శ్మశానం రంగస్థలం…కాటికాపరి, శవవాహకులు ముఖ్యపాత్రలు

కొల్లూరి సోమ శంకర్

 

కొల్లూరి సోమశంకర్

అన్యులు సృజించని అంశాలపై రచనలు చేసే రచయితలు తెలుగులో చాలా తక్కువ. సమాజంలో హీనమైన పనులుగా ముద్రబడ్డ చర్యల ఇతివృత్తాలతో సాహితీసృజన చేసి మెప్పించడం అందరికీ సాధ్యం కాదు. సాహిత్యంలో జనన మరణాల సంఘటనలెన్నో ఉంటాయి. కానీ శ్మశానం రంగస్థలంగా, కాటికాపరి, శవవాహకులు ముఖ్యపాత్రలుగా చేసిన రచనలు చాలా అరుదు.

మృత్యువంటే చాలా మందికి జడుపు. కొందరికి ఆసక్తి.. ఎందరికో రోత… జీవమున్నంత కాలం గౌరవించి, ఆదరించిన వ్యక్తులను సైతం, మరణించగానే వీలైనంత త్వరగా అంత్యక్రియలు ముగించడానికి తొందరపడతారు జనాలు. చావంటే మనుషులకున్న భయం అలాంటిది. ఇక శ్మశానం, రుద్రభూమి, వల్లకాడు లాంటి పదాలను ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడని వ్యక్తులు ఎందరో ఉన్నారు.

అయితే అంత్యక్రియలపై ఆధారపడే జీవనం గడుపుకునే వారెందరో ఉన్నారు. కాటికాపరి, శవవాహకులు, శ్రాద్ధ కర్మలు చేయించే బ్రాహ్మలు… ఇలా మాములు మనుష్యులు ఏనాడు పట్టించుకోని ఓ సమూహాం గురించి, వారి జీవితాల గురించి తెలిపే నవల “పితృవనం“. పితృవనం అంటే శ్మశానం. శీర్షికలోనే ఇతివృత్తం ఏమిటో అర్థమయ్యే ఈ నవలని శ్రీ కాటూరి విజయసారథి  వ్రాసారు.

పేదరికం తాండవిస్తూ, నిలకడైన సంపాదన లేని మధ్యతరగతి కుటుంబాలలో ఓ మనిషి చనిపోతే, అంత్యక్రియలకీ, కర్మకాండకీ చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. చనిపోయినవారి కోసం అంత ఖర్చు చేయడం అవసరమా అంటే… చనిపోయిన వ్యక్తుల ఆఖరి కోరిక  అంత్యక్రియలు సక్రమంగా చేయించమనే అయ్యుంటుంది. ఎందుకంటే…. కర్మకాండలు సరిగ్గా జరగకపోతే… ఏదో అయిపోతుందనే భయం… తదుపరి జన్మ మంచిది లభిస్తుందో లేదో అనే అనుమానం.

అయితే కర్మకాండ నిర్వహించవలసినవారి ఆర్ధిక స్థితిగతులను గూర్చి ఎవరూ పట్టించుకోరు. తరతరాలుగా వస్తున్న ఆచారాలు కొనసాగించవలసిందే అంటారు. ఇదే అంశంతో ప్రారంభమవుతుంది నవల. ఒకప్పటి వాల్తేరు ఈ నవలకి కార్యరంగం. శవాలను మోసే సూరిగాడిని వెతుక్కుంటూ వస్తాడో కుర్రాడు. అతని తండ్రి చనిపోయాడు. చాలా తక్కువ డబ్బులుంటాయి. ఎలాగొలా శవసంస్కారాలు కానివ్వమని సూరిని బ్రతిమాలుకుంటాడు. మొదట కటువుగా మాట్లాడినా, ఓ లాయర్ దగ్గరికి తీసుకెళ్ళి ధన సహాయం చేయిస్తాడు. మిగతా శవవాహకులను, మంత్రం చెప్పే బ్రాహ్మడు సుబ్బావధానినీ, పాడె కోసం మేదరవాళ్ళకీ పురమాయిస్తాడు.

చివరికి శవం లేస్తుంది. ఊరికే లేచిందా? వందలు చేత్తో పట్టుకుంటే లేచింది. ముష్టెత్తినా, ఎత్తుకొచ్చినా వందలు చేత్తో పట్టుకోకపోతే ఏ శవమూ గుమ్మం ముందు నుంచీ లేవదు. చివరికి శవదహనం పూర్తవుతుంది. ఆ కుర్రాడి పేరు ఆనంద్ అనీ అతని భార్య పేరు శాంత అని తెలుస్తుంది. ఇంటర్ చదివి, టైప్ రైటింగ్ పాసయిన ఆనంద్ జీవిక కోసం ఇద్దరు లాయర్ల దగ్గర పనిచేస్తూంటాడు. వారిచ్చే కొద్దిపాటి డబ్బుతో రోజులు నెట్టుకొస్తుంటాడు. మొత్తం ఖర్చెంతయ్యిందో లెక్కలు వేయించి, ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వారికి ఆనంద్ చేత ఇప్పిస్తాడు సూరి. తన వాటా మాత్రం తీసుకోకుండా ఊరుకుంటాడు. ఆనంద్ ఇంటికి వెళ్ళిపోయాక, కాటికాపరి వీరబాహుడు అడుగుతాడు ఎందుకింత తక్కువ ఇప్పించావని, సూరి ఎందుకు డబ్బులు తీసుకోలేదని. ఇంకో శవమేదయినా వస్తే అప్పుడు సరిగానే ఇస్తాలే… అని చెప్పి విశ్రాంతి కోసం కాసేపు కునుకు తీస్తాడు సూరి. నిద్రలేచే సరికి ఇంకో శవం కాలుతూ కనబడుతుంది. ఆనంద్‌ని జ్ఞాపకం చేసుకుని ఈ జనారణ్యంలో ఏ ఒక్క మృగమూ అతని గోడు ఆలకించనందుకు బాధ పడతాడు.

సూరిలో అంతర్మథనం జరుగుతూంటుంది. ఎన్నెన్నో ప్రశ్నలు. సమాజం తీరు పట్ల కలత. ఆలోచనల నుంచి తేరుకుని వీరబాహుడితో కబుర్లలో పడతాడు. ఊసులయ్యాక, ఆ కాలుతున్న శవం ఎవరిదో వాకబు చేస్తాడు. ఆ శవం పీర్ల కోనేరు సందు మొదట్లో టీ కొట్టు నడిపే నాయర్‌‌దని తెలుసుకుంటాడు. ఆ చీకట్లో ఎవరో పడుకుని ఉండడం చూసి ఎవరో మరో శవాన్ని అక్కడ వదిలేసి పోయారేమోననుకుంటారు సూరి, వీరబాహుడు. అయితే ఆ వ్యక్తి ఇంకా చావలేదనీ, బ్రతికే ఉందనీ గ్రహిస్తారు. ఆమె నాయర్ కొట్లో పనిచేసేదని తెలుస్తుంది. వేరే ఆధారం లేకపోయేసరికి తన ఇంటికే తీసుకువెడతాడు సూరి. ఆమె పేరు జయ అని తెలుసుకుంటాడు. ఆమెకో ఆధారం దొరికే వరకు తనకు వంట చేసి పెడుతూ తన ఇంట్లోనే ఉండమని చెబుతాడు.

సద్బ్రాహ్మణ వంశంలో పుట్టిన సూరి అసలు పేరు సూర్యనారాయణ మూర్తి. చిన్నప్పుడు బడిలో హెడ్మాస్టర్ అకారణంగా దండించడంతో చదువు మానేస్తాడు. చదువు అబ్బకపోవడం వల్ల ఏ ఉద్యోగం దొరక్క తన ఈ వృత్తి చేపట్టాల్సివచ్చిందని బాధపడతాడు. చనిపోయిన నాయర్ టీ కొట్టు సామన్లను అమ్మేస్తున్నారని తెలిసి, వాటి యజమానితో మాట్లాడి వాటిని తను కొనుక్కుంటానని ఎవరికీ ఇచ్చేయద్దని చెబుతాడు. ఇంతలో ఓ బేరం వస్తుంది. చనిపోయినది డబ్బున్న ఆసామి వాళ్ళ నాన్న. ఆ ఆసామి గీరగా మాట్లాడితే తగిన సమాధానం చెప్పి అతని పొగరు దించుతాడు సూరి.  ఈ శవదహనమూ అయ్యాకా ఇల్లు చేరుతాడు. జయ గతం తెలుసుకుంటాడు.. సొంత మనుషులే ఆమెని దుబాయ్ షేకులకి అమ్మేస్తారు. వారి బారినుంచి తప్పించుకుని, ఎన్నో కష్టాలు పడి నాయర్ పంచన చేరుతుంది. నాయర్ దగ్గరనుంచి తమ వాటా డబ్బులు పట్టుకుపోతుంటారు ఆమె బంధువులు. నాయర్ ఆదరణతో మాములు మనిషైన జయ భవిష్యత్తు… నాయర్ చావుతో అగమ్యగోచరమయింది.

PithruvanamFrontCover

నాయర్ అస్థిసంచయనం చేసొచ్చాక సూరిని కలుస్తాడు ఆనంద్. లాయర్ల దగ్గర పనిమానేసి టీ కొట్టు నడుపుకోమని ఆనంద్‌కి సలహా ఇస్తాడు సూరి. తాను హామీగా ఉండి ఆ కొట్టుని ఆనంద్‌కి ఇప్పిస్తాడు. టీ పాటు టిఫిన్లు కూడా అమ్మేలా శాంతను, జయను కుదురుస్తాడు.

తన స్నేహితుడు రాజుకి ఉద్యోగం రావడం కోసం ఓ అధికారితో వాదన వేసుకుంటాడు. కాలు జారినా, తన తప్పు తెలుసుకొని కొత్త జీవితం గడపాలనుకునే ఓ అమ్మాయికి దారి చూపిస్తాడు. నాయర్ చనిపోయాడని తెలిసిన జయ బంధువులు ఆమెని బలవంతంగా ఎత్తుకుపోవాలని ప్రయత్నిస్తే, తన తోటివారందరితోనూ కలసి అడ్డుకుని ఆమెను కాపాడుతాడు. జయని పెళ్ళి చేసుకుంటాడు.

సూరి, వీరబాహుడు జానకిరామయ్య తాత, అరుణ, జయ, నాయర్.. ఒక్కొక్కళ్లది ఒక్కో కథ. అందరినీ అంతఃసూత్రంగా కలిపేది పేదరికం, అవసరం… అంతకుమించి మానవత్వం.

రిజర్వేషన్ల వ్యవస్థపైనా, కులమతాల మీద, ఆచార వ్యవహారాల మీద మనుషుల నీతి నిజాయితీల మీద ఎన్నెన్నో ప్రశ్నలున్నాయి, మనసుని కదిలించే వ్యాఖ్యానాలున్నయి ఈ నవలలో.

శ్రామికులూ, కార్మికులు ఒకటికారా? కాదనే అంటుందీ నవల. శ్రామికులందరూ కార్మికులు కారు. కర్మాగారాలలో పనిచేసే కార్మికులకు చట్టపరమైన హక్కులుంటాయి. సంఘటితమైన శ్రామికులను కార్మికులు అనచ్చేమో. అసంఘటితంగా ఉన్న శ్రామికులను తోటి కార్మికులు కూడా పట్టించుకోరని ఈ నవలలో ఓ ఉదంతం తెలుపుతుంది. కార్మికులవలె, తమకు కూడా కనీస సదుపాయలను కల్పించాని, సాంఘిక భద్రత కల్పించాలని అపరకర్మలు చేసే శ్రామికులు కోరితే… వాళ్ళసలు కార్మికుల విభాగంలోకి రానే రారని, చట్టపరమైన నిబంధనలను వారికి వర్తింపజేయనక్కర్లేదని వాదిస్తారు కార్మికులు, వారి నేతలు. అన్ని రకాలుగా నిస్సహాయులైన శవవాహకులు కృంగిపోతారు.

కాలక్రమంలో వచ్చిన ఓ మార్పు మానవ సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని సూరి అంటాడు. ఓ మనిషి విగతజీవుడయ్యాక, అంతిమ సంస్కారానికి శవాన్ని మోయడానికి కూడా వెనుకాడుతున్నారని, అదే ఇతర మతాలలో శవాన్ని మోయడం ఓ గౌరవంగా భావిస్తారని.. వాపోతాడు.

KaturiViajayaSarathi

కాటూరి విజయసారధి

 

పేదలూ మనుషులేనని, అవకాశాలు లేక, మరింత పేదలుగా మారుతున్నారని, ఒకరికొకరు సాయం చేసుకుంటే, కొందరైనా ఎదిగి మిగతావారి ఎదుగుదలకి తోడ్పడవచ్చనేది సూరి దృక్పథం. మాట కటువు మనసు వెన్న.. అనే నానుడి సరిగ్గా సరిపోయే మనిషి సూరి. ఇదే అర్థం వచ్చేలా ఓ సందర్భంలో తాత “పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము – నవ్యనవనీత సమానము నిండు మనమ్ము” అని మహాభారతంలోని పద్యాన్ని అన్వయిస్తాడు  సూరికి.

తాను చేసే వృత్తి పాడుదని తాను అనుకోవడం లేదని, అందరూ అలా అనుకుంటున్నందుకే తాను బాధ పడుతున్నానని అంటాడు సూరి. తనకి వీలయినయింత మేర తోటివారికి సాయం చేసి వాళ్ళు జీవనసాగరాన్ని ఈదేలా చూస్తాడు సూరి.

“డబ్బు మీద నమ్మకం పెరిగిన కొద్దీ మనుషుల మీద నమ్మకం తగ్గిపోతుంది మరి.” అంటాడు సూరి ఓ సందర్భంలో. ఈ ఒక్క వాక్యాన్ని ఎన్ని ఇజాలకి అన్వయించుకోవచ్చో!

ఈ నవల చదువుతున్నంత సేపూ సమాజం పట్ల ఓ రకమైన ఏవగింపు కలుగుతుంది. శ్మశాన వైరాగ్యం వల్లకాడులోంచి బయటకొచ్చాక పోతుంది, మరి సమాజ వైరాగ్యం ఎలా పోతుంది? భద్రజనులు, బాధసర్పద్రష్టులు పరస్పర ఘర్షణ లేకుండా జీవనం గడపగలరా? జీవితాలలోని విలువలని పునర్నిర్వచించుకోవాలని అన్యాపదేశంగా సూచించే నవల “పితృవనం”.

1989 దీపావళి సందర్భంగా ఆంధ్రప్రభ వారపత్రిక వారు నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకున్న నవల ఇది.  1992లో తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ నవలగా వార్షిక పురస్కారం పొందిన నవల “పితృవనం”.

గోకుల్ చంద్ర & రాహుల్ చంద్ర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్, విశాఖపట్నం వారు ప్రచురించిన ఈ నవల అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ, జేష్ఠ లిటరరీ ట్రస్ట్ వారి వద్ద, ఇంకా ప్రచురణకర్తల వద్ద దొరుకుతుంది. 141 పేజీల ఈ పుస్తకం వెల రూ.100/-.  కినిగెలోనూ ప్రింట్ బుక్ లభ్యం.

ప్రచురణకర్తల చిరునామా

గోకుల్ చంద్ర & రాహుల్ చంద్ర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్

c/o. విజయ్ నిర్మాణ్ కంపెనీ

 సిరిపురం జంక్షణ్, విశాఖపట్నం – 530003.

ఫోన్: +91 891 2575755

 

మీ మాటలు

  1. Mani Vadlamani says:

    Nenu ee na lani andhraprabha lo serial ga vachhinppudu Chadivaanu.naaku chall istmaina Navala idi ,ee Navala lo Suri babu. Patrachala Revolutionary ga untundi.

  2. ధన్యవాదాలు మణి గారు

  3. Lalitha P says:

    మీ పరిచయం చాలా బాగుంది. థాంక్స్. నేనీ నవల చదవలేదు కానీ, మనిషి పుట్టినదగ్గర నుండీ చచ్చేవరకూ చేసే సంస్కారాలు, వాటి చుట్టూ అల్లుకున్న వృత్తులూ, కాలం మారుతున్న కొద్దీ ఆ వృత్తులూ ఆ సంస్కారాలే వుచ్చులై బిగుసుకోవటం… మంచి సబ్జెక్టు. కుల నిచ్చెనలో అగ్ర వర్ణ బ్రాహ్మల్లో అథమ స్థాయి పొందిన శవవాహకులూ, దానాలు పట్టేవాళ్ళూ … ఈ జీవితాల మీద ఫోకస్ చేసిన నవలలా అనిపిస్తోంది. కొంచెంగా ‘సంస్కార’ గుర్తు వస్తోంది.

  4. ధన్యవాదాలు లలిత గారు.

  5. Dr. Rajendra prasad Chimata says:

    ఈ నవల సీరియల్ గా వచ్చిన రోజుల్లో చదివిన కొన్ని భాగాలు గుర్తుకొస్తున్నాయి. అరుదైన వస్తువును విప్లవాత్మకంగా మలిచారు. మళ్లీ పరిచయం చెయ్యడం బాగుంది. వీరివి ఇతర రచనలు?

  6. ధన్యవాదాలు రాజేంద్ర ప్రసాద్ గారు.
    రేడియో కోసం కథలు, గేయాలు, నాటకాలు వ్రాసానని అంకితం పేజీలో కాటూరి విజయ సారథి గారు ప్రస్తావించారు. ఆ కథలు, గేయాలు, నాటకాలు పుస్తక రూపంలో వెలువడ్డాయో లేవో నా వద్ద సమాచారం లేదు. తెలిసిన పెద్దలెవరైనా తెలియజేయగలరు.
    కొల్లూరి సోమ శంకర్

  7. buchireddy gangula says:

    very. good. novel…

    —————–buchi.reddy.gangula

మీ మాటలు

*