లోతు తక్కువ.. వైశాల్యం ఎక్కువ!

 

“మాళవిక” నవలా రచయిత ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారితో వారి ప్రియ మిత్రులు, సాహితీవేత్త, తల్లావఝుల పతంజలి శాస్త్రి గారు ‘ఛాయ’ సంస్థ కోసం జరిపిన సంభాషణల రెండవ, చివరి భాగం.

 సాహిత్య దర్శనం అంటే ఏమిటి? సాహిత్యానుభవం రచయితలకు కొరవడినదని నేను అనుకుంటున్నాను.

జ: ‘దర్శనం’ అంటే శాస్త్ర పరి భాషలో ‘నిశితమైన చూపు’ అని అర్ధం.  ఒక తాత్విక ప్రతిపాదన గాని, కళా సాహిత్య ప్రతిపాదనగాని – స్వతంత్ర బుద్ధితో – ఏ రంగమ్ముందుకైనా తీసుకురావడం ‘దర్శనం’ ప్రాధమిక ధర్మం.  సాహిత్య విషయకమైన నిర్వచనాలూ, కొందరు విశిస్ట రచయితల గురించి సమర్ధులైన  విమర్శకులు చేసిన విశ్లేషణలు స్థూలంగా ‘సాహిత్య దర్శనం’ గా చెప్పుకోవచ్చు.  ప్రతి దర్శనం, చర్చకు అవకాశం ఇచ్చేదే – ఇక – సాహిత్యానుభవం సంగతి. ఇది కవిత్వ విషయంలో ఒక అంతరువులోనూ, వచన ప్రక్రియల విషయంలో మరొక అంతరువులోనూ ఉండే అవకాశం ఉంది.  కవిత్వ పాఠకుడుకి instant గా intuitive గా కవిత్వానుభవం కలిగే అవకాశం ఉంటుంది.   వచన ప్రక్రియల విషయంలో సమాజం, వ్యక్తుల స్వభావాలు, బాహ్య ఆంతరిక పరిస్థితులు, వంటి యితర విషయాల ప్రమేయం కూడా అవసరం అవుతాయి. సూటిగా చెప్పాలంటే కవిత్వానుభవం చాలా సబ్జెక్టివ్.  వచన ప్రక్రియ ఆస్వాదన అనండి, అర్ధం కావటం అనండి,  చాలా భాగం ఆబ్జెక్టివ్ – అదలా ఉంచండి – తెలుగు రచయితలకు సాహిత్యానుభవం లేక పోవడానికి ప్రధాన కారణం అధ్యయన లోపం.  రచయిత ఎప్పుడూ చదువుతూ ఉండాలి.  కేవలం జీవితాన్ని జల్లెడ పట్టేశాను అనుకుంటే చాలదు.  సాహిత్యం ఒక క్రాఫ్ట్.    చూడాలి.  చూసింది బలంగా చెప్పగలగాలి.  ఇది కేవలం అధ్యయనం వల్ల మాత్రమే సాధ్యం.

  1. మనకి లిటరరీ ఇంటిగ్రటి పలచబడిపోతున్నదని నా అభిప్రాయము. మీకెలా అనిపిస్తుంది?

జ: లిటరరీ ఇంటిగ్రటి అనేది వ్యక్తి  స్వభావాన్ని చెపుతుంది.  ప్రాణం పోయినా సరే, ఆ వ్యక్తి తన భావ ప్రకటనా స్వేచ్ఛ, అందు మూలంగా అబ్బిన స్వతంత్ర వ్యక్తిత్వం వదులు కోడు.  చలం, విశ్వనాథ, శ్రీపాద, కుటుంబ రావు, అజంతా, రా.వి.శాస్త్రి, త్రిపుర వంటి వాళ్ళు నాకు వెంటనే గుర్తుకొస్తున్నారు.   అది ప్రాధమిక  అవసరం.  ముసిలోణ్ణయి పోయానని మీరు అనుకోరని నాకు తెల్సు.  సుమారు పదేళ్ళుగా ఇది సరిగా లేదని – మీతో ఏకీభవిస్తున్నాను.

  1. మీ రచనల మీద మీకు సంతృప్తి ఉందా?

జ: నేను నా రచనలలో రకరకాల ప్రక్రియలు వాడ గలిగా ననుకుంటున్నాను.  అయితే నేను ఏ ఒక్క సిద్ధాంతానికో, మత  ధార్మిక అంశాలకో చెందిన వాణ్ని కాను.  నాకు జీవన లాలస ఎక్కువ.  గోదావరిలో పడవ నడుపుకునే వాళ్ళ మొదలు రకరకాల స్థాయి లో మనుషులు నాకు పరిచయం.  మన తెలుగు వాళ్ళ అహంకారాలు, భేషజాలు, టెక్కులు, వెటకారాలు, లౌఖ్యాలు, దొంగ ప్రేమలు, సదాచారాలు, వ్యభిచారాలు చాలా వరకు నా అనుభవాల ద్వారా సుపరిచితాలు.  నేచర్, ఋతువుల పరిణామం – తెల్సి జీవించటం చాలా ఇష్టం.  ఎరమరికలు లేకుండా ప్రపంచ సాహిత్యం చదవడం నాకు ఇష్టం.  దరిద్రం ఎరుగుదును గనుక డబ్బున్న వాడిగా ఉండడం ఇష్టం.  చాలా వరకు నా రచనలకు నా జీవితానుభవాలు, బలమైన ఇష్టానిష్టాలే  మూలం.  సాహిత్య వ్యాసంగంలో మొగమాటాలు, అబద్ధాలు, జీవన వక్రీకరణలు నాకు సమ్మతం కావు.  అపరిచిత విషయాల్ని ఊహించి వ్రాయలేదని చెప్పగలను.  ఈ మాత్రపు నిజాయితీ నా కున్నదని చెప్పగలను.  తృప్తికి అంతం ఎక్కడా?

  1. అసలు ఆధునిక కళ అనేదే సకృత్తుగా ఉన్నప్పుడు మనకి ‘ఆధునికోత్తర దశ ‘ ఏమిటని ఒక అభిప్రాయం ఉంది . మీరేమంటారు?

జ: అసలు ‘ఆధునికత’ అనే మాటే వివాద గ్రస్తం.  సమకాలీన మైనదంతా ఆధునిక కాజాలదు.  ఆధునికత అనే భావన వ్యక్తి నిష్ఠమా? గుంపు నిష్ఠమా? కళా సాహిత్య విషయాలలో ఆధునికత అనే భావన పూర్తిగా వ్యక్తి నిష్ఠమని నా నమ్మిక.  ‘ఆధునికోత్తర’ అనే పద బంధం గాని, దాని భావ విస్తృతి గాని నా కేమీ తెలియవు.  నేనెప్పుడూ దృష్టి పెట్టలేదు.

  1. ఆదివాసుల గాథలు, పంచతంత్రం, మిత్ర భేదం, మిత్ర లాభం వంటివి చదివితే రచయితలు బాగు పడతారనిపిస్తుంది నాకు. ఆ కథల నిర్మాణం, వాటిలో ప్రతీకలు అత్యంత ఆధునీకంగా ఉంటాయి కదా? దక్షిణ అమెరికన్ రచయితలు ఇదే చేశారు. అవునా?

జ: మీరు పేర్కొన్న జాపితాకి మరి రెండు కలుపుతాను.  బౌధ్ధ జాతక కథలు, హంస వింశతి.  ముఖ్యంగా హంస వింశతిలో ఎంత జీవితం, ఎన్ని స్వభావాలు, చెప్పాడో కదా!  మళ్ళీ అదే మాట!  మన రచయితలకు అధ్యయన గుణం లేదు.  వేతన శర్మ కథ, సృష్టిలో, పిపీలికం వంటి కథల్ని రా.వి.శాస్త్రి వ్రాసాడన్నా, ‘బకాసుర’ వంటి కథ, దిబ్బ కథలు వంటివి కుటుంబ రావు వ్రాసారన్నా, – వాళ్ళ కథన చాతురికి వాళ్ళ అధ్యయనం ఎంతగా ఉపయోగ పడిందో బోధ పడుతుంది.  స్థానాపతి రుక్మిణమ్మ ‘దెయ్యాలు’ అని కథా సంకలనం కూర్చింది.  పల్లెటూళ్లలో చెప్పుకునే కథలు.  ఎంత బావుంటాయో.  కథలో, కథలో కథ గా కథలు అల్లే పద్ధతిని భారతీయులకు నేర్పింది పైశాచి ప్రాకృతంలో ఉన్న బృహత్ కథే.  కాశీ మజిలీ కథలకు ఈ విధానమే ప్రేరణ.  ముళ్ళపూడి గారి ‘రాజకీయ బేతాళ పంచ వింశతి’ ఈ పద్ధతి పుత్రికే – ఒకటే కర్తవ్యమండీ, సాహిత్య ప్రేమికులు ఎల్లలు లేని అధ్యయన వేత్తలు కావాలి.

  1. మీరు కథలు బాగా రాస్తారు. విరివిగా కథలు రాయాలని అనిపిస్తోందా? కొంతమంది రచయితలు సృజనాత్మకమైన సంతృప్తి కోసం ఒక దానికంటే ఎక్కువ సాహిత్య ప్రక్రియల్నిఆశ్రయిస్తూ ఉంటారు. సరదా కోసం వారు.  ప్రతిభ వల్ల మీరు?

జ: నా కేరీర్ తొలి రోజుల్లో – అంటే 1962-1967 నడుమ – ఎక్కువగా కథలే వ్రాసాను.  వ్యాసాలు కూడా.  ఒక సారి నేను వ్రాసిన ‘తెరలు’ అనే కథ ఆంధ్ర ప్రభ వార పత్రికలో వచ్చింది.  మా నాన్నగారు దానిని చదివి (1964 లో) నన్ను వెటకారం చేశారు.  “రమణీమణుల్ని దింపకుండా కథ వ్రాయ రాదా? లేవా? “ అని.  ఆ మూడో నాల్గో కథలు వ్రాసానేమో!  – (1967) – ఆ తర్వాత పూర్తిగా మానేశాను.  ఎంతదాకా? –  2000 సంవత్సరం అనుకుంటాను.  “ఏమైందంటే…” అనే కథను ‘రచన’ సాయిగారు ప్రచురించే పర్యంతం.  అప్పుడు నుంచి మళ్ళీ – కొంచమే – కథలు వ్రాయడం ప్రారంభించాను.  కథా  రచనని  చా.సో. గారు ‘A lyric in prose’ అన్నారు.  నాకా ప్రక్రియ చాలా ఇష్టం.  ఇంకో సంగతి చెప్పనా?  నేను ఇంగ్లీష్ లో ఆస్కార్ వైల్డ్, గోర్కీ, కాఫ్కా, చెహోవ్, ఓ హెన్రీ, మపాసా వంటి రచయితల కథలు చదివి కవిత్వం వైపు మళ్లిన వాడిని.  నా ఊదేశ్యంలో రచయిత అయినవాడికి అన్ని ప్రక్రియలు కరతలామలకంగా ఉండాలి.  ఏ పరికరం అవసరమో గుర్తెరిగి ఆ వృత్తంతో అనుసంధించ గలగాలి.  ‘కలిపి కొట్టరా కావేటి రంగా ‘ అన్న సామెతగా సర్వం కవిత్వం పేరిట ఊరదొక్క కూడదు.  నేను చేసిన వృత్తుల కారణంగా వివిధ ప్రక్రియలలో రచనలు చేయవలసిన అవసరం నా కేర్పడింది.   నాకా ప్రక్రియలు లొంగడానికి కారకులు – గాయకులు, నర్తకులు, నాటక ప్రయోక్తలు – యక్ష గాన కళాకారులు – నేనెరిగిన మూడు తరాల రచయితలూను.  సాహిత్యంలో ప్రక్రియా వైవిధ్యం నాకు చాలా ఇష్టమైన  అంశం.

  1. గత పాతిక సంవత్సరాలలో వచ్చిన కవిత్వం గురించి మీ అభిప్రాయం, కంప్లైంట్లు? పేర్లు, ధోరణులు అవసరం లేదు.

జ: గత పాతికేళ్ళంటే: సుమారు 1985 నుంచి అనుకుందాం. అంటే ఫెమినిస్ట్ లు, దళిత కవులు, ప్రముఖంగా రచనలు చేయడం నడుస్తున్న కాలం – నిష్కర్షగా చెప్పాలంటే:

_ most of the complaints were accusative.  భౌతికం, సామాజిక ప్రశ్నలు, ఫిర్యాదులు, సాధారణమయ్యాయి.

_ ఊహాశాలిత, లాలిత్యం, సున్నితత్వం స్థానే వెటకారం, ఎత్తిపొడుపు, తాత్త్వి కంగా బాకీ తీర్చుకునే ధోరణీ,  నాకు కంపించాయి.  లోతు తక్కువ.  వైశాల్యం ఎక్కువ, and frequently offensive.

  1. ఒక జీవత్ భాషగా తెలుగు ప్రమాదంలో పడిందనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు?

జ: ప్రమాదంలో పడిందంటే:  మన మధ్య తరగతి, ఉన్న తరగతి మహాను భావులే పడేశారు.  బహుశ ఏ యితర భాషల వాళ్ళకీ లేని భాషా దారిద్రయం మన వాళ్ళ నొసటనే పొడిచింది.  నేనెరిగినంతలో నలభై యేళ్ళ క్రితం ఈ విధ్వంసనాలు ఏ తెలుగు జాతి మహానుభావులు చేశారో వారే ఇవాళ పంచలు, కండువాలు ధరించి తెలుగు భాషోధ్ధారణ ప్రసంగాలు చేస్తున్నారు.  నాకు తెలియని, బోధపడని అంశం;  భాషా విషయం ఎవరికి వారు అనుసరించదగిన అంశం.  వీరంతా ఎదుటివారికి ఉపదేశిస్తారేమిటీ?  జరగాల్సిన చోట నిశ్శబ్దంగా, నిస్సంశయంగా, ధృఢంగా ఆచరణ జరగాలి.  అది లేదు.  జీవద్భాష అన్న తర్వాత అది అంతరిస్తుందనటం సరికాదు.  అంతా బూతులతో  సహా సుఖంగా తెలుగు భాష మాట్లాడుకుంటున్నారు.  భాషకేమీ ఢోకా లేదు.  Convent generation percentage చాలా స్వల్పం.  జరుగుతున్న హంగు, నాటకం అంతా నీడలను చూసి భయపడటమంతే!

  1. తెలుగు వాళ్ళకి అతి సున్నితమైన కవిత్వం, వచనం, ఇతర లలిత కళల పట్ల ఆసక్తి లేదేమో అనిపిస్తూ ఉంటుంది ప్రశ్న. ఏదైనా కొంచం ఎక్కువ మోతాదులో ఉండాలి. నిజమేనా?

జ: పూర్వం మనం కాలేజీలలో చదువుకునే రోజుల్లో ఇద్దరు ముగ్గురు లెక్చరర్లో – హై స్కూళ్ళలో తెలుగు పండితులో – కళాసాహిత్యాల పట్ల కొందరినైనా యువ విధ్యార్ధుల్ని ఇన్స్పైర్  చేసేవారుండేవారు.  నాటకాలు, పాటలు, ఆటలు, సందడి బాగా ఉండేది.  బోధకులు, విద్యార్ధులు కూడా ఇవాళ తీరిక లేని వాళ్ళు అవుతున్నారు.  తల్లిదండ్రులు కూడా పిల్లల అభిరుచుల మీద కంటే కెరీర్ మీదనే ఎక్కువ వత్తిడి పెంచుతున్నారు.  కవులూ, కళాకారుల ఆవశ్యం పెరగాలి.  నాకు పెరగగలరనే ఆశ ఉంది.

  1. నిజమైన intellectual రచయితలు తెలుగులో అతి తక్కువ మంది ఉన్నారని అభియోగం విన్నాను. అంటే అనేక విషయాల పట్ల ఆసక్తి, వాటి గురించి ఆలోచించడం, కనీసం ఇతర లలిత కళల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళన్న మాట. ఇది అంతరిస్తున్న జాతి అంటున్నారు.

జ: మళ్ళీ నాది పాత పాట:  అధ్యయనం, పరిశోధనా శక్తి లేక పోవటమే కారణం.   చరిత్ర, సామాజిక అంశాలు, కళలు, సాహిత్యం పట్ల గాఢమైన, ఏకీకృతమైన దీక్ష intellectual flair అనిపించుకుంటుంది.  ఒక జాతిగా అటువంటి వైవిధ్యం గల ‘యావ’ మన వాళ్ళలో లేకపోవడం మన దురదృష్టం.

  1. మంచి సినిమా, సంగీతం, నాటకం వంటి వాటి మీద తెలుగు వాళ్ళకి కక్ష వంటిది ఉందంటారా? మరి పొరుగు రాష్ట్రాలలో ఈ పరిస్థితి కనిపించదు గదా?

జ: దీనికి కారణాలు చాలా లోతైనవి.  ప్రాధమికంగా మన తెలుగు జాతికి కెరీర్, డబ్బు సంపాదన, ఏదో రకంగా జీవితంలో సక్సెస్ మీద ఉన్న యావ, కళలు, సాహిత్యం మీద లేవుగాక లేవు.  మతం, సాహిత్యం, రాజకీయాలు అన్నీ నాసిరకంగా పరిణమించినట్టే కళలు, సాహిత్యం కూడా నాసిరకంగా పరిణమించాయి.  సినిమా, సంగీతం పరిస్థితి అంతే.  ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దు.  మీడియోక్రిటీ అనేది మన జాతి జీవనంలో మెజారిటీ జనానికి లైఫ్ లైన్ అని నా వ్యక్తిగత అభిప్రాయం.  తెలుగు తనపు నాసి తనాన్ని యేళ్ళ తరబడి వదుల్చుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను.

  1. మీరెన్నో సంవత్సరాలు అధ్యయనం చేస్తూ వచ్చిన ఉపనిషత్తులకు వివరణ వంటిది రాశారు గదా, పూర్తి అయిందా?

జ: ఉపనిషత్తుల అనువాదం త్వరలో పుస్తకరూపంలో వస్తోంది.  అవి 11.  పూర్వ తాత్త్వికులు  ఆచార్య త్రయం వారి వ్యాఖ్యలు, వివాదాలలోకి వెళ్లకుండా – ఉపనిషత్తుల తాత్త్విక చింతన, ఆసక్తి గల చదువరులకు వ్యావహారిక సరళ వచనంలో అనువదించి ప్రతి సూక్తం చూపడం, కొద్దిగా అవసరమైన పరిభాషల్ని వివరించడం నా ప్రధమ సంకల్పం.   ఉభయ వేదాంత పండితులు, నా మిత్రులు, శ్రీమాన్ సముద్రాల రంగ రామానుజాచార్య ముందు మాటతో ముద్రణ జరుగుతోంది.

  1. మీ అనుభవాలు, జ్ఞాపకాలు ఎప్పుడు విడుదల చేస్తారు? పుస్తకం రాస్తున్నప్పుడు తాటస్త్యమ్ సాధ్య పడింది? అసాధారణ ప్రజాదరణ లభిస్తుందనుకుంటున్నాను.

జ: ‘నేను ఇంటిపేరు ఇంద్రగంటి’ పేరిట ఆత్మకథ వ్రాయడానికి కారణం:  గత యాభై యేళ్లలో నేనెరిగిన సాహిత్య జీవితం రికార్డు చేయాలని.  మా పూర్వుల కథ కొంత, మా నాన్నగారి అనుభవాలు, ఆశా భంగాలు, రచనా వ్యాసంగ విశేషాలు కొంత, నా తరంలో నేను ప్రత్యక్షంగా పత్రికా రచయితగా, రేడియో కార్యక్రమ ప్రయోక్తగా, రచయితగా పొందిన అనుభవ పరంపర కొంత – కలిపి ఈ రచన చేస్తున్నాను.  1968 నుంచి 2016 వరకు నేను వ్రాసిపెట్టుకున్న డైరీలు, నేనెరిగిన మూడు తరాల రచయితలతో సన్నిహిత పరిచయాలు, ఈ రచనకు ప్రేరణ.  త్వరలో పూర్తి చేస్తాను.

  1. తెలుగు కథా రచయితలు ఫోరంని ఎక్కువ డిస్టర్బ్ చేయ లేదని అభియోగం ఉంది. మీరేమంటారు?

జ: నేనెరిగినంతలో – ఆచంట సాంఖ్యాయనశర్మ  గారి దగ్గర 1909 నాటి నుంచి ప్రారంభించి చూస్తే – ఒక కథాంశం, లేదా ఘటన నుంచి చెప్పిన కథలే ఎక్కువ.  కథా రచనలలో సాంప్రదాయితంగా నడిచే ఈ ఫ్రేం ని ఆధునిక కథా రచయితలలో  డిష్టర్బ్ చేసిన రచయితలు నలుగురు.  పద్మరాజు, బుచ్చిబాబు, రా.వి.శాస్త్రి, త్రిపుర.  వీరి కథలలో కేవలం కథనం మాత్రమేకాక, పైకి కనపడని తాత్త్విక ప్రశ్నలు, ప్రతి పాదనలు ఉంటాయి.  దాని ద్వారా కథకు గల విశేష శక్తి బహిర్గతమైనదనే  నా విశ్వాసం.

  1. బాల సాహిత్య రచయిత, మేధావి కాడనీ, వ్యాస రచన ఉత్తమ సాహిత్య స్థాయికి చెందదని ఒక అభిప్రాయం ఉంది. నాటకాన్ని సాహిత్యంగా అంగీకరించడం లేదు – ‘కన్యాశుల్కం’ తప్ప. వ్యాసం అంటే ఏదో ఇన్ఫర్మేటివ్ గా తప్ప దానిని సాహిత్య ప్రక్రియ గా మనం గౌరవించం  అనుకుంటాను. 

జ: మీరంతదాకా వెళ్లారు నయం.  అసలు పద్య కావ్యం వ్రాయని వాడు రచయిత ఏమిటీ? అనే ప్రబుద్ధులు మన జాతిలో ఉన్నారు.  సైజు, బరువే క్రైటీరియా.  బాల సాహిత్యం అనే ఊహే మన వాళ్ళకి అర్ధం అయిందనుకోను.  బాల గేయాలంటూ ప్రౌఢులు పాటలు వ్రాయడంతో సరిపెట్టారు.  పిల్లలకు అద్భుతాలు, fairy tales, బొమ్మలతో చెబితే చాలా ఇష్టం.  ఆ పని రష్యా రచయితలు, ఇంగ్లీష్ రచయితలు గొప్పగా చేశారు.  మళ్ళీ మళ్ళీ భారత కథలు, రామాయణ కథలు, పంచ తంత్రం, జాతక కథలు, చెప్పినవే చెప్పడమే తప్ప – లేదా ఉపదేశాలు కుక్కడం తప్ప, ఆహ్లాద కరమైన, కంటికింపైన, బాలల కథా సాహిత్యం తెలుగులో కొత్త ఆలోచనలతో, పాత్రల కల్పనతో జరగలేదనే నా అభిప్రాయం.

ఇక – వ్యాస రచనలో పరిశోధన, విశ్లేషణ, ప్రతిపాదన – ఈ త్రయి నెరవేర్చడానికి ఎంతో సహనం, సహృదయత, విస్తారమైన పఠనానుభవం కావాలి.  ఇంతా చేసి ఇదంతా పత్తి పని.  Thankless job అని మన వాళ్ళలో చాలా మందికి గల ధృఢభిప్రాయం.  ఉంటే పొగడ్త. లేకపోతే తెగడ్త.  శాస్త్రీయత ఎక్కడ ఉందీ? మన తెలుగులో సాహిత్య విమర్శ చాలా భాగం కవులకు, రచయితలకు ఉపాహారం.  Main course  కాలేదనుకుంటాను.

నాటక రచన విషయానికి వస్తే – తొలి రోజుల్లో పురాణం సూరి శాస్త్రిగారొక్కరు నాటక రచనల్ని, నటుల సమర్ధతని, నిష్కర్షగా అంచనా వేసిన వారిగా కనిపిస్తున్నారు.  అదీగాక, పరిషత్తు నాటకాల హవా తెలుగు నాటకాన్ని, ఒక మూస లోకి తోసేసిందని నాకు ఏర్పడిన ధృఢభిప్రాయం.  తెలుగులో చాలా మంది వచనం వ్రాయగల మంచి రచయితలు నాటకం వైపు రాలేదు.  చదువుకున్నా, ప్రదర్శన చూసినా, సరిసమానంగా మనకు ఆదరణ కలిగించ గల నాటకాలు – కన్యాశుల్కం తో సహా – చాలా తక్కువ.  నేను చాలా ప్రదర్శనలు చూసి –  41 తెలుగు నాటకాలు సమీక్షిస్తూ ‘అలనాటి నాటకాలు’ అనే పుస్తకం వ్రాసి – అనుభవంతో చెపుతున్నాను.

హాస్యాన్ని కూడా ప్రత్యేక సాహిత్యాంసంగా మన వాళ్ళు గుర్తించ లేదు.  ఆహ్లాదకరమైన హాస్య నాటకాలకు పరిషత్తుల్లో బహుమతులిచ్చిన దాఖలాలు నాకు కనపడలేదు.  ఎమెట్యూర్ ధియేటర్ లో కృషి చేసిన చాలా మంది ప్రయోక్తలు, రచయితలూ కూడా main stream సాహిత్యవేత్తలుగా కృషి చేసిన వారు కారు. నవలల్ని “సీరియల్ నవల” పేరిట ఒక ప్రక్రియగా చేసినట్టే నాటకాన్ని కూడా “పరిషత్తు నాటకం” పేరిట మూసలో పోశారని నా అభియోగం.  రచయిత ఒక ఉద్దేశ్యంతో నిర్వహించదలచిన నాటకాన్ని కొందరు ప్రముఖ నటులు తమ రంగస్థల అవసరాల కోసం మార్చేసి, కుదేలు పరచిన (సాహిత్య పరంగా) నాటకాలుగా పద్మరాజుగారి ‘రక్త కన్నీరు’, కాళ్ళ కూరి వారి ‘చింతామణి’ చెప్పుకుంటే చాలు.  సాహిత్య గౌరవం, తాహతు ఏమి మిగిల్చారు?

31. ఇన్నేళ్ళ సాహిత్య జీవితం, రచన, గొప్ప వాళ్ళతో స్నేహ పరిచయాలు – ఇప్పుడు మీకేవనిపిస్తోంది?

జ: విజయవాడ, విశాఖపట్నం, మద్రాసు, తెనాలి, బందరు, కాకినాడ, రాజమండ్రీలలో నేనెరిగిన సాహిత్య సభలు, ఎందరో సాహిత్య బంధువులు, ఆత్మీయ మిత్రులు, ఇప్పుడు గతించిపోయారు.  నేనెరిగిన ప్రముఖ రచయితలు నా కంటే వయస్సులో, అనుభవంలో, రచనా సామర్ధ్యంలో అధికులు.  వాళ్ళు ఏనాడూ రచయిత మిత్రులుగా వయస్సు అంతరాన్ని పాటించే వారు కారు.  సమాన స్కంధులుగానే స్నేహం నేర్పే వారు.  నా జీవితంలో విజయవాడ, మద్రాసు అలాంటి గొప్ప స్నేహాల్ని ఇచ్చాయి.  రేడియో, పత్రికలు ఎంత వైబ్రంట్ గానో ఉండేవి కదా! – ‘కహా గయే ఓ దిన్’, అని అనుకుంటూ ఉంటాను.  వారందరూ ఎక్కడికి వెళ్ళి పోయారు? అని జ్ఞాపకాలు బాధిస్తాయి.  వాళ్ళంతా వివిధ సంధర్భాలలో నాకు అర్ధ శతాబ్ధిగా వ్రాసిన సుమారు 200 ల ఉత్తరాలు భద్రంగా దాచాను.  వాళ్ళ దస్తూరీలోంచి వాళ్ళు  నన్ను పలకరిస్తూనే ఉంటారు. కొత్త మిత్రులు యిటీవల చాలా మంది కలిశారు.

The show goes on forever – అజంతా అంటూ ఉండేవారు: “మన వెనక నుంచి పలకరించి వెళ్ళి పోయినట్లుగానే మనం అలా పొగలాగ వెళ్లిపోవాలి” అని – నిజం కదా!

నన్ను గురించి నే ననుకునేది ఒకటే – నేను కోరుకున్న చదువు చదివాను.  ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను.  మనసుకు నచ్చిన ఉద్యోగాలు చేశాను.  నిజాయితీగా నేను దగ్గరగా ఎరిగినవీ, నా అనుభవాలుగా ఎదురైన సుఖదుఖాలు, ఉద్రిక్తతలు, బెంగలూ, సంయోగవియోగాల గురించీ వ్రాశాను.

ఇంతకంటే ఏం కావాలీ?

 

మీ మాటలు

*