Archives for June 2016

కంపనవడ్డ కాళ్ళు   

rafi1

Art: Rafi Haque

           -జూపాక సుభద్ర

~

“ సావు ముండా సావే నువు సచ్చినాపాపంలేదే……

కుంటి ముండ నీకు కాల్లేలేవాయెప్రేమ గావాల్సొచ్చిందానె…..తెచ్చి పెడ్తాంటె మదమెక్కి కాని పంజేసి కడుపు దెచ్చుకుంటివి” అని బిడ్డ ప్రశాంతను యేసన్న తిట్టుకుంట, గుద్దుతండు ఎక్కడ బడితె అక్కడ తంతండు. తల్లి మల్లక్క’ వో అయ్యా బిడ్డె జత్తది కొట్టకు బాంచెనని’ అడ్డంబొయింది అయినా ఆగకుంట దీన్ని నరికినా పాపంలేదే దీన్ని సంపి జేలుకు బోత’ అని మల్లా వురికి ప్రశాంత ఎంటికలు బట్టి గొర్ర గొర్ర గుంజుకొట్టి గోడగ్గొడ్తాంటే….ప్రశాంత ఓ….ఓ…..అని మొంద్తుకుంటాంటె తల్లి మల్లక్క “ దానుసురు దాక్తది కాల్లులేని కబోది పచ్చసోంటీది. దాన్ని ఎంత గొడ్తె ఎమత్తది సెప్పు…..ఎంతగనమని కొడ్తవు వూపిరి లేంది పానంబోతది నీ దండంబెడ్త “ అని అమాంతం బిడ్డ ప్రశాంతను బట్టుకొని మొగని సేతులున్నఎంటికల్ని యిడిపిచ్చింది యేడ్సుకుంట.

“ అసే లంజే నువ్విచ్చిన లాగంతోనే నీ బిడ్డకు యీ యేషమైందే…. అద్దు పద్దు లేకుంట కడుపు దెచ్చుకున్నదే” అని బార్య మల్లక్క మీదికెగబడి యేసన్న తల్లిమీద పిల్లను, పిల్లమీద తల్లిని పడేసి కొడ్తుంటె పిల్లలు బయంతోని మూలల కూసోని ఏడుస్తుండ్రు. యిల్లంత తిట్లతోని, ఏడుపులతోని దద్దరిల్లుతంది.

కోపందీరెదనుక కొట్టి బైటికొచ్చి కూసుండు యేసన్న అల్సిపోయి’ దీంతల్లి మండమొయ్య, వుండెకాడుండక లేని పోని నామర్దజేత్తివి. యియ్యాల రేపు కాల్జేతులు సక్కంగున్న ఆడిపోరగాండ్లనే గంగల గల్పుతుండ్రు నిన్నెవడడిగిండే కుంటి ముండా, నన్ను పజితజేత్తివి ‘ అని నెత్తి గొట్టు కుంట తిడ్తుండు.

ప్రశాంత యింట్ల ఏడ్సుకుంట తన కడుపును గుద్దుకుంటాంటె…… సేతులు వట్టుకొని ‘గిప్పుడు గుద్దుకొనేం ఫాయిదనే…. గిన్ని నెల్లు దాత్తివి దైద్రందాన మైల గాకుంటె నాకొక్క మాట జెప్పవైతివి. ఏ డాక్టర్ కాళ్లు గడుపులు వట్టుకోనన్నా తీయిద్దును. గిప్పుడు ముదిరిపొయినంక డాక్టరేమన్నడో యింటివి గద! ఒక్క నెల గాదు రొన్నెల్లు గాదు ఏన్నెల్ల కడుపు దీత్తె పెద్ద పానానికి గండమని చెప్పె. మీ నాయిన ‘సత్తెమాయె తీసెయ్యాండ్రంటె’ పోలీసు కేసుబెడ్తనని డాక్టరు బెదిరిచ్చె, ఏంజేతుము, కాల్లు లేందాని వాయె ఎంత జాగర్తగుండాలె. యిప్పుడు వాడు జాడకులేకపాయె పత్తకు లేకపాయె. కడుపు జేసి అవుతల బడ్డడు’,.. మల్లక్క బిడ్డ కండ్లపోంటి నీల్లు తుడ్సుకుంట. వూరికిబోతె ఎంత మందేమంటరో, పల్లెనిడిసి పట్నంబొయి పరువు దీస్కున్నరని యిల్లవల్లి మాటలు మాట్లాడ్తరు. ఏ మొకం బెట్టుకొని వూరికి బోదుము బగమంతా! కుంటిది గింతకత జేత్తదనుకోలె గీ కత యెట్ల గట్టెక్కాలె యేసయ్యా…..మల్లక్క సొద యెల్లబోస్కుంట బిడ్డకాన్నే కూసున్నది.

ప్రశాంత ఏసన్న మల్లక్కలకు రెండోబిడ్డ. ప్రశాంతకు చిన్నప్పుడే పోలియో వచ్చి రెండుకాల్లు సచ్చుబడ్డయి. ‘ప్రశాంత’ కుటుంబంల, చుట్టాలల్ల  నోరు దిరుగని పేరు. పశాంతా అని కొందరు పశ్శా అని కొందరు, జెర పరిగాషికంగా ‘ఓపాషాటో’ అని కొందరు బిలుస్తుంటరు. యింట్ల ప్రేమగ ముద్దుగ కుంటవ్వా, కుంటక్కా అని పిలుస్తుంటరు. “గీ కుంటి పోరికి దొర్సానసోంటి పేరు బెడ్తివికాని మల్లక్కా….ఏ మచ్చె కాల్లు లేకపాయె. దీపంతోలె యెర్రగ సూడసక్కని సుక్కోలె వుండె. బిడ్డకు దేవుడు కాల్లు లేకుంటజేసె” అని తెల్సి నోల్లు బాద పడ్తుంటరు.

ప్రశాంతకు కుంటవ్వా, కుంటీసు, కుంటా…అనే పేర్లు యిని యిని ‘నన్నట్ల బిలువద్దు’ అని పోరి…..పోరి అల్సిపోయి సివరాకరికి ఆ పేర్లకే అలువాటు పడ్డది అసహాయంగ.

ప్రశాంత తల్లి దండ్రులు యేసన్న మల్లక్క పల్లెల కూలినాలి దొర్కుతలేదని 5 గురు పిల్లలతో సహ పట్నమొచ్చి సుతారి పనిజేస్కుంట బతుకుతుండ్రు. ప్రశాంతకు పెండ్లయిన అన్న యిద్దరు చెల్లెండ్లు వొక తమ్ముడు. ప్రశాంత మూడో తరగతి దాకా యింటి పక్కనుండే గౌరుమెంటు బడిల చదువుకున్నది తర్వాత తమ్ముడు చెల్లెండ్లను చూసుకునే దానికి బడికి బోవుడు బందు వెట్టింది. ప్రశాంతకు సదువుకు బోవుడు షాన యిష్టం. తమ్ముడు చెల్లెండ్ల పుస్తకాలు రోజు సదువుకొని ‘అమ్మా వోపెన్ గ పది రాయొచ్చునంటనే ఫీజు గట్టరాదె’ అని తల్లినడిగితే ‘ కాల్లు రెక్కలున్నోల్లకే సదువు సక్కంగత్తలేదాయె నీకేడత్తది బిడ్డా.’…అంటే “నీయవ్వ కాల్లకు తెలివికేమ్ సమందమే…..కాలు కుంటిదైతె తెలివి కుంటిదైతదానె’ అనే ప్రశాంత మాటల్ని యెవ్వరు పట్టి పర్వజెయ్యలే ఆమె చదువు  గట్టుకు మొరిగిన కుక్క తీరే అయింది.

పనుల కాడ మాత్రం కాల్లు లేవు గదా పనులేంజేస్తదనేది లేదు యింటోల్లకు. యింట్ల సకులం పనులు ప్రశాంతనే జెయ్యాలె కూసోనే వూడుస్తది, గిన్నెలు తోముతది, బట్టలుత్కుతది తమ్ముడు సెల్లెండ్లకు తానాలుజేయించి తయారు జేసి తినబెట్టి బడికి తోల్తది. అన్నవదినెలకు అమ్మనాయినలకు టిపిండ్లు కట్టిచ్చుడు, యింటికొచ్చేటాలకు అన్నంగిన్నె నోటికందిచ్చే పనులన్ని ప్రశాంతనే కూసొని జేస్తది. సుట్టు పక్కల బస్తోల్లు అవ్వా! కాల్లున్నోల్లేంపని కొత్తరు, కాల్లులేకున్నా యింటితోనింటెడు పంజేత్తంది మల్లక్కా….. బంగారి బిడ్డెను గన్నవని మెచ్చుకుంటే…..ఆ…యెంతజేసినా ఏమున్నది, నా బిడ్డెకు కాల్లు యియ్యకపాయె దేవుడు. ఎంతజేసినా కుంటిదే అంటది లోకం పాడువడని దుక్కపడేది.

Kadha-Saranga-2-300x268

యిట్లా గడియపుర్సత్ లేని దమ్మిడాదాయంలేని ప్రశాంతోల్లయింటికి అన్నబామ్మరిది రమేషు కొలువు యెతుక్కోనీకొచ్చిండు. తల్లిదండ్రులు, అన్నవదినలు సుతారి పనికిబోతే, సెల్లెండ్లు తమ్ముడు బడికిబోతే ప్రశాంత వొక్కతే యింట్లుండేది. యిదర్తమై రమేషు పొద్దున లేవంగనే పొయి యింట్ల అందరు ఎటోల్లటు యెల్లిపోయినంక యింటికొచ్చేటోడు. ప్రశాంత పనులుజేస్కుంటాంటె…..సాయంజేస్కుంట మాటల మాటకలిపిండు.

గీ మసిగిన్నెలు తోమి బంగారమసోంటి సేతులు నల్లగైనయి, నువ్వు గీ యింట్ల పుట్టవల్సిందానివి గాదురా బంగారం, నువ్వు దేవకన్నెవురా! అని ప్రశాంతను పొగుడి ఆకాశం జూయించిండు, కాల్లులేక పోతేంది మెరుపు తీగెవురా. నువ్వు వూ………..అంటే నా కండ్లల్ల బెట్టుకోని సూస్కంట నువ్వు నా యింట్ల వుత్తగ్గూసున్నా సాలు లైటేసే పనుండది. నిన్ను పెండ్లిజేస్కుంటె నేను లక్ష్మిదేవిని జేస్కున్నట్లే. నీ నవ్వుసాలురా దీపమోలె యెలిగే ఆ మొకంజాలురా కన్నా………. ఒక్కజెన్మగాదు యెన్ని జెన్మలైనా ఇట్లా సూస్కంట బత్కుతరా అని ప్రశాంతను మైకంల బెట్టి మాయజేసిండు, యెన్నెల్లు పూయించిండు. కుంటిదానా, కుంటిది అని యింట్ల బైట యినీ యినీ సెదలుబట్టిన ప్రశాంత సెవులు, రమేష్ ప్రేమ మాటలకు తేనె గూల్లయినయి.

యింట్ల తల్లిదండ్రి దగ్గెర కూసుండబెట్టుకొని బిడ్డె మంచిసెడ్డలడిగే దానికి, మాట్లాడనీకి వాల్లకు పుర్సతేవుండది తన తోటోల్లు ఎవ్వరొచ్చి స్నేహంజెయ్యరు, తమ్ముడు చెల్లెండ్లతోని అల్లరితో ఎగిరే దునికే ఆటలు ఆడుకోలేదు ప్రశాంత. తన సంబురాలు, దుక్కాలు కోపాలు సెప్పుకొనే దగ్గెరి మనిషే లేదు. రమేష్ మాటలకు ప్రశాంత నిద్రబోలే…..ఆమె మనసు చెమ్మ చెక్కలాడింది, ఎగిరి దునికి దొమ్మరి గడ్డేసింది అట్లా రమేష్ ప్రేమలో వున్న ప్రశాంత ఓ నాడు “నాకు నెలొస్తలేదు” అని రమేష్ నెత్తి పునుక్కుంటన్నది. ఆ మాటినంగనే రమేష్ కండ్లు పచ్చబడ్డయి ‘ ఎండ్రోజులాయె’ అని వులిక్కి పడి కడుపు మీద చెయ్యేసి చూసిండు మామూలుకంటె ఎత్తుగున్నట్లు అర్తమైంది.

ప్రశాంత ‘ చానరోజులైంది నెలరాక ‘ అని చెప్పినాగూడ ఏమెరుగనట్లు ఏంగాదులే అని చెప్పి………ఆ రాత్రే మెల్లెగ జారుకుండు రమేష్.

ప్రశాంతకు జెరంవచ్చుడు, ఏందిన్నా ఓకారిచ్చుకుంటాంటె జెరంవల్లనేమో అనుకున్నరు గానీ అది నెలదప్పిన ఓకారమని కనిపెట్టలేక పోయిండ్రు. లేవ కుండా ఎప్పటికి కూసొనే వున్నందుకు ఎవ్వరు కడుపు గుర్తువట్టలేదు. ఓనాడు మల్లక్క,, బిడ్డ కూసోని కదలనీకి అవుస్త పడ్తాంటె తేరిపారజూసి పసి గట్టింది. యిగ ఆ కాన్నుంచి ప్రశాంతను తిట్టుడు, కోట్టుడు యింట్లంత లొల్లిలోల్లి. డాక్టరు దగ్గెరికి తీస్కపోతే పిండమ్ముదిరిందని వల్లగాదని చెప్పేటాలకు……..ఏంజెయ్యాల్నో తెలువక ప్రశాంతను యింటికి దీసుకొచ్చి,.,. అన్న, తండ్రి సావసావ గొట్టిండ్రు. ఎవడు ఏందని ఆరాలు దీసి  తర్వాత రమేషని తెల్సుకుండ్రు.

ప్రశాంత సొద యెవరింటరు? కండ్లల్లదుక్కం కడుపుల బిడ్డె ఒక చిన్నప్రేమ మాటకోసం, ఓదార్పుకోసం, తియ్యటి పిలుపుకోసం యెనుకముందేవి ఆలోసించుకోలేక అది మోసమని యెర్కలేని యెడ్డితనంతోని బొందల వడ్డది.

కడుపు తీయించుడు వల్లగాదని డాక్టరన్నంక ప్రశాంత తండ్రి, అన్న పారిపోయిన రమేష్ ని యెతికి యెతికి పట్టుకొని, రమేష్ వూల్లెనే కుల పంచాయితి పెట్టిచ్చిండ్రు.

“యింట్లున్న కుంటిపోరిని యేన్నుంచో నా యింట్ల జొరబడి నా బిడ్డెబతుకాగమ్ జేసి గిప్పుడు తప్పిచ్చుక తిరుగుతుండు నా బిడ్డెకు నాయం జెయ్యాండ్రయ్యా అని ప్రశాంత తండ్రి యేసన్న, పంచాయితి పెద్దకు దండంబెట్టిండు. పంచాయితి పెద్ద నివద్దే యింట్లున్న కుంటి పిల్లకు కడుపుజేసి పోతివి, ఆపాపం నీదే గద పెండ్లి జేసుకో! ఎవలు జేసిన కర్మ వాల్లనుబవించాలె గద’’ “ ఎందీ పెండ్లా!”…………గా కుంటి దాన్నెట్ల జేస్కుంటరు రమేష్ కోపంతోని మరాపిల్లను తల్లింజేసినపుడు కుంటి తనం కనబల్లేదా! ఆ పిల్ల జోలికెందుకు బొయినట్టు ! ఆ పిల్లేమన్న కాల్లున్నదా నీ యెన్కబడనీకి, యింట్లున్న పిల్లను తల్లింజేసి,కుంటిదాన్ని నేనెందుకు జేస్కుంటంటే ఎట్ల! “అని పెద్ద మనిషి కోపానికొచ్చిండు.

ప్రశాంత తల్లిదండ్రులు కోపాన్నంత అనుసుకొని వున్నరు. ఏమంటె ఏంతప్పులవడ్తమో బండకింద సెయ్యున్నదని ఎక్కువ తక్కువ ఏమ్మాట్లాడ్త లేరు

“అయ్యో కాల్లులేందని మాగ మాట్లాడ్తండ్రుగానీ, కాల్లులేంది కాల్లులేని జాగల వుండాలె…..అది సక్కంగుంటే గిదంతెందుకు జరుగు, మీ పిల్లను అద్దుల వెట్టుకోకుంట మా పిలగానికి, గా కాల్లు లేందాన్నంట గట్టి ఆని బత్కునాగం జేత్తరా” రమేష్ తల్లి

“ఏహే అంటగడితె వూకుంటమా ఎట్లెట్లంటగడ్తరు? గిదెవడన్న మెచ్చే కతేనా’ అని రమేష్ తండ్రి అడుగు తాంటె రమేష్ యిగో మీరేంజేసినా, ఎక్కడికి బొయినా కేసులు బెట్టినా….జేల్లనన్న వడ్తగని గా కుంటిదాన్ని జేస్కునేది లేదని ఖరాఖండిగ తెగేసిండు.

పంచాది పెద్దమనుషులు గూడ కుంటి మెడకోడమ్ ను ఎట్లాజేస్కుంటడు అనే అంటన్నారు  గానీ ఒక అమాయక ఆడపిల్ల బత్కును మోసకారితనంగ అగాయిత్యంజేసి బుగ్గి జేసిన సెడ్డతనాల మీద ప్రశాంత తల్లిదండ్రులు మాట్లాడే న్యాయాలను బేఖాతరు జేస్తుండ్రు. పంచాది పిలగాని తరపున్నేవున్నదని అర్తమైనంక, మల్లక్క,యేసోబు కూడ బలుక్కున్నరు. మల్లక్క,. యేసోబు కోపంగ మాట్లాడితె ఎటుబొయి యెటత్తదోనని మల్లక్కనే కోపమంత దిగమింగుకొని “అయ్యా బాంచెన్ మీకందరికి ఆడిపిల్లలున్నరు యియ్యాల నా బిడ్డైంది రేపు మీ బడ్డెలక్కావచ్చు, గిట్ల నాయింట్ల కచ్చి నా పిల్లను బద్నాం జేసుడు మంచి రీతేనా ! పలానోల్ల బిడ్డె పెండ్లిగాకుంట కడుపైందాటనే మాట నలుగుట్లె తలెత్తుకునేటట్లుంటదా! మాకింక యిద్దరాడ పోరగాండ్లున్నరు, రేపు గాల్ల పెండ్లీలెట్లగావాలె! మీరే సెప్పుండ్రి దండంబెడ్తమ్. మీ బాంచన్, మీ కాల్లు మొక్కుత వాయ్యలార.,! కాల్లేని పచ్చి అన్యాలం జెయ్యకుండ్రి, రేపది ఎట్ల బత్కాలె మీరే జెప్పుండ్రి దానికి పుట్టిన బిడ్డకు తండ్రెవలంటే ఎవల పేరు జెప్పుదుము. నెత్తిమాద యిత్తులు బడ్డదారి వేరేవుంటది” అని మల్లక్క మాట పురంగ యినకుంటనే

“అరే మల్లా నెత్తి మీద యిత్తుల సంగతి మాట్లాడ్తవేందే, లేదంటె పాడుమంటన్నవ్” అని వురిమినట్లు రమేష్ తల్లి మాట్లాడంగనే…….అరే ఏందమ్మా ఆడిపిల్ల అండ్ల కాల్లులేని పిల్ల తల్లి ఏంజెప్తదో సొద యిననియ్యరాదు అని అదులాయించంగనే,. మల్లక్క “పెండ్లి పేరంటం లేకుంట కడుపొచ్చుడు కనుడు కులానిగ్గూడ బర్కద్దక్కువే, దానిగోస, ఏడుపు పిల్లపిల్ల తరాలకు తాకుతది వూకెనే పోదు ఆపాపం ఏమన్న జెప్పుండ్రయ్యా, ఏమన్నజెయ్యుండ్రి ఎటుదిరిగి దానికి పెండ్లిజెయ్యాలె బాంచెన్, లేకుంటె నా బిడ్డెబత్కది మేంబత్కము,” అని నిక్కచ్చిగ గుంజ బాతినట్లు మాట్లాడింది మల్లక్క.

ముందుగాల”గా కుంటిముండనేంజేస్కోను,మెడకేసుకొని తిరుగనా,” అస్సలే వద్దన్న రమేషును పెద్దమనుషులు “వాల్లుకేసులకు బోతె శాన తిప్పలవడ్తవు, జేలుకు బోతవు. వాల్లు మేదుగులయే పట్కె నువ్వు బచాయించినవు, నువు సొక్కంగున్నట్లు మీదికి బోతెట్ల తప్పు నీది జెర తగ్గుండ్రి” అని రమేషుని వాల్ల తల్లిదండ్రులను భయపెట్టిండ్రు.

చాలాసేపు ప్రశాంత తల్లిదండ్రులు ‘పెండ్లంటే’,., రమేష్ వాల్లు ‘చేస్కోము’ బైసు నడ్సినంక పెద్దమనుషులు ఒక తీర్మానాని కొచ్చిండ్రు. ‘మీయిద్దరి తరుపున పంచాది పెద్దమనుషులు ఒక నిర్ణయాని కొచ్చినమ్ యినుండ్రి’. “యిగో పిల్లగా ఆ పిల్లను యింట్లున్న దాన్ని బైటేసి బద్నామ్ జెసి తప్పుల వడ్డవు ఆ తప్పుకు నువ్వు ఆ పిల్లను పెండ్లిజేస్కోవాల్సిందే,…..ఎందుకంటె పెండ్లి లేకుంట పిల్లను కనుడు కుటింబానికి కులానిగ్గూడ అపకీర్తే… యిగ పెండ్లయినంక సంసారానికి తెచ్చుకుంటవా లేదా అనేది మీ యిష్టం పెండ్లయితె సేస్కునుడు సేసుకునుడే… యిగ పెండ్లిగాకుంట ఆ పిల్లను ఆగం జేసినందుకు దండుగ 50 వేల రూపాలియ్యాలె, యిగ దీని మీద ఎవ్వలు మాట్లాడద్దు యిటోల్లటోల్లు అని… యిగ తిరుగు లేదన్నట్లుగ పంచాది తీర్మానంజెయ్యంగనే……

ప్రశాంత తల్లిదండ్రులు సంసారం సంగతెట్లున్నా పెండ్లయితంది గదా! అని జెర సల్లబడ్డరు. రమేష్ వాల్లు ఏదో పెండ్లియిందనికండ్లు మూసుకుంటె అదటు మనమిటు, అది గుదిబండోలెయింట్ల వుండది గదా! ఏదో! జరిగిన తప్పుకు యాబై వేలేసిండ్రు అడిగినప్పుడు సూద్దాంలే అని….. అటోల్లు యిటోల్లు రాజి పడ్డరు. పిల్లకు పొద్దులంటండ్రు కతజెల్దిగానియ్యాలె, యీ వారంల ఫలానా తేది బెట్టుకోండ్రి పెండ్లి. ఆ రోజు కల్లా పిల్లందీసుకొని రాండ్రి పెండ్లిజేద్దామని రెండు కుటుంబాల్ని సమదుజేసి సాగనంపిండ్రు పంచాది పెద్దలు. బిడ్డె మీద నింద లేకుంట నలుగుట్లె పెండ్లయిందనిపిచ్చుకుంటెసాలు మనం బత్కినన్నాల్లు, మనతోటి కలో గంజో కాగిబత్తది. కూల్నాలి జేసుకొని బత్కెటోల్లము. నా బిడ్డెను సంసారానికి తోల్కపొమ్మని ఆల్లింటి సుట్టు పంచాదులు పెడావులు జేస్కుంట యాడ దిరుగుతము, నా పిల్లనాగంజేసిన రమేష్ గాడు మాగజత్తడు పురుగులవడి. అని ఒక్కసిత్తం జేస్కొని ప్రశాంత తల్లిదండ్రులు యింటికొచ్చిండ్రు.

పంచాది తీర్మానంయిన్నకాన్నుంచి ప్రశాంతకు కడుపంత సలసలమరుగుతుంది పెండ్లి లేకుంటేది అసోంటి అవుమానంపెండ్లి అయితేంది కాకుంటేంది వాని కాల్లకింద యీగినట్టు వాన్నిపెండ్లిజేసుకొని సంసారానికి పోకుంట వుండేటట్లు ఆ పెద్దమనుషులెట్ల పంచాజ్జేసిండ్రు? నా అసోంటి బిడ్డె వాల్లకు లేదా! వాడు జేసిన మోసానికి వాని మొకంజూడొద్దు. మోసంజేసింది వాడైతె శిక్ష నేను మొయ్యాల్నా! దొంగ బాడ్కావ్ ఎంత బెల్లమ్మాటలు సెక్కర మాటలు మాట్లాడిండు? నన్ను నడింట్ల బొండిగ్గోసి పొయిండు. ఏంజేద్దు దేవుడా గీ బతుక్కంటె బాయిల దునికి సచ్చింది మేలు “ఓ అమ్మా, ఓ,నాయినా నన్నిట్లనే సంపుండ్రే నాకీ పెండ్లద్దే——ఆ లుచ్చబాడ్కావుకు నేందండెయ్యనే, యీ కడుప్పాడుగాను అని యిల్లంత బొబ్బవెట్టి, బోండ్రిల్లాలనే’’ దేవిపోతున్నది———కాని అట్లజేత్తె తప్పంత నాదని నాకు మదమచ్చి కడుపుదెచ్చుకున్ననని నా మాదికే యెగవడ్తరు. అవన్ని యిని యిని సెవులు పుండ్లయినయి ప్రశాంతకు.

కాల్లతో పాటు మనసుగూడ సచ్చుబడితె బాగుండను కున్నది దరిలేదు దాపులేదు, దిక్కులేదు దెశ లేదు ఎటుజూసినా యీ సావు పెండ్లి నాపే ఆసరకన బడ్తలేదు ప్రశాంతకు. సావనన్న జత్తగాని యీపెండ్లి మాత్రం జేసుకోను, ఏంజెయ్యా లెనని వల పోస్కుంటనే వున్నది.

ప్రశాంతకు పొద్దులు నిండి కుండంత బొత్త కూసుంటె నేల మీదనేవుంటంది. యించు మందంగూడ కదులుడు కష్టమైతంది. పన్నెది పన్నట్లే వుంటంది. నీల్లు తాగితే, అన్నందింటె బాత్రూమ్ లకుపోవాల్సి వస్తదని అవి గూడ ఎక్కువ తాగుతలేదు తింటలేదు తల్లే ఎత్కపోయి మల్లా మంచాల పండుకో బెడ్తంది. గింత పస్తున్నా నాకు సావస్తలేదాయె, సద్దామంటె గూడ సచ్చేదారుల్లేవాయె యీ గోస యెట్లతెల్లారాలె దేవుడా! అని రాత్రులు గూడా గుండెలు పిండి పిండయే దుక్కం యెగబోస్కుoటంది.

పెండ్లి రేపనంగ మల్లక్క, ఏసన్న ప్రశాంతను తీస్కొని కుటింబంతోని పయనమైండ్రు. ప్రశాంత అల్లకల్లోలమైన అశాంతితోని, ఆందోళనతో కడుపుల పిండం గూడ ఆరగోలు బారగోలయి డాక్టరమ్మ యిచ్చిన తేది కన్నా పదిరోజుల ముందే బసుల్నే నీల్లాడింది ప్రశాంతి. పిలగాడు బుట్టిండు. యీ దుక్కాలల్ల నీల్లాడే నొప్పులు గూడ దిగ దుడుపైనయి.

“ఓ బగమంతా! గీ బిడ్డె మీద నీకెందుకు గింత పగ. ఎందుకు నా బిడ్డెను గింత సెరబెట్ట వడితివి. గీ కుంటిపోరి ఎవ్వలకేమన్యాలం జేసిందని దానికింత గోస! గీ బాలెంతం దీసుకొని యెట్లబోదుము పెండ్లని” మల్లక్క శోకాలు దీత్తాంటె……

“సోకాలెందుకే.. సోకాలు బందువెట్టు అని బార్యనదిలిచ్చి, ప్రశాంతంజూస్కుంట ఏసన్న “దీంతండ్రి పెండ్లమ్ముండమొయ్య, లోకంలున్న దైద్రమంత దీన్నెత్తి మీన్నేవున్నదేంజేద్దామ్, యెన్కకు బోతే, పంచాది మల్లా…యెన్కకత్తది, కతమొదటి కత్తది. ఏమన్నగానీ, యెట్లన్నబోనీ…. పెండ్లయిందని పిచ్చుకోనద్దాంపా ! అని బార్యకు సగ జెప్పిండు. అదే పచ్చిబాలెంత తోని, పసిగుడ్డుతోని పయనమైండ్రు.

పెండ్లి రమేష్ వూరిల చర్చిముందట.పెద్ద మనుసులు చెప్పినట్లు టెంటు కుర్చీలేయించిండ్రు. అదే వూల్లె సుట్టాలింట్ల దిగిండ్రు ప్రశాంత కుటింబమంత. అవ్వా! బాలెంతకు పెండ్లా…. బల్లె పిలగాన్ని బెట్టుకొని పెండ్లా! అని వూరోల్లు, బందువులు ముక్కిరిసిండ్రు మూతిరిసిండ్రు. కొందరు అయ్యో!బిడ్డా ఏం రాతరాసుకచ్చుకున్నవే…. గిసోంటి కష్టం ఎవ్వలకు రావొద్దే అని జాలి పడ్డరు.

ప్రశాంతకు సెవు నిండ దూదులుబెట్టి కడుపుసుట్టునడికట్టేసి మీదికెలి కొత్తబట్టలు గట్టిచ్చిండ్రు పచ్చి తల్కాయని దువ్వెన బెట్టక ఎంటికలు సరిజేసి జెడేసిండ్రు పెండ్లంటే….సందడిగ, లొల్లి లొల్లిగ సుట్టాలతోని బందువుల తోని బ్యాండుసప్పుల్ల తోని సంబురంగ వుంటరు. అట్లాంటి సంబురాలు, సంతోషాలు లేవు ప్రశాంత పెండ్లిల. ఎవరో సచ్చిపోయినట్లు,అందరు దిగాలుగ, దిగులుగున్నరు పెండ్లికచ్చినట్లు లేరు సావుకొచ్చినట్టేవున్నరు.ప్రశాంత తల్లిదండ్రులు,అన్న,యివన్నేంబట్టిచ్చుకుంటలేరు. పెండ్లయిందని పిచ్చుకుంటెసాలు అన్నట్లున్నరు. కానీ ప్రశాంతకు యివన్ని అవుమానంగనే వున్నయి, కడుపును కత్తికోత బెడ్తున్నయి.

చర్చిల అడుగెత్తు గద్దెమీద రెండుకుర్చీలేసిండ్రు చర్చిల పంచాది పెద్దలు అటుబందువులు యిటు బందువులోల్లు కూసుండ్రు కాల్లులేని ప్రశాంతను తండ్రి ఎత్తుకోనొచ్చికుర్చిల కూసుండబెట్టిండు. తర్వాత రమేష్ వచ్చికూసునేటాలకు ప్రశాంత పచ్చిపెయి నరాలన్ని పొంగినయి ‘నన్నుబొంకిచ్చి బోర్లిచ్చి, నన్ను నలుగురు నవ్వే బత్కును జేత్తివి గదరా! అని కడుపంత సలసల మసిలింది. ప్రశాంతకు ఎదురుగ కూసున్న రమేష్ని బూడిది సేసేటట్టు చూసింది.

చెర్చిపాస్టరు ఏందేందో పెండ్లివాక్యాలు జెప్తుంటె అవి సావు వాక్యాలోలె యినబడ్తన్నయి ప్రశాంతకు. .వాక్యాలన్ని అయి పోయినంక పాస్టరు, పిల్ల పిల్లగాని తల్లి దండ్రుల్ని గద్దెమీనికి బిలిసిండు. దండలు, తాలిపుస్తె, పల్లెంబట్టుకొని ప్రశాంత తల్లిదండ్రులు గద్దెక్కి పిల్ల పిలగాని ముందటున్నసిన్న బల్లమీన బెట్టిండ్రు.’ ‘పరిశుద్ధాత్ముడైన దేవుని సన్నిధిలో యీ బిడ్డలు భార్యా భర్తలు కాబోతున్నరు వీరినాశీర్వదించుము ప్రభువా’ అని పాస్టరు దండలు మార్చుకొండని చెప్పి రమేష్కి దండ అందిచ్చిండు రమేష్ దర్జాగ దండవట్టు కొని బింకంగా నిలుసొని ప్రశాంత మెడల దండెయ్యబోతుండంగనే…….ప్రశాంతకు యేన్నుంచి వచ్చిందో ఏమో ఏనుగంత బలము, యిన్నిరోజులు మూసుకొని, దాసుకున్నదుక్కం వొక్కసారే మరుగుతున్న నిప్పుల వుప్పెనోలె ఎగదన్నింది. పచ్చిపెయంత యీనినావోలె రెచ్చిపొయింది. దండ గుంజుకొని రమేష్ మొక్కమ్మీన గొట్టింది సిప్ప సప్ప ‘’అరేయ్….నువ్వు బత్కద్దురా సావురా….. నాబత్కును బండల్జేత్తివి గదరా! యింట్లున్నదాన్ని బజార్లేసి నలుగుట్లె నవ్వుల పాల్జేసినవురా, అని అంగిబట్టుకొని గుంజి అప్పుడు కనబల్లేదుర నేను కుంటిదాన్నని, దబ్బ దిబ్బ దంచి అంగిసింపి పక్కన పల్లెంలున్న దండ, తాలిపుస్తె దీసి నేలగ్గొట్టింది కాల్లులేనోల్లంటె గింత లోకువార! బాడ్కావు! నీతోని పుస్తె గట్టిచ్చుకొని నీ పెండ్లాన్ననే పేరు జెప్పుకోని నేంబత్క నాకీ పెండ్లే వద్దు.. యీ అడ్డమైన పెండ్లినాకద్దు. గింత లుచ్చ పెండ్లి నాకద్దు,గింత లఫంగి పెండ్లి లత్తకోరు పెండ్లి నాకద్దు………..అని చర్చంత దద్దరిల్లేటట్లు బొబ్బ బెట్టుకుంట ‘’ఓ అమ్మా నన్ను సంపుండ్రే…. నేను సావనన్న సత్తగాని, నాకీ సావుపెండ్లి జెయ్యకుండ్రే గీ బట్టెబాజిగాని పేరు నేను మొయ్యనే నాయినా అని కడుపులున్న దుక్కం, బాద కోపం, కసి, అవుమానమంతా కాండ్రికిచ్చి థూ…… అని తుపుక్కున రమేష్ మొకం నిండ వూంచింది.

యింత అధాటుగ యిట్ల జరుగంగనే చెర్చిల అందరు బీరిపొయి సూత్తాంటె….. సల్ల సేముటలు బెట్టి వణుకుతున్నప్రశాంతను మల్లక్క ఏసన్నలు ఎత్తుకొని బైటికెల్లి పోయిండ్రు. కాల్లు కంపన వడితేంది మొకమ్మిద మంచిగ దన్నిందనుకుండ్రు చెర్చిల కొందరు.

*

స్వయంభువు

 

 

 

-పప్పు నాగరాజు

~

 

క్షణ క్షణాలతో ఒరుసుకుంటూ
యుగయుగాలుగా వరదై
పరుగులు తీస్తోందో ప్రవాహం
ఆ ఏటి మాటున,
ఎన్నో ఏళ్ళై
నన్ను విడిచిన జీవితం

ఇసుకమేటగ నిట్టూర్చింది

ఈ క్షణం మాత్రం నేను

నది విసిరేసినా నవ్వుతున్న నత్తగుల్లని
నా అనుభవాల సైకత శిల్పాలకి

అర్చనగా మిగిలిన సిరిమల్లెని

****

mandira1

Art: Mandira Bhaduri

కనిపించిన మౌనం

 

జడివాన చైతన్యంలో
జలకమాడిన తటాకం
గట్టుతో చెప్పిన గుసగుసలు

ఆవిరైపోతున్న ఆరోప్రాణంకోసం
పొంగిన పాల గుండెలో
నీటిబొట్టు చిందించిన చిర్నవ్వులు

ముకుళించిన మూఢభక్తికి
ముద్దరాలైపోయిన గుడిగంట
జగన్మాత క్రీగంటి చూపులతో సయ్యాటలు

పక్షిరెట్ట తెల్లదనంతో
తృప్తిపడ్డ బుద్ధవిగ్రహంలా
అలజడితీరం దాటిన ఏకాంతనావలో
మిణుకుమంటున్న ఒక దీపశిఖ…
ప్రవాహంలో విరిసిన వెన్నెలపువ్వు

*

రోషం, ఆనందం కలగలసి…

 

 

ఎవరిదా శిబిరం?

ఎవరున్నారు అక్కడ?

ఇంకెవరు ?

సాళ్వుడు

అప్పుడు ఎప్పుడో ఉద్యానవనం నుంచి సరాసరి ఇంటికెళ్ళిపోయిన సాళ్వుడు, వాళ్ళ నాన్నగారితో ప్రేమ దోమ గురించి మాట్లాడితే నాన్నగారన్నారు – ఒరే నాయనా, ఈ కాలంలో అలా నడవదు. మగపెళ్లివాళ్ళం మనం వెళ్ళి వాళ్ళను అడగటమేంది ? యుగధర్మం, సాంఘికధర్మం ప్రకారం నా అంచనా తప్పక ఆ కాశీరాజు స్వయంవరం ప్రకటిస్తాడు. అప్పుడు వెళ్ళు, ఆ అమ్మాయి ఎలాగు నిన్ను ప్రేమించిందంటున్నావ్ కాబట్టి, నీ మెళ్ళోనే మాల వేస్తుంది. అప్పుడు ఇంటికి తీసుకొచ్చెయ్. నేను అందరికీ పప్పన్నం, పరవాన్నం పెట్టుకుంటా అన్నాడు

దాంతో సరేనని, స్వయంవరం ప్రకటన జరగటం ఆలస్యం, మనవాడు పరుగెత్తుకుంటూ వచ్చేశాడు

రేపు జరగబోయే స్వయంవరానికి సన్నద్ధమైపోయాడు

అలా వచ్చి విడిదిలో కులాసాగా నిదరపోతున్నవాణ్ణి తట్టి లేపింది అంబ

ఏంటిది? ఈ రాత్రి పూటా వచ్చేవేమి ఎవరన్నా చూస్తే బాగుండదు, వెళ్ళిపో అన్నాడు

అయ్యో ఆడపిల్లనైన నాకుండాల్సిన సిగ్గు నువ్వు పడుతున్నావేమి స్వామీ అని బుగ్గ మీద చిటికె వేసి నీకు తెలుసా గాంగేయుడు వచ్చాడని అని అడిగింది

ఆ తెలుసు, అయినా ఎవరొస్తే నాకేంటి, నీ మాల నా మెళ్ళోనేగా అన్నాడు ఈయన

అది కాదండి, ఆయన ఆయనకోసం రాలేదు, నాకోసమూ రాలేదు, తన తమ్ముళ్ళ కోసం వచ్చాడు అంటూ నాలిక కరుచుకుంది

ఏమిటీ? అని ఆశ్చర్యపోయాడు సాళ్వుడు

తనకోసం కాక తమ్ముళ్ళ కొసం రావటం ఏమిటి? అది నీకెట్లా తెలుసు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు

దేవదూత చెప్పిన సీక్రెటును లీకు చేసినందుకు కొరుక్కున్న నాలిక సరిచేసుకుని, నాకు కల వచ్చింది అలా అని, రేపు యుద్ధం జరగబోతోంది అని కూడా ఆ కల్లో వచ్చింది అంటూ మాట దాటవేసి, ఇప్పుడు ఆ గొడవలన్నీ ఎందుకు మనకి, ఇద్దరం కలిసి ఇప్పుడే మీ ఊరికి వెళ్ళిపోదాం పద అని అన్నది అంబ

గొడవేముంది, యుద్ధానికొస్తే ఊడ్చవతల పారేస్తా ఎవరినైనా అన్నాడు ఈయన

స్వామీ, నువ్వు ఊడ్చవతల పారేస్తావులే కానీ, అటుదిటైతే నా బతుకు చీపుగా చీపురైపోతుంది, అందుకని నా మాటిని పారిపోదాం పద మీ ఇంటికి అన్నది అమ్మాయి

ఠాట్, ఠూట్ అని మొత్తానికి ఒప్పుకోలా మహానుభావుడు

అంబ ఉస్సురంటూ కాళ్లీడ్చుకుంటూ అంత:పురానికి వెళ్ళిపోయి పొద్దుకిరణాలు పొడిచేదాకా దిండు మీద తలపెట్టుకుని పడుకోకుండా పడుకుండిపోయింది

సన్నగా ఒక నవ్వు, అశరీరవాణి నవ్వు

ఆరు నూరైనా ఆ రాతను, నీ తలరాతను మార్చలేవు నువ్వు అంటూ నవ్వు

నవ్వులతోనే తెల్లవారిపోయింది

స్వయంవరం

అంతా విచ్చేశినారు మంటపానికి

రాజకుమారులందరూ వచ్చేశినారు

ఒక్కొక్కరి అందం వర్ణించనలవి కావట్లా

అంతందంగా ఉన్నారు

అయితే ఎంత అందం ఉంటే ఏమిటి, అమ్మాయీమణులకు నచ్చినవాడే స్వయంవర విజేత

అమ్మాయీమణులు కూడా వచ్చేశారు

అంతా వరసాగ్గా నిలబడుకొని ఉన్నారు

ఇంతలో వచ్చాడు

ఎవరు ?

ఇంకెవరు ?

గాంగేయుడు

సభ అంతా కళకళలాడిపోయింది ఆయన రాకతో

ఆ అందగాడి రాకతో

రావటం, అమ్మాయిలూ రథం ఎక్కెయ్యండి అనటం జరిగిపోయింది

అమ్మాయిలు ఖంగారు పడ్డారు

సభలో గుసగుసలు, కొంతమంది రాజుల్లో పౌరుషాలు పెల్లుబుకినాయి

ఎట్లా ఉన్నది ఆ కొంతమంది రాజుల పరిస్థితి ?

కళ్ళు ఎరుపెక్కినాయ్

పళ్ళు పట పట సవుండ్లు చేస్తున్నాయ్

పెదాలు కొరుకుడు పడుతున్నాయ్

కపోలాలు చెమటలు పడుతున్నాయ్

కనుబొమలు ముడిపడుతున్నాయ్

ఇవన్నీ కోపారంభానికి సూచన

ఆ కోపంలో చేతులు ఒరల మీదకు వెళ్ళిపోయినాయి

గాంగేయుడు ఓరకంట చూశాడు

పక్కవాడి చేయి కత్తి మీద ఉన్నది కదానని ధైర్యం చేశిన మిగిలిన వారి అందరి చేతులు కత్తుల మీదనే ఉన్నవి

కొంతమంది చేతులు వణుకుతున్నవి, అయినా మేకపోతు గాంభీర్యంతో కత్తి పిడులు పట్టుకునే వున్నారు

మీసం మెలివేశాడు గాంగేయుడు

ఎవరురా కత్తి ఒరలోనుంచి బయటకు తీసేది అని సింహనాదం చేసినాడు

ఆ సింహనాదానికే చేతులు కత్తుల మీద నుంచి తీసివేశారు చాలా మంది

మిగిలినవారిలో ఓ పదిమంది తమ ఆసనం మీదనుంచి కిందకు దిగివచ్చి సవాలు చేసినారు

మీ లాటి చిన్న చితక వారికి ధనస్సు ఎత్తటం, దానికి బాణాలు వేష్టు చెయ్యటం ఎందుకని అందరిని దాపుకు రానిచ్చి ఒక ముష్టిఘాతం విసరినాడు

అంతే, ఆ పదిమందీ గింగిరాలు తిరుగుతు పడిపోయినారు

ఎట్లా పడిపోయినారు వారంతా ?

పోతన గారు హిరణ్యాక్షవధను వర్ణించిన ఈ క్రింది విధంగా పడిపోయినారు

 

బుడబుడ నెత్తురు గ్రక్కుచు

వెడరూపముదాల్చి గ్రుడ్లు వెలికుఱుక నిలం

బడి పండ్లు గీటుకొనుచును

విడిచెన్ బ్రాణములు….

 

ఆ దృశ్యం అచ్చంగా అలాగే ఉన్నది అక్కడ

మరి దెబ్బ విసరినది ఎవరు ?

సాక్షాత్ ఆ పరశురాముని శిష్యుడు

ఆ దేవదేవుని అవతారం ఆ రాముని శిష్యుడు

ఆయన వద్ద విద్య నెర్చుకున్నవాడికి తిరుగు ఉంటుందా?

ఆ విద్యకు ఎదురు నిలవగల శక్తి ఈ లోకంలో ఉన్నదా?

అంతటి విద్య అది, అంతటి ప్రతిభాశాలి ఆ గాంగేయుడు

ఆ పడిపోయిన వారిని చూచి మిగిలినవారికి ముచ్చెమటలు పట్టినాయి

ఎవరి అడుగు ముందుకు పడలా

గాంగేయుడు అమ్మాయీమణుల దగ్గరకు వచ్చి ముగ్గురినీ రథంలోకి ఎక్కించాడు

అశ్వాల వెన్ను మీద ఒక్క చరుపు

అంతే, ధనస్సు విడిన బాణంలా పరుగు అందుకున్నాయ్

అయ్యో అయ్యో అని హాహాకారాలు మిన్ను ముట్టినాయి

సాళ్వుడు అక్కడే ఉన్నాడుగా, చూశాడు, ఆ దృశ్యాన్ని చూశాడు

నోట మాటే రాలా

అయినా చిక్కబట్టుకొన్నాడు

ధైర్యం చిక్కబట్టుకొన్నాడు

మరి అమ్మాయీమణి కావాలిగా

అంబా పాణిగ్రహణం జరగాలిగా

ముందు వెళ్ళిపోతున్న రథం వంక చూచినాడు

ఆ రథంలో దీనంగా నిలబడుకొని ఉన్న అంబ వంక చూచినాడు

రథం తోలుతున్నా గాంగేయుని వంక చూచినాడు

అంబ సైగలు చేస్తోంది ఇంకా నిలబడి ఉన్నావేం అన్నట్లు

ఇక అదే ఊతంగా తీసుకొని వెళ్ళిపోయినాడు

గాంగేయుని రథమ్మీదకు ఉరుకులు పరుగులుగా వెళ్ళిపోయినాడు

సాళ్వుడూ వీరుడేగా?

మొత్తానికి గాంగేయుడి రథం వేగాన్ని అందుకున్నాడు

అందుకోవటమేమిటి, దాటేశాడు కూడాను

ఆపాడు రథాన్ని, ఆపించాడు దేవవ్రతుడి రథాన్ని

కానీ ఆయన్ని ఎదురెదురుగా చూడగానే సాళ్వుడికి ఒళ్ళు గగుర్పొడించింది

ఆ అందానికి, ఆ భీషణత్వానికి, ఆ వీరత్వానికి, సహస్ర సూర్య భగవాను తేజానికి

ఒంటి మీది రోమాలన్నీ నిలబడుకొనిపోయినాయి

అచ్చంగా బ్రహ్మ నిద్ర నుంచి లేచి కాళ్ళు చేతులు విదిలించినప్పుడు పుట్టిన సరీసృపాల్లా, పాముల్లా నిలబడుకొనిపోయినాయి

** తన సృష్టి వృద్ధిలేమికిఁ

గనలుచు శయనించి చింతఁ గర చరణాదుల్

గొనకొని కదలింపఁగ రా

లిన రోమము లుగ్రకుండలివ్రజ మయ్యెన్**

అన్న పద్యం గుర్తుకువచ్చిందా?

అంతే మరి, భావన అంటే ఒక శక్తి

ఆదిపరాశక్తితో సమానం

అంత గగుర్పాటును అణుచుకొంటూ సింహనాదం చేసినాడు

అమ్మాయీమణులను వదిలెయ్యమన్నాడు దేవవ్రతుడితో

ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా, పొదిలోనుంచి ఒక మహాస్త్రం తీసి ఒక్క వేటు వేసినాడు

మాట మంతీ లేకుండా, ఆ మహాస్త్రపు దెబ్బకు రథమ్మీదనుంచి కిందపడిపోయి ఆమడ దూరం జారిపోయినాడు

అక్కడికి సాళ్వుడి యుద్ధ నైపుణ్యం సమాప్తం

దేవవ్రతుడు వెళ్ళిపోతున్నాడు

హస్తినకు వెళ్ళిపోతున్నాడు

అమ్మాయీమణులను తీసుకొని వెళ్ళిపోతున్నాడు

సాయం సమయమయ్యింది

అమ్మాయిలకు విశ్రాంతి కావాలని విడిది చేశినాడు

మార్గమధ్యంలో ఉన్న అడవిలో విడిది చేశినాడు

రాతిరి ఒకటవ జాము నడుస్తుండగా అంబ వచ్చింది గాంగేయుని దగ్గరకు

నిద్ర పోకుండా ఏమి చేస్తున్నావ్ అన్నాడీయన

భీష్మా, నీవు సత్యానికి బద్ధుడవేనా ? అని నోరు పెగలించుకొని అడిగింది అంబ

సత్యానికొక్కదానికేనేమి, ధర్మానికి కూడా బద్ధుడినే అన్నాడు గాంగేయుడు

మరి నీ శపథం వదిలివేసుకుంటున్నావా అని ప్రశ్నించింది అంబ

ఎవరన్నారు నా శపథం వదిలి వేస్తున్నానని అన్నాడు భీష్ముడు

మరి నీవు పెండ్లాడకపోతే మమ్మల్ని ఎందుకు తీసుకొని పోతున్నావు అని మరో ప్రశ్న వచ్చింది అంబ నుండి

నా తమ్ముడు విచిత్రవీర్యునికి మిమ్మలందరినీ ఇచ్చి కట్టబెట్టటానికి అన్నాడు ఈయన

ఎవరికో ఇచ్చి కట్టబెట్టటానికి నీ వీరాన్ని చూపించావా అంటూ అంబ హేళణగా నవ్వింది

ఆయన మారుమాట్లాడలా

రెట్టించింది అంబ

మీ నాన్న పంపించిన స్వయంవర ఆహ్వానంలో ఉన్నదే నేను చేసినాను, నా తప్పేమీ లేదు అన్నాడీయన

మా నాన్న చెప్పింది చెయ్యటమేమిటి ? ఏమున్నది ఆహ్వానంలో అంటూ ఒక్క క్షణం ఉక్కిరిబిక్కిరి అయినది అంబ

ఎవరు వీరాధివీరులో, ఎవరి రాజ్యంలో అందరూ వీరులేనో, ఎవరు ఆ వీరులకు రాజో, ఎవరు యుద్ధవిజేతో వారికే మా అమ్మాయిమణులను కట్టబెట్టేది అని ఉన్నది

నాన్నగారు అలా అనలేదే మాతో, స్వయంవరం అన్నారే అంటూ అంబ ఆశ్చర్యపడ్డది

అది మీరు మీరు తేల్చుకోవాల్సిన విషయం అన్నాడు ఈయన

ఆ, గుర్తుకు వచ్చింది ఆ ఆహ్వానం మా మంత్రిగారు పంపించారు, ఆయన మతలబు చేశి ఉంటాడు ఇందులో, నరికేస్తా వాడిని అంటూ ఆవేశానికి లోనయ్యింది అంబ

ఇప్పుడు ఆవేశపడి లాభం లేదు కానీ, ఆహ్వానం వచ్చాక మా రాజ్యంలో అంతా వీరులే, ఇంత చిన్నదానికి రాజుగారు రావటం ఎందుకని నేనే వచ్చేశా, మిమ్మల్ని తీసుకెళ్ళి మా చిన్నరాజు గారికి అప్పగించేసి పెళ్ళి చేసేస్తానంటూ అటు తిరిగి నిద్రకుపక్రమించాడు

అదంతా నాకు తెలియదు, ఎవరికో కట్టబెట్టటమేమిటి ? నన్ను ఎత్తుకొచ్చిన నీవే నన్ను పెండ్లి చేసుకోవాలి అని మరో మాట విసిరింది

కుదరదు అన్నాడు గాంగేయుడు

ఎట్లా కుదరదు? నన్ను సాళ్వుడికి కాకుండా చేసి, ఎత్తుకొచ్చిన నీకు కాకుండా చేసి, వేరెవరికో కట్టబెడితే నీ అంతు చూస్తాను, నీకు మృత్యుదేవతనవుతాను అంటూ తాండవం చేసింది

ఆయన సాళ్వుడి పేరు వినగానే కాస్త అశ్చర్యానికి లోనైనాడు

సాళ్వుడా? వానికి నిన్ను కాకుండా చెయ్యటమేమిటి అన్నాడు

సాళ్వుని వృత్తాంతం, తమ ప్రేమ వృత్తాంతం తెలిపింది అప్పుడు అంబ

అది విన్న భీష్ముడు మ్రాన్పడిపోయినాడు ఒక్క నిముషం

ఏ నాడు తప్పు చేయని నేను దారి తప్పినట్టే ఉన్నది, తప్పు కాదు కానీ తప్పు అనబడదగ్గ పని చేసినాను. నీ మనసులో మాట రథం ఎక్కక ముందైనా చెప్పినావు కాదు నాకు అని చింతించాడు

అయిపోయిందేదో అయిపోయింది, ఇక సాళ్వపతి దగ్గరకన్నా నన్ను పంపించివేయి, లేదా నీవే నన్ను పెండ్లి చేసుకోమని పట్టు పట్టినది

పట్టు పట్టరాదు పట్టి విడువరాదు అన్న సూత్రముననుసరించి పట్టు పట్టినది

నేను శపథ బద్ధుడిని, అది ఆ పరమశివుడు కూడా మార్చలేడు, అందువల్ల నీవు నా మీద కోరిక వదిలి ఆ సాళ్వరాజు వద్దకు వెళ్ళిపో అని , గుర్రం ఎక్కించి పంపివేశినాడు

అంబ రోషం, ఆనందం కలగలసిన మన:స్థితిలో పరుగు పరుగున సాళ్వుడు పడిపోయిన ప్రదేశానికి దౌడు తీయించింది గుర్రాన్ని…

అక్కడ….

 

(ఇంకా ఉంది….)

అసమ దాంపత్య బంధంలో ఎక్స్ ట్రా నాట్!

 

 

-ఎ . కె . ప్రభాకర్

~

 

స్త్రీవాద రచయితల్లో గీతాంజలి (డా. భారతి)ది విలక్షణమైన గొంతు. ప్రగతిశీలమహిళా వుద్యమాల్లో క్రియాశీలంగా పనిచేసిన కార్యకర్తగా స్వీయ జీవిత అనుభవ నేపథ్యం నుంచి ఆమె రచించిన ‘ఆమె అడవిని జయించింది’ నవల నూత్నవస్తు – శిల్పాల స్వీకృతి కారణంగా గొప్ప సంచలనం సృష్టించింది. కుటుంబంలో లోతుగా పాతుకుపోయిన పితృస్వామ్య భావజాల నిరసన   – స్త్రీల సమస్త శక్తి యుక్తుల్ని హరించి వాళ్ళను బోన్సాయ్ మొక్కలుగా మార్చే ఇంటి చాకిరీలోని అమానవీయ కోణాలు –  కనపడని గృహహింసకు బలయ్యే స్త్రీల ఆవేదన – పసిపిల్లలమీద జరిగే అత్యాచారాలు – ఆడదాని గర్భసంచి చుట్టూ అల్లుకొన్న రాజకీయాలు  గీతాంజలి తొలినాళ్ళలో రచించిన కథలకి (బచ్చేదానీ – 2004 ) ముఖ్య వస్తువు. ఓల్గా లాగానే స్త్రీ శరీరాన్ని కేంద్రం చేసుకొని అమలయ్యే పురుషాధిపత్య రాజకీయాలను బలంగా యెండగట్టడంతో గీతాంజలి ఆగిపోలేదు. ఒక డాక్టర్ గా , సెక్సాలజిస్టుగా ఫేమిలీ కౌన్సిలింగ్ కోసం తన దగ్గరకొచ్చే స్త్రీల హృదయవిదారకమైన జీవితాలను గొప్ప ఆర్తితో వర్ణించింది. ఆ కథల్లో ( పహెచాన్ – 2007) యెక్కువ భాగం ముస్లిం స్త్రీలకు చెందినవే కావడం విశేషం. దుర్భర దారిద్ర్యంలో నలిగిపోతూ కమ్యూనిటీ లోపలా బయటా పురుషాధిపత్య – మత భావజాలంతో పెనుగులాడే ముస్లిం మహిళల  దు:ఖ మూలాల్ని వెతికే క్రమంలో తనది కాని జీవితాలతో మమేకమౌతూ సాటిలేని సహానుభూతితో డా. గీతాంజలి కలం నుంచి వెలువడ్డ కథలు అనితర సాధ్యాలు. షాజహానా వంటి ఇన్ సైడ్ రచయితలు మాత్రమే రాయగలిగినవి.

ఇవన్నీ వొక యెత్తయితే  రైతుని నమ్ముకొన్న నేలకి దూరం చేసే సెజ్ లకు వ్యతిరేకంగా ఆమె కలం పదునెక్కింది. కరువు కోరల్లో చిక్కుకొని బతుకు తెరువు వెతుక్కుంటూ దేశాలు పట్టిపోయే పాలమూరు వలస కూలీల వెతల్ని జీవన్మరణ పోరాటాన్ని వాళ్ళ భాషలోనే (పాలమూరు వలస బతుకు చిత్రాలు – 2015) చిత్రించింది.

రచయితగా సామాజిక కార్యకర్తగా  సమాజంలో పాతుకుపోయిన సకల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా క్షేత్ర స్థాయిలో పనిచేస్తూనే ‘మూసి ఉన్న తలుపులు వెనకాల పెళ్లి , దంపత్య జీవితం , రొమాన్స్ పేర్లతో … పెళ్లి , భర్త అనే చట్టబద్ధమైన లైసెన్సులతో  … స్త్రీల మనో దేహాల మీద జరిగే దాడి … సెక్సువల్ వయోలెన్స్’ ఎంత భయానకంగా ఉంటుందో తెలియ జేస్తూ ‘మగవాళ్ళను సెన్సిటైజ్ చేయాలనే’ వొక బలమైన ఆశతో స్త్రీల లైంగిక రాజకీయాల గురించి నిర్దిష్టమైన అవగాహనతో   గీతాంజలి రాస్తోన్న కథల పరంపరలో – శిలగాని శీల , ఫ్రిజిడ్ , నింఫోమేనియా మొదలైన  కథలు సాహిత్య ప్రపంచంలో తీవ్రప్రకంపనాలు సృష్టించాయి. ఆ క్రమంలో యింతకు మునుపు యే రచయితా స్పృశించని విలక్షణమైన వస్తువుతో వచ్చిన కథ ‘ హస్బెండ్ స్టిచ్’ ( విహంగ , మహిళా సాహిత్య మాస పత్రిక – జనవరి 2014) .

  కథ  లింక్   :  http://vihanga.com/?p=10972#sthash.25kbCw4h.dpbs

 

 

పాపినేని శివశంకర్ ‘మనుషులు వదులవుతారు’ (కథ – 1999) కథలో వొక  భర్త వయసు పెరిగిన భార్య వొదులై పోయిందని వేరే స్త్రీతో సంబంధం కోసం ప్రయత్నిస్తుంటాడు . అతనలా వెంపర్లాడుతున్నాడని తెలుసుకొని ‘నేనంటే నా ఒళ్ళు మాత్రమేనా’ అని ప్రశ్నించుకొని ఆమె వాపోతుంది. ‘మాయదారి సంసారాల్లో ఎక్కడో పెద్ద మోసం దాగుంది’ అని గ్రహిస్తుంది.

శివశంకర్ కథలో ‘సతీ సావిత్రి’ కి తన శరీరమ్మీద కనీసం గౌరవమైనా మిగిలి వుంది. సంసార సంబంధంలో యేదో మోసం వుందన్న యెరుక వుంది.  గీతాంజలి కథలో పాపం సుశీలకి ఆ రెండూ లేవు. ఆమె తనను నిర్లక్ష్యం చేసిన భర్త శంకర్రావుని మళ్ళీ తన దగ్గరకు రప్పించుకోడానికి పడరాని పాట్లు పడింది.

‘సంవత్సరం నుంచి మా మధ్య శారీరక సంబంధం లేదు’ … ‘నాతో సెక్స్ బాగోలేదట – నీది ఒదులైపోయింది అందుకే రావాలన్పించడం లేదంటాడు … ‘ఆయన మళ్ళీ నా దగ్గర్కి రావాలి. రావాలంటే నేను ఆపరేషన్‌ చేయించుకుని పెళ్ళికి ముందులా తయారవ్వాలి’ అని సుశీల తన  స్నేహితురాలు మంజులకి సిగ్గు విడిచి చెప్పుకొంది.

మాయదారి సంసారాల్లో దాగున్న మోసాన్ని గ్రహించలేక తన అనారోగ్యాన్ని కూడా లక్ష్య పెట్టక ఎక్స్ ట్రా నాట్ కి సిద్ధపడింది. అందుకు తాహతుకి మించిన అప్పుచేయడానికి సైతం వెనకాడలేదు. డాక్టర్ హెచ్చరించినా వినక ప్రాణం మీదకి తెచ్చుకొంటుంది. ఇదీ ‘ హస్బెండ్ స్టిచ్’ లో స్థూలంగా కథ .

సుశీల అభద్రతకీ భయానికీ దు:ఖానికీ  కారణాలని రచయిత కథ నుంచీ పక్కకు వెళ్లి యెక్కడా ప్రత్యక్షంగా పేర్కొనక పోవడంలో గొప్ప సంయమనం ప్రదర్శించింది. దాంపత్య జీవితంలోని లైంగికత గురించి –  నియంత్రణల గురించి – పురుషానుకూలగా యేక పక్షంగా పాతుకుపోయిన  సామాజిక చట్రాల గురించి – భావజాలం గురించి పాఠకుల్లో సవాలక్ష ఆలోచనలు , ప్రశ్నలు పుట్టాడానికి అవకాశం యిచ్చే విధంగా కథాగమనంలో  అనేక పొరలు నిర్మించింది. గీతాంజలి రచించిన యితర కథలనుంచి ఈ కథ ప్రత్యేకంగా రూపొందడానికి అందులో వాడిన విశిష్టమైన శిల్పమే కారణమైంది ( గీతాంజలి కథల్లో కథ పొడవునా వొక వొడవని దు:ఖం చెవులు హోరెత్తేలా గుండెలు అవిసేలా వినిపిస్తూ వుంటుంది. కానీ ఈ కథలో మాత్రం దు:ఖ కారణాలే అక్షరాల మాటున దాగి రహస్యంగా ధ్వనిస్తాయి) .

వస్తు స్వీకరణ దగ్గర్నుంచీ యెత్తుగడ , యితివృత్త నిర్వహణ,  పాత్రల యెంపిక , ముగింపు అన్నీ చక్కగా అమరిన కథ యిది. దాంపత్య సంబంధంలో లైంగిక ప్రక్రియలో మాధుర్యం గురించి పురుష దృష్టికోణం నుంచే నిర్వచించే భావజాలాన్ని నిరసిస్తూ పడక గదుల్లో అమలయ్యే పురుషాధిపత్య లైంగిక రాజకీయాల మూలాల్ని  స్త్రీవాద సాహిత్యం చాల చోట్ల చర్చకి పెట్టినప్పటికీ ‘‘ హస్బెండ్ స్టిచ్’’ లాంటి వస్తువుని యెవరూ యెక్కడా స్వీకరించిన దాఖలాల్లేవు. అందువల్ల గీతాంజలి కథల్లోనే కాదు ; స్త్రీ వాద సాహిత్యంలో సైతం యీ కథ ప్రత్యేకంగా నిలుస్తుంది.

బిడ్డ సైజ్ పెద్దగా వున్న కారణంగానో , సరైన వైద్య సదుపాయం అందుబాటులో లేని కారణంగానో , బిడ్డకో తల్లికో ప్రాణాపాయం యెదురైన హడావిడిలో కాన్పు చేసే  కారణంగానో … ప్రసవ సమయంలో స్త్రీ జననాంగం చిరగడం వల్ల కావొచ్చు లేదా ప్రసవం తేలికగా కావడానికి కట్ (episiotomy ) చేయడం వల్ల కావొచ్చు ;  ప్రసవానంతరం మళ్ళీ పూర్వ స్థితి కోసం కుట్లు వేయాల్సిన అవసరం యేర్పడుతుంది.  అలా కుడుతూ – దాంపత్యంలో భర్తకి తృప్తి కలగడానికి వొకటి రెండు కుట్లు అదనంగా వేస్తారు. చాలా సందర్భాల్లో ఈ ప్రక్రియలో ఆ స్త్రీ ప్రమేయం వుండదు. కోసినట్టుగానీ అదనపు కుట్లు వేసినట్టుగానీ ఆమెకు తెలియజేయడం జరగదు. ఒక్కోసారి యిది భర్త కోరిక మేరకు చేస్తారు. లేదా డాక్టరే స్వయంగా నిర్ణయం తీసుకొని చేస్తారు. భర్త కోసం వేసే అదనపు కుట్టు కాబట్టి దీన్ని హస్బెండ్ స్టిచ్ అనీ ఎక్స్ ట్రా నాట్ అనీ అంటారు. భర్తల్ని సుఖపెట్టడానికి ,మగవాళ్ళు పక్కదారులు పట్టకుండా దాంపత్య బంధాన్ని నిలుపుకోడానికి ఎక్స్ ట్రా నాట్ బలమైన సాధనం అని నమ్మే స్త్రీలు కూడా ఉంటారు. అయితే దీని వల్ల ప్రయోజనం వుండదనీ తర్వాతి కలయికల్లో స్త్రీలు నరకాన్ని అనుభవిస్తారనీ , భర్తలు కూడా సుఖపడరనీ సర్వేల ద్వారా పరిశోధనలద్వారా తెలుస్తోంది (వివ . Mama Birth – July 28 , 2013). వ్యాపార దృష్టి లేని మంచి  డాక్టర్లు ఈ ప్రొసీజర్ ని ప్రోత్సహించరు.

‘కాన్పులనీ , కుట్లనీ , సిజేరియన్లు , హిస్టెరెక్టమీలు – ట్యూబెక్టమీలు రీకేనలైజేషన్లనీ అన్ని గాట్లు, కాట్లు ఆడవాళ్ళకు అవుతూనే ఉంటాయనీ’ అలా స్త్రీ శరీరమ్మీద పెద్ద వైద్య వ్యాపారం జరుగుతోందని చెప్తూ  , అందాల అంగడిలోనూ –   ఆరోగ్య విపణిలోనూ స్త్రీ శరీరం సరుకైన వైనం చుట్టూ అల్లిన సాహిత్యం చదువుకొన్నాం. ఆ క్రమంలో వచ్చిన డా. గీతాంజలి ‘హస్బెండ్ స్టిచ్’  బలమైన కథగా రూపొందడానికి కారణం – వస్తు శిల్పాల చక్కటి సమన్వయమే. కథలో కథని మాత్రమే చెప్పాలన్న సూత్రాన్ని రచయిత నిక్కచ్చిగా పాటించింది.

కథకి అవసరమైన సాంకేతికమైన  వైద్య పరమైన విషయాల్ని  కథలో రచయిత్రి  నేరుగా ప్రస్తావించకుండా డాక్టర్ ముఖత: చెప్పించడంతో ప్రతిపాదితాంశాలకి   ప్రామాణికత విశ్వసనీయత లభించాయి. సుశీల దాంపత్య జీవితంలో యెదుర్కొనే సమస్యనీ , అందుకు ఆమె యెంచుకొన్న పరిష్కారాన్నీ , అందులోని సాధక బాధకాల్ని విప్పి చెప్పడానికి  గీతాంజలి కథని నెరేటివ్ స్టైల్లోగాక సంభాషణ శైలిలో నడిపింది. అందువల్ల కథలో రచయిత ప్రమేయం దాదాపు శూన్యమే. సుశీల తన బాల్య స్నేహితురాలు మంజులతో , పక్కింటి సుమతితో , డాక్టరమ్మతో చేసిన మూడు సంభాషణల్లో రచయిత్రి కంఠస్వరం డాక్టర్ పాత్రలో స్పష్టంగా వినిపిస్తుంది. రచయిత్రి నిజ జీవితంలో  తన దగ్గరకి కౌన్సిలింగ్ కోసం వచ్చే సుశీల లాంటి పేషంట్ల పట్ల చూపే సహానుభూతే డాక్టర్ మాటల్లో ప్రతిధ్వనించింది.

‘కాన్పు తర్వాత యోని కండరాలు మళ్ళీ సంకోచించి పోతాయి. వాటికి సాగే గుణంతో పాటు ముడుచుకునే గుణం కూడా ఉంటుంది. చాలా తక్కువ కేసుల్లో 10,12 మంది పిల్లల్ని కన్న వాళ్ళల్లో, నీలా పల్లెల్లో మంత్రసానులతో కాన్పులయిన వాళ్ళలో ఈ సమస్య వస్తుంది

‘నీ భర్తను ఒకసారి కౌన్సిలింగ్‌కి నా దగ్గర్కి తీసుకురా అతనికి అంతా వివరంగా చెప్పి నిన్నిలా వేధించద్దని చెప్తాను. నీకు కొన్ని ఎక్సర్‌ సైజులు చెప్తాను , అవి చేస్తే ఇంకా బిగుతయ్యే అవకాశం ఉంటుంది.

‘ఈ ఆపరేషన్‌ అయ్యాక అంతా బాగవుతుందనుకోవద్దు. నీ భర్తకు బాగుండచ్చు కానీ కుట్లు మరీ బిగుతై పోయి కలయిక భరించలేనంత నొప్పిగా ఉండి దాంపత్య జీవితం పట్ల భయం కలుగవచ్చు. మధ్య మధ్యలో యోని నించి రక్తప్రావం అవుతూ ఇన్ఫెక్షన్స్‌ వస్తాయి.’

డాక్టర్ చెప్పే మాటల్లోని సారాంశం భరోసా హెచ్చరిక  సుశీలకి యెక్కలేదు. జీవితంలోని అభద్రతే ఆమెని భయపెట్టింది. అందుకున్న యితరేతర కారణాలని కూడా రచయిత సుశీల అంతర్మథనం ద్వారా స్పష్టం చేస్తుంది. నిజానికి సుశీల ‘పెళ్ళైన వాడని తెల్సీ’ ఎందుకో శంకర్రావంటే  ‘పిచ్చి ఆకర్షణ కలిగి అతనితో పారిపోయి గుళ్ళో పెళ్ళి చేసేస్కుంది. అమ్మ, నాన్న వెళ్ళగొట్టారు. అతని మొదటి భార్య విజయ ఆత్మహత్య ప్రయత్నం చేసి బతికింది . ఆమెకిద్దరు మగ పిల్లలు. తనకు కవల ఆడపిల్లలు పుట్టారు.’

సుశీలకి పెళ్లై నాలుగేళ్లే. కానీ దాంపత్య జీవితంలో ఎన్ని రకాల దు:ఖాల్ని మోసుకు తిరుగుతుంది? అందుకు కారణం తాను వొదులై పోవడమా? ఆడపిల్లల్ని కనడమా? రెండో భార్య కావడమా ?ఆమెకు అర్థం కాదు. అసలు కారణం శంకర్రావులోని చావనిస్ట్ మగాడు. కన్న బిడ్డలు తండ్రి ప్రేమకి దూరం కాకుండా వుండడానికి ఆమె తోటి స్త్రీతో పోటీకి దిగింది. భర్త తన కొంగు వదలకుండా వుండేలా చేసుకోడానికి దేనికైనా సిద్ధపడింది. తన శరీరాన్ని పణ్య వస్తువు చేసుకొని మొగుడిని ఆకర్షించే ఆలోచనలు చేసింది. ఆకట్టుకొనే దారులు వెతికింది. అటువంటి పరిస్థితుల్లో పక్కింటి సుమతి   [పేర్ల ఎంపికలో కూడా రచయిత్రి  దృక్పథం వ్యక్తమౌతుంది ; స్త్రీని కేవలం శరీరంగా , సెక్స్ అవసరాలు తీర్చే యంత్రంగా భావించే శంకర్రవులాంటి శృంగార పురుషుల్ని అన్నివిధాలా సుఖపెట్టడానికే అంకితమైన – పాతివ్రత్య ధర్మాలు జీర్ణించుకొన్న పురాణ పాత్రలు ]  మాటలు సుశీలకి అమృతోపమమయ్యాయి.

కాన్పు అయ్యాక మానం వెడల్పుగా సాగుతుంది కదా భర్తకు తర్వాత కలయిక బాగుండాలని, అక్కడ బిగుతుగా ఉండాలని ఒక కుట్టు ఎక్స్‌ట్రా వేస్తార్లే. నేను నా రెండు కాన్పులకీ వేస్కున్నానాకు ముందే తెల్సు. డాక్టరమ్మని ముందే అడిగా. ఎక్స్‌ట్రా మనీ అడిగిందనుకో, కాపురం కంటే ఎక్కువా చెప్పు? మా ఆయనా పోరు బెట్టాడనుకో డాక్టరమ్మ ఎంత డబ్బడిగితే అంతిచ్చాడు తెల్సా ? నువ్వూ అట్లా చేయించుకోవాల్సింది’

సుమతి సుశీలతో అన్న మాటల్లో కాపురాలు కాపాడుకోటానికి దాంపత్య సంబంధాల్ని సడలకుండా చూసుకోడానికి స్త్రీలు పడుతున్న అవస్తలే కాదు ; ఎక్స్ ట్రా నాట్ లు డాక్టర్లకి ఎక్స్ ట్రా మనీ మూటలు కట్టడానికి యెంతగా తోడ్పడుతున్నాయో తెలుస్తుంది. అందుకు భర్తలు యెంత వుదారంగా వుంటారో దూరదృష్టితో ప్రవర్తిస్తారో అర్థమౌతుంది.

నా దగ్గర్కి ఆయన రావాలి మేడమ్‌. పిచ్చెక్కుతోంది ఆయన రాకపోతే. సెక్స్‌ కోసం కాదు మేడమ్‌ నాకు ఆయనంటే ప్రేమ. పిల్లలు నాన్న కావాలంటారు. నా దగ్గర ఆకర్షణ లేకపోతే ఎందుకొస్తారు మేడమ్‌? నాకు ఎక్స్ ట్రా నాట్‌ కావాలి . పల్లెటూల్లో కాన్పు కావడం వల్ల అక్కడ మీ లాంటి డాక్టరమ్మ కాకుండా మంత్రసాని తో కాన్పు చేయించుకున్నా . అందుకే వదులై పోయింది మేడమ్‌. నేను టైట్‌ చేయించుకోవాలనుకుంటున్నా.

అని సుశీల డాక్టరమ్మని ప్రాధేయపడింది. సుశీల యెదుర్కొన్న హైన్యం మనస్సుని కలచివేస్తుంది. స్త్రీని యింతగా బలహీనురాల్ని చేసున్న సామాజిక – సాంస్కృతిక నిర్మాణాల పట్ల క్రోధం కల్గుతుంది.

డాక్టరమ్మ వద్దని యెంత కౌన్సిలింగ్ చేసినా వినకుండా  సుశీల చేయించుకొన్న ఆపరేషన్ సఫలం కాలేదు. సంసారాన్ని నిలబెట్టుకోడానికి వేయించుకొన్న ఎక్స్ ట్రా నాట్ తో ఆమె భర్తని కట్టివేయలేకపోయింది. భర్త మీద అలవికాని ప్రేమను చూపుతున్నాను  అనుకొని అసమ దాంపత్యంలో హింసని అనుభవించింది.

‘కలయికలో నొప్పి భరించలేక గావు కేకలు పెట్టలేక పళ్ళు బిగువన కన్నీళ్ళు కారుతుంటే భరించింది సుశీల. తర్వాత కలయిక అంటే చచ్చేంత భయం ఏర్పడినా భర్త కోసం ఆ భయంకరమైన నొప్పిని భరించసాగింది. భర్త కళ్ళ ముందుంటే చాలు అనుకుంది.’

పంచ కన్యల పురాణ గాథలు – వాత్స్యాయన కామసూత్రాలు మొదలుకొని ఇవ్వాళ్టి వయాగ్రా మాత్రలు , సిలికాన్ యింప్లాంటేషన్ లు వెజైనోప్లాస్టీ – ఎక్స్ ట్రా నాట్ ల వరకూ   అన్నీ లైంగిక తృప్తిని  పురుష కేంద్రంగానే నిర్వచించి డిజైన్ చేయడంలో భాగంగానే పడగ్గదుల్లోకి ప్రవేశిస్తున్నాయనే స్పృహ కథ చదువుతున్నంతసేపూ మనకు కలుగుతూనే వుంటుంది. దాంపత్యంలో సమ భావన , సమ భాగస్వామ్యం లేకుండా చేసిన పురుషస్వామ్య భావజాలంలోని హింస యెరుకవుతూనే వుంటుంది. ఒకరికి యిద్దరిని కట్టుకొని విలాసంగా రొమ్ము విరుచుకొని తిరిగే శంకర్రావుల కాళ్ళ దగ్గరే పడివుండాల్సిన అగత్యాన్ని , దుస్థితిని  స్త్రీలకు  కల్పిస్తున్న సమస్త  కారణాల పట్ల – భావజాలం పట్ల అసహనం కలుగుతుంది. కథ పొడవునా రచయిత వుద్దేశ్యం స్పష్టమౌతూనే వున్నప్పటికీ ముగింపు దగ్గరకొచ్చేసరికి  కొత్త ప్రశ్నలు తలెత్తుతాయి.

నొప్పి భరించైనా భర్తతో బంధాన్ని కాపాడుకోవాలని సుశీల అనుకొన్నప్పటికీ ‘ఎక్స్ ట్రా నాట్ మహిమ’ తో లభించిన భోగం మూడు నెలల ముచ్చటే అయ్యింది. సమస్య మళ్ళీ మొదటికి రావడంతో భర్త తిరస్కారంతో సుశీల బీపీ పెరిగి పక్షవాతానికి గురై ఆసుపత్రి పాలయ్యింది.

కథని నిర్మాణ పరంగా కొంత ఎడిట్ చేసుకొంటే బాగుండేది అనిపించినా రచయిత తాను చర్చించదలచుకొన్న సమస్యకి (కథా వస్తువుకి) – సుశీలనీ , పాఠకులకి – సుశీల పట్ల సానుభూతి చూపే మంజులనీ , సమస్య చుట్టూ నిర్మితమైన సామాజిక విలువలకీ భావజాలానికీ – సుమతినీ , రచయిత్రి గొంతుకి – డాక్టరమ్మనీ ప్రతినిధులుగా యెంచుకొని కథ నడిపినట్టు తోస్తుంది. ఇది కథలో దాగి వున్న అంతర్గత నిర్మాణం.

సుశీల వైవాహిక జీవితాన్ని మొదట్నుంచీ యెరిగిన ఆమె స్నేహితురాలు మంజుల దయనీయమైన ఆ పరిస్థితిని చూసి చలించిపోయింది. పాఠకులకి కలిగే ప్రశ్నలే కథ ప్రారంభం నుంచీ మంజులకి కూడా కలుగుతాయి. టీచర్ గా పనిచేస్తున్న మంజులకి జీవితంలో కొత్త పజిల్  యెదురైంది.

ముఫ్పై నిండిన మంజుల మొన్నొచ్చిన సంబంధానికి అవునని చెప్పాలో, కాదని చెప్పాలో తేల్చుకోలేకుండా ఉంది.

 

ఇదీ రచయిత్రి కథకిచ్చిన ముగింపు. పాఠక దృష్టికోణం నుంచి యిచ్చిన యీ  యేక వాక్యపు ముగింపు   కథలో రచయిత్రి చెప్పిన విషయాల గురించే గాక చెప్పని విషయాల గురించి , మంజుల అంతరంగంలో మెదిలిన అనేక ప్రకల్పనల గురించి యెంతగానో ఆలోచించేలా చేస్తుంది. రేపు తన భర్త కూడా శంకరరావు లాంటి వాడే అయితే అన్న సందేహం ఆమెకు కల్గిందని వొక్క మాటలో తెల్చివేయలేం. అటువంటి  సందేహ ప్రస్తావన కథ మధ్యలో కూడా వచ్చింది. మంజుల మనస్సులో కల్గిన వూగిసలాటకి కారణాలు కేవలం వైయక్తికమైనవి కావు. సుశీల – సుమతి – తనూ వ్యవస్థీకృత విలువలకి బానిసలవుతున్న పరిస్థితులన్నిటి గురించీ  విమర్శనాత్మక దృష్టితో విశ్లేషిస్తూ క్రాస్ రోడ్ల కూడలిలో ఆమె నిలబడింది.

 

స్త్రీ వైవాహిక జీవితంలో ఎదురయ్యే హింస పట్ల భయం ,  పెళ్లి అనే వ్యవస్థ పట్ల అనుమానమూ  , స్త్రీపురుష సంబంధంలో  అసమానతలని వైరుధ్యాలని  సృష్టించిన పితృస్వామ్య ఆధిపత్య భావజాలం వల్ల కాపురాల్లో సంభవించే  కల్లోలాల గురించిన  లోచూపూ ,  ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచన అన్నీ వొక్కసారిగా ఆమెను చుట్టుముట్టి   వుంటాయి. పెళ్లి పేరున మొత్తం స్త్రీ జాతి అనుభవిస్తున్న బంధనాలు ఆమెను పెళ్లి గురించి పునరాలోచించేలా  చేశాయి.

 

సాధారణంగా ముగింపు వాక్యం రచయిత దృక్పథాన్ని బలంగా చెప్పడానికి ఉపయోగ పడుతుంది. గీతాంజలి యీ కథని కేవలం ఎక్స్ ట్రా నాట్ గురించి మాత్రమే వుద్దేశించి రాయలేదనీ ముడివడని అసమ దాంపత్య సంబంధాలన్నిటినీ చర్చకు పెట్టడమే ఆమె లక్ష్యమనీ , పురుష ఆధిపత్య వ్యవస్థీ కృత విలువల్ని ప్రశ్నించడానికి ప్రేరేపించడమే ప్రధానమైన ఆశయమనీ  ముగింపు ద్వారా నిరూపించింది. ఆ ప్రయత్నంలో ఆమె అన్ని విధాల సఫలమయ్యింది.

మగవాళ్ళనందరినీ శంకరర్రావు పక్కన నిలబెట్టి ప్రకృతి సహజమైన స్త్రీ పురుష సంబంధాన్నే తిరస్కరించే దిశగా గాక మనస్సుతో నిమిత్తం లేకుండా దేహభాషకే పరిమితమైన  శృంగారంలో  తృప్తి – భావప్రాప్తి వంటి పదాల చుట్టూ అల్లుకొని వున్న పురుష  లైంగిక రాజకీయాల గురించి పాఠకులు ఆలోచించడానికి ఆస్కారం కల్గించడానికే రచయిత యిటువంటి open ముగింపుని యిచ్చినట్లు  తోస్తుంది.

మగవాళ్ళని సెన్సిటైజ్ చేయడం కూడా తన యీ కథల రచనోద్దేశాల్లో వుందని రచయిత్రి చెప్పినప్పటికీ  స్త్రీలను అనేక రూపాల్లో కట్టిపడేస్తున్న “బంధాల” గురించి సరైన అవగాహన కల్గించడానికి యీ కథ బలంగా దోహదం చేస్తుంది. ప్రధాన స్రవంతిలో యిటువంటి కథలు మరెన్నో  రావాల్సి వుంది. ఆ దిశలో డా. గీతాంజలి చేస్తున్న కథా వ్యాసంగాన్ని మనసారా స్వాగతిస్తున్నాను.

 

బొంబాయి ఐ.ఐ.టి –తెలుగులో తొలి అడుగులు   

 

-వంగూరి చిట్టెన్ రాజు

~

 

తారీకు గుర్తు లేదు కానీ అది 1966 జూన్, జూలై లలో ఒక రోజు. బొంబాయిలో అరవ్వాళ్ళు ఎక్కువగా ఉండే మద్రాసు మాంబళం లాంటి మాటుంగా అనే చోట మడత మంచాల హోటల్ లో పొద్దున్నే లేచి నేనూ, గోవింద రాజులూ లోకల్ రైలూ, BEST వాళ్ళ బస్సూ ఎక్కి అంతకు ముందు రోజే రిహార్సల్స్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఇబ్బంది లేకుండానే పవయ్ అనే ప్రాంతంలో ఉన్న ఐఐటి కి మా ఇంటర్వ్యూ కోసం చేరుకున్నాం. మెకానికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ లో అడుగుపెట్టగానే పట్ట పగలే అన్ని ట్యూబులైట్లూ దేదీప్యమానంగా వెలుగుతూ ఉండడం  నాకు మొట్టమొదట ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అంత వరకూ కాకినాడలో నేను ఎప్పుడూ మా ఇంట్లో కానీ, కాలేజ్ లో కానీ పగలు లైట్లు వేసుకోడం చూడ లేదు. పైగా పొరపాటున వేస్తే “వెధవ కరెంట్ ఖర్చు అయిపోతుంది” అనే మాటలు వినపడేవి. ఆ రోజు మాస్టర్స్ డిగ్రీ కి ఇంటర్వ్యూకి దేశంలో అన్నిచోట్ల నుంచీ సుమారు 300మంది పైగా వచ్చారు… అందరితో బాటూ భయం, భయంగా కూచున్నాం. మా లాగే ఇంటర్వ్యూ కి వచ్చిన వాళ్ళలో కొందరు బొంబాయి లోనే చదువుకున్న వాళ్ళు, కొందరు కేరళ, గుజరాత్, బెంగాల్..ఇలా అన్ని రాష్ట్రాల నుంచీ వచ్చిన వాళ్ళు ఉన్నా బొంబాయి వాళ్ళకి మాత్రం మేము కాస్త బైతుల్లాగా కనపడ్డాం అని నాకు అనుమానం వేసింది. ఎందుకంటే వాళ్ళ వేషభాషలు, ధైర్యం, కలుపుగోలుదనం ఇతర రాష్ట్రాల వాళ్ళ కంటే కొంచెం దర్జాగా ఉంది. పైగా ఇంగ్లీషు మాట్లాడడం బావుంది. ఆప్పుడే నాకు తెలిసిపోయింది మనకి ఆ భాష గొప్పగా మాట్లాడడం రాదు సుమా అని. ఇప్పటికీ అది నిజమే కదా!

అంత మందిలో నేనూ, గోవిందరాజులూ భయం భయంగా కూచుని ఉండగా అప్పుడు మా గదిలోకి కొంత మంది ప్రొఫెసర్లు వచ్చి ఇంటర్వ్యూ పద్ధతులు వివరించారు. అందులో మా కొంప ముంచే రెండు “బాంబ్ షెల్స్” ఉన్నాయి.  అందులో మొదటిది మెకానికల్ ఇంజనీరింగ్ లో మెషీన్ టూల్స్, మెషీన్ డిజైన్, ఇంటర్నల్ కంబశ్చన్ ఇంజన్స్, రిఫ్రిజిరేషన్ లాంటి ఐదారు బ్రాంచ్ లు అన్నింటికీ కలిపి ఉండే సీట్లు మొత్తం ముఫై లోపేట.   అంటే ఒక్కొక్క విభాగం లోనూ మాస్టర్స్ డిగ్రీ కి ఐదారు సీట్లు మాత్రమే ఉంటాయి. ఈ విషయం తెలిసి మూడు వందల మందిలో ముఫై సీట్లయితే “ఎక్కడో ఆంధ్రా బాపతు గాళ్ళం, మన పని ఉట్టిదే గురూ. అనవసరంగా వచ్చి చచ్చాం” అని నేనూ, గోవిందరాజులూ అనుకుంటుంటే, రెండో బాంబ్ షెల్ ఏమిటంటే కేండిడేట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మొదటి ఎలిమినేషన్ రౌండ్ గా ఎంట్రెన్స్ పరీక్ష పెట్టడానికి వారు నిర్ణయించుకున్నారుట. అది వినగానే కాస్త దడ పట్టుకుంది. ఎందుకంటే, ఇంజనీరింగ్ పరీక్షలు అంటే లెక్కలు కట్టడానికి కనీసం స్లైడ్ రూల్ అయినా ఉండాలి. అది లేక పొతే చేతి వేళ్ళతో ఇంజనీరింగ్ లెక్కలు చెయ్యలేం. కేలుక్యులేటర్ లాంటి మాటలు అప్పటికి పుట్ట లేదు. పైగా ఆ పరీక్షలో ఏమైనా డ్రాయింగులు గియ్యమని అని అడిగితే టీ-స్క్వేరు, పెన్సిళ్లు, డ్రాయింగ్ పరికరాలు ఉండాలి. మన దగ్గర అవేమీ లేవు. అంచేత పరీక్ష రాయడానికి ముందే ఫెయిల్ అయిపోయాం అనుకున్నాం. కానీ ఆ ఇంటర్వ్యూకి వచ్చిన ఎవరి దగ్గరా కూడా అవి లేక పోయే సరికి నాకు కాస్త ధైర్యం, ఇంకాస్త అనుమానం వచ్చి అక్కడ టై కట్టుకుని హడావుడి గా తిరుగుతున్న ఒక ప్రొఫెసర్ గారితో “మాకు ముందు ఈ పరీక్ష గురించి తెలిస్తే అన్నీ తెచ్చుకునే వాళ్ళం” అని నా గోడు వెళ్ళబుచ్సుకున్నాను. ఆయన ఓ నవ్వు నవ్వి  “అవేం అక్కర లేదు. ఈ పరీక్షలో ఇది మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి.  కరెక్ట్ ఆన్సర్ టిక్కు పెట్టడమే” అన్నాడు. ఈ రోజుల్లో ఎవరూ నమ్మరు కానీ, ఆ రోజుల్లో మా కాకినాడ కాలేజ్ లో కానీ ఆంధ్రా ప్రాంతాలలో మరెక్కడా కానీ ఈ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నా పత్రాల పద్ధతి లేదు. ఒక్క ప్రాక్టికల్స్ తప్ప పరీక్ష ఏ సబ్జెక్ట్ లో అయినా ప్రతీ ప్రశ్నకీ పోలోమని దస్తాల కొద్దీ ఆన్సర్లు రాసెయ్యడమే. పైగా ఎన్ని పేజీలు  రాస్తే అన్ని ఎక్కువ మార్కులు వస్తాయి అనుకుని పెద్ద పెద్ద అక్షరాలతో పేజీలు  నింపేసే వాళ్ళం. అప్పటి వరకూ మల్టిపుల్ చాయిస్ గురించి వినడమే కానీ అలాంటి పరీక్షలు రాయ లేదు. మొత్తానికి వాళ్ళు సైక్లో స్టైల్ కాపీలు అందరికీ ఇచ్చి పరీక్ష పెట్టారు. అప్పటికి ఈ క్సీరాక్స్ అనే పేరే ఎవరూ వినలేదు. దేనికైనా కాపీలు కావాలంటే ఒక స్పెషల్ పేపరు మీద టైపు కొట్టి, ప్రింటింగ్ యంత్రం లాంటి దాంట్లో పెట్టి అలాంటి స్పెషల్ పేపర్ల కాపీలు తీసే వారు. ఆ పరీక్షకి సరిగ్గా గంట టైమ్ ఇచ్చారు. మెకానికల్ ఇంజనీరింగ్ కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ లోనూ సుమారు వంద ప్రశ్నలు….ప్రశ్నకి ఒక మార్కు వేసినా  తప్పు ఆన్సర్ రాస్తే అర మార్కు తీసేస్తారు. అంచేత ఖచ్చితంగా సరి అయిన సమాధానం తెలిస్తేనే టిక్కు పెట్టాలి. లేక పొతే నెగెటివ్ మార్కులు వస్తాయి. మొత్తం ఉన్న సీట్లు 30 కాబట్టి వచ్చిన మూడు వందల మందిలోనూ వంద మందిని మాత్రమే పెర్సనల్ ఇంటర్వ్యూ కి ఎంపిక చేసి మిగిలిన వాళ్ళని పంపించేశారు. ఈ పరీక్షలో పాస్ అయి నేనూ, గోవిందరాజులూ ఇంటర్వ్యూ కి ఎంపిక అయ్యాం. అప్పుడు ఎంపిక అయిన ఆ వంద మందిలో ఉన్న ఎనిమిది బ్రాంచ్ లకీ సీట్లు ఐదేసి ఉంటే ఇంటర్వ్యూ కి పదేసి మంది చొప్పున మళ్ళీ ఎవరికీ ఏ బ్రాంచ్ కావాలో చెప్పమని మరో పత్రం ఇచ్చారు. అప్పటికే ఉన్న అన్నింటిలోనూ ఎక్కువ డిమాండ్ ఉన్న బ్రాంచ్ లు – అంటే మెషీన్ టూల్స్,  మెషీన్ డిజైన్ లాంటి నాలుగు బ్రాంచ్ లలో మనకి ఎలాగా సీటు రాదు అని తెలిసిపోయింది కాబట్టి మరో రెండు బ్రాంచ్ లకి మేం ఇద్దరం మా పేర్లు ఇచ్చి పిలుపు కోసం కూచున్నాం. సాయంత్రం నాలుగు గంటలకి ఆ ఇంటర్వ్యూలు అయ్యాయి. వాటిల్లో నాకు సీటు రాదు అని అనుమానం వచ్చి విచారంగా కూచున్నప్పుడు ఒక ప్రొఫెసర్ గారు వచ్చి ఫ్ల్యూయిడ్ మెకానిక్స్ & ఫ్లూయిడ్ పవర్ బ్రాంచ్ లో ఆసక్తి ఉన్న వారు ఇంటర్వ్యూకి రావచ్చును అని ప్రకటించారు. చెప్పొద్దూ..అప్పటి దాకా అలాంటి బ్రాంచ్ ఉంది అనే మా ఇద్దరికీ తెలియదు. మరో అవకాశం ఉంది అని వినగానే ఇద్దరం పేర్లు ఇచ్చేశాం. ఆ గదిలోకి వెళ్ళగానే అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్న ముగ్గురు ముందుగా నా ఇంజనీరింగ్ ఫైనల్ పరీక్ష మార్క్ షీట్ అడిగి, “నీకు  హైడ్రాలిక్స్ లో మంచి మార్కులు వచ్చాయే” అని మెచ్చుకుని ఆ సబ్జెక్ట్ లో తప్ప ఇంజనీరింగ్ తప్ప ఇతర రకాల మామూలు ప్రశ్నలు అడిగారు. గోవింద రాజులు కూడా తన ఇంటర్ వ్యూ బాగానే అయింది అని చెప్పాడు. మొత్తానికి రాత్రి ఎనిమిది గంటలకి అన్ని బ్రాంచ్ ల ఇంటర్ వ్యూలూ అయ్యాక, ఎంపిక అయిన అభ్యర్థుల లిస్టు ఆయా బ్రాంచ్ తాలూకు ప్రొఫెసర్లు అక్కడ నోటీసు బోర్డ్ లో పెట్టారు. అల్లా ఒక్కొక్క నోటీసూ చూసుకుని, ఎందులోనూ మా ఇద్దరి పేర్లూ లేకపోవడంతో ఎంపిక అయిన వాళ్ళ నవ్వు మొహాల్లో మేము ఏడుపు మొహాలు పెట్టుకుని వెళ్లిపోడానికి సామాను సద్దేసుకుంటూ ఉండగా ఆఖర్న ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ & ఫ్లూయిడ్ పవర్ బ్రాంచ్ వాళ్ళ లిస్టు వచ్చింది. ఎంపిక చేసిన ఐదుగురులో నా పేరు చూసి కళ్ళు తిరిగాయి. నా కంటే ఎక్కువగా గోవింద రాజులు కళ్ళు తరిగాయి. ఎందుకంటే నా కన్నా అన్ని విధాలుగానూ ఎక్కువ మార్కులు వచ్చిన అతని పేరు సీటు వచ్చిన వాళ్ళ లిస్టులో లేదు కానీ  ప్రొవిజినల్ లిస్టు లో ఉంది. అంటే సెలెక్ట్ అయినా ఐదుగురిలో ఒక వేళ ఎవరైనా చేరక పొతే ఆ ఖాళీలో అతను చేర వచ్చును అనమాట.

ఎక్కడో కాకినాడ నుంచి మా ఇద్దరిలో ఎక్కువ అర్హత ఉన్న గోవిందరాజులు బదులు  బదులు నాకు సీటు రావడంతో ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఇద్దరం ఆలోచనలో పడ్డాం. అప్పుడు నాకు ఓ ఐడియా వచ్చింది. వెంటనే ఆ ప్రొఫెసర్ గారి ఇల్లు ఎక్కడో కనుక్కుని ఆయన ఇంటికి వెళ్లాం ఇద్దరం. అప్పుడు రాత్రి 10:30. పాపం ఆయన కూడా పొద్దుటి నుంచీ ఇంటర్వ్యూలు చేస్తూ చాలా అలిసిపోయి భోజనానికి కూచుని మేము తలుపు కొట్టగానే తలుపు తీసి “ఎవరు మీరు?” అని అడిగాడు. “నాకు మీ బ్రాంచ్ లో సీటు ఇచ్చినందుకు కృతజ్ఞలు చెప్పుకుందాం అని వచ్చాం” అనగానే ఆయన ఆశ్చర్యం గా “నాకు మీ మొహాలు గుర్తు లేదు. అయినా ఇంత రాత్రి ఇలా రావడం ఎందుకు. రేప్పొద్దున్నే ఫీజు కట్టేసి చేరిపోండి” అన్నారు విసుగ్గా. “అది కాదు సార్. మే ఇద్దరం తూర్పు తీరం లో ఉన్న కాకినాడ నుంచి కలిసి వచ్చాం. మీరు నాకు ఒక్కడికే సీటు ఇచ్చారు. ఇతనికి ప్రొవిజినల్  గా బదులు క్లాసులో చేర్చుకుంటే మీ ఋణం తీర్చుకోలేం. ఇద్ద్దరం కలిసి చదువుకుంటాం” అని మా సమస్య వివరించాను. ఆయన ఇంకా ఎక్కువ ఆశ్చర్య పోయి “అసలు నువ్వే ఎవడివో నాకు తెలీదు. ఇంకోడిని రికమెండ్ చెయ్యడానికి అర్థ రాత్రి వచ్చావా?” అని కోప్పడి తెలుపులు వేసేసుకున్నారు. ఇంక చేసేది ఏమీ లేక ఇద్దరం ఆఖరి బస్సు పట్టుకుని మాటుంగా వెళ్లి పోయాం. మర్నాడు రైల్లో గోవింద రాజులు బెంగళూరు ఇండియన్ ఇన్స్ టిస్ట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో ఇంటర్వ్యూ కి వెళ్ళిపోయాడు. ఇది 1966 జూన్ లో జరిగింది. ఆ తరువాత ఇప్పటిదాకా – అంటే 50 ఏళ్లలో  గోవిందరాజుల్ని మళ్ళీ చూడ లేదు.

ఇలా బొంబాయి IIT లో నాకు ఎడ్మిషన్ రావడం నా జీవితంలో చాలా పెద్ద మలుపు. అనుకోని, ఆశించని మంచి మలుపు. నేను చాలా అదృష్టవంతుడిని అని అనుకోడానికి ఒక దృష్టాంతం. అంతే కాదు. నాకు తెలిసినంత వరకూ కాకినాడ నుంచి బొంబాయి ఐఐటి లో చేరిన మొట్టమొదటి వాడిన నేనే! నా తరువాత మా డిపార్ట్మెంట్ లోనే చేరడానికి పరోక్షంగానూ, నా ప్రమేయం వలనా నా జూనియర్లు చాలా మంది అక్కడ చేరడం నాకు చాలా ఆనందం కలిగించే విషయం.

1966 నుంచి 1974 దాకా నా బొంబాయి జీవితం వివరాలు – త్వరలోనే….

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

అబ్ కీ బార్.. అగ్లీ బార్..

 

                       -బమ్మిడి జగదీశ్వరరావు

~

గౌరవనీయులైన ప్రధాని మోడీగారికి!

నమస్కారాలతో-

‘నా దేశం మారుతోంది

ముందుకు పురోగమిస్తుంది’ – అని,

“అబ్ కీ బార్” యువతకు అపారమైన అవకాశాలు’ – అని,

మీరు యిచ్చిన ప్రకటన.. మన భారత ప్రభుత్వం తరుపున మీరు యిచ్చిన ప్రకటన.. చాలా బావుంది. అందుకు మీకు కృతజ్ఞతలతో కూడిన అభినందనలు!

’20 ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం’ అన్నారు. ఢిల్లీ జవహరలాల్ నెహ్రూ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలను తలదన్నేలా యివాళ మీ పాలనలో దేశమే వొక యూనివర్సిటీగా మారింది అందుకు కూడా మీకు నిజంగా అభినందనలు!

‘ప్రధానమంత్రి “కౌశల్ వికాశ్ యోజన” కింద 20 లక్షలకు పైగా యువకులు శిక్షణ పొందారు’ అన్నారు. యిది నిజం! ముమ్మాటికీ నిజం! అయోధ్యలో నిర్వహించిన, నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రమే అందుకు సాక్ష్యం! స్థానిక యువతకు శిక్షణ యివ్వడం యెంతయినా గొప్ప విషయం! మన ఆరెస్సెస్, విహెచ్పీల పాత్ర చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించతగ్గది! శిలాక్షరాలతో నమోదు చేయతగ్గది! భారత దేశ భవిష్యత్తును యిప్పుడే సందర్శించతగ్గది!

అయ్యా.. మన యువత తుపాకులూ కర్రలూ పట్టుకొని సైన్యంగా కవాతులు చేస్తుంటే – పరుగులు తీస్తుంటే – అగ్గిలోంచి దూకుతూ వుంటే – నిప్పు చక్రాల్లోంచి యెగురుతూ వుంటే – ముస్లింలను పోలిన ఆ వుగ్రమూకలపై తిరగబడుతూ వుంటే – తలలుబద్దలు చేస్తూ వుంటే – రక్తాలు పారిస్తూ వుంటే – కాల్పులు జరుపుతూ మందిని మట్టుబెడుతూ వుంటే – వాళ్ళంతా అలా నేలకు వొరిగిపోతూ వుంటే – శాంతి కపోతం ఆకాశంలోకి యెగరడం చూస్తూ వుంటే – నా వొళ్ళు పులకరించిపోయింది అంటే నమ్మండి! అప్పుడే కొందరి గుండెల్లో చెమటలు పడుతున్నాయి! అందుకే అంతలా యేదో అనర్ధం జరిగిపోతున్నట్టు గగ్గోలు చేస్తున్నారు! మాక్ ప్రదర్శనలా కావవి.. భారత సైన్యం యెక్కడో సరిహద్దుల్లో లేదని.. మన పక్కలో భల్లెంలా దుర్గామాత భల్లెంలా వుందని.. మన మధ్యనే వుందని.. కళ్ళు పట్టని ఆదృశ్యం చూస్తే.. ఆహా అనిపించింది! ఓహో అనిపించింది!

మరి నోయిడాలో? అభం శుభం తెలియని పిల్లలకు అద్భుతమైన శిక్షణ యివ్వడం కూడా మామూలు విషయం కాదు! మొక్కలే వంగుతాయి! మానులు వంగవు! దేశానికి పిల్లలే గాని దేశ భక్తికి పిల్లలు కారు! వొకరా యిద్దరా.. యెందరో వీర శివాజీలు! వీర సావార్కరులు! భవిష్యత్ భగవతీలు! రేపటి మన తొగాడియాలు! పిల్లలలో యిలాగే స్పూర్తిని నింపాలి! రగిలించాలి! రణరంగంలోకి పంపించాలి! చదువుకున్న పాఠాలలో మార్పులతో పాటు యీ విధమైన శిక్షణ ప్రతి పాఠాశాలలో యివ్వాలి! పాఠాశాలలు లేనిచోట అంగన్వాడి కేంద్రాలలోనే శిక్షణని యివ్వాలి! మొదలవ్వాలి! భారతీయతను దర్శించేలా తరించేలా తయారు చేయాలి! ముక్కుపచ్చలారని ముఖాల్లో వెచ్చటి దేశభక్తి టీవీల్లో చూసి యెలా మరిచిపోగలను? అసలుసిసలు “మేక్ యిన్ యిండియా” అంటే యిదే! అర్థం చేసుకోలేని కుహనా లౌకికవాదులు చేస్తున్న పర్ధం లేని ఆరోపణలు అస్సలు పట్టించుకోవలసిన అవసరం లేదు! ప్రతిపక్షాలన్నాక ఆ మాత్రం విమర్శించకపోతే వాటికి వునికి వుండదు! డోంట్ కేర్! కేర్ వోన్లీ కేర్ కేర్ పిల్లలు! కేరింతల పిల్లలు! కరసేవకు పిల్లలు!

యింకా వారణాసిలో? మన వీహెచ్పీకి అనుబంధ సంస్థ.. దుర్గావాహిని సంస్థ యిచ్చిన శిక్షణ భారతీయ మహిళా చరిత్రలోనే మరువలేనిది! మరువరానిది! మరపురానిది! నిజంగా ఆడవాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరిగింది! అది మనం వారి మాటల్లోనే వినొచ్చు! కనొచ్చు! ‘లవ్ జీహాది’ పేరుతో జరుగుతున్న అరాచకాలను అడ్డుకుంటామని పిడికిలి బిగించి ముందుకు వచ్చారు యెందరో గృహిణులు.. విద్యార్ధినులు.. అమ్మాయిలు! పెళ్లి కూడా వాళ్లకు ప్రతిబంధకం కాలేదు! ఒక్కొక్కరూ వొక్కో లేడీ బ్రిగ్రేడ్! వీళ్ళంతా దేశానికి గొప్ప సందేశాన్ని యిచ్చారు! ‘ఆత్మరక్షణకే ఆయుధం’ అంటున్నారు! తుపాకులు యెక్కుపెడుతున్నారు! తూటాలు దట్టిస్తున్నారు! సుకుమారము వొదిలి మారాము చేస్తున్నారు! సున్నితమైన వేలిని ట్రిగ్గర్ మీద పెట్టి టార్గెట్ ని టార్గెట్ చేస్తున్నారు! వారి కన్ను మనకి వెన్ను! కాంతలు కత్తులైనారు! కరవాలాలై తిరుగుతున్నారు! తిప్పుతున్నారు! కరసేవకు సిద్ధమంటున్నారు! ఆత్మవిశ్వాసమే మా అడ్రెస్స్ అంటున్నారు! అంతే కాదు, దేశంలో యితర ప్రాంతాలలో కూడా శిక్షణ యిస్తామని కొనసాగిస్తామని యెంతో నమ్మకంగా చెపుతున్నారు! అబ్ కీ బార్.. ప్రపంచ మహిళల్లోనే భారతీయ మహిళ అందరికన్నా ముందున నిలబడ్డది!

అయోధ్యా.. నోయిడా.. వారణాసి ప్రాంతాల్లో శిక్షణలను యివాళ మీడియా బూచిని చూపించినట్టు చూపించొచ్చు! కాని మా వూళ్ళో.. వూరు విడిచిపెట్టి వచ్చి వున్న ఈ నగరంలో.. చాలా స్కూళ్ళలో పొద్దున్నే తెల తెలవారక ముందే ఖాకీ నిక్కర్లూ తెల్ల చొక్కాలు వేసుకొని- కర్రలు పట్టుకొని- తలకు ఓం గుర్తుగల కాషాయపు జెండాలు కట్టుకొని- కర్రసాములూ కరాటేలూ చేస్తూ వుంటే.. రేపటి యుద్ధానికి యివాళే సిద్ధమవుతూ వుంటే.. చూడాలంటే కళ్ళు చాలవు! యిది నర సైన్యం కాదు, వానర సైన్యం!

“స్టార్టప్ యిండియా’ – దేశంలోని యువతే మన సంపద. వీరిలో కొత్త కొత్త అన్వేషణలు చేసేవారికి ప్రభుత్వం సాంకేతిక సహకారం, మెంటార్ షిప్ ద్వారా సాయం అందిస్తోంది” అంటూ మీరిచ్చిన ప్రకటన.. ప్రకటన మాత్రమే కాదని, ప్రచారం కానే కాదని, ‘ఆచరణ’ అని అక్షరమక్షరమూ నిరూపిస్తోంది! సాక్ష్యంగా నిలుస్తోంది! దేశంలోని అణువణువూ నినదిస్తోంది!

ప్రతిపక్షాలకు పని లేదు! మేథావులకు పని లేదు! ఆలోచనాపరులు అని చెప్పుకొనే వాళ్ళకి అస్సలు బుద్ది లేదు! యూపీ యెన్నికలలో లబ్ది పొందడానికే యిదంతా చేస్తున్నామని ఆరోపిస్తున్నారు! ఆరోపిస్తారు.. అరుస్తారు.. అంతకంటే యేమి చేస్తారు? ఆరెస్సెస్ ఐయస్ వొకటేనా.. రామ రామ.. దుర్మార్గం కాకపోతే?  ఆరెస్సెస్ ని ఐయస్ తో పోల్చడం మేథో దివాళాకోరుతనం తప్ప యింకోటో మరోటో కాదు! మన వాదాన్ని వాళ్ళు వివాదం చేస్తున్నారు! తప్పనిసరి పరిస్థితుల్లో అయోధ్యలో శిక్షణ పొందుతున్న యువకుల్ని కొద్దిమందినైనా అరెస్టు చేయడాన్ని మేము అర్థం చేసుకోగలము! మళ్ళీ మనం రెట్టింపు వుత్సాహంతో పని చేయాలి! నిజం చెప్పనా.. మీరు అధికారంలోకి వచ్చాకే మాకు అనేక అవకాశాలు వచ్చాయి! మనం విస్తరిస్తున్నాం! అందుకు కూడా మీకు నా కృతజ్ఞతలు!

మన ప్రభుత్వ ప్రతినిధులూ నాయకులూ యెవరి వంతు సహకారం వారు అందిస్తూ మాట్లాడుతున్నారు! వారికి నా కృతజ్ఞతలు! అన్నట్టు చెప్పడం మరిచాను, మన సుబ్రహ్మణ్య స్వామి అయోధ్యలో ఆలయ నిర్మాణం యీ యేడాదే చేస్తామనడం.. దానికి వుమా భారతి గారు ‘సుబ్రహ్మణ్య స్వామే నా హీరో’ అనడం యివన్నీ కూడా మాలో నిద్రాణమై వున్నా ఆత్మా’రాముణ్ణి’ లేపుతున్నాయి! మేల్కొలుపుతున్నాయి!

మనది లౌకిక రాజ్యం! లౌకిక రాజ్యానికి యెప్పుడూ శ్రీరాముడే రక్ష! నాకు తెలుసు మీరు రామ రాజ్యం తెస్తారు! తెచ్చి తీరుతారు!

‘అబ్ కీ బార్’ ప్రకటనలోనే- మీతో మాట్లాడడానికి ఫోను నెంబరు యిచ్చి మిస్సుడు కాల్ యివ్వమన్నారు.. యిచ్చినా యివన్నీ మాట్లాడే అవకాశం వుండదని మీకు యిలా వుత్తరం రాయాల్సి వొచ్చింది!

‘యధారాజా తదా ప్రజ’ తప్పక అవుతారని ఆశిద్దాం..!

మీకు మరోసారి మనస్పూర్తిగా అభినందనలు తెలియ జేస్తూ..

జై హింద్!

మీ

దేశభక్త అభిమాని

 

 

రూపాయి!

 

-తుర్లపాటి రామానుజ రావు

~

 

ఎప్పుడో

పసితనం వసివాడని రోజుల్లో

కాణీకో జీడి,

అర్ధణాకో ఐస్ ఫ్రూట్!

రూపాయి నోటుండే జేబు

బ్యాంకులా

డాబుగా వుండే దప్పుడు.

పదిలంగా దాచుకున్న  పచ్చ నోటు

త్రాసులో కృష్ణుడినైనా తూచేది.

కాణీలు,

అర్ధణాలు

ఆభరణాలలో చేరిపోయి,

రూపాయి నోటు

స్టాంపు కలెక్షన్లతో పాటు,

ఆల్బంలో చోటు చేసుకుందిప్పుడు.

సరిహద్దుల మాటున,

నల్లమబ్బుల చాటున,

ఒకటికి రెండిచ్చే

దొంగ సోమ్మైందీ నోటు.

‘బరువై’,

‘బంగారమై’,

‘రియల్ వరమై’,

‘స్విస్’ జమలై,

ఊసరవెల్లి

రూపం  మారుస్తుందెప్పుడూ.

ఆశ  ఆకాశమంత

అవకాశం అందినంత

స్కాముల గారడీలలో

మాయమైన రూపాయి

కాగితాలపై లెక్కలై

కొరకరాని కొయ్యగా మిగులుతుంది.

నల్లదో,

తెల్లదో,

కష్టం పండించిన

వంద నోటు,

కూలివాని చేతి చెమటలో వెలిగి,

ఆనందమై  నిండి,

సారా ప్యాకెట్లలలో పండి,

జారిపోతుంది.

మరునాడది

చిటారు కొమ్మన

అందని

మిఠాయి పొట్లం అవుతుంది.

మధ్య తరగతి గృహిణి

అవసరాల కన్నీళ్ళలో,

తడిసి,తడిసి,

నలిగి,నలిగి,

అక్కరకు రాని చుట్టమే అవుతుంది.

ఎక్కడెక్కడో తిరిగి,

మూల మూలల నక్కి,

వంద నోటు

నల్లబడి

ఆవ గింజలా,

కంటి కానడం లేదిప్పుడు.

చిక్కి,చిక్కి,

బక్క చిక్కి,

తూకానికి సరి చూసినప్పుడు,

పప్పు బద్దే

బరువైందిప్పుడు.

——————

 

ప్రేమ అనే విస్ఫోటనం

 

 

 

-అరుంధతి రాయ్

అనువాదం: వి.వి. 

~

 

‘దేశమును ప్రేమించుమన్నా

మంచియన్నది పెంచుమన్నా

దేశమంటే మట్టి కాదోయ్

దేశమంటే మనుషులోయ్’

 

దేశాన్ని ప్రేమిస్తే చాలదట భక్తి కావాలట

‘భారత్‌ మాతాకి జై’ దేశభక్తి

మనుషుల్ని ప్రేమించి మట్టిని అమ్ముకుంటే

భారతమాత పట్ల భక్తి పెరుగుతుందా?

 

‘ఇదేం ప్రేమ?’

దేశం పట్ల  మనకుండే ప్రేమ ఎటువంటిప్రేమ?

ఇదేం దేశం?

ఎన్నడూ మనస్వప్నాలను సాకారం చేయలేని దేశం

ఇవేం స్వప్నాలు?

సదా భగ్నమయ్యే స్వప్నాలు’

 

‘గొప్ప జాతుల గొప్పతనాలు ఎప్పుడూ

వాటి నిర్దాక్షిణ్యమైన మారణ సామర్ధ్యానికి

ప్రత్యక్ష సమతూకంతో ఉంటాయికదూ’

 

‘ఒక దేశ విజయం

సాధారణంగా దాని నైతిక వైఫల్యంలో ఉంటుంది కదూ.’

 

‘మన వైఫల్యాల సంగతేంటి?

రచయితలు, కళాకారులు, రాడికల్స్, జాతి ద్రోహులు, పిచ్చివాళ్ళు

వ్యవస్థలో ఇమడలేనివాళ్ళు-

వీళ్ళ భావాల, స్వప్నాల వైఫల్యాల సంగతేమిటి?’

 

‘జెండాల, దేశాల భావాన్ని

ప్రేమ అనే ఒక విస్ఫోటన పదార్థంతో

మార్చలేకపోతున్న మన వైఫల్యాల సంగతేమిటి?’

 

‘మనుషులు యుద్ధాలు లేకుండా జీవించలేకపోతున్నారా?’

కాందిశీకులు, కరువు బాధితులు కాకుండా,

వలసలు, ఆత్మహత్యలు లేకుండా

ఎన్‌కౌంటర్లు, అసహజమరణాలు లేకుండా జీవితంలేదా?’

 

‘మనుషులు ప్రేమలేకుండా కూడా జీవించలేరుకదా

ప్రేమకోసం యుద్ధాలకు మరణాలకు వెనుకాడరు కదా

యుద్ధాల బహిరంగ పగలు  రహస్య ప్రేమ రాత్రులు’

 

‘కనుక ప్రశ్న ఏమిటంటే

మనం దేన్ని ప్రేమించాలి?

ప్రేమంటే ఏమిటి? ఆనందమంటే ఏమిటి?

అవును నిజంగానే దేశమంటే ఏమిటి?’

మనుషులమధ్య ప్రేమేకదా

అంతేనా?

‘మన ప్రేమకు ప్రాధామ్యాలేమిటి?’

మనుషులం కనక మానవత్వం సరే-

మరిమట్టిని ప్రేమించవద్దా?

 

‘అత్యంత అర్వాచీనమైన దట్టమైన అడవి

పర్వతశ్రేణులు, నదీలోయలు’

భూగర్భజలాలు, ఖనిజాలు

మానవశ్రమ, ప్రకృతి సంపద

అవును-ఆకాశమూ సూర్యుడూ చంద్రుడూ, గ్రహాలు

గాఢాంధకారంలో ఇనుమిక్కిలి నక్షత్రాలు

ఇంకిన, కారుతున్న కన్నీళ్లు. పారుతున్న, గడ్డకట్టిన నెత్తురు

‘దేశంకన్నా ప్రేమించదగినవి కదూ.’

 

నేను పోగొట్టుకున్న నదీలోయలను

పోరాడుతున్న పడమటి కనుమలను

పోగొట్టుకున్న నల్లమలను

పోరాడుతున్న దండకారణ్యాన్ని

ప్రేమించినంతగా

దేశభక్తి, జాతీయత అనే భావనలను ప్రేమించగలనా?

అబద్ధమాడలేను,

ఎందుకంటే,

ప్రేమ విస్ఫోటనం చెందే సత్యం.

 

(ఆంగ్లమూలం: అరుంధతీ రాయ్ . తెలుగు, మార్పులూ చేర్పులూ- వి.వి.

 ఇందులో అరుంధతీరాయ్ వాక్యాలను ఆమె శైలి తెలిసిన ఎవరైనా పోల్చుకోగలరు)

 

వ్యక్తుల హక్కులా? వ్యవస్థల హక్కులా?

 

krishna1

-కృష్ణుడు 

~

దేశ రాజధాని ఢిల్లీలో మనకు అత్యంత అందమైన, చరిత్రాత్మకమైన పార్లమెంట్ భవనం ఉంది. దాని ప్రక్కనే నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌లు ఉన్నాయి. మధ్యలో సువిశాలమైన రాష్ట్రపతి భవన్ ఉన్నది. ఇండియాగేట్ ముందు పచ్చిక బయళ్లలో సాయంత్రం కుటుంబాలు సేదదీరుతూ కనిపిస్తాయి. ఇండియాగేట్‌కు సమీపంలోనే ఢిల్లీ హైకోర్టు, ఆ పై సుప్రీంకోర్టు కనిపిస్తాయి. మొత్తం దేశ రాజకీయ ఆర్థిక, సామాజిక వ్యవస్థ ఈ భవనాలనుంచే నిర్ణయమవుతుంది. పార్లమెంట్ సమావేశాలు అవుతుంటే చాలు చుట్టుప్రక్కల ఎంతో హడావిడి కనిపిస్తుంది. భద్రత కట్టుదిట్టంగా మారుతుంది. పార్లమెంట్ సభ్యులు, కేంద్రమంత్రులు, అధికారులు హడావిడిగా తిరుగుతుంటారు. మొత్తం దేశాన్ని ఇక్కడినుంచే నడిపిస్తున్నామన్న భావన వారిలో కనిపిస్తుంది. మనకూ అనిపిస్తుంది.

దేశాన్ని వారు ఇక్కడినుంచే నడిపిస్తున్నారన్న మాట వాస్తవమే. కాని ఎలా నడిపిస్తున్నారు? మన భారత రాజ్యాంగం నిర్మించిన వ్యవస్థలనన్నిటినీ వారు సవ్యంగా నడిపిస్తున్నారా? లేక తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారా అన్న అనుమానాలు మనకు కలగక మానదు. అన్ని వ్యవస్థలూ రాజకీయ వ్యవస్థకు అనుకూలంగా మారుతున్నాయి. అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సిబిఐ, పోలీసు యంత్రాంగం, ఎన్నికల కమిషన్, సివిసి, మానవ హక్కుల కమిషన్ ఆఖరుకు సమాచార కమిషన్ కూడా రాజకీయ వ్యవస్థకు అనుగుణంగా మారుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలు కాపాడుకునేందుకే కాక తమ ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక నేరాలు, అవినీతి, నేరాలు, కాపాడుకునేందుకు ఈ వ్యవస్థల్ని ఉపయోగించుకుంటున్నారు. అవినీతి అక్రమ భూయిష్టం కాని వ్యవస్థలేవీ కనిపించడం లేదు. న్యాయాస్థానాలే కాదు, సివిసి, సిబిఐ, కమిషన్‌లు అన్ని చోట్లా అస్మదీయుల్ని నియమించుకుంటున్నారు. పార్లమెంట్ లో కూడా నేరచరితుల్ని, కాంట్రాక్టర్ల్ని, మాఫియాను నియమిస్తున్నారు. వారే కలిసి తమకు అనుకూల చట్టాల్ని చేసుకుంటున్నారు. సభలో 50 మంది ఉంటే చాలు మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నుల్ని మార్చి పడేసే నిర్ణయాల్ని తీసుకోగలుగుతున్నారు. తాము తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలపై ఎన్ని వేల కోట్ల భారం పడుతుందో న్న ఆలోచన లేకుండా గుత్త పెట్టుబడిదారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంట్రాక్టులు, టెండర్లు,కేటాయింపులు, అనుమతుల్లోనే కాదు, రక్షణ శాఖ కొనుగోళ్లలో వేల కోట్ల అక్రమాలు జరుగుతున్నాయి. కూడా నలుగురైదుగురు ఉంటే చాలు, ఏ నిర్ణయాన్నైనా నిలిపివేయగలుగుతున్నారు. నింగినుంచి నేల వరకు దేన్నైనా కబళించడానికి భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అవకాశం కల్పిస్తున్నది. రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లే కాదు, మాఫియా కూడా పరస్పర ఆశ్రితాలుగా మారిపోయాయి.

మరో వైపు కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల్ని పెంచి పోషించడం, తద్వారా తాము ప్రయోజనం పొందడమే అభివృద్దికి కొలమానం అనుకుంటున్నారు.క్రోనీ కాపిటలిజం విశ్వరూపంగా పార్లమెంట్, చట్ట సభలు మారుతున్నాయి. నిదేశాల్లో ఉన్న నల్లధనం గురించి కమిటీలు వేసేందుకు మనం ఆలోచిస్తున్నాం కాని అసలు మన ఎంపిలు ఎన్నికలల్లో గెలిచేందుకు కోట్లాది రూపాయలు ఎలా ఖర్చు పెట్టారని ఆరా తీసిన వారు లేరు. విదేశాల్లో ఉన్న మన వారి నల్లధనం కంటే ఎక్కువ అక్రమ సంపద మన దేశంలోనే ఉన్నదన్న విషయంలో అతిశయోక్తి లేదు. ఎన్నికల్లో కోల్పోయిన సొమ్నును తిరిగి ఆర్జించడానికి అధికారంలోకి వచ్చాక అక్రమాలు తప్పవు. ఈ విషవలయంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థ సాగుతోంది. ఆఖరుకు ఎంపి లాడ్స్ నిధులను కూడా స్వాహా చేస్తున్నారు. తాము ఓట్లు కొనుగోలు చేసి అ«ధికారంలోకి వచ్చాము కనుక తమ అక్రమాలను ప్రశ్నించే హక్కు వారికి లేదని భావిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఒక్కర్ని కూడా జైలుకు పంపించిన దాఖలాలు లేవు.

ఒక అంచనా ప్రకారం తిరుపతి కి ప్రతి ఏటా 8 నుంచి 9 కోట్ల మంది భక్తులు వెళతారు. ఇతర మందిరాలు, మసీదులు, మఠాలు, తీర్థయాత్రలకు వెళ్లేవారినికలిపితే 50 కోట్లమంది దాటుతారు. వీరంతా పాపపుణ్యాలపై నమ్మకం పెట్టుకున్నవారు. హత్య, మోసం, దొంగతనం, అత్యాచారాలు అక్రమాలు చేసిన వారిని నేరస్తులని వారు భావిస్తారు. కాని నేరం చేసిన వారే అ«ధికారంలో ఉంటారని వారు ఊహించలేరు.ఊహిస్తే వారు దేవుళ్లను వ్యవస్థలను బాగు చేయాలని, వాటిని నేరస్తులనుంచి ప్రక్షాళన చేయాలని భావిస్తారు. కాని మన దేశంలో ఓటర్లను కూడా నేరాలకు పురికొల్పుతున్నారు. వారిని కొనుగోలు చేస్తున్నారు. అవినీతిపరులు, నేరచరితులు కూడా అభిమాన సంఘాలు, భక్తులు తయారవుతున్నారు. ముహూర్తం చూసి జైలుకు వెళ్లేవారు తయారయ్యారు.

దేశంలో పలుకుబడి గల వారికి, ధనికులకు మాత్రమే ప్రభుత్వం, న్యాయవ్యవస్థ ఇతర యంత్రాంగాలు సహకరిస్తున్నాయి. రాజకీయ అవసరాలు దేశంలో అవినీతికి అక్రమాలకు చట్టబద్దత కల్పిస్తున్నాయి. న్యాయ వ్యవస్థకూడా రాజకీయ అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటోంది. రాజకీయ నాయకుల కేసులను విచారించేందుకు ఏళ్ల పాటు సమయం తీసుకుంటున్న కోర్టులు కొట్టివేయడానికి ఎక్కువ కాలం తీసుకోవడం లేదు,. అదే సామాన్యుల కోస్లు వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. ఈదేశంలో వేలాది మంది అమాయకులు జైళ్లలో మగ్గుతున్నారు.. అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల వాపోయారు. ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక చట్టాలు చేసేందుకు, దమనకాండను అమలు చేసేందుకు న్యాయాస్థానాలు తోడ్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. న్యాయమూర్తులపై వస్తున్న అవినీతి ఆరోపణలు, తమ పదవీ కాలం ముగిసిన తర్వాత వారు చేపడుతున్న పదవులు న్యాయవ్యవస్థ విశ్వనీయతపైనే అనుమానాలు కలిగించేలా చేస్తున్నాయి.

ఆర్థిక సంస్కరణలు ప్రవేశించిన తర్వాత దళితుల అణిచివేత తగ్గలేదు సరికదా, పెరిగింది. గతంలో రాజకీయ ప్రాబల్యం కోసం దళితుల అణిచివేత జరిగితే ఇప్పుడు ఆర్థిక కారణాల రీత్యా అణిచివేత జరుగుతున్నది. అభివృద్ది పేరిట దళితుల ఆవాసాలు, స్థలాలు కూల్చివేసిన సంఘటనలు ఎన్నో. అడిగితే రిక్షా తొక్కేవాడి చేతుల్లో మొబైల్ ఫోన్ ఉండటమే సామాజికన్యాయమేనని మురిసిపోతున్నారు. చరిత్ర అంటే గ్రామాలు కూలిపోవడం, జీవితాలు శిథిలం కావడం, నెత్తుటి మరకలపై రహదారులు వేయడం, మాల్స్‌ను బహుళ అంతస్తులు నిర్మించడంగా భావించే రోజులు వస్తున్నాయి.

ముఖ్యంగా అధికార వ్యవస్థ దాదాపు అవినీతి, అక్రమాల మయంగా మారింది. అధికార వ్యవస్థ రాజకీయ నాయకులు అడ్డదారిన తొక్కడానికి సహకరిస్తున్నది. చాలా మంది అధికారులు రాజకీయనేతల అడుగులకు మడుగులొత్తడమే కాక, కార్పొరేట్లకు ఎర్రతివాచీ పరుస్తున్నారు. అందుకే వారు రిటైరైన తర్వాత ప్రభుత్వ పదవుల్లోనో, కార్పొరేట్ పదవుల్లో నో కొనసాగుతున్నారు. ఆఖరుకు విదేశీ దౌత్యసంబంధాలు కూడా వ్యాపార ప్రయోజనాలకు అనుగణంగా సాగుతున్నాయి. మనకు స్వతంత్ర విదేశాంగ నీతి అంటూ లేకుండా పోయిందని చెప్పడానికి పలు ఉదాహరణలున్నాయి.

ఢిల్లీ నుంచి క్రింది స్థాయి వరకు వచ్చే సరికి వ్యవస్థల బూటకత్వం, వాటి వి«ధ్వంసం, ఉల్లంఘన మరింత ఎక్కువవుతుంది. గ్రామస్థాయిలో ఉండేవారికి వ్యవస్థల గురించి తెలిసే అవకాశమే తక్కువ. ప్రతి రాష్ట్ర రాజధాని ఒక మినీ ఢిల్లీగా మారింది. ప్రభుత్వాలు మారినా రాజకీయాలు మారడం లేదు. వ్యవస్థల్ని తమకు అనుకూలంగా మార్చుకునే వారు మారడం లేదు. సామాన్యుడి విలువ తగ్గుతున్నదే కాని పెరగడం లేదు. మనం చూస్తున్న అభివృద్ది ఎవరికోసం? అన్న ప్రశ్న ఎప్పటికీ విలువైన ప్రశ్నగా మిగిలిపోతోంది. గత 34 సంవత్సరాల నా జర్నలిస్టు జీవితంలో వ్యవస్థల పనితీరు దిగజారిందే కాని మెరుగైన దాఖలాలు కనపడడం లేదు.

ఈదేశంలో చాలా మంది వ్యక్తులకోసం పోరాడుతున్నారు. కాని వ్యవస్థల్ని నిజాయితీగా నిర్మించానికి వెనుకాడేవారిని, నిర్మించిన వాటిని విధ్వంసం చేసిన వారిని, వాటిని తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకునే వారిని ఎవరూ ప్రశ్నించడం లేదు. వ్యక్తుల హక్కుల కన్నా వ్యవస్థల హక్కులు కాపాడడం ముఖ్యం వ్యవస్థలు లేకుండా సమాజం లేదు. అది లేని రోజు అంతా కుప్పకూలిపోతుంది. అరాచకమే తాండవిస్తుంది.

( కృష్ణారావు రాసిన నడుస్తున్న హీన చరిత్ర పుస్తకావిష్కరణ ఈ నెల మే 29న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రలో జరిగింది. ఈ సందర్భంగా చేసిన ప్రసంగం)

అరె!

చిత్రం: రాజశేఖర్

చిత్రం: రాజశేఖర్

 

-ఆర్.దమయంతి

~

 

అతని కోసం ఎదురుచూస్తున్న ఆమనికి విసుగొచ్చింది.  ఆ తర్వాత  – అది అసహనంగా  మారే అవకాశాన్ని రానీకుండా పుస్తకం తీసుకుంది చేతిలోకి. రెండు పేజీలైనా పూర్తి చేయకుండానే అర్ధమైపోయింది ఆ నవలా ఇతివృత్తం.

తనతో కాపురం చేయనంటున్న భర్త మీద తిరుగుబాటు చేసిన ఒక స్త్రీ కథ.

ఆమని కి ఒళ్ళు మంట ఇలాటి కథలన్నా, టీవి ల్లో చూపించే దృశ్యాలన్నా.

కట్టుకున్న వాడు ‘నువొద్దు మొర్రో ఫో’అని తరిమి కొడుతుంటే..  స్పర్శ రహిత శరీరంతో ఆమె మాత్రం.. అతనింట్లోనే పడుంటానండం, అతనితోనే కాపురం చేసి తీరతాననడం..ఎంత హాస్యాస్పదం!  ఎంత వ్యక్తిత్వంలేని తనం? పై పెచ్చు వాదన ఏమిటంటే, – తన హక్కు కోసం పోరాడుతున్నట్టు చెబుతుంది?

నిజమైన మొగుడూ పెళ్ళాల మధ్య హక్కులేమిటీ? శాసనాలేమిటీ? ఆ ఇంటిముందు మూగిన జనాలు,  స్త్రీ వాద సంఘాలు, మరో పక్క విలేకరులు,  కెమెరాలు, పోలీసులు… పెద్దమనుషులు… వీళ్ళంతా కలసి ఆమెని ఆ ఇంట్లోకి నెట్టి పోవచ్చు. కానీ ఆ తర్వాత గదిలో వాళ్ళు స్వచ్చమైన మనసుతో  ఎలా కాపురం చేస్తారని?

ఒక సారి  భార్య పట్ల ఇంత హేయం గా ప్రవర్తించిన వాడు, జనం బుధ్ధి చెప్పడంతో అమాంతం మంచివాడైపోతాడా? భయంతోనో, బెదిరింపులతోనో, కత్తి చూపించో, కక్ష కొద్దో చేసేదీ –  ఒక కాపురమే?!పండంటి కాపురమే?

ఎవరి మనసుని వారు ప్రశ్నించుకోవాలి. పైకి బాగానే వున్నా మేడి పండు చందం లా, ఎవరి ఆత్మ ఘోష ఎంతో ఆ జీవులకే తెలియాలి.

తననెప్పటికీ ఒక  గొప్ప సందేహం వెంటాడుతూ వుంటుంది.

ఎంత తాళి కడితే మాత్రం?! ..అసలంత పచ్చి శత్రువుతో ఆ పెళ్ళాం ఎలా పడుకుంటుంది?

‘నోర్ముయ్. అలాటి పిచ్చిమాటలు మాట్లాడకూడదు. సంసార పక్షమైన ఆలోచన్లు చేయి” – తల్లి కంఠం కంచులా మోగింది. ఆవిడ అక్కడ లేకపోయినా!

నవ్వొచ్చింది ఆమనికి.

అమ్మ ఏవడిగింది? తను – పుట్టింటికి తిరిగొచ్చినప్పుడు?

గదిలోకొచ్చి, తలుపులు మూసి, దగ్గరగా, చెవిలో రహస్యంగా అడగలేదూ? – ‘ఒక మాట అడుగుతాను చెప్పు. మీ ఆయన నీతో ‘కాపురం చేస్తున్నాడా?” ముఖమంతా  ఆందోళన నింపుకున్న  – ఆవిడ్నీ, ఆ అడిగే తీరు నీ చూసి  తను ఫక్కున  నవ్వింది.

ఆవిడకి కోపమొచ్చింది. “పరాచికాలకిది సమయం కాదు. అవతల నీ జీవితం నాశనమైపోతోంది నీకర్ధమౌతోందా ఆ సంగతి? ఇప్పటికైనా నిజం చెప్పు. ఎందుకంటే- నీ కాపురాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత నాకుంది.” అంది గంభీరమైన గొంతుతో.

ఆవిడ దృష్టిలో ‘కాపురం’ అంటే సెక్స్.  తామిద్దరూ  కలసి సఖ్యం గా  ‘కాపురం’చేసుకునే కార్యంలో  – ఈవిడ బాధ్యతాయుతమైన పాత్ర పోషించడమేమిటో అర్ధం కాక మళ్ళీ తను నవ్వింది. గట్టిగా,  మరింత గట్టిగా నవ్వేసింది.

‘అడుగు తుంటే సమాధనం చెప్పకుండా ఏమిటా వెర్రి నవ్వూ, నువ్వూను?’ అంటూ అక్కడ్నించి విస్సురుగా  వెళ్ళిపోయింది.

Kadha-Saranga-2-300x268

తల్లి అమాయకత్వం మీద జాలేసింది. ‘భార్యా భర్తల మధ్య శారీరక సంబంధం కొనసాగుతూ వుంటే, ఇక ఆ సంసారానికి ఢోకా వుండదు.’ – అనేది ఆవిడ అభిప్రాయం కావొచ్చు. లేదా, గట్టి నమ్మకవూ కావొచ్చు.

కానీ, పగలు జరిగే యుధ్ధాలను కానీ, లేదా ఇద్దరి మధ్య రగిలే ఘోర విభేదాలను గానీ –  ఈ సెక్స్యుయల్ బంధమేదీ లేవీ అడ్డుకోలేదన్న  సంగతి ఆవిడకి తెలీదు. చెప్పినా అర్ధం కాదు.

ఎందుకంటే – సర్దుకుపోవడానికి, సహనం నశించిపోవడానికి మధ్య వున్న దూరం  చాలా పెద్దదన్న నిజం ఆమె ఒప్పుకోదు.

అది – ఇన్నోసెన్సో, ఇగ్నోరెన్సో ఏదైతే ఏంలే, కొందరి స్త్రీల అమాయకత్వాలే కొంతమంది భర్తలకి శ్రీరామ రక్షలు.

ఇలాటి జంటే ఒకటుంది తనకి తెలిసి.

వాడు పట్టుబడ్డాడు.సాక్షాత్తు భార్యే పట్టిచ్చింది. పేపర్లో కూడా వచ్చింది ఆ వార్త. చుట్టాలందరూ ఏమౌతుందా కథా అని చెవులు కొరుక్కున్నారు. పరుల బాధలు –  మంకి వినోదాలు కదా. అయితే, చివరికి ఏమీ కాలేదు. ఆమె  ఇల్లొదిలి ఎక్కడికీ పోనూ లేదు. అతను తన అలవాట్లను  మానుకోనూ లేదు.

ఇప్పటికీ అతనితోనే..’కాపురం’ చేస్తోంది. పెళ్ళిళ్ళకీ  పేరంటాలకీ   నవ్వుముఖమేసుకుని కనిపిస్తూనే  వుంది. పాపిట్లో ఇంత సిందూరం  పులుముకుని. మొన్ననే  దంపత్ సమేతం గా పీటల మీద కూర్చుని –  సత్యనారాయణ వ్రతం చేసుకుని లేచారు.

ఇలాటి వాళ్ళని చూసి తనెన్ని సార్లు బుర్ర బద్దలు కుంటుందో! ఈ మోసగాడితో, ఎలా ‘కాపురం’ చేస్తోందీ ఈమె అని?

‘చేయక?, మరెక్కడికి పోతుంది పాపం!’అనుకోడానికి ఆమేమైనా చదువూ డబ్బూ లేనిదా అంటే అదీ కాదు.

మరి? – అర్ధం కారంతే. వదిలేద్దాం.

స్త్రీలు ధనం తో కాదు. – వ్యక్తిత్వంతో బ్రతకగలిన రోజే అసలైన స్త్రీ స్వేచ్చకి అర్ధం.

తనకీ సమస్య వొచ్చింది. మొదట్లో – విడాకుల వరకూ వెళ్ళకూడదనుకుంది. రాను రాను  భరించడం కష్టమై, వొద్దనుకుంది. శాశ్వతంగా వొద్దనుకుంది.

లోపమేమిటో చెప్పాలన్నారు.  ఎందుకు చెప్పాలనేది తన పాయింట్.

ఒక మగాడికి దురలవాట్లేమీ లేనంత మాత్రాన, అతగాడు గ్లోబల్ లేబుల్డ్ మొగుడైపోతాడా?

ఆ మాటకొస్తే భర్తలో భార్యకి కనిపించిన వీక్నెస్సులు ప్రపంచంలో మరెవరికీ కనిపించవు.

ఇంట్లో కాసేపు కూర్చుని వెళ్ళిపోయే మనిషినైతే ముక్కు మూసుకుని ఎంతైనా భరించొచ్చు. కానీ, కాలమంతా కలసి బ్రతకాల్సొచ్చినప్పుడే – ఆ లోపం మరింత భయంకరం గా కనిపిస్తుంది. ముఖ్యంగా గదిలో..ఒకే మంచాన్ని పంచుకోవాల్సొచ్చినప్పుడు.. ఉహు. ఇక భరించడం తన వల్ల కాదంటుంది మనసు.

అప్పటి అ పరిస్థితిలో – తననెవరూ  అర్ధం చేసుకోవడం లేదనే చింత మానుకుంది. నిరాశనిస్పృహలనించి – ధైర్యంగా సమస్యనెదుర్కుని ఒడ్డుకొచ్చిపడింది.

నిజమా! నిజంగా  తను ఆ సుడిలోంచి బయటపడిందా? – అవును., కాదు.! దేనికి ఎక్కువ మార్కులేయాలో తెలీడం లేదు.

సెల్ మోతకి ఉలిక్కిపడి, ఆశగా అందుకుంది. అతనేమోనని.  స్క్రీన్ మీద ‘అక్క’ పేరు చూసి నిట్టూర్చింది. నిరాశగా.

“హలో అక్కా..”

“ఏమిటే , అలా వస్తోంది మాట నీరసంగా”

పట్టెసింది తనని. ఎంతైనా అక్క తెలివిగలది. ‘నువ్వెంత చదివి ఏం లాభం? అక్కలా కాపురం చేసుకునే తెలివితేటలు లేనప్పుడు?” తల్లి వేసిన దొబ్బులు చెవిలో మోగాయి.

“లేదక్కా, బాగానే వున్న. చెప్పు. ఏమిటి సంగతులు? ‘ బావగారితో నీ ‘కాపురం’ఎలా సాగుతోంది?”

అడిగింది నవ్వుతూ.

“ఆ. నన్నే అడిగావ్? ఎప్పుడూ వున్న ఖర్మే. నా రాతెప్పుడు మారేను?”

“యాగీ చేసొచ్చానన్నావు కదా? ఏమైంది?”

“దాన్నొదిలేశాడు. కానీ ఇప్పుడు కొత్త రోగం పట్టుకుంది. అది మనసులో పెట్టుకుని కక్ష సాధిస్తున్నాడు వెధవ.”

“అయ్యో. అలానా! ఏం చేస్తున్నాడు? కొడుతున్నాడా?” ఆందోళన గా అడిగింది.

చిత్రం: రాజశేఖర్

“కొట్టడమెక్కడా? మాటలే లేవు.” ఎంత నిస్పృహ! బూతులు తిడుతూ, వీర బాదుడు బాదే మొగుడి దురాగతాలకి అలవాటుపడిపోయిన భార్యలకి నిలువెత్తు నిదర్శనం లా..కాదు కాదు ఆదర్శిని లా  కనిపిస్తోంది అక్క – ఆ క్షణంలో.  “పైగా చెప్పా పెట్టకుండా ఎటో పోతాడు. ఎప్పుడో గానీ, ఇంటికి తగలడడు. వున్నాడనుకోనా? పోయాడనుకోనా? పోయినా ఫీడా పొదును. పోనన్నా పోడు.” వింటున్న ఆమని కి ఆశ్చర్యమేసింది. మొగుణ్ణి ‘ఏమండీ ఏమండీ’ అంటూ పిలిచే అక్కేనా ‘వాడూ వీడూ’ అని చీదరిస్తోంది? ఈ విడిగారే గా చారుమతి అవతారమెత్తి  శ్రావణ శుక్రవార నోము నోచుకుని, ఆ తాగుబోతు పాదాలను లాక్కుని మరీ దణ్ణాలు పెట్టింది?! ఔర!

మొగుణ్ణి  వెనక తిట్టుకోవడం లో పెద్ద  తప్పు లేదని అక్క గాఢాభిప్రాయం. హు. ఇదీ –  గౌరవ దంపతుల సిధ్ధాంతం.  ఇంకా వింటోంది అక్క మాటల్ని. “వీడి వల్ల పుట్టిన పిల్లలు లేకపోతే నేనూ..ఎవడోకణ్ణి పట్టుకు పోయేదాన్ని. నీ..లా..గ…   హాయిగా..”

‘ నీ…లా…గ…నీ లా..గా..’ -అక్క మాటలు చెంప మీద చాచి కొట్టినట్టనిపించింది ఆమనికి.

అసలీమెకేం మాట్లాడాలో తెలీదు. ఇంతకు ముందు ఇలానే పరామర్శ పేరుతో నొచ్చుకునేలా మాట్లాడితే కాల్ కట్ చేసింది. కానీ మళ్ళా ఆమే,  పదే పదే ఫోన్ చేయడంతో, క్షమించింది. సర్లే. ఈ మాత్రమైనా తనని పలకరించే వాళ్ళెవరున్నారనిపించి, మాట్లాడుతోంది.

“ఏమనుకోకే ఆమని, నేను నిజం చెబుతున్నా..నువ్వు చేసిన పనే కరెక్ఠ్ అనిపిస్తోంది నాకిప్పుడు. మొగుడికి నీతి నిజాయితీ లేనప్పుడు ..పెళ్లానికి మాత్రం ఎందుకుండాలే? పెళ్ళాన్ని పెళ్ళాం గా చూడని ముండమోపులతో కాపురాలేవిటే చెల్లీ? నాకు మనసు రగిలిపోతోందే!..ఈ శరీరాన్ని డబ్బాడు కిరసనాయిలు పోసి తగలబెట్టాలనుందే..” అక్క ఆవేశం దుఃఖంలోకి మారిపోతుంటే, ఆ నిస్సహాయ స్థితికి జాలేసింది ఆమనికి.

“బాధ పడకు అక్కా. పోనీ నా దగ్గరకొచ్చి వుంటావా,  ఓ నాలుగు రోజులపాటు?” మనస్ఫూర్తిగా పిలిచింది.

రెండు సెకన్ల తర్వాత మాట్లాడింది అక్క. చెంగుతో  కళ్ళు తుడుచుకున్నట్టుంది. “వొద్దులేవే ఆమని! నేనక్కడకొచ్చినప్పుడు ఈయనిక్కడికొస్తే..పెద్ద గోలౌతుంది. మా అత్త పక్షి వుంది గా. అది లేనిపోనివన్నీ వాడికెక్కిస్తుంది. మొగుడు ఊళ్ళో లేనప్పుడు, చెప్పకుండా రహస్యం గా వెళ్ళానని  లేని ‘..తనాలు’ అంట కట్టినా అంటకడ్తుంది. కట్టుకున్నవాడు సవ్యమైనవాడైతే గా, నమ్మకపోడానికి? –  విన్న వాళ్ళు కూడా నిజమనుకుంటారు. అది నే భరించలేను. ఆ తర్వాత బ్రతికేం లాభం చెప్పు? ఇప్పుడొద్దు.  తర్వాతెప్పుడైనా వస్తాలే..”

అక్క మాటలకి, ఆమె ఆలోచనా విధానానికి గాఢం గా  నిట్టూర్చింది ఆమని.

“అవునే ఆమనీ? ఇప్పుడితను నిన్ను బాగానే చూస్తున్నాడా? ..” ఆ కంఠం లో ఆర్ద్రత కంటెనూ, ఆరా తనమే కొట్టొస్తూ వినిపించింది.

“ఆ! బాగానే వుంటున్నాం అక్కా” అని జవాబిస్తూనే లోపల్లోపల అనుకుంది. ‘ఇక మొదలు. ప్రశ్నల దాడి.’

“పోన్లే. వ్రతం చెడ్డా ఫలం దక్కా లంటారు అందుకే! నువ్వు సుఖం గా వుంటే అంతే చాలే నాకు. కానీ విను.  నీ తోబుట్టువుగా నీ మేలు కోరి  చెబుతున్నా విను. మగాణ్ని నమ్మేందుకు లేదు. ఇవాళున్నట్టు రేపుండాలని రూలేం లేదు. వాడు ఎప్పుడు, ఎక్కడ, ఎలా మన చేతుల్లోంచి జారిపోతాడో చెప్పడం కష్టం. ఇరవై నాలుగ్గంటలూ ఏం కాపలా కాస్తావ్ కానీ, మెల్లగా ఈ మాటా ఆ మాటా చెప్పీ ఆ మూడు ముళ్ళు వేయించుకో. ఏ గుళ్ళోనో పూలదండలు మార్చుకుని, ఒక ఫోటో తీయించుకుని ఇంట్లో పెట్టుకో.. ఎటొచ్చెటు పోయినా పడుంటుంది ఒక ఋజువుగా!..  ఏమిటీ? వింటున్నావా?”

అక్క గారి మాటలకీ, సూచనలకీ – ఆమని మది చెదిరింది.

శ్రేయోభిలాషి పాత్ర పోషిస్తున్న అక్క – ‘ ఏమిటీ మాట్లాడుతోంది? ‘  అనుకుంటూ  విస్తుబోయింది.

కట్నమిచ్చి, పెద్ద మనుషుల మధ్య, నిండు పందిట్లో పెళ్ళి చేసుకుంది కదా! మరి ఇప్పుడెవరొస్తున్నారు ఆమె కాపురాన్ని సరిదిద్దడానికి? రెండు వరసల బంగారు నాంతాడు, వాటికి వ్రేలాడుతూ రెండు సూత్రాలు, నల్లపూసల గొలుసు, కాళ్ళకి మెట్టెలు..హు. మరి ఇవేవీ మొగుడి చేత  ‘కాపురం’చేయించలేకపోతున్నాయి ఎందుక ని?

అతను పరాయి చోట్లకి పారిపోకుండా ఏ కొంగు ముళ్ళూ కట్టి పడేయలేకపోతున్నాయెందుకనీ?  నడిచిన ఏడడుగులు అతన్ని కళ్ళాలేసి కట్టడి చేయలేకపోతున్నాయెందుకనీ?  ఒక మూర దారంతో, నాలుగు పసుపు అక్షింతలతో పవిత్రమై పోయిందనుకున్న వివాహ బంధాలకు గారంటీ కార్డ్ ఏదీ? ఎక్కడుందీ? ఎవరిస్తారు?

అక్కని సూటిగా ప్రశ్నించాలనుకుంది. కాదు. నిలదీయాలనుకుంది. కానీ,  అడగలేదు. ఎందుకంటే, కాలం ఖర్చైపోవడం తప్ప పెద్ద ఉపయోగకరమైన జవాబేమీ రాదు.

సగటు ఇల్లాళ్ళకు –  కష్టాలు చెప్పుకుని సానుభూతి పొందడం లో వున్నంత సుఖం, పరిష్కారాన్ని కనుగొనడం లో వుండదు. వీళ్ళు  – మనశ్శాంతిని పారేసుకున్నంత సులువుగా మనస్తాపానికి కారకుడైన మొగుణ్ని  పారేయలేరు. కట్టుకున్న వాడెలాటి వాడైనా సరే,  వాడితోనే ‘కాపురం’ చేసుకోవడం అలవాటై పోయాక, అదే ప్రాతివ్రత్యమని రూఢీ  చేసుకున్నాక, .. ఇక ఇప్పుడు తను అక్క గారికి కొత్త గా చెప్పాల్సిన సూక్తులు కానీ సందేశాలు కానీ ఏవీ లేవు.  ఆవిడ చెప్పింది విని ‘పాపం’ అని అంటే చాలు. ఆవిడ ఆనందం తో పండిపోతుంది. తను సతీ సుమతికి అచ్చమైన వారసురాల్నని  గట్టిగా ఊపిరి తీసుకుని, రాని మొగుణ్ణి తిట్టుకుంటూ నిద్రపోతుంది.  హు!

‘ఆమనీ! మాట్లాడవేమిటే?” – అక్క మాటలకి ఈ లోకంలోకొచ్చింది.  -“ఆ! అక్కా! వింటున్నా చెప్పు…సరే సరే. అలానే చేస్తాలే.  ఇవాళే  మాట్లాడతా అతనితో!..ఏమంటాడో చూస్తా..” అక్క సంతృప్తి కోసం  చెప్పింది.

“ముందు నువ్వాపనిలో వుండు. సరేనా? జాగ్రత్త. వుంటా మరి…”

సెల్ మూసేసి, సోఫాలో జారగిలబడి దీర్ఘాలోచన్లో మునిగిపోయింది. ఎంత వొద్దనుకున్నా, అక్క మాటలు   ఆమని బుర్రని తొలిచేస్తున్నాయి

గతమంతా ఒక్క సారి కళ్ళ ముందు రీలు చుట్టుకుంది. తను తీసుకున్న నిర్ణయం సరైనదే అని మరోసారి తీర్పునిచ్చుకుంది. ముఖ్యంగా ఇతనితో.. కలసి బ్రతకడం గురించి!

“అదేం, చీకట్లో కూర్చున్నావ్?”  లైట్ స్విచాన్ చేస్తూ  అడుగుతున్నాడు. – అతను.

చీకటి..చీకటి..తను గమనించనే లేదు!  ..చీకటి… నల్లటి చీకటి..తెరలుతెరలు గా..దట్టమైన చీకటి.. బలమైన అలలు వలయాలు గా  చుట్టుకుంటూ ముంచేసినా తెలీని చీకటి.  తననుకుంటోంది..వెలుగులోకొచ్చానని..తెలివిగా ఆలోచిస్తోందని ..కాలానికి తగిన మార్పులు చేర్పులతో సుఖం గా బ్రతుకుని నిర్దేశించుకుంటోందనీ..మోడర్న్ లేడీ అనీ.కానీ, కాదనుకుంటా? ఒకవేళ అయితే, అప్పుడు ఇప్పుడూ తన దిగులు పరిస్థితి ఒకలానే ఎలా వుంటుంది. ..ఎదురు చూడటం…నమ్ముకున్న అతను నిజమైన వాడేనా? జీవితానికి అతికించుకున్న బంధం – వమ్ము ఔతుందేమోననే అభద్రతా భావం..కాదు అశాంతి సంద్రం ఎందుకనీ?

అటు అక్కది, ఇటు తనదీ అదే పరిస్థితి..ఎందుకనీ? ఇంతటి అనిశ్చిత – తమకు  మాత్రమే ఎందుకనీ?..

చిత్రం: రాజశేఖర్

అతనొచ్చి ఆమె పక్కన కుర్చున్నాడు. రెండు చేతుల్తో భుజాలు చుట్టి దగ్గరకి తీసుకుని, ఆమె పెదవుల మీద బలం గా ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత..అతని చేతులు అలవాటుగా ఆమె భుజాల మీంచి కిందకి జారుతుంటే , సున్నితంగా నెట్టేస్తూ, పక్కకి జరిగి, అతని ముఖంలోకి సూటిగా చూసింది. ఎలాటి టెన్షనూ కనిపించలేదు.

ఆమె చూపుల్ని మరోలా అర్ధం అయ్యాయి అతనికి. “నీకు తెలుసు కదా ఆమని, నా పరిస్థితి..? ” అన్నాడు. ‘సారీ’ అనే అర్ధం స్ఫురించేలా!

ఆమేం మాట్లాడ్లేదు.

“అవునూ, నేనిక రాననుకున్నావా, అంత దిగాలుగా కూర్చున్నావ్?-ఏమిటీ?,కొంపదీసి  వొదిలేశాననుకోలేదుగా?'” అంటూ నవ్వాడు, ఫెళ్ళున.  పెద్ద జోక్ పేల్చినట్టు.

ఆమని వెంటనే – అతని ముఖంలోకి లోతుగా పరీక్షగా చూసింది – అభావంగా. అతనికేమీ అర్ధం కాలేదు.

కొన్ని సెకన్ల తర్వాత – హఠాత్తుగా – వున్నమనిషి వున్నట్టు ఫక్కున నవ్వింది.

తన జోక్ పేలిందనుకున్నాడతను.

కానీ ఆమె నవ్వు ఆగలేదు. ఇంకా బిగ్గరగా తెరలు తెరలుగా నవ్వడంతో..అతని ముఖం లో నవ్వు వెలిసిపోయింది. తెల్లగా.

“ఎందుకు అంతలా నవ్వుతున్నావ్?” – ఆ పిచ్చి నవ్వుకి బెదిరిపోతూ అడిగాడు.

“నవ్వొ..స్తోం..ది. ఎం..దు..కం..టే.. నీ మాటలకి.  ‘ భయపడ్డావా వదిలేసానని ?’ అని నువ్వంటుంటే.. నవ్వు..నవ్వొస్తోంది..”

“..అవును. తప్పేముంది?” ముఖం చిట్లించుకున్నాడు.

ఒక్కసారిగా మనిషంతా గంభీరమైపోతూ ఒక్కో అక్షరం వొత్తి పలుకుతూ అంది. “మరి నీకు భయమేయలేదా? ఇంటికి రాకుండా పోతే, నేనిన్ను వొదిలేస్తానని? ఆ?.”

అనుకోని ప్రశ్నకి.. విద్యుద్ఘాతం తగిలిన వాడిలా చూస్తుండిపోయాడు. అహం దెబ్బ తిన్న అతన్లోనిమగాడి కేక ఆమెకు మాత్రమే వినిపించింది.

మళ్ళీ నవ్వొచ్చింది. ఇంకా నవ్వుతోంది..తెరలు తెరలు గా..పడీ పడీ నవ్వుతోంది.. మెళ్ళో మంగళ సూత్రాలు లేని గొలుసు కదిలిపోయేలా…అలా  న..వ్వు..తూ..నే వుంది.

******

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఆరిన ఆర్తి

 

-మహమూద్

~

 

కన్నుల్లో ఆర్తి ఆరిపోయినపుడే కద
మేఘాల నీళ్ళ పక్షులు
వాలాలి బిందువులై రెప్పలపై

దీపం చీకట్లో నిదరోతోంది
గుక్కెడు నీళ్ళు చిలకరించండెవరైనా

భూ గర్భం ఒట్టిపోయింది
ప్రాణాన్ని జలం చేసి పోయండెవరైనా

విడదీయకూడని బంధాన్నెవరో తెంచేసినట్టు
పవనం విధ్వంస రూపంలో
గాలి కూడా నీళ్ళు తాగాలేమో

నేలకు కొండ గొడుగులుండేవి
ఆ చల్లదనంలో సెదదీరేది
చెట్లుంటెనే అదో కొండ
పచ్చగా లేక పోతే ఎంత పొడుగు పర్వతమైనా
ఎంత వెడల్పు మైదానమైనా నిరుపయోగమే
నేలకు పర్వత నీడా లేదు కప్పకోడానికిప్పుడు
నదుల పయ్యద చిట్లుతున్న సవ్వడి విని
పారిపోయాయి ఎండమావులు
కరువు ఒచ్చినపుడు
మొదటి చావు నేలదే.

రుధిర జలం జల రుధిరం
మానులో మానై మనిషిలో మనసై
చెట్లకు ఆకులై
నదులకు తీరాలై
సముద్రాలకు నదులై

ఏ దూరతీరాలకు పయనమైందో
తెలుసుకునే లోగా
తెగుతున్న ప్రాణతీగలను
పట్టుకొని ఎన్ని రోజులుండగలం

కనపడవు కానీ
మనిషి వేర్లు నీళ్ళలోనే ఉంటాయి
ఆ నీళ్ళే ప్రవాహాన్ని విరమించుకున్నాయి

నీరు లేని
జీవన విధ్వంసంలో
ఎండిపోయిన నరాలకు పానకాలు
షర్బత్లూ కోలాలు కాదు

నీరు మాత్రమే కావాలి
నీరు లేకపోతే నాలుక మీద మాట నిలబడుతుందా
నీరు లేక నరాల్లో జీవం ఊరుకుతుందా
నీరు లేని కన్ను చూపుల ఊటను తయారు చేస్తుందా
తడి తగలకపోతే గుండె లయల గూడౌతుందా
కన్నీరోలాకాలంటే లోపలికి దిగాలికదా నీరు
నీరు మనిషి లోపలి లోగిలిని మండించేఇంధనం కదా

మట్టిని వెన్న ముద్ద చేసే
తల్లి చేతి మాయ కదా కవాలిపుడు
తడి సముద్రాల తల్లి ఒడి
ఇపుడో గర్భశోక చావిడి

ఇది నీ పై నీవు ప్రకటించుకున్న
విధ్వంసం
నిను లోపల్నించి చీల్చే
అంతర్యుధ్ధం

ఎక్కడికెళతావు ఇప్పుడు నీటిని వెతుక్కుంటూ
నీళ్ళ ఖజానాలేం లేవు దోచుకోడానికి
జలం ఉన్నపుడు జాగ్రత్త పడలేదు నువ్వు

రాబందుల గురించి ఊహలేం అవసరం లేదు
అవకాశం వస్తే సజీవంగా నీ నీడే నిన్ను పిక్కతినేలా ఉంది

దూర దూరాల దాక మైదాన వైరాగ్యం నాటుకుపోయాక
పచ్చని చెట్ల కల ఆకులు రాల్చుకుంటుంది
కన్నీటి ధార కూడా పెదవుల దాకా చేరని వ్యధై

( దేశం లోని కరువు పరిస్థితులు చూస్తూ చెమ్మగిల్లిన కలం రాల్చిన కన్నీళ్ళతో )

పిల్లలా…!  నో వే…!

 

 

-రాజ్యలక్ష్మి

~

 

 

హేండ్ బేగ్, లంచ్ బాక్స్ భుజానికి తగిలించుకుని, లిఫ్ట్ కోసం ఆగకుండా దాదాపు పరిగెత్తుతున్నట్టే మూడంతస్తులు ఎక్కి, ఆఫీసులో తన సీట్ దగ్గరకు వెళ్లి లాగిన్ అయి, “అమ్మయ్య!  లేట్ కాలేదు” అనుకుంటూ అనుకుంటూ నీరసంగా కుర్చీలో కూలబడింది సౌమ్య.  లేకపోతే నెలలో రెండు లేట్లకి ఒక లీవ్ కట్.  ఇంకానయం, లాప్‌టాప్ లేదు.  లేకపోతే అది మోస్తూ ఇన్ని అంతస్తులు ఎక్కాలంటే…  అమ్మో!

ఇంతలో “హాయ్…” అంటూ భార్గవి వచ్చింది.  “ఏంటి నిన్న రాలేదు, ఒంట్లో బాలేదా?” సౌమ్యని అడిగింది.

“నేను బాగానే ఉన్నాను. అనన్యకి మొన్నటి నించీ జ్వరం.  ఇంకా తగ్గలేదు.”

“మరెందుకు వచ్చావు?  ఈరోజు కూడా సెలవు పెట్టాల్సింది.”

“నేను అదే అనుకున్నాను.  కానీ మేనేజర్‌కి ఫోన్ చేసి సెలవు అడిగితే, ఫస్ట్ వీక్ కదా రిపోర్ట్స్ ప్రిపేర్ చేయాలని రమ్మన్నాడు.  అందుకే దానిని క్రెచ్‌లో దింపి, మందులు జాగ్రత్తగా వేయమని చెప్పి వచ్చాను.  సాయంకాలం మళ్ళీ డాక్టర్ దగ్గరకి తీసుకు వెళ్ళాలి.  ఈ రిపోర్ట్స్ అవగానే వెళ్లిపోతాను.“

“ఓ.కె.  ఏదైనా సహాయం కావాలంటే చెప్పు” అంటూ భార్గవి తన సీట్ దగ్గరకి వెళ్లిపోయింది.

సౌమ్య పేరుకు తగ్గట్టే చాల సౌమ్యంగా ఉంటుంది.  తన పని చాలా శ్రద్ధగా చేస్తుంది, ఎవరూ వంక పెట్టడానికి వీలు లేకుండా.  తనేమో, తన పనేమో అన్నట్టుగా ఉంటుంది.  ఇల్లు, ఆఫీసు తప్ప వేరే ప్రపంచం లేదు.  ఎవరినీ ఒక మాట అనదు, ఎవరన్నా తనని అన్నా తిరిగి సమాధానం చెప్పడం చేతకాక, తనలో తనే బాధపడుతుంది.

భార్గవి ఇందుకు పూర్తిగా విరుద్ధం.  తను ఎవరిజోలికీ వెళ్ళదు కానీ, ఎవరైనా తన జోలికి వచ్చారంటే మాత్రం ఊరుకోదు.  ఆఫీసులోనూ, బయటకూడా ఎవరికైనా సహాయం చేయడంలో ముందుంటుంది.  అందులోనూ ఆడవాళ్ళంటే ఇంక వెనకా ముందూ చూసుకోదు.  ఒక మహిళాసంస్థలో వాలంటీర్‌గా కూడా పనిచేస్తోంది.

భిన్న ధృవాల్లాగా లాగా ఇద్దరి మనస్తత్వాలలో ఏమాత్రం పోలిక లేకపోయినా ఇద్దరూ మంచి స్నేహితులు.  పక్కవారి మీద అంత దయ, ప్రేమ చూపించే భార్గవి అదే సమయంలో అంతలా ఎలా పోట్లాడగలదనేది సౌమ్యకి ఎప్పుడూ అంతుపట్టని విషయం.  “అందుకే పోట్లాడతా” అని నవ్వుతుంది భార్గవి.

“మా అక్క న్యూరాలజి చేయాలనుకుంది, ముఖ్యంగా సర్జన్ అవుదామనుకుంది.  సీట్ కూడా వచ్చింది.  కానీ వాటిల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, పిల్లలతో కష్టమని మా అమ్మానాన్న రేడియాలజి చేయమన్నారు” అని సౌమ్య చెప్తే “మీరు ఏం చదవాలో మీ అమ్మానాన్న నిర్ణయించడమేమిటి, అందులో పి.జి. లెవెల్లో?” అని భార్గవి చాలా ఆశ్చర్యపోయింది.  “ఇలాగే ఈ తల్లిదండ్రులు ప్రేమ, భధ్రత పేరుతో పిల్లలని ఇండివిడ్యుయాలిటి లేకుండా, బలహీనులుగా తయారు చేస్తారు” అని బాధపడింది.  “అలా ఇల్లు, ఆఫీసు అంటూ బావిలో కప్పల్లాగా ఉండద్దు.  కాస్త బయటకొచ్చి ప్రపంచాన్ని చూడండి” అంటుంది ఎప్పుడూ.   భార్గవి స్నేహంతో సౌమ్య కూడా కొంచెం ఆలోచించడం నేర్చుకుంది, ఆమెలాగా ఎదిరించలేకపోయినా.

“నిన్న ఆఫీసులో గొడవ అయిందట కదా!” లంచ్ రూంలో అడిగింది ఉష.

“నిన్న నువ్వు లేవు కదా! ప్రియ మెటర్నిటి లీవ్ అప్లై చేస్తే రాకేష్ అవమానకరంగా మాట్లాడాడుట.  తను పాపం రెస్ట్ రూంలో ఏడుస్తుంటే భార్గవి చూసి కంప్లైంట్ చేయించింది. ఆఫీసులో పెద్ద గొడవ.  ఆడవాళ్ళందరమూ కూడా ప్రియకి సపోర్ట్ చేసాము.  అపాలజీ చెప్పకపోతే వుమెన్ ప్రొటెక్షన్ సెల్‌కి కంప్లైంట్ చేస్తామనేటప్పటికి, రాకేష్ ఇక తప్పక అపాలజి చెప్పాడు.  ఈ క్రెడిట్ అంతా భార్గవికే.” అంది సూజన్.  ఇలాంటివాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయింది సౌమ్య.

“మా అఫీసులో ఒకేసారి ఇద్దరు మెటర్నిటి లీవ్‌లో వెళ్ళారు.  మావాళ్ళేమో రిప్లేస్‌మెంట్ ఇవ్వరు.  చచ్చిపోతున్నాము చాకిరీతో.  ఈ ఆడవాళ్ళు ఎందుకొస్తారో ఉద్యోగాలు చేయడానికి…” అని తన అన్నయ్య ఒకసారి విసుక్కోవడం గుర్తొచ్చింది ఉషకి.

“అసలు ఆడవాళ్ళందరూ ‘పిల్లలని కనం, పెంచం’ అంటే ఏం చేస్తారో ఈ మగవాళ్లు!” కోపంగా అంది సూజన్.   “పిల్లలు లేకుండానా…! అమ్మో…!  అనన్య లేకుండా ఒక్క క్షణమైనా తను ఉండగలదా…” అనుకుంది సౌమ్య

“అయినా హెచ్. ఆర్. లో కొంచెం సెన్సిటివ్ వాళ్ళని తీసుకోవాలి, ఇలాంటివాళ్ళని కాదు.” అంది ఉష.

“అసలు మనుషులని మనుషులలా కాకుండా ఒక్ రిసోర్స్ లాగా చూడడమే ఇన్సెన్సిటివిటి.  మళ్ళీ అందులో సెన్సిటివిటి ఏమిటి”  అంది భార్గవి.   అందరూ నవ్వారు.

కానీ భార్గవి ఈ విషయంలో చాలా సీరియస్.  ఈ ఒక్క విషయంలోనే కాదు భార్గవికి ప్రతి విషయంలో ఒక ఖచ్చితమైన, ధృఢమైన అభిప్రాయం ఉంటుంది.  స్త్రీల పట్ల వివక్ష; ఇంట్లో, ఆఫీసులో వాళ్ళకి జరిగే అన్యాయాలు – ఇలాంటివే కాకుండా పర్యావరణ రక్షణ, రైతు ఆత్మహత్యలు, ప్రభుత్వం రైతులనుండి సారవంతమైన భూమిని వ్యవసాయేతర అవసరాలకోసం సేకరించడం – ఇలాంటివాటి పైన కూడా  ఒక స్పష్టమైన అవగాహనతో ఉంటుంది.

సౌమ్య రిపోర్ట్స్ ప్రిపేర్ చేసి అప్రూవల్ కోసం మేనేజర్ కాబిన్‌లోకి వెళ్ళేసరికి ఆయన ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. “బ్రాంచ్‌లో అడిషనల్ స్టాఫ్ కావాలి నిజమే, కానీ ఆడవాళ్ళు వద్దు.  ఇప్పటికే మా బ్రాంచ్‌లో ఆడ స్టాఫ్ ఎక్కువైపోయారు.  ఎప్పుడూ సెలవలు, పర్మిషన్లు!  వాటికితోడు గొడవలు!  చచ్చిపోతున్నాననుకో…” అంటూ సౌమ్యని చూసి ఫోన్ కట్ చేసాడు.

‘ప్రతి ఒక్కడూ ఆడవాళ్ళమీద కామెంట్లు చేసేవాడే!  సుత్తిమొహం…’ అనుకుంటూ అప్రూవల్ తీసుకుని “ఈ రిపోర్ట్స్ మెయిల్ చేసేసి నేను వెళ్తాను, పాపని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి” అంది. “ఓ.కె. నో ప్రాబ్లం. మరి లీవ్ అప్లై చేసారా?” అన్నాడు.  “లేదు, హాఫ్‌డే చేస్తాను” అని బయటకొచ్చింది, అంతకంటే ఏమీ అనలేక.

“ఏమంటున్నాడు మన బాసాసురుడు?” సౌమ్య విసురుగా రావడం చూసి అడిగింది ఉష.

“అసలు సెలవు తీసుకుందామనుకుంటే పనైపోగానే వెళ్ళిపోవచ్చని బతిమాలి ఆఫీసుకు రమ్మన్నాడు.  ఇప్పుడేమో తీరా పని పూర్తిచేసి వెళ్తానంటే హాఫ్‌డే లీవ్ పెట్టమంటున్నాడు.“  సౌమ్యకి ఒళ్లు మండిపోతోంది.

“A boss is a boss is a boss is a boss.” నవ్వింది సూజన్.

“ఇప్పుడు లీవెందుకు?  అప్పుడే నాలుగున్నర అయింది కదా!” ఆశ్చర్యపోయింది ఉష.  “నువ్వు అడగకపోయావా?” అంది

“ఉపయోగం లేదు.  నిన్నటి గొడవ తర్వాత ఆడవాళ్ళంటేనే మండిపోతున్నాడు.”  అంది సూజన్

“ఏమీ వద్దు.  లీవ్ అప్లై చేసి దర్జాగా వెళ్లిపో.  లేకపోతే వీళ్ళందరూ ఆడవాళ్ళు ఎప్పుడూ పర్మిషన్లు అడుగుతారని ఏడుస్తారు” అంది భార్గవి.

“నిజమే” అంది సూజన్.

లీవ్ అప్లై చేసి ఆఫీస్‌లోంచి బయటపడింది సౌమ్య.  అనన్యని డాక్టర్‌కి చూపించి ఇంటికి వెళ్ళింది.  అనన్యకి మందు వేసి, బ్రెడ్, పాలు ఇచ్చి పడుకోపెట్టింది.  మందు పనిచేసినట్టుంది, అనన్య ఏడవకుండా నిద్రపోతోంది.   సౌమ్య కూడా పక్కనే పడుకుంది.  ఈ రోజు చాలా అలసటగా ఉంది.  అందులోనూ మధు ఊళ్ళో లేకపోవడంతో మరీ ఒంటరిగా అనిపిస్తోంది.  ఇంతవరకు అనన్య గురించిన దిగులుతో ఆఫీసులో జరిగిన విషయాలు పట్టించుకోలేదు.  ఇప్పుడు అనన్య ప్రశాంతంగా నిద్రపోతూడడంతో పొద్దుననుండి జరిగిన విషయాలు గుర్తుకొస్తున్నాయి.

ఈ మేనేజర్ ఒకడు, మొత్తం పని చేయించుకుని హాఫ్‌డే లీవ్ పెట్టమన్నాడు.  దానికన్నా వాళ్ళు ఆడవాళ్ళ గురించి చేసిన కామెంట్లు మరీ బాధిస్తున్నాయి.  మెటర్నిటి లీవ్ గురించి రాకేష్ అసభ్యంగా మాట్లాడాడుట!  ఏమన్నాడో?  అసలు ఏమైనా అనే అధికారం అతనికేముంది?  మేనేజర్ అయితే ఏకంగా బ్రాంచ్‌లో ఆడస్టాఫునే వద్దంటున్నాడు.  ఏం?  ఆడవాళ్ళు జీనియస్సులు కారా?  వాళ్ళకి ఎఫిషియెన్సి లేదా?

తను చదువుకునే రోజుల్లో ఆడపిల్లలకి మార్కులు ఎక్కువ వస్తాయని మగపిల్లలు గొడవ చేసేవారు.  “మీరేమన్నా క్రికెట్ ఆడుతారా?  ఫ్రెండ్స్‌ తో బయట తిరుగుతారా?  ఊరికే ఇంట్లో కూర్చుని ఏమీ తోచక చదివితే మాకూ వస్తాయి మార్కులు” అని వెక్కిరించేవారు.  ఆడపిల్లలు కూడా స్పోర్టివ్‌గా తీసుకుని “మిమ్మల్ని మేమేమన్నా బయట తిరగమన్నామా?  మీరూ ఇంట్లో కూర్చుని చదవండి” అనేవారు నవ్వుతూ.  అప్పుడు ఏమీ అనిపించేది కాదు, సరదాగా ఉండేది.  కానీ ఇది వేరు!

బయట వాళ్ళననుకుని ఏం లాభం?  “ఆడవాళ్ళు ఎంత చదివినా పొయ్యిలోకే!  బి.యే. చదివినా బియ్యం ఏరాల్సిందే!” – అమ్మ టెంత్ తర్వాత ఇంకా చదువుకుంటానని గొడవ చేస్తే వాళ్ళ తాతయ్య అనేవాడట.  “స్త్రీ స్వాతంత్ర్యం అంటే ఇదే!  ఇంట్లోనూ, బయటా కష్టపడడమే!  కావాలని సాధించుకున్నారుగా! అనుభవించండి…” – అమ్మ ఇంట్లోనూ బయటా చేసుకోలేక సతమతమవుతుంటే తాతయ్య వెక్కిరింతగా అనేవాడు.  “నిన్ను ఉద్యోగం చేయమని ఎవడేడ్చారు?  ఆ వెధవుద్యోగం లేకపోతే గడవదా?  మానిపారెయ్…” – తనకేదైనా ఇబ్బందయితే అమ్మ మీద అరిచేవాడు నాన్న కూడా!  ఆ మాట అనిపించుకోకూడదని అమ్మ నానా హైరానా పడేది.  “నా ఉద్యోగం చిన్నదనీ, మీ నాన్నతో సమానంగా చదువుకోలేదనీ, సంపాదించటంలేదనీ చులకన నేనంటే.  మీరు మాత్రం బాగా చదువుకుని మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేయాలి.  అప్పుడే మీకు గౌరవం” అనేది అమ్మ ఎప్పుడూ.  అమ్మ అభిప్రాయం ఎంత తప్పో ఇప్పుడు తెలుస్తోంది.  వాళ్ళతో సమానంగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నా ఇంకా ఎందుకో అంత చులకన?

“ఈ మగవాళ్ళు ఇలా ఎందుకు ఉంటారో…” అంటే, “ఆడపిల్లలు పుట్టరు, తయారు చేయపడతారు అంటారు.  కానీ మగపిల్లలు కూడా పుట్టరు, తయారు చేయపడతారు.  మనం వారితో పాటు సమానంగా చదువుకుని ఉద్యోగాలు చేయటం వారిలో తరతరాలుగా జీర్ణించుకున్న అహంకారం భరించలేదు.  ఆ అసహనంవల్లే ఈ కామెంట్లూ అవీ…  వీళ్ళసలు ఇళ్ళల్లో కూడా ఇలాగే ఉంటారు, కాని అవన్నీ ప్రేమ, ఆప్యాయతల ముసుగులో ఎవరికీ కనపడవు” అంటుంది భార్గవి.

ఇలాంటివెవరైనా తనని అంటే కాళ్ళూ, చేతులూ బిగిసిపోయి, గుడ్లప్పగించి చూస్తుంది కానీ తిరిగి సమాధానం చెప్పలేదు.  లాభం లేదు.  అలాంటివాళ్ళకి స్ట్రాంగ్‌గా సమాధానం చెప్పడం నేర్చుకోవాలి.  రకరకాల అలోచనలతో సౌమ్య నిద్రలోకి జారుకుంది.

 

***

క్రీ.శ. 2040

 

“పెళ్ళి పెళ్ళి అని నన్ను ఊరికే సతాయించకమ్మా.  మీకెన్నిసార్లు చెప్పాలి?  నేను పెళ్ళి చేసుకోను.” సౌమ్యని విసుక్కుంది అనన్య.

అనన్య బయోటెక్నాలజిలో రీసెర్చ్ చేస్తోంది.  కూతురికి ముప్పయ్యేళ్ళు వచ్చేస్తున్నాయి, ఇంకా పెళ్ళి కాలేదని సౌమ్య దిగులు.  ఎప్పుడైనా అనన్య ఇంట్లో ఖాళీగా దొరికితే ఇద్దరికీ ఇదే చర్చ.

“అదికాదమ్మా, నీకిష్టమైనవాడినే చేసుకో,   మేమేమీ కాదనం కదా!” అంటున్న సౌమ్యకేసి జాలిగా చూసింది అనన్య.

“అబ్బా!  నీకెలా చెప్తే అర్థమవుతుంది?  పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు కదా ఇష్టమైనవాడో, ఇష్టంలేనివాడో!  పెళ్ళి చేసుకుని నా కెరీర్ పాడుచేసుకోలేను.”  అంది అనన్య

“పిన్నీ…!  అనన్యా…!” అంటూ వచ్చింది నవ్య, సౌమ్య అక్క కూతురు.  నవ్యని చూడగానే సౌమ్యకి సంతోషం వేసింది.  కాసేపు కబుర్లు చెప్పిన తర్వాత “చూడవే… నవ్యా!  అనన్య అసలు పెళ్ళేచేసుకోనంటొంది.  నువ్వయినా చెప్పవే…” అంది సౌమ్య ఆశగా.

నవ్య అనన్యకి షేక్‌హాండ్ ఇచ్చి, “కంగ్రాచ్యులేషన్స్!  నేను చేయలేని పని నువ్వు చేస్తున్నావు.  ఈ మాట మీదే నిలబడు” అంది .
“అదేమిటే, నువ్వు కూడా అలా అంటావు!  పెళ్ళి చేసుకుని నువ్వు ఏం ఇబ్బంది పడుతున్నావు?  ఒకటి రెండేళ్ళల్లో పిల్లలకి కూడా ప్లాన్ చేస్తారనుకుంటుంటే…” ఆశ్చర్యంగా అంది సౌమ్య.

“ఓ, పిన్నీ!  పిల్లలా…! నో వే…!  అసలు పెళ్ళే ఒక బర్డెన్ అనుకుంటుంటే ఇక పిల్లలు కూడానా!”  నవ్య చాలా ధృఢంగా చెప్పింది.  అర్థం కానట్టు చూస్తున్న సౌమ్యతో “మా అమ్మ న్యూరాలజీ చెయాలని ఉన్నా రేడియాలజి ఎందుకు చేసింది, నేను ఉన్నాననే కదా!  నువ్వు ప్రమోషన్లు ఎందుకు వదులుకున్నావు, అనన్య కోసమే కదా!  అంటే మీ కెరీర్‌ని, కోరికలని మాకోసం చంపుకున్నారు.  నేను అలా ఉండాలనుకోవటం లేదు. అందుకే…” అంది నవ్య.

సౌమ్య అయోమయంగా చూసింది.  ఏమైంది వీళ్ళందరికీ!  తన స్నేహితులందరికీ వాళ్ళ పిల్లలతో ఇదే సమస్య.  సగానికి సగం మంది పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు.  ఒకవేళ చేసుకున్నా పిల్లలని కనడమే లేదు, కెరీర్ పాడవుతుందని!

“అనన్య అసలు పెళ్ళే చేసుకోనంటోంది.  నవ్యేమో పిల్లలు వద్దంటోంది.  ఏం చెయాలి వీళ్ళని?” అంటూ మధు దగ్గర బాధపడింది.

“చూడూ!  మా అమ్మమ్మ వాళ్ళు ఏడుగురుట.  మా అమ్మ వాళ్ళు నలుగురు.  మేము ఇద్దరం.  మనకి ఒక్కరే.  మనని ఇంకొకరిని కనమని ఎంత బలవంతం చేసారో మర్చిపోయావా?” అన్నాడు.  “మరీ ఒక్క పిల్లేమిటే!  ఇంకొక్కరు ఉంటే బావుంటుంది.  ఒకరికొకరు తోడుగా ఉంటారు” అని అమ్మ ఎన్నోసార్లు తనతోనూ, అక్కతోనూ అనడం గుర్తొచ్చింది సౌమ్యకి.

“కానీ, ఇద్దర్ని మనం మేనేజ్ చేయలేమని కదా ఒక్కరే చాలనుకున్నాము”

“అదే నేను చెప్పేది.  మనం ఒక్కరు చాలనుకున్నాము.  ఈ తరం ఆ ఒక్కరు కూడా వద్దనుకుంటోంది.”

“పిల్లలు సరే, అనన్య అసలు పెళ్ళే చేసుకోనంటోంది కదా!  ఇప్పుడు బాగానే ఉంటుంది.  కొంతకాలం పోయిన తర్వాత ఒంటరితనంతో ఎంత బాధపడతారు!”  సౌమ్యకి ఈ పరిస్థితి మింగుడుపడడంలేదు.

“బహుశా బాధపడరేమో!  ఇప్పటికే సింగిల్‌గా ఉండే ఆడపిల్లలూ, మగపిల్లలూ ఎక్కువవుతున్నారు.  అనన్య స్నేహితుల్లో కూడా అలాంటివాళ్ళు చాలామందే ఉన్నారు కదా!  ఇంక ఒంటరితనం అన్న ప్రశ్నే రాదు.”

మధు తీసుకున్నంత తేలికగా సౌమ్య తీసుకోలేకపోతోంది.  “మనమేమీ చేయలేము.  ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్.”  అన్నాడు అనునయంగా మధు.

 

***

 

క్రీ.శ. 2300

 

వెంకట్ బిక్కుబిక్కుమంటూ రోడ్డుమీద నడుస్తున్నాడు.   కనుచూపుమేరలో ఇంకెవరూ లేరు.  దాదాపు రెండొందల సంవత్సరాల క్రితం మనుషులు ఇలా రోడ్డు మీద నడిచేవారట.  ఇల్లు ఇంకో వందగజాలు ఉండగా వెహికల్ ఆగిపోయింది.  దగ్గరే కదా అని నడవడం మొదలుపెట్టాడు.  కానీ మనసులో చాలా భయంగా ఉంది.   ఉన్నట్టుండి అయిదారుగురు ముసలివాళ్ళు చుట్టుముట్టారు.  వెంకట్‌కి ఏమి చేయాలో తెలియలేదు.  వెంకట్ దగ్గరున్న వస్తువులు లాక్కుని వాళ్ళు పారిపోయారు.  ఈమధ్య ఇది మామూలైపోయింది.  పోలీసులకి పట్టుబడతామని భయం కూడా లేదు.  నిజానికి పట్టుబడితే ఇంకా మంచిది.  ఏ రెండు మూడు నెలలో జైల్లో హాయిగా ఉంటారు.  పాపం వాళ్ళననేమీ లాభంలేదు!  స్ట్రగుల్ ఫర్ ఎగ్సిస్టెన్స్, అంతే!  

 

***

బాబి కంప్యూటర్ ముందునుంచి లేచాడు విసుగ్గా.  కంప్యూటర్ గేమ్స్ ఆడీ ఆడీ విసుగొచ్చేసింది.  రోజంతా కంప్యూటర్‌తోనే కాలక్షేపం.  ఆడుకోవడానికి కాదు కదా కనీసం మాట్లాడడానికి కూడా ఎవరూ లేరు.  చదువు కూడా కంప్యూటర్ సహాయంతోనే.  అంతా ఆటోమేటెడ్!  రెండొందల ఏళ్ళ క్రితం వరకూ పిల్లలందరూ ‘బడి’లో చదువుకునేవారనీ, అక్కడ పాఠాలు చెప్పడానికి ‘టీచర్’ అనేవాళ్లు ఉండేవారనీ, సాయంకాలాలు పిల్లలందరూ కలిసి ఆడుకునేవారనీ చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాడు.  వీడియోల్లో చూసాడు.  ఎంత బావుందో!  తనెప్పుడూ అలా ఆడుకోలేదు.  అసలు తన ఈడు పిల్లలని చూసి ఎన్నాళ్ళయిందో!

***

 

ప్రపంచ నేతల సదస్సు జరుగుతోంది.  అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు.

“మన టెక్నాలజి చాలా అభివృద్ధి చెందింది.  మనిషి తన మేధస్సునీ, తెలివి తేటలనీ ఒక్క రీసెర్చ్ కే ఉపయోగిస్తున్నాడు.  మిగిలిన రొటీన్ పనులన్నీ ఆటోమేట్ చేసాము.  అఫీసుల్లో, పొలాల్లో, ఫాక్టరీల్లో  పని అంతా రోబోలే చేస్తున్నాయి. ఈ రోబోలని కంట్రోల్ చేయడానికే మనిషి!

దీనికి ఇంకొక పార్శ్వం గమనిస్తే, ఇరవైయ్యొకటవ శతాబ్దంతో పోలిస్తే ప్రపంచ జనాభా సగానికి పైగా తగ్గిపోయింది.  దానిలో యాభై శాతం పైగా వృద్ధులే!  పిల్లలు పది శాతం కూడా లేరు!

కుటుంబ వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమవడంతో వృద్ధుల, పిల్లల భారం ప్రభుత్వాల మీద పడింది.  వారి పోషణ, రక్షణ ప్రభుత్వాలకి పెద్ద సవాలైంది.   వృద్ధులలో క్రైం రేటు బాగా పెరిగిపోయింది.  చిన్న చిన్న దొంగతనాలు, వృద్ధులు గుంపులు గుంపులుగా కలిసి ఒంటరివారిపై చేసే దాడులు పెరిగిపోయాయి.  జైళ్ళన్నీ వృద్ధులతో నిండిపోయాయి.  తోటిపిల్లలు లేకపోవడంతో పిల్లలు కూడా స్థబ్దుగా తయారయ్యారు.  అన్ని వర్గాల, వయస్సుల ప్రజలలో రకరకాల సామాజిక, మానసిక సమస్యలు తలెత్తాయి.  ఆత్మహత్యల రేటు విపరీతంగా పెరిగిపోయింది.  ఇదే పరిస్థితి కొనసాగితే తొందరలోనే మానవజాతి అంతరించి పోతుంది.  ఈ సమస్యని అధ్యయనం చేయడానికి సోషియాలజీ ప్రొఫెసర్ పండిట్ అధ్యక్షతలో ఒక కమిటీని నియమిస్తున్నాము.  ఈ కమిటీలో ఆర్థికశాస్త్రం, జీవశాస్త్రం మొదలైన రంగాలలో నిపుణులు మెంబర్లుగా ఉంటారు.” అని ముగించాడు.

ఆ కమిటీ ఒక సంవత్సరం పాటు రకరకాల అంశాలను అధ్యయనం చేసి జనాభా తగ్గడానికి గల కారణాలు, ఇది ఇలాగే ఉంటే ఇక ముందు మానవజాతి ఎదుర్కోబోయే సమస్యలు, అలాగే జనభా పెరుగుదలకు తీసుకోవలసిన చర్యలు సిఫార్సు చేసింది.   ప్రపంచ నేతల సదస్సులో ప్రొఫెసర్ పండిట్ ఆ రిపోర్ట్‌ లోని అంశాలని చెప్పడం మొదలుపెట్టాడు.

“ఇరవయ్యొకటవ శతాబ్దం తర్వాత జనాభా తగ్గడానికి గల ముఖ్యమైన కారణాలు:

  1. పర్యావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి వల్ల స్త్రీ, పురుషులిద్దరిలో సంతానలేమి పెరిగింది.
  2. ఇరవయ్యొకటవ శతాబ్దం నుంచీ స్త్రీలు పురుషులకి తామేమీ తీసిపోమని వారితో సమానంగా చదువూ, ఉద్యోగాలలో రాణించారు. ఆ క్రమంలో తమ చదువుకి, కెరీర్‌కి ఇచ్చిన ప్రాముఖ్యం వివాహానికీ, సంతనానికీ ఇవ్వలేదు.   వివాహము, సంతానము తమ చదువుకూ, కెరీర్‌కూ ప్రతిబంధకంగా వారు భావించారు.

 

జనాభా తరుగుదలకి ఈ రెండో కారణమే ప్రధానం.  దీనిని అరికట్టాలంటే యువతకు, ముఖ్యంగా స్త్రీలకు వివాహము, సంతానము కారణంగా వారి కెరీర్‌కి ఎలాంటి ఆపద ఉండదని హామీ ఇవ్వాలి.  అంతే కాకుండా ఎక్కువమంది సంతానం ఉన్నవారికి తగిన ప్రోత్సాహకాలు కూడా ఇవ్వవలసి ఉంటుంది.  కుటుంబవ్యవస్థని తిరిగి పునరుద్ధరించటానికి తగిన చర్యలు తీసుకోవాలి.  ఇంకా…”

***

ఫోన్ మోగుతున్న శబ్దానికి సౌమ్యకి మెలకువ వచ్చింది.  కాసేపు తను ఎక్కడ ఉన్నదో అర్థం కాలేదు. తల తిప్పి చూస్తే పక్కన అనన్య నిద్రపోతోంది.   ఎంతసేపటినించీ ఆ ఫోన్ మోగుతోందో!  మోగీ మోగీ ఆగిపోయింది.   టైము చూస్తే తొమ్మిదే అయింది.  అంటే తను గంటే నిద్రపోయిందన్నమాట.  ఈ గంటలోనే కలా!  లేచి ఎవరు ఫోన్ చేసారా అని చూసింది.  భార్గవి.  ఎందుకు చేసిందా అని అనుకుంటుండగానే మళ్ళీ చేసింది,  అనన్యకి ఎలా ఉందంటూ.

“ఫరవాలేదు.  నిద్రపోతోంది.  అది సరే కానీ, నాకిప్పుడే ఒక చిత్రమైన కల వచ్చింది తెలుసా…”  అంటూ భార్గవికి తనకొచ్చిన కల చెప్పింది సౌమ్య నవ్వుతూ.

“ఇది నవ్వుకునే విషయం కాదు సౌమ్యా! ముందుముందు మానవజాతి ఎదుర్కునే స్థితి.  దీని సూచనలు ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని దేశాలలో కనిపిస్తున్నాయి.  ఉదాహరణకి జపానులో జనాభా వృద్ధిలో తగ్గుదల ఇప్పటికే మొదలైంది.  దీనికి కారణం, అక్కడ స్త్రీలు కెరీర్‌కి ఇచ్చిన ప్రాముఖ్యత సంతానానికి ఇవ్వకపోవడమే!  దీనివల్ల జపాను ప్రభుత్వం రకరకాల సమస్యలని ఎదుర్కొంటోంది.  ఈ సమాజానికి ఉత్పత్తి ఎంత ముఖ్యమో, పునరుత్పత్తి కూడా అంతే ముఖ్యం.  ఉత్పత్తి చేసే వాళ్ళల్లో ముఖ్యమైన రైతుకి అన్నదాత, రైతే రాజు అనీ, అలాగే కుటుంబవ్యవస్థలో, పునరుత్పత్తిలో ముఖ్యపాత్ర వహించే స్త్రీకి గృహలక్ష్మి, మాతృదేవత అని బిరుదులిస్తున్నామే కానీ, వారి శ్రమకు తగిన విలువ, గుర్తింపు, గౌరవం ఇవ్వడంలేదు.  కుటుంబమా – కెరీరా?  పిల్లలా – ప్రమోషన్లా?  ఇలా ఏదో ఒకటి మాత్రమే ఎంచుకునే పరిస్థితి నేటి స్త్రీది.  కానీ ఈ రెండూ జంటపదాల్లాగా, జుగల్బందీలాగా విడదీయలేనివి.  ఇది అర్థం చేసుకోనంతకాలం ఈ పరిస్థితిలో మార్పు రాదు.  ఈ పరిస్థితి ఇలాగే ఉంటే నీకొచ్చిన కల నిజమవడానికి ఎంతో కాలం పట్టదు.” ఆవేశంగా అని, “మా మహిళా సంస్థలో వీటిగురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి.  ఇంకా ఎంతో చర్చ జరగాల్సి ఉంది.  ఎంతో అర్థం చేసుకోవాల్సి ఉంది.  రేపు తీరిగ్గా మాట్లాడుకుందాం.” అంటూ ఫోన్ పెట్టేసింది భార్గవి.

భార్గవి మాటలకు బిత్తరపోయి అలాగే కూర్చుండిపోయింది సౌమ్య.                                                                                                               *

 

[ఉత్పత్తి సమాజ మనుగడకు ఎంత ముఖ్యమో పునరుత్పత్తి అంత ముఖ్యం.  దానిలో కీలక పాత్ర స్త్రీది.  అక్కడ వారి శ్రమకు విలువగుర్తింపు, గౌరవం దొరకాలి.  ప్రస్తుతం అవి లేవు.  మాతృమూర్తి, దేవత అని కితాబునిచ్చి ఊరుకుంటారు.  –  ఓల్గా]

తర్జుమా కావాలి: సంగిశెట్టి

 

 

  ఇంటర్వ్యూ : స్కైబాబ 

~

తెలంగాణ  సాహిత్యానికి  చేసిన సేవలకు గుర్తింపుగా సంగిశెట్టి శ్రీనివాస్‌ కి  తెలంగాణ అవతరణ ఉత్సవ పురస్కారం దక్కింది. సంగిశెట్టి 1965లో నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట దగ్గరలోని రఘునాథ పురంలో పుట్టారు. చిన్నప్పుడే  తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్‌ వచ్చిన శ్రీనివాస్‌ 1990వ దశకం ఆరంభంలో ఉస్మానియాయూనివర్సిటీ కేంద్రంగా  ఏర్పడి, పనిజేసిన తెలంగాణ స్టూడెంట్స్‌ ఫ్రంట్‌ స్థాపకుల్లో ఒకరు. 1991 నవంబర్‌ ఒకటిన ఆర్ట్స్‌ కళాశాలపై ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు వ్యతిరేకంగా పెద్ద నల్లజెండాను ఎగరేశారు సంగిశెట్టి.

తొలి  కవయిత్రి కుప్పాంబికను వెలుగులోకి తెచ్చారు. తొలి తెలుగు కథలు  – భండారు అచ్చమాంబ, ఆవుల  పిచ్చయ్య, సురమౌళి కథా సంపుటాలను వెలువరించారు. మరుగునపడ్డ తొలితరం తెలంగాణ కథల  సూచీ ‘దస్త్రమ్‌’ తీసుకొచ్చారు.  ఆంధ్రా కథకులతో పోలుస్తూ తెలంగాణ కథాచరిత్రను ‘కథాత్మ’ పేరిట వెలువరించారు. ‘తొలినాటి తెలంగాణ కథలు’, తెలుగు  యూనివర్సిటీ ‘నూరేండ్ల తెలుగు కథ’ పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం పరిశోధనలో భాగంగా తెలంగాణ పత్రికారంగ చరిత్ర ‘షబ్నవీస్‌’ని చిత్రికగట్టారు. ‘హైదరాబాద్‌ సిర్ఫ్‌హమారా’ పేరిట పుస్తకాన్ని రాశారు. సురవరం సమగ్ర కవిత్వం, తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి ‘రామప్ప రభస’ పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. సురమౌళి కథలు వెలుగులోకి తెచ్చారు. 1969-73 ఉద్యమ కవిత్వానికి, వట్టికోట ఆళ్వారుస్వామి జీవిత చరిత్ర ‘సార్థక జీవనం’కు సహసంపాదకత్వం వహించారు. 30కి పైగా పుస్తకాలను ‘కవిలె’ తెలంగాణ రీసెర్చ్‌ అండ్‌ రెఫరాల్‌ సెంటర్‌ తరపున అచ్చేశారు. తెలంగాణ హిస్టరీ సొసైటీ, సింగిడి, దస్కత్‌, బహుజన కథకుల కచ్చీరు తరపున అనేక కార్యక్రమాల నిర్వహణలో ప్రధాన భూమిక పోషించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం అభిమాన విషయాలుగా అనేక పరిశోధనా పత్రాల్ని, వ్యాసాల్ని వెలువరించారు. జోగిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల లైబ్రరీ సైన్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ దళిత చరిత్ర రాసే పనిలో ఉన్నారు.

1. మీరు కవిత్వం రాశారు. ఉద్యమాలు చేశారు. చివరికి సాహిత్య చరిత్ర పరిశోధనలోకి ఎలా వచ్చారు?

జవాబు: అవును.. 1980-84లో ఆ ప్రాంతంలో చాలా కవిత్వం రాశాను. శ్రీశ్రీని ఇమిటేట్‌ చేస్తూ. ‘స్నిగ్ధశ్రీ’ అనే కలం పేరుతో నేను రాసిన కవితలు పోతుకూచి సాంబశివరావు నడిపిన ‘విశ్వరచన’ పత్రికలో అచ్చయినయి. అందులో శబ్దాల పైనే ఎక్కువగా శ్రద్ధపెట్టిన. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానియంలో జరిగిన కవి సమ్మేళనానికి సీనియర్‌ దాశరథి ముఖ్య అతిథిగా వచ్చి నేను చదివిన కవితను మెచ్చుకోవడం ఓ తీపి జ్ఞాపకం.
ఇక ఉద్యమం – పరిశోధన రెండూ నా విషయంలో విడదీయలేనివి. 1990లో ఉస్మానియా విశ్వవిద్యాయంలో జర్నలిజం విద్యార్థిగా తెలంగాణ స్టూడెంట్‌ ఫ్రంట్‌ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే వాడిని. నిజానికి యూనివర్సిటీల్లో ఎన్నికలు నిషేధం విధించిన తర్వాత రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ సానుభూతి పరులు స్థాపించారు. ఈ సంఘం కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాను. ఈ దశలో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం (ఇప్పటికీ) బెస్ట్‌ స్టూడెంట్‌కు ‘షోయెబుల్లాఖాన్‌’ స్మారక అవార్డు ఇచ్చేవారు. ఆయనెవరు? అని ప్రొఫెసర్లని అడిగినా సరైన సమాధానం దొరకలేదు. దాంతో పరిశోధన మొదయ్యింది. మన మూలాలు తెలుసుకోవడం ప్రారంభమయింది.
నేను ఉస్మానియా జర్నలిజంలో ఎంఫిల్‌ మొదటి బ్యాచ్‌ విద్యార్థిని. ‘తెలంగాణాలో తెలుగు పత్రికలు’ అనే అంశంపై పరిశోధన చేసేందుకు నిర్ణయించుకొని అప్పటి మా గురువు ఇప్పటి మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్‌ని సంప్రదిస్తే ఆయన ‘తెలంగాణలో తెలుగు పత్రికలు ఎక్కడివి? పరిశోధన సాగదు’ అని నిరుత్సాహ పరిచిండు. అయినా నేను పట్టుబట్టడంతో ఒప్పుకున్నడు. ఇది 1992నాటి సంగతి. ఇగ అప్పటి నుంచి హైదరాబాద్‌ల ఎక్కడ పాత లైబ్రరీ ఉన్నా వెళ్ళి అక్కడి పాత పత్రికల జిరాక్స్‌ సేకరించడం. పరిశోధనలో భాగంగా అందులోని విషయాలని నోట్‌ చేసుకునే వాణ్ణి. ఇట్లా పత్రికల నుంచి సాహిత్యంలోకి వచ్చాను.
దాదాపు ఇదే కాలంలో ఆంధ్రా ప్రాంత సాహిత్యకారులు మళ్ళొక్కసారి తెలంగాణ తెలుగు కథ అనే అంశంపై అక్కడక్కడా చర్చలు చేశారు. ఇదే కాలంలో కథ సిరీస్‌ ప్రచురణ ప్రారంభమయింది. ఒక వైపు పాత పత్రికలను అధ్యయనం చేస్తూనే అందులో ఉన్న కథను ప్రత్యేకంగా నోట్‌ చేసుకున్నాను. ఇట్లా ప్రత్యేకంగా నోట్‌ చేసుకున్న కథల లిస్టు ‘దస్త్రమ్‌’ పేరిట 2005లో మెవరించాను. అలాగే అంతకుముందు పరిశోధన సమగ్రంగా ఉండాలనే తపనతో సేకరణకు, రచనకు ఎక్కువ సమయం పట్టింది. ఈ లోపు ఎంఫిల్‌ సబ్మిట్‌ చేయాల్సిన టైమ్‌ కూడా అయిపోయింది. దాంతో ఈ పరిశోధనను ‘షబ్నవీస్‌’ పేరిట ప్రచురించాను. ఇది 2004 నాటి సంగతి.
1995-96 ఆ ప్రాంతంలో ‘ఉదయం’ సహోద్యోగి, తెలుగు యూనివర్సిటీలో పరిశోధన చేస్తున్న కె.శ్రీనివాస్‌తో కలిసి హైదరాబాద్‌లో ఉన్న అన్ని గ్రంథాయాలను వడపోశాము. అనేక మంది వ్యక్తులను కలిశాము. ఇదే సమయంలో ‘కవిలె’ తెలంగాణ రీసెర్చ్‌ అండ్‌ రెఫరాల్‌ సెంటర్‌ని ఏర్పాటు చేశాము. దీని ప్రధానోద్దేశము అటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కావలసిన ముడి సరుకును అందించి, విస్మరణ, వివక్షకు గురైన విషయాల్ని వెలుగులోకి తీసుకురావడం. ఇప్పటి వరకు ఈ సంస్థ తరపున పది విలువైన సాహిత్య, చారిత్రక పరిశోధక పుస్తకాలు ప్రచురించాము.
అలాగే తెంగాణ సాంస్కృతిక వేదిక, ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం నిర్వహించిన సభల్లో పాల్గొనడమే గాకుండా ‘సోయి’ పత్రికలో రెగ్యులర్‌ విస్మరణకు గురైన విషయాల్ని చిత్రిక గట్టాను. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి తీసుకొచ్చిన ‘మత్తడి’కి కొంత ముడిసరుకునందించాను. ఇది తెలంగాణ సాహిత్య చరిత్రలో కొత్త చూపుకు పునాది వేసింది.

2. మీరొక బీసి.. పద్మశాలి. బీసిల గురించి మీరు చేసింది ఏమిటి?

జవాబు: తెలుగు సాహిత్యంలో నా అస్తిత్వాన్ని వెతుక్కుంటున్న దశలో సుద్దాల హనుమంతుపై జయధీర్‌ తిరుమలరావు రాసిన చిన్న పుస్తకం దొరికింది. ఆ తర్వాత అలిశెట్టి ప్రభాకర్‌, తర్వాతి కాలంలో కథకు బి.ఎస్‌.రాములు, ఆడెపు లక్ష్మీపతి, పి.చంద్‌ ఇట్లా… అవును, మన వాళ్ళు కూడా సాహిత్య రంగంలో ఉన్నారు కదా.. తెలుగు సాహిత్యంలో చేనేత కార్మికుల వెతల్ని, ఛిధ్రమౌతున్న బతుకుల్ని రికార్డు చేసిన కథల్ని త్వరలోనే మిత్రులతో కలిసి సంకనంగా తీసుకు రానున్నాము. నేను నా మూలాలను మరువలేదు. దాంట్లో భాగంగానే 18వ శతాబ్దంలోనే  దార్ల సుందరమ్మ రాసిన ‘భావలింగ శతకం’ను త్వరలో పుస్తకంగా ఆధునిక దృక్కోణంలో ఆమె స్థానాన్ని ఖరారు చేస్తూ తీసుకు వస్తున్నాం.
ఇక బీసీల గురించి మీరు ఏమి చేసిందేమిటని? నిజానికి తెలంగాణ సమాజం మరిచిపోయిన ‘కృష్ణస్వామి ముదిరాజ్‌’ని ముందుగా పరిచయం చేసింది నేను. సాయుధ పోరాటంలో స్వయంగా పాల్గొన్న సాహిత్యకారుడు ఆవుల పిచ్చయ్య కథల్ని అచ్చు రూపంలోకి తెచ్చాను. సోయి, తెలంగాణ టైమ్స్‌ పత్రికల్లో చాకలి ఐమ్మ, దొడ్డి కొమురయ్య, హకీం జనర్దానదాస్‌, సంగె లక్ష్మీబాయమ్మ, సరోజిని రేగాని, మల్యా దేవిప్రసాద్‌ యాదవ్‌, మరిపడగ బలరామాచార్య, గూడూరి సీతారామ్‌, డాక్టర్‌ మల్లన్న ఇట్లా కొన్ని వందలమంది బీసీల జీవిత చరిత్రను పాఠకులకు పరిచయం చేసిన. మేము కూడా చరిత్రకు ఎక్కదగ్గ వాళ్ళమే అని నొక్కి చెప్పిన.
ఫోరం ఫర్‌ కన్సర్న్‌డ్‌ బీసీస్‌ సంస్థను ఏర్పాటు చేసి బహుజనులకు వివిధ సాహిత్య, సామాజిక రంగాల్లో జరుగుతున్న అన్యాయాలను నిలదీస్తూ పత్రికా ముఖంగా అనేక వ్యాసాలు వెలువరించడమైంది.

3. ముఖ్యంగా బ్రాహ్మణుల గురించే ఎక్కువ పనిచేశారని బహుజనకారుల విమర్శ… 

–  ఇది కూడా అర్ధసత్యం. నేను నిజానికి ఎక్కువ పనిచేసిందీ, సమాచార సేకరణ కోసం ఎక్కువ కష్టపడ్డదీ దళితుల కోసం. ఎవ్వరికీ తెలియని తొలితరం దళితోద్యమకారుడు ‘వల్తాటి శేషయ్య’ను రంగం మీదికి తీసుకొచ్చాను. 1857-1956 మధ్య కాలంలో వందేండ్లలో తెలంగాణ సమాజంలో దళితుల్లో వచ్చిన మార్పును పుస్తకంగా ప్రచురించాల్సి ఉంది. ఆ పని జరుగుతోంది. భాగ్యరెడ్డి వర్మ, శ్యామ్‌సుందర్‌, బి.ఎస్‌. వెంకటరావు, సుమిత్రాదేవి, రామారావు, వెం. లక్ష్మయ్య, సదాక్ష్మి, శంకర్‌ దేవ్‌, ‘దళిత పదం’… ఇట్లా అనేక రచనల్ని పాఠకులకు అందుబాటులోకి తీసుకు రావడమయింది. అట్లనే తుర్రెబాజ్‌ఖాన్‌ పోరాటాలను, మహలఖాబాయి చందాను తెలుగు పాఠకులకు పరిచయం చేసింది కూడా నేనే నని గర్వంగా చెబుతున్నాను. 1857 పోరాటం- దాంట్లో ముస్లింల పాత్ర, రజకార్ల నెదిరించిన ముస్లింలు, షోయెబుల్లాఖాన్‌, ఇట్లా అనేక విషయాలపై రాసిన.
నేను ముస్లింల గురించి ఎక్కువగా రాయడానికి కారణం కళాశాలలో ఉద్యోగ సహచరులు. సంగారెడ్డి జూనియర్‌ కాలేజీలో ఉర్దూ మీడియం కూడా ఉండేది. అక్కడ అహ్మదుల్లా ఖురేషి, మహమూద్‌, నజీర్‌ లాంటి మిత్రులతో ఎప్పుడూ బైస్‌ నడిచేది. హైదరాబాద్‌-ముస్లింలకు సంబంధించిన అనేక విషయాలు మా మధ్య చర్చకు వచ్చేవి. మంచి, చెడూ కూడా. కృష్ణస్వామి ముదిరాజ్‌ ‘పిక్టోరియల్‌ హైదరాబాద్‌’,  షీలారాజ్‌ రాసిన ‘మీడివలిజమ్‌ టూ మాడర్నిజం’, రత్నా నాయుడు రాసిన ‘ఓల్డ్‌ సిటీస్‌ న్యూ ప్రిడక్‌మెంట్స్‌’ చదివిన తరవాత ఆలోచనల్లో మార్పు వచ్చింది. నిజాం పట్ల నిష్పాక్షికంగా తెలుసుకోవాల్సిన విషయాలున్నాయని అర్థమయింది. దావూద్‌ అష్రఫ్‌ పుస్తకాలు కొత్త నిజాం చరిత్రలో కొత్త వెలుగులో నింపాయి. ఇవన్నీ ముస్లిం పట్ల ప్రేమను మరింతగా పెంచాయి.
ఆళ్వారుస్వామి, సురమౌళిలను కేవలం బ్రాహ్మణులుగా చూసినట్లయితే తెలంగాణ చరిత్రకు అన్యాయం జరుగుతది. వాళ్ళు తమ జీవితకాలంలోనే ‘డీకాస్టిఫై’ అయ్యిండ్రు. అట్లనే సురమౌళి అయితే కులనిర్మూన సంఘమే పెట్టిండు.
రాయసీమ, ఉత్తరాంధ్ర అంటే కూడా నాకు ప్రత్యేకమైన అభిమానం. ఉత్తరాంద్ర వాళ్ళు కూడా వలసాధిపత్యంలో వనరులు కోల్పోయారు. దాంతో పాటు సంస్కృతి, భాష కూడా కొల్లగొట్టబడింది. ముఖ్యంగా తాపీ ధర్మారావు లాంటి సాహిత్యకారులకు తగినంత గుర్తింపు రాలేదు. అట్లా రావాలని నేను మాట్లాడాను. అట్లనే రాయలసీమ తొలి కథ గాడిచర్ల హరిసర్వోత్తమరావుది బయటపెట్టి వాళ్ళ కథా చరిత్రను ఇంకొంచెం ముందుకు జరిపాను. ఆ తర్వాత పరిశోధనల్లో అది మరింత ముందుకు వెళ్ళింది. ఈ పరిశోధన చేస్తున్న మిత్రులందరికీ అండగా ఉన్నాను. కథా సాహిత్యంపై పరిశోదన చేస్తున్న వారికి మా ‘కవిలె’ సంస్థ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నది.

4. ‘సింగిడి’తో అనుబంధం గురించి చెప్పండి…

– తెలంగాణ రచయిత వేదిక నిష్క్రియా పరత్వంలోకి జారిపోయిన సందర్భమే గాకుండా దళిత, బహుజనులకు ఆ సంస్థలో తగిన గౌరవం, గుర్తింపు దక్కక పోవడం, పుస్తకాల ప్రచురణ, పత్రికా నిర్వహణలోనూ సమాజంలో మెజారిటీగా ఉన్న వారిని విస్మరించడం బాదేసింది. దీంతో కొంత మంది ‘లైక్‌మైండెడ్‌’ మిత్రులము కలిసి ఈ ‘సింగిడి’ తెంగాణ రచయితల సంఘాన్ని 2008లో స్థాపించాము. నాతో పాటుగా సుంకిరెడ్డి నారాయణరెడ్డి, స్కైబాబ, పసునూరి రవీందర్‌, జిలుకర శ్రీనివాస్‌, సిలువేరు హరినాథ్‌, ఏలేశ్వరం నాగభూషణాచార్య తదితరులున్నారు. శ్రీకృష్ణ కమిటీ ముందు ఏడుగురం సభ్యులము భిన్న సామాజిక వర్గాకు ప్రాతినిధ్యం వహిస్తూ మా వాదనను వినిపించాం. నిజానికి మొత్తం తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాల వాణిని వాళ్ళు ఒక్క దగ్గర విన్నది ఆ ఒక్కసారే అంటే అతిశయోక్తి కాదు. ఆ కమిటీ వాళ్ళు అన్యాయం చేస్తే ‘ఛీ కృష్ణ కమిటీ’ పేరిట వారి భంఢారాన్ని, తప్పుడు నిర్ధారణను తిప్పి కొట్టడం జరిగింది.
1969-73 ఉద్యమ కవిత్వాన్ని, విగ్రహాల కూల్చివేతను సమర్ధిస్తూ వ్యాస సంకలనం ‘బర్మార్‌’ ఇట్లా చాలా పుస్తకాలను ‘సింగిడి’ తరపున వెలువరించాం. సాహిత్యకారులకు అంతవరకు తెలియని ఎన్నో చీకటి కోణాలను ఆవిష్కరించడమైంది.. తెలంగాణ ఆవిర్భావ సందర్భంలోనే బహుజనులకు తక్షణం ఏం కావాలో వివరిస్తూ ‘సింగిడి ఎజెండా’ పుస్తకంగా వెలువరించాం. రాజకీయాలకు అతీతంగా నిర్భయంగా, నిష్పాక్షికంగా సమాజంలోని మెజారిటీ వర్గాలైన బహుజనుల అభ్యున్నతి కోసం ఈ సంస్థ పనిచేస్తున్నది.
    5. సాహిత్య చరిత్ర, పరిశోధనల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ?
– ఇన్నేండ్లు తెలంగాణ చరిత్రకు, సాహిత్యానికి ఆంధ్రా సాహితీవేత్తలు సరైన గౌరవం ఇవ్వలేదని వాళ్ళను నిందిస్తూ వచ్చాం. ఇప్పుడు వాళ్ళని నిందించడం గాకుండా మన చరిత్రను మనం వినిర్మించుకోవాలి. పునాదులతో సహా దళిత, బహుజన, ముస్లిం, ఆదివాసీ, మహిళా చైతన్యంతో తెలంగాణ సాంస్కృతిక ప్రతీకలను నిర్మించుకోవాలి. విస్మరణకు గురైన వ్యక్తులను, సాహిత్యాన్ని ప్రయత్న పూర్వకంగా వెలుగులోకి తేవాలి. తెలుగు విశ్వవిద్యాలయంలో పరిశోధన, ప్రచురణ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఈ పనిని యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన అవసరముంది.
దున్న ఇద్దాసు, దైదవేము దేవేందరన, సుద్దాల హనుమంతు, ఆళ్వారుస్వామి, సురవరం, మహలఖా యిచాందా, ఇట్లా కొన్ని వందల పేర్లు చెప్పొచ్చు. వాళ్ళందరి రచలను పుస్తక రూపంలో సమగ్రంగా రావాలి. అంతేగాకుండా కేవలం పత్రికల్లోనే ఉన్నటువంటి రచనలను కూడా సేకరించి అచ్చువేయాలి. ఈ పనిని ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. లేదంటే అవి కూడా లుప్తమై పోయే అవకాశముంది. అంతేగాకుండా వివిధ విశ్వవిద్యాయాల్లో వివిధ విభాగాల్లో జరిగే పరిశోధనల్లో సమన్వయం ఉండాలి. తెలుగు విభాగం, చరిత్ర విభాగం ఒకే అంశంపై పరిశోధన చేయకుండా చూడాలి. వీటి మధ్యన సహకారం ఉన్నట్లయితే మరింత మెరుగైన పరిశోధనలు వచ్చే అవకాశముంటుంది. అచ్చుకు యోగ్యమైన పరిశోధన ఫలితాలను ఒక కమిటీ ద్వారా పరీక్షింపజేసి ప్రభుత్వమే అచ్చేయాలి. అప్పుడే ప్రజలకు విషయాలు తెలుస్తాయి.
ప్రభుత్వం చరిత్ర నిర్మాణ సంఘాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా రాగద్వేషాలకు అతీతంగా ప్రామాణికమైన తెలంగాణ ప్రజల చరిత్రను రచింపజేయాలి. సాహిత్య కారులు వివిధ ప్రక్రియల్లో వెలువరించే పుస్తకాలకు కేరళ రాష్ట్రం మాదిరిగా వాటిని అచ్చేసేందుకు ఆర్థికంగా అండగా నిలవాలి. తెలంగాణలోని తెలుగు, ఉర్దూ భాషల్లోని క్లాసిక్స్‌ని ఇంగ్లీషులోకి తర్జుమా చేయించాలి.
పుస్తక ప్రచురణకు, ప్రాచుర్యానికి ప్రభుత్వం, గ్రంథాలయాలు  అండగా ఉండేలా చర్యలు చేపట్టాలి.

*

ఒక్క శ్వాస

 

 

 

– ధనుష్ లక్కరాజు                                                తెలుగు: కొల్లూరి సోమ శంకర్

~

కిటికీలోంచి ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చిన చల్లటిగాలి నన్ను తాకి, మేల్కొలిపింది. చల్లటి వాతావరణంలో తెల్లవారుజామున అయిదు గంటల సమయంలో వీచే చలిగాలులు ఏమంత ఆహ్లాదంగా ఉండవు. ఓ శీతల పవనం నన్ను నిలువెల్లా వణికించడంతో లేచి కూర్చున్నాను. ఓడ కుదుపులు తెలుస్తున్నాయి. ఈ కుదుపులు చాలామందిలో వాంతులకు కారణమవుతాయి, కానీ చిరపరిచితమైన కారణంగా నాకు మాత్రం ఆ భావన కలగడం లేదు. ఏదో చైతన్యం నన్ను నిలువెల్లా ఆవరించింది, కానీ నా మనసు మాత్రం అంతఃశ్చేతన కల్పించిన ఓ భ్రమలో ఉండి ప్రశాంతంగా ఉంది. ఒక్కసారిగా లేచి నిలుచున్నాను. గచ్చంతా చల్లగా ఉంది; మంచుకొండ మీద నిలుచున్నట్లుంది. నెమ్మదిగా కిటికి వైపు కదిలాను, పై నుంచి కురుస్తున్న మంచు బిందువులను చూడసాగాను. అదో అద్భుతమైన దృశ్యం, వణికించే అనుభవం.

కిటికి మూసేసాను, అయినా ఆ దృశ్యంపైనే కొన్ని క్షణాలపాటు దృష్టి నిలిపాను. నా శరీర ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయింది. కాస్తంత తాజా గాలి వస్తుందని నేనే తెరిచానా కిటికిని నిన్న రాత్రి. అయితే ఈ అనుకోని అతిథి నన్ను పలకరిస్తాడని ఊహించలేదు. అక్కడ్నించి కదిలి వెళ్ళి నా మంచం మీద కూర్చున్నాను. బద్దకాన్ని వదిలించుకునేందుకు కాళ్ళు చేతులు సాగదీసి, గట్టిగా ఆవులించాను. ఇవాళ నాకెంతో విశేషమైన రోజు. గడ్డకట్టిన శరీరావయవాలతో, పడుతూ లేస్తూ పక్కగదిలోకి నడిచాను. అక్కడున్న సోఫావైపు అడుగులేసి, నేను ధరించిన దుస్తులని బిగుతు చేసుకుంటూ సౌకర్యంగా సోఫాలో కూలబడ్డాను.

నా మేనేజర్, నా చిరకాల మిత్రుడు, ఎప్పుడో నిద్ర లేచి కాఫీ తాగుతున్నాడక్కడ. నా పక్కకొచ్చి కూర్చున్నాడు.

“గుడ్ మార్నింగ్ స్టీవ్” అని గొణిగాను. ఆ నిరుత్సాహపూరితమైన వాతావరణంలో ఏదో ఉత్తేజం కలిగించాలని విశాలంగా నవ్వాను.

స్టీవ్ నాకేసి చూస్తూ మొక్కుబడిగా నవ్వాడు, ఉత్సాహంగా ఉన్నట్లు నటిస్తూ, “ఈ ఉదయం నీకెలా ఉంది?” అని అడిగాడు.

కాని నాకర్థమైంది. అతను చాలా ఉద్విగ్నంగా ఉన్నాడు. కాబిన్‌లో అందరిలానే మృత్యువంటే భయపడుతున్నాడు. నేను నీట మునిగిపోతాననే భయం, నేనెన్నటికి పైకి రాలేనేమోనన్న భయం కాబిన్ అంతా వ్యాపించింది.

నేనొక ప్రొఫెషనల్ స్క్యూబా డైవర్‌ని, అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్‌ని. భూమి మీద అతి పెద్ద మానవ వైజ్ఞానిక సాహసయాత్రకి సంబంధించిన ఒప్పందంపై ఇటీవలే సంతకం చేశాను. దానిలో భాగంగా భూమిపై అత్యంత లోతైన అగడ్త అయిన “మరియానా ట్రెంచ్”లోకి నేను దూకాలి. అక్కడ ఒత్తిడి ఎంతో తీవ్రంగా ఉంటుంది. పూర్తిగా అనావిష్కృతమైన వాతావరణం! వెళ్ళగలిగినంత దూరం నేను వెళ్ళాలని; అడుగుపొర వరకూ (కనీసం మధ్య వరకూనైనా) చేరాలని నిర్ణయమైంది. నా శరీరానికి అమర్చే సెన్సార్ల ద్వారా శరీరంలోపలా, బయటా ఏం జరుగుతున్నా – మధ్య పసిఫిక్ ప్రాంతానికి నేను ప్రయాణిస్తున్న ‘అడిలైడ్’ అనే ఓడ డెక్ పైన ఉండే మానిటర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.

ఎక్కడ తప్పు జరగవచ్చో ఎవరూ ఊహించలేకపోతున్నారు. కానీ చాలా మందికి తెలుసు – ఇది ఒక వైపు ప్రయాణమేనని! ఓ స్నేహితుడిని, కొడుకుని, పరిచయస్తుడిని, బంధువుని పోగొట్టుకుంటామేమోనని అందరూ భయపడుతున్నారు. నా గురించి నాకన్నా ఎక్కువగా భయపడుతున్నారు. నేనెలా ఉండాలని ప్రపంచం అనుకుందో, అలాగే ఉన్నాను. వాళ్ళకి నేను “అందమైన, యువ సాహసిని, లోతైన సముద్రాల అన్వేషిని, సముద్ర శాస్త్రవేత్తలకు కొత్త ఆప్తమిత్రుడిని” అని ఓ పత్రిక రాస్తే, మరో పత్రిక ఇంకో అడుగు ముందుకేసి, “విజ్ఞానశాస్త్రం కోసం జీవితాన్ని ధారపోస్తున్న సముద్రాన్వేషి” అని పేర్కొంది. నిజానికి సైన్స్ కోసమంటే, నేను ఏ ప్రాజెక్ట్‌నయినా ఒప్పేసుకుంటాను. నిజానికి – సముద్రపు లోతుల్లో నన్ను నేను తెలుసుకోడానికే ఈ ప్రాజెక్టు ఒప్పుకున్నాను. ఆలోచనల్లోంచి బయటపడి ఒళ్ళు విరుచుకున్నాను. బాహ్యపరిసరాలకు తగ్గట్టుగా నా హైపోథలమస్ నా శరీర ఉష్ణోగ్రతని సవరించింది.

“మనం ఇంకా చేరలేదా?” అడిగాను మేనేజర్‌ని, బార్ కౌంటర్ వద్ద కొత్తగా అమర్చిన కాఫీమెషిన్ వైపు నడుస్తూ

“లేదు… లెఫ్టినెంట్ ఉర్కెల్ ప్రకారం మనం అక్కడికి చేరడానికి కనీసం ఇంకో రెండు గంటలు పట్టచ్చు. నువ్వు విని ఉండకపోతే, మళ్ళీ అడుగుదాం..” అంటూ అతనేదో చెప్పబోతుంటే – మధ్యలో జోక్యం చేసుకుంటూ – “మా ఇంటికి ఫోన్ చేసి కనెక్షన్ ఇస్తావా? ఒకసారి…. బహుశా ఆఖరిసారి వాళ్ళతో మాట్లాడాలని అనిపిస్తోంది!” అన్నాను. నాలో ఏదో నిరాశాభావం!

అపరాధభావంతో చూస్తూ, “అలాగే…” అన్నాడు.

తన శాటిలైట్ ఫోన్ నుంచి మా ఇంటికి ఫోన్ చేశాడు. అక్కడ చాలాసార్లు మ్రోగుతోంది కాని ఎవరూ ఫోన్ తీయడం లేదు. ఎంత అత్యాధునికమైన పరికరాలు ఉన్నా, టైమ్ జోన్స్ ఎప్పటికీ సమస్యే.

అతను ఏదైనా మాట్లాడడానికి ముందే, “సరే అయితే, నేను వెళ్ళి సిద్ధమవుతాను..” అన్నాను

ఓ చిరునవ్వు నవ్వి, నా గది వైపు కదిలాను. గదిలోకి వెళ్ళి తలుపు మూసాను. తలుపుని ఆనుకుని నిలుచున్నాను. సముద్రపు నీటికన్నా ఉప్పనైన ఓ కన్నీటి చుక్క నా బుగ్గలమీదకి జారింది. హాస్యాస్పదం కదూ! కన్నీరు కార్చాల్సిన అవసరమే లేదు. మృత్యుభయం నన్ను ఆవహించే లోపే ప్రత్యేకంగా రూపొందించిన డైవింగ్ సూట్ బయటకి తీసి, మంచం మీద ఉంచాను. ఎటువంటి ఒత్తిడినైనా తట్టుకునేలా సుప్రసిద్ధ కంపెనీ ‘టీమ్ స్పిరిట్’ తయారు చేసిందా సూట్‌ని. నేను ధరించిన బట్టలు విడిచి, శరీరానికి సెన్సార్లు, వైర్లు తగిలించుకున్నాను. తరువాత ఆ బరువైన డైవింగ్ సూట్‌ని ధరించాను.

ఇరవై లీటర్ల ఆక్సీజన్ సిలిండర్లు నాలుగు, పీడన వాయువుల సిలిండర్లు చిన్నవి రెండు నా వీపుకి తగిలించుకోవాలి. ఇవి నా దిశలను మార్చుకోడానికి, తేలే శక్తిని కాపాడుకోడానికి అవసరం. సూట్ ధరించాకా, నౌకా సిబ్బందిలో ఒకడైన గ్యారీని పిలిచి, సిలిండర్లను తగిలించుకోడంలో సాయం చేయమన్నాను. ఓడ కదలడం ఆగిపోయిందని తెలుస్తోంది. నేను సన్నద్ధమయ్యాను. బ్రహ్మాండమైన ఆ ఓడ డెక్ మీదకు నడిచాను. అక్కడ నా కోసం కెప్టెన్, మానేజర్‌తో సహా సిబ్బంది అందరూ ఎదురుచూస్తున్నారు.

“వచ్చేసామన్న మాట” అన్నాను గట్టిగా.

కానీ నా మాటలు అక్కడ ఎవరికీ వినిపించలేదు. హోరున వీస్తున్న పసిఫిక్ గాలులు – గత పదిహేను సంవత్సరాలుగా కలిసి పని చేస్తున్న వ్యక్తులకు నా చివరి మాటలు వినబడకుండా చేశాయి. బరువైన దుస్తులు, చేతిలో హెల్మెట్‌తో వాళ్ళవైపు నడిచాను. కెప్టెన్ ఉద్వేగంతో నన్ను గట్టిగా హత్తుకున్నాడు.

“మిత్రమా, నీకు ఇరవై గంటల పాటు సరిపోయే ఆక్సీజన్ అందుబాటులో ఉంది.. ఒక వేళ నువ్వు వెనక్కి వచ్చేయదలచుకుంటే ఎనిమిది గంటల ముందు ఆగిపోయి, అక్కడే.. సముద్రతలంలోని ఓ గుట్ట మీదో లేదంటే ఏ కొండచరియ మీదో నిల్చో. సముద్రంలో ఈ భాగం… చాలా వరకు అనావిష్కృతంగానే ఉంది.. అందుకని ఈ ఆయుధం ఉంచుకో..” అంటూ ఓ తుపాకీ లాంటి యంత్రాన్ని నా చేతిలో ఉంచాడు. దానితో పాటు పది మిల్లీ లీటర్ల ట్రాంక్విలైజర్ సీసాలు నాలుగు ఉన్నాయి.

“ఒక్కో సీసా – నీకు ప్రమాదం కలిగించే జీవిని అరగంట నుంచి గంట వరకు మత్తులో ఉంచుతుంది. వీటిని తక్కువ మోతాదులో ఎందుకు ఇస్తున్నామంటే – సొరచేపలు గానీ, ఇతర సముద్రజీవులు గానీ ఈదడం మానేస్తే మునిగిపోతాయి. ఈ సాహసయాత్రలో ప్రాణనష్టం జరగడం మంచిది కాదు…”

నేను అతని కళ్ళలోకి చూసాను. కనుబొమలు ముడిచాను. ఇలా మాట్లాడినందుకు ఆయన బహుశా తనని తానే కొద్దిగా అసహ్యించుకుంటున్నాడేమో. నా జీవితం ఎలాగూ ప్రమాదంలో ఉంది, అందువల్ల ఆ మాటలు కొద్దిగా వ్యంగ్యంగా అనిపించాయి. ఆ సీసాల్ని జేబులో పెట్టుకుని జిప్ వేసేశాను. స్టీవ్ వైపు నడిచి, అతడిని హత్తుకున్నాను. “నేను తిరిగొస్తానని వాళ్ళకి చెప్పు” అని అతని చెవిలో గొణిగాను. అతను నాకేసి మౌనంగా చూస్తూండిపోతే, కన్ను గీటాను.

హెల్మెట్ బిగించుకున్నాను, బెల్ట్‌ బిగుతు చేసుకున్నాను. మరి ఇక ఆలస్యం చేయకుండా సముద్రంలోకి దూకేశాను.

అప్పుడు సమయం ఉదయం 5 గంటల 45 నిమిషాలు.

ఉత్తరపుగాలుల ప్రకోపం వలె నీళ్ళు మరీ చల్లగా ఉన్నాయి. ఏదో తెలియని అనిశ్చితి, భయం, సాహసకృత్యం చేయబోతున్నాననే ఉత్సాహం నాలో కలిగాయి. కొన్ని క్షణాల పాటు చూపు మసకగా ఉన్నా, సముద్రాంతర భాగాలపైకి దృష్టి సారించాను. దిగువన సముద్రంలోని విశాలమైన, అందమైన దృశ్యాలను చూస్తుంటే… సముద్రానికి ఎగువన ఉన్న జీవితం సూక్ష్మమైనదిగా అనిపిస్తుంది.

నీలం! నీళ్ళలోకి దూకిన కాసేపటి వరకూ నా కళ్ళు గ్రహించినది ఇదే! ఆక్వా బ్లూ! ఇంతలో హఠాత్తుగా నా కర్తవ్యం గుర్తొచ్చింది.

అన్ని అవయవాలను సవరించుకుని, అంతులేని అంధకారపు అగాధంలోకి జారసాగాను. కాళ్ళను వేగంగా కదిపాను. జలదృశ్యం వైపు ఈదసాగాను.

క్రమక్రమంగా… ఉదయించే సూర్యుడి కిరణాల గుండా సాగరం నాకు తనలోని జీవరాశులను చూపించసాగింది. నేను వెంటనే నా హై రెజల్యూషన్ వాటర్ రెసిస్టెంట్ కెమెరాని ఆన్ చేశాను. పసుపుపచ్చ రంగులో మెరిసిపోతున్న జల్లిచేపలు పైపైకి చేరాలని ప్రయత్నించడం కనిపించింది. వాటి మీసాలు మెడుసా కేశాల్లా పొడవుగా ఉన్నాయి, చేపలు పైకి ఈదాలని ప్రయత్నిస్తున్నడప్పుడల్లా అవి మెలి తిరుగుతున్నాయి. అయితే వాటి స్థితిలో మాత్రం మార్పు లేదు. బలిష్ఠమైన చేపలెన్నో నా పక్కనుంచి ఈదుతున్నాయి. కొన్ని నన్ను ఢీకొట్టాయి, మరికొన్ని – జలాంతర్గత నగరంలో తీరికలేని పాదచారుల్లా – నన్ను పట్టించుకోలేదు. తమ పనులలో నిమగ్నమైపోయి, తమలోకంలోకి వచ్చిన ఈ అన్యజీవిని అవి గుర్తించలేదు. దాదాపు 100 అడుగుల మందాన పేరుకుపోయిన సముద్రపు పాచిని చూసాను. నీటి ప్రవాహంతో పాటు అదే దిశలో కదులుతోంది అది. పాచి ఉందంటే, అడుగున ఎక్కడో రాతి గుట్ట ఉంటుంది. ఈ అనంతమైన నీలి జలరాశి మధ్య నేనెంత అల్పుడనో అర్థమైంది, ఎంత అణఁకువగా ఉండాలో తెలిసింది.

పసిఫిక్ మహాసముద్రంలో అంతగా లోతు లేని ఈ ప్రాంతంలో తీరికగా రెండు గంటలపాటు సముద్రపు అందాలని ఆస్వాదిస్తూ గడిపాను. ఇంక లోతులకి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. ఏం జరిగినా సరే, సంయమనం కోల్పోకూడదు, కంగారు పడకూడదు అని నిర్ణయించుకున్నాను. ఆక్సీజన్‌ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. గబగబా లెక్కలు కట్టాను. ఇప్పటికే ఒక సిలిండర్‌లో ఐదో వంతు ఉపయోగించేశాని అర్థమైంది. గట్టిగా తల విదిల్చి, నా విధిని అనుసరించాను. లోపల మరింత చీకటిగా మారుతుంది. మల్టీపర్పస్ డివైజ్‌ని చెక్ చేశాను. సముద్ర ఉపరితలానికి 300 మీటర్ల దిగువన ఉన్నాను. మరియానా ట్రెంచ్ సముద్రమట్టానికి 10,810 మీటర్ల అడుగున ఉంది. నేను అంత దూరానికి – మరియానా ట్రెంచ్ అట్టడుగు ప్రాంతానికి వెళ్ళకపోయినా (అది అసాధ్యం, సాధ్యమైతే మాత్రం అద్భుతమే) – 2000 నుంచి 2500 మీటర్ల లోతుకి వెళ్ళగలను. అసలైన మరియానా ట్రెంచ్ ప్రస్తుతం నేనున్న చోటుకి ఇంకో 2 కిలోమీటర్ల అడుగున ఉంటుంది.

ఏదో తేడాగా అనిపిస్తుంది. సముద్రం అసాధరణంగా చాలా ప్రశాంతంగా ఉంది. అండర్‌వాటర్ డైవింగ్‌లో నాకున్న విశేష అనుభవం దృష్ట్యా… అది ప్రమాదానికి సూచన అని గ్రహించాను. ఉత్పాతానికి ముందుండే ప్రశాంతత అది అని నాకు తెలుసు.

కొద్ది దూరంలో ఓ చిన్న ప్రాణి యొక్క నీడ కనబడింది. దాని ముందు భాగం నల్లగానూ, వెనుక భాగం వెండి రంగులో ఉంది. తూరమీను? బహుశా కాదేమో! అదేంటే నాకు అర్థమయ్యేసరికి ఓ భారీ జీవి నా వెనుక నిలిచింది. సుగ సుర జాతికి (Carcharhinus falciformis) చెందిన సొరచేప. పసిఫిక్ సముద్రం వీటి సహజావాసం. అది బాగా అనుకరిస్తుంది, పైగా దాని భారీ పరిమాణం మానవులకి ప్రమాదకరం.

మానవులకి ప్రమాదకరమైనది అదొకటే కాదు. రెండో ఆలోచన లేకుండా మరింత లోతుకి ఈదసాగాను. ఈదుతూనే నా జేబు తెరిచి, ట్రాంక్విలై‌జర్లు బయటకి తీసాను. నీటిలో మరింత లోతుకు దూసుకుపోతు, జేబు జిప్ మూసేశాను. ఈతలో కొద్దిగా పట్టు జారేసరికి, ట్రాంక్విలైజర్లు జారిపోయాయి. ఎలాగొలా రెండు సీసాల్ని చేజిక్కించుకోగలిగాను. మిగతా రెండు సీసాల కోసం ప్రయత్నించే అంత బలం, వెనక్కి తిరిగి చూసేంత ధైర్యం నాకు లేకపోయాయి. నాకు తెలిసిందల్లా నా వెనుకగా సోకుతున్న సొరచేప ప్రకంపనాలే! వాసనని అనుసరిస్తూ అది నా వెనుకే వస్తోంది. సాగరం దానికి అనుకూలం కావడంతో నేను దాని నుంచి తప్పించుకుని ఎక్కువ దూరం పోలేను. దానికి మత్తు ఇవ్వడమే ఉత్తమం. తుపాకీలో ఇంజక్షన్ లోడ్ చేసి వెనక్కి తిరిగాను. అంతే! 346 కిలోల భారీ ప్రాణి నా ఎదురుగా ఉంది. నేను ఊపిరి పీల్చుకునేలోపు, అది నా చేతిని పట్టుకుంది.

నేను భయంలో బిగుసుకుపోయాను, నిస్సహాయుడనయ్యాను. నా చెయ్యి తెగిపోతోంది. దాని పదునైన దంతాలు నా చేతిలోకి గుచ్చుకుపోతున్నాయి. చేతిని విదిలించుకోడానికి గట్టిగా ప్రయత్నించాను. చిక్కటి రక్తం బయటకొచ్చింది. నేనున్న ప్రాంతంలో నీలి రంగు కాస్తా మాజెంటా రంగులోకి మారింది. భరించలేని నొప్పి నా వెన్నంతా పాకింది. అసంకల్పిత ప్రతీకారచర్యగా నేను నా చేతిలో ఉన్న ఇంజెక్షన్‌ని దాని వెనుక భాగంలో గుచ్చాను. అఘాతపు ప్రభావాన్ని తగ్గించుకునేందుకు మరింత క్రిందకి జారడానికి ప్రయత్నించాను. అది అక్కడితో ఆగలేదు, నా వెనుకే నీటిని చీల్చుకుంటూ వేగంగా వస్తోంది. నా వీపు పై ఉన్న సిలిండర్లను లక్ష్యంగా చేసుకుంది. నేను వెనక్కి తిరిగి తాను పొట్ట మీద వీలైనంత గట్టిగా తన్నాను. ఈ క్రమంలో నా సిలిండర్ స్టాండ్ విడిపోయింది, నా సూట్ చిరిగిపోయింది. సిలిండర్లు స్టాండ్ నుంచి ఊడిపోయి పైకి తేలసాగాయి.

ఉన్నట్లుండి అధిక పీడనం వల్ల నా వీపు మీద భారం పెరిగిపోయింది. వెనక్కి తిరిగి సొరచేప వైపు చూసాను. ట్రాంక్విలై‌జర్ ప్రభావం చూపుతోంది. గురుత్వాకర్షణకి దారిచ్చాను. ఈ సంఘటనని పైన మా వాళ్ళు చూసి ఉంటారు, లేదా చూసుంటారని ఆశించాను. నా ఈ దుస్థితికి కారణమైన ప్రదేశానికి చేరాలని ప్రయత్నిస్తుంటే ఊపిరి అందడం లేదు. ఊపిరితిత్తులు నిండిపోయానని, గట్టిగా దగ్గి నీళ్ళని బయటకి తెద్దామని చూసాను. అధిక పీడనం వల్ల నా రక్తనాళాలు చిట్లిపోతాయని అనిపించింది. తెగిన చేతి నుంచి రక్తం ధారపాతంగా కారుతూనే ఉంది. రక్తం వాసన గ్రహిస్తే, మరికొన్ని సొరచేపలు నా మీద దాడి చేయడం ఖాయం.

నాకున్న అతి కొద్ది సమయంలోనే, నా మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఇక నాకు చావు తప్పదా? నేను దేని కోసం జీవించాను? ఏం సాధించాను? అసలు నేనెందుకు చావాలి? నా జీవితంలో నేను ఎక్కవగా ఏం కోరుకున్నాను? ఇవన్నీ అలా ఉంచితే, ప్రస్తుతం నాకు కావల్సింది ఒక్క శ్వాస! ఒక్క శ్వాస నాక్కావాలి. పైకి చేరేందుకు, కుటుంబాన్ని కలిసేందుకు, మరణాన్ని తప్పించుకునేందుకు – ఒక్క బలమైన శ్వాస కావాలి. గాయపడిన నా శరీరం ఏదో గట్టి రాయికి కొట్టుకుంది, దాంతో వీపు నొప్పి మరింత అధికమైంది. ఇంతలో నాకేదో ఆలోచన స్ఫురించింది. మంగోలియన్ గడ్డి మైదానాలలో నేను నల్ల గుర్రమెక్కి తిరుగుతున్న భావన నన్ను వణికించింది. ఈ వైజ్ఞానిక సాహసయాత్ర ద్వారా పొందే మిలియన్ డాలర్లు నాకు అక్కర్లేదు, పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు, నా కుటుంబాన్ని ఆఖరిసారి మాత్రమే చూడాలనుకోవడం లేదు. గడ్డి మైదానాలలో గుర్రమెక్కి తిరగాలనుకోవడం లేదు. నా అవయవాలన్నీ తెగిపోయినా పర్వాలేదు, సొరచేప నన్ను తినేసినా పర్వాలేదు, నేను బ్రతకకపోయినా పర్వాలేదు…. కానీ ప్రస్తుతం నాక్కావలసింది మాత్రం ఒకే ఒక్క శ్వాస! ఓ జంతువు ఎలా ఊపిరి తీసుకుంటుందో, నేనూ అలాగే శ్వాస తీసుకోవాలనుకుంటున్నాను. మనిషి కూడా జంతువే కదా! నన్ను మగత కమ్మేస్తోంది. నీలి రంగు నీళ్ళు నల్లగా మారుతున్నాయి. పైకి లేవాలనుకున్నాను, కాని లేవలేకపోయాను. కాసేపటికే… నా ఆలోచనల్ని శుభ్రం చేసిందుకో, నా పాపాల్ని తొలగించేందుకో… నన్ను చీకటి కమ్మేసింది. నేనిప్పుడు ‘అందమైన, యువ సాహసిని, లోతైన సముద్రాల అన్వేషిని, సముద్ర శాస్త్రవేత్తలకు కొత్త ఆప్తమిత్రుడిని’ కాను, ‘విజ్ఞానశాస్త్రం కోసం జీవితాన్ని ధారపోస్తున్న సముద్రాన్వేషిని’ అసలే కాను; శ్వాస కోసం పరితపిస్తున్న ఓ సాధారణ మానవుడిని. మృత్యుదేవతకి ఎవరైనా ఒకటే!

కాసేపటికే నాకు స్పృహ తప్పింది. మళ్ళీ నాకు స్పృహ వచ్చాకా తెలిసింది – నేను మా ఓడ అడిలైడ్ డెక్ మీద ఉన్నాననీ; మా లెఫ్టినెంట్ నా చాతీఎముకని ఒత్తుతున్నాడనీ. నా చేతి గాయానికి బ్యాండ్ ఎయిడ్ వేసి ఉంది, నాకు ఇన్సులిన్ ఎక్కిస్తున్నారు. నేను గట్టిగా దగ్గి, నీళ్ళని కక్కాను. దీర్ఘ శ్వాస తీసుకున్నాను. “అమ్మయ్య! నువ్వు ఊపిరి తీసుకోగలిగినందుకు నాకెంతో సంతోషంగా ఉంది” అంటూ కెప్టెన్ అరిచాడు.

నేను చిన్నగా నవ్వి, “నాక్కూడా” అని గొణిగాను.

సముద్రంలోని నీటిని చూస్తూ, “నేను మత్తు మందు ఇచ్చిన ఆ సొరచేప క్షేమంగానే ఉండి ఉంటుంది కదా…” అన్నాను.

కళ్ళ నుండి నీళ్ళు జారుతుంటే… కెప్టెన్ ముసిముసిగా నవ్వాడు.

(సమాప్తం)

 

 

మూలకథ “Breath” అనే పేరుతో మ్యూస్ ఇండియా డాట్ కామ్ అనే వెబ్‌సైట్ లో(మే – జూన్ 2016 సంచిక) ప్రచురితమయ్యింది.

మూలకథని ఈ లింక్‌లో చదవవచ్చు.

http://museindia.com/regularcontent.asp?issid=67&id=6555

సూఫీ- సంత్ సంవాద కేళి

 

 

-అవ్వారి నాగరాజు

~

 

సంత్ ఏక్‍నాథ్ ఒక రోజున స్నానమాచరించడానికి గోదావరీ నదీ తీరానికి వెళ్ళాడట. శుచిగా స్నానం చేసి తిరిగి వస్తుండగా దారి పక్కన ఉన్న ఒక ఫకీరు ఆయన మీద ఉమ్మి ఊస్తాడట. శరీరం మైల పడిపోవడంతో  ఆయన తిరిగి మరోసారి స్నానానికి వెళతాడట. తిరిగి వస్తుండగా ఆ ఫకీరు మరో సారి ఆయన మీద ఉమ్మి ఊస్తాడట.  ఏక్‍నాథ్ ఆ ఫకీరుని ఏమీ అనకుండా సహనం వహించి తిరిగి మరో సారి నదికి వెళతాడట.

స్నానం చేసి తిరిగి రావడం, ఫకీరు ఉమ్మడం – ఇలా అనేక సార్లు జరిగిన తర్వాత కూడా తనని ఏమీ పల్లెత్తు మాట కూడా అనని సంత్‍ సహనానికి ఆ ఫకీరు పశ్చాత్తాపం చెంది తనను క్షమించమని అడుగుతాడట. పైథాన్(ప్రతిష్టాన పురం) నివాసి అయిన ఏక్‍నాథుని గొప్పతనం గురించి జనసామాన్యపు నాలుకల మీద ఉన్న ఈ కథనానికి కొనసాగింపు ఉంది.

తనని క్షమించమని అడిగిన ఫకీరుకు, బదులుగా ఏక్‍నాథ్-  మీరు చేసిన ఈ పని వల్లనే పవిత్రమైన ఈ గోదావరీ నదిలో అనేక మార్లు  స్నానం చేసే భాగ్యం నాకు కలిగిందని అంటాడట. సంత్ ఏక్‍నాథునితో ఫకీరు జరిపిన ఈ సంవాదాన్ని సంత్ అనుచరులు ఇద్దరు మహాత్ములు జరిపిన దివ్య కేళీ కలాపంగా వివరిస్తుంటారు.

సంత్ గొప్పదనాన్ని ప్రపంచానికి వెల్లడి చేసేందుకు ఫకీరుగా తన పాత్రని పండించిన వ్యక్తి సిద్ధి ఆలీబాబా. ప్రముఖ సూఫీ గురువు.  ఆయన అప్పుడు- మీ మీద ఇన్ని సార్లు ఉమిసాను కదా, బదులుగా ప్రాయశ్చిత్తం చెప్పమంటాడట. నా పుట్టిన రోజునాడు నా భక్తులు చేసే ఉత్సాహాల సందోహంలో, వారి కాలికింద రేగిన దుమ్ము నీ దర్గాపై పడుతుంది పో. అదే నీకు ప్రాయశ్చిత్తం అని సంత్,  బాబాని  సముదాయిస్తాడట.

సంత్ పుట్టిన రోజు ఉత్సవాలలో పాల్గొనే భక్తులు, దారిలో ఉన్న సిద్ధి ఆలీ బాబా దర్గాను చూసి ఈ కథనాన్ని  తలుచుకోవడం ఇప్పటికీ వాడుకలో ఉంది.

జనం వాడుకలో ఉన్న ఈ కథనాలు భక్తి ఉద్యమాన్ని గురించి మనకు సంకేత ప్రాయంగా రెండు విషయాలని తెలియజేస్తున్నాయి. పదమూడవ శతాబ్ధి చివరి వరకూ తెర వెనుకగా ఉన్న ఇస్లామ్- సూఫీ ప్రభావాలు ఉత్తర భారత దేశంలో పద్నాలుగ శతాబ్ధం నుండీ ప్రత్యక్షంగా అయిపోయాయి. ఈ రెండూ పరస్పరం జరుపుకున్న ఆదానప్రధానాలు పైన చెప్పిన కథనంలో మాదిరిగా ఎదురెదురుగా  నిలుచున్న సూఫీ, సంత్‍లు జరిపిన సంవాదకేళిలాగా మారిపోయాయి.  అలాగే,  పైన చెప్పిన కథనంలో మాదిరిగా సాధికారికమైన మత తాత్వికతకు ప్రత్యామ్నాయమైన  విశ్వాసాలూ, ఆచరణా కలగలిసిన సాంస్కృతిక ఆవరణాన్ని భారత దేశ మధ్యయుగాలకు ఇవి అందివ్వగలిగాయి.

ఇలాంటి సాంస్కృతిక వాతావరణం నుండే ఉత్తర భారతదేశపు భక్తి ఉద్యమం అభివృద్ధి చెందింది.

ఙ్ఞానేశ్వర్, నామదేవ్, కబీర్, రాయ్‍దాస్, నానక్, దన్నా, దాదూ, ఇంకా ఒరిస్సాలోని పంచసఖులు, తుకారాం, చైతన్యుడు, మీరా- ఇలా వీరందరూ ఉత్కృష్టమైన సాంస్కృతిక పర్యావరణానికి ఉదాహరణలు. వీరు ఇస్లాం, సూఫీల ప్రభావానికి ప్రత్యక్షంగా లోను కావడమే కాకుండా, తమ కాలపు మత ఆచరణలలోని చెడులను తీవ్రంగా విమర్శించారు కూడా. నామదేవ్ విగ్రహాలను పూజించడాన్ని అపహాస్యం చేస్తాడు. హిందూ-ముస్లీంల నడుమ సయోధ్యను ఏర్పర్చడానికి కృషి చేస్తాడు. కబీర్ ఇటు బ్రాహ్మనీయ హిందూ మతంలోనూ,ఇస్లాంలోనూ ఉన్న అతిని ఖండిస్తాడు. నానక్ మరో అడుగు ముందుకు వేసి ఒక విశ్వాసానికి ఎదురుగా మరో విశ్వాసం నిలబడి ఉన్నప్పుడు వాటి మధ్య సయోధ్య కుదరదని అంటాడు. ఈ రెండింటినీ విడిచి సిక్కుమతాన్ని స్థాపిస్తాడు. ఆయన మహ్మద్ ప్రవక్త జీవితం నుండీ ప్రేరణ పొందినట్టుగా చెప్పుకున్నాడు. సూఫీలవలే గురు పరంపరను ఏర్పరచి గురుస్థానాన్ని మార్గదర్శకంగా చేస్తాడు. ఒరిస్సాలోని పంచసఖులు భారత, భాగవత, రామాయణాలను ఒడియాలోకి అనువాదం చేసి భక్తి మార్గాన్ని సుస్థిరం చేసారు. చైతన్యుడు సంకీర్తనామార్గాన్ని అవలంభించాడు. మీరా రాబియా వలే భగవంతునిలో సఖుడిని వెతుక్కుంది.

ఒక భక్తి ఉద్యమ కవినీ లేదా సంత్‌నీ అధ్యయనం చేయడానికి వారి స్థానిక సాంస్కృతిక వాతావరణం, వారి వాఙ్మయ సారస్వతం గొప్ప ఆధారాలుగా ఉపయోగపడతాయి. వాటిని ఆధారంగా వారు తమ కాలపు సామాజిక చలనంలో ఎక్కడ నిలబడి ఉన్నారో, వారు తమ కాలానికి చెందిన లక్షణాలను ఎలా ప్రతి ఫలించగలిగారో మనం అధ్యయనం చేయవచ్చు.

మధ్య యుగాల నాటి ఉత్తర భారత దేశంలో ఉన్న సాంస్కృతిక వాతావరణం మునపటికన్నా మరింత కాంతివంతంగా మారడానికి బయటి నుండీ జరిగిన దండయాత్రలూ,ముస్లీంల రాజ్య స్థాపన దోహద పడ్దాయి. సామాజిక స్థితిగతులలో కుదపూ ఏర్పడింది.ఈ కుదుపుకు అనుగుణంగా సమాజంలో సర్దుబాట్లు జరగాల్సిన అవసరం ఏర్పడింది. గుప్తుల కాలం నాటికి బయటి ప్రాంతాల నుండి వచ్చిన శకులు, హుణులు లాంటివారు ఇక్కడి స్థానిక సమాజంలో భాగమయ్యారు. అలాగే స్థానిక ఆదివాసీ తెగలు ప్రధాన స్రవంతిలో భాగమయ్యి రాజపుత్రులుగా, వివిధ కులాలుగా స్థిరపడ్డారు. సరిగ్గా అలాంటి  సామాజిక మార్పులే ముస్లీం రాజ్య స్థాపనల వల్ల మరోసారి ఏర్పడాల్సిన పరిస్థితులు వచ్చాయి.

ఈ రకమైన సామాజిక మార్పులు వ్యక్తమవడానికి ఇస్లాం-సూఫీ తాత్వికతలు ఈ కాలంలో ఎంతగానో దోహద పడ్డాయి.

సాధికార మత తాత్వికతలు, కొత్తగా తమ చారిత్రక పాత్రని నిర్వహించడానికై ఉబికి వస్తున్న ప్రజా సమూహాలకు గొప్ప అడ్డంకులుగా ఉండడం వల్ల వాటిని తోసివేసే మత విశ్వాసాలూ, ఆచరణలే మధ్య యుగపు తాత్విక భూమికలయ్యాయి. ఇవి అటు బ్రాహ్మణీయ హిందూ మతానికీ, ఇమాంలు ప్రవచించే  ఇస్లాంకూ సవాల్‍గా నిలబడ్డాయి. ఈ చారిత్రక ఘట్టం భక్తి ఉద్యమంగా పిలవబడడానికి బహుళత్వానికి పీట వేసే వివిధ సంప్రదాయాలు, సూఫీల కృషీ పునాదులుగా దోహదపడ్దాయి. సూఫీలు తమను తాము ఇస్లాంలో విడదీయరాని భాగంగా చెప్పుకుంటూ ఈ కృషిలో పాలు పంచుకున్నారు.

ఉత్తర భారతంలో భక్తి ఉద్యమ కాలపు సాంస్కృతిక వాతావరణాన్ని మనం తిరిగి సంత్ ఏక్‍నాథ్ నుండే ఉదహరించవచ్చు. ఏక్‍నాథ్ దక్కన్‍లో భాగమైన మహారాష్ట్ర ప్రాంతపు బ్రాహ్మణుడు. ఆయన పదహారవ శతాభ్ది చివరి అర్థభాగానికి చెందిన వాడు. ఆయన పుట్టిన పైథాన్ పట్టణం ప్రతిష్టానపురం పేరుతో చరిత్రలో శాతవాహనుల ఏలుబడిలో ఉండేది. మహారాష్ట్రలో వర్కారీ సంప్రదాయానికీ ఆలంబనగా ఉన్న విఠోబా విగ్రహాన్ని విజయనగరం నుండీ వెనక్కి తీసుకొని వచ్చి పండరీపురంలో పునఃస్థాపించిన భానుదాసు ఈయన పూర్వీకుడు. దేవగిరి దౌలతాబాద్‍గా మారడానికి పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన యాదవులు మరాఠీ భాషాభిమానులు. నిజాంషాహీల పాలన ఇక్కడికి వచ్చే నాటికి పైథాన్ పట్టణం గొప్ప విద్యా, వాణిజ్యకేంద్రం.

ఏక్‍నాథ్ తండ్రి సుల్తాన్ వద్ద వజీరుగా పని చేసే ఒక బ్రాహణుడికి గురువు. ఆ రకంగా వారి కుటుంబానికి ఇటు పైస్థాయి అధికార వర్గంతోనూ, భక్తి సంప్రదాయంతో మమేకమయ్యే సాధారణ ప్రజానీకంతోనూ దగ్గరి తనం ఉండేది. ఏక్‍నాథ్‍ను విద్యనభ్యసించడానికి దౌలతాబాద్‍లో ఉన్న ఒక బ్రాహ్మణుడి వద్దకు ఆయన తండ్రి పంపుతాడు. ఆయన దౌలతాబాద్ కోటలో పని చేసే ఒక అధికారి(ఖిల్లేదార్). దౌలతాబాద్‍కు  జంటనగరంగా ఉన్న ఖుల్దాబాద్ ఏక్‍నాథ్ కాలం నాటికే  ప్రముఖ సూఫీకేంద్రం. ఏక్‍నాథ్‍కు  విద్యను నేర్పే గురువును ఆశీర్వదించడానికి అప్పుడప్పుడూ ఆయన ఇంటికి ఒక సూఫీ ఫకీర్ వస్తూ ఉండేవాడు. అంటే ఏక్‍నాథ్ గురువుకు గురువు ఒక సూఫీ ఫకీర్ అన్నమాట.

ఊహించడానికి కూడా సంభ్రమాన్ని కలిగించే ఇలాంటి చిత్రమైన సామాజిక వాతావరణం ఏక్‍నాథ్‍ను మహారాష్ట్రలో ఏ విధంగా ప్రముఖమైన సంత్‍గా మార్చి వేసిందో దాదాపుగా అలాంటి సామాజిక పర్యావరణమే ఉత్తర భారత దేశంలోని భక్తి ఉద్యమకారులమీదా భక్తి ఉద్యమం మీదా ప్రభావితమై అంతటా తానై అయి నడిపించింది.

ఇలాంటి చిత్రమైన సామాజిక పర్యావణం ఏర్పడడానికీ, వాటిని అందిపుచ్చుకొనే సామాజిక శక్తులు ఏర్పడడానికి  ప్రధాన కారణాన్ని సామాజిక చరిత్రకారులు పైకి ఎదిగి వస్తున్న కులాల అస్తిత్వ చైతన్యం నుండి వివరిస్తున్నారు. ఈ వివరణను దక్షణాదిన భక్తి ఉద్యమం ప్రారంభమయ్యే నాటి కాలానికి కూడా వీరు వర్తింప చేస్తున్నారు. గుప్తుల పతనానంతరం స్థిరమైన, విశాలమైన రాజ్యాలు దక్షణాదినే ఏర్పడడంతో పాటుగా, చాప కింద నీరులాగా ఇస్లాం- సూఫీల ప్రభావం కూడా పని చేయడం వల్ల ఇక్కడ నూతనంగా ఆవిర్భవిస్తున్న సామాజిక శక్తులకు ఒక దారి దొరికినట్లయింది. నయనార్లతో భక్తి ఉద్యమం స్పష్టమైన రూపం తీసుకున్నదని అనుకున్నట్లయితే, సంగం యుగం కాలం నుండీ ఎనిమిదవ శతాబ్ధం వరకూ కొనసాగిన ఈ సంప్రదాయపు సాహిత్యం పదవ శతాబ్ధానికి గానీ క్రోడీకరింపబడలేదు. పదవ శతాబ్ధంలో క్రోడీకరింపబడిన ఈ సాహిత్యపు ఉనికిలోనూ, ప్రత్యేకించి ఎంపిక చేయబడిన అరవైమూడుమంది నయనార్ల పేర్లలోనూ ఈ అస్తిత్వ చైతన్యమే పని చేసిందని వీరు వివరిస్తున్నారు. ఆళ్వార్లుగా ప్రసిద్ధిపొందిన వారికీ ఇది వర్తిస్తుంది.

భక్తి ఉద్యమం- అది కొనసాగిన కాలం దృష్ట్యా, అది వ్యాపించిన భౌగోళిక ప్రాంతం దృష్ట్యా చాలా విస్తృతమైనది.  నూతనంగా ఎదిగి వస్తున్న సామాజిక శక్తులకు ఉనికికి అది ఒక తాత్విక వ్యక్తీకరణగా ఎట్లా ఉపయోగపడిందో, సమాజంలోని ప్రధాన స్రవంతితో, ఆధిపత్య భావజాలంతో సర్దుబాటు చేసుకోవడానికి కూడా అంతగానే ఉపకరించింది. సాధికారికమైన భావజాలాలతో పేచీ పడడానికి, వాటి స్థానంలో ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించడానికి అది ఎలా కారణమైందో అలాగే తిరిగి మరో కొత్త సాధికారిక భావజాల కేంద్రాల స్థాపనకు అది దోహదమయింది. ఘర్షణ-ఐక్యతా చరిత్ర చోదక సూత్రాలుగా ఎలా పదేపదే ప్రకటితమవుతూ వచ్చాయో అదే విధంగా సాధారణీకరణ-వైవిధ్యమూ భక్తి ఉద్యమ కాలపు లక్షణాలుగా వ్యక్తమవుతూ వచ్చాయి.

ఇంత సంక్లిష్టత ఈ కాలపు లక్షణంగా ఉన్నందువల్ల భక్తి ఉద్యమం సామాజిక శాస్త్రవేత్తలకు గొప్ప అధ్యయన వనరయింది. సామాజికంగా ఉన్న కుల వివక్షలను స్థూలంగా పక్కకు నెట్టడం, బౌద్ధిక వ్యక్తీకరణలకు కేంద్రంగా ఉన్న సంస్కృత ఆధిపత్యాన్ని తోసివేసి స్థానిక భాషలకు ప్రాధాన్యాన్ని ఇవ్వడం, దైవం గురించి, ఆరాధనా సంబంధమైన కర్మకాండలకు సంబంధించి పై కులాలకు మాత్రమే అర్థమయ్యే విధంగా ఉన్న మత తాత్విక విధానాలను కిందికి దించి జన సామాన్యానికి అర్థమయ్యే ఉద్వేగ సంబంధమైన  ఆచరణలలోనికి తీసుకరావడం, దేవుడిముందు రాజూ-పేదా అందరూ సమానమనే భావనలను తేవడం భక్తి ఉద్యమకాలపు సాధారణ వ్యక్తీకరణలు. భక్తి ఉద్యమ కవులు, యోగులందరిలోనూ ఈ లక్షణాలను మనం చూడవచ్చు.

అయితే సామాజిక శాస్త్రవేత్తలకు ఈ సాధారణించబడిన లక్షణాలకన్నా, భక్తి ఉద్యమంలోని  వైవిధ్యమూ, బహుళత్వమే మరింత ఆసక్తికరమైన అంశాలుగా కనపడుతున్నాయి. సగుణ-నిర్గుణ వంటి విభజనల ఆధారంగా ఉత్తర భారతంలోని భక్తి ఉద్యమం గురించి స్థూలంగా కొన్ని సాధారణీకరణలను చేయడానికి కొందరు చరిత్రకారులు ప్రయత్నించారు. అయితే ఈ విభజనకూడా స్థూలమైనదే కానీ ఏ ఆచరణనూ పూర్తిగా సమగ్రంగా చెప్పడానికి పనికి వచ్చేది కాదు. భక్తి ఉద్యమాన్ని ఇలా సాధారణీకరించడానికి ప్రయత్నించిన ప్రతీ సారీ , దాని లోపలి నుండే పొడ చూపే భిన్నత్వం చరిత్రకారులకు నిరంతర సవాల్‍గా ఉండేది. ఒక ఆచరణ నిర్దిష్టమైమైన స్థల కాలాల పరిమితుల్లో  వివిధ సామాజిక శ్రేణులమధ్య వ్యాప్తిని పొందేటప్పుడు ఆయా ప్రజానీకపు అస్తిత్వ అవసరాలకనుగుణంగా అది నిరంతరంగా మార్పులకు గురికావడమే దీనికి కారణం . ఈ మార్పులు ఎంతగా తీవ్రంగా ఉంటాయంటే,  అవి దాని తొలి రూపానికి ఏమాత్రమూ పొంతనలేని ఒక కొత్త మత ఆచరణలోకి మార్చేసేవి.  బసవుని వీరశైవం నుండీ వివిధ పంథాల వరకూ వీటిని మనం గమనించవచ్చు.

సగుణ భక్తి భగవంతునికొక రూపాన్ని ఇచ్చి స్తుతిస్తుంది. నిర్గుణ భక్తి భగవంతుని నిరాకారునిగా చూస్తుంది. సగుణ భక్తి కన్నా నిర్గుణ భక్తి ప్రగతి శీలమైందనీ, ఇది సాధికారిక మత సంప్రదాయాలను నిర్ద్వంధ్వంగా తోసివేసిందనీ సామాజిక చరిత్రకారులు చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా నిర్గుణ భక్తికి కబీర్‍ను, సగుణ భక్తికి తులసీ దాస్‍ని వీరు చెబుతారు.

బసవని తర్వాత కబీర్ అపురూపమైన వ్యక్తిగా మనకు కనపడతాడు. సాధికారికమైన మత ఆచరణలను కబీర్ తన రచనల ద్వారా ఆవలికి నెట్టివేస్తాడు. తన జీవిత కాలమంతటా మగ్గం నేసి జీవిస్తూ, సాధారణ ప్రజానీకానికి సాధ్యంకాని సన్యాసి-ఫకీర్ ఉదాహరణలకు భిన్నమైన పంథాగా ఆయన జనానికి అందుబాటులో ఉంటాడు. ఆయన సారస్వతం పూర్తిగా మౌఖికమైంది. తర్వాత అది గ్రంథస్తమైనా మౌఖిక సంప్రదాయమే ఆయన విధానం. ప్రజలు పాడుకొనే భాషలో, వారికి అర్థవంతంగా ఉండే ఆయన ధోరణి సాధికారికమైన పుస్తక కేంద్రక విధానానికి వ్యతిరేకమైనది. ఆయన చెప్పే రాముడు దశరథకుమారుడూ, సీతాపతీ అయిన రాముడు కాదు. అంతకు మించి దశావతారాలలో ఒకడైన పురాణ పురుషుడూ కాదు. వీటన్నింటికీ విరుద్ధంగా ఆయన నిరాకారి. అనంత ప్రేమా మూర్తి.  రాముడనేది భగవంతుడికి కబీర్ పెట్టిన పేరు మాత్రమే. అందుకే కబీర్ భగవంతుడిని రాముడిగా కీర్తించిన సూఫీగా మనకు కనపడతాడు. దీనివల్లనే కబీర్ శిష్యులలో అసంఖ్యాకంగా కింది కులాలవారూ, ముస్లీంలూ కూడా మనకు కనపడతారు.

సగుణ భక్తుడైన తులసీదాస్ దీనికి భిన్నంగా రాముడిని పురాణ పురుషుడిగా,దశావతారాలలో ఒకనిగా రామచరిత మానస్‍లో రాస్తాడు. గ్రంథానికీ, బ్రాహ్మణాధిక్యతకూ చోటిచ్చి పునరుద్ధరణ వాదానికి దోహదపడతాడు.

ఒక వైపు  మౌఖిక సంప్రదాయంలో భక్తి వ్యాపిస్తూ ఉండగా, ఈ కాలంలోనే  మరొక వైపు సంస్కృత మత గ్రంథాలు, భారత, భాగవత, రామాయణాలు స్థానిక భాషలలోకి అనువాదం అయ్యాయి. ఇవి మూలానికి పూర్తిగా లోబడి ఉండక ఆయా భాషలలో స్వతంత్రమైన వైఖరులను తీసుకున్నాయి.  బ్రాహ్మణీయ విలువలను, ఆధిక్యతనూ స్థాపించడానికే ఇవి ఆయా భాషలలో రాయబడ్డాయని విమర్శకు గురయినా అప్పటి ఆధిపత్య భాష అయిన సంస్కృతానికి ప్రత్యామ్నాయంగా స్థానిక భాషలను ముందుకు తేవడానికి ఆయా కవులు పెద్ద యుద్ధమే చేసారు.  ఏక్‍నాథ్ మరాఠీలో భాగవతపురాణాన్ని రాయడం కోసం తన కొడుకు నుండే వ్యతిరేకతని ఎదుర్కొన్నాడు. తనకంటే చాలా  ముందుగానే ఙ్ఞానేశ్వర్ మరాఠీలో రాసే సంప్రదాయాన్ని ఆరంభించినప్పటికీ ఆయనకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా భక్తి ఉద్యమ కవులు స్థానిక భాషలను ముందుకు తెచ్చి పెద్ద తిరుగుబాటునే చేసారు.

ఒక వైపు తిరుగుబాటూ, మరో వైపు పునరుద్ధరణ పక్కపక్కనే, ఒక దాని వెంట ఒకటిగా కొనసాగడం భక్తి ఉద్యమ కాలానికి సంబంధించిన ప్రధాన లక్షణం. ఈ విచిత్రమైన స్వభావాన్ని సామాజిక చరిత్రకారులు గ్రామ్‍స్కీ ప్రతిపాదించిన “హిస్టారికల్ బ్లాక్” (historical block) భావన ద్వారా వివరిస్తున్నారు.

సమాజంలోని వివిధ శ్రేణులు తమ అవసరాల కోసం, అస్తిత్వం కోసం ఉనికిలో ఉన్న సాధికర భావజాలాలతో, నిర్మాణాలతో తిరుగుబాటును ప్రకటించి పోరాడతాయి. ఈ క్రమంలో అవి తమవయిన తాత్విక సామాజిక భావజాలాలను ప్రత్యామ్నాయంగా ముందుకు తెస్తాయి. అయితే అవి తమ గమనంలో ఒక సంతృప్త స్థితికి చేరుకున్న తర్వాత  ఇదివరకటి తిరుగుబాటును పక్కన పెట్టి  ప్రధాన స్రవంతిలో భాగమవుతాయి. సమాజగమనం గురించిన ఈ సత్యాన్ని గ్రామ్‍స్కీ “హిస్టారికల్ బ్లాక్” భావనలో వివరించాడు.

భక్తి ఉద్యమంలోని తిరుగుబాటు-పునరుద్ధరణ లేదా సర్దుబాటులను మాత్రమే కాకుండా సమకాలీన సమాజంలోని వివిధ ఉద్యమాలు, ధోరణుల  గమనాలను అర్థం చేసుకోవడానికి కూడా ఈ భావన బాగా ఉపయోగపడుతుంది.

 

ఆధారం:

1. Sufism, An introduction-Farida Kahanam

2.Rabia As Mystic, Muslim And Woman- Barbara Lois Helms

3.Influence Of Islam ON Indian Culture- Tarachand

4. Vaishnavism, Saivism And MInar Religious Systems- R.G. Bhadarkar

5.Contextualizing The Past, The Saint And His Environment -Dusan Deak

6. Challenging Gender And Sexuality Norms Through Devotion: Bhakti And Sufi Writings- Srishti Nayak

బంగారు పాప

vamsi

ఫోటో: రేఖ

*

– సత్యగోపి

~

చూస్తూనే వుండాలంతే
చూసి చూసి కళ్లకు ఆనంద ప్రపంచాలేవో వేలాడుతాయి
ఓ పాపనెక్కడో
లీలగా చూసిన దృశ్యం
ఓ పాప నా అరచేతుల్లో పారాడిన సన్నివేశం
ఓ పాప నా నుదురుపై పాదాలతో తడిమినట్టుగా
ఓ పాప నా గుండెలపై
నవ్వుతూ అలసి నిదురపోయినట్టుగా
ఆ నవ్వునెవరైనా
నా కళ్లకు బిగించమని
ఆ పాపనెవరైనా నా బుగ్గలపై నడిపించమని
ఎన్నెన్ని అదృశ్య రహస్యాలు
నాలోపల్లోపలే
రాత్రిలా మొరపెట్టుకుంటున్నాయో
రాత్రెపుడూ 
ఓ వెలుగు రేఖ కరచాలనం కోసం తచ్చాడుతుంటుంది
అలాంటి ఓ రాత్రిని  నేనే అవడం
నన్ను నేను వెలుగు చాపమీద దొర్లి దొర్లి నిద్రపుచ్చాలనుకోవడం
ఎంత దయామయ పసితనమది
ఎక్కడినుంచి వొచ్చిందిదంతా నాలో
ఏ బాల్యస్మృతుల గీతం గొంతెత్తి పాడుతోంది
ఆ పాపకోసం
నన్ను నేను ఛిద్రం చేసుకుని బయటికొచ్చేయాలనుంది
ఆ పాపకోసం
కాళ్లను చుట్టచుట్టి చక్రాల్లా తిరిగేయాలనుంది
నేను వేరు పాప వేరు అన్నపుడు
దేహన్ని ఉండచుట్టి దిబ్బలో పడేయాలనుంటుంది
దేహం ధరించుండడమే దౌర్భాగ్యంగా తోస్తుంది
దేహం ముసుగేసుకోవడమే
అసలైన మరణంగా భావిస్తాను
నాకెవరైనా విరూపాన్ని ఇవ్వండి
పోనీ పాప చెంతనుండే ఏదొక రూపమివ్వండి
ఆ పసిదానితో ఆడుకోడానికి మబ్బుల బంతిలానో
ఆ పసిదాని పాదాలంటుకునుండే అడుగుల్లానో
ఆ పసిదాని లోకంలో రెక్కల్లేకుండా ఎగిరే ఊహలానో
పసిదానితో వుండే వొకేవొక్క నవ్వునివ్వండి
లేదంటే
నిన్నటికి ఇవాళ్టికి మధ్య
ఆగిన కాలాన్ని హత్యచేయడానికి నాకో ఖడ్గాన్నివ్వండి
కనీసం నా చూపు పొలిమేరల్లో
ప్రవహించే ఆత్మీయతను తన ముందు కుమ్మరించే
ఒక్క రోజునైనా ఇవ్వండి
నా మాట చివర్లలో ఒలికే ఆప్యాయతే
తన కళ్ళకు కాటుక అయ్యే క్షణాన్నైనా ఇవ్వండి
ఆ పాప నాలోపలి సముద్రం
ఆ పాప నాలోపలి సంతోషం
ఆ పాప నాకు నన్నుగా చూపించే ప్రాయం
ఎన్ని ఉదయాలనో కుప్పగా పోస్తేగాని పాపను చేరుకోలేను
ఇలా
ఇక్కడ సాయంత్రం గుమ్మం ముందు నుంచుని
రాత్రిని హత్యచేయడానికి 
నేనో విధ్వంసక రూపాన్ని నిర్మించుకుంటున్నాను
*

అతని మరణం…

 

స్లీమన్ కథ-35

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు అన్నా, నొప్పి తిరగబెట్టింది. ఇంతకుముందు కన్నా దుర్భరంగా మారింది. చెవిలోని అస్థి కవచం దెబ్బతిన్నట్టు, మంట లోపలిచెవిలోకి వ్యాపించినట్టు అర్థమైంది. వైద్యులు వారిస్తున్నా వినకుండా ఆసుపత్రినుంచి వెళ్లిపోవాలని స్లీమన్ నిర్ణయించుకున్నాడు. చెవుల్లోంచి తీసిన ఎముకలను రెండు చిన్న పెట్టెలలో ఉంచి అతని చేతికి ఇచ్చారు. అతను  లైప్జిగ్ (Leipzig) 1 వెళ్ళి తన ప్రచురణకర్తలను కలసుకున్నాడు. అక్కడినుంచి బెర్లిన్ వెళ్ళి విర్కోను కలిశాడు. వినుకలిశక్తి పూర్తిగా పోయింది. అయినా విర్కోకు ఉల్లాసంగా ఉన్నట్టు కనిపించాడు. కెనారీ సందర్శనకు తోడు వస్తానన్న అతని వాగ్దానాన్ని గుర్తుచేసి రైల్లో పారిస్ వెళ్ళాడు.

డిసెంబర్ 15న పారిస్ చేరుకున్నాడు. ఆ శీతాకాలంలో అతిశీతల దినం అదే. సోఫియా రాసిన ఆరు ఉత్తరాలు అతనికోసం ఎదురుచేస్తున్నాయి. అవి చదువుతుంటే, తన గురించి ఆందోళన చెందుతూ ఆమె తన పక్కనే ఉన్నట్టు  అనుభూతి చెందాడు. క్రిస్టమస్ నాటికి గానీ తను తిరిగి ఎథెన్స్ కు వెళ్ళలేననుకున్నాడు. ఈ మధ్యలో తను నేపుల్స్ 2 మ్యూజియంను సందర్శించేందుకు వ్యవధి ఉంటుంది. తను పాంపే 3లో తవ్వి తీసిన పురావస్తుసంపదను అందులో ప్రదర్శిస్తున్నారు. చెవిపోటు తిరగబెట్టడానికి తను చేసిన పొరపాటే కారణమనీ, రైల్లో వెళ్ళేటప్పుడు అరేబియన్ నైట్స్ అరబ్బీ మూలాన్ని చదవడంలో మునిగిపోయి చెవులలో దూది పెట్టుకోవడం మరచిపోయాననీ భార్యకు రాశాడు. విర్కోకు చివరి ఉత్తరం రాస్తూ, పల్లాస్ ఎథెనా (Pallas Athene-గ్రీకు ఉచ్చారణ: పలావా ఫినా) 4 చిరకాలం వర్ధిల్లుగాక! ఇప్పుడు కనీసం కుడిచెవితోనైనా వినగలుగుతున్నాను. ఎడమ చెవి కూడా బాగుపడుతుందని అనుకుంటున్నాను” అన్నాడు.

తనను జీవితాంతం కాపాడుతూ వచ్చిన పల్లాస్ ఎథెనా, ఇతర గ్రీకు దేవతలు ఇప్పుడు ఒలింపస్ 5 మబ్బుల మాటున ఉండిపోయారు. తను కనుగొన్న నిక్షేపాలను కడసారి చూసేందుకు మాత్రం అనుమతించారు, అది కూడా లిప్తకాలమే! ఓ శీతాకాలపు మధ్యాహ్నాన విపరీతమైన జ్వరంతోనూ, నిస్త్రాణతోనూ బాధపడుతూ పక్కన వైద్యుని ఉంచుకుని నేపుల్స్ మ్యూజియంను సందర్శించాడు.

అక్కడికి చేరే సమయానికే తుదిఘడియలకు చేరువలో ఉన్నాడు. చెవిపోటుతో గిలగిలలాడుతున్నాడు. పారిస్ నుంచి రెండు రోజుల ప్రయాణం అతని ఓపికను పూర్తిగా హరించింది. పోటు క్షణక్షణానికి దుస్సహమవుతున్న స్థితిలో వెంటవెంటనే ఇద్దరు వైద్యులను సంప్రదించాడు. ఇంకో వైపు అతని ఎథెన్స్ ప్రయాణానికి ఓడ సిద్ధంగా ఉంది. కానీ అతను సముద్రప్రయాణం చేసే స్థితిలో లేడు. క్రిస్టమస్ సంబరాలను కొద్ది రోజులు వాయిదా వేయమని సోఫియాకు తంతి పంపించి, మూడో వైద్యుని సంప్రదించడానికి వెళ్ళాడు. అతన్ని గుర్తుపట్టిన ఆ వైద్యుడు పురావస్తుశాస్త్రంపై ఎంతో ఆసక్తిని చూపిస్తూ, ఓసారి పాంపే వెళ్ళి వస్తే ఎలా ఉంటుందని సూచించాడు.

ఓ పెద్ద కోటును చుట్టబెట్టుకున్న స్లీమన్, ఓ బండిలో కూర్చుని వెసూవియస్(Vesuvius)6 కొండ నీడనే, ఓ  అఖాతాన్ని చుట్టుకున్న దారిలో సుదీర్ఘప్రయాణం చేసి పాంపేను సందర్శించాడు. వసారా ఇళ్ళు, పురాతన రోమన్ శకటాల కింద నలిగిన రహదారులు, రెండువేల ఏళ్ల క్రితం మద్యవిక్రేతలు నిలబడిన తబెర్నా(tabernae-మద్యవిక్రయ కుటీరాలు)లు-అతను ఎలా ఊహించుకున్నాడో అలాగే ఉన్నాయి. ఆ తర్వాత హోటల్ గదికి తిరిగొచ్చాడు. తను త్వరలోనే ఎథెన్స్ చేరుకుంటాననీ, అక్కడికొచ్చాక ఈ చెవినొప్పి సంగతి చూస్తాననీ చెబుతూ మరికొన్ని తంతులు పంపించాడు.

స్లీమన్ ఎథెన్స్ నివాసంలో ఉన్న నాణేల మ్యూజియం

స్లీమన్ ఎథెన్స్ నివాసంలో ఉన్న నాణేల మ్యూజియం

క్రిస్టమస్ రోజున, పోస్టాఫీస్ కు వెడుతూ కాబోలు, ప్యాజ్జా డెల్లా శాంటా క్లరీటాను దాటుతున్నాడు. అంతలో  రోడ్డు మీద కుప్పకూలిపోయాడు. అయినా కళ్ళు తెరచుకుని స్పృహలోనే ఉన్నాడు. జనం చుట్టూ మూగి ఎవరు, ఏమిటని ప్రశ్నించారు. తల ఊపడం తప్ప మాట్లాడలేకపోయాడు. మాట పడి పోయిందని అర్థమైంది.

పోలీసులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాస్త కళ్ళు తిరిగి ఉంటాయి తప్ప, పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని భావించిన ఆసుపత్రి సిబ్బంది అతన్ని చేర్చుకోడానికి నిరాకరించారు. దాంతో అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అతని ఆనవాలు పత్రాల కోసం, డబ్బు కోసం జేబులు వెతికారు. అవి కనిపించలేదు కానీ, వైద్యుడి చిరునామా దొరికింది. అతన్ని పిలిపించారు. స్లీమన్ గురించి అతను చెప్పిన వివరాలకు  విస్తుపోయారు. అతని దుస్తులు చూసి పేదవాడు అనుకున్నారు. అతను పెద్ద సంపన్నుడనీ, అతని పర్సు నిండా బంగారు నాణేలు ఉంటాయనీ వైద్యుడు చెప్పాడు. తనే అతని చొక్కా లోపలి జేబులోంచి బంగారు నాణేలతో ఉన్న ఒక పెద్ద పర్సును బయటికి తీశాడు.

స్లీమన్ ను అతని హోటల్ గదికి తీసుకెళ్లారు. అప్పటికీ అతను పూర్తి స్పృహలోనే ఉన్నాడు. ఒక్క మాట పోవడం తప్ప మిగిలిన అవయవాలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయి. వైద్యుడు అతని చెవిని తెరచి చూశాడు. అప్పటికే రుగ్మత మెదడుకు వ్యాపించినట్టు అర్థమైంది. ఈ దశలో చేయగలిగింది ఏమీ లేదని తోచింది. ఆ రాత్రి గడిచింది. మరునాడు అతని శరీరంలో కుడిభాగం చచ్చుబడిపోయింది. కపాలానికి రంధ్రం చేసి లోపల పరీక్షిస్తే మంచిదన్న సలహా వినిపించింది. ఎనిమిదిమంది నిపుణులను పిలిపించారు. వాళ్ళు ఇంకో గదిలో సమావేశమై ఏం చేయాలో చర్చించుకుంటూ ఉండగానే, చివరివరకు స్పృహలోనే ఉన్న స్లీమన్ తన పడక మీద నిశ్శబ్దంగా కన్నుమూశాడు.

***

ఎథెన్స్, బెర్లిన్ లకు తంతి వెళ్లింది. దార్ఫెల్త్, సోఫియా అన్న వెంటనే బయలుదేరి వచ్చారు. మృతదేహాన్ని ఎథెన్స్ కు తీసుకెళ్లారు. పదో రోజున, 1891 జనవరి 4న శవపేటికను, ఆకాశపు కప్పు కింద ఇరవైనలుగురు పాలరాతి దేవీదేవుళ్ళు కొలువుతీరిన అతని భవంతిలోని విశాలమైన హాలులో ఉంచారు. కింగ్ జార్జి, యువరాజు కాన్ స్టాన్ టైన్ స్వయంగా వచ్చి శవపేటిక వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. ప్రపంచం నలుమూలల నుంచీ సానుభూతి సందేశాలు వెల్లువెత్తాయి.

తన సమాధి స్థలాన్ని అతను ముందే ఎంచుకున్నాడు. ఇలిసస్ కు దక్షిణంగా ఉన్న ఒక శ్మశానంలో, తను ఎంతగానో ప్రేమించిన గ్రీకుల మధ్య, ఒక వీరుడికి తగిన గోపురం కింద అతని మృతదేహాన్ని సమాధి చేశారు.  అక్కడినుంచి ఎథెన్స్ పురాతనదుర్గమూ, శరోనిక్ 7 నీలిజలాలు, సుదూర ఆర్గోలిస్ పర్వతాలు– స్థిమిత పడని అతని ఆత్మకు దర్శనమిస్తూ ఉంటాయి. ఆ పర్వతాలకు అవతలే మైసీనియా, టిర్యిన్స్ రాజుల సమాధులు ఉన్నాయి. జీవితం చాలించిన తర్వాత కూడా తన ఆరాధ్య వీరులకు, దేవతలకు దగ్గరగానే ఉన్నాడు. శిఖరాగ్రాన ఉన్న శిథిల పార్థినోన్ (Parthenon) 8 నుంచి తెలి చూపుల తల్లి ఎథెనా అతన్ని చల్లగా చూస్తూనే ఉంటుంది.

మరణానంతరం అతనికి కొత్త జీవితం ప్రారంభమైంది. భూమిని మంత్రించి బంగారాన్ని వెలికి తీసిన ఈ వ్యక్తి తన జీవితకాలంలోనే ఒక చరిత్రగా మారిపోయాడు. మరణాంతరం అంతకంటే పెద్ద చరిత్రగా పరిణమించాడు. అతని దురాగ్రహాన్ని, తలబిరుసును, ఇబ్బందికరమైన అతని విపరీత ధోరణులను జనం మరచిపోయారు. హోమర్ పట్ల అతని అచంచల విశ్వాసాన్నీ,  భూమిలో సమాధైన రహస్యాల వెల్లడిలో అతని మడమ తిప్పని సంకల్పబలాన్నీ గుర్తుపెట్టుకున్నారు. అతని అవగుణాలే సుగుణాలుగా మారిపోయాయి. విచక్షణ ఎరగని అతని అహంభావాన్ని సహజమైన ఆత్మగౌరవమన్నారు. అతని అతిశయోక్తులూ, డాబుసరి మాటలూ,  గొప్ప చారిత్రకసంపదను బయటపెట్టాలన్న అతని తహతహ నుంచి పుట్టినవనీ; వాటిని క్షమించచ్చనీ అనుకున్నారు.  తనను ఒక మంచి బ్యాంక్ గుమస్తాగా మలచిన అలవాట్లే అతనికి జీవితాంతం ఉండిపోయాయన్న సంగతిని జనం మరచిపోయారు. మేథ్యూ ఆర్నాల్డ్(Matthew Arnold)9 అంటాడు: హోమర్ మహావేగంతో దూకే జలపాతం, నిష్కపటి, ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు, గొప్ప ఉదాత్తత నిండినవాడు 10;  స్లీమన్ ది పూర్తి విరుద్ధ స్వభావం, నిదానంగా, గడుసుగా వ్యవహరించేవాడు, సంక్లిష్టస్వభావి, జిత్తులమారి, డాంబికుడు, కోపిష్టి. సహజమైన ఉదాత్తత మచ్చుకైనా లేనివాడు.

museum

స్లీమన్ మ్యూజియం

అయినాసరే,  ట్రాయ్ బురుజులమీద నిలబడి తన శత్రువులతో  అసామాన్య విజిగీషతో పోరాడిన వీరుడిగా; మొక్కవోని సంకల్పశక్తి ఉన్నవాడిగా చరిత్ర అతన్ని అభివర్ణించింది. తన విశ్వసనీయతను పెంచుకోడానికి తగినంత సత్యసంధతను పాటించినవాడిగా చిత్రించింది.  వాస్తవంగా హోమర్ కాలానికి చెందిన వస్తువులను వేటినీ అతను వెలికితీయకపోయినా, అతని శవపేటిక శిరోభాగం వద్ద హోమర్ శిలాప్రతిమను ఉంచడం ఎంతైనా సముచితంగా కనిపించింది.

చివరికి, పురావస్తురంగంలోకి దారులు తెరచి చూపించిన గొప్ప వేగుచుక్కలలో ఒకడిగా, తొలితరం పురావస్తు నిపుణులలో ప్రముఖుడిగా గుర్తింపు పొందాడు. నిజానికి అతను శాస్త్రీయ పురావస్తు పరిజ్ఞానానికి వ్యతిరేకి. పూర్తిగా కాల్పనికభావన నిండినవాడు. యథేచ్ఛగా కిటికీలు తెరిచేసి రకరకాల గాలులు లోపలికి ప్రసరించడానికి అవకాశమిచ్చినవాడు. కేవలం విశ్వాసమూ, స్వాప్నికతే ఈ రంగంలో అతన్ని ముందుకు నడిపించాయి. తను బాల్యం నుంచీ ఆరాధిస్తూ వచ్చిన హోమర్ వీరుల స్వభావాన్నే ఈ రంగంలోనూ అతను పుణికిపుచ్చుకున్నాడు.

స్లీమన్ మరణించిన కొన్ని రోజుల తర్వాత, ఎనభయ్యొక్కేళ్ళ గ్లాడ్ స్టన్ వణికే చేతితో స్వయంగా సంతాపసందేశం రాసి సోఫియాకు పంపించాడు. స్లీమన్ లోని విలక్షణ మేధాశక్తి తనను ఎంత గాఢంగా ప్రభావితం చేసిందో అందులో రాశాడు. స్లీమన్ విజయస్వభావాన్ని ఒకే ఒక్క పేరాలో ఇలా వర్ణించాడు:

అతనిలోని ఉత్సాహశక్తి;  పురాకాలపు శౌర్యసాహసస్ఫూర్తిని పరిశుద్ధ, రక్తరహిత రూపంలో సంపూర్ణంగా గుర్తుచేసింది. తన పరిశోధనల తొలి దశలలో అతను తీవ్రవిమర్శనూ ఉపేక్షనూ రెండింటినీ ఎదుర్కొన్నాడు. కానీ మంచుపొగనుంచి సూర్యుడు బయటపడినట్టుగా అతని పరిశోధనల శక్తీ, విలువా స్పష్టమౌవుతున్న కొద్దీ వ్యతిరేకులు తోక ముడిచారు.  అతని బాల్యమూ, యవ్వనకాలమూ, అతని అనంతరజీవితం కంటే ఏమంత తక్కువ ప్రాముఖ్యం ఉన్నవి కావు. నిజానికి ఆ మూడు దశలనూ ఎవరూ విడదీయలేరు. ఎందుకంటే, తొలినుంచి తుదివరకూ ఒక లక్ష్యశుద్ధి, ఒక ప్రయోజనదృష్టి ఒకేలా అతని జీవితాన్ని ముందుకు నడిపించాయి. అతన్ని ప్రముఖుడిగా నిలబెట్టడానికి అతనిలోని ఉత్సాహశక్తి, ఔదార్యాలలో ఏ ఒక్కటైనా సరిపోతాయి. ఇక ఆ రెండూ కలిసినప్పుడు అదొక అద్భుతానికి ఏమాత్రం తక్కువ కాదు.

“అతనిలోని ఉత్సాహశక్తి; పురాకాలపు శౌర్యసాహసస్ఫూర్తిని పరిశుద్ధ, రక్తరహిత రూపంలో సంపూర్ణంగా గుర్తుచేసింది…” అన్న గ్లాడ్ స్టన్ వాక్యంతో స్లీమన్ విభేదించి ఉండేవాడు. పురాతన వీరులకు తను రక్తమాంసాలు కల్పించాననీ, సమాధులనుంచి వారిని పునరుత్థానం చెందించాననీ చెప్పి ఉండేవాడు. భూమిలో కప్పడిన పురానగరాలపై ఒక మాంత్రికుడిలా అతను మంత్రదండం తిప్పి, వాటిని సజీవం చేశాడు. ఈ పురాతన జీవుల గురించి మనకిప్పుడు తెలుస్తోందంటే, అతను తన శక్తియుక్తులన్నీ గుప్పించి వారి అవశేషాలను వెలికి తీశాడు కనుకనే. ఒకప్పుడు గొప్ప వైశాల్యమూ, అద్భుతత్వమూ, నిగూఢతా మూర్తీభవించిన మహావీరులు ఈ భూమిమీద నడయాడారు. ఇప్పటికీ వారిలో ఆ వైశాల్యమూ, అద్భుతత్వమూ అలాగే ఉన్నాయి కానీ; వెనకటంత నిగూఢులు కారు. అఖిలెస్, నక్కజిత్తుల ఒడీసీయస్, శిరస్త్రాణంపై నర్తించే తురాయితో హెక్టర్—వీళ్ళందరి మధ్యా స్లీమన్ నిరంతరం జీవించాడు, వీరిపట్ల అతను నమ్మకాన్ని కోల్పోయిన క్షణమంటూ లేదు.

***

ఒక్కోసారి స్లీమన్ ఆలోచనా సరళి ఎలా ఉండేదంటే,  హోమర్ చిత్రించిన వీరులు మాత్రమే నిజం, మిగతా యావత్ప్రపంచం అబద్ధమన్న భావన అతనిలో జీర్ణించుకుందా అనిపించేది. తన జీవితంలో చివరి అయిదేళ్లూ అతను ప్రాచీన గ్రీకుభాషలోనే మాట్లాడాడు, రాశాడు. హోమర్ మంత్రదండం స్పర్శించని ప్రతిదానిపైనా అతను నిరాసక్తుడయ్యాడు. “ఒక్క హోమర్ మాత్రమే నాలో ఆసక్తిని నింపుతున్నాడు. మిగతా అన్నిటిపట్లా నాలో నిరాసక్తత నానాటికీ పెరుగుతోంది” అని ఒక మిత్రుడితో అన్నాడు. పురాతనపు మట్టిపిడకల(tablets)మీద లిఖించిన ధర్మశాస్త్రాలకు ఉన్నంత శక్తిమంతతతో హోమర్ అతనితో సంభాషించాడు. అంతేకాదు, హోమర్ అతనికి ఒక దిగ్దర్శి, ఒక శిలాశాసనం, ఒక జీవనవిధానం, ఈ భూగోళపు ఒకానొక చరిత్ర. రేపటి మానవజీవనసరళిని ప్రస్ఫుటించే ఒక భవిష్యవాణి. స్లీమన్ ఉన్మాది కాడు, కానీ ఉన్మాదానికి దగ్గరగా ఉంటాడు.  ఉజ్వలమైన, అత్యద్భుతమైన విశుద్ధనాగరికత ఒకప్పుడు ఈ భూమిమీద వర్ధిల్లిందన్న విశ్వాసాన్ని విరాడ్రూపానికి పెంచిన ఉన్మాదం అతనిది. అతని దృష్టిలో, ఉన్మాది కావడానికి సైతం సిద్ధమై అడుగుపెట్టదగిన మహత్తర నాగరికత అది.

స్లీమన్ తో పాటు అలాంటి ఉన్మత్తతను పంచుకున్నవారు మరెందరో!  ఆంగ్లకవి కీట్స్ ఒక గ్రీకు కలశాన్ని చూడగానే, తనను ఏదో అద్భుతమైన ఉజ్వలత కమ్మేసిన అపురూప క్షణాలను అనుభూతి చెందాడు. పురాకాలపు బలులు, ఇతర తంతులు తన కళ్లముందు జరుగుతున్నట్టు భావించుకున్నాడు. భూమి మీద ఏనాడో అదృశ్యమైన ఆ నాగరికతకు జర్మన్ రచయిత గథా(Goethe)11, జర్మన్ కవి షిలర్(Schiller)12  విధేయత ప్రకటించుకున్నారు. గ్రీకు దేవతలను తలచుకుని మత్తెక్కి మైమరచిన మరో జర్మన్ కవి  ఫ్రీడ్రిచ్ హోల్డర్లీన్(Friedrich Holderlin)13, ఇప్పటికీ వారి ఆలయాలు ఉన్నట్టూ, వాటిలో ఇప్పటికీ వారి కొలుపులు జరుగుతున్నట్టూ, ఈ ఆలయాలలో తనొక పూజారి నైనట్టూ ఊహించుకున్నాడు. ఊహల్లో తప్ప ఎన్నడూ చూసి ఎరగని గ్రీకు దీవుల్లో తనొక సంచారి ననుకున్నాడు. అతని భావనలో క్రీస్తే సర్వోన్నత దైవం, గ్రీకు వీరులు క్రీస్తు పుత్రులు. క్రీస్తు, గ్రీకు దేవతల పట్ల అతనిలో ఒకేవిధమైన భక్తితత్పరత.  ప్రాచీన గ్రీకు సంగీతయుక్తంగా కవిత్వం విరచిస్తూనే అతను క్రైస్తవకవులలో అగ్రగణ్యుడిగా గుర్తింపు పొందాడు.  క్రీస్తు ఆరాధన, గ్రీసు విధేయత జమిలిగా అతన్ని ఎంత వివశుణ్ణి చేశాయంటే, చివరికి అతనొక ఉన్మాది అయ్యాడు.

స్లీమన్ విషయానికి వస్తే, అతను చర్చి వాతావరణంలో పెరిగినా, తన క్రైస్తవ వారసత్వాన్ని నిరాకరించాడు. ఏనాడూ చర్చికి వెళ్లలేదు. బైబిల్ ను కల్పితరచనగా భావించాడు. కొత్త నిబంధన(New Testament) చూసి విస్తుపోయాడు. హోమర్ లో కనిపించని అనేక గ్రీకు పదాలు అందులో కనిపించాయి. సోఫియా తల్లి మరణించినప్పుడు, శ్మశానవాటికకు వెళ్ళిన అతను, అక్కడ క్రైస్తవ పూజారుల చేస్తున్న ప్రార్థనలు విని, “ఇదంతా అర్థరహితం. పునరుత్థానం అంటూ ఏదీ లేదు- ఉన్నదల్లా ఒక్క అమరత్వం మాత్రమే!” నని గొణుక్కున్నాడు. హోమర్ అనంతరకాలానికి చెందిన యూరోపియన్ సంప్రదాయం మొత్తాన్నిఅతను తృణీకరించాడు. మోజెస్ సినాయి ఏడారులను దాటాడు; క్రీస్తు పరమపదించాడు; రోమన్ సామ్రాజ్యం ఉత్థాన పతనాలను చూసింది. ఆ తర్వాత సాంస్కృతిక పునరుజ్జీవనం అడుగుపెట్టింది. ఆ తర్వాత ఒక్కొక్క రేకే కాండం నుంచి జారిపోయింది; అతని దృష్టిలో ఇవన్నీ కేవలం అర్థరహితాలు–

చివరివరకూ నిలిచి వెలిగేది ఒకే ఒక జ్వాల… ఆ జ్వాల పేరు, హోమర్!!!

***

స్లీమన్ తర్వాత…

  • స్లీమన్ ప్రారంభించిన పని, అతని మరణం తర్వాత కూడా విజయవంతంగా కొనసాగింది. యూరప్ కు చెందిన ఎందరో పురావస్తునిపుణులు గ్రీస్, మధ్యప్రాచ్యం మొదలైన చోట్ల తవ్వకాలు జరిపించి పురాకాలానికి చెందిన ఎన్నో విశేషాలను బయటపెట్టారు.
  • ట్రాయ్ లో తవ్వకాలు కొనసాగించడానికి దార్ఫెల్త్ కు సోఫియా ఆర్థికసాయం చేసింది. ఆ తర్వాత జర్మన్ చక్రవర్తి నుంచి కూడా ఆర్థికసాయం అందింది. హోమర్ చిత్రించిన ట్రాయ్ ను గుర్తించడంలో స్లీమన్ పొరబడినట్టు దార్ఫెల్త్ కు అర్థమైంది. అతని తవ్వకాలలోనే హోమర్ ట్రాయ్ బయటపడింది.
  • సర్ ఆర్థర్ ఎవాన్స్ 1900-05 మధ్య క్రీటులో తవ్వకాలు జరిపించి క్రీ.పూ. ఆరవ సహస్రాబ్దికి చెందిన నాగరికతను వెలికితీశాడు. క్రీటుకు చెందిన మూడు లిపులను బయటపెట్టాడు.
  • అమెరికాకు చెందిన కార్ల్ బ్లెగన్ 14అనే పురావస్తునిపుణుడు 1932-38 మధ్యకాలంలో హిస్సాలిక్ లో తవ్వకాలు జరిపించి స్లీమన్, దార్ఫెల్త్ ల పొరపాట్లను సరిదిద్దాడు. మైసీనియాలో క్రీటు లిపిలో ఉన్న మట్టిపిడకలను కనుగొన్నాడు. అయితే ఆ లిపిని ఛేదించలేకపోయాడు. ఇంతలో రెండో ప్రపంచయుద్ధం రావడంతో పురావస్తు తవ్వకాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి.
  • 1952లో క్రీటు లిపితో ఉన్న మరికొన్ని మట్టిపిడకలు బయటపడ్డాయి. మైకేల్ వెంట్రిస్(Michael Ventris) 15అనే ఆంగ్లేయభాషాశాస్త్రవేత్త, జాన్ చాద్విక్(John Chadwick) 16, ఆలిస్ కాబర్(Alice Kober) 17 అనే మరో ఇద్దరు భాషావేత్తలతో కలసి ఎట్టకేలకు విజయవంతంగా క్రీటు లిపిని ఛేదించి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేశాడు. వెంట్రిస్, చాద్విక్ లు Documents in Mycenaean Greek అనే తమ రచనను స్లీమన్ కు అంకితమిచ్చారు.

(అయిపోయింది)

అథోజ్ఞాపికలు

  1. లైప్జిగ్: జర్మనీలోని ఒక నగరం.
  2. నేపుల్స్: ఇటలీలో రోమ్, మిలాన్ తర్వాత పెద్ద నగరం.
  3. పాంపే: ఇటలీలో నేపుల్స్ కు దగ్గరలో ఉన్న పురావస్తు ప్రాధాన్యం కలిగిన ప్రాచీన నగరం.
  4. పల్లాస్ ఎథెనా: విజ్ఞానాన్ని, ధైర్యసాహసాలను, స్ఫూర్తిని, న్యాయ, ధర్మాలను, నాగరికతను, గణిత శాస్త్రాన్ని, యుద్ధవ్యూహాన్ని, లలితకళలను, చేతివృత్తులను సంకేతించే గ్రీకు దేవత. మన సరస్వతీదేవితో పోల్చదగిన దేవత అన్నమాట.
  5. ఒలింపస్: గ్రీకు దేవతలు నివసించే పర్వతం. రాక్షసులపై దేవతలు విజయం సాధించిన తావు.
  6. వెసూవియస్(Vesuvius): ఇటలీలో నేపుల్స్ కు దగ్గరలో ఉన్న ఒక అగ్నిపర్వతం.
  7. శరోనిక్: గ్రీస్ లో ఉన్న ద్వీపసముదాయాన్ని చుట్టి ఉన్న జలసంధి. ఈ పేరే ఈ ద్వీపసముదాయానికి కూడా వచ్చింది.
  8. పార్థినోన్ (Parthenon): గ్రీస్ లో ఎథెన్స్ లో ఉన్న పురాతన దుర్గంపై ఉన్న ఎథెనా ఆలయం.
  9. మేథ్యూ ఆర్నాల్డ్(1822-1888): ప్రముఖ ఇంగ్లీష్ కవి, విమర్శకుడు.
  10. విచిత్రంగా వాల్మీకి గురించి రాంభట్ల కృష్ణమూర్తిగారు కూడా ఇలాగే అంటారు: “వాల్మీకి నిజాన్ని దాచడు. అబద్ధం చెప్పడు”(జనకథ). వ్యాసుడికీ ఇదే వర్తిస్తుందనుకుంటాను.
  11. జొహాన్ వాల్ఫ్ గంగ్ గథా(1749-1832): జర్మన్ రచయిత, రాజనీతిజ్ఞుడు.
  12. జొహాన్ క్రిస్తోఫ్ ఫ్రీడ్రిచ్ వాన్ షిలర్(1759-1805): జర్మన్ కవి, తత్వవేత్త, చరిత్రకారుడు.
  13. జొహాన్ క్రిస్టియన్ ఫ్రీడ్రిచ్ హోల్డర్లీన్(1770-1843): ప్రముఖ జర్మన్ గేయకవి.
  14. కార్ల్ విలియం బ్లెగన్ (1887-1971): అమెరికాకు చెందిన పురావస్తునిపుణుడు.
  15. మైకేల్ జార్జి ఫ్రాన్సిస్ వెంట్రిస్(1922-1956): ఆంగ్లేయ భాషాశాస్త్రవేత్త.
  16. జాన్ చాద్విక్ (1920-1998): ఆంగ్లేయ భాషాశాస్త్రవేత్త.
  17. ఆలిస్ ఎలిజబెత్ కాబర్(1906-1950): అమెరికాకు చెందిన భాషానిపుణురాలు.

 

 

 

 

 

 

ఇష్టమైన నరకం…

 

 

-మధు  పెమ్మరాజు 

~

 

 ఉన్నట్టుండి ఓ రోజు తెలుగు సాహిత్యానికి నా అవసరం ఉందనిపించింది.  ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా అమెరికాలో తెలుగు మగవాళ్ళ పై (అంటే బేబీ షవర్ రోజు తలుపు చాటున దాక్కుని, తలుపు తెరుచుకోగానే  “సర్ప్రైస్” అని భయపెట్టే మగవాళ్లపై) బ్లాగు రాసి స్నేహితులకి పంపి అభిప్రాయం  అడిగాను, వారం దాకా ఏ సమాధానం రాలేదు, మనోభావాలు దెబ్బ తిన్నాయేమోనని ఫోన్ చేసి అడిగితే “అద్భుతం! నువ్వు మామూలు మనిషివి కాదు!” అని ఉత్తేజపరిచారు (తర్వాత చదవకుండా పొగిడారని తెలిసింది)

కానీ రైలు స్టేషన్ దాటేసింది. వారానికో బ్లాగు రాయడం, జనాలపై ఎక్కుపెట్టడం మొదలుపెట్టాను. నెట్లో నారద సంచారం చేస్తుంటే ఎందరో మంచి బ్లాగర్లు, రచయితలు తారసపడ్డారు. వారి పదునైన రచనలు చదివాకా నేను రాసింది ఏదైనా కావచ్చు కానీ సాహిత్యం మాత్రం కాదని, సాహిత్యానికి నా అవసరం లేదని తేలిపోయింది. అప్పటికే కొన్ని ప్రమాదాలు జరిగిపోయాయి – ”ఇంట్లో రచయితగా గౌరవిస్తున్నారు, యధేచ్ఛగా కంప్యూటర్ ముందు కూర్చోనిస్తున్నారు, పార్టీలకి వెళితే నా వీరు బ్లాగులు అవి రాస్తారని ప్రత్యేకంగా పరిచయం చేస్తున్నారు” ఇక ఇన్ని సదుపాయాలు, మర్యాదలు జరుగుతుంటే వదలాలని అనిపించలేదు.

అంతర్జాల పత్రికలలో కథలు, కవితలు చూసుకుని, లెక్కపెట్టుకుని మురిసిపోయేవాడిని. ఆ ముచ్చట వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది పోటీలలో బహుమతి రావడంతో ముగిసింది, ఏ బాదరబందీ లేకుండా హాయిగా బ్లాగులు రాసేవాడిని కాస్తా రాయడం సీరియస్ గా తీసుకోవడం అక్కడ మొదలయ్యింది. బ్లాగులు బాచిలర్ జీవితం లాంటిది (ఏ బాదరబందీ ఉండదు), కథలు కాపురం లాంటివి (బరువు, బాధ్యత, ఇష్టమైన నరకం).

మొదట్లో ఏది రాసినా చప్పగా అనిపించేది, కథలు పూర్తయినా నా లాప్టాప్ దాటేవి కావు, అంతా అస్పష్టత..అంతు పట్టని దారులు. అయినా నిరుత్సాహపడకుండా కథని అవగాహన చేసుకునే ప్రయత్నం చేసాను, ఆ క్రమంలో…

ఒక సగటు పాఠకుడు కథని ఎందుకు ఇష్టపడతారు? – పత్రిక చేతిలో పడగానే సగటు పాఠకుడు చూసే మొదటి శీర్షిక కథ. ఆ ఆకర్షణకి ముఖ్య కారణం పాఠకుడు పెట్టే అతి తక్కువ సమయానికి మానసిక ఉల్లాసం, తృప్తిని ఇవ్వగలిగే అవకాశమున్న ప్రక్రియ కాబట్టి (నా ఉద్దేశ్యం అన్ని కథలని కాదు, వేరే శీర్షికలు తక్కువ చెయ్యడం కాదు..ఎక్కువ అవకాశం ఉన్న శీర్షిక అని మాత్రమే).

పాఠకులు ఎలాంటి కథలు ఇష్టపడతారు? – తమ మనసుని తాకి, కదిలించే ఇతివృత్తాలకి పాఠకుడు స్పందిస్తాడు. నిజానికి కథలో తమని తాము వెతుక్కుంటాడని  అనిపిస్తుంది. ఒక పాఠకుడిగా నాకు నచ్చే అంశాలు ఏమిటంటే- .

కథ సంపూర్ణ యాత్రలా (psychological journey) అనిపించాలి. మనని మనం పోగొట్టుకుంటూ, మళ్ళీ కలుసుంటూ వచన కవిత్వంలా సాగాలి.

నిదానంగా సాఫీగా, సాగినా ఆలోచింపజేయాలి, వెక్కిరించాలి, చుట్టూ ఉన్న పొరలని విప్పాలి.

పదాల గారడీలా కాకుండా వచనంలో నికరమైన యోగ్యత  ఉండాలి.    

చూసిందే, చదివిందే అనేలా చప్పగా అనిపించకూడదు

అంటే నేను ఆస్వాదించే స్థాయి (నా బేస్లైన్) వేరు, రాస్తున్న తీరు వేరు..ఈ రెంటి మధ్య దూరాన్ని  ఎలా తగ్గించాలి? నింగి అందనంత ఎత్తులో ఉందని చూస్తూ కూర్చుంటామా? ఇటుకలు పేరుస్తూ ఉంటాము, మెట్లు కడుతూనే ఉంటాము.

రాయడం ఏకాంత ప్రయత్నమయినా పెన్ను, పేపర్ ని తాకే లోపు ఎన్నో సందర్భాలు, వ్యక్తులు, పుస్తకాలు, సంభాషణలు మనలో జేరి అదృశ్య హస్తాలుగా రాయిస్తూ ఉంటాయి, కాబట్టి రాయడం ఒక సమావేశం.

అవకాశం వచ్చింది కాబట్టి నాకనిపించిన అదృశ్య హస్తాలు- సాహిత్య వాతావరణం, సంపాదకులు,  సాహితీవేత్తలు, పాఠకులు.

సాహిత్యం ఒక అవసరంలా అనిపించాలి, ఆదరించే వాతావరణం కావాలి. ఆ వేదిక చిట్టెన్ రాజు గారు అనే వ్యవస్థ ద్వారా లభించింది. కొన్ని దశాబ్దాలుగా బాషకి, సాహిత్యానికి ఎనలేని సేవ చేసారు. సాహితీ సదస్సులు, వెన్నెల వేడుకలు నిర్వహించడమే కాకుండా కొత్తవారిని ఆత్మీయంగా ప్రోత్సహిస్తారు. వారి పరిచయం వలన సాహిత్యంతో బలమైన, ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది.

కొత్త కథకులని వెలికి తీసి, వారిని ప్రోత్సహించే సహకార సాంప్రదాయం ఉండాలి. ఆ అంశంలో సంపాదకులు  కీలకమైన పాత్ర పోషిస్తారు. అంతర్జాలలో మనం రకరకాల పత్రికలని చూస్తుంటాము. రచన పంపగానే మాటామంతీ లేకుండా ప్రచురించే ‘పాసివ్’ పత్రికలు, అత్యున్నత ప్రమాణాల “కంచు కోట” పత్రికలు, రెండిటి వల్ల కొత్తవారికి పెద్ద ఉపయోగం లేదు.

కౌముది సంపాదకులు – కిరణ్ ప్రభ గారు, కవిత పంపినా, కథ పంపినా వెంటనే స్పందించి, అభిప్రాయం తెలిపేవారు. రచయిత దగ్గర స్పార్క్ ఉందని అనిపిస్తే విడిచిపెట్టకుండా ప్రోత్సహిస్తాను అని ఫోన్ లో మాట్లాడి, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి, తిరగ రాయించి పత్రికలో వేసేవారు.

తానా-సంపాదకులు-నారాయణస్వామి గారికి కొత్త కథలు పంపి అభిప్రాయం చెప్పమని అడిగేవాడిని, ఓపికగా ఫోన్లో విశ్లేషించే వారు. సవరణలు సూచించేవారు. గంటల, గంటల రైటర్ ల వర్క్ షాపులు కాదు. ఓ ఐదు, పది నిముషాల సంభాషణ, ఒకటి రెండు సూచనలు చాలు అల్లుకుపోవడానికి, నిండా ముంగిన వాడికి చిన్న తాడు చాలు.

సారంగ సంపాదకులు – అఫ్సర్ గారి ఆత్మీయ పలకరింపు, ఏదైనా రచన పంపమనే పిలుపు రచయితకి మంచి ఊతాన్ని ఇస్తాయి.

కథ పూర్తి చేసి, ఏదో ఒక పత్రికకి హడావిడిగా పంపి, అచ్చులో పేరు చూసుకునే తాపత్రయం కాస్తా నాకు నచ్చే వచనం రాయాలనే తపనగా మారింది.  ఓపికగా తిరగ రాయడం, మళ్ళీ రాయడం. – ప్రతీ పదం, వాక్యం, సంభాషణ మళ్ళీ మళ్ళీ చదువుకుని, పాఠకుడు ఎలా చదువుతాడో? స్పష్టత ఉందా? మనం అనుకున్న భావం ఇదేనా? అని లెక్కలేనన్ని సార్లు అనుకుంటూ ముందుకి వెళ్ళడం అక్కడ నుండి  మొదలయ్యింది.

ఇక కథ పూర్తి అయ్యాకా అసలు కథ మొదలవుతుంది (optimization ఫేస్)  కొన్ని బాగా పండిన సంభాషణలు, వాక్యాలు  తొలగిస్తున్నపుడు చెయ్యో కాలో తీస్తున్నట్టు బాధ పడే వాడిని, రాను రాను పేషంట్ నుంచి సర్జెన్ పాత్ర పోషించడం నేర్చుకున్నాను.

నూటికొక ఐదో ఆరో గొప్ప కథలు దొరుకుతాయి. పతంజలి శాస్త్రి గారివి ఆ కోవకి చెందిన అరుదైన, అపురూపమైన కథలు. ‘వడ్ల చిలుకలు’ కథా సంపుటి నుండి ఈ మధ్యనే వచ్చిన ‘గేదె పై పిట్ట’ దాకా  అయిపోతాయేమోనని కొద్దికొద్దిగా చదువుకుంటాను, అయిపోయాకా మళ్ళీ చదువుతాను.

ఏ మాత్రం కష్టపెట్టని పదాలు, వచన కవిత్వం, వ్యంగ్యం, పాఠకుడితో తెలివైన, బరువైన, లోతైన..పొరల పొరల సంభాషణలు జరపడం వారికే సాధ్యం.  ఎప్పుడు కలిసినా చాయ్ తాగుదామా? అంటూ పలకరింపుతో మొదలయి రెండు, మూడు గంటల సరదా సంభాషణ సాగుతుంది. నేను కథల చిట్కాలు అడగను, సాహిత్యం అంటూ విసిగించను. ఆ మహా కథకుడి సమక్షంలో కాసేపు గడిపితే చాలు ప్రభావం మనతో నడిచొస్తుంది, మనలో నిలిచిపోతుంది.

కేవలం సాహిత్యాన్ని ప్రేమిస్తూ, పబ్లిసిటీకి దూరంగా ఉండే సాహితీవేత్తలు నన్ను అమితంగా ఆకర్షిస్తూ ఉంటారు. అటువంటి మిత్రుడు మెహర్.

రచనా శైలి, పద విన్యాసం, ఒకసారి కాదు మళ్ళీ మళ్ళీ చదివించే రిపీట్ వేల్యూ గల వ్యాసాలు, బ్లాగ్ గుళికలు, పుస్తక/రచయిత పరిచయాలు. రాయడం తపస్సులా సాధన చేసే వ్యక్తి. ఏమీ ఆశించకుండా సాహిత్యాన్ని ప్రేమించడడానికి / ఇష్టపడడానికి స్ఫూర్తి!! Inspiration for literary enthusiasm!!

ఈ మధ్యన ఒక పాఠకుడు మూడు పేజీల కథకి  నాలుగు పేజీల విమర్శ పంపాడు. కథని ఇంత సీరియస్ గా తీసుకుంటారని తెలియడం చాలా ఆశ్చర్యం కలిగింది. ఇటువంటి అనుభవాలు రచయిత ఒద్దికైన ఇరుకుని వదుల్చుకునే అవకాశాలు. రచయిత కారైతే విమర్శ బ్రేక్ లాంటిది, ప్రశంస ఆక్సిలరెటార్ లాంటిది….రెండూ అవసరమే..

 

****

నీళ్ళూ నిప్పులే!

 

-బమ్మిడి జగదీశ్వరరావు

~

ఒరేయ్ రాజుగా..!

యెలాగున్నావురా? వూరొదిలీసావు కదా యెలాగుంటావ్? బాగనే వుండుంటావులే! బాగుపడక పోయినా చెడిపోకుండా మాత్రం వుండుటావ్!

వదిలేసినోడి పెళ్ళాం యెవడితో పోతే యెందుకన్నట్టు.. వూరు వొగ్గేసాక యెలాపోతే అలాపోనీ అని అనుకోక వూర్లోని కబుర్లు రాయమని వుత్తరం రాసావ్! ఫోన్లో మాట్లాడితే చాలదా.. చేదస్తం కాకపోతే అని అనుకున్నాన్రా.. కానోరే- యివి ఫోన్లో మాట్లాడేవి కావురా, వుత్తరం రాయాల్సిందే..! వూరూసులు నీకు చెప్పాల్సిందే..!

వూరికి కరువొచ్చింది! అలాటి యిలాటి కరువు కాదు! కాటకము లాటి కాటకము కాదు! గింజకు కరువైతే పంటకు వుంచిన యిత్తనాలు తిన్నాము! గడ్డికీ గాదాముకీ కరువొస్తే పసులను కబేలాలకి పంపించీసినాము! వూరికి మరిడొస్తే మహంకాలమ్మకు దిష్టితీసి దండవెట్టి ముడుపులుగట్టి మొక్కులుదీర్సి సంబరాలుసేసి సచ్చినోల్లని సాపల్ల జుట్టి వల్లకాడుకు యీడ్సినాము! పూడ్సినాము!

ఏ తల్లి దయ చూపినా గంగమ్మ తల్లి దయ చూపడం లేదురా.. శివయ్య నెత్తిమీద నుండి గంగమ్మని దించడు గావాల.. అతగాడికి సల్లదనం సాలదు గావాల.. అనీసి నలుగురం అనుకోని, ఆడుకోని.. యింటికి పది బిందిలు.. వంద గడప.. వంద యిళ్ళు.. మొత్తానికి యెక్కడెక్కడ్నుంచో నీళ్ళు తోడుకొచ్చినాం.. సేతులు బొబ్బలు కాలు బొబ్బలు.. ‘దేవుడు దిబ్బయిపోయిన దేవుడు’ అని తిట్టకోకుండా వోపిక పట్టినాం.. సుమ్మగుడ్డ నెత్తి మీన  యెట్టుకోని బిందిలికి బిందిలు మోసినాం.. కావిళ్ళు యేసినాం.. బళ్ళు పూసినాం.. పులిసిపోనాం.. పులకించిపోనాం.. పంతుళ్ళ మంత్రాలొకపక్క.. జంగమోడి శంఖమొకపక్క.. దీపాలు దూపాలు.. ఆరతులు ఆబిసేకాలు.. అది కళ్ళు తోటి చూడాల్సిందేరా.. చెప్పనలవయితే గాదు.. వూరందరం గలిసి మనూరి శివాలయంలో శివుడి నెత్తిమీద వెయ్యిన్నొక్క కుండల నీళ్ళు కుమ్మరించినాం.. గర్బగుడిలోంచి నీళ్ళు పోకండా స్నాన మట్టం ముందలే మూసీసినాం.. ద్వార ప్రవేశకాల దగ్గర కన్నాలు కలిపి వొగ్గకుండా బిరడాలు సుట్టి పెట్టి మూసీసినాం.. నీళ్ళు యెట్నుంచి పోకండా చేసీసినాం.. యేటవుద్ది? శివలింగం ములిగిపోయింది..! దేవుడికి వూపిరాడక వుక్కిరి బిక్కిరి అయిపోయి.. ‘ఓళ్తల్లో.. గంగమ్మ తల్లో.. వూపిరి సలపడం లేదు, దిగి బేగి అవతలికి యెల్లే..’ అనీసి శివుడు అంటాడు గావల.. గంగమ్మతల్లి గంగ వెర్రులెత్తుకోని మేగాలంట పరుగులెట్టుకోని బూమ్మీదకి అడ్డగ దిగిపోద్ది గావాల.. వర్షాలు కుండపోతగా కుమ్మరించేస్తాయి గావాల.. దబ దబమని దబాయించి అంచెట్టకుండా బాదికెలిపోద్ది గావాల.. వానలు వరదలై యెత్తి ముంచేస్తాది గావాల.. కరువుదీరా కసిదీరా కురుసేస్తాది గావాల.. కరువు తీరిపోద్ది గావాల..

వానల్లు కురవాలి వానదేవుడా!

వరిసేలు పండాలి వానదేవుడా!

సెర్లన్నీ నిండాలి వానదేవుడా!

మడ్లన్నీ పండాలి వానదేవుడా!

కప్పలకు పెళ్ళిళ్ళు వానదేవుడా!

గొప్పగా జరగాలి వానదేవుడా!

అనీసి పాడీసి.. ఆడీసి.. గెంతీసి.. కప్పలకి పెళ్ళిళ్ళు చేసీసి.. ముత్తైదువులు పేరంటాళ్ళు మండోదరికి పూజలూ పునస్కారాలూ చేసీసి.. యిలాగ బూమ్మీద యెన్నున్నాయో అన్నీ చేసిసి.. వూరు వూరంతా కిందా మీదా పడిపోయినా గంగమ్మ తల్లి దిగలే! మొగుడు నెత్తినెక్కించుకుంటే దిగుతాది? యే యాడదాయన్నా దిగుతాది? నువ్వయినా సెప్మీ?

యారళ్ళ పోరు పడలేనని పార్వతమ్మ యెదురుతిరిగినా బాగుణ్ను! మొగుడా.. శివుడా.. గంగని యిడిసిపెట్టురా అనీసి అలనాడు సేసినట్టు గోల గోల గొల్లు గొల్లు సేసినా బాగుణ్ను! శివుడికి సిగ్గయినా వచ్చును! యిడిసీ పెట్టును! మనూర్ల ఆడోలు నాలికలు అరిగిపోయినట్టు మాట్లాడుకున్నారు గాని సుక్క పడ్లే! సినుకు కుర్లే! యెప్పటిలాగ యదావిది.. సిద్దిరస్తు..!

కప్పలు అరిస్తే వానలు కురుస్తాయంటారు.. సెర్ల నీళ్ళే లేవు! కప్పలు యెక్కడి నుండొస్తాయి? అప్పుడికీ మనోలు యెక్కడికో యెల్లి కప్పల్ని పట్టుకొచ్చినారు! కొండమీది కోతే మందంటే తేవాల గదా? తెచ్చిన కప్పల్ని అరండే అంటే అరుస్తాయీ? సెప్పితే నీకు అబద్దము, నాకు నిజిము.. ఈలు మనోలు బెక బెక మనడమే గాని కప్పలు అరేలేదు.. అరుపులు నేర్పించినా అరలేదు! మూగి కప్పల్లాగ కియ్ అనలేదు.. కయ్ అనలేదు! ‘యేమే కప్పా అరవూ.. అంటే నానోటి నిండా నీళ్ళున్నాయని..’ సామెత! నీళ్ళూ లేవు! అరుపూ లేదు!

పుర్రాకులు యెన్ని పడినా గుక్కెడు నీళ్ళకి గుటుక్కుమన్నట్టుగుంది బతుకు!

మన వూరి పెద చెరువు యెండిపోయింది! చిన్న చెరువూ యెప్పుడో యెండిపోయింది! తూరుపున వున్న గుండం యింకేపోయింది! పడమరన వున్న బట్టి యెండిపోయి యిటికల బట్టీ అయిపోయింది!

మనూరి బోర్లు యెండిపోయినాయి! బావిలు యెండిపోయినాయి! మంచినీలకు కష్టమంటే కష్టం కాదు! కనా కష్టంగుంది! యమ యాతనగుంది! యిప్పుడు యెలక్షన్లు వున్నా బాగుణ్ను! సర్కారు పట్టించుకున్ను! మనం దిక్కులేని పక్షుల్లా చచ్చినా యిప్పుడు యెవుడుకీ పట్టదు! మీ చావు మీరు చావండి అని వదిలేసినారు! మనూర్లదాక మజ్జిక పేకట్లు రాలే! అయినా మజ్జికతో కడుపు నిండుతాదా? మంచినీళ్ళతో దినమెళ్తాదా? యేమంటే ‘చెట్టూ – నీరు’ పోగ్రాముకి రమ్మంటారు.. మనుషులకే నీళ్ళు లేవు.. మోడులకి నీళ్ళు యెక్కడి నుండి తెచ్చి పోసీది?

ఊళ్ళో ట్యాంకులతో నీళ్ళ అమ్మకం లేదు! మనూరోలికి కొనే తాహత్తు లేదనేమో ట్యాంకులోల్లు పట్నం  పోయినారు! ఎక్కడైనా గిరాకీయే గాని అక్కడైతే వొక రూపాయి యెక్కువకి అమ్ముకోవచ్చు! నాల్డబ్బులు సీజన్ల సంపాదించుకోవచ్చు! ఆల యాపారాలు ఆలవి! కాదని అనగలమా? ఆపగలమా?

గోర్జిల నంద నుయ్యి వుందికదా.. మనం స్నానాలు చేసీవోళ్ళం.. ఆడా మగా పిల్లా పిచ్చుకా అందరం అక్కడే కదూ! కళకళలాడే నుయ్యి! నుయ్యికాడ నీళ్ళుతోటి యెన్నెన్ని కతలు తెండీ వోరని?! నీళ్ళు పట్టుకొని యెల్లగానే యెల్లినమ్మ మీద అమ్మలక్కల వూసులు! వయిసిన గుంటల సూపులు గునపాల్లాగా వుండీవి కావూ?! ఓలి మరదలా బీపి రుద్దిమీ.. బాగా రుద్దినావంతే మీ యప్పకి సెప్పి పెళ్ళాడేస్తాన్లే.. యిద్దరు సక్కన వుందురు.. యికటాలు! ఓరే గండా.. మనవడా.. నన్ను పెళ్ళాడుతావేట్రా అని ముసిలమ్మల ముసిముసి నవ్వులు! వోరి గొల్లిగా నూతిలోని నీలన్నీ తోడేస్తావేటి?, ఆపిల్ల వూరెల్లింది, యిప్పుడప్పిడే రాదు.. సిగ్గుపడి సేద వొదిలీసి పరుగులు.. పరాసికాలు! నుయ్యి నూర్రకాలుగా వుండీది.. నవ నవ లాడీది!

యెలాటి నుయ్యిరా అది.. రెండు బారలకే నీళ్ళందీవి! పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు ఫంక్షన్లు గింక్షన్లు అన్నీ ఆపీది! అది కూడా వెలవెలబోయింది! తొంగి చూస్తే అడుగు కనిపిస్తోంది! అడుగంటీసింది! మట్టి తీతుమన్నా కళ్ళు తిరిగిన లోతు! ముంత వొలకబోసినట్టు నీళ్ళు! చిన్న పిల్లాడు వుచ్చపోసినట్టు వూట! జల యింకి పోలేదు! తగ్గిపోయింది! పొయ్యి పొక్కల్లలా మూడు పక్కలనుండి మూడు వూటలు! వూరిని.. వందగడపని.. కొంత కాకపోతే కొంతయినా కాపాడుకొస్తోంది ఆ నుయ్యమ్మ తల్లి!

‘పెపంచకంల వున్ని నుయ్యిలన్నీ యెండిపోయినా మన గోర్జి నుయ్యి యెండదురా..’ అనీసి కంచరాన అచ్చమ్మ అనీది.. ఆ ముసిల్ది వంద నిండినదాక వుండి కొండెక్కిపే! పిచ్చికలాటి మనిషి! ముంతడు అంటే ముంతడు నీలు తోటి తాన్నం జేసీసి బట్ట కూడా తడిపీసీది.. ఆ మారాజు కూతుర్ని తలవనోలు లేరనుకో! యెందుకని అడుగు? నీల కరువుకి.. దేవుడికి నీలదార తియ్యడమే మరిసిపోయిన కాలంలో అచ్చేమ్మే ఆదర్శము గదూ? ‘ముంతడు నీలల్ల ములిగి సచ్చిపోడమేటో’ సాస్త్రం యిప్పుడు బోదపడింది!

తడిగుడ్డతోటి వొళ్ళు తుడుసుకోడం తప్ప తాన్నాలు లేవు! ‘పులులూ సింహాలూ రోజూ తానమాడుతాయేట్రా?’ అనీసి నీల్లున్నప్పుడే నెలకీ పదికీ తాన్నం జేసే మన సావాసగోడు కామేసు లేడూ.. ఆడ్ని అందరం యెక్కిరించీవోలిమి గదా..? ఆడిప్పుడు ‘సెయ్యండిరా.. తలారా తాన్నాలు సెయ్యండిడ్రా!” అని యెక్కిరించి నవ్వుతున్నాడు. ‘మనిషి అంటే జంతువే, జంతువుల్లాగా బతకండి..’ ఆడు యెకసెక్కానికి అన్నా గాని.. నీళ్ళు కాదు గాని మనషులు మనషులుగా మిగిలినట్టు లేరు.. ఆ కత కూడా చెపుతాను విను..

ఊరంతటికీ వంద కుటుంబాలకి గోర్జి నుయ్యే దిక్కు! పూటకి యిన్నీ యిన్నీ నీల్లవుతున్నాయి.. లేదనడానికి లేదు! అయితే అవి అందరికీ చాలవు! కొట్టుకు చచ్చినా చాలవు! కత్తులు నూరినా చాలవు! కేసులు పెట్టుకున్నా చాలవు! నాను ముందొచ్చినాను అనంటే నాను ముందొచ్చినాను అని కయ్యాలు! కళ్ళు అగుపడవా.. పిల్లడ్ని పెట్టి యెల్లినానని వొకమ్మ, మీ నయనాలు తీసి గైనాన దోపుకున్నారా.. బింది పెట్టి యెల్లినానని వొకమ్మ! రాత్రి తెల్లవార్లూ నుయ్యి దగ్గరే జాగారం జేసి సచ్చినానని మరకమ్మ, నీకు మొగుడు లేడు.. నువ్వు నుయ్యిదగ్గిరే పడుకుంటే అవుతాది, నాకు మొగుడున్నాడు.. ఆడి పక్కన పడుకోపోతే అవుతాదా.. అని యింకొకమ్మ! నీకంతే సంసారం లేదు, సన్నాసిలాగున్నావు వొంటిగ.. మమ్మల్నీ సన్నాసరకం సెయ్యమంటావా.. సంసారరకం వొద్దంటావా.. చెప్పు మానేస్తాను.. అనంటే- అయితే మానియ్యే, నా మాట మీద యేటి రోటి పోస్తావు.. అని అలగన్నాదోలేదో- మరి నువ్వొచ్చి నామొగుడు పక్కన పడుకోయే.. అనంటే- ఆ గుడిసేటోడు దగ్గిర నీనేల పడుకుంటాను అని.. నా మొగుడు గుడిసేటోడా?.. వొవ్వో గొడవ! ఓసి నువ్వెవులెవులకాడ పడుకున్నావో నాకు తెల్దా? అంతకంటే నా మొగుడు యేటి తక్కువ అనంటే- నువ్వే గాల మా పక్కలు యెత్తినావు అని- నీనేనికి యెత్తుతాను?, లంజలవల్ల.. అనంటే- లంజా లమ్మిడీ.. రామాయణ భారత భాగవతాలెల్ల చదివేసింది చాలక.. జుట్టులు పట్టుకున్నది చాలక.. యేడు తరాలు యెక్కబీక్కున్నది చాలక.. కాంతలందరూ మొగుళ్ళ మీద పడ్డారు. నువ్వు సేత్తక్కువోడివి కాబట్టి ఆ నంజ అన్ని పేలతంది.. నీ నోట్ల యేటున్నాది.. దనిమీద నీకు యేటి లేకపోతే యెందుకడగవు? అని వొక పెళ్ళాం పేచి. నాకు దానిమీద యేటుంది? అని మొగుడు. రోకు అని పెళ్ళాం. మొగుడూ పెళ్ళాల గొడవలు. పిల్లలు మద్దిలో యేడిస్తే పిత్త సిరగ బాదీడిం.. కాదంటే దుడ్డుగర్రలు పుచ్చుకొని యెప్పుడువో పాత పగలు పెట్టుకోని బాగారుల్లాగా యిప్పడు తలలు బద్దలు చేసుకోవడం.. యికనేటుంది? కట్టులూ.. బెండేజీలూ.. ఆస్పెటిల్లూ! పోలీసులూ.. కేసులూ.. కోర్టులూ! సాచ్చికాలు యిస్తే వొక తప్పు! యివ్వకపోతే యింకొక తప్పు! యెటెల్లినా తప్పే! యెల్లక పోయినా తప్పే! నీళ్ళు కాదుగాని వూరు నిప్పుల గుండమయిపే!

యికన యిలగ లాభం లేదని వూరి పెద్దలందరూ కలిసి వుమ్మడిగ యేటి సేద్దాము అనంటే యేటి సేద్దాము అనుకోని వొక తీరుమానం చేసినారు! వూర్ల వున్నవి వంద యిళ్ళు.. వంద కుటమాములు.. కాబట్టి వంద అంకెలు చిట్టీలు రాసి.. చీటీ పాట లాగ యేసి.. వొకటోకటి చిట్టీలు తీసి.. యే నెంబరికి ముందొస్తే ఆలకి ముందు నీలకి అవకాశమిచ్చి.. చీటీల వారీగా వొకరి తరువాత వొకరికి అందరికీ వూరందరికీ వందమందికీ అవకాశము యిచ్చినారు! యింటికి రొండు బిందిలు నీలు! వొక ట్రిప్పు అవడాకి రొండొందలు బిందిలు కావాల! పూటకి నుయ్యిల పది బిందిలు నీల్లూరినా రొండుపూటలా కలిపి యిరవై బిందిలు.. మరీ పెద్ద బిందిలు తెస్తే కాదు, వొక్కలు యెత్తికెల్లగలిగిన బిందే.. పది రోజుల్లల్ల అందరికీ అవకాసమొస్తాది.. రొండో ట్రిప్పు మళ్ళా పదిరోజులకే! వొకేల ముందు ట్రిప్పుల ముందే వొచ్చి యెనక ట్రిప్పుల యెనకే వొస్తే నడుమ దూరానికి నట్టేట్లో మునిగినట్టే! యేటో బతుకు పీనుగుల పెంటయిపోయిందనుకో!

అందరూ వైష్ట్నమయ్యిలే.. గాని దాకలో రెయ్యిలు మాయమయిపోయినాయట.. అలగుంది యవ్వారం! అందరూ మంచోల్లే.. మంచోడి బుద్ది మత్స మాంసాల కాడని సామెత. మంచినీళ్ళ కాడా అంతే! యే రేతిరప్పుడు యెవలు తోడికేలిపోతే? దొంగల్ల దోపల్ల ఆపని చేస్తే? చేస్తే కాదు.. చేసినారు! వూరిల నీటి దొంగలు బయలెల్లినారు! కన్ను సేరేస్తే సేన! సత్య పెమానకాలు చేసేస్తన్నారు, మేం కాదంటే మేం కాదని! తెల్లారితే నుయ్యిల నీలు మాయం! యిలాక్కాదనీసి కొత్త చెప్పులు నాలు జతలు తెచ్చి నూతి మీద యేలాడేనాగ కట్నాం! ‘నీళ్ళు దొంగతనం చేస్తే చెప్పు దెబ్బలు తింటారు’ అని నంద మీద నల్లటి మసిబొగ్గుతో తాటికాయంత అచ్చరాలతో రాయించినాం! అయినా గాని నీళ్ళ దొంగతనం ఆగలే! అరే రేతిరి పూట కాలు మడుద్దుమని లేస్తే తప్పు! వుచ్చకో దొడ్డికో పొతే కూడా నిజంగానే పోతన్నాడా లేదా అని పోసినదాక ఆగి, యెల్లినదాక ఆగి అప్పుడు చూసి గాని వొదిలేది లేదు! నీడలాగ పెతీ వోడికీ యింకోడు కాపలా! నిద్దర్ల నడిసే అలవాటున్న అప్పడినయితే కొట్టేన్రు కూడా! రేతిర్లు కక్కుర్తి పడ్డ ఆడా మగా కయితే అడ్డుకట్ట పడిపే! లాభం లేదని మళ్ళీ ఆలోచన జేసి.. యింటికి యిద్దర్ని నుయ్యికాడ రేతిరిపూట కాపలా వుండీలాగా డూటీలు యేసుకున్నాం! యెవులుకి యే రోజు కావాలో ఆరోజే డూటీ చేసినట్టు సర్దుబాటు చేసుకున్నాం! అందరూ మేముంటాం అంటే మేముంటాం అంటే.. మళ్ళీ అనుమానం.. కాపలా వున్నోలుగాని రేతిరిపూట కుమ్మకైపోయి గాని నీలు మోసికెలిపోతే? అమ్మో.. యింకెవులికి పడతాయి నిద్దర్లు? రోజూ శివరాత్రే! రోజూ జాగారమే!

నీలు లేవు! నిద్దర్లు లేవు! నీలకి కాపు! నూతికి కాపు! మనిసికి కాపు! కాపు వున్నోడికి కాపు! చీమ చిటుక్కుమంటే చాలు.. అబరా గుబరా లేసి నుయ్యికాడికి పరుగే పరుగు! నీలు కాదుగాని యెవులూ యెవల్నీనమ్మడం లేదు! వూర్ల నీల్లారిపోయినట్టు నమ్మకం ఆరిపే! నీలు లేపోతే యెంత ప్రమాదమో.. నమ్మకం లేపోతే అంతే ప్రమాదం గదూ? మనూర్ల అప్పయినా తనకాకయినా ప్ర్రాముసరీ నోట్లు రాసుకొని యెరగం! అంతనమ్మకం! అలాటిది గాచ్చారం కాపోతే నీటి తిత్తవ వూరి తిత్తవని పూరా మార్సీసింది! నిప్పుని ఆర్పడాకి కదా నీలు! నీలే నిప్పయితే? అయితే కాదు, అయ్యింది! వూరంటుకుంది! తగలబడిపోతోంది! నీలు కావాలి! నీలు కురవాలి! నిప్పు ఆరాలి! నీలు తాగాలి! దప్పిక తీరేలా నీలు తాగాలి! మలినం అయిపొయినాము గదూ? ఆ కుళ్ళూ కుతంత్రం కడగడానికి నీలు కావాలి! కన్నీలు కడగడానికి నీలు కావాలి! నీలు కావాలి! స్వచ్చంగా మనిసి మెరవడానికి నీలు కావాలి! నీలు కావాలి! నీలు కురవాలి!

తుఫానట! తీవ్ర వాయుగుండమట! బతుకు గండమట! మూడో నెంబరు ప్రమాద సూచిక యెగరేసారట! వూరికి తుఫాను యెన్నడో వొచ్చింది! అతలాకుతలం చేసింది! యీ తుఫాను వొక లెక్కా? లెక్కే! తుఫానొస్తే వానలు వస్తాయి! అదే తెలిసిన లెక్క! గాలోనయినా అది నీలోనే! నీల వానే! యీదురు గాలులు గంటకి నూటిరవై కిలోమీటర్ల వేగంతో వీస్తాయట! వియ్యనీ! యెలాగోలా వాన కురిస్తే చాలు! ఆకశాన హరివిల్లు మెరిస్తే సేన!

ఉరుము వురికి వస్తే బాగున్ను! మెరుపు మేగాలను చీల్చితే బాగున్ను! దాక్కున్న నీలు దబదబ కింద పడిపోను! పిడుగు పడింది! పడనీ! అర్జునా ఫలుగునా అంటే ఆగుతుందా? పిడుగులతో పాటు యింత వర్షం కురిస్తే బాగున్ను! అల్పపీడనం అటెటో తిరక్కుండా వున్నా బాగున్ను! తిరిగి వొస్తే బాగున్ను! తడిసి ముద్దయితే బాగున్ను!

అరే.. గాలి తేలిపోయింది! మబ్బూ తేలిపోయింది! మసాబు తేలిపోయింది! వానా తేలిపోయింది! ప్రాణం పోయింది! చినుకు కురవాలి! చిగురు తొడగాలి! మొక్కలే కాదు, మోడులైన మనుషులు తిరిగి మొలవడానికి! మొలకెత్తడానికి!

వానోస్తేనే.. తిరిగి నీకు వుత్తరం రాస్తాను!

అంతవరకూ సెలవు!

యిట్లు

నీ

నేస్తం!

తప్పుల వెనక మూగ రోదన!

 

 

టి. చంద్రశేఖర రెడ్డి

~

          పాఠకులు-పరిణామక్రమంలో కథకులో, సమీక్షకులో/విమర్శకులో అవుతారు. కాని, ఎంత మంది కథకులు తమ రచనలకు/వాటి పుస్తకరూపానికి నిబద్ధత గల ప్రూఫ్ రీడర్ అవుతారు?

ఈ ప్రశ్నకు సరైన జవాబు; వ్యక్తులెవరూ చెప్పనవసరం లేదు. తప్పులతడకలుగా వస్తున్నందుకు మూగగా రోదిస్తున్న రకరకాల రచనలే మౌనంగా సమాధానిస్తాయి.

ఆ రోదనకి కారణం రకరకాల ముద్రా రాక్షస చర్యలు.  వాటిని నివారించలేని, తొలగించలేని పరిస్థితులు.

అలాంటి వాటిని కొన్నిటిని ఈ వ్యాసం బహిర్గతం చేస్తుంది. ఈ ప్రయత్నానికి మద్దతుగా ఇచ్చిన ఉదాహరణలు నేను సృష్టించినవి.

అసలు రచనలనుంచే కొన్ని ఉదాహరణలు  ఇవ్వవచ్చు. ఇవ్వకపోవటానికి కారణం చెప్పకుండానే అర్థం చేసుకోవాల్సినది, చేసుకోగలిగినది.

  1. మన చేతిలో ఉన్న పుస్తకం కవరు పేజీ మీద కథల సంపుటి పేరు ‘విడాకుల పర్వం’ అని అందమైన అక్షరాలతో ఉంది. అదే సంపుటి వెన్నెముకపై ఆ పేరు కాకుండా  ‘నూరేళ్ల పంట’ అని ఇంకో పేరు అంతకన్నా అందంగా తీర్చిదిద్దబడింది. మొదటిది ప్రస్తుత కథల సంపుటి పేరు. రెండోది అదే రచయిత వెలువరించిన ఇంతకు ముందు కథల సంకలనం పేరు. కవరు పేజీ డిజైన్ చేసినపుడు ఒక చోట పేరు మార్చి, మరో చోట మార్చకపోవటంతో దొర్లిన పొరపాటిది. ఆ తప్పుతో, ఇప్పుడొక ప్రముఖ రచయిత కథల సంపుటి మార్కెట్లో ఉంది.
  2. రచనలో ప్రతి పేరా ఒక చోటే మొదలు కాకపోవటం. ఇది రెండు రకాలు. ఒకటి ప్రగతిపథంలో దూసుకుపోవటం. రెండవది వెనకబడిన వర్గానికి చెందాలనుకోవటం.

            “మీరిద్దరూ ఒకసారి నాతో బయటికి రావాలి” పెళ్లి జరిపిస్తున్న బ్రాహ్మణుడి సూచనతో పెళ్లికొడుకు లేచి నిలబడ్డాడు. అతడితో పాటు పెళ్లికూతురు కూడా లేచి నిలబడింది. వాళ్లిద్దరూ బ్రాహ్మణుడి వెంట ఫంక్షన్ హాల్ బయటికి నడిచారు.

“ఇప్పుడు బయట మాతో ఏం చేయిస్తారు?”  తన పక్కనే ఉన్న అన్నని నెమ్మదిగా అడిగాడు పెళ్లికొడుకు.

“మీ ఇద్దరికీ ఆకాశంలో ఉన్న అరుంధతీ నక్షత్రం చూపిస్తారు, ” అన్న లోగొంతుకతో జవాబిచ్చాడు.

వధువుతో పాటు అరుంధతి నక్షత్రం చూడటానికి ప్రయత్నిస్తున్న వరుడికి వివాహప్రక్రియలో,  ఒక భాగంగా ఈ క్రియ ఎందుకో  అర్థం కాలేదు.  పెళ్లైనతర్వాత ఇద్దరిలో ఎవరో ఒకరికి లేదా ఇద్దరికీ చుక్కలు కనపడతాయనటానికి ముందస్తు సూచనా ఇది?  తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది అతడికి.

  1. 0 విడిగా జీవించాల్సిన పదాలు సహజీవనం చేయటం.

అప్పుడేవిచ్చుకున్నగులాబీలా (ఈ మూడు పదాలూ కలిసి ఉండకూడదు) ఉంది కొత్త పెళ్లి కూతురి ముఖం. ఆమె మెడలో తాను వేసిన మూడు ముళ్లు, ముళ్లై గుచ్చుకుంటాయా తనకి, ముట్టుకోబోతే?ఎర్రబడ్డ వధువు కళ్లు చూస్తున్న వరుడికి అనుమానం కలిగింది.

  1. 0 పదాల్లో అక్షరాల మధ్య సమైక్యత లోపించి విడిపోవటం.

ఇంట్లో ద్వారాలకీ, కిటికీలకీ వేలాడుతున్న తోరణాల్లో ఎండిపోయిన మామిడి ఆకుల వంకా తన చేతిలో ఉన్న కాగితాల వంకా మార్చిమార్చి చూశాడతను. అది అతడికి భార్య పంపిన విడా  కుల (విడాకుల అని ఉండాలి) నోటీసు.

  1. 0 వాక్యంలో ఒక పదం బదులు ఇంకో అర్థం వచ్చే పదం రాయటం.

ఇద్దరి వైపూ పెద్దలు కూర్చుని రాజీకి ప్రయత్నిద్దామని అనుకుంటున్న సమయంలో అర్థంతరంగా ఈ నోటీసు ఏమిటి? (అర్థంతరంగా అంటే అర్థంలో భేదంతో అని. అర్ధంతరంగా అని ఉండాలి)

  1. 0 ఒక వాక్యం (బ్రాకెట్లలో ఉన్నది) పూర్తిగా లేకపోవటం.

బాసింపట్టు వేసుకుని కూర్చున్న అతని పక్కన ఆమె-మోకాళ్ల మధ్యలో తలదూర్చి అతడి వైపు తమకంతో చూస్తూ. ఆమె కాళ్లు బార్లా చాపి ఉన్నాయి. (ఇద్దరి పాదాలనూ తాకి వెనక్కి మళ్లుతున్న సముద్రకెరటాలు). అతడికి, దోసిళ్లతో వాటిని పట్టుకుని తాగాలనిపించింది.

  1. ఓ పంక్తి చివర పదంలో ఓ అక్షరం ఉండిపోయి, మిగిలిన అక్షరాలు రెండో పంక్తి మొదట్లోకి వెళ్లిపోవటం. ఈ జబ్బు ఎక్కువగా ‘ఉ’ అక్షరంతో మొదలయ్యే పదాల్లో కనపడుతోంది.

కొడుకుల చేతుల్లో తియ్యటి చెరకు రసం. వరండాలోని మడత మంచంలోకి విసిరేయబడ్డ పిప్పి

న్నట్లుండి (ఉన్నట్లుండి అనే పదంలో అక్షరాలన్నీ ఒకే చోట ఉండాలి) ఖళ్లుఖళ్లున దగ్గుతోంది.

  1. అక్షరాలకి గుణింతం లోపించటం.

ఈ వయసులో తనకి ఆసరాగా నిలబడాల్సిన ఒక్క కొడుకూ, తనన (తనని అని ఉండాలి) ఇలా వదిలేస్తాడని తవిటయ్య కలలో కూడా ఊహించలేదు.

  1. ఒక వాక్యంలో భాగమో, వాక్యమో, వాక్యాలో-అదే పేరాలో రెండో సారి పక్కపక్కనే రావడం. ఇలాంటి పొరపాటు సాధారణంగా ఒక పేజీ చివరనుంచి, మరో పేజీ మొదటికి వెళ్ళినపుడు జరుగుతుంది.

చనిపోతూ భార్య కోరిన ఆఖరి కోరిక తీర్చటం వల్ల తనకీ పరిస్థితి దాపురించిందా? ఒక సారి తల బాదుకున్నాడతను. (పేజీ ముగింపు)

చనిపోతూ భార్య కోరిన ఆఖరి కోరిక తీర్చటం వల్ల తనకీ పరిస్థితి దాపురించిందా? ఒక సారి తల బాదుకున్నాడతను. (తర్వాత పేజీ మొదలు)

  1. 10. అవసరం లేని చోట ఒక అక్షరానికి గుణింతం వాడటం.

తన మనసు ఇంతగా పరిణితి ఎప్పుడు చెందిందో ఆమెకి తెలీటం లేదు. అది కూడా పరిణితి చెందితేనే తెలుస్తుందేమో? (పరిణితి కాదు పరిణతి).

  1. 11. అక్షరాలకి ‘ఒత్తు’ తప్పుగా ఇవ్వటం.

అలాగైతే సెకండ్లూ గంటలూ ఏమిటి? అతడికి అర్ధం కాలేదు (‘థ’ ఒత్తు బదులు ‘ధ’ ఒత్తు).

  1. 12. అసలు వాడకూడని ‘ఒత్తు’ ని వాడటం.

పెళ్ళిపీటల మీద కూర్చున్న అతనికి అవి ముళ్ళకంచెల్లా అనిపిస్తున్నాయి (‘ళ’ ఒత్తు ఏ అక్షరానికీ వాడకూడదు. అన్ని సందర్భాల్లోనూ ‘ల’ ఒత్తే వాడాలి).

  1. 13. పదంలో ఒక అక్షరానికి వాడాల్సిన గుణింతాన్ని ఇంకో అక్షరానికి ఉపయోగించటం.

ఆ భ్రమ కలిగించిన భయంతో ఉన్న అతడికి, పెళ్లికూతురు పెదాలపై చిరునవ్వు చూసి కొంచెం స్వాంతన కలిగింది. (‘సాంత్వన’ బదులు ‘స్వాంతన’).

  1. పదంలో వాడకూడని అక్షరాలని వాడటం.

కళ్యాణమంటపం అనే పదబంధంలో ‘మంట’ అనే పదం ఎందుకుందో, పెళ్లైన సంవత్సరానికి కాని అర్థం కాలేదతనికి (‘కళ్యాణ’ అని రాయకూడదు-‘కల్యాణ’ అని ఉండాలి).

  1. 15. పదంలో ఉండాల్సిన అక్షరాలు లేకపోవటం.

వద్దన్నా వెంటపడుతున్న ఆమె జ్ఞాపకాలు అతడి మనసును అతలాకుతం (అతలాకుతలం అని ఉండాలి) చేస్తున్నాయి.  

  1. 16. ఒత్తు సరిగా వాడి, అక్షరం తప్పు రాయటం.

గతం స్మశానమైతే స్మృతులు మరణించిన అనుభవాలకి సమాధులా? (‘స్మ’  కాదు, ‘శ్మ’ అని ఉండాలి).

  1. 17. ఒక పేజీ పూర్తిగా డి‌టి‌పి కాకపోవటం.

ఇంటిముందు నిలబడి అనుమానంగా కాల్ బెల్ నొక్కాడతను. లోపలినుంచి ఎవరో నడిచి వస్తున్నట్లు అడుగుల చప్పుడు. నెమ్మదిగా తలుపులు తెరుచుకున్నాయి.

(మధ్యలో ఒక పేజీ లేదు)

ఎదురుగా విశాలంగా వినీలంగా ఒక కల్లోలిత సముద్రం. ఉవ్వెత్తున లేచి పడుతున్న అలలు. ఆ హోరు వింటూ చేష్టలుడిగిపోయి అతడు నిలబడ్డాడు.

  1. 18. ఒక వాక్యంలో పదాలు తర్వాత వాక్యంలో భాగంగా మారటం.

ఆమెకి దుఃఖం వచ్చింది. అతడి మాటలు గుర్తొచ్చి, దూరంగా ఎవరో నవ్వుతున్న సవ్వడి (ఆమెకి దుఃఖం వచ్చింది అతడి మాటలు గుర్తొచ్చి అనేది ఒక వాక్యం. మిగిలింది ఇంకో వాక్యం.)

  1. సంబంధం లేని అక్షరాలు పదాలతో జత కట్టటం.

నీళ్లొచ్చినంత మాత్రాన నల్లాలూ, కళ్లూ ఒకటే అనుకుంటే ఎలా!1 (ఆశ్చర్యార్థకం, 7 అంకె కీ బోర్డ్ లో ఒకే ‘కీ’ గా ఉంటాయి. అందుకే రెండు ఆశ్చర్యార్థకాల బదులు ఒక ఆశ్చర్యార్థకం, వాక్యం చివర 7 అంకె వచ్చాయి.)

వివిధ ప్రక్రియల్లో రచనలు చేసేవారూ, తమ రచనలని పుస్తకరూపంలో తెచ్చేవారూ వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రూఫ్ రీడింగ్ చేస్తే, తమ రచనల్లో ముద్రారాక్షసకాండని నిశ్చితంగా గణనీయంగా తగ్గించొచ్చు.

ఎట్లా ఉన్నది అక్కడ?

 

అనగనగా ఒక నగరం.

నగరం అంటే నగరం కాదు.

బ్రహ్మాండమైన నగరం.

అలాటిలాటి నగరం కాదది.

సాక్షాత్తూ విశ్వనాథుడి నివాసం.

జటాజూటవాసిని, గంగానమ్మవారి తీరం.

ఆ తీరంలో ఆ పురం.

ముల్లోక పూజ్యం.

సకల సద్గుణం.

సకల విద్యాపురం.

పేరు కాశీపురం.

ఆ పురానికి ఒక రాజు.

చాలా గొప్ప రాజుగారు.

సద్గుణ విరాజమానుడు.

ధర్మనిరతుడు.

పేరు విక్రమసింహుడు.

పేరొక్కటే విక్రమం కాదు.

అన్నిట్లోనూ త్రివిక్రముడే.

అందులోనూ సింహంలాటి వాడయ్యె.

ప్రజలకు లోటేమి ?

అసలైనా శాస్త్రాలెం జెపుతయ్?

**************************

రాజాదైవతరూపేణ

కామధేనుశ్చ మంత్రిణః

పరివారం కల్పవృక్షంచ

యథారాజాతథాప్రజాః

 

రాజారాక్షసరూపేణ

వ్యాఘ్రరూపేణ మంత్రిణః

పరివారం శ్వానరూపేణ

యథారాజాతథాప్రజాః

**************************

అని కదా!

మరి మనవాడేమో దైవతరూపేణ గా ఉన్నాడయ్యె.

ఇహ ప్రజలెట్లా ఉంటారు ?

తథాస్తుగా ఉంటారు.

అంతేగా మరి ?

అంతే అంతే.

 

అలాటి రాజుకు కష్టమొచ్చిందయ్యా?

ఏవిటి కష్టం?

పిల్లల్లేకపోటం.

ఆ రోజుల్లో పిల్లల్లేకపోటం అంటే చాలా నామోషి.

ఇప్పటి చైనా వాళ్ళలా ఇబ్బడి ముబ్బడిగా ఉండాలన్నది అప్పటివారి కోరిక.

అంతకు కాదంటే మనవాళ్ళల్లా ఇబ్బు మబ్బుగానన్నా ఉండాలని కోరిక.

అందువల్ల ఏం జేసాడాయన ?

పిలిచాడు!

ఎవరిని ?

జ్యోతిష్యులని, శస్త్రాధికారుల్ని.

అడిగాడు.

ఏవిటీ సంగతి అని.

చార్మినారు రేకులు అప్పటికి లేవు కాబట్టి జ్యోతిష్యులేమి చెప్పలేకపొయ్యారు.

శస్త్రాధికారుల్ని అడిగితే శాస్త్రం మాకు తెలీదు సార్, మీలో లోపం మటుకు ఏమీ లేదు అన్నారు.

శస్త్రాధికారులంటే, శాస్త్రాధికారులనుకొని పొరబడేరు, కాదు కాదు వారు ఇప్పటి డాక్టర్లండోయ్

అప్పుడయన ఇలాక్కాదు సంగతి అని, సరాసరి విశ్వనాథుడి దగ్గరకెళ్ళిపోయాడు.

దగ్గరికెళ్ళిపోయి స్తోత్రం చేశాడు.

శివయ్య రాలా.

అరే, ఇదేమిట్రా నాగతి. ఈయన రాపోతే ఇక్కడే తలపగలగొట్టుకుని చచ్చిపోతానని ఆయన్ని కావలిచ్చుకుని కూర్చున్నాడు.

అలా ఆయన్ను పట్టుకుని విడవలా.

ఎంత విగ్రహమైనా భక్తితో పట్టుకుంటే అసలాయన్ని పట్టుకున్నట్టే.

పైగా పట్టుకుని విడవకపోతే ఇంకోళ్ళెలా పట్టుకుంటారు ?

అమ్మవారేమో అయ్యవారి పక్కనే ఉంటుందాయె.

ఇలా ఈయన ఆయన్ని పట్టేసుకుని కూర్చుంటే ఆవిడకు పట్టు దొరకట్లా.

అమ్మవారికి ఇక విసుగొచ్చింది.

ఇదేవిటండీ ఇలా మిమ్మల్ని కావిలిచ్చుక్కూర్చుంటే ఎట్లానని.

శివయ్య తత్తర బిత్తర పడ్డాడు.

అమ్మకు కోపం వస్తే ఇంకేవన్నా ఉందీ ?

గగ్గోలు గందరగోళం అయిపోదూ ?

అదంతా ఎందుకని నీకేవిటి కావాలి అని అడిగాడు విక్రమసింహుణ్ణి.

ఆయనన్నాడు, అయ్యా! దేవరా! నాకు సంతానం కావాలి అన్నాడు.

సరే ఇంక కొన్ని రోజులాగు, నీకు సంతానం కలుగుతుంది. ఇంక నన్నొదిలెయ్ అన్నాడాయన.

పట్టు వదలని విక్రముడు పట్టు వదిలాడు.

శివయ్య హాపీసు.

అమ్మవారు హాపీసు.

ఆ తర్వాత కొన్ని రోజులకు విక్రముడు హాపీసు.

ఎందుకు ?

ఒకరు కాదు, ఏకంగా ముగ్గురొచ్చారు.

కూతుళ్ళ రూపంలో.

అంబ, అంబిక, అంబాలిక పుట్టారయ్యా..

పుట్టారు, పెద్దవాళ్ళయ్యారు.

అందరూ కూతుళ్ళే కావటంతో వాళ్ళనే కొడుకులనుకుని కత్తి యుద్ధాలు, అస్త్ర విద్యలు అన్నీ దగ్గరుండి నేర్పించాడు విక్రముడు.

అందులో అంబ చలాకీదవ్వటం వల్ల, చటుక్కున మెలకువలన్నీ పట్టుకుని ఆరితేరిపోయింది.

సరే ఆటలు, పాటలు పక్కనబెడితే – కూతుళ్ళు గెడకర్రల్లా పెరిగిపోవటంతో పెళ్ళీడుకొచ్చారు అన్న సంగతి తెలిసిపోయింది.

పెళ్ళంటే మటాలా?

అందులోనూ యువరాణులు.

పైగా కాశీరాజు కూతుళ్ళు.

సరితూగేవాడు కావొద్దూ ?

సరితూగేవాడు రావొద్దూ ?

అలా వచ్చేవారకూ కొంతమంది ఎదురు చూస్తారు.

అలా కుదిరేవరకూ కొంతమంది ఎదురు చూడరు.

అలా ఎదురు చూడకూడదని డిసైడు అయిపోయినవారి లిష్టులో అంబ చేరింది.

అలా చేరటానికి ఒక కారణం వున్నది.

ఆ కారణానికి కారణం యవ్వనం.

అవును యవ్వనమే.

యవ్వనమంటే కలకలం, కిలకిలం.

కిలకిలలతో కళకళలాడుతున్న కాలంలో ఒకరోజు అంబ ఒక ఉద్యానవనానికి వెళ్ళింది.

ఉద్యానవనానికి యువరాణులు మామూలుగా వెళతారూ ?

బోల్డంతమంది చెలికత్తెలు వగైర వగైరా.

అలా అక్కడికెళ్లినప్పుడు సౌంభపురానికి రాజైన సాళ్వుణ్ణి అక్కడ చూసింది.

సౌంభపురం అంటే ఇప్పటి పంజాబులో ఒక ప్రాంతం.

కాశీకి కాస్త దగ్గరే.

సాళ్వుడు కూడా యవ్వనంలో వున్నాడు.

నాన్న ఆజ్ఞప్రకారం దేశాటనలో పడ్డాడు.

రాజు కాబోయేముందు అలా దేశాటన చేసిరావటం ఒక ఆచారం.

అలా అలా తిరుగుతూ కాశిపురానికి వచ్చాడు.

యువరాజు, అందునా అందగాడు.

విక్రమసింహుడు సాళ్వుడొచ్చిన విషయం తెలుసుకుని ఆతిథ్యం స్వీకరించబ్బాయ్ అని ఒక భవంతిలో కూర్చొబెట్టాడు.

రోజంతా భవంతిలో కూర్చుని విసుగొచ్చి సాళ్వుడు అమ్మాయిగారొచ్చేసమయానికే వ్యాహ్యాళికి వెళ్ళాడు.

అటో ద్వారం.

ఇటో ద్వారం.

అటు పక్క అంబ.

ఇటు పక్క సాళ్వుడు.

అటుపక్కన ఉన్న అంబ ఎలా ఉందిట?

ఎలా ఉంది ఆ సౌందర్యవతి ?

ధగధగ మెరిసిపోయే తెల్లని చీర

చేతులకు గాజులు

కాలికి అందెలు

జబ్బలకు కడియాలు

మధ్య పాపట

దమ్మిడీ అంత బొట్టు

మెళ్ళో ఆభరణాలు

కోరకొప్పు

కొప్పుగొలుసులు

ఈ కొప్పుల గురించి కుమార సంభవంలో “పలుచని పూతలున్ మెరుగుబండ్లును నున్నని కోరకొప్పులున్ బొలకువ తీపు జెన్ను బొరపొచ్చెము బొచ్చము కాగ మాయలన్ లలనల దేర్పజూచు” అంటూ ఒక మాంచి మాట ఉన్నది

మరి ఇటుపక్కన ఉన్న సాళ్వుడు ఎలా ఉన్నాడట?

ప్రచండంగా ఉన్నాడు

విక్రమం ఉట్టిపడుతున్నాడు

మార్తాండమండల తేజంతో వెలిగిపోతున్నాడు

తీరైన తల

ఆ తల మీద పాగా

ఆ పాగలో నెమలీకలు

కోటేరులాటి ముక్కు

కోర మీసాలు

చిరు గడ్డం

అసలు అబ్బబ్బా లాగ ఉన్నాడు

ఆడపిల్ల చూసిందంటే గుండెలో తంత్రులు తెగిపోవాల్సిందే

అంత అందగాడు

అందాల సంగతి పక్కనబెట్టేస్తే వీళ్ళు నిలుచుకొని ఉన్నచోట పూలు, సువాసనలు, మకరందాలు, తేనెటీగలు.

ఎలా ఉంది అక్కడ?

అదీ కాక అప్పుడు వసంత కాలం

వసంత కాలం గురించి కుప్పలు తెప్పలుగా వర్ణనలు

***********************

ఎందును బుష్పసౌరభము * లెందు నమందమదాలిఝంకృతం

బెందును సాంద్రపల్లవము * లెందును గోకిలకంఠకూజితం

బెందును విస్ఫురత్ఫలము * లెందును గోమలకీరభాషితం

బందము లయ్యె మందమరు * దంచితచారువనాంతరంబులన్

***********************

అని నృసింహపురాణంలో ఒక వర్ణన మచ్చుకి

సరే, అదలా పక్కన పెడితే – కేతకీ పుష్పాలు వికసించిపోయి వున్నాయి

నువ్వేనేమిటే వికసించేదని వకుళ, చంపక, నాగ, పున్నాగ, సన్నజాజి అన్నీ పోటీలు పడ్డాయి

ఇక కలువలు, పద్మాలు వాటితో పాటు చకోరాలు, హంసలు, చిలుకలు సంగతి చెప్పనే అక్కరలా

ఆ మధ్యలోనే యవ్వనం.

ఇహ సీను ఊహించుకోవచ్చును.

వీటన్నిటికి తోడు ఆ సమయంలోనే మన్మథుడు కూడా లోకసంచారం చేస్తూ అక్కడికొచ్చాడు.

అంతే, వీళ్ళిద్దరిని చూసి, వాళ్ల అందాలు చూసి ఆయనకు మతిపోయింది.

ఆయనకు మతి పోయిందంటే ఏం చేస్తాడో ఆయనకే తెలీదు.

అహా అని పొగుడుదామని చేతులెత్తాడు.

ఆయన చేతులు ఎంత పొడుగో ఆయన బాణాల సంచీ అంత పొడుగు.

అందులో బాణాలు ఇంకా పొడుగు.

పైగా వాటికి పూలు గట్రా, ఆ హంగామా అంతా ఉంటుందాయె.

ఈయన చేతులెత్తినప్పుడు ఆ పూల వొత్తిడి మెత్తగా తగిలింది.

ఆడవారి చిటికెనవేలి కొసలు, పూలు ఒకటే.

ఆయనకు రతీదేవి వేళ్ళు గుర్తుకొచ్చినై.

దక్షుడి కూతురైన రతి, అందరికీ మనఃవికారాలు కలిగించే తన మనస్సునే అల్లకల్లోలం చేసిన సంగతి గుర్తుకువచ్చింది.

రతీదేవిని పెళ్ళి చేసుకున్నప్పుడు ఆవిడ చిటికెనవేలు ఈయన చిటికెనవేలిని పట్టుకుని నడిచిన సంగతి గ్యాపకం వచ్చింది.

చిటికెనవేలు తగలటమేమిటి, రసవాహిని ఒళ్ళంతా ఝల్లుమనిపించటమేమిటి – అలా అన్నీ గుర్తుకొచ్చినాయి.

వీళ్ళ సంగతి కూడా అట్లా చెయ్యాలన్న చిలిపి కోరిక అలా వచ్చి చేరింది మన్మథుడి మనస్సులోకి.

అంతే, ఆ పొడుగు చేతుల్తో ఇంత పొడుగు పూల బాణాలు, పంచబాణాలు ఒకసారి సవరించుకొన్నాడు

ఆ బాణాలు ఏవిటయ్యా అని ఎవరైనా అడిగితే “అరవిందాశోకచూత: నీలోత్పలే నవమల్లికా” అని ఒక లైను వదలండి

తామర, అశోక, మావిడి, మల్లె, కలువ పువ్వుల బాణాలు అవి

ఒక్కొక్కదానికి ఒక్కో మోహం, ఒక్కో సువాసన, ఒక్కొక్క వశీకరణం

మరి ఐదూ కలిస్తే ఇంకేమన్నా ఉన్నదీ ?

సరేనని ఎడమ భుజమ్మీదున్న విల్లందుకున్నాడు.

ఆ విల్లు చెరుకు గడలతో చేసి ఇంత పొడుగ్గా ఉన్నది.

చెరుకు గడల కణుపుల మీద చెయ్యి పెట్టాడు.

ఓ సారి నారిని టక్ టక్ మని సవరించాడు.

బాగా చప్పుడు చేసిందది.

అంటే బిగువుగా సిద్ధంగా ఉన్నానని ధరించినవాడికి చెప్పటమన్నమాట.

అయితే ఆయన దేవుడు కావటం వల్ల, ఆ విల్లు కూడా దేవుడి చేతిలో ఇమడటం వల్ల, అది చేసిన చప్పుడు తేనెటీగల ఝంకారంలా వినపడింది ఆ ఉద్యానవనంలో.

సవుండు ఆగింది. నిశ్శబ్దం రాజ్యమేలింది.

అప్పుడు చూశాడు.

ఎవరి వంక?

అంబ వంక చూశాడు, సాళ్వుడి వంక చూశాడు.

మధ్యలో ఉన్న ఖాళీ స్థలం వంక చూశాడు.

పరుగు పరుగున ఆ మధ్యలోకొచ్చి నిలబడి అటు ఐదు బాణాలు, ఇటు ఐదు బాణాలు వదిలేసాడు

ఫాస్టుగా, తేరుకునేందుకు అవకాశమే ఇవ్వకుండా.

ఆయన బాణాలెయ్యటం, ఈ ఇద్దరికీ గుచ్చుకోవటం ఒక వరసలో ఇరికింది.

వెయ్యగానే అటు అంబకు, ఇటు సాళ్వుడికి మనసు ఝల్లుమనటం. గుండె ఘల్లుమనటం జరిగిపోయినై.

ఝల్లు, ఘల్లుల మధ్య ఒక ఆవేశం కలిగింది.

అదే మోహావేశం.

అది పట్టుకుంటే ఎవరు నిలబడతారు ?

మోహం అనేది ఒక వలయాగ్ని.

కొంతమందికి విషవలయాగ్ని.

యవ్వనమనే నెయ్యి ఆ అగ్గిలో పోస్తే పెచ్చరిల్లటమే కానీ, తగ్గేదుండదు.

బాలానాం న భయం న మోహం అన్నారు కానీ, యవ్వనానాం న భయం న మోహం అనలేదందుకనే!

అయితే సత్ పురుష, సత్ స్త్రీల మోహం ఇంకో మెట్టు ఎక్కుతుంది.

ఆ మోహానికి పైనున్న మెట్టు పేరు ప్రేమ.

వీరిద్దరూ సత్ కోవకు చెందినవారు కాబట్టి మోహం వదిలి ప్రేమ మెట్టు ఎక్కేశారు.

సాళ్వుడు, కళ్ళు మనసు గిరగిరా తిరుగుతున్నా, స్టెబిలైజు అయిపోతూ, నేన్నిన్ను పెళ్ళి చేసుకుంటా అన్నాడు.

ప్రేమ దోమ ఎంత ఉన్నా అమ్మాయీమణి అమ్మాయీమణేగా! ఆవిడ భయం ఆవిడది. పైగా నాన్న మాట జవదాటనిది.

అందువల్ల ఆవిడన్నదీ – సామీ, ఇలా అడిగితే గెష్టు లేదు, లిష్టు లేదు అని మా అయ్య నిన్ను తుక్కు చేస్తాడు. నువ్వెళ్ళి మీ పెద్దాళ్ళనేసేసుకుని రా! – అని

సాళ్వుడు, సరే ఇదేదో బాగుంది, నేనెళ్ళొస్తా – అందాకా ఇక్కడే ఉద్యానవనంలో తిరుగుతూ ఉండమాక, చల్లగా ఉంది జలుబు చేస్తుంది అంత:పురానికి వెళ్ళు అని ఒక జోకు జోకి ఇంటికి పరుగులెత్తాడు.

ఇంతలో కాశీరాజుగారు ఒక మంత్రుల సమావేశం ఏర్పాటు చేసారు.

ఆ సమావేశంలో రాజుగారన్నారు – బాబూ! లోకధర్మం ప్రకారం పెళ్ళి చెయ్యాలి, రాజ్యధర్మం ప్రకారం స్వయంవరం ఏర్పాటు చెయ్యాలి. కానీ…”

కానీ అని ఆగిపోయాడు.

ఆలోచనలో పడ్డాడు.

ఇక మాట పొడిగించలా.

ఎందుకా ?

ఆయన ఒక సాత్త్విక భావానికి గురైనాడు.

సాత్త్విక భావమంటే సత్వానికి సంబంధించిన భావమనే అనుకోకూడదు.

సాత్త్విక స్వభావాలు ఎనిమిదని లోకోత్తరం.

సాత్త్వికం అంటే ఒక భావం.

భావాలు మనుషులకు కాక ఎవరికుంటయ్యి ?

ఆ భావం ఏదైనా కావొచ్చు.

అయితే ఆ ఏదైనా ఈ ఎనిమిదిట్లో ఇరకాల్సిందేనని లోకధర్మం, శాస్త్రసమ్మతం.

ఆ ఎనిమిదినిట్లా నిర్వచించారు.

“స్తంభః స్వేదః రోమాంచః స్వరభంగః వేపథుః వైవర్ణ్యం అశ్రుః ప్రళయమ్ ఇతి అష్టౌ సాత్త్వికా స్మృతాః ”

స్తంభః అంటే నిశ్చేష్టత

స్వేదః అంటే చెమటలు పట్టటం

రోమాంచః అంటే గగుర్పాటు కలగటం

స్వర భంగః అంటే గొంతు గద్గదం కావడం

వేపథుః అంటే ఒంట్లో వణుకు పుట్టటం

వైవర్ణ్యం అంటే కళ తప్పిపోవటం

అశ్రుః అంటే కళ్ళలో నీళ్ళురావటం

ప్రళయమ్ అంటే పూర్తిగా వివశుడైపోవటం

ఇవీ ఎనిమిది సాత్త్విక భావాలు

ఈ ఎనిమిదిట్లో స్వరభంగః భావానికి గురైనాడు.

మాట పెగలట్లా.

పైగా రాజుగారు.

మంది ఉన్న సభ.

మంది ఉన్న సమావేశం.

మంత్రులున్న సమావేశం.

మంత్రులకేం తోచలా.

ఎందుకు ఏడుస్తున్నాడన్నది ముందు అర్థం కాలా.

ఇంతలో తెలివికల ఒక మంత్రి లేచి – అయ్యా, మీ బాధ నాకర్థమయ్యింది, మీ ఏడుపు నాకర్థమయ్యింది అన్నాడు.

మిగిలిన మంత్రులంతా ఈ తెలివిడి మంత్రి వంక చూసారు.

అబ్బో మాకు తెలీంది వీడికి తెలిసింది ఏమిటానని!

ఆయన స్పీచు మొదలుపెట్టాడు.

“అయ్యా ఆడపిల్లలున్న తండ్రికి ఇదే చిక్కు, పెళ్ళి చేసి పంపించాలంటే గుండె అంతా మెలిపెట్టేసినట్టు ఉంటుంది. మాటలు రావు. మనసు కదలదు. అయినా ఒక తండ్రిగా మీరు మీ బాధ్యత నెరవేర్చాలి. పిల్లలను గుదిబండగా చేసుకోకుండా ఒక మొగుడుబండని చూసి వాడికిచ్చేసి మన బాధ వాడికి ట్రాన్స్ఫరు చేసేస్తే అయిపోతుంది, కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా స్వయంవరం ప్రకటించండి. పైగా ముగ్గురూ ఈడుకొచ్చారు కాబట్టి, ముగ్గురికీ ఒకటే సారి ప్రకటించెయ్యండి పనైపోతుంది” అని స్పీచు ముగించి కూర్చున్నాడు.

అప్పుడు మిగిలిన వారందరికీ అర్థమయ్యింది, రాజుగారి బాధ.

సందు దొరికింది కదాని ప్రతివాడు సలహాలివ్వటం మొదలుపెట్టాడు.

అవతలివాడు బాధ పడుతున్నాడంటే ఆనందించటం లోకస్వభావం.

ఆ స్వభావం ఆ కాలంలో తక్కువే అయినా ఉచిత సలహాలకు మటుకు తక్కువ లేదు.

అంతా తలో సలహా పడేసి కూర్చున్నారు.

అప్పుడు రాజు గారిని రెండో సాత్త్విక స్వభావం ఆక్రమించుకుంది.

అశ్రు: అని ఆ స్వభావం.

అది వచ్చినప్పుడు ఆపుకోవటం పరమాత్మకైనా కష్టమే.

రాజుగారి స్థితిని గమనిస్తున్న ముఖ్యమంత్రి అందరిని బయటికి తరిమేశి – సార్, మీరట్లా మంది ముందు ఏడిస్తే కష్టం సార్ అన్నాడు

మరి ఏం చెయ్యమంటావయ్యా? ఏడుపొచ్చినప్పుడు ఏడవక కుక్కుకోమంటావా అని కసిరాడు రాజుగారు

సంభాళించుకోవాలి సార్, మీరు రాజుగారు కాబట్టి చెప్పటం, మామూలు వాళ్ళైతే గంగాళాలు కార్చినా నే పట్టించుకోను అన్నాడు ఆ మంత్రి

దాంతో తెలివి తెచ్చుకుని, సరే ఆలోచన చేసి స్వయంవరం ఎప్పుడు ప్రకటిద్దామో చెప్పండి అని అంత:పురంలోకి వెళ్లిపోయాడాయన

దీనికి ఆలోచన ఎందుకండీ, మీరు ఊ అనండి స్వయంవరం ఏర్పాటు చేసే బాధ్యత అంతా మాది అని, ఆయనతో పాటు అందాకా వెళ్ళి ఆయనతో ఊ అనిపించుకుని దండోరాలు, ఆహ్వానపత్రాలు వేసేసి ప్రపంచం నలుమూలలకి పంపించేసాడు ఆ ముఖ్యమంత్రి

స్వయంవరం వార్త అమ్మాయీమణికి చేరింది

సంతోషకరమైన వార్త వింటే ఒళ్ళు పులకించదూ

అలా పులకింతల్లో ఈ ప్రపంచమే మర్చిపోతుంటే చెల్లెళ్ళిద్దరూ వచ్చారు

అంబాలిక అన్నదీ, ఈ స్వయంవరం ఒక్కొక్కళ్ళకు ఒక్కో సంవత్సరం పెడితే బాగుండునేమో అని

అయ్యో, ఈ స్వయంవరంవల్ల మనం ముగ్గురూ మూడు రాజ్యాలకు వెళ్ళిపోతే ఎట్లానే అక్కా అని అంబిక అన్నది

అంబాలిక పోనీ ముగ్గురం కలిసి ఒకణ్ణే పెళ్ళి చేసుకుంటే పోలానని వేళాకోలమాడింది

ఊరుకో పైన తథాస్తు దేవతలు ఉంటారు, నిజమయ్యేను అని కోపగించింది అంబ

ఆవిడ బాధ ఆవిడది, ఎక్కడ సాళ్వుణ్ణి పంచుకోవాల్సి వస్తుందోనని

ఎందుకే అంత కోపం, స్వయంవరానికొచ్చే యువరాజుల్ని పెళ్ళి చేసుకోవటం నీకిష్టం లేనట్టున్నది అన్నది అంబాలిక

రాజు లేదు, పేద లేదు, కులం లేదు, మతం లేదు, ఎవరైనా సరే నేను మెచ్చినవాణ్ణే పెళ్ళాట్టం అని గట్టిగా తెగేసిందీవిడ

మరి స్వయంవరం అంటే అంతేగా అన్నది అంబిక

స్వయంవరంలో వచ్చిన పదిమందిలో ఒకరిని మెచ్చటం కూడా ఒక మెచ్చటమేనని వెళ్ళిపోయింది అంబ

రాత్రయ్యింది, రేయి గడిచిందంటే పొద్దున్నే స్వయంవరం

యువరాజులందరూ వచ్చేసారు

పట్టణం అంతా కోలాహలంగా ఉన్నది

ఆ కోలాహలమంతా చూట్టానికి కళ్ళు చాలట్లేదు

పట్టణమంతా దేదీప్యమానంగా వెలిగిపోతోంది

ప్రాకారాలన్నీ మేరు పర్వతమంత ఎత్తున బోర విరుచుకొని ఉన్నవి

ఎందుకట ?

బంగారంతో తాపడం చేసేశారని

స్థంభాలన్నీ నిటారుగా తలేత్తుకొని నిలబడినవి

ఎందుకట?

స్ఫటికాలతో చుట్టివేసి అలంకరించేశారని

కుడ్యాలన్నీ మీసాలు మెలివేస్తున్నవి

ఎందుకుట?

మరకతమాణిక్యాలతో సింగారించేసారని

లతలన్నీ, చెట్లు తాండవమాడుతున్నవి

ఎందుకుట?

గాలిదేవుడు ఒక పుప్పొడిని ఇంకో పుప్పొడితో కలిపేసి హోలీ రంగులు చల్లేశాడని

ఇలా ఒక రకమైన కోలాహలం కాదు, వెయ్యి పండగల కోలాహం అంతా అక్కడ కుప్పపోసినట్టు ఉన్నది

ఆ కోలాహలంలో ఒక ఆజానుబాహుడు ఆరు అశ్వాలు పూంచిన రథమ్మీద నెమ్మదిగా ఆ పట్టణంలోకి అడుగుపెట్టాడు

వీర స్వభావమే ఆయన కాళ్ళ ముందు పడిగాపులు కాస్తున్నంత ఇదిగా ఉన్నాడు

అంత వీరంతో ఉన్న వీరుడెవరయ్యా?

ఇంకెవరు? గాంగేయుడు

సాక్షాత్ ఆ గంగమ్మ పుత్రుడు

పేరు దేవవ్రతుడే అయినా గాంగేయా అని పిలిస్తేనే ఇష్టమట ఆయనకు

అమ్మంటే అంత ప్రేమ

అమ్మ పేరంటే అంత ప్రేమ

కొంతమంది వెంటనే గుర్తుపట్టారు

కొంతమందికి ఆయనెవరో తెలియదు

కొంతమంది ఆ అందగాణ్ణి విభ్రమంగా చూస్తూ నిలబడిపోయినారు

కొంతమంది చెవులు కొరుక్కోవటం మొదలు పెట్టారు

గాంగేయుడు వచ్చాడేమి?

ఆయన పెళ్ళి చేసుకోనని కదా శపథం పట్టాడు!

శపథం వదిలేశాడా?

ఇలా నానారకాలుగా మాటాడుకుంటున్నారు

దేవవ్రతుడు వచ్చాడన్న వార్త అంత:పురానికి చేరిపోయింది

అంబాలిక అంబిక కూడా చెవులు కొరుక్కున్నారు

అంబకు ఆ చెవుల కొరుకుడు శబ్దం నచ్చలేదు

వచ్చి అడిగింది సంగతేమిటని

వారిద్దరూ చెప్పినారు వింతగా ఉన్నదే, పెళ్ళి చేసుకోనని శపథం పట్టిన శంతనమహారాజు కొడుకు దేవవ్రతుడు కూడా స్వయంవరానికి వచ్చాడని

దేవతల వ్రతం కలవారంతా దేవవ్రతులే కానీ, పెళ్ళి చేసుకోకపోతే ఎందుకు వచ్చాడట అని దీర్ఘాలు తీసింది అంబ

నీ దీర్ఘాల వల్ల అక్కడ ఏమీ కాదు కానీ, రేపు స్వయంవరంలో ఏమవుతుందో ఏమిటోననుకుంటూ వెళ్ళిపోయినారు అంబిక అంబాలిక

అంబ దీర్ఘాలోచనలో పడిపోయినది

సాళ్వుడే మది నిండా

ఆ అందగాడి తలపులే

ఆ అందగాడి పాణిగ్రహణమే

రేపటి స్వయంవరంలో ఆ అందగాడి మెడలో తన చేతినుంచి పడబోయే వరమాల ఊసులే

అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూనే మాగన్నుగా మగత నిద్రలోకి జారిపోయింది

ఇంతలో ఒక ధవళవస్త్రధారి, ఒక దేవదూత వచ్చాడు

అంబా, అంబా అని పిలుస్తూ వచ్చేశాడు

ఎవరది అంటూ దిగ్గున లేచింది అంబ

నీవు చేయవలసిన కార్యం జరిగించే సమయం వచ్చేసింది అంటూ ఆ దేవదూత వచనం మొదలుపెట్టినాడు

అంబ తికమక పడిపోయింది

నేను చేయవలసిన కార్యమేమిటి, అసలు నువ్వెవరు అన్నది

నేనొక దేవదూతను, నీవు చేయవలసిన కార్యం ఆ మహానుభావుడు దేవవ్రతుణ్ణి కడతేర్చడమే

నేనా, ఆ గాంగేయుణ్ణా హతమార్చేది అంటూ మ్రాన్పడిపోయినది అంబ

దేవదూత నెమ్మదిగా దగ్గరకు వచ్చి, అంబా నీవు దేవాంశ సంభూతురాలవు, అతణ్ణి నిర్జించటానికే పుట్టించబడ్డావు అంటున్నాడు

అయ్యో నాకా సంకల్పం ఈషణ్మాత్రమైనా లేదేనని అన్నది తేరుకున్న అంబ

నీకు తెలియని సంకల్పాన్ని చిగురించి, దానిని దృఢ సంకల్పం చేయటానికే దేవతలు నన్ను పంపించారు అన్నాడీయన

దేవతలకు ఆయన మీద అంత కోపమేమి అని ప్రశ్న వేసింది అంబ

దేవతలూ తప్పులు చేస్తారు. సాధారణంగా ఆ తప్పులు దేవతలకార్య నిమిత్తం ఆ పరమాత్ముడు చేయిస్తూ ఉంటాడు. అలాటి తప్పు ఒకటి చేసి శాపవశాన ఈ భూమ్మీదకు వచ్చినవాడు ఆ శాంతనవుడు, ఆ గాంగేయుడు. అతని శాపం నీవల్ల తీరవలసిందే. ఇది దైవ నిర్ణయం అని చెప్పాడు ఆ దేవదూత

మరి అతను చేయవల్సిన కార్యం ముగిసిపోయిందా అని మారుప్రశ్న వేసింది అంబ

లేదు, కొద్దికాలంలో పూర్తిచేస్తాడు, అప్పుడే నీ అవసరం, ఆ అవసరానికి తగ్గ సంకల్పం, దృఢసంకల్పం నీకు కలిగించడానికే నేను వచ్చింది, తయారుగా ఉండు అంటూ మాయమైపోయినాడు దేవదూత

దిగ్గున కల నుంచి లేచింది అంబ

ఒక జాము గడిచింది

రెండో జాముకి వచ్చింది ఒక ఆలోచన

లేచి వడివడిగా బయటకు నడిచింది

ఎక్కడికి ?

విడిది ప్రదేశానికి

రాకుమారుల విడిది ప్రదేశానికి

ఎట్లా ఉన్నది అక్కడ?

కోలాహలం అప్పుడే సద్దుమణిగినట్లు కనపడుతున్నది

కొబ్బరి ఆకుల పందిళ్ళు తలలు నిటారుగా నిలబెట్టి నిద్రపోతున్నాయి

కాశీరాజు గారి తరఫున వచ్చిన రాకుమారులందరికీ “ఎదురు కోలు” కార్యక్రమం పూర్తైపోయింది

మేళతాళాలు భూనభోంతరాలుగా వాయించినవారు అలసిపోయి నిద్రపోతున్నారు

అంతమంది రాకుమారుల కాళ్ళు కడిగటంతో ఒక చిన్న సరస్సు ఉద్భవించిందా అన్నట్లు ఉన్నది అటు పక్కన

అమ్మాయీమణులు నన్నే వరించటం ఖాయమని కొంతమంది ఆత్రంగా పారాణి కూడా రాసుకుని రాగా, కాళ్ళు కడుగుడు కార్యక్రమంలో ఆ పారాణి అంతా పోయి, ఆ చిన్న మడుగు ఎర్రగా రక్తపుటేరులా ఉన్నది

దివిటీలు ధగధగా మెరిసిపోతున్నాయి

చటుక్కున మేలిముసుగులాటి వస్త్రమొకటి తలమీదకు కప్పుకొంది, ఎవరికీ తెలియకూడదని

నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఒక శిబిరంలోకి ప్రవేశించింది

అక్కడ………

 

(ఇంకా ఉంది….)

చిగురంత ఆశ ..ఈ చిన్ని సినిమా!

 

siva

 

శివలక్ష్మి 

~

గర్ల్ రైజింగ్ (Girl Rising)  అనే ఈ స్పెషల్ ఇంట్రస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ న్యూయార్క్ లో చిత్రీకరించబడింది.

ఈ చిత్ర దర్శకుడు రిచర్డ్ రాబిన్స్ .

ఈ సినిమా నిడివి గంటా 41 నిమిషాలు.

 

ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఆడపిల్లలు పుట్టిన దగ్గరనుంచి పెరుగుతున్న క్రమంలో పడుతున్న దారుణ మైన హింసల్ని రికార్డ్ చేసిన చిత్రమిది. బాల్య వివాహాలు,  పిల్లల బానిసత్వం, నిరక్షరాస్యత, పేదరికం, మానవ రవాణా మొదలైన సమస్యల గురించి హృదయ విదారకమైన కథలు చెబుతుంది. 9 దేశాల ప్రతినిధులుగా 9 మంది బాలికలు ఈ అడ్డంకులన్నిటినీ అధిగమిస్తామని గొప్ప ఆశావాదాన్ని వినిపిస్తారు.

కంబోడియా మురికి వాడ నుంచి వచ్చిన అనాధ “సోఖా” చురుకైన విద్యార్ధిగా, ‘నర్తకి’ గా మారిన విధానాన్ని మనసులో నిల్చిపోయేటట్లు చిత్రించారు.

నేపాల్ నుంచి “సుమ బలవంతపు దాస్యం నుంచి తాను తప్పించుకుని మిగిలిన తనలాంటివారిని తన సంగీత విద్య ద్వారా బాధ్యతగా తప్పించే పనిలో నిమగ్న మవడం చూస్తాం.

ఇండియా నుంచి కలకత్తాలో రోడ్డు పక్కన నివసించే ఒక తండ్రి తన చిన్నారి పాప  “రుక్సానా లోని ఆర్టిస్ట్ ని గుర్తించి ఆమె కోసం కుటుంబమంతా తమ  ప్రాధమికావసరాల్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడతారు. రోడ్డు మీద నివశించే వారి కుటుంబం ఒకసారి కురిసిన తుఫాన్ లాంటి వర్షంలో అల్లాడిపోతుంది.”వెయ్యి నదులు కక్షతో ప్రవహిస్తున్నట్లు వర్షిస్తుంటే,నిలువ నీడలేని మా అందరితో పాటు నా చిత్రలేఖనాలు కూడా రోదిస్తున్నట్లనిపిస్తుంది. నానిపోయిన నా డ్రాయింగ్స్ ని ఏమూల ఆరబెట్టాలి?” అంటుంది రుక్సానా ఏడుపు గొంతుతో.

అలాగే పెరూ దేశం నుంచి “ సెన్నా” అనే పాప పేరుని క్లాస్ రిజిస్టర్ నుంచి స్కూలు ఫీజ్ కట్టనందు వల్ల    తీసేస్తారు.తల్లిని చదువుకుంటానని అడుగుతుంది. తల్లి “మన దగ్గర డబ్బుల్లేవమ్మా” అని చెప్తుంది. తల్లికి సహాయం చేస్తూనే మళ్ళీ క్లాస్ కెళ్తుంది. బహుశా అది పేద దేశమైనందు వల్లనో ఏమో స్కూలు బిల్డింగ్  లాంటి వేమీ ఉండవు.ఒక ఖాళీ జాగాలో టీచర్ పాఠాలు చెప్తూ ఉంటుంది.నిశ్శబ్దంగా మన పాప వెనక బెంచీలో కూర్చుని పాఠాలు వింటూ ఉంటుంది. టిచర్ చూసి “మీ అమ్మ స్కూలు ఫీజ్ ఇచ్చిందా”? అనడుగుతుంది.పాప ధైర్యంగా “లేదు. మా దగ్గర డబ్బు లేదం”టుంది.ఐతే క్లాస్ నుంచి  వెళ్ళిపొమ్మంటుంది టిచర్. మొదటిసారి నిరాశగా వెళ్ళిపోతుంది సెన్నా. చదువుకోవాలనే కోరిక ఆ పాపని నిలవనీయదు. ఎన్నిసార్లు వెళ్ళమన్నా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది.ఇక చివరికి టీచర్ కి ఆ పాప పట్ల ఇష్టం పెరిగిపోయి చిరునవ్వుతో చూస్తూ ఉండిపోతుంది.చిత్రం ముగుస్తుంది.

“నేను చదువుతాను. నేను చదువుకుంటాను. నేను నేర్చుకుంటాను. మీరు నన్ను ఆపడానికి ప్రయత్నిస్తే నేనింకా బలంగా పోరాడతాను” – అని కధకురాలు తన గొంతుతో చెప్తుంది గానీ ఆ పాప తాను చదువుకోవాలనే విపరీతమైన తన కాంక్షను తన నటన ద్వారా అద్భుతంగా వ్యక్తీకరించింది. “ఒకవేళ మీరు గనక నన్ను దూరంగా పంపిస్తే మీరు ఉండమనేవరకూ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను” అని చెప్తూ నటించడం కాకుండా ఆ చిన్ని పాత్రలో జీవించి చూపించింది.కాకరాల గారంటారు “పాత్రలలో చిన్నా, పెద్దా అని తేడాలుండవు. ప్రతిదీ ప్రత్యేకమైనదే”అని.

అమ్మాయిలందరూ ఎవరికి వారే సాటి అని అనిపించినప్ఫటికీ ఈ సెన్నాపాప కథ చాలా ఆశాజనకంగా ఉండి నాకు విపరీతంగా నచ్చేసింది. అసలు సినిమాలో ఈ పాప కథని నడిపించే సంగతేమిటంటే  “వారియర్ ప్రిన్సెస్ సెన్నా”లా పెరగాలని తండ్రి ఆమెకు ఆ పేరు పెడతాడు. అతను సెన్నాకి పాఠశాలకి వెళ్ళి బాగా చదవాలని చెప్తుండేవాడు. తర్వాత తండ్రి ఒక బంగారు గని మైనింగ్ ప్రమాదంలో మరణిస్తాడు. ఆమె తండ్రి ఆదేశం ప్రకారం స్కూలుకి వెళ్ళడానికి తన శక్తికి మించి ప్రయత్నించి తన కోరికే కాక తండ్రి ఆశయాన్ని నెరవేర్చే దిశగా దృఢ నిశ్చయంతో అడుగులు వేస్తుంది. పౌరహక్కుల సంఘం నాయకుడు పురుషోత్తం గారిని హైదరాబాద్ లోని దిల్ శుక్ నగర్ లో నడిరోడ్డుమీద గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపేస్తే ప్రతి ఒక్కరూ కన్నీళ్ళు పెడితుంటే వాళ్ళ పాప మాత్రం (పదేళ్ళుంటాయేమో) నిబ్బరంగా ఉంది. అస్సలేడవలేదు.”ఏంట్రా, నీకేడుపు రావట్లేదా?” అనడిగితే “బాపు నాకు ఏడవద్దని చెప్ఫాడు” అని చెప్పింది. తండ్రి చెప్పిన మాటను తు.చ. తప్పకుండా పాటించాలనుకునే సెన్నాని చూసినప్పుడు నాకది గుర్తొచ్చింది!

అసలెందుకిలా జరుగుతుంది? ఈ అమ్మాయిలేమీ అసాధ్యమైన, గొంతెమ్మ కోరికలు కోరడం లేదు కదా? ఈ పిల్లలు భావి ప్రపంచపౌరుల కిందికి రారా? వీళ్ళు విద్యావంతులవ నవసరంలేదా? అనే భావాలతో హృదయం తల్లడిల్లిపోయింది.

ఆఫ్ఘనిస్తాన్ నుంచి “అమీనా” “నా తండ్రి నాకు పెళ్లి ఏర్పాట్లు చేసినప్పుడు నాకు 11 సంవత్సరాలు” అని అంటుంది.

అలాగే తొమ్మిది మంది  బాలికల కథలు తొమ్మిది రకాలైన ప్రత్యేక కథనాలైనప్పటికీ ఇవి ప్రపంచంలోని అన్ని దేశాల్లో సర్వ వ్యాపితమైనవే. ఎక్కడో జరుగుతున్నట్లనిపించవు.మన చుట్టూ మనం చూస్తున్న సంఘటనలే అనిపిస్తాయి!

“ఇంత  అందమైన ప్రపంచంలో అందం,ఆనందాలతో పాటు ఇంత కౄరమైన నీచత్వం ఒకే చోట  ఎలా కలగలిసి ఉంటున్నాయి?” అని అంటుందొక పాప.

“బాలికలు ఎప్పటికీ సమస్య కాదు. వారు అన్నిటికీ పరిష్కారాలు సూచించగలరు. మీరు ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టాలన్నా, ప్రపంచ ఆర్థికపరిస్థితిని మెరుగు పరచాలన్నా అమ్మాయిల్ని చదివించండి” అని అంటుందింకొక అమ్మాయి.

“నేను మా ప్రాంతాల్లో అమ్మాయిల వేలం  పాట విన్నాను.పురుషులను కూడా అలాగే వేలం  వెయ్యండి” – అని ఒక పాప అంటే,

“నావిషయంలో ఏంజరిగిందో ప్రతిదీ నేను మీకు చెప్పలేను. కానీ ఆ హింసను నేను నాజన్మలో మర్చిపోలేను” – అని మరొక అమ్మాయి అంటుంది.

సామాజిక కార్యకర్త మరియాసియర్రా ఒక ఇంట్లో బానిస చాకిరీ చేస్తున్న ఒక అమ్మాయికి స్వేచ్చ నివ్వమని అడుగుతుంది. ఆ యజమాని నిరాకరించినప్పుడు ఆమె వివిధ చట్టాల గురించి వివరించి చెప్పి ఆయన నొప్పించి అమ్మాయికి విముక్తి కలిగిస్తుంది.

“మీరు గనక నన్ను ఆపివేస్తే, నా వెనక లక్షలమంది అమ్మాయిలు ఈ కారణం కోసం పని చేస్తారు”.

“చదువుతో ఏదైనా చేయగలనని భావిస్తున్నాను.ఆడపిల్లల ప్రపంచాన్ని మార్చే శక్తి వస్తుంది”.

“చదువుకుని ఆర్ధికంగా నా కాళ్ళమిద నేను నిలబడగలిగితే నాకు నేనే స్వంత మాస్టర్ నవుతాను”

“నేను మేకల పర్యవేక్షణలో ఉన్నప్పుడు అమ్మాయిల కంటే మేకలే మంచి స్థితిలో ఉన్నట్లనిపించింది”.

ఈ విధంగా అమ్మాయిలు వాళ్ళ వాళ్ళ కోరికల్ని, అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. తమ వ్యక్తిగత బాధామయ ప్రయాణాలను ప్రపంచంతో పంచుకోవడం ద్వారా ఒక్కొక్కరూ ఒక్కో ఉపాధ్యాయురాలి లాగా మారినట్లు ప్రేక్షకులకు కనిపిస్తారు. సినిమా చూచిన వారందరికీ మెరుపు తీగల్లాంటి తొమ్మిదిమంది అమ్మాయిలు మన మనో ఫలకంపై ముద్ర పడిపోతారు. ఆడపిల్ల  చదువుకుని విద్యావంతురాలైతే ఆమె జీవితం లోనే కాక ప్రపంచాన్నే మార్చగలిగిన శక్తి వస్తుందనే ఆశాభావాన్ని కలిగిస్తారు.

ఈ కథ సాధారణమైనదే! ఇది మొదలూ కాదు, అంతమూ కాదు. కానీ ఈ పిల్లల్లో కనిపించే గొప్ప ఉత్తేజం ఆనందం కలిగిస్తుంది. ఒక్కొక్కరినీ చూస్తుంటే శతాబ్దాలుగా చెత్త పోగులో పడి ఉన్న “ఆమె” ఇప్పుడు కటిక చీకటిలో అందమైన మిణుగురుల పంట పండిస్తుందనిపించింది!

ఇది వినూత్నమైన పద్ధతిలో నిర్మించిన ఒక కథా చిత్రం. ప్రపంచ మంతటా ఎదుర్కొనే ప్రమాదకరమైన అసమానతలను విశ్లేషించారు. తీవ్రంగా కలతపెట్టే సమస్యల చర్చలున్నాయి. ఆడపిల్లల సాధికారత, విద్య, సమానత్వాల గురించి చర్చించినప్పటికీ, ఈ అమ్మాయిలు ఎలా దోపిడీ అణచివేతకు గురౌతున్నారో చిత్రించడానికి భయానక శబ్దచిత్రం గా రూపొందించారు. ఎదుగుతున్న తరం కూడా తమ స్త్రీజాతి ఇక్కట్ల గురించి తెలుసుకోవాలని, అవగాహన కలిగించాలని ఒకవేళ వారి తల్లిదండ్రులు ఎవరైనా అనుకుంటే ఈ సినిమా చూపించడానికి  ప్రయత్నించే వీలే లేదు. తమ టీనేజ్ ఆడపిల్లలతో కూర్చుని ఈ చిత్రాన్ని చూడడం గానీ, వాళ్ళకు ఈ కల్లోల పరిస్థితుల్ని వివరించి చెప్పడం గానీ, ఆలోచనలు పంచుకోవడం గానీ కుదరదు. వారి పెద్దలకు చాలా ఇబ్బందిగా అసౌకర్యంగా ఉంటుంది!

ఒక్కో అమ్మాయి కథను కు చెందిన ఆయా దేశాలకు చెందిన ఒక్కో ప్రఖ్యాత రచయిత రాశారు. సామాజిక కార్యకర్త మరియా-సియర్రా గొంతుతో పాటు, ఆయా దేశాల ప్రముఖ నటీమణుల స్వరాలతో కధనాన్ని హృద్యంగా దృశ్యీకరించారు దర్శకులు రిచర్డ్ రాబిన్స్. ఆయన ఆస్కార్ నామినేటెడ్ డాక్యుమెంటేరియన్.

మొత్తానికి పాఠశాలకు వెళ్ళాలని  కలలు కంటున్న  అద్భుతమైన అమ్మాయిలు వీళ్లంతా! ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి బాలికలు 66 మిలియన్ల మంది ఉన్నారని తెలుస్తుంది. ఒక్కోఅమ్మాయి ధైర్యంగా చదువుకోవాలని ఆరాటపడడం చూస్తే ఎవరికి వారు వారి వారి దేశాల్లో విప్లవాలు చేసేటట్లున్నారు !

ఇంత గొప్ప దర్శకులు రిచర్డ్ రాబిన్స్ పిల్లల్ని విప్లవాలనుంచి తప్పించే ప్రయత్నంలో ఉన్నారా అనే విషయం నిరాశ పరిచింది. నిజంగా స్పష్టమైన మూల కారణాలను అన్వేషించే ప్రయత్నమైతే కనిపించలేదు.  రిచర్డ్ రాబిన్స్ బాలికలకు విద్యా, సమానత్వం కోరుతూ పని చేసే  “10” అనే ఒక సామాజిక సంస్థ డైరెక్టర్. ప్రపంచమంతా దీని శాఖలున్నాయి.

“అదిగో చూడండి,అక్కడ పీడితులున్నారు.బాధితులున్నారు” అని చెప్పడానికి అసలు విషయం చెప్పకుండా నిజమైన స్ట్రగుల్స్ నిర్మించకుండా వారిని దిష్టి బొమ్మలుగా చూపిస్తూ తమ భవిష్యత్తుని దేదీప్యమానంగా వెలిగించుకుంటారు కొందరు ఎన్ జీ వో  సంస్థల నాయకులు. పీడితుల వెతల్ని హృదయ విదారకంగా వర్ణిస్తూ మన రచయితల్లాగే అవార్డులూ, రివార్డులూ ఆస్కార్ నామినేషన్లూ సాధించుకుంటారు. కానీ పీడితుల, బాధితుల పరిస్థితులు ఎప్పటికీ మారవు. ప్రభుత్వాలు కోరుకుంటున్నట్లే వీళ్లకు కూడా  యధా తధ పరిస్థితులు  కొనసాగాలి. చిత్ర నిర్మాణాలకు దర్శకులకు,రాయడానికి రచయితలకు మాత్రం వాళ్ళ బాధలు కావాలి,ఆ తర్వాత బాధితులు ఎలా చస్తే మనకెందుకు మన బహుమతులు మనం గెల్చుకోవాలి అని కోరుకుంటారు!

“పిల్లలు స్త్రీలు బలహీనులు.నిరుపేదలు.సమానత్వాన్ని కోరుకుంటారు.బలవంతులకి ఆ ఆలోచనే ఉండదు”- అని అరిస్టాటిల్ 348 B.C.లోనే చెప్పాడు. అప్పటినుంచి ఇప్పటివరకూ హింసను కొనసాగిస్తున్న ప్రపంచ పాలకుల, వారి మద్దతు దార్ల ఘనతను ఏమని కొనియాడాలి?

మానవత్వం అనేది ఏమిటో మచ్చుకైనా తెలియని పెట్టుబడి చేస్తున్న విధ్వంసమిది!మార్కెట్ కి వినియోగదారులుగా పనికిరాని, కొనుగోలు శక్తి లేని పేద ప్రజలను ఏకంగా  మట్టుబెట్టాలని చూస్తుంది. ఈ సినిమాలో కనిపించే అసలు రహస్యం ఇదే! దీనంతటికీ మూల కారణాలైన కేపిటల్ గురించీ, మార్కెట్ గురించీ చెప్పకుండా చేసిన ఈ దృశ్యీకరణ ఎంత బాగున్నప్పటికీ, పేదలపట్ల జరుగుతున్న ఈ ఘోరకలిని మెచ్చుకోలేం!

“సాధారణ ప్రజలు మనకంటే చాలా తెలివైనవాళ్ళు. ఈ కష్టాల వ్యవస్థలో ఎలా బతకాలో వాళ్ళకి తెలుసు.ఎవరూ ఏమీ చెయ్యకపోయినా ఫరవాలేదు. మీరందరూ హాయిగా బతకండి.  కానీ వారి ఉద్యమాలకు వెనకుండి మద్దతు నివ్వండి” అని అంటారు  మహాశ్వేతా దేవి. మన వంతుగా కనీసం అది చేసినా చాలు!

నేనీ సినిమా గోతెజెంత్రం (జర్మన్ ఫిల్మ్ క్లబ్) లో చూశాను.

 

~