ఏకాంత సౌందర్యాన్వేషకుడు త్రిపుర

tripuraమనిషి సంఘజీవి.  మనుష్యుల  మధ్యనే జీవిస్తూ మానసికంగా ఏకాంత జీవనసౌందర్యాన్ని అన్వేషించగలిగినవారు, అనుభూతం చేసుకోగలిగిన వారు ఋషి తుల్యులౌతారు.నిరంతర గమనశీలత్వం గలిగిన జీవనంలో గుంపులో కాకుండ, ఒక్క ప్రయాణికుని మాత్రమే తోడుగా ఎంచుకోమని, సరైన తోడు దొరకనపుడు ఖడ్గమృగంలా ఒంటరిగానే గమనం సాగించమని బుద్ధుడుపదేశించాడు. అందుకే, జీవితమంతా ఎంతోమందిని కలుపుకుంటూ విడిపోతూ, సరైన తోడుకోసం అన్వేషిస్తూ జీవనగమనాన్ని సాగించే మనిషి, ఏదో ఒక దశలో ఏకాంత జీవన సౌరభాన్ని ఆఘ్రాణించగలుగుతాడు.   తామరాకు మీది నీటి బొట్టులా ప్రాపంచికబంధాలకు అంటీముట్టనట్లుగా ఉంటూనే, జీవితాన్ని ఉత్సవంలా తీర్చిదిద్దుకోగలుగుతాడు.

సున్నితమనస్కులూ, మానవజీవితాల్లోని అసంబద్ధతలకు, దుఃఖాలకు చలించిపోగలిగిన కరుణాశీలురు, తమనుతాము సరిదిద్దుకుంటూ ఎదిగిన జీవన తాత్వికులూ, ఎన్నో భిన్నమార్గాల్లో గమించి, గమించి, జెన్ బౌద్ధంలో సేదతీరిన సత్యాన్వేషకులూ — వెరశి మానవత్వ ప్రేమికులు అయిన త్రిపుర — ఏకాంత సౌందర్యాన్వేషణలో జీవితాన్ని ఉత్సవంలా మలుచుకున్నవారు.  ఒకే చోట పాతుకు పోయిన వారికన్నా, నిరంతర యాత్రికులు, దేశాంతర వాసులు అయినవారు మానవస్వభావవైవిధ్యాలను, క్షుణ్ణంగా దర్శించగలరు. విభిన్న ప్రాంతాలను సందర్శిస్తూ, రాష్ట్రేతరప్రాంతాలలో ఉద్యోగించిన త్రిపుర ఒకవైపు భిన్నభిన్న సిద్ధాంతాలతోబాటు బౌద్ధాన్ని, ముఖ్యంగా జెన్ బౌద్ధాన్ని, అధ్యయనం చేస్తూనే, మరోవైపు మానవజీవన పార్శ్వాలలోని విభిన్నకోణాలను, అసంబద్ధతలను, ద్వైదీభావ వర్తనలను, జీవన దుఃఖాలను చూచి చలించి పోయారు. తమ గురువు బుచ్చిబాబుగారిలా, తమ ప్రశ్నలకు జవాబులను ప్రపంచ సాహిత్యంలో వెదుక్కునే అలవాటును పెంపొందించుకున్న త్రిపుర – నిరంతర అధ్యయనశీలి త్రిపుర — జీవనగమనంలో ఎన్నో మలుపులు తిరిగి, తిరిగి, ఏకాంత జివనసౌందర్యాన్ని అనుభూతం చేసుకున్న వేళ, పుస్తకాలను గూర్చి, “మనస్సులో మంటలు లేపి, జీవితాన్ని గాలివాన చెట్లను ఊపినట్లు ఊపి, ఇప్పుడు ప్రశాంతంగా బీరువాల్లో పడిఉన్నాయి. అప్పటి వాటి ‘నిజం’, ‘ప్రాణం’ ఇప్పుడు లేవు(చీకటిగదులు), అని గుర్తించిన త్రిపుర అంతర్ముఖత్వంవైపు పయనాన్ని కొనసాగించారు. ఏరుదాటిన తర్వాత తెప్పను ఒడ్డునే వదిలివెడతామనే బౌద్ధభావానికిది గొప్ప ఆనవాలు.
మానవాంతర్గత చీకటికోణాలను ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా మొదలైన త్రిపుర కథారచన, మనిషి, మనీషిగా ఎదగగలిగిన క్రమాన్ని నిర్దేశిస్తాయి. కథలు ఆటోబైయోగ్రఫికల్ గా ఉండాలనీ, రెండురకాల మనస్తత్వాలు లేకుండా, మనం మనతోనే ఇంటర్ రిలేటడ్ గా ఉండాలని నమ్మిన త్రిపుర, తమ కథలను, ఆటోబయోగ్రఫికల్ గా, కన్ ఫెషనల్ గా, ఇంటర్ రిలేటడ్ గా తీర్చి దిద్దారు. తమకు నచ్చని పనిని చేయలేకపోవడం తమ బలం గా కలిగిన త్రిపుర, ‘మనస్సులో కల్మషం ఉంటే దేహానికి జబ్బు ‘ అన్న ప్రాథమిక ఆరోగ్య సూత్రాన్ని గుర్తించిన అపర ధన్వంతరి త్రిపుర, తమను తాము క్షాళన చేసుకుంటూ ఎదిగిన క్రమాన్ని ఆయన కథలు చెప్తాయి.
  జ్ఞాపకాలను కూడా ఆబ్జెక్టివ్ గా చూడడం అలవాటు చేసుకున్న త్రిపుర, తమకు సంబంధించిన సంఘటనలు ఎవరివో అయినట్లు అనుకునే ‘మెంటల్ మేకప్’ను సాధిస్తూ (ప్రయాణీకులు), జీవితానికి అర్థం ఏమిటని ప్రశ్నలు లేవదీస్తూ మౌనం గా ప్రవహించే గంగ ఒడ్డున ఎదిగిన త్రిపుర ముప్ఫై నాలుగేళ్ళకే అరవై యేళ్ళ మనిషి మనస్తత్వాన్ని (చీకటి గదులు)అలవర్చుకునే పక్వతను సాధించారు.తెలుసుకోవడం తమ శిక్షణలో భాగమయినా, తమ మాటల్లో ఖంగుమని ‘నిజం’ మ్రోగించే నేపథ్యంలో తమలోంచి తాము విడివడి బ్రదకడాన్ని సాధన చేస్తూ, మెల్లగా, తొందరలేకుండా ఆలోచించడం నేర్చుకునే మార్గం లో మాటలు తగ్గించి మౌనసాధనతో పరిక్రమించిన త్రిపుర, సులభంగా స్పష్టంగా కత్తీంచులాంటి నిజంచెప్పాలంటే ఎంతగ అంతర్ముఖులు కావలసి ఉందో గుర్తించారు.పరిమిత పాత్రలతో సాగే వారి కథల్లో తమను తాము భిన్న భిన్న పాత్రల్లో రూపొందించుకుంటూ, ‘నేను ‘ అన్న ఆత్మగతస్థాయినే ‘నువ్వు ‘ అనేలా కొత్త వొరవడిని ప్రవేశపెడుతూ, సున్నితమయిన కవితాత్మక శైలిలో సాగే వచనం తో నడిపించడం త్రిపుర ప్రత్యేకత! ఉన్నత లక్ష్య సాధన కోసం జీవించిన వీరస్వామి అయినా, గమనశీల జీవనం లో నిరంతరం పరిక్రమిస్తూ ఉండిన సత్యాన్వేషకుడు భాస్కర్ అయినా (జర్కన్)ఒక పరిపూర్ణ లక్ష్య సాధనలో పరస్పరం సహకార మందించుకోవలసిన ఒకే మూర్తి యొక్క భిన్న రూపాలే! ఏది యాత్ర?  ఏది వృత్తి? అన్న బేధం అదృశ్యమై, విరామం లేకుండా సాగుతున్న జీవన యానంలో, మనిషి తననుండి తాను వేరుపడి జీవించడం సాధన చేసినపుడు మాత్రమే జీవిత శిఖరాగ్రాల నధిరోహించగలడన్నది త్రిపుర అభిప్రాయం మాత్రం మాత్రమే కాదు, వారు సాగించిన అన్వేషణకూ ప్రతీక!

జీవన బంధాలను గొలుసులు లాగే భావించిన త్రిపుర ఆ గొలుసులను త్రెంచుకుంటూ, తమను తాము ప్రపంచం నుండి మానసికంగా విదుదల చేసుకునే దిశగా పయనించారనడానికి వారి చివరి రెండు కథలే ఆధారం!
మనుషులందరిలాగే ప్రపంచంతో కలిసి నడిచిన త్రిపుర,చెప్పవలసినదంతా కేవలం పదమూడు కథల్లోనే చెప్పి, ఇక చెప్పడానికి ఏమీ లేదు అని జీవితాన్వేషణలో క మజిలీకి చేరుకున్న త్రిపుర, దాదాపు దశాబ్దం తరువాత రాసిన కథ ‘గొలుసులు, చాపం,విడుదలభావం ‘ అన్న కథ. ‘నా జాతి, నా వారసత్వం … నా సంప్రదాయం అంటూ వుండి పోతే తుప్పుపట్తి పోతావ్.’ అని గుర్తించిన త్రిపుర, ప్రపంచానికి సంబంధించనట్లు అనిపించే ఈ జీవితం ఒక కాపీ లా, నకల్ లా., కౌంటర్ ఫీట్ లా , ఒక కుట్రలా కనిపిస్తుందని, ఈ కుట్రని చేదించడానికి … మనుషుల్ని దగ్గరగా లోపలికి గుండెల్లోకి లాక్కోడం చేస్తుందనీ, భావించిన త్రిపుర, “జీవితంలోంచే, ప్రపంచంలోంచే ఆలోచనలను లాగాలి” అని గుర్తించిన త్రిపుర మన జీవితం మన ఆలోచనల మూర్తిమత్వమే అన్న బౌద్ధ సత్యాన్ని అవగాహనకు తెచ్చుకున్న త్రిపుర, అన్ని అసంబద్ధతల నుండి జీవన దుఃఖాలనుండి ప్రాపంచిక బంధాలనుండి మానసికంగా విడుదల సాధించే దిశగా తమ పయనాన్ని సాగించారు.    శృంఖలాల క్రౌర్యం ఎంతో, స్వేచ్చ కూడా అంత భయంకరంగా ఉంటుందన్న సత్యాన్ని గుర్తించిన త్రిపుర, ‘చచ్చిపోలేదు గాని జీవితంలో మిగిలి ఉంది ఏదీ లేదు ( వంతెనలు) అని ఎప్పుడో గుర్తించిన త్రిపుర,  ఆలోచనల స్థాయినుండి తెలుసుకునే స్థాయికి గెంతగలగాలని ఒకప్పుడు భావించిన త్రిపుర (జర్కన్), ఆ అఖాతాన్ని దాటడానికి, గొలుసులు-చాపం-విడుదలభావం కథ ద్వారా వంతెనను వేసుకున్న త్రిపుర,  “ఈ ప్రపంచంలో కొన్నాళ్ళు ఊపిరి పీల్చి ఆఖరికి అలా ఊపిరిని బలవంతంగా వదిలివేయడం … దీనికి అర్థం లేదు. ఏ మంచీ చెడుల సంఘర్షణ సిద్ధాంతమూ దీనికి అర్థం ఇవ్వలేదు …ఇదంతా అసందర్భం…’ అనిగుర్తించిన త్రిపుర, నేను అన్న సరిహద్దులను తుడిపేసుకుంటు, హేతుబద్ధంగా, సముదాయంపుగా ప్రకృతినీ మానవ ప్రకృతినీ పూర్తిగా ఆస్వాదిస్తూ, దేనినీ వేటినీ , ఎవరినీ తోసిపుచ్చకుండా, నేలమేదే నడుస్తూ, నిలబడుతూ, ఎటూ తేలి పోకుండా ఉండగల స్థిరత్వాన్ని సాధించారు అండానికి, వారి చివరి కథ, ‘వలసపక్షుల గానం’కథ గొప్ప ఉదాహరణ.
  డ్రాయింగ్ రూములో లలిత్ పూర్ బుద్ధుని బొమ్మ, అభిధమ్మ పఠనం, గౌడమీద చిత్రిపబడిన ఎర్రటి రంగు బుద్ధుడు, బౌద్ధ క్షేత్రాల సందర్శనలు, బౌద్ధోపన్యాసాలు, తాంత్రిక్ బౌద్ధము…వీటన్నిటినీ జీవన దుఃఖాలను పారద్రోలే సధనాలుగా మలుచుకున్న త్రిపుర, తమను తాము లోలోతుల్లోకి అవలోకించుకుంటూ, ఉన్నది ఉన్నట్లుగా స్వేకరించే స్థాయికి ఎదిగిన పరిణితిని వివరిస్తుందీ కథ. సత్యాన్ని మాత్రమే అన్వేషిస్తూ, జన్మించినప్పటినుండి వెంటాడుతూ ఉండే శూన్యాన్ని అవగాహన చేసుకుంటూ, ఆరురోడ్ల కూడలి ద్వారా ప్రయాణిస్తూ, లోలోపలి పురాతన భవనాలను శిధిలం చేసుకుంతూ సాగే అన్వేషణలో చివరికి మిగిలేదంతా మహా  శూన్యం అన్న అవగాహనకు వచ్చారు త్రిపుర. బౌద్ధంలో శూన్య భావ అవగాహన అత్యుత్తమమైన సాధన! ప్రతి భాగానికి విడివిడిగా పేర్లున్న విభిన్న భాగాల సమాహార రూపమే మనిషయినా,చెట్టయినా, మరొకటి మరొకటయినా. మనిషి ఉన్నాడా అంటే ఉన్నాడు, లేడు అంటే లేడు..ఎందుకంటే విడివిడిగా పేర్లున్న బహిరంతర్గత అవయవాల సమాహార రూపమే మనిషి కనుక, మనిషి అన్న పేరు ఎన్నో ముక్కల ఏకీకృత రూపం మాత్రమే కనుక..అన్నది సామాన్య నిర్వచనం. ఈ శూన్య భావాన్ని అర్థం చేసుకున్న త్రిపుర, వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించడమే జీవితం అన్న బౌధ్ద్ధభావాన్ని అనుభూతం చేసుకున్నారు.
  అటునుంచి ఏడోనెంబర్లోనూ, ఇటునుంచి పదమూడో నెంబర్లోనూ రాని భగవంతాన్ని కలవాలనికలవాలని, తామే వెదుక్కుంటూ వెళ్ళిన త్రిపుర, బలమైన ఒళ్ళూ, కరుణార్థ్రపూరితమైన బోధిసత్వ అవలోకితేశ్వరుని కళ్ళూ.. ఉన్న వీరబాహును కలిశారు. ధ్యానాన్ని. ధ్యానంతోబాటు, తమనుతాము రక్షించుకోవడానికి నిరపాయకరమైన కుంగ్-ఫూ- విద్యను నేర్పే జెన్ బౌద్ధానికి ప్రతీక వీరబాహు. జీవకారుణ్యాన్ని ఈ ప్రపంచంలో ఒక సూత్రం లాగా చేసుకుని జీవితాన్ని సాగించగలమా? అన్న సందేహంతో సతమవుతూ సాగిన వారి అన్వేషణ, ఒక్కోసారి లాఘవంగా, మరోసారి గంభీరపు అనివార్యతతో, అప్పుడప్పుడూ బీభత్స వేగంతో దూకుడుగా ..ఏకాగ్రతతో ఏకాంత సౌందర్యాన్నన్వేషించే దిశగా సాగింది.ఉత్త గోధుమరంగు వేడి నుండి, ఉత్త వేడిరంగు గోధుమ ఊహల్లోకి ( భగవంతం కోసం ) జారుకున్న త్రిపుర, నల్లకళ్ళ గోళీలతో పాట చరణం సాగించిన తోటి ప్రయాణికుదు వరదరాజులు , సకల ప్రాపంచిక ప్రాకృతిక జ్ఞానమూ లోపల పూర్తిగా ఇమిడిపోయి జీర్ణమయిపోగా, చూపుల్లో ప్రసారం చేసే గొళీల రాగమాలికలను దాటుకుని, కళ్ళలో పావురాల రంగు గొళీలు స్వల్ప వ్యవధిలో లలితసంగీతపు ఝలక్ లా కాకుండా, వెండి నీరులా ఆలపించే సంగీతాన్ని వినగలిగారు.అందుకే, ‘నేనంటే రెండు మనుషులని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది ‘ అని ఎప్పుడో రాసుకున్న వాక్యానికి ఎదురుగా,ఉన్నది ఉన్నట్లుగా స్వేకరించమనే అర్థం లో భగవంతం చేత టిక్కు మార్కును పొందగలిగారు.ప్రేమతో పెంచిన కన్నపిల్లలు ఉద్యోగాల రీత్యా రెక్కలొచ్చి ఎగిరిపోతే, ప్రతి తరంలోనూ తల్లిదండ్రులు పడే వేదనకు వివరణగా కనిపించే ‘వలసపక్షులగానం’ వాస్తవాన్ని యథాతథంగా స్వేకరించక తప్పదనే ‘మహా శూన్యపు భావనకు ‘ ప్రతీకగా నిలవడమే గాక, మంచీచెడులూ, సుఖదుఃఖాలూ వంటి ద్వైదీభావాలు ఉంటాయనీ వాటిని యథాతథంగా అంగీకరించడమే జీవన దుఃఖాలనుండి విముక్తులయ్యే మార్గమనే జీవన సత్యాన్ని గూర్చి చెబుతుంది.
‘ A special Transmission outside the scriptures;
No dependence on words and letters;
Direct pointing to the mind of man;
Seeing into one’s nature and attaining Buddhahood. “—-అంటారు జెన్ బౌద్ధ స్థాపకులయిన బోధిధర్ముదు. ద్యానం ద్వారా అంతర్ముఖులు కావడం ప్రధాన లక  లక్ష్యం జెన్ బౌద్ధంలో. ‘మానసిక పరిణితిని సూచించే ఒక జీవన విధానం బౌద్ధం ‘అనే సత్యాన్ని ఆచరణ సులభం చేసిన విధానమిది. తృష్ణారహితులుగా, కరుణాశీలురుగా, సహానుభూతితో బ్రదకడం అభ్యాసం చేసుకోదగిన వారందరూ చేరుకోదగిన గమ్యమిది. ఈ గమ్యానికి నిరపాయంగా చేరుకున్న ధీశాలి ఏకాంతసౌందర్యాన్వేషకులు   త్రిపుర. .అందుకే ‘Complete rejection of everything, which is complete acceptance of everything aswell ‘  (ఈ మాట) అన్నది వారి జీవన విధాన మయ్యింది. ఎన్నెన్నో సత్యాలవైపు ఆకర్షించబడిన త్రిపుర, బౌద్ధం లో సేదదీరారు కనుకే, లోకం నుండి మానసికంగా తమను తాము విడగొట్టు కున్నారే తప్ప భౌతికంగా లోకానికి దూరంగా పారిపోలేదు. మనుష్యులమధ్యే ఉంటూ, మనసిక ఏకాంత సౌందర్యాన్ని అనుభూతం చేసుకుంటూ, ఆమరణ పర్యంతం జీవితాన్ని, పసిపిల్లల్లా ఉత్సవంలా మలుచుకుంటూ, ప్రతిక్షణం కాసే పున్నమి వెన్నెలలా ఆనందంగా మనగలిగారు.

 

* * *

—డా. రాయదుర్గం విజయలక్ష్మి

మీ మాటలు

  1. gorusu jagadeeshwar reddy says:

    విజయ లక్ష్మి గారి స్మరణ చదివాక త్రిపుర మరింత గా నాకు దగ్గరయ్యారు . త్రిపుర కథలలో ఆయన పరిణామ క్రమాన్నిపసిగట్టి సందర్భోచితంగా ఉటంకిస్తూ స్మరించారు ఆమె. త్రిపుర మనకు దూరమయ్యాక వారి మీద ఇప్పటి వరకు వచ్చిన నివాళులు త్రిపురని మరింత పారదర్శకతతో చూపిస్తున్నాయి. లక్ష్మి గారికి ధన్యవాదాలు .
    – గొరుసు

మీ మాటలు

*