Archives for January 2017

‘పడగ’ల స్తబ్ధతా, ‘విండ్’ చలనమూ !


సాహిత్యంలో దృక్పథాలు రెలెవెన్స్-11

 వేయిపడగలలో ధర్మారావు ముఖంగా అతిమానుష, మానుష ప్రపంచాల మధ్య తారతమ్య వివేచన నవల పొడవునా జరుగుతూనే ఉండడం గురించి చెప్పుకున్నాం. అరుంధతినీ, కిరీటి భార్య శశిరేఖనూ కూడా అబ్బురపరచిన అతిమానుషజగత్తు అది. దేవదాసిని చూసినప్పుడు, “తానొక కల్పితజగత్తున, అమానుషప్రపంచమున  తిరుగాడుచున్నట్లు”; “ఈ సంవిధానమే చిత్రముగా నున్నట్టు” శశిరేఖకు అనిపిస్తుంది. అలాగే, కావ్యజగత్తే యథార్థమైన జగత్తు అనీ, అపరిపక్వమైన మనస్సులు, కృత్రిమ ప్రకృతులు, అసహజమైన మనోభావాలు కలిగిన మనమే కల్పిత జగత్తు అనీ ధర్మారావు అనుకోవడం గురించీ, దివ్యజగత్తు నుంచి భౌమజగత్తులోకి రావడంలో అతను ఎదుర్కొనే క్లేశం గురించి కూడా చెప్పుకున్నాం.

ఈ అతిమానుష, మానుష జగత్తులను; అవాస్తవిక, వాస్తవికజగత్తులుగా అనువదించుకుంటే ధర్మారావు పొందే క్లేశం వాస్తవికతను ఎదుర్కోవడంలోనే. శిల్పంలోనూ, కవిత్వంలోనూ కూడా వస్తుస్వరూపాన్ని “యథాప్రాప్తం”గా చిత్రించ కూడదని అతను అనుకుంటాడు. అతని ఆలోచనలు ఇంకా ఇలా ఉంటాయి:

లోకమునందలి వస్తువు బహుదోషభూయిష్ఠముగా నుండును. దాని నుండి దోషమును తీసివేసి దాని ఉత్కృష్ట స్వరూపమునే గ్రహించవలయును. దోషమును పరిహరించుట రెండు విధములు. ఒకటి లోకమునందలి ఉత్కృష్ట స్వరూపమునే గ్రహించుట, రెండవది, కొన్ని సమయములు, సంప్రదాయములు సృష్టించి తదనుగుణముగా శిల్పమును చిత్రించుట. మొదటిదాని కన్న రెండవది ఉత్కృష్టమైనది. పాశ్చాత్యశిల్పము మొదటి మార్గము ననుసరించును…వారి చిత్రము లన్నింటికి మాతృకలుండును…భారతదేశశిల్పి శిల్పము చక్షుర్విషయమున కన్న యెక్కువ మనోవిషయమగుచున్నది. పాశ్చాత్యశిల్పమునందు మనము చూచు బొమ్మ గొప్ప సౌందర్యము కలిగియుండును. అది మన నేత్రానందకరము. భారతశిల్పము నందలి చిత్రము పూర్తిగా మనోవిషయము…ఎన్ని చూచినను భారతశిల్పము యొక్క యుత్కృష్టత అవివాదాంశము.

రవివర్మచిత్రాల గురించి ఇలా అంటాడు:

రవివర్మ శిల్పము పాశ్చాత్యమార్గము ననుసరించును. అందులో కూడా చాలా తక్కువరకముది…ఇట్టి చిత్రములు వ్యాప్తి పొందుట చేత లోకమున జనులకు పూర్వ సంప్రదాయములయు, పూర్వ మహాపురుషుల స్త్రీల యథార్థతత్త్వము యొక్కయు జ్ఞానము లేక చెడిపోవుచున్నారు. పైగా వీనియందు సౌందర్యజ్ఞానము కలుగుటలేదు. మనస్సును స్పృశించుటలేదు సరికదా, నేత్రము యొక్క నైశిత్యమును కూడ తాకుట లేదు…ఇప్పటి యీ గ్రామఫోన్ల ప్లేట్ల సంగీతము వలెనే యిట్టి బొమ్మలును మనదేశమునందలి జ్ఞానమునకు వేరుపుర్వు లగుచున్నవి.

వాస్తవికతను నిరాకరించి, అవాస్తవికతను నిర్మించాలని చెప్పడమే ఇది. దీనిని శిల్పానికీ, సాహిత్యానికే కాక సంఘానికీ  ఆపాదిస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఊహించగలం. యథాప్రాప్తంగా కాకుండా దోషాన్ని పరిహరించి ఉత్కృష్టాన్నే స్వీకరించడమంటే, వాస్తవిక ప్రపంచంలోని వైరుధ్యాలను మరుగుపుచ్చి సాహిత్యానికి, సాహిత్యకారుడికీ ఉపదేశక స్థానాన్ని కల్పించడమే. అదలా ఉంచితే పాశ్చాత్యంలో కానీ, మన దగ్గర కానీ సాహిత్యం వాస్తవిక జీవన ప్రతిబింబం కావడం వెనుక చాలా చరిత్రే ఉంది. అందులోకి వెళ్లడానికి ఇది సందర్భం కాదు.

గాన్ విత్ ద విండ్ కు వస్తే, వాస్తవికత గురించి యాష్లీ ఊహలు కూడా అచ్చం ధర్మారావు ఊహల్లానే ఉంటాయి. అతను కూడా వాస్తవికతను ఎదుర్కోడంలో క్లేశానీకీ, భయానికీ లోనవుతాడు. “దేనికి భయపడుతున్నా”వని స్కార్లెట్ అడిగినప్పుడు అతని సమాధానం ఇలా ఉంటుంది:

ఓహ్, నామరహితమైన అనేకవాటి గురించి. మాటల్లోకి మార్చితే అర్థరహితంగా ధ్వనించే వాటి గురించి. జీవితం హఠాత్తుగా మరీ వాస్తవికం అయిపోవడం, జీవితం గురించిన అల్ప వాస్తవాలతో కూడా మరీ వ్యక్తిగత సంబంధం కలగడం గురించి.  ఇక్కడ బురదలో నిలబడి కట్టెలు కొట్టవలసివచ్చినందుకు నేను బాధపడడంలేదు. ఇది దేనిని సంకేతిస్తోందో దానిని తలచుకుని బాధపడుతున్నాను. నేను అమితంగా ప్రేమించిన పాతజీవితంలోని సౌందర్యాన్ని కోల్పోయినందుకు కుంగిపోతున్నాను. యుద్ధానికి ముందు జీవితం ఎంతో అందంగా ఉండేది. గ్రీకుకళలోలా అందులో ఒక ఆకర్షణ, పరిపూర్ణత, సమగ్రత, సౌష్టవం ఉండేవి. అందరికీ అలా అనిపించకపోవచ్చు. ఆ తేడా కూడా ఇప్పుడే అర్థమవుతోంది. నాకు మాత్రం ట్వెల్వ్ ఓక్స్ లో జీవించడంలోనే నిజమైన అందం ఉంది. నేనా జీవితానికి చెందినవాణ్ణి. అందులో భాగాన్ని. ఇప్పుడు అదంతా గతించిపోయింది, ఈ కొత్త జీవితంలో నేను ఇమడను. అందుకే భయపడుతున్నాను. పాత జీవితంలో ఛాయామాత్రంగా లేని ప్రతిదానికీ; మరీ వాస్తవికంగా, మరీ జీవశక్తితో కనిపించే మనుషులకు, పరిస్థితులకు దూరంగా ఉండేవాణ్ణి. నా జీవితంలోకి అలాంటి మనుషులు, పరిస్థితుల చొరబడితే కోపం వచ్చేది. అందుకే నిన్ను కూడా దూరంగా ఉంచాను. కారణం, నీలోనూ జీవశక్తి పొంగి పొర్లుతూ మరీ వాస్తవికంగా కనిపిస్తావు. నీడలనూ, స్వాప్నికతనూ ప్రేమించే పిరికివాణ్ణి నేను… యుద్ధం వచ్చి పడకపోతే, ట్వెల్వ్ ఓక్స్ లోనే పాతుకుపోయి, జీవితంలో భాగం కాకుండానే దాని గమనాన్ని సాక్షిమాత్రంగా దర్శిస్తూ సంతోషంగా, సంతృప్తిగా జీవితం గడిపేసేవాణ్ణి.

విచిత్రం ఏమిటంటే, యాష్లీకి ట్వెల్వ్ ఓక్స్ ఎలాగో; ధర్మారావుకు సుబ్బన్నపేట అలాగ.  చదువుకోసమనో, మరొకందుకనో మధ్య మధ్య అతను వేరే ఊళ్ళకు వెళ్ళి వచ్చినా ప్రధానంగా సుబ్బన్నపేటకే అతుక్కుపోతాడు. అక్కడి జీవితమే తనకు ఇష్టమని ఒకటి రెండు సందర్భాలలో అంటాడు కూడా. అతని అతిమానుషజగత్తుకు చెందిన ప్రణాళికను అమలు చేయడానికి ఉద్దేశించిన కార్యక్షేత్రం కూడా సుబ్బన్నపేటే.

అయితే, ఇద్దరి జీవనపరిస్థితులు, అనుభవాలు, ఊహల మధ్య పెద్ద తేడా తెచ్చిపెట్టింది, యుద్ధం! ఇదో చిత్రమైన వాస్తవం. యుద్ధాన్ని ఎవరూ కోరుకోరు. కానీ యుద్ధం మనిషి అనుభవంలో, ఆలోచనల్లో, తద్వారా జీవితంలో తీసుకు వచ్చే మార్పు బహుముఖంగా ఉంటుంది. అది శతాబ్దాల స్తబ్ధతను వదలగొట్టి మనిషిని క్రియాశీలిని చేస్తుంది. మనిషిలోని మానవత్వాన్నీ, రాక్షసత్వాన్నీ కూడా ఆవిష్కరిస్తూ అంతిమంగా మనిషితనానికి ఒక పెద్ద పరీక్షాఘట్టం అవుతుంది. అంతవరకు ఆకాశవిహారం చేయించే అందమైన కాల్పనిక ఊహలనుంచీ, స్వాప్నికతనుంచీ మనిషిని హఠాత్తుగా కఠోరవాస్తవాల భూమార్గం పట్టిస్తుంది.

యాష్లీ ఇంకా ఇలా అంటాడు:

యుద్ధం రాగానే, జీవితం తాలూకు వాస్తవికత నాలోకి చొచ్చుకువచ్చింది. నీకు గుర్తుండే ఉంటుంది, మొదటిసారి నేను యుద్ధంలోకి దిగింది బుల్ రన్ దగ్గర. నా బాల్యస్నేహితులు తునాతునకలవుతున్న దృశ్యాన్ని అప్పుడు చూశాను. మృత్యుముఖంలో ఉన్న గుర్రాలు పెట్టే సకిలింపులు విన్నాను. నేను జరిపిన కాల్పులలో  అవతలిపక్క మనుషులు రక్తం కక్కుకుంటూ కుప్పకూలిపోతున్నప్పుడు కలిగే హృదయవిదారకమైన, దారుణమైన అనుభూతిని చవిచూశాను.  అయితే నావరకు యుద్ధం తాలూకు దారుణాలు ఇవి కావు; నేను జనాల మధ్య జీవించవలసి రావడం!

నేను అంతవరకు జనానికి దూరంగా నాదైన గూడులో ఉండిపోయాను. నా మిత్రులు కూడా ఎంతో జాగ్రత్తగా ఎంచుకున్న అతి కొద్దిమంది. కానీ, కొందరు స్వాప్నికులతో నాదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నానన్నఎరుకను యుద్ధం  కలిగించింది. నా భార్యాపిల్లలను పోషించుకోవాలంటే, నాతో ఎలాంటి సాదృశ్యం లేని మనుషుల ప్రపంచంలో నేను జీవించక తప్పదన్న సంగతి ఇప్పుడు నాకు తెలిసివచ్చింది. నువ్వు వేరు, జీవితంతో ముఖాముఖి తలపడుతూ దానిని నీ ఇష్టానుసారం వంచడానికి పూనుకున్నావు. కానీ ఈ ప్రపంచంలో నేను ఎక్కడ ఇమడగలను? అందుకే భయపడుతున్నాను…నాదైన చిన్న ఆంతరిక ప్రపంచం అంతరించిపోయింది. నా ఆలోచనలతో ఎలాంటి సారూప్యతా లేనివారు, భిన్నమైన కార్యాచరణతో నాకు హాటెన్ టోట్లలా విజాతీయుల్లా తోచేవారు దానిని దురాక్రమించుకున్నారు. బురద కాళ్లతో నా ప్రపంచాన్ని తొక్కేశారు. నేనిప్పుడు తలదాచుకుందుకు చోటేదీ మిగల్లేదు.

ఇలాంటి యాష్లీ మాటల్లో ధర్మారావు ఊహల ప్రతిఫలనానికి మరిన్ని ఉదాహరణలు ఇచ్చుకోనవసరం లేదు. ఇద్దరూ మార్పుతో రాజీపడలేని, మార్పును జీర్ణించుకోలేనివారే.  అంతటి యుద్ధం కూడా ఇలాంటి యాష్లీ స్వభావంలో మార్పు తేలేదు. అయితే, ఇద్దరి మధ్యా ఒక తేడా. తనకు ఎంత రుచించనిదైనా యాష్లీని యుద్ధం వాస్తవికతలోకి ప్రవేశపెట్టింది. వాస్తవికత గురించే కాక, తన గురించి కూడా కొత్త పాఠాలు నేర్పి, కొత్త ఎరుక కలిగించింది.  మారిన ప్రపంచంలో తనకు చోటు లేదనుకున్నా, అందులో ఇమిడి కాలు కూడదీసుకోడానికి శతవిధాల పోరాడుతున్న స్కార్లెట్ లాంటి వ్యక్తులపట్ల యుద్ధం అతనిలో ప్రశంసను, సానుభూతిని రేకెత్తించింది. దృష్టి వైశాల్యాన్ని పెంచింది. తనను ప్రేమిస్తున్నానని చెప్పమని స్కార్లెట్ అడిగినప్పుడు, “అవును, నీ సాహసాన్ని, దృఢసంకల్పాన్ని, నీలోని జ్వాలనూ, నిర్దాక్షిణ్యతను ప్రేమిస్తున్నా”నని యాష్లీ అంటాడు. “ప్రేమించడానికి, పోరాడడానికీ  నాకేమీ మిగల్లే”దని స్కార్లెట్ అన్నప్పుడు;  తారాకు పూర్వవైభవం తెచ్చి పెట్టే పని ఒకటి మిగిలిందని సంకేతిస్తూ, కిందికి వంగి ఎర్రటి మట్టి తీసి ఆమె చేతిలో పెడతాడు.

లోకజ్ఞానాన్ని మించి, యాష్లీలో యుద్ధం కలిగించినది స్వస్వరూపజ్ఞానం. మారిన పరిస్థితులలో నీడలను, స్వాప్నికతను అంటిపెట్టుకుని ఉండడం పిరికితనం అనుకుంటాడు.  కొత్త ప్రపంచంలో తను ఇమడలేకపోవచ్చు కానీ, అందులో చోటుకోసం పెనుగులాడుతున్న వ్యక్తులపై ఇప్పుడతనికి నిరసన, తృణీకారభావం, నిషేధబుద్ధి లేవు. లోకాన్ని అదేపనిగా ఆడిపోసుకోవడంలేదు. గత, వర్తమాన జీవితాలను శ్రేష్టతా, సామాన్యతల తాసులో తూచి శ్రేష్టజీవితం కోసం కలలు కనడం లేదు. ఆత్మోత్కర్షలేదు. యుద్ధానికి ముందు అలాంటివి ఏమాత్రమైనా ఉన్నా, యుద్ధం తర్వాత  అంతరించిపోయాయి.

ధర్మారావులో మాత్రం ఇవన్నీ ఉన్నాయి. కారణం, అతని వెనుక యుద్ధం లేదు, యుద్ధం కలిగించే అనుభవమూ, స్వస్వరూప జ్ఞానమూ, దృష్టి వైశాల్యమూ, మార్పులతో రాజీపడే, సర్దుకునే వ్యక్తులపట్ల సానుభూతీ లేవు. యాష్లీకి ఉన్నట్టు పెద్ద కుదుపుతోపాటు అనూహ్యమైన చలనశీలతను తెచ్చే యుద్ధ నేపథ్యంలేని స్థితిలో ధర్మారావుకు నిలబడి ఉన్న లౌకిక ప్రపంచం, సాపేక్షంగా స్తబ్ధ ప్రపంచం. ఎక్కువ కాలవ్యవధిలో చాప కింద నీరులా వ్యాపించే మార్పులతో  ధర్మారావు ఊహలోని గతవైభవ జీవితాన్ని లోపలినుంచి శిథిలం చేస్తున్న ప్రపంచం. ఈ మార్పుల దీర్ఘ కాలవ్యవధి, ధర్మారావు ఊహాశాలితను భూమార్గం పట్టించేబదులు మరింతగా అతిమానుష, కాల్పనిక జగత్తువైపు నడిపించి, లౌకికంగా అతన్ని నిష్క్రియుడిగా, నిస్సహాయుడిగా, నిర్వేదిగా మిగిల్చింది. గతవైభవోద్ధరణకు ఉద్దేశించిన అతని కార్యాచరణ ప్రణాళికా అతిమానుషమే, కాల్పనికమే. అది, ఇంద్రియ మనోనిగ్రహాల ద్వారా భక్తి జ్ఞానాలను పొందడం! సుబ్బన్నపేటలోని దేవాలయవ్యవస్థ అందుకు కార్యక్షేత్రం. గిరిక, గణాచారి, హరప్ప, అరుంధతి లాంటివారు కార్యకర్తలు.

యుద్ధానుభవం లేదా సాంస్కృతిక పునరుజ్జీవనానుభవం ఉండడం, లేకపోవడం అనేది పాశ్చాత్య, భారతీయ సామాజిక, సాంస్కృతిక, సాహిత్యక, తాత్వికతల తారతమ్య పరిశీలనకు ఒక ముఖ్య కొలమానం. ఆ స్పృహ వేయిపడగల రచయితలోనే కాదు, ఆ భావజాలానికి చెందిన చాలామందిలో లేదు. దాని ఫలితం బహురూపాలలో కనిపిస్తుంది. అన్నింటిలోనూ ఉభయుల మధ్య ఉన్న తేడాలు స్థిరమైనవనీ, స్వాభావికమైనవనీ, మౌలికమైనవనే నిర్ధారణ వాటిలో ఒకటి. వేయిపడగల రచయిత ధర్మారావు ముఖంగా వ్యక్తీకరించిన అనేక నిర్ధారణలు అలాగే ఉంటాయి. ఒకచోట ఇలా అంటాడు:

పాశ్చాత్యలోకము తన సంఘము ప్రతినిమేష పరివర్తనములచేత గగ్గోలు పడుచున్నది. అనియత భావములు జలపాతమువలె నిలిచి ప్రవహించలేక, యూర్థ్వ తిర్య గధో ముహుస్తాడనములచేత ఘూర్ణిళ్లిపోవుచున్నది. సిద్ధాంతమేదో తెలియదు. ఆదర్శమేదో తెలియదు. ఒక నిలుకడకు రాని, వచ్చుటకు వీలు లేకుండ తనే చేసుకొనిన పరిస్థితుల నుండి బహుళసమస్యలు పెంచుకుని, తత్సమస్యాపరిష్కారము కొరకు వేవిధముల వాఙ్మయమును వినియోగించుచున్నది. అది యంతయు సారస్వతమేనా?

పాశ్చాత్యలోకం పైన చెప్పిన విధంగా ఉండడానికి కీ ఎక్కుడుందన్న పరిశీలన వేయిపడగల రచయితలో లేదు. సాంస్కృతిక పునరుజ్జీవనం రూపంలో పెద్ద కదలిక వచ్చిన సమాజం అది. ఆ తర్వాత రెండు ప్రపంచయుద్ధాలను చూసింది(వేయిపడగల రచనా కాలానికి మొదటి ప్రపంచయుద్ధమే జరిగింది). ఆ విధంగా రకరకాల పరివర్తనలకు పాశ్చాత్యలోకం ప్రపంచప్రయోగశాల అయింది. మంచీ-చెడూ కలగలసిన పరివర్తనలు అవి. ఈ పరిణామాన్ని స్తబ్ధతా-చలనాల దృష్టికోణం నుంచి చూసినప్పుడు వేటి ప్రాధాన్యం వాటికుంది. కానీ వేయిపడగల రచయిత స్తబ్ధతను, నిలకడను గొప్ప గుణంగా చూపిస్తున్నాడు. స్తబ్ధతను ప్రేమించే దృక్పథం కాలాన్నీ, చరిత్రనూ, సారస్వతాన్నే కాక, సమస్తాన్ని స్టాణువుగానే చూస్తుంది. “మహార్థవంతమైనది నశించిపోవుటయు, అల్పప్రయోజనము లైనవి విజృంభించుటయు యీ నాటి సృష్టిపరిణామములోని యొక భాగము…ఒక నిమేషమాత్రమున్న మార్పు నిమేషజీవితులకు దీర్ఘముగానే కనిపించును. అనంతమైన కాలమున దీర్ఘ హ్రస్వత లెక్కడ?” అని ఒకచోట ధర్మారావు అంటాడు. ఈ నాటి సృష్టిపరిణామమే ఇలా ఉందనీ, ఒకప్పటి సృష్టి పరిణామం ఇలా లేదనే ఒక అతార్కిక ఊహను మొదటివాక్యం వెల్లడిస్తే, రెండో వాక్యం అనంతమైన కాలంలో మార్పు నిమేషమాత్రమే నంటూ మార్పు లేకుండా ఉండడమే కాలానికి గల అసలు స్వభావమని ధ్వనింపజేస్తోంది.

దేవీ దేవతలు, మతవిశ్వాసాలు, ఆచారాలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన అనేకాంశాలలో పాశ్చాత్య, భారతీయ సమాజాల మధ్య ఉన్న తేడాలు స్వాభావికమైనవీ, మౌలికమైనవీ కావనీ; క్రీస్తు పూర్వ ప్రపంచంలో పాశ్చాత్యంతో సహా ప్రపంచమంతా ఈ విషయాలలో దాదాపు ఒకేవిధమైన అనుభవాన్ని పంచుకుందనీ సారంగలోనే వెలువడిన నా పురాగమన వ్యాసాలలో సోదాహరణంగా చూపించాను.

అదలా ఉంచితే, వేయిపడగలను, గాన్ విత్ ద విండ్ ను పక్క పక్కన పెట్టి పరిశీలించినప్పుడు; వేయిపడగలకు గాన్ విత్ ద విండ్ ఒక సమాధానమనీ, యుద్ధానుభవం ద్వారా, వేయిపడగల ఇతివృత్తానికి లేని ఒక సంపూర్ణతను, సమగ్రతను అది పొందగలిగిందనీ, వేయిపడగల రచయిత ధర్మారావును నాయకుణ్ణి చేసి పట్టం కడితే; గాన్ విత్ ద విండ్ రచయిత్రి ధర్మారావు ప్రతిబింబమైన యాష్లీ నిరాకరించి మార్పుకు పట్టం కట్టడమే లక్ష్యంగా తన నవలను నడిపించిందనే భావన కలుగుతుంది.

(ఈ భాగాన్నిఇక్కడితో సశేషం చేసి సారంగను చూడబోతే ఇక సెలవు’, ‘ఇదే సారంగ చివరి సంచిక అంటూ సంపాదకవర్గం చేసిన పిడుగుపాటులాంటి ప్రకటన. సారంగ లాంటి పత్రిక ఆగడం సాహిత్యవిజ్ఞానప్రేమికులందరికీ  బాధాకరపరిణామం. ఇది తాత్కాలికం కావాలనే అందరిలా నేనూ కోరుకుంటున్నాను. నా పురాగమన వ్యాసాలు, ఈ వ్యాసాలతోపాటు వివిధ ఇతర వ్యాసాలను కూడా ప్రచురించిన అఫ్సర్, కల్పనగార్లకు కృతజ్ఞతలు.

ఈ పరిణామం కారణంగా ఈ వ్యాసపరంపర ఇక్కడ అర్థాంతరంగా ఆగిపోక తప్పడంలేదు. మరోచోట పునః ప్రారంభమవు తుందేమో నన్నది ప్రస్తుతానికి ఆశాభావం. -కల్లూరి భాస్కరం)

 

 

 

 

మీ అమ్మ మారిపోయిందమ్మా!

(శ్రీమతి గన్నవరపు సరోజినీ సత్యనారాయణమూర్తిగారి స్మారక కథలపోటీలో మొదటి బహుమతి గెల్చుకున్న కథ )

Art: Rajasekhar Chandram

“మీ అమ్మ మారిపోయిందమ్మా..”అన్న నాన్నగారి మాటే నా చెవుల్లో గింగుర్లెత్తుతోంది. ఈ మాట ఆయన నాలుగునెలలక్రితం ఫోన్ లో అన్నారు. “అమ్మ మారడమేంటి నాన్నా!” అనడిగితే “ఏమోనమ్మా! నాకలా అనిపిస్తోంది..” అని అక్కడితో ఆపేసారు. మళ్ళీ నెల్లాళ్ళ తర్వాత అదే మాట. “ఏం జరిగింది నాన్నా!” అంటే “ఇదివరకులా లేదమ్మా.. ఇదివరకు అస్సలు యిల్లు కదిలేది కాదా! ఇప్పుడు అస్తమానం ఎక్కడికో అక్కడకి వెడుతోంది.” అన్న నాన్నగారి మాటలకి హోస్.. అంతేనా అనిపించింది. “పోనీ, వెళ్ళనీ నాన్నా.. ఇప్పటికి కదా అమ్మకి కాస్త వెసులుబాటయిందీ..ఇన్నాళ్ళూ యిల్లు పట్టుకునే వుంది కదా..!” అని తేలిగ్గా తేల్చేసాను. అప్పటికి వూరుకున్నారు నాన్న. మొన్న మళ్ళీ ఫోన్ చేసినప్పుడు “ఏవిటోనమ్మా! మీ అమ్మ యిదివరకులా లేదు. ఎప్పుడూ లేనిది డబ్బు లెక్కలు కూడా అడుగుతోంది.” అన్నారు. ఈ మాటకి కాస్త ఆశ్చర్యం వేసింది నాకు. ఎందుకంటే అమ్మ డబ్బు విషయం యెప్పుడూ పట్టించుకునేది కాదు. ఆ విషయాలన్నీ నాన్నగారే చూసుకునేవారు. అమ్మకి యెంతసేపూ యిల్లే కైలాసం, పతియే ప్రత్యక్ష్యదైవం అనే ధోరణిలో వుండేది. నాన్నగారికి యిబ్బందవుతుందని యేవైనా పెళ్ళిళ్ళుంటే తప్పితే పుట్టింటికి కూడా యెక్కువ వెళ్ళేది కాదు. అలాంటి అమ్మ డబ్బులెక్కలు అడుగుతోందంటే కాస్త వింతగానే అనిపించింది.

ఈ సంగతేమిటో తెలియాలంటే ఒకసారి రాజమండ్రీ వెళ్ళాల్సిందే అనుకున్నాను. అమ్మానాన్నల్ని చూసి వచ్చి కూడా అప్పుడే ఆర్నెల్లయిందని గుర్తు చేసుకుంటూ పనికట్టుకుని హైద్రాబాదునుంచి రాజమండ్రీ వచ్చాను. రైలు దిగి ఇంటికి వెడుతున్నంతసేపూ దారి పొడుగునా కనిపిస్తున్న చిన్నప్పటి జ్ఞాపకాలను మించిపోయాయి మా నాన్నగారు అమ్మని గురించి ఫోన్‍లో చెప్పిన మాటలు.

గేట్లోకి అడుగు పెట్టగానే ఇంటిముందు చుక్కలతో పెట్టిన మెలికలముగ్గు ముద్దుగా స్వాగతం చెప్పింది. అటువంటి మెలికలముగ్గు ఎన్నిసార్లో అమ్మ దగ్గర నేర్చుకుందామని ప్రయత్నించి విఫలురాలినయ్యాను. ముచ్చటగా ముగ్గును చూస్తూ ఇంటి వరండాలో అడుగు పెట్టిన నాకు నాన్నగారికి కాఫీ అందిస్తున్న అమ్మ కనిపించింది. నన్ను చూడగానే ఇంతమొహం చేసుకుని, “రా రా..ఒక్కదానివే వచ్చావా? పిల్లలు రాలేదా?”  అంటూ అక్కున జేర్చుకుంది. అదేమిటో అమ్మ దగ్గరికి రాగానే చిన్నపిల్లనయిపోయినట్టనిపిస్తుంది. “నీ కాఫీకోసం వచ్చానమ్మా..” అన్నాను నవ్వుతూ. “రా అమ్మా.. రా..” అన్న నాన్నగారి పిలుపు విని అటు నడిచాను. పక్క కుర్చీ చూపిస్తూ, “పిల్లలూ, అతనూ బాగున్నారామ్మా?” అనడిగారు. మేమిద్దరం క్షేమసమాచారాలు చెప్పుకుంటూనే వున్నాం అమ్మ కమ్మటి కాఫీ అందించింది చేతికి.

అదేమిటో పుట్టింటికి వెళ్ళగానే యెక్కడలేని బధ్ధకం వచ్చేస్తుందేమో టైమ్ యెనిమిదవుతున్నా నాన్నగారూ, నేనూ అలా కబుర్లు చెప్పుకుంటూ అక్కడే కూర్చున్నాం. ఇంతలో అక్కడికి అమ్మ వచ్చింది. చూసి ఆశ్చర్యపోయాను. ఎప్పుడు స్నానం, పూజా చేసుకుందో, యెప్పుడు వంట చేసిందో, యెప్పుడు తయారయిందో తెలీదు కానీ శుభ్రమైన ఇస్త్రీచీర కట్టుకుని, చేతిలో ఒక చిన్న సంచీలాంటిది పట్టుకుని చెప్పులు వేసుకుంటూ మాతో అంది. “వంటంతా చేసి టేబుల్‍మీద పెట్టేనమ్మా. నువ్వూ, మీ నాన్నగారూ కబుర్లయాక స్నానం చేసి, భోంచెయ్యండి. నాకు చిన్న పనుంది. వెళ్ళొస్తాను..” అంటూ జవాబు కోసమైనా చూడకుండా వెళ్ళిపోయింది.

నాన్నగారి మొహం చిన్నబోయినట్తైపోయింది. “చూసేవామ్మా.. ఇదిగో, ఇదీ వరస. రోజూ యెక్కడికోక్కడికి వెడుతుంది. మళ్ళీ మూడుగంటలు దాటితేకానీ రాదు. అంత మొగుడికి అన్నంకూడా పెట్టకుండా చేసే రాచకార్యాలేంటో మరి?” కాస్త బాధగానూ, మరికాస్త నిష్ఠూరంగానూ అన్న నాన్నగారి మాటలకి ఓదార్పుగా అన్నట్టు ఆయన చేతిమీద చెయ్యివేసి, “నేను కనుక్కుంటానుగా నాన్నా..” అన్నాను. “అదేనమ్మా. అందుకే నీకు ఫోన్ చేసేను..” అన్నారాయన.

నేనక్కడున్న నాలుగురోజులూ అమ్మని బాగా గమనించాను. నిజమే. అమ్మ యిదివరకులా లేదు. యేదో తేడా కనిపించింది. తేడా అంటే ఆరోగ్యం విషయం కాదు. అలాంటి సమస్యలేవీ వున్నట్లు లేవు. కానీ యిదివరకులా ప్రతి చిన్న విషయం నాన్నని అడగడం, యెక్కడికైనా వెళ్ళాలంటే నాన్నగారి భోజన సమయాలూ అవీ కాకుండా చూసుకోవడం లాంటివేమీ లేవు. ఆఖరికి నాన్నగారిని మంచినీళ్ళు కూడా ముంచుకోనివ్వని అమ్మ గబగబా యేదో వండి అక్కడ పడేసి బైటకి వెళ్ళిపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అదేమిటో అమ్మని అడగాలని ఈ నాలుగురోజుల్లోనూ ప్రయత్నించాను కానీ అడగలేకపోయాను. యేమని అడగగలను? సంసారం యెంత గుట్టుగా నడుపుకోవాలో నాకు చెప్పిన అమ్మని, భర్త మర్యాద నలుగురిలో యెలా కాపాడాలో పాఠాలు చెప్పిన అమ్మని, పిల్లలని యెంత బాధ్యతగా పెంచాలో ఉదాహరణలతో సహా చెప్పిన అమ్మని “నాన్నని ఒక్కరినీ అలా వదిలేసి బైటకి యెందుకు వెడుతున్నావమ్మా..”అని యేమని అడగగలను? అడగాలనుకున్నది అడగకుండానే హైద్రాబాదు తిరుగుప్రయాణం అవ్వాల్సొచ్చింది.

ఆటోలో స్టేషన్‍కి వెడుతున్న నేను టక్కున తలకి తగిలిన దెబ్బకి అమ్మానాన్నల గురించి ఆలోచనల్లోంచి ఒక్కసారి ఈ లోకంలో కొచ్చాను. ఆటో సడన్‍బ్రేక్ వెయ్యడంతో తల ఆటో ముందురాడ్‍కి కొట్టుకుంది. “అమ్మా..” అంటూ నుదురు తడుముకున్నాను. ఆటోవాలా రాంగ్‍రూట్‍లో వచ్చిన స్కూటర్‍వాడిని తిట్టుకుంటూ మళ్ళీ ఆటో స్టార్ట్ చేసాడు. ఇంకా స్టేషన్ ఎంతదూరమా అనుకునేలోపే స్టేషన్‍లో ఆపేడు ఆటోని. బాగ్ చేతిలోకి తీసుకుని, ఆటోకి డబ్బిచ్చి ప్లాట్‍ఫామ్ మీదకి వచ్చేటప్పటికి గౌతమి అప్పటికే ఆగి వుంది. పరుగెడుతున్నట్టే ఎస్8 బోగీ వెతుక్కుంటూ వెళ్ళి, బోగీకి అతికించిన ఛార్ట్ లో నా పేరు, బెర్త్‍నంబరూ చూసుకుని, లోపలకెళ్ళి బెర్త్ మీద బేగ్ పెట్టి కూర్చుని, “హమ్మయ్య..” అనుకున్నాను. కిటికీకి ఆనుకుని కూర్చున్న నాకు మళ్ళీ అమ్మానాన్నల గురించిన  ఆలోచనలు మొదలయ్యాయి.

నాన్నగారన్న మాట నిజమే. అమ్మ యిదివరకులేని పనులు చాలా కల్పించుకుంది. వారంలో రెండురోజులు నాలుగు వీధులవతలవున్న స్కూల్‍కి వెళ్ళి, అందులో పిల్లలకి కథలు చదివి విన్పించి వస్తుంది. మరో రెండ్రోజులు కాస్త దూరంలో వున్న అదేదో సంఘానికి వెళ్ళి, అక్కడ మిగిలినవారితో కలిసి కౌన్సిలింగ్‍లాంటిదేదో చేస్తుంది. ఇంకో రెండ్రోజులు పక్క వీధిలో వున్న గుడికి వెళ్ళి పూలమాలలూ అవీ కట్టిచ్చి వస్తూంటుంది. యిలాగ యేదో పని కల్పించుకుని వూరు పట్టుకు తిరుగుతోందని నాన్నగారి అభియోగం. అన్నీ వండి పెట్టే వెడుతున్నాను కదా అని అమ్మ అంటుంది. “వండి పడేస్తే చాలా..నేనొక్కణ్ణి యెలా వుండగలననుకున్నావ్?” అని నాన్నగారి ప్రశ్న. “కాసేపే కదా వెడుతున్నాను. మీరు కూడా మీ కాలక్షేపమేదో చూసుకోండి..” అని అమ్మ జవాబు. నాకైతే అంతా అయోమయంగా అనిపించింది. యిన్నాళ్ళు లేని వ్యాపకాలు అరవయ్యేళ్ళు వచ్చేక యిప్పుడు అమ్మ యెందుకు కల్పించుకున్నట్టు? హాయిగా యిద్దరూ వేళకింత వండుకుని, తిని, ఒకరికొకరుగా వుండక లేనిపోని గొడవలు కోరి తెచ్చుకోవడమెందుకు? ఈ నాలుగురోజుల్లోను ఈ మాట అమ్మని అడుగుదామని చాలా ప్రయత్నించాను కానీ అడగలేకపోయాను.

నా ఆలోచనల్లో వుండిపోయి ట్రైన్ యెప్పుడు బయల్దేరిందో కూడా గమనించనేలేదు. టీసీ వచ్చి టికెట్ అడిగేటప్పటికి మళ్ళీ ఈ లోకంలో కొచ్చాను.  టీసీకి టికెట్ చూపించి మళ్ళీ దానిని బేగ్‍లో పెట్టుకుంటుంటే అందులో యేవో కాగితాల మడతల్లాంటివి కనిపించాయి. ఇవేం కాగితాలు..నేనేం పెట్టలేదే అనుకుంటూ మడతలు విప్పగానే  మొదటి పదమే “అమ్మలూ..” అంటూ అమ్మ చేతివ్రాత. ఒక్కసారి ఒళ్ళు జల్లుమంది. అమ్మ ఉత్తరం అది. అమ్మ ఉత్తరం రాసి నా బేగ్‍లో పెట్టింది. అంత ఉత్తరం రాసి చెప్పవలసిన విషయాలు యేమున్నాయా అన్న ఆతృతతో నా కళ్ళు ఆ అక్షరాల వెంట పరుగెత్తాయి.

“అమ్మలూ, పిల్లల పరీక్షల ముందు నువ్వు అమ్మనీ నాన్ననీ చూడడానికి యింత ఆతృతగా యెందుకొచ్చావో అర్ధం చేసుకోగలనమ్మా.. నా బంగారుతల్లీ, మామీద నీకున్న అభిమానానికి యెంత సంతోషంగా వుందో చెప్పలేను. నువ్వు నన్ను అడగాలనుకున్న ప్రశ్నలు నీ గొంతులోనే ఆగిపోయాయని తెలుసుకోలేనిదాన్ని కాదు. ఈ వయసులో నాన్నగారిని దగ్గరుండి చూసుకోకుండా నేను చేసే ఘనకార్యాలు నీకు మింగుడు పడలేదు కదూ! అవునమ్మా.. నిజమే.. మీ నాన్నగారికి డెభ్భైయేళ్ళు. నాకు అరవైయేళ్ళు దాటాయి. ఇదివరకంతా నాన్నని నీడలాగా కనిపెట్టుకుని వున్న అమ్మ ఈ పెద్ద వయసులో ఆయనని ఒక్కరినీ వదిలేసి బైట చేస్తున్న రాచకార్యాలకి కారణమేమిటో తెలుసుకోవాలని వుంది కదా తల్లీ. చెపుతాను విను.

అమ్మలూ, నీకూ తెలుసు.. నిన్నూ, చెల్లెల్నీ యెలా కళ్ళల్లో పెట్టుకుని పెంచానో. మీరు కాలేజీ చదువులు చదువుతున్నప్పుడు కూడా మీ చేత యింట్లో యే ఒక్క పనీ చేయించలేదు సరి కదా.. మీ యిద్దరికీ అన్నం కూడా కలిపి నోట్లో పెట్టేదాన్ని. అలాగ మీకు ఒక్కపనీ నేర్పకుండానే, అందరూ అమ్మలాగే వుంటారని చెపుతూనే మీకు పెళ్ళిళ్ళు చేసి పంపించాను. అలాగ పువ్వుల్లాగ పెరిగిన మీరిద్దరూ పూల కన్న ముళ్ళే యెక్కువగా వున్న ఈ సమాజంలో మీ సౌరభాన్ని నిలబెట్టుకుందుకు  మీరు పడ్డ కష్టం మీకు తెలియనిది కాదు. ఆ భగవంతుని దయవల్ల యిద్దరూ మీమీ కుటుంబాల్లో యిమిడిపోయి మంచిపేరు తెచ్చుకున్నారు. మీరిద్దరూ అన్నీ మీ మీ అనుభవాలమీదే నేర్చుకున్నారు. ఒక ఐదారు సంవత్సరాలు మీరు శ్రమ పడినా మిగిలిన జీవితమంతా మీరు మీకు అనుకూలంగా మలుచుకున్నారు.  కానీ ఒకరిమీద ఒకరం పూర్తిగా ఆధారపడ్డ నాకూ, మీనాన్నగారికీ మా రాబోయే జీవితం గడపడానికి అలాగ అనుభవం మీద నేర్చుకునే టైమ్ యిప్పుడు లేదమ్మా. ఇద్దరం జీవితం చరమాంకానికి వచ్చేసాం.

అమ్మలూ, నీకు తెలుసు కదా! యింట్లో మీ యిద్దరితో సమానంగా నాన్నగారిని చూసుకునేదాన్ని. పొద్దున్న లేచిందగ్గర్నుంచీ ఆయన తిండితిప్పలూ, అలవాట్లూ, చిరాకులూ అన్నింటినీ ఆయన కూడా ఒక పిల్లాడే అనుకుని నిభాయించుకుని వచ్చేదాన్ని. మీలాగే ఆయనకూడా నామీద పూర్తిగా ఆధారపడిపోయారు. మీరు బైటకి వెళ్ళి నాలుగూ నేర్చుకున్నారేమో కానీ, నాన్నగారు మటుకు మీరు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళాక నా మీద ఆధారపడడం మరీ యెక్కువైపోయింది. నాకూ అది ఆనందంగానే అనిపించేది. యెందుకంటే మీ నాన్నగారంటే నాకున్న యిష్టం వల్ల. కానీ, తల్లీ.. ఆరునెల్లక్రితం జరిగిన ఒక సంఘటన నాలో యిదివరకు లేని ఆలోచనను తట్టిలేపింది.

నీకు మన దయానందం  తెల్సుకదా.. ఆయన భార్య హఠాత్తుగా పోయింది. పాపం దయానందం. భార్య వున్నన్నాళ్ళు మంచినీళ్ళు కూడా ముంచుకుని యెరగడు. పిల్లలు  యెవరి సంసారాలు వాళ్లవి. వాళ్ల దగ్గరికి వచ్చి వుండమన్నా కూడా యిల్లూ, పెన్షనూ వచ్చినన్నాళ్ళు యెవరి దగ్గరికీ వెళ్లలేరు కదా! అలాగ ఒక్కడే వుంటున్నాడు. వంట మాట అలా వుంచు..ఉదయం లేచి కాఫీ పెట్టుకోడం కూడా రాదు. ఎవరిని యేమడగాలో తెలీదు. అది చూసి నాకు ఒక్కసారి భయంలాంటిది వేసింది. అనుకోడానికి యిష్టమున్నా లేకపోయినా  పునర్జన్మ సిధ్ధాంతం నమ్మినవాళ్లం మనం. ఆ భగవంతుడి పిలుపు యెప్పుడోప్పుడు  రాకతప్పదు. అందరం యెప్పుడో అప్పుడు పైకి వెళ్ళవలసినవారమే! యెవరు ముందో యెవరు వెనకో యెవరికి తెలుసు? ఒకవేళ నేను ముందు వెళ్ళిపోతే మీ నాన్నగారికి కంచంలో అన్నం యెవరు వడ్డిస్తారు? టేబిలు మీదున్న గిన్నెల్లో ముందుది వేసుకుని, వెనకది చూసుకోని మీ నాన్నగారి పరిస్థితి యేమిటి? ఆయనకి మంచినీళ్ళు యెవరు అందిస్తారు? మేం లేమా అంటారు మీరిద్దరూ. కానీ, ఆయనింట్లో ఆయనుంటే వున్న గౌరవం మీ యిళ్ళకొచ్చి వుంటే వుండదు కదా! అయినా చిన్నప్పట్నుంచీ యెవరింటికీ వెళ్ళని మనిషి కూతురింట్లో యెలా వుంటారు? మీరు మీ సంసారాలని వదిలి ఆయన దగ్గరకొచ్చి వుండలేరు కదా! యెల్లకాలమూ నేను ఆయన పక్కన వుండలేనని నాన్నగారికి తెలియాలి. చిన్న చిన్న పనులైనా ఆయనంతట ఆయన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నేను యింట్లో వున్నంతసేపూ మీ నాన్నగారు అలా చెయ్యరు. అందుకనే నేను బైటకి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. కావాలని వ్యాపకాలు పెంచుకున్నాను. ఆయన ఆకలి ఆయనకి తెలియాలనీ, ఎక్కడెక్కడేమున్నాయో చూసుకుని కావలసినవి తీసుకుని తినడం తెలుసుకోవాలనీ అనుకున్నాను. నేను బైటకి వెడితే మధ్యాహ్నం టీ పెట్టుకోవడం యెలాగో చెప్పాను. యివన్నీ చెపుతున్నప్పుడు నాలో నేను యెంత మథనపడ్డానో తెలుసా తల్లీ.. కానీ అంతకన్న దారిలేదు. వంటమనిషిని పెట్టి వండించుకున్నా, లేకపోతే బైటనుంచి భోజనం తెప్పించుకున్నా రేపు నేను వెళ్ళిపోయాక కనీసం టేబిలు మీదున్నవయినా వడ్డించుకు తినే అవకాశముంది. మొన్నమొన్నటివరకూ మీ నాన్నగారు పూర్తిగా నామీద ఆధారపడేవారు. నాకు అదెంత సంతోషంగా అనిపించేదో!  కానీ, దయానందాన్నిచూసాక ఒకవేళ నేను ముందు వెళ్ళిపోతే మీ నాన్నగారి పరిస్థితి యెలా వుంటుందోనని భయపడి యిలా చెయ్యవలసివచ్చింది. ఒక్క విషయం చెప్పనా తల్లీ..మనం ఆడవాళ్ళం.. ప్రతి ప్రసవానికీ మరణం అంచులదాకా వెళ్ళొస్తాం కనుక మన గుండె కొంచెం గట్టిగా వుంటుంది. కానీ, మగవాళ్ళు యెంత పెద్దవాళ్ళైనా పసిపిల్లలేనమ్మా.. వాళ్ళని యెప్పుడూ అమ్మో, భార్యో, కూతురో చూస్తూండాలి.

అమ్మలూ,  యిదంతా చదువుతుంటే నీకు యింకో ప్రశ్న రావచ్చు. తప్పులేదు.. యెవరు ముందో యెవరు వెనకో యెవరు చెప్పగలరు? ఒకవేళ నేనే ఒంటరిదాన్నయిపోతేనో.. అవును.. ఆడవాళ్ళు వొంటరిగా మిగిలిపోతే వారి బాధ వేరుగా వుంటుంది. అందుకే యెప్పుడూ పట్టించుకోని నేను మీ నాన్నగారిని డబ్బు విషయాలు అడగడం మొదలుపెట్టాను. మన శాంతి తెలుసు కదా.. వాళ్ళమ్మ..పాపం యిలాగే ఒంటరి దయిపోయింది. వాళ్లాయనకి యే బేంక్‍లో యెంత డబ్బుందో ఆవిడకి అస్సలు తెలీదు. పక్కన వున్న ఆవిడకే తెలీకపోతే యెక్కడో ఉద్యోగాల్లో వున్న పిల్లలకి మాత్రం యెలా తెలుస్తుంది? అందుకే మీ నాన్నగారిని ఏ బాంక్‍లో ఎంత డబ్బుందో చెప్పమన్నాను. అలా అడిగానని ఆయనకి కోపం కూడా వచ్చింది. కానీ నా భయం నన్నలా అడిగించింది తల్లీ.

యిన్ని విషయాలు తెలిసున్నదానివి ఈ నాలుగురోజులూ నాన్నగారితోనే గడపకుండా ఆయన్ని ఒంటరిగా వదిలి బైటకి యెందుకు వెడుతున్నాననుకుంటున్నావేమో.. చెపుతాను విను.. అమ్మలూ, నాకు పెళ్ళయి వచ్చినప్పటినుంచీ మీ నాన్న చుట్టూ తీగలా అల్లుకుపోయాను. ఆయనలేని జీవితాన్ని ఊహించలేని స్థితికి వచ్చేసాను. మీ నాన్న తప్పితే అంత ఆసరా మరింక యెవ్వరూ యివ్వలేరు. అందుకే ఆయన చుట్టూనే ముడులూ, బ్రహ్మముడులూ వేసేసుకున్నాను. కానీ, ఒక్కసారి శాంతివాళ్ళమ్మ పరిస్థితి చూసేసరికి నన్ను వెన్ను మీద యెవరో చరిచినట్లయింది. యిప్పటినుంచీ ఆ ముడులను విప్పుకుని, నా అంతట నేను నిలబడలేకపోతే మూలమే కదిలిపోయి నేలమీదపడి అందరి కాళ్ళకిందా నలిగిపోతాను. అందుకే నా మనసుని నేను గట్టి చేసుకున్నాను. కనీసం పగలు రెండుగంటలైనా మీ నాన్నగారు ఒంటరిగా వుండేలా చెయ్యాలనుకున్న నేను, నాకు కూడా ఈ యిల్లు కాక మరో ఆసరా కావాలనిపించింది.

తల్లీ, ఒక్క మాట చెప్పనా.. మనిషి బ్రతికున్నన్నాళ్ళు తిండీ, బట్టా కనీసావసరాలు. మన ఆకలికి తిండి తినడం తప్పనిసరి యెల్లాగో అలాగే ఎదుటి మనిషికోసం బట్ట కట్టుకోవాలి. లేకపోతే మనలను పిచ్చివాళ్ళకింద జమకడతారు. కానీ, ఈ రెండింటితోపాటు మనసన్నది కూడా ఒకటుంటుంది కదమ్మా. దానికి సరైన ఆలోచన లేకపోతే అది దెయ్యమై పీక్కు తింటుంది. అందుకని నా మనసుకి తృప్తి కలిగించుకుందుకు నేను ఆ వ్యాపకాలు పెట్టుకున్నాను.

ఇంకోవిషయం చెప్పనా తల్లీ.. బాల్యం మనకి తెలీకుండానే ఆనందంగా గడిచిపోతుంది. యవ్వనం మనం కావాలని ఆనందిస్తూ గడుపుతాం. మధ్యవయసు సంతోషంగా చేసే బాధ్యతల బరువుతో నడుస్తుంది. యివన్నీ ఆనందంగా స్వీకరిస్తున్న మనం వానప్రస్థాన్ని మటుకు అంతే ఆనందంగా యెందుకు స్వీకరించకూడదు? వార్ధక్యం అంటే భయమెందుకు? అన్నింటికీ ఆ భగవంతుడే వున్నాడనుకుంటూ తామరాకుమీది నీటిబొట్టులా గడపడానికి యెందుకు ప్రయత్నించకూడదూ అన్నదే నా ప్రశ్న. నేను అందుకే డిటాచెడ్ గా వుండడానికి ప్రయత్నిస్తున్నాను. ఇలా చెయ్యడం నాకూ చాలా కష్టంగానేవుంది కానీ తప్పదుగా మరీ!..

తల్లీ, పండితులొకరు వానప్రస్థమంటే యేమిటో విడమరిచి చెప్పారు. మనని మనం ఈ సంసారబంధాలకు గట్టిగా కట్టేసుకున్నాం. వానప్రస్థమంటే ఆ బంధాలను వదులుకోవడం కాదుట. గట్టిగా కట్టుకున్నబంధాలు కాస్త వదులవడానికి ఆ కట్టుపైన మరోకట్టు యింకా గట్టిగా కట్టడంట. అప్పుడు ముందు కట్టినకట్టు కాస్త వదులవుతుందన్నమాట. అంటే సంసార బంధాలను కాస్త తగ్గించుకుని, ఆధ్యాత్మికతవైపుకానీ, సామాజిక సమస్యలవైపు కానీ మరో బంధం యేర్పరచుకోవడం. అందుకే నేను నాకున్న పరిథిలో కొన్ని వ్యాపకాలను యేర్పరచుకున్నాను.

తల్లీ, నువ్వు నన్ను అడగబోయి మానుకున్న ప్రశ్నలకి సమాధానాలు దొరికేయనుకుంటాను. యిప్పుడిదంతా  యింత వివరంగా యెందుకు రాస్తున్నాననుకుంటున్నావేమో..దానికి  ముఖ్యకారణం ఒకటుంది. నేను మీ అక్కచెల్లెళ్ళిద్దరినీ ఒక్క కోరిక కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు నన్నొక్కదాన్నీ వుంచితే మీరు ఫోన్ చెయ్యడం కాస్త ఆలస్యమైనా మీ సంసారబాధ్యతలు తెలిసినదాన్ని కనుక అర్ధం చేసుకోగలను. కాని అలా కాకుండా నాకే ఆయన పిలుపు ముందుగా వస్తే కనక మీ నాన్నని వారం, పదిరోజుల కొక్కసారైనా ఫోన్‍లో కాస్త పలకరిస్తూండండి. మీ దగ్గరనుంచి ఫోన్ రావడం నాలుగురోజులు దాటిన దగ్గర్నుంచీ మీరెలా వున్నారోనని ఆయనలో ఆతృత మొదలౌతుంది. అది రోజురోజుకీ పెరిగి మరో నాలుగురోజులయ్యేటప్పటికి యింక అదే ధ్యాసలో పడిపోయి, మీ గురించి లేనిపోనివి ఊహించేసుకుని బెంగ పెట్టేసుకుంటారు. అందుకని నువ్వూ, చెల్లీ కూడా మీ నాన్నకి వారానికోసారి ఫోన్ చేస్తామని ఈ అమ్మకి మాటిస్తారు కదూ…

…. మారిపోయిన మీ అమ్మ..

చేతులమధ్య నలిగిపోతున్నకాగితం  చివర వున్న “అమ్మ” అన్న మాటను చదవడానికి నాకు కళ్ళనిండుగా వున్న నీళ్ళు అడ్డం వచ్చేయి.

*

జి.ఎస్. లక్ష్మి

 

 

 

 

 

 

 

 

 

భగవంతుని భాష

(శ్రీమతి గన్నవరపు సరోజినీ సత్యనారాయణమూర్తిగారి స్మారక కథలపోటీలో రెండో బహుమతి గెల్చుకున్న కథ )

తనది పేరుకి చిన్న కాకా హోటల్లాంటిదే అయినా ఇక్కడ టిఫిన్లు బావుంటాయని  వండుకోవడానికి సమయం, ఓపిక చాలని సాఫ్ట్ వేర్  యువత వస్తుంటారని టేబుళ్లన్నీ అద్దంలా తుడిపిస్తూ ఎంతో నీట్‌గా ఉంచుతాడు  ఆ హోటల్‌  ఓనరు బలరాం. ఆర్డరిచ్చిన పావుగంటలోకల్లా పొగలు  కక్కుతూ టిఫిన్‌ టేబుల్‌మీదకి రావడమూ అక్కడ ప్రత్యేకతే.

నోట్లో పెట్టుకోకుండానే అల్లం  చెట్నీతో పెసరట్టు రోస్టు కరకరలాడున్నట్టు ఊరించేస్తూ దానిమీద వేసిన బటర్‌ నెమ్మదిగా కరిగిపోతోంటే టిఫిన్‌ ప్లేటు దగ్గరకు జరుపుకుంటున్న జీవన్‌కు భార్య మందార గుర్తుకొచ్చి నవ్వొచ్చింది.

తను  పెసరట్టు తింటున్నాడని తెలిస్తే ఇంకేమన్నా ఉందా?ఇంటికెళ్లాక మీదపడి కరిచేస్తుంది.అసలే ఒంట్లో బాగాలేదని సెలవుపెట్టింది ఇవాళ.తను డ్యూటీకి వచ్చేసాక వండుకోవడానికి కూడా బద్ధకం వేసి  మునగదీసుకుని పడుకుని ఉంటుంది.ఆకలితో కరకరలాడుతున్న మనిషికి తనకు ఎంతో ప్రాణప్రదమైన పెసరట్టును మొగుడుగారు లొట్టలేసుకుంటూ ఆరగిస్తున్నాడని తెలిస్తే మండదా?మందార ఆఫీసు దగ్గర్లో స్టార్‌ హోటళ్లేగాని ఇలాంటి కాకా హోటల్‌ లేదు.ప్యాక్‌ చేయించి తీసికెళ్దామంటే ఇంత అందమైన పెసరట్టూ ఇంటికెళ్లేసరికి మెత్తబడిపోయి పిసపిసలాడుతుంది.

జీవన్‌ జేబులో సెల్‌ సంకేతమిచ్చింది ఎత్తమని.ఇంకెవరు? మందారే…

‘హలో జీ! ఎక్కడున్నావ్‌?’ ముద్దుగా మొగుడిని ‘జీ’ అని పిలుస్తుంది మందార.

‘నేనా? ఎక్కడంటే….’నీళ్లు నములుతున్న జీవన్‌ పల్స్‌ పట్టేసింది మందార.

‘ఇంట్లో దిక్కులేకుండా పడివున్న బెటర్‌ హాఫ్‌కు పెట్టకుండా రోస్టెడ్‌ పెసరట్టుకేసి లొట్టలేస్తూ చూస్తున్నావుకదూ!’

‘అబ్బెబ్బే  నేను ఇంటికి వచ్చే దారిలో ఉన్నాను మందారా?’ ‘వారిజాక్షులందు వైవాఇకములందు….’ఎపుడెపుడు ఆపద్ధర్మానికి అబద్ధమాడవచ్చో చెప్పే చిన్నప్పటి పద్యం గుర్తొచ్చి అనవసర రభస ఎందుకని చిన్న అబద్ధమాడేసాడు జీవన్‌.

‘కోతలు కొయ్యకు. అయితే సర్వర్‌ కాఫీ ఆర్డర్లు వినబడుతున్నాయేం? ఇదిగో నేను నీ పక్కన లేకపోయినా నువ్వెక్కడ ఉన్నావో ఏంచేస్తున్నావో చెప్పేయగలను తెలుసా?’ తర్జనితో బెదిరిస్తున్నట్టుగా కళ్లముందు  మెదిలింది మందార.

‘సరే మహాతల్లీ నీ ఊహాశక్తికి జోహార్లుగాని నీకోసం మంచి చెక్కవడలు పార్శిల్‌ చెప్పానులే. అది రాగానే ఆఘమేఘాలమీద నీ ఒళ్లో వాలనా?ఆ తర్వాత మనిద్దరమూ…లలలలా…’

‘ష్‌…చుట్టుపక్కల చూసుకోకుండా ఏమిటా పైత్యం?అవతల బలరాం నవ్వుతున్నాడు చూడవయ్యా మగడా!’

జీవన్‌ చప్పున కౌంటర్‌ దగ్గరున్న బలరాంకేసి చూస్తే అతను అటుగా తల తిప్పుకుని నవ్వుతున్నాడు.

‘మైగాడ్‌ నీకేమన్నా పరకాయప్రవేశ శక్తి ఉందా?లేక  ఇక్కడ ఏ పావురంలోనైనా దూరి చూస్తున్నావా ?’

‘అదంతా నీకనవసరం. అయ్యో పెళ్లాం సిక్‌లీవ్‌ పెట్టింది. పెందరాళే ఇంటికొచ్చి వండిపెట్టాలని లేదుగాని ఒక్కడివీ గుటుకూ గుటుకూమంటూ మింగడానికి అసలు నీకు ప్రాణమెలా ఒప్పుతోంది జీ?’నుదురు కొట్టుకున్నాడు జీవన్‌…

‘ఎక్కువ కొట్టుకోకు బొప్పికొడుతుంది.త్వరగా ఆరగించి నాకోసం వడలు  మోసుకుని గీత్‌ థియేటర్‌కి రా. మంచి రొమాంటిక్‌ సినిమాకి టికెట్లు బుక్‌ చేసివుంచాను.నేను గేటుదగ్గరే వెయిట్‌ చేస్తూ ఉంటాను. జల్దీ.’జీవన్‌ ఇంకేం చెప్పేందుకు తావివ్వకుండా ఫోన్‌ ఆఫ్‌ చేసేసింది మందార.

‘మహా చిలిపి…ఇవాళ రణధీర్‌ కొత్త సినిమా రిలీజన్నమాట. అందుకే సిక్‌లీవ్‌ పెట్టేసింది.పెళ్లయి పుష్కరం దాటిపోయినా మందారలో తాజాదనం తగ్గలేదు. పెళ్లయిన కొత్తలో ఎలా అల్లరి చేసేదో ఇప్పటికీ అలాగే తనను హమేషా కవ్విస్తుంటుంది.’

‘జీవన్‌బాబూ! టిఫిను చల్లారిపోయినట్టుంది. వేరేది పంపిస్తానుండండి.’  అలవాటయిన కస్టమర్‌ని బలరాం వినయంగా అడుగుతుంటే ఈలోకంలోకి వచ్చి ‘వద్దులే టైమయిపోతుంది.’అంటూ జీవన్‌ పెసరట్టు తుంచి గబగబా నోట్లో పెట్టుకోబోతున్నవాడల్లా ఎవరో తన సీటు పక్కనేవున్న  కిటికీ వెనకనుంచి తనకేసే చూస్తున్నట్టనిపించి తలెత్తి చూసాడు.

ఓ ఏడేళ్ల కుర్రాడు ఆకలి కళ్లతో దోసెను ఆశగా చూస్తున్నాడు.జీవన్‌ మనసు విచలితమైపోయింది.ఆ కుర్రాడే…తను ఇందాక రోడ్డు పక్కగా చెట్టుక్రింద బైక్‌ పార్క్‌ చేస్తోంటే ఆశగా దగ్గరకు రాబోయాడు.తను జేబులోంచి డబ్బు తీసేలోగా ఎదర పెద్ద షాపు తాలూకు గార్డు వాడిని తరిమేసాడు. అందుకే జీవన్‌ గబగబాలేచి బయటకు వెళ్లి వాడిని లోపలికి తీసుకొచ్చి తన పక్కనే కూర్చోబెట్టుకుంటూంటే బలరాం వాడిని అదిలించి బయటకు నెట్టేయబోయాడు.

‘బలరాం!ఈ కుర్రాడికి  ఏంకావాలో ఎంతకావాలో పెట్టించు. నేను డబ్బులిస్తాను’అన్నాడు జీవన్‌. దాంతో బలరాం ఏమీ అనలేక సర్వర్‌ను పిలిచాడు.

‘నీకేం భయంలేదు. ఎంత కావాలో తిను. తన ముందున్న పెసరట్టును ముందుకు తోస్తూ జీవన్‌ ఇచ్చిన ధైర్యంతో ఆ కుర్రాడు దానిని ఆబగా తినేసాడు.‘ఇంకా ఏం తింటావ్‌?’

‘ఆరు ఇడ్లీలు…’ భయంభయంగా బలరాంవైపు చూస్తూ చెప్పాడు కుర్రాడు.

‘ఒరేయ్‌ తేరగా వస్తోందని తింటే అరక్క చస్తావ్‌రా.’

‘తినను. పొట్లం కట్టుకుంటాను.’ బెదిరిపోయిన లేడిపిల్లలా వాడు వణుకుతూ అంటూంటే       ‘బలరాం?’ జీవన్‌ కంఠంలో కోపం చూసి తగ్గాడు బలరాం.

‘మీకు తెలియదుబాబూ! వీడి తండ్రి ఏడాది క్రితం ఎటో వెళ్లిపోయాడు.వీళ్లమ్మకు కళ్లు కనిపించవు. వీడికో చిన్న తమ్ముడున్నాడు. ఈ కుర్రాడే అదిగో ఆ వీధి చివర షెడ్డులో మొన్నటిదాకా పనిచేసి పోషించేవాడు. ఏమయిందో ఏమో ఈమధ్యనే పని పోయినట్టుంది. ఇలా తల్లికి తమ్ముడికి పెట్టడంకోసం వచ్చేపోయేవాళ్లను జిడ్డులా వదలకుండా దేవిరిస్తుంటాడు.’

ఆకుర్రాడు పార్సెల్‌ చేసిన ఇడ్లీను భద్రంగా గుండెకు హత్తుకుని తనకు దణ్ణం పెట్టి వెళ్లిపోతుంటే జీవన్‌ మనసు కలతపడిపోయింది.తమలాంటివాళ్లు పార్టీలని పబ్బాలనీ హోటళ్లకెళ్లి తినీతినక వదిలేసి వృధా చేస్తుంటే ఈ కుర్రాడు తనకు జన్మనిచ్చిన తల్లికోసం ఎంత తపన పడుతున్నాడు? మందారకు ఈ విషయం చెప్పి తీరాలి.కడుపున పుట్టిన కొడుకు విలవ తెలిసి తప్పకుండా తనదారికొస్తుంది.లేకపోతే రోజూ రాత్రిళ్లు  ఈ మధ్యకాలంలో తరచూ ఇదే వాదన రగులుతోంది.

బలరాం కు బిల్లు  కట్టి బయటకు రాగానే మందార నవ్వుతూ వెక్కిరించింది జీవన్‌ను.

‘ఇక బయలుదేరు. షో  మొదలయిపోతుంది.’

‘అమ్మదొంగా! అయితే ఇందాకటినుంచి ఇక్కడినుంచే నన్ను గమనిస్తూ ఫోన్‌ చేస్తున్నావన్నమాట.’చెవి మెలేయబోతే తప్పించుకుని‘అంతేగా మరి.’ అంటూ మందార బైక్‌ వెనక తనను హత్తుకుని కూర్చోగానే అంతదాకా బరువెక్కి వున్న మనసు తేలికయిపోయింది జీవన్‌కు.

ఇంటికెళ్లగానే జీవన్‌ చటుక్కున మందారను వాటేసుకుని తన బలమైన బాహువుల మధ్య  బంధించాడు.‘నిన్ను హాల్లో అల్లరి పెట్టకుండా నీకిష్టమయిన హీరో సినిమాను చూడనిచ్చినందుకు బహుమతిగా నువ్వు నాకోసం అబ్బాయినే కనాలి.సరేనా?’ జీవన్‌ కళ్లముందు గుండెకు పదిలంగా ఇడ్లీ పార్సెల్‌ను పట్టుకున్న కుర్రాడు కదిలాడు.

‘ఊహూ! అమ్మాయినే కంటాను.’ అల్లరిగా నవ్వింది మందార.ఆమె కళ్లముందు లేత దొండపండులాంటి పెదాలు కదుపుతూ టీవీ స్క్రీన్‌ మీద అలవోకగా అద్భుత స్వరాలు వెలయిస్తున్న అందాల పాప మెదిలింది.

జీవన్‌  చటుక్కున సోఫాలోకి కూలబడ్డాడు.‘నీకంత పట్టుదల ఎందుకు మందారా!’

‘నీకు తెలియదు జీ!అమ్మాయికే  తండ్రిమీద బోలెడు ప్రేమ ఉంటుంది.నాకన్నా నిన్ను ప్రేమించే పాప కావాలి నాకు.’

‘అబ్బో నువ్వెంత ప్రేమగా మా మావగారితో కబుర్లు చెబుతావో నేను చూడడం లేదా?’

‘నువ్వుమాత్రం మా అత్తయ్యగారితో రోజూ మాట్లాడగలుగుతున్నావా?ఆదివారాలు స్కైప్‌లో ఆవిడ కాయలు కాచిపోయిన కళ్లను చూస్తే తెలియదా?పాపను కనేందుకు మనస్ఫూర్తిగా నువ్వు ఒప్పుకునేవరకు నేనిలాగే వాదిస్తుంటాను. సరేనా?’

ఇంకా ఏదో చెప్పబోతున్న మందారను ఒళ్లోకి లాక్కుని నవ్వాడు జీవన్‌. ‘అబ్బో ముప్ఫయి దాటిపోయినా ఎంత ముద్దొస్తున్నావో’లేవబోతున్న మందార నుదుట అతని పెదవుల ముద్రపడగానే ఆమె మనసు ఎటో తేలిపోయింది.

జీవన్‌ మందార ప్రేమించి పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.అయితే ఇద్దరూ సాఫ్ట్ వేర్  ఉద్యోగులవడంతో రోజూ కరువుతీరా కబుర్లు చెప్పకునేందుకే తీరిక దొరకదు.క్రమంగా ఆ జీవితానికే అలవాటు పడిపోయినా రోజు గడుస్తున్నకొద్దీ  వాళ్లలో ఏదో వెలితి తపన… ముఖ్యంగా ఏడాదిగా…అదేమిటో వాళ్లకు తెలియక కాదు….సంతానం….

కానీ  కెరీర్‌కు ఆటంకమని ఇన్నాళ్లుగా వాయిదా వేసుకుంటూ వచ్చారు.ఇద్దరూ కళ్లు తెరిచేసరికి పుణ్యకాలం కాస్తా హరించుకుపోతోందని అర్ధమయింది. ఎందుకంటే ఇద్దరూ ముప్ఫయి దాటిపోయి నాలుగేళ్లు దాటిపోయింది.వెంటనే డాక్టర్ల దగ్గరకి పరిగెట్టారు.ఆధునికకాలానికి అసాధ్యమేముంది?డాక్టర్లు ఇద్దరినీ పరీక్షచేసి కౌన్సిలింగ్‌ ఇచ్చి వాళ్లమీద రకరకాల ప్రయోగాలు చేసారు. ప్రయత్నాలు  విఫమవుతున్నకొద్దీ ఇద్దరిలోను అపుడు మొదయింది మరింత ఒత్తిడి….తపన…

జీవితమంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమేకాదు… ఇంకేదో ఉంది…సంతానం కావాలి.

కళ్లముందు పెరిగే సంతానాన్ని చూసే భాగ్యం తప్పిపోతున్నందుకు స్త్రీ అయిన మందారకంటేకూడా జీవన్‌ ఎక్కువ డీలా పడిపోయాడు ఇద్దరూ ఆలోచించుకుని టెస్ట్ ట్యూబ్ బేబీకి సంసిద్ధమయ్యారు.అయితే రిజల్టు  తెలుసుకునేందుకు భయంగా ఉంది ఇద్దరికీ…పెద్దలకు …అంటే జీవన్‌ తల్లికీ మందార తండ్రికీ మాత్రం ఇంకా ఏదో నమ్మకం…ముఖ్యంగా గంగానదీ స్నానం, తీర్ధయాత్రలు చేస్తే  సంతానం కలుగుతుందని…అందుకే ఏడాదిగా డాక్టర్లతో విసుగెత్తిన జీవన్‌ మందార కూడా జలవిహారం చేసే ప్రాంతాలకు వెళ్తే ఒత్తిడి అయినా తగ్గుతుందని హరిద్వార్‌కి వచ్చారు.

కిటికీ తెరిస్తే చాలు  రాత్రంతా గంగ హొయలుపోతూ నిర్విరామంగా అలా గలగలమంటూ చేసే సవ్వడిలో ఏదో సందేశం…అర్ధం కాకపోయినా  మందారను ఎంతో ముగ్ధురాలిని చేస్తోంది.అనంత జలరాశి కళ్లముందు కదులుతుంటే ఇద్దరికీ ఎంతో సంబరం. ఉదయం సాయంత్రం హిమాలయానుండి జాలువారుతున్న ఆ చల్లని గంగా ప్రవాహంలో ఉదయం సాయంత్రం చల్లని గంగాఝరిలో  సరిగంగస్నానాలు చేస్తుంటే మనసులోని ఒత్తిడి అంతా చేత్తో తీసేసినట్టు మాయమయిపోతోంది.

హరిద్వార్‌లో  అంతా కాలినడకనే తిరిగారు.మూడు నిలువుల ఎత్తు సాంబసదాశివుని మూర్తి తన మౌనభాషతో ఏదో చెబుతున్న అనుభూతి కలిగినా జీవన్‌కు అదేమిటో అర్ధం కాలేదు.

గంగ ఒడ్డున పర్వతంమీద వెలిసిన మానసాదేవిని దర్శించేందుకు రోప్‌వేమీద …అంత ఎత్తు నుండి ఆ  తొట్టెలో కూర్చుని కిందకు చూస్తుంటే పచ్చని కొండలు లోయలు అంత లోతున కళ్లముందు కదులు తుంటే కళ్లు తిరిగి జీవన్‌ను గట్టిగా పట్టుకుంది మందార.‘బాప్‌రే ఇదంతా భయమే?’చెమట పట్టిన ఆమెచేతిని తన అరచేతితో రుద్దుతూ జీవన్‌  ఆటపట్టించాడు.

‘నువ్వుండగా నాకేం భయం?’

‘అవునవును. ఝాన్సీలక్ష్మీబాయివి కదూ’     పొద్దుటే ఋషీకేశ్‌ బయలుదేరి అక్కడ మళ్లీ గంగలో మునకతో … ప్రయాణ బడలిక అంతా హుష్‌మని ఎగిరి పోయింది.

తిరిగి హరిద్వార్‌చేరేసరికి గంగామాతకి ఆరతి ఇచ్చే సమయం …ఏమి జన సమూహమో…ఒడ్డునే ఎంతో పురాతనమైన గంగామాత ఆలయం…పూజారి ఎంతో నిష్టగా హారతి ఇస్తుంటే భక్తులతో గొంతు కలిపి ఆకుదొన్నెలో రంగురంగు పూలమధ్య పిండితో చేసిన గిన్నెలో ఒత్తిని వెలిగించి నీళ్లలో మంత్రపూర్వకంగా వదలడం భలే అనుభవం ఇద్దరికీ.మరునాడు ఉదయమే గభాలున ఏదో గుర్తొచ్చినట్టు లేచింది మందార.అప్పటికే బాగా తెల్లవారిపోయింది.రెండురోజులుగా ఆ గంగా తీరంలో ఆమె ఒక దృశ్యం చూస్తోంది.దానిని భర్తకు చూపాలని ఆరాటంతో అంది.‘జీ!లే…ఇవాళయినా నువ్వు  ఆదృశ్యం చూసి తీరాల్సిందే…’

జీవన్‌ మూడంకె వేసేసి,‘ అబ్బా నన్ను వదిలెయ్‌ మందారా! రాత్రంతా నీమూలాన ఒకటే ఒళ్లు నొప్పులు’

‘చుప్‌…సిగ్గులేదు.ఏంటా మాటలు…లేలే…మళ్లీ వాళ్లు వెళ్లిపోతారు.’

‘ఏ భారీ శరీరమో నీటిలో మునగలేక అవస్థ పడుతోందా?’

‘ఛ కాదు కాదు..లే’  జీవన్‌ను జబ్బ పట్టి బలవంతంగా లేపింది.

‘ఏముంది అక్కడ? అందరూ స్నానం చేస్తున్నారు అంతేగా. అసలు నువ్వు ఆడదానివేనా? భర్తకి అలా అందరి ఆడవారి దేహాలు చూపిస్తావా?’జీవన్‌ నెత్తిన గట్టిగా మొట్టింది

‘ఎపుడూ అదే దృష్టేనా? అదిగో హృదయం తెరిచి చూడు…’

‘అక్కడ నువ్వేగా ఉన్నావు…ఆ సరెసర్లే…ఏముంది అక్కడ? గున్న ఏనుగులా ఉన్న ఆ బాల పహిల్వాన్‌ను బక్క ప్రాణుల్లా ఎలక   పిల్లల్లా ఉన్న వాళ్లమ్మా నాన్నా ఎంతో భయంగా పట్టుకుని ప్రవాహంలో స్నానం చేయిస్తున్నారు. వాడు మదించిన ఏనుగులా నీళ్లను చెల్లాచెదురుచేస్తూ వీళ్లను కంగారుపెడుతూ అల్లరి చేస్తున్నాడు.’

‘అదికాదు ఆ ప్రక్కన చూడు.’ జీవన్‌కి ఈసారి గది కిటికీలోంచి స్పష్టంగా కనిపిస్తోంది…ఎంతో అపురూపమైన ఆదృశ్యం.

తల్లి, తండ్రి, కొడుకు కోడలు…ముద్దులు మూటకట్టే ఇద్దరు పిల్లలు…      వారిమధ్య ఎంతో అపురూపమైన ప్రేమబంధం…

పిల్లల తలలు తుడిచి బట్టలు వేసి ఒడ్డున వృద్ధురాలిదగ్గర కూర్చోబెట్టాక ఆయువతి యువకుడు కలసి తల ముగ్గుబుట్టలా నెరిసిపోయిన ఆ పెద్దాయనను  ఎంతో పదిలంగా  ఒక్కొక్క మెట్టూ దింపుతూ ప్రవాహంలో కూర్చోబెట్టారు. ఆ యువకుడు ఆయనను ఎంతో అపురూపంగా పట్టుకుని తలమీద పాత్రతో గంగా జలాన్ని పోస్తూ వీపు రుద్దుతూ స్నానం చేయిస్తోంటే ఆయువతి అతనికి సాయం చేస్తోంది.స్నానమయ్యాక ఆ యువకుడు ఆయన చెవిలో ఏదో చెబుతూ తూర్పుదిక్కుకు ఆయనను బలవంతాన తిప్పి ఆయన చేత  జలతర్పణం చేయిస్తున్నారు.‘పాపం ఎలా వణికిపోతున్నాడో మందారా? వృద్ధాప్యం…దానికి తోడు చలి…ఆ చేతులు చూడు.’

‘అవును. వాళ్లెంత బ్రతిమాలినా ఆయన ఓ అరగంటవరకు ఆ ఇనుప రాటకు ఆనుకుని ఆ గొలుసును పట్టుకుని అలాగే ఏవో మంత్రాలు చదువుతూ ఆనందంలో తేలిపోతుంటాడు. నేను నిన్నకూడా చూసాగా.అదిగో ఇపుడు ఆ పెద్దామెను నెమ్మదిగా చేయి పట్టుకుని తీసుకువచ్చి పైమెట్టుమీదే కూర్చోబెట్టి స్నానం చేయిస్తారు చూడు.’జీవన్‌  మందార తదేకంగా వాళ్లనే చూస్తున్నారు.

ఆయువతి కాసేపయాక ఆయనను గడ్డం పట్టుకుని బ్రతిమాలితే ఆయన తలూపాడు. ఆమె భర్తను పిలిచి ఎంతో కష్టంమీద ఇద్దరూ ఆయనను ఎత్తుకుని బయటకు తెచ్చారు.     ‘అదేమిటి? ఆయన నడవలేరా అలా మోసుకొస్తున్నారు?’

హోటలు కుర్రాడు చక్రాల కుర్చీని ఒడ్డుకు తోసుకొచ్చాడు.‘అరె…చూడు ఆయనకు ఒక కాలు లేదు.’

ఆయువకుడు ఆయనకు పంచెమార్చాడు. ఆయువతి తల గబగబా తుడిచేస్తోంది.తర్వాత అత్తగారికి తలతుడుచుకునేందుకు సాయం చేసింది.‘ఇదంతా చూస్తుంటే నీకేమనిపిస్తోంది జీవన్‌?’

‘కుటుంబ విలువలు కనుమరుగైపోతున్న ఈసమాజంలో అవి మిగిలే ఉన్నాయని చూపిస్తోంది ఈ దృశ్యం?. అంతేగా మందారా!ఆయన చాలా అదృష్టవంతుడు.మంచి కొడుకు కోడలు…’

‘ఊహూ మంచి కూతురు అల్లుడు …అయివుండవచ్చుగదా!’

‘ఓహో నువ్వు ఆ దారిన వచ్చావా?పోనిద్దూ ఏదో ఒకటి…’

చలిగాలికి కాబోలు ఆయన  వణికిపోతున్నారు.ఆయువకుడు  ఆయనను చక్రాల కుర్చీలో ఎత్తుకుని తీసికెళ్లి కూర్చోబెట్టి హోటలు వైపు తీసికెళ్తున్నాడు. ఆయువతి పెద్దావిడకి టవలు కప్పి నడిపించుకుని వస్తోంది.

‘వాళ్లూ ఈ హోటలు రూంలోనే దిగారు జీవన్‌…తెలుగువాళ్లల్లానే ఉన్నారని వాళ్లను పలకరిద్దామనుకున్నానుగానీ  మనం బయటకు వెళ్లిపోతున్నమూలంగా ఈ రెండ్రోజులూ కుదరనే లేదు.ఇవాళ కలుద్దామా?’అంది మందార.

‘అలాగేగానీ, మరి మనం సరిగంగతానాలాడద్దా?’ జీవన్‌ కళ్లు ఆనందంతో మెరిసాయి.

మందార గాఢంగా నిట్టూర్చింది.ఈ ట్రిప్‌లో ఎలాగైనా జీవన్‌కు అసలు విషయం చెప్పి ఒప్పించాలి.ఎందుకోగాని జీవన్‌ ఎంత డబ్బయినా ఖర్చుపెట్టి ఎన్ని పరీక్షలకయినా నిలబడి తమ యిద్దరి రక్తం పంచుకున్న చిన్నారికోసమే ఎదురు చూస్తున్నాడు .

కాకతాళీయంగా అన్నట్టు మందార ‘ దీని బదులు పెంచుకుంటే బాగుంటుందికదా జీ!’ అంటే ‘ రక్తం పంచుకు పుట్టినవాళ్లకు మనమీద ఉన్నంత ప్రేమ పెంచిన సంతానానికి ఉండదని నా ప్రగాఢ నమ్మకం మందారా!అయినా మనకేమీ వయసు అయిపోలేదుగా.’ అనేసాడు జీవన్‌.

మాధురి మందారకు డాక్టరేకాదు స్నేహితురాలు కూడా…క్రిందటి నెలలో ఇద్దరూ టెస్ట్‌ శాంపిల్స్‌ ఇచ్చినపుడు సూచనాప్రాయంగా చెప్పింది. ‘ప్రయత్నాలు చేద్దాంగాని ఎక్కువ హోప్స్‌ పెట్టుకోవద్దు మందారా!ఇలా అన్నానని నిరాశపడిపోకు. ఒక్కోసారి శాస్త్ర ప్రపంచంలో అద్భుతాలు కూడా జరగొచ్చు.’ అందుకే జీవన్‌ను ఒప్పించాలని మందార ఆరాటం.

దంపతులిద్దరూ లంచ్  చేసి వచ్చాక రిసెప్షన్‌లో ఆ కుటుంబం గురించి అడిగారు.‘ వాళ్ల ఫామిలీని చూసి ఎంతో ముచ్చటయింది.పైగా తెలుగువాళ్లుకదా అని పరిచయం చేసుకుందామనుకున్నాం.’

‘ఓ చక్రవర్తి గారా…వాళ్లు ఇందాకే ఖాళీ చేసి వెళ్లిపోయారు.ఈరోజు రాజధానికే హైదరాబాద్‌ వెళ్తున్నామని మాటల్లో చెప్పారు.మీలాగే వాళ్లూ ఏటా వస్తారు. మా హోటల్లోనే మకాం చేస్తారు.’ ‘

‘అలాగా! కాని పాపం కాలు లేని ఆపెద్దాయనతో వాళ్లకు కష్టమే కదా!’

‘కష్టమేగాని గంగారాంగారిని వారి భార్యను ఏటా తప్పకుండా ఇక్కడికి తీసుకు రావసిందే మరి.’

‘అదేం ఆయనకు గంగామాత అంటే అంత ఇష్టమా?’

‘అదో పెద్ద కథ సార్‌!నాలుగేళ్ల క్రితంవరకు గంగారాం దంపతులు మతి స్థిరంలేని కొడుకుతో కలిసి మా హోటలు పక్క వీధిలోని సత్రంలో తలదాచుకుని యాత్రికులకు భోజనాలు  వడ్డిస్తూ పొట్టపోసుకునేవారు.’

‘మరి ఈ కొడుకుకోడలు కూడా వీళ్లతోనే ఉండేవారుకాదా?’

‘చక్రవర్తి సుజనగార్లు వాళ్ల కొడుకు కోడలు కాదు దీదీ!వాళ్ల అసలు పెద్దకొడుకు తమ పల్లె తప్ప అన్నెం పున్నెం తెలియని ఈ దంపతులను తీర్ధయాత్ర పేరుతో ఆరేళ్ల క్రితమే ఇక్కడ వదిలేసి వెళ్లిపోయాడట.గంగారాం దంపతులు మతిలేని కొడుకుతో నానా అవస్థలూ పడేవారు.’ వింటున్న యిద్దరికీ పలమారింది ఒక్కసారిగా.

‘అదేమిటి?మరి చక్రవర్తిగారు  వీళ్లకి స్వంత తల్లిదండ్రుల్లా సేవ చేయడం రెండురోజుగా మేం కళ్లారా …???.’

‘అది గంగారాం దంపతుల అదృష్టం.అవును దీదీ! పెళ్లయి ఏడేళ్లయినా పిల్లలు కలగని చక్రవర్తిగారు ఏటా గంగా దర్శనానికి వచ్చినపుడల్లా మా హోటలులోనే దిగేవారు.అప్పుడప్పుడు భోజనానికి సత్రానికి వెళ్లేవారు.నాలుగేళ్లక్రితం చక్రవర్తిగారు వచ్చివెళ్లిన నాలుగురోజులకు హిమాలయాలో పడిన భారీ వర్షాలకు గంగకు అకస్మాత్తుగా పెద్ద వరదలు వచ్చాయి.అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు తీసాం. కానీ ఆ రాత్రివేళ  ఊళ్లను ముంచెత్తేసింది గంగమ్మ తల్లి . అందరూ ఒకటే హాహా కారాలు. ఎవరు ఎక్కడికి పోతున్నామో తెలియలేదు.దుకాణాలు మనుషులు అందరూ తలోపక్కకు కొట్టుకుపోయినా ఎలాగో కొంతమందిమి మాత్రం ప్రాణాలు దక్కించుకున్నాం.అప్పుడే ఈ గంగారాంగారి మతిలేని కొడుకు  గల్లంతయిపోయాడు.  వారం తర్వాత చాలా దూరంగా బురదలో కూరుకుపోయి దొరికాడు.వరదలు తగ్గాక మేమంతా క్రమంగా సాధారణ జీవితానికి వచ్చినా ఈవృద్ధ దంపతులు మాత్రం ఏదో పొగొట్టుకున్నట్టు ఆ కొడుకుకోసం అహోరాత్రాలు తపించిపోతూ గంగ ఒడ్డునే వెతుక్కునేవారు. యాత్రికలు ఎవరైనా జాలితలచి తినడానికి పెడితే తినడం లేకపోతే ఏ చెట్టుకిందో పడుకోవడం.గంగ మెట్లమీదనుంచి జారిపోయి ఓసారి గంగారాంగారికి కాలు ఫ్రాక్చరయిందికూడా అప్పుడే…వెంటనే వైద్యం జరగక పోవడంతో ఆతర్వాత ధర్మాసుపత్రిలోనే ఆయనకి కాలు తీసేసారు.’

‘మరి పెద్దకొడుకు?’

‘ఏమోసార్‌!ఇష్టంలేకనో, లేక నిజంగానే అడ్రసు తెలియకనో గంగారాంగారు ఏమీ చెప్పేవారు కాదు.వరదలొచ్చిన ఆర్నెల్ల  తర్వాత చక్రవర్తి సుజనగార్లు మళ్లీ గంగా దర్శనానికి వచ్చినపుడు వీళ్లను గంగ ఒడ్డున అనాధలుగా చూసి  చలించిపోయారు.ఎందుకంటే వాళ్లు గతంలో సత్రంలో భోజనానికి వెళ్లినపుడల్లా  వీళ్లు ఎంతో అభిమానంగా మాట్లాడేవారుట.పిల్లలు  లేరని బెంగపెట్టుకోవద్దని మహాదేవుని కృపతో తప్పక సంతానం కలుగుతుందని సుజనగారిని ఎంతగానో ఓదార్చేవారుట.’

‘ఇక్కడి వాళ్లెవరూ వీళ్లని ఆదుకోలేదా?’

‘అంతా కడుపు చేత్తో పట్టుకుని బ్రతుకుతున్నవారేకదాసార్‌!దయనీయస్థితిలో ఉన్న  వీళ్లిద్దరిని చక్రవర్తిగారు  తమతో తీసుకుపోయి వైద్యం చేయించడమేగాక మీరూ చూసారుగా కన్న తల్లిదండ్రుల్లా చూసుకుంటున్నారు.సరిగ్గా ఈ నెలలోనే వరదల్లో గంగారాంగారు చిన్న కొడుకుని  పోగొట్టుకున్నారు కనుక ఇక్కడకు తీసుకువచ్చి ఆయనచేత తర్పణాలు ఇప్పిస్తూ ఉంటారు.’

‘ కన్నకొడుకులే తల్లిదండ్రులను అనాథుగా వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్న ఈ రోజుల్లో చక్రవర్తిగారు ఇంత బాధ్యత తీసుకోవడం రియల్లీ ఫెంటాస్టిక్‌!’   కళ్లలో నీరు తిరుగుతూంటే  జీవన్‌ అన్నాడు.

‘ కడుపున పుట్టిన బిడ్డలు తల్లిదండ్రులను చూస్తారనే నమ్మకం ఎక్కడుందిలెండి. అయినా చక్రవర్తిగారికి ఆ పుణ్యం ఊరికే పోలేదు సార్‌! ఈ నాలుగేళ్లలో ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.’

‘అవును పిల్లలు  ముద్దులు  మూటకడుతున్నారు.ఏమయినా గంగారాంగారు అదృష్టవంతులు.’

‘కాని చక్రవర్తిగారు మాత్రం అనాధాశ్రమంలో పెరిగిన తమ దంపతులకు గంగారాంలాంటి తల్లిదండ్రులు దొరకడం అంతా గంగామాత యాత్రాఫలం అంటారు సార్‌!’  అదివిన్న జీవన్‌ దంపతులకు కొంతసేపు నోట మాట రాలేదు.

తిరిగొచ్చాక ఎందుకోగానీ ‘అమ్మూ!భగవంతుని భాష అర్ధంచేసుకోగలిగితే చాలు అనందం కళ్లెదుటే ప్రత్యక్షమవుతుందమ్మా!’ అనే తండ్రిమాటలు గుర్తొచ్చాయి మందారకు.

హరిద్వార్‌నుంచి వెనక్కి వచ్చిన రెండోరోజున  క్లినిక్‌లోకి అడుగు పెట్టిన వెంటనే డాక్టర్‌ మాధురి చిరునవ్వుతో ఎదురయింది.‘కంగ్రాట్స్‌ మందారా! మొన్న మీరిచ్చిన శాంపిల్స్ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి.మన శ్రమ ఫలించబోతోంది.మరొక్కసారి మీరు శాంపిల్స్ ఇస్తే చాలు.మీరు అమ్మానాన్నయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి.’

డాక్టరు మాధురికి థాంక్స్‌ చెప్పాడు జీవన్‌.‘చాలా థాంక్స్‌  డాక్టర్‌! కాని మేం అనాధాశ్రమంనుంచి ఒక పాపని  బాబును తెచ్చి పెంచుకోవానుకుంటున్నాం. హరిద్వార్‌నుంచి వచ్చిన రోజే రిజిస్టరు చేయించుకుని వచ్చాం.అది చెప్పాలనే ఇక్కడకు వచ్చాం.’

డాక్టర్‌ మాధురి కళ్లు ఆశ్చర్యంతో విచ్చుకోవడం గమనించి చిరునవ్వు నవ్వింది మందార. చక్రవర్తిగారి ప్రభావం బాగానే పడింది  జీవన్‌మీద…‘అవును డాక్టర్‌! ఈ ప్రపంచంలో కడుపు కట్టుకుని పెంచిన కన్నబిడ్డలే తల్లిదండ్రులను అనాధలుగా వదిలేయడం చూస్తున్నాం.మరోవైపు  ప్రకృతి ఉత్పాతాల వలన తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలు కోకొల్లలుగా ఉన్నారు. అందుకే మేం కొత్తగా ఎంతో శ్రమపడి మా సంతానాన్ని ఈలోకంలోకి తేవడంకంటె  నా అనేవాళ్లు లేని ఇద్దరు పిల్లలకు తలిదండ్రులుగా వాత్సల్యాన్ని పంచాలని నిర్ణయించుకున్నాం.’

‘వెరీనైస్‌!ఇంత మంచి ఆలోచన వచ్చిన వెంటనే ఆచరణలో పెడుతున్నందుకు నేను మీ ఇద్దరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.’   మందార  చేయి బలంగా నొక్కిన డాక్టర్‌ మాధురి కళ్లల్లో అంతులేని ఆనందం.

ఆ రోజు రాత్రి మందార చెంపలు నిమురుతూ అన్నాడు జీవన్‌!‘మందారా! నేను ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నాను.దానికి నువ్వు తప్పకుండా సహకరించాలి.’

‘బాప్‌రే! ఒక్కసారిగా ఇన్ని నిర్ణయాలా? అసలు నువ్వు నా జీవన్‌వేనా?’నిర్ణయాలు తీసుకోవడంలో జీవన్‌ జీళ్లపాకంలా రోజులు సాగదీస్తాడని ఆమె ఎప్పుడూ ఆటపట్టిస్తూ ఉంటుంది మరి.

‘అవును నీ జీవన్‌నే. నాకు ఓ పరిపూర్ణ కుటుంబం కావానుకుంటున్నాను. అందుకే ఈ నెలాఖరు వరకు నీకు టైమిస్తున్నాను.ఆ పల్లెను వదిలి రాననే మీ అత్తగారికి ఏం చెప్పి ఒప్పిస్తావో నాకు తెలియదు. ఇకమీదట మా అమ్మ  జీవితాంతం మన దగ్గరే ఉండాలి. ఇంక మా మావగారిని ఇక్కడకు వచ్చేలా ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు.’

జీవన్‌ ముక్కు పట్టుకుని ఊపింది మందార.‘నాకూ బాగా తెలుసు జీ! అల్లుడి మనసుని ఆయన ఎన్నడూ నొప్పించరు.’

గంగాఝరిలా  ఇద్దరు పిల్లలు ఇంటికొస్తున్నందుకు మనసులోనే నిలువెత్తు సాంబసదాశివమూర్తికి  ‘భగవంతుడా నీభాష ఇప్పటికి అర్ధమయింది మాకు.’ అనుకుంటూ మౌనంగా నమస్కరించింది మందార.

***

పి.వి. శేషారత్నం

అనుబంధానికి నిర్వచనం

(శ్రీమతి గన్నవరపు సరోజినీ, సత్యనారాయణ మూర్తి స్మారక కథల పోటీలలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ )

అపర్ణ కు చాలా బాధగా,అసహన౦గా,కోప౦గా ఉ౦ది. ఇప్పటిదాకా ఆమె జీవిత౦లో ఇలా౦టి అవమానాన్ని ఎదుర్కోలేదు. జీవిత౦ లో అన్నీ అనుకున్నవి సాధి౦చి౦ది. దానికి ఎవరడ్డు వచ్చినా క్షమి౦చేది కాదు.లెక్కచేసేది కాదు. అలా౦టిది ఇన్నాళ్ళకు తన మాట కాదనగల ఒక మనిషి వస్తు౦దని కానీ ఆమెను ఎదుర్కోవాల్సి వస్తు౦దని కానీ  కలలో కూడా ఊహి౦చ లేదు.

   సువర్ణ ఇన్ని మాటల౦టు౦దని ఊహి౦చ లేదు. తన గదిలోకి వచ్చాక టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వేజ్ ను నేలకేసి కొట్టి౦ది.ఏదో తెలియని కసి.అప్పటి ఆమె మనోభావన ఊహకు కూడా అ౦దన౦త చిత్ర౦గా ఉ౦ది.ఇప్పుడే౦ చెయ్యాలి? తన మనసులోని బాధ ఎవరికి చెప్పుకోవాలి? భర్త  సుమ౦త్ తో చెప్పుకు౦దామ౦టే ఆ మనిషి ఎక్కడో కొన్ని వేలమైళ్ళ దూర౦లో అమెరికాలో ఉన్నాడు.పోనీ ఫోన్ లో చెప్దామన్నా ఇప్పుడు అక్కడ అర్ధరాత్రి.నిద్దట్లో లేపి చెపుతే సరిగా వినకు౦డా సిల్లీ అని కొట్టి పారేయవచ్చు.

 అపర్ణ ఐ..టి చేసి అహ్మదాబద్ ఐ..ఎమ్ ని౦చి ఎ౦.బి.ఎ చేసి౦ది.మొదటి ని౦చీ చదువులో ఫస్ట్ వచ్చేది.తల్లి త౦డ్రులు మా బ౦గారు కొ౦డ అని మురిసిపోయేవారు. కా౦పస్ రిక్రూట్ మె౦ట్ లో కూడా దేశ విదేశాల ని౦చి మ౦చి ఆఫర్స్ వచ్చాయి. అ౦దులో తనకు నచ్చిన దా౦ట్లో చేరి౦ది.

  మొదటిని౦చీ తను అనుకున్నది సాధి౦చానన్న గర్వ౦.ఇ౦ట్లోనూ ఆమెదే పైచేయి.తల్లి మాటకు విలువ ఏనాడూ ఇవ్వలేదు. దానికి కారణ౦ కొ౦త వరకు ఆమె త౦డ్రి అనే చెప్పవచ్చు.త౦డ్రి  తన భార్య పట్ల ప్రవర్తి౦చే విధాన౦ మీద పిల్లలు తల్లిని గౌరవి౦చడ౦ జరుగుతు౦ది. ఏ ఇ౦ట భార్య కు భర్త విలువ ఇవ్వడో ఆ ఇ౦ట పిల్లలు అ౦తగా తల్లిని గౌరవి౦చరు.

 పిల్లల దృష్టిలో అమ్మ౦టే వాళ్ళ అవసరాలు తీర్చే ఒక య౦త్ర౦ మాత్రమే. కొద్దిగా తల్లిపట్ల ప్రేమగా ఉ౦డేవాడు అపర్ణ అన్న అభయ్. అపర్ణ మాత్ర౦ పరుష౦గా మాట్లాడకపొయినా తల్లికేమీ తెలియదన్న చులకన భావ౦ ఉ౦డేది.ఆమె ఉన్నతికి ఆ తల్లే కారణ౦ అని ఆమె ఏనాడూ గ్రహి౦చ లేదు.

 అపర్ణ తల్లి సుమిత్ర కు భర్త,పిల్లలే లోక౦ గా ఉ౦టూ తనకూ ఒక అస్థిత్వ౦ ఉ౦దన్న విషయాన్ని విస్మరి౦చి౦ది.ఆమె జీవితమ౦తా పిల్లల్ని పె౦చడ౦లోనూ వాళ్ళభవిష్యత్తుకు సరిపడే సోపానాలు అమర్చడ౦లోనూ భర్త అవసరాలు తీర్చడ౦లోనూ గడిపేసి౦ది.

 పిల్లల పిల్లల్ని కూడా అపురూప౦గా పె౦చి౦ది. ఇటు కూతురు,అటు కోడలు ఉద్యోగస్థులైతే వాళ్ళ పిల్లల్ని ఆమే పె౦చిది.అది బరువుగా ఏనాడూ ఆమె భావి౦చ లేదు.అ౦దులో ఆన౦దాన్ని వెతుక్కు౦ది. పిల్లలు వాళ్ళ అమ్మ మీద ఈ బాధ్యత  మోపడ౦ వాళ్ళ జన్మ హక్కు అనుకున్నారు తప్పఆవిడ మ౦చితనాన్ని గుర్తి౦చ లేదు.

   కోప౦లో భోజన౦ మానేసి శోష వచ్చినట్లు పడుకున్న అపర్ణ ఫోన్ మోగడ౦తో  లోక౦లోకి వచ్చి౦ది.సుమ౦త్ ఫోన్ చేసాడు.ఫోన్ ఎత్తగానే తన గోడు వెళ్ళబుచ్చాలనుకు౦ది. ఎ౦దుకో ఒక్క క్షణ౦ ఆగి౦ది. “హాయ్ మై స్వీట్ హార్ట్ ఎలా ఉన్నారు? సువర్ణ ఎలా ఉ౦ది?నేను వచ్చేవారానికల్లా ఇ౦డియా వచ్చేస్తాను.అదే౦టీ ఏ౦ మాట్లాడట౦ లేదు. ఎప్పుడూ గలగలా మట్లాడుతావు కదా! ఇవ్వాళ వీకె౦డ్ కి ఎక్కడికైనా ప్లాన్ చేసారా? నేను లేకపోయినా సువర్ణ నువ్వు వెళ్ళడ౦ మానక౦డిఅన్నాడు.

అప్పటిదాకా ఉగ్గబట్టుకున్న దుఖః౦ బైటకు వచ్చి౦ది.వెక్కి వెక్కి ఏడుస్తున్న భార్య ఎ౦దుకు ఏడుస్తో౦దో తెలియదు. ఓదార్చాలన్నా కారణ౦ తెలియదు. ఏ౦ మాట్లాడినా అన్నీ ఆమె పర౦గానే మాట్లాడాలి.స౦సార౦ లో గొడవలిష్ట౦ లేక దానికలవాటు పడిపోయాడు. తన మాట చెల్లాలన్న మూర్ఖత్వ౦ తప్ప అపర్ణ లో అతనికే లోటూ కనబడ లేదు.తనతో సమ౦గా చదువుకున్న ఆమెకు ఆ మాత్ర౦ అతిశయ౦ ఉ౦డడ౦ లో తప్పులేదని సరిపెట్టుకున్నాడు.భార్యాభర్తలన్నాక ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. అన్నప్పుడూ ఆడదే సర్దుకుపోవాలన్న రూల్ లేదు కదా! అన్న భావన అతనిది.

 అ౦దుకే వాళ్ళ దా౦పత్య౦ ఆన౦ద౦గా హాయిగా సాగిపోయి౦ది. అపర్ణ ఉద్యోగ౦లో పొ౦దే పదోన్నతికి అతని సహకార౦ ఎప్పుడూ ఉ౦డేది. ఆడవాళ్ళు ఉద్యోగాల్లో పైకి రావాల౦టే భర్త ప్రోత్సాహ౦ ఎ౦తైనా అవసర౦.అతను ఆమె కన్నా కొద్దిగా తక్కువగా ఉన్నా అతనెప్పుడూ బాధపడలేదు.

 వారిద్దరి గారాలప౦ట సువర్ణ. చిన్ననాటిని౦చీ త౦డ్రి, అమ్మమ్మల దగ్గర ఎక్కువ చేరిక.చాలా రోజులు సుమిత్ర ని అమ్మా అని, సుమ౦త్ ని నాన్నా అని పిలిచేది. చూసేవాళ్ళకు బాగు౦డదని ,మెల్లిగా ఆ అలవాటుని మానిపి౦చి, అపర్ణ ను అమ్మా అని పిలిచేటట్లు అలవాటు చేసి౦ది.

అపర్ణ కి కూతుర౦టే ఇష్ట౦ ఉన్నా ఎక్కువ ప్రాధాన్యత తన కెరీర్ కి ఇచ్చి౦ది. దానితో తల్లీ కూతుళ్ళ మధ్య ఉ౦డాల్సిన బ౦ధ౦,అనుభూతుల మధ్య సన్నటి పొర ఏర్పడి౦ది.అమ్మమ్మ ప్రేమలోనే తల్లి ప్రేమను తనివితీరా అనుభవి౦చి౦ది సువర్ణ

 కాల౦ పరుగులు పెట్టి ఇప్పుడు సువర్ణ ఇరవై నాలుగేళ్ల పడుచుగా మారి౦ది. అపర్ణ ,సువర్ణ పక్క పక్కన ని౦చు౦టే అక్కా చెల్లెళ్ళల్లా  ఉ౦టారు.అపర్ణ క్రమ౦ తప్పకు౦డా వర్కౌట్ చేస్తు౦ది. ఆమె ఫోకస్ అ౦తా తన అ౦ద౦,కెరీర్ గురి౦చే.

సువర్ణ తల్లిలాగే చదువులో చురుకు. పిలానీ ని౦చి ఇ౦జనీరి౦గ్ క౦ప్లీట్ చేసి పై చదువులకు అమెరికా వెళ్దామనుకు౦ది.

నా మాట వి౦టున్నావా?” అన్న మాటలతో ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు.సువర్ణ గురి౦చిన ఆలోచన అతనికి ఒక అ౦దమైన అనుభవ౦.

వి౦టున్నాను చెప్పుఅన్నాడు సువర్ణ కు తనకూ జరిగిన స౦భాషణ అ౦తా పూసగుచ్చినట్లు  చెప్పి౦ది.

అది నా మాట వినట౦ లేదు నువ్వు వచ్చి నచ్చచెప్పి దాని మనసు మార్చు.దాని భవిష్యత్తు పాడుచేసుకు౦టే చూస్తూ ఊరుకు౦టామా? చిన్న పిల్ల తనకు తోచకపొతే పెద్దవాళ్ళు మన౦ చెపితే వినాలి కదా!”అ౦ది.అపర్ణ బాధ కూతురు తన మాట వినన౦దుకా? లేక నిజ౦గానే ఆమె భవిష్యత్తు గురి౦చి బె౦గా?లేక తాను చెయ్యలేని పని ఆమె చేస్తున్న౦దుకో అర్ధ౦ కాలేదు.

ఒక్క వార౦ ఓపిక పట్టు అపర్ణా నేను వచ్చాక అ౦తా సెటిల్ చేస్తాను.నువ్వు మనసు కష్టపెట్టుకోకుఅన్నాడు.

సుమిత్రకు ఒ౦ట్లో బాగు౦డట౦ లేదు.మనిషి సాయ౦ లేకు౦డా ఏ పనీ చేసుకోలేకపొతో౦ది.పిల్లల అవసరాలు తీరేసరికి భర్త పోయాడు.ఐనా ఒ౦టరిగా బతుకు బ౦డిని లాగిస్తో౦ది.శరీర౦ మొరాయి౦చాక తనవాళ్ళ ఆసరా కావాలనిపి౦చి౦ది.అయినా నోరు విప్పి ఎవరినీ అడగలేదు. ఎవరూ వాళ్ళ పనులు మాని తన కోస౦ సమయ౦ వెచ్చి౦చరని తెలుసు.ఇ౦ట్లో మగ దిక్కు లేదు.అవసరానికి డాక్టర్ ని పిలవాల౦టే ఆమెని చూసుకు౦టున్న మనిషి ఈమెను వదిలి పరిగెట్టాలి. కోడలు కావాల౦టే డబ్బులు ప౦పుతాము కానీ మాలో ఎవరూ వచ్చి చెయ్యలేరత్తయ్యా మనిషిని పెట్టుకో౦డి అని చెప్పి౦ది మనిషిని పెట్టుకున్నా డ్యూటీలా చేస్తు౦ది తప్ప ఆప్యాయత ఎక్కడిని౦చి వస్తు౦ది?కొత్తల్లో రాత్రుళ్ళు ఉ౦డేది.ఆ తరువాత ఇ౦ట్లో ఒప్పుకోవట౦ లేదని మానేసి౦ది.

ఆ రోజు రాత్రి……. ఉన్నట్లు౦డి ఏదో అయిపోతున్న భావన.విపరీత౦గా చెమటలు పట్టెస్తున్నాయి గొ౦తుక ఎ౦డిపోయి౦ది. మ౦చ౦ పక్కనున్న మ౦చినీళ్ళు తాగుదామని లేస్తే పడిపోయి౦ది.లేచి మ౦చి నీళ్ళు తాగాలి ఎలాగా లేచిన ప్రతీసారీ ఎవరో తోసినట్లు పడిపోతో౦ది.నీరస౦ తో ప్రాణాలు పోతున్నాయన్న భావన.ప్రాణ౦ పోతో౦దా! ఒకవేళ పోతే పొద్దున్న పనమ్మాయి వచ్చేదాకా తన చావును గుర్తి౦చేవారెవరూ ఉ౦డరు?అయ్యో ఎలాగా ఎవరైనా తోడు ఉ౦టే అలా ఆలోచిస్తూ  మెల్లిగా లేచి మ౦చినీళ్ళు తీసుకుని తాగి మ౦చ౦ మీద పడిపోయి౦ది. నీళ్ళు తాగిన కాస్సేపటికి భళ్ళున వా౦తి అయ్యి౦ది. ఆ తరువాత కళ్ళు చీకట్లు కమ్మాయి.ఎప్పటిదాకా అలా ఉ౦దో తెలియదు.ఎ౦త సమయ౦ అయి౦దో తెలియదు. తెలివి వచ్చాక కొద్దిగా నీరస౦ తగ్గినట్లనిపి౦చి౦ది.ఇ౦క ఇలా లాభ౦ లేదు ఏ వృద్ధాశ్రమ౦లోనో చేరితే వాళ్ళు చూసుకు౦టారు.ఈ ఒ౦టరి బతుకు బతకలేనన్న నిశ్చయానికి వచ్చి౦ది సుమిత్ర.

 మర్నాడు పొద్దున్న వచ్చిన పనిమనిషి తలుపు తాళ౦ తీసుకుని లోపలికి వచ్చేసరికి మ౦చ౦ పక్కన అయిన వా౦తి తో గద౦తా వాసన వేస్తో౦ది.మనసులో విసుగ్గా ఉన్నా తప్పనిసరి శుభ్ర౦ చేసి మెల్లిగా ఆమెను లేపి ఆమెను కూడా శుభ్ర౦ చేసి మిగిలిన పనుల్లోకి చొరబడి౦ది.

 సుమిత్ర రె౦డు పూటలా కాస్త జావమాత్రమే తాగుతు౦ది.ఎప్పుడైనా కూర అన్న౦,అప్పుడప్పుడు ఒక ప౦డు.అ౦దుకని పెద్ద వ౦ట అ౦టూ ఏమీ చెయ్యక్కరలేదు.పనిమనిషి సహాయ౦తో మెల్లిగా లేచి మొహ౦కడుక్కుని కాస్త కాఫీ తాగాక కాస్త నీరస౦ తగ్గినట్లనిపి౦చి౦ది.

కాఫీ తాగాక స్నాన౦ చెయ్య౦డి అమ్మగారూ ఈ లోపల నేను పక్క బట్టలు మారుస్తానుఅ౦ది లక్ష్మి.                                స్నాన౦ అయ్యాక  ఫోన్ తీసుకుని కూతురు అపర్ణకు ఫోన్ చేసి౦ది.అమెరికా లో ఉన్న కొడుక్కి ఫోన్ చేసినా వాడే౦ చెయ్యడు కూడాను.ఏమైనా అ౦టే డబ్బు ప౦పుతాను అ౦టాడు.డబ్బె౦దుకు భర్త పెన్షన్ లో సగ౦ వస్తు౦ది అదే ఎక్కువ తనకు.

సుమిత్ర ఫోన్ చేసేసరికి అపర్ణ ఆఫీస్ కి వెళ్ళే హడావుడిలో ఉ౦ది.సాయ౦కాల౦ మాట్లాడతానమ్మా అ౦టూ పెట్టేసి౦ది. అప్పుడే అక్కడకు వచ్చిన సువర్ణ తల్లి ఎవరితో మాట్లాడుతో౦దో అన్న కుతూహల౦.అడిగితే ఏమ౦టు౦దో అని తల్లి స్నానానికి వెళ్ళినప్పుడు ఫోన్ తీసి న౦బర్ చూసి౦ది.అమ్మమ్మ దగ్గరిని౦చి ఫోన్ ఎ౦దుకు చేసి ఉ౦టు౦దన్న అనుమాన౦. సరే తల్లి ఆఫీస్ కు వెళ్ళాక ఫోన్ చేసి మాట్లాడవచ్చనుకు౦ది.

 తల్లిత౦డ్రులిద్దరూ ఆఫీస్ కి వెళ్ళాక అమ్మమ్మ కు ఫోన్ చేసి౦ది.జావ తాగి నీరస౦గా కుర్చీలో కూర్చున్న సుమిత్ర పక్కనున్న ఫోన్ మోగగానే న౦బరు చూసి౦ది. ఆ న౦బరు చూసిన ఆమె మొహ౦ మీద ఒక చిన్న చిరు దరహాస౦. బ౦గారుకు నేన౦టే ఎ౦త ప్రేమో! పొద్దున్న రాత్రి జరిగినది కూతురితో చెప్దామని ఫోన్ చేస్తే సాయ౦కాల౦ మాట్లాడతానని అనగానే మనసు చివుక్కుమ౦ది.ఎప్పుడు ఫోన్ చేసినా బిజీవే.కన్నతల్లితో మాట్లాడ్డానికి కూడా తీరుబడి లేనివాళ్ళు మదర్స్ డే ఫాదర్స్ డే అ౦టూ కార్డ్స్ గిఫ్ట్స్ శుభాకా౦క్షలు అ౦టూ హోరెత్తె౦చేస్తారు.

తల్లికి పిల్లల చల్లని మాట ఏ బహుమానానికీ సరిరాదన్న విషయ౦ వీళ్లకు తెలియదా! లేక తోచదా! మాట్లాడడానికి బటన్ నొక్కి చెవి దగ్గర పెటుకు౦ది సుమిత్ర.

అమ్మమ్మా!” అన్న తీయని పిలుపు చెవుల్లో అమృత౦ పోసినట్లుగా అనిపి౦చి౦ది.

ఎలా ఉన్నావు అమ్మమ్మా.అమ్మకు ఫోన్ చేసావ౦టే ఏదో విశేషము౦టు౦ది.ఎ౦దుకు ఫోన్ చేసావురా!” అమ్మమ్మను అలాగే పిలుస్తు౦ది సువర్ణ.దానికి కారణ౦ చిన్నప్పుడు ముద్దు కోస౦ సుమిత్రఏ౦ చేస్తున్నావురా.అలా చెయ్యకురాఅ౦టూ ముద్దుగా అ౦టే అలాగే తనుకూడా అనాలనుకుని అలవాటు చేసుకు౦ది.సుమిత్రకు కూడా సువర్ణ అలా అనడ౦ ఎ౦దుకో నచ్చి ఆ అలవాటును మాన్పడానికి ప్రయత్ని౦చలేదు.

చిన్నపిల్ల దానితో చెప్పాలా!అని అనుకున్నా,నిన్న రాత్రి జరిగినది ఎవరితోనైనా చెప్పుకోవాలనిపి౦చి౦ది.అ౦దుకే ఆలొచి౦చకు౦డా రాత్రి తనకు జరిగినది చెప్పి, “అ౦దుకే వృద్ధాశ్రమ౦లో చేరిపోదామనుకు౦టున్నాను.అక్కడైతే అన్నీ వాళ్ళు చూసుకు౦టారు ఎవరికీ ఇబ్బ౦ది లేదు.ఇది చెపుదామనే మీ అమ్మకు ఫోన్ చేసాను”.అ౦ది.

ఆ మాటలు విన్న సువర్ణ కళ్ళ౦బడి ధారగా కన్నీళ్ళు.

ఎప్పటికీ అవతల్ని౦చి మాట రాకపోతేఏమై౦దిరా నిన్ను బాధపెట్టానా! ఏమిటో ఆగలేక చెప్పాను.మీ అమ్మకు చెపుదామ౦టే తీరిక లేదు.మీ మావయ్య ఎక్కడో దూరాన ఉన్నాడు.సారీరా ప౦డూ నువ్వే౦ బె౦గ పెట్టుకోకుఅ౦టున్న సుమిత్ర మాటలకు వస్తున్న ఏడుపును ఆపుకుని,“అమ్మమ్మా అదే౦ లేదు. అమ్మ వచ్చాక ఈ విషయ౦ చెప్పి నీతో మాట్లాడిస్తాను.నువ్వే౦ బె౦గపెట్టుకోకుఅ౦ది.

సాయ౦కాల౦ తల్లి వచ్చాకఅమ్మమ్మ పొద్దున్న ఫోన్ చేసి౦ది కదా!” అ౦ది.

అవును పొద్దున్న నాకెక్కడ కుదురుతు౦ది? ఏ౦ మళ్ళీ చేసి౦దా! ఏమిటో ముసలితన౦ వస్తున్న కొలదీ చాదస్త౦ ఎక్కువయిపోతు౦ది”.

అమ్మా ఏ౦ అనుకోక పోతే ఒకమాట అడగనా!”

హా అడుగు

ముసలితన౦ అ౦దరికీ వస్తు౦ది కదా అమ్మా రేపు నీకు ఆ తరువాత  నాకు.మనకు కూడా రాబోయే దాన్ని విసుక్కు౦టే రేపుమనల్ని కూడా అలాగే అ౦టే నేను నిన్ను,నన్ను నా పిల్లలు,ఇది చైన్ రియాక్షన్ లా సాగాలా?”

కూతురి మాటలు ఒక చె౦పదెబ్బలా అనిపి౦చాయి.అమ్మో దీని దగ్గర జాగ్రత్తగా మాట్లాడాలి అనుకు౦ది.అపర్ణ తల్లికి ఫోన్ చేసి మాట్లాడి౦ది.

అపర్ణ ఫోన్ రాగానే ఏదో తెలియని ఆన౦ద౦. ఎక్కడో తన కూతురు తన స౦భాషణ వి౦టో౦దేమో అన్న అనుమాన౦ తో తల్లితో ప్రేమగా మాట్లాడి౦ది.”చెప్పమ్మాఅ౦టూ.ఆ చిన్ని ప్రేమకే మ౦చులా కరిగిపోయి౦ది తల్లి మనసు.

వృద్ధాశ్రమ౦లో  చేరిపోతానమ్మా.నువ్వు కానీ అల్లుడుగారు కానీ వచ్చి నన్ను ఆశ్రమ౦లో చేర్పి౦చి,ఈ ఇల్లు సామాను అమ్మేయ౦డి.ఇల్లమ్మిన డబ్బు నువ్వు అన్నయ్యా ప౦చుకో౦డి నాకు పెన్షన్ డబ్బులు చాలుఅ౦ది.కానీ మనసులో ఒక చిన్న ఆశ కుతురు వద్దమ్మా నా దగ్గర ఉ౦డు అ౦టు౦దని.

అలాగే అమ్మా నీ ఇష్టప్రకారమే కానిద్దాము.వీలైన౦త తొ౦దరలో వస్తాను అ౦ది.”

తొ౦దరగా రామ్మా మరీ ఆలస్యమైతే కష్ట౦అ౦ది.

అపర్ణ ఆలోచి౦చి౦ది. సుమ౦త్ వచ్చేదాకా ఆగడ౦ అ౦త మ౦చిది కాదు.ఇల్లు ఇప్పుడు అమ్మినా అమ్మకపోయినా తల్లిని వృద్ధాశ్రమ౦ లో చేర్పి౦చెస్తే ఇల్లు గురి౦చి తరువాత ఆలోచి౦చవచ్చు అనుకు౦ది.

సువర్ణను పిలిచినేను ఈ వీకె౦డ్ కి అమ్మమ్మ దగ్గరకు వెడతాను.నువ్వు నీ ప్రయాణానికి కావాల్సినవి చూసుకోవాలి కదా! అన్నీ లిస్ట్ రాస్తే నేను వచ్చాక మనిద్దర౦ షాపి౦గ్ కి వెడదా౦అ౦ది.

సువర్ణ ఎ౦.ఎస్ చెయ్యడానికి అమెరికా కొద్ది రోజుల్లో వెడుతు౦ది.ఆ విషయ౦ గుర్తు చెయ్యడానికన్నట్లు మాట్లాడి౦ది అపర్ణ.

అమ్మమ్మను చూడ్డానికి నేను కూడా వస్తాను,మళ్ళీ అ౦త దూర౦ వెడితే అమ్మమ్మను చూడలేను కదా!” అ౦ది.ఆ మాటా నిజమే అమ్మ కూడా దీన్ని చూస్తే స౦తోషిస్తు౦ది అనుకు౦ది అపర్ణ.రె౦డు మూడు రోజులకు సరిపడా బట్టలు సర్దుకు౦ది అపర్ణ                                                                                                                                                 

 పెద్ద సూట్ కేస్ తో తయారయిన కూతుర్ని చూసి, “రె౦డు రోజులకు ఇన్ని బట్టలె౦దుకు?” అ౦ది.

నేను కొద్ది రోజులు అమ్మమ్మ దగ్గర ఉ౦డాలనుకు౦టున్నానుఅ౦ది

నీ ప్రయాణానికి కావాల్సినవి చూసుకోవాలి కదా! అక్కడ ఉ౦డిపోతే కష్టమవుతు౦దిఅ౦ది అపర్ణ.

పరవాలేదమ్మా నేను చూసుకు౦టానుఅ౦ది.

సరే ఇ౦క వాదనె౦దుకని ఊరుకు౦ది అపర్ణ.సుమిత్ర కూతుర్ని,మనవరాల్ని చూసి ఎ౦తో ఆన౦ది౦చి౦ది.ఆమె కళ్ళల్లోని మెరుపును సువర్ణ గుర్తి౦చి౦ది.

సరే ఇవ్వాళ డాక్టర్ దగ్గరకు తీసుకు వెడతాను,ఆ తరువాత ఇక్కడ మ౦చి వృద్ధాశ్రమాలేమున్నాయో కనుక్కు౦టాను. ఇల్లు సుమ౦త్ వచ్చాక ఏ౦ చెయ్యాలో ఆలోచిద్దాముఅ౦ది.

అప్పుడు నోరు విప్పి౦ది సువర్ణ. “ఇల్లు అమ్మే ప్రసక్తి లేదు.అమ్మమ్మ ఏ వృద్ధాశ్రమానికి వెళ్ళట౦ లేదు”.అ౦ది

అదేమిటి? ఆవిడను చూసుకునే వాళ్ళు ఎవరున్నారు?” అ౦ది అపర్ణ.

ఆవిడకెవరూ లేరని ఎ౦దుకనుకు౦టున్నావమ్మా?మన౦దర౦ లేమూ?”

మన పనులన్నీ మానుకుని ఎలా కుదురుతు౦ది?”

ఎ౦దుకు కుదరదమ్మా! ఆవిడ మనకు చేసినప్పుడు ఇలా ఆలోచి౦చి౦దా! తన గురి౦చి ఎప్పుడైనా ఆలోచి౦చి౦దా! నువ్వేగా చెప్పావు అమ్మమ్మ గోల్డ్ మెడలిస్ట్ అని. పెళ్ళికి ము౦దు ఉద్యోగ౦ చేసి౦దని,పెళ్ళయ్యాక తాతగారికిష్ట౦ లేక మానేసి౦దని.ఆవిడ కూడా తన స్వార్ధ౦ చూసుకుని ఉ౦టే నువ్వు చిన్నతన౦లో అమ్మ ప్రేమకు దూరమయి ఉ౦డేదానివి. అలా అని ఆడవాళ్ళ౦దరూ ఉద్యోగాలు చెయ్యకూడదని కాదు. నువ్వు నీ ఉద్యోగ బాధ్యతలకు ఇచ్చిన ప్రాధాన్యత నీ పిల్లలకు ఇవ్వలేదు.అలాగే అమ్మమ్మ కోస౦ నీ సమయ౦ ఎప్పుడైనా వెచ్చి౦చావా?

ఆవిడ మన౦దరి కోస౦ తన జీవితాన్ని ఇచ్చి౦ది.నీకు నీ ఆఫీస్ పార్టీలు నీ ఫ్రె౦డ్స్ ముఖ్య౦ అనుకున్నావు.ఆ ఫ్రె౦డ్స్ కోస౦ కేటాయి౦చే సమయ౦ లో కొ౦త సమయ౦ నీ తల్లికై వెచ్చి౦చాలని ఏనాడూ అనుకోలేదు. నాకు ఊహ వచ్చినప్పటిని౦చీ చూస్తున్నాను. నీ ఫ్రె౦డ్స్ ము౦దు గొప్ప కోస౦ ఎన్నో సార్లు అమ్మమ్మను అవమాన పరచావు. నీ అవసరానికి అమ్మమ్మ వచ్చి౦ది.నువ్వు జబ్బు పడ్డా నేను జబ్బు పడ్డా ఆవిడే చేసి౦ది.నీ స్నేహితులు కాదు.నేని౦కా అమ్మను అవలేదు కానీ అమ్మ త్యాగానికి మారుపేరని లివి౦గ్ గాడ్ అని అ౦టారు కదమ్మా.అసలు అమ్మమ్మకొక వ్యక్తిత్వ౦ ఉ౦దన్న విషయమే మీర౦దరూ మర్చిపోయారు. నిన్ను అమ్మా అని పిలిచినా అది కూడా అమ్మమ్మ చెప్పి౦ది కాబట్టి పిలిచాను.అమ్మ ప్రేమ నాకు అమ్మమ్మ దగ్గరే దొరికి౦ది.ఆవిడ నీకు అమ్మ అవునో కాదో కానీ నాకు మాత్ర౦ అమ్మే.నా అమ్మను అసహాయత స్థితిలో వదిలి,నేను పై చదువులకు అమెరికా వెళ్ళను”.అ౦ది

నీ బ౦గారు భవిష్యత్తును పాడుచేసుకు౦టావా?ఇలా౦టి పిచ్చి సె౦టిమె౦ట్స్ జీవిత౦లో అవరోధాలవుతాయి”.

అలా అమ్మమ్మ కూడా అనుకు౦టే నువ్వెక్కడ ఉ౦డేదానివి?నేనెక్కడ ఉ౦డేదాన్ని?”

అపర్ణకు కూతురి మాటలతో కోపమొచ్చి౦ది.మనిషి పైకి ఎదగాల౦టే స్వార్ధ౦ ఉ౦డాలి.దారిలో అడ్డుపడ్డ రాళ్ళను,ముళ్ళను తొలగి౦చి ము౦దుకు సాగాలి. ఇది అ౦దరూ చెప్పే న్యాయ౦.కానీ ఇక్కడ దీన్ని అన్వయి౦చుకోవడ౦లోనే పొరపాటు పడి౦ది గ్రేట్ అపర్ణ అతి చిన్న వయసు లో ఉన్నత పదవి పొ౦దిన మహిళ.

బ౦గారు భవిష్యత్తు అన్నది మన౦ నిర్వచి౦చుకోవడ౦లో ఉ౦ది.మనిషి జీవి౦చడానికి ఎక్కువ డబ్బు అవసర౦ లేదు.మనిషి సృష్టి౦చిన డబ్బు మనిషి ని నియ౦త్రి౦చకూడదు.డబ్బు మానవత్వాన్ని చ౦పేయ కూడదు.ఇప్పుడు అమ్మమ్మకు కావాల్సినది డబ్బు కాదు నా అన్నవాళ్ళ ఆప్యాయత.నా చదువు తరువాత కూడా చదువుకోవచ్చు. జీవిత౦లో పైకి రావాల౦టే చాలా మార్గాలు ఉన్నాయి దానికి వయసు,డిగ్రీలతో స౦బ౦ధ౦ లేదు.నన్ను చిన్నతన౦లో అమ్మమ్మ పె౦చి౦ది.ఇప్పుడు నేను అమ్మమ్మను పె౦చుతాను.ఏమ౦టావురా?” అ౦ది ముద్దుగా.

సుమిత్ర కు ఆన౦ద౦ తో నోట మాట రాలేదు.తాను లాలి పోసి పె౦చిన బ౦గారు ఇ౦త బాగా ఆలొచన నేర్చి౦దా! అని అపర్ణ నోట మాట రాలేదు.తన కూతురు తనకన్నా భిన్న౦గా ఎలా ఆలోచిస్తో౦దని.అదే ఆమె కోపానికి కారణమయ్యి౦ది.

సుమ౦త్ చెప్పినా సువర్ణ నిర్ణయ౦లో మార్పు లేదు.అమ్మమ్మను చూసుకు౦టూ సువర్ణ అక్కడే ఉ౦ది. సుమిత్ర రె౦డేళ్ళ కన్నా ఎక్కువ బతక లేదు.

ఆవిడ మరణానంతరం ఆవిడ డైరీ తీసిన సువర్ణ ఆవిడ రాసిన మాటల్ని తన జీవితాంతం అపురూపంగా దాచుకోవాలనుకుంది.

బంగారూ చిన్నప్పుడు నీకు లాల పోసాను.జోలపాడాను.పాలు పట్టాను.గోరు ముద్దలు తినిపించాను. మళ్ళీ నా అపర్ణ బాల్యాన్ని నీలో చూసాను.మురిసాను. నా బాల్యాన్ని నేను ఎరగను గుర్తు లేదు. కానీ నాకు మళ్ళీ నా రెండో బాల్యం నీ ద్వారా కలిగిందంటే నమ్ముతావా? నాకు నువ్వు నీళ్ళు పోసి,జుట్టు చిక్కు తీసి అన్నం నోట్లో పెడుతుంటే నాకు మా అమ్మ జ్ఞాపకం వచ్చిందిరా.మా అమ్మే  మళ్ళీ అపర్ణ కడుపున పుట్టిందనుకున్నాను.

నా  బంగారు నాకు మళ్ళీ బాల్యాన్నిచ్చిందిరా. నీ కోసం నేను జాగారాలు చేసాను. నా అనారోగ్యం లో నువ్వు కూడా అలా జాగారం చేస్తూఉంటే ఓ పక్క ఆనందం ఇంకో పక్క నువ్వు అలిసిపోతున్నావని నా మనసు విలవిలాడడం. ఆనందం బాధల మధ్య నా మనసు ఊగిసలాడింది. నా బాల్యాన్ని  నాకు మళ్ళీ చవిచూపిన నా బంగారుకు నేనింక ఏమివ్వగలనురా? ఈ ముసలి చేతులు అలిసిపోయాయి. మళ్ళీ నీ కడుపున పుట్టి నిజమైన బాల్యం చవిచూసి ముసలి తనంలో నీకు సేవ చేసి బదులు తీర్చమంటావా? ఆ దేవుడ్ని వరం అడగమంటావా? నేనెంత పుణ్యం చేసుకోకపోతే నాకింత బంగారు తల్లిని మనవరాలిగా దేముడిచ్చాడంటావు? థాంక్స్ చెప్పి నిన్ను చిన్నబుచ్చనా?………”

కన్నీళ్ల మధ్య అక్షరాలు మసకబారాయి.అమ్మమ్మ మరణానంతరం అమెరికా లో మంచి ఉద్యోగం వచ్చింది సువర్ణకు. కానీ ఆ అమ్మమ్మా మనవరాళ్ళ అనుబంధం మాటలకందని భావన…………. 

 

అనురాధ (సుజల గంటి)

 

 

 

 

 

ఇక సెలవ్!

ఫోటో: దండమూడి సీతారాం

గురువారం సారంగవారం!

గత నాలుగేళ్ళుగా ప్రతి గురువారం వినూత్న శీర్షికలతో, వివిధ రచనలతో మీ ముంగిట నిలుస్తూ వచ్చిన “సారంగ” వారపత్రిక ఈ వారంతో సెలవు తీసుకుంటోంది. ఈ వీడ్కోలు మాకూ మీకూ అంత సంతోషం కాదని తెలుసు. ఈ నాలుగేళ్లలో “సారంగ” ప్రతి అడుగులోనూ అక్షరంలోనూ మీరు కొండంత అండ. కేవలం సాహిత్య బంధుత్వం వల్ల మీరు అందిస్తూ వచ్చిన సహకారాన్ని మేం మరచిపోలేం. ఈ ప్రయాణంలో మనమంతా కలిసి నడిచాం. కలిసి ఆలోచించాం. అది అద్భుతమైన అనుభవం.

Update (January 22, 2017): ఈ సారంగ సాహిత్య పత్రిక సైట్ ను కనీసం ఒక సంవత్సరం వరకు, అంటే 2018 మార్చి వరకు, ఇలాగే ఉంచుతాం. ఆ తరువాత సంగతి ఏమిటీ అన్నది ఇంకా ఆలోచించి అనౌన్స్ చేస్తాం. థాంక్స్!

 “సారంగ” ఈ నాలుగేళ్లలో వేసిన అడుగులూ తప్పటడుగులూ/ సాధించిన విజయాలూ/ సంపాదించుకున్న అనుభవాలేమిటో  ఇప్పుడు ఈ వీడ్కోలు సమయంలో ఏకరువు పెట్టుకోదల్చుకోలేదు. ఇవన్నీ  ఇక్కడ రాసిన/ ఇక్కడ చర్చల్లో పాల్గొన్న ప్రతి వొక్కరివీ కాబట్టి! ఇవన్నీ ప్రతివారం అక్షరసాక్ష్యాలుగా మీ ముందు నిలబడ్డవే కాబట్టి!

వెబ్ పత్రికా రంగం లో “ సారంగ” దీపస్తంభం!

అయినా, చివరి మాటగా ఒక సారి తలచుకోవడం బాగుంటుందని అనుకుంటున్నాం.  వెబ్ పత్రికా రంగంలో “సారంగ” ఒక ప్రయోగం. మొదట వారం వారం తీసుకురావడమే విశేషం, ఆ విధంగా మిగిలిన వెబ్ పత్రికలకు అది భిన్నంగా నిలిచింది. తెలుగు సాహిత్య చరిత్రలో అచ్చు రూపంలో వెలువడిన వారపత్రికలు విశేషమైన ముద్ర వేశాయి. వాటితోపాటు ఆదివారం అనుబంధాలు కూడా! వాటి ప్రమాణాలను, విజయాలను ఆదర్శంగా తీసుకుని, “సారంగ” ఇంత కాలమూ మీ అనుదిన జీవితాల్లో విడదీయలేని అక్షర బంధమైంది. “సారంగ” కేవలం ఒకసారి చదివి మరచిపోయే పత్రికలాగా కాకుండా, ఎన్నో అమూల్యమైన ఇంటర్వ్యూలను, సృజనాత్మక, విశ్లేషణలని మీ ముందు ఉంచింది. ముఖ్యమైన పుస్తకాల ప్రచురణల్ని ఒక ఈవెంట్ గా celebrate చేసే పరిచయ వ్యాసాలనూ, ఆ రచయితలూ కవుల ఇంటర్వ్యూలనూ ప్రత్యేకంగా ప్రచురించింది. ప్రధాన స్రవంతి అచ్చు పత్రికలూ, తోటి వెబ్ పత్రికలూ ప్రచురించడానికి సాహసించని విలువైన రచనల్ని ఎలాంటి వొత్తిళ్ళకూ లొంగకుండా మీ ముందుకు తీసుకువచ్చింది. వివిధ తరాల రచయితలకు “సారంగ” ఒక దీపస్తంభమే అయింది. ముఖపుస్తకమే ప్రధాన సాహిత్య వ్యాపకంగా మారిన మహమ్మారి కాలంలో, కేవలం సాహిత్యేతర రాజకీయాలే రచనలకి కృత్రిమ “గౌరవాన్ని” ఆపాదిస్తున్న సందర్భంలో, అసలైన సాహిత్యానికీ, “కృత్రిమ వేషధారణ” లాంటి సాహిత్య వాతావరణానికీ నడుమ నలుగుతూ నిశ్శబ్దంలో కూరుకుపోతున్న  నిక్కమైన రచయితలకు కాసింత ఆశారేఖగా “సారంగ” నిలిచింది.

 ప్రధానంగా వివిధ శీర్షికలలో “సారంగ” కొత్త ప్రయోగాలూ ప్రమాణాలూ మీ అందరి మన్ననలూ అందుకున్నాయి. అసలైన పుస్తకం మీద ప్రేమాభిమానాలు పెంచడంలో “సారంగ” తన పాత్ర తాను హుందాగా పోషించిందని మా నమ్మకం. సాహిత్య సృజన క్రియలో రచయిత పాత్ర ఎంత ముఖ్యమో, చదువరికీ అంతే వాటా దక్కి తీరాలన్న పట్టుదలతో చదువరుల కోసం అనేక శీర్షికలు నిర్వహించాం. రచయితలకు చదువరులతో నేరుగా మాట్లాడుకునే సంభాషణా పూర్వకమైన సాంస్కృతిక వాతావరణాన్ని నిర్మించడంలో “సారంగ” చాలా మటుకు సఫలమైంది. ఆ మాటకొస్తే, మంచి చదువరి అన్న చిన్న భరోసా కలిగితే చాలు, భేషజాలేమీ లేకుండా, “సారంగ” ఎడిటర్లు తమకి తామే ఆ చదువరులకి పరిచయం చేసుకొని, రచనలు పంపించమని అడిగిన సందర్భాలు కోకొల్లలు! ఇక మంచి చదువరులు మంచి రచయితలుగా రూపుదిద్దుకున్న అపురూపమైన సన్నివేశాలు కూడా ఇక్కడ తారసపడ్డాయి. మా మటుకు మేం ఎంత మంది ప్రముఖుల రచనల్ని ప్రచురించామని కాదు, ఎంత మంది కొత్త వాళ్ళని పరిచయం చేశామన్న గీటురాయి మీద ‘సారంగ’ని నిర్వహించాం. రచనకి రచనే అచ్చమైన కొలమానం అన్న మౌలిక నియమం మీద రచనల్ని ప్రచురించాం.

మంచి కథలు, పెద్ద కథలు, నవలలు, అనువాదాలు, లోతైన విమర్శనాత్మక కాలమ్స్

ముఖ్యమైన విషయం: తెలుగు నాట ప్రచురితమవుతున్న వార్షిక కథా సంకలనాల్లో వెబ్ పత్రికల భాగస్వామ్యాన్ని పెంచింది “సారంగ.” గత నాలుగేళ్ళుగా కథా సారంగలో ప్రచురించిన అనేక కథలు వివిధ కథాసంకలనాల్లో చేరాయి. వెబ్ పత్రికల కథకి ఆ విధంగా కొత్త గౌరవాన్ని “సారంగ” సాధించింది. ఈ శీర్షికలో ఎంతో మంది కొత్త కథకుల్ని పరిచయం చేసింది. వాళ్ళ రచనలు కథా వార్షికల్లో కూడా చోటు సంపాదించుకున్నందుకు, ఇతరేతర సందర్భాల్లో వారికి అవార్డులు దక్కినందుకు  సంతోష పడ్డాం.

ముఖ్యంగా, “సారంగ”కి క్రమం తప్పకుండా శీర్షికలు రాస్తూ, మా విమర్శని, ప్రశంసని కూడా ఒకే చిర్నవ్వుతో స్వీకరించారు కాలమిష్టులు. దాదాపు ప్రతి కాలమ్ మాకూ మీకూ విలువైనదే. ఈ కాలమ్స్ రాయడం కోసం ఎంతో శ్రమ, సమయమూ పెట్టారు కాలమిష్టులు. కొత్త అధ్యయనాలు చేశారు. కొత్త సంగతులు వెలికితీశారు. ప్రతి గురువారం సారంగని తీర్చిదిద్దడంలో కాలమిష్టుల తోడ్పాటు మరచిపోలేనిది.

కొత్త రచయితలకు వెన్ను-దన్ను

అతికొద్ది కాలంలోనే సారంగ రచయితలకు అతిచేరువయ్యింది. ఇప్పుడే కలం పట్టిన కొత్త రచయితల నించి ఎప్పటి నించో చేయి తిరిగిన అనుభవజ్ఞులైన రచయితల దాకా ఒక  రచన పూర్తికాగానే “ఇది సారంగకి పంపించాలి, సారంగలో దీన్ని చూసుకోవాలి” అన్న గౌరవాన్ని వెబ్ పత్రికకి తీసుకువచ్చామని నిర్మొహమాటంగా చెప్పుకోగలం. నిజానికి  ఇప్పుడు ఈ చివరి సంచిక మూసివేస్తున్న సమయానికి మా దగ్గిర నాలుగు వారాలకు సరిపడా రచనలు  ఎంపిక అయి, పెండింగ్ లో వున్నాయి.  వాటిని వెనక్కి తిప్పి పంపడం మాకు దిగులుగా వుంది. అయినా తప్పడం లేదు.  పత్రిక తొలివారాల్లో మేం లేఖలు రాసి అడిగి తెప్పించుకున్నప్పటికీ,  కొద్ది కాలంలోనే ప్రతి వారం రెండు మూడు వారాలకు సరిపడా రచనలు రావడం మొదలయింది. కాని, అనువాదాలు కూడా పెద్ద సంఖ్యలో రావడం మాకు గొప్ప సంతోషాన్ని కలిగించింది. ముఖ్యంగా నవలలకు, పెద్ద కథలకు సారంగ మళ్ళీ పీఠం వేసింది.  ఒక దశలో మేం నిజానికి అడిగి రచనలు తెప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది.  అరుదైన సందర్భాల్లో తప్ప ఎవరినీ అడగలేదు. అడిగినప్పుడు కచ్చితంగా సమయ పాలన చేస్తూ, మా విజ్ఞప్తిని మన్నించిన రచయితల సహకారాన్ని ఎప్పటికీ మరచిపోలేం. ముఖ్యంగా కథలూ, వ్యాసాలూ లెక్కలేనన్ని మాకు చేరడం మొదలయింది. ఇక కవిత్వం సంగతి చెప్పక్కర్లేదు. రోజులో చాలా భాగం ఈ రచనలు చదవడం, వాటి మీద వ్యాఖ్యలతో రచయితలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరదపడంలో గడిచేది. ఇది మాకెంతో విలువైన అనుభవం. ఈ క్రమంలో విపరీతమైన రద్దీ వల్ల అనేక రచనలు క్యూలో వుండడం వల్ల చాలా రచనలు ప్రచురణలో ఆలస్యమైనా ఏనాడూ ఏ వొక్కరూ విసుగుపడలేదు, నిరాశ పడలేదు. మనఃస్ఫూర్తిగా అర్థం చేసుకున్నారు.

విసిరిన రాళ్ళే పూలమాలలు!

అలాగే, అనేక వాదాలూ వివాదాలూ వ్యక్తిగత సంవాదాలూ నడుస్తున్న ఈ సంక్షుభితదశలో  రచనల విషయంలో మేం ప్రజాస్వామిక భావనని గౌరవించాం. “సారంగ”కి తనదైన ఒక పాలసీ వున్నప్పటికీ, మేం  చెప్పిందే వేదం అనుకోకుండా, భిన్న స్వరాలకు చోటిచ్చాం.  కొన్ని సమయాల్లో అస్తిత్వ సాహిత్యాల పట్ల ఎక్కువ మొగ్గు చూపించినా, దానికి కొందరు  అసహనం ప్రకటించినా, “సారంగ” దారి ఏమిటో స్పష్టంగా తెలిసిన వాళ్ళు సహనంగానే వున్నారు. అభిప్రాయ స్వేచ్చని నిరభ్యంతరంగా గౌరవించాం.

ఇక ఈ ప్రయాణమంతా సుఖంగానే, సంతోషంగానే జరిగిందని చెబితే అది పచ్చి అబద్ధమే అవుతుంది. ప్రతి పని డబ్బుతో కాదంటే పరపతితో ముడిపడి వున్న ఈ కాలంలో ప్రతి గురువారం సంచిక బయటికి రావడానికి పడ్డ ప్రసవ వేదన తక్కువేమీ కాదు. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఒకటి, రెండు  రోజులు  ఆలస్యం చేశాం. ఇక్కడ కాలాన్నీ ధనాన్నీ మేం లెక్కలోకి తీసుకోలేదు. నిరంతరం మారుతున్న ఉద్యోగాల మధ్యా, వూళ్ళ మధ్యా, పెరుగుతున్న కుటుంబ, వృత్తిపరమైన బాధ్యతల మధ్యా ప్రతి గురువారం పొద్దున్నే ఒక దరహాసంతో “సారంగ” మీ ముందు ప్రత్యక్షరమైందంటే, అది చిన్న విషయం కాదు. ఎలాంటి ప్రతిఫలాపేక్షా లేకుండా ఇంత సమయం ఇందులో పెట్టామంటే అది  కేవలం సాహిత్యం పట్ల మాకున్న ఆసక్తి వల్ల! మా ఆసక్తిని నలుగురితోనూ సహృదయంతో పంచుకోవాలన్న తపన వల్ల!

అయినా సరే,  కొన్ని చేదు అనుభవాలు తప్పలేదు. కొంతమంది రచయితలు అలిగి మొహం తిప్పుకుంటే మరికొంత మంది బెదిరింపులకు కూడా సిద్ధపడ్డారు. అవసరానికి సారంగ పత్రికను వాడుకొని అవకాశం వచ్చినప్పుడు బురద చల్లాలని చూసారు మరి కొందరు. ఇలాంటి కొన్ని చేదు అనుభవాలు ఈ వీడ్కోలు సందర్భంగా అయినా చెప్పకపోతే, ఈ పత్రిక నిర్వహణ వెనక ఎలాంటి శ్రమ వుందో మీకు అర్థం కాదు.

కొత్త ఆలోచనలతో మళ్ళీ ఎప్పుడో !

అటువంటి కొన్ని అపశ్రుతులు తప్ప “సారంగ” గానం అందంగా సాగింది, మంచి అనుభవంగా నిలబడింది. కొత్త వాగ్దానంగా వెలిగింది. ఒక గొప్ప తృప్తితో నిష్క్రమిస్తున్నాం. తెలుగు సాహిత్యంమీద ఒక ఆశావహమైన దృష్టితో ఈ ప్రయాణంలో ఇక్కడితో  ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాం. ఇద తాత్కాలికమే అనుకుంటున్నాం. నిజానికి  వెబ్ పత్రికా రంగంలో, సాహిత్య సందర్భంలో “సారంగ” చేయాలనుకున్నవీ , సాధించాలనుకున్నవీ అనేకం వున్నాయి. వాటిల్లో మేం కొంత మేరకు మాత్రమే ఈ పత్రిక ద్వారా ఈ నాలుగేళ్ల లో చేయగలిగాం. పత్రికని ఇంకా విశేషంగా తీర్చిదిద్దాలన్న కోరిక కూడా బలంగానే వుంది. ఎలా తీర్చిదిద్దాలా అన్న విషయంలో స్పష్టత కూడా వుంది. అన్నిటికీ మించి మీ సహాయ సహకారాలు ఎప్పుడూ వుంటాయన్న గొప్ప నమ్మకం వుంది. సారంగ ను మొదలు పెట్టిన నాటి సాహిత్య వాతావరణం కంటే ప్రస్తుత సాహిత్య సామాజిక వాతావరణం లో అతి ముఖ్యమైన ప్రత్యామ్నాయ తెలుగు సాహిత్య పత్రిక సారంగఅవసరం ఇప్పుడు మరింత ఎక్కువ గా ఉందని మాకు తెలుసు. ఇలాంటి సంక్లిష్ట, సంక్షుభిత పరిస్థితుల్లో నిష్క్రమణ మీకూ, మాకూ ఇద్దరికీ విషాదమే. కానీ తప్పనిసరి అయింది. కొత్త రూపు రేఖలతో, కొత్త ఆలోచనలతో  మళ్ళీ ఎప్పుడో మీ ముందుకు వస్తామన్న నమ్మకం తో  మీ నుంచి సెలవు తీసుకుంటున్నాము!

రచయితలకు సాంకేతిక సూచన:

ఈ గురువారమే సారంగ చివరి సంచిక. మార్చి 30 తరవాత సారంగ వెబ్ సైట్ కూడా పూర్తిగా తొలగిస్తాం. కాబట్టి, మీ రచనలు అన్నీ విడిగా ఈ లోపే డౌన్ లోడ్ చేసుకోండి, ఆ తరవాత అవి కనిపించవు కాబట్టి! ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. అలాగే, మా వద్ద పెండింగ్ లో అనేక రచనలు వున్నాయి. వాటిని రచయితలు వెనక్కు తీసేసుకోవలసిందిగా వ్యక్తిగత విన్నపం. మమ్మల్ని సంప్రదించాల్సి వస్తే editor@saarangabooks.com కి ఈమెయిల్ చేయండి.

అఫ్సర్

కల్పనారెంటాల

రాజ్ కారంచేడు

తెలుసు

Art: Rajasekhar Chandram

 

రాత్రి వొడవదు

ఎన్నో రాత్రి ఇది

చెంప మీద ఎన్నో కన్నీటి చుక్క

జారి

ఆరిపోతున్నది

 

తెల్లని మంటయ్ కురుస్తున్న మంచు

కిటికీ అద్దం మీద వీధి లాంతరు విసుగు

ఒక్క వెచ్చని వూహ లేదని ఫిర్యాదు

దృశ్యం మారితే బాగుండు, మార్చేది ఎవరు

 

నేనెప్పుడూ చీకట్లో ఆడుకుంటున్న ఆడపిల్లనే

 

నా చుట్టూరా నల్లని కందకం, ప్రతిబింబం లేని అద్దం

వృత్తాకార కందకంలో నాచు పట్టిన కత్తులు

కందక ఖడ్గానికి పొదిగిన పచ్చల వలె చుక్కలు

 

నల్లని అద్దాన్ని దాటే ప్రయత్నం

కమ్మని పరిమళం కొన్ని గాయాల నుంచి

నొప్పి మందుగా ఏవో కలలు రాసుకుని

బతకొచ్చు అనెస్తీసియా మైమరుపులో

 

నేను మరణించాక ఎవరో వచ్చి

పోపుల డబ్బాలు కూడా ఘాలించి

స్వప్నాల వాసన ద్రవ్యాలు మూటగట్టి

గేటు దూకేస్తారు వొంటికి నూనె రాసుకుని

దొంగలను పట్టుకోలేవు

వాళ్ళే అరుస్తారు నీ వేపు వేలు చూపి

నువ్వూ దొంగవేగా, ఏమీ అనలేవు

 

ఎలాగో ఇంటికొచ్చేశావు

బాగా నలిగిపోయావు

నిద్దర పోరా నాన్నా నిద్రపో

 

ఏడూర్ల వాళ్ళు తిన్నా మిగిలే

పెను చేపను పట్టి, కత్తి కోరల

సొరచేపలతో తలపడి ఓడి

చివరికి ఈ గట్టున

ఊరక దొరికే కాడ్ లివర్ ఆయిల్ తాగి

గుడిసెలో ముసలి నిద్రలో మునిగిపో

నువ్వు నిద్ర పోరా నాన్నా నిద్ర పో

 

ఇంతగా చెప్పలా

నువ్వూ నేనూ తానూ వేరా?

మనం చిరిగి చీలికలవుతున్న

ఒక ప్రపంచం చీరె ముక్కలం

 

తెలుసు

ఈ రాత్రి ఇంతే ఇక

వుదయం ఒక అపహాస్యం

పద్యం ఒక ఆర్తనాదం

 

*

నాకు నచ్చిన చిత్రం: జయభేరి

‘సంగీతమపి సాహిత్యం సరస్వత్యా కుచద్వయం; ఏక మాపాత మధురం అన్యదాలోచనామృతం.’ సంగీతం చెవిన పడినంతనే మధురం. సాహిత్యం అలా కాదు. ఆలోచిస్తే అమృతం. ఆలోచింపచేసే దే సాహిత్యం.” అని అంటారు దాశరధి రంగాచార్యులు గారు తమ ఋగ్వేద పరిచయ పుస్తకంలో. సినిమా అనేది- ఒక కళ. నటన, నాట్యము,  సంగీతము, సాహిత్యము మరియు దృశ్యము- సమపాళ్ళలో మేళవించి చెక్కిన శిల్పమే, ఈ దృశ్య కావ్యము. తెలుగు చలనచిత్ర స్వర్ణ యుగములో అజరామరమైన చిత్రాలు అందించినవారిలో శ్రీ పి. పుల్లయ్య ఒకరు. వందల చిత్రాలకు కధా, మాటలు, పాటలు సమకూర్చి, తన పదునైన సంభాషణలతో, ప్రేక్షకుల గుండె లోతులను తట్టినవాడు ఆచార్య ఆత్రేయ. ఒక రచయితగా, సినీ కవిగా, మాననీయ వ్యక్తిగా, అంతకంటే అందరిచే గురువుగా మన్ననలందుకున్న ఒకే ఒక వ్యక్తి, శ్రీ మల్లాది రామసృష్ణశాస్త్రి గారు. మేటి సంగీత దర్శకులలో తలమానికమైన సంగీత రసగుళికలు అందించినవారు, శ్రీ పెండ్యాల నాగేశ్వరరావుగారు. ఈ ఉపోత్ఘాతమంతా ఎందుకంటే- ఈ అందరి మహామహుల అనితర సాధ్యమైన సాధనవల్ల, 1959లో శారదా ఫిలిమ్స్ పతాకంపై, శ్రీ వాసిరెడ్డి నారాయణరావు/ ప్రతిభా శాస్త్రి గార్ల నిర్మాణములో రూపొందుకున్న మహత్తర సంగీత, సాహిత్య , సందేశాత్మక దృశ్యకావ్యం, జయభేరి.

 

క్లిష్టమైన ఇతివృత్తంతో కొన్ని చిత్రాలు, ఇతివృతాలు ప్రధానంగా కొన్ని చిత్రాలు వచ్చాయి. మనకు ప్రేమ కథలు, కులాంతర విహాహాలు అరుదు కాదు. కవుల, కళాకారుల జీవితము, మతము, ఆచారాల కథనము క్రొత్తవి కావు. కాని వీటన్నిటిని రంగరించి, సంగీత సాహిత్యాలను మేళవించి, వైవిధ్యంగా, కష్టతమమైన అంశాలను అతి మెళుకువగా విశ్లేషించిన చిత్రాలు బహుకొద్ది. ఆ కోవలో ప్రజలను ఆలోచనాపరులను చేస్తూ, కళల మరియు మానవ పరమావధిని జనరంజకంగా చెప్పి, సంస్కరణకు ఉద్యుక్తులను చేసే మకుటాయమానమైన సందేశాత్మక చిత్రం, ‘జయభేరి’. ఆత్రేయ తెలుగువారికి అందించిన మరొక కావ్యం, ఈ జయభేరి.

ఒక సంగీత తపస్వికి, ఒక మహత్తమమైన గురువుకి ఆలోచనాసరళిలో తేడాలుండవచ్చు. ఆ విభేదము మనుషుల, మనసుల మధ్య ఈర్శ, ద్వేషాల కతీతమై, కళ పరమావధికి, దాని భవితకు చెందినదైతే, దాని పర్యవసానము ఏమిటి? కళ ప్రయోజనం, విద్వత్ సభలలో ప్రదర్శించి, పెద్దలను మెప్పించుటయే పరాకాష్టయని ఒకరు, జన సామాన్యానికి దూరమైన కళ, సంకుచితమై, సమసిపోతుందని, కళ బహుజన హితము, ప్రియము కావాలని తపించే వారొకరు.

జయభేరికి ముందూ, తరువాత కూడా ఎన్నో సంగీత, సాహిత్య, నాట్య పరమైన చిత్రాలు వచ్చాయి. రావచ్చు కూడా! ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ చిత్రంలోని ఒక సన్నివేశాన్నో, లేక ఒక అంశాన్నో తీసుకొని, మరిందరు చిత్రాలు తీశారేమో కానీ, ఆ ఆదర్శాన్ని ప్రతిబింబించలేదు . అంతేకారు, సంగీతము, సాహిత్యము, అభినయము సమపాళ్ళలో పోటీపడి, తమ సత్తా చాటుతూ సమ్మిళితమై, ఆనందముతో పాటు, ఆలోచనామృతాన్ని కలిగించిన తీరు నాటికి, నేటికి జయభేరి జయభేరియే! మధురమైన సంగీతముతోపాటు, మెదటికి పదునుబెట్టే మాటలు, పాటలు మనుషులను ఆలోచింప చేస్తుంది. మతము, ఆచారము, సాంప్రదాయము, ఈర్ష, అసూయలు – మానవత్వాన్ని విడిచి, మరిచి విజృంభిస్తే – మంచికి, మనసుకి, కళకి మనుగడ కరువు అవుతుందని కనులముందు ప్రత్యక్ష పరుస్తుంది.

పెండ్యాల నాగేశ్వరరావు గారు చక్కని శాస్త్రీయమైన బాణీలు కూర్చటంతోపాటు, కన్నడ మరియు చక్రవాక రాగాలను మిళితంచేసి, సృష్టించిన ‘విజయానంద చంద్రిక’ రాగంలో మల్లాది వారి సాహితికి మన ఘంటసాల ప్రాణము పోయగా, అక్కినేని అద్భుతంగా అభినయించిన పాట, ‘రసిక రాజ తగు వారము కామా’. గురు శిష్యుల సరళిని మమేకం చేస్తూ, పండిత పామరుల ప్రశంసలు పొంది, సినీ వినీలాకాశంలో ఒక తారగా నిలిచిపోయింది. ఈ ఒక్కపాటపై శ్రీ సత్యనారాయణ వులిమిరి గారు ఆరు పేజీల వ్యాసము వ్రాశారు. ఆనాటి మేటి గాయకులు: ఘంటసాల, పి.బి. శ్రీనివాస్ మరియు రఘురాజ్ పాణిగ్రాహి కలిసి ఆలాపించిన, మల్లాది వారి, ‘మది శారదా దేవి మందిరమే’ మరొక అనితర సృజన. విజ్ఞుల అభిప్రాయంలో సంగీత-సాహిత్యపరంగా తెలుగు సినీ చరిత్రలో ఇంతవరకు సృజించబడిన మూడు అగ్రతమమైన పాటలలో, ఈ రెండు పాటలను ఉదాహరిస్తారంటే (మూడో పాట ‘జగతేకవీరుని కథ’ లోని ‘శివశంకరి శివానందలహరి’), జయభేరి అందుకున్న శిఖరాలేమిటో మరి నొక్కి చెప్పవలసిన అవసరం లేదేమో!

కధాగమన ప్రస్థానంలో, మూర్ఖుల ఛాందసాన్ని నిరసిస్తూ మనసులను నిలదీసే ఆత్రేయ సమయానుచిత వాదనకు, మహత్తర సందేశాన్ని జోడించి మహాకవి శ్రీశ్రీ అందించిన ‘నందుని చరితము వినుమా’ పాట ఒక కలికితురాయి. దేవుని చూడాలనే ఓ నిస్సహాయ చిన్నవాని ఆక్రందనకి, మూగబోయిన గొంతుని సవరించి, ఆలయాలలోనే దేవుడు లేడని, నందునికి మోక్షమిచ్చే శివుడున్నాడని, తన పాటతో అండగా నిలిచే అద్భుత అక్కినేని నటన మనముందుయించి, పుల్లయ్యగారు మన కంట కన్నీరు కురియించ, దీనికి మరి ప్రతి లేదు! ఈ పాటను, కుల నిర్మూలన ప్రచారానికై, ఆనాడు ప్రభుత్వము 16యమ్ యమ్ ప్రింట్లు తీసుకొన్నారని అంటారు పులగం చిన్నారాయణగారు తమ ‘ఆనాటి ఆనవాళ్ళు’ పుస్తకములో.

పెండ్యాల నాగేశ్వరరావు గారు అందించిన మరికొన్ని ఆణిముత్యాలు:

 

  • రాగమయి రావే.. అనురాగమయి రావే (మల్లాది)
  • సవాల్ సవాల్ అన్న చిన్నదానా.. సవాల్ పై సవాల్ (మల్లాది)
  • నీవెంత నెరజాణనౌర (మల్లాది)
  • సంగీత సాహిత్యమే మేమే నా శృంగార (మల్లాది)
  • నీ దాన నన్నదిర, నిన్నే నమ్మిన చిన్నదిర (మల్లాది, చిత్రంలో లేదు)
  • యమునా తీరమున.. సంధ్యా సమయమున (ఆరుద్ర)
  • ఇంద్ర లోకంనుండి తెచ్చినారయ్యా (ఆరుద్ర)
  • హోయ్ వల్లో పడాలిరా పెద్ద చేప (ఆరుద్ర)
  • ఉన్నారా.. జోడున్నారా.. న్నానోడించే వారున్నారా (కొసరాజు)
  • దైవం నీవేనా, ధర్మం నీవేనా (నారపరెడ్డి, టి‌.ఎం. సౌందర్ రాజన్ పాడారు)

 

ఆచారాల అనాచారానానికి తమ్ముని, కడకు భార్యను కూడా త్యజించవలసిన పాత్రలో గుమ్మడి; తల్లి కాని తల్లిగా తన మరిది భవిత కోసం ప్రాణ త్యాగం చేసే ఇల్లాలుగా శాంతకుమారి; లోన వ్యక్తిత్వానికే విలువయిచ్చే మాననీయ గురువుగా నాగయ్య; ప్రజారంకంగా పాలించే కళా హృదయుడైన రాజుగా ఎస్‌.వి. రంగారావు; నాట్యంతో పాటకు జీవంపోసి, చాకచక్యంతో రాజా దండన నుంచి భర్తను కాపాడుకొనే పాత్రలో అంజలిదేవి; రాజ నర్తకిగా కపట యోచనతో ఒక తోటి కళాకారుని జీవితాన్ని కడతెర్చే కరకు పాత్రలో రాజసులోచన, మతం కోసం మానవత్వాన్ని పణంగా పెట్టె రాజగురువు పాత్రలో ముక్కామల, మనకు మరపురాని అనుభూతిని కలిగించారు. మరియు రమణారెడ్డి, రేలంగి, చదలవాడ, సూర్యకాంతం పోటీపడి, అత్యుత్తమ నటన అందించన ఈ చిత్రం, మీరు చూసివుంటే మరొక్కమారు చూడండి, లేకపోతే మీరు తప్పక చూడవలసిన చిత్రాల జాబితాలో ముందుంచండి.  ఈ విశ్లేషణని ముగించడం చాలా కష్టమనిపించింది. ఆలోచించగా, నాకు కనిపించిన ఈ Lancelot Hogben మాటలతో సశేషం (from his book ‘Mathematics for the Million’):

“Our studies in Mathematics show us that whenever the culture of a people loses contact with the common life of mankind and becomes exclusively the plaything of a leisure class, it is becoming a priestcraft. It is destined to end… To be proud of intellectual isolation form the common life of mankind and to be disdainful of the great social task of education is as stupid as it is wicked. It is the end of progress in knowledge. History shows that superstitions are not manufactured by the plain man. They are invented by the neurotic intellectuals with too little to do.”

ఆలాగునే యుగాల పరిణామములో, మహర్షుల తపో యజ్ఞములతో, సకల జీవకోటి శాంతి కోసం- ఆవిర్భవించిన మన వేదాలు, ధార్మిక వర్తన, సాహిత్యము, సంగీతము, ఇతర కళలు ఈనాడు సామాన్యునికి, యువతరానికి ఎంత చేరువలో ఉన్నాయి? వాటిని భూమార్గాన్ని పట్టించే భగిరధ ప్రయత్నము, ఆలోచించండి, ఎవరి చేతిలో ఉందో?

*

 

తూరుపు గాలులు -చివరి భాగం

3

దీపాంకరుడు ఉత్తారారామానికివచ్చి రెండేళ్ళుదాటింది. కొత్త పరిసరాలు, కొత్త మనుషులు, కొత్త విషయాలు; నేర్చుకోవడానికి అంతులేని అవకాశాలు. వీటిమధ్య రోజులు ఇట్టే గడిచిపోయాయి. సింహళభాష బాగాపట్టుబడింది. శిష్యుల సహకారంతో ఉచ్ఛారణ లోపాలు కూడా సరిదిద్దుకున్నాడు. తనకు సాయంగా నియమించబడిన శిష్యుడు ధర్మపాలుడితో అతనికి బాగా సఖ్యత కుదిరింది. ఉత్తరారామంలో దీపాంకరుడికి అన్నిటికన్నా ఆనందం కలిగించినదేమంటే దంతమందిరానికి సంవత్సరంపొడుగునా వచ్చేభక్తుల సందడి, అక్కడ ఉత్సాహపూరితంగాజరిగే పండగలు, పూజలు, దైనందిన కార్యక్రమాలు. నాలందాలోకూడా అతడటువంటి బౌద్ధ జనసందోహాన్ని చూడలేదు. వరసగా రెండేళ్లపాటు అన్ని పూజలనూ, పండగలనూ దగ్గరగా పరిశీలించినమీదట  అతనికి తోచిన విషయాలను వైశాఖ పూర్ణిమనాడు ఈవిధంగా తన జ్ఞాపకసంపుటిలో వ్రాసుకున్నాడు:

మరో బుద్ధజయంతి పండగ వచ్చి వెళ్ళిపోయింది. మొత్తానికి ఈ రెండేళ్లలో చాలా సంగతులే తెలియవచ్చాయి. ఉదాహరణకి సింహళదేశం కూడా బ్రాహ్మణపౌరోహిత కులం, రాజ, వైశ్య కులాలు, భూమిమీద, వ్యవసాయంమీద ఆధిపత్యం కలిగిన గోవి కులం, వృత్తుల ఆధారంగా ఏర్పడ్డ అనేక కులాలు, ఛండాల కులం – ఇలా చాలా కులాలున్నాయని తెలుసుకున్నప్పుడు ఒకింత ఆశ్చర్యం కలిగింది. అనురాధపురంలోనూ, పొలోన్నరువలోని దంతమందిరంలోనూ వంశపార్యంపరంగా పౌరోహిత్యం చేసే బ్రాహ్మణులు భారతదేశంనుండి మహేంద్రుడు, సంఘమిత్రలతో బాటుగా వచ్చారంటారు. (ఈ ఆచారం నిలబడిందిగాని, సంఘమిత్ర స్థాపించిన భిక్షుణిల విహారం ఎందుచేత మూతబడిందో? ఆ మాటకొస్తే నాలందాలో కూడా అంతా భిక్షువులేగాని, భిక్షుణిలు లేరు).

దంతమందిరానికి వచ్చే భక్తులను చూస్తూంటే, వాళ్లతో మాట్లాడుతూంటే తథాగతుడు దుఖాన్ని సార్వజనీన మానవజీవన విషాదంగా, నాలుగు మహాసత్యాల్లో మొదటిదానిగా ఎందుకు గుర్తించాడో వాస్తవరూపంలో కళ్ళముందు కదలాతుడుతుంది. సంతానం కలగలేదని విలవిలలాడుతూన్న దంపతులు, సంతానంపెట్టే బాధలుభరించలేకపోతూన్న తల్లిదండ్రులు, యుద్ధంలో మరణించిన సైనికుని భార్య, ఆత్మీయుల దీర్ఘకాలిక అనారోగ్యంతో వ్యధ, దగ్గరవారు చేసిన ద్రోహానికి తట్టుకోలేకపోయిన వంచితులు, వర్షాలులేక పంట చేజారిన రైతులు, భాగస్వాముల చేతిలో మోసపోయి వీధినపడ్డ వ్యాపారి, పైఅధికారుల ఆగ్రహానికి గురైన చిరుఉద్యోగి, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూన్న యువతీ యువకులు….వీళ్ళందరితోనూ మాట్లాడుతూంటే తమ బాధల్ని చెప్పుకోవడంలోనే వాళ్ళు ఉపశమనం పొందుతున్నారనిపిస్తుంది. వాళ్ళ మొహాల్లో చిగురించే ఆశాభావం ఉత్సాహం కలిగిస్తుంది. భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేసి, దంతాన్ని భద్రపరచిన ధాతుపేటికను కడిగిననీళ్ళను తీర్థంగా స్వీకరించి, తథాగతునిపై భారంవేసి, ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో దైనందిన జీవనపోరాటాలని కొనసాగించడానికి తిరిగివెళ్తున్నారు. వారి విశ్వాసబలం చూస్తే ఆనందం కలుగుతుంది. నాలందాలో ఉండగా ఒక చీనావిద్యార్థి  ఏదో సందర్భంలో బౌద్ధధర్మంపై పాళీభాషలో అల్లిన ఒక కవిత చదివాడు. దాని సారాంశం ఇలా ఉంటుంది: ధర్మంఅంటే అంధకారంలో నిత్యంవెలిగే ఒక అద్భుత ఆశాకిరణం; భూత, భవిష్యత్తుల అవిరామ పదఘట్టనలో నలిగిపోయేవారి వర్తమానానికి అర్థంకల్పించే ఏకైక ఆధారం; విధివంచితుల వేడుకోలు; ప్రజానీకం భక్తి పారవశ్యంతో గొంతెత్తి పాడుకొనే పాట.

అప్పుడు తెలియలేదుగానీ, నాలందా విధ్వంసం తరువాత సాధువులతో చేసిన తిరుగుప్రయాణం ఒక గొప్ప అనుభవం. ఇప్పుడు కళ్ళారాచూస్తూన్న విశ్వాసబలమే ఆ సాధువులను అత్యున్నతస్థాయిలో ఆవహించిందనిపిస్తోంది. వారి భక్తివిశ్వాసాలకుమూలం,  జీవితం విరజిమ్మే వర్తమాన భయాందోళనలు కావు. వారిది మూర్ఖవిశ్వాసంకాదు; నిస్వార్థమైన, భయరహితమైన భక్తి; ప్రకృతినీ, మాననవాతీత శక్తులను నమ్రతతో గౌరవించి ఆరాధించే భావన; బాహ్య, అంతర్గత సౌందర్యాలను అవలీలగా సంధించగల శక్తి.

ఇక బౌద్ధం విషయానికి వస్తే భక్తిమార్గంలో, విశ్వాసాలతో మొదలుపెట్టినవారిని  జ్ఞానమార్గంలో, హేతుబద్ధత వైపు ప్రయాణింపజేయడమే బౌద్ధధర్మ విశిష్టత. అంతిమంగా ఎవరి కర్మలకువారినే బాధ్యులనిచేసి, ఎవరి దారిని వారే వెతుక్కోవాలంటుంది బౌద్ధం. మనుషులకే అన్ని నిర్ణయాలనూ వదిలిపెట్టిన తథాగతుడు గొప్ప ఆశావాది అయిఉంటాడు. ఎన్నుకున్న మార్గం ఏదైనా ప్రయాణారంభం మాత్రం మనుషులందరికీ ఒకటే.

పుట్టుక, నిత్యజీవన సంఘర్షణ, ఉన్నదిపోతుందేమోనని భయం, కోరుకున్నది లభించదేమోనని ఆందోళన, బాధనుండి విముక్తికోరుకోవడం, ఆనందాన్నిమాత్రమే ఆశించడం, అనారోగ్యం, వార్ధక్యం; చివరికి మృత్యువువాత పడటం, అక్కడకూడా ఆందోళనే – అనామకులుగా కాలగర్భంలో కలసిపోతామేమోననే ఆందోళన – ఇదే ప్రతిఒక్కరి జీవితానుభవం; అన్ని ప్రశ్నలకూ, అన్వేషణలకూ మూలం  ఇదే. ఈ విశ్వవ్యాపిత మౌలికతనుండే బౌద్ధం పుట్టింది. [బహుశా అందుకే తథాగతుడు తన మొదటి ప్రవచనమైన దమ్మచక్కపవత్తన సూత్త (ధర్మచక్ర ప్రవర్తన సూత్రం)లోనే ఈ పరమసత్యాన్ని ప్రస్తావించాడు].

భక్తులందరూ తమ సాంసారిక బాధలనుండి, దుఖమయ జీవితాలనుండి విముక్తిని కోరుకొనేవాళ్ళే. అయితే వాళ్ళ దుఃఖాలను తెలుసుకున్నప్పుడు కరుణాభావం కలగకపోతే అట్టివ్యక్తి భిక్షువుకాదుకదా, మనిషినని చెప్పుకోవడానికి కూడా అనర్హుడు. అయితే కరుణఅనేది భావంగానే, లోలోపలే ఉండిపోతే సరిపోతుందా? నిత్యజీవనాచరణలో ప్రతిఫలించాలి కదా? అందుకనే తథాగతుడు మేత్త (మైత్రి)ని నిత్యం ధ్యానం ద్వారా అధ్యయనం చేయవలసిన అంశంగా, ఆచరించవలసిన ఆదర్శంగా అనేకసందర్భాల్లో పేర్కొన్నాడు. థేరవాదం ఈ అంశానికి అత్యున్నతమైన ప్రాధాన్యతనిస్తుంది. థేరవాద భిక్షువులు నిత్యం జనసమూహాలకుచేసే ప్రవచనాల్లో, పఠించే సూత్తాల్లో తరచూ వినిపిస్తుంది. రోగికి వ్యాధినిబట్టి తగిన మోతాదులో మందిచ్చేవాడే సరైన వైద్యుడు. (జనులందరినీ అనుక్షణం బాధించే నిర్దిష్టమైన సమస్యల్ని పక్కనపెట్టి శూన్యత, ఆత్మ, అనాత్మ, కర్మ, పునర్జన్మ, ద్వైతం, అద్వైతం – ఇటువంటి అమూర్తమైన విషయాలమీద ఉపన్యసించి ఊదరగొట్టడం అర్థరహితం. ఎవరికోతప్ప వీటిపై అందరికీ ఆసక్తీ ఉండదు).

దుఃఖం, కరుణ, మైత్రి ఈ మూడు అంశాలపైనా, వాటిమధ్యగల మానవీయసంబంధంపైనా గ్రంధాలలో ఎంత చదివినా, ఎంత చర్చించినా తెలియనిలోతు ఇప్పుడు సాధారణజనులతో మాట్లాడుతూంటే తెలిసివస్తున్నది. ఈ సంబంధాన్ని సరళంగా, అర్థవంతంగా తెలియజెప్పగలగడమే ఉత్తమబౌద్దాచార్యుని లక్షణం, ధర్మం. లక్షలసంఖ్యలో జనులకు ఈ సంబంధాన్ని విడమరచిచెప్పగలిగితే, వారిలోంచి వేలకొద్దీ ఉత్తమస్థాయి ఉపాసకులూ, ఉపాసికలూ, ఆచార్యులూ ఉదయిస్తారు. వీరే బౌద్ధానికి భవిష్యదూతలు. ఇలా ఆలోచిస్తే సామాన్యప్రజలనే లక్ష్యం చేసుకోవాలని మొదట్లో ఎన్నుకున్నమార్గమే సరైనదనిపిస్తున్నది. (ఏది ఏమైనా ప్రశ్నలు మాత్రం అవే; చుట్టూతిరిగి స్ఫురించే సమాధానాలుకూడా అవే. అయితే వాటినే మరింత లోతుగా, అర్థవంతంగా చర్చించడం సాధ్యపడుతున్నది. ఈ విషయంపై శాంతిదేవుడు ఏమంటాడో?).

శాంతిదేవుడిని కలుసుకోవడం, అతనితో పూర్వంరోజుల్లోమాదిరిగా సంభాషించడం, చర్చించడం నానాటికీ దుర్లభంగా ఉన్నది. అతడు ఎక్కువకాలం సంఘపరిషత్తు సమావేశాల్లోనూ, రాజభవనంలో జరుగుతూన్న  సంప్రదింపుల్లోనూ గడుపుతూన్నట్లుగా తోస్తున్నది. ఇదేమాట దీపాంకరుడు తనశిష్యుడు ధర్మపాలునితో అంటే – అతడు,

“అవును, ఆచార్యా! శాంతిదేవథేరోవారిని సంఘరాజాగా నియమిస్తూ రెండుమూడు రోజుల్లో రాజభవనంనుండి ప్రకటన విడుదల కావచ్చు. మేమంతా ఆ శుభఘడియ కోసమే ఎదురుచూస్తున్నాం. మీరు ఆయనతో సమావేశంకావాలని కోరుకుంటూన్న సంగతి ఆయనకు తెలియజేస్తాను”. అన్నాడు.

“తొందరేమీలేదు. ఆయనకు తీరుబడి దొరికినప్పుడేలే” అన్నాడు దీపాంకరుడు.

***

శాంతిదేవునితో సంభాషించే అవకాశం బుద్ధజయంతి వెళ్ళిన వారంరోజులకుగాని లభించలేదు. అయితే ఆరోజున అతడు తీరుబడిగా, ఉల్లాసంగా ఉన్నట్టుగా అగుపించాడు.

“ఏదో మాట్లాడాలన్నవుటకదా? మనం మాట్లాడుకొని చాలారోజులైంది. నీకిక్కడ ఎలాఉంది? నువ్వనుకున్నవన్నీ సాధించగలుగుతున్నావా? ఏమైనా సాయంకావాలా? చెప్పు”.

“పనులన్నీ సవ్యంగానే సాగుతున్నాయి, ఆచార్యా. గ్రంధాలప్రతులను వ్రాసిపెట్టుకోవడానికిమాత్రం  అనుకున్నదానికన్నా ఎక్కవ సమయంపడుతున్నది. ఇంకో సంవత్సరంగడువు ఉన్నదిగనుక ఆపని కూడా పూర్తవుతుందనే అనుకుంటున్నాను. కాకపోతే ఒక విషయం మీతో చర్చించాలనుకుంటున్నాను”.

“అలాగే, చెప్పు. నాకు తెలిస్తే చెబుతాను”

“మీకు గుర్తుండే ఉంటుంది – నేనిక్కడికి రావడానికి మీరిచ్చిన సూచనే కారణం. నాలందాలో నిలిపివేసిన అధ్యయనాన్ని కొనసాగించడం, ఉత్తరారామాన్ని ఉత్తమబోధనాకేంద్రంగా తీర్చిదిద్దడానికి మీరుచేస్తున్న కృషిలో పాలుపంచుకోవడం – ఇవేకాక మరో రెండు లక్ష్యాలను కూడా సాధించాలని అనుకున్నాం కదా! మొదటిది పాలకుల సమర్థన, సహకారం కలిగినఉన్నచోట్ల బౌద్ధం ఏవిధంగా వికసిస్తుంది? అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడం, రెండోది జనబాహుళ్యంలో బౌద్ధం ఆచరించే దేశాన్ని సమీపంగా పరిశీలించడం. ఈ రెండు లక్ష్యాలనీ సాధించగలననే అనుకుంటున్నాను. అయితే మా దేశంలో ఈ రెండు అనుకూలతలూ లేవు. మాకున్న కొద్దిపాటి వనరుల్నీ ఎక్కడ కేంద్రీకరించాలి? అన్న ప్రశ్నే మళ్ళీమళ్ళీ  ముందుకొస్తోంది”.

“అర్థమైంది. మొదట కొన్నివిషయాలు చెప్పాలి. అనుకూలతలు అనేమాటవాడావు. నిజమే, మీకులేని అనుకూలతలు కొన్ని మాకున్నాయి. అయితే వాటిమూలంగా వచ్చే సమస్యలుకూడా అనేకం”

“నాకు అర్థంకాలేదు, ఆచార్యా”

“మొదట జనబాహుళ్యంలో బౌద్ధాన్ని తీసుకుందాం. మహిమలు, పూజలూ, తంతులు – వీటిని కోరుకోనేవారూ, నమ్మేవారూ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు; ఎప్పుడూ ఉంటారు. వీరి మూలంగా థేరవాదం తన మూలస్వరూపాన్ని, తాత్విక స్వచ్ఛతను కోల్పోయి, ఆచరణలో మహాయాన, వజ్రయానాలవైపు మళ్ళిపోయే ప్రమాదం నిరంతరం పొంచి ఉంటుంది. ధర్మబోధకుని పనికూడా గొర్రెలకాపరిచేసే పనే. గొర్రెల్ని అప్పుడప్పుడూ అదిలిస్తూ, సరైనతోవలో నడిపిస్తూండాలి. ఒకటిరెండు గొర్రెలు దారితప్పాయంటే మొత్తం మందంతా వాటివెంట పారిపోయే ప్రమాదం ఉన్నది”.

గొర్రెలు, గొర్రెలకాపరి – ఈ ఉపమానం దీపాంకరుడికి అంతగా రుచించలేదు. అయినా కిమ్మనకుండా వినసాగాడు.

“ఇక రెండో అనుకూలత రాజుల సమర్థన, సహకారం. ఇదికూడా ఒక సమస్యే. ఏ ఇద్దరు రాజులూ ఒక మాదిరిగా ఉండరు. ఒక్కొక్కడికీ ఒక్కో పిచ్చి; ఎవడిపిచ్చి వాడికానందం అన్నారు. అందుచేత ఎన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ బౌద్ధాన్ని కాపాడుకోవడమంటే కత్తిమీద సామువంటిదే”.

‘పిచ్చిమారాజులు’, ‘కత్తిమీదసాము’ ఈ పదప్రయోగాలు దీపాంకరుడికి ఆశ్చర్యం కలిగించాయి. శాంతిదేవుడు చెప్పుకుపోతున్నాడు.

“మా దేశంలోని రాజవంశాలన్నీ కళింగ, చోళ, పాండ్య రాజ్యాలతో పెనవేసుకుపోయాయి. బౌద్ధం స్వీకరించి పూర్తిగా స్థానికులుగా మారినవారూ ఉన్నారు. యుద్దాలుచేసి ఆక్రమణదారులుగానే మిగిలిపోయినవాళ్ళూ ఉన్నారు. విదేశీయులతో యుద్ధాలు జరిగినప్పుడల్లా బౌద్ధం, సింహళ జాతీయవాదానికి ప్రతీకగా నిలిచింది. ఏదైనా సంక్షోభం మీదపడినప్పుడు ప్రజల్ని సమీకరించడానికి బౌద్ధమే శరణ్యం. అటువంటప్పుడు ధర్మం, సంఘం ఒక స్థాయివరకే; ఆ తరువాత అంతా రాజకీయప్రమేయం, ఆధిపత్యపోరాటమే. ఇది మా రాజులందరికీ తెలుసు. అందుకే అన్ని వ్యవహారాల్లోనూ మామాటకు విలువనిస్తారు. అందుచేత నీ ప్రశ్నకి సమాధానం ఏమంటే – మీరిప్పుడు సామాన్య ప్రజలమీదనే దృష్టిపెట్టాలి; తప్పీజారీ ఒకరిద్దరు పాలకులెవరైనా బౌద్ధానికి అనుకూలురుగా ఉంటేగనక ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగపరచుకోవాలి. ఈ రెండు అనుకూలతల కన్నాకూడా మరో ముఖ్యమైన విషయం ఉన్నది. ఈ మధ్యంతా మీ దేశంలో ఉన్నానుకాబట్టి నాకర్థమైన సంగతి ఒకటి చెబుతాను”.

“చెప్పండి, ఆచార్యా”

“మీ దేశంలో బౌద్ధం పరిస్థితి నానాటికీ తీసికట్టుగా ఉంటోంది. ఇప్పట్లో పరిష్కారమంటూ ఏమీలేదు. ఎన్నో ఆరామాలు మూతపడ్డాయి. భిక్షువుల సంఖ్య రోజురోజుకీ క్షీణించి పోతున్నది. పైగా ఈ తురుష్కుల ఆక్రమణ. అందుచేత మీరిప్పుడు చెయ్యవలసిందల్లా మిగిలిన ఆరామాల్లోనయినా మూలగ్రంధాలను కాపాడుకోవడం, ధర్మవాణి పూర్తిగా మూగబోకుండా రక్షించుకోవడం. మన తరం చెయ్యవల్సిందీ, చెయ్యగలిగిందీ – ఇదొక్కటే”.

శాంతిదేవుడు కుండ బద్దలుకొట్టినట్లు మాట్లాడతాడని తెలుసుగానీ – మరీ ఇంత సూటిగా, నిర్మొహమాటంగా ఉండడం చూడలేదు. బహుశా ప్రతీదీ విడమర్చిచెప్పడానికి వ్యవధిలేకపోవడంవల్ల కావచ్చు అనుకున్నాడు దీపాంకరుడు.  

“తురుష్కుల ఆక్రమణ గురించి ప్రస్తావించారు. వారినుండి ఎప్పటికైనా విముక్తి ఉంటుందంటారా?”

“నాకు తెలిసి వాళ్ళను ఉత్తరభారతదేశంనుండి ఇప్పట్లో కదిలించగల వాళ్ళెవరూలేరు. దక్షిణదేశాన్నయినా కాపాడుకోగలిగితే అదే గొప్పవిజయం. తురుష్కులధర్మం వేరుకావచ్చు, వారి పద్ధతులు అత్యంత క్రూరమైనవీ, హేయమైనవీ కావచ్చుగానీ రాజులందరూ సామ్రాజ్యవిస్తరణకై యుద్ధాలుచేసినవాళ్ళే, అశోకునితో సహా”.

దీపాంకరుడు నివ్వెరపోయాడు. “తురుష్కులను అశోకునితో ఎలా సరిపోలుస్తున్నారో అర్థంకావటం లేదు, ఆచార్యా”

“నిజమే. కళింగయుద్ధం తరువాత అశోకునిలో ఉదయించిన పశ్చాతాపం, వైరాగ్యం మరే చక్రవర్తిలోనూ చూడం. అదొక్కటే అతనిలోని అపూర్వమైన విశిష్టత. అదే అతడిని బౌద్ధంవైపుగా మళ్ళించింది. దానిఫలితంగానే అతడు చరిత్రలో శాశ్వతమైనస్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ ఒకేఒక్క ప్రత్యేకతని మినహాయిస్తే అతడూ రాజ్యవిస్తరణ కాంక్షతో రగిలిన పాలకుడే; అత్యంతక్రూర హింసాకాండకు వెనుదీయని పోరాటయోధుడే”.

అశోకుడ్ని ఈ కొత్తకోణంలో చూడడం దీపాంకరుడికి కొరుకుడుపడలేదు.

ఇంతలో శాంతిదేవుని ప్రధానశిష్యుడైన గుణసేనుడు వచ్చి అతని చెవిలో ఏదో చెప్పాడు. శాంతిదేవుడు లేచినిలబడి,

“దీపాంకరా, నేను బయల్దేరాలి. రాజభవనంనుండి  పిలుపువచ్చింది. మరోరోజున మనచర్చని కొనసాగిద్దాం” అని వడివడిగా వెళ్ళిపోయాడు.

దీపాంకరుడికి శాంతిదేవునితీరు కొత్తగా అనిపించింది. ఇన్నాళ్ళూ శాంతిదేవుడతనికి ఒక ఉత్తమథేరవాద ఆచార్యునిగా, బౌద్ధచరిత్రకారుడిగా మాత్రమే తెలుసు. ఈరోజున అతడు లోకంపోకడను కాచివడపోసిన కార్యదక్షుడిగా, గొప్ప నాయకత్వలక్షణాలు కలిగిన కర్మయోగిగా కనిపించాడు. ఇదేమాట శిష్యుడు ధర్మపాలునితోఅంటే అతడు నవ్వి,

“ఆచార్య శాంతిదేవథేరోకు చాలా పార్శ్వాలున్నాయి. మనకు కనిపించేవి కొన్ని మాత్రమే” అన్నాడు.

ఆరోజున జరిగిన చర్చపై దీపాంకరుడు ఈవిధంగా వ్రాసుకున్నాడు:

ఈ రోజున శాంతిదేవునితో ఆసక్తికరమైన చర్చజరిగింది. అతడి దృష్టిలో ఇవాళ్టి భారతదేశ పరిస్థితుల్లో బౌద్ధధర్మరక్షణ, వికాసం, విస్తరణ ఎలా సాధ్యం – కిందనుండి పైకా లేక పైనుండి కిందకా? అన్న ప్రశ్నలు అంత ప్రధానమైనవికాదు. బౌద్ధానికి ఇప్పుడు ఏర్పడిన ప్రమాదం అత్యంత తీవ్రమైనది. మొత్తం తుడిచిపెట్టుకుపోకుండా ఎలా కాపాడుకోవడం? – అనేదే ముఖ్యమైన ప్రశ్న. అతనితో మాట్లాడాక ఎప్పుడూ కలిగే నిబ్బరానికి బదులుగా భవిష్యత్తుపై ఆందోళన పెరిగిపోయింది. ఏదిఏమైనా ఇక్కడ తలపెట్టిన పనులన్నింటిలోకీ మూలగ్రంధాల ప్రతులను వ్రాసిపెట్టుకోవడమే అత్యంత కీలకమైనదని బోధపడింది. వాటిని యదాతథంగా రాబోయేతరాలకు అందజేయగలిగితే అవే వారికి మార్గదర్శకాలు అవుతాయి. లేదంటే భవిష్యత్తు అంధకారమే.  (నాలందాలో అగ్నికిఆహుతైన జ్ఞానసంపందను తలచుకుంటే కన్నీళ్లు ధారలుకట్టాయి. రాత్రంతా నిద్రలేదు).

***

 

దుర్దినాన తెల్లవారుఝామునజరిగే ప్రార్థనలో పాల్గొనడానికి దీపాంకరుడు వెళ్తూంటే విషాదవదనుడైన ధర్మపాలుడు ఎదురై, రాత్రి శాంతిదేవుడు మరణించాడని చెప్పాడు. పిడుగులాంటి ఆ వార్తవిని దీపాంకరుడు నిశ్చేష్టుడయ్యాడు. మెదడు మొద్దుబారిపోయింది. యాంత్రికంగా ధర్మపాలునివెంట విహారప్రాంగణంవైపు నడిచాడు. అప్పటికే అక్కడ చాలామంది భిక్షువులు గుమిగూడి ఉన్నారు. మృతదేహం చుట్టూ కొంతమంది కూర్చొని ఉన్నారు. మంద్రస్వరంలో ప్రార్థనలు చేస్తున్నారు. ఊదొత్తులు, ప్రమిదలు వెలుగుతున్నాయి; పూలదండల మధ్య శాంతిదేవుని శరీరం నిశ్చలంగా, నిద్రపోతున్నట్లుగా ఉంది. అతని మొహం ప్రశాంతంగా, చిరునవ్వు చిందిస్తున్నట్టుగా ఉన్నది. దీపాంకరుడికిదంతా ఒక పీడకలలా ఉందితప్ప నిజమని నమ్మలేకపోతున్నాడు. తదేకంగా శాంతిదేవుని ముఖంలోకి చూశాడు. ఇతడేనా నిన్నగాకమొన్న నాతో అన్నివిషయాలు చర్చించింది? ఇంతలోకే ఎలా మృత్యువాతపడ్డాడు? ఏదో  చెప్పాలని ప్రయత్నిస్తూన్నట్లుగా ఉంది శాంతిదేవుని ముఖం చూస్తూంటే. లేక అంతా తన ఊహేనా? మళ్లీమళ్లీ చూశాడు. ‘నేను చెయ్యగలిగింది చేశాను; ఇక మీ పైనే మొత్తం భారంపెట్టి వెళ్తున్నాను. ఏం చేస్తారో, మీ ఇష్టం’ అంటున్నట్టుగా తోచింది.   ఇక అక్కడ నిలబడలేక దూరంగావెళ్లి రాతి మంటపస్తంభానికి జేరబడి మెట్లమీద కూర్చున్నాడు. అలా ఎంతసేపు కూర్చున్నాడో తెలియదు. బాగా ఎండెక్కింది. అతన్ని వెతుక్కుంటూ శిష్యుడు ధర్మపాలుడు వచ్చాడు. చిన్న మట్టిముంతతో – చిటికెడు ఉప్పుకలిపినగంజి ఇచ్చి తాగమన్నాడు; అది తాగాక దీపాంకరుడికి కాస్త సత్తువ వచ్చింది. లేచినిలబడ్డాడు. అప్పటికి ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. అందరూ కంటతడిపెడుతున్నారు; పైకి ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు. శాంతిదేవునికి ఇంతమంది సన్నిహితులూ, అనుచరులూ ఉన్నారంటే ఆశ్చర్యం వేసింది.

“ఎలా జరిగింది?” అని ధర్మపాలుడిని ప్రశ్నించాడు.

“రాత్రి పడుకోనేటప్పుడే ఒంట్లో నలతగా ఉందని గుణసేనుడితో అన్నారట. వైద్యుడిని పిలిపిద్దామంటే అవసరంలేదు, పొద్దున్న చూద్దాంలే అన్నారట. అంతే, నిద్రలోనే పోయారు”.

చుట్టూ మూగిన జనాన్ని తప్పించుకుంటూ అంతిమ దర్శనంకోసం శాంతిదేవుని శరీరాన్ని ఉంచిన ప్రాంగణం వైపు ఇద్దరూ నడుస్తున్నారు. శాంతిదేవుని శిష్యుడైన గుణసేనుడు ఎదురై,

“ఆచార్యా, పొద్దుటనుండీ మీకోసం తెగవెతుకుతున్నాను. మీతో మాట్లాడవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది – పదండి” అని చెయ్యపట్టుకొని గుంపునుండి దూరంగా లాక్కుపోయాడు.

అతడి గురువులానే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గుణసేనుడి మోహంలో ఆందోళన, తీవ్రమైన ఆదుర్దా కనిపించేసరికి దీపాంకరుడుకూడా కంగారుపడ్డాడు. చుట్టూ ఎవరూలేరు.

“ఏమైంది గుణసేనా?”

“ఎవరితోనూ అనకండి, ఆచార్యా. విషప్రయోగం జరిగింది. కిట్టనివాళ్ళు శాంతిదేవథేరోని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. రాజభవనంలో ఇప్పుడు వాళ్ళదే పైచేయిగా ఉంది”. గుణసేనుడి కండ్లవెంట నీళ్ళు.

“అంత ఖచ్చితంగా ఎలాచెప్పగలవు?”

“రెండురోజుల క్రితం ఆయనే స్వయంగా నాతో అన్నారు”

“ఏమని?”

“నామీద హత్యాప్రయత్నం జరగవచ్చు అన్నారు. ఒకవేళ అనుకోనిదేమైనా జరిగితే ఏం చెయ్యాలోకూడా చెప్పారు”

“ఏం చెప్పారు?’

“చాలానే ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి సమయంలేదు. మీకు సంబంధినది మాత్రం చెబుతాను”

“చెప్పు”

“మీరు వెంటనే బయల్దేరి మీ దేశం వెళ్లిపోవాలి”

“అర్థంకాలేదు”

గుణసేనుడు అసహనంగా “దీంట్లో అర్థంకాకపోవడానికి ఏముంది? ఈరోజే బయల్దేరి మీదేశం వెళ్ళిపొండి” అన్నాడు.

“ఈ రోజే?”

“అవును. ఈ రాత్రికల్లా మీరు పొలోన్నరువ వదిలి వెళ్లిపోవాలి, ఆచార్యా”.

“అసాధ్యం. ఇప్పటికిప్పుడు ఎలా వెళ్తాననుకున్నావు? అయినా ఎందుకు వెళ్ళాలి? నాకేం అర్థంకావడం లేదు”.

“వివరంగా చెప్పేటంత వ్యవధిలేదు. మీరు శాంతిదేవథేరో తీసుకొచ్చిన మనిషనీ, కళింగరాజ్యంకోసం పని చేస్తున్న గూఢచారులనీ, అందుకే సింహళభాషని అంతత్వరగా నేర్చుకొని స్థానికులతో సంబంధాలు పెట్టుకుంటున్నారనీ, ఇంకా చాలా ఆరోపణలున్నాయి.  ఏ నిముషంలోనైనా రాజభటులువచ్చి మిమ్మల్ని తీసుకుపోతారు”.

దీపాంకరుడికి తలతిరిగిపోయింది. నెమ్మదిగా అన్నాడు –

“గ్రంధాల ప్రతులు?…..ఇంకా పూర్తికావల్సినవి చాలా ఉన్నాయి….. ఇప్పటివరకూ చేసినవో?”

“అవన్నీ మేంచూసుకుంటాం. మాకొదిలెయ్యండి. జాబితా నాకివ్వండి. పూర్తికాగానే మీవిహారానికి పంపే ఏర్పాటు చేస్తాను. మీగదికి వెళ్దాం పదండి”. ఆచార్యుల వసతిపైపు నడుస్తున్నారు. ధర్మపాలుడు ఇంకా ఏదో అంటున్నాడు –

“అందరూ అంత్యక్రియల సన్నాహాల్లో ఉన్నారు. మీరు వెంటనే బయిల్దేరితే రేపటివరకూ ఎవరూ గమనించరు”.  

దీపాంకరుడికేమీ అర్థంకావడంలేదు. అతని గదిని చేరుకున్నారు.

“మీ వస్తువులు తీసుకోండి”

చుట్టూచూసాడు దీపాంకరుడు. ఒక భిక్షువు తన వెంటతీసుకుపోయే వస్తువులేముంటాయి? భిక్షాపాత్ర, చేతికర్ర, భుజానికి తగిలించుకొనే చిన్నమూట – అంతే. ప్రతులను తయారుచేసుకోవడానికి వ్రాసుకున్న గ్రంధాల జాబితాగల తాళపత్రాలను వణుకుతూన్న చేతులతో, మౌనంగా గుణసేనుడికి అందజేసి,  

“ఎక్కడికి వెళ్ళాలి?” అని దీపాంకరుడు అయోమయంగా అడిగాడు.

“ఏర్పాట్లన్నీ చేసేశాం. మీరు ఎలాగైనా వారంరోజులలో ఉత్తరతీరంలోఉన్న యాపనయపట్టన (జాఫ్నాపట్నం) చేరుకోవాలి. దారిలోతగిలే ఆరామాలన్నీ మన సానుభూతిపరులవే. ఎవరైనా అడిగితే బౌద్ధక్షేత్రాలు దర్శించడానికి భారతదేశానికి వెళ్తున్నామని చెప్పండి. వీలైనంతవరకూ సింహళభాషలోనే మాట్లాడండి. మీవెంట ఒక శిష్యుడు వస్తాడు. యాపనయపట్టనలో మిమ్మల్ని మత్స్యకారుల పడవనెక్కిస్తాడు. అక్కడనుండి దక్షిణభారత తీరానికి ఒక్కపూటలో చేరుకోవచ్చు”.

గదిబయటకు నడిచారు. గుణసేనుడికి తను మరీ కర్కశంగా, ముక్తసరిగా ఉన్నానేమోఅని అనుమానం కలిగింది. నచ్చజెప్పే స్వరంలో, మృదువుగా –

“నేనే మీతో వద్దామనుకున్నాను, ఆచార్యా. కానీ నేనిప్పుడిక్కడ కనబడకపోతే అంతా అనుమానిస్తారు” అన్నాడు. మౌనంగా నడుస్తున్నారు. గుణసేనుడు తటాలున ఆగి –

“నేనిక్కడినుండి ప్రాంగణంవైపు వెళ్తాను. మీరు స్నానాలకోనేరు పక్కనేఉన్న మామిడిచెట్టుకింద ఉండండి. ఇప్పుడక్కడ ఎవరూ ఉండరు. శిష్యుడిని పంపిస్తాను. ముఖద్వారం వైపుగా కాకుండా పెరటిదారిన వెళ్ళిపోవడం ఉత్తమం”.

“అంత్యక్రియలు…?”

“సూర్యాస్తమయంలోగా అయిపోవాలి. మీరు రాకపోవడమే ఉత్తమం” అని దీపాంకరుడికి నమస్కరించి పెద్దపెద్ద అంగలువేస్తూ హడావుడిగా ప్రాంగణంవైపు వెళ్ళిపోయాడు.

దీపాంకరుడు స్నానాలకోనేరు దిశగా నడిచాడు. సూర్యుడు పశ్చిమదిశకు మళ్లిపోయాడు. ఉత్తరారామంతో తనకు ఋణంతీరిపోయిందంటే నమ్మలేకున్నాడు. ప్రాంగణంలోకివెళ్లి, ఆఖరుసారిగా శాంతిదేవుడిని దర్శించుకోవాలనీ, విద్యాధరబుద్ధుడి విగ్రహానికి నమస్కరించాలనీ, నిర్వాణబుద్ధుడ్నీ, చేతులుకట్టుకొని పక్కననిలబడ్డ ఆనందుడినీ మరోసారి చూసిరావాలనీ అతనికి బలమైనకోరిక కలిగింది.  అన్నికోరికల్నీ వదులుకొని ఒంటరిగా పెరటిదారిన బయట పడ్డాడు.

మూడువారాల్లో దీపాంకరుడూ, అతని శిష్యుడూ యాపనపట్టణం చేరుకున్నారు. దీపాంకరుడిని తమిళజాలరుల పడవనెక్కించి శిష్యుడు వెనుతిరిగాడు. సింహళతీరం అదృశ్యమవుతూండగా తను వ్రాసుకుంటూన్న జ్ఞాపకాల సంపుటి ఉత్తరారామంలోనే మర్చిపోయిన సంగతి దీపాంకరుడికి తటాలున గుర్తుకొచ్చింది. మనసు చివుక్కుమంది. గుణసేనుడు గ్రంధాల ప్రతులతోబాటు అందజేస్తాడులెమ్మని సరిపెట్టుకున్నాడు.

***

పాండ్య, కాకతీయరాజ్యాలగుండా ప్రయాణించి పంపావిహారానికి చేరడానికి దీపాంకరుడికి ఆరునెలలపైనే  పట్టింది. అతడు ప్రయాణించిన దారిలో మూడు బౌద్ధ ఆరామాలు కనిపించాయి. ఒక ఆరామం పాడుబడి ఉంది; అక్కడ ఎవరూ లేరు. రెండవ ఆరామంలో ఆరుగురు భిక్షువులు కనిపించారు. వారిలో ముగ్గురు వయోవృద్ధులు. మిగతా ముగ్గురూ వారికి సేవచేస్తూ చెంతనే ఉండిపోయిన శిష్యులు. దీపాంకరుడినిచూడగానే వారందరికీ ప్రాణం లేచివచ్చింది; నాలందాలో చదువుకున్నాడనీ, సింహళదేశంలో ఆచార్యునిగా పనిచేసి వస్తున్నాడనీ తెలుసుకొని ఎంతో సంతోషించారు. తమతోబాటు ఉండమని అభ్యర్ధించారు. వాళ్లమాట కాదనలేక దీపాంకరుడు వారందినాలు  అక్కడేగడిపాడు. ఇక మూడవది ధాన్యకటకవిహారం; అక్కడి పరిస్థితి ఆశాజనకంగా ఉన్నది. వందకుపైగా  భిక్షువులూ, నలుగురు ఆచార్యులూ ఉన్నారు. తెలుగుమాటలు వినబడుతూంటే దీపాంకరుడికి వీనులవిందుగా ఉన్నది. థేరవాదులుకూడా ఉన్నప్పటికీ, మహాయాన, వజ్రయానాలను అనుసరించేవారు ఎక్కువగా ఉన్నట్టు తోచింది. నాగార్జునిబోధనల ప్రభావం బలంగాఉన్నది. దీపాంకరుడు ఈ విహారానికిరావడం అది రెండోసారి. ఆరేడేళ్లక్రితం, నాలందా వెళ్ళేదారిలో రెండురోజులు అక్కడ బసచేసాడు. అప్పుడుకూడా మంచిఅభిప్రాయమే కలిగింది. అక్కడి శిల్పసంపద అతన్ని ముగ్ధుడ్ని చేసింది.  దీపాంకరుడి గురించి తెలుసుకున్న ప్రధానాచార్యుడు అతన్ని వర్షావాసం అక్కడేగడపమనీ, తనకుతోచిన విషయాలపై ప్రసంగించమనీ కోరాడు. దీపాంకరుడు అంగీకరించాడు.

రెండోరోజున, ఉదయపు ప్రార్థనలు పూర్తికాగానే ఆ విహారపు ప్రత్యేకత అయిన కాలచక్రస్థూపాన్ని దర్శించేందుకు దీపాంకరుడు బయలుదేరాడు. స్థూపంచుట్టూ ఉన్న సువిశాలమైన తోటపై సూర్యుని తొలికిరణాలు ప్రసరిస్తూండగా పక్షుల కిలకిలలతో మర్మోగుతున్నదా ప్రదేశం.

తథాగతుడే స్వయంగా సుచంద్రుడనే రాజుకీ, ఇతరులకూ ఈ ధరణికోటలోనే కాలచక్రతంత్రాన్ని బోధించాడని వజ్రయానంలో ఒక కథ ప్రచారంలో ఉన్నది. కొన్నివందల ఏళ్ల తరువాత శంభాల రాజవంశీకులు ఆ తంత్రపుసారాన్ని విమలప్రభ అనే రచన ద్వారా అందరికీ అర్థంఅయ్యేట్టుగా వివరించారని అంటారు. యుగాంతంలో బౌద్దులకూ, మ్లేచ్చులకూ ఘోరమైనయుద్ధం జరుగుతుందనీ, బౌద్ధులదే అంతిమవిజయం అవుతుందని కాలచక్రతంత్రంలో ఉందని దీపాంకరుడు నాలందాలోఉండగా వజ్రయాన తరగతుల్లో  తెలుసుకున్నాడు. థేరవాది కావటంమూలాన అప్పట్లో వజ్రయానంలో ఏమంత ఆసక్తి ప్రదర్శించకపోయినా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ధర్మయుద్ధాలు, అంతిమ విజయాలు ఇటువంటి అంశాలపట్ల అతనిలో మొదటిసారిగా కుతూహలం కలుగుతున్నది. కాలచక్రతంత్రం సూచించే అంతిమవిజయం బౌద్ధమనుగడకు ఆఖరిఆధారం కావచ్చునేమోనని ఎక్కడో ఒక చిన్న ఆశ.

చాలాసేపు ప్రశాంతంగా కూర్చున్నాక కాలచక్రస్థూపానికి మరోసారి నమస్కరించి బయలుదేరబోతూంటే వెనకనుంచి ఎవరో, “నీకోసమే ఎదురుచూస్తున్నాను, దీపాంకరా” అన్నారు. చూడబోతే చిరునవ్వులు చిందిస్తూ ప్రజ్ఞామిత్రుడనే వజ్రవాద ఆచార్యుడు. వయసు ఏభైపైనే ఉండొచ్చు. అయినా యవ్వనకాలపు చురుకుచూపు, పెంకితనపు నవ్వు.  క్రిందటిసారి అతన్ని చూశాడుగాని పెద్దగా పరిచయంలేదు.

‘ఈయన నాకోసం ఎదురుచూడడం ఏమిటి?’ అనుకుంటూ అభివాదం చేశాడు. ప్రజ్ఞామిత్రుడు అతని ఆలోచనలను గ్రహించినట్టుగా –

“థేరవాదులు కొట్టిపారేస్తారుగానీ, నిరంతరధ్యానం సృష్టించే ప్రగాఢ నిశ్శబ్దంలోంచి రహస్యసంకేతాలు వెలువడుతూనే ఉంటాయి – జాగ్రత్తగా వింటే” అన్నాడు.

దీపాంకరుడు మౌనం వహించాడు. ఇద్దరూ విహారంవైపు నడుస్తున్నారు. మొదట ప్రజ్ఞామిత్రుడే మాట్లాడాడు –

“అజ్ఞానంనుండి జ్ఞానంవైపు ఎంతదూరం  ప్రయాణించినాకూడా తెలుసుకున్నది పరిమితమైనదీ, తెలియనిది అపరిమితమైనదీ, అనంతమైనదీ అని మొదట అంగీకరించాలి”

“నిజమే, ఆచార్యా! మనల్ని నడిపించేది పరిమితమైన వర్తమాన జ్ఞానమే కావచ్చు; కాని అజ్ఞానం మాత్రం కారాదు”.

ప్రజ్ఞామిత్రుడు కొంటెగా నవ్వి, “జ్ఞానం, అజ్ఞానం వీటి మధ్య అందరికీ వర్తించే లక్ష్మణరేఖ ఏదీ ఉండదు. ఎక్కడ జ్ఞానం అంతమవుతుందో, ఎక్కడ అజ్ఞానం మొదలవుతుందో నిర్ణయించడం కష్టం. ఒకవేళ నిర్ణయించినా అది తాత్కాలికమే. ఆ సరిహద్దు స్థిరంగా ఉండదు. కదులుతూ ఉంటుంది. అయినా మాటలకు అందేది పాక్షిక సత్యమే”.

“ఆచార్యా! మీరేమి చెప్పదల్చుకుంటున్నారో అర్థంకావటం లేదు”.

“ఏమీలేదు. వజ్రయానతరగతులు నడుస్తున్నాయి. వారంరోజుల పాటు నువ్వుకూడా వచ్చి మా శిష్యులతోబాటు కూర్చొనివింటే సంతోషిస్తాను. చివరిలో అభ్యాసం కూడా ఉంటుంది”.

“అభ్యాసం అంటే?”

“నువ్వే చూస్తావు”

“తప్పకవస్తాను. కాలచక్రతంత్రంపై మీతో చర్చించవలసిన విషయాలుకూడా కొన్ని ఉన్నాయి”.

ఆ వారం రోజుల్లో వజ్రయానంగురించీ, కాలచక్రతంత్రంగురించీ దీపాంకరుడు చాలా తెలుసుకున్నాడుగాని ఈ మ్లేచ్చులు ఎవరు? వాళ్ళతో యుద్ధం ఎప్పుడు జరగబోతోంది? బౌద్ధులకెవరు నాయకత్వం వహిస్తారు? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు దొరకలేదుగాని చివరిరోజున ప్రజ్ఞామిత్రుడు నిర్వహించిన ఆచరణాత్మక అభ్యాసంలో అతడికి ఊహించని కనువిప్పు కలిగింది. తన అనుభవాన్ని ఈ విధంగా వ్రాసుకున్నాడు:

ఉదయపు ప్రార్థనలు పూర్తికాగానే ప్రజ్ఞామిత్రుడు నన్నుతన గదిలోకి తీసుకుపోయాడు. మా వెంట అతని శిష్యుడొకడున్నాడు. ముగ్గురం ముఖాలకు ఇత్తడి తొడుగులు ధరించాం. ఎందుకని అడిగితే – మన ప్రస్తుత రూపాలనుండి వేరుపడి దూరంగా ప్రయాణించడానికి అన్నాడు. శిష్యుడు ఊదొత్తులు వెలిగించాడు ఒకే ఒక్క ప్రమిదను వెలిగించి, తెరలుమూసి చీకటిచేశాడు. ప్రజ్ఞామిత్రుడు నన్ను తనతోబాటుగా ధ్యానంచెయ్యమని అడిగాడు. ఇద్దరం చాలాసేపు ధ్యానంచేసాం. నాకలవాటేగనుక ఏ విధమైన ఇబ్బందీ కలుగలేదు. తనతోబాటుగా ఊపిరితీసుకొని వదలమన్నాడు. అలాగేచేశాను. ఇరువురి సన్నటి ఊపిరిశబ్దం మినహా అంతటా నిశ్శబ్దం. పిదప నన్ను శవాసనంలో పడుకోమన్నాడు. దీర్ఘనిద్రలోకి వెళ్ళమనిసూచించాడు. ఆ తరువాత ఏమైందో తెలియలేదు. తెలివివచ్చేటప్పటికి మధ్యాహ్నమయింది. ప్రజ్ఞామిత్రుడి శిష్యుడు వ్రాసిపెట్టుకున్న వివరాలను బట్టి క్రింది సంభాషణ జరిగినట్టుగా తెలిసింది:

ప్రజ్ఞామిత్రుడు: నీవు విహారంలో కొత్తగా ప్రవేశించిన రోజుల్ని గుర్తుచేసుకో. ఆరోజులు నీకు బాగా గుర్తొస్తున్నాయి. ఇప్పుడేం కనిపిస్తోంది?

దీపాంకరుడు: అప్పుడునేనొక చిన్నపిల్లవాడిని. పదేళ్ళుంటాయేమో. ఒక భిక్షువు నా చెయ్యపట్టుకొని నడిపిస్తున్నారు. ఉత్సాహంగా వెళ్తున్నాను. ఒక చెట్టుకింద కూర్చోబెట్టి గుండుగీసారు. భయంవేసింది. కాషాయిబట్టలిచ్చి కట్టుకోమన్నారు. ఏడుపొస్తోంది. మా ఇంటికి, అమ్మ వద్దకు వెళ్ళిపోతానన్నాను”.

ప్ర: మీ అమ్మ అక్కడలేదా?

దీ: అక్కడే ఉంది. ‘ఇది నీ బడి. ఇక్కడుంటే నీకు చదువుచెబుతారు. ఈయన నీకు గురువులు; వారు చెప్పినట్టుగా చెయ్యి. నీకు బాగా చదువొస్తుంది. గొప్పవాడివి అవుతావు’ అని అంటోంది ఆమె నాతో.

ప్ర: తరవాత ఏమైంది?

దీ: గురువుగారు మా అమ్మని వెళ్ళిపొమ్మని అంటున్నారు. మా అమ్మ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. నేనూ ఏడుస్తున్నాను. గురువుగారు ఓదారుస్తున్నారు.

ప్ర: మీ నాయిన లేడా?

దీ: ఏమో, తెలీదు. కనబడడం లేదు.

ప్ర: ఇంకా వెనక్కి, ఇంకా చిన్నతనంలోకి వెళ్తున్నావు. ఇప్పుడేమి చూస్తున్నావు?

దీ: మా నాయినను అరుగుమీద పడుకోబెట్టారు. అమ్మ ఏడుస్తున్నది. ‘మాకు దారిచూపించి వెళ్ళిపో’ అంటున్నది. ఇంకా ఎవరో చాలామందే ఉన్నారు.

ప్ర: మీ నాయిన ఏమంటున్నాడు?

దీ: ఏమీ మాట్లాడడం లేదు.

ప్ర: మీ నాయన ఏమిచేస్తుంటాడు?

దీ: రాచకొలువులో నియోగిగా (కరణీకం) చేస్తూంటాడు.

ప్ర: ఏ ఊళ్ళో?

దీ: తెలియదు.

ప్ర: మీ ఊళ్ళో ఏముంది?

దీ:  మా ఊళ్ళో నృసింహస్వామి ఆలయం ఉంది. ఊరవతల నది ఉంది. తెల్లవారుఝామున మా నాయినతో వెళ్లి నదిలో స్నానంచేస్తున్నాను. అబ్బో చలి! నీళ్ళు చల్లగా ఉన్నాయి. కార్తీకమాసం. మా నాయిన మంచివాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. నడవలేనంటే నన్ను భుజంమీదఎక్కించుకొని ఇంటికొచ్చాడు. మాఅమ్మ మాకోసం చక్కెరపొంగలి చేసింది.

ప్ర: ఆ నది పేరేమి?

దీ: బాహుదా నది.

ప్ర: కళింగరాజ్యంలో ఉన్నది. అదేనా?

దీ: ఏమో, తెలియదు.

ప్ర: ఇంకా వెనక్కి, ఇంకా చిన్నతనంలోకి వెళ్ళు. ఇప్పుడేమి చూస్తున్నావు?

దీ: ఏమీ కనబడటంలేదు. చీకటి. అయినా ఎంతో వెచ్చగా, ప్రశాంతంగా ఉన్నది. ఆనందంగా ఉన్నది.

ప్ర: నీ తల్లి గర్భంలో ఉన్నావు. అవునా?

దీ: ఏమో, తెలియదు.

ప్ర: గాఢనిద్రనుండి బయటకు వస్తున్నావు. మళ్ళీ ఇప్పటికాలంలోకి వస్తున్నావు. కళ్ళు తెరిచిచూడు.

ఈ అనుభవంతో దీపాంకరుడు చలించిపోయాడు. అతనికి లీలగా గుర్తున్నవిషయాలూ, పూర్తిగా మర్చిపోయిన విషయాలూ అనేకం జ్ఞాపకానికిరాసాగాయి. ఈ ప్రయోగాన్ని ఇంకా పొడిగిస్తే దీపాంకరుడు తన గతజన్మల గురించి తెలుసుకోవచ్చన్నాడు ప్రజ్ఞామిత్రుడు. ఈ విషయమై దీర్ఘంగా ఆలోచించాక దీపాంకరుడు ఒక నిర్ణయానికి వచ్చాడు.

“మళ్ళీ ఎప్పుడు కూర్చుందాం?” అని ప్రజ్ఞామిత్రుడు అడిగినప్పుడు,

“ఈ జన్మ యిచ్చిన విషాదాన్ని భరించడమే కష్టంగా ఉన్నది. గతజన్మల విషాదాన్నికూడా తవ్వుకోవాలనుకోవడం నాకు అర్థరహితంగా కనబడుతున్నది – జన్మరాహిత్యంవైపుగా ప్రయాణించాలని బయల్దేరినవాడిని” అన్నాడు.

అక్కడితో ఆ చర్చ ముగిసింది. వారంరోజుల తరువాత ప్రజ్ఞామిత్రుడు కొంతమంది శిష్యుల్ని వెంటబెట్టుకొని వజ్రయానాన్ని అధ్యయనం చెయ్యడానికని తిబెత్తుదేశానికి బయలుదేరాడు. మరో రెండువారాల తరువాత దీపాంకరుడు పంపావిహారానికి ప్రయాణంకట్టాడు.

***

దీపాంకరుడు పంపావిహారం చేరేనాటికి శిశిరం వెళ్ళిపోయి వసంతఋతువు ప్రవేశిస్తున్నది.  కొండల్లో  పచ్చదనం, చల్లదనం ఇంకా మిగిలిఉన్నవి. అల్లంతదూరాన పచ్చని విహారపు కొండలు కనబడగానే దీపాంకరుడి ఉత్సాహం రెట్టింపయింది. అడుగులు వడివడిగా పడుతున్నాయి. చెమటలుకక్కుతూ విహారప్రాంగణం చేరుకున్న దీపాంకరుడికి నిరాశే ఎదురైంది. అక్కడ మనుష్యసంచారం లేదు. పరిసరాలను పరికిస్తే అక్కడ చాలాకాలంగా ఎవరూ అడుగుపెట్టిన సూచనలు లేవు. ఎటుచూసినా దుమ్మూ, ధూళీ, ఎండుటాకులు, పిచ్చిమొక్కలు. దీపాంకరుడికి విపరీతమైన దాహం వేస్తున్నది. మెట్లమీద ఉండే మంచినీళ్ళ కుండలు అడవిజంతువులేవో వాటిని పడదోసినట్టు ముక్కలై ఉన్నాయి. కోయిలల పిలుపులతో లోయంతా మార్మోగిపోతోంది. వేడిగాలి మోసుకొస్తూన్న మామిడిపూత వాసన గుప్పుమంటోంది. విహారపు గుహలోపలికి నడిచాడు. నిర్మానుష్యంగా ఉన్నది. ‘అక్కడసలు మనుషులు ఉండేవారా ఎప్పుడైనా?’ అని సందేహం కలిగేట్టుగా ఉంది. అతడిరాకతో మేల్కొన్న గబ్బిలం ఒకటి కీచుమని అరుస్తూ అతని తలమీదుగా బయటకు ఎగిరిపోయింది. కాసేపు తను చూస్తున్నది పీడకలా నిజమా అని దీపాంకరుడికి అనుమానం కలిగింది. ప్రాంగణంలోకి వచ్చి మర్రిచెట్టుకింద కూర్చున్నాడు. అప్పటికే సన్నబడిన పంపానదిలో ఎప్పటిలానే చాకళ్ళు బట్టులుతుకుతున్నారు. బట్టల్ని బండకేసిమోదిన క్షణకాలం తరవాత ‘దభీ, దభీ’ మనే శబ్దం పైకి కొండమీదకి వినవస్తోంది; ఆ వెంటనే ఆ శబ్దపు ప్రతిధ్వని లోయల్లో గింగురుమంటోంది. కోయిలల సందడి దీపాంకరుడి చెవులకు అసందర్భంగా వినిపిస్తున్నది.

ఎంతసేపలా కూర్చుండిపోయాడో అతనికే తెలియదు. మధ్యాహ్నమైంది; భిక్షాటనకు వెళ్ళాల్సిన సమయం మించిపోయింది. దాహానికి ఆకలి తోడైంది. గుడిగంట వినబడింది. ఆదిక్కుగా చూశాడు. శివుడి కోవెలగా మారిన విహారపు గుహనుండి. ఇదివరకెన్నడూ అక్కడ్నించి గుడిగంటలు వినరాలేదు. చూడబోతే జనసంచారం ఉన్నట్టుగానే అనిపించింది. లోయలోకి దిగాడు. ఒక వేపచెట్టువద్ద గ్రామదేవత గుడిముందు అలంకరించిఉన్న మేకలను బలివ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. డప్పులు మోగుతున్నాయి. అక్కడ మూగిన మనుషుల్నిదాటి ముందుకి నడిచాడు; కొండపైకి ఎక్కి శివకోవెలగా మారిన విహారపుగుహని చేరుకున్నాడు. అక్కడంతా భక్తులతో సందడిగా ఉంది; ఇదివరకులేని బ్రాహ్మణపూజారి కనిపించాడు. శివలింగరూపమెత్తిన అసంపూర్ణ స్తూపానికెదురుగా కొత్తగా వచ్చిచేరిన రాతిమంటపంలో నందివిగ్రహం. పూజారినడిగితే గ్రామపెద్దకు ఈశ్వరుడు కలలోకనిపించి నందీశ్వరుడిని ప్రతిష్టించమని కోరాడని చెప్పాడు. పూజారినడిగి మంచినీళ్ళు తాగాడు. ప్రసాదంఇస్తే తన బిక్షాపాత్రలో వెయ్యమన్నాడు. పక్కకు వెళ్లి ఒక రాతిమీద కూర్చొని ప్రసాదం తిన్నాక పూజారిని అడిగాడు –

“పక్కనున్న కొండపైన విహారంలో ఉండే భిక్షువులు ఏమయ్యారో తెలుసా?”

పూజారి నోరువిప్పేలోగా పక్కనున్న భక్తుడు సమాధానం చెప్పాడు, “గుండు సాధువులేనా? వాళ్ళ పెద్దగురువు పోయి ఏడాదిపైనే అవుతుంది. ఆయనపోయాక వాళ్ళెవరూ ఇటు రావడంలేదు”.

“అంటే భద్రపాలుడుగారు పోయారా?”

“పేరు తెలియదు స్వామీ. పసరువైద్యం చేస్తూండేవారు కదా – పెద్దాయన. ఆయన పోయాడు”

దీపాంకరుడు ఒక్క నిముషం మౌనంగా ఉండిపోయాడు.

“మొన్నటి వర్షాకాలంలో ఎవరైనా ఇటు వచ్చారా?”

“అబ్బే, ఎవరూ రాలేదు, స్వామీ”

భిక్షాటనకు మాత్రం ఊళ్లోకి వెళ్ళివస్తూ విహారంలో ఒంటరిగా వారంరోజులు గడిపాక దీపాంకరుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇక్కడిక చెయ్యగలిగేదేమీ లేదు. గ్రంధాలకు ప్రతులు వ్రాసిపెట్టడంలోనూ, అవకాశంఉన్న మేరకు యువభిక్షువులకు బోధనలు చెయ్యడంలోనూ గడిపితేనే శేషజీవితం సార్థకమవుతుంది. ఇందుకుగాను ధాన్యకటక విహారానికి మరలిపోవడమే  ఉత్తమం అనిపించిది. ఏ కష్టాలూ, ఇబ్బందులూ ఇకపై అతన్నితాకబోవనీ,  అతని లక్ష్యాన్ని ఛేదించలేవనీ అతనికి స్పష్టమైపోయింది.

దీపాంకరుడు ధాన్యకటక విహారం చేరుకున్నప్పుడు ప్రధానాధ్యాపకుడు అతనికి ఎంతో ఆదరంగా స్వాగతంపలికాడు. దీపాకరుడు తలపెట్టిన మహాత్కార్యాలకు విహారం తప్పకుండా సహకరిస్తుందని అభయమిచ్చి కలకాలం గుర్తుండిపోయే ఒక మాటన్నాడు:

“బౌద్ధానికి కాలంచెల్లిపోయిందని కొంతమంది ప్రచారంచేస్తున్నారు. ఇప్పటి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నమాట వాస్తవమే. మానవజీవితం దుఃఖభరితంగా ఉన్నంత కాలం, అజ్ఞానంఅనే అంధకారం చుట్టూతా ఆవహించినంత కాలం, చావనే అంతుతెలియని అగాధం మనుషులకెదురుగా నిలిచిఉన్నంత కాలం, బౌద్ధం ఒక ఉత్తమ మోక్షసాధనంగా ఉంటూనేఉంటుంది; సత్యం, కరుణ, మైత్రి – వీటివైపు మనుషుల్ని నడిపిస్తూనే ఉంటుంది”.

దీపాంకరుడు మరో ఇరవైఏళ్లపాటు తనవంతు కృషిచేసి, ధాన్యకటకవిహారంలోనే తనువుచాలించాడు. అతడు కోరుకున్నట్లుగానే అతని చితాభస్మాన్ని కళింగదేశ సరిహద్దుల్లోని బాహుదానదిలో కలిపారు. ఆ మారుమూల ప్రాంతంలో, చిన్న వాగులాంటి నదిని ఆచార్యులవారు ఎందుకు ఎన్నుకున్నారో శిష్యులకు తెలియలేదు. అయినప్పటికీ దీపాంకరునిపై ఉన్న గౌరవంతో అతని ఆఖరి కోరికని నెరవేర్చారు.

oOo

ఉణుదుర్తి సుధాకర్

లోలోపలే మరణిస్తున్న ఎందరో….

నాలుగు వందల సంవత్సరాల వివక్షా పూరిత గాలులలో ఇప్పటికీ విషం చెరిగే అసత్యపు సాంస్కృతిక మూస ధోరణులు, జాతి మరీచికల నడుమ మనిషికి మనిషికి మధ్య ముఖ్యంగా నల్లజాతి మనిషికి తెల్లజాతి మనిషికి మధ్య  ముడి నగ్న సత్యాల మార్పిడి అత్యవసరం అంటారు  మనందరం చదివి ఔపోసన పట్టిన “రూట్స్” రచయిత అలెక్స్ హేలీ . మరి వేల ఏళ్లకి పైగా రంగు తేడాలు లేకుండానే వివక్షలననుభవిస్తున్న16.6 శాతం షెడ్యుల్ క్యాస్ట్స్ ఇంకో 8.6 శాతం షెడ్యుల్ ట్రైబ్స్ గొంతెత్తి చెప్తున్న నగ్న నిజాలని హత్తుకొనే ధైర్యం లేకపోయినా కనీసం రెండు చెవుల మధ్య మెదడు తెరచి పెట్టుకొని వినే క్షమత అయినా మిగిలిన వాళ్లందరికీ ఇప్పుడు ఉందా అన్నదే ప్రశ్న .

రెండున్నరేళ్ళ క్రితం ఎంపికైన బ్యాలెట్ల రక్తం నిరంతర బలవంతపు సామాజిక సంఘీభావాలు  , నియంతృత జాతీయవాదాలుగా మారిపోయి నిరపరాధులను అమాయకులను హతమార్చడం ,ఇన్నోసెంట్ పీడిత మేధావుల అణచివేతకు కేరాఫ్ అడ్రెస్గా ప్రభలుతూ, గాంధీ స్థానంలో గాడ్సే ఆరాధకుల హంతక ముఖచిత్రాలు ముద్రించుకుంటున్న నయా మూఢభారతం అసలు వినిపించుకొనే పరిస్థితిలో ఉందా అని  ?

సరిగ్గా ఏడాది ఇప్పటికి, ఒక ధిక్కారాన్ని హత్య చేసి ! బ్రాహ్మణ వాదాన్ని భుజాన మోసిన గౌతమీ పుత్ర శాతకర్ణి, తల్లికిచ్చిన మర్యాదల కథలకి  కదిలిపోయి ఈ రోజుకి సైతం కన్నీరు పెట్టుకొనే సమాజం రోహిత్ వేముల తన కులమేమిటో నిర్ణయించుకొనే హక్కు మాత్రం తల్లి పేగు నుండి విడదీసి తండ్రి మొలకి చుట్టి చప్పట్లు కొడుతున్న అదే ప్రజల సమాజంగా రెండు నాలుకల పితృస్వామ్య నిసిగ్గు ధోరణికి పరాకాష్టగా నిలబడుతున్నప్పుడు ఇక్కడ ప్రశ్నలు మూగబోవట్లేదా ? సమాధానాలు నిశబ్దంగా సజీవ సమాధి కాబాడటం లేదా ? ఇహ ఇక్కడ వినేవాళ్ళు ఎవరు అసలిక్కడ  ?

ఇప్పుడిక్కడ సంస్థాగత హత్యని యేమార్చి, హంతకులని అట్రాసిటీ కేసులనుండి తప్పించడమే మిగిలిన పరమ ధర్మం అయినప్పుడు దేవుడి సాక్షిగా సైన్సు పీఠాధిపతులు మధ్య ప్రధానమంత్రి చేతి నుండి ప్రతిభావంతుల తలారులు మిలేనియం అవార్డులు పొందుతారు . హత్యను ప్రేరేపించిన పరిమిత నేషనలిజపు పెద్ద తలకాయలు ఆధిపత్య జెండాలు ఎగరేయడానికి కొత్త అధికార కేంద్రాల మధ్య అదలాబదిలీ ఆటాడుకుంటుంటాయి. ప్రతిసారి పాయిజన్లు పరాన్న జీవులు కలగలిసిన తప్పుడు విశ్వాసాల ప్రమాణాల మధ్య  ప్రాదేయపడుతున్న హక్కుల వికాసం మళ్ళీ మళ్ళీ ఒక రోహిత్ వేములగా ఉరికొయ్యకి వేలాడుతుంది. అందుకేనేమో ఇప్పుడిక్కడ నిశబ్ధం కూడా చోటుచేసుకోనంత అనంత శూన్యమే మిగిలినట్టు కనిపిస్తుంది .

బహుశ అధికార నియంతృత్వ మీడియాలో కాకపోయినా కనీసం సోషల్ మీడియాలో సైతం భావప్రకటనా స్వేచ్చ కరువైపోయాక, పౌరుషాలన్నీ ఎటిఎం క్యూల ముందు డీలా పడి స్వీయసంపాదనలలో పావలాకి  అర్ధకి యాచకులైనప్పుడు భారతదేశం శాంతికాముకుల దేశం కాదిది చేతగాని చవటాయిల రాజ్యమని నిసిగ్గుగా ప్రపంచ దేశాల ముందు ప్రకటించుకుంటున్నప్పుడు , దేవుని పేరిట రాజుల పేరిట నియంత్రించబడి, విభజించి జయించడానికే పరిమితమయిన సాంస్కృతిక రక్షకుల మెదడులు, చెవులు మాత్రమే కాదు ఇక్కడ ముక్కలయిన హృదయాలు సైతం మూతపడిపోయాయి అనుకుంటా కదా !

ఇహముందు రాబోయేదంతా మరింత గడ్డుకాలమే అని చుట్టూగాలులన్నీ వెర్రిగా ఏడుస్తున్నప్పుడు క్లాడ్ మెకై (Festus Claudius “ClaudeMcKay (September 15, 1889 – May 22, 1948) రాసిన   చిన్న పవర్ఫుల్ కవిత “ If we must die” అనుసృజన మనకేమన్నా కొద్దిపాటి ధైర్యం నేర్పుతుందేమో చూద్దాం .

 

చావు తప్పనిసరైనప్పుడు

_ క్లాడ్ మెకై  Claude McKay

 

మనందరికీ

చావు తప్పనిసరైనప్పుడు

శపించబడిన మనలాంటివారి చుట్టూచేరి

గేలిచేస్తున్న ఆకలి కుక్కల నడుమ

నికృష్టకరమయిన స్థలాలలో వేటాడబడిన పందుల్లా కాకుండా

చివరికి మనల్ని అంగీకరించని క్రూరులు సైతం ఈ మరణాలniని గౌరవించక తప్పనట్లు

మనందరికీ చావు తప్పని సరైనప్పుడు

మన విలువైన రక్తం నేలపాలు కాకుండా ఘనంగా చావునాహ్వానిద్దాం !

 

ఓ సంబంధీకులార !

మనది పరిమిత సంఖ్యే అయినా

వాళ్ళ వేల దెబ్బల ముందు ఒక్క మరణం విలువేమిటో చూపి

మన ధైర్యం చాటడానికిi మన సమిష్టి శత్రువుని మనందరం కలవాలి

(వంద గొడ్లని తిన్న రాబందులు ఒక్క తుఫానుకి చచ్చినట్టు )

 

అయినా ,

మన సమాధుల ముందు ఇహ మనకేమి మిగిలుందని

గోడలకేసి నొక్కి పెట్టె హంతక తోడేళ్ళ గుంపులపై తిరిగి పోరాడటం మినహా !

 

(“రో” జ్ఞాపకంలో  రోజురోజుకి లోలోపలే మరణిస్తున్న ఎందరో ఔత్సాహికులతోపాటు…)

*

 

 

 

 

సుగాలిపిల్ల

Art: Satya sufi

నువ్వంతే
ఎప్పుడూ
నిత్య వికసిత
కుసుమానివై పరిమళం వెదజల్లుతుండు
నిను కాంచే చూపుల పై… దేహాలపై…
~
నీ నవ్వుకు వేలాడుతుంది ఓ ముక్క ఆకాశం
కాంతి సముద్రాన్నెత్తుకొని
నీ నడుమ్మోసే చంటిపాపలా
ఓ మాయని మాయలా
ముడతలు కొన్ని
నీ ముఖంమ్మీద
అందం చెక్కిన ఆనందాలౌతుంటాయి
అసలే నలుపు
ఆపై చెవికి చెవులై వేలాడే లోలాకులు
నక్షత్రమంత కాకపోయినా
అలాంటిదే ఓ ముక్కు పుడక
నీ ముక్కు అందం జుర్రేసుకుంటూ
అంత వరకూ చూడని
రంగురంగుల సీతాకోకచిలుక
దేహపుహోళిలా నిను చుట్టేసిన బట్టల
అద్దాల్లోంచి తొంగి చూస్తూ
విభ్రమకు భూగోళం నిజార్థమై నిలబడిపోతే
దాని ఉపగ్రహమై నీ ఊహలతో  భ్రమిస్తూ  నేను…
ఏ తాండా నుంచి ఊడిపడ్డావో వాకబు చేయడానికనుకుంట
రోడ్డువార నిలుచొని నువ్వల్లిన పూసల పూల మీద
వాలింది  గాలిభ్రమరం మకరందాన్ని జుంటితేనెగా చేస్తూ
నల్లరంగందం లో  ఓ పిల్లా
పిల్లతెమ్మర నీ జడకుచ్చై కవ్విస్తోంది
కాసింత చూసుకో
నీ బోళాతనంలోనే
నీ అందమంతా దాగుందని తెలుసుకొని
కాబోలు
నీ రెండు కనుబొమల మధ్య జాగాలో
సాయంకాలాన్ని అద్ది వెళ్ళిపోయాడు
భానుడు
నీ ముఖవర్ఛస్సును
రెండింతలు చేస్తూ
నిను నీ అందపు అమృతాన్ని
నింపుకోకుండా
ఏ కంటి రెటినా ఉండగలదూ…చెప్పు..

నిర్భయారణ్యం

Art: Satya Sufi

నా లోపలి సతత హరితారణ్యానికి

ఎవడో చిచ్చు పెట్టాడు

మట్టిదిబ్బలూ ముళ్లపొదలూ తప్ప

తుమ్మముళ్లూ బ్రహ్మజెముళ్లూ తప్ప

పూల పలకరింపుల్ని ఆఘ్రాణించలేని

పక్షుల రెక్కల ఆకాశాల్ని అందుకోలేని

సెలయేళ్ల లేళ్లను తనలోకి మళ్లించుకోలేని

జంతుజాతుల జన్మరహస్యాల్ని పసిగట్టలేని

మనిషిరూపు మానవుడొకడు

ఒళ్లంతా అగ్గి రాజేసుకుని అంటించేశాడు

వాడు

విధ్వంసపు మత్తులో తూలుతూ

మంటల ముందు వెర్రిగా తాండవమాడుతూ

++++++

కాలమాపకయంత్రం మలాము పూసింది

కాలిన గాయాలు కనుమరుగవుతున్నాయి

పచ్చదనం మళ్లీ పొగరుగా తలెగరేస్తూ-

పాపం!

వాడి మొహం మంటల్లో చిక్కుకుంది

 

– 

 

 

ఏ నిమిషానికి…

 

భూపతిరాజు త్రిలోచనరాజుగారి ఇంటి దగ్గర ఆగిన వేగిరాజోరి మట్ట,  ప్రహారీ ముందు కాస్సేపు అలాగే  నిలబడి, అయోమయంగా తల గోక్కున్నారు.

‘ తూర్పా, పడమటా? పడమటా, తూర్పా?  ఉత్తరవా, దచ్చిణవా? దచ్చిణవా, ఉత్తరవా? ‘ ఈరోజు త్రిలోచనరాజుగారు ప్రహారీకి ఏ దిక్కునున్న తలుపు  తీయించి ఉంటారు? అనే అనుమానంతో మట్ట చేతులు అలా అసంకల్పిత ప్రతీకార చర్యలా  తలలోకి పోయి గోకడం మొదలెట్టాయి.

‘ కాళ్ళుపీకేలా ఇక్కడెందుకు నిలబడ్డం?  ఇంటి చుట్టూ ఓ ప్రదక్షిణ చేసి వచ్చేస్తే, అదే తెలిసిపోతుంది కదా?’ అనుకొని  ఆ పనిలో పడ్డారు మట్ట.

నెమ్మదిగా నడచి వెళ్తున్న మట్ట మొహాన్ని, తెరలు తెరలుగా వచ్చిన గాలి అలలు అలలుగా మారి చాచిపెట్టి కొట్టింది.

‘ ఇదేంటిది? ఇదేం గాలిది? ‘ అనుకున్న ఆయన, నడవడం ఆపి అటు ఇటూ పైకీ కిందకీ ఓసారి చూసారు. చుట్టూ చాలా చెట్లున్నా… ఎక్కడా ఏ చెట్టుకున్న ఆకూ అల్లల్లాడ్డంలేదు.

‘మరి ఈ మాయముండా గాలి ఎక్కడ్నుంచి ఊడి పడినట్టో? ‘ ఎందుకో కానీ మట్ట వళ్ళు జలదరించింది.

ఎందుకో ఏమిటి? అది భయం ముందర వచ్చే గగుర్పాటు.

‘చర చర, జర జరా ‘ మని… పెద్ద కాలనాగు కాళ్ళ పక్కనుంచే పాక్కుంటూ పోతున్న చప్పుడు ఆయన చెవులకి తాకింది. అది నాగా? కాదా? అని తల వంచి చూసే సాహసం చెయ్యలేకపోయారు.వెన్నులో సన్నగా  మొదలయిన వణుకు, కాళ్ళలోకి పాకి ఇక కదలవద్దంటూ బంధనం వేసేసింది.

‘ ఎప్పుడూ లేంది? ఏంటియ్యాల!’ భయంతో… ఆయన గొంతులోంచి ఓ వెర్రికేక, దిక్కులు పిక్కటిల్లేలా బయటపడాలని ఆరాటపడింది. కానీ అంతలోనే…

‘ మ.మ..మ…హహ్హహ్హహ్హ…హాట్టా…ట్టా…ట్టాట్టా ‘

‘ ??????????? ‘

‘ అటు… టూ.టూ..టూ… ‘

‘ ??????????? ‘

‘ ఆ ఆ ఆ… తూ.తూ..తూ…ర్ ర్ ర్పు వేపు  రా రా రా ‘ అంటూ చడీ చప్పుడు కాకుండా వచ్చిన ఇంకో గాలి, చెవిలో ఈలలా గోల చేసి వెళ్ళిపోయింది.  ఆ గాలి స్వరం భాస్వరంలా, అచ్చం త్రిలోచనరాజుగారి కంఠస్వరంలాగా ఉంది.

‘ భ్రమా? భ్రాంతా? గాలి మాట్టాడ్డం ఏంటి? నా తలకాయ్’ అనుకున్న మట్ట… ఒక్క సారిగా శక్తిని కూడదీసుకొని, తూర్పుగుమ్మం వైపు పరుగు లంకించుకున్నారు.

గుమ్మం ముందు పరుగు ఆపి, ఒకింతసేపు ఆయాసం తీర్చుకొన్నాకా… స్థిమితపడి, దానికి వున్న పెద్ద ఇనపతలుపుని లోపలకి త్రోసారు.

‘ కిర్ర్… ర్ ‘ అందే కానీ… అది కొంచెం కూడా కదల్లేదు.

‘ ఊప్ ‘ బలాన్నంతా ప్రయోగించి రెండు చేతులతోనూ ఇంకోసారి ప్రయత్నించారు.

‘కిర్ర్. ర్రు.. ర్రూ…ర్ర్ ర్ ‘ మని మొండికేస్తూనే ఎలుగుబంటి ఆవులించినట్టు,  ఎడమ వైపు ఉన్న సగం తలుపు లోపలకి  తెరుచుకుంది.

‘ ఎంతైతే ఏంటి? ఎంతో కొంత… తెరుచుకుందిలే, దూరడానికి సందు దొరికింది కదా… అదే బ్రహ్మాండం ‘ అనుకున్న మట్ట ‘శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం ‘అని చదువుకుంటూ  ఒక్క ఉదుటున లోపలకి  గెంతి, ఎదురుగా ఉన్న బంగాళా పెంకుల పెద్దింటి వైపు,  తేరిపార చూసారు.

మాయామహల్ అంటే ఇదేనేమో అనిపించింది ఆయనకి. ‘ మాయలూ, మంత్రాలూ వచ్చినోళ్ళుండే ఇల్లు మాయామహల్లా కాకుండా, లీలా మహల్ సినిమాహాల్లా ఉంటదేటీ?’ అనుకొని, వెనక్కి తిరిగి తలుపుని యధాప్రకారం  త్రోసేసారు.

లోగడ ఇద్దరు, ముగ్గురు తమకి ఇలాంటి జడుపు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు కానీ మట్ట వాటిని పట్టించుకోలేదు.

ఇవన్నీ త్రిలోచనరాజుగారు తమ ఇంటి చుట్టూ కాపలా పెట్టుకున్న అదృశ్య శక్తులు చేసే అరాచకాలూ, విపరీత చేష్టలూనట. మరి ఆ గాలి మాటలేంటి? అచ్చం త్రిలోచనరాజుగారి మాటల్లాగే ఎందుకు ఉన్నాయి. బాబోయ్ ఇంక అలోచించకూడదు. ఆలోచిస్తే తల పగిలిపోయేలా ఉంది అనుకున్న మట్ట, మనస్సులో మళ్ళీ ఆంజనేయదండకం  మొదలెట్టారు.

***

మట్ట అసలుపేరు వేగిరాజు పెద చంద్రరాజు. చిన్నప్పుడు, అయనా, ఆయనగారి తమ్ముడు బలబద్ర రాజూ క్రికెట్ ఆడుకోవటానికి, బ్యాటూ బంతీ బదులు కొబ్బరిమట్టా, కొబ్బరిపుచ్చులని వినియోగించేవారట. దానితో పెద్దవారు మట్టగానూ, చిన్నవారు పుచ్చుగానూ ప్రసిధ్ధికెక్కారు. మట్టా పుచ్చూ అనటమే కానీ, వాళ్ళ అసలు పేర్లు ఎవరికో గానీ పూర్తిగా తెలీవు. వాళ్ళ కుటుంబంలో ఇంకా పెద్దమట్టా చిన్నపుచ్చూ,  పెద్దపుచ్చూ చిన్నమట్టా కూడా ఉన్నారు. ఈ మధ్యనే ఓ బుజ్జిమట్టో, బుల్లిపుచ్చో కూడా పుట్టినట్టున్నారు. నిన్నో మొన్నో ఊరంతా బిడ్డసారిగా, చలివిడీ సునిపిండీ  పంచిపెట్టారు. భవిష్యత్ లో పుచ్చూ మట్టా అనేవి  వారి ఇంటి పేర్లుగా మారిపోయినా ఆశ్చర్య పోనక్కరలేదు. అలాంటి దృష్టాంతాలు రాచ కుటుంబాల్లో అనేకం ఉన్నాయి.

***

మాయా మహల్ లాంటి భూపతిరాజు త్రిలోచనరాజుగారి ఇల్లు, రెండెకరాల కొబ్బరితోటలో ఉంది. తోట చుట్టూ ఎత్తైన ప్రహారీ, ఇంటి చుట్టూ పిట్టగోడ. పిట్టగోడకీ ప్రహారీకి మధ్య పెద్ద దూళ్ళచావిడి. పశువులని లంకల్లో మేతకోసం, గోదారి దిగ్గొట్టడంతో దూళ్ళచావిట్లో లేగదూడలు మాత్రమే కనిపిస్తున్నాయి.  ప్రహారీకి నాలుగు వేపులా నాలుగు పెద్ద పెద్ద గుమ్మాలూ వాటికి ఇనప తలుపులూ వున్నాయి. త్రిలోచనరాజుగారికి గ్రహఫలాలూ, వాస్థు పట్టింపులూ చాలా ఎక్కువ. తిధి,వార, నక్షత్రాల ప్రకారం, ఒక్కో రోజున ఒక్కో దిక్కున ఉన్న ప్రహారీతలుపులు తీసి మసులుతుంటారు ఇంట్లో వాళ్ళు .  తెరిచిన ఆ గుమ్మం మినహా, ఆరోజుకి మిగతా మూడు దిక్కుల్లోని  గుమ్మాలతలుపులూ మూసేసి, లోపలకి తాళాలు బిగించేసి ఉంటాయి. ఇంటి పిట్ట గోడకి కూడా నాలుగు వైపులా నాలుగు చిన్న చిన్న గుమ్మాలున్నాయి. వాటికి ఇరుప్రక్కలా, నాలుగు రెళ్ళు ఎనిమిది దీప స్థంభాలు ఠీవిగా నిలబడి ఉన్నాయి.

***

మట్ట, కొబ్బరితోట మధ్యలో ఉన్న  ఎర్రకంకర కాలిబాట మీదుగా, త్రిలోచనరాజుగారి ఇంటి వేపు నడుస్తున్నారు.బాటకి ఇరుప్రక్కలా ఎత్తుగా ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లు, తోటకి గొడుగులు పడుతున్నట్లుగా ఉన్నాయి. దాంతో తోటలోపల పట్టపగలే చిరుచీకటి అలుముకున్నట్టుగా ఉంది. ఉండుండి సన్నటి చలి కూడా వేస్తోంది. మంద్రంగా కీచురాళ్ళ రొద తప చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉండడంతో, చెప్పుకాళ్ళ కింద విరుగుతున్న ఎండుపుల్లల చప్పుడు మట్టకే కర్ణకఠోరంగా వినిపిస్తోంది.

మేతకోసం వెతికి వేసారి అలసిపోయిన ఓ ముసలి కాకి, ఏమూలనుంచో ‘కా, కా’ అని నీరసంగా ఆకలి కేకలు వేస్తోంది. వెనక వైపు తోటలోంచి కాబోలు, నకనకలాడే ఆకలితో ఉన్న నాగుపాము ఆత్రంగా మింగేసిన కప్ప ఒకటి, రక్షించండ్రోయ్, రక్షించండిరా అన్నట్టు  ‘ కెక్, బెక్, కెక్బెక్ బెక్… ‘ అంటూ కప్పభాషలో వికృతంగా ఆర్తనాదాలు చేస్తోంది.

అకస్మాత్తుగా అన్ని వైపుల నుంచీ వస్తున్న ఆ శబ్దాలకి మట్ట గుండె దడదడలాడ్డం మొదలెట్టింది. వీటికి తోడు ఎండిన కొబ్బరాకు ఒకటి ‘ దబ్బు ‘ మని దారికి అడ్డంగా రాలి పడ్డంతో ‘ హమ్మో ‘ అంటూ పక్కకి గెంతారు ఆయన. అలా గెంతడంవల్ల తృటిలో పెద్ద ప్రమాదం తప్పిపోయింది కానీ…  లేకపోతే కొబ్బరి మట్ట, మట్టగారి మెడని విరగ్గొట్టేసేదే.

‘తుప్ తుప్’ అంటూ గుండెలమీద ఊసుకొని, వీపుమీద తనకి తానే చెళ్ళు చెళ్ళుమని చేత్తో కొట్టుకొని, అప్పటివరకూ ఉన్న నడకని పరుగులాంటి నడకగా మార్చారు మట్ట.

గాలిలో తేలివచ్చిన పనసపండు వాసన గమ్ముగా ముక్కుకి తగలడంతో, మౌనంగా ఆంజనేయదండకం చదువుకుంటున్న ఆయన… నడుస్తూ నడుస్తూనే అలవోకగా తలతిప్పి ఓరగా అటువైపు చూసారు.

జుట్టు విరబోసుకున్న దయ్యంలా ఉన్న… ఓ పెద్ద చింతచెట్టు పక్కనే, గుబురుగా పెరిగిన చిన్న పనస చెట్టు కనిపిచింది. దాని  కిందినుంచి పై దాకా, ఎక్కడా కాయ కాదు కదా! చిన్న పిందె కూడా లేదు. కాయలు లేకుండానే పండు ముగ్గిన వాసన ఎలా వస్తోంది?’ అంటూ అంత భయంలోనూ ఆశ్చర్య పోయారు మట్ట. ‘ కొంపదీసి, ఏ కామినీ పిశాచమో! పనసపండుని ఎరవేసి, తనని వశీకరణం చేసేసుకోవాలని ప్రయత్నిస్తుందో ఏమిటో? ఖర్మ ‘  అన్న అనుమానమూ  కలిగింది.

‘చేత్తే… చెయ్యనీవోయ్? నాకేవన్నా భయవా? దాని ముక్కు పిండి, ముంతలో పెట్టి మూత మూసెయ్యడానికి మా పెదబాజ్జీ లేరా ఏమిటీ?’ అని బింకంగా  ధైర్యం చెప్పుకుని, ఇల్లు దగ్గర పడుతుండంతో నడక వేగాన్ని ఇంకా ఇంకా పెంచారు.

ఇంటి పిట్టగోడ మీద నుంచి లోపలకి చూచే సరికి, అరుగు మీద మోచేతిని మెడకింద దాపెట్టుకొని, అనంత పద్మనాభస్వామిలా పరుపు మీద పవలించివున్న త్రిలోచనరాజుగారు కనిపించారు.దానితో అప్పటివరకూ మట్టలో ఉన్న భయాంధోళనలు మటు మాయమయ్యాయి.అక్కడ పెద్దాయన తప్ప ఇంక ఎవరూ లేక  పోవడంతో ఆయన  తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.

‘ హమ్మయ్య, భయం ఏత్తే ఏసింది!  చుట్టూ పోరంబోకు సంత ఎవరూ లేకుండా! ఇన్నాళ్ళకి పెద్దబాజ్జీ ఒక్కరే ఒంటరిగా దొరికారు’అనుకొని, ఒకింత ఉత్తేజంతో పిట్టగోడకి ఉన్న ఒంటితలుపునితోసి, అంతకు రెండింతలు రెట్టించిన ఉత్సాహంతో లోపలకి అడుగు పెట్టారు. గుమ్మం మెట్ల దగ్గర చెప్పులు విప్పేసి, అక్కడే వున్న బిందెలోంచి ఓ చెంబుడు నీళ్ళు తీసి, శుభ్రంగా కాళ్ళు కడుక్కొన్నారు. తర్వాత సడి చెయ్యకుండా వెళ్ళి, త్రిలోచనరాజుగారికి పరుపుకి ఎదురుగా, కుడివేపు అరుగుమీద వేసివున్న తుంగచాప మీద… బాసింపట్టేసుకొని కూర్చున్నారు.

ఎడమ వైపు అరుగుమీద పరిచివున్న పరుపులమీద, కళ్ళుమూసుకొని పడుకున్న త్రిలోచనరాజుగారికి  అటు పక్కన, తెల్లటి మల్లుగుడ్డతో ముడేసి కట్టిన తాళపత్రగ్రంధాలు గోడకి చేర్చి వరసగా పేర్చి ఉన్నాయి.

పెరట్లో జాబుల కిందవున్న జట్టీపుంజులు కొక్కొరోకో అంటూ పోటాపోటీగా కూస్తున్నాయి.

***

“ఆ మంతనోరి రామం ఎంత పనిచేసాడనుకున్నారూ? తవరి దాకా వచ్చిందా పెద బావజ్జీ ఈ గొడవ? ” అంటూ వచ్చీరాడంతోనే… కూర్చునీ కూర్చోవడంతోనే తోక భారతం విప్పారు మట్ట.

” ఏ రామం వాయ్? పెద రామమా? చిన రామమా? ” అడిగారు. కళ్ళు మూసుకొని సావకాశంగా పడుకున్న, త్రిలోచనరాజుగారు సాలోచనగా.

ఊరిలో రాజుల ఇళ్ళకీ, త్రిలోచనరాజుగారి ఇంటికీ… పద్దతిలో చాలా తేడాలు వుంటాయి.

మిగతా రాజుల ఇళ్ళల్లో వున్నట్టు, త్రిలోచనరాజుగారి ఇంటికి వచ్చిన అతిధులు కూర్చోవడానికి కుర్చీలూ, బల్లలూ కనిపించవు. ఎంతటివారైనా తుంగచాపల మీద ఆసీనులు కావాల్సిందే. ఎడమ వేపు అరుగుమీదకి… త్రిలోచనరాజుగారికి తప్ప మరెవరికీ ప్రవేశం ఉండదు.

త్రిలోచనరాజుగారు గడ్డం, మీసం నున్నగా గీయించుకొని ఉన్నారు.లుంగీ కట్టుకొని, పైన ఖద్దరుతో కుట్టిన జబ్బల బనీను తొడుక్కున్నారు. తల్లీ, తండ్రీ లేకపోతే మీసం తీయించేసుకొనే వెసులుబాటు రాజులకి ఉంది. త్రిలోచనరాజుగారి నుదుటి మీద అడ్డంగా  ఆరేడు సన్నటి ముడతలు ఉన్నాయి. వాటిమీద ఎర్రటి, సన్నటి తిలకంబొట్టు తిన్నగా ఉంది.

” పెదరామవే… చినరామం అయితే ఎందుకు చెబుతానండీ తవకి? ఆడింకా చిన్నపిల్లోడే కదా!”

” పెదరామం అంటే, పొడుగ్గా తెల్లగా ఉంటాడు వాడా? నల్లగా, లావుగా నీలా ఉంటాడు వాడా?” కళ్ళుమూసుకొనే అడిగారు త్రిలోచనరాజుగారు.

ఆయన ఎప్పుడో కానీ కళ్ళు తెరవరు. అదేమని అడిగితే యోగనిద్ర అంటారు. అదేమిటో?. కళ్ళుమూసుకునివున్నా, ఆయనకి అంతా కనిపిస్తూనే ఉంటుందట. ఎవరు వస్తున్నారు? ఎవరు పోతున్నారు? ఏం చేస్తున్నారు? మనస్సులో ఏమనుకుంటున్నారు? ఇలా  సమస్తం తెలిసి పోతూనే ఉంటుందిట.

త్రిలోచనరాజుగారికి ఏవో మంత్రసిద్దులు ఉన్నాయని, అందుకే ఆయనకి అవన్నీ అలా సాధ్యం అవుతుంటాయని చెవులుకొరుక్కుంటూ ఉంటారు అన్ని రాచపల్లెల్లోనూ.

కళ్ళు మూసుకొని వుండే ఆయనతో మాట్లాడ్డమంటే… మనిషితో మాట్లాడినట్టు కాకుండా, ఏ మొక్కతోనో, దుక్కతోనో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. కానీ ఎవరూ ఏమీ అనలేరు.కళ్ళు మూసుకొని  వింటున్న లేదా మాట్లాడుతున్న ఆయన మొహంలో ఎలాంటి హావభావాలూ ఎదుటి వాళ్ళకి కనపడవు.అది ఇబ్బందిగానే వున్నా… ఆయనతో పని మీద వచ్చేవాళ్ళకి తప్పదు.

త్రిలోచనరాజుగారికి బంగారం తయారు చేసే విద్య కూడా వచ్చంటారు. అందులో నిజం ఎంతో? ఉట్టిది ఎంతో? ఎవరికీ తెలీదు.  ఆయన దగ్గరనుంచి ఆ విద్యని ఎలాగైనా సరే నేర్చుకు తీరాలని, ఊరిలో చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అది  ఎవరికీ సాధ్యం పడడం లేదు. త్రిలోచనరాజుగారు ఒక పట్టాన ఎవరికీ తమ దగ్గర చనువు ఇవ్వరు.

ఆయన మనస్సుకి దగ్గరైన కుర్రాళ్ళు ఊరిలో ఎవరైనా ఉన్నారూ అంటే, అది ఒక్క మట్టగారు మాత్రమే. ఇంకో ఇద్దరు ముగ్గురు కుర్రాళ్ళు ఉన్నారు కానీ,  వాళ్ళు మట్టంత దిట్టలు కారు. మట్టకి అర్ధణా గాలి దొరికితే చాలు, దాన్ని ఆరణాల దుమారంగా మార్చెయ్యగలరు.

ఆ ఇద్దరు, ముగ్గురికీ ఇంకా ఈ అద్భుతకళ వంటపట్టకపోవడంతో… పూర్తిగా పెద్దాయన్ని ప్రసన్నం చేసుకోవడంలో విఫలమై పోయారు పాపం.

” నాకు మంత్రాలూరావూ, నా మాటలకి చింతకాయలూ రాలవు.  నేను చేసేవి మాయలూ కాదు, మహాత్యాలూ అసలేకాదు నన్నొదిలెయ్యండిరా బాబోయ్. పంచేంద్రియాలనీ అదుపు ఆజ్ఞల్లో  పెట్టుకుంటే,  అందరూ ఎన్నో కొన్ని  చిన్నా చితకా శక్తులని సాధించవచ్చు” అంటూ  తనకి మంత్రశక్తులు ఉన్నాయన్న పుకార్లని  త్రిలోచనరాజు గారు చాలా సార్లు కొట్టి పడేసారు. కానీ దాన్ని ఎవరూ విశ్వసించడంలేదు.

ఆ విద్యలు నేర్పమని అందరూ అడిగేస్తున్నారన్న భయంతోనే… వాటిని ఎవరికీ నేర్పడం ఇష్టంలేక, ఆయన అలా అబద్దం ఆడుతుంటారని ఊరిలో అంతా అనుకుంటూ ఉంటారు.

త్రిలోచనరాజుగారు ప్రతిరోజూ రాత్రి దయ్యాలతోనూ, భూతాలతోనూ చెట్టాపట్టాలేసుకొని… తోటలో వనవిహారం చేస్తారన్న అనుమానంకూడా చాలామందిలో వుంది. పగలంతా తోటలో, ఆ చెట్లమీదా ఈ చెట్లమీదా విశ్రాంతి తీసుకునే దయ్యాలు… ఊరంతా నిద్రపోయాకా లేచి, త్రిలోచనరాజుగారితో అచ్చికబుచ్చికలాడుతూ… కోతీకొమ్మచ్చీ, తొక్కుడుబిల్లాట ఆడుకుంటూ ఉంటాయట. ఇద్దరు ముగ్గురు ఆ దృశ్యం తమ కళ్ళతో స్వయంగా చూసారట కూడాను. ఆ దయ్యాల భయంతోనే త్రిలోచనరాజుగారి తోటలోకి, ఒంటరిగా రావడానికి అంతా భయపడుతూ ఉంటారు. ఒకవేళ వచ్చినా, ఏ చెట్టు మీదనుంచి ఏ దయ్యం దూకుతుందోనన్న బెదురుతో  బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటారు.

“పొడుగ్గా తెల్లగా ఉండే రామం అల్లూరోరిరామం, నల్లగా పొట్టిగా ఉండేరామం ముదునూరోరి రామం.  ఆడికీ ఈళ్లకీ అస్సలు  సమ్మంధం లేదు. నేను  చెప్పిన రామం… ఇంతింత బుగ్గమీసాలేసుకొని, విత్తనాల పోతులా ఉంటాడు చూడండి. ఆడు… ”

” సరి సరి, నువ్వుచెప్పొచ్చేది మంతెన గరుత్మంతరాజుగారబ్బాయి… మీసాల రామంగాడి గురించి అయి ఉంటుందిలే ”

” అయ్యో పెదబాజ్జీ, ఆయన పేరు గరుత్మంతరాజో, గండభేరుండరాజో కాదు మంతెన గంగాధర రాజు. గంగాధరరాజుగారబ్బాయి  మీసాల రామంగాడు కాదు, ఆడు సీసాల రామం గాడు ”

” సీసాలోడు ఎందుకొచ్చాడు? మజ్జలో, మీసాలోడి గురించి కదా మనం మాట్లాడుతుంట? ” గద్దించారు త్రిలోచనరాజు గారు.

” ఆడు రాలేదు, తవరే రప్పించారు ”

” నేను రప్పించడం ఏవిట్రా బడుద్దాయ్? నిన్నో మొన్నో వాడే వచ్చి… నువ్వు కూర్చొన్న చోట్లోనే కూర్చున్నాడు ”

” ఆడే వచ్చేడా? ఏ దయ్యాన్నో ఉస్కో… మని ఉసిగొలిపెయ్యాల్సింది.పీడా పోను? అయినా ఆడిక్కడికి… ఎందుకొచ్చినట్టు?  ” ఆరా  తీసారు మట్ట.

” ఎందుకొచ్చాడంటే, ఎందుకొచ్చాడు చెప్మా? ఆం… పేకముక్కల్లో, చుక్కలు మార్చే మంత్రం ఉంటే ఉపదేశించమని వచ్చాడురా ”

“ఓహ్! అదా? అలా అయితే, తవరి దగ్గరకొచ్చింది సీసాల రామం కాదు.సీసాల రామంగాడికి మందుకొట్టడవే తప్ప పేకాటాడ్డం రాదు ”

” సరి సరి… వీడు వాడు కాకపోతే? ఆ వచ్చినోడు ఎవడంటావ్ మరి? ”

” మోసాల రామంగాడు అయి ఉంటది. పేకాటలో దొంగాటలాడి ఎదవ్వేషాలు ఎయ్యబోతే, నిన్న మైనర్ గారింటి దగ్గర…తాతబాబు తన్న బోయాడట? సుబ్బన్నయ్య అడ్డుపడబట్టి బతికిపోయాడని… ఊరంతా కోడై కూస్తోంది! ”

” అయ్యే ఉంటుందిలే? వాడి వాలకం చూస్తే… అచ్చం నీ వాలకం లానే వుంది. ఇంతకీ… ఈ రామంగాడి తోబుట్టువునేనా? అద్దరిని మురమళ్ళో ఏదో ఊరు ఇచ్చినట్టున్నారు ”

” అద్గదీ… ఇప్పుడొచ్చారు దారికి, అది మోసాలరామంగాడి తోబుట్టువు కాదు. నేను చెబ్తున్న మీసాలరామం గాడి తోబుట్టువు ” చెప్పారు మట్ట.

పెదబాజ్జీ తనని మోసాలరామంగాడితో పోల్చి నందుకు మొహం మాడ్చుకుని. ఆయన మొహం మాడ్చుకుంటే ఏంటి? పేల్చుకుంటే ఏంటి? త్రిలోచనరాజుగారు కళ్ళు తెరిస్తే కదా కనిపించటానికి.

” ఆ పెళ్ళికి, వెళ్ళినట్టు గుర్తులేదురా… పిలిచేరా మన్ని?”

” భలేటోరే,  పిలాపోవటం ఏంటి? ఇంటింటికీ పరక పరక మావిడిపళ్ళు పంచి… మరీ పిలిచారు ఉభయులూ ”

” ఏం కాయలంటావ్రా… చక్రపానీయా? అమృతపానీయా?”

” అదేంటండి బాబూ… బోడిగుండుకీ మోకాలికీ ముడేసినట్టు, అంటిపళ్ళుని మాడిపళ్ళుతో ముడెడ్తన్నారు ”

” అవును సుమా! చెరుకురసమా? పంచదారకలిసా? అని అడగబోయి… ఇలా అడిగినట్టున్నాను.ఈ మధ్య జ్ఞాపకశక్తి కాస్త  తగ్గిందోయ్ ” అన్నారు త్రిలోచనరాజుగారు రెండో వైపుకు వత్తిగిల్లుతూ.

” అదెప్పుడి గొడవండిబాబూ? ఐదేళ్ళో ఆరేళ్ళో  అయ్యింది. అప్పుడు తవరు ఏ మేరుపర్వతాలకో, మందర పర్వతాలకో పోయుంటారు ”

” అవి మేరు పర్వతాలో, మందరపర్వతాలో కాదురా దద్దమ్మా! హిమాలయపర్వతాలు ”

” హిమాలయాలంటే గుర్తొచ్చింది పెదబాజ్జీ, తవకి గ్నాపకసత్తి నిజంగానే మందగించి పోయిందా ?  మీకొచ్చిన ఆ మాయ మంత్రాలు  కానీ మర్చిపోలేదుకదా? కొంపదీసి ” ధైర్యంగా అడిగేసారు మట్ట.

‘ అనవసరంగా అడిగేనేమో? పెదబాజ్జీ ఇప్పుడు ఏం చివాట్లేస్తారో, ఏంటో?’ అని మనస్సులోనే భయపడ్డం మొదలెట్టారు. కానీ త్రిలోచనరాజుగారి ‘ వీపు ‘ దాన్ని పట్టించుకున్నట్టు కనిపించలేదు. దాంతో ఇంకాస్త ధైర్యం చేసి…

” పెదబాజ్జీ, మీ కోడలు ఎప్పట్నుంచో వడ్డోణం చెయ్యించమని చంపుకు తినేత్తంది. ఆబంగారం చేసే విజ్జేదో నాకు చెప్పి పుణ్యం కట్టుకుందురూ…తవరుగానీ మర్చిపోతే, మళ్ళీ ఆ విజ్జ మీతోనే అంతవైపోయే పెమాదం ఉంది ” అంటూ మనస్సులోని మాటని చాకచక్యంగా బయట పెట్టేసారు.

సాలోచనగా ఓ నిమిషంపాటు మౌనం వహించిన త్రిలోచనరాజుగారు…

” చెబ్తాను, చెబ్తాను. ముందు  నువ్వు ఇది చెప్పేడు. కణుజు మాంసంకూర నువ్వొక్కడవే దొబ్బి తినేయా పోతే, అయ్యో! మా పెదబాజ్జీకి ఎంతిష్టవో? అని ఓ మట్టుగిన్నెడు కూర పట్రావాలన్న ఇంగితం లేపోయిందిరా నీకు? ” అన్నారు తీవ్ర స్వరంతో.

ఆయన మాటలతో పక్కలో పిడుగు పడినట్టు ఉలిక్కి పడ్డారు మట్ట .

పొద్దున్న వాళ్ళావిడ,  పుట్టినిల్లు తేటగుంట నుంచి వస్తూ వస్తూ… కణుజు మాంసం తేవడం మాట నిజమే. కానీ ఆ సంగతి ఆ మొగుడూ పెళ్ళాలిద్దరికీ తప్ప మరో కంటికి తెలీదు. అరిచి చచ్చినా ఇంకో కంటికీ, ఇంకో కంటికీ తెలిసే అవకాశం అస్సలు లేదు. ఎందుకంటే? ఆమె ఊరినుంచి వచ్చేసరికి, పనిమనిషీ పాలేరూ ఇంట్లో లేరు.

తమ వంటింటి రహస్యం… కళ్ళు మూసుకుని, ఇక్కడ అటుతిరిగి పడుకుని ఉన్న ఈ పెద్దమనిషికి ఎలా తెలిసిపోయింది? అన్న భయాంధోళనలు మట్టని పట్టి కుదిపేసాయి. గాభరాగా చేత్తో మొహం తుడుచుకుంటుంటే…  కణుజు మాంసం కూర వాసన ఎక్కిరిస్తూ  గుప్పున ముక్కుకి  తగిలింది.

ఉదయం ఆ భార్యాభర్తల మధ్య పెదబాజ్జీకి కూర పట్టుకు వచ్చే అంశం ఎడతెగని చర్చకి దారి తీసింది.

***

” సరే… తెచ్చిన మాంసం ఎలాగూ తెచ్చావు, గబుక్కున కూరొండి పడేస్తే, మా పెద బాజ్జీకిచ్చేసి వస్తాను. ఆయనకి ఏట మాంసాలంటే  చచ్చేంత ఇట్టం ” అన్నారు మట్ట.

” అబ్బ ఉరుకోండె, ఏదీ కానేళ గేదె ఈన్నట్టుంది మీసంబరం. ఎప్పుడో తెల్లారగట్ట మొదలెట్టిన ప్రెయాణం ఇప్పుడుకి తెమిలింది. వళ్ళు హూనవైపోయింది. నాఅద్రుష్టంకొద్దీ, ఇంజరం వంతెన దగ్గర నావ దొరకబట్టి  గమ్మున ఇంటికి రాగలిగేను.లేపోతేనా… ఏ మజ్జాన్నం పొద్దుకో తగలడేదాన్ని.

ఇప్పటికిప్పుడు ఈ దాకడు కూరకీ ఉల్లి రుబ్బడాలు, మసాలాలు నూరడాలు నావల్ల కాదు బాబూ. మీరో చెయ్యేత్తే, మనిద్దరి  మట్టుకూ ఓ నాలుగు ముక్కలు ఇగరబెట్టేత్తాను. సాయంకాలానికి నిమ్మలంగా వండి, అపుడు పట్టుకెలుదురు లెద్రూ. అయినా ఈపాటికి మీ పెదబాజ్జీ భోంచేసేసే ఉంటారు.

నేను రాననుకుందో ఏవిటో? ఆ సుబ్బులు ఇంకా ఊడి పడ్లేదు. ఏదో కాకి చేత దానికి ఓ కబురంపుదురూ. ఈ ఉల్లీ, మసాలాల గొడవ చూసుకొంటుంది ” అంటూ నచ్చచెప్పారు. మట్టగారి పట్టపురాణి పార్వతి తమ శ్రీవారికి.

పార్వతిగారి అభ్యర్ధన మేరకి, వంటలో చిన్నో చితకో సహాయం చేద్దామనివున్నా, ‘ గబుక్కున ఎవరైనా పనిమీద ఇంటికి వస్తే?… ఆ వచ్చినోళ్ళు తను వంట చెయ్యడం చూస్తే?… ఎంత పరువుతక్కువ ‘ అని ఆలోచించలోచించిన మట్ట, గోడ తలుపులూ, గుమ్మం తలుపులూ మూసేసి వచ్చి…కానీ వంటలో వ్రేలు పెట్టలేదు.

” యావండీ… మీ పెదబాజ్జీని ఏవన్నా కదిపేరా? ఆ పరశురామ విజ్జ నేర్పమని?” అడిగారు పార్వతి. మాంసం కొయ్యడానికి కత్తిపీట మీద కూర్చుంటూ.

” పరసురామ విజ్జేవిటీ…?” ఆశ్చర్యంగా అడిగేరు మట్ట.

” మీ మతిమరుపూ  మీరూనూ అదేనండీ… ఆ బంగారం చేసే విజ్జ ” విడమరిచారు పార్వతి.

” నీ మొకం అది పరశురామ విజ్జ కాదు. పరసవేదో? పనసభేదో? అలా ఏదో అంటారు దాన్ని” అంటూ సరిదిద్దారు మట్ట. ఉల్లిపాయలు వొలుస్తూ.

” వేదవో! నాదవో! ఏదైతే ఏవిటి లెండి. అదే… దానిగురించే కదలేసారా? అని ”

” ఎక్కడ కుదిరేడుస్తోంది? ఎప్పుడూ ఎవలో ఒకళ్ళు… కర్ణ పిశాచాల్లా ఆయన చుట్టూ కూచ్చొని ఉంటన్నారు పనీ పాటాలేని రాజులు ”

” చాల్లెద్దురూ బడాయి? ఆ కాడకేదో మీకు పెద్ద పనున్నట్టు? అంత పనున్న పెద్దమనిషైతే కర్రట్టుకుని ఆ పొలం గట్టున నిలబడితే ఆ కౌలు గింజలేవో… మనకే మిగులునా? ”

ఒక్కసారిగా మట్ట కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

ఖంగారు పడకండి… ఆ నీళ్ళు పార్వతిగారు దెప్పి పొడిచినందుకు కాదు వొస్త. నీరుల్లిపాయలని గిల్లడం వల్ల తిరిగాయి అవి.

” పోనీ, ఈలోగా బంగారం చైటాకి కావాల్సిన సరుకుల చిట్టా అన్నా కూపీ లాగ లేపోయేరూ. అన్నీ అమారులో ఉంటే, తర్వాత పని తేలికవుతుంది కదా! ”

” అయ్యన్నీ… మనకి తెలిసినియ్యే లేవే. ఆమాత్రం ఈమాత్రం ఆవుపేడలో పెదబాజ్జీ చెప్పే ఆకుపసర్లు బాగా కలిపి పిసికేసి, నాలుగు మంత్రాలు చదివేసి…  టపటపా గోడకి పిడకల్లా కొట్టేయడవే. అయ్యి బాగా ఆరేకా,  పీకి ఎండబెట్టేత్తే ఎండేకొద్దీ మేలిం బంగారం చాయొచ్చేత్తాయి. ఎటొచ్చీ పేడ  మేలుజాతి దేశవాళీ ఆవు పున్నం రోజుల్లో ఏసిందై ఉండాలంట ”

” కొంపముంచేసారు కదండీ? ” అదిరిపడ్డారు పార్వతిగారు. ఆవిడ చేతిలోని పొత్రం రుబ్రోల్లో…ఉల్లిని రుబ్బడం మానేసింది.

” ఏం ఏమయ్యిందేమి? ఏలు కానీ నలగ్గొట్టుకున్నావా? ” అనుమానంగా ప్రశ్నించారు మట్ట, గిన్నెలో వున్న మాంసాన్ని కడగడం ఆపేసి.

” ఏలూ నలగలేదు! కాలూ నలగ లేదు! మనింట్లో  గేదెలు తప్ప, ఆవులెక్కడియ్యండీ మహానుభావా? సమయానికి మా పుట్టింట్లో కూడా గేదెలే ఉండి చచ్చాయ్. తోలి తెచ్చుకుందావన్నా… ” అన్నారు పార్వతి. నలిగీనలగని ఉల్లిని బోడిగిన్నెలోకి తీస్తూ. ఆమె మొహాన అసహనం ఆవరించింది.

” నిజమేనేవ్! మరేం జెయ్యాలిప్పుడు ” పొయ్యిమీద వేడెక్కిన దాకలో, నూనె పోస్తూ అడిగారు మట్ట.

” కాస్సేపుండండి ఆలోసింతనాను కదా! ఈలోగా… మీరు  ప్లేట్లో ఉన్న  లవంగాలూ, మరాఠీమొగ్గలూ ఆ మందార చెట్టుకిందున్న సన్నికల్లు మీద నూరుకొచ్చెయ్యండి బేగా ” ఆదేశించారు ఆవిడ.

పొయ్యిమీద కూర  కుతకుత ఉడుకుతుంటే, కూరలో గరిటె తిప్పుతున్న పార్వతి గారి తలలో ఆలోచనలు చక చకా చక్కర్లు కొడుతున్నాయి.

” ఏం ఏవన్నా తోచిందా? ” అడిగారు మట్ట, మసాలాగుండ తీసిన  ప్లేటుని తెచ్చి ఆవిడ పక్కన పెడుతూ.

” ఏం తట్టి చావడం లేదు.  రెండు ఎల్లుల్లి రేకలు తీసి చిదగ్గొట్టండి. ఈ కూరముండ మొకాన, ఓ తాళింపు పిసరు పడేస్తే… ఏదో ఉపాయం అదే వచ్చేడుద్ది ”

గదులపెట్టెలోంచి రెండు వెల్లుల్లిపాయలు తీసి, వాటిని  అమాన్దస్తాలో రేకలు రేకలుగా విడదీసి పడేసి, బండతో రెండు పోట్లు పొడిచి, అర్ధాంగికి అందించారు మట్ట.

పొడవాటి గుంటగరిటలో నూనె పోసి, దాన్ని పొయ్యిలోపల సలసల మరగబెట్టి, అందులో కరేపాకు, ఎండిమిర్చిముక్కలూ,వెల్లుల్లి రేకలూ వేసి దోర దోరగా ఏగనిచ్చి, పొయ్యిమీద ఉడుకుతున్న కూరలో ‘ సుయ్ ‘ మంటూ తాళింపు వేసి చటుక్కున మూతెట్టేసారు పార్వతిగారు.

ఆవిడ వేసిన తాళింపు  ఘాటుకి మొగుడూ పెళ్ళాలు ఇద్దరికీ దగ్గొచ్చి, కళ్ళల్లో నీళ్ళు తిరిగి…ముక్కులోంచి కారడం మొదలెట్టాయి.

కూర వాసనకి… మట్టకి నోట్లో నీళ్ళు ఊరుతుంటే, పార్వతి గారికి తలలో ఆలోచనలు మొగ్గతొడుగుతున్నాయి.

పార్వతిగారు అన్నం వండడానికి… పొయ్యిమీద తెపాలాతో ఎసరు పడేసారు.

మట్ట, పొగలు కక్కుతున్న రెండు కణుజు మాంసం ముక్కలు స్వయంగా ప్లేట్లో వడ్డించుకొని, ‘ఉపూ ఉపూ’ అని ఊదుకుంటూ రుచి చూడ్డం మొదలు పెట్టారు.

” ఓ పని చేద్దావండీ… దేవుడు చిట్టిబాబు గారింట్లో ఓ గంగిగోవుంది.చూడ్డానికి కామధేనువే అనుకోండింక. గోపూజ చేసుకుంటామని వంకెట్టి, ఓ పదేను రోజులిమ్మని అడుగుదాం. ఆళ్ళకీ… పూజలూ పునస్కారాలూ ఎక్కువే కాబట్టి… నేనడిగితే బంగారు కన్నమ్మ కాదనలేరు. ఎటొచ్చీ, ఆ టైంలో వరాలప్ప ఉండకూడదు  అక్కడ. ఆవెకి ఆరాలు ఎక్కువ. ఇంతకీ ఆవిడ ఇక్కడున్నారో? కత్తిపూడిలో ఉన్నారో? పూర్ణ ఉన్నా ఫర్వాలేదు లేండి. అదివేం పట్టించుకోదు. ఏవంటారు?” ఉపాయం చెప్పి కరణేషు మంత్రి అయ్యారు పార్వతిగారు.

” బెమ్మాండం, పోయి అడిగేసిరా అయితే. రోజూ పొద్దున్నే… ఆళ్ళు పాలు తీసేసుకున్నాకా నేనే సొయంగా తోలుకొచ్చి, సాయంత్రం పాలు  తీసే ఏలకి నేనే సొయంగా  తోలుకెళ్ళి కట్టేసొత్తాను ” అన్నారు మట్ట వ్రేళ్ళు నాక్కొంటూ.

” ఇప్పుడెక్కడకెల్తాను? భోజనాలయ్యాకా, కాస్సేపు నడుం వాల్చి, లేచాకా ఓ మాటెల్లొస్తాను. రోజుకి రెండు మూడు వీసెల పేడన్నా ఎయ్యదంటారా? ఆ ఆవు. చూడ్డానికి పుష్టిగా బాగానే ఉంటది ” అడిగారు పార్వతిగారు అన్నం వారుస్తూ.

” ఎందుకెయ్యదూ? దాని బాబదే ఏస్తుంది.లేపోతే రెండ్రోజుల్చూసి, చిట్టు తవుడూ దండిగాపెట్టడవే! పోతే పోయాయి పది రూపాయలు   అనుకొని ”

” మీకూ బుర్ర బానే పని చేత్తందండోయ్ రాజుగారూ ” మెచ్చుకొన్నారు పార్వతిగారు. పెళ్ళయిన ఇన్నేళ్ళలో, మట్టకి ఇదే ఆవిడ మొట్ట మొదటి మెచ్చుకోలు.

” వడ్డించేత్తావా? తినేత్తే, ఓ పనయిపోద్ది” అన్నారు మట్ట.

” ఓ క్షణం ఉండండి, ఎప్పుడూ తిండి యావే. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆవుని తోలుకొచ్చేప్పుడు, ఆ సిరంజీవిగాన్ని ఓ కంట కనిపెడుతుండండి. మా ఆవు, మా ఆవు అని తోకలా కూడా వచ్చేత్తాడు. ఆడసలే గడుసుగోదారి లాటోడు. ఆవు ఆవులిస్తే చాలు, దాని కడుపులో ఎంత పేడుందో కనిపెట్టేస్తాడు. అదోటి జార్త పడాల మనం ”

” ఆడి గొడవ నాకొదిలెయ్యి… ఏదో బొమ్మల పుత్తకం పడేత్తే ఇంక దాన్నట్టుకు ఏలాడతాడు. నేను చూసుకుంటాను కదా అయ్యన్నీ ” అంటూ లేచి వెళ్ళి, కాళ్ళు చేతులూ కడుక్కొని వచ్చారు మట్ట .

” వీసెడు పేడకి, నికరంగా ఏమాత్రం బంగారం దిగుద్దంటారూ? ” పీట వేసి గిన్నెలు సర్దుతూ అడిగారు పార్వతి.

” తడి పేడకీ, ఎండి పిడకలకీ మజ్జ బరువు… సగానికి సగం తేడా ఉంటదనుకో. ఎంత చెడ్డా, ఈసెడు పేడకి పదలం బంగారం ఎక్కడికీ పోదు నాకు తెలిసి. ఎందుకన్నా మంచిది. రేపోసారి ఎంత పేడకి ఎన్ని పిడకలు దిగుతున్నాయో? దిగిన పిడకలు ఎండిన తర్వాత ఒక్కోటీ  ఎంత బరువు తూగుతుందో? తల్లమ్మ కొట్లో తూకం  ఎయ్యించేసొస్తే సరి ”

” అదీ ఒకందుకు మంచిదే, మీరన్నట్టు చిట్టూ తవుడుకి తోడు, ఓ అడ్డుడు ఉలవలు ఉడకేసి పడేత్తే, ఇంకో ఏబులం బంగారం ఎటూ పోదు  ఏవంటారు? ”

” బంగారం వొత్తాదంటే ఎవరొద్దంటారే? ఎర్రిమొహవా! ఎంత చెట్టుకి అంత గాలన్నట్టు, ఎంత తిండికి అంత పేడ ”

” పదలం బంగారం ఏం ధర పలుకుద్దో?  ఓమాటు ఆరా తియ్యండీ ”  శ్రీవారి కంచంలో ఇంకొంచెం కూర వడ్డిస్తూ… భోజ్యేషు మాత అయ్యారు పార్వతిగారు.

” తులవో, కాసో అయితే ఎవలో ఒకలు చెప్పగల్రు.పదలాలు, ఏబులాల లెక్కన బంగారం ఎవరు కొనగల్రు ఈ రోజుల్లో. ఏ రాంపురమో, కాకినాడో ఎళ్ళి కనుక్కొని రావాలి మరి, కాదూ కూడదంటే… ”

” నేను ముందే చెప్పేస్తనా, ఆరేడీసెల బంగారంతోనన్నా… నేను ఏడోరాల నగలు చేయించుకుంటాను. తర్వాత మీరు టేట్ అంటే కుదరదు. పదలం బంగారంతో వడ్డాణ్ణం చెయ్యిస్తే ఆనుద్దంటారా? పైన ఓ పంపుడన్నా ఎయ్యాలంటారా? ” భవిష్య కార్యాచరణ ప్రకటించి, కార్యేషు దాసి అయ్యారు పార్వతి గారు.

” పిండికొద్దీ రొట్టె. అయినా అన్నీ నీకేనా? నాకూ పిల్లలకీ ఏం వొద్దా?” అనుమానంగా అడిగారు మట్ట.ఇద్దరు పిల్లలనీ సెలవులకి…    తేటగుంట అమ్మమ్మగారింట్లో దింపి, పొద్దున్నే వొస్తూ వొస్తూ కణుజు మాంసం పట్టుకొచ్చేరు పార్వతి గారు.

” బంగారాలూ సింగారాలూ మొగోళ్ళకెందుకండీ.ఏ పేకాటకో తాకట్టెట్టేత్తారు. మరీ కాదూ కూడదూ అంటే ఓ అరకాసెట్టి రెండేళ్ళకీ రెండుంగరాలు  చేయించుకుందురుగాని లెండి. ఓటి ఎంకన్నబాబుదీ,ఇంకోటి ఆంజనేయస్వామిదీని ” దయ తలిచారు పార్వతిగారు.

” పాపం , సుబ్బులుకి కూడా ఓ వడ్డాణ్ణం చెయ్యిందామే? అంతక్కాపోతే మజూరీ దాన్నే… పెట్టుకోమందాం. నీ అంత లావు ఉండదు  కాబట్టి, ఆబక్క నడానికి ఓ పంపు బంగారం అయితే ఎక్కితిక్కలయిపోద్ది” ఓ సలహా పడేసారు మట్ట, తిన్న చేతిని పల్లెంలో కడుక్కుంటూ.

ఆ సలహాతో పార్వతిగారు శివాలెత్తిపోయారు.

” ఏం తలతిరుగుతోందా? గుంట గరిటి కానీ తిరగేసెయ్యనా? ” అంటూ మట్టమీదకి ఒంటి కాలి మీద లేచారు. ఆవిడ మాటల్లో మునుపటి మర్యాద మచ్చుకైనా కనపడలేదు.

” ఇప్పుడు, నేనేవన్నానే బాబూ. పేడ పిసికి బంగారం పిడకలు వేసేదానికి, ఆ మాత్రం చెయ్యా పోతే నలుగురూ నానా మాటలూ అంటారని… అన్నాను గానీ, నీకిట్టం లేపోతే వద్దులే ” నచ్చ చెప్పారు నాలుక్కరుచుకున్న మట్ట.

” తగుదునమ్మా అని మీరేం సొంత పెత్తనాలకి పోకండి. అందరిముందూ బంగారం చేస్తే, పాళ్ళు ఆళ్లందరికీ తెల్సిపోవా? మీరు పేడ పిసకండి. నేను పిడకలు కొడతా. మధ్యలో ఇంకో పిట్టపురుగు ఉండానికి నేనొప్పుకోను జార్త ” హెచ్చరించారు పార్వతి గారు.

” సర్లే, అలాగే కానిద్దాం. నువ్వు భోంచేసి, ఆ ఆవు గొడవ చూడు.నేనలా పెదబాజ్జీ దగ్గరకెల్లొత్తాను ” చెప్పారు మట్ట.

” ఆ ఎల్లేటప్పుడు కాస్త పెన్సిలూ, కాయితంముక్కా పట్టుకెళ్ళండి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఆయన చెప్పింది ఇనేసి వచ్చెయ్యకుండా, ఆ ఇవరాలన్నీ కాగితం మీదెట్టండి ”

” అలాగలాగే ” అంటూ గదిలోకి వెళ్ళి ఓ పెన్సిలూ, కాగితం ముక్కా చొక్కా జేబులో పెట్టుకున్న మట్ట ఇంట్లోంచి బయటపడ్డారు.

ఆ పడ్డం పడ్డం ఇదిగో ఇలా త్రిలోచనరాజుగారి నోట్లో పడ్డారు.

***

ఉదయం నుంచీ జరిగిందంతా ఓ సారి గుర్తు చేసుకుని, పెద్దాయనకి కూర గురించే తెలిసిందా? లేక  వంటింట్లో చేసిన మొత్తం కుట్రంతా తెలిసిపోయిందా? అన్న అనుమానంలో ఉన్న మట్ట కాస్త తేరుకుని…

” అయ్ బాబోయ్ పెదబాజ్జీ అది,  పొద్దున్నయితే తవ భోజనానికి ఆలీసవైపోద్దని,   మీ కోడలూ నేనూ నాలుగు ముక్కలు వండుకు           తినేసాం. సాయంత్రానికి, వండి అట్టిపెట్టమన్నాను. నేను వెళ్ళి పట్టుకొస్తాన్లెండి. అయినా తవకీ సంగతి ఎలా తెల్సిపోయిందండీ? ” సంజాయిషీ ఇచ్చుకుంటూ అడిగారు మట్ట.

” అదంతే, అలా తెలిసి పోతుందిలే. అదలా ఉంచి, ఆ ఉత్తరం వేపునుంచి గడ్డి మోఫెత్తుకుని ఆడమనిషి వస్తంది కదా? ఏ రంగు కోక కట్టింద్రా అది, ఆకుపచ్చదా? ఎరుపుదా? రెండింటి కలబోతా? ” ప్రశ్నించారు త్రిలోచనరాజుగారు. ఆయన అటు తిరిగే వున్నారు.

” ఆడమనిషా? ఎక్కడా? ఆడమనిషి కాదు కదా! ఆడపురుగు కూడా కనపడ్డంలేదిక్కడ ” అన్నారు మట్ట అటూ ఇటూ పరికించిచూసి.

” ఇక్కడ కాదోయ్, అయోమయం గాడిదా! అలా ఆ ప్రహారీ దాకా వెళ్ళి చూసిరా ” పురమాయించారు త్రిలోచనరాజుగారు.

యాభై ఎకరాల ఆసామీ అయిన త్రిలోచనరాజుగారు, వాస్థు కోసం కొబ్బరితోట చుట్టూ  కట్టిన ప్రహారీ గోడ ఎత్తు ఏడడుగులు పైనే. ఆ మొత్తం ప్రహారీ అంతటికీ సిమ్మెంటు పూత పెట్టించారు.ఆ సిమ్మెంటు తాపడం కింద ఉన్న ఇటుకలన్నీ… బంగారం ఇటుకలే అని ఊళ్ళో వాళ్ళందరికీ బలమైన నమ్మకం. త్రిలోచనరాజుగారు బంగారం తయారీలో  చెయ్యి తిరిగిన మనిషి కాబట్టి… ఆయన చేసుకొన్న బంగారాన్నంతా ఇటుకలరూపంలో అలా దాచుకున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఉట్టిదో? నిజమో? గునపంతో ఓ పోటు పొడిచి చూద్దామంటే… అలా చేసిన వాళ్ళని త్రిలోచనరాజుగారి బాణం ఎక్కడ ఉన్నా వెతికి వేటాడేస్తుందన్న భయంతో ఎవరూ సాహసించ లేకపోతున్నారు. అదీ కాకపోయినా…  ఆయన ప్రహారీకి  కాపలా పెట్టుకున్న అదృశ్య శక్తులు అలాంటి నేరం జరుగుతుంటే  చూస్తూ ఊరుకొంటాయేమిటి? బోర కొరికి చంపేయవూ.

‘ఏంటో చాదస్తం కాపోతేను, అటు తిరిగి పడుకొన్న పెద్దమనిషికి ఏడడుగులెత్తు గోడమీంచి… బయట ఎవరెళ్తున్నారో,ఎవరొస్తున్నారో కనిపించేత్తందా? అసలు ఎలా కనిపించేత్తాదని? అడిగే వాడు లేక ఈయన ఆటలు ఇలా సాగుతున్నాయి గానీ.ఇప్పుడక్కడిదాకా ఎళ్లి ఎనక్కి రావాలంటే ఎన్ని చంకలు నాకాలో?’ అనుకుంటూ ఈసురోమని అరుగు దిగి… భయం భయంగా నడుచుకుంటూ వెళ్ళిన మట్ట,  ఇనప తలుపు బలంగా లోపలికి లాగి, తల ఒక్కటే బయట పెట్టి  అటూ ఇటూ కళ్ళు మిటకరించి చూడసాగారు . అలా చూస్తున్న మట్ట… తన కళ్ళని తనే నమ్మలేకపోయారు.

మట్ట ఇంట్లో… పనిచేసే సుబ్బులు,  నెత్తిన పచ్చగడ్ది గడ్డిమోపు ఎత్తుకొని వయ్యారంగా నడుచుకుంటూ వస్తోంది.గడ్డిమోపు అడ్డంగా ఉండడంతో, ముందు అది ఎవరో ఆయన పోల్చుకోలేకపోయారు. కానీ గుమ్మానికి అడ్డంగా ఉన్న మట్టని చూసి ” ఏటండయ్యగోరూ గేటుకి గబ్బిలంలా ఏల్లాడత్నారు? నా కోసం బెంగెట్టేసుకున్నారేటీ అప్పుడే? ” సరసం ఒలకపోస్తూ సుబ్బులు పలకరించడంతో… మట్ట మొహాన చిరు చెమట్లు అలుముకున్నాయి.

పెదబాజ్జీ చెప్పినట్టే… సుబ్బులు ఆకుపచ్చ కోక కట్టి, ఎర్రటి జబ్బలరైక తొడుక్కుని ఉంది. ఆ కోక కూడా అటుమొన్న మధ్యాహ్నం, ముచ్చటపడి తను రాంచంద్రపురంనుంచి   కొని తెచ్చిందే.

” ఎల్లహే… ఇల్లు కాలి ఒకడేడుత్తుంటే, ఇంకేదో కాలి ఆడెవడో ఏడ్చాడని, ఇంతోడి అందగత్తె మాకు దొరకదని? ఇక్కడ ఏళ్ళాడత్నాం అనుకున్నావా? మీ అయ్యగారు ఊర్నించి వచ్చేసింది. నువ్వు ఎదవ్వేషాలెయ్యకుండా బేగా ఇంటికిపో. అది చెప్పడానికే ఇక్కడ కాపేసా ” ఖంగారు ఖంగారుగా అబద్దం చెప్పారు మట్ట.

” అల్లయితే, మాపిటికి యర్రపోతారం సినిమా లేనట్టేనా? హుహుం ” మూతి తిప్పుకుంటూ పోయింది సుబ్బులు.

వెనక నుంచి దాన్ని కాస్సేపు అలా మురిపెంగా  చూసుకుని, మతిపోబొట్టుకోబోయిన మట్ట…పెదబాజ్జీ దివ్యదృష్టి గుర్తుకురావడంతో గేటు మూసేసి ,అది నిజమో కాదో పరీక్షించడానికి… ఏదో ఆలోచన వచ్చినట్టుగా కాలికివున్న చెప్పులు విప్పేసి, వాటిని చేత్తో పట్టుకొని, మెల్లిగా పిల్లిపిల్లలా చడీ చప్పుడు చేయకుండా, అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి ఇందాకటి నుంచీ తను కూర్చున్న చోటనే కూర్చున్నారు.

త్రిలోచనరాజుగారు ఇందాకటి భంగిమలోనే, అటు తిరిగి పడుకున్నవారు… ఇంకా పడుకొన్నట్టే ఉన్నారు.

” ఏమోయ్  పచ్చకోకా? ఎర్రకోకా? ” ప్రశ్నించారు కదలకుండానే ఆయన.

పడుకున్న ఆయన్ని… భూతాన్ని చూసినట్టు చూసారు మట్ట.’ నేను తిరిగొచ్చినట్టు ఈయనకెలా తెలిసిపోయింది. వీపుక్కానీ కళ్ళున్నాయా? ‘ అనుకొని…

” ప …ప్ప… పచ్చకోకా ఎర్రజాకెట్టూను ” అని చెప్పారు.

‘ఈయనకి ఈ కోక రంగొక్కటే తెలుసా? లేపోతే సుబ్బులుకీ తనకీ మధ్య ఉన్న చుట్టరికం కూడా తెలుసా? ‘ అన్న కొత్త భయం మట్టలో మొదలయ్యింది.

” పెప్పెప్పెద బాజ్జీ, నిజంగా మీరు మాంత్రికులే కదా? ” అన్నారు వణికే స్వరంతో.

” భయపడి చావకు. ఇది మాయాకాదూ మర్మం కాదు. దీన్నే గంధవేది అంటారు.వాసనలని బట్టి ప్రాణులని కనిపెట్టడం అన్నమాట. ఈ భూమ్మీద పుట్టిన ప్రతి ప్రాణికీ… ఒక్కో వాసన ఉంటుంది. కొంత అభ్యాసం చేస్తే గాలిలో  తేలి వచ్చే వాసనలని బట్టి వచ్చేది మనిషా? మృగమా? పశువా? పక్షా? అన్నది చెప్పెయ్యొఛ్చు. ఈ శక్తి ఎక్కువగా కుక్కల్లో  ఉంటుంది. అన్నారు వెల్లకిలా తిరుగుతూ.

***

త్రిలోచనరాజుగారు పడుకున్న పరుపుకి పైన… ఆయన తలవైపున గోడమీద దిగ్గొట్టిన మేకుకి ఓ విల్లు వ్రేళ్ళాడుతోంది. పక్కనే మరో మేకుకి తగిలించిన పొడవాటి ఈతాకులబుట్టలో నాలుగో ఐదో బాణాలు ఉన్నాయి. ఆ విల్లుతో ఆప్పుడప్పుడూ, ఆయన మిత్రులతో కలిసి అడవిలోకి వేటకి వెళ్తుంటారు. వెళ్ళినప్పుడల్లా ఏదో పిట్టనో, పెట్టనో కొట్టి తెస్తుంటారు.

గోడమీద విల్లూ బాణాలు ఉన్నాయి కాబట్టి, కధ అయిపోయే లోపు ఎవరో ఒకరు బాణం వేయాల్సిందే కదా?

నిన్న త్రిలోచనరాజుగారి చిన్నకొడుకు వెంకట బంగార్రాజుకి… పెద్దకొడుకైన బుచ్చిత్రిలోచనరాజు ఆ  బాణాలతో కాస్సేపు సరదాగా ఆడుకున్నాడు. బుచ్చి రామచంద్రపురంలో తల్లిదండ్రుల దగ్గర ఉండి చదువుకుంటున్నాడు. తాతయ్యనీ నాన్నమ్మనీ చూసిపోదామని వచ్చిన ఆ బుచ్చిత్రిలోచనుడు తాతయ్యని ఏమార్చి… విల్లునీ బాణాన్నీ తోటలోకి పట్టుకుపోయి, ఆకాశం వైపు ఎక్కుపెట్టి ఎగురుతున్న ఓ అడవిపావురాన్ని గురిచూసి కొట్టాడు. గురి తప్పి దూసుకు పోయిన ఆ బాణం, ఎటుపోయిందో పోయి అదృశ్యం అయిపోయింది.

బహుశా ఏదో చెట్టుమీద  సుఖంగా విశ్రాంతి తీసుకుంటున్న  త్రిలోచనరాజుగారి ఏ పెంపుడు దయ్యానికో, భూతానికో అది తగిలివుంటుంది. దాన్ని పట్టేసుకున్న అవి చెవిలో పెట్టుకుని చమ్మగా తిప్పుకుంటున్నాయో? ఏమో… కొట్టి పడెయ్యలేం బాబూ.

ఒకవేళ బాణం క్రింద ఎక్కడైనా పడిందేమోనని, బుచ్చిత్రిలోచనరాజు తోటంతా తిరిగి వెదికాడు.అయినా ప్రయోజనం లేకపోయింది.ఎందుకొచ్చిన గొడవలే… తాతయ్య కానీ వచ్చి చూస్తే తాట తీసేస్తారు. అని తలచి వాటిని, ఏమీ ఎరగనట్టు  యధాస్థానంలో పెట్టేసాడు.

తెల్లవారు జామునే లేచిన అతను, ఇంజరం వంతెన వరకూ పాలేరుచేత సైకిల్ మీద దిగబెట్టించుకున్నాడు. అక్కడ నుంచి  బస్సు ఎక్కి రామచంద్రపురం చక్కా పోయాడు.

***

” పెదబాజ్జీ కొంచెం ఆ బంగారం చేసే కిటుకేదో చెప్పేస్తే, తవరి శిష్యుడిగా కీర్తి గడిస్తూ… చచ్చి మీ కడుపునపుడతాను ” ఆశగా అడిగారు మట్ట.

” సరే అయితే ” అంటూ ఆయన పరుపుమీదనుంచి లేచి, అరుగుమీదనుంచి మెట్లమీదకి కాళ్ళు వేళ్ళాడేసి కూర్చున్నారు. అప్పటి వరకూ టెక్కా మీద కప్పి ఉన్న కండువా అందుకుని, చెవుల మీదుగా తలపాగా చుట్టుకున్నారు.

” కన్నమ్మని అడిగి మంచినీళ్ళు తెమ్మన్నారా?” అంటూ లేచారు మట్ట.

” వద్దు… ఆ గుమ్మందగ్గరకి వెళితే ఓ దయ్యం నీకో మరచెంబు ఇస్తుంది. దాన్ని నాకు ఇచ్చి మళ్ళీ వెళితే ఇంకో భూతం తెచ్చి నీ చేతికి టీ గ్లాసులు ఇస్తుంది. అయ్యందుకో చాలు” అని  ” జాగ్రత్తరోయ్… వాటిని చూడాలని ప్రయత్నించకు.  తల్లో కొమ్ములూ నోట్లో కోరలూ మొలిచెయ్యగలవు” లో గొంతుతో హెచ్చరించారు త్రిలోచనరాజు గారు.

మట్ట పై ప్రాణాలు పైనే పోయాయి.తలుపువెనక నుంచి గాజుల శబ్దం వినిపిస్తోంది.దానితో పాటే కిసుక్కున నవ్విన చప్పుడు కూడా.

”  బాబోయ్ నాకు భయం. చంపేత్తాయేమో? నాకేం… నేను తేను ” అన్నారు మట్ట. అరుగు చివరికి దేకుతూ.

” ఏం ఫర్వాలేదు లేవోయ్! నేనున్నానుగా ఆటి ముక్కు పిండి… ముంతలో పెట్టి మూత పెట్టడానికి ” ధైర్యం చెప్పారు.

ఆయన మాటలు వినగానే మట్టకి భయం మరీ ఎక్కువయ్యింది. ‘ఇందాకా తోటలోంచి నడుస్తూ తను ఏమనుకున్నాడో? అవే మాటలని… తిరిగి ఆయన తనకి అప్ప చెబుతున్నారు.

కాదు, లేదంటున్నారు కానీ నిజంగా పెదబాజ్జీ మాంత్రికుడే. మంత్రగాడే కాదు పెద్ద మాయల ఫకీర్ కూడా అయ్యుంటారు. అందులో ఎంత మాత్రం సందేహం లేదు. అందుకే అప్పుడప్పుడూ హిమాలయాలకి పోయొత్తుంటారు’  అని తనలో తనే తీర్మానించుకున్న మట్ట కళ్ళు పెద్దవి చేసుకొని…

భయంభయంగా తలుపు దగ్గరకి వెళ్ళేసరికి  త్రిలోచనరాజుగారు చెప్పినట్టే ఏదో అదృశ్యహస్తం  ఆయన చెప్పిన అన్నిటినీ సమకూర్చింది. తల అటు తిప్పకుండానే కళ్ళు మూసుకుని మట్ట వాటిని వణికే చేతులతో అందుకున్నారు.

మట్ట ఇత్తడి గ్లాసులో ఉన్న వేడి వేడి టీని చప్పరిస్తుంటే… త్రిలోచనరాజుగారు మరచెంబులోని మంచినీళ్ళు పుక్కిలించి ఊసి,  తర్వాత  వెండి గ్లాసులో ఉన్న టీ పుచ్చుకొని లేచి నిలబడ్డారు.

” పెదబాజ్జీ మరి ఆ విజ్జ కొంచెం ” అంటూ నసుగుతూ లేచిన మట్ట… జేబులోంచి ఓ తెల్ల కాగితాన్నీ, చిన్న పెన్సిల్ ముక్కనీ తీసి త్రిలోచనరాజుగారి కళ్ళ ముందు ఆడించారు. చెబితే రాసుకుంటాను అన్నట్టు.

” కంగారేవిట్రా నడు… అలా తోటలో చల్లగాలికి తిరుగుతూ చెబ్తాను. అసలు నేను కలగ జేసుకోకపోతే నువ్వు ఈపాటికి చచ్చూరుకుందువు ఆ సంగతి నీకు తెలుసా? ” అంటూ అరుగు దిగి కాళ్ళకి చెప్పులు వేసుకుని… అరుగుకి జారేసిన చేపాటి కర్రని చేతిలోకి తీసుకున్నారు త్రిలోచనరాజుగారు.

” ఏంటీ నేను చచ్చిపోదునా? ఏం అంటున్నారు తవరు? హాస్యానికి కూడా హద్దూ పద్దూ ఉండొద్దా?” ఆయన మాటలు పూర్తి అవ్వకుండానే కీచుగా అరిచారు మట్ట. ఏడుపొక్కటే తక్కువ ఆయనకి.

” నేను అబద్దం ఎందుకు చెబుతానురా? ఏబ్రాసీ… నువ్వు ఇందాకా ప్రహారీగోడ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నీ కాళ్ళ దగ్గర నుంచి పెద్ద త్రాచుపాము పాక్కుంటూ పోయిందా? లేదా?

” నిజవే! అదీ పామో? కాదో నేను చూల్లేదు ” మట్ట గొంతు తడారిపోతోంది.

” భయంతో నువ్వు చూల్లేదు కానీ…, దాన్ని నువ్వు తొక్కేసి ఉంటే కాటు వేసేదా? లేదా? కాటేస్తే ఏమవును చెప్పు? అసలు ఏమవునంటావ్? నిన్ను దాని మీద కాలు వెయ్యనీయకుండా… ఒరే మట్టా ఆ తూర్పుగేటు నుంచి రారా అని పిలిచానా లేదా?” చిరునవ్వుతో అడిగారు.

త్రిలోచనరాజుగారు చెప్పేది వింటుంటే మట్టకి నవనాడులూ కృంగిపోయాయి. ఆయన్ని అంతులేని నీరసం ఆవహించింది.

‘అవును నిజవే. పెదబాజ్జీ చెప్పేదంతా నిజవే. అమ్మ బాబోయ్ నేను చచ్చిపోతే నా పెళ్ళాం పిల్లలు ఏవైపోదురు?’ నాలుకతో పెదాలు తడుపుకున్నారు.

” ఓపక్క మాయలు లేవు, మంత్రాలు లేవు అంటారు. ఇయ్యన్నీ తవరికెలా తెలిసాయండీ” మాటలు కూడబలుక్కొని ఉక్రోషంగా అడిగారు మట్ట.

” భయపడకురా సన్నాసీ. భయమే… మనిషిని సగం చంపేస్తుంది.దీన్నే శబ్దవేది అంటారు.శబ్దాన్ని బట్టి ప్రమాదాలని పసిగట్టడవన్న మాట. నీ విషయంలో అక్కరకి వచ్చిందా కదా? ”

” మరి ఆ కామినీ పిశాచం పనసపండు ఏసాలేవిటీ? ఆ తలుపెనకాల దెయ్యాల దొంగాట ఏంటి?”

” తలుపు వెనకాల దయ్యం మీ కన్నమ్మేరా? నేను పడుకొని లేచే వేళలు వాళ్ళకి తెలీవురా? ఇంక పనస వాసన అంటావా? నడు చూపిస్తా! అది నేల పనస. భూమిలోనే కాస్తుంది. పక్వానికి వచ్చాకా నెర్రలు తీసి కాయలు బయటకి వస్తాయి ”

” అలాగా? ”

” స్పృహలోనే ఉన్నావు కదా? నడు ”

” ఏం స్పృహ అండీ, చచ్చి బతికితేనీ. నాకియ్యాళ మీరు ఆ బంగారం చెయ్యడం నేర్పాపోతే… ఎప్పుడూ మీ గుమ్మం మెట్టు ఎక్కనింక ” గారం గుడుస్తూ శఫధం చేసారు మట్ట.

” సరే… రా రాసుకుందీ గాని  ” అన్నారు త్రిలోచనరాజుగారు ముందు నడుస్తూ.

పెన్సిల్ ముక్కా కాగితం పట్టుకొని… మట్ట ఉత్సాహంగా ఆయన్ని అనుసరించారు.ఆయన మొహంలోకి మళ్ళీ మునుపటి జీవ కళ వచ్చి చేరింది.

***

‘ మట్టగారూ త్రిలోచనరాజుగారూ… వీళ్ళిద్దరూ ఇక్కడ ఉల్లాసంగానే ఉన్నారు’

‘పార్వతిగారు అక్కడ ఆవుకోసం వరాలప్పని ఉబ్బేస్తూ… పక్షంరోజులపాటూ ఆవుని ఎలా ఎత్తుకెళ్ళాలా అని ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ ఆవిడా బాగానే వున్నారు’

‘సినిమా యవ్వారం చెడిపోయినా, సాయంత్రం కణుజు మాంసం కూర దొబ్బితిందామన్న ఆశతో సుబ్బులూ కులాసాగానే ఉంది’

‘తాతయ్యనుంచి తన్నులు తప్పించుకోవటానికి పొద్దున్నే రామచంద్రపురం పోయిన  బుచ్చి త్రిలోచనరాజు మిగతా కుర్రోళ్లతో కలిసి కిరికెట్టు ఆడుకుంటూ అతనూ బాగానే ఉన్నాడు’

‘ఎక్కడ ఉన్నాడో గానీ ఆ మంతెనోరి రామంగాడు కూడా బాగానే ఉండుంటాడు.బాగోకపోవడానికి అతనికి తిన్నది అరగట్లేదా ఏమన్నానా?’

‘ ఎటొచ్చీ ఈ కధ చెబ్తున్న నేనే బాగాలేను. అవును అస్సలు ఏం బాలేను ‘

‘గోడ మీద ఉందన్న విల్లు  నాకు మహ గొప్పగొడవ తెచ్చి పెట్టేసింది. త్రిలోచనరాజుగారు ఆ విల్లుని అలాతీసి… కనీసం ఇలా ఓసారి తుడిచేసి గోడకి తగిలించేసినా నాకు పెద్ద ఇబ్బంది లేకపోను. ఆయనేమో తన మానాన తాను మట్టని వెంటేసుకొని కొబ్బరి తోటలో విహారానికి పోయారు.

బంగారం చేసే విద్య నేర్చేసుకొని… మణుగులకొద్దీ బంగారం తయారు చేసేసుకొని మట్ట మహారాజైపోతారు.ఆయన మహారాజైతే… పార్వతిగారు ఎలాగూ ఇంక మహారాణే కదా.అంతే ఇంకేముంది…శుభం. కధకంచికి మనం ఇంటికి.

ఇలా అని సరి పెట్టేసుకుంటే పాఠకులనిపించుకుంటారా మీరు?

ఏంటిది? గోడమీద విల్లుందన్నాడు. పెద్ద పెద్ద బాణాలు ఉన్నాయన్నాడు. నిన్నో మొన్నో ఎవడో ఓ కుర్రకుంక గురిలేని బాణం వదిలి… పొద్దున్నే పారి పోయాడని చెప్పి, చేతులు దులిపేసుకుంటే సరా? అలాంటప్పుడు ఇవాల్టి కధలో  దాని ఊసు ఎందుకెత్తినట్టు? కధా నియమం పాటించనక్కర్లేదా? చేతకాకపోతే చేతకానట్టుండాలి.హత్తెరి అంటూ తయారైపోకూడదు. అని మీరు వేలెత్తి చూపించకుండా ఉండగలరా? అప్పుడు నా పరువు ఏంకావాలి?  కధ చెప్పే… నా మర్యాద ఏవన్నా మిగులుద్దా?’

***

‘ ఏంటో?పిచ్చెక్కిపోతోంది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో? నాకే అర్ధం కావడం లేదు ‘

నడుస్తూ నడుస్తూ వున్న త్రిలోచనరాజుగారు ఎందుకో గానీ వెనక్కి తిరిగారు.

‘ కళ్ళుమూసుకుని… అన్నీ తెలిసేసుకునే ఆయన, నా బాధని కనిపెట్టేసారా ఏమిటీ? ‘

‘ …….’

‘అదిగో ఆయన వెనక్కి తిరిగారు. ఇటే…నావైపే ఒక్కో అడుగూ వేస్తూ వస్తున్నారు ‘

‘ఇక్కడికి వస్తారు… వచ్చి ఈ గోడమీద ఉన్న విల్లూ బాణాలూ తీసుకెళ్తారు’

‘బాణం ఎక్కుపెట్టి ఏదో పావురాన్నో, పిట్టనో కొట్టకపోరు! నా మర్యాద నాకు దక్కించక పోరు ‘

????????????????

‘ క్షణాలు నిమిషాలవుతున్నాయి… నాలో ఉత్కంఠ పెరిగిపోతోంది ‘

‘ఆయన వస్తున్నారు’

‘వచ్చేస్తున్నా…రు ‘

‘ వచ్చేస్తు…న్నారు ‘

‘ వచ్చే…స్తున్నారు ‘

‘ వ…చ్చేస్తున్నారు ‘

‘ …చ్చేస్తున్నారు ‘

‘చ. చచ… అక్కడి దాకా వచ్చి, అక్కడే ఆగిపోయారేంటీ? కిందకి వంగి ఏదో మొక్కని పీకి మట్టకి చూపిస్తున్నారు.బంగారం తయారీలో వాడే ఆకుపసరు అదే అయి ఉంటుందా? ఏమో… అయ్యే వుంటుంది. ఆ మొక్కని పట్టుకొని…  మట్టతో కలిసి మళ్ళీ ముందుకు నడవడం మొదలెట్టారు.

‘ఇక లాభం లేదు? నాకు నా పరువు మర్యాదలు నా గౌరవం ముఖ్యం.  ఏం చేసి అయినా సరే… వాటిని నిలబెట్టుకుని తీరాల్సిందే. అందుకు కోసం  నేను ఖూనీ చెయ్యడానికైనా  సిద్దమే ‘

వెళ్లి గోడనున్న విల్లుని, ఓ బాణాన్ని విసురుగా చేతిలోకి తీసుకున్నాను.

త్రిలోచనరాజుగారి వైపు కోపంగా బాణం గురి పెట్టాను.

ఒకటీ.

ఓ కన్ను మూసి చూస్తున్నాను.

రెండూ..

ఏంటీ… గురి కొబ్బరిగెల మీదకి వెళుతోంది.చెయ్యికానీ… వణుకుతోందా?

మూడూ…

వింటి నుంచి బాణం వె.లు..వ…డిం………………………

కొబ్బరి చెట్ల కిందనుంచి నెమ్మదిగా నడచి వెళ్తున్న త్రిలోచనరాజుగారి తలమీద అమాంతంగా వచ్చి ఓ కొబ్బరిగెల దబ్బునపడింది. పడిన కొబ్బరిగెలతోపాటూ ఆయనా కిందపడిపోయారు.ఆయనకి ఏంజరిగిందో తెలియదు.తలచుట్టూ రక్తం మడుగులు కట్టింది. ఈ విషయం ఆయనకి తెలిసే అవకాశమే లేదు.

ఆయన వెనకే నడుస్తున్న మట్ట ఏంజరిగిందో గ్రహించి… దూరంగా పరిగెత్తి పారిపోయారు.

ఆయన చేతిలోని తెల్లకాగితం గాల్లో ఎగురుతూ గిరికీలు కొడుతోంది.పెన్సిల్ ముక్క ఎగిరి వెళ్ళి ఎక్కడో పడిపోయింది.

కిందపడ్డ కొబ్బరిగెల తొండానికి ఓ బాణం గుచ్చుకొని ఉంది.

వీధివైపు గెలపడ్డ పెద్ద చప్పుడు వినిపించడంతోనే… త్రిలోచనరాజుగారి పెరట్లో పనిచేస్తున్న పనివాళ్ళు ఏమయ్యిందోనని చూడ్డానికి ఖంగారుగా వీధిలోకి పరిగెత్తుకుంటూ వస్తున్నారు.

నేను ఇంక ఇక్కడ ఉండడం అంత మంచిదికాదు.గబ గబా విల్లూ చేతిలోని బాణాన్ని ఎక్కడనుంచి తీసానో అక్కడే పెట్టేసి అక్కడనుంచి నిష్క్రమించాను.

ఇంతజరిగాకా కూడా, అసలు ఆ మంతెనోరి రామం ఏం చేసాడూ? అని  మీరు  నన్ను అడుగుతారని అనుకోను.

దివ్య దృష్టితో అడ్డుగోడల అవతల ఏంజరగబోతుందో చెప్పగలిగే త్రిలోచనరాజుగారికి… ఆ మంతెనోరి రామం ఏం చేసాడో?  తెలీకుండా  ఉంటుందా?

అయినా… మంతెనోరి రామం గురించి మట్ట చెప్పాలనుకున్నది  నాకూ మీకూ కాదు కదా!త్రిలోచనరాజుగారికే గానీ.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

తనతో కలిసి …

Painting: Rafi Haque

                              పెట్టె

నా బరువును దించుకుంటూ గతవారపు మేఘవిస్ఫోటనాన్నీ, ఒక ప్లాస్టిక్ మేకనూ, హై స్కూల్లో అనుభవించిన ఐదు సంవత్సరాల నరకాన్నీ, తత్తరపాటు నిండి వికృతమైన నా మొదటి ముద్దునూ, నేనెప్పుడూ కలవని నా అమ్మమ్మనూ తాతయ్యనూ, చాపమీద వొలికిన వొంటినూనె పరిమళాన్నీ, మొన్నమొన్ననే పుట్టిన పిల్లిపిల్లనూ, మొక్కజొన్న నూకతో చేసిన ఉప్మానూ పెట్టెలో సర్దేస్తాను. వృద్ధాప్యంలో వుంటాను కనుక నన్నూ అందులో పడేసుకుంటాను. ఎన్నైనా పట్టేలా ఆ పెట్టె వ్యాకోచం చెందుతుంది మరి! ఆఖరుకు దానికి ఏ లేబులూ తగిలించక రైలుస్టేషను ప్లాట్ఫామ్మీద వదిలేస్తాను. అలా అది తన గమ్యాన్ని చేరుకుని వుంటుందక్కడ, ఎవరో అపరిచితుడు తనను తీసుకుని నిధిలాగా దాచుకుని తనతో కలిసి బతుకుతాడని ఎదురు చూస్తూ.

                                              ఆంగ్లం: గెయిల్ డెండీ

                                      తెలుగు: ఎలనాగ

                     స్వర్గం అండ్ సన్స్ Co.

 

తిరుగు లేని నిర్ణయాధికార పరిధిననుసరించి మోక్షగాముల సంఖ్యను తగ్గించాలని నిశ్చయింపబడిందని తెలుపడానికి చింతిస్తున్నాను. ముక్తిని పొందవలసిన ఒక మహా మానవాళిని ఈ విధంగా తొలగించాల్సి రావటం మీకు చిత్రంగా తోచవచ్చు. కాని పెద్దసారు గారు అందరికీ శాశ్వత స్థాయిని వాగ్దానం చేయలేరనీ, కటాక్షవీక్షణాల రూపంలో వేతనం పొందుతున్నవారిని సైతం తొలగించకుండా వుండలేరనీ దయ చేసి గమనించాలి మీరు. ఈ సూత్రం పట్ల అవగాహన లేకపోవటం పెద్దసారు గారి దివ్యత్వాన్ని ఎంతగానో తగ్గిస్తుందనేది, నిజమైన వినయాన్ని క్షీణింపజేస్తుందనేది స్పష్టం. మిమ్మల్ని అంతిమంగా తొలగించే ముందు ఒక సమావేశాన్ని ఏర్పరచి పునర్ముక్తి కోసం మీరు ఏ ప్రత్యామ్నాయాలను కోరుకుంటారో అడుగుతాం. మీరు బాధితులుగా కాని, వేడుకునేవాళ్లుగా కాని రావచ్చు. ఇక వెంటనే మీ కాగితాలను వదిలి వెళ్లండి. చిన్నచిన్న గీతలూ పిచ్చిగీతలూ ఉన్న కాయితాల్ని కూడా వదిలి వెళ్లాలి. ఈ కార్యాలయం నుండి బయటికి పోయేటప్పుడు మీ వెంట ఒక సెక్యూరిటీ గార్డు వస్తాడు. మిమ్మల్ని తీసేయడం పెద్దసారు గారి అనుగ్రహపు అస్పష్టతను ఎలా తెలియజేస్తుంది అనే ప్రశ్న మీలో తలెత్తితే నన్ను సంప్రదించడానికి సందేహించకండి. మీ సేవలకు కృతజ్ఞుణ్ని. పునర్జన్మలో మీకు సంపూర్ణ విజయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.

ఆంగ్లం: ఫిలిప్ ప్రైడ్

                                          

                                                                                                    ***

 

 

 

చాయ్ కప్పులో గోదారి!

(త్వరలో ప్రచురణ కానున్న భాస్కరభట్ల కవిత్వ సంపుటికి రాసిన ముందు మాట)

గోదావరి నాలో మొదటి సారి ఎప్పుడు గలగల్లాడిందో చెప్పాలి ఇప్పుడు భాస్కరభట్ల గురించి రాయాలంటే! నదితో కాపురమున్నవాడి గురించి రాయాలంటే నది నించే మొదలెట్టాలి, ఎందుకంటే అతని మూలం నదిలో వుంటుంది కాబట్టి! ఈ “పాదముద్రలు” భాస్కరభట్ల దాచుకున్న పదముద్రలు, నెమలీకలు.  తనే అన్నట్టు:

ఇప్పుడంటే రెండేగానీ…

చిన్నప్పుడు నాకు మూడు కళ్లు!

పుస్తకంలో

దాచుకున్న

నెమలికన్నుతో కలిపి!!!

కవిత్వంతో మొదలైన జీవితం చివరికి  పాటతో ముడిపడడం గోదావరి జీవులకి కొత్త కాదు. అది దేవులపల్లి కావచ్చు, నండూరి సుబ్బారావు కావచ్చు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కావచ్చు, సిరివెన్నెల కావచ్చు, భాస్కరభట్ల కావచ్చు. వాళ్ళు కవిత్వం రాసినా అందులో గోదావరి గలగలే  పల్లవి అందుకుంటాయి.  నేను ఎంతో ఇష్టపడే ఇస్మాయిల్ గారి తొలినాళ్ళ కవిత్వంలో కూడా ఆ పాట వినిపిస్తుంది,  “తొలి సంజ నారింజ ఎవరు వలిచేరూ?” అంటూ.

అయితే, ఇస్మాయిల్ లాంటి కవులు పాటలాంటి గోదావరి ప్రవాహంలోంచి కవిత్వ సెలయేటిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతే, భాస్కరభట్ల అటు ఆ ప్రవాహంలోనూ ఇటు ఈ సెలయేటిలోనూ రెండీట్లోకి హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే, ఇప్పటికీ అతన్ని నడిపించే దారి  గోదారే అని నా నమ్మకం.

భాస్కరభట్ల ఆ గోదారి మీంచి హైదరాబాద్ దాకా జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చిన 1998 నాటి రోజులు నాకు మంచి జ్ఞాపకాలు. అప్పుడు నేను ఆంధ్రభూమి దినపత్రికలో ఫీచర్స్ ఎడిటర్ గా వుండే వాణ్ని. తెలుగు జర్నలిజంలోనే మొట్ట మొదటి ప్రయోగంగా ప్రతి వారం నాలుగు పేజీల సినిమా స్పెషల్ “వెన్నెల” ని అప్పుడు మొదలు పెట్టాం. అదిగో అక్కడ కలిశాం నేనూ భాస్కరభట్ల, పులగం చిన్నారాయణ. ఆ ఇద్దరూ రాజమండ్రిలో ఒకే నది వొడ్డున తిరిగారు, ఒకే బడిలో పెరిగారు, ఒకే కవిత్వపు ఒడిలో కరిగిపోయారు. ఆ స్నేహపు అందమైన ఒరవడి వాళ్ళ జీవితాల్ని ఇప్పటికీ వెలిగిస్తోంది.

చాలా అమాయకమైన అప్పటి ఆ ఇద్దరి ఆ లేత నవ్వు  కళ్ళల్లో  జీవితం మీదా, అక్షరాల మీద బోలెడు ప్రేమ కురుస్తూ వుండేది. సాయంత్రాలు మేం అలా నడుచుకుంటూ వెళ్లి, గార్డెన్ కేఫ్ లో హైదరాబాదీ చాయ్ లు తాగుతూ కవిత్వమూ కబుర్లూ…జీవితం చాలా బిజీగానూ వుండేది, ఆ బిజీలో బోలెడంత బిజిలీ కూడా వుండేది. ఇప్పుడు బిజీ మాత్రమే మిగిలి, బిజిలీ మాయమయ్యింది కానీ…

పులగం చిన్నారాయణ  సినిమా పత్రికా రచయిత. సినిమా గురించి ఏం అడిగినా క్షణాల మీద రాసివ్వగలిగిన మేదోజీవి. అతనికి భిన్నంగా భాస్కరభట్ల ఊహాజీవి. అందమైన ఊహలే ప్రాణంగా పాటలూ కవిత్వమూ అల్లుకుంటూ వుండే కాల్పనికుడు. కాని, పాపం, పొట్ట కూటి కోసం సినిమా వ్యాసాలు రాసిచ్చే వాడు మాకు. అతని కల మాత్రం ఎప్పుడూ పాటే! పాట అతన్ని రాత్రీ పగలూ వెంటాడేది! లోకాన్నంతా వొక్క  పాటగా మాత్రమే ఊహించుకుంటూ హాయిగా బతికేసే simple philosophy అతనిది. అందుకే, అందులో ఎలాంటి complications, implications వుండవ్. అతని నవ్వులోని ఆ simple innocence అతని వాక్యాల్లోకి హాయిగా తర్జుమా అవుతుంది ఇప్పటికీ- బహుశా, అందువల్లనే అతను మహామాయామేయ జగత్తులో వుండి కూడా, తన అందమైన అద్దాన్ని పోగొట్టుకోలేదు. ఆ శబ్ద దర్పణానికి మాయలు నేర్పలేదు.

ముఖ్యంగా, భాస్కరభాట్లలో వొక చమత్కారి వున్నాడు. తనతో మాట్లాడిన అనుభవం వున్న స్నేహితులకి అదేమీ కొత్త సంగతి కాదు. అతని మాట “పన్”చ దార పలుకు. అయితే, ఎప్పుడూ వొక చక్కని అనుభూతి చిలుకు. ఈ పదముద్రలో పన్ లేదు కాని, మంచి పరిమళభరితమైన అనుభూతి వుంది-

శీతాకాలం

తెలావారు ఝాము

మంచు కురుస్తోంది…

అప్పుడే వాయతీసిన

వేడి వేడి ఇడ్లీలమీద పొగలా!

తనకి  పదాల రాహస్యం బాగా తెలుసు. శ్రీశ్రీ లోంచీ, తిలక్ లోంచీ మొదలైన వాడికి పదాలూ వాక్యాల లోగుట్టు తెలియడంలో వింత లేదు. పన్నెండేళ్ళ నించీ కవిత్వంతో కాపురం చేస్తున్నవాడికి ఆ అందంలోని ప్రతి మెరుపూ తెలుసు. చాలా లోతైన విషయాలు కూడా సరళంగా చెప్పడం కూడా ఈ మెరుపు విద్యలో భాగమే.

ఇద్దరం..

మధ్యలో మరికొందరు..

మళ్ళీ మనిద్దరమే..!!

 

గుండె కలుక్కుమనే ఇంకో భావం:

హుండీలో వేసిన

అజ్ఞాత భక్తుడి కానుకలాగ

అనాధపిల్లలు..!!

 

కవిత్వ పదాల్ని  మహా పొదుపుగా వాడ్తాడు భాస్కరభట్ల. కథనంగా కవిత్వాన్ని సాగదీయడం కాకుండా, వొక మెరుపులా మెరిపించే గజల్ సౌందర్యమేదో అతని కవిత్వంలో కనిపిస్తుంది. క్లుప్తత దాని అంతర్/ బహిర్ సౌందర్యం. గజల్ కవిలానే భాస్కరభట్ల రెండు పంక్తుల్లో ఇహపరాల పారమెరిగిన వాడు. ఉదాహరణకి:

కనుపాపల మగ్గం మీద

కలల్ని నేస్తోంది

నిద్ర!!

మరో సందర్భంలో:

చీకటి చూరుకి

వేలాడుతున్న

వెలుతురు ఖడ్గంలా

వీధి దీపం !!

తనలోని తాత్వికుడు ఎక్కడ దొరుకుతాడూ అంటే, సహజమైన ప్రకృతికీ, మనిషి సృష్టించుకున్న అసహజమైన వికృతాలకూ మధ్య విరోదాభాసలో-

ఉదాహరణకి :

మా ఊరు

తప్పిపోయింది…

ఫ్లై-ఓవర్ వచ్చి..!!

~

‘Well’ settled

అనుకుంటుందేమో

నూతిలో కప్ప..!!

~

ఆకాశం

అదేపనిగా

ఎన్నిసిగరెట్లు కాలుస్తోందో ఏమో..

లేకపోతే

ఇన్ని పొగమబ్బులెక్కడివీ?

విస్తరించి చెప్పడం ఏనాడూ భాస్కరభట్ల లక్షణం కాదు, చెప్పాల్సిందేదో చెప్పేసి చక్కా వెళ్ళిపోతాడు వచ్చిన దారినే! కాని, తను చెప్పింది మాత్రం మనలోపల మిగిలిపోతుంది, మంచి స్నేహవాక్యంలాగా- పాదముద్రలన్నీ అలాంటి అనుభవరసం నింపుకున్న నిమ్మతొనలే. మన మానసిక ఆరోగ్యానికి రోజూ కొన్ని కావాలి ఇవి.

తొలినాటి వొక స్నేహితుడు తన చిరునామా మళ్ళీ కవిత్వంలో వెతుక్కుంటున్న ఈ సమయం నాకు అర్థవంతమైన కవిసమయం!

*

 

బీటలు వారిన ‘గాలి అద్దం’

‘ ఏరుకున్న దుఃఖంలో’ అంటూ నాయుడి మీద 22 ఏళ్ల క్రితం నేను రాసుకున్న కవిత ఇది:

వెన్నెల రెక్క తెగిన
అమావాస్య ఏడుపురా నువ్వు

 

శ్వాసలూ భాషల్లోనే మూల్గాయని

ఆత్మహత్యాత్మకంగా నొక్కి

 

తలవాకిట పడిగాపుల్లో

చీత్కార ప్రణయాన్ని ఖాండ్రించి నవ్వి

 

నువ్ తీస్తున్న దౌడు పాదాల

పియానో చప్పుడు-

 

మహానగర కూడలి చాపిన తారునాల్కకి

వెగటు రుచివి

మొండి గోడల్ని బీటలు చీల్చిన

గడ్డిపూ పజ్యానివి

కొడిగట్టిన దూదొత్తి రెపరెప కాల్చిన

ఒంటరి అరిచెయ్యివేరా ఏంతకీ

నువ్వు-

 

పెకలించినా మట్టంటని మొక్కలు

మరెప్పుడూ నేల చేరని వాన చినుకులు

అరచేతి గ్రహణాల్ని కప్పుకుని బావురుమనే

చందమామలు

ఈ గట్టునే ఊడలు దించిన మృత్యువు!

 

దెయ్యం కాళ్ల పరుగుల్తో

వెనక్కి నడిచే గడియారాలం

 

లబ్‌డబ్మని పెట్లుతున్న గుండెల

పింగాణీమోతలో

విన్పించని

కన్నీటి వీడ్కోలు తేమరా నువ్వు

 

ఆ గట్టు చేర్చకుండానే కూల్తుందీ వంతెన

 

ఆగాగు!

ఊడల్తోనైనా దాటాలీ చీకటి జన్మాల ఏరు

నువ్వైనా మరి

నేనైనా-

* * *

నాయుడి కవిత్వం- గాలి అద్దం సంకలనానికి రమణసుమనశ్రీ ఫౌండేషన్ అవార్డు అందిస్తున్న వేళ నాయుడు గురించి నాలుగు ముక్కలు మాట్లాడవల్సి వచ్చిన సందర్భంగా సుమారు పాతికేళ్ల మా సాన్నిహిత్యాన్నీ, 22 ఏళ్ల నాటి ఆ కవితనీ స్మరిస్తున్నాను. దాన్నిలా తలుచుకుంటున్న సమయాన దాని భావంతో, సారంతో, ఉద్వేగంతో నేనిప్పుడు ఎంత కనెక్టు అయ్యి ఉన్నాన్నో తరిచిచూసుకున్నాను.

‘తాను పారిపోతున్నాడో, లేక నేనిక్కడ బందీనే అయ్యానో తేల్చుకోలేక వీడ్కోలులా’  నాయుడు కోసం రాసిన ఆ కవిత గానీ, అందులోని ‘పర్సనల్’ సందర్భంగానీ తనకైనా గుర్తుండి ఉంటుందని అనుకోను. ‘అనుక్షణిక’మంటూ నాయుడు నాడు రాసుకున్న భగ్నకవిత అతని జ్ఞాపకాల్లో భద్రంగా ఉందని కూడా అనుకోను. ‘అతడు గీసింది కన్నా/ చెరిపింది ఎక్కువ ‘ అన్నారు ఇస్మాయిల్ గారు ‘పికాసో’ గురించి. నాయుడు కూడా రాసింది కంటే చెరిపిందే ఎక్కువ, మర్చిపోయిందే ఎక్కువ. బహుశా 1997లోనే అనుకుంటా, మో (వేగుంట మోహన ప్రసాద్ గారు) తనలానే అనుకంపన లయతో సంచలిస్తుండే అక్షరాల… పదాల… వాక్యాల… దొంతర్ని 47పులు (47 ఏడుపులుని 47 లోని ‘ఏడు’తో ‘పులు’ కలిపి pun చేస్తూ) పేరిట నాయుడు 47- కవితల సంకలనం- ‘ఇపుడే’కి ముందుమాటగా నాకు పంపారు, కంపోజ్ చేయించమని. ‘ఆ 47 కవితలకి మరిక మార్పులు, చేర్పులూ చేయవద్దని, తన తొలిపలుకు కంపోజ్ చేయించి పంపితే, నాయుడి తొలి సంకలనం- ‘ఇపుడే’ వేయించేస్తాననీ’ మో నాకు కవరింగ్ లెటర్ రాసారు. నేను పరమ విధేయంగా 47పుల్ని టైపించి ఒరిజినల్, ఓపెన్ ఫైల్ రెండూ పంపించేశాను. ‘ఇపుడే’ కోసం ఎదురుచూస్తున్నపుడే, మహా అయితే మరో నెల లోపు, ‘మో’ చెప్పారు- నాయుడు తన కవితల రాతప్రతి చింపి తగలబెట్టేశాడని. చెరపడం, మరవడం – నాయుడి విషయంలో అంత తీవ్రంగా ఉంటాయి. కాబట్టి, అపుడేపుడే నేను రాసినదేదో గుర్తుంటుందని కచ్చితంగా అనుకోను. నాయుడిది ఏరుకున్న, తనంతట తాను ఐచ్ఛికంగా ఎంపిక చేసుకున్న దుఃఖమేనని అంటున్న ఆ నా కవితలో content- context ల దృష్ట్యా ‘పర్సనల్’ భాగంగా కొంత మేరకు వడకట్టేసి, depersonalise కాబడ్డ భాగం వరకూ మాత్రమే చూస్తే-

మహానగర కూడలి చాపిన తారునాల్కకి వెగటు రుచి వంటి, మొండి గోడల్ని బీటలు చీల్చిన గడ్డిపూ పజ్యం వంటి, కొడిగట్టిన దూదొత్తి రెపరెప కాల్చిన ఒంటరి అరిచెయ్యివంటి అతడు, తలవాకిట పడిగాపుల్లో ఛీత్కార ప్రణయాన్ని obvious కాన్కగా పొందిన ప్రేమోపహతుడు మాత్రమే కాదు, కవి కూడా. ఎటువంటి కవి? మాటలు, ఆలోచనలే కాదు, శ్వాసలు సైతం భాషల్లో మూల్గడాన్ని ఏవగించుకునే కవి.  నేను పై కవిత రాసిన 1994 నాటికి మహా అయితే ఓ పుంజీడు కవితలు రాశాడేమో, అప్పటికే తన కవిత్వం తిరగేసిన భాష అని తెలిసిపోయింది మిత్రులమైన మాకు.

“She dealt her pretty words like Blades/ How glittering they shone/ And every One unbared a Nerve

Or wantoned with a Bone..” అంటూ Emily Dickinson తరహా ఊహలల్లుకున్నాం నాయుడి కవిత్వం మీద. ఇక్కడ ఒక సర్రియలిస్ట్ సత్యమేమంటే, ఏ కవితలూ రాయకముందే మా సిద్ధార్థకి ప్రియమైన కవి అయిపోయాడు నాయుడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఖైరతాబాద్ దక్షిణ హిందీ ప్రచార సభ కాంపౌండులో ఉన్న తన జిరాక్స్ సెంటరుకి అరుదుగా వచ్చే ఓ ఫిలాసఫీ కుర్రాడి కళ్లలో విలోమబింబాలుగా కదలాడుతున్న కవితలు చదివి రేపటి కవిని సిద్ధార్థ discover చేయడం – బహుశా ఏ దేశకాల సాహిత్య చరిత్రలోనైనా విశేషమైన, అపూర్వమనదగ్గ వృత్తాంతం.

ఒక తరం కవుల్ని, లేదా ఒక తరహా కవిత్వోద్యమాన్నీ అర్థం చేసుకునేటప్పుడు అప్పటి సామాజిక ఆర్థిక పరిస్థితుల్నీ, యుద్ధాలు, క్షామాలూ వంటి ప్రాపంచిక పరిణామాల్నీ తరిచి చూసే విమర్శక, విశ్లేషణాత్మక పనిముట్లని ఆధునిక (పాశ్చాత్య) అధ్యయనం అలవాటు చేసింది. ఏమిటితని ఏడుపు, ఎందుకింత వగపు? ‘మధ్యతరగతి సుడో సుఖాల పడవ మునిగిపోతుందేమోనన్న వెంపర్లాట ‘గా అజంతా గారి కవిత్వం మొత్తాన్నీ తేల్చిపారేశాడు ఓ ఆధునిక విమర్శకుడు. ఒక తరం కవుల నిరాశకి, నిస్పృహకీ unemployment, underemployment కూడా కారణాలని చేసిన విశ్లేషణలూ విన్నాము. అంటే, ‘సొంత ఇల్లూ, అణగారిన భార్య, ప్రతి సంవత్సరం పై క్లాసులోకి వెళ్ళే కొడుకూ, bank- account, వొట్టిపోని ఆవు’ ఉంటే, మున్ముందు వాటి ఉనికికి ఏ ఢోకా లేదనుకుంటే అజంతా, నాయుడుల కవిత్వం ఉండేది కాదా? అలా సెటిల్ కాలేదనీ, తన జీవితం వడ్డించిన విస్తరి కాలేదనేనా నాయుడి దిగులు, గుబులు? నాకెందుకో ఈ వాదాలూ, విశ్లేషణలూ విచిత్రంగా, రొడ్డకొట్టుడుగా తోస్తాయి. నాయుడ్నే తీసుకుందాం. సుమారు పాతికేళ్లుగా గమనిస్తునానతన్ని. అతను కవిత్వం అయ్యే క్షణాల కోసం; అంతేకాకుండా, అతను కవిత్వం కాకుండా పోయే లిప్తల కోసం కూడా ఏకకాలంలో ఎదురుచూడటం నిజజీవితంలో నాకు ఎదురైన అధివాస్తవికత, కల-మెలకువల మధ్య తిర్యగ్ బిందువుని దర్శించడంలా అనుభవంగానే తప్ప మరింకే విధంగానూ అర్థం చేయించలేని అభాస!

అయితే, మన తెలుగు ఆధునిక సాహిత్యావరణంలో కొన్ని సాహిత్యేతర హిపోక్రసీలు గమనిస్తే భలే వినోదాన్నిస్తాయి. “Poets are, by the nature of their interests and the nature of artistic fabrication, singularly ill-equipped to understand politics…” అని W H Auden అంతటివాడు అన్నట్లు చదివో, కర్ణాకర్ణిగా వినో ఉంటారు. Artistic fabrication మాట దేవుడెరుగు, ఏమీ తెలియకుండా ఉండటంలో ఉండే సౌఖ్యాన్ని అనుభవిస్తూ, చాలా convenient గా intellectual disturbance వంటి అరువు సలపరింతలకి గురౌతుంటారు. ఆధునిక సంక్షోభ యుగంలో కవులెలా ప్రవర్తించాలో, ఎలా ఆలోచించాలో ముందుగానే సిద్ధమై ఉన్న అలిఖిత రూల్ బుక్ లో కొన్ని పడికట్టు వాక్యాల్నే కాస్త అటూఇటుగా వల్లెవేస్తుంటారు: లౌకిక విషయాలు పట్టవనీ, నోట్లో వేలుపెడితే కొరకలేమనీ, రాయడానికి బద్ధకమనీ, ఎవరో చెవిలో గుసగుసలాడినట్టు కొన్ని కవితావాక్యాలలాగ తళుక్కుమంటాయనీ, ఇక రాసినవి దాచే అలవాటు బొత్తిగా లేదనీ…. ఇలా ఈ అబద్ధాలకి అంతులేదు. ఇవన్నీ నిజమని అమాయకంగా నమ్మి, బహుశా ‘రంజని’ వారనుకుంటా, making of a poem తెలుసుకోవాలని తపించే ఆధునిక కవిత్వాభిమానుల కోసం ఇరవై ఏళ్లక్రితం ఒక సంకలనం తెచ్చారు. ప్రసిద్ధ కవులు, వారి కవిత (లేదా కవితలు)- ఆ కవిత అంతిమ రూపం తీసుకోక ముందటి చిత్తుప్రతి. తెలుగు ఆధునిక కవి మోసం, కాపట్యాలకి landmark గా నిలిచిపోయిందా సంకలనం. కాబట్టి అటువంటి కాలుష్య వాతావరణంలో నాయుడుని గ్రహించడం కష్టం. Making of a poem – తెలుసుకోగోరే ఏ సీరియస్ పాఠకుడు, కవితాప్రేమి, సాహిత్య విద్యార్థికైనా-  రాసినవి చెరిపేసే తెంపరితనం, మిగిలినవాటిని దాచని నిర్లక్ష్యం, అక్షరమంటే అలవిమాలిన ఆపేక్ష, కుకవిత్వం మీద తీవ్ర అసహనం – సహజంగా ఉన్న అసుర (అంబటి సురేంద్రరాజు), నాయుడు వంటి అతి కొద్దిమంది కవులు మాత్రమే testimonial గా నిలుస్తారు.

కవిత ఎప్పుడు రెక్కలల్లార్చి, ఎప్పుడు ముడుచుకుంటుందో తనకే తెలియకపోవడం వల్ల కాబోలు, ఎటువంటి తారీఖుల బరువుల్నీ కవితల రెక్కలకి కట్టే ప్రయత్నం చేయలేదు నాయుడు. పఠితకి విశ్రాంతిని ఎర చూపే మాయలాడి విరామచిహ్నాలు ఉండనే ఉండవు. నాయుడి కవిత్వంలో లౌకికమైన కళ్లకి తోచే ఏ రకమైన సందర్భాలూ, కనీసం నెపాలుగానైనా ఎదురుపడవు. కుర్చీగానో, హోదాగానో తప్ప, మనిషిగా పరిచయమైన ఎవర్నైనా చవక చేసే లోకంలో గత్యంతరం లేక మసలుతుంటాడు కాబట్టి, సందర్భాలు పటాటోపంగానైనా ఎత్తిచూపే scholarship కనబడదు నాయుడిలో. కానీ, కె.ఎన్.వై. పతంజలి గారి మీద రాసిన ఎలిజీ ‘వాగ్విశ్రాంతి’ (గాలి అద్దం- పేజీ 171) చూడండి: “ఏదీ కోరని అక్షరాకాశానికి నక్షత్రఖచితమొనర్చాడు/ అంతర్థానమయ్యే అనుభవాల్లో/ నిబిడాంధకార శబ్దస్పర్శలు/ యాదృచ్ఛిక భవిష్యత్తులో వాక్యసామీప్యాలు లేవతనికి/…. / అతడొక వాక్యవిస్మృతి/ అతడొక వాగ్విశ్రాంతి”!

పతంజలి గారి రచనా సర్వస్వం మీద వచ్చిన అత్యుత్తమ విశ్లేషణలు, సిద్ధాంతాలు వేటికైనా తీసిపోతాయా ఈ స్మృతిగీత పాదాలు! మో మీద, త్రిపుర గారి మీద రాసిన ఎలిజీలు కూడా అదే స్థాయి.

అయితే, ‘గాలి అద్దం’ కవితా సంకలనం మీద నాకు అసంతృప్తి ఉంది. నాయుడు కానిది ఇందులో ఎక్కువగా కనిపించడంవల్ల కలిగిన అసంతృప్తి. నాయుడు కానిదాని వైపు నాయుడిని జీవితం నెట్టడాన్ని ప్రత్యక్షంగా చూసినప్పటి దుఃఖ్ఖాన్ని పోలిన అసంతృప్తి. అంతకుముందు, ఎన్నింటిని గుదిగుచ్చినా దేనికదే ప్రత్యేకంగా తోచేలా చేసిన కవిత్వాంశ తగ్గి, monotonous గా అనిపించాయి ‘గాలి అద్దం’లో కొన్ని కవితలు; మరికొన్ని వచనమై సోలిపోయాయి. కవిత్వం ఇలా స్పష్టత దిశగా పలచబారడానికి కారణమేమిటా అని ఆలోచిస్తే ఏమనిపించిందంటే- ఒకానొక upper yielding point కు కూడా చేరుకున్నాక, బద్దలైనట్టు నాయుడు అలిగాడు. ఆ అలకని చూపడంలో ఎవరి పద్ధతి వారిది అయినట్టు, కవిత్వాన్ని విస్పష్టత దారుల్లోకి మళ్లించడం నాయుడి స్టైల్ ఏమో. ఏదిఏమైనా, తాను కినుక వహించడానికి కారణమైన లోకంలో నేను సైతం భాగం కావడాన్ని మాత్రం ఎంత కక్షతోనైనా క్షమించుకోలేకపోతున్నా.

*

 

రెహ్మానుకి వేటూరి అందం!

ఈ జనవరి 6 న యాభై ఏళ్ళు పూర్తిచేసుకున్న ఏ. ఆర్. రెహ్మాన్ ఎందరో సంగీతాభిమానుల గుండెల్లో స్థిరనివాసం ఏర్పరుచుకుని తనదైన చరిత్ర సృష్టించుకున్నారు. తెలుగు పాటని పునర్నిర్వచించిన పాటల రచయితగా తెలుగుని ప్రేమించే వారి గుండెల్లో శాశ్వత స్థానాన్ని పొందిన వేటూరి జయంతి కూడా జనవరిలోనే (జనవరి 29).  ఈ సందర్భంగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కొన్ని చక్కని పాటలని గుర్తుచేసుకుందాం.

వేటూరికి సంగీత దర్శకుడు రెహ్మాన్ తో సన్నిహితమైన అనుబంధం ఉందని చాలా మందికి తెలియదు. రెహ్మాన్ దిలీప్‌గా రాజ్-కోటి వంటి సంగీతదర్శకుల వద్ద సహాయకుడిగా ఉన్న రోజులనుంచే వారి పరిచయం మొదలైంది. ఒకసారి వేటూరి రెహ్మాన్‌కి ఎవరి గురించో చెప్తూ,  “ఆయన పక్కా జంటిల్మేన్!” అన్నారుట. రెహ్మాన్‌కి ఈ ఎక్ష్ప్రెషన్ చాలా నచ్చి, “గురూజీ, ఇది ఏదైనా పాటలో వాడండి!” అని అడగడం “సూపర్ పోలిస్” సినిమాలో వేటూరి “పక్కా జంటిల్మేన్ ని, చుట్టపక్కాలే లేనోణ్ణి, పట్టు పక్కే వేసి చక్కా వస్తావా?” అని పల్లవించి ఆ కోరిక తీర్చడం జరిగింది. ఇలా వారిద్దరి స్వర-పద మైత్రి గొప్పది! కొత్తపుంతలు తొక్కుతున్న రెహ్మాన్ సంగీతానికి తానూ గమ్మత్తైన తెలుగు పదాలను పొదిగానని వేటూరి “కొమ్మ కొమ్మకో సన్నాయి” లో చెప్పుకున్నారు! అలా పుట్టినవే “విదియా తదియా వైనాలు”, “జంటతోకల సుందరి” వంటి ప్రయోగాలు!

రెహ్మాన్ పాటలని తెలుగులో వినడం కష్టం అనీ, లిరిక్స్ చెత్తగా ఉంటాయనీ, కాబట్టి తెలుగు గీతరచయితలకి (వేటూరితో సహా!) ఓ దణ్ణం పెట్టి, హిందీనో తమిళాన్నో నమ్ముకోవడం మంచిదనే అభిప్రాయం ఒకటి ఉంది! ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఇది ముఖ్యంగా రెహ్మాన్ డబ్బింగ్ సినిమాలతో వచ్చే చిక్కు. “సూపర్ పోలీస్”, “గ్యాంగ్ మాస్టర్”, “నాని” వంటి రెహ్మాన్ తెలుగు సినిమాల్లో ఈ సమస్య అంత కనిపించదు.  అయితే రెహ్మాన్ – వేటూరి కాంబినేషన్‌లో చాలా చక్కని డబ్బింగ్ పాటలూ ఉన్నాయి.  కాస్త శ్రద్ధపెట్టి వింటే సాహిత్యాన్ని బాగా ఆస్వాదించొచ్చు. వేటూరిని స్మరించుకుంటూ, రెహ్మాన్ కి అభినందనలు తెలుపుకుంటూ మచ్చుకి ఓ మూడు పాటలు చూద్దాం!

మేఘాలు గాయపడితే మెరుపల్లే నవ్వుకుంటాయ్!

వేటూరి డబ్బింగ్ పాటలని కూడా గాఢత, కవిత్వం కలిగిన తనదైన శైలిలో రాశారు. బొంబాయి సినిమాలో “పూలకుంది కొమ్మ, పాపకుంది అమ్మ” అనే పల్లవితో వచ్చే పాటలో చాలా స్పందింపజేసే భావాలు ఉన్నాయి. పెద్దలనీ, సమాజాన్నీ ఎదిరించి పెళ్ళి చేసుకున్న యువజంట, తమ జీవితాన్ని ప్రేమతో, ఆశావహ దృక్పథంతో ఎలా దిద్దుకున్నారో వివరించే పాట ఇది. పాట మొదట్లోనే వచ్చే ముద్దొచ్చే వాక్యం –

నింగీ నేలా డీడిక్కి, నీకూ నాకూ ఈడెక్కి!

ఇది నేలనీ ఆకాశాన్నీ కలిపే ప్రణయతరంగమై ఎగసిన ఆ పడుచుజంట హృదయస్పందనని ఆవిష్కరించే వాక్యం. “డీడిక్కి” అనే పదం వాడడం, దానికి “ఈడెక్కి”తో ప్రాస చెయ్యడం అన్నది వేటూరిజం! సినిమా సందర్భంలో తన శ్రీమతి గర్భవతి అయ్యిందన్న ఆనందంలో ఆ భర్త ఉంటాడు కనుక పసిపిల్లలకి వాడే “డీడిక్కి” అనే పదాన్ని వేటూరి వాడారు!

గుండెలో ఆనందం, తలపులో ఉత్సాహం నిండినప్పుడు జీవితం ఎలా ఉన్నా గొప్పగానే అనిపిస్తుంది. ఆ జంట అచ్చంగా ఇలాగే ఉన్నారు. పువ్వులు నవ్వు లేకుండా దిగులుగా ఉండవు,  ఎగిరే గువ్వలు కన్నీళ్ళు పెట్టుకోవు అని చెబుతూ “సూర్యుడికి రాత్రి తెలీదు” అంటూ వచ్చే భావం గొప్పగా ఉంటుంది –

పున్నాగ పూలకేల దిగులు?

మిన్నేటి పక్షికేది కంటి జల్లు?

రవి ఎన్నడూ రాత్రి చూడలేదు

స్వర్గానికి హద్దూ పొద్దూ లేనే లేదు

జీవితమనే ప్రయాణం సుఖవంతంగా ఉండాలంటే లగేజీ తగ్గించుకోవాలి. “ఓటమి బరువు” మోసుకుంటూ వెళ్ళినవాళ్ళకి బ్రతుకంతా తరగని మోతే! మేఘాలు సైతం ఢీకొని గాయపడ్డాక మెరుపులా గలగలా నవ్వేసుకుని చకచకా సాగిపోవట్లేదూ? ఎంత బావుంటుందో ఈ ఎక్స్ప్రెషన్!

కవ్వించాలి కళ్ళు, కన్నెమబ్బు నీళ్ళు

మేఘాలు గాయపడితే మెరుపల్లెయ్ నవ్వుకుంటాయ్

ఓటమిని తీసెయ్ జీవితాన్ని మోసెయ్

వేదాలు జాతిమత భేదాలు లేవన్నాయ్

 

ఈ పాటలో వచ్చే ఇంకా కొన్ని లైనులు చాలా బావుంటాయి. “ఎగరెయ్యి రెక్కలు కట్టి ఎదనింక తారల్లోకి” అనడంలో కవిత్వం, ఆశావహ దృక్పథం కనిపిస్తాయి. “అనురాగం నీలో ఉంటే ఆకాశం నీకు మొక్కు!” అనడం ఎంత గొప్ప భావం! ప్రేమమూర్తులకు ప్రకృతి సమస్తం ప్రణతులర్పించదూ?

 

ఈ పాటని యూట్యూబులో చూడొచ్చు – పూలకుంది కొమ్మ

 

విరబూసెను విరజాజే ఏ మంత్రం వేశావో!

ఇద్దరు సినిమా అనగానే “శశివదనే” పాట చప్పున గుర్తుకు వస్తుంది. కానీ అదే సినిమాలో ఉన్న “పూనగవే పూలది” పాట కూడా ఆణిముత్యమే. ఎంతో సున్నితంగా, అందంగా, స్త్రీలకి మాత్రమే సాధ్యమయ్యేలా ఒక అమ్మాయి తన మౌన ప్రణయారాధనని నివేదించుకునే పాట!  పల్లవిలో వినిపించే పదాలు ఎంతో లలితంగా, ట్యూన్‌కీ భావానికి తగ్గట్టు ఉంటాయి –

నగవే పూలది

లేనగవే వాగుది

మౌనముగా నవ్వనీ, నీ కౌగిలి పూజకి!

“మౌనంగా కౌగిలి పూజకి నవ్వడం” – ఎంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్!  సుమబాల నవ్వునీ, సెలయేటి పాటనీ, (బైటపడలేని) చినదాని మౌన ప్రేమనీ గమనించే పురుషుడు ధన్యుడు!

ఇంతకీ ఆ అమ్మాయికి తను ప్రేమలో పడ్డానని ఎలా తెలిసింది? అతను చెంత ఉన్నప్పుడు విరబూసిన విరజాజై తన కన్నెతనం గుబాళించినప్పుడు, చేమంతుల పూరేకులు ప్రేమలేఖలై అతన్నే గుర్తుచేసినప్పుడు! ఎంత కవిత్వం! ఇంత ప్రేమ తనలో ఉన్నా గ్రహించని ప్రియునికి అభ్యర్ధనగా “ఒక్క సారి నన్ను చూడు, నువ్వే ఉసురై (ప్రాణమై) నా అణువణువూ నిండి ఉన్నావని తెలియక పోదు” అని జాలిగా అడగడం కదిలిస్తుంది –

విరబూసెను విరజాజే ఏ మంత్రం వేశావో

చేమంతుల నీడలలో తెలుసుకుంటి నీ వలపే

ఒకనాడైనా శోధించవా అణువణువు ఉసురవుతాలే!

“నాలోని తీయని అనుభూతులన్నీ నీ వల్లనే!” అనడం నుంచి, “నువ్వు లేక నేను లేను” అంటూ తనలోని ప్రేమ తీవ్రతని కూడా ఎంతో అందంగా వ్యక్తీకరించడం రెండో చరణంలో కనిపిస్తుంది. తమిళ భావాన్ని ఎంత అందంగా వేటూరి తెలుగు చేశారో ఇక్కడ. “తొలిదిశకు తిలకమెలా” అనడంలో శబ్దంపై వేటూరి పట్టు తెలుస్తుంది. ఈ వాక్యమనే కాదు, మొత్తం పాటలోనే ఎంతో శబ్దసౌందర్యం కనిపిస్తుంది!

నీలవర్ణం సెలవంటే ఆకసమే గాలి కదా?

సూర్యుడినే వేకువ విడితే తొలిదిశకు తిలకమెలా

నన్నికపై విడిచావా నా ఉసురిక నిలవదులే

 

ఈ పాటని యూట్యూబులో చూడొచ్చు (50:30 నుంచి)  – పూనగవే పూలది

 

వానొస్తే నీవే దిక్కు!

దాశరథి రంగాచార్య గారు ఓ వ్యాసంలో ఒక అందమైన ఉర్దూ షాయరీ గురించి చెప్పారు.  ఇద్దరు ప్రేయసీ ప్రియులు రాత్రి రహస్యంగా కలుస్తారు. బైట వర్షం పడుతోంది. ప్రియుడు వర్షంలోకి వెళ్ళి తడిసి ఆనందిద్దామంటాడు. మగవాళ్ళింతే!  ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆడవాళ్ళకి స్పృహ ఉంటుంది కాస్త! సరసానికి గోప్యం ఉండద్దూ? అందుకే ప్రియురాలు అంటుంది – “వర్షం వర్షం అంటావ్. ఏముంది అక్కడ? నా కళ్ళలోకి చూడు – నీలి మేఘం ఉంది, మెరుపు ఉంది, తడి ఉంది. హాయిగా నా కళ్ళల్లో కొలువుండు! ఎంతమందికి ఈ అదృష్టం వస్తుంది?”

వేటూరికి (లేదా తమిళ రచయితకి) ఈ కవిత తెలుసో లేదో కానీ, రిథం సినిమాలోని “గాలే నా వాకిటకొచ్చె” పాట మొదటి చరణంలో పంక్తులు విన్నప్పుడల్లా ఆ ఉర్దూ కవితే గుర్తొస్తుంది నాకు!

 

అతడు: ఆషాఢ మాసం వచ్చి వానొస్తే నీవే దిక్కు

నీ ఓణీ గొడుగే పడతావా?

ఆమె: అమ్మో నాకొకటే మైకం అనువైన చెలిమే స్వర్గం

కన్నుల్లో క్షణమే నిలిపేవా?

ఈ పాటలో “గాలిని” ప్రేమగా వర్ణిస్తాడు కవి. గాలి మెల్లగా వచ్చి తలుపు తట్టిందిట. “ఎవరోయ్ నువ్వు?” అంటే “నేను ప్రేమని!” అందిట. “ఆహా! మరి నిన్నామొన్నా ఎక్కడున్నావ్? ఇన్నాళ్ళూ ఏమయ్యావ్?” అని అడిగితే – “నీ శ్వాసై ఉన్నది ఎవరనుకున్నావ్, నేనే!” అందిట. ఇదో చమత్కారం!

గాలే నా వాకిటకొచ్చె, మెల్లంగా తలుపే తెరిచె

ఐతే మరి పేరేదన్నా, లవ్వే అవునా?

నీవూ నిన్నెక్కడ ఉన్నావ్, గాలీ అది చెప్పాలంటే

శ్వాసై నువు నాలో ఉన్నావ్ అమ్మీ అవునా?

 

తెమ్మెరలా హాయిగా సాగే ఈ ప్రేమపాటలో రెండో చరణంలో చక్కని శృంగారం కనిపిస్తుంది. ప్రియురాలు ముత్యంలా పదిలంగా దాచుకున్న సొగసుని పరికిస్తూ తన్మయుడై ఉబ్బితబ్బిబైపోతున్న ప్రియుని మనస్థితికి “ఎద నిండా మథనం జరిగినదే!” అంటూ ఎంత చక్కని అక్షరరూపం ఇస్తారో వేటూరి!

 

ఆమె: చిరకాలం చిప్పల్లోన వన్నెలు చిలికే ముత్యం వలెనే

నా వయసే తొణికిసలాడినదే!

అతడు: తెరచాటు నీ పరువాల తెరతీసే శోధనలో

ఎదనిండా మథనం జరిగినదే!

ఈ చరణం చివరలోనే వేటూరి చిలిపితనాన్ని చూపెట్టే ఓ రెండు వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యాలని ఎవరికి వారు అర్థం చేసుకుని ఆనందించాల్సిందే, వివరిస్తే బాగుండదు!

అతడు: కిర్రుమంచమడిగె కుర్ర ఊయలంటే సరియా సఖియా?

ఆమె: చిన్నపిల్లలై మనం కుర్ర ఆటలాడితే వయసా వరసా!

 

ఈ పాటని యూట్యూబులో చూడొచ్చు – గాలే నా వాకిటకొచ్చె!

 

 

 

 

 

 

అలుపెరుగని పోరాటం – దంగల్ 

నం వినని కథలూ కావు. మనం చూడని సినిమాలూ కావు. సక్సెస్ స్టోరీలెప్పుడూ చాలా ఉత్తేజాన్ని కలుగజేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. ‘చాలానే చూసాం కదా, అటువంటి మరో కథేలే’ అని ట్రైలర్ చూసినప్పుడు అనిపించకపోలేదు కానీ ఈ సినిమా చూసినప్పుడు మాత్రం, ‘ఒక శిల్పకారుడు అతి నేర్పుగా చెక్కిన శిల్పంలా ఉంది సుమా’ అనే ఆలోచన మాత్రం రాక మానలేదు. సినిమా ఒక కథ, సినిమా ఒక కవిత, సినిమా ఒక క్షణికానందం, సినిమా ఒక జీవితకాల సత్యం, సినిమా ఒక వినోదం, సినిమా ఒక దుఃఖం, సినిమా ఒక వెతుకులాట నిజానికి సినిమా ఒక ఆట కూడా. పట్టూ విడుపూ తెలిసి ఉండటం, దాడి చేయడమెప్పుడో దెబ్బకు కాచుకోవడమెప్పుడో అర్థం చేసుకునే తెలివితో మెలగడం, ప్రత్యర్థి ఏమాత్రం ఊహించలేని ఎత్తులను సమయానుకూలంగా వేయగల నేర్పరితనాన్ని కలిగి ఉండటం వంటి లక్షణాలు ఒక ఆటకు ఎంతో అవసరం. అదే విధంగా ఎక్కడ ఏ విధమైన ఎమోషన్ ని పండించాలో, ఏ భావ తీవ్రతను ఎక్కడి వరకూ తీసుకెళ్లి ఆపేయాలో, కథను ఎప్పుడు ఎటువంటి ఊహకు అందని విధంగా మలుపు తిప్పాలో తెలుసుకున్న దర్శకుడు ఏ కథాంశాన్ని తీసుకున్నా, దాన్ని సినిమాగా మలచడంలో విజయం సాధిస్తాడని దంగల్ సినిమా నిరూపించింది. ‘దంగల్’ అంటే రెజ్లింగ్ అని అర్థం.

నిజ జీవితానికి చెందిన కథను ఆసక్తికరమైన చిత్రంగా తీర్చిదిద్దడం అంత సులువైన విషయం కాదు. అందులోనూ అమ్మాయిల రెజ్లింగ్ పోటీలకు చెందిన కథాంశంతో ఇంత చక్కని సినిమాను మన వెండితెర వెనుకనుంచి ఇంతద్భుతంగా ప్రజంట్ చేసినందుకు దర్శకుడు నితేష్ తివారీని ఎంతగా అభినందించినా తక్కువే అవుతుంది. చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ‘మహావీర్ సింగ్ పొఘాట్’ అనే ధీశాలి కథను దేశం మొత్తం తెలుసుకునేలా చేసి, ఎందరో అమ్మాయిల లక్ష్యాల నిండుగా ధైర్యాన్ని నింపిన అమీర్ ఖాన్ ని కూడా అభినందించాల్సిందే.

దేశానికి స్వర్ణపతకాన్ని తేవాలని కలలు గన్న మహావీర్, పేరు ప్రతిష్టలను తప్ప ధనాన్ని సంపాదించుకోలేకపోయిన కారణంగా రెజ్లింగ్ ని వదిలి ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది. తను కన్న కల, తనకు పుట్టబోయే కొడుకు ద్వారా నిజం చేసుకోవాలని బలంగా కోరుకున్న అతడు, వరసగా నలుగు ఆడపిల్లలకి తండ్రవుతాడు. కలలన్నీ కల్లలు చేసిన విధిరాత కారణంగా విరక్తి చెందిన ఈ రెజ్లింగ్ ప్రేమికుడు, రెజ్లింగ్ ఆటపైనే ఆసక్తిని కోల్పోయి వాస్తవంతో రాజీపడిపోయి జీవించడం మొదలుపెడతాడు. అలా వాడిపోయి మరణించిపోతున్న అతనిలోని ఆశల వృక్షానికి అతని పెద్ద కూతుళ్లిద్దరూ వాళ్లలో దాగున్న పౌరుషాన్ని ప్రదర్శించడం ద్వారా తిరిగి మళ్లీ చిగురులేయిస్తారు.

అవును, కావాల్సింది, తేవాల్సింది స్వర్ణం. తెచ్చేది అమ్మాయైతేనేం? అబ్బాయైతేనేం? అన్న ఆలోచన అతనిలో తిరిగి జీవాన్ని నింపుతుంది. ఒక పల్లెటూళ్లో, అమ్మాయిలు కేవలం ఇంటి పనులు చేయడానికీ, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడానికీ మాత్రమే పుడతారని బలంగా నమ్మే రోజుల్లో అతను తన ఇద్దరు ఆడపిల్లలకీ నిక్కర్లు తొడిగించి పొలాల వెంట పరుగులు తీయిస్తాడు. నీళ్లలోకి దూకించి ఈతలు కొట్టిస్తాడు. సుకుమారమైన మొగ్గల్లాంటి ఆ పసికందుల చేత ఎంతో కఠినమైన సాధన చేయిస్తాడు. ఎప్పుడూ ఎందుకూ నోరెత్తి ఎరగని అతని భార్య  కూడా ఎదురు తిరిగి గట్టిగా అరిచి గోల చేసినా వినకుండా పిల్లల చేత మాంసం తినిపిస్తాడు. వాళ్ల కోసమే ప్రత్యేకంగా రెజ్లింగ్ సాధన చేసే ప్రదేశాన్నిఏర్పాటుచేసి తానే స్వయంగా శిక్షణనిస్తాడు. అబ్బాయిలతో కుస్తీ పట్లు పట్టిస్తాడు. ఎన్నో అవమానాలను భరిస్తాడు. ఆర్ధికపరమైన అనేకమైన ఇబ్బందులని అనుభవిస్తాడు. ఎన్నెన్నో ఆటుపోట్లని తట్టుకుని, నిర్భయంగా నిలబడి, నవ్విన నాప చేనే పండేలా చేసుకుంటాడు. తన కూతుళ్ళని గ్రామమే కాదు, మొత్తం దేశమే చూసి గర్వపడేలా తీర్చిదిద్దుతాడు.

ఇటువంటి కష్టాలతో నిండిన కథను, హుషారుగా సాగిపోతున్న ప్రవాహమంత సులువుగా కళ్లముందు కదిలేలా చేసి కనికట్టు చేసాడు దర్శకుడు నితేష్. ముఖ్యంగా మహావీర్ పాత్రను ధరించిన అమీర్ ఖాన్ ఎక్కడా తనని తాను ప్రదర్శించుకోలేదు. ఎక్కడ ఆ పాత్ర ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే కనిపించి, కథను ఎంతో మెళకువతో ముందుకు నడిపించాడు. హుందాతనం, గాంభీర్యత నిండిన ఒక హర్యానా వాసి పాత్రలో అతడు ఒద్దికగా ఒదిగిపోయాడు. అరవై ఏళ్ల వయసు కలిగిన వ్యక్తిగా తనని తాను సహజంగా చూపించుకోవడం కోసం, 30 కేజీల బరువు పెరిగి 98 కేజీల వరకూ చేరుకున్నాడట అమీర్. ఈ అంకిత భావానికి తగ్గ ఫలితాన్ని కూడా దక్కించుకున్నాడు. అతి సాధారణమైన గంగి గోవులాంటి గ్రామీణ స్త్రీ పాత్రలో, అతని భార్యగా నటించిన సాక్షి తన్వార్ కూడా అంతే నెమ్మదిగా కుదురుకుపోయింది. ఇక కడిగిన ముత్యాల్లాంటి గీతా, బబితాలు బాల్యంలోనూ, యవ్వనంలోనూ కూడా ఎంతో

అందంగా కనిపించి అద్భుతంగా అమరిపోయారు. మిక్కిలి శ్రద్ధగా ఏర్పాటు చేసిన ప్రతి రెజ్లింగ్ పోటీ అతి సహజంగా అనిపించి, నిజమైన పోటీలను చూస్తున్న అనుభూతిని కలుగజేసింది.

కథతో పెద్దగా సంబంధం లేని వ్యక్తి అయిన మహావీర్ సింగ్ తమ్ముడి కొడుకుతో కథ చెప్పించడం వలన, అతని ద్వారా హాస్యాన్ని జోడించడానికి సినిమాకు అవకాశం ఏర్పడి, కథలో ఒక విధమైన సరళత్వం మిళితమైంది. ఇక మరింత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాటలు గురించి. ప్రీతమ్ అందించిన మంచి ఊపున్న సంగీతానికి అమితాబ్ భట్టాచార్య  రచించిన సాహిత్యం భలే అందంగా జతకూడింది. ‘బాపూ సేహత్ కేలియే తూతో హానీకారక్ హై’ పాటైతే తప్పనిసరిగా విని తీరాల్సిందే. తెలుగు భాష తీయదనం గురించి ఎప్పుడూ తెలిసిందే గానీ హిందీ భాషలో ఎంతటి సౌందర్యం దాగుందో కదా అనిపిస్తుంటుంది కొన్ని కొన్ని పాటల్ని వింటుంటే.

అతి కష్టమైన, శారీరకమైన శ్రమతో కూడిన ఈ రెజ్లింగ్ సైతం ఆడపిల్లల్ని అడ్డుకోలేదని మహావీర్ సింగ్ నిరూపించి చూపాడు. తన కూతుళ్ల తలరాతల్నీ, గీతల్నీ తనే గీసినా మరెందరో అమ్మాయిలకి కలలు కనేందుకు బంగారు దారుల్ని బహూకరించాడు అతడు. గీతా, బబితాలు కూడా తండ్రి శ్రమను వృధాగా పోనివ్వకుండా కష్టానికీ, శ్రమకూ, అంతులేని త్యాగాలకూ వెరవక, విజయపథంలోని తొలి బాటలుగా మారారు. ఈ ముగ్గురి జీవితాలనీ మరింత ఆసక్తికరంగా, ఆదర్శప్రాయంగా కనిపించే విధంగా తిరగరాసి, కదిలే చిత్రంగా మార్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు అమీర్, నితేష్ లు.

*

 

శ్రీమతి గన్నవరపు సరోజినీ, సత్యనారాయణ మూర్తి స్మారక కథల పోటీ ఫలితాలు

సారంగ పత్రిక తో కలిసి నిర్వహించిన శ్రీమతి గన్నవరపు సరోజినీ, సత్యనారాయణ మూర్తి స్మారక కథల పోటీలను ఆదరించి కథలు పంపించిన రచయితలందరికీ ధన్యవాదాలు. దాదాపు నలభై కథల నుంచి రెండు కథలను బహుమతి కి ఎంపిక చేయటం కొంచెం కష్టమే అయినప్పటికీ న్యాయ నిర్ణేతలు మొత్తం పోటీకి వచ్చిన కథల నుంచి రెండు కథలను ప్రథమ, ద్వితీయ బహుమతులకు ఎంపిక చేసారు.

మొదటి బహుమతి గా మూడు వేల రూపాయలు గెల్చుకున్న కథ “ మీ అమ్మ మారిపోయిందమ్మా !” ( రచన :  జి.ఎస్. లక్ష్మి)

రెండవ బహుమతి గా రెండు వేల రూపాయలు గెల్చుకున్న కథ “ భగవంతుని భాష “ ( రచన : పి.వి. శేషారత్నం)            

సాధారణ ప్రచురణ కు ఎంపికైన కథలు

అనుబంధానికి నిర్వచనం : సుజలా గంటి

తాంబూల సందేశం : డా. దేవులపల్లి సుజాత

సంకలనాలే ప్రమాణం కాదు : మధురాంతకం నరేంద్ర

 

1) 2016 లో వచ్చిన కథలు:-

పన్నెండేళ్ళపాటూ వార్షిక కథల్ని చదివిన అనుభవంతో చాలాకాలంగా సీరియస్‌గా చదువుతున్న పత్రికలు కొన్నే! మిగిలిన పత్రికలని చదవకపోయినా మంచి కథల్ని చదవకుండాపోయే ప్రమాదముండదని అనుభవంద్వారా నేర్చుకున్న పాఠం.

చదువుతున్న పత్రికలు:-

ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం

పాలపిట్ట

చినుకు

యివిగాకుండా గతంలో మంచి కథల్ని జారిపోకుండా జాగ్రత్తపడటం కోసం మరికొన్ని పత్రికల్ని కూడ చదివేవాణ్ణి. యిప్పుడా అవసరం లేదు. “సాక్షి” ఆదివారం అనుబంధాల్లో కథలకిచ్చే ప్రాముఖ్యత బాగా తగ్గిపోవడంతో దాన్నీ చూడాల్సిన అవసరం తప్పిపోయింది. పైగా వాళ్ళు గొప్ప తెలుగు కథల్ని సంక్షిప్తీకరించి ప్రచురించే నేరాన్ని గూడా చేశారు. యిప్పుడు మామూలు పాఠకుడిగా చదివే అవకాశం దొరికింది. అందువల్ల గుర్తున్న కథల్ని గురించి మాత్రమే చెప్పగలను. వస్తుపరంగా చూసినప్పుడు పర్వాలేదనే చెప్పొచ్చు. కానీ శిల్పపరంగా అంటే యేం చెప్పాలి? “వస్తువే శిల్పాన్ని ఎన్నుకుంటుంది” అనేది పాతబడిన మాటే అయినా గుర్తుంచుకోవల్సింది గూడా! అయితే జీవితపు సంక్లిష్టతల్ని వివరించే వస్తువుల్ని యెన్నుకోవడానికీ, వాటిని అవసరమైన శిల్పరీతుల్లో ఆవిష్కరించడానికీ అనుకూలమైన పరిస్థితులు లేవు.

2015లో O’Henry Prize Storiesలో దాదాపు 80పేజీల కథ వచ్చింది. తెలుగులో యిప్పుడు 10పేజీల కథను పత్రిక లేనేలేదు (పాలపిట్ట, చినుకు మినహా). యీ ప్రమాదం నుంచీ రచయితల్ని కాపాడింది మాత్రం వెబ్ పత్రికలే! రెండు మూడు సంవత్సరాలుగా వెబ్ పత్రికలు (సారంగ, వాకిలి, విహంగ వంటివి) రావడంతో పరిస్థితి మెరుగుపడింది. అయితే యీ పత్రికలు మామూలు పత్రికల్లాగా సమయానికి తప్పకుండా వస్తున్నాయో లేదో తెలియదు. యీ పత్రికలన్నింటికి కలిపి వొక Web Index లాంటిది తయారై, అది facebookలాంటి చోట ప్రకటించబడుతూ వుంటే నాలాంటి పాఠకుడికి సౌలభ్యంగా వుంటుంది.

2) 2016లో నేను విడవకుండా చదివింది, లేక చదవడానికి ప్రయత్నించిందీ “ఆంధ్రప్రదేశ్” పత్రికనే! నాకు గుర్తున్న కథలన్నీ దాన్లోంచే వచ్చాయి. ఫిభ్రవరినెలలో రాణి శివశంకర శర్మ “ప్రొఫెసర్ అంతరంగం” అనే కథ రాశాడు. అలీగరీగా చెప్పదలచుకున్న అంశాన్ని బాగా చెప్పాడు. అయితే Browning ప్రసిద్ద కవిత, డ్రమటిక్ మొనలాగ్ “My Last Duchess” ప్రతిధ్వనులు వినిపించాయి. యేప్రెల్‌లో శ్రీవల్లీ రాధిక రాసిన “నాన్న దగ్గరికి” Mythను సమకాలీనంగా మలిచిన కథ.రచయిత్రికి సంప్రదాయంపైన వున్న ప్రగాడమైన విశ్వాసం, ఆస్తిక ధోరణీ కథ సగానికి చేరేసరికి ముందేం జరుగుతుందో, పాత్రలెవరో తేల్చేశాయి. ఆ suspenseను చివరివరకూ సాగనివ్వలేదామె. రచయిత్రి విశ్వాసాలతో పాఠకుడికి పని లేనప్పుడు కథ తేలిపోతుంది. విశ్వాసం వున్నప్పుడు పాఠకుడికి పరవశం కలుగుతుంది. రెండు విధాలా కథకు దెబ్బే తగులుతుంది.

మన్నం సింధుమాధురి డిసెంబరులో “తూరుపు కొండ” అనే చాలా మంచి కథ రాశారు. ఆవిడదైన శైలి యీ కథకు బాగా నప్పడంతోనూ, నిపుణతతో వాడిన శిల్పంతోనూ యీ కథ చాలా బాగా వచ్చింది. యీ కథలన్నింటినీ ప్రచురించడానికి దాని సంపాదకుడైన “నరేష్ నున్నా”ను అభినందించాలి. మంచి సంపాదకుల కొరత వల్లే మంచి కథలు రావడంలేదని గూడా గుర్తించాలి. పట్టుదలతోనూ, అభిరుచితోనూ కృషి చేస్తే మంచి కథానికల్ని రాయించి, ప్రచురించవచ్చునని ఆంధ్రప్రదేశ్ పత్రికా సంపాదకులు నిరూపించి చూపెట్టారు. అలాగే “సారంగ” పత్రిక గూడా. సారంగలో వచ్చినవన్నీ సీరియస్ కథలే! అయితే కొన్ని మాత్రమే గుర్తున్నాయి.

యివిగాకుండా యీ యేడాదిలో చదివిన కథల్లో నాకు గుర్తున్న కథ, ఖదీర్ బాబు రాసిన “తేగలు”. మెట్రోకథల చట్రంలోకి యీ కథను దూర్చకపోవడంతోనే యిది మంచి కథయ్యింది. అయితే కథను చెబుతున్న వ్యక్తి భార్యపాత్ర చిత్రణలో కొంత వైరుధ్యం కనపడింది.

కథాసారంగలో వచ్చిన సింధుమాధురి గారి కథ “డేవిడ్” పెద్ద Romantic artificial కథగా తయారయ్యింది.

యిటీవలికాలంలో యువ రచయితలూ, రచయిత్రులూ ధైర్యంగా స్త్రీపురుష సంబంధాలను చిత్రిస్తున్నారుగానీ, యిందులో అనవసరపు అనౌచిత్యపు ధోరణులుండడం మంచి ధోరణి గాదు. సత్యం చెప్పడానికీ, extremities చెప్పడానికీ మధ్యనున్న తేడాను గుర్తించాలి.

బూతులు వాడటమే మాండలికమన్న అభిప్రాయమొకటి బలపడింది. నిజజీవితంలో వాడని బూతుల్నిగూడా కథలోకి జొప్పించి, cheap popularityకి పాకులాడడం గూడా జరుగుతోంది. కథకెంత అవసరమో అంత మోతాదులోనే యేదైనా వాడచ్చు. కానీ ఆ మోతాదు శృతిమించడం సంస్కారం గాదు. సాహిత్యం మానవుడి సంస్కారాన్ని పెంచేదిగానే వుండాలి.

3) యీ ప్రశ్నకు జవాబివ్వతగ్గంతగా నేను కథలన్నింటినీ చదవలేదు.

4) వొక ప్రక్రియగా తెలుగు కథ అంతర్జాతీయ ప్రమాణాల్ని అందుకుందా లేదా తెలుసుకోవాలంటే సమకాలీన విదేశీ సాహిత్యాన్ని గూడా చదవాలి. అందుబాటులో వున్న విదేశీకథల సంకలనాలు కొన్నే! వాటితో పోల్చి చూసినప్పుడు మనకథకు యెదగడానికి వీలయిన పరిస్థితులు లేవు.

యిన్ని మార్పులు వచ్చినా తమిళంలోనూ, కన్నడంలోనూ, మళయాళంలోనూ, ఒడిస్సాలోనూ సాహిత్య పత్రికలు కొన్ని వుండనే వున్నాయి. పాఠకులూ వున్నారు. కానీ తెలుగులో పత్రికలూ లేవు. మంచి పాథకుల సంఖ్యా క్రమంగా తగ్గిపోతోంది.

మిగిలిన భారతీయ భాషలతో పోలిస్తే కమర్షియల్ సినిమా వ్యాపారం పెచ్చుపెరిగి పోవడమూ, సాహిత్యం పట్ల అనురక్తి తగ్గడమూ గమనించాల్సిన విషయం.

5) —-

6/7) కథావార్షికను 12సంవత్సరాల పాటూ ప్రచురించిన తర్వాత ఆపేశాను. యిందుకున్న కారణాల్ని గురించి సావధానంగా చెప్పాలి. దానిక్కాస్తా సమయం కావాలి. తరువాతెప్పుడైనా…

2016లో వచ్చిన కథ, ప్రాతినిథ్య సంకలనాలు సగం సగం చదివాను. కొన్ని కథలు బావున్నాయి. కొన్ని నచ్చలేదు.

యిలాంటి సంకలనాలు అన్ని పత్రికలూ చదవలేని పాఠకులకు బాగా వుపయోగపడతాయి. అయితే యీ సంకలనాలలోకి రాకుండాపోయిన మంచి కథల గురించే బాధంతా! యీ సంకలనాల ఆధారంగా అటువంటి మంచి కథల గురించి శోధన, చర్చ జరగడమే లేదు. అదొక గొప్ప విషాదం. మంచి కథలు వేయడం వల్ల వార్షిక సంకలనాలకు గౌరవం చేకూరుతుంది గానీ, వాటిలో వచ్చిన అన్ని కథలూ మంచివి కాలేవు. యిదంతా పెద్ద సాపేక్షికమైన వ్యవహారం.

వార్షిక కథాసంకలనాలు కథానికా ప్రక్రియ పెరుగుదలకు దోహదం చేయడంలో అనుమానమే గానీ, పాఠకుల దృష్ట్యా మాత్రం మంచే చేస్తున్నాయి, కొంతవరకూ… యీ ప్రయాణం సాగాలి యిలాగే… పరిపూర్ణత అన్నది సాపేక్షికమూ, అసాధ్యమూ అయినా దానికోసం చేసే కృషే సాహిత్యపు భూమిక అని గుర్తుంచుకోవాలి.

*

మధురాంతకం నరేంద్ర

కవి పిచ్చివాడే…

 

art: Rafi haque

art: Rafi haque

మేఘాలు భోరుమని ఏడుస్తూ

నేల గుండెలమీద

వాన బిందువులతో

దబదబా బాదుతుంది

ఆకాశంలోనే కాదు

గుండెల్లో దాగిన జాడలు కూడా

రక్త ప్రవాహపు వేడి సెగల గాల్పులకు

తలంపుల మేఘంగా మారతాయి

సఖి కొప్పులో జాజిమల్లి పరిమళాన్ని

నింపుకున్న గాలి తాకగానే

లోలోపలే

దాచుకున్న అగ్నిపర్వతాలు విస్ఫోటనమై

కన్నీటి లావాను కక్కుతుంది

నడిచొచ్చిన దారుల గుర్తులలో

మౌనంగా ముంచెత్తుతుంది.

ఇలాంటి సెన్సిటివ్

వాళ్ళ కొరకు వెతుక్కుంటూ

బోస్టన్ సైడ్ వాక్స్ మీద నడుస్తుంటే

నా జాలువారిన కన్నీళ్ళు వానలో

సీక్రెట్ కోడ్ తో వాటి దేహాల

మీద లిఖితమైన కవితలు

నా కొత్త దోస్తులు.

అక్షరాలలో ఏముంది లే

పిచ్చివాడి రాతలకు మాత్రమే అవి

కవివి కూడా అంతే కదా!

తెలివి మీరిన వాళ్ళ ముందు

స్వచ్ఛమైన అక్షరంతోపాటు

దానిని ప్రేమించే కవి కూడా పిచ్చివాడే.

స్వార్థపరులు అంతిమయాత్రలకు దూరం

కానీ కవి పిచ్చివాడు కదా

వాడు ఎవరూ లేని వాళ్ళ శవాలను మోస్తాడు

అక్షరాలతో నివాళులు అర్పిస్తాడు

సమాజంలో దుర్మార్గుల మీద యుద్ధం ప్రకటిస్తాడు

పోరులో పుట్టుకొస్తాడు

పోరులోనే అమరుడౌతాడు

ప్రతీ పూట

జానెడు పొట్ట ఆకలి ముందు

ఓడిపోతుంటాడు.

అయిన

కవి పిచ్చివాడని నిర్దారణకు వచ్చిన

వాళ్ళకు చెప్పినా అర్థం కాదులెండి

వాడి వెర్రి తపన గూర్చి.

*

 

 

 

 

 

 

నక్షత్రాల్లాంటి ఆ కథలు…

kathana

రిత్రయుగం ఇప్పటికి అయిదువేల ఏళ్ళకిందట మొదలయ్యిందనుకుంటే, తాత్త్వికయుగం క్రీ.పూ 6-5 శతాబ్దాల్లో మొదలయ్యింది. చైనాలో, భారతదేశంలో, గ్రీసులో తలెత్తిన ఈ కొత్తధోరణి పురాణగాథలమీదా, పురాణక్రతువులమీదా, పురాణవిశ్వాసాలమీదా తలెత్తిన తిరుగుబాటు.

గ్రీసులో సోక్రటీస్ కి పూర్వపు తత్తవేత్తలు గ్రీకు పురాణకవులైన హోమర్ నీ, హెసియోద్ నీ  ధిక్కరించడంద్వారా, సాహిత్యంకన్నా, తత్త్వశాస్త్రం సత్యానికి ఎక్కువ సన్నిహితంగా ఉంటుందని వాదించారు. ఆ క్రమంలో పురాణకథల్లోని సంక్లిష్టతను తొలగించి మనిషికి మార్గనిర్దేశనంచెయ్యడానికి మంచిచెడుల్నివిడదీసిచూపించి, మంచికి ఉదాహరణలు చూపించడంకోసం బుద్ధుడుకథలు చెప్పడంతో ఉదాహరణకథలు( ఎగ్జంప్లం) వికసించాయి.

కాని మనిషి కేవలం సత్యంమీదా, నీతిసూత్రాల మీదా మాత్రమే బతకలేడు. మనిషికి సత్యంకన్నా సమగ్రత ముఖ్యం. తనజీవితానికీ, తన జాతిజీవితానికీ కూడా సమగ్రత సిద్ధిస్తుందంటే అతడు అబద్ధాలు చెప్పుకోవడానికి కూడా సంకోచించడు.

ఆసమగ్రతని ప్రతిష్టించుకోవడంలోఅతడికొక సంతోషముంది. ఆ సంతోషాన్నిగ్రీకునాటకకర్తలు play wisdom అన్నారు.

మనిషి తొలినాళ్ళల్లో నీతినియమాలతో సంబంధంలేకుండా కథలు చెప్పుకుంటున్నప్పుడు, చతురపాత్రలు సృష్టించుకుంటున్నప్పుడు అనుభవిస్తున్నది ఆ play wisdom నే. తాత్త్వికులు ఇవ్వలేకపోతున్నఆ play wisdom ని తిరిగి జానపదకథాధోరణిలో అందివ్వాలని నీతికథ ముందుకొచ్చింది. అయితే ఈ నీతికథ జాతకకథల తరహా నీతికథ కాదు. ఇది ఈసోపు తరహా నీతికథ. దీని మూలాలు చరిత్రపూర్వకాలంలోనే ఉండిఉండవచ్చు. కాని తన కాలానికి తగ్గట్టుగా ఈసోపు ఆ ప్రక్రియకు ప్రాణం పోసాడు.

ఈసోపు వల్ల మరొకసారి కథ ఎంత సముజ్జ్వలంగా భాసించిందంటే, సాహిత్యాన్నీ, కవుల్నీ, కథకుల్నీద్వేషించిన ప్లేటో కూడా చివరికి సోక్రటీస్ నోటి  వెంట ఒక ఈసోపు తరహా కథ చెప్పించకుండా ఉండలేకపోయాడు.

ఈసోపు తరువాత కథ రెండుదారులు తీసుకుంది. ఒకటి, పురాణగాథల్లాగ భౌతిక, అభౌతికప్రపంచాల మధ్య సేతువు నిర్మించడం. కాని అందుకోసం పురాణకథల్లాగా అభూతకల్పనల మీద ఆధారపడకుండా, ఈలోకాన్నీ, ఇక్కడి దైనందిన జీవితాన్నీకథావస్తువు చేసుకోవడం. చక్కటి రూపకాలంకారంలాగా, చూస్తున్నదాన్నిదృష్టాంతంగా చూపిస్తూ మనంచూడలేనిదాన్నీ, చూడవలసినదాన్నీచూపించడం.

బహుశా ఈ కఠినబాధ్యతని పారబుల్స్ చెప్పడం ద్వారా క్రీస్తు నిర్వహించినంతగా మరే కథకుడూ నిర్వహించలేకపోయాడని చెప్పాలి.

ఈసోపుకథలు తీసుకున్నమరొకదారి, ఈ ప్రపంచం లోనే వివిధ సామాజికవాస్తవాల మధ్య సేతువు నిర్మించడం. పురాణగాథల్లాగా ఆధికారికవిశ్వాసాలుగా స్థిరపడ్డ సామాజికవిశ్వాసాల్నీ, కథల్నీ, కల్పనల్నీ ప్రశ్నించడం. దీన్నివ్యంగ్యకథ అనవచ్చు. గ్రీకు, రోమన్ బానిస రచయితలు ఇందుకు  మానవాళికి తోవ చూపించారు.

ముఖ్యంగారోమన్ బానిసగా జీవితం ప్రారంభించి రోమన్ చక్రవర్తులతో సమానమైన గౌరవానికి పోటీపడ్డ ఫయాడ్రస్. పురాణగాథకి పూర్తి వ్యత్యస్తరూపం వ్యంగ్యకథ.

ఒక సామూహికవిశ్వాసాన్ని ఇవ్వడం ద్వారా సమాజాన్ని సమగ్రంగా నిలిపి ఉంచుతుందని ఆశ కల్పించిన పురాణకథ, వాస్తవంలో సమాజాన్నిచీల్చడానికే ఉపకరించిందని ఎత్తిచూపడమే వ్యంగ్యకథ ప్రయోజనం.

ఏ అతీతకాలం లోనో ఎన్నోసహస్రాబ్దాలకు పూర్వం గుహలముందు  నెగడి చుట్టూ కూచుని చరిత్రపూర్వయుగ మానవుడు, అక్షరపూర్వయుగ మానవుడు తాను చూసినదాన్నీ, చూడనిదాన్నీకూడా కథలు చెప్పుకోవడం మొదలుపెట్టాడు.

బహుశా వినోదం కోసమే ఆ కథలు పుట్టి ఉండవచ్చు. కాని కాలక్రమంలో అవి సామాజిక, సాంస్కృతిక అవసరాలుగా మారిపోయాయి. కథలే లేకపోతే, సుమేరియన్, ఈజిప్షియన్, గ్రీకు, చీనా, భారతీయ, పారశీక సంస్కృతులిట్లా రూపొంది ఉండేవా అన్నది ప్రశ్నార్థకమే. కథ ఒక సామాజికఅవసరమే కాకపోయుంటే హోమర్, హెసియోద్, వర్జిల్, వ్యాసవాల్మీకులు ప్రభవించి ఉండేవారే కాదు. కథలుగా  చెప్తేనే మనుషులు తమ మాటలు మరింత బాగా వింటారని గ్రహించినందువల్లనే బుద్ధుడూ, క్రీస్తూ వంటి ప్రవక్తలు కూడా కథకులుగా, ఇంకా చెప్పాలంటే అద్వితీయకథకులుగా, మారారు. ఒకవేళ కన్ఫ్యూషియస్ వంటి గురువులు కథలు చెప్పకపోతే, వాళ్ళ జీవితంలోని చిన్నచిన్నసంఘటనల్నేవాళ్ల శిష్యులు కథలుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. సామాజికసమగ్రతని కాపాడటంకోసం తమ చక్రవర్తుల్నిదైవాంశసభూతులుగా ప్రతిష్టిస్తూ పురోహితులు చెప్పిన కథల్లోంచి చరిత్రయుగం మొదలైతే, మళ్లా ఆ పురాణగాథల నుంచి సామాజికసమగ్రతను కాపాడుకోవడం కోసం నిరక్షరాస్యులైన బానిసలు చెప్పుకున్నకథలతో చరిత్ర మరో మలుపు తిరిగింది.

ఈ పరిణామమూ, ప్రయాణమూ సవివరంగా ముందుముందు.

 

***        ***        ***

ప్రాచీనకథారూపాలు: పురాగాథ

 

మా ఊళ్లో ఒక కొండ ఉంది. దాన్నిజెండాకొండ అంటాం. మాది గిరిజనగ్రామం కాబట్టి పండగలప్పుడు ఊళ్లో వాళ్లంతా ఆ కొండ ఎక్కడం ఒక అలవాటు. ఆ కొండ కింద పెద్ద బండరాయి ఉండేది. ఆ రాయి పెద్దపాదం ఆకారంలోఉండేది. అది మధ్యలో పగిలిపోయికూడా ఉండేది. మా చిన్నప్పుడు మా ఊళ్లోవాళ్లు ఆ రాతి గురించి ఓకథ చెప్పేవారు. ఒకప్పుడు భీమసేనుడు ఆ కొండమీంచి కిందకి దిగాడనీ, అతడు పాదం మోపగానే ఆ బండరాయి పగిలిపోయిందనీ చెప్పేవారు. మా చిన్నప్పుడు మాకు అదంతా నమ్మదగ్గట్టే ఉండేది. ఆ శైశవం నుంచి బయటపడ్డాక, ఆ ఊరు వదిలాక, ‘విద్యావంతులం’అయ్యాక ఆ కథను నమ్మడం మానేశాం. కానీ ఇప్పటికీ ఆ కొండ దగ్గరికి వెళ్తే, ఆ బండరాతిని చూస్తే అది భీమసేనుడి అడుగే అని ఎక్కడో మానసికఅగాధాల్లో ఒక జలదరింపుకు లోనవుతూనేవుంటాం. ఆ రాతిచుట్టూ అల్లినకథా, ఆ కథ వినగానే మనసులో రేకెత్తకుండా ఉండలేని జలదరింపూ వీటినే మనం లెజెండ్ అంటాం.

చాలాకాలం పాటు పురాగాథ (లెజెండ్), పురాణగాథ (మిత్), జానపదగాథ (ఫోక్ టే ల్) ల మధ్య తేడా గమనించేవారు కాదు. కానీ వాటి మధ్య సున్నితమైన సరిహద్దురేఖలున్నాయని అత్యంత ప్రాచీనతెగలకు కూడా తెలుసని మానవశాస్త్రజ్ఞులు గుర్తుపట్టడం మొదలుపెట్టారు. ప్రసిద్ధ మానవశాస్త్రజ్ఞుడు మాలినోవస్కీ తన ‘Myth in Primitive Psychology’ (1926) లో టోబ్రియాండ్ ద్వీపవాసులు గురించి రాస్తూ, వాళ్లకి మూడు రకాల కథనరూపాలున్నాయని వివరించాడు.

painting: Annavaram Srinivas

painting: Annavaram Srinivas

  • జానపదకథలు: కల్పితకథలు, నాటకీయంగాచెప్పుకునేకథలు. వ్యక్తులూ, కుటుంబాలూ చెప్పుకునే కథలు. హేమంతకాలంలో పంటలకోతల కాలానికీ, చేపలుపట్టే కాలానికీ మధ్యకాలంలో చెప్పుకునే కథలు. ఆ కథలు చెప్పుకుంటే పంటలు బాగా పండుతాయని నమ్మే కథలు.
  • పురాగాథలు: యథార్థంగా జరిగాయని నమ్మేకథలు. వాటిలో యథార్థమైన సమాచారం ఉంటుంది. అవి ఏ ఒక్క వ్యక్తికో, కుటుంబానికో సంబంధించినవి కావు. తెగ మొత్తానికి చెందినవి. వాటిని చెప్పుకోవడంలో కూడా ఒక మూసపద్ధతి ఉంటుంది. వాటికి మంత్రశక్తికూడా ఉందని నమ్ముతుంటారు.
  • పురాణగాథలు: అవి యథార్థమైన కథలే కాకుండా, పవిత్రమైన కథలు కూడా. వాటి పట్ల ఆ తెగమొత్తానికి  ఆరాధన, గౌరవం, సమర్పణభావం ఉంటాయి. తెగ మొత్తం పాల్గొనే సామాజిక, సామూహికక్రతువుల్లో ఆ పురాణగాథలదే ప్రధానస్థానం.

వీటిలో , పురాగాథని (లెజెండ్) జానపదకథ (ఫోక్ టేల్) నుంచి విడిగాతీసి, శాస్త్రీయంగా అధ్యయనం చేయడం 1975 నుంచి మొదలయ్యింది. మొదట్లో జానపద కథలకి ఉన్నంత నిర్మాణస్పష్టత పురాగాథలకి లేదనుకునేవారు. కానీ పురాగాథల్నిజానపదగాథలతో పోల్చిచూడటం మొదలైన తర్వాత పురాగాథలకు కూడా కొన్నిస్పష్టమైన, నిర్మాణపరమైన లక్షణాలున్నాయని భావిస్తున్నారు. వాటిని మనమిట్లా చెప్పుకోవచ్చు:

  • జానపదకథలు యథార్థవాస్తవాన్నివ్యంగ్యంగా చిత్రించడానికి ప్రయత్నిస్తే, పురాగాథలు యథార్థవాస్తవాన్నినమ్మదగ్గట్టుగా పునర్నిర్మిస్తాయి.
  • జానపదకథలు అంతరంగవాస్తవం గురించి పట్టించుకుంటే పురాగాథలు బాహ్యవాస్తవం గురించి ఆలోచిస్తాయి.
  • జానపదకథలు మనిషి గురించి ఆలోచిస్తే, పురాగాథలు మనిషికి ఏం జరుగుతోంది, మనిషి ఏమౌతున్నాడు ఆలోచిస్తాయి.
  • జానపదకథలు తమ సాంస్కృతిక వాతావరణం నుంచి కూడా బయటికి ప్రయాణించగలుగుతాయి.
  • కానీ పురాగాథలు చాలా స్పష్టంగా తమ సంస్కృతికి మాత్రమే పరిమితమై మనగలుగుతాయి. అవి ఆ సంస్కృతికి సంబంధించిన సంప్రదాయంతో, విశ్వాసాలతో, ఆ మానవసమూహం తాలూకు మానసికసంవేదనలతో ముడివడి ఉంటాయి. పురాగాథలు సాధారణంగా ఏదో ఒక్క సంఘటన మీంచి నిర్మాణమవుతాయి. అవి ఆ మానవసమూహం తాలూకు బాహ్యస్థలాన్నిఆంతరంగికస్థలంతో ముడివేస్తాయి. ఆ సామూహికగతం గురించిన జ్ఞాపకాల్నితరం నుంచి తరానికి అందిస్తూ, ఆ జాతికొక చారిత్రక అంతర్దృష్టి ని  సమకూరుస్తాయి.

పురాగాథల్నీ, జానపదకథల్నీపోల్చిచూసి, తిమోతి.ఆర్. తంగ్హెర్లేని అనే ఆధునిక జానపదవాజ్మయ పండితుడు లెజెండ్ ని  ఇట్లా సమగ్రంగా నిర్వచించడానికి (1990) ప్రయత్నించాడు:

‘లెజెండ్ అంటే సాంప్రదాయిక కథ. ఏక సంఘటనాత్మక కథ. నిర్దిష్టవాతావరణానికి తగ్గట్టుగా, చారిత్రకస్వభావాన్నిసంతరించుకున్నకథనం. సంవాదరూపంలో సాగే అభినయం. ఒక తెగ నమ్మకాల్నీ వారి సామూహికఅనుభవాల్నీమానసికస్థాయిలో నెమరువేసుకుంటూ ప్రతీకాత్మకంగా చెప్పే కథ. ఒక సమూహం తాలూకు సాంప్రదాయికవిలువల్నిపునరుద్ఘాటించడం కోసం చెప్పుకునే కథనం’

నిజానికి పురాగాథలు అచ్చుపుస్తకాల్లో చదువుకునేవి కావు, అవి అభినయరూపాలు. వాటికి నిర్ణీతవేళలుంటాయి. వాటి చుట్టూ కొన్ని నమ్మకాలుంటాయి. ఉదాహణకి సెనెకా ఇండియన్ తెగల్లో, ఇరోకో తెగల్లో ఏ కథలూ వేసవిలో చెప్పుకునేవి కావు. అట్లా చెప్పుకుంటే రెండు రకాల అనర్థాలు వాటిల్లుతాయని వాళ్ళు నమ్ముతారు. మొదటిది, వేసవిలో జంతువులకి పనీపాటా ఉండదు కాబట్టి, అవి మనుషులు చెప్పుకునే కథలు వింటాయనీ, అలా వింటున్నప్పుడు మనుషులు తమని తాము మరీ అతిగా పొగుడుకుంటే విని ఆగ్రహిస్తాయనీ ఒక నమ్మకం. రెండవది, అవి ఆ కథలు వింటూ మైమరచిపోతే ప్రకృతిలో వాటిచోటు తప్పిపోతుందనీ, ప్రకృతి నడక మారిపోతుందనీ మరొక భయం.

అందుకని ఆ కథలన్నీశీతాకాలంలో ప్రకృతి కునికిపాట్లు పడేటప్పుడు  చెప్పుకోవలసిందే.

సెనెకా తెగలో ఈ కథలు చెప్పడానికొక కథకుడుంటాడు. అతణ్ణి ‘హగెఓతా’అంటారు. కథలు చెప్పడాన్ని ‘ఎసెగెఒడె’అంటారు. అతడి దగ్గరుండే కథాభాండాగారాన్ని ‘గనొండసహగొ’అంటారు. కథలు చెప్పేటప్పుడు శ్రోతలు నిద్రపోయినా, ఊకొట్టకపోయినా కథకుడు అమర్యాదగా భావిస్తాడు. ఒకవేళ శ్రోతకి నిద్రొస్తుంటే అతడు కథకుణ్ణి కొంతసేపు ఆకథ కట్టెయ్యమని అడుగుతాడు. కథవిన్నాక శ్రోతలు కథకుడికి పూసలో, పొగాకో, ఏదో ఒక చిన్నకానుక ఇవ్వడం తప్పనిసరి.

ఒక జాతి తన సామూహిక, సమష్టిఅనుభవాల్నిఅర్థంచేసుకునే క్రమంలో, గుర్తుపెట్టుకునే క్రమంలో ప్రతీకాత్మకంగా మిగుల్చుకునే ఆనవాళ్లు పురాగాథలు. ఉదాహరణకి  ‘కథలుఎలాపుట్టాయి’అనే ఈ పురాగాథ చూడండి. సెనెకాఇండియన్లు చెప్పుకునే ఈ పురాగాథలో రాయి కథలు చెప్పటం చూస్తాం.

kesavareddyరాయి కథలుచెప్పడం ఆధునికమానవుడి దృష్టిలో, అయితే, ఒక మెటఫర్, లేదంటే, ఒక ఫాంటసి. కానీ సెనెకాఇండియన్లకి తమ చుట్టూ ఉండే ప్రకృతిలో ప్రతి ఒక్కటీ సజీవపదార్థమేనని మనం గుర్తిస్తే, ఈ పురాగాథ వాళ్ల సామూహికవిశ్వాసంతో ఎంతగా పెనవేసుకుపోయిందో మనకు అర్థమవుతుంది.

రామాయణంలోనూ, మహాభారతంలోనూకూడాఎన్నోపురాగాథలున్నాయి. ఐరోపీయ సాహిత్యంలో ఆర్థరియన్ లెజెండ్లు సుప్రసిద్ధం. తెలుగులో డా.కేశవరెడ్డి ‘మూగవానిపిల్లంగోవి’, ఆర్. వసుంధరాదేవి ‘రెడ్డెమ్మగుండు’కథలు లెజెండ్ తరహాలోచెప్పినవే.

 

 

***        ***        ***

సెనెకాఇండియన్లు1చెప్పుకునేకథ:  కథలుఎలాపుట్టాయి?

ఒకానొక కాలంలో ఒక అనాథ పిల్లవాడుండేవాడు. అతణ్ణి అతడి తల్లిదండ్రులకి బాగా దగ్గరగా తెలిసిన ఒక ఆడమనిషి పెంచింది. అతడు పెరిగి పెద్దవాడయినప్పుడు బలవంతుడు గానూ, బుద్ధిమంతుడు గానూ రూపొందాడు. అతడికి తగిన వయసు రాగానే ఒకరోజు ఆమె అతని చేతికి విల్లంబులు ఇచ్చి, ‘ఇక నువ్వు వేటాడడం నేర్చుకునే వయసు వచ్చింది. అడవికి పోయి వేటాడి ఆహారం తీసుకురా’ అని చెప్పింది. ఆ మర్నాడు పొద్దున్నే అతడు వేటకు వెళ్లాడు. మూడు పక్షులను కొట్టాడు. మధ్యాహ్నానికల్లా అతడి అమ్ములపొది వదులైంది. అల్లెతాడు బిగించుకోవడం కోసం అతడొక చాపరాయి మీద కూర్చున్నాడు.

ఇంతలో ఉన్నట్టుండి హటాత్తుగా అతణ్ణి ఎవరో ‘నీకో కథచెప్పమంటావా’అని అడిగారు.

అతడు తన ఎదురుగా ఒక మనిషి నించొని తనని అడుగుతున్నాడనుకుని తలపైకెత్తి చూశాడు. కాని ఎదురుగా ఎవరూ కనిపించలేదు.

‘నీకో కథ చెప్పమంటావా?’ మళ్లీ వినిపించిందాగొంతు.

ఆ కుర్రవాడికి భయమేసింది. అతను అన్నిదిక్కులా చూశాడు. కాని ఎవరూ కనబడలేదు. మళ్లా ఆ గొంతు వినబడేసరికి అప్పుడతనికి అర్థమైంది, ఆ గొంతు తాను కూర్చున్న బండ లోంచి వినబడుతోందని.

‘నీకో కథ చెప్పమంటావా?’

‘కథలంటే ఏమిటి?’ అని అడిగాడు ఆ పిల్లవాడు.

‘కథలంటే చాలాకాలం కిందట జరిగిన సంగతులు. నా కథలు నక్షత్రాల్లాగా ఎప్పటికీ చెక్కు చెదరవు.’

ఆ రాయి కథ చెప్పడం మొదలుపెట్టింది. ఒక కథ పూర్తిచేస్తూనే మరో కథ మొదలుపెట్టింది.

అది కథలు చెప్తున్నంతసేపూ ఆ కుర్రవాడు తలవంచుకుని శ్రద్ధగా ఆ కథలే వింటూ కూర్చున్నాడు. సూర్యాస్తమయవేళకి ఆ రాయి హటాత్తుగా ఇలా అంది.

‘ఇక మనం ఇప్పటికి చాలిద్దాం. రేపు మళ్లారా. మీ వాళ్లందరినీ కూడా తీసుకురా. వాళ్లంతా కూడా నా కథలు వింటారు. వచ్చేటప్పుడు వాళ్లందరినీ నాకోసం తలా ఒక కానుక తీసుకురమ్మని చెప్పు’అంది.

ఆ కుర్రవాడు ఆ సాయంకాలం తన వాళ్లందరికీ ఆ కథలు చెప్పే రాయి గురించి చెప్పాడు. దాంతో మర్నాడు పొద్దున్నే ఆ ఊరిజనమంతా అతడి కూడా అడవిలోకి దారితీశారు. ప్రతిఒక్కళ్లూ రొట్టెలో, మాంసమో, పొగాకో ఏదోఒకటి తలా కొంత తీసుకువచ్చి ఆ రాతి ముందు పెట్టి కూర్చున్నారు.

అంతా నిశ్శబ్దంగా కూర్చున్నాక రాయి మాట్లాడడం మొదలుపెట్టింది.

‘నేనిప్పుడు మీకు చాలాకాలం కిందట జరిగిన కథలు చెప్పబోతున్నాను. మీలో కొంతమందికి నేనుచెప్పే ప్రతి ఒక్కమాటా గుర్తుంటుంది. కొంతమందికి కొంతే గుర్తుంటుంది. తక్కినవాళ్లకి అసలేమీ గుర్తుండదు. శ్రద్ధగా, జాగ్రత్తగా వినండి.’

ఆ ప్రజలంతా శ్రద్ధగా శిరస్సు వంచి విన్నారు. రాయి కథ చెప్పడం పూర్తిచేసేటప్పటికి పడమట పొద్దుకుంకింది. అప్పుడు ఆ  రాయి ఇట్లా అంది.

‘నా దగ్గరున్న కథలన్నీ చెప్పేశాను. మీరు వాటిని మీ పిల్లలకి చెప్పండి. మీ పిల్లలపిల్లలకి చెప్పండి. అలా తరతరాలపాటు చెప్పుకుంటూనే ఉండండి. మీరెవరినైనా కథ చెప్పమని అడిగినప్పుడు మర్చిపోకుండా వాళ్లకిట్లా ఏదో ఒక బహుమతి ఇవ్వండి.’

అదీ, అలా జరిగింది. మనకి తెలిసిన కథలన్నీఆ రాయి మనకి చెప్తే విన్నవే. మన తెలివితేటలన్నీ ఆ రాతినుంచి మనకు దొరికినవే.

 

_________________________________________________________________________

1: సెనేకా ఇండియన్లు: అమెరికన్ఇండియన్లుగా పిలువబడే రెడ్ఇండియన్లు సుమారు 60 వేలఏళ్ల కిందట ఉత్తరఅమెరికాలో అడుగుపెట్టారు. మధ్యఆసియా మైదానాల నుంచి ఈశాన్యదిశగా సైబీరియాసరిహద్దులు దాటి వాళ్లు అమెరికాలో అడుగుపెట్టారు. వేటాడుతూ, ఆహారం ఏరుకుంటూ ఆ సమూహాలు కొలంబియానది పొడవునా రాకీలు దాటి దక్షిణంవైపు మెక్సికన్ మైదానాల మీదుగా సతతహరితారణ్యాలు దాటుకుంటూ యుకాటన్ అడవుల దాకా విస్తరించారు. ఆకాశంలో ఎన్నినక్షత్రాలున్నాయో అన్ని ఇండియన్ తెగలున్నాయని నానుడి. వాళ్లు దాదాపు 300 భాషలు మాట్లాడతారు.

 

1492 లో క్రిస్టఫర్ కొలంబస్ అమెరికాలో   అడుగుపెట్టినప్పటినుండి 1890 దాకా నాలుగు శతాబ్దాల పాటు సభ్యప్రపంచం అమెరికన్లను వేటాడి, వాళ్ల సంస్కృతినీ, నాగరికతనీ ధ్వంసం చేసేసింది.

 

కానీ 19 వశతాబ్దపు ప్రారంభం నుండీ అంటే, 1830 ల నుంచి అమెరికన్ తెగల సంస్కృతి , మౌఖికసాహిత్యం, జీవనశైలి గురించి విరివిగా అధ్యయనాలు మొదలయ్యాయి.

అట్లా సమగ్రంగా అధ్యయనం జరిగిన తెగల్లో సెనెకాతెగ కూడా ఒకటి. సెనకా ఇండియన్లు న్యూయార్క్ ప్రాంతంలో జెనెసె నదికి కేనాన్ డైగువాసరస్సుకీ మధ్యప్రాంతంలో నివసిస్తారు.

ఆ తెగ ఒకప్పుడు చాలా పెద్దసమూహంగా ఉండేది. సెనెకా ఇండియన్లు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ జాతి. ఒకరకంగా మాతృస్వామికతెగ అని కూడా చెప్పవచ్చు.

సెనెకాఇండియన్ తెగలు చెప్పుకునే కథల్నిజెరిమియా కర్టిన్, జె.ఎన్.బి. హ్యూవిట్ నేవారు  Seneca Fiction Legends and Myths’ (1918)  పేరిట ప్రచురించారు.

సాంప్రదాయికఅమెరికన్ తెగల కథలు, పురాగాథల్ని ‘The Story Telling Stone’ (1965) పేరిట సుసాన్ ఫెల్డ్ మాన్  వెలువరించిన సంకలనంలోని కథ ఇది.  ఈ కథను కెనడాలో టొరంటొ దగ్గర సేకరించారు.

***        ***        ***

రావి శాస్త్రి గారి ఆరు సారా కధల్లో ….

 

ravi-sastry

నా మేనమామ ఆకెళ్ళ కృష్ణమూర్తి గారు శాస్త్రి గారి ఆప్తమిత్రుల్లో ఒకరు కాబట్టి, వారు మా మావయ్య తో విశాఖలో ని సింధియా కోలని లో ఉన్న మా ఇంటికి తరచూ  రావడం వల్ల వారితో నా చిన్నప్పటి నుంచి పరిచయం ఉండడం నా అదృష్టం. ఆ పరిచయం నా వ్యక్తిత్వమూ, ఆలోచనలు సరి అయిన దారిలో రూపొందడానికి చాలా సహకరించింది. ఆరు సారా కధలు ఏప్రెల్ 2 1961 నుంచి  లో  విశాలాంధ్ర ఆదివారం సంచికలో 6 వారాలు వచ్చినప్పుడు 16 సంవత్సరాల వయస్సులో నేను అన్ని  కధలు చదివి  చాలా ఇష్టపడి మా ఎకనామిక్స్ డిపార్టుమెంట్ లో ( అప్పుడు నేను ఆంధ్రవిశ్వవిద్యాలయం లో 4 సంవత్సరాల  ఎకనామిక్స్‌ హానర్స్ రెండవ సంవత్సరం విద్యార్ధిని) అందరితోనూ ఆ కధలు చదివించే వాడిని.

ఆ తర్వాత 1983 లో ఢిల్లీలో కల జె,యెన్.యు లో టంకశాల అశోక్ గారి ఆధ్వర్యంలో ఉండే  “ప్రగతి సాహితి” మిత్రులతో కలిసి సారా కధల ఆధారంగా   అత్తిలి కృష్ణరావు గారు రాసిన సారాంశం నాటికను నా దర్శకత్వంలో  ఢిల్లీలో 5 చోట్ల తర్వాత విజయవాడ లో జరిగిన విరసం సభల్లోనూ ప్రదర్శించాం . ఆ రకంగా ఆరు సారా కధలతో 21 ఏళ్ల తర్వాత నా అనుబంధాన్ని గట్టి పరచుకున్నాను.

2014 మార్చ్  లో ఢిల్లీ తెలుగు సాహితీ వేదిక వారు రావిశాస్త్రి గారి కధల మీద ఒక సదస్సు నిర్వహించినప్పుడు, శాస్త్రి గారి ఆరు సారా కధల మీద ఒక ప్రసంగం  చేయాలని ,   ఈ కధలని విపరీతంగా ఇష్టపడే  వాడిని కనుక,    సదస్సు నిర్వాహకుల అంగీకారం తర్వాత ఒక ప్రసంగం  చేశాను. ఇప్పుడు అదే ప్రసంగాన్ని  చాలా మార్పులు చేసిన వ్యాసమిది.  55 సంవత్సరాల తర్వాత నాకెంతో ఇష్టమయిన రావి శాస్త్రి గారి ఆరు సారా కధలను మళ్ళీ తలచు కోవడం  ఎంతో ఆనందం గా ఉంది.

మన రాజ్యాంగానికి స్వాతంత్రం  వచ్చి ఇన్నాళ్లు అయినా కూడా మన న్యాయ వ్యవస్థ ఇంకా బ్ర్తిటిష్ వాడు తన వలస పాలన సౌలభ్యం కోసం  పెట్టిన   న్యాయ పద్ధతులు, ముఖ్యంగా భారత శిక్షా స్మృతి, ( బ్రిటిషోడు 1860 లో పెట్టినదే  – పాపం కొన్ని మార్పులు తర్వాత చేసినట్టున్నారు), ఇంకా అమల్లో ఉండడం మన దౌర్భాగ్యం. 2015, 2016 ల్లో,    బ్రిటిషోడు ప్రజలు తమకు అణిగి ఉండడం కోసం ఏర్పాటు చేసిన దేశభక్తి న్యాయం (Sedition Law) కూడా ఇంకా అమల్లో ఉండడం రాజ్యం చేస్తున్న దౌర్జన్యం. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే దేశద్రోహమనే ఈ చట్టం , 2016 జనవరి – ఫిబ్రవరిలో లో హైదరాబాద్ సెంట్రల్ & జె.ఎన్.యు. విశ్వవిద్యాలయాల విద్యార్ధుల మీద జరిగిన దౌర్జన్యానికి  ప్రస్తుత ప్రభుత్వం వాడింది. . అక్కడే కాదు ఇంకా అనేక చోట్ల ఈ ‘దేశద్రోహ నేరం’ ప్రస్తుత కేంద్ర పాలకులకు తరచుగ  ఉపయోగ పడుతోంది. ఈ మార్పులను దృష్టిలో  పెట్టుకొని, 2 ఏళ్ల తర్వాత ఈ వ్యాసాన్ని తిరిగి రాసాను.

పేదల – బడుగుల సమస్యల్నే కథలుగా మలిచిన రావిశాస్త్రి గారు, ఉత్తరాంధ్ర తెలుగు సాహిత్యానికి ఇచ్చిన   గొప్ప వరం. ఆయన 1960 లో రాసిన ఆరు సారా కధలు తెలుగు సాహిత్యం లో ఒక మరుపు లేని కొత్త మలుపు. రాజ్యము రాజ్యవ్యవస్థగా ఉన్న కోర్టులు, పోలీసులు, ప్రభుత్వ కార్యాలయాలలోని ప్రజా వ్యతిరేకత  చూపించిన ఘనత ఆరు సారా కధలకే దక్కుతుంది

“ఉత్తమ సాహిత్యం సామాజిక శాస్త్రాల కన్నా ప్రతిభావంతంగా సమాజాన్ని  ప్రతి ప్రతిఫలిస్తుంది. అందుకే “సాహిత్య పరిశీలన సామాజిక అధ్యయనానికి సాధనం మాత్రమే  కాదు అవసరం కూడా” అని మిత్రుడు సి.వి.సుబ్బారావు (విరసం రచయిత + పౌరహక్కుల ఉద్యమకారుడు  – సుర/సుబ్బా) తన విభాత సంధ్యలో అన్నారు. ఆ దృష్టి లో చూస్తే ఆరు సారా కధల పరిశీలన చాలా అవసరం  అని  నా ఉద్దేశం.

ఆరు సారా కధల సంపుటి  ముందు మాటలో శ్రీ శ్రీ  గారు అన్నట్టుగా ” అతడు కళా స్రష్ట. అతడు వ్రాసిన ఆరు కథానికలు ఆరు కళా ఖండాలు.  తెలుగులో ఒక్క గురజాడ మహాకవికి మాత్రమే సాధ్యమయిన పాత్ర చిత్రణ ఈ కధల్లో కనపడుతుంది. ఇవి వాస్తవికతకు ఒక నివాళి. వీటిలో  కధనం ఉంది, కావ్యం ఉంది, డ్రామా ఉంది. జీవితాన్ని  నిశితంగా పరిశీలించడం ఉంది. ఆ చూసిన దాని మీద వ్యాఖ్యానించినట్టు గా కనిపించని వ్యాఖ్యానం ఉంది”

రావి శాస్తి గారి ఆరు సారా కధల్లో ప్రత్యేకంగానూ, ఆయన రచనలు అన్నిటిలోనూ ప్రఖ్యాత జర్మన్ నాటక రచయిత-దర్శకుడు బెర్టోల్ట్ బ్రెక్ట్  దూరీకరణ  సూత్రం  (alienation effect) ,  తాదాత్మ్య విచ్ఛిత్తి , కనిపిస్తుంది.  ఇందు లో  నాటకంలో ప్రేక్షకులకు/కధలో పాఠకులకు , తాదాత్మ్యం కలిగించి వాస్తవమని భ్రమ కలిగించాలన్న సూత్రానికి భిన్నం గా ఆ తారతమ్యాన్ని ఛేదించి, నిరంతరం ఇది నాటకం/కధ అని జ్జ్ఞప్తికి తెస్తూ, వాటిల్లో ఇమిడి ఉన్న నైతిక, సామాజిక, రాజకీయ సంఘర్షణల అంతరాయాన్ని ప్రేక్షకుడు/పాఠకుడు గ్రహించే విధంగా  చేయడం ఈ సూత్రం లక్ష్యం.

ఉదాహరణకి ‘మాయ’ కధలో ముత్తేలమ్మ అన్న పాత్ర చేత అప్పుడు దేశం లోని సామాజిక పరిస్థితిని శాస్త్రి గారు చెప్పించిన విధం చూడవచ్చు. ఆమె ఇలా అంటుంది “పీడరు బాబూ సెప్తున్నాను ఇను! నువ్వే కాదు, ఈ బాబే కాదు, ఏ మనిసి మంచోడని ఒవురు సెప్పినా  నాను  నమ్మను.   ఈ నోకంల డబ్బూ యాపారం తప్ప  మరేట్నేదు. పశువులూ-నోర్లేని సొమ్ములు  – ఆటికి నీతుంది కానీ మనకి నేదు. సదువు లేందాన్ని నాకూ నేదు; సదువుకున్నాడివి నీకూ నేదు. డబ్బు కోసం నోకం – నొకమంతా పడుచుకుంటోంది. డబ్బుకు నాను సారా అమ్ముతున్నాను, డబ్బుకి సదువుకున్న సదువంతా నువ్వమ్ముతున్నావు. డబ్బుకి పోలిసోళ్ళు  నాయ్యేన్నమ్ముతున్నారు. మందు కోసం పెద్దాసుపత్రికెల్తే  అక్కడ మందులమ్ముతున్నారు. గుళ్ళోకెళ్లి కొబ్బరికాయ సెక్కా  కాన్డడబ్బూ  ఇస్తే ఆ దేవుడి దయే అమ్ముతున్నారు. వొట్లొస్తే ( ఎన్నికలు) పీడరు బాబూ నువ్వూ. నానూ ,ఈ బాబూ, అందరం అమ్ముడయిపోతున్నాం. అమ్మకం! అమ్మకం! అమ్మకం! అమ్మకం తప్ప మరెట్నేదీలోకంలో.” ఇంతకన్నా సమాజంలో డబ్బు   ఎంత ముఖ్య పాత్ర వహిస్తోందో ఈ మాటల్లో శాస్త్రి గారు   నేరుగా  పాఠకులకు చెప్పారు. అలాగే ఈ కధల్లో  చాలా సార్లు పాత్రలు తిన్నగా పాఠకులతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి .

సామాన్య ప్రజలు తమ రోజు వారీ జీవితం లో ఎదుర్కునే రాజ్యం యొక్క వివిధ రూపాలను /శక్తులను, వాటితో ప్రజల ప్రతి చర్యలను ఉదాహరణగా తీసుకొని మన సమాజంలో రాజ్య స్వభావం  మీద మనకున్న అమాయక మాయను తొలగించడానికి రావి శాస్త్రి గారు ఆరు సారా కధల్లో అపూర్వమయిన ప్రయత్నం చేశారు. ఆయన ఈ రచనలో  పాత్రలు రాజ్యం తాలూకా   రూపాలు లేదా శక్తులు, విభిన్న సందర్భాల్లో  ఎదుర్కుంటాయి.   వాళ్ళ సామాజిక అనుభవాలని విశ్లేషించడం రావి శాస్త్రి గారు సాధించిన విజయం. ఆ పరిశీలనను, పైన చెప్పిన  బెక్ట్ పద్ధతి లో పాఠకులు ఆలోచించే శైలి లో వారు రాశారు.  అయన ఆరు సారా కధల  తరవాత వచ్చిన ఇతరుల కధల మీద, ముఖ్యం గా బీనాదేవి , పతంజలి రచనల మీద, వాటి ప్రభావం చాలా ఉంది.

వివిన మూర్తి, ఏం.వి.రాయుడు గార్ల సంపాదకత్వంలో వచ్చిన “రాచకొండ విశ్వనాధశాస్త్రి  రచనా సాగరంలో” లో వారు చెప్పినట్టు “బాధ్యతగా మాత్రమే రాయాలనుకుంటున్న రచయిత   తన ఆవేశానికి అనుగుణంగా కళాకౌశవాన్ని ఇనుమడింప చేసుకుని ఆరు సారా కధల వంటి కళాఖండాలను  వెలువరించిన దశ ఇది. ఈ కధలు శాస్త్రి గారు తన రాజకీయ దృక్పథాన్ని స్థిరపరచుకున్న దశలో వచ్చిన మొదటిది”.

ఆరు సారా కధల్లో రావి శాస్తి గారు రాజ్యం, ప్రజల, ముఖ్యంగా అణగారిన ప్రజల పైన, తన అధికారం చూపడానికి సులభంగా, అది కూడా వలస వాదులు, ఎదురు తిరిగే ప్రజలను అణచివేయడానికి పనికి వచ్చే శిక్షా స్మృతి , మిగిలిన వలస వాద న్యాయ సూత్రాల సహాయంతో, రాజ్యం కొమ్ము కాచే  రెండు ముఖ్య సంస్థలు పోలీసు , న్యాయ వ్యవస్థ ల గురించి ఒక తిరస్కార   విమర్శ చూపించారు.  అయితే పోలీసుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ బాధను, నిస్సహాయతను సహానుభూతితో చూపుతారు. ఇది మనం మోసం కధలో చూడవచ్చు.  ప్రజల రక్షణ కోసం ఉన్న పోలీసులను తమ స్వంత పనులకోసం  రాజ్యాన్ని నడిపే రాజకీయ నాయకులు, ఆ నాయకులను నిలబెట్టి గెలిపించే అత్యధిక ధనిక వర్గాలు  ఎలా హింస పెడతారో   అద్భుతంగా చెప్పారు శాస్త్రి గారు.

బ్రిటిషోడు తన రాజ్యాధికారం కోసం మరియు  తన వలసను స్థిరపరచుకునేందుకు ఏర్పాటు చేసిన శిక్షాస్మృతిని, న్యాయవ్యవస్థని స్వాతంత్రం వచ్చేకా కూడా మన దేశం లో అమల్లో ఉండటాన్ని “మాయ’ కధలో ఒక సీనియర్ న్యాయవాది ఒక చిన్న న్యాయవాదితో చెప్పిన ఈ కింది సంభాషణ లో కనిపిస్తుంది. అప్పటి వలస చట్టాలను గత రెండు సంవత్సరాలుగా , 2015-2016 ల్లో మన ప్రభుత్వం  దేశ ప్రజలమీద, ముఖ్యంగా విద్యార్ధుల మీద, రాజ్య పద్ధతులను ప్రశ్నిస్తున్న అన్నీ వర్గాల మీద   ప్రభుత్వం   తన సంస్థల  ద్వారా జరిపిస్తున్న దాడుల్లో కూడా ఈ సంగతి ఖచ్చితంగా కనిపిస్తుంది.

జ్ఞానమొచ్చినప్పటినుంచి,  నాకు  ఒక విషయం ఎప్పుడూ అర్ధమయ్యేది కాదు. చట్టాలోకటే అయినప్పుడు ఒక కేసు నిర్ణయం ఒకొక్క కోర్టు లో ఒకొక్క విధంగా యెందుకుంటుందని . ఈ న్యాయ నిర్ణయం లో అంతులేని పేద నిస్సహాయులకు, పలుకుబడీ, అధికారం లో ఉన్న తేడా కూడా మనం చూస్తూనే ఉంటాం. మనది చాలా గొప్ప ప్రజాస్వామ్య దేశమనీనూ , ఇంత గొప్ప దేశం లో న్యాయం  చాలా నిజంగానూ, స్వచ్ఛంగా తళతళ మెరుస్తుందనీనూ    నమ్మేవారు శాస్త్రి గారు   చెప్పిన ఈ కింది మాటలు (మాయ కధ)  మనస్సులో పెట్టుకోవాలి. ఈ మాటల నిజం  ఈ మధ్య ప్రభుత్వం ఆడిన  డీమోనటైజేషన్ నాటకం లో బాగా కనిపిస్తుంది. దేశం లో ఉన్న నల్ల డబ్బును బయటకు తీయడానికి మొదలు పెట్టిన ఈ ప్రక్రియ లో నల్ల డబ్బున్న కొద్దిమందీ బాగానే ఉన్నారు, ఏమీ లేని జనం మాత్రం  రోజుల తడబడి లైన్లలో నుంచుని , అందులో కనీసం 100 పైగా చనిపోయిన దౌర్భాగ్యం,  ఎలా జరిగుంటుందో  కూడా ఈ మాటల్లో తెలుస్తుంది.

ఇంగ్లీషువాడు మనకి స్థాపించిన న్యాయం అది. ఆకులన్నీ ప్రజలవి. ఆపిల్ పళ్ళన్నీ అధికారులవి. వాళ్ళ దేశంలోనూ అంతే, మన దేశంలోనూ అంతే.      మనకి వాడు చెప్పిన పాఠమే అది. పని కూలివెధవల్ది. లాభం బుగతది     (పెట్టుబడిదారుడిది).   ఏమైనా అంటే , ఎదురు తిరిగితే మన (రాజ్యం)    సాయానికి  (పోలీసులున్నారు) కోర్టులున్నాయి, జెయిళ్ళున్నాయి.  ఇవి లేకపోతే        ఇంగ్లీషువాడి  రాజ్యమే లేదు. ……… ఆఖర్నయినా ఏం          చేశాడు? అక్కడా-అక్కడా  చలాయించినట్టు ఇక్కడ (కూడా) కూలి       వెధవలు   పెత్తనం             చలాయిస్తారేమోనని అనుమానం కలిగింది.  వెంటనే సాటి        షావుకార్లకి   రాజ్యం అప్పచెప్పి చల్లగా తెర వెనక్కి      జారుకున్నాడు.   గొప్ప మాయగాడు. వ్యాపారం, వ్యాపారం లాగే ఉంది.   లాభాలు  లాభాల్లాగే ఉన్నాయి.  ఏదైనా       రొష్తుంటే అదంతా మన      వెధవల్దే  అయింది.

అందుకే ఇప్పటి న్యాయవ్యవస్థలో, అప్పటి వలస రాజ్యం లో లాగా, కోర్టుల్లో అనాధుల ఆక్రందన, పేదల కన్నీటి జాలులే కనిపిస్తాయి. ప్రభుత్వం వారి లెక్కల ప్రకారమే  డిసెంబర్ 31, 2015 కు , దేశంలో నిందమోపబడి, న్యాయ విచారణ కోసం  జైళ్లలో మగ్గుతున్న ఖైదీలలో సగానికి పైగా – 54.9 శాతం , (దళితులు  21.6%. గిరిజనులు  12.4% మరియు ముస్లింలు 20.9%) వీరే కనిపిస్తారు. వీరు కాక మిగతా వెనుకబడిన కులాల (OBC) 31% శాతం కూడా కలిపితే మొత్తం 85.9% ఉన్నారు.

ఇదేమాట శాస్త్రి గారు 50 సంవత్సరాల కిందట  రాసిన వారి నిజం నాటకం ముందు మాటలో   ఇలా చెప్పారు.

ప్రస్తుతం మన దేశంలో ప్రతి రోజూ, ప్రతీ ఛోటా కూడా ఎందరో      కొందరమాయకులు వాళ్ళు చేయని నేరానికి శిక్షలనుభవించడం            జరుగుతోంది. కానీ , ఈమాత్రం డబ్బూ పలుకుబడీ, పదవీ, హోదా        కలవాడెవడూ పడడు, ఇరుక్కోడు, ఒకవేళ పడినా, ఇరుక్కున్నా పైకి    తప్పించుకోగలడు.

ఇలా ఎన్ని రోజులు?. రావి శాస్త్రి గారు సారా కధల్లోని పుణ్యం కధలో మార్పు ఎలాగో సూచించారు. ఈ కధలో  పోలమ్మ అన్న ఆవిడ గురించి కరుణాకరం అనే లాయరు ఇంకో తోటి లాయరుతో మాట్లాడుతూ :

            అది తెలివితక్కువ ముండ, వెర్రి వెంగళ్ళప్పన్నావు . ఇప్పటికీ బాగానే  ఉంది. అలాంటి వాళ్ళు దేశంలో కోటానుకోట్లున్నారు. అందుకే నువ్వూ      నేనూ బతికేస్తున్నాం. కానీ ఎల్లకాలం వాళ్ళు అలా వెంగళప్పల్లా        ఉండిపోరు. ఎప్పుడో అప్పుడు వాళ్ళు గప్పున తెలివి             తెచ్చుకుంటారు. వాళ్ళు తెలివి     తెచ్చుకుంటే నువ్వూ నేనూ,   నీలాంటి వాళ్లూ నాలాంటి వాళ్ళం అంతా కూడా జాగ్రత్తగా      ఉండాలి.            ఏంచేత జాగ్రత్తగా వుండలో తెలుసా?. అప్పుడు    పుణ్యం వర్ధిల్లుతుంది . అప్పుడు మనలాంటి పాపులం బహు జాగ్రత్తగా ఉండాలి.

  ఇప్పుడున్న వ్యవస్థలో, రాజ్యం సామాన్య ప్రజల అణచివేతకు, దోపిడీకి, బ్రిటిష్ వాడు తన వలస పాలన కోసం ఏర్పాటు చేసిన చట్టాలూ, న్యాయ వ్యవస్థలనూ,  స్వాతంత్రం వచ్చాక కూడా ప్రభుత్వం ఎలా వాడుకుంటున్నాయా 1961 లోనే చెప్పారు తన ఆరు సారా కధల్లో.

 చివరగా….

ఆరు సార కధల్లోని మోక్షం కధలో చెప్పినట్టు  –   ఒహ్హో మర్చేపోయాను! గవర్నమెంటుకి పాపం (ఈ డీమోనటైజేషన్ తో) పిచ్చెకింది కదూ? ఎలా ఉందో ఏమిటో చూద్దాం పదండి.

(ఈ వ్యాసం రాయడం లో మిత్రులు మృణాలిని, వేణుగోపాల్, , సాయిపద్మ, విజయభాను కోటె మంచి సలహాలనిచ్చి  సహకరించారు. వారికి నా కృతజ్ఞతలు )

 

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఎప్పుడు పోతనా మా ఊరికని…

Art: Annavaram Srinivas

కలెబడె కవి అలిశెట్టి  

 

వులు, రచయితలు, కళాకారుల్ని బతికున్నప్పుడు ఏమాత్రం పట్టించుకోకుండా చనిపోయిన తర్వాత మాత్రమే గౌరవించడమనేది ఇవ్వాళ తెలుగు సాహిత్య, సాంస్కృతిక రంగాన్ని పీడిస్తున్న జాఢ్యం. సరే కనీసం చనిపోయిన తర్వాతైనా పట్టించుకుంటున్నారన్నది కొంత సంతృప్తి ఇచ్చే విషయం. అయితే ఈ పనిని వారి మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు మాత్రమే ఎక్కువగా చేస్తున్నారు. కానీ కవి, రచయిత తాను జీవితకాలం ఏదైతే సంస్థతో అసోసియేట్‌ అయి వున్నాడో ఆ సంస్థలు వాళ్ళని పట్టించుకోవడం లేదు. సమగ్ర రచనలు ప్రచురించకున్నా కనీసం జయంతి, వర్దంతులు కూడా నిర్వహించడం లేదు. ఇది ఏదో ఒక సంస్థను దృష్టిలో పెట్టుకొని చెబుతున్న విషయం కాదు. అన్ని సంస్థలు అట్లానే ఉన్నాయి. అరసం, విరసం, తెరసం ఏ సంఘమైనా కానివ్వండి అన్నీ అలానే వ్యవహరిస్తున్నాయి. ఇందులో కొంత విస్మరణ, మరికొంత వివక్ష, ఎక్కువగా నిర్బధ్యాత ఉన్నది. బాధ్యతగా భావించి గౌరవించాల్సిన ప్రభుత్వాలూ ఈ విషయంలో ‘సెలిక్టివ్‌’గా వ్యవహరిస్తున్నాయి.  ఈ వివక్ష, విస్మరణ ఇవ్వాళ 63వ జయంతి, 24వ వర్ధంతిని జరుపుకుంటున్న అలిశెట్టి ప్రభాకర్‌ విషయంలోనూ జరిగింది.

అభ్యుదయ రచయితల సంఘానికి ఆయువు పట్టుగా నిలిచి, నడిపించిన తాపీ ధర్మారావు సమగ్ర రచనలు ఇప్పటికీ తెలుగు పాఠకులకు ఒక్క దగ్గర అందుబాటులో లేవు. అలాగే విద్వాన్‌ విశ్వం రచనలు కూడా సమగ్ర సంపుటాలుగా అందుబాటులో లేవు. ఆళ్వారు స్వామి రచనలు సమగ్ర సంపుటంగా వెలువడలేదు. (తెలుగు అకాడెమీ ప్రచురించినా ఆ సంపుటం అసమగ్రం). వీళ్ళు పేరుకు మాత్రమే. ఇలాంటి సాహితీవేత్తలు ఎంతోమందివి సమగ్ర సంపుటాలు రావాల్సి ఉన్నవి. మరోవైపు పొట్లపల్లి రామారావు రచనల్ని భూపాల్‌ సాయంతో ఆయన కుటుంబ సభ్యులు వెలుగులోకి తెచ్చారు. విప్లవ రచయితల సంఘం స్థాపన నాటి నుంచి చనిపోయే వరకూ దాంట్లో భాగమైన కె.వి.రమణారెడ్డి రచనల్ని ఆయన కుటుంబ సభ్యులు వరుసగా ప్రచురిస్తున్నారు. అలాగే అలిశెట్టి ప్రభాకర్‌ రచనల్ని సమగ్ర సంకలనంగా ఆయన మిత్రులు నర్సన్‌, నిజాం వెంకటేశం, జయధీర్‌ తిరుమలరావు తదితరులు పూనుకొని వెలువరించారు. ఇందులో ఇంకా సిటీలైఫ్‌లో భాగంగా వెలువడ్డ కొన్ని కవితలు జోడించాల్సి ఉంది.

జీవిత కాలం సేవ చేసిన సంస్థలే పట్టించుకోకపోవడమనేది ఇవ్వాళ కొత్తగా జరుగుతున్నది కాదు. ఆది నుంచి ఈ తంతు ఇలాగే కొనసాగుతోంది. 1953కు ముందు హైదరాబాద్‌ కేంద్రంగా తెలంగాణ రచయిత సంఘం ఏర్పడింది. దీని ద్వారా ఎక్కువగా సంస్థ బాధ్యులైన దాశరథి, నారాయణరెడ్డిల స్వీయ ప్రచురణలే ప్రచురితమయ్యాయి. సురవరం ప్రతాపరెడ్డి లాంటి వారి రచనలు వీళ్లు వెలువరించలేదు. దీని వల్ల ఆయన రచనలు సమగ్రంగా అందుబాటులో లేకుండా పోయాయి. ఆ యా సంఘాల తరపున దాని బాధ్యుల స్వీయ రచనలు అప్పుడూ వెలువడ్డాయి. ఇప్పుడైతే ఇబ్బడి ముబ్బడిగా వెలువడుతున్నాయి. అయితే తెలుగు సాహిత్యానికి చిరస్మరణీయమైన సేవ చేసిన వెలుగుల రచనలన్నీ ఒక్క దగ్గర లేక పోవడం మూలంగా సాహిత్య చరిత్రకూ, సాహితీవేత్తలకు, సృజనకారుకు అన్యాయం జరుగుతోంది. న్యాయంగా, హక్కుగా దక్కాల్సిన గౌరవం నుంచి వాళ్ళు వంచితువులతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున కొంతమంది విస్మ ృతుల్ని, వారి రచనల్ని పాఠ్యపుస్తకాల్లో జోడించాని ప్రయత్నించినపుడు అవి అందుబాటులోకి రాలేదు. దీనివల్ల వారి గురించి తెలుసుకునే అవకాశాన్ని కోల్పోయాం. అయితే అలిశెట్టి రచనలన్నీ ఒక్క దగ్గర ఉండడం మూలంగానే ఆయన రచనని పాఠ్యాంశంగా నిర్ణయించడానికి వీలయింది.

నిజానికి అలిశెట్టి ప్రభాకర్‌ 1993లో చనిపోతే 2013 వరకూ ఏ సంస్థా ఆయన మీద సభలు, సమావేశాలు నిర్వహించలేదు. ఒక్క విప్లవ రచయిత సంఘం మాత్రం ఆయన మరణానంతరం ‘మరణం నా చివరి చరణం కాదూ’ పేరిట చిన్న కవితా సంపుటిని వెలువరించింది. (అంతకు ముందు అలిశెట్టి తన సిటీలైఫ్ ని అచ్చేసి దాని ద్వారా వొచ్చిన డబ్బుని చెరబండరాజు చికిత్సకు అందించిండు) అయితే నర్సన్‌, నిజాం వెంకటేశం, దాసరి నాగభూషణం, వి.సామ్రాట్‌ అశోక్‌, గుండేటి గంగాధర్‌ ఇంకొంతమంది 2012 జనవరిలో అలిశెట్టి ప్రభాకర్‌ సంస్మరణ పెట్టేవరకు లబ్ధప్రతిష్టులైన ఆయన మిత్రులెవరికీ ఆయన స్మరణలో లేడు. బతికున్నప్పుడంటే తమకు పోటీ అవుతాడు కాబట్టి అలిశెట్టిని విస్మరించారు అనుకోవచ్చు. కానీ చనిపోయాక…అదీ 20 ఏండ్ల వరకూ ఆయన రచనలేవీ అందుబాటులో లేవు అంటే అలిశెట్టిని కవిగా ఖతం చేయడమే! ఇదే కాలంలో శ్రీశ్రీ రచనలు సమగ్ర సంపుటాలుగా విరసం, మనసు ఫౌండేషన్‌ వాళ్ళు ప్రచురించారు. అట్లాగే ఇప్పటికీ ఎవరో ఒకరు మహాప్రస్థానం ప్రచురిస్తూనే ఉన్నారు. ‘కవి’ అనే రెండక్షరాలతో ఇద్దరినీ పోల్చడం కాదు గానీ అలిశెట్టి కవిత్వం ఒక్కసారి చదివితే చాలు నిద్రాణంగా ఉన్నవాణ్ని సైతం నినాదమై మేల్కొల్పుతుంది

ఈ మేల్కొలుపు కవిత్వానికి పునాది జగిత్యాలలో పడింది. అలిశెట్టి 1974 నుంచి కవిత్వం రాస్తున్నా, 1978 జగిత్యాల జైత్రయాత్రలో ఔట్‌సైడర్‌గానే ఉన్నడు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆనాడు తెలంగాణ కవుల రచనలు అతి తక్కువగా పత్రికల్లో  ప్రచురితమయ్యేవి. అడపా దడపా దాశరథి, సి.నారాయణరెడ్డి రచనలు మాత్రమే పత్రికల్లో అచ్చయ్యేవి. అయితే ఈ స్థితిని అధిగమించేందుకు తెలంగాణలో కొంత ప్రయత్నం అన్ని జిల్లాల్లో జరిగింది. దీంట్లో భాగంగా జగిత్యాల కేంద్రంగా బి.నర్సన్‌, గంగాధర్‌, రఘువర్మ, ధరన్‌ బాబులు పత్రికల వారికి ప్రత్యామ్నాయంగా కవితా సంకలనాలు తీసుకురావాని సంకల్పించారు. అందుకే తామే సొంతంగా వివిధ ప్రాంతాల్లోని కవులకు ఒక వేదికగా ‘సాహితీ మిత్ర దీప్తి’ ని ఏర్పాటు చేసిండ్రు. దీని ద్వారా దీప్తి, చైతన్య దీప్తి తదితర ఐదు కవితా సంపుటాలు వెలువరించిండ్రు. ఇందులో రాష్ట్రేతర ప్రాంతాలకు చెందిన వారి కవిత్వంతో పాటు తెలంగాణాకు చెందిన రామాచంద్రమౌళి, నందిని సిధారెడ్డి లాంటి ఆనాటి యువ కవుల కవిత్వం కూడా చోటు చేసుకునేది. ఈ కవితా సంపుటాల ప్రచురణ, నిత్య కవితా పఠనం, సాహితీ మిత్ర దీప్తి దోస్తానా అలిశెట్టిని కవిగా నిలబెట్టింది. అందుకు ఆయన ఎదిగొచ్చిన సమాజం, ఎదుర్కొన్న ఒడిదొడుకులు పాఠాలను నేర్పాయి. ఏదైనా పని ముందటేసుకుంటే దాని అంతు చూసే వరకూ, లేదా సమస్యకు పరిష్కారం కనుక్కునే వరకు దాంట్లోనే మునిగిపోయేవాడు. అందుకే తాను చూస్తున్న సమాజంలోని రుగ్మతలకు వెంటనే రియాక్ట్‌ అయ్యేవాడు.

నిజానికి 1970 నుంచే దొరలు, భూస్వాములు నక్సలైట్‌ ఉద్యమం రూపుదిద్దుకోవడాని కన్నా  ముందే తమ పిల్లల చదువు కోసం గ్రామాల నుంచి పట్టణాల బాట పట్టిండ్రు. దాదాపు ఇదే సమయంలో అప్పటికే పట్టణ ప్రాంతాల్లోని బీసీలు మొదటిసారిగా టీచర్‌, క్లర్క్‌ లాంటి చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరిండ్రు. అట్లాగే ఉత్తర తెంగాణలోని రైల్వే ట్రాక్‌ వెంబడి ఉన్న పట్టణాల నుంచి సింగరేణికి వలసలు పెరిగినయి. ఈ కాలంలోనే అలిశెట్టి ప్రభాకర్‌ తండ్రి చినరాజం టీచర్‌గా పనిచేసేవాడు. ఆయన అలిశెట్టికి 15 ఏండ్ల వయస్సున్నప్పుడు చనిపోయిండు. అప్పటి నుంచి అన్నీ తానే అయి తల్లి లక్ష్మి పెంచింది. నిజానికి అప్పటికీ ఇప్పటికీ జగిత్యాలో పద్మశాలీలది పెద్ద జనాభా. ఎక్కువ మందికి బీడీల్జేసుడే వృత్తి. ఈ దశలో తాను పుట్టినప్పటినుంచి ఉన్న జగిత్యాల పట్టణానికి చుట్టు పక్కల గ్రామల నుంచి వలసొచ్చిన వెలమ దొరలు, వాళ్ళ కొడుకుల దబాయింపు, అజమాయిషీని, ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేక ప్రతిఘటించేవాడు. వాళ్ళ విచ్చలవిడితనం కూడా అలిశెట్టిని ప్రశ్నించేలా చేసింది. పిట్టపిల్ల కాయమైనా భౌతికంగా దాడిచేయడానికి కూడా వెనుకాడేవాడు కాదు. అందుకే అలిశెట్టి కవిత ‘రక్తరేఖ’లో ఇలా సాగుతుంది.

‘‘నువ్వు ఉరిమి చూసినప్పుడు

ఊరంతా పాలేర్లే

వాళ్ళే

ఊరినించి తరిమికొడితే

నీ బ్రతుకంతా పల్లేర్లే’’

అని దొరలను హెచ్చరించిండు. అలాగే నిరుద్యోగం గురించి..‘‘పుస్తకం లోంచి దులిపేసిన అక్షరాల్లా లక్షకి లక్షలు దేశమంతా నిరుద్యోగులై నిండుకున్నారు’’ అన్నడు. కవిత్వంలో రాజకీయాన్ని చీల్చి చెండాడిండు. తెలుగులో ఇంత పదునుగా రాజకీయ`కవిత్వం అల్లినవాళ్ళు అరుదు.

‘‘‘జలగాలు’ ‘బ్రహ్మ’జెముళ్ళూ

అవకాశవాది ‘రూలుకర్రా’

‘ఆరణాల కూలీ’

‘పునాది’లేని ‘భవనం’ నాచారం ‘సన్యాసులూ ’

వరుసగా ఎవరెవరు ముఖ్యమంత్రులైనా

ఇరవైనాలుగ్గంటలు కుట్ర ఇంకొకడ్ని ప్రమాణ స్వీకారం

చేయించినా-

అక్షరాలా అరాచకంలో మార్పుండదు’’ అని అంజయ్య, చెన్నారెడ్డి, ఎన్టీఆర్‌, నాదెండ్ల ఇలా ఆనాటి ముఖ్యమంత్రుల ముసుగుల్ని తొలగించిండు. వాళ్ళ ఆరాచకాల్ని చిత్రికగట్టిండు.

జగిత్యాలో ఉన్న సమయంలో అలిశెట్టి కవితలు రాయడం, పోస్టు చెయ్యడమే పనిగా పెట్టుకున్నడు. తాను అనుభవించిన పేదరికం, దగ్గర నుండి చూసిన అణగారిన వర్గాల వెతలే అక్షరాలుగా తెలుగు నేలంతా అలికిండు. ఆ పంట నుంచి ఒక్కసారైనా బువ్వ తినని కవులు లేరంటే అతిశయోక్తి కాదు. తన కవిత్వంలో మహిళల పట్ల ప్రేమ, ఆర్తిని కలగలిపిండు. కైగట్టిండు. దళిత, ముస్లిం, చేనేత, గౌడ బతుకుల వెతలను రాసిండు. రైతు, కార్మికుడు, విద్యార్థి, ఇలా అందరి గురించీ రాసిండు. నిత్య చైతన్యంతో ఎదిగి వచ్చిన ఒక తరానికి తన రాజకీయ కవిత్వాన్ని సమాజాన్ని శస్త్ర చికిత్స చేసేందుకు ఇన్స్‌ట్రుమెంట్సుగా ఇచ్చిండు. గుండె లోతుల్లోకి వెళ్ళి ఛిధ్రమౌతున్న సమాజాన్ని, అడుగంటుతున్న మానవీయ విలువల్ని హృదయంతో చూసిండు. రక్తంతో రాసిండు. అందుకే కవిత్వమంటే ఏమిటో తాను 1978లో ప్రకటించిన తొలి కవితా సంకనం  ‘ఎర్రపావురాలు’ లో

‘‘నా గుప్పిట్లో

మండుతున్నా

ఎన్నో గుండెలు …

ఒక్కొక్కదాన్లో

దూరి,  వాటిని చీరి ,

రక్తాశ్రువులు ఏరి

పరిశీలిస్తాను నేను’’ అన్నాడు. ‘’వర్తమానానికి భావితవ్యానికీ నడుమ // ప్రగతి వంతెన కట్టాలని అనుక్షణం// పరితపిస్తున్నాను అని రాసిండు .

పేదరికం, ఆకలితో సహవాసం చేయడాన్ని అలవాటు చేసుకున్నడు. నిరుద్యోగం, నగర జీవితం గురించి రాసిండు. మెజారిటీ ప్రజల బాధలూ గాధలే తన కవిత్వానికి ముడి సరుకని చెప్పుకున్నడు. ‘గొర్రె మందతో నడిచేకంటే.. చీమల బారులో చేరితే మేలు’ అనే సోయున్నవాడు. ‘కవిత్వం, జీవితం’ రెండూ వేర్వేరు కావని కవమనమల్లినవాడు. భావజాల వ్యాప్తికన్నా బాధితుల గుండె చప్పుడు వినిపించడానికే ఎక్కువ ఇష్టపడ్డడు. ఆఖరి వరకూ ఆత్మాభిమానంతో ఉన్నడు. అందుకే

‘‘చితికి…చితికి…చివరికి

పత్రిక పారితోషికమే జీవనాధారంగా

స్వీకరిస్తున్న నేపథ్యంలో

హృదయం విప్పి నన్నీ నాలుగు మాటలు

చెప్పుకోనివ్వండీ’’

అని రాసిండు.  సామాజిక స్పృహ ఉన్నవాడు కాబట్టే

‘‘గడ్డ కట్టిన కారంచేడు నెత్తుటి మడుగులో

అగ్రవర్ణాల అహంకారపు గొడ్డళ్ళు మునిగి

ఉపరితలమ్మీద

ఆరుగురి  హరిజనుల శిరస్సులు మొలిచి

హాహాకారాలు చేస్తుంటాయ్‌’’ అన్నడు.

అలిశెట్టి ప్రభాకర్‌ అర్దాంతరంగా ప్రయాణం ముగించినా… ఆయన వేసిన దార్లు ఇంకా కొత్తగానే ఉన్నాయి. ఈ దారుల్లో కొంతమంది ‘టేక్‌ డైవర్షన్‌’ అని కొత్తగా బోర్డులు పెట్టి తప్పుదోవ పట్టిస్తున్నవారూ ఉన్నరు. నిజానికి ఆయన గ్రామాల నుంచి నగరానికి దారులు వేసిండు. అక్షరాల్లో ‘సిటీ లైఫ్‌’ని చిత్రించిండు. అన్యాయం ఎక్కడ కనబడ్డా అక్షరాలనే గొడ్డళ్ళుగా చేసిండు. ఇవ్వాళ ఆయన్ని, ఆయన రచనల్ని ఆలింగనం చేసుకునే  సంస్థలు బాధ్యులూ ఎన్నడూ అలిశెట్టి కుటుంబం గురించి ఆలోచించలేదు. 1993లోనే కొంతమంది తెలంగాణ స్టూడెంట్‌ ఫ్రంట్‌ మిత్రులం ఆనాటి తెలుగు యూనివర్సిటీ వీసీ సి.నారాయణరెడ్డి మీద ఒత్తిడి తెచ్చి అలిశెట్టి అర్ధాంగి భాగ్యకు అటెండర్‌ ఉద్యోగమైనా ఇప్పించాం. ఇన్నేండ్లూ కంటెజెన్సీగానే కొనసాగుతున్న ఆమెను తెలంగాణ ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేసి, ఉండేందుకు ఇంత నీడ కల్పించాల్సిన అవసరమున్నది.

 

 

బతుకమ్మ మునిగింది

 

లోగో: భవాని ఫణి

 

కొన్ని కథలు అనుకోకుండా వెలుగులోకి వస్తాయి. కథల పోటీలూ నవలల పోటీలు ప్రకటించినపుడు పోటీ తత్వంతో రాసిన వాటిలో కొన్ని మంచి ప్లాట్స్ బయట పడతాయి. అలా వచ్చిందే ఈ “బతకమ్మ మునిగింది” నవల.నిజాం పాలించిన తెలంగాణా లో ఊరి పెద్దల దౌర్జన్యాలు వారసత్వంగా కొనసాగే రోజుల్లో చోటు చేసుకున్న కథ ఇది. ఈ నవల ను సాకేతపురి కస్తూరి 1992 లో ఆంధ్ర జ్యోతి నవలల పోటీ కోసం రాశారు. ఆ పోటీలో ఈ నవలకు ప్రథమ బహుమతి వచ్చింది.

సాకేత పురి కస్తూరి పల్లకీ, ఇతర వార పత్రికల్లో కథలు రాస్తూ ఉండేవారు. సీరియల్స్ కూడా రాసినట్లే ఉన్నారు. అయితే కొన్నేళ్ళ నుంచీ ఎక్కడా కనిపించడం లేదు, ఏమీ రాస్తున్నట్లు కూడా లేరు. వివరాలు తెలుసుకోడానికి ప్రయత్నించినా వీలు కాలేదు. నవల లో ఉన్న ఫోన్ నంబర్ ఎప్పటిదో 1996 నాటిది. ఎంత ప్రయత్నించినా ఆమె వివరాలు కనుక్కోలేక పోయాను. ఎవరికైనా తెలిస్తే పంచుకోవచ్చు.

ఏ నవల పరిచయం చేసినా, రచయిత/రచయిత్రి పాయింటాఫ్ వ్యూ, ఆ నవల గురించి వాళ్ళ సొంత భావనా తెలుసుకుని రాస్తే మరింత బాగుంటుంది.

ఈ నవల్లో కస్తూరి ఒక బోల్డ్ ప్లాట్ ఎన్నుకున్నారు ఒక స్త్రీకి సంబంధించి. ఒక వివాహితను ఒక ఊరిపెద్ద కిడ్నాప్ చేసి తీసుకు పోయాక కొన్నాళ్ళకి ఆమె ఆతనితో ప్రేమలో పడుతుంది. ఇది అత్యంత సహజంగా జరిగే ప్రక్రియ గా కస్తూరి చిత్రించడం వల్ల, కథా నాయిక పట్ల పాఠకుడికి ప్రేమే తప్ప కోపం కలగదు.

కథా కాలం వర్తమానం కాదని గుర్తుంచుకోవాలి. రచయిత్రి తెలంగాణాకు చెందిన వారా కాదా అనేది తెలీదు. కానీ, ఆమె భర్త వరంగల్ లో పని చేసే రోజుల్లో దశమి నాటి వెన్నెల్లో బతుకమ్మని పేర్చి దాని చుట్టూ పాటలు పాడుతూ తిరిగే ఆడపడుచుల్ని చూసిన క్షణం ఈ నవల కథ తన మనసులో మెదిలింది అని చెప్పారు ముందు మాటలో!

కథ ఒక పల్లెటూరు లో బతుకమ్మ పండుగ రోజు మొదలవుతుంది. వూర్లోని ఆడవాళ్లంతా చెరువులో బతుకమ్మల్ని వదలడానికి వెళ్ళినపుడు, మునుగుతూ తేలుతూ పోతున్న ఒక బతుకమ్మ దేనికో చిక్కుకుందని గుర్తించి దాన్నుంచి విడిపించే ప్రయత్నం చేస్తారు ఆడవాళ్ళంతా! ఆ ప్రయత్నంలో పసుపు పచ్చని పట్టుచీర కట్టి ఉన్న ఒక బండరాయి ని బయటికి తీయాల్సి వస్తుంది

ఆ చీర లక్ష్మిది

ఏడాది క్రితం చెప్పా పెట్టకుండా వూర్లోంచి మాయమైన లక్ష్మిది ఆ చీర! లక్ష్మి చచ్చి పోయి ఉంటుందనే అనుమానం అందరికీ ఉన్నా, ఆ అనుమానాన్ని ఎక్కడా బయట పెట్టే పరిస్థితులు గానీ, ధైర్యం గానీ అక్కడెవరికీ లేవు. ఆ చీర చూడగానే వాళ్ళకి కొంత అర్థమై పోతుంది. కానీ అది కూడా బయటికి అరిచి చెప్పే ధైర్యం లేదు. అందుకే “లక్ష్మి లచ్చుమమ్మగా వెలిసింది” అని ఆ రాయిని ఆ చీరతో సహా చెరువు గట్టున పెట్టి పసుపూ కుంకుమ పెట్టి దేవతను చేస్తారు.

లక్ష్మి అలా రాలి పోయి, దేవతగా అవతరించడానికి వెనక కథ వ్యధా భరితమైందే

తెలంగాణ లోని ఒక చిన్న పల్లెటూరులోని బ్రహ్మయ్య కూతురు పదహారేళ్ల లక్ష్మిని వేరే గ్రామానికి చెందిన స్వర్ణకారుడు లక్ష్మయ్య కి ఇచ్చి పెళ్ళి చేశారు. లక్ష్మికి సవతి తల్లి కావడంతో ఆ పిల్ల పడే బాధలు చూడలేక తండ్రి వీలైనంత త్వరగా పెళ్ళి సంబంధం వెదికి పెళ్ళి చేసి కాపరానికి పంపిస్తాడు. వరసకు చుట్టాలైన ఒకరిద్దరుతప్ప ఎవరూ లేని లక్ష్మయ్య భర్యను అపురూపంగా కాపురానికి తెచ్చుకుంటాడు. ఇంకా మొదటి రాత్రయినా  గడవని ఆ జంట కి అదిక జరగనే జరగని విపత్తు సంభవిస్తుంది. ఆ వూరి పెద్ద దొర రామచంద్రా రెడ్డి చుట్టాల పెళ్ళి వేరే వూర్లో మరో మూడు రోజులో జరుగుతుండటంతో నగలు చేయడానికి అతన్ని అప్పటికపుడు తమతో రమ్మంటారు.

ఎదురు చెప్పలేక, తప్పని సరి పరిస్థితుల్లో లక్ష్మయ్య భార్యను పక్కింటి పోచమ్మ, లక్ష్మయ్యకు వరసకు చెల్లెలైన చుక్కమ్మల సంరస్ఖణ లో వదిలి రెడ్డి తో పెళ్ళికి వెళ్తాడు.

చుక్కమ్మ అందమైన  పడుచు. ఆమెగురించి వూళ్ళో ఎవరికీ సదభిప్రాయం లేదు. ఎందుకంటే ఆమెకు రామ చంద్రారెడ్డి దొర తో శారీరక బంధం ఉంది. చుక్కమ్మ లక్ష్మికి తోడు గా ఉంటూ, లక్ష్మయ్య మంచివాడనీ, అతనితో సఖ్యంగా ఉండి జీవితాన్ని సుఖంగా మల్చుకోమనీ పసితనం వీడని లక్ష్మికి దాంపత్య జీవితం పట్ల ఆసక్తిని కల్గించేందుకు ప్రయత్నిస్తుంది.

రోజూ వూళ్ళోని చెరువు కి నీళ్ళు తేవడానికి తనతో పాటు లక్ష్మిని తీసుకుపోతుంది చుక్కమ్మ. బంగారు రంగుతో బారెడు జుట్టుతో దేవకన్యలా ఉన్న లక్ష్మిని చూసి వూళ్ళో అంతా అబ్బురపడి మనసులో దిగులు పడతారు “దొర కళ్లలో పడిందంటే ఈ పిల్ల బతుకేమవుతదో” అని. లక్ష్మి చెరువులో చేపపిల్లల్లే ఈత కొడుతుంటే చుక్కమ్మ ఆశ్చర్యపడుతుంది. తనకు మాత్రం నీటిగండముందని ఎవరో చెప్తే నమ్మి నీటి వైపు కూడా పోదు.

వూర్లో ఆడవాళ్ళంతా చుక్కమ్మ మంచిది కాదని , దొరతో దానికి సంబంధం ఉంది కాబట్టి దానితో తిరగ వద్దని లక్ష్మి కి హితబోధ చేస్తుంటారు గానీ లక్ష్మి పట్టించుకోదు

ఒకరోజు  చుక్కమ్మ కనిపించని కారణాన, ఒక్కతే పోవడానికి ఇష్టపడక లక్ష్మి పోచమ్మ కొడుకు మల్లిగాడితో చెరువుకి బయలు దేరి వెళ్తుంది. నిండుగా ఉన్న చెరువుని  చూసి సరదా పడి , మల్లి గాడిని చింతకాయలకు  పంపి ఈతకి దిగుతుంది. గంటల తరబడి ఈతకొట్టి కొట్టి అలసి పోతుంది. కట్ట మీదుగా వెళ్తున్న చంద్రారెడ్డి దొర కళ్ళ బడనే పడుతుంది. బంగారు చేపల్లే ఈదుతున్న ఈ సౌందర్య రాశిని చూసి అలాగే కట్టుబడి పోతాడతడు. కాసేపలాగే చూసి చెరువులో అవతలి వైపు దిగి ఈదుకుంటూ వచ్చి లక్ష్మి ని అడ్డగిస్తాడు. ఆ తర్వాత లక్ష్మి ఎంత గింజుకున్నా లాభం లేకపోతుంది. పురుష స్పర్శే ఎరగని లక్ష్మి ని బలాత్కరించి, సొమ్మసిల్లిన లక్ష్మిని చెరువు గట్టున పారేసి పోబోతాడు. ఎవరో వస్తున్న అలికిడి కావడంతో ఆమెను వెనుక తుప్పల్లో పడేయాలని తీసుకు పోతాడు. స్పృహ తప్పి పడున్న లక్ష్మిని పరిశీలనగా చూసిన రెడ్డి ని లక్ష్మి కనుముక్కు తీరు , శరీర సౌష్టవం ముగ్ధుడిని చేస్తుంది

“తీస్క పోయి తోట బంగళాల పెడతా, ఎవరేమంటరో జూస్తా” అని బుజాన వేసుకుని తీసుకు పోయి ఇంటి పక్కనే ఉన్న తోట బంగళాలో గదిలో పడేస్తాడు

తోటకి కాపలాగా పెట్టిన మల్లమ్మ, ఆమె కొడుకు వీరన్నలని పిల్చి గదిలో ఉన్న పిల్లకి ఏం కావాలో చూడమని, జాగర్తగా చూసుకోమని ఆదేశిస్తాడు. “ఎవరీ పిల్ల దొరా? సెర్లో పడ్డదుండీ?” అని మల్లమ్మ అడిగితే “ఔ, లచ్మయ్య పెండ్లాం ఇక సెర్లో పడిన లెక్కనే” అని చెప్తాడు. లక్ష్మి కి స్పృహ వచ్చాక జరిగింది తెలిసి ఏడ్చి గోల చేస్తుంది గానీ ఆమె గోడుని పట్టించుకునే నాథుడు లేడు. మల్లమ్మ ఎంతగా నచ్చజెప్పినా వినదు.

నీళ్ళకు వెళ్ళిన లక్ష్మి బిందె గట్టునే ఉంది గానీ లక్ష్మి జాడ లేక పోవడంతో లక్ష్మి చెర్లో పడి కొట్టుకు పోయిందని ఊర్లో అందరూ నిర్ధారణకొస్తారు. అయితే చుక్కమ్మ నమ్మదు. ఈత బాగా వచ్చిన లక్ష్మి చెరువులో ఎలా కొట్టుకు పోతుందని సందేహంతో చెరువు గట్టున మొత్తం వెదుకుతూ పోతుండగా లక్ష్మి కాలి పట్టీ దొరుకుతుంది. అది పట్టుకుని ఎందుకో అనుమానం వచ్చి దూరంగా చెట్ల మధ్యలో కనిపిస్తున్న  చంద్రారెడ్డి దొర తోట బంగ్లా కంచె దగ్గరికి వెళ్ళి చూస్తే బంగ్లా గదిలో లక్ష్మి! గుస గుస గా ఎంత పిల్చినా లక్ష్మికి వినపడదు! ఎలుగెత్తి పిలిచే పరిస్థితి లేదు. ఈ లోపు పెళ్ళి నుంచి తిరిగొస్తున్న చంద్రా రెడ్డి, వీరన్నలు చుక్కమ్మని చూడనే చూస్తారు.

తనను ఇష్టంతో దగ్గరికి తీసుకునే దొర ఇంకో స్త్రీని, అందులోనూ లక్ష్మిని తెచ్చాడంటే చుక్కమ్మ నమ్మలేక పోతుంది. “మా కులం ల పుట్టుంటే నిన్ను గూడా లగ్గం చేసుకునేటిదుందే చుక్కీ” అని మరులు గొల్పిన దొర, ఒక్కరోజు తను తోటకి రాక పోతే “రాత్రి రాక పోతివి తోటకి? నీ కోసం నడిజాము దాక జాగారం చేస్తూ కూచుంటి చుక్కీ”అని నిష్టూరాలు పోయిన దొర..

లక్ష్మి కి కొత్తగా పెళ్ళయిందని, తననేమీ చేయొద్దని, పై పెచ్చు తాను చంద్రా రెడ్డి వల్ల గర్భవతినయ్యాయని చెప్పి కాళ్లమీద పడి వేడుకుంటుంది

“నీ అసుంటి చెడిన దాని బిడ్డకి నేనెట్ల తండ్రైతనే” అని ఈసడిస్తాడు దొర.”లచ్మి సంగతి గానీ ఊర్ల ఎవరికైనా చెప్పినవంటే, రేపీయేల కి పాలెం చెర్ల నీ పీనుగ బతకమ్మ లెక్క తేలి ఆడతది, యాదుంచుకో” అని హుంకరిస్తాడు.

బతుకమ్మని పీనుగతో పోల్చినందుకు చుక్కమ్మ అగ్రహోదగ్రురాలై చంద్రా రెడ్డిని నానా శాపనార్థాలు పెడుతూ ఊర్లోకి పరిగెత్తి ఎలుగెత్తి అందర్నీ పేరు పేరునా పిలుస్తూ లక్ష్మి దొర చెర లో ఉన్న సంగతి అరిచరిచి చెప్తుంది. అందరూ గుండెలుగ్గబట్టుకుని ఇళ్ళలో వుండే వింటారు తప్ప ఒక్కరూ బయటికి రారు. రాలేరు. ఈ లోపు దొర మనుషులు వెంటాడటం తో చుక్కమ్మ చెర్లో దూకి మునిగి పోతుంది. నీటి గండముందని భయపడిన చుక్కి నీటికే బలై పోతుంది. ప్రేమను నమ్మిన చుక్కమ్మ జీవితం ఎవరికీ అర్థరాత్రి నీళ్లలో ఆమె భయపడినట్టే ముగిసి పోతుంది.

వూరునుంచి తిరిగొచ్చిన లక్ష్మయ్య కి పోచమ్మతో సహా మిగతా జనమంతా నెమ్మది మీద విషయం చెప్పి అతడికి పోచమ్మ కూతురితోనే పెళ్ళి చేసి వేరే వూరికి పంపేస్తారు.

ఈ విషయం మల్లమ్మ ద్వారా తెలుసుకుని లక్ష్మి కుమిలి పోతుంది.”నా మొగుడికి నేనంటే ఎంతో ఇష్టమనుకున్నాను, ఎంతో ప్రేమ ఉందనుకున్నాను. నన్ను ఎలా  మర్చిపోగలిగాడు” అని ఎంత ఏడ్చినా లాభం లేక పోతుంది.

ఇంత జరిగాక ఇక వూరిలో తాను చచ్చిన దానితో జమ అయినట్టే అని గ్రహిస్తుంది. ఇక లక్ష్మికి దొరని అంగీకరించడం తప్ప వేరే గత్యంతరం లేక పోతుంది. మల్లమ్మ మంచి మాటలతో లక్ష్మి మనసుని మళ్ళిస్తుంది. “దొరకి నువ్వంటే ఎంతో ఇష్టం! నీ కోసం చీరలు నగలు తెస్తాడు. మనిషి మాత్రం ఎంత బాగున్నాడో చూడు. ఆయన్నే నమ్ముకో! సంతోషంగా కాపురం చెయ్యి. నీకిక బయట జీవితం లేదు, నీ మొగుడు కూడా ముట్టక ముందే దొర తెచ్చాడు నిన్ను. నిన్ను మొదట తాకింది దొరే! ఇక ఈయనే  మొగుడనుకో” అని వాస్తవాన్ని వివరంగా చెపుతుంది.

కాలం గడిచే కొద్దీ చంద్రా రెడ్డినే భర్తగా భావిస్తూ,ప్రేమిస్తూ అతనికి వశమై పోతుంది లక్ష్మి. చంద్రా రెడ్డి ఎప్పుడూ స్త్రీలను వాడి పడేసే రకమే తప్ప ఇలా ప్రాణ ప్రదంగా ప్రేమించే అవకాశ్సం ఏ స్త్రీకీ  ఇచ్చినవాడు కాక పోవడంతో లక్ష్మి ప్రేమ అతనికి కొత్త, వింత అనుభూతిని కల్గిస్తుంది. లక్ష్మి ప్రేమలో పిచ్చి వాడై, వేరే స్త్రీల జోలికి కూడా పోకుండా ఎక్కువ కాలం తోట బంగ్లాలోనే గడపటం మొదలు పెడతాడు. సర్వస్వం లక్ష్మే అతనికిప్పుడు

ఈ సంగతి వూర్లో కూడా న్యూస్ అవుతుంది. లక్ష్మి దొరని వల్లో వేసుకుని పూర్తిగా వశం చేసుకుందనీ,పట్టు చీరెలు నగలు మోయలేక పోతుందనీ, త్వరలోనే దొరని దివాలా తీయించడం ఖాయమనీ, లక్ష్మి ఇంత గుండెలు దీసిన బంటని తాము ఊహించలేదనీ, దొర భార్య ఉసురు లక్ష్మికి తగిలి నాశనమౌతుందనీ .. ఎన్నో మాటలు. ఒకప్పుడు వీళ్ళే లక్ష్మి బతుకుని రెడ్డి దొర నిలువునా నాశనం చేశాడనీ, పూవు లాంటి లక్ష్మి దొర కాళ్ల కింద నలిగిందనీ, నలిపిన దొర దాన్ని విసిరి బయట పారేస్తాడనీ ఆవేదన చెంది జాలి చూపించిన వాళ్ళు. వాళ్ళు ఆశించినట్లు జరగక దొర లక్ష్మిని నెత్తిన పెట్టుకున్నపుడు విస్తుపోయి లక్ష్మి నాశనం కావాలని ఆశిస్తారు

లక్ష్మి ఎంత చెప్తే అంత అన్నట్టు నడుస్తున్నాడు రెడ్డి.

అయితే పార్వతమ్మ అన్న నాగిరెడ్డి దొర చుట్టపు చూపుగా వచ్చి లక్ష్మి మీద కన్నేసిన నాటి నుంచీ లక్ష్మి కి కష్టాలు ప్రారంభమవుతాయి. చంద్రా రెడ్డి ఉండబట్టి ఆమె వైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేక పోతాడు.

రెడ్డి భార్య పార్వతమ్మకి అతని వ్యవహారాలు అలవాటే కాబట్టి అతనితో ఏ సంబంధమూ లేక ఒక కప్పు కింద ఉంటుందంతే! వూర్లో గుడి ని రెడ్డితో చెప్పి బాగు చేయిస్తుంది లక్ష్మి. అలాగే దేవదాసి నాగరత్నం ని తిరిగి  బంగళా వైపు చూడకుండా చేసి పంపేస్తుంది. రెడ్డి ఇదివరకటి అహంకారి కాదు. ప్రతి దానికీ అంతెత్తున ఎగిరి పడే అతను సౌమ్యంగా మారి పోతాడు. ఇదంతా లక్ష్మి చలవే అని భావించి పార్వతమ్మ లక్ష్మి మీద అభిమానంగా ఉంటుంది.

కొన్నాళ్ళకి పార్వతమ్మ తనకీ లక్ష్మి కీ కలిపి బట్టలు ఇతర వస్తువులు తెప్పించేంత దగ్గరవుతుంది లక్ష్మి కి. ఆమెను తనతో పాటు వూరి జనం మధ్యలోకి బతకమ్మ ఆడటానికి గౌరవంగా తీసుకుపోతుంది పార్వతి. మొగుడు ఉంచుకున్న దాన్ని తనతో పాటు వూరి మధ్యలోకి తెచ్చిన పార్వతిని గురించి వింతగా చెప్పుకుంటారు జనం

అయితే బతకమ్మ పండగ రాత్రి వెన్నెల్లో తోట బంగ్లాకి బయలు దేరిన చంద్రా రెడ్డికి చుక్కమ్మ దెయ్యమై తనను వెంటాడుతున్న భ్రమ కల్గుతుంది. వెన్నెల్లో చెట్ల నీడలు చూసి జడుసుకుంటాడు. చుక్కమ్మ తన ఎదురుగా నిల్చుని మాట్లాడుతుంది. అతడు తనకు చేసిన ద్రోహానికి బదులు తీర్చుకోక వదిలి పెట్టనంటుంది. నీ శవం బతుకమ్మ వోలె నీళ్ళలో తేలిస్తా చూసుకోమని వెంటబడుతుంది. ఆ భ్రమలో చంద్రా రెడ్డి భయపడి చెరువు కట్ట మీద పరిగెడుతూ, పట్టు తప్పి చెరువులో పడి పోతాడు. ఎంతటి ఈతగాడైనా, చుక్కమ్మ దెయ్యం తనను చంపబోతున్నదన్న భయంతో నీళ్ళలోంచి బయటికి రాలేక చెరువులోనే ప్రాణాలు వదిలేస్తాడు.

ఆ తర్వాత జరిగిన పరిణామాలేమిటి? లక్ష్మి ఎలా మరణించాల్సి వచ్చింది. ఆత్మ హత్య చేసుకుందా హత్య చేశారా? Concubine ముద్ర వేయించుకున్నా ఒకడితోనే చివరి వరకూ ఉండి పోయిన లక్ష్మి కథేమైంది?నిజంగా చంద్రా రెడ్డి ని చంపింది చుక్కమ్మ దెయ్యమేనా? కాక పోతే ఆ వేషంలో వచ్చిందెవరు?

మల్లమ్మ వీరన్నలేమయ్యారు? ఈ నవల తిరిగి ప్రచురణకి వస్తే ఇవన్నీ అందులో చదవొచ్చు. నిజానికి ఈ నవల తిరిగి ప్రచురణ కావడానికి ఇది సరైన సమయం కూడానేమో, మల్లమ్మ గతమేమిటి?

ఈ నవలలో కథ చాలా చాలా బలమైనది. తన ప్రమేయం లేకుండా అన్యాయమై పోయిన ఒక యువతి కథ. దొరల చరిత్రలో ఒక మామూలు పేజీ. నేల పాలై రాలిన జీవితాల్లో ఒక నిర్భాగ్య జీవితం లక్ష్మిది.

ప్రతి పాత్రనూ రచయిత్రి సజీవంగా చిత్రీకరిచడానికి వీలైనంతగా ప్రయత్నించారు. లక్ష్మి, పార్వతి, రాంచంద్రా రెడ్డి,నాగి రెడ్డి , మల్లమ్మ, వీరన్న ప్రతి పాత్రా పాఠకుడిని ఆకర్షిస్తుంది. మల్లమ్మ వీరన్నల కథలోని మలుపు కొంత సినిమాటిక్ గా అనిపించినా అది కూడా దొరల వారసత్వపు  దౌర్జన్యాలకు అద్దం పట్టేదే కాబట్టి కథకు అతికేదిగానే ఉంటుంది తప్ప, విడిగా తోచదు.

ఇది సినిమాగా తీసి హిట్ చేయగలిగినంత గొప్ప కథ. అయితే కథనంలో గానీ భాషలో గానీ బలం లేదు. రచయిత్రి మాటల ప్రక్రారం ఆమె వరంగల్ లో నివసిస్తున్నపుడు చుట్టు పక్కల జరిగే బతకమ్మ సంబరాలు చూసి ప్రేరణ పొంది నవల రాశారు. అంతే తప్ప ఆమెకు తెలంగాణా మాండలికంతో  దగ్గరి పరిచయం ఉన్నట్టు కనిపించదు, పైగా నవల లో మాండలికాన్ని ప్రభావశీలంగా ప్రయోగించలేక పోయారనేది స్పష్టంగానే తెలుస్తుంది. సంభాషణలన్నీ తెలంగాణా భాషలోనే నడిచినా, కథ నెరేషన్ మాత్రం (పత్రికల) ప్రామాణిక భాషలోనే నడుస్తుంది. అందువల్ల కథ ఎంత బలమైనదైనా, ఒకరకమైన తేలిక దనం నవలంతా పరుచుకుని ఉంటుంది. నవలలో ని నేటివిటీ కూడా తెలంగాణా దే అని తెలియజెప్పే శిల్పం ఎక్కడా కనిపించదు. వూరు చెరువు తప్ప మిగతా జన జీవనం ద్వారా తెలంగాణా పల్లెను స్ఫురింపజేయలేక పోయారు. తెలంగాణా ప్రాంతపు సంభాషణలన్నీ ఆమె అదే భాషలో రాయడానికి ప్రయత్నించి దాదాపుగా 90 శాతం సఫలమయ్యారు గానీ, గాఢత కనిపించదు.

బలమైన కథకు తగ్గట్టు మిగతా అంశాలన్నీ అమరి ఉంటే ఇది చాలా పేరు తెచ్చుకుని ఉండేది. సీరియల్ గా ఆంధ్ర జ్యోతిలో ప్రచురితమైనపుడు ఆసక్తి కరమైన కథ కోసం ప్రతి వారమూ పాఠకులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసేలా చేసిన నవలే!

బహుమతికి ఎట్టి పరిస్థితిలోనూ ఇది అర్హమైన నవల. రచయిత్రి ఆచూకీ తెలిసి ఉంటే ఈ నవల గురించి మరిన్ని విశేషాలు తెలిసి ఉండేవి.

ఎక్కడైనా పాత పుస్తకాలమ్మే చోట్ల దొరికితే తప్పక చదవండి

*

సిస్టర్ అనామిక

Art: Satya Sufi

తని
రెండు రెక్కల్లో చేతులు ఉంచి
టాయిలెట్ సీట్ నుంచి లేపి
పళ్ళుతోమి స్నానం చేయించి
ఒళ్ళుతుడిచి బట్టలు తొడిగి
జాగ్రత్తగా నడిపించి
మంచంపై పడుకోబెట్టి
“మీ అబ్బాయి రమ్మంటున్నాడని అన్నారుగా
వెళ్ళొచ్చు కదా?” అందామె
మాత్రలు వెతుకుతూ
నీటిపొర నిండిన కళ్ళతో
సీలింగ్ కేసి చూస్తూ ఉండిపోయాడతను
ఫోన్ కూడా చేయటం మానుకొన్న
బబ్లూ గాడిని గుర్తుచేసినందుకు.
*

పాపం పాకావిలాస్‌..!

 

కేరళా పాల్ఘాట్‌ నించి పారొచ్చేరు. తమిళ కంచినించి కదిలొచ్చేరు. కన్నడ బళ్లారినుంచి దౌడాయింపుతో వచ్చేరు. వచ్చి వచ్చి చోడవరంలో పడ్డారు. అంతా అయ్యర్ల మేళమే. ఊరి బస్టాండ్‌లో సోమయ్యరు పాల్ఘాట్‌ కాఫీభవన్‌ తెరుచుకుంది. చినబజార్‌లో తంబీ హోటల్‌ మెరిసింది. కొత్తూరులో గణపతీవిలాస్‌ గలగలమంది. లక్షిందేవిపేట సిగన కేశవ్‌కేఫ్‌ కుదురుకుంది. పోలీస్‌ ఠాణా ఎదురుగా మణికంఠా లంచ్‌హోమ్‌ రెడీ అయ్యింది.

పచ్చగా దోసపళ్లలా ఉండీవారు వచ్చిన అయ్యర్లు. విభూది పిండికట్లు ఒళ్లంతా పెట్టి, పాలతెలుపు పంచెలుకట్టి, భుజంమీద పట్టువాణీలు పెట్టి, రుద్రాక్షపూసలదండలు మెళ్లో చుట్టి, అప్పుడే కైలాసంనించి దిగొచ్చిన శంభోశంకరుని ప్రతినిధుల్లా ఉండీవారు. స్ఫటికాల్లాంటి వాళ్లరూపాలు చూసే మేం సగం పడిపోయేం. ఆనక వాళ్ల మాట తీరు మమ్మల్ని మరో సగం వొంచీసింది. వాళ్ల మర్యాద, మన్నన పూర్తిగా దిగలాగీసింది. వాళ్లు మాట్లాడే పగిలిన తెలుగు మమ్మల్ని ముచ్చటపరిచీసింది.

అయితే, వాళ్లొచ్చీదాకా మావూరి జనానికి అల్పాహారం గురించి స్వల్పంగా నయినా తెలీదని కాదు. మేం మరీ అంత దారుణంగా బతుకుతున్నామనీ కాదు. పెద్దబజార్లో పద్మనాభుని బుల్లబ్బాయి కాఫీహోటల్‌ మాకు తెలియందా. పీర్లపంజా దగ్గర్లోని కురందాసు పాపారావు పాకావిలాస్‌, ఎడ్లవీధిలో సింహాచలం నాయుడు తాటాకు వొటేలు తెలీకనా. తాలూకాఫీస్‌ పక్కనుండే అమ్మాజమ్మ టీ దుకాణం, ఫకీర్‌సాహెబ్‌పేట దార్లో ఉండే ఇప్పిలి మోహనరావు టీకొట్టూ, పూర్ణా సినీమాహాలు దరినున్న అగ్గాల సన్నాసి గొడుగుబండి మా బుర్రలో లేకనా. ఇవన్నీ  బాగానే తెలుసును. వీటన్నిట్లోనూ మేం తిన్నవాళ్లమే. కాపోతే, అయ్యర్లొచ్చేక  మా తిండి మొత్తం తిరగబడిపోయింది.

అప్పటివరకూ, పాపారావు పాకావిలాస్‌లో ముగ్గురు చేరేరంటే, నాలుగోవాడు నిలబడే  తినాలి. పదేళ్ల కిందట నేయించిన తాటాకు పైకప్పునుంచి నల్లటి నుసి గోధుమరంగు ఇడ్డెన్ల మీద పడుతున్నా భరించాలి. పోనీ అని సింహాచలం టీ దుకాణానికి వెళ్లేవనుకోండి. అక్కడ గోలెంలోని కుడితినీళ్లలాటి తెల్ల జలాల్లో అందరు తిన్న సివరి ప్లేట్లూ ముంచితీసీడవే. అన్నీ ఎంగిలిమంగలాలే. సర్వమంగళ మాంగల్యమే. అమ్మాజమ్మ టీ చిక్కం కుట్టించింది ఎప్పుడో ఎవడికీ తెలీదు. అది నల్లపీలికలా అయిపోయి మా చిన్నప్పటినించీ డికాషను ఒడకడుతూనే ఉండీది. సన్నాసి కొట్టూ తక్కువకాదు. అంచులన్నీ  చుట్టుకుపోయిన లొత్తల పేట్లుండీవి. మోహనరావు  వొటేల్లో కూర్చునీ కుర్చీకి మూడు కాళ్లు పొడవు. ఒక  కాలు కురచ. పద్మనాభునివారు ఉప్పుపిండి తప్పనిచ్చి మరోటి వడ్డిస్తే ఒట్టు. రుచుల సంగతి చెప్పుకుందావంటే అవీ నేలబారే. ఎక్కడికెళ్లినా ప్లేట్లో ఇడ్లీ పడీడం. వాటి మీద వేపిన శెనగపప్పు టుర్రు చెట్నీ పోసీడం. ఆటు మీదట పసుపుపచ్చ బొంబాయి చెట్నీ ఒలిపీడం. పోనీ అని, చెమ్చాతో తిందామని నోరుతెరిచి అడిగితే, చెయ్యిలేదేటి.. అనీది సమాధానం.  అన్ని పచ్చళ్లూ మీద పడిపోయిన ఇడ్లీలు ఎలా ఉండీవంటే, గంధాలు మెత్తిన సింహాద్రప్పన్న నిత్యరూపంలా ఉండీవి. ఏడాదికోమారయినా అప్పన్నబాబు నిజరూపాన్ని సింహాచలంలో చూడొచ్చు. మా ప్లేట్లో ఇడ్లీలెప్పుడూ మాక్కనబడిందే లేదు. అన్నీ కలిపికొట్టీసీ కావేటిరంగా అనీడవే. మూతి తుడుచుకుని పోడవే.

అట్టు విషయమైతే అసలు చెప్పక్కర్లేదు. అది మినపట్టో, రవ్వట్టో, పెసరట్టో నరమానవుడు పోల్చలేడు. ఉల్లిపాయుంటే అది ఉల్లి అట్టు. జీలకర్ర కనబడితే అది పెసరట్టు. అలా అంచనాగా అనీసుకోడవే. ఉప్మా అంటే గోడకి సినీమా పోస్టర్లు అంటించుకునీ బంకలాగుండీది. పీటీ ఉషలాగ పరిగెడుతుండీది. అయితే ఒకటి లెండి. మేవిచ్చీ పావలాకీ, బేడకీ అంతకంటే ఎవడు పెట్టగలడు లెండి. పైగా ఈ ఫలహార దుకాణాలు నడిపీవాళ్లంతాను, ఏరోజుకారోజు సామాన్లు తెచ్చి చేసీవాళ్లే.  డబ్బున్నవాళ్లేం కాదు. కాబట్టి మాటిమాటికీ కుర్చీలు కొత్తవి ఎలా కూర్చగలరు. బెంచీలు ఎలా మార్చగలరు.

అయ్యర్లు వచ్చేక మాకు కొత్త తిండి సంగతులు కొంచెంబానే తెలిసినట్టయింది. మాకు తెలీని మద్రాసు సాంబారు ఘుమఘుములు ముక్కుకు తగీలివి. వేడివేడి సాంబారిడ్లీ జుర్రుకు తినీసీవాళ్లం. సింగిలిడ్లీ.. బకెట్‌సాంబారు.. నినాదం ఒక జాతీయవిధానంగా మావూళ్లో స్థిరపడిపోయిందప్పుడే. అట్టు అనే మా మాట ఎక్కడికి పోయిందో తెలీదు. దోశ పదం దొరసానయింది. రవ్వదోశ, మావుదోశ, పెసరదోశ మాముందుకు వచ్చీవి. మామూలు ఉప్మా ఉండీదా. అది అయ్యర్ల చేతుల్లో పడ్డాక టమాటా బాత్‌ అయిపోయీదంటే నమ్మండి. ఎన్నడూ పెద్దగా ఎరగని మసాలాదోశ, తైర్‌వడ, బోండా, పొంగలి మానోటికి అందీసీటప్పటికి లజ్జుగుజ్జులు పడిపోయీవాళ్లం.

మసాలాదోశలోకి కూర ఎలా చేరిందో, గారెలోకి పెరుగు మరెలా దూరిందో, బోండాలోకి  బంగాళాదుంప ఇంకెలా చొచ్చుకుపోయిందో.. బాపతు సందేహాలతో మా ఊరి ముసిలాళ్లు కొందరు అదోలా అయిపోయీవారు. చెట్నీ వ్యవహారమూ చిన్నది కాదు. కొబ్బరి చెట్నీ అంటే కొబ్బరికాయ పచ్చడే తప్పనిచ్చి శెనగపప్పు పెద్దగా తగిలీదికాదు. వేగిన ఉల్లిపాయతో చేసిన సరికొత్త చెట్నీ చేతులోకొచ్చేక ఎవరి మాట మేం వినగలవండీ. మేమెప్పుడూ ఎరగని రసం ఉండనే ఉంది. అవియల్‌, పొరియల్‌ సిద్ధమయ్యేయి. స్వీట్లు, డ్రింకుల సంసారం గురించి చెప్పాంటే మాటలు చాలవు. జాంగ్రీలు, బాద్‌షాలు, బాదంగీర్లు రాజ్యం చేసీవి. కవురుకంపు టీలు తాగిన మాకు అయ్యరుబాబులు కమ్మని కాఫీ కప్పులు నోటికందించేరు. మా కళ్లముందే కాఫీగింజలు మిషన్లలో ఆడి ఫిల్టర్లకెత్తీవారు.

వాళ్ల శుచి, వాళ్ల శుభ్రతా మామూలేంటి. పరిమళాలు వెదజల్లే ఊదొత్తులు వెలిగించేరు. పొందికయిన కుర్చీలు వేసేరు. పాలరాతి పలకలున్న ఒబ్బిడి టేబుళ్లు పరిచేరు. తళతళలాడే స్టీల్‌ప్లేట్లు మాముందుపెట్టేరు. అందుకే, మేవంతా నిత్యమూ అయ్యర్ల హోటళ్లమీదేమీదనే ఉండీవాళ్లం. ఆ దెబ్బకి ఊరి పాకావిలాసున్నీ విలాసం లేకుండా పోయేయి. మామూలుగానే ఎప్పుడూ ఈగలు ముసురుకునీ ఈ హొటేళ్లు, ఒక్కసారిగా దోమలు కూడా తోలుకోడం మొదలెట్టేయి. ఒక్కడంటే ఒక్కడూ వాటి మొహం చూసీవాడు కాదు. అరువిద్దామన్నా వచ్చీదాతాదైవం కనిపించలేదు. మరంచేతే, అనతి కాలంలోనే, వీటిని నడిపేవాళ్లంతా  నిలువూ నిపాతంగా నీరయిపోయేరు. అడ్డంగా మునిగిపోయేరు. చెట్టోపిట్టగా ఎగిరిపోయేరు.

అయ్యర్ల భోజనసామ్రాజ్యం ఊళ్లో ఆ విధంగా నాలుగైదు దశాబ్దాలు నడిచింది. ఒక్కరిగా వచ్చిన అయ్యరు బాబులు, వాళ్ల దేశాలెల్లి పెళ్లిళ్లు చేసుకుని అడ్డబొట్టు కామాక్షమ్మల్ని తీసుకొచ్చేరు. చిమ్మిలి ముద్దల్లాంటి విశాలాక్షమ్మల్ని తెచ్చుకొచ్చేరు. పిల్లల్ని మాత్రం మావూళ్లోనే కన్నారు. వాళ్లూ చోడవరం గుంటల్లో ఒకటయిపోయేరు.

తొలినాళ్లలో వచ్చిన అయ్యర్లు,  తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం కలగలిపీసీవారు. సంకరభాషగా పనగలిపీసీవారు. ఆ తర్వాత మాత్రం మన భాషా నేర్చీసేరు. అయినప్పటికీ వారి పలుకుల్లో అరవయాస, మయాళీ ఘోష కనిపించీది. వాళ్ల  పిల్లలు మా మధ్యలో పడ్డారు కాబట్టికి, ఏట్రా, గీట్రా అని మాలానే మాటాడీవారు. అలా హాయిగా సాగిపోతున్న అయ్యర్లకి పదిపదిహేనేళ్ల కిందటినించీ గొప్ప దెబ్బతగుల్తూ వచ్చీసింది.

ఎక్కడినుంచో వెళిపొచ్చీసిన వాళ్లెవరో ఆంధ్రాలో రాజ్యం చేయడమేంటని అనుకున్నారో.. తిండికి మించిన వ్యాపారం మరోటి ఉండదని తలపోసారో.. మనవాళ్లని తినే హక్కు మనకే ఉందని భావించారో..  మనకి తెలీదు.  కృష్ణా, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్నించి ఎవరెవరో పరుగుల మీద మావేపు వచ్చీసేరు.  రియల్‌ఎస్టేట్‌ ధర్మమాని వాళ్ల ఊళ్లో ధరలు పెరిగిన ఊర భూములు కొన్నింటిని భారీ డబ్బుసంచుకి అమ్మీసుకున్నారు. భవిష్యత్తులో బాగుపడిపోతుందనుకున్న విశాఖపట్నం ప్రాంతానికి వెల్లువెత్తీసేరు. ఉత్తరం పత్తరం లేకుండా మా ఉత్తరానికొచ్చి పడిపోయేరు.

వచ్చినవాళ్లు పట్టణాలకే కాదు. పల్లెలకీ పాకీసేరు. వాళ్లకి డబ్బంటే భయం లేదు. రిస్కంటే రస్కంత ఇష్టం. అడ్డంగా సొమ్మొచ్చి పడిపోతే ఆలోచన సరళమైపోతుంది. ఇందువల్లే, ధనాన్ని వెదజల్లీగలిగేరు. నెల్లూరుమెస్‌ అన్నారు. బెజవాడహోటల్‌ అన్నారు. గూడూరుసదన్‌ అన్నారు. గుంటూరుగృహ అన్నారు. ఒంగోలు కాఫీహౌస్‌ అన్నారు. మెస్‌ మీద మెస్‌ పెట్టీసేరు. మెస్సు సంస్కృతి మాకు మప్పీసేరు. నీరు పల్లమెరుగు. నీరు లాంటిదే పెట్టుబడీను. దానికీ పల్లమే తెలుసు. పల్లంలోకి ప్రవహించి పదింతలు కావడమే తెలుసు. చోడవరం కూడాని పల్లంలోనే ఉంది కదేంటి.

మెస్సు వస్తాదులు వస్తూవస్తూ కొత్తరుచులు వెంటతెచ్చీసేరు. మా అయ్యర్లకి బొక్క బద్దలయిపోయింది. విజయవాడ ఉలవచారు ముందు చెన్నై సాంబారు చెదిరిపోయింది. గుంటూరు గోంగూర దెబ్బకి అవియల్‌ అయిపులేకుండాపోయింది. కృష్ణా పులుసుకూరలు హూంకరించీసరికి పొరియల్‌‌ పులిసిపోయింది. నెల్లూరు మొలకొలుకుల ముంగిట కళింగ హంస బియ్యాలు  కడదేరిపోయేయి. ఎర్రగా వర్రగా నోటికి తగిలే అల్లం పచ్చడి ముందర మద్రాసు శాకం చిన్నబోయింది. ఫ్రైకర్రీ ముఖం చూ సీసరికి అరవ కొబ్బరికూర హడలెత్తిపోయింది. చుక్కకూర పప్పు పుల్లపుల్లగా విరగబడ్డంతో అయ్యరుగారి ముద్దపప్పు ముణగదీసుకుపోయింది. చివరాఖరికి, చవులూరించే సరికొత్త పాకం ముందు పాల్ఘాట్‌ పడకేస్సింది.  అయ్యర్లు వెజిటేరియన్లు. మెస్సుయితే నాన్‌ వెజ్జూ వడ్డించగవు. అయ్యర్లకి అరువివ్వడం భయం. మెస్సులు అరువు ఇవ్వాగగలవు.  అరిచి రిచి వసూలు చేసుకోనూగలవు. దానాదీనా, ఊరి జనం నాలుకలన్నీ కొత్తవేపు మొగ్గుచూపించేయి. మా అయ్యర్ల హోటళ్లన్నీ బోసిపోయేయి. లాభం లేకపోతే పోయే. నష్టాలు తగులుకోడం మొదలయ్యింది.

మావూళ్లో అయ్యర్లు ఎంత సంపాదించుకున్నా ఎప్పుడూ గజం భూమి  కొనలేదు. మెస్సు మారాజులు అలా కాదు. రూపాయొచ్చినా స్థలాలే కొనీవారు. మజ్జిగచార్లు గట్రా మాచేత మట్టసంగా తాగించీసి, మాభూములే క్రయిచీటిలు రాయించీసుకునీవారు. ఇంకోమాట ఏంటంటే, అలగ.. ఇలగ.. ఎలగ..  అని మాట్లాడే మా సొంత మాటలకి బదులుగా, అట్టాగ.. ఇట్టాగ.. ఎట్టాగ.. అని మేవందరూ కొత్త పలుకు నేర్చడమూ ఆ మహానుభావుల పుణ్యమే. వాళ్ల తెలివితేటలకి, వ్యాపారదక్షతకి మోకరిల్లిపోయి, ఆ మాటలే అసలైన తెలుగుభాషని మావూళ్లో చాలామంది అనుకోపోలేదు కూడాను.

తమ హోటళ్లు ఆకులు నాకి పోతూ, మెస్సులన్నీ కస్టమర్లతో కళకళలాడిపోతున్న తరుణంలో, దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకునే తత్వంగల అయ్యర్లకి లైటు వెలిగింది. చోడవరంనించి పొందింది చాలనుకుంటూ తమ సొంత ప్రదేశాలకు ప్రయాణాలు కట్టీయాలని నిర్ణయించీసుకున్నారు. మెల్లగా దుకాణాలు మూసీసి, వచ్చినంతకే కుర్చీలు, బెంచీలు మెస్సుల వాళ్లకే అమ్మీసుకుని బయలెల్లిపోడం ఆరంభించేరు. ఎక్కడ చదువుతున్న పిల్లల్ని అక్కడే ఉద్యోగా లు చూసుకోమన్నారు. లేదా వ్యాపారాలు పెట్టుకోమన్నారు. చదువూసంధ్యాలేని కుర్రాయిల్ని   చోడవరంలోనే తగలడమన్నారు. వాళ్లిక్కడే గంతకి తగ్గ బొంతల్ని లవ్‌మేరేజ్‌లు గట్రా చేసుకుని మెస్సుల్లోనే సూపర్‌వైజర్లుగా, వెయిటర్లుగా స్థిరపడిపోయేరు. పూలమ్మినచోట కట్టెలమ్మడమూ ఒక కళే అనీసుకున్నారు.

చోడవరం నుంచి ప్రయాణం కట్టిన కొందరు ముసలి అయ్యర్లు ఓపికలు పోయి, మోకాళ్లు వీకయిపోయి, ఉన్నదేదో బ్యాంకులో వేసీసుకుని, కంచి కోవెల్లో పూజార్లయిపోయేరు. మరికొందరేమో పాల్ఘాట్‌ వెళ్లిపోయి  కాఫీగుండ దుకాణాలు తెరుచుకున్నారు. మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే, ఇప్పుడు ఒక్కటంటే ఒక్క అయ్యరు హోటలూ మావూళ్లో భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. అయితే,  ఒకటి మాత్రం నిజం. పాకావిలాసుల్ని అయ్యర్లు సాగనంపీగలిగేరు. అయ్యర్లని మెస్సులు తగిలీగలిగేయి. కానీ, మెస్సుల్ని దారిపెట్టీడం మటికి అంత సులువుకాదు. అలుణ్ని బలుడు కొడితే, బలుణ్ని బ్రెమ్మదేవుడు కొడతాడంటారు. అలాంటిదేదో జరగాలంతే..!

*

 

 

తూరుపు గాలులు ( పెద్ద కథ – రెండో భాగం )

2

వంశధారనది ఒడ్డునేఉన్న శాలివాటిక (శాలిగుండం, శాలిహుండం) విహారంలో బసచేసి కళింగపట్నంనుండి సింహళద్వీపానికి వెళ్ళే ఓడల నిమిత్తమై భోగట్టాచెయ్యగా, కొద్దిరోజుల క్రితమే వాడబలిజీలఓడ ఒకటి సింహళదేశపు తూర్పుతీరానికి పయనమైపోయిందనీ, అయితే ఓ పారశీక ఓడ, నబోపాడా (నౌపాడా) ఉప్పుగల్లీలలో పండిన ఉప్పుని నింపుకొంటున్నదనీ, మరోరెండువారాల్లో త్రికోణమలై (ట్రింకోమలీ)కి బయిల్దేరబోతున్నదనీ తెలియవచ్చింది. ఆ తరువాత మళ్ళీ ఇప్పట్లో సింహళదేశంవెళ్ళే ఓడలేవీ లేవన్నారు. ప్రయాణానికయ్యే కేవు తాము చెల్లిస్తామని స్థానికవర్తకులు ముందుకొచ్చారు. పారశీక నఖోడా (ప్రధాన వర్తకుడు, ఓడ యజమాని) కేవు తీసుకోకుండా ముగ్గురుభిక్షువుల్నీ త్రికోణమలైవరకూ తీసుకెళ్లేందుకు సంతోషంగా అంగీకరించాడు. లంగరెత్తి, పైకి మడిచికట్టిఉన్న తెరచాపల్నిదింపి గాలివాటానికి అనుకూలంగా తిప్పగానే అవి పూర్తిగా విచ్చుకున్నాయి. ఓడ నైరుతిదిశగా రివ్వున ప్రయాణించసాగింది. తూర్పుగాలులు బలంగా వీస్తున్నాయి.

ఆచార్యశాంతిదేవునికీ అతనిశిష్యుడు గుణసేనుడికీ సముద్రప్రయాణం చేసిన అనుభవం ఉన్నదిగాని, దీపాంకరుడికది పూర్తిగాకొత్త. మొదటిరెండురోజులూ నౌకఊగిసలాటతో అతడు చాలాఇబ్బందిపడ్డాడు. తిన్నా, తినకపోయినా వాంతులయ్యాయి. నీరసంగా పడుకున్నాడు. రెండురోజులూ రెండుయుగాల్లా గడిచాయి. ‘భగవంతుడా, ఇంకా ఎన్నాళ్ళిలా?’ అనుకున్నాడు. మధ్యమధ్యలో  నఖోడావచ్చి భిక్షువుల యోగక్షేమాలు విచారిస్తూనే ఉన్నాడు. అరబ్బుసరంగు అబూ సయ్యద్ నిమ్మకాయి ముక్కలు తెచ్చిచ్చాడు. వాటిని చప్పరిస్తే వాంతులు కట్టేస్తాయన్నాడు.

“పైకివచ్చి చూడు, సముద్రం ఎంత ప్రశాంతంగా ఉందో” అన్నాడు సరంగు – సంభాషణ అంతా సైగలతోనే.

మూడోరోజున ధైర్యంచేసి తమకిచ్చిన చీకటిగది నుంచి బయటకువచ్చి సముద్రాన్ని పరికించాడు. అరబ్బు, పారశీక నావికులు అతన్నిచూసి నవ్వుతూ పలకరించారు. పల్చని నీలాకాశపు పైకప్పుకింద కనుచూపుమేర అన్నివైపులా గాఢనీలిరంగులో పరుచుకున్న  సముద్రం; అక్కడక్కడా తెల్లటినురగలుకక్కుతూ చిరుకెరటాలు.  ఉప్పుగాలి దీపాంకరుడి మొహాన్ని మెత్తగా తాకుతూంటే అతనికొక అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. తన జీవితంలో ఒక నూతనాధ్యాయం తెరుచుకోబోతున్నదనే భావన అతనిలో బలంగామెదిలింది. మొదటిసారిగా పరిసరాలను ఆసక్తిగా గమనించసాగాడు. సముద్రతలాన్ని చీలుస్తూ ఓడ ముందుకుసాగుతూంటే గలగలమంటూ పక్కగాతాకే కెరటాల సవ్వడి, గాలివేగంలో, దిశలో మార్పులువచ్చినప్పుడల్లా తెరచాపలు కాసేపు కొట్టుకొని మళ్ళీ పూర్తిగా తెరుచుకునేటప్పుడు చేసే ‘ఫట్, ఫట్’ మనే శబ్దం,  ఓడ నెమ్మదిగా ఊగుతూంటే తడిసిన కొయ్యపలకలు, తెరచాపస్తంభాలు, కప్పీలూ, మోకులూ కలిసికట్టుగా ‘కీ…..కట…కట…కట…..కీ…..’మంటూ రాత్రనక, పగలనక నిరంతరంగా చేసే మూలుగుధ్వనులు, నావికులకు సరంగు అబూ సయ్యద్ చేసే హెచ్చరింపులు, నఖోడా, మౌలీంల ఆదేశాలు, నావికుల జవాబులు, తెరచాపల్ని గాలివాటాన్నిబట్టితిప్పి, తిరిగికడుతున్నప్పుడల్లా  “అరియా ……అబీస్……..వదార్”  – ఇవన్నీ నేపధ్యంలో వినిపిస్తున్నాయి.

ఇంతలో చుక్కానిపట్టుకున్న నావికులు కేక పెట్టారు, “కిర్రష్!, కిర్రష్!! (సొరచేపలు! సొరచేపలు!!)”

దీపాంకరుడు అటుగా చూశాడు. ఉదయపుటెండలో వెండిమెరుపుల్లా గిరికీలుకొడుతూవచ్చి ఓడను చుట్టుముట్టిన సొరచేపల గుంపు.  అంతవరకూ తెరచాపలు బాగుచేసుకుంటూ, తాళ్ళుపేనుతూ, వంటవాడికి సాయంచేస్తూ తమతమ పనుల్లోఉన్న ఓడకళాసులందరూ హడావిడిగా లేచివచ్చి గుమిగూడారు. వాళ్ళఅరుపులతో, కేకలతో వాతావరణం ఉద్రిక్తమైంది.  ఒక యువకళాసీ తెరచాపకి అడుగుభాగానఉండే రాటమీదెక్కి దానిఅంచువరకూ నడుచుకుంటూ వెళ్ళాడు. మిగతావాళ్ళు కేరింతలతో, హర్షధ్వానాలతో అతన్ని ప్రోత్సహిస్తున్నారు. ముదుసలి సరంగు అబూ సయ్యద్ మాత్రం కొన్నిదశాబ్దాలుగా ఉప్పుగాలితాకి నెరిసిన గెడ్డంతో, ముడుతలుపడ్డ తన మొహంలో ఏ భావనాలేకుండా, కుళ్లాయి (ముసల్మానులు ధరించే చిన్న అల్లికటోపీ)ని తీసి గుండునిమురుకుంటూ గమనిస్తున్నాడు; అతడిలాంటివి చాలా చూశాడు. తెరచాప అంచుకిచేరి తాడు పట్టుకొని రాటమీద నిల్చున్న ఆ యువకుడికి ఎవరో ఒక ఈటెను అందించారు. ఆ ఈటెకు ఒకతాడు వదులుగా కట్టిఉన్నది. నౌక ఊగుతున్నది. ఆ సాహసి కాలుజారిపడ్డాడంటే తిన్నగావెళ్లి సొరచేపల మధ్యలో పడతాడు. అతడు గురిచూసి విసిరిన ఈటె నేరుగా ఒక సొరచేప పొట్టను ఛేదించింది. నీళ్ళలో రక్తం చిమ్మింది. సొరచేప కొట్టుకుంటూ ఉంటే నురగ. నావికుల ఉత్సాహం, కేరింతలు. కొంతమంది చివరన వలకట్టిఉన్న పొడుగాటికర్రని తీసుకొచ్చి నీటిమట్టానికి చేరువగా నిలిపారు. యువకుడు ఈటెను పైకి లాగి ఒక్క ఊపుతో సొరచేపను నావలోనికి విసిరాడు. వల అవసరంలేకపోయింది. చెక్కబల్లలపైనపడ్డ చేపబలంగా కొట్టుకోసాగింది. నావికులు ఉడుపుగా దాని తోకనుపట్టుకొని, తలను కాళ్ళతో తొక్కిపట్టి కట్టడిచేశారు. అలాగే మరో రెండు చేపల్ని పట్టుకున్నారు. నాలుగవది ఈటెదెబ్బ తినికూడా తప్పించుకొని పారిపోయింది. సొరచేపలగుంపు వచ్చినంత అకస్మాత్తుగానే మాయమైంది. ఆరోజు దొరికిన చేపల్నికోసి, పులుసు వొండే కార్యక్రమంలో నిమగ్నమైనారు – వంటవాడూ, అతని సహాయకులూ.

ఆరోజున సాయింత్రం కూడా దీపాంకరుడు పైకి వచ్చి పడమటిదిక్కున సూర్యాస్తమయం సృష్టించిన అద్భుత దృశ్యాన్ని చూస్తూ మైమరచిపోయాడు. అటుగా వెళ్తూన్న మౌలీం (ప్రధాన నావికాధికారి, కప్తాను) దీపాంకరుడిని చిరునవ్వుతో పలకరించాడు. అతడు చాలాసార్లు కళింగపట్నం, మచిలీపట్నం వెళ్లి ఉన్నాడు; తెలుగు కొద్దిగావచ్చు.

“నీటి రంగు మారింది, చూశారా?” అన్నాడు.

నిజమే, దీపాంకరుడు గమనించనే లేదు. “ఎందుచేత?” అనడిగాడు. మౌలీం చాలా కష్టపడి ఒక పక్క సౌంజ్ఞలు చేస్తూ వచ్చీరాని తెలుగులో చెప్పిన బదులుకి సారాంశం: “నరసాపురం, అంతర్వేది దాటుతున్నాం; గోదావరి సముద్రంలో కలిసే చోటు. పెద్దనదులు సముద్రంలోకలిసేచోట్ల నీటిరంగు కొంచెం బురదగాఉన్నట్టు కనిపిస్తుంది – ఆ నదులు మోసుకొచ్చే ఒండ్రుమట్టి మూలంగా”.

“అంటే మనం తీరానికి బాగా దగ్గరలోనే ఉన్నామా?”.

“అవును”.

“అయినా ఎటుచూసినా సముద్రం; ఎక్కడున్నామో మీకెలా తెలుస్తుంది?”.

“తీరానికి దగ్గరలోఉన్నప్పుడు తరచూ కొండలూ, గుట్టలూ, చెట్లూ, చేమలూ  కానవస్తాయి. ఈ ప్రాంతంలోలేవుగాని, కళింగపట్నం నుండి కోరంగివరకూ కొండలు కనిపిస్తూనే ఉన్నాయి; మీరప్పుడు పైకిరానేలేదు. ఒక్కోచోట స్తూపాలూ, గుళ్ళూ, గోపురాలూ ఉంటాయి. నీటిరంగునుబట్టి, నీటిలోకొట్టుకొచ్చే చెట్లకొమ్మల్నిచూసి, పక్షుల్ని, అవిఎగిరే దిశల్ని గమనించి, గాలివాటంలో వచ్చేమార్పుల్నిబట్టి, ప్రవాహాలను పరిశీలించి, దొరికేచేపల్నిబట్టి, లోతుని కొలిచికూడా తీరానికి ఎంతదూరంలోఉన్నామో అంచనావెయ్యవచ్చు. ఇంకాచాలా సూచనలుంటాయి”.

దీపాంకరుడిలో కుతూహలం పెరిగింది. “తీరానికి బాగాదూరంగా, నడిసముద్రంలో ఉంటేనో?”.

“నావికుడి నైపుణ్యానికి అత్యున్నతమైన పరీక్ష అదే. ముఖ్యంగా రాత్రిపూట. అలాంటప్పుడు నక్షత్రాలను చూసి తెలుసుకుంటాం. మేఘాలుకమ్ముకుంటే అది సాధ్యంకాదు. మీకు అర్థంఅయ్యేలాచెప్పాలంటే చాలారోజులు పడుతుంది. సాయింత్రపు నమాజ్ కాగానే సొరచేప పులుసుతో భోజనం చెయ్యడానికి వంటవాళ్లు రమ్మంటున్నారు. మీరూ పదండి”. అన్నాడు మౌలీం నవ్వుతూ.

“సూర్యాస్తమయం తరవాత మేము ఏమీ తినం. అయినా నేను శాకాహారిని. మన్నించండి”.

మౌలీం చుక్కానివైపుగా వెళ్ళిపోయాడు. పడమటివైపున సూర్యుడు అస్తమించాకకూడా నారింజకాంతులు మేఘాలను ముద్దాడుతున్నాయి. తూర్పువైపున చీకట్లు ముసురుకుంటున్నాయి; తొలిచుక్కలు మిణుక్కుమంటున్నవి. మౌలీం ఆదేశంమేరకు సరంగు అబూ సయ్యద్ చుక్కానివద్దనున్న గంటనుమోగించి మక్కా వైపుగా చెయ్యెత్తి చూపించాడు. నావికులందరూ అటువైపుగా తిరిగి, చాపలుపరుచుకొని ప్రార్థనకుపక్రమించారు. కొద్దినిముషాల్లో నమాజ్ పఠనం పూర్తయింది. “అల్లాహో అక్బర్, అల్లాహో అక్బర్” అని బిగ్గరగాఅంటూ ప్రార్థనలు ముగించారు. నూనెదీపాలు వెలిగించి అవిర్లుకక్కుతూన్న వేడివేడి వరన్నంతో కమ్మటివాసనలను వెదజిమ్ముతూన్న సొరచేపలపులుసు తినేటందుకు కలిసికూర్చున్నారు. వాళ్ళ హాస్యాలూ, నవ్వులూ లీలగా వినిపిస్తున్నాయి.

దీపాంకరుడికి అంతవరకూతెలియని ఒక కొత్తప్రపంచానికి తెరతీసిన ఆ నావికులపట్ల అతనికుండిన గౌరవం పదింతలు పెరిగిపోయింది. ‘భిక్షువుని కాకపోయుంటేగనక నావికుడినై సముద్రాల్నిశోధించి ఉందును’ అనుకున్నాడు – తమకిచ్చిన కొట్టుగదికి వెళ్తూ. భోజనాలుకాగానే ఒకనావికుడు తంబూరావాయిస్తూ తన ప్రియురాలిని గుర్తుచేసుకుంటూ ఒళ్లెరగని పారవశ్యంతో ఓ పారశీక విరహగీతాన్ని పాడసాగాడు. రోజంతాపడ్డ కష్టాన్నిమరచి మిగతావాళ్ళు ఉత్సాహంగా వంతపాడుతున్నారు. బాగా నానిపోయిన కొయ్యపలకలూ, తెరచాపస్తంభాలూ, కప్పీలూ, మోకులూ సమిష్టిగా నేపధ్యసంగీతాన్ని ఆలాపిస్తున్నవి – ‘కీ……కట…కట…కట…కీ……’. నావ సుతారంగా ఊగిసలాడుతూ, చీకటిసముద్రాన్ని చీలుస్తూ ముందుకి కదులుతోంది.

***

ముగ్గురుభిక్షువులూ తమకిచ్చిన చిన్నగదిలోనే తామువెంటతెచ్చుకున్న చిన్న బుద్ధవిగ్రహాన్ని ప్రతిష్టించుకున్నారు. రోజుకి మూడుసార్లు ప్రార్థనల్లోనూ, మిగతా సమయం ధ్యానంలోనూ గడపసాగారు. ఆచార్యశాంతిదేవుడే ప్రార్థనలను జపించడంలో ముందున్నాడు. మంద్రస్థాయిలో అతడు ఉచ్ఛరించే ప్రార్థనలు మొదట్లో దీపాంకరుడికి బొత్తిగా అర్థంఅయ్యేవికావు. అతనికి తెలిసిన ప్రార్థనలకు భిన్నమైనవిగా వినిపించాయి. వారంరోజులపాటు వినగా, వాటిల్లో పాళీభాషాపదాలు ధ్వనిస్తున్నట్టుగా అతనికి తోచింది. అదేమాట శాంతిదేవునితో అంటే, అతడు నవ్వి,

“మొత్తం అంతా పాళీ భాషే, అయితే సింహళయాసతో మేళవించిన పాళీ” అన్నాడు – దీపాంకరుడిని ఆశ్చర్యపరుస్తూ.

“అయితే ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏదీలేదు. తథాగతుని బోధనలను, త్రిపిటికానియామాలనూ వాటి మూల రూపాన్ని, సారాన్ని కాపాడుకుంటూ, ఎటువంటి మార్పులూచేర్పులూ చెయ్యకుండా అత్యంతస్వచ్ఛమైన ప్రామాణికతను కాపాడుకుంటూ వస్తూన్నది సింహళ థేరవాదమే. ఈ విషయంలో సింహళభిక్షువులు, పౌరులూ కూడా ఎంతో గర్వపడుతూంటారు; కొద్ది రోజుల్లో నువ్వే చూస్తావు”.

దీపాంకరుడు పూర్తిగాకోలుకున్నాడని గమనించిన శాంతిదేవుడు, తమ దేశంలోని సమకాలీన పరిస్థితులగురించి, బౌద్ధసంప్రదాయాలగురించి కొన్నివివరాలు అతనికి తెలియజేయ్యాల్సిన సమయం ఆసన్నమైందని భావించాడు.

“పద, ఈ చీకట్లోంచి పైకిపోదాం, మంచిగాలీ, వెలుతురూ ఉంటాయి” అన్నాడు.

శాంతిదేవుని వెంట నడిచాడు దీపాంకరుడు.

“మౌర్యవంశాన్ని అంతంచేసి చక్రవర్తిగా ప్రకటించుకున్న  బ్రాహ్మణసేనాపతి పుష్యమిత్ర శుంగుడు అశ్వమేధయాగం చేసి మీదేశంలో బౌద్ధాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు అనేకవిధాలుగా ప్రయత్నించాడని మనగ్రంధాలు తెలుపుతున్నాయి. భిక్షువుల తలలునరికి తెచ్చినవాళ్ళకు బహుమతులు ప్రకటించాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మొదట పుష్యమిత్రశుంగుడు, ఆ తరవాత – వంగదేశానికి చెందిన మరో బ్రాహ్మణరాజైన శశాంకుడు బౌద్ధాన్ని అన్నివిధాలా తొక్కిపెట్టారు. పురాతన బోధివృక్షాన్ని నాశనం  చేశారు; మీదేశస్థులు దానికొమ్మల్ని మళ్ళీమళ్ళీ పాతుకుంటూ కాపాడుకున్నారు. అయితే మాదేశంలోమాత్రం అశోకుని సంతానమైన మహేంద్రుడు, సంఘమిత్రలు తీసుకొచ్చిపాతిన మహాబోధివృక్షపు అంటు మహావృక్షంగామారి ఇప్పటికీ అనురాధపురంలో సురక్షితంగా, సజీవంగా ఉన్నది. దాని మహిమలు అన్నీఇన్నీ కావు”.

ఈ విషయాలన్నీ దీపాంకరుడు విన్నవీ, చదివినవీ;  నాలందాలో ఉండగా బౌద్ధచరితాధ్యయనంలో భాగంగా తెలుసుకున్నవీ. అయనా శాంతిదేవుడు చెబుతూన్నతీరుకు ముగ్ధుడై, ‘ఇతడు మంచి అధ్యాపకుడు’ అని మనసులోఅనుకుంటూ వింటున్నాడు. ఎవరెంత ప్రయత్నించినా నాశనంకాకుండా నిలిచి, వేళ్ళూని, సదా విస్తరించే  బోధివృక్షం బౌద్ధానికి చిహ్నంగా, ప్రతీకగా ఎందుకు నిలిచిందో అతనికి మరోకోణంలో అర్థంఅయింది. ఆచార్య శాంతిదేవుడు చెప్పుకుంటూ పోతున్నాడు –

“….అందుచేత చెప్పొచ్చేదేమంటే ఏవిధంగా చూసినా బౌద్ధం తన మూలస్వరూపాన్ని సింహళదేశంలోనే నిలబెట్టుకుంది. అంతేకాదు సింహళంనుండీ, భారతఖండపు తూర్పుతీరంనుండీ జావా, సుమాత్రా దీవులకీ,  శ్యామదేశానికీ (సయాం, థాయ్ లాండ్), బాగాన్ రాజ్యానికీ (బర్మా, మియన్మార్) థేరవాద విస్తరణ జరిగింది – దాన్ని కొందరు హీనయానంఅని తప్పుగా వ్యవహరిస్తున్నారు. నిజానికి మేము ఆచరిస్తున్నదే అసలుసిసలైన బౌద్ధం. అందుకే ఆ బౌద్ధాన్నికాపాడడం తమకు ప్రసాదించబడిన పవిత్రమైన బాధ్యతఅని మాపాలకులు భావిస్తారు. అలాగే మా రాజులు తథాగతుని దంతాన్ని వెయ్యికళ్ళతో కాపాడుకుంటూ వస్తున్నారు. అది ఎవరి ఆధీనంలోఉంటే వాళ్ళే సింహళదేశ పాలకులు అవుతారు. ఇది నమ్మకం మాత్రమేకాదు, వాస్తవం కూడా”.

“ఆచార్యా, నాలందానుపోలిన మహోన్నతజ్ఞానకేంద్రాన్ని స్థాపించాలని మీరెందుకంతగా తపిస్తున్నారో నాకిప్పుడు బాగా అర్థంఅవుతోంది. మీవిహారంలోని బోధనాకేంద్రంగురించి, అందులో నేనుచేపట్టాల్సిన బాధ్యతలగురించి చెప్పండి” అన్నాడు దీపాంకరుడు ఉత్సాహంగా.

“చెబుతాను. అయితే అంతకన్నా ముందుగా మరికొన్ని విషయాలు చెప్పాలి. సుమారు వందేళ్ళక్రితం సింహళదేశం మూడురాజ్యాలుగా ముక్కలైంది. ఏభైఏళ్ళపాటు అంతర్యుద్ధం చెలరేగింది. పొలోన్నరువపట్టణం ఒక రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఆ రాజ్యపురాజు, పరాక్రమబాహుడనే సార్థకనామధేయుడైన చక్రవర్తి,  మళ్ళీ దేశాన్ని ఐక్యపరచి తన పాలనకిందికి తీసుకొచ్చాడు. చోళులకు శత్రువులైన పాండ్యరాజులపక్షాన నిలబడి బాగాన్ రాజ్యంపై తన నౌకలతో దాడిచేసి ఆరాజ్యాన్ని నియంత్రించాడు. ఎన్నో ప్రజాహితకార్యక్రమాలు చేపట్టాడు. ఇప్పుడు మేముండే ఉత్తరారామాన్ని అతడే స్థాపించాడు. అనురాధపురాన్ని పునరుద్ధరించాడు. తథాగతుని దంతాన్ని అనురాధపురం నుండి పొలోన్నరువకు తీసుకొచ్చి దానికొక గుడి కట్టించాడు. ముఖ్యంగా బౌద్ధం విషయానికివస్తే, ఎంతో దూరదృష్టితో ముక్కలైన బౌద్ధధర్మాన్ని ఒకతాటిపైకి తీసుకొచ్చాడు. బిక్షువులు పాటించవలసిన నియమాలను ప్రకటించాడు. దుర్మార్గులైన, అవినీతిపరులైన భిక్షువులను వెళ్ళగొట్టాడు, శిక్షించాడు”.

“భిక్షువుల్లో దుర్మార్గులూ, అవినీతిపరులూనా?” దీపాంకరుడి ఆశ్చర్యానికి అంతులేదు.

“భిక్షువులుకూడా మనుషులే. మనుషులన్నాక అన్నిరకాలవాళ్ళూ ఉంటారు. అందరిలాగే పరిస్థితులనుబట్టి నడుచుకుంటారు. ముఖ్యంగా రాజపోషణ, రాజ్యాధికారాలకు దగ్గరవుతున్నకొద్దీ ఆధిపత్యం కోసం జరిగే పెనుగులాటలో కలుగజేసుకొనే అవకాశాలు, అవసరాలు ఏర్పడతాయి. వాటికి సామాన్యప్రజల నిత్యజీవితాల్ని శాసించగల పరిస్థితులు తోడ్పడతాయి. సన్మార్గంనుండి దూరంకావడానికీ, అవినీతికి లొంగిపోవడానికీ ఆకర్షణలు కూడా ఎక్కువవుతాయి. ఇటీవలకాలంలో తగ్గుముఖం పట్టిందిగాని, పరాక్రమబాహుడు సంస్కరణలు అమలుచేసే నాటికి బౌద్ధసంఘం అస్తవ్యస్తంగా మారింది. స్త్రీలతో సాంగత్యంచేసి పిల్లల్నికన్న భిక్షువులూ, ఆచార్యులూ తయారయ్యారు. చాలామంది భిక్షువులు విసిగిపోయి సంఘాన్ని విడిచిపెట్టి సంసారులుగా మారిపోయారు. మీ దేశంలో బౌద్ధానికి ఈమధ్యకాలంలో అధికారపీఠానికి చేరువలో మెలిగే పరిస్థితులుగాని, జనబాహుళ్యంలో సంచరించే సందర్భాలుగాని  లేకపోయాయిగనుక మీకెవ్వరికీ ఈ దుర్గతి అనుభవంలోకి రాలేదు”.

శాంతిదేవుని మాటలు దీపాంకరుడికి కొత్తగా ఉన్నాయి. అర్థంఅవుతున్నట్టుగానే ఉన్నాయిగాని పూర్తిగా తెలియ రావడంలేదు. ఏమనాలో తోచలేదు. కాసేపుఆగి, “ప్రస్తుతం అధికారంలో ఉన్నది పరాక్రమబాహుడేనా?” అన్నాడు.

“కాదు. దురదృష్టవశాత్తూ ఆయన సుమారు ఇరవైఏళ్లక్రితం చనిపోయాడు. ఇప్పుడు తిరిగి కొంత అనిశ్చిత, సంక్షోభం ఏర్పడ్డాయి. దక్షిణభారతదేశాన్నిపాలించే  పాండ్యరాజుల దృష్టి మాదేశంపైన పడింది. పూర్వం చోళుల ఆక్రమణ నుండి బయటపడ్డాం; ఇప్పుడు పాండ్యులు దాడికి సిద్ధమౌతున్నారనే వదంతులు వింటూన్నాం. ఏదిఏమైనా, బౌద్ధాన్ని కాపాడే రాజులు బలంగా ఉండాలి; వారి రాజవంశాలు చిరకాలం కొనసాగాలి. వాళ్ళు ధర్మాన్ని రక్షిస్తారు, ధర్మం వాళ్ళని రక్షించాలి. అందుచేత ఏదో ఒకమేరకు ఉన్నతస్థాయిలోని బౌద్ధనాయకత్వానికి రాజకీయ చదరంగంలో, ఎత్తుగడల్లో తలదూర్చడం తప్పనిసరి అవుతుంది”.

‘రాజవంశాల్నికాపాడడం?……బౌద్ధనాయకత్వం?…..రాజకీయ చదరంగం?….ఎత్తుగడలు?’ దీపాంకరుడి అంతా అయోమయంగా ఉంది. అతడు చదివిన బౌద్ధగ్రంధాలలో గాని, నాలందాలోచేసిన అధ్యయనంలోగాని ఈ విషయాలు ఎన్నడూ ప్రస్తావించబడలేదు. దీపాంకరుడి మొహంలో సందేహఛాయల్ని గమనించిన శాంతిదేవుడికి అవసరమైనదానికన్నా  ఎక్కువగా మాట్లాడానేమో అని అనుమానం కలిగింది. సర్దిచెప్పడానికి –

“అయితే ఈ విషయాలన్నీ మనబోంట్లకు ముఖ్యంకాదు; మనం పట్టించుకోనక్ఖరలేదు. వాటిని పట్టించుకొనే వాళ్ళు వేరేఉంటారు. మనదృష్టిని కేవలం అధ్యయనంమీదా, బోధనాకేంద్ర నిర్మాణంమీదా పెడితే సరిపోతుంది” అన్నాడు.

“అవిమాత్రం రాజుల సహకారం, నిధులులేకుండా సాధ్యం అవుతాయా?” అన్నాడు దీపాంకరుడు. అతనికి కాస్తంత బోధపడుతున్నది. చుట్టుపక్కలఉన్న వందగ్రామాల నుండేవచ్చే ఆదాయాన్ని నాలందాకు ధారాదత్తంచేస్తూ హర్షవర్ధనుడు శాసనం ప్రకటించాడని వినిఉన్నాడు. అదీగాక, రెండువందలగ్రామాల ప్రజలని భిక్షువులకు నిత్యం అవసరమయ్యే బియ్యం, పాలు ఇత్యాది సామగ్రిని ప్రతీరోజూ అందజేయమని కూడా హర్షుడు ఆదేశించాడని తెలుసు.

“సరిగ్గా అదే నీకూ, నాకూ సంబంధించిన అంశం; మనం పట్టించుకోవలసిన విషయం. మిగతావి మనకి అనవసరం” అన్నాడు శాంతిదేవుడు.

శాతిదేవుని శిష్యుడైన గుణసేనుడువచ్చి ప్రార్థనకు వేళయిందని సూచించాడు. ముగ్గురూ లోపలికి నడిచారు. దీపాంకరుడి మస్తిష్కంలో ఎన్నెన్నో సందేహాలు ముసురుకున్నాయి. ‘ఏదిఏమైనా ఇదంతా ఒక కొత్త అనుభవం; నేర్చుకోవలసిన విషయాలు చాలాఉన్నాయి’ అనుకుంటూ శాంతిదేవునివెంట తమ గదివైపు నడిచాడు. దారిలో ఎదురైన సరంగు అబూ సయ్యద్ వారికి సలాం చేశాడు.

***

ఉదయాన్నే త్రికోణమలై రేవుచేరిన ఓడ లంగరుదించింది. కళింగపట్నంనుండి మోసుకొచ్చిన ఉప్పుబస్తాల్ని చిన్నపడవల్లోకిదించే ఏర్పాట్లు నావికులు చెయ్యగానే ముగ్గురు భిక్షువులూ అందరివద్దా సెలవుతీసుకున్నారు. సరంగు అబూ సయ్యద్ ఏదో చెప్పాలని ప్రయత్నించాడుగాని అర్థంకాలేదు. మౌలీం తన వచ్చీరాని తెలుగులోకి అనువదించగా అల్లా తమను సురక్షితంగా, క్షేమంగా ఉండేటట్టు కరుణించాలని కోరుకుంటున్నాడని బోధపడింది. ఓడ దిగుతూంటే నవ్వుతూ నావికులంతా చేతులూపుతున్నారు. అందరిలోనూ ఉత్సాహం వెల్లివిరుస్తోంది. అదే మాట మౌలీంతో అంటే,

“అవును. ఈ రేవులోనే బియ్యం ఎక్కించుకొని బస్రా వెళ్తాం. దాంతో ఈ యాత్ర ముగుస్తుంది. నావికులంతా సెలవుమీద తమతమ దేశాలకు, ఇళ్ళకు వెళ్ళిపోతారు. అందుకనే ఈ ఉత్సాహం” అన్నాడు.

తీరానికి పయనంకట్టిన ఒక పడవనెక్కి భిక్షువులు ఒడ్డుచేరారు. రేవులోనూ, గోదాములవెంటా నడుస్తూంటే సింహళభాష దీపాంకరుని చెవినపడింది. అది కాస్తోకూస్తో తెలుగులా ధ్వనించింది. సింహళలిపిని కూడా చూడడం తటస్థించింది. అక్షరాలన్నీ గుండ్రంగా తెలుగులిపికి దగ్గరగా ఉన్నట్లు కనిపించాయిగాని ఏమీ చదవలేకపోయాడు. దీన్ని గమనించిన శాంతిదేవుడు తన వివరణ ఇచ్చాడు.

“సింహళలిపి కూడా తమిళం, కన్నడం, తెలుగు, మలయాళ లిపుల మాదిరిగా బ్రాహ్మీలిపి నుండి వచ్చినదే.  ఇంకా చెప్పాలంటే ప్రాచీన కన్నడ, తెలుగుభాషలు వినియోగించిన కదంబ అక్షరమాలే మా లిపికి మూలం. మాకు వంగ, కళింగదేశాలతోనూ, ముఖ్యంగా దక్షిణభారతదేశంతోనూ అనాదిగా సంబంధాలున్నాయని  మా ప్రాచీనగ్రంథాల్లో చెప్పబడింది. వ్యాపారసంబంధాలు, ఓడవర్తకమూ ఎప్పటినుండో నడుస్తున్నాయి. అంతెందుకు? హేమమాలిఅనే ఒక కళింగదేశపు యువరాణి తథాగతుని దంతాన్ని రహస్యంగా తనకేశాలలో దాచిపెట్టి ఆనాటి సింహళరాజుకు అందజేసింది. సింహళభాషపైన ద్రావిడభాషలప్రభావం మొదటినుండీ ఉంటూవస్తున్నది. అశోకునికాలంనుండి పాళీ, సంస్కృతభాషలుకూడా వచ్చిచేరాయి. మావిహారంలో ప్రధానబోధనాభాషలు అవే. తమిళులు ఎంతోకాలం మా దేశంలోని ముఖ్యప్రదేశాల్ని పాలించారుకూడా. కాకపోతే చోళరాజులతో యుద్ధాలుకూడా చేశాం. చోళులును ఓడించినప్పటినుండీ మారాజులు తమిళులను బానిసలుగా వినియోగిస్తున్నారు”.

“బానిసలా? పరాక్రమబాహుడు కూడానా?” దీపాంకరుడు సందేహం వెలిబుచ్చాడు.

“అవును. పరాక్రమబాహుడు కూడా. నిజానికి అతడు కట్టించిన ప్రజాహిత నిర్మాణాలన్నిట్లోనూ, ఉత్తరారామ నిర్మాణంతో సహా – తమిళుల బలవంతపు చాకిరీని విరివిగా వినియోగించాడు”.

“మరి బ్రహ్మజాలసూత్రం (పాళీలో బమ్మజాలసుత్త) లోని స్థూలశీల (పాళీలో చూలసీల) ప్రవచనంలో బౌద్ధులు బానిసల సేవలను వినియోగించరాదని తథాగతుడు స్పష్టంగా చెప్పిఉన్నాడే?”

“సాధారణ బౌద్దులకూ, సామాన్య ఉపాసకులకు అన్ని సూత్తాలను వర్తింపజేయడం సరికావచ్చుగాని రాజులకు చక్రవర్తులకూ అన్నీవర్తించవు. బానిసలూ, పనివాళ్ళూ, ఉద్యోగులూ, సైనికులూ, మందీమార్బలం లేకపోతే పరాక్రమబాహుడు అంతటి బ్రహ్మాండమైన కట్టడాలు నిర్మించగలిగేవాడా? కట్టినా వాటిని కాపాడగలిగేవాడా? అతిత్వరలో నువ్వేచూస్తావు – వాటి విశిష్టత ఏమిటో స్వయంగా తెలుసుకుంటావు”.

దీపాంకరుడు మౌనంవహించాడు. త్రికోణమలై ఊరుదాటారు. పొలోన్నరువదిశగా నడుస్తున్నారు. ఎటుచూసినా పచ్చదనం; కొబ్బరి, అరటి, పనస చెట్లు; ఇళ్ళముందు మందార, బంతి, చేమంతి, సన్నజాజి పూలమొక్కలు. కళింగతీరంలో ఉన్నట్లుగానేఉందితప్ప మరోదేశానికి వచ్చామని అనిపించడంలేదు దీపాంకరుడికి. వాతావరణంకూడా ఉక్కగా, గాలిఆడకుండాఉంది. నాలుగేళ్ళతరవాత వాళ్ళదేశానికి తిరిగివస్తూన్న ఆనందం శాంతిదేవునిలోనూ గుణసేనుడిలోనూ ప్రస్ఫుటం అవుతున్నది. ఇన్నాళ్ళూ దీపాంకరుడి ఊహల్లో పొలోన్నరువ ఒక వినూత్న ప్రపంచపు ముఖద్వారం; ఇప్పుడది వాస్తవరూపంలో కళ్ళముందుకు రాబోతోంది. తన జీవితాన్ని బౌద్ధధర్మపథంలో సార్థకంచేసుకొనే అవకాశం. నాలాందాలో తురుష్కులచేతిలో శిరచ్చేదానికిగురైన పాళీభాషాబోధకుడు గుర్తుకొచ్చాడు; అతనిమదిలో రవ్వంత విషాదం చోటుచేసుకున్నది. మరోపక్క ముందుముందు ఏమిజరుగబోతోందో అని కాస్తంత ఆందోళన.

శాంతిదేవుని గంభీరవదనం చూస్తూంటే అతడికి తనగురువూ, పితృసమానుడూ అయిన భద్రపాలుడు గుర్తుకొచ్చాడు. భద్రపాలుడు పిన్నవయసులో ఇప్పటి శాంతిదేవునిలానే ఉండిఉంటాడనిపించింది; ఏదో మొండిధైర్యం అతన్ని ఆవహించింది.  ముగ్గురుభిక్షువులూ చెమటలు కక్కుతూనే అడుగులు వడిగా వేస్తున్నారు. మార్గమధ్యానఉన్న విహారాల్లోమజిలీలుచేస్తూ, రోజుకోపర్యాయం స్థానికభిక్షువులతోబాటుగా సమీపగ్రామాల్లో  భిక్షాటన చేసుకుంటూ ముప్ఫైకోసులదూరంలోఉన్న పొలోన్నరువ చేరడానికి నాలుగురోజులు పట్టింది.

ఉత్తరారామం చేరేసరికి చీకటిపడింది.  ఆచార్యశాంతిదేవుడూ, అతని శిష్యుడు గుణసేనుడూ ఎప్పుడు వస్తారాఅని కళ్ళుకాయలుకాచేలా ఎదురుచూస్తున్నవందలకొద్దీ భిక్షువులు వారికి ఘనంగా స్వాగతంపలికారు. ఆర్భాటాలేవీలేనప్పటికీ, వారిలోవిరిసిన సంతోషం, ఆప్యాయత దీపాంకరుడ్ని కదిలించాయి. నాలందాని మినహాయిస్తే అతడు ఇంతమంది భిక్షువులున్న ఆరామాన్ని ఎన్నడూచూడలేదు. నాలందాలో మాదిరిగానే ఇక్కడకూడా నిబద్ధతకలిగిన జ్ఞానాన్వేషణ, క్రమశిక్షణతోకూడిన యువశక్తి ఉన్నట్టుగా అతడికి తోచింది. ‘ఇక్కడ నాకు మంచి అనుభవం ఎదురౌతుంది’ అనే ఆశాభావం కలిగింది. యువభిక్షువులు దీపాంకరుడిని చుట్టుముట్టారు. ఎన్నోప్రశ్నలు వేశారు. కొన్నాళ్ళపాటు తమతోబాటు ఉంటాడని తెలుసుకొని  సంతోషం వ్యక్తపరిచారు. ప్రతిఒక్కరూ పాళీపదాలు జోడించిన చక్కటి సంస్కృతం మాట్లాడుతున్నారు. బాగా పొద్దుపోయింది. శాంతిదేవుడు కలుగజేసుకొని,

“ఇవాళ్టికి మీ ప్రశ్నలు చాలు. ఆయన్ను విశ్రాంతి తీసుకోనివ్వండి” అన్నాడు. ఒక యువభిక్షువుని ఉద్దేశించి,

“ధర్మపాలా, దీపాంకరుడి వసతిఏర్పాట్లు చూడు. ఈ రోజునుండీ ఆయన బాగోగులు చూసుకుంటూ ఉండు” అన్నాడు.

అధ్యాపకుల వసతివైపు దారితీశాడు ధర్మపాలుడు. దీపాంకరుడి గది చూపించాడు. నూనెదీపం వెలిగించాడు. మంచినీళ్ళకూజా తెచ్చిపెట్టాడు. కప్పుకోనేందుకు దుప్పటి ఇచ్చాడు. మర్నాడు తెల్లవారుఝామునే వస్తానని చెప్పి బయల్దేరబోతూంటే దీపాంకరుడు సందేహిస్తూనే అడిగాడు – “నాలందాలో ఏమైందో మీకు తెలిసిందా?”.

“తెలిసింది. కొందరు భిక్షువులు, తీర్థయాత్రలకని బౌద్ధక్షేత్రాలకు వెళ్ళిన ఉపాసకులు ఆ దుర్వార్తని మోసుకొచ్చారు. ఆచార్యలు తిరిగివస్తారనే ఆశ వదులుకున్నాం. మాఅందరికీ ఈరోజు ఎంతటి శుభదినమో మాటల్లో చెప్పలేను”

ధర్మపాలుడు వెళ్ళిపోయాడు. అంతటా నిశ్శబ్దం. ఎక్కడా మనుషుల అలికిడిలేదు. నేపధ్యంలో కీచురాళ్ళ రొద. దీపంచుట్టూ పురుగులు చేరాయి. బాగా అలిసిపోయిన దీపాంకరుడు నిద్రలోకి జారుకున్నాడు.

***

శిష్యగణం తనను ‘ఆచార్యా’అని సంబోధిస్తూంటే దీపాంకరుడికి మొదట్లో కొత్తగా అనిపించినా క్రమేపీ అలవాటైంది.  ఆచార్యశాంతిదేవథేరోకు (ఉత్తరారామంలో శాంతిదేవుడిని అలాగే పిలుస్తారు) సహాయకుడిగా వ్యవహరిస్తూ పాళీ మూలగ్రంధాలలోని కొన్నిసూత్రాలను (సూత్తాలను) విద్యార్థులకు వివరించే తరగతులను అతనికి అప్పగించారు. అదేమంత కష్టమైనపని కాదనుకున్నాడుగానీ దిగాకే లోతుతెలిసింది. శాంతిదేవుడిని సంప్రదించాడు. అంతా విని అతడిలా అన్నాడు –

“అధ్యాపకుని పాత్ర నీకు కొత్త. మొదట్లో కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. బోధనకూడా ఒక కళ. విషయపరిజ్ఞానం ఉన్నవాళ్ళంతా ఉత్తమ ఉపాధ్యాయులయితీరాలనే నియమం ఏదీలేదు. నాలందాలో గమనించిఉంటావు; అక్కడున్న వాళ్ళంతా మహాపండితులేకాక, అత్యుత్తమ ఉపాధ్యాయులుకూడా. మనకెంత జ్ఞానం ఉన్నదనేదొక్కటే ముఖ్యంకాదు. మొదట బోధించే విషయంపట్ల విద్యార్థుల జీవితకాలమంతా వారిని అంటిపెట్టుకొనేటంత ఆసక్తిని, కుతూహలాన్ని, ఉత్సుకతని రేకెత్తించాలి. వారిస్థాయికివెళ్లి చెయ్యిపుచ్చుకొని నడిపించగలగాలి. అంటే వాళ్ళతోబాటు నాలుగడుగులు వేసి ఆ తరువాత వాళ్ళనే శోధించమనాలి. ఒకవేళ దారితప్పితేగనక సరైనమార్గాన్ని సూచించాలి; అంతేగాని దారిపొడుగునా మనంవారివెంట నడవాలనుకోకూడదు. ఒక్కముక్కలోచెప్పాలంటే మనం మార్గసూచకులం మాత్రమే, సహయాత్రీకులంకాదు. బౌద్ధంలో ఇదిముఖ్యం. ఎవరి మోక్షానికివాళ్ళే స్వయంగా కృషిచెయ్యాల్సి ఉంటుంది. ఎవరి అన్వేషణ వారేచేసుకోవాలి. వారివారి అనుభవాలకు, అవగాహనకు విషయసారాన్ని అన్వయించుకోవాలి. తథాగతుడి కాలామసూత్తను గుర్తుంచుకుంటే మనపాత్ర స్పష్టమౌతుంది”.

ఇదీ ఉత్తరారామంలో అడుగుపెట్టాక దీపాంకరుడు శాంతిదేవునివద్ద నేర్చుకున్న మొదటిపాఠం. అక్కడున్న మూడేళ్ళలోనూ శాంతిదేవునివద్దా, మిగతా ఆచార్యులవద్దా, ముఖ్యంగా శిష్యులనుండీ చాలా నేర్చుకున్నాడు. ఒకోసారి అతనికి అనిపిస్తుంది – నేర్పినదానికన్నా నేర్చుకున్నదే చాలాఎక్కువ అని.

ఆరామజీవనానికి దీపాంకరుడు తొందరగానే అలవాటుపడ్డాడు. అతని నాలందా అనుభవం అన్నివిధాలా అక్కరకు వచ్చింది. మొదటి మూడునెలలూ పని ఒత్తిళ్ళతోనే గడిచిపోయింది. పరిసరాలను పట్టించుకొనే అవకాశం చిక్కలేదు. బోధనాంశాలపై కాస్తంత పట్టుచిక్కాక ఒక్కొక్కొటిగా మిగతా విషయాలను గమనించనారంభించాడు. ఉత్తరారామాన్ని నాలందాతో పోల్చడం అతనికి అనివార్యం అయింది. అతనికి తెలిసింది నాలందాయే మరి. ఆచార్యుల నిబద్ధత, విద్యార్థుల త్రికరణశుద్ధి పోల్చదగినవిగా ఉన్నాయి. అయితే బోధనాంశాల విస్తృతి, విహారపు విస్తీర్ణం, సదుపాయాలూ, గ్రంధాలయాలూ – వీటన్నిటిలోనూ నాలందా అనేక శతాబ్దాలముందుగానే అత్యున్నతస్థాయిని చేరుకున్నదనడంలో సందేహంలేదు. అసలు నాలందాని అందుకోవాలని అనుకోవడమే ఒక మూర్ఖత్వం అవుతుందని దీపాంకరుడికి బలంగా అనిపించసాగింది. అయితే ఆ మహావిహారాన్ని ఆదర్శంగా, స్ఫూర్తిగా భావించి ఉత్తరారామంలో చెయ్యవలసిన కృషిచేస్తూపోవడమే బుద్ధిమంతుల లక్షణం అనుకున్నాడు. ఈమాట శాంతిదేవునితోఅంటే అతడు నవ్వి,

“నాకు తెలియదనుకున్నావా? నాలందాకున్న విశిష్టత, చరిత్ర ఏంచేసినా తిరిగిరావు. అలాగని ఊరుకోలేకనే ఈ ప్రయత్నం. ఇప్పుడు మొదలుపెడితే ఎప్పటికో ఒకప్పటికి ఒకస్థాయికి చేరుకోగలం. ఆ రోజుని నువ్వూనేనూ చూడం. మహావిహారాలచరిత్రలో ఒక జీవితకాలం అంటే క్షణకాలమే”.

దీపాంకరుడికి భద్రపాలుడు తరచూవాడే మాట జ్ఞాపకం వచ్చింది: ‘కాలం విధించిన కర్తవ్యం’. ఉత్తరారామ చరిత్రలో తనకూ ఒకచిన్నపాత్ర ఉందనుకోవడం అతనికి ఆనందం కలిగించింది. ఆవెంటనే ‘నావల్ల అవుతుందా?’ అనే  సందేహం అతన్ని కలవరపరచింది. ఏదిఏమైనా, తనవంతు ప్రయత్నం చేసితీరాలనీ, తనకు ప్రసాదించబడిన ఈ అవకాశాన్నీ, మూడేళ్ళ వ్యవధినీ సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలనీ దృఢనిర్ణయం తీసుకున్నాడు. ఇకమీదట బోధనకుమాత్రమే పరిమితంకాకుండా మూడులక్ష్యాలను సాధించాలని తీర్మానించుకున్నాడు. మొదటిది సింహళభాష నేర్చుకోవడం – ముఖ్యంగా మాట్లాడడం. తద్వారా స్థానికప్రజలతోనూ, శిష్యులతోనూ వారిభాషలో సంభాషించడానికీ, వారికి మరింతచేరువ కావడానికీ, అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకోవడానికీ సాధ్యపడుతుంది. రెండోది – వీలు చిక్కినప్పుడల్లా ఆరామపు గ్రంధాలయానికివెళ్లి అరుదైన బౌద్ధగ్రంధాల ప్రతులను తయారుచేసుకోవడం. చివరిగా – చుట్టుపక్కలఉన్న ప్రదేశాలతో మొదలుపెట్టి ఒక్కటొకటిగా ఆ దేశపు బౌద్ధక్షేత్రాలను సందర్శించి వాటివివరాలను జ్ఞాపకార్థం ఒకచోట వ్రాసిపెట్టుకోవడం. తన నాలందా జ్ఞాపకాలను ఒకచోట రాసిపెట్టుకోకుండా గడిపివేసినందుకు అతనికి విచారంగా ఉంది. ఈ పర్యాయం మాత్రం అనుకున్నదే తడవుగా దీపాంకరుడు తన తీర్మానాలను ఆచరణలో పెట్టడం ప్రారంభించాడు.

దీపాంకరుడు సింహళభాష నేర్చుకోవదానికి అతనికి శిష్యుడిగా, సహాయకుడిగా నియమింపబడిన ధర్మపాలుడి తోడ్పాటు చాలా ఉన్నది; నెల్లాళ్ళలోనే చిన్నచిన్న వాక్యాలు మాట్లాడగలిగాడు. అంతకన్నా ముఖ్యంగా సింహళ భిక్షువుల మాటలు కొద్దికొద్దిగా అర్థంఅవుతూవచ్చాయి. మిగతా శిష్యులుకూడా సహకరించారు; చిరునవ్వులతో తప్పులను సవరించారు. తమలో ఒకనిగా దీపాంకరుడ్ని స్వీకరించడానికి వారికి ఎన్నోరోజులుపట్టలేదు. వాళ్ళు అతనితో తమ వ్యక్తిగత సమస్యలనుండి రాజకీయ పరిణామాలవరకూ ప్రతీదీ చర్చించడం మొదలుపెట్టారు. శిష్యులతో అతడు గడిపే సమయం బాగా ఎక్కువైంది. అయినప్పటికీ దీపాంకరుడు అధ్యయనానికీ, గ్రంధాలయానికీ, కొంత సమయం కేటాయిస్తూ వచ్చాడు. నాలందాగ్రంధాలయాలతో పోలిస్తే బాగాచిన్నదే అయినప్పటికీ  ఉత్తరారామంలోని పుస్తకసముదాయం అతన్ని ఆశ్చర్యపరచింది. అరుదైనగ్రంధాల జాబితాను తయారుచేసుకొని ప్రతులు తయారుచెయ్యడం మొదలుపెట్టాడు. ఈపనిలో దీపాంకరుడికి సహకరించేందుకు నలుగురు శిష్యులు ముందుకొచ్చారు. ఈ బృహత్కార్యానికి శాంతిదేవుడు తన ఆమోదం తెలియజేసాడు. మరో నలుగురు భిక్షువులను ఈ పనికి నియమించాడు. అయితే, దీపాంకరుడు వ్రాసిపెట్టుకున్న జాబితానిచూసి పెదవివిరిచాడు. వాటినన్నిటినీ వెంటతీసుకు పోవాలంటే ప్రత్యేకించి ఒక ఓడ, రెండువందల గాడిదలూ ఉండాలని చమత్కరించాడు.

“ఎన్ని ప్రతులను నీతో తీసికెళ్ళడం సాధ్యమవుతుందో నిశ్చయించుకొని అప్పుడు మొదలుపెట్టు” అని సూచించాడు.

శాంతిదేవుని ముందుచూపుకు సింహళభాషలో కృతఙ్ఞతలు తెలియజేసి ఆయన్ను ఆశ్చర్యపరిచాడు దీపాంకరుడు. దీపాంకరుడ్ని వెంటతీసుకురావడం సరైననిర్ణయంఅని శాంతిదేవునికి బలంగాఅనిపించిది. అనాటినుండీ దీపాంకరుడిపట్ల మరింత సుముఖంగా, అభిమానంగా ఉండనారంభించాడు.

ఇక బౌద్ధక్షేత్రాల సందర్శనానికివస్తే ఉత్తరారామం, పొలోన్నరువలతో మొదలుపెట్టాలని దీపాంకరుడు నిశ్చయించుకున్నాడు. తను కన్నవీ, విన్నవీ, వ్యాఖ్యాసహితంగా ఈవిధంగా రాసుకోవడం ఆరంభించాడు:

‘సుమారు వందేళ్ళక్రితం దక్షిణభారతదేశానికి చెందిన చోళులు స్థానిక సింహళరాజులను ఓడించి, రాజధానిని అనురాధపురంనుండి పొలోన్నరువకుమార్చి ఏభైఏళ్లపాటు పాలించారు. విజయబాహుఅనే సింహళ రాజవంశీకుడు చోళుల్ని తరిమివేశాడు. అయితే భౌగోళికంగానూ, ధర్మంపరంగానూ సింహళదేశ ఏకీకరణ తరువాత వచ్చిన పరాక్రమబాహునిద్వారానే సాధ్యంఅయింది. ఇతడిని ఈ దేశస్థులు అశోకునితో సమానంగా గౌరవిస్తారు.

పరాక్రమబాహుడు అధికారం చేపట్టేనాటికి సింహళదేశపు బౌద్ధం అభయగిరివిహార, జేతవనవిహార, మహావిహార అనే  మూడు నియాక సమూహాలుగా చీలిపోయిఉన్నది. అతడు ఈ మూడు సమూహాల ప్రతినిధుల్నీ ఉత్తరారామానికి పిలిపించి సమావేశపరిచాడు. భ్రష్టుపట్టిన, అవినీతిపరులైన భిక్షువుల్ని సంఘంనుండి బహిష్కరించాడు. సాధారణపౌరులుగా మార్చివేశాడు. (ఇక్కడ మరికొన్ని వివరాలు అవసరం). మహావిహారసంఘాన్ని సమర్థించి మిగతా రెండుసమూహాల్ని, అంటే అభయగిరి, జేతవన సంఘాలను నామరూపాలు లేకుండాచేశాడు.  థేరవాదబౌద్ధానికి పెద్దపీటవేసి మహాయాన, వజ్రయాన ధోరణులను పూర్తిగా అరికట్టాడు. భిక్షువులు పాటించవలసిన నియమాలను పునర్లిఖింపజేసి వాటిని ఉత్తరారామంలో శిలాశాసనంగా ప్రకటించాడు. (వినయపీటికఉండగా మళ్ళీ ఇదిఎందుకు అవసరమైందో తెలియరాలేదు). సంఘానికి పెద్దగా, నాయకునిగా, ప్రతినిధిగా వ్యవహరించేదుకు సంఘరాజా అనే పదవిని సృష్టించాడు. అతనికి సహాయకులుగా ఇద్దరు ఉపసంఘరాజాలు ఉండేటట్టు ఏర్పాటు చేసాడు.

పరాక్రమబాహుడు మరణించాక గద్దెనెక్కిన కళింగవంశప్రభువు నిస్సంకమల్లుడే స్వయంగా పూనుకొని శాంతిదేవుడిని నాలందాకు పంపాడని శిష్యుడు ధర్మపాలుడిద్వారా తెలిసింది. శాంతిదేవుడు నాలందా చేరకముందే నిస్సంకమల్లుడు మరణించాడు. రాజ్యం పరిస్థితి గందరగోళంగా మారింది; రాజభవనంలో కుట్రలూ, కుతంత్రాలూ పరాకాష్టకు చేరుకున్నాయని వినవస్తున్నది. సర్వత్రా వదంతులు వ్యాపిస్తున్నాయి. (నాలందానుండి తిరిగివచ్చాక శాంతిదేవుడు ఉపసంఘరాజాగా  నియమించబడ్డాడు. త్వరలో అతడే సంఘరాజా పదవిని చేపడతాడని వినికిడి. అయితే అతని నియామకాన్ని కొందరు రాజవంశీకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిసింది. తుదిపరిణామాలు ఎలాఉంటాయో వేచిచూడాలి. పరాక్రమబాహుడు బౌద్ధసంఘ పునరుజ్జీవనానికీ, అనురాధపుర  పునర్నిర్మాణానికి, ఉత్తరారామ ప్రశస్తికి చేసిన కృషినిగురించి తెలుసుకున్నాక అతనిపాలనలో నిర్మితమైన  కట్టడాలను మరింత ఆసక్తిగా పరిశీలించ సాగాను).

కొండరాతి పార్శ్వతలాన జీవకళ ఉట్టిపడేట్టుగాచెక్కిన నాలుగు పెద్ద ఏకశిలా బుద్ధవిగ్రహాలు ఉత్తర ఆరామపు ముఖ్య ఆకర్షణలు. కొండరాతినిదొలిచి సృష్టించిన విజ్జాధరగుహ (విద్యాధర గుహ)లో  ధ్యానముద్రలో ఉన్న తథాగతుడు దర్శనమిస్తాడు. తలపై గొడుగుతో, అటూఇటూ బ్రహ్మ, విష్ణువుల ఆశీర్వాదంతో సింహాసనంపై కూర్చున్నట్టుగా బుద్ధుని రూపకల్పన చేశాడు శిల్పి. ధ్యానముద్రలోనే ఉన్న పదిహేను అడుగుల ఎత్తైన మరో పెద్ద బుద్ధ విగ్రహం కూడా ఉన్నది. ఇక మూడవది – నిర్యాణానికి ముందు కుడివైపు తిరిగి చేతిపై తలనానించుకొని పడుకొని ప్రశాంతవదనంతో ఆఖరి ప్రవచనం చేస్తున్నతథాగతుడి శిల్పం. ఇది సుమారు ఏభై అడుగుల పొడవైన బ్రహ్మాండమైన కళాసృష్టి. పక్కనే ఆనందుడు విషాదవదనంతో చేతులుకట్టుకొని నిలుచున్నట్టుగా చెక్కారు. శయనభంగిమలోఉన్న తథాగతుని విగ్రహం ఎంతసహజంగా ఉందంటే, ఆయన తలఆనించిన దిండు మెత్తగా, ఒకవైపు కొద్దిగా నొక్కబడినట్టుగా అగుపిస్తుంది. విగ్రహాలన్నిటి పైనా బంగారురేకు తాపడాలున్నాయి.  అన్ని విగ్రహాలకూ వాటిని ఆనుకొని చెక్కలతో నిర్మించిన ఆలయాలున్నాయి. [శిల్పశాస్త్రం గురించి నాకేమీ తెలియదుగాని ఇక్కడి శిల్పాలను చూస్తూంటే నాలందా వెళ్ళేదారిలో ధాన్యకటకం (అమరావతి)లో చూసిన విగ్రహాలు ఎంతగానో జ్ఞాపకంవచ్చాయి. రెంటికీ చాలాపోలికలున్నాయి. కారణం ఏమైఉంటుంది? ఎవరైనా శిల్పశాస్త్రప్రవీణులను  సంప్రదించాలి].

పరాక్రమబాహుడు తనపాలనలో చేబట్టిన ప్రజాహిత నిర్మాణాలనుగురించి వ్రాసిపెట్టుకోకపొతే ఈ జ్ఞాపక సంపుటి అసంపూర్ణంగా ఉండిపోతుంది. తన రాజ్యంలో వర్షించిన ఒక్క నీటిబొట్టునుకూడా వృధాగా పోనివ్వనని శపథంచేసి శాసనం ప్రకటించాడు. సుమారు ఐదువేల ఎకరాల విస్తీర్ణంకలిగిన పరాక్రమసముద్రం అనే బ్రహ్మాండమైన సరస్సుని సృష్టింపజేశాడు. దానిమూలంగా ఇరవైవేలఎకరాలు సశ్యశ్యామలంగా మారాయి. దిగువగ్రామాల్లో తాగునీటి సమస్యకూడా తీరిపోయింది. ఇటువంటి ఆనకట్టల నిర్మాణాల్ని రాజ్యమంతటా చేయించాడు. మనుష్యులకేకాకుండా పశువులకుకూడా వైద్యశాలలు ఏర్పాటుచేసాడు. అవన్నీ నేటికీ చక్కగా పనిచేస్తున్నాయి. ఇక్కడి ప్రజలు పరాక్రమబాహుడిని అశోకుడంతటి గొప్ప చక్రవర్తిగా గౌరవిస్తున్నారంటే అందులో ఆశ్చర్యపడవలసిందేమీలేదు. (బౌద్ధాన్ని కాపాడుకోవాలంటే సానుకూలురైన, ప్రజాహితులైన, సైనికబలం కలిగిన, దృఢచిత్తులైన  పాలకులు ఉండితీరాలని ఈమధ్య కాలంలో – అంటే పొలోన్నరువ రాజ్యానికి వచ్చిన నాటినుండి – బలంగా అనిపిస్తున్నది. రాజ్యాధికారంతో ప్రమేయం లేకపోతే బౌద్ధం నిలువదేమో. అలాగని రాజులమీదే పూర్తిగా ఆధారపడటంకూడా సరికాదు. ఒక్కోరాజూ ఒక్కోతీరుగా ఉంటాడు. ఈ విషయంపై శాంతిదేవునితో చర్చించాలి).

***

(మూడో భాగం -వచ్చే వారం )

ఉణుదుర్తి సుధాకర్

కాసేపు వాక్యాన్ని పక్కన పెట్టి …

దృశ్యం: దండమూడి సీతారాం

పదాలు:  భాస్కర్ కె. 

*

బేకారీలు

 

క రాత్రంతా, ఏరంగునూ తాకలేనని

ఆ సాయంత్రపు ఆకాశం

సకలసౌందర్యలేపనాలన్ని

పసిపాపలా వంటికి రాసుకున్నట్లు

 

చీకటితో యుద్దంలో ఓడుతూ  భానుడు

ముఖాన్ని మబ్బుల వెనుక దాచినా

ఆకాశం ఆ సిగ్గును ప్రతిఫలిస్తున్నట్లు

 

అతన్ని ఆపుతూ ఆమె అంటుంది

కాసేపు వాక్యాన్ని పక్కన పెట్టి ఆస్వాదించు

 

నిజానికి సాయంత్రమంటే భగవంతుడు

ఆ పగటికి రాసే వీడ్కోలుకవిత్వం

ఆ రాత్రికి రాయబోతున్న తొలిప్రేమలేఖ.

*

లోతు తక్కువ.. వైశాల్యం ఎక్కువ!

 

“మాళవిక” నవలా రచయిత ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారితో వారి ప్రియ మిత్రులు, సాహితీవేత్త, తల్లావఝుల పతంజలి శాస్త్రి గారు ‘ఛాయ’ సంస్థ కోసం జరిపిన సంభాషణల రెండవ, చివరి భాగం.

 సాహిత్య దర్శనం అంటే ఏమిటి? సాహిత్యానుభవం రచయితలకు కొరవడినదని నేను అనుకుంటున్నాను.

జ: ‘దర్శనం’ అంటే శాస్త్ర పరి భాషలో ‘నిశితమైన చూపు’ అని అర్ధం.  ఒక తాత్విక ప్రతిపాదన గాని, కళా సాహిత్య ప్రతిపాదనగాని – స్వతంత్ర బుద్ధితో – ఏ రంగమ్ముందుకైనా తీసుకురావడం ‘దర్శనం’ ప్రాధమిక ధర్మం.  సాహిత్య విషయకమైన నిర్వచనాలూ, కొందరు విశిస్ట రచయితల గురించి సమర్ధులైన  విమర్శకులు చేసిన విశ్లేషణలు స్థూలంగా ‘సాహిత్య దర్శనం’ గా చెప్పుకోవచ్చు.  ప్రతి దర్శనం, చర్చకు అవకాశం ఇచ్చేదే – ఇక – సాహిత్యానుభవం సంగతి. ఇది కవిత్వ విషయంలో ఒక అంతరువులోనూ, వచన ప్రక్రియల విషయంలో మరొక అంతరువులోనూ ఉండే అవకాశం ఉంది.  కవిత్వ పాఠకుడుకి instant గా intuitive గా కవిత్వానుభవం కలిగే అవకాశం ఉంటుంది.   వచన ప్రక్రియల విషయంలో సమాజం, వ్యక్తుల స్వభావాలు, బాహ్య ఆంతరిక పరిస్థితులు, వంటి యితర విషయాల ప్రమేయం కూడా అవసరం అవుతాయి. సూటిగా చెప్పాలంటే కవిత్వానుభవం చాలా సబ్జెక్టివ్.  వచన ప్రక్రియ ఆస్వాదన అనండి, అర్ధం కావటం అనండి,  చాలా భాగం ఆబ్జెక్టివ్ – అదలా ఉంచండి – తెలుగు రచయితలకు సాహిత్యానుభవం లేక పోవడానికి ప్రధాన కారణం అధ్యయన లోపం.  రచయిత ఎప్పుడూ చదువుతూ ఉండాలి.  కేవలం జీవితాన్ని జల్లెడ పట్టేశాను అనుకుంటే చాలదు.  సాహిత్యం ఒక క్రాఫ్ట్.    చూడాలి.  చూసింది బలంగా చెప్పగలగాలి.  ఇది కేవలం అధ్యయనం వల్ల మాత్రమే సాధ్యం.

  1. మనకి లిటరరీ ఇంటిగ్రటి పలచబడిపోతున్నదని నా అభిప్రాయము. మీకెలా అనిపిస్తుంది?

జ: లిటరరీ ఇంటిగ్రటి అనేది వ్యక్తి  స్వభావాన్ని చెపుతుంది.  ప్రాణం పోయినా సరే, ఆ వ్యక్తి తన భావ ప్రకటనా స్వేచ్ఛ, అందు మూలంగా అబ్బిన స్వతంత్ర వ్యక్తిత్వం వదులు కోడు.  చలం, విశ్వనాథ, శ్రీపాద, కుటుంబ రావు, అజంతా, రా.వి.శాస్త్రి, త్రిపుర వంటి వాళ్ళు నాకు వెంటనే గుర్తుకొస్తున్నారు.   అది ప్రాధమిక  అవసరం.  ముసిలోణ్ణయి పోయానని మీరు అనుకోరని నాకు తెల్సు.  సుమారు పదేళ్ళుగా ఇది సరిగా లేదని – మీతో ఏకీభవిస్తున్నాను.

  1. మీ రచనల మీద మీకు సంతృప్తి ఉందా?

జ: నేను నా రచనలలో రకరకాల ప్రక్రియలు వాడ గలిగా ననుకుంటున్నాను.  అయితే నేను ఏ ఒక్క సిద్ధాంతానికో, మత  ధార్మిక అంశాలకో చెందిన వాణ్ని కాను.  నాకు జీవన లాలస ఎక్కువ.  గోదావరిలో పడవ నడుపుకునే వాళ్ళ మొదలు రకరకాల స్థాయి లో మనుషులు నాకు పరిచయం.  మన తెలుగు వాళ్ళ అహంకారాలు, భేషజాలు, టెక్కులు, వెటకారాలు, లౌఖ్యాలు, దొంగ ప్రేమలు, సదాచారాలు, వ్యభిచారాలు చాలా వరకు నా అనుభవాల ద్వారా సుపరిచితాలు.  నేచర్, ఋతువుల పరిణామం – తెల్సి జీవించటం చాలా ఇష్టం.  ఎరమరికలు లేకుండా ప్రపంచ సాహిత్యం చదవడం నాకు ఇష్టం.  దరిద్రం ఎరుగుదును గనుక డబ్బున్న వాడిగా ఉండడం ఇష్టం.  చాలా వరకు నా రచనలకు నా జీవితానుభవాలు, బలమైన ఇష్టానిష్టాలే  మూలం.  సాహిత్య వ్యాసంగంలో మొగమాటాలు, అబద్ధాలు, జీవన వక్రీకరణలు నాకు సమ్మతం కావు.  అపరిచిత విషయాల్ని ఊహించి వ్రాయలేదని చెప్పగలను.  ఈ మాత్రపు నిజాయితీ నా కున్నదని చెప్పగలను.  తృప్తికి అంతం ఎక్కడా?

  1. అసలు ఆధునిక కళ అనేదే సకృత్తుగా ఉన్నప్పుడు మనకి ‘ఆధునికోత్తర దశ ‘ ఏమిటని ఒక అభిప్రాయం ఉంది . మీరేమంటారు?

జ: అసలు ‘ఆధునికత’ అనే మాటే వివాద గ్రస్తం.  సమకాలీన మైనదంతా ఆధునిక కాజాలదు.  ఆధునికత అనే భావన వ్యక్తి నిష్ఠమా? గుంపు నిష్ఠమా? కళా సాహిత్య విషయాలలో ఆధునికత అనే భావన పూర్తిగా వ్యక్తి నిష్ఠమని నా నమ్మిక.  ‘ఆధునికోత్తర’ అనే పద బంధం గాని, దాని భావ విస్తృతి గాని నా కేమీ తెలియవు.  నేనెప్పుడూ దృష్టి పెట్టలేదు.

  1. ఆదివాసుల గాథలు, పంచతంత్రం, మిత్ర భేదం, మిత్ర లాభం వంటివి చదివితే రచయితలు బాగు పడతారనిపిస్తుంది నాకు. ఆ కథల నిర్మాణం, వాటిలో ప్రతీకలు అత్యంత ఆధునీకంగా ఉంటాయి కదా? దక్షిణ అమెరికన్ రచయితలు ఇదే చేశారు. అవునా?

జ: మీరు పేర్కొన్న జాపితాకి మరి రెండు కలుపుతాను.  బౌధ్ధ జాతక కథలు, హంస వింశతి.  ముఖ్యంగా హంస వింశతిలో ఎంత జీవితం, ఎన్ని స్వభావాలు, చెప్పాడో కదా!  మళ్ళీ అదే మాట!  మన రచయితలకు అధ్యయన గుణం లేదు.  వేతన శర్మ కథ, సృష్టిలో, పిపీలికం వంటి కథల్ని రా.వి.శాస్త్రి వ్రాసాడన్నా, ‘బకాసుర’ వంటి కథ, దిబ్బ కథలు వంటివి కుటుంబ రావు వ్రాసారన్నా, – వాళ్ళ కథన చాతురికి వాళ్ళ అధ్యయనం ఎంతగా ఉపయోగ పడిందో బోధ పడుతుంది.  స్థానాపతి రుక్మిణమ్మ ‘దెయ్యాలు’ అని కథా సంకలనం కూర్చింది.  పల్లెటూళ్లలో చెప్పుకునే కథలు.  ఎంత బావుంటాయో.  కథలో, కథలో కథ గా కథలు అల్లే పద్ధతిని భారతీయులకు నేర్పింది పైశాచి ప్రాకృతంలో ఉన్న బృహత్ కథే.  కాశీ మజిలీ కథలకు ఈ విధానమే ప్రేరణ.  ముళ్ళపూడి గారి ‘రాజకీయ బేతాళ పంచ వింశతి’ ఈ పద్ధతి పుత్రికే – ఒకటే కర్తవ్యమండీ, సాహిత్య ప్రేమికులు ఎల్లలు లేని అధ్యయన వేత్తలు కావాలి.

  1. మీరు కథలు బాగా రాస్తారు. విరివిగా కథలు రాయాలని అనిపిస్తోందా? కొంతమంది రచయితలు సృజనాత్మకమైన సంతృప్తి కోసం ఒక దానికంటే ఎక్కువ సాహిత్య ప్రక్రియల్నిఆశ్రయిస్తూ ఉంటారు. సరదా కోసం వారు.  ప్రతిభ వల్ల మీరు?

జ: నా కేరీర్ తొలి రోజుల్లో – అంటే 1962-1967 నడుమ – ఎక్కువగా కథలే వ్రాసాను.  వ్యాసాలు కూడా.  ఒక సారి నేను వ్రాసిన ‘తెరలు’ అనే కథ ఆంధ్ర ప్రభ వార పత్రికలో వచ్చింది.  మా నాన్నగారు దానిని చదివి (1964 లో) నన్ను వెటకారం చేశారు.  “రమణీమణుల్ని దింపకుండా కథ వ్రాయ రాదా? లేవా? “ అని.  ఆ మూడో నాల్గో కథలు వ్రాసానేమో!  – (1967) – ఆ తర్వాత పూర్తిగా మానేశాను.  ఎంతదాకా? –  2000 సంవత్సరం అనుకుంటాను.  “ఏమైందంటే…” అనే కథను ‘రచన’ సాయిగారు ప్రచురించే పర్యంతం.  అప్పుడు నుంచి మళ్ళీ – కొంచమే – కథలు వ్రాయడం ప్రారంభించాను.  కథా  రచనని  చా.సో. గారు ‘A lyric in prose’ అన్నారు.  నాకా ప్రక్రియ చాలా ఇష్టం.  ఇంకో సంగతి చెప్పనా?  నేను ఇంగ్లీష్ లో ఆస్కార్ వైల్డ్, గోర్కీ, కాఫ్కా, చెహోవ్, ఓ హెన్రీ, మపాసా వంటి రచయితల కథలు చదివి కవిత్వం వైపు మళ్లిన వాడిని.  నా ఊదేశ్యంలో రచయిత అయినవాడికి అన్ని ప్రక్రియలు కరతలామలకంగా ఉండాలి.  ఏ పరికరం అవసరమో గుర్తెరిగి ఆ వృత్తంతో అనుసంధించ గలగాలి.  ‘కలిపి కొట్టరా కావేటి రంగా ‘ అన్న సామెతగా సర్వం కవిత్వం పేరిట ఊరదొక్క కూడదు.  నేను చేసిన వృత్తుల కారణంగా వివిధ ప్రక్రియలలో రచనలు చేయవలసిన అవసరం నా కేర్పడింది.   నాకా ప్రక్రియలు లొంగడానికి కారకులు – గాయకులు, నర్తకులు, నాటక ప్రయోక్తలు – యక్ష గాన కళాకారులు – నేనెరిగిన మూడు తరాల రచయితలూను.  సాహిత్యంలో ప్రక్రియా వైవిధ్యం నాకు చాలా ఇష్టమైన  అంశం.

  1. గత పాతిక సంవత్సరాలలో వచ్చిన కవిత్వం గురించి మీ అభిప్రాయం, కంప్లైంట్లు? పేర్లు, ధోరణులు అవసరం లేదు.

జ: గత పాతికేళ్ళంటే: సుమారు 1985 నుంచి అనుకుందాం. అంటే ఫెమినిస్ట్ లు, దళిత కవులు, ప్రముఖంగా రచనలు చేయడం నడుస్తున్న కాలం – నిష్కర్షగా చెప్పాలంటే:

_ most of the complaints were accusative.  భౌతికం, సామాజిక ప్రశ్నలు, ఫిర్యాదులు, సాధారణమయ్యాయి.

_ ఊహాశాలిత, లాలిత్యం, సున్నితత్వం స్థానే వెటకారం, ఎత్తిపొడుపు, తాత్త్వి కంగా బాకీ తీర్చుకునే ధోరణీ,  నాకు కంపించాయి.  లోతు తక్కువ.  వైశాల్యం ఎక్కువ, and frequently offensive.

  1. ఒక జీవత్ భాషగా తెలుగు ప్రమాదంలో పడిందనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు?

జ: ప్రమాదంలో పడిందంటే:  మన మధ్య తరగతి, ఉన్న తరగతి మహాను భావులే పడేశారు.  బహుశ ఏ యితర భాషల వాళ్ళకీ లేని భాషా దారిద్రయం మన వాళ్ళ నొసటనే పొడిచింది.  నేనెరిగినంతలో నలభై యేళ్ళ క్రితం ఈ విధ్వంసనాలు ఏ తెలుగు జాతి మహానుభావులు చేశారో వారే ఇవాళ పంచలు, కండువాలు ధరించి తెలుగు భాషోధ్ధారణ ప్రసంగాలు చేస్తున్నారు.  నాకు తెలియని, బోధపడని అంశం;  భాషా విషయం ఎవరికి వారు అనుసరించదగిన అంశం.  వీరంతా ఎదుటివారికి ఉపదేశిస్తారేమిటీ?  జరగాల్సిన చోట నిశ్శబ్దంగా, నిస్సంశయంగా, ధృఢంగా ఆచరణ జరగాలి.  అది లేదు.  జీవద్భాష అన్న తర్వాత అది అంతరిస్తుందనటం సరికాదు.  అంతా బూతులతో  సహా సుఖంగా తెలుగు భాష మాట్లాడుకుంటున్నారు.  భాషకేమీ ఢోకా లేదు.  Convent generation percentage చాలా స్వల్పం.  జరుగుతున్న హంగు, నాటకం అంతా నీడలను చూసి భయపడటమంతే!

  1. తెలుగు వాళ్ళకి అతి సున్నితమైన కవిత్వం, వచనం, ఇతర లలిత కళల పట్ల ఆసక్తి లేదేమో అనిపిస్తూ ఉంటుంది ప్రశ్న. ఏదైనా కొంచం ఎక్కువ మోతాదులో ఉండాలి. నిజమేనా?

జ: పూర్వం మనం కాలేజీలలో చదువుకునే రోజుల్లో ఇద్దరు ముగ్గురు లెక్చరర్లో – హై స్కూళ్ళలో తెలుగు పండితులో – కళాసాహిత్యాల పట్ల కొందరినైనా యువ విధ్యార్ధుల్ని ఇన్స్పైర్  చేసేవారుండేవారు.  నాటకాలు, పాటలు, ఆటలు, సందడి బాగా ఉండేది.  బోధకులు, విద్యార్ధులు కూడా ఇవాళ తీరిక లేని వాళ్ళు అవుతున్నారు.  తల్లిదండ్రులు కూడా పిల్లల అభిరుచుల మీద కంటే కెరీర్ మీదనే ఎక్కువ వత్తిడి పెంచుతున్నారు.  కవులూ, కళాకారుల ఆవశ్యం పెరగాలి.  నాకు పెరగగలరనే ఆశ ఉంది.

  1. నిజమైన intellectual రచయితలు తెలుగులో అతి తక్కువ మంది ఉన్నారని అభియోగం విన్నాను. అంటే అనేక విషయాల పట్ల ఆసక్తి, వాటి గురించి ఆలోచించడం, కనీసం ఇతర లలిత కళల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళన్న మాట. ఇది అంతరిస్తున్న జాతి అంటున్నారు.

జ: మళ్ళీ నాది పాత పాట:  అధ్యయనం, పరిశోధనా శక్తి లేక పోవటమే కారణం.   చరిత్ర, సామాజిక అంశాలు, కళలు, సాహిత్యం పట్ల గాఢమైన, ఏకీకృతమైన దీక్ష intellectual flair అనిపించుకుంటుంది.  ఒక జాతిగా అటువంటి వైవిధ్యం గల ‘యావ’ మన వాళ్ళలో లేకపోవడం మన దురదృష్టం.

  1. మంచి సినిమా, సంగీతం, నాటకం వంటి వాటి మీద తెలుగు వాళ్ళకి కక్ష వంటిది ఉందంటారా? మరి పొరుగు రాష్ట్రాలలో ఈ పరిస్థితి కనిపించదు గదా?

జ: దీనికి కారణాలు చాలా లోతైనవి.  ప్రాధమికంగా మన తెలుగు జాతికి కెరీర్, డబ్బు సంపాదన, ఏదో రకంగా జీవితంలో సక్సెస్ మీద ఉన్న యావ, కళలు, సాహిత్యం మీద లేవుగాక లేవు.  మతం, సాహిత్యం, రాజకీయాలు అన్నీ నాసిరకంగా పరిణమించినట్టే కళలు, సాహిత్యం కూడా నాసిరకంగా పరిణమించాయి.  సినిమా, సంగీతం పరిస్థితి అంతే.  ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దు.  మీడియోక్రిటీ అనేది మన జాతి జీవనంలో మెజారిటీ జనానికి లైఫ్ లైన్ అని నా వ్యక్తిగత అభిప్రాయం.  తెలుగు తనపు నాసి తనాన్ని యేళ్ళ తరబడి వదుల్చుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను.

  1. మీరెన్నో సంవత్సరాలు అధ్యయనం చేస్తూ వచ్చిన ఉపనిషత్తులకు వివరణ వంటిది రాశారు గదా, పూర్తి అయిందా?

జ: ఉపనిషత్తుల అనువాదం త్వరలో పుస్తకరూపంలో వస్తోంది.  అవి 11.  పూర్వ తాత్త్వికులు  ఆచార్య త్రయం వారి వ్యాఖ్యలు, వివాదాలలోకి వెళ్లకుండా – ఉపనిషత్తుల తాత్త్విక చింతన, ఆసక్తి గల చదువరులకు వ్యావహారిక సరళ వచనంలో అనువదించి ప్రతి సూక్తం చూపడం, కొద్దిగా అవసరమైన పరిభాషల్ని వివరించడం నా ప్రధమ సంకల్పం.   ఉభయ వేదాంత పండితులు, నా మిత్రులు, శ్రీమాన్ సముద్రాల రంగ రామానుజాచార్య ముందు మాటతో ముద్రణ జరుగుతోంది.

  1. మీ అనుభవాలు, జ్ఞాపకాలు ఎప్పుడు విడుదల చేస్తారు? పుస్తకం రాస్తున్నప్పుడు తాటస్త్యమ్ సాధ్య పడింది? అసాధారణ ప్రజాదరణ లభిస్తుందనుకుంటున్నాను.

జ: ‘నేను ఇంటిపేరు ఇంద్రగంటి’ పేరిట ఆత్మకథ వ్రాయడానికి కారణం:  గత యాభై యేళ్లలో నేనెరిగిన సాహిత్య జీవితం రికార్డు చేయాలని.  మా పూర్వుల కథ కొంత, మా నాన్నగారి అనుభవాలు, ఆశా భంగాలు, రచనా వ్యాసంగ విశేషాలు కొంత, నా తరంలో నేను ప్రత్యక్షంగా పత్రికా రచయితగా, రేడియో కార్యక్రమ ప్రయోక్తగా, రచయితగా పొందిన అనుభవ పరంపర కొంత – కలిపి ఈ రచన చేస్తున్నాను.  1968 నుంచి 2016 వరకు నేను వ్రాసిపెట్టుకున్న డైరీలు, నేనెరిగిన మూడు తరాల రచయితలతో సన్నిహిత పరిచయాలు, ఈ రచనకు ప్రేరణ.  త్వరలో పూర్తి చేస్తాను.

  1. తెలుగు కథా రచయితలు ఫోరంని ఎక్కువ డిస్టర్బ్ చేయ లేదని అభియోగం ఉంది. మీరేమంటారు?

జ: నేనెరిగినంతలో – ఆచంట సాంఖ్యాయనశర్మ  గారి దగ్గర 1909 నాటి నుంచి ప్రారంభించి చూస్తే – ఒక కథాంశం, లేదా ఘటన నుంచి చెప్పిన కథలే ఎక్కువ.  కథా రచనలలో సాంప్రదాయితంగా నడిచే ఈ ఫ్రేం ని ఆధునిక కథా రచయితలలో  డిష్టర్బ్ చేసిన రచయితలు నలుగురు.  పద్మరాజు, బుచ్చిబాబు, రా.వి.శాస్త్రి, త్రిపుర.  వీరి కథలలో కేవలం కథనం మాత్రమేకాక, పైకి కనపడని తాత్త్విక ప్రశ్నలు, ప్రతి పాదనలు ఉంటాయి.  దాని ద్వారా కథకు గల విశేష శక్తి బహిర్గతమైనదనే  నా విశ్వాసం.

  1. బాల సాహిత్య రచయిత, మేధావి కాడనీ, వ్యాస రచన ఉత్తమ సాహిత్య స్థాయికి చెందదని ఒక అభిప్రాయం ఉంది. నాటకాన్ని సాహిత్యంగా అంగీకరించడం లేదు – ‘కన్యాశుల్కం’ తప్ప. వ్యాసం అంటే ఏదో ఇన్ఫర్మేటివ్ గా తప్ప దానిని సాహిత్య ప్రక్రియ గా మనం గౌరవించం  అనుకుంటాను. 

జ: మీరంతదాకా వెళ్లారు నయం.  అసలు పద్య కావ్యం వ్రాయని వాడు రచయిత ఏమిటీ? అనే ప్రబుద్ధులు మన జాతిలో ఉన్నారు.  సైజు, బరువే క్రైటీరియా.  బాల సాహిత్యం అనే ఊహే మన వాళ్ళకి అర్ధం అయిందనుకోను.  బాల గేయాలంటూ ప్రౌఢులు పాటలు వ్రాయడంతో సరిపెట్టారు.  పిల్లలకు అద్భుతాలు, fairy tales, బొమ్మలతో చెబితే చాలా ఇష్టం.  ఆ పని రష్యా రచయితలు, ఇంగ్లీష్ రచయితలు గొప్పగా చేశారు.  మళ్ళీ మళ్ళీ భారత కథలు, రామాయణ కథలు, పంచ తంత్రం, జాతక కథలు, చెప్పినవే చెప్పడమే తప్ప – లేదా ఉపదేశాలు కుక్కడం తప్ప, ఆహ్లాద కరమైన, కంటికింపైన, బాలల కథా సాహిత్యం తెలుగులో కొత్త ఆలోచనలతో, పాత్రల కల్పనతో జరగలేదనే నా అభిప్రాయం.

ఇక – వ్యాస రచనలో పరిశోధన, విశ్లేషణ, ప్రతిపాదన – ఈ త్రయి నెరవేర్చడానికి ఎంతో సహనం, సహృదయత, విస్తారమైన పఠనానుభవం కావాలి.  ఇంతా చేసి ఇదంతా పత్తి పని.  Thankless job అని మన వాళ్ళలో చాలా మందికి గల ధృఢభిప్రాయం.  ఉంటే పొగడ్త. లేకపోతే తెగడ్త.  శాస్త్రీయత ఎక్కడ ఉందీ? మన తెలుగులో సాహిత్య విమర్శ చాలా భాగం కవులకు, రచయితలకు ఉపాహారం.  Main course  కాలేదనుకుంటాను.

నాటక రచన విషయానికి వస్తే – తొలి రోజుల్లో పురాణం సూరి శాస్త్రిగారొక్కరు నాటక రచనల్ని, నటుల సమర్ధతని, నిష్కర్షగా అంచనా వేసిన వారిగా కనిపిస్తున్నారు.  అదీగాక, పరిషత్తు నాటకాల హవా తెలుగు నాటకాన్ని, ఒక మూస లోకి తోసేసిందని నాకు ఏర్పడిన ధృఢభిప్రాయం.  తెలుగులో చాలా మంది వచనం వ్రాయగల మంచి రచయితలు నాటకం వైపు రాలేదు.  చదువుకున్నా, ప్రదర్శన చూసినా, సరిసమానంగా మనకు ఆదరణ కలిగించ గల నాటకాలు – కన్యాశుల్కం తో సహా – చాలా తక్కువ.  నేను చాలా ప్రదర్శనలు చూసి –  41 తెలుగు నాటకాలు సమీక్షిస్తూ ‘అలనాటి నాటకాలు’ అనే పుస్తకం వ్రాసి – అనుభవంతో చెపుతున్నాను.

హాస్యాన్ని కూడా ప్రత్యేక సాహిత్యాంసంగా మన వాళ్ళు గుర్తించ లేదు.  ఆహ్లాదకరమైన హాస్య నాటకాలకు పరిషత్తుల్లో బహుమతులిచ్చిన దాఖలాలు నాకు కనపడలేదు.  ఎమెట్యూర్ ధియేటర్ లో కృషి చేసిన చాలా మంది ప్రయోక్తలు, రచయితలూ కూడా main stream సాహిత్యవేత్తలుగా కృషి చేసిన వారు కారు. నవలల్ని “సీరియల్ నవల” పేరిట ఒక ప్రక్రియగా చేసినట్టే నాటకాన్ని కూడా “పరిషత్తు నాటకం” పేరిట మూసలో పోశారని నా అభియోగం.  రచయిత ఒక ఉద్దేశ్యంతో నిర్వహించదలచిన నాటకాన్ని కొందరు ప్రముఖ నటులు తమ రంగస్థల అవసరాల కోసం మార్చేసి, కుదేలు పరచిన (సాహిత్య పరంగా) నాటకాలుగా పద్మరాజుగారి ‘రక్త కన్నీరు’, కాళ్ళ కూరి వారి ‘చింతామణి’ చెప్పుకుంటే చాలు.  సాహిత్య గౌరవం, తాహతు ఏమి మిగిల్చారు?

31. ఇన్నేళ్ళ సాహిత్య జీవితం, రచన, గొప్ప వాళ్ళతో స్నేహ పరిచయాలు – ఇప్పుడు మీకేవనిపిస్తోంది?

జ: విజయవాడ, విశాఖపట్నం, మద్రాసు, తెనాలి, బందరు, కాకినాడ, రాజమండ్రీలలో నేనెరిగిన సాహిత్య సభలు, ఎందరో సాహిత్య బంధువులు, ఆత్మీయ మిత్రులు, ఇప్పుడు గతించిపోయారు.  నేనెరిగిన ప్రముఖ రచయితలు నా కంటే వయస్సులో, అనుభవంలో, రచనా సామర్ధ్యంలో అధికులు.  వాళ్ళు ఏనాడూ రచయిత మిత్రులుగా వయస్సు అంతరాన్ని పాటించే వారు కారు.  సమాన స్కంధులుగానే స్నేహం నేర్పే వారు.  నా జీవితంలో విజయవాడ, మద్రాసు అలాంటి గొప్ప స్నేహాల్ని ఇచ్చాయి.  రేడియో, పత్రికలు ఎంత వైబ్రంట్ గానో ఉండేవి కదా! – ‘కహా గయే ఓ దిన్’, అని అనుకుంటూ ఉంటాను.  వారందరూ ఎక్కడికి వెళ్ళి పోయారు? అని జ్ఞాపకాలు బాధిస్తాయి.  వాళ్ళంతా వివిధ సంధర్భాలలో నాకు అర్ధ శతాబ్ధిగా వ్రాసిన సుమారు 200 ల ఉత్తరాలు భద్రంగా దాచాను.  వాళ్ళ దస్తూరీలోంచి వాళ్ళు  నన్ను పలకరిస్తూనే ఉంటారు. కొత్త మిత్రులు యిటీవల చాలా మంది కలిశారు.

The show goes on forever – అజంతా అంటూ ఉండేవారు: “మన వెనక నుంచి పలకరించి వెళ్ళి పోయినట్లుగానే మనం అలా పొగలాగ వెళ్లిపోవాలి” అని – నిజం కదా!

నన్ను గురించి నే ననుకునేది ఒకటే – నేను కోరుకున్న చదువు చదివాను.  ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను.  మనసుకు నచ్చిన ఉద్యోగాలు చేశాను.  నిజాయితీగా నేను దగ్గరగా ఎరిగినవీ, నా అనుభవాలుగా ఎదురైన సుఖదుఖాలు, ఉద్రిక్తతలు, బెంగలూ, సంయోగవియోగాల గురించీ వ్రాశాను.

ఇంతకంటే ఏం కావాలీ?