నేనొచ్చేశాన్లే మళ్ళీ…

1

తలుపు తట్టి ఇగో నేనొచ్చేశాన్లే మళ్ళీ
అని గదిలోపల నవ్వుతూ కూర్చుంటుంది మరణం
ఈ పూటకి చావు వాసన లేకుండా దాటేద్దామని అనుకున్నప్పుడు –

2
ముసుగు తన్ని దుప్పటి పై మీదికి కప్పేసి
వొక ప్రశాంతతని కూడా వొంటి మీదికి లాక్కుని
నిద్రలోపలి గుహలోకి పారిపోతూ వుంటాను
చాల్చాల్లే అని విదిలించుకుని కసురుకొని నన్ను నేను,

లేదులేదులేదు
రానే రావద్దే నువ్వు నా లోపలికి అనుకుంటూ పైకే అంటూ

3

రాత్రి బరువు ఎంతో నీకు తెలుసా?
మరీ దాన్ని రెప్పల మీద మోస్తున్నప్పుడు!

4

పగలగొట్టేయ్యాలన్నంత

కోపమొచ్చేసే గడియారపు బుడి బుడి నడక

వొంటి మీద మెత్తగా గీసుకుపోయే కత్తి

5
రాని నిద్దురని దుప్పటిలా
విసుగ్గా అవతలకి విసిరేసి
పుస్తకంలోకో సినిమాలోకో

అనిద్రని ఖననం చెయ్యాలని కూర్చున్నాను.

ఊహూ,

ఆ అన్నీ లోకాలూ నన్ను విఫలం చేశాయి.

6

కాళ్ళ కింద నేల జారుతున్న అసహనంతో
గది నిండా తిరుగుతున్నప్పుడు
దూరం నించి మిత్రుడి మరణ వార్త.

7
ఆ తరవాత నేనూ చీకటీ
చీకటీ నేనూ వొకరి ముఖంలోకి
ఇంకొకరు చూస్తూ…

*

 

మీ స్మృతిలో మో …

 

(ఇంకో మో అంటూ వుండరు..ఇంకో  ‘బతికిన క్షణ”మూ వుండదు. ఇంకో “చితి-చింత” కూడా వుండదు. అసలు వొక మనిషి ఎప్పుడూ ఇంకో మనిషిని replace గానీ, displace గానీ చేయడం అంటూ వుండదు. అందుకే, వొక మనిషి- అందునా  ఆ మనిషి తనదైన వాక్యాల అడుగుల్ని వెతుక్కున్న మనిషి వెళ్ళిపోయినప్పుడు భరించలేని నిశ్శబ్దం వెంట పడ్తుంది మనల్ని! మో- ఈ జనవరి అయిదున పుట్టారన్నదే నాకు గుర్తుంది. ఆయన వెళ్ళిపోయిన రోజు ఇంకా నా మనసులో సరిగా రిజిస్టర్ కావడం లేదు. మీలో చాలా మందికి అంతే అయి వుండాలి. మీలో చాలా మందికి మో తెలుసు, కవితంలోనూ, వ్యక్తిగతంగానూ, ఉత్తరాల్లోనూ..అలాంటివి మాకు రాయండి. వొక అరుదైన అద్భుతమైన కవిని తలచుకుందాం..)

కన్ఫెషన్ హద్దు దాటి కెరటమైన అరుణ్ సాగరం!

arun (2)

రుణ్ సాగర్  చివరి కవితా సంకలనం మ్యూజిక్ డైస్ పుస్తకం అట్ట మీద సీతా రాములోరి బొమ్మ. ఆ రోజు ప్రెస్ క్లబ్ లో కలిసాడు అప్పుడే ప్రెస్ నుండి వచ్చిన కవర్ పేజీ. రావుడి  చేతిలో ధనస్సు వెనక అభయం కోసం సీత. ఎంతో మందిని అడిగి ఒక  ఫోటో తీయమన్నాడు. చానా మంది తీసారు, ఎవరు తీసినా సీత కళ్ళల్లో దాగిన భయం రావడం లేదు. ఆయనకు కావాల్సింది సీతకు కేవలం రావణుడు నుంచి రక్షణ కోసం కాదు. పోలవరం మూలంగా కోల్పోతున్న సర్వస్వం ఆమె కళ్ళల్లో చూసాడు. ఒక సామూహిక దుఖం ఆమె కళ్ళలో కనుగొన్నాడు. వందలాదిగా గొడ్డూ గోడా అదృశ్యం అవుతుంటే వాళ్ళందరి సామూహిక దుఖాలు  ఆమె కళ్ళలో వెతికాడు.కానీ ఆయన కోరుకున్నట్లుగా ఫోటో దొరకలేదు.

ఏదో ఓక్ వెబ్సైటు లో చివరికి  వెబ్సైటులో వంశీ కార్తీక్ అనే అతను తీసిన  ఫోటో తీసుకొన్నాడు . ఇప్పుడు ముంపు మూలంగా పోతున్న సీతారావుని  పర్ణశాల కోసం కాకుండా దాని చుట్టూ ఉన్న అవాసాల కోసం ఏడవాలి. అందుకే ఒరే  రావుడూ ఇలా రారా మట్టి మరణ వాగ్మూలం విను, దమ్మక్క పెడుతున్న శాపనార్ధాలు వినరా విను” అని సీతతో రావుడికి వేడుకోలు చెప్పించాడు . పర్ణశాల లో మిగిలిన సీతా రావణుల బొమ్మలు అవి కేవలం బొమ్మ లేనా వాటి చుట్టూ మిగిలిన ఎట్టి మనుషులు కోల్పోతున్న ఆనవాళ్ళు , విరిగిన కళలు.అలంకార ప్రాయంగా మిగిలిపోతున్న ఎద్దుకొమ్ములు, వెదురు బుట్టలూ,జనావాసాల్లో అలంకరణ కోసం మిగిలిన ఆదిమ కళల ఆనవాళ్ళు. ఎవరయినా పాపికొండల విహార యాత్రకు వస్తే “గుడ్డి నాయాల, చెవిటి నా కొడకా అవి నీళ్ళు కాదురా కన్నీళ్లు కోట్ల క్యూసెక్కుల కన్నీళ్లు” ధైర్యం ఉందా మనకి అరుణ్ లా ఆలోచించడానికి? ఆయన చేసే ప్రతి పనిలో ఇంకా ఏదో మిగిలిపోయిన బాధ్యత. ఒక కొనసాగింపు కోసం నిరీక్షణ. అవును అరుణ్ తన పుస్తకానికి కవర్ పేజీ అట్ట కోసం  ఎన్నెన్ని లోతయిన విషయాలు ఆలోచించాడు.

ఏడాది కింద మువ్వా సార్ వాళ్ళ అమ్మానాన్న సాహిత్య పురస్కారం కోసం ఖమ్మం లో మీటింగ్. రాష్ట్ర వ్యాప్తంగా కవులంతా ఖమ్మం లోనే . మువ్వా సర్ మీటింగ్ అయినా అది అరుణ్ సాగర్ మీటింగ్ లాగానే చేసాడు .ఒక తమ్ముడికోసం అన్న చేసిన మీటింగ్.  వేలాది మంది కూర్చొనే చోటు లేక బయట ఏర్పాటు చేసిన తెరల మీద అరుణ సాగర్ ప్రసంగం. గోరటిపాట  రాష్ట్రంలో పేరుమోసిన కవుల తోబాటు, అప్పుడే కళ్ళు తెరిచిన కవికుంకల దాకా అంతా అక్కడే అదో కోలాహలం. మీటింగ్ అయ్యాక ఖమ్మం శివారులో ఒక రిసార్ట్ లో పార్టీ. గడ్డ కట్టే చలి,ఆ రాత్రి క్యాంపు ఫైర్ వేసారు. రాజేసిన నెగడులో రవ్వలు ఎగజిమ్ముతున్నాయి. ఎవరి చేతిలో ఏముందో వెచ్చటి ద్రావకం ఒక్కొక్కరి  గొంతులో జారుతోంది. ఎగిసి పడుతున్న  మంటల ముందు ఏదో ఆలోచిస్తూ అరుణ్. ఒంటరి ఊపిరితిత్తు ఆయన లోపలి ఎగసే ప్రశ్నలు, తడబడుతున్న హృదయ కవాటాలు, మొరాయిస్తున్న శ్వాస. చీకటి మధ్యలో మంటలు, తెనాలి పద్య నాటక మిత్రుల హరిచంద్ర పాటలు గోరటి   తో జుగల్బందీ . అంతా అవధులు లేని ఆనందం లో అక్కడ కేవలం ఒక్క మనిషి లో విషాదం.అదే అరుణ్ ఆయన  ఆలోచనలు. తరిగి పోతున్న నిముషాలు. ఒక్క్కొక్కటి మాయం అవుతూ ఆయన ఆయుషు తినేస్తున్నట్లు కానీ నాకు తెలుసు ఆయన మందగించిన చూపు, తడబడుతున్న శ్వాస. కోల్పోతున్న ప్రతి నిముషంకు అర్ధవంతం అయిన ముగింపు ఇవ్వాలని తపన, దగ్గరి వాళ్ళతో ఆయన బ్రతికిన క్షణాలు అన్నీ బోనస్ గా దొరికినవి అని. ఆ మిగిలిన  క్షణాలు అమూల్యమైనవి అనీ.తాను మొదలుపెట్టిన ప్రయాణం అర్దాంతరంగా ఆగడం ఇష్టం లేదు. ఆయనకు తెలుసు కాలం ఆయనని తరుముతూ ఉందని.

ఒక సారి లోయపల్లి అని ఒక ఊరు పోయాం . ఆ ఊరిలో ఒక చిరు ఉద్యోగి ఆయన పనిచేసే చానెల్ లో అతనూ,  పూసలోల్లు అని ఒక సంచార కులం నుండి వచ్చిన అతని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. రాష్ట్రం మొత్తం ఆ కులం నుండి  పాత్రికేయ ప్రపంచంలో ఒకడే ఉన్నాడు.ఆ పేరు ఇప్పుడు పాత్రికేయ వృత్తిలో సుపరిచయం. ఇంటర్వ్యూ సమయం లో అతని గురించి తెలుసో లేదో కానీ పూసలు అమ్ముకొనే ఒక తల్లి తన కొడుకుని పాత్రికేయ ప్రపంచానికి అందించిది అది కేవలం అరుణ్ మాత్రమె చేయగలడు. అగొ వృత్తిలో ఇలాంటి మానవీయ విలువలు ఉంటాయా ?

మళ్ళీ ఏడాదికి ఖమ్మంలో క్రాంతి సర్ వాళ్ళ మీటింగ్ అదే సమూహం మీటింగ్ ప్రాంగణం అరుణ్ పేరుతో. వందలాదిగా తరలి వచ్చారు,ఒక్క నిముషం అరుణ్ కోసం నివాళి. మళ్ళీ చిమ్మ చీకట్లో రాజేసిన మంటలు అక్కడ కూడిన అందరిలో ఒక పేరు మిస్ అవడం.పోయిన సారి అందరం ఇక్కడే కలిసాం కదా. అంతా నిశబ్దంగా . అంతకు ముందు. వైజాగ్ జగతి-రామతీర్ధ పిలుపు. మువ్వా,ఖాదర్అన్నా,ప్రసాద మూర్తి,పవనన్న నేను హైదరాబాదు,భద్రాచలం,సుక్మా, కుంట,మీదుగా పాపికొండలు,పోలవరం,మారేడుమిల్లి,లంబసింగి, వైజాగ్ ప్రయాణం.ప్రతి మూలమలుపులో కోల్పోయిన క్షణాలు.ఆయన పుట్టిన పరిసరాలు, శబరి వంపులో తొలి యవ్వన జ్ఞాపకాలు.అరుణ్ కు లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టం. ‘’నాగరిక’ సమాజానికి సుదూరంగా కాస్త ప్రేమను వెతుక్కొనే క్రమంలో తిరిగాడు. అరుణ్ కుటుంబం రాజకీయ విశ్వాసాలకోసం విస్తాపితులు అయ్యారు. పుట్టుక,చదువు,కొలువు,చివరి మజిలీ ఏ ఒక్కటీ స్థిరంగా లేని విస్తాపన ఆయనది. నాలుగడుగుల తన చిన్న కాబిన్ లో మానసిక ఉక్కపోతలో ఆయన రాసుకున్న వాక్యాలలో స్వాంతన పొందాడు.ఆ రాతల్లో  అంతరించి పోతున్న ఒక రేలపాట, ఆ పాట  మృత్యు సంగీతంగా మారుతున్న సమయం.  లక్షలాది ఆదివాసీల గుండె గొంతుకకు ఆయన వాక్యాలతో కాస్త దైర్య వచనం అయ్యాడు . మనలో ఎక్కడయినా  కడంచున కాస్తంత మనిషి తనం మిగిలి ఉంటె ఆ వాక్యాలు చదవి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. మాయం అయిపోతున్న మనిషి జ్ఞాపకాలు ఆయన వాక్యాలు. కుంట,చీదరి చంద్రయ్య,ఇరపా లక్ష్మి. అరుణ్ సాగర్ రచనల్లో కావ్యకన్యకలు అయ్యారు.జ్ఞాపకంగా మారిన చీదర చంద్రయ్య కోసం కీట్స్ తన మిత్రునికోసం రాసినట్లు.

khader

అరుణ్ చనిపోయి ఏడాది కూడా కాలేదు. అనుకున్నట్లుగా ఆయనపేర ఒక అవార్డు రూపకల్పన చేసిన మిత్రులు.  ఈ పుట్టిన రోజు ఆయన మిత్రుల సహకారంతో ప్రెస్ అకాడమి ఆయన పేర మూడు అవార్డులు,విశ్వం బాబాయ్ అరుణ్ సాగర్  సమగ్ర కవితా సంకలనంతో ఆయనకు నివాళి. మానవీయ విలువలతో పాత్రికేయ వ్రుత్తి లో ఉన్న వాళ్ళను వెతికారు అల్లం అన్న,రాజకుమార్ అన్న. మొదటి సారి ఖాదర్ అన్నకి ఇస్తున్నారని తెలిసింది.

ఒక మనిషి పుడతాడు పోతాడు. కానీ పోయే లోపు నిన్ను కన్ననేల చెర బడుతున్నప్పుడు కాస్తంత కన్ఫెషన్ అవసరం. కానీ అరుణ్ సాగర్ ఎకంగా కోల్పోతున్నరేల పాటకోసం మరణ వాగ్మూలం రాసుకుండు. ఒక మైదాన వాసి విస్తాపితుడిగా తాను పుట్టి పెరిగిన ప్రాదేశిక ప్రాంతాలు చరిత్ర గతిలో గతంగా మారబోతున్న సంక్షుభిత సమయం లో  ఎనభై అడుగుల లోతులో సమాధి కాబోతున్న మన ఆనవాళ్ళను  దూరంగా మన బిడ్డలకు  చూపించి “అగొ అక్కడే నీ తాతలు తండ్రులు ఒకప్పుడు ప్రాణం తో ఉన్న మనిషి జ్ఞాపకాలు  అని కడసారి మనకు చూపించి కనుమరుగు అయ్యాడు అరుణ్. లేదు నలుగురు కూడిన ప్రతిచోటా అరుణ్ ఉంటాడు.

*

 

 

 

‘చో’ ఆగిపోయింది!

cho-ramaswamy

1976లో ‘బంగారు పతకం’ అనే సినిమా చూశాను. అది తమిళం నుంచి తెలుగుకు డబ్ చేసిన సినిమా. శివాజీ గణేశన్, కె. ఆర్ . విజయ హీరో, హీరోయిన్లు. చాలా సీరియస్ సినిమా. అయినా ఆ సినిమాను మూడుసార్లు చూశాను. కారణం, అందులో చో రామస్వామి సెటైర్లు. ఆ సెటైర్లు కానీ, అందులో ఆయన పాత్రకానీ ఇప్పుడు గుర్తు లేవు. ఆ సినిమా కోసం నెట్ లో చూస్తే దొరకలేదు. అదే సినిమాను 1981లో ‘కొండవీటి సింహం’పేరుతో ఎన్టీఆర్, శ్రీదేవిలతో తెలుగులో రీమేక్ చేసినట్టు మాత్రం చూశాను. ఆ సినిమా నేను చూడలేదు.

‘బంగారు పతకం’ లో చో రామస్వామి పోలీస్ కానిస్టేబుల్ గా నటించినట్టు లీలగా జ్ఞాపకం. అతనికి ఒక కొడుకు. తండ్రి-కొడుకుల సంభాషణలో గొప్ప రాజకీయ వ్యంగ్యోక్తులు పేలుతూ హాలంతా నవ్వులు పండిస్తాయి. లీలగానే  గుర్తున్న ఒక సెటైర్ ప్రకారం, కొడుకు చదువురాని బడుద్ధాయి. “అయితే ఇంకేం! రాజకీయనాయకుడి వవుతావు” అని తండ్రి ఊరడింపు.

మనిషికి పుట్టుకతో కొన్ని ఆనువంశిక లక్షణాలు సంక్రమించవచ్చు. కానీ ఐడియాలజీతో సహా అతని ఆలోచనాసరళిని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది అతను పుట్టి పెరిగిన భౌతికవాతావరణమే. అంటే ఆలోచనారీతి, వాటిని వ్యక్తీకరించే పద్ధతితో సహా అన్నీ కండిషండే తప్ప సర్వస్వతంత్రాలు కావు. చో రామస్వామి ఒక ఉదాహరణ.

దక్షిణాదిన ఇంగ్లీష్ వారు తమ స్థావరంగా మార్చుకుని అభివృద్ధి చేసిన తొలి నగరం మద్రాసు కావడం, ఆ విధంగా ఇంగ్లీష్ ప్రభావాలకు బ్రిటిష్ పాలన తొలిరోజుల్లోనే అది లోను కావడం, ఆ ప్రభావాలను సామాజికంగా, సాంస్కృతికంగా అగ్రస్థానంలో ఉన్న బ్రాహ్మణులు వెంటనే అంది పుచ్చుకోవడం, మద్రాసు తనదైన విలక్షణమైన సంకీర్ణ నాగరికతను తెచ్చుకోవడం, ఆ తర్వాత స్వాతంత్రోద్యమంలో భాగంగా అక్కడి స్థానిక, బ్రాహ్మణేతర వర్గాలు క్రమంగా జాగృతమై బ్రాహ్మణీయతను సవాలు చేస్తూ భిన్నశక్తిగా మారడం, అది బ్రాహ్మణవ్యతిరేక ద్రవిడ ఉద్యమంగా బలపడడం, దానికి ప్రతిక్రియగా బ్రాహ్మణీయ శక్తులు పోలరైజై  ఉనికి పోరాటానికి దిగడం…

ఇంతటి ‘నలుగు’ పిండినుంచి వినాయకుడిలా రూపం దిద్దుకున్నవాడే చో రామస్వామి! ఈ నేపథ్యం లేకపోతే మనకు తెలిసిన ఇప్పటి రూపంలో చో ఉండడు!

తెలుగు ప్రాంతాలలోని బుద్ధిజీవుల్లోంచి  చో రామస్వామి లాంటి ఓ కేరక్టర్ ఎందుకు పుట్టలేదన్న కుతూహలకరమైన ప్రశ్ననుంచి ఈ నేపథ్యాన్ని తడమాల్సివచ్చింది. తెలుగు ప్రాంతాలలో ఆంధ్ర,రాయలసీమలకు వస్తే ఇక్కడి వాళ్ళకు తమిళులకు ఉన్నట్టు మద్రాసు లాంటి ఒక స్వతంత్ర రాజధాని నగరం లేదు. రాంభట్లగారి సూత్రీకరణనే పరిగణనలోకి తీసుకుంటే, సొంత నగరం లేని జనాలకు గుర్తించదగిన సొంత నాగరికత ముద్ర ఉండదు. అలాగే మద్రాసీలకు ఉన్నంత ఇంగ్లీష్ ప్రభావమూ వీళ్ళ మీద లేదు. తెలంగాణకు హైదరాబాద్ లాంటి నగరం ఉన్నా దాని స్వభావం వేరు. తెలంగాణలో, ఆ సంబంధంతో కొంతవరకు ఆంధ్రలో వామపక్ష ఉద్యమాల ప్రభావం ఉంది. అదంతా చాలా సీరియస్ వ్యవహారం. అక్కడ వ్యంగ్యానికి, హాస్యానికి చోటు తక్కువ. తమిళనాడు కొస్తే అక్కడ బ్రాహ్మణీయ వ్యతిరేక ద్రావిడ ఉద్యమం, అంతకుముందు కాంగ్రెస్ ప్రభావాలే తప్ప వామపక్షఉద్యమ ప్రభావాలు చాలా తక్కువ.

వ్యంగ్యం, హాస్యం, ఝటితి చమత్కారం(రిపార్టీ) చోకు ఆనువంశికంగానో, వ్యక్తిగతంగానో సంక్రమించి ఉండచ్చు. కానీ వాటిని తారస్థాయికి పెంచి రాజకీయవస్తువుకు వాటిని మేళవించి జనరంజకం చేయడానికి చో కు నిస్సందేహంగా తను పుట్టిన పెరిగిన భౌతికవాతావరణమే తోడ్పడింది. మద్రాసు ముందే నగరం కావడంవల్ల అక్కడ విద్యావంత మధ్యతరగతి పెద్ద సంఖ్యలో ఏర్పడింది. వారిలోంచి ఆవురావురుమనే పాఠకులు పెరిగారు, పత్రికలు పెరిగాయి. సినిమాతో సమానంగా థియేటర్ నూ కాపాడుకుంటూనే వచ్చారు. ఆ విధంగా చో  రంగప్రవేశం చేసి విజృంభించడానికి అవసరమైన పూర్వరంగమూ, ఆయన బహుముఖీన ప్రతిభావ్యుత్పత్తులకు స్పందించి ఆస్వాదించగలిగిన పాఠకులు, ప్రేక్షకులు ముందే ఏర్పడ్డారు. ఇక జరిగింది… చరిత్ర.

చో బహుముఖీనత తెలుగు ప్రమాణాలతో చూస్తే విస్మయం కలిగిస్తుంది. ఆయన లా చదువుకున్నాడు. ఓ పెద్ద కంపెనీకి లీగల్ అడ్వైజర్ గా ఉన్నాడు. ఇంకోవైపు తుగ్లక్ పత్రిక ద్వారా జర్నలిస్టుగా అవతారమెత్తాడు. ఆపైన నాటకాలు రాశాడు, వేశాడు. 200 కు పైగా సినిమాల్లో నటించాడు. అది కూడా ఎమ్జీఆర్, శివాజీ గణేశన్, జయలలిత, ఎం ఆర్ రాధా, జయలలిత, నగేష్, రజనీకాంత్, కమల్ హాసన్, మనోరమ, సచ్చు లాంటి హేమాహేమీలతో. మొదట్లో తన రాజకీయ వ్యంగ్యాస్త్రాలను ద్రవిడపార్టీమీదా, వామపక్ష భావజాలం మీదా ఎక్కుపెట్టాడు. అవి ముఖ్యంగా ద్రవిడ నేతలకు తగలవలసిన చోటే తగిలి తహ తహ పుట్టించడం ప్రారంభించాయి. ఆయనపై రకరకాల రూపాల్లో ప్రతి దాడికీ సిద్ధమయ్యారు. డెబ్బై దశకంలో ఆయన తీసిన మహమ్మద్ బిన్ తుగ్లక్ సినిమా ఆడే థియేటర్లపై కూడా దాడులు జరిగాయి. అయినా నిర్భీతికి చిరునామాగా చో నిలబడ్డాడు. కారణం మరేం లేదు. బ్రాహ్మణవ్యతిరేక ఉద్యమాన్ని  ప్రతిఘటించడం ద్వారా రాటుదేలిన బ్రాహ్మణీయవర్గాల మద్దతు ఆయనకు ఉంది. తన పత్రికకు, తన రాతలకు, నాటకాలకు ఆ వర్గాల వెన్ను దన్ను, ప్రోత్సాహం ఆయనకు ఉన్నాయి. అదీగాక నిన్నమొన్నటి వరకు మధ్యతరగతి విద్యావంతవర్గానికి సొంత రాజకీయ అభివ్యక్తికి బలమైన వాహకం లేదు. దాంతో అది యాంటీ-ఎస్టాబ్లిష్మెంట్ ధోరణిని జీర్ణించుకుంది. ఇది కూడా చో కు కలసివచ్చి ఆయన రాజకీయవ్యంగ్యానికి మరింత పదును పెట్టింది. తుగ్లక్ లాంటి పత్రికకు 90 వేలకు పైగా సర్క్యులేషన్ ఉండేదంటే చో కు లభించిన ఆదరణను అర్థం చేసుకోవచ్చు.

ఎమర్జెన్సీ దరిమిలా ఆయన గురి కాంగ్రెస్ వైపు తిరిగింది. తుగ్లక్ పత్రిక ద్వారా ఆయన సాగించిన ఎమర్జెన్సీ వ్యతిరేకపోరాటం మరో అధ్యాయం. ఎల్టీటీయీ తీవ్రవాదాన్ని వ్యతిరేకించడంలోనూ అంతటి నిర్భీతినే ఆయన చాటుకున్నాడు. అధికారబలం, అంగబలం, రాజకీయబలం లేకపోయినప్పటికీ అవన్నీ ఉన్న ఉద్దండ శక్తులకు ఎదురు నిలిచి నిలదొక్కుకోవడంలో చో తో పోల్చదగిన వ్యక్తి సుబ్రమణ్యంస్వామి. వీరు తమిళనాడులోని ప్రత్యేక పరిస్థితులనుంచి ప్రాణం పోసుకున్న వ్యక్తులు.

వ్యక్తిగా కొంతవరకు చో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించినట్టే కనిపిస్తాడు. మంచి ఎక్కడున్నా ఎంచి చూపడంలో, చెడును నిర్దాక్షిణ్యంగా ఖండించడంలో ఆయనకు స్వ, పర భేదాలు లేవని పేరు. జయలలిత కుటుంబంతో ఆయనకు ముందునుంచీ పరిచయం. ఆయన నాటకాలలో జయలలిత నటించింది. ఆ తర్వాత సినిమాల్లో కూడా కలసి నటించారు. అయినా జయలలిత పాలన అవినీతి భూయిష్టంగా కనిపించినప్పుడు ఆమెను బహిరంగంగా వ్యతిరేకించడమే కాదు; ఆమెకు వ్యతిరేకంగా తన బద్ధ విరోధి అయిన కరుణానిధి, తమిళ మానిల కాంగ్రెస్ ల మధ్య సయోధ్యకు కృషి చేశాడు. వ్యక్తిగతమైన ఈ నిష్పాక్షిక వైఖరే ఆయనను అన్ని పార్టీలవారికి దగ్గర చేసినట్టు కనిపిస్తుంది. జయలలితే కాదు; ఎమ్జీఆర్, శివాజీ గణేశన్ సహా ఎందరో ఆయన సలహాను ఆపేక్షించేవారని అంటారు. ఆయనను రాజగురువుగా ప్రధాని మోడీ చేసిన అభివర్ణనను పూర్తిగా అతిశయోక్తి అనలేం.

చో ఆర్ ఎస్ ఎస్ వైపు, హిందుత్వ భావజాలం వైపు ఒరగడం, వాజ్ పేయి హయాంలో రాజ్యసభ సభ్యత్వం పొందడం వగైరాలను ఆయన పుట్టి పెరిగిన తమిళనాడు పరిస్థితుల నేపథ్యం నుంచి వేరు చేసి చూడలేం. మొత్తం మీద చెప్పాలంటే ఆయన జీవితం, ఆయన పత్రిక, నాటకాలు యాభై ఏళ్ళకు పైబడిన మన ప్రజాస్వామిక రాజకీయ వైఖరులకు నిలువెత్తు ప్రతిఫలనాలు.

                                                                                                           -భాస్కరం కల్లూరి

“దేవపుత్ర” కాదు మట్టిబిడ్డ!! 

deva

Artwork: Akbar

     *

1990 కి ముందు చదువరులకు ముఖ్య కాలక్షేపం వారపత్రికలే! వాట్లో వచ్చే కథలు, నవలల కోసం వారం పొడుగునా ఎదురు చూసే కాలమది.
 
     అప్పుడు నల్లమాడలో నేను ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడ్ని. కథల మీద ఆసక్తి ఉన్న ముగ్గురం మూడు వారపత్రికల్ని  కదిరి నుంచి తెప్పించేవాళ్లం.
 
     1987 డిశెంబరు ఆంధ్రసచిత్ర వారపత్రికలో “ఇరుకు” అనే కథ వచ్చింది. ఆ కథను మేం ముగ్గురమే కాక, సాయంత్రం వాకింగుకు వెళ్లి దూరంగా బండమీద కూర్చొనే మా ఉపాధ్యాయ మిత్రులకంతా చదివి వినిపించాను. వారు దాన్ని మెచ్చుకొని మరికొందరితో చదివించారు. ఆ కథను రాసింది చిలుకూరి దేవపుత్ర!! అప్పట్నుంచీ అతని పేరు నాలో ముద్రించినట్లు స్థిరపడి పోయింది.
 
     అప్పుడతంది ఏవూరో? ఏ ఉద్యోగమో చేస్తున్నాడో కూడా నాకు తెలియదు. అయినా పత్రికల్లో పేరు కనబడితే మొదట అతని కథనే చదివే వాడిని.
 
     మరలా హిందూపురానికి బదిలీపై వచ్చాక, డా.పెద్దిరెడ్డిగారి సాహచర్యంతో 1993  ప్రాంతంలో దేవపుత్రది అనంతపురమే అని, ఇంకా సింగమనేని నారాయణ, శాంతినారాయణ, బండినారాయణ స్వామి వంటి ప్రసిద్ధ రచయితల్ది కూడా అనంతపురమే అని తెలిసి సంతోషించాను.
 
     చిలుకూరి దేవపుత్ర 1951 ఏప్రిల్ 15 నాడు అనంతపురం జిల్లా బెళుగుప్ప దగ్గర కాలువపల్లెలో ఆశీర్వాదం, సరోజమ్మ అనే దంపతులకు జన్మించాడు. దళితుడైన అతని తండ్రి చిన్నపాటి ఉద్యోగి కావడంతో దేవపుత్ర ఇతర దళితుల్లాగా అవమానాలకూ, అంటరాని తనాలకూ గురికాకుండా పెరిగి ఉండవచ్చు!!
 
     అయినా తన వర్గానికి జరిగిన, జరుగుతున్న వెలివేతల్నీ, అంటరానితనాల్నీ, అణగదొక్కడాల్నీ గమనిస్తూ అందరిలాగా చూసీ చూడనట్లు పోలేదు. వారి అసహాయతల్నీ, జీవన శైథిల్యాల్నీ, ఇతర సామాజిక రుగ్మతల్నీ 100 కు పైగా కథల్లోనూ, ఐదు దాకా నవలల్లోనూ సజీవ రూపాలుగా అక్షరబద్దం చేశాడు.
 
     అతడు చదివింది S.S.L.C నే అయినా సమకాలీన సమాజాన్ని, తాను పనిచేసిన రెవెన్యూ శాఖ రుగ్మతల్ని బాగా ఆకళింపు చేసుకొన్నాడు. అతను రాసిన కథల్లో సగందాకా తను పని చేసే శాఖలోని బలహీనతలూ, లంచగొండితనాలూ, దొల్లతనాల్ని గురించి రాసినవే!! అతడంత ధైర్యంగా రాయగలిగాడంటే ఎంతగా వృత్తికి అంకితమై వుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
 
     అతని కథలు “వంకర టింకర ఓ” “ఆరు గ్లాసులు” “ఏకాకి నౌకచప్పుడు” “బందీ” చివరి మనుషులు” అనే సంకలనాలుగా వచ్చాయి.
 
     ఇతను, ప్రసిద్ధ కథకుడు సింగమనేని నారాయణ గారి సాహచర్యం వల్ల వామపక్ష భావాల్ని ఆకళింపు చేసుకొని తన రచనల్ని మెరుగులు దిద్దుకొన్నాడు. ఆ భావజాలంతో 1977 లో మొదట రాసిన “మానవత్వం” అనే కథను రంగనాయకమ్మ గారు మెచ్చుకొని అచ్చువేశారు. అప్పట్నుండీ అదే బాటలో చివరిదాకా నమ్మిన సిద్ధాంతాన్నీ, పట్టిన దారినీ వదలకుండా అద్భుతమైన రచన్లు చేశాడు.
 
     “అద్దంలో చందమామ” నవల- తమ అధికారాల కొమ్ములూడినా రెడ్డీ కరణాల ఆధిపథ్య ధోరణినీ, దళారీతనాల్నీ, దళితులపట్ల వారి కల్ముష వైఖర్లనీ వివరిస్తుంది. “పంచమం” నవల- దళితుల దైన్య జీవితాలను అద్దంపట్టే రచన. “ప్రజల మనిషి” నవల- అవకాశాలు కల్పిస్తే దళితులు కూడా తమ ప్రతిభల్ని చాటుకోగల సమర్థులు అని కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంది. “కక్షశిల” నవల- పేరులోనే రాయలసీమ కక్షల కాఠిన్యాన్ని ధ్యనిస్తుంది. సీమ ముఠా కక్షల్లో బలి అవుతున్నబలహీన బడుగువర్గాల సజీవ సత్యం. “చీకటి పూల” నవల- తెలియని వయస్సులో నేరాలు చేసి జైళ్లకు వెళ్ళే బాలల హృదయవిదారకమైన దుస్థితిని గుండెల్ని తాకేలా చెప్పింది.
 
     “రచయితలు తమ తరానికి జవాబుదార్లు.
      వారు తమకు తామే జవాబు చెప్పుకోవలసిన వారు” అని, ఆదివాసుల వాస్తవ స్థితిగతుల్ని కళ్లకుకట్టి చూపించిన మహోన్నత రచయిత్రి మహాశ్వేతాదేవి గారన్నట్లు, చిలుకూరి దేవపుత్ర మా అనంతపురం జిల్లాలోని కరువు, దళితసమస్యలు,ఫ్యాక్షనిజం మొదలైన విషయాలను ఇక్కడి సామాన్యప్రజల నిత్య వ్యవహారాల పదజాలంతో, ఎటువంతి కల్పనలకూ, అతిశయోక్తులకూ పోకుండా అక్షరబద్దం చేశాడు.
 
    అతను చాలా యేళ్లు కలెక్తరు కార్యాలంలో పని చేశాడు. నేను ఆకాశవాణికి ధ్వనిముద్రణకు వెళ్లినప్పుడల్లా కలిసేవాణ్ణి. అతను చాలా సార్లు “సడ్లపల్లీ! నువ్వు కథల్లో ఆవేశం, కసి రవ్వంత తగ్గించుకో!! పాత్రల్ని పక్కకు నెట్టి నువ్వెందుకు చొరబడతావు??” అని సూచనలు చేసేవాడు. “వీరమాండలికుడు” అని నాకు చురకలంటించి, సరళ మాండలికం రాయించిన ఘనత దేవపుత్రదే!!
 
     ఎంత భయంకరమైన సామాజిక నగ్నాలు, సంఘర్షణలూ తన రచనలో చెబుతున్నప్పటికీ ఆవేశాన్ని కానీ, అసహనాన్ని కానీ, ధర్మోపదేశాల్ని కానీ చేయడు. పాత్రల పరిధికి మించి ఒక్క మాటకూడా ఎక్కువగా మాట్లాడించడు.
 
     కథను ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ఎలా ముగించాలో తెలిసిన బహుకొద్దిమంది  రచయితల్లో దేవపుత్ర ఒకడు.
 
     ఊడలమర్రి, ఇదెక్కడిన్యాయం, ఔషధం, విలోమం, ఆయుధం, సమిధలు, గురుదక్షిణ, నేను పెసిడెంటు సుట్టమురాల్ని మొదలైనవి దళితకథలు. వీటిలో రిజర్వేషన్ల మూలంగా దళితులకు సంక్రమించే పరిపాలనాధికారాలు భూస్వాముల మూలంగా ఎలా అనుభవించలేక పోతున్నరో బలంగా చెప్పిన కథ. గురుదక్షిణ- కథనైతే ప్రముఖ చిత్రకారుడూ, సినీ దర్శకుడూ అయిన బాపు “నాకు నచ్చిన కథ”అని కితాబిస్తూ, తన చేతుల మీదుగా అద్భుతమైన బొమ్మ గీసిన ఆణిముత్యం వంటి కథ.
 
     ఐడెంటిఫికేషన్, మీసాలు, ఆర్డర్లీ, ఆరుగ్లాసులు, విడుదల, దొంగయితే బాగుండు తదితరకథలు వైవిద్య భరితమైన అధికార్ల నిరంకుశత్వాన్ని చెప్పేకథలు.
 
     మట్టికీ దాన్ని నమ్ముకొన్న రైతుకూ వున్న సంబంధాన్ని గొప్పగా చిత్రించిన కథలు మన్నుతిన్న మనిషి,ముంపు. రైతుకూ అతని పెంపుడు నేస్తం పశువుకూ వున్న ఆత్మీయబంధాన్ని కళ్లకు కట్టినట్లు చూపే రచన నెర్లు. మనిషియొక్క శాడిజం మీద రాసింది సిహ్మమ్నవ్వింది అనే కథ.
 
     అతని రచన్లన్నీ మొదట్నుంచీ చివరిదాకా చదివించే, ఆలోచింప చేసేవయినప్పటికీ, నాకు అపరిమితంగా నచ్చిన కథ “రెండు రెండ్ల నాలుగు” అది ఎంత హాస్యంగా మొదలై మనల్ని కడుపుబ్బ నవ్విస్తుందో, ముగింపు గుండెల్ని చెమర్చేలా చేస్తుంది. అలా రాయడం అందరిచేతా అయ్యేపని కాదు!!
 
     “చివరి మనుషులు” కథ నేటి సమాజంలో సంపన్న వర్గాలవారూ, వామపక్ష భావాలవారూ,అధికారులూ,ప్రజల్నేలే నాయకులూ చేసే ప్రసంగాలకూ ఆచరించే దొళ్లతనాలకూ పొంతనలేని భేషజాల్ని ఉతికి ఆరేసిన రచన. ఆ కథలో తమపిల్లల్ని తెలుగుపాఠశాలలో చదివించే ఆంగ్లోపన్యాసకుడు వేరెవరో కాదు! అతడు తెలుగుతల్లి అభిమాన భాషా మానస పుత్రుడైన  చిలుకూరే!!
 
     అతడు తన ఇదరు పిల్లల్నీ ప్రభుత్వ బడుల్లో తెలుగుమాధ్యమంగానే చదివించాడు. కుమార్తె చిలుకూరి దీవెన కవయిత్రి, కథకురాలుకూడా!!
 
     ఇంకొక విషయం ఏమిటంటే అతని భార్య లక్ష్మీదేవిగారిది కర్నాటక. ఆమె అక్కడ చదివింది కేవలం నాలుగో తరగతి దాకానే! ఇతని సాంగత్యంతో తెలుగు చదవడం రాయడం నేర్చి ఓపన్ యూనివర్సిటీలో డిగ్రీకూడా పాసయ్యింది. ఇరవై దాకా కథలుకూడా రాసిన ఏమే దేవపుత్ర కథలకు మొదటిశ్రోత, విమర్శకురాలునూ!!
 
     ఇతడు రాసిన కథలు, నవలలకు ఇరవైకి పైగా అవార్డులూ, సత్కారాలూ అందుకొన్నాడు. చివరగా జాషువాజయంతిని పురష్కరించుకొని సెప్టెంబరు 28 నాడు విజయవాడలో “గుర్రం జాషువా” పురష్కారాన్ని అందుకొన్నాడు. ఇరవైఐదు దాకా విశ్వవిద్యాలయాలు ఇతని రచనలని పాఠ్యాంశాలుగా చేర్చుకొన్నాయి. పది మంది దాకా విద్యార్థులు ఇతని రచన్లపై పరిశోధనలు చేసి డాక్టరేట్లు, యం.ఫిల్ పట్టాలు పొందారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీవారు ఆంగ్లంలో ప్రచురించిన దళితకథా సంకలనంలో ఇతని గురుదక్షిణ తీసుకోవడం మన తెలుగు కథక జాతికే గర్వకారణం.
 
    ఆగష్టు 23 నాడు హిందూపురంలో తపన సాహిత్యవేదిక తరపున తమిళనాడులోని తెలుగు సోదరులు రాసిన “రాగెన్నుల రాజ్యం” మరికొన్ని పుస్తకాల ఆవిష్కరణలతో పాటు, మా అబ్బాయి పెండ్లికి హాజరై, రాత్రి 11 దాకా నాతో ఏకాంతంగా గడిపి కుటుంబ నేపథ్యాన్నతా అదిగి తెలిసుకొని “నువ్వు మనిషివి కావు, రాక్షసుడివి, బ్రహ్మరాక్షసుడివి నీ కథ రాసి తీరుతా” అని కౌగిలించుకొని ముద్దు పెట్తుకొన్నాడు!!
 
    ఇతడు స్నేహశీలి, సౌమ్యుడు, చాలా సున్నితమైన మనస్వి. ఉబికివచ్చే ఆనందాన్ని తన్లో దాచుకోలేని వ్యక్తి. ఒక సారి అనంతపురానికి వచ్చిన గోరటి వెంకన్నతో మేమంతా కలిశాము. “సంత” తో ముడిపడిన జీవితాల్ని అభినయిస్తూ అద్భుత పదచిత్రాల పూలని తనదైన శైలిలో మా హృదయాలమీద చిలకరిస్తున్నాడు. మేము రెప్పవాల్చకుండా గుండెల్ని కూడా శబ్దించకుండా నిశ్శబ్దపరచి ఆస్వాదిస్తున్నాము.
 
     చిలుకూరి ఉన్నఫళంగా లేచి గోరటివెంకన్నను కౌగిలించుకొని తన స్పందనల్ని మాటలుగా మార్చలేక చిన్న పిల్లాడిగా ఏడ్చేశాడు. అదొక్కటి చాలు సమస్యల పట్ల ఎంతగా చలించిపోయే వాడో అని అంచనా వేయడానికి!!
 
    సెప్టెంబరు 27 నాడు పత్రికల్లో వార్తవచ్చింది చిలుకూరికి జాషువా అవార్దు ఇస్తున్నత్లు. ఫోన్ చేసి అభినందనలు చెప్పి, “మా ఊరికి ఎప్పుడొస్తావ్ మా సంస్థతరపున సన్మానం చేయాలనుకొన్నాం” అన్నాను.దానికతడు నవ్వుతూ, “నువ్వు రైతుల కతలు రాయప్పా! అదేనాకు చేసే సన్మానం” అన్నాడు.
 
     అక్తోబరు ఒకటో తేదీ నాడు ఫోన్ చేసి, “సడ్లపల్లీ! వేదగిరి రాంబాబుగారు మన కథల ప్రూఫులు పంపినాడు. ఐ.డి. చెప్పు మెయిల్ చేస్తాను అన్నాడు. “పుత్రా అయితే రేపు అనంతపురానికి నేను రావాల్సిన పని లేదా?” అన్నాను.
 
    “ఔ గదా!! రేపు అభ్యుదయ రచయితల సంఘం తరపున గురజాడ- గుర్రం జాషువాల వ్యక్తిత్వాలపై సమావేశముంది కదా!! పొద్దున్నే ఇంటికొచ్చేయ్” అన్నాడు. అతను జిల్లా రచయితల, అభ్యుదయ రచయితల సంఘాల్లో చురుగ్గా పాల్గొనే వ్యక్తి.
 
     మరుసటి దినం తొమ్మిదింటికే మరో కడప మిత్రునితో కలిసి ఇంటికెళ్లాను. అప్పటికే మంచం వెడల్పునా కల్లంలో రైతులు పండిన ధాన్యాన్ని నెరిపినట్లు కూర్చోవడానికే సందు లేకుండా పేపర్లనూ, పుస్తకాల్నీ పరుచుకొని, నేను పెసిడెంటు సుట్టమురాల్ని – కథ ప్రూఫు దిద్దుతున్నాడు.
 
     అతని శ్రీమతి లక్ష్మి దేవిగారు కమ్మని కాఫీ అందించారు. పిచ్చా పాటీ మాటలయ్యక, “టైమయితా వుంది, నేను బిరీన స్నానం చేసొస్తాను. ఈ ప్రూఫ్ అట్ల దిద్దు నువ్వూ మాండలికుడివే కదా” అన్నాడు నవ్వుతూ.
 
     దానికి నేను “మాండలికం అంతే భాష పరిధిని కుదించి చట్రంలో బిగించినట్లుంటుంది. ప్రాంతీయ యాస అంటే బాగుంటుంది కదా” అన్నాను.
 
    “ఎందుకు బాగుండదు! ఇంక మీదట అట్లనే పిలుద్దాంలే” అని స్నానానికి పోయాడు. దిద్దడం అయిపోయాక నా కథను కూడా అతనే తీసుకొని హైదరాబాదుకు పంపిస్తానన్నాడు. మధ్యాన్నానికి సభ ముగిసింది.
 
     అక్టోబరు 15 శుక్రవారము. శాంతినారాయణ, దేవపుత్రా ఫోన్ చేసి” మన జిల్లావే నావుగయిదు కథలున్నాయి. ఆదివారం కథల సంకలనం ఆవిష్కరణ వుంటుందని, వేదగిరి రాంబాబు మైల్ చేశాడుకదా! నువ్వు కూడా వచ్చేయ్ అందరూ కల్సి పోదా” మన్నారు. కొన్ని పునులుండడంవల్ల నేను రానని చెప్పాను.
 
     అక్టోబరు 18, ఉదయం పది గంటల సమయంలో శాంతినారాయణ గారు ఫోన్ చేసి”చిదంబరరెడ్డీ.. ఒక దుర్వార్త…” అని కొంచెం సేపు గుండెను బిగబట్టుకొన్నట్లు ఆగి మన దేవపుత్ర అని చెప్ప బోయాడు. ఏదో ప్రమాదం లాంటిది జరిగి వుండొచ్చనుకొని  ఏం జరిగింది సార్?? అన్నాను. గుండెపోటుతో మనకు దూరమైనాడు” అని ఫోను పెట్టేశాడు.
 
     నాకు కొంతసేపు ఏమి చేయాలో తోచలేదు. వెంటనే ఫేస్ బుక్కులో అతన్ని గురించి నాలుగు మాటలు రాసి, సంతాపం తెలుపుతూ పోస్టు చేసాను.
 
    క్షణాల్లో ప్రపంచంలోని అన్ని దేశాల నుండీ  ఎడతెరిపి లేకుండా సంతాప సందేశాలు పంపిస్తుంటే- అంతమంది అభిమానులు అందునా యువకులు ఉండడం నాకు ఆశ్చర్యానికి గురిచేసింది. మరి కొంత మందయితే అతని కనుమరుగును జీర్ణించుకో లేక నేరుగా నాకు ఫోను చేసిగాని నమ్మలేక పోయారంటే… ఆ సాను భూతిని, అభిమానాన్ని, ప్రేమా వాత్సల్యాల్ని ఎలా వ్యక్తం చేయను?? (ఇప్పుడు 29.10.2016 రాత్రి 10 గంటలప్పుడుకూడా దూరప్రాంతాల్లో వుండి ఆలశ్యంగా తెలుసుకొన్న వారు అతనికి సంతాప స్పందనలు వస్తూనే వున్నాయి)
 
     విషాద వార్త తెలుస్తూనే దేవపుత్ర ఇంటికి వెళ్లిన కథారచయిత బండినారాయణ స్వామి”అతని మరణంలో విషాదంతో పాటు ఒక సంతోషం కూడావుంది. ఉదయం యథాప్రకారం వాకింగు నుండి వచ్చాడు. కాఫీ తాగినాడు. భార్యతో నాలుగు మాటలు మాట్లాడి కుప్పకూలి పొయాడు. ఆమె భయంతో అరిచింది. అతన్ని బతికించుకోవడానికి గుండెపై ఒత్తిడి చేస్తుంటే నిద్రనుంచి లేచినట్లు లేచి “నేను నిద్ర పోతున్నాను. నాకు అందమైన కలలు వసున్నాయి. దయచేసి పాడు చేయవద్దు” అని అతని చివరి మాటలు వివరిస్తూ, “అతడు సమాధుల తోట్లో పూసిన ఒక పూవు. నా నల్లని చందమామ”అన్నాడు.
 
     రెవెన్యూ శాఖలో ఇనస్పెక్టరుగా పని చేస్తున్న వ్యక్తి ఇంతికి కావాల్సిన చక్కెర, కిరోసిన్ వంటివి అందరిలాగే బ్లాకులో కొనడం మీరెక్కడైనా చూశారా??
 
    అదేశాఖలో పని చేస్తూ ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తిని, అదే సంస్థ”మీరు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల్సిన పని లేదు. యథాప్రకారం ఆఫీసులోనే వచ్చి కూర్చొండి. చేతనయితే ఏదయినా పని చేయండి. మీరు ఇక్కడికి రావడమే మా కార్యాలయానికి గౌరవ సూచిక. ప్రతి నెలా గౌరవ వేతనం పదివేలిస్తాం.”అని ఎక్కడైనా అన్నట్లు విన్నారా??
 
     అంగ్లేయుల కాలంలో చెప్పలేను కానీ, ఇప్పటి వ్యవస్తలో అంతటి నిజాయితీ, వృత్తికి అంకితమై పోయిన మొదటివాడూ చివరివాడూ బహుశహా చిలుకూరి దేవపుత్ర ఒక్కడేనేమో!!
 
     బయటి ప్రపంచానికి తెలియని దళిత, బడుగు వర్గాల జీవితాల కఠోర సత్యాల్ని ఇంకా చెప్పాల్సిన దేవపుత్ర మరణం అభ్యుదయ సమాజానికీ, అణగారిన ప్రజానీకానికీ తీరని లోటు.
 
    అతడందించిన కథల కేతనాన్ని యువతరం అంది పుచ్చుకొని,విశ్వమానవ సమాజం వైపు నడిపించుకు పోయినప్పుడే  అతనికి నిజమైన నివాళి !!

*

డారియో ఫో – అతని నాటకరంగం

dario1[వ్యాసానికి చిన్న పరిచయం:

13 అక్టోబరు 2016 నాడు మరణించిన డారియో ఫో కు 1997లో నోబెల్ బహుమతి వచ్చింది.

ఆ సందర్భంగా కన్నడ రచయితా, నాటకకర్తా – ఎస్. బాబురావు – ఓ విపులమైన వ్యాసం వ్రాసి “మెయిన్‌స్ట్రీమ్” పత్రికలో 1998 జనవరిలో ప్రచురించారు.

డారియో ఫో నిష్క్రమించిన సందర్భంగా ఆ వ్యాసపు అనువాదం అందిస్తున్నాం]

*

ఈ ఏడాది సాహిత్యపు నోబెల్ బహుమతిని ఇటాలియన్ నాటక రచయితా, రంగస్థల కళాకారుడూ, రాజకీయ కార్యకర్త అయిన డారియో ఫో కు ప్రకటించడం ద్వారా స్వీడన్‌కు చెందిన నోబెల్ ఫౌండేషన్ సంస్థ వాళ్ళు చరిత్ర సృష్టించారనే అనాలి; ఇప్పటివరకూ సాహిత్యానికి ఇచ్చిన నోబెల్ బహుమతుల్లో ఇది అత్యంత వివాదాస్పదం మరి!

ఈ ప్రకటన పడమటి దేశాలలోని ‘ఉన్నత తరగతి’ సాహితీ వ్యవస్థలను ఒక కుదుపు కుదిపి వదిలిపెట్టింది. ఇది కలిగించిన అలజడిని అంచనా వెయ్యడానికి ఒక మార్గముంది: ఓ శుభోదయాన మన కేంద్ర సాహిత్య అకాడెమీ వాళ్ళు  ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ‘నౌటంకీ’ నాటకకర్తకు ఎవార్డు ప్రకటిస్తే మన కాకలు తీరిన రచయితలంతా ఎలా స్పందిస్తారూ? – అదిగో ఆ బాపతు స్పందన వచ్చింది – పాశ్చాత్య దేశాల సాంస్కృతిక సాహిత్య రంగాల్లో ‘డారియో ఫో కు నోబెల్ బహుమతి’ అన్న వార్త విని. సమకాలీన నాటకరంగపు తీరుతెన్నుల గురించి అంతగా పట్టించుకోని పెద్దమనుషులు అడిగినా అడిగి ఉంటారు – “అసలీ డారియో ఫో అనే మనిషి ఎవరూ?” అని! సాహిత్యానికి సంబంధించి ఎన్‌సైక్లోపీడియాలలోనో, చరిత్ర గాథలనో తిరగేసినా…  రచయితల జీవిత చరిత్రలూ, అకారాది క్రమ వివరాలు ఉన్న నిఘంటువులూ తిరగేసినా వాళ్ళకి డారియో ఫో గురించి వివరాలు తెలిసే అవకాశం అతి తక్కువ. ఒక వేళ కాస్తో కూస్తో వివరాలు ఉన్నా,  ‘అతనో హాస్య నాటక రచయిత, నాటకరంగపు జోకరు’ – అన్న అంటీ ముట్టని వివరం తప్పించి సమగ్రమైన సమాచారం దొరకదు. ఇంకెవరైనా మరికాస్త రాస్తే – అతనో షోమాన్, ఒక బఫూనూ అనవచ్చు. నిజమే. అతను షోమాన్, క్లౌన్ అన్న మాట నిజమే. కానీ అతని పరిచయానికి ఈ మాటలు చాలవు. మరింకెన్నో చెప్పుకోవాలి.

డారియో ఫో కు నోబెల్ బహుమతి రావడం వల్ల నొచ్చుకొని, కోపం తెచ్చుకొన్న వ్యవస్థల్లో ఇటలీకి చెందిన ఘనత వహించిన ‘రోమన్ కాథలిక్ చర్చి’ ఒకటి. ఈ నిర్ణయం తమకెంతో విస్మయం కలిగించిందనీ, ఇది అత్యంత ఊహాతీతమైన నిర్ణయమనీ ఈ చర్చివారు ఇప్పటికే అంగీకరించి ప్రకటించి ఉన్నారు.

కానీ విశ్వవ్యాప్తంగా ఉన్న – మరో ప్రపంచానికి చెందిన – రంగస్థల అభిమానులకు ఈ ప్రకటన ఆనందహేతువే. ‘ఓ అరాచకవాది హఠాన్మరణం’ (The Accidental Death of an Anarchist) లాంటి విజయవంతమైన తన ప్రముఖ నాటకాల ద్వారా డారియో ఫో ఇండియాలాంటి తృతీయ ప్రపంచపు దేశాలలో ఎనభైల నాటి నుంచీ బాగా పేరు నలిగిన మనిషే; కానీ ఈ అభిమానులు కూడా ‘ఇలాంటి అద్భుతం ఎలా జరిగిందా’ అని ఆశ్చర్యపడక మానరు.

ఇలాంటి విభిన్న విపరీత స్పందనలకు కారణం సుస్పష్టం. మనం ఆలోచించే బాణీలోంచీ, మనం అంగీకరించే పద్ధతిలోంచి చూస్తే డారియో ఫో ఒక రచయితా, నాటకకర్తా కానే కాదు. అమెరికాకు చెందిన ఆర్థర్ మిల్లర్, బ్రిటన్‌కు చెందిన ఎడ్వర్డ్ బాండ్, జర్మనీకి చెందిన పీటర్ హండ్కే ల లాంటి నాటక రచయిత గాదు. అసలు అన్నిటికీ మించి డారియో ఫో ముఖ్యంగా ఒక రాజకీయ కార్యకర్త. తను తన మిగతా పార్టీ సహచరుల కన్నా ‘అతి ఎక్కువ ఎరుపైన’ కమ్యూనిస్టు. ఆయన దృష్టిలో నాటకాలు రాయడమన్నది – ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నాటకాలకు స్క్రిప్టు తయారు చెయ్యడమన్నది – ఒక గమ్యం కానేగాదు; ఓ గమ్యం చేరడానికి ఉన్న ఒకానొక మార్గం మాత్రమే. షేక్‌స్పియర్, మొలిరే (MOLIERE), బ్రెక్ట్ లాంటి అప్పటి, ఇప్పటి గొప్ప నాటక రచయితలందరి లాగానే డారియో ఫో కూడా రంగస్థలంతో అత్యంత సన్నిహిత ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యక్తి. తన నాటకాలలో ప్రముఖ భూమికలను పోషించిన మనిషి. అంతే గాకుండా ఆయన రంగస్థల కార్యకలాపమంతా అసలు సిసలు రాజకీయ కార్యకలాపమే. చుట్టూ అనుదినం జరిగే సంఘటనలూ, అసంఘటనలూ అతని నాటకాలకు ముడిపదార్థాలు. అవి అతనిపై కలిగించే ప్రభావమూ, ఒత్తిడుల ఫలితమే అతని నాటకాల స్క్రిప్టులు. ఆ స్క్రిప్టులని – ఆయా నాటకాల రిహార్సళ్ళలో, తన భార్య ఫ్రాంకా రమే (Franca Rame) సాహచర్యంలో మరింత నిర్దుష్టంగా రూపొందించి పదును పరుస్తాడు డారియో ఫో.

జీవితపు ప్రయోజనం, బతుకు పరమార్థం, మానవాళి గమ్యం – ఇలాంటి గంభీరమైన, ఘనమైన విషయాల గురించి గాఢంగా ఆలోచించే మేధావి రచయితల వర్గానికి చెందిన మనిషి కాడు డారియో ఫో. అతి వేగంగా క్షీణించి పోతోన్న మానవ సంబంధాల గురించీ, తన నుంచీ, తన పరిసారాల నుంచీ క్రమక్రమంగా దూరమైపోతున్న ఆధునిక మానవుని అసహాయత గురించీ డారియో ఫోకు పట్టదు. గతంలోకి శోధించుకుంటూ వెళ్ళి ఈనాటి సమస్యలకు అలనాటి చరిత్రలోనో, పురాణాలలోనూ సమాధానాలు వెతకడం కూడా ఫో కు చేతగాదు. రచయితగా ఆయన ధ్యేయం ఒక్కటే! సమాజంలోని కాపట్యాన్ని ఎండగట్టడం… ధనవంతులూ, మతాధికారులూ దొరతనంవారితో చేతులు గలిపి సామాన్య మానవుడ్ని ఎన్ని రకాలుగా హింసలకు గురి చేస్తున్నారో – ఆ తతంగాన్ని బయటపెట్టడం. తన రచనల ద్వారా, తన రంగస్థల కార్యకలాపాల ద్వారా ప్రపంచాని కాస్తో కూస్తో మార్చి దాన్ని మాములు మనుషులు మరికాస్త సుఖంగా బతకగల ప్రదేశంగా రూపొందించడమే ఫో అభిమతం. ‘ఇది జరగాలంటే మనకు మరికాస్త మంచి ప్రభుత్వం అవసరం… మంచి రాజకీయ వ్యవస్థ అవసరం… సాంఘిక వ్యవస్థ అవసరం’ అని డారియో ఫో అంటున్నట్టు అనిపిస్తుంది.

***

dario2డారియో ఫో 1926లో ఇటలీ దేశపు లంబార్డీ ప్రాంతంలో సాన్‌జియానో అన్న చోట పుట్టాడు. వాళ్ళ నాన్న రైల్వేలో స్టేషన్ మాస్టారు; తన తీరిక సమయాల్లో సరదాగా స్థానిక నాటకల్లో పాత్రలు పోషించేవాడు. బాగా చిన్నప్పటి నుంచే వాళ్ళ నాన్నని నాటకాల్లో వేషాలు వేయడం గమనించిన డారియో ఫోకు సహజంగానే నాటకరంగమంటే ఆసక్తీ, గాఢ అనురక్తీ కలిగాయి. 1950లో – తన ఇరవై నాలుగో ఏట – ఫో మిలన్ నగరం వచ్చి అక్కడే ఓ నాటక సమాజంలో చేరాడు. ఆ సమాజం వాళ్ళు తమ సంగీత రూపకాలకు వ్యంగ్య వ్యాఖ్యానాలు రాసే పని అతనికి అప్పజెప్పారు. వాటి ఉద్దేశమల్లా ప్రేక్షకులను రంజింపజెయ్యడమే. అక్కడ పని చేస్తున్నప్పుడు అతనికి ఫ్రాంకా రమే అన్న సమమనస్కురాలితో పరిచయం అయింది. అది 1953లో పరిణయానికి దారితీసింది. ఫ్రాంకా రమే ఇటలీ దేశపు ‘గిల్లారీ’ అన్న సంచార నాటక ప్రదర్శకుల కుటుంబాలకు చెందిన వ్యక్తి. జానపద నాటక కళారీతుల బాగా తెలిసిన కుటుంబాలవి. అప్పటికప్పుడు ఆశువుగా నాటకాలు రూపొందించి ప్రదర్శించడంలో నిష్ణాతులు ఆ కుటుంబాల వాళ్ళు. వాళ్ళలో ఎక్కువగా చదువు ఉండకపోవడంతో వాళ్ళు తమ నాటకాలను రాత ప్రతుల మీద కన్నా తమ తమ (ఆశు) సృజనాత్మక శక్తి మీదే ఎక్కువగా ఆధారపడుతూ ఉండేవారు. నటులంతా తమ తమ శక్తియుక్తులన్నీ నటనా ప్రావీణ్యాన్నీ జోడించి రంగస్థలం మీదనే అప్పటికప్పుడు ఓ నాటకాన్ని రూపొందించేవారు.

ఫ్రాంకా రమేతో పరిణయం ఫో కు ఓ వరంగా పరిణమించింది. నాటకరంగం సహజమూ, శక్తివంతమూ అవ్వాలంటే అది తన సంప్రదాయ రంగస్థల రీతులను అవగాహన చేసుకుని ఆ అవగాహన లోంచి పెరిగి పెద్ద అవడం అత్యవసరం అన్న విషయాన్ని ఫో అర్థం చేసుకొన్నాడు. తన భార్య ద్వారా జానపద రంగస్థల కళారీతుల్ని తెలుసుకొన్నాడు. మెళకువల్ని తెలుసుకొన్నాడు. ఆ  ఎరుక సాయంతో తన కళకు మెరుగులు దిద్దుకొన్నాడు.

సిద్ధాంతపరమైన భావ స్పష్టతకూ, తన రచనలు సాధికార రాజకీయ ప్రమాణాలు సంతరించుకోవడం కోసమూ – లెనిన్, మార్క్స్‌ల తర్వాత అంత గొప్ప వామపక్ష సిద్ధాంతవేత్త అని పేరు పడ్డ – గ్రామ్‌స్కీ అన్న ఇటాలియన్ సోషలిస్ట్ మేధావి రచనలను ఫో అధ్యయనం చేశాడు. ఐతిహాసిక సంప్రదాయాలలోనూ బ్రెక్ట్ ప్రతిపాదించిన ‘అన్యాక్రాంత ప్రభావం’ (Alienation effect) అన్న సూత్రంతోనూ పరిచయం ఏర్పరుచుకొన్నాడు. అలాగే మయకోవ్‍స్కీ నాటకాలనూ అధ్యయనం చేశాడు. వీటన్నిటి వల్ల డారియో ఫో లో గణనీయమైన పరిణామం సంభవించింది… ఒక కొత్త అభిజ్ఞత (Awareness) రూపుదిద్దుకుంది. ఆ మిలన్ నగరపు నాటక సమాజంలో పని చేయడం ద్వారా తన శక్తియుక్తుల్ని వృధా చేసుకుంటున్నానీ, మార్పుని నిరోధించే బూర్జువా వర్గపు ఆనందం కోసం సంగీత రూపకాల చెళుకులు రాయడం శుద్ధ పనికిమాలిన వ్యవహారమనీ గ్రహించాడు. 1968లో ఆ సమాజం నుంచి బయటపడి తన భార్యతోనూ, మరికొద్దిమంది కమ్యూనిస్టు మిత్రులతోనూ కలసి నువో సినా (Nuova Scena) అన్న మరో నాటక సమాజం స్థాపించాడు. అప్పటికే తను గ్రహించి, జీర్ణించుకొన్న అనేకానేక ప్రభావాల నేపథ్యంలో – అవసరమైతే ఆయా ప్రభావాలనూ, భావాలను మరి కాస్త మెరుగులు దిద్దుకుంటూ తన సాంఘిక, రాజకీయ, వ్యంగ్య నాటకాలకు రూపకల్పన చేశాడు. ‘మిస్ట్రియో బఫో’ (Mistero Buffo – 1969), ‘ఓ అరాచకవాది హఠాన్మరణం’ (The Accidental Death of an Anarchist – 1970), ‘ఇవ్వలేమూ, ఇవ్వం కూడానూ’ (Can’t Pay, Won’t Pay – 1974) – ఆ నాటకాలలో కొన్ని.

ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క నాటకరంగాన్ని నిర్మించడమన్నది డారియో ఫో లక్ష్యం. తన నాటక ప్రదర్శనల కోసం రంగస్థలాలనూ, నాటకాల హాళ్ళను అద్దెకు తీసుకోవడం మానేసి, వాటిల్ని కార్మికుల క్లబ్బుల్లో, పారిశ్రామిక ఆవరణల్లో ప్రదర్శించడం మొదలెట్టాడు. క్రమక్రమంగా తన రంగస్థల కార్యకలాపాల్లో కార్మికులని భాగస్వాములుగా చెయ్యగలిగాడు. వారి సాంస్కృతిక స్పృహను ఆ రకంగా పెంపొందించగలిగాడు.

డారియో ఫో తన నాటకాలకు ఇతివృత్తాలను తన పరిసరాల లోంచీ, సమకాలీన సమాజంలోంచీ గ్రహిస్తాడు. పోలీసుల క్రూరత్వం, రాజ్యపాలనలో ‘చర్చి’ జోక్యం, స్త్రీవాదం, తీవ్రవాదం, అవకతవక ఆర్ధిక విధానాల వల్ల పెరుగుతోన్న ద్రవ్యోల్బణం – ఇవీ, ఇలాంటివీ ఆయన ఇతివృత్తాలు. ఈ నాటకాల సాయంతో ఆయన వ్యవస్థలోని కాపట్యాలను బహిరంగపరచి ఎగతాళి చేస్తాడు. మతాధికారులూ, ధనాధికారులూ చేతులు కలిపి జనాన్ని ఎలా దోచుకొంటున్నారో చూపిస్తాడు. ఆ చూపించడం కూడా మళ్ళీ కరవవచ్చే వ్యంగ్యంతోనూ, పొట్టచెక్కలయ్యే హాస్యంతోనూ కలగలిపి చూపిస్తాడు. దాంతో ప్రేక్షకులందర్నీ నవ్వించడమూ, అలరించడమూ మాత్రమే కాకుండా వాళ్ళతో ఆయా విషయాలను గురించి గాఢంగా ఆలోచింపజేస్తాడు, కార్యాచరణకు సిద్ధపడేలా చేస్తాడు.

కాలం చెల్లిన ఊహాజనితమైన విషయాలనెప్పుడూ తీసుకోడు డారియో ఫో. ప్రజా బాహుళ్యానికి చెందిన ఏదేనీ విషయంగానీ సంఘటనగానీ జరిగినప్పుడు – దాని వాడీ వేడీ ఇంకా తగ్గకముందే – ఆ నేపథ్యంలో ఓ నాటకానికి రూపకల్పన జేసి ప్రదర్శిస్తాడు ఫో. ఉదాహరణకు పినో ఫినెల్లీ ( Pino Pinelli) అనే ప్రముఖ కమ్యూనిస్టు కార్యకర్తను అరాచకవాది అన్న ఆరోపణల మీద పోలీసులు అరెస్టు చేసి ‘లాకప్పు డెత్తు’కు గురి చేసినప్పుడు ఫో వెంటనే స్పందించాడు. పోలీసులు ఆ కేసును అణచిపెట్టి, ఆత్మహత్యగా వక్రీకరించి, తమ తమ ఆత్మరక్షణా… పధకాల రూపకల్పనకు పాల్పడినప్పుడు – ఆయా వివరాలు క్షుణ్ణంగా తెలిసిన డారియో ఫో ఇంకా ఆ కేసు కోర్టు గదుల్లో ఉండగానే ‘ఓ అరాచకవాది హఠాన్మరణం’ అన్న నాటకాన్ని రూపొందించి విజయవంతంగా ప్రదర్శించాడు. ఆ ప్రదర్శన జరిగిన చాలా రోజుల తర్వాత కోర్టువారి తీర్పు వచ్చింది. ఫో తన నాటకంలో చూపించిన విషయం నిజమని ఆ తీర్పు నిర్ధారించింది. పినెల్లీ నిర్దోషి అనీ, పోలీసు జులుం వల్లనే మరణించాడనీ ధృవీకరించింది.

తన నాటకాల ప్రదర్శనలలో ఫో – ఆ ప్రదర్శన ముగిసిన తరువాత – నాటకం గురించి చర్చ నిర్వహిస్తాడు, ప్రేక్షకులందరినీ ఆ చర్చలో భాగస్వాములు చేస్తాడు. ఆ రకంగా ప్రతి ప్రదర్శనా ప్రజాప్రదర్శనగా పరిణమిస్తుంది.

***

dario3తమ నువో సినా సమాజాన్ని స్థాపించిన కొద్ది సంవత్సరాలకే ఫో, ఫ్రాంకా రమేలు ఆ నాటక సమాజ స్థాపనా ప్రయోగం విఫలమయిందన్న సంగతి గ్రహించారు.  ఆ సమాజంలో ఉన్నది తమ తోటి కమ్యూనిస్టులే అయినా వాళ్ళు అధికారగణంతో కుమ్ముక్కై నువో సినా ధ్యేయాలనూ, లక్ష్యాలనూ దెబ్బతీస్తున్నారని ఆ దంపతులు గ్రహించారు. నువో సినా నిర్వహణలో కమ్యూనిస్టు పార్టీ అధినేతల నిరంతర జోక్యం కూడా వీళ్ళకి దుస్సహమయింది. అలా విడివడి మరో నలుగురు అతి సన్నిహితులతో కలసి ‘ల కమ్యూన్’ (LA COMMUNE) అన్న మరో చిన్న సమాజాన్ని స్థాపించారు వారు. ఆ విడివడటం పుణ్యమా అని అన్నేళ్ళుగా శ్రమపడి సంపాదించిన సంపత్తిని – లారీ, వ్యాన్లూ, ఎలక్ట్రికల్ పరికరాలు – ఫో వదులుకోవలసి వచ్చింది.

తన భావాలూ నాటకాల పుణ్యమా అని ఓ రంగస్థల సమాజాన్ని స్థాపించి కొనసాగించడమన్నది ఫోకు ఒక ఒడిదొడుకు వ్యవహారంగా పరిణమించింది. శక్తివంతమైన శత్రువర్గం ఏర్పడిందతినికి – మతాధికారులు, ప్రభుత్వ గణం, కాపిటలిస్టులు – అతను ఎవరినయితె ఎండగడుతున్నాడో వాళ్ళంతా సహజంగానే అతని మీద ధ్వజమెత్తారు. అతడినీ అతడి నాటక సమాజాన్నీ సమూలంగా నాశనం చెయ్యాలని వాళ్లంతా కంకణం కట్టుకొని ప్రయత్నించారు. అతని రాతప్రతులు ముందస్తుగా గవర్నమెంటు వారి అనుమతి పొంది తీరాలన్నారు. ఆ అనుమతి పొందే ప్రక్రియలో విపరీతమైన మార్పులకూ, కోతలకూ గురి అయ్యేవి. అలా సెన్సారయిన నాటకాలను మళ్ళీ ఏ మార్పులు చేర్పులూ చెయ్యకుండా ప్రదర్శిస్తున్నారని నిర్ధారించడం కోసమూ, అప్పటికప్పుడు రంగస్థలం మీద ఆశువుగా చేర్పులు చెయ్యడాన్ని అరికట్టడం కోసమూ ప్రేక్షక సముదాయంలో ప్రతీసారీ ఓ పోలీసు అధికారి ఉంటూ ఉండేవాడు. అయినా ఇలాంటి ప్రతికూల పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మార్చుకోగలిగాడు డారియో ఫో.

సంభాషణల సెన్సారు కత్తిరింపుల వల్ల కోల్పోయిన నాటక భాగాలను శరీరపు కదలికల ద్వారా, ముఖ కవళికల ద్వారా పూరించుకోడమూ నేర్చాడు. పెరోల్ మీద విడుదలయిన నేరస్థులు తమ తమ అనుదిన కదలికలను పోలీసులకు ముందస్తుగా విన్నవించుకోవలసిన రీతిలో డారియో ఫో కూడా తన నాటక సమాజం ఏ రోజు ఏ ఊర్లో ప్రదర్శన ఇవ్వబోతోందో – ఆ వివరాలు పోలీసులకు చెప్పి అనుమతి తీసుకోవలసి వచ్చేది. ప్రభుత్వం వారి ఆగ్రహానికి గురవుతామన్న భయం వల్ల థియేటర్ల యజమానులు తమ ప్రాంగణాలను డారియో ఫో కు అద్దెకివ్వమనేవాళ్ళు. మిస్ట్రియో బఫో లాంటి ‘చర్చి వ్యతిరేక’ నాటకాలను ప్రదర్శించినపుడు ఆయా బిషప్పులు ఆ నాటకాల పోస్టర్లను గోడల మీద నుంచి చించెయ్యమని పోలీసులకు చెప్పేవాళ్ళు. ఇవన్నీగాక భౌతిక దాడీ, హింసా ఉండనే ఉంది. అరెస్టులూ, నిర్బంధాలూ, జైళ్ళూ, లాకప్పులూ – వీటికి అంతే లేదు. డారియో ఫో నలభైసార్లు అరెస్టుకు గురయ్యాడు. కొన్నిసార్లు హత్యాప్రయత్నాలకూ గురయ్యాడు. ‘ఓ అరాచకవాది హఠాన్మరణం’  నాటక ప్రదర్శనలో ఓసారి బాంబు పేలింది. మరోసారి ఫాసిస్టు ముఠాల వాళ్ళు ఫ్రాంకా రమేను కిడ్నాప్ చేసి నిర్బంధంలో ఉంచారు. మరొకరూ మరొకరూ అయితే ఇవన్నీ చూసి బెంబేలెత్తిపోయేవారేమో గానీ డారియో ఫో ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎంతో నిబ్బరంతో ఎదుర్కున్నాడు. తన ఆదర్శాలకూ, రంగస్థల నమ్మకాలను సడలనివ్వకుండా నలభై సంవత్సరాల పాటు నిలచి ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన ఈ నోబెల్ బహుమతి అతని శత్రువుల్ని నిర్వీర్యం చేసి డారియో ఫో ను మరింత శక్తిమంతుడిని చేసే అవకాశం ఉంది.

డారియో ఫో కు నోబెల్ బహుమతి రావడమన్నది రంగస్థల ప్రపంచానికి అనేక విధాలుగా ముఖ్యమైన విషయం. సాహిత్య రంగంలో నాటక రచన అన్నది చిన్నచూపుకు గురవుతోంది; కవిత్వం, నవల లాంటి ప్రక్రియలకున్న గౌరవం నాటక రచనకు లేదు. గత అరవై ఏళ్ళుగా సాహిత్యానికి నోబెల్ బహుమతి అందుకొన్న వాళ్ళ పట్టికను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. 1936లో యుగెనీ ఓ నీల్, 1969లో శామ్యూల్ బెకెట్ – ఇప్పుడు డారియో ఫో. అంతే. అంతా కలసి ముగ్గురు. ఒక్కొక్కరికీ మధ్య దాదాపు ముప్ఫై ఏళ్ళ వ్యవధి.  బ్రెక్ట్ లాంటి లబ్దప్రతిష్ఠులు సైతం ఆ నోబెల్ ‘గౌరవాన్ని’ అందుకోలేకపోయారు; అది గౌరవమే అయిన పక్షంలో నాటకాలు రాయడం మరింత కష్టమయిన పని అవ్వడం వల్లనో లేదా ఆ నాటక రచన కళాప్రదర్శనకు ఉన్న మార్గాలు అతి పరిమితం అవ్వడం వల్లనేమో – అంకితభావంతో కథా కవిత సృష్టి చేసే వాళ్ళున్నంత విరివిగా నాటకకర్తలు ఎప్పుడూ లేరు మనకు. ఇప్పుడు ఇలా డారియో ఫో కు నోబెల్ బహుమతి రావడమన్నది నాటక రచన ప్రక్రియకు నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని మనం ఆశించవచ్చు.

అలాగే డారియో ఫో బాణీ నాటకాలను ‘మోటు నాటకాలు’గా పరిగణించేవాళ్ళకూ కొదవేం లేదు. రాజకీయాలు, సాంఘిక ప్రయోజనాలు, వ్యంగ్యం, ఫార్సు, అసంబద్ధత, శ్రుతిమించిన హాస్యమూ కలగలసిన ఆయన నాటకాలను చాలామంది ఇప్పటిదాక ‘అశ్లీల’ (vulgar) నాటకాలని నిరసించారు. ఈ బహుమతి పుణ్యమా అని పరిస్థితులలో కొంత మార్పు రావచ్చు. వాటికి మరికాస్త ఆదరణా, ‘గౌరవం’ లభించవచ్చు. సాంఘిక సమస్యలను ఎత్తి చూపడానికీ, సామాజిక చైత్యన్యాన్ని కలిగించడానికీ నాటకరంగం ఒక ప్రముఖమైన మార్గం అన్న కనీస స్పృహ ప్రజల్లో రావచ్చు. సమస్యల గురించి ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించడానికీ, ఆ ఆలోచనల సాయంతో సమాజంలో మార్పును తేవడానికీ రంగస్థలం ఒక శక్తివంతమైన ఆయుధం అన్న గుర్తింపు కలగవచ్చు.

మన దేశం విషయానికి వస్తే దీని ప్రాధాన్యత ఇంకా ఎక్కువ. ఇటలీ లాగానే మన దేశంలో కూడా సాంఘిక సమస్యలు అనేకం. రాజకీయ సమస్యలకి కొదవు లేదు. ఇటలీలో ‘గిల్లారీ’ బాణీ జానపద నాటక కళారూపాలు ఉన్నట్టే మనకూ మన మన శక్తివంతమైన జానపద నాటక సంప్రదాయాలు ఉన్నాయి. నిజానికి మన ప్రతీ భాషకు తమ తమ విస్పష్ట జానపద నాటక సంప్రదాయాలున్నాయి. ఇటలీలానే మనకూ రాజకీయ నేపథ్యం గల, చైతన్యవంతమైన ‘రంగస్థలం’  ఉంది; అది ఇంకా బాల్యావస్థలోనే ఉందన్న సంగతి వేరే మాట. డారియో ఫో కు ఈ విశిష్ట పురస్కారం లభించడమన్న విషయం మనకూ మన రాజకీయ నేపథ్యపు రంగస్థల వ్యవస్థకూ; మన మన జానపద నాటక కళారీతులకూ ఒక నూతన స్ఫూర్తిని కలిగించగలగాలి.

మన రంగస్థలాన్ని మరింత చైతన్యవంతం చెయ్యాలి, శక్తివంతం చెయ్యాలి. అలా అని మనమంతా డారియో ఫో ను గుడ్డిగా అనుకరించాలనీ గాదు; అతని ధోరణీ, అతని బాణీ, అతని పద్ధతులూ పరిశీలించి వాటిని మన పరిస్థితులకు అనుగుణంగా మలచుకొని స్వీకరించాలి. అలాగే మన సాహితీవేత్తలు నాటక రచనను కూడా చేపట్టవలసిన అవసరం ఉంది. డారియో ఫో రచన పద్ధతులను అధ్యయనం చెయ్యడం ద్వారా మన మన సామాజిక సమస్యల మీద విరివిగా నాటక రచన చేసి ఓ  ‘నాటకాల నిధి’ని సృష్టించాల్సిన అవసరం ఉంది. ఆ నిధి రూపకల్పన అన్నది రంగస్థలానికి ఎంతో అవసరం. దేశానికి ఇంకా అవసరం.

 

ఆంగ్లం: ఎస్. బాబూరావు

తెలుగు: దాసరి అమరేంద్ర

*

 

బొజ్జ తారకం ఎవరు?!

tarakam1
బొజ్జా తారకంగారితో నాకు గల పరిచయాన్ని మీతో పంచుకోవాలనిపిస్తోంది.
2004 డిసెంబర్ లో నేను జపాన్ నుంచి భారత దేశానికి తిరిగివచ్చినప్పుడు కొద్దికాలం హైదరాబాద్ లో టూరిజం డైరెక్టర్ గా ఉన్నాను. ఆ సమయంలో కొన్ని దళిత సమావేశాలలో బొజ్జ తారకంగారిని కలిసేవాడిని.  ఆయన సంపాదకీయంలో వెలువడే ‘నీలి జెండా’ పత్రికను తెప్పించుని  దళితుల సమస్యలమీద రాస్తున్న వ్యాసాలను చదివి అర్దం చేసుకునేవాణ్ణి.  గనుముల జ్ఞానేశ్వర్ గారు కనబడినప్పుడు బొజ్జ తారకంగారి గురించిన వార్తలు చెప్పేవారు. అప్పుడు నేను కొత్తగా దళిత కవిత్వం రాయడం మొదలు పెట్టాను. కవితలు ఆంధ్ర జ్యోతిలో ప్రచురింపబడ్డప్పుడు తారకంగారు తప్పకుండా ఏదో విధంగా చదివేవారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కనబడినప్పుడు నా కవిత్వం గురించి  ప్రస్తావించి మరిన్ని దళిత సమస్యలమీద రాయాలని ఉద్భోధించేవారు. ‘పోరాడాలి. లేకపోతే  అన్యాయం జయిస్తుంది ‘ అని తరుచుగా అనేవారు.
ఏ విషయాల మీద రాయాలి, ఏ విషయాల మీద పోరాటం చెయ్యాలి అని మార్గదర్శకత్వం చేసేవారు. “బొజ్జ తారకం గారిని ఎలా చూడాలి”  అనే సందేహం నన్ను వెంఠాడేది. ఒక కవిగా, రచయితగానే కాదు, సామాజిక, దళిత న్యాయవాదిగా, పౌరహక్కుల కార్యకర్తగా అన్ని రూపాల్లో నాకు కనబడేవారు. సమాజంలో బాధ్యత గల పౌరుడిగా ఎన్ని పాత్రలు నిర్వహించాలో అన్ని పాత్రలనూ ఆయన సమర్ధవంతంగా నిర్వహించారు.  అందుకేనేమో ఈరోజు అన్ని వర్గాలవారు తారకంగారిని తమవాడిగా చెప్పుకుంటున్నారు. పౌరహక్కులకోసం ఇంతగా పోరాడిన నాయకుడు నాకు ఇంతవరకూ తారసపదలేదు. దళిత కులం నుంచి వచ్చిన తారకంగారు పౌరహక్కుల విషయంలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు. అనేక  బూటకపు పోలీసు ఎన్కౌంటర్లలో పాల్గొన్న అధికారులకు వ్యతిరేకంగా తారకంగారు సుప్రీం కోర్ట్ లో కేసు దాఖలు చేసి కేసు గెలిచారు . 2004లో  డాక్టర్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా  ఉన్నప్పుడు  ముస్లింలకు  రిజర్వేషన్లు ఇవ్వాలన్న కేసును తారకంగారు వాదించారు.  కారంచేడు దళితులపై జరిగిన హింసకు  నిరసనగా  తారకంగారు  ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక ప్రాసిక్యూటర్ పదవికి  1984 లో రాజీనామా చేశారు.
టోలీ చౌక్ లో ఉన్న ఆయన ఇంటికి ఎన్నోసార్లు వెళ్ళాను. అంబేద్కర్ గారు రాసిన రాసిన పుస్తకాలను తెలుగులోకి  ఆనువదించిన ఆయన సతీమణి విజయభారతిగారు కాఫీ ఇచ్చి కుశల ప్రశ్నలు వేసేవారు. 2007 లో నా మొదటి కవితా సంకలనం ‘దళిత వ్యాకరణం ‘ ఆవిష్కరణకు మొత్తం కార్యక్రమాన్ని తన బుజాలమీదకు ఎత్తుకున్న కవి శిఖామణిగారు  బొజ్జ తారకంగారిని  నా తరపున ఆహ్వానించారు. నా కవిత్వం చదివి మురిసిపోయి నన్ను తుల్లిమల్లి కాదు, ‘తుళ్ళీతుళ్ళిపడే విల్సన్ సుధాకర్’ అని తారకంగారు చమత్కరించారు. గత సంవత్సరం డిసెంబర్లో హైదరాబాద్ బుక్ఫెస్టివల్ కు సామాన్యగారి పుస్తకం ఆవిష్కరణకు బొజ్జ తారకంగారిని ఆమె ఆహ్వానించారు.  ఆమె తరపున నేను తారకంగారింటికి వెళ్ళీ ఆయనను, విజయభారతిగారిని కారులో ఎగ్జిబిషన్కు తీసుకువచ్చాను. ఆ సందర్భంగా ఆయనతో దళిత సోదరులమంతా ఫోటోలు దిగాము.
 tarakam2
దళిత వాణిగా పేరొందిన బొజ్జా తారకం గారి మరణ వార్త విని ‘ పౌర హక్కులకు  ఆసరాగా నిలబడ్డ చివరి బురుజు కూలిపోయింది ‘ అన్నారు ఆంధ్ర జ్యోతి సంపాదకులు కే. శ్రీనివాస్ గారు.  ‘బొజ్జ తారకం ఎవరు’ అనే ప్రశ్న నేటి తరానికి  కలగొచ్చు.  ఒక్క మాటలో తారకం గారిని నిర్వచించలేము.  దళిత, పౌరహక్కుల, సామాజిక కార్యకర్తగా, న్యాయవాదిగా,  ఆంధ్రలో రిపబ్లికన్ పార్టీ , దళిత మహాసభ సంస్థాపకుడిగా తారకంగారు ఎంతో సేవ చేశారు.  దళితుల మీద అగ్ర వర్ణాలు జరుఫుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఆయన నిరంతర పోరాటం చేసారు.  సెంట్రల్ ఊనివర్సిటీ విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్యోదంతాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి దేశంలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని వినిపించగలిగారు. మేజిస్ట్రేట్, హైకోర్ట్ , సుప్రీం కోర్ట్లలో దళితులు, మైనారిటీలు, కొండజాతులవారికి న్యాయ సహాయం అందించారు. అనారోగ్యం పాలయినా సరే  RPI ద్వారా అంబేద్కర్ ఆశయాలను యువతలో ప్రచార చేసేలాచివరివరకూ క్రుషి చేశారు.  జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశేష అధికారాలతో పోలీసు యంత్రాంగం చెలరేగిపోయి నక్సలైట్ ముద్రలు వేసి యువతను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నప్పుడు ‘ పోలీసులు  అరెస్ట్ చేస్తే’ అనే పుస్తకాన్ని రచించి పౌరహక్కుల కోసం క్రుషి చేశారు. ఈ పుస్తకం Jane Maxwell రచించిన Where There Is No Doctor అనే పుస్తకం పొందినంత ప్రచారం పొందింది.
1992 లో చుండూర్ లో దళితులపై అగ్రవర్ణాలు జరిపిన మారణ కాండపై తారకం గారు జరిపిన న్యాయపోరాటం ఎంతో ప్రసిద్ధమయ్యింది. మా ఇద్దరి మధ్య కొన్నిసార్లు చుండూరు కేసు ప్రస్థావనకు వచ్చేది. ఏకపక్షంగా కొందరు న్యాయమూర్తులు ఎలా వ్యవహరిస్తున్నదీ, చివరకు వారి మనసులో ఏమున్నదీ తారకం గారు నాకు చెప్పేవారు. ఒకానొక దశలో తారకంగారిమీద కోర్టు ధిక్కార నేరాన్నిమోపుతానని ఒక న్యాయమూర్తి బెదిరించారనీ, మీరు ఏమిచేసుకుంటారో చేసుకోండని  అన్నాననీ తారకం గారు చెప్పి వారి పక్షపాత ధోరణి పట్ల విచారం వ్యక్తం చేసేవారు.
చుండూరు ఊచకోత కేసులో  తారకంగారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. దళిత కెమెరా తో ఒక ముఖాముఖిలో మాట్లాదుతూ ” చుండూరు కేసులో ఇచ్చిన తీర్పు తర్కవిరుద్ధమయినది, పక్షపాతంతో కూడినది  అని  చీత్కరించారు. హైకోర్టు చేసిన వాదన నేర న్యాయశాస్త్రం మీమాంసకు, రుజువులున్న సాక్ష్యాలకు, అన్ని నియమాలకు విరుద్ధంగా ఉంది.  తొలి తీర్పు ఇచ్చిన  ట్రయల్ కోర్టు మొత్తం సాక్ష్యాల్నిచర్చించించి తిరుగులేని ఒక నిర్ధారణకు వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు హైకోర్టు  అన్ని నిబంధనలను గాలికి వదిలి, నేర న్యాయ శాస్త్ర మీమాంసను తెలియక,  అశాస్త్రీయతార్కికంతో  అన్ని ఆరోపణలున్న దోషులను నిర్దోషులుగా విడుదల చేసింది” అని అభిప్రాయపడ్డారు.
tarakam3
హైకోర్టు  వాదన ప్రకారం- కారణాలలో ఒకటి ఏమిటంటే  ” ప్రాసిక్యూషన్ ‘సంఘటన సమయాలను రుజువుచెయ్యడంలో విఫలమైంది, ఏ సమయంలో బాధితులకు  గాయాలు ఏ తగిలాయో చెప్పలేదు.”  కేవలం భౌతికమైన వైరుధ్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని మేము న్యాయమూర్తులకు చెప్పామని” తారకంగారు అన్నారు. కానీ నేరపూరిత న్యాయ మీమాంసకు, విధానాలకు సంబంధం లేకుండా, చట్టం, సాక్ష్యం ప్రసక్తి లేకుండా హైకోర్టు తీర్పును ఇచ్చింది. ఎటువంటి వాదనలకోసం ఎదురు చూడకుండా దోషులను వదిలివెయ్యాలని హైకోర్ట్ నిర్ణయించిందని మాకు అర్దమయ్యింది అని తారకం గారు నాడు వ్యాఖ్యానించారు. చివరకు వారు కొరినట్లే జరిగింది అని ఆయన అన్నారు.
తారకంగారు తెలుగు రాష్ట్రాలలోని  అట్టడుగు వర్గాలకు  ఆయన ఒక గొప్ప వాగ్దానం. దళితులు మీద దుర్మార్గపు చర్యలపై నిత్రంతరం పోరాటం జరిపిన వ్యక్తి. ఒక గొప్ప నాయకుడు, కవి, వక్త , కార్యకర్త. ఒక గొప్ప రచయిత విజయ భారతి జీవిత భాగస్వామి. తమ మీద అత్యాచారాలు జరిపిన వారిమీద ప్రతీకారం తీర్చుకోవాలని కోరిన ఏకైక వ్యక్తి. ఆయన మరణంపై సంతాపం తెలుపని ఆంధ్ర ప్రదేష్ ముఖ్యమంత్రి విజ్ఞతను మేము ప్రశ్నిస్తున్నాము.
*

బాబూ! గుడ్ బై టు యూ!

kasi1

(సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు,  గొప్ప  వక్త, విర‌సం వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు యాధాటి కాశీప‌తి  హైద‌రాబాద్‌లో కన్నుమూశారు. కాశీపతి స్మృతిలో   ఆయన  సన్నిహిత  మిత్రుడు  హెచ్చార్కె   నాలుగు  మాటలు…)

*

క కంచం ఒక మంచం అంటారు స్నేహానికి పరమావధిగా. ఆ అవధిని చవి జూచిన స్నేహం మాది. ముషీరా బాదు డిస్త్రిక్ట్ జైలులో ఆ రెండు పనులూ చేశాం. ఒకే కంచం లోంచి తిన్న సందర్భాలు, ఒకే సిగరెట్ పంచుకున్న సందర్భాలు సరే…. అవి కొల్లలు.

అది కాదు. ‘మీసా’ (‘మెయింటెనెన్స్ అఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్’) డిటెన్యూలకు జైలు బ్యారక్ లో  పొడుగ్గా రెండు వరుసలుగా మంచాలు వేసి వుండేవి. రాత్రులు పక్క పక్క మంచాల మీద దోమ తెరలు కల్పించే హేజీ వెలుతురులో కబుర్లు చెప్పుకుంటూ కబుర్లలోంచి నిద్దట్లోకి జారిపోయేది మేమిద్దరం.  వేర్వేరు మంచాలు వీలుగా లేవని, మా మంచాల్ని దగ్గరగా జరుపుకుని, ఒకే మంచంగా చేసుకుని, దోమ తెరల్ని కలుపుకుని మాట్లాడుకుంటూ నిద్రపోయే వాళ్ళం కూడా. ఇది చూసి ఒక అనంతపురం వీరుడు మేము ‘స్వలింగ సంపర్కుల’మని జైలు గోడల మీద రాశాడు. మేము ఆ దుష్ప్రచార వ్రాతను గుర్తు చేసుకుని, చాల సార్లు నవ్వుకున్నాం. మా స్నేహాన్ని నిలబెట్టుకున్నాం.  ఇప్పుడెలా వుంటుందో ఏమో గాని, అప్పుడు… 70లలో… ‘గే’ అనే ప్రచారం ఎవరి గురించి చేసినా, అది హీనమూ, దుర్మార్గమే.

‘ఎవ్వడికీ, దేనికీ భయపడగూడదు, ఇతర్లు మన గురించి ఏమనుకుంటారనే దానికి ఆసలే భయపడకూడదు, మనకు నిజ్జంగా ఎలా ఇష్టమో అలా జీవించాలి. ఏదైనా మనం బలంగా అనుకుంటున్నామంటే, అది నూటికి తొంభై వంతులు తప్పై వుండదు’ అనేది ఆనాడు మా ‘బాబు అండ్ బాబు’ లెజెండ్. బాబు అంటే నేను లేదా తను. అది మేము ఒకరినొకరం పిలుచుకున్న పిలుపు.

మేము పరస్పరం విభేదించలేదా? ఎందుకు లేదూ?! ఇద్దరం సిపిఐ ఎం ఎల్ చండ్ర పుల్లారెడ్డి గ్రూపులో క్రియాశీలురం. తను బాగా సీనియర్. ఎమర్జెన్సీ తరువాత పార్టీలో నేను ఏం చేయాలనే విషయంలో, పార్టీలో చీలిక ఏర్పడుతున్నప్పుడు మేము ప్రవర్తించిన పద్ధతుల్లో విభేదాలు వచ్చాయి. విభేదాలు మా వంటి వాళ్ళ మధ్య ఎలా రావాలో అలాగే వచ్చి, అలాగే కరిగిపోయాయి.

నేను హోల్ టైమర్ గా వొద్దని, భార్యాబిడ్డలను చూసుకుంటూ జీవించాలని తను కోరుకోడమే కాదు. ‘ఈ రాజకీయాలు వాడికి చాత కావు, వాడు సంసారం చూసుకుంటూ, వుద్యమం పనులు చేయనీ’ అని పార్టీతో వాదించాడు. నేనూ వినలేదు, పార్టీ వినలేదు.

పార్టీ చీలిక రోజుల గురించి చిన్న సరదా వుదాహరణ. ఒక ముఖ్య కార్యకర్త కమ్ రచయిత్రి విషయమై పార్టీ రాష్ట్ర నాయకులున్న సమావేశంలో చర్చ  వచ్చింది. ఆమె ‘అటు’వైపు వున్నారంటూ నేను అన్నానని… కాశీపతి చెప్పాడు. కాశీపతి అక్కడ అలా అనగూడదు. అలా అనడం నష్టకరం. ఎందుకంటే ఆ సమావేశంలో నా మాటల్ని ఇష్టపడని ‘అటు’వైపు వాళ్లు కూడా వున్నారు. అదింకా చీలికలో శ్రేణీకరణ పూర్తి కాని కీలక దశ. నేను ఆమె గురించి అలా అనలేదని, కాశీపతి చెబుతున్నది నిజం కాదని  వెహిమెంట్ గా ఖండించాను. అక్కడున్న వారంతా నా మాటలనే సీరియస్ గా తీసుకున్నారు. కాశీపతి అబద్ధం చెప్పినట్టయింది.

బయటికి వచ్చాక, టీ కొట్టులో పూర్తిగా మా ‘వైపు’ వాళ్లే వుండగా కాశీపతి ఆ విషయం ప్రస్తావించాడు. “ఏమిరా, నువ్వు నాతో అలా అనలేదా?” అని అడిగాడు. “అన్నాను. ఆ మాట నీతో అన్నాను. అది నీ వరకే వుండాలి. దాన్ని నువ్వు అతిక్రమించావు. నేను అబద్ధం చెప్పను. ఇంత రేర్ గా అబద్ధం చెప్పినా, సమావేశంలో నా మాటకు వుండే విలువ నీ మాటకు వుండదు, నువ్వు చెప్పేది నిజం అయినప్పటికీ. నాకున్న ఆ కాస్త లివరేజ్ ని నేను అక్కడ వుపయోగించుకున్నాను. అలా వుపయోగించుకోడం రైటే” అనే సరికి, “ఉరేయ్, నువ్వు దేవాంతకుడివి” అని నవ్వేశాడు కాశీపతి.

(‘దేవాం’తకుడిని కావడానికి బాగా ప్రయత్నిస్తున్నాను బాబూ! కుదరడం లేదు. )

ఇటీవల కొంతకాలం, నాకు నేను మానసిక ఆరోగ్యం కోల్పోవడం వల్ల, తనను ఆ తీవ్ర అనారోగ్యంలో చూడడం చాతగాక…  విషయాలు తెలుసుకుంటున్నా…. ఎక్కువగా కలుసుకోలేకపోయాను. శ్రీ శ్రీ మీద తను సరదా భాషలో రాసిన సీరియస్ పుస్తకం ‘మందు’ హాసం ఆవిష్కరణలో చూశాను. అనారోగ్యం శరీరానికే గాని, బుద్ధికి కాదని ఆ గంట తన వుపన్యాసం నిరూపించింది.

రాజకీయ ఆర్థిక అధ్యయనంలో, ప్రజా సమస్యలను భౌగోళిక (గ్లోబల్) దృక్పథంతో వివరించడంలో తరిమెల నాగిరెడ్డి తరువాత అంతటి వాడనిపించే అద్భుత మేధావి యాధాటి కాశీపతి. నాగి రెడ్ది లాగే కాశీపతి కూడా పెదిమల మధ్య సిగరెట్ వుంచుకుని, గంటల తరబడి మాట్లాడే వాడు. బహుశా ఈ సిగరెట్ కూడా తనకు తరిమెల నాగిరెడ్డి నుంచి అబ్బిన విద్యే అయ్యుంటుంది.

తన సంగతేమో గాని, నా పొగ మాత్రమే కాశీపతి పెట్టిన నిప్పుదే. జైలుకు వెళ్ళక ముందు నాకు సిగరెట్ల అలవాటు లేదు. జైలుకు వెళ్ళాక పక్కన కాశీపతి రోజుకు పది పాకెట్ల చార్మినార్లను తగలేసే వాడు. నేను ముందే డిప్రెస్డ్ గా వున్నానేమో కాశీపతి సిగరెట్ డబ్బాలు నా వల్ల కూడా ఖాళీ కావడం, నా ‘పాకెట్ మనీ’ నుంచి కూడా సిగరెట్లు కొనడం మాకు తెలీకుండానే మొదలయిపోయింది. నన్నూరు వెంకట్రెడ్డన్న వంటి వారు ‘పిల్లోన్ని చెడగొడుతున్నాడ’ని కాశీపతిని కోప్పడే వారు. ఇద్దరం సిగరెట్ మానలేదు. మొన్న మొన్నటి వరకు.  

మా స్మోకింగ్ అలవాటు గురించి ఇద్దరం తరచు అనుకునే వాళ్ళం. స్మోకింగ్ వల్ల మనిషి ఆయుష్షు పదేండ్లు తగ్గుతుందట కదా?!.ఓకే, లెటజ్, ఎంజాయ్. క్రిష్టొఫర్ మార్లోవ్ నాటకంలో డాక్టర్ ఫాస్టస్ తన ఆత్మను దయ్యానికి ఇచ్చి ఏవేవో ఆనందాల్ని తీసుకుంటాడు. మేము మరీ అంత కాదు. మా జీవితాలు వందేళ్ళ లోంచి ఒక పదేళ్లు సిగరెట్లకు ఇచ్చేస్తాం అని హాస్యమాడుకునేది. ఆ లెక్కన ఇప్పుడు కాశిపతికి ఎన్నేళ్లు? తను సిగరెస్టస్ కు ఇచ్చినవి కూడ కలుపుకుంటే, దరిదాపు ఎనభయ్యయిదు అవుతాయి.

బాబూ, మరేం ఫరవాలేదు! ఎవడు  బతికేడు మూడు యాభైలు. మనం అనుకున్నదే కదా, మనకు నిజంగా ఇష్టమయినట్టు జీవించాం. ఇలా జీవించేట్లయితే, ఇక, ఎవరం ఎప్పుడు మరణిస్తేనేం?

‘ఎనీ టైమ్ ఎనీ సెంటర్’ అని సవాలు చేసి బతికే వాళ్ళం మనం. ఎప్పుడయితేనేం, ఎక్కడయితేనేం?

ఇట్స్ ఓకే బాబూ!

ఈ ‘బాబు అండ్ బాబు’ ఏంటి అనుకుంటారు ఇది చదివే వాళ్లు.

కాశీపతికి ఒక జబ్బుంది. తన కన్న చిన్న వాళ్లైతే చాలు పరిచయం కాగానే ‘ఒరే’ అనేస్తాడు. నన్నూ అలా అనే సరికి ఖోపమొచ్చింది. ఇది తన బ్రాహ్మణ్యాహంకారపు మిగులు అని విమర్శించాను కూడా.  ఒకటి రెండు సార్లు తిరిగి తనను నేనూ ఒరే అని చూశా. అది నాకు బాగుండ్లేదు. నా కన్న కనీసం పదేళ్లు పెద్దాడు . అది మానేసి పేరుతో పిలిచి చూశా. మేము సన్నిహితమయ్యే కొద్దీ పేరు మానేసి ‘అది కాదు బాబూ’ తరహాలో బాబూ అనడం మొదలెట్టా. ఆ మాట తనకు నచ్చింది. తను కూడా బాబూ అనడం మొదలెట్టాడు. ఇద్దరం ఒకరికొకరం ‘ఒరే’లం కాలేదు గాని, ఒకరికొకరం బాబూ అయ్యాం. ‘బాబూ అండ్ బాబూ’…. అనేది ఆ ‘మూవీస్’ వాళ్ళకేమో గాని, మా స్నేహానికీ మంచి బ్యానర్ అయిపోయింది.

బాబూ రావు (మాచవరం ), చలపతి (అరుణోదయ), బూర్గుల ప్రదీప్, శ్యామ్(మధుసూదనరాజు తమ్ముడు), ఇంద్రారెడ్డి (మాజీ మంత్రి), కృష్ణారెడ్డి (తరువాత, విమలక్క భర్త) …  అందరికీ మా ‘బాబూ- బాబూ’ వ్యవహారం కుంచెం అసూయగా వుండేది.

కాశీపతి బయటి నుంచి తెప్పించిన స్టౌ తో ఏవేవో వంటలు చేసి మా మీద ప్రయోగాలు చేసే వాడు. తన వంట పూర్తి కాగానే, దానికి ఫ్రెంచి పుడ్డింగ్ అనో పోర్చుగీస్ పుడ్డింగ్ అనో నామకరణం కూడా చేశాక స్టౌ దగ్గర మా పిల్లల క్యూ. “వాడేడీ? బాబు.. బాబూ.. ఏడీ వాడు?’ అని లైనులో వెనుక వున్న నేను ముందుకొచ్చి, ప్లేటు చాచే వరకు వడ్డన మొదలెయ్యేది కాదు. మరి వాళ్ళకు అసూయ వుండదూ.

వాళ్ళకు చాటుగా చెప్పేవాడు. ‘వాడు, పాపం, పెండ్లైన ఇరవై రోజులకే జైలుకు వచ్చాడు రా. పెద్దోళ్ళం మాకైనా ఒకటి రెండు పెరోల్స్ వచ్చాయి. అదేంటో, వాడికి ఒక్క పెరోలు కూడా రాలేదు. పాప పుట్టినప్పుడు కూడ రాలేదు. పాపం, వాన్ని మనం బాగా చూసుకోవాలి’ అనే వాడు.

ఇప్పుడు అదేం అవసరం లేదులే బాబూ. ఆ ‘ఇరవై రోజుల’ జయకు, అప్పుడు నేను చూడలేదే అని నువ్వు అంగలార్చిన చిన్నారి మమతకు.. ఇప్పుడు నిరంతరం దగ్గరగా వుంటున్నాను. సంతోషంగా వుంటున్నాను. నీ ఫ్రెంచ్, పోర్చుగీస్ పుడ్డింగ్ లను మిస్ అవుతూనే వుంటా.

అయినా జీవితం ప్రహిస్తూనే వుంది. నీ బిడ్డలు ప్రగతి, వెన్నెల…. నువ్వు ఏం చెప్పావో అలాగే…. తమకు నిజ్జంగా ఇష్టమైన విధంగా, అదే సమయంలో ప్రగతి శీల రీతులలో జీవిస్తున్నారు. డోంట్ వర్రీ. వాళ్ళ సంగతి, పుష్ప సంగతి కూడా వాళ్ళు చూసుకుంటారు.

నువ్వొప్పుకుంటావో లేదో గాని, మిగిలిన ప్రపంచం కూడా బాగుంది. తన సంగతి తాను చూసుకోగలనని ప్రతీప శక్తుల తీవ్ర ముట్టడి మధ్య కూడా ప్రపంచం నిరూపిస్తున్నది. మనిషి తనకిష్టమైన విధంగానే జీవిస్తాడు. సందేహం లేదు. ఎవరు ఎలా నియంత్రించినా, ఎవరు ఎలా బుజ్జగించినా… కాసేపు కాలక్షేపానికి అవీ ఇవీ బొమ్మలతో ఆడుకుంటాడేమో గాని…. మనిషి తనకు ఇష్టమైన విధంగానే జీవిస్తాడు. అన్ని నిరంకుశాల్ని, బుజ్జగింపులను, అబద్ధాల్ని కాదని… కాలిలో విరిగిన తుమ్మ ముళ్ళను పిన్నీసు పెట్టి తీసుకున్నంత సహజంగా, సునాయాసంగా తీసేసుకుని…  నడుస్తాడు. నడవడం చాల ఇష్టం మనిషికి, కలలు కంటూ నడవడం మరీ ఇష్టం.

కాశీపతీ! మనం కలిసి పంచిన కలల్ని ఇక్కడ మిగిలి వున్న వాళ్ళం పంచుతూనే వుంటాం. ఎక్కడికక్కడ కలల్ని పంచడానికి, అబద్ధాల్ని తుంచడానికి ఇక్కడ ఎవరమో ఒకరం మిగులుతూనే వుంటాంలే. అబద్ధాల కలుపు తీయడం కూడా కలల సేద్యంలో భాగామే.

“హెచ్చార్కె! ఎవరో అఫ్సర్, జీఎస్ రామ్మోహన్ అట. నీకు మెసేజ్ లు పెట్టారట. చూడు. నీ క్లోజ్ ఫ్రెండు ఎవరో చనిపోయారట. మమత వాళ్ల మేసేజ్ చూసి ఆఫీసు నుంచి ఫోన్ చేసింది.”….  అని పొద్దున్నే మొద్దు నిద్ర పోతున్న నన్ను లేపి కూర్చోబెట్టి, ఆ తరువాత, నేనిది రాస్తుంటే పక్కనే తన ల్యాప్ టాప్ లో తానేదో చేసుకుంటున్న అన్య పాపకు, బహుశా, నువ్వు నేను గుర్తుంటాములే బాబూ! మమత, అన్య వాళ్లకు, ప్రగతి, వెన్నెల వాళ్ళకు మన పనుల్లో మిగుళ్ళు గుర్తుంటాయిలే.

గుడ్ బై, బాబూ! ఐ విల్ మిస్ యూ!.

*

  

మానవుడితో…

 

 

-బాలసుధాకర్ మౌళి

~

( చ‌ల‌సాని వ‌ర్థంతి స‌భ‌ ఈ 24 ఉదయం  9.30గంట‌ల‌కు  విశాఖ‌ప‌ట్నం పౌర గ్రంథాల‌యం, ద్వార‌కాన‌గ‌ర్‌

అధ్య‌క్ష‌తః వ‌ర‌వ‌ర‌రావు
చ‌ల‌సాని ప్ర‌సాద్ సాహిత్య స‌ర్వ‌సం – 1 ఆవిష్క‌ర‌ణ‌
ఆవిష్క‌ర్తః కృష్ణాబాయి)

*

రెండేళ్ల కిందటి సంగతి – విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో ‘జనకవనం సభ’ ప్రారంభకులుగా కె. శివారెడ్డి గారు వచ్చారు. పబ్లిక్ లైబ్రరీకి దగ్గర్లోనే ఏదో హోటల్లో రూం.

సాయంత్రం సభ అయింతర్వాత – శివారెడ్డి గారు వున్న హోటల్ రూంకి వెళ్లాను. ఒక అరగంట సేపు కవిత్వం – వర్తమానం ..ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్న తర్వాత – ‘ హాఫ్ చేతుల తెల్లని షర్ట్, వొక మామూలు ప్యాంట్ ‘ వేసుకుని ‘చలసాని ప్రసాద్ గారు’ వచ్చారు. అదే మొదట – నేను ఆయనతో మాట్లాడింది. ఆయన గొంతుని, మాటని దగ్గరగా వినడం. చూడడం.. నాకు మిగిలిన అనుభవాలు. అంతకు ముందు విజయనగరంలో, విశాఖలో వొకటి, రెండు సభల్లో చూసాను. శ్రీశ్రీ కి పరమ భక్తుడని, విప్లవానికి నిబద్ధుడని -నేను ఆయన గురించి విన్నవి. చలసాని గారి సాహిత్యంతో పరిచయం వుంది నాకు. ఆయన వ్యాసాలు, కవిత్వం చదివాను. ‘జైలు’ మీద రాసిన అతని కవిత్వం, ఆ కవిత్వ నిర్మాణం నన్ను ఆశ్చర్యపరుస్తుంటుంది.

ఆ రోజు శివారెడ్డి గారే నన్ను చలసాని గారికి పరిచయం చేసారు. నా కవిత్వసంపుటి గురించి చెప్పి.. ఆయనకి వొక కాపీ యిమ్మన్నారు. నేను బ్యాగ్ లోంచి తీసి.. ఆయనకు అందించాను – ‘ గురుతుల్యులు… చలసాని ప్రసాద్ గారికి’ అని రాస్తూ –   ఆయన వొక నిమిషం అటు యిటూ తిప్పి చేతిలో వుంచుకున్నారు. నేను చాలా ఆనందపారవశ్యానికి లోనయ్యాను. అదే ఆయనతో తొలుత నేను వుండటం.

మళ్లీ..

2015 ఏప్రిల్లో విశాఖలోనే ‘వైజాగ్ ఫెస్ట్’ లో భాగంగా ‘పుస్తక మహోత్సవం’ లో వొకసారి కలిసాను. వీక్షణం బుక్ స్టాల్ ముందు కూర్చున్న  ఆయన వద్దకు వెళ్లాను. నేను ఆయనకు జ్ఞాపకంలో లేను. ‘ఆనాటి హోటల్లో శివారెడ్డి గారితో వున్నప్పటి సందర్భం’ – గుర్తుచేసాను. గుర్తు తెచ్చుకున్నారు. ‘ఓహో నువ్వా… ‘ అని వొక చిరునవ్వు నవ్వి నా చేతిని తన చేతుల్లోకి తీసుకున్నారు. మళ్లీ మురిసిపోవడం నా వంతు.

ఆ తర్వాత..

రెండు మూణ్ణెళ్లు పోయాక ఆయన ఇక లేరని వార్త తెలిసింది. జూలై 25, 2015 న విశాఖలో ఆయన ఇంటి వద్ద ఆయన పార్దీవ దేహాన్ని చూడడమే చివరిసారి. ఒక స్వాప్నికుడు – ఒక మానవుడు.. నాకు తెలిసిన కొన్ని నెలలకే భౌతికంగా లేకపోవడం నన్ను చాలా బాధకు లోను చేసింది. వెంటనే ఆయన అంతిమ యాత్రకు వెళ్లటం – నా తీవ్ర కాంక్ష. చాలా ఉద్విగ్నంగా అనిపించింది. మనసులో ఆ ఉద్విగ్నతతోనే విశాఖ బయలుదేరాను. అంతిమ యాత్రకి ముందు – చలసాని ప్రసాద్ గారి ఇంటి వద్దే జరిగిన సభలో వి.వి, కాత్యాయని విద్మహే గారు, వివిధ ప్రజాసంఘాల బాధ్యులు యింకా చాలా మంది చలసాని జ్ఞాపకాలను రుద్ధకంఠంతో పంచుకున్నారు.

సభంతా వొక గంభీర వాతావరణం పరచుకుంది. అలాంటి సభల్లో వుంటేనే నేను వున్నట్టనిపించింది. జీవించినట్టనిపించింది. నిజంగా ప్రాణంతో వున్న మనుషుల మధ్య బతికినట్టనిపించింది. వొక వీరుని మరణం గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది. ” నా హృదయం దుఃఖించింది – స్పూర్తిని పొందింది. ” వక్తల మాటల్లో చలసాని గారి ‘ఆ గొప్ప ఆకాంక్ష’ గురించి అప్పుడే విన్నాను. అదే : ” తలుపుల్లేని ఇళ్లు, జైళ్లు లేని దేశం, తరగతి గదులు లేని బడులు ” నిజంగా అది అందరి ఆకాంక్ష కూడా. నేను… అప్పుడు అందరి ముఖాల్లోకి చూసాను. ఎవరి ముఖంలోనైనా కురవడానికి సిద్ధంగా వున్న మేఘాలే కనిపించాయి. ముఖాల అడుగున వున్న తేజోవంతమైన కాంతీ కనిపించింది.

chalasani

అంతిమ యాత్ర మొదలయ్యింది.

రాష్ట్రం నలుమూలల నుంచి తెలిసిన, తెలియని అనేక మంది మనుషులతో నడవడం, ప్రయాణించటం – నా జీవితంలో వొక ఉద్విగ్నపూరిత అనుభవం. విశాఖ రోడ్డు మీద యాత్ర సాగి.. A.U medical institute కి దేహాన్ని అప్పగించటం – చలసాని గారితో అనుబంధం వున్న వొక్కొక్కరు వెళ్లి ఆయన దేహం ముందు భోరున విలపించటం – ఇంక నాలో కంపనం మొదలయ్యింది. వరవరరావు, పాణి, కె. వరలక్షి గారు, అరసవిల్లి కృష్ణ గారు , ప్రసాద వర్మ గారు, కెక్యూబ్ వర్మ గారు, రివేరా, అద్దేపల్లి ప్రభు గారు వొకరా ఇద్దరా అనేకులు అనేకులు. నేను వరవరరావు గారి దగ్గరకు వెళ్లి నిల్చొన్నాను- అంతకు వొకసారి కలిసాను.  నా కవిత్వం చదివానని చెబుతూ..  అనంతమైన ప్రేమ  నిండిన ఆ చేతులతో నన్ను దగ్గరకు తీసుకున్నారు. ఆ చేతులు నాకు అలాగే అనిపించాయి.

ఇక.. ఎనభై యేళ్ల పైబడిన నిర్జీవదేహాన్ని అక్కడ అప్పగించాక.. నాకు దేన్నో వెతుక్కోవాలనిపించింది. వెతుక్కుంటూ వెళ్లాలనిపించింది. సముద్రం గుర్తొచ్చింది. తిన్నగా సముద్రానికే నడిచాను.

సముద్రం , జనం – వొక్కటేనేమో.

జనంలో వున్నప్పుడూ, సముద్రం దగ్గర వున్నప్పుడూ – వొకే అనుభూతి. ఈసారి అనుభూతి – దుఃఖం. రెండింటి దగ్గరా దుఃఖమే. అన్ని అనుభూతులకూ, అనుభవాలకూ వాహిక ‘కవిత్వమే’  అవుతుంది.

 

ఈ కవిత : అప్పుడే – సముద్రం దగ్గరే రాసుకున్నాను.

chalasani1

 

 

కొన్ని ఉద్విగ్నక్షణాల మధ్య..

 

 

మౌనంగా పిడికిళ్లెత్తి

జోహార్లు చెబుతున్న దృశ్యమే కళ్ల ముందు –

ఏ స్వప్నాలు

కెరటాల్లా ఎగిసివస్తున్నాయో

ఏ దుఃఖాలు

లావాలా ఉబికి వస్తున్నాయో

ఆత్మీయులు

భుజం భుజం కలిపి కొత్త వారధిని నిర్మిస్తున్నవాళ్లు

ఏం కాకపోయినా

కన్నీళ్లు కార్చినవాళ్లు

ఎక్కడ నుంచో

పిడికెడు స్థైర్యాన్ని పొందినట్టు

అక్కడికక్కడే కాసింత స్ఫూర్తిని పొందినవాళ్లు

అంతా వొక దగ్గరే

అమరుని దేహం చుట్టూ చేరి

రేపటిని వాగ్దానం చేస్తున్నారు

 

2

 

తీరం వెంబడి నడుస్తున్నాను

వొక దిగులును దిగమింగుకుంటూ

గొంతెత్తి

అమరత్వాన్ని గానం చేస్తున్న

వొక సమూహాన్ని

అలల ఘోషలో పోల్చుకుంటున్నాను

ఇసుకపర్రల మీద

పాదాల గమ్యాన్ని వెతుక్కుంటున్నాను

చుట్టూ

జనసమూహం

సముద్రంతో

తమని తాము విభిన్నరూపాల్లో

వ్యక్తం చేసుకుంటూ…

 

3

 

సముద్రానికా శక్తి ఎక్కడినుంచొస్తుందో…

ఊయలలూపుతుంది

లాలిస్తుంది

అట్నుంచి యిటు

ఇట్నుంచి అటు తోస్తూ

ఈనిన దూడని

నిలబెడుతున్న తల్లి ఆవులా

అచ్చం

విప్లవాగ్నిలా…

 

4

 

వెళ్తూ వెళ్తూ

కొన్ని ఉద్విగ్నక్షణాల్ని

రక్తనాళాల్లోకి ఊదుకుంటున్నాను –

 

( చలసాని గారితో అల్పకాల పరిచయాన్ని తలచుకుంటూ… )

 

 

చలసాని గొంతులో …https://www.youtube.com/watch?v=IfqTbEzYAzo

చెరగదు ఆ దస్తూరి!

Gutala (1)

 

-జగద్ధాత్రి

~

జనవరి 4 2004 మోజాయిక సాహితీ సంస్థ రిజిస్టర్ అయి స్థాపించబడిన రోజు. ఆరోజే రామతీర్థ తెలుగు లోకి అనువాదం చేసిన టి.ఎస్. ఇలియట్ ‘ద వేస్ట్ లాండ్’ ‘వృధాత్రి’ పేరిట ఆవిష్కరణ. ఆరోజు హోటల్ మేఘాలయ లో రోజంతా జరిగిన సాహిత్య సభలో ఎందరెందరో మహానుభావులు, సాహితీ మూర్తులు. ప్రఖ్యాత కవి కె. శివారెడ్డి , అద్దేపల్లి, ఆదేశ్వరరావు గారు, ఇంకా ఎందరో. సభకు ప్రత్యేక ఆకర్షణ లండన్ నుండి వచ్చిన గూటాల కృష్ణ మూర్తి గారు. ఆరోజు ఆయనని , అచ్యుతరామరాజు గారిని గులాబీ మాలలతో సత్కరించుకోవడం మా సాహిత్య సంస్థకు
శుభారంభంగా భావించాము.

అనువాదాల ఆవశ్యకతను గూర్చి కొన్ని మాటలు మాట్లాడేరు గూటాల. ఇక ఆరోజు సాయంత్రం మా సాహితీ మిత్రుడు ప్రముఖ కవి ఏవిఆర్ మూర్తి తీసుకువెళ్లగా గూటాల దంపతులను దర్శించుకున్నాం, నేను శివారెడ్డి గారు ఇంకా కొందరు సాహితీ మిత్రులు. ఎంతో ఉత్సాహం తో సిగరెట్టు తాగుతూ ఆయన చెప్పిన కబుర్లు ఇప్పటికీ గుర్తు న్నాయి. శ్రీశ్రీ లండన్ వచ్చినప్పుడు తాను వచ్చిన పనిని కొంత వెనుక బెట్టినట్టు ఒక నాడు జి.కె. కి అనిపించి ,  ఆమాటే అంటే ఆ తర్వాత తాను వచ్చిన పని పూర్తి చేసేవరకు శ్రీశ్రీ మందు సేవించలేదని, చివరికి తను ఉండలేక బీరు
తాగేవాడినని, కనీసం అది కూడా తాగ కుండ పని పూర్తి చేసి అప్పుడు తాగాడు శ్రీశ్రీ అని చెప్పారు. శ్రీశ్రీ కోసం ఒక గదిని ప్రత్యేకంగా పెట్టి
అందులో ఆయనకి కావల్సిన మదిరను ముందే ఏర్పాటు చేసానని నవ్వుతూ చెప్పేరు.
ఆయనతో ఉన్న ఆయన శ్రీమతి తో కూడా నేను కాసేపు ముచ్చటించాను. ఎందుకంటే అక్కడ ఉన్న వారందరిలోనూ మహిళను నేనొక్కతినే. ఆమె తో మాట్లాడుతూ ఉంటే ఎన్నో కబుర్లు. ప్రొఫెసర్ గా పని చేసిన ఆమె కూడా విద్యావేత్త, కావడం గొప్ప విషయం. అయితే ఆవిడ సైన్స్ ప్రొఫెసర్ . నాతో జి.కె. సాహిత్య పిచ్చి గురించి ఆవిడ కంప్లెయింట్లు ప్రేమగా చెపుతుంటే భలే మధుర స్మృతిగా మిగిలింది
ఆరోజు మా మదుల్లో ఇప్పటికీ.

‘ఫ్రాన్సిస్ థామ్సన్’ 1890 లలో పుట్టి 1907 లో మరణించిన గొప్ప ఇంగ్లీషు కవి. అతని గురించి పరిశోధన చేశారు జికె. అంతే కాదు ఫ్రాన్సిస్ థామ్సన్
సోసైటీ పెట్టి కొన్నాళ్లు ఒక పత్రిక కూడా నడిపారు. 1890 పొయెట్రీ సొసైటీనaపేరిట జికె చేసిన సాహిత్య పరిశోధన  అమోఘం. ఆంగ్లేయులకే వారెరుగని వారి కవులను పరిచయం చేసేరు గూటాల. ఇక తెలుగు తల్లికి ఆయన చేసిన సేవ విదేశాంధ్ర ప్రచురణలు స్థాపించి శ్రీశ్రీ మహాప్రస్థానం ని మహాకవి స్వదస్తూరిలో నమోదు చేయించి ఆ గీతాలను శ్రీశ్రీ స్వరం లో రికార్డ్ చేసి కేసెట్ను ఆ ఫాసిమైల్ ఎడిషన్ లోనే వెనుక ఒక చిన్న బాక్స్ లా పుస్తకం లోనే పెట్టి ప్రచురించారు. మేము వెళ్ళిన రోజు ఒక్క పుస్తకాన్ని శివారెడ్డి గారికి బహుకరించారు. తర్వాత పురిపండా వారి  పులి పంజా కూడా అలాగే తీసుకొచ్చారు.

శంకరంబాడి వారి ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ను తన గాన సుమస్వరం లో అజరామరంగా అందించిన టంగుటూరి సూర్యకుమారి గురించి చాలా ఖరీదైన పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకం లో ఆమె జీవిత విశేషాలను తెలియజేసే ఫోటోలు అన్నీ ఒక ఆల్బమ్ లా పొందు పరిచి ప్రచురించారు. సాంకేతికత ఇంకా ఇంత అభివృద్ధి చెందని ఆరోజుల్లో ఒక మహాకవి స్వరాన్ని దస్తూరిని భావి తరాలకు మిగిల్చిన  గొప్ప సాహితీ ప్రేమికుడు గూటాల.మరొక విషయం ఈరోజు సీనియర్ కధకుడు జయంతి వెంకట రమణ ని కలవడం జరిగింది. జి.కె. వారికి మేన బావ అని
తెలిసింది. అయనను కన్న బాబు అని పిలిచేవారట . ఎప్పుడూ ఇంగ్లీష్ పుస్తకం చదువుతూ ఉండెవాడు. 1956 నుండి సాన్నిహిత్యం అని గుర్తు చేసుకున్నారు .
ఏదేశమేగినా ఎందు కాలిడినా ఎంత కీర్తి గడించినా తెలుగు తల్లి ముద్దు బిడ్డగానే మిగిలి, తిరిగి మాతృ దేశం లోనే అసువులు బాసిన మహనీయుడు జికె. ఆయనకి సాహితీ జగత్తు అక్షర  నివాళి సమర్పిస్తోంది.

*

అట్టడుగు ముస్లిం రచయిత ‘అలీ’

-స్కైబాబ
~
ముస్లింవాద సాహిత్యంలో అట్టడుగు ముస్లింలలోంచి కవిగా రచయితగా తన గొంతుక బలంగా వినిపించినవాడు అలీ. తొలుత ‘పాన్‌మరక’ అలీగా, తరువాత ‘హరేక్‌మాల్‌’ అలీగా పేరుబడ్డ అలీ ‘పాన్‌మరక’ ‘జఖమ్‌’ ‘తమన్నా’ ‘గర్జన’ కవితా సంపుటులు, ‘జఖమ్‌’ కరపత్ర కవిత్వం, ‘హరేక్‌మాల్‌’ కథల సందూఖ్‌ వేశాడు. ఇంకా తన రచనలు వెలువరించే ప్రయత్నంలోనే ఉన్నాడు. అలాంటి అలీ సెల్‌ఫోన్‌ నుంచి మార్చి 6 అర్ధరాత్రి తను చనిపోయినట్లు కాల్‌ వస్తే ఎంతకూ నమ్మబుద్ధి కాలేదు. ‘అయ్యో! ఇంకా అతని జీవితంలోంచి మరిన్ని ముఖ్యమైన రచనలు రావలసి ఉండె కదా అని, ఈ మధ్యనే బిడ్డ షాదీ చేశాడు కదా, ఇంకా పెళ్లి కాని పిల్లలున్నారు కదా అని మనసు పిండేసినంత బాధయ్యింది.
మూడేళ్ల క్రితం హార్ట్‌ ప్రాబ్లమ్‌తో దవాఖానాలో చేరాడు అలీ. గుండె ఆపరేషన్‌ చేయడానికి అతని శరీర స్థితి సహకరించదని డాక్టర్లు చెప్పారు. దాంతో ఎలాగో అలా నెట్టుకొస్తున్నాడు. మార్చి 6న నల్లగొండలో ఒక ముషాయిరాలో పాల్గొనడానికి పేరు ఇచ్చాడు. రాత్రి ఎనిమిదింటికి కవిత రాస్తూ కూర్చున్నాడు. 9 ప్రాంతంలో శ్వాస తీసుకోవడం కష్టమవడంతో దవాఖానాకు తీసుకెళ్లారు. ముషాయిరా నిర్వాహకులు అలీ పేరు పిలవడానికి అతను కనిపించకపోవడంతో అతని సెల్‌కు ఫోన్‌ చేశారు. హార్ట్‌ ఎాక్‌తో అతను చనిపోయాడని విని విస్తుపోయారు!
నల్లగొండ పట్టణంలో పాన్‌డబ్బా నడుపుకుంటున్న అలీని 1986 చివరలో పరిచయం చేసుకుని ఆయన పాన్‌డబ్బా జీవితంపై కవిత కావాలని అడిగాను. పేజీలకు పేజీలు కవిత రాశాడు అలీ. దాన్ని మూడు పేజీలకు కుదించి ‘జల్‌జలా’లో మొదటి కవితగా చేర్చాను. 1998లో వెలువడిన ‘జల్‌జలా’ కవిగా అలీ పేరు మారుమోగిపోయింది. ఆ తరువాత ‘పాన్‌మరక’ పేరుతోనే అతను కవితా సంపుటి వేశాడు. ముస్లింల జీవితంలోని ఒక పాత్రే సాహిత్యకారుడుగా తెలుగు సాహిత్యంలో ఇన్నాళ్లు సంచరిస్తూ రావడం విశేషం. మన దేశంలోని, ముఖ్యంగా తెలంగాణలోని ముస్లిం జీవితాలకు సజీవ సాక్షిగా అలీ జీవితం గడిచింది. తన జీవితమంతా గరీబీనే తోడుగా నడిచిన కవి అలీ. సచార్‌ కమిటీ, మిశ్రా కమీషన్‌ రిపోర్టుల నేపథ్యంలో చూస్తే అలీ భారతీయ ముస్లింల ముఖచిత్రం.
అతని కవితా పాదాల్ని తడిమితే-
‘ప్రతిరోజు ఎంతోమంది నోళ్లు పండిస్తుాంను/ కాని నా బతుకే పండట్లేదు /నేనమ్మిన కింగ్‌సైజ్‌ సిగరెట్టే/ నా గరీబీ బీడీ వైపు చీదరింపుగా చూస్తుంది’ అప్పట్లోనే డిగ్రీ చేసిన అలీ ‘ఫ్రేంలో బంధించబడ్డ నా పట్టా/ బూజు పట్టిన గోడకు/ పాత క్యాలెండర్‌లా వేలాడుతుంది’ అంటూ ‘ఇంటర్వ్యూలకైతే పిలుస్తారు/ తీరా నా పేరు ‘అలీ’ అని తెల్సుకొని చిత్తు కాగితంలా విసిరేస్తే/ ఎండుటాకులా మిగిలిపోయాను’ ‘అలీ గల్లీకొచ్చి చూడు/ సోరుప్పు రాలే గోడలు/ సిమెంటు అతికిన ఉప్పుదేరిన కుండలు/ పగిలిన కవేలీ కప్పులు/ ఇమ్మిచ్చిన అర్రలు/ దిల్‌కే ఉప్పర్‌ థర్మామీటర్‌ రక్కే దేఖో/ ఓ కిత్‌నా దర్ద్‌ బతాయేగా!’ లాంటి ఎన్నో తాత్వికమైన కవితా పాదాలు ‘పాన్‌మరక’ కవితలో చూస్తాం. ఆ కవితను ముగిస్తూ ‘ఈ దేశపు గోడ మీద/ ఉమ్మేసిన పాన్‌ మరకలా/ నేనిలా ……….’ అంటూ ఈ దేశ ముస్లింల దయనీయమైన స్థితిని ప్రతిబింబిస్తాడు.
aliఅచ్చమైన తెలంగాణ కవి
– – – – – – – – – – – –
తెలంగాణ ఉద్యమానికి ఎన్నో కవితలను అలీ అందించాడు. ‘మత్తడి’, ‘పొక్కిలి’ ‘మునుం’ లాంటి కవితా సంకలనాల్లో అతని కవితలున్నాయి. ‘గర్జన’ పేరుతో తెలంగాణ ముస్లింవాద కవితా సంపుటి వెలువరించాడు. ‘మత్తడి’లో, తెలంగాణ ఉర్దూ, తెలుగు ముస్లిం కవితా సంకలనం ‘రజ్మియా’లోని అతని కవిత ‘అస్తర్‌’లో-
‘ఆటోవాలా చల్తే/ క్యా బేటా.. కైసే హై?’/ నా ‘జబాన్‌’ని అనకొండలేయో మింగినయ్‌/ నా పేర్లు మార్చి/ నా ఖాన్‌దాన్‌ మూసీల కలిపినయ్‌’ -అంటూ తెలంగాణలోని ఉర్దూ భాషను ఆంధ్రావారు ఎలా నాశనం చేశారో చెబుతాడు అలీ. రోడ్డు పక్కన చిల్లర వ్యాపారాలు చేస్తున్న ముస్లింల దీనస్థితిని చెబుతూ ‘పైజామా లాల్చీల కెల్లి/ తొంగి చూస్తున్న/ బొక్కల బొయ్యారం’ను వర్ణిస్తూ ‘హమారా జీనా/ జూతేకే నీచే/ అస్తర్‌ బన్‌గయా’ అంటాడు. ఇతర కవితల్లో- ‘ఈ గులాంగిరీ బతుకులు ఇంకెన్నాళ్లు’ అని నిలదీస్తాడు. ‘కుడిపక్క కృష్ణా కాల్వ ప్రవాహమున్నా/ మాకు ఫ్లోరిన్‌ నీళ్ల భూమి పొరలే దిక్కు’ అంటూ బాధపడుతూ ‘నైజామోడి పైజమా ఏనాడో ఊడింది/ ఇక ఆంధ్రోడి పంచె ఊడగొడదాం రాండ్రి’ అంటాడు. ‘తెలంగాణ సెంటిమెంటు కాదురా/ నా ఆత్మబలం.. నా ఆత్మగౌరవం.. నా జన్మహక్కు’ అని నినదించాడు.
గుజరాత్‌ ముస్లింల ఊచకోతపై కదిలిపోయిన అలీ ‘జఖమ్‌’ పేరుతో నాలుగు కవితలతో కరపత్రం వెలువరించాడు. అందులోని ఒక కవితలో ‘హమ్‌ మర్కే భీ జగాతే హైఁ/ సోయీ హుయీ దునియాఁ కో’ అనడం మొత్తం భారత సమాజాన్నే మేల్కొల్పే తత్వంగా చూడొచ్చు. ఇంకా ‘గుజరాత్రుల్లో నన్ను ఊచకోత కోసి/ అమ్మీజాన్‌ చిత్రపటాన్ని నగ్నంగా నిలిపావు’ అంటాడు.
అతని కవిత్వంలో ‘చెదలు పట్టిన గిర్కల బావి కలలు’ ‘నా కాలివేళ్ల సందుల్లో/ ఇరుక్కున్న మట్టి వాసనల నడుగు/ నేను దళిత వారసున్నేనని మద్దెల మోగిస్తాయ్‌’ ‘దువా ఒక్కటే దవా కాదు’ ‘ధర్నాకైనా హిమ్మత్‌లేని లాల్చి పైజామాలు/ రూమిటోపీలకు బిగించిన హద్దుల సంకెళ్లు/ నా నోట్లోని నాలుకకు కుట్లేస్తున్నాయి’ ‘నీ అంటరాని ఆత్మలకు అత్తరు పూస్తా’ లాంటి ఎన్నో వెంటాడే కవితా పాదాలు చూస్తాం.
Ali_4
ముస్లింవాద కథకుడు.. ‘హరేక్‌మాల్‌’ రచయితగా అలీ
– – – – – – – – – –  – – – – – – – – – – – – – – – – – –
‘వతన్‌’ ముస్లిం కథా సంకలనం వేసే పనిలో 2000 ప్రాంతం నుంచి మళ్లీ అలీ వెంటపడ్డాను. అప్పటికీ అలీ పాన్‌డబ్బా రోడ్డు వెడల్పు కార్యక్రమంలో తీసేస్తే నల్లగొండ పట్టణం రోడ్ల మీద నాలుగు పయ్యల బండి మీద ‘హరేక్‌మాల్‌’ అమ్ముకుంటున్నాడు. ఏ అడ్డా మీద ఉన్నాడో తెలుసుకోవడం, వెళ్లి ఆయనతో బండి పక్కన నిలబడి మాట్లాడ్డం చేసేవాణ్ణి. హృదయ విదారకంగా ఉండేది, అలీ హరేక్‌మాల్‌ దందా! నల్లగొండ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పట్టణాల్లో వారంలో ఒక్కోరోజు ఒక్కో పట్టణంలో అంగడి ఉంటుంది. ఆ అంగళ్లకు అలీ, అతని మిత్రులు హరేక్‌మాల్‌ మూటలు ఎత్తుకొని బస్సుల్లో పడి పొద్దున్నే వెళ్లడం, పొద్దుగూకిందాకా ‘దస్‌ కే చార్‌! దస్‌ కే చార్‌!’ అని అరిచీ అరిచీ మళ్ల మిగిలిన వస్తువులన్నీ మూటకట్టుకొని లాస్ట్‌ బస్‌కి నల్గొండ చేరడం.. ఆ బస్‌లో ఒక్కో ఊరిలో ఒక్కొక్కరు దిగిపోతుంటే ఒంటరిగా తమ గరీబీ గురించి ఆలోచించుకుంటూ రావడం.. అట్లా ఆ కథంతా రాశాడు అలీ.
దారిద్య్రరేఖకి ఇంకా కింద బతుకుతున్న ముస్లింల జీవితాలను పట్టించిన కథ ఈ హరేక్‌మాల్‌. డిగ్రీ చదివి రోజు కూలికి పోలేక హరేక్‌ మాల్‌ అమ్ముకుంటూ తన జీవితాన్ని చర్వణం చేసుకునే ఒక పేద ముస్లిం బతుకును సమగ్రంగా అన్ని కోణాలనుంచి చూపించిన కథ. అన్ని దారులు మూసుకు పోగా బతకలేక చావలేక బతుకుతున్న అనేక మంది ముస్లిం కుటుంబాలకు ప్రతీకగా కనిపిస్తాడు కథానాయకుడు. ముస్లింల చుట్టూ పరుచుకున్న పేదరికపు విషవలయం ఎప్పటికీ నశించేది కాదని, వెతలు ఎప్పటికీ తీరేవి కావని చెప్తూ భూమి గుండ్రంగా సైకిలు చక్రాల్లా ఉన్నదని చెప్తూ తమ జీవితాల్లో ఎప్పటికీ వెలుగులుండవని కథను ముగిస్తాడు రచయిత. ‘వతన్‌’ సంకలనంలో ఆ కథ ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది.
2006లో ‘హరేక్‌మాల్‌’ కతల సందూఖ్‌ పేరుతో సంపుటి వేశాడు అలీ. కథల సందూక్‌ అనడంలోనే మంచి ప్రయోగం కనపడుతుంది. కథల పెట్టె అని అర్ధం. ‘హరేక్‌మాల్‌’ కథతోపాటు మరో తొమ్మిది కథలు ముస్లింలలోని నిరుపేదల జీవితాలను రికార్డు చేశాయి.
ఆ సంపుటిలోని మిగతా కథల్లో ‘ముసీబత్‌’ కథ ‘ముల్కి’ ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచిక (2004)లో అచ్చయింది. ఈ కథ తెలుగు సాహిత్యంలో మరో భిన్నమైన పార్శ్వం. ఇందులో- సౌదీకి వలస వెళ్ళే పేద ముస్లింల లాగే అలీ బావ ఫయాజ్‌ సౌదీ వెళ్తాడు. అక్కడ కొన్నాళ్లకు హార్ట్‌ ఎటాకొచ్చి చనిపోతాడు! దోస్తులు ఇక్కడికి ఫోన్‌ చేసి ఫయాజ్‌ భౌతిక కాయాన్ని పంపాలంటే అతని దగ్గర ఉన్న పైసలు పంపలేము! పైసలు పంపించాలంటే బాడీని పంపలేము! అంటారు. ఏం చేయాలో ఎవరికీ ఏం తోచలేదు. అంతా ఫయాజ్‌ భార్య అభిప్రాయం అడిగారు. ఆమె ఏం చెప్పగలదు! ముగ్గురు ఆడపిల్లలు! పైసలేం మిగుల్చుకోలేదు. ఇల్లు గడవడం.. పెళ్లిళ్లు.. వగైరా ఎలా జరుగుతాయి?! గింజుకుని, నలిగీ, యాతనపడీ చివరికి పైసలు పంపించమనే- అందరి అభిప్రాయంగా చెబుతారు! -ఇంతటి గరీబీని చిత్రించాడు అలీ తన కథల్లో..!
అయితే ఇదే ‘ముసీబత్‌’ కథలో మరో ముఖ్యమైన విషయం రికార్డు చేశాడు అలీ.
ముస్లింల ఆచార వ్యవహారాలు ఒక్కో దేశంలో ఒక్కోవిధంగా ఉన్నాయి. దేశదేశాలకు ఇస్లాం వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఆయా దేశాల సంస్కృతుల్ని తనలోకి ఇముడ్చుకోవడం, ఇస్లామిక్‌ (అరేబియన్‌) సంస్కృతిని ఆయా దేశాలకు వ్యాప్తి చేయడం జరిగింది. జరుగుతున్నది. ఈ క్రమాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచమంతా ముస్లింల సంస్కృతి ఒకే రకంగా ఉండదని అర్థమవుతుంది. ఆ దిశలోనే మన దేశంలోని మన రాష్ట్రంలోని ముస్లింల సంస్కృతిని చర్చకు తెస్తూ షాజహానా, స్కైబాబ తమ సంపాదకత్వంలో ‘అలావా’ ముస్లిం  సంస్కృతి కవితా సంకలనం వేశారు. అందులోని సంపాదకత్వంలో స్కైబాబ అలీ ‘ముసీబత్‌’ కథను ఉటంకిస్తూ చెప్పిన విషయాన్ని ఇక్కడ చూడొచ్చు-
‘మూడో రోజు జ్యారత్‌. సమాధి దగ్గరికి వెళ్లి పూల చాదర్‌ కప్పి ఫాతెహా లివ్వాలి. ఇక్కడ సమాధి లేదు. చిత్రమైన స్థితి. ఏం చెయ్యాలో ఎవరికీ తోచలేదు. చివరికి ఫయాజ్‌ దోస్తులకు ఫోన్‌ చేసి జర సమాధి దగ్గరికి వెళ్లి పూల దుప్పి కప్పి ఫాతెహా లిచ్చి రమ్మని అభ్యర్ధిస్తారు. ‘ఇక్కడ అవన్నీ ఉండవు. సమాధి చేసి వచ్చారంటే తిరిగి అటు వెళ్లడం ఉండదు!’ అంటారు ఫయాజ్‌ దోస్తులు. పరేశాన్‌!’
ఇట్లా అలీ 2004లోనే దేశీ ముస్లిం సంస్కృతిని చర్చకు పెడుతూ కథ రాయడం గమనార్హం. ఈ  సంస్కృతి గురించి ఇవాళ తీవ్ర సంఘర్షణ జరుగుతుండడం విశేషం.
సహజంగా గ్రామాల్లో, పట్టణాల్లో జరిగే మోసాలను, ప్రపంచంలో పెరిగిపోతున్న మత విద్వేషాలను పట్టి చూపిన కథ ‘కోడిపిల్లలు మూడు’. మూడు కోడిపిల్లలు కొని పెంచబోయిన తన కొడుకు కథ అది. ఒక పిల్లను పిల్లి ఎత్తుకుపోగా, అది చూసి భయపడ్డ మరో కోడిపిల్లకు పక్షవాతమొస్తుంది. దాన్ని పడేయమని తల్లి చెబుతున్నా వినక దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు ఆ పిల్లవాడు. దాని గురించే బెంగ పెట్టుకుంటాడు. చివరికది చనిపోతుంది. దాన్ని పెంటదిబ్బ మీద పడేయమని చెప్పినా వినకుండా ఇంటి ఆవరణలో ఒక మూల దానిని సమాధి చేస్తాడు. మోసాలు ద్వేషాలు లేని ప్రపంచం ఒకటుందని, అది పిల్లల ప్రపంచమని చెప్తూ తన పిల్లలకు అంతటి జాలి దయ ఉండాన్ని చూసి సంతోషపడతాడు కథానాయకుడు. నేడు సమాజంలో ముస్లింల మీద జరుగుతున్న విష ప్రచారానికి పూర్తిగా భిన్నమైన కోణంలో మనల్ని వెంటాడుతుంది ఈ కథ.
సమాజంలో ఏ ఉపద్రవం జరిగినా చివరికి అది పేదవాళ్ళ కడుపు కొట్టడానికేనని అలీ ‘పాన్‌డబ్బావాలా’ కథలో వివరిస్తాడు. అసలే వ్యాపారం నడవక అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి, డిగ్రీ పట్టాలు బ్యాంకుల్లో పెట్టి లోన్లు తీసుకుని పాన్‌ డబ్బా నడుపుకుంటున్న చిన్న జీవితాల వ్యధలను చిత్రించిన కథ పాన్‌డబ్బావాలా. పోలీస్‌ వాళ్ళకి లంచాలిచ్చి, అడిగిన వాళ్ళకల్లా అప్పులు పెట్టి జీవితం గడవక నానా బాధలు పడి డబ్బాను నడిపిస్తుంటే ఆఖరికి రోడ్ల వెడల్పు కార్యక్రమంతో ఆ జీవనాధారాన్ని కూడా లేకుండా చేస్తే ఏం చేయాలో తెలీని నిరుద్యోగుల, బడుగు జీవుల కథ పాన్‌డబ్బావాలా.
ఏ జాతి  ఉన్నత విద్యకు దూరమైపోతుందో, ఆ జాతి అభివృద్ధిపథం వైపు పయనించడం చాలా కష్టమైన విషయమని చెప్పిన కథ ‘నయా ఖదమ్‌ నయీ సోంచ్‌’. ముఖ్యంగా ముస్లిం అమ్మాయిలకు చదువు ఎంతో ముఖ్యమని, బాల్యంలోనే వివాహాలు చేయడం మూలాన ముస్లింలు వెనుకబడుతున్నారని కథలో కొత్త ఆలోచనలను రంజాన్‌ పండుగ దినాన పాత్రల ద్వారా వివరిస్తాడు రచయిత. రాజకీయాలలో మతాలు ముఖ్యపాత్ర వహించడాన్ని కూడా విమర్శిస్తాడు. క్రిష్టియన్‌ సంస్థలు విద్యా వ్యాప్తికి పూనుకోవడాన్ని ఉదహరిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాలన్నీ వివిధ దేశాలలో ఉన్న ముస్లింల గురించి ఏం చేస్తున్నాయని ప్రశ్నిస్తాడు.
ఇలా హరేక్‌మాల్‌ కథా సంపుటి నేటి ముస్లింల ఆర్ధిక రాజకీయ సామాజిక పరిస్థితులకు అద్దం పట్టింది. నల్లగొండలో మాట్లాడే తెలంగాణ ఉర్దూ కలగలిసిన మిశ్రమ యాసతో కూడిన భాష ఈ సంపుటిలో కనిపిస్తుంది. కొన్ని కొత్త పదబంధాలు, కొత్త సామెతలు కనిపిస్తాయి. ఇలాంటి వైరుధ్యభరితమైన కథలు అందించిన అలీ ఒక నవల, తన ఆత్మకథ రాసిపెట్టాడని తెలుస్తున్నది. వాటిని అచ్చు వేయవలసిన బాధ్యతను తలకెత్తుకోవలసి ఉంది.

*

ఒక విస్థాపితుడి స్వగతం

 

 

-గుర్రం సీతారాములు

~

gurramఅరుణ్ సాగర్ తెలుగు బుద్దిజీవుల్లో ఒక మర్యాదగల పాత్రికేయుడు. చూడడానికి అత్యాదునికునిగా కనిపించే అతను ఆరణాల అచ్చం ఆదివాసీ. అకస్మాత్ గా అయన గుండె పనిచేయడం ఆగింది. అరుణ్ తండ్రి  టి.వి.ఆర్ చంద్రం అంటే గోదావరీ నదీలోయ పరీవాహక ప్రాంతం లో, పోడుకోసం గూడుకోసం, తునికాకు రేటుకోసం జీవితం త్యాగం చేసిన ఒక నికార్సయిన, నిబద్దత కలిగిన సాధారణ కార్యకర్త . ఉమ్మడి కమ్యునిస్ట్ పార్టీ నుండి మార్క్సిస్ట్ పార్టీ దాకా బద్రాచలం ప్రాంత పార్టీ నిర్మాతల్లో ఒకడుగా ఆయన  తాను నడిచిన నేలంతా పోరాటాల విత్తనాలు చల్లి ప్రజల జ్ఞాపకాల్లో మిగిలే ఉన్నాడు.

ప్రపంచ  వ్యాప్తంగా భూమి ఇరుసుగా అనేక సాయుధ, విముక్తి పోరాటాలు జరిగినవి. అవి వలసవాదుల కబ్జానుంచి భూమిని విముక్తి చేసుకునే క్రమం లో, స్వతంత్రం ఒక మేడిపండు అని, అది కేవలం అది ఒక అధికార మార్పిడీ అని అనేక ప్రత్యామ్నాయ, అస్తిత్వ వాద ఉద్యమాలు నడిచాయి. ఆ క్రమం లో  అంతులేని రక్తపాతాలు  జరిగినవి. వీటేనక  టి.వి.ఆర్ చంద్రం తరం చేసిన త్యాగాలూ ఉన్నవి. బద్రాచలం, బస్తర్ నేలలు  దశాబ్దాల పోరు భూమిగా పోరాట వారసత్వాన్ని కలగన్నది, దాని పొరల్లో పేరుకు పోయిన రక్తపు మరకల తడి ఆరని చిత్తడి నేలలు అవి . ఒక నాడు మహోజ్వలంగా వెలిగిన స్థానిక సంచార జాతుల రాజ్యాలు, రాజులు వర్తమాన  పోరాటాల మూలంగా కనుమరుగు అయ్యాయి . ఆధునికత పేరుతో జరిగిన అభివృద్ధి కోట్లాది మంది అత్మగౌరవంగా బ్రతికిన నేలనుంచి విడదీయ బడుతున్నారు . ఇలా వలస పాలన నుంచి విముక్తి పొందిన అనేక దేశాలలో దాదాపు ఇరవై కోట్లకు పైగా విస్తాపనకు తాకిడికి చిద్రం అయ్యారు అని లెక్కలు చెబుతున్నాయి.ఇంత విద్వంశం జరుగుతున్నా ‘నాగరికతకు’ ఆవడ కారడవుల్లో నాగరికం అని పిలవబడుతున్న ప్రపంచానికి  వేల ఏళ్ళ దూరంలో, సెలయేటి నీరంత  ప్రశాంతంగా, తమదయిన, అవధులు లేని, ఆంక్షలు లేని, దోపిడీ, పీడన లేని అసలు రేపు ఏంటి ? స్వంత ఆస్తి ఏంటి ? అనే ఆధునిక భావనల గాలి సోకనంత స్వచ్చంగా బ్రతుకుతున్న కోట్లాది మంది గోదావరి పరీవాహక  ఒడ్డున ఉన్నారు.

తాళ్లూరి అరుణ్ సాగర్ ఉరఫ్ చంద్రం గారబ్బాయి నాలుగున్నర దశబ్దాల కింద కొంట అనే చిన్న గిరిజన గ్రామం లో  కుడివైపు సీలేరు (ఆంధ్రప్రదేశ్ ) ఎడమవైపు శబరి (చత్తీష్ ఘడ్) దాని నడుమ కాసింత నేల  ఒడిసా లో బాగం అయిన ఆయన రాసుకున్నట్లు ‘ సరిగ్గా కొమ్ముబూర లా వంపుతిరిగిన చోట’ తన ఇంటి కిటికీ లోంచి  శబరీ గోదారీ సంగమస్థలి లో  కడంచున, ఆధునికత, పురాస్మ్రుతుల జ్ఞాపకాల సంగర్షణ ల మధ్య, భారత కల్లోల విస్పోటనల, ఖాకీ పద ఘట్టనల , ప్రత్యామ్నాయ భావ స్రవంతుల మధ్య ఆయన బాల్యం పురుడు పోసుకుంది. అలా కడగొట్టు నాగరికత విలసిల్లిన ప్రాంతాన అయన కవిత్వ మూలాలు ఉన్నాయి. అక్కడే ఒక మైదాన వాసి- మూలవాసీ నిర్వాశితుడు అవడం ఒక్కటి కాదని అన్నాడు.

అరుణ్ సాగర్  కవిత్వం లో కాసింత ఆంత్రోపాలజీ, నల్లజాతీ సంగీత సొబగు, అత్యాధునికమైన జీవితం లో ఒక మెట్రోపాలిటన్ జీవితం లో ఉన్న సందిగ్ధత, ఇన్ని వైరుధ్యాలు ఉన్నా త్యాగానికి  లింగ వివక్ష వద్దనీ తండ్రుల త్యాగాలు కొనియాడుతూ ప్రతి కొడుకూ తన తండ్రి జన్యు విశేషణగా, ఆయన కొనసాగింపుగా చేసిన అభివ్యక్తి తెలుగు సాహిత్య లోకాన ఒక కుదుపు. ‘పత్తి కాయలా గుండె పగిలిపోతుంటే పురుగు మందు తాగిన’ తండ్రుల గుండె కోతను ఆయన  లాగా చెప్పే సాహసం ఎవరూ చేయలేదు. అరుణ్ సాగర్ పుట్టిన పెరిగిన నెలలో ఉన్న ఆదిమ జాతుల  నడకకు ఒక లయుంది, ప్రకృతిలో బాగం అయి పరవశం తో పాడుకున్న రేల పాటలు గానం చేసుకున్న  గొంతుకు ఒక శ్రుతి ఉంది.  ఒక సామూహిక బృందగానం ఉంది. మట్టితో పెనవేసుకున్న వేల ఏళ్ళ జ్ఞాపకాల బరువూ ఉంది. ఒకప్పటి రాజులు ఒకప్పటి మూలవాసులు , ఇప్పటికీ గుడి బడికి దూరం అయ్యి గుడ్డి దీపాల వెలుగుల్లో కునారిల్లుతున్నారు. ఇప్పుడు  బస్తర్, నల్లమల లో గోండు, కోలం జాతులు  చిన్న మాత్రకు కూడా నోచుకోకుండా దోమకాటుకు, పాముకాటుకు బలవుతూ ప్రకృతితో యుద్ధం చేస్తున్నారు. ఇప్పడు అడివి మనాదితో  మంచం ఎక్కింది. నాగరికతకు దూరం అయినా నమ్మిన నేల కపాడుద్ది అనే బరోసా తో పోడు తో ఏటికి ఏతం పెట్టి ఎట్టి మనుషుల నుండి భూమిని గుంజుకునే ఆధునిక రాజ్యాన్ని ఎదిరించ లేక పోతున్న బడుగు జీవులకు అరుణ్ సాగర్ ధైర్య వచనం అయ్యాడు.

అరుణ్ సాగర్ పుట్టిన ఊరులో కుమ్మూరు ఇరపా సీతక్క తన నుదుటున ముద్దేట్టి ‘కలెట్టరయ్’ రావాలి బిడ్డా అని దీవించింది ఆమె ఆకాంక్ష వినడానికి బాగానే ఉన్నా, ఆయన దృష్టిలో అది కేవలం అధికార దర్పానికి తప్ప కడగొట్టు జీవితం లో వెలుగును నింపదనీ, ‘కలెట్టరయ్’ అనపకాయ బుర్రలూ వెదురునార విల్లులూ, ఎద్దు పుర్రెలో గుదిగుచ్చిన నెమలి పించాలు ఇంట్లో అలంకరణ కు పెట్టుకోవడం తప్పా వాళ్ళ తలరాతలు మార్చని అభివృద్దిని ఈసడించుకున్న అరుణ్ పాత్రికేయుడిగా వాళ్ళకు ఏదన్నా చేయాలి అని ఎన్ని కలలు కన్నాడో. స్వతంత్రం, అభివృద్ధి, స్వయం ప్రతిపత్తి లాంటి లాబొరేటరీ లో తయారు చేయబడుతున్న ఆధునిక పదజాలం ఆ అలగా జనాల విముక్తికి ఏనాటికీ ఉపయోగ పడదనీ  ఆయనకు తెలుసు. ‘సమీకృత అభివృద్ధి-సాంస్కృతిక పృధక్కరణ-సామాజిక సమగ్రత’ వినడానికి గొప్పగా ఉన్నా అవన్నీ డొల్ల పదాలనీ ఎరిగిన వాడు , ఆరున్నర దశాబ్దాల అభివృద్ధి గిరిజన సంక్షేమ సూత్రాలూ ‘అప్లయిడ్ ఆంత్రోపాలజీ పరిశోదనలో వాడేసుకుని అలగా జనాల బతుకుల్ని మాత్రం నట్టనడి జలాశయాల్లో ముంచేస్తారా, అని అక్రోశించడం కూడా తెలుసు.ఇంత లోతయిన జీవితం ఆచరణ ఉన్న కవి నాడి అంచనా వేయడం లో తెలుగు మేధో సమాజం మరుగుజ్జు తనాన్ని నిరూపించు కుంది. కవితా వాకిళ్ళలో ఇమడని ఆయన వచనం చానా ఆలస్యం గా కవిత్వం గా చర్చించ బడ్డది. తండ్రుల వ్యధలూ సీదర సేంద్రయ్య లు అర్దంతర నిష్క్రమనలూ, ఆధునిక పద బందాల్లో తెలుగు కవిత్వానికి కాసింత ఆసరా అయ్యాయి.

చివరిరోజుల్లో అయన జీవితం అయ్యలనుండి వచ్చిన చైతన్యం ఎక్కిరించిన వైనాన్ని మౌనంగా స్వీకరించాడు. అది ఆయన్ను ఎంత బాదపెట్టిందో ఆయనకు దగ్గరగా ఉన్న మిత్రులకు నాకన్నా బాగా తెలుసు. సిరలు ధమనులు పగిలి నెత్తురు చిమ్మెంతగా’ విలవిల్లాడు అతను. ఆయన జేవితం లో అదో విషాదం. ఈ విషాదాల వికట్ట హాసాల ఉక్క పోతల మధ్య ఇమడలేని ఆయన తన మృత్యు శాసనాన్ని ముందే రాసుకుండు.

ఒక మనిషి పుడతాడు పోతాడు. కానీ పోయే లోపు నిన్నుకన్న నేల చెర బడుతున్నప్పుడు కాస్తంత కన్ఫెషన్ అవసరం. కానీ అరుణ్ సాగర్ ఎకంగా కోల్పోతున్నరేల పాటకోసం మరణ వాగ్మూలం రాసుకుండు. నేలకోసం , పలవరిస్తూ, మళ్ళీ ఒక సారి ఎనభై అడుగుల లోతులో సమాధి కాబోతున్న తన ఆనవాళ్ళు దూరంగా తన బిడ్డకు చూపించి అగొ అక్కడే నీ తాతలు తండ్రులు ఒకప్పుడు ప్రాణం తో ఉన్న మనిషి జ్ఞాపకం అని కడసారి చూపిస్తూ, మనందరి సామూహిక వైపల్యాల మీద అల్లుకున్నచిన్న పిచ్చిక గూడు మ్యూజిక్ డైస్ లా చిట్టచివరి అగ్రహ ప్రకటన చేసాడు .

బహుశా తెలుగు కవిత్వ చరిత్రలో ఒక వలపోతను మరణ వాంగ్మూలం గా రాసుకున్నది అయన ఒక్కడే కావొచ్చు. జీవిక కోసం కన్న ఊరును వదిలి రావాల్సి వచ్చినప్పటికీ అయనను  ప్రతి క్షణం బాల్యపు గుర్తులు వెంటాడాయి. అందుకే తప్పించుకోలేక కవిత రాసి దుఖాన్ని కడిగేసుకొనే ప్రయత్నం చేయలేదు. కొట్టుకొచ్చిన శవాలమీద నాలుగు వాక్యాలు ఏరుకొనే బ్రతకనేర్చిన తనాన్ని, కనీసం ఒక లాఠీ వైపు తేరిపార చూడలేని దౌర్భాగ్యాన్ని ఆయన చిన్న గుండె తట్టుకోలేక పోయింది. ఆచరణలో ఆయన నిజంగా నిలువెత్తు నిదర్శనం. ఆయన పుట్టిన కుటుంబంకు ఉన్న నిబద్దత, త్యాగమయ జీవితం కావొచ్చు. పెరిగిన నేలలో ఉన్న పోరాటాల వారసత్వం కావొచ్చు, వృత్తిలో, ప్రవృత్తిలో, స్నేహం లో, సహచర్యం లో అయన చుట్టూ ప్రాణంఇచ్చే స్నేహ సంపద కావొచ్చు, ఇవన్నీ ఆయన్ని పరిపూర్ణ మానవునిగా మార్చాయి. మార్కెట్ శాసించే  మానవ విలువలను తూకంలో వేసి బాగిస్తుంటే ఆ ఒరవడిలో కొట్టుకొని పోకుండా, తానెక్కడ ఉన్నా తన అంతరంగం లో ఒక వెతుకులాట తో ఉండేవాడు. నిజానికి  వేసవికాలం కాలం లో గోదావరిలా పైకి కనిపించే అయన లోలోపల వానాకాలంలో గోదారి వరద ఉదృతిలా అలజడి తో అల్లాడిపోయే వాడు . అలాంటి గోదావరి ప్రవాహానికి అడ్డంగా కడుతున్న ‘గాలికట్ట’ అయన గుండె కవాటాలను ఎంత ఉక్కిరిబిక్కిరి చేసిందో. అందుకే కాసింత విశ్రాంతి కోరుకుంది. ఆ  విశ్రాంతి శాశ్వతంగా అరుణ్ సాగర్ ని మన నుండి దూరం చేసింది.

దశాబ్దాల పోరాటాల తర్వాత మిగిలిన తెలంగాణా పంపకాల్లో అయనకు తెలియ కుండానే ఆయన నడయాడిన నేల మారకపు విలువగా మారడం మూలాన ఎంత క్షోభను అనుభవించాడో. ఒక నాగరికతను బలవంతంగా బట్వాడా చేయడాన్ని ఎంతగా నిరసించాడో. బహుశా  నిర్వాశిత సమష్య ను అత్యంత మానవీయంగా ఆయన లాగా ఎవరూ రాయలేదు. ‘కంకర తేలిన పదును, ఎర్ర మట్టి చదును, పెంచి పెద్ద జేసిన వీధి, వంటినిండా పాదముద్రలు వేసుకొని నడిచిన జాడలను మరవని వాడు’.      అందుకే తన తాతల తండ్రుల వారసత్వంగా వచ్చిన పోరాడుతున్న ఆకలి కేకల కోసం కనీసం గొంతయినా కలపక పోవడం నేరం అని భావించాడు. కవిత ఆచరణకు సాటి రాదు అని తెలిసీ ఒక నినాద రచనగా ఒక విధాన అనుసరణగా  కనుమరుగు అవుతున్న రేల పాటకోసం నినాదం అయ్యాడు.

పాత్రికేయ ప్రపంచం లో అరుణ్ సాగర్ జీవితాన్ని ఒక నమూనాగా చూడాలి. తన నాలుగున్నర దశాబ్దాల మొత్తం జీవితం లో రెండు దశాబ్దాల పాత్రికేయ వృత్తి, విభిన్న మాధ్యమాలు, విభిన్న సంస్కృతుల కలబోత.  వృత్తిలో అంత నిబద్దత నమ్మిన విలువలకోసం బ్రతకడం కోసం శరీరాన్ని ప్రయోగ శాల మార్చుకొని, శస్త్రచికిత్స తో, వడలిన శరీరంతో ఎక్కడికి పోయినా తనతో ఒక ‘మినీ డిస్పెస్సరి’ లా ఉండేది ఆయన జీవితం. అరుణ్ జీవించింది చానా తక్కువ కాలమే అయినప్పటికీ ఇంత మందికి ఇంత దుఖాన్ని మిగిల్చి మబ్బులా మాయం అయ్యాడు. అరుణ్ సాగర్ ఈ కల్లోలాలను మనసారా అక్షరీకరించాడు. మన అందరం అపరాధ రుసుము ఎప్పటికయినా చెల్లించాలి అని ఒక వార్నింగ్ ఇచ్చిమరీ పోయాడు. అరుణ్ ! మల్లెప్పుడు కనబడతావ్  బాస్ ?  నీతో మళ్ళీ లోయపల్లి, భద్రాచలం, చట్టి, కుంట, మారేడు మిల్లి, లంబసింగి, విశాక ఒడ్డు తిరగాలని ఉంది. అయినా నా పిచ్చిగానీ కొంత కాలానికి అవీ కాలగర్భంలో కనుమరుగు కాబోతున్నాయి. అవును మనందరి సామూహిక వైఫల్యాల సాక్షిగా వాగు కొమ్ముబూరలా వంపు తిరిగిన చోటు నీ పాదముద్రలూ, దమ్మక్క రోదనలాగా కనుమరుగు కాబోతున్నాయ్. కానీ నువ్విచ్చిన స్పూర్తీ కవిత్వమూ బ్రతికే ఉంటాయి అన్నా ..

*

 

 

ఈ చిన్ని అద్దంలో కౌముది!

 

-కేక్యూబ్ వర్మ

~

 

varmaచిన్న అద్దంలో కొండని చూపించడం లాంటిదే కౌముది గారిని  చిరు వ్యాసంలో పరిచయం చేయడం! ఆయన కవి, కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు,అభ్యుదయ  రచయితల సంఘానికి క్రియాశీల కార్యవర్గ సభ్యుడు. ఖమ్మం జిల్లాలో అరసం  వ్యవస్థాపకుడు. కమ్యూనిస్టు  పార్టీ యువజన పత్రిక  “యువజన” కి సంపాదకుడు. “విశాలాంధ్ర” ఉద్యోగిగా జీవితం ప్రారంభించి, అధ్యాపకత్వంలో స్థిరపడ్డారు. అక్షరోద్యమ నేత గా  మారుమూల ప్రాంతాల్లో రాత్రనకా పగలనకా పర్యటించి, అక్షర సేవలో కన్ను మూసిన ఉద్యమ శీలి.  ప్రజానాట్య మండలిలో కొన్ని వందల స్టేజీ నాటకాలపై నటించిన ప్రజా నటుడు, గాయకుడు. ఇవన్నీ కాక, రచయితగా అనేక కథలూ, అనువాద రచనలూ అందించిన సృజన శీలి.

అలనాటి కమ్యూనిస్టు ఉద్యమాలతో కలిసి నడిచిన కార్యశీలిగా, ప్రజా నాట్యమండలి కళాకారునిగా ప్రాచీన కవిత్వం నుండి అత్యాధునిక కవిత్వం వరకు విశ్లేషించే సాహిత్య పిపాసిని ఈ కొద్ది మాటల్లో  పరిచయం చేయడం -కొండను అచ్చంగా అద్దంలో చూపడమే.

చాలా సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో సమకాలీన అంశాలను తన కవితలలో ప్రతిబింబిస్తూ వచన కవితా స్థాయిని ఏమాత్రం చెక్కుచెదరకుండా నిలిపి వుంచిన అక్షరశిల్పి కౌముది గారు. తన రచనా సమాహారం ’అల్విదా’ ముందుమాటలో ప్రముఖ కవి ఖాదర్ మొహియుద్దీన్ చెప్పినట్లు కౌముదిగారు కవీ, రచయితా, విమర్శకుడూ, తన యవ్వన దశని ప్రగతిశీల సాంస్కృతిక ఉద్యమానికి పరిపూర్ణంగా వెచ్చించిన సమరశీలి, ప్రతిభాశాలి. ఇంతకుమించి ఆయనకు ఎలాంటి విశేషణాలు అవసరం లేదు. కొందరి సాహితీ మూర్తిమత్వాలు ఏ విశేషణాలకూ అందవు. అటువంటి కొందరిలో ఒకరు కౌముది గారు అని అంటారు. ఇది నిఖార్సయిన నిజం. తన రచనలలోని సమరశీలత ప్రగతిశీల ధృక్పథం నేటికీ మనలను కట్టి పడేస్తాయి. ఆలోచనలను ఉర్రూతలూగిస్తాయి. రచనలలోని సమకాలీన రాజకీయ ప్రాంతీయ స్థల కాల విశ్లేషణలు నాటి సమాజాన్ని మన కనుల ముందు సాక్షాత్కరింప చేస్తాయి. ఉదాహరణకు బంగ్లాదేశ్ ఆవిర్భావం గురించి రాసిన ’ముక్తి వాహినీ విజయ్ కరే’ కవితలో

చెప్పు తల్లీ! చెప్పు మళ్ళీ

ఎందుకు పుట్టాడు దానవుడు

ఏ అపరాధం చేశాడని

వంగభూమిలో మానవుడు

 

నిద్రిస్తూన్న శిశువుమీద

నిండు చూలాలిమీద

మంచిమీద మానవత్వం మీద

అఘాయిత్యాల సంపుటి

అమ్మా! ఇది గుండె మీది కుంపటి!

….

 

మతాలు, గతానుగతికాలు

మనస్సును కుంచించే సంకుచితాలు కుత్సితాలు!

మానవతామృధ్జ్యోత్స్నావగాహుడైన మనిషికి

కానే కావు సమ్మతాలు

-అంటారు.

 

చలనశీలమైన సమాజంలో మార్పును కాంక్షించే అభ్యుదయ వాదిగా కౌముది గారు ’ఇలాగే వస్తుంది మార్పు’ కవితలో –

ఇలాగే వస్తుంది మార్పు

ప్రజలు వినిపించినప్పుడు తీర్పు

ఇలాగే వస్తుంది మార్పు

 

నగరాలు నినాదాలు యిస్తాయి

రాస్తాలు వూరేగింపులు తీస్తాయి

రేపటి వుదయానికి ఆకాశం

పంచరంగుల పోస్టర్లను ఆవిష్కరిస్తుంది

పిల్లగాలుల పత్రికా విలేకర్లు

ఈ వార్తను అందుకొని ఎగిరిపోతారు

దిక్కులు భేరీ భాంకృతుల్తో ఈ సత్యాన్ని ప్రకటిస్తాయి

-అని రేపటి మార్పుని ఓ గొప్ప ఆశావహ దృక్పథంతో ఆవిష్కరిస్తారు.

ప్రతీ కవితలో అన్నార్తుల అభాగ్యుల జీవన వేదనను చిత్రిస్తూ చివరిగా రేపటి తరంలోని మంచి మార్పును ఆశించి సాగిన కవిత్వం కౌముది గారిది. నాటి అభ్యుదయ భావజాలం నేటి సామాజిక స్థితికి కూడా దగ్గరగా వుండడం వారి రచనలలోని సజీవత్వానికి నిదర్శనం. ’ఉదయిస్తున్నాడు రేపటి రవి’ కవితలో

పాలులేక మరణించిన

పసిపాప సమాధిమీద

పాడె బట్ట నోచుకోని

పరమదరిద్రుడి శవం మీద

ఇరుకు బ్రతుకు, మురికి గుడిశ

ఆకటి, చీకటి, చిత్తడుల మీద

పచ్చ పచ్చగా వెలుతురు

పరుగెత్తుతూంది చూడు!

– అంటారు..

హరించిపోతున్న మానవత్వం కోసం పరితపించడం కౌముది గారి కవితలలో ప్రతి చోటా మనల్ని నిలువనీయదు. సూటిగా ప్రశ్నించడం తన కవితలలో ఓ గొప్ప లక్షణం. చాలా నిక్కచ్చిగా నిర్మొహమటంగా మనలోని సంకుచితత్వాన్ని మతతత్వాన్ని ప్రశ్నిస్తూనే రేపటి ఉషస్సుకోసం ఆరాటపడడం ప్రతి కవితలో ప్రస్ఫుటం. వెన్నెలను కలం పేరుగా మార్చుకున్నా తన రచనలలో మాత్రం అగ్నిశిఖలా వెలిగిపోవడం కౌముది గారి ప్రత్యేకత. చివరిగా మహాకవి, మహానాయకుడు మఖ్దూమ్ స్మృతిలో తను రాసిన కవితా పాదాలే తనకోసం ఉదహరిస్తూ ’అల్విదా’ తో ముగిస్తాను.

గీతశిల్పి వెళ్ళిపోయాడు

గీతం తెగిపోయింది

ఏ సంకేతమూ లేకుండా

ఎవ్వరికీ చెప్పకుండా

అనుకోకుండా తెగి

గాలిలో కరిగిపోయే నక్షత్రంలా

అకస్మాత్తుగా జారి

మట్టిలో కలిసిపోయే కన్నీటి చుక్కలా

ఉన్నట్టుండి హఠాత్తుగా

సభ మధ్యలోంచి తలవంచుకొని

షాయర్ వెళ్ళిపోయాడు

ముషాయరా ఆరిపోయింది…

 

*

 

అలుపూ అలకలూ లేని అద్దేపల్లి..

 

 

 -బొల్లోజు బాబా

~

 

baba“శయనిస్తున్న అతనెలా ఉన్నాడు? యోధునిలాగా లేక కవిలాగ?     హ్మ్…… కవిత్వ యోధునిలా” — జె.డి. రోబ్

ఓ మాస్టారికి ఒక  కిళ్ళీ కొట్టు వద్ద ఖాతా ఉండేది.   అయిదేళ్ళు గడిచాకా, ఓ మిత్రుడు ఆ కొట్టు యజమానికి ‘ఈయనే ప్రముఖ కవి అద్దేపల్లి రామమోహనరావు” అని పరిచయం చేసాడు.  ఆ కొట్టు యజమాని  ఓ బైండు చేసిన పుస్తకాన్ని తీసి చూపిస్తూ మనస్సు బాగోనప్పుడల్లా ఈ పుస్తకాన్ని చదువుతుంటానని చెప్పాట్ట.  ఆ పుస్తకం పేరు “అంతర్జ్వాల”.  అది  అద్దేపల్లి  రచన.  ఒక కవికి ఇంతకు మించిన పురస్కారం ఏ అకాడమీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వాలు ఇవ్వగలవు?

యాభై ఏళ్ల సాహితీప్రస్థానంలో సుమారు 30 పుస్తకాల్ని వెలువరించి, వందకు పైగా ముందుమాటలు వ్రాసి, వివిధ సభల్లో రెండువేలకు పైగా అద్యక్షోపన్యాసాలు ఇచ్చి, ఎన్నో వందల పుస్తకాలను సమీక్షించి, కొన్ని వందల తెలుగు గజల్స్ ను వ్రాసి, గానం చేసి- తెలుగు సాహితీలోకంలో ఒక కవిత్వయోధునిలా జీవించిన  అద్దేపల్లి రామమోహనరావు జీవిత చరమాంకంలో కూడా  ఒక యోధునిలానే నిష్క్రమించారు.

గత మూడునెలలుగా ఆయన అస్వస్థతకు గురయ్యారని కాకినాడ సాహితీమిత్రుల మధ్య గుసగుసలుగానే ఉండింది.  కానీ ఇంత త్వరగా విడిచిపోతారని ఎవరూ అనుకోలేదు.

తన అనారోగ్యం గురించి ఎవరికి తెలియనివ్వలేదు  అద్దేపల్లి.  ఎవరినీ ఎక్కువగా కలిసే వారు కాదు.  గతమూడునెలలుగా ఎవరైనా ఆయనను కలిసినా అస్వస్థత ప్రస్తావన లేకుండానే మాట్లాడేవారు.  ఇవతలి వ్యక్తికి తెలిసినా, ఆయన ధోరణిని బట్టి, తెలియనట్టుగానే మాట్లాడాల్సివచ్చేది.  అలాగని నిర్వేదంలో పడిపోయారా అంటే అదీకాదు,  మరణానికి వారంరోజుల ముందు వరకూ కూడా స్వయంగా ఆటో ఎక్కి రేడియేషన్ చేయించుకొని వచ్చిన వ్యక్తి.  ఒక సాహితీ మిత్రునికి ఫోన్ చేసి, ఈ సంవత్సరం ఎలాగైనా “సాహితీ స్రవంతి” పత్రికను ప్రారంభించాలి అని దిశానిర్ధేశం చేసిన వ్యక్తి  అద్దేపల్లి.  “మీరు రేడియేషన్ చేయించుకొన్నారు కదా జాగ్రత్తగా ఉండాలి” అని కుటుంబసభ్యులొకరు అన్నప్పుడు, “అన్ని సిట్టింగులు అయిపోయాయి,  రేడియేషన్ అన్న మాట ముగిసిపోయిన అధ్యాయం, ఇకదాని గురించి మాట్లాడకండి” అని వారికే తిరిగి ధైర్యం చెప్పిన వ్యక్తిత్వం  అద్దేపల్లిది.  మరణాన్ని కూడా ప్రశాంతంగా స్వీకరించాలంటే గొప్ప   రుషిత్వం ఉండాలి.

కవిగా, విమర్శకునిగా, వక్తగా, వ్యక్తిగా ఆయన పోషించిన వివిధ పాత్రలను తెలుసుకోవటం ద్వారా  అద్దేపల్లి చేసిన సాహిత్యకృషిని అర్ధం చేసుకొనవచ్చును.

అద్దేపల్లి కి ప్రాచీన సాహిత్యంపై  గొప్ప  పట్టు ఉండేది . మొదట్లో చందోబద్దమైన కొన్ని వందల పద్యాల్ని రచించారు.  1960 లో తొలికవిత కృష్ణాపత్రికలో అచ్చయింది.  కాలక్రమేణా తాను విశ్వసించే  హేతువాద దృక్ఫధం, అభ్యుదయత, ప్రగతిశీల భావాలకు వచనకవిత్వమే సరైనదని అనుకొని వచన కవితామార్గాన్ని ఎంచుకొన్నారు.  ప్రపంచీకరణ ప్రభావం వలన చిధ్రమౌతున్న మానవజీవనంపై కవిత్వం వ్రాసిన తొలి తెలుగుకవి  అద్దేపల్లి.  వీరి కవిత్వ సంపుటాలలో అంతర్జ్వాల (1970), రక్త సంధ్య (1978), గోదావరి నా ప్రతిబింబం (1992), పొగచూరిన ఆకాశం, సంఘం శరణం గచ్చామి, మెరుపు పువ్వు, గీటురాయి వంటివి ప్రముఖమైనవి. మినీ కవితల ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి గొప్ప ప్రాచుర్యాన్ని కలిగించారు  అద్దేపల్లి.  తెలుగులో అనేక వందల గజల్ లను రచించి వాటిని గొప్ప రాగయుక్తంగా ఆలపించి అనేక సభలను రంజింపచేసేవారు. వీరి అనేక కవితలు వివిధ భాషలలోకి అనువదింపబడ్డాయి.  కవిగా  అద్దేపల్లి తెలుగు సాహితీలోకంలో ఎప్పటికీ చిరస్మరణీయుడే.

విమర్శకునిగా  అద్దేపల్లి పాత్ర గణనీయమైనది. శ్రీశ్రీ మహాప్రస్థానంపై వీరి మొదటి విమర్శనా గ్రంధం వచ్చి పలువురి ప్రసంశలు పొందింది.  ఈ వార్తవిన్న శ్రీశ్రీ యే స్వయంగా “సరోజినీ, ఈ విషయం విన్నావా, నా పుస్తకం మీద సమీక్షా గ్రంధం వస్తోంది” అని చెప్పటం ఒక మధురమైన ఘట్టం.  కుందుర్తి వచన కవితా వైభవం, స్త్రీవాద కవిత్వం-ఒక పరిశీలన, మహాకవి జాషువా కవితా సమీక్ష, తెలుగు కవిత్వంపై ఆధునికత, అభ్యుదయ విప్లవ కవిత్వాలు- సిద్దాంతాలు, శిల్పరీతులు వంటివి  అద్దేపల్లి వెలువరించిన వివిధ విమర్శనా గ్రంధాలు.  మంచిని విస్తారంగా చర్చించి, చెడును సూచనప్రాయంగా ఎత్తిచూపటం  అద్దేపల్లి విమర్శనా శైలి.

వక్తగా  అద్దేపల్లి సమకాలీన సాహితీవేత్తలెవరూ అందుకోలేనంత ఎత్తులో ఉంటారు.  సభలకు ఎవరైనా పిలిస్తే దూరభారాలకు వెరవకుండా,  తప్పనిసరిగా హాజరయ్యి, ఆ సంస్థలకు, అక్కడి యువకవులకు ఎంతో స్పూర్తిని, ఉత్తేజాన్ని నింపే గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేవారు. రిజర్వేషన్ లేకపోతే 80 ఏళ్ళ వయసులోకూడా జనరల్ భోగీలో ప్రయాణించైనా సరే వస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకొనేవారు  అద్దేపల్లి.  ఈ లక్షణాన్ని గుర్తించిన తెలుగు సాహితీలోకం  అద్దేపల్లికి  “సాహితీ సంచార యోధుడు” అన్న బిరుదును ఇచ్చి సత్కరించింది.  ప్రాచీన, ఆధునిక సాహిత్యాలపై లోతైన అవగాహనతో వీరు చేసే అనర్ఘళమైన ఉపన్యాసాలు, చక్కని ఉటంకింపులతో,  చలోక్తులతో సాగి సభికులను రంజింపచేసేవి.  వీరు గత ముప్పై ఏళ్ళుగా ఇచ్చిన ఉపన్యాసాలు రెండువేలకు పైమాటే.

వ్యక్తిగా అద్దేపల్లి స్నేహశీలి, నిరాడంబరుడు, భోళాశంకరుడు, నిరంతర సాహితీకృషీవలుడు. సమయపాలన విషయంలో  అద్దేపల్లి నిక్కచ్చిగా ఉండేవారు.  వీరు అద్యక్ష్యత వహించిన సభలలో కాలం తూకం వేసినట్టు నడిచేది.   తనకన్నా చిన్నవారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని వారి కవిత్వంలోని గుణగణాలను విప్పిచెప్పి ప్రోత్సహించేవారు. ఎవరైనా   మంచి వాక్యం వ్రాస్తే భలే ఉంది అంటూ వెన్నుతట్టి మెచ్చుకొనేవారు. అద్దేపల్లి అద్యక్షత వహించిన ఒక సభలో నేను నా కవిత వినిపించి వెళిపోతుంటే, నన్ను ఆపి — బొల్లోజు బాబా కవిత్వం వాచ్యంగా ఉండదు ధ్వని ప్రధానంగా ఉంటుంది, ఇప్పుడు చదివిన కవితా పంక్తులలోని సొబగులు ఇవి అంటూ విశ్లేషించి, అభినందించటం— నేను ఎన్నటికీ మరచిపోని ఒక తీపి జ్ఞాపకం.

తెలుగు కవిత్వయోధుడు అద్దేపల్లి రామమోహనరావు ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ…….

 

*

 

 

 

 

 

 

 

 

లోపల సరస్సులున్న మనిషి

 

కె. శ్రీనివాస్‌

 

దేవతలకు ముప్పయ్యేళ్ల దగ్గరే వయసు ఆగిపోతుందట.  త్రిపురనేని శ్రీనివాస్‌ రాక్షసుడే అయినా ముప్పయిమూడేళ్ల వయసు దగ్గర ఆగిపోయాడు. ఆ తరువాత కాలం పందొమ్మిదేళ్ల ముసలిదైపోయింది. అతనూ అతని జ్ఞాపకమూ అతని స్ఫురణా మిసమిసలాడే యవ్వనంతోనే నిలిచిపోయాయి. శ్రీనివాస్‌ కవిత్వం కూడా.  ఇప్పుడు మరోసారి  కొత్తగా త్రిశ్రీ అక్షరాలను తడుముతుంటే,  మొదట తెలుస్తున్నది ఆ యవ్వనమే. అదేదో భౌతికమయినది కాదు , జలజలలాడిపోయే, జివజివలాడిపోయే, కువకువలాడిపోయే, కళకళలాడిపోయే కవిత్వయవ్వనం.

త్రిశ్రీని తెలుగు సాహిత్యం సాగనంపలేదు. అతని ఉనికికి ముగింపు చెప్పలేదు. ఒక దిగ్భ్రాంతిలో, ఒక దుఃఖంలో కలవరపడింది. అతన్నే ఒక నినాదంగా పలవరించింది.  హో అంటూ అతని కవిత్వాన్ని ఉచ్చాటన చేసింది. కార్యకర్తృత్వానికి కృతజ్ఞతలు చెప్పుకున్నది. అంతే తప్ప, హఠాత్తుగా నిష్క్రమించిన కవిని తూకం వేసి చరిత్ర అరలో బిగించలేదు. అతని జ్ఞాపకానికి పటం కట్టలేదు.  అతను చేసిన పనుల అర్థమేమిటో, సారమేమిటో అవగతం చేసుకోలేదు. కొనసాగింపూ జరగలేదు. ఆ అర్థంలో కూడా అతను యవ్వనంలోనే నిలిచిపోయాడు.

కవులందరికీ, సుడిగాలి జీవితం జీవించిన సామాజికులందరికీ ముగింపు-కొనసాగింపు తప్పనిసరి తతంగమేమీ కాదు. నిజానికి అట్లా జరగడం ఇష్టంలేదన్నట్టు  త్రిశ్రీయే  సంచరించాడు. ఒకరి వెనుక నడవటం చేత కాక, ఏ యిల్లూ లేక,  ఒక్క దేహం చాలని గుండెతో – సాంప్రదాయిక సాహిత్య అంత్యక్రియలను తానే నిషేధించుకున్నాడు.. అర్థం కానిదంతా అనర్థమేననుకుని,  ఎడంగానడిచినవారంతా పెడవారేననుకునే రెడీమేడ్‌ తరాజులు మాత్రమే అర్జెంటుగా  త్రిశ్రీ ఒడ్డూపొడువూ లెక్కలు కట్టారు. అతని చేతనాస్తిత్వపు నానార్థాలను చరిత్రచలనంలో తప్ప పట్టుకోలేమని  ప్రేమికులు నిస్సహాయులయ్యారు

ఆరాధన ఎక్కువై, అంచనా వేయలేమనుకుంటాము కానీ, ఎంతటి చలచ్చంచల దీప్త లేఖినులైనా వ్యాఖ్యలకు, విశ్లేషణలకు అతీతమైనవి కావు. కాకపోతే, మేధ గవాక్షాలను ఓరగానైనా తెరచి ఉంచుకోవడం అవసరం. కొత్తగాలులకు వేసట పడకుండా, అంతిమ నిర్ధారణలకు ఆత్రపడకుండాకాసింత సహనం అవసరం. ఇప్పుడు త్రిశ్రీని అర్థం చేసుకోవాలంటే, అతని వాచకాలకు పందొమ్మిదేళ్ల చరిత్రను జోడించాలి. అతని అనంతరం తెలుగు సమాజం సమకూర్చుకున్న అనుభవాల, జ్ఞానాల నేపథ్యంలో అతనిని చూడాలి. ఏ అక్షరానికైనా అర్థం, అపార్థం చారిత్రకమే.

ఎనభైల మధ్యలో కవిగా మొదలైన త్రిశ్రీ, విప్లవకవిత్వానికి కొత్త డిక్షన్‌నీ, మిలిటెంట్‌ వ్యక్తీకరణనీ, మొత్తం మీద నూత్న యవ్వనాన్నీ ఇవ్వాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో అతను ఒక్కడే కాడు, ఒంటరీ కాదు. కానీ, కాలం అప్పటికే కొత్త ఉద్యమాలను కడుపుతోవున్నది. అసంకల్పితంగానో సంకల్పపూర్వకంగానో త్రిశ్రీ కవిత్వం కొత్తపలుకులు పలికింది. తన కవిత్వంలోని వేగాన్నీ చెళ్లుమనిపించే కొరడాకొసలనీ కాక, ఆగామి ఉద్యమాల ప్రాతిపదికల ప్రకటనలను లోకం అధికంగా పట్టించుకున్నది. కవి రాసింది కాక, పాఠకసమాజం అర్థం చేసుకున్నదే కవిత్వార్థం అవుతుంది, కాలస్వభావంతో వెలిగిందే పతాకశీర్షిక అవుతుంది. ‘నీడ వెనుక ఆలోచన కదలాడదు’- ఏ నీడ? ఎవరి నీడ? సంతకం ఒకేలా చేయలేకపోవడం ఏమిటి? పునరుక్తుల మీద, ప్రతిధ్వనుల మీద అతనికి ఎందుకంత వ్యతిరేకత? అది సవ్యంగానే అర్థం అయిందా?

త్రిపురనేని విప్లవోద్యమాన్ని ఆరాధించాడు. మరో రకంగా చెప్పాలంటే విప్లవోద్యమంలో ఉండే నిర్భీతిని, విస్ఫోట గుణాన్ని, ఉద్వేగానికి ఆచరణకు ఉండే అతి సాన్నిహిత్యాన్ని అతను ప్రేమించాడు. రహస్యాన్ని, ధిక్కారాన్ని, ఆత్మత్యాగాన్నీ ప్రేమించాడు. ఉద్యమానికి తనను తాను పర్యాయం చేసుకుని మాట్లాడాడు.  అదే సమయంలో అతను అనుచరత్వాన్ని, విధేయతను ఈసడించుకున్నాడు. నంగితనాన్ని, సానుభూతుల్ని ఏవగించుకున్నాడు. కవిత్వంలో కూడా రహస్యోద్యమంలో ఉండే గుణాలన్నీ ఉండాలనుకున్నాడు. తనదికాని అనుభవాలను, తాము మనస్ఫూర్తిగా నమ్మని అంశాలను ఆపాదించుకునే సహానుభూతులను అయిష్టపడ్డాడు. వ్యవస్థను వ్యతిరేకించడం అంటే వ్యవస్థీకరణను వ్యతిరేకించడం కూడా అనుకున్నాడు. కుటుంబాన్ని పెళ్లినే కాదు,  ప్రేమల వెనుక పొంచి ఉన్న వ్యవస్థలనూ వెక్కిరించాడు. ఏకకాలంలో ఒకర్నే ప్రేమించలేనని, తనసూర్యోదయానికి ఒక్క ఆకాశం సరిపోదని బాహుళ్యవాదాన్ని సమస్త జీవనరంగాలకూ అన్వయించాడు. తనకు అనుచరులూ విధేయులూ ఎవరూ లేకుండా చూసుకున్నాడు. స్నేహాల్లో ప్రజాస్వామ్యాన్ని ఆచరించాడు.

వ్యక్తివాద అరాచకవాద విషసాంస్కృతికవాద వ్యక్తిగా కొందరికి  కనిపించిన త్రిపురనేని శ్రీనివాస్‌, ఉద్యమాలను వ్యతిరేకించలేదు. సాహిత్యంలో రాజకీయాంశాలను, సామాజికాంశాలను వ్యక్తం కావడాన్ని కాదనలేదు, పైగా ప్రోత్సహించాడు. ప్రచురణకర్తగా తను వేసిన పుస్తకాలలో సగం ఉద్యమాలకవిత్వం అయితే, తక్కిన సగం వ్యక్తులుగా సామాజికుల కవిత్వం. గొంతు బలపడి స్థిరపడిన ఉద్యమానికి (గురిచూసి పాడేపాట)తొలిసంకలనాన్ని, వర్తమానంలో విస్తరిస్తున్న మరో అస్తిత్వ కవిత్వ ఉద్యమం చిక్కపడుతున్న దశలో (చిక్కనవుతున్న పాట) మహాసంకలనాన్ని, ఇంకొక బాధిత అస్తిత్వ వాదం తొలికేక పెట్టినప్పుడే పుస్తకాన్ని (పుట్టుమచ్చ) ప్రచురించడం- సాహిత్య, కార్యకర్తగా శ్రీనివాస్‌ ఉద్యమవ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటం చేస్తాయి. అనుయాయిత్వాన్ని, పునురుక్తిత్వాన్ని అతను ఉద్యమతత్వానికి పర్యాయపదంగా వాడలేదు. ఉద్యమావరణాల్లో వ్యాపిస్తున్న అవాంఛనీయతలకే సంకేతించాడు.  విరసం నుంచి వెళ్లిపోవలసివచ్చి, రహస్యోద్యమం పుస్తకం బయటకు వచ్చి, తనపై విప్లవవ్యతిరేక ముద్ర విస్తరిస్తున్న సమయంలో కూడా అతను విప్లవకవిత్వం రాశాడు. ఆవేశమూ గాఢతా మమేకతా కలగలసిన విప్లవకవిత్వం ఎట్లా ఉండాలని తాను అనుకుంటాడో అట్లాగే అతను ఆ కవిత్వం రాశాడు.  అతనేమిటో అర్థం చేసుకోవడానికి సాధ్యం కాకపోతే, తప్పు అతనిది కాదు.

పాత్రికేయుడిగా, ప్రచురణకర్తగా, కార్యకర్తగా, కవిగా, వ్యక్తిగా త్రిపురనేని శ్రీనివాస్‌ చాలా పనులు చేసినా, వాటన్నిటిలోనూ ఏకసూత్రతతో కూడిన వైవిధ్యం ఉన్నది, మరి వైరుధ్యాలు కూడా ఉన్నాయా? ఇందుకు సమాధానం వెదికేముందు, స్వేచ్ఛకు ఎవరు ఇచ్చే నిర్వచనం ఏమిటి? రాజకీయ విశ్వాసాలకు, మానవవిలువలకు మధ్యనుండే ఎడం ఎంత ? – వంటి ప్రశ్నలనేకం వస్తాయి. మరొకరి అనుభవాన్ని ఎవరూ పలవరించవలసిన పనిలేదని, నిషేధించిన అక్షరం మీదనే తనకెప్పుడూ మోజు అని- త్రిశ్రీ చెప్పినప్పుడు అవి సమకాలపు ప్రయోజనం కోసం అర్థవ్యాకోచం చెందాయా? ఈ రెండు దశాబ్దాల కాలంలో తెలుగు సమాజంలో పరిణతి పెరిగిందా? లేక- మరింతగా విలువల వ్యవస్థీకరణలోకి  కూరుకుపోయిందా?

శ్రీనివాస్‌ సాహిత్య జీవితాచరణ నుంచి తెలుగు సాహిత్యం, ముఖ్యంగా పురోగామి సాహిత్యం ఎంతో ప్రయోజనం పొందింది. పాతికేళ్ల వెనుకకు వెళ్లి చూసినప్పుడు, ఆ కాలపు మలుపులో శ్రీనివాస్‌ కీలకమయిన కర్తవ్యాలు నిర్వహించాడు. ఏకైక నాయకపాత్రలో ఉన్న విప్లవసాహిత్యం స్థానాన్ని బహుళ సాహిత్యవాదాలు పంచుకునే పరిణామానికి అతను ఫెసిలిటేటర్‌గా ఉన్నాడు. వేయి పూవులుగా వికిసించగల తెలుగు కవిత్వానికి అతను తోటమాలిగా వ్యవహరించాడు. కవిత్వం నాణ్యత పెరగడానికి, నిర్భయమైన ప్రశ్నలు వెల్లువెత్తడానికి అతను సహాయపడ్డాడు. వ్యక్తివాదులుగా, అనుభూతివాదులుగా, అస్పష్ట-సంక్లిష్ట వ్యక్తీకరణవాదులుగా పేరుపడ్డ అనేకమంది ఒంటరి సామాజికులను కవిత్వపాఠకులందరి ముందుకు తెచ్చాడు. వారి నుంచి నేర్చుకోవలసింది నేర్చుకోవలసిందేనని తాను స్వయంగా అజంతా ప్రభావంలో పడి మరీ చెప్పాడు.

ప్రతికవీ కవిత్వం ఎట్లా ఉండాలో చెప్పినట్టే, త్రిశ్రీ కూడా ‘కవిత్వం కావాలి కవిత్వం’ రాశాడు. కవి అన్నవాడు ఎట్లా ఉండాలో ‘ అతడు అక్షరానికి మాతృదేశం’ పోయెంలో చెప్పాడు. మనిషి ఎట్లా పొగరుగా సాధికారంగా ధిక్కారంగా ఉండాలో అనేక కవితల్లో ప్రస్తావవశంగా చెప్పాడు. ఇవన్నీ శ్రీనివాస్‌ కవిత్వంలో ముఖ్యమైన, కీలకమయిన పద్యాలే. వాటిలో ఆవేశం, స్వాభిమానం, ఒకింత అహంకారం- అతని ప్రకటనలను కవిత్వంగా మలిచాయి.  కానీ, అతనికి అవి మాత్రమే చాలా ఇష్టమైనవని చెప్పలేము. ‘ద్వీపవతి’ కవితను అతను ఎంత ఇష్టపడి రాసుకున్నాడో, రాసి ఇష్టపడ్డాడో నాకు ప్రత్యక్షంగా తెలుసు. అజంతా గుప్పుమంటున్నా ‘నిశ్శబ్దం సాకారమై పరిమళిస్తుంది’ పోయెంను ఎంత ప్రేమించాడో కూడా నాకు తెలుసు. కవిత్వం అతని దృష్టిలో ‘అక్షరఖచిత భాష’. పొదగడం తప్ప అతను పూసగుచ్చలేడు, పోగుపెట్టలేడు.  ద్రాక్షవిత్తనాన్ని తపస్వి ముత్యపు శిల్పంగా పోల్చిన గాఢత కానీ, పుస్తకం తనను తిరగేయాలని,  కవిత్వం తనను రాయాలని, ఎండలు వానలకు తడిశాయని- చేసిన అనేక విలోమ ఊహలు కానీ ‘రహస్యోద్యమం’ లో అడుగుడుగునా మనలను ఆశ్చర్యపరుస్తాయి. ‘రహస్యోద్యమం’ పుస్తకంగా వచ్చినప్పుడు- ఫెటీల్మన్న చప్పుడు. దేనినో అధిగమించినట్టు, బకాయిపడ్డ నిట్టూర్పుకు విముక్తి లభించినట్టు. కవిత్వానికి అంతకుమించి సార్థకత ఏముంటుంది?

త్రిశ్రీ వెళ్లిపోయాక కూడా కాలం కదులుతూనే ఉన్నది. లోకం మారుతూనే ఉన్నది. అతను ముందే చెప్పిన మాటలు అనేకం తరువాత మన నిఘంటువుల్లోకి చేరిపోయాయి. కవిత్వం కావడమే కవిత్వానికి మొదటి షరతు అని అందరం ఇప్పుడు ఒప్పుకుంటూనే ఉన్నాము. మానవవిలువల ప్రజాస్వామ్యీకరణ జరగడం సంఘవిప్లవంలో భాగమని, సంఘవిప్లవానికి అవసరమనీ గుర్తిస్తూనే ఉన్నాము. స్త్రీ, దళిత, మైనారిటీ వాదాలు తెలుగుసాహిత్యంలో అవిభాజ్య, అనివార్య పరిణామాలని చరిత్రపుస్తకాలలో చేర్చుకున్నాము. టిబెట్‌ విషయంలో చైనా చేసింది తప్పని శ్రీనివాస్‌ రాసినప్పుడు అభ్యంతరపెట్టిన విప్లవసాహిత్యోద్యమం ఇప్పుడు భిన్నాభిప్రాయానికి చోటు ఇస్తున్నట్టే కనిపిస్తున్నది. మరి త్రిశ్రీ అప్పుడు ఎందుకు అపార్థమయ్యాడు? ఎందుకు అతని ‘జాము లోయల్లో నిదురించని’ యవ్వనాన్ని చూసి కొందరు భయపడ్డారు? అతను కూడా ఒక  సామూహిక ఏకవచనమని ఎందుకు గుర్తించలేకపోయారు?

త్రిపురనేని శ్రీనివాస్‌ రహస్యోద్యమ కవితలకు రహస్తాంత్రికుడు ‘మో’ ఇంగ్లీషు అనువాదాలను కలిపి వేస్తున్న పుస్తకం ఇది. పాఠకులుగా ఒకరికొకరు ఇష్టులే కానీ, కవులుగా ఇద్దరి కోవలు వేరు.  సకల మార్గాల తెలుగు కవులను అనువదించిన ‘మో’కు త్రిశ్రీ కఠినుడేమీ కాదు కానీ, ఎందుకో, కొన్ని పద్యాలు హడావుడిగా అనువదితమయినట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల స్వేచ్ఛ ఎక్కువ తీసుకోవడం పరవాలేదు.  మూలకవి భావానికి మరీ ఎడంగా ఉన్న సందర్భాలు కూడా కొన్ని కనిపిస్తాయి. శ్రీనివాస్‌ ఉన్నప్పుడే ‘మో’ ఈ అనువాదాలు చేశారట.  ఆ తరువాత అయినా ‘మో’ ఒకసారి సరిచూసి ఉంటే కొన్ని పొరపాట్లు లేకుండా  ఉండేవి.

“రహస్యోద్యమం”  తాజా ప్రచురణకు ముందుమాట

ఆగస్టు 10, 2015

 

అతనొక వేకువ పసిమి వెలుతురు…

 

కుప్పిలి  పద్మ
(ఆగస్టు పదిహేడు త్రిపురనేని శ్రీనివాస్ కన్ను మూసిన రోజు)
 

త్రిపురనేని శ్రీనివాస్ ని తలచుకోవడమంటే వేకువ కంటే  ముందు  వికసించే సూర్యోదయాన్ని,    వసంతమేఘ ఘర్జనని, శరత్కాలపు వెన్నెలని,  యువకవుల కవిత్వపు సెలిబ్రేషన్ని తలచుకోవటం.
* * *
వొకకానొక వసంత కాలపు సాయంకాలం.  వొక సాహితీ  మీటింగ్ ప్రాంగణంలో వుపన్యాసం వింటూ ఆకాశంలో నిండు చందమామని చూస్తున్నాను.
వో నవ్వు మాటలు కలగలసిన పిలుపు. వెనక్కి చూసాను. కిసుక్కున నవ్వుతోన్న చందమామ.  తిరిగి ఆకాశం వైపు చూసాను. ఆ ఆకాశపు చందమామ అక్కడే వున్నాడు.  మరి యెవరీ చందమామ అని తిరిగి చూసాను.  కృష్ణ గాలులు నులివెచ్చగా  వీస్తున్న ఆ మల్లెల కాలంలో ‘ప్రవహించు గోదావరి’ని   చూసాను.
 * * *
‘గోదావ‌రీ ప్ర‌వ‌హించు ‘  అంటూ  తిపురనేని శ్రీ‌నివాస్‌, సౌదా  కలసి సాహిత్యప్రవాహం లోకి కలసి ప్రవహించటం  మొదలుపెట్టారు.అప్పుడు  ఆ కవిత్వనవ్య ధార తళతళతో  చదవురుల మనసులని మిలమిలలాడించింది.

ఆ తరువాత
‘కవిత్వం కావాలి  కవిత్వం

అక్షరం నిండా  జలజలలాడిపోయే
కవిత్వం కావాలి
ప్రజల మీదే రాయి
ప్రజలల్లోని  అగాధ గాధల  మీదే రాయి
కవిత్వం రాయి
కాగితం మీంచి కన్నులోకి వెన్నులోకి గన్నులోకి
దూసుకు పోయే కవిత్వం రాయి
అలా వొక వాక్యం చదవగానే
శత్రువు ఠారెత్తి  పోవాలి
అమాయకుడు ఆయుధమై హోరెత్తి పోవాలి
కవిత్వం వేరు వచనం వేరు
సాదాసీదా డీలా వాక్యం రాసి
కవిత్వమని బుకాయించకు
కవిత్వాన్ని వంచించకు
వచనమై తేలిపోతావ్…  అంటూ పదునైన కవిత్వంతో  1989లో త్రిపుర‌నేని శ్రీ‌నివాస్ ‘ర‌హ‌స్యోద్య‌మం’ ప్రచురించారు. తెలుగు విప్ల‌వ క‌విత్వం సరికొత్తగా  రెపరెపలాడింది. ఆ సరి కొత్త గాలితో  కవిత్వపు హృదయాలు వుప్పొంగాయి.
యిప్పుడు మళ్ళీ  ఆ ‘ర‌హ‌స్యోద్య‌మం’ వేగుంట మోహ‌న‌ప్ర‌సాద్ గారి ఆంగ్లానువాదంతో రెండు  భాష‌ల్లో, కె.శ్రీనివాస్ గారి ముందు మాటతో  రాబోతోన్నయీ పుస్తకాన్ని శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వ‌రావు  గారు ప్ర‌చురించారు. విశ్వేశ్వర రావు గారి  కవిత్వం మీద వున్న గౌరవానికి,  శ్రీను  మీద వున్న  ప్రేమకి, యీ పుస్తకం వొక  నిదర్శనం.  ఆ  పుస్తకం రావటం అన్నది శ్రీను స్నేహితులకి, ఆప్తులకి యెంత  సంతోషాన్ని  కలిగిస్తుందో  కవిత్వాభిమానులకి అంతే ఆనందాన్ని యిస్తుంది.
యిప్పటికీ నవయవ్వనంతో తేజోవంతంగా  ప్రకాశిస్తోన్న  త్రి. శ్రీ. కి కవిత్వం రాయటమే కాదు యెక్కడ కవిత్వంలో కొత్తదనం కనిపించినా , అస్తిత్వాల   ఆనవాలు మెరిసినా  యెంతో  యిష్టంగా ప్రారంభించిన  క‌విత్వ ప్ర‌చుర‌ణ‌ల నుంచి 1990 నుంచి 94 వ‌ర‌కు 14 పుస్తకాలు ప్రచురించాడు. వస్తువు, రూపం వ్యైవిధ్య భరితం.  అవి వరుసగా

1. క్రితం త‌ర్వాత‌… ఆరుగురు యువ క‌వుల సంయుక్త క‌విత 2. యెక్క‌డైనా యిక్క‌డే… ప్రీతిష్‌నంది క‌విత్వానువాదం త్రిపుర‌నేని శ్రీ‌నివాస్ 3.19 క‌విత‌లు… గాలి నాస‌ర‌రెడ్డి  4. ఒఖ‌డే… స్మైల్  5. బ‌తికిన క్ష‌ణాలు… వేగుంట మోహ‌న‌ప్ర‌సాద్ 6. ఇక ఈ క్ష‌ణం… నీలిమా గోపీచంద్ 7. ఫోర్త్ ప‌ర్స‌న్ సింగుల‌ర్‌… గుడిహాళం ర‌ఘునాథం 8. బాధ‌లూ-సంద‌ర్భాలూ… త్రిపుర 9. గురిచూసి పాడే పాట‌…స్త్రీవాద క‌విత‌లు 10. ఎన్నెలో ఎన్నెలో… రావిశాస్త్రి క‌విత్వం 11. పుట్టుమ‌చ్చ‌… ఖాద‌ర్ మొహియుద్దీన్ 12. మ‌రోవైపు… దేశ‌దే శాల క‌విత్వానువాదం త్రిపురనేని శ్రీ‌నివాస్ 13.స్వ‌ప్న‌లిపి… అజంతా 14.అజంతా 14. చిక్క‌న‌వుతున్న పాట‌… ద‌ళిత క‌విత్వం 15. హో… త్రిపుర‌నేని శ్రీ‌నివాస్ క‌విత్వం. 1997లో క‌విత్వం ప్ర‌చుర‌ణ‌లు 15వ పుస్త‌కంగా శ్రీను  స్నేహితులు ప్ర‌చురించారు.

*  *  *
అస్తిత్వ‌వాద వుద్య‌మాల  వేకువలో  శ్రీను తను యించార్జ్ గా వున్న  వార్తాపత్రికల్లో స్త్రీ, ద‌ళిత‌, మైనారిటీ వాదాల సాహిత్యానికి  మొదట  ప్రాధాన్యత నిచ్చేవాడు. కధ నైనా,
కవిత్వానైనా  మామూలుగా  రాస్తే నిర్మొహమాటంగా  యిది యీ కాలపు రచన కాదని చెప్పేవాడు.
నేను బలంగా నమ్మే, యిష్టమైన  స్త్రీ వాద ఫిలాసఫీతో  రాసిన మసిగుడ్డ  కథని శ్రీను ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో  ప్రచురించాడు.  ఆ కథకి వచ్చిన అద్భుతమైన  రెస్పాన్స్ చూసి నేను   ఆశ్చర్యపోయాను. ఆ కథ  స్త్రీ వాద కధా  ప్రపంచంలో స్పష్టమైన స్త్రీవాద కథకురాలిగా  నిలబెట్టింది.
ఆ తరువాత మరి కొన్ని కథలు వివిధ పత్రికల్లో  అచ్చుఅయ్యాయి. నిర్ణయం కథ చదివి అందులో వైష్ణవి పిల్లల  విషయంలో తీసుకొన్న నిర్ణయం చూసి గట్టిగా నవ్వుతూ  ‘ అరే, యీ విషయంలో కూడా  మా మగవాళ్ళ కి  నిర్ణయించే హక్కుని వుంచవా ‘  అని అడిగాడు. ఆ తరువాతెప్పుడో  ఆ కథలో  నీ నరేషన్ చాల నచ్చింది.  కుటుంబాలకి సంబంధించిన  ఆ ముఖ్యమైన అంశం అంత సునాయాసంగా చర్చించావో అని చెప్పినప్పుడు తిరిగి వొక సీరియస్ చర్చ. భలే  భాద్యతగా చర్చించేవాడు.
నా  రెండవ కథా సంకలనం ‘ ముక్త ‘  శ్రీనివాస్ కి  అంకితం యిచ్చాను.
 * * *
మోడల్స్  జీవితం పై వొక కథ రాసాను.  ఆ కథ చదివి  శ్రీను అటువంటి అనేక లేయర్స్ వున్న వస్తువుని  తీసుకొన్నప్పుడు ఆ విషయాలలో  సంక్లిష్టతని పాత్రల స్వభావాలని  మరింత అవగాహనతో రాయాలని, అందులోని విషయాలని మరింత లోతుగా అర్ధం చేసుకోడానికి వసంతలక్ష్మి గారు, వసంత  కన్నభిరన్ గారి వంటి అనుభవజ్ఞులతో  మాట్లాడితే  విషయాలు మరింత బాగా అర్ధం అవుతాయని వొక  వుత్తరం రాసాడు. ఆ వుత్తరం  వొక కథకురాలిగా  నన్ను నేను మరింత మెరుగుపరచుకోడానికి  తోడ్పడింది.
 * * *
త్రి శ్రీ.  సాహిత్యానికి  సంబంధించి హితబోధలు  చెయ్యకుండా వొక మంచి మాట, వొక సూచన  చేస్తే మాత్రం అవి ఆ  రచయితకి, సాహిత్యానికి  అత్యంత విలువైనవిగా వుండేవి.
కథలో అస్థిత్వాన్ని అంతర్లీనంగా రాసినా,  ప్రస్పుటంగా రాసినా సరే  కథ యెప్పుడు కథకి  సంబంధించిన యీస్థటిక్స్ తో  కథ కథలానే  వుండాలి వ్యాసం లా  వుండకూడదనే వాడు.
 * * *
అస్తిత్వ వాదరచనలని  అర్ధం చేసుకోవటంలో,  ప్రచురించటం పై యెనలేని అవగాహన వుండేది తనకి.  రాబోయే కాలపు  సాహిత్య ప్రవాహానికి  తను  ముందుగానే తెరచిన తలుపుల్లోంచి  అస్థిత్వ వాద సాహిత్యం యెలా వొప్పొంగిందో  మనం  చూస్తూనే వున్నాం.
 * * *
బిమల్ రాయ్  సుజాతని చూస్తే  కళ్ళు చెమ్మగిల్లే   శ్రీనుకి మన నాగేశ్వరరావు గారి దేవదాసే దేవదాస్…  వొక పాజిటివ్ ద్ధిక్కారపు  సంతకం  యెప్పుడు వొకలానే  యెందుకుండదో, వుండలేదో  త్రిపురనేని శ్రీనివాస్ కి  ఖచ్చితంగా అప్పుడే  తెలుసు. ఆ  తరువాత సాహిత్య ప్రపంచానికి మెల్లమెల్లగా  తెలియసాగింది.
* * *
 త్రిపురనేని శ్రీనివాస్ ని తలచుకోవడమంటే వేకువ కంటే  ముందు  వికసించే సూర్యోదయాన్ని, వసంతమేఘ ఘర్జనని, శరత్కాలపు వెన్నెలని,  యువకవుల కవిత్వపు సెలిబ్రేషన్  న్ని తలచుకోవటం మాత్రమే కాదు  వొక సాహిత్య  యవ్వనోత్సాహాన్ని నెమరేసుకోవటమే.
Kuppili Padma Photo

పల్లవించవా నా గొంతులో….

కవితా చక్ర

 

కళ. ఒక తపస్సు…

కళ. ఒక ధ్యానం..!

కళ. జీవన్ముక్తి సోపానం…!!

కళ కి సేవచేయడమూ కళేనేమో…!!

సినీ సంగీత విశ్వంలో వీరెప్పుడూ ధ్రువ తారే!

అవును.

ఆయన సంగీతం.. మిన్నంటే అల!

ఆయన బాణీ గుండెల్లో విరబూసే తీయని వెన్నెల!

వీరి పాట వింటూంటే మనసు తీగకు అనుభూతి పూవు పూయాల్సిందే!

వీరి స్వరాస్వాదనలో గుభాళింపు హృదయం అలౌకిక రాగ లోకాలలో విహరించాల్సిందే!.

అది ఏ తీగ పూవైనా, ఉత్తేజ పరిచే కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు అయినా, సరిగమల గలగలలైనా…

వీరి ప్రేమ, ఆప్యాయత మాటల్లో వర్ణనాతీతం! పాటల్లో కొంతవరకు వ్యక్తపరచొచ్చేమో..!

స్వరబ్రహ్మ లైన ఎమ్మెస్, ఇళయరాజా గారి పాటలు వింటూ ఈ పాటల పై మక్కువ ఏర్పడి,  గొంతుక రెక్కలు విప్పుకుని స్వర విహారం చేస్తున్నప్పుడు  వారిని కలిసి ఆశీస్సులు పొందాలన్న తపన ఎక్కువైంది.

అనుకున్నదే తడవు, స్వరాంజలి టీమ్ తో వెళ్లి సంగీత దిగ్గజాల్ని కలవడం నా సుకృతం. ఒక్కసారి మరపు రాని ఆ స్వర క్షణాలని మళ్ళీ పంచుకోవాలనుకుంటున్నాను.

జూన్ 2, 2014, చెన్నై లో వారి ఇంటి ముందు మా కార్ సరిగ్గా సాయత్రం ఆరు గంటలకి ఆగింది. అప్పటికే అప్పాయింట్మెంట్ తీస్కున్నందున, వారి పీ.ఏ ఎదురొచ్చారు. వారి ఇంటి గేటు కి పక్కగా..’ఎమ్మెస్.విశ్వనాథన్’ అని మాత్రమే రాసి ఉంది. గేట్ లోకి ప్రవేశించగానే ధూప దీప సువాసనలు. లోపలి నుండి హారతి, గంటల శబ్దాలు. సాయంకాల పూజా సమయం అనుకున్నాను. మొదటి అంతస్తులో వారి నివాసం. ముందు ఒక సిటౌట్! మరో ఇద్దరెవరో కూర్చుని ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చి, “ఒక పది నిముషాలు కూర్చోండి సార్ పూజలో ఉన్నారు” అని తమిళ్ లో చెప్పి వెళ్ళాడు.

ఒక్కో క్షణం ఉద్విగ్నంగా గడుస్తుంది. అప్పటికే నా బృందానికి వారి ముందు పాడే పాటల్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసి, మరింతగా ప్రిపేర్ చేస్తున్నా.

ఒకటి, రెండు,మూడు!! లెక్క పెట్టుకుంటున్న అంకెలకు అడ్డుకట్ట వేస్తూ వచ్చింది ఆ క్షణం! లోపలి నుండి పిలుపు రానే వచ్చింది!

ఆనందం, ఉద్విగ్నం, ఆరాధన అన్నీ భావాలు మేళవించిన భావన నా కంటిలో చెమ్మై నిండుకుంది వారిని చూడగానే…!!

DSC_0146

తెల్లని వస్త్రాల్లో దివ్యమంగళ స్వరూపం.. ప్రశాంతత వారి చిరునవ్వులో, పరమేశ్వర విబూది వారి గొంతుక ని అద్దిందేమో! అందుకే అపర సరస్వతి వారిని ముద్దు బిడ్డలా అక్కున జేర్చుకుంది. ఎనిమిది పదుల నిండైన రూపం! కల్లా కపటం లేని స్వచ్చమైన చల్లని చూపు. అన్నిటినీ మించి వారి కాళ్ళ లో కాంతి! ఒక అద్భుతాన్ని చూస్తున్నానా అన్న ఏమరపాటు లో నేను. మమ్మల్ని చూసి, వారు లేచి ఆహ్వానించారు. సాష్టాంగ ప్రమాణాలయ్యాక, స్వరాంజలి మోటో గట్రా వారికి వినిపించాను. ఆశీర్వదించారు.

ఆ తరవాత నా బృందం చే వారి పాట లు పాడిస్తుంటే వారి ఆనందం చెప్పలేను. అన్నీ విన్నాక నాతో ఒక్క మాట చెప్పారు…”ఇంత చక్కటి కార్యక్రమాలకి హైదరాబాద్ రాలేనేమో..చెన్నై లో ఏర్పాటు చేస్తే చూడాలని ఉంది”

వారి ఆకాంక్ష!

నా అసమర్థత! జోడించిన చేతులతో “మీ ఆశీర్వాదం తప్పకుండా” అన్నాను.

వారు కంపోసింగ్ చేసిన రోజులను తలచుకున్నారు. వారి సంతోషం లో తెలియని లోటు గమనించాను.

అలా ఒక గంట సరదాగా పాడుతూ మాట్లాడుతూనే ఉన్నాం. సమయానికి జాలి, దయ ఉండవు కదా! ఆ స్వర ఘడియలు రెప్పపాటు లో కరిగిపోయాయి.

ఒక అద్భుతమైన అనుభూతిని గుండెల నిండా నింపుకుని వెను దిరిగాము.

వారి స్వర సీమలోకి కాస్త తొంగి చూస్తే…

**                                 **                       **

 

వీరి పూర్తి పేరు, మనయంగాథ్ సుబ్రహ్మణ్యన్ విశ్వనాథన్. విశ్వనాథన్ జూన్ 24, 1928 తేదీన జన్మించారు.

పదేళ్ళ చిన్నారి ప్రాయం లోనే నీలకంఠ భాగవతార్ గారి దగ్గర మూడేళ్ల పాటు సంగీతం నేర్చుకున్నారు. పదమూడేళ్ల వయసులోనే మూడు గంటల పాటు నిర్విరామంగా సంగీత కచేరి చేసి అందరి ప్రశంసలు పొందారు. జైలు డే రోజు ఖైదీలతో “హరిశ్చంద్ర” నాటకం వేయించారు, అందులో లోహితాస్యునిగా విశ్వనాధన్ అదరగొట్టేశారు. దానితో ఖైదీలందరూ సినిమాలలో ప్రయత్నించమంటూ ప్రోత్సహించారు.

మొదట సినిమాల్లో వేషాలు వేయాలన్న కుతూహలంతో 1941వ సంవత్సరంలో విజయదశమిన మద్రాసులో తొలిసారి పాదం మోపాడు విశ్వనాధన్. మేనమామ సహాయంతో, జూపిటర్ పిక్చర్స్ అధినేతలు ఎమ్.సుందరం చెట్టియార్, మొహిద్దీన్ లను కలిశారు. న్యూటోన్ స్టూడియాలో మేకప్ టెస్ట్ చేశారు. అయితే…ఆ వేషానికి తను నప్పడని కాదనడంతో, తిరిగి వెనక్కి రాలేక, అక్కడే ఆఫీస్ బాయ్ లా పని చేస్తూనే, మరో పక్క జూపిటర్ సంస్థ తీసిన “కుబేర కుచేల” సినిమాలో సేవకునిగా చిన్న వేషం వేశారు. నటుడు కావడానికి తన ఆకారము, పర్సనాలిటి సరిపోదని తనకే అర్ధమైపోయింది. అందుకే సంగీత విభాగంలోనే కృషి చేసి పైకి రావాలని నిర్ణయించుకున్నారు విశ్వనాథన్.

సేలంలో మోడ్రన్ థియేటర్స్ అనే సంస్థలో సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ ఉన్నారని తెలుసుకొని వెళ్లి కలిశారు. విశ్వనాధన్ తో ఓ పాట పాడించుకున్న మహదేవన్ గారు, అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చాలు అన్నట్టుగా ఆ ఒక్క పాట తోనే విశ్వనాధన్ లోని ప్రతిభని గుర్తించి, సరాసరి సెంట్రల్ స్టూడియోకి వెళితే అక్కడ పని దొరుకుతుంది అని చెప్పారు. సెంట్రల్ స్టూడియోలో సంగీత దర్శకునిగా ఉన్నఎస్.ఎమ్.సుబ్బయ్య నాయుడు గారి ట్రూపులో హార్మోనిస్ట్ గా చేరారు విశ్వనాథన్. అక్కడే “రామమూర్తి” (తిరుచారాపల్లి కృష్ణస్వామి రామమూర్తి) తో స్నేహం ఏర్పడింది.

అలా చాలా రోజులు సుబ్బరామన్ దగ్గర సహాయకునిగా పనిచేశారు ఇద్దరూ.. సుబ్బరామన్ దగ్గర ఉన్నప్పుడే ఘంటసాల, సుసర్ల దక్షిణామూర్తి, టి.జి.లింగప్ప, గోవర్ధనం పరిచయమయ్యారు. ఇలా కొద్ది రోజులు గడిచాక ఎమ్జీఅర్ హీరోగా “జనోవా” అనే సినిమాకి సంగీత దర్శకత్వం చేసే అవకాశం విశ్వనాధన్ కు వచ్చింది. ఒకే రోజు నాలుగు పాటలు చేసి, అవి సాయంత్రం సుబ్బరామన్ కు వినిపిద్దామని అనుకున్నాడు. కాని ఈలోపే వినకూడని వార్త వినాల్సి వచ్చింది, సుబ్బరామన్ చనిపోయారు అని! అప్పటికే సుబ్బరామన్ చేతిలో ఏడు సినిమాల దాకా ఉన్నాయి. వాటిని విశ్వనాధన్ – రామమూర్తి లు కలిసి పూర్తిచేసారు. అప్పటికే సుబ్బరామన్ దేవదాసు సినిమాకి 7 పాటలకు బాణీలు చేశారు. మిగిలిన రెండు పాటలు “జగమే మాయ బ్రతుకే మాయ”, బాలసరస్వతి పాడిన “ఇంత తెలిసియుండి” అను పాటలను కూడా స్వరపరిచారు. ఇలా సుబ్బరామన్ ఒప్పుకున్న తెలుగు, తమిళం చిత్రాలను ఎంతో చిత్తశుద్ధితో సకాలంలో పూర్తి చేశారు. ఇక ఆ తరువాత వీరిద్దరు కలిసి ఎన్నో చిత్రాలకు కలిసి సంగీత దర్శకత్వం చేశారు. విశ్వనాధన్ సోలోగా 700 సినిమాలకు (తమిళం 510, మలయాళం -76, కన్నడం – 3, తెలుగులో 70) పైగా స్వర సారధ్యం వహించారు.

**              **                        **

ఒక సంగీత దిగ్గజం ఇహలోకం లో నేల రాలోచ్చు గాక, సంగీతాకాశంలో మీరెప్పుడూ కాంతి పుంజమే!

కళ్ళలో ఉన్నవేవో కన్నులకే తెలిసినా..

దేవుడే ఇచ్చిన వీధి ఒక్కటే అయినా..

విధి చేయు వింతలెన్నయినా గాక,

మీరెప్పుడూ మా సంగీత విశ్వంలో స్వర నవ్వుల రేడే!

మీ బాణీ లో విరబూసిన స్వర పుష్పాలెన్నో…

మీ స్వరాలాపనలో ఆఘ్రాణించిన పరిమళాలెన్నో..

మీ పాట మూగవోయిన గొంతుకల్లో పల్లవిస్తోంటే మాటల్లేవు, మీ పాట ను పాడే గొంతుకను రెండు అశ్రు నయనాలు తడిమేసే వేళా….

తండ్రీ…!! మీకిదే అశ్రు నివాళి.

*

‘నీ జీవితమే ఒరవడి!’

వి.వి.

vv.kara                విశాఖపట్నంలో  శ్రీశ్రీ  శతజయంతి సభల్లో  2010 ఏప్రిల్‌ 30,  మేడే రెండురోజులూ నిండా పదిహేనేళ్లు నిండని పసివాడు వేదికమీద, నలుగురిలో గొంతెత్తి పాడిన శ్రీశ్రీ గీతాలు వింటారా? అవి విరసం నిర్వహించిన సభలు. ఆ సభలకు ఆ వసివాడని పసిబాలుడు ఉపాధ్యాయుడైన తండ్రితో వచ్చాడు. తండ్రి డెమొక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌లో నలగొండజిల్లాలో సభ్యుడు.

 

మరో ప్రపంచం

మరో ప్రపంచం

మరో ప్రపంచం పిలిచింది

 

పదండి ముందుకు

పడండి త్రోసుకు

పోదాం, పోదాం పైపైకి

 

కదం తొక్కుతూ

పదం పాడుతూ

హృదంతరాళలం గర్జిస్తూ`

పదండి పోదాం

వినబడలేదా

మరోప్రపంచపు జలపాతం?

 

దారిపొడుగునా గుండెనెత్తురులు

తర్పణచేస్తూ పదండి ముందుకు!

 

బాటలునడచీ

పేటలుగడచీ

కోటలన్నిటిని దాటండి!

నదీనదాలూ

అడవులు, కొండలు

ఎడారులా మనకడ్డంకి?

..             ..             ..

ఎముకలు క్రుళ్లిన

వయస్సుమళ్లిన

సోమరులారా! చావండి!

నెత్తురుమండే

శక్తులు నిండే

సైనికులారా! రారండి!

 

ఈ గీతం ఇంకెవరో కాదు అప్పటికింకా పదిహేనేళ్లు నిండని వివేక్‌ పాడాడంటే ఇవ్వాళ ఎంత సాధికారికంగా పిలుపు ఇచ్చినట్లు, ప్రకటించినట్లు అనిపిస్తున్నది.

పరస్పరం సంఘర్షించిన

శక్తులలో చరిత్ర పుట్టెను`

అని ‘దేశచరిత్రలు’ కవిత చదివి వినిపించి ఆ పిల్లవాడు అందులోని లోపాలు కూడ చెప్పాడని అంటే అది ఇవ్వాళ మనకాశ్చర్యమనిపించదు.

ఏ దేశచరిత్ర చూచినా

ఏమున్నది గర్వకారణం?

అంటాడేమిటి శ్రీశ్రీ? ప్రజలు నిర్మించిన, నిర్మిస్తున్న చరిత్రపట్ల గౌరవం ఉండాలికదా అన్నాడంటే చండ్రరాజేశ్వరరావు పెట్టిన విమర్శ విని ఉన్నట్లా? చెంఘిజ్‌ఖాన్‌ గురించి నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’లో రాసింది మొదలు, తెన్నేటిసూరి ‘చెంఘిజ్‌ఖాన్‌’ నవల వరకు రాసిన విషయాలు తెలుసుకొని, చదివి ఉన్నాడు ఈ పిల్లవాడు. ఇంతకన్నా శ్రీశ్రీకి ఎక్కువే తెలిసిఉండాలికదా అని ఆశ్చర్యపోయాడు. అవునులే శ్రీశ్రీ, గాంధీని ఇందిరాగాంధీ (ఎమర్జెన్సీ)ని పొగిడినవాడే కదా అని కాస్త కటువుగానే అంటే పిట్టకొంచెం, కూతఘనం అనిపించింది.

ఒక వ్యక్తిని మరొక్కవ్యక్తీ,

ఒక జాతిని వేరొకజాతీ,

ఓడిరచే సాంఘిక ధర్మం

ఇంకానా? ఇకపై సాగదు.

 

చీనాలో రిక్షావాలా,

చెక్‌దేశపు గనిపనిమనిషి

ఐర్లాండున ఓడకళాసీ

అణగారిన ఆర్తులందరూ `

హాటెన్‌టాట్‌, జూలూ, నీగ్రో

ఖండాంతర నానాజాతులు

చారిత్రక యథార్థతత్వం

చాటిస్తారొక గొంతుకతో `

 

ఈ ఆఖరి నాలుగు చరణాలు మరింత పునరుక్తితో చదివాడు

ఏ యుద్ధం ఎందుకు జరిగెనో?

ఏ రాజ్యం ఎన్నాళ్లుందో

తారీఖులు,  దస్తావేజులు

ఇవి కావోయ్‌ చరిత్రకర్థం `

ఈ రాణీ ప్రేమపురాణం,

ఆ ముట్టడికైన ఖర్చులూ,

మతలబులూ, ఖైఫీయతులూ

ఇవి కావోయ్‌ చరిత్రసారం

ఇతిహాసపు చీకటికోణం

అట్టడుగున పడికాన్పించని

కథలన్నీ కావాలిప్పుడు!

దాచేస్తే దాగనిసత్యం

 

నైలునదీ నాగరికతలో

సామాన్యుని జీవనమెట్టిది?

తాజ్‌మహల్‌ నిర్మాణానికి

రాళ్లెత్తిన కూలీలెవ్వరు?

 

సామ్రాజ్యపు దండయాత్రలో

సామాన్యుల సాహసమెట్టిది?

ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌,

అది మోసిన బోయీలెవ్వరు?

 

తక్షశిలా, పాటలిపుత్రం

మధ్యధరా సముద్రతీరం

హరప్పా మొహెంజొదారో

క్రో`మాన్యన్‌ గుహాముఖాల్లో `

 

చారిత్రక విభాతసంధ్యల

మానవకథ వికాసమెట్టిది?

ఏ దేశం ఏ కాలంలో

సాధించినదే పరమార్థం?

ఏ శిల్పం? ఏ సాహిత్యం

ఏ శాస్త్రం? ఏ గాంధర్వం

ఏ వెల్గులకీ ప్రస్థానం?

ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?

 

ఇవీ చారిత్రక భౌతికవాదం నుంచి వేయవలసిన ప్రశ్నలు అంటూనే  ‘పరమార్థం’లోని ఆధ్యాత్మిక వాసన చర్చిస్తే ‘ప్రస్థానం’ గూడా చర్చించాల్సే ఉంటుంది కానీ శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ గీతాలు పదాలకు ఉద్దేశాలవల్ల అర్థాలు మార్చినవని అనేవాడు. ఆ సభల్లోనే అని కాదు ` ఆ తర్వాత నాలుగేళ్లలో కలిసినపుడల్లా చర్చల్లో

ప్రశ్నలే, ప్రశ్నలే

జవాబులు సంతృప్తి పరచవు

 

మాకు గోడలు లేవు

గోడలను పగులగొట్టడమే మాపని

 

అలజడి మా జీవితం

ఆందోళన మా ఊపిరి

తిరుగుబాటు మా వేదాంతం

 

ముళ్లూ, రాళ్లూ, అవాంతరాలెన్ని ఉన్నా

ముందుదారి మాది

 

ఉన్నచోటు చాలును మీకు

ఇంకా వెనక్కి పోతామంటారు కూడా

మీలో  కొందరు

 

ముందుకు పోతాం మేం

ప్రపంచం మావెంట వస్తుంది

 

తృప్తిగా చచ్చిపోతారు మీరు

ప్రపంచం మిమ్మల్ని మరచిపోతుంది

 

అభిప్రాయాలకోసం

బాధలు లక్ష్యపెట్టనివాళ్లు

మాలోకి వస్తారు

 

అభిప్రాయాలు మార్చుకొని

సుఖాలు కామించేవాళ్లు

మీలోకి పోతారు

 

పందొమ్మిదేళ్లు నిండకుండా రాజ్యహింసకు బలి అయిన వివేక్‌ చితికి నిప్పుపెట్టి తిరిగివస్తున్నపుడు ఒక టీచర్‌ అతనితల్లి మాధవితో ‘వివేక్‌ ఇవ్వాటినుంచి మన ఆలోచనల్లో, ఆచరణలో జీవిస్తాడమ్మా’ అన్నాడు తన కన్నీళ్లతో ఆమె కన్నీళ్లు తుడిచే ప్రయత్నంలో

 

కొంతమంది యువకులు రాబోవుయుగం దూతలు

పావన నవజీవన బృందావన నిర్మాతలు

 

అని శ్రీశ్రీ ఇటువంటి విద్యార్థుల గురించే అన్నాడా?

 

పదిహేనో ఏట మాకందరికీ ఇట్లా పరిచయమైన ఈ విద్యార్థి ` అక్షరాలా ` 2009 నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 9 వరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రపంచాన్ని కుదిపేసిన పదిరోజుల ఉత్తేజం నుంచి పోరాట బాటలెంచుకున్నవాడు. అతడు లేని, పోరాడని, అరెస్టుకాని తెలంగాణ విద్యార్థి ఉద్యమం ఏదైనా ఉందా? వీపుమీద పుస్తకాలమూట, కళ్లద్దాలచాటున నూతనప్రపంచ దృష్టి ` అతడొక నవనవోన్మేష అడాలసెంట్‌  వలె లేడూ`  ముఖ్యంగా రెండురెక్కలు పట్టుకొని ఈడ్చుకొని పోతున్న ఉక్కుశిరస్త్రాణాల సాయుధపోలీసుల మధ్యన ` చిరునవ్వుల బాలచంద్రుని వలె.

1934 నుంచీ 41 వరకు రాసిన ‘మహాప్రస్థానం’ మొదలైన గీతాలను శ్రీశ్రీ 1938లోనే అప్పటికే మరణించిన తన మిత్రుడు కొంపెల్ల జనార్దనరావుకు అంకితం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ‘మహాప్రస్థానం’ వెలువడిరది మాత్రం 1950లో.

కాని ఇవ్వాళ

ఎవరికి కావాలి, నేస్తం! నువ్వు

కాగితంమీద ఒక మాటకు బలి అయితే,

కనబడని ఊహ నిన్ను కబళిస్తే….

అనడానికి లేదు. అంతమారింది లోకం` మంచికీ, చెడ్డకూ. సంచలనానికి, సంక్షోభానికీ, సంఘర్షణకు. అందరికీ కావాలి ` కాగితంమీద ఒక మాటకు బలి కావల్సిందేనా అని అడిగే మేధావులూ ఉన్నారు. వాళ్లకాళ్లకు డెక్కలు మొలిచాయి, వాళ్లనెత్తికి కొమ్ములలాగే. వాళ్లందరినీ ఆయన 2 జూన్‌ 2014 నాటికే పోల్చుకున్నాడు. అందుకే నాలుగునెలల్లోనే

నిన్న వదలిన పోరాటం

నేడు అందుకొనక తప్పదని

తన తోటి విద్యార్థి యువకులకు పిలుపునిస్తూ ఆయన విప్లవోద్యమంలోని అజ్ఞాతజీవితానికి వెళ్లిపోయాడు. ఆయనకు పోలవరం పాదయాత్ర దండకారణ్యం జైత్రయాత్రగా మార్చే స్వప్నం. అది సాకారంచేసే జనతన సర్కార్‌లోకి సాగిపోయాడు.

అడవులమీద ఆకాశం తొంగిచూస్తున్నప్పుడు

కొండల్లో ప్రతిధ్వనిస్తుంది నా గుండెల చప్పుడు

తెలుగు దేశంలో ఎక్కడున్నా నేను

నా తొలి యౌవనాన్ని పునర్జీవిస్తాను

అని శ్రీశ్రీ 1975లో అన్నాడు. అప్పుడు ఎమర్జెన్సీ రోజులు. నలబైఏళ్లు పోయాక 2015లో అప్రకటిత ఎమర్జెన్సీ కాలంలో వివేక్‌ అడవులమీద ఆకాశం తొంగిచూసినపుడు

కొండల్లో ప్రతిధ్వనించిన గుండెలచప్పుడయ్యాడు

బాలెంల సూర్యాపేట తెలంగాణ మట్టిలో తన తొలియవ్వనంలోనే కలిసిపోయాడు. కాని కలిసిపోయిన మరుక్షణం నుంచి మనమధ్యన పునర్జీవిస్తున్నాడు, మరింత ప్రాభవంతో `

అందుకే అంటున్నాం `

లేదు, నేస్తం! లేదు…

నీ ప్రాభవం మమ్మల్ని వదలలేదు!

నిరుత్సాహాన్ని జయించడం

నీవల్లనే నేర్చుకుంటున్నాము!

ప్రతికూల శక్తులబలం మాకు తెలుసు,

భయం లేదులే అయినప్పటికీ! `

నీ సాహసం ఒక ఉదాహరణ!

నీ జీవితమే ఒరవడి!

 

(15 జూన్‌ శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా 12 జూన్‌ వివేక్‌ అమరత్వం గురించి)

15 జూన్‌ 2015

 

ఫోటో: కూర్మనాథ్‌ 

 శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా విశాఖపట్నంలో విరసం నిర్వహించిన ఊరేగింపు(2010)లో ఆదివాసులకోసం నినాదం రాసుకొని పాల్గొన్న వివేక్‌

దాశరథి రంగాచార్య – తెలంగాణ సమాజపు మోదుగుపువ్వు

  • ఎన్ వేణుగోపాల్

 

దాశరథి రంగాచార్య (1928-2015) మరణంతో తెలంగాణ సాహిత్య ప్రపంచం, తెలుగు మేధో ప్రపంచం ఒక బహుముఖ ప్రజ్ఞాశాలినీ ఆలోచనాపరుణ్నీ ప్రజాజీవితాన్ని అద్భుతంగా చిత్రించిన రచయితనూ కోల్పోయింది. ఎనబై ఏడు సంవత్సరాల నిండు జీవితంలో, డెబ్బై సంవత్సరాలకు మించిన సామాజిక జీవితంలో, కనీసం ఆరు దశాబ్దాల రచనలతో ఆయన తెలంగాణ సామాజిక జీవితానికీ, తెలుగు సాహిత్యానికీ అసాధారణమైన సేవలందించారు. చిల్లరదేవుళ్లు, మోదుగుపూలు, జనపదం, మాయజలతారు, రానున్నది ఏది నిజం, పావని, నల్లనాగు, అమృతంగమయ నవలలు, ఉమ్రావ్ జాన్ వంటి నవలల అనువాదం, కథల అనువాదం, కవిత్వం, వ్యాసాలు లాంటి రచనలు, జీవనయానం ఆత్మకథ, బుద్ధుడి జీవితచరిత్ర మాత్రమే కాక, రామాయణం, భారతం, భాగవతం, ఉపనిషత్తులు, వేదాలు అన్నిటినీ ఒంటి చేత్తో తేటతెలుగులో రాసి, పదహారు వేల పేజీల పైన రచనలు చేసిన రంగాచార్య ఏ కోణం నుంచి చూసినా విశిష్టమైన రచయిత. ముఖ్యంగా నవలా ప్రక్రియ ద్వారా ఇరవయో శతాబ్ది తెలంగాణ జనజీవనానికి, అప్పటి ప్రజా పోరాటాలకు అద్దంపట్టిన మహా రచయిత ఆయన.

అంతటి విస్తారమైన జీవితానుభవం, ఆచరణ ఉండి కూడ దాశరథి రంగాచార్య రెండు విరుద్ధ ప్రకృతుల సమ్మేళనం అనిపిస్తుంది. ఆలోచనలలోనూ ఆచరణలోనూ చివరికి ఆహార్యంలోనూ కూడ ఆధ్యాత్మిక, ఆస్తిక, మత భావనలు ఒకవైపు. తనను తాను మార్క్సిస్టుగా చెప్పుకుంటూ, మార్క్సిజం ప్రేరణతో, కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలో సాగిన ప్రజా ఉద్యమాన్ని నిజాయితీగా అక్షరబద్ధం చేయడం, ఏ రాజ్య వ్యతిరేక ప్రజా ఉద్యమానికైనా తన మద్దతు ఇవ్వడం మరొకవైపు. అది వైరుధ్యమా, విరుద్ధ భావాల మధ్య సమన్వయమా? ఆయనే చెప్పుకున్నట్టు మనిషి, మానవత్వం, సమానత్వం తన ప్రాథమిక లక్ష్యాలుగా మతం, ఆధ్యాత్మికత, ప్రత్యేకించి వేదాలు కూడ సమానత్వాన్నే బోధించాయని నమ్మినందువల్ల, ఆ నమ్మకాన్ని నిరూపించడానికి ప్రయత్నించారా? తాను ఎప్పుడూ కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిని కాదని అంటూనే, తాను మార్క్సిస్టునని, మార్క్స్ మహర్షి అని అనడం ఆయనలో వైచిత్రికి నిదర్శనాలు.

పాత వరంగల్ జిల్లా, ప్రస్తుత ఖమ్మం జిల్లా చిన్నగూడూరులో శ్రీవైష్ణవ కుటుంబంలో పుట్టిన దాశరథి రంగాచార్య పన్నెండో ఏట ఖమ్మంలో పాఠశాల విద్యార్థిగా నిజాం వ్యతిరేక ఉద్యమంలో భాగంగా సమ్మె చేయించి, పాఠశాల నుంచి బహిష్కృతులయ్యారు. హైదరాబాదు రాజ్యంలో మరెక్కడా పాఠశాలల్లో చేర్చుకోగూడదని ఉత్తర్వులతో ఆయన చదువు ఆగిపోయింది. “నాకు పాఠశాల విద్య లేదు. గురువుల వద్ద చదవలేదు” అని ఆయనే చెప్పుకున్నారు. ఈ రాజకీయాభిప్రాయాలను సహించని తండ్రి ఆయనను ఇంటి నుంచి గెంటేశారు. ఒకరకంగా గోర్కీ లాగ ప్రజాజీవితమే, ప్రజాఉద్యమ భాగస్వామ్యమే రంగాచార్య మేధాశక్తికీ సృజనశక్తికీ పదును పెట్టాయి. అన్న, ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య (1925-1987) అనుచరుడిగా రంగాచార్య నిజాం వ్యతిరేక ప్రజాఉద్యమంలో కార్యకర్తగా మారారు. వేరువేరు కారణాలతోనైనా, వేరువేరు భావజాలాలు గల కమ్యూనిస్టు పార్టీ, స్టేట్ కాంగ్రెస్, ఆర్యసమాజం నిజాం వ్యతిరేక ప్రజా ఉద్యమంలో భాగస్వాములైనందువల్ల ఆ ఉద్యమ కార్యకర్తలలో కూడ కొన్ని ప్రగతిశీల, ప్రజాస్వామిక భావాలు, కొన్ని మతవాద, అప్రజాస్వామిక భావాలు కలగలిశాయి. ఆంధ్ర మహాసభ చీలిక (1944) తర్వాత ఆయా కార్యకర్తల భావజాలాలలో కొంత స్పష్టత వచ్చినప్పటికీ, కొంత గందరగోళం తదనంతర పరిణామాలలో కూడ కనిపిస్తుంది. ముస్లింలు భారతీయులేననీ, భారతీయ కళా సంస్కృతులకు వారు ఎంతో దోహదం చేశారనీ, ఒక ముస్లిం రాజు ప్రజల మీద సాగించిన తప్పుడు పనులను వెయ్యి సంవత్సరాల ముస్లిం పాలనకు అంటగట్టగూడదనీ చాల సమన్వయపూరితమైన వ్యాఖ్యలు చేస్తూనే, తమ పోరాటం “తురక రాజుకు వ్యతిరేకంగా”నని రంగాచార్య రాయడం ఈ గందరగోళం ఫలితమే. నిజాం ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కొద్దికాలంలోనే పోరాట నాయకత్వం పట్ల కూడ ఆయనకు విశ్వాసం సన్నగిల్లింది. ఆయనే చెప్పుకున్నట్టు “ఈ వ్యవస్థలో త్యాగానికి స్థానం లేదని తేల్చుకుని” “స్వయంకృషితో రెండు డిగ్రీలూ రెండు డిప్లొమాలూ సాధించి” హైదరాబాద్ మునిసిపల్ కార్యాలయంలో ఉద్యోగంలో చేరి 1988లో పదవీ విరమణ చేశారు.

పోరాట కాలంలో భారతీయ సాహిత్యమంతా పనికిరానిదని ఈసడించుకున్నామనీ, కాని పోరాట అనంతరం ఆ సాహిత్యాన్ని చదవడం ప్రారంభించి ఆకర్షితుడినయ్యాననీ ఆయన రాశారు. ఈ సమయంలోనే 1960ల మొదట్లో వచన రామాయణం, వచన భాగవతం రాశారు. 1966 తర్వాత నవలలు, కథలు, వ్యాసాలు రాయడం, అనువాదాలు చేయడం ప్రారంభించారు. వచన మహా భారత రచనను 1962లో ప్రారంభించి 1993లో పూర్తి చేశారు. వేదాలను తెలుగులోకి తీసుకురావాలనే కోరికతో 1995లో రుగ్వేదంతో ప్రారంభించి 2008 నాటికి చతుర్వేదాలనూ తెలుగులోకి తెచ్చారు. ఈ మధ్యలో ఉపనిషత్తులను కూడ తెలుగు చేశారు. బహుశా రామాయణం, మహాభారతం, భాగవతం, వేదాలు, ఉపనిషత్తులు అన్నిటినీ అనువదించిన/రాసిన ఏకైక రచయిత ఆయనే కావచ్చు.

ఆ ఆధ్యాత్మిక రచనల కోసం, అందులో ఆయన ప్రచారం చేసిన హేతువిరుద్ధ భావాల కోసమూ ఆయనను గౌరవించేవాళ్లు కూడ ఉండవచ్చు గాని, 1930ల నుంచి 1950ల దాకా తన జీవితాన్ని యథాతథంగా, కళాత్మకంగా చిత్రించినందుకు తెలంగాణ సమాజం ఆయనను గుర్తు పెట్టుకుంటుంది. వట్టికోట ఆళ్వారుస్వామి ప్రారంభించి అసంపూర్ణంగా వదిలిన తెలంగాణ సంక్షుభిత జనజీవన చిత్రణను ఆయన కొనసాగించారు. ముఖ్యంగా చిల్లరదేవుళ్లు, మోదుగుపూలు, జనపదం, మాయజలతారు నవలల్లో ఆయన గడీల దౌర్జన్యాలను, రైతు కూలీల మీద, ఆడబాపలమీద, సబ్బండవర్ణాల మీద దొరల దుర్మార్గాలను, రజాకార్ల దాడులను, నిజాం నిరంకుశత్వాన్ని, ప్రజల పోరాటాలను అత్యద్భుతంగా చిత్రించారు.  తెలంగాణ నుడికారపు సొగసును తెలుగు పాఠకుల అనుభవానికి తెచ్చారు. మానవ స్పందనలను, ఉద్వేగాలను స్వచ్ఛంగా, స్పష్టంగా పట్టుకున్నారు.

1940లో ప్రారంభమైన రాజ్య వ్యతిరేకతనూ, ఆధిపత్యం మీద ధిక్కారాన్ని చివరివరకూ నిలుపుకున్నారు. 1990ల మధ్య నుంచి దాదాపు 2010 దాకా హైదరాబాదులోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రభుత్వ అక్రమాలకు వ్యతిరేకంగా సాగిన ప్రతి ఆందోళనలో ఆయన సంతకం ఉంది.

దాశరథి కృష్ణమాచార్య లాగ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా వ్యతిరేకించకపోయినా, ఈ ఉద్యమం వల్ల ప్రజా తెలంగాణ ఏర్పడబోదని, అధికారం ఒక పాలకవర్గ ముఠా చేతినుంచి మరొక ముఠా చేతికి మారుతుందని ఆయన పదే పదే అన్నారు. ఫజలలీ కమిషన్ సూచనను పాటించి 1956లోనే తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసి ఉండగూడదని, తెలంగాణకు అన్యాయం జరిగిందని అంటూనే, ఆ అన్యాయంలో “రెండు వైపుల వాళ్ల బద్మాషీ ఉంది” అని రెండు ప్రాంతాల పాలకవర్గాలనూ తప్పు పట్టారు. కేంద్ర పాలన నడుస్తున్నప్పుడు, ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రంలో ఏం చేయగలుగుతుందని అన్నారు.

ఆయనలో, ఆయన రచనలో ప్రశ్నించవలసినవీ, చర్చించవలసినవీ, బహుశా తిరస్కరించవలసినవీ కూడ ఉండవచ్చు గాని, ఆయన తెలంగాణ సమాజం పూచిన మోదుగుపువ్వు. దానికి నల్లని తొడిమా ఉంది, ఎర్రెర్రని పూవూ ఉంది. వసంతోత్సవ వేళ సమాజం మొత్తాన్నీ రంగుల్లో ముంచెత్తే శక్తీ ఉంది.

 

మైదానంలో వొంటరి రాజేశ్వరి!

నామాడి శ్రీధర్

sri1​శివలెంక రాజేశ్వరీదేవి. జన్మత: ఓ అద్భుతమైన కవిత. మనమధ్యన ఒంటరిగా జీవించిన అమాయక బాలిక. శరత్‌, చలం, చండీదాస్‌ రచనల్లోంచి రెక్కలు కట్టుకువచ్చిన దయాళువైన వనిత. ఎల్లల్లేని స్వేచ్ఛలోకి అశ్రుబిందువై హరించుకపోయిన ముక్త.

ఆమెది జననంతో ప్రాప్తించిన ఏకాకితనం. దివాస్వప్నం లో కరిగిన యవ్వనం. ప్రత్యుత్తరం లేని ప్రేమలేఖనం. పీటలమీద ఆగిపోయిన కళ్యాణం. ఒక్క గదిలో కొనసాగిన ప్రపంచయానం. సాహిత్యం, సంగీతం తోడునీడలుగా తనలో తాను మాట్లాడుకొన్న శూన్యావరణం. ఎదురెదురుపడే నిరాదరణంతో తలపడే దినదినం. ఏ ఒక్క సంతోషరేణువునో గుప్పెట బంధించాలన్న జాగరణం. ఆ అరవయ్యేళ్ల నిష్ఫలపరంపరకు ముగింపుగా ఆఖరికి ఆదరించినది మరణం.

* * *

1984-94 మధ్య రాజమండ్రిలో నా విద్యాభ్యాసం. ఉద్యమకాలం. అంతరాంతరం నవచైతన్యంతో వికసిస్తోన్న యవ్వన ప్రాయం. కవిత్వమొక తీరని దాహమైన దేశదిమ్మరితనం. అప్పుడొక పత్రికలో రాజేశ్వరీదేవి కవిత కనబడింది. ఎంత బావుందీ కవిత, ఎవరీ కవయిత్రీ అని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. ఆనాటి నుంచి ఇవాళ్టికీ ఆమె కవితని అపురూపంగానే భావించాను. మిత్రు లతో ‘కంజిర’ (1990-95) ప్రారంభించాక, కవిత కోసం పోస్ట్‌కార్డ్‌ రాశాను. ‘టెలిఫోన్‌టాక్‌’ పంపించింది. నాల్గవ బులిటెన్‌లో అచ్చు వేశాం. అటుపిమ్మట హైదరాబాద్‌ ‘వార్త’ రోజుల్లో (1995-98) కూడ సాహిత్యం పేజీ, సండే మ్యాగజైన్‌లలో కొన్ని కవితలు ప్రచురించాం.

నేను ఉద్యోగం వదలివేశాను. స్వస్థలం చేరుకొన్నాను. ఓ రోజు ఒమ్మి రమేష్‌బాబు వచ్చేడు. మా కబుర్లలో… సి.వి.ఎస్‌. మహేష్‌, కవులూరి గోపీచంద్‌, టి.వి.ఎస్‌.రామన్‌, కలేకూరి ప్రసాద్‌, శివలెంక రాజేశ్వరీదేవి ఇత్యాది వుల పుస్తకాలు రావడంలేదు. మనం పూనుకోవడం మంచిదనుకున్నాం. ఆ తర్వాత రాజేశ్వరీదేవికి ఫోన్‌ చేశాను. ‘మీ కవిత్వమంటే మాకిష్టం, పుస్తకం వేయండి. లేదా, కవితలన్నీ మాకివ్వండి. పుస్తకం తీసుకొస్తాం’ అని సంభాషణ ప్రారంభించేను. ఆమె ఏ కొంచెం కూడ ఉబ్బితబ్బివ్వలేదు. ఇప్పుడెందుకులే అన్నట్టు మాటమార్చింది. ఆ ప్రథమ పరిచయంలోనే ఒక ముఖ్యమైన సంగతి చెప్పింది…’శ్రీధర్‌, నీ తల్లి అకాలమరణంతో నువ్వెంతగా దుఖ్ఖించావో విన్నాను. ఆ బాధ నేనెరుగుదును. ఆమె తిరిగిరాదు. ఇక నేనే నీకు అమ్మనని…ఆ రోజుల్లో ఉత్తరం రాశాను. నాన్నా!  అది పోస్టుచేయలేదు.’ అప్పటినుంచి ఆమె నాకు అమ్మతో సమానం.

అయితే, అక్కడితో నేను ఆగిపోలేదు. నా దగ్గరున్న పత్రిక లు, ప్రత్యేక సంచికలు, సంకలనాలు వెతకసాగాను. స్నేహితులనీ వాకబు చేశాను. పది కవితలు వెలికితీశాను. తెలుగు కవిత్వంలో ఆమెది ఓ ప్రత్యేక తరహా. మధ్యేమధ్యే అందం కోసం రంగుల పూసలవలె ఆంగ్లపదాల్ని గుచ్చుతుంది. పాత సినిమా పాటల్లో చరణాల్ని చేర్చుతుంది. స్వతంత్ర భావం, ఇంపైన పరిభాష. ప్రభాత పవనం, నిర్మలమైన నీరెండ కలగలిసి మనని స్పృశిస్తోన్న అనుభూతి కలుగుతోంది. ఏ కవిత పనిగట్టుకొని రాసినట్టుండదు. అసలు ఆ అవసరమే లేదామెకు. కవనం కొండవాగుమల్లే  స్వచ్ఛంగా సాగు తోంది. వాక్యం స్వేచ్ఛగా సంచరిస్తోంది. పగిలిన అద్దంలో, కవితాత్మ కత, ఒంగిన గగనం, ద్వైతం, రంగులు వెలసి రాగాలు వినిపించని వేళ, ఇక శెలవా మరి…ఇలా కొన్నిటిని సేకరించాను. ఇవిగో మీ కవితలని కొరియర్‌లో పంపాను. ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఆలస్యంగా తెలిసిన నిజమేమిటంటే, ఇంట్లోని పాత న్యూస్‌పేపర్స్‌లో కలిసిపోయిన ఆ కవితల కాగితాలూ తూకానికి వేసేశారని.

raj1

* * *

కొత్తలో ప్రతిరోజు ఎడతెగని మాటలు. కాలక్రమంలో ముక్తసరి సంభాషణలు. నేను పనిలో పడి రెండ్రోజులు ఉలుకూ పలుకూ లేకుంటే ఎదురుచూపులు. ఉమ్మడి మిత్రులెవరికైనా ఫోన్‌ చేసేది. నా కుశలం తెలుసుకొన్నాక స్థిమితపడేది.

రాజేశ్వరీదేవికి నిరంతరం సాహిత్యమే. సాహిత్యమే సర్వ స్వం. బుద్ధిపూర్వకంగా సాహిత్యం మినహా ఇతరేతర చిల్లర విష యాలు తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు. శరత్‌, చలం, చండీదాస్‌, ఆలూరి బైరాగి, శేషేంద్రశర్మ, మోహన్‌ప్రసాద్‌, చినవీరభద్రుడు అంటే ఆమెకు అపరిమితమైన మక్కువ. ఆ అక్షరాలంటే అపార మైన సమ్మోహం. ఆమె హృదయంలో ఇంకిపోయిన, రుధిరంలో సంలీనమైన రచనలవి. ఆ కథలు, నవలల్లోని పాత్రలు ఆమెకు చిరపరిచితమైన వ్యక్తులు, నేస్తాలూను. కొన్ని సంభాషణలు కంఠో  పాఠం. కవిత్వ చరణాలనేకం అవలీలగా ఉదహరించేది. బాలసర స్వతి పాటలు, శారదాశ్రీనివాసన్‌ మాటలు మరిమరి చెప్పేది. శేషేంద్ర, చండీదాస్‌ మరణించినప్పుడయితే రోజులకి రోజులు బాధపడిపోయేం, ఇరువురం అదేపనిగా చర్చించుకున్నాం. పురాణం సుబ్రహ్మణ్యశర్మ, నండూరి రామ్మోహనరావు, ఎబీకే ప్రసాద్‌, ఇంద్ర గంటి శ్రీకాంతశర్మ, కె.శ్రీనివాస్‌, అఫ్సర్‌, ఆర్టిస్ట్‌ మోహన్‌ రచనల గురించి ఇష్టపూర్వకంగా ముచ్చటించేది.

* * *

రాత్రి నడిజాము దాటే దాకా చదువుకోవడం, పొద్దెక్కేక లేవడం, కాఫీ తాగడం, నాలుగు న్యూస్‌పేపర్లు చూడడం, ఎడిట్‌ పేజీల్లో చదవవలసినవి పక్కనపెట్టడం, ఇష్టమైన పుస్తకం పట్టుకుని కూర్చోవడం, అప్పుడప్పుడు టీవీ, సాయంకాలం వాహ్యాళి.ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మిత్రుల్ని ఫోన్‌లో పలుకరించడం, సాహిత్యం పేజీల్లో, సండేమ్యాగజైన్లలో వచ్చిన కవితలు, కథలు, వ్యాసాల గురించి మాట్లాడం, హిందీ, బెంగాలీ, తెలుగు ఆర్ట్‌ సినిమాలని గుర్తుచేయడం, పాతపాటలని తలచుకోవడం. ఏడాదికోసారి విజయవాడ పుస్తకోత్సంలో కొత్త పుస్తకాలు కొనడం…ఇంతే జీవిత పర్యంతం. ఆమె కాలాతీత వ్యక్తి. ఇరవైనాలుగు గంటల్లో ఏ క్షణమైనా ఫోన్‌ చేసేది. ఊరకనే పలుకరించేది. బదులు లేకపోతే, గుడ్‌నైట్‌ లేదా గుడ్‌మోర్నింగ్‌ మైడియర్‌ బాయ్‌ అనే మెసేజ్‌. కిందన ‘మా’ అని రాసేది.

ఆమె ఎంచుకున్న స్నేహితులు తక్కువ. ఒమ్మి రమేష్‌బాబు, గుడిపాటి, కుప్పిలి పద్మ, జుగాష్‌విలి, ఎమ్మెస్‌ నాయుడు, ఆర్టిస్ట్‌ అన్వర్‌, జూలూరి గౌరీశంకర్‌, ఎమ్మెస్‌ సూర్యనారాయణ, భాస్కర్‌ జోగేష్‌, వాడ్రేవు వీరలక్ష్మీదేవి, ఘంటశాల నిర్మల, మరో ఇద్దరు ముగ్గురు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో కవిత్వ పఠనం కోసం తొలినాళ్ల రాకపోకల్లో కొన్ని పరిచయాలు, కొందరు మిత్రు లు. అన్నీ నెమ్మదిగా చెల్లాచెదిరిపోయిన స్మృతులు.

* * *

రాజేశ్వరీదేవికి అంకెలు,లెక్కలంటే భయం. అహం ప్రదర్మిం చే తెలివితేటలంటే అసహ్యం. నానాటికీ డబ్బు ఊబిలో కూరుకు పోతున్న అవివేక సమాజమంటే ఛీత్కారం. వేళకి భోజనం అలవాటు లేదు. ఒక్కతే రోడ్డు దాటడమనేది తనవల్లకాని పని. ప్రయాణమంటే మహా హైరానా. ఎన్నడూ సర్వసాధారణమైన సౌఖ్యాలవేపు మొగ్గ లేదు. మానవీయ విలువల కోసం అన్వేషణ ఆ గొంతులో ధ్వనిం చేది. ఆమెది సంపూర్ణంగా హృదయసంబంధం. పేదరికమంటే చలించి, తలకు మించిన సాయంచేసే కనికరం. ఇవన్నీ ఇంటా బయటా ఆమెకు కష్టం కలిగిస్తుందన్న ఎరుక లేకపోలేదు. అయినా సరే మనుషుల్ని ప్రేమించడమే ఆమె బలమూ, బలహీనత అయింది.

ఇన్నేళ్లలో ఆమెని ఒకేఒక్క పర్యాయం చూడగలిగాను. 2008లో కాబోలు, కేంద్రసాహిత్య అకాడెమీ రాజమండ్రిలో సదస్సు నిర్వహించింది. అందులో నేను పాల్గొంటున్నానని తెలిసి, ఎంతో దూరం నుంచి నన్ను చూడవచ్చింది. ఓ తెల్లని పారదర్శకమైన గాజుబొమ్మమల్లే అనిపించింది. అలా తాకగానే చిట్లిపోతోందేమో అన్నంత సున్నితంగా కనిపించింది.

* * *

‘మా ఇంటిలో ఇమడలేపోతున్నాను. నాకు ఎవ్వరున్నా రని, ఎక్కడికని వెళ్లను?’ అన్నది అనేకసార్లు. కోనసీమకు రండి. మా ఇంట, మాతో బాటు ఉండండి. అనేక పుస్తకాలు, నలువైపులా నీరు, వరిచేలు, కొబ్బరితోటలు, ఒంటరితనంనుంచి ఒకింత బయట పడే కొత్తవాతావరణంలోకి ఆహ్వానించాను. మీ కవితలన్నీ తీసుకు రండి. నేను పుస్తకం వేస్తాను. నలుగురూ చదువుతారు. మీతో మాట్లాడతారు. అది ఉత్సాహకారకంగా ఉంటుందనీ అభ్యర్థించాను.

ఆద్యంతం, ఆమెకు ఈ రెండేరెండు మాటలు చెప్పుకొచ్చాను. ఒక్కటీ లక్ష్యపెట్టలేదు. ఆమెకు ఇష్టంలేక కాదు. ఏనాడో ఆ సాంప్రదాయక కుటుంబం, రాజేశ్వరీదేవి అనే ఇంద్రధనుస్సుని ఒక గుంజకి కట్టిపడేసింది. అరవయ్యేళ్ల పెనుగులాటలో దేహం మాత్రమేనా అలసిపోయింది. ఏ తెగువ చేయలేని మనిషీ నిలువెల్లా విసిగిపోయింది. కడకు కోకిలవంటి హృదయం సైతం నిశ్చలన మయింది. లేకపోతే, తొలుత ఆమె హాయిగా బతుకుతుండేది. సాహిత్యలోకంలో వైభవోపేతమైన కవిత్వ సంపుటమూ నిలిచేది. ఇప్పుడు తెగిపోయిన ఆ హరివిల్లు అదృశ్యతీరానికి తరలి పోయింది.

నా చిన్నతనంలో శరత్‌నీ, చండీదాస్‌నీ, డాక్టర్‌ కేశవరెడ్డినీ పరిచయం చేసింది నన్ను కన్నతల్లి. విచిత్రంగా ఆ రచనల గురించి పదేపదే చర్చించిన అమ్మ రాజేశ్వరీదేవి. ఇరువురూ, నా ఎడల అవ్యాజప్రేమని చూపారు, నా శ్రేయస్సుని కోరుకున్నారు. ‘ఆకుపచ్చ లోయ’ని శిశువువలె అక్కున జేర్చుకొన్నారొకరు. ‘బంధనఛాయ’ని అభిమానించి మురిసిపోయారు మరొకరు. అయితే నాకు ఒక్కమాట మాత్రం చెప్పకుండానే, ఇద్దరూ హఠాత్తుగా అదృశ్యమైనారు.

.

రాజేశ్వరీదేవి కవిత

ద్వైతం

నేనసలే గంగను కదా

నాకు పర్వతమూ ఇష్టమే పొలమూ ఇష్టమే

గండశిలల్నించి కరిగి కిందికొచ్చినందుకే

ఈ మునిగిపోయిన పేదపల్లెల కన్నీళ్లు ఇష్టం.

రాళ్లు పగిలితేనే గానీ కన్ను చెమ్మగిలదు

మీరేదో అనుకుంటారు ఆ గుండె ఆగాధమని

కానీ ఎంతనొప్పో ప్రథమ శిశువుకి పాలు తాపేప్పుడు

ఆ తీయని బాధలో మృత్యువుని జయించిన లోయలకేక

కాశీ వారణాసి బెనారస్‌లో చూడండి నన్ను

నా దేహంమీద కాలీకాలని ఎన్ని కళేబరాలో

కానీ ప్రేమ హర్మా ్యల్లోంచి మీరంతా రిక్తహస్తాలతోనే కదా

ఈ నా పుణ్యక్షేత్రానికి చేరుకునేది!

కేదారనాధ్‌ బదరీనాధ్‌ అమరనాధ్‌ అన్నీ నేనే

ఏనాటి వాడో ఆదిశంకరాచార్యుడ్ని తల్చుకుని

మీ పాపాల చేతుల్నీ పాదాల్నీ కడిగేసుకుంటున్నామనుకుంటున్నారో

కానీ అదంతా హిమాలయాలపైకి మీ ఒట్టి ఎగశ్వాస, దిగశ్వాస

ఎండమావినీ నేనే, తొలకరి మబ్బునీ నేనే

కలకత్తా కాళికనీ నేనే, సలాం బాంబేనీ నేనే

మదర్‌ థెరిసానీ నేనే, ‘బీస్ట్‌ అండ్‌ బ్యూటీ’ని నేనే

పుట్టిన కేకనీ నేనే, ఆఖరి కౌగిలినీ నేనే.

(కవిత్వం ప్రచురణలు. 1990లో వెలువరించిన ‘గురిచూసి పాడేపాట’ పుస్తకం నుంచి)

*

చేసంచి – కాళ్ళ గజ్జెలు – ఒక ఉద్యమం

రమా సుందరి 

 

రమాసుందరి

ప్రత్యామ్నాయ రాజకీయాలు మనసుకు నచ్చుతున్న కాలం అది. విశాఖలో పద్మ ఇల్లు వాటికి అడ్డాగా ఉండేది. “శ్రీకాకుళం లోన – చిందిన రక్తము/ కాల్వలై ప్రవహించే – కొండ వాగులలోన/ బండలెరుపెక్కినాయి – పోరాడ కొండలే కదిలినాయి.”  అరుణ గొంతు ఖంగుమని మోగుతుండేది ఆ ఇంట్లో. నేను వీర కళాభిమానినే కానీ కళాకారిణిని కాదు. పాటలు పాడే వాళ్ళమీద వెర్రి ఆరాధనతో ఉండేదాన్ని. పిల్లలకు పాటలు, డాన్సులు నేర్పటానికి కానూరి వెంకటేశ్వరరావు వచ్చి ఉన్నాడు. పాటలు నేర్పిస్తున్న కానూరి తాతకి ఒక చేతి సంచి మాత్రమే ఉండేది. దాంతోనే  ఆయన రాష్ట్రమంతా తిరుగుతాడని చెప్పారు. సాయకాలం నాలుగు నుండి ప్రాక్టీసు. పగలంతా ఖాళీ. మూడు వరుస గదులు ఉన్న ఇంట్లో వరండాలో వుండేవాడు. మిట్ట మధ్యాహ్నం ఎండకు ఒక దుప్పటి కప్పేవాడు. ఎండకు అనుగుణంగా దుప్పటి దశను కటకటాల మీద మార్చుకొంటూ వుండేవాడు కానీ ఎంత మంది పిలిచినా లోపలకి మాత్రం పోయే వాడు కాదు. సూర్యుడి కిరణాలు ఏటవాలుగా ముఖానికి గుచ్చుకొంటున్న ఆ మధ్యాహ్నాలు నా జీవితంలో అతి ముఖ్యమైనవి. మనసా వాచా ఒక విప్లవ కళాకారుడిగా వందేళ్ళు బ్రతికిన మనిషి అంతరంగంతో ములాఖాతు చేసిన మధ్యాన్నాలు అవి.

అది పద్మ వాళ్ళ ఇల్లు కావచ్చు, వరంగల్ జిల్లాలోని పల్లెలో ఒక చెట్టుకింద కావచ్చు, గుంటూరు చుట్టుగుంట సెంటర్ లోని మురికిపేటలో కావచ్చు, ప్రజాపంధా ఆఫీసు కావచ్చు, ప్రకాశం జిల్లా మద్దులూరు కావచ్చు, హైదరాబాదు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు … ఎక్కడ, ఎప్పుడు, ఎంత సేపు మాట్లాడానో గుర్తు లేదు కానీ ఆయన జీవితంలోని పార్శాలు నాకు సుపరిచితం అయ్యాయి. గత సంవత్సరం పీవోడబ్ల్యూ మహాసభల్లో ఆయన వందేళ్ళ పుట్టిన రోజును జరిపారు. వయసుతో బాటు ముడుచుకొని పోయిన ముఖంలో భావప్రకటన కష్టమైపోయి, వృద్దాప్యపు ఇక్కట్ల పూర్తి స్థాయిలో అనుభవిస్తున్న ముసలి ముంపున కూడా నన్ను గుర్తు పట్టి వెంటనే అడిగిన ప్రశ్న “ఎన్వీయస్ ఎలా ఉన్నాడు?” ఎన్వీయస్ కళాకారుడు కాబట్టే ఆ శ్రద్ధ.

ఎనిమిది దశాబ్ధాల రాజకీయ జీవితం. రాష్ట్రాన్నిచైతన్యవంతం చేసిన నాలుగు ఉద్యమాలలో ప్రవేశం. రాజకీయం, కళలు వేరు కాదనే దృక్పధం. “సాంఘీక ఆర్ధిక, రాజకీయాలు సమ్మిళితం చేసి ఆచరించే భౌతిక సమాజ రూపమే సంస్కృతీ”. సంస్కృతికి ఆయన ఇచ్చిన నిర్వచనం .. ఇవన్నీ ఆయన ఏ చెట్టుకు కాసిన కాయో విదితం చేస్తాయి. కళారంగానికి వర్గ దృక్పధాన్ని మేళవించిన మొదటి తరంలోని మనిషి ఆయన. ప్రజల చరిత్ర లేని ప్రజా కళలలను (జానపద కళలు) దేదీప్యమైన దారిలోకి మళ్లించిన వాడు. ‘విప్లవ కళాకారుల్లో తాతలుండరు. అన్నలు మాత్రమే ఉంటారు.” అనే విమర్శలో ‘వాళ్ళు ఎక్కువ కాలం విప్లవంలో కొనసాగలేరు. అనేక ప్రలోభాలు వాళ్ళను పక్కకు లాగుతాయి’ అనే వాస్తవం దాగి ఉంది. ప్రజానాట్యమండలి నుండి సినిమా ఫీల్డ్ కు సాగిన వలసలు ఈ విమర్శకు మొదటి స్టెప్పు. ఆ మిత్ ని బద్దలు కొట్టి చనిపోయేంత వరుకూ విప్లవ ప్రజాగాయకుడిగా, కవిగా, నృత్య శిక్షకుడిగా కొనసాగిన వ్యక్తి కానూరి. అలాగని కళాకారుడిగా తన పరిధులు ఆయన ఎప్పుడు దాటలేదు. కళారంగం రాజకీయ రంగానికి అనుబంధంగా వుండాలి కానీ అదే రాజకీయాలు నడవకూడదనే మాట చివరిదాకా పాటించాడు. చదివింది నాలుగో తరగతి అయినా తెలుగు పట్ల ఆయన మమకారం ఆయన మాటల్లోనే “తెలుగు భాషకు అన్ని ధ్వనులు పలుకగల అక్షర క్రమం వున్నది. తెలుగు సాహిత్యానికి శబ్ధ సౌందర్యం కలిగించే ఛందో రీతి ఉన్నది. తెలుగు సంగీతానికి సప్త ధ్వనులను కంట్రోల్ చేసే గుణమున్నది.”

kanoori 12

ఆయన ఏమి రాసినా అందులో పదునైన రాజకీయ విమర్శ ఉంటుంది. పదాల వాడకం కొద్దిగా మోటుగా కొట్టినట్లు ఉంటుంది. ఆయనను కదిలించిన విషయాలే ఆయన వస్తువులుగా అర్హత సంపాదించుకొంటాయి. ఉమ్మడి కమ్యూనిష్టు పార్టీ ఉన్నప్పుడు కృష్ణా జిల్లా కాటూరు దురంతం గురించి రాసిన బుర్ర కధ కానీ, స్వతంత్ర భారతంలో బ్యూరోక్రసీని విమర్శిస్తూ రాసిన ‘ప్రగతి బాగోతం’ కానీ, శ్రీకాకుళ సాయుధ ప్రజా ప్రతిఘటన నేపధ్యంలో రాసిన ‘జనగానం’ కానీ ఆయన హృదయాంతరంగంలో బుసలు కొట్టి వెలువడ్డ తూరుపు ముక్కలే. అరుణోదయ రామారావు ఎక్కువగా పాడే కానూరి పాట  

“వీరగాధలు పాడరా… విప్లవ ధీర చరితలు పాడరా!

తూర్పు కొండల నడుమా – అరుణ కాంతుల జ్వాల

నగ్జల్ బరీలోన – నవయుగ శివలీల

 శ్రీకాకుళం గిరీ – సింహాల జయహేల

తీర గోదావరి గిరిజన శలభాల”  వింటుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకొంటాయి. బాబ్రీ మసీదుని కూల్చాక “రాముడో దేవుడో  – నీకేదేమీ ఖర్మరో/ రాజకీయ రొంపులోకి నిన్నే దించారురో” అని ఆయన పెట్టిన గగ్గోలు ఇంకా చెవుల్లో మార్మోగుతుంది.

 

విరసంతో ఆయన అనుబంధం కూడా గొప్పదే. శ్రీశ్రీ , కొడవటిగంటి, రావి శాస్త్రి, కెవియార్ లాంటి ఉద్ధండులతో కలిసి పనిచేశాడు. కేంద్ర ప్రజా నాట్యమండలి బాధ్యుడిగా ఉన్న కొండపల్లి సీతారామయ్య, తెలంగాణా బాధ్యుడిగా వున్న రామ నరసయ్య, నీలం రామచంద్రయ్య, జంపాల ప్రసాద్ మొదలైన వాళ్ళతో ఆయనకు ఉన్న ఉద్యమ అనుబంధం ఆత్మగతమైనది. జంపాల, రామనర్సయ్య, నీలం రామచంద్రయ్య ఎన్ కౌంటర్లు ఆయనలో ఎంత సంక్షోభాన్ని రేపాయో, పార్టీ చీలిన ప్రతిసారి అవే తుఫాన్లు. ఒకటిన్నర సంవత్సరం ఆయన గడిపిన బళ్ళారి జైలు జీవితం ఆయన్ను అంత కంటే బాధ పెట్టి ఉండదు.

kanoori 9

చేతి సంచితో బయలుదేరి, పార్టీ ఎక్కడకు చెబితే ఆ బస్సు ఎక్కి నెలల తరబడి గ్రామాల్లో అరుణోదయ శిబిరాన్ని నిర్వహిస్తూ యువతీ యువకులతో, పసి పిల్లలతో స్నేహం చేసే ఈ  సంచారజీవి, బక్క పలచని పెద్ద మనిషి సొంత జీవితం ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం నాకు ఆయన పరిచయం అయిన చాలా సంవత్సరాల తరువాత దొరికింది. ఆయనకీ ఒక ప్రేమ కధ ఉందనీ అది ఆయన సజీవ చలనానికి ఊతామిస్తూ ఉంటుందని ఆమె మరణించిన తరువాతే నాకు తెలిసింది. ఉత్తరాలు తప్ప ఫోన్లు లేని ఆ కాలంలో ఆమె మరణం పార్టీకి తెలియడానికి నెల రోజులు పట్టింది. ఆమె కోసం ఆయన రాసిన ‘ప్రణయ గీతం’ ప్రజాపంధా’లో అచ్చయింది. ప్రజాపంధాలాంటి పార్టీ అధికార పత్రికలో అచ్చయిన ఆ కవితలో కొంత భాగం.

కమ్యూనిజానికి టీకాటిప్పణి తెలియని

సాధారణ కమ్యూనిష్టు అభిమాని

ఎర్ర జెండాల కోలాహలం

 విప్లవ గీతాల బృందగానం

విని వెర్రెత్తి పోయే దరహాస రేఖ

తను నమ్మిన పార్టీ ముక్కలు చెక్కలై

మహానాయకులు పార్లమెంటరీ భక్తులై

స్వార్ధం తల బరువై స్వాతంత్ర్యం నక్కల పాలై

అమరవీరుల త్యాగాలు అంగడి సరుకై

ఓల్డు కమ్యూనిష్టు లీడర్లు

నయా కాపిటలిష్టు దళారులై

సోషలిజం అందని మ్రాని పండై

కల చెదిరి కలత చెంది

ఉస్సురని నిట్టూర్చిన హ్యూమనిష్టు

 నాటి తెలంగాణా సమర సింహాల చెల్లమ్మ

నేటి నగ్జల్ బరీ నరసింహాల అమ్మమ్మ

అర్ధ శతాభ్ధి సాంసారిక జీవితంలో లేదు విశ్రాంతి

 అలసి సొలసి ప్రకృతి ఒడిలో శాశ్వత శాంతి

ఆశించి వెళ్ళావా! దమయంతి! 

అని శోకించాడు. ఇది ప్రణయ గీతమా? కమ్యూనిష్టు ఆలాపనా? అయినా సంసార బంధనాలు లేని ఋషి అనుకొంటున్న ఈ మహానుభావుడికి ఈ బాధ ఏమిటి? ఆ దుఃఖం ఇంకో స్టాంజాలో

ప్రేమించి మనం పెళ్ళి చేసుకోలేదు

 ప్రేమోపాసన ఎట్లుంటుందో తెలీదు

 అమర ప్రేమకు అర్ధాలే తెలియవు

 ప్రపంచంలో ప్రేమ జంటలు, ఆదర్శ దంపతులు అసంఖ్యాకులు

అనగా వినడమే గాని ఆ గొడవలు అట్టే తెలియవు

అంతో ఇంతో అనురాగ సుధలు సేవించి సేద తీరిన సామాన్య ప్రేమికులం మనం.

ఈ కవిత నన్ను నిలబడనీయలేదు. ప్రేమించి తప్ప పెళ్ళి చేసుకోగూడదని పంతం పట్టిన వయసు అప్పటిది. ఇలాంటి దాంపత్యంలో ఉన్న పరమార్ధం కోసం అన్వేషిస్తూ మళ్ళీ కవిత చదవటం కొనసాగించాను. ఈ సారి దమయంతి  వైపు నుండి గొంతుక ఆయనే ఇచ్చాడు.

kaanuri tata books

అయినా నాకు తెలియక అడుగుతాను

నేనూ బుర్రున్న మనిషినే

నాకు రవ్వంత లోకజ్ఞానం ఎక్కించాలని నీకుంటేనా?

నీ కవిత్వాలు కాకరగాయలు లోకులకేనా?

అక్కడికి నీవో దేశభక్తునివి నేనో దెబ్బమ్మనా?

పెళ్ళాన్కి హోమ్ మినిష్టర్ హోదా యిచ్చేసి

కాళ్ళు కదిలే వీలు లేకుండా వంటింట్లో కుదేసి

జయ పరమేశా అని సంచి భుజాన తగిలించి

చెక్కేస్తాడయ్యా చైతన్య కళాకారుడు!

సాల్సాలు సంబడం!

ఏక్ బజా అయ్యింది

నీ బస్సుకు టయిమ్ అయింది

లేలేమ్మని వంటింట్లోకి నడిపించి

లేత వంకాయ శాకం కొసరి కొసరి తినిపించి

సంచి సాగరం నింపి

టిక్కెట్లు బద్రం

దిగే కాడ పదిలం

నీకసలే మతిమరుపు

ఒక కార్డు ముక్కన్నా రాసి పంపు

మల్లెప్పుడు రాకడ..?    

తడి అయిన కళ్ళతో ఆయన కోసం చూశాను. సర్వం పోగొట్టుకొన్నట్లు బేజారు పడ్డ ముఖంతో తల వేలాడేసుకొని కూర్చొని వున్నాడు ఒక మూల. ఈయన ఇక బ్రతుకగలడా అనిపించింది ఆ క్షణాన. కానీ నిజంగా బ్రతికి చూపించాడు తరువాత 30 సంవత్సరాలు., పార్టీ ఆఫీసుల్లో, ప్రజల మధ్యన. చివరకు పార్టీ ఆఫీసులోనే మరణించాడు. “మా కాలంలో ….” లాంటి అసంతృప్త, నిష్టూరపు వాక్యాలు ఎప్పుడూ ఆయన నోటి నుండి వచ్చేవి కావు. హృదయంలో కళాతపన కూసింత ఉంటే చాలు ఏ వయసు వారితోనైనా ఆయనకు సావాసమే. తరాలు అంటని స్నేహాలు చేసేవాడు. వంటి సుఖం గురించి ఎప్పుడూ కంప్లైంట్ ఉండదు. మజ్జిగన్నం ఉంటే చాలు. వ్యక్తి గత విషయాల ప్రస్తావన ఉండదు. స్థితప్రజ్ఞ విప్లవకారుడు ఆయన.

ఒంగోల్లో ఆయన బహిరంగ కార్యక్రమం ఉందంటే జనం ఎగబడతారు. ఆయన అభిమానులు అన్ని పార్టీలలో, రాష్ట్రమంతా ఉంటారు. తొంబ్బై ఏళ్ల వయసులోకూడా స్టేజ్ మీద  “చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా! కొయ్యరా కోతలు మొనగాడా!” పాటకు నృత్యం చేసినవాడు. ఆయన అభిమానులు పట్టుపట్టి ఎనభై అయిదేళ్ళ వయసులో ఆయన కళారంగ అనుభవాలు రికార్డ్ చేసి ‘కధ కాని కధ’ పేరుతో పుస్తకం తీసుకొని వచ్చారు. జంపాల ప్రసాదు టైమ్ లో ఉస్మానియా విద్యార్ధునులు కె. లలిత, గీతల నుండి …  అరుణోదయ విమల, వంగ పద్మ, సృజన, సుధ, అరుణ, విశాఖ పద్మ ఆయన శిష్యగణంలో ఆడపిల్లల పట్ల ఆయన శ్రద్ధ వేరుగా ఉండేది. మహిళా ఉద్యమంలో పనిచేసున్న మా పట్ల చాలా ప్రేమగా ఉండేవాడు.

3315_front_cover

సతీశ్ చందర్ అంటారు “ఉద్యమం అంటే ప్రతిసారి మూడు తుపాకులూ, ఆరు మందు పాతరలే కానక్కరలేదు. ఒక డప్పూ రెండు చిటికెన పుల్లలూ కలిసినా ఉద్యమం అవుతుంది” అని.  అవును. రెండు చిరతలు, చిన్న డోలు, కాళ్ళకు గజ్జెలు కూడా ఉద్యమం అవుతాయి. బుర్రకధలు, హరికధలు, ఒగ్గు కధలు, జనగానాలు, గొంగళి ప్రదర్శనలు కూడా ఉద్యమాలు అవుతాయి. వీటన్నిటిని ఔపాసన పట్టి ప్రజల్లోకి దూకిన కానూరి ఉద్యమ రధసారధి అవుతాడు. 15 ఏళ్ల వయసులో యాంత్రికంగా కళారంగానికి వచ్చి గొప్ప సాంస్కృతిక ఉద్యమానికి నిట్టాడిగా నిలబడ్డ కానూరి గారిని కేవలం కళాకారుడు అంటే సరిపోతుందా? శాస్త్రీయ సంగీతంలో తామే రచించి, స్వరకల్పన చేసి పాటలు పడే వారిని వాగ్గేయకారుడని అంటారు. తనకు తెలిసిన అనేక కళా రూపాల్లో ఒకదాన్ని ఎంచుకొని, దానికి రచన చేసి, బాణీ కట్టి, దానికి నృత్య రీతిని సమకూర్చి, గజ్జె కట్టి ఆడి, పాడి, తన చుట్టూవున్న వాళ్ళకు నేర్పించిన వారిని ఏమని పిలవాలో కానూరి తాతను అలాగే పిలవాలి. ఆయన పనిచేసి, నాయకత్వ బాధ్యతలు ఇచ్చిన సాంస్కృతిక, సాహితీ సంస్థలు ప్రజానాట్యమండలి కానీ, అరుణోదయ సాహితీ సమాఖ్య కానీ, విరసం కానీ, ప్రజాస్వామిక రచయితల సంఘం కానీ ఆయన రచనలపై పూర్తి భరోసాతో ఉండేవి. ఎందుకంటే ఆయనది ప్రజల పంధా. అంగుళం కూడా దానిని అతిక్రమించడనే నమ్మకం. పేదప్రజలకు, వారి ప్రతినిధి అయిన విప్లవ పార్టీకి మాత్రమే నిబద్ధుడైనాడు కడ దాకా. ఆయన వందేళ్ళ పరిపూర్ణ  విప్లవ జీవితం ప్రజలకే అంకితం.

 

ఈ మరణం అనివార్యం అని తెలుసు. ఆయన మరణం చెందక ముందుకీ, ఇప్పటికీ ఉన్న తేడా ఏమిటి? ఖమ్మం సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమాక్రసీ ఆఫీసులో కానూరి తాతను ఎప్పుడైనా చూడచ్చు అనే ఆశ ఇక ఇప్పుడు లేదు. నాలుగు తరాల కమ్యూనిష్టు మనస్తత్వాలను అవగతం చేసుకొని ఎప్పుడూ వర్ధమానంలో బ్రతికిన సాహిత్య, సాంస్కృతిక,   సాయుధ వీరుడు భౌతికంగా అదృశ్యమై ఫోటోలోనూ, ఆయన పుస్తకాలలోనూ, ఆయన ఆదర్శాలలోనూ మాత్రమే కనిపిస్తాడు ఇక. రెండు చొక్కాలు, కాళ్ళ గజ్జలు, ఒక చేతి సంచితో ఆయన నిరాడంబర విప్లవ జీవితం తప్పక ఎక్కడో, ఎప్పుడో ఒక గుప్పెడు మందికి దారి దీపం అవుతుంది. కళ్ల నీళ్ళు తుడుచుకొని, నిండు మనసుతో ఆయనకు ప్రణమిల్లడం తప్ప చేయగలిగినది ఏముంది? మహిళా ఉద్యమం ‘కల్చరల్ కలరా’ను పారదోలుతుందన్న ఆయన నమ్మకాన్ని మోసుకొని పోవడం తప్ప.

*

‘ప్రగతి’ ఆయన వేలిముద్ర

2
ఒక మనిషి వ్యక్తిత్వాన్ని వారి బాడీ లాంగ్వేజీతోనే కాదు, సదరు వ్యక్తి నవ్వును బట్టి కూడా చక్కగా అంచనా వేయవచ్చును. ఆరోగ్యం నిండిన నవ్వు, హాయిగా నవ్వే తీరు ఆ వ్కక్తి తాలూకు సంతృప్తికరమైన జీవితాన్నే కాదు, సాఫీగా సాగుతున్న సంస్థ తీరుతెన్నులనూ పట్టిస్తుంది. ప్రగతి ఆఫ్ సెట్ ప్రింటర్స్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మెన్ పరుచూరి హనుమంతరావు విషయంలో ఇదే నిరూపితం అవుతోంది. ఆయన గుండెనిండా నవ్వుతూ మాట్లాడుతుంటే వారు సాధించిన ‘ప్రగతి’ సప్తవర్ణ ఇంద్రధనుస్సు వలే ఆవిష్కారం అవుతున్నది.

ఆరు దశబ్దాల ప్రగతి రథ సారథి అయిన హనుమంతరావు లాల్చీ పైజామా ధరిస్తారు. ఆయనది సుఖం, శాంతి, సంతృప్తులను ఇముడ్చుకున్న ఛామన ఛాయ, మేను. రెడ్ హిల్స్ లోని వారి ప్రధాన కార్యాలయంలో సందర్శకుల కోసం వేసిన ఒక సోఫాలో కూచుని ఆయనతో ముఖాముఖి మాట్లాడుతుంటే, తెలుగు ప్రజలు అంతర్జాతీయంగా స్థిరంగా వేసిన కొన్ని ముద్రల్లో వీరిదీ ఒకటా అన్న సోయి కలగనే కలగదు. అంత సింప్లిసిటీ వారిది.

మాటల్లో మధ్యలో సందేహం కలిగి, ‘ మీరు రెగ్యులర్ గా కూచునే ప్లేస్ ఏది?’ అంటే, ‘ నా కంటూ కుర్చీలేదు. నిజమే. నేను చెయిర్ లేని చైర్మెన్ ను’ అంటూ నవ్వేశారు.

నవ్వుతూనే ఆయన లేచి నిదానంగా ముందుకు దారి తీశారు. ఆయనతో పాటు నడుస్తూ ప్రింటింగ్ కార్యాలయాన్ని, పని జరిగే చోట్లను చూస్తుంటే, యంత్రాలన్నీ ఒక్క క్షణం గౌరవ వందనం చేసి మళ్లీ పరుగందుకున్నాయా అన్నట్టు చలిస్తున్నాయి.

సన్నటి చప్పుడుతో ఆ యంత్రాలు పనిచేస్తుంటే ఒక్కో మిషను వద్ద ఆగి, జరుగుతున్న పని క్వాలిటీని అంచనా వేస్తూ హనుమంతరావు ముందుకు వెళ్లసాగారు. ఆకస్మాత్తుగా ఆయన ఒక చోట ఆగి, మిషన్ ఆపరేటర్ బసవరాజును పరిచయం చేశారు. ‘ ఈయన మా తొలి ఉద్యోగుల్లో ఒకరు. పైన, బైండింగ్ సెక్షన్ లో మహ్మద్ మెయినుద్దీన్ ఉన్నారు. ఆమయనా అంతే. సంస్థ స్థాపించిన తొలి రోజుల్నుంచీ మా కుటుంభంలో దాదాపు ఐదొందల సిబ్బంది పనిచేస్తున్నారు’ చెప్పారాయన.

‘మా వర్క్ ఫోర్స్’ ఘనత ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకోవడం ఒక్కటే కాదు, కస్టమర్లకు ప్రింట్ చేసిన మెటీరియల్ ను సప్లై చేసే కంపెనీగా కాకుండా ఆయా సంస్థల భాగస్వామిగా  సజీవ సంబంధాలు నెరుపుతాం. మా ‘ప్రగతి’కి ఇదే సూత్రం’ అని వివరించారాయన.

+++
1
‘ప్రగతి’కి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. 1979లో ప్రగతి దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఫొటో టైప్ సెట్టింగ్ సర్వీసులను ప్రారంభించింది. 1985లో మొదటి కలర్ ఆఫ్ సెట్ ప్రింటింగ్ ప్రెస్ ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 1988లో తొలిసారిగా కంప్యూటర్డ్ కంట్రోల్డ్ రిజిస్టర్, ఇంక్ కీ సెట్టింగ్ ను ఇన్ స్టాల్ చేసిన ఘనత కూడా వీరిదే. అలాగే, కంప్యూటర్ టు ప్లేట్ టెక్నాలజీని ప్రారంభించి, మ్యాన్యువల్ గా ప్లేట్లు తయారు చేసే పద్ధతికి స్వస్తి చెప్పడం వీరితోనే ప్రారంభం. అలా ప్రగతి క్వాలిటీ ముద్రణలోకి వెళ్లింది. ఇలా తక్కువ సమయంలో ఎక్కువ నాణ్యతగల సేవలు అందించే ప్రింటర్స్ గా ‘ప్రగతి’ దేశవిదేశాల్లో పేరు గడించింది.

ఆ విషయాలను వివరించి చెబుతూ, ‘నలభై ఐదేళ్లక్రితం పన్నెండువేల రూపాయలతో ప్రగతిని ప్రారంభించాను. ఒకే ఒక ట్రెడిల్ మిషన్ తో నేను ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టాను. తర్వాత నా కుమారులు నరేంద్ర, మహేంద్రలు వచ్చారు. ప్రగతికి కావాల్సిన ఆఫ్ సెట్ మిషనరీలు తెచ్చారు. క్రమంగా ఐ.టి.పరిజ్ఞానాన్ని అనేక విధాలుగా ఇమిడ్చారు. ఇంతలో అమెరికాలోని రాఛెస్టర్ యూనివర్సిటీలో చదువుకున్న నా పెద్ద మనవడు హర్ష వచ్చి చేరాడు. తను ప్రింటింగ్ పరిజ్ఞానానికి అవసరమైన సైంటిఫిక్ అప్రోచ్ ను జోడిస్తున్నాడు. త్వరలో మరో మనవడు హేమంత్ ( మెకానికల్ ఇంజనీర్) జతకావచ్చు’ ఉత్సాహంగా చెప్పారాయన.

అంటే, ఈ సంస్థది మూడు తరాల ప్రగతి అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కో దశను వేగవంతం చేశారు. అందరూ నమ్మింది ఒకటే. ఫోకస్, కమిట్ మెంట్, డెడికేషన్.  ఇవి కాకుండా టెక్నాలజీ, మౌలిక వసతులు, నిపుణులను సమకూర్చుకోవడం- వీటితో ప్రీప్రెస్, ప్రింటింగ్, ఫినిషింగ్, బైండింగ్ రంగాల్లో అమితశ్రద్ధ తీసుకుంటూ భారతదేశంలోనే కాదు, ప్రపంవ వ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు హై క్వాలిటీ ప్రింట్ సర్వీసులు అందిస్తున్న సంస్థగా ప్రగతి పురోగమిస్తోంది.

‘ఒక్క మాటలో చెప్పాలంటే, ఓ ప్రింటింగ్ ప్రెస్ గా ప్రారంభమై ఐటి సర్వీసులు అందించే మేటి సంస్థగా ప్రగతి నేడు పేరొందింది’ అని సంక్షిప్తంగా ఆయన వివరించారు.

ఏదో  ఫోన్ వస్తే మాట్లాడుతూ ఆయన మిషన్లన్నీ దాటుకుంటూ మళ్లీ మొదటి అంతస్థులోని కార్యాలయానికి తిరిగి వచ్చారు. వస్తూ, అక్కడి టేబుల్ పై ఉంచిన ఏనుగు విగ్రహం వద్ద ఆగి, ‘ప్రింటింగ్ కమ్యూనిటీ యావత్తూ కలగనే పురస్కారం ఇదే’ అంటూ ఆగారాయన.

నిజం. ‘సౌత్ ఆఫ్రికన్  పల్ప్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్ వారు ప్రతి ఏడాది ప్రింటింగ్ కాంపిటిషన్లు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో గత సంవత్సరం కేటలాగ్ విభాగంలో ప్రగతి ‘ఇంటర్నేషనల్ ప్రింటర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం దక్కించుకుంది. ఏనుగు ప్రతి రూపం అదే’ అని చెప్పారాయన. అంతటితో ఊరుకోకుండా, ఏనుగు పురస్కారం వచ్చాక తొట్టతొలి మిషనుతో ( ట్రెడిల్ ప్రెస్) తాను దిగిన ఫొటోను కూడా తెప్పించి చూపించారాయన. ‘ ఈ పురస్కారంతో మేం ప్రింటింగ్ టెక్నాలజీలో ఉన్నత శిఖరం అధిరోహించాం. ఇక, ఆ శిఖరంపై నిలదొక్కుకోవడమే మా ముందున్న కర్తవ్యం’ చెప్పారాయన. చెబుతూ, మరింత సన్నిహితంగా ఆయన నిర్మించిన ‘ ప్రగతి’ని చూపించారు.

అదేమిటో కాదు, అంగుటి. వేలిముద్ర. ‘థంబ్ ఇంప్రెషనే మా లోగో’ అని వేలెత్తి చూపారాయన. విజిటింగ్ కార్డు అందిస్తూ, ఆ ముద్ర తనదే అని హాయిగా నవ్వుతూ చెప్పారు. చూస్తే, ఆ లోగోలో సప్తవర్ణాలున్నాయి. తాము ఇముడ్చుకున్న సాంకేతిక ప్రతిభ, శ్రమశక్తికి సంకేతంగా అది మెరిసిపోతుండగా ఆయన తన కుమారులు నరేంద్ర, మహేంద్రలను, మనవడు హర్షలను పరిచయం చేశారు, ఇక ముందు వారిదే ‘ప్రగతి’ అని!

– కందుకూరి రమేష్ బాబు

( 18 మార్చి 2007 వార్త దినపత్రికలో ప్రచురితమైన ‘అంతర్ముఖం’ శీర్షికా వ్యాసం)

3
పూర్తిపేరు: పరుచూరి హనుమంతరావు
మారుపేరు: ‘ప్రగతి’ హనుమంతరావు
స్వస్థలం: చిట్టూర్పు, కృష్ఝాజిల్లా
చదువు: బిఎ
అభిరుచి:బాస్కెట్ బాల్
ఇష్టమైన రంగు: ఎరుపు
అభిమానించే వ్యక్తులు: లెనిన్, మావో
‘ప్రగతి’ స్థాపన: 1962
ప్రగతికి ముందు: సారథి స్టూడియో మేనేజర్, విశాలాంధ్ర విలేకరి, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి నేత, మూడేళ్ల జైలు జీవితం.
ప్రగతి కార్యాలయాలు: హైదరాబాద్, బెంగుళూర్,కోల్ కోత్తా, ముంబై, న్యూఢిల్లీ, న్యూయార్క్.

కస్టమర్లు: బజాజ్, ఇన్ఫోసిస్, ఫోర్ట్ ఇండియా, మెర్సిడెస్, పాన్ అమెరికా, ఐటిసి, తాజ్ గ్రూప్, బిబిసి, రెడ్డి ల్యాబ్స్, ఎల్ అండ్ టి, హచ్, ఇంకా చాలా…
ఇష్టమైన జాబ్ వర్క్:  పెళ్లి పత్రిక అచ్చేయడం.

కవిత్వపు మెరుపు తీగ జాన్ హైడ్!

 

john1
ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు
~*~
ఎన్నడో
నిద్రలోనో, మగతలోనో, మెలకువలోనో
పరిచయమనుకున్న ఓ నవ్వు
ఎప్పుడైనా ఎక్కడైనా
ఒక్కసారి కౌగలించుకున్న స్నేహ హస్తపు స్పర్శ
వదిలించుకున్నామని అనుకున్నా
పెనవేసుకున్నామనుకున్నా వెంటాడుతూనే వుంటుంది

జీవితాన్ని నడిచిన క్షణాలు కొన్ని
ధనుర్మాసపు మంచుకమ్మినట్టు కమ్మొచ్చు
మసక మసక వెలుతురుమధ్య జ్ఞాపకాలు కప్పినప్పినప్పుడు
చలికి మునగదీసుకున్న దేహంలా అనుబంధం కుంచించుకున్నప్పుడు
కళ్ళు చెమర్చమడం మరచిపోతుంది

***

అనుబంధాలు
మమకారాలు
కరన్సీని ఉన్నిగా తొడుక్కున్నాక
మాటలు కలిపి కలబోసుకోవడం కనుమరుగయ్యాక
ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు

***

నీవు ఒంటరివై
రాత్రిలోకి నిన్నునీవు దూర్చుకొని
తాగినవన్నీ కన్నీళ్ళే కదా!

రగిలిస్తున్న యెదమంటలను
చల్లార్చడం మధువుకే చేతనౌనని అనుకున్నాక
తలుపులు ఒకొక్కటిగా మూసుకుంటుంటే
తలుపు తెరచి తొంగిచూసే ధైర్యలేనప్పుడు
ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు

***

కొలమానాల లోకం
బిగించుకున్న చట్రాల చూపుల్లో ఇమడనప్పుడు
నీవు వేసిన అడుగులన్నీ
తప్పుడుగానో, తడబాట్లుగానో కన్పిస్తుంటాయి

ఇక ఏ అనుబంధం ముడిపడనప్పుడు
ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు

***

నీలో నీవే దాచుకున్న దేహాన్ని విదిల్చుకుని
నీవు అలా వెళ్ళిపోతావు
కన్నీరొలికించలేనివారు కళ్ళలోంచి తీసేస్తారు
గుప్పెడుమట్టిని సమాధిపైవేసి
ఎవ్వరిని పలకరించకుండానే వెళ్ళిపోతారు
నిన్ను కప్పిన మట్టిలో సమస్యలు దాక్కోవు

***

పొద్దు గ్రుంకుతుంది
కాలచక్రం ఎక్కడా ఆగదు
కోలాహలమైన పక్షుల కిలకిలరావాలతో
రాత్రిదుఃఖాన్ని విదిల్చి మళ్ళీ తూర్పున సూర్యోదయం

***

నువ్వు ఎవరైనా
మళ్ళీ మనం కలుస్తామనే ఓ నిరీక్షణయైనప్పుడు
ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు.

john hyde

మధ్యతరగతి స్త్రీల మనోలోకంలో ద్వివేదుల విశాలాక్షి

untitled

సాహితీ ప్రపంచానికి మణిపూస శ్రీమతి ద్వివేదుల విశాలాక్షిగారు, ఎన్నో నవలలు,కదలు,వ్యాసాలు వ్రాసారు. పాత తరం,కొత్త తరం ఎవరైనా కాని ఆమె రాసినవన్నీ అందరికీ మార్గదర్శకాలే. ఆమె రచనలు పాఠకులను చేయిపట్టి తమతో పాటే తీసుకోని వెళతాయి. రాజలక్ష్మీ ఫౌండేషన్‌ లిటరరీ అవార్డు (1999) సహా 13 పురస్కారాలను విశాలాక్షి అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆమెకు 1998లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఎంతోమంది విద్యార్థులు ఆమె రచనలపై పరిశోధనలు జరిపి ఎంఫిల్‌, పీహెచ్‌డీలు పొందారు.

ఇక వారు రాసిన నవలలో ముఖ్యంగా స్త్రీ పాత్రల కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కొవ్వొత్తి లోని లలిత, మారిన విలువలలో జానకి, గ్రహణం విడిచింది లోని భారతి, గోమతి లో గోమతి, రేపటి వెలుగు లో శారద ,ఎక్కవలసిన రైలు లో మాధవి, ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో పాత్రలు. వారి రచనలలోని గొప్పదనం ,ఆ పాత్రలు ,ప్రదేశాలు కూడా మనకు బాగా పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తాయి. ఉదాహరణకి కొవ్వొత్తి లో నాయకుడు ప్రకాశం ఇల్లుని ఈ విధంగా వర్ణిస్తారు “అది ఒక పాత లోగిలి,చిన్న,చిన్న వాటాలు”. ఈ వర్ణన ఇంచుమించుగా అన్ని నవలలో ఉంటుంది. అంటే అప్పటి మధ్యతరగతి జీవితాన్నిదర్పణం పట్టి చూపించారు. నలభైయేళ్ల క్రితం వాళ్ళకి ఇలాంటి ఇళ్ళు గుర్తు ఉండే ఉంటాయి. ముఖ్యంగా ఆవిడ రచనలలో ఎన్నడూ శ్రీమంతుల దర్పం కనిపించదు. మధ్యతరగతి జీవన విధాన గురుంచి ఎక్కువ రాసేవారు ఇప్పుడు మనం down-to-earth అంటాం కదా! అలాంటి పాత్రలనే సృష్టించారు.

వారు రాసిన నవలల నుండి కొన్ని మచ్చుతునకలు.

నాకు బాగా నచ్చిన పాత్రలు   గోమతి, రేపటి వెలుగు(శారద), కొవ్వొత్తి(లలిత) ఎక్కవలసిన రైలు లోని(మాధవి) పాత్రలను వాటి స్వభావాలను గనక పరిశీలిస్తే,

గోమతి: చిన్ననాటి స్నేహం ముగ్గురి మధ్య ముప్పేటలా పెనవేసుకొన్న బంధం. ఇది ఒక triangular love story . నవలలోకి వెళితే   ”అట్లతద్దోయి ఆరట్లోయి” అన్న చిన్న పిల్లల కేకలతో నవల మొదలవుతుంది. కధానాయిక గోమతి కి అది చూసి మనసు గతం లోకి పరగులు తీస్తుంది. చిన్నప్పటి నుంచి. మేనత్త కొడుకు గోపాలం, స్నేహితుడు గోవిందు. ముగ్గురూ ఒక జట్టు. ఊరి చివరనున్న ఆఫీస్ బంగ్లా గేటు ఎక్కి జామ కాయలు కోయడం, అక్కడే ఉన్న ఆకు సంపెంగ పూలు కోసు కోవడం,స్కూల్ లో మాస్టారు చేత దెబ్బలు తినడం ఇవన్నీ ఇంట్లో తెలిసి పెద్దవాళ్లు తిట్టడం జరుగుతూ ఉంటాయి.

పెద్ద అయ్యాక అభిమానాలూ పెరుగుతాయి, బావ మరదళ్ల మధ్య కానీ గోమతి తల్లి వల్ల తెలియని దూరం పెరుగుతుంది . “చిలకలా తిరుగుతోంది పిల్ల,వదినా! మా గోవిందు కి మీ గోమతిని చేసుంటాను” అని తల్లితో నేస్తం,పక్క్టింటి అబ్బాయి గోవిందు వాళ్ళ అమ్మ అడిగిన వెంటనే గోమతి తల్లి తండ్రులు గడపలోకి వచ్చిన సంబంధం,ఎరిగున్న వాళ్ళు,కాదనడానికి తగ్గ కారణం ఏమి లేదని పెళ్లి చేస్తారు. బోటా బొటి సంపాదన, పట్నం లో కాపురం. పైగా అదే సమయం లో గోవిందు కాలు విరగడం,ఉద్యోగంపోవడం ఒకటే సారి జరుగుతాయి. ఈ క్రమం లో గోమతి, సంసారభారాన్ని మోసేందుకు ఉద్యోగం లో చేరుతుంది. అక్కడ ఆమె పై ఆఫీసర్ బావ గోపాలమే. ఆడపడచు మీద ఉన్న చులకన భావం తో మేనల్లుడు గోపాలాన్ని చిన్న చూపు చూస్తుంది గోమతి తల్లి.

అది తెలిసి గోమతి మీద ప్రేమను బయట పెట్టలేకపోతాడు. కానీ స్నేహితుడు గోవిందు ఇది ముందే పసిగట్టి గోమతి తనకే దక్కాలన్న స్వార్ధంతో గోపాలం కంటే ముందు వెళ్లి తన ప్రేమని చెప్పేస్తాడు. వాళ్ళు ఎప్పుడు కలుసుకునే మందార చెట్టు దగ్గర. వెంటనే గోమతి సరే అంటుంది. అది విని భంగపాటు తో గోపాలం ఇంట్లో చెప్పకుండా వెళ్లి పోతాడు. కొంతకాలానికి తన ఆఫీస్ లోనే ఉద్యోగానికి వచ్చిన గోమతి తో పూర్వంలా చనువుగా ఉండటం సహించలేని గోవిందు గోమతిని సూటి పోటి మాటలు అంటాడు. కొన్ని రోజులు ఘర్షణల మధ్యే జీవితం గడుపుతారు. చివరకి గోవిందు గోమతి జీవితం నుంచి తొలగి పోవడానికి నిశ్చయించుకొని ఉత్తరం రాసి రైలు ఎక్కుతాడు. ఎక్కిన రైలు కొంచెము దూరం వెళ్లి ఆగుతుంది. ఎవరో అంటారు రైలు కిందబడి ఒక ఆడకూతురు ఆత్మహత్య చేసుకుందని అది విన్న గోవిందు మటుకు, గోమతి కి ఆ గతి పట్టదు.చక్కగా గోపాలం తో హాయిగా ఉంటుందిలే అని సమాధానపడతాడు. కానీ అతనికి  తెలియని నిజం  గోమతి  కి తన మీద ప్రేమ ఏమాత్రము తగ్గ లేదని .తన కోసమే రైలు ఎక్కబోయి పది పోయి చని పోయిందని .

  ఈ నవలలో నాయిక  ధైర్య వంతురాలైన  చివరకి  విధి వశాత్తు రైలు కింద పడి  మరణిస్తుంది.

 

రేపటి వెలుగు: ఈ నవలలో కూడా మధ్యతరగతి కుటుంబీకులు శారద తల్లితండ్రులు. ముందు పుట్టిన ఇద్దరు అక్కలకు పెళ్ళిళ్ళు అవుతాయి. అప్పులు, బాధ్యతలతో తల మునగలు గా ఉంటాడు తండ్రి.ఇక రేపో మాపో రిటైర్ అవుతాడు, గుండెల మిద కుంపటి లా పెళ్లికేదిగిన మూడో కూతురు.అని ఆలోచించిన తల్లి కూతురి తో అంటుంది, “చదివిన చదువు చాల్లే ఏదో మా శక్తి కొద్ది గంత కు తగ్గ బొంతను చూసి పెళ్లి చేస్తాను”.

కాని స్వతంత్ర భావాలూ గల శారద అందుకు ఒప్పుకోదు స్వశక్తి మిద నిలబడాలని అనుకుంటుంది. అదృష్టం ఆమెకు అనుకోని విధంగా వేలువిడిచిన మేనమామరూపం లో వస్తుంది. అతనితో వాళ్లింటికి పట్నం వెళుతుంది. అక్కడ తన ఈడుదైన అరవింద తో పరిచయం. ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ క్రమం లో అనిల్ తో పరిచయం ఆమెకి చక్కటి మధురభావనలను కలిగిస్తుంది. అరవింద కి ఒక పంజాబీ తో పెళ్లి అవుతుంది. అతని స్నేహితుడే అనిల్ బెనర్జీ, బెంగాలీ వాడు . శారదను చూసి ఆమె మృదువైన స్వభావం చూసి , ఇష్టపడతాడు. కాని ఆమె ఎటూ నిర్ణయించుకోలేక పోతుంది. ఇంతలో తల్లి “జాగ్రత్తగా ఉండు, ఎక్కడో ఉన్నావు మాకు తలియకుండా కొంపలుముంచకు అంటుంది”.

తల్లి మాటలకూ శారద బాధ పడుతుంది.అప్పుడే అనిల్ దగ్గర్నుంచి ఉత్తరం వస్తుంది “నువ్వు ఇతరుల ఒత్తిడికి,అధికారానికి తల ఒగ్గేదానివి కావన్న సంగతి నాకు తెలుసు. అందుకే నువ్వంటే నాకింత గౌరవం, ఇష్టం, ఆరాధన” అన్న అనిల్ మాటల తో ఆమె హృదయం ఉప్పొంగుతుంది. అందులోనే నిన్ను కలవడానికి మా అక్క సిద్దేశ్వరి వస్తోంది. రేపు నువ్వు ఎయిర్ పోర్ట్ కి వెళ్ళు అని ఆమెకి రాస్తాడు.ఆ ఉత్తరం చదువుకున్న శారద ఆ రాత్రి కమ్మని కలలతో తేలిపోతూ ,అందమైన రేపు గురుంచి ఎదురుచూచ్తుంది. ఆ రేపు లో ఎన్నో కొత్త ఆశలు, కోటి కోరికల వెలుగులు విరజిమ్ముతూ అందంగా, మనోహరంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ వెలుగుల కాంతులు ఆమె మనసు నిండా పరచు కొన్నాయి.

రేపటి వెలుగు నాయిక శారద మృదుస్వభావి, కార్యసాధకరాలు                                  

కొవ్వొత్తి: ఇందులో కథానాయిక లలిత, …చిన్నప్పటి నుంచి,తన కోసంకాక, ఇతరులకోసమే బ్రతకడం నేర్చుకున్న లలిత. తల్లి కావాలన్న అతి సహజమైన కోరికను తీర్చుకోలేని దురదృష్టవంతురాలు లలిత. కొవ్వొత్తిలా తను కరిగి పోతూ ఇతరులకు వెలుగు నిచ్చే కొవ్వొత్తికి తన చుట్టురా చీకటే మిగుల్తుంది.ఆ నాటి సాంఘిక పరిస్థితుల కి అద్దం పట్టిన నవల ఇది. రచయిత్రి ఒక్క మాట అంటారు చివరిలో “ప్రకాశించే శక్తి ఉన్నంతవరకు వెలుగును ఇస్తూనే ఉండాలని”

లలిత ఒక నాటి మధ్య తరగతి మహిళల కి ప్రతి రూపం

ఎక్కవలసిన రైలు: మాధవి ,పోట్ట్టపోసుకోవడం కోసం ఉద్యోగానికి పట్నం వస్తుంది. ఉద్యోగం ఇచ్చిన పెద్ద మనిషి చాల మంచి వాడు. ఇంట్లో పిల్లలా చూసుకుంటాడు. వారి బంధువు సుందరమూర్తి, ఒకర్నొకరు ఇష్టపడతారు. జీవితాన్ని ఏంటో సుందరం గ ఊహించుకుంటూ బంగారు కలలుకంటున్న మాధవి ఒక్క సారిగా వాస్తవ ప్రపంచం లోకి వస్తుంది. తనకు సుందరమూర్తి కి గల అంతరం తెలుసుకొని రెండో పెళ్ళివాడైన వాసుదేవమూర్తి ని చేసుకుంటుంది. మాధవి ని పెళ్లి చేసుకోలేక పోయిన సుందరమూర్తి ఎక్కవలసిన రైలు అతడు ఎక్కకుండానే వెళ్ళిపోతున్న రైలు వెనుక ఎర్రదీపాలు అతన్ని చూసి వెక్కిరిస్తున్నాయి, అతని మనసు ,కాలం విలువ తెలుసుకొని బుద్దిహినుడా,జీవితం లో నీకిది గుణపాఠం అంటూ హెచ్చరించింది. అని ముగిస్తారు.

ఇందులో మాధవి పాత్ర ఒక సజీవమైన పాత్ర. కోరింది దొరకక పోయినా,దొరికిన దానితో ఆత్మ వంచన చేసుకోకుండా,తృప్తి పడే పాత్ర.

విశాలాక్షి గారి రచనలలో ఒక గమ్మతైన విషయం కనిపిస్తుంది. ఆమె రాసిన తల్లి పాత్రల కొంచెము,కోపం,దురుసుస్వభావంగా ఉండేవి అయితే, అత్తగారి పాత్రలు మాత్రం ఎప్పుడూ కూడా కోడలని ప్రేమతో చూసుకుంటూ, అభిమానంగా ,సపోర్ట్ ఇచ్చే విధంగా ,ఉంటాయి.

ఇలా మన కళ్ళ ముందు సజీవంగా తిరగాడే పాత్రలు ఎన్నో ఎన్నోన్నో సృష్టంచిన ఘనత శ్రీమతి ద్వివేదులవిశాలాక్షి గారిది. ఆ మహా రచయిత్రికి సారంగ సాహిత్య వార పత్రిక తరపున సాహితీ నివాళులు సమర్పిస్తూ……………

-మణి వడ్లమాని

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

అతడు ఈ నేల మీది వాడల ఆస్తి!

10527627_758258257546728_5310203278332013818_n

 

‘ తెరేష్ ఈస్ నో మోర్ ‘ …. మొన్న సెప్టెంబర్ 29 న కవి మోహన్ రుషి పంపిన మెసేజ్ చూడగానే లోపలెక్కడో కాస్త అపనమ్మకంగానే కట్టుకున్న చిన్న ఆశ ఏదో ఒక్కసారిగా కుప్పకూలి పోయిన బాధ ! వార్త తెలిసిన వెంటనే  ఆఫీస్ నుండి సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రికి వెళ్ళడం అయితే వెళ్లాను గానీ తెరేష్ అన్నని ఒక విగత జీవిగా దగ్గరనుండి చూసే ధైర్యం లేకపోయింది. బహుశా, తెరేష్ అన్నని కాస్తో కూస్తో సమీపంగా తెలిసిన ఎవరికైనా ఇదే అనుభవం ఎదురై వుంటుంది. ఎప్పుడు కలిసినా గొప్ప జీవకళతో వెలిగిపోతూ, మనుషుల్ని ఆలింగనం చేసుకునే మనిషిని ఒక్కసారిగా అట్లా చూడవలసి రావడం మనసుకి ఎంత కష్టం !

 

అంతకు క్రితమే నేను పాల్వంచలో ఉద్యోగం చేసే కాలంలో కవి మిత్రుడు ఖాజా ద్వారా తెరేష్ కవిత్వం గురించి విని వున్నప్పటికీ, 1996 లో తన ‘అల్పపీడనం ‘ కవితాసంకలనం విడుదల సందర్భంలో తెరేష్ అన్నతో నా తొలి పరిచయం. తెలుగు కవిత్వంలో నాకు పరిచయమైన కవులలో తొలి పరిచయ కాలంలోనే నేను ‘అన్నా ‘ అని పిలిచిన అతి కొద్దిమంది కవులలో తెరేష్ ఒకడు! … తను కూడా ఎట్లాంటి అనవసర మర్యాదలు లేకుండా ‘విజయ్ ‘ అనే పిలిచాడు.  పరిచయమైన కొద్దికాలం లోనే మనుషులు దగ్గరి వాళ్లై పోయే గొప్ప మానవాంశ ఏదో తెరేష్ అన్నలో వుండేది !

తెలుగు కవిత్వం నిండా దళిత కవిత్వం పరుచుకున్న కాలంలో ఆ దళిత కవిత్వ జెండాని రెప రెప లాడించిన ఇద్దరు బాబుల్లో ఒకరు తెరేష్ బాబు అయితే మరొకరు మద్దూరి నగేష్ బాబు. అప్పుడప్పుడే హైదరాబాద్ కి వొచ్చి కవిత్వాన్ని సీరియస్ గా చదువుకుంటూ వున్న నాకు ఆ ఇద్దరి కవితలు, దళిత జీవితంలోని అవమానాలనీ, దళితులు సవర్ణ వ్యవస్థ పైన ప్రదర్శించే ధర్మాగ్రహం వెనుక వున్న నిత్య గాయాల పుళ్లనీ చిత్రిక కట్టాయి.  ముఖ్యంగా, తెరేష్ ఎంచుకున్న మార్గం కొంత విభిన్నం! …. కొన్ని తరాల పాటు తనని అవమానాల పాలు చేసిన ఈ సవర్ణ వ్యవస్థ సిగ్గుతో చితికి బిక్క చచ్చి పోయేలా చేయడానికి ఉపయోగించవలసిన సాధనం ‘తిట్లూ – శాపనార్థాలూ ‘ కాదనీ, పోలీసు దెబ్బల్లా పైకి మరకలేవీ కనిపించకుండా కొట్టాలంటే అందుకు పదునైన వ్యంగ్యమే సరైనదని అతడు భావించినట్టు తోస్తుంది. అతడి చాలా కవితలు ఎంతో కసితో రాసినట్టు తెలిసిపోతూ వుంటుంది.  ఎవరో గాట్టిగా తంతే పెద్ద సింహాసనం ముక్కలు ముక్కలై గాల్లోకి ఎగిరిపోతున్నట్టుగా వుండే ‘అల్పపీడనం‘ కవర్ పేజి ఇందుకు మంచి ఉదాహరణ! తన ‘నిశానీ’ కవితా సంకలనం లో బూతులు యధేచ్చగా దోర్లాయని ఫిర్యాదులు వొస్తే, ‘కమలా కుచ చూచుకాల్లో / వేంకటపతికి అన్నమయ్య పట్టించిన సురతపు చెమటల్లో / నీకు బూతు అగుపడదు ‘ అని దూకుడుగా జవాబు చెప్పిన కవి తెరేష్ !

తెరేష్, తెలుగు భాష పైనే కాదు – ఉర్దూ పైన కూడా మంచి పట్టు వున్న కవి. ముఖ్యంగా పాత హిందీ సినిమా పాటలు, గజల్స్ అంటే తనకు ఎంతో యిష్టం. తనదైన శైలిలో అద్భుతమైన దళిత కవిత్వం మాత్రమే కాదు – సగటు టి వి ప్రేక్షకులని ఉర్రూతలూగించిన సీరియల్స్ కూడా రాసాడు. అంతేగాక గొప్ప గాయకుడు. తెలుగులో తాను రాసిన గజల్స్ లో ‘నీ ప్రేమలేఖ చూసా – నే గాయపడిన చోటా ‘ కి వున్న అసంఖ్యాకమైన అభిమానులలో నేనూ ఒకడిని! … ఆ మధ్యన ఎక్కడో కలిసినపుడు ఆ గజల్ టెక్స్ట్ కావాలని అడిగితే గుర్తు పెట్టుకుని మరీ పేస్ బుక్ లో ‘విజయ్ – ఇది నీకోసం’ అని పోస్ట్ చేసాడు.

మరీ ముఖ్యంగా, తెలంగాణ ఉద్యమానికి తెరేష్ తన కవితల ద్వారా యిచ్చిన సపోర్ట్ మరిచిపోలేనిది. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా సీమాంధ్ర కవులు తెచ్చిన కవితా సంకలనానికి పెట్టిన పేరు ‘కావడి కుండలు‘, తెరేష్ రాసిన కవిత శీర్షిక నుండి స్వీకరించినదే ! …. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ముందుకు సాగే క్రమంలో తెలంగాణ కు వ్యతిరేకంగా జరిగిన కుట్రలను హేళన చేస్తూ పేస్ బుక్ లో క్రమం తప్పకుండా ‘విభజన గీత’ శీర్షికతో తెరేష్ పోస్ట్ చేసిన పద్యాలు / వ్యాఖ్యానాలు పెద్ద హిట్ ! చాలా మంది తెలంగాణ కవులలో కూడా లుప్తమైన గొప్ప రాజకీయ పరిజ్ఞానంతో అప్పుడు జరిగిన సంఘటనల వెనుక దాగిన కుతంత్రాలని తన విభజన గీత పద్యాలలో విప్పి చెప్పాడు!

కొంతకాలంగా తెలుగు కవిత్వంలో ‘దళిత కవిత్వం ఎక్కడుంది ?’ అని ఒక ఫిర్యాదు వుంది. నగేష్ , తెరేష్ , యువక లాంటి కవులని అభిమాంచిన నా లాంటి వాడికి కూడా ‘ఉధృతంగా సాగిన దళిత కవిత్వం పూర్తిగా మందగించింది. అచ్చమైన దళిత కవిత్వం రాయగలిగిన తెరేష్ లాంటి కవులు విస్తృతంగా రాయడం లేదు’ అన్న ఒక ఫిర్యాదు వుంది. తనకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి, ఐదు నెలల క్రితం ఇంటికి వెళ్లి పలకరించినపుడు… ఈ ఫిర్యాదుని తన ముందు పెడితే, ‘నేను మళ్ళీ విజ్రుంభిస్తా!’ అని తనదైన శైలిలో గొప్ప ఆత్మ విశ్వాసంతో చెప్పాడు. అతడే కాదు … నా లాంటి మిత్రులు చాలా మందిమి విశ్వసించాము … కాదంటే, ఆశపడ్డామేమో ?! …. ఇంతలోనే ఇట్లా జరిగిపోయింది !

ఈ నేల మీది కొన్ని లక్షల మంది దళిత వాడల తల్లులు ఎన్నెన్ని పురిటి నొప్పులు పడితే, ఆ వాడల అవమానాల గాయాలని గానం చేసే, వాడలలో సృష్టించే అల్ప పీడనంతో ఊళ్ళ లోని సింహాసనాలని కూల్చి వేసే,  ఒక తెరేష్ లాంటి కవి జన్మిస్తాడు. ఆ దళిత వాడల అపురూప ఆస్తి కదా అతడు! ….ఇంకా చేయవలసిన యుద్ధాలు ఇన్నేసి మిగిలే వున్నా, ఇట్లా తొందర పడి, ఈ నేలని విడిచి వెళ్ళిపోయే హక్కుని ఆ కవికి ఎవరిచ్చారు ?

కోడూరి విజయకుమార్    

ఫోటో: కాశిరాజు   

 

అప్పుడే వెళ్ళిపోవాలా శ్రీనివాస్?

_77686021_160577751

విజయవాడలో కర్నాటక సంగీత కచేరీ అంటే గాంధీనగరం హనుమంతరాయ గ్రంధాలయంలో జరుగుతుండేవి సర్వ సాధారణంగా. ఆ నెల కచేరీ టిక్కెట్లు ఇవ్వడానికి వచ్చిన సభ గుమాస్తా చాలా గొప్పగా చెప్పాడు అమ్మతో, “ఈ సారి కచేరీ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో నండీ. ఫోగ్రాము మా గొప్పగా ఉంటది అన్నారు మా అయ్యగారు.” వరండాలో కూర్చుని ఏదో ఇంగ్లీషు డిటెక్టివు నవల చాలా శ్రద్ధగా చదువుకుంటున్న నా చెవిలో ఈ మాటలు పడి కొంత కుతూహలం కలిగించాయన్నది నిజం. కళాక్షేత్రంలో కచేరీ అంటే మాటలు కాదు. అప్పటికి నాకు తెలిసి అలాంటి కచేరీ జరిగింది సుబ్బలక్ష్మి వచ్చి పాడినప్పుడూ, మళ్ళీ బాలమురళీకి విజయవాడ పౌరసన్మానం జరిగినప్పుడూనూ.

కచేరిలో చెవుల తుప్పొదిలిపోయింది. అసలు అంతకు మునుపు ఎప్పుడూ విని ఎరుగని ధ్వని. విచిత్రంగా ఉన్నది. అటుపైన, ఆ రాగాలాపనల నొక్కులేవిటి, ఆ స్వరప్రస్తారాల మెరుపులేమిటి .. ఇంతా చేసి అంత పెద్ద స్టేజీ మీద ఒక నలుసంత పిల్లగాడు. అటూ ఇటూ పక్క వాద్య విద్వాంసులు సూర్య చంద్రుల్లాగా ఉన్నా ఆకాశంలో కదలని స్థానం నాదేసుమా అని ధీమాగా మెరుస్తున్న ధృవ నక్షత్రం లాగా ఆ చిన్న పిల్లాడు, చేతిలో .. ఒక ఆటవస్తువు లాంటి వాయిద్యం .. దాని పేరు మేండొలిన్-ట! కేవలం కొత్త వాయిద్యం కొత్త రకం నాదం అన్న వైవిధ్యం ఒక్కటే కాదు .. ఆ విద్వత్తు, విద్వత్తుని వెలువరించిన తీరు .. విభ్రాంతి కలిగించాయి అనడం అతిశయోక్తి కాదు. అసలే ఆ రోజుల్లో నాకు ఎవరూ ఒక పట్టాన నచ్చే వాళ్ళు కాదు. కానీ కరిగి ముద్దైపోయాను.

కచేరీ పూర్తయ్యాక, చివరి బస్సు పట్టుకోవాలి అని ఎప్పుడూ ఆరాట పడే అమ్మ, ఆ మాటే ఎత్తకుండా స్టేజివేపుకి దారి తీసి, ఆ పిల్లాడి బుగ్గలు పుణికి పర్సులోంచి ఓ పది రూపాయల కాయితం ఆ అబ్బాయి చేతిలో పెట్టి వచ్చింది. ఎవరో శ్రీనివాసుట .. తెలుగు పిల్లాడేట .. మహా ఐతే పన్నెండేళ్ళుంటాయేమో .. అబ్బ, నిజంగా ఆ మేండలిన్‌తో బిల్లంగోడు ఆడుకున్నట్టు ఆడుకున్నాడు.

1424416_737306813028416_4252700639450257697_n

మరోసారి శ్రీనివాస్ విజయవాడలో కచేరి చెయ్యడానికి వచ్చే సరికి మా అమ్మ బుగ్గలు పుణికే స్థాయి దాటి పోయి చాలా ఎత్తుకి ఎదిగి పోయాడు. చూస్తుండగానే సంగీతం షాపుల్లో కొల్లలుగా కేసెట్లు .. ఎక్కడెక్కడివో రాగాలు .. ఏవేవో పోకడలు .. అడిబుడి రాగాలలో పెద్ద పెద్ద రాగం-తానం పల్లవులు. బాగా తెలిసిన నను పాలింప, నగుమోములకి సరికొత్త రంగులద్దకాలు. ఆ ఉప్పెనలో చెన్నై మునిగిపోయింది. ఒక చెన్నై ఏవిటి, ప్రపంచం మొత్తంలో కర్నాటక సంగీతం వినే వారెవరూ ఆ మంత్రజాలంతో ముగ్ధులు కాకుండా ఉండలేదు.

ఫోటో: ఆర్వీవీ కృష్ణారావు గారి సౌజన్యంతో

ఫోటో: ఆర్వీవీ కృష్ణారావు గారి సౌజన్యంతో

నేను అమెరికా వచ్చాక కూడా ఐదారు సార్లు నేరు కచేరీలు విన్నా. ఇన్ని కర్నాటక కచేరీలలోనూ ఒక పరమాద్భుతమైన అనుభవం డెట్రాయిట్ సింఫొనీ హాలులో జాన్ మెక్లాలిన్ శక్తి బేండుతో కలిసి శ్రీనివాసుని వినడం. నయాగరా జలపాతంలో పడితే అది మహా అయితే ఓ మూణ్ణిమిషాల అనుభవం కావచ్చు. సుమారు గంతన్నరసేపు నయాగరా కింద నిలబడితే ఎలా ఉంటుందో .. ఎదురు పడినా ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఒక మందహాసం. వేదిక మీదినించి మాట్లాడినా . మంద్రస్థాయిలో మృదువుగా, పాటని ఎనౌన్స్ చేసేంత వరకే. ఎప్పుడూ ఏ కాంట్రవర్సీలలోకీ పోలేదు. ఒక సారి అతని అమెరికా టూరుగురించి ఏదో అసంతృప్తి చెందిన కొందరు పెద్ద తలకాయలు కొంత అలజడి సృష్టించినా ఇతను సంయమనం కోల్పోలేదు.

తనివి తీరలేదే .. మా మనసు నిండలేదే .. ఎన్ని రికార్డింగులున్నా .. నేరుగా నీ చిరునవ్వుని చూసిన అనుభవం రాదుగా! అప్పుడే వెళ్ళిపోవాలా శ్రీనివాస్?

-నారాయణ స్వామి

10322847_10202715932672029_5083099762996079386_n

అమావాస్య యెరుగని చంద్రదీపం: ఎం. టి. ఖాన్

10603396_10203693605597290_3827708837853894168_n

1986 – 87 లో అనుకుంటా – విరసం లో సభ్యునిగా సిటీ యూనిట్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సమయం. ఆ రోజుల్లో పేరుకు విరసం లో సభ్యున్నే కానీ దాదాపు అన్ని ప్రజా సంఘాల్లో చురుగ్గా పనిచేసే వాళ్ళం. వాటిల్లో PDSU విద్యార్థి ఉద్యమాలకు చేయూతా, పౌరహక్కుల ఉద్యమం APCLC ముఖ్యం. ఒక వైపు ఇంజనీరింగ్ కాలేజీ లో లెక్చరర్ గా పని చేస్తూ దొరికిన ప్రతి ఖాళీ సమయాన్నీ ఉద్యమాల్లో పనిచేయడానికే ఉపయోగించుకునే వాణ్ణి.

APCLC లో స్నేహితుడు వీరప్రకాష్ సభ్యుడు. ఆయనతో కలిసి ప్రతి APCLC సమావేశానికీ వెళ్ళేవాణ్ణి. ఒక సారి, విరసం లోనూ APCLC లోనూ సభ్యులూ నాయకులూ అయిన ఖాన్ సాబ్ యింటికి వెళ్ళి రావాల్సిన పని బడింది. అప్పటి దాకా ఆయనని చూడడం పలకరించడం తప్ప ఆయనతో ఎక్కువగా చనువు లేదు. ఖాన్ సాబ్ ఇల్లెక్కడ అంటే పురానా పూల్ పక్కనే అని చెప్పారు. నాకేమో అప్పటికింకా హైద్రాబాద్ హస్తసాముద్రికం ఇంకా పూర్తిగా పట్టుబడలేదు. పుట్టింది జజ్జిలిఖాన లో అని మా నాయనమ్మ చెప్పినా పాతనగరం ఎకువగా తెలియని పరిస్థితి. పురానా పూల్ దగ్గర బస్సు దిగి ఎవర్నడిగినా చెప్తారు అన్నారు.

సరే అని బయలుదేరా! బస్సు దిగి వెతుక్కుంటూ ఒకరిద్దరిని అడిగితే అదిగో అని చూపిస్తున్నారు కానీ నేను పోల్చుకోలేక పోతున్నా! సరే ఒకాయన యెవరో వేలు పట్టుకోని ఒక యింటి ముందు నిలబెట్టి ఇదే ఖాన్ సాబ్ ఇల్లు అని చూపించారు. నేను నివ్వెరపోయాను. ఖాన్ సాబ్ ఇల్లంటే యేదో పెద్ద భవంతినో బంగళానో ఊహించుకుంటున్నా! చూడబోతే అదేమో ఒక పాడుబడ్డ గోడలు కూలిన పాత యిల్లు. జంకు జంకుగా సందేహంగా తలుపు మీద కొట్టా! కొంచెం గట్టిగా కొడితే కూలిపోతుందేమో అన్నట్టుందా తలుపు.

కొంచెం సేపటికి ‘ఆ రహా హూ’ అనుకుంటూ తలుపు తెరిచారు ఖాన్ సాబ్. ‘ఆవో ఆవో’ అనుకుంటూ సాదరంగా లోనికి తీసుకెళ్ళారు. నేను యింకా ఆశ్చర్యం నుండి తేరుకోలేదు … ‘హా సాబ్’ అనుకుంటూ లోనికి నడిచాను. చాలా ప్రేమగా లోపలికి తీసికెళ్ళి ‘బైఠో ‘ అంటూ ఒక కుర్చీ చూపించారు. ఆ హాలులో రెండే కుర్చీలు. నేను కూర్చోవడానికి కొంచెం జంకితే ‘కూర్చో నారాయణస్వామీ ‘ అంటూ చేయి పట్టుకోని కూర్చోబెట్టి యెంతో ప్రేమగా సాదరంగా మాట్లాడారు ఖాన్ సాబ్. అంత పెద్ద మనిషి నా లాంటి పిల్లగానిని అంత సాదరంగా కూర్చోబెట్టడం అంత సేపు మాట్లాడ్డం నేను కలలో కూడా ఊహించలేదు. ఉద్యమాల్లో యెన్నో యేండ్లుగా పనిచేస్తూ , అందరిచేతా గొప్పగా గౌరవింపబడే ఖాన్ సాబ్ నన్ను అంత ప్రేమగా పలకరిస్తారని యేనాడూ అనుకోలేదు.

ఆయన ఇల్లుచూసే నివ్వెరపోయిన నేను, ఆయన నడవడి చూసి మరింత ఆశ్చర్య పోయాను. అప్పటికే ఆయన పట్ల యెంతో గౌరవం తో ఉన్న నా దృష్టిలో ఆయన వ్యక్తిత్వం మరింత ఉన్నతంగా యెదిగిపోయింది.

ఖాన్ సాబ్ జీవితాంతం అదే శిథిలావస్థ లో ఉన్న యింట్లోనే జీవించారు. అదే పేదరికంతో, అవే కష్టాలతో అంతే సాదా సీదాగా బతికారు. భౌతిక సుఖాలకు దూరంగా, జీవితమంతా ఒక సూఫీ తత్వం తో , తాను నమ్మిన ఆశయానికి కట్టుబడి, గొప్ప నిబద్దతతో జీవించారు. తాను యేది చెప్పారో అది ఆచరించి చూపించారు. నిష్కల్మషమైన చిరునవ్వుతో యెప్పుడూ యితరులకు ఇవ్వడమే తప్ప యెన్నడూ యేదీ ఆశించని నిస్వార్థంతో ఖాన్ సాబ్ ప్రజా ఉద్యమాలకు అంకితమయ్యారు. తనకంటూ ఆస్తుల్ని కూడబెట్టుకోవడం కానీ, సుఖ భోగాల్ని కోరుకోవడం కానీ అనుభవించడం కానీ, ఖాన్ సాబ్ యెన్నడూ చేయలేదు.

ఖద్దరు లాల్చీ, పైజామా తో, బుజానికి సంచీ తో ఖాన్ సాబ్ ప్రతి సమావేశానికీ ఒక విద్యార్థిలా వచ్చే వారు. తనకేదో తెల్సుకాబట్టి అది బోధించడానికి వచ్చేవారు కాదు. యెప్పుడూ నేర్చుకోవడానికి వచ్చే వారు. ఒక మూలకు నిశ్శబ్దంగా కూర్చుని తన పని తాను చేసుకుంటూ సమావేశాల్లో పాల్గొనే వారు. యెప్పుడూ వినే వారు. తక్కువ మాట్లాడినా యెన్నో విలువైన విషయాలు మాట్లాడే వారు. ఆయన ఉపన్యాసాలు దీర్ఘంగా కాక , చిన్నగా , సూక్తుల్లా గా, సూఫీ పలుకుల్లా ఉండేవి. ధారాళమైన వక్త కాకపోయినా చెప్పే మాటల్లో పదునూ, గ్నానమూ యెంతో ఉండేది. ఆయన రాతల్లో కూడా అంతే! విరసంలోనూ, APCLC లోనూ అంత ఉద్యమానుభవమూ, పరిగ్నానమూ ఉన్నా, పదవులున్నా సాధారణ కార్య కర్తలా పనిచేయగలగడం ఖాన్ సాబ్ కే సాధ్యమైంది. దానిక్కారణం ఆయన సామాజిక నేపథ్యమే! హైద్రాబాదు పాతనగరం (అదే అసలైన నగరం కూడా) లో పేద ముస్లిం కుటంబ నేపథ్యం – అదే నగరానికి పాలుతాపిన గొల్ల అమ్మ వొడిలో పాలు తాగిన సామాజిక నేపథ్యం !

10559901_10203693615637541_4934043015941360340_n

ఖాన్ సాబ్ తో వీవీ

ఖాన్ సాబ్ వెళ్ళిపోయారంటే, కటువైన ఆ వార్తను నమ్మాలంటే చాలా కష్టంగా ఉన్నది. దుఃఖంగా ఉన్నది. ఆయన తరం వాళ్లంతా ఒక్కరొక్కరే వెళ్ళి పోతూ ఉంటే వొంటరి తనమూ, దిగులూ చుట్టుముట్టి, వెంటాడుతున్నాయి. అంత నిర్మలంగా, నిష్కల్మషంగా, నిరాడంబరంగా, సూఫీ తత్వాన్నీ , విప్లవ తిరుగుబాటునూ నరనరానా జీర్ణించుకున్న సాధువులా జీవించిన మహోన్నత వ్యక్తిత్వం , యెంతో గ్నాన సంపన్నత ఉన్నా యేమీ తెలియనితనంతో, యెప్పుడూ నేర్చుకోవాలనే జిగ్నాసతో నిరంతర విద్యార్థిలా, ఉద్యమాలకు నాయకుడైనా, సాధారణ కార్యకర్తలా పనిచేయగలిగిన గొప్ప మానవతామూర్తి ఖాన్ సాబ్ 1935 లో హైద్రాబాద్ లో జన్మించారు.

ఖాన్ సాబ్, మొహమ్మద్ తాజుద్దీన్ ఖాన్ అసలు పేరైనా ఎం టీ ఖాన్ గా అందరికీ సుపరిచితుడు. ఖాన్ సాబ్ జీవితం – ఎనిమిది దశాబ్దాల హైద్రాబాదు సుసంపన్నమైన చరిత్ర – బహుళ సంస్కృతుల సమ్మేళనమైన డెక్కన్ చరిత్ర. సమస్త భారతదేశానికే తలమానికమైన సంపద్వంత తెలంగాణ చరిత్ర. తెలుగు నేలపైన జరిగిన మహోన్నత ప్రజా పోరాటాల చరిత్ర, భారత ప్రజల విప్లవోద్యమ చరిత్ర , విప్ల వ సాంస్కృతికోద్యమ చరిత్ర. తెలంగాణ కోసం జరిగిన మూడు దశల ప్రజాపోరాటాలతో – సాయుధ రైతాంగ పోరాటం, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 1994 – 95 లలో తిరిగి ఊపిరి పోసుకుని తెలంగాణ మహాసభ, జనసభ ల తో పుంజుకుని చివరికి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ యేర్పడే దాకా జరిగిన ప్రతి ఉద్యమంతో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంబంధాలుండి క్రియా శీలకంగా పాల్గొన్న ఉద్యమకారుడు ఖాన్ సాబ్.

చిన్ననాటినుండే మహాకవి మఖ్దూం మొయినుద్దీన్ తో సాంగత్య మూ, శిష్యరికమూ , ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నడిపిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ప్రభావమూ, యిప్టా (అభ్యుదయ రచయితల సంఘం) కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర ఖాన్ సాబ్ వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దినయి. పేద ముస్లిం, దళిత బహుజన సామాజిక నేపథ్యం (అప్పుడా ప్రత్యేక స్పృహ లేనప్పటికీ) ఆయనలోని నిరాడంబర, నిస్వార్థ సూఫీ సాధు తత్వాన్ని, కమ్యూనిస్టు ఉద్యమాలు, పోరాటాలు తిరుగుబాటు మార్క్సిస్టు తత్వాన్ని ద్విగుణీకృతం చేసాయి.

ఆయన చిరకాల స్నేహితులు, సహచరులు బూర్గుల నర్సింగరావూ, కేశవరావు జాదవ్ గార్లతో ఖాన్ సాబ్ హైద్రాబాద్ లౌకిక ప్రజాస్వామిక సంస్కృతికీ చరిత్రకీ రూపకల్పన చేసారు. హిందూ ముస్లిం మతోన్మాదాలకు వ్యతిరేకంగా, పేద ముస్లిం లకు విద్య కనీసావసరాల కన్నా మసీదుల్లో మైకు లకోసం పాకులాడిన MIM మత రాజకీయాలకు వ్యతిరేకంగా, రాజకీయ విషసర్పాలు పడగ విప్పి బుస కొట్టిన మత కలహాలకు వ్యతిరేకంగా, పేద ముస్లిం, హిందూ ప్రజల ఐక్యత కోసం ఖాన్ సాబ్ చేసిన కృషి సామాన్యమైంది కాదు, అది చిరస్మరణీయమూ మనకందరికీ దారి చూపించేదీ!

బి యే పాసు అయినా కాకపోయినా ఎం యే విద్యార్థులకూ పాఠాలు నేర్పగల దిట్ట, మార్క్సిజం నరనరానా జీర్ణించుకుని, విద్యార్థులకు ముందుగా మనుషుల్లా బతకడం అన్నింటికన్నా ముఖ్యం అని యాకుత్ పురాలోని ధన్వంత కళాశాల లో పాఠాలు నేర్పిన ఉపాధ్యాయుడు ఖాన్ సాబ్! ఉర్దూ, పార్సీ, తెలుగు, ఆంగ్లం, మరాఠీ – ఐదు భాషల్లో ప్రావీణ్యత సాధించి – అన్ని భాషల్లో రచన సాగించిన ఖాన్ సాబ్ సియాసత్ న్యూస్ టైం లాంటి పత్రికల్లో జీవిక కోసం సంపాదక స్థాయిలో (పదవులు లేక పోయినా ) రాసారు.

భారత కమ్యూనిస్టు పార్టీ జడత్వానికి లోనై, పార్లమెంటరీ పంథా బురద లో కూరుకుపోయినప్పుడు ఉవ్వెత్తున యెగసిన నక్సల్బరీ తో ఉన్నారు ఖాన్ సాబ్! తెలుగు సాహిత్యంలో దిగంబర కవిత్వం కెరటంలా యెగసి పడుతున్న సందర్భం – నక్సల్బరీ ఉద్యమం శ్రీకాకుళ నిప్పురవ్వలు రాజేస్తున్న సందర్బం – పాణిగ్రాహి లాంటి ప్రజాకవులు విప్లవ సాహిత్యానికి బీజాలు వేస్తున్న సందర్భం – విరసానికి కర్టెన్ రైజర్ లాంటి ‘అంటార్కిటా’ పోస్టర్ కవిత ను (వేణుగోపాల్, తేజ్ రాజేందర్ లతో ) రూపొందించారు ! విరసం. APCLC లలో సంస్థాపక సభ్యులు. 1972 లో పిలుపు పత్రికను ప్రారంభించారు. 1973 లో మీసా కింద వరవరరావు, చెరబండరాజులతో అరెస్టయ్యారు. సికింద్రాబాద్ కుట్రకేసులో నిందితుడయారు. ఎమర్జెన్సీ చీకటి రోజులు మొత్తం జైల్లో బందీ గా గడిపారు. అయినా చెక్కు చెదరలేదు. నిర్బంధాలూ, కుట్రకేసులూ, జైలు జీవితమూ , కటిక పేదరికమూ, కష్టాలూ , కన్నీళ్ళూ ఖాన్ సాబ్ ని యేమాత్రమూ మార్చలేదు. ఆయన వెనుకంజ వేయలేదు, దారితప్పలేదు. విరసంలో, APCLCలో చివరి ఊపిరిదాకా కొనసాగారు. AILRC ఉద్యమంలోనూ పాల్గొన్నారు.

1453335_10203693641238181_6506679510882453898_n

హైద్రాబాదులో సెకులర్, ప్రజాస్వామిక, విప్లవ ఉద్యమాలన్నిటిలో అలుపెరుగకుండా జీవితాంతం పాల్గొన్నారు. ఆయన జీవిత చరిత్రను ప్రజాస్వామిక లౌకిక హైద్రాబాద్ చరిత్ర కు ప్రర్యాయ పదంగా మార్చారు. 1992 లో APCLC కి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 90 వ దశకంలో వచ్చిన అస్తిత్వ, ప్రజాస్వామిక ఉద్యమాలకూ మద్దతునిచ్చారు. మలిదశ తెలంగాణా ఉద్యమంలో నిత్య యవ్వనంతో పాల్గొని 60 యేండ్ల తెలంగాణ కల తన జీవిత కాలం లో సాకారమైన నిత్య ఉద్యమ కారుడు ఖాన్ సాబ్!

హైద్రాబాద్ నగరానికి పెద్ద దిక్కు , కఠినమైన పేదరికంలో నూ నమ్ముకున్న ఆశయాలనూ, నడుస్తున్న ఉద్యమ బాటనూ వదలని ఉద్యమకారుడూ, సాహిత్యకారుడూ , పోరాటశీలీ ఖాన్ సాబ్ మనలని వదలి వెళ్ళిపోవడం అత్యంత బాధాకరామూ మనకు తీరని లోటూ! మొన్న చేరాగారూ, నిన్న ఖాన్ సాబ్
– ఒక్కరొక్కరే మనల్ని వదలి వెళ్ళిపోతుంటే తీరని దుఃఖంగా ఉన్నది –

వెళ్ళి పోతున్నారు
అంతా ….
ఒక్కొరొక్కరే

నిశ్శబ్దంగా,
యేమీ చెప్పకుండా
పట్టుకున్న వెచ్చని చేతులని
వదిలిచుకుంటూ
వెళ్ళిపోతున్నారంతా –

ఒకరు వీడిన కన్నీరు ఇంకా ఆరనే లేదు
మరొకరు,
కన్నీటి చుక్కల్ని పొడిపిస్తూ
నిర్దయగా ….

ముళ్ళూ రాళ్ళూ గుచ్చుకున్న పాదాలకు
అనునయంగా పదిలపు లేపనం పూసినోళ్ళు,
కన్ను పొడిసే చీకట్లల్ల
పురుగూ బూసి కరువకుండ జాగ్రత్తల దీపాలైనోళ్ళు,
పెచ్చులూడిన గోడలమీద
వెలిసిపోయిన రంగులని వెతుక్కుంటున్నప్పుడు
మెరిసిన జాజి రంగు నినాదాలైనోళ్ళు,

కష్టమైనా నష్టమైనా వెన్నంటే ఉంటామని
కొండంత అండైనోళ్ళు

వెళ్ళిపోతున్నారంతా …
బయటికి రాని శోకాన్ని పుట్టెడు దుఃఖాన్ని
మన గొంతుల్లో మిగిలించి …..

యెడతెరపిలేకుండా
యెన్నో వెలుతురు ముచ్చట్లు చెప్పి
యెట్లా బతకాలో బతికి చూపించినోళ్ళు

కలలెప్పుడూ యిగిరిపోవద్దనీ,
కంట్లోనూ మనసులోనూ
తడి యెన్నడూ యింకిపోవద్దనీ
కంటినీరు తుడిచినోళ్ళు

యెన్ని పోగొట్టుకున్నా
యెన్నడూ మనిషితనం పోగొట్టుకోవద్దని,
శిథిలమైన బతుకుగోడల మధ్యా
చెదరని చిరునవ్వుతో చెప్పినోళ్ళు

ఒక్కొరక్కరే వెళ్ళిపోతున్నారు
మౌనంగా ….

నెమ్మదిగా తలలూపే చెట్లలాగా,
పొద్దుటి పూట చెమ్మగిల్లిన పూలలాగా,
లేత యెండలో మెరిసే చిగురుటాకుల్లా

నెరవేరని కలలనీ
అలుపెరుగని చిరునవ్వులనీ
మనకు మిగులుస్తూ…

ఒక్కొరక్కరే వెళ్ళిపోతున్నారు
మౌనంగా ….

 

యెన్నో తరాలకు చిమ్మ చీకట్లలో దారి చూపిన ఖాన్ సాబ్ చిరునవ్వు అమావాస్య యెరుగని చంద్ర దీపం!
మన గ్నాపకాల్లో, నెరవేరని కలల్లో ఖాన్ సాబ్ యెప్పుడూ జీవించే ఉంటారు, చిరస్మరణీయులై!

-నారాయణస్వామి వెంకట యోగి

నారాయణస్వామి వెంకట యోగి

ఫోటోలు: కూర్మనాధ్

చేరాగారి చివరి పాఠమేమిటి..?

10534397_326754877475156_564669077665495274_n

భుజాన నల్ల సంచీ, దాన్నిండా కిక్కిరిసిన పుస్తకాలు, గాలికి కదిలే తెల్లజుట్టూ ఆహార్యాలుగా వున్నాగానీ ,దాదాపు ఆరడుగుల వెలుతురు రూపం మన చేరా మాస్టారు. ఎప్పుడూ  పరధ్యానంగా , ఏదో ఆలోచిస్తూ వుంటారు. మొదటిసారి మాట్లాడుతున్నవాళ్ళకయినా సరే ఆయన ఖచ్చితంగా ప్రొఫెసరే అయివుంటాడనిపిస్తుంది తప్ప రియల్ ఎస్టేట్ దారుడో, ఎల్.ఐ.సి ఉద్యోగో మాత్రం కానేకాదు అనిపిస్తుంది. మాట్లాడ్డం మొదలుపెడితే మాత్రం ఆ ఆప్యాయత ఉరవడిలో ఆయన హోదా ఏమిటో గుర్తురాదు. అంత బాగా జన సామాన్యంతో కలిసిపోయే వ్యక్తిత్వం చాలా తక్కువ మందికే వుంటుంది. ఒక ప్రక్రియలోనే తల పండి అలసిపోయామనుకున్నవారికి మాస్టారి బహుముఖ ప్రజ్ణా, నిరాడంబర వ్యక్తిత్వం నిదానంగా మాత్రమే అర్ధమవుతాయి.

చేరా గురించి నాకున్నన్ని జ్నాపకాలు మా నాన్నతో కూడా వున్నాయో లేదో.

దాదాపు పాతికేళ్ళ క్రితం రంజని ఆఫీసు వాళ్ళు కవి సమ్మేళనం పెట్టి నప్పుడు చదివిన లేబర్ రూమ్ కవిత విని మాస్టారు చాలా మెచ్చుకున్నారు. అప్పటికి అదే కవిత అశ్లీలంగా వున్న కారణంగా ఆంద్ర జ్యోతి వారి చెత్తబుట్టకు చేరువలో వుంది. కాబట్టీ ఆ ప్రోత్సాహం నాకు తెరిపిగా అనిపించింది. చేరా అ0టే చేరాతల రచయిత అని మాత్రమే తెలిసిన నాకు, భాషాశాస్త్రంలో ఆయనకి వున్న ప్రతిభా, వ్యాకరణ , వాక్య నిర్మాణ విన్యాసం, కృషి తెలుసుకున్నాక గర్వంగా అనిపించింది. అప్పటికి నేను రాసిన సందిగ్ధ సంధ్య సంకలనాన్ని సమీక్ష కోసం మాస్టారు ఇచ్చిన చిరునామా కి చాలా భయపడుతూ పంపించాను.  అందులో కొన్ని మాత్రమే బావున్నాయని, కొన్ని అనవసర వాక్యల పొడిగింపు వల్ల నిస్సారంగా వున్నాయని చెబుతూ ఒక ఉత్తరం రాశారు.. సాహిత్య రచనకి సంబంధించి ఎలాంటి ప్రోత్సాహమూ , వాతావరణము లేని నాకు అది మొదటి పాఠం. రాసినదాన్ని గట్టిగా చదివి చూసుకునే అలవాటు రేడియో కాంపీరింగు వల్ల చాతనయితే , ఎన్నిసార్లు అయినా తిరిగి రాసుకోవడం, సొంత అక్షరాల పట్ల వీలయినంత నిర్మమకారంగా వుండటం మాస్టారి వల్ల సాధ్యమయింది. .

ఎన్ని ఉత్తరాలు రాసుకునేవాళ్లమో , ఒక్కొక్కటి ఒక్కో ఆత్మీయ , సాహిత్య, సామాజిక అక్షర శిల్పం. ఆగాకర కాయ కూర దగ్గరనుంచీ అన్నమయ్యదాకా ఏ విషయం మీదయినా ఆయనదొక భిన్నమైన అభిరుచి ప్రకటన. రె౦డు రెళ్ళు నాలుగు అనేది సంఖ్యా శాస్త్రం . అయిదు, ఆరు,, ఏడు   కూడా ఎందుకు అవుతాయో నిరూపీంచడం భాషా శాస్త్రం. ఎందుకంటే ఇంత పెద్ద ప్రపంచంలో ఇన్ని భాషల, నుడికారాల మధ్యా ఇదే సరి అయినది అని చెప్పడం పిడి వాదం అనేవారాయన. మాస్టారులో వున్న సరళీకృత విధానానికి, నూతన ఆవిష్కరణల పట్ల అనుకూలతకు అదొక గుర్తు.

. మాస్టారులో వున్న నిబ్బరానికి హాస్య ప్రియత్వానికి చాలా ఉదాహరణలున్నాయి. వాక్యంలో బడు ప్రయోగం చర్చ జరుగుతున్న రోజుల్లో ఒకసారి ఖమ్మం నించి ఇటు తిరువూరు వచ్చారు. టిఫినూ కాఫీ అయ్యాక స్నానం చెయ్యడానికి సూట్కేసు తెరిస్తే అందులో పెద్దవాళ్ళు కట్టుకునే జారీ నేత చీరలూ , పగడాల గౌలుసులూ లాంటివి కనబడ్డాయి. ఆయనతో బాటు మేం కూడా  తెల్లబోయా౦. విషయం ఏమిటంటే బస్సులో సూట్కేసు తారుమారయింది. ఏ బస్సులో వచ్చారో ఆ ఆ నంబరు గుర్తులేదు. కనకదుర్గా ట్రావెల్ సర్వీసెస్ అని మాత్రం చెప్పగలిగారు. ఎంత చిన్న వూరు అయినాకానీ భద్రాచలం, మళ్ళీ అక్కడ్నించీ హైద్రాబాదు వెళ్ళి వచ్చిన ఆ బస్సులో ఎవరితోనో దిగిపోయిన సూట్కేసు పట్టుకోవడానికి మూద్రోజులు పట్టి౦ది.. అది దొరికేవరకూ మేం పడ్డ హడావిడి , ఆందోళన అన్నీ మాకే వదిలి తను మాత్ర౦ ఇంట్లో వున్న ఒక రెడీమేడ్ టీషర్ట్, లుంగీ కట్టుకుని, అక్కడి గెస్ట్ హౌసులో కూచుని హాయిగా పేపర్   రాసుకున్నారు. పైగా,

“ ఎందుకంత కంగారు పడతారు. నా పెట్టెలో పుస్తకాలు తప్ప ఖరీదయినవేవీ వుండవు. అవి ఎవరు పట్టుకుపోయి చదువుకున్నా సంతోషమే, నేనెలాగూ అన్నీ పారేసుకూంటాను కాబట్టి మా ఆవిడ ఎలాగూ పాత దుప్పట్లు తువ్వాళ్ళు పెడ్తుంది, ఏమీ పారేసుకోకుండా ఇంటికేడితే మళ్ళీ ఆవన్నీ ఇ౦ట్లో సర్ధడ౦ ఆవిడకే చిరాకు, “ అన్నారు గట్టిగా నవ్వుతూ.

ఒకసారి బెంగుళూరులో జరిగిన ప్రపంచ మహాసభల్లో కవిత్వం చదవడానికి నేనూ, యాకూబ్, అఫ్సరు, శిఖామణీ, దేవీ ప్రియ ఇంకా కొ౦దరు కలిసి వెడుతుంటే రైల్లో ముత్యాల సరాలు పాఠం చెప్పారు. ఆ రాత్రి కదిలే రైల్లో మాస్టారు మంద్రస్వరంతో చెప్పిన ముత్యాలు కిటికీలో పొంచి చూస్తున్న చందమామ ఎత్తుకుపోకుండా కాపలా కాయడం కష్టమయింది. అదే ఛందస్సులో మేమంతా ఎవరికివారం మనసులోనే కవిత్వం మాల అల్లుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. వీళ్ళంతా నా శిష్యులు అనుకోవడంలో మాస్టారికెంతో సంతృప్తి వుండేది.

స్త్రీలకొక వాదం కూడానా అని అహంకరిస్తున్న కాలంలో స్త్రీవాద కవిత్వాన్ని అర్ధం చేసుకునే సూక్ష్మదర్శని అందరికీ ఇచ్చింది రామారావు గారే. నిజానికి అంతక్రితం ఎన్నోఏళ్లనుంచీ ఎన్ని వాద వివాదాల గురించి పరిచయం చేసినా స్త్రీవాద పక్షపాతి గానే మాస్టారు అందరి హర్షానికీ , కొ౦దరి ద్వేషానికీ కారణయ్యారు.  నీలి కవితలు, వార కవితలు, వళ్ళు బలిసిన మధ్య తరగతి ఆడవాళ్ళ రచనలు అని దూషించిన వారికి రచయిత్రులెంత బాగా జవాబు చెప్పారో, విమర్శకులుగా మాస్టారూ అంత బాగా మాకు మద్దత్తు ఇచ్చారు.

చేరాగారు ప్రధానంగా పద్య ప్రేమికులు అయినా వచనాన్ని బాగా ప్రచారం చేశారు. కాబట్టి కవిత్వంలో వచనం వున్నా, వచనంలో కవిత్వం వున్నా అస్సలు సహించలేరు. దేనికది ప్రత్యేక వ్యక్తీకరణ వున్న సాహితీ ప్రక్రియ అని గట్టిగా నమ్మేవారు. నేను పత్రికలకోసం రాసిన రిపోర్టుల్లో కవిత్వ ఛాయలు అండర్ లైన్ చేసి అలా రాయద్దని, ఇలాగైతే ఇక నీకు మంచి వచనం పట్టుబడదని హెచ్చరించేవారు.

నడిచే గాయాలు పుస్తకానికి ఆర్ధిక బాధ్యత తప్ప ముద్రణా, అచ్చుతప్పులు దిద్దడం, కవర్ పేజీ వేయీంచడం అన్నీ చేరాగారే స్వయంగా చూశారు. గోడలు అనే కవిత పత్రికలో వచ్చిన రూపంలో కాక ఇంకాస్త బాగా ఎడిట్ చేసి నేను పంపేలోగా పుస్తకం అచ్చయిపోయింది. అప్పుడు నా నిరుత్సాహం చూళ్ళేక రెండవ వర్షన్ కూడా చివరి పేజీలో వేయించారు. ఎంత చిన్న మనిషినయినా పెద్దగానే పట్టీంచుకోవడం మాస్టారికలవాటు.

చేరా ఉస్మానియా యూనివర్సిటీ డీన్ గా వున్నప్పుడు ఒకసారి నే వెళ్ళేసరికి ఏవో ఆఫీసు లెటర్స్ టైపు చేస్తున్నారు.

“ అదేమిటి మాస్టారూ మీరు చేస్తున్నారేమిటి ఈ పని. మీదగ్గర టైపిస్తులు ఎవరూ వుండరా ?”అని అడిగాను.

“ఎందుకుండరు, వుంటారు. కానీ మూడింటికల్లా పంపించివేస్తాను. ఇక్కడి నుంచి మా టైపిస్టు వాళ్ళీల్లు చాలా దూరంట. ఆ అమ్మాయికేవో కుటుంబ సమస్యలున్నట్టున్నాయి.. చెప్పాలనుకుంటే తానే చెబుతుంది. నేను అడగడమెందుకు. అయినా నా పని నేను చేసుకోవడమే హాయి” అన్నారు. దటీజ్ చేరా. ఎదుటివారి వ్యక్తిగతానికి, వ్యక్తిత్వానికి అ౦త చోటు ఇచ్చే బాస్ లు నేను పనిచేసిన చోట ఎక్కడా దొరకలేదు.

ఎవరింటికయినా వెడితే ఆ ఒక్క మనిషితోనే మాట్లాడి వచ్చేసే దురలవాటు నాకు వుండేది. మిగిలినవాళ్లని పట్టీంచుకునేదాన్ని కాదు. అది స్థాయికి సంబంధించిన దూరాన్ని తెలియజేస్తుందని , అలా వుండకూడదని మాస్టారు మాయింట్లో వాళ్ళతో కలిసిపోయిన తీరుని చూసి నేర్చుకున్నాను.

చేరాకి మనుషులు కావాలి. అది ద్వారకా హోటలు అయినా, సుప్రభాతమ్ ఆఫీసు అయినా మా ఇల్లు అయినా , ఇంకోటి ఇంకోటి అయినా ఆటో చేసుకుని వచ్చేస్తారు. మనుషుల్ని౦చి దూరం చేసే ఏ హోదా ఆయన పాటీంచేవారు కాదు.

చేరాలాంటి మహాసముద్రాన్ని గురించి నాలాంటి చిన్న మనీషి ఎన్ని దోసిళ్లతో తవ్వి తలపోసుకున్నా తక్కువే అవుతుంది.

కానీ గత రెండేళ్ల నుంచీ ఎందుకోగానీ మాస్టారు సరిగా పలకడంలేదు. ఏ సభలో కలిసినా ముక్తసరిగానే వున్నారు. ఎవరితో పంచుకున్నా ఇదే అనుభవం చెబుతున్నారు. ఎడ్నార్ధం క్రితం నా పుస్తక ఆవిష్కరణకి మాట్లాడారు. తర్వాత మళ్ళీ మొన్న కృష్ణక్క పుస్తక సభలో చూశాను. రోజూ త్యాగరాయ సభకి వెడుతున్నారని తెలిసి అక్కడికి వేడితే అప్పుడే ఇంటికి వెళ్ళారు అన్నారు. ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్ళినా వుండరని తెలుసుకుని తమాయించుకోవాలి.

మామూలుగా నేను ఎలిజీలు రాయను.. రాయలేను. ఎందుక౦టే మొదటగా జరిగిన సంఘటన జీర్ణించుకుని, మళ్ళీ తేరుకుని, ఆ జ్నాపకాల్నిఆ౦టే బహుశా నిట్టూర్పుల్ని క్రమబద్ధీకరించుకుంటూ రాయాలి.. ఇందుకు సమయం పడుతుంది. కాబట్టి వెంటనే ఆ పని చేయలేకపోతాను. అయితే గత కొన్నాళ్ళుగా చేరా మానసికంగా పాటించిన ఒక మౌనమే మనందరికీ ఒక తాత్త్విక వాతావరణం ఏర్పడేలా చేసింది. బహుశా ఇది కూడా ఒక పాఠమే. చేరా మాస్టారు చెప్పిన చివరి పాఠం. ఈ పాఠం పట్టుబడటం కష్టంగా వుంది చేరాగారూ.

-కొండేపూడి నిర్మల

శనివారం, 26.7.2014

(చిత్రం: రాజు)

పిచ్చేశ్వరరావు ప్రియస్మృతిలో…..

                ఒక రచయితకు అర్హతకు మించిన గుర్తింపు లభిస్తుంది. మరొక రచయితకు అర్హతకు తగిన గుర్తింపు కూడా రాదు. మొదటి దానికంతగా విచారించనక్కర్లేదు. కానీ, రెండో దానికి అనివార్యంగా విచారం కలుగుతుంది. ఎందుకంటే, అర్హతకు మించిన గుర్తింపు రావడం వల్ల ఆ రచయితకు కొంత ప్రయోజనం కలిగినా, అందువల్ల సాహిత్యానికీ, సమాజానీకీ కలిగే నష్టం అంతగా వుండదు. అంతేగాదు, అర్హతకు మించిన గుర్తింపు అట్టే కాలం నిలిచివుండదు. రచయిత అర్హతకు తగిన గుర్తింపు రాకపోతే మాత్రం సాహిత్యానికీ, సమాజానికీ ఎంతో కొంత నష్టం జరిగితీరుతుంది. గుర్తింపుకు రాని రచయిత తన సాహిత్యం ద్వారా ఏం చెప్పిందీ, ఏ విలువల కోసం పోరాడిందీ తెలీక పోవడం వల్ల, అటువంటి నష్టం కలుగుతుంది. అట్లూరి పిచ్చేశ్వరరావు విషయంలో అలా జరిగిందనిపిస్తుంది. పిచ్చేశ్వరరావుకు గుర్తింపే రాలేదనికాదు, అర్హతకు తగిన గుర్తింపు రాలేదనే చెబుతున్నది. అందుకు కారణాలున్నాయి. వాటిని తర్వాత చెప్పుకుందాం.

ఎవరీ పిచ్చేశ్వరరావు?

ఈ ప్రశ్నకు నేనైతే, ‘‘పిచ్చేశ్వరరావు మా పెద్దమ్మ కొడుకు, మా పులపర్రువాడు, పిచ్చేశ్వరరావు లేకుండా వుండివుంటే, ఈ అట్లూరి రాధాకృష్ణ కూడా లేకుండా వుండేవాడు, ఉండినా ఇలా వుండేవాడు కాడు, ఇంకెలాగో వుండేవాడు’’ అంటాను. అంటే, పిచ్చేశ్వరరావు ప్రభావం నావిూద అంతలా వుందనీ, ఈ నేను రూపొందిందే ఆ ప్రభావంతోననీ అనడమన్నమాట. నా ద్వారా పిచ్చేశ్వరరావును చూపించడం కన్నా, పిచ్చేశ్వరరావును పిచ్చేశ్వరరావు ద్వారానే చూపించడం సరైన పద్ధతి. అందువల్ల, నాకు పిచ్చేశ్వరరావుకూ వున్న సంబంధం గురించీ, అనుబంధం గురించి అవకాశాన్ని బట్టి మరోసారి చెబుతానని, హామీ ఇస్తున్నాను. ఇప్పుడు పిచ్చేశ్వరరావును గురించి కొడవటిగంటి కుటుంబరావు ఏం చెప్పారో చెబితే, గౌరవ ప్రదంగా వుంటుంది కదా!

‘విశాలాంధ్ర పబ్లిషింగ్‌హౌస్‌’’ వారు 1967 నవంబర్‌లో మొదట ‘పిచ్చేశ్వరరావుకథలు’ ప్రచురించారు. దానికి కుటుంబరావు ‘కథకుడుగా పిచ్చేశ్వరరావు’ అంటూ, ముందుమాట రాసారు. ముందుమాటలో మొదటి మాటగా ఇలా అన్నారాయన. ‘‘అతను చనిపోయాడంటే నేను నమ్మలేను. అతను ఇంకా నాకళ్ళకు కట్టినట్టు కనపడుతూనే వున్నాడు’’ ఈమాటలు ఒక కథలో పిచ్చేశ్వరరావు అన్నవి. ఈ మాటల్నీ పిచ్చేశ్వరరావును గురించి కుటుంబరావూ అన్నారు. అంతేనా? ఇంకా ఇలా అన్నారు. ‘‘ఒక మనిషి చావు అవాస్తవం అనిపించడానికి కారణం ఏమిటని ఆలోచించాను. ఆ మనిషిమీద ప్రేమాభిమానాలే అందుకు కారణంకాదు. మనిషితోపాటు పోకుండా సజీవంగా మిగిలిపోయేదేదో వుంటుంది. అదే ఆ మనిషి చావును నమ్మశక్యం కాకుండా చేస్తుంది’’ గొప్ప విశ్లేషణ కదూ! పిచ్చేశ్వరరావులో మిగిలిపోయిన సజీవతను గుర్తించిన కుటుంబరావు ఆయనకథ ‘చిరంజీవి’ని మెచ్చుకోకుండా ఎలా వుంటారు?

Atluri_Pitcheswara_Rao_Apr12_1924_to_Sept26_1966_Atluri_Anil_

‘‘నిజానికి పిచ్చేశ్వరరావును బాగా ఎరిగినాక, అతని సజీవ భావ చైతన్యాన్ని గుర్తించకుండా వుండడం సాధ్యంకాదు. చాలా సామర్ధ్యాలు కలవాడు. కానీ వాటిని సాధ్యమైనంత గోప్యంగా దోచుకున్నాడు’’ కుటుంబరావు పిచ్చేశ్వరరావును గురించి ‘బాగా ఎరిగిన’ వారుకనుకనే, ఈ సంగతి కనిపెట్టగలిగారు. ఆ సంకలనంలో వున్న 22 కథల్లోనూ చాలా వాటిని పేర్కొని, వ్యాఖ్యానించి మెచ్చుకున్నారు. చివరగా, ‘‘నేనెరిగినంతలో అతని కథలు నాలుగైదు ఉత్తమ తెలుగు కథా సాహిత్యంలో శాశ్వతంగా నిలువ కలిగినవిగా వున్నాయి’’ అనీ ప్రకటించారు. కుటుంబరావు అన్ని కథల్ని ప్రస్తావించడమూ, ఆ చివరి అభిప్రాయమూ ఆశ్చర్యం కలిగించేవే.

KoKu

ఆ తర్వాత, 1994 జులైలో ‘పిచ్చేశ్వరరావు కథలు’ ద్వితీయ ముద్రణగా వచ్చాయి. దానికి ‘ధ్యేయం’ అన్న పేరిట ఆరుద్ర ముందుమాట రాసారు. అందులో ఆయన ‘‘కుటుంబరావు వంటి నిర్మొహమాట విమర్శకుడు అభిప్రాయం వెలిబుచ్చాక, ఈ సంపుటికి ఇంకొకరు ముందుమాట రాసి పిచ్చేశ్వరరావును ప్రశంసించనక్కర్లేదు’’ అన్నారు. ‘‘ఉత్తమ సాహిత్యం బ్రతుకు మీద మమతను పెంచాలి. పిచ్చేశ్వరరావు ఆ ధ్యేయంతో కథలు రాసాడు. అందుకు ఈ సంపుటిసాక్ష్యం’’ అంటూ ఆరుద్ర సాక్ష్యం ఇచ్చారు.

ఇద్దరు సాహితీ ప్రముఖులు ఈ విధంగా ప్రశంసించినప్పుడు పిచ్చేశ్వరరావుకు తగిన గుర్తింపు రాలేదనడమేమిటి… అనడగవచ్చు… గుర్తింపు రావడంమంటే, కుటుంబరావు, ఆరుద్ర స్థాయిలో గుర్తింపు రావడమని కాదు. ఉత్తమ సాహిత్యాన్ని గుర్తించగలిగిన పాఠకుల స్థాయిలో సైతం గుర్తింపు రావాలన్న కోరిక. అందుకు కారణాలున్నాయనీ, వాటిని తర్వాత చెప్పుకుందామనీ అన్నాను. అయితే, నేను చెప్పనవసరం లేకుండా ఆ ఇద్దరు ప్రముఖులే అవీ చెప్పారు. ఎలా చెప్పారో, ఏం చెప్పారో చెప్పుకుంటేచాలు.

‘‘అతను చాలా సామర్ధ్యాలు కలవాడు. కానీ వాటిని గోప్యంగా దాచుకున్నాడు. వాటిని దుకాణంలో పెట్టలేదు. ప్రదర్శించి కీర్తి తెచ్చుకోడానికి మొదలే ప్రయత్నించ లేదు. హిందీ, ఇంగ్లీషు, తెలుగూ బాగావచ్చు. బెంగాలీ కూడా వచ్చుననుకుంటాను. శాస్త్రీయ దృక్పథం వుంది. కథలు రాసాడు, విమర్శలు రాసాడు, అనువాదాలు చేసాడు, సినిమాలకు సంభాషణలు రాసాడు. ఏదిరాసినా, విశిష్టంగా తన వ్యక్తిత్వం ఉట్టిపడేట్టుగా రాసాడు’’ (కుటుంబరావు)

అదిగో… ఆ వ్యక్తిత్వమే తనని తాను ప్రదర్శించుకోనీకుండా చేసింది. ఏది రాసినా తన వ్యక్తిత్వం చూపెట్టేందుకు రాసాడు కానీ, తన ప్రతిభను చూపెట్టేందుకు రాయలేదు. గొప్పకథలు రాయాలన్న కోరికతో, తపనతో కాకుండా, క్లుప్తంగా, గుప్తంగా రాసినా, ఉత్తమ కథా సాహిత్యంలో శాశ్వతంగా నిలువ గలిగినవీ రాసాడు! ఆశ్చర్యంగా లేదూ? ఆశ్చర్యమెందుకు? అది కూడా పిచ్చేశ్వరరావు వ్యక్తిత్వంలో, ధ్యేయంలో భాగమే.

ప్రజలలో చాలామంది చావంటే వున్న భయంతో బ్రతుకుతున్నారనీ బ్రతకుమీద మమతను పెంచేకథలు రాసాడని, ఆరుద్ర అన్నారు. చావంటే వున్న భయంతో చాలా కాలం బ్రతకడం ఇష్టంలేకనేమో, బ్రతుకుమీద మమతతో స్వల్ప కాలం బ్రతికినా చాలని చాటడానికేమో, పిచ్చేశ్వరరావు 41 సంవత్సరాల వయస్సులోనే మరణించాడు. ఆయనకంటే చిన్నవాడినీ, ఆయన చేత ‘కృష్ణా’ అని ఆప్యాయంగా పిలిపించుకున్నవాడినీ, అయిన నేను ఎనభై ఏళ్ళు పై బడినా ఇంకా ‘బ్రతికివున్నాడ జీవచ్ఛవంబువోలె’ ఇదంతా చెప్పడమెందుకంటే, పిచ్చేశ్వరరావు అన్నట్టూ, నాతో సహా చాలా మంది చావు భయంతో బ్రతుకుతున్నవాళ్ళమే అనడానికి.

ఇంతకూ, పిచ్చేశ్వరరావుకు అర్హతకు తగిన గుర్తింపు రాలేదన్న బాధ కలుగుతుందేకానీ, అసలా మనిషి తన అర్హతను పూర్తిగా చూపించిందెప్పుడని, ఆ అర్హతను గుర్తించే అవకాశం ఈ ‘ప్రదర్శన యుగం’లో ఇతరులకెలా వస్తుంది?

 

‘‘మహాసముద్రంలాంటి సినిమా రంగంలో కూడా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నాడు’’ (కుటుంబరావు) చూడండి, సముద్రంలో ఉన్నప్పుడు ఆ అలల మీద అలా అలా జాలీగా కొట్టుకుపోతారుకానీ, వ్యక్తిత్వాన్ని పట్టుకొని కూచుంటారా? ఒక్కమాటలో చెప్పాలంటే, పిచ్చేశ్వరరావును ‘బ్రతకడం తెలియనివాడు’ అనాలి. పాపారావును అందరూ అన్నట్టే పిచ్చేశ్వరరావును నేను అలా అంటాను. పాపారావు ఎవరో తెలీదా?

అతను పిచ్చేశ్వరరావేనండీ.

ప్రజలలో చాలామంది చావు భయంతో బ్రతకుతున్నారే కానీ, బ్రతుకుమీద మమతతో కాదని, పిచ్చేశ్వరరావు ఒక భయానక సత్యం చెప్పింది. ఆ ‘బ్రతకడం తెలియనివాడు’ కథలోనే. కుటుంబరావు, ఆరుద్రల మాదిరిగా నేనూ ఓ మేధావిగా పిచ్చేశ్వరరావు రాసిన కొన్ని కథల్ని గురించి చెబుదామనుకున్నాను. కానీ, అనవసరం తన ఆశయాలతో, జీవితంతో, వ్యక్తిత్వంతో ప్రత్యక్షంగా పిచ్చేశ్వరరావే పాపారావులో కనిపిస్తున్నప్పుడు, ఆ ఒక్క కథ గురించి చెబితే చాలదా? అది పిచ్చేశ్వరరావు అర్హతనూ, నా అర్హతనూ చెబుతుంది కనుక, ఆ కథ గురించీ పలికేది రెండు మూడు గాథలు పలుకగనేలా?

‘‘నీకు బ్రతకడం తెలియదురా’’ అన్నారు అందరూ పాపారావు ముఖం మీదనే. పాపారావు ముఖం చిరునవ్వు నవ్వింది కానీ నోరు తెరిచి మాట్లాడలేదు. పాపయ్య అన్న తాత పేరు మనవడి తరానికి పాపారావు అయింది. అయితే, తాత లక్షణాలేవీ మనవడికి లేవు. తాత లక్షణాలేకాదు, తండ్రికున్న తెలివితేటలూలేవు. పాపారావు తండ్రి సంఘ సంస్కర్త, హరిజనులతో దేవాలయ ప్రవేశం చేయించాడు, వాళ్ళతో పంక్తిభోజనాలు చేసాడు. తన ఇంట్లో మాలవాళ్ళతో మంచినీళ్ళు తెప్పించుకునే ఏర్పాటు చేసాడు. అటువంటి సంస్కర్తకూ ఒక సమస్య వచ్చిపడిరది. వెట్టివెంకడు తన కొడుకు పాపారావును ‘‘చిన్న దొరగారూ!’’ అని పిలుస్తూంటే, వాడి కొడుకు సుబ్బడు ‘‘పాపారావ్‌, గోళీలు ఆడుకుందాం రావోయ్‌’’ అని పిలవడం ఆ సంస్కర్తకు మింగుడుపడటం లేదు. కొడుకు గోళీలు ఆడుకోవచ్చు, కానీ ఆ వెట్టివెంకడి కొడుకుతోనా అదీ ‘వోయ్‌’ అని పిల్చేవాడితోనా? ఆ సుబ్బడిని తిడదామనో, తందామనో అంటే, తన సంస్కర్తతనం గాల్లో కలుస్తుంది. ఇప్పటికీ ఆ పక్కింటి బ్రహ్మయ్య చూపు ఎలావుంది?

‘‘మాలవాళ్ళతో మంచినీళ్ళు తెప్పించుకుంటున్నానంటే వాళ్ళమీద ప్రేమతోనా? అరమైలుదూరంలో వున్న చెరువు నుంచీ రోజూ పది కావిళ్ళ మంచినీళ్ళు కావాలి కదా! వాళ్ళ మీద ప్రేమవుంటే, మాలపాలేరుకు పదిసోలలవడ్లు ఎక్కువ ఇస్తున్నావా? పోనీ సెలవులైనా ఇస్తున్నావా? ఎందుకయ్యా ఈ సంస్కర్త వేషమా, మోసమూ’’ అన్నట్టుంటుంది. అనడు, అన్నట్టు కనిపిస్తుంటాడు.

ఒకసారి ఆగ్రహం పట్టలేక, ‘‘ఆ లంజాకొడుకు తో సావాసం మానకుంటే గొంతు కోస్తాను, అని అంటే కొడుకు అదిరాడా, బెదిరాడా? పైగా ఇంట్లో నుంచీ కత్తి పీట పట్టుకొచ్చి ‘‘ఇదిగో… కొయ్యి గొంతు’ అన్నాడు! అలాంటి వాణ్ణి ఎవరేం చేస్తారు? చదివిస్తే, స్నేహాలు మాని మారతాడేమోనని స్కూల్లో చేర్పిస్తే, అక్కడా అంతే! మాలవాణ్ణి లోపలికి రానివ్వలేదని హోటల్‌ వాడితోనూ జీతం కట్టనందుకు విద్యార్థిని బెంచీ ఎక్కించిన మాస్టారితోనూ పోట్లాటే. పోనీ, స్కూలూ మాన్పిద్దామంటే ఎప్పుడూ ఫస్టు మార్కులే! అలాంటి వాడిని గొడ్లకాడికి ఎలా పంపాలి?

PitcheswaraRaoKathalu_kathaasaagaraMFrontCoverPubByDesiApril1954

వయస్సు పెరిగే కొద్దీ మారతాడేమో అనుకుంటే, ఇంకా ముదిరాడే. కాలేజీ చదువు పనికి రాదనీ, సమాజం గురించి చదవాలనే దశకి ఎదిగాడు. ఇంకిలా కాదని, ఇంట్లో నుంచీ వెళ్ళి పొమ్మంటే, ‘‘నీ ఇష్టం నాన్నా’’ అని వెళ్ళిపోయాడు. అప్పుడూ అదరలేదు, బెదరలేదు. ఆ తర్వాత కూడా పాపారావు రైతులతో ఆందోళనలు చేయించీ, ఉద్యోగులతో సమ్మెలు చేయించీ, కొంత ప్రయోజనాలు పొందేలా చేసాడు. ఈ లోపల సమాజం మరీ పురోగమించింది. రౌడీయిజం పెరిగింది. గూండాయిజం చేతులు చాపింది. దౌర్జన్యాలకు తలవంచే ప్రజలను చూస్తే పాపారావుకు చిరాకేసింది. జనంలో ఎక్కువమంది చావు భయంతో బ్రతుకుతున్న వాళ్ళే కానీ, బ్రతుకు మీద కోర్కెతో బ్రతుకుతున్నవాళ్ళు కాదనిపించింది. ప్రజలకు బ్రతుకుమీద కాంక్ష పెంచాలని నిర్ణయించుకున్నాడు. తుపాకులు పేల్చేవాళ్ళమీద ఎదురు నిలబడి తనూ తుపాకి పేల్చాడు. ఆ పోరాటంలో పాపారావు మరణించాడు. పాపారావు తుపాకీ పట్టడం తప్పు అన్నవాళ్ళు వున్నారుకానీ, అప్పటికే తుపాకీ పేల్చేవాళ్ళమీద తుపాకీ పేల్చేందుకు చాలామందీ తయారయ్యారు. వాళ్ళంతా, బ్రతికితే పాపారావులా బ్రతకాలని నమ్ముతున్నవాళ్ళే.

ఇది పిచ్చేశ్వరరావు రాసిన ‘బ్రతకడం తెలియనివాడు’ అనే కథ. ఇది నూటికి తొంభైపాళ్ళు పిచ్చేశ్వరరావు జీవిత కథే. తండ్రి ఇంట్లో నుంచీ వెళ్ళి పొమ్మంటే, వెళ్ళిపోయింది పిచ్చేశ్వరరావే. అతను రాసిన చాలా కథల్లాగే, నవల కావలసిన ఇతివృత్తాన్ని చిన్న కథగా కుదించాడు. కథేకాదు, తనను తాను కుదించి చూపడం కూడా పిచ్చేశ్వర తత్వమే. రౌడీలతో, గూండాలతో పోరాడటమనేది ఒకప్పుడు కమ్యూనిస్టులు అరాచక శక్తులతో పోరాడిన నేపథ్యం కావచ్చు. అలాగే సంస్కర్తలనిపించుకోవడానికి కొందరు చేసిన ప్రయత్నాలు కూడా అప్పటివే. పాపారావు తండ్రి, పక్కింటి బ్రహ్మయ్య చూపులో వున్నట్టు అనుకుంటున్నది, అతని అంతరాత్మ అన్నదీ! పోతే, పాపారావు తుపాకి పట్టడం అన్నది, అప్పటికి పిచ్చేశ్వరరావు మనసులో వున్న ఆలోచన కావచ్చు. పాపారావు తుపాకి పట్టడం తప్పు అన్నది, మనం ఇప్పుడు వింటున్నదే.

అంతవరకూ, ‘బ్రతకడం తెలియనివాడు’ గా కనిపించిన పాపారావు, తుపాకిపట్టి ప్రాణాలర్పించిన తర్వాత, బ్రతికితే పాపారావులా బ్రతకాలి అన్న ఆదర్శమయ్యాడు. అంతే కాదు. బ్రతకడం తెలిస్తే అది బ్రతుకుకాదనీ, బ్రతకడం తెలియకపోతేనే నిజమైన బ్రతుకు అనీ అన్యాపదేశంగా ఈ కథ తెలియజేస్తోంది. చావంటే తెలీనివాళ్ళకు బ్రతకడమంటే కూడా తెలీకపోవచ్చని ఇది తెలియజేసింది.

ఈ ఒక్క కథ చాలదా కథా సాహిత్యంలో పిచ్చేశ్వరరావుకు శాశ్వత స్థానం వుందనీ, వుంటుందనీ తెలియ జేసేందుకు…

 

-కృష్ణ

Krishna

ఆమె ప్రతి అడుగూ రంగుల హరివిల్లు!

images

ఏ దేశకాలాలు పరీక్షించి చూసినా… ఆర్థిక వ్యత్యాసాలలో, కష్టసుఖాలనుభవించడంలో, సమస్యలు ఎదుర్కోవడంలో మనుషులందరినీ ఒక “Normal Curve” మీద గుర్తించవచ్చు.   అయితే ఈ రేఖకి ఎడమప్రక్కనున్నవాళ్ళందరూ దుఃఖంలోనే బ్రతకలేదు, కుడిపక్కనున్నవాళ్లంతా సుఖలోనే బ్రతకలేదు. సంఘటనలు (ప్రకృతిసిద్ధమైనవి) యాదృచ్చికాలు. కొందరు జీవితానికి బానిసలై జీవిస్తే, కొందరు జీవితాన్ని శాసిస్తూ బ్రతికేరు. కొందరు కొంతకాలం జీవితానికి బానిసలైనా, ఒకానొక మహత్తరక్షణంలో తమ జీవితాన్ని 180 డిగ్రీలు తిప్పి, నమ్మశక్యంగాని జీవితానికి తెర తీశారు. జీవించడమనే మహాద్భుతమైన ప్రక్రియని అక్షరాలా అనుభవించిన అటువంటి అరుదైన వ్యక్తిత్వాలలో … సమకాలీన అమెరికను కవయిత్రి మాయా ఏంజెలో ఒకరు.

“నువ్వు మరణించినపుడు నీ చుట్టాలూ బంధువులూ కాక, మరొక వ్యక్తి కన్నీరు కారిస్తే నీది గొప్ప జీవితం” అన్నది ప్రమాణంగా తీసుకుంటే, మాయా ఏంజెలో నిరుపమానమైన విశ్వ నారి; చెప్పిన మాటని ఆచరించి చూపిన ఆదర్శ కవయిత్రి.

కవిగా ఎన్నో నీతి వాక్యాలు, ఎంతో ఉత్సాహాన్ని నింపే మాటలు చెప్పొచ్చు. జీవితాన్ని ఒక ఉదాహరణగా బ్రతకడం చాల కష్టం. వాళ్ళకున్న నేపధ్యంలో జీవితం చితికిపోతే ఎవరూ ఆశ్చర్యపోరు. అందరూ జాలిపడతారు. జీవితంలో ఏదీ సాధించని, సాధించలేని వాళ్ళే ఇతరుల జాలికోసం, తమ అసమర్థతలకి నేపధ్యాన్ని ఒక సాకుగా చేసుకుని ఆత్మవంచన చేసుకుంటుంటారు. అనువుగాని పరిస్థితులకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళే వీరులు. కొందరి జీవితాలు అక్షరాల మేనేజిమెంటు సూత్రాలకి అచ్చమైన గీటురాళ్ళు. మాయా ఏంజెలో జీవితమే గమనించండి:

ఆమె మూడవయేట తల్లిదండ్రులు విడిపోయారు; ఆమె బాల్యంలోనే తల్లి ప్రియుడుచే మానభంగానికి గురవుతుంది; వయసులో కుంటెనగాడితో ప్రేమలో పడుతుంది, పర్యవసానంగా తానుకూడా వ్యభిచారవృత్తిలోకి దిగవలసి వస్తుంది; వంటలక్క వంటి ఎన్నో చిల్లరమల్లర ఉద్యోగాలు చేసీ, అదికూడా కుదరనప్పుడు దొంగతనం చేసిన బట్టలు అమ్ముకునీ, పొట్ట పోషించుకోవలసి వస్తుంది; అటువంటి పరిస్థితుల్లోకూడ ఖాళీ ఉన్నప్పుడు చెహోవ్, దోస్తావ్ స్కీ, లని చదివింది. తమ స్థితికి భగవంతుడినో, వ్యక్తులనో నిందించకుండా, జీవితం పట్ల ఆశని వదులుకోకుండా, వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని తమజీవితాన్ని తామిచ్చిన సందేశాలకి ఉదాహరణగా గడిపిన కవులు అరుదు.

తనజీవితం ఎంత అధః పాతాళానికి పోయిందో తన జీవిత చరిత్ర రెండోభాగంలో ఇలా చెబుతుంది: “కొన్నాళ్ళు మాదకద్రవ్యాలతో కూడా సహవాసం చేసినతర్వాత ఒకరోజు ఒక మిత్రుడు తను హెరాయిన్ తీసుకుంటుండగా చూడమని బలవంతం చేశాడు… ‘తను తల వాల్చేడు, నోటంట మెల్లిగా చొంగ కారుతోంది. అది నా జీవితాన్ని మలుపుతిప్పిన సంఘటన.’ జీవితలో పతనపు అంచులుదాకా నడిచేను. ఒక ఉదాత్తమైన వ్యక్తి ఔదార్యం వల్ల బయటపడగలిగేను,” అని.

 

ang0_007

బహుశా, అందుకే జీవితం పట్ల తరగని ఆశావహ దృక్పధాన్ని అలవరచుకోగలిగింది.

 

1997లో వెబర్ స్టేట్ యూనివర్శిటీలో మాటాడుతూ, ” మన అతి బలహీన క్షణాల్లో, వేదనలతో అతలాకుతలమైన క్షణాల్లో, భయంకరమూ, నిరాశాభరితమైన క్షణాల్లో జీవితం మీద ఆశని రగల్చడానికి భగవంతుడు మేఘాల్లో ఇంద్ర ధనుస్సులు ఉంచాడంటే, మనలో ప్రతి ఒక్కరమూ మరొకరి జీవితంలో ఇంద్రధనుస్సు అవగలిగే అవకాశం ఉందని సూచించడానికే….” అని చెప్పింది.

ఆమె గొప్పబలం, కవిత్వం చదవడం తమకి పెద్దగా అలవాటు లేదని చెప్పుకునే పాఠకులకి సైతం దగ్గరవగలగడం. ఆమె స్వీయ చరిత్ర 17 భాషలలోకి అనువదించబడింది. 5 భాగాలుగా వ్రాసిన ఆమె స్వీయ చరిత్ర, I know why the caged Bird Sings   మిలియను పైగా కాపీలు అమ్ముడుపోయింది.

 

I Still Rise అన్న కవితా ఖండికలో…

 

“నువ్వు కసిగా, వక్రీకరించిన అబధ్ధాలతో,

చరిత్రలో నన్ను విలువలేనట్టు చిత్రీకరించ వచ్చు

నన్ను బురదలో తొక్కి అణగార్చ వచ్చు,

అయినా, నేను ఆ ధూళిలాగ పైకి లేస్తాను.

…..

నువ్వు నీ మాటలతో చంపెయ్య వచ్చు

నీ చూపులతో ముక్కలు చెయ్యొచ్చు

నీ ద్వేషంతో హతమార్చ వచ్చు

అయినా నేను గాలిలా, మళ్ళీ పైకి లేస్తాను. ” అంటుంది.

 

ఆమెకి అజరామరమైన కీర్తి తెచ్చిపెట్టిన కవిత I know Why the Bird in the Cage Sings లో పంజరంలోని పిట్టనీ, స్వేచ్ఛగా ఎగిరే పిట్టనీ సరిపోలుస్తూ,

 

ఒక స్వేఛ్ఛావిహంగము గాలి మూపున పైకెగురుతూ

ప్రవాహ దిశలో గతి మందగించేదాకా తేలియాడి,

సూర్యుని స్వర్ణారుణ కిరణాలలో రెక్కలల్లార్చి

ఆకసం పై తన హక్కును ప్రకటించ సాహసిస్తుంది…

….

పంజరం లోని పిట్ట భయద నిస్వనంతో ఆలపిస్తుంది…

తనకి తెలియనివీ, అయినా ఆకాంక్షించే కలలగురించి.

ఆ గీతం దూరతీరాలనున్న కొండలలో ప్రతిధ్వనిస్తుంది,

ఎందుకంటే, ఆ పంజరపు పిట్ట ఆలపించేది స్వేఛ్ఛాగానం.

*

 

ఒక్కసారి మళ్ళీ జాన్ డన్ (John Donne) గుర్తుకి రాకమానడు.

 

” ఓ మృత్యువా, గర్వపడకు!

ఎవరో కొందరు నిన్ను మహాశక్తిశాలివనీ,

భయంకరమైన దానివనీ అన్నారని.

నీ కంత శక్తులేం లేవు.

.

నువ్వెవర్నో కొందర్ని గెలిచేనని ఊహించేసుకుంటున్నావుగానీ,

వాళ్ళేం మరణించలేదు….

….

వాళ్ళ భౌతికకాయాలు ప్రకృతిలో కలిసినా,

ఆత్మలు నిర్వాణాన్ని చేరుకుంటాయి.

……

 

  1. అయినా, నేను పైకి లేస్తాను… ( I Still Rise)

 

.

నువ్వు కసిగావక్రీకరించిన అబధ్ధాలతో,

చరిత్రలో నన్ను విలువలేనట్టు చిత్రీకరించ వచ్చు

నన్ను బురదలో తొక్కి అణగార్చ వచ్చు,

అయినా, నేను ఆ ధూళిలాగ పైకి లేస్తాను.

.

నా ఎదురుసమాధానం  నిన్ను కలవరపెడుతోందా?

నువ్వెందుకు దుఃఖం లో ములిగి ఉన్నావు?

నా ఇంట్లో చమురుబావులు తోడుతున్నంత

ధీమాగా నే నడుగువేస్తున్నాననా?

.

సూర్య చంద్రుల్లాగా

అలుపెరుగని కడలి తరంగాల్లాగా

ఎగసిపడే ఆశల్లా విరజిమ్ముకుంటూ

నేనింకా పైకి ఉబుకుతాను.

.

నేను క్రుంగిపోతే చూడాలనుకున్నావుకదూ?

శిరసు అవనతం చేసి, కనులు నేలకు వాల్చి

భుజాలు కన్నీరులా క్రిందకి జారిపోతూ

హృదయవిదారకంగా రోదిస్తూ, బలహీనమైపోయి?

.

నా అహం నిన్ను బాధిస్తోందా?

నా పెరట్లో బంగారు గనులు తవ్వుతున్నంత

ధీమాగా నేను నవ్వడం

భరించలేనంత కష్టంగా ఉందా?

.

నువ్వు నీ మాటలతో చంపెయ్య వచ్చు

నీ చూపులతో  ముక్కలు చెయ్యొచ్చు

నీ ద్వేషంతో హతమార్చ వచ్చు

అయినా  నేను గాలిలా, మళ్ళీ పైకి లేస్తాను.

.

నా స్త్రీత్వం నిన్ను తలక్రిందులు చేస్తోందా?

నా ఊరువుల సందులో వజ్రాలున్నట్టుగా  

నేను నాట్యం చెయ్యడం 

నీకు ఆశ్చర్యంగా ఉందా?

.

అవమానాల చరిత్ర కుటీరాల్లోనుండి లేస్తాను

బాధల పునాదుల్లో కూరుకుపోయిన గతాన్నుండి లేస్తాను

నేనొక ఎగసిపడి విస్తరించే నల్ల సముద్రాన్ని,

ఉరకలేస్తూ, ఉప్పెనలా  విరిగిపడే అలని కౌగిలిస్తాను

భయాల్నీ, భీతావహనిశల్నీ వెనక వదిలేసి నే నుదయిస్తాను

అద్భుతమూ, తరళమూ ఐన ఉషోదయంగా ఆవిర్భవిస్తాను.

నేను నా పూర్వీకులనుగ్రహించిన ఆశీస్సులను మోసుకొచ్చే,

బానిస కలనీ, ఆశాగీతాన్నీ.

నేను లేస్తాను

లేస్తాను

లేస్తాను.

 

2

పంజరంలోని పిట్ట ఎందుకుపాడుతుందో నాకు తెలుసు

.

 

ఒక స్వేఛ్ఛావిహంగము గాలి మూపున పైకెగురుతూ

ప్రవాహ దిశలో గతి మందగించేదాకా తేలియాడి,

సూర్యుని స్వర్ణారుణ కిరణాలలో రెక్కలల్లార్చి

ఆకసం పై తన హక్కును ప్రకటించ సాహసిస్తుంది…

.

కాని పంజరం ఇరుకులో ఒయ్యారపు నడలు పోయే పిట్ట

పంజరపు మోజులో తన రెక్కలుత్తరించబడడం గాని,

తన కాళ్ళు బంధింపబడడం గాని గుర్తించలేదు.

అందుకే దాని గొంతుని పాటలాలపించడానికి విప్పుతుంది.

 

పంజరం లోని పిట్ట భయద నిస్వనంతో ఆలపిస్తుంది…

తనకి తెలియనివీ, అయినా ఆకాంక్షించే కలలగురించి.

ఆ గీతం దూరతీరాలనున్న కొండలలో ప్రతిధ్వనిస్తుంది,

ఎందుకంటే, ఆ పంజరపు పిట్ట ఆలపించేది స్వేఛ్ఛాగానం

.

ఆ స్వేఛ్ఛా విహంగం మరొక మరుద్వీచికనీ,

తరుల తాపాన్ని ఉపశమింజేస్తూ లలితంగా వీచే తూరుపు గాలినీ,

ఉషోదయాన్ని తలపించే లేపచ్చికమీద నిరీక్షించే క్రిముల్నీ తలపోస్తూ,

ఆకాశాన్ని తనదిగా ప్రకటించుకుంటుంది.

 

పాపం, పంజరంలోని పిట్ట తన కలల సమాధులపై నిలబడుతుంది,

దాని నీడ పీడకలలోలా కెవ్వున అరుస్తుంది.

దాని రెక్కలుత్తరించబడ్డాయి, పదాలు బందీలయ్యాయి,

అందుకే అది దానిగొంతు గీతాలాపనకై విప్పుతుంది

.

పంజరం లోని పిట్ట భయద నిస్వనంతో ఆలపిస్తుంది…

తనకి తెలియనివీ, అయినా ఆకాంక్షించే కలలగురించి.

ఆ గీతం దూరతీరాలనున్న కొండలలో ప్రతిధ్వనిస్తుంది,

ఎందుకంటే, ఆ పంజరపు పిట్ట ఆలపించేది స్వేఛ్ఛాగానం”.

-నౌడూరి మూర్తి

త్రిపురాంతకుడి వలసగానం

 

సిద్ధార్థ

సిద్ధార్థ

 

 

 

 

 

 

 

(మే 24: త్రిపుర నిష్క్రమణ- ఒక ఏడాది)

 

త్రిపురని మొదటిసారి చూసినపుడు బౌద్ధభిక్షువనుకున్నాను.

తెల్లటి సరస్సులా, చలికాలపు ఎండలా ఉందప్పుడు ఆయన మొహం. ఈయన చాలామందికి తెలియరు. తెలుసుకో ఇష్ట పడరు.

త్రిపుర మోపిన కథల బరువుతో, కవిత్వంతో స్థాణువులైపోయి, ఇలా కూడా రాయొచ్చేమో. కథల్నీ, కవిత్వాల్నీ అవి తీవ్ర అంతస్థాపానికి గురయ్యింది తెలుగు పాఠకలోకం. త్రిపుర మొహంలో ఏమీ తెలియదన్నట్టు, అన్నీ తెలుసుకుని చాటుకొచ్చిన అమాయకత్వమూ, త్రిపుర అన్న పేరు చూసి చాలామంది అది ఒక స్త్రీ పేరేమోనని ఊహించడం కూడా జరిగింది. త్రిపురగారి కథల్ని చదివినవాళ్ళు చాలామంది ఆయనకి స్నేహితులూ, శత్రువులూ అయిపోయారు. ఆయన కథల్లో వుండే తీవ్రతా, సాంద్రతా, ద్రవగుణమూ ఇప్పటికీ నెమరుకొస్తాయి. ఆయన్ని రెండుసార్లూ ట్రైన్‌లో, స్టేషన్‌లో ఆగినపుడే కలిశాను. ఐదోసారి… నేనూ నాయుడూ… కలిశాం.

అయితే ఎప్పుడూ అన్పిస్తూంటుంది త్రిపురకీ ట్రైన్‌కీ ఏదో సంబంధం వుందని. హఠాత్తుగా ఏదో ప్రాంతం నుండి మరేదో ప్రాంతానికి వెళ్తూ వెళ్తూ మధ్యలో తన అలుపుకు ఆగిన రైలు కిటికీలోంచి వొక వలసపక్షిలా తల బయటికి పెట్టే అమాయకపు నవ్వు ముఖం. త్రిపుర కథల్ని చదివి చాలా సీరియస్‌గా, జ్ఞానపు బరువు చూపుల్తో ఉంటాడేమో అనుకున్నవాళ్ళు ఒక్కసారిగా త్రిపురని చూసి ఫరవాలేదు. పాపం యాభై ఏళ్ళు వుంటాయేమో అనుకుంటారు. (ఆయనకు అటూ ఇటూ డెబ్బైఏళ్ళు), జర్దాపాన్‌ వొకటి ఎప్పుడూ నాలిక కిందా, పంటి పక్కనా, దవడ లోపలికీ, ‘ఉండ’లా కదులుతూ ఉంటుంది.

అప్పుడే ఎనస్తీషియాలోంచీ, tranquility నుంచి హఠాత్తుగా తెగిపడిన కంటిచూపు, మాట్లాడుతూ… డుతూ… వుంటే మెల్లమెల్లగా జంకు ఇగిరిపోతుంది. తనపైనే తను detached గా వుండి జోక్స్‌ కట్‌ చేసుకుంటూ వుంటాడు. మాటల్లో ఆవిరయ్యే పసిపిల్లల ఆవిరితనం. కేవలం 15 కథల్లో (త్రిపుర కథల సంపుటి రెండవ ముద్రణ, 1999) త్రిపుర మనల్ని వేళ్ళతో సహా పెరికేస్తున్నాడు. (మనకు ఏమైనా వేళ్లు వుంటే అవే మనల్ని కాపాడతాయని వొక జాతక కత). ముప్పై  వరకూ రాసిన కవితల్లో తన స్థలాకాలాల్ని భద్రం చేసుకున్నాడు.

అవునూ ఈ ‘భగవంతం’ ఎప్పటివాడు. మనకంటే చిన్నవాడేమో అనుకుంటాం. ఇష్టంలేక మాట్లాడుతున్నట్టుగాని, జ్ఞాన భారంతో వంగి ప్రవర్తిస్తున్నట్టుగాని అనిపించదు. త్రిపురతో మాట్లాడుతూ త్రిపురని చదువు కోవడమూ మధ్య ఏ అగాధమూ కనిపించదు.

ఫోన్లో మాట్లాడగానే… మీకూ వ్యాంగో బొమ్మకూ ఏమైనా సంబంధం వుందా అంటే…

‘‘ఏమో నాకూ అర్థంకాలేదు. కాని ఎంతో ప్రేమతో వేశారా పుస్తకాన్ని. పాపంవాళ్ళు పెట్టే ఖర్చుల కయినా డబ్బులొస్తే బాగుండని,’’ బాధపడ్డాడు. లక్ష్మణ్‌ బొమ్మల్నీ… అందులోని నలుపు గాఢతల్నీ, తెలుపుల లోతుల్నీ తడుముతూ…

‘‘నాకు నలుపంటే ఎంతో ఇష్టం. కేవలం నలుపుతో కూడిన ముదురు రంగులంటే ఇష్టం’’ అంటూ వో కుంచె నవ్వును పారేశాడు.

మాట్లాడటం మాట్లాడక పోవడం నడుమ ఒక తెర వుంటుందనీ, ఎవరైనా వచ్చి ఆ తెరని జరిపితే ఎక్కువ మాట్లాడు తుంటాననీ అంటారు. తన రచనల గురించి ఎవరైనా వచ్చి చెప్పి, తనకే తెలియని అంశాల్ని ఆపాదించి మాట్లాడుతూంటే… ఇబ్బందిగా వుంటుందనీ చెప్తాడాయన. వెయిటింగ్‌ ఫర్‌ గొడో (బెకెట్‌ నాటకం) తను భగవంతం కోసం రాసిం తరువాతే చదివాననీ చెప్పారు.

ఫొటోలో ఉన్నవారు ( L to R ) సిద్ధార్థ, త్రిపుర, ఎం. ఎస్. నాయుడు, నరేష్ నున్నా, గుంటక శ్రీనివాస్ …….వొక ప్లాట్ ఫారం మీది కలయిక…

త్రిపురా… ఇప్పుడేం చేస్తున్నారు… ఏం జీవిస్తున్నారు… ఏం చదువుతున్నారు…? అని అడిగితే, ‘‘ఇప్పుడు బొత్తిగా ఫిక్షన్‌ను ఇష్టపడటంలేదు. పట్టుమని ఓ పదిపేజీల కంటే ఎక్కువ చదవలేక పోతున్నాను. కొంత చదివిం తరువాత అతనేం చెప్పదలుచుకున్నాడో తెలిసిపోతుంది. పుస్తకంలో ఏం చెప్పదలచుకున్నాడో తెలిసిం తరువాత ఎలా చదవగలం? ప్రస్తుతానికిక ఫిలాసఫీయే… కవిత్వం కూడా అంతే. ఎవరైనా ఎక్కడైనా ఒక మంచి కవిత చదివి నాకు కటింగ్‌ పంపు తూంటారు. నా కవితలు ఎక్కడయినా అచ్చయితే నా ఫ్రెండ్సే కట్‌ చేసి పోస్ట్‌ చేస్తారు వాటిని,’’ అంటూ ఇంకో టీలోకి మరో పాన్‌ వేసుకుని కొంచెం ఆపి వొక్కసారి నిశ్శబ్దించిన thought constipation లోకి…

మీ కథల influences on the readers అంటూ ఏదో మాట్లాడబోతే… ‘‘అసలు నన్ను ఎవరైనా గుర్తుపెట్టుకున్నారంటే ఎంతో ఆశ్చర్యం, సంతోషమూ కలుగుతుంది. నేను నిజంగా తెలుసా అనే సందేహం కూడా కలుగుతుంది. (అవునూ, త్రిపురని అచ్చేసిన కవిత్వం శ్రీనివాస్‌ నువ్వెక్కడున్నావే….) 1990లో త్రిపుర బాధల సందర్భాల్ని అచ్చేసేదాక కథకుడిగా గుర్తుకురాలేదు. ఈ 1999లో రెండోసారి కథల్ని అచ్చువేస్తే కవి గుర్తుకు రావడంలేదు. కథకూ కవిత్వానికీ మధ్య వున్న విభజనను చెరిపేశాడాయన. న్యాయస్థాం ముందు ద్వారపాలకుడిలా… వేచి… వేచి… ఎవర్నీ లోపలకి వెళ్ళనీయక కాపలా కాస్తున్నాడు. కాఫ్కా అయి, trial లోకి తనని పంపించుకుని, ఇదంతా… ఎందుకు? ఏమిటని ప్రశ్నించనివారికే లోపలికి వెళ్ళే ఆజ్ఞ వుందని, చాలామంది ఆగంతకుల్ని వద్దు వద్దు ప్రశ్నలొద్దు. జ్ఞానమొద్దు ఎవరి అనుజ్ఞలకోసం వెంపర్లాడటమూ వద్దని నివేదించు కుంటున్నాడు త్రిపుర.

మీరు రచయిత ఎందుకయ్యారు… కవిత్వం ఎందుకు? అంటే ‘‘నాకు ఎక్కువ inferiority వుండేది. చదూకునేరోజుల్లో నా పేరుకు ముందు ఓ అరడజను initials, affixes  వుండేవి. వాటిని పిలవడానికి అందరూ ఇబ్బందిపడేవాళ్ళు. పేరు అంత పొడుగ్గా వుండి, నా ఆకారమేమో చిన్నగా వుండి, నానా ఇబ్బందులకి గురిచేసేది నా పేరు నన్ను. నేను త్రిపురగా బోధపడటానికి రాయటం మంచి దారిగా కనిపించింది. ఇంగ్లీష్‌లో ఎక్కువగా రాసేవాణ్ణి. ఇప్పుడసలు రాయలేను. నేను రచయితను అవ్వాలనీ అనుకోలేదు.’’ అవునూ ఇప్పుడు మీ memoirs రాయొచ్చు కదా. ‘‘memoirs autobiography గా రాయకూడదు. జీవిత చరిత్రలు పెద్ద మోసం. రాస్తే ‘మో’ బ్రతికిన క్షణాల్లా రాయాలి. నా కది చేతకాదు. రచయితల జీవితాల్ని జీవితచరిత్రల్లో వెదకడం పెద్ద hoax. వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ కథల్లోనే తెలుసుకోవాలి. నేనెక్కువగా నా గురించి మాట్లాడుతున్నానంటే పెద్ద దగా…’’

మీరు దృశ్యాలని కథల్లో కదిలిస్తున్నప్పుడు వాటికి పరిమళాల్ని అంటగడతారు కదా… (ఉదాహరణ- ‘నీలిరంగు, ఛాయల్లో నిద్రిస్తూన్న తటాకంలో ఒక సువాసన, గులకరాయి సృష్టించిన తరంగాల వృత్తాల్లోంచి ప్రసరించిన ధ్వనికిరణం లాగా వుంది,’ వలసపక్షుల గానంలో, ‘ఇది కాఫీ కాదు, ఉత్త వేడిగా వున్న గోధుమరంగు’- భగవంతంకోసంలో) ఏమీ చెప్పలేను. నాకు చిన్నప్ప ట్నుంచీ జంతువులూ, పక్షులతో సాన్నిహిత్యం ఎక్కువ. అన్నిరకాల జంతువులూ నన్ను చూడగానే దగ్గరికొచ్చేస్తాయి. నా కథల పుస్తకంలోని (first print)  భుట్టో (పిల్లి) మీకు జ్ఞాపకం వుందా? అది ఇంచుమించుగా మనిషే… నేను ‘అగార్త’లో ఉన్నప్పుడు అన్నిరకాల పక్షులూ జంతువులూ మా కాటేజీ చుట్టూ వచ్చి వాలి నన్ను పలుకరిస్తూ వెళ్ళేవి. కొన్ని వానసాయంత్రాల్లో పెద్దకప్పలు నా పాదాల మీదికెక్కి నిద్రపోయేవి. బహుశా నా శరీరంలో వొకరకమైన animlas కి వచ్చే smell వాసన ఉందేమో, తెలీదు. లేక క్రితం జన్మలో ఏ పామునో, కప్పనో పక్షినో అయ్యుంటాను.’’

‘‘నేను ఒక known poet ని కాను. ఎవరికీ తెలియని రచయితని. నన్ను తెలుసుకోవాలని అనుకునే వాళ్ళుంటారా అని అనుకుంటాడు త్రిపుర. అవును- ఈయనని ఎవరైనా గొప్ప రచయితని పొగిడినప్పుడు సిగ్గుపడిపోతాడు. ఆ పరిస్థితి నుంచి తప్పుకుపోవాలనుకుంటాడు. ఆ disturbance ఎలాంటిదంటే చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారిని కలవడానికి ఎప్పుడూ కొంతమంది doctors వచ్చేవాళ్ళట. (ఆయన medical officer గా పనిచేసేవారు.) అందులో ఒక lady doctor ఉండేది. ఆమెను చూడగానే భయపడి, సిగ్గుపడి ఇంటివెనుక ఉన్న back yards లోకి పారిపోయి ముళ్లపొదల మధ్య దాక్కునేవాడట. బయటికి వొచ్చేసరికి ఆ ముళ్ళు గీరుకుని, అక్కడక్కడా రక్తమొచ్చి భయపెట్టిన అనుభవం. అదే అనుభవాన్ని తననెవరైనా రచయితగా తెలుసుకోవాలని వచ్చినప్పుడు ఎదుర్కొంటానని చెపుతాడు. ‘‘రచయితలూ, పాఠకులూ అన్న సంగతి వదిలేసి ముందు మనుషులుగా దగ్గరవుదాం,’’ అంటాడీ భగవంతపు త్రిపుర. మధ్య మధ్యలో తనని ఆకట్టుకునే తన కథల్లోని కొన్ని పంక్తుల్ని చదివించుకుంటాడు. ఆ లైన్ల ద్వారా తనకీ మనకీ ఏదైనా ఒక తలపు, దారి స్పురిస్తుందేమోననే ఆశ. తన కథల్లోని ప్రతి పాత్ర సంఘటనా అన్నీ జరిగి తను ఎదుర్కొన్నవనే అంటాడు. అందుకే కథల్లో ఏ భాగం దగ్గర తను liberate అయ్యాడో ఎక్కడ తను పొందిన అర్థాలని పొందుపరిచాడో పేరాల్ని చదివించుకున్నాడు. చిన్నప్పటి నుంచి తను lone walking అంటే ఇష్టపడతానని చెబుతాడు. ‘‘అలా ఒక్కణ్ణే నడుచుకుంటూ వెళ్లిపోతాను. ఆ సమయాల్లో నాతో నేను intactగా వున్నట్లనిపించి స్వేచ్చగా అనిపిస్తుంది. ఆ అలవాటు ఇప్పటికీ పోలేదు.’’

త్రిపుర కథల్లోపల ఏం వుంది? ఏం దొరుకుతుంది? అని ప్రశ్నించుకుంటే ఏమీ వుండదు. ఏమీ వుండబోదు. తనని తాను ఎక్కడికీ జారిపోకుండా అదిమిపట్టే అస్తిత్వపు స్పృహ. కొన్ని సంవత్సరాలుగా పొందిన అనుభవాలు తదేక వేదనోద్విగ్నతలో మాగి మాగి రాలకుండా కథల్ని చెప్పి రాలిపోయిన సంఘటనలు. ఓ కొండమీద నిస్సంచార మధ్యాహ్నంలో ఎండిన కొమ్మమీద పిట్టని చూస్తూ తదేకతలోకి జారిన జెన్‌ భిక్షువు గుర్తుకొస్తాడు త్రిపుర చూసినప్పుడు.

భిక్షువుకి పిట్టలాగా త్రిపురకి కథ. అంతే… నాకు కాఫ్కా అంటే ఇష్టం, ఎంతిష్టం అంటే అతని పుస్తకంలోని ఏ వాక్యాన్నీ తీసుకున్నా నా కొక కథ లేదా వొక poem. కళ్ళు మూసుకుని ఒక పేజీ తెరిచి వొక పదాన్ని స్పృశిస్తే అది కవిత్వంగా తగులుతుంది. బహుశా మనకి నచ్చిన authors కి సంబంధించి ఇలాగే వుంటుందమో. కాఫ్కా జీవితం చుట్టూరా అతని తండ్రి వొక irresistible ప్రభావం.

కథల్రాయలేరా ఇక అని బెరుకిరుకుతనంతో అడిగితే… ‘‘ఎట్లా రాయను… అనుభవాలేమీ లేవు… చాలావరకూ అంతా చచ్చిపోయింది. ఏమైనా రాస్తే పాత అనుభవాలనే, ఇరవై ఏళ్ళ క్రితంవి రాయాలి. అవన్నీ రాసేశాను. రాయడం నాకెప్పుడూ ఇష్టంలేదు. నేను professional writer నీ కాదు.  I’m a dead wood now. రాస్తే కవిత్వాన్ని రాసుకుంటున్నాను. వాట్లో కాఫ్కా themes. కాఫ్కాని నేను ఇంకా ఇంకా అర్థం చేసుకుంటున్నాను. కాఫ్కాని పూర్తిగా ఒకసారే చదవలేను. కొన్ని పేరాలు చదివిన తర్వాత ఆగిపోతాను. ఆ తర్వాత నా discovery మొదలవు తుంది.  K తో.. అది నేనే… బహుశా నా స్వంత K ని నేను extend చేసుకుంటున్నానేమో… నా కనిపిస్తుందీ నేను చెప్పేసుకున్నదంతా వలసపక్షులగానంలో ఎక్కువగా పలికింది. నా ఫ్రెండ్‌ ఒకతను అన్నాడు. అది మీ magnum opus అనీ. కానీ దాన్ని ఎవరైనా పూర్తిగా చదివి చెబుతారా అని ఎదురుచూస్తున్నాను. అందులోనే కొన్ని పంక్తులు చదివితే నా పరిస్థితి ఇంకా నాకు ఎక్కువ స్పుటమవుతుంది.

‘‘నవ్వేను…. నవ్వితే రెండు సిగరెట్లు ఒకేసారి కాలుతున్నట్టుగా అడుగడుగున తెలుస్తుంది. పిప్పి పన్ను నొక్కుకుంటూంటే నొక్కుకుంటున్నట్టుగా, నొప్పి క్షణాలన్నింట్లోనూ పాకురుతున్నట్టుగా తెలుస్తుంది. గోలెంలోని మొక్కుకి నళ్ళు పోస్తూ ఉంటే నీరూ, నీరు రూపం చెందిన వెలుగూ, మొక్కమీద పడి మొక్క చుట్టూ చెదిరి వ్యాపించి, మట్టిలో కలిసినట్టుగా- ఆ ప్రాసెస్‌ అంతా- ఆ క్షణాల్లో ఆ క్షణాలన్నీ నన్ను కదిపి ఒక కాస్మిక్‌ కాన్షష్‌నెస్‌లోకి తోస్తాయి. తెలుస్తుంది. తెలియగానే నా ఫ్రాంటియర్స్‌ నాకు పోతాయి’’- బాబుట్టి బోధపరుచుకోటానికి ప్రయత్నిస్తున్నట్టుగా చూసింది. కానీ నవ్వింది చివరకు. నవ్వి, అంది నీ శక్తి కాదేమో అది, అదొక వ్యాధేమో ఆలోచించావా?’’

ఈ పేరాలోని తనవి చెప్పుకునే క్రమాన ‘‘నాకు స్పష్టంగా అర్థమయ్యేదేమిటంటే ఈ  constant awareness of myself. ఇది నన్ను వదిలిపోదు. బహుశా ఇదే నన్ను తట్టుకోలేక కథల్ని రాయించిందేమో. ఎంత దీన్నుంచి తప్పించుకోవాలనుకున్నా కుదరడంలేదు. ఒక సైకాలిజిస్టు ఫ్రెండ్‌కి చూపుంచుకుంటే ఇది కొంతమంది mystics కోరుకునే స్థితి అని చెప్పాడు. నాకయితే అక్కడ కుబ్బ చెబుతున్నట్టుగా వ్యాధిగా కూడా తోస్తుంది. మీతో ఈ మాట్లాడుతున్నదంతా ప్రతి క్షణక్షణానికీ తెలిసీ… తెలుసునని తెలిసీ… తెలిసింది తిరిగి తెలిసి…’’

త్రిపుర చనిపోయిన తన తల్లిని కాఫ్కాలోకి పిలిచి ఖాళీకుర్చీతో మాట్లాడిన కవిత ఇంకా గుర్తుంది. ‘‘మీ అమ్మతో మీ అసోసియేషన్‌ ఏమిటి’’ అన్నాను. కవితని మసగ్గా recollect చేసుకుంటూ, మా అమ్మగారికి mental illness ఉండేది, చాలా fragile గా ఉండేది. హాస్య ప్రియత్వం ఎక్కువ. ఒక గొప్ప image maker మా అమ్మ, ఎవర్నైనా చూసినప్పుడు ఒక వస్తువు పేరును ఆ వ్యక్తికి అంటగట్టేది.

ఒకసారి భమిడిపాటి జగన్నాథరావుగారు మా ఇంటికి ఇస్మాయిల్‌గారిని తీసుకుని వచ్చారు. ఆయన్ని కవిగా మా అమ్మకు పరిచయం చేశారాయన. ‘‘నువ్వు చెప్పనక్కరలేదురా అతడి మొహం చూస్తేనే తెలుస్తుంది కవి అని,’’ అందామె. ఇస్మాయిల్‌గారు ఈ విషయాన్ని ఎంతో సరదాగా చెప్పుకుని తిరిగేవారు.’’

త్రిపుర కవిత్వంలో adjectivesని ఇష్టపడరు. పదాల్ని తేలికపరిచి condense చేసి డాలీ, వంచిన కాలంతో తడిపినట్టు చిన్న పదాల్నే తడిపి పలికిస్తుంటాడు.  ఇప్పుడు తనకు జెన్‌ తప్ప ఏదీ ఛత్రపు ఛాయ అంటూ తనదైన tranquil looksలోంచి అశబ్దంగా కులికాడు. మీరు నమ్మరు, మీరు పవిత్ర ఖురాన్‌నిగానీ, భగవద్గీతనుగానీ తిరగేసినట్టుగా నేను Kafka diariesలోని రోజూ వొక పేజీని తిరగేస్తుంటాను. అందులో వొకచోట ఆగిపోయి freeze అయిపోతాను…’’ అంటూ చెపుతాడీయన. ఇంకా ఇలా గొణుగుతుంటాడు కూడా. Everything gives way at the center under that feet అంటూ కాఫ్కా చెప్పిన మాటల్లోకి తూలి కవిత్వం చేయొచ్చునంటూ సంబరపడిపోతాడు.

జీవితంలో ఏదైనా తుఫానులాంటిది మీదపడితేనేగానీ రాయలేనంటాడు. వలసపక్షుల గానాన్ని రాయడానికి తన అగర్తల (త్రిపుర) ఉద్యోగ జీవితాంతాన్ని గుర్తుకు తెచ్చుకుని అప్పటి తమ ఒంటరి బతుకుల కరెంటులేని చీకటి సాయంత్రాల ఈశాన్యపు పక్షుల స్నేహాన్నీ recall చేసుకున్నాడు.

త్రిపురా, వలసపోయిన పక్షులన్నీ ఇప్పుడొకసారైనా నీ గూటికి తిరిగొచ్చాయా చెప్పు త్రిపురా…. నీ పాఠకుడెక్కడున్నాడో అతన్నైనా పక్షుల జాడ చెప్పమందాం.

 

-సిద్దార్థ

ఆంధ్రప్రభ దినపత్రిక, 7 మార్చి 1999

త్రిపుర ఫోటో: మూలా సుబ్రహ్మణ్యం