వాస్తవం, జ్ఞాపకం, ఊహల అద్భుత కలనేత

gabrielGarciaMarquez1981-Eva-Rubinstein

గాబ్రియెల్ గర్సియా మార్కెజ్ మరణించాడన్న వార్త ఒక్కసారిగా పెటిల్లున దుఃఖాన్ని తోసుకొచ్చింది. అమ్మ చనిపోయినప్పుడు, బాపు చనిపోయినప్పుడు, ఎందరెందరో చిన్ననాటి స్నేహితులు, ప్రజావిముక్తి యుద్ధంలో ఆత్మీయులైన వీరయోధులు చనిపోయినప్పుడు జరిగినట్టుగా మనసు నిండా శూన్యం ఆవరించింది. జాతస్య మరణం ధ్రువం కావచ్చు. కాని కొందరి మరణం ఎంతమాత్రమూ అంగీకారయోగ్యం కాదనిపిస్తుంది. ఆ లోటు ఎప్పటికీ తీరదనిపిస్తుంది. మార్కెజ్ మరణ వార్త విన్నప్పటి నుంచి నలభై ఎనిమిది గంటలుగా తెరలు తెరలుగా దుఃఖం వస్తూనే ఉంది.

భాషలో, జాతిలో, భూఖండంలో, వయసులో ఎంతో ఎడం ఉన్న సుదూరమైన ఈ మనిషి, ప్రతిభలో ఆకాశమంత ఎత్తయిన ఈ మనిషి కేవలం భావాల వల్ల దగ్గరివాడైన ఈ మనిషి నా మనిషి అని ఎందుకనిపిస్తున్నాడు? నా హృదయపు ముక్క ఒకటి తెగిపోయినప్పటి మహా విషాదం ఎందుకు ఆవరిస్తున్నది?

అతి ఎక్కువగా ప్రభావితం చేసిన రచయితలు, కళాకారులు ఎవరికైనా ఇలాగే నా మనిషి అని ఆప్తులుగా అనిపిస్తారేమో. వారిని ఎన్నడూ కలవకపోవచ్చు కాని వారినిక కలిసే అవకాశం కూడ ఎప్పటికీ లేదనే ఎరుక కలగడం, వారి అద్భుత ప్రతిభ వెలువడడానికి ఇక వీలులేదని తెలియడం ఒక జీవితకాల విషాదం.

ఆయనను చదివాను. ఆయన అక్షరాల మాయలో చిక్కుకున్నాను. ఆయన వాక్యాల వెంట కన్నీరు కార్చాను. ఆయన సృష్టించిన సన్నివేశాలలో భాగమై అపారమైన ఆనందాన్ని అనుభవించాను. గొప్ప తాదాత్మ్యం పొందాను. మైమరిచిపోయాను. బహుశా ఆ పఠనానుభూతి, ఆ సంభ్రమం, ఆ ఆనందం ఎప్పటికీ మాయం కావు, ఆయన ఇక లేడు. ఆయన రచనలు వెలువడడం ఆగిపోయి పదేళ్లు అయింది గాని ఏమో హఠాత్తుగా ఆ కాన్సర్ నుంచి విముక్తి అయి, ఆ అల్జీమర్స్ నుంచి బైటపడి, ఆ అద్భుత మేధ మళ్లీ ప్రపంచం కోసం ప్రేమతో మరి నాలుగు అక్షరాలు వెదజల్లేదేమో. కాన్సర్ అని తెలిసిన తర్వాతనే, చనిపోయాడని నీలివార్త ప్రచారమైన తర్వాతనే కదా ‘కథ చెప్పడానికే బతుకు’ (లివింగ్ టు టెల్ ది టేల్) అని జీవిత కథ రాశాడు!

ఇక ఆ ఆశ లేదు. కథ చెప్పే మనిషి లేడు. ఆ కలం ఆగిపోయింది. యాభై సంవత్సరాలకు పైగా లాటిన్ అమెరికన్ జీవిత సముద్రాన్ని మథించి, ప్రపంచానికి అమృతాక్షరాలనందించిన ఆయన చేతివేళ్లు దహనమైపోయి చితాభస్మంగా మారిపోయాయి. అనంత కోటి జ్ఞాపకాలను, కోటి ఊహలను, లక్ష వాస్తవాలను కలగలిపి, ఆ రసాయనిక సంయోజనంలో ప్రపంచాన్ని సమ్మోహితం చేసిన ఆ మేధ ఆలోచించడానికి ఇంక అవకాశం లేదు. ఆయన శిష్యురాలు, చిలీ జీవితాన్ని దాదాపు గురువంత అద్భుతంగానూ చిత్రించిన నవలా రచయిత ఇసబెల్ అయెండె అన్నట్టు, “నా గురువు మరణించాడు. కాని ఆయనకు సంతాపం ప్రకటించను. ఎందుకంటే నేనాయనను పోగొట్టుకోలేదు: ఆయన మాటలను మళ్లీ మళ్లీ చదువుతూనే ఉంటాను.”

***

Gabriel-Garcia-Marquez-2-190

ఎక్కడో కొలంబియాలో పుట్టిపెరిగి, స్పానిష్ లో రాసి, మార్క్యూజ్ అనే పొరపాటు ఉచ్చారణతో పిలుచుకున్న ఈ గాబ్రియెల్ గర్సియా మార్కెజ్ అనే మహా శబ్దమాంత్రికుడు, మాంత్రిక వాస్తవికతా శిల్పి నా జీవితంలోకి ఎలా వచ్చాడు? ఆయన మా వరంగల్ వాడో, తెలంగాణ వాడో అని నేను ఎప్పుడూ ఎందుకు నమ్ముతూ వచ్చాను?

“జీవితమంటే ఒకరు జీవించినది కాదు, వారు గుర్తు పెట్టుకునేది, తిరిగి చెప్పడం కోసం ఎట్లా గుర్తుపెట్టుకున్నారనేది” అని తన ఆత్మకథ లివింగ్ టు టెల్ ది టేల్ లో అన్నాడు మార్కెజ్. బహుశా ఆయన జీవితమూ రచనా అన్నీ ఈ సూత్రానికి కట్టుబడి ఉన్నాయి. అందువల్లనే ఆయన రచన వాస్తవికత మాత్రమే కాదు, అది వాస్తవికత, జ్ఞాపకం, ఊహల కలనేత. వందల సంవత్సరాల సామూహిక జ్ఞాపకాల దొంతరలు నిత్యజీవన భయానక ఉజ్వల వాస్తవికతతో పడుగూ పేకల్లా కలిసిపోయిన తెలంగాణ వంటి ప్రతి సమాజంలోనూ ఆయన ఉన్నాడు, ఆయన సృజన ఉంది.

మార్కెజ్ ను నాకు పరిచయం చేసింది రాజకీయార్థిక శాస్త్రవేత్త, సురా పేరుతో విమర్శకుడిగా సుప్రసిద్ధుడు, సృజన సాహితీమిత్రుడు సి వి సుబ్బారావు. రాడికల్ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడిగా ఎమర్జెన్సీ కాలమంతా జైలులో ఉండి, ఎమర్జెన్సీ తర్వాత ఢిల్లీలో లెక్చరర్ గా చేరాడు. అప్పటి నుంచి 1985 దాకా ఎప్పుడు సెలవులు వచ్చినా నేరుగా వరంగల్ వచ్చి, అటూ ఇటూ వెళ్తూ వస్తూ, వరంగల్ లోనే ఎక్కువకాలం గడిపేవాడు. సృజనకూ సాహితీమిత్రులకూ బైటి ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ఆయన ఒక తెరిచిపెట్టిన విశాలమైన కిటికీ. ఆయన నిశాచరుడు. రాత్రంతా మేలుకుని ఉండి ఉదయం ఐదున్నర, ఆరుకు పడుకునేవాడు. రాత్రంతా ఆయనకు తోడుగా చెప్పినవి వింటూ, రోడ్లమీద తిరుగుతూ, అన్నివేళల్లోనూ హనుమకొండ చౌరస్తాలో ఇరానీ హోటళ్లలో చాయ్ తాగుతూ కాలం గడుస్తుండేది. అలా సుబ్బారావు ద్వారానే 1982 చివరిలో మార్కెజ్ గురించి తెలియడమే కాక వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ పుస్తకమూ, మార్కెజ్ నోబెల్ ఉపన్యాసం అచ్చయిన ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ కటింగ్ ఫొటోకాపీ చేతికందాయి. ఆ నవలలో మొదటిసారి మంచుముక్కను ముట్టుకున్న మహోగ్ర ఉష్ణమండల వాసిలాగనే నేనూ ఆ అక్షరాలు ముట్టుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. ఆ మొదటి పఠనంలోనే నవల మొత్తంగా అర్థమయిందని చెప్పలేను గాని గాఢమైన ప్రభావాన్ని వేసింది. అంతకన్న ఎక్కువగా ఆకట్టుకున్న, దుఃఖావేశాలు కలిగించిన, లాటిన్ అమెరికా చరిత్ర చదవడానికి పురికొల్పిన నోబెల్ ఉపన్యాసం వెంటనే తెలుగు చేశాను.

(http://www.andhraprabha.com/offbeat/hundred-years-of-solitude/15980.html) అది అప్పుడే సృజన జూన్ 1983 సంచికలో అచ్చయింది. తర్వాత గడిచిన మూడు దశాబ్దాలలో వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ చదివినప్పుడల్లా కొత్త అర్థాలు స్ఫురింపజేసింది.

తర్వాత నాలుగైదు సంవత్సరాలకు బెజవాడలో ఉండగా లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కలరా చేతికందింది. సరిగ్గా తెలుగు సీమలో ఆట పాట మాట బంద్ అనే నియంతృత్వం అమలవుతున్న చీకటిరోజులవి. కలరా రోజులవి. పైకి ప్రేమ కథగా కనబడినప్పటికీ అది మానవసంబంధాలను విచ్ఛిన్నం చేసే వాతావరణానికీ, మానవసంబంధాల అపరాజితత్వానికీ ఘర్షణ కథ అని నాకనిపించింది. ఆ తర్వాతెప్పుడో ఒక ఇంటర్వ్యూలో స్వయంగా మార్కెజ్ కూడ ఆ నవల గురించి “పాఠకులు నా వలలో పడగూడదు” అన్నాడని చదివినప్పుడు ఆ నవల పొరలుపొరలుగా ఏమేమి చెప్పిందో ఎన్ని సార్లు చదివితే అన్నిసార్లు కొత్త అర్థాలు దొరుకుతాయనిపించింది.

images

తర్వాత బెంగళూరులో ఉండగా పన్నెండు కథల సంపుటం స్ట్రేంజ్ పిల్ గ్రిమ్స్. ఇరవై ఏళ్ల కింద ఆ పుస్తకం చదువుతున్నప్పటి అనుభవం ఈ క్షణాన అనుభవిస్తున్నట్టే ఉంటుంది. ఆ పుస్తకమంతా ప్రవాసానికీ ప్రవాస వైచిత్రికీ సంబంధించినది. ఆ ప్రవాసం స్థలానిది కావచ్చు, కాలానిది కావచ్చు, వయసుది కావచ్చు. మనసుది కావచ్చు. అధికారానిది కావచ్చు. ఆ డజను కథలూ వస్తుపరంగా గాని, శిల్పపరంగా గాని పాఠ్యపుస్తకాలుగా అధ్యయనం చేయదగినవి. ఆ పుస్తకంమీద నా ప్రేమ ఎంతటిదంటే కనీసం అరడజను మందికి ఆ పుస్తకం కానుక ఇచ్చాను. కనీసం డజను సార్లయినా కథ వర్క్ షాపుల్లోనో, సాహిత్య సమావేశాల్లోనో వాటిలో ఏదో ఒక కథ గురించి చెప్పి ఉంటాను. ఇరవై ఏళ్లు గడిచినా వాటిలో ద ట్రెయిల్ ఆఫ్ యువర్ బ్లడ్ ఇన్ ద స్నో గాని, ఐ ఓన్లీ కేమ్ టు యూజ్ ద ఫోన్ గాని గుర్తుకొస్తే కళ్లు చెమరుస్తాయి. లైట్ ఈజ్ లైక్ వాటర్ ముందర అమాయక, నైసర్గిక బాల్యంలోకి జారిపోయి నిజంగానే ఆ ట్యూబ్ లైట్ పగిలిపోయి దాంట్లోంచి వెలుగు నీటిలా ప్రవహిస్తుందా చూడాలనిపిస్తుంది.

బెంగళూరులో ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) అని మేం నడుపుతుండిన బృందంలో అందరూ రాజకీయ, సామాజిక కార్యకర్తలే కాక సాహిత్యాభిమానులు కూడ. మార్కెజ్ రచనలు మాకు నిరంతర చర్చనీయాంశాలు. అందుకే నేను బెంగళూరు వదిలేసి వచ్చేటప్పుడు పిడిఎఫ్ మిత్రులు అప్పుడే తాజాగా వెలువడిన ఆఫ్ లవ్ అండ్ అదర్ డెమన్స్ కానుకగా ఇచ్చారు. మళ్లీ ఇది కూడ ప్రేమ కథగా కనబడుతుంది గాని పొరలు విప్పుకుంటూ పోతే వలసవాదం, క్రైస్తవం, స్థానిక ఆచారవ్యవహారాలు, అభూత కల్పనలు, ప్రేమ, ఆధిపత్యం ఒకదానిలో ఒకటి కలిసిపోయి అబ్బురపరుస్తాయి.

బెంగళూరులో ఉండగానే దొరికిన మరొక మార్కెజ్ అద్భుతం క్లాండెస్టైన్ ఇన్ చిలీ. అకాలంగా మరణించిన సాహితీమిత్రుడు గోపీ స్మృతిలో ఒక పుస్తక ప్రచురణ కార్యక్రమం, ముఖ్యంగా తనకు ఇష్టమైన అనువాద సాహిత్యం ప్రచురించాలని అనుకున్నప్పుడు వెంటనే తట్టినదీ, కొద్ది రోజుల్లోనే అనువాదం, ప్రచురణ అయిపోయినదీ ఆ క్లాండెస్టైన్ ఇన్ చిలీ పుస్తకమే. నేను, సి వనజ అనువాదం చేసిన, చీకటి పాట పేరుతో వచ్చిన ఆ పుస్తకంలో సల్వదోర్ అయెండె పేరు వర్ణక్రమం దగ్గరి నుంచి ఎన్నో పొరపాట్లు ఉన్నప్పటికీ తెలుగులో వెలువడిన మొట్టమొదటి మార్కెజ్ పుస్తకం అది. దాని అనువాదంతో, ప్రచురణతో సంబంధం ఉండడం నాకు సంతోషంగా, గర్వంగా ఉంటుంది.

IMG_20140422_074326

 

నోబెల్ బహుమతి డబ్బుతో పత్రిక కొని దాంట్లో రిపోర్టర్ గా పని చేస్తాననడమూ, చేయడమూ, ఎప్పటేప్పటి జ్ఞాపకాలనూ, తాత అమ్మమ్మల అభూత కల్పనలకు అక్షరాలు తొడగడమూ, మకాండో అనే ఊహాగ్రామం చుట్టూ అల్లిన అద్భుత గాథలూ, గెరిల్లాలతో చర్చలకు మధ్యవర్తిత్వమూ, అధ్యక్ష పదవి చేపట్టమని కోరడమూ, మరణించాడనే గాలి వార్తా, దానికి జవాబుగా కథ చెప్పడానికే బతికి ఉన్నాననడమూ, కాస్ట్రోతో స్నేహమూ, సామ్రాజ్యవాద వ్యతిరేకతా…. ఆయన చుట్టూ అల్లుకున్న అభూతకల్పనల వంటి జానపదగాథలు ఎన్నెన్నో, మిత్రులతో సంభాషణల్లో ఎన్నిసార్లో….

అనుకోకుండా వనజకు బర్కిలీలో ఫెలోషిప్ వచ్చి, నాకు కూడ మూడు నెలల కోసం అమెరికా వెళ్లే అవకాశం వచ్చినప్పుడు అక్కడ చూడవలసిన మనుషుల, ప్రాంతాల జాబితా తయారు చేసుకున్నాను. గూగీ, జేమ్స్ పెట్రాస్, మార్క్ ట్వెయిన్, పాల్ రాబ్సన్, బాబ్ డైలాన్, ఐన్ స్టీన్, స్వీజీ-మాగ్డాఫ్ లు గడిపిన మంత్లీ రివ్యూ ఆఫీసూ వగైరా… వనజకు బర్కిలీలో పరిచితమైన మెక్సికన్ వలేరియా బ్రబాతా వల్ల మెక్సికో కూడ వెళ్లడం వీలయినప్పుడు అక్కడ మార్కెజ్, ఫ్రీదా కాలో, డీగో రివేరా, వీలైతే దక్షిణాదికి వెళ్లి జపాటిస్టాలు…. కాని సరిగ్గా అప్పుడే మార్కెజ్ మెక్సికో సిటీ లో లేడు. తర్వాత కొద్ది రోజులకు గూగీని కలవడానికి అర్వైన్ కు వెళ్తూ లాస్ ఆంజెలిస్ లో మిత్రులు డాక్టర్లు జ్యోతి, గిల్బర్ట్ ల దగ్గర ఆగినప్పుడు, మాటల్లో ప్రస్తావన వస్తే గిల్బర్ట్ పనిచేసే ఆస్పత్రిలోనే మార్కెజ్ కు కీమోథెరపీయో, ఆ తర్వాత చికిత్సలో జరుగుతున్నాయని తెలిసింది. కాని ఆ షెడ్యూల్ కూడ అప్పుడు లేదు. అంటే రెండు సార్లు కనుచూపుమేర లోకి వెళ్లి కలవలేకపోయాను.

***

images

మార్కెజ్ ఆయన జ్ఞాపకాలను, తన జ్ఞాపకాలను మాత్రమే కాదు, తన జాతి జ్ఞాపకాలనూ, మానవజాతి జ్ఞాపకాలనూ తన రచనకు ముడిసరుకుగా వాడుకున్నాడు. జ్ఞాపకం అన్నప్పుడే కాలం జల్లెడ పట్టగా మిగిలిన వాస్తవం అని అర్థం. ఆ జల్లెడలో పూర్తిగా నెల్లు మిగిలిందా, పోయిందంతా పొల్లేనా ఎవరూ చెప్పలేరు. ఆ జ్ఞాపకాలను ఊహలతో రంగరించి, వాస్తవికతతో మెరుగులు దిద్ది అక్షరాలకెక్కించాడు మార్కెజ్. అందువల్లనే ఆయన రచనల్లో వందలాది కోటబుల్ కోట్స్ ఉంటాయి. అవి మానవజాతి తరతరాల సంచిత ఆస్తికీ, ప్రాచీన వివేకపు నికషోపలానికీ. ఆధునిక, అత్యాధునిక, భవిష్య ఆశాసూచికలకూ ప్రతీకలు. ఆనందంతో బాగుపడని దాన్ని ఏ మందులూ బాగుచేయలేవు అన్నా, ఎప్పుడైనా ప్రేమించడానికి ఏదో మిగిలే ఉంటుంది అన్నా మార్కెజ్ ప్రకటిస్తున్నది మనిషి పట్ల ప్రేమను, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని. ఆ ప్రేమకూ, ఆ ఆశకూ ఎన్నటికీ మరణం లేదు.

దాన్ని ఆయన కాల్పనిక రచనల్లో మాత్రమే కాదు, కఠిన వాస్తవిక ప్రసంగంలోనూ వ్యక్తీకరించాడు.

“…ఇన్ని జరిగినా, మాపట్ల కొనసాగినఅణచివేతకూ, మమ్మల్ని కొల్లగొట్టుకు పోవడానికీ, మమ్మల్ని వెలివేయడానికీమాకు ఒక జవాబు ఉంది. అది బతుకు. మాపై కొనసాగిన దౌర్జన్యానికంతటికీ మేంబతుకుతో జవాబిస్తాం. వరదలు గానీ, రోగాలు గానీ, కరువులు గానీ, ప్రళయాలుగానీ, శతాబ్దాల తరబడి సాగిన అనంత యుద్ధాలు గానీ చావుమీద బతుకు సాధించినవిజయాన్ని కాదనలేకపోయాయి. చావు మీద బతుకు గొప్పతనాన్ని తొలగించలేకపోయాయి” అని ఆయన నోబెల్ ప్రసంగంలో అన్నాడు.

అంతేకాదు, తన సామాజిక వాస్తవికతకూ తన సాహిత్య అభివ్యక్తికీ మధ్య సంబంధం పట్ల కూడ ఆయన ప్రకటించిన సవినయ అవగాహన మనిషి మీద, సమాజం మీద, చరిత్ర మీద, భవిష్యత్తు మీద ఆయన గౌరవానికి నిదర్శనం: లాటిన్ అమెరికా బీభత్స వాస్తవాన్ని వివరంగా చెప్పి, “నిజంగా స్వీడిష్ సాహిత్య అకాడెమీదృష్టికి రాదగిన అర్హత కలిగినది ఈ పెరిగిపోయిన వాస్తవమేగాని, దాని కేవలసాహిత్య వ్యక్తీకరణ కాదు. ఒక కాగితం మీది అక్షరం కాదు. మాలో బతుకుతున్నవాస్తవం. ఆ వాస్తవం మా అసంఖ్యాక రోజువారీ మరణాలను నిర్ణయిస్తున్నది. ఆవాస్తవం అనంతమైన సృజనాత్మకతకు వనరులు చేకూర్చిపెడుతున్నది. ఆ వాస్తవంనిండా కన్నీళ్లు ఉన్నవి, సౌందర్యం ఉన్నది. గతకాలాన్ని నెమరేసుకుటూ దేశదిమ్మరిగా తిరిగే ఈ కొలంబియన్ ఆ వాస్తవానికి ఒకానొక వ్యక్తీకరణ, అదృష్టం వరించినఒకానొక ఉదాహరణ” అని ఆయన నోబెల్ వేదిక మీది నుంచి ప్రకటించాడు.

ప్రపంచమంతా ఆయనకు నివాళి అర్పించింది. కాని అన్నిటిలోకీ నాకు నచ్చినది, ఆయన పుట్టిపెరిగిన నేల మీద దశాబ్దాలుగా సాయుధ పోరాటం సాగిస్తున్న మార్క్సిస్టు విప్లవకారుల సంస్థ కొలంబియా విప్లవ సాయుధ సైన్యం (ఫార్క్) తాము వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ పాత్ర కర్నల్ అరెలియానో బెండియా నుంచి ప్రేరణ పొందుతూనే ఉంటామని అంది. ఆ మహాద్భుత వ్యక్తి మరణం తర్వాత మళ్లీ ఒకసారి చెపుతున్నాం. అరెలియానో బెండియా లాగనే మేం కూడ శాంతి గురించి కలగంటూనే ఉంటాం, శాంతిని నెలకొల్పుతాం అంది ఫార్క్.

-ఎన్. వేణుగోపాల్

venu

“అమ్మ” హేమలత తనకు తానే ఒక సైన్యం!

జోగిని బతుకుల్లో కాంతి "లత"

జోగిని బతుకుల్లో కాంతి “లత”

ఇది నా జన్మ భూమి

ఇది నా మాతృ భూమి
ఇది నా ప్రియతమ భారతి
దీని బాగు నా బాగు
దీని ఓగు నా ఓగు
“నా దేశం తప్పు అయితే దాన్ని దిద్దుతాను
నా దేశం ఒప్పు అయితే దాన్ని అనుసరిస్తాను ‘
అని కేక వేసిన ఒక దేశాభక్తుడైన నా సోదరుని కేకతో …
నా కంఠమూ కలుపుతాను …
అన్నదెవరో కాదు, మూఢ నమ్మకాలపై కన్నేర్రజేసి, తాయత్తు గమ్మత్తులను చిత్తు చేసి జోగినీ చెల్లెళ్ళ జీవితాల్లో వెలుగునింపిన, నేరస్థ జాతుల్ని జనజీవన స్రవంతిలో కలిపిన సంస్కరణోద్యమ ధీర వనిత,  కవికోకిల నవయుగ వైతాళికుడు జాషువా ముద్దుబిడ్డ కవితాలత హేమలత .   అమ్మ హేమలతాలవణం భౌతికంగా దూరమై అప్పుడే ఆరేళ్ళు.  కానీ ఆమె స్మృతులు  మా మదిలో సజీవంగానే ..  ఒక వ్యక్తిగా కాదు శక్తిగా ఆమె చేసిన సాంఘిక కార్యక్రమాలు కళ్ళముందు సజీవ చిత్రాలుగా కదలాడుతూనే ..
బాల్యములో అందరి ఆడపిల్లల్లాగే ఎదిగిన హేమలత వ్యక్తిత్వంలోకి తొంగి చూస్తే ఆవిడ ఏమిటో అర్ధమవుతుంది.
అస్పృశ్యత కూడా మూఢ నమ్మకమే . కుల భేదం , మత భేదం, మూఢ నమ్మకాలు … ఈ మూడూ మానవ కుటుంబాన్ని ముక్కలు చేసి వేరు చేసాయి.   నాటినుంచి ఈ నాటివరకు మానవ జాతి దీనిని ఎదుర్కుంటూనే ఉంది.  ఆనాడు మరీ కరుడుగట్టిన అజ్ఞానం, అగ్రకులం, కింది కులం, వారు గౌరవింప దగినవారు , వీరు దూరంగా ఉంచవలసినవారు అనే ఆచరణ పేరుకు పోయినరోజులు . ఒక్క మనుషుల మధ్యే కాదు ఈ బేధం . వస్తువుల మధ్య , పండుగల మధ్య , నీరు ఆహారాల మధ్య … అన్నింటి మధ్యా ఈ అంటరానితనం అడ్డుగోడ.   ఒక్క గాలి , ఎండ, వెన్నెలకే లేదు .  ఒక వేళ  వాటికీ అడ్డు పెట్టగలిగితే వీటిని కూడా అడ్డుకునే వారేమో !  అంటారామె .
బైబిలు చదివి , ప్రార్థనలు చేసి , తాతగారి క్రైస్తవ బోధనలు విని అప్పుడప్పుడు చర్చికి వెళుతుండే హేమలతతో ” అమ్మాయీ.., దేవుడు లేడు ” అనే మనిషిని చూసాను అన్న తండ్రి మాటలు దిగ్బ్రాంతి చెందించాయి.  ఆ మాటలు ఆమెను ఆకర్షించాయి.   తండ్రితో ఆ మాటలు అన్న వారిని చూడాలన్న, వారి మాటలు వినాలన్న జిజ్ఞాస గోరా, సరస్వతి గోరాలను కలవడానికి కారణమయింది.  వారి పరిచయం , వారు నడిపే “సంఘం” పత్రిక చదవడం ఆమె జీవిత విధానాన్ని మార్చివేశాయి. ఆమెను నాస్తికురాలిగా మార్చాయి.  గోరా , జాషువాల స్నేహం దిన దిన వర్ధమానమవుతున్న సమయంలో   గోరాగారి పెద్దకుమారుడు లవణం, జాషువాగారి  చిన్న కుమార్తె హేమలతకి పెళ్లి చేయ్యాలనుకున్నారు. సాంప్రదాయానికి విరుద్దంగా గోరాగారి ఆహ్వానంపై పెళ్ళికొడుకును చూడడానికి 1959 నవంబరులో జాషువా గారితో కలసి  హేమలత విజయవాడలోని నాస్తిక కేంద్రానికి వెళ్ళారు.  పెద్దలు అప్పటికప్పుడే వారి పెళ్లి 1960 జనవరి 12 వ తేదిన సేవాగ్రాం లో జరగాలని నిశ్చయించారు.
HEMALATHA LAVANAM___1
నాస్తిక కేంద్రంలో నిరాడంబరమైన జీవన విధానం హేమలతని ఆకట్టుకుంది.  కుల, మత రహిత సమాజం కోసం వారు తీసుకున్న నిర్మాణాత్మక కార్యక్రమాలు ఆమెను ప్రోత్సహించాయి. గోరా గారి కుటుంబం ఏమి చెప్పే వారో అదే ఆచరించే వారు.  కట్న కానుకలకు , ఆడంబరాలకు తావేలేక పోవడం ఆమెను ఆకర్షించింది.
పెళ్ళికోసం సేవాగ్రాం వెళ్ళగానే ఆమెకు కలిగిన భావాలిలా అక్షరీకరించారు
“ఇదే నాడు శాంతి నివాసం
అదే నాదు బాపూ వాసం
ప్రేమఝరులు ప్రవహించేనిచ్చట
సత్యాహింసలు మొలచెనిచ్చట
శాంతి సస్యములు పడిన విచ్చట
త్యాగ చంద్రికలు విరిసిన విచ్చట
………
వినుకొండలో పుట్టి పెరిగిన హేమలత చదువు మద్రాసులో సాగింది. ఆమెకు తల్లిదండ్రులు , స్నేహితులు , బంధువులు , నవలలు, జీవత చరిత్రలు , సాహితీ గ్రంధాలు, సాహితీ సమావేశాలూ  తప్ప సామాజిక జీవన పరిస్థితులు తెలియదు. అత్తవారింట అందుకు భిన్నమైన వాతావరణం.  సాంఘిక దృష్టి, సాంఘిక సమస్యలు, సమాజపు మార్పు , నాస్తిక జీవన విధానం , సత్యాగ్రహాలు, శాస్త్రీయ పరిజ్ఞానం … కార్యక్రమాలు.. అంతా కొత్తగా .. అందరూ ఆప్యాయంగా  నాస్తిక జీవన విధానానికి అలవడుతున్న ఆమె ఆలోచనల్లో మార్పు. భావాల్లో మార్పు .. భయాలు పోయి మనసు విచ్చుకుంది.
మన వ్యక్తిత్వం మన జీవితాన్ని నడుపుతుంది.  అయితే జీవితపు దిశ , నిర్ణయం మలుపులు మన చేతిలోనే ఉంటుంది . అలా మన చేతుల్లో దిశా నిర్ణయం లేకుంటే మన జీవితపు దిశ ఎదుటి వాళ్ళ చేతుల్లో ఉంటుంది  అంటారు అమ్మహేమలత  .
నాస్తికమార్గంలో .. 
వివాహానంతరం అత్తింటికి చేరిన ఆమె ఉదయం లేచి చూసిన దృశ్యం వారి పూరింటి ముందు మామ గోరా ఊడుస్తూ , గేదెల పాకలో అత్త సరస్వతి పాలు పితుకుతూ , ఉసిరి చెట్టు నీడలోనున్న పాకలో లవణం, విజయం, సమరం ప్రెస్లో , మైత్రి, విద్యలు రాత్రి భోజనం తాలుకు అంట్లగిన్నెలు తోముతూ . కేంద్రమంతా ఎప్పుడో మేల్కొంది.  ఆలస్యమైనందుకు సిగ్గు పడింది. వారిపనులు వారు చేయడం, పనుల్లో ఆడ మగ తేడా లేకపోవడం ఆమెను ఆశ్చర్యపరిచింది.  కులమత అడ్డు గోడలు లేని ఈ మానవ కేంద్రం ఆమె ప్రపంచాన్ని విశాలం చేసింది. విశ్వపుటంచుల్ని తాకి నిల్చేలా చేసింది. నాస్తిక జీవన విధానం లోని నిర్భయత్వాన్ని రుచి చూసింది.
ఒకరోజు హేమలత తాత గారు ఆమెను చూడడానికి వచ్చారు.  మాటల్లో అమ్మాయీ భగవంతుని ధ్యానం మరువ లేదు కదా అని అడిగారు.  నేను నాస్తికురాలిగా మారిన తర్వాతే ఈ ఇంటికి వచ్చాను. ఇక్కడ దేవుడు , పూజ , ప్రార్ధన అనే వాటికి తావు లేదని చెప్పి ఆయన కోపానికి గురైంది. చిరునవ్వే ఆభరణంగా , ఖద్దరు లేదా నేత బట్టల్లో ఆమె నిరాడంబర నాస్తిక జీవన మార్గంలోనే జీవించింది.
సంస్కరణ – నేపథ్యం  
హేమలత పెళ్ళయిన తర్వాత లవణం గారితో కలసి వినోభాభావే పాదయాత్ర జరుగుతున్న చంబల్ లోయకు వెళ్ళారు.  ఆ సమయంలో బందిపోట్ల క్రూర బీభత్సాన్ని , వారి హత్యల రక్తంతో తడిసిన భూమిని శాంతి ధామంగా మార్చాలన్న ప్రయత్నంలో ఉన్నారు వినోభా .
ఆ రోజు అర్దరాత్రి దాటాక బందిపోట్లు లొంగిపోవడానికి వినోభా దగ్గరకు వస్తున్నారన్న వార్త  హేమలతని భయకంపితురాలిని చేసింది.  మాములుగానే దొంగలు అంటే వణికిపోయే సున్నిత మనస్కురాలైన హేమలత .. ఆ అర్ధ రాత్రి , ఆ లోయల్లో .. అంధకారంలో .. బందిపోటు దొంగలు ..  గజ గజలాడింది. మరుసటి రోజు ఆ బందిపోట్ల నాయకుడు పూజారి లుక్కారాం ‘బహెన్ బహెన్ ‘ అని పిలువడంతో ఆమె భయం పోయింది.  ఆ సంఘటన వాళ్ళూ మనుషులే కదా అన్న ఆలోచనకు , తర్వాతి కాలంలో స్టువార్టుపురం నేరస్తుల సంస్కరణకు బీజం వేసింది.
వాసవ్య విద్యాలయం 
హింస కాదు అభివృద్ధి  – అహింస అభివృద్ధి
హింస కాదు పరిష్కారం  – శాంతి పరిష్కారం
అని నమ్మే హేమలత గోరా గారి ఆలోచన ప్రకారం ‘వాసవ్య విద్యాలయం ‘1961లో తన పెద్ద ఆడపడుచు మైత్రి తో కలసి ప్రారంభించారు. వాస్తవికత,  సంఘదృష్టి, వ్యక్తిత్వం లక్ష్యంగా నిర్వహించిన ఆ విద్యాలయంలో చదువంటే భయం లేకుండా, వత్తిడి లేకుండా ఆనందంగా బోధనా సాగేది.  spare the child, spoil the rod అన్న విధానంలో సాగేది విద్య.
 కులాంతర వివాహాలు 
కులాంతర , మతాంతర వివాహాలు అతి తక్కువగా ఉన్న సమయంలో కులాంతర , మతాంతర వివాహం చేసుకున్న హేమలత ఆ తరువాతి కాలంలో భర్త, అతని కుటుంబంతో కలసి  ఎన్నో కులాంతర , మతాంతర వివాహాలు జరిపించారు.
‘నా వివాహంతో నా  పుట్టింట మూసుకున్న కులాల మతాల తలుపులూ తెరుచుకున్నాయి . విశ్వమానవతా  పవనాలు చొరబడ్డాయి.  ఈ వివాహంతో చిన్నక్క కుటుంబంలో అన్నీ సమ సమాజ నిర్మాణానికి బాటలు వేసిన వివాహాలే జరిగాయి. స్వార్థపూరిత సాంఘిక కట్టుబాట్లను తెంచి ఈనాడు అందరూ అర్హమైన పదవుల్లో అలరారుతున్నారు’ అంటారు హేమలత
040
సంఘసంస్కర్తగా … 
మన దేశంలో స్వాతంత్రం  రాక ముందు ఎన్నో సంస్కరనోద్యమాలు జరిగాయి. కానీ స్వాతంత్ర్యానంతర ఉద్యమాలు రెండే రెండు అనుకుంటా .. ! అవి నేరస్థుల సంస్కరణ, జోగినీ దురాచార నిర్మూలన.  ఆ రెండూ హేమలతాలవణం దంపతుల ఆధ్వర్యంలోనే జరగడం విశేషం.
స్టువార్టుపురం అనగానే మనందరికీ గుర్తొచ్చేది అక్కడి గజదొంగలే. ఆ పేరు వింటేనే అంతా  ఉలిక్కి పడతారు.  అలాంటి చోటుకి 1974లో హేమలత అడుగుపెట్టారు.  అది మామూలు అడుగు కాదు. ఒక సాహసోపేతమైన అడుగు. ఒక వినూత్నమైన సంస్కరణకు మార్గం వేసిన అడుగు.  వినోభా బావే నుండి పొందిన ఉత్తేజం ఆమెను ఆ అడుగు వేయించింది. అదే ఆమెనీ సాహస కార్యానికి పురిగొల్పింది.
అటు దొంగలకు ఇటు పొలీసు అధికారులకు మధ్య వారధిలా ఉండి సమావేశాలు నిర్వహించడం, ఆ దొంగల ఇల్లు ఇల్లు తిరిగి వారి జీవన స్థితిగతులు తెలుసుకోవడం … ఈ క్రమంలోనే వారికి ఆమెపై ఆమె చేసే కార్యక్రమాలపై నమ్మకం ఏర్పడింది.  ఆమె జీవన సహచరుడు లవణం, గోరాగారి కుటుంబం ఆమె పక్కన నిలబడి అండగా నిలిచి మనో ధైర్యాన్ని నింపారు. .
సువార్టుపురం వెళ్ళినప్పుడు వాళ్ళు కాఫీ ఇచ్చినా , భోజనం చేయమన్నా స్వీకరించేది కాదు.  మీరు దొంగతనం చేసి తెచ్చిన సొమ్ముతో పెట్టే తిండి నాకు వద్దు.  మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము అయితేనే స్వీకరిస్తాను అని నిర్మొహమాటంగా ఆమె చెప్పిన మాటలు వారిని బాధించినప్పటికీ, వారి మనస్సులో ఆలోచనను రేకెత్తించాయి.  కరుడుకట్టిన జీవితాల్లో మార్పుకు దోహదం చేశాయి.
1975లో “మా కుటుంబాలకు, కుటుంబ సభ్యులకు  పొలీసు వారి నుండి రక్షణ కల్పించండి .  వాళ్ళ హింసకు తాళలేక పోతున్నాం ”  అని విన్నవించిన కుటుంబాల్లో నేడు సామాజిక మార్పు.  ఆ మార్పు పరిమాణం స్పష్టంగా ప్రపంచానికి అగుపిస్తూ… వారి ఆలోచనల్లో కొత్తదనం, తరతరాలుగా వస్తున్న నేరసంస్కృతిని, ప్రవృత్తిని చేధించే తత్వం .. సంకల్పమ్. జనజీవన స్రవంతిలో కలసిపోవాలన్న ఆరాటం .. మూడు తరాల సాంఘిక చైతన్యం కనిపిస్తుంది వారి మాటల్లో, నడతలో .
ఎంత గాడాంధకారంలోనైనా సన్నని వెలుగు కనిపించి మనకి మార్గం చూపుతుంది. అదే విధంగా ఎంతటి దుర్మార్గులలోనైనా మంచి ఎంతో కొంత ఏ మూలో దాకుని ఉంటుంది అని నమ్మి ఆ మంచి వెతుక్కుని దాని ఆసరాతో ముందుకెళ్ళే ఆశా జీవి హేమలత.  నేరస్థ సంస్కరణోద్యమంలో ఓ వైపు దొంగల్ని, మరో వైపు పోలీసుల్ని, ఇంకో వైపు సమాజం అన్నింటినీ సమన్వయ పరుచుకుంటూ పనిచేస్తూ ముందుకు సాగిన ధీర ఆమె.
దాదాపు నలబై ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న నేరస్తుల సంస్కరణోద్యమ కార్యక్రమాలు  ఇక అవసరం లేదనుకుంటా .. కారణం ఇపుడక్కడ బతకడం కోసం దొంగతనం చేసేవాళ్ళు, దొమ్మీలు , లూటీలు చేసే వాళ్ళు లేరు. వారి పిల్లలు చదువుకున్నారు. చదువుకుంటున్నారు.  శ్రమ జీవనం గడుపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. వారి జీవితాల్ని వారు అమ్మ హేమలతాలవణం , ఆమె నెలకొల్పిన సంస్కార్.
అమ్మా అన్న పిలుపు 
దొంగతనానికి వెళ్ళినప్పుడు అయిన గాయం సలుపుతుంటే బల్లాని అంకయ్య అనే వారెంటు ఉన్న దొంగ బాధపడుతున్నాడు. అతన్ని పోలీసుల పర్మిషన్ తో ఆసుపత్రికి తీసుకెళ్ళింది హేమలత. బాధనుంచి ఉపశమనం పొందిన అతను మరుసటి రోజు హేమలతను కలసి “అమ్మా ! మీ దయ వల్ల  నొప్పి తగ్గింది. బాగా నిద్ర పోయాను తల్లీ !’ అన్నాడు ఆమె పాదాలకు నమస్కారిస్తూ .. అలా మొదటి సారి అతని నోట  అమ్మా అన్నపిలుపుతో పులకించిన హేమలత ఆ తర్వాతి కాలంలో వేలాది మందికి ‘అమ్మ ‘ అయింది. అది ఆమెకు బిరుదుగా మారింది.
జోగినీ దురాచార నిర్మూలన 
ఓ పక్క నేరస్థుల సంస్కరణ కార్యక్రమాలు, మరో పక్క కులరహిత సమాజం కోసం పనిచేస్తూ, ఉప్పెన వంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ముందువరస నిలిచి ఆపన్నులకు సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు.  హేమలతాలవణం దంపతులు చేసే సేవా కార్యక్రమాల గురించి తెలిసిన ఆనాటి గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషి ఆనాడు నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న జోగినీ దురాచార నిర్మూలనకు పని చేయవలసిందిగా ఆహ్వానించారు.  ఆ విధంగా జోగిని దురాచారాన్ని గురించి తెలుసుకున్న అమ్మ తీవ్రంగా చలించింది.  ఈ నాగరిక సమాజంలో సాంప్రదాయం ముసుగులో  అలాంటి అమానవీయ ఆచారాలు  కొనసాగడం, అణగారిన వర్గాలలోని మహిళలు ఆ ఆచారపు కోరల్లో చిక్కి గిజగిజలాడిపోవడం ఆమెను చలింపజేసింది.  వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఎంత కష్టనష్టాలకైనా ఎదురొడ్డి నిలవాలని నిర్ణయించుకున్నఅమ్మ వెంటనే కార్య క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుంది.  బలంగా వేళ్ళూనుకుని ఉన్న దురాచారాన్ని రూపుమాపాలంటే ఈ దురాచారం గురించి ప్రజలలో ప్రచారం చేయడమే కాకుండా ఒక చట్టం అవసరమని భావించింది హేమలత.  ఆవిడ సంస్కార్ సంస్థ ద్వారా గట్టి ప్రయత్నం చేసింది. ప్రభుత్వం పై వత్తిడి తెచ్చింది. ఫలితంగా  జోగిని, బసివి, మాతమ్మల దురాచార నిర్మూలనా చట్టం 1988లో వచ్చింది.
సమాజం అంగీకరించిన , సాంప్రదాయం ఆమోదించిన వికృతాచారపు కోరలనుండి వేలాదిమంది మహిళలు బయటపడేలాచేయడమంటే సామాన్య విషయం కాదు.  ఎంతో ప్రతిఘటన ఎదుర్కొంది.  దుర్భర దారిద్యంలో నిత్యం అవమానాలు అవహేళనలతో, తమ శరీరంపై తమకి హక్కులేని స్థితిలో  ఇది తమ తలరాత అనుకునే వారి తలరాతను మార్చింది అమ్మ. వారిని గౌరవంగా చెల్లీ అని పిలిచి సమాజం చేత కూడా అలా పిలిపించుకునే గౌరవాన్నిచ్చింది.
‘ఎవరు చేశారమ్మా నిన్నిలా ?!
వెన్నెలా నీ బతుకు నల్లనీ రేతిరలే
ఎవరు చేశారమ్మా నిన్నిలా ?!
వన్నెలా ని బతుకు వాడినా జోగిలా
ఓ! పోశవ్వ చెల్లీ!  ఓ లచ్చవ్వ తల్లీ !
ఎందుకున్నా వమ్మా మౌన మునిలా ?!
తిరగబడి నీ బ్రతుకు దిద్దుకో చెల్లెలా
ఎవరు మూశారమ్మ నీ నోరు మూగలా?!
నోరిచ్చి నీ పరువు నిలుపుకో చెల్లెలా
………………
నిప్పులే చెరుగమ్మా చెల్లెలా !
జోగి యాచారమ్ము బుగ్గి బుగ్గైపోవ !
నిప్పులే చేరుగమ్మ చెల్లెలా
బసివి యాచారమ్ము నుగ్గు నుగ్గై పోవ
అంటూ అమ్మ జోగినీ చెల్లెళ్ళని చైతన్యం చేశారు. ప్రశ్నించడం నేర్పారు. పెద్దలకు, భూస్వాములకు వినపడేలా ఒక నగారా మోగించారు. ఈ క్రమంలో ఎన్నో ఎదురు దెబ్బలు , ఆటుపోట్లు .. అన్నీ అధిగమిస్తూ ఆత్మవిశాసంతో సాగారు హేమలత.
 అమ్మ చేసిన అనేక సాహసోపేత నిర్ణయాలు, కార్యక్రమాల వల్లే  వారూ , వారి కుటుంబాలు ఇప్పుడు  గౌరవనీయమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు .  ఇప్పుడు వారికి అవమానం అంటే తెలిసింది. గౌరవప్రదమైన జీవితం ఏమిటో ఆర్ధమైంది.  నేడు నిజామాబాదు జిల్లాలో జోగిని ఆచారం రూపుమాసింది.  ఇప్పుడు వారి కుటుంబాల్లో పిల్లలకి కూడా జోగుపట్టం గురించి తెలియదు.  ప్రభుత్వం , సంస్కార్ సహకారంతో వారి జీవితాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. చేసిన అమ్మ హేమలత ఎందరికో ఆరాధ్యనీయురాలు.
ఎన్ని సత్కారాలైనా తక్కువే!

ఎన్ని సత్కారాలైనా తక్కువే!

జాషువా ఫౌండేషన్ 
దారిద్ర్యం అంటే ఏమిటో ఆమెకు బాగా తెలుసు. అందునా మహోన్నతమైన భావాలను నింపుకొని అక్షర వ్యవసాయం చేసే కవులెందరో అనుభవించిన దారిద్య్ర్యాన్ని కనులారా చుసిన్దామే. కవి పుత్రి అయిన హేమలత కవులను సన్మానించి, సమాదరించాలని భావించింది. కన్న తండ్రి జాషువా జ్ఞాపకార్ధం జాషువా ఫౌండేషన్ ద్వారా వివిధ భారతీయ భాషల్లోని ప్రముఖ సాహితీ వేత్తలను గుర్తించి వారికి జాషువా సాహిత్య పురస్కారం అందించారు.
గౌరవ డాక్టరేట్ అందుకుంటూ...

గౌరవ డాక్టరేట్ అందుకుంటూ…

రచయిత్రిగా 
నేరస్థుల సంస్కరణ అనుభవాలతో రాసిన పుస్తకాలు రెండు. ఒకటి నేరస్తుల సంస్కరణ , జీవన ప్రభాతం.  ఈ నవలకు తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహితీ పురస్కారం పొందింది.  జోగినీ దురాచార నేపథ్యంలో నవల రాస్తున్న క్రమంలోనే అమ్మ మనకు దూరం కావడం సాహితీ లోకానికి ఎనలేని లోటు.  అసంపూర్తిగా ఉన్న ఆ పుస్తకాన్ని ఆమె జీవన సహచరుడు లవణం గారు మనముందు ఉంచే ప్రయత్నంలో ఉన్నారు. మా నాన్నగారు , అహింసా మూర్తుల అమరగాదలు, జాషువా కలం చెప్పిన కథ, తాయత్తు గమ్మత్తు , మృత్యోర్మా అమృతంగమయ వంటి పుస్తకాలు వెలువరించారు అమ్మ.
HEMALATHA LAVANAM___2
నాకు కులం లేదు , మతం లేదు అనే అమ్మ హేమలత వటవృక్షంలా నిలిచి చేయి చాచి ఆపన్నులకు ఇచ్చిన చేయూతని, తద్వారా వారి కుటుంబాల్లో నిండిన వెలుగుని అనుభవిస్తున్న వారు  ఎప్పటికీ మరువలేరు.  సంస్కరణలో అలుపెరుగని యోధ , మానవతావాది , అహింసావాది అమ్మ హేమలతాలవణం బిడ్డలలో నేనూ ఒకరిని.  ఆమె బిడ్డలందరి తరపున అమ్మకి అక్షరాంజలి ఘటిస్తూ.. .
వి . శాంతిప్రబోధ

మామూలుగా కనిపించే అమామూలు కథ!

images
చాసొ కథల్లో ఏది నచ్చిందీ అంటే కొంచం చెప్పడం కష్టమే . ఒక్క కథ గురించే మాత్రం మాట్లాడలేము. కానీ ఇక్కడ శీర్షిక నాకు నచ్చిన చాసో కథ అన్నారు కనుక నా మనసును బాగా  ఆకట్టుకున్న కదిలించిన కథ ” లేడీ కరుణాకరం”.
ఈ కథ నాకు ఎందుకు నచ్చిందీ అంటే చాలా కారణలున్నాయి :
ముందుగా ఈ కథలోని ఆర్ధిక కోణాన్ని రచయిత వివరించిన తీరు. మధ్య తరగతి జీవితాల్లో విద్య కూడా ఒక అందని ఫలమనిపిస్తుంది. దాని కోసం శారద తల్లి తండ్రి అవలంబించిన పద్ధతి మంచిదా కదా అన్న చర్చ లో నైతికత అనేదానికి తావు లేదు. రచయిత ఎక్కడా తన అభిప్రాయాన్ని కానీ ఏ సిద్ధాంతాన్ని కానీ చెప్పడు. సమస్యను కేవలం సమస్యగా దానికి ఆ దిగువ మధ్య తరగతి వారు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రమే చెప్తాడు. ఇలాంటి కథ ను నిర్మమంగా చెప్పడం చాలా కష్టం.
ఈ కథ గురించి చాలా విమర్శ ఉంది. కేవలం తన భర్త చదువు కోసం శారద వ్యభిచరించాలా , ఆ మార్గం పైగా తన తల్లి తండ్రులే సూచిస్తారు. ఇది ఎంతవరకు సమంజసం?
ఇక్కడ సమంజసమా కదా అన్నది ప్రశ్న కాదు. కానీ ఏ చదువూ లేని శారదకు వాళ్ళ తల్లి తండ్రులు సూచించిన పరిష్కారం ఇది.
అసలింతకీ ఈ కథ ఇతివృత్తం దేని గురించి?
ఈ కథ ఒక మనిషి జీవన పరిష్కారం కోసం ఏమి చేసిందనీ కాదు , ఈ కథ చదువు గురించి . ఈ కథ విద్యా గురించి అన్న ఆలోచనతో చూస్తే ఈ కథ వెనకాల రచయిత దృక్కోణం కనిపిస్తుంది. శారద ఎందుకు వ్యభిచరించింది ? తన భర్త చదువు కోసమే కదా. ఆ పైన అతనికి ఒక మంచి పదవి రావడం కోసం. పేదరికం చాలా మంది సమస్య కానీ ఇక్కడ ఈ సమస్యను శారద తన తల్లి తండ్రులు చెప్పిన పద్ధతి లో పరిష్కరించుకుంటుంది. పెళ్లి చేసుకుని హాయిగా భర్తతో కాపురం చెయ్యాలనుకునే ఏ ఆడ పిల్ల ఇలా చెయ్యాలనుకోదు. ఎవరూ కావాలని ఆ దారి తొక్కరు.
ఆమె భర్త కి కూడా శారద పట్ల ఆ కృతజ్ఞత ఉంటుంది. ఇదంతా నీవు పెట్టిన భీక్షే కదా శారద నీవు సరస్వతి వి అంటాడు. అతనికీ పిల్లలు తనకు పుట్టిన వారు కాదని తెలుసు , అతనిలోనూ బాధ ఉంటుంది , అసహనం ఉంటుంది కానీ కేవలం ఆమె చేస్తున్న పని వెనుక ఉన్న కారణాన్ని అర్ధం చేసుకుంటాడు కనుక గమ్మున ఉంటాడు.
చివరికి అతనికి సర్ బిరుదు వస్తుంది . అప్పుడు అంటుంది శారద అయితే నేనిప్పుడు “లేడీ కరుణాకరం ” అన్న మాట అని. అన్న తర్వాత ఒకే వాక్యంలో చాసో అంటాడు “శారద మహా పతివ్రత ” అని. భర్త నపుంసకుడైనప్పుడు అతను నియోగించిన వారితో రమించి తల్లి అయిన కుంతి మహా పతివ్రత అయితే మరి శారద ఎందుకు కాదు? భర్త చదువు కోసం శారద అదే పని చెయ్యాలా అని అడగచ్చు. అందరి సమస్యకి ఇదే పరిష్కారమా అని కూడా ప్రశ్నించవచ్చు . కానీ వారికి తోచిన పరిష్కారం వారు ఎన్నుకున్నారు అన్నదే ఇక్కడ రచయిత చెప్పే విషయం.
శత కోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు , అలాగే వారి దారిద్రానికి వారికి తోచిన పరిష్కారం అది. అనుకున్నది సాధించుకుంటారు కరుణాకరం దంపతులు.
ఈ కథ చదివి హృది చెమరించని వారుండరు. వ్యంగ్యాత్మకంగా చెప్పినా ఈ కథలోని విషాదం మనల్ని కదిలిస్తుంది. ఈ కథ ఖచ్చితంగా పాఠకుడి మనసులో నిలిచి పోతుంది. ఆలోచింపజేస్తుంది. ఆ నాడు చదువు కోసమే ఒక శారద ఈ పని చేస్తే. నేటి ఈ ప్రైవెటైజేషన్ కాలం లో పేదవారికి  అందక , ఎందరో   సమర్ధత ఉండీ కూడా చదువు కోలేకపోతున్నారు. అసలీ విద్యా రంగాన్ని ఎందుకు ప్రభుత్వం తీసుకోదు ? విద్యా వైద్య రంగాలను ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అతి సాధరణంగా కనిపించే ఈ కథలో ఎన్నో విషయాలున్నాయి  అందుకే ఈ కథ అంటే నాకు ఇష్టం .
                                     -జగద్ధాత్రి
1231658_539630582777569_2120927918_n

నాకు నచ్చిన చాసో కథ – ఆఁవెఁత

chaso

సాహిత్య రచన ఏ ఆశయంతో జరగాలి అని ప్రశ్నించుకుంటే ఒక్కొకరూ ఒక్కో విధంగా వారి వారి అభిప్రాయాన్ని చెప్పడానికి అవకాశం ఉంది కాని సాహిత్య శిల్పం మాత్రం కాలపరిస్థితులని బట్టి మారుతుండాలి అనే విషయంలో మాత్రం అందరూ ఏకీభవిస్తారు.  ఏ రచనైనా చదివి ప్రక్కన పడేసేదిగా కాక  కొంత సామాజిక ప్రయోజనం కలిగించేదిగా ఉండాలంటే రచయిత తన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న, జరగబోయే మార్పుల పట్ల సమగ్ర అవగాహన కలిగి ఉండాలి – అంతే గాక మానవ జీవిత క్రమాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకునే శక్తి, నిశితంగా గమనించే నేర్పూ ఓర్పూ రచయితకి ఉండాలి – అలాంటి కోవకి చెందిన వారిలో ప్రముఖుడు శ్రీ చాగంటి సోమయాజులు గారు.

ఈయన రచనలకి ఆనాటి ఆయన సమకాలీన రచయితలు, ఆ తరం పాఠకులు ఎంత మందో ప్రభావితులైనారట.  ఇప్పటి రచయితలకి ఆయన రచనలు ఉత్తేజాన్ని కలిగించి కథంటే ఎలా ఉండాలో పాఠాలు చెప్తాయి.  ఆయన కథల్లోని వైవిధ్యం, క్లుప్తత, వేగం మనల్ని చకితుల్ని చేస్తాయి.

సాధారణ జీవితాల నుండి అంత గొప్ప కథలు రాయగలగడం అందునా సరళంగా రాయగలగడం ఎలా సాధ్యం అని మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన రాసిన ఏ కథ చదివినా ఆ కథ మరోలా రాయొచ్చునేమో ఇలా రాసుంటే బాగుండేదేమోననే ఆలోచన మనకి కలగదు.  విపరీతమైన ద్వేషాన్ని గురిచి కాని అనవసరమైన సానుభూతిని చూపిస్తూ కాని కాకుండా మామూలుగా కథని చెప్పే తీరు అనిర్విచనీయమైనది.  ఈనాటి ప్రతి రచయితా గ్రహించదగినది.  అందుకే ఆయనని  కథకుల కథకుడు అంటారు – ఈ విషయాలన్నీ నేను చెప్తున్నవి కాదు ఆయన గురించి మహామహులు చెప్పినవి, ఇప్పటికీ చెప్తున్నవి.

ఆయన రాసిన 40 కథలని విశాలాంధ్ర వారు వేసిన సంపుటిలో చదివాను.  వాటన్నిటి కంటే కూడా నాకు ఫేస్ బుక్ లో వేంపల్లి షరీఫ్ గారి ‘కథ’ గ్రూప్ ద్వారా పరిచయమైన రమణమూర్తి గారు పంపిన ఆఁవెఁత”  కథ ఎంతో నచ్చింది.

ఈ కథ నాకెలా దొరికిందంటే ….

వేంపల్లి షరీఫ్ గారు విశాలాంధ్ర వారు వేసిన చాసో కథల సంపుటిలోని అన్ని కథలూ చదివి  ‘చెప్పకు చెప్పకు’  అనే కథ పేరు నచ్చక – “ఆ పేరు నన్ను ఆకట్టుకోలేదు అందుకే చదవలేదు కాని ఇదొక్కటి ఎందుకు వదలాలిలే అని చదివాను చదివాక అర్థమైంది అది ఎంత మంచి కథో”  అని రాశారు కథ గ్రూప్ లో.

అప్పుడు గొరుసుగారు “ఆవెత కథని చదివితే చాసో విశ్వరూప దర్శనం లభిస్తుంది” అన్నారు.

రమణమూర్తి గారు “విశాలాంధ్ర వాళ్ళు వేసిన పుస్తకంలో లేని కథని షరీఫ్ ఎలా చదువుతాడు?  నా దగ్గర ఉంది  కావాల్సిన వాళ్ళు అడిగితే ఇస్తా”  అని ఊరించారు.  తాయిలం ఇస్తానంటే ఎవరు అడగరు చెప్పండి ఆయన ఆశ పెట్టడం కాకపోతే! రమణమూర్తి గారూ,  ఆ కథ  నాకు పంపగలరా?  నా ఇ మెయిల్ … అని టైప్ చేయగానే  ‘వామ్మో! ఇది ఫేస్ బుక్ కదా ఇ మెయిల్ అడ్రస్ ఇస్తే కొంప కొల్లేరు అవదూ’  అనుకుని ఆయన టైమ్ లైన్ కి వెళ్ళి మెసేజ్ పెట్టా.  వెంటనే రమణమూర్తి గారు “ఆఁవెఁత”  కథని పంపారు.  ఆ కథ చదవగానే గొరుసు గారు అన్నట్లు నాకు చాసో గారి సారస్వత  విశ్వరూప దర్శనం అయింది.  స్త్రీ స్వేచ్ఛపై సంపూర్ణ అవగాహన కలిగింది.

స్వేచ్ఛ ఉండాలిట స్త్రీకి సమస్త స్త్రీ జాతితో కలిసి మగవాళ్ళు కూడా (వ్యంగ్యంగా) అరుస్తున్నారు.  ఏ విధంగా ఉంటుంది? స్వేచ్ఛ ఉండాలంటే ముఖ్యంగా కావాల్సింది డబ్బు.  అది లేనపుడు స్త్రీని బానిసని చేయడానికి సంఘం, కట్టుకున్న భర్త ఆఖరికి కన్న తల్లి దండ్రులు కూడా వెనుకాడటం లేదు.  అవినీతికీ, అధికారానికీ, డబ్బుసంపాదనకీ స్త్రీని ఎరగా మారుస్తున్నారు – ఈ నిజాన్ని గుండెల్లో గుచ్చుకునేట్లు అలవోకగా చెప్పి తప్పుకుంటాడు చాసో ఈ కథలో మనల్ని వదిలేసి.  గుండెల్లో ఆ మంట ఆరడానికి మనకి చాలా రోజులు పడుతుంది.

‘ఆఁవెఁత’  అంటే ‘విందు’ అట.  గతిలేని ఓ స్త్రీ, భర్త చేసిన అప్పు – తమ పెళ్ళి కోసం చేసిన అప్పుని కట్టడానికి ఓ డబ్బున్న మగవాడికి విందుగా మారడమే ఈ కథ.

పెళ్ళయ్యాక ఆమె పారాణి కూడా ఆరిందో లేదో పెళ్లి కోసం చేసిన అప్పు తీర్చడానికి రంగూన్ వెళ్ళిపోతాడు చాకలి దాలిగాడు.  వాడటు వెళ్ళగానే ‘భర్త లేకుండా పాపం దానికి ఎట్లా నిద్రపట్టేది’ అని ప్రతి వాడూ “ఏమంటావు ఏమంటావు” అని ఆమె వెంట పడుతుంటారు.

ఆ ఊళ్ళో వాళ్ళు ఆమెని దక్కించుకోవాలని,  దాలిగాడు రంగూన్ లో ఒకదాన్ని మరిగాడనీ ఇక రాడనీ కథలు పుట్టిస్తారు.  ఆ ఊరివాడే పెళ్ళి కాని చిన్నవాడు శాస్త్రి ఆమె అమ్మకి డబ్బు ఆశ చూపించి కూతురిని తన దగ్గరకి పంపమంటాడు. దాలిగాడు నిజంగానే రావడం లేదు ఎన్నాళ్ళయినా ఇక డబ్బున్న శాస్త్రే గతి అని నిర్ణయించుకున్న ఆమె అమ్మ కూతురిని శాస్త్రి దగ్గరకి పంపుతుంది.  అట్లా ఆమెని లోబరుచుకుంటాడు శాస్త్రి.  పొలంలో మంచి గదీ, మంచం, పుస్తకాలు, టీకి సరంజామా వాటితో పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు ఇచ్చి ఆమె  “విందు” తెప్పించుకుంటుంటాడు.  అతనికి లోబడుతున్న ప్రతిసారీ మనసుకీ, తనువుకీ సుఖమిచ్చిన భర్తకి అన్యాయం చేస్తున్నానని ఆమె పడే బాధ – అమాయకమైన ఆమె మాటలతో మన గుండె లోతులని స్పృశిస్తాడు చాసో.

ఇంతకు ముందు ఎవరూ చెప్పని సందేశాన్ని సున్నితంగా చెప్పడమే చాసో కథల ప్రత్యేకతట.  ఆ  నాడు (1950-51) ఆయన చెప్దామనుకున్నదేమిటో అందరికీ స్పష్టమే కాని ఇప్పుడు చదివే వారికి ముఖ్యంగా ఆర్థికంగా ఎదిగిన ఇప్పటి స్త్రీకి ఈ కథ వల్ల తగిన నూతన సందేశం తప్పకుండా అందుతుంది.

ఈనాటి స్త్రీ (ఎక్కువ శాతం)  ఆర్థికంగా నిలదొక్కుకుంది నిజమే కాని దానితో పాటు ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, వివేక విచక్షణా జ్ఞానాన్ని అలవరచుకోవాలి.  లోపల –  లోలోపల నిజమైన స్వేచ్ఛని పొందాలి.  అలా లేని నాడు పురాతన స్త్రీకి భిన్నంగా మగవాడి పెత్తనాన్ని తప్పించుకోగలదేమో కాని అధికార వ్యామోహానికీ, అహంకారానికీ, అసూయాద్వేషాలకీ,  ధనకాంక్ష కీ బానిస అవుతుంది  అన్న విషయం నాకు గ్రహింపుకి తెచ్చిన కథకుల కథకుడు చాసోకి వందనాలు.

 

    ***

radhamanduva1–రాధ మండువ

  —    రాధ మండువ

నాకు నచ్చిన చాసో కథ: “ఎందుకు పారేస్తాను నాన్నా?”

images

చాసోని కథకుల కథకుడుగా వర్ణించారు కొకు. ఆ మాటేమో నిజమే. కానీ అందుకు నిదర్శనం? చాసో ఏ కథ తీసుకున్నా అందుకు నిదర్శనం కనపడుతుంది. ముఖ్యంగా ఆయన శిల్పాన్ని గమనిస్తే అందుకు తార్కాణాలు కథ కథలోను కనిపిస్తాయి. “వాయులీనం”, “ఏలూరెళ్ళాలి”, “బొండుమల్లెలు”, “ఎంపు”, “కుంకుడాకు” ఇంకా ఎన్నో…! ప్రతి కథలో ఓ వైవిధ్యమైన కథా వస్తువు, అలవోకగా సాగిపోయే నడక, అమాంతంగా వచ్చి మీదపడే ముగింపు. ఇవన్నీ గమనించుకుంటూ చదివితే ప్రతి కథకుడూ ఓ మెట్టు పైకెక్కడం ఖాయం. అలా ఎదిగిన ప్రతి కథకుడూ మళ్ళీ అదే మాట అంటాడు – “చాసో కథకుల కథకుడు” అని.

చాసో కథలలో బాగా నచ్చిన కథ ఏది అంటే చెప్పటం చాలా కష్టం. “ఎంపు” నేను మొట్టమొదట చదివిన చాసో కథ. అందులో నిష్కర్షగా, కఠోరంగా ఓ చెప్పిన జీవిత పాఠాన్ని ఆకళింపు చేసుకోడానికి గడిపిన ఒంటరి రాత్రి గుర్తొస్తుంది. “వాయులోనం” కథ చదవడం అయిపోయినా అందులో లీనమై బయటపడలేక గిలగిలలాడిన సందర్భం గుర్తుకొస్తుంది. కనీసం పది కథలు గుర్తొస్తాయి. అయితే ఇవన్నీ పాఠకుడిగా. ఈ మధ్యకాలంలో ఓ కథకుడిగా ఆయన్ని మళ్ళీ చదివినప్పుడు నాకు చాసోలో కనపడ్డవి జీవిత పాఠాలే కాదు, కథా రచన పాఠాలు కూడా. ఆ దృష్టికోణంలో చూస్తే నాకు చాలా బాగా నచ్చినది, ప్రభావితం చేసినది “ఎందుకు పారేస్తాను నాన్నా” అనే కథ.

(కథ చదవనివారుంటే ఆ కథని చదివి ఈ వ్యాసం కొనసాగించగలరు. ఇక్కడినుంచి తొలిపఠనానుభూతిని తగ్గించే సంగతులు వుండగలవు)

కృష్ణుడనే కుర్రవాడు. చదవాలని ఆశ. పేదరికం వాడి చదువుని మింగేసిన భూతం. తండ్రి చుట్టలు తెమ్మంటాడు. బడిమీదుగా పోక తప్పదు. నామోషీగా అటు వైపు వెళ్తాడు. నరిశింహం, శకుంతల అనే సహాధ్యాయులతో మాట్లాడతాడు. బడి మొదలైనా అక్కడి వరండాలో స్తంభానికి జేరబడి వుండిపోతాడు. తండ్రి వెతుక్కుంటూ వస్తాడు. కొడుకు బాధని తెలుసుకుంటాడు. కొడుకు బాధని తనూ పడతాడు. చుట్టాలు తెమ్మని ఇచ్చిన డబ్బులు వున్నాయా పారేశావా అంటాడు. – “ప… ప్ప… ప్పారీలేదు. జేబులో ఉన్నాయి… ఎందుకు పారేస్తాను నాన్నా?” అంటాడు కృష్ణుడు.

ఆ వాక్యంతో కథ అయిపోయింది. అదే వాక్యంలో మాట కథకి శీర్షిక అయ్యింది.

అదలా పక్కనపెడదాం. ఏమిటీ కథలో గొప్పదనం? చెప్పాలనుకున్న విషయం చిన్నదే. స్పష్టంగా చెప్పేడు కూడా. “ఎందుకు పారేస్తాను నాన్నా?” అన్న ఒక్క ప్రశ్న ఎన్ని ప్రశ్నలు పుట్టిస్తుంది? “ఎందుకు పారేస్తాను? ఎలా పారేస్తాను? నాకు బాధ్యత తెలుసు కదా నాన్నా. నా చదువాపేసిన పేదరికం గురించి కూడా తెలుసు కదా నాన్నా. ప్రతి రూపాయినీ పారేయకుండా ఉంచుకుంటే అవి నా పుస్తకాలకు పనికొస్తాయనీ తెలుసు కదా నాన్నా..” అంటూ పిల్లాడు అడిగనట్లు అనిపిస్తుంది. అంతకు ముందే పుస్తకం కొంటానని మాట ఇచ్చిన నాన్న, చుట్టలు మానేస్తే కృష్ణుడి జీతానికి సరిపోతుందనుకున్న నాన్నా, పిల్లాడు పారేయకుండా వుంచిన డబ్బుతో అప్పటికప్పుడు ఇంగ్లీషు పుస్తకం కొన్నాడా? ఎమో తెలియదు. కానీ తెలుసుకోవాలనిపిస్తుంది. కథ అయిపోయిన తరువాత ఏం జరిగుంటుందో అన్న ఆలోచనపుడుతుంది. ఇలా జరిగి వుంటే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చేదాకా వెంటాడుతుంది. అదీ గొప్ప ముగింపు లక్షణం. చాసొ ప్రతి కథలో, (ప్రత్యేకించి ఈ కథలో) ఇలాంటి ముగింపులే వుంటాయి. తెలుగు కథలలో వచ్చిన అత్యుత్తమ ముగింపు వాక్యాలు రాస్తే అందులో పదింట అయిదు చాసోవి వుండితీరాల్సిందే..!

ముగింపుకు అంత బలం ఎక్కడ్నుంచి వచ్చింది? కథ మొదటి ముగింపుకి బలాన్ని ఇస్తూనే వుంటాడు చాసో. వాతావరణ చిత్రణ, పాత్ర చిత్రణ అన్నీ క్రమంగా ఈ సొరంగం తొవ్వుతున్నట్లు నిర్దేశించిన ముగింపు వైపు వెళుతూనే వుంటాయి. పాఠకుడి గమనించినా గమనించకపోయినా.

(కేవలం ఆరు పేజీల కథ ఇది. నేను పూర్తిగా విశ్లేషిస్తే అంతకన్నా ఎక్కువే అవుతుందేమో)

chaganti somayajulu copy

కృష్ణుడి పాత్రని తీసుకుందాం –

మూడో వాక్యంలోనే అనేస్తాడు – “కృష్ణుడి వీధి ముఖం చూడకుండా, మొగుడు చచ్చిన విధవలాగ ఇంట్లో దూరి కూచుంటున్నాడు” అని. చదువు మానేయడం వల్ల కలిగిన నామోషి కారణంగా బయటికి వెళ్ళని కుర్రాడు. ఇది కథ మొదలౌతూనే పాఠకుడి తెలిసేలా చెప్పేశాడు కథకుడు. తరువాత కథలో కృష్ణుడి మానసిక స్థితిని వర్ణిస్తాడు -కళకళలాడుతున్న “బడి చూడగానే బెంగ పట్టుకుంది”. ఒక చోట “నామోషి” అయితే మరో చోట “నామర్దా” అంటాడు. “చదువుతున్న కుర్రాళ్ళమీద ఈర్ష, తనకి చదువులేకుండా పోయిందన్న దుఃఖము – రెండూ రెండు లేడిక పాములై అతని బుర్రని కరకర లాడిస్తున్నాయి” అంటాడు. “తనకు చదువుపోయింది కదా అని కుమిలిపోతున్నాడు”. “(డిస్కంటిన్యూడ్ అన్న..) పదం జ్ఞాపకం రాగానే అతనికి దుఃఖము పొర్లుకుంటూ వచ్చింది…” ఇలా అడుగడుగునా కృష్ణుడి బాధని మన బాధ చేసేస్తాడు కథకుడు.

నరిశింహంతో మాట్లాడినప్పుడు కృష్ణుడు వాడి ముందు ఎంత అల్పుడో చెప్తాడు. నరిశింహం వేసుకునే డబుల్ కప్పు చెక్కా, హవానా పేంటు గురించి చెప్పి కృష్ణుడి నిక్కరులో వున్న పోస్టాఫీసు, చినిగిపోతే కుట్టగా బుట్టలా భుజాలు పైకి లేచే చొక్కా గురించి చెప్తాడు. అక్కడితో ఆగకుండా – “పేంటుకైతే బట్ట ఎక్కువ పడుతుంది. బట్ట ఎక్కువైతే డబ్బు ఎక్కువవుతుందని వాడికి తెలుసు” అంటాడు. ఈ వాక్యాన్ని కథ ముగింపు వాక్యంతో కలిపి చదవండి. ఆర్థిక అవసరాలు, డబ్బుల విలువ తెలుసుకున్న పిల్లాడు కృష్ణుడు. కాదూ పేదరికం నేర్పించిన పాఠాలను ఆకళింపు చేసుకున్నవాడు. వీడు కథానాయకుడు.

మరో నాలుగు వాక్యాలు ప్రయాణించగానే నరిశింహం ముందు అల్పుడిలా కనపడ్డ కృష్ణుడ్ని వెంటనే వామనావతారంలా పెంచేస్తాడు. “కృష్ణుడు మార్కుల గొడవ తేగానే గొప్పవాడైపోయాడు. తెలివైనవాడు కాబట్టే నలుగురూ గౌరవిస్తున్నారు” అంటాడు. తెలివితేటలు వుండి చదువుకోలేని అశక్తత ప్రదర్శించడం వల్ల ఆ పాత్ర మీద సింపతీ పెరుగుతుంది కదా..! అక్కడ్నుంచి కథంతా అదే ప్రదర్శన కొనసాగుతుంది.

enduku

శకుంతల కూడా తెలివైనదే. ఆ పిల్ల ఇంగ్లీషులో ఫస్టు. కృష్ణుడు తెలుగులో, లెక్కల్లో ఫస్ట్. గమనించండి లెక్కల్లో ఫస్ట్. డబ్బుకి లెక్కలకి వున్న సంబంధం డబ్బు పట్ల వుండే జాగ్రత్తే కదా..!! లెక్కలు బాగా వచ్చిన పిల్లాడికి డబ్బు విలువ తెలియకుండా ఎలా వుంటుంది. కలిసిన ఇద్దరు పిల్లలూ బడిలోకి రమ్మంటారు. కృష్ణుడి రానని చెప్పడు. అప్పటికే తన తల్లి తండ్రికి నచ్చజెప్పినా, తండ్రిమాటే నెగ్గుతుందనీ “చదువుకి స్వస్తి చెప్పడమే ఖాయమనీ” అప్పటికే నిర్థారించుకోని వుంటాడు. అయినా కలిసిన పిల్లలతో (ఒకటికి రెండుసార్లు) సోమవారం నుంచి బళ్ళో చెరుతానని చెప్తాడు. తన మనసులో వున్న ఆశని వాళ్ళ మీద ప్రొజెక్ట్ చేస్తాడు. ఓ క్షణం శకుంతలని వెనక్కి పిలిచి చెప్పేయబోతాడు కానీ తమాయించుకుంటాడు.

బళ్ళో వొంటరిగా స్తంభానికి జేరిబడి కూర్చోని తాను లేకుండా జరిగిపోతున్న క్లాసులను వింటాడు. గత సంవత్సరం జరిగిన క్లాసుల్లో తన ప్రతిభను గుర్తుచేసుకుంటాడు. స్కూలు మానేసిన మరో కుర్రవాడి పేరు కొట్టేసి “డిస్కంటిన్యూడ్” అని రిజిస్టర్లో రాసిన సంగతి గుర్తు చేసుకుంటాడు. తన భవిష్యత్తు ఏమిటా అని ఆలోచిస్తాడు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది.. మూడింటిని కలిపితే “దుఃఖం పొర్లుకుంటూ” వస్తుంది.

“నేను ఇంటికి వెళ్ళను” అని అనుకుంటాడు. ముక్కు దిబ్బడేసిపోతుంది. “ముక్కుని ఎగబీల్చుకుంటూ పొంగుకొస్తున్న దుఃఖానికి ఆనకట్టలు” వేస్తాడే తప్ప ఏడవడు. మరెప్పుడు ఏడుస్తాడు? వాళ్ళ నాన్న వచ్చాక.

“వాళ్ళంతా బడికెళ్ళారు!”

“వెర్రి నాగమ్మా. అదిరా” అన్నాడు తండ్రి.

అప్పుడు ఏడ్చాడు. “వెక్కి వెక్కి చుట్టుకుపోతూ ఏడుపు మొదలెట్టాడు. కొడుకు బాధంతా తండ్రికి బోధపడ్డాది. కొడుకు బాధంతా తండ్రి పడ్డాడు.” అంటాడు చాసో. ఒక్క వాక్యం. ఆ ఒక్క వాక్యంతో కృష్ణుడు ఆపుకున్న ఏడుపుకి ఓ ప్రయోజనం చేకూరుస్తాడు.

ఈ కథలో విలన్ ఎవరు? మనకి బాధ కలుగుతుంది నిజమే. కోపం కూడా వస్తుంది. ఎవరి మీద? తెలియదు. పరిస్థితులా? పేదరికమా? అసమానతలా? ప్రభుత్వమా? తెలియదు. కోపం ఎవరి మీదో తెలియక అది కూడా దుఃఖంగా మారుతుంది.

తండ్రి మీద కోప్పడగలమా?

“చదువు మానిపించానని అంత బాధపడుతున్నావా? బడి వరండాలు పట్టుకుని దేవుళ్ళాడుతున్నావా నాయనా? పద ఇంటికి” అన్న తండ్రి మీద మీకు కోపం వస్తోందా?

“(పుస్తకాలు) కొందాం, పద. ఏడవకు నాయనా, నే చచ్చిపోయాను, ఏడవకు!” అని తండ్రిని చూస్తే మీకు ఏడుపొస్తుందా కోపం కలుగుతుందా?

అదే తండ్రి తాగుబోతు అయ్యింటే? కొడుకు అత్తెసరు విద్యార్థి అయితే? ఏ పాత్ర ఎలా వుండాలో. ఏ వాక్యం ఎంత వుండాలో. ఏ పదం ఎక్కడ వెయ్యాలో. ఏ అక్షరం ఏ భావాన్ని కలిగిస్తుందో – తూకం వేసినట్లు రాయటమే చాసో గొప్పదనం.

ఇలా లెక్కలు వేసి కథలు రాయవచ్చు. ఆలోచించి కథని అల్లవచ్చు. కానీ చాసో లెక్కలు వెయ్యలేదు. ఆలోచించి రాయలేదు. వాటంతట అవే వచ్చి అలా కూర్చున్నాయి. ఇప్పుడు మనం వాటినికి “బైసెక్ట్” చేసి వాటిని ఫార్ములా కనిపెట్టుకోడానికి వాడుకుంటున్నాం. అంచేత, చాసో కథకుల కథకుడే కాదు. కథకుల పాలిటి ఓ లైబ్రరీ, ఓ లాబరేటరీ కూడా.

– అరిపిరాల సత్యప్రసాద్

aripirala

దళిత అస్తిత్వ పతాక నామ్ దేవ్ ధాసల్!

 art-culture-dalit-poet-namdeo-dhasal-dead.jpg itok=MkqHycCs

1970 ల్లో మరాఠీ సాహిత్యాన్ని, మొత్తం భారతీయ సాహిత్య రంగాన్నే  తీవ్ర సంచలనానికి గురిచేసి ఒక్క కుదుపు కుదిపిన ప్రముఖ కవి నామ్ దేవ్ ధాసల్ కనుమూసారు. ఆంగ్లం, జర్మన్ , ఫ్రెంచ్ , ఇటాలియన్ తదితర భాషల్లోకి అనువదింపబడి దళిత అస్తిత్వానికీ , పోరాటాలకూ ప్రతీకకగా నిలిచిన నామ్ దేవ్ ధాసల్ కవిత్వం చాలా పదునైనది. తీవ్రమైన భావవేశంతో, పదజాలంతో, అప్పటి దాకా తన మాటను, ఆలోచననూ, మొత్తంగా మరాఠీ సాహిత్యాన్ని నియంత్రించిన బ్రాహ్మణ మను వాద భావజాలాన్ని, భాషనూ తుత్తునియలు చేసి కొత్త భాష, కొత్త డిక్షన్ , కొత్త ఆలొచనల పద సామగ్రి కనుక్కొన్నారు ధాసల్ .

అమెరికా లో బ్లాక్ పాంథర్స్ ఉద్యమం ప్రేరణతో,  మహరాష్ట్రలో 1972 లో  దళిత పులుల ఉద్యమాన్ని   (dalit panthers movement)       ప్రారంభించి, ప్రదాన పాత్ర వహించారు. దళిత పులుల ఉద్యమం రాడికల్ రాజకీయాలని కార్యాచరణనూ సమర్థించి ఆచరించింది. 1973 లో గొల్పిత కవితా సంకలనం తో మరాఠీ సాహిత్యరంగం లో  ఒక కెరటమై విరుచుకుపడి , పెను ప్రభంజనమై వీచారు. ఆయన రాసిన ఒక్కో పద్యం ఒక్కో డైనమైటై పేలింది. బ్రాహ్మణ వాద, మను వాద సంప్రదాయాల్ని, సంకెళ్ళనీ , కట్టుబాట్లనీ ధిక్కరించి దళితుల విముక్తి కోసం తన ప్రతి పద్యాన్ని అతి తీవ్రమైన పదజాలంతో, ఆగ్రహ భావావేశాల్తో ఆయుధాల్లా సంధించారు నామ్ దేవ్ ధాసల్. బొంబాయి నగరం లోని అట్టడుగు ప్రజానీకం కోసం నామ్ దేవ్ ధాసల్ తన కవిత్వాన్నీ రాజకీయ కార్యాచరణనూ అంకితం చేసారు.

కామాటిపురా రెడ్ లైట్ ఏరియా లోని వేశ్యల హక్కుల కోసం, జీవితం తమని శపిస్తే రోడ్డు పక్క ఫుట్ పాత్ లపై, రైల్వే స్టేషన్ లలో, చింపేసిన విస్తరాకుల్లా, ఆకలీ, పేదరికమూ, మాదక పదార్థాలకు అలవాటు పడిన బాల్యాన్ని అక్కున చేర్చుకున్నారు.  నోరు లేని వారికి నోరిచ్చారు. ఆత్మలు అణచివేయబడి దోచుకోబడ్డ వారికి తన కవిత్వంతో ధిక్కార ఆత్మలనిచ్చారు. మరాఠీ మధ్యతరగతి వెసులుబాటు సుఖలాలసతకు, భద్రలోక జీవితపు విలువలకూ, అభిప్రాయాలకూ పెద్ద షాక్ ట్రీట్ మెంటు ఇచ్చారు నామ్ దేవ్ . మావోయిస్టు భావాలతోనూ కవిత్వం రాసారు. తన కవిత్వంతో దళిత సాహిత్యం లో వినూత్న సంతకం చేసారు. అనేక కవితా సంకలనాలను ప్రచురించారు ఆయన కవిత్వం ఆంగ్లం లో “Poet of the Underworld” అనే పేరు తో ప్రచురితమైంది.

అయితే దళిత పులుల ఉద్యమం యెక్కువ రోజులు కొనసాగలేకపోయింది.. 1980 ల కల్లా దళిత పులుల ఉద్యమంలో పగుళ్ళు ప్రారంభమైనయి. నామ్ దేవ్ దళిత ఉద్యమాన్ని ఇంకా విశాలం చేసి పీడిత ప్రజలందరినీ  అందులో భాగస్వామ్యం చేయాలని ఆశించాడు. తన రాజకీయ కార్యాచరణ అట్లా ప్రకటించాడు కానీ అది మిగతా వారికి నచ్చలేదు. తమ ఉద్యమం కేవలం దళితులకే పరిమితం చేయాలి అని పట్టు బట్టారు. రాజకీయంగా చైతన్యమై విప్లవాత్మక ధిక్కారం ప్రకటించిన దళితులని మనువాద బ్రాహ్మణవాద పార్టీలు అనేక ప్రలోభాలకు లోను చేసినయి. ఒక తాత్విక, రాజకీయ యేక సూత్రత లేని దళిత పులుల ఉద్యమకారులు రాజకీయ పార్టీల అనేక కుట్రలకు బలై పోయారు. చెట్టుకొకరూ పుట్ట కొకరూ అయి పోయారు. నామ్ దేవ్ క్రమంగా మద్యానికి అలవాటు పడ్డాడు.  ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. 1990 ల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ నామ్ దేవ్ కరుడు గట్టిన మనువాద బ్రాహ్మణ వాద పార్టే శివసేన లో చేరాడు. అందులోనూ ఇమడలేదు. అయితే యెప్పటికప్పుడు తన రాజకీయ తప్పిదాలను , మెరుపుల్లాంటి తన కవిత్వంతో , పిడుగుల్లాంటి తన రాతలతో మరిపించే వాడు. క్రమంగా అనారోగ్యం బారిన పడ్డాడు. 2007 లో చికిత్సకైన ఖర్చు భరించడానికి ఇల్లు అమ్మబోతే సినీ నటులు అమితాబ్ బచ్చన్ సల్మాన్ ఖాన్ నిధులు సమకూర్చి నామ్ దేవ్ కు సాయపడ్డారు. . చివరి రోజుల్లో కాన్సర్ తొ బాధ పడుతూ ఆసుపత్రిలో కనుమూసారు.

రాజకీయంగా కొన్ని తప్పిదాలుగా చేసినా నామ్ దేవ్ సాహిత్యంలో చేసిన కృషీ , సాధించిన విజయాలూ అసమానమైనవి.  కరుడు గట్టిన బ్రాహ్మణవాద మనువాద చాందస భావజాలాన్ని, దుర్మార్గాలని , సంకెళ్ళని సవాలు చేస్తూ ధికరిస్తూ అవి చిరకాలం నిలిచే ఉంటాయి. దళితుల విముక్తి కోసం నిరంతరం కలలు గని దళిత అస్తిత్వం కొరకు పోరాడిన గొప్ప విప్లవకవి నామ్ దేవ్  చిరస్మరణీయుడు!  శ్రీ శ్రీ గురించి కాళోజీ  “నువు రాసి పారేసిన కవితలు గుబాళిస్తుంటే నువు తాగి పారేసిన సారా సీసాల కంపు మాకెందుకు” అని అన్నారు. అది ఈ రోజు నామ్ దేవ్ ధాసల్ కి సరిగ్గా సరిపోతుంది.

nanded

పంజరమంత బలంగా యేమీ లేదు.

పంజరం లో పిట్ట ఆశ కోల్పోయి

ఆలోచనల్లో మునిగిపోయింది.

బయట గుంపులోంచి ఒక పావురం

పంజరంలోని పిట్టతో అందిలా ..

మేము నిన్ను తప్పక చెర విడిపిస్తాం.
విధిలిఖితం అని చింతించకు
యెన్నడైనా విధి బందీ ఐన   వారిని విడిపించిందా?

సిద్దంగా ఉండు –
నీ రెక్కలకు తుప్పు పట్టనీయకు
రేపు అనంతాకాశంలో అంతెత్తున రివ్వున యెగరాలి నువ్వు!

 


—————————

ఆట

 

చూసాను అతన్ని

యెన్నో సార్లు తిరస్కరించాను

ఊరూరా తిరిగే నా శవం

ఈ సాయంత్రం వెలుగులో నిశ్చలంగా ఎదిరిచూస్తోంది

 

యెవడో తాగుబోతు దేవునికి ఫోన్ చేస్తున్నాడు

కుళ్ళి కృశించే జాలీ సానుభూతీ చూపకు నాపైన

బహుశా మన సంబంధం ముగిసిపోయిందేమో

బుజాల్ని విదిలించేయి దాన్ని వదిలించుకో

అట్లైనా, 
ఈ నీళ్ళని
గొడ్డలి తో నరకగలుగుతావేమో!

 —————————

కామాటి పురా

ఒక నిశాచర ముళ్ళపంది విశ్రమిస్తోందిక్కడ

ప్రలోభపెట్టే  బూడిద పుష్పగుచ్చం లా!

వంటినిండా శతాబ్దాల సిఫిలిస్ పొక్కులతో …
తన కలల్లో తానే కోల్పోయి
కాలాన్ని క్రూరంగా తరిమేస్తుంది.
మనిషి నోటి మాట పడిపోయింది.

తన దేవుడు బేదులు పెట్టిన అస్తిపంజరం.

ఈ శూన్యానికో గొంతు దొరుకుతుందా ,
ఒక మాటవుతుందా ఎప్పుడైనా?

నీక్కావాలనిపిస్తే దానిమీద ఒక ఇనుప కన్ను వేసి చూడు
దానిలో కన్నీటి చుక్క ఉంటే దాన్ని గడ్డకట్టించు!  కాపాడు!!

దాని చూపులు నిన్ను సమ్మోహనం చేసి
పిచ్చి ఉన్మాదం లోకి నెట్టేస్తాయి

ముళ్ళపంది హఠాత్తుగా నిద్రలేచి

నిన్ను యెక్కుపెట్టిన పదునైన ముళ్ళతో వెంటాడి
వొళ్ళంతా తూట్లు పొడిచి గాయపరుస్తుంది.

రాత్రి తన పెళ్ళికొడుకు కోసం సిద్ధమవుతూంటే

గాయాలు పుష్పిస్తాయి

అనంత పుష్ప సముద్రాలు పొంగిపొర్లుతాయి

నెమళ్ళు నాట్యం చేస్తాయి
ఇది నరకం

ఇది సుళ్ళు తిరిగే భయంకర మృత్యుగుండం

ఇది వికారమైన వేదన

ఇది గజ్జెలు కట్టి నాట్యమాడే  నొప్పి.

 

నీ చర్మాన్ని వదిలేయి.

వేర్ల నుండీ నీ చర్మాన్ని వలిచేయి.

ఈ విషపూరితమైన శాశ్వత  గర్భాలు విచ్చిన్నం కానీ!

ఈ స్పర్శ కోల్పోయిన మాంసపు ముద్దకు  అంగాల్ని మొలకెత్తనీకు!!
ఇదిగో దీన్ని రుచి చూడు

పొటాస్సియమ్ సయనైడ్ !

నువ్వు మరణిస్తున్నప్పటు క్షణంలో
వెయ్యోవంతు లిప్తలో
పాతాళంలోకి కుంగిపొతున్న నీ ప్రాణపు రుచిని  రాయి!
రాండ్రి!

మృత్య్వుని రుచి చూడాలనుకున్న వాళ్ళంతా
విషపు రుచి ఉప్పనో పుల్లనో తెలుసుకోవడాని
ఇక్కడ క్యూ కట్టుండ్రి!

మృత్యువు  ఆవృతమౌతుందిక్కడ
కవిత్వపు పదాల్లాగే …..
కొంచెం సేపట్లో కుంభవృష్టి కుర్వబోతోంది!

ఓ కామాటిపురా!

అన్ని రుతువులని నీ చంకలో బంధించి

బురదలో

కూలబడి ఉంటావలా!

నా వ్యభిచారాల సుఖాల్నన్నింటినీ దాటి

యెదిరిచూస్తాను
ఈ బురదలో
నీ పద్మం వికసించడం కోసం!

నారాయణస్వామి వెంకట యోగి

–నారాయణ స్వామి వెంకట యోగి

” యిన్నాళ్ళ బ్రతుకే ఒక బోనస్” : ఆ పోరాట వీరుడి ఆఖరి వాక్యం!

పోరాటాల  మల్లారెడ్డి

పోరాటాల మల్లారెడ్డి

ఆగస్టు 23 (2011) వుదయాన  ఫోన్, మిత్రుడు కుంబాల మల్లారెడ్డి యిక లేడని. . క్యాన్సర్ వ్యాధితో యేడు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం యిక ముగిసింది. అంతకు రెండు రోజుల ముందే పరామర్శించడానికి వెళ్లి, దిగులు పడుతూనే ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తే, ‘ఎప్పుడో పోవాల్సిన ప్రాణం కదా, యిన్నాళ్ళ బ్రతుకే ఒక బోనస్’ అని జవాబు చెప్పిన మనిషి.

ఏమని చెప్పుకోవాలి మల్లారెడ్డి గురించి? చీకటిలో కనిపించని నీడల గురించి, వెలుతురు మెరుపులలో విస్మృతమయే దీపాల గురించి, మాటల సవ్వడిలో వినిపించని మౌనం గురించి, సుదీర్ఘ పయనంలో గుర్తించని దురాల గురించి, వుత్సవంలో వెలుగు చూడని విషాదాల గురించి..ఎప్పుడో రాండాల్ స్వింగ్లర్ రాసాడు కదా..

వీధులన్నీ విద్యుత్తేజంతో వురకలేస్తూ

కరతాళ ధ్వనులతో మార్మోగుతున్నపుడు

కవాతు చేసే మన వూహల లయతోనే

భేరీలు మోగుతున్నపుడు

గొంతెత్తి పాడడం తేలిక ..

జనసమూహం జాగృతమై

మనం రుజువు చేయదల్చుకున్నదాన్నే కోరుకుంటున్నపుడు

కదంతొక్కేలా మాట్లాడడమూ తేలికే

కన్నుపొడిచినా కనిపించని కటిక చీకటిలో

నిప్పురవ్వని దావానలంగా విస్తరించే వొడుపుతో

వెలుగువైపు నడిపించడం అంత తేలిక కాదు

ఎవరు చూడనిదీ, గుర్తించనిదే అసలైన పని

మల్లారెడ్డి గురించి మాట్లాడటమంటే ఎవరు చూడని, గుర్తించని పనుల గురిచి చెప్పుకోవడమే.

ఎమర్జెన్సీ అనంతర కాలం కరీంనగర్ జిల్లాలో భూస్వామ్య వ్యతిరేక రైతాంగ పోరాటాల వెల్లువ పెల్లుబికిన కాలం. సిరిసిల్ల, జగిత్యాల జైత్రయాత్రల కాలం. ‘దొరల కాలికింది ధూళి ఎగిసి వాళ్ళ కళ్ళలో పడిన చోటు ‘కల్లోలిత ప్రాంతం’గా ప్రకటించిన కాలం. రైతాంగ పోరాటాలు అటు సామాజిక ఆచరణలో, ఇటు సైద్ధాంతిక రంగంలో కొతాచుపునీ, కోణాలని ఆవిష్కరించిన కాలం. దానితోపాటు ఆ ఉద్యమాల ముందు కొత్త సమస్యలూ ముందుకొచ్చాయి. విశాలమైన పునాదిపై ఐక్యతని నిలబెట్టుకోవడం, ఉద్యమాన్ని సంఘటిత పరచుకోవడం, విస్తృతం చేయడం, భూస్వామ్య వ్యతిరేక ప్రతిఘటనని అభివృద్ధి చేయడం, భూస్వాములకి అనుకూలంగా ప్రభుత్వం అమలు జరుపుతున్న నిర్బంధాన్ని తట్టుకుని నిలబడటం – ఇవి ఆనాడు వుద్యమం ముందుకొచ్చిన సమస్యలు. 1982 లో సిరిసిల్ల, వేములవాడ రైతాంగ పోరాటాలపై ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ప్రచురించిన వ్యాసం ఆనాటికి ప్రభుత్వ నిర్బంధమే కీలకమైన సమస్యగా మారిన విషయాన్ని గుర్తించింది. ఆరోజులలో (రోడ్డు)పదిర గ్రామ సర్పంచిగా, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేసిన యువకుడు మల్లారెడ్డి.

1985 తర్వాత, ‘ఆట, పాట, మాట’ అన్నీ బంద్ అయిన కర్కశ, నిరంకుశ పాలన రాజ్యమేలింది. కరీంనగర్ జిల్లా రైతాంగ పోరాటంలో ముందుకొచ్చిన వ్యక్తులు, నాయకులు వుద్యమ విస్తరణ అవసరాల రీత్యా యితర ప్రాంతాలకి తరలడమో, బూటకపు ఎదురుకాల్పుల్లో బలికావడమో జరిగింది. ఆ రోజుల్లో మల్లారెడ్డి యేమయ్యాడో చాలామందికి తెలియదు. ఉవ్వెత్తున వుద్యమాలు యెగిసినప్పుడు మెరిసిన మనుషులు తర్వాతి కాలంలో వొడుదుడుకులు  యెదురైనప్పుడు తెరమరుగు కావడం సహజమే. మల్లారెడ్డి ఆచూకి మాత్రం చాలా మందికి తెలియలేదు. మిత్రులకీ, బంధువులకీ, శత్రువులకీ.

పార్టి రహస్య నిర్మాణంలో అనుసంధానకర్తగా మల్లారెడ్డి నిర్వహించిన బాధ్యతల గురించి యెవరు చెప్పగలరు? అవి అజ్ఞాత జీవితపు అజ్ఞాత వివరాలే కదా. ఒక వ్యక్తి బహు ముఖాలుగా, అనేక పేర్లు వొకే ముఖంగా, పరిచిత ముఖాల మధ్య వొక అపరిచితునిగా, అనామకునిగా నిలిచిన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించగలిగేదెవరు? చిరుద్యోగిగా, చిరువ్యాపారిగా, చిరపరిచిత మిత్రునిగా, చుట్టపుచూపుగా అప్పుడప్పుడూ వచ్చిపోయే బంధువుగా తారసపడే వ్యక్తి రూపాన్ని బట్టి అతను నిర్వహించే బాధ్యతలని యెవరూ వూహించలేరు. కలుసుకోబోయే మనిషిని బట్టి, స్థలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వొక వ్యక్తి యెన్నెన్ని పేర్లు, యెన్నెన్ని రూపాలలో యెదురవుతాడో లెక్కపెట్టిందెవ్వరు? ఎప్పుడు పొంచివుండే ప్రమాదాన్ని అలవోకగా ధిక్కరించిన  నిర్లక్ష్యంతో, అవసరానికి మించి యేమీ మాట్లాడని జాగ్రత్తని మేళవించి అనామకంగా మిగిలిపోవడానికి తాను చూపిన శ్రద్ధ విలక్షణమైనది.

ఉద్యమాలు సమూహపు స్వప్నాల లాంటివి. కొన్ని సార్లు కలలు చెదిరిపోవచ్చు. శత్రువులు చిదిమివేయవచ్చు. లాంగ్ స్టన్ హ్యూస్ వాయిడా పడిన కల గురించి చెబుతాడుకదా,

వాయిదా పడిన కలకి యేమవుతుంది?

ఎండిన ద్రాక్ష పండులా ముడుచుకు పోతుందా?

గాయంలా సలుపుతూ

 స్రవిస్తుందా?

కుళ్ళిన మాంసంలా

గౌలుకంపు కొడుతుందా?

తీయటి పొరలా

పేరుకపోతుందా?

బహుశా వొక దింపుకోలేని బరువులా

వేలాడుతుందా?

లేక పెఠీల్లుమంటూ

పేలిపోతుందా?

కల చెదిరినా లొంగిపో నిరాకరించేమనిషి యేమౌతాడు? మల్లారెడ్డి యేమయ్యాడు? ఏకాకి కాకున్నా మల్లారెడ్డి వొక వొంటరి మనిషి. తనదొక వొంటరి యుద్ధం. తానెంచుకున్న పోరాట రంగంలో పదిమందిని కూడగట్టి న్యాయం కోసం పోరాడాడు. నాయకత్వం కోసం, పేరు కోసం, ప్రాపకం కోసం అర్రులు చాచే కాలంలో తాను ముందుకి రాకుండా, తెరవెనుకే నిలబడి బస్తీ ప్రజలని సంఘటితం చేశాడు. మనసుని వెంటాడే కల చెదిరిన దు:ఖానికి మనిషిని నిలువెల్లా కుంగదీసే క్యాన్సర్ వ్యాధి తోడైతే యెలా వుంటుంది? ఇక్కడ కూడా మల్లారెడ్డి ద్రుడంగా నిలబడ్డాడు. తనవలెనే క్యాన్సర్ వ్యాధి పాలైన మరొక మితృనికి ఆసరాగా నిలబడ్డాడు. ఊరటనిచ్చేందుకు శాయశక్తులా కృషి చేశాడు. జీవితమొక యుద్ధరంగం.. కల చెదిరిన మనిషి వొక అనామక సైనికుడు.. మల్లారెడ్డిని తలచుకోవడమంటే కలల్ని నిలబెట్టుకోవడానికి మనిషి వొంటరిగానూ, సాముహికంగానూ చేయాల్సిన కృషిని బేరీజు వేసుకోవడమే.

ఎక్కడినుంచి వెలుగుతుందో తెలియదు

బయలుదేరి వెళ్లిపోయాక గానీ

గుర్తించని చిరునవ్వు వెలుతురు

మేఘాల చాటున కనిపించని నక్షత్రం

ఎందరికి ఆసరాగా నిలిచిందీ తెలియదు

ఒంటరి యుద్ధంలో గాయపడ్డాకగానీ

వెలుగులోకి రాని రహస్య జీవితం

మౌనంలో ప్రతిధ్వనించే నిశ్సబ్ద నినాదం

ఎప్పుడు ఎవరు నాటారో తెలియదు

తొలకరి జల్లు కురిశాక గానీ

కనిపించని రైతు పాదముద్ర

నాగేటి చాళ్లలో మొలిచిన రహస్యోద్యమ సందేశం

ఎటునుంచి ఎటు వీచిందో తెలియదు

కరచాలనం చేసి మాట్లాడాక గానీ

అనుభవంలోకి రాని సహజ స్నేహ పరిమళం

పంటపొలాల్ని మోసుకొచ్చిన సిరిసిల్ల పైరగాలి

మల్లారెడ్డికి జోహార్లు..

  సుధా కిరణ్

సాహసానికి ఇంకో పేరు: రంగవల్లి!

3

(విప్లవోద్యమ నాయకురాలిగా తెలుగు నేలకు సుపరిచితమైన రంగవల్లి 1999 నవంబర్ 11 న ములుగు అడవుల్లో బూటకపు ఎంకౌంటర్ లో పోలీసుల చేత హత్య చేయబడింది. హత్యచేయబడ్డప్పుడు ఆమె పేరు జ్యోతక్క. అంతకు ముందు ఉమక్క గా కూడా చాలా మందికి చిరపరిచితురాలే! PDSU (ప్రగతిశీల విద్యార్థి సంఘం) మాస పత్రిక విజృంభణ సంపాదక కమిటీ నాయకురాలిగా, మహిళా ఉద్యమ నాయకురాలిగా, పల్నాడు భూపోరాటాల నాయకురాలిగా, గోదావరీ లోయ విప్లవోద్యమ నాయకురాలిగా రంగవల్లి జీవితాన్ని పీడిత ప్రజల కోసం త్యాగం చేసిన మహోన్నత మానవతామూర్తి  రంగవల్లి. ఆమెతో ఉద్యమంలో కలిసి పనిచేసిన పరిచయాన్నీ , నా అనుభవాల్నీ , మర్చిపోలేని జ్ఞాపకాల్లా  చెప్పే ప్రయత్నం ఇది).

 

1987 ఆగస్టు నెలలో ఒక రోజు… వర్షా కాలం.. సాయంత్రం 8:55… బయట భోరుమని వర్షం – భీకరమైన ఈదురు గాలులు – ముసురుకున్న  చీకట్లు – మధ్య మధ్యలో ఆకాశం కసిగా నవ్వినట్టు మెరుపులు ….

కిటికీ రెక్కలు విరిగి పోయేటంతగా కొట్టుకుంటుంటే ఒకటొకటే అతి కష్టం మీద మూస్తూ ‘ఈ తుఫాను వానలో ఈ రాత్రి తను ఇంక రాదు ఈ పూటకు మన సమావేశం లేనట్టే ‘ అన్నాన్నేను చారి తో. ‘అవును నిజమే ఈ వానకు  ఆటోలు కూడా నడవడం కష్టం.. తనెట్లా వస్తుంది? సమావేశం మరో రోజు పెట్టుకోవాల్సిందే! కనీసం మనం యేదైనా వండుకునైనా తిందాం’ అని చారి వంటగది వైపు నడిచాడు. ఈ లోపల ఠపీ మని లైటు కూడా పోయింది. గాలివానకు యెక్కడో కరంటు తీగ తెగిపోయి ఉంటుంది. మెల్లగా వెతికి దీపం వెలిగించాం. రూం లోపలికి గాలివాన తోసుకొస్తోందా అన్నట్టు దీపం వణికిపోతోంది.

హైదరాబాదులో మెహ్దీ పట్నం దాటాక కాకతీయ నగర్ నుండి ఒక మూడు  కిలోమీటర్ల దూరంలో గుడిమల్కాపూర్ కి పోయే దారిలో,  అప్పటికింకా యిళ్ళూ కాలనీలూ యేమీ లేని చోట విసిరేసినట్టుగా ఉండేది నా రూం. అపుడప్పుడే కాలేజీ లో లెక్చరర్ గా చేరాక దగ్గరగా ఉంటుందని అక్కడ కిరాయకు తీసుకున్నా! 118టి అని కోటి నుండి ఒకే ఒక బస్సు ఉండేది – అదీ యెప్పుడు వస్తుందో తెలియదు – ప్రతిసారీ కాకతీయ నగర్ దగ్గర బేర్బన్ బస్టాప్ లో దిగి నడిచేది రూం కి. వచ్చే వాళ్లంతా విసుక్కునే వాళ్లు సెంటర్కి యింత దూరం తీసుకున్నావేమిటంటూ – అయితే సెంటర్ కి దూరంగా ఉండడం వల్లనూ జనసంచారం పెద్దగా లేకపోవడం వల్లనూ నా రూం అనేక సమావేశాలకు అనువైన ప్రదేశంగా ఉండేది. యెప్పుడు పడితే అప్పుడు, నేనున్నా లేక పోయినా రూం లో సమావేశాలు నడుస్తూనే ఉండేవి. ఇంటికి పార్టీ ప్రదాన నాయకత్వం అంతా నిరభ్యంతరంగా వస్తూ పోతూ ఉండే వారు.  అప్పుడు నేను యితర అనేకానేక సాహిత్య సాంస్కృతిక బాధ్యత ల్లో భాగంగా విజృంభణ పత్రిక ప్రచురణ కూడా చూస్తూ ఉండేది.

మా టీం లో చారి ప్రధాన సభ్యుడు. అట్లా ఆ సాయంత్రం నా రూం లో యేర్పాటైన సమావేశం 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండింది. అంత భయంకరమైన వానలో, తుఫాను హోరుగాలిలో మానవమాత్రులెవరూ రారు రాలేరని నిర్ధారించుకుని ఇంక వంట కార్యక్రమం మొదలుబెడదామనుకున్నాం. యింతలో టక టక ఇంటి తలుపు చప్పుడు. భీకరమైన గాలి పెద్ద చేతులు చాపి తలుపులు బాదుతుందిలే అనుకున్నామిద్దరం. ఈ సారి మరింత పెద్దగా తలుపు చప్పుడు. ఆశ్చర్యపోయాం. ఖచ్చితంగా పోలీసులే సమావేశం వివరాలు తెలిసి దాడిచెయ్యడానికి వచ్చారు అనుకుని కొయ్యబారిపోయాం. వెనక తలుపు నుకంచి పారిపోదామా అంటే బయట పరిస్థితి బీభత్సం. అయినా పోలీసులైనా మనుషులే కదా యింత వానలో రావడం అసంభవం అనుకున్నాం. యేదో మళ్ళీ గాలివానే కావచ్చులే  అనుకుంటుండగానే మళ్ళి తలుపు టక టక … ఇంక ఇద్దరికీ పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. ధైర్యం చిక్కబట్టుకుని కిటికీ రెక్క కొద్దిగా తెరవబోతే విసురుగా వాన చెళ్ళుమని చరిచింది.

యింక లాభం లేదని ‘యెవరూ ‘ అని అరిచాం … మా గొంతు మాకే వినబడలేదు … తలుపులు తీయాలా వద్దా పెద్ద మీమాంస.. మళ్ళి టక టక … యేమయితే అయింది అనుకుని మెల్లగా తలుపు తీసాం … బయట తను .. గాలి వానకు విరిగిపోయిన చెత్రీ తో పూర్తిగా తడిసి ముద్దై పోయి వణుకుతూ … ‘అక్కా మీరా….’ నిర్ఘాంత పోయాం చారీ నేనూ  –  ఈ రాత్రి ఈ వానలో మీరొక్కరే యెట్లా వచ్చారు అసలెందికింత సాహసం చేసారు మీకేమనా అయితే? యేమిటీ పిచ్చిపని ?”

ప్రశ్నల వర్షం … అసలు లోపలికి రానిస్తారా లేదా అంటూ లోపలికి తలుపు తోసుకుని వచ్చింది ఒక పెద్ద నీళ్లమూటలా … వెంటనే పరిగెత్తుకెళ్ళి తువ్వాల తెచ్చిచ్చా – తను అంతకు ముందు అడపా దడపా సమావేశాలు వస్తూ ఉండేది గనక తనవి మరో జత బట్టలున్నటు గుర్తుకొచ్చి అదే చెప్పా తనకు .. అవును కదూ అంటూ లోపలికి వెళ్ళింది తను…. నేనూ చారీ ముఖాలు చూసుకున్నాం గొప్ప సంభ్రమాశ్చర్యాలతో… అసలు ఊహించలేదు కదా తను వస్తుందని .. ఈ వానలో బస్సు లుండవు ఆటొ వాడు కూడా ఇటువైపు రావడానికి సాహసించడు.. యెట్లా వచ్చి ఉంటుంది? ఈ చీకట్లో ఈ భయంకరమైన ఈదురుగాలిలో ఈ  తుఫాను వానలో ఇంతదూరం యెట్లా వచ్చింది తను?

నేనూ చారి యిట్లా ప్రశ్నించుకుంటుండగా యేమిటీ యేదొ గునుగుతున్నరు? అనుకుంటూ లోపలినుండి పొడి బట్టలు కట్టుకుని తలార బెట్టుకుంటూ బయటికొచ్చింది.

‘అక్కా! యేమిటీ పిచ్చి పని – అసలెట్లా వచ్చిండ్రు మీరు? ఈ తుఫానులో ఈ చీకట్లో ఒక్కరే?  యేమైనా అయితే?’ ‘యేం యేమవుతుంది? ఈ ప్రాంతమంతా సేఫేలే’ ‘అట్లా అని కాదు – ఈ పూట బస్సులు కూడా ఉండవు కదా’  …. అవును బస్సులు లేవు ఆటోలూ లేవు –

‘ ‘మరి యేట్లా వచ్చారు?’

‘ నడుచుకుంటూ- ‘ ‘యెక్కడ్నుండి?’  ‘మెహిదీ పట్నం నుండి’ అంటే దాదాపు ఆరు కిలోమీటర్లు .. వానలో చలిలో క్రూరంగా విసిరి కొట్టే ఈదురు గాలిలో – యెందుకక్కా యింత సాహసం?’

‘మరి సమావేశం కదా ముఖ్యం కాదూ? ఈ పూట మనం కలవక పోతే నాకు మళ్ళా వారం దాకా కుదరదు – ఈ సమావేశం జరగక పోతే పత్రిక ఆలస్యం అవుతుంది – ఇప్పుడిప్పుడె పత్రికకు ప్రచారం లబించి యెక్కువ మంది చదువుతున్నారు – ప్రతి నెల మొదటి తారీకున పుస్తకాల షాపుల్లో అడిగి మరీ కొనుక్కుంటున్నారు – పత్రికకు క్వాలిటీ తో పాటు రెగులారిటీ కూడా చాల ముఖ్యం’  అంది తను మిణుకు మిణుకుమంటూ వణుకుతున్న దీపంవెలుగులో మిలమిలా  మెరిసే నిర్మలమైన కళ్లతో..

పదండి కూర్చుందాం!!  వచ్చే నెల పత్రికలో యేమేమి వస్తే   బాగుంటుందో అనుకుందాం – యేమైనా తిని మొదలు పెడదామా అక్కా? ‘ఆకలిగా ఉందా సర్లే యింత అన్నం కుకర్ లో పడేస్తే యేదయినా పచ్చడి తో తినొచ్చు – అన్నమయే లోపల పత్రిక వ్యాసాలు చర్చించుకోవచ్చు – చారీ ఇంత అన్నం కుకర్ లో పెట్టు – స్వామీ పత్రిక మీటింగ్ మినట్స్ బుక్ తీయి’  అంటూ చారిని నన్నూ పురమాయించింది తను.

2

ఆ రోజు అట్లా ప్రకృతికి వ్యతిరేకంగా యుద్ధం చేసి పి డి యెస్ యూ విజృంభణ పత్రిక సకాలంలో రావడానికి అవసరమైన నాయకత్వాన్నిచ్చిన ఆ అక్కే రంగవల్లి.

కల్సినప్పుడల్లా గొప్ప  ఉత్తేజాన్నిచ్చేది. మమ్మల్ని  చాల మంది ‘నాయకులు’ కల్సే వారు. యెన్నెన్నో చర్చించే వారు, తాత్విక, రాజకీయ, సామాజిక సాంస్క్టృతిక అంశాల మీద తమ విశ్లేషణ చేసి , అనేక సూచనలు చేసే వారు. సంస్థ యెట్లా నడవాలో, దాన్ని ఇంకా మేము యెంత సమర్థవంతంగా నడపవచ్చునో, యింకా మేము యెంత కృషి చేయవచ్చునో – తదితర అంశాల గురించి అనర్గళంగా ఉపన్యాసాలిచ్చే వారు. కానీ సంస్థ లో పనిచేసే కాడర్ కూడా మామూలు మనుషులేనని, వారికి అనేక సాధక బాధకాలుంటాయని పూర్తికాలం పనిచేసే వాళ్లు తమ జీవితాలని మొత్తంగా యేమీ ఆశించకుండా గొప్ప త్యాగనిరతితో సంస్థ కోసం పనిచేస్తున్నారనీ వారిని మానవీయ దృక్పథం తో చూడాలని ఆలోచించే అతి తక్కువ నాయకుల్లో రంగవల్లి ఒకరు.

అట్లే, సంస్థ కోసం part-time పని చేస్తూ తమ చేతనైనంత సహాయ సహకారాలని అందించే సానుభూతి పరుల సాధక బాధకాలని యెంతో ఆత్మీయంగా అడిగి పట్టించుకుని  వీలైనంత సహాయం చేసేది రంగవల్లి. ముందు తనెవరింటికి వెళ్ళీనా యే పని మీద వెళ్ళీనా ముందు అందరి గురించీ, ఇంట్లో పరిస్థితుల గురించీ ముందు అడిగి తెలుసుకుని, బాగోగులు పట్టించుకునేది. యింట్లో వారికి యేమేమి కావాలో అడిగి తెల్సుకుని వీలైనంత సహాయం చేసి కానీ తర్వాత పార్టీ పనుల గురించి సంస్థ పనుల గురించీ మాట్లాడేది కాదు.

తన దగ్గర యేమున్నా అది వెనుకా ముందూ చూడకుండా,   ఆలోచించకుండా అడగ్గానే ఇచ్చేసేది. యెంత డబ్బు ఉంటే అంత, బట్టలేవయినా ఉంటే తనకంటూ చూసుకోకుండా యిచ్చేసేది. ఇది తనది అంటూ యెన్నడూ చెపుకోని అపురూపమైన మానవి రంగవల్లి.  తను యెవరింటికి వెళ్ళినా ముందు వారు కడుపునిండా తిన్నారా లేదో కనుక్కుని అప్పుడు తినడానికి యేమైనా ఉందా అని అడిగేది. యేది ఉంటే అది, యేది పెడితే అది తినేది. యెప్పుడూ మాయని మల్లెపూవు లాంటి చిరునవ్వు తో, యేనాడూ అలసట యెరుగని ఉత్తేజ పూరితమైన ముఖంతో, భేషజాలు, పట్టింపులూ లేని నిష్కల్మషమైన పలకరింపుతో గొప్ప మానవీయతకు ప్రతిరూపంలా ఉండేది రంగవల్లి.

మొదటి సారి తనని చూడడం చాలా చిత్రమైన పరిస్థితుల్లో జరిగింది. నేను యింజనీరింగ్ రెండవ సంవత్సరంలో అప్పుడప్పుడే PDSU కార్యక్రమాల్లో పాల్గొంటున్న క్రమంలో సెక్రటేరియట్  ముందు పెద్ద దర్నాలో పాల్గొన్నాం. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ముందువరసలో ఉన్న నాయకులతో ఇద్దరు ముగ్గురు పోలీసు ఇన్స్పెక్టర్లు పెద్ద పెద్దగా అరుస్తున్నారు, బెదిరిస్తున్నారు, తోసేస్తున్నారు – విద్యార్థి నాయకుల్లో ముందువరసలో ఉన్నవాళ్లలో ఒక అమ్మాయి కూడా ఉంది. సన్నగా రివటలా బక్క అలచగా ఉన్న ఆ అమ్మాయి గొంతెత్తి సమాధానం చెప్తోంది, నినాదాలిస్తోంది. మొరటుగా క్రూరంగా కర్కశంగా ఉన్న మగ పోలీసు ఆఫీసర్లని యెదిరించి ధైర్యంగా మాట్లాడుతోంది.

నిండా 17 యేండ్లున్న నాకు అది గొప్ప అచ్చెరువునొందించిన సందర్భం. యిప్పటికీ దాదాపు 30 యేండ్ల తర్వాత కూడా చాలా వివరంగా గుర్తుంది. నిన్న గాక మొన్న జరిగినంత తాజా గా ఉంది జ్ఞాపకాల్లో! యింతలో పెద్ద కోలాహలం చెలరేగింది. మేము చూస్తుండగానే పోలీసులు ఆ అమ్మాయిని తోసేసి కొట్టబోయారు. ఆమె వెంటనే ఆడ పులిలా లంఘించి ఆ ఇన్స్పెక్టర్ ని లాగి ఓ చెంపకాయ కొట్టింది. అప్పటిదాకా క్రూరంగా అధికారం ప్రదర్శిస్తూ చెలరేగిన  రాజ్య , పోలీసు అహంకారాల తల మీద మేమెవవరమూ కొట్టలేని దెబ్బ కొట్టింది. ఉద్యమిస్తున్న విద్యార్థులకు పెద్ద ఊపునిచ్చింది. సంభ్రమాశ్చర్యాలతో నాకు  చాలా సేపు నోటమాట రాలేదు. అప్పటిదాకా శ్రీ శ్రీ ని దిగంబర కవులనీ, తిరగబడు కవులనీ చదివి తీవ్రమైన ఆవేశంతో అన్యాయాల మీద వాటిని సమర్థించే అధికారం మీద దెబ్బ వేయాలని వువ్విళ్ళూరుతున్నా – నా కళ్ళ ముందే యే మాత్రం ఊహించని విధంగా ఆ అమ్మాయి అట్లా పోలీసుని కొట్టే సరికి బిత్తరపోయాను. తర్వాత మా ధర్నా మీద పెద్ద యెత్తున లాఠీ చార్జీ జరిగింది. అంతా చెల్లాచెదురయ్యారు. నేను పక్కనే ఉన్న పెద్ద గోతిలో పడి (ఇప్పుడక్కడ వెలసి ఉన్న పెద్ద హోటల్ కట్టడానికి తీసిన గోతి) చీకటి పడేదాకా నక్కి తర్వాత కాళ్ళీడ్చుకుంటూ హాస్టల్ కి వెళ్ళిపోయాను.

కానీ ఆమె యెవరో యెక్కడుంటుందో క్ర్రూరమైన అధికారాన్ని అంత నిర్భయంగా యెదిరించే ధైర్య సాహసాలు ఆమెకెట్లా వచ్చాయో తెల్సుకోవాలని చాలా ఉత్సుకతగా ఉండేది. తర్వాత తెలిసింది ఆమె రంగవల్లి అనీ, PDSU నాయకురాలనీ, OU లో విద్యార్థిని అనీ. ఒకసారయినా ఆమెని కలవాలనీ ఆ ధైర్యాన్ని కొంచెమైనా పొందాలనీ అనుకుంటున్న సందర్భం లో PDSU లో మరింత చురుకుగా పాల్గొంటున్న సందర్భంలో ఒక సారి యెవరో దూరం నుండి చూపించారు – అదిగో ఆమే రంగవల్లి అక్క అని. క్రమేణా తాను మరిన్ని సంస్థాగత బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా పనిచేస్తుందని  తెల్సింది. నేనూ సాహిత్యం, సాంస్కృతికరంగం లో పని చేస్తూ విరసం కార్యక్రమాల్లో తలమునకలైపోయాను. మళ్ళీ యెప్పుడూ బహిరంగంగా తనని చూసే అవకాశం కలగలేదు.

సాహిత్యరంగం లో నాకున్న ఆసక్తి కారణంగా PDSU పత్రిక విజృంభణ పత్రిక బాధ్యతలు చూసుకొమ్మన్నారు. విజృంభణ పత్రిక సంపాదక వర్గంలో మాధవస్వామి (నా ప్రియ మిత్రుడూ, కవీ  – కర్నూల్ లో డాక్టర్ గా పనిచేస్తూ ఈ మధ్యే ఆకస్మికంగా కనుమూసాడు) , చారీ, మధుసూధన్ రెడ్డి, ప్రకాష్  , కిరణ్ , నేనూ ఉండే వాళ్లం. ప్రకాష్ ,  కిరణ్ నాకు జే యెన్ టీ యూ కాలేజీ రోజుల్నుంచీ అత్యంత ప్రియ మిత్రులూ ఉద్యమంలోనూ జీవితం లోనూ చాలా సన్నిహితులూ. మాకు పైనుంచి మార్గదర్శకత్వం వహించడానికి యెవరో ఒకరు వచ్చే వారు. అట్లా మా కమిటీ కి నాయకురాలుగా , ఒక అక్క రాబోతుందని చెప్పారు. యెవరో తెలియదు. ఒకానొక సమావేశానికి తాను రానే వచ్చింది. గుడ్డి వెలుతురు చీకట్లో ఆమెను ముందు పోల్చుకోలేదు. నిజమైన పేరు తెలియదు కాబట్టి ఆమె యెవరో ఊహిస్తూ ఉన్న సందర్భంలో చారి అనుకుంటా చెప్పాడు – ఆమెనే రంగవల్లి అక్క అని.

నోట్లో మాట పెగల్లేదు చాలా సేపు. యెంత సౌమ్యంగా మాట్లాడింది? యెంత అణకువా, యెంతా intellectual humility? యెంత ప్రేమా యెంత అనునయమూ – ఈమె నేనా ఆరోజు సెక్రటేరియట్ ముందు పోలీసు ఇన్స్పెక్టర్ ని చాచి లెంపకాయ కొట్టింది అని పదే పదే అనుకున్నా. తర్వాత తర్వాత రోజుల్లో చాల సన్నిహితంగా కల్సిపోయింది మాతో! తానో నాయకురాలు అని యెప్పుడూ అనుకునేది కాదు. కానీ తన మాటలతో, జ్ఞానంతో, పరిశీలనా విశ్లేషణలతో మమ్మల్ని ఆశ్చర్యపరిచేది. మా నుండి గొప్ప గౌరవాన్ని పొందేది. తనకు తెలిసిన విషయాలపట్ల యెంత command తో మాట్లాడేదో తనకు తెలవని విషయాల పట్ల చిన్న పిల్లల అమాయకత్వంతో ఉత్సుకత ప్రదర్శించేది. యెప్పుడూ తనకు తెలిసింది చెప్పుకుని ప్రదర్శించాలనే దుగ్ధ కన్నా తెలియంది నేర్చుకోవాలనే తపనే యెక్కువ తనకు. అట్లా మా విజృంభణ కమిటీ సమావేశాలకు (మాధవ స్వామి కర్నూల్ కి, మధుసూధన రెడ్డి భోనగిరి దగ్గర తన స్కూల్ కి, కిరణ్ వేరే బాధ్యతలకూ  వెళ్ళిపోయాక మిగిలిన మా యిద్దరితో కలవడానికి) క్రమం తప్పకుండా గొప్ప పట్టుదలతో క్రమశిక్షణతో హాజరయేది. అట్లా తర్వాత కాలంలో మాకు అత్యంత సన్నిహితమైంది.

 

Rangavalli2

1989 తర్వాత నా పెళ్ళయాక విద్యతో పద్మనాభ నగర్ లో మొదటి యిల్లు కిరాయకు తీసుకున్నాం. ఆ యింటికి ఒక మహిళా సమావేశం కోసం యితర మహిళా నాయకురాళ్లతో కలవడానికి వచ్చింది. అదే చెక్కు చెదరని చిరునవ్వు, నిష్కల్మషత్వం, నిర్మలత, సౌమ్యత – ప్రేమగా పలకరించే ఆత్మీయత – విద్య కు వెంటనే నచ్చేసింది. తను యెప్పుడు వచ్చినా విద్య తో ప్రత్యేకంగా యెంతో సేపు యెన్నో విషయాలు మాట్లాడేది. యిద్దరూ మంచి స్నేహితులైపోయారు అతి త్వరలోనే! క్రమ క్రమంగా తాను విభిన్న సంస్థాగత బాధ్యతలవల్లా పనుల వత్తిడి వల్లా రావడం తగ్గింది. మేమూ నానా యిండ్లూ నానా కారణాల వల్ల మారి చివరకు దోమల్ గూడ గగన్ మహల్ వెనుక ఒక బస్తీ లో యిల్లు తీసుకున్నాం. అప్పుడు యింక మా యిల్లు ఒక పార్టి కార్యాలయంలా ఉండేది. పార్టి తో పాటు అనేక సంస్థల కార్యాలయం కూడా! అనేక మంది వస్తూ పోతూ ఉండే వారు. అజ్ఞాతంలో ఉన్న నాయకులు కూడా వచ్చే వాళ్ళు. వాళ్లలో తానూ ఒకరు.

యెంత మంది వచ్చి పోయినా తాను వచ్చిందంటే నాకూ విద్యకూ యెంతో సంబరం. ఒక ఆత్మీయురాలు, ఒక ఆత్మబంధువు, సన్నిహితురాలు యింటికొచ్చినట్టు – మననుండి యేమీ (యేమంటే యేమీ) ఆశించకుండా యెప్పుడూ తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి వెళ్ళాలనే తపనతో ఉండేది. మాట్లాడినంత సేపూ ‘మీరెట్లా ఉన్నారు, యేమి ఇబ్బందులున్నాయి మీకు, యేమయినా కావాలా బట్టలు కానీ, వస్తువులు కానీ’  అంటూ ‘యింట్లో అది లేదా ఇది లేదా’  అని అడిగి తీసుకునే అనేక మంది నాయకులకు పూర్తి విరుద్ధంగా భిన్నంగా గొప్ప మానవీయత ప్రదర్శించేది.

బహుశా తను వచ్చినప్పుడల్లా ఒకే ఒక favor అడిగేది – ‘స్వామీ వీధి చివరదాకా వెళ్ళి యెవరైనా అనుమానాస్పదంగా ఉన్నారో లేక follow అయ్యారో చూసి రావా’ అంటూ పురమాయించేది.  అట్లా చేయడంలో  తనకేమైనా అవుతుందో అనే ఆత్రుత  కన్నా తాను వచ్చినందుకు మాకూ, ఫలితంగా విప్లవోద్యమానికీ యేమైనా నష్టం జరుగుతుందో అనే భయమే యెక్కువ కనబడేది నాకు. అజ్ఞాత జీవితంలో ఉన్న వారికి అది తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్త. అందుకే ఆమె అంటే విద్యా నేనూ అంత యిష్టపడేవాళ్లం. కించిత్తు అహంకారం కానీ, భేషజం కానీ లేకుండా, నిష్కల్మషంగా  ఒక నిర్మలమైన ప్రవాహం లాంటి రంగవల్లిని ప్రేమించకుండా ఉండడం అసాధ్యం!

వాసవీ కాలేజీ లో పనిచేస్తున్న రోజుల్లో ఒక రోజు,  ఒక రెండవ సంవత్సరం చదువుతున్న అజిత అనే ఒక అమ్మాయి నా ఆఫీసుకి వచ్చి మీకు రంగవల్లి ఆంటీ తెలుసట కదా అని అడిగింది. అవునూ యెందుకు అని అడిగాన్నేను. ఆంటీ నాకు బంధువు. నాకు పిన్నమ్మ అవుతుంది అని చెప్పింది. ఆ అమ్మాయి సామాజిక నేపథ్యం తెలిసిన నేను నివ్వెరపోయాను. నోట మాట రాలేదు నాకు. యేమిటీ రంగవల్లి నీకు పిన్నమ్మనా? నిజమా? అంటూ అజిత ను పదేపదే అడిగాను. తర్వాత తెలిసింది రంగవల్లి నాన్న, కుటుంబమూ, బంధువులూ బాగా ఉన్నత వర్గానికి చెందినవాళ్లనీ, తెలుగు నేలని శాసిస్తున్న రాజకీయార్థిక, ధనిక సామాజికవర్గానికి చెందిన వాళ్ళనీ తెలిసాక మరింత ఆశ్చర్య పోయాను.

అటువంటి నేపథ్యం నుండి వచ్చిన వారు విప్లవోద్యమంలోకి వచ్చినాక  కూడా యెట్లా ప్రవర్తించారో, యెంత అహంకారాన్ని, దర్పాన్ని, అధికారాన్ని, భేషజాన్ని ప్రదర్శించారో, ప్రదర్శిస్తున్నారో యెన్నో సార్లు నాకు అనుభవం – అట్లాంటి ప్రవర్తనని బహుశా కలలో కూడా యేనాడూ ప్రదర్శించని రంగవల్లిది ఒక అరుదైన వ్యక్తిత్వం. నిరంతరం విప్లవోద్యమం గురించీ పీడిత ప్రజల విముక్తి గురించీ, అన్యాయాలని వ్యవస్థీకృతం చేసిన అధికారం మెడలు వంచడం గురించి మాత్రమే తీక్షణంగా ఆలోచిస్తూ, విప్లవోద్యమంలో , పార్టీలో, సంస్థల్లో పనిచేసే వాళ్లని మానవీయ కోణంతో ఆత్మీయంగా అక్కున చేర్చుకున్న గొప్ప నాయకురాలు! పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు పార్టికి యేమి పని చేస్తారో, యెట్లా ఉపయోగపడతారో, యేమిస్తారో అని కాకుండా వారిని విప్లవోద్యమంలో సజీవమైన భాగం చేయడానికి పార్టీ నాయకురాలిగా, ఒక మనిషిగా ముందు వారికోసం తానేమి చేయగలనో , వారికి యేమి ఇవ్వగలనో అని నిరంతరం ఆలోచించే మహోన్నత వ్యక్తి రంగవల్లి,  చిరస్మరణీయురాలు!

1997 లో ప్లీనం  సమావేశాల తర్వాత, ఒక్క సారి కలిసింది! ‘యేమిటి స్వామీ అమెరికా వెళ్తున్నావట – శాశ్వతంగా అటేనా మళ్ళా వస్తావా? యెప్పుడొస్తావు మళ్ళీ’ అంటూ కళ్ళల్లో కదిలీ కదలని సన్నని నీటి పొరతో అడిగింది – నాకూ కండ్లల్ల నీళ్ళు తిరిగినయి – నా ఆత్మీయుడు మారోజు వీరన్నా అదే ప్రశ్న అడిగాడు.

ఆయనకీ, రంగవల్లికీ  యే సమాధానమూ చెప్పే ధైర్యం లేదప్పుడు. తర్వాత 1999 లో యిద్దరూ వెళ్ళిపోయారు. క్రూరమైన రాజ్యం అధికారం కోరలకు  బలైపోయారు.. యిప్పుడు సమాధానం నేను చెప్పాలనుకున్నా, నేను మళ్ళీ తిరిగి వచ్చినా,  యెన్నడూ కలవలేని, తిరిగి రాని లోకాలకు తరలిపోయారిద్దరూ. కానీ వారిద్దరి చిర్నవ్వూ, ఆత్మీయతా, నిష్కల్మషత్వమూ, అన్నింటికన్న మించి అద్భుతమైన మానవత్వమూ నన్నెప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. కలల్లోనూ వాస్తవంలోనూ….

 నారాయణస్వామి

నారాయణస్వామి వెంకట యోగి

నారాయణస్వామి వెంకట యోగి

సముద్రపు హోరుకి సరిగమల తోడు…మన్నాడే!

Manna-dey

“కడలిలెఒళవుం… కరళిలెమోహవుం.. అడజ్నుకిల్లొమనె అడజ్నుకిల్లా.. మానసమైనవరుం.. మధురం…”  అన్న మళయాళం పాట విన్నాను.

అబ్బ.. సముద్రపు హోరులో మెత్తగా సుతిమెత్తగా కలిసిపోయి ఆ స్వరం ఎవరిది? మన్నాడేది కాక?!

ఇరవై రెండుసార్లు ఆ సినిమా  ‘చెమ్మీన్’ చూశాను. సిల్వర్ స్క్రీన్ మీద చేయి తిరిగిన చిత్రకారుడు వేసిన పెయింటింగ్ లాంటిది ఆ సినిమా. దర్శకుడు రామూ కరియత్. సంగీత దర్శకుడు సలీల్ చౌధరి. నటీనటులు సత్యన్ , మధు, షీలా.. ఓహ్.. తలుచుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

ఓ బెంగాలీ క్లాసికల్ సింగర్ ఓ మళయాళ చిత్రంలో పాడటమా? అసలెందుకు పాడించాల్సి వచ్చింది? ఎందుకూ? ఆ పాట ‘మన్నాడే’ మాత్రమే పాడగలడు. విన్న ‘చెవులకి’ ఆ సముద్రపు హోరుని తనొక్కడే వినిపించగలడు.

యస్. ఎస్.ఎల్.సి చదివేటప్పుడు మా ఇంట్లో రేడియో లేదు. హోటల్ రామారావు ముందర్నించి నడుస్తూ వుంటే రోజూ ఏదో ఓ సమయంలో ఓ పాట వినిపించేది. అతను హిందీ పాటలే ఎక్కువ వినేవాడు. ‘వివిధ్ భారతి’.. ఆ పాటకి అర్ధం అప్పుడు నాకు తెలీదు. కానీ .. గుండెకి గాయమై ఒక్కో రక్తపు బొట్టు కారుతుంటే, భగ్న హృదయానికి ఎలాంటి ‘తీయని’ బాధ వుంటుందో ఆ బాధ నా మనసుకి అర్ధమయ్యేది. అది నవరంగ్‌లోని పాట.
“తూ చుపీ హై కహా.. మై తడప్తా యహా” అన్న (నువ్వెక్కడ దాక్కున్నావూ.. నేనిక్కడ తపిస్తూ వున్నాను) గీతం అది. ఆలపించేది నేనే అనిపించేది. ఎన్ని పాటలూ? ఎందరో గాయకులున్నారు. గుండెలోతుల్లోంచి ‘విషాదాన్ని’ వెలికి తీసిన ముఖేష్, పాటకే సొబగులు అద్దే రఫీ..

మలయమారుతంలా తాకే తలత్, ఉత్సాహంతో వెర్రిగంతులు వేయించే కిషోర్.. ఎందరో మహానుభావులు… మరి ఆకాశంలోకి ‘స్వరాన్ని’ రాకెట్‌లా పంపే మహేంద్రకపూర్?  అవును. అందరూ మహానుభావులే…. కానీ… మన్నాడే వేరు.. మనిషికి బట్టలు తొడిగినట్టు పాటకి ‘శరీరాన్ని’ తొడుగుతాడు.

‘ధర్తి కహే పుకార్ కే’ (దో భీగా జమీన్)  పాట వింటుంటే మనమూ తుళ్లిపోతాం.
‘మౌసం బీతాజాయ్’ అంటూ.. ‘తూ ప్యార్ కా సగర్  హై.. తెరీ ఇక్ భూంద్ సే ప్యాసే హమ్’ అని మన్నాభాయ్ పాడుతుంటే కళ్లవెంట విషాదమో, ఆవేదనో కాని అశృవుల్ని రాలుస్తూ ‘ధ్యానం’ లో మునిగిపోతాం.. ఏమంటాడూ..?  నీవో ప్రేమసముద్రానివి.. ఒక్క చుక్క ప్రేమ చాలు మా దాహం తీరడానికి..’ అంటాడు. (సినిమా – సీమ, రచన – శైలేంద్ర). ‘ఇధర్ ఝూమ్ కె గాయె జిందగి.. ఉదర్ హై మౌత్ ఖడి ‘ అన్న లైను వినగానే తటాల్న మేలుకుంటాం. అవును.. ‘జీవితం ఇక్కడ చిందులేస్తుంటే, అక్కడ మృత్యువు నోరు తెరుచుకుని సిద్ధంగా వుంది..’ ఎప్పుడు తనలో మనని కలుపుకుంటుందా అన్నదే ప్రశ్న. ఆ ప్రశ్న వేసిందెవరూ?  ‘మనకి మనమేనా?’  అన్నంత మాయలో ముంచుతుంది మన్నాడే స్వరం.

వెన్నెల రాత్రుల్లో వెర్రివాడిలాగా తిరుగుతూ పాడుకునేవాడ్ని. ‘ఏ రాత్ భీగి భీగి..’ అంటూ. ‘చాంద్’ ఉండక్కర్లా… చీకటైనా విరహవేదనే.. ‘ఠండీ హవా!’ గుండెను తాకుతోంది మిత్రమా…!

‘సుర్ నా సజే.. క్యా గావూ మై.. సుర్ కే బినా జీవన్ సూనా..’ (శృతి చేయలేనివాడ్ని.. ఏమని పాడను? శృతి లేని జీవితం.. స్వరం లేని జీవితం శూన్యం కాదా?) దేన్ని సృశించాలి? దేన్ని ‘స్వరిం’చాలి? జీవితాన్నేగా..!

‘కోరి చునరియా ఆత్ మా  మోరీ.. మైల్ హై మాయాజాల్ .. ఓ దునియా మేరే బాబుల్ కా ఘర్.. ఏ దునియా ససురాల్’ తెల్లని వస్త్రం లాంటిది నా ఆత్మ.. యీ మాయాలోకం ‘మైల’ (మరకలతో) నిండి వున్నది. ఆ లోకం నా పుట్టిల్లు.. యీ లోకం అత్తవారిల్లు.. అయ్యో… యీ ‘మరక’ పడ్డ వస్త్రంతో నా ‘తండ్రి’కి మొహం ఎలా చూపించనూ? అని రెండు లోకాల్ని ఒకేసారి చూపించే మన్నా మన మద్యలో లేరా? వెళ్లిపోయారా ఆలోకానికి.. మాయ నిండిన యీలోకాన్ని వొదిలి?

‘లాగా  చునరీ మే దాగ్. చుపావు కైసే’ పాట ‘రానివాడు’ గాయకుడిగా అనర్హుడు. ఎంత చిన్నదైనా, ఎంత గొప్పదైనా, ‘పాటలపోటీ’ అంటూ జరిగితే మాత్రం యీ పాట ఎవరో ఒకరు పాడాల్సిందే. లేకపోతే అది ‘సంగీత కార్యక్రమం’ ఎందుకవుతుంది? తేనెపట్టులోంచి వరసగా తేనెచుక్కలు రాలినట్లు మన గుండెల మీద వాలుతాయి ఆ స్వరాలు.. అదీ.. మన్నా మేజిక్ అంటే.. అందరూ క్లాసికల్, సెమి క్లసికల్ సాంగ్స్ పాడగలరు. కానీ, మన్నాడే ‘స్టైల్’ వేరు. అత్యంత సహజంగా పాడతారు. గొంతు ‘పాట’ మొదలెట్టినప్పుడు ఎంత ‘ఫ్రెష్’గా వుంటుందో, చిట్టచివరి లైన్ కూడా అంతే ఫ్రెష్‌గా వుంటుంది. అదీ పాటలోని ‘ఎమోషన్స్’ని వెదజల్లుతూ..  బంగారానికి సువాసన అబ్బితే ఎలా ఉంటుందో తెలీదు గానీ, మన్నాడే ‘స్వరం’లో ఆయన పాడిన ప్రతీ పాటకీ ఓ ‘చిరునామా’  దొరుకుతుంది.

‘ఏ కజ్‌రారీ  చంచల్ అఖియా.. హోట్ గులాబీ..’ అని రాజ్‌కుమార్ అభినయిస్తుంటే పరవశించని హృదయం ఉన్నదా?  ‘ఝనక్ ఝనక్ తేరీ బాజే పాయలియా’ పాటలో.. ఆ ‘పరవశం’ నింపింది మన్నాడే కాక మరెవరూ? నిజంగా మన్నాడే ‘జాదూ’ చేశారు.

‘కస్మే వాదే ప్యార్ వఫా.. సబ్ బాతే హై బాతోన్ కా క్యా?’ ఉప్‌కార్ సినిమాలో కళ్యాణ్‌జీ సంగీత నిర్దేశికత్వంలో ‘ఇందీవర్’ రాసిన యీ పాటని ‘మనసు’లోనే ‘ఆహ్వానించని మనిషి’ ఉండడు.

తేరీ సూరత్ మేరీ ఆంఖే’ సినిమాలో S.D.బర్మన్‌గారు శైలేంద్ర రాసిన ఓ అద్భుతమైన పాటని మన్నాడే చేత పాడించారు.

‘పూచోన కైసే మైనే రైన్ బితాయీ.. ఇక్ పల్ జైసే  ఇక్ యుగ్ బీతా.. యుగ్ బీతే మోహె నీంద్ నా ఆయే..’ శైలేంద్రగారి ‘భోజ్‌పురీ’ మెరుపులు చాలా సహజంగా మన్నాడే గొంతులో ఒదిగిపోయాయి. ముఖ్యంగా .. మోహే.. మోరా .. అనేవి. భాషకి అతీతుడేగా గాయకుడంటే! (స్నేహితులారా.. ఒక్కొక్క పాటనీ పూర్తిగా హిందీలో రాసి, తెలుగులో స్వేచ్చానువాదం  చేసి ‘వినిపించాలని’ వుంది. అంత పిచ్చెక్కుతోంది మన్నాడే పాటల్ని తలుచుకుని).

1965లో టాప్ 2nd  సాంగ్‌గా ‘బినాకా గీత్‌మాలా’లో వచ్చింది మన్నాడే పాడిన ‘ఆవో ట్విస్ట్ కరే’ పాట. మన్నాడే ఆ పాట పాడింది మెహ్‌మూద్ కోసం. సినిమా భూత్ బంగ్లా. సంగీతం ఆర్.డి.బర్మన్. రాసింది హస్రత్ జైపూరీ. పాయింట్లు 277. ఆయన ‘క్లాసికల్’ మాత్రమే కాదు ‘వెస్ట్రన్’ తోటీ ‘మేజిక్’ చెయ్యగలరని నిరూపించిన పాట అది. అదే సంవత్సరం రఫీ & మన్నాడే కలిసి పాడిన ‘ఏ దో దీవానే దిల్ కే చలే హై దేఖో మిల్ కే (జోహార్ మెహ్మూద్ ఇన్ గోవా.. సంగీతం-కళ్యాన్‌జీ- ఆనంద్‌జీ.. రచన కువర్ జలాలా బాదీ) 177 పాయింట్లతో 12వ పాటగా నిలిచింది. (మొత్తం 1965లో టాప్ 15 సాంగ్స్ లిస్ట్)

కాబూలీవాలా సినిమాలో ‘ఏ మేరే ప్యారే వతన్’ పాటని ఏ భారతీయుడైనా మర్చిపోతాడా? (సంగీతం సలీల్ చౌధరీ. రచన ప్రేమ్ ధవన్) అలాగే మరోపాట.. “పాడవోయి భారతీయుడా” అని శ్రీ శ్రీగారు రాసిన చిరస్మరణీయమైన పాట… హిందీలో సినిమా పేరు నాస్తిక్ (మన హైద్రాబాదీ ‘అజిత్’ హీరో. రాసింది ప్రదీప్.. సంగీతం సి.రామచంద్ర. ఆ పాట.. “దేఖ్ తేరే సంసార్‌కి  హాలత్ క్యా హోగయీ భగవాన్… కిత్‌నా బదల్ గయా ఇన్సాన్.” అనే పాట. ‘జానే అంజానే’ సినిమాలో శంకర్ జైకిషన్ స్వరపరచగా SH బిహారీ రాసిన “చమ్.. చమ్.. బాజేరే పాయలియా..!’  అనే పాట. అది గుండె చప్పుడుతో సహచర్యం చేస్తుంది. గుండెలో నాట్యం  చేయిస్తుంది. సీత ఔర్ గీతాలో ( ఆర్.డి. బర్మన్ – ఆనంద్ బక్షీ) ‘అభీ తో హాత్ మే జామ్ హై..’  పాటని ఎన్నిసార్లు ‘విస్కీ’తో ఆస్వాదించానో..

భయ్యా.. “దునియా బనానేవాలే.. క్యా తేరే మన్ మే”(శంకర్ జైకిషన్.. హస్రత్ జైపూరీ. సినిమా జిద్దీ) పాటలు వినకపోతే ‘కాహెకో దునియా బనాయీ? అని ఎలా ప్రశ్నించగలం? ‘బాత్ ఏక్ రాత్ కీ’లో ‘వో కిస్‌నే చిల్‌మన్ సే మారా… నజారా ముఝె.. ‘ (శంకర్ జైకిషన్.  మజ్రూహ్ రచన) అని మన్నాడే పాడుతుంటే పిచ్చెక్కదూ?

సోదరులారా.. సోదరీమణులారా.. క్షమించాలి. నా కళ్లు ‘నీలాల్ని’ వర్షిస్తున్నాయి. ఏడుపు తన్నుకొస్తుంది.

‘ఆజా సనమ్ మధుర్ చాంద్‌నీ మే హమ్..’   (శంకర్ జైకిషన్,  హస్రత్, చోరి చోరి సినిమా) ‘తుఝే సూరజ్ కహూ యా చందా (ఏక్ ఫూల్ దో మాలీ , కవి –  ప్రేమ్ ధవన్ రచన), కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే’ (మదన్‌మోహన్, రాజేంద్ర కృష్ణ. దేఖ్ కబీరా రోయా సినిమా), ‘శ్యామ్  ఢలే జమూన కినారే’ (తెలుగులో యమునా తీరమునా, సంధ్యా సమయమున…. లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఆనంద్ బక్షీ. పుష్పాంజలి సినిమా),’తుఝ్ బిన్ జీవన్, కైసే జీవన్(బావర్చీ సినిమా, మదన్‌మోహన్, కైఫీ ఆజ్మి), చునరీ సంభాల్ గోరీ.. ఉడీ చలీ జాయిరే (ఆర్.డి, మజ్రూహ్, బహారోన్ కి సప్నే సినిమా), మస్తీ భరా హై సమా…!’  (పర్వరిష్ సినిమా, హస్రత్ రచన, ఎన్.దత్తా) ‘తూ హై మేరా ప్రేమ్ దేవతా’ (ఓ.పి నయ్యర్, కమర్ జలాలాబాదీ, కల్పన సినిమా).

ఎన్ని పాటలు ఉదహరించను? భగవాన్. ఆయన మమ్మల్ని అలరించారు. పాటలతో మురిపించారు. నీలో మళ్లీ కలిసి పోవడానికి పుట్టింటికి అంటే నీ దగ్గరికి చేరిపోయారు. పోన్లే.. ” ఏ భాయ్ .. జరా దేఖ్ కే చలో’ అని మాకు జాగ్రత్తలు చెప్పే వెళ్లారుగా. జీవన వేదాంతం బోధించే వెళ్లారుగా.. ‘ కోయి బాత్ నహీ. ఫిర్ మిలేంగే’..

ఒకమాట చెప్పక తప్పదు. “వాలు జడ – తోలు బెల్టు ” అనే సినిమా జరిగేటప్పుడు ‘విజయబాపినీడు’గారు నన్ను “భువనచంద్రగారూ.. మీకు హిందీ అన్నా, హిందీ సాహిత్యమన్నా,  సినిమాలన్నా పిచ్చి కదా. మీకు నచ్చిన సీను, పాట చెప్పండి!” అంటే శ్రీ 420లోని సీను- దానిలో వచ్చే ‘ప్యార్ హువా ఇక్‌రార్ హువా హై, ప్యార్ సె ఫిర్ క్యో డర్‌తా హై దిల్’ అనే పాటని పాడి వినిపించా. ఆయన అదే పాటని (తెలుగులో రాస్తే) ఆ సినిమాలో పెడదామన్నారు. నేను ఒప్పుకోలేదు. రాయలేక కాదు. కానీ, అంత గొప్ప పాట గౌరవాన్ని యధాతథంగా నిలుపుదామని) చివరికి విజయబాపినీడుగారు నా మాటని గౌరవించి బాలూ+చిత్రలతో ‘తననా’లలో ఆ పాట పాడించారు. ‘No Lyric’ ఇదే నేను మన్నాడే బ్రతికుండగా ఆయనకిచ్చిన గౌరవం. ఆ గౌరవం భద్రంగా నా గుండెల్లో (మీ గుండెల్లోనూ) జీవితాంతం ఉంటుంది. ఎందుకంటే ‘మన్నా’ మన గాయకుడు. మధురగాయకుడు.  శెలవు దాదా!

ఇందులో మన్నాడే జీవిత విశేషాలు ‘ఒక్కటి’ కూడా రాయలేదు. ఎందుకు రాయాలి? ఎవరికి తెలీదని?

పోనీ వచ్చే ఏడాది ఆయన్ని స్మరించుకుంటూ ఎన్నెన్నో ‘విశేషాలు’ రాస్తాను. సరేనా.. అయ్యా .. యీ వ్యాసంలో ఉదహరించినవి చాలా తక్కువ పాటలు మాత్రమే. అంత సూర్యుడిని అద్దంలో చూపించాను.

అంతే

మీ భువనచంద్ర..

అలుపు లేని ‘జీవనసమరం’ ముగిసింది!

bharadwaja

జ్ఞాన పీఠ అవార్డ్ గ్రహీత శ్రీ రావూరి భర ద్వాజ  ఇక లేరు అన్న వార్త వినంగానే – గుండె ఉసూరుమంది.
ప్రఖ్యాత కథా,  నవలా రచయిత, బాల సాహిత్యోధ్ధారకుడు , రేడియో, స్టేజ్  నాటక రచయిత,  విశిష్ట విమర్శకులు.. ఇవన్నీ ఇప్పుడు మనం  వింటున్న బిరుదులు – ఆయన పేరు చివర!
కానీ, ఇవేవీ లేనప్పుడు..
తనకి ఈ సమాజం ఇచ్చిన బిరుదులు, తనని పేరు తో కాకుండా  పిలిచిన పిలుపులు అన్నీ తనకు బాగా గుర్తే అనే వారు  భరద్వాజ.
తనని-  అవమానించిన మనుషులే తన రచనలో పాత్రలు, తను -ఎదుర్కొన్న  అమానుష సంఘటనలే –  సన్నివేశాలు, తన జీవితానుభవాలే – రచనా సంపుటాలు. కష్టాల కన్నీల్లన్నీ అక్షరాలు గా మారాయి కామోసు!
నిజమే.
అందుకే వారి రచనలు జీవ జలాలు. జీవన సారాలు గా మిగిలిపోయాయి.
రచయిత గానే కాదు, వ్యక్తి గా కూడా అయన ఒక మహర్షి లానే జీవించారు. ‘తనని పనికిరావు ఫొమన్న  వారికే  తిరిగి సాయం చేసారు.  మనుషుల మీద తనకె లాటి  ధిక్కారాలు, ప్రతీకారాలూ లేవనే వారు. ఏ మనిషైనా దిగజారడానికి కారణం అవసరం అని నమ్మే ఈ సమాజ పరిశొధనాత్మకుని మాటలు శిలా శాసనాలు గా నిలిచి పోతాయనడం లో సందేహం లేదు.
తన శతృవు కైనా సాయం చేయడం  ఆదర్శం గా భావించే   ఈ రచయిత, కేవలం మాటల మనిషి మాత్రమే కాదు. చేతల చైతన్య మూర్తి కూడా! ‘సాయం పొందిన వ్యక్తి కళ్లల్లో కనిపించే ఆనంద తరంగం కంటే మించి పొందే అవార్డ్ ఏదీ వుండదని, దీనికి మించిన తృప్తి మరేదీ ఇవ్వదని   విశ్వసించే ఒక విశ్వ మానవ ప్రేమికుదు, శాంతి దూత –  భౌతికం గా మాత్రమే మనకు   లేరు.
కానీ ఆయన రచనలు ఇక్కడ మనల్ని నిత్యం పలకరిస్తూ వుంటాయి. మనిషి గా ఆలోచించమంటాయి.   ఆయన చదివింది 7 వ తరగతే అయినా, వారి రచనలు మాత్రం పరిశోధనాత్మకాంశాలు కావడం గొప్ప విశేషం.
విద్య –  వివేకం కన్నా గొప్పది కాదు.
మనిషి కి కొలమానం విజ్ఞానం కాదు. సంస్కారం.
మనిషిని మనిషి తెలుసుకోవడం కన్నా మరో విశిష్ట గ్రంధమే దీ లేదు అని నిరూపించేందుకు నిలువెత్తు నిర్వచనం గా నిలిచిపోతారు రావూరి.
పుట్టింది   కుగ్రామమే ఐనా, ఇప్పుడు సాహితీ ప్రపంచ పుటం లో వీరి స్థానం హిమాలయమంత!
చిన్నతనం లో –
తిండి లేకుండా చెరువులో నీళ్ళు తాగి బ్రతికానని చెప్పుకునే రావూరి చివరి శ్వాస వరకు కూడా చాలా నిరాడంబరమైన జీవితాన్నే  గడిపారు.

తెలుగు సాహితీ రంగానికి ఎనలేని కృషి సలిపి, అక్షరాలను  సంజీవిని  ఔషధ వృక్షాలుగా మార్చి,  తెలుగు నవలకు పట్టం కట్టించి,  ప్రతిష్టా కరమైన  జ్ఞాన పీఠ అవార్డ్ ని పొంది ..
అలసి సొలసి ఆయన విశ్రమించారేమో కానీ..
మనకు మాత్రం   విరామం వుండదు. ఆయన్ని స్మరించుకోవడంలో.
ఆయన చిరంజీవి గా వర్ధిల్లుతూనే వుంటారు.
తలచుకున్నప్పుడల్లా కన్నీరౌతూ గుర్తొస్తూనే వుంటారు.

ఆర్. దమయంతి

***

అసంతృప్తి కావాలి

నన్ను మండించాలని నీవూ, నిన్ను మసి చేయాలని నేనూ, సహస్ర సహస్రాబ్దాలుగా తంటాలు పడుతున్నాం.
నేను మండిపోనూ లేదు;నీవు మసి కుప్పగానూ మారిపోలేదు.
హోరాహోరీ పోరాటం అనంత కాలాల దాకా, అవిచ్చిన్నంగా
సాగుతూనే ఉంటుంది” అన్నది ఆ అంధకారం, దూరం నించి వస్తోన్న వెలుతురు వేపు చూస్తూ.

“నీకు సంతృప్తి కావాలా? అసంతృప్తి కావాలా?” అన్నారు ప్రభువు ఉదయపు నడకలో.
“అసంతృప్తి” అన్నాను.
ప్రభువు ఆశ్చర్యంగా చూశాడు నావేపు.
“ఉన్న చోటనే ఉండి పొమ్మంటుంది సంతృప్తి. మునుముందుకు  నడిపిస్తుంది అసంతృప్తి” అన్నాను.
ప్రభువు నా వీపు తట్టాడు!
ఎందుకో తెలీదు.

రావూరి భరద్వాజ జ్నాపకాలతో……

– రాధాకృష్ణ

***

 జీవన సమరంలోని అన్ని కోణాల అనర్గళ అసమాన ఆవిష్కరణం

ఆయనతో అంతగా పరిచయం లేదు. పరిచయమంతా ఆయన రచనలతోనే.

రేడియోలో మొట్ట మొదటిసారి 1985లో నా గొంతు, నా కవిత్వం వినిపించింది ఆయనే. దిగ్గజాల మధ్యలో యువకవిగా నన్ను నిలబెట్టారు. ఆ తర్వాత కొన్నేళ్ళకు అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో జరిగిన కథల సదస్సుకు ఆయనతో పాటు రైలు ప్రయాణం…కాకినాడలో రెండు రోజుల కబుర్ల పారాయణం…! అది మామూలు ప్రయాణమూ కాదు…అవి మామూలు కబుర్లూ కాదు. జీవన సమరంలోని అన్ని కోణాల అనర్గళ అసమాన ఆవిష్కరణం.
ఈ మధ్యనే ఆయన జ్ఞానపీఠం అందుకున్నారు. కలవాలి కలవాలి అనుకుంటూనే కలవలేక పోయాను. ఇప్పుడు కలవాలన్నా…
ఆయన భౌతికంగా ఇక లేరు.

రావూరి భరద్వాజ గారూ…! జోహార్…జోహార్…

– చైతన్య ప్రసాద్

***

గమనిక:

వొక రచయిత కన్ను మూసాక మిగిలేది ఏమిటి? అతను మన కళ్ళు తెరిపించిన కొన్ని రచనలూ, కొన్ని జ్ఞాపకాలూ..

రావూరి భరద్వాజ గారి గురించి, వారి రచనలతో, వారితో మీకున్న జ్ఞాపకాల గురించి ఇక్కడ వ్యాఖ్యల రూపంలో పంచుకోండి. ఈ వ్యాఖ్యల పరిధి సరిపోదు అనుకుంటే editor@saarangabooks.com కి పంపండి. ప్రచురిస్తాం.

 

ఏకాంత సౌందర్యాన్వేషకుడు త్రిపుర

tripuraమనిషి సంఘజీవి.  మనుష్యుల  మధ్యనే జీవిస్తూ మానసికంగా ఏకాంత జీవనసౌందర్యాన్ని అన్వేషించగలిగినవారు, అనుభూతం చేసుకోగలిగిన వారు ఋషి తుల్యులౌతారు.నిరంతర గమనశీలత్వం గలిగిన జీవనంలో గుంపులో కాకుండ, ఒక్క ప్రయాణికుని మాత్రమే తోడుగా ఎంచుకోమని, సరైన తోడు దొరకనపుడు ఖడ్గమృగంలా ఒంటరిగానే గమనం సాగించమని బుద్ధుడుపదేశించాడు. అందుకే, జీవితమంతా ఎంతోమందిని కలుపుకుంటూ విడిపోతూ, సరైన తోడుకోసం అన్వేషిస్తూ జీవనగమనాన్ని సాగించే మనిషి, ఏదో ఒక దశలో ఏకాంత జీవన సౌరభాన్ని ఆఘ్రాణించగలుగుతాడు.   తామరాకు మీది నీటి బొట్టులా ప్రాపంచికబంధాలకు అంటీముట్టనట్లుగా ఉంటూనే, జీవితాన్ని ఉత్సవంలా తీర్చిదిద్దుకోగలుగుతాడు.

సున్నితమనస్కులూ, మానవజీవితాల్లోని అసంబద్ధతలకు, దుఃఖాలకు చలించిపోగలిగిన కరుణాశీలురు, తమనుతాము సరిదిద్దుకుంటూ ఎదిగిన జీవన తాత్వికులూ, ఎన్నో భిన్నమార్గాల్లో గమించి, గమించి, జెన్ బౌద్ధంలో సేదతీరిన సత్యాన్వేషకులూ — వెరశి మానవత్వ ప్రేమికులు అయిన త్రిపుర — ఏకాంత సౌందర్యాన్వేషణలో జీవితాన్ని ఉత్సవంలా మలుచుకున్నవారు.  ఒకే చోట పాతుకు పోయిన వారికన్నా, నిరంతర యాత్రికులు, దేశాంతర వాసులు అయినవారు మానవస్వభావవైవిధ్యాలను, క్షుణ్ణంగా దర్శించగలరు. విభిన్న ప్రాంతాలను సందర్శిస్తూ, రాష్ట్రేతరప్రాంతాలలో ఉద్యోగించిన త్రిపుర ఒకవైపు భిన్నభిన్న సిద్ధాంతాలతోబాటు బౌద్ధాన్ని, ముఖ్యంగా జెన్ బౌద్ధాన్ని, అధ్యయనం చేస్తూనే, మరోవైపు మానవజీవన పార్శ్వాలలోని విభిన్నకోణాలను, అసంబద్ధతలను, ద్వైదీభావ వర్తనలను, జీవన దుఃఖాలను చూచి చలించి పోయారు. తమ గురువు బుచ్చిబాబుగారిలా, తమ ప్రశ్నలకు జవాబులను ప్రపంచ సాహిత్యంలో వెదుక్కునే అలవాటును పెంపొందించుకున్న త్రిపుర – నిరంతర అధ్యయనశీలి త్రిపుర — జీవనగమనంలో ఎన్నో మలుపులు తిరిగి, తిరిగి, ఏకాంత జివనసౌందర్యాన్ని అనుభూతం చేసుకున్న వేళ, పుస్తకాలను గూర్చి, “మనస్సులో మంటలు లేపి, జీవితాన్ని గాలివాన చెట్లను ఊపినట్లు ఊపి, ఇప్పుడు ప్రశాంతంగా బీరువాల్లో పడిఉన్నాయి. అప్పటి వాటి ‘నిజం’, ‘ప్రాణం’ ఇప్పుడు లేవు(చీకటిగదులు), అని గుర్తించిన త్రిపుర అంతర్ముఖత్వంవైపు పయనాన్ని కొనసాగించారు. ఏరుదాటిన తర్వాత తెప్పను ఒడ్డునే వదిలివెడతామనే బౌద్ధభావానికిది గొప్ప ఆనవాలు.
మానవాంతర్గత చీకటికోణాలను ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా మొదలైన త్రిపుర కథారచన, మనిషి, మనీషిగా ఎదగగలిగిన క్రమాన్ని నిర్దేశిస్తాయి. కథలు ఆటోబైయోగ్రఫికల్ గా ఉండాలనీ, రెండురకాల మనస్తత్వాలు లేకుండా, మనం మనతోనే ఇంటర్ రిలేటడ్ గా ఉండాలని నమ్మిన త్రిపుర, తమ కథలను, ఆటోబయోగ్రఫికల్ గా, కన్ ఫెషనల్ గా, ఇంటర్ రిలేటడ్ గా తీర్చి దిద్దారు. తమకు నచ్చని పనిని చేయలేకపోవడం తమ బలం గా కలిగిన త్రిపుర, ‘మనస్సులో కల్మషం ఉంటే దేహానికి జబ్బు ‘ అన్న ప్రాథమిక ఆరోగ్య సూత్రాన్ని గుర్తించిన అపర ధన్వంతరి త్రిపుర, తమను తాము క్షాళన చేసుకుంటూ ఎదిగిన క్రమాన్ని ఆయన కథలు చెప్తాయి.
  జ్ఞాపకాలను కూడా ఆబ్జెక్టివ్ గా చూడడం అలవాటు చేసుకున్న త్రిపుర, తమకు సంబంధించిన సంఘటనలు ఎవరివో అయినట్లు అనుకునే ‘మెంటల్ మేకప్’ను సాధిస్తూ (ప్రయాణీకులు), జీవితానికి అర్థం ఏమిటని ప్రశ్నలు లేవదీస్తూ మౌనం గా ప్రవహించే గంగ ఒడ్డున ఎదిగిన త్రిపుర ముప్ఫై నాలుగేళ్ళకే అరవై యేళ్ళ మనిషి మనస్తత్వాన్ని (చీకటి గదులు)అలవర్చుకునే పక్వతను సాధించారు.తెలుసుకోవడం తమ శిక్షణలో భాగమయినా, తమ మాటల్లో ఖంగుమని ‘నిజం’ మ్రోగించే నేపథ్యంలో తమలోంచి తాము విడివడి బ్రదకడాన్ని సాధన చేస్తూ, మెల్లగా, తొందరలేకుండా ఆలోచించడం నేర్చుకునే మార్గం లో మాటలు తగ్గించి మౌనసాధనతో పరిక్రమించిన త్రిపుర, సులభంగా స్పష్టంగా కత్తీంచులాంటి నిజంచెప్పాలంటే ఎంతగ అంతర్ముఖులు కావలసి ఉందో గుర్తించారు.పరిమిత పాత్రలతో సాగే వారి కథల్లో తమను తాము భిన్న భిన్న పాత్రల్లో రూపొందించుకుంటూ, ‘నేను ‘ అన్న ఆత్మగతస్థాయినే ‘నువ్వు ‘ అనేలా కొత్త వొరవడిని ప్రవేశపెడుతూ, సున్నితమయిన కవితాత్మక శైలిలో సాగే వచనం తో నడిపించడం త్రిపుర ప్రత్యేకత! ఉన్నత లక్ష్య సాధన కోసం జీవించిన వీరస్వామి అయినా, గమనశీల జీవనం లో నిరంతరం పరిక్రమిస్తూ ఉండిన సత్యాన్వేషకుడు భాస్కర్ అయినా (జర్కన్)ఒక పరిపూర్ణ లక్ష్య సాధనలో పరస్పరం సహకార మందించుకోవలసిన ఒకే మూర్తి యొక్క భిన్న రూపాలే! ఏది యాత్ర?  ఏది వృత్తి? అన్న బేధం అదృశ్యమై, విరామం లేకుండా సాగుతున్న జీవన యానంలో, మనిషి తననుండి తాను వేరుపడి జీవించడం సాధన చేసినపుడు మాత్రమే జీవిత శిఖరాగ్రాల నధిరోహించగలడన్నది త్రిపుర అభిప్రాయం మాత్రం మాత్రమే కాదు, వారు సాగించిన అన్వేషణకూ ప్రతీక!

జీవన బంధాలను గొలుసులు లాగే భావించిన త్రిపుర ఆ గొలుసులను త్రెంచుకుంటూ, తమను తాము ప్రపంచం నుండి మానసికంగా విదుదల చేసుకునే దిశగా పయనించారనడానికి వారి చివరి రెండు కథలే ఆధారం!
మనుషులందరిలాగే ప్రపంచంతో కలిసి నడిచిన త్రిపుర,చెప్పవలసినదంతా కేవలం పదమూడు కథల్లోనే చెప్పి, ఇక చెప్పడానికి ఏమీ లేదు అని జీవితాన్వేషణలో క మజిలీకి చేరుకున్న త్రిపుర, దాదాపు దశాబ్దం తరువాత రాసిన కథ ‘గొలుసులు, చాపం,విడుదలభావం ‘ అన్న కథ. ‘నా జాతి, నా వారసత్వం … నా సంప్రదాయం అంటూ వుండి పోతే తుప్పుపట్తి పోతావ్.’ అని గుర్తించిన త్రిపుర, ప్రపంచానికి సంబంధించనట్లు అనిపించే ఈ జీవితం ఒక కాపీ లా, నకల్ లా., కౌంటర్ ఫీట్ లా , ఒక కుట్రలా కనిపిస్తుందని, ఈ కుట్రని చేదించడానికి … మనుషుల్ని దగ్గరగా లోపలికి గుండెల్లోకి లాక్కోడం చేస్తుందనీ, భావించిన త్రిపుర, “జీవితంలోంచే, ప్రపంచంలోంచే ఆలోచనలను లాగాలి” అని గుర్తించిన త్రిపుర మన జీవితం మన ఆలోచనల మూర్తిమత్వమే అన్న బౌద్ధ సత్యాన్ని అవగాహనకు తెచ్చుకున్న త్రిపుర, అన్ని అసంబద్ధతల నుండి జీవన దుఃఖాలనుండి ప్రాపంచిక బంధాలనుండి మానసికంగా విడుదల సాధించే దిశగా తమ పయనాన్ని సాగించారు.    శృంఖలాల క్రౌర్యం ఎంతో, స్వేచ్చ కూడా అంత భయంకరంగా ఉంటుందన్న సత్యాన్ని గుర్తించిన త్రిపుర, ‘చచ్చిపోలేదు గాని జీవితంలో మిగిలి ఉంది ఏదీ లేదు ( వంతెనలు) అని ఎప్పుడో గుర్తించిన త్రిపుర,  ఆలోచనల స్థాయినుండి తెలుసుకునే స్థాయికి గెంతగలగాలని ఒకప్పుడు భావించిన త్రిపుర (జర్కన్), ఆ అఖాతాన్ని దాటడానికి, గొలుసులు-చాపం-విడుదలభావం కథ ద్వారా వంతెనను వేసుకున్న త్రిపుర,  “ఈ ప్రపంచంలో కొన్నాళ్ళు ఊపిరి పీల్చి ఆఖరికి అలా ఊపిరిని బలవంతంగా వదిలివేయడం … దీనికి అర్థం లేదు. ఏ మంచీ చెడుల సంఘర్షణ సిద్ధాంతమూ దీనికి అర్థం ఇవ్వలేదు …ఇదంతా అసందర్భం…’ అనిగుర్తించిన త్రిపుర, నేను అన్న సరిహద్దులను తుడిపేసుకుంటు, హేతుబద్ధంగా, సముదాయంపుగా ప్రకృతినీ మానవ ప్రకృతినీ పూర్తిగా ఆస్వాదిస్తూ, దేనినీ వేటినీ , ఎవరినీ తోసిపుచ్చకుండా, నేలమేదే నడుస్తూ, నిలబడుతూ, ఎటూ తేలి పోకుండా ఉండగల స్థిరత్వాన్ని సాధించారు అండానికి, వారి చివరి కథ, ‘వలసపక్షుల గానం’కథ గొప్ప ఉదాహరణ.
  డ్రాయింగ్ రూములో లలిత్ పూర్ బుద్ధుని బొమ్మ, అభిధమ్మ పఠనం, గౌడమీద చిత్రిపబడిన ఎర్రటి రంగు బుద్ధుడు, బౌద్ధ క్షేత్రాల సందర్శనలు, బౌద్ధోపన్యాసాలు, తాంత్రిక్ బౌద్ధము…వీటన్నిటినీ జీవన దుఃఖాలను పారద్రోలే సధనాలుగా మలుచుకున్న త్రిపుర, తమను తాము లోలోతుల్లోకి అవలోకించుకుంటూ, ఉన్నది ఉన్నట్లుగా స్వేకరించే స్థాయికి ఎదిగిన పరిణితిని వివరిస్తుందీ కథ. సత్యాన్ని మాత్రమే అన్వేషిస్తూ, జన్మించినప్పటినుండి వెంటాడుతూ ఉండే శూన్యాన్ని అవగాహన చేసుకుంటూ, ఆరురోడ్ల కూడలి ద్వారా ప్రయాణిస్తూ, లోలోపలి పురాతన భవనాలను శిధిలం చేసుకుంతూ సాగే అన్వేషణలో చివరికి మిగిలేదంతా మహా  శూన్యం అన్న అవగాహనకు వచ్చారు త్రిపుర. బౌద్ధంలో శూన్య భావ అవగాహన అత్యుత్తమమైన సాధన! ప్రతి భాగానికి విడివిడిగా పేర్లున్న విభిన్న భాగాల సమాహార రూపమే మనిషయినా,చెట్టయినా, మరొకటి మరొకటయినా. మనిషి ఉన్నాడా అంటే ఉన్నాడు, లేడు అంటే లేడు..ఎందుకంటే విడివిడిగా పేర్లున్న బహిరంతర్గత అవయవాల సమాహార రూపమే మనిషి కనుక, మనిషి అన్న పేరు ఎన్నో ముక్కల ఏకీకృత రూపం మాత్రమే కనుక..అన్నది సామాన్య నిర్వచనం. ఈ శూన్య భావాన్ని అర్థం చేసుకున్న త్రిపుర, వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించడమే జీవితం అన్న బౌధ్ద్ధభావాన్ని అనుభూతం చేసుకున్నారు.
  అటునుంచి ఏడోనెంబర్లోనూ, ఇటునుంచి పదమూడో నెంబర్లోనూ రాని భగవంతాన్ని కలవాలనికలవాలని, తామే వెదుక్కుంటూ వెళ్ళిన త్రిపుర, బలమైన ఒళ్ళూ, కరుణార్థ్రపూరితమైన బోధిసత్వ అవలోకితేశ్వరుని కళ్ళూ.. ఉన్న వీరబాహును కలిశారు. ధ్యానాన్ని. ధ్యానంతోబాటు, తమనుతాము రక్షించుకోవడానికి నిరపాయకరమైన కుంగ్-ఫూ- విద్యను నేర్పే జెన్ బౌద్ధానికి ప్రతీక వీరబాహు. జీవకారుణ్యాన్ని ఈ ప్రపంచంలో ఒక సూత్రం లాగా చేసుకుని జీవితాన్ని సాగించగలమా? అన్న సందేహంతో సతమవుతూ సాగిన వారి అన్వేషణ, ఒక్కోసారి లాఘవంగా, మరోసారి గంభీరపు అనివార్యతతో, అప్పుడప్పుడూ బీభత్స వేగంతో దూకుడుగా ..ఏకాగ్రతతో ఏకాంత సౌందర్యాన్నన్వేషించే దిశగా సాగింది.ఉత్త గోధుమరంగు వేడి నుండి, ఉత్త వేడిరంగు గోధుమ ఊహల్లోకి ( భగవంతం కోసం ) జారుకున్న త్రిపుర, నల్లకళ్ళ గోళీలతో పాట చరణం సాగించిన తోటి ప్రయాణికుదు వరదరాజులు , సకల ప్రాపంచిక ప్రాకృతిక జ్ఞానమూ లోపల పూర్తిగా ఇమిడిపోయి జీర్ణమయిపోగా, చూపుల్లో ప్రసారం చేసే గొళీల రాగమాలికలను దాటుకుని, కళ్ళలో పావురాల రంగు గొళీలు స్వల్ప వ్యవధిలో లలితసంగీతపు ఝలక్ లా కాకుండా, వెండి నీరులా ఆలపించే సంగీతాన్ని వినగలిగారు.అందుకే, ‘నేనంటే రెండు మనుషులని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది ‘ అని ఎప్పుడో రాసుకున్న వాక్యానికి ఎదురుగా,ఉన్నది ఉన్నట్లుగా స్వేకరించమనే అర్థం లో భగవంతం చేత టిక్కు మార్కును పొందగలిగారు.ప్రేమతో పెంచిన కన్నపిల్లలు ఉద్యోగాల రీత్యా రెక్కలొచ్చి ఎగిరిపోతే, ప్రతి తరంలోనూ తల్లిదండ్రులు పడే వేదనకు వివరణగా కనిపించే ‘వలసపక్షులగానం’ వాస్తవాన్ని యథాతథంగా స్వేకరించక తప్పదనే ‘మహా శూన్యపు భావనకు ‘ ప్రతీకగా నిలవడమే గాక, మంచీచెడులూ, సుఖదుఃఖాలూ వంటి ద్వైదీభావాలు ఉంటాయనీ వాటిని యథాతథంగా అంగీకరించడమే జీవన దుఃఖాలనుండి విముక్తులయ్యే మార్గమనే జీవన సత్యాన్ని గూర్చి చెబుతుంది.
‘ A special Transmission outside the scriptures;
No dependence on words and letters;
Direct pointing to the mind of man;
Seeing into one’s nature and attaining Buddhahood. “—-అంటారు జెన్ బౌద్ధ స్థాపకులయిన బోధిధర్ముదు. ద్యానం ద్వారా అంతర్ముఖులు కావడం ప్రధాన లక  లక్ష్యం జెన్ బౌద్ధంలో. ‘మానసిక పరిణితిని సూచించే ఒక జీవన విధానం బౌద్ధం ‘అనే సత్యాన్ని ఆచరణ సులభం చేసిన విధానమిది. తృష్ణారహితులుగా, కరుణాశీలురుగా, సహానుభూతితో బ్రదకడం అభ్యాసం చేసుకోదగిన వారందరూ చేరుకోదగిన గమ్యమిది. ఈ గమ్యానికి నిరపాయంగా చేరుకున్న ధీశాలి ఏకాంతసౌందర్యాన్వేషకులు   త్రిపుర. .అందుకే ‘Complete rejection of everything, which is complete acceptance of everything aswell ‘  (ఈ మాట) అన్నది వారి జీవన విధాన మయ్యింది. ఎన్నెన్నో సత్యాలవైపు ఆకర్షించబడిన త్రిపుర, బౌద్ధం లో సేదదీరారు కనుకే, లోకం నుండి మానసికంగా తమను తాము విడగొట్టు కున్నారే తప్ప భౌతికంగా లోకానికి దూరంగా పారిపోలేదు. మనుష్యులమధ్యే ఉంటూ, మనసిక ఏకాంత సౌందర్యాన్ని అనుభూతం చేసుకుంటూ, ఆమరణ పర్యంతం జీవితాన్ని, పసిపిల్లల్లా ఉత్సవంలా మలుచుకుంటూ, ప్రతిక్షణం కాసే పున్నమి వెన్నెలలా ఆనందంగా మనగలిగారు.

 

* * *

—డా. రాయదుర్గం విజయలక్ష్మి

మిగిలినవి నాన్న పుస్తకాలూ, కొన్ని జ్ఞాపకాలూ!

అనిల్ అట్లూరి

అనిల్ అట్లూరి

విజయవాడలో పూర్ణానందపేటలో అనుకుంటా మేము ఉండేవారం. లీలగా గుర్తు. నా చిన్నతనంలోనే నాన్న నా కోసం బొమ్మలు తీసుకురావడం, పుస్తకాలు తేవడం బాగానే గుర్తుంది. అప్పట్లో నాన్న ‘విశాలాంధ్ర’లో ఉండేవారు.

విజయవాడ నుండి మద్రాసుకి హౌరా మెయిల్లో వెళ్లడం గుర్తే. పొగబండి (స్టీం ఇంజన్) కదా! కళ్ళు మిరుమిట్లు గొలిపే హెడ్‌లైట్. మెటాలిక్ సిల్వర్‌తో నక్షత్రం లాంటి డిజైన్ మధ్యలో ఉండేది ఆ దీపం. మొదట పసుపచ్చని కాంతి కనబడేది. తరువాత ధడ్, ధడ్, ధడ్ మంటూ శబ్దం వినపడేది. ఆ తరువాత ట్రైన్ కనపడేది. రైలు పట్టాలు మెరిసేవి ఆ కాంతిలో.

 ప్లాట్‌ఫారం అంతా వెలుతురే! ముందు తెల్లటి ఆవిరి. అది బుసలు కొడుతూ చేసే శబ్దం. ఆ బ్రహ్మాండమైన నల్లటి చక్రాలు, వాటిని కదిలించే శక్తివంతమైన పిస్టన్లు. కాళ్లక్రింద ప్లాట్‌ఫార్మ్ కదిలిపోతుందా అనిపించేది. దగ్గిరకు వెళ్ళి చూద్దామనుకుంటూ ఉంటే వెనక అమ్మ చెయ్యి పట్టుకుని ఆపడం బాగానే గుర్తు ఉంది. కిటికి పక్కనే కూర్చోవడం, కళ్లలో ఆ రాకాసి బొగ్గు నుసి, మొహంమ్మీదకి, ముక్కులోకి ఆ నల్లని, చిక్కటి, దట్టమైన పొగ, ఆ చీకట్లోకి కళ్ళు చికిలించి చూడడం ఇంకా గుర్తే! ఈలోపు అమ్మ నాన్న సహాయంతో హోల్డాల్‌ తెరిచి బెర్త్ మీద పరవడం లీలగా గుర్తు.

మద్రాసు సెంట్రల్ స్టేష‌న్లో దిగడం. ఫియట్ టాక్సిలో నేను, అమ్మ వెనుక సీటులో. నాన్న ముందు సీటులో. డిక్కిలో సామాన్లు. పైన కారియర్‌. దాని మీద హోల్డాలులు. ఇంటి ముందు దిగడం గుర్తు ఉంది. తేనాం పేటలోని వెంకటరత్నం వీధి, ఇంటి నెంబరు 13. మేడ మీద ఉండే వారం. మొదట్లో ముగ్గురమే. నాన్న, అమ్మ, నేను.

ఫాస్ట్ ఫార్వార్డ్

ముఖం మీద లైట్ పడి కళ్ళు తెరిచాను. నాన్న బట్టలు వేసుకుంటున్నారు. బయట కిటికిలోంచి చూస్తే చీకటి కప్పేసింది ప్రపంచానంతటిని. బయటికి వెడుతున్నట్టున్నారు.

“వస్తావా?”

“ఎక్కడికి?”

పాంటు వేసుకుంటూ, “చెప్పకపోతే రావా?”

పుస్తక ప్రపంచంలో నాన్న

పుస్తక ప్రపంచంలో నాన్న

నేను కళ్ళు నులుముకుంటున్నాను. అమ్మ “వద్దులేండి” అంటుండగానే, “వస్తా” అంటూ లేచాను. వరండాని వీధి లాంతరు వెలుతురు పలకరిస్తోంది. వరండాకి పిట్ట గోడ ఉంది. దానినిండా జాలీలు. పిట్ట గోడ అంచుమీద కుండీలు. అటు ఇటూ మనీప్లాంట్ మొక్కలు. మధ్యలో ఇంకేవో పూల మొక్కలు. బయట పెరడులో వేపచెట్టు, మల్లె చెట్లు, కొబ్బరి చెట్టు, సంపెంగలు, గన్నేరు చెట్లు, వగైరా. వాటి మధ్య నుండి పడుతున్న ఆ వీధి లాంతరు వెలుగులో ఆ కొమ్మల, ఆకుల నీడలు అల్లిబిల్లిగా ఆ వరండా గోడ మీద నృత్యం చేస్తున్నవి నిశబ్దంగా.

ఈ లోపు ‘మోతి‌’ కూడా లేచి తోక ఊపుకుంటూ వెనక పడింది. దాన్ని ఆగమంటూ అమ్మ గేటు వేసేసింది. కిందకి దిగిన తరువాత, నాన్న షర్ట్ జేబులోంచి గోల్డ్ ఫ్లేక్ పాకెట్ తెరిచి అందులోనుంచి సిగరెట్టు తీసుకున్నారు. లైటర్‌తో దాన్ని ముట్టించారు. గుండెల నిండా పీల్చి నెమ్మదిగా వదులుతున్నారు. ఆ పొగలోంచి నా వైపు చూసారు.

వీధి లాంతరు మసక వెలుతులో.. చలిగాలిలో.. ఆ సుడులు తిరుగుతున్న పొగల వలయాలలో నాన్న నాకు దేవుడు లాగా కనపడ్డాడు. చెయ్యి అందుకున్నాను. వెచ్చగా ఉంది తన ప్రేమ లాగా. ఇద్దరం నెమ్మదిగా నడవడం మొదలు పెట్టాము.

“ఎక్కడికి నాన్నా?”

“ఇక్కడే నాకొక ఫ్రెండ్ ఉన్నాడు. చూద్దామని”

బహుశా ఇక్కడే పడిందేమో “స్నేహం”కి నా తొలి పునాది. ఎందుకనో మొదటి నుంచి నాకు స్నేహితులే దగ్గిరవుతూ వచ్చారు, బంధువుల కన్నా.

నాన్న అడుగుతున్నారు. నేను చెబుతున్నాను. నేను అడుగుతున్నాను. నాన్న చెబుతున్నారు. అలా మా వీధిలోనుండి అవి ఇవి కబుర్లు చెప్పుకుంటూ తేనాం పేట మెయిన్ రోడ్డు మీదకి చేరుకున్నాం. కుడి చేతి వైపుకు తిరిగి, మార్కెట్ వైపు నడవడం మొదలుపెట్టాం. ఎడం చేతి వైపు అక్కడ స్కూలు. ఒకొక్కసారి సాయంకాలం నా స్నేహితులతో అందులోనే ఆటలు. దానిని దాటాం. ఇంకా వీధి లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. తరువాత గుడి. మార్కెట్టు ప్రాంతంలో ఎడ్ల బండ్ల మీద నుంచి కూరగాయల గంపలు, బస్తాలు దింపుకుంటున్నారు. తుపుక్కున నములుతున్న తమలపాకుని ఊస్తున్నారు. బొడ్డునుంచి ఆకులు తీసుకుని, సున్నం రాసి, మడిచి నోట్లో పెట్టుకుంటోంది ఆమె. కొందరు బీడీలు కాలుస్తూనే బస్తాలు మోస్తున్నారు. నిశబ్దంగా యాంత్రికంగా పనిచేసుకుంటున్నారు. ఈ లోపు టీ షాప్ కనపడింది. నాన్న నిలబడగానే ఆ టీ మాస్టారు పలకరింపుగా నవ్వి, నా వంక చూస్తూ ఏదో అన్నాడు.

పొగలు కక్కే..Young Turk...!

పొగలు కక్కే..Young Turk…!

నాన్న “నువ్వు కూడా తాగుతావా? టీ”.

“ఊ” అంటూ బుర్ర ఊపాను.

నాకొక చిన్న గాజు గ్లాసులో సగం కన్నా తక్కువ టీ ఇచ్చాడు. మూతి వెడల్పు, అడుగు సన్నగా ఉంటుంది ఆ గ్లాసు. దాని చుట్టూ పలకలు, పలకలుగా దానికి డిజైను. “నెమ్మదిగా తాగు, వేడిగా ఉంటుంది. జాగ్రత్త”. అరిచేతుల మధ్య పట్టుకుని ఊదుకుంటూ, ఆ మార్కెట్టు వైపు, ఆక్కడ వాళ్ళు చేసుకుంటున్న పనులు చూస్తూ ఆ టీ తాగాను. నాన్న మరో సిగరెట్టు అంటించారు. టీకొట్టు వాడికి డబ్బులు ఇచ్చారు నాన్న. నేను మళ్ళీ నాన్న చెయ్యి అందుకున్నాను. ప్లాట్‌ఫారం పైనే నడుచుకుంటూ వెళ్ళాం ఇద్దరం. నేను నా చెప్పులతో కాళ్లకి అడ్డం వచ్చిన గులక రాళ్ళు తంతున్నాను. వాటితో పాటు సిగరెట్టు ఫాయిల్స్.

ఒక పది ఇళ్ళు, కొట్లు దాటగానే కుడి చేతి వైపునే తలుపులు. చిగురాకుపచ్చ రంగులో. నెమ్మదిగా నాన్న నెడితే అవి తెరుచుకున్నవి. పైకి మెట్లు కనపడ్డాయి. ఏదో గుడ్డి వెలుగు. ముందుకు నన్ను నెట్టి నాన్న నా వెనక మెట్లు ఎక్కుతున్నారు. ఈ లోపు కిర్రు మని చప్పుడు. పైన తలుపు రెక్క తెరుచుకుని ఎవరో ఒకాయన లుంగిలో బయటకి వచ్చారు. పైన బనీను. ముఖానికి కళ్ళజోడు. “రండి, రండి. మీ వాడ్ని కూడా తీసుకువచ్చారా” అంటూ నవ్వుతూ అహ్వానించారు. (దాసరి సుబ్రహ్మణ్యం గారనుకుంటాను).

గుమ్మం ముందు ఒక పక్కగా చెప్పులు వదిలి లోపలికి అడుగు పెట్టాం ఇద్దరం. గదిలోపల ఎడం వైపు మంచం. దానికి ఆనుకుని ఎదురుగాఉన్న గోడకి ఒక చెక్క కుర్చి. పక్కనే చెక్క స్టూలు. క్రింద పేపర్లు. ఒక వైపు గోడకి ఆనుకుని రాక్. దాని నిండా పుస్తకాలు. రంగు రంగుల అట్టలు. వాళ్ళిద్దరు మాటల్లో పడ్డారు. నాకు ఏమీ తోచడం లేదు.

“నేను అవి చూడోచ్చా”

“చూడ్డమెందుకురా? చదువుకో. మీ ఇంట్లో ఉండే ఉంటాయి! లేకపోతే తీసుకువెళ్ళు.”

అవి ఇల్లస్ట్రేటెడ్ వీక్లి ప్రతులు. ఇంగ్లీష్ పత్రిక. రెండో మూడో తీసుకుని మంచం మీద కూర్చుని చూస్తున్నాను. మా యింట్లో, లైఫ్, స్పాన్, పంచ్, ఇంకా ఎవో చాలా ఇంగ్లిష్ పత్రికలున్నాయి. వాటిల్లో కొన్నింటిలో బొమ్మలు ఉంటాయ్. కొన్నిట్లో బొమ్మలు అస్సలు ఉండవు. ఈ లోపు నాన్న, ఆయనా మాటల్లో పడ్డారు.

ఎవరో నెమ్మదిగా “బాబు, బాబూ” అంటూ పిలుస్తున్నారు. కళ్ళు తెరిచి చూస్తే నాన్న, నా కళ్లలోకి చూస్తూ. తెల్లవారింది. ఇంటికి ఎలా చేరానో గుర్తు లేదు కాని.. మోతి మాత్రం భలే గొడవ చేసింది.

ఆడించే నాన్న...పాడించే నాన్న!

ఆడించే నాన్న…పాడించే నాన్న!

నిద్ర లేచి చూస్తే, నాన్న పక్క మీద లేరు. హాల్లోనూ లేరు. వరండాలో పేము కుర్చిలో కూర్చుని, పిట్టగోడమీదకి కాళ్ళు జాపుకుని ఏదో ఇంగ్లీష్ పుస్తకం చదువుకుంటున్నారు. వెళ్లి పుస్తకం లాగేసి నేను బొజ్జమీదకి చేరాను. నన్ను వాటేసుకున్నారు.

“బాబు, ఈ పూట సుమతీ శతకంలో పద్యాలు చదువుకుందామా?”

“ఊ”

“ఐతే వెళ్ళి ముఖం కడుక్కుని రా”

ముఖం కడుక్కున్నాను. బినాకా టూత్ పేస్టు. అమ్మ ఈ లోపు బోర్న్‌వీటా కలిపి ఇచ్చింది. అది తీసుకుని వెళ్ళి నాన్న ముందున్న టేబుల్ మీద పెట్టాను. నా టేబుల్ మీద ఉన్న శతకాల పుస్తకంలో నుండి, సుమతీ శతకం తీసుకుని మళ్ళీ వరండాలోకి వెళ్ళాను. నాన్న కాళ్ళ మధ్యకి చేరాను. నా చుట్టు చేతులు చాపి నా ముందు నాకు కనపడేలాగా పుస్తకం పట్టుకున్నారు. నా తలమీదుగా పుస్తకాన్ని చూస్తూ నాన్న ఒకొక్క పాదం చదువుతుంటే నేను మళ్ళీ పలికేవాడిని. నాన్న నన్ను అలా వాటేసుకున్నట్టుంటే ఆ బలమైన చేతులమధ్య ఎంత వెచ్చగా, హాయిగా ఉంటుందో! బహుశా అందుకేనేమో ఆ పద్యాలు అంత ఇష్టంగా నేర్చుకున్నాను.

శ్రీ రాముని దయచేతను

నారూఢిగ సకల జనులు నౌరా యనగా

ధారాళమైన నీతులు

నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ

సుమతీ, వేమన, దాశరధి, కృష్ణ శతకం, గజేంద్ర మోక్షం నాన్నే నాతో వల్లె వేయించారు. ప్రతి దానికి తాత్పర్యంతో సహా. దాదాపు ప్రతి రోజు పొద్దునే ఉండేది ఈ శతకాలన్ని చదవడం. ఉచ్ఛారణ కూడా. చ అక్షరం పలకడం లో ఎందుకనో ఆ రోజు నాకు రావడం లేదు. చ కి వత్తుతో పలకడం రావడం లేదు నాకు. చేప అంటున్నాను , చాప అంటున్నాను కాని వత్తుతో పలకలేక పోతున్నాను.

“అది. ఇప్పుడు “చ్చ” పలికావుగా! అలా అన్నమాట”

“ఏది మళ్ళీ చెప్పు. “చ్చ” పలుకు.”

“చ్చ”

“చా”

“చాప”

“చేప”

“చాపము”

——

మద్రాసులో టి.నగర్ బస్ టెర్నినస్, సౌత్ ఉస్మాన్ రోడ్డులో ఉంది. దానికి తూర్పు వైపున కృష్ణవేణి సినిమా హాలు. అందులో ఒక ఉదయం తెలుగు సినిమా ప్రీవ్యూకి తీసుకెళ్ళారు నాన్న. చాలా మంది పలకరించారు నాన్నని. నాన్నకి చాలా మంది స్నేహితులు ఉన్నారు! నెమ్మదిగా మెట్లు ఎక్కి పైన ఫోయర్ లోకి వెళ్లాం. బాల్కని. ఏదో ఒక వరుస. అప్పటికే కొంత మంది కూర్చుని ఉన్నారు. కుడి చేతి వైపు మధ్యలో ఉన్న ఒక వరుసలోకి ముందు నన్ను వెళ్లమంటూ నాన్న నా వెనకే వచ్చారు. హాలు ఫుల్.

నాన్నకి కుడి వైపున నేను కూర్చున్నాను. లైట్లు డిమ్ అయినవి. సినిమా మొదలైంది. ఇంట్రవెల్‌లో నాన్న లేచారు. వారి వెనకే నేను. ఐల్ లోకి రాగానే నాన్న చిటికిన వేలు పట్టుకున్నాను. చుట్టూ చాలా పాంట్లు. చాలా మంది మగవాళ్ళు. ఆ చిటికిన వేలు పట్టుకుని ఒకొక్క మెట్టు ఎక్కి తలుపుల దగ్గిరకి చేరాను. అక్కడ ఫోయర్ లోకి దిగడానికి మెట్లు. దిగి చిటికిన వేలును పట్టుకుని పైకి చూసాను. నాన్న కాదు. ఇంకెవరో! నాన్న ఏరి? చూట్టూ చాలా మంది పెద్దవాళ్ళు.

పొగ. మాటలు. నవ్వులు. పలకరింపులు. నాన్న కనపడటం లేదు. నాన్న, నాన్న ఏరి? ‘ఏపిఆఱ్‌”..”రావుగారు” అని పిలుపులు. చక్కగా గంజిపెట్టిన, స్టిఫ్‌గా ఉన్న పాంట్, దానితో పాటు నాకు చిరపరిచితమైన రెండు అడ్డపట్టీలున్న నల్లరంగు పాలీష్డ్ లెదర్ చెప్పులు. పైకి చూస్తే నవ్వుతూ నాన్న. “భయపడ్డావా?” నాన్న పక్కనే ఉంటే నాకు భయం ఎందుకు? నవ్వుతూ నాన్న చిటికెన వేలు అందించారు. దానితో పాటే వెళ్లాను. పాప్‌కార్న్ పాకెట్టు ఇచ్చారు. అక్కడే నిలబడి ఎవరితోనో సిగరెట్టు తాగుతూ, కాఫీ తాగుతూ ఏవో కబుర్లు. ఇంతలో హాలు బెల్లు మ్రోగింది. మళ్ళీ లోపలికి. ఈ సారి జాగ్రత్తగా నాన్న చిటికిన వేలును చూసుకుని పట్టుకుని ఆయన వెమ్మటే నడిచాను. సీట్‌లో కుర్చున్నాక, పాప్‌కార్న్ పాకెట్ ఒపెన్ చేసి ఇచ్చారు. నెమ్మదిగా చప్పుడు చెయ్యకుండా తింటూ సినిమా చూసాను.మళ్ళీ నాన్న చెయ్యి పట్టుకుని బయటికి వచ్చాను. కారులొనే మళ్ళీ ఇంటికి.

వరండా. నాలుగు పేము కుర్చిలు. ఒకటి టూ సీటర్. రెండు సింగిల్ సీటర్లు. మధ్యలో చెక్క టేబుల్. దాని మీద ఒక ఆకు పచ్చని క్రాస్టిచ్ గుడ్డ పరిచి ఉంటుంది. దాని మీద పూల బొమ్మ. అది కుట్టింది అమ్మే. దాని మధ్యలో ఇత్తడి ఆష్ ట్రే. దాని మీద చక్కని నగిషీలు. మూత తీస్తే, లోపలి అంచు చుట్టూతా పది చిన్న గొట్టాలు. ప్రతి గొట్టం లోను ఒక చిన్న స్ప్రింగ్. అందులోకి సిగరెట్లు పేర్చి, మూత పెట్టాలి. మూతలో ఒక బెజ్జం. మూత తిప్పగానే ఆ బెజ్జం నుండి ఒక సిగరెట్టు పైకి వచ్చేది. ఒక పక్కనే ఇల్లస్ట్రేటేడ్ వీక్లి, స్పాన్, లైఫ్ వగైరా. మరో వైపు తెలుగు దిన పత్రికలు. ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రిక, విశాలాంధ్ర, అభ్యుదయ లాంటివి. చందమామ కూడ. పేము కుర్చీలకు కవర్లు. కవర్ల మీద అందమైన పువ్వులు. వాటిని క్రాస్ స్టిచ్‌తో కుట్టింది అమ్మే. అమ్మకి కుట్లు, అల్లికలు వచ్చు. చాలా బాగా వచ్చు. కలర్ మాచింగ్ కూడా అమ్మ తరువాతే ఎవరైనా. నా భార్యకి కూడ అమ్మే నేర్పింది.

వరండాలోనుంచి హాల్లోకి గుమ్మం. గుమ్మానికి కర్టెన్లు. దాని మీద చక్కని కుట్లు. అవి కూడా అమ్మ కుట్టినవే. హాల్లో నుంచి బెడ్ రూమ్. బెడ్ రూములో ఉత్తరం వైపున నా స్టడీ టేబుల్. టేకుది. దక్షిణం వైపున గోడకానుకుని నాన్న టేబుల్, రైటింగ్ పాడ్, నాన్న కుర్చి. టేబుల్ ని కప్పేస్తూ గుడ్డ. దాని అంచుల చూట్టూ అందమైన లతలతో అమ్మ కుట్టిన డిజైన్లు. దాని మీద ఎదురుగుండా గోడకి ఆనుకుని నాన్న కలం. పార్కర్ పెన్ను. పెన్సిళ్ళు, ఎరుపు, నీలంతో పాటు మాములు గ్రాపైట్ పెన్సిళ్లు. అవన్నీ ఒక చెక్క పెట్టెలో. దానికి మూత ఉండదు. పక్కనే ఒక షార్పెనర్. నాన్న వాడుకునే క్వింక్ , బ్లూబ్లాక్ ఇంక్ బాటిల్. బ్లాటింగ్ పేపర్లు. ఒక బ్లాటింగ్ పాడ్. మార్కింగ్ పెన్సిళ్ళు, ఎరేజర్లు. మరో వైపు నాన్న చదువుకునే పుస్తకాల దొంతర. ఒక చిన్న పళ్ళెం. మధ్యలో ఒక బ్రాస్ ఆష్‌ట్రే. అందులో కొన్ని నీళ్ళు. దాని పక్కేనే లైటర్.

ఆ రోజు నాన్న ఇంట్లోనే ఉన్నారు. సాయంత్రం స్కూలు నుంచి వచ్చి, స్నానం చేసి ఆటలాడుకుని ఇంటికి రాగానే మళ్ళీ స్నానం. పుస్తకాలు వేసుకుని హోం వర్క్ చేసుకున్నాను. అమ్మ పక్కనే కూర్చుంది. ఏదో పుస్తకం చదువుకుంటూ. నాన్న అవతల పడక గదిలో ఉన్నారు.

“ఇక చాల్లే. లే భోజనం చేద్దువు” అని అమ్మ అంటే, “నాన్నని పిలుస్తా!”

“నాన్న వ్రాసుకుంటున్నారు. తరువాత చేస్తారు లే. ముందు నువ్వు కానివ్వు”

నాన్న గారి చేరాత

నాన్న గారి చేరాత

“మరి నువ్వు?”

“నేను నాన్నగారితో చేస్తాను. నీకు నేను పెడతానుగా. నువ్వు చేసేయ్”.

అయిష్టం గానే భోంచేసాను. సాధ్యమైనంత వరకు మేము ముగ్గురం కలిసే భోజనం చేసేవారం. అదే అలవాటు నా జీవితాంతం పాటించాను.

బెడ్ రూం గుమ్మానికున్న కర్టెన్లు తొలగించి, నెమ్మదిగా చప్పుడు చెయ్యకుండా ఒక తలుపు రెక్కని వెనక్కి తోసాను. ఎదురుగుండా టేబుల్ లైటు వెలుగులో గోడ మీద ముందుకు వంగి కూర్చున్న నాన్న నీడ. నాన్న ఎడం చేతిలో సిగరెట్టుతో కూర్చుని ఉన్నారు. కుర్చీ చేతుల మీదుగా టేబుల్‌కి వారధి లాగ మధ్యలో రైటింగ్ పాడ్. దానిమీద తెల్ల కాగితాలు. టేబుల్ మీద టేబుల్ లైటు. దాని వెలుతురు కాగితాల మీద పడుతోంది. కుడిచేతిలో పెన్ను. పార్కర్ పెన్ను అది. బంగారపు పాళీ. ఆ కలం కాగితం మీద పరుగెడుతున్న చేస్తున్న మధురమైన శబ్దం. (వయొలిన్ గుర్తు వస్తోంది) ఆ లైటు వెలుతురులో వ్రాసుకుంటున్న నాన్న.

చప్పుడు చెయ్యకుండా నాన్న వెనుకగా గోడ వైపుకు ఉన్న నా చిన్న మంచం మీదకి ఎక్కి దుప్పటి కప్పుకున్నాను. కాళ్ళూపుకుంటూ నాన్న వీపు వైపు చూస్తున్నాను. నాన్న వ్రాసుకుంటున్న కలం పాళీ చప్పుడు చేస్తున్న చప్పుడు వింటున్నాను. మధ్యలో ఎందుకో ఒకసారి, వెనక్కి తిరిగి చూసారు. నేను దుప్పటి తలమీదుగా కప్పుకుని పడుకుని ఉన్నాను. నన్ను చూసి నవ్వారు. నేను నవ్వాను. కళ్ళు మూసుకున్నాను. కాగితం మీద ఆ ‘వయొలిన్’ వినిపించే సంగీతానికి ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో నాకే తెలియదు.

మరో రోజు

ఆ రోజు ఉదయం నాన్న పడక కుర్చీలో హాలులో గుమ్మానికి ఎదురుగుండా కూర్చుని ఉన్నారు. పెన్సిల్‌తో ఏదో ఇంగ్లీష్ పజిల్ నింపుకుంటున్నారు. చెవుల మీదుగా తలకి మఫ్లర్ చుట్టుకున్నారు. స్వెటర్ కూడా వేసుకున్నారు. దగ్గిరకి వెళ్ళి పుస్తకం నెట్టేసి చేతుల మధ్య నుండి ఆయన బొజ్జ మీదకి ఎక్కేసాను. ఆయన నడుం చుట్టూ కాళ్లేసేసి, చాతీ మీద తల వాల్చుకున్నాను. ఎందుకనో ఎప్పుడు ఉండే వెచ్చదనంకంటే ఆయన శరీరం ఇంకా కొంచెం ఎక్కువగానే వెచ్చగానే ఉన్నట్టుంది. ఈ లోపు అమ్మ ఒక పళ్ళెంలో కప్పు, సాసర్‌తో టీ తెచ్చింది. నన్ను చూస్తునే, “లేమ్మా, నాన్నగారికి బాగోలేదు”.

“ఏం అయ్యింది?”

“జ్వరం”

“ఐతే నేను స్కూలుకి వెళ్లను. నాన్న ఇంట్లోనే ఉంటారుగా”.నాన్న నవ్వుతూ, “నేను ఇంట్లోనే ఉంటాను కదరా? నువ్వు స్కూల్‌కి వెళ్ళి వచ్చేయ్”

నాకు ఎందుకో నాన్నని అలా వదిలేసి స్కూలుకి వెళ్ళాలనిపించలేదు. నేను వెళ్లను అని, వెళ్ళాలని అమ్మా, నాన్న. చివరికి నాన్న ఒక సలహా ఇచ్చారు. సరే స్కూలుకి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేయ్ సరేనా? అని. అమ్మ లీవు లెటర్ వ్రాసి ఇచ్చింది.

రోజూ స్కూలుకి స్కూలు బస్సులో వెళ్లి వచ్చేవాడిని. ఆ రోజు స్కూలు బస్సులో వెళ్ళి మధ్యాహ్నం బస్సులో ఇంటికి చేరుకున్నాను. నాన్న పడుకుని ఉన్నారు. ఎందుకో దిగులేసింది. నాన్న అలా పడుకుని ఉండటం నచ్చలేదు నాకు. నెమ్మదిగా పక్కలోకి దూరాను. నాన్న ఆ మగత నిద్రలోనే నా తలని తన భుజం మీదకు లాక్కున్నారు. అలానే ఉండిపొయ్యాను. అమ్మ గదిలోకి వచ్చి చూసి ఏమనలో తెలియక అలా చూసి వెళ్ళిపోయింది. కళ్ళలో తడి. ఉందా? ఏమో తెలీదు.

—-

భార్యాభర్తలు సినిమా విడుదల ప్రకటన

భార్యాభర్తలు సినిమా విడుదల ప్రకటన

నాన్న ఊరెళ్ళారు.

పొద్దున్నే వస్తారు అని అమ్మ చెప్పింది. నేను, మోతి ఇద్దరం వరండాలోనే కూర్చున్నాం. ఏదో కారు హారన్ వినపడింది. చదువుకునే వాడినల్లా పిట్టగోడకున్న జాలీలో నుంచి చూస్తే, కారులో నుంచి నాన్న దిగుతున్నారు. “నాన్నొచ్చారు” అని అరుస్తూ, గేటు తెరిచి మెట్లు దూకుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నా వెనకే మోతి. నాన్న నవ్వుతూ నా వైపు తిరిగి మోకాళ్ల మీదకి కొంచెం వంగి చేతులు చాపారు. ఒక్క దూకు దూకాను ఆ చేతుల్లోకి. అలాగే గాల్లోకి లేపి, మళ్ళీ నన్ను హత్తుకున్నారు.

బాబోయ్, నాన్నకి ఎంత బలమో!

మోతి కూడ నాన్న కాళ్ళమీదకి ఎగురుతోంది. నాన్న కాళ్ళు నాకుతోంది. మా ఇద్దరి చుట్టు గిరగిరా తిరుగుతోంది. సంతోషంగా అరుస్తోంది. డ్రైవరు డిక్కి లోంచి సామాన్లు తీసి కింద పెడుతున్నాడు. ఈ లోపు పనిమనిషి ‘బేబి‌’ వచ్చింది. అవన్నీ తీసుకుని ఇంట్లోకి చేరుస్తోంది. పెద్దది బ్రవున్ పేపర్ పాకెట్ ఒకటి. చాలా బరువుగా ఉన్నట్టుంది. మొయ్యలేక ఆపసోపాలు పడుతోంది. నాన్న అలాగే నన్ను ఒక చేత్తో ఎత్తుకుని మరో చేత్తో హొల్డాలు పట్టుకుని, మెట్లెక్కి పైకి ఇంట్లోకి తీసుకువెళ్ళారు.

కాసేపు అవి ఇవి కబుర్లు. స్కూలు టైం అయిపోతుంది అమ్మ నన్ను హెచ్చరిస్తోంది. స్కూలు ఎగగొట్టే అవకాశం లేదు. “నేను ఉంటానులేరా నువ్వు వచ్చేటప్పడికి”, అని నాన్న దగ్గిర అరిచేతిలో ప్రమాణం చేయించుకుని ఆ రోజు స్కూలుకి వెళ్ళాను.

సాయంత్రం వచ్చాను. నాన్న హాలులో పడక కుర్చీలో కూర్చుని చదువుకుంటున్నారు. మార్కింగ్ పెన్సిల్‌తో గుర్తు పెట్టుకుంటున్నారు. ఇంట్లో హాలులో పుస్తకాల రాక్‌ల మధ్య ఆ బ్రవున్ పేపర్ కట్ట అలానే ఉంది.

“నాన్న, ఇందులో ఏం వున్నాయి?”

“నువ్వే చూడు”

“నేను తెరవ్వొచ్చా”.

నవ్వుతూ “ఊ”..

అమ్మ నవ్వుతూ “మెషిన్లో కత్తెర ఉంది గా. చూడు”.

ఉషా కుట్టు మిషిన్ అది. నాన్నకి, నాకు అమ్మ ఆన్నీ దానిమీదే కుట్టి పెట్టేది. అందులో నుంచి కత్తెర తీసాను. అమ్మ సహాయంతో ఆ కట్టకున్న తాళ్ళు కోసేసాను. పొరలు పొరలుగా కాగితాలు తీసేసి చూస్తే లోపల పుస్తకాలు. ఎన్ని పుస్తకాలో! రంగు, రంగుల అట్టలతో!

“నాన్నా, ఈ పుస్తకాలన్ని నాకేనా?”

“నీకేరా..అన్నీ నీకే”.

తీస్తూన్నాను, ఇంకా వస్తూనే వున్నాయ్. ఇంగ్లీష్‌లో కూడా ఉన్నాయి పుస్తకాలు.
ఇవన్నీ చదివి నాన్నలాగా పెద్దవాడినై పోవాలి. మరి ఎక్కడ పెట్టుకోవాలి ఈ పుస్తకాలన్నీ.  అమ్మ అంది. నీ టేబుల్ మీద పెట్టుకో అని. “మరి అన్ని పట్టవుగా”? అప్పుడు నాన్న, “ నా రాక్‌లో కొన్ని పెట్టుకో. నీ పుస్తకాలకి ఇంకో రాక్ చేయించుదాంలే” అన్నారు. నాన్న పుస్తకాల రాక్‌లో నాన్న పుస్తకాల పక్కనే నా పుస్తకాలు. అంటే నాన్న అంత గొప్పగా చదువుకుంటాను. నాన్నకంటే ఎక్కువ తెలుస్తుంది అప్పుడు. అప్పుడు, నాన్నని కాస్మోనాట్ అంటే ఎవరు, స్పుత్నిక్ అంటే ఏమిటి, పడవలను ఎలా చేస్తారు, షిప్పు కాప్టెన్‌కి సముద్రంలో దారి ఎలా తెలుస్తుంది, దెబ్బ తగిలితే రక్తం వస్తుంది కదా, అది ఎలా చెక్కు కడుతుంది, ఒంట్లో పురుగుగులు ఎలా ఉంటాయ్,  అవేమి తింటాయ్ అని అడగకుండా అన్ని నేనే చదివి తెలుసుకోవచ్చు.

నాన్న నాకు డ్రాయింగ్ బుక్స్ కూడా తెచ్చిపెట్టారు. ఎంచక్కగా, జనమంచి మామయ్య తెచ్చిన కలర్ పెన్సిల్స్‌తో కొత్త పుస్తకంలో, కొత్త కొత్త బొమ్మలు వేసుకోవచ్చు. బొమ్మల పంచతంత్రం, భారతం, రామాయణం, పారిపోయిన బఠానీ, జానపద కథలు, రష్యన్ కథలు, గేయాలు. పిల్లల పాటలు, నీతి చంద్రిక, ఉత్పలమాల, మను చరిత్ర, సింద్‌బాద్ కథలు ఎన్నో కథలు. రాకుమారులు, రాకుమార్తెలు, మంత్రగత్తెలు, గుర్రాలు, ఏనుగులు, పులులు, చీమలు, కోతులు, చెట్లు, ఆకులు, పడవలు, స్పుత్నిక్కులు, విమానాలు, కార్లు, ఫోర్డ్, నక్షత్రాలు, నీరు, పిడుగులు, విద్యుత్తు …వాటితో పాటు గ్లోబ్. దాని మీద పేర్లన్నీ తెలుగులో ఉన్నాయి!

నాన్న మీద అమాంతం ప్రేమ పెరిగిపోయింది. పరుగెత్తుకుంటూవెళ్ళి నాన్నమీదకి ఎక్కేసాను. నేను చూసుకోలేదు. నాన్న చేతిలో సిగరెట్టుని. కాలుతున్న సిగరెట్టు కొస నుండి ఒక కణిక నాన్న చాతి మీద పడింది. కాలింది. బొబ్బలేచింది. నా ప్రేమకి మచ్చగా అది మిగిలిపోయింది. నాన్న నవ్వుతునే ఉన్నారు.

ఆ రోజు ఆకాశంలో నల్లని మబ్బులు అటూ ఇటూ పరుగెడుతునే ఉన్నాయి. నాన్న అటు పడక గదిలోనుండి ఇటు హాలు లోకి అటూ ఇటూ తిరుగుతునే ఉన్నారు. ఏమిటో తెలియదు కాని ఏంటో ఏదో సరిగ్గా లేదు. నేను వరండాలో చెస్ ఆడుకుంటున్నాను.

లోపల నుండి మూలుగులు. పరిగెత్తుకుంటూ పడక గదిలోకి వెళ్ళాను. అమ్మ కూడా వంటగదిలోనుండి వచ్చింది.

నాన్నకి బాగోలేదు. వాంతులు, విరోచనాలు. బెడ్‌రూమ్ నిండా వాంతులే. నాన్నకి అస్సలు బాగోలేదు. సన్నటి తుప్పర పడుతోంది. క్రింద ఇంటిలోనుండి వాళ్ళు వచ్చారు పరుగెత్తుకుంటూ. ఎవరో అన్నారు, “టాక్సీ తీసుకురామ్మా. నాన్నని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలి”. పరుగెత్తాను. తేనాం పేట మెయిన్‌రోడ్డు మీదకి. ఆ మూల మీద టాక్సీ స్టాండ్‌లో ఎవరూ లేరు. అటూ, ఇటూ చూసాను. ఆల్వార్ పేట మూల మీద రెండు పెట్రోలు బంకులున్నవి. వాటి దగ్గిర్లో ఒక టాక్సీ స్టాండ్ ఉంది. అటువైపు పరుగెత్తాను. దాదాపు ఒక కిలోమీటరు. రొప్పుతూ అంబాసిడర్ కార్ టాక్సీ డ్రైవర్‌కి చెప్పాను. నాన్నకి బాగోలేదు. నువ్వు రా. హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి అని.  ముందు డోర్ తెరిచి కూర్చో మన్నాడు. ఇంటికి తీసుకు వెళ్ళాను. నాన్న కిందకి తీసుకుని వచ్చారు. మెట్లమీద, నాన్న “బాబూ” అంటూ రెండు మూడు సార్లు పిలిచారు. అదే ఆఖరు సారి నాన్న నన్ను పిలవడం. బహుశా ఆయన ఆ ఆఖరి క్షణాలలో భయ పడింది నేనేమైపోతాననేమో!

నాన్న వెళ్ళిపోయారు. నేను మిగిలిపోయాను. ఆయన జ్ఞాపకాలు మిగిలిపోయినవి, ఆయన పుస్తకాలు లాగానే!

 

-0-

నాన్నకి వార్ మెడల్

నాన్నకి వార్ మెడల్

మా నాన్న పేరు అట్లూరి పిచ్చేశ్వర రావు.  ఆయన వృత్తి రీత్యా మొదట నావికుడు.  బ్రిటీషు వారి రాయల్ ఇండియన్ నేవీ నావికాదళంలో నౌకల మీద ఇంజనీరు. భారత దేశ స్వాతంత్ర్య సమరం నేపథ్యంలో రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటులో(మ్యూటిని) పాల్గొన్నారు. బ్రిటీష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి శిక్షించింది. బారతదేశ స్వాతంత్ర్యానంతరం, భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు మళ్ళీ భారత నౌకాదళంలో చేరారు. ఆయన రచయిత. సాయుధ నౌకదళం తిరుగుబాటు నేపథ్యంతో కథలు కూడా వ్రాసారు. కొన్ని కథలు, వ్యాసాలు, నాటికలు, వెండి తెర నవలలే కాక, సినిమాలకి కథలు కూడా వ్రాసారు. కొన్నింటికి సంభాషణలు కూడా వ్రాసారు. అంటే స్క్రీన్‌ప్లేలు. కొన్ని హిందీ నవలలని తెలుగులోకి అనువదించారు.

మా అమ్మ పేరు చౌదరాణి. శతావధాని త్రిపురనేని రామస్వామి గారి కనిష్ట పుత్రిక. తనూ రచయిత్రే. కథలు, కవితలు, రేడియో వ్యాసాలు, నవలలు వ్రాసింది. హిందీలో నుండి తెలుగులోకి అనువాదాలు చేసింది. స్వయంగా మూడు దశాబ్దాల పాటు మద్రాసులోని త్యాగరాయ నగరులోని, పాండి బజారులో తెలుగు వారికోసం ప్రత్యేకంగా తెలుగు పుస్తకాల షాపుని స్థాపించి, సాహిత్య గోష్టులు, చర్చా వేదికలు, సమావేశాలు నిర్వహిస్తూ సాహిత్య సేవ చేసింది. బహశా ఆ మాత్రం చేసిన తొలి తెలుగు మహిళ తనేనేమో!

– అనిల్ అట్లూరి

సెప్టెంబర్ 26 ప్రసిద్ధ అభ్యుదయ రచయిత అట్లూరి పిచ్చేశ్వర రావు గారి వర్ధంతి .

Sakshi_D25895202

– ౦-

 

“మాలతమ్మా.. మళ్ళీ ఎప్పుడు కలిసేదీ…?”

bhuvanachandra“అర్ధాంతరంగా మృత్యువొచ్చి” ఆ మహానుభావుడ్ని తీసికెళ్లిపోయింది…!” అన్నారు ఒకరు.. మా విశ్వనాధ ఆశ్రమంలో..

నా వయసప్పుడు 8 సంవత్సరాలు .

“అలాగా! ఎక్కడ్నించి వచ్చింది? ఏ బస్సులో వచ్చింది.. ఎవరితో వచ్చింది?” నవ్వుతూ అడిగారు మా స్వామిజీ బోధానందపురి మహరాజ్.

“అదేంటి స్వామి అలా అంటారూ? మృత్యువంటే చావు కదా…”  చిన్నబుచ్చుకున్నాడాయన.

“అదేనయ్యా అంటున్నది. ఆ చావు ఎక్కడ్నించి వచ్చిందని . తెలుసా? తెలీదు కదూ! చావు ఎక్కడి నించీ రాదు. మనిషి పుట్టిన క్షణమే చావు పుట్టింది. మనిషితో పాటే పెరుగుతుంది. మనిషిలో ‘శక్తి’ సన్నగిల్లాక ఆ మృత్యువు అ మనిషిని తనలో ‘కలిపేసుకుంటుంది..’  ఓ విధంగా చెబితే మృత్యువు అలసిన శరీరానికి ‘ముక్తినిస్తుంది..’ అనగా బాధ్యతలనించి ‘విముక్తి కల్పిస్తుంది’ అన్నారు స్వామీజీ.

ఈ మాటలు ఇన్నేళ్లుగా ఆల్‌మోస్టు ప్రతీరోజూ జ్ఞాపకం వస్తూనే వున్నాయి. ఆ మాటల్ని మరిన్నిసార్లు గుర్తు తెచ్చుకుంటాను – ‘మాలతీ చందూర్’ లాంటి మనసున్న మనుషులు పరమపదించినప్పుడు.

ఒకరు ముందూ, ఒకరు వెనుకా .. తేడా అంతే… అందరం యీ అత్తింటిని వదిలి ‘ఆ’ పుట్టింటికి చేరాల్సిన వాళ్లమే. (లాగా చున్‌రీ మే దాగ్. చుపావూఁ కైసే  పాట గుర్తుందా?)

మృత్యువు ‘ఆడు’కోని జీవి యీ సృష్టిలో ఉంటుందా? అసలు పుడుతుందా? సరే.. ఆ వి షయం పక్కన పెడితే…. “భువనచంద్రగారూ.. మనం ‘పెద్దపీట’లవాళ్ళం. ఇదీ.. నేనెప్పుడు కలిసినా మాలతీ చందూర్ గారు ఆప్యాయంగా నాతో అనే మాట.

ఏలూరు, నూజివీడు ప్రాంతాల వాళ్ళని అప్పటివాళ్ళు ‘పెద్దపీట’లాళ్లు అనేవారు. కారణం భోజనానికి కూర్చునే పీటలు చాలా పెద్దవి చేయించి వాడటమే గాక, ‘అతిథి మర్యాదల్ని’ అద్భుతంగా పాటించేవారు కూడా. మా ఇద్దరి సంభాషణల్లో చోటు చేసుకునే మరో అంశం ‘ఏలూరు’. మా చింతలపూడి ఏలూరికి ముప్పై మైళ్లేగా.. ఇంకా నూజివీడు  చిన్న రసాలతో పెట్టిన ఆవకాయ, మా వూరి దగ్గరున్న ప్రగడవరం పండుమిర్చి, మరియు ఘనత వహించిన ఏలూరి దోమలు.

నాకు వంటావార్పూ రాకపోయినా, నా నాలిక మాత్రం రుచి మరిగిన నాలిక. దాంతో రకరకాల కూరలూ, పచ్చళ్ళూ తయారీ విధానం, ఇంకా మా వేపు మాత్రమే చేసుకునే వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి మెంతిపోపూ మాత్రమే గాక నేతిబీరకాయ పచ్చడి ఘుమఘుమా ఇవన్నీ ఏ సభలోనో, సమావేశంలోనో మేము కలుసుకున్నప్పుడు దొర్లే విషయాలు.

చందూర్‌గారికి ‘తిండి’ యావ పెద్దగా లేదు గనక హాయిగా నవ్వుతూ మా కబుర్లు వినేవారు. ఒకసారి నేను ‘నల్లేరు’ పచ్చడి గురించి చెబితె మాత్రం ఆయన చాలా ఇంట్రెస్టింగ్‌గా విన్నారు. నల్లేరు పచ్చడి గురించి ఆయన అంతకు ముందు వినలేదట.

ఆంధ్రాక్లబ్ (ఆస్కా)లో ఎప్పుడు సభలు జరిగినా ఘంటసాల రత్నకుమార్‌గారు స్వచ్చమైన, అచ్చమైన ఆంధ్రా టిఫిన్లు చేయిస్తారు. ఉల్లిపాయలు దట్టించి, నిమ్మకాయలు పిండిన ఘాటుతోటి పచ్చిమిరపకాయ బజ్జీలు, లేత ‘బంగారు’ రంగులో నుంచి ‘ముదురు’ రంగులోకి అందంగా దిగిన ‘ఆలూ బోండాలు’, ‘స్వర్గం చూడాలా? రా .. నన్ను తిను” అని నోరూరించే చల్ల పునుకులూ, ఎర్రగా వర్రగా ‘మింగెయ్ నన్ను’ అన్నట్లు చూసే అల్లం చెట్నీలు.. వీటన్నింటితోటి ఒకింత చిలిపిదనంతో అందరినీ అలరించే మాలతీ చందూర్‌గారి మధురమైన మాటలూ .. యీ చెన్నై మహానగరంలో నివశించే ఏ తెలుగువాడు మరిచిపోగలడు?

మాలతిగారు  ‘లేని’ సభని ఊహించలేం.  ‘వీడు గొప్పవాడు’, సామాన్యుడు అని చూడకుండా, అందరితోటి హాయిగా కలిసిపోయి, ఆప్యాయతానురాగాల్ని పంచే మాలతిగారు మనని విడిచి ఎక్కడికి పోతారు? శరీరానికేముందీ….. అదెప్పుడైనా మనని విడిలిపోయేదే. కానీ ఆత్మ? పోనీ మనసూ? అంతెందుకూ. ఆవిడ మంచి మాట? మనని విడిచిపోగలదా?

మాలతిగారి గురించి అనుకోగానే మనకి గుర్తొచ్చేది  ప్రమదావనం పాత కెరటాలు. ఇంకా వంటలూ – వార్పులూ. మూడువందలకి పైగా ఆమె చేసిన అనువాద రచనలూ, 25 పైగా చేసిన స్వీయ రచనలు. మాకు అంటే చెన్నైవాళ్లకు వీటన్నిటికన్నా మించి గుర్తొచ్చేవి ఆవిడ నిష్కల్మషమైన నవ్వులూ, ఎవరినీ నొప్పించని ఆమె కామెంట్లూ, సరదాగా, హాయిగా గంగా ప్రవాహంలాగా  ఆవిడ గళం ద్వారా ప్రవహించే  ప్రసంగాలు.

“ఆరోగ్యం ఎలా ఉందమ్మా?” అని అడిగితే పకపకా నవ్వి “ఇదిగో.. ఇలా ఉందయ్యా!” అనేవారు. ఇంకేం!

కష్టాలు ‘చెప్పుకోవడం’, ఇతర్లని విమర్శించడం, తప్పొప్పుల్ని, లోటుపాట్లని ‘వెదకడం’ ఆవిడకి తెలీని విషయాలు.

ఓ మంచి పుస్తకం గురించి మాట్లాడండి.. అంత మంచి ‘శ్రోత’ ప్రపంచంలో దొరకదు.

ఓ సారి మీసాలు బాగా ‘ట్రిమ్’ చేశాను. “ఇదిగో భువనచంద్రా.. నేను లావైనా, నువ్వు మీసాలు తగ్గించినా చూడ్డానికి బాగోదయ్యా! అన్నారు. ఆ తర్వాత ఏనాడూ నేను ‘ట్రిమ్’ చేయ్యలేదు.

చాలా చాలా ఏళ్ళ క్రితం, అంటే ఓ అయిదు దశాబ్దాల  వెనక్కి వెళితే, మాలతీ చందూర్‌గారి ‘ప్రమదావనం’, తెన్నేటి హేమలతగారి ‘ఊహాగానం’, రామలక్ష్మి ఆరుద్రగారి ‘కాలక్షేపం (అంతరంగాలు) పాఠకుల్ని ఉర్రూతలూగించేవి. ముగ్గుర్లో ఎవరు గొప్ప అని కూడా ‘మేం’ వాదించుకునేవాళ్ళం. నా అదృష్టం ఏమోగానీ ఆ మహానుభావురాళ్లు ముగ్గురూ నేను పెద్దయ్యాక పరిచయం కావటం, వారి పాదాలనంటి ఆశీస్సులు నేను పొందటం జరిగింది.

ఇప్పుడే అంటే ఓ పది నిముషాలకి ముందు బలభద్రపాత్రుని రమణిగారితో మాట్లాడుతూ, “రమణిగారూ నలభై ఏళ్ళ క్రితం మాలతీ చందూర్‌గారు వ్రాసిన ‘రెక్కలు – చుక్కలు’ అనే నవల సినిమాకి అద్భుతంగా పనికి వస్తుంది. చక్కని లేడీ ఓరియెంటెడ్ ‘సబ్జెక్ట్’ అన్నాను. ఎందుకంటే యీనాటి సమాజంలో ఆవిడ ‘చూసి, చూపించిన’ పరిస్థితులే ఉన్నాయి.

స్వాతి పత్రికలో ‘పాతకెరటాలు’ ఎన్ని లక్షలమంది పాఠకుల్ని ‘విశ్వ’ పాఠకులుగా మారిచిందో నాకు తెలుసు. స్వాతి ‘మాస’ పత్రిక రాగానే మొదట చదివేది, ఆ శీర్షికకు సంబంధించిన నవలే. అలాగే ‘నన్ను అడగండి’..

ఏమి చెప్పినా, వ్రాసినా, తనదంటూ ఓ విలక్షణ శైలి. తన ‘సాహిత్య సంపద’ని అందరితో పంచుకోవాలనే తపన… ఎవరు ఏది వ్రాసి చూపించినా చెప్పినా, “భలే ఉంది” అంటూ ప్రోత్సహించడం మాలతిగారి జీవలక్షణం. నవ్యలో నేను వ్రాసిన ‘ ‘ఆ ఊరేది’ కథ చదివి, “చివర్లో ఏడిపించావోయ్. నీ సమయాన్నంతా ‘కథ’లకే కేటాయిస్తే ఎంత బాగుంటుందో?” అన్నారు. ఆ స్ఫూర్తితో నేను చాలా కథలు రాసే ‘ధైర్యం’ సమకూర్చుకున్నాను అనటం అతిశయోక్తి కాదు.

ఏ ‘కథ’ చదివినా బాగుంటే ఆవిడతో చెప్పేవాడ్ని. “అదా.. అద్భుతం” అనేవారు. అంటే ఆల్‌రెడీ ఆమె చదివేశారన్నమాట. ” ఓ రోజు మీ ఇంటికొచ్చి నీ లైబ్రరీ చూడాలి..!” అన్నారు. ఆవిడ అన్న ఆ మాట మాత్రం ఇక నా జీవితాంతం ఓ తీరని కలలాగే మిగిలిపోతుంది.

“వివరించడం” అనేది మాలతిగారికి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే ఏలూరులో ఆవిడ ఉపాధ్యాయురాలిగా పని చేశారు. ఆవిడ సెన్సార్ సెంట్రల్ బోర్డు మెంబరుగానూ పని చేశారు. ‘రవ్వలదిద్దులు’ కథ (మొదటిది)ని మా అమ్మగారు గట్టిగా చదువుతుండగా నా చిన్నతనంలో నేను విన్నానని గర్వంగా ఇప్పుడు చెప్పుకోగలను. ఆలోచించు, హృదయనేత్రి, భూమిపుత్రి, శతాబ్ది సూరీడు,  ఇలా 25కి మించి నవలలు రాశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య ఎకాడమీ అవార్డు, భారత భాషా పరిషత్ అవార్డు ఇలా ఎన్నో అవార్డుల్ని అందుకున్నారు.

ఒక్క విషయం విన్నవించుకుంటాను. న్యాయంగా యీ నాలుగు మాటలూ మాలతీ చందూర్‌గారి మృతి సందర్భంగా వ్రాయాల్సినవి . కానీ నా మనసులో ఆ ఆలోచన లేదు. 84 సంవత్సరాలపాటు సంపూర్ణంగా, సంతృప్తిగా జీవించి సాహితీలోకానికి అమూల్య సేవ చేసి, విజ్ఞానపు వెలుగుల్ని లక్షలాది మందికి నెలనెలా పంచుతూ, ఎందరికో ప్రశ్నోత్తరాల ద్వారా బతుకుని దిద్ది బతుకుబాటని చూపిన మాలతీచందూర్‌గారికి మరణం లేదు. ఆఖరికి తన భౌతిక శరీరాన్ని కూడా, ‘వైద్య పరిశోధన’ల నిమిత్తం రాంచంద్ర కళాశాలకు వప్పచెప్పమన్నారంటే, ఆమె వ్యక్తిత్వం ఎంత గొప్పదో  మనం ఊహించుకోవచ్చు.

“లోకాన్నించి  ఏవీ తీసికెళ్లలేం..” ఇది నిజం. కానీ “లోకానికి ఎంతో ఇవ్వొచ్చు…!” ఇది మాలతీ చందూర్‌గారు ప్రాక్టికల్‌గా రుజువు చేసిన నిజం.

అందుకే మాలతమ్మా.. కన్నీళ్లు కార్చి మీకు వీడ్కోలు పలకాలని లేదు. గుండెనిండా ప్రేమతో మిమ్మల్ని తలుచు కుంటాం. ప్రతీ పాత కెరటాన్ని, మా హృదయ సముద్రంలో మరోసారి కదలాడమని వేడుకుంటాం. కలకాలం హృదయాల్లో జీవించే మీకు ‘కన్నీ’టి వీడ్కోళ్లెందుకు?

మీరు వ్రాసిన పుస్తకాల్ని మళ్లీ మళ్లీ చదవాలి. మీ నవ్వుల్ని మాటల్నీ, మళ్లీ మళ్లీ తలుచుకుని రాబోయే తరానికి మీగురించి చెప్పాల్సిన బాధ్యత మాకు ఎలానూ ఉంది కదా!

ఎటొచ్చీ ఒకటే బాధ. ఇకనించీ ఏ సభకి వెళ్లినా, ఏ సమావేశానికి వెళ్లినా ఖాళీగా ఉండే ముందు వుండే మీ కుర్చీ మా గుండెల్ని పిండెయ్యదూ.. మీ జ్ఞాపకాల్లో మమ్మల్ని ముంచెయ్యదూ.

అవునూ.. ఇన్ని వేల పేజీలు వ్రాశారు కదా. మీ జ్ఞాపకాలతో గుండెల్లోంచి పొంగి, ‘కళ్ళల్లోంచి కారే కన్నీళ్ల’ని ఎలా ఆపుకోవాలో మాత్రం ఎందుకు వ్రాయలేదు? అలా రాసి గనక వుంటే ఇవ్వాళ ఇన్ని వందల కళ్లు…. ఎందుకులేమ్మా…. పుట్టింటికేగా వెళ్ళావూ…! మేమూ కలుస్తాంలే.. ఏనాడో ఓనాడు… అన్నట్టు.. మరో మంచి ‘వంట’ కనిపెట్టరూ. మేం వచ్చాక టేస్టు చెయ్యడానికి… పోనీ మాకోసం మళ్లీ యీ  లోకంలోనే పుట్టకూడదూ..

 

నమస్సులతో

భువనచంద్ర..

 

(వంటల గురించి వ్రాసింది ఎందుకంటే మాలతిగారిని తలుచుకుంటూ మంచి భోజనాన్నో, టిఫిన్నో ఇష్టమైన వారికి వడ్డిస్తారని ..)

నిక్కచ్చి మనిషి మాలతి చందూర్!

Gowri

గౌరీ కృపానందన్

మాలతి చందూర్  అంటేనే తెలుగు వారికి “వంటలు పిండి వంటలు”  పుస్తకం గుర్తుకు వస్తుంది. అప్పట్లో వంటల గురించి పుస్తకం తెలుగులో రావడం, సులభమైన శైలిలో అందరికీ అర్థం అయ్యే విధంగా ఉండటం అందరినీ చాలా ఆకర్షించింది.

ఈ పుస్తకం యొక్క తొలి ఎడిషన్ కాపీ నా దగ్గర ఉందని గర్వంగా చెప్పుకుంటున్నాను.

85865329_45a5e50811

మాలతి చందూర్ గారి ప్రమదావనం అప్పట్లో ఆంధ్రప్రభలో నలబై ఏళ్ళు నిర్విరామంగా వచ్చింది. ఎటువంటి సమస్యలకైనా, అది ప్రపంచ చరిత్ర గురించి కానీయండి, అప్పలమ్మ ఇంట్లో వచ్చిన సమస్య అయినా కానీయండి ఆమె చెప్పే విషయాలు, సూచించే పరిష్కారాలు మిగిలిన వాళ్లకి కూడా మార్గదర్శకంగా ఉంటాయి.

1955లో ‘ప్రమదావనం’ లో ఆమె ఇచ్చిన జవాబులు నా డైరీలో వ్రాసుకుని పెట్టుకున్నాను.

“ఎంత మహోజ్వలమైన ప్రేమ అయినా ఆరు నెలలు దాటే సరికి వెచ్చాల ఖర్చు అడుగుతుంది.”

“ముసలి అత్తగార్లను వృద్ధాశ్రమానికి తరిమేసే కోడళ్ళు, ముందు ముందు తమకీ ఆ గతి పట్టడానికి ఆస్కారం ఉందని గ్రహించాలి.”

ఎవరూ లేని వాళ్లకి వృద్ధాశ్రమం ఆసరాగా ఉండడం సబబు. కానీ కన్నవాళ్ళు ఉన్నా చూసుకునే దిక్కులేక జీవితపు చరమ దశను ఆశ్రమంలో గడపాల్సి రావడం నిజంగా దుర్భరం.

ఆమెతో నా పరిచయం దాదాపు పదేళ్ళ క్రితం జరిగింది. తమిళ సినిమా డైరక్టర్ శ్రీ  ముక్తా శ్రీనివాసన్  గారికి విశ్వనాధ సత్యనారాయణగారి గురించి, ఆయన రచనల గురించి వివరాలు సేకరించి తమిళంలో తనకి ఇవ్వమని అడిగిన సందర్భంలో(రేడియోలో ఇతర భాషా రచయితలు పరిచయం చేసే ఒక కార్యక్రమం కోసం) మాలతి చందూర్ గారిని వారి ఇంటికి వెళ్లి కలిసాను. చిన్న వయస్సులో ప్రమదావనంలో ప్రశ్నలు – జవాబులు శీర్షిక ద్వారా పరిచయమైన ప్రఖ్యాత రచయిత్రిని నేరుగా కలుసుకున్నప్పుడు ఎంత ఉద్వేగం చెందానో మాటల్లో చెప్పలేను. చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నారు. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా తెలియచేసే మనిషి.

తెలుగు నుంచి తమిళంలోకి, తమిళంనుంచి తెలుగులోకి అనువాదం చేస్తున్నానని నన్ను నేను పరిచయం చేసుకున్నప్పుడు నా రచనల గురించి అడిగి తెలుసుకున్నారు.

మాటల మధ్యలో ఆమె రచయితకీ పాఠకులకీ మధ్య కొంచం అంతరం ఉంటేనే బాగా ఉంటుంది అని అంటూ వివరణ ఇచ్చారు. రచనలు చదివిన  పాఠకుడు రచయిత గురించి ఎంతో గొప్పగా ఊహించుకుంటాడు. వాళ్ళు గానీ రచయితతో ఎక్కువగా  పరిచయం పెంచుకుంటే, వాళ్ళు ఊహించుకున్నంత గొప్పగా ఆ రచయిత ఉండక పోతే చాలా నిరాశ చెందుతారు. రచయితలు దివినుంచి దిగి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళకీ కొన్ని బలహీనతలు, అంతో ఇంతో స్వార్థం ఉండొచ్చు. ఆ పార్శ్వం పాఠకులకి తెలియకుండా ఉండడమే మంచిది అని ఆవిడ అన్నప్పుడు నిజమే కదా అనిపించింది.

ఒక సారి చెన్నైలో రచయిత్రి డి.కామేశ్వరి గారి చెల్లెలి ఇంట్లో కామేశ్వరి, మాలతి చందూర్, ఆమె సహోదరి శ్రీమతి శారద  వాళ్ళందరితో నేను, అందరూ కలిసి చిన్నపాటి విందు భోజనం, సాహిత్య చర్చ జరిగిన ఆ మధుర క్షణాలను ఎప్పటికీ మరిచి పోలేను. ఆరోజు శారద గారు నా మొహమాటం చూసి “సిగ్గు లేకుండా తినండి” అని జోక్ చేస్తూ సిగ్గు పడకుండా తినండి అని చెప్పడమే తన ఉద్దేశ్యం అయినా తిండి ముందు సిగ్గు పడితే పని జరగదు కదా అని వ్యాఖ్యానించారు.

భర్త చందూర్ తో మాలతి గారు

భర్త చందూర్ తో మాలతి గారు

“హృదయనేత్రి” అన్న నవలకి మాలతి చందూర్ గారికి సాహిత్య అకాడమి ఆవార్డు వచ్చింది. ఈ నవలను శ్రీమతి శాంతాదత్ గారు “IDHAYA VIZHIKAL” అన్న పేరుతో తమిళంలో అనువదించారు.

భూమిపుత్రి, మనసులోని మనసు, శిశిర వసంతం, కలల వెలుగు, ఆలోచించు, రెక్కలు ముక్కలు ఇలా వాసిలో ఆమె చేసిన రచనలు కొన్ని మాత్రమే అయినా వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా స్త్రీ పాత్రలను బేలగా కాకుండా ఆత్మ గౌరవంతో సమస్యలను ఎదుర్కునే విధంగా చిత్రీకరిస్తారు.

ఎన్నోఆంగ్ల నవలలను కధా మంజరి అన్న పేరిట పరిచయం చేసారు. తమిళ రచయిత D.జయకాంతన్ గారి నవలను “కొన్ని సమయాలల్లో కొంత మంది మనుషులు”, N. పార్థసారధి గారి నవలను “సమాజం కోరల్లో”, శివశంకరి గారి నవలను “ఓ మనిషి కధ “ అన్న పేరిట తెలుగు పాఠకులకి అందించారు.

ఆమె రచనల్లో నాకు చాలా నచ్చిన నవల “శతాబ్ది సూరీడు.” దాన్ని తమిళంలో అనువదించడానికి ఆమె అనుమతి తీసుకున్నాను గాని ఇంకా మొదలు పెట్టలేదు. ఆమెకి నివాళిగా వెంటనే ఆ నవలను తమిళంలో తేవాలని, తమిళ పాఠకులకి ఆమెను పరిచయం చేయాలని నా కోరిక.

రచనా వ్యాసంగంలోరాణించి, అందరి మన్ననలనూ పొంది, తన రచనల ద్వారా సమాజానికి మంచి మార్గం చూపించిన మాలతి చందూర్ గారు చిరస్మరణీయులు.

గౌరీ కృపానందన్

 

గోదారికి కొండమల్లెలు తురిమిన పాటగాడు!

నిన్నటి పాటతో ఇవాళ్టి కవిత: గిడుగుతో కవి కృష్ణుడు

నిన్నటి పాటతో ఇవాళ్టి కవిత: గిడుగుతో కవి కృష్ణుడు

“వేల మైళ్ల ఎత్తులో ఎగిరే పక్షినై.. “అని ఇటీవల ఒక కవిసమ్మేళనంలో ఒక కవి చదువుతున్నప్పడు అదే సమ్మేళనంలో నా ప్రక్కనే కూర్చున్న గిడుగు రాజేశ్వరరావు నవ్వుతూ..” పక్షి అంత ఎత్తుకు ఎగిరితే ఆక్సిజన్ లేక చచ్చిపోతుంది.” అని మెల్లగా నా చేయి నొక్కుతూ చమత్కరించారు. నాకూ నవ్వొచ్చింది కానీ ఇతరులు ఏమి అనుకుంటారో అని ఆపుకున్నాను.

ఆ తర్వాత నేనూ, ఆయనా కవితలు చదివాను. ఆయన నేటి వర్తమాన సమాజంంపై విసుర్లు విసురుతూ కందపద్యాలు చదివారు. చాలా సరళంగా, సులభంగా వచన కవిత్వం చదివినంత హాయిగా ఆయన కందపద్యాలు రాయగ లరు. మళ్లీ కలుసుకుందామని విడిపోయాం కానీ, ఆయన మూడునెలల్లోనే ఆయన నేను కలుసుకోలేనంత దూరం వెళిపోతారని ఊహించలేదు. 

ఎందుకో గిడుగును నేనుచాలా తక్కువ సార్లు కలిసినప్పటికీ కలిసినప్పుడల్లా మాకు ఎన్నో రోజులుగా పరిచయం ఉన్నట్లు అనుభూతి. నా చేతులను తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా చాలా విషయాలు మాట్లాడేవారు. నాకంటే ఆయన దాదాపు 30 ఏళ్లు పెద్దవారైనా ఆ వయోతారతమ్యం అనేదే లేనట్లు ఆయన సంభాషించేవారు. స్వాతంత్య్రం వచ్చిన రోజే ఆయన తొలికథ అచ్చయిందని తెలిసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అప్పటికి ఆయనకు 14 ఏళ్లు.

గిడుగుకు భౌతికమైన వయోతారతమ్యం మాత్రమే కాదు,మానసికమైన అడ్డుగోడలు కూడా లేవని, ఆయన స్వచ్చమైన నదీ ప్రవాహం లాంటి వారని ఆయనతో గడిపిన కొన్ని క్షణాలు అనిపిస్తుంది. ।మేధస్సును పెంచుకునే ఆరాటంలో మనసును పెంచుకోలేకపోవడమే నేటి మానవుడి బలహీనత… ఏ శిబిరానికో, వివాదానికో అంకితమై ఇతరుల్ని ప్రత్యర్థులుగా చూసే సాహసం అలవడ లేదు..* అని ఆయన ఒక సందర్భంలో చెప్పినప్పటికీ తన కథల్లో మానవ సంబంధాలను చిత్రించేటప్పుడు మనిషి మనిషిగా ఉండాలంటే కొన్ని జీవలక్షణాలు అవసరమన్న అభిప్రాయం ఆయనకు ఉన్నట్లు అర్థమవుతుంది. అది మంచితనం, యుక్తాయుక్త విచక్షణ,సభ్యత, మానవత్వం, సున్నితత్వం, ఒకరినొకరు గౌరవించుకోవడం, నైతిక విలువలు, బలహీనులకు చేయూతనివ్వడం లాంటివి. ఎలాంటి సిద్దాంతాల ప్రస్తావన లేకుండానే ఆయన కథల్లో మనం నిత్యం చూసే మనుషుల జీవితాల్లో ఈ విలువలను చిత్రించారు.
“ఏ ప్రేమ మహిమతో నెల్ల నక్షత్రాలు నేల రాలక మింట నిలిచి యుండు..” అన్నఅద్భుతమైన కవితా వాక్యంతో ఆయన ।కాళిందిలో వెన్నెల* అన్న కథ ముగించి మన రెప్పలు విశాలంగా తెరుచుకునేలా చేస్తారు. పురుషాధిపత్యాన్ని ద్వేషించే కాళింది అనే అమ్మాయిలో ఒక యువకుడు తెచ్చిన మార్పును ఈ కథ చిత్రిస్తుంది. “పతనమైన సామ్రాజ్య శకలాల్లోంచి నిజంగానే సరికొత్త విలువలు ఏరుకుంది లక్ష్మి..” అన్న వాక్యంతో ఆయన మరో కథ ముగుస్తుంది. ఆ కథ సాధారణ కుటుంబ కథ అయినప్పటికీ వ్యవస్థలో మార్పులు కుటుంబంలో ప్రతిఫలిస్తాయనే మౌలిక వాస్తవాన్ని ఆయన ముగింపు ద్వారా తెలిపారు.

ఇటీవల ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్‌ను సందర్శించేందుకు వెళ్లిన వేలాది మంది ప్రకృతివైపరీత్యాలకు గురైనప్పుడు ఆయన రాసిన ఒక కథ గుర్తుకు వచ్చింది. ।ఇంత చలిలో, అప్పుడప్పుడూ గోరువెచ్చగా వచ్చే ఎండలో ఉండీ ఉడిగిపడే వానజల్లులో ఈ మనుష్యులు ఇన్ని కష్టాలకోర్చి ఏం చూడాలని వెళుతున్నారు? వారిని ఇళ్లలోంచి తరిమి ఈ ప్రస్థానం చేయిస్తున్నదెవరు? సత్యశోధనా, జ్ఞానతృష్ణా ఈ యాత్రకు ఊపిరిపోస్తున్నదా? ఊహకందని విశాల విశ్వాకృతి పట్ల తనకున్న ఆరాధనా భావాన్ని ప్రకటించుకుని తేలికపడాలని మానవుడు ఒక సంక్షిప్తాకృతిని ప్రతీకగా కల్పించుకుంటున్నాడా? *అని ఆయన ఈ కథలో ఒక పాత్ర ద్వారా ప్రశ్నింపచేశారు. ప్రతిదాన్నీ వ్యతిరేక భావంతో, అనారోగ్య విమర్శనాత్మక ధోరణితో చూసేవారికీ గిడుగు దృష్టికీ ఎంత తేడా? అది మురికి కాల్వ ప్రవాహానికీ, జలపాతానికీ ఉన్న తేడా కాదా?

“రచ యిత ఏ ఇంట పుట్టినా, అతి అతడి చేతులో లేని పని. ఆ ఇంట తనకు వెచ్చగా కప్పిన కంబళిలో పెరిగినా, చింకి దుప్పటిలో పెరిగినా ఆ ఆచ్ఛాదన తొలగించుకుని లోకాన్నీ, సమాజాన్నీ, చరిత్రనూ ఆకళింపు చేసుకోగల విశిష్ట రచయితగా మారగలగాలి. కరకు కాబూలీ వాలాలో మెత్తటి మనసును చూడగలగడానికి టాగోర్ కాబూలీవాలాగా పుట్టాల్సిన అవసరం లేదు..” అని గిడుగు రాజేశ్వరరావు అన్నారంటే ఆయన పిడివాదాలకూ, అస్తిత్వ వాదాలకూ, సిద్దాంత,రాద్దాంతాలకూ ఎంతో దూరంగా ఒక నిర్వికల్ప,నిష్కల్మష స్మితయోగిగా ఎదిగారని అర్థమవుతుంది. లేని వాళ్ల బతుకు గడవని క్షణాలను, ఉన్న వాళ్ల బతకడం రాని దినాలను ఆయన సమానంగాచిత్రించారు.

నిజానికి ఆయనలో గాఢత లేదని కాదు. గాఢత ఉన్నందుకే ఆయన సరళంగా వ్యక్తం చేయగలిగారు. తండ్రి గిడుగురామమూర్తి పంతులు,పెదతండ్రి గిడుగు సీతాపతి,తండ్రిగిడుగు రామదాసు తెలుగు భాషను గ్రాంథిక కౌగిలినుంచి వేరు చేసేందుకు చేసిన కృషి అంతా గిడుగు రచనల్లోనే ప్రతిఫలిస్తుందేమోననిపిస్తుంది. ఆసక్తికరమైన విషయమేమంటే గిడుగు కుటుంబం జీవితం రాష్ట్ర విభజన తో ముడిపడి ఉన్నది. ఒరిస్సా రాష్ట్రం అయినప్పుడు పర్లాకిమిడి రాజా అందులోనే ఉండాలని నిర్ణయించారు. రాజాను వ్యతిరేకించిన సీతాపతి తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు.ఒరిస్సా రాష్ట్రం అయిన రోజే గిడుగు రామమూర్తి కుటుంబం విజయనగరం తరలివచ్చింది. పర్లాకిమిడిలోని టెక్కలిలో హైస్కూలు వరకు చదివిన రాజేశ్వరరావు విజయనగరంలో ఇంటర్ చేశారు. శ్రీశ్రీకి పాశ్చాత్య సాహిత్యాన్నిపరిచయం చేసిన రోణంకి అప్పలస్వామి శిష్యరికం ఆయనకు అబ్బిందంటే రాజేశ్వరరావు ఎలాంటి పరిణతి సాధించాలో అర్థంచేసుకోవచ్చు. 1956 వరకూ మద్రాస్ ఎజి ఆఫీసులో పనిచేసిన రాజేశ్వరరావు రాష్ట్ర విభజన కాగానే ఉద్యోగుల బదిలీలో భాగంగా హైదరాబాద్ ఎజి ఆఫీసుకు వచ్చారు. ఇప్పుడు మరోసారి రాష్ట్ర విభజనకు తెరతీస్తున్న సమయంలోనే ఆయన మరణించడం యాదృచ్ఛికం కావచ్చు. మద్రాసులో ఉద్యోగం లేనప్పుడు ఆయన అప్పుడు మద్రాసులో ఉన్న గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ప్రతులకు మేలు ప్రతులు రాస్తూ చిరుద్యోగంచేసేవారట.

గిడుగు రాజేశ్వరరావు తనను తాను ఎప్పుడూ మేధావి అని, ఎవరికో ఏదో బోధించాలనో ఎప్పుడూ అనుకోలేదు. వెన్నెల ఆకాశానికీ, మేఘాలకూ మాత్రమే పరిమితంకాకుండా నేలపై, పసిపాపలచెక్కిళ్లపై, ప్రేమికుల కనురెప్పలపై, పేదల ఆశలపై మెరిసినట్లు ఆయన కథలు, కవితలు, గేయాలూ రాస్తూ జీవించారు. స్కూలుకు వెళ్లే తన కూతురు అడిగినా, పోరాటాలు చేసే కార్మికులు అడిగినా ఆయన వారివారి భావాలకు తగ్గట్లు ర చనలు రాసిస్తూ ఉండిపోయారు. రేడియోకోస లలిత గీతాలు, నాటికలు రాశారు. ఎజి ఆఫీసులో రంజని సాహిత్య సంస్థకు సారథ్యం అందించి బృహత్తర కార్యక్రమాల్ని నిర్వహించారు. ఆకురాల్చి నిట్టూర్చిన తరువులు, కోరిన రంగుల కొత్త చివురులు, కురిసే జల్లుల పుడమి కమ్మగా కలుకుచు తావిని చిమ్మేకాలాలను అలవోకగా చిత్రిస్తూ పోయారు.

“విరితేనెల గ్రోలి భ్రమర వైణికులే మురియగా, విరబూసిన వేపరెమ్మ వింత తావి కురియగా* అని రాయడం ఆయనకు అలవోకగా అబ్బింది. అదే సమయంలో ఆయనలో ప్రేమికుడు దాగిపోలేదు. ।ఆ కాటుక కళ్లలోని అల్లరి ఇంతింతా? అవిరేపే పెనుతుఫాను ఎదలో ఎంతెంతా? ” అని తనను తాను ప్రశ్నించుకున్నారు.

“ఒడ్డునెక్కి నవ్వుతున్న ఓరకనుల చినదానా, ఉరికిపడే వరదనీటి ఊపేమిటి తెలుసునా? ” అని తన ఊపు గ్రహించమని సంకేతాలందించారు. “మెల్లగ పోనీర బండి అల్లరి పిల్లోడ, కొండగాలి ఎదరగొట్టి గుండె ఝల్లుమంటది, మనసులోని ఊసేదో మాటకందనంటది, మాటరాక పల్లకుంటే ఏటోలా గుంటది.. “అని పిల్లదాని మనసును చిత్రించిన రసహృదయుడు రాజేశ్వరరావు. ఆయన పిల్లలకోసం రాసిన గేయాలు కూడా అసమానం. “ఎప్పటికప్పుడు ఏదో పనిలో తీరిక చిక్కని పెద్దల్లారా, చిట్టెడు ప్రేమనుపంచండి.. ” అని రాశారు. ఆయన కవితలు, గేయాలు చదివితే మన జీవితాలను చుట్టుముట్టిన పట్టణీకరణ కాలుష్యం తొలగిపోతుందనడంలో అతిశయోక్తి లేదు.

ఆయన సంగీత ప్రియుడని కూడాచాలామందికితెలియదు. కాని ఆయన గేయ సంపుటాలకు రావు బాలసరస్వతి, శ్రీరంగం గోపాలరత్నం లాంటివారు ముందుమాటలు రాశారు. అల నాటి ప్రముఖ గాయని, నటి బాలసరస్వతి ఆయన సంగీత జ్ఞానానికి పరవశించిపోయారు. 1936లో ఆమె ఆరేళ్ల ప్రాయంలో బాల కుచేల నాటకంలో నటించి పాడిన పాట కూడా రాజేశ్వరరావుకు నోటికి వచ్చని ఆమే రాశారు.

“శిశిర రుతువులో కూడా చిత్రమైన అందాన్ని చూడగల భావుకుడూ, తాత్వికుడూ రాజేశ్వరరావు” అని, “ఆయన పాటలలో గోదారి సరికొత్త అందాలు సంతరించుకుని కొండమల్లెలు తురుముకుంటూ ఉరుకుతుందని,నిరాశగా ఉన్న ఎలమావి ఉన్నట్లుండి వన్నెలు తొలగి పలకరిస్తుందని” బాలసరస్వతి రాశారంటే రాజేశ్వరరావు గొప్పతనం మనకు అవగతమవుతుంది.

మల్లీశ్వరి, మాయాబజార్, చెంచులక్ష్మి వంటి గొప్ప చిత్రాలకు సంగీత దర్శకత్వంవహించిన ప్రముఖ సంగీత విద్వాంసుడు సాలూరురాజేశ్వరరావు నుఆయనఎంతో అభిమానించేవారు. ।గాలినై వేణువున క్షణమున్న చాలురా, రాగఝరినై సాగి పొంగిపోతాను* అని రాసిన గిడుగు రాజేశ్వరరావు సాలూరి పాడిన ।ఓహో యాత్రికుడా* పాటను మరిపిస్తూ యాత్రికుడులా సాగిపోయారు.

కృష్ణుడు

గురువు, స్నేహితుడు, నాయకుడు గంటి ప్రసాదం

venu and ganti prasad

వ్యాసకర్త ఎన్.వేణుగోపాల్ మధ్యలో, కుడి వైపున గంటిప్రసాద్

 

ఒక ఎండాకాలపు ముసిముసి వేకువ ఔరంగాబాద్ స్టేషన్ లోకి రైలు ప్రవేశిస్తుండగా దిగడానికి తలుపు దగ్గరికి వచ్చి ప్లాట్ ఫారం మీద నిలబడిన వ్యక్తిని చూడగానే నేను వస్తున్నది ఆయనకోసమే అని పోల్చుకున్నాను. అప్పటికి ఆయన పేరు చాలసార్లే విని ఉన్నాను గాని ఆయనను చూడలేదు. పూర్తిగా ఆయన పోలికలతోనే ఉన్న  తమ్ముడిని విశాఖపట్నంలో ఎన్నోసార్లు కలిశాను గనుక ఆయనను గుర్తు పట్టడం కష్టం కాలేదు. అయినా మా కలయిక సంకేతస్థలం రైల్వే స్టేషన్ లో కాదు గనుక నా మానాన నేను రైలు దిగి గేటు దాటి ఓ వంద గజాలు నడిచి చాయ్ కొట్టు దగ్గర ఆగాను. ఆయన నా వెనుకే వచ్చి చెయ్యి కలిపారు. అది మొదలు.

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది మామూలుగా నిజమో కాదో తెలియదు గాని ఆయనతో నాకు కుదిరిన ప్రేమానురాగాలు మొదలయినది మాత్రం ఆ క్షణాన్నే. ఆయనతో మొదటి ముఖ పరిచయమే తొలిచూపు వలపు లాగ మొదలయింది. వెనక్కి తిరిగి చూస్తే ఆయన నా జీవితంలోకి ప్రవేశించి ఎనిమిది సంవత్సరాలు మాత్రమేనా అని ఆశ్చర్యం వేస్తుంది. ప్రాణసమానమైన ఆత్మీయ మైత్రి అది. యావజ్జీవిత సాన్నిహిత్యం అనిపించేంత గాఢమైన సంబంధం అది. పరస్పరం ఎంత విమర్శించుకున్నా, ఎంత గట్టిగా అరచుకున్నా, ఎన్ని అభిప్రాయ భేదాలు తలెత్తినా మరుక్షణం అదంతా మరచిపోయి అల్లుకున్న స్నేహం అది. ఒకరిపట్ల ఒకరికి సంపూర్ణమైన నమ్మకం, గౌరవం, చనువు ఉన్న సమస్థాయి సంబంధం అది. పన్నెండు సంవత్సరాల వయసు తేడా ఉన్నదని ఏ ఒక్కక్షణమూ అనిపించని స్నేహాదరం అది. ఆయన పట్ల నాకు అపారమైన గౌరవమూ ప్రేమా ఉండేవి. ఆయనకు నాపట్ల చెప్పలేనంత వాత్సల్యమూ అభిమానమూ ఉండేవి.

ఆయన గంటి ప్రసాదం.

అలా ఔరంగాబాద్ స్టేషన్ ముందు కలుసుకున్న మేం అప్పటికే ఆయన దిగిన లాడ్జికి వెళ్లి అది ఖాళీ చేసి, ఆయన వెంట ఉన్న సహచరుడు సురేందర్ తో సహా మహారాష్ట్ర టూరిజం గెస్ట్ హౌజ్ గది లోకి మారాం. ఆ తర్వాత ఓ గంటా గంటన్నరలో చెంచయ్యగారు, పాణి, రవి వచ్చేశారు. కాని అప్పటికే ఆయనా నేనూ లోకం మీది విషయాలన్నీ మాట్లాడేసుకుంటున్నాం. ఇక అందరమూ చేరాక మొదలుపెట్టిన సమావేశం మధ్య మధ్య భోజనాలు, చాయలు, కొన్ని గంటల నిద్ర మినహాయిస్తే మర్నాడు సాయంత్రం దాకా నిర్విరామంగా సాగింది. ప్రసాదం గారి పట్ల గౌరవం ఇనుమడించడానికి ఆ సుదీర్ఘ సమావేశం మరొక మెట్టు. సాహిత్యం, సాహిత్య విమర్శ, రాజకీయాలు, పార్టీ చరిత్ర, విరసం చరిత్ర, వ్యక్తులు, వ్యక్తుల సామర్థ్యాలు, బలహీనతలు, వ్యక్తుల పట్ల అంచనాలు, భవిష్యత్తు కార్యక్రమాలు, సాంకేతిక అంశాలు, బహిరంతర రహస్యాలు… ఎన్నెన్నో. కొన్ని వందల అంశాలు చర్చకు వచ్చాయి. ప్రతి ఒక్క అంశం లోనూ ఆయన సంధించిన ప్రశ్నలు, ప్రతిపాదనలు, అభిప్రాయాలు, చర్చలు, వ్యాఖ్యానాలు, వివరణలు, విశ్లేషణలు, ముక్తాయింపులు ఆయన విశ్వరూపాన్ని చూపాయి. ఆయన నోటి నుంచి వెలువడిన పరిహాసాలు, చరిత్ర నుంచి అనుభవాలు ఎంతో బరువైన సందర్భాన్ని కూడ ఆహ్లాదకరంగా తేలికపరచాయి. ఆయన మాటలన్నిటితో ఏకీభవించానని కాదు, అబ్బురపడినవీ ఉన్నాయి, తీవ్రంగా విభేదించినవీ ఉన్నాయి. కాని ఒక విప్లవోద్యమ నాయకత్వానికి ఎటువంటి సమయస్ఫూర్తి, అవగాహన, సంయమనం, విశాల దృక్పథం ఉంటాయో నాకు మరొకసారి చూపిన అనుభవమది. ఆ విశిష్టత నానాటికీ విస్తరిస్తున్న, పరిణతి చెందుతున్న విప్లవోద్యమ ఫలితం అని ఎంతగా అనవచ్చునో, ఆ విశిష్టతను వ్యక్తీకరిస్తున్న ప్రత్యేక వ్యక్తిలోని నిత్య చలనశీల, ప్రవాహ, విస్తరణ స్వభావానికి సూచిక అని కూడ అంతగా అనవచ్చు.

నిజానికి ఆ రెండు రోజులు జరిగిన సంభాషణంతా నోట్స్ రాసుకున్నాను, ఆయన మాటల్లో ఎక్కువభాగం ఆ నోట్స్ లో ఉండి ఉంటాయి. కాని రెండో రోజు రాత్రి భోజనానికి లేవడానికి ఇంకో అరగంట ఉందనగా ఆ గది మీద దాడి చేసిన ఎస్ ఐ బి తోడేళ్ల గుంపు మా వస్తువులన్నిటితో పాటు ఆ నోట్స్ కూడ ఎత్తుకుపోయింది. దాడి చేసిన వాళ్లెవరో మేం గుర్తించే లోపుగానే ఒక్కొక్కరి మీద పడి మొట్టమొదట చేసిన పని కళ్లకు గంతలు కట్టడం. చేతులు వెనక్కి విరిచి కట్టడం. ఆ తర్వాత మూడు రోజులు అక్రమ నిర్బంధంలో పెద్దగా మాట్లాడుకునే అవకాశం దొరకకపోయినా ఒకరికొకరం తోడుగా ఉన్నాం. చిన్న చిన్న మాటలతోనే, స్పర్శతోనే ఒకరికొకరం ధైర్యం చెప్పుకున్నాం. ఆ నిర్బంధాన్నీ, ప్రశ్నల దాడినీ ఎదుర్కున్నాం.

ఆ తర్వాత నిజామాబాద్ డిఐజి కార్యాలయంలో మమ్మల్ని పత్రికల వారి ముందు ప్రవేశపెట్టి అక్కడ్నించి నిజామాబాద్ ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్ కూ, మర్నాడు బోధన్ కోర్టుకూ, అక్కడ్నించి ఆ సాయంత్రానికి నిజామాబాద్ ఖిలా జైలుకూ తీసుకుపోయిన ప్రయాణమంతా ప్రసాదం గారు మాట్లాడుతూనే ఉన్నారు. ఆ తర్వాత ప్రసాదం గారినీ, నన్నూ పోలీసు కస్టడీకి తీసుకుపోయారు. అప్పటికే డికె బసు కేసు తీర్పులో పోలీసు కస్టడీలో ఖైదీకి ప్రశ్నలకు జవాబు చెప్పకుండా ఉండే హక్కు ఉందనీ, పక్కన న్యాయవాదిని ఉంచుకునే హక్కు ఉందనీ విని ఉన్నాం గనుక మళ్లీ ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి దాదాపు డజను మంది అధికారులు ఏ ప్రశ్న అడిగినా మేం చెప్పం అని మొండికేశాం. వ్యక్తిగత వివరాలు పేరూ ఊరూ చదువూ ఉద్యోగమూ కుటుంబసభ్యుల పేర్లూ తప్ప మరేదీ చెప్పబోమన్నాం. ఆ తతంగంలో కడప నుంచి వచ్చిన ఒక సిఐ మామీద విపరీతంగా కోపం తెచ్చుకుని, పక్కన న్యాయవాదులు ఉండడంతో ఏమీ చేయలేక పళ్లు పటపట కొరకడం, చూపులతోనే మమ్మల్ని ఎన్ కౌంటర్ చేయడానికి ప్రయత్నించడం ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడ కళ్ల ముందు ఆడుతోంది. మూడు రోజుల కోసం తీసుకున్నవాళ్లు అలా ఒకటిన్నర రోజు గడవగానే నన్ను వెనక్కి పంపేశారు. ప్రసాదం గారిని ఏమైనా చేస్తారా అని భయం. న్యాయవాదులకు కూడ చెప్పకుండా ఆయనను హైదరాబాదుకు తరలించారు. బహుశా నిజామాబాదుకు రాలేని అధికారులు హైదరాబాదులో ఆయనను ప్రశ్నించారు. కళ్లకు గంతలవల్ల వాళ్లెవరో ఆయన పోల్చుకోలేక పోయారు గాని పైస్థాయి వాళ్లెవరో అయి ఉంటారని అన్నారు.

నాలుగో రోజు ఆయనను మళ్లీ నిజామాబాదు జైలుకు తీసుకువచ్చారు. ఆ తర్వాత మాకు బెయిల్ దొరికి విడుదలయ్యే వరకూ రెండువారాలకు పైగా రోజుకు ఇరవైనాలుగు గంటలూ మేం పంచుకోని విషయం లేదు. చర్చించుకోని అంశం లేదు. కేవలం మాటల్లోనే కాదు, మౌనంలోనూ, రోజువారీ శారీరక, మానసిక కార్యకలాపాలన్నిటిలోనూ ఒకరేమిటో మరొకరికి పూర్తిగా తెలిసివచ్చిన అద్భుతమైన, అనివార్యమైన, నిర్బంధశిబిర సాన్నిహిత్యం అది. బహుశా ఆ తర్వాత ఎనిమిది సంవత్సరాల ప్రగాఢ సంబంధానికి మూలం ఆ రెండు వారాలలో ఒకరి పట్ల ఒకరికి ఏర్పడిన నమ్మకమూ అంచనాలే కావచ్చు. ఆ తర్వాత ఆ కేసు వాయిదాల కోసం ఇరవై ముప్పై సార్లు నిజామాబాదుకు కలిసిచేసిన ప్రయాణాలు, చివరికి సాక్షుల విచారణ, వాదనల సమయంలో నిజామాబాదులో వారం రోజులు కలిసి గడపడం, ఈ మధ్యలో మా ఇంట్లోనూ, రాష్ట్రంలో ఎన్నో చోట్ల సభల సందర్భంగానూ వందలాది గంటల సంభాషణలు అరుణారుణ స్మృతులు. హైదరాబాదు వచ్చిన ప్రతిసారీ పది నిమిషాల కోసమైనా సరే, ఒక రోజో, రెండు రోజులో గడపడానికైనా సరే నా దగ్గరికి వచ్చేవారు. వనజతోనూ, అమ్మతోనూ, విభాతతోనూ కూడ సన్నిహితంగా ఉండేవారు. రావడానికి అసలే కుదరకపోతే ఫోన్ చేసి, ‘ఈ సారి కుదరడం లేదు, మళ్లీ వస్తాను’ అనేవారు.

చాల లోతయిన, సైద్ధాంతికమైన, నిబద్ధమైన, మానవీయమైన దృక్పథం, స్పష్టత ఉంటూనే ఆయనలో చాల ఆశ్చర్యకరమైన అమాయకత్వమూ పసితనమూ కూడ ఉండేవి. ఒక్క క్షణం కింద తత్వవేత్తలా, నాలుగు దశాబ్దాల ఆచరణతో తలపండిన అనుభవజ్ఞుడిగా మాట్లాడిన ఆయనేనా అనిపించేంత అమాయకంగా, స్వచ్చంగా, పసితనంతో ప్రవర్తించేవారు. తనకు తెలియని విషయం తెలియదని ఒప్పుకోవడంలో, అమాయకంగా అడగడంలో ఆయనకు ఎప్పుడూ భేషజం ఉండేది కాదు. మేం జైల్లో ఉన్నప్పుడు వనజ నాకు అదనంగా చొక్కాలు తెచ్చింది. అవి చర్మాస్ లో దొరికే మామూలు నూలు చొక్కాలు. కాని వాటి రంగులు ఆయనను చాల ఆకర్షించాయి. నిజామాబాద్ జైల్లో జాలీ ములాఖాత్ లోనే ‘వనజా నాకు అటువంటి షర్ట్ కావాలి’ అని చిన్న పిల్లవాడిలా అడిగారు. జైల్లో అది వేసుకుని చాల సంతోషించారు. విడుదలై వచ్చాక కూడ మళ్లీ అటువంటిది కొనిపించుకున్నారు. అలాగే జైలులో ఉన్నప్పుడూ, బైటికి వచ్చాక కూడా నశ్యం పొడి కోసం ఆయన ప్రయత్నాలూ, చిరాకూ, అది సమయానికి అందకపోతే చిన్నపిల్లవాడిలా మంకూ ఆయనలోని స్వచ్ఛతకూ, నిష్కల్మషత్వానికీ అద్దం పట్టేవి.

ఇక ఆయనలోని అమాయకత్వానికీ, చిన్నపిల్లవాడి మనస్తత్వానికీ చెప్పుకోవలసిన చిహ్నం తెలుగు పజిల్స్ నింపడం మీద ఆయనకు ఉండిన పిచ్చి. నాదగ్గరికి చాల పత్రికలు వస్తాయి గనుక ఆయనకు పండగలా ఉండేది.  వచ్చినప్పుడల్లా పాత పత్రికలన్నీ వెతికి ముందేసుకుని ఆ పజిల్స్ నింపడంలో మునిగిపోయేవారు. ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే వినకుండా, లేదా పరధ్యానంగా వింటూ పజిల్స్ లో మునిగిపోతున్నారని కోప్పడేవాణ్ని. సారూ, ఇంకెప్పుడూ కోప్పడను, ఒక్కసారి వచ్చిపోరూ….

అట్లాగే, ఆయనకు రచన చేయాలని చాల కోరిక ఉండేది. పనుల్లో ప్రయాణాల్లో తీరిక దొరకక ఎక్కువ రాయలేక పోయారు గాని రాస్తే చాల బాగా రాసేవారు. చంచల్ గూడ జైల్లో ఉండగా తెలంగాణ మీద ఒక వ్యాసం రాసి ఇచ్చారు. ఆరు సంవత్సరాల కింద వీక్షణంలో అచ్చయిన ఆ వ్యాసం ఇప్పటికీ చాల తాజాగా, గొప్ప విశ్లేషణతో ఉంది. నిజంగా తెలంగాణ ఉద్యమం మీద ఆయన అవగాహన చాల సరయినది. ఇటీవల కిషన్ జీ హత్య తర్వాత రాజ్యం జరిపిన దుష్ప్రచారం మీద అరుణతారలో ఒక మంచి వ్యాసం రాశారు. ఈ రెండు మూడు వ్యాసాలు, అమరుల బంధుమిత్రుల సంఘం చరిత్ర, ప్రణాళిక మినహాయిస్తే మిగిలిన రచనలు ఎక్కువగా కరపత్రాలే. కాని రాసిన ప్రతి కరపత్రమూ చూపెట్టి, కూచుని చదివించి, బాగుందా అని చిన్న పిల్లవాడిలా, కొత్త రచయితలా అడిగేవారు. అలాంటప్పుడు, ఆయన చదవాల్సిన కొత్త పుస్తకాలు, వ్యాసాలు ఎన్నెన్ని ఉన్నాయో చెప్పి పనులు కొన్ని తగ్గించుకుని అయినా చదవమని కోప్పడేవాణ్ని. చదువు మానేశారని విమర్శించేవాణ్ని. కాని ఆయన అసలు చదవడం లేదని కొన్నిసార్లు అనిపించేది గాని, ఆశ్చర్యకరంగా ఆయన చాల విషయాల్లో చాల అప్ టు డేట్ గా, తాజా వివరాలతో ఉండేవారు. ఒక పత్రిక వెలువడిన రోజు సాయంత్రం జరిగిన సభలోనే ఆ పత్రిక సంపాదకీయాన్ని ఉటంకిస్తూ విశ్లేషించడం చూసినప్పుడు ఆయన అవసరమని అనుకున్నవి వెంటనే చదువుతారని అనిపించేది.

అలాగే నేను ‘చౌరస్తాలో తెలంగాణ ఇంకెన్నాళ్లు’ అని వీక్షణం నవంబర్ 2012 సంచికలో ఒక వ్యాసం రాస్తూ తెలంగాణ ఉద్యమంలో ఉన్న అన్ని శక్తుల బలాబలాలను గురించి చర్చించినప్పుడు, ఒక వారంలోపే ప్రసాదం గారు కలిశారు. ‘అందరి గురించీ విమర్శలు ఉన్నాయి మావోయిస్టు పార్టీ గురించి, దాని ప్రభావంలోని తెలంగాణ సంస్థల గురించి విమర్శ లేదేమిటి’ అని వ్యాఖ్యానించారు. ‘ఈ మాటలు మరొక పేరుతో ఉత్తరంగా వేయనా’ అని అడిగితే సరేనన్నారు. ఒకరకంగా ఆయన విప్లవ నిర్మాణంలో చాల కీలక స్థానాలలో ఉండి కూడ అక్కడి సమస్యల గురించి బైటివాళ్లు ఎలా ఆలోచిస్తారో అలా ఏమాత్రం స్వీయాత్మకత లేకుండా వస్తుగతంగా ఆలోచించేవారు. మరొకవైపు బహిరంగంగా మాత్రం తనకు విభేదం ఉండిన అంశాలను కూడ సంపూర్ణంగా సమర్థించే ఉక్కు క్రమశిక్షణతో ఉండేవారు.

చివరి రోజుల్లో ఆయన పదే పదే చర్చించిన అంశం ఒకటి ఆయనలోని చదువరిని, సిద్ధాంతకర్తను నాకు పట్టి ఇచ్చింది. ‘ఎందుకు ఇటీవలి కాలంలో పాలిమికల్ (సైద్ధాంతిక వాదవివాదాల) రచనలు మనకు తగ్గిపోతున్నాయి? మార్క్స్ ఎంగెల్స్ లు తమ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసినది పాలిమిక్స్ తోనే. మన పార్టీ చరిత్రలో ప్రధానమైన పాత్ర పాలిమిక్స్ దే. విరసం కూడ తొలిరోజుల్లో పాలిమిక్స్ ద్వారానే తన అవగాహనలను స్థిరపరచింది, ప్రచారం చేసింది. ఎందుకు ఇప్పుడు ఎవరు ఏమి రాసినా, ఎన్ని తప్పులు రాసినా మీరందరూ పట్టించుకోకుండా ఉండిపోతున్నారు? ఎందుకు పాలిమిక్స్ రాయడంలేదు?’ అని ఆయన చాల తీవ్రంగా ప్రశ్నించేవారు. అలా అడిగి అడిగి ఎవరూ పూనుకోవడం లేదనే అసహనంతోనేమో ఆయనే పాలిమికల్ వ్యాసాలు రాయడానికి పూనుకున్నారు.

చదవడానికి సమయం దొరకకపోయినా గొప్ప ఆచరణ జ్ఞానం వల్ల ఆయన సాధారణంగా సరైన వైఖరే తీసుకునేవారు. చర్చలలో చాల కచ్చితమైన, నిర్దిష్టమైన, నిర్దుష్టమైన వ్యాఖ్యలు చేసేవారు. ఆయనకు అలవాటైన భాష కొంత పాతదిగా, సాగదీసినట్టుగా అనిపించేది గాని సారంలో ఆయన విశ్లేషణ మాత్రం పూర్తిగా సైద్ధాంతికంగా, ఆచరణాత్మకంగా, సరిగ్గా ఉండేది.

మార్చ్ చివరి వారంలో లెఫ్టిస్ట్ స్టడీ సర్కిల్ విజయవాడలో భారత ఉత్పత్తి విధానం మీద సదస్సు పెట్టినప్పుడు మొదట ప్రసాదం గారికీ నాకూ చిన్న ఘర్షణ జరిగింది. అర్ధభూస్వామ్య, అర్ధవలస సూత్రీకరణను పూర్తిగా నమ్ముతూ ఆచరిస్తూ ఉన్న పార్టీ ప్రతినిధిగా ఆయన దానికి తప్పనిసరిగా హాజరు కావలసి ఉంటుందని, ఆయనను పిలవమని నిర్వాహకులకు సూచించాను. కాని కుదురుతుందో లేదో అని ఆయన వారితో అన్నారని తెలిసి నేను ఫోన్ చేశాను. ‘నువ్వున్నావు గదా, నేనెందుకూ, చాల పనులున్నాయి’ అన్నారు. ‘నేనేమీ మీ ప్రతినిధిగా వెళ్లడం లేదు. నేను అర్ధభూస్వామ్య అర్ధవలస సూత్రీకరణను నమ్మే ఒక రాజకీయార్థశాస్త్ర విద్యార్థిగా వెళుతున్నాను. అయినా నేను మీకు అస్పృశ్యుడిని కదా. అక్కడ ఆ సూత్రీకరణను సమర్థించుకోవలసిన బాధ్యత పూర్తిగా మీదే’ అని కటువుగా అన్నాను. నిజానికి మరెవరి మీద కోపమో ఆయన మీద తీర్చుకున్నాను గాని ఆయన నన్నెప్పుడూ ఒక్క క్షణం కూడ అస్పృశ్యుడిలా భావించలేదు. నేనలా మాట్లాడాక వచ్చి ఒక పూటంతా ఉండి, ఆ విషయానికి సంబంధించిన రెండు పుస్తకాలు జిరాక్స్ చేయించుకుని వెళ్లారు. బెజవాడలో కనబడగానే, ‘ఇదిగో వచ్చాను’ అని చిన్నపిల్లవాడిలా చెప్పారు. మొదటి రోజు సాయంత్రం చర్చలో జోక్యం చేసుకుని చాల బాగా మాట్లాడారు. క్లుప్తంగానైనా చాల సూటిగా, స్పష్టంగా ఇటువంటి చర్చల పరమ లక్ష్యం ఏమై ఉండాలో చెప్పారు.

నాలుగైదు నెలల కింద నక్సలైట్ ఉద్యమం మీద ఎవరో పోలీసు ఆఫీసర్ రాసిన పుస్తకం ఒకటి తెప్పించి పెట్టమన్నారు. నేనది తెప్పించి మరుసటిసారి వచ్చినప్పుడు ఇస్తే, నీదగ్గరే ఉండనీ, నాకు అవసరమైనప్పుడు తీసుకుంటానులే అన్నారు. రెండుమూడు నెలల కింద విశాఖ నుంచో, కోమర్తి నుంచో ఫోన్ చేసి కొలంబియా విప్లవోద్యమ సంస్థ ఫార్క్ (కొలంబియా విప్లవ సాయుధ సైన్యం) మీద, టర్కీ పికెకె (కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ) మీద, లాటిన్ అమెరికా ప్రజా ఉద్యమాల మీద సమాచారం కావాలని, తీసిపెట్టమని అడిగారు. అవి పోగేస్తుండగానే తీసుకోలేని చోటికి వెళ్లిపోయారు.

ఆయనలోని ఈ గుణాలూ ప్రత్యేకతలూ విశిష్టతలూ, ఆయనతో ఆత్మీయ మైత్రీ, ఆయన ఆదరాభిమానాలూ అన్నీ నా ఒక్కడి అనుభవమే ఎంత మాత్రమూ కాదు. ఆయన గురించి సరిగ్గా ఇలాగే భావించేవాళ్లు రాష్ట్రంలో కొన్ని వందల మంది ఉండి ఉంటారు. బహుశా ఆయనతో నేను అనుభవించినంత ఆత్మీయతనూ, అంత కన్న ఎక్కువ ఆత్మీయతనూ కూడ అనుభవించిన వారు నాకు తెలిసే డజన్ల కొద్దీ ఉన్నారు. ‘ఆయన నాకు దగ్గరి వారు, నా హృదయంలోని మనిషి. అత్యంత ఆప్తుడు. ఆయన దగ్గర నాకు రహస్యాలేమీ లేవు. నన్ను ఆయన పూర్తిగా తన విశ్వాసంలోకి తీసుకున్నారు’ అని ప్రతి ఒక్కరూ అనుకున్న వ్యక్తి గంటి ప్రసాదం. ఒక మనిషి జీవితంలో అంతకన్న కావలసింది లేదు. ఒక మనిషిని మనీషిగా మార్చేది అదే. గంటి ప్రసాదం అనే మనిషి మార్క్సిజంలో విశ్వాసం వల్ల, నాలుగు దశాబ్దాలకు పైబడిన విప్లవోద్యమ ఆచరణ వల్ల మనీషిగా మారారు. అటువంటి మనీషుల అవసరం మరింతగా పెరుగుతున్న సమయాన రాజ్య దుర్మార్గం ఆయనను మననుంచి దూరం చేసింది. ‘ఆ బుల్లెట్లు నన్ను చంపగలవేమో గాని, నా ఆశయాన్ని కాదు’ అని ఆయన తన వీలునామా లాగ చెప్పిన మాటలే ఆయన మిత్రులందరికీ మిగిలిన ఆశ్వాసం.

–          ఎన్ వేణుగోపాల్

జూలై 13, 2013

మండుటెండలో మోదుగుపువ్వు

అతనొక మోదుగుపువ్వు

మండుటెండలో వసంతాగమన వీచిక

భవిష్యత్ వర్షహర్షానందాల మానవ సూచిక

అతని మునివేలు కొసన ఎప్పుడూ ఒక కంటి తడి

ఎవరెవరి కన్నీళ్లు తుడిచివచ్చాడో

తన కన్నీళ్ల చెలియలికట్టనే ఎన్నిసార్లు కట్టుకున్నాడో

 

వాలిన గరికపోచల చివర్ల అతని ప్రోత్సాహాశ్రు బిందువే

రాలిన తురాయి పూల కనుకొలకుల అతని అనునయ స్పర్శే

కూలిన నిర్మాణాల చెంపల చారికల మీద అతని సాంత్వన బాసలే

ఆగిన దారుల మూలమలుపుల్లో నెత్తుటి మరకలపై అతని గురుతులే

 

అందరూ దూరం కొట్టిన అస్పృశ్యులను ఆలింగనం చేసుకున్నదతడే

కంటిపాప కరువైన తల్లి శోకానికి తల వాల్చే భుజం అందించినదతడే

సహచరుల్ని కోల్పోయిన బంధుమిత్రులకు బాసటగా నిల్చినదతడే

బిడ్డను పోగొట్టుకున్న ఊరికి ఓదార్పు మాటల లేపనాలు పూసినదతడే

ముఖాలు చూసుకోని గడ్డి పరకలను కలిపి

మదగజాలను లొంగదీసే తాళ్లు పేనినదతడే

రాజ్య దుర్మార్గం మీద పెదాల చివరినుంచి నిప్పుకణికలు విసిరినదతడే

ఎప్పుడాగిపోతుందో తెలియని గుండెను అదిమి పట్టుకుని

వేల మైళ్ల దూరాల్ని వందల అవరోధాల్ని అవలీలగా దాటినదతడే

అరెస్టులనూ అనారోగ్యాన్నీ దాడులనూ దుర్భాషలనూ

తోసిరాజని జీవిత చదరంగాన్ని గళ్ల నుడికట్టులా ఆడినదతడే

 

దైవ ప్రసాదం కాదు, జన హృదయ ప్రసాదం, ప్రజా పోరాట ప్రసారం

 

–          వి. కవిత, జూలై 14, 2013

నినదించే కవిత్వం ‘చెర’ ప్రతి పదం!

cherabandaraju1

చెరబండ రాజు ఇక లేడు.

ప్రజలకోసం అంకిత భావంతో అశ్రాంతమూ శ్రమించిన వాడు… పది సంవత్సరాలపాటు ప్రభుత్వం అతన్ని వెంటాడింది. ప్రజలకోసం ప్రజలభాషలో కవిత్వం రాసేవాళ్లని రాజ్యం పెట్టే హింసలు గిరిజన, రైతాంగ వీరులని పెట్టే హింసలకి తులతూగుతుంది. అయితే అతని మార్గదర్శకుడూ, శ్రీకాకుళం విప్లవ కవీ అయిన సుబ్బారావు పాణిగ్రాహిలా అతన్ని ప్రభుత్వం చంపలేదు… అతను బ్రెయిన్ ట్యూమర్ వల్ల చనిపోయాడు,అంతమాత్రం చేత అతని ఆరోగ్యం మీద అతను పదే పదే జైలుకి వెళ్లిరావడం యొక్క ప్రభావాన్ని తక్కువ అంచనా వెయ్యలేం. అతను మొదటిసారి 1971లో PD Act క్రిందా, 1973లో MISA Actక్రిందా, సికిందరాబాదు కుట్రకేసులో ఇరికించి 1974 లోనూ అరెస్టు అవడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ లో ఇతర విప్లవ కవుల్లా ఎమర్జెన్సీ సమయం అంతా జైల్లోనే గడిపేడు… ఆ సమయంలో అతను పేగు సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నప్పటికీ. (బ్రెయిను ట్యూమరు అనంతర పరిణామం).  అతని సన్నిహిత మిత్రులతనిని ముద్దుగా ‘చెర ‘ అనిపిలుస్తారు… అతని జీవితానికి ‘చెర ‘ అంత చక్కగా అమిరిపోయింది.

పూర్వపు హైదరాబాదుజిల్లాకి చెందిన అంకుశపురం గ్రామంలో బద్దం భాస్కర రెడ్డి గా జన్మించిన చెరబండ రాజు, ప్రాచ్యభాషాహిత్యంలో పట్టా తీసుకుని హైదరాబాదులోనే ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు బోధించేవాడు. అతను మరో అయిదుగురు  కవులతో కలిసి దిగంబర కవులలో ఒకడిగా 60వ దశకం చివరలో ఒక్క సారిగా తెరమీదకి వచ్చేడు.  వాళ్ళు …. చెరబండ రాజు జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, నగ్నముని, మహాస్వప్న, భైరవయ్య… వంటి చిత్రమైన పేర్లు పెట్టుకుని అద్భుతమైన కవిత్వం రాసేరు. ఆ ఉద్యమం ప్రాధమికంగా వ్యక్తుల్నీ, సిద్ధాంతాల్నీ లక్ష్యపెట్టకుండా పేరుకుపోయిన విశ్వాసాల్ని విధ్వంశం చేయ సంకల్పించినది… దానికి వాళ్ళు ఎన్నుకున్నవికూడా ఘాటైన అశ్లీలమైన పదాలు… భ్రష్ట ఛిద్ర శృంగార జీవితాల్లోంచి ఎంచుకున్న ప్రతీకలూను. దానికి తగ్గట్టే ఆ రోజుల్లో గౌరవించడానికి యోగ్యతగల వ్యక్తులు గాని, సిద్ధాంతాలు గానీ లేవు.

అవి చెకోస్లోవేకియా సోషలిజానికి అనువుగా ఉండడానికి రివిజనిజం యుద్ధ టాంకులు నడిపి అణగదొక్కిన రోజులు; ఒక తరం తరం యువత యావత్తూ అసాంఘిక కార్యకలాపాలవైపూ, అరాచకపు అలవాట్లవైపూ మరలిపోతుంటే, ఇంకోవైపు  ప్రాన్సులో కోపోద్రిక్తులైన విద్యార్థులని ంచుకుందికి జీన్ పాల్ సార్ట్ర వంటి సంప్రదాయ వ్యతిరేకి తప్ప వాళ్లగోడు వినే నాథుడు ఎవరూ దొరకలేదు; మనదేశంలో చూడబోతే, శ్రీకాకుళంపోరాటంలో నక్సల్ బరీ ఉద్యమం దాని ప్రభావం పూర్తిగా కనబరచలేదు; మావో ఆలోచనా విధానంలోని మౌలిక విశిష్టతగాని, అద్భుతమైన శ్రామికవర్గపు సాంస్కృతిక విప్లవాన్ని గాని ప్రపంచం అర్థం చేసుకోని రోజులవి. అధికార మార్క్సిస్టులని కోశాంబి తిరస్కారంగా మాటాడే మార్క్సిస్టులు దిగంబరకవులని అనామకమైన బూర్జువా అరాచకపు కవులుగా కొట్టి పారేసినా, అధికార మార్క్సిస్టుల ప్రాపకంలో, మద్రాసు సినీ కవిత్వపు అంతస్సంస్కృతితో అభ్యుదయ ముద్రతోఅలరారేవారి ముతక చవకబారు బజారు అశ్లీల సాహిత్యంకంటే, వీరి నిజాయితీ గల ఆగ్రహంలోంచివచ్చిన అశ్లీల పదజాలమే ప్రశ్నించగల యువతరాన్ని ఆకట్టుకుంది. దిగంబర కవులు అన్ని సిద్ధాంతాలకీ వ్యతిరేకత ప్రకటించి, వ్యవస్థీకృత రాజకీయాలకి వ్యతిరేకులైనప్పటికీ, సామాజిక, రాజకీయ  సమస్యలకి విముఖులు కారు. 1965లో వాళ్ల ప్రథమ కవితా సంకలనంతో పాటు వాళ్లు విడుదల చేసిన మేనిఫెస్టో ఒక అస్తిత్వవాద కరపత్రంగా కనిపిస్తుంది.

(ఇన్ని సాంఘిక, ప్రకృతిసిద్ధ మైన కార్య నిమగ్నతల మధ్య, నిన్ను నువ్వు ఇరికించుకున్న వేల తొడుగుల ముఖాల మధ్య, విరామమెరుగని జీవన పోరాటాల మధ్య, నువ్వు ఒంటరివే, జీవన్మరణ పోరాటంలో ఒంటరి సైనికుడవే.) వీరి కవితలు పాఠకుడిని పదే పదే తనకున్న సామాజిక తొడుగులని విడిచిపెట్టి , తమని తాము దిగంబరంగా చూసుకోమని అర్థిస్తాయి. మనిషి తపనపడే సామాన్య విషయాలని  గర్హిస్తాయి:

నాకోక సారి చెప్పు,

నువ్వు ఏడవని రోజుందా?

పొగచూరిన నీ ముఖం

నాకు బొగ్గుగనుల్ని గుర్తుచేస్తుంది

(నిఖిలేశ్వర్)

ఆ రోజుల్లో కూడా వాళ్ళు దిగంబరంగా చూడమన్నది మనిషి స్వభావంగా మారిన అవినీతిమయమైన సమాజపు దుర్మార్గాన్ని; వాళ్లు పీలికలు చెయ్యమన్నది శాంతి, ప్రగతి అంటూ మోసకారి రాజకీయ నాయకులూ, ఆదర్శవాదులూ ప్రజాస్వామ్యానికి తొడిగిన బూటకపు ముసుగుని; నాగరికత తెచ్చిపెట్టుకున్న గౌరవనీయతని. ఇది ముఖ్యంగా చెరబండరాజు, నగ్నముని, నిఖిలేశ్వర్ ల విషయంలో ఎక్కువ వర్తిస్తుంది. చెరబండరాజు విషయంలో ఇతరకవులు భావించినట్టు మనిషి నగ్నత్వాన్ని కప్పిఉంచే సామాజిక వ్యక్తిత్వంకంటే, ఆ వ్యక్తిలోని ఆత్మవంచనని ఎక్కువగా అతను నిరసించాడు.

ఏది ఏమైనా, ఒక ఏడాది తర్వాత వచ్చిన తమ రెండవ మేనిఫెస్టోలో “ప్రస్తుతం ఉన్న క్రూర సమాజాన్ని రూపుమాపి, సరికొత్తదీ, ఉదాత్తమైన సమాజాన్ని తీసుకు రావాలనుకుంటున్న ఆకాంక్షని ప్రకటించారు. ఈ క్రింది పంక్తులు ఆ రోజుల్లో చెరబండరాజు కవిత్వానికి అద్దం పడతాయి:

అవకాశవాద పెత్తందారుల బూట్లు నాకుతూ

వాళ్ళ నీడల్లోనే నువ్వు భవంతులు కట్టుకున్నావు

ఆ పునాదులు కదిలేలోపు

నిన్ను పంపిస్తాను,

లేదు, జైలుకి మాత్రం కాదు

కసాయి కొట్టుకి.

1968లో విడుదల చేసిన వాళ్ళ మూడవ మేనిఫెస్టోలో, వాళ్ళ ఆవేదనలు ఇంకా స్పష్టంగా సామాజికమైపోయాయి.

వాళ్ళ సైద్ధాంతిక వ్యతిరేకత కొనసాగుతూనే ఉంది. అయితే వాళ్ళు ఒకటి గుర్తించేరు: పేదరికమూ, ఆకలీ విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నంతకాలమూ, మార్క్సిజాన్ని ఎదిరించేసాహసం ఎవరూ చెయ్యలేరని. పేదరిక నిర్మూలనానికి  మార్క్సిజం గురించి ఇంత చిన్న ప్రాధమిక అవగాహనతో, విరసం (విప్లవ రచయితల సంఘం) ఆవిర్భవించే వేళకి ఇందులో కనీసం నలుగురైనా మార్క్సిస్టు- లెనినిస్టు రచయితలుగా ఎదిగేరు.  కమ్యూనిజం రివిజనిజంగా రూపుదిద్దుకున్న కాలంలో, ప్రతిఘటనలు కూడా శూన్యవాదంలోకి దిగడం సహజమైనప్పటికీ, లక్ష్యం పట్ల నిబద్ధతా, సైద్ధాంతిక అరాజకత్వం రెండూ జంటగా ఎక్కువ్కాలం కొనసాగలేవు. ఎప్పుడో ఒకప్పుడు ఆ రెండింటిలో ఏదో ఒకటి రెండవదానిపై పైచేయి సాధించవలసిందే. ఆరుగురు దిగంబరకవుల్లో నలుగురు విషయంలో మొదటిది గెలిచింది(మిగిలిన ఇద్దరిలో ఒకరు తర్వాత ఆచార్య రజనీష్, మరో కొంతమంది బాబాలకి భక్తుడిగా మారిపోయాడు) శ్రీకాకుళం నక్సల్బరీ ఉద్యమ ప్రేరణతో ఈ నలుగురూ, శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, వరబర రావు, రమణారెడ్డి వంటి మరికొంతమంది రచయితలూ కలిసి 1970, జులై 4 న విరసం స్థాపించేరు. ఆ నలుగురిలో చెరబండరాజు ఒకరు. 1971-72 లో దానికి అతను జనరలు సెక్రటరీగా ఉండడమే కాకుండా, దానికి మరణ పర్యంతం కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా కొనసాగేరు.

ఇంతకుముందు చెప్పినట్టు, దిగంబరకవిగా ఉన్నప్పుడుకూడా  అందరిలోకీ ఎక్కువ సామాజిక స్పృహ కనపరిచింది చెరబండ రాజే. దిగంబర కవుల మూడవ సంకలనం వచ్చే వేళకి అతని పదాల్లో విచక్షణారహితంగా తిరస్కారం కనిపిస్తూ, హృదయాన్ని కదిలించడానికి బదులు ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ, అతని కవిత్వం విప్లవభావాలతో గుర్తుపట్టగలిగేదిగా  ఉంది. వందేమాతరం అన్న కవితలో భారతమాతని ఒక వేశ్యగా వర్ణిస్తూ, ఆమెని ఇలా సంబోధిస్తాడు:

నీ అందం ఎలాంటిదంటే

అంతర్జాతీయ విఫణిలో నీ

అంగాంగమూ తాకట్టుపెట్టబడింది

నీ యవ్వనం

ధనవంతుల కౌగిళ్ళలో

ఆదమరచి నిశ్చింతగా నిద్రిస్తోంది.

(ఇది రాసిన చాలా రోజుల తర్వాత, ఎమర్జెన్సీ రోజుల్లో ఈ కవితని జైల్లో చదివినప్పుడు, భారతమాతను ఇలా తూలనాడినందుకు ఒక ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త అతనిపై దాడి చేశాడు)

అయితే, విప్లవకవిగా మారిన తర్వాత చెరబండరాకు క్రమంగా వచన కవిత్వం నుండి కవిత్వ రూపంగా పాటకి మరలిపోయాడు. విప్లవకవిగా ఉన్న రోజుల్లో వచనకవిత్వమూ, పాటా ఉన్న 8 సంకలనాలు వేసినప్పటికీ, నిరక్షరాస్యులూ, పాక్షిక అక్షరాస్యులూ అయిన పాటక జనానికి రాజకీయ పరిజ్ఞానాన్ని కవిత్వంద్వారా అందించాలంటే,పాట సరియైన మాధ్యమం అనిగుర్తించిన కొద్దిమంది కవుల్లో అతనొకడు. ఈ విషయంలో అతనికి ముందు సుబ్బారావు పాణిగ్రాహి, అతనికి తోడుగా శివసాగర్ ఉన్నారు. శ్రీశ్రీ భాషా, ప్రతీకలూ మధ్యతరగతికి సరిపోయినట్టుగా, వీరు ముగ్గురూ ముందుతరం వామపక్షభావజాలాకవిత్వానికి వారధిలా పనిచేశారు. అందులోని తీవ్రవాద భావజాలమూ, చెప్పేవిధానమూ పక్కన బెడితే, జననాట్యమండలికి చెందిన రచయితలూ, గేయకారులూ, ముఖ్యంగా గద్దర్ లాంటి వాళ్ళు కేవలం పాటలు రాయడమే గాక, ప్రజలభాషలో రాస్తూ, వాటిని జానపద సరళిలో పాడి ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు.

నక్సల్ బరీ తర్వాత తెలుగులో వచ్చిన వామపక్షభావజాలకవిత్వానికి చెరబండరాజు ఒక మార్గదర్శకుడవడం ప్రభుత్వానికి నచ్చలేదు.

మేం కొండలు పగలగొట్టాం

మేం బండరాళ్లను పిండి చేశాం

మా రక్తం రాయిగా

ప్రాజెక్టులు నిర్మించాం

కష్టం ఎవడిది?

కాసులెవడివి?

… అదికూడా నిరుపేదల్లో నిరుపేదలైన శ్రామికులకి అర్థం అయేరీతిలో రాయగల కవి, ఆ ప్రాజెక్టుల లబ్ధిదారుల ప్రయోజనాలను సం రక్షించే ప్రభుత్వాలకి ప్రమాదకర వ్యక్తిగా కనిపించడం సహజమే.

అందుకే చెరబండరాజు ఇంకెవరూ అనుభవించని హింసని అనుభవించాడు. మిగతా ముగ్గురు దిగంబరకవులతోపాటు అతను 1971లో  ప్రివెంటివ్ డిటెన్షన్ ఏక్ట్ క్రింద 50 రోజులు నిర్బంధించబడ్డాడు; 1973లో 37 రోజులు MISA (Maintenance of Internal Security Act) క్రింద అరెస్టుకాబడ్డాడు. రెండు సందర్భాలలోనూ అతని మీద అభియోగం అతను తన కవిత్వంద్వారా యువతని సాయుధపోరాటం వైపు పురికొల్పుతున్నాడని. సికిందరాబాదుకుట్రకేసులో అతన్ని ఇరికించడంతో 1974లో అతన్ని స్కూలు టీచరు ఉద్యోగమ్నుండి తొలగించడం జరిగింది. ఎమర్జెన్సీ తర్వాత అతను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోబడినా, మూడురోజులు తిరక్కుండా DIG (Intelligence) అతన్ని తిరిగిపనిలోకి తీసుకున్నందుకు DEO ని చీవాట్లు పెట్టడంతో అతనిదగ్గరనుండి తిరిగి ఉద్యోగం నుండి తొలగిస్తూ తంతి వచ్చింది. మార్చి 1980లో అప్పటి విద్యాశాఖమాత్యులు ఉపాధ్యాయుల నియోజకవర్గం నుండి ఎన్నికైన MLC అడిగిన ప్రశ్నకి అసెంబ్లీలొ అతన్ని పదవిలోంచి తప్పించినట్టు ప్రకతించారు. అతను చనిపోవడానికి కొన్ని వారాలు ముందు, అతను హాస్పిటల్లో స్పృహలేకపడిఉన్నప్పుడు, అతన్ని లాంఛనంగా ఉద్యోగంలోకి తీసుకున్నారు.

అతను అనుభవించిన రాజ్యహింస గురించి చెరబండ రాజు ఒక చోట మంచి కవిత చెప్పేడు:

 

పొరపాటున అమాయకత్వంకొద్దీ

నేను ఆకాశంవైపు చూడడంతటసిస్తే

వాళ్ళు నా చూపుల వాలుని కొలుస్తారు

నా అడుగుజాడలు పడ్ద మట్టిని

ప్రయోగశాలల్లో పరీక్షిస్తారు

నా పాటల్లో చరణాల నిర్మాణ

సరళిని పసిగట్టడానికి.

 ఈ మధ్యలో అతనికి కేన్సరు సోకింది… మూడుసార్లు శస్త్రచికిత్స చేశారు. అతనికి చూపు పోయి, చివరకి చాలా కాలం అపస్మారకస్థితిలో ఉండి జులై 2 న కన్నుమూసాడు.

సాధారణంగా విప్లవకవిత్వం అంటే నినాదాల ఘోష అన్న అపవాదు ఉంది. దాన్నే సరిగ్గా నిలబెట్తి, చెరబండరాజు కవిత్వంలో నినాదాలుగా చెప్పగలిగిన ఎన్నో పదాలున్నాయని చెప్పవచ్చు. (ఈ మధ్య ఒక విమర్శకుడు చెప్పినట్టు అది అంత సామాన్యమైన విషయమేమీ కాదు.) తెలంగాణా నగరాల్లోని గోడలనిండా కనపడే  శ్రీ శ్రీ, గద్దర్, శివసాగర్ లతోపాటు అతని నినాదాల్లోనూ, అతని కవిత్వానికి  ప్రతిస్పందించిన వాళ్ల హృదయాలలోనూ అతను శాశ్వతంగా నిలిచి ఉంటాడు.

 

(కె. బాలగోపాల్ ఇంగ్లీష్ లో రాసిన వ్యాసానికి నౌడూరి మూర్తి తెలుగు అనువాదం )

Courtesy: Economic and Political Weekly, July 24, 1982.

 

 

‘చెర’గని జ్ఞాపకం…చెరబండ రాజు!

venu

వ్యాసకర్త ఎన్.వేణుగోపాల్

 

(జూలై 2:  ప్రసిద్ధ కవి చెరబండ రాజు వర్థంతి )

చిన్నా పెద్దా అందరమూ ప్రేమగా ‘చెర’ అని పిలుచుకుంటుండిన చెరబండరాజు చనిపోయి అప్పుడే ముప్పై ఒక్క ఏళ్లు గడిచిపోయాయి. చెర పుట్టినరోజు తెలియదు.“ హైదరాబాదుకు తూర్పున, అంకుశాపురం గ్రామంలో పదిహేను రోజుల ప్రసవవేదనలో అమ్మ చచ్చిపోతుందనగా నేలమీదికి కసిగా విసిరివేయబడ్డాడు. ఎప్పుడో తేదీ లేదు. బంగారమొడ్డించే పల్లెవాసుల చల్లని చూపుల్లో, పైరుపచ్చని పొలాల గట్ల మెద్ద కాలిబాటల చీలికల్లో పెరిగాడు. ఎదురైన ప్రతి హృదయానికీ అంకితమవుతాడు. సాగర తీరాల ఇసుక తిన్నెల మీద ఒంటరిగా కూర్చోవడం, వానలో నానడం, ఏకాకిగా ఉండడం, విషాదం ఇష్టం. మనిషికోసం పడి చస్తానంటాడు. ఒక్క భగవంతుని మీదే కసి, పగ” అని దిగంబరకవులు మొదటి సంపుటంలో పరిచయం రాసుకున్న నాటికైనా, చివరి వరకూ అయినా పుట్టినతేదీ తెలియనే లేదు. జ్ఞాపకం ఉన్న సంఘటనలను బట్టి పుట్టిన సంవత్సరం 1944 అని చెప్పుకునేవాడు. అది సరైనదే అయితే చెర ఇప్పుడు 69 నిండి డెబ్బైలలో ప్రవేశిస్తుండేవాడు.

చెరను బహుశా 1972లో మొదటిసారి చూసి ఉంటాను. అప్పటినుంచి 1982 జూలై 2న చనిపోయేదాకా ఆయనతో గడిపిన జ్ఞాపకాలు మానసాకాశం మీద ఎప్పటికీ చెరగని అరుణారుణతారలు. మనిషిని చూసినది పది సంవత్సరాలే, అందులోనూ ఆయన రెండేళ్లు ముషీరాబాద్ జైల్లోనూ, రెండేళ్ల కన్న ఎక్కువే గాంధీ రోగ నిలయం (గాంధీ ఆస్పత్రికి ఆయన పెట్టిన పేరు) లోనూ గడిపాడు. ఆయనను కలిసింది కూడా సభల్లో, అంబర్ పేట ఇంట్లో, జైలులో, కోర్టులలో, ఆస్పత్రిలో అప్పుడప్పుడూ మాత్రమే గనుక మొత్తంగా నెల కూడ ఉండదేమో. కాని వెయ్యి పున్నముల వెలుగు అది. ఆయన జీవితం మీద, కవిత్వం మీద ఎన్నో చోట్ల మాట్లాడాను, రాశాను. మాట్లాడినప్పుడల్లా , రాసినప్పుడల్లా కొత్త స్ఫురణకు వీలు కల్పించే నవనవోన్మేష స్ఫూర్తి అది.

ఆయన ఎక్కువకాలం గడిపిన అంబర్ పేట కిరాయి ఇల్లు ఇప్పుడు లేదు. ముషీరాబాద్ జైలును కూల్చేసి గాంధీ ఆస్పత్రి చేశారు. గాంధీ రోగనిలయాన్ని కూల్చేసి ఎవరికి రియల్ ఎస్టేట్ చేద్దామా అని ఆలోచిస్తున్నారు. ఆయన ఉద్యోగం నుంచి తొలగింపుకూ, అనారోగ్యానికీ గురయితే తెలుగు సమాజం అసాధారణంగా స్పందించి ఆయన సహాయనిధి సేకరించి కట్టించి ఇచ్చిన రెండుగదుల చిన్న ఇల్లు కూడ ఇప్పుడు అపార్ట్ మెంట్ గా మారిపోయింది. ఆయనకు అన్నివిధాలా సంపూర్ణంగా సహచరిగా ఉండిన శ్యామలక్క అకాలంగా అనారోగ్యంతో మరణించింది. ఆయన కంటిపాప ఉదయిని కాన్సర్ పీడితురాలయి ముప్పై ఏళ్లు నిండకుండానే ప్రాణాలు కోల్పోయింది. కొడుకు కిరణ్ తప్ప భౌతికంగా చెర జ్ఞాపకం అని చూపదగినవి దాదాపుగా ఏమీ లేవనే చెప్పాలి. కాని చిరస్మరణీయమైన చెర కవిత్వం ఉంది.

‘అమ్మమ్మ ఇందిరమ్మ చేసింది సాలుపొమ్మా’ అని గానానికి అనువుకాని, శ్రుతిలయలు తెలియని సన్నని గాత్రంతోనే ఆయన పాడిన పాటలు, ‘పాడుతాం పాడుతాం ప్రజలే మానేతలనీ ప్రజాశక్తి గెలుచుననీ’ అనీ, ‘విప్లవాల యుగం మనది, విప్లవిస్తె జయం మనది’ అనీ, ‘ఈ మట్టిని తొలుచుకొనీ విప్లవాలు లేస్తున్నై, ఎరుపెక్కిన ఈ మట్టికి మా నెత్తుటి స్వాగతాలు’ అనీ ఆయన చేతి సంకెళ్లనే సంగీత సాధనాలుగా మార్చి కూర్చిన అద్భుతమైన లయబద్ధమైన కవితానినాదాలు ఇంకా చెవుల్లో రింగుమంటూనే ఉన్నాయి.

cherabandaraju1

విప్లవ రచయితల సంఘం ఏర్పడినప్పటి నుంచి ఎమర్జెన్సీ విధించే దాక అంటే 1970 జూలై నుంచి 1975 జూన్ దాకా  ఐదు సంవత్సరాలలో హనుమకొండ-వరంగల్ లలో కనీసం యాభై సభలు, సమావేశాలు జరిగి ఉంటాయి. నేను 1973 జూన్ తర్వాతనే చదువు కోసం హనుమకొండ వచ్చాను గాని అంతకుముందరి సభలు కూడ చూశాను. అటువంటి సభల్లో ఏదో ఒకదానిలో, బహుశా చెర 1971లో మొదటిసారి ప్రెవెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అరెస్టయి విడుదలైనాక జరిగిన సభలోనో, లేదా మరేదైనా సభలోనో చూసి ఉంటాను. ఇక నేను హనుమకొండకు చదువుకు వచ్చినాక నాలుగు నెలలకే అక్టోబర్ లో విరసం మొదటి సాహిత్య పాఠశాల జరిగింది. విరసం నాయకులందరినీ మూడు నాలుగురోజులపాటు సన్నిహితంగా చూడడం, వారి మాటలు, కవితలు, ఉపన్యాసాలు వినడం అప్పుడే. అందరితో, ముఖ్యంగా చిన్నపిల్లలతో స్నేహం చేసే చెర ప్రభావం ఆ సభల్లో పుస్తకాల దుకాణం దగ్గర కూచున్న నా మీద పడడం చాల సహజంగా జరిగింది.

ఆ సభలు జరిగిన రెండు మూడు రోజులకే ఒక రోజు పొద్దున్నే ఇంటికి వచ్చిన పోలీసులు మామయ్య (వరవరరావు) ను అరెస్టు చేసి తీసుకుపోయారు. అదే సమయంలో హైదరాబాదులో చెరను కూడ అరెస్టు చేశారు. అప్పటినుంచీ చెర మా కుటుంబ సభ్యుడే అయిపోయాడు. ఆ నిర్బంధం నెలన్నరలోనే ముగిసింది గాని, మరొక ఆరునెలలకు చెరనూ మామయ్యనూ సికిందరాబాదు కుట్రకేసులో ముద్దాయిలుగా కలిపి పెట్టారు. ఇక ముషీరాబాదు జైలులోనో, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులోనో చెరను రెగ్యులర్ గా కలుస్తుండేవాళ్లం. కొన్నాళ్లకే చెర బెయిల్ మీద విడుదలై ఎమర్జెన్సీ విధించేదాకా జరిగిన సభల్లో పాల్గొన్నాడు. ఫిబ్రవరిలో హైదరాబాదులో జరిగిన రాడికల్ విద్యార్థి సంఘం మొదటి మహాసభల నాటికి జైలులో ఉన్నాడో విడుదలై పాల్గొన్నాడో గుర్తు లేదు గాని, ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో జరిగిన నాలుగైదు ఆర్ ఎస్ యు సభలకు ఉపన్యాసకుడిగా వచ్చాడు. ఏప్రిల్ లో తెలుగు మహాసభల దగ్గర శ్రీశ్రీతో పాటు నిరసన ప్రదర్శన జరిపి అరెస్టయ్యాడు. ఆ తర్వాత ఎమర్జెన్సీ రెండు సంవత్సరాలూ జైల్లో, కోర్టుల్లో కలవడమే.

ఎమర్జెన్సీ తర్వాత చెర బతికింది సరిగ్గా ఐదు సంవత్సరాలు, అందులోనూ రెండు, రెండున్నర సంవత్సరాలు ఆస్పత్రులలోనే ఉన్నాడు. మిగిలిన కాలమంతా ఎన్నో చోట్ల ఎన్నో సభల్లో కలుసుకుంటూ ఉండేవాళ్లం. 1979లో మా బాపును తీవ్రమైన లివర్ సంబంధిత సమస్యతో గాంధీ ఆస్పత్రిలో చేర్చి, పది పదిహేను రోజులు ఉన్నప్పుడు చెర కూడ ఆపరేషన్ కోసం అక్కడే ఉన్నాడు. అప్పటికే రాయడం మొదలుపెట్టిన నాకు ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, నా కలం పేరు మీద ఆయన వ్యాఖ్య, ఆ గొంతు నా చెవుల్లో ఇప్పటికీ ధ్వనిస్తూనే ఉంది.

చెర జీవితం గురించి తలచుకున్నప్పుడల్లా ఆ విస్తృతీ, వైవిధ్యమూ చూసి చాలా ఆశ్చర్యం వేస్తుంది. బతికినది నిండా ముప్పై ఎనిమిదేళ్లు కూడా కాదు. అందులో మూడు సంవత్సరాలు జైలుకూ మూడు సంవత్సరాలు అనారోగ్యానికీ, ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగిస్తే ఆర్థిక ఇబ్బందులకూ, కేసులకూ పోతే, పదిహేను సంవత్సరాలు సాహిత్య, సామాజిక జీవితానికి ముందరి వ్యక్తిగత జీవితానికి పోతే ఆయన సాహిత్య, సామాజిక జీవితానికి మిగిలింది అటూ ఇటూగా పదిహేనేళ్లు మాత్రమే. కాని ఆ స్వల్ప కాలంలోనే ఆయన రెండు సాహిత్య ఉద్యమాలకు ప్రధాన భాగస్వామి అయ్యాడు. ఏడు కవితా సంపుటాలు అచ్చు వేశాడు, ఒక డజను దాకా కథలు రాశాడు. మరో డజను నాటికలు, నాటకాలు రాశాడు. మూడు నవలలు రాశాడు. ఒక అసంపూర్ణ నవల వదిలిపోయాడు. ఉపన్యాసాల కోసం, కవితాపఠనం కోసం రాష్ట్రమంతా తిరిగాడు. విప్లవ రచయితల సంఘానికి ఒక సంవత్సరం కార్యదర్శిగా పనిచేశాడు. హైదరాబాదులో విప్లవోద్యమానికీ, విప్లవ విద్యార్థి యువజనోద్యమాలకూ, జననాట్యమండలికీ పెద్దదిక్కుగా ఉన్నాడు.

ఈ పనులన్నీ కూడ ఏదో చేశాడంటే చేశాడన్నట్టు కాకుండా మనసు పెట్టి చేశాడు. శ్రద్ధగా చేశాడు. తెలుగు పండిత శిక్షణ పొంది, ప్రాచీన సాహిత్యం చదువుకున్నా, పాఠాలు చెప్పినా, వచన కవిత్వం మీద పట్టు సాధించాడు. ఎప్పటికప్పుడు వస్తుశిల్పాలను పదును పెట్టుకున్నాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని 1969లో వ్యతిరేకిస్తూ కవిత రాసినవాడే, 1972 నాటికి తన ఆలోచనలోని పొరపాటు గ్రహించి తెలంగాణ ఆకాంక్షలను సమర్థిస్తూ కవిత రాశాడు. నిరంతర సాధనతో తన వస్తువులను తానే మార్చుకున్నాడు. వస్తువు ఎంపికలో వైవిధ్యం సాధించాడు. అప్పటికి విప్లవ సాహిత్యోద్యమం కూడ సంకోచించిన అంశాలను వస్తువులుగా తీసుకుని రచన చేశాడు. వచన కవితా రూపంతో తన లక్ష్యం నెరవేరదనుకున్నప్పుడు తనను తాను మార్చుకుని పాట వైపు పయనించాడు. తన పాటలు తానే పాడాడు. నిర్బంధంలో చేతికి సంకెళ్లతో కోర్టుకు తీసుకు వస్తున్నప్పుడు అప్పటిదాకా విప్లవకారులకు, విప్లవ రచయితలకు అలవాటైన నినాదాల స్థానంలో సంకెళ్ల దరువుతో కవితా పాదాలు అల్లడం మొదలుపెట్టాడు. అలా రాసిన ఏడెనిమిది పాటల్లో ప్రతి చరణమూ ఆ తర్వాత విప్లవోద్యమ ఊరేగింపులలో నినాదంగా మారింది.

ఆలోచిస్తుంటే చెర కవిత్వం గురించీ, కవిత్వ శక్తి గురించీ, జీవితం గురించీ ఇప్పటికి చాలమంది చాలా చెప్పి ఉన్నప్పటికీ ఇంకా అన్వేషించవలసిందీ, వివరించవలసిందీ, విశ్లేషించవలసిందీ ఎంతో మిగిలి ఉన్నదనే అనిపిస్తున్నది.

అవును, చెరస్మరణ చిరస్మరణీయం.

—ఎన్.వేణుగోపాల్

 

అలాంటి మధుర క్షణాలు కొన్ని చాలు …

ramana

 

ముళ్ళపూడి వెంకట రమణ అనే మహానుభావుడితో నాలుగైదు సార్లు ఫోన్లో మాట్లాడేసి, రెండు, మూడు సార్లు  ధైర్యంగా ఎదురుపడి నమస్కారం కూడా పెట్టి, వీలుంటే ఆయన చెయ్యి ముట్టేసుకుని పవిత్రం అయిపోయి .అక్కడితో ఆగిపోకుండా ఆయనకీ, తమకీ ఎంతో అవినాభావ సంబందం ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చేసుకుంటూనే, కొందరు అమెరికా “ప్రముఖ ప్రబుద్దులు” నేను కూడా అలాగే నా పాప్యులారిటీ పెంచుకోవడం కోసం ఆయన పేరుని “cash” చేసుకుంటున్నాను అనుకునే ప్రమాదం పొంచి ఉంది అని నాకు తెలుసు. అటువంటి వారితో నేను “అమెరికోతి కొమ్మచ్చి” ఆడదలచుకో లేదు. అయినా ఆయన 81 వ జన్మదిన సందర్బంగా ముళ్ళపూడి గారిని తల్చుకుని, ఎవరికీ అందని పై, పై కొమ్మలకి ఎగిరి పోయి నాకు నేనే ఆనందిద్దామనీ, ఆ ఆనందాన్ని అందరితో పంచుకుందామనీ ఈ చిన్న వ్యాసం లో నా అతి చిన్న ప్రయత్నం.  

Bapu & Ramana releasing my book

కొంచెం సిగ్గుగానే ఉన్నా… ముందుగా ఇటీవల జరిగిన…జరగని ఒక సంగతి చెప్పుకోవాలి.

క్రిందటి మార్చ్, 2013 లో నేను ఇండియా వెళ్ళినప్పుడు, తాడేపల్లి గూడెం లో ఒక కాలేజ్ వారు కొన్ని అమెరికా వ్యాపార రహస్యాలను లో MBA విద్యార్ధులకి బోధించమని కోరగా నేను కాకినాడ నుంచి మా మేనల్లుడు అద్దంకి సుబ్బారావు తో కారులో అక్కడికి బయలు దేరాను.

నాకు ముందు తెలియదు కానీ, మేము ఒక ఊరు చేరగానే “మామయ్యా, ఇదే ధవళేశ్వరం, అదిగో అక్కడే కాటన్ దొర..” అని ఏదో అనబోతూ ఉంటే “ఆపు, కారు, ఆపు” అనేసి “ముళ్ళపూడి గారి మేడ దగ్గరకి పోనియ్ “ అన్నాను నెర్వస్ గా. ఒకే క్షణంలో అంత ఆనందము, అంత విచారము నాకు నా జన్మలో ఎప్పుడూ కలగ లేదు. “ముళ్ళపూడి రమణ గారు పుట్టిన పుణ్య క్షేత్రం ధవళేశ్వరం చూడగలిగాను.”  అని ఆనందం అయితే, “అయ్యో, కాస్త ముందు ఈ సంగతి తెలిస్తే ‘గోదావరి పక్కన గురువు గారి మేడ’ ఉందో లేదో వివరాలు కనుక్కుని కనీసం ఆ ప్రాంగణం లో అడుగు పెట్టి ధన్యుణ్ణి అయ్యే వాడిని కదా..అపురూపమైన అవకాశాన్ని అందుకోలేక పోయాను కదా” అని ఎంతో విచారించాను.

అన్నింటి కన్నా విచారం అక్కడ ఉన్న కాస్త సమయంలో ముళ్ళపూడి గారి ఇంటి గురించి ఎవరిని అడిగినా వారు వెర్రి మొహాలు పెట్టడం, కాటన్ దొర గురించి అడిగితే “అదిగో ఆ విగ్రహం దగ్గర ఫోటో దిగండి” అని సలహా ఇచ్చివ వారే!

“అలాంటివన్నీ ముందు వెబ్ లో చూసుకు రావాలి మామయ్యా, లోకల్ వాళ్లకి ఎవడికి కావాలీ?” అన్నాడు మా మేనల్లుడు. తెలుగు వారి సంస్కృతి నేల మీద వెల వెల బోతున్నా, వెబ్ లో వెలుగులు చిమ్ముతోంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలీ?

Mullapudi

ఇక ముళ్ళపూడి గారితో నా మొదటి పరోక్ష పరిచయం మా బావ గారు నండూరి వెంకట సూర్యనారాయణ మూర్తి గారి ద్వారా జరిగింది. మా బావ గారు, బాపు-రమణలు  మద్రాసు లో కేసరి హై స్కూల్ లో చిన్నప్పుడు  సహాధ్యాయులు. ఇప్పుదు హైదరాబాద్ లో ఆయన సీనియర్ అడ్వొకేట్. నేను వ్రాసిన నా మొదటి నాటకాన్ని (బామ్మాయణం అను సీతా కల్యాణం”) మా బావ గారు చదివి, 1970 ప్రాంతాలలో “ఇలాంటి సరదా డ్రామాలంటే బాపు-రమణ లకి ఇష్టం. ఇది వాళ్లకి పంపించి అభిప్రాయం అడుగుదాం” అని అనుకుని, నాతో చెప్పకుండానే ఆ నాటకాన్ని మద్రాసు పంపించారుట. ఈ విషయం చాలా సంవత్సరాల తరువాత రమణ గారు ఏదో మాటల సందర్భంలో చెప్పారు.  “కన్నప్ప” గారి కేసులో రమణ గారు మా బావ గారిని లీగల్ సలహాకి సంప్రదించారు అని విన్నాను. అప్పటికే అంతా అయిపోయింది.

ఆ తరువాత అనేక సందర్భాలలో ముళ్ళపూడి గారితో నా అనుబంధం మూడు పువ్వులు ఆరు కాయలు గానే మహదానందంగా సాగింది. అందులో పరాకాష్టగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన “మొట్ట మొదటి ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు”  (డిశంబర్ 31, 2006- జనవరి 1, 2007,  హైదరాబాద్) లో బాపు-రమణ ల మైత్రీ షష్టి పూర్తి…అంటే రమణ గారి కథ కి బాపు బొమ్మ గీసి ప్రచురించబడి అప్పటికి అరవై సంవత్సరాలు నిండాయి. సన్మానాలకీ, సత్కారాలకీ ఎప్పుడూ దూరంగా ఉండే వాళ్ళిద్దరూ మొట్ట మొదటి సారిగా సతీ సమేతంగా మా సత్కార సభకి వచ్చి, రెండు రోజులూ పూర్తిగా సభలలో పాల్గొని నా మీద వ్యక్తిగతంగా ఎంతో అభిమానం చూపించారు. విశేషం ఏమిటంటే, ఇప్పటికీ ఏ టీవీ వారైనా బాపు -రమణ ల మీద  ఏ సందర్భంలో టీవీ క్లిప్స్ చూపించినా, ఆ ఇద్దరి వెనకాల back drop  ఎప్పుడూ ఆ నాటి మహా సభలదే ఉంటుంది.

ఆ సభలో వంగూరి ఫౌండేషన్ ముళ్ళపూడి గారికి “జీవన సాఫల్య పురస్కారం” అంద చేశాం. ఆ మహా సభలు పూర్తి అయ్యాక నాలుగు రోజులలో నాకే ఆయన ఐదు వేల రూపాయల చెక్కు పంపించారు. నేను ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి “ఎందుకు సార్ “ అని భోరుమని ఏడవగానే ఆయన నన్ను బుజ్జగించి “అది కాదు నాయనా…దేనికైనా ఓ పద్ధతి ఉండాలి కదా..మీ సభలకి నేను, మా ఆవిడా వచ్చినప్పుడు మా అబ్బాయి ప్రతీ రోజు మా హోటల్ కి వచ్చి మాతో బాటు భోజనం చేసాడు. వాడు నీ గెస్ట్ కాదుగా..వాడి తిండి ఖర్చు నాదేగా ..అందుకూ ఆ చెక్కు. తక్కువైతే చెప్పు. ఇంకోటి పంపిస్తాను.”  అన్నారు.అదీ ఆయన పద్ధతి.

అంతకు ముందే నా మొట్టమొదటి కథల సంపుటి “అమెరికామెడీ కథలు” అనే పుస్తకాన్ని ప్రచురిస్తే బావుంటుంది కదా అనే ఊహ నాకు కలిగినప్పుడు  తక్షణం మూడు “కోతి కొమ్మచ్చులు” నా మనసులో మెదిలాయి. మొదటిది ఆ పుస్తకం బాపు-రమణలకి అంకితం ఇవ్వాలి.  రెండోది వారి చేత ‘ముందు మాట” వ్రాయించుకోవాలి. ఇహ మూడోది బాపు గారి చేత ముఖ చిత్రం వేయించుకోవాలి. వెనువెంటనే బాపు గారిని యధాప్రకారం భయ భక్తులతో ఫోన్ చేసాను. యధాప్రకారం అభిమానంగా ఆప్యాయంగా, క్లుప్తంగా ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. “అంకితం” విషయం వినగానే  “వెంకట్రావ్ ఇక్కడే ఉన్నారు అడిగి చెప్తాను.” అని చెప్తాను అన్నారు. ఇక ముందు మాట . ముఖ చిత్రం గురించి కూడా వినగానే ముళ్ళపూడి గారే స్వయంగా ఫోన్ అందుకుని “అంకితానికెంతా, ముందు మాటకెంతా, ముఖ చిత్రాని కెంతా …ఒక్క అంకితానికెంతా, ముందుమాట కెంతా   ..ఏమైనా కన్సెషన్ ఉందా…” అని చమత్కరిస్తూ… హాయిగా అన్నింటికీ ఒప్పేసుకున్నారు.

నేను ఎప్పుడు మద్రాసు వెళ్ళినా రమణ గారిని చూడడం తప్పని సరి. ఆఖరి సారిగా రమణ గారు మనల్ని ఈ భూప్రపంచంలో వదిలేసి తను స్వర్గానికి వెళ్ళిపోడానికి కొన్ని నెలల ముందు నేనూ, గొల్లపూడి గారూ వారింటికి వెళ్ళి, ఆయన తోటీ, బాపు గారి తోటీ గంటల తరబడి సరదాగా సీరియస్ విషయాలు, సీరియస్ గా సరదా విషయాలు అనేకం మాట్లాడుకున్నాం.

అలాంటి మధుర క్షణాలు కొన్ని చాలు … ఎవరికీ అందని పై, పై కొమ్మలకి ఎగిరి పోయి నాకు నేనే ఆనందించడానికి..

 

(రమణగారి రేఖాచిత్రం: అన్వర్ )

 

బతుకు క్రితం ఓ కల క్రితం

1. బర్వుగా జారిపోతాం. జరాస జర్దా జల్దీ జిందగీలో. బాబా రత్న రంగుని పులుముకుంటూ నములుకుంటూ. తేలు కొండెం చీకటిలోకి ఆలోచనలు లేని ఆలోచనలలోకి. మనసుని గోక్కుంటూ.

2. బర్వుగా తేలిపోతాం. ఏ ఊరెళ్ళావో ఎవరికీ చెప్పకే. tabula rasa. తబలా తలల జ్ఞాపకాలు, హార్మోనియం నేర్చుకోవటాలు, బొమ్మలు గీయటాలు, spells of tranquilityని పట్టుకోవటాలు తేలిపోయిందెక్కడకో. యిపుడెవరికి కాపలా యీ వుత్తరాలూన్నూ. ఎవరికైనా చెప్పి తిరిగొచ్చేయ్ మొగల్ సరాయ్ లో కలుసుకుందాం. ఓ గోధుమ రంగు స్నేహంలో. గో. గో. ఇళ్ల కప్పుల్నీ, కప్పల్నీ, కాళ్లనీ, కన్నీళ్ళనీ, కాకి ఇంద్రధనుస్సుల్నీ విడిచి. ఇడిచి.

3. బర్వుగా నానిపోతాం. నాన్న కొట్టారా. భార్య చనిపోదెప్పటికీ. అమ్మే మిగిలి. మిగిలి. నాన్నే రగిలి. పగిలి. గిలి గిలి సిల్లీ చలి. గిల్టీ గాలిబ్ ల లబ్ డబ్ లు యిక వినిపించవులే. రబ్బరు రెక్కల రక్తం తొంగిచూడదులే. రేపటి గురకలు గుర్రమెక్కాయా. వలస కలవరింతలే కనికరించాయా. అసలు పక్షులు యెగురుతాయా.

4. బర్వుగా కాలిపోతాం. నలుపు మంచు ఉరుముల ఊపిరిలో. ఎప్పటి రాత్రైనా వొహప్పటి జ్ఞాపకమేనా. దీపానికి తెలుసా సమయమెంతైందని. దేహానికి తెలుసా మరణమెంతైందని. ఆర్పు. ఆర్పు. నిద్రనదిలో మరుగుతున్న మంటల్ని.

5. బర్వుగా చూస్తుంటాం. గది లోపలి లోపలి గదిలో గది గది గది లోపల లోపల లోపల గదిలో. కాళ్ళీడుస్తూ చూపులు. వొళ్లు విరగ్గొట్టుకుంటూ చూపులు. cosmic consciousnessలోకి ‘నన్ను’ని వెతుక్కోవాలని చూస్తూ స్తూచూ చూస్తూ స్తూచూ వెళ్ళావా. నీ లోపలి గాలిలోకి. వీధిలోకి.

6. బర్వుగా గడ్డకడతాం. ‘ ఊదా నీలి జాలి – / “నిబద్ధతే” ఇదంతా ‘ అంటూ నన్ను నడుస్తున్న నీడల్తో, తాటిచెట్టంత రంగులతో నడుస్తున్నప్పుడు, ఎవరో నన్ను పీక బిగించిన నాలుకతో, నాలుకంత పీకని బిగించిన చీకటిలో గడ్డకట్టలేదూ. ‘కోరతనపు అమాయకత్వం తెరలతో కప్పబడిన వికటాట్టహాసంలాగా, తలనరకబడిన కొబ్బరి బొండాంలాగా, మాసిపోయిన మొన్నలాగా,’ ఓ వెర్రినవ్వు గడ్డకట్టలేదూ.

7. బర్వుగా ఖలరవుదాం. ‘ గోళీసోడా కొట్టినపుడు ఖయ్యిమంటూ మొదలుపెట్టి కీచుమంటూ దిగిన శబ్దపు ఖలరుందే, ఆ ఖలరండీ… ఒక నయంకాని ఏకాంతంలోకి… అంతటి అర్థరాత్రిలోనూ దూరంగా ఒక మిత్రుణ్ణి కలుసుకోవాలని ఉంటుంది అతనెలా ఉన్నాడో కనుక్కుందామని… ఆ ఖలరండీ… ఇంతకీ, ఆ ఖలర్లోని వేడి, వెలుతురు సరిపడ్డాయా?

img625(1)

సిద్ధార్థ, త్రిపుర, ఎం. ఎస్. నాయుడు, నున్నా నరేష్, గుంటుకు శ్రీనివాస్

ఆకాశం, చలం, సముద్రం….ఒక్కోసారి ఒక్కోలా…!

Kuppili Padma Photoవేసవి గాడ్పులు. ముదురాకుపచ్చని జీడిమామిడి చెట్లు గొడుగైన ఆ మధ్యాహ్నాం నా  రెండు చిన్నారి  చేతుల నడుమ ప్రేమలేఖలు. ఆ వేసవి వేడి, మట్టివాసన ,రాబోయే కాలానికి నిబద్దతతో ఆహారసేకరణలో చీమలు బారులు. చిన్నవి, ఎర్రనివి, నల్లనివి. గండు చీమలు. అలాంటి వొకానొక వేసవి మధ్యాహ్నం  ఫ్రేమలేఖలని చదవటం మొదలు పెట్టాను. వొక పేజ్‌ నుంచి మరో పేజ్‌లోకి చూపులు కదలనని మొరాయిస్తున్నాయి. కాసపటికి గూస్‌పింపుల్స్‌.
అప్పటికే మైదానం, శశిరేఖ , అమీన , హంపీకన్యలు చదివి యీ పమలేఖలకి ముందు అరుణని చదివి వున్నాను. అప్పటికింకా నా చెవుల్లో అరుణ జలపాతపు నవ్వు హారెత్తిస్తోనే వుంది. ఆ చలం యీ చలం వొక్కరేనా… వొక్కరే. వాళ్లు అమ్మాయిలు. యివి లేఖలు.

ఆ సాయంకాలానికి గాలిదుమారం చాలా వేసవి సాయంకాలాల్లానే. కాని ఆ నాటి ఆ దుమారం రాబోయే కాలంలో నా హదయంలో చెలరేగే మనోదుమారానికి నాందని ఆ క్షణం తెలియలేదు.

కరెంట్‌ పోయింది యింట్లో.  హరికేన్‌ లాంతరు వెలుగులో చదవాలని ఆరాటపడ్డాను. యీ పుస్తకంలో మునిగి అసలే సాయంకాలం మల్లెమొగ్గలు కోయలేదని అలిగిన మా మేనత్తలు నాకు  లాంతరు యివ్వకుండా  శిక్షించారు. చివరికి గాలి ఆగింది. కరెంట్‌ వచ్చింది. హరికేన్‌ దీపాలు ఆర్పిన తరువాత వచ్చే మసివసన కమ్ముకొంటుంటే మరిన్ని లేఖలు చదివాను. ఆ రాత్రి  అందరు నిద్రపోయాక కూడా వెదురు బద్దలు రెయిలింగ్‌తో వున్న వరండాలో కూర్చుని మరి కొన్నింటిని చదువుకొన్నాను. అలా ఆ వేవవిలో చాలాసార్లు ఫ్రేమలేఖలని చదువుతూనే వున్నాను.
తొలిసారి పాపాయి కన్నులు విప్పినంత మదువుగా మనసు విచ్చుకొంటుంది. మెల్లమెల్లగా నా హదయంలో వొక పసికోరిక విప్పారటం మొదలయింది… ఫ్రేమలేఖ రాయాలని. అప్పుడే యెవ్వరు మనసులోకి వచ్చే అవకాశం పెద్దగా ఆ సమయంలో యెవ్వరికి ఇస్తాము. కానీ  చివరికి రాసేశాను. యెంత బాగ రాసుకొన్నానో. యెడిట్‌ తెలియని మనసుతో. యెవ్వరు లేని మనసులో యెవ్వరినైన మనసులో నింపుకొంటే అంత గాఢంగా అంతే మదువుగా  అంతే చిలిపిగా అంతే గౌరవంగా నింపుకోవాలి. యిది పరస్పరం. అది సాధ్యం కానప్పుడు చలంగారే దారి కనుగొన్నారు. ప్రపంచానికే  ప్రేమలేఖలు రాయాలి.

అలా యెప్పుడు చలంగారివి యే పుస్తకం పట్టుకొన్న వాళ్లని మనం వదల్లేం. వొకసారి చదివినప్పుడు తోచనవి మరోసారి తోస్తాయి. కొన్నిసార్లు మొదట తోచినవి మరెప్పుడో కాదనిపిస్తాయి. నేను చదువుకొన్న తెలుగు సాహిత్యంలో నాతో  యిలా దాగుడుమూతలు ఆడిన  రచయిత మరొకరు లేరు. ఆకాశము, సముద్రమూ చలం వొక్కసారి కనిపించిన్నట్టు మరోసారి కనిపించరనిపిస్తుండేది.
మెల్లమెల్లగాగా సైన్స్‌ చదువుతుంటే సముద్రమూ ఆకాశమూ వెనుకనున్న శాస్తం తెలుస్తున్నట్టు లోకాన్ని చూస్తున్న కొద్దీ చలంగారు , చలంగారిని చూసేకొద్ది లోకం యేదో తెలుస్తున్నట్టుండేది.
యింతకీ చలంగారు యెందుకిలా మనలని మనం, ఆయన్ని పలకరించుకొనే వుంటాం. యిప్పటికి యెంతో యిష్టంగా ఫ్రేమగా. యెందుకు మనకి యితను దార్శనీకుడు.
చలంగారి శతజయంతి వుత్సవాలప్పుడు ఢల్లీలో మీటింగ్‌కి వెళ్లాం. ఆంధ్రా భవన్‌లో సభ. వి.యస్‌. రమాదేవిగారు మాటాడుతు తన వృత్తిలో కొన్ని బిల్స్‌ ముఖ్యంగా స్తీలకి సంబంధించినవి  తయ్యారు చేసినప్పుడు చలంగారు యెలా గుర్తొచ్చేవారో ఆ సాహిత్య ప్రభావం యెలా వుండేదో చెప్పారు.

అలానే చలంగారు తమ తరంవారికే కాకుండా యిప్పటి తరం వారిని యెలా ప్రభావితం చేస్తున్నారో చూడండని ఆమె నన్ను సభ ముందుకి చేయిపట్టి లాక్కొచ్చి సభకి పరిచయం చేసి యీ యంగ్‌లేడీ యిప్పుడు ప్రసంగిస్తారని చెప్పారు. అలానే వరంగల్లో చలంగారి ఫ్రేమలేఖలపై మాట్లాడినప్పుడు ఆ సభలో వున్న కాళోజి గారు మొదటి వాఖ్యం పూర్తికాగానే చప్పట్లు కొట్టారు. సభ అయ్యాక కాళోజిగారితో మాటాడుతుంటే కాళోజిగారు అన్నారు చలంని యెప్పటికప్పుడు కొత్తతరం తమ కాలానికి అనుగుణంగా చూస్తోందన్నారు. ఆ రాత్రి  చలంగారి అల్లుడు విశ్వంగారి దగ్గర కూర్చుని చలంగారి కబుర్లు చెప్పించుకొన్నాను. ఆ రోజు నుంచి విశ్వంగారు మంచి స్నేహితులయ్యారు. విశ్వంగారు మా యింటికి వచ్చినప్పుడొకసారి యక్సర్సైజ్ చేసే సైకిల్‌ని చూసి రోజు చేస్తావా అని అడిగారు. లేదు… అప్పుడప్పుడూ అన్నాను. చలంగారిని యిష్టపడటమంటే  స్వేచ్ఛని యిష్టపడటం … డిసిప్లీన్‌ లేని స్వేచ్ఛ చాలా ప్రమాదకరం. చలంగారు చాలాచాలా చిన్నచిన్న విషయాలలో కూడా యెంతో బాధ్యతగా వుండేవారని విశ్వంగారు చెప్పారు.
సభలు సమావేశాలు , పుస్తకాలు యిలా చాలా వుత్సాహంగా చలంగారి శతజయంతిని జరుపుకొన్నామంతా.
తిరిగితిరిగి ఆలోచిస్తోంటే అనేకానేక ఆలోచనలు కమ్ముకొనేవి. స్త్రీవాద  రచనలు విరివిగా వచ్చినకాలంలో ఆధునిక స్తీలకి సంబంధించిన  విషయాలు ఆలోచిస్తోంటే చలంగారు స్పశించని స్తీల విషయం వుందాఅనిపించేది. అసలు స్తీ గురించి పిల్లల గురించి చలంగారు అన్ని కోణాల నుంచి నిక్కచ్చిగా రాయటం వలన సాహిత్యంలో స్తీస్వేచ్ఛకి వో రహదారి యేర్పడింది. అసలు చలంగారు యింతగా రాసుండక పోతే యెక్కడ నుంచి ప్రశ్నించటం  మొదలుపెట్టాలి. యెంతగా వివరించాల్సి వచ్చేదో కదా. అంత శక్తి వున్న వారు యెవరు. మార్గం సుగమం అయింది.
కొందరు చలంగారిని మొదటి ఫెమినిస్ట్‌ అనేవారు. చలంగారిని అలా వో విషయానికి పరిమితం చేయలేమనిపించేది. ఆయన అందించిన తాత్వికత జీవితంలో యెన్నెన్నో పార్స్వాలకు  సంబంధించేది. లోతైనది . సౌందర్యంతో మిలమిలలాడే రచనలు. కపటత్వాన్ని అసూయని అనుమానాన్ని ద్వంద నీతిని నిక్కచ్చిగా యెత్తి చూపించి హృదయాలని ప్రక్షాళన చేయ్యాల్సిన అవసారాన్ని  నిర్భయంగా నిజాయితీగా చూపించింది.
ప్రస్తుత సమాజంలో  ముఖ్యంగా స్తీపురుష సంబంధాలు అత్యంత హింసాత్మకంగా మారిపోతోన్న వేళ , యిన్‌సెక్యూరిటీతో వొకరినొకరు పోలీసింగ్‌ చేసుకొంటున్న  సమయమిది.
ప్రస్తుతం జీవితాలు బోల్డంత యెక్స్‌ట్నాలైజ్‌ అయిపోయిన సందర్భంలో మన సమాజం, జీవితాలు వున్నాయి. అన్ని విషయాలని మార్కెట్‌ నియంత్రిస్తున్న యీ సమయంలో యే వస్తువు యే ఫ్రేమకి, యేయే అనుబంధాలని నిదర్శనమో చెపుతు మనలని కండీషనైజ్‌ చేయటమే కాకుండా యెలాంటి స్త్రవర్‌బతీవం యేయే  వివాహానికి, పిల్లలపెంపకానికి , ఫ్రేమకి, స్నేహాలకి, కుటుంబాలని  మిగిలిన మానవసంబంధాలకి ప్రతిబింబమో చెపుతోన్న యీ సందర్భంలో మనకి మన హదయం అంటూ వొకటుందని తెలుసుకొనే నిశ్శబ్ధం మనచుట్టూ వుందా. యిక్కడే మనకి సాహిత్యం మన మనసులపై టార్చ్‌ని ఫోకస్‌ చేస్తుంది. అలాంటి సాహిత్యాన్ని అందించిన అరుదైన నిత్యసత్యాన్వేషకులు  చలంగారు.
డబ్బు, పోరు, పోటితత్వం సమాజనీతి, ప్రపంచ ధర్మం అయిన యీ సమయంలో సంబంధాల నుంచి సంబంధాల్లోకి  కష్టపడుతునో, సునాయాసంగానో  నడిచే వో స్పేస్‌ని సంపాందించుకున్నాక కూడా యెందుకు సంతోషంగా వుండలేకపోతున్నారు. అలానే అనేక అసంతప్తుల నడుమ వొకరితోవొకరు యెందుకు కపట ఫ్రేమలు కొనసాగిస్తున్నారు. వొక ప్రజాస్వామిక స్పేస్‌ని యెందుకు రచించుకోలేకపోతున్నారు. వొక బంధాన్ని అనుబంధంలో కంటే యిమేజ్‌ చట్రం లో  చూడటం యెందుకు యెక్కువవుతుంది… ఆరోగ్యవంతమైన ప్రేమ ఆనవాలుని యే జీవితపు మలుపు దగ్గర పారేసుకొన్నామో లేదా విసిరేసామో , జారిపోయిందో  యెవరికి వారు ఆత్మశోధన చేసుకోవలసిందే.
అసత్యల బంధాల మేడలని ప్రపంచపు మెప్పుపొందాలని  నిర్మిస్తారో  లేదా సత్యవంతమైన పొదరిల్లుని  యెవరి ఆనందం కోసం వారు నిర్మించుకొంటారో…  యెవరి చాయిస్‌ వాళ్లది.
మన పెదవులపై నికార్సైన నవ్వు వెలగాలంటే , మన మన:శరీరాలు మోహపు పువ్వుల పరిమళపువనం కావాలనుకొంటే , మన జీవితాదర్శం శాంతి అయితే  చలంగారు తరతరాలకు  చిగురించే సాహిత్యపుతోటని యిచ్చారు. సీతకోకచిలుకలమై వనమంత చూసొద్దామా…

స్మృతి సుగంధగానం శంషాద్‌ బేగమ్‌

shamshad1పాత తరం హిందీ పాటల ప్రియులకు ఆమె అనుపమాన ఆరాధ్య దేవత. పంజాబీ ఫక్కీ జానపద గీతాలంటే, భారత ఉపఖండంలో ఎవరి కైనా గుర్తుకొచ్చేది ఆమె పేరే. అవిభక్త భారతదేశంలో గ్రామ్‌ఫోన్‌ రికార్డుల గానంతో స్టార్‌ సింగర్‌ అయిన ఆమె – శంషాద్‌ బేగమ్‌. మొన్న ఏప్రిల్‌ 23న కన్నుమూసిన ఈ గంధర్వ గాయని పాటలు ఎప్పటికీ స్మృతి సుగంధ పరిమళాలే! చెరగని ఆమె గాన మాధుర్యానికి ఇది ఓ సంగీత ప్రియుడి అక్షర నివాళి…

హిందీ మూకీ సినిమాల శకం ముగిసి టాకీ సినిమాలు ప్రారంభమైన కాలంలో చాలా వరకు నటీ నటులే పాటలు పాడుకునేవారు. అలా ప్రసిద్ధులైన సురయ్య, నూర్జహాన్‌, కె.ఎల్‌. సైగల్‌ లాంటి వారి మధ్య 1941లో ‘ఖజాంచీ’ చిత్రంలో ప్లేబాక్‌ సింగర్‌ శంషాద్‌ బేగం (ఎస్‌.బి) రెండు పాటలు మినహా అన్ని పాటలూ పాడారు. ఆమె పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఆ సినిమా సంగీత దర్శకుడు గులాం హైదర్‌ ఆమెను సినీ రంగానికి తీసుకురావడం వెనుక ఓ కథ ఉంది. గతంలో హార్మోనియం ప్లేయర్‌గా గ్రామఫోన్‌ కంపెనీలో పనిచేస్తున్న కాలంలో లాహౌర్‌, పెషావర్‌ రేడియోలో ప్రైవేట్‌ గీతాలు, ఇస్లాం సంప్రదాయ భక్తి గీతాలైన నాట్‌లు పాడుతున్న ఎస్‌.బితో పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయంతో పంజాబీలో 1940లో ‘యమ్లా జట్‌’ చిత్రంలో శంషాద్‌ బేగంతో ‘కంకాణ్‌ దియాన్‌ ఫసలా పకియా మే’ పాట పాడించారు. ఆ చిత్రమే ఇటీవలే దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వచ్చిన నటుడు ప్రాణ్‌ మొదటి చిత్రం కూడా!

ఆ తరువాత 1941లో ఈ ‘ఖజాంచీ’ అనే హిందీ చిత్రంలో పాడిం చారన్న మాట. చిత్ర విజ యానికి పాటలు విశేషంగా తోడ్పడడంతో ఎస్‌.బి.కి ఆఫర్లు, అవకాశాలు వెతు క్కుంటూ వచ్చాయి. నిజానికి, శంషాద్‌ బేగం గాయకురాలిగా అవత రించడం వెనుక కూడా చాలా కథే ఉంది. లాహౌర్‌లో 1919 ఏప్రిల్‌ 14న ఆమె జన్మించారు. సరిగ్గా జలియన్‌ వాలా బాగ్‌ ఘటన జరిగిన మరునాడే ఆమె పుట్టారు. హుసేన్‌ బక్ష్‌, గులాబ్‌ ఫాతిమాలకు ఆరో సంతానం ఆమె. తండ్రి చెక్క నగిషీ పనిచేసే వ్యాపారంలో ఉండేవారు. ఇంట్లో అంతా సంప్రదాయ వాతావరణం. దాంతో, ఆమెను బయటకు వెళ్ళ నిచ్చేవారు కాదు. అయితే, పుట్టుకతోనే గొంతులో తేనె పోసుకొని పుట్టినట్లు పాడే ఎస్‌.బి. తమ బంధువుల ఇళ్ళల్లో జరిగే శుభ కార్యాల్లో గొంతు విప్పేవారు. బహదూర్‌ షా జఫర్‌ గజల్‌ పాడేవారు. ఆమె గాన ప్రతిభను చిన్నాన్న గుర్తించాడు. శంషాద్‌ తండ్రిని ఆయనే ఒప్పించి, గ్జెనోఫోన్‌ గ్రామఫోన్‌ కంపెనీకి ఆడిషన్‌కు తీసుకు వెళ్ళారు. అక్కడ ‘హాత్‌ జోడ్‌ పకియాన్‌ దా’ అనే పంజాబీ గీతం మొదట రికార్డింగే చేశారు. ఒక్కో పాటకు పన్నెండు రూపాయల వంతున మొత్తం 12 పాటలకు కాంట్రాక్ట్‌ కుదిరింది. అక్కడ హార్మోనియమ్‌ ప్లేయరైన గులామ్‌ హైదర్‌ ఆమెను సినీ రంగానికి తీసుకొచ్చారు.

తండ్రి నుంచి ఆమె ఎన్నో ఆంక్షలను ఎదుర్కొన్నారు. ఎప్పుడూ విందు వినోదాలకు వెళ్ళరాదనీ, ఫోటో దిగరాదనీ షరతు పెట్టారు. దాంతో, ఆమె బురఖా వేసుకొని, రికార్డింగ్‌కు వెళ్ళి వచ్చేవారు. 1970ల వరకు ఆమె పాటే తప్ప, ఆమె ఎలా ఉండేవారో జనానికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు స్టూడియో యజమాని మెహబూబ్‌ఖాన్‌ తన ‘తకదీర్‌’ (1943) చిత్రంలో ఎస్‌.బి.తో పాడించుకోవడం కోసం చాలా కసరత్తే చేశారు. ఆమె తండ్రిని ఎలాగోలా ఒప్పించి లాహౌర్‌ నుంచి ముంబాయికి మకాం మార్పించారు. అదే ప్రముఖ నటి నర్గీస్‌ మొదటి చిత్రం. ఆ చిత్ర విజయంతో మొహబూబ్‌ ఖాన్‌ నిర్మించిన ‘హుమయూన్‌, ‘అనోఖీ’, ‘అన్‌మోల్‌ఘడీ’, ‘ఆన్‌’, ‘అందాజ్‌’, ‘మదర్‌ ఇండియా’ చిత్రాలలో ఎన్నో మధురగీతాలను ఎస్‌.బి. ఆలపించారు.

ఎస్‌.బి. తొలి రోజుల్లో కోరస్‌ సింగర్స్‌గా ఉండే మదన్‌మోహన్‌, కిశోర్‌కుమార్‌లు తర్వాత కాలంలో ఆమె ప్రోత్సాహంతో యుగళగీతాలు ఆలపించారు. మొదటి చిత్రం ‘ఆంఖే’ (1949)కి పట్టుబట్టి ఎస్‌.బి.తో మదన్‌మోహన్‌ పాట పాడించుకొన్నారు. ఆ రోజుల్లో ఎస్‌డి బర్మన్‌, నయ్యర్‌, మదన్‌ మోహన్‌, నౌషాద్‌, బులో సి. రాణి, అనిల్‌ బిశ్వాస్‌, వసంత్‌ దేశాయి లాంటి వర్ధమాన సంగీత దర్శకులకు ఎస్‌.బి.తో పాడించుకోవడం సెంటిమెంట్‌.

రికార్డింగ్‌ సమయంలో పరిచయమైన ఓ.పి. నయ్యర్‌ సంగీతంలో ‘సిఐడి, ఆర్‌పార్‌, కిస్మత్‌, మిస్టర్‌ అండ్‌ మిస్టర్‌ 55’ తదితర చిత్రాల్లో ఎస్‌.బి.కి ఎన్నో చాలా ప్రజాదరణ పొందిన పాటలు వచ్చాయి. ఆశాభోంస్లేతో సాన్నిహిత్యం వల్ల ఎస్‌.బి.తో పాటలు పాడించడం నయ్యర్‌ మానేయడంతో ఒక శకం ముగిసింది. దేశ విభజన ముందు, తర్వాత స్వతంత్ర భారతంలో విజయ ఢంకా మోగించిన ‘అన్‌మోల్‌ ఘడీ, షాజహాన్‌, దిల్లగీ, దులారీ, బాబుల్‌, బైజు బావరా, మదర్‌ ఇండియా, మొఘల్‌-ఏ-ఆజమ్‌’ చిత్రాల చిత్ర సంగీత దర్శకుడు నౌషద్‌ ఆలీ ఎన్నో మంచి పాటలను ఏరికోరి పాడించుకోవడం గమనించదగ్గ విషయం. ఆ తర్వాత వచ్చిన శంకర్‌ – జైకిషన్‌, కళ్యాణ్‌ జీ – ఆనంద్‌జీ, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌, రవి, ఆర్‌.డి. బర్మన్‌, రాం గంగూలీలు ప్రత్యేకంగా ఎస్‌.బి.తో కొన్ని పాటలు కోరి పాడించుకున్నారు.

సినిమా తళుకుల ప్రపంచంలో ఉండి కూడా ఎస్‌.బి. ఏనాడూ సినిమా ఫంక్షన్స్‌కు గానీ, పార్టీలకు గానీ, విజయోత్సవ వేడుకలకు ఎన్నడూ హాజరు కాలేదు. 1970వ దశకం వరకు కూడా ఎస్‌.బి. ఫోటో కాని, వ్యక్తిగతంగా చూసిన అభిమానులు ఎవరూ లేరు. 1955లో ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్త హఠాన్మరణంతో పాడడం విరమించుకొన్న ఎస్‌.బి. ఆ తర్వాత వర్ధమాన సంగీత దర్శకుల కోరిక మేరకు అడపాదడపా కొన్ని పాటలు పాడారు. రేడియో, గ్రామ్‌ఫోన్‌ రికార్డుల వల్ల భారతదేశమంతటా ఎంతోమంది అభిమాను లను సంపాదించుకొన్న ఎస్‌బికి భారతదేశ ప్రాంతీయ భాషలలోని ప్రముఖ గాయక, గాయనీ మణులందరికి ఆవిడంటే ఎనలేని అభిమానం.

నాలుగేళ్ళ క్రితం 2009 జూన్‌ 9న హైదరాబాద్‌ జూబ్లీహాల్‌లో జరిగిన ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో ఎస్‌బిని రావు బాలసరస్వతీ దేవి, పి. సుశీల, జమునారాణి ఎల్‌ఆర్‌ ఈశ్వరి, అప్పటి రాష్ట్ర ఆర్థిక మంత్రి రోశయ్యల చేతుల మీదుగా ”కళా సరస్వతి” బిరుదుతో సత్కరించారు. ఆ కార్యక్రమంలో అలనాటి మేటి చిత్రాలలోని హిట్‌ గీతాలాపనతో అభిమానులు, వేదిక మీద వీల్‌ఛైర్‌లో ఉన్న 90 సంవత్సరాల పండు ముదుసలి ఎస్‌బి కూడా ఎంతో ఆనందించారు. ఆమె పాటలు ఇప్పటికీ రేడియోలో ప్రసారం అవుతూనే ఉన్నాయి. ప్రచారానికి దూరంగా వుండే ఎస్‌.బిని భారత ప్రభుత్వం 2009 పద్మభూషణ్‌తో సత్కరించింది.

భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య సాంస్కృతిక వారధులు – అలనాటి చిత్రాలు, ఆ సినిమాల సంగీతం, వాటిలో శంషాద్‌ బేగం, రఫీ, నూర్జహాన్‌లు ఆలపించిన గీతాలు. అలనాటి మేటి తారలైన శ్యామ షకీలా, నిగర్‌ సుల్తాన్‌, నర్గీస్‌, మీనాకుమారి, గీతాబాలీ, మధుబాల, వహీదా రెహమాన్‌, కామినీకౌశల్‌, నళినీ జయవంత్‌, వైజయంతి మాల తదితరులందరికీ శంషాద్‌ బేగం నేపథ్య గీతాలు పాడడం విశేషం. నటి భానుమతి హిందీలో నటించిన ‘నిషాన్‌’, ‘మంగళ’ చిత్రాలకు శంషాద్‌ గాత్రం అందించడం విశేషం. స్వయంగా గాయని అయిన భానుమతికి పాడే అవకాశం తెలుగులో ఎవరికీ దక్కలేదు. అలాగే, పార్థ సారథి, సాలూరి రాజేశ్వరరావు, ఈమని శంకరశాస్త్రి లాంటి దక్షి ణాది సంగీత దర్శకత్వంలో హిందీలో ఆవిడ పాటలు పాడారు.

ప్రతిభావంతులైన నటులు, దర్శకులు, నిర్మాతలుగా తర్వాత కాలంలో ప్రశంసించబడిన దేవానంద్‌, గురుదత్‌, మెహబూబ్‌, కె.ఆసీఫ్‌, షోరబ్‌మోడీలు ప్రత్యేక శ్రద్ధతో ఆసక్తితో ఎస్‌బితో వారి చిత్రాలలో పాడించుకొన్నారు. ఒ.పి. నయ్యర్‌ మాటల్లో చెప్పాలంటే, గుండిగంటలలోని ‘స్వచ్ఛత” ఎస్‌బి సొంతం. హిందీ, పంజాబీ, గుజరాతీ భాషల్లో 600కు పైగా ప్రేమ గీతాలు, విషాదగీతాలు, బృందగీతాలు, పెళ్లిపాటలు పాడారు. హౌలీ గీతం, పెళ్లిళ్లలో వినిపించే అప్పగింతల గీతం… ఎన్ని తరాలైనా ఎస్‌.బి. గాత్రంలో వాడని కుసుమాలే.

వ్యక్తిగత జీవితంలో ఆమెకు ఎన్నో ఒడుదొడుకులు వచ్చాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త హఠాన్మరణం, చెందారు. ఒకప్పుడు తను లేకపోతే సంగీతం కూర్చబోమన్న మదన్‌మోహన్‌, ఒపి నయ్యర్‌లు, ఎస్‌డి బర్మన్‌లు ఆ తర్వాత వచ్చిన నూతన గాయకులు లతా మంగేష్కర్‌, ఆశా భోంస్లేల ఒత్తిడికి తలొగ్గారు. దాంతో, ఎస్‌.బి.కి అవకాశాలు తగ్గాయి. 1940, 50 దశకాలలో ‘సంగీత సామ్రాజ్ఞి’గా కీర్తించబడిన ఎస్‌బి పాడిన చిత్రాలు ఇప్పటికి డివిడిలతో అందుబాటులో ఉండడం విశేషం. ఈ పాటలలో శంషాద్‌ సదా చిరంజీవే!

ప్రజాదరణ పొందిన పలు హిట్‌ గీతాలు

‘డర్నా మొహబ్బత్‌ కర్‌లే…’ – ‘అందాజ్‌’ (1949). లతతో కలసి పాడారు. నర్గీస్‌, దిలీప్‌ కుమార్‌, కుకూలపై చిత్రీకరణ. నౌషాద్‌ సంగీతం.

‘ఏక్‌, దో, తీన్‌ ఆజా మాసమ్‌ హై రంగీన్‌..’ – ‘ఆవారా’ (1951)లో నాట్యతార కుకూ, రాజ్‌కపూర్‌లపై చిత్రించిన క్లబ్‌ గీతం. శంకర్‌ – జైకిషన్‌ సంగీతం.

‘ఉడన్‌ కటోలేపే జావూ..’ – ‘అన్‌ మోల్‌ఘడీ’ (1946) – మేటి గాయని జొహ్రా బాయితో కలసి పాడారు. నౌషాద్‌ సంగీతం.

‘మేరి పియా గయా రంగూన్‌..’- ‘పతంగ’ (1949). చితాల్కర్‌ పేరుతో సంగీత దర్శకుడు సి. రామచంద్ర, ఎస్‌బితో పాడిన ఎవర్‌గ్రీన్‌ హిట్‌.

‘సయ్యా దిల్‌ మే ఆనారా…’ – ‘బహార్‌’. ఎస్‌.డి. బర్మన్‌ సంగీతం.

‘యే దునియా రూప్‌ కీ చోర్‌…’ – ‘షబ్నం’ (1949). కామినీ కౌశల్‌పై చిత్రించిన ఈ బహు భాషా గీతంతో ఎస్‌డి బర్మన్‌ సంగీత దర్శకుడిగా మార్మోగిపోయారు.

‘దూర్‌ కోయిగాయే ధున్‌…’- ‘బైజూ బావరా’ (1952). నౌషాద్‌ సంగీతం. మీనా కుమారి బృందంపై చిత్రీకరణ.

‘ఓ లేకే పెహలా పెహలా ప్యార్‌…’ – ‘సిఐడి’ (1956). ఓ.పి.నయ్యర్‌ సంగీతం. ఎస్‌బి, రఫీతో కలసి పాడారు.

‘కభీ ఆర్‌ కబీ పార్‌ తీరే నజర్‌…’ – ‘ఆర్‌పార్‌’ (1954). ఓ.పి. నయ్యర్‌ సంగీతం. గురుదత్‌, శ్యామాలపై చిత్రీకరణ జరిగిన పాట.

‘రేష్మీ శల్వార్‌ కుర్తా జాలీకా…’ – ‘నయాదౌర్‌’ (1957). ఓ.పి. నయ్యర్‌ సంగీతం. ఆశా భోంస్లేతో కలసి ఎస్‌.బి. పాడిన సూపర్‌హిట్‌.

‘ఆనా మేరీ జాన్‌ మేరీ జాన్‌ సండే సే సండే…’ – ‘షెహనాయి’ (1948). సంగీత దర్శకుడు సి. రామచంద్ర భారత సినిమా రంగంలో తొలిసారిగా పాశ్చాత్య బాణీలో చేసిన గీతం.

‘హౌలీ ఆయీరే కన్హాయి…’ – ‘మదర్‌ ఇండియా’ (1957). నౌషద్‌ సంగీతం. ఇప్పటికే హౌలీకి ఇదే పాట.

‘కజ్రా మొహబ్బత్‌ వాలా..’ – ‘కిస్మత్‌’ (1967). నయ్యర్‌ సంగీతం. ఆశాతో ఎస్‌.బి. పాడిన ఎవర్‌గ్రీన్‌ పాట.

‘మిల్తే హి ఆంఖే దిల్‌ హువా దీవానా…’ – ‘బాబుల్‌’. తలత్‌ మొహమ్మద్‌తో కలసి పాడారు.

‘మేరీ నీందో మే తుమ్‌…’ – ‘నయా అందాజ్‌’. ఒపి నయ్యర్‌, కిశోర్‌కుమార్‌, ఎస్‌బిల కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌ డూపర్‌ రొమాంటిక్‌ డ్యూయట్‌.

అరుదైన జ్ఞాపకాలు

రాజ్‌కపూర్‌ తన తొలి సొంత చిత్రం ‘ఆగ్‌’ (1948)లో పాట పాడమని ఎస్‌బిని కోరారు. పారితోషికం పెద్దగా ఇవ్వలేమని చెప్పారు. అప్పట్లో స్టార్‌ సింగరైన ఎస్‌.బి. ఆయన తండ్రి, తాను పాటలు పాడిన పలు చిత్రాల కథానాయకుడు పృథ్వీరాజ్‌ కపూర్‌పై గౌరవంతో ఒప్పుకున్నారు. ఆ పాట రిహార్సల్‌ కోసం సంగీత దర్శకుడు రాంగంగూలీ తన సహాయకులు శంకర్‌-జైకిషన్‌లతో ఎస్‌బి ఇంటికి వెళ్ళి రిహార్సల్‌ చేశారు. ఆ పాటే ‘కాహే కోయర్‌ షోర్‌ మచాయిరే’!

చాలా మంది సంగీత దర్శకుల మొదటిచిత్రాలకు, వారి కెరిర్‌ ఒక గాడిలో పడటానికి తోడ్పడిన పలు పాటలకు గాత్రం అందించారు.

మైక్‌కు దూరంగా జరిగి పాడటం, తారాస్థాయిలో ఎస్‌బి పాడటం ప్రత్యేక శైలి.

ఆ కాలంలో వచ్చిన బాక్స్‌ఫీస్‌, మ్యూజికల్‌ హిట్‌ చిత్రాలకు ప్రధానభూమిక ఎస్‌బి పోషించారు.

చాలా వరకు ఎస్‌బి ప్రైవేట్‌ గీతాలు, లాహౌర్‌,షెషావర్‌ రేడియోకి పాడినవి అలభ్యాలే. కారణం గ్రామఫోన్‌ రికార్డులుగా విడుదల కాకపోవటం.

1940, ’50 దశకాలలో 78 ఆర్‌పిఎం గ్రామఫోన్‌ రికార్డులలో ఎస్‌బి పాటలు లభ్యం కావటం వల్ల ‘గ్రామ్‌ఫోన్‌ గాడెస్‌’ అని అభిమానులు పిలుస్తారు.

1950వ దశకంలో తన కెరియర్‌ తారా స్థాయిలో ఉన్నప్పుడు భర్త హఠాన్మరణంతో స్వచ్ఛందంగా విరమించుకొని కొంత మంది సంగీత దర్శకుల కోరికపై అడపాదడపా పాటలు పాడారు. ఆమె చివరి పాట పాడిన చిత్రం 1981లో విడుదలైన ”గంగా మాంగ్‌ రహిపై బలిదాన్‌’.

భారత విభజన తర్వాత నూర్జహాన్‌, సంగీత దర్శకుడు గులాం హైదర్‌ పాకిస్థాన్‌ వెళ్లిపోవడంతో ఎస్‌బి 1955 వరకు ఎన్నో హిట్‌ చిత్రాలకు ప్లేబాక్‌ ఇచ్చారు. 1940 దశకం, 50 దశకాల్లోని ప్రసిద్ధ తారల మొదటి గీతాలు శంషాద్‌ బేగమే పాడారు.

శివసాగర్ జాంబవసాగర్ కాలేకపోవడం విషాదం

Shivasagar_Colour_01

(ఏప్రిల్ 17 ప్రసిద్ధ కవి శివసాగర్ ప్రథమ వర్థంతి)

మన దేశంలో అన్ని రకాల విప్లవాలను సవర్ణులు గుత్తబట్టిండ్రు. నూతన ప్రజాస్వామిక / ప్రజాతంత్ర / వ్యవసాయిక / సోషలిస్టు / సాంస్కృతిక విప్లవాలతో పాటు వాటి రాజకీయాలను, వ్యూహాలను, నాయకత్వాలను ఇంకా సవర్ణ పాములకిరవైనట్లు అర్ధమయ్యాక తను ఇమడలేని, ఇమడనియ్యని పరిస్థితులనుంచి కవి శివసాగర్ (కె.జి. సత్యమూర్తి) నిరసన నిష్క్రమణ చేశాడు.

విప్లవ కవి శివసాగర్ అజ్ఞాత చీకట్ల నుంచి దళిత ఐడెంటిటీతో వచ్చాడంటే అభిమానంతో వెళ్ళి పలకరిస్తుండేవాణ్ని.  దళితుడు, విద్యాధికుడు, కవి ప్రముఖుడు, సీనియర్ విప్లవ నాయకుడూ అయిన అలాంటి పెద్దమనిషితో ముచ్చటించే అవకాశం ఉండేదంటే వ్యవస్థ సమూలంగా మారాలని కోరుకునే  నాలాంటి కార్యకర్తకు అంతకంటే పండగ ఇంకేముంటుంది?

బంజారాహిల్స్ శరత్ వాళ్లింట్లో కొన్నిసార్లు, రాంనగర్ ఎస్సార్పీ క్వార్టర్‌లో కొన్నిసార్లు వెళ్ళి ఆయన్ని కలిసేవాణ్ని. విశేషమైన అనుభవాల్లోంచి వచ్చిన ఆయన విశ్లేషణలు, కవిత్వం, మాటలు, రాతలు వింటుంటే వెచ్చటి నల్ల తిన్నంత సంబరంగుండేది.

ప్రేమనీ,నిప్పునీ ప్రభావశీలంగా, ఆలోచనీయంగా కురిపించే శివసాగర్ కవిత్వం, మాటలు బలంగా ఆకర్షించేవి. తిమ్మ సముద్రం దళిత ఉద్యమం సందర్భంలో ఆయనా, పార్వతి, బాంబుల అంకమ్మ, గాయకుడు డప్పు ప్రకాష్, శరత్, బాబూరావు తదితరులతో కలిసి పని చేసే అవకాశం  నాకు వచ్చింది. చుట్టుపక్కల గ్రామాలకెళ్లి దళిత పల్లెల్లో సమావేశాలు నిర్వహించి చైతన్యపరిచే కార్యక్రమాలు చేసేవాళ్ళం.

ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావుగారి నాయకత్వంలో 1992 – 93 లలో గుంటూరు కేంద్రంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల రాజకీయ పార్టీ కోసం సన్నాహక అవగాహన సమావేశాలు జరిగేవి, గుంటూరు జిల్లా దళిత మహాసభ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నా అధ్యక్షతన ఈ సమావేశాలు జరిగేవి. ఈ సమావేశాల్లో శివసాగర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, గౌతులచ్చన్న, శీలం ప్రభుదాస్ తదితర ప్రముఖులు పాల్గొంటుండేవారు.

1996 ఫిబ్రవరి 18న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎమ్మార్పీయస్ రాష్ట్ర కో కన్వీనర్‌నైన నా అధ్యక్షతన “ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్ల అమలులో లోపాలు – వర్గీకరణ” అంశంపై జరిగిన సెమినార్‌లో టి.ఎన్.సదాలక్ష్మి, కంచ ఐలయ్యతో పాటు శివసాగర్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ కులాలవారికి రిజర్వేషన్లలో పంపిణీ న్యాయం జరగవల్సిన ఆవశ్యకత గురించి రిజర్వేషన్ల వర్గీకరణకు మద్ధతుగా శివసాగర్ ఆనాటి సెమినార్‌లో ప్రసంగించారు. ఇంతే కాక నిజాం కాలేజీ బయట జగ్జీవన్‌రాం విగ్రహం వద్ద మాదిగలం ఉద్యమ కార్యక్రమాన్ని నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వంచే రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పరిశీలన కోసం విచారణా కమీషన్‌ను సాధించుకున్నాం. ఆ సందర్భంలో కూడ శివసాగర్ వచ్చి మాదిగ దండోరా ఉద్యమానికి సంఘీభావం తెలిపి వెళ్లారు. ఇందుకు ఆయన్ని మేము (మాదిగలం) అభినందించాము.

జాఫ్నా కేంద్రంగా సాగిన ప్రత్యేక  తమిళదేశ సాధనోధ్యమంపై ‘నేను జాఫ్నాలో చనిపోయాను’ అని శివసాగర్ సంఘీభావ కవిత్వం రాశారు. దక్షిణాఫ్రికాలో తెల్ల జాత్యహంకార ప్రభుత్వంపై ఉద్యమిస్తున్న నల్లజాతి విముక్తి సైన్యానికి మద్ధతుగా శివసాగర్ కవిత్వం రాశారు. వివక్షా వ్యతిరేక ఉద్యమాలపై  ఆయన కవిత్వం చదివినప్పుడల్లా చాలా సంతోషమనిపించేది. కాని, ఆశ్చర్యకరంగా తన మాల పల్లెకి పక్కనున్న గుడిసెల్లో, పొరుగునున్న మాదిగ గూడేలలో మనుషులుగా గుర్తింపుకోసం ఆక్రందిస్తూ, ఆకలితో న్యాయం కోసం వెయ్యి తప్పెట్లై ఉద్యమించిన మాదిగల కోసం శివసాగర్ ఏనాడూ కవిత్వం/పాట/అక్షరాల ద్వారా సంఘీభావం ప్రకటించలేదు.

మాదిగలు, డక్కలి, చిందు, బైండ్ల,మెహతార్, రెల్లి, తోటి, గొడగలి, గొదారి, పాకీ, పంచములు – సాటి సహబాధిత కులాలవారు మానవహక్కుల కోసం, విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో దామాషా  ప్రాతినిధ్యం కోసం చేసిన ఉద్యమాల పట్ల సానుకూల బాధ్యత లేకుండా శివసాగర్ పెన్ను మూసుకుపోయిందేమిటబ్బా అని చాలా విచారించే వాళ్లం. చాలా నిరసనతో ఉండేవాళ్లం.

జనాభా దామాషా ప్రకారం రాష్ట్రంలోని 61 ఎస్సీ కులాలవారు ఎవరి వాటా రిజర్వెషన్లు వారు పొందగలిగే ఏర్పాటు ఉండాలనేది మాదిగలు ముందుకు తెచ్చిన డిమాండు.

మాల నాయకులు పైకి ఏం చెబుతున్నప్పటికీ, సాంకేతికమైన సాకులు, తొండి వాదనలతో దండోరా ఉద్యమం ముందుకు తెచ్చిన డిమాండుని ఫలప్రదం కానీయకుండా అడ్డుకున్నారు. 61 కులాలకి అందే విధంగా రిజర్వేషన్ల కుండని భాగించకూడదని మునుపు దోచుకు తిన్నట్టే ఇకపైన అఏ కులం బలమైనదైతే ఆ కులమే (మాల కులమే) దోచుకు తినాలనే అసాంఘిక వైఖరి కొందరు మాల నాయకుల్లో ప్రబలించి. మాల కులంలోని ఇలాంటి దళిత వ్యతిరేక, అసాంఘిక శక్తులు బలంగా ఉన్న కారణంగా చాలామంది మాల అధికారులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు రిజర్వేషన్ల హేతుబద్ధీకరణకు తటస్థులయ్యారు. శివసాగర్ కవి కూడా ఈ కుల ప్రభావాన్నుంచి తప్పించుకోలేకపోయాడు. ఈ కారణం చేతనే సాహిత్య సౌహార్ద్రతలను దండోరా ఉద్యమానికి ప్రకటించలేకపోయాడు. శివసాగర్ పెన్ను శాశ్వతంగా మూసుకుపోయింది.

సవర్ణ కవి రేణువుల మధ్య ఆఫ్రికా వజ్రం లాంటి కవి శివసాగర్. “స్వార్ధం శిరస్సును గండ్ర గొడ్డలితో నరకగలిగినవాడే నేటి హీరో” అని నినాదమై మెరిసి, మెదళ్లలో ప్రసారమై నిలిచి, రక్తాన్ని మరిగించి, రోమాల్ని నిగిడించి యువతరాన్ని విప్లవం వైపు మార్చింగ్ చేయించిన గొప్పకవి శివసాగర్. సందేహమే లేదు. కోటిమంది సవర్ణ కవుల కంటే గొప్పకవి శివసాగర్. ఐతే, మాదిగలకేంటి? సామాజిక ఉద్యమ నాయకుడు కె.జి.సత్యమూర్తి పాక్షికంగా దండోరా ఉద్యమాన్ని బలపరిచాడు. కాని, కవి శివసాగర్ పాక్షికంగా కూడా దండోరా ఉద్యమాన్ని బలపరచలేదు. పైగా “మండే మాదిగ డప్పును, సిర్రా, చిటికెన పుల్ల”ల్ని మాదిగ గూడెంలోంచి ఎత్తుకుపోయి మాదిగేతర రాజకీయ, సాంస్కృతికాంశాలకి వాయించాడు. ఇది శానా తప్పు గురూ. మాలత్వం ఐడెంటిటీ కాదు, ఆధిక్యాలను)వొదులుకున్న కుల ప్రజాస్వామ్య శివసాగర్ మాదిగలకు కావాలి. శివసాగర్ సాహిత్యంలో జాంబవసాగర్ కాలేకపోవడం పెద్ద విషాదం.

తెలుగు కోసం కలవరిస్తూ… వెళ్ళిపోయిన మన ధర్మారావు

గోరా శాస్త్రి, పీ.వీ. నరసింహారావుల తో కలిసి పాల్గొన్న సభలో ప్రసంగిస్తున్న ధర్మారావు

గోరా శాస్త్రి, పీ.వీ. నరసింహారావుల తో కలిసి పాల్గొన్న సభలో ప్రసంగిస్తున్న ధర్మారావు

తెలుగు ప్రజానీకానికి నూరు మంచి పుస్తకాలు ఏర్చి, కూర్చి, వెదజల్లిన చలమాల ధర్మారావు (1934-2013) కళాప్రియుడు, సాహిత్యాభిమాని, అన్నింటికి మించి సహృదయుడు. మా యిరువురికీ వున్న ఏభై ఏళ్ల పరిచయం ఎన్నో అనుభవాలను సంతరించి పెట్టింది.

ధర్మారావుకు చదువుకునే రోజుల్లో మిత్రులుగా వున్న వెల్చేరు నారాయణరావు, ముక్తేవి లక్షణరావుతో సహా ఉత్తరోత్తర హైదరాబాదులో ఆప్త మిత్రులుగా మారిన శ్యామలరావు కోడూరి కాశీవిశ్వేశ్వరరావు శుభలేక నిర్మాత శాస్త్రిగారు, నాటక కర్త ఎ.ఆర్. కృష్ణ ఆయన్ను అంటిపెట్టుకుని విడిపోకుండా కొనసాగటం ఆయన ఆప్యాయతకూ, మానవతకూ నిదర్శనం.

ధర్మారావు మాటవరసకి ప్రభుత్వ ఉద్యోగే కాని ఆచరణలో బహుముఖ కార్యదక్షుడు. సెక్రటేరియట్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు కళానికేతన్ అనే సంస్థను స్థాపించి, ఎన్నో నాటకాలు, సాహిత్య ప్రదర్శనలు చేసారు. దానికి తొలుత బాబుల్ రెడ్డి అధ్యక్షుడుగా ధర్మరావు కార్యదర్శిగా వుండేవాడు.

ధర్మారావు వివిధ సంఘాలలో వున్న ఆసక్తికి నిదర్శనగా ఆయన హీరోగా నటించిన ‘సినిమా పిచ్చోడు’ అనే చలన చిత్రం పేర్కొనవచ్చు. రఘునాథ రెడ్డి ప్రొడ్యూసర్ గా ఉన్న సినిమాలో ధర్మారావు హీరో. వాణిజ్యపరంగా అది సఫలం కాలేదు. బి.నరసింగరావు చేసిన ‘హరివిల్లు’ సినిమాలో చిన్నపాత్ర కూడా ధర్మరావు వేశారు.

ఇవన్నీ అలా వుంచి రచనా వ్యాసంగం ఆయనకు ఇష్టమైనది. తెలుగు స్వతంత్రలో ప్రారంభించి ఎన్ని పత్రికలకు తన వ్యాసాలందించాడో లెక్కలేదు. హైదరాబాదు నుండి వచ్చిన ప్రజాతంత్ర వారపత్రికలో దేవీప్రియ సంపాదకత్వాన వెలువడిన రోజులలో నేను ధర్మారావు సీరియల్ గా రచనలు చేశాం. ‘విస్సన్న వేదం’ అనే పేరిట ధర్మారావు ఒక కాలం నిర్వహించారు. విజయవాడ నుండి వెలువడిన ‘నడుస్తున్న చరిత్ర’ కొన్నాళ్ళు ధర్మారావు సంపాదకత్వాన సాగింది కూడా. ఇక దిన పత్రికలలో, వారపత్రికలలో ఎన్నో విలువైన వ్యాసాలు రాశారు. ఈనాడులో సి.ధర్మారావు అనే పేరిట వ్యాసాలు వస్తే చాలామంది అవి రాసింది ఈయనే అనుకునేవారు. కానీ, ఆ ధర్మారావు వేరు.

చలం పట్ల ధర్మారావుకు వీరాభిమానం వుండేది. ఇంచుమించు ఈ విషయంలో రంగనాయకమ్మకు ధర్మారావుకు పోలిక వున్నది. చలం సాహిత్యాన్ని కొంతమేరకు ఎంపిక చేసి, అందులో స్త్రీలపట్ల చలం రచనలు వాటి ప్రాధాన్యతను చూపిన ధర్మారావు, చలానికి విజయవాడలో ఒక కంచు విగ్రహం వేయించి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

ధర్మారావు హాస్యప్రియుడు. సున్నిత విమర్శకుడు. మార్క్సిజం ఎక్కడ మిగుల్తుంది అంటే రంగనాయకమ్మ దగ్గర అని చమత్కరిస్తే మిత్రులు నవ్వుకున్నారు. ఆయన చేసిన వుద్యోగాలలో ఆయనకు అత్యంత ఇష్టమైనది అధికార భాషా కమీషన్ కు కార్యదర్శిగా వుండడం. నండూరి రామకృష్ణమాచార్యులుగారు అధ్యక్షులుగా వున్నప్పుడు, విధానాల నిర్ణయంలోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగును వ్యాపింపచేసే తీరుకు మార్గదర్శకత్వాలను నిర్ణయించటంలోనూ ధర్మారావు నిగర్విగా పాత్ర వహించారు.

ధర్మారావుకు సొంత నినాదం ఒకటున్నది. అదేమంటే ‘రాజ్యాంగం తెచ్చిన భారతీయ భాషలన్నిటికీ సమాన ప్రతిపత్తి వున్నది. కనుక హిందీని మాత్రం జాతీయ భాష అనటం తప్పని, అన్నిటికీ ఒకే స్థాయి సమకూర్చాల’ని అనేవాడు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివరావుతో కలసి, తాను కార్యదర్శిగా ‘జనహిత’ అనే సంస్థ స్థాపించి, మంచి పుస్తకాల ఎంపిక కార్యక్రమం చేపట్టారు. అందులో పురాణం సుబ్రహ్మణ్య శర్మ, బొమ్మకంటి శ్రీనివాసాచార్యులుగారి సహకారంతో రాత్రింబగళ్ళు, పుస్తకాలను దుర్భిణి వేసి చూసి లిస్టు చేసి సెంచరీ కొట్టారు. ఆ వంద పుస్తకాల లిస్టు వివాదాస్పదం కాకపోవటం ధర్మారావు ప్రతిభకు నిదర్శనం.

తెలుగు భాషను అభివృద్ధి చేయటానికి అవలంబించాల్సిన మార్గాలను అన్వేషించి నిరంతర చెపుతూనే వుండేవాడు. ఒక అనధికార సంఘాన్ని కూడా తెలుగు భాషా సమాఖ్య పేరుతో ఏర్పరచారు.

భారత సాహిత్య చరిత్రలో సంచలనం సృష్టించిన కేరళ కవయిత్రి కమలాదాస్ స్వీయ చరిత్రను తెలుగులోకి అనువదించారు. కమలాదాస్ హిందువైనా ముస్లింగా మారి, అటు కవితలలోనూ, వచన రచనల్లోనూ, కొత్తదారులు తొక్కి అందరి దృష్టీ ఆకర్షించారు. అందుకే ధర్మారావు ఆమె స్వీయచరిత్రను అనువదించారు.

ఇక అతి ముఖ్యమైన విషయం ధర్మారావుకు ఇష్టమైన గోరాశాస్త్రి స్నేహం. అందులో నేనూ భాగస్వామిని. మేమిరువురం కూడబలుక్కుని మండవ శ్రీరామమూర్తిని కలుపుకుని గోరాశాస్త్రి అర్థశతాబ్ది జన్మదినోత్సవాన్ని జరిపాము. అసలు విషయం ఆ పేరిట ఆయనకు ఆర్థిక సహాయం చేయాలని సంకల్పించాము. గోరాశాస్త్రి ఎప్పుడూ ఆర్థిక మాంద్యంలో వుండేవారు. అనారోగ్యం సరేసరి. కర్నూలులో 1968లో పెద్ద సభ జరిపి నాటి విద్యామంత్రి పి.వి.నరసింహారావు జిల్లాపరిషత్ అధ్యక్షుడు కోట్ల విజయభాస్కర రెడ్డిని పిలిచి వారి చేతుల మీదుగా గోరాశాస్త్రికి పర్సు ఇప్పించాము. ధర్మారావు, నేను ఒక సంచికను వెలువరించాము.

ధర్మారావుకు బహుముఖాల మిత్రత్వం వుండేది. చాలా పెద్ద జాబితా. విప్లవ కవుల్లో ఒకరైన నగ్నముని (కేశవరావు), కుందుర్తి ఆంజనేయులు, గోల శాస్త్రి (గోపాల చక్రవర్తి), శీలా వీర్రాజు (సుప్రసిద్ధ ఆర్టిస్టు) యిలా చాంతాడువలె జాబితా దొరుకుతూనే వుంటుంది.

రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాథ శాస్త్రి) హైదరాబాదు వచ్చినప్పుడల్లా నియో మైసూర్ కేఫ్ లో వుంటూ మాకు కబురు చేసేవాడు. అక్కడ గోరా శాస్త్రి, నేను, ధర్మారావు తదితరులం చేరి జోకులతో కడుపు చెక్కలయ్యేటట్లు ఆనందించిన రోజులు మరువరానివి. రిటైర్ అయిన తరువాత కూడా ధర్మారావు సాహిత్య కాలక్షేపం భాషా సేవతోనే గడిపారు.

ధర్మరావు భార్య వరలక్ష్మి నలుగు సంతానాన్ని ఆయనకందించి, చాలా పిన్న వయసులోనే చనిపోయింది. అప్పటి నుండి ధర్మారావు తన యిద్దరు కుమారులు, యిద్దరు కుమార్తెలను పెంచి వాళ్ళను ఒక ఇంటివారిని చేశారు. చాలా నిబ్బరంగా హుందాగా వుండేవాడు. కాలక్షేపానికి కుదువలేకుండా మిత్రులు కలసి పేకాడుకుంటూ కబుర్లు చెప్పుకునేవారు. ఆఖరి క్షణాలవరకూ ఆయన సన్నిహిత మిత్రుడు అమెరికాలో వున్న ప్రొఫెసర్ వెలిచేరు నారాయణరావుతో, నాతో ఫోను పలికరింపులు సాగించారు.

చివరి దశలో ధర్మారావు వుద్యోగ విరమణ చేసిన వారి నిమిత్తం ‘ఆవలితీరం’ అనే మాసపత్రిక పెట్టి కొన్నేళ్ళపాటు నడిపారు. అందులో ఆయన సంపాదకీయం వుండేది. వాటిని ‘ప్రేమించుకుందాం రండి’ అనే శీర్షికతో పుస్తకంగా వెలువరించారు. ‘రవ్వలు, పువ్వులు’ అనే మరో వ్యాస సంకలనం కూడా వెలువడింది. ఒకసారి అమెరికా వచ్చి, తానావారి సత్కారాన్ని అందుకున్నారు (2006).

చెట్టుకవి ఇస్మాయిల్ అంటే ధర్మారావుకు ఎంత యిష్టమో చెప్పజాలం. మరొక ఇస్మాయిల్ ఏలూరులో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ గా వుండేవాడు. ఆ ఇరువురి కవితలను మెచ్చుకోవటం పదిమందికీ చెప్పటం ప్రచారం చేయటం ధర్మారావు నోట అనేకమంది వినేవారు. సెక్రటేరియట్ లో అధికార భాషా సంఘ కార్యాలయంలో కూర్చొని కిటికీ ద్వారా కనిపిస్తున్న రావిచెట్టును దాని ఆకులు చేసే గలగల శబ్దాన్ని వింటుంటే ఇస్మాయిల్ గుర్తొస్తున్నాడని అనేవారు.

ధర్మారావు మిగిల్చి పోయిన సాహిత్య సంపద చాలా విలువైనది.

(తెలుగు భాషా పరిరక్షణ కోసం నడుం కట్టి తెలుగు కోసమే కడ వూపిరి దాకా జీవితాన్ని అంకితం చేసిన సీ. ధర్మా రావు గారు నిన్న కన్నుమూశారు.  ఆయనకి ‘సారంగ’ నివాళి)