ఛానెల్ 24/7- 9 వ భాగం

“మనిషి ఎలా వుండాలో ఆ స్ట్రక్చర్ ఇమ్మని అడగగలమా”

“నువ్వు మహాత్మాగాంధీలా అవ్వాలనుకొన్నావనుకో. మీడియా ఇచ్చేది ఏవుంది. న్యాయంగా, నిజాయితీగా, ధైర్యంగా నీకు నువ్వే తయారవ్వాలి. నాకు మాట్లాడాలంటే భయం, స్టేజ్‌ఫియర్ అన్నావనుకో. ఎవరో ఒక కౌన్సిలింగ్ ఎక్స్‌పర్ట్ నువ్వెలా మాట్లాడాలో, మీడియాలో మాట్లాడి పెడతారు. నీ జీవితంలో నీ ఇల్లు ఎలా వుండాలో, నీ కారు ఏదై వుండాలో నీకెలాంటి డిజైనర్ చీరె కావాలో, నీవేం తినాలో, తాగాలో నిన్నొక కార్పోరేట్ పర్సన్‌లాగ డిజైన్ చేసి పెడుతోంది మీడియా. నువ్వు కోరుకుంటే, నువ్వు గొప్పగా ఎలా వుండాలనుకున్నావో అదే ఊహించి ఇస్తుంది. నీ పిల్లలు అన్నం పప్పు తినకుండా నూడుల్స్ తిని ఎలా ఆరోగ్యంగా వుండాలో చెపుతుంది. నిమ్మకాయ నీళ్లు తాగకుండా న్యూట్రిషియస్ డ్రింక్‌ని చేతిలో పెడుతోంది. నీ గురించి నువ్వు ఆలోచించుకోనక్కరలేదు. అదే ఆలోచించి ఇస్తుంది.”

“మరి నాకు ప్రాబ్లం వస్తే..”

“ఎందుకు.. కౌన్సిలింగ్ ఎక్స్‌పర్ట్స్”

“కడుపు నొప్పేస్తే..”

“మెడికల్ ఎక్స్‌పర్ట్స్”

“కాపురం వద్దనుకుంటే…”

“లీగల్ ఎక్స్‌పర్ట్స్.. అంతటా ఎక్స్‌పర్ట్స్. ఎక్కడో ఒక చోట దర్శనం ఇస్తూ..”నవ్వింది స్వాతి.

“మీరు పొలిటికల్ ఎడిటర్ కదా.. ఎక్స్‌పర్ట్స్ అంటే ఎగతాళెందుకు మీకు?”

ముక్కుపైన వేలేసుకొంది స్వాతి.

“ఎగతాళా.. నీ ప్రశ్నకు సమాధానం చెప్పాను. ఆక్టోపస్‌లాగ ప్రజలను మీడియా ఎలా చేతుల్లోకి తీసుకొంటుందో చెపుతున్నాను”

“వాళ్లకు మంచి చేస్తుందా.. చెడు చేస్తుందంటారా?”

“మీడియా ఒక వ్యవస్థ. రాజకీయంలాగా, పోలీస్ వ్యవస్థలాగ ఇంకో వ్యవస్థ. మన జీవిత విధానంలో ఒక భాగం. ప్రజలకు – పాలకులకు, ప్రజలకు – ప్రజలకు, ప్రజలకౌ – న్యాయానికి, న్యాయానికి – అన్యాయానికి, మనిషికి – మనిషికీ మధ్య ఒక వంతెన…”

“నేను అడిగింది డెఫినిషన్ కాదు. మీ అభిప్రాయం. ఇంతకు ముందోసారి చెప్పారు. మీడియా వ్యక్తుల లాభాలతో కూడా ముడిపడుతోందని, దురాశలకు చేయి అందిస్తోందని..” నయన గొంతులో కాస్త ఆవేశం.

“నయనా.. స్పష్టంగా నిజాన్ని చూడు. ఒక చాకు తీసుకో. అది నీకు మామిడిపండు కోయటానికి ఉపయోగపడుతుంది. ఒక ఉన్మాది చేతిలో గొంతు కోసేందుకు ఉపయోగపడుతుంది. చాకు మేలు చేస్తోందా, కీడా?”

“మేడం…”

“అదే చెబుతున్నాను. జర్నలిస్ట్‌లన్నా, పత్రికలన్నా, చానల్స్ అన్నా ప్రజలకు నమ్మకం. ఇష్టం. వాళ్లు మీడియాతో చేయి కలిపారు. గొంతు కలిపారు. అయితే మీడియా వాళ్ల భావాలన్నీ, అభిప్రాయాలన్నీ కరక్టు కాదు. లిట్మస్ టెస్ట్‌లాగా చూసుకోవాలి ప్రజలు. కొన్ని వ్యవస్థలకు కొన్ని విధులు కర్తవ్యాలు కావాలి. ఉండాలి. పోలీస్ వ్యవస్థ రక్షణ ఇవ్వాలి. చివరకు ఆటోవాళ్ల దగ్గర కూడా లంచాలు పుచ్చుకొంటారు చూడటంలా. రాజకీయ నాయకులు మన ప్రతినిధులుగా ఉండాలి. కానీ వాళ్ల కుటుంబ ఆస్థులను పెంచుకొనే ప్లేసుల్లో ఉంటారు కొందరు. డాక్టర్ ప్రాణం పోసే పరమాత్మలాగా ఉండాలి. కానీ కార్పోరేట్ వైద్యం పేరిట ఎవరికైనా నిజమైన వైద్యం అందుతుందా? డాక్టర్లు ప్రాణదాతలుగా ఉన్నారా? వ్యాపారుల్లా ఉన్నారా? ఉపాధ్యాయులు విద్యాదానం చేయాలి. ఇవ్వాల్టి రోజుల్లో ఒక పిల్లకి ఫీజు కట్టాలంటే మామూలు మధ్యతరగతి కుటుంబం మనిషి ఇంటిల్లిపాదీ పస్తుండాల్సిందే. విద్యలాంటి వ్యాపారం ఎక్కడైనా వుందా? దీనికి సమాధానం నీ దగ్గర వుందా?”

“అంటే వీటన్నింటిలాగే మీడియా లంచగొండిగా వ్యవహరిస్తోందంటారా?”

తనను ఇరికించాలని చూస్తోందని అర్ధం అయింది స్వాతికి.

“నయనా నేను మీడియా పర్సన్‌ని. ఈ ప్రపంచంలో నా గుర్తింపు నేను ఒక జర్నలిస్ట్‌గా ప్రతి క్షణం మర్యాద పొందాను. గౌరవం పొందాను. నేను ఫలానా అని తెలిస్తే ఏదైనా హాస్పిటల్లో కూడా నాకు వైద్యం ఉచితంగానే అందుతుంది. నేనడగకుండా, ఒక జర్నలిస్ట్ పట్ల మనుష్యులకుండే ప్రేమ, అభిమానం అది. నా ఉద్యోగం మొత్తంగా నేను తిన్నంగా వుంటే, అత్యాశపరురాలని కాకుంటే, డబ్బుపట్ల మమకారం లేకుండా ఒక జర్నలిస్ట్‌గానే జీవిస్తే సాక్షాత్తు ధర్మదేవతను. అలా కాకుండా నేను నా కుటూంబం బాగుపడాలని నేను అనుకొంటే, కోరుకుంటే నా వృత్తి నాకు వందరెట్లు సాయం చేస్తుంది కాదంటారా” అంది స్వాతి.

నయన నవ్వింది. నవ్వులో ఆనందం లేదు. వెటకారం వుంది.

“మేడం మీరు ధర్మదేవతేనా?”

స్వాతి ఆమెవైపు చూసింది.

“నేను నా మనసు  చెప్పినట్లు కూడా విన్నాను. నాకు నేను కరెక్టే. ధర్మదేవతనే.”

“మనసు ధర్మాన్నే చెప్పిందా?”

“నా బతుకు తెరువును కూడా పరిగణలోకి తీసుకొంది.”

నయన కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. లేచి ఆవిడ కాళ్లకు నమస్కరించింది.

“మీరు ఎమోషనల్ అయిపోతున్నారు నయనా. బ్రేక్ తీసుకొందాం” అన్నాడు మైక్‌లో ప్రొడ్యూసర్.

***

“ఇప్పుడు మనం టాక్‌బండ్‌పైన దృశ్యాలు చూద్దాం” అన్నాడు న్యూస్ రీడర్. టాక్‌బండ్‌పైన ఊరేగింపు దృశ్యాలు, మధ్యలో పోలీసులు ఆపేయటం, స్టూడెంట్స్ రెచ్చిపోవటం, టియర్‌గ్యాస్ వదలటం, రబ్బరు బుల్లెట్లు వదలటం ఐదు నిముషాల ప్యాకేజీ. స్క్రీన్‌పైన కనిపించింది.

“దక్షిణామూర్తిగారు మీరేమంటారు?”

“మీరు చూశారు కదా జయదేవ్. ఇటువైపు నుంచి ప్రదర్శన వుంటుందని ప్రజలకు హెచ్చరిక లేదు. ఆ బస్ ఆగింది చూడండి. పెద్దవాళ్లు, పిల్లలు నక్కి నక్కి బస్ చాటున ఎలా కూర్చున్నారో చూడండి. ఒకవైపు స్టూడెంట్స్ బస్ పగులగొట్టేస్తున్నారు. ఏ రాయి ఎటువైపు వచ్చి పడుతుందో తెలియదు. ఇది అన్యాయం అనిపించటం లేదా?” అన్నాడు దక్షిణామూర్తి.

వీడు అడ్డంగా దొరికాడు అనుకొన్నాడు ఎండి. లైవ్ అని, జనం చూస్తున్నారనే జ్ఞానం కాస్సేపు నశించిపోయి నవ్వు కూడా వచ్చిందాయనకు. ఈ లైవ్ దిగాలి.
స్టూడెంట్ లీడర్ యాక్షన్ కమిటీ నాయకుడు పాండు దక్షిణామూర్తి వంక చిరాగ్గా చూశాడు.

“మీరు పెద్దవాళ్లు. ఉద్యమం దేన్ని గురించండీ. మీరు పిల్లలు. బస్సు, రాళ్ల దెబ్బల గురించి మాట్లాడుతున్నారు. ఇవ్వాళ ఉదయం ఈ ఉద్యమం కోసమే మా స్టూడెంట్ తగలబడి చనిపోయాడండి. ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆ మంటల వేడి ఇంకా చల్లారలేదు. అతని గుండెల చప్పుడు మా విద్యార్థులను నిప్పులపైన నడిపిస్తోంది.”
దక్షిణామూర్తి నవ్వాడు.

“చాలా రోజుల క్రితం నేనో పిల్లల నవల చదివాను. యుద్ధంలో కొంతమంది మన సైనికులు గాయపడ్డారు. ఆ గాయపడిన వాళ్లని హెలికాప్టర్‌లో హాస్పిటల్‌కు తెచ్చారు. పొరపాటున వారిలో ఒక పాకిస్తానీ  సైనికుడు కూడా కలిసిపోయాడు. గాయపడ్డ వాళ్ల దుస్తులు కాలిపోయి, వళ్ళంతా పేలిపోయి ఆకారాలు మారిపోయి వున్నారందరూ. అందరికీ వళ్లంతా సందు లేకుండా కట్టు కట్టారు. ఈలోగా శత్రు సైనికుడున్నాడన్న విషయం అందరికీ తెలిసింది. ప్రజలంతా హాస్పిటల్ చుట్టుముట్టారు. చిన్నపిల్లలు గుంపుగా చేరి వాడ్ని మాకు అప్పగించండి. వాడ్ని కర్రకు గుచ్చి వాడి మర్మాయవాన్ని వత్తిలా చేసి అంటిస్తాం అని అరుస్తున్నారు. శత్రుసైనికుడు ఇది విన్నాడు వణికిపోతున్నాడు. ఎలా బయటపడాలి…? నేనూ వీరుణ్ణే. శత్రువునే అయిన అనా మాతృభూమికోసం దేశభక్తితో యుద్ధం చేశాను. నాకు ప్రాణబిక్ష పెట్టండని ఇంగ్లీషు భాషలో ఎలా అడగాలో ప్రాక్టీసు చేస్తున్నాడు. ఈలోగా ఇది విన్న ఇంకో సైనికుడు.. అతనూ మన సైనికుడే.. “అబ్బా ఏం పిల్లలో! ఎలాంటి శిక్షలు కోరుతున్నారో తలుచుకొంటేనే భయం వేస్తోంది” అన్నాడు. వెంటనే జనం వీడే శత్రువు అని. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చంపేశారు. పిల్లలనోట అలాంటి మాటలు రాకూడదనుకొని, అజ్ఞానపు మాటలని భావించి మనవాడు నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు హతమైపోయాడు” అన్నాడు దక్షిణామూర్తి.

“అంటే మాది అజ్ఞానమంటారా?” మాటల్లోనే నిప్పులు కురిపించాడా విద్యార్థి నాయకుడు.

దక్షిణామూర్తి గొంతు స్థిరంగా వుంది.

“ప్రపంచం  నా అభిప్రాయాన్ని మన్నించనక్కర్లేదు. విద్యార్థుల కర్తవ్యం చదువు. వాళ్ల భవిష్యత్తు రాజకీయాలైతే నాకు అభ్యంతరం లేదు. వాళ్ల భవిష్యత్తు పోతోంది. వాళ్లు ఆవేశంగా వున్నారు. ఇది నేతలకు సంబంధించిన, మేధావులకు సంబంధించిన, కేవలం రాజకీయ ప్రయోజనం ఆశించే కొద్దిమంది నాయకులకు సంబంధించిన ఉద్యమం. దీన్ని ప్రజలు ఆమోదించారా? ప్రజలు అండగా వున్నారా? ప్రజామోదం పొందిన ఏ ఉద్యమంలోనైనా నష్టపోయిన ప్రజలకు లాభం జరగాలి. అది మానవ కల్యాణానికి ఉపయోగపడితే భూమిపైన వుండే మనుషులంతా ఆ ఉద్యమం వెనకే ఉంటారు. నేను మాట్లాడుతోంది ఉదయం మంటల్లో దహించుకుపోయిన అబ్బాయి గురించే. ఆ అబ్బాయి తల్లిని మన చానల్ గెస్ట్ రూంలో చూశాను ఇంతకు ముందు. ఆమె కళ్ల తడి ఎప్పటికైనా ఆరుతుందా? ఒక్కగానొక్క కొడుకు చదువుకొని ఉద్యోగం చేసి, ఆ తల్లిని సుఖపెట్టవలసిన బిడ్డ బూడిదైపోతే ఆవిడ నిలువునా కుంగిపోతూ వణికిపోతూ వెర్రిచూపులు చూస్తుంటే నాకు ఈ ఉద్యమం పట్ల ఎందుకు ప్రేమ వుండాలి?”

విద్యార్థి నాయకుడు చిద్విలాసంగా నవ్వాడు. ఎండిగారు చిరునవ్వు నవ్వాడు.

“అయ్యా మీరు పెద్దవాళ్లు. ఎంతో ప్రపంచాన్ని చూశారు. ఒక ఎడిటర్‌గా మీరు రాసిన ఎడిటోరియల్స్ భక్తిగా చదువుకొన్నాను నేను. ఉద్యమం ఒక వ్యక్తి ఆత్మాహుతికి ఆగిపోతుందా?

మీరు సెంటిమెంటు గురించి ఆలోచిస్తున్నారు. నేను భవిష్యత్తుని చూస్తున్నాను.”అన్నాడతను.

దక్షిణామూర్తి అతని వైపు జాలిగా చూశాడు.

“కానీ నేనీ ఉదయం నుంచి ఒక కొత్త కోణం చూస్తున్నానండీ. పోరాటం, యుద్ధం, ప్రదర్శనలు, ఇవన్నీ ఒక వ్యాపారం అవటం  గుర్తించాను. ఈ ఉద్యమం వెనకాల జరుగుతున్న మ్యానిపులేషన్స్, ఎన్నెన్నో స్వార్ధాలు, ఎందరివో అహంకారాలు నాకు స్పష్టంగా కనిపించాయి. దయచేసి అపార్ధం చేసుకోవచ్చు. ఇది నా అభిప్రాయం. మళ్లీ మళ్లీ చెబుతున్నాను. మనుష్యుల్లోని దుర్మార్గం, హింసా ప్రవృత్తి ప్రతి చానల్‌లో నిముష నిముషం కళ్ళారా చూశాను. అసలు రెండు ముక్కల్లో చెప్పాలంటే ఇవ్వాళ లాస్ట్ మినిట్‌లో శ్రీధర్ పిలిచినా వద్దనకుండా రావాలనే వచ్చాను. ఈ ప్రాంతీయ ద్వేషాలు ఇందు గురించి జరుగుతున్న హింస ఇదంతా వీరకృత్యంలాగా, ఇదంతా అత్యున్నత ఆదర్శంలాగా నాకు అనిపించటం లేదు. ఇదే కుర్రాళ్లు ఉన్మాదంతో చచ్చిపోకపోతే చాలని నేనెన్నడూ నమస్కారం చేయని ఆ దేవుడికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను” అన్నాడు దక్షిణామూర్తి ఉద్వేగంగా.

జయదేవ్ ఓ నిముషం మాట్లాడలేదు.

“సర్ మీరేమంటారు?” ఎస్.ఆర్.నాయుడుగారి వంక చూశాడు. కాస్త బ్రేక్ వస్తే  బావుంటుందనిపించిందతనికి.

“దక్షిణామూర్తిగారిని మాట్లాడనివ్వండి. ఇప్పుడు జరుగుతున్న టాంక్‌బండ్ ప్రదర్శన గురించి వారు మాట్లాడుతున్నారు కదా” అన్నాడు హెచ్చరికగా జయదేవ్‌తో.
“నేను ఈ నిముషం జరుగుతున్న ప్రదర్శన గురించే చెప్పటంలేదండి. ప్రతి మనిషికీ ప్రాంతీయాభిమానం దేశభక్తి వుంటాయి. ఇవన్నీ నిరూపించుకునే ఓ సమయం అనుకోకుండా వస్తుంది. ఎలాగోలా మనం కూడా అందరి దృష్టిలో పడితే కాస్త గొప్పగా వుంటుందనీ, మనం కూడా ఇందులో భాగంగా వుంటే ఓ పనయిపోతుందనీ, మన ఉనిక్కి భంగం కలగకుండా వుంటుందనీ అనుకొనేవాళ్లు కూడా ఈ గుంపుల్లో వున్నారు. ఈ పూట కూలీ ఇస్తాం రమ్మంటే వచ్చినవాళ్లున్నారు. వాళ్లకి ఈ ఉద్యమం గురించీ తెలియదు. దానికోసం ప్రాణాలు ఇవ్వటమూ తెలియదు. పొట్టకూటికోసం ఓ సాహసం చేస్తున్నారేమో. మిగతావాళ్లంతా ఈ ప్రదర్శన అంతా ఎలా వుంటుందో తెలిసినవాళ్లు. వాళ్లు తెలివిగా కావలసిన వాటివైపు అడుగులు వేస్తారు. వాళ్ల గురించి నాకు భయం దిగులు లేదు. మిగతా మూర్ఖుల గురించే “అన్నాడు దక్షిణామూర్తి తొణకకుండా.

ఎటో వెళుతుందనిపించింది జయదేవ్‌కి.

చప్పున ఓ బ్రేక్ తీసుకొందాం అనేశాం. వెంటనే స్క్రీన్‌పైన చానల్ బ్యాంగ్ వచ్చేసింది. యాడ్స్ మొదలైయ్యాయి.

 

మీ మాటలు

*