తెలియని విద్యాబోధనా పద్ధతులు, వ్యాపార కేంద్రాలుగా మారి విలసిల్లుతున్న విశ్వవిద్యాలయాలు..ఏ ఒక్క యువకునికైనా సమాజస్పృహ, దేశ స్పృహ ఉందా..ఈ దిక్కుమాలిన దుస్థితిని సరిచేద్దామన్న కనీస ఆలోచన ఉందా..”
”నేనూ అదే అంటున్న లీలా..కనీస ఆలోచనైనా ఉందా అని.. నీవంటి ప్రతిభాశీలియైన యువతికైనా దేశంగురించిన కనీస స్పృహ ఉండాలి గదా అని నేనంటున్నా..అందరూ చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే..దీపాన్ని వెలిగించేదెవ్వరు.. నీవంటి జీనియస్‌ కనీసం సమాజం యింత బీభత్సంగా చెడిపోయిఉందని గ్రహించడమే విశేషం..ఐతే దానిని శుభ్రపర్చే మార్గం అన్వేషించి ఏదో ఒక పరిష్కారం కనుక్కొని అమలు చేయకుండా ఊర్కే ఎదుటివాళ్లను విమర్శిస్తూ కూర్చుంటే.. మిగతా వాళ్ళకూ మనకూ తేడా ఏమిటీ అని..”
లీల ఉలిక్కిపడి చూచింది రామంవైపు.
”నాకు ఈ వ్యవస్థమీద కసిగా ఉంది రామం”
”కాబట్టి..”
” ఈ అసమర్థ పాలకులు, అవ్యవస్థితమైన వర్తమానం, కొద్దిగా తెలివీ, నీతిహీనతా, ఎక్కువ ధైర్యం ఉన్న ఎవరైనా రాక్షసంగా ఎదిగి ఎదిగి విజృంభించగల ఈ ప్రస్తుతస్థితిలో ఒకసారి కసిగా ఈ వ్యవస్థలో ఆడుకుని నన్నునేను పరీక్షించుకోవాలనుకుంటున్నా..లైకె ఎ గేమ్‌ ఐ వుడ్‌ లైక్‌ టు మేక్‌ ది లైఫ్‌ ఎ ఛాలెంజింగు టాస్క్‌ అండ్‌ ఎంజాయ్‌”
”ఊఁ.. చివరికి ఏం సాధిస్తావ్‌..”

”ఆ ప్రశ్నే అనవసరం..ఆనందించడమే జీవితం..అందరూ పైశాచికమైన చర్య ప్రతిచర్యలతోనే ఆనందిస్తున్నారీ ప్రపంచంలో. ఇరాక్‌పై దాడిచేయం బుష్‌కు ఆనందం..ప్రజలను వెధవలను చేసి కోట్లు కోట్లను సంపాదించి ప్రపంచంనిండా బ్రాంచీలతో ఎదగడం, పైగా నీతులను, బోధనలనూ కొనసాగించడం భారతదేశపు ఏమతానికి చెందిన స్వామికైనా ఆనందం, ప్రజలపై డబ్బును కుమ్మరించి.. బిచ్చగాళ్ళ గుంపుపైకి కరెన్సీ నోట్లను ఎగజల్లి ఏరుకుంటూ వాళ్ళు కొట్టుకుని చస్తూంటే సంతోషించడం ఈ రాజకీయ నాయకులకు ఆనందం. కార్పొరేట్‌ ప్రపచంలో అంతులేని డబ్బును ప్రోగుచేసుకుంటూ  ఫోర్బెస్‌ జాబితాలోకి దూసుకుపోవాలనుకోవడం ఇంకొందరికి ఆనందం..ఎవని ఆనందాన్ని ఎవడు నిర్వచించగలడు. ఎవని ఆనందాతిరేకాలు తప్పని ఎవరిని ఎవడు నిరోధించగలడు. నో థియరీ ఫిట్స్‌ టు ద సిస్టమ్‌..”
”కుళ్ళిపోయి, భ్రష్టుపట్టిపోయి..తెలివైన సామాజిక స్పృహ ఉన్న మనవంటి యువతనుండి ఏదో ఒక చికిత్సను కోరుతున్న వర్తమాన భారతదేశస్థితిని నువ్వు చూస్తున్న దిశ లోపభూయిష్టంగా ఉంది.లీలా”
”కావచ్చు..మూడువేలకోట్ల రూపాయల స్కామ్‌లో కోర్టులో సాక్ష్యంచెబ్తూ హర్షద్‌మెహతా ఏమన్నాడో తెలుసా రామం.. నేను అంతా భారతదేశ సెబీ నిర్దేశించిన రూల్స్‌ ప్రకారమే చేశాను..తప్పేదైనా ఉందీ అంటే అది లోపభూయిష్టమైన మీ దిక్కుమాలిన రూల్స్‌లో ఉన్నాయి. దమ్ముంటే మీ రూల్స్‌ను సరిచేసుకుని సవరించుకోండి. లేకుంటే ఆ కుళ్ళులోనే కుళ్లిచావండీ అన్నాడు.. మొన్న వేలకోట్ల రూపాయల స్టాంప్‌పేపర్ల కుంభకోణంలో తెల్గీ కూడా అదే అన్నాడు..ఎక్కడని ఈ వ్యవస్థను రిపేర్‌ చేస్తావు రామం. దిస్‌ సిస్టమ్‌ ఈజ్‌ ఇర్రిపేరబుల్‌. దీని సర్వాంగాలూ కుళ్లిపోయినై..”
”అందుకే. మరమ్మత్తుకు లొంగనపుడు, సాధ్యంకానపుడు మొత్తం వ్యవస్థనే మార్చాలి. ధ్వంసానంతర పునర్నిర్మాణం జరగాలి.”
”కదా.. అందుకే ఈ వ్యవస్థయొక్క సంపూర్ణ ధ్వంసానికి నేను ఉపక్రమిస్తున్నా..తదనంతర పునర్నిర్మాణం నువ్వు చెయ్‌” అంది లీల స్పష్టంగా..నిశ్చలం.
అప్పుడు..ఆ రోజు కూడా భీకరమైన వర్షమే..ఈ చర్చ..ఒక సాయంకాలం రిహోబోత్‌ బీచ్‌ స్టార్‌బక్‌ కాఫీ షాప్‌లో జరిగింది. ఎదురుగా..లోపలికి చొచ్చుకొచ్చిన అట్లాంటిక్‌ మహాసముద్రం..ఒక ఎడతెగని నిరంతర తరంగ ఘోష మధ్య.
మొత్తంమీద లీల గురించి తనకు తెలిసిన మూడేళ్ళలో అర్థమైందేమిటంటే, ఆమె అసాధారణ ప్రతిభాశీలి. మృదు హృదయిని. సున్నిత మనస్కురాలు..కాని కఠిన క్రమశిక్షణతో కఠోర పరిశ్రమ చేసే తత్వం గలది. కొన్ని నిర్ణయాలను నిర్దయగా తీసుకుంటుంది. ప్రేమ అనే పదం ఆమెలో లేదేమో అన్నంత అతి తక్కువ మోతాదులో ఉంది. సంగీతాన్ని  యిష్టపడ్తుంది. తాత్విక స్పందనలుంటాయి. ఐతే ఎందుకో అలెగ్జాండర్‌లో ఉన్నట్టు ఈ సమస్త ప్రపంచాన్ని జయించాలన్నంత బలమైన ఉత్తీర్ణతాకాంక్ష ఉందామెలో. ఆమెది సున్నితమైన మల్లెపరిమళంవంటి అందం. సంభాషణ అర్ధవంతమైన ఆకాశంలా గంభీరమైంది.
”నాకో సంశయముంది రామం” అందొక సందర్భంలో ఆరోజే..అట్లాంటిక్‌ సముద్రం ముందు.
ఇద్దరూ ఇసుకలో నడుస్తున్నారప్పుడు..అలల రొద నడుమ.
రామం మౌనంగానే ఆమెవైపు చూశాడు.
”నేను నాకు తెలియకుండానే నిన్ను ప్రేమిస్తున్నానేమోనని..”యథాలాపంగానే కాని లోలోతుల్నుండి వస్తోందామాట.
”…..”
”చాలా జాగ్రత్తగా నన్ను నేను విశ్లేషించి చూచుకుంటే.. నువ్వు కొంతవరకు నాలో విస్తరించి ఇప్పటికే అల్లుకుపోయావని కూడా అనిపిస్తోంది.”
”…..”
”నీకేమనిపిస్తోంది”
”నిజానికి నాలో ఏ భావమూ లేదు లీలా..నా మనసంతా ఈ సహజమైన శారీరక స్పందలనకతీతంగా ఒక యుద్ధం ఆవరించి ఉంది. వ్యక్తి కంటే వ్యవస్థ, వ్యవస్థ కంటే మానవ సమూహం, మానవ సమిష్టి కంటే దేశం, దేశంకంటే విలువలతో కూడుకున్న ఆత్మ ఉన్నతి.. యివే అతి ప్రధానమై నానిండా ఒక సముద్రమై గర్జిస్తున్నాయి. సముద్రమంటే ఒట్టి నీరు.. ఒక్కోసారి మౌనమై, ఒక్కోసారి ప్రళయమై, అగ్నిపర్వతాలనుకూడా తన గర్భంలో దాచుకుని నిర్మలంగానవ్వే నీరు.. నాలో ఏదో నిర్గుణాత్మకమైన రాహిత్యత ఉంది లీలా..”
”…..” లీల మాట్లాడలేదు. కోటి ప్రశ్నలను, అర్ధింపులను నింపుకున్న చూపులతో చూచింది రామం వంక.
ఆ క్షణం అతనికి ఆమెపట్ల మమకారం నిండిన ‘ఈమె కావాలి’ అన్న భావం బలంగా కల్గింది.. వెంటనే ఆమె చేతినితన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమిరాడు.
లీల పులకించిపోయింది.
కొద్దిసేపు అలాగే ఇద్దరూ నడచి..నడుస్తూనే..మౌనమై..కోటి సంభాషణలై..శతకోటి ఉద్వేగాలై.,
”నేను రేపు నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను రామం..నన్ను నేను విజేతగా మల్చుకునేందుకు ప్రయోగాత్మకంగా ఈ లోపభూయిష్టమైన వ్యవస్థను నాకనుకూలంగా మలచుకునేందుకు యిక విజృంభించబోతున్నాను. చూస్తా..ఒక వ్యక్తి ఎలా ఒక బలీయమైనా శక్తిగా మారి శాసించగలదో సాధించి ఆత్మపరీక్ష జరుపుకుంటా.. అందుకే నీతో ఈ రోజు ప్రత్యేకంగా కలవాలని ఈ ప్రోగ్రాం..”
”మన యిద్దరి లక్ష్యాలు దాదాపు ఒకేరీతైనవి లీలా..ఐతే నీది దక్షిణ ధుృవమైతే నాది ఉత్తర ధుృవం..నువ్వు ఎన్నుకున్న దారీ, ఎంతో రిస్క్‌తో నిండిన సాహసోపేతమైన సాధన..అంతా గొప్పదే ఐనా లక్ష్యం ఋణాత్మకమైంది. నా దారీ నీ దారే ఐనా.. నా గమ్యం నిర్మాణాత్మకమైంది..”
”కావచ్చు..కాని..”లీల..ఒట్టిగానే నడిచింది వెంట..చాలాసేపు..ఏమీ మాట్లాడకుండా.
తర్వాత.. ఇసుకలోనుండి సముద్రంతో దూరమై..కార్లో పయనించి పయనించి డెలావర్‌..మేరీల్యాండ్‌.. పోర్‌ నైంటీఫైవ్‌ ఇంటర్‌స్టేట్‌..రాక్‌ విల్లీలో దిగిపోయింది.
చటుక్కున ఒక తార తెగిపోయింది..,
తర్వాత భారత కార్పొరేట్‌ వ్యవస్థలో, రాజకీయ, ఉన్నత సంపన్న వర్గాల వ్యూహాత్మక వ్యాపార లావాదేవీల్లో, కుతంత్ర రచనల్లో లీల ఒక తిరుగులేని శక్తిగా ఎదగడం, విస్తరిల్లడం రామంకు తెలుస్తూనే ఉంది ఎప్పటికప్పుడు.
ఉండి ఉండి.. ఏ దేశంనుండో చటుక్కున ఏ రాత్రో, పగలో అకస్మాత్తుగా ఫోన్‌ చేస్తుంది లీల. నాల్గయిదు వాక్యాలు, లోలోపల గుప్తమైఉన్న ఆత్మ మాట్లాడ్తున్నట్టు వర్షమై కురుస్తుంది. అప్పుడప్పుడు అనూహ్యంగా అమెరికాలో కళ్ళముందు ప్రత్యక్షమౌతుంది. ఒక మెరుపులా వచ్చి మరుక్షణం మాయమైనట్టు నిష్క్రమిస్తుంది.
మొత్తంమీద ఆమె మనసులో మాసిపోని ఓ ముద్రయి తనున్నాడు..ఉంటాడు..శాశ్వతంగా. ఆ విషయం తనకు తెలుసు.
ఐతే ఇటువంటి ఆత్మానుగత అంతస్సంబంధాన్ని ఏమంటారు.
వర్షం కురుస్తూనే ఉంది..చినుకులు ఎక్కువై, చిక్కనై..బయటా..అప్పట్నుండి లోపలా.,
కారును పార్కింగు ఏరియాలో ఆపి, పక్కనే ఉన్న గొడుగును తీసుకుని..దిగి..చీకటి అలుముకుంది అప్పటికే.. చుట్టూ అనేక దుకాణాలు..వందల కార్లు..వాల్‌మార్ట్‌, హోమ్‌ డిపో, రైట్‌ ఎయిడ్‌, పెట్‌మార్ట్‌, కోల్స్‌, బార్నెస్‌ అండ్‌ నోబుల్స్‌,
‘చాలా సేపే ఐంది – క్యాథీ ఎదురుచూస్తూంటుంది.’ అనుకుంటూ రామం వర్షంలో వడివడిగా అడుగులు వేసుకుంటూ.,
క్యాథీకి తనకూ నడుమ ఇప్పుడు జరుగబోయేది అతీ కీలక సమావేశం. రెండు జీవితాలకూ, రెండు అసమాన ప్రతిభా విశేషాలు ఒకటిగా సంధానమై ఒక నిర్ణయాత్మక శక్తిగా రూపొందడానికి ప్రాతిపదిక ఏర్పడే.. తమకు సంబంధించినంత వరకు ఓ అతి ప్రధాన సందర్భం..అందుకే క్యాథీని అవసరమైతే నాల్గయిదు గంటలసేపు విపులంగా చర్చించుకుని నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా సిద్ధపడి రమ్మని చెప్పాడు రామం.
అతని మనసు నిజంగా వర్షం కురుస్తున్న రాత్రివలెనే చిత్రంగా, గంభీరంగా ఉంది.
చటుక్కున ఒక జ్ఞాపకం రామం హృదయంలో పిడుగై కురిసింది.

(సశేషం)

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 4 వ భాగం

( గత వారం తరువాయి)

4

Ekkadi(1)

తన కొత్త ఇన్‌ఫినిటీ కార్‌లో దూసుకుపోతున్నాడు నలభై ఏళ్ళ రామం. ఇంటర్‌ స్టేట్‌ టు సెవన్టీపై..వేగం ఎనభై ఎమ్‌పిహెచ్‌. దాదాపు గంటకు నూటాపది కిలోమీటర్లు.. టైర్ల ధ్వని బీభత్సంగా..కార్లమంద..అప్పుడే కురిసి వెలిసిన వర్షపు నీరు దూసుకుపోతున్న కార్ల టైర్ల రాపిడివల్ల ఆవిరిగామారి తెల్లని పొగమంచువలె ఎగిసి,ఎవరో వెంటపడి తరుముతూంటే పరుగెత్తుతూ పారిపోతున్నట్టు ఎవరికివారు కార్లలో మందలు మందలుగా ఒకటే.. పరుగు. ఏదైనా అడ్డొస్తే తునాతునకలై ఎక్కడో ఎగిరి పడ్తుందన్నంత వేగం..మనిషికి ఇంత విధ్వంసకర వేగం అవసరమా అని అనిపించే ఒకణ్ణి మించి మరొకరి దూకుడు. గ్లోబల్‌ పొజిషనింగు సిస్టంలోనుండి ఆమె అరుస్తోంది..’టేక్‌ ఎగ్జిట్‌’ అని
రామం జిపిఎస్‌సిస్టం విన్నప్పుడల్లా ఆశ్చర్యంతో, పులకింతతో, మనిషి సాధిస్తూ వస్తున్న ఈ అనేక విజయాలపట్ల గర్వపడ్తూంటాడు. ఒక ఇంజినీర్‌గా ఈ ఊహాతీత సౌఖ్యాల సాధన అతనికి ఓ అద్భుతంగా తోస్తూంటుంది. వాషింగ్టన్‌ నేషనల్‌ పైక్‌.. ఫాదర్‌ హర్లే రోడ్‌.. టంగు టంగు.. ఘంట వంటి అలర్ట్‌ శబ్దం. ఎదురుగా స్టీరింగు పానల్‌ తెరపై సిక్స్‌ట్రాక్‌ రోడ్‌ బొమ్మ.. గుండ్రగా ఎంట్రీ, ఎగ్జిట్‌ రోడ్లతో కలిసి బ్రిడ్జ్‌ బొమ్మ., అందులో కారును సూచిస్తూ కదుల్తున్న బాణం ఎర్రగా.. లోపల్నుండి సమాంతరంగా సిడిలోనుండి సన్నగా వినిపిస్తున్న కంఠ ధ్వని..బయట వర్షం మళ్ళీ ఆరంభమై.,
”సాప్ట్‌ సిడి” అన్నాడు రామం. ఠక్కున వీణధ్వని ఆగిపోయింది. లోపల ఎవరో ఓ మనిషి కూర్చుని చెబుతున్న విషయాలన్నింటినీ విని అతి ఖచ్చితంగా, విధేయంగా చేస్తున్నట్టు..రిడ్జ్‌రోడ్‌ జంక్షన్‌.. ఎదురుగా ఎర్రని స్టాఫ్‌ లైట్లు.. మెల్లగా కారుకు బ్రేక్‌ వేస్తూ,
చీకటి ముంచుకొస్తోంది ఒక పెద్ద సముద్ర కెరటంలా..అందరూ గుంపులు గుంపులుగా ఆగితే..ముందున్న  కార్ల ఎర్రని టెయిల్‌ ల్యాంప్స్‌ సమూహం కణకణలాడే నిప్పుల ప్రవాహంవలె..ఎదురుగా ప్రక్క అప్‌స్ట్రీమ్‌లో..వస్తున్న కార్లమంద హెడ్‌లాంప్స్‌..పచ్చని కాంతితో ప్రవహిస్తున్న కరిగిన ఇనుమువలె..టు సెవెన్టీ ఎక్స్‌ప్రెస్‌ వే నుండి బయటికొచ్చి. ఎడమదిక్కు అబ్జర్వేషన్‌ డ్రైవ్‌లోకి..ఎదురుగా ఎర్రనిలైట్లు ఆకుపచ్చగా మారగానే..కదలికల్లో ఓ చైతన్యం…మళ్ళీ కార్ల పరుగు..
రాయల్‌ క్రౌన్‌..విలియం గిబ్స్‌ ఎలిమెంటరీ స్కూల్‌. మైల్‌స్టోన్‌ డ్రైవ్‌..డార్సిమిల్‌ రోడ్‌..’టేక్‌ లెఫ్ట్‌’ అని జిపిఎస్‌లోనుండి సూచన..వాటర్స్‌ హాలో..బ్రూక్‌ ఫీల్డ్‌..ఓల్‌నెస్ట్‌ సర్కిల్‌..నౌ..యు రీచ్చ్‌ యువర్‌ డిస్టినేషన్‌..గమ్యం..ఇల్లు చేరుట..,
మనిషి నిజానికి ఎప్పుడు తన గమ్యాన్ని..ఇంటిని..లక్ష్యాన్ని చేరినట్టు..తను ప్రారంభమౌతున్న చోటును..తను చేరవలసిన గమ్యాన్ని స్పష్టంగా నిర్వచిస్తే మానవ మేధతో నిర్మితమైన ఈ ఉపగ్రహ, సంచార, ఉత్సర్గ గ్రాహక వ్యవస్థ ఖచ్చితంగా దారిని చూపిస్తుంది. దిశానిర్దేశం చేస్తుంది. దారి తప్పితే సవరించి మళ్ళీ సరియైన దార్లోకి మార్గదర్శనం చేస్తుంది. మళ్ళీ దారితప్పుతూంటే హెచ్చరికకూడా చేసి దాదాపు తిట్టినంతపని చేస్తుంది.
కాని జీవితంలోనో.,
ఎందరికి తన జీవితం ఎక్కడ ప్రారంభమౌతోందో..తను చేరవలసిన గమ్యం ఏమిటో తెలుస్తుంది. ఎవరికైనా తన గమ్యం నిర్వచించుకుంటే దారి తెలుస్తుంది దారి తెలిస్తే దిశ, దూరం..దూరంతో వేగం స్పృహ..వేగంతో కాలం అంచనా.. కాలంతో తన ప్రణాళిక..పథకం..పథకంతో వ్యూహం.,
ఎవరినైనా ఓ మనిషిని ఎంచుకుని..నువ్వు రేపేం చేస్తావు..నువ్వు జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు. ప్రత్యేకంగా సాధించవలసిన లక్ష్యాలేవైనా నీకున్నాయా అని అడిగితే..పెళ్లిచేసుకుంటా, పిల్లలను కంటా, వీలైనంత ఎక్కవ డబ్బు కూడబెడ్తా.. పద్ధతి ఏదైనా ఫర్వాలేదు. డబ్బును గుట్టలు గుట్టలుగా పోగెేస్తా అని తప్పితే భిన్నమైన ఒక నిర్మాణాత్మక జవాబును ఎంతమంది ఇవ్వగలరు.
ఓ పుచ్చలపల్లి సుందరయ్యలా ఈ దేశంకోసం జీవించవలసిన తను భవిష్యత్తులో పిల్లలుంటే తన నిర్దేశిత లక్ష్యాలను చేరలేనని పిల్లలను కనకుండా ఎందరు కఠోర, త్యాగపూరిత నిర్ణయాలు తీసుకోగల్గుతారు.
అసలు భవిష్యత్తునే ఊహించలేని ఈ తరం..అస్తవ్యస్తంగా ఉన్న దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడ్తూ దిక్కుమాలిన నీతిహీన, అనైతిక, అసమర్ధ ప్రభుత్వాల పాలనలో మగ్గుతున్న సమాజంలో..ఏమని ‘రేపు’ను స్వప్నించగల్గుతుంది. ఇక విలువలు, నీతి, నిజాయితీ, నైతికత.. వీటిగురించి కనీసం ఆలోచనైనా చేయగల్గుతుందా.,
రామం కారును గ్యారేజిముందు ఆఫ్‌ చేసి.. దిగి..సన్నగా కురుస్తున్న చినుకుల్లో..నాల్గడుగులు వేసి..తన ఇంటి తలుపులను తాళం చెవితో తెరిచి..ముందు గదిలో బూట్లు విడిచి, రాక్‌లో పెట్టి.,
‘ఇక తనకు కూడా..ఎప్పుడో పదేళ్లకు ముందు స్పష్టంగా నిర్వచించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు కార్యరంగంలోకి దూకవలసిన సమయం ఆసన్నమైందా..’అనే ప్రశ్న..బాధ్యత…ఉద్యుక్తత ఉదయంనుండీ మనసులో పదేపదే కదుల్తూ.,
రామంకు గతవారంనుండీ మనసు మబ్బుపట్టిన ఆకాశంలా, గాలి దుమారంలో ఎడారిలా, కల్లోల సముద్రంలాఉంది. గతం.. ఏళ్ళకు ఏళ్ళుగా అనుభవించిన సంఘర్షణ..మేధోపరంగా ఒట్టి పుస్తకాల పురుగులా జీవిస్తూ.. ఉద్యోగం,వృద్ధి, సుఖవంతమైన జీవితం, విలామయమైన వ్యష్టి వికాసం..వీటినే పరమావధిగా భావిస్తూ నిర్మించుకున్న స్వప్న ప్రపంచంనుండి.. నాన్న.. నాన్నను తను అమెరికా వచ్చిన తర్వాతనుండే నిజంగా అర్ధం చేసుకున్నాడు.
‘నాన్న’..నాన్న జ్ఞాపకం రాగానే మనసు బకెట్‌లోని నీళ్ళను చేతితో లొడపెట్టినట్టు కల్లోలమై పోయింది.
రెండేళ్ళక్రితం నాన్న తన దగ్గరికి..యిక్కడి అనేక విశ్వవిద్యాలయాల్లో, మేధావుల సమావేశాల్లో, తెలుగు సంఘాలు ఏర్పాటుచేసిన సభల్లో మాట్లాడ్డానికి వచ్చినపుడు తనుకూడా ప్రతి సమావేశానికీ వెంటవెళ్ళాడు. నాన్న చేసిన అర్ధవంతమైన, అవశ్యమైన సామాజికాంశాలతోకూడి మనిషిని ప్రశ్నించే అనేక ఆలోచనాత్మకమైన ప్రసంగాలను ఒక ‘భారతీయ యువకుడిగా’ జీర్ణించుకుని ఎంతో ఉత్తేజాన్ని పొందాడు. చిన్ననాటినుండి పుస్తకాలు..చదువు..చదువు..ర్యాంకులు..స్థాయి..క్వాలిఫికేషన్‌ పెంచుకోవడం, స్టార్‌ స్టూడెంట్‌గా ఎదగడం..స్కూల్‌ ఫస్ట్‌..కాలేజి ఫస్ట్‌..స్టేట్‌ ఫస్ట్‌..ఐఐటిలో చేరాలని లక్ష్యం..ఐఐటీయన్‌ కాని జీవితం ఛీ.. ఏం జీవితం అని అహర్నిశలు పుస్తకాలు పుస్తకాలు..ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌.. శక్తి నిత్యత్వ సూత్రాలు, అణుధార్మిక సిద్ధాంతాలు, అత్యాధునిక శాస్త్ర పురోగతులు. కృత్రిమ మేధో విశ్లేషణలు..ద్రవ్య ప్రతిదవ్య భావనలు..నియమాలు. ఇవే ఇవే.,
రాత్రింబవళ్ళు..లైబ్రరీ..ఇంటర్నెట్‌..వికీపీడియా..డిజిటల్‌ పుస్తకాలు..ఐఐటీ మద్రాస్‌ హాస్టల్‌లో..ఎన్ని రాత్రులో.. ఒక అసాధారణ మేధోజీవిగా రామం అనే తనకు ఓ పేద్దపేరు. 1959లో ప్రారంభించబడి భారతదేశంలోనే ఒక అత్యుత్తమ విద్యాసంస్థగా పేరున్న ఐఐటి మద్రాస్‌నుండి మెకానికల్‌ ఇంజినీరింగులో..ఎమ్‌టెక్‌లో బంగారు పతకాన్ని సాధించడం ఒక సుందర స్వప్నం.

third week fig-2
నాన్న అప్పటికే రీజినల్‌ ఇంజినీరింగు కాలేజ్‌ వరంగల్‌లో ప్రొఫెసర్‌..అమ్మ తను హైస్కూల్‌లో ఉన్నపుడే పోయింది. అమ్మంటే ఒక దేవత అనే తీయని జ్ఞాపకం.. అమ్మ అంటే నవ్వు..అమ్మ అంటే ఒక ఆశీర్వాదం..అంతే తెలుసు తనకు..నాన్న అంటే ఋషి..పుస్తకాలు..పాఠం..బోధన..జ్ఞానం..ఒక సజీవ సిద్ధాంతం..తను పుట్టినప్పటినుండీ తనకు తెలిసిందీ, తను ఆడుకున్నదీ, తన పరిసరాలూ అన్నీ పుస్తకాలే..అంతా నాన్నే.
నాన్న చెప్పేవాడు..పుస్తకాలు రెండు రకాలని..ఒకటి విద్యావిషయక శాస్త్రాలు..గణితం, భాష, చరిత్ర, భౌతిక, రసాయనికి శాస్త్రాలు..ఇవి..ఈ ప్రపంచ భౌతిక జీవితం గురించి చెప్పేవి. రెండు సృజనాత్మక పుస్తకాలు..కవిత్వం, శాస్త్రాలు, సంగీతం, కళలు, జీవితాధ్యయనాలు, దేశచరిత్రలు..పరిణామ సిద్ధాంతాలు, మనిషి పరిణామ ప్రక్షిప్తాలు, ఇతిహాలు, తత్వ, ఆధ్యాత్మిక శాస్త్రాలు..ఇవి..మనిషి గురించి, జీవితం గురించీ, జీవిత పరమావధి గురించి, హృదయం గురించి, అంతిమంగా ఈ సృష్టి ఏమిటి..గురించీ..ఒక అనంతానంత ఆత్మ దర్శనం.
దాదాపు.. ఎమ్‌.టెక్‌ పూర్తయి..స్వర్ణపతకం పొంది..రెండు మూడు ప్రఖ్యాత కంపెనీలలో కాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ వచ్చి.. ఓహ్‌ా.. పందొమ్మిది వందల తొంభై ఏడు..అనుకున్న ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి..అప్పుడే రెక్కలు మొలుస్తున్న పక్షి పిల్ల పొందే అవ్యక్త మహానుభూతి..కాన్వొకేషన్‌ జరిగి..గవర్నర్‌ చేతులమీదుగా బంగారు పతకాన్ని మెడలో వేయించుకుని..పొంగి పొంగి.,
నాన్నకూడా వచ్చాడు ఆ కీలకమైన సభకు. ఆహుతుల్లో ఒకనిగా కూర్చుని కాన్వొనేషన్‌ను తిలకించాడు. అప్పుడు ఆయన కేవలం తండ్రి.. అప్పటికే ఆయన రీజినల్‌ ఇంజినీరింగు కాలేజిలో పేద్ద పేరున్న మెకానికల్‌ ఇంజినీరింగు ప్రొఫెసర్‌. ఐతే అనేక సామాజికశాస్త్ర, సాహిత్య గ్రంథాలు రాసిన రచయితగా నాన్నకు పెద్దపేరు..రాష్ట్రపతినుండి, రాష్ట్రప్రభుత్వంనుండి ఉత్తమ అధ్యాపకునిగా పురస్కారం పొందినవాడు. అతి తక్కువగా మాట్లాడేవాడు.. అనర్ఘళంగా ఉపన్యసించేవాడు.. అతి నిరాడంబరంగా ఒక నమూనాగా జీవించేవాడు.
ఆ రాత్రి.. భీకరంగావర్షం కురుస్తున్న రాత్రి..పన్నెండు దాటిందేమో.,హాస్టల్‌కు నాన్నా..తనూ తిరిగొచ్చి..నాన్నకు తను పొందిన బంగారు పతకాన్ని చూడమని ఇచ్చి..అతని కళ్ళలోకి తనకీ జన్మనిచ్చినందుకు కృతజ్ఞతాపూర్వకంగా చూచిన క్షణం..
”వెల్‌ డన్‌ మై బాయ్‌..”అన్నాడు నాన్న..ఒక తండ్రి.
”థాంక్యూ నాన్నా..”నాన్నా అని పిలిపించుకోవడమే ఆయన కిష్టం.
”ఇటువంటి..ఎమ్‌టెక్‌లో స్వర్ణపతకాన్ని నలభై ఏళ్ళక్రితమే మీరు సాధించారుగదా నాన్నా..ఏమనిపిస్తోంది మీకు.”
‘ది ట్రెడిషన్‌ కంటిన్యూస్‌. అప్పుడు నాకుగానీ..ఇప్పుడు నీకుగానీ ..ఒక అధ్యాయం ముగిసింది నాన్నా..ఇప్పుడు మనిషి ఒక చౌరస్తాలోకి వచ్చి నిలబడ్డాడు. ఈ కీలకమైన సందిగ్ధసమయంలో మనిషి తన జీవితాన్ని నిర్దేశించగల ప్రధాన నిర్ణయాన్ని తీసుకోవలసి ఉంటుంది.. ఐతే..” అని ఓ క్షణం ఆగి..తన కళ్ళలోకి చూశాడు నాన్న ఎంతోసూటిగా..బాగా జ్ఞాపకం తనకు ఆ చూపు ..గుచ్చుకున్న ఆ చూపు.,
”ఐతే.. మనిషి ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో ఆ నిర్ణయం తీసుకున్నందుకు పశ్చాత్తాపపడవలసిన పరిస్థితి రావద్దు. ఆచితూచి, మనిషిగా పరిపూర్ణమైన జ్ఞానంతో అడుగుముందుకు వేయాలి.”
”…..”ఒట్టిగా వింటున్నాడు తను.
”మనిషి ప్రధానంగా వ్యష్టి జీవి.ఎంతసేపూ నూటికి తొంభైఐదు శాతం మందికి తను, తన భార్య, తన పిల్లలు, తన పరివారం, తన సంపద..తన అభివృద్ధి.. తన సంతోషం..ఇవే. ఐతే ప్రకృతిసహజంగా మనిషి. ఆ మాటకొస్తే ఏ జీవియైనా సంఘజీవి అనే ప్రాథమిక సూత్రాన్ని మరిచి, తన సహ మానవులపట్ల, జీవులపట్ల, సమాజంపట్ల..సంఘ బాధ్యతలపట్ల మనిషి ఆలోచించడం క్రమంగా మరచిపోతూ..”
”అర్థమైందా రామం..”
”ఊఁ.. ఔతోంది”
”మనిషి ఎప్పుడూ సమాజంలోనుండి ఎదుగుతాడు. ఉదాహరణకు ఒక ఐఐటీయన్‌గా నువ్వీ డిగ్రీ పొందడానికి ప్రభుత్వం..అంటే ఈ భారత ప్రజలు దాదాపు ఇరవై ఐదు లక్షలు నీపై ఖర్చు చేశారు..నువ్వనుకుంటావు..నిన్ను నేను కన్నాను, కొంత నేను చదివించాను..ఎక్కువగా రేయింబవళ్ళు కష్టపడి నువ్వు చదువుకున్నావు.సాధించావు..అని..అది పాక్షిక సత్యమే. పూర్తి సత్యంకాదు. ఐఐటి అనే ఈ మహత్తరమైన ప్రజల డబ్బుచే నిర్మించబడ్డ సంస్థ సమాజపరంగా చేస్తున్న విద్యాదాన క్రతువువెనుక లక్షలమంది అతి సామాన్యపౌరుల చెమటతో నిండిన డబ్బే ఖర్చవుతున్న సంగతి..”
”….”
”కొన్ని బయటికి కనిపించవు. కనబడకుండా గుప్తంగానే దాగి ఉంటాయి అగ్నిలా..ఇక్కడే మనిషి బాధ్యతాయుతంగా ఆలోచించాలి.. వ్యష్టిగా కాదు.. సమిష్టికోసం..”
”అంటే..”
”నీకిప్పుడు టిసిఎస్‌లో సెలక్షన్‌ వచ్చింది. నువ్వు యుఎస్‌ఎ – మేరీల్యాండ్‌ ఆఫీస్‌లో జూన్‌ పదిన రిపోర్ట్‌ చేయాలి. హెచ్‌వన్‌బి వీసాగీసా, నీ ఫ్లైట్‌ టికెట్‌ ..అన్నీ రెడీ చేయబడ్డాయ్‌..ఔనా..”
”ఔను..”
”నలభై ఏండ్ల క్రితం నాకిదే జరిగింది..రీజినల్‌ ఇంజినీరింగు కాలేజి మొదటి బ్యాచ్‌ విద్యార్థిని నేను..ఎమ్‌ఇ చేసి.. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో..అరబ్‌ దేశమైన బహ్రాన్‌లో..అరామ్‌కో అనే ప్రపంచంలోనే అతిపెద్ద పెట్రోలియం ఉత్పత్తి కంపెనీలో ట్వంటీ కె డాలర్లతో ఉద్యోగం వచ్చింది..నా మిత్రులు, నా ప్రొఫెసర్లు, అందరూ ఆ అదృష్టానికి ఎంతగానో అభినందించారు.. కాని నేనా ఉద్యోగంలో చేరలేదు. తిరస్కరించాను.” ఆగిపోయాడు నాన్న.
” మా నాన్నా ఒక సాధారణ ప్రాథమిక పాఠశాల పంతులు. నిజాయితీకి ప్రతీక. అన్నాడు..’ఇన్నాళ్ళూ నిన్ను కని, సాది, పెంచి పెద్దచేసిన నన్నూ, అమ్మనూ నువ్వు అర్థాంతరంగా ఈ వృద్ధాప్యంలో విడిచి వెళ్ళడం ఎంతవరకు న్యాయమో తెలియదు నాన్నా..కాని..నిన్ను ఈ దేశపు బీదాబిక్కి ప్రజలు పన్నులరూపంలో సమకూర్చిన డబ్బుతో ఇంత ఉన్నతంగా తీర్చిదిద్దబడ్డ మేధోజీవివైన తర్వాత ఈ దేశంపట్ల, ఈ ప్రజలపట్ల, ఈ సమాజంపట్ల, నీకెటువంటి బాధ్యతా లేదా నాన్నా. నీ అద్భుతమైన తెలివితేటలు ఈ దేశంకోసం, ఈ దేశప్రగతికోసం, ఉపయోగపడొద్దా..అవన్నీ నిన్ను పోషించే వేరే ఇతర దేశాలకోసమే ధారపోయాలా.’ అని..”
”……”
”ఒక రాత్రంతా ఆలోచించాను..నాకు బాగా జ్ఞాపకం. ఆ రోజుకూడా ఇలాగే..కుండపోతగా వర్షం..ఎడతెగని వర్షం.. మర్నాడు నిర్ణయం తీసుకున్నాను..అరామ్‌కోలో చేరలేదు. ఆ ఉద్యోగాన్ని తిరస్కరించాను. స్థిరంగా, లోతుగా, బాధ్యతాయుతంగా ఆలోచించి చివరికి ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగు కాలేజిలో లెక్చరర్‌గా చేరాను.. ఎందుకంటే టీచర్‌ ఒక జ్యోతివంటివాడు..ఒక జ్యోతి లక్షల దీపాలను వెలిగిస్తుంది. ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని కాంతిమయం చేస్తుంది.. ఇన్నాళ్లుగా నేను చేస్తున్నదదే..నేను కొన్ని తరాలను తయారు చేస్తున్నాను.” చెప్పుకుపోతున్నాడు నాన్న ఒక ట్రాన్స్‌లో ఉన్న మనిషిలా.
”మంచి టీచర్‌ ఒక అంకెవంటివాడు రామం. ఒట్టి సున్నాల్లాంటి విద్యార్థులు అతని ప్రక్కన చేరి విజ్ఞానవంతులై పదులు, వందలు, వేలు, లక్షల సంఖ్యలుగా విస్తరిస్తారు. విద్యాదానం ఒక యజ్ఞం..ఒక క్రతువు..ఒక అదృష్టం..”
”…..”
”ఐతే ఎవరి జీవితం వారిది. తత్వాలు కూడా ఎవరివి వారివే. అప్పటి సామాజిక, వ్యక్తిగత సందర్భంలో వ్యక్తి విజ్ఞతనుబట్టి తగు నిర్ణయం తీసుకోవాలి. నౌ ఇటీజ్‌ లెప్ట్‌ టు యు..”
”…..”నాలో ఒక అనిశ్చితి.. కాని అవగతమౌతున్న మనిషి బాధ్యత.. జీవిత పరమార్థం.
ఇన్నాళ్ళూ వ్యక్తిగత వృద్ధి..వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, నడక..ఇవన్నీ హస్తగతమైనాయి. ఇప్పుడు ఇక ‘నడత’ గురించిన స్పృహ కావాలి. అందరిలా పుట్టినం, ఎదిగినం, సంపాదించినం, పిల్లలను కన్నాం, చచ్చినం.. కాకుండాఏదో ఒక విలక్షణమైన మహా సంకల్పాన్ని ఒక పరిమితమైన పరిధిలోనే విస్తరించిఉన్న చూపును యిక విస్తృతపరచాలి. ఈ భారత సమాజాన్నీ, రాజకీయాలనూ, ప్రజల స్థితిగతులనూ, లోలోతుల్లోకి పయనించి చూడవలసిన నిజమైన జనజీవితాలనూ, అడవులను.. ఆదివాసీలను, గిరిజనులకు, విస్మరించబడ్డ బడుగుజాతులను.,
ఐతే.. వర్తమానాన్ని అంతర్జాతీయ మానవ సమాజంతో పోల్చి చూచినపుడు మాత్రమే పేదరికం, దరిద్రం, అవిద్య, కుళ్ళు రాజకీయాలు, అవినీతి, అనైతికత..ఇవన్నీ స్పష్టంగా తెలుస్తాయి. అందుకే ఇప్పుడు ఒక విపులమైన అధ్యయనం చేయాలి తను. ఒక రాహుల్‌ సాంకృత్యాయన్‌వలె, ఇంగ్లండ్‌లో చదివి దక్షిణాఫ్రికాలో ఒక మామూలు మనిషిలా అడ్వకేట్‌ జీవితం జీవిస్తూనే ప్రపంచ రాజకీయాలను శాసించగల మహావ్యక్తిగా ఎదిగిన గాంధీవలె, దేశాంతర పర్యటనలతో తనను తాను తెలుసుకున్న అనిబిసెంట్‌ , జిడ్డు కృష్ణమూర్తివలె..ఇప్పుడు ఒక అధ్యయనాత్మక జీవితాన్ని కొంతకాలం గడపితే.. తర్వాత కార్యరంగంలోకి దూకితే..,
అదే అన్నాడు రామం అతని తండ్రితో..,
”మన్య విప్లవం ప్రారంభించడానికి ముందు అల్లూరి సీతారామరాజు విస్తృతంగా దేశమంతా పర్యటించి ప్రజల జీవితాలను అధ్యయనం చేశాడు. గాంధీకూడా అహింసా విప్లవోద్యమంలో దూకేముందు కాశ్మీర్‌నుండి కన్యాకుమారి దాకా అధ్యయన యాత్ర జరిపాడు. ఐతే..ఇప్పుడు భారతదేశం ఇంగ్లీష్‌వాడు పాలించినప్పటికంటే అనేకరెట్లు చెడిపోయి, పతనమై పోయి, కుళ్ళిపోయి ఉంది. భారతేతరులు పరిపాలించినపుడు ఎక్కడ జనం తిరుగబడ్తరోనన్న భయంతో ఒళ్లుదగ్గరపెట్టుకుని మెదిలారు. కాని యిప్పుడు మనల్ని పాలిస్తున్న మనవాళ్ళుమాత్రం నిస్సిగ్గుగా, నీతిహీనంగా ప్రజలను పీడించుకు తింటున్నారు. సమాజాన్ని దోపిడీ చేస్తున్నారు. పందికొక్కుల్లా అందినంత మేరకు స్వాహాచేసి ఇకిలిస్తున్నారు.”
”…..” శ్రద్ధగా వింటున్నాడు రామం.
”ఓట్లకోసం ఏమైనా చేయగల నిర్లజ్జ రాజకీయాలు ఈ దేశానికి శాపంలా దాపురించాయి. గత కొన్ని థాబ్దాలుగా వృద్ధనాయకత్వంలో దేశం మగ్గిపోతోంది. కొత్త మేధావితరం రాజకీయాల్లోకి రావడంలేదు. రాజకీయాలన్నీ మాఫియాలు, గుండాలు, నేరచరితులు, దొంగలు, దోపిడీదారులతో భ్రష్టుపట్టిపోయాయి. అధికారంకోసం ఏ దౌర్భాగ్యపు పనికైనా సిద్ధపడి పాలకులు విలువలను భూస్థాపితం చేశారు. దేశభక్తి, సామాజిక బాధ్యత, విలువలు, నైతికత, ఆత్మ.. యివన్నీ ఒట్టి కాలంచెల్లిన పదాలుగా మిగిలిపోయాయి. విషాదమైన విషయమేమిటంటే ప్రజలను ఈ ప్రభుత్వాలు తాగుబోతులుగా సోమరిపోతులుగా, అవినీతిపరులుగా, ఒట్టి కుక్కగొడుగులవంటి పారసైటిక్‌ తరంగా తయారుచేస్తున్నాయి. యధారాజా తథాప్రజా ధోరణిలో ప్రజలుకూడా పూర్తిగా అవినీతిపరులై ఎవనికి అందిందివాడు దోచుకుతింటున్నాడు. ఒక మున్సిపల్‌ ఇంజినీర్‌ ఇంటిపై దాడిచేస్తే కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్తున్నాయి. జనం ఈ రోజు విని రేపు అన్నీ మరిచిపోతున్నారు. ఎక్కడా జవాబుదారీతనం లేదు. ఒకవైపు హద్దులు మీరిన మీడియా, విచ్చలవిడి సినిమాలు, అతిస్వేచ్ఛాయుత వాతావరణంలో ఇంటర్నెట్‌, సెల్‌ఫోన్‌ సౌకర్యాల విషవలయంలో చిక్కి యువత నిర్వీర్యమై, దారితప్పి, పుట్టుకతోనే వృద్ధులుగా మిగిలి.. దేశం దేశమంతా వృద్ధ నాయకత్వంతో, అసమర్థులైన యువ వృద్ధులతో నిండి కుళ్లిపోతోంది రామం. ఏ కొద్దో మేధోసంపద ఉన్న నీవంటి క్రీమ్‌ విదేశాలపాలై ఈ దేశాన్ని అనాథను చేస్తోంది. ఈ దేశం కుక్కల పాలైపోతోంది రామం..” చటుక్కున ఆగిపోయాడుాన్న.
తలెత్తి చూస్తే..ఎదుట తండ్రి కళ్ళనిండా నీళ్ళు..పొంగిపొర్లుతున్న దుఃఖం అతని మాటలను సమాధి చేసింది.
ఇద్దరిమధ్య ఒట్టి నిశ్శబ్దం.
నిశ్శబ్దం ఒక్కోసారి ఎంతో శక్తివంతంగా సంభాషిస్తుంది. గర్జిస్తుంది. నినదిస్తుంది..నిలదీస్తుంది.
”..ఇప్పుడీ దేశానికి శస్త్ర చికిత్స జరగాలి రామం..బహుముఖంగా విరుచుకుపడ్తున్న అవినీతి, లంచగొండితనం ఈ భారత సమాజాన్ని కేన్సర్‌లా పీడిస్తోంది. ఒక తరిమెల నాగిరెడ్డి ‘ఇండియా మార్టిగేజ్డ్‌’ పుస్తకం రాసినప్పటి పరిస్థితి ఏమాత్రం మెరుగు పడకపోగా యింకా యింకా ఎన్నిరెట్లో కుళ్ళిపోయింది. కంపుకొడ్తోంది. దిస్‌ నీడ్స్‌ ఎ ప్రెషరైజ్డ్‌ వాషింగు, రాథర్‌ డిస్ట్రాయింగు అండ్‌ రీకన్‌స్ట్రక్టింగు..”
”ఔను..” స్థిరంగా జవాబు చెప్పాడు తను.
సరిగ్గా అప్పుడే ఫెళఫెళారావంతో ఎక్కడో పిడుగుపడింది. బాగా గుర్తు తనకు.. స్థితి తెలుసు తనకు.. తన ధర్మమూ, తన బాధ్యతా తెలుసు తనకు.. గురి తప్పకుండా బాణాన్ని సంధించి లక్ష్యాన్ని ఛేదించాలనుకున్నప్పుడు నిగ్రహం, సంయమనంతో కూడిన పరిణతీ, ప్రావీణ్యం, సాధనా అవసరం.
అందుకే.. వ్యూహాత్మకంగానే తను అమెరికా వచ్చాడు.
మొట్టమొదట తను అమెరికా భూభాగంపై అడుగుపెట్టింది వాషింగ్టన్‌ డి.సి డల్లెస్‌ ఏర్‌పోర్ట్‌లో.. తొంభై ఏడు మే పదిహేనవ తేదీ సాయంత్రం నాల్గుగంటల ముప్పయి నిముషాలకు.
రాక్‌ విల్లేలో ఆఫీస్‌ …టాటా కన్‌సల్టేన్సీ లో హైటెక్‌ ఇంజినీరింగు, ఎంటర్‌ప్రైజ్‌ సొల్యూషన్స్‌, సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌ మెంట్‌ వ్యవహారాలు చూచేవాడు తను. కనీసం ఒక ఏడాది పాటు టాటాస్‌తో ఉండాలని ప్లేస్‌మెంట్‌ అగ్రిమెంట్‌. హండ్రెడ్‌ కె పేమెంట్‌ పర్‌ ఆనం.
మేరీల్యాండ్‌ విలేజ్‌ గ్రీన్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో మకాం. ఇక ప్రయాణం, ప్రయోగం, భవిష్యత్‌ పథక ప్రణాళిక  ప్రారంభం.
అమెరికాతో ఇండియన్స్‌కు ఉన్న వలసల అనుబంధం ఎంతో సుదీర్ఘమైందని రామంకు అతితొందరగానే అర్థమైంది  దాదాపు గత ఎనభై సంవత్సరాల నుండి భారతదేశం నుండి, ఆంధ్రదేశం నుండి కూడా విపరీతంగా వలసలు జరిగాయి. ఐతే ఎవరు వలస వచ్చినా ఒక మేధోపరమైన విలక్షణతతోనే యుఎస్‌ఎకు వచ్చారు. మొదట ఎక్కువగా  డాక్టర్లు, వ్యాపారులు, ఏ ఆధారమూ లేకుండా అలా గాలికి వచ్చి స్థిరపడ్డ బాపతు ఎక్కువైతే, తొంభైలలో అనూహ్యంగా వచ్చిన బూంవల్ల మాత్రం ఐటి ఇండస్ట్రీ ఈ వలసల వెల్లువను ఒక కుదుపు కుదిపి విడిచిపెట్టింది. ఐతే గతంలో వలస వచ్చి అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు ఇండియన్స్‌ అంటే గౌరవనీయులై మేధోజీవులన్న సామాజిక విలువను యిక్కడ స్థిరపర్చి పదిలపర్చారు. ఈ పరంపర ఉధృతంగా కొనసాగి న్యూజెర్సీ, డెట్రాయిట్‌లాంటి చోట తెలుగువాళ్ల సంఖ్యాబలం ఎంత పెరిగిందంటే..అంతటా ఇండియన్‌ స్టోర్స్‌ ప్రత్యేకంగా నెలకొల్పబడ్డాయి. కాగా రాజకీయాలనుండి మొదలుపెట్టి భారత సంతతి జనం అనేక అమెరికా జీవనరంగాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు. అమెరికాలోని మొత్తం డాక్టర్లలో ముప్పయి ఎనిమిది శాతం మంది భారతీయ డాక్టర్లు, ముప్పయి ఆరుశాతం ప్రతిష్టాత్మక నాసాకేంద్ర శాస్త్రజ్ఞులు, దేశ శాస్త్రవేత్తల్లో పన్నెండుశాతం, మైక్రోసాఫ్ట్‌లో ముప్పయినాల్గుశాతం,ఐబియంలో ఇరవై ఎనిమిదిశాతం, ఇంటెల్‌, జిరాక్స్‌లాంటి బహుళ జాతి కంపెనీల్లో పదిహేడు పదిహేను శాతం భారతీయులే విస్తరించి పోయారంటే..విస్తృతి ఎంత ఉధృతంగా జరిగిందో ఊహించవచ్చు.
ఐతే తొంభైలలో అమెరికాలోకి వచ్చిపడ్డ చెత్త చెదారం మాత్రం యిక్కడి నాణ్యతా ప్రమాణాలను బాగా దెబ్బతీసి ఒక రకమైన నిస్పృహను మిగిల్చి క్రమక్రమంగా భారతదేశం నుండి వలసలు తగ్గడానికి కారణం కావడం మాత్రం ఒక పచ్చినిజంగా జరిగింది. పెరుగుట విరుగట కొరకే అనేసూక్తి నిజమైంది కూడా. వేలు చూపితే కొండబాకే తత్వమున్న తెలుగువాళ్ళు అనేక అమెరికా సామాజిక రంగాల్లోకూడా చొరబడ్డారు.,
ఈ నేపథ్యంలో నిలబడ్డ వర్తమానం మాత్రం.. వాల్‌మార్ట్‌, జెయింట్‌. కాట్‌స్కో వంటి భారీ వ్యవస్థల్లో సేల్స్‌మెన్‌, మెయింటెనెన్స్‌ పీపుల్‌, ల్యాండ్‌ స్కేపర్స్‌, రోడ్‌ వర్కర్స్‌ వంటి అన్ని ప్రజా వినిమయ రంగాల్లో చిన్నస్థాయి ఉద్యోగాల్లో ఉన్న స్థానిక అమెరికన్లకు..’ఈ ఎక్కడనుండో వచ్చిన భారతీయులు మమ్మల్ని దోచుకుంటున్నారు అన్న కొంగ్రొత్త భావన కల్గుతున్నట్ట్థుానిక భారతీయుల అనుభవాలు చెబుతున్నాయి.
అడవి అంటుకోవద్దు..ఒకసారి నిప్పురవ్వ ఎండిన చెట్లనడుమ పడిందంటే ఆ బడబాగ్నిని నియంత్రించడం ఎవరితరమూకాదు. గత నాల్గుయిదు సంవత్సరాలుగా అంతర్జాతీయ సమాజంలో ప్రధానంగా అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, కెనడా వంటి దేశాల్లో స్థానికేతరుల ఉనికి అక్కడి పౌరులను అసహనానికి గురిచేస్తున్న ఉదంతాలు పదేపదే పొటమరించడం.. ఒక విపరీత పరిణామం.
ఐతే చాలామంది సాధారణ అమెరికన్లు పౌరులుగా ఎంతో సంస్కారవంతులు. ప్రేమమయులు. క్రమశిక్షణ గల ఉత్తమపౌరులు. అందరిలోనూ ఎంతో గొప్పగా భాసించేది వాళ్ల దేశంపట్ల వాళ్ళకున్న విపరీతమైన ప్రేమ, దేశభక్తి, సమాజంపట్ల ఉన్న అంకితభావం. పౌరవిధులపట్ల స్పృహ. ఉదయం వాకింగు చేస్తున్నపుడు ఎదురైన ఏ అమెరికనైనా ప్రేమగా,నవ్వు ముఖంతో ‘హాయ్‌’అని పలకరిస్తాడు. కాని ఇండియన్స్‌ పలకరించలేకపోవడం సర్వసాధారణంగా కనబడే విషయం. అమెరికన్స్‌ ఎందుకో చదువులో..ఉంటే మహాగొప్పగా..లేకుంటే సగటుకంటే తక్కువ స్థాయిలో ఉన్నట్టు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.
ఐతే.. చాలామంది అమెరికన్లు దురాశపరులు కారు. సంపాదించిన దాన్ని తమ తక్షణావసరాలకోసం, జీవితాన్ని సౌకర్యవంతంగా గడపడం కోసం, ప్రధానంగా నాణ్యమైన ఆహారంకోసం, అలంకరణ, ఆరోగ్యంకోసం ఖర్చుచేస్తారు. కడుపు చంపుకుని పొదుపుచేసి తెలుగువాళ్లవలె డబ్బును దాచిదాచి ఆస్తులు, సంపదలు కూడబెట్టుకోవాలన్న యావలేదు వీళ్ళకు. తెలుగువాళ్ళలో వలె సంపాదన మొదలుపెట్టి తన తరంతోపాటు భావి ఇంకో ఐదు తరాలు సుఖపడేట్టు మందికొంపలు ముంచయినా కూడబెట్టే దుష్టసంస్కృతికూడా అమెరికన్లలో లేదు. తను కష్టపడి ఏదో ఒక ఆదాయం కల్గించే పనిచేసి జీవిస్తూ పిల్లలను వాళ్ల కాళ్ళమీద వాళ్ళు నిలబడే ప్రయత్నమే అందరూ చేస్తారు. పారదర్శకమైన జీవితం వాళ్ళ విశిష్టత.
భారతసమాజంలో ఉన్న తీవ్రమైన ఆర్థిక అసమానతలు, బీదరికం, నిరుద్యోగం, అవిద్య మనుషులందరినీ ఒకేచోట, ఒకేవిధంగా, జీవించే వీలు కల్పించలేకపోతుంది. కాని శతాబ్దాల పర్యంతం కొనసాగిన అనేక దూరదృష్టిగల పాలకుల పరిపాలనా పద్ధతులు, సంస్కరణల వల్ల ప్రస్తుతం ఎక్కువగా ఆర్థిక నిమ్నోన్నతులు లేని సమసమాజం అమెరికాలో వేళ్ళూనుకుంది. అందరికీ కనీసాదాయం, కనీస వసతి, కనీస సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ స్థితి సాధించడం సాధారణ విషయమేమీకాదు. భారతదేశంతో పోల్చుకుకంటే అనైతికత, విచ్చలవిడితనం, అవినీతి, లంచగొండితనం, రాజకీయ కాలుష్యం అమెరికాలో అస్సలే లేవు.
ఈ నేపథ్యంలో..,
రామం డ్రెస్‌ మార్చుకుని, డ్రాయింగు రూంలోకి వచ్చి..అప్పటినుండీ మనసునిండా ఒక వీడియో కార్యక్రమంలా కదిలిన గతాన్ని పునశ్చరణ చేసుకుంటూనే.,
తను అమెరికా వచ్చిన మొట్టమొదటిరోజు నుండి..ఒకటే ఆలోచన..ఒకటి..ఎప్పటికైనా..సాధ్యమైనంత త్వరగా భారతదేశానికి వెళ్లిపోవాలి..ఈ లోగా తను వర్తమాన భారత సమాజాన్ని పట్టి పీడిస్తున్న సర్వరుగ్మతలనూ రూపుమాపగల పరిష్కారాలను తయారు చేసుకోవాలి. రూపొందించుకోవాలి వాటిని పకడ్బందీగా అమలు చేయగల కార్యాచరణ ప్రణాళికను రచించుకోవాలి.
ఉద్యమం అంటే హింసాయుతమైన, రక్తపాతంతో కూడిన దౌర్జన్యకర ప్రజాప్రతిఘటనే కానవసరంలేదు. అర్ధవంతమైన హృదయ పరివర్తనతో కూడిన చైతన్యంకూడా ఉద్యమమే ఔతుంది. విప్లవం అంటే పెనుమార్పేగాని వేల లక్షలమంది ఆత్మార్పణతో నిండిన హింసాత్మక ఘటన కాదు. మనుషుల్లో సమూలమైన, నీతివంతమైన ప్రవర్తనను నెలకొల్పడం, అప్పటికే పతనమై ఉన్న మానవీయ మూలవిలువలను పునఃప్రతిష్టించడం కూడా ఒక అతి ప్రధానమైన విప్లవం క్రిందే లెక్క. ప్రశాంతంగా కూడా విప్లవాలు సాధ్యమౌతాయని తన అంచచల విశ్వాసం. అందుకు పటిష్టమైన సిద్ధాంతాన్ని రూపొందించుకోవాలి. రెండు..ఏ పెనుమార్పును ప్రవేశపెట్టాలన్నా మొదట తగిన ఆర్థిక పరిపుష్టత కావాలి. ప్రారంభథలో డబ్బు చేతిలో లేకుండా ఉద్యమాలను నిర్మించడం సులభసాధ్యం కాదు. కనీస పోషణలేకుండా కార్యకర్తలు ఒక పోరాటంలో నిలబడలేరు. అందువల్ల ఒక నియమితకాలం కష్టపడి కొంత డబ్బును అతివేగంగా సంపాదించాలి. ‘ధనం మూలం మిదం జగత్‌’ అన్నది ఎవరూ విస్మరించలేని పరమసత్యం.
మూడవది.. ప్రజా ఉద్యమాలెప్పుడూ ఒకే ఒక వ్యక్తిచే నిర్మించబడి, నిర్వహించబడితే విజయవంతంకావు. ఒకే ఆలోచనా విధానం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం కలిగిన కొంతమంది మూలవ్యక్తుల భాగస్వామ్యం ప్రతి ఉద్యమ నిర్మాణంలో ప్రారంభథలోఅవసరం. భారతదేశ సమూల మార్పును కాంక్షించే తనవంటి ఎందరో యువకులు, వ్యక్తులు ఎందరెందరో ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్లను గుర్తించడం, సమీకరించడం, ఒకచోట చేర్చడం, అందరినీ కలిపి ఒక శక్తిగా ఏకీకృతం చేయడం.. అప్పుడు ఒక సిద్ధాంతబద్ధమైన కార్యాచరణతో ముందుకు సాగడం.. ఇదంతా ఒక దీర్ఘకాలిక, జీవసమానమైన ప్రణాళిక.
ఒక మార్క్స్‌, ఒక మావో జుడాంగు, ఒక హోచిమిన్‌, ఒక గాంధీ..వీళ్లందరూ తమవైన విలక్షణమైన మానవీయ వ్యూహాత్మక సిద్దాంతాలతో ఈ మానవ సమాజానికి వివిధ జీవనసూత్రాలనందిస్తేగదా ఆ బలమైన పునాదుల మీద అనేక సమాజాలు, దేశాలు నిర్మితమై ఎదిగి ఈ రోజు మనగల్గుతున్నాయి.ఐతే..ఆ సిద్ధాంతాలు కాలపరీక్షకు నిలబడి మారుతున్న మానవ సమాజంలో ఎన్నేళ్ళు నిలబడగలిగాయి..ఎంతకాలం మనగలిగాయి..ఇంకా సజీవంగా ఉన్నాయా, కాలగర్భంలో కలిసి అంతరించిపోయాయా అన్నది వేరే విషయం.
ఏమైనా..ఒక సామాజిక పెనుమార్పుకు మాత్రం ఒక సూత్రబద్ధమైన సిద్ధాంతం, విపులమైన మానిఫెస్టో, విధానం అవసరం.. దాన్ని రూపొందించుకోవాలిప్పుడు తను..ఐతే లీలా మాత్రంగా ప్రస్తుత పరిస్థితికి పరిష్కారాలనబడే పద్ధతుల గురించి ఎప్పట్నుండో తను తన సహానుభూతిగల మిత్రులతో చర్చిస్తూనే ఉన్నాడు. అవి కార్యరూపం ధరించేందుకు సమయం ఆసన్నం కాబోతోందిక.
రామం నిశ్శబ్దంగా సోఫాలో ఒరిగి..అలా నిర్వ్యాపారంగా చూస్తు ఉండిపోయాడు. ఎదురుగా..చిన్నప్పటినుండీ  తనకున్న అలవాటును ప్రతిబింబిచే ఒక చిత్రం ఉంది. గోడపై..ఒక ముఖ్యవాక్యాన్ని ఎదురుగా ఉదయం లేవగానే కనబడేవిధంగా బెడ్‌రూంలో గోడకు అతికించుకునేవాడు తను. మరుపు రాకుండా..’మనిషి దొంగ’ అని రాసిపెట్టుకున్నాడు ఎన్నో నెలలు. అది పైకి అసత్యమేమో అనిపించినా ఆత్మసమీక్ష స్థాయిలో అదే సత్యమని ఎవరి అనుభవం వారికి చెబుతుంది.
ఇప్పుడు.. ఎదురుగా ఉన్న మందపు డ్రాయింగు షీట్‌పై..ఒక బొమ్మవేసి ఉంది. కుళాయి నుండి వడివడిగా నీళ్ళు ఒక కుండలో పడ్తున్నాయి. ఆ నీళ్ళపై ‘దేశప్రజల ఆర్థిక వనరులు’ అని రాసి ఉంది. ఆ నీటిధార క్రింద ఒక కుండ ఏర్పాటు చేయబడి ఉంది. దానికి అడుగు లేదు.కుండపై ‘భారతదేశం..ప్రజలు..ప్రజాసంక్షేమం’ అని రాసి ఉంది. కుండలో ఒక్క నీటి బొట్టుకూడా పడకుండా సూటిగా నీళ్లుమొత్తం క్రింద ఉన్న బకెట్‌లో పడి, నిండి పొంగి పొర్లిపోతున్నాయి. బకెట్‌ఫై ‘మంత్రులు..రాజకీయనాయకులు..దళారులు..ప్రభుత్వ అధికారులు’ అన్న అక్షరాలున్నాయి.
భారతదేశపు భావి ప్రధానిగా భావించబడ్తున్న రాహుల్‌ గాంధీ ఒక సందర్భంలో భారతదేశంలో ఊడలుదిగిన అవినీతి గురించి చెబుతూ ‘ఈ దేశంలో ప్రభుత్వం ఒక రూపాయిని ప్రజాపథకాలకు అందిస్తే కనీసం ఐదు పైసలు కూడా లబ్దిదారులకు అందడంలేదు’ అని వాపోడం జ్ఞాపకమొచ్చింది రామంకు.
‘ఈ దేశంలోనుండి అవినీతి లంచగొండితనం  అనే రక్కసిని మనందదరం ఏకస్తులమై పారద్రోలాలి’ అని రాష్ట్రపతి తమ ప్రసంగంలో ఉద్ఘాటించడం స్ఫురణకొచ్చింది.. పారద్రోలవలసిన రాష్ట్రపతే ‘మనందరం కలిసి పారద్రోలాలి’ అని నిస్సహాయంగా అంటే.. ఇక పారద్రోలవలసింది ఎవరు.

( సశేషం)

ఎక్కడి నుండి ఎక్కడి దాకా ? 3 వ భాగం

( గత వారం తరువాయి)

3

third week fig-1

వర్షం ఇంకా కురుస్తూనే ఉంది.
చుట్టూ విపరీతమైన మీడియా వ్యక్తుల ఒత్తిడి. టి.వి. ఛానళ్ళవాళ్ళు, పత్రికలవాళ్ళు, ఒక మంత్రి హత్య జరిగింది కాబట్టి జాతీయస్థాయి టి.వి. వాళ్ళు..ఒకటే హడావుడి.. ఈ దేశంలో ఇంత స్వేచ్ఛ, యింత మీడియా కవరేజ్‌, యింత అతి ప్రవర్తన అవసరమా అని వేయవసారి విసుక్కున్నాడు ఎస్పీ విఠల్‌. గెస్ట్‌హౌజ్‌లో మంత్రిగారి హత్య జరిగిన బెడ్‌రూం ప్రక్కగదిలో కూర్చున్నాడు ఒంటరిగా బోనులో సింహంలా. బయటంతా పోలీసులు వాసన.. హడావుడి.. మంత్రిగారి శవాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించే ప్రయత్నం..మంత్రి బంధువుల రాక..రాళ్ళవానలా..అంతా బీభత్సం.
విఠల్‌లోనుండి విస్కీ మత్తు పూర్తిగా దిగిపోయింది.
‘కథ’ను ఎంత పకడ్బందీగా అల్లినా..డిపార్ట్‌మెంట్‌లో తనకు విధేయులైన చెంచాగాళ్ళను ఎంత మందిని పురమాయించి ఉద్యుక్తుల్ని చేసినా..ఇటువంటివే ఎన్నో హత్యలను తను ఇదివరకు విజయవంతంగా చేసినా..ఎందుకో చిత్రంగా విఠల్‌కు భయం కల్గుతోంది. ఎన్నడూ లేంది.
ఎందుకు.. రాక్షసుడిలాంటి, రాయిలాంటి తనకు భయమెందుకు.
వర్షం బయట ఉధృతంగా కురుస్తున్నా విఠల్‌ ముఖం నిండా అతనికి తెలియకుండానే చెమటపట్టింది.. ఏదో సన్నని వణుకు.
సరిగ్గా అప్పుడు మ్రోగింది విఠల్‌ మొబైల్‌.
”హలో” అన్నాడు. అన్‌నోన్‌ నంబరది.
”విఠల్‌.. అనవసరంగా తొందరపడ్డావ్‌” అటు ప్రక్కనుండి గంభీరమైన నిశ్చలమైన ఓ స్త్రీ గొంతు.
మొదట షాకై..క్షణకాలం తత్తరపడి..తర్వాత అదిరిపడి. మరుక్షణం ఆ కంఠాన్ని లీల స్వరంగా గుర్తించి..కంపితుడై,
”మేడమ్‌..”అన్నాడు ఆందోళనగా.
”ఇలా చేయవలసింది కాదు” అదే స్థిరత్వం గొంతులో. సారీ మేడం..”
”ఇట్సాల్‌రైట్‌.. ఒక ఎంక్వయిరీ కమీషనొస్తుంది..బయట పడ్డానికి ముందు నిన్ను అక్కడ్నుండి ట్రాన్స్‌ఫర్‌ చేపిస్తా.. నీతో నాకు చాలా పనుంది. ధైర్యంగా ఉండు”
”థ్యాంక్యూ మేడం”
”నువ్వు అళ్లిన కథనే కొనసాగించు. కథ బాగానే ఉంది..ఊఁ. తాగడం బాగా తగ్గించి తక్కువగా మాట్లాడ్డ మంచిదేమో విఠల్‌ నీకు ఊఁ..”
”ఔను మేడం.”
ఫోన్‌ పెట్టేసింది లీల అటువైపునుండి.
నిజానికి విఠల్‌ అప్పుడాక్షణం లీల గొంతువిని అదిరిపడ్డ వణుకునుండి కోలుకోకుండానే..వెంటనే పోలీస్‌ బ్రెయిన్‌తో లీల చేసిన నంబర్‌ను డిస్‌ప్లే చేసి కోడ్‌ చూచుకున్నాడు. 0974.. అని ఉంది. నైన్‌ సెవెన్‌ ఫోర్‌..అంటే దోహా..కతార్‌.,
ఎక్కడో ఓ అరబ్‌దేశంలో ఉన్న లీలకు..తను చేసిన హత్య విషయం ఇంత వివరంగా..ఇంత తొందరగా.,
చటుక్కున విఠల్‌కు జ్ఞాపకమొచ్చింది..మంత్రికీ, తనకూ కలిపి ఆ పవర్‌ ప్రాజెక్ట్‌ రెండువందలకోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ను యిప్పించింది లీలేనని. తమ గొడవను సెటిల్‌ చేయమని తనే ఈ మధ్య లీలను సంప్రదించడంకూడా వెంటనే స్ఫురించింది.
విఠల్‌ ఖంగుతిని..’తనెరిగిన కొద్దమంది అద్భుతమైన అతి తెలివితేటలున్న వ్యక్తుల్లో ఈ లీల ఒకతి’ అని ఎందుకో అనుకున్నాడు లిప్తకాలం.. వెంటనే ముఖంమీద పట్టిన చెమటలు తుడుచుకుంటూ.,
జ                జ        జ
విఠల్‌తో మాట్లాడి మొబైల్‌కాల్‌ కట్‌చేసిన లీల టైం చూచుకుంది. దోహాలో ఉదయం ఆరుగంటల పదినిముషాలు.. ఇండియాలో ఎనిమిది దాటింది.
క్షణకాలం చనిపోయిన మంత్రి విశ్వనాధరెడ్డితో ఉన్న లావాదేవీలను పునశ్చరణ చేసుకుంది.. ”పూర్‌ ఫెలో..నోటి దురుసున్న ఒట్టి ఆవేశపరుడు..”అని నిట్టూర్చి..నిర్మలను పిల్చుకుంది లైన్‌లోకి.
”నిర్మలా..ఏమైంది..”
”మీ ప్రోగ్రాం మొత్తం రీషెడ్యూల్‌ చేశాను మేడం. ముందనుకున్నట్టు మీరు ఢిల్లీకి రాకుండా..వాషింగ్టన్‌ వెళ్తారు. రెండు రోజుల స్టే అక్కడ..ఔనా.”
”ఎగ్జాట్లీ..ఫుట్‌ మీ టోటల్లీ ఫ్రీ నిర్మలా”
”ఎస్‌ మేం..యు ఆర్‌ కంప్లీట్లీ రిలీవ్డ్‌.. మీకెవరూ కాల్‌ చేయరు. అన్ని కాల్స్‌ను జామ్‌ చేస్తాను”
”దట్స్‌ గుడ్‌..”
”మీకు ఈ పూటే తొమ్మిదీ పదికి కతార్‌ ఎయిర్‌వేస్‌లో గష్ట్ర.51 ఫస్ట్‌క్లాస్‌లో వాషింగ్టన్‌ డి.సి.కి టికెట్‌ బుక్‌ చేశా మేడం. రిసిప్షన్‌లో ఇ-టికెట్‌ తీసుకోండి.. పదమూడు గంటలు ప్రయాణం. సాయంత్రం యుఎస్‌ టైం నాల్గున్నరకు అక్కడకు చేరుకుంటారు. మేరీల్యాండ్‌లో ఉంటారు మీరు కాబట్టి లోయిస్‌ ఇంటర్‌ కాంటినెంటల్‌ అన్నెపోలిస్‌ హోటల్‌లో డీలక్స్‌ కింగు సూట్‌ మీ పేర బుక్‌ చేయబడి ఉంది. మీకు మన ఏజంట్‌ ప్రకాశ్‌ రిచర్డ్స్‌ అనే డ్రైవర్‌ నిచ్చి ఏర్‌పోర్ట్‌కు కారును పంపుతాడు..”
”థాంక్యూ నిర్మలా..వెల్‌డన్‌”
”హాపీ స్టే మేం..”
”థాంక్యూ”
అటువేపునుండి నిర్మల నిష్క్రమించింది. ఎంత చురుకైన ఎగ్జిక్యూటివో అనుకుంది లీల.

Ekkadi(1)
‘రెండురోజులు..ఫ్రీ..స్వేచ్ఛ..వినీలాకాశంలో ఎగిరే పక్షి తను..’ఎందుకో ఆమె అప్పుడే రెక్కలు మొలుస్తున్న పక్షికూనలా పులకిస్తూ సంబరపడిపోయింది.
‘ఒక అద్భుతమైన టీ తాగితే ఎలా ఉంటుంది.’ అని అనిపించి,
చటుక్కున లేచి.. కిచెన్‌ ఓవెన్‌లోనుండి కంపోజ్ట్‌ టీ..రెండు నిముషాల్లో తెచ్చుకుని..ఎంత గ్రాండ్‌ హోటల్స్‌ ఇవి.. అన్నీ చాచిన చేయికి అందేవిధంగా..లాంజ్‌లోకి వచ్చి..విశాలమైన గాజు కిటికీ సన్నని తెరలనుజరిపి ఎదురుగా గర్జిస్తున్న నీలి సముద్రం..దూరంగా లంగరు వేసిన నౌకలు..పైన ఎర్రగా ఆకాశం..పురిటినొప్పులు పడ్తున్న ప్రకృతి..ఒక సూర్యశిశువు జన్మించాలిప్పుడు..లెట్‌ మీ సీ ఇట్‌.
పసిపిల్లయిపోయింది లీల.
చాలా అనాలోచితంగా. ఆమె టకటకా తన బ్లాక్‌బెర్రీ ఫోన్‌తో ఎంపిఫోర్‌ ట్రాక్‌ చేసి బటన్‌ను ఆన్‌ చేసింది.
తనకెంతో యిష్టమైన ముఖేశ్‌ పాట..’లౌట్‌ కే ఆఁ..లౌట్‌ కే ఆఁ…’
పాట ఒక సముద్ర కెరటమై పురి విప్పుకుని విస్తరిస్తూండగా..టీని మృదువైన పెదవులలో కొద్దికొద్దిగా చప్పరించి.. కళ్ళుమూసుకుని..కుర్చీలో వెనక్కి ఒరిగి..
శరీరంలోనుండి.. ఆత్మ విడివడి వియుక్తమౌతున్నట్టు…ఏదో విభాజ్యమై..ఏదో సంయోగం చెంది..ఎక్కడో ఒక అనుస్పర్శతో పులకించి.. వివశయై.,
తంత్రి మీటబడి..ఒక రసధ్వని పుట్టి..విస్తరిస్తూ..వ్యాపిస్తూ..భాషకందని ఏదో తాదాత్మ్యతలో అన్నీ కోల్పోతూ.. అంతర్ధానమైపోతూ..లీనమైపోతూ..అదృశ్యమైపోతూ,
‘ఎక్‌ ఫల్‌హై హస్‌నా, ఏక్‌పల్‌ హై రోనా
ఏక్‌ పల్‌ హై మిల్నా ఏక్‌ పల్‌ బిచడ్‌నా
దునియాహై దోదిన్‌కా మేలా…’అంటున్నాడు ముఖేశ్‌.
ఎంత సత్యం.. స్థూలంగా జీవితమైవరిదైనా అంతిమంగా అంతా ఇంతేగదా.
మనిషి వెళ్ళిపోయి..పాడిన పాట మిగిలిపోయి..పాటతో ఒక జీవిత సారాంశం చిరస్మరణీయ సంపదగా మిగిలిపోయి.. ఏదోపోయి..ఏదో మిగిలి..అసలు పోయేదేమిటి..చివరికి మిగిలేదేమిటి..నిజానికి పోవడానికిగానీ మిగిలిపోవడానికిగానీ మనిషి దగ్గర ఏదైనా ఉందా. శక్తి నిత్యత్వ సిద్ధాంతం ప్రకారం ఎక్కడైనా వ్యవస్థీకృతమైన శక్తి ఎప్పుడూ స్థిరమేకదా..రూపాలు మారవచ్చుగానీ శక్తి పరిమాణం మారుతుందా..పరిణామక్రమాలు వేరుకావచ్చు కాని రూపాంతరస్థాయిలో నిక్షిప్తమై ఉండే శక్తి స్థిరమూ, శాశ్వతమూ, అనంతమూ ఐ..చివరికి మిగిలేది శూన్యమేగదా.,
పూర్ణమదః పూర్ణమిదః
పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావ శిష్యతే
శూన్యం నుండి శూన్యాన్ని తీసివేసినా, శూన్యానికి శూన్యాన్ని కలిపినా..శూన్యంతో శూన్యాన్ని హెచ్చవేసి, భాగించి.. భిన్న భిన్న సహస్రాంశ సూక్ష్మాలుగా విభజించినా..సత్యమై, నిత్యమై పరిఢవిల్లే పరమ పచ్చి నిజం శూన్యమేకదా-
కళ్ళు మూసుకున్న లీల మనసు సముద్రమై మథనం చెందుతోంది.
నిశ్చలత్వం. అనిశ్చితి..స్థిరత..డోలనం..మథనం..మళ్ళీ ఏకత..ఇదంతా ఏమిటి?
మూసిన కళ్ళవెనుక ఏదో గాఢమైన, లోతైన, సాంద్రమైన..స్పష్టంగా తెలియని ఏదో అవ్యక్తత.,
ఏమిటది..తెలియని ఆ ఏమిటో ఏమిటది.?
అన్వేషణ..లోపల..లోపల్నుండి యింకా లోపలివైపు..’ఎవ్వనిచే జనించు, జగమెవ్వని లోపల నుండు లీనమై..ఆ ‘లోపలివైపు’ ..నక్షత్రాలను చిమ్ముకుంటూ రసోద్విగ్నయానం చేస్తున్న ఆత్మ ఒక ఉల్కవలె విశ్వాంతరాల గర్భాల్లోకి చొచ్చుకొని చొచ్చుకునిపోతూ పతనమౌతున్న క్షణం..ఒక బిందువై జన్మించే అన్వేషణ, వివేచనై.. విశ్లేషణై, విస్తరించి విస్తరించి.. ఉహుఁ.. అర్థంకావడంలేదు..అంతు చిక్కడంలేదు..భౌతికం అభౌతిమై, మిథ్య ఒక వాస్తవమై..సత్యం పరమ సత్యంగా భాసిస్తూ ఋజువుగా అనుభవమౌతున్న మహోద్వేగ క్షణాలు..వ్యక్తీకరించేందుకు భాషకు లొంగుతాయా. అనేక సందర్భాల్లో మనిషి తట్టుకోలేని మహోగ్ర ఉద్విగ్నతలను బయటి ఏ భాషలోనైనా వ్యక్తీకరించలేక ఓడిపోయి..సుళ్ళు తిరుగిపోతూ బిగ్గరగా ఏడ్చి.. పిచ్చిగా నవ్వి.. పొంగి పొర్లి తుఫానులా తల్లడిల్లిపోయిన అనుభవాలు ఎందరికి లేవు.
ఐతే.. ఈ అంతర్‌లోకాంతరాల్లోకి తొంగి చూడగల సంస్కారం, తత్వం, అభిరుచి ఎందరికుంటుంది..దీన్నేుకృతమంటారా. కృతాలూ, దృష్టాలూ..ఇవన్నీ ఏమిటి..సుకృతాలూ, కనబడని అదృష్టాలూ ఏమిటి..అసలీ కనబడడం, కనబడకపోవడమేమిటి. చూపు, దృష్టి ఏమిటి.. ఉందీ అంటే కనబడడమా. లేదూ అంటే కనబడకపోవడమా. కనబడనివన్నీ లేనట్టా. సమస్త విశ్వాంతరాల చుట్టూ క్షేత్రమై వ్యాపించి ఉన్న ఏ శక్తితరంగాలూ కంటికి కనబడ్డం లేదు కదా. అంతమాత్రాన అవి లేవని నిర్ధారించలేముకదా. ఉన్నాయని మన రేడియో తరంగాలు, విద్యుదయస్కాంత తరంగాలు, అనేక వర్గీకరణలకు చెందిన కాంతి తరంగాలు..ఇవన్నీ తమ అద్భుత చర్యలతో ప్రమేయాలై ఋజువు చేస్తున్నాయికదా. మనిషికి తెలిసిన ఈ కొద్ది అదృశ్య తరంగశక్తులు కాకుండా..మనిషి ఇంకా పసికట్టని అనేకానేక వింత శక్తి స్వరూపాలు ఈ సృష్టిలో ఇంకెన్నున్నాయో.
హృదయ తరంగాలుంటాయా..ఒక మనిషి తనకు చెందిన ఒక హృదయ పౌనఃపున్యంతో స్పందిస్తున్న మరో మనిషియొక్క హృదయ తరంగాలతో అనుసంధానమై ప్రతిచర్యించగలడా.
వ్చ్‌.. ఏమో,
చీకటే శాశ్వతం..వెలుగే అప్పుడప్పుడు మధ్య మధ్య అతిథిలా వచ్చి ‘దిన’మై మనను భ్రమింపజేస్తోందనే వాదన నిజమేనా. వెలుగును విశ్లేషిస్తే ఏడు రంగులుగా విడిపోయినట్టు చీకటిని విశ్లేషిస్తే.. వింతైన అద్భుతాలు బయటపడ్తాయా,
లీల ఒక శ్వాసిస్తున్న సముద్రంలా కళ్ళు మూసుకుని..సమాధియై పోయింది.
ఆకాశపర్యంతం విస్తరించిన ఒక మహావాయుస్తంభనలో తను చిన్న ధూళి కణమై తేలిపోతున్నట్టు..అంతా తేలిక, అగమ్యం. శూన్యోత్సర్గం-
నిశ్శబ్దం..గడ్డకట్టిన నిశ్శబ్దం..అభేద్యమైన నిశ్శబ్దం.
కాలం గడుస్తోంది..ఆమె పూర్తిగా అభౌతికమైపోయింది.
..అప్పుడు మ్రోగింది ఆమె మొబైల్‌ఫోన్‌.
ఉలిక్కిపడి..చటుక్కున ఎత్తి..
నిర్మల
నిర్మల కాల్‌ చేయవలసిన ప్రోగ్రాం ఏమీలేదు. ఐనా ఎందుకు చేస్తోంది.
”నిర్మలా..”అంది.
”….”జవాబు లేదు. ఏదో గర్ర్‌ర్‌ర్‌మని ధ్వని. లైన్‌ డిఫెక్టివ్‌.,
”నిర్మలా..”మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది. కొద్దిసేపు ఏవేవో శబ్దాలు వినిపించి ఓ అర నిముషం తర్వాత లైన్‌ తెగిపోయిది. మనసులోనుండి ఏదో ఓ మహాపర్వత భారం తొలగిపోయినట్టయి..,
ఎదురుగా అదే దృశ్యం..నిరంతరంగా సంఘర్షించే సముద్రపు అలలు. నీలి గగనం..నీలి నీరు..మధ్య రగులుకోబోతున్న కొలిమిలా ఎర్రగా నిప్పుముద్ద..సూర్యోద్భవం.
సూర్యోదయం..నిత్యనూతనమైన..అతిసాధారణమైన.. అతి సహజమైన..ప్రాణప్రదమైన, జీవాధారమైన..సూర్యోదయం.
దేవుడున్నాడా.. లేడా.. ఉంటే ఎలా ఉన్నాడు,ఎక్కడున్నాడు, ఆ ఉన్నది ఆడదా, మగాడా, వాడు లేక ఆమె రూపమేమిటి.. వాడి వెనుక మర్మమేమిటి..ఈ మీమాంసను ప్రక్కనబెడ్తే..తన దృష్టిలో ప్రత్యక్షదైవం సూర్యుడే..కనబడేవాడు.. కనిపింపజేసేవాడు.. కనువిప్పుకలిగించేవాడు. సర్వశక్తులకూ శక్తికేంద్రకమై  సకల చరాచర సృష్టికి మూలమై భాసించేవాడు. ప్రధానంగా తనకూ, తన జీవిత రూపకల్పనకు స్ఫూర్తిప్రదాతయై ఒక ఊపిరిగా గుండెల్లో నిత్యమై జ్వలించేవాడు. తన వ్యక్తిత్వ వికాసానికి అజ్ఞాత నిత్యప్రేరకుడు.

third week fig-2
రథస్యైకం చక్రం భుజగయమితా స్సప్తతురగాః
నిరాలంబో మార్గ శ్చరణవికల స్సారథి రవిపి|
రవి ర్యాత్యేవాస్తం ప్రతిదిన మపారస్య నభసః
క్రియాసిద్ధి స్సత్వే భవతి మహతాం నోపకరణే||
ఎంత గొప్ప స్ఫూర్తిదాయకమైన విషయమిది..
ఒంటి చక్రమేగల రథాన్ని అధిరోహించి వచ్చేవాడు..అసలు ఒంటి చక్రం పడిపోకుండా నిలబడ్తుందా..ఒంటి చక్రం నిలబడాలన్నా, నిలబడి పయనించాలన్నా కొంత కనీస భ్రమణవేగాన్ని కలిగి ఉండాలి. లేకుంటే అది కూలిపోతుంది. అంటేకదలిక.. కనీస వేగంతో కూడిన కదలిక జీవిపురోగతికి అత్యంతావశ్యకమని చెప్పడం.. సప్తాశ్వరథమారూఢం.. ఏడు గుర్రాలు తెలుపురంగుకు మూలమైన సప్తవర్ణాలకు ప్రతీకలే ఐనా..ఏడు శక్తులు గుర్రాలవలె వివిధ దిశలలో రథాన్ని.. అంటే మనిషిని లాక్కుపోతున్నపుడు వాటన్నింటిని సమన్వయపరిచి ఏకశక్తిగా..సింగిల్‌ వెక్టార్‌గా రూపొందించుకోవాలి.. అంటే మనిషి తనలో నిబిడీకృతంగా ఉన్న వివిధ శక్తులను గుర్తెరిగి వాటిని సమీకృతపరచుకుని ఏకలక్ష్య గమనంతో గమ్యంవైపు సాగాలి. రథసారధి అనూరుడు. తొడలు లేనివాడు. కనీసవేగంతో ఒంటిచక్రపు రథాన్ని నడుపుతూ, ఏడు గుర్రాలను సమన్వయపరుస్తూ, అదుపులో ఉంచుకుంటూ క్రమశిక్షణతో నిండిన కాలస్పృహతో పయనం సాగించేవాడు. అంటే జీవితమనే గమనానికి సారధ్యం వహించేవానికి అంగవైకల్యం ఏవిధంగానూ ఒక అవరోధం కాదు- అని. గుర్రాలను నియంత్రించే పగ్గాలు.. పాములు. సజీవమైన పగ్గాలు సక్రమంగా పనిచేయాలంటే సమర్థవంతమైన పాలనతో కూడిన నిర్వహణ ముఖ్యం..అందుకు పాటవం కావాలి. అన్నింటినీ మించి ప్రతి దినమూ భూగోళానికంతటికీ సంబంధించి కాలధర్మానికీ, సృష్టి నియమాలకూ లోబడి నియమిత ప్రాంతంలో, నియమిత కాలంలో సూర్యుడక్కడకు చేరి, విధులను నిర్వర్తించి ఉదయాస్తమయ ధర్మాలను పాటించాలి.. ఒక నిర్దుష్ట మార్గాన్ని అతి ఖచ్చితంగా పాటించాలి. ఐతే.. ఏ దారీలేని ఆకాశమార్గంలో.. మేఘాల్లో..ఎప్పటికప్పుడు దారిని తెలుసుకుంటూ, పథభ్రష్టత చెందకుండా ఒళ్ళు దగ్గరపెట్టుకుని ప్రయాణం కొనసాగించాలి. జీవితంలో లక్ష్యాలను చేరేందుకు ఎప్పటికప్పుడు ఎవరికివారు తమతమ దిశను తామే నిర్దేశించుకుంటూ జాగ్రత్తగా సాగాలి..అని లేకుంటే దారితప్పి ఆత్మధ్వంసంతో మనిషి పతనం కావడం ఖాయం.. ఇంత వ్యక్తిత్వవికాస పాఠం సూర్యునితో, సూర్యునివల్ల..సూర్యునిద్వారా.,
తను ఎం.బి.ఎ చేస్తున్నపుడు మౌళిసార్‌ చెప్పిన ‘ఆదిత్య హృదయ వివరణ’. ఇది ఎంత గొప్ప అన్వయం. జ్ఞానం ఉన్న ఏ మనిషికైనా సూర్యుణ్ణి మించిన స్ఫూర్తి ప్రదాత ఇంకెవరుంటారు.,
ఆకాశంనుండి ఒక నక్షత్రం రాలిపడ్డ అనుభూతి కలిగి..చటుక్కున తెగిపోయి..ఉలిక్కిపడి,
టైం చూచుకుంది లీల. ఎనిమిదీ పది. తొమ్మిదీ నలభైకి యుఎస్‌ఎ ఫ్లైట్‌..తయారుకావాలి.,
ఇంతకూ నిర్మల ఎందుకు ఫోన్‌ చేసినట్టు,
చకచకా నిర్మలకు నంబర్‌ కలిపింది..రింగై..”నిర్మలా..”
”మేడం..పావుగంటనుండి మీకోసమే ప్రయత్నిస్తున్నా..లైన్‌ కలువడంలేదు”
”చెప్పు..”
”ఒక అలర్ట్‌ న్యూస్‌”
”మనం. ఇరాక్‌ యుద్ధం తర్వాత రీ కన్‌స్ట్రక్షన్‌ ప్రోగ్రాంలో భాగంగా విపరీతమైన ప్రాజెక్ట్స్‌ దొరుకుతాయని ఒక మూడునెలలకాలం కేవలం మిడిలీస్ట్‌ కార్యకలాపాలపైననే దృష్టి పెట్టాం జ్ఞాపకముందా. బస్రా పవర్‌ ప్రాజెక్ట్‌ ఇన్‌స్టలేషన్‌కు సంబంధించి అమెరికా కంపెనీ ఆల్టెక్‌ పవర్‌ ఇన్‌కార్పొరేషన్‌తో కలిసి ఇండియాకు చెందిన మన క్లెయింట్‌ రమేశ్‌ సహానీకి రెండు మిలియన్‌ డాలర్ల కాంట్రాక్ట్‌ ఇప్పించాం..జ్ఞాపకముందా..ఆ డీల్‌లో మెక్సికోకు చెందిన జెన్‌రోవర్‌ అండ్‌ కంపెనీతో గొడవపడ్డాం.. మీరు ఒకసారి మెక్సికోకూడా వెళ్ళొచ్చారు. రోజర్స్‌, మైకేల్‌, మిసెస్‌ బర్గర్‌,మిస్‌ హోస్టలర్‌..ఊఁ..ఐతే నిన్నరాత్రి ఎవరో గుర్తుతెలియని దుండగులు రమేశ్‌ సహానీని గుజరాత్‌ గాంధీనగర్‌లో కృష్ణ ఐమాక్స్‌ థియేటర్‌లో తన కీప్‌తో కలిసి సినిమా చూస్తూండగా కాల్చి చంపారు..ఎవరో ఆ పాతపగను పర్సూ చేస్తున్నారు..మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇపుడు మిసెస్‌ బర్గర్‌ గ్రూప్‌ మార్చి అలెక్స్‌ మైకేల్‌ గ్రూప్‌లో ఉందట. ఆమెకు మీరు..మీ గురించిన పూర్తి వివరాలు తెలుసు. చాలా పదునైన మనిషి – యంగు అండ్‌ బ్యూటిఫుల్‌. ఆమె ఫోటోను మీకు మెయిల్‌ చేస్తున్నా. మొన్ననే ఆమె ఇండియాకు వచ్చి వెళ్ళినట్టు తెలిసింది..”
చెప్పుకుపోతోంది నిర్మల..ఒక పోలీసాఫీసర్‌కంటే స్పష్టంగా,
యంగు అండ్‌ బ్యూటిఫుల్‌..నిర్మల కూడా. కార్పొరేట్‌ రంగాల్లోగానీ, దుర్మార్గమైన నీచరాజకీయాల్లోగానీ, మాఫియా గ్రూపుల్లోగానీ కీలకమైన వ్యక్తులు వ్యక్తిగతమైన ఆసక్తులతో ద్రోహపూరిత చర్యలతో ప్లాట్‌ఫాం మారడం ఎంతో సహజమే.. ఐతే, నాయకత్వం వహించేవాళ్లు ఎప్పుడూ ‘ఎదుటివాడు దొంగ..ద్రోహి’ అనే దృష్టితోనే అనుక్షణమూ వ్యవహారాలను నిర్వహిస్తూంటారు. ఎక్కడైతే అత్యంత సుఖవంతమైన సౌకర్యాలూ, అధికారాలూ ఉంటాయో ప్రక్కనే తత్‌వ్యతిరేకమైనప్రాణభయంతో కూడిన ప్రమాదాలూ, రిస్కూ పొంచి ఉంటాయి. ఉన్నతస్థాయి నిర్వహణలన్నీ తాడుపై పరుగువంటివి. పరుగును మరచి నడకకొనసాగిస్తే లోయల్లోకి పత్తాలేకుండా కూలిపోతారు..ధ్వంసమైపోతారు.
”ఓకే నిర్మలా..”
”టేక్కేర్‌ మేం..” లైన్‌ కట్‌ చేసింది.
”… ” లేచి..అద్భుతమైన పరిమళం నిండిన బాత్‌రూంలోకి నడిచింది లీల. గోరువెచ్చని నీటి షవర్‌క్రింద స్నానం కానిస్తూ,
ఆమె మెదడు పాదరసంలా జ్ఞాపకాలను తవ్వుతోంది. మార్చి 20, 2003న ప్రారంభమైన ఇరాక్‌ యుద్ధంలో అమెరికా సేనలు ఇరాక్‌ సమాజాన్ని కకావికలు చేసిన విధ్వంసం తర్వాత, యుఎస్‌ 35 బిలియన్‌ డాలర్ల సహాయాన్ని ఇరాక్‌ పునర్మిర్మాణం కోసం ప్రకటించిన తర్వాత, యిక అంతర్జాతీయ స్థాయి రాబందులన్నీ ఇరాక్‌ నేలపై వాలడం మొదలైంది. మల్టీనేషనల్‌ కంపెనీల ముసుగువేసుకున్న ఈ దిక్కుమాలిన కంపెనీలన్నీ దేశం ఏదైనా ఒకే ఒక అనైతిక మూలసిద్ధాంతాన్ని కలిగి ఉంటాయి. అదేంటంటే ‘పే అండ్‌ యూజ్‌’. నిజానికి ఇది ప్రైవేట్‌ టాయ్‌లెట్‌ ఆపరేటర్ల స్లోగన్‌. ఇదే నినాదం అత్యున్నత స్థాయి అంతర్జాతీయ వ్యాపార సంస్థలు కూడా ఖచ్చితంగా పాటిస్తాయి. దేశమేదైనా, వ్యక్తి ఎవరైనా డబ్బుకు లొంగని వాడెవడూ ఉండడు. గో ఎ హెడ్‌ అండ్‌ కాప్చర్‌. అంతే. ఆ క్రమంలో అమెరికాకు చెందిన ఫిలిప్‌ బ్లూమ్‌ కంపెనీతోకలిసి మెక్సికోకు చెందిన జెన్‌ రోవరో 1.2 బిలియన్‌ డాలర్ల పవర్‌ ప్రాజెక్ట్‌లను బస్రా, కుర్దిష్‌, రుమాలియాలలో చేజిక్కించుకున్నపుడు మెల్లగా తను ప్రవేశించి 0-2-బి. ఒకటి, 0.4 ఒకటి, 0.3 ఒకటి ఇలా మూడు సబ్‌ కాంట్రాక్ట్‌లను రమేశ్‌ సహానికి యిప్పించింది. అందువల్ల జెన్‌ రోవర్‌ కొన్ని ప్రాజెక్టులను కోల్పోవలసి వచ్చింది తన వల్ల. అదీ తనపై వాళ్ళ పగ.అప్పుడైతే..రెండు నెలల బాగ్దాద్‌లోనే మకాం వేసింది తను ”ఆయిల్‌ ఫర్‌ ఫుడ్‌” పథకం క్రింద బైజి, రుమాలీయాలలో మన బిహెచ్‌ఇఎల్‌ 8.7 బిలియన్‌ రూపాయలతో నాల్గు గ్యాస్‌ టర్బయిన్‌లను నెలకొల్పడంలో మాత్రం తక్కువ అవినీతి జరిగిందా. సైట్‌ ఇంజనీర్‌ నాయర్‌, వాసుదేవ్‌, అలెగ్జాండర్‌, షర్మిల సక్సేనా.. వీళ్ళందరు ఎన్ని లక్షలు..కోట్లు తిన్నారో.. చరిత్రలన్నీ అవినీతి కంపు..వ్యాపారాలన్నీ పుట్టకురుపుల్లాంటి కుళ్ళు.,
స్నానం ఐపోయింది..ఒక చెత్త జ్ఞాపకం తెగిపోయింది. బయటకొచ్చి చకచకా పదినిముషాల్లో తయారై..యిక యిప్పుడెవడూ రారు తనకోసం..ప్యూర్లీ పర్సనల్‌ మూవ్‌మెంట్స్‌..రూంలోని ఇంటర్‌కాంలోనే రిసిప్షనిస్‌కు దోహా ఏర్‌పోర్ట్‌కు టాక్సీకోసం చెప్పి,
అద్దంలో..తనను తాను తృప్తిగా చూచుకుని..పొంగిపోతూ.,
కిందికి..ట్యాక్సీలోకి..పావుగంట తర్వాత దోహా ఏర్‌పోర్ట్‌లోకి..మరో పది నిముషాల్లో కతార్‌ ఏర్‌ వేస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫస్ట్‌క్లాస్‌..ఎ- త్రీ టు కిటికీ దగ్గరి ఫ్లాట్‌బెడ్‌లాంటి సీట్లోకి.. మరో పదినిముషాల్లో విమానం గర్జిస్తూ టేకాఫై ..గగనతలంలోకి.,
మళ్ళీ..శృతిలా కొనసాగుతున్న విమాన గర్జన మధ్య గడ్డకట్టిన నిశ్శబ్దం.
పదమూడు గంటల ప్రయాణం..బాగ్దాద్‌, బస్రా, ఫ్రాంక్‌ఫర్ట్‌…అట్లాంటిక్‌ మహాసముద్రంపై నాల్గుగంటలు..డెట్రాయిట్‌, పెన్సెల్వీనియా, బూస్టన్‌, న్యూయార్క్‌.
మళ్ళీ…అంతర్లోకాల్లోకి ప్రయాణం.,
రామం జ్ఞాపకమొచ్చాడు లీలకు.
జ్ఞాపకమొచ్చాడు అనడం తప్పేమో..మరిచిపోతేగదా జ్ఞాపకం రావడానికి.. కొన్ని జ్ఞాపకాలు నిరంతరం ఒక అనునాదంలా హృదయంలో సజీవంగా కదుల్తూనే ఉంటాయి. మెలకువలోనైనా..నిద్రలోనైనా.
రామం ఒక ప్రత్యేకమైన అతీత వ్యక్తి.

ఎక్కడి నుండి ఎక్కడి దాకా ? – 2 వ భాగం

ekkadi-2( గత వారం తరువాయి )

2

రాత్రి పన్నెండుగంటల నలభై రెండు నిముషాలు.ఎస్పీ విఠల్‌ చాలా అసహనంగా, చికాగ్గా..ఎందుకో పొయ్యిమీది గిన్నెలో మరుగబోతున్న నీటిలా ఉడికిపోతున్నాడు.

ఎండాకాలం.. ఉంచుకున్న మూడవ ఆడదాని మూడవ అంతస్తులోని ఎ సి గదిలో ఒంటరిగా..రివాల్వింగు చైర్‌లో అటు ఇటూ కదుల్తూ..నిప్పుకణికలా కణకణలాడ్తున్నాడు.
అంత అసహనం ఎందుకో అతనికే అంతుపట్టడంలేదు. కాని ఎందుకో ఏదో చేయాలని మాత్రం చాలా కసిగా ఉందతనికి.

ఎదురుగా టేబుల్‌పై ఆరోజే కొత్తగా సీల్‌తీసి పొద్దట్నుండి తోలుకేస్‌లో పెట్టుకున్న యుఎస్‌ఎ బెరెట్టా సర్వీస్‌ రివాల్వర్‌ ఉంది. తళతళా మెరుస్తూ, నిగనిగలాడ్తూ కొత్త పిస్టల్‌ పొద్దట్నుండీ లాడ్జింగు గదిలో తనకోసం ఎదురుచూస్తున్న కొత్త ఆడదానిలా కవ్విస్తూనే ఉంది.

పిస్టల్‌ను ఎప్పుడు వాడుదామా అని తొందర.. ఎవర్నయినా కాల్చి చంపితే ఎంత బాగుండుననే అజ్ఞాత కాంక్ష.. గులగుల.. ఉవ్విళ్ళూరే హింసోన్మాదం. ముట్టుకోవాలనీ, ముద్దుపెట్టుకోవాలనీ ఏదో తెలియని మోహం..,

ప్రతి మనిషిలోనూ తనకు తెలియకుండానే హింసను బలంగా యిష్టపడే పశుప్రవృత్తి అజ్ఞాతంగా ఉంటుందా.. అందుకే సినిమాల్లో ఫైటింగు దృశ్యాలను ప్రతిమినిషీ ఆనందిస్తాడా..వీధుల్లో ఎవరైనా కొట్లాడుకుంటూంటే అందుకే అందరూ ఆసక్తిగా తిలకిస్తూ ఆనందిస్తారా. చిన్నపిల్లలు అందుకే తూనీగనిస్తే రెక్కలనూ, తోకనూ పీకేసి హింసిస్తారా..బొద్దింకనిస్తే చీపురుపుల్లతో గుచ్చి గుచ్చి అందుకే చంపుతారా. మనిషిలో గుప్తంగా జ్వలించే ఈ హింసాపిపాస ఏమిటి.?

ప్రక్కనే టేబుల్‌పై తనకిష్టమైన ఫ్రెంచి విస్కీ 25 సంవత్సరాల ఏజ్డ్‌ గిన్లేవిట్‌ విస్కీ సీసా ఉంది. అప్పటికే రెండు పెగ్గులు దాటింది.. మూడవ పెగు సగం ముగిసి సోడా, ఐస్‌ ముక్కలు..ఏదో వెలితి..ఏదో ఉద్వేగం..ఏదో,

ఆ ఏదో ఏమిటి.. ఏమిటి కావాలి తనకు.,

యింతకుముందే డైమండ్‌ నెక్లెస్‌ కొనివ్వలేదని ఈ నంబర్‌ త్రీ అలిగి తనతో పడుకోకపోవడం కారణమా..ఆ మంత్రి వెధవ తమ మద్యవ్యాపార, వ్యవహార లావాదేవీల లెక్కలను మాట్లాడుకుందామంటే తమ జిల్లాకు పర్యటనకని వచ్చి గెస్ట్‌హౌజ్‌లో ఉండికూడా తనకు అపాయింట్‌మెంటివ్వకపోవడం కారణమా..పొద్దట్నుండీ ఈ కొత్త పిస్టల్‌ కవ్విస్తూండడం కారణమా..వ్చ్‌..ఏమో

మళ్ళీ కొద్దిగా విస్కీని సిప్‌ చేశాడు విఠల్‌. కసివల్ల కావచ్చు ఇంకా ఇంకా తాగాలనే కోరిక పురులు విప్పుకుంటోంది. రాత్రి ఎనిమిది తర్వాత అపాయింట్‌మెంట్సన్నీ కాన్సిల్‌ చేసుకుని సలుపుతున్న మనసుతో ఈ నంబర్‌ త్రీ యింటికొచ్చాడు. నేరుగా.. గంటన్నరసేపు.. బాగానే గొడవ జరిగింది. అరేబియా గుర్రంలా కవ్వించే ఆడది రంజని.. ఉహు..అస్సలే పడుకోలేదు. మొండికేసింది. ఎంత బతిలాడినా వినలే..తలుపులేసుకుని కనుమరుగైంది. కుంపటిలా కోరిక. ఇదస్సలే పడుకోదు.. అటు ఆ మంత్రిగానిపై కోపం పాదరసం లెవెల్‌ వలె పెరిగి పెరిగి తారాస్థాయికి చేరుతోంది. తామిద్దరికీ చెంది బినామీ పేర్లతో గ్యాస్‌ పవర్‌ స్టేషన్‌ నిర్మాణంలో ఏడాదిగా నడుస్తున్న రెండు వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ లెక్క, జిల్లాలో వాడి బామ్మర్దిపేర, తన ఉంపుడుగత్తె రంజని పేర నడుస్తున్న ఏడు బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, హైద్రాబాద్‌లో ఎనభై రెండు కోట్ల ఫ్లై ఓవర్‌ కాంట్రాక్ట్‌, దేవాదుల ప్రాజెక్టుకు మెటల్‌ పైపుల సప్లయ్‌, ఇరవై రెండు కోట్ల సబ్‌ కాంట్రాక్ట్‌, పద్దెనిమిది భూమి పంచాయితీల సెటిల్‌మెంట్లు, మంత్రి ఇన్‌స్ట్రక్షన్‌పై.. ఒక హత్య.. రెండు శాల్తీల గల్లంతు కేసులు.. అన్నీ కలిపి… కోట్లకు కోట్ల లెక్క తేలాల్సి ఉండగా.,

‘లంజాకొడ్కు నక్‌రాల్‌ చేస్తాండు’

మనిషిని అధికారం, నిర్భయం, ధీమా, అహం..ఇవి కళ్ళుండగానే గుడ్డివాణ్ణి చేసి ధైర్యం పేరుతో ఉన్మాదిగా మారుస్తాయి. విఠల్‌లోకి అహం కట్టలు తెంచుకుని ప్రవహించడం మొదలైంది.
అప్రయత్నంగానే విఠల్‌ టేబుల్‌పైన విస్కీ సీసా ప్రక్కనే ఉన్న కొత్త బెరెట్టా పిస్టల్‌ను చేతిలోకి తీసుకున్నాడు. ఒక బ్రహ్మస్తంలా చేతిలోకి ఆయుధం రాగానే ఒట్టి రాగి తీగలోకి విద్యుత్తు ప్రవేశించినట్టయింది. విఠల్‌.. విఠల్‌ ఐపిఎస్‌గా మారి.. ఒక జిల్లాకు ఎస్పీగా సర్వం సహాధికారిననే స్పృహ కలిగి.. ఎదురులేని నియంతకు గల శక్తి తెలిసి..,

ఏదో తెగింపు కట్టలు తెంచుకుంటూండగా.,

సెల్‌ఫోన్‌ను తీసి మినిస్టర్‌కు ఫోన్‌ చేయాలనుకుంటూండగా…, అట్నుండే కాల్‌..”విఠల్‌..రా..యిప్పుడ్రా..గెస్ట్‌హౌజ్‌లో ఉన్న..తెగ తొందరపడిపోతున్నావ్‌గదా..తేల్చుకుందాంరా.. లెక్కలను..”అంటున్నాడు మంత్రి.

వెధవ..మెట్రిక్యులేట్‌ ..నోరుతెరిస్తే..పశువుకు మాటొచ్చినట్టు..ఫైల్‌ చదువరాదు..ఎండార్స్‌మెంట్‌ రాయరాదు.. అధికారులు చెప్పేది విని..మళ్ళీ వాళ్ళకే ఉల్టా చెప్పి..నవ్వులాట..మంత్రి పదవి వెధవలకు ఓ నవ్వులాట థూ నీయమ్మ.. భారత రాజకీయాలన్నీ భ్రష్టు పట్టిపోయాయి. ఎంతసేపూ ఎలా అధికారంలో కొనసాగాలా, ఎలా పార్టీఫండ్‌ పేరుతో దండుకోవాలా అని అన్ని రాజకీయపార్టీలు సంకీర్ణ సహకారాల పేరుతో ఒకన్నొకడు బ్లాక్‌మెయిలింగు, సిగ్గువిడిచి బహిరంగంగానే ప్రజాధనం దోపిడి.. పెచ్చుమీరిపోయిన విచ్చలవిడి అవినీతి. ఎవనిపైన ఎవనికీ అదుపులేని అసమర్థ పరిపాలన.. ఎక్కడా కనిపించకుండా శాశ్వతంగా కనుమరుగైపోయిన క్రమశిక్షణ.,

బెరెట్టా పిస్టల్‌పై మోడల్‌ నంబర్‌ ధగధగా మెరుస్తోంది జుఎఔ. 8085 డిస్టింక్టివ్‌ సీరియల్‌ నంబర్‌. 25-03-92 సీరిస్‌ మ్యాగజైన్‌. ధర తొంభై వేలు.. కొన్న కోటిరూపాయల పిస్టల్స్‌ ఖరీదులో నలభైశాతం కిక్‌ బ్యాక్స్‌.

కిక్‌.. బ్యాక్‌.. వెనక్కి తన్ను.. వెనుకనుండి తన్ను.. వెనుక వీపుపై తన్ను.

ఎవని వీపుపై ఎవరు తన్నుట?..ఎవరి వీపుపైనైనా ఎవరైనా తన్నుట.

విఠల్‌ కొత్త పిస్టల్‌ను ప్యాంట్‌ బెల్ట్‌వెనుక, ముడ్డి దగ్గర పదిలంగా గుచ్చుకుని చకచకా నడిచాడు కిందికి.. కిందికి రాగానే తన అక్యురా కార్‌ను స్టార్ట్‌ చేసి మంత్రి బసచేసి ఉన్న గెస్ట్‌హౌజ్‌ దిక్కు పోనిచ్చాడు. ఒక మర్డర్‌కేస్‌లో లిక్కర్‌ కాంట్రాక్టరొకణ్ణి సేవ్‌ చేసినందుకు ఈ అక్యురా కార్‌ను వారంక్రితం తన మూడవ ఆడదాని పేర రిజిస్ట్రేషన్‌ చేసి లంచమిచ్చిన సంగతి ఎందుకో స్ఫురించింది విఠల్‌కు.. తిరుగులేని అధికారాలు తనవి.. ఎదురులేని మగాడు తను.

గెస్ట్‌హౌజ్‌ చేరుకుని, కారును పార్క్‌చేసి సూటిగా మంత్రిగారి ఆంటీరూంలోకి నడిచాడు విఠల్‌ వడివడిగా. అక్కడ విజిటర్స్‌ ఎవరూ లేరు.. అర్ధరాత్రి దాటింది కదా.

ఒక సెక్యూరిటీ కానిస్టేబుల్‌ మాత్రం కునికిపాట్లు పడ్తూ బెడ్‌రూం దగ్గర నిలబడి నిద్రలో జోగుతూ.. వాని దగ్గరా విస్కీ వాసన గుప్పుమంది.

‘నమ ..స్తే సర్‌” అన్నాడు ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్‌. వాడి పేరేమిటో తెలియదు. డ్రెస్‌లో ఉన్నాడు. బెల్ట్‌కు పిస్టల్‌ ఉంది. కళ్ళు ఎర్రగా..మాట ముద్దముద్దగా ఉంది.

విఠల్‌ కొద్ది అసహనంగా తలపంకించి మంత్రిగదిలోకి చొచ్చుకుపోయాడు.

గదిలోకి పోగానే మంత్రిగారి దగ్గర్నుండీ విస్కీవాసనే.

అంతా మత్తులో గమ్మత్తుగా జోగుతూ, తూగుతూ, ఊగుతున్న వేళ.,

ఒకడు భద్రతకోసం నియమించబడ్డవాడు.. మరొకడు ప్రజలందరి భద్రతకు హామీగా నిలబడవలసినవాడు, ఇంకొకడు మంత్రిగా రాజ్యాంగబద్దంగా ప్రజల భద్రతకూ, సంక్షేమానికీ బాధ్యత వహిస్తానని ప్రమాణం చేసినవాడు.. అందరూ విస్కీమత్తులో చిత్తయి ఉన్న వేళ.,

ఐనా తాగుబోతుల డబ్బులతో నడుపబడ్తున్న ఈ దిక్కుమాలిన, సిగ్గుమాలిన ప్రభుత్వాలు నీతి తప్పి, రీతి తప్పి విశృంఖలంగా, నిర్లజ్జగా ప్రవర్తిస్తున్న వర్తమాన సంకక్షుభిత సందర్భంలో..ఈ సన్నివేశం సమకాలీన భారత సమాజాన్ని ప్రతిబింబిస్తోందా..అనుకున్నాడు విఠల్‌.

ఎందుకో.. ఎదురుగా విశాలమైన డబుల్‌ కాట్‌ మంచంమీద విలాసంగా ఒరిగిఉన్న మంత్రి తలపై ఉన్న వాచ్‌దిక్కు దృష్టిపోయింది విఠల్‌కు. టైం ఒంటిగంట పది నిముషాలు.

”ఊఁ.. ఏందయ్యా.. తెగ గోల చేస్తున్నావ్‌ లెక్కలూ లెక్కలో అని..”

”…..” విఠల్‌ ఎదురుగా సోఫాలో కూర్చుని ఒట్టిగా, నిర్లిప్తంగా మంత్రివైపు చూశాడు.

”చెప్పు.. ఏం చేద్దాం..”

”ఆ పవర్‌ ప్రాజెక్ట్‌ పనులకోసం ఫ్లై ఓవర్‌ కన్‌స్ట్రక్షన్‌ కోసం.. నేనొక్కణ్ణే నా తరపున నూటా పదికోట్ల పెట్టుబడి పెట్టిన. మీరు వాటి సంగతే మాట్లాడ్డంలేదు. మీ బార్లు, సెటిల్‌మెంట్లు, భూముల లావాదేవీలు.. వీటన్నింటి కింద నాకు దాదాపు నా లెక్క ప్రకారం నలభై కోట్లు రావాలి. మొన్న మీ కీప్‌ రంజనికి సెటిల్‌మెంట్‌ కింద పద్దెనిమిదెకరాల భూమిని ఫ్రీగా ఇప్పించిన కేస్‌లో ఒక మర్డర్‌ కూడా చేయించవలసి వచ్చింది..”

”ఓకే.. ఓకే..ఐతే.. ఇప్పుడేంది”

” నాకు క్యాష్‌ కావాలి”
”ఎంత…”
”రెండు వందల కోట్లు”
”ఊఁ..”
”అక్కెరుంది నాకు”
”ఇప్పుడు లేవు..”
”అట్లంటెట్ల”

”ఇవ్వాళ ఉదయం చూచినౌగద..ముఖ్యమంత్రికే ఎసరుపెట్టిన..జంగు షురువైంది..పరేషాన్లున్న. అధిష్టానం నుంచి వార్నిగచ్చింది..మనుషుల్ని కొనాలె..”
”అందుకే చెబ్తున్న.. సెటిల్‌మెంట్‌ చేయమని”

”అరే.. రేపు కాబోయే ముఖ్యమంత్రిని నేనే..పొద్దుగాల్నుంచి మీడియా అంత చూచినౌకద. కోడై కూస్తాంది లోకం..”
”అని నువ్వనుకుంటానౌ. హై కమాండ్‌కు ఎదురు తిరిగినవని ఉన్న మంత్రి పదవి పోద్దని నా ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్స్‌ చెప్తానై..”
”అట్లనా..ఓరి కుక్కలకొడ్కా..నమక్‌ హరాం..శుభం పల్కురా పెండ్లికొడ్కా అంటే గిట్ల మాట్లాడ్తానౌర..అరేయ్‌..”
”మాటలు మంచిగా రానియ్‌..”
”ఏందిర నీతో మంచిగా మాట్లాడేది.. ఆఫ్టరాల్‌ ఒక ఎస్పీగానివి.. వెంట్రుక ముక్క లెక్క పీకేస్తే బంగాళాఖాతంల కొట్కపోవాలె నాకొడ్కా..”
”హోల్డ్‌ యువర్‌ టంగు మిస్టర్‌ మినిస్టర్‌” విఠల్‌కు తెలుసు ఎక్కడా తమ సంభాషణ రికార్డ్‌ కావడంలేదని.
”ఏందిరా హోల్డ్‌..బొచ్చు..ఇప్పుడు నాదగ్గర పైసల్లేవు.. పో.. పీకుతవా..”
”మీరు హద్దులు మీరి మీట్లాడ్తున్నారు. ప్లీజ్‌”

మంత్రి బోనులోపెట్టి కొట్టిన పులిలా మహోగ్రంగా ఉన్నాడు. అతను అంతకు ముందే ఒక రహస్య స్థావరంలో తను ప్రత్యేకంగా యిష్టపడి తెప్పించుకున్న ఓ పల్లెటూరి ఇరవై ఏళ్ళ యువతితో కుతిదీరా రమించి, అలసి.. తృప్తిగా పీకలదాకా తాగి, యిష్టమైన చికెన్‌ కబాబ్‌ తిని.. ఉదయం మీడియాతో రాజకీయంగా, ఎత్తుకు ఎత్తి కుదిపిన కుదుపుల చక్కిలగిలికి పొంగి.. అంతా మత్తు.. ఆనందం.. వెర్రి సంతోషం.. పరవశోన్మాదం..

తెరవెనుక మాస్టర్‌మైండ్‌ లీల ఆశీర్వాదం.,
”అరే ఎస్పీ.. ఏందిరా నీల్గుతానౌ”
”మాటలు.. మాటలు..”
”మాటలేందిరా..అట్లనే అంట..ఒక్క పెన్‌ స్ట్రోక్‌తో శంకరగిరిమాన్యాల్‌బడ్తవ్‌ బిడ్డా”

”అరే..దొంగవెధవా. నీ దిక్కుమాలిన చిట్టా విప్పిన్నంటే అదిరిపడి గుండెపగిలి చస్తవ్‌..జనం రేపు నీ నోట్లె ఊంచుతరు.. పొలిటికల్‌ బాస్టర్డ్‌.. నువ్వేందిరా నాయి పీకేది. ఇయ్యాల పవర్లుంటవ్‌ రేపు పోతవ్‌.. నీలాంటి బాస్టర్డ్స్‌ ఎందరు మారినా శాశ్వతంగా కుర్చీలల్ల ఉండి ఈ ప్రభుత్వాలను నడిపేది మేమేకాదురా గూట్లే.. షటప్‌”
”నన్నే షటప్‌ అంటవా..”
”ఔ అంట..మళ్ళీ మళ్ళీ వందసార్లంటు..నా పైసల్‌ పారేయ్‌బే”
”బే..”అవాక్కయిన స్తబ్దత.
”ఔ.. బేనే.. డబ్బుసంగతి చెప్పు ముందు. రెండు వందల కోట్లు”
”లెవ్‌.. ఏంజేస్తవ్‌”
”ఏంజేస్తనా..” ఆఁ.. ఏంజేస్తవ్‌రా”

”విఠల్‌ పిచ్చికుక్కయి పోయాడు. తలలో విజృంభిస్తున్న విస్కీ విస్ఫోటనం విచక్షణను చంపేసింది. ప్రక్కనున్న టీపాయ్‌మీది గాజుఫ్లవర్‌ వేజ్‌ను తీసి నేలకేసి కొట్టాడు బలంగా. అది భళ్ళున శబ్దంచేసి పగిలి ముక్కలుముక్కలైంది.

వెంటనే బయట నిద్రలో జోగుతున్న గన్‌మెన్‌ లోపలికి పరుగెత్తుకొచ్చి.. అప్రయత్నంగానే సర్వీస్‌ రివాల్వర్‌ను బయటికి తీసి.. ఎస్పీ విఠల్‌ దిక్కు, మంత్రి దిక్కు బిక్కుబిక్కున షాకై చూస్తూండగానే,

తృటికాలంలో.. విఠల్‌ మెదడులో తను ఆ రోజే సీల్‌ తీసిన తన బెరెట్టా పిస్టల్‌ జ్ఞాపకమొచ్చి.. తళ్ళుక్కున ఓ మెరుపు మెరిసినట్టయి.. హింసావాంఛ సముద్రంలా పొంగి, క్షణంలో వేయితలల సర్పమై పడగ విప్పి.. జస్ట్‌ ఫర్‌ ఫన్‌.

‘ఈ మంత్రిగాన్నిప్పుడు చంపితే ఎలా ఉంటుంది..చంపితే ఏమౌతుంది. మజాగా ఉంటుందికదా’ అని అనిపించి,

విఠల్‌ లిప్తకాలంలో తన నవనవలాడే కొత్త బెరెట్టా పిస్టల్‌తో గన్‌మెన్‌ను కాల్చాడు. క్షణంలో వేయవవంతుకాలంలో కొత్త తూటా కానిస్టేబుల్‌ గుండెలో దిగబడి, ఫౌంటెన్‌లా రక్తం చింది..చావుకేక గెస్ట్‌హౌజ్‌  దద్దరిల్లేలా విస్ఫోటించి.. మరుక్షణమే నేలపైకి కూలిపోతున్న గన్‌మెన్‌ చేతిలోని రివాల్వర్‌ను నేలపై పడకుండా అందుకుని..మరుక్షణమే దాన్ని మంత్రిపైకి గురిచూచి.. ట్రిగ్గర్‌ను నొక్కి.,

బుల్లెట్‌ మెరుపులా దూసుకుపోయి..మంత్రి తలను వందముక్కలు చేసి..అరిచే సమయంకూడా లేక ”తప్‌” మని  మంత్రి శరీరం మంచంపైనుండి కిందపడి..అంతా రక్తం..ఎర్రగా..జయ్‌ఁమని చిమ్ముతూ విస్తరిస్తూ.,
‘అసలేం జరిగింది.’

వ్చ్‌.. ఏమో చుట్టూ ప్రపంచం గిరగిరా..కసిగా..పిచ్చిపిచ్చిగా..ఆనందంగా.

విఠల్‌ చేతిలో రివాల్వర్‌తో నిలబడి..పడగెత్తిన విస్కీమత్తు శరీరం నిండా గర్జిస్తుండగా ఏదో ఒక కుదుపు..షాక్‌.

ఐతే విఠల్‌ పోలీస్‌ బుర్ర మెరుపులా మెరిసింది. వెంటనే గన్‌మెన్‌ పిస్టల్‌పైనపడ్డ తన వేలిముద్రలను చకచకా దస్తీతో తుడిచి, మళ్ళీ భద్రంగా వాడి శవం చేతిలో ఉంచి..
పేరు తెలియని గన్‌మన్‌ శవం దిక్కూ,  క్షణం క్రితం తనను ఏం పీక్కుంటౌరా’ అని హూంకరించి మరుక్షణమే దిక్కులేని కుక్క చావుచచ్చి కింద నేలకు కరుచుకుని పడున్న మంత్రి మృతశరీరం దిక్కూ, గిర్రున తిరుగుతున్న బుర్రతో, కళ్ళతో చూచి.. దీర్ఘంగా, గంభీరంగా శ్వాస ఎగపీల్చుకుని, నిట్టూర్చి.,

‘ఇట్స్‌ ఓ.కే..’ అనుకుని,

తూగుతూ ఒక్కో అడుగువేసుకుంటూ గదినుండి బయటికొచ్చి..’ఇప్పుడెలా’ అనుకుంటూ,

పోలీస్‌ మెదడు దీర్ఘకాల శిక్షణలవల్ల అతిసహజంగానే నేరపూరితమై ఎప్పుడూ పాదరసంలా సంచలితంగా ఉంటుంది.
బయటికి.. వరండాలోకి వచ్చి నిలబడ్డ విఠల్‌..అప్పట్నుండీ ఉరుముతున్న ఆకాశం విషయం గమనించనేలేదు. ఉన్నట్టుండి కుండపోతగా వర్షం మొదలై గాలివానతో మెరుపులు ముసురుకుంటూండగా.ఉలిక్కిపడ్డట్టయి..,
చకచకా ఓ కథ రూపుదిద్దుకుంటోంది విఠల్‌ పోలీస్‌ మెదడులో,

ఉదయం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మంత్రిగారు నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్‌ నేపథ్యంలో జిల్లా పర్యటనకు వచ్చిన తర్వాత..అనేకమంది ముఖ్యమంత్రి అభిమానులనుండి, శిబిరాలనుండి మంత్రిగారికి పుంఖానుపుంఖాల బెదిరింపు కాల్స్‌ వచ్చాయి పొద్దంతా. అందుకు ఆయనెంతో ఆవేదనచెంది భయపడ్డారు. ప్రాణభయంకూడా ఉందని చర్చిండానికి అసాధారణ వేళే ఐనా అర్ధరాత్రి ఏకాంతంగా మాట్లాడ్డానికి ఎస్పీగా తనను రమ్మని కబురుచేస్తే తను వచ్చాడు. సీరియస్‌గా మాట్లాడ్తున్న మంత్రి తన సహజధోరణిలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అనేక ఆరోపణలు చేస్తూ ముచ్చటిస్తున్న సందర్భంలో.. తాము అప్పటినుండీ గమనించని ముఖ్యమంత్రి వీరాభిమానియైన గన్‌మెన్‌ అనూహ్యంగా తన రివాల్వర్‌ను తీసి మంత్రిగారికి గురిపెట్టి బండబూతులు తిట్టడం మొదలెట్టాడు. అవాక్కయిన తను గన్‌మెన్‌ను వారించి సర్దిచెప్పే ప్రయత్నం చేసే లోపలే.. బాగా తాగిన మత్తులో ఉన్న గన్‌మన్‌ టకటకా పిస్టల్‌ను మంత్రిగారిపైకి కాల్చాడు. వెన్వెంటనే కుప్పకూలిన మంత్రి.. పెనుగులాటలో ఆత్మరక్షణార్థం, మంత్రిని రక్షించే ప్రయత్నంలో భాగంగా తను అనివార్యమై గన్‌మన్‌ కాల్చడం.. అంతా క్షణాల్లో జరిగి.,

మంత్రిగారి మరణం.. వెన్వెంటనే గన్‌మన్‌ మరణం కూడా,     కావలిస్తే.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో మంత్రీ, గన్‌మన్‌ ఇద్దరూ తాగినట్టు ఎలాగూ రిపోర్ట్‌ వస్తుంది. మంత్రి శరీరంలో కానిస్టేబుల్‌ బుల్లెట్‌, కానిస్టేబుల్‌ శరీరంలో తన రివాల్వర్‌ బుల్లెట్‌ ‘ఈ కథ బాగుంది. సరిగ్గా అతికింది’ అనుకున్నాడు విఠల్‌.

విఠల్‌ కొద్ది అసహనంగా తలపంకించి మంత్రిగదిలోకి చొచ్చుకుపోయాడు. అనుకున్నాడు విఠల్‌. శవాలూ ఉన్న బెడ్‌రూంలోకి వెళ్ళి, చేతికి దస్తీ చుట్టుకుని ప్రక్క వార్ట్‌రోబ్‌లో ఉన్నమంత్రిగారి బ్రీఫ్‌కేస్‌ను తెరిచాడు. ఆశ్చర్యం..నిండా బంగారు బిస్కెట్‌ బిళ్ళలు. మరుక్షణమే బ్రీఫ్‌కేస్‌ను మూసి.. టకటకా బయటికొచ్చి..వర్షంలో తన కారు డిక్కీ తెరిచి … క్రింద టూల్‌ బాక్స్‌దగ్గర బ్రీఫ్‌కేస్‌ను భద్రంగా సర్ది..ప్రశాంతంగానే డిక్కీని లాక్‌ చేసి..మళ్ళీ నెమ్మదిగా నడుచుకుంటూ వరండాలోకి వచ్చి నిలబడి..దీర్ఘంగా ఊపిరిపీల్చుకుని నిట్టూర్చి,
లోపల విస్కీ మత్తు విచ్చుకుపోతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది విఠల్‌కు.

ఆ క్షణం అతని మెదడులో..మంత్రి మరణంవల్ల తమ మధ్య లావాదేవీల్లో ఎంత నష్టమొస్తుంది..ఈ బంగారు బిస్కెట్ల విలువెంతుంటుంది.. మిగతాది ఎలా రాబట్టాలి..వంటి ఆలోచనలు చినుకుల్లా కురుస్తూండగా..,

ఈ గన్‌మన్‌ మరణం ఏమిటి..ఎందుకు..జస్ట్‌ఫర్‌ ఫన్‌ కదా..తన కొత్త పిస్టల్‌ను ఉపయోగించి పైశాచికంగా ఆనందించాలనే అంతర్గత రాక్షసవాంఛేనా,
ఐనా.. బూటు కింద ఒక చీమ ఎందుకు పడిచస్తుంది..పండిన టమాటాపై బూటుకాలు పడి చితికితే..వాటి
వెనుక హేతువేమిటి..అందుకు కారణమేమిటి..వంటి ఆలోచనలు..మీమాసం ఎందుకు..అనవసర పిచ్చిగానీ,
వ్చ్‌.. అంతా ట్రాష్‌.
విఠల్‌ చకచకా తన సెల్‌ఫోన్‌ను డయల్‌చేసి డిఎస్పీ ప్రకాశ్‌ను తన మందీ మార్బలంతో గెస్ట్‌హౌజ్‌కు రమ్మని  ఆదేశిస్తూ..,
అప్పుడు..ఆక్షణం..అంతా ప్రశాంతంగా..గంభీరంగానే ఉంది.

( సశేషం)

ఎక్కడి నుండి ఎక్కడి దాకా…? -మొదటి భాగం

rama intro

ముప్పది ఐదు సంవత్సరాల పరిపూర్ణ స్త్రీ లీల ఒంటిపైనున్న మెత్తని ఉన్ని శాలువను సున్నితంగా సవరించుకుంది. విమానం నిండా గంభీర నిశ్శబ్దం..మేఘాలను చీల్చుకుంటూ దూసుకుపోతున్న గర్జనవంటి మౌనధ్వని..గాత్రం ప్రవాహంలా సాగుతూంటే ఒక అంతర్లీనంగా వినిపించే ప్రాణప్రదమైన శృతివలె.

                ఫస్ట్‌క్లాస్‌ కేబిన్‌లో..అతి సౌకర్యవంతంగా..ఏర్‌హోస్టెస్‌ల కన్నుసన్నలలో..ముప్పదిఆరువేల ఫీట్ల ఎత్తులో, గంటకు తొమ్మిదివందల కిలోమీటర్ల వేగంతో..,

                అతివేగం..అతి అతిక్రమణ..అతి దూసుకుపోవడం..ఇవన్నీ ఎంత నిశ్శబ్దంగా, ఎంత నిశ్చలంగా,ఎంత గంభీరంగా ఎంత ఉత్సుకతతో నిండి ఉంటాయో…తన జీవితంలోవలె.

                ఎదురుగా ఇరవైమూడు అంగుళాల ఎల్‌సీడీ కంప్యూటర్‌ కం టి.వి. తెరపై ‘దోహా’ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువకాబోతున్న తమ విమానం ఏరియల్‌ వ్యూ కనబడ్తోంది..నాలుగ్గంటల క్రితం హైద్రాబాద్‌ ఏర్‌పోర్ట్‌లో ఐదు గంటలకు విమానంలోకి ఎక్కిన తర్వాత..బాంబే మీదుగా అరేబియా సముద్రం..సముద్రంపై వందల కిలోమీటర్ల ప్రయాణం..

                మనిషి ఒదిగి ఒదిగి, వంగి వంగి, నంగి నంగి తలవంచుకుని నిలబడి ఉన్నంతసేపు ఈ ప్రపంచం నీపై స్వారీ చేస్తూనే ఉంటుంది. నీపై ఉక్కుపాదాన్ని మోపి తాడనం చేస్తూనే ఉంటుంది. ఒక్కసారి తల విదిలించి, నిక్కి నిలబడి ప్రశ్నించడం, ఎదురుతిరగడం, ఎదురొడ్డి నిలబడడం, బిగించిన పిడికిలితో సమాజంపై స్వారీ చేయడం మొదలెట్టిన తర్వాత..ప్రపంచం చిన్న బొచ్చు కుక్కపిల్లలా మనిషికి స్వాధీనమైపోవడం, లొంగిపోవడం, వెంట అతి వినమ్రంగా నడిచివస్తూండడం.. ఇదంతా తెలుస్తూంటుంది విజ్ఞులకు.

ప్రపంచం నువ్వు జవాబు చెప్తున్నంతసేపు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఒక్కసారి నువ్వే ప్రశ్నించడం ప్రారంభిస్తే అది ఖంగుతిని తనే జవాబుదారీగా మారి జవాబులు చెబుతూనే ఉంటుంది. స్వారీ సమర్థవంతంగా చేస్తే గుర్రం నీకు లొంగిస్వాధీనమౌతుంది. అసమర్థంగా ఉంటే కింద నేలపై పడేసి పెక్కపెక్క తన్ని తరిమేస్తుంది.

అందుకే సమర్థుడైన నిర్వాహకుడు ఎప్పుడూ పగ్గాలను తన దగ్గర, తన అధీనంలో ఉంచుకుంటాడు.  ఎవరో చెబితే తను వినడం వేరు.. తను చెబుతూంటే ప్రపంచం వినయంగా విని విధేయంగా ఉండడం వేరు,

ఎందుకో లీల హృదయం వర్షించబోయేముందు, ఉరిమే ముందు ఆకాశంలా గంభీరంగా, ఆవేశంగా, ఉద్విగ్నంగా ఉంది.

ఒంటరితనం..మనిషిని వెంటాడ్తుంది.. గతాన్ని తవ్వి తవ్వి గాలివానలా ధ్వంసించి ధ్వంసించి, చిలికి చిలికి.. ఒక్కొక్కప్పుడు పుండును కాకిలా పొడిచి పొడిచి రక్తసిక్తం చేసినట్టు ..నొప్పి..హృదయంలో నొప్పి..అంతరాంతరాల్లో గుప్తమై రగిలే నొప్పి..బాధ..కసి..క్షోభ.. కన్నీళ్ళు..అపజయాలు..ఆకలి..దిక్కులేనితనం, నిస్సహాయత…అవమానాలు..తలవంచుకుని రాత్రులు రాత్రులు ఏడ్వడాలు..,

కాలేజిలో.. గణితం సబ్జెక్టులో ఎప్పుడూ క్లాస్‌ ఫస్ట్‌ తనే..కాలుక్యులస్‌..సంకలీకరణ..ఇంటిగ్రేషన్‌..రెండు అవధులు.. లోయర్‌ లిమిట్‌.. అప్పర్‌ లిమిట్‌..జీరోనుండి ఇన్‌ఫినిటీ..విస్తరణ. శూన్యంనుండి ప్రారంభమై విస్తరిస్తూ విస్తరిస్తూ..ఎదిగి ఎదిగి..వ్యాపించి వ్యాపించి..అనంతానంతాల పర్యంతం ఒక క్షేత్రమై.,

విస్తరణ..విస్తరణ.,

జీవితాన్ని ఎవరికి వారు నిర్మించుకుంటూ, కూలిపోతూ, ఓడిపోతూ, పాఠాలను నేర్చుకుంటూ మళ్ళీ మళ్ళీ పునర్నిర్మించుకుంటూ..జీవించడమంటే నిజానికి ఒక అంతులేని నిరంతర నిర్మాణక్రియను కొనసాగించడమే కదా.

నిజానికి..జీవితాన్ని నిర్మించుకోవడం..తన దృష్టిలో ఒక ఇసుకగూడును కట్టడం వంటిది..కాలు తీయగానే కూలిపోవడం..మళ్ళీ సరిగ్గా మెత్తి, మరమ్మత్తులు చేసుకుని..ఒక రూపాన్ని, ఒక ఆకారాన్ని, ఒక భౌతిక ఉనికిని..ఒక స్వప్నాన్ని ఆకృతీకరించడం..గూడు అందంగా కట్టడం ఒక అధ్యాయమైతే దాన్ని అలా కొనసాగించడం, కాపాడుకోవడం, రక్షించుకోవడం..ఆ క్రమంలో గూడును ఆనందించడం మరో అధ్యాయం. నిజానికి ఈ రెండవ అధ్యాయమే కీలకమైంది.. ప్రధానమైందికూడా.

అరేబియా సముద్రంపై విమానం ఎగురుతున్నపుడు..తన హృదయం ఎంత ఉద్విగ్నమైపోయిందో.

సముద్రం లోతైందా..మనిషి హృదయం లోతైందా..సముద్రం విశాలమైందా. మనిషి హృదయం విశాలమైందా..అనంతమైన అలజడితో, కల్లోలంతో నిత్యం ప్రళయగర్భయై భాసిల్లే మహాసముద్రం నిజానికి నిత్యపోరాటంతో జీవించే నిజమైన మనిషితో పోల్చినపుడు..ఒక సమాంతర ప్రతీకగా,

మనిషి..సముద్రం – సముద్రం..మనిషి.

ఎర్నెస్ట్‌ హెమింగ్వే నవలతో రూపొందిన సాహసోపేతమైన ‘ది ఓల్డ్‌మాన్‌ అండ్‌ ది సీ’ సినిమా జ్ఞాపకమొచ్చింది లీలకు.

పోరాటం.. పోరాటం.. నిరంతరం ఎడతెగని పోరాటం..అంతులేని పోరాటం. బ్రతకడానికి.. ఆకలి తీర్చుకోడానికి.. డబ్బు సంపాదించడానికి .. అధికారంకోసం.. పేరు ప్రతిష్టలకోసం.. శాశ్వతమైన తన అహంతో నిండిన ఆత్మతృప్తి కోసం.. పోరాటం.. కుట్రలు..కుతంత్రాలు.. పెనుగులాటలు.. వ్యూహాలు.. పాచికలు.. మందుపాతరలు..పెదవులపై చిరునవ్వులు.. మోసపూరిత పథకాలు.. ఎన్నో,     విమానం మెల్లగా ఆగడం..కాబిన్‌ లగేజ్‌నుండి అటెండెంట్‌ చేతికందివ్వగా తన అతి ఖరీదైన సామ్‌సొనైట్‌ బ్యాగ్‌ను తీసుకుని లేచి.. ఒకడుగు వేయబోతూండగా..హోస్టెస్‌ మిస్‌ హాస్టలర్‌ వినమ్రంగా తల పంకించి.. అంతా మౌనమే..కాని చిరునవ్వులు చిందే పెదవులు..పలకరించే కళ్ళు..ముకుళించే ముఖాలు..వ్యాపారమే ఐనా పరిమళించే మానవ సౌరభాలు..,

 

లీల ప్రీమియం ఎంట్రీలోకి ప్రవేశిస్తూ, తన బ్లాక్‌బెర్రీ సెల్‌ఫోన్‌ను స్విఛాన్‌చేసి ‘మెమో’ షీట్‌ తెరిచింది.

15 మే అపాయింట్‌మెంట్స్‌.

స్టే ఎట్‌ గ్రాండ్‌ రీజన్సీ ఇంటర్‌కాంటినెంటల్‌ హోటల్‌ రూం. నంబర్‌ 206. మహమ్మద్‌ రఫీక్‌ ఏర్పాట్లు పర్యవేక్షిస్తాడు.

మూడు అపాయింట్‌మెంట్స్‌. భారత జాయింట్‌ సెక్రటరీ టు డిపార్ట్‌మెంటాఫ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ అండ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌, రాంసక్సేనా, మినిస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ వర్క్స్‌, గవర్నమెంటాఫ్‌ అస్సాం అరుణ్‌ ఉజ్లేకర్‌, నీరజారావ్‌ కౌన్సిల్‌ ఎట్‌ ఫ్రాన్స్‌..మొత్తం రెండు గంటల నలభై నిముషాలు ఇంటరాక్షన్‌. నాల్గువందల ముప్పయి రెండు కోట్ల రూపాయల డీల్‌. తర్వాత దోహా స్థానిక ఇండస్ట్రియలిస్ట్‌ మహమ్మద్‌ బిన్‌ ఉసామాతో డిన్నర్‌..నాలుగు గంటలు నిద్ర..ఉదయం ఆరుగంటల పది నిముషాలకు ఎమిరేట్స్‌ విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం.

ఎందుకో ఒకసారి తనవైపు తనే చూచుకుంది లీల..ఏర్‌కండిషన్డ్‌ బస్‌ దిగుతూ మక్‌మల్‌ మడతల మధ్య ధవళవర్ణంలో ధగధగా మెరుస్తున్న మంచిముత్యంలా ఉంది తను.

ప్రపంచాన్ని మొట్టమొదట ఆకట్టుకునేది మనిషి బాహ్యరూపు..అందం..ఆకర్షణ. ఆ తర్వాత ఆ మనిషి వ్యక్తీకరణ, ప్రతిభ, తెలివితేటలు..ఆ తర్వాత ఆర్థిక, అధికారిక, వ్యాపారాత్మక లావాదేవీలు – ఇవన్నీ ఎంతో స్పష్టంగా తెలుసు లీలకు.

లీలకు మనుషుల మూలతత్వాల గురించి చాలా విపులమైన లోతైన అవగాహన ఉంది. ఆమె ఎదుటి వ్యక్తులతో చాలా తక్కువగా, అవసరమైనపుడు మాత్రమే మాట్లాడ్తుంది. ఎక్కువగా చూపులతో అధ్యయనం చేసి మొదట ఎదుటి మనిషిలోని బలహీనతలను కనిపెడ్తుంది. ప్రతి మనిషికీ ఏదో ఒక బలహీనత ఉంటుందని బలంగా నమ్ముతుందామె. అది డబ్బు కావచ్చు, కాంతా కనకాలు కావచ్చు, అధికార వ్యామోహం కావచ్చు, పేరు ప్రతిష్టలు కావచ్చు..ఏదో ఒకటి. ఏదో ఒక వ్యామోహం ప్రతి మనిషికీ ఉంటుంది. ఆ బలహీనతను గ్రహించి సరిగ్గా అక్కడ దెబ్బకొట్టగలిగితే వాడే విజయుడు.

భారతదేశంలో ఎంత పెద్దమనిషైనా తప్పకుండా ఏదో ఒక ప్రలోభానికి లొంగుతాడు. ఎంత ఉన్నతస్థానంలో ఉన్నవాడైనా తప్పకుండా ఏదో ఒకదానికి అమ్ముడుపోతాడు. దాసోహమై తనను తాను కోల్పోతాడు. నిశ్శబ్దంగానే మనుషులను, వాళ్ళ దిక్కుమాలిన వ్యామోహ వివశతలను పసిగట్టి చెస్‌ ఆటలో పావులను కదిపినట్టు ఒక్కో వ్యూహాత్మక కదలికతో జయిస్తూ వస్తున్న తను గత థాబ్దకాలంపైగా సాధించిన విజయాలు తనకు ఒక నిషానూ, మత్తునూ కలిగించే అనుభవాలుగా మిగిలిపోయాయి. ఇంత పెద్ద మనుషులు ఇంత సుళువుగా చిత్తయిపోతారా అని ఆశ్చర్యంతో తాను బిత్తరబోయిన సందర్భాలెన్నో.,

ఐతే..చాలా సమయాల్లో అవసరానికి మించి అతిగా మాట్లాడ్డం అనే అతిపెద్ద బలహీనతని లీల ఎంతో ప్రధాన విషయంగా గమనించింది. నిజానికి ఒక ఎగ్జిక్యూటివ్‌ యొక్క వ్యూహాత్మక మౌనం ఎదుటి మనిషిలో ‘భయం’ కల్గిస్తుంది.

first week fig-1

‘ఎగ్జిట్‌’ దగ్గరికి రాగానే తనూహించినట్టుగానే రఫీక్‌ వడివడిగా ఎదురొచ్చి ఒక అందమైన, విలువైన పూలబొకే అందించి, ఆమె చేతుల్లోని బ్యాగ్‌ను అతి వినయంగా అందుకున్నాడు.

”వెల్కం మేడం” అన్నాడు ముద్దముద్దగా.

ఆమె మాట్లాడలేదు. ఒక చిర్నవ్వు చిలకరించి మౌనంగా, గంభీరంగా అతని వెంట నడిచింది. అలా నడుస్తున్నపుడు విరజిమ్ముతున్న విద్యుత్‌కాంతుల నడుమ చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో ఆసక్తిగా అవాక్కయి తనను గమనిస్తున్నట్టు ఆమె గమనించింది.

రఫీక్‌ డోర్‌ తెరుస్తూండగా బయట సిద్ధంగా ఉన్న బిఎండబ్ల్యు కారు వెనుక సీట్లోకి చేరిందే తడవ..కారు మెత్తగా.. సర్రున నల్లని త్రాచుపాములా కదిలింది.

వేగం.. గాజుపలకపై ఇనుప గోళీలా..దూసుకుపోయే వేగం.,

తన ప్రతి క్యాంప్‌ ఏర్పాట్లను తన అత్యంత అంతరంగిక కార్యదర్శి నిర్మల స్వయంగా పర్యవేక్షిస్తుంది..మినట్‌ టు మినట్‌ కదలికలు, ప్రాంతాలు, వ్యక్తులు, వ్యవహారాలు, రక్షణ, బాధ్యతల అప్పగింతలు..అన్నింటినీ మించి ఫాలోఅప్‌, మానిటరింగ్‌.. వీటి విషయంలో నిర్మల నిజంగా సుపర్బ్‌.

‘యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌…’ఇంగ్లీష్‌లో ప్రకటన..ఎన్ని వందలసార్లు విన్నదో తను విమానాల్లో పయనిస్తూ..ఇక విమానం భూమిపైకి దిగబోతోంది. సీట్‌ బెల్ట్స్‌ పెట్టుకోండి, సీట్లను నిటారుగా ఉంచుకోండి. సెల్‌ఫోన్లను స్విచాఫ్‌ మోడ్‌లోనే ఉంచండి..వంటి అంశాలు..చివరికి పైలట్‌ ‘దయతో ప్రయాణంలో సహకరించినందుకు మీకందరికీ ధన్యవాదాలు..’అని ఓ సాంప్రదాయ వినమ్ర నివేదన.

ర్ర్‌ర్‌ర్‌మని ..విమానం టైర్లు నేలను తాకిన మ్రోతతో కూడిన భీకర ధ్వని.. కుదుపు. విడిచిన బాణంవలె దూసుకుపోతున్న గాలిధ్వని..ఒక పెద్ద సంరంభం.

ప్రక్కనున్న కిటికీలోనుండి చూచింది లీల. దోహా నగరం విద్యుత్‌కాంతులతో మిలమిలా మెరిసిపోతోంది. కతార్‌ ఎయిర్‌వేస్‌ ప్రధాన స్థావరం. అరబ్‌ దేశాల గుండెలా ఎదుగుతున్న అంతర్జాతీయ విమానయాన క్షేత్రం. ఇస్లాం సాంప్రదాయాలను పాటిస్తూనే వడివడిగా అంతర్జాతీయ స్థాయిని అందుకుంటున్న అత్యాధునిక విమానయాన సంస్థ కతార్‌.

తన ఆల్‌ గోల్డ్‌ వాచ్‌ చూచుకుంది లీల.

ఎనిమిది గంటల పన్నెండు నిముషాలు..’ఇప్పుడు నిర్మల తనతో మాట్లా..’అని మనసులో అనుకుంటూండగానే ఆమె సెల్‌ఫోన్‌ మోగింది.

”గుడీవినింగ్‌ మేడం..మీ కారు దోహా మాల్‌ దాటి అల్‌ ఖలీషా రోడ్‌లోకి ప్రవేశిస్తోందా..”

”ఎస్‌ నిర్మలా..”

”ఇంకో పన్నెండు నిముషాల్లో మీరు హోటల్‌ గ్రాండ్‌ రీజన్సీలో ఉంటారు. ఫ్రెషప్‌ కాగానే..సరిగ్గా తొమ్మిది గంటలకు రాంసక్సేనా ఐఎఎస్‌ మీ గదికొస్తాడు. అతను ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌లో ‘పరిశ్రమలు – పర్యావరణ కాలుష్యం..నివారణ’ అంశంపై మాట్లాడ్డానికి రెండ్రోజుల క్రితమే ఫ్రాన్స్‌లో ఉన్నాడు. మీతో మాట్లాడి ఆ ఎనభైకోట్ల రూపాయల ఎబిటు జీరోఫైవ్‌ బాపతు డీల్‌ను ఫైనల్‌ చేస్తాడు. అందుగ్గాను మనం అతనికి ఆరుకోట్ల క్యాష్‌ను స్విస్‌ బ్యాంక్‌ హిడెన్‌ కాతాకు బదిలీ చేస్తాం.. మేడం ఒకసారి మీ లాప్‌టాప్‌లో రెండు నిముషాల క్రితం నేను మీ జడ్‌ మెయిల్‌కు పంపిన ఫోల్డర్‌లో చూడండొకసారి. ఓవర్‌ వ్యూ వస్తుంది.. సి యు మేం..”గడగడా, స్పష్టంగా, పొల్లుపోకుండా చెప్పుకుపోయింది నిర్మల.

ఎందుకో లీల చిన్నగా నవ్వుకుని..లాప్‌టాప్‌ను తెరిచింది. ప్రపంచంలోనే అతి సన్నని లెనోవా 0.9 ఇంచ్‌ కంప్యూటర్‌ అది. చకచకా రిడిఫ్‌ మెయిల్‌ తెరిచి తన రహస్య పన్నెండవ ఇ మెయిల్‌ క్లిక్‌ చేసింది. నిముషమున్నర క్రితం వచ్చిన నిర్మల మెయిలది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాం ఇన్ఫోటెక్‌ అనే సంస్థ ప్రవీణ్‌రెడ్డి నేతృత్వంలో ప్రపంచ వ్యాప్తంగా పద్దెనిమిది సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కంపెనీ వ్యాల్యూ ప్రైస్‌వాటర్‌ కూపర్‌ మదింపుద్వారా నాల్గువేల కోట్లుగా నిర్దారించబడింది. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెజ్‌ల ఏర్పాటుక్రింద భారత ప్రభుత్వానికి భూమి కేటాయింపు గురించి ధరఖాస్తు పెట్టుకుంది. నూటా యాభై ఎకరాలను కనీస నామమాత్రపు ధర క్రింద రాం ఇన్ఫోటెక్‌కు కేటాయిస్తే నాల్గు సంవత్సరాలలో స్థలాన్ని అభివృద్ధిపర్చి, పరిశ్రమను స్థాపించి, మూడు వేలమందికి ఉపాధి..,

..ఇలా ఉంది ఫైల్‌-

‘అంతా ట్రాష్‌.. చెత్త…’అనుకుని వాస్తవస్థితిని ఉజ్జాయింపుగా అంచనా వేసింది లీల. నూటా యాభై ఎకరాలను ఎకరానికి యాభైవేల చొప్పున కొనుక్కుని ఏడున్నరకోట్ల పెట్టుబడితో నాల్గుసంవత్సరాల తర్వాత మూడువందల కోట్ల ఆస్తిగా మార్చుకోవాలని దుష్టమైన ప్రణాళిక. అందులో ముఖ్యమంత్రి బామ్మర్ధి కొడుకు పేరుమీద ఇరవైకోట్ల నగదు లంచం, భారీ పరిశ్రమల మంత్రి ఉంపుడుగత్తెకు పదికోట్లు.. మిగతా తతంగమంతా ప్రవీణ్‌రెడ్డి చూచుకోవాలి. ఆ పరంపరలో క్లియరెన్స్‌కోసం ఒక క్లెయింట్‌గా తమను ఆశ్రయించాడు ప్రవీణ్‌రెడ్డి. ‘లీలకు కేస్‌ అప్పజెప్పి కూచుంటే అంతా నిశ్చింత. బేఫికర్‌. ముందే కన్సల్టెన్సీ ఫీ మాట్లాడుకుని డాక్యుమెంట్లన్నీ ఇస్తే యిక అన్ని లెవెల్స్‌లో లీల తనే మేనేజ్‌ చేసుకుని పనిని సాధించిపెడ్తుంది.. బ్లాక్‌ యాక్టివిటీస్‌ చేయడానికి లీల హైలీ రిలయబుల్‌ వైట్‌ ఏజెంట్‌. ముందే అంతా స్పష్టం..’

లంచాల కింద ఇరవైరెండు కోట్లు..తన ఫీ ఐదు కోట్లు..టైం పీరియడ్‌ మూడు నెలల పదిరోజులు-

కేస్‌ స్టేటస్‌.. స్టేట్‌ గవర్నమెంట్‌నుండి అన్నీ క్లియరై..అనుకూలమైన రిమార్క్స్‌తో ఫైల్‌ భారత ప్రభుత్వ భారీ పరిశ్రమలు మరియు పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు పంపబడింది..పద్నాల్గు రోజుల క్రితం. ఫైల్‌ నంబర్‌ ఎఫ్‌ఫోర్‌ / టు త్రీ ఫైవ్‌ సిక్స్‌ / ఇండస్ట్రీస్‌ / 09 తేది 6 జూన్‌ రెండువేల తొమ్మిది.

అంతా అర్ధమైంది లీలకు.

తమకు అప్పటికే రెండుకోట్ల అరవై లక్షల అడ్వాన్స్‌ ముట్టింది. లంచాలు ఎనిమిది కోట్ల చిల్లర ఖర్చయింది.. ఇప్పుడు జాయింట్‌ సెక్రటరీ రాంసక్సేనా స్వయంగా ‘సెజ్‌’ శాంక్షన్‌ కాగితాలను తన దగ్గరకు తెచ్చిస్తాడు. అదీ ఏర్పాటు.

ఈ పనిని సాధించడానికి తన ఆధీనంలో పనిచేసే ఎందరో రిటైర్డ్‌ ఐఎఎస్‌ ఆఫీసర్లలో ఫార్మర్‌ హోం సెక్రటరీ రాజన్‌ పిళ్ళై ఎంతో సహకరించారు. పిళ్ళై, రాంసక్సేనా యిద్దరూ బాటిల్‌మేట్స్‌..రూట్‌ దొరికింది. సరియైన పనికి సరియైన నైపుణ్యంగల మనిషిని వెదికిపట్టుకుని ఆ పనిని అప్పజెప్పి నిర్విఘ్నంగా సాధించడమే ఒక మంచి మేనేజర్‌ లక్షణం.

నవ్వొచ్చింది లీలకు..ఈ ప్రపంచంలో ఎవడైనా డబ్బుకు లొంగేవాడేకదా..ఒకడు ఎక్కువకు, మరొకడు ఇంకా ఎక్కువకు.. కాని లొంగడం మాత్రం ఖాయమైన వర్తమానంలో మనిషి ‘మార్కెట్‌’గా మారి…వ్చ్‌, క భ్రాంతిమయ అనుభూతి ఆమెను ఆకస్మాత్తుగా ఆవహించింది. ఎక్కడి ఆంధ్రప్రదేశ్‌లో తూఫ్రాన్‌ వద్ద వెంకట్రావ్‌పల్లె దగ్గరి సెజ్‌..ఎక్కడి ఢిల్లీ…ఎక్కడి ప్రవీణ్‌రెడ్డి, ఎవరీ లీల..ఎక్కడి దోహా..ఎవరీ రాంసక్సేనా..ఆ భూమి తాలూకు కాగితాలను యిక్కడ..ఈ అరబ్‌ గడ్డపైకి తెచ్చి తనకు యివ్వడమేమిటి..?

వ్యాపారం..అంతా వ్యాపారం..డబ్బు..డబ్బు..,

మార్క్స్‌ అన్నట్లు..మానవ సంబంధాలన్నీ వ్యాపారాత్మక ఆర్థిక సంబంధాలేనా?

కారు ట్రాఫిక్‌ను చీల్చుకుంటూ డి- రింగ్‌రోడ్‌, అల్‌ సౌదన్‌, ఫరీజ్‌ అల్‌ అమిర్‌ రోడ్‌ మీదుగా..గ్రాండ్‌ రీజెన్సీ హోటల్‌ చేరుకుని..పొర్టికోలో ఆగి-

మెరుపులా రఫీక్‌ కిందికి దిగి..డోర్‌ తెరిచి.,

అద్భుతమైన హోటల్‌ అది. రోజుకు రెండువేల యాభై యుఎస్‌ డాలర్స్‌. గేట్‌ దగ్గర ఆరున్నర అడుగులఎత్తు ఓ షోమ్యాన్‌ వినయంగా వంగి సలాం చేసి..,

డబ్బు.. డబ్బు..డబ్బుతో హోదా..హోదాతో గౌరవం..గౌరవంతో తృప్తి, అహం..అహం ఒక ఎడతెగని నిషా.. రాజ్యాలూ, రాజ్యాధికారాలూ అన్నీ అహంతో సంభవించిన దర్పంతోనే ధ్వంసమైపోయినట్టు అరుస్తూ చెప్పే మానవ చరిత్ర.,

రఫీక్‌ అప్పటికే రిసెప్షన్‌లోనుండి లేజర్‌ మానిటర్‌ను తీసుకుని, పెద్ద హాల్‌కు ఒక ప్రక్కన ఉన్న కాంతులీనే లిఫ్ట్‌ దగ్గరికి తోడ్కొనిపోయి,

…రెండు వందల ఆరు..ఎగ్జిక్యూటివ్‌ సూట్‌..చుట్టూ గాజు తలుపుల్లోనుండి.. స్విమ్మింగ్‌ పూల్‌.. దూరంగా సముద్రం.. ఇటు ప్రక్క గార్డెన్‌..సన్నగా సంగీతం..వాతావరణం నిండా ఏదో భాషకందని మత్తు..శరీరాన్ని వీణతంత్రులను మీటినట్టు పులకింపజేసే పరిమళం., గాలినిండా ఏదో మహత్తరమైన వివశత.

”మేడం ..షలై టేక్‌ లీవ్‌.. మై డ్యూటీ ఈజోవర్‌..మార్నింగ్‌ మిస్టర్‌ నాయర్‌ విల్‌ కం ఎట్‌ ఫైవ్‌ థర్టీ.. టు టేక్‌ యు టు ఏర్‌పోర్ట్‌..’రఫీక్‌.,

”ఓకే..థ్యాంక్యూ.”

రఫీక్‌ వంగి..సలాం చేసి..అతను దృఢంగా..కండలు నిండిన శరీరంతో అరబ్‌ గుర్రంలా ఉన్నాడు. వీళ్ళందర్నీ ఇండియా నుండి నిర్మల ఏర్పాటు చేస్తుంది. రఫీక్‌కు వెళ్ళేప్పుడు రిసెప్షన్‌లో ఐదువందల డాలర్ల టిప్‌ ముడ్తుంది. అతని రోజుకూలీ వేయి డాలర్లు కాకుండా. ఊహకందని పేమెంట్స్‌. ప్రతి రహస్య కార్యకలాపం చాలా ఖరీదుగానే ఉంటుంది మరి.

రఫీక్‌ వెళ్ళగానే..వెన్నెల ముద్దలా ఉన్న డబుల్‌ బెడ్‌పై ఒక్క క్షణం ఒరిగి కళ్ళు మూసుకుంది లీల.

‘కన్ను తెరిస్తే ఒక ప్రపంచంలో నువ్వు ,

కన్ను మూస్తే నీలోనే ఒక గర్జించే ప్రపంచం..’ఎవరివో కవితాపంక్తులు.

వేగం.. వేగం..ఒక అతివేగవంతమైన ప్రపంచంలో కాలాన్ని వేటాడ్తూ తను..తనను వెంటాడ్తూ కాలం..ఊపిరి సలపని పరుగులో పూర్తిగా మృగ్యమైపోయిన విచక్షణ..తనలోకి తను తొంగి చూచుకోలేని తీరికలేనితనం..నిజానికి ఒక్కసారైనా ఆత్మలోకి అవలోకించుకోడానికి తనకే తెలియని ఏదో భయం.

అసలేంచేస్తోంది తను..ఎక్కనినుండి మొదలై ఎక్కడికి కొనసాగుతోంది తన గమనం..అసలు తనకు ఒక గమ్యం అనేది ఉందా..తన అంతిమ లక్ష్యం ఏమిటి?

సుడిగాలిలోని కాగితం ముక్కకు ఒక థ, దిశ ఉంటుందా.?

ఎందుకో ఒక్కసారిగా ఒళ్ళు జలదరించినట్టయి..దిగ్గున లేచి..బాత్‌రూంలోకి వెళ్ళింది. అన్నీ స్వర్గాన్ని మరిపించే ఏర్పాట్లు. మంచుతుంపరలు కురుస్తున్నట్టు కాంతి. తెల్లని వెండి మేఘాల తరగలపై నడుస్తున్నట్టు నేల..సన్నగా ఏదో మృదుధ్వని..పరిమళం.,

స్నానం కానిచ్చి..బట్టలను మార్చుకుని..డ్రైయర్‌కింద ఆరబెట్టకున్న జుట్టును విరబోసుకుని..డ్రెస్సింగ్‌ టేబుల్‌ముందు ..బంగారు చెంపలకు ఓలె క్రీం కొద్దిగా పూసి..,

‘ఎంత అందంగా ఉంది తను’ అనుకుంది లీల ఎదుట అద్దంలో తనను తాను చూచుకుంటూ..నాల్గడుగులు వెనక్కునడచి., బెడ్‌పై వాలి.,

టైం ఎనిమిదీ యాభై ఐదు.,

సెల్‌ఫోన్‌ మ్రోగింది.. నిర్మల.

”మేం. రాం సక్సేనా ఈజ్‌ ఆన్‌ద వే. వితిన్‌ ఫైవ్‌ మినట్‌ హి విల్బీ..”

ఫోన్‌ కట్‌ చేసింది ఏమీ మాట్లాడకుండానే

‘జిన్హే హమ్‌ భూల్‌నా చాహే..ఓ అక్సర్‌ యాద్‌ ఆతీహై..’అనూహ్యంగా ముఖేశ్‌ గీతం వినబడింది చానల్‌ మ్యూజిక్‌లో..సన్నగా.,

కత్తితో వెన్నముక్కను ఎవరో కోస్తున్నట్టు..సర్‌ర్‌ర్‌మని ఏదో..చటుక్కున సముద్రమై పొంగిన దుఃఖం..ఆకాశమంత ఎత్తున్న అల విరిగి పైనబడ్డట్టు ఏదో బీభత్స విధ్వంసం..

ఒక్కపాట..ఒక్క చరణం..మనిషిని ఇంతగా కకావికలు చేస్తుందా..?

వ్చ్‌.,

సరిగ్గా అప్పుడే..బయట బజర్‌మ్రోగింది.

లీలకు తెలుసు..వచ్చింది రాం సక్సేనా అని..చేతిలోని లేజర్‌ రిమోట్‌తో బయటి డోర్‌ తెరిచింది.

ఔను రాంసక్సేనానే..”గుడీవినింగ్‌ మేడం” అన్నాడు వస్తూనే.

‘ప్లీజ్‌’ అంది..ఎదుట ఉన్న సోఫా చూపిస్తూ.

రెండు నిముషాల మౌనం..నిశ్శబ్దం..తర్వాత..అతను తన బ్రీఫ్‌కేస్‌ను తెరిచి ఒక అందమైన ప్లాస్టిక్‌ ఫోల్డర్‌ను ఆమెకు వినయంగా అందించాడు.

సక్సేనా యిదివరకు ఢిల్లీలో జరిగిన ఒక పెళ్ళివిందులో తనకు పరిచయం. పిళ్ళై చేశాడు.

”శాంక్షన్‌ ప్రోసీడింగ్సాఫ్‌ దట్‌ సెజ్‌..మిస్టర్‌ ప్రవీణ్‌రెడ్డీస్‌..”

”ఊఁ..”కాగితాన్ని పరిశీలనగా, మెరుపుపాటుకాలంలో చూచి,

”హౌమచ్‌ యుహావ్‌ రిసీవ్డ్‌ సోఫార్‌”

”టు క్రోర్స్‌ మేడం. మిస్టర్‌ పిళ్ళై కన్‌సెంటెడ్‌ దిస్‌ అసైన్‌మెంట్‌ యాజె ప్యాకేజ్‌ ఫర్‌ ఫోర్‌ క్రోర్స్‌..”అని అర్ధాంతరంగా ఆగి.,

”ఐనో..ఐనో..”

”ఆల్‌రెడీ.. దిస్‌సెజ్‌ శాంక్షనీజ్‌ పబ్లిష్డ్‌ ఇన్‌ ఎస్టర్‌డేస్‌ గెజిట్‌”

”ఓకే..”

లీల చకచకా తన లాప్‌టాప్‌ను తెరిచి..ఏదో అకౌంట్‌లోకి వెళ్ళి ఇ-ట్రాన్స్‌ఫర్‌ ఆపరేషన్‌ ప్రారంభించి.,

”యు వాంట్‌ దిస్‌ మనీ టు బి క్రెడిటెడిన్‌ యువర్‌ జడ్‌ టు జడ్‌..హిడెన్‌ అకౌంట్‌..ఈజిట్‌”

”యస్‌ మేం..”

”నౌ దిసీజ్‌ డన్‌..యు కెన్‌ వెరిఫై..”

”నాట్‌ నెసెసరీ మేం..ఐ బిలీవ్‌”

దొంగల మధ్య నిజాయితీ, క్రమశిక్షణ, వృత్తిధర్మంపట్ల నిబద్ధత ఎక్కువగా ఉంటుంది. హవాలా లావాదేవీలన్నీ ప్రపంచవ్యాప్తంగా కాగితంముక్కకూడా ఆధారంలేకుండా అందుకే నిక్కచ్చిగా జరుగుతున్నాయి..కోట్లకు కోట్లుగా.

రాంసక్సేనా లేచి..” ఐ టేక్‌లీవ్‌ మేం..ఆల్వేస్‌ వుయ్‌ విల్‌బీ ఎట్‌ యువర్‌ డిస్పోజల్‌” అని వినయంగా తలపంకించి,

డబ్బు ముందు..వాడు ఐ ఎ ఎస్సా..ఆర్మీ ఆఫీసరా..రాజకీయ నాయకుడా..అన్న మీమాంస లేదు. లొంగిపోవాల్సిందే.. రేటు మారుతుందంతే.

అతను వెళ్ళిపోయాడు.

కాగితాన్ని బ్రీఫ్‌కేస్‌లో పెట్టింది. ఈ ఫైల్‌ క్లోజ్‌. హైద్రాబాద్‌ పోగానే ఇంకో యాభై లక్షల రూపాయలను పంచిపెడితే ఈ సెజ్‌ ప్రవీణ్‌రెడ్డి పరమైపోతుంది. భూమి వానివశమైపోయే కాగితాలన్నీ చకచకా తయారౌతాయి. ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ింద మిగిలిన రెండు కోట్ల నలభై లక్షలు తన బినామీ అకౌంట్‌లో జమైపోతుంది.

అన్నీ అంకెలు…ఒక అంకెప్రక్కన ఎన్నో ఎన్నో సున్నాలు.

అంకె లేకుంటే ప్రక్కనున్న సున్నాల విలువ సున్న. ప్రక్కన సున్నాలు లేకుంటే ఒంటరి అంకె విలువ విలువ లేనిదే.,

తను ఒక అంకెనా..ఒక సున్నానా..వాటి సమ్మేళనమా.,

అస్సాం పవర్‌ మినిస్టర్‌ అరుణ్‌ ఉజ్లేకర్‌ అపాయింట్‌మెంట్‌ తొమ్మిదీ యాభై నిముషాలకు..ఇంకా అరగంట టైముంది.

చకచకా లిక్కర్‌ ర్యాక్‌ తెరిచింది..మాకల్లన్‌ విస్కీ బాటిల్‌. సోడా సీసా, ఐస్‌క్యూబ్స్‌.. క్రిస్టల్‌ గ్లాస్‌లో మిలమిలా మెరుస్తూ స్వర్ణద్రవం.

‘జిన్హే హమ్‌ భూల్‌నా చాహే..’

ఏవైతే మరిచిపోవాలనుకుంటూంటామో..ఆ జ్ఞాపకాలే ఎందుకో మళ్ళీ మళ్ళీ వెంటాడ్తూంటాయి మనిషిని.

జ్ఞాపకాలు ముఖంపై వర్షపు చినుకుల్లా..శిరసుపై చిరుజల్లు ముసురులా, మూసిన కళ్ళపై ముసిరే తూనీగల్లా.. ఒంటరిగా నడుస్తున్నపుడు తలపై రాలే పొన్నపూల జల్లులుగా,

ఎక్కడో వీణతీగ మ్రోగి..రాగాలను చిందించి..మైమరపించి..చటుక్కున తెగి..అతికి..మళ్ళీ తెగి..,

అతను జ్ఞాపకమొచ్చాడు..అతను..పన్నెండేండ్లక్రింద పరిచయమై, ఒక మానవ పరిమళమై..ఒక స్పర్శించే వీచికై..ఒక అర్థంకాని ఏదో ఐ..అతను..అతను..అతను.,

మనసు నిండా ఒక సముద్ర గంభీర నిశ్శబ్దం.. స్తబ్ద ప్రళయం..మౌన అలజడి.,

అస్సాం మంత్రి అరుణ్‌ రావడానికి..ఇంకా పదినిముషాలు.

తెలుసు..ఆ కేస్‌ వివరాలన్నీ లీలామాత్రంగా మేథోపథంలో ఉన్నాయి. డిబ్రూగడ్‌లో స్థాపించబడ్తున్న రెండు వందల తొంబయ్‌ మెగావాట్ల పవర్‌ప్లాంట్‌లో రెండు గ్యాస్‌ టర్బయిన్ల నిర్మాణ కాంట్రాక్ట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ‘మిత్రా కన్‌స్టక్షన్‌’కు యిప్పించాలి. నూటా ఎనభై కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌. మిత్రా కన్‌స్ట్రక్షన్‌ కాకతీయ గ్రూప్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన దామెర లక్ష్మయ్యది. స్వంత రాష్ట్రంలో కాంట్రాక్ట్‌లు చేస్తే బద్‌నాం ఔతున్నామని ఇతర రాష్ట్రాలకు ఎగబాకుతున్న కంపెనీ. పదికోట్ల డీల్‌. గ్యాస్‌ రేట్‌ ఒడంబడికలో తను చేస్తున్న రేటు పెంపుదలతోనే ఎనిమిది కోట్ల లాభం వాడికి. చిన్న వెంట్రుకవాసి రేటు తేడా కొన్ని కోట్ల రూపాయల ఫలిత ప్రభావాన్ని చూపిస్తుంది.

సరిగ్గా పది నిముషాల తర్వాత కాలింగ్‌ బజర్‌ మ్రోగింది. తెలుసు లీలకు ఆ వచ్చింది అరుణ్‌ అని.

బెడ్‌పై కొద్దిగా సర్దుకుంటూనే.. లేజర్‌ రిమోట్‌తో డోర్‌ తెరిచి..

‘రాజకీయ నాయకులు, మంత్రులంటే పచ్చి లంజలకంటే కడహీనులు’ అనుకుంటూండగానే,

”గుడ్‌ మార్నింగ్‌ మేడం…”

వీడికి మార్నింగ్‌..ఈవినింగ్‌., నైట్‌ ..తేడాలు తెలియట్లేదనుకుని.,

”బోలియే ఉజ్లేకర్‌ సాబ్‌..కైసేహై ఆప్‌” అంది.

”బహుత్‌ మజేమే..”

”హమ్‌ ఆప్కో..”

”పూరా యాద్‌ హై..ఇస్‌ హఫ్తామే ఓ లక్ష్మయ్య సాబ్‌కా కాగజ్‌ దస్తకత్‌ కర్కే బేజ్‌దేంగే…పూరా కామ్‌ హోగయా.. బేఫికర్‌..”

”కామ్‌ హోతేహీ..ఆప్‌కా కిసీ ఆద్మికో ఢిల్లీమే 9390109293 నంబర్‌ మే కాంటాక్ట్‌ కర్లేకే పూరా దో కరోడ్‌ క్యాష్‌.. దౌజంట్‌ నోట్స్‌ లేజానా..ఓ ఆర్డర్‌లేకే హమ్‌కో ఫాక్స్‌ కర్‌దేనా..ఠీక్‌ హై”

”ఠీక్‌ హై మేడమ్‌..ఏక్‌ దమ్‌..పూరా క్యాష్‌ మిలేగా క్యా”

”హా..వోహీ చాహియేనా ఆప్‌కో”

”హా”

అతను లేచాడు.. మరో రెండు నిముషాల్లో ఆమెవైపు భయం భయంగా, కొద్దిగా ఆశగా ఆకలిగా చూచి..నీళ్ళు నములుతూ.., బై” అంది లీల.

ఖేల్‌ కతమ్‌..తాలీ బజావ్‌.,అరుణ్‌ ఉజ్లేకర్‌ నిష్క్రమించాడు.

లీలకు అస్సాం గ్యాస్‌ పవర్‌ ప్లాంట్‌లో జపాన్‌ ప్రభుత్వం పరస్పర అభివృద్ధి పథకాల, పరస్పర సహకార ప్రణాళికల కింద ముప్పయి ఎనిమిది మిలియన్ల ఎన్స్‌ అప్పు..ఆ తతంగమంతా జ్ఞాపకమొచ్చింది.

అప్పు అంతా ప్రజలవంతు..ఆనంద తాండవాలన్నీ, అనంత సుఖాల భోగాలన్నీ ప్రభుత్వాధికారులదీ, రాజకీయ నాయకులదీ ఐన ఈ వర్తమానం దేశాన్ని ఎవరికెవరికి, ఎంత దారుణంగా కుదువ బెడ్తోందో తలుచుకుంటే..అయ్యో పాపమనిపించి, నిట్టూర్చి.,

ఆకలి అనిపించింది లీలకు..అకస్మాత్తుగా.,

ముందరున్న స్క్రీన్‌పై చికెన్‌ టిక్కా, ఖలీఫా తందూరి ముర్గా ఆర్డర్‌ చేసింది.

ఎదురుగా..పల్చని బంగారు మాకల్లన్‌ విస్కీ ద్రవం..తెల్లని మంచుపూల వలె ఐస్‌.,

ఒక సిప్‌ చేసి.,

ప్రపంచం యావత్తు ఆనంద సముద్రంలో తేలిపోతున్నట్టనిపించి,

ఏ మనిషికైనా తన దుఃఖమే ప్రపంచదుఃఖం..తను అనభవిస్తున్న తన ఆనందమే చుట్టూ ఉన్న ప్రపంచ మానవాళి అందరి ఆనందమనుకుంటూ..ఒక భ్రాంతిలో బ్రతుకుతూ..ఒక మార్మిక ఆత్మవ్యంజనలో..,

ఇంకా గంట సమయం ఉంది..ఆ రోజు మూడవ కేస్‌ నీరజా రావ్‌తో. ఒక జర్మనీ కంపెనీ భారతదేశంలో స్థాపించాలనుకుంటున్న ఆటోమొబైల్‌ కంపెనీ తాలూకు అన్ని క్లియరెన్స్‌లు, ల్యాండ్‌ అలాట్‌మెంట్‌.. వగైరా ఏర్పాట్లన్నీ.. మూడువేల కోట్ల ప్రాజెక్టు. అందులో స్పెషల్‌ గ్రేడ్‌ రోవర్‌ వెహికిల్స్‌ను ఆరేళ్ళపాటు ఇండియన్‌ డిఫెన్స్‌ కోసం కొనుగోలు చేసేందుకు యంఓయూపై అడ్మిరల్‌ కులకర్ణీతో ఒప్పందం..డీల్‌-

‘అబ్బా..యిప్పుడు ఓపిక ఉందా..ఇదంతా చేయడానికి..’అనుకుంది లీల.

లేదు.. అని గోముగా జవాబొచ్చింది లోలోపల్నుండి.

వెంటనే నిర్మలకు ఫోన్‌ కలిపింది లీల..

‘నిర్మలా..కెన్‌ యు గెట్‌ నీరజారావ్‌ ఆన్‌ లైౖన్‌ ఫర్‌ డిస్కషన్‌..ఐ కాంట్‌ మీట్‌ హర్‌ పర్సనల్లీ నౌ..ఐ షల్‌ డిస్పోజ్‌హర్‌ ఓవర్‌ ఫోన్‌ ఓన్లీ.’

‘యస్‌ మేం. ఐ విల్‌ బి బ్యాక్‌ టు యు ఆఫ్టర్‌ టెన్‌ మినట్స్‌’

లైన్‌ తెగిపోయింది.,

ఒక దేశపు సైనిక శిబిరాల్లోనైనా తన సంస్థలో ఉన్న క్రమశిక్షణ ఉంటుందా. నిబద్ధత ఉంటుందా. బాధ్యతలపట్ల ఇంత అంకితభావముంటుందా అని అనిపించింది లీలకాక్షణంలో.

ఈ రోజు లీల ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ. భారతదేశం కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఏ పనంటే ఆ పని.. రాజకీయ, ఆర్థిక, వ్యాపార, సైనిక, రాయబార సకల రంగాల్లో ఏదైనా సరే.. ఆ పనిని అతి విశ్వసనీయంగా నిర్వహించగల ఏకైక శక్తి.. లీల.

లీల అంటే..నమ్మకం..గ్యారంటీ..లీలంటే ఒక ఓటమి ఎరుగని విజయం..లీలంటే ఒక వ్యూహాత్మక కార్పొరేట్‌ ఎత్తుగడ.. ఒక ఆధిపత్య ప్రతీక.

మొబైల్‌ సన్నగా ప్రకంపించింది.

”హలో”

” మేడం. నేను నీరజా రావ్‌ని..”

”హై..హలో నీరజా..చెప్పు..”

”మీరు చెప్పిన పనులన్నింటినీ విజయవంతంగా ముగించాను మేడం. రిపోర్ట్స్‌న్నీ నా దగ్గరున్నాయి. జర్మనీ ఆటోమొబైల్‌ జెయింట్‌ రోవర్‌కు ఆదిలాబాద్‌ దగ్గర వందా యాభై ఎకరాల స్థల కేటాయింపు, వాళ్ళు తయారుచేసే డిఫెన్స్‌ యుటిలిటీ వెహికిల్స్‌కు ఆరేళ్ళపాటు పర్చేజ్‌ గ్యారంటీ ఒప్పందం..అంతా ఓకే..సంబంధిత అధికారులు, నాయకులు, మంత్రులు..అందరూఓకె. పద్దెనిమిది కోట్ల లంచాలు..మిసలేనియస్‌ ఖర్చులు ఇంకో రెండు కోట్లు. వెరసి మీరు ఈ డీల్‌ను ముప్పయికోట్లకు ఓకే చేసుకోవచ్చు. మేడం, రోవర్‌వాళ్ళు ఐదుకోట్లు మన కువైట్‌ అకౌంట్‌లో రేపు వేస్తామంటున్నారు. మీరు ఓకే అంటే.. ఐ విల్‌ వెయిట్‌ ఫర్‌ యువర్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌.”

నీరజా రావ్‌ ఐఐఎమ్‌ బెంగళూర్‌ యంబిఎ క్వాలిఫైడ్‌. మెరుపులాంటి మేధ.. చూపితే కొండ ప్రాకే తత్వం. తన కన్‌సెల్టెన్సీలో మిడిల్‌ ఈస్ట్‌ ఇంచార్జ్‌. కాని పైకి మాత్రం ఫ్రాన్స్‌లోని రోవర్‌ కంపెనీలో రెసిడెంట్‌ కన్‌స్టలెంట్‌..

అంతా బినామి..

ఎక్కడా..తమ పేరు ఉండదు బాహాటంగా..అంతర్గతంగా మాత్రం అంతటా తమ పేరే ఉంటుంది.

ఉండీలేనట్టుగా..లేకా ఉన్నట్టుగా అనిపించేదే లీల కదా.

లీల ఒక మిథ్య…ఒక సత్యం..ఒక స్వప్నం..ఒక సందిగ్ద సందర్భం..భయంకొల్పే వాస్తవం..అంతిమంగా ఒక ఓటమి ఎరుగని విజయం.

చటుక్కున ఏదో తోచినట్టు ఉలిక్కిపడి..నీరజారావ్‌కు ఫోన్‌ కలిపింది క్షణంలో. ఆమెతో డైరెక్ట్‌ కాంటాక్ట్‌ డ్యూటీలో ఉన్న తమ ఇన్నర్‌ సర్కిల్‌ అసోసియేట్స్‌ లీల స్పెసిఫిక్‌ టూర్‌లోఉన్నప్పుడు హై అలర్ట్‌లో హాట్‌లైన్‌పై అందుబాట్లో ఉండి క్షణాల్లో ఆన్‌లైన్‌లో కొస్తారు పిలవగానే. లీల కంపెనీ పనిసంస్కృతి అది.

‘వెల్‌ నీరజా..రోవర్‌తో డీల్‌ పక్కా చెయ్‌’. మనం లాస్ట్‌ డిస్కషన్‌లో మెక్సికన్‌ కంపెనీ రిచర్డ్‌సన్‌ పవర్‌ సిస్టమ్స్‌ గురించి చర్చించాం. గుర్తుందా. కువైట్‌లో మన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కూరపాటి అండ్‌ సన్స్‌ గ్లోబల్‌ టెండర్‌కు అడ్డుతగుల్తున్నాడు వాడు. వాళ్ళ బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ వచ్చే ఇరవై ఎనిమిదిన ఫ్రాంక్‌ఫర్ట్‌ వస్తున్నాడు. డిటెయిల్స్‌, ఫ్లైట్‌ నంబర్‌, హోటల్‌..వివరాలన్నీ నీకు మెయిల్‌లో వస్తాయి. వాణ్ణి టాకిల్‌ చేయాలి. వినకుంటే వాటర్స్‌ హాలో రోడ్‌లో ఆరోజు రాత్రి ఒక రోడ్‌ యాక్సిడెంట్‌పేర వాణ్ణి లేపెయ్యాలి. వాడు ఆరోజు జాన్సన్స్‌ రిక్రియేషన్‌ క్లబ్‌లో ఒక పార్టీలో పాల్గొంటాడు. ఆపార్టీనుండి వస్తూండగా..ప్లీజ్‌ నోట్‌’

”ఓకే మేం..”

”గెట్‌ బ్యాక్‌ టు మీ..ఆన్‌ ట్వంటీ నైన్త్‌ ఈవినింగ్‌ ఎట్‌ సిక్సోక్లాక్‌ పాజిటివ్లీ”

”యస్‌ మేం..”

ఫోన్‌ పెట్టేసి..టకటకా ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలోని ఒక సీనియర్‌ మంత్రి విశ్వనాథరెడ్డికి లైన్‌ కలిపి..”మీరు రేపు ఉదయమే..ఎనిమిది గంటలలోపు ప్రెస్‌మీట్‌ పెట్టి ముఖ్యమంత్రి పనితీరుపై, అసమర్థతపై మండిపడ్తూ తీవ్రపదజాలంతో ఒక స్టేట్‌మెంట్‌ ఇవ్వండి. చదరంగం ప్రారంభమైంది. ఒక పావు కదపాలిప్పుడు మనం. మీకది ఉపయోగకరంగా ఉంటుంది..”అని ఆదేశించింది.

”యస్‌ మేడం..”

గుండెల్లో ఏదో ఉద్వేగం..ఒకని మరణశాసనం..ఒక ప్రభుత్వ పతనానికి ముహూర్తం.,

కళ్ళు మూసుకుంది..అలసటగా.

ఎదురుగా..విశాలమైన గాజుతలుపుల కారిడార్‌లోనుండి..చొచ్చుకొచ్చి నిరీక్షిస్తున్న నీలి సముద్రం. అలల ఎడతెగని చప్పుడు..లయబద్ధంగా..నిరంతరంగా..వింటోంది..వింటూనే ఉంది..,

ఆమెకర్ధమౌతోంది.. ఆమె బయట.. ఎదుట మాత్రమే కాదు.. తన లోలోపలకూడా ఒక నిశ్శబ్ద సముద్రం గర్జిస్తోందని,

టైం చూచుకుంది లీల కొద్దిసేపైన తర్వాత. రాత్రి రెండూ యాభై నిముషాలు.

ఈ దిక్కుమాలిన ప్రపంచంలో రాజకీయాల్లోగానీ, ఇతరేతర ఏ కీలక రంగాల్లోగానీ అతిప్రధానమైన నిర్ణయాలన్నీ రాత్రుళ్లే జరిగిపోతాయి. రాత్రుళ్ళు వ్యూహించుట..పగళ్ళు అమలు..ఒక రేయింబవళ్ళు వేట,

ఎందుకో ఆమెకు తన ఇష్టమైన ‘ఎర్త్‌’ బ్లూరే డివిడి చూడాలనిపించింది. లాప్‌టాప్‌లోనుండి ఎదుట ఉన్న శాంసంగ్‌ హోం థియేటర్‌ సిక్ట్సీ ఫోర్‌ ఇంచెస్‌ టి.విలోకి డిస్ని నేచర్‌ ‘ఎర్త్‌’ ఫైల్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసి ‘ప్లే’ నొక్కింది.

‘ఎర్త్‌’..అంటే..భూమి..ఫృథ్వి..పుడమి..ధరణి.,

స్త్రీ.. అంటే అన్నింటినీ భరించేది..ధరించేది..ధరణేకదా., టి.వి. తెరపై విశాలంగా ఒక ఎడారి విచ్చుకుని పరుచుకుంది. ఒక ఒంటరి గ్రద్ద..విశాలంగా విప్పుకున్న రెండు రెక్కలు.. పరుగెత్తుతోంది..పైన ఆకాశం..క్రింద భూమి,

లీల అలసిపోయిన ప్రతిసారీ ఈ ‘ఎర్త్‌’ డివిడిని చూస్తుంది..చూడగానే హృదయం రీచార్జ్‌ ఔతుంది. తను పునరుత్తేజిత ఔతుంది. ఈ భూమిపై చిగురించి, ఎదిగి, ఒదిగి, వికసించి, నశించి, దహించుకుపోయి, శిథిలమై, ఒట్టి అవశేషంగా మిగిలి..స్తబ్దమై..నిర్జీవమై..మళ్ళీ చిగురించి..,

‘వలయం వలయేతి..’

చక్రం.. కాలచక్రం..ఋతుచక్రం.. జీవచక్రం..జ్ఞానచక్రం..జగమంతా ఒక అవ్యవస్థిత చక్రగమనం.. చక్రభ్రమణం,

ఏనుగు శరీరం ఎంతో పెద్దది. కళ్ళు ఎంత చిన్నవో,

పక్షి ఏదైనా..రెక్కలు రెండు..ఎంత చిన్నవో..ఈదవలసిన ఆకాశం ఎంత విశాలమైందో..

గుర్రం కాళ్ళు ఎంత  సన్ననివి..కాని, దాని వేగం ఎంత ప్రచండమైంది. ఐతే జీవితమంతా పరుగే..పుట్టి భూమిపైన పడ్డ మరుక్షణం నుండి చచ్చేవరకు గుర్రం నిరంతరం రేయింబవళ్ళు ఎప్పుడూ నిలబడి ఉండడమే. అలసట ఎరగకుండా.. విధేయంగా, సహనంగా..ఎంత శిక్ష..జీవితకాల శిక్ష.

రెక్కలు మొలుస్తున్నపుడు ప్రతి పక్షీ ఎంత పులకించిపోతుంది,

పుడ్తున్నపుడు ఏ మొక్కయినా ఎంత అందంగా ఉంటుంది జీవకాంతితో.

ప్రతి జలపాతం..క్రింద పడి..పతనమై..చితికి…చింది..స్థూల ప్రవాహం ఒక సూక్ష్మ విస్తరణగా, వ్యాప్తిగా మారి..ఉత్థానం..పతనం..శృంగం, ద్రోణి – శిఖరం..లోయ..చీకటి, వెలుగు..ఉదయం, అస్తమయం..ప్రక్కప్రక్కనే, వెంటవెంటనే,

ఒక జింకను ఒక పులి వేటాడ్తోంది.. ఆకలిగా, కసిగా, దీక్షగా..తెరపై .,

ఆ క్షణం ముందు పులి పొడ జింకకు తెలియదు.. జింక ఉనికి పులికి తెలియదు..ఒకదానికి మరొకటి తటస్థపడగానే.. ఆత్మరక్షణ..వేట..వేటాడబడ్డం.,

భూమ్మీది ఈ సకల చరాచర జీవరాశులన్నీ జీవించడానికి పోరాడ్తూనే, ఆత్మరక్షణ కోసం వ్యూహాత్మకంగా బ్రతుకంతా యుద్ధం చేస్తున్నాయి..కదా.

యుద్ధం..యుద్ధం..జీవితమంటే..యుద్ధం..పోరాటం.,

ఎవరితో..?

సముద్రాలు..ఎడారులు..అడవులు..ఆకాశం..ఈ సమస్త జీవజాలం..,

అంతా ఏనాడూ ఎవరికీ అర్ధంకాని ఒక వ్యవస్థ..ఒక పాఠం..ఒక సజీవ బోధన..అంతా ఉండి చివరికి ఏదీ ఉండదని నిరంతరం ఒక సత్యాన్ని ప్రవచించే ప్రజ్వలిత చేతన.,

లీల మనసునిండా ఒక ఛాయామాత్రంగా సమస్త సృష్టి.. క్రమంగా వ్యాపించి..అల్లుకుపోతూ..ఎక్కడో తెలిపోతూ.,

గాలి కనబడ్తుందా..?ప్రశ్న.

కనబడదు కాబట్టి గాలిలేనట్టు కాదుగదా.

కనబడనివన్నీ లేనట్టా.. కనబడేవన్నీ ఉన్నట్టా..,ప్రతి మనిషికీ తెలిసే ‘ఆకలి’ ఉన్నట్టా లేనట్టా.

ఎందుకో ఆమె హృదయపు లోపొరల్లో అన్నమయ్య కీర్తన కదిలి సన్నగా వినిపించడం మొదలైంది.

‘అంతర్యామీ..అలసితి..సొలసితి..’

లీల కళ్ళు మూసుకుంది.

ఎందుకో ఆమె కళ్ళనిండా నీళ్ళు నిండి..దుఃఖం పొంగి పొంగి,

అప్పుడామె తీరాన్ని చేరబోతున్న సముద్రపుటలలా..కల్లోలంగా ఉంది.

(సశేషం)

రామా చంద్ర మౌళి కలం నుంచి కొత్త సీరియల్ వచ్చే వారం నుంచి ప్రారంభం!

Saranga_1

 

ఛానెల్ 24/7 -15 వ భాగం

sujatha photo

  (కిందటి వారం తరువాయి)

ఆయనకు దక్షిణామూర్తిని చూడాలనిపించింది. అతన్ని భరించాలనిపించింది. ఆయన తప్పకుండా ఏదో ఒకటి అంటాడు. తన జీవితాన్ని విమర్శిస్తాడు. ఇది కూడదంటాడు. తను ఇంకెలాగో ఉండాలంటాడు. ఆయన తనను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. తన స్నేహితుడు. ఆయన ఇంకోలా ఎలా వుంటాడు.

బాయ్‌ని పిలిచి దక్షిణామూర్తిగారిని లోపలికి తీసుకు రమ్మన్నాడు. తను గబగబ వచ్చేశాడు. ఆయన అందరినీ పలకరిస్తూ స్టూడియో బయటే నిలబడ్డాడు. ఆయనకొసం తను ఆగలేదు. ఇప్పుడాయన చెప్పేవన్నీ తన మనసు తనకు చెబుతున్న విషయాలు. తన గురించి తనకు తెలిసినవీ, తన విజ్ఞత తనను మనిషిగా  ఉండమని హెచ్చ్చరిస్తున్నవే. ఇప్పుడు దక్షిణామూర్తి వస్తాడు అనుకొన్నాడు ఎస్ఆర్‌నాయుడు.

***

“ఇప్పుడు అడుగుతున్నా మేడం.. మీ పర్సనల్ లైఫ్ ఎందుకు డిస్టర్బ్ చేసుకున్నారో చెప్పండి..”

“నయనా.. నువ్వు ప్రశ్న సరిగ్గా అడుగు. నేను తిన్నగా చెబుతాను. నీ ఆలోచనలోంచి నన్ను చూస్తున్నావు. నా జీవితంలో డిస్ట్రబెన్స్ లేదు. నేనో మార్గం ఎంచుకొని అటు తిన్నగా నడుస్తూ వచ్చాను. ఒక వ్యాపారి తన వ్యాపారం అభివృద్ధి చేసుకొన్నట్లు నాయర్‌తో విడిపోయేసరికి నేను ఎడిటర్‌గా వున్నానని చెప్పానుగా. ఒక పత్రికా నిర్వహణ నా పర్సనల్ లైఫ్‌కి ఎక్కడా టైం కేటాయించనివ్వలేదు. ప్రపంచంకంటే కొన్ని గంటలు ముందుగా నిద్రలేవలసిన ఒక జర్నలిస్ట్ తనని తాను ఎంతగా అప్‌డేట్ చేసుకోవాలో అంతా చేశాను. ఇతర పత్రికలతో పోటీ, నా పత్రిక నిరంతరం సర్కులేషన్ పెంచుకోవటం కోసం నే పడ్డ తపన, నా కేంప్‌లో నేను కలుసుకొనే మనుష్యులు,నా జీవితానికి కేంద్ర బిందువు నా కెరీర్, నేను ఉమెన్ ఎడిటర్‌ని, టాప్‌మోస్ట్ జర్నలిస్ట్‌ని, ఎడిటర్స్ గిల్డ్ మెంబర్‌ని. నా ఎడిటోరియల్స్ గురించి నిరంతరం చదువు విశ్రాంతి లేని నా జీవితంలో నాయర్ ఎక్కడో మాయం అయ్యాడు”

“అంటే  కెరీర్, పర్సనల్ లైఫ్‌కి విలువివ్వదా..?”

“మనం ఒక ప్రవాహంలో వున్నాం. ఉదయం నిద్రలేవటం దగ్గరనుంచి ఆఫీస్ ఫోన్స్, బయటనుంచి కలుసుకోవలసిన వీఇపిలు.  పర్సనల్ లైఫ్‌కి ఒక గీత చెరిగిపోయింది. నాయర్‌తో విడిపోయాక నాకింకో పర్సనల్ జీవితం ఏముంది. పాపాయి చదువుకొంటుంది. బాబాయి కుటుంబంతో వుంది. నాకు ఆమె బాధ్యత లేదు. నేను, నాకోసం చరిత్రలో ఒక పేజీ సంపాదించుకోవాలనుకొన్నాను. అది నా లక్ష్యం.”

“వైఫల్యాలు, నష్టాలు. ఏవీ లేవా…?”

“ఓ గాడ్ నీకింకా అర్ధం కావటం లేదు. నాకోసంగా పిల్లలు లేరు. స్నేహితులు, బంధువులు, విహారయాత్రలు ఏవీ లేవు. తెలుసు కదా. మన పత్రిక పబ్లిక్ ఇష్యూకి వెళ్లింది. చానల్ లాంచ్ చేశాం. పొలిటికల్ ఎడిటర్‌ని. నేనెక్కిన మెట్లు ఏవీ మిగల్లేదు. కానీ నాకోసం వెనక్కి తిరిగి చూస్తె ఈ కెరీర్ వదిలేస్తే నేనేం చేయాలో నాకు తెలియదు. వృత్తి తప్ప నాకేం లేదు.”

“ఇందుకు బాధపడుతున్నారా? ఏమైనా నష్టపోయారా..?”

“బాధపడటం లేదు. నన్నెవరన్నా ఇలా వుండాల్సిందే అని నిర్భంధించారా.. లేదే.. నాకై నేను ఎంచుకొని కోరి వరించిన జీవితం. అటు నష్టపోయానో లేదో అర్ధం కాని జీవితం. నన్ను ఓ మీటింగ్‌లో నా జీవితంలో జరిగిన  యదార్ధ హాస్య సంఘటన, మీరు అందరితో కలిసి నవ్వుకొన్న్న సంఘటన గురించి చెప్పమని అడిగారు. హాస్య సంఘటన అలాంటిదేమీ లేదు. మరపురాని సంఘటనలంటే అవార్దులు తీసుకొనే అవకాశాలు తప్ప ఇంకేం లేదు. దాన్ని నేను నిర్వచించలేక పోతున్నాననుకొంటా..”

“అంటే కుటుంబ జీవితం పాపాయితో గడపటం మిస్ అయ్యారా…?”

“ఏమో,  కుటుంబ జీవితం నాకు ప్రత్యేకంగా అందించిన ప్రత్యేకమైన అనుభవాలు  ఏవీ లేవు. అటు నాన్నగారి సమయబద్ధమైన పొలిటికల్ జీవితం. అందులో ఆయన కుటుంబం కోసం కేటాయించినది ఏదీ లేదు. ఇటు నాయర్ కోరుకొన్న జీవితంలో నేను ఎల్లాగూ లేను. ఆయంతో కలసి ఉన్నంతకాలం ఆయన రాజకీయాలకు చెందిన మనిషే. ఆయనకు పర్సనల్ జీవితం ఉంటే ఆయన సొంత బతుకే. తను గొప్ప వ్యక్తిగా ఎదగటం. మరి ఈ మనుష్యులు నాకు నేర్పింది ఇదేనేమో ”

“కెరీరే లక్ష్యం అయితే ఇంకేముండదా మేడం..”

“ఇంకా అంటే బహుశా లేదేమో.. నీకు ఉద్యోగం లక్ష్యం. ఉదయం లేచి తయారై ఆఫెస్‌కు వస్తావు. సాయంత్రం వరకూ గంటకోసారి న్యూస్‌లో కనిపించాలి. ఇప్పుడే శ్రీధర్ అన్నాడు. ఐదవుతూనే నువ్వు ఇంకో ప్రీ రికార్డెడ్ ప్రోగ్రాంకు అటెండ్ అవ్వాలని. ప్రోగ్రాం కాన్సెప్ట్‌ని బట్టి ఏం కట్టుకోవాలో, ఏ నగలో, ఏ డ్రస్‌లో ఆలోచిస్తావు. నీకు పాప వుంటే దాన్ని గురించి ఉదయం నుంచి ఎన్నిసార్లు ఆలోచించగలిగేదానివి”

నయన ఆలోచిస్తుంది.

స్వాతి ఆమెను చూస్తోంది.

“నయనా.. ఎప్పటి సంగతో చెబుతున్నా. మా పాపకి పన్నేండేళ్లు వచ్చాయి. మొదట్లో నేను గమనించలేదు కానీ, ప్రతిరోజూ నేను ఇంటికి వచ్చేవరకు మేలుకొని వుండేది. ఒక్కోసారి ఆఫీస్‌కు వచ్చేది. చాంబర్‌లోకి రాకుండా బయటనే కూర్చునేది. రిపోర్టర్స్ రూంలో కూర్చుని వాళ్లతో మాట్లాడేది. నేను నా పనులయ్యాక కలిసేదాని. ఇద్దరం కలిసి కారెక్కేవాళ్లం. దాన్ని దగ్గరకు తీసుకొన్నా నాకు ఏదో ఫోన్, నేనేదో ఆఫీస్‌లో ఎవరితోనో ఏదో చెప్పాల్సిన అవసరం, థర్డ్ ఎడిషన్‌లోనో, లాస్ట్ ఎడిషన్‌లోనో చేయాల్సిన మార్పులు, లాస్ట్ మినిట్స్‌లో వచ్చిన ఫ్లాష్ న్యూస్ ఏదో ఒకటి నా మనసంతా. పోనీ ఏ మీటింగ్‌కో కలిసి వెళ్ళేవాళ్లం. ఆ మీటింగ్‌లో నేను మొత్తంగా వుండగలను. కానీ పాపాయి పాత్ర ఎంతవరకూ. మొదటిసారి అందరూ పలకరిస్తారు. ఇంకా దగ్గరివాళ్లయితే దగ్గర కూర్చోమంటారు అంటే. నేను తనని ఎంత ఎంగేజ్ చేయగలను” అంది.

“నెమ్మదిగా తర్వాత మానుకొందనుకొంటా” స్వాతి ఆలోచిస్తూ ఊరుకొంది.

తలెత్తి చినంగా నవ్వింది

“ఆమె పెళ్ళి కోసం ముందుగా వారం రోజులున్నాను. ఇంట్లో పెళ్ళయ్యాక తను అమెరికా వెళ్ళే ఏర్పాట్లలో వుంది. తను వెళ్ళేందుకు రెండు నెలలు పట్టింది. ఆ రెండు నెలల్లో రెండు సార్లు తన కోసం వెళ్ళేను. మొత్తం పాపాయి కోసం నేను సంవత్సరంలో నాలుగైదు రోజులు కేటాయించానేమో. ఇంట్లోనే వున్నా పెద్దగా కలిసి లేము. నా పనుల్లో నేను, పాపాయికి నేనేం ఇచ్చాను. తనను కనటం తప్ప”

“ఇప్పుడు అమ్మలా ఆలోచించారు” నవ్వింది నయన.

“అంటే నయనా. మన సొసైటీలో స్త్రీలకు ప్రత్యేకమైన ఫార్మేట్ వుంది. ఆమె ఎలా వుండాలో ఎవరో ఆలోచించి డిజైన్ చేసి ఇచ్చిన ఫార్మెట్. దాన్ని సొసైటీ ఆమోదించింది. ఆమె ఇలా ప్రేమించాలి. ఇలా పెళ్ళాడాలి పిల్లల్ని కనాలి. కుటుంబానికి ఇలా సేవ చేయాలి. ఆమె మనసులో ఈ స్థాయిలో మెల్టింగ్ పాయింట్ వుండాలి. మరి నేను అలా కాకుండా ఇంకోలా వుంటానంటే అతిగా లేదూ. ఈ స్వేచ్చని ఎవరు ఎలా ఆమోదిస్తారు. ఇటు నాయర్‌ కోసం విచారించకా, అటు పాపాయిని సరిగ్గా తల్లి పాత్రలో వుండి చేరదీయకా, స్వాతిలాగా కెరీరిస్ట్‌గా నిలబడ్డానంటే నాకేం విశేషణాలుంటాయి చెప్పు”

నయన తడబడింది. నిజం మాట్లాడితే ఏం బావుంటుంది. తన ఉద్ధేశ్యంలో తన దృష్టిలో ఈవిడ చాలా స్ట్రిక్ట్. ఎండితో కలిసి ప్లాన్ వేస్తే అవతలవాడు మటాష్, తను ఏదైనా కావాలనుకొంటే ఎలాగైనా సాధిస్తుంది. దయాదాక్షిణ్యాలు లేవు. ఇంకా అబ్బో.. ఎవర్నీ ప్రేమించదు. శిఖండి. ఏం మనిషిరా బాబూ అనేవాళ్ళే ఎక్కువమంది. ఎంతదాకా ఎందుకు. తనకే పదిసార్లు హెచ్చరికలు చేసింది. గ్రూప్‌లు కట్టకూడదంటుంది. అతి చనువు కూడదంటుంది. అనవసరమైన రిలేషన్స్ పెంచుకోవద్దంటుంది. బహుశా కళ్లెత్తి చూస్తే ఆవులిస్తే పేగులు లెక్కపెడుతుంది. నయననే చూస్తున్న స్వాతి నవ్వింది.

“నేను నీ ఆఖరి ప్రశ్నకు జవాబు ఇవ్వాలి. ” అన్నది.

నయన కంగారుగా చూసింది.

“ఇంకేం లేదు మేడం” అన్నది.

“ఇంకేమున్నాయో ఆలోచించుకో. నీకు ఇరవై నిముషాలే టైం” అన్నది కుర్చీలో హాయిగా రిలాక్సయిపోతూ.

 

***

 

దక్షిణామూర్తిగారు డోర్ తెరుచుకుని లోపలికి వచ్చారు. ఫోన్‌లో మాట్లాడూతున్న ఎస్ఆర్‌నాయుడు లేచి ఆయన్ను కూర్చోమన్నట్టు తన ఎదురుగ్గా వున్న చూపించి మర్యాద చేశాడు. ఆఫీస్ మొత్తం బాంబే నుంచి వచ్చిన ఇంటీరియర్ డెకొరేషన్ ఎక్స్‌పర్ట్ డిజైన్ చేశాడు. చాలా అందమైన ఆఫీస్. దక్షిణామూర్తి తన కాబిన్‌ను ఆశ్చర్యంగా చూస్తున్నాడా లేదా ఆయన మొహం వంక చూస్తున్నాడు ఎస్ఆర్‌నాయుడు. కూర్చుంటూ పై కండువాతో ముఖం తుడుచుకొంటూ ఎదురుగ్గా రాక్స్‌లో వున్న పుస్తకాల వంక చూస్తున్నాడు.

“భోజనం చేద్దాం దక్షిణామూర్తిగారూ” అన్నాడు ఎస్ఆర్‌నాయుడు.

దక్షిణామూర్తి తల వూపాడు.

“ఫ్రెష్ అవుతారా?” అన్నాదు ఎస్ఆర్‌నాయుడు.

“వస్తూ బాత్‌రూంకు వెళ్ళివచ్చా” అన్నాడాయన.

ఆయన ఖద్దరు షర్ట్, జీన్స్ పాంట్ తమాషాగా వుంటుంది. ఆ కాంబినేషన్ పైన ఖద్దరు తువ్వాలు వంటిది మెడచుట్టూ వేసుకొంటాడు. ఎస్ఆర్‌నాయుడు చాలా స్టయిల్‌గా వుంటాడు. చక్కని మడత నలగని షర్టు నలుపు తెలుపులుగా వున్న ఉంగరాల జుట్టు చక్కగా దువ్వుకొని  ఎప్పుడు పడితే అప్పుడు లైవ్‌లో కనిపించటానికి వీలుగా రెడీగా వుంటాడు.

భోజనం వచ్చింది. ట్రేలో వున్న డిష్‌లన్నీ ఒక్కోటి తీసి చూస్తున్నాడు దక్షిణామూర్తి. నాకు సాంబార్ చాలోయ్ అన్నాడు బాయ్‌తో. బటర్ నాన్, పుల్కా కూడా ఉన్నాయి సార్ అన్నాడు బాయ్. వద్దులేవయ్యా రైస్ తింటాను అన్నాడాయన.

“ఎలా వుంది చానల్” అన్నాడు ఎస్ఆర్‌నాయుడుతో.

“చూస్తున్నారుగా సెకండ్ ప్లేస్‌లో. అటూ ఇటూ ఫస్ట ప్లేస్ కూడా”

“అవును చాలా సెన్సేషనల్ చేసావు” అన్నాడు దక్షిణామూర్తి.

తింటున్నది గొంతులో పడ్డట్టు అయింది. సెన్సేషనల్ అంటే ఈయన వెక్కిరింతా పొగడ్తా.

“మొన్న మీ చైర్మన్‌గారు ఎయిర్‌పోర్టులో కలిశారు.  చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆయనకు పవర్ ప్రాజెక్ట్ వచ్చిందంటగా. మీ కృషి చాలా వుందన్నాడు.

తింటున్న భోజనం కమ్మగా లేదనిపించింది ఎస్ఆర్‌నాయుడుకు.

చైర్మన్ ఆదికేశవులుకి ఎన్నో బిజినెస్‌లు వున్నాయి. ఎన్నో సంస్థల్లో పెట్టుబడులున్నాయి. ఈ చానల్‌లో ఆయనకూ షేర్స్ ఉన్నాయి. నేనూ స్వాతీ డైరెక్టర్స్ . తెలుసు కదా..”

“ఆయన తమ్ముడు శ్రీరంగనాయకులు నేనూ క్లాస్‌మేట్స్”

ఈసారి దగ్గొచ్చింది ఎస్ఆర్‌నాయుడుకు. ఇది తనకు తెలియదు.

“అయితే పెద్దయ్యాక ఎప్పుడూ రిలేషన్స్‌లో లేము. మొన్నమాటల్లో చెప్పుకొన్నాము. శ్రీరంగనాయకులు మినిష్టర్ అయ్యాక నేను కలుసుకొన్నది లేదు. ఇష్యూ బయటికి వచ్చాక నీతో మాట్లాడాలనుకొన్నా.”

ఎస్ఆర్‌నాయుడుకు ఏం మాట్లాడాలో తోచటం లేదు. ఆదికేశవులు కాలేజ్ సంగతి ఎక్కడా బయటకు రాకుండా తనే చూశాడు. గవర్నమెంట్ లాండ్ అది. లీజ్‌కు తీసుకొన్నారు. పర్మిషన్స్ తెచ్చుకోవచ్చునని బిల్డింగ్స్ కట్టేశారు. ఆ స్థలం లీజుకు ఇచ్చినందుకు అప్పటి కమీషనర్‌ను కోటీశ్వరుణ్ణి చేశాడు ఆదికేశవులు. ఆయన ఆస్తులు సగం తన పేరుపైనే ఉన్నాయి. ఈ చానల్‌లో తను పెట్టిన షేర్లు అతను ఇచ్చినవే. వాళ్ల కోసం తను ఏం చేస్తే సరిపోతుంది..?”

“నువ్వు చాలా రిస్క్ తీసుకొంటున్నావు. నీతో మాట్లాడాలనే వచ్చా. ఓన్లీ ఫ్రెండ్లీగా. నువ్వు స్వాతి కలిసి డెయిలీని ఎన్నో ఎడిషన్లు చేశారు. ఆ పెట్టుబడి ఎక్కడిదో నాకు తెలుసు. ఈ చానల్ పెట్టుబడీ నాకు తెలుసు. స్వాతి నాన్నగారు బతికుంటే ఇదంతా జరిగేది కాదు. ఒకప్పుడు ఆ పత్రికకు ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఉండేది. అవ్వాళ్టి పార్టీ లీడర్స్‌కి పదవులు లేవు. ప్రజాసేవ తప్ప. ఆదికేశవులు దాన్ని టేకోవర్ చేశాడని అందరికీ తెలుసు. బయట నువ్వు చాలా బద్నామ్ అవుతున్నావు”

ఇంత చెబుతూ తాపీగా అన్నం తింటున్న మనిషి వైపు తెల్లబోయి చూస్తున్నాదు ఎస్ఆర్‌నాయుడు.

“పత్రిక, చానల్ అడ్డంపెట్టి ఎన్నింటికి పర్మిషన్ తెచ్చుకొన్నాడో నువ్వెలా డిల్లీ చుట్టూ తిరుగుతున్నావో నీ తోటివాళ్లు ఎంతలా గమనిస్తున్నారో తెలుసా నీకు”

దక్షిణామూర్తి ఏనాడో పాతికేళ్ల గతంలోంచి లేచొచ్చి కూర్చున్నట్టు వుంది ఎస్ఆర్‌నాయుడుకి.

ఇద్దరూ ఎడిటోరియల్‌లో షిఫ్ట్ ఇన్‌చార్జ్‌లుగా పనిచేసేవాళ్లు. ఎడిటోరియల్ రాయటంలో పోటి, రిపోర్టింగ్‌లో పోటీ. కొత్త కొత్త విషయాలు రాయటంలో పోటీ. ఆరోగ్యకరమైన పోటీలో ఇద్దరూ వెలిగిపోతుండేవాళ్లు.

“నాతో శ్రీరంగనాయకులు చెప్పారు. ఒక్క రూపాయి చేతిలోంచి పెట్టకుండా ఎలా సంపాదించారో ఆదికేశవులు చెప్పుకొచ్చాడు. తను మినిష్టరుగా అడ్డమైన లాబీయింగ్‌లతో ఎన్ని కాంట్రాక్టులు, ఎన్నో పర్మిషన్లు ఇప్పిస్తూ వాళ్లందరిచేత ఈ చానల్‌లో పెట్టుబడులు పెట్టించాడో, మొత్తం చానల్స్‌లో టాప్‌లో ఎలా ఉందో చెప్పాడు నాకు. నువ్వు స్వాతి ఎవరెవరికి కొమ్ము కాస్తున్నారో, ఏం స్టోరీలు చేస్తున్నారో, ఎవరిని ఎలా బెదిరిస్తున్నారో, ఇవన్నీ నీకు వాళ్లు తెలిసే చేస్తున్నావా? ఆదికేశవులు బావున్నాడు. వాళ్ల తమ్ముడూ బావున్నాడు. వాళ్ల ఆస్తులు , పిల్లలు అంతా బావున్నారు. మరి నువ్వెలా వున్నావు? ఇదంతా నీకెందుకు నీ అంత మంచి రైటర్ ఎవరున్నారు? నీ పిల్లలు బుద్ధిమంతులు. చక్కగా చదువుకొన్నారు. నీకు కోట్ల ఆస్తులు లేకపోతే ఏం.. ఎందుకిదంతా. ఆదికేశవుల్ని ఎదిరించాడని. ఆ కల్నల్ పర్సనల్ లైఫ్ చానల్‌లోకి లాగి నవ్వుల పాలు చేశావు. ఆయన ఎవరిని చేరదీస్తే నీకెందుకు. ఎదుటివాళ్ల బెడ్‌రూమ్స్‌లోకి తొంగిచూడాలా నువ్వు”

తినటం ఆపి దక్షిణామూర్తి వైపు చూస్తున్నాడు నాయుడు. ఆయనకు ఊహించని దెబ్బ ఇది. దక్షిణామూర్తిని ఎలా తొక్కేయాలా అని ఉదయం నుంచి ఆలోచిస్తున్నాడు తను. ఉద్యోగం సద్యోగం లేక దిక్కులేక ఉన్నాడనుకొన్నాదు. ఈయన తనకే పాఠాలు చెబుతున్నాడు.

“నీకు నేను చెప్పటం ఏమిటి అని ఆలోచించాను. నేను పత్రిక వదిలేశాక నీకు తెలుసుగా పుస్తకాల ట్రాన్స్‌లేషన్ పెట్టుకొన్నాను. మానవ చరిత్ర పన్నెండు వాల్యూమ్స్ అయ్యాయి. తెలుగు మాండలికాలు తయారయ్యాయి. పిల్లల పుస్తకాలు చాలా చేసాను. ఒక రకంగా ఇదివరకటి కంటే తీరిక లేకుండా వున్నా. మనం చేయవలసిన పనులు ఎన్నో వున్నాయి. అవన్నీ వదిలేసి ఇప్పుడిలా.. ఇదంతా ఎందుకు? నాకు తోచింది చెప్పాను. వినటం, వినకపోవటం నీ ఇష్టం.” అన్నాడు ఎస్ఆర్‌నాయుడు వంక చూసి.

ఎస్ఆర్‌నాయుడుకి నోటమాట రాలేదు. పాతికేళ్ళ గతంలోకి నడిచిపోయి దక్షిణామూర్తితో కలిసి రాత్రివేళ లాంగ్ డ్రైవ్ చేయాలనిపించింది. పత్రిక వృద్ధిలోకి రావటం కోసం కొత్త కొత్త ప్రయోగాల కోసం రాత్రిళ్ళు నిద్రపోక  మేలుకొని చేసిన చర్చలు గుర్తొస్తున్నాయి. ఎక్కడో తమ స్నేహం, జీవిత మాధుర్యం చేజారాయి. తను తుఫానులో కొట్టుకుపోయాడు.

“తినలేను” అన్నాడు నీరసంగా తింటున్న ప్లేటు వదిలేసి.

“తిను తిను.. నేను కంపెనీ ఇస్తా. ఇంకా ఫ్రూట్ సలాడ్ వుంది చూశవా?”అన్నాను దక్షిణామూర్తి కప్పు చేతిలోకి తీసుకొని.

ఎందుకో దక్షిణామూర్తిపైన కోపం రాలేదు. తన హోదా తన చానల్. తన గొప్పతనం ఏవీ గుర్తు రాలేదు. తనను నిలదీసే ధైర్యం ఎవ్వరికుంటుంది. తను ఎవ్వరికైనా సమాధానం చెప్పుకోవాలా అంటే తన మనస్సుకే అనుకొన్నాడు. శాంతిగా అనిపించింది. తీరిగ్గా భోజనానికి ఉపక్రమించాడు. రూం చల్లగా వుంది.

 

 

ఛానెల్ 24/7 – 14 వ భాగం

sujatha photo

  (కిందటి వారం తరువాయి)

మనం బతికివున్న నిముషంకన్నా మంచి ఘడియ ఇంకేముంటుందీ.. దేవుడొక్కడే ఇరవై నాలుగు గంటలూ బతుకంతా కృషి చేస్తూ మనందరి కోరికలు తీరుస్తూ కూర్చుంటాడా..? కాళ్ళు నొచ్చుకోవా? మొన్న ఎండిగారికి మంచి ఆశీర్వచనం అందరూ చూస్తుండగానే చెప్పారు ఈ చారిగారే. రెండో నిముషంలో అడుగుపెట్టి చూడకుండా అక్కడేదో వైరు తన్నేసి బొక్కబోర్లా పడ్డాడెందుకు ఎండి. ఈ ఆశీర్వచనం పనిచేయలేదా?, ఈయన చెప్పే లక్ష్మీయంత్రం నాలుగు వేలు పెట్టి కొనుక్కుంటాను. మరి నా జీతం రెండేళ్లదాకా పెంచనని మేనేజ్‌మెంట్ చెప్పారు కదా. నాకు ధనలాభం ఎలా వస్తుంది? ఒకవేళ ఏదైనా సంచో పాడో, డబ్బులకట్టో రోడ్డు మీద దొరుకుతుందా అనుకొంటే ఇంతింత అద్దాలలో నాకు అడుగు ముందు ఏమవుతుందో కనబడి చావదు. మీ లక్ష్మీయంత్రం కథేమిటి అని చారి పని పట్టాలని శ్రీధర్ తన ప్రశ్నలతో ఇప్పటికే సిద్ధంగా వుండే వుంటాడు. కనుక వీడే అసలైన శనిగ్రహం చారి పాలిట. ఆయన శనిదోష నివారణ పూజలు ఎన్ని చేసినా ఈ విగ్రహం చలించదు కదా” అనుకొన్నాడు నవ్వుకొంటూశ్రీకాంత్.

“చారిగారు నేను ఎండి్‌గారితో మాట్లాడి ఫైనల్ చేస్తాను” అన్నాడు.

“సరేనండి నేను కూడా ఎండి్‌గారిని ఒకసారి కలిసి వెళతాను” అన్నాడు చారి.

 ***

“నేను ఎస్.ఆర్.నాయుడుని, బెహరా బావున్నారా?”

“ఓ..మీరా.. గుడ్… ఎలా వున్నారు? మిమ్మల్ని కలిసి చాలా కాలం అయింది” అన్నాడు బెహరా.

అతని గొంతులో ఒక చానల్ హెడ్‌తో మాట్లాడుతున్న గౌరవం గానీ అభిమానం కానీ లేవు. ఎస్.ఆర్.నాయుడుకి ఒక్క నిముషంలో ఈ ధ్వని తెలిసింది. తప్పదు. ఇతనితో మాట్లాడేందుకు ఉదయం నుంచి ట్రై చేస్తున్నాడు. అతన్ని ట్రాప్ చేసేందుకే నెలరోజులనుంచి కష్టపడుతున్నాడు. ఇప్పటికి చిక్కాడతను.

“చెప్పండి బెహరా నేనేం చేయాలి?”

“మీరేం చేయాలో నేనేం చెప్తాను. అంతా చేసేది మీరే కదా” నవ్వాడు బెహరా.

చాలా కక్షగా ఉందతనికి. ఒకప్పుడు తనెవరో ఏమిటో ఎవ్వళ్ళూ ఎరగరు.నిజమైన ప్రేమతో యూనివర్సిటీలో తనతో చదువుకొన్న రవళిని కోరి, ఆమెని వేటాడి పెళ్లాడాడు. వాళ్ల నాన్నకు, అమ్మకు ఎన్‌జి్ఓ ఉండటం, దాన్ని ప్రపంచ వ్యాప్తంగా వాళ్లు ప్రమోట్ చేసుకోవటం తన ఎదురుగా.. రవళి భర్తగా ఆ ఇంటికి వెళ్లాకే ఆ పాలిటిక్స్ తెలిశాయి. వాళ్లు ఎన్‌జి్ఒ పనిచేసే చోట కూలిజనం అవసరాలు, వాళ్లనెలా దోచుకోవాలో వాళ్లకే ముందు తెలుసు. ఎంబిఏలో గోల్డ్ మెడలిస్ట్ అయిన తనకి అర్ధం కదా? డబ్బు రుచి చూపించింది వాళ్లే. ఎంతో జీవితం చూసిన వాళ్లకే ఆశవుంటే తనలాంటి యువకుడికి ఆశ వుండదా? పేదవాళ్ల జీవితాలను బంధించే చిన్న వడ్డీకి అప్పు రూపం పోసుకొంది వాళ్ల ఇంట్లొనే. పెట్టుబడి వాళ్లే పెట్టారు. రవళి కూడా డైరెక్టర్. ఎవ్వరూ ఊహించని ప్రగతి. ఇంతింతై ఎదిగిన బిజినెస్, అప్పు ఇస్తామని క్యూ కట్టిన బ్యాంకులు, విరాళాలు కురిపించిన ఫారినర్స్… తనో సామ్రాట్. ఇప్పుడు వాటాలు కావల్సి వచ్చాయి. కమలకి, ఆమె మొగుడికి, మధ్యలో రవళి పావు. చానల్ పెడితే ఏం కావాలన్నా దాన్ని సాధించవచ్చు. కేసులు లేకుండా తప్పించుకోవచ్చు. జర్నలిజం ముసుగు ఎంత విలువైందో చెప్పింది ఎస్ఆర్‌నాయుడు. తను దొరక్కుండా పోతాడా? ఇప్పటికే దొరికాడు. వాళ్లు అనుకోవటం ప్రపంచవ్యాప్తంగా పదిమందిని పోగేసుకొని టీవీల్లో గోలచేసి తనను వంచాలని. కానీ తనకు తెలుసు. ఎలాగైనా తనకు ఇది లాభసాటి ప్రమోషన్. ప్రపంచానికి ఎంత ఓపిక వుంటుంది. ఎన్నిసార్లు తన సంగతి పట్టించుకొని, తిండితిప్పలు మానేసి తన ఆఫీస్ వంక చూస్తూ కూర్చుంటారు. వాళ్లని సంతోషపెట్టేందుకు వాళ్ల పూర్తి జీవితాన్ని కాజేసినందుకు, మహేష్‌బాబో, పవన్‌కళ్యాణో వున్నారు. పది రూపాయలు ఫోన్‌కు ఖర్చుపెట్టి బంగారు నాణాలు గెల్చుకొమ్మని పిలిచే గేమ్ షోలున్నాయి. పట్టుచీరెల అంచులు  చూసి ధరలు చెప్పి ఉత్తపుణ్యానికి చీరె మీ ఇంటికి తీసుకుపొమ్మనే యాంకర్లున్నారు. ఉదయం లేస్తూనే దేవుడి స్తోత్రాలు, కాస్తాగితే జ్యోతిష్యచక్రాలు, ఎనిమిది దాటితే ఏ పనీ చేయకపోయినా హాయిగా కార్లో తిరిగే జీవితమున్న రాజకీయ నేతలు, అన్ని చానల్స్‌కి ఇటోకాలు, అటోకాలు వేస్తూ ఎవడెవడు ఏమేం కాజేశాడో, ఎవడికి ఎంత ఆస్తి వుందో లెక్కలు, ఆధారాలతో చెపుతూ కాలక్షేపం చేసే రాజకీయ వేత్తలున్నారు. వాళ్లకి చానల్స్ కావాలి. ఇంకా మనమేం కొనుక్కోవాలి, మనకేం కావాలో, ఎంత వండాలో ఎలా పడుకోవాలో, రోగమొస్తే ఎక్కడ పాకేజీలుంటాయో, రాని గుండెజబ్బులకు కూడా ముందే డబ్బు కట్టేస్తే గుండెపోటొస్తే ఎలా ఖర్చు లేకుండా ఆపరేషన్లు చేస్తారో.. ఒకటేమిటి మన బతుకు వాళ్ళే బతికి పెట్టె చానల్స్ వుండగా సామాన్యునికి బెహరా కావాల్సి వచ్చాడా…?

బెహరాకి ఇంకా  హుషారొచ్చింది. ఎస్ఆర్‌నాయుడిని ఫుట్‌బాల్‌లా తన్నగలడు.

“ఏం సార్.. నన్నేం చేయాలనుకొన్నారు?” అన్నాడు నవ్వుతూ.

ఎస్ఆర్‌నాయుడుకి వళ్లు మండింది.

“అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏం వ్యాపారం బెహరా? ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇవ్వాళ చానల్స్ చుట్టూ ఆ బాధితులు గుంపులుగా వున్నారు. ఇదంతా చూసి కమల, రవళి ఎలా వున్నారో తెలుసా?”

“ఈ విషయాలు గుండెల్లో దాచుకోలేక ప్రపంచానికి చాటాలని మీ దగ్గరకు పరుగెత్తి వచ్చి వుండాలే” అన్నాడు బెహరా వెటకారంగా.

ఎస్ఆర్‌నాయూడు గుటక వేశాడు. బిపి అమాంతం వెరిగిందతనికి.

“బెహరా! ప్రజల ప్రాణాలను నువ్వలా దూదిపింజల్లా చూడటం బావుండలేదు. హోం మినిస్టర్ కూడ ఇందాక మాట్లాడారు. ఆయన కూడా లైవ్‌కి వస్తానంటున్నారు. ఇదంతా సి.ఎం. పేషీలో డిస్కషన్ అవుతోంది. నాతో వాళ్లంతా టచ్‌లో వున్నారు” అన్నాడు బెదిరింపుగా.

బెహరాకి కోపం నషాలానికి ఎక్కింది.

“ఆ.. సర్.. తప్పనిసరిగా చర్చించండి. మీరు తెలుసుకోవలసిన ఈ పదేళ్ళ బిజినెస్ గురించి కాదు. దీన్ని గురించి నేనేం ఆలొచిస్తున్నానన్నది లెక్కలు వేశారు మీరు. ఇప్పటికే వందకోట్లున్నాయి. నా పెళ్లాం బిడ్డలు మీ ఆఫీసులోనే పడి వున్నారు. నాది అనుకొన్న కుటుంబం వాటాకోసం రోడ్డెక్కింది. వాళ్లు సమాధానపడినా మీలాంటివాళ్లు, మా కేస్ టేకప్ చేసిన క్రిమినల్ లాయర్లు, నా బిజినెస్ షేర్లు కోరుతున్న సొకాల్డ్ మినిష్టర్లు ఎవ్వరూ ఊరుకోరు. నేను మీకు పైసా ఇవ్వను. ఎవ్వళ్లకీ  ఇవ్వను. ఏం కోరి మీరు రచ్చ చేశారో…? మీ మీద కేస్ వేస్తున్నాను. మీ రైవల్ గ్రూప్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నాను. నన్ను మీరు మీ లాభం కోసం రోడ్డుకెలా ఈడ్చారో చెప్పేస్తా. నాకేంటండి భయం. నా డబ్బు ఆశించింది మీరు. డబ్బు సంపాదించుకొనేందుకు మెట్లు వేసుకొన్నవారికి, దాన్ని కాపాడుకోవటం ఎలాగో తెలియదా? మీరే నా గురువులు. రేపే యాడ్ ఇస్తా. మీతో ఎవరికైతే పడదో వాళ్లచేతే పేపర్ పెట్టిస్తా. చానల్ పెట్టిస్తా. మీరు నా డబ్బులు వరకే కాజేయాలనుకొన్నారు. నేను మొత్తంగా మీ జీవితం మొత్తాన్ని రోడ్డుపైన పెట్టిస్తా. మీకేమైనా డౌట్లున్నాయా?”

ఎస్ఆర్‌నాయుడుకు మాట రాలేదు.

“బెహరా నీకు నాపైన ఏదన్నా పర్సనల్ గ్రడ్జ్ వుందా?”

బెహరా వికటంగా నవ్వాడు.

“మీరెవరు సార్. నేను కోపం తెచ్చుకోవటానికి.. నాకు మీమెదెందుకు కోపం. మీరంటే  నాకెంతో అభిమానం. ఎన్నోసార్లు మీ ఎదురుగ్గా కూర్చుని మీ ఎడిటోరియల్స్ గురించి డిస్కస్ చేశాను. మీ పుస్తకాలు నేను అచ్చువేయించా.. నేనేం ఆశించలేదు. మీవంటి గొప్పమనిషికి నేను ఉడతాభక్తిగా చేశాను. నా జీవితాన్ని దగ్గరగా చూసి ఇవ్వాళ నన్ను నేల్లోకి తొక్కాలని మీరు అనుకొన్నారు. మీ ముందు నేనెంత సార్”

ఎస్ఆర్‌నాయుడుకు గొంతులో ఏదో అడ్డం పడింది.

“నీ చానల్ ఎప్పుడు వస్తుంది బెహరా?”

బెహరా మళ్లీ నవ్వాడు.

“సో.. సారీ సార్.. ఊరికే అన్నాను. నాకేం కావాలి సర్. నా చుట్టూ చేరిన వాళ్ల గురించి చెప్పాను. నన్ను చానల్ పెట్టమని, పేపర్ పెట్టమని మీ సీనియర్స్ నన్నడగరా? నేను అడక్కుండానే నా వ్యాపారాలు కాపాడుకోవటానికి నేనేం చేయాలో వారు చెప్పరా?”

“బెహరా.. నీ బెదిరింపులకు నేను మారిపోయానని చెప్పటంలేదు కానీ ఈ విషయం నా చేతిలో లేదు. ఈ కాంపిటీషన్‌లో ఎక్కడో ఏదో కొట్టుకుపోతోంది. సర్వైవల్ కోసం ఏదయినా నేనూ చేశానేమో..”

“అదేంటి సార్.. సారీ సర్..  మీరంటే నాకెంతో ఇష్టం. ఇవ్వాళ్టికీ మీరు ఉదయం చేసే రౌండప్ చూడందే నాకు రోజు మొదలు కాదు. చాలా గుడ్డిగా మీరు చెప్పే ఎనాలసిస్ ఫాలో అవుతాను. మీరు ఏ అక్షరం పలికితే అది నాకు మంత్రం. నేను మీ విషయంలో చాలా ఎమోషనల్ సర్” అన్నాడు బెహరా.

“బెహరా నేనేం చేయాలి?” అన్నాడు ఎస్ఆర్‌నాయుడు.

“మీకు ఎలా అనిపిస్తే అలా సర్. మీరేం చేసినా నేనేమీ అనుకోను. మీరంటే నాకు చాలా ఇష్టం సార్.” అంటూనే పోన్ పెట్టేశాడు బెహరా.

ఫోన్ పెట్టేసి వెనక్కి వాలిపోయాడు ఎస్ఆర్‌నాయుడు .

తనను తనెంత ఎత్తున పెట్టుకోగలిగాడో, తనంతట తను ఎలా కిందికి దిగుతున్నాడో తెలిసిపోతోంది. కిందికి జారకుండా ఉండలేడా? ఎవరెలా ఆడిస్తే ఎలా ఆడే కోతిబొమ్మనా ?ఎవరెవరి అవసరాలో తనకు గాలం వేస్తుంటే ఆ ఉచ్చులోంచి ఎప్పుడైనా తప్పించుకోవాలని ఆలోచించాడా? అది ఉరితాడు అని గ్రహించాడా? బంజారాహిల్స్‌లో కడుతున్న మేడ ఇటుకరాళ్లతో కాక పరువు ప్రతిష్టలతో కడుతున్నట్లనిపించింది ఎస్ఆర్‌నాయుడుకు.

తలతిప్పి చుట్టూ చూశాడు. తను రాసిన పుస్తకాలు, ఎడిటోరియల్స్, అందంగా ముద్దుగా తనవేపు చూస్తున్నాయి. నీ జీవితం ఇది, నీ వేళ్లెంత గొప్పవి. నీ తెలివితేటలెంత విలువైనవి. నువ్వు  ప్రజలకెంత ఉపయోగపడగలవు అంటున్నాయి. తను తలుచుకొంటే ప్రతిక్షణం తను అర్ధం చేసుకొన్న, తను క్షణ్ణంగా పరిశీలించి, పరిశోధించిన ఈ ప్రపంచాన్ని, ఎన్నో రహస్యాలను ప్రతివాళ్లూ ఎలా తెలుసుకోవాలో మూలసూత్రాలన్నీ చెప్పగలడు. ఈ ప్రపంచం ఎంత అందమైనదో, ఎంత అపురూపమైనదో చెప్పగలడు. మానవ సంబంధాలు ఎంత గొప్పవో నిరూపించగలడు. ఈ ప్రపంచంలో మనుష్యులందరికీ తను ఆప్తుడు, దగ్గరివాడు. ప్రతివాళ్లకు ఎవరికి వాళ్లకే తను సొంతం. నాకేం కావాలి. దక్షిణామూర్తి గుర్తొచ్చాడు ఎస్ఆర్‌నాయుడుకు.

నాలుగేళ్ళ క్రితం ఓ మినిష్టర్ పెళ్లిలో కలసి భోజనం చేసి బయటికి వచ్చాక, దక్షిణామూర్తి నిన్ను డ్రాప్ చేయనా అన్నాడు తను. తన విశాలమైన కారు ఆదికేశవులు ఇచ్చింది. డిల్లీలో తనకు కారు లేదు. తను మినిష్టర్ ఇంటి పెళ్లికి వస్తుంటే గెస్ట్‌హౌస్ బుక్ చేసి కారు అరేంజ్ చేసారు ఆదికేశవులు. కారు దగ్గరకు వస్తూనే తనకు వేరే పని వుందన్నాడు దక్షిణామూర్తి. ఎక్కడ దిగావన్నాడు తను. రైల్వే స్టేషన్‌లోనే వుండి. తెల్లవారు జామున ట్రైన్ ఎక్కేస్తానన్నాడు. స్టేషన్‌కు బస్‌లోనో, ఆటోలోనో వెళ్లిపోతానన్నాడు. ఆరోజు ఆయన తిరస్కారం తనపైన అసూయగా అనుకొన్నాడు తను. కారు, హోదా చూసి ఓర్చుకోలేకనే అనిపించిందా  టైంలో. అన్నేళ్లు కలిసి పని చేసి అతన్ని ఇంకోలా ఎలా అర్ధం చేసుకొన్నాడు.

పదిహేనేళ్ల నుంచి ఇద్దరూ కలిసి పనిచేశారు. ఎడిటోరియల్, కాలమ్స్, ఎనాలసిస్‌లు, న్యూస్‌స్టోరీస్ పోటీలు పడి రాసేవాళ్లు. తను రాసిన ప్రతి అక్షరం ప్రజల మనసుల్లో హత్తుకుపోయి వుంది. ఇవ్వాళ తనపట్ల ప్రపంచం చూపిస్తున్న నమ్మకానికి అవ్వాళ్టి అక్షరాలు, ఆ నిజాయితీ పునాది. ఆ పునాదిపైన తను నిర్మించిన భవనం ఎలాంటిది?

 (సశేషం)

 

 

ఛానెల్ 24/7 -13 వ భాగం

sujatha photo

( గత వారం తరువాయి )

ఎంత ఏడ్చినా ఇదే జీవితం, తను ఎంచుకొన్న రంగుల స్వప్నం. డైరెక్టర్, ఇన్‌పుట్, అవుట్‌పుట్, మేనేజర్, హెల్పర్ ఎవరైనా ఒకటే.. మగవాళ్లే.. అవకాశం దొరికితే ఎంజాయ్ చేద్దామనుకొనేవాళ్లే. ప్రేమలకు, ఆప్యాయతలకు, నమ్మకాలకు … శ్రీజ ఏడుస్తూనే వుంది.

“సారీ..సారీ..” అన్నాడు పూర్ణ లోగొంతుకలో.

ఎవ్వళ్లూ మాట్లాడలేదు.

“సరే పొండి. శ్రీజా కళ్లు తుడుచుకో అమ్మా” అన్నాడు ఎం.డి.

శ్రీధర్, శ్రీకాంత్ ఇద్దరూ కలిసి ఒకళ్ల చెయి ఒకళ్లు పట్టుకొని బయటకు వచ్చేశారు. బయటికి రాగానే నవ్వు మొహం పెట్టింది పి.ఏ.

“బాగా భోంచేశారా?” అన్నది నవ్వుతూ.

ఇప్పుడు నవ్వారు ఇద్దరూ మనస్ఫూర్తిగా.

“ఏరా” అన్నాడు ప్రేమతో శ్రీధర్.

వెనకనుంచి అరిచి చెప్పింది సరిత.

“శ్రీధర్‌గారూ,  మీకోసం అనంతాచార్యులుగారు మీ క్యాబిన్‌లో వెయిట్ చేస్తున్నారు. మీరు రమ్మన్నారట కదా”

శ్రీధర్, శ్రీకాంత్ వైపు చూసి గట్టిగా నవ్వాడు.

“ఏరా. చారిగారు నీ జాతకం మార్చేస్తానన్నారా?” అన్నాడు నవ్వుతూ శ్రీకాంత్.

“నాది కాదురా. నీ బుద్ధి మార్చాలని రమ్మన్నా” అన్నాడు శ్రీధర్.

ఇద్దరూ ఫస్ట్‌ఫ్లోర్‌లోకి వచ్చారు. శ్రీధర్ కాబిన్‌లో కళ్ళు మూసుకొని కూర్చుని వున్నాడు అనంతాచారి.

“నమస్కారం శ్రీధర్‌గారూ, నా జాతకం ఎప్పుడు చూస్తారు?” అన్నాడు.

శ్రీకాంత్, శ్రీధర్ ఇద్దరూ కూర్చున్నారు.

“కాఫీ తాగుతారా?” అన్నాడు శ్రీధర్.

బాయ్‌ని కాఫీ తెమ్మన్నాడు శ్రీకాంత్.

“సర్. చారీగారూ బావున్నారా?”

“ఏం బాగు శ్రీధర్‌గారూ. ఎండిగారు దయదల్చినా మీరు కళ్లు తెరవలేదు” అన్నాడు చారి.

శ్రీధర్‌కి ఎండిగారి తల పగలకొట్టాలన్న కోరిక చాలా బలంగా కలిగింది.

ఈ చారిని తనపైకి తోలటమేమిటి..? చారికి జాతకం స్లాట్ ఫ్రీగా కావాలి. అందులో గ్రహబలం, జాతకాలు లైవ్‌లో చెపుతానంటాడు. ఉదయం ఐదునుంచి ఆరు వరకూ. ఎండిగారికి ఆ స్లాట్ ఫ్రీగా ఇవ్వటం ఇష్టం లేదు. చారిని డబ్బు అడగటం ఇష్టం లేదు. చారికార్పొరేట్  స్వామీజీ. ఫేమస్ పర్సనాలిటీ. ఇటు రాజకీయరంగం, సినిమా రంగం, వ్యాపారం అన్నింటిలోనూ ఆయన పరిచయాలు ఎక్కువే. ప్రతివాళ్లకీ ఆయనే ముహూర్తం పెట్టాలి. సినిమావాళ్లను లైవ్‌లోకి తెస్తాను. మీకు రేటింగ్ వస్తుంది అంటాడాయన. ఎవ్వళ్లు స్పాన్సర్ చేసినా ఆ డబ్బంతా తనే వుంచుకోవాలని చారి ప్లాన్. అందులో సగమైనా తనకో, చానల్‌కో రావాలని ఎండి ప్లాను. ఇద్దరు  మధ్యలో తనతొ[ ఆడుకుంటున్నారు.

“మీకోసం ఉంగరాలు తెచ్చాను చూడండి. ఇది పూర్తిగా రాయితో మలిచారు. ఇవి హృషికేష్ నుంచి రెండే వచ్చాయి. ఒకటి మీ ఆవిడకు, ఒకటి మీకు” అన్నాడు అవి చేతికిస్తూ.

“ఇంకోటి.. కిందటిసారి మనసు బావుండలేదు. ఇవ్వాళ మీతో మాట్లాడలేనన్నారు కదా. అలా మనసు బావుండటం లేదంటున్నారని… అందుకే మీకోసం త్రివేణీ సంగమంలోని మట్టి తెప్పించాను. ఇది మీ దగ్గర వుంచుకోండి. అన్ని టెన్షన్లు పోతాయి” అంటూ ఒక ప్లాస్టిక్ సంచిలో గుప్పెడూ మట్టి  శ్రీధర్ ముందు ఉంచాడు.

“ఆ ఉంగరం వేలికి పెట్టుకోండి. హెడ్డయిపోతారు” అన్నాడు చారి.

“అంటే ఎండిగారిని పంపేస్తున్నారా మీరిద్దరూ” అన్నాడు వెంటనే నవ్వుతూ శ్రీకాంత్.

చారి ఉలిక్కిపడ్డాడు. చిరాగ్గా శ్రీకాంత్ వైపు మొహం చిట్లించి చూశాడు.

“అది కాదండి నా ఉద్ధేశ్యం. ఈయన మంచి స్థాయిలోకి వెళతారు అని”

శ్రీకాంత్ కొంటెతనానికి శ్రీధర్‌కు ఆపుకోలేనంత నవ్వొచ్చింది.

ఇంకా నయం మట్టి గురించి ఏం వాగలేదు  నయం అనుకొన్నాడు. అతని ఆశ నిరాశే అయింది.

శ్రీధర్ మట్టి సంచి  చేత్తో పట్టుకొని అటూఇటూ తిప్పి చూశాడు.

“ఈ మట్టితో టెన్షన్లు పోతాయా?” అన్నాడు.

చారి మొహం వికసించింది.

“నేను హామీ ఇస్తా. ఇది మూడు నదుల్లోంచి సాగరంలో ఆ పాయలు కలిసిన చోటు నుంచి తీసిన మట్టి. కాళ్లనొప్పులు, టెన్షన్లూ, చెప్పా పెట్టకుండా పారిపోతాయి.”

“ఏరా.. మరి నాలుగు బళ్లమట్టి తెప్పించి నేనో హాస్పిటల్ ఓపెన్ చేయనా? దిక్కుమాలిన తిట్లనుంచి తప్పించుకోవచ్చు. ప్రతివాడు ఉద్యోగం మానేయమనేవాడే. ఏమంటారు?” అన్నాడు చారి వైపు తిరిగి.

చారి పిడుగు పడ్డట్టు అయిపోయాడు.

ఇతను ఖాయంగా ఎగతాళి చేస్తున్నాడు.. కిం కర్తవ్యం”

అతన్ని, శ్రీధర్‌ని తిప్పి తిప్పి చూసి నవ్వాడు చారి.

వచ్చేటప్పుడు టైము, లగ్నం సరిచూసుకునే ఛానల్‌లోకి అడుగుపెట్టాడు తను. మరి ఈ దుష్టగ్రహం శ్రీకాంత్ ఎలా తగిలాడో అర్ధం కాలేదాయనకు.

“మా శ్రీకాంత్ చేయి చూడండి” అన్నాడు శ్రీధర్ నవ్వుతూ.

“మీ పుట్టిన టైమ్ ఖచ్చితంగా కావాలండీ” అన్నాడు చారి.

“మా అమ్మనడగాలి” అన్నాడూ శ్రీకాంత్.

అమ్మ గుర్తొచ్చింది శ్రీకాంత్‌కి.

“నాన్నా బంగారం. నీకోసం ఎన్ని పూజలు చేశానురా. మన పొలంలో నాగేంద్రుడి పుట్ట వుందా? ఆ పుట్ట చుట్టూ  ప్రదక్షిణలు  చేసేదాన్ని. నేను పుట్ట తడిపి పూజ చేసి ప్రదక్షిణాలు  చేసేదాన్ని. నేను పుట్ట తడిపి పూజ చేసి ప్రదక్షిణాలు చేసేవేళకు ఆ దూరంగా ఒక నెమలి పురివిప్పి ఆడుతుండేదిరా నాన్నా.. ఈ పొద్దుటి పొద్దుటే నెమలి ఆడేవేళకు మన పొలం గట్టుపై గుడిసె వేసుకొన్న సన్నాయి తాత సన్నాయి ఊదేవాడురా. ఆ పాట, నెమలాట, పుట్టలోని సామి దయ నువ్వు పుట్టేవురా శ్రీకాంత్. నీకందుకే పాటలొచ్చు. ఇన్ని మాటలొచ్చు. దేవుడి దయతో పుట్టావు నాన్న. నీకు దేవుడంత మంచి మనసుందిరా. నా తండ్రి పెద్దాడై పెళ్లి చేసుకొని బిడ్డల్ని కనేదాకా నేను కష్టపడగలనురా” అనే తల్లి తనను తడిమిన గరుకు చేతులు గుర్తొచ్చాయి.

పొలం పని చేసి చేసి గరుకు చేసిన చేతులు, కాయకష్టంతో నల్లరూపు పడ్డ మొహం, తన యూనివర్సిటీ చదువు అయ్యేలోపున అర్ధాంతరంగా వెళ్లిపోయిన ఆమె రూపం కళ్లముందు కదలాడింది శ్రీకాంత్‌కి. ఉన్న ఎకరం పొలం గట్టునే పాకలో ఇప్పటికీ కాపురం వుండే తండ్రి గుర్తొచ్చాడు. సన్నాయి తాత మనవరాలు చేసిపెట్టే జొన్నరొట్టె, కారం పచ్చడి ఇష్టంగా తినే తండ్రి తలపుకొచ్చాడు. తనని చూడగానే అమ్మా పాప, అన్నాయికి ఇంకో రొట్టే ఇస్తావా? అన్న తండ్రి గొంతు, ఆ పాప అనిపించుకొన్న పాతికేళ్ల మీనాక్షి మొహం కదలాడింది. అన్నాయికి రొట్టెలెందుకు పెదనాన్నా, నేనింటికి తీసుకుపోతా. ఆడ ఏం తిన్నాడొ ఏమో. నేను మంచిగా వండి పెడతా అంటున్న మీనాక్షిని తను అందరి అమ్మాయిల మొహాల్లో చూడగలడు. మాట్లాడితే ఏడుపులు ఏడ్చి విసిగించే శ్రీజలో తనకు మీనాక్షి కనిపించదా?”

ఊరికి దగ్గరగా వున్న పొలం, పొలం చివర్లో రెండు నిట్టాడి గుడిసెలు, రెండు కాపురాలు.  ఒకదాంట్లో తండ్రి, ఇంకోదాన్లో సన్నాయి తాత కుటుంబం. ఊర్లో ఏ పెళ్లి పేరంటం జరిగినా, సన్నాయి తాత గ్రూపు మేళం. ఆయన కూతురు కూతురు మీనాక్షి. తల్లి పోయాక తాత కుటుంబమే తనకూ, నాన్నకు బంధువులు. సెలవుల్లో ఆ అమ్మాయి చేతి వంట తినే ప్రాణి తను. ఆ అమ్మాయి ఒక్కోసారి తల్లిలాగ, చెల్లెలాగా, తన చిన్న చిన్న బహుమతులకు సంబరపడే పాపలాగా కనిపిస్తూ వుంటుంది. సాయంత్రంవేళ, ఉదయంవేళ పాక బయట మంచంపైన పడుకొంటే సన్నాయితాత పాత, చుట్టూ జొన్నచేల పచ్చదనం, మీనాక్షి కబుర్లు, నాన్న ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ ఈ కాంక్రీట్ జంగిల్‌లో ఎలా వస్తాయి. తను అటుపోతే ఉద్యోగం ప్రాబ్లం, వాళ్లు ఇటు వస్తే వాళ్ల స్వేచ్చ పోతుంది.

“ఏంటి ఆలోచిస్తున్నారు?” అన్నాడు చారి.

“నా పుట్టినతేదీ రికార్డు చేసేంత చదువు లేదు మా అమ్మానాన్నకి. అటు ఇటూగా ఉదయం ఐదు ఆరూ మధ్య అంటూ వుంటుంది అమ్మ” అన్నాడు శ్రీకాంత్.

“వాడి జాతకం వాడే రాసుకుంటాడు. మనతో పన్లేదు శ్రీకాంత్‌కి” అన్నాడు శ్రీధర్.

“ఏంటండీ అలా గన్నారు? సార్‌కు నేను చెప్పకూడదా జాతకం?” అన్నాడు ముఖం మాడ్చుకున్న చారి శ్రీధర్‌ని చూస్తూ..

“అయ్యో అదేం లేదండీ” అన్నాడు శ్రీధర్.

“చారిగారూ సరదాగా అన్నాను. ఇవ్వాళ మీరు మా అమ్మని గుర్తుకు తెచ్చారు. ఏదో ఒక కోరిక కోరుకోండి  తీర్చేస్తాను” అన్నాడు శ్రీకాంత్.

అతని నవ్వు మొహం చూసి చారి నవ్వేడు.

“నా ఉదయం స్లాట్ గురించి సెటిల్ చేయండి. నేను ఎంత పాపులరో మీకు తెలుసు. చిన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దాకా నన్ను కన్సల్ట్ చేయకుండా వుండరు.” అన్నాడు బ్యాగ్‌లోంచి ఆల్బం తీస్తూ.

“అబ్బే అవన్నీ ఇప్పుడు చూసే టైం లేదు. మీ కోరిక ఇదిగో ఈ శ్రీధర్ మనసుపెట్టి తీర్చాలని  మీ దేవుడ్ని నేనూ ప్రార్ధిస్తా” అన్నాడు శ్రీకాంత్.

“అంటే మీకు దేవుడు లేదా?” అన్నాడు చారి.

“అంటే నా దేవుడికంటే మీ దేవుడికి మీరు క్లోజ్ కదా. రోజూ పూజలు చేస్తూ వుంటారు. ఆయన ఇప్పటికే మెత్తబడి వుంటారు. నేనూ ఇంకో నాలుగు దణ్ణాలు పెట్టి మీ గురించి చెప్పుకొంటాను. అప్పుడు శ్రీధర్ మనసు మెత్తబడి మీ ప్రోగ్రాం ఓకే అయిపోతుంది” అన్నాడు.

చారి మొహం వికసించింది.

“శ్రీధర్‌గారూ మీరు ఓకే అనండి చాలు” అన్నాడు.

శ్రీధర్ కోపంగా చూశాడు శ్రీకాంత్ వైపు.

తను వప్పుకుంటే అయిపోతుందా? ఈ హాఫెనవర్ కమర్షియల్స్ సంగతి సెటిల్ చేయకుండా ఎండి వప్పుకుంటాడా? ఈ ప్రోగ్రాం జనం చూస్తారు. జాతకం, రేపేం జరుగుతుందో ఇవ్వాళే తెలుసుకోవాలనే ఆశ, మనకి ఎప్పుడూ మంచే జరగాలని ఎవరేనా చెప్పాలి లేదా ఆ చెప్పేవాటిలో మనకి నచ్చనివి తీసేసుకుని నచ్చేవే జరగాలంటే సిద్ధాంతిగారి సాయంతో పూజలు హోమాలు జరిపిస్తే సలక్షణంగా బతుకు గడిచిపోతుందనే కాన్సెప్ట్ ఎప్పుడూ వర్కవుట్ అవుతుంది.

దేవుళ్లకి దణ్ణాలు పెడితే, హోమాలు చేయిస్తే , తాయత్తులు కట్టుకుంటే, గ్రహపూజలు చేయిస్తే, గడిపే ప్రతి నిముషంలో మంచి ఘడియని ఒడిసిపట్టుకొని ఆ ఘడియలో తమకు అనుకూలమైన పనులు, లాభం వచ్చే పనులు మొదలుపెట్టి కోట్లు సంపాదించాలి. ఉద్యోగ వ్యాపారాల్లో అంతెత్తున కూర్చోవాలని ఆశపడే మనుష్యులు ఉన్నంతకాలం చారికి ఢోకా లేదు.

 (సశేషం)

 

 

 

ఛానెల్ 24/7- 12 వ భాగం

sujatha photo

   (కిందటి వారం తరువాయి)

బెహరా బాధితుల్లో నాగమ్మ బైట్ గుర్తొచ్చింది శ్రీధర్‌కు. ఎలా బతికుంది, ఏం బతుకు, ఏం జీవితం, అయ్యా నాకు ఒకే కొడుకు, ఆడు చదువుకోవాలని ఇరవైవేలు అప్పు తీసుకొన్నా.  పద్నాలుగుసార్లు మిత్తి కట్టినా. నాకు జబ్బు చేసి కూలికి వెళ్లలేకపోయినా. నా మొగుణ్ణి మేకలు కాయమని  జీతానికి పెట్టినా, ఆడికిచ్చే సంవత్సరం జీతం రెండునెల్లకోసారి తీసుకొని వడ్డీ కట్టినా, రెండోపాలి నా కొడుక్కి జీతం కట్టే రోజుకి ఈ ఇరవైవేలు బాకీ తీరి మళ్లీ తీసుకోవచ్చు. పిల్లాడి చదువు అయిపోతుంది అనుకొంటే పిల్లాడి చదువాగిపోయింది. మిత్తి కట్టనందుకు నన్ను తన్ని జైల్లో పెట్టించారు. నా కొడుకు భయపడి ఇంట్లోంచి పారిపోయిండు. నా మగడు పురుగుమందు తాగి సచ్చిపోయిండు. నేనిట్టయినా. నా కొడుకు ఏడకిపోయిండో,  నేనీ ఇరవైవేలు అప్పు ఎలా తీర్చాల్నో .. ఇదీ ఏడుపు.

ఇరవైవేలకు ప్రాణం పోయింది. చదువుకొనే పదిహేడేండ్లవాడు ఊరువదిలి పరారైనాడు. నాగమ్మ ఇల్లు, సామాను జప్తు చేశారు. ఆమె రోడ్డున పడి కూర్చుని వుంది. ఇలాంటి బతుకులు, ఇప్పుడామెకు మళ్లీ అప్పిస్తానంటే సంతోషంగా తీసుకొంటుంది. అసలు రూపాయి ఎక్కడుంది. వాళ్ల చేతిలోకి ఎలా వస్తుంది.?  ఈ బతుకులపైన వ్యాపారం చేస్తూ బెహరా విమానాల్లోనే తిరుగుతాడు. విమానాశ్రయాల్లో వీఇపిలతో కలిసి కనిపిస్తాడు. కమలలాంటి వాళ్లకు బిజినెస్ ఇస్తాడు. నాయుడుకు పర్సంటేజ్ ఇస్తాడు. రవళిలాంటి అందమైన భార్యకు చానల్ ఇస్తాడు. ఏమైనా చేస్తాడు. కానీ నాగమ్మ, బెహరా ఇద్దరూ మనుషులే. ఒక్కలాగే పుట్టారు. నాగమ్మ చీకటి వెంట. బెహరా వెలుగుల వెంట వున్నారు. నాగమ్మను తలుచుకొంటే నీతి నియమం, దయ, దాక్షిణ్యం, మనిషితనం పక్కన పెట్టి కెరీర్ గ్రాఫే చూసుకోవాలనిపించింది శ్రీధర్‌కు.

“ఏమిటాలోచిస్తున్నావ్…?”

“కమల వాళ్లని మీరు కలుద్దురుగానీ, లంచ్ ఇక్కడకు చెబితే సరిపోతుంది” అన్నాడు శ్రీధర్.
“బావుంది” అన్నాడు ఎండి.

***

కెమేరామెన్ పూర్ణ వెయిట్ చేస్తున్నాడు. అతన్ని శ్రీకాంత్ కొట్టాడు. యూనిట్ అంతా షూటింగ్ కాన్సిల్ చేసుకొని వెనక్కి వచ్చారు. శ్రీజ కూడా వుంది. లోపలికి పంపమంటారా…? ఇంటర్‌కంలో చెప్పింది పి.ఎ.

“ఎందుకు కొట్టాడట. లోపలికి రమ్మను” అన్నాడూ చిరాగ్గా ఎం.డి.

పూర్ణ లోపలికి వచ్చాడు. అతని వెనకాలే శ్రీజ వచ్చింది. కెమేరా అసిస్టెంట్ డోర్ దగ్గర నిలబడ్డాడు.

“కూర్చో” అన్నాడు ఎం.డి.

పూర్ణ కూర్చున్నాడు. అతని మొహం ఎర్రగా వుంది.

“చాలా కష్టం సర్ శ్రీకాంత్ సర్‌తో. చాలా ఎగ్రసివ్‌గా ఆలోచించకుండా బిహేవ్ చేస్తాడు. మేం చాలా ఓర్చుకున్నాం సర్. ఈ రోజు షూటింగ్‌కు బయలుదేరాం.
శ్రీజగారు లేటయ్యారని ఆమెను కోపంతో అరిచాడు. చాలా అప్‌సెట్ అవుతున్నాం సర్. చిన్న జోక్ వేశాను సర్. అప్పటిదాకా నవ్వుతూనే ఉన్నాడు సర్. చెంపపైన లాగిపెట్టి కొట్టాడు. తలుచుకొంటే నేనూ చేయి చేసుకోగలను సర్.”

“ఏం జోకేశాడు” అన్నాడు శ్రీజతో.

ఆమె మొహం దించుకొంది.

“సరిగా వినపడలేదు. ఏదో నాపైనే అయి వుంటుంది సర్”

“వినపడకపోవటానికి అదేమన్నా ప్యాలెస్సా, కార్లో పక్కనే కూర్చున్నా వినబడలేదా.”

“నన్ను ముందు సీట్లోనే కూర్చోమంటాడు సర్ శ్రీకాంత్” అన్నది శ్రీజ ఉన్నట్లుండి.

శ్రీకాంత్ తనను ముందు సీట్లో ఎందుకు కూర్చోమంటాడో అర్ధం అయింది ఆమెకు. ముఖం ఎర్రగా పెట్టుకొంది.

ఒక్క క్షణం కూడా అతనికి తనకు పడదు. ఎప్పుడూ ఆయన్ని వెనకాల శాపనార్ధాలు పెడుతూనే వుంటుంది అందరి ముందు. అతను లేనప్పుడు అతన్ని అనుకరించి నవ్విస్తూ వుంటుంది. కార్లో ఏ డైరెక్టరయినా వేన్‌లో తనతో కలిసి కెమేరామెన్‌తో కలిసి వెనక సీట్లో కూర్చుంటారు. మేకప్ అతను డ్రెస్ తీసుకొని వెనకాల కూర్చుంటాడు. కెమేరామెనో ఎవరో ముందు సీటు ఆక్యుపై చేస్తారు. శ్రెకాంత్ ఒక్కడే తనను ముందు సీట్లో కూర్చోమంటాడు. సరిగ్గా చెప్పడు. కసుర్తాడు. ఆ మేకప్ ఏమిటంటాడు. ఆ డ్రెస్ అలా వుండాలా అంటాడు. చిరాగ్గా వుంటుంది అతన్ని చూస్తే, మొదటిసారి తనకు తెలియనిది ఏదో జరిగినట్టు అనిపించింది శ్రీజకు. ఇప్పటివరకు పూర్ణని కొట్టడం తనకు నచ్చలేదు. కారణం ఎవ్వళ్ళూ మాట్లాడలేదు. కొట్టడం గురించి అరుచుకున్నారు. సగం దూరం వెళ్లాక ప్రోగ్రాం కాన్సిల్ చేసుకొని వచ్చేశారు.

“శ్రీకాంత్‌ని రమ్మను. శ్రీధర్‌ని కూడా..” ఇంటర్‌కంలో పి.ఎ.కి చెప్పాడు ఎం.డి.

నిముషంలో శ్రీధర్ వచ్చాడు. తాపీగా శ్రీకాంత్ వెనకాలే వచ్చాడు. అప్పటిదాకా శ్రీకాంత్ ప్రవర్తన ఎంత అరాచకంగా వుంటుందో చెపుతూనే వున్నాడు పూర్ణ.

“శ్రీధర్, శ్రీకాంత్‌ని పంపిచ్చేద్దాం. ఇలాంటి బిహేవియర్ కష్టం.” అన్నాడు కోపంగా.

శ్రీధర్ ఉలిక్కిపడ్డాడు.

“సర్. ఏం జరిగింది”

“అతన్నే అడుగు” అన్నాడు ఎం.డి.

ఏంట్రా అంటూనే సర్దుకొని ఏం జరిగింది శ్రీకాంత్ అన్నాడు.

“పొరపాటే సర్. కోపం వచ్చి కొట్టాను” అన్నాడు శ్రీకాంత్.

“చూశారా.. చూశారా పొరపాటేమిటి సర్. నన్ను ఇన్‌సల్ట్ చేసినట్టే కదా సర్” అంటూ గోలపెట్టాడు పూర్ణ.

“ఎందుకు కొట్టారు. కొట్టడం ఏమిటండీ” అన్నాడు కోపంగా శ్రీధర్.

ఈరోజు శ్రీకాంత్ ఉద్యోగం ఊడిపోయింది అనిపించిందతనికి..

“చిన్న జోక్ సర్” అంటూనే ఆగిపోయాడు పూర్ణ. హటాత్తుగా అతనికి తట్టింది.

తను వేసిన జోక్ గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు శ్రీకాంత్. తలతిప్పి శ్రీజ వైపు చూశాడు. ఆమె కళ్లెత్తి శ్రీకాంత్ వైపు చూస్తోంది. తన జోక్ తనకే నచ్చనట్లు అనిపించింది పూర్ణకు.
ఆ అమ్మాయి కాస్త పొట్టిగా, తెల్లగా, బొద్దుగా వుంటుంది. తన పక్కన కూర్చోమని తనే ఇన్వైట్ చేశాడు. హాయిగా వచ్చి కూర్చొంది. శ్రీకాంత్ వస్తూనే ఆమెను ముందుకెళ్లమన్నాడు. జుట్టు గాలికి ఎగురుతూ వుంది. ఏసి లేదు కనక గ్లాస్ డోర్ ఓపన్ చేస్తారు. జుట్టు చెదిరిపోతుంది ముందు సీట్లోకి వెళ్లను అంది. నోరు మూసుకుని ఫ్రంట్ సీట్‌లో కూర్చో అన్నాడు. నీలంరంగు చీరె, డిజైనర్ బ్లౌజ్ వేసుకొంది. బ్లౌస్ వెనకవైపుగా రౌండ్‌షేప్‌లో కట్ చేసి, పైనో ముడి వేసింది. వీపంతా తెల్లగా కనిపిస్తోంది. ఎంతో టెంప్టింగా వుంది ఆ అమ్మాయిని చూస్తే. అటు కూర్చోండి సర్ అన్నాడు తను. నువ్వు వెనక్కురా అని ముందు సీట్లో కూర్చుని అసిస్టెంట్‌కి చెప్పి శ్రీజను గదిమాడు శ్రీకాంత్. అమె విసుక్కుంటూ దిగింది. పక్కనే వచ్చి కూర్చున్న శీకాంత్‌తో మస్తు మజా మిస్ అయ్యాం సర్. ఆ పోరికి లేని కష్టం మీకెందుకు అన్నాడతను. సరిగ్గా ఈ మాటలే అన్నాడతను. ఆ నిముషానికి నోటికొచ్చిన పదం ఒకటి వాడాడు కూడా. ఓ నిముషం తప్పు చేశాననిపించింది పూర్ణకు.

“అదేనయ్యా ఎందుకు కొట్టావు. కారణం సరైందయితేనే, లేకపోతే వెళ్లిపో. నిముష, నిముషం నీతో న్యూసెన్స్‌గా వుంది” అన్నాడు ఎం.డి.

“కారణం చెప్పండి స్రీకాంత్” అన్నాడు శ్రీధర్.

“పూర్ణ ఊరికే సతాయించాడు సర్. లేటయిందని. శ్రీజతో ప్రతిరోజూ ఇదే ప్రాబ్లం. కోపం వచ్చింది” అన్నాడు. అంతే గానీ పూర్ణ వేసిన జోక్, బూతు మాట గురించి చెప్పలేదు.

అతని మొహంలో ఎలాంటి చిరాకు లేదు. ఎం.డి మోగిన పోన్ చూసుకొంటున్నాడు.

శ్రీకాంత్ మొహం చూసి చిరాకు ముంచుకొచ్చింది శ్రీధర్‌కు. వీడీ జన్మకు మారడు అనుకొన్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ల బాధ ఇతనిదే.

“ఏమంటావు?”  ఎండి మొదటికొచ్చాడు.

శ్రీధర్‌వైపు, పూర్ణవైపు చూశాడు. పూర్ణ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పా పం శ్రీజ గురించి తనేం మాట్లాడాడో చెపితే శ్రీజకి ఎంత అవమానం. ఈ విషయం ఈయనకి తెలిస్తే ముందు నన్నెళ్లి పొమ్మంటాడు..

“అదే ఏమైంది..” మళ్లీ గద్దించాడు ఎండి.

“యూనిట్‌ని సరైన టైంకి హ్యాండిల్ చేయకపోవటం నా ఇనెఫిషిన్న్సీ అన్నాడు సర్. నాకు ప్రొడ్యూసర్ లక్షణాలు ఏవీ లేవన్నాడు” అన్నాడు శ్రీకాంత్.
ఎండీకి నవ్వొచ్చింది.

“అయితే కొట్టేస్తావా?” అన్నాడు.

“ఆయనకి ఊరికే కోపం వస్తుంది సర్” అన్నాడు పూర్ణ. అతని గొంతులో కోపం లేదు. అనవసరంగా ఇష్యూ చేశాననిపించింది. భయం వేసింది. శ్రీజ గురించి తను వాగిన వాగుడు ఇప్పుడు ఎండికి చెబితే తనకు మరి ఫ్యూచర్ లేదు అందరి ముందు పరువూ లేదు.

“అయితే ఏంటంటావయ్యా, పూర్ణ కంప్లయింట్ చేస్తున్నాడు. శ్రీజ ఏడుస్తూ కూర్చుంది. ఆఫీస్ ఎట్మాస్ఫియర్ డిస్టర్బ్ అవుతోంది నీ వల్ల. నీలాంటివాళ్లు ఒకళ్లున్న చాలు. ఆఫీస్ కిష్కింధలాగా అయిపోయినట్లే. ఇట్ ఈజ్ వెరీ బాడ్. కొట్టుకోవటం ఏమిటయ్యా.. నీతోటివాడు. కొలీగ్, నీకెంత కోపం వచ్చినా కొట్టడమేమిటి అసహ్యంగా”

“కొట్టాలనుకోలేదు. ఏదో చిరాగ్గా ఉన్నాను. నా వల్లనే ప్రోగ్రామ్స్ లేటయిందంటాడు. కేమ్స్ తీసుకొని గంట సేపటినుంచి ఎండలో నిలబడ్డాం. మీరు రాలేదు. ఫోన్ చేయలేదు. మా ఇంచార్జ్ వచ్చేయమన్నాడు అంటాడు. నన్ను లేట్ మాస్టర్ అంటే..”

తలపట్టుకొన్నాడు ఎండి.

“తంతావటయ్యా. తన్ను అందరినీ, పెద్ద రౌడీలాగా ఉన్నావే” అన్నాడు చిరాగ్గా.

శ్రీకాంత్‌పైన ఎవరికీ కోపం రాదు. ఎంతోమంచి రైటర్. ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా మొత్తం తనకే ఆ కష్టం వచ్చిందనుకుంటాడు. ఆడపిల్లలు యాంకర్లు అతని నీడలో ఉన్నట్లుంటారు.
ఎండీకి హఠాత్తుగా ఏదో స్ఫురించింది. పూర్ణ మిస్ బిహేవ్ చేసి వుంటాడనిపించింది.

“ఏం చేద్దాం?” అన్నాడు పూర్ణతో.

పూర్ణ కంగారుపడ్డాడు.

“శ్రీధర్ చూడవయ్యా.. ఇతన్ని కొట్టాడు. ప్రోగ్రాం కాన్సిల్ చేసుకొనేంత ఇష్యూ అయింది. ఇతన్ని మనం భరించాలా?”

“పూర్ణా.. జరిగింది లెటర్ రాసివ్వు. శ్రీకాంత్‌ పైన యాక్షన్ తీసుకొందాం”

శ్రీధర్, శ్రీకాంత్ ఇద్దరూ మాట్లాడలేదు.

పూర్ణ నోరు పెగుల్చుకొన్నాడు.

“సర్ నాదే తప్పు ఆర్. దీన్ని వదిలేద్దాం సర్.” అన్నాడు.

అందరికీ అర్ధమయ్యీ అర్ధం కాకుండా వుంది. నిశ్శబ్దంలోంచి శ్రీజ వెక్కిళ్ళు పెద్దగా వినిపించాయి అందరికీ. చేతుల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది ఆ అమ్మాయి. ఒకసారి మొహం పైన లైట్లు పడ్డాక చానళ్ళలో తళుక్కున మెరిశాక ఇంకో జీవితం ఏ యాంకరూ ఊహించదు. టీవీపైన మమకారంతో ఎలాంటి హింసకైనా  ఓర్చుకుంటారు. ఉదయం వేసుకొన్న మేకప్‌తో చర్మం మండిపోతున్నా ఎండలో నిలబడి సాయంత్రం వరకూ షూటింగ్ చేస్తారు. ఎండలు మండిపోతున్నా ఫాన్ వేస్తే ఆ రెపరెపల శబ్దం కెమేరా రికార్డర్లో వస్తాయని దిగ చెమటలతో కుకరీ ప్రోగ్రాం చేస్తూ, నవ్వుతూ వండిన వంట నవ్వుతూ రుచి చూస్తూ నవ్వుతూ పేలుతూ నటిస్తూ వుంటుంది తను.

ప్రతిరోజూ ఒక కొత్త డిజైనర్ డ్రెస్, అందమైన నగలు, వెనక్కాల హెయిర్ డ్రస్సర్, మేకప్ మేన్‌ల గారాబం, షూటింగ్ స్పాట్‌లో గౌరవం, స్క్రీన్ పైన కనిపించే అందం, లక్షలమందికి తను తెలుస్తానన్న గర్వం, వాటికోసం తనలాంటి అమ్మాయిల పరుగులు, తమ  ఆశల చుట్టూ ఇంకోళ్ళ వ్యాపారపు ఆశలు, తమ అందం, వాక్చాతుర్యం చుట్టూ కమర్షియల్ ప్రోగ్రాంలు,  ప్రతిరోజూ రాత్రి పది నుంచి పదకొండు గంటల వరకూ చేసే ప్రోగ్రాం ఏమిటి? ఫోన్ కొట్టండి కాష్ పట్టండి, ఏంటా ప్రోగ్రాం. అందమైన డ్రెస్, రంగురంగుల విగ్‌లు.. గంటసేపు ఎడతెరిపిలేని కబుర్లతో ప్రేక్షకులపై ఆశలవల విసిరేయటం, స్క్రీన్‌పై ఎవరో పాపులర్ యాక్టర్,  కనీకనిపించనట్లుగా కనిపిస్తాడు. అతనెవరో కనుక్కోమంటూ, కనుక్కుంటే ఐదువేలు గిఫ్టంటూ, ఒకసారి ఎవరైనా ఫోన్ చెసి ఇరుక్కున్నారంటే అరవై, డెబ్బై రూపాయలు ఫోన్ కాల్స్ రూపంలో చానల్ లాగేస్తుంటుంది. ప్రోగ్రాం అయ్యేసరికి కార్యక్రమం  చేయడానికి అయ్యే ఖర్చుకంటే ఎన్నో ఎక్కువ రెట్లు ప్రేక్షకుల దగ్గరనుంచి లాగేస్తుంటారు. అందులోంచి ఐదువేలు గిఫ్ట్ ఇవ్వటం ఏం కష్టం. ఆ ప్రోగ్రాం అయ్యేసరికి పదకొండు దాటిపోతుంది ఆవేళకి. తనతోపాటు ఆఫీస్ కార్లో రావటానికి ఎంతోమందికి ఆశ. ఎక్కడో బిర్యానీ తిందామా అంటారు. కబుర్లలో పెడతారు. తను తేలిగ్గా దొరకాలని ఎంతమంది కలలు.. తను మాత్రం తక్కువదా? నవ్వుతూనే వుంటుంది. కాస్సేపు నవ్వుతూ మాట్లాడితే అలా పడుంటారని, వేరే ప్రోగ్రామ్స్‌కి తననే అడుగుతారని ఆశ. ఇవన్నీ చూస్తూ ఎండితో కవిత్వాన్ని వినిపిస్తూ, చుట్టుపక్కల చానల్‌లలో, సినిమాల్లో చాన్స్ దొరికితే బావుంటుందని సినిమా ప్రొడ్యూసర్‌లతో,  ప్రతివాళ్లతో ఫోన్‌లో చాటింగ్‌లూ, నవ్వులూ… తన విలువ తను ఇలా గుర్తించింది.

శ్రీకాంత్ ఇంకో రకంగా గుర్తించాడు. ఎప్పుడూ ఎవ్వరినీ ముట్టుకోనివ్వడు. యాంకర్ అయినా డిగ్నిఫైడ్‌గా ఉండాలి. అది ఉద్యోగంలా చూడాలి. కంటిచూపుతో శాసిస్తాడు. తనని ముందుసీట్లో కూర్చోమంటూ, ఎవళ్లనీ తన పక్కన కూర్చో నివ్వకుండా చేసే తత్వం మొదటిసారి అర్ధమయ్యిందామెకు. తననే కాదు తనతోటి యాంకర్లతో సొంత చెల్లెళ్లలాగే మాట్లాడతాడు. పూర్ణ తనపైనే జోక్ వేసి వుంటాడు. దాన్ని భరించలేక ఈయన కొట్టాడు. కొట్టేముందు ఎలాంటి ఆలోచనా లేదు. తనకేం జరుగుతుందో, శ్రీజ వల్ల తనకేం ఒరిగింది, ఆఫీస్, తన ఉద్యోగం ఇవేం లేవు. తన చెవుల్లో ఒక ఆడపిల్ల గురించిన చౌకబారు మాటలు.

శ్రీజ కన్నీళ్లలో ఈ దుఃఖం అంతా జారుతుంది.

(సశేషం)

 

ఛానెల్ 24/7 -11 వ భాగం

sujatha photo

    (కిందటి భాగం తరువాయి )

“నాన్న అందరికీ తెలిసిన మనిషే, కళాకారుడాయన. వాసుదేవనాయర్ కమ్యూనిస్ట్ పార్టీలో ముఖ్యమైనవారు. నాకు ఊహ తెలిసే సరికే అమ్మ పోయారు. ఆవిడా కార్యకర్తనే. నాన్న, అమ్మపేరు పైన  ఇవ్వాళ పార్టీ ఆఫీస్ వుంది. విద్యానాయర్ బిల్డింగ్స్. అక్కడే పార్టీ పత్రిక వస్తుంది. ఆ ఆవరణలోనే మా ఇల్లు. రాజేశ్వరమ్మగారి పెంపకంలో కమ్యూన్‌లో పెరిగాను. నాతోపాటు ఇవ్వాళ ఎన్నోరకాల పదవుల్లో వున్న ఆడపిల్లలు రాజేశ్వరమ్మగారి చేతిభోజనం తిని పెరిగాం. నాకు అమ్మ లేదు. మిగతావాళ్ల పేరెంట్స్ చాలా వరకూ పార్టీలో సీరియస్‌గా పని చేసేవాళ్లే. అరెస్టవుతూ అండర్‌గ్రౌండ్స్‌లో వుంటూ ప్రదర్శనలు, మీటింగ్‌లే లోకంగా వుండేవాళ్ల పిల్లలం మేము. అందరినీ సాంస్కృతిక బృందంగా తీర్చిదిద్దారు. పాటలు, నాటకాలు, మీటింగ్స్ జరిగితే జెండాలు అంటించటం దాకా. అదే చిన్నప్పటి జీవితం.”

నయన సీట్లోంచి ముందుకు వంగింది. ఆ అమ్మాయి ఊహించని విషయాలు.

“నాన్నకి నన్ను పట్టించుకునే తీరికలేదు. నన్ను పెంచే ఓపికాలేదు. ఆయన కళ్ళ ఎదుటే ఆయన కూతురిగా నా దారిన నేను పెరిగాను. నాన్నకంటే బాబాయితోనే ఎక్కువ చేరిక. బాబాయి అధికార పార్టీలోకి వచ్చి ఎంపీదాకా ఎదిగారు. నేను ఆయన దగ్గరవుండి చదువుకొన్నాను. తమాషా ఏమిటంటే ఇటు నాన్న పార్టీలో లేను. అటు బాబాయి పార్టీలోనూ లేను. చదువు పూర్తయ్యాక నాన్న నడిపే పేపర్‌లో ట్రయినీగా చేరాను. నాన్న పోయేసరికి రెసిడెంట్ ఎడిటర్ అయ్యాను. నా జీవితం ఇలా జర్నలిజం దగ్గరలోనే వుంది.”

“పెళ్లి పిల్లలు” అన్నది నయన.

“బాబాయ్ మంచి సంబంధం అని నిశ్చయించి పెళ్లి చేశారు. అప్పటికి ఉద్యోగం, రెండు పార్టీలతో సంబంధాలు, మనుష్యులతో స్నేహాలు.. జీవితం ఒక ఆటాపాటలాగ వుండేది. పాప పుట్టాక నా భర్తతో తగవులు వచ్చాయి. ఇటు నాన్న నుంచేనా, అటు బాబాయి నుంచేనా మంచి పొజిషన్‌లోకి  రావాలనుకున్నారు ఆయన. వాళ్లు పాత తరం వాళ్లు, ఎవరినైనా పైకి తీసుకువచ్చే ఆలోచనలు లేవు. వాళ్ల జీవితం రాజకీయాలకు ముడిపడి  వుంది. నాన్న పార్టీ ముఖ్య కార్తకర్త అనుకోండి. ఆయనకి పర్సనల్ అంటూ ఏదీ లేదు. దాన్ని ఈయన అర్ధం చేసుకోలేదు. బాబాయి చేస్తానన్న అరకొర వాగ్ధానాలు ఈయనకు నచ్చలేదు. తను ఓ మంచి పొజిషన్‌లోకి ఎదిగేందుకు వాళ్లిద్దరు సాయం చేయాలని ఈయన సిద్ధాంతం. అంతే మేం విడాకులు తీసుకొన్నాం.”

“పాపాయి ఎక్కడుంది” అన్నది నయన.

“పాపాయి ఇప్పుడు అమెరికాలో వుంది. డాక్టర్. ఆమె భర్త డాక్టర్. వాళ్లు అక్కడే సెటిలయ్యారు.”

నాలుక కరుచుకొంది నయన.

“ఆమె సంగతి చెప్పండి” అన్నది నవ్వుతూ.

“పాపాయి పేరు స్వతంత్ర. నాన్న దగ్గర నేను పెరిగినట్లుగా కమ్యూన్‌లోనే పెరిగింది. పాపాయి పుట్టేసరికి నాన్న ఓల్డేజ్‌హోమ్,  హెల్త్ రిసెర్చ్ సెంటర్ డెవలప్ చేశారు. పార్టీకి అనుబంధంగానే పాపాయి అక్కడే పెద్దదయింది. చదువుకొంది. మళ్లీ హాయిగా బాబాయి చూసిన సంబంధమే పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లింది.”

నవ్వేసింది స్వాతి.

“మీరు ప్రేమ వివాహాలకు వ్యతిరేకమా?”

“ఎవరన్నారు?  మేం కమ్యూన్‌లో పెరిగామంటే అర్ధం ఏమిటి? పార్టీ లీడర్స్ పిల్లలం. అందరూ ఒకే ఇంట్లో, ఒకే మనిషి చేతివంట తింటూ పెద్దవాళ్లం అయ్యాం. అందరూ చదువుకు మొదటి స్థానం ఇచ్చాం. ఎంతోమంది రష్యాలో చదువుకొన్నారు. మంచి విద్యావేత్తలు, ఆర్టిస్ట్‌లు, స్కాలర్స్ అందరూ కలిసి పెరిగాం. వాళ్లలో ఒకళ్లని చూసి వాళ్ల ద్వారానే కొందర్ని చూసి బాబాయి ఈ సంబంధాలు సెటిల్ చేశారు. ప్రేమలకు, తీరికకు చోటు లేదు. ఆఫీస్ ఇల్లు. అందుకే బాబాయి బాధ్యత పెళ్లిళ్లు. మేం పర్లే. అన్నీ అంతే. పరిచయాలు చేయటం. కబుర్లు చెప్పుకోవటం. సరేననటం ఇదే పెళ్లి” అన్నది స్వాతి.

“గ్రేట్ మేడమ్.. ఏదో సినిమా కథ వింటున్నట్లు వుంది.”

“అవును. నిజంగా సినిమాలో చూపించే స్థాయిలో ప్రేమలు, అభిమానాలు, సెంటిమెంట్లు, కన్నీళ్లు పెట్టుకోవటాలు మా మధ్య వుంటాయి. ఒక్కళ్లపైన ఒకళ్లకి విపరీతమైన ప్రేమలు. మా అందరికీ తల్లిదండ్రులను మిస్ అయిన ఫీలింగ్ కావచ్చు. అందరిలా కాకుండా ప్రత్యేకంగా అందరూ వుండి అనాధల్లా పెరిగామన్న ఊహ కావచ్చు. నీకో విషయం చెప్పనా? మా బాబాయి దగ్గర రాణీ అని ఒక కుక్క వుండేది. అది నా ఏడెనిమిదేళ్ల వయసులో నా అంత లావుగా, పెద్దగా వుండేది. అదంటే నాకు భయం. బాబాయి అది గమనించి,, స్వాతీ!  రాణీకి నువ్వంటే భయంరా. నీ దగ్గర పిల్లిలా వుంటుంది అనేవాడు. రోజూ చేసే మచ్చికతో రాణీ నిజంగానే నా పట్ల చాలా ప్రేమగా, ఇష్టంగా కాళ్లచుట్టూ తిరుగుతూ వుండేది. నాకదేం తెలుసు. నా మనసుకి రాణీకి నేనంటే భయం అన్న భావన కలిగించుకొన్నాను. ఒక గర్వం నాకు రాణీ అంటే భయం పోయేలా చేసింది. జీవితంలో నేను చేసిన మొదటి పొరపాటు అడుగు అది. నేను జయించలేని దానిపైన అధికారం సాధించాననుకునే నమ్మకం. అది నన్ను చాలా కిందికి లాగింది.”

నయన స్థిరంగా  కూర్చుంది. ఆవిడకు అడ్డం రావాలనిపించలేదు.

“లాంగ్ అయిపోతోంది మేడం. బ్రేక్ తీసుకోండి” అంటున్నాడు ఇయర్ మైక్‌లో ప్రొడ్యూసర్.

“ఫ్లో దెబ్బ తింటుంది” అన్నది చిన్నగా నయన.

“భయాన్ని జయించటంలో తప్పేముంది  మేడమ్”

“నేను భయాన్ని జయించలేదు కదా. నాకూ భయమే. కానీ నాకు భయం లేదన్న అపోహ. అర్ధమైందా…?”

” అర్ధం కాలేదు.”

“నాన్నతో దెబ్బలాటలు, అతని ఆశ భరించలేకపోయాను. అతన్ని మార్చుకునే ప్రయత్నం  ప్రయత్నం చేయలేదు. మాట్లాడుకోలేదు. అతనికి నేనంటే అసూయ అనుకొని దాన్నే నమ్మాను. దాన్ని పెద్దది చేసుకొని విడిపోయాము. అతనికి నేనంటే నా బిడ్డంటే ఇష్టం వుండి వుండచ్చు అని నాకు తట్టలేదు. నేను పెరిగిన వాతావరణం ఇమోషన్‌కు స్థానం లేదు. విడిపోయాక అతనెంతో బాధపడ్డాడు. కలిసి వుండమన్నాడు. నేను ఒప్పుకోలేదు.”

“ఆయన ఎక్కడ వున్నారు మేడం?”

“చనిపోయారు. తన్ను తాను  హింస పెట్టుకొన్నాడు. ఉద్యోగం, వ్యాపారం, పాలిటిక్స్ అన్నీ వదిలేశాడు. చాలా ఏకాంతవాసం చేశాడు. నా చుట్టూ వున్నవాళ్లు అతన్ని క్షమించలేదు. నన్ను క్షమించనివ్వలేదు.”

“అదేంటి మేడం.. అలా ఎవరెలా చెబితే అలా వింటామా మనం?”

స్వాతి నవ్వింది.

“ఎందుకు వినం? ఇవ్వాళ టాంక్‌బండ్ ప్రదర్శన చూడు. అందరికీ ఇలాంటి ప్రదర్శనలు చేయాలని వుంటుందా? చదువులు మాని భవిష్యత్ గాలికి వదిలి, అదో గుంపు తత్వం. అవతల వాళ్లు చేస్తే  మనమూ చేయాలి. గొప్పగా అనిపిస్తే చేయాలి. దానికి రీజనింగ్ వుండదు”

“ఉద్యమకారులకు గుంపు తత్వం అంటగడుతున్నారా?”

నయనకు పాయింట్ దొరికింది.

“ఇవ్వాళ ప్రదర్శన చేసింది నాయకులు కారు. నాయకులు అరెస్ట్ అయ్యారు. ఓన్లీ స్టూడెంట్ లీడర్స్. ఎంత ఉద్రేకంగా వున్నారు. ఎంత విధ్వంసం సృష్టించారు. వీళ్లని ప్రోత్సహించిన లీడర్స్ పత్తా లేరు. ఈ ఆత్మాహుతులు, హోటళ్లు, హాస్పిటల్స్, బస్‌లు ధ్వంసం చేయటం ఉన్మాద చర్య కాదా?” అన్నది.
“మీరెటో వెళ్లిపోతున్నారు” పిసీఅర్‌లోంచి ప్రొడ్యూసర్ నయనని హెచ్చరించాడు.

“సారీ మేడం. ఇప్పుడో   బ్రేక్ తీసుకొందాం” అన్నది.

***

“బెహరా మాట్లాడమంటున్నారు సర్” అన్నాడు శ్రీధర్.

ఎండి చాంబర్ చల్లగా వుంది. చక్కని ఇంటీరియర్ చేసిన అందమైన చాంబర్ అది. చుట్టూ వాల్స్‌కి వున్న రాక్స్, పుస్తకాలు, నీడలు కనిపించే నేల, ఖరీదైన సోఫాలు, చుట్టూ చూసుకొన్నాడు ఎండి ఎస్.ఆర్.నాయుడు. ఎప్పటికంటే కంఫర్టబుల్‌గా అనిపించింది రూమ్.

“కూర్చోవయ్యా” అన్నాడు సంతోషంగా.

“కమలగారు, వాళ్లమ్మాయి బెహరా వైఫ్ రవళి వచ్చారు. గ్రీన్‌మేట్ పైన రవళిగారి ఇంటర్వ్యూ తీసుకొంటాను. బెహరాకి సంబంధించిన ఆఫీస్, వాళ్ల లోగోలు, వాళ్ల చేతిలో ఎఫెక్ట్ అయిన విక్టిమ్స్, అవన్నీ బ్యాక్‌డ్రాప్‌లో ప్లే అవుతాయి.”

“ఇంటర్వ్యూని డామినేట్ చేయవు కదా అవంతా?”

“అవనీయండి. బెహరాని ట్రాప్ చేయటం కోసంగానే కదా” అంటూ మాట వదిలేశాడు.

ఎండి మొహంలోని నవ్వు ఎగిరిపోయింది.

“సరే శ్రీధర్ కారీ ఆన్. నేను సాయంత్రం బెహరాని కలుస్తాను. ఆతనితో మాట్లాడతాను.” అన్నాడు ఎస్.ఆర్.నాయుడు.

నన్ను రమ్మని పిలిచాడు అనాలనుకొని ఊరుకొన్నాడు శ్రీధర్.

చెప్పినా ఎట్లాగూ ఎంటర్‌టేయిన్ చేయడు. తనే నన్ను పీల్చాడంటే ఊరుకొంటాడా? ఈయన ఇవ్వాళ రాత్రికి బెహరా విషయం సెటిలయిపోతోంది. ఇంటర్వ్యూ టైం దండగ. ఏదీ టెలికాస్ట్ అవకుండానే బెహరా వాళ్లకి ఎవరి వాటా వాళ్లకి పారేస్తాడు. రేపటినుంచి హాయిగా వ్యాపారం చేసుకొంటాడు. అప్పు దొరకగానే ఎగబడే లేబరంతా ఇచ్చినవాళ్లను, తన్నిన వాళ్లను, పోలీస్ స్టేషన్లకు లాక్కుపోయిన వాళ్లను క్షణంలో మర్చిపోయి కొత్త అప్పులకు ఎగబడి వాళ్ల బతుకులు బెహరాలాంటి వాళ్లకు తాకట్టు పెట్టుకొంటారు. పూటకూలి కోసం రోడ్డు పక్కన ఎండలో రాళ్లు కొట్టే బాపతు, నిరుపేదలకు పావలా వడ్డీ రుణాలిచ్చి వాళ్ల ప్రాణాలు లాగేయాలని బెహరాలాంటి దరిద్రుడికి ఎలా ఐడియా వచ్చింది దేవుడా అనుకొన్నాడు శ్రీధర్.
ఈ ప్రపంచంలో శ్రీమంతులు వందల్లో వుంటే దరిద్రులు కోట్లలో. బెహరాకి  పెట్టుబడిగా ఇప్పటికే పుట్టి దరిద్రపు బతుకు ఈడుస్తూ ఓ పూట విందు భోజనం దొరికితే తిని చచ్చిపోదాం అనుకునే మూర్ఖుల్ని ఏం కాపాడతాం. ఎందుకు  కాపాడటం వాళ్లంతా ఏమంత సుఖంగా ఉన్నారు కనుక. ఊరి చివర, గవర్నమెంట్ దయతో కట్టిచ్చిన అగ్గిపెట్టంత ఇళ్లల్లో, చుక్క నీళ్లు దొరక్కపోయినా, కాస్త వెలుగు లేకపోయినా చస్తూ బతకటానికి, మూర్ఖంగా అలవాటు పడిన వాళ్లు ఎన్నిసార్లు చస్తారు. ఇంకా ఎందు గురించి చస్తారు.

(సశేషం)

ఛానెల్ 24/7 – 10 వ భాగం

(కిందటి వారం తరువాయి)
sujatha photo

“అదేమిటి జయదేవ్ బ్రేక్ చెప్పావు” కోపంగా అన్నాడు ఎండి.

దక్షిణామూర్తి చేత వాగిస్తే పనయిపోతుంది అనిపించింది ఆయనకు. ఒక వర్గానికి ఆయన శత్రువైపోతాడు.

“దక్షిణామూర్తిగారు సెన్సిటివ్‌గా ఉన్నారనిపించింది” అన్నాడు జయదేవ్.

విద్యార్థి నాయకుడు కూడా మొహం దించుకొని ఊరుకొన్నాడు. అతని మనసులోకి సూటిగా వెళ్లాయి దక్షిణామూర్తిగారి మాటలు. యాభైఏళ్లనుంచి చేస్తూ వస్తున్న పోరాటం ఇది.

ఇంతవరకూ ఓ దారికి రాలేదు. ఏ బానిసత్వపు గుప్పిట్లోంచి బయటపడాలని ఈ పోరాటం మొదలైందో అది ఇప్పుడు ఏ దారి పట్టిందో స్పష్టంగా తెలుసు. ఇది పులినెక్కి స్వారీ చేయటం. ఎక్కటమేకానీ దిగటం ఎలా సాధ్యం?  ఉదయం చనిపోయిన భాస్కర్ తల్లి నిలువెత్తు దుఃఖం కళ్ళముందు కదలాడింది. ఆమె కన్నీళ్లు దక్షిణామూర్తిని ఏ స్థాయిలో తాకాయో అర్ధం అయింది. ఆయన ఉద్యమానికి వ్యతిరేకి కాదు. ఏదైనా స్లొగన్,  టైటిల్, పాంప్లెట్ ఏది కావాలన్నా ఆయన దగ్గిర వాలిపోతారు తామంతా. ఇవ్వాళయితే బాధలో ఉన్నారు. దాన్ని పర్సనల్‌గా తీసుకోకూడదని అనుకొన్న ఆయన ఆరాటం, ఆగని నిట్టూర్పు తెలిసి వచ్చిందతనికి.

“సర్ మీ కోసం గెస్ట్‌లు వచ్చారు” అన్నాడు ప్రొడక్షన్ మేనేజర్.

స్టూడియో తలుపు దగ్గర వైపు చూశాడు ఎండి. ఆయన వెనకగా కమల, బెహరా భార్య రవళి కనిపిస్తున్నారు. దక్షిణామూర్తికి క్షణంలో విషయం అర్ధం అయింది. ఎండి ఎస్.ఆర్.నాయుడు వైపు సాలోచనగా చూశాడు.

వాళ్లని ఒకసారి విష్ చేసి,”  పది నిమిషాల్లో ట్వల్వ్ థర్టీ బులెటిన్ స్టార్టవుతుంది. ఓన్లీ ఎయిట్ మినిట్స్‌లో ముగిస్తున్నాం. మీకు శ్రీధర్ అసిస్ట్ చేస్తాడు ” అన్నాడు ఎండి. వీళ్లని శ్రీధర్ దగ్గరకు తీసుకు వెళ్ళు అన్నట్లు ప్రొడక్షన్ మేనేజర్ వైపు చూసి…

***

“బెహరా కంపెనీ గురించి ఎంతమంది ఇంటర్వ్యూలు తీసుకొన్నారు మీరు” అని అడిగింది కమల.

పక్కనే కూర్చుంది రవళి. చాలా అందంగా వుంది.

“ఎస్.ఆర్.నాయుడుగారు మీతో మాట్లాడమన్నారు” అన్నది కమల. ఏం ఫర్వాలేదు. ఆఫీస్ ప్రోగ్రామ్స్ గురించి నేను తెలుసుకోవచ్చు అన్నట్లు వినిపించింది శ్రీధర్‌కు.

“అదేం లేదండి” అంటూ నవ్వాడు.

వ్యవహారం డైరెక్టుగా వుంది. ఇంతగా ఇష్యూ చేసి సేకరించిన ఇంటర్వ్యూలు వెయ్యచ్చు, వెయ్యకపోవచ్చునన్నమాట.

“చాలా వచ్చాయండి. ఇరవైమంది దాకా నిన్న చానెల్ కు  వచ్చారు. ఇక్కడే రికార్డ్ చేశాం. డేటా కూడా రెడీగా వుంది” అన్నాడు

ఎండిగారు ఈవిడతో ఏం చెప్పమన్నారో తెలియటం లేదతనికి .

అతను సందేహిస్తున్నాడని అర్ధం అయింది కమలకి, ఏం పోయింది. పది నిముషాలుంటే వీళ్ళకి ఎండీనే చెపుతాడు అనుకొన్నదామె.

“రవళి ఫ్రెష్ అవుతావా? అన్నది కూతురితో.

బాంబే నుంచి ఫ్లయిట్‌లో సరాసరి నేరుగా ఇటే వచ్చిందా అమ్మాయి. అంతా చల్లచల్లగా ఏసీల్లో ప్రయాణం. చెక్కు చెదరకుండా కాగితం చుట్టిపెట్టిన కొత్త సబ్బుబిళ్లలా ఉంది అనుకొన్నాడు శ్రీధర్. ఆ అమ్మాయిని చూస్తుంటే మనసు తేలిపోతుంది. కాసేపు ఆమె చర్చనీ, ఉద్యోగ ధర్మాన్ని మరచిపోతే బావుండనిపిస్తోంది.

అతని మొహం చూస్తోంది కమల. ఇతను మనసుపెట్టి చేస్తే అనుకొన్న పని చిటికెలో అయిపోతుంది అనిపించింది ఆమెకు. కాస్త బాగా మాట్లాడాలి.

శ్రీధర్ మంచి తెలివైనవాడు. చాలా  యాక్టివ్. చిన్న వయసులో మంచి పొజిషన్‌లోకి వచ్చాడు. రేపు మన ఛానెల్ కి  ఇతన్ని లాక్కుంటే అనిపించింది ఓ నిముషం.

శ్రీధర్ ఇంటర్‌కంలో హెయిర్ డ్రెస్సర్‌ని, మేకప్‌మేన్‌ని పిలవటం, గ్రీన్ మ్యాట్ స్టూడియోలో ప్రోగ్రాం రికార్డ్ చేద్దామని ప్యానల్ ప్రొడ్యూసర్‌తో చెప్పటం, రవళిని ఆమె వేసుకొన్న డ్రెస్ బ్యాక్‌గ్రౌండ్‌కు సూట్ అవదనీ, కర్టసీకోసం చాలా అందమైన డ్రెస్‌లు తెచ్చారని వాటిల్లో ఏదైనా వేసుకొమ్మని చాలా మర్యదగా చెప్పటం చూస్తూ వుంది. రవళి గురించి అతనెంత శ్రద్ధగా ఉన్నాడో, ఎంత మర్యాదగా ఆమె ప్రోగ్రామ్ గురించి చెబుతున్నాడో విన్నాక కమల మనసులో ఉద్ధేశ్యం స్థిరపడింది. రవళికి ఛానెల్స్  వ్యాపారం గురించి తెలియదు. శ్రీధర్ సరిగ్గా హ్యాండిల్ చేస్తాడు. ఇతన్ని తప్పనిసరిగా తీసుకోవాలి అనుకొంది.

“శ్రీధర్ రేపు మా ఇంటికి లంచ్‌కి రాకూడదూ” అన్నది అభిమానంగా.

శ్రీధర్ ఆశ్చర్యంగా చూశాడు.

“నీతో మాట్లాడాలి. చాలా ముఖ్యమైన విషయం. నీ ఫ్యూచర్, మా ఫ్యూచర్” అన్నది హింట్ ఇస్తూ.

శ్రీధర్‌కి మనసు తేలిపోయిందనిపించింది. తను ఛానెల్  సి.ఇ.ఓ ఐపోకుండా ఆ దేవుడు కూడా ఆపలేదు. కాకపోతే ఇప్పుడిక ప్యాకేజీ విషయమే. తను జాగ్రత్తగా వుండాలి. ”  ప్రోగ్రాం అయ్యాక నా పనులు చూసుకొని చెప్తాను. ఉదయం కోర్ మీటింగ్ వుంటుంది. రేపు పరిస్థితి చూసి చెప్తాను ” అన్నాడు.

“మేడం జిల్లాల నుంచి వచ్చిన బైట్స్ చూస్తారా?” అన్నాడు.

“బెహరా సార్ గురించి, రికవరీ ఏజంట్లవల్ల బాధపడి చనిపోయిన వాళ్లు ఇరవైమంది వున్నారు మేడం. ఈ గొడవ  ప్రెస్‌కు వచ్చాక మామూలు చావులు కూడా బెహరాగారికి అంటగట్టారు” అన్నాడు.

బెహరాని కాస్త గట్టిగా పట్టుకోవాలిగాని, బురదలోకి లాగి తొక్కేయనక్కరలేదని అర్ధమైంది అతనికి. ఎండి. కమల కలిసి వేసిన ప్లాన్. బెహరా గురించి అతని బిజినెస్ ఫైనాన్స్ గురించి చెయవలసినంత యాగీ చేశారు. ఇప్పుడు రవళి ఇంటర్వ్యూని రికార్డ్ చేస్తున్నామని మెసేజ్ ఇస్తారు. అతనివల్ల బాధపడినవాళ్ల ఇంటర్వ్యూలు సిద్ధంగా వున్నాయని బెదిరిస్తారు. ఇవన్నీ కలిపి టెలికాస్ట్ చేసేస్తామని అంతా ప్రజల ముందుకు వస్తే నీ పరువేమిటో చూసుకోమని చెప్తున్నారు. బహుశా బెహరా బెదిరితే వీళ్లందరి పంట పండినట్లే.

బిజినెస్ డెస్క్ ఇన్‌చార్జ్ ఫోన్ చేశాడు.

“శ్రీధర్‌గారు బెహరా పి.ఏ లైన్లో వున్నారు. ఇమ్మంటారా?” అంటున్నాడు. శ్రీధర్‌కి నవ్వొచ్చింది.

“ఇవ్వండి” అన్నాడు.

అవతలనుంచి బెహరా పి.ఏ.

“మీరు శ్రీధర్ గారండీ. నేను బెహరాగారి పి.ఏ.ని సార్ మీతో కలవాలనుకుంటున్నారు”

“ఆయన ఇక్కడికి వస్తారా?” అన్నాడు శ్రీధర్.

“లేదండి సార్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు.”

“సరే” అన్నాడు శ్రీధర్.

మరు నిముషం లైన్‌లోకి వచ్చాడు బెహరా.

“హలో శ్రీధర్ హౌ ఆర్ యూ?”

“చెప్పండి సార్.. బావున్నారా?”

“మా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మా ఇంటర్వ్యూలు, అభినందనలు మీ చేతిమీదగానే వచ్చాయి. మీరు మర్చిపోయారు. నేను గుర్తుపెట్టుకొన్నా” అన్నాడు బెహరా చక్కని ఇంగ్లీస్ యాక్సెంట్‌లో..

శ్రీధర్ నవ్వేశాడు.

“చెప్పండి సర్.. నేనేం చేయాలి?”

“నువ్వే నాకు చెప్పాలి” అన్నాడాయన.

“నేను ఫైవ్ థర్టీ తర్వాత ఫోన్ చేస్తాను సర్” అన్నాడు శ్రీధర్. “ఇప్పుడు చాలా అర్జెంట్ పనిలో వున్నాన”ని చెబ్తున్నట్లుగా.

“బిజీగా వున్నారా? ఎస్. కేరీ ఆన్. మళ్లీ మాట్లాడుకుందం” అన్నాడు బెహరా.

ఫోన్ పెట్టేసి కమలవైపు చూశాడు.

బెహరా ఫోన్ చేసాడని కమలకు చెప్పాలా వద్దా? ఎండి డెసిషన్ ఎలా వుందో అనిపించింది.

“నేనొకసారి సార్‌ని కలిసి వస్తాను. మీరు రిలాక్స్ అవండి. రవళిగారు రాగానే ప్రోగ్రాం మొదలుపెడదాం” అన్నాడు.

***

“మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండీ మేడం” అన్నది నయన.

“ఒన్ మినిట్ నయనా” అన్నాడు పిసీఅర్‌లోంచి ప్రొడ్యూసర్.

“దీన్ని లీడ్ తీసుకొందామా” అన్నాడు.

ఇంట్రడక్షన్ ఇక్కడ చెబితే బావుంటుందా అని. నయన క్షణం ఆలోచించింది.

“వద్దండి రొటీన్‌గా ఉండదా? మేడం దగ్గరనుంచి మీడియా లెసన్స్ వినాలనుకొంటాం. సక్సెస్ గురించి వినాలనుకొంటాం. పర్సనల్ లైఫ్ .. నాట్ ఇంపార్టెంట్” అన్నది నయన.

స్వాతి తలవంచి నవ్వుకొంది.

నిజంగానే పర్సనల్ లైఫ్ ఏ రకంగా ఇంపార్టేంట్. మీడియా కబుర్లలో పర్సనల్ లైవ్ ఇముడుతుందా? కాని నా జీవితం ఇమిడిపోయింది. నయన అభిప్రాయం మార్చుకొంటుంది.

మీడియా గురించిన కబుర్లకంటే తన జీవితంలో వచ్చిన మలుపులే ఇంటరెస్టింగ్.

“చెప్పండి మేడం” అంది నయన.

( సశేషం)

ఛానెల్ 24/7- 9 వ భాగం

“మనిషి ఎలా వుండాలో ఆ స్ట్రక్చర్ ఇమ్మని అడగగలమా”

“నువ్వు మహాత్మాగాంధీలా అవ్వాలనుకొన్నావనుకో. మీడియా ఇచ్చేది ఏవుంది. న్యాయంగా, నిజాయితీగా, ధైర్యంగా నీకు నువ్వే తయారవ్వాలి. నాకు మాట్లాడాలంటే భయం, స్టేజ్‌ఫియర్ అన్నావనుకో. ఎవరో ఒక కౌన్సిలింగ్ ఎక్స్‌పర్ట్ నువ్వెలా మాట్లాడాలో, మీడియాలో మాట్లాడి పెడతారు. నీ జీవితంలో నీ ఇల్లు ఎలా వుండాలో, నీ కారు ఏదై వుండాలో నీకెలాంటి డిజైనర్ చీరె కావాలో, నీవేం తినాలో, తాగాలో నిన్నొక కార్పోరేట్ పర్సన్‌లాగ డిజైన్ చేసి పెడుతోంది మీడియా. నువ్వు కోరుకుంటే, నువ్వు గొప్పగా ఎలా వుండాలనుకున్నావో అదే ఊహించి ఇస్తుంది. నీ పిల్లలు అన్నం పప్పు తినకుండా నూడుల్స్ తిని ఎలా ఆరోగ్యంగా వుండాలో చెపుతుంది. నిమ్మకాయ నీళ్లు తాగకుండా న్యూట్రిషియస్ డ్రింక్‌ని చేతిలో పెడుతోంది. నీ గురించి నువ్వు ఆలోచించుకోనక్కరలేదు. అదే ఆలోచించి ఇస్తుంది.”

“మరి నాకు ప్రాబ్లం వస్తే..”

“ఎందుకు.. కౌన్సిలింగ్ ఎక్స్‌పర్ట్స్”

“కడుపు నొప్పేస్తే..”

“మెడికల్ ఎక్స్‌పర్ట్స్”

“కాపురం వద్దనుకుంటే…”

“లీగల్ ఎక్స్‌పర్ట్స్.. అంతటా ఎక్స్‌పర్ట్స్. ఎక్కడో ఒక చోట దర్శనం ఇస్తూ..”నవ్వింది స్వాతి.

“మీరు పొలిటికల్ ఎడిటర్ కదా.. ఎక్స్‌పర్ట్స్ అంటే ఎగతాళెందుకు మీకు?”

ముక్కుపైన వేలేసుకొంది స్వాతి.

“ఎగతాళా.. నీ ప్రశ్నకు సమాధానం చెప్పాను. ఆక్టోపస్‌లాగ ప్రజలను మీడియా ఎలా చేతుల్లోకి తీసుకొంటుందో చెపుతున్నాను”

“వాళ్లకు మంచి చేస్తుందా.. చెడు చేస్తుందంటారా?”

“మీడియా ఒక వ్యవస్థ. రాజకీయంలాగా, పోలీస్ వ్యవస్థలాగ ఇంకో వ్యవస్థ. మన జీవిత విధానంలో ఒక భాగం. ప్రజలకు – పాలకులకు, ప్రజలకు – ప్రజలకు, ప్రజలకౌ – న్యాయానికి, న్యాయానికి – అన్యాయానికి, మనిషికి – మనిషికీ మధ్య ఒక వంతెన…”

“నేను అడిగింది డెఫినిషన్ కాదు. మీ అభిప్రాయం. ఇంతకు ముందోసారి చెప్పారు. మీడియా వ్యక్తుల లాభాలతో కూడా ముడిపడుతోందని, దురాశలకు చేయి అందిస్తోందని..” నయన గొంతులో కాస్త ఆవేశం.

“నయనా.. స్పష్టంగా నిజాన్ని చూడు. ఒక చాకు తీసుకో. అది నీకు మామిడిపండు కోయటానికి ఉపయోగపడుతుంది. ఒక ఉన్మాది చేతిలో గొంతు కోసేందుకు ఉపయోగపడుతుంది. చాకు మేలు చేస్తోందా, కీడా?”

“మేడం…”

“అదే చెబుతున్నాను. జర్నలిస్ట్‌లన్నా, పత్రికలన్నా, చానల్స్ అన్నా ప్రజలకు నమ్మకం. ఇష్టం. వాళ్లు మీడియాతో చేయి కలిపారు. గొంతు కలిపారు. అయితే మీడియా వాళ్ల భావాలన్నీ, అభిప్రాయాలన్నీ కరక్టు కాదు. లిట్మస్ టెస్ట్‌లాగా చూసుకోవాలి ప్రజలు. కొన్ని వ్యవస్థలకు కొన్ని విధులు కర్తవ్యాలు కావాలి. ఉండాలి. పోలీస్ వ్యవస్థ రక్షణ ఇవ్వాలి. చివరకు ఆటోవాళ్ల దగ్గర కూడా లంచాలు పుచ్చుకొంటారు చూడటంలా. రాజకీయ నాయకులు మన ప్రతినిధులుగా ఉండాలి. కానీ వాళ్ల కుటుంబ ఆస్థులను పెంచుకొనే ప్లేసుల్లో ఉంటారు కొందరు. డాక్టర్ ప్రాణం పోసే పరమాత్మలాగా ఉండాలి. కానీ కార్పోరేట్ వైద్యం పేరిట ఎవరికైనా నిజమైన వైద్యం అందుతుందా? డాక్టర్లు ప్రాణదాతలుగా ఉన్నారా? వ్యాపారుల్లా ఉన్నారా? ఉపాధ్యాయులు విద్యాదానం చేయాలి. ఇవ్వాల్టి రోజుల్లో ఒక పిల్లకి ఫీజు కట్టాలంటే మామూలు మధ్యతరగతి కుటుంబం మనిషి ఇంటిల్లిపాదీ పస్తుండాల్సిందే. విద్యలాంటి వ్యాపారం ఎక్కడైనా వుందా? దీనికి సమాధానం నీ దగ్గర వుందా?”

“అంటే వీటన్నింటిలాగే మీడియా లంచగొండిగా వ్యవహరిస్తోందంటారా?”

తనను ఇరికించాలని చూస్తోందని అర్ధం అయింది స్వాతికి.

“నయనా నేను మీడియా పర్సన్‌ని. ఈ ప్రపంచంలో నా గుర్తింపు నేను ఒక జర్నలిస్ట్‌గా ప్రతి క్షణం మర్యాద పొందాను. గౌరవం పొందాను. నేను ఫలానా అని తెలిస్తే ఏదైనా హాస్పిటల్లో కూడా నాకు వైద్యం ఉచితంగానే అందుతుంది. నేనడగకుండా, ఒక జర్నలిస్ట్ పట్ల మనుష్యులకుండే ప్రేమ, అభిమానం అది. నా ఉద్యోగం మొత్తంగా నేను తిన్నంగా వుంటే, అత్యాశపరురాలని కాకుంటే, డబ్బుపట్ల మమకారం లేకుండా ఒక జర్నలిస్ట్‌గానే జీవిస్తే సాక్షాత్తు ధర్మదేవతను. అలా కాకుండా నేను నా కుటూంబం బాగుపడాలని నేను అనుకొంటే, కోరుకుంటే నా వృత్తి నాకు వందరెట్లు సాయం చేస్తుంది కాదంటారా” అంది స్వాతి.

నయన నవ్వింది. నవ్వులో ఆనందం లేదు. వెటకారం వుంది.

“మేడం మీరు ధర్మదేవతేనా?”

స్వాతి ఆమెవైపు చూసింది.

“నేను నా మనసు  చెప్పినట్లు కూడా విన్నాను. నాకు నేను కరెక్టే. ధర్మదేవతనే.”

“మనసు ధర్మాన్నే చెప్పిందా?”

“నా బతుకు తెరువును కూడా పరిగణలోకి తీసుకొంది.”

నయన కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. లేచి ఆవిడ కాళ్లకు నమస్కరించింది.

“మీరు ఎమోషనల్ అయిపోతున్నారు నయనా. బ్రేక్ తీసుకొందాం” అన్నాడు మైక్‌లో ప్రొడ్యూసర్.

***

“ఇప్పుడు మనం టాక్‌బండ్‌పైన దృశ్యాలు చూద్దాం” అన్నాడు న్యూస్ రీడర్. టాక్‌బండ్‌పైన ఊరేగింపు దృశ్యాలు, మధ్యలో పోలీసులు ఆపేయటం, స్టూడెంట్స్ రెచ్చిపోవటం, టియర్‌గ్యాస్ వదలటం, రబ్బరు బుల్లెట్లు వదలటం ఐదు నిముషాల ప్యాకేజీ. స్క్రీన్‌పైన కనిపించింది.

“దక్షిణామూర్తిగారు మీరేమంటారు?”

“మీరు చూశారు కదా జయదేవ్. ఇటువైపు నుంచి ప్రదర్శన వుంటుందని ప్రజలకు హెచ్చరిక లేదు. ఆ బస్ ఆగింది చూడండి. పెద్దవాళ్లు, పిల్లలు నక్కి నక్కి బస్ చాటున ఎలా కూర్చున్నారో చూడండి. ఒకవైపు స్టూడెంట్స్ బస్ పగులగొట్టేస్తున్నారు. ఏ రాయి ఎటువైపు వచ్చి పడుతుందో తెలియదు. ఇది అన్యాయం అనిపించటం లేదా?” అన్నాడు దక్షిణామూర్తి.

వీడు అడ్డంగా దొరికాడు అనుకొన్నాడు ఎండి. లైవ్ అని, జనం చూస్తున్నారనే జ్ఞానం కాస్సేపు నశించిపోయి నవ్వు కూడా వచ్చిందాయనకు. ఈ లైవ్ దిగాలి.
స్టూడెంట్ లీడర్ యాక్షన్ కమిటీ నాయకుడు పాండు దక్షిణామూర్తి వంక చిరాగ్గా చూశాడు.

“మీరు పెద్దవాళ్లు. ఉద్యమం దేన్ని గురించండీ. మీరు పిల్లలు. బస్సు, రాళ్ల దెబ్బల గురించి మాట్లాడుతున్నారు. ఇవ్వాళ ఉదయం ఈ ఉద్యమం కోసమే మా స్టూడెంట్ తగలబడి చనిపోయాడండి. ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆ మంటల వేడి ఇంకా చల్లారలేదు. అతని గుండెల చప్పుడు మా విద్యార్థులను నిప్పులపైన నడిపిస్తోంది.”
దక్షిణామూర్తి నవ్వాడు.

“చాలా రోజుల క్రితం నేనో పిల్లల నవల చదివాను. యుద్ధంలో కొంతమంది మన సైనికులు గాయపడ్డారు. ఆ గాయపడిన వాళ్లని హెలికాప్టర్‌లో హాస్పిటల్‌కు తెచ్చారు. పొరపాటున వారిలో ఒక పాకిస్తానీ  సైనికుడు కూడా కలిసిపోయాడు. గాయపడ్డ వాళ్ల దుస్తులు కాలిపోయి, వళ్ళంతా పేలిపోయి ఆకారాలు మారిపోయి వున్నారందరూ. అందరికీ వళ్లంతా సందు లేకుండా కట్టు కట్టారు. ఈలోగా శత్రు సైనికుడున్నాడన్న విషయం అందరికీ తెలిసింది. ప్రజలంతా హాస్పిటల్ చుట్టుముట్టారు. చిన్నపిల్లలు గుంపుగా చేరి వాడ్ని మాకు అప్పగించండి. వాడ్ని కర్రకు గుచ్చి వాడి మర్మాయవాన్ని వత్తిలా చేసి అంటిస్తాం అని అరుస్తున్నారు. శత్రుసైనికుడు ఇది విన్నాడు వణికిపోతున్నాడు. ఎలా బయటపడాలి…? నేనూ వీరుణ్ణే. శత్రువునే అయిన అనా మాతృభూమికోసం దేశభక్తితో యుద్ధం చేశాను. నాకు ప్రాణబిక్ష పెట్టండని ఇంగ్లీషు భాషలో ఎలా అడగాలో ప్రాక్టీసు చేస్తున్నాడు. ఈలోగా ఇది విన్న ఇంకో సైనికుడు.. అతనూ మన సైనికుడే.. “అబ్బా ఏం పిల్లలో! ఎలాంటి శిక్షలు కోరుతున్నారో తలుచుకొంటేనే భయం వేస్తోంది” అన్నాడు. వెంటనే జనం వీడే శత్రువు అని. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చంపేశారు. పిల్లలనోట అలాంటి మాటలు రాకూడదనుకొని, అజ్ఞానపు మాటలని భావించి మనవాడు నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు హతమైపోయాడు” అన్నాడు దక్షిణామూర్తి.

“అంటే మాది అజ్ఞానమంటారా?” మాటల్లోనే నిప్పులు కురిపించాడా విద్యార్థి నాయకుడు.

దక్షిణామూర్తి గొంతు స్థిరంగా వుంది.

“ప్రపంచం  నా అభిప్రాయాన్ని మన్నించనక్కర్లేదు. విద్యార్థుల కర్తవ్యం చదువు. వాళ్ల భవిష్యత్తు రాజకీయాలైతే నాకు అభ్యంతరం లేదు. వాళ్ల భవిష్యత్తు పోతోంది. వాళ్లు ఆవేశంగా వున్నారు. ఇది నేతలకు సంబంధించిన, మేధావులకు సంబంధించిన, కేవలం రాజకీయ ప్రయోజనం ఆశించే కొద్దిమంది నాయకులకు సంబంధించిన ఉద్యమం. దీన్ని ప్రజలు ఆమోదించారా? ప్రజలు అండగా వున్నారా? ప్రజామోదం పొందిన ఏ ఉద్యమంలోనైనా నష్టపోయిన ప్రజలకు లాభం జరగాలి. అది మానవ కల్యాణానికి ఉపయోగపడితే భూమిపైన వుండే మనుషులంతా ఆ ఉద్యమం వెనకే ఉంటారు. నేను మాట్లాడుతోంది ఉదయం మంటల్లో దహించుకుపోయిన అబ్బాయి గురించే. ఆ అబ్బాయి తల్లిని మన చానల్ గెస్ట్ రూంలో చూశాను ఇంతకు ముందు. ఆమె కళ్ల తడి ఎప్పటికైనా ఆరుతుందా? ఒక్కగానొక్క కొడుకు చదువుకొని ఉద్యోగం చేసి, ఆ తల్లిని సుఖపెట్టవలసిన బిడ్డ బూడిదైపోతే ఆవిడ నిలువునా కుంగిపోతూ వణికిపోతూ వెర్రిచూపులు చూస్తుంటే నాకు ఈ ఉద్యమం పట్ల ఎందుకు ప్రేమ వుండాలి?”

విద్యార్థి నాయకుడు చిద్విలాసంగా నవ్వాడు. ఎండిగారు చిరునవ్వు నవ్వాడు.

“అయ్యా మీరు పెద్దవాళ్లు. ఎంతో ప్రపంచాన్ని చూశారు. ఒక ఎడిటర్‌గా మీరు రాసిన ఎడిటోరియల్స్ భక్తిగా చదువుకొన్నాను నేను. ఉద్యమం ఒక వ్యక్తి ఆత్మాహుతికి ఆగిపోతుందా?

మీరు సెంటిమెంటు గురించి ఆలోచిస్తున్నారు. నేను భవిష్యత్తుని చూస్తున్నాను.”అన్నాడతను.

దక్షిణామూర్తి అతని వైపు జాలిగా చూశాడు.

“కానీ నేనీ ఉదయం నుంచి ఒక కొత్త కోణం చూస్తున్నానండీ. పోరాటం, యుద్ధం, ప్రదర్శనలు, ఇవన్నీ ఒక వ్యాపారం అవటం  గుర్తించాను. ఈ ఉద్యమం వెనకాల జరుగుతున్న మ్యానిపులేషన్స్, ఎన్నెన్నో స్వార్ధాలు, ఎందరివో అహంకారాలు నాకు స్పష్టంగా కనిపించాయి. దయచేసి అపార్ధం చేసుకోవచ్చు. ఇది నా అభిప్రాయం. మళ్లీ మళ్లీ చెబుతున్నాను. మనుష్యుల్లోని దుర్మార్గం, హింసా ప్రవృత్తి ప్రతి చానల్‌లో నిముష నిముషం కళ్ళారా చూశాను. అసలు రెండు ముక్కల్లో చెప్పాలంటే ఇవ్వాళ లాస్ట్ మినిట్‌లో శ్రీధర్ పిలిచినా వద్దనకుండా రావాలనే వచ్చాను. ఈ ప్రాంతీయ ద్వేషాలు ఇందు గురించి జరుగుతున్న హింస ఇదంతా వీరకృత్యంలాగా, ఇదంతా అత్యున్నత ఆదర్శంలాగా నాకు అనిపించటం లేదు. ఇదే కుర్రాళ్లు ఉన్మాదంతో చచ్చిపోకపోతే చాలని నేనెన్నడూ నమస్కారం చేయని ఆ దేవుడికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను” అన్నాడు దక్షిణామూర్తి ఉద్వేగంగా.

జయదేవ్ ఓ నిముషం మాట్లాడలేదు.

“సర్ మీరేమంటారు?” ఎస్.ఆర్.నాయుడుగారి వంక చూశాడు. కాస్త బ్రేక్ వస్తే  బావుంటుందనిపించిందతనికి.

“దక్షిణామూర్తిగారిని మాట్లాడనివ్వండి. ఇప్పుడు జరుగుతున్న టాంక్‌బండ్ ప్రదర్శన గురించి వారు మాట్లాడుతున్నారు కదా” అన్నాడు హెచ్చరికగా జయదేవ్‌తో.
“నేను ఈ నిముషం జరుగుతున్న ప్రదర్శన గురించే చెప్పటంలేదండి. ప్రతి మనిషికీ ప్రాంతీయాభిమానం దేశభక్తి వుంటాయి. ఇవన్నీ నిరూపించుకునే ఓ సమయం అనుకోకుండా వస్తుంది. ఎలాగోలా మనం కూడా అందరి దృష్టిలో పడితే కాస్త గొప్పగా వుంటుందనీ, మనం కూడా ఇందులో భాగంగా వుంటే ఓ పనయిపోతుందనీ, మన ఉనిక్కి భంగం కలగకుండా వుంటుందనీ అనుకొనేవాళ్లు కూడా ఈ గుంపుల్లో వున్నారు. ఈ పూట కూలీ ఇస్తాం రమ్మంటే వచ్చినవాళ్లున్నారు. వాళ్లకి ఈ ఉద్యమం గురించీ తెలియదు. దానికోసం ప్రాణాలు ఇవ్వటమూ తెలియదు. పొట్టకూటికోసం ఓ సాహసం చేస్తున్నారేమో. మిగతావాళ్లంతా ఈ ప్రదర్శన అంతా ఎలా వుంటుందో తెలిసినవాళ్లు. వాళ్లు తెలివిగా కావలసిన వాటివైపు అడుగులు వేస్తారు. వాళ్ల గురించి నాకు భయం దిగులు లేదు. మిగతా మూర్ఖుల గురించే “అన్నాడు దక్షిణామూర్తి తొణకకుండా.

ఎటో వెళుతుందనిపించింది జయదేవ్‌కి.

చప్పున ఓ బ్రేక్ తీసుకొందాం అనేశాం. వెంటనే స్క్రీన్‌పైన చానల్ బ్యాంగ్ వచ్చేసింది. యాడ్స్ మొదలైయ్యాయి.

 

ఛానెల్ 24 / 7- 8 వ భాగం

sujatha photo

   ( కిందటి వారం తరువాయి)

“శ్రీధర్‌గారూ ఈ కాన్సెప్ట్ ఎల్లా రిజెక్ట్ చేశారో అర్ధం కావటం లేదు” అన్నది కాదంబరి. చేతిలోవున్న ఫైళ్ళు, క్యాసెట్లు, హెడ్‌ఫోన్ టేబుల్ పైన పెట్టి శ్రీధర్ ఎదురుగ్గా నిలబడింది.

శ్రీధర్ ముందు అయోమయంగా ఆమె వంక చూశాడు. ఒక్క నిముషం ఏవీ అర్ధం కాలేదు. ఆమె చేతిలో వున్న ఫైల్ లోగో చూశాక అర్ధం అయింది.
“మేడం కూర్చోండి” అన్నాడు తాపీగా.
కాదంబరితో కాస్సేపు కబుర్లు పెట్టుకొంటే కాస్త టెన్షనన్నా తగ్గుతుందనిపించింది.

మేడం అని పిలిచేసరికి నవ్వొచ్చింది కాదంబరికి. రిజక్ట్ చేసిన అంశం గుర్తొచ్చి మళ్ళీ కోపం కూడా వచ్చింది.

“దాన్ని మనం ఇప్పుడు ఎందుకు టెలికాస్ట్ చేయాలో చెప్పండి. నేను మార్చి ఎనిమిదికోసం అనుకొన్నాను. అప్పటికి నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ సబ్జెక్ట్‌లో టెన్షన్ వుంది. మీకు తెలుసు అన్నది. శ్రీధర్ ఆలోచిస్తున్నాడు. అది భూమి సొషల్ నెట్‌వర్క్ కోలబరేషన్‌తో చేసింది. ఇప్పుడీ ప్రోగ్రాం చేస్తే ఆ ఎన్జీవో కమలని హైలైట్ చేయాలి. ఆవిడను ఎన్నిసార్లు డిస్కషన్‌కి పిలిచాడు తను. మొహమాటంలేకుండా రాను పొమ్మంది. ఇదయ్యాక భర్త ఆస్థిలో వాటా ఉండేలా చట్టం చేయాలి అన్న కాన్సెప్ట్‌తో ప్రోగ్రాం చేయాలనుకొన్నాడు. కమల చాలా చక్కగా మాట్లాడుతుంది. కాన్సెప్ట్ బాగానే వుంది కానీ మీరు పిలిచే  ఎక్స్‌పర్ట్ కాంబినేషన్ బాగాలేదంది. నన్నూ పిలుస్తారు. కట్నాల్ని వ్యతిరేకించే రాడికల్ ఫెమినిస్ట్‌నీ పిలిచారు. ఒకావిడతో కట్నం ఇస్తే తప్పేంటీ అంటుంది. మన ఫెమినిస్ట్ ఏమో  చెప్పు తెగుతుంది అంటూంటే మధ్యలో నా పనయిపోతుంది. మీకు సెన్సేషన్ కావాలి కానీ మనుష్యులపైన కన్సర్న్ లేదు. నిజంగా ఆడవాళ్లకు న్యాయం చేయాలంటే ఈ తన్నుకొనే గాంగ్ ను ఎలా ఐడెంటిఫై చేస్తారు?. మీ చానల్‌కు నేను రాను పొమ్మంది. అది దృష్టిలో పెట్టుకొనే తను కమలని చానల్‌కు రానివ్వకూడదనుకొన్నాడు. ఇప్పుడు కాదంబరి పట్టుకొంది. మాటిమాటికి ఎండిగారితో దేన్నయినా ఒప్పి ఇస్తానంటుందావిడ. అలాంటప్పుడు మధ్యలో తనెందుకు. ప్రతివాళ్ళు పుడింగిలే. ఈ కాన్సెప్ట్ ఎంత బావున్నా ఎండి దిగొచ్చినా ఓకే అనేది లేదు అనుకొన్నాడు శ్రీధర్.

” ఆ చెప్పండి” అన్నాడు నవ్వుతూ..

“హైబ్రీడ్ కాటన్ సీడ్ కోసం కూలీలను గ్రామాలనుంచి తెస్తున్నారండి. ముఖ్యంగా అమ్మాయిలను. పదమూడు నుంచి పదహారేళ్ళ వయసువాళ్లు. చిన్నపిల్లలయితే కూలి తక్కువ. తెల్లారుజామునే పత్తిపంటకు మందు కొడతారు. ఆ ఉదయం వేళ పత్తి పూవును వేరే పూవుతో కలుపుతూ పోవాలి. ఆ పత్తికి స్ప్రే చేసిన మందంతా పీల్చుకుంటున్నారు. జబ్బులు వస్తున్నాయి. తొందరగా మెచ్యూర్ అవుతున్నారు. అన్నింటికంటే ఘోరం ఇరవై, ముప్పయిమందిని ఓ గోడౌన్‌లాంటి ఇంట్లో వసతి సౌకర్యం ఇస్తున్నారు. అదీ వూరికి దూరంగా వుంటుంది. ఈ పిల్లలకి డబ్బుల ఆశ చూపించి ఏజంట్లు, ఆ పొలాల యజమానులూ  పాడు చేస్తున్నారు. అన్నిరకాలుగా కూలికోసం వచ్చిన పిల్లలు పాడైపోతున్నారు. ఎవిడెన్స్‌లు, బైట్‌లు రెడీగా వున్నాయి. కమలగారు ఆ ప్లేస్‌లకు వెళ్ళి అందరినీ కలిశారు. విక్టిమ్స్ చాలామంది ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా ఘోరం  కదండీ” అన్నది కాదంబరి.
వింటున్నకొద్దీ ఆడపిల్లల్ని తలచుకొని పాపం అనిపించింది కానీ కమలని తలుచుకుని వళ్ళు మండింది. పెద్ద ఎన్.జి.ఓ. నాయకురాలి ఫోజు. అన్ని చానల్స్‌లో ఈమే. అడ్డమైన సమస్యలు ఈవిడ ఇంటికొస్తాయి. హ్యాపీగా మీడియేటర్ పనులు చేసి డబ్బులు సంపాదిస్తుంది. లేకపోతే హోండా సిటీ కారెక్కడినుంచి వచ్చింది ఆమెకు?. ఆవిడ నడిపే ఎన్.జి.ఓ కు అద్దాల మేడలు ఎలా వచ్చాయి?. అంతా ట్రాష్ అనుకొన్నాడు కోపంగా.

కాదంబరిని చూస్తున్నా కోపం వచ్చింది శ్రీధర్‌కు.

***

“నయనగారూ స్టూడియో ఎన్నిగంటలకు ఇస్తామో చెప్పమంటున్నారు శ్రీధర్‌గారు. ఒన్ అవర్‌లో ప్యాకప్ అని చెప్పనా?” అన్నాడు డైరెక్టర్ అంటూనే నయనతో.

“మిమ్మల్ని ఈ షిఫ్ట్ కూడా వుండమంటున్నారు. బెహరా వైఫ్ వస్తున్నారంట. ఆవిడ ఇంటర్వ్యూ తీసుకోమంటున్నారు” అన్నాడతను.

స్వాతి, నయన మొహం మొహం చూసుకొన్నారు. స్వాతి మొహం పైకి నవ్వొచ్చింది.

“బెహరా వైఫ్‌ని పట్టుకొన్నారు” అన్నది స్వాతి.

నయన ఆమెను చూస్తూ ఊరుకొంది. నోరెత్తితే ఎటుపోతుందో అనిపించింది ఆ అమ్మాయికి. స్వాతి ఎండి ఫేవర్. శ్రీధర్ వీళ్ళిద్దరికీ చంచా. ఇంకేం మాట్లాడాలి అనుకొంది కోపంగా నయన.

న్యూస్ యాంకర్‌గా ఎనిమిదేళ్ళనుంచి ఫీల్డ్‌లో వుంది తను. టాప్ మోస్ట్ కింద లెక్క. నాలుగు చానల్స్ ఈ ఎనిమిదేళ్లలో. ప్రస్తుతం ఇక్కడ. రెండు నెలలుగా బెహరా దగ్గర  కొన్ని కోట్లయినా రాబట్టాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు ఎండి. సూక్ష్మరుణ వ్యాపారంలో దిగ్గజం బెహరా. పేదవాళ్లకి వడ్డీకి అప్పులిచ్చి ప్రపంచంలో గొప్పదాతగా పేరు తెచ్చుకొన్నాడాయన. అప్పు వసూలు చేసే విషయంలో రాక్షసుడి అవతారం ఎత్తాడు. అప్పు తీర్చని వాళ్లని ఎన్ని యాతనలు ఉన్నాయని చదువుకున్నామో అన్నీ పెట్టేస్తున్నాడు. ఇళ్ళు వాకిళ్ళు వేలం, వాళ్ల ఇళ్లల్లో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేయిస్తానని బెదిరింపులు, ఏజంట్‌లచేత కొట్టించటాలు, ఒకటేమిటి దేశం అల్లకల్లోలంగా వుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాజెక్టులకు డబ్బులు లేవు. ఈ సందు చూసుకొని గవర్నమెంట్ అఫీషియల్స్ బెహరాని రోడ్డుపైకి లాగి తమ సంస్థలకు గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేయించుకోవాలని ఒకవైపు, దాన్ని ఆధారం చేసుకొని ఇటు బెహరా కొమ్ములు వంచి డబ్బు లాగాలని చానల్స్ తీవ్రంగానే కృషి చేస్తున్నాయి. అందిట్లో ఎండి ముందు వరుసలో ఉన్నాడు. బెహరాని బ్రష్టు పట్టించే అందరినీ లైవ్‌ల్లో కూర్చోబెట్టాడు. అప్పు కట్టలేని ప్రజల్ని చానల్‌కి సకల లాంచనాలతో రప్పించాడు. వాళ్లకి హోటల్లో అకామడేషన్  ఇప్పించి లైవ్‌ల్లో పంపించాడు. బెహరాని ఇప్పుడు అష్టదిగ్భంగంలో పెడితే వాడు బెదిరిపోయి తన్ను గురించి మరచిపోడని, కోట్లు గుమ్మరిస్తాడని ఎండి ఆశ. బెహరా అంతకంటే ముదురు. దీన్నిగూడా పబ్లిసిటీనే అనుకొన్నాడు. అప్పులిచ్చినవాళ్లు కట్టక ఏం చేస్తారు? . దిక్కుమాలిన జనాలు మళ్లీ తన ఆఫీసుల చుట్టూ తిరక్క ఏం చేస్తారు?. రిక్షా లాక్కునేవాళ్లు , కూలిపని చేసుకునే వాళ్లు పదివేలు అప్పుడొరికితే ఆశ పడకుండా వుంటారా? రోజంతా ఎద్దులాగ కష్టపడినా వంద రూపాయలు కళ్లచూడనివాళ్లకి ఓక వేయి రూపాయలు అవసరం ఉండదా?? డబ్బా?… మజాకా?….. అది మనుష్యుల్ని కోతుల్ని చేసి ఆడించకుండ వుంటుందా?

ఇప్పుడు నవ్వొచ్చింది నయనకు. ఆ కూటికి గతిలేనివాళ్ళని కోతుల్ని చేసిన డబ్బే ఇప్పుడు ఎండీనీ చేసింది. ఇప్పుడు ఏనాడో విడిపోయిన బెహరా పెళ్ళాం రంగం మీదికి వచ్చింది.  ఉత్సాహం వచ్చింది నయనకు.

” ఆ అమ్మాయికి తెలుగు వస్తుందా?” అన్నది స్వాతితో.

స్వాతి ఫోన్‌లో మెసేజ్ చూసుకొంటోంది. ఎండి ఇచ్చిన మెసెజ్.

“తెలుగు ఎందుకు రాదు?. వాళ్ల నాన్నకు ఇక్కడే ఒక ఆర్ఫనేజ్ వుంది. మెంటల్లీ  హ్యాండీకాప్డ్ చిల్డ్రన్స్‌కు . కమలవాళ్లది అదే కదా. కమలగారి అమ్మాయి”

కళ్ళు పెద్దవి చేసి చూసింది నయన. ఎక్కడెక్కడో లింక్ దొరుకుతూ ఉంటుంది. ఈ ఎన్జీఓతో బెహరాకు సంబంధం ఉండటం వల్ల ప్రపంచంలో అన్ని ప్రాంతాల నుంచి నిధులు వస్తాయి. ఈ స్ట్రీట్ చిల్డ్రన్ రిహాబిలిటేషన్ కింద గవర్నమెంట్ ఫండ్స్ బ్రహ్మాండంగా వస్తాయి. ఆ కోట్లాది రూపాయలు నిధులు మళ్లించి బెహరాతో అంటే అల్లుడితో  కొత్త బిజినెస్ పెట్టదా? విషయం అర్ధం అయింది నయనకు.

“బెహరా కంపెనీలో ఈ అమ్మాయి కూడా ఒక డైరెక్టర్. డబ్బు విషయంలో గొడవలు వచ్చాయిట. కమలకి వాటాలున్నాయి. ఆ వాటాలు డిసైడ్ చేసుకోవడం కోసం ఈ అమ్మాయిని రంగంలోకి దింపుతోంది కమల. ఈ ఎటాక్‌తో అంటే ప్రపంచంలో పరువు ప్రతిష్టలు పోతాయని భయపడి బెహరా వాళ్ల మనీమేటర్ సెటిల్ చెస్తాడని ఐడియా. ఈ అమ్మాయి బెహారిని వదిలేశాక ఈ రెండేళ్ళలో మన ఎండిగారబ్బాయితో కలిసి మీడియా హౌస్ ఎస్టాబ్లిష్ చేసింది. ఈయన మన చానల్ కోసం ఢిల్లీ, బాంబే టూర్స్ వేస్తాడు. వాళ్లబ్బాయి మీడియా హౌస్‌కు యాడ్స్ వచ్చి వాల్తాయి.”

“ఎండిగారబ్బాయితో ఏంటి రిలేషన్?”

“మానవి  ఎంటర్‌టేయిన్‌మెంట్ చానల్ యాడ్స్ చూడలేదా?”

“ఓ మై గాడ్…” గుండెపైన చేయి వేసుకొంది నయన.

“కొత్త చానల్ వాళ్లదే కదా. ఎండిగారు ఇక్కడుండరా? అన్నది నయన.

స్వాతి నవ్వింది.

“ఆయన ఇక్కడ వుండకపోవటానికి కారణం ఏవుంది చెప్పు. ఫైవ్ లాక్స్ పర్ మంత్ రెండేళ్ళనుంచి. ఇంకేం కావాలి.
నయన మాట్లాడలేదు.

“మీరెందుకు చానల్ వదిలేద్దామనుకుంటున్నారు మేడం?”

“ఇది ఇంటర్వ్యూ క్వశ్చనా?. ఆఫ్ ది రికార్డా?” నవ్వింది స్వాతి.

“ఫర్ మై సేక్. నాకోసం నేనడుగుతున్నాను. అయ్ మిస్ యు మేడం” అన్నది నయన.

” ఈ ప్రశ్నకు సమాధానం నేను రికార్డింగ్‌లో చెపుతా” అన్నది స్వాతి.

“సో.. స్టార్ట్ చేద్దామా మేడం..” అన్నడి స్వాతి నవ్వేసి.

లైట్లన్నీ వెలిగాయి.

“మేడం ఎడంవైపు జుట్టు సరిచేయండి. మేడం మొహం పైకెగురుతోంది” అన్నాడు డైరెక్టర్ మైక్‌లోంచి.

నయన వంగి స్వాతి జుట్టు సరిచేసింది. రెండే వెంట్రుకలు పైకి రెపరెపలాడుతున్నాయి. అవి క్లోజ్‌షాట్‌లో కనపడి వుండొచ్చు. అందుకే కేక వేశాడు డైరెక్టరు. లేకపోతే  మేడంకి చెప్పే సాహసం చేయడు అనుకొంది నయన. మొట్టమొదటిసారి చూస్తున్నట్లు ఆవిడ వైపు చూసింది. వయసు 60 దాటి వుంటాయి. తెల్లగా బొద్దుగా వుంది. జుట్టును నున్నగా దువ్వి చిన్న ముడిగా వేసుకొంది. చిన్న చుక్కలాంటి బొట్టు. కళ్ళజోడు, ఖరీదైన నూలు చీర. మ్యాచింగ్ బ్లౌజ్. ఈవిడ డ్రెస్ విషయంలో పర్ఫెక్ట్ అనుకొంది నయన. ఆమె అందంగా వుందా అంటే లేదు. కానీ గ్రేస్‌ఫుల్‌గా వుంది. చూడగనే గౌరవ భావం కలిగేలా వుంది. మేడం పేరు చెప్పగానే ఎలర్ట్ అయ్యే స్టాఫ్‌ను తలుచుకొని నవ్వొచ్చింది. కాస్సేపు కూడ ఓర్పుగా ఊరుకోదు. కోపం వస్తే అవతలవాడు పరుగులు తీయాల్సిందే.

“మొదలుపెడదామా?” అన్నది స్వాతి.

“మేడం  మీడియాకు ప్రజలకు ఇవ్వాళున్న అనుబంధం ఏమిటి?”

“జీవితంలో ఒక భాగం మీడియా. ఒక కల్పవృక్షం అనుకో. ఎవరికేం కావాలో అవన్నీ ఇచ్చే సూపర్ పవర్” గర్వంగా అంది స్వాతి.

“మీడియానే అన్నీ అవుతుందా ప్రజలకు?” అన్నది.

“ఒక సమయంలో ఉదయం లేవగానే పేపర్ చూడకపోతే కాఫీ కూడ తాగని వాళ్లున్నారు. అది ప్రింట్ మీడియాకు స్వర్ణయుగం. ఇప్పుడు ఎలక్ట్రానికి మీడియా యుగం. ఒక మనిషి పబ్లిక్ జీవితం మీడియా చుట్టూ లేదా బిజినెస్, న్యూస్, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్. జాతకాలు, దేవుళ్లు, జబ్బులు, మందులు, నీకేం కావాలో అడుగు?. కోరుకో నరుడా ఇచ్చేస్తాననే పాతాళ భైరవి”

నవ్వింది నయన.

“పాతాళ భైరవి. ఇంకే దేవతతోనూ పోలిక లేదా”

“మనిషి కోరికను తక్షణం తీర్చేలా హామీ ఇచ్చిన దేవత ఇంకెవరూ నాకు కనిపించలేదు. సినిమా దేవత తప్ప ఇవాల్టి రోజుల్లో మనిషి అవసరాలు ఏవయితే వున్నాయో వాటికి సమాధానాలు మీడియాలో ఉన్నాయి.

( సశేషం)

ఛానెల్ 24/7 – 7 వ భాగం

sujatha photo

  ( 6 వ భాగం తరువాయి)

నయన, స్వాతి కూర్చొన్న వేదికని క్లోజ్‌లో,  వైడ్‌లో మార్చి మార్చి చూస్తున్నాడు డైరెక్టర్. నయన  క్లోజ్, స్వాతి క్లోజ్ షాట్స్ కట్ చేశాడు స్విచ్చర్‌లో. స్వాతి వెనకాల బల్బ్‌లు బుట్టలో వేలాడదీశారు. చుట్టూ ప్రమిదలు అంటించిన గుండ్రని బుట్టలపై ప్రమిదల్లో చాలా చిన్న లైట్లున్నాయి. మినుకు మినుకుమంటూ. ఆ బుట్టలోంచే తేలికపాటి వెలుగు స్వాతిపైన పడుతోంది. ఆమె మొహం, బుగ్గలు నున్నగా మేకప్ వేసినంతగా మెరుస్తున్నాయి.  నలుపు తెలుపులు కలనేతగా వున్న వత్తయిన జుట్టుపైన గమ్మత్తుగా పడుతోంది వెలుగు. చక్కని నేతచీరతో ఆమె కుర్చీలో కూర్చున్న ఆధునిక సరస్వతిలాగ వుంది అనుకొన్నాడు ప్రొడ్యూసర్.
“మేడం రెడీ, నయనగారూ” అన్నాడు ప్రొడ్యూసర్.

“మేడం, జర్నలిజంలో, ఇటు రచనా రంగంలో మీరు ఎక్కలేని మెట్లు  లేవు. ఈ సక్సెస్ రహస్యం ఏమిటి?”

“సక్సెస్‌కి రహస్యాలు ఏముంటాయి నయనా, మనం కష్టపడాలి అంతే.”

“అంతేనా మేడం, ఇదే స్టేట్‌మెంట్” అన్నది నయన.

“ఇది స్టేట్‌మెంట్. కాని సక్సెస్‌కి ఒకే ఒక్క దగ్గరదారి వుంది. మనం ఎదగాలంటే చుట్టూ ఎవ్వళ్ళూ ఎదగకుండా జాగ్రత్తపడాలి ” అన్నది స్వాతి.

“దానికి మనమే చేస్తాం మేడం. చుట్టూ ఉన్నవాళ్లు వృద్ధిలోకి రాకుండా మనమేం చేయగలం”

స్వాతి నవ్వింది.

“నువ్వు గట్టిగా ఆలోచించు. మొత్తం పది న్యూస్ చానల్స్. నాలుగు ఎంటర్‌టైన్‌మెంట్ చానల్స్ తెలుగులో బాగా నడుస్తున్నాయి. ఆరు న్యూస్ పేపర్లు మెయిన్‌గా వున్నాయి.

ఎంతమంది ఎడిటర్స్, చానల్ హెడ్స్ ఉన్నారు. మొదటినుంచి ప్రతి ఎదుగుదలలోనూ వాళ్ళే. వాళ్ల చుట్టూ ఎవ్వళ్లూ ఎదగలేదే. ఎవ్వళ్ళూ ఎందుకు వృద్ధిలోకి రాలేదు. ఈ ఒక్క ఇరవైమందే తెలివైనవాళ్లా ?  సెకండ్ పొజిషన్‌లో కూడా ఎవ్వళ్లూ లేరేం?”

నయన భయంగా చూసింది ఆవిడవైపు.

“నయనా, నేను సరిగ్గానే చెప్పాను. సరైన సమయంలో ఎవ్వళ్ళొ కొందరికే అవకాశం వస్తుంది. నెమ్మదిగా ఆ అవకాశం ఉపయోగించుకొంటారు. ఆ కొందరు అంచలంచెలుగా ఎదిగే క్రమంలో తమతో సమంగా ఉండేవాళ్ళతో సంబంధాలు ఉంచుకోరు. ఒక పరిధిలో రెండు కత్తులు ఇమడవు కదా. యుద్ధతంత్రం లాగే ఇదీ. నువ్వు బతకాలంటే ఇతరుల్ని బతకనివ్వకూడదు.”

నయన ఓ నిముషం ఆవిడవైపే చూస్తూ ఊరుకొంది.

“కెరీర్‌లో పైకి ఎదగాలంటే యుద్ధ తంత్రాలే అవసరమా”

స్వాతి నిట్టూర్చింది.

“ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్. అవతలి వాళ్ళను జయించలేమోనన్న భయం. తనకంటే తెలివైన వాళ్లు తన పక్కనుంటే, తన తెలివితక్కువతనం బయటపడుతుందనే ఈర్ష్య. జలసీ..”

“మీరు ఇంత వృద్ధిలోకి వచ్చారు. మీకు చేదు అనుభవాలు ఏమైనా ఎదురయ్యాయా… మీరేమీ అనుకోనంటే మీరు కూడా యుద్ధ తంత్రాన్నే నమ్మారా?”
నయన గొంతు స్థిరంగా వుంది.

“ఎందుకు కాదు నయనా?. ఎన్నెన్నో చేదు అనుభవాలు. తీపి అనుభవాలు. అర్ధం అయ్యేలా ఎలా చెప్పను. వ్యక్తుల గురించి మనకి తెలియని కొత్త పార్ష్యాలలో గబుక్కున కనిపిస్తాయి. మనకి పరిచయం వున్న దారులే ఉన్నట్టుండి ఇక్కడ ఎప్పుడూ మనం చూడలేదనిపించే అనుభవంలాగా అన్నమాట”

“అర్ధం కాలేదు” అన్నది నయన.

“ఇందులో కంఫ్యూజన్ ఏవీ లేదు. మనం అనుకొన్నట్లు మన భావాలకు తగినట్లు, మనం నమ్మిన విలువల్ని మనమే చూస్తూ వదిలేస్తూ రావటం నాకు స్పష్టంగా కనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్, నేనో కార్యక్రమం చేయాలనుకొంటాను. దానికింత బడ్జెట్ కావాలని అన్ని డిపార్ట్‌మెంట్స్ సాయం అడుగుతాను. అందరూ కలిసి అంటే ఇన్ని కెమెరాలు, లోకేషన్ కోసం వెరిఫై చేయటం. ఒక సెట్ వేయటం కోసం సెట్ డిజైనర్ ప్రపోజల్, సెట్ ప్రాపర్టీస్ కొనటంలో ప్రొడక్షన్ మేనేజర్, భోజనాల ఖర్చు, పెట్రోలు, వెహికల్స్, అవుట్‌డోర్ యూనిట్ ఖర్చు, జనరేటర్, ఒకటేమిటి సవాలక్ష పనులన్నీ అందరి సహకారంతో ఒక దారికి తేవాలి. అందరినీ నమ్మించి తీరాలి. తీరా  అందరూ చెప్పింది నేను సరేననుకొని ఓకే చేసాక అందులో ఎవరెవరి స్వార్ధాలున్నా, దురాశలున్నా, లంచం తినాలనుకొన్నా ఇవన్నీ పరోక్షంగా నేను బాధ్యత తీసుకోవాలి. నేను నిజాయితీగా వుండాలనుకున్నా నా చుట్టూ వున్న టీమ్ కోఆపరేషన్ వద్దా?”

“అంటే మీరు బాగానే వున్నారు. మీ టీమ్ సరిగ్గా ఉండలేదంటున్నారా?”

నయన గొంతు ఇంకా కఠినంగా పలికింది.

స్వాతికి అర్ధం అయింది. నయన ఎక్కడో హర్ట్ అయింది.

“నయనా, సరిగ్గా పాయింట్‌కు వచ్చావు. నేను చెప్పిన నా చుట్టూ టీమ్ లో నువ్వూ ఉన్నావు. నేను అందరినీ మెప్పించగలగాలి. ఇక ఇన్‌చార్జిగా అందరి ఉద్రేకాలు, ఉద్వేగాలను నేను బాలన్స్ చేయగలగాలి. ఇంతకుముందు మన శ్రీజ అరగంట లేటుగా ఆఫీసుకు వచ్చింది. ప్రొడ్యూసర్‌కి వళ్ళు మండింది. తను చేసింది అరగంట లేటే. కానీ ఇటు మేకప్‌మాన్, అటు కెమేరా, వెహికల్, అవతల గెస్ట్‌లు, ప్రొడక్షన్ మేనేజర్ అందరూ సరిగ్గా వచ్చినా బికాజ్ ఆఫ్ శ్రీజ అంతా అప్‌సెట్ అయింది. ఓ అరగంట లేట్‌ని కన్సిడర్ చేయకూడదా అనుకొంటుంది ఆ యాంకర్. ఇవన్నీ ఇంటర్‌లింక్‌గా వుండే పనులు. నేను ఎలా వప్పుకొంటాను. అన్నీ నేను కాదు. అన్నీ నేనే. అందరి హృదయం నాది కాదు. కానీ నేనే. ఎవర్ని నొప్పించినా, ఆ డిపార్ట్‌మెంట్ నుంచి నాకు థ్రెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను నొప్పించాననుకో, నన్ను లైవ్‌లో వెర్రి ప్రశ్నలు వేసి విసిగించగలవు. నా ప్రోగ్రాం అప్‌సెట్ చెయగలవు. నిన్ను ఏ రకంగా నేను దండించగలను” అన్నది స్వాతి.

నయన తల వంచుకొంది. ఎక్కడో ప్రోగ్రామ్ పక్కకు జరిగింది. ఇంటర్వ్యూ సరిగ్గా లేదు. అంతా పర్సనల్ ఐపోతుంది. ఎన్నని ఆఫ్ ద రికార్డ్ అంటూ పక్కన పెడతారు.

“మేడం, బ్రేక్ తీసుకొందామా?” అంది నయన.

స్వాతి మాట్లాడలేదు.

“ఇప్పుడో బ్రేక్ తీసుకొందాం” అన్నది మామూలుగా.

సాధారణంగా బ్రేక్ తీసుకునే ముందుగా అంతకుముందు జరిగిన ఇంటర్వ్యూ గురించి తన అభిప్రాయం చెప్పేది నయన.. ఈసారి చెప్పేందుకు ఏవీ కనిపించలేదు.

***

“ఒక్క నిముషం నయనా, నేను శ్రీధర్‌తో మాట్లాడాలి. టు మినిట్స్” అన్నది స్వాతి.

“ఓకే మేడం అంటూ జస్ట్ టు మినిట్స్” అన్నది ప్రొడ్యూసర్‌తో నయన.

ఫోన్ తీసి “శ్రీధర్ ఓ నిముషం వస్తావా?” అన్నది స్వాతి.

“నేను ఇక్కడే డోర్ దగ్గర ఉన్నాను” అన్నాడు శ్రీధర్.

శ్రీధర్ స్టుడియో మెయిన్‌డోర్ తీసి మెట్లు దిగి కిందికి వచ్చాడు.

“వన్‌ మినిట్” అన్నాడు నయనతో.

నయన మైక్ తీసి సీట్లో పెట్టి లేచి వెళ్లిపోయింది.

స్వాతి పక్కన కూర్చున్నాడు శ్రీధర్.

“ఇదేంటీ మేడం” అన్నాడు దిగులుగా.

“దక్షిణామూర్తి వచ్చారా?” అన్నది స్వాతి.

“వచ్చారు … లైవ్‌లో” అన్నాడు ఎదురుగా వున్న మానిటర్ చూపిస్తూ. దూరంగా మ్యూట్‌లో పెట్టిన ఎల్ సిడిలోంచి లైవ్ కనిపిస్తోంది. వరసాగ్గా దక్షిణామూర్తిగారు, సావిత్రి, ఎండి కనిపిస్తున్నారు.

“ఆయన నా గురువుగారు. ఆయన దగ్గర నేను న్యూస్ ఎడిట్ చేయటం నేర్చుకొన్నా. కాలం ఎలా రాయాలో, స్పాట్ డెసిషన్ ఎలా తీసుకోవాలో ఆయనే నాకు గురువు. ఎండికీ, దక్షిణామూర్తి థ్రెట్ ఎప్పటికైనా. ఈయనతో సమానంగా ఉండేది దక్షిణామూర్తిగారే. అందుకని లోకల్‌టీవీకి లాగమంటాడు. ఒకసారి లోకల్‌లో ఇరుక్కున్నాడంటే ఇక మెయిన్ స్త్రీంలోకి రాలేడు కదా. మన సర్‌కి ప్రాబ్లం ఉండదు కదా. ఇదే కదా మేడం!”

స్వాతి దూరంగా నిలబడ్డ నయనవైపే చూస్తోంది.

యుద్ధతంత్రం ఇదే. ఎండిగారు టాప్‌లో ఉండాలంటే ఆయనతో సమానమైన తెలివితేటలున్న దక్షిణామూర్తి అణగారిపోవాలి. ఆయన్ని మంచిగా గొయ్యిలోకి దించాలి. ఇలాంటివి సర్వత్రా లేవా అనుకొంది స్వాతి మనసులో.

శ్రీధర్ కళ్ళు ఎర్రబడ్డాయి.

“నేను రిజైన్ చేస్తా మేడం. ఈ బురదలో నేను బతకలేను” అన్నాడు ఉద్రేకంగా.

స్వాతి అతనివైపు చూసింది.

“ఎండిగారి కుడిభుజం నువ్వ్వు. సగం చానల్ నీపైనే ఆధారపడి వుంది. నీకు వల వేయకుండా ఉన్నాడా ఎండి” అన్నది కఠినంగా.

శ్రీధర్ ఉలిక్కిపడి చూశాడు.

“ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని వస్తాను. దక్షిణామూర్తిగారిని ఎంగేజ్ చేయి” అన్నది స్వాతి.

ఇంకేం మాట్లాడొద్దు. వెళ్లిరా అన్నట్టు అనిపించింది శ్రీధర్‌కు. లేచి నీరసంగా నడుస్తూ తన క్యాబిన్‌లో కూర్చున్నాడు. ఎదురుగ్గా టీవీలో లైవ్ నడుస్తోంది. ఏదో తప్పు చేస్తున్నట్టు మనసు అల్లకల్లోలంగా వుంది.

***

( మిగతాది వచ్చే వారం)

ఛానెల్ 24/7 – 6 వ భాగం

sujatha photo

   (  కిందటి వారం తరువాయి)

“మీరు సావిత్రిగార్ని సజెస్ట్ చేశారు కదా. ఆవిడ్ని మేనేజ్ చేయగలమా” అన్నాడు న్యూస్ కోఆర్డినేటర్ రమణ.

“మనం పట్టాభిగార్ని, వెంకట్రావు, ప్రొఫెసర్ బలరాం ఇంకా మొత్తం పన్నెండుమందిని అనుకొన్నాం. అందులో జయమ్మగారు, సంజయ్‌గారు వేరే లైవ్‌లో ఉన్నారట. పట్టాభిగారు ఆ మూల ఉన్నారు. వెహికల్ ప్రాబ్లం. ఇకపోతే రమణగారూ ఇటు దక్షిణామూర్తిగారిని మన చానల్ చుట్టుపక్కల్నే ఉన్నారు కనుక వాళ్లని అనుకొందమా” అన్నాడు శ్రీధర్.

“అరగంటలో లైవ్ మొదలుపెట్టాలి. ఎక్స్‌పర్ట్స్ సగం దారిలో వున్నారు. ఇప్పటికి ముగ్గురే తేలారు. ఈ సావిత్రిగారి విషయమే నాకు భయం” అంటున్నాడూ రమణ.

“అదేనండి. దక్షిణామూర్తిగారు ఇక్కడే తార్నాకలోనే కదా వుండేది.  ఆన్ ది వే పిలిస్తే వస్తారు” అన్నాడు శ్రీధర్.

“దక్షిణామూర్తి.. పెద్ద సార్. వప్పుకొంటారా .. ” అన్నాడు సందేహంగా రమణ.

“చానల్‌కి రాకముందు ఎండిగారు పని చేసిన డెయిలీలో దక్షిణామూర్తి రెసిడెంట్ ఎడిటర్, ఇద్దరికీ క్షణం పడేది కాదు. దక్షిణామూర్తి తెలివితేటలంటే ఎండిగారికి భయం” అన్నాడు కాపీ ఎడిటర్ సాంబమూర్తి.

రమణ ఆయనకు నమస్కారం చేశాడు.

“మీరు ప్రతి నిజాన్ని చెప్పనక్కర్లేదు సాంబమూర్తీ, ఏదో కొంప మీదకి తెస్తావు. ఆయన గురించి వివరణ నిన్ను అడగలేదుగా” అన్నాడు చిరాగ్గా రమణ.

సాంబమూర్తి చిద్విలాసంగా నవ్వాడు.

“నీ గురువుకి నేనేం శిష్యపరమాణువుని కాదు. ఒకవేళ నే స్వయంగా అయాన కాళ్లు మొక్కినా మీ ఎండి నన్ను నమ్మడు. ఆయన నేనూ ఒకేసారి జర్నలిజంలోకి అడుగుపెట్టాం. ఆ ఆయన నన్ను తొక్కి పెట్టాడు” అన్నాడు అక్కసుగా.

శ్రీధర్ రమణవైపు ఉరిమి చూశాడు.

“ఇక్కడ అసలు విషయం ఎటో పోతోంది.”

సాంబమూర్తి, ఎండి ఇద్దరూ కొలీగ్స్. ఆయన గబగబ వృద్ధిలోకి వచ్చాడు. సాంబమూర్తి డెస్క్‌లో అలా పని చూస్తూనే రోజులు గడిపాడు. ఈ చానల్ మొదలుపెట్టాక సాంబమూర్తి తనంతట తనే వచ్చి పని చేస్తానన్నాడు. ఎస్ఆర్‌నాయుడు కాదనలేదు. ఆయనకు మంచి విలువ, పొజిషనూ ఇవ్వలేదు. కాపీ ఎడిటర్ ఉద్యోగం ఇచ్చాడు. నలభై వేలు జీతం. డెయిలీలో ఇరవై వేలతో సరిపెట్టుకొంటున్న సాంబమూర్తి నలభైవేల జీతం చెవులారా విన్నాక  పొజిషన్ గురించి మాట్లాడకుండా వచ్చి చేరాడు. ఆయన తర్వాత చేరిన శ్రీధర్ న్యూస్ ఎడిటర్‌గా ఉండటం, అరవైవేల శాలరీ తీసుకోవటం సాంబమూర్తికి కడుపు మండించింది. నోరెత్తితే ఎండి అసలు పొమ్మంటాడేమోనని భయం. కక్కలేక మింగలేక ఉంటాడతను.

రమణ ఇంటర్‌కమ్ లో ఎండిని సలహా అడిగాడు.

“సర్ దక్షిణామూర్తిని పిలుద్దామా. ఆయనైతే సరిగ్గా ఎనాలిసిస్ చేసాడు సర్. బాలన్స్ బావుంటుంది. మీరు కూడా ఉంటారు కదా. ఆయన హిస్టరీ వైపు మాట్లాడతాడు. ఉద్యమ  చరిత్ర అంతా ఆయనకు కొట్టిన పిండి కదా” అన్నాడు.

అవతల నుంచి ఎండి క్షణం సేపు మాట్లాడలేదు. కాస్సేపు ఊరుకొని శ్రీధర్‌ని పైకి రమ్మను అన్నాడు.

“మరి దక్షిణామూర్తిగార్ని పిలిచేదా” అన్నాడు రమణ.

పిలవకపోతే బావుండదన్నంత గట్టిగా అన్నాడు తెగించి.

“సరే పిలవండి.. శ్రీధర్‌ని రమ్మను” అన్నాడాయన.

“సావిత్రిగారు ఈ ఇష్యూపైన చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారు. మిగతా అందరూ పెద్దవాళ్లు. ఈ సందర్భాన్ని చక్కగా ఎనాలసిస్ చేస్తారు. సావిత్రిగార్ని కాస్త రెచ్చగొడితే చాలు ఆవిడ దాన్ని సాగదీస్తారు. కాస్త హాట్‌హాట్‌గా ఉంటుంది. దక్షిణామూర్తిగారికి అసలే కోపం. ఆవిడ పని పడతారు” అన్నాడు శ్రీధర్.

రమణ నవ్వాడు.

“సావిత్రిగారికి నోటి దురుసు. ఆవిడకి కోపం వస్తే అరుపులు మొదలుపెడుతుంది. అడ్డదిడ్డంగా వాదిస్తుంది. మిగతావాళ్లకి వినోదం. డిస్కషన్ బావుంటుంది. కానీ సార్‌కి అసలే ప్రధమ కోపం. ఆవిడ్ని నోరు మూసుకో అన్నారనుకో పనయిపోతుంది” అన్నాడు.

శ్రీధర్ ఎండి చాంబర్ దగ్గరకు వెళ్లాడు. డోర్ తెరుచుకొని తొంగి చూశాడు. ఎండి ఎదురుగ్గా ప్యానల్ ప్రొడ్యూసర్, పిసిఆర్ ఇన్‌చార్జ్ కూర్చుని వున్నారు.

“రా శ్రీధర్ అంటూనే.. సరే మధ్యాహ్నం లంచ్ తర్వాత డిస్కస్ చేద్దాం” అన్నాడు వాళ్లతో.

ఇద్దరూ లేచి నిలబడ్డారు.

“స్టూడియో ప్రాబ్లం అయిపోతుందంటున్నారోయ్. వర్చువల్ స్టూడియో ఒక్కటే కదా. లైవ్ తీసుకోవాల్సి వస్తే, వర్చువల్‌లో జరిగే షూటింగ్‌లకి మాటిమాటికి బ్రేక్ ఇవ్వాల్సి వస్తోందిట. అదీ ప్రాబ్లం. ఫోర్ట్  స్టూడియోలో ఇంకో బ్లూమేట్ వుంటే కంఫర్టబుల్‌గా వుంటుందంటున్నారు. నువ్వు టెక్నికల్‌వాళ్లతో కూర్చుని డిసైడ్ చేయి” అన్నాడు ఎండి.

వాళ్లిద్దరూ బయటకు వెళ్ళిపోయారు.

“శ్రీధర్ వన్ మినిట్. దక్షిణామూర్తి వస్తున్నాడు కదా” అన్నాదు.
“సర్” అన్నాడు శ్రీధర్.

“మొన్నీమధ్యన నువ్వు కేబుల్ నెట్‌వర్క్ వాళ్లు ఏదో లోకల్ చానల్ పెడుతున్నారన్నావు కదా”

“అవును సార్, లోకల్ నెట్‌వర్క్ అది. ఎంటెర్‌టైన్‌మెంట్, న్యూస్ కూడా. రెండు బులెటిన్లు ఉంటాయి.”

“మీకు బాగా తెలుసు కదా వాళ్లు”

“నాకు తెలియటం ఏమిటి సర్.. మీతొ పని చేసిన చారి వాళ్ల బావగారిది. వాళ్లు రియల్ ఎస్తేట్స్, కన్స్ట్రక్షన్స్‌లో వున్నారు. వాళ్లదే ఆ చానల్.”

“ఆ చానల్‌కు నువ్వు దక్షిణామూర్తిని సజెస్ట్ చెయరాదూ” అన్నాడు ఎండి.

శ్రీధర్‌కి అర్ధం కాలేదు. దక్షిణామూర్తికి ఈయనకు క్షణం పడదు. వాళ్లకు సజెస్ట్ చేయమంటే ఏమిటి అర్ధం.

“అదేనోయ్. దక్షిణామూర్తి ప్రింట్ మీడియా వదిలేసాడు కదా. పైగా ఆ డెయిలీలో శాలరీస్ ఏముంటాయో నాకు తెలుసు కదా. ఏమంటావయ్యా నీవు.. దక్షిణామూర్తికి మంచి బ్రేక్ వస్తుంది కదా”

శ్రీధర్ మొహం వికసించింది.

ఎండి సాక్షాత్తు ఎస్ఆర్‌నాయుడు సాక్షాత్తు సత్యసాయిబాబాగా అనిపించారు.

“మీరు ఒక్కమాట చెబితే పనయిపోతుంది సార్” అన్నాడు వికసించిన మొహంతో.

“నేను కాదుకానీ, మన స్వాతికి ఆయన చాలా క్లోజ్. ఆయన దగ్గరే చాలా సంవత్సరాలు పనిచేసింది. స్వాతిచేత దక్షిణామూర్తికి చెప్పించు. స్వాతి ఎక్కడుంది.”

“ఇవ్వాళ మేడమ్  ఇంటర్వ్యూ రికార్డ్ చేస్తున్నాం సార్”

“పోయి చెప్పు. పది నిమిషాల్లో కిందికి వస్తున్నాను” అన్నాడాయన.

ఒక్క దూకులో ఫోర్త్ ఫ్లోర్‌లోని స్టూడియోలో పడ్డాడు శ్రీధర్. అతని మొహం వెలిగిపోతోంది. దక్షిణామూర్తిగారికి మంచి పొజిషన్ ఇప్పించే అవకాశం ఇప్పుడు తన చెతుల్లో వుంది. ఎన్నో సంవత్సరాలు ఆయన ఎడిటర్‌షిప్ కింద ట్రెయినీ సబ్ఎడిటర్‌గా పని చేశాడతను. బహుశా తన మొహం కూడ ఆయనకు గుర్తు ఉండకపోవచ్చు.

స్టూడియోలో అందరూ స్నాక్స్ తింటున్నారు. స్వాతి కాఫీ తాగుతోంది. స్టూడియో మెట్లు దిగాక గానీ శ్రీధర్ ఉద్రేకం తగ్గలేదు. స్వాతి ఎదురుగ్గా నిలబడ్డాడు. పక్కనే నయనకు టచప్ ఇస్తున్నాడు మేకప్‌మెన్.

ఏంటి అన్నట్లు కళ్లెగరేసింది స్వాతి.

“మేడం… సార్ మీతో ఒక మాట చెప్పమన్నారు. దక్షిణామూర్తిగారు లైవ్‌కి వస్తున్నారు. చారిగారి లోకల్ చానల్ ఇన్‌చార్జ్ కావాలని వాళ్లు చూస్తున్నారు కదా. దక్షిణామూర్తిగారికి ఈ విషయం చెప్పమని మీకు చెప్పమన్నారు” అన్నాడు.

“లోకల్ చానల్ ఇన్‌చార్జిగా దక్షిణామూర్తిగారిని వెళ్లమని నేను చెప్పాలన్నారా” అన్నది స్వాతి.

శ్రీధర్ మొహంలో వెలుగు తగ్గింది.

“సార్ చెప్పమన్నారు” అన్నాడు . అతని బుర్రలో చప్పున ఏదో మెరిసినట్లయింది. ఎండిగారి ప్లాన్ అర్ధమయింది. దక్షిణామూర్తిగారిని మెయిన్ స్ట్రీంలో లేకుండా తొక్కేద్దామని ప్లాన్.

“దక్షిణామూర్తి సార్ ఇవాళ్తి లైవ్‌కి వస్తున్నారు. పది నిముషాల్లో ఇక్కడ వుంటారు” అన్నాడు లోగొంతుతో. మాట పెగల్లేదు అతనికి.

స్వాతి అతనివైపు చూస్తూ చిరునవ్వు నవ్వింది.

“సార్ చెప్పమన్నారు అంతే కదా.. మాట్లాడదాం. దక్షిణామూర్తిగారికి డైలీ ఎడిటర్ ఉద్యోగం పోయింది అందుకే  లోకల్ చానల్ ఇన్‌చార్జిగా వెళ్లమని చెపుదాం. శాలరీ రెట్టింపు అవుతుంది అంతే కదా” అన్నది నెమ్మదిగా స్వాతి.

శ్రీధర్ కళ్లు పెద్దవి చేసుకొని ఆమె వంక చూశాడు.

అతని కళ్లలో నీళ్లు తిరిగాయి.

“లైవ్ వన్అవర్ తీసుకొంటారు కదా శ్రీధర్. నేను ఈ ఇంటర్వ్యూ అవగానే వస్తాను. అందరికీ లంచ్ ఏర్పాట్లు చేయమని ప్రొడక్షన్ మేనేజర్‌కి చెప్పండి. దక్షిణామూర్తిగారు పలావ్‌లు తినరు. ఆయనకు సౌతిండియన్ మీల్ చెప్పండి. నేను మాట్లాడతాను” అన్నది స్వాతి.

శ్రీధర్ వంట్లోంచి రక్తం మొత్తం తోడేసినట్టు తేలికగా అనిపించింది. దక్షిణామూర్తిగారిని లోకల్ చానల్ ఇన్‌చార్జ్‌గా చేద్దామా శ్రీధర్ అంటున్న స్వాతి గొంతు అతని గుండెల్లో మోగింది.
నీరసంగా నడుస్తూ స్టూడియోనుంచి బయటికి వచ్చాడు. అతని వెనకే స్టూడియో లైట్లు ఒక్కోటే వెలుగుతున్నాయి. పిసిఆర్‌లోంచి మైక్‌లో మేడం స్టార్ట్ చేద్దామా అంటున్నాడు ప్రొడ్యూసర్. వన్ అవర్‌లో మొత్తం బ్రేక్‌లతో పాటు, ఇంట్రడక్షన్ కూడా చెప్పించేయాలి. ఓన్లీ వన్ అవర్ అంటోంది స్వాతి.

***

(మిగతాది వచ్చే వారం)

ఛానెల్ 24/7 – 5 వ భాగం

sujatha photo  (కిందటి వారం తరువాయి)

శ్రీనివాస్ సీట్లో కూర్చొన్నాడు. స్క్రోలింగ్ డిపార్ట్‌మెంట్ ఎదురుగ్గా వుంది. అన్ని చానల్స్ వరసగా కనిపిస్తున్నాయి. ఏ చానల్‌లో ఏం వస్తుందో చూస్తూ నోట్ చేసుకుంటున్నాడు.

“శ్రీనివాస్‌గారూ” స్క్రోలింగ్ చూస్తున్న అసిస్టెంట్ పిలిచాడు.

“సార్ విజయవాడ నుంచి రెడ్డిగారు సార్” అన్నాడు.

శ్రీనివాస్ ఫోన్ తీసుకొన్నాడు.

“సార్… విజయవాడనుంచి గుంటూరునుంచి బైట్‌లు రెడీగా ఉన్నాయి సర్. మొత్తం కోస్తా నుంచి కామెంట్స్ తీసుకొన్నాను. లిస్ట్ పాంపాను మీ మెయిల్‌కు. ఓకే అనుకొన్నవన్నీ లాగర్‌లో వున్నాయి. తీసుకోండి. బైట్స్ తీసుకొన్నవి తీసుకొన్నట్లు డ్రాప్‌లో  పడేస్తున్నా. మీరు వెరిఫై చేసుకోండి.” అంటున్నాడు.

ఎన్నడూ లేనిది శ్రీనివాస్‌కి కాళ్లు వణికాయి. ఎవరి కామెంట్ స్క్రోలింగ్ ఇవ్వాలి?. ఏ బైట్ న్యూస్‌లో ఇవ్వాలి?. ఎవర్ని మెయిన్‌లైన్‌లో తీసుకోవాలి?. ఎండి ఏమనుకొంటున్నాడు? మొదటిసారి ఎండి అభిప్రాయం తీసుకోవాలనిపించింది శ్రీనివాస్‌కు. ఇంతకుముందు  ఎప్పుడూ లేని కన్ఫ్యూజన్. తనెప్పుడూ వ్యక్తులను దృష్టిలో పెట్టుకోలేదు. వ్యాపారాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. న్యాయం అనిపించింది, ఉచితంగా తోచింది చేశాడు.

కామెంట్ చేసేవాడి స్టేటస్, ఆ సందర్భంలో అతని ప్రమేయం, పొలిటికల్‌గా అతని అనుభవం, అతని స్టేట్‌మెంట్‌కు ప్రపంచం ఇచ్చే విలువ మొత్తంగా ఆ సందర్భాన్ని ప్రజలు ఎలా అర్ధం చేసుకోవాలో, ఎలా వాళ్ల జీవితానికి ఆ సంఘటన ఉపయోగపడుతుందో, సామాన్యమైన మనిషికి కూడా నేరుగా చేరేలా, తెలివిగా ఆలోచించి టెలికాస్ట్‌కు ఓకే చేసేవాడు. ఒక మామూలు మనిషికి ఆ చరిత్ర అందాలని తపించేవాడు. ఎన్నిసార్లు మెమోలు అందుకున్నాడో, అందరికీ కంట్లో నలుసులా ఎలా వున్నాడో…! కాని ఇవ్వాళ తను కూర్చోబోతున్న ఛానెల్  హెడ్ పొజిషన్ ఆ అంచనాలను మింగేసింది. తను తొందరపడకుండా ఎండి ఇష్టాన్ని తన ఇష్టాన్ని మార్చుకొవాలి. ఇంటర్‌కమ్  మోగింది.

శ్రీనివాస్.. ఎగిరి గంతేశాడు.

“శ్రీనివాస్ నేను లైవ్‌లో ఉండాలి. నువ్వు కోస్తా హ్యాండిల్ చేయి. విజయవాడ వదిలేయ్. మిగతావి తీసుకో. పైగా అందరూ ఇక్కడే వున్నారు. అసెంబ్లీ వుంది కదా. పబ్లిక్ ఒపీనియన్ యాసిటీజ్‌గా వాడొచ్చు.”

శ్రీనివాస్ సరే అన్నాడు.

పబ్లిక్ ఎవరైనా ఈ సందర్భంలో ఎలా రియాక్ట్ అవుతారు?. సిద్ధేంద్రయోగి, కృష్ణరాయలవారి విగ్రహాలు కూలిపోవటం ఎవ్వరికి ఇష్టం?. ఆయన చెప్పినట్లు సీనియర్ లెవెల్ ఎవ్వళ్లూ జిల్లాలో లేరు. శ్రీనివాస్ ఉత్సాహంగా  ఆక్టోపస్ ఓపన్ చేశాడు. టాంక్‌బండ్, టాంక్‌బండ్2 అని ఒకొక బైట్‌కు నంబర్లు ఇచ్చారు. విజయవాడ రెడ్డి పంపిన కామెంట్లు అన్నీ వరసగా ప్లే అవుతున్నాయి. ప్రతివాళ్లు ఖండిస్తూనే ఉన్నారు. ఉత్సాహపడి జనంలోకి వచ్చిన ఇద్దరు సీనియర్ నాయకులు ఉద్యమకారుల చేతుల్లో పడ్డాక, మిగతావాళ్లకి బయటికి రావాలనే ఉత్సాహం పోయినట్లుంది. ఖండనలు మొదలయ్యాయి.

వీడియో ఎడిటర్‌కు వరసగా అన్నీ షార్ట్‌కట్ చేస్తూ వేయమని చెప్పాడు. కళ్లముందు మానిటర్‌లో ఎడిట్ చేసిన బైట్స్ వరసగా కనిపిస్తున్నాయి. జిల్లాలనుంచి వచ్చిన పొలిటికల్ లీడర్స్ బైట్స్ డైరెక్ట్‌గా ఎడిట్ సూట్స్‌లో ఓపెన్ చేసి ఎడిట్ చేసి లాగ్‌లో పడేస్తున్నారు. శ్రీనివాస్ మనసులో ఉదయం నుంచి ఎండి పైన పేరుకొన్న ద్వేషం, రిపోర్టర్లకి అన్యాయం జరిగిందన్న ఆక్రోశం అన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతున్నాయి.

మ్యూట్‌లో పెట్టిన ఫోన్ కదలి బయటనుంచి కాల్ వస్తోందని జర్క్ ఇచ్చింది. తీసి చూశాడు. చాలా మిస్డ్ కాల్స్  ఉన్నాయి. భారతి నుంచి కూడా. ఓపెన్ చేసి అవతలనుంచి ఆమె గొంతు వినపడగానే “డియర్ నేనో గుడ్‌న్యూస్ చెప్పనా” అన్నాడు.

“రాత్రి భోజనానికి రావటంలేదు అంతేగా”అన్నారామె గారాబంగా. ఏదో పార్టీ తగిలి వుంటుంది. పైసా ఖర్చు లేకుండా మందుకొట్టి ఇంటికి రావటం లాగ అర్ధం చేసుకొంది.

శ్రీనివాస్‌కి చురుక్కుమంది.

“నేనెలా కనిపిస్తున్నాను,” అన్నాడు ఉక్రోషంగా.

అవతలనుంచి ఆవిడ నవ్వింది.

“మనకు పెళ్ళయి ఐదేళ్ళయింది. ఉల్‌ఫాగా వచ్చిన ఏ పార్టీ ఐనా వదిలారా మీరు. ఊరికే వచ్చింది ఏదైనా పోనిచ్చారా? మనింట్లో మూడు ఫ్రిజ్‌లు చూసి.. ఛ.. మా వదిన నవ్వింది.” అన్నారామే ఇంకా చిరాగ్గా.

“ఎవరేం గిఫ్ట్ ఇచ్చినా వద్దనలేం మరి. ఆబ్లిగేషన్”

” మా చెల్లెలికి ఇద్దామంటే ఊరుకొన్నావా,” అన్నాడు.

“మా వదినవాళ్లకు, మా అమ్మావాళ్లకు ఇద్దామంటే నువ్వు సరే అన్నావా?” అందామే.

శ్రీనివాస్‌కు చిరాకొచ్చింది.

“చ… నీతో షేర్ చేసుకోవాలనుకోవటం నాది బుద్ధి తక్కువ,” అన్నాడు కోపంగా.

అతని గొంతులో కోపం కనిపెట్టిందామె.

“సారీ.. సారీ.. ప్లీజ్ చెప్పవా.. చెప్పవా?” అన్నది లాలనగా.

“బహుశా వచ్చే నెల నుంచి కొత్తగా రాబోయే ఛానెల్ కు  హెడ్ అవుతా,” అన్నాడు చిన్న గొంతుతో.

“వావ్… గ్రేట్.. పార్టీ…” అన్నదామె నవ్వుతూ.

“ఇంటికొచ్చాక మాట్లాడుకొందాం,” అన్నాడు శ్రీనివాస్ ఫోన్ పెట్టేస్తూ.

చేతిలోని స్లిప్ తీసుకొని బాయ్ వచ్చాడు.

“ఎండిగారు..” అన్నాడు స్లిప్ శ్రీనివాస్ చేతికిచ్చి.

ఎంవీఅర్ ఇంజనీరింగ్ కాలేజ్ శ్యాంమనోహర్ రెడ్డి బైట్ ప్లే చేయి అని మెసేజ్.

ఓహో! ఎంవీఅర్ ప్రాపర్టీస్ అన్నీ హైద్రాబాదులొనే వున్నాయి. ఎండి మిత్రా తోడల్లుడు. మనసులోనే మాటలు పడుతున్నాయి. నందిగామ ఓపన్ చేశాడు. శ్యాంమనోహర్ రెడ్డి స్క్రీన్ పైకి వచ్చాడు.

“ఏంటండి అన్యాయం? టాంక్‌బండ్ తలుచుకొంటే కడుపు తరుక్కుపోతోంది. అన్నమయ్య విగ్రహం, ఓ గాడ్! ఆయన పాటకు పరవశించని హృదయం వుంటుందా? ప్రజా పరిపాలనలో స్వర్ణయుగాన్ని సృష్టించిన కృష్ణదేవరాయల విగ్రహం, ప్రపంచమంతా నృత్యాన్ని అజరామరం చేసిన సిద్ధేంద్రయోగి. దారుణం. ఈ సంఘ వ్యతిరేక శక్తుల్ని తీవ్రంగా శిక్షించాలంటే. ఈ పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. విగ్రహాలు మళ్లీ ప్రతిష్ట చేయాలి. మా వంతు మేం సహకారం ఇస్తాం,” ఆయన చెప్పుకు పోతున్నాడు.

టాంక్‌బండ్ విధ్వంసం టైటిల్‌తో పది నిముషాలకోసారి బ్రేక్‌తో కోస్తాల ప్రముఖులు మాట్లాడుతున్నారు. ఖండిస్తున్నారు. కవులు, గాయకులు కన్నీళ్లు పెట్టుకొంటున్నారు. చానల్ వ్యూయర్‌షిప్ సెకండ్‌ ప్లేస్‌లో వుందని ఎనలిస్ట్ మెసేజ్ పంపించాడు.

ఎవరేనా అర్ధాంతరంగా పోతే, ఎవరికైనా చావు ముంచుకొచ్చి ప్రమాదం జరిగితే.. ఎవడి ఆస్తులైనా పోయి వాడు మట్టి కొట్టుకుపోతే  అవన్నీ చూపించాలని, ఎవరికో ఏదో లాభం కలిగిందనో, దీన్ని సెన్సేషన్ చేసి ప్రజల దృష్టి ఇటు మరల్చాలని అత్యంత తెలివిగల జర్నలిస్ట్‌లు, మార్కెటింగ్ పీపుల్ కలిసి కృషి చేశారు. అదంతా సక్సెస్ అయి ఇవ్వాళ  ఛానెల్  రేటింగ్ ఆకాశమంత ఎత్తున పెంచుతున్నాయి. ఒక మనిషి ఆఖరు క్షణాలను తిన్నగా ప్రేక్షకుల ముందు గదిలోకి తీసుకురావటమే సెన్సేషనల్ జర్నలిజం అయితే దానికే పెద్ద పీట..

ఎదురుగ్గా ఏదో ఎంటర్‌టెయిన్‌మెంట్  చానల్‌లో ఎవరో ఒక సైకియాట్రిస్ట్ ఒక సినిమా యాక్టర్‌ని హిప్నటైజ్ చేసి గత జన్మలోకి తీసుకుపోతున్నాడు. అతను కళ్లు మూసుకొని తను గత జన్మలో ఒక యోధుడినని, ఎన్నో యుద్ధాలు చేశానని చెబుతున్నాడు. ఇంకా లోపలికి వెళ్లండి, ఇప్పుడేం చేస్తున్నారు అంటున్నాడు. నేనో పూలతోటలో ఉన్నాను. పూల సౌరభం నన్ను ఆనంద పరుస్తోంది. నేనో రాజకుమార్తెను చూస్తున్నాను అంటూ కూస్తున్నాడు అతను. రాజకుమార్తె ఎలా వుందంటున్నాడు ఇతను. అతను చెబుతున్న వివరాల ప్రకారం జెనీలియా ఫోటో డిస్‌ప్లే చేస్తున్నారు.

శ్రీనివాస్‌కి నవ్వొచ్చింది.

మన ఎండి క్రితం జన్మలో ఏమై ఉంటాడు అనుకొంటున్నాడు.

ఇనప్పెట్టె  అయివుంటాడు అనిపించింది. ఆపుకోలేనంత నవ్వొచ్చింది శ్రీనివాస్‌కి.

                   (మిగతాది వచ్చే వారం )

ఛానెల్ 24 / 7 – 4వ భాగం

స్టూడియోలో అన్ని లైట్లు గబుక్కున వెలిగాయి.

ఇంకో అరగంటలో ముగించాలి అన్నది స్వాతి. నయన తల ఊపింది.

“ఇన్నేళ్ల జర్నలిస్ట్ జీవితంలో మీకు నచ్చని అంశం ఏమిటి మేడం,” అన్నది నయన.

“నిజాయితీని నటించటం” అన్నది చప్పున స్వాతి.

“నిజాయితీని ఎలా నటించగలం మేడం” అన్నది నయన ఆశ్చర్యంతో.

“నయనా. నాలుగు రోజులు క్రితం మనం ఒక లొకేషన్‌కు వెళ్ళాం గుర్తుందా?. మన ఛానెల్  నుంచి మీడియా పార్ట్ నర్ షిప్ ఇచ్చాం. కమలాంజలి  ప్రొడక్షన్ వాళ్లతో.. ఆ రోజు మనం ఓ సెట్ చూశాం. ఒక తులసికోట.. ఇంట్లోకి వెళ్ళే దారి.. ఆ దారిపైన చుక్కల ముగ్గులు. తరువాత ఓ గడప. గడపకి పసుపు పూసి బొట్టుపెట్టి.. అటువైపునుంచి అంతా ఖాళీ..

ఇటు నుంచి చూస్తే అదొక ఆధ్యాత్మిక  ప్రపంచానికి చెందిన ఒక భక్తుని ఇల్లు. అటువైపు లోకేషన్‌లో ఒకవైపు దేవుడి ప్రతిమలు, పూజ, అలంకారాలు, ఇటువైపు సెట్‌లో వీణ, వెనగ్గా త్యాగరాజస్వామి విగ్రహం. ఈ మధ్యలో ట్రాలీ కేమ్స్. చూసే ప్రేక్షకుడి దృష్టిలో అదొక అందమైన పెంకుటిల్లు. మన కళ్లముందు ఒక వైపు చక్కని ఇంటిద్వారం. బంతిపూల తోరణం. గడపదాటి ఆ ఆర్టిస్ట్ కాలు ఇటుపెట్టే యాంగిల్ వరకే షాట్. వచ్చి దేవుడి ముందు హారతి. ఒక ట్రాలీ కెమేరా దాటి ఇటువైపు వస్తే వీణని ఉంచిన వేదిక. పైన టాప్ ఏదీ లేదు. ఎత్తుగా లైటింగ్ చేశారు. ఆ లైట్ల వెలుగులోనే దేవుడి ముందు దీపాల ధగధగ. ఆర్టిస్ట్ అందమైన మొహం, నిజంగా అక్కడ ఇల్లు, ఆధ్యాత్మికత వుందా.. లేదే..

నీ కళ్లతో నీవే చూశావు. ఆ ఆర్టిస్ట్ చేతిలో బీరు కాన్ వుంది. సిగరెట్ కాలుస్తున్నాడు. పంచెకట్టుపై పట్టు కండువా. మొహం ఎంత అందంగా వుంది. బీరు తాగుతూ సిగరెట్ కాల్చుతూ నిలబడ్డ మనిషి కెమేరా స్టార్ట్ అనగానే పరమ భాగవతోత్తముడు అయిపోయాడు. ఎడిటింగ్‌లో దీపం వెలుగులు, దేవుడి మొహం, అందులోంచి యాక్టర్ మొహం డిసాల్వ్ అవటం, తోరణం ఊగటం, బంతిపూల రేకలు చిరుగాలికి చిన్న కదలిక, తులసి చెట్టుపై పసుపు కుంకుమ, గూట్లో  ప్రమిద అన్నీ విడివిడిగా తీశాక ఎడిటింగ్ ఎఫెక్ట్‌తో ఆర్టిస్ట్ అర్ధనిమిలిత నేత్రాలతో సాక్షాత్తూ భాగవతోత్తముడిలాగ కనిపిస్తాడు. ఇది నిజమా, అబద్ధమా?”

“యాక్షన్” అంది నయన.

“దేర్ యు ఆర్” అన్నది స్వాతి.

“నిజాయితీని నటించలేమా నయనా”

నయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.

స్వాతిని చూడాలంటే  భయం వేసింది నయనకు. ఈవిడ ఇంటర్వ్యూ సెన్సేషన్ చేయాలని అన్నారు ఎం.డి. ఏది సెన్సేషన్ చేయాలి. ఈవిడ ఏకంగా ఎం.డి బతుకుని ముగ్గులోకి లాగరు కదా. ఒక్క నిముషంలో ఇదేం లైవ్ టెలికాస్ట్ కాదు కదా. ఆనక తీరిగ్గా టేప్ రివైండ్ చేసి విని అవసరమనుకొన్నవే ఉంచుతాడు డైరెక్టర్ అనుకొంది.

ఆమెనే తదేకంగా చూస్తోంది స్వాతి. ఆమె మొహంలోకి చిరునవ్వు వచ్చింది.

“ఇది లైవ్ కాదు కదా నయనా భయం లేదు,” అన్నది స్వాతి.

నయన ఉలిక్కిపడింది. స్వాతి వైపు చూసి సిగ్గుగా నవ్వింది.

“సారీ మేడం,” అన్నది.

మీకు కూడా నిజాయితీని నటించవలసిన అవసరం వచ్చిందా అని అడగాలని వుంది నయనకు. స్వాతి వైపు చూసింది. ఆమె నిర్లిప్తంగా చూస్తోంది టీపాయ్ పైన వున్న డిజైన్ వైపు.

“మీరు నటించారా ఎప్పుడైనా,” అన్నది నయన.

“నేను నటించనక్కర్లేదు నయనా. నా వృత్తి నా పట్ల ప్రపంచానికి ఆ నమ్మకం ఇస్తుంది. ఇప్పుడు ఆ లైవ్ చూడు. మన యాంకర్ మాట్లాడుతోంది చూడు. టాంక్‌బండ్ పైన జరుగుతున్న విధ్వంసకాండని అల్లరిమూకల దుందుడుకు చర్య అంటోంది. ఇలాంటివాళ్లా ఈ హైద్రాబాద్‌ని పరిపాలించేది అంటోంది. ప్రజలు ఏదయితే మనల్నించి ఆశిస్తున్నారో దాన్నే మన స్క్రిప్ట్ చెబుతాయి. వాళ్ల అభిప్రాయం ఏదయితే వుందో దాన్ని వాళ్లకంటే చక్కగా మాటల్లో చెప్పగలుగుతాం. ఈ వృత్తి ఇచ్చిన అవకాశం అది.

ఒక యథార్థాన్ని కరెక్ట్ గా  ప్రజల దృష్టికి తీసుకువెళ్లే సాధనం మీడియా. మనం కనిపిస్తూ  ప్రజల అంతరాత్మలాగా ఉంటాం. ఈ లైవ్ అయిపోయాక ఆ  యాంకర్ ఎవరి పక్షాన వుంటుందో ప్రేక్షకులకు తెలుసా? ఆ లైవ్‌ని అక్కడ నుంచి కవర్ చేస్తున్న రిపోర్టర్ దాన్ని ఏ యాంగిల్ తను నమ్ముతున్నాడో దాన్నే చూపించగలడా…? ఛానెల్ పాలసీ ఏదయితే దాన్ని చూపించాలి .

తనకే అధికారం వుంటే అతను ఈ ఉద్యమాన్ని  ప్రేమిస్తున్నాడనుకో,  ఉద్యమకారులపై పోలీసుల జులుం అంటూ పోలీసులు తన్నే సీన్లపైన దృష్టి పెడతాడు. లేదా యాంటీ అనుకో. ఆ రోడ్లపైన వీరంగాలు తొక్కుతున్నవాళ్లను, చూపిస్తూ విగ్రహాల కూల్చివేతను చూపిస్తూ దానిపైనే ప్రేక్షకుల దృష్టి వుండేలా చూస్తాడు. అతను నిజాయితీగా ఉన్నాడా అంటే ఉన్నాడు. కానీ అతను ఛానెల్ మనిషి, అతని అభిప్రాయంతో ఛానెల్ కి  పని లేదు. ఛానెల్  నుంచి యజమాన్యం ఏది చెప్పాలనుకుంటే,, ఏది యజమాన్యానికి లాభం అయితే అదే ఛానెల్  పాలసీ. ఇక్కడ పని చేసేవారంతా ఆ బోర్డర్ లైన్స్‌లో పనిచేయాలి.”
మధ్యలో అడ్డం వచ్చింది నయన.

“కానీ మనకో పాలసీ వుంది కదా మేడం”

“అదే చెబుతున్నా. ఈ ఛానెల్  పొలిటికల్ పాలసీని ఎవరు సృష్టించారు?  ఈ ఛానెల్ కి  డబ్బు పెడుతున్న యాజమాన్యం, వాళ్ల లాభాలు, వాళ్ల ఆకాంక్షలు…”

నయన దిక్కులు చూసింది. ఇది ఎడిట్ అనుకొంది.

“అవును మేడం,” అన్నది నవ్వులేని మొహంతో.

“మీడియా అంటేనే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా మేడం, ఫోర్త్ ఎస్టేట్ కదా,” అన్నది  గజిబిజిగా దిక్కు తోచనట్లు.

సబ్జెక్ట్ డైవర్ట్ చేయకపోతే మొత్తం ప్రోగ్రాం అవతల పారేయాలి.

స్వాతి నవ్వింది.

“కరెక్టే నయనా.. మొన్న నువ్వు వరల్డ్ ఎయిడ్స్ డేకి డాక్టర్ పెరుమాళ్‌ని ఇంటర్వ్యూ చేశావు. సెన్సేషన్ అనుకొన్నాం అందరం. ఆయన ముక్కు సూటి మనిషి, ప్రభుత్వ ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ ఫండ్స్ ఎలా దుర్వినియోగం అయ్యాయో అంకెల్తో సహా చెప్పాడు. మనం దాన్నే ఉదయం నుంచి సాయంత్రం దాకా న్యూస్ బైట్స్ కింద వేశాం. ఆపేయమని ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ స్వామి రిక్వెస్ట్‌ల మీద రిక్వెస్ట్‌లు పెట్టారు. మనకి యాడ్స్ ఇస్తానని కమిట్ అయ్యాడు. అందుకే ఆపాం. ఆ తర్వాత గంటయ్యాక పెరుమాళ్ వైఫ్ మోహినీ పెరుమాళ్ మన ఆఫీసుకు వచ్చారు. నీకు తెలుసా. వరల్డ్ నెంబర్ వన్ గైనకాలజిస్ట్ ఆమె.

ఇప్పుడు ఇంత బాగా కబుర్లు చెప్పిన పెరుమాళ్ నన్ను కొట్టి చంపేస్తున్నాడు. నాకు పైసా ఆస్తి లేకుండా అన్నీ కాజేస్తున్నాడు. ఆఫీస్ మేనేజర్ ఇంచార్జ్ లలితా అయ్యర్‌తో ప్రణయం, నా పిల్లలు, నేను మట్టి కొట్టుకుపోతాం. లైవ్ ఏర్పాటు చేయండి అని కాళ్లావేళ్లా పడింది. మనం ఇచ్చామా..? ఆవిడ హాస్పిటల్ పెరుమాళ్ గారి పెత్తనంలో వుంది. సంవత్సరానికి యాభై లక్షలు యాడ్స్ రూపంలో మనకు ఇస్తాడు. ఆ రోజు ఆయన ఎయిడ్స్ మందు ప్రచారం కోసం స్లాట్ ఇచ్చాం. ఆ మందు పని చేస్తుందో లేదో ఎవళ్లకి తెలుసు. ఎంతోమంది ఎయిడ్స్ పేషెంట్స్ ఆ మందు వాడుతున్నారు.

ఆయన  హోమియోపతి మందు కూడా అన్నింటీకీ ఇస్తాడు. అన్ని మందులు ఒకే డాక్టర్‌కు ఎలా తెలుస్తాయో ఇవన్నీ మనం ఆలోచించామా? మోహినీ పెరుమాళ్‌కు నేనూ, మన ఎండి సోపేసి పంపేశాం. ఆవిడ పురుళ్లు పోస్తేనే హాస్పిటల్‌కు అన్ని కోట్లు వస్తున్నాయి. ఆవిడ్ని పోనీయడు. ఆవిడతో కాపురం చేయడు. ఆవిడకు డైవోర్స్ ఇవ్వడు. ఆవిడను చావనివ్వకుండా ఇద్దరు పిల్లలు. నేనో గొప్ప జర్నలిస్ట్‌ని నేను నిజాయితీని నటించాను. యామై కరక్ట్?”

నయనకు చెమట్లు పడుతున్నాయి. కెమేరామెన్ వంక చూసింది. క్రేన్‌పైన వున్న కెమేరామెన్ నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. ఇది టెలికాస్ట్ అయ్యే ఇంటర్వ్యూ కాదని తేలిపోయిందతనికి.

నయన స్వాతి వైపు చూసింది.

స్వాతి మళ్లీ నవ్వింది. ఆఫ్ ది రికార్డ్ అంది.

పిసీఅర్‌లోంచి డైరెక్టర్ బ్రేక్ తీసుకుందాం అంటున్నాడు.

స్టూడియోలో లైట్ళు ఒక్కోటి ఆరిపోతున్నాయి. ప్రొడక్షన్ మేనేజర్ సెట్‌లోకి వచ్చాడు.
“మేడం స్నాక్స్ తెసుకుందాం” అన్నాడు స్వాతితో.
స్వాతి తలవూపింది. వెజిటబుల్ పఫ్స్, టీ, బిస్కట్లు వచ్చాయి. స్వాతి కప్పు అందుకొంది.
ఎందుకిలా తిక్కతిక్కగా వుంది తను. నవ్వొచ్చింది స్వాతికి. ఈ ఇంటర్వ్యూ వద్దనే అంది. ఏం చెప్పాలి. గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు వస్తున్నాయి అని బాధపడటంలో అర్ధం వుందా.. ఏం చెప్పాలి.

ముప్పై ఏళ్ళ ఉద్యోగ జీవితంలో తనేమైనా ఝాన్సీరాణిలాగ పోరాటాలు చేసిందా? ఎప్పుడూ కాంప్రమైజ్ అవటమే. ఒక్కో మెట్టు ఎక్కేందుకు ఒక్కోరకమైన కాంప్రమైజ్. అసలు తనలా ఆడవాళ్లు ఎంతమంది మంచి పొజిషన్లో వున్నారు. ఎంతమంది ఇన్‌చార్జ్‌లు ఆడవాళ్లలో వున్నారు…? అంధ్రప్రదేశ్‌లో కనీసం మొత్తం పాతికమంది కూడా లేరు. ఉన్నా స్క్రిప్ట్ రైటర్లు, ప్రోగ్రామ్స్‌లో వున్నారు. వారి విలువ ఏమిటి, కుకరీలు, ఎడ్యుకేషన్, మెడికల్ ఇవ్వే.. మెయిన్‌స్ట్రీమ్ కి మైళ్ల దూరంలో. ఎలాంటి కెరీర్ లేకుండా, దీన్నే చెప్పాలా..

ఎండితో సమానంగా తను నిలబడిందంటే ఎలా? ఏ బలంతో?.. ఎండికి భుజంగా ఆయన  పి.ఏ. సరితలాగా. ఆయన అకౌంట్‌లు, బాలెన్స్ షీట్‌లు మానేజ్ చేస్తూ ఆమె, ఆయన పబ్లిక్ లైఫ్‌కి ప్రాబ్లం లేకుండా ఆఫీస్ మొత్తాన్ని ఆయన గుప్పిట్లో వుంచుతూ తనూ. ఇన్‌పుట్, అవుట్‌పుట్ ప్రోగ్రామ్స్ ఏవీ ఆయన కనుసన్నల్లోంచి పోవు. ఏ వార్త రావాలన్నా, ఏం చేయాలన్నా కోర్ మీటింగ్‌లో ఆయనే డెసిషన్ తీసుకోవాలి. ఆయనకు ఇష్టమున్న ఎక్స్‌పర్ట్‌లే లైవ్‌కి రావాలి. ఆయన కిష్టమైన పొలిటీష్యన్లకే పవర్‌ఫుల్ రోల్స్, ప్యాకేజీలు ఇవ్వాలి. ఆయనకు వళ్ళు మండితే థర్టీ మినిట్స్ విత్ ఎస్.ఆర్.నాయుడులో ఆయన ఎదురుగ్గా కూర్చుని ఆయన క్రాస్ ఎగ్జామినేషన్‌తో ఉక్కిరిబిక్కిరి అవ్వాలి.

క్రిందటినెల  ప్రాపర్టీ కబ్జాలో దొరికిపోయిన సినీహీరో ఎంపీ కళ్యాణ్‌ను మర్యాదగా లైవ్‌కి పిలిచి, ఫేక్ ఫోన్‌లు చేయించి ఆయనతో ఎండి ఎలా ఆడుకున్నాడో! ఆయన సినిమా హీరో కనుక ఆయనకు నటనానుభవం వుంది కనుక  బతికిపోయాడు. ఏడవకుండా నవ్వుతో నెట్టుకొచ్చాడు. బయటనుంచి వస్తున్నవి ఛానెల్  వాళ్లే చేయిస్తున్నారని పసిపిల్లాడికి కూడా అర్ధం అవుతున్నాయి. సమాధానాలు చెప్పలేక కల్యాణ్ పడుతున్న అవస్థని ఎండి పాములాంటి కళ్లతో చూస్తూ  ఎలా ఎంజాయ్ చేశాడో ప్రపంచం అంతా చూసింది. రెండోసారి మీ చానల్‌కి రాను అని అందరిముందు తిట్టి మరీ చెప్పి వెళ్లిపోయాడు కల్యాణ్. ఆయన్ని అలా ఇరుకున పెట్టినందుకు ఇంకో కమ్యూనిటీ లీడర్ ఎంతో సంతోషించి చానల్‌కు రెండు కోట్లు గిఫ్ట్ పంపాడంట. అది ఆఫీస్ అకౌంట్‌లో పడిందో, ఎండి అకౌంట్‌లో పోయిందో దేవుడికి, సరితకు తెలియాలి. నవ్వొచ్చింది స్వాతికి…

( మిగతాది వచ్చే వారం)

 

ఛానెల్ 24 / 7 – మూడవ భాగం

sujatha photo

(కిందటి భాగం తరువాయి)

“శ్రీజ ఇంకా ఏడుపు ఆపలేదు” అన్నాడు మేకప్‌మాన్ దామోదర్.

పేపర్ చదువుకొంటున్న శ్రీకాంత్ దామోదర్ వంక చూశాడు.

“ఇదేం గోలరా బాబూ పొద్దున్నే.. ఎంతసేపు ఏడుస్తుందంట..” అన్నాడు చిరాగ్గా..

“ఆవిడ్ని అంతమందిలో  అలా అరవటం బావుండలేదు సర్,” అన్నాడు దామోదర్.

“ఓహో.. తమరికీ బాధ కలిగిందన్నమాట,” అన్నాడు శ్రీకాంత్.

“నాకేమిటి సర్, ఇంతవరకూ ఆమె డ్రెస్ చేంజ్ చేసుకోలేదు. మీరు నన్నరుస్తారని వచ్చాను,” అన్నాడు దామోదర్ మొహం మాడ్చుకొని.

పేపర్ టేబుల్‌పైన పడేసి కాబిన్‌లోంచి చుట్టూ చూశాడు శ్రీకాంత్. ఎవరి పనుల్లో వారు ఉన్న అందరి చెవులూ ఇప్పుడు తన మాటనే వింటాయనిపించింది శ్రీకాంత్‌కి.

కోపం తెచ్చుకోకూడదని ఎంత కంట్రోల్ చేసుకొన్నా ఆ నిముషం నోరు ఊరుకోదు. ఇక ఆ తర్వాత ఎంత తల విదిలించినా పరిస్థితి చేతుల్లోకి రాదు. మళ్లీ ఈవిడ సీన్ క్రియేట్ చేసింది. ఎండిగారి దగ్గర క్లాసు పీకించుకోవాలి.

“ముసలాయన వచ్చాడా,” అన్నాడు శ్రీకాంత్.

“ఎవరు సార్,” అన్నాడు దామోదర్.

కళ్లెత్తి అతనివైపు చూశాడు.

ముసలాయనేమిటి.. ఆయన ఎండి చచ్చినట్టు సరిగ్గా మాట్లాడు అన్నట్లున్నాయి దామోదర్ చూపులు. వీడొక పుడింగ్‌గాడు. నన్నే కొశ్చెన్ చేస్తాడేమిటి. ఈ రోజంతా వీడికి తిండి లేకుండా, ప్రోగ్రామ్  బ్రేక్ లేకుండా చేయకపోతే మారుపేరు  పెట్టుకొంటా అనుకొన్నాడు మనసులో శ్రీకాంత్.

“దామోదర్ అస్సలే చిరాగ్గా వున్నాను. నువ్వో తద్దినం పెట్టకు పదా. ఆవిడెక్కడుంది..”

“వాయిస్ ఓవర్ స్టూడియో ఎదురుగ్,గా” అన్నాడు దామోదర్. మొహంలో మాయరోగం వదిలిందా అన్న ఫీలింగ్ ఉందనిపించింది శ్రెకాంత్‌కి.

దేవుడా.. సరిగ్గా ఎండి క్యాబిన్ ముందు ఏడుస్తూ కూర్చుందన్నమాట. ఐపోయాను ఇవ్వాళ అనుకొన్నాడు. టైమ్ చూసుకొన్నాడు. తొమ్మిదిన్నర. ఇంకేం ప్రోగ్రాం. ఇంకో అరగంటకు బయలుదేరినా స్పాట్‌కి చేరేటప్పటికే పన్నెండు. లైటింగ్ చూసుకొనేసరికి లంచ్ టైం. నాశనం చేసింది ప్రోగ్రామంతా. మనసులో తిట్టుకొనేందుకు కూడా శ్రీకాంత్‌కు ధైర్యం చాలలేదు.

“పద,” అన్నాడు లేచి నిలబడి.

లిఫ్ట్ కోసం కూడా ఆగకుండా  ఫోర్త్‌ఫ్లోర్‌కు గబగబా నడిచాడు. మెట్ల దాకా వచ్చిన దామోదర్ ఆగిపోయాడు. నవ్వొచ్చింది అతనికి. నాలుగు రోజులకొకసారి శ్రీకాంత్‌కు ఈ ఫీట్స్ తప్పవు. పాపం అనుకొన్నాడు. ఆ పిల్ల కూడా అంతే.  శ్రీజ ఏడుపు తలుచుకొంటే ఇంకా నవ్వొచ్చింది. రావటమే ఎనిమిదిన్నరకి.  శ్రీకాంత్ ముందే చెప్పాడు. తొమ్మిదికల్లా కారెక్కాలి అని. అతను వెళ్ళేదాకా చూస్తూ వింటూ ఊరుకొంది. రోజూ ఉండేదేగా అనుకొని మేకప్ అయ్యాక హెయిర్ స్ట్రెయిట్ చేయమంది. హెయిర్ డ్రస్సర్ ఒక్కో పాయ తీస్తూ స్ట్రెయిట్ చేస్తోంది.  శ్రీకాంత్ వచ్చేసరికి శ్రీజ తీరిగ్గా చెయిర్‌లో వెనక్కు వాలి మ్యూజిక్ వింటోంది. సగం సగం మేకప్ కాగానే పెద్దగా అరిచాడు.

“ఏవుంది సర్ ఫైవ్ మినిట్స్.. డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాక చేతుల పని చూద్దాం,” అంది.

“ఇంకా ఏం చేంజ్.. వేసుకొన్నవి బాగా వున్నాయ్‌లే పదా,” అన్నాడు చిరాగ్గా.

“లేదు సర్ కాస్ట్యూమర్ వెయిట్ చేస్తున్నాడు. కార్నర్‌లో ఉన్నాట్ట. షోరూమ్ నుంచి డ్రెస్‌లు తీసుకొస్తున్నాడతను. నేను వచ్చేస్తాను సర్,” అంది కూల్‌గా శ్రీజ.

శ్రీకాంత్‌కి కాస్త కోపం ఎక్కువే. గబగబా కాస్ట్యూమర్ రాజుకు ఫోన్ చేశాడు.

“సర్ ఇక్కడే షాపులో డ్రస్‌లు రెడీగా వున్నాయి. ఇదే దారికదా పట్టుకుపోండి సర్. నేను శ్రీజకు చెప్పాను,” అన్నాడు.

అతని వంకే సినిమా చూసినట్టు చూస్తోంది శ్రీజ. నీ కుప్పిగంతులు నా దగ్గరా అన్నట్లున్నాయి ఆమె చూపులు. చీటికి మాటికి అరిచే శ్రీకాంత్ అంటే వళ్ళుమంట శ్రీజకి. అతనితో పని చెయక తప్పదు. డెయిలీ ప్రోగ్రాం. ప్రతిరోజు దాదాపు షూటింగ్ వుంటుంది. రోజూ  వుండే  పనే కదా కూల్‌గా వుందాం అనుకోడు శ్రీకాంత్. కాస్త కోపం కానీ మనిషి మంచివాడే అనుకొంది శ్రీజ. ఇదాంతా నాలుగు రోజుల కొకసారి ఆఫీస్‌లో అందరికీ కనులకీ, చెవులకీ విందు. శ్రీకాంత్ టెన్షనూ, శ్రీజ కూల్‌గా కనిపిస్తూ విసిగించటం..

ఫోర్త్ ఫ్లోర్‌కి ఒక్క ఊపున పరుగు తీశాడు . ఆయాసం వచ్చింది శ్రీకాంత్‌కి. ఎదురుగ్గా కనపడుతున్న దృశ్యం చూసేసరికి గుండె గొంతులోకి వచ్చింది.

పొడుగ్గా వంగిపోయి ఎండిగారు. ఆయన ఎదురుగ్గా ఏడుస్తూ శ్రీజ. పరుగులు ఆపి నడుస్తూ వచ్చాడు శ్రీకాంత్. ఎండి ఎస్.ఆర్.నాయుడు కళ్లజోడు పైనుంచి శ్రీకాంత్ వైపు చూశాడు.

“నువ్వు ఇవ్వాళే వెళ్లిపోతావా, హెచ్ఆర్‌లో చెబుతాను సెటిల్ చెయ్యమని,” అన్నాడు కూల్‌గా.

“ఏంటి సార్” అన్నాడు శ్రీకాంట్. మళ్ళీ కంగారుగా  గుడ్ మార్నింగ్ అన్నాడు.

“నీ న్యూసెన్స్ భరించలేకపోతున్నానోయ్. రిజైన్ చేయి పోయి” అన్నాడు మళ్లీ. ఆయన గొంతులో కోపం లేదు. మాటల్లోనే అంతా.

“సారీ సర్. లేట్ చేస్తోంది సార్. ఎంతకీ తయారవదు. లోకేషన్ దూరం సార్. దిల్‌షుక్ నగర్ దాటాలి. అవతల సెలబ్రిటీ సర్. ప్రోమో షాట్ల కోసం ఇన్వైట్ చేశాం సర్. ఆమె హాఫెనవర్ టైమ్ ఇస్తానంది సర్. స్పెషల్ కుకరీ, సెలబ్రిటీ కుకర్. శ్రీజ ఎప్పుడూ లేట్ సర్,” అన్నాడు గబగబ.

ఎండిగారు తీరిగ్గా ఆమె వైపు చూశాడు. ఆయన ఎదురుగా ఎవరు వుంటే వాళ్ల సైడ్‌కి మారిపోతూ వుంటాడు.

“ఏమ్మా, ఎందుకు లేట్”

“సర్ వచ్చాను సర్. సెలబ్రిటీ వస్తున్నారు కదా సర్. మంచి డ్రెస్ కోసం కాస్ట్యూమర్ వెళ్లాడు సర్. ఆవిడ బాగా తయారై వస్తారు కదా సర్. మరి ఎలా పడితే అలా ఎలా వెళ్లాలి సర్,” అన్నది.

” ఏం చేద్దాం,” అన్నాడు ఎస్.ఆర్.నాయుడు.

శ్రీజకు కోపం దిగిపోయింది. శ్రీకాంత్‌ను ఉద్యోగంలోంచి తీసేస్తానని ఎండి అనడం లోపలనుంచి ఆనందం తన్నుకు వచ్చింది.

“ఏం లేదు సర్ బయలుదేరుతున్నాం,” అన్నాడు శ్రీకాంత్.

చైర్‌లో వెనక్కి వాలి కూర్చొంటూ, కళ్లజోడు పైనుచి శ్రీజను చూస్తూ ఏం చేద్దాం అన్నాడు ఎస్.ఆర్.నాయుడు. మళ్లీ ఆయన మొహంలో నవ్వు.

“వెళుతున్నాం సర్,” అన్నది శ్రీజ.

ఆయనకు నమస్కారం చేసి గబగబ కిందకి వెళ్లిపోయింది.

శ్రీకాంత్ వంక చూశాడు ఎండి.

“నోరు అదుపులో పెట్టుకో. ఆడపిల్లలతో ఏమిటి నీకు,” అన్నాడు చిరాగ్గా.

“ఒక్కమాట కూడ వినిపించుకోదు సర్. టైమ్ మెయింటెయిన్ చేయదు. చాలా ప్రాబ్లం,” అన్నాడు శ్రీకాంత్.

“అయితే వెళ్ళిపొమ్మని చెప్దాం,” అంటూనే అటు తిరిగి  మెసేజ్‌లు చూసుకోవటం మొదలుపెట్టాడాయన.

నన్ను పంపించకపోతే చాలు అనుకొంటూ వెనక్కి తిరిగాడు శ్రీకాంత్.

“ఏంటి.. ఏమంటాడు,” అన్నాడు పక్క లైబ్రరీలోంచే ఈ ఫార్స్ చూస్తున్న అవుట్‌పుట్ ఎడిటర్ శ్రీధర్. ఎండి గురించి ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాడతను. ఇంకో గంటలో హైద్రాబాద్‌లో జరిగిన విధ్వంసం పైన లైవ్ మొదలుపెట్టాలి. వరసగా అందరికీ ఫోన్‌లు చేసుకొని ఎండి కోసం పడిగాపులు పడుతున్నాడు.

“ఏవంటాడూ.. దాన్నీ..” అంటూనే ఎవరైనా విన్నారేమోనని చుట్టూ చూశాడు శ్రీకాంత్.

“శ్రీజని తీసేయ్యాలిట.”

“తీసి ఎక్కడ వేయాలి” నవ్వాడు శ్రీధర్.

“ఆయన నెత్తిమీద. ఇది గంటకోసారి ఆయన కాబిన్ ముందు నిలబడుతుంది. ఈవిడ పోయట్రీకి ఇన్స్పిరేషన్ ఆయనేనట”

“ఆమె పోయట్రీకి ఈ ముసలాడు ఇన్స్పిరేషనేమిటిరా. ఈవిడకు ఆయన్ను చూసి కవిత్వం పొంగటమేమిటో అర్ధం కాదు.”

శ్రీకాంత్ చిరాకు చూసి ఇంకా నవ్వొచ్చింది శ్రీధర్‌కి.

“దాని ఉద్యోగానికి ఇది పర్మినెంట్ స్టాంపు.”

“శ్రీజలాగా మన ఆఫీసులో కనీసం వందమందికి ఇన్స్పిరేషన్ ఆయన. మన డెస్క్ రమణగాడు చూడు. నిముషానికి ఓ సారి అభిసారికలాగా సార్ అంటూ  పరిగెత్తుకొస్తుంటాడు. తన లైవ్‌లో ఎటువైపు చూసినా దీపం పురుగుల్లా జర్నలిస్టులు ముసురుతుంటారని మొన్న కోర్ మీటింగ్‌లో ఎండి మూర్ఛపోయాడు. అసలింతకీ రమణగాడు ఎందుకు వచ్చాడో తెలుసా..? ఇప్పుడు ఎడిట్ అవుతున్న ప్రోగ్రామ్‌లో వైట్ షర్ట్ గ్లేర్ కొట్టిందంట. ఆ తెల్లటివి వేసుకోవద్దని కెమెరా పరశురాం చెప్పమన్నాడని వచ్చానన్నాడు. ఈ సంగతి చెప్పేందుకు రమణ రావాలా చెప్పు. ఎండీగారు రమణగాడి పొగడ్లకి  కోమాలోకి వెళ్ళిపోయాడనుకో,” అన్నాడు శ్రీధర్.

ఒక కన్ను ఎండి కాబిన్‌వైపు పెడుతూ, కేబిన్ ఎదురుగా ఆయన పి.ఏ. సరిత సీరియస్‌గా కంప్యూటర్‌కి అతుక్కుపోయి కనిపిస్తుంది. ఆమె ఎదురుగా పదిమంది ఎండిగారి కోసం వెయింటింగ్‌లో వున్నారు.

“లైవ్ వుందిరా బాబూ పోతున్నా. ఆయనకు గెస్ట్ లిస్ట్ ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది,” అంటూ అటు పరిగెత్తాడు శ్రీధర్.

సరితకు ఎదురుగా నిలబడ్డాడు. ఓ సెల్యూట్ కూడా కొట్టేశాడు.

“చాల్లే బడాయి” అన్నది సరిత నవ్వు ఆపుకొని.

“ఆయనకు పర్మిషన్ ఇవ్వొచ్చుగా నన్ను కలిసేందుకు,” అన్నాడు సీరియస్‌గా.

సరిత మళ్లీ నవ్వింది.

“ఇవ్వను,” అన్నది సిస్టంలోంచి ఏదో నంబర్ నోట్ చేసుకొంటూ.

“ప్లీజ్ మేడం. చచ్చి నీ కడుపున పుడదామన్నా టైం లేదు. టాంక్‌బండ్ మీద విగ్రహాలు మొత్తం మటాష్”

“సర్లే బాబూ ఓవరాక్షన్ ఆపి పోయి పనిచేసుకో,” అన్నదామె.

క్యాబిన్ అద్దంలోంచి ఎండి ఫోన్‌లో మాట్లాడతం కనిపిస్తోంది. అద్దంలోంచి కనిపిస్తున్న శ్రీధర్‌కి తలవూపి లోపలికి రమ్మన్నాడు.

“అదేమిటండి . విగ్రహాలన్నీ.. అబ్బ అవన్నీ అంటే నాకెంతో ఇష్టం,” అన్నది సరిత. ఎదురుగ్గా గోడపై ఫిక్స్ చేసిన టీవీలో లైవ్ చూస్తూ, చూస్తుండగానే జాషువా విగ్రహం నేలమట్టమైపోయింది.

శ్రీధర్‌కి మొహంలో నవ్వు మాయమైపోయింది.

“చరిత్రకి సాక్ష్యాలు కూడా మిగల్చరా వీళ్లు. ఏం సాధిస్తారో..” అంటూనే ఏండి రూమ్‌లోకి వెళ్ళిపోయాడు.

హుస్సేన్‌సాగర్‌పైన జరుగుతున్న విధ్వంసం లైవ్‌లో కనిపిస్తోంది. వందలకొలదీ విధ్యార్థులు దూసుకు వస్తున్నారు. విగ్రహాలు కూలిపడుతున్నాయి. పోలీస్ వ్యాన్ దొర్లి పడింది.

“అమ్మో.. టెన్షన్‌గా వుంది,” అన్నది సరిత. ఎదురుగ్గా కూర్చొన్నవాళ్లవైపు చూసి. ఎదురుగా న్యూస్ ఎడిటర్ శ్రీనివాస్ విగ్రహంలా కూర్చుని వున్నాడు. ఆయన మొహంలో ఏ ఫీలింగ్ లేదు.

“శ్రీనివాస్‌గారూ స్పాట్‌కి వెళ్ళలేదా,” అన్నది సరిత.

“సరితగారూ, ఓ నిముషం సార్‌ని కలుస్తా” అన్నాడు శ్రీనివాస్.

“ఏమయిందండీ అంటూ…” ఇంటర్‌కం ఫోన్ తీసింది.

“ప్రతి విషయం మీ పర్మిషన్ తీసుకోలేనండి” అన్నాడు శ్రీనివాస్.

సరిత మొహం మాడిపోయింది.

ఫోన్  పెట్టేసి, సార్ ఫోన్‌లో మాట్లాడుతున్నారు అన్నది శ్రీనివాస్ వైపు చూస్తూ.

“మధ్యలో నా పర్మిషన్ ఏమిటండి” అన్నది రెట్టిస్తూ మళ్లీ.

“ప్లీజ్ సరితగారూ, నన్ను వదిలేయండి. ఎల్లాగూ మీ వెర్షనే ఆయన వింటాడు. నాపైన దయదలచి నన్ను వదిలేయండి.” అన్నాడు రెండు చేతులు జోడించి.

సరిత దిక్కులు చూసింది. చుట్టూ చాలా మంది విజిటర్స్ ఉన్నారు. ఏం మాట్లాడినా శ్రీనివాస్ గొంతు పెంచేలా ఉన్నాడు.

మళ్లీ ఫోన్ తీసింది.

“సార్ శ్రీనివాస్ సార్  ఓ నిముషం మాట్లాడాలంటున్నారు.”

“శ్రీధర్‌ని పంపేస్తాను” అన్నాడు ఎస్.ఆర్.నాయుడు.

“ఏమంటాడు కుదరదు అంటున్నాడా?” గొంతు పెంచుతున్నాడు శ్రీనివాస్.

“ఆయనతో నాకేం పని లేదండి. జస్ట్ రిజైన్ చేసిన పేపర్ ఇస్తాను అంతే ” అన్నాడు పెద్ద గొంతుతో.

“శ్రీనివాస్‌గారూ ప్లీజ్. శ్రీధర్ రాగానే మీరు వెళ్లండి” అన్నది సరిత.

శ్రీనివాస్ మనసు  ఉడికిపోతుంది. వందమంది రిపోర్టర్స్‌కి న్యూ ఇయర్ కోసం టార్గెట్స్‌తో ఎడ్వర్‌టైజ్‌మెంట్స్‌ కోసం ఎంత కష్టపడ్డాను. వాళ్లు ఉద్యోగాలు మాని కంపెనీకి డబ్బు రావాలని కష్టపడ్డారు. ఒక్కో రిపోర్టర్‌కి ఐదేసి లక్షలు టార్గెట్. పాపం అంతా చేశారు. ఏం జరిగిందీ. ఒక్కళ్లకి కూడా సింగిల్ పైసా పర్సంటేజ్ ఇవ్వలేదు. మొత్తం ఎండి ఖాతాలోకి వెళ్లిపోయింది. టార్గెట్స్ పెట్టిన సంగతి, రిపోర్టర్స్ పని చేసిన సంగతి మేనేజ్‌మెంట్ దాకా వెళ్లనేలేదు. మొత్తం తన ద్వారానే వచ్చిందని ఎండి క్రియేట్ చేసుకున్నాడు. స్టాఫంతా తన పైన పడతారు. తను చీట్ చేశారంటారు. దిక్కుమాలిన ఉద్యోగం. పళ్లు కొరుక్కున్నాడు శ్రీనివాస్.

శ్రీధర్ బయటకు వస్తూ శ్రీనివాస్‌కి విష్ చేసాడు. శ్రీనివాస్ నవ్వులేని మొహంతో నిలబడ్డాడు. ఒక్క నిముషం కళ్లు మూసుకొని ఎండి రూంలోకి గబగబ వెళ్లాడు.

“శ్రీనివాస్ కూర్చోండి. లైవ్ ప్రోగ్రాం తర్వాత ఒక అరగంట ఈ టాంక్‌బండ్ విషయాలపై రౌండప్ నాదే. మూడుగంటల బులెటిన్ ముందు నా రౌండప్ ఉండాలి. లైవ్‌లో పోలీస్ అఫీషియల్స్‌ని పిలవండి.” అన్నాడు.

“సార్.. నా రిజిగ్నేషన్” అన్నాడు శ్రీనివాస్ పేపర్ ఆయన ముందుకు తోస్తూ.

“వ్వాట్.. ఎందుకు..? ఏమయింది..?” అన్నాడాయన ఉలిక్కిపడి.

“ఎందుకు లెండి సార్.. నేనీ  ఉద్యోగానికి తగను” అన్నాడు శ్రీనివాస్.

“శ్రీనివాస్ ఇవాల్టి పరిస్థితి ఇలా వుంటే, మనం ఏ  సైడ్ తీసుకోవాలో తెలియని  క్రూషియల్ పీరియడ్. ఇప్పుడు నేనేం నిర్ణయాలు తీసుకోలేను. తర్వాత మాట్లాడదాం. చూడు హుస్సేన్ సాగర్ దగ్గర ఎంత గందరగోళం..” అన్నాడాయన.

“నేను నా నిర్ణయం తీసుకొన్నాను సర్.. ఇది నా కెరీర్‌కు సంబంధించింది” అన్నాడు శ్రీనివాస్ అయన వైపు చూస్తూ.

ఎండి మాట్లాడలేదు. కాస్సేపు ఊరుకొన్నాడు.

“శ్రీనివాస్ నువ్వు మేనేజ్‌మెంట్ గుడ్‌లుక్స్‌లో వున్నావు. పొలిటికల్ ఎడిటర్‌గా ప్రమోషన్ ఇద్ద్దామనుకొంటున్నాను. అంటే నువ్వే చానల్‌కు మెయిన్ రోల్. ఆర్‌యూ హ్యాపీ నౌ…”

“నో సర్.. నేను వెళ్ళిపోతాను. సర్. నేను మీ దగ్గర ట్రెయినీగా చేరాను. నన్ను మీరు పెంచారు. కానీ నాకు డబ్బుకంటే  కెరీర్ ముఖ్యం సార్. నాకెంతో  జీవితం వుంది. నేను ఎవరినీ మోసం చేయలేను..”

ఎండి మొహం ఎర్రబడింది.

“అంటే ఏమిటి నీ ఉద్ధేశ్యం.”

“ఏవుంది సార్. అన్నింటికీ నేను అడ్డం వుంటాను. ఈ  చానల్‌లో ప్రతి ఎంప్లాయికీ జరిగే ప్రతి అన్యాయం నా చేతులపైనే జరుగుతోంది. రిపోర్టర్స్ చాలా అసహ్యించుకుంటున్నారు. వాళ్ళు కష్టపడతారు. మీకు పేరు వస్తోంది. రేపు మన రెండో చానల్‌కు కూడా మీరే హెడ్. మరి చాకిరి చేసేవాళ్ల గతి ఏమిటి?”

ఎండికి అర్ధం అయింది. పరిస్థితి ఇంకా ఎటూ పోలేదు. బాల్ తన కోర్టులోనే వుంది. శ్రీనివాస్‌కు కావలసింది ఏమిటో అర్ధం అయింది.

“ఎంటర్‌టెయిన్‌మెంట్ చానల్ వచ్చిన తర్వాత హెడ్‌గా నువ్వే వుంటావనుకున్నాను” అన్నాడు తాపీగా వెనక్కి వాలి.

శ్రీనివాస్ మొహంలో కోపం తెరలు కాస్త తొలగిపోయాయి.

“సార్…” అన్నాడు లోగొంతులో.

“శ్రీనివాస్ టీవీ21 వాళ్లు చూడు. ఏం టైటిల్ పెట్టారో. ఈ అల్లరి మూకలా రేపు పాలించేది.. బావుంది కదా” అన్నాడు.

శ్రీనివాస్ గొంతు పెగల్లేదు.

“నాకు లైవ్ వుంది. రాత్రికి మాట్లాడుకొందాం,” అన్నాడాయన లేస్తూ.

శ్రీనివాస్ పేపర్స్ తీసుకొని బయటికి వచ్చాడు. అతని మొహం వెలిగిపోతోంది.

వందమంది ఆశలు తను తీసుకువచ్చాడు. ఇప్పుడు తన ఆశ ఒక్కటే తను తీర్చుకొన్నాడు. ముప్పై ఎనిమిదేళ్లు వస్తున్నాయి. ఇవ్వాల్టికీ కారు లేదు. ఇల్లు లేదు. మొన్ననే బాబు పుట్టాడు. ఖర్చులు పెరుగుతున్నాయి. మంచి జీవితం ఇవ్వాలి వాళ్లకు. తనో రూల్ పెట్టుకుని న్యాయం ధర్మం అంటూ వేళ్ళాడలేదు. మనిషిగా మిగలాలి అనుకోకపోతే చాలు ఈ ప్రపంచంలో మహారాజుగా బతకవచ్చు.

సరిత ఎదురుగ్గా కూర్చున్నాడు. సరిత మొహంలో స్పష్టంగా నవ్వు కనిపిస్తోంది. ఎండి. పిఏ ఆమె. సమస్తం ఆమెకు తెలుసు. ఎండి బ్యాంకు ఎక్కౌంట్లు ఆమె చేతుల్లోనే వుంటాయి. శ్రీనివాస్ పాత్ర ఏమిటో, లోపల అతనేం చేయబోతాడో, ఎలా బయటికి వచ్చాడో ఊహించింది సరిత. ఇలాంటి వాళ్లని ఎండి ఎంతమందిని చూసి వుంటాడు. బంజారాహిల్స్‌లో అంత పెద్ద భవనం ఎలా కట్టేడు. పిల్లలు ఫారిన్‌లో, బావమరుదులు, మరదళ్లు ఆయన ఆఫీస్‌లో ఎంతగా పాతుకుపోయారో ప్రతి నిముషం ఎవరేం మాట్లాడుకొన్నా ఆయనకు ఇన్‌ఫర్‌మేషన్ ఎలా వస్తుందో చక్కగా తెలుసు. శ్రీనివాస్ కోపం ఎంత సేపు.

“టీ తాగుతారా శ్రీనివాస్‌గారూ,” అంది సరిత.

“వుందా,” అన్నాడు శ్రీనివాస్ నీరసంగా.

***

వచ్చే గురువారం …

ఛానెల్ 24 / 7 – రెండో భాగం

Channel 24-2 

(కిందటి భాగం తరువాయి)

sujatha photo

“ఉపేంద్రా… నాకు తెలుసు.. నువు నన్ను పట్టించుకోవటం లేదు.. ”

“అంటే…”

“అంటే ఏవుందీ.. నాకెన్ని బులెటిన్‌లు? ఉదయం 8 గంటలకు ఒకటి, రాత్రి ఎనిమిదికి ఒకటి… అంటే ఎన్ని గంటలు.. నన్ను సాధిస్తున్నావు కదూ..” గొంతు పోయింది పల్లవికి.

ఉపేంద్ర తల పైకి ఎత్తకుండానే కళ్ళెత్తి ఆమె వైపు చూశాడు. తను అలా చూస్తే ఎంతో రొమాంటిక్‌గా వుంటాడని మేకప్‌మెన్ రుద్ర లక్షసార్లు చెప్పాడు ఉపేంద్రకి.

“నా గురించి నీకు అలాంటి ఇంప్రెషన్స్ ఉన్నాయంటే ఐయాం సారీ..”

“ఇంప్రెషనేమిటీ.. ఫాక్ట్.. కావ్యకి నాలుగు బులెటిన్లున్నాయి. ఆమె మొహం అంత నచ్చిందా..?”

“ఓ షిట్.. నాకు నచ్చటమేమిటి.. మీరేమంటున్నారు పల్లవీ..”ఉపేంద్ర మొహం ఎర్రబడింది.

పల్లవి కంగారు పడింది.
“ఉపేంద్ర.. ప్లీజ్.. మీరు వేరే విధంగా అనుకోవద్దు. చనువుకొద్దీ అన్నాను. మీరు తప్ప నన్ను ఈ ఫీల్డ్‌లో ఎంకరేజ్ చేసేవాళ్లు ఎవరున్నారు?” అన్నది లాలనగా.

ఉపేంద్ర మొహం చూస్తూనే పల్లవికి ధైర్యం వచ్చింది. జుట్టు చేత్తో సరిచేసుకొంది. చెవుల జూకాలు కదిలేలాగ ఓ సారి తల తిప్పింది. నల్ల బ్లేజర్‌లోంచి తెల్లగా కనిపిస్తున్న తన తెల్లటి చేతులవైపు చూసుకొంది. పర్లేదు. ఇవ్వాళ ఉపేంద్ర చేత అవుననిపించాలి.

“వన్.. మినిట్..”

ఉపేంద్ర సెల్‌లో ఎవరితోనో మాట్లాడటం మొదలుపెట్టాడు. పల్లవి చుట్టూ చూసింది. కాబిన్‌లో యాంకర్స్ ఎవళ్ళూ లేరు. నయన థర్ద్ స్టూడియోలో వుంది. రెండు గంటలవరకూ రాదు. మార్చి ఎయిట్ సెలబ్రేషన్స్ లైవ్‌లో కావ్య ఇరుక్కుపోయింది. మినిమం వన్ అవర్. చచ్చినా రాలేదు. బ్లూ‌మేట్‌లో రవీంద్ర.. యమున పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ రికార్డింగ్‌లో ఉంది. వాయిస్ ఓవర్ శాంతికి, కృష్ణకి మునిగిపోయేన్ని ప్యాకేజీలు వున్నాయి. చెరో పాతిక స్క్రిప్ట్‌లు పట్టుకొని ఆడియో రికార్డింగ్ స్టూడియోలో వేలాడుతున్నారు. కన్‌ఫర్మ్. ఇవ్వాళ ఉపేంద్ర ఊ అనేదాకా.. నోవే..

మొహం పైకి నవ్వు తెచ్చుకొంది పల్లవి.

ఫోన్ మోగింది. మ్యూట్‌లో వుంది కనుక ఎవ్వళ్లకీ వినబడదు. విసుక్కుంటూ పల్లవి ఫోన్ తీసింది. సంతోష్.. రిజక్ట్ చేసింది. ఫోన్ వంకే చూస్తోంది. తప్పనిసరిగా మెసేజ్ పెడతాడు. వెంటనే మెసేజ్ వచ్చింది. పాపకి ఫీవర్ నార్మల్ వచ్చింది, ఈ రోజు నాకు సెలవు దొరికిందని.

పల్లవికి ఈల వేయాలనిపించింది. సంతోష్ ఇంట్లో వుంటే ఇక బెంగే లేదు. తను చూసుకొంటాడు. ఫోన్ బ్యాగ్‌లోకి తోసేసి ఉపేంద్ర వైపు నవ్వు మొహం పెట్టుకు కూర్చొంది.
ఉపేంద్ర ఫోన్ పక్కన పెట్టాడు.

“నీకూ.. రవివర్మకి అండర్‌స్టాండింగ్ ఏమిటి?”

డైరెక్ట్‌గా ముగ్గులోకి వచ్చాడనుకొంది పల్లవి.

“ఏవుంది?  ప్రోగ్రాం.. మార్నింగ్ ఫైవ్ రెగ్యులర్‌గా నేను, రవివర్మ కలిసి చేయాలని ఎం.డి. అన్నారు కదా…”

రిలాక్స్‌గా వెనక్కు వాలి కూర్చుంది. ఉపేంద్ర ప్రాబ్లం అర్ధం అయింది పల్లవికి. రవివర్మ అంటే జెలసీ.

“నీకు మార్నింగ్ బులెటిన్స్ ఓకేనా ? ” అన్నాడు ఉపేంద్ర.

పల్లవి గబగబా ఆలోచించుకొంది. అంటే రవివర్మతో మార్నింగ్ ఫైవ్‌ని వదిలించుకోవాలి. తనకి ప్రోగ్రామ్స్ ఎందుకు , న్యూసే కావాలి.

“మరి ఆ ప్రోగ్రామ్ ఎవరు చేస్తారు?” అంది దిగులుగా మొహం పెట్టి.

“ఎవళ్ళో ఒకళ్ళు.. ఉషాకి ఇద్దాము.. “టెన్షన్‌గా అంటున్నాడు ఉపేంద్ర.

“రవివర్మ ఉషాగార్ని రిజక్ట్ చేశాడు,” అన్నది పల్లవి.

ఆవిడ పెద్దావిడ కదా. నాతో కాంబినేషన్ బావుండదు అన్నాడు ఎం.డీ.గారితో,” అన్నది పల్లవి.

నవ్వు ఆపుకొన్నా ఆగటం లేదు ఆమెకు.

ఉపేంద్ర, రవివర్మ.. ఇద్దరికీ తన పైన నమ్మకం వుంది. తను ఉపేంద్ర వైపు వుంటేనే లాభం. న్యూస్ బులెటిన్లు ఫస్ట్ షిఫ్ట్ వేస్తాడు. తనకి హ్యాపీ కదా. సంతోష్‌కి ఎటూ సెకండ్ షిఫ్టే. ఇంకా నయం నేనూ సంతోష్ ఇద్దరం హాయిగా ఇంట్లో అంటే పాపం ఇతను మొహం ఎలా పెడతాడో…?

“ఏమిటి ఆలొచిస్తున్నావు, ” అన్నాడు ఉపేంద్ర.
అతనివైపు చూసింది. ఉపేంద్ర మొహంలో యంగ్ లుక్ పోతోంది. జుట్టు పల్చబడింది. గడ్డం ఫ్రెంచ్ కట్ చేయించాడు. మొహం ఏమీ బావుండలేదు. ముసలాడు అనుకొంది పల్లవి.

“ఏం లేదు.. మీరేం డిసైడ్ చేసినా నాకు ఓకే,” అన్నది.

ఉపేంద్ర ఆలోచనలో పడ్డాడు. నైట్ షిఫ్ట్ వేస్టే మన కంట్రోల్ వుంటుంది. ఎండీ ఒకవేళ ఉదయం రవివర్మతో కూడా ప్రోగ్రామ్  చేయమని అంటే ఈమెని తప్పించే వీలుండదు. కొన్నాళ్లు చూద్దాం. ఎక్కడికి పోతుంది అనుకొన్నాడు.

“సరే పల్లవి. మార్నింగ్ షిఫ్ట్‌లో వన్ థర్టీ బులెటిన్ చేసుకొని వెళ్లిపో… తర్వాత చూద్దాం. ఎయిట్ థర్టీ బులెటిన్, తర్వాత డిస్కషన్ లైవ్, వన్ థర్టీ బులెటిన్.. లేకపోతే టెన్‌కి బులెటిన్ వన్ అవర్, స్టేట్ రౌండప్ ఐనా సరే.. నేనోసారి ఎఫ్.పి.సి చూస్తాను,” అన్నాడు ఉపేంద్ర.

ఎగిరి గంతేయాలనిపించింది  పల్లవికి.

ఆమెనే చూస్తున్నాడు  ఉపేంద్ర. చాలా బావుంటుంది. ఎందుకు జారిపోనివ్వాలి అనిపించిందతనికి.

పల్లవి  అతన్నే గమనిస్తోంది. మంచి అవకాశం. ఉదయం షిఫ్ట్ పూర్తి చేసుకొంటే పాపాయితో పగలంతా ఎంజాయ్ చేయచ్చు. సంతోష్‌కి చాలా కష్టం ఐపోతోంది పాపతో. ఎంతమంచి భర్త సంతోష్. నన్ను పాపాయిని ఒక్కలాగే చూస్తాడు. ఎలాగైనా ఇతన్ని మేనేజ్ చేయాలి అనుకొంది.

“థాంక్యూ ఉపేంద్రా,” అన్నది చేయి చాపి.

చాపిన చేతిని  అందుకొన్నాడు ఉపేంద్ర.
“సో… నైస్.. ” అన్నాడు మెచ్చుకోలుగా..

***

వచ్చే గురువారం …

 Front Image: Mahy Bezawada 

ఛానల్ 24/7

ch24_inner

sujatha photo“కరెక్టా.. కాదా.. సరిగ్గా ఆలోచించానా…?”

దిగుతున్న మెట్టు మెట్టుకీ ఒక్కో ప్రశ్న నిలదీస్తోంది. స్వాతి డోర్ దగ్గిర కనబడగానే ఒక్కో లైటూ వెలుగుతోంది స్టూడియోలో.

సెట్ వెలిగిపోతోంది. నల్లని బ్యాక్‌డ్రాప్‌లో చమక్‌మనే కర్టెన్స్ జిగ్‌జాగ్‌గా కన్పిస్తున్నాయి. ఫ్లోర్‌లో రెండే రెండు చెయిర్స్ ఎదురెదురుగా వున్నాయి. రెండింటికీ మధ్యలో ఒక చిన్న టీపాయ్. బ్యాక్‌డ్రాప్ బ్లాక్ కలర్‌లో పైనుంచి కిందిదాకా వేలాడుతున్న డిజైనర్ బుట్టల్లోంచి వెలుగు. సీలింగ్ స్టాండ్ నుంచి రెండు లైట్లు సరిగ్గా కిందవున్న చైర్స్‌పై పడుతున్నాయి. ఎడం వైపు వున్న చెయిర్‌లో నయన కూర్చుని చేతిలో వున్న పేపర్స్ వంక చూసుకోంటోంది.

అది పగలైనా సెట్ మాత్రం నైట్ ఎఫెక్ట్‌లో వుంది. వైడ్ కెమేరాలో మొత్తం సెట్ అంతా కవరయ్యేలా మానిటర్‌లో చూసుకొంటూ అడ్జస్ట్ చేసుకొంటున్నాడు సీనియర్ కెమేరామెన్.

మెట్ల దగ్గర శబ్దం విని హలో మేడం.. అంటూ ఎదురొచ్చింది నయన స్వాతిని విష్ చేస్తూ.

చప్పట్లు కొడుతూ కెమేరామెన్స్‌ని హెచ్చరించింది నయన. నాలుగు వైపులా కేమ్స్. వెనకాల కెమేరామెన్స్. చిరునవ్వుతో స్వాతిని విష్ చేస్తున్నారు అందరూ. క్రేన్‌పైన కూర్చొన్న నరేంద్ర ఓ ట్రయల్ వేద్దామని క్రేన్ ఆపరేటర్‌ని అడుగుతున్నాడు. స్వాతిని చూసి హలో మేడం అంటూ విష్ చేశాడు. మెట్ల దగ్గరనుంచి స్వాతి చేయి పట్టుకొని నడుస్తూ సెట్ దగ్గరకు తీసుకొచ్చింది నయన.

వెల్‌కమ్ చెబుతున్నట్లు తలవంచి అభివాదం చేస్తూ నయన, “వెల్‌కమ్ మేడం,” అన్నది.

స్వాతి చైర్‌లో కూర్చుని చుట్టూ చూసింది. ఎదురుగ్గా స్క్రిప్ట్ రైటర్ పరిమళ, అసిస్టెంట్ ప్రొడ్యూసర్ రవి, ప్రొడక్షన్ మేనేజర్ నాగేశ్వరరావు నవ్వుతూ చూస్తున్నారు.

“టచప్ ఇవ్వనా మేడం,?” మేకప్‌మేన్ బెదురుతూనే అడిగాడు.

కళ్ళెత్తి అతనివైపు చూసింది స్వాతి. ఆమె వైపు చూస్తునే రెండు అడుగులు వెనక్కి వేశాడు మేకప్‌మేన్ స్వామి. ఒక్క క్షణం అతనికి భయం అనిపించింది. స్వామీ అని గద్దించే స్వాతి గొంతు చెవుల్లో మోగినట్లయింది. పదిహేనేళ్ళుగా మేకప్‌బాయ్‌గా, ఫ్లోర్‌లో అడుగుపెట్టినప్పటినుంచి అలవాటుగా వింటున్న గొంతు. వెనక్కి వెళ్లి నిలబడ్డాడు.

స్వాతిపైన వెలుతురు పడేలా అసిస్టెంట్ లైటింగ్ షేడ్ మారుస్తున్నాడు. ఆమె చెదిరిన జుట్టుపైన వెలుగు పడి జుట్టు మెరుస్తోంది. తెల్లబడిన కనుబొమలు, తలవంచుకొన్న చోటపడిన నీడ, తెల్లని ముక్కుపైన వెలుగు, ముడుచుకొన్న పెదవులు, అరవైఏళ్ళ వయసులో కూడా అపురూపమైన అందం. ఆమె అందంగా వుందా.. గంభీరంగా వుందా.. కోపంగా వుందా.. ఏదీ తెలియనివ్వని నిర్లిప్త్త. ఎన్నో ఏళ్లుగా చూస్తున్నా ఎప్పుడూ కొత్తగా.. భయపెడుతూ…

“స్వామి.. అద్దం తీసుకురా,” నయన కేక పెట్టింది.

అద్దం తీసుకొని స్టేజ్‌పైకి పరుగు పెట్టాడు స్వామి. అది తీసుకొని అద్దంలో మొహం చూసుకొంది నయన. జుట్టును చేతులతో సరిచేస్తూ వెనక్కి వేస్తోంది హెయిర్ స్టయిలిస్ట్ కమల. ప్రతి రోజూ, ప్రతి ప్రోగ్రామ్‌కి అలవాటైన ఒక పద్ధతి. స్వాతి నయన వైపే చూస్తోంది. మొహం చూసుకొని, అద్దం స్వామికి ఇచ్చేసి స్వాతి వైపు తిరిగింది నయన.

“మేడం ఓకే నా,?” అడిగింది.

స్వాతి చిరునవ్వు నవ్వింది.

కెమేరామెన్ సజెషన్స్ ఇస్తున్నాడు.

“నయనా మేడం! మీరు ఈ క్యామ్ లోకి చూడండి,” క్రేన్‌వైపు కూర్చున్న నరేంద్ర బొటనవేలు పైకి చూపించి ఓకే అన్నాడు.

“ఫ్లోర్ సైలెన్స్.. మూవ్ క్రేన్.. యాక్షన్,” అన్నాడు ప్రొడ్యూసర్ శైలేంద్ర క్రేన్ కెమేరా మూవ్‌మెంట్‌ని మానిటర్‌లో చూస్తూ. ఆన్‌లైన్ స్టూడియోలో అతని ఎదురుగ్గా వున్న మానిటర్స్‌లో నాలుగు కెమేరాల అవుట్‌పుట్ కనిపిస్తోంది. క్రేన్ పైనుంచి ఒక రౌండ్ తిరిగింది. స్వాతి, నయన కూర్చున్న దగ్గరకు జూమ్ చేస్తున్నాడు పైనుంచి నరేంద్ర. నయన మొహం క్లోజ్‌లో కనిపిస్తోంది. శైలేంద్ర మొహం పైన నవ్వు కనిపించింది. హెడ్‌ఫోన్‌లోంచి నయనకి కంగ్రాట్స్ చెప్పాడు.

నయన నవ్వింది. కెమేరా నయన క్లోజ్ చూపిస్తోంది.

“నమస్కారం. ఇవాళ ప్రపంచపు పదోవింత మీ ముందుకు తెస్తోంది టీఎవీ సెవెన్. ప్రఖ్యాత జర్నలిస్ట్, రచయిత్రి, టీవీ సెవెన్ పొలిటికల్ ఎడిటర్ స్వాతితో మనం ఈ రోజు మాట్లాడబోతున్నాం. మూడు దశాబ్దాలుగా మీడియా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకొన్న స్వాతి, జర్నలిస్ట్‌గా, కార్యక్రమ రూపకర్తగా ఎన్నో టాప్ రేటింగ్ ప్రోగ్రామ్స్ సృష్టించారు. 30 ఏళ్ళ అనుభవంతో, ప్రతిభావంతమైన రచనా సామర్ధ్యంతో ఆమె ప్రపంచం మెచ్చుకొన్న మహిళ. ఇవ్వాళ నుంచి ధారావాహికంగా ప్రసారంకాబోతున్న 60 మినిట్స్ విత్ నయనతో మొట్టమొదటి విశిష్ట అతిథిగా మీ ముందుకు వస్తున్నారు స్వాతి. నమస్కారం స్వాతి!”

స్వాతి కళ్ళెత్తి చూసి నమస్కారం చేసింది.

నయన చాలా మంచి యాంకర్. ఏపి లోవున్న న్యూస్ యాంకర్స్‌లో టాప్ త్రీలో ఒకరుగా వుంది. గలగలమనే గంగా ప్రవాహంలాగా మాట్లాడుతుంది.

ఇప్పుడు మనం స్వాతితో మాట్లాడబోతున్నామంటే 30 ఏళ్ళ మీడియా ప్రపంచంలోకి తొంగి చూడబోతున్నాం. అద్భుతమైన రచయిత్రిగా సాహితీ ప్రపంచంలో చోటు సంపాదించుకొన్న స్వాతి మీడియాలో అడుగుపెట్టారు. కాలమిస్ట్ గా , జర్నలిస్ట్‌గా, స్క్రిప్ట్‌రైటర్‌గా, డైరెక్టర్‌గా ఆమె అత్యున్నతమైన స్థానంలో వున్నారు. ఆమె జీవితంలో ప్రతి అనుభవం ఇవాళ్టి జర్నలిస్ట్‌లకు ఒక అపురూపమైన పాఠం. కమాన్ క్లాప్స్,” అంటూ నయన వంగి స్వాతి పాదాలకు నమస్కారం చేసింది.

స్వాతి లేచి నిలబడి నయనను కౌగలించుకొంది.

“థాంక్యూ. నయనా”

“నేనే మీకు థాంక్స్ చెప్పాలి మేడం. ఇవ్వాల్టి నా ప్రోగ్రాంలో మీరు రావటం నాకు ఆశీర్వచనం. మీరు ప్రపంచం ఎరిగిన జర్నలిస్ట్. మీడియా ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టించారు. ప్రసిద్ధి చెందిన ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. మిమ్మల్ని ఈ నిముషం వరకూ ప్రేక్షకులు కళ్ళతో చూడలేదు. మీరెలా వుంటారో తెలియకుండానే మిమల్ని ప్రేమించిన సాధారణ ప్రేక్షకులు మీ ముందున్నారు. వాళ్ల కోసం మీరు మనసు విప్పి మాట్లాడండి,” అన్నది నయన.

స్వాతి వైపు తిరిగాయి కెమేరాలన్నీ. అన్ని కేమ్స్‌లోనూ స్వాతి రకరకాల యాంగిల్స్‌లో కనిపిస్తోంది.

చిరునవ్వుతో నమస్కారం చేసింది స్వాతి.

“నన్ను ఆదరించిన అందరికీ నమస్కారం. మీ ప్రేమ, అభిమానం నన్నింత దాన్ని చేశాయి. నా వృత్తీ, ప్రవృత్తీ ఒక్కటే కావటం నా అదృష్టం. అక్షరాల వరసల్లో సంగీతం విన్నాను. అక్షరాల్నీ ప్రేమించాను, ఆరాధించాను. నా జీవనాధారం కూడా అక్షరాలే. నా ఆలోచనలు, ఊహలు అన్నీ ఎప్పుడూ ఏవో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తూ వచ్చాయి. నేను కలలు కన్న ప్రపంచాన్ని నా కళ్లముందుకు తెచ్చే అవకాశం నాకు కలిగింది. అదే నా అదృష్టం. నేను ఎప్పుడూ నమ్మని ఈ అదృష్టం అన్న పదాన్ని ఇవ్వాళ మీ ముందుకు తెచ్చాను. కొన్ని భావాలకు మాటలు లేవు. ఈ అదృష్టం అన్న పదం కన్నా నాకు ఇప్పుడు, ఈ క్షణంలో ఇంకేం పదం ఆలోచనలోకి రావటం లేదు.”

“కట్.. కట్..” శైలేంద్ర గొంతు మైక్‌లో వినిపించింది.

“సారీ మేడం.. ఆడియో ప్రాబ్లం వుంది,” అన్నాడు శైలేంద్ర స్వాతిని ఉద్దేశించి.

సెట్‌లో అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. స్వాతి తలవంచుకొని కూర్చుంది. నయనకు ఆమెను పలకరించే ధైర్యం లేదు. టెక్నికల్  చీఫ్ కిందకి వచ్చి మైక్స్ చెక్ చేస్తున్నాడు.

“నిన్న యూనిట్ మొత్తం అవుట్‌డోర్ వెళ్లింది మేడం. ఆన్‌లైన్ పంపించాను. ఏవో లైన్స్ ప్రాబ్లం ఇస్తున్నాయి. ఉదయం అంతా చెక్ చేశాం,” అంటున్నాడు అపాలజిటిక్‌గా.

స్వాతి కుర్చీలో వెనకి వాలి కూర్చుంది. ఎంతో మాట్లాడాలి. ఎన్నో చెప్పాలి. ఏది ముందు… ఏది వెనక… ఈ కెమేరాల ముందు ఫ్లాష్ లైట్ల వెనక, మేకప్ కాస్ట్యూమ్స్ వెనక… ఇక్కడ ఏం జరుగుతోంది? తనేం చెప్పబోతోంది? అరగంట క్రితం కాన్ఫరెన్స్ హాల్లో సి ఇ ఒ కి చెప్పిన తన నిర్ణయం గురించి ఏం ఆలోచించాలి? ఒకే ఒ క్క నెల రోజుల్లో తను ఈ ప్రపంచంలోంచి బయటికి నడిచిపోవాలి. ఈ ప్రపంచం… ఈ మీడియా… ఎవరు ఎవరికోసం నేనేదయినా చేయగలనని ఈ ఉద్యోగం గురించి చెప్పుకొంటున్నారు… మీడియా గుట్టు తను విప్పబోతుందా…?

వచ్చే గురువారం …

 Front Image: Mahy Bezawada