చారిత్రక కాల్పనిక నవల “శ్రీకృష్ణ దేవరాయలు”

 

 

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమశంకర్

ఒకనాటి పాలకుల, చరిత్రలో పేరుగాంచిన వ్యక్తుల జీవితాలకు కాల్పనికత జోడించి సృజనాత్మక రచనగా వెలువరించడం చాలా కష్టమైన పని. ఆ యా పాత్రలపై అతి ప్రేమ లేదా అతి ద్వేషం చూపితే వాస్తవాలు మరుగునపడే ప్రమాదం ఉంటుంది. కొన్ని వందల ఏళ్ళ క్రితంనాటి పాలకులపై రచన చేస్తున్నప్పుడు – అప్పటి ఆ యా పాలకుల పరిపాలనని లేదా పరాక్రమాన్ని తెగ పొగడడం లేదా ఆ రాజ్యంలో పాలితు లెదుర్కున్న కడగండ్లు, కష్టాలను మాత్రమే ప్రస్తావించడం – సమంజసం కాదు. అప్పటి పరిస్థితులు వేరు, వర్తమాన స్థితిగతులు వేరని గుర్తుంచుకుని; రచనలో ఏ మాత్రం అతిశయోక్తులు, లేదా వ్యక్తిత్వ హననాలు జొప్పించకుండా జాగ్రత్త వహించాలి. లేకపోతే సమాజంలో అనవసరమైన కలతలు రేగుతాయనే అంశాన్ని రచయితలు మనసులో ఉంచుకోవాలి.

ఈ విధంగా, చరిత్రలో సుప్రసిద్ధుడైన ఓ మహారాజుని, అతని పాలనని వివరిస్తూ, అతని వ్యక్తిత్వాన్ని కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేసారు కస్తూరి మురళీకృష్ణ. ఆ మహారాజు వేరెవరో కాదు, భారతీయులకు, ముఖ్యంగా దక్షిణాది వారికి సుపరిచితుడైన శ్రీకృష్ణ దేవరాయలు.

నవల ప్రారంభంలో – నిరంతరం శత్రుదాడులతో భారతదేశం బలహీనపడడం గురించి ప్రస్తావిస్తారు రచయిత. భారతీయ సమాజం దిశారహితమై దిక్కుతోచకుండా బిక్కుబిక్కుమంటున్న కాలమని పేర్కొంటు శ్రీకృష్ణ దేవరాయలు పాలనా పగ్గాలు చేపట్టే ముందరి పరిస్థితులని కళ్ళకు కట్టినట్టు వివరించారు. అటువంటి సంక్లిష్ట పరిస్థితులలో మహామంత్రి తిమ్మరుసు, ఇతర ముఖ్యులు కలసి రాజ్యాధికారాన్ని శ్రీకృష్ణ దేవరాయలకు అప్పగిస్తారు. రాజ్యం పరిస్థితి ఏమీ బాగాలేదని విన్నవిస్తాడు తిమ్మరుసు.

పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే ఆత్మవిశ్వాసం అత్యంత ఆవశ్యకం.. ఏం చేస్తే పరిస్థితులు బాగవుతాయో సూచనలు కావాలి నాకు. సమస్యలను ఎత్తి చూపించి సమయం వ్యర్థం చేయాల్సిన అవసరం లేదు. సమస్య స్వరూపాన్ని వివరించి, పరిష్కారాలు సూచించండి.” అంటాడు కృష్ణదేవరాయలు.

రాయలు సింహాసనమెక్కి వారమైనా కాకముందే తురుష్కులు విజయనగర సరిహద్దులను దాటి చొచ్చుకువస్తున్నారని తెలుస్తుంది. రాయలకింకా రాజ్యవ్యవహారాలపై అవగాహన పూర్తిగా రాలేదనీ; అప్పుడే యుద్ధానికి వెళ్ళడం అంత క్షేమకరం కాదని తిమ్మరుసు భావించాడు.

అయితే ఓటమి అనే పదాన్ని సైతం ఇష్టపడని కృష్ణదేవరాయలు తన సైన్యాన్ని ఉత్తేజితులను చేసి యుద్ధరంగం వైపు నడుపుతాడు, ఓడిస్తాడు. అదే ఊపులో మరికొన్ని రాజ్యాలను గెలవాలని ఆలోచిస్తాడు. కాని తిమ్మరుసు వద్దంటాడు. రాయలు మౌనంగా వచ్చి గుడారం బయట నిలుచుంటాడు. ఎదురుగా పరవళ్ళు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది కృష్ణానది. రాయల దృష్టి, నది నడుమన నిలిచిన బండరాయిపై పడింది. అతి వేగంగా ప్రవహిస్తున్న నీరు బండరాయిని బలంగా తాకుతోంది. దాన్ని కూడా తనతో పాటు ప్రవహింపజేయాలన్న దూకుడు చూపిస్తోంది. కాని రాయి నిశ్చలంగా ఉంది. దాంతో ఓ వైపు రాయిని కోసే ప్రయత్నం చేస్తూనే పక్కకి తిరిగి, రాయి పక్క నుంచి ప్రవహిస్తోంది. అది చూసిన రాయల ముఖంపై చిరునవ్వు వెలసింది. ఆ క్షణంలో ప్రకృతి అతనికి ఓ చక్కని పాఠం నేర్పింది.

ఓ సందర్భంలో, పాలకులకు ఉండాల్సిన లక్షణం గురించి రాయలు ఇలా అంటారు:

ముందుగా మనం మన ప్రజలకు కలలు కనడం నేర్పాలి. జీవితాన్ని అనుభవించడం నేర్పాలి. రకరకాల భయాలతో, బాధలతో, మనవారు జీవించడం మరచిపోయారు, బ్రతుకులోని ఆనందాలను అనుభవించడం మరచిపోయారు. ఎంత సేపూ గతాన్ని తలచుకుంటూ భవిష్యత్తు గురించి భయపడుతూ వర్తమానాన్ని విస్మరిస్తున్నారు. ముందుగా ప్రజలకు ఆత్మవిశ్వాసాన్నివ్వాలి, వారికి భద్రతనివ్వాలి”.  ఈనాటి నేతలకి సైతం వర్తించే సూచనలివి అనడంలో సందేహం ఏ మాత్రం  లేదు.

తర్వాత రెండేళ్ళపాటు రాజ్యంలో అభివృద్ధి పనులు చేపడుతూ, సైన్యాన్ని బలోపేతం చేశాడు. వివాహం చేసుకున్నాడు. రాచరిక, వైయక్తిక ధర్మాలను నెరవేర్చాడు. ఒక్కో శత్రువునీ జయిస్తూ, సామ బేధ దాన దండోపాయాలతో దక్షిణాపథాన్నంతా ఏకఛత్రం క్రిందకి తెచ్చాడు శ్రీకృష్ణ దేవరాయలు. ఎన్నో సంస్కరణలు చేపట్టి జనరంజకంగా పాలించాడు, విశిష్ట కట్టడాలని నిర్మించాడు.

పరిపాలనాదక్షుడుగా, వీరుడిగా, సాహితీప్రియుడిగా, కవిగా, గొప్ప కట్టాడాలను కట్టించిన రాజుగా మనకి తెలిసిన శ్రీకృష్ణ దేవరాయల లోని ఆధ్యాత్మికతను, ధర్మదీక్షని పరిచయం చేసారు రచయిత ఈ నవలలో. విజయనగర రాజ్యాధికారం లభించడమంటే ధర్మరక్షణ చేసే అవకాశం లభించడమేనని శ్రీకృష్ణ దేవరాయలు భావించాడని, దైవం తనకి నిర్దేశించిన కర్తవ్యం అదేనని ఆయన నమ్మాడని రచయిత చెబుతారు. తన సామ్రాజ్యంలో ఎన్నో దేవాలయాలకు నిధులిచ్చి, వాటిని పునరుద్ధరించి, నిత్యపూజలు జరిగేలా చూసాడు. ఆలయాలు జనసామాన్యంలో ధార్మికత నెలకొల్పగలిగే కేంద్రాలని రాయలు విశ్వసించాడు.

శ్రీకృష్ణ దేవరాయలు వేంకటేశ్వరుని భక్తుడు. వీలైనన్ని సార్లు తిరుపతి వెళ్ళి స్వామి వారి దర్శనం చేసుకునేవాడట. “ఏడుకొండలు ఎక్కలేము, ఇంకోసారి రాలేము” అనుకునే వారందరూ కూడా మళ్ళీ మళ్ళీ స్వామి దర్శనానికి ఎందుకు వస్తారో రచయిత చక్కగా వివరించారు. “ఏడుకొండలపై తిష్టవేసుకున్న కోనేటి రాయుడి దర్శనం కోసం ఏడు కొండలు నడిచి వెళ్ళాలి. ఒక్కో అడుగు వేస్తూ.. కొండలెక్కుతుంటే, మానవ ప్రపంచానికి దూరమవుతూ, దైవ ప్రపంచంలో అడుగుపెడుతున్న భావన కలుగుతుంది. ఇంత కష్టపడి ఏడు కొండలు అధిరోహించి, దైవమందిరంలో అడుగిడితే, ఆ చీకటిలో, దీపాల వెలుతురులో ధగధగా మెరిసే వజ్రాభరణాల వెలుగులో, నల్లటి రాతివిగ్రహం నుండి మనల్ని చూస్తున్న ఆ స్వామి విరాట్స్వరూపాన్ని ఎంత చూస్తే తనివితీరుతుంది?” అంటాడు రాయలు.

ఆలయ దర్శనం పూర్తయ్యాక, ఉదయగిరి కోటపై దాడి చేసి గెలుచుకుంటాడు. మరల తన దేవేరులతో కలసి తిరుమల వేంచేస్తాడు. ఎప్పుడూ స్వామి వారి సన్నిధిలోనే ఉండిపోవాలని అభిలషిస్తుంది చిన్నాదేవి. రాయలకి కూడా అదే కోరిక ఉన్నా పాలనా బాధ్యతల దృష్ట్యా సాధ్యం కాని పని. తిమ్మరుసు చేసిన ఓ ఆలోచన వల్ల – నిరంతరం స్వామి దగ్గరే ఉండాలన్న రాయల కోరికను పరోక్షంగా, ప్రతీకాత్మకంగా నెరవేరింది. ఫలితమే – తిరుమల గుడిలో శ్రీకృష్ణ దేవరాయలు తన ఇద్దరి భార్యలతో ఉన్న విగ్రహాల ఏర్పాటు!

రాచకార్యాలు, యుద్ధవ్యూహాల నడుమ సాహిత్య సమాలోచనలు, సాంసృతిక ఉత్సవాలను నిర్వహించేవాడు రాయలు. శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు ఆలయంలో దైవదర్శనం చేసుకున్నాకా, రాయల హృదయంలో ప్రేరణ కలిగి ఆముక్తమాల్యద రచనకి బీజం పడుతుంది. ఈ సందర్భంలోనే శ్రీకృష్ణ దేవరాయల నోటి నుంచి “దేశభాషలందు తెలుగు లెస్స” అనే పద్యం వెలువడింది.

ఆముక్తమాల్యద రచన ప్రారంభించినప్పటినుంచి రాయల ప్రవర్తనలోనూ, మానసిక స్థితిలోనూ మార్పు రావడం గమనిస్తాడు తిమ్మరుసు. తన తదనంతరం, విజయనగర సామ్రాజ్యం ఏమై పోతుందో అని చింతిస్తున్న శ్రీకృష్ణ దేవరాయలు మానసిక స్థితిని వర్ణిస్తూ – “తన జీవితంలో ఒక దశకి చేరిన తరువాత ఇతరుల పొగడ్తలు వింటున్న వ్యక్తి మనసులో అహంకారం జనిస్తుంది, దాని వెంటే సంశయం కలుగుతుంది. ఈ పొగడ్తలకు అర్హుడినా అనే అనుమానం కలుగుతుంది, మరో వైపు ‘నేనింత సాధించాను’ అన్న అహంభావం పెరుగుతుంది. ఈ రెండిటి నడుమ జరిగే ఘర్షణలోంచి, ‘ఇది పోతేఅన్న భయం జనిస్తుంది. ఆ భయాన్ని వ్యక్తి ఎలా ఎదుర్కుంటాడన్నది ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది” అని అంటారు రచయిత.

ఈ స్థితిలో రాయలికి ధైర్యం చెబుతాడు తిమ్మరుసు. “మనిషి మనసు ఎల్లప్పుడూ భవిష్యత్తుని తలచుకుని భయపడడానికే ఇష్టపడుతుంది. ఆ భయాన్ని మనం నిర్మాణాత్మకంగా వాడుకోవాలి. ఎప్పుడో ఏదో జరుగుతుందని ఊహిస్తూ, ఇప్పటి నుంచే బాధపడుతుంటే, భవిష్యత్తు అటుంచి, వర్తమానం చేజారిపోతుంది.” అంటూ మృదువుగా హెచ్చరిస్తాడు.

సామ్రాజ్యం విస్తరిస్తుంది, బలపడుతుంది. కాలచక్రం గిర్రున తిరిగి, పుత్రుడికి పట్టాభిషేకం చేసే సమయం ఆసన్నమవుతుంది. రాయలు తన పుత్రుని భవిష్యత్తు గురించి బెంగపడుతున్న సమయంలో యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది, రాయల అప్పటి మానసిక స్థితిని అద్భుతంగా చిత్రించారు రచయిత. “మనిషికి ఆత్మస్థైర్యం ఇవ్వవలసిన మానవ సంబంధాలే మనిషిని బలహీనం చేయడం సృష్టిలో చమత్కారం” అంటారు.

ఆముక్తమాల్యద రచన పూర్తి కాగానే శ్రీకృష్ణ దేవరాయలు తృప్తిగా కన్నుమూయడంతో నవల పూర్తవుతుంది.

ఉత్కంఠగా చదివించే ఈ నవల తొలుత ఆంధ్రభూమి వారపత్రికలో సీరియల్‌గా ప్రచురితమైంది. నవలగా మొదటిసారి “కస్తూరి ప్రచురణలు” వారు ప్రచురించారు. 124 పేజీలున్న ఈ నవల వెల రూ.60/- ప్రచురణకర్తల వద్ద ప్రింట్ బుక్ లభిస్తుంది. ఈబుక్ కినిగెలో లభ్యం.

~ కొల్లూరి సోమ శంకర్

ప్రచురణకర్తల చిరునామా:

Kasturi Prachuranalu

Plot No. 32, Dammaiguda,

Raghuram Nagar Colony,

Nagaram Post Office,

Hyderabad – 83,

Cell : 98496 17392.

 

మీ మాటలు

  1. అజిత్ కుమార్ says:

    చరిత్రలో శ్రీకృష్ణ దేవరాయలు అనే రాజు లేడు. కొందరు ఈ చరిత్రను సృష్టించారు.

    • G B Sastry says:

      శ్రీ కుమార్ గారి అభిప్రాయానికి ప్రామాణికం తెలిపితే చరిత్రని సరిగా అర్ధం చేసుకోడానికి ఉపకరిస్తుంది లేకుంటే ఆయనది ఒక ఊహాజనితమైన ఆలోచనగా భావించవలసి వస్తుంది
      శ్రీ కృష్ణ దేవరాయల గూర్చిన కొన్ని అతిశయోక్తులు ప్రచారంలో ఉండొచ్చుకాని ఆయనే లేరనడమ్ …….

  2. అజిత్ కుమార్ says:

    శాస్త్రి గారూ! శ్రీకృష్ణ దేవరాయల గురించి నేనొక చరిత్ర పుస్తకంలో చదివాను. విదేశీ చరిత్రకారులుగానీ, స్వదేశీ చరిత్రకారులుగానీ సదరు రాజుగారిని గురించి తెలియజేయలేదట. మీకు చరిత్ర మీద ఆసక్తి ఉంటే మీరు స్వయంగా పరిశీలిస్తే మీకూ తృప్తిగా ఉంటుంది. కోట్లాదిగా ప్రజలు, ప్రభుత్వాలూ నమ్ముతున్న విషయాన్ని ఎవరో ఒకరు కాదంటే ఎలా నమ్మడం. కష్టమేమరి.

మీ మాటలు

*