Archives for May 2014

కన్యాత్వం: మరో రెండు కథలు

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

మహాభారతంలో ఉన్నదే నేను రాస్తున్నాను. అది అలా ఎందుకు ఉంది, ఫలానా పాత్రలు ఫలానా విధంగా ఎందుకు ప్రవర్తించాయంటూ తప్పొప్పులు ఎంచడం నా పరిధి కాదు. నాకు దాని మీద ఆసక్తి కూడా లేదు. కాలగమనంలో మనిషి అనేక సవాళ్లను ఎదుర్కొంటూ, అనేక ఘట్టాలను దాటుతూ, అనేక పరిమితులకు లొంగుతూ, అప్పటి జీవన పరిస్థితులను బట్టి, అనివార్యతలను బట్టి నైతికతను నిర్వచించుకుంటూ, వ్యూహాలను రచించుకుంటూ ముందుకు సాగాడు…

ఇది కొన్ని వేల సంవత్సరాల కాలగమనం గురించి. ఇప్పటి విషయానికే వస్తే, కేవలం రెండు మూడు తరాలకే నైతికతను, విలువలను తిరగరాసే పరిస్థితిని చూస్తున్నాం. ఒక్క ఉదాహరణే చెప్పుకోవాలంటే, ఇంతవరకూ అగ్నిసాక్షిగా జరిగిన వివాహం ఒక అనుల్లంఘనీయమైన విలువ. కానీ ఇప్పుడు అలాంటి వివాహంతో పనిలేని ‘సహజీవ’నాన్ని న్యాయస్థానాలు కూడా గుర్తిస్తున్నాయి. ఇలాంటివే ఇంకా అనేకానేక ఉదాహరణలు…

ఇలాంటి విషయాలలో వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఎలాగైనా ఉండవచ్చు. ఈ వ్యాసపరంపరకు సంబంధించినంతవరకు ఒకరి ఇష్టాన్ని సమర్థించడం, ఇంకొకరి ఇష్టాన్ని వ్యతిరేకించడం అన్న పనిని నేను పెట్టుకోలేదు. నేను ఇక్కడ గతాన్ని కేవలం తటస్థదృష్టితో మాత్రమే చూస్తున్నాను. అంతే తప్ప, మంచిచెడుల గురించి తీర్పు చెప్పే పనిని తలకెత్తు కోవడం లేదు. ఎవరి సంగతి ఏమైనా, అలా తీర్పు చెప్పే స్థాయి కూడా నాకు లేదని నేను నమ్ముతున్నాను. మన తీర్పు కోసం ఆగకుండా లోకంలో, ప్రకృతిలో అనేక పరిణామాలు జరిగిపోతూ ఉంటాయి. మన పుట్టుక మన తీర్పుతో, ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండానే జరిగిపోతుంది. మనం మరొకరికి జన్మనివ్వడం కూడా మన తీర్పుతోనూ, ఇష్టాయిష్టాలతోనూ సంబంధం లేకుండానే జరిగిపోతుంది.

మనం గడిచివచ్చిన కాలానికి కూడా ఇదే సూత్రాన్ని వర్తింపచేస్తే…

***

250px-Ravi_Varma-Shantanu_and_Satyavati

మత్స్యగంధి అంది కదా…ఓ పుణ్యాత్ముడా! నేను చేపల కంపు కొట్టే జాలరిదాన్ని, పైగా కన్యను, నా కన్యాత్వం అంతరిస్తే నా తండ్రి గడప ఎలా తొక్కను, నాకు ఆ దోషం అంటకుండా అనుగ్రహించూ…అని.

పరాశరుడు ఆ మాటకు సంతోషించాడు. నా కోరిక తీర్చినందువల్ల నీ కన్యాత్వానికి భంగం కలగదన్నాడు. ఆపైన, నువ్వు వసురాజు వీర్యం వల్ల జన్మించినదానివి తప్ప శూద్రకులంలో పుట్టినదానివి కావన్నాడు. అప్పటికప్పుడు ఆమె చేపల కంపు పోగొట్టి యోజన దూరం వ్యాపించే సుగంధాన్ని ఇచ్చాడు. అంతేకాక, ఆమెకు దివ్యవస్త్రాలను, ఆభరణాలను ఇచ్చాడు.

నీ కన్యాత్వానికి భంగం కలగదన్న వెంటనే ఇవన్నీ జరిగినట్టు చెప్పడం ద్వారా పరాశరుడు ఎంతో మహిమోపేతుడని కథకుడు సూచిస్తున్నాడన్నమాట. ఆవిధంగా, కన్యాత్వానికి భంగం కలగదని అనడం కూడా ఆయన మహిమలో భాగమేనని చెబుతున్నాడు. అంటే, కన్యాత్వానికి భంగం కలగకుండా చేయగల మహిమ పరాశరుడి లాంటి మహర్షికి తప్ప, ఇంకెవరికీ ఉండదని అందులోని ధ్వని.

ఈ కన్యాత్వంతో ముడిపడిన మరో రెండు ఉదంతాలు ఈ సందర్భంలో చటుక్కున గుర్తొస్తున్నాయి. వాటిలో మొదటిది బాగా ప్రసిద్ధమైన కుంతి కథ. రెండోది అంతగా ప్రసిద్ధం కాని మాధవి కథ.

కుంతి కథ

ఆదిపర్వం, పంచమాశ్వాసంలోని కుంతి కథ ఇలా సాగుతుంది….

శూరుడు యాదవకులానికి పెద్ద. అతని పెద్ద కూతురు పృథ. ఆమె వసుదేవునికి చెల్లెలు కూడా. తన మేనత్త కొడుకైన కుంతిభోజునికి సంతానం లేకపోవడంతో పృథను శూరుడు అతనికి దత్తు ఇచ్చాడు (ఆ విధంగా ఆమె కుంతి అయిందన్నమాట). కుంతి దత్తత తండ్రి ఇంట్లో ఉంటూ అతని ఆదేశం ప్రకారం ఇంటికొచ్చిన బ్రాహ్మణులకు రుచికరంగా వండి పెడుతూ, దానాలు, సేవలు చేస్తూ ఉండేది.

అలా ఉండగా, ఒకరోజున దూర్వాసుడనే సిద్ధముని అతిథిగా వచ్చాడు. కుంతి అతనికి ఇష్టమృష్టాన్న భోజనం పెట్టింది. అతను చాలా సంతోషించి ఆమెకొక దివ్యమంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రంతో నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధించినా ఆ దేవుడు నువ్వు కోరుకున్న లక్షణాలు కలిగిన కొడుకును ఇస్తాడని చెప్పి వెళ్లిపోయాడు.

కుంతి ఒక రోజున ఆ మంత్రశక్తిని పరీక్షించాలనుకుంది. ఏకాంతంగా గంగ ఒడ్డుకు వెళ్లింది. కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కుంది. దూర్వాసుడు ఇచ్చిన మంత్రాన్ని హృదయంలో నిలుపుకుని, సూర్యుడికి అర్ఘ్యమిచ్చింది. నీలాంటి కొడుకునిమ్మని చేతులు జోడించి అడిగింది.

సూర్యుడు తన తీవ్రతను ఉపసంహరించుకుని లేలేత కాంతితో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. కుంతి ఆ తేజోరూపం చూసి ఆశ్చర్యాన్ని, భయాన్ని, తత్తరపాటును పొంది అక్కడినుంచి పారిపోదామని చూసింది. సూర్యుడు ఆమెను భయపడవద్దని చెబుతూ, నువ్వు కోరిన వరం ఇవ్వడానికి వచ్చానన్నాడు.

అప్పుడు కుంతి సిగ్గుతో తలవంచుకుని,‘ఒక బ్రాహ్మణుడు నా మీద కరుణతో ఈ మంత్రాన్ని ఉపదేశించాడు, ఆ మంత్రశక్తిని తెలుసుకోవాలనిపించి అజ్ఞానంతో నిన్ను రప్పించాను, నా తప్పును క్షమించు. ఆడవాళ్లు అజ్ఞానంతో ఎప్పుడూ తప్పులే చేస్తూ ఉంటారు, అయినాసరే అందరూ దయతో వాళ్ళను కాపాడుతూనే ఉంటారు’ అంది.

అప్పుడు సూర్యుడు,‘నీకు దూర్వాసుడు ఇచ్చిన వరం గురించి, మంత్రశక్తి గురించి నాకు తెలుసు, నా దర్శనం వృథా కాదు, నీ కోరిక తీరుస్తాను’ అన్నాడు.

‘నేను మంత్రశక్తి తెలియక కోరాను, గర్భవతిని అయితే నా తల్లిదండ్రులు, చుట్టాలు నవ్వరా?’ అని కుంతి అంది.

‘’నీకు సద్యోగర్భం(అంటే నవమాసాలు మోయనవసరం లేకుండా అప్పటికప్పుడు)లో కొడుకు పుడతాడు. నీ కన్యాత్వం కూడా చెడదు’ అని సూర్యుడు వరమిచ్చి వెళ్లిపోయాడు.

అప్పుడు కుంతికి సహజకవచకుండలాలతో ‘కానీను’ (కన్యగా ఉన్నప్పుడు కన్న సంతానాన్ని కానీన శబ్దంతో సూచిస్తారు)డిగా కర్ణుడు పుట్టాడు. ఆశ్చర్యపోయిన కుంతికి ఏం చేయాలో తోచలేదు. ఈ లోకాపవాదం నుంచి ఎలా బయటపడతాను, ఈ విషయం జనానికి తెలియకుండా ఎలా ఉంటుంది, ఈ బాలుని తీసుకుని ఇంటికి ఎలా వెళ్లను అని ఆందోళన చెందింది. అప్పుడు రత్నాలు, బంగారం నింపిన ఒక పెట్టె సూర్యుని ప్రేరణతో నదిలో తేలుతూ ఆమె దగ్గరికి వచ్చింది. కొడుకును ఆ పెట్టెలో ఉంచి నదిలో విడిచిపెట్టి కుంతి త్వర త్వరగా ఇంటికి వెళ్లిపోయింది.

ఆ పెట్టె, రాధ అనే ఆమెకు భర్త అయిన ఒక సూతుడికి దొరికింది. అతడు అందులోని శిశువును భార్యకు ఇచ్చాడు. ఆమె సంతోషంతో ఆ శిశువుకు స్తన్యమిచ్చింది. వసువు(బంగారం)తోపాటు దొరికాడు కనుక అతనిని వసుషేణుడనే పేరుతో ఆ దంపతులు పెంచి పెద్దచేశారు. రాధ పెంచిన కారణంగా అతడు ‘రాధేయు’డిగా కూడా గుర్తింపు పొందాడు.

***

kunti-and-surya

ఇది నన్నయ భారతంలోని కథ. సంస్కృత భారతంలో కొంత తేడా కనిపిస్తుంది. కర్ణుని పుట్టుక గురించి కుంతి ఆశ్రమవాసపర్వంలో వ్యాసుడికి వివరిస్తుంది. ఆ సమయంలో పశ్చాత్తాపం కూడా ప్రకటిస్తుంది. ఆ వృత్తాంతం ప్రకారం, కుంతి గంగ ఒడ్డుకు వెళ్ళి మంత్రశక్తిని పరీక్షించలేదు. తన మేడమీద నిలబడి ఉదయభానుని చూస్తూ మంత్రం పఠించింది. అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంచుమించు పైన చెప్పిన విధంగానే వారిమధ్య సంభాషణ సాగింది. సూర్యుడు,‘నా రాక వృథా కావడానికి వీల్లేదు, వృథా అయితే నీకూ, ఆ దూర్వాసునికీ కూడా హాని కలిగిస్తాను’ అన్నాడు. సూర్యుని శాపం నుంచి దూర్వాసుని కాపాడాలనుకున్న కుంతి, చేసేదిలేక ‘నీ లాంటి కొడుకును ఇవ్వు’ అని అడిగింది. అప్పుడు సూర్యుడు తన తేజస్సుతో ఆమెను ఆవహించి, మోహపరవశురాలిని చేసి, కొడుకు పుడతాడని చెప్పి వెళ్లిపోయాడు. ఆమె అంతఃపురంలోనే రహస్యంగా కొడుకును ప్రసవించింది. ‘పితృమర్యాద’ను కాపాడడం కోసం అతన్ని నీళ్ళలో విడిచిపెట్టింది.

ఈ రెండు పాఠాలలోనూ కొన్ని తేడాలే కాకుండా గమనించవలసిన కొన్ని విశేషాలు ఉన్నాయి. మొదటిది, కర్ణుడు ఎవరికైతే దొరికాడో ఆ సూతుడి పేరు చెప్పలేదు. సూతుడనే మాట అతని కులాన్ని మాత్రమే చెబుతుంది. అతడు ‘రాధఅనే ఆమెకు భర్త’ మాత్రమే. కుంతి కొడుకులు ‘కౌంతేయులు’ గా కూడా ప్రసిద్ధులైనట్టే; పెంచిన తల్లి పేరిట కర్ణుడు కూడా ‘రాధేయుడు’ గా ప్రసిద్ధుడయ్యాడు. కుంతి కొడుకులను తండ్రి పేరిట పాండవులు అన్నట్టే, కర్ణుని కూడా ‘సూతపుత్రు’డన్నారు, అది వేరే విషయం. ఇక్కడ తల్లి పేరిట ప్రసిద్ధులు కావడమే గమనించవలసిన విషయం.

దూర్వాసుని సంబంధంతోనే కుంతి గర్భవతి అయినట్టు, రహస్యంగా కొడుకును కన్న తర్వాత అతన్ని పెంచమని తనే రాధకు ఇచ్చినట్టు ఎస్.ఎల్. భైరప్ప ‘పర్వ’ నవలలో చిత్రించారు. అదలా ఉంచితే, కర్ణుడు సహజ కవచ, కుండలాలతోనూ, రత్నాలతోనూ, బంగారంతోనూ దొరికాడన్న వివరాన్ని మనం స్థూలంగా ఇలా కూడా అన్వయించుకోవచ్చు:

రాధకు తన కొడుకును పెంపకానికి ఇస్తూనే, అందుకు అవసరమైన ధన సంపత్తిని కూడా కుంతి ముందే ఇచ్చింది. దాంతోపాటు అతనికి కవచ, కుండలాలు కూడా ఇచ్చింది. అవి రాచరిక చిహ్నాలు కావచ్చు. అతన్ని తమ స్థాయికి తగినట్టు రాచరిక హోదాలో పెంచమని చెప్పడం కుంతి ఉద్దేశం కావచ్చు. సరిగ్గా యుద్ధానికి ముందే ఇంద్రుడు బ్రాహ్మణవేషంలో కర్ణుడి దగ్గరకు వచ్చి కవచకుండలాలను యాచించి తీసుకువెళ్లిపోతాడు. అవి రాచరికానికి ప్రతీకలు అనుకుంటే, వాటిని అతనికి దూరం చేయడం రాచరిక హోదాను నిరాకరించడమే. సరిగ్గా యుద్ధానికి ముందే అది జరగడంలో ఉద్దేశం, యుద్ధంలో రాజన్యుల సాయం కర్ణునికి లేకుండా చేయడమే. శల్యసారథ్యం తెలిసినదే.

కుంతి యాదవుల ఆడబడుచు కదా, యాదవులకు రాజ్యార్హత ఉందా అన్న సందేహం రావచ్చు. రాంభట్ల కృష్ణమూర్తిగారి(జనకథ)ప్రకారం, యాదవులలో పశులకాపరులు పెద్ద యాదవులు, వారికి రాజ్యార్హత ఉంది. భోజకులు అలాంటివారే. కుంతి దత్తత తండ్రి కుంతిభోజుడు భోజకుడు. కనుక అతనికి రాజ్యార్హత ఉంది. యాదవులలో వృష్ణికులు గొర్రెల కాపరులు, కనుక చిన్న యాదవులు. వారికి రాజ్యార్హత లేదు. కృష్ణుడు వృష్ణియాదవుడు. మరి అతను గోవుల కాపరి కాలేదా అనచ్చు. బహుశా అప్పటికి వృష్ణి యాదవుల సామాజిక హోదా ఊర్ధ్వ చలనానికి లోనవుతూ ఉండవచ్చు.

కర్ణుని పుట్టుక విషయానికి మరోసారి వెడితే, పరాశరుని శాపభయానికి మత్స్యగంధి లొంగిపోయినట్టే, సూర్యుని శాపభయానికి కుంతి కూడా లొంగి పోవడం గుర్తించదగిన ఒక పోలిక. అలాగే తెలుగు భారతంలో రెండు ఉదంతాలలోనూ ‘సద్యోగర్భం’లో కొడుకులు(వ్యాసుడు, కర్ణుడు) కలిగినట్టు ఉంది. కానీ కర్ణుడికి సంబంధించి పైన చెప్పిన సంస్కృత పాఠంలో సద్యోగర్భ ప్రస్తావన లేదు. సహజగతిలోనే అతడు కుంతికి పుట్టాడన్న భావన ఈ పాఠం కలిగిస్తోంది. ఇదే పాఠంలో ‘సూర్యుడు తన తేజస్సుతో ఆమెను ఆవహించి మోహపరవశురాలిని చేశా’డనడం కూడా సాధారణ స్త్రీ-పురుష సంబంధాన్నే సూచిస్తూ ఉండచ్చు. ఈ వివరం తెలుగు భారతంలో లేదు.

ఇంకొక తేడా ఏమిటంటే,(పైన చెప్పిన) సంస్కృత పాఠంలో సద్యోగర్భ ప్రస్తావన లేనట్టే, కొడుకును కన్నా నీ కన్యాత్వం చెడదని దూర్వాసుడు కానీ, సూర్యుడు కానీ అన్నట్టు లేదు. ‘సూర్యుని ప్రభావం వల్ల మళ్ళీ నాకు కన్యాత్వం ప్రాప్తించిందనీ, దూర్వాసుడు చెప్పినట్టే జరిగిందనీ’ కుంతే వ్యాసునితో అంటుంది.

ఇక రెండో కథ చూద్దాం.

మాధవి కథ

images

ఉద్యోగపర్వం, తృతీయాశ్వాసంలోని కథ ఇది. పాండవులతో శత్రుత్వం మానుకుని, సంధి చేసుకోమని కృష్ణుడితోపాటే కణ్వుడు, నారదుడు మొదలైన మునులు కూడా దుర్యోధనుడికి బోధిస్తారు. మొండికెత్తితే ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలుసుకో మంటూ నారదుడు గాలవుని గురించి చెబుతాడు.

గాలవుడు విశ్వామిత్రుని శిష్యుడు. విద్యాభ్యాసం పూర్తైన తర్వాత గురుదక్షిణ ఏమివ్వమంటారని గురువును అడిగాడు. ఏమీ వద్దని గురువు అన్నాడు. అయినా వినకుండా, మీరు అడిగితీరవలసిందే నంటూ నిర్బంధించాడు. విశ్వామిత్రుడు విసిగిపోయాడు. ‘అయితే సరే, మొత్తం శరీరమంతా తెలుపు రంగులో ఉండి, ఒక్క చెవి మాత్రం నీలవర్ణంలో ఉండే ఎనిమిదివందల ఉత్తమ జాతి గుర్రాలను తెచ్చి ఇవ్వు’ అన్నాడు.

గాలవుడు అలాంటి గుర్రాల వేటలో పడ్డాడు. ఎక్కడా దొరకలేదు. దాంతో విచారంలో మునిగిపోయాడు. ఆహారం, నిద్ర కూడా వదిలేసి గుర్రాలను వెతుకుతూ మహాపథం వెంట సాగిపోయాడు. ఒక చోట అతనికి గరుడుడు కనిపించాడు. బాల్యమిత్రుడైన అతనికి గాలవుడు తన ప్రయత్నం గురించి చెప్పాడు. అతని మీద జాలిపడిన గరుడుడు, దేవతల దగ్గర తప్ప అలాంటి గుర్రాలు దొరకవని చెప్పి, అతన్ని తన వీపు మీద ఎక్కించుకుని దేవేంద్రుడు ఉన్నవైపు బయలుదేరాడు. మార్గమధ్యంలో గాలవునికి విపరీతమైన దాహం వేయడంతో అతన్ని ఒక కొండ మీద దింపాడు. ఇక ఇతనితో అంత దూరం వెళ్ళడం మంచిది కాదనుకున్నాడు. అక్కడినుంచి ప్రతిష్టానపురాన్ని పాలించే తన మిత్రుడు యయాతి దగ్గరికి అతన్ని తీసుకెళ్ళాడు. యయాతికి విషయం చెప్పాడు.

తన దగ్గర అలాంటి గుర్రాలు లేవని చెప్పిన యయాతి, అందగత్తె అయిన తన కూతురు మాధవిని గాలవునికి అప్పగించాడు. ఒకవేళ ఏ రాజు దగ్గరైనా అలాంటి గుర్రాలు ఉంటే, ఈమెను అతనికి చూపించు, ఈమె కోసం తప్పకుండా గుర్రాలు ఇస్తాడని చెప్పాడు.

గరుడుడు గాలవుని, మాధవిని తీసుకుని అయోధ్యరాజు దగ్గరకు వెళ్ళాడు. నా దగ్గర రెండువందల గుర్రాలు మాత్రమే ఉన్నాయని అతను చెప్పాడు. అప్పుడు మాధవి,‘నాకో మహాభావుడు ఒక వరం ఇచ్చాడు. ఆ వరప్రభావం వల్ల నేను కొడుకును కన్నాసరే, కన్యగానే ఉండిపోతాను. కనుక నన్ను ఈ రాజుకు ఇచ్చి రెండువందల గుర్రాలూ తీసుకో. ఆమేరకు అతనితో ఒప్పందం చేసుకో’ అని సలహా ఇచ్చింది.

కొడుకులు లేని ఆ రాజు మాధవిని తీసుకుని గుర్రాలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఆమెవల్ల వసుమనస్సుడనే కొడుకును పొందిన తర్వాత ఆమెను గాలవునికి తిరిగి ఇచ్చేశాడు. ఇలాగే మిగిలిన గుర్రాలు కూడా సంపాదించుకోమని గాలవునికి చెప్పి గరుడుడు వెళ్లిపోయాడు.

ఆ తర్వాత మాధవిని తీసుకుని గాలవుడు కాశీరాజు దగ్గరికి వెళ్ళాడు. కాశీ రాజు తనవద్ద ఉన్న రెండువందల గుర్రాలు ఇచ్చి మాధవితో ప్రవర్ధనుడనే కొడుకును పొందాడు. ఆ తర్వాత భోజపురాన్ని పాలించే రాజువద్దకు వెళ్ళాడు. అతను కూడా తన దగ్గర రెండువందల గుర్రాలే ఉన్నాయని చెప్పి మాధవిని తీసుకుని గుర్రాలు ఇచ్చాడు. మాధవి వల్ల అతనికి శిబి అనే కొడుకు కలిగాడు.

అప్పుడు గరుడుడు మళ్ళీ వచ్చాడు. ‘అలాంటి గుర్రాలు ఈ ముగ్గురి దగ్గరే ఉన్నాయి, ఇక నువ్వు వెతకడం అనవసరం, ఈ ఆరువందల గుర్రాలను, మాధవిని కూడా తీసుకువెళ్లి నీ గురువుకు ఇవ్వు, ఈమెతో ఆయన కూడా కొడుకును కంటాడు’ అని సలహా ఇచ్చాడు. అతనికి తోడుగా తను కూడా విశ్వామిత్రుని దగ్గరకు వెళ్ళి, జరిగినదంతా చెప్పి, ఇతడు బాలుడు, దయతో ఇతన్ని క్షమించి ధన్యుణ్ణి చేయండని ప్రార్థించాడు.

విశ్వామిత్రుడు సరే నని గుర్రాలను, మాధవిని స్వీకరించాడు. మాధవి వల్ల ఆయనకు అష్టకుడనే కొడుకు పుట్టాడు.

ఆ తర్వాత మాధవి తపస్సుకు వెళ్లిపోయింది.

***

‘నా కోరిక తీరిస్తే నీ కన్యాత్వం చెడ’దని మత్స్యగంధితో పరాశరుడు అన్నాడు. (తెలుగు భారతం ప్రకారం)‘నీకు సద్యోగర్భంలో కొడుకు పుడతాడు, నీ కన్యాత్వం చెడ’దని సూర్యుడు కుంతితో అన్నాడు. ‘ఒక మహానుభావుడు ఇచ్చిన వరప్రభావం వల్ల నేను కొడుకును కన్నా కన్యగానే ఉంటా’నని గాలవునితో మాధవి అంది.

ఇంతకీ అసలు ఈ ‘కన్యాత్వం’ ఏమిటి? నేటి సాధారణ అవగాహనతో చెప్పుకుంటే, కన్య అంటే అవివాహిత. కన్యావస్థలో ఉన్నప్పుడు ఆమె పురుష సంపర్కం పెట్టుకోవడం, సంతానం కనడం తప్పు. అంటే కన్యాత్వం అనేది వివాహం అనే వ్యవస్థతో ముడిపడి ఉందన్న మాట. ఆవిధంగా అది వ్యవస్థ తీసుకొచ్చిన భావనే తప్ప ప్రకృతి సిద్ధంగా వచ్చిన భావన కాదు. ఒక స్త్రీ గర్భం ధరించడానికి ఆమె కన్యా లేక వివాహితా అన్న విచక్షణతో ప్రకృతికి సంబంధం లేదు.

కానీ పైన చెప్పిన మూడు కథలూ ఏం చెబుతున్నాయి? కన్యాత్వం అనేది ఒకటి ప్రకృతి సిద్ధంగా ఉంటుందనీ, కన్య గర్భం ధరిస్తే ఆ కన్యాత్వం పోతుందనీ, కానీ కన్య గర్భం ధరించినా కన్యాత్వం పోకుండా చూడగలిగిన మహిమ కొందరు మహానుభావులకు ఉంటుందనే భావన కలిగిస్తున్నాయి.

కన్యాత్వం అనేది ప్రకృతి నియమం కాదనీ, వ్యవస్థ చేసిన నియమమనీ అనుకుంటే; ఆ వ్యవస్థ చేసిన వారే ఈ కథల్లో ఆ వ్యవస్థ నుంచి పై ముగ్గురినీ మినహాయిస్తున్నారన్న మాట!

కన్యాత్వం గురించి మరిన్ని విశేషాలు చెప్పుకునే ముందు, మత్స్యగంధి-పరాశరుడు; కుంతి-దూర్వాసుడు లేదా సూర్యుల ఉదంతాలలో కన్యాత్వం గురించి సంప్రదాయ పండితుల చర్చ ఎలా సాగిందో చెప్పుకుందాం.

అది వచ్చే వారం…

 

 

 

 

 

 

 

 

అస్తిత్వానికి ఆనవాళ్ళు తొలి తెలంగాణ కథలు

సంగిశెట్టి శ్రీనివాస్‌

సంగిశెట్టి శ్రీనివాస్‌

నిజాం పాలనలో హైదరాబాద్‌ రాజ్యంలో ముఖ్యంగా హైదరాబాద్‌/సికింద్రాబాద్‌ నగరాల్లో కాస్మోపాలిటన్‌ కల్చర్‌ వెల్లి విరిసింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల వారితో పాటు అటు ఇరాన్‌ నుంచి ఇటు ఫ్రాన్స్‌ ఇంకా అనేక దేశాల నుంచి వలస వచ్చిన వారు హైదరాబాద్‌ని తమ శాశ్వత ఆవాసంగా మార్చుకున్నారు. అంతకు ముందరి కుతుబ్‌షాహీల పాలన కూడా విదేశీ పర్యాటకుల పొగడ్తలతోపాటు, దేశీయుల మన్ననలందుకుంది.

ఇబ్రహీం కులీ కుతుబ్‌షాను కవులు మల్కిభరాముడు అని కొనియాడిండ్రు.  హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించిన మొహమ్మద్‌ కులీకుతుబ్‌షా చంచల్‌గూడా బిడ్డ భాగమతిని వివాహమాడిండు. భాగమతి ` కుతుబ్‌షాహీ ఖాందాన్‌లో వీరమాతగా, వీరపత్నిగా వెలుగొందారు. తారామతి, ప్రేమావతిలు గోల్కొండ కోటలో నృత్య ప్రతిభతో దేశదేశాల్లో పేరు పొందిండ్రు. అక్కన్న మాదన్నలు కుతుబ్‌షాహీల సేవలో తరించారు. ఉన్నత పదవుల్ని అధిష్టించారు.  ఖైరున్నీసా బేగమ్‌ని పెళ్ళి చేసుకొని బ్రిటీష్‌ రెసిడెంట్‌ కిర్క్‌ పాట్రిక్‌ చరిత్రలో నిలిచి పోయాడు. స్వాతంత్య్రానికి పూర్వమే హైదరాబాద్‌లో చైనీస్‌ రెస్టారెంట్స్‌ ఉండేవి. కరాచీ బేకరీ ఇప్పటికీ ఉంది. ఫ్రాన్స్‌కు చెందిన సైనిక యోధుడు రేమండ్‌ సమాధి హైదరాబాద్‌ ఆస్మాన్‌ఘడ్‌లో ఇప్పటికీ ఉంది. బ్రిటీష్‌ ప్రధాని చర్చిల్‌ తాను సైన్యంలో ఉన్నప్పుడు సికింద్రాబాద్‌లో నివాసమున్నాడు.   ఆయన కూడా హైదరాబాద్‌లో సర్వేయర్‌గా పనిచేశారు. ప్రపంచ ప్రఖ్యాత కవి టేలర్‌ ఇక్కడుండి కవిత్వం రాసిండు. తెలుగులో నవలలు రాకముందే హైదరాబాద్‌ నగర జీవితం ఇంగ్లీషు నవలల్లో రికార్డయింది.

బ్రిటీష్‌ రెసిడెంట్‌ హాలండ్‌ బంధువు వాల్టర్‌ స్కాట్‌ ఈ నవల రాసిండు. ఇలా ఎంతో మంది హైదరాబాద్‌ ‘షాన్‌’, ‘నిషాన్‌’ని విశ్వవ్యాప్తం చేసిండ్రు. తమ స్వీయ ‘అస్తిత్వా’న్ని ‘పోలీస్‌ యాక్షన్‌’ వరకూ ఇక్కడి ప్రజలు కాపాడుకున్నారు. ఈ కాపాడుకున్న అస్తిత్వం కథా సాహిత్యంలో కూడా ప్రతిఫలించింది. మాజీ మంత్రి, 1969 ఉద్యమ నేత టి.ఎన్‌. సదాలక్ష్మి మామ నిజాం మిలిటరీలో పనిచేస్తూ మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్‌లో పర్యటించాడు. ఆఫ్రికన్‌ కావల్రీ గార్డ్స్‌లో పనిచేసేందుకు అఫ్ఘనిస్తాన్‌, ఈజిప్ట్‌, గల్ఫ్‌, ఇథియోపియాల నుంచి సిద్దీలు, పఠాన్‌లు ఇంకా ఎంతోమంది తమ జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చిండ్రు. ఇలా వచ్చిన వారు వందల సంఖ్యలో ఉన్నారు. వీరిలో ట్రెంచ్‌, టస్కర్‌లతో పాటు అనేక మంది యూరోపియన్‌ అధికారులూ ఉన్నారు. అలాగే సరోజిని నాయుడు, డాక్టర్‌ మల్లన్న తదితరులు ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌ నుంచి యూరోప్‌కు వెళ్ళిండ్రు.

హైదరాబాద్‌ నుంచి చదువుకునేందుకు ఇంగ్లండ్‌ వెళ్ళిన సంస్కర్త రాయె బాలకిషన్‌ విదేశాల్లో గదర్‌ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. కొన్ని వేల మంది హైదరాబాదీలు విదేశాల్లో చదువుకున్నారు. హైదరాబాద్‌ ఉప ప్రధాని పింగళి వెంకటరామారెడ్డి కుమారుడు యూరోప్‌లో జరిగిన బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొన్నాడు. ఆ పోటీల సందర్భంగానే దెబ్బలు తగలడంతో బాక్సింగ్‌ రింగ్‌లోనే ప్రాణాలు వదిలాడు. ఇదంతా హైదరాబాద్‌ ప్రజలకు ప్రపంచం చేరువైన తీరు. మిగతా తెలుగు వాళ్లందరికన్నా ముందుగానే బాహ్య ప్రపంచం పరిచయమైందనే వాస్తవాన్ని తెలియజేస్తుంది. ఈ పరిచయం, చైతన్యం, భాషా విశేషాలు, భావాల మేలు కలయిక, కోర్టుల్లో వాడే ఇంగ్లీషు, ఉర్దూ భాషలు అన్నీ కలగలిసి తెలుగులో ఆనాడు కథలు రాసిన వారిపై గాఢమైన ప్రభావాన్నే వేశాయి. అందుకే నందగిరి వెంకటరావు లాంటి వారు తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో 1930కి ముందే కథలు రాసిండ్రు. భాస్కరభట్ల కృష్ణారావు ఆరేడు భాషల్లో నిష్ణాతుడు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు, ఉర్దూ, ఫార్సీల్లో సమాన ప్రతిభ కలవాడు. వీరందరూ ఆనాడు సాహితీ ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకుండ్రు.

585_luther_1
హైదరాబాద్‌పై పోలీసుచర్యకు పూర్వం అంటే 1948 సెప్టెంబర్‌ 13 కన్నా ముందు రాసిన తెలంగాణ` తెలుగు కథల్లో ప్రముఖంగా చోటు చేసుకున్న అంశం ఇక్కడి తెహజీబ్‌. హిందూ`ముస్లిం సోదరుల్లా కలిసిపోయిన సంస్కృతి. దాదాపు ఆనాటి తెలంగాణ కథకులందరూ తెలుగు`ముస్లిం జీవితాలను తమ కథల్లో నిక్షిప్తం జేసిండ్రు. నందగిరి వెంకటరావు, సురవరం ప్రతాపరెడ్డి, భాస్కరభట్ల కృష్ణారావు, నెల్లూరి కేశవస్వామి, వట్టికోట ఆళ్వారుస్వామి, వెల్దుర్తి మాణిక్యరావు, కాంచనపల్లి చినవెంకటరామారావు, నందగిరి ఇందిరాదేవి ఇంకా చాలా మంది ఈ జీవితాలకు తమ కథల ద్వారా శాశ్వతత్వాన్ని కల్పించిండ్రు.

ముస్లింల అబ్బాయిలతో తెలుగమ్మాయిలు, తెలుగువారితో ముడిపడ్డ ముస్లిం అమ్మాయిల జీవితాలు, ఉద్యోగాలు, కలివిడితనం, విద్య, సంస్కరణ, ఆత్మగౌరవం ఇవన్నీ ఈ కథల్లో ప్రతిఫలించాయి. గంగా జమునా తెహజీబ్‌తో పాటు 1945 తర్వాత మూడేళ్ళ కాలంలో నిజాం ప్రభుత్వ అసహాయ వైఖరిని కూడా తమ కథల్లో ఎత్తి చూపిండ్రు. దొరలు, పాలకులు చేస్తున్న దగా, దోపిడీ,  మోసాలను నిలదీసిండ్రు. రైతుల దీనావస్థను కళ్ళకు కట్టిండ్రు. ఆంధ్రమహాసభ కార్యక్రమాలు తీసుకొచ్చిన చైతన్యంతో కొంతమంది కథకులు గ్రంథాలయోద్యమం, పత్రికోద్యమం, పుస్తక పఠనం, వెట్టి చాకిరి, రాజకీయ చైతన్యాన్ని తమ కథల్లో వస్తువుగా తీసుకున్నారు. కనుమరుగౌతున్న భాష పట్ల అవగాహన కల్పించే విధంగా కథలల్లిండ్రు. ఈ దశలో తెలంగాణ కథల్లో అనివార్యంగా జైలుకు సంబంధించిన జీవితాలు, పోరాటాలు చోటు చేసుకున్నాయి. పొట్లపల్లి రామారావు ‘జైలు’. వట్టికోట ఆళ్వారుస్వామి’ ‘జైలు లోపల’తో పాటు కాంచనపల్లి వెంకటరామారావు, ఆవుల పిచ్చయ్య తదితరుల కథలే దానికి సాక్ష్యం.
తొలి తెలుగు కథ రాసిన భండారు అచ్చమాంబ మొదలు 1948లో కథలు రాసిన నందగిరి ఇందిరాదేవి వరకూ 25మందికి పైగా రచయితలు తమ కథల్లో తెలంగాణ/హైదరాబాద్‌ రాజ్య అస్తిత్వాన్ని రికార్డు చేసిండ్రు.   1899 నాటికే తెలుగులో తొలి కథలు రాసిన భండారు అచ్చమాంబ హైదరాబాద్‌లో అందరికీ ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ (ఆంధ్రలో) బతుకలేని పరిస్థితి వస్తే హైదరాబాద్‌కు వలస వెళ్ళయినా జీవితాన్ని వెళ్ళదీయొచ్చు అని ‘సతాప్రత్రదానము’ (1902) కథలో చెప్పారు. అచ్చమాంబ బాల్యము ఒకప్పటి మునగాల, దేవరకొండలో గడిచింది. వివాహానంతరం మహారాష్ట్రలో గడిపింది. అందుకే ‘ధనత్రయోదశి’ ‘బీద కుటుంబం’ కథలో బొంబాయి, మహారాష్ట్ర ప్రజల జీవితాన్ని రికార్డు చేసింది. ఆనాడు హైదరాబాద్‌ రాజ్యంలో మరాఠీలు కూడా భాగమే. హైదరాబాద్‌లో మెరుగైన జీవన స్థితిగతులు ఉన్నందువల్లనే ఆమె తమ్ముడు కొమర్రాజు లక్ష్మణరావు, మునగాల జమిందార్‌ రాజా నాయని వెంకటరంగారావు హైదరాబాద్‌ ఆవాసంగా చేసుకొని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం (1901`హైదరాబాద్‌) తో పాటు అనేక ప్రజాహిత కార్యక్రమాలు నిర్వంహించారు.
అచ్చమాంబ తర్వాత తెలంగాణ జీవితాల్ని ప్రతిఫలించే విధంగా కథలు రాసింది మాడపాటి హనుమంతరావు. ఆయన ‘హృదయశల్యము’ కథలో కాకతీయుల చారిత్రక మహిళ ‘రుద్రమదేవి’ గురించి రాసిండు. ఈయన రాసిన ‘నేనే’ కథలో కృష్ణాథియేటర్‌కు రమ్మని హీరోయిన్‌ హైమవతి తానెవరో చెప్పకుండా న్యాయవాది గణపతిరావుకు లేఖ రాస్తుంది. షోకుగా తయారై వెళ్ళిన రావుకు అక్కడ తన భార్య కనబడడంతో తమాయించుకొని ‘ఈ కొంటె తనము చేసింది నువ్వేనా?’ అని అడుగుతాడు. దానికి ఆమె ‘నేనే’ అని జవాబు చెబుతుంది. ఆనాటికి ఈనాటికి కృష్ణా థియేటర్‌ చార్మినార్‌ దగ్గర చరిత్రకు సాక్ష్యంగా నిలబడి ఇంకా సజీవంగా ఉంది. ‘నేనే’ కథ పురుషుల బలహీనతల్ని చెబుతుంది. ఇది ఆనాటి సమాజంలో వ్యాప్తిలో ఉన్న విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. ఆ లౌల్యానికి సాహిత్యంలో స్థానం దక్కింది. ఇదే కాలంలో బడారు శ్రీనివాసరావు అనే మహబూబ్‌నగర్‌కు చెందిన జర్నలిస్టు, ఆయుర్వేద వైద్యుడు, నాటకకర్త తాను వెలువరించిన ‘హితబోధిని’ (1913`15) పత్రికలో కథలు వెలువరించాడు. రాజయ్య సోమయాజులు, విషాదము, మృత్యువు దాని జ్ఞాపకము అనే కథలు వెలువరించాడు. ఇందులో మృత్యువు దాని జ్ఞాపకము మ్యూజింగ్స్‌ మాదిరిగా ఉంటుంది. ఈ కథలో దొరతనము గురించీ, దానికి గ్రామంలోని కరణాలు, ఆయుర్వేద వైద్యులు తమ స్వలాభం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేసే జీవితాల్ని, దాసిరాండ్రని వాడుకునే స్థితిని, ఆనాటి పాలమూరు జిల్లా సంఘటనల్ని రికార్డు చేసిండు.
1921లో ప్రారంభమైన నీలగిరి, తెనుగు పత్రికల్లో కథకుల పేర్లు లేకుండా తెలంగాణ జీవితాల్ని ప్రతిబింబించే విధంగా అనేక కథలు వెలువడ్డాయి. నీలగిరిలో నైజగుణము, సాతాని జియ్యర్‌, కాపు, దురాశ తదితర కథలు అచ్చయ్యాయి. ఇందులోని పాత్రలన్నీ హైదరాబాద్‌, వరంగల్‌, తెలంగాణ జీవితాలనే ప్రతిబింబించాయి. అలాగే తెనుగు పత్రికలో ఒద్దిరాజు సోదరులు తమ పేరు లేకుండానే స్థానిక అంశాలపై అన్యాపదేశంగా కథనాలు వెలువరించారు. ఇవి విషయాల్ని కథలుగా చెప్పాయి. ఇదే పత్రికలో ఇతరుల కథలు కూడా అచ్చయ్యాయి. 1927`30 మధ్యకాలంలో హైదరాబాద్‌ నుంచి సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలువడ్డ ‘సుజాత’ పత్రికలో వీరి రచనలు చాలా వెలువడ్డాయి.
భారతి పత్రికలో మొట్టమొదటిసారిగా ఒక తెలంగాణ వాడి కథలు అచ్చుకావడమనేది వాసుదేవరావుతో ప్రారంభమయింది. పక్కా హైదరాబాదీ అయిన వాసుదేవరావు తొలి కథ ఆగస్టు,1924 భారతి సంచికలో ‘నేను జొన్నరొట్టె’ శీర్షికన అచ్చయింది. 1924`33 మధ్య కాలంలో డజనుకు పైగా కథలు అచ్చయ్యాయి. ఇందులో ఒకటి రెండు కథలు ప్రేమ్‌చంద్‌ కథలకు అనుసరణలు కాగా మిగతావన్నీ పక్కా హైదరాబాద్‌ ఠీవిని, ఆహార్యాన్ని, ఆహారపు అలవాట్లని పట్టిచ్చాయి. ‘ఆలోచన’, ‘ప్రయాణం’, ‘వివాహం’ సీక్వెల్‌ కథలు.

మూడిరటిలోనూ పెళ్ళిచూపులు, పెళ్ళి ఇతివృత్తం. ఒక దాంట్లో పెళ్ళి చూపులకు ఆంధ్ర ప్రాంతంలోని తన మామయ్య ఇంటికి వెళ్ళాలని నిశ్చయం, రెండో దాంట్లో అందుకోసం చేసిన ప్రయాణంలో జరిగిన సంఘటనలని, మూడో దాంట్లో పెళ్ళికి సంబంధించిన విషయాల్ని రికార్డు చేసిండు. బి.ఎ. పూర్తి చేసిన కథానాయకుడు ఇంగ్లండ్‌ వెళ్ళి ఎం.ఎ. చదవాలనుకుంటాడు. అలాగే హైదరాబాద్‌ సివిల్‌ సర్వీసెస్‌లో ఉద్యోగం సంపాదించిన తర్వాత పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు.
సూటూ, బూటు నీటుగా టై వేసుకోవడం, విదేశీ అధికారుల మాదిరిగా తయారు కావడం, ఆంగ్ల భాషాభిమానం, ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ సంస్కరణపట్ల ఆసక్తి, వితంతువివాహాలు, రజస్వాలానంతర వివాహాలకు సంబంధించిన విషయాలు ఈ కథల్లో ప్రస్తావనకు వస్తాయి. హైదరాబాద్‌ అస్తిత్వాన్ని, సంస్కృతిని, మాట తీరుని, భాషని, వ్యంగ్యాన్ని చాలా హృద్యంగా వాసుదేవరావు ‘‘నేనా? నేనా? నేను హైదరాబాదు `దక్కనీ! నా హృదయం వేరే. వాళ్ళ హృదయం వేరే. నేనూ వాళ్ళవంటి వాణ్ణే అయితే అయిదు కాదు పదేను వేలిస్తే గాని పెళ్ళి చేసుకోనని పట్టుబట్టి కూర్చుందును. పెద్ద పెద్ద సభలలో వేదికల మీద నెక్కి సంఘసంస్కర్తలని పేరు పెట్టుకొని, సంస్కార విషయాలు పెద్ద పెద్ద లెక్చర్లిచ్చి (బహిరంగంగా) లోలోపల, వందలు వేలు కట్నాలు పుచ్చుకొనే ఆంధ్ర బ్రాహ్మణులెక్కడ? నేనెక్కడ ఈ వ్యత్యాసం నీకు కనబడలేదామ్మా?’’ అంటూ హైదరాబాద్‌(దీ) ఔన్నత్యాన్ని ‘ఆలోచన’ కథలో చాటి చెప్పిండు.

కథానాయకుడి డ్రెస్సింగ్‌ చూసి అతను యూరోపియనా? అనే అనుమానం కలిగిందంటే ఆనాటి హైదరాబాదీ ఆహార్యాన్ని అర్థం చేసుకోవచ్చు. బడాయి కూడా అలానే ఉండేదని తల్లి పాత్ర ద్వారా వాసుదేవరావు చెప్పిస్తాడు. ఇవి గాకుండా ‘నేను జొన్నరొట్టె’, ‘పిశాచం’, ‘ఇదియేనా పునర్వివాహం’, మాటీలు, సుప్రభాతము, ముద్దుటుంగరము, అనర్థం, సంశయం తదితర కథలు హైదరబాదీ హృదయంతో వెలువడ్డాయి. వాసుదేవరావు లాగానే పక్కా హైదరాబాదీ తర్వాతి కాలంలో జడ్జిగా పనిచేసిన నందగిరి వెంకటరావు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో కథానికలు రాసిండు.
నందగిరి వెంకటరావు (1909`1985)  తెలంగాణ తొలితరం కథకుల్లో అగ్రగణ్యుడు. 1926`35 సంవత్సరాల మధ్యకాలంలో 50కి పైగా కథలు రాసిన ఈయన రచనలేవి పుస్తక రూపంలో రాకపోవడంతో వాటికి తగిన గుర్తింపు దక్కలేదు. ‘గిరి’ అనే కలం పేరుతో భారతి, ఉదయిని, కృష్ణాపత్రిక, సమదర్శిని, సుజాత, గోలకొండ పత్రికల్లో ఈ కథలు అచ్చయ్యాయి. 1935లోనే ప్రథమ అఖిలాంధ్ర కథకుల సమ్మేళనాన్ని హైదరాబాద్‌లో నిర్వహించిన వెంకటరావు భార్య నందగిరి ఇందిరాదేవి కూడా చాలా కథలు రాసింది.

ఆంధ్రమహాసభ నాయకుడిగా, తెలంగాణ సాయుధ పోరాట కాలంలో జైలుకెళ్లిన స్వాతంత్య్ర యోధుడిగా, జడ్జిగా, గ్రంథాలయోద్యమ కార్యకర్తగా, స్త్రీవిద్య ప్రచారకుడిగా నందగిరి వెంకటరావు చేసిన కృషి చిరస్మరణీయమైనది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో కథా సాహిత్యాన్ని సృజించిన అరుదైన ప్రతిభాశాలి నందగిరి వెంకటరావు.
తెలుగు సాహిత్యం ముఖ్యంగా కథానికా సాహిత్యం దేదీప్యమానంగా వెలుగడానికి చమురునెంతో సరఫరా చేసిన వాడు నందగిరి. కథానికా సాహిత్యంలో తనకంటూ ఒక శైలిని ఏర్పర్చుకొని లో చూపుతో విశ్లేషించి, మానవ సంబంధాల్ని మానవీయ కోణంలో సున్నితంగా సృజించి జీవితాల్ని చిన్న కాన్వాస్‌పై ‘కథ’గా చిత్రీకరించిన అక్షర పెయింటర్‌ నందగిరి. హైదరాబాద్‌ హిందూ`ముస్లిం సంస్క ృతి, తెలంగాణ జీవితాల్ని కథలుగా మలిచిండు. 1935కు ముందే హైదరాబాద్‌ కేంద్రంగా జరిగే జాతీయ ఉద్యమాల్ని తన కథల ద్వారా అక్షర రూపమిచ్చిండు.
హైదరాబాద్‌ తెహజీబ్‌, హిందూ`ముస్లిం పండుగలు, సంస్కృతి, మతాలకతీతమైన రొమాన్స్‌, హిందూ`ముస్లిం ప్రజల సంబంధాల్ని, జీవన విధానాన్ని నందగిరి చిత్రికగట్టినంత సున్నితంగా ఇంకెవ్వరూ రాయలేదు అంటే అతిశయోక్తి కాదు. ప్రతిఫలం, నూర్జహాన్‌, తప్పేమి, జరిగిన కథ మొదలైన కథల్లో హైదరాబాదీ ముస్లిం జీవితం, సంస్కృతి వ్యక్తమయ్యింది. నందగిరి అటు ఆంద్రమహాసభ ఉద్యమంలోనూ, గ్రంథాలయోద్యమంలోనూ, పత్రికోద్యమంలోనూ చురుగ్దా పాల్గొన్న వాడు కావడంతో ఆయన రచనలు అందరికన్నా ఒక అడుగు ముందున్నాయి. చలంతో పోటీపడి తెలంగాణ నుంచి కథలు రాసి యావత్తెలుగు ప్రజల్ని మెప్పించిన కథకుడు నందగిరి వెంకటరావు.
తెలంగాణ సాయుధపోరాటారంభానికి 15 యేండ్ల ముందే దొరల దౌర్జన్యాన్ని నిరసిస్తూ ‘పటేలుగారి ప్రతాపం’ పేరిట కథ రాసిండు. గ్రామ పటేలు తన మాట వినని రామయ్య అనే రైతును కొట్టడమే గాకుండా వితంతువైన ఆయన సోదరిని అల్లరి చేయడం. దీనికి పటేలు తల్లి కూడా మద్దతుగా ఉండి నీ తండ్రి కాలంలో  ఎదురు తిరిగి మాట్లాడిన వాడు లేడు అని కొడుకుని రెచ్చగొట్టడం, అడ్డు వచ్చిన వారిని బెదిరించడం జరిగింది. దాదాపు ఇలాంటి ఘటనే సాయుధ పోరాట కాలంలో జరిగింది. ఈ కాలంలో విసునూరి దొరలు ఇలాగే దౌష్ట్యానికి దిగారు. విసునూరి ‘బాబుదొర’ను ప్రజలు చంపేసినట్లుగానే ఈ కథలో కూడా ప్రజలు దొరను చంపేస్తారు. అయితే వాస్తవానికి జరిగిన సంఘటనకన్నా 15 యేండ్లకు ముందే నందగిరి వెంకటరావు పటేలుగారి ప్రతాపంలో ఇవే సంఘటలను చిత్రీకరిస్తూ ప్రజలు తిరుగుబాటు చేయాలని పరోక్షంగా చెప్పిండు. చిత్రచోరులు కథలో ఒక అంశాన్ని భిన్న కోణాల్లో చూసే తెలంగాణ`ఆంధ్రవారిని గురించి రాసిండు.
తెనుగు పత్రికలో డిటెక్టివ్‌ కథలు కూడా అచ్చయ్యాయి. హైదరాబాద్‌ అమ్మాయి సినిమాల పట్ల వ్యామోహంతో ఆనాడే బొంబాయికి వెళ్ళి ఆ మాయలో చిక్కుకు పోయిన విషాదాన్ని నందగిరి వెంకటరావు తన కథల్లో చెప్పిండు. ఇదే కాలంలో ఒద్దిరాజు సోదరులు వివిధ పత్రికల్లో తమ రచనలు వెలువరించారు. వీరి కథలు ఎక్కువగా వారు వెలువరించిన తెనుగు పత్రికతో పాటు ‘సుజాత’ పత్రికలో అచ్చయ్యాయి. ఒద్దిరాజు సీతారామచంద్రరావు తెలుగులో తొలిసారిగా వైజ్ఞానిక కథలు రాసిన వాడిగా ప్రసిద్ధుడు. దీనికి నిదర్శనం ‘అదృశ్యవ్యక్తి’ కథానిక. ‘నటి’ కథలో జమీందారి కుటుంబానికి చెందిన నళినీకాంతుడు నటి తారాదేవితో సాన్నిహిత్యంగా ఉంటాడు. నళినీకాంతుడి సోదరులు తారాదేవిని వదిలిపెట్టాలని వత్తిడి తీసుకొస్తారు. కొంతమంది యూరోపియన్‌ మిత్రులు పెళ్ళి చేసుకొమ్మని సలహా ఇస్తారు. దాంతో పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమవుతాడు, అయితే తార పశ్చాత్తాపంతో నళినీకాంతుడికి ఉత్తరం రాస్తుంది. ప్రేమానుభవం కంటే ప్రేమ స్మృతి గొప్పదని అదే అధిక మాధుర్యం కలదిగా తోస్తుందని, వివాహమాడి భార్యతో సుఖంగా ఉండమని రాస్తుంది. హితబోద చేసినట్టుగా కథ ముగుస్తుంది. ఈయన కథలపై బెంగాళీ రచనల ప్రభావముంది. ఇక సీతారామచంద్రరావు సోదరుడు రాఘవరంగారావు తెలంగాణలో దేశ్‌ముఖ్‌ల, జమీందారుల జీవితాల్ని కథల్లోకి తెచ్చిండు. ‘లండన్‌ విద్యార్థి’ కథలో దేశ్‌ముఖ్‌ల సోమరితనం, విలాసాలు, మరో వైపు ఇంగ్లండ్‌లో విద్యాభ్యాసంపై మోజుని చెప్పిండు.
భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్‌లో పుట్టి పెరిగినవాడు. అంబేద్కర్‌ కన్నా ముందు మొత్తం జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నాయకుడు. ఈయన హైదరాబాద్‌ నుంచి ‘భాగ్యనగర్‌’ అనే పత్రిక తీసుకొచ్చాడు. ఇందులో వెట్టిమాదిగ పేరిట ఆనాటి సమాజంలో ఉన్నటువంటి దళితుల దుర్భర జీవితాన్ని తెలియజెప్పిండు. రామిరెడ్డి దురహంకారానికి బలయిన వంతు మాదిగ మల్లయ్య గురించి ఇందులో వివరించిండు. దీనికి కొనసాగింపుగా సురవరం ప్రతాపరెడ్డి అనేక కథలు రాసిండు. ప్రతాపరెడ్డి కథలు ముఖ్యంగా ‘సంఘాల పంతులు’ కథలో పంతులు ఊరి మాదిగలను, కోమట్లను కూడగట్టి వెట్టిచాకిరి, సప్లయిలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాడు. సంఘం అంటే కమ్యూనిస్టు సంఘమనే భావనలోనే ఆ పదాన్ని సురవరం వాడారు. తెలంగాణ వాతావరణ నేపథ్యంతో పాటు, పదాలు, తెలంగాణ ఆత్మని పట్టిస్తాయి. ఈయన మొగలాయి కథలు కూడా ఆయన విశిష్టతను చాటి చెబుతాయి. కరీంనగర్‌ జిల్లా మంథనికి చెందిన వెంకట రాజన్న అవధాని ‘తిరుగుబాటు’ కథలో స్త్రీ విద్య, సంస్కరణ గురించి రాసిండు. ఖమ్మంకు చెందిన దాశరథి కవిత్వంతో పాటు కథలు కూడా రాసిండు.
వీరితో పాటు మాడపాటి రామచంద్రుడు, జి.రాములు, జమలాపురం వెంకటేశ్వర్లు, శేషభట్టర్‌ వెంకట రామానుజాచార్యులు, జమలాపురం వెంకటేశ్వర్లు, తదితరులు ఖమ్మం, కరీంనగర్‌, నల్లగొండ ప్రాంతాల్లోని జీవితాలను రికార్డు చేసిండ్రు. నల్లగొండకు చెందిన బోయనేపల్లి రంగారావు, గం. గోపాలరెడ్డి తదితరులు కూడా ఆనాడు తెలంగాణ తనాన్ని కథల్లో చిత్రించారు. వీరిలో కథకుడు జి.రాములు మాజీ జడ్జి జీవన్‌ రెడ్డి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి, ఎన్నో వర్సిటీలకు వైస్‌ ఛాన్సలర్‌గా పనిచేసిన జి. రాంరెడ్డిలకు విద్యా గురువు. ఈయన పెరటి చెట్టు, బ్రహ్మపుత్ర భక్త సమాజం, ఆత్మఘోష, పిచ్చి శాయన్న, కొత్తదాసి కనకం తదితర కథలు బహుజన దృక్కోణం నుంచి తెలంగాణను ఆవిష్కరించాయి. పెరటిచెట్టు కథలో గౌడ కులస్థుల జీవన వ్యథల్ని చెప్పిండు. ఇందులో దున్నేవాడిదే భూమి అన్నట్టు గీసేవాడిదే చెట్టు అని సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
1943లో ఆంధ్రప్రాంతంలో ఆరంభమయిన అభ్యుదయ రచయితల సంఘం సమావేశాలకు తెలంగాణ నుంచి ఏకైక ప్రతినిధిగా వట్టికోట ఆళ్వారుస్వామి హజరయ్యిండు. ఆ తర్వాత ఆంధ్రలో జరిగిన ప్రతిసమావేశానికీ విధిగా ఆళ్వారుస్వామి హాజరయ్యిండు. 1944 నాటి భువనగిరి ఆంధ్రమహాసభల్లో కమ్యూనిస్టులు`కాగ్రెస్‌ వారికి సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు జేసిండు. కాంగ్రెస్‌లో కమ్యూనిస్టుగా, కమ్యూనిస్టుల్లో కాంగ్రెస్‌ ఆలోచనాపరుడిగా సంఘసంస్కరణకు పాటుపడే విమర్శకుడిగా, కార్యశీలిగా ఆళ్వారుస్వామి గుర్తింపు తెచ్చుకున్నాడు. గ్రంథాలయోద్యమం, పత్రికోద్యమం, సత్యాగ్రహాల్లో విశిష్ట భూమిక పోషించిండు. పౌరహక్కుల కోసం పోరాడిరడు. జైల్లో దాశరథితోపాటు ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిండు.

తెలుగుతల్లి పత్రిక ప్రచురణ ద్వారా హైదరాబాద్‌లో అడివిబాపిరాజు, రాంభట్ల కృష్ణమూర్తి, భాస్కరభట్ల కృష్ణారావు తదితరులతో కలిసి నగరంలో అభ్యుదయ రచయితల సంఘానికి ప్రాణం పోయడమే గాకుండా, ఆంధ్రప్రాంతంలో కూడా అరసంకు ఆసరాగా నిలిచిండు. ఈ సమయంలోనే వరంగల్‌లో జరిగిన మజ్లిస్‌ సభల్లో బహదూర్‌ యార్జంగ్‌ తన ఆవేశ పూరిత ప్రసంగంలో ‘‘హైదరాబాద్‌ రాజ్యం ఆలాహజ్రత్‌ సొంత జాగీరు కాదు. ఈ రాజ్యం ఏ ఒకరిదో అనుకుంటే అందుకు బలికావాడానికి నేను సిద్ధంగాలేను. ఇది ముస్లిం ప్రజలందరి ఆస్తి’’ అని చెప్పిండు. ఆ తరువాతి సంవత్సరం నిజాం ఇచ్చిన విందులో హుక్కా పీల్చి అనుమానాస్పద స్థితిలో చనిపోయిండు. అనంతరం మజ్లిస్‌ పగ్గాలు కాసీంరజ్వీ చేతుల్లోకి వెళ్ళాయి. ఆయనే రజాకార్ల ఉద్యమాన్ని లేవదీసిండు. మత పరమైన ఉద్రిక్తతలు ఒకవైపూ, అరసం కార్యకలాపాలు మరోవైపూ హైదరాబాద్‌లో కార్యక్రమాలు నిర్వహించాయి.
1946లో సాయుధ రూపం తీసుకున్న ‘రైతాంగ పోరాటం’, 1948లో ‘పోలీస్‌ యాక్షన్‌’, 1951లో పోరాట విరమణ, 1952లో మిలిటరీ పాలన, ఎన్నికలు, మిత్రుడు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ పాలన, ముల్కీ ఉద్యమం, 1953లో ఆలంపూరులో అఖిలాంధ్ర సారస్వత సభ, 1955లో ఆంధ్రలో ఎన్నికలు, 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు 46 ఏండ్ల ఆళ్వారుస్వామి జీవితంపై ప్రభావం చూపిన అంశాలు. ఇవి ఎన్నో గుణపాఠాలు నేర్పాయి. అలాగే రెండు విడతలుగా జైలుశిక్ష, కమ్యూనిస్టుల ఏకపక్ష ధోరణి, బాధ్యతారాహిత్యం అన్నీ కలగలిసి ఆళ్వారుస్వామిని చివరి పదేళ్ళు పుస్తక ప్రచురణ, రచనా రంగానికే పరిమితం చేశాయి. ఈ కాలంలోనే ఆళ్వారుస్వామి తెలుగు సాహిత్యంలో తనదైన ముద్రవేసే, ఉన్నత విలువల్ని ప్రతిష్టించే రచనలు చేసిండు.
‘తెలంగాణ మంటల్లో’ అనే కథా సంకలనాన్ని 1948లోనే వెలువరించిన అడ్లూరి అయోధ్యరామకవి స్వతహాగా కవి, గాయకుడు, జర్నలిస్టు. ‘నైజాం ప్రజావిజయం’ అనే బుర్రకథ, ఘంటారావంతో పాటు అనేక ఖండికలను రాసిన ఈయన బాంబుల భయం, కాలాన్ని తేవాలి, తల్లి ప్రేమ, చీకటి రాజ్యం, జనానా రజాకార్‌, అమరలోక యాత్రికులు అనే కథలు రాసిండు. ఇందులో ‘బాంబుల భయం’ కథలో సాయుధ పోరాట సమయంలో గ్రామ రక్షణ దళాలు సిరిపురం పై రజాకార్ల దాడిని అడ్డుకున్న అంశాన్ని చిత్రించాడు. సాయుధ పోరాట కాలంలో కాంగ్రెసు కార్యకర్తగా, దాశరథి కృష్ణమాచార్యతో కలిసి ప్రచారకుడిగా పనిచేసిన అడ్లూరి కథలన్నీ ఆనాటి పోరాటాన్ని చిత్రీకరించాయి.

కమ్యూనిస్టులు, ప్రజలు, కాంగ్రెస్‌, రజాకార్లు, దొరలు, గడీలు, సాయుధ పోరాటం, జైలు అన్నీ ఈయన కథాంశాలయ్యాయి. ఈయనతో పాటు కాళోజి నారాయణరావు కూడా సాయుధ పోరాట సమయంలో కథలు రాసిండు. కాళోజి రాసిన లంకాదహనం ఉద్యమానంతర పరిస్థితుల్ని రికార్డు చేశాయి. ఆశించిన ఫలితాలు అందకుండా పోయిన స్థితిని ఇందులో కాళోజి రికార్డు చేసిండు.
సాయుధ పోరాటం కన్నా ముందు నుంచే గోలకొండ పత్రికలో కథలు రాసిన వారిలో అగ్రగణ్యుడు భాస్కరభట్ల కృష్ణారావు. 1939 నుంచీ కథలు రాస్తూ వచ్చిన భాస్కరభట్ల మూడు కథా సంపుటాలు ప్రచురించాడు. మొదటి సంపుటం 1955లో ‘కృష్ణారావు కథలు’ పేరిట, తర్వాత ‘చంద్రలోకానికి ప్రయాణం’, ‘వెన్నెల రాత్రి’ పేరిట మిగతా రెండు సంపుటాలు ప్రచురితమయ్యాయి. ఈయన మొత్తం తెలంగాణ కథకుల్లో ముందు వరుసలో నిలబడాల్సిన వాడు. జన్మత: తెలంగాణ వాడు కావడంతో ఆయన కథల్లో తెలంగాణ మట్టి వాసన కనబడుతుంది. ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, బాధలు, సంతోషాలు అందులో కనిపిస్తాయి.

భాస్కరభట్లకు బాగా పేరు తీసుకు వచ్చిన కథ ‘ఇజ్జత్‌’. ఇందులో కౌలుకు తీసుకున్న భూమిలో పంటలు సరిగా పండక పోవడంతో మల్లయ్య అనే రైతుల కౌలు చెల్లించ లేక పోతాడు. ఇందుకు అతనికి ‘శిక్ష’ వేస్తారు. ఆ అవమానాన్ని భరించలేక ఉరిబెట్టుకున్న రైతు కథను ఇందులో చిత్రీకరించాడు. భూసంస్కరణల అమలు చట్టం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో  పేద రైతు దీనస్థితిని ఈ కథలో భాస్కరభట్ల కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఈ కథ 1944లో మీజాన్‌ పత్రికలో అచ్చయ్యింది. మల్లయ్య అనే రౌతు రంగారావు పొలం కౌలుకి తీసుకొని క్రమం తప్పకుండా కౌలు గింజలు చెల్లిస్తూ ఉండేవాడు. అయితే కాలం సరిగా కాకపోవడంతో, కుంటకు గండిపడడం లాంటి ఇబ్బందులకు తోడుగా ఈ మధ్యనే కూతురు పెళ్ళి చేశాడు. దీంతో ఖర్చులో పడ్డాడు. అందువల్ల కౌలు గింజలు ఇవ్వలేక పోయాడు. గండి పూడ్చగల తాహతు మల్లయ్యకు లేదు. పైగా భూసంస్కరణల చట్టం ఒకటి వచ్చి పడుతోంది. ఈ పరిస్థితిలో తన కౌలుగింజల బకాయి రాబట్టుకోవడానికి రంగారావు గట్టి ప్రయత్నం చేస్తాడు. మల్లయ్య ఎంత ప్రాధేయపడినా ఫలితం లేక పోయింది. అతనికి శిక్ష వేస్తారు. వంగబెట్టి వీపుమీద బండ పెట్టించారు.

కొంత సేపటికి మల్లయ్య స్పృహ తప్పి పడిపోయాడు. సేదదీర్చి ఎవరో పుణ్యం గట్టుకున్నారు. అతని భార్య గొల్లున ఏడుస్తూ వస్తుంది. ఆమెతో ‘ఇజ్జత్‌’ పోయిందే పిల్లా అని చెబుతూ పరువు పోవడంతో బతకడం కష్టమని తలంచి ఇంట్లో దూలానికి ఉరివేసుకొని చనిపోతాడు. ఇందులో రైతుల కష్టపడే గుణాన్ని, కౌలుదారీ విధానం గురించి కథకుడు చెబుతాడు. ఆఖరికి ఆత్మాభిమానం మెండుగా గల రౌతు ఆత్మహత్య చేసుకోవడంతో కథ ముగుస్తుంది. ఇది 1944నాటి తెలంగాణ రైతుల స్థితిగతుల్ని లెక్కగడుతుంది.    మీజాన్‌ పత్రికలోనే 1945లో వెలువడ్డ మరో కథ ‘మార్పు’. ఇందులో దేవుడి మొక్కును వాయిదా వేసుకునేందుకు సాకులు వెతికే భర్త గురించి చెప్పాడు. చివరికి ఖైరతాబాద్‌లోని ఆంజనేయ గుడికి వచ్చి మొక్కు చెల్లించుకునేలా భర్తని మార్చిన భార్య గురించి చెప్పాడు. ఖైరతాబాద్‌లో ఆంజనేయ స్వామి గుడి ఇప్పటికీ ప్రతి శనివారం భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది.

అలాగే మరో కథ ‘సానుభూతి’, ‘హృదయ పరివర్తనం’ కథల్లో మధ్యతరగతి ప్రజల్లోని అవకతవకలను ఎత్తి చూపిస్తూ వాటి నుంచి విముక్తులు కావాలని హెచ్చరిస్తాడు. ‘అవమానం’అనే కథలో స్వార్థపరుల నీచత్వాన్ని నగ్నంగా చూపించి, ఆత్మవంచన చేసుకునే వారికి గుణపాఠం చెప్పాడు.
హైదరాబాద్‌ నగర జీవన విధానం, రాజకీయ పరిస్థితులు, సామాజిక, సాంస్కృతికరంగాలు, హిందూ`ముస్లిం దోస్తానా దానితో పాటే మజ్లిస్‌ మతవిద్వేషం, జమీందార్లలో కూడా మంచీ చెడూ రెండూ ఉంటాయని భాస్కరభట్ల చెప్పిండు. ఆధునిక స్త్రీ స్వయం నిర్ణయాధికారం కోసం తండ్రిని సైతం ఎదిరించడం, విద్యా ప్రాధాన్యత ఈ నవలల్లో, కథల్లో ప్రధానంగా చోటు చేసుకున్నాయి. ‘యుగసంధి’ నవల్లో రుక్మిణి, రమణ, పద్మల పాత్రల ద్వారా ఆనాటి స్రీల ఆలోచనాసరళిని వారి తెగింపుని, కట్టుబాట్లకు లొంగని తిరుగుబాటు దోరణిని చదువుకున్న, ఆధునిక భావాలు గల స్త్రీల మనోభావాల్ని రికార్డు చేసి నవలకు సమగ్రత కల్పించిండు. నిరుద్యోగం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం కూడా ఇందులో అంతర్లీనంగా చోటు చేసుకున్నాయి. భాస్కరభట్ల  మీద ఉన్న ప్రేమతో నెల్లూరి కేశవస్వామి తన ‘పసిడి బొమ్మ’ కథా సంపుటిని అంకితమిచ్చాడు.
నెల్లూరి కేశవస్వామి కూడా పక్కా హైదరాబాదీ. ఈయన కథల్లో హిందూ`ముస్లింల మైత్రి, ప్రేమ, ఆచార వ్యవహారాలు, అంతర్లీనంగా నవాబుల పోకడలు అన్నీ ప్రతిఫలిస్తాయి. ‘పోలీసుచర్య’కు పూర్వం హైదరబాద్‌ నగరంలో ఉన్న జీవన స్థితిగతుల్ని ముఖ్యంగా ముస్లింల జీవితాలని నెల్లూరి కేశవస్వామి హృద్యంగా చిత్రీకరించాడు. ‘యుగాంతం’ అనే పెద్ద కథలో పోలీసుచర్య నాటి జీవన విధ్వంసాన్ని చిత్రించాడు. ‘చార్మినార్‌’, ‘పసిడి బొమ్మ’ పేరిట కథా సంపుటాలను వెలువరించాడు. సంపుటాల్లో చేరని కథలు ఇంకా చాలా ఉన్నాయి.
వీరితో బాటుగా వరంగల్‌కు చెందిన పెండ్యాల చినరాఘవరావు, ఖమ్మంకు చెందిన బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి, హీరాలాల్‌ మోరియా, ఊటుకూరి రంగారావు, కవిరాజమూర్తి, దాశరథి తదితరులు తెలంగాణ జీవితాల్ని తమ కథల్లో నిక్షిప్తం జేసిండ్రు. వీరందరూ ఉర్దూలో కూడా నిష్ణాతులే కావడం విశేషం. బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి స్వయంగా కథలు రాయడమే గాకుండా ఉర్దూ కథల్ని తెలుగులోకి అనువదించారు. హీరాలాల్‌ మోరియా ఎక్కువగా ఉర్దూలో కథలు రాసిండు. వీటిని ఊటుకూరి రంగారావు తెలుగులోకి అనువదించేవారు. ఈయన స్వయంగా కథకుడు కూడా. ఇక కవిరాజమూర్తి అయితే ఏకంగా ఉర్దూలో నవలలే రాసిండు. ఇవి కూడా ఉర్దూ నుంచి తెలుగులోకి తర్జుమా  చేయబడ్డాయి.
హైదరాబాద్‌లో మొదటి నుంచీ పంచభాషా సంస్కృతి ఉండేది. హైదరబాదీయులందరికీ గతంలో ఐదు భాషలు అవలీలగా వచ్చేవి. తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడం, ఇంగ్లీషు భాషలు హైదరాబాద్‌లో నివాసముండే ప్రతి ఒక్కరూ తప్పకుండా మాట్లాడగలిగేవారు. నిజాం ప్రభుత్వం విధిగా తమ కార్యకలాపాలన్నింటినీ ఈ ఐదు భాషల్లో నిర్వహించేది. సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నందగిరి వెంకటరావు, నెల్లూరి కేశవస్వామి, భాస్కరభట్ల కృష్ణారావు, కాళోజి నారాయణరావు, పొట్లపల్లి రామారావు, బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి, కవిరాజమూర్తి, ఊటుకూరి రంగారావు, హీరాలాల్‌ మోరియా, బూర్గుల రంగనాథరావు, వట్టికోట ఆళ్వారుస్వామి,  కాంచనపల్లి చినవెంకటరామారావు ఇంకా అనేకమంది తెలుగుతో పాటుగా ఉర్దూలో కూడా రచనలు చేయదగ్గ సమర్ధులు. నందగిరి వెంకటరావు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో కథలు రాసిండు. కవిరాజమూర్తి, పొట్లపల్లి రామారావులు తెలుగుకన్నా ఎక్కువగా ఉర్దూలో తమ రచనలు వెలువరించిండ్రు.

అయితే ఈ బహుభాషా సంస్కృతి హైదరాబాద్‌పై పోలీసు చర్య అనంతరం అంతరించి పోయింది. పోలీసుచర్య తర్వాత ఏర్పడ్డ పరాయి పాలన, వలసాంధ్రాధిపత్యం, హిందీ ప్రాభవం అన్నీ కలగలిసి పంచభాషా సంస్క ృతిని మట్టుబెట్టాయి. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఉన్నన్ని రోజులు హైదరాబాద్‌ రాజ్యంలో అంతో ఇంతో ఉర్దూ, తెలుగు, కన్నడ, మరాఠీలకు ఆదరణ లభించినప్పటికీ తర్వాత కనుమరుగయ్యాయి.
1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డ తర్వాత తెలుగుని మాత్రమే ముందుకు తీసుకువచ్చి ఆ భాషలోనూ తెలంగాణేతరులు రాసిన రచనలే గొప్పగా ప్రచారం కావడంతో వాటికి మాత్రమే గౌరవం దక్కింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కావడం వల్ల తెలంగాణకు జరిగిన పెద్ద నష్టమిది. బహుభాషా సంస్కృతి, కాస్మోపాలిటన్‌ కల్చర్‌కి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు గొడ్డలి పెట్టయ్యింది. 1956 కు ముందు ఇంకా చెప్పాలంటే 1948 సెప్టెంబర్‌కు ముందు హైదరాబాద్‌ రాజ్యం నుంచి తెలుగులో వెలువడ్డ కథ, నవల, కవిత్వానికి తర్వాతి కాలంలో సరైన ఆదరణ లభించలేదు. ఇప్పటికైనా ఆనాటి అమూల్యమైన రత్నాలను వెతికి వెలుగులోకి తీసుకొచ్చి మన సాహిత్య చరిత్రను పునర్నిర్మించుకోవాలి. తెగిన తల్లివేరు భాషను బతికించుకోవాలి. ఇవన్నీ ఆనాటి రచనలను ఒక్కొక్కటిగా సంకలనాలుగా వెలువరించడం ద్వారా సాధించవచ్చు.
ఆనాటి రచనలను పునర్ముద్రించుకోవడం ద్వారా కనుమరుగై, గౌరవానికి నోచుకోకుండా పోయినా తెలంగాణ అస్తిత్వానికి చిత్రిక గట్టవచ్చు. మనమూ చరిత్రకెక్కదగిన వారమే, ఎవరికీ ఎందులోనూ తీసిపోము, మీదు మిక్కిలి ఆగమైన మన ఘనమైన చరిత్రను చెక్కిలిపై రాపాడిరచుకోవడానికి, నెత్తిన పెట్టుకొని ఊరేగించడానికి  ఈ అస్తిత్వ కథలు సమగ్ర సంకలనాలుగా వెలువడాల్సిన అవసరముంది.

-సంగిశెట్టి శ్రీనివాస్‌

పరాశరుని ఉదంతం: పండితుల మౌనం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

 

 

 

 

 

కిందటి వ్యాసంలో చెప్పుకున్న విషయాన్ని సంగ్రహంగా పునశ్చరణ చేసుకుంటే…

పొర: 1లో చెప్పినది బీజరూప కథాంశం మాత్రమే. అందులోని పరాశర-మత్స్యగంధుల లైంగిక సంబంధం కానీ, ఆ ఇద్దరి వ్యక్తిత్వాలు కానీ ఫలానా రకమైనవని నిర్ధారణ చేయలేం. వాస్తవంగా మన ఎదురుగా ఉన్నది పొర:2 ఒక్కటే. పొర:1 లోని ఆ రెండు పాత్రలనూ తీసుకుని కథకుడు ఆ ఇద్దరి లైంగిక సంబంధం ఎలాంటిదో, వారి వ్యక్తిత్వాలు ఎలాంటివో చెబుతున్నాడు. ఆ చెప్పడంలో పరాశరునిలోని చీకటి, వెలుగుల కోణాలను రెండింటినీ, అతని ప్రవర్తనలోని వైరుధ్యాన్నీ మన ముందు ప్రదర్శిస్తున్నాడు.

అలా ప్రదర్శించడంలో అతని ఉద్దేశాన్ని ఇలా అర్థం చేసుకోడానికి అవకాశం ఉంది: 1. పురుషుడికి ఒక స్త్రీ పట్ల వాంఛ కలిగినప్పుడు ఆమె ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఆ వాంఛను తీర్చుకునే ప్రయత్నం చేయవచ్చు. భయపెట్టో, ప్రలోభపెట్టో ఆమెను లొంగదీసుకోవచ్చు. స్త్రీ పురుషుడి దృష్టిలో ఒక భోగ్యవస్తువు మాత్రమే. 2. పురుషుడి మాటల్లోనూ, చేతల్లోనూ ఎలాంటి తప్పును కానీ, వైరుధ్యాన్ని కానీ వెతకడానికి వీల్లేదు. అతను ఏం మాట్లాడినా ఒప్పే, ఏం చేసినా ఒప్పే. అతని మాట లేదా చేత ఏదైనా సరే, అది శిలాశాసనం.

కథకుడు ఇక్కడ పితృస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

గాంధారి తండ్రి సుబలుడు గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశానన్నాడు! ఆ సంబంధం గురించి కుటుంబసభ్యుల్లో ఎలాంటి చర్చ జరిగినా సరే, వారి ఇష్టాయిష్టాలు ఏవైనా సరే; వాటికి సుబులుని మాటతో అడ్డుకట్ట పడిపోవలసిందే. కన్యాశుల్కం నాటకంలో ‘తాంబూలాలిచ్చేసాను, తన్నుకు చావం’డన్న అగ్నిహోత్రావధాన్లు మాట కూడా ఇలాంటి శిలాశాసనమే.

ప్రస్తుతానికి వస్తే, ఈ కథలో మత్స్యగంధి మాతృస్వామ్య అవశేషాలకు ప్రతినిధి. కథకుడు ఆ అవశేషాలను మరుగుపుచ్చలేదు. కారణం ఒకటే; మాతృస్వామ్యంపై పితృస్వామ్య విజయాన్ని లేదా ఆధిపత్యాన్ని కూడా చెప్పడం అతని ఉద్దేశం. అప్పుడు మాతృస్వామ్య అవశేషాలను మరుగుపుచ్చడం వల్ల ఆ ప్రయోజనం నెరవేరదు. ఇంకొకలా చెప్పుకుంటే, ఇదొక యుద్ధం లాంటిది. లేదా నేటి ఎన్నికల యుద్ధం లాంటిది. కథకుడు ఈ యుద్ధంలో పితృస్వామ్య పక్షం వహిస్తున్నాడు. యుద్ధం అన్నప్పుడు తప్పును కూడా ఒప్పుగా బుకాయించడం, రకరకాల సమర్థనలను, ఉపాయాలను, మాయోపాయాలనూ కూడా ఆశ్రయించడం మామూలే. ఈ కథలోనూ, ఇంకా ఇలాంటి అనేక కథలలోనూ కథకుడు ఒక కీలకమైన ఉపాయాన్ని, బహుశా మాయోపాయాన్ని ప్రయోగించాడు. దాని గురించి త్వరలోనే చెప్పుకోబోతున్నాం.

Satyavati

మత్స్యగంధి మాతృస్వామ్య అవశేషాలకు ప్రతినిధి అనడానికి సాక్ష్యం ఈ కథలోనే ఉంది. మత్స్యగంధిపై కోరిక తీర్చుకోవడమే ప్రధానం తప్ప అనంతర పరిణామాలపై పరాశరునికి ఆసక్తి లేదన్న సూచనను కథాగమనమే అందిస్తోంది. ‘పరాశరుని మహిమ వల్ల మత్స్యగంధికి అప్పటికప్పుడు వ్యాసుడు జన్మించా’డనడం పరాశరుని మహిమోపేతుడిగా మరోసారి నొక్కి చెప్పడానికి కథకుడు చేసిన కల్పన అనుకుంటే, పరాశరుడు కొడుకు పుట్టేదాకా మత్స్యగంధితో ఉండలేదు. కోరిక తీర్చుకున్న వెంటనే తన దారిన తాను వెళ్లిపోయాడు. అంటే, తండ్రి-కొడుకుల మధ్య కలయిక జరగలేదు. భవిష్యత్తులో కూడా ఎప్పుడూ జరిగినట్టులేదు. విజ్ఞులెవరైనా జరిగినట్టు ఆధారం చూపిస్తే ఈ అభిప్రాయాన్ని సవరించుకోడానికి నేను సిద్ధమే.

అంటే ఏమిటన్న మాట…వ్యాసుడు అచ్చంగా ‘తల్లి కొడుకు’. సత్యవతి కొడుకుగా సాత్యవతేయుడు. అతను పుట్టగానే నమస్కరించింది తల్లికి మాత్రమే. తపస్సుకు వెడుతూ ‘నాతో పని ఉంటే నన్ను తలచుకోండి, వెంటనే వస్తాను’ అని చెప్పాడు. ముందు ముందు అతనితో తల్లికి ఒక అవసరం కలగబోతోంది. అది, కురువంశాన్ని నిలబెట్టడానికి తన కోడళ్ళు అయిన అంబిక, అంబాలికలకు అతని ద్వారా సంతానం కలిగించడం. భర్త శంతనుడు మరణించడంతో, భీష్ముడు అవివాహితుడిగా ఉండిపోవడంతో సత్యవతే పితృస్వామిక బాధ్యతను తన చేతుల్లోకి తీసుకుందని ఇంతకుముందు చెప్పుకున్నాం. ‘తండ్రికి కొడుకు మీద అధికారం ఎలా ఉంటుందో, తల్లికీ అలాగే ఉంటుంది. కనుక నిన్ను ఒక పనికి ఆదేశిస్తున్నాను’ అని ఆ సందర్భంలో సత్యవతి వ్యాసుడితో అంటుంది. అంటే, మాతృస్వామ్య ప్రతినిధి అయిన సత్యవతి, కోడళ్ళకు సంతానం కలిగించవలసిన ఘట్టంలో తన మాతృస్వామిక అధికారాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి సిద్ధమైందన్నమాట.

ఇదే మాతృస్వామిక కోణాన్ని పరాశర-మత్స్యగంధు(సత్యవతి)ల లైంగిక సంబంధానికి వర్తింపజేస్తే, మత్స్యగంధికి ఆ సంబంధం పట్ల సూత్రరీత్యా వ్యతిరేకత ఉండకపోవచ్చు. ఆ విధంగా అది ‘అసమ’ లైంగిక సంబంధం కాక,‘సమ’ లైంగిక సంబంధం కావచ్చు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు, మాతృస్వామ్యంపై పితృస్వామ్య విజయాన్ని, లేదా ఆధిపత్యాన్ని చెప్పదలచుకున్న కథకుడు దానికి అనుగుణంగా పరాశర-మత్స్యగంధుల సంబంధాన్ని అసమ లైంగిక సంబంధంగా చిత్రించి ఉండవచ్చు.

పరాశర-మత్స్యగంధుల సంబంధాన్ని తలపించే పాత్రలు, చిన్న చిన్న తేడాలతో మహాభారతంలో మరి కొన్ని కనిపిస్తాయి. ఆదిపర్వంలో, సర్పయాగ సందర్భంలో చెప్పిన జరత్కారుడు-జరత్కారువుల సంబంధం, అదే పర్వంలో చెప్పిన కుంతి-దూర్వాసు(సూర్యు)ల సంబంధం, ఆ పర్వంలోనే ఖాండవదహన ఘట్టంలో చెప్పిన మందపాలుడు-చరిత అనే ఒక ఆటవిక యువతి సంబంధం ఇప్పటికిప్పుడు స్ఫురిస్తున్న ఉదాహరణలు. జరత్కారుడు అనే ముని అదే పేరు కలిగిన ఒక నాగజాతి కన్యను పెళ్లి చేసుకుని ఆమె గర్భవతి కాగానే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడామె పుట్టింటికి చేరుకుంటుంది. ఆమెకు ఆస్తీకుడనే కొడుకు కలుగుతాడు. ఇక్కడ కూడా తండ్రీ-కొడుకుల మధ్య కలయిక జరగలేదు. ఇక కుంతీ-దూర్వాసు(సూర్యు)ల సంబంధం ప్రసిద్ధమే. మూడో ఉదాహరణకు వస్తే, మందపాలుడు అనే మునికి నిజభార్యవల్ల సంతానం కలగలేదు. సంతానం లేకపోతే స్వర్గం లభించదు కనుక అతడు చరిత అనే ఆటవిక యువతితో సంబంధం పెట్టుకుని సంతానం కంటాడు. ఆ విధంగా అతనికి రెండిళ్ళు ఏర్పడతాయి.

ఈ కథల పూర్తి వివరాలను వాయిదా వేస్తే, పరాశర-మత్స్యగంధులతో సహా ఈ నాలుగు ఉదాహరణలలో ‘పుట్టింటి’ పాత్రను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకోవడం అవసరం. మత్స్యగంధి పుట్టింటిలో ఉండగానే పరాశరునితో సంబంధం ద్వారా వ్యాసునికి జన్మనిచ్చింది. జరత్కారుడు తనను విడిచి వెళ్ళగానే జరత్కారు పుట్టింటికి వెళ్లిపోయింది. కుంతి పుట్టింట్లో ఉండగానే దూర్వాసు(సూర్యు)నితో సంబంధం ద్వారా కర్ణుని కన్నది. మందపాలుడు సంబంధం పెట్టుకున్న చరిత పుట్టింట్లోనే ఉండిపోయింది. తపతి-సంవరణుల కథలోకి వెడితే, తపతి కూడా పన్నెండేళ్ళు పుట్టింట్లోనే ఉండి కాపురం చేసింది.

ఇక ఇప్పుడు పరాశర-మత్స్యగంధుల కథలో మరో పొరకు వద్దాం.

 

పొర:3

ఇది రెండవ పొర లోని కథను ఆధారం చేసుకుని పండితుల వ్యాఖ్యలు, వివరణలు,సమర్థనలు పేరుకోవడం ప్రారంభమైన దశ అని స్థూలంగా అనుకుందాం. విశేషమేమిటంటే, ఈ పొర ఇప్పటికీ మన కళ్ల ముందు ఉన్న పొర. అయితే, రెండవ పొరలోని కథ కాస్తా ఈపాటికే ప్రశ్నించడానికి వీలులేని మతవిశ్వాసంగా ఘనీభవించింది. దానర్థం, మీరు కథకు ఎన్ని పైపై మెరుగులైనా దిద్దండి, ప్రధాన కథలో వేలుపెట్టడానికి వీలులేదు. అలాగే, పండితుల భాష్యాలూ హద్దుల్లో ఉండవలసిందే. వారు తమ పాండిత్యాన్ని రంగరించి ఎలాంటి వివరణలైనా ఇవ్వవచ్చు, కానీ సంప్రదాయపరిధిని దాటడానికి వీలు లేదు. పోలిక చెప్పుకోవాలంటే ఇదొక వలయంలో నడక లాంటిది. మనం ఎంతసేపు నడిచినా ఆ వలయంలోనే నడుస్తూ ఉంటాం. మళ్ళీ మళ్ళీ బయలుదేరిన చోటికే చేరుతూ ఉంటాం. ఆ వలయమే మన ప్రపంచంగా మారిపోతుంది.

సాంప్రదాయికత మనల్ని నీడలా నిరంతరం అంటిపెట్టుకుని మన ఆలోచనలను ఎంతగా నియంత్రిస్తూ ఉంటుందంటే; సాధారణబుద్ధికి అసంబద్ధంగానూ, అన్యాయంగానూ అనిపించేవాటిని కూడా సంభవమైనవిగా, న్యాయమైనవిగా చూడవలసివస్తుంది. అప్పటికీ కొన్ని అంశాలు మన ఇంగితజ్ఞానానికి మరీ కొరకరాని కొయ్యలుగా కనిపిస్తే వాటికి ఏదో దైవిక కారణాన్నో, మహిమనో ఆపాదించి ‘కిట్టించ’ వలసివస్తుంది. అయినాసరే, కొన్ని పూరించని ఖాళీలుగా అలాగే మిగిలిపోతూ ఉంటాయి. ఆ ఖాళీలు వ్యాఖ్యాతల మౌనానికి అద్దం పడుతుంటాయి.

dushyanta

ఇతరేతరమైన దృష్టికోణాలూ, మేధో భారాలూ ఏమీ లేని; మహాభారతం పట్ల భక్తిభావమూ, పూజ్యభావమూ ఉండి, తుడిచిన పలకలాంటి బుద్ధి కలిగిన ఒక జిజ్ఞాసి పరాశర-మత్స్యగంధుల ఉందంతం చదివినప్పుడు ఎటువంటి భావసంచలనానికి లోనవుతాడన్నది ఈ సందర్భంలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న. అతనిలో మహాభారతం పట్ల భక్తి, పూజ్యభావమే ఎక్కువ మోతాదులో ఉంటే, పరాశరుని ప్రవర్తనను, అందులో కనిపించే వైరుధ్యాన్ని మామూలుగా తీసుకుంటాడు. ఇంగిత జ్ఞానాన్ని జోకొట్టి కథకుని వేలు పుచ్చుకుని ముందుకు వెళ్ళిపోతాడు. అంటే అక్కడ విశ్వాసం పనిచేసిందన్న మాట.

లేదా, ఇంగితజ్ఞానమే సలిపినప్పుడు పరాశరుని ప్రవర్తనకు నిజంగా ఆందోళన చెందుతాడు. అయోమయానికి లోనవుతాడు. ఇదేమిటి, ఇంత గొప్ప మహర్షి ఇలా ప్రవర్తించాడేమిటని అనుకుంటాడు. అతనికి పరాశరునిలోని లైంగిక దాహం, మత్స్యగంధి దేహంపై మనోవాక్కాయ కర్మలతో అతను చేసిన దాడి, అతను శాపమిస్తాడన్న భయంతో మత్స్యగంధి లొంగిపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఇలా పైకి కనిపించేది నిజం కాదేమో, దీని వెనుక ఏవైనా అతీంద్రియ అన్వయాలు, అంతరార్థాలు ఉండి ఉంటాయేమో నని కూడా అనుకుంటాడు. అలాంటివి కనిపించనప్పుడు అతని ముందు ఉండేవి రెండే మార్గాలు: విశ్వాసాన్ని ఆశ్రయించడం, లేదా అలా సందేహస్థితిలోనే ఉండిపోవడం.

సంప్రదాయ పండితులు పరాశర-మత్స్యగంధుల ఉదంతానికి ఎలాంటి వివరణ ఇచ్చారో పరిశీలించడానికి ప్రయత్నించాను. నా ఎదురుగా దాదాపు 70 ఏళ్ల క్రితం వెలువడిన వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ‘మహాభారత తత్త్వ కథనము’, దివాకర్ల వేంకటావధాని, జి.వి. సుబ్రహ్మణ్యం గార్ల సంపాదకత్వ, వ్యాఖ్యానాలతో టీటీడీ ప్రచురించిన ఆంధ్ర మహాభారతం, ఆదిపర్వం మొదటి భాగమూ ఉన్నాయి.

‘మహాభారతతత్త్వ కథనము’ సంప్రదాయబద్ధమైన రచన. సంప్రదాయవిరుద్ధమైన పెండ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలపై ఖండనగా వెలువడిన రచన. ఇందులో గ్రంథకర్త మహాభారతంపై అంతవరకు సంస్కృత, ఆంధ్రాలలో వెలువడిన వ్యాఖ్యలనూ, భాష్యాలనూ మధ్య మధ్య విస్తృతంగా ఉటంకించారు. అయితే, ఇందులో వేదవ్యాసుడు నిషాదుడా లేక బ్రాహ్మణుడా అన్న అంశం పైనా, మత్స్యగంధి కన్యాత్వంపైనే చర్చ జరిగింది తప్ప పరాశరుని ప్రవర్తనపై చర్చ జరగలేదు. అంటే, సంప్రదాయపండిత లోకంలో పరాశరుని ప్రవర్తన అభ్యంతరకరం కాలేదన్న మాట!

ఎందుకని? పరాశరుడి వంటి మహర్షి మత్స్యగంధి అనే జాలరి యువతితో లైంగిక వాంఛ తీర్చుకోవడం, ఆమెకు కొడుకును ప్రసాదించడం వాస్తవంగా ఆమెను అనుగ్రహించడమే నన్న భావనతోనా? లేక, ఆ సంబంధం వల్ల వ్యాసునంతటివాడు జన్మించాడు కనుక, అది లోకోపకారానికి ఉద్దేశించిన జన్మ కనుక పరాశరుని ప్రవర్తనను ప్రశ్నించనవసరం లేదన్న భావనతోనా? లేక, స్త్రీని ఎలాగైనా లొంగదీసుకోవచ్చుననీ, పితృస్వామిక వ్యవస్థలో ఇది సహజమేనన్న భావనతోనా? లేక, పరాశరుని లైంగిక ప్రవృత్తిని అలా చిత్రించడం ఆనాటి కథన పద్ధతి అన్న భావనతోనా?

ఇలా మనం ఊహించుకోవలసిందే కానీ కారణం తెలియదు. అక్కడ మనకు ఎదురవుతున్నది మహామౌనం మాత్రమే.

ఇక టీటీడీ ప్రచురణకు వద్దాం. ఇది 2000లో ప్రథమ ముద్రణ పొంది, 2008లో తృతీయ ముద్రణ పొందిన ప్రచురణ. ప్రతి పద్య, గద్యాలకూ ప్రతిపదార్థం, తాత్పర్యం ఇవ్వడం; కొన్ని చోట్ల విశేషాలను చర్చించడం అనే ప్రణాళికను అనుసరించింది. విశేషాలలో కొన్ని చోట్ల ఛందస్సు, వ్యాకరణం, అలంకారం, రసం లాంటి కావ్యసామగ్రికి సంబంధించిన అంశాలను, పాఠాంతరాలను ఎత్తి చూపడం; కొన్ని చోట్ల సాంప్రదాయిక భాష్యాలకు అనుకూలమైన అన్వయాలు ఇవ్వడం చేసింది. ప్రత్యేకించి మత్స్యగంధిపై పరాశరుని లైంగిక ప్రవర్తనకు సంబంధించిన ప్రస్తుత అంశంలో ‘విశేషం’ పేరుతో ఒక అలంకారం గురించి మాట్లాడింది, అంతే.

పరాశరునిలోని లైంగిక వైపరీత్యం విషయంలో వ్యాఖ్యాతలు పూర్తిగా మౌనం వహించడాన్ని అలా ఉంచుదాం. పరాశరుడు మత్స్యగంధిని చూసి చిత్తచాంచల్యానికి లోనైనట్టు చూపిస్తూ, చెబుతూనే; అతనిని జితేంద్రియుడిగా చెప్పడంలోని వైరుధ్యాన్ని కూడా కనీసం స్పృశించలేదు. ఎందుకంటే, సంప్రదాయం విధించిన పరిమితులు, నిషేధాలు అంత బలవత్తరమైనవి. ఏదైనా ఒక మతవిశ్వాసంగా మారి ఘనీభవించిందంటే, దాని ముందు మన హేతుబుద్ధి, ఇంగితజ్ఞానం వగైరాలు ఏవీ పనిచేయవు. వాటిని అటక ఎక్కించవలసిందే.

మహాభారతంలోని ఒక లైంగిక వైపరీత్యాన్ని చూపించి, దానిని నేటి కాలానికి అన్వయించే ప్రయత్నం చేయడం అతి స్పందనగా, అనవసరచర్చగా కొందరికి కనిపించవచ్చు. నిజానికి ఆ లైంగిక వైపరీత్యంపై స్పందించడమో, అతిస్పందించడమో ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం కాదు. స్త్రీ పట్ల నాటికీ, నేటికీ ఉన్న దృష్టి భేదాన్ని ఒక సామాజిక చారిత్రక కోణం నుంచి ముందుకు తేవడమే.

అదలా ఉంచితే…

పితృస్వామికత పక్షాన నిలబడిన కథకుడు ఈ కథలోనూ, ఇంకా మరికొన్ని కథలలోనూ వివిధ ఉపాయాలను, లేదా మాయోపాయాలను ఆశ్రయించాడని మొదట్లో చెప్పుకున్నాం. ‘కన్యాత్వ వరం’ అనేది వాటిలో ఒక కీలకమైన ఉపాయం, లేదా మాయోపాయం.

దాని గురించి తర్వాత…

 -కల్లూరి భాస్కరం

 

 

వీలునామా – 35, 36 భాగాలు

veelunama11

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

ప్రేమ విజయం

హేరియట్ వస్తూ వస్తూనే, ఆస్ట్రేలియాని, వలస వచ్చిన వాళ్ళనీ, నగరాలనీ విమర్శించి పారేసింది. నిజానికి తను ఇంకో పదేళ్ళు ముందొచ్చినట్టయితే ఇంకా ఎక్కువ తిట్టిపోయడానికి వీలుగా వుండేది. స్టాన్లీ, బ్రాండన్ ఇద్దరూ మెల్బోర్న్ ని అందాల నగరమని పిలవడం ఆమెకి హాస్యాస్పదంగా తోచింది. వాళ్ళిద్దరు మాత్రం మెల్బోర్న్ నగరం ఎంత అభివృధ్ధి చెందిందో, కట్టడాలెంత త్వరగా పూర్తవుతున్నాయో, డబ్బెంత హాయిగా సంపాదించుకోవచ్చో చెప్పి చెప్పీ ఆమెని విసిగించారు.

అయినా ఆమెకి మెల్బోర్న్ కానీ, విక్టోరియా రాష్ట్రం కానీ ఏ మాత్రం నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే కారణం కూడా ఆమె చెప్పలేదు. ఇళ్ళూ వాకిళ్ళూ, డబ్బూ, దస్కమూ నాగరికతా, నాజూకూ అన్నీ బానే వున్నా, ఇంగ్లాండు లా లేదుగా అన్నదామె.ఆమె విక్టోరియాకి రావడానికి కారణం కేవలం కుతూహలం. ఎలాగూ ఇంగ్లండుతో పోలిస్తే వేరే రకంగా వుంటుందన్న విషయం ఆమె ఊహించిందే. అయితే అన్ని రకాలుగా ఇంగ్లండు ముందు తీసికట్టుగా వుందన్నది ఆమె ఉవాచ. అన్నిటికంటే ముఖ్యంగా వేడీ దుమ్మూ! ఆ వేడికి ఆమె తెచ్చుకున్న దుస్తులన్నీ వేసుకోవడం కుదరలేదు. కానీ, ఇంగ్లీషు సమాజం తమ దుస్తుల మీదా నాగరికత మీదా వుధించిన నియమాలను ఉల్లంఘించడానికీ లేదు. పాపం, ఈ రెండిటి మధ్యా నలిగిపోయి ఆమెకి విక్టోరియా అంటే మహా చికాకు పట్టుకుంది. అంత ఎర్రటి ఎండల్లోనూ అచ్చమైన బ్రిటిష్ పౌరుడిలా డాక్టర్ గ్రాంట్ నల్లటి సూటూ, నల్లటి హేటూ ధరించడం ఆమెకి కొంత ఉపశమనం.

“మా డెర్బీషైర్ లో వున్న శాంతీ తీరుబడీ లేదు, పోనీ లండన్ లో వున్న చైతన్యమూ నాగరికతా లేవు. ఈ మెల్బోర్న్ నగరాన్ని చూసా మీరంతా ఇంత మురిసిపోయేది,” అని ఆమె బ్రాండన్ ని వేళాకోళం చేసింది. కానీ, బ్రాండన్, స్టాన్లీ మెల్బోర్న్ నగరం పూరి గుడిసెలతో వున్న పల్లెటూరి స్థాయి నుంచి, డబ్బూ వెలుతురూ నింపుకున్న వీధుల నగరం వరకూ ఎదగడం కళ్ళారా చూసి వున్నారు. ఎదుగుదలలో వాళ్ళ భాగస్వామ్యమూ వుంది.వారికి ఆ నగరం బ్రతక నేర్చిన తనమూ, సాహసమూ నేర్పింది. అందుకేవాళ్ళిద్దరూ ఈ కొత్త మనిషికి మా నగరం నచ్చకపోవడమేమిటి అని గింజుకున్నారు.

లిల్లీ ఫిలిప్స్ కి మెల్బోర్న్ లో పరిచయస్తులూ స్నేహితులూ లేరనే చెప్పొచ్చు. కానీ డాక్టరు గ్రాంట్ కీ, స్టాన్లీకి చాలా మందే సన్నిహితులున్నారు. చెల్లెలికోసం స్టాన్లీ చాలామందిని తమ ఇంట్లో విందులకి ఆహ్వానించాడు. కానీవాళ్ళంతా హేరియట్ కళ్ళకి మొరటుగా అనాగరికంగా అనిపించారు. అయినా వాళ్ళతో ఆమె చనువుగానే మసిలింది.తన చదువూ, తెలివితేటలూ, సంభాషణా చాతుర్యమూ అన్నీ కలిసి అక్కడివాళ్ళని ఉక్కిరి బిక్కిరి చెస్తాయనీ, తన నోటి వెంట వచ్చే ప్రతీ మాటకీ ఆ అనాగరికులంతా పరవశించిపోతారనీ ఊహించుకుందామె. కానీ, పాపం, తన అభిప్రాయాలనెవరూ పట్టించుకోరనీ, ముఖ్యంగా ఆస్ట్రేలియన్ బ్రతుకు గురించీ తను చేసే గంభీరమైన వ్యాఖ్యల్ని మర్యాదకోసం చిరునవ్వుతో వింటారే కానీ, ఒక్కటికూడా వినిపించుకోరనీ అర్థమైనప్పుడు కోపమూ, ఉక్రోషమూ పట్టలేకపోయింది.అసలు ఆడా మగా అంత పూసుకొని తిరగడమే ఆమెకి కంపరంగా వుంది. తమ ఇంగ్లండులో స్త్రీ పురుషులు ఒకరినొకరు కళ్ళతో, చిరునవ్వులతో పలకరించుకుంటారు కనీ, ఈ వికవికలూ పకపకలూ ఎరగరు! కానీ ఈ విషయం గురించి ఆమె ఏదైనా వ్యాఖ్యానించి నట్టయితే అందరూ ఆమెని “మీరూ డాక్టరు గారితో చనువుగానే వుంటున్నారు కదా?” అని ఎదురు ప్రశ్నిస్తారన్న భయంతో నోరు మెదపలేదు.

డాక్టరు గ్రాంట్ తో హేరియట్ నవ్వులూ ఎడతెగని కబుర్లూ నిజంగానే ఎవరి దృష్టినీ దాటిపోలేదు. ఇంకొద్ది రోజుల్లో ఆయన మెల్బోర్న్ వదిలి తన వూరు బెన్ మోర్ వెళ్తాడనుకుంటే ఆమెకి దిగులు ముంచుకొస్తుంది.

“మిమ్మల్నొదిలి వెళ్ళడం నాకూ కష్టంగానే వుంది మిస్ హేరియట్. కానీ, బ్రాండన్ లా నేను పని ఎగ్గొట్టి ఊళ్ళు తిరగలేనుగా! ఊరికి వెళ్ళి నా పని చూసుకోవాలి. మీరు విరివాల్టా ఎస్టేటుకి త్వరగా వచ్చేస్తారుగా? అది మా వూరికి చాలా దగ్గర. మనం మళ్ళీ ఇప్పట్లాగే కలుసుకోవచ్చు.” ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు డాక్టర్ గ్రాంట్.

“తొందరగానే వచ్చేస్తాను. నిజానికి మా వదిన ఆరోగ్యం కుదుటపడింది కూడా. డబ్బంతా దండగ చేస్తూ ఆవిడ ఇంకా ఈ మెల్బోర్న్ లో ఎందుకుందో నాకైతే అర్థం కాదు!” హేరియట్ అన్నది.

“అవునవును! ఇహ ఆమె ఆరోగ్యానికేం ఢోకా లేదు.”

“నాకూ విరివాల్టా చూడాలని చాలా అతృతతగా వుంది. పిల్లల వుత్తరాల నిండా ఎస్టేటు కబుర్లే. టీచరు జేన్ కి కూడా చాలా నచ్చిందట. మీరు టీచరు గారిని చూసారా? మీలాగే ఆవిడా స్కాట్ లాండ్ సంతతి.”

“ ఆ టీచరు గారు మన పనమ్మాయి ఎల్సీ వాళ్ళ అక్కట కదా? ఈవిడ లాగే ఈసురోమని వుంటుంది కాబోలు!”

“అయ్యో అలాగంటారే! మా అన్నయ్యకి ఎల్సీ అంటే ఎంతిష్టమో తెలుసా? నావరకు నాకు జేన్ ఎక్కువగా నచ్చుతుంది. చూడడానికి మామూలుగా వున్నా మహా తెలివైంది. విరివాల్టాలో ఆమెని చూడగానే మీరు ప్రేమలో పడిపోతారేమో, జాగ్రత్త!” వేళాకోళంగా అంది హేరియట్.

“ఆ ప్రమాదమేం లేదులే. నాకు మరీ పుస్తకాల పురుగుల్లా వుండే ఆడవాళ్ళంటే చిరాకు. స్త్రీలు చదువుకోవల్సిందే, కానీ తాము ఆడవాళ్ళమన్న మాటే మరిచిపోయేంత చదువేం వొద్దు. అదలా వుంచండి. హేరియట్!మీకు విరివాల్టా వెళ్ళాలని వుంటే మీ వొదినగారు రాకపోయినా, నేను తీసుకెళ్తాను,” సాహసంగా అన్నాడు గ్రాంట్.

“వెళ్ళొచ్చనుకోండి, కానీ అన్నయ్య ఏమంటాడో!” నసిగింది హేరియట్.

“స్టాన్లీ తో నే చెప్తాగా. ఇక్కడ లిల్లీగారు బాగా కోలుకున్నారనీ, ఇక్కడ వున్న మన గుర్రాలు అర్జంటుగా ఎస్టేటు చేర్చాలనీ, అందువల్ల మనిద్దరమూ కలిసి గుర్రాలు తిసుకొస్తామనీ చెప్తాను.”

“నాక్కూడా మెల్బోర్న్ అంటే విసుగు పుడుతోంది. ఇహ ఇక్కడ చూడ్డానికింకా ఏమీ లేదు. విరివాల్టా వెళ్ళిపోతే అక్కడికి వదిన వచ్చేలోపు ఇల్లంతా ఆవిడకొరకు చక్కబెట్టొచ్చు. పైగా, జేన్ టీచరుకు లెక్కలూ, సైన్సూ లాటివే తప్ప సంగీతం బొత్తిగా రాదు. నేనుంటే పిల్లల సంగీతం పాఠాలు మళ్ళీ మొదలుపెట్టొచ్చు. నేను విరివాల్టా వొచ్చేస్తానంటే అన్నయ్య తప్పక ఒప్పుకుంటాడు!” హేరియట్ సాలోచనగా అంది.

“ఏమిటీ? జేన్ టీచరుకి సంగీతం రాదా? మరి ఆవిడని పిల్లలకి టీచరుగా ఎందుకు పెట్టారు?”

“అయినా ఆవిడ చాలా తెలివైంది. ఆవిడ రాక ముందు మా అన్నయ్య పిల్లలు దేభ్యాల్లాగుండేవారు. చెట్లూ గుట్టలూ ఎక్కి తిరుగుతూ మహా పోకిరీల్లాగుండేవారు. ఆవిడ కాస్త క్రమశిక్షణతో వాళ్ళని దార్లోకి తెచ్చింది. ఆవిడ బ్రిటిష్ యువతి కాదు, అదొక్కటే నాకు ఆవిడలో కనపడే లోపం,” నవ్వుతూ అంది హేరియట్.

“స్కాట్ లాండ్ వాళ్ళని మరీ అంత తీసిపడెయ్యొద్దు! నేనూ స్కాట్ లాండ్ వాణ్ణేగా? అది సరే, మరయితే మన ప్రయాణం ఖాయమేనా?”

“గుర్రాల మీద వెళ్తే ఎన్ని రోజులు పట్టొచ్చంటారు?”

“రెండురోజులు.మధ్య దారిలో మా మిత్రుడి హోటలుంది. ఒక రోజు రాత్రి అక్కడ బస చేయొచ్చు. ఆస్ట్రేలియాలో పల్లెటూళ్ళల్లో ఎలాటి ఆతిథ్యం దొరుకుతుందో చూపిస్తాను. అందులోనూ, వాళ్ళూ నాలాగే స్కాట్ లాండ్ కి చెందిన వారు! ఆ ప్రదేశం కూడా చాలా అందంగా వుంటుంది,” ఊరిస్తూ అన్నాడు డాక్టర్ గ్రాంట్.

“సరే, అదీ చూద్దాం మరయితే. అయితే నేనొక్కమాట వదినని కూడా అడిగి చెప్తా, సరేనా?”

*******

 

ఆ రోజు లిల్లీ ఎప్పటికంటే చిరాగ్గా వుంది. మరదలు పిల్లల సంగీతమూ అదీ ఇదీ అని చెప్పిన ఒక్క మాటా నమ్మలేదు గానీ, మెల్బోర్న్ వెళ్ళడానికి తనకేమీ అభ్యంతరం లేదంది. నిజానికి ఆ అమ్మాయి అన్నగారి ఇంట్లో పేరుకు మాత్రమే వుంది. ఎన్నడూ వదిన గారితో ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదు. ఒంటరిగా డాక్టరుతో పంపితే భర్త ఏమంటాడో నన్న భయం కొంచెం ఏ మూలో కలవరపెట్టినా పెద్దగా పట్టించుకోలేదు. అందరు స్త్రీలకీ సత్ప్రవర్తన గురించి ఉపన్యాసాలిచ్చే హేరియట్ ఒంటరిగా డాక్టరుతో కలిసి రెండు రోజులు ప్రయాణం చేయబోతుందని తెలిసినప్పుడు ఎల్సీ మాత్రం ఆశ్చర్యపోయింది. ఆమె ఆశ్చర్యాన్ని హేరియట్ కనిపెట్టింది కూడా.

“ఇలాటి ప్రయాణం ఇంగ్లండులో అయితే నేను చచ్చినా తలపెట్టి ఉండేదాన్ని కాదు. కానీ, ఇక్కడ ఎవరూ పట్టించుకుంటున్నట్టు లేరు. అలాటప్పుడు నేను నా పధ్ధతులకోసం నిన్నిబ్బంది ఎలా పెడతాను వొదినా? ఎలాగూ నువ్వు కొద్దిరోజుల్లో అక్కడికే వొస్తున్నావాయె. కొంచెం ముందుగా వెళ్ళి ఇల్లదీ నీకు సౌకర్యంగా ఏర్పాటు చేయాలనే నా తాపత్రయమంతా! పైగా ఇలా వెళితే కాస్త పల్లెటూళ్ళనీ చూసినట్టుంటుందన్న కుతూహలం ఒకటి. పోనీ నువ్వూ మాతో రాకూడదూ? ఇప్పుడు నువ్వు తేలిగ్గా ప్రయాణం చేయొచ్చని డాక్తరుగారు చెప్పారు.”

“నేను చచ్చినా ఒంటరిగా ప్రయాణాలు చేయను. మీ అన్నయ్య ఇక్కడికొచ్చి నన్ను తిసుకొస్తాడు లే. నువ్వు ఒంటరిగానే వెళ్ళు.” నిర్మొహమాటంగా అంది లిల్లీ.

“మరి ఇక్కడ నువ్వు ఒంటరిగా, అన్నయ్య కోప్పడతాడేమో!”

“అబ్బ! ఇక్కడ ఎల్సీ, ఇంకొక నర్సూ కూడా వున్నారుగా. వాళ్ళు చూసుకుంటార్లే. నువ్వు వెళ్ళి వీలైనంత త్వరగా మీ అన్నని పంపించు.”

హమ్మయ్య, అని నిట్టూర్చి ప్రయాణమైంది హేరియట్.

మధ్యలో ఒకరోజు ఆగి, రెండో రోజు సాయంత్రానికి విరివాల్టా ఎస్టేటు చేరుకున్నారు వాళ్ళు. ఆమెని ఎస్టేటు దగ్గర దిగబెట్టి తానింకో రోజు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ గ్రాంట్.

ఇంటికెళ్ళేసరికి స్టాన్లీ లేడు. ఏదో పనిమీద బయటికెళ్ళాడు. జేన్ వాళ్ళిద్దర్నీ చూసి ఆశ్చర్యపోయినా ఏమి అనలేదు.

ఆ మర్నాడంతా హేరియట్ అన్యమనస్కంగానే గడిపించి. అన్నగారిల్లూ, ఎస్టేటులో పెంచుతున్న జంతువులూ, పిల్లల ఆటలూ, ఇంట్లో పనివాళ్ళూ, ఆమెకి పెద్ద సంతోషాన్నివ్వడంలేదు. కాలం గడవనట్టనిపిస్తూంది. ఆమెకి మళ్ళీ డాక్టర్ గ్రాంట్ వచ్చి కబుర్లు చెప్తే బాగుండనిపించింది. ఆమె ఆశపడ్డట్టే గ్రాంట్ మళ్ళీ వచ్చి ఆమెని కబుర్లలో ముంచెత్తాడు. మళ్ళీ హేరియట్ కి కాలం సరదాగా గడవసాగింది.

**********

వాళ్ళిద్దరూ అలాగే సరదా కబుర్లలో మునిగివున్న ఒకరోజు అకస్మాత్తుగా మేనల్లుడు ఎడ్గర్ ని వెంటబెట్టుకొని బ్రాండన్ విరివాల్టాకొచ్చాడు. అతన్ని చూసి ఒక్క క్షణం తడబడింది హేరియట్. అంతలోనే తేరుకొంది.

“ఎంత ఆశ్చర్యం! బ్రాండన్ దొరగారొచ్చారే! బహుకాల దర్శనం. బాగున్నారా? ఇన్ని రోజులూ ఎక్కడికి మాయమయ్యారు?” అంది వేళాకోళంగా.

“చాలా చోట్లే తిరిగాలెండి పన్ల మీద! అందుకే కనబడలేదు.” ఆమె వేళాకోళానికి చిరాకు పడ్డాడు బ్రాండన్.

“పన్లా? ఏం పన్లబ్బా అవి? గొర్రెలని తరుముతూ ఆస్ట్రేలియా అంతా పరుగులు తీస్తున్నారని విన్నానే!”

“అవునవును. సరిగ్గా గొర్రెల వెనకే తిరిగాను. అది సరే కానీ, మీ అన్నయ్యా వదిన లేరి?”

ఎమిలీ కల్పించుకుంది. “అమ్మ మెల్బోర్న్ లోనే వుంది బ్రాండన్. నాకు ఇంకో బుల్లి తమ్ముడు పుట్టాడు తెల్సా? నాన్న శనివారం వచ్చేస్తాడు. నిన్నూ, ఎడ్గర్ నీ చూసి చాలా సంతోషపడతాడు. మిమ్మల్నిద్దరినీ చాలా తలచుకుంటున్నాడు.”

“జేన్!మీ చెల్లాయి ఎల్సీ ఏది? తనూ ఇక్కడికొచ్చిందా లేకపోతే ఇంగ్లండులోనే వుండిపోయిందా? తనెలా వుంది?” జేన్ వైపు తిరిగి సంకోచంగా అడిగాడు బ్రాండన్.

“బాగుండకేం చేస్తుంది? అక్కడ మెల్బోర్న్ లో మా వదిన దగ్గరే వుంది. రెండు మూడు వారాల్లో వాళ్ళూ ఇక్కడికొస్తారు,” హేరియట్ అసహనంగా అంది.

“నీ అరోగ్యం బాగు పడిందా ఎమిలీ?”అభిమానంగా అడిగాడు బ్రాండన్. వాళ్ళందరూ భయంకరంగా జబ్బు పడ్డసంగతి తెలుసతనికి.

“ఓ! రోజూ జేన్ టీచర్ నన్ను ఎస్టేటంతా నడిపిస్తూందిగా? దాంతో బోలెడంత శక్తి వచ్చేసింది. మేమింకా మా బుక్కి తమ్ముణ్ణి చూడనేలేదు.”

“అవునుగాని, మీరెవరూ నాకసలు ఉత్తరాలే రాయలేదే? చాలా రోజుల కింద మీకందరికీ బాగా జ్వరంగా వుందనీ, చిన్నారి ఈవా మనకిక లేదనీ ఒక ఉత్తరం వచ్చింది. ఆ తర్వాత ఒక్క ఉత్తరమూ లేదు! ఏమయ్యారు మీరంతా?”

“పడవ మీద ప్రయాణం చేస్తూన్నాం కదా? అందుకే రాయలేదేమో. పడవమీద అనుకున్నదానికంటే ఎక్కువరోజులు పట్టిందట, నాన్న అన్నాడు. అన్నట్టు పడవ మీద కూడా జేన్ టీచరు పాఠాలు చెప్పారు తెలుసా?”

నవ్వాడు బ్రాండన్.

“హేరియట్! మెల్బోర్న్ వదిలి ఈ పల్లెటూరు ఎలా వచ్చావు? నీకు ఈ ప్రదేశం కొంచెం కూడ నచ్చి వుండదు!”

“అదేం లేదు. నేను ఎస్టేటు చూస్తానంటే అన్నయ్య ఎగిరి గంతేసాడు.నాకిక్కడ భలే సరదాగా వుంది. ఇక్కడే వుండిపోతానని చెప్పలేను కానీ, అప్పుడప్పుడూ రావొచ్చు.”

ఆమె అతిశయం చూసి నవ్వొచ్చింది బ్రాండన్ కి. జేన్ వైపు తిరిగాడు.

“జేన్, మీకూ మీ చెల్లాయికీ, మాలాటి వలస పక్షులంటే అసహ్యం లేదు కదా? అన్నట్టు మీ బంధువు ఫ్రాన్సిస్ ఎలా వున్నారు? ఇప్పుడాయన పార్లమెంటు సభ్యుడట కదా?”

“ఫ్రాన్సిస్ బానే వున్నాడు బ్రాండన్. వలస పక్షులవల్లే కదా ఇంగ్లండు అభివృధ్ధి చెందేది. వలసపక్షుల మీద కోపం దేనికి?”

“వచ్చే ముందు పెగ్గీ కనిపించిందా?”

“వెళ్ళి ఒకసారి చూసొచ్చాము. తనూ త్వరలో ఇక్కడికి వస్తూండవచ్చు.”

తమనివొదిలేసి వాళ్ళిద్దరే మాట్లాడుకోవడం గ్రాంట్ కేమాత్రమూ నచ్చలేదు.

“అది సరే కాని బ్రాండన్, ఇన్ని రోజులూ అడిలైడ్ లో ఏం చేసావ్? నన్నేమో ఎస్టేటు వ్యవహారాలు చూడొద్దన్నావు. నువ్వేమో ఊరేగపోయావు. ఇలాగైతే స్టాన్లీ ఏమంటారు?” దర్పంగా అడిగాడు.

తన ప్రియమైన బ్రాండన్ తో గ్రాంట్ అలా మాట్లాడడం ఏమాత్రం నచ్చలేదు ఎమిలీకి.

“ఆహా! అక్కడికేదో నువ్వు మహా పెద్ద పని చేస్తున్నట్టు. అది చాలదని అక్కడ అమ్మనీ, ఎల్సీని ఒంటరిగా ఒదిలేసి అత్తయ్యనీ వెంటబెట్టుకొచ్చాడు. నాన్నేం అంటాడో! నాకూ బుజ్జి తమ్ముణ్ణీ అమ్మనీ చూడాలని వుంది.”

“పోనీ నేను నిన్ను తీసికెళ్ళనా మెల్బోర్న్? రేపే బయల్దేరదాం.” బ్రాండన్ అడిగాడు.

“వెళ్ళనా టీఛర్?” ఆశగా అడిగింది ఎమిలీ జేన్ ని.

నవ్వేసింది జేన్.

“లేదమ్మా!మీ నాన్నగారొస్తే చదువూ సంధ్యా మానేసి అంత దూరం పంపినందుకు నన్ను కోప్పడతారు. అయినా తొందర్లోనే అమ్మా,తమ్ముడూ ఎల్సీ అందరూ ఇక్కడికే వొచ్చేస్తారుగా?” అంది అనునయంగా.

ఇప్పుడే అడిలైడ్ నించి వచ్చి, మళ్ళీ మెల్బోర్న్ ప్రయాణమా? ఇలా అయితే ఇతని ఎస్టేటు నడిచినట్టే అనుకున్నాడు గ్రాంట్ హేళనగా.

తన ఉత్తరం ఎల్సీకి అందలేదు కాబట్టే ఏ జవాబూ రాలేదు. ఈ సంగతి విన్నదగ్గర్నించీ బ్రాండన్ కి రెక్కలు కట్టుకుని మెల్బోర్న్ వెళ్ళి ఎల్సీని చూడాలని వుంది.ఎడ్గర్ ని అక్కడే విరివాల్టాలో వొదిలేసి ఆఘమేఘాలమీద ఆత్రంగా మెల్బోర్న్ ప్రయాణమయ్యాడు బ్రాండన్.

*****************

36 వ భాగం

హేరియట్ ఫిలిప్స్ ఆత్మ బంధువు

డెంస్టర్ అడిలైడ్ హోటల్లో చెప్పినట్టు ఫిలిప్స్ కుటుంబం ఆస్ట్రేలియా చేరుకోగానే విడి పోవాల్సి వచ్చింది. లిల్లీ ఫిలిప్స్ ఆరోగ్య కారణాలవల్ల మెల్బోర్న్ లోనే వుండాలని నిశ్చయించుకుంది. ఎస్టేటు కెళ్తే ఆ పల్లెటూళ్ళో వైద్య సహాయం తేలిగ్గా దొరకకపోవచ్చు. వకీలు టాల్బాట్ ఉత్తరం రాసి మిసెస్ పెక్ ని బెదిరించడం ద్వారా స్టాన్లీ ఆవిడ మెల్బోర్న్ రాకుండా కట్టుదిట్టం చేసాననుకున్నాడు. దాంతో భార్య మెల్బోర్న్ లో వుంటానంటే అభ్యంతర పెట్టలేదు. ఒక మంచి ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబాన్ని అందులో వుంచాడు.

అయితే పిల్లలకి మాత్రం మెల్బోర్న్ కొంచెం కూడా ఇష్టం లేదు. వారికి వాళ్ళు వుండే విరివాల్టా వూరే ఎంతో ఇష్టం. దాంతో చెల్లెల్నీ, ఎల్సీనీ భార్యకి తోడుగా వుంచి పిల్లలనీ జేన్ నీ తీసుకుని విరివాల్టా వెళ్ళిపోయాడు స్టాన్లీ.

మెల్బోర్న్ లో దిగగానే బ్రాండన్ అడిలైడ్ వెళ్ళిన సంగతి తెలుసుకోని స్టాన్లీ చిరాకు పడ్డాడు. అతను స్నేహితుణ్ణి కలిసి తన ఎస్టేటు విశేషాలు ముచ్చటించాలన్న ఆత్రంతో వున్నాడు. డాక్టర్ గ్రాంట్ వచ్చి బ్రాండన్ తనని ఉద్యోగంలోంచి పీకేసేంతవరకూ తానెంత శ్రధ్ధగా ఎస్టేటుని కనిపెట్టి వున్న సంగతి చెప్పి వూదర గొట్టేసాడు.

“ పైగా ఎస్టేటు పన్లన్నీ వొదిలేసి అడిలైడ్ వెళ్ళాడండీ మీ స్నేహితుడు! ఏదో గొర్రెలని కొనుక్కొస్తాడట. నన్నడిగితే ఆయనకి గొర్రెకీ బర్రెకీ తేడా తెలియదు. మరేం బేరాలు చేస్తాడో కానీ..”

“మన ఎస్టేటు లోకి కూడా గొర్రెలు కొంటానన్నాడే, అవన్నీ మరి విరి వాల్టా చేరుకున్నాయా?”

“ఇంకెక్కడి గొర్రెలండీ? అయినా, నాకు తెలీకడుగుతాను, మన విక్టోరియా లో దొరికే గొర్రెలకంటే బాగుంటాయా ఆ అడిలైడ్ లో గొర్రెలు? అక్కణ్ణించి లారీల్లో ఈ వూరు ఒచ్చేసరికే అందులో మూడొంతులు చచ్చి వూరుకుంటాయి. ఆయన డబ్బూ, దాంతో పాటు మనదీ, అంతా మునిగినట్టే!”

“అది సరే, బ్రాండన్ మిగతా పరిస్థితి ఎలా వుంది? ఇంగ్లండు నించి చాలా ఆందోళనగా బయల్దేరాడు.”

“ఎస్టేటంతా బానే వుంది కానీ, ఆయనకే ఏదో మనసు బాగున్నట్టు లేదు. ఇంతకు ముందులా పని చేయడంలేదు. పైగా మన ఎస్టేటులో నన్ను పని చేయనివ్వకుండా ఒకటే కలిపించుకోవడం. పనివాళ్ళకి చనువిచ్చి నెత్తినెక్కిచ్చుకోవడం, అబ్బో ఒకటనేమిటి..”

హేరియట్ ఆ సంభాషణలో కలగజేసుకుంది.

“మీరన్నది నిజమే డాక్టర్ గ్రాంట్. మా అన్నయ్యకీ, బ్రాండన్ కీ, ఇద్దరికీ పని వాళ్ళకి చనువిచ్చే అలవాటుంది. దానికి వాళ్ళేం పేర్లు పెట్టినా, అది మంచి అలవాటు కాదు.”

నిజానికి డాక్టరు గ్రాంట్ కి తిక్క తిక్కగా వుంది. ఎస్టేటులో తన ఉద్యోగం బ్రాండన్ పీకేయడం ఒక కారణమైతే,

“ఆ పల్లెటూళ్ళో సరైన వైద్య సహాయం దొరకదు,” అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ లిల్లీ ఫిలిప్స్ మెల్బోర్న్ లోనే వుండిపోతాననడం ఇంకొకటి. అంటే ఏమిటావిడ వుద్దేశ్యం? నేను మంచి వైద్యుణ్ణి కాననా, అని గింజుకున్నాడు.

అందుకే స్టాన్లీ మెల్బోర్న్ వదిలి విరివాల్టా వెళ్ళింతరవాత కూడా తాను ఒక వారం పదిరోజులు మెల్బోర్న్ లోనే వుంటాననీ, కావాలంటే లిల్లీ అమ్మగార్ని కనిపెట్టుకునీ వుండగలననీ అన్నాడు.

అయితే స్టాన్లీ వెళ్ళిపోయి వారమే కాదు రెండూ వారాలు దాటినా, డాక్టర్ గ్రాంట్ మెల్బోర్న్ లో ఇల్లు వదిలి ఎస్టేటు కెళ్ళేప్రయత్నాలేవీ చేయలేదు. పైగా, స్టాన్లీకి

“ఇక్కడ అమ్మగారికీ, అప్పుడే పుట్టిన వారి బిడ్డకూ, చిన్నమ్మాయి హేరియట్ గారికీ తన అవసరం చాలా వుండడం వల్ల, నేను ఇక్కడే తమ అనుమతితో ఇంకొన్ని రోజులు వుండగలను,” అంటూ ఉత్తరం రాసి పడేసాడు. లిల్లీ ఫిలిప్స్ సంగతేమోకానీ, అతను హేరియట్ ఫిలిప్స్ ని చాలా బాగా కనిపెట్టి వున్నాడనే చెప్పుకోవాలి.

అతనికి హేరియట్ ని చూస్తున్న కొద్దీ ఇలాటి భార్య తనకుంటే బాగుండనిపిస్తూంది. ఆమె చదువూ, డబ్బూ, వేష భాషల్లో నాగరికతా, నాజూకు అతనికి తెగ నచ్చేసాయి.ఆమెతో పరిచయమూ చనువూ పెంచుకునే ఉద్దేశ్యంతో అతను రోజూ ఆమెని సాయంత్రాలు షికారు తీసికెళ్లడం మొదలు పెట్టాడు. ఆ షికార్లో తన కుటుంబం గురించీ, తన కున్న గొప్ప వాళ్ళ పరిచయాల గురించీ, స్కాట్ లాండ్ లో తమకున్న రాజ ప్రాసాదాల గురించీ వివరంగా చెప్పుకొచ్చాడు. కొంచెం ఆ మాటా నిజమే. అతని తల్లి వైపు నించీ తండ్రి వైపు నించీ కూడా రాజ వంశీకులకి దూరపు బంధుత్వం వుంది.

ఆ విషయాన్నతడు పదే పదే చెప్పి, తాను, డబ్బు కి పేదైనా కులానికీ, అంతస్తుకీ గొప్పనే నమ్మకం ఆమెకి కలిగించాడు.హేరియట్ స్కాట్ లాండ్ కి చెందిన స్త్రీ కాకపోవడం కొంచెం దురదృష్టమే ఐనా, ఆమె అతను చెప్పిన వీర గాథలన్నీ చాలా ఇష్టంగా విన్నది.హేరియట్ కీ బ్రాండన్ కీ నిశ్చితార్థమైనట్టు డాక్టర్ గ్రాంట్ చూచాయగా విని ఉన్నాడు. ఎలాగైనా బ్రాండన్ ని తప్పించి తానే హేరియట్ ని పెళ్ళాడేస్తే ఇహ జీవితాంతం డబ్బుకి లోటుండదు. అందుకే అతను వీలైనప్పుడల్లా బ్రాండన్ గురించి ఫిర్యాదులూ చేసాడు.

పైగా, హేరియట్ తండ్రీ, అన్నల్లాగే తనూ డాక్టరే. వీటన్నిటితో అతనికి హేరియట్ తో మాట్లాడాడానికి బోలెడన్ని విశేషాలూ, సంగతులూ వుండేవి. హేరియట్ కూడా అతనికేమీ తీసిపోకుండా డెర్బీషైర్ లో తమ ఇల్లూ, తమ తోటా, తమ ఇంట్లో జరిగే విందులూ, నగలూ, ఆస్తులూ గురించి వివరంగా చెప్పుకోవడం మొదలు పెట్టింది. దాంతో రోజుకి కనీసం అయిదారు గంటలు కబుర్లు చెప్పుకుంటే కానీ సరిపోని పరిస్థితి ఏర్పడింది.

చదువూ సంధ్యా లేనీ పల్లెటూరి గబ్బిలాయి లాంటి బ్రాండన్ కంటే డాక్టర్ గ్రాంట్ ఎంతో నచ్చసాగాడు హేరియట్ కి. ఎంత డబ్బుంటే ఏం, పుస్తకాల గురించీ, కళల గురించీ తెలియక పోయాక, అనుకునేదామె బ్రాండన్ ఙ్ఞాపకం వచ్చినప్పుడల్లా. తన పొలమూ, గొర్రెల ఖరీదూ, ధరవరల గురించీ తప్ప బ్రాండన్ కింకో విషయమే పట్టదు. అదే డాక్టర్ గ్రాంట్- పుస్తకాలు, చిత్ర లేఖనం, కవిత్వం, రాజకీయాలు, మతం, అబ్బో, అతనికి తెలియని విషయమే లేదనిపించేలా మాట్లాడగలడు.

అసలైతే హేరియట్ వదిన గారికి సాయంగా మెల్బోర్న్ లో వుంటానన్నది కానీ, ఆమెకి ఆ సంగతే గుర్తు లేదు. బాలింతరాలు లిల్లీ ఫిలిప్స్ బాధ్యతా, శిశువు బాధ్యతా కూడా ఎల్సీ పైనే పడ్డాయి. నిజానికి ఎల్సీ పెద్ద పిల్లలతోటీ, జేన్ తోటీ కలిసి విరివాల్టా వెళ్ళాలనుకుంది. హేరియట్ ,“వదినని నేనొక్కదాన్నీ చూసుకోలేను, నువ్వూ నాకు సాయానికి వుండిపో,” అని మొహమాట పెట్టేసరికి మెల్బోర్న్ లోనే ఉండిపోయింది. అయితే హేరియట్ పొరపాటున కూడ “వదినగారిని చూసుకోవడం” అనే పని పెట్టుకోదల్చుకోలేదని ఆమెకి అర్థమైపోయింది.

దానికి తోడు ఒక కూతురి మరణం, మళ్ళీ పురుడూ, పక్కనే భర్త లేకపోవడం అన్నీ కలిపి లిల్లీ గయ్యాళితనాన్ని ఇంకా పెంచాయి.

అయితే ఇంటి పనీ, పై పనీ కంటే ఎల్సీని వదినా మరదళ్ళు ఏదో ఒకనాడు పెద్దగా గొడవ పడతారేమోనన్న భయం ఎక్కువగా కృంగ దీసింది. ఎందుకంటే రాను రానూ హేరియట్ వదిన గారి గదిలోకి రావడమే తగ్గించేసి, ఆపైన మొత్తానికే మానేసింది!

                   ****************

 

 

 

 

ఇది poetry + prose లోని రెండు భావనల fusion!

fusion

నేపథ్యం —

            ప్రస్తుత ప్రపంచం లో మనకంటూ ప్రత్యేకంగా దేశాలు, ప్రాంతాలు, సంస్కృతులు , భాషలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ గ్లోబలైజ్డ్ వ్యవస్థ లో మన తరం మాత్రం మల్టీ కల్చరల్ విశ్వం లోనే బ్రతుకుతోంది. దీని ప్రభావం ఇప్పుడు మన ఆలోచనలు, భావాలు, వ్యక్తీకరణ లలో కూడా కనిపిస్తూనే ఉంది. అంతే గాక మానవ భావోద్వేగాలను వ్యక్తీకరించే సాధనమే భాష అయితే, కొన్ని భావోద్వేగాలను కొన్ని భాషలలోని పదాలు, ఇతర భాషా పదాల కన్నా బలంగా, గాఢoగా అభివ్యక్తి చేస్తాయనేది కూడా నిజం. దీని వల్ల, సంక్లిష్టమూ, సమ్మిశ్రితమూ అయిన సమకాలీన జీవన వీక్షణ ని కూడా మల్టీ కల్చరల్, మల్టీ లింగ్వల్ దృక్కోణం లోంచే పరిశీలించాల్సిన ఆగత్యం ఏర్పడుతోంది. ఈ అనివార్యతే ఇప్పుడు new-gen కవిత్వం పుట్టుకకు కారణం అవుతోంది. ఈ మల్టీ లింగ్వల్, మల్టీ కల్చరల్ కవిత్వా  నేను fusion షాయరీ అని పిలుస్తున్నాను.
ఆవశ్యకత

               పద్యం లోని ఛందో బందోబస్తులను బద్దలు చేస్తూ వచ్చింది వచన కవిత.  అయినప్పటికీ తొలి నాళ్లలో పద్య లక్షణాలు కొన్ని అలాగే కొనసాగాయి.  దీనికి ఉదాహరణే ఆనాటి వచన కవితల్లో లయ, అంత్య ప్రాస నియమం,   అని చెప్పాలి .  కానీ ఆధునికత, స్త్రీవాదం, దళిత వాదం, మైనారిటీ వాదాలు ఉధృతమైన తర్వాత తెలుగు వచన కవిత్వం నిర్మాణ పరంగా స్వేచ్చని, భావాల పరంగా గాడతని, వస్తు పరంగా myriad life stylesని , శిల్ప పరంగా iconoclastic trendsనీ పరిచయం చేసింది. ఇక 1991 తర్వాత మొదలైన గ్లోబలైజేషన్, 2001 అనంతరపు విశ్వ సాంస్కృతిక సంగమ భావనలు, ఆదాన ప్రదానాలు ఇప్పుడు సాహిత్యానికీ, కవిత్వానికీ ఉన్న ఆఖరి బంధనాలను, నియమాలను కూడా తెంచి వేసాయి.  అలా నిబంధనల విబంధనకు గురి అయిన వాటిలో భాష కూడా ఒకటిగా మారింది. భావం universal అయినప్పుడు, దానిని అభివ్యక్తి చేసే భాష కూడా హద్దులకు, పరిమితులకు అతీతంగా universal గా మారాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపధ్యం లోంచి ఉద్భవించిన సమకాలీన నవ కవితా సంప్రదాయమే multi-lingual, multi-cultural సాహిత్యం/ కవిత్వం.  దీనికే నేను, Fusion షాయరీ అని పేరు పెట్టాను.  దీనికి సశాస్త్రీయతను, సాహితీ ప్రతిపత్తిని ఆపాదించడానికి కొన్ని నియమాలను కూడా రూపొందించాను.
నియమాలు:
— పేరు లోనే చెప్పినట్లు, ఇది poetry + prose లోని రెండు భావనల fusion! అందుకే ఈ కవిత prose style లోని పేరాగ్రాఫ్ pattern ని, పోయెట్రీ లోని stanza రూపం లో అనుసరిస్తుంది.
— దీనిలో కవిత్వం లోని భావ చిత్రాలు, symbolism, allegory, metaphoric expressions మరియు prose లోని వాక్య నిర్మాణ శైలి, విషయ విస్తృతి జమిలిగా కలిసి పోయి ఉంటాయి
— ఈ కవిత్వం లో బహు భాషా పదాలు, బహు సంస్కృతుల దృగ్విషయాలు, బహు సమాజాల, దేశాల జీవన శైలులు ఒక్క భావనను లేదా కవిత్వ చింతనను చెప్పడానికి వాడబడతాయి.
— వస్తువు విషయం లో ఏకత్వ నియమం ఉంటుంది కానీ, శిల్పం, నిర్మాణం విషయం లో మాత్రం అనేకత్వ నియమం అనుసరించ బడుతుంది.
— poetry is the spontaneous over-flow of powerful feelings అని William Wordsworth చెప్పినట్లు, ఏయే భావోద్వేగాలను వ్యక్తీకరించడం లో  కవికి ఏ భాషా పదం తగినట్లుగానూ, perfectly apt గానూ తోచుతుందో, ఆ భాషా పదాన్నే వాడతాడు తప్ప, భాషా భిషక్కు లానో, భాషా తీవ్రవాది లానో బలవంతంగా తెలుగు భాషా పదం కోసమో, తెలుగు సమానార్ధకం కోసమో వెతుకులాడుతూ బుర్ర బద్దలు కొట్టుకోవడం ఉండదు. కవి ఆలోచనా ధారలో ఏ పదం మెరిస్తే, ఆ పదాన్నే వాడతాడు. తెలుగు పదం కోసం వెతికే ప్రయత్నం లో కవి తన original మూల భావాన్ని, భావనని కోల్పోయే ప్రమాదాన్ని ఇది నివారిస్తుంది. “నా మంచి పాట నాలో నే పాడుకుంటా. నే పైకి పాడ. పాడితే గీడితే వచ్చేదంతా రెండో రకమే”!
— ఈ కవితా నిర్మాణానికి నిర్దిష్ట పధ్ధతి కానీ, నియమం/ సంప్రదాయం కానీ లేదు. అయితే దీనిలో 4 నుండి 8 stanzaలు ఉంటే బాగుంటుంది. ప్రతి stanza చివర విడిగా కొస మెరుపు లాంటి వ్యాఖ్యానం ఉంటే, ఆ stanzaకు గాడత వచ్చి, చదువరికి  రసానుభూతి కలుగుతుంది. దీనికి గాను కవికి పదజాలం, భాషా సంపత్తి ని creativeగా వాడే నైపుణ్యం కా (రా)వాలి.
– మామిడి హరికృష్ణ

మామిడి హరికృష్ణ

యాడున్నడో…

10314600_637667592989813_7764800892807168432_n

 

 

 

 

 

 

యాడున్నడో కొడ్కు
ఈది బళ్ళ సదివిండు ఇదేశాలకు పోయిండు
నా కండ్లల పానాలు పెట్కొనున్నా వాడొస్తడని

సత్తు గిన్నెలల బువ్వ పెట్టిన  ఈయవ్వ యాదున్నదో లేదో
గంజితాపించినగాని గరీబుగా పెంచలే

కూలిజేసి కాలేజిల చేర్సినా
కువైట్లా ఉజ్జోగమన్నడు
గల్లీలల్ల గోలీలాడేటోడు డాలర్లులెక్కేస్తున్నడు

గుడ్సెల సల్ల తాగినోడు
నా కుతికల సుక్క పోస్తడో లేదో
అప్పుడపుడు పైసలైతే పంపిస్తడు
ఎప్పుడూ నన్ను సూడనికి రాలే

పదేండ్ల క్రితం వానయ్య పీనుగయ్యిండు
గియ్యలా నాకు తోడులేకపాయే
వాడునన్ను సూస్తడని
ఒక ముద్ద పెడ్తడనుకున్న నన్నిట్ల ఒదిలిపోయిండు

అయినా ఆశ సావలే
నేను మాత్రం దినం దినం సస్తున్న

 

-తిలక్ బొమ్మరాజు

ఫాల నేత్రం

1514990_791134514236556_1280152144_n

నాలో నేనున్నాను.. నీవున్నావు

నేను మనమైయున్నాము-

* * *

జరిగిందేదో జరిగిపోయింది-

అలాని అది చిన్న నేరమనికాదుకానీ..

జరగాల్సినదెంతో ఉన్నందున కాసేపు దాన్ని విస్మరిద్దాం

సాకారమైన కలకు కొత్త నిర్మాణాలు నేర్పుదాం

* * *

సరే, ఎటులైతేనేమి, భీష్మ,ద్రోణ, విదుర, అశ్వత్థామలు ఓడిరి

ధర్మము నాలుగు పాదాలా నడయాడిననాడే..

‘కుంజరః’అని ధర్మజుడు కూసేయగలిగినాడు

కలియుగమ్మున-అందునా రాజకీయమ్మున..

ధర్మాధర్మ విచక్షణ తగునే విజ్నులకు?

వాలిని చంపిన రాముడు; కోకలు దోచి, కుత్తుకలు కోయించిన క్రిష్ణుడు

చేసినది లోక కల్యాణమేగాన..

ఇప్పుడు జరిగినది వేరేమి?

Red_eye_speed_painting_by_ZbassartZ

* * *

ఇన్నాళ్లూ, వేలు మనది కన్ను వారిది

ఇప్పుడు కన్నూవారిదే, వేలునూ వారిదే

కాటుకలే దిద్దుకుందురో, కలికములే పెట్టుకుందురో-

అది కన్నూ వేలూ సొంతమైనవారి సొంతయవ్వారంగందా!

ఫాల నేత్రం తెరుచుకుందిప్పుడే..

కన్ను కొత్తగా ఎరుపెక్కినప్పుడు బిగిసినవారి పిడికిలిలో..

మన వేలుకు ఎప్పుడూ చోటుంటుంది కదా!

* * *

నాలో నీవున్నాను.. నీలో నేనున్నాను..

మనమే, నీవు.. నేనైనాం!

-దేశరాజు

కాళీయ మర్దనం అలా కాదు!

10327144_4265257486769_1693149695_n

– మృత్యుంజయ్

11937_578811308820340_1396284388_n

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా- 19

 

Ekkadi(1)
జీవితకాలమంతా పనిచేసి.. డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, ప్రొఫెసర్లుగా, ఉపాధ్యాయులుగా, లాయర్లుగా.. రిటైరై.,
ఉద్యోగ విరమణ అనేది అకస్మాత్తుగా ఎదురై ముందునిలబడే ఒక వీధిమలుపు. నిన్నటిదాకా ఫలానా పనికి పనికొచ్చిన మనిషి ఒక ఈనాటినుండి పనికిరాడు అని నిర్దారించబడే వేళ. కాని చాలామందిలో ఇంకా జవసత్వాలుంటాయి. బతుకునంతా వడబోసి వడబోసి కూర్చుకున్న అనుభవసారం ఉంటుంది. జీవితాన్ని పూర్తి మానవతా దృష్టితో వీక్షించగలిగే పరిణతి ఉంటుంది. జీవిత సంధ్యాసమయానికి చేరువౌతున్నకొద్దీ సంయమనంతో కూడిన, మనిషిపట్ల సానుభూతితో స్పందించగలిగిన సంస్కారం అలవడ్తుంది. ఐతే ఈ అపూర్వమైన ఒక సంపదను సమాజం ఉపయోగించుకోవడంలేదు. అన్నింటినీమించి ఉద్యోగవిరమణ చేసినవాళ్లకు పెద్దగా ఆర్థికావసరాలుండవు. అయ్యో జీవితంలో అనుకున్న కొన్ని పనులు చేయలేకపోయామే..యిప్పుడవి చేస్తే బాగుండునన్న జ్వలన ఒకటుంటుంది. దాన్ని సామాజిక ఉన్నతికోసం ఉపయోగించుకోవాలనుకున్నారు రామం, క్యాథీ, గోపీనాథ్‌.. మూర్తి అందుకే రాష్ట్రంలోని ప్రధానమైన ఎనిమిది హైద్రాబాద్‌, వరంగల్లు కరీంనగర్‌, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో సామాజిక సేవా భావం కలిగి, ఐచ్ఛికంగా వాళ్ళంతట వాళ్ళు తమతమ నైపుణ్యాలను అందివ్వగలిగితే అటువంటివారి సేవలను ఉపయోగంచుకునేందుకు వాళ్ల వివరాలను సేకరించమని ‘జనసేన’ సేవా విభాగానికి అదేశాలొచ్చాయి. పదిహేను రోజుల క్రితం ‘జనసేన’ యువ కార్యకర్తలు రామదండులా కదిలి విస్తృతమైన సంపర్కం చేశారు. సీనియర్‌ సిటిజన్స్‌ వివరాలను సేకరించి వాళ్ళను కలిసి మాట్లాడారు. వాళ్ల సహకారాన్ని, ఆశీస్సులను, సేవలను అర్థించారు. వయోజనులు చిరునవ్వులు చిందించే ముఖాలతో స్నేహహస్తాన్నందించారు. ఒక్కో కేంద్రంలో వందలమంది వివిధ వృత్తి నిపుణుల సమాచారం, అంగీకారం ప్రోగైంది. వెంటనే ‘జనసేన’ కేంద్రంనుండి ప్రతి నగరంలోనూ విశాలమైన అన్ని వసతులున్న భవనాలను అద్దెపద్ధతిపై మొదట సమకూర్చమని ఆదేశాలొచ్చాయి. అదేరకంగా.. ఆ రోజు..ఎనిమది మహానగరాల్లో ఎనిమది ‘జనసేన’ ప్రజాసేవా కేందాలు అన్నిరకాల అత్యంతాధునిక పరికరాలు, ఫర్నీచర్‌, ఉపకరణాలు, ఇతరేతర సమస్త సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డాయి.
ఒక్కో ప్రజాసేవా కేంద్రంలో సీనియర్‌ డాక్టర్లతో ఉచిత వైద్య విభాగం, ఇంజినీరింగు నిపుణులతో ఏ నిర్మాణ కార్యకలాపాల్లోనైనా పనికొచ్చే సలహాసహకార విభాగం, రిటైర్డ్‌ లాయర్లతో న్యాయ సహాయ విభాగం, రిటైర్డ్‌ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లతో విద్యా విషయ సహకార విభాగం.. యువజనుల కోసం వ్యాయామ, క్రీడా, సేవా విభాగం ఇలా అనేకరంగాలతో ఒక విస్తృతమైన సామాజిక వేదిక.. కౌన్సిలింగు కేంద్రం.. ఒక్కోచోట వీటితో ఓ ప్రజాక్షేత్రం.
ఆ పరంపరలో.. వరంగల్లులోని కొత్తవాడలో .. ఒక పెద్ద ప్రైవేట్‌ భవనంలో.,
‘జనసేన’ సామాజిక సేవా కేంద్రం ప్రారంభం.
ఉదయం పదిగంటల ముప్పయి నిముషాలు.. భవనం బయట వేలమంది జనం. ప్రజల్లో ఉప్పెనై పెల్లుబుకుతున్న చైతన్యం. ఎక్కడో ఓ కిరణంలా ఆశ. ఈ చీకట్లోనుండి, బురదలోనుండి.. అందరి ఆత్మాభిమానాన్ని శూలంతో పొడిచి గాయపర్చి.. రక్తం చిందించి, ఛిన్నాభిన్నం చేసి.. వీడు మా ప్రజాప్రతినిధి..అని చెబుతే తలెత్తుకునేలా కాకుండా.. సిగ్గుపడేలా, తలదించుకుని లోపల ఎక్కడో దాచుకునేలా.. సరిగా చదువురాని వాడు, సంస్కారం లేనివాడు, తెలివి అస్సలే లేనివాడు..పశువకు మాటొస్తే వలె మాట్లాడువాడు.. పరమఛండాలుడు.. ఈ గుండెలను పిండే దుస్థితినుండి తప్పించి – ఏదో ఒక వెలుగు ద్వారాన్ని తెరుస్తున్న ‘జనసేన’.
‘భగవంతుడా.. ఈ జనసేనను కాపాడు తండ్రి” అని మొక్కుకుంటోంది ఓ ఎనభై ఐదేళ్ళ వృద్ధ మహిళ.. బయట పోచమ్మగుడి దగ్గర.
”ప్రియమైన మిత్రులారా.. మనం చేస్తున్న జైత్రయాత్రలో భాగంగా.. ఈ సామాజిక సేవా కేంద్రాల స్థాపన ఒక ప్రధాన ఘట్టం. ఎంతో అనుభవమున్న ఎందరో ప్రముఖ డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, విద్యావేత్తలు.. ఎందరో మీపై ప్రేమతో, వాత్సల్యంతో ఉచితంగా నిరంతరం సేవ చేయడానికి సంసిద్ధులై మీ ముందు యిక్కడ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. దయచేసి జనసేన సేవలను వినియోగించుకోండి. తెల్లకార్డులు, పచ్చకార్డులు.. పైరవీలు.. నూటా నాల్గు అన్ని మాయలు.. ఎండమావులు. మనం మననే నమ్ముకుందాం. ముందుక సాగుదాం.. జనసేన.. రేపు ఒక ‘ప్రభంజనం’ కార్యక్రమాన్ని చేపడ్తోంది. ‘సమాచార చట్టం ఆర్‌టిఐ ప్రకారం సేకరించిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు జిల్లా కేంద్రాల్లో ఫస్ట్‌ మెజిస్ట్రేట్‌ కలెక్టర్లకు, ఎసిబి అధికారులకు, హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌కు మొత్తం నాల్గువేల ఆరువందల ముప్పయి రెండు కేసులను, అభియోగాలతో కూడిన కంప్లెయింట్స్‌ను, సమగ్ర విచారణను కోరుతూ అధికారికంగా విన్నపాలను సమర్పించబోతున్నాం. యిది ప్రజాస్వామ్య చరిత్రలో అతిపెద్ద ప్రజాప్రతిఘటన. ఈ విన్నపాల ఆధారంగా ఎసిబి వాళ్ళు దాడులు చేయాలి. కోర్టులు విచారణను ప్రారంభించాలి. కలెక్టర్లు విచారణకు ఆదేశించాలి. లేకుంటే వాళ్ళ భరతంకూడా బజారుకెక్కుతుంది. నిజమైన అహింసాయుతమైన ప్రజాచైతన్య విజృంభణ రేపు మొదలుకాబోతుంది. సోదరులారా కదలిరండి..ఒక్కో లింక్‌ కలిస్తే చెయిన్‌ ఔతుంది.. చెయిన్‌ తయారై లాగితే జగన్నాధరథం కదుల్తుంది. హరోం హర హర.. హరోం హర హర..” శివ చెబ్తున్నాడు వేదికపై జ్వలిస్తున్న అగ్నిలా.
ప్రక్కన వేదికపై.. రామం.. క్యాథీ.. డాక్టర్‌ గోపీనాథ్‌.. మూర్తి.,

25
”ఇప్పుడు .. ఈ జనసేన సామాజిక కేంద్రాన్ని ప్రారంభించడానికి.. కొత్తవాడ నివాసి, బీడీ కార్మికురాలు.. ఆకుతోట లచ్చమ్మను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆమె ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తూండగా ప్రముఖ రిటైర్డ్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ అమర్‌సింగు ఆమెకు సహకరిస్తాడు. అమర్‌సింగు గారి నేతృత్వంలో ఈ కొత్తవాడ కేంద్రం ప్రజలకు ప్రక్కలో ఆపద్భంధువులా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. సెలవు..” శివ కూర్చున్నాడు.
వేదికపైకి.. బీడీ కార్మికురాలు వస్తూండగా జనసేన కార్యకర్తలు.. డాక్టర్‌ అమర్‌సింగు ఎదురేగి.. వెంట తోడ్కొని వచ్చి స్విచ్‌ ఆన్‌ చేయించి..
ఎదురుగా.. ఎల్‌సిడీ తెరపై.. ఒక దివిటీని ఎత్తిన స్త్రీ బొమ్మ ప్రత్యక్షమైంది.
వేలమంది హర్షాతిరేకాలతో చప్పట్లు. ఒక ఆనందోద్విగ్న సందోహ సముద్రం.. జన జాతర.
వేదికముందు పదులసంఖ్యలో మీడియా ప్రతినిధులు. టి.వి. కెమెరాలు.. పదుల సంఖ్యలో పాత్రికేయులు.
పులకించిపోతూ ఒక సీనియర్‌ పాత్రికేయుడు నరేందర్‌ తన ప్రక్కనున్న శ్రీనివాస్‌తో అంటున్నాడు.. ”చీమ తన శరీరంకన్నా ఎనిమిదిరెట్ల బరువుగల పదార్థాన్ని మోసుకుంటూ నిర్విరామంగా, అవిశ్రాంతంగా కదుల్తూ, ఒక రోజు దాదాపు పన్నెండు మైళ్ళు వెళ్తుందట.. ఈ రామం అనేవాడు ఒక చిన్న చీమలా ‘జనసేన’ కార్యక్రమాన్ని ప్రారంబించి మెలమెల్లగా చూశావా ఎలా ఓ ప్రభంజనమై, ఓ తుఫానై విజృంభిస్తున్నాడో. చావుకు భయపడనివాణ్ణి ఎవడూ చంపలేనట్టే..ఏ స్వార్థమూ లేక సర్వసంగపరిత్యాగియై ప్రజలకోసం ముందుకు సాగుతున్నవాణ్ణి ఎవరైనా ఏంజేయగలరు. వాడికి పదవీవద్దు. అధికారం వద్దు… గాంధీవలె.. గాంధీ ఎప్పుడూ ఏ పదవుల్నీ కావాలనలేదు కదా. వీడు అజేయుడు శ్రీనివాస్‌.. ఇంతపెద్ద ప్రజాస్పందనను ఎన్నడూ చూల్లేదు. అస్థిత్వ ఉద్యమాలు, తాత్కాలిక గర్జనలు, శంఖనాదాలు.. సమరశంఖాలు.. ప్రజలను కొనుక్కుని ఏవో ఒక్కరోజు నిర్వహిస్తే చూశాంగాని, ప్రజలు స్వచ్ఛందంగా ఇలా స్పందించడం అద్భుతమనిపిస్తోంది..” అంటున్నాడు.
సరిగ్గా అప్పటికి అదే అభిప్రాయంతో ఉన్న శ్రీనివాస్‌.. ”ఎందుకో ఇక ఈ సమాజం బాగుపడ్తుందని ఆశ కల్గుతోంది నరేందర్‌” అన్నాడు ఒకరకమైన ట్రాన్స్‌లోనుండి.
ఈలోగా ఆకుతోట లచ్చమ్మ సభను నిర్వహిస్తున్న శివ కోరికపై నాల్గుమాటలు మాట్లాడ్డానికి మైక్‌ ముందుకొచ్చింది.
”అందరికీ దండం.. నా వయస్సు డెబ్బయ్యేండ్లు. ఎనకట ఆరోక్లాస్‌ చదివిన.. నా ఒక్కగా ఒక్క కొడ్కు నక్సలైట్లల్లపోయి పోరాటం చేసి పోలీసుల చేతుల్ల చచ్చిండు. ఏం ఫికర్‌ లేదు. ఆర్మీల ఒక కాప్టెన్‌ చచ్చినంత గౌరవం.. నాకిప్పుడు గీ ‘జనసేన’ను సూత్తాంటే నా కొడ్కుకల నిజమైతాందనిపిస్తాంది. రామంను నా కొడ్కనుకుంటాన.. ఒక్కటే చెప్త.. ఒకసారి గీ గీసుకొండ మండలం గంగదేవిపల్లెకు పోయిన. ఆదర్శగ్రామం అది. ఊరిదంత ఒకతే కత్తు. ఒకటే కుటుంబం. గట్లనే మనది ఒక ఆదర్శ జిల్లా. ఒక ఆదర్శ రాష్ట్రం. ఒక ఆదర్శ దేశం కాదా.. ఐతది.. తప్పకుండ ఐతది.. మనం చేద్దాం.. మనమే చేద్దాం..”
అంతే.. ఉత్సాహం కట్టలు తెంచుకుంది. పిడికిళ్ళెత్తిన జనం.. ”జనసేన” అని గొంతెత్తి నినదిస్తే,
ఆకాశం ప్రతిధ్వనిస్తున్నట్టు ”వర్ధిల్లాలి” అని ప్రతినినాదం.
”జనసేన..”
”జిందాబాద్‌”
”జై జనసేన”
”జై జై జనసేన..” .. ఉద్యమాల పురిటిగడ్డ, విప్లవాల రక్తగర్భ ఓరుగల్లు మానవ మహోత్తేజంతో పొంగి ఉరకలేస్తోంది.
తర్వాత డాక్టర్‌ అమర్‌సింగు సామాజిక సేవా కేంద్రం ప్రజలకు ఉచితసేవలను అందించే విధానం క్లుప్తంగా వివరించారు.
శివ..తర్వాత మైక్‌ ముందుకొచ్చి.. జనసేనతో కలిసి పనిచేయడానికి, అవినీతి ప్రక్షాళనలో పాలుపంచుకోవడానికి, పరిశుద్ధ భావి భారత పునర్నిర్మాణంలో తామూ ఒక భాగం కావడానికి సంసిద్ధత వ్యక్త ంచేస్తున్న ప్రజా సంఘాల పేర్లను ప్రకటిస్తాననీ, ఆయా సంస్థల బాధ్యులు ఒకరొకరుగా వేదికపైకి వచ్చి ప్రజలకు పరిచయం కావాలనీ ప్రకటించి ఒక్కొక్క సంస్థ పేరును చదవడం ప్రారంభించాడు.
”జిల్లా జర్నలిస్ట్స్‌ యూనియన్‌.. రచయితల సంఘం.. మానవ బాధ్యతల సంఘం.. జిల్లా చర్మకార సంఘం..జిల్లా పద్మశాలి సంఘం.. జిల్లా యాదవ సంఘం.. జిల్లా ఎన్‌జివోల సంఘం.. విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం..” పట్టిక కొనసాగుతూనే ఉంది.
సరిగ్గా.. ఆక్షణంలో.. రాష్ట్రవ్యాప్తంగా ‘జనసేన’ నిర్వహిస్తున్న అన్ని ఎనిమిదికేంద్రాల్లో .. అన్ని వేదికలపై అటువంటి కార్యక్రమమే జరుగుతున్నట్టుగా వీడియో సంధానంలో ఉన్న క్యాథీ ఎదుటి లాప్‌టాప్‌ కంప్యూటర్‌ ద్వారా రామంకు తెలుస్తోంది.
ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి విజయాన్ని సాధించడానికి ”అత్యాధునిక సాంకేతికత వినియోగానికి ఎన్నటికీ మారని స్థిరమైన భారతీయ జీవన విలువలను జోడించి, పరిపుష్టం” చేసిన విధానాలను అనుసరించాలని రామం ఉద్ధేశ్యం.
అతనికి చాలా తృప్తిగా ఉంది.. ప్రణాళికలో అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతూ ముందుకు దూసుకుపోగల్గుతున్నందుకు. ఐతే తను ఊహించినదానికంటే దాదాపు నాల్గురెట్లు ప్రజల ప్రతిస్పందన రావడం, అదీ చిన్న, పెద్ద, క్రింది, పైది.. అన్న తేడాలేకుండా అన్నివర్గాలనుండి ప్రతిచర్య ఉవ్వెత్తున రావడం అతనికి పరమానందంగా ఉంది. ఆ పులకింతలోనుండే ప్రక్కనే ఉన్న క్యాథీతో అన్నాడు..”  ”ఫెర్మీ అణుకేంద్రక విచ్ఛిత్తి సిద్ధాంతం జ్ఞాపకమొస్తోందిక్యాథీ.. కేంద్రకాన్ని గనుక అద్భుతమైన శక్తినుపయోగించి విచ్చిన్నం చేయగలిగితే విడివడే శకలం మూడు ముక్కలై శక్తిని ఉద్గారించి.. మళ్ళీ ఒక్కో ముక్క మళ్ళీ మూడుముక్కలై.. మళ్ళీ శక్తిని ఉద్గారించి.. మళ్ళీ ఒక్కో ముక్క.. ఇలా క్షణాల్లో గుణశ్రేఢిలో, ఒక శృంఖలచర్యగా సాగే నిర్మాణాత్మక విచ్ఛిన్న క్రియ ఎంతో బహుళమైన శక్తిని అంతిమంగా అందిస్తుందో,  అదేవిధంగా అణుకేంద్రక సమ్మేళన కార్యక్రమంలోకూడా ఒక్కో అణుకేంద్రకం సంలీనమైపోతూ మళ్ళీ అఖండమైన శక్తిని.. సూర్యునినుండి వికరణజ్వాలలవలె వెలువరిస్తుందో.. జనసేనలోకి ఒక్కో మనిషి అణుకేంద్రకంలా ప్రవేశించి.. ఎంత వేగవంతంగా న్యూక్లియర్‌ రియాక్షన్‌వలె బలోపేతమై పోతోందో.. చాలా ఆనందంగా ఉంది క్యాథీ మనం చేపట్టిన ఈ ప్రక్షాళన చర్య..”
క్యాథీ మౌనంగా.. నిండుగా.. పరిపూర్ణంగా నవ్వుతూ రామంలోకి చూచింది.
ఇద్దరి కళ్ళలోనూ నక్షత్రాలు నిండుగా పూచిన ఆకాశంలో ఉండే పరిపూర్ణ వింతకాంతి.
అప్పుడే రామం రక్షణను పర్యవేక్షించే రఘు రామం వెనుకనుండి కొద్దిగా పైకివంగి.. ”సర్‌ మీరిప్పుడు రాష్ట్రస్థాయిలో కొందరు పత్రికా సంపాదకులతో టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొనే కార్యక్రమముంది సార్‌.. మన కేంద్రక కార్యాలయానికి బయలేర్దామా..” అన్నాడు గుసగుసగా.
”యస్‌.. గోపీనాథ్‌ సర్‌.. మీరు మిగతా విషయాలు చూడండి. మేం వెళ్ళిరామామరి ”అని ప్రక్కనున్న గోపీనాథ్‌ గారి అనుమతి తీసుకుని.. క్యాథీ కూడా లేచి రాగా.., సెంటరింగు చెక్కలతో చేసిన విశాలమైన వేదికపైనుండి టకటకా మెట్లపైనుండి దిగుతూండగా,
భూనభోంతరాలు దద్దరిల్లేట్టుగా ఓ బాంబు ప్రేలింది.
అంతా బీభత్సం.. మంటలు పొగ.. ధ్వంసం.. వేదిక చెక్కలు ఎగిరెగిరిపడ్తూ.. ప్రేలుడు.
పరగులు.. అరుపులు.. కకావికలు.. కేకలు.. విధ్వంసం.

సురసురమని వెలుగు…

drushya drushyam -31
బతుకు చిత్రాలు బహుకొద్ది దొరుకుతాయి.
చాలాసార్లు వెలుతురులో. కానీ అరుదుగా చీకటిలో దొరుకుతాయి, వెలుతురు బతుకులు.అవును.
వెలుగు నీడల మధ్య కొన్ని జీవితాలు.
గాలిలో పెట్టిన దీపంలా కాదు, దీపం చుట్టూ గాలి గోడలా.
కాసేపైనా అట్లా జీవితం నిలబడి ఉంటున్నప్పుడు, జీవితానికి ఆధారం పొందుతున్నప్పుడు – ఇట్లా చిత్రాలు లభించడం ఒక అదృష్టం.
+++ఒక కుటుంబం బతకాలంటే ఒక చిన్న ద్వారం.
కిటికీ మాత్రం గా తెరుకునే వెలుగు.
ఆ వెలుగు నించే అంతానూ. సురసురమంటూ చేప కాలుతుంటే ఒక వెలుగు. నీడ. అదే ఆధారం. జీవనం.దీన్ని తీసింది మా ఇంటి దగ్గరే.
హైదరాబాద్ లోని పార్సిగుట్టలో, కమాన్ దగ్గర కల్లు డిపో ముందర.+++

నిజానికి చీకట్లో మాత్రమే వెలిగే చిన్న షాపది.
చేప ముక్కల్ని వేయించి మద్యపానంలో మునిగితేలే కస్టమర్లకు వేడివేడిగా రుచికరంగా అందించే మనిషి బండి అది.
నిలబడి నిలబడి నడిచే బండి. చీకటి గడుస్తుంటే వెలుగులు తరిగే సమయం అది
ఏడు నుంచి పన్నెండున్నర. అంతే
మళ్లీ తెల్లారితే- రాత్రయితేనే పని.
అదీ ఈ చిత్రం విశేషం.

+++

దీన్ని చిత్రీంచేదాకా నాకు తెలియదు.
ఒక చిన్న వెలుగు నీడలో జీవితం సాఫీగా గడచిపోతున్నదని.
ఆ మాత్రం చీకట్లో గడిపితే తనకు మొత్తం దినమంతా గడచిపోతుందని!

ఈ చిత్రం తీసి చూసుకున్న తర్వాత ఒకటొకటిగా అటువంటి జీవితాలన్నీ తెరుచుకున్నయి.
ఏడు దాటిందంటే బతికే  జీవితాలన్నీ కానరావడం మొదలయ్యాయి.

మొదలు  ఇదే. అందుకే అదృష్ట ఛాయ అనడం.

+++

ఈ చిత్రంలో ఒక చిన్న శబ్ధం, సంగీతం ఉంటుంది.
ఆకలి కేకల రవళి ఉంటుంది. అది తీరుతున్నప్పుడు సేద తీరుతున్న కమ్మని కడుపు శాంతిజోల ఉంటుంది.
కస్టమరుకు, తనకూనూ…

+++

మనందరం చిమ్మ చీకట్లో ఫొటోలు చాలా తీస్తుంటాం. కానీ, ఒక దీపం వెలుతురులోనో లేదా ఒక చిన్న బల్బు వెలుగులోనో, చుట్టూ గాలినుంచి పొయ్యిని కాపాడుకుంటూ కాస్తంత నిప్పును రాజేసి సరాతంతో అలా సుతారంగా చేపల్ని వేయిస్తుంటే, వాటిని అమ్మే ఈ మనిషిని చూశాక….ఇట్లాగే కందిలి పెట్టుకుని రాత్రంతా కోఠి బస్టాండులో దానిమ్మ పండ్లు అమ్మే ఇంకొకాయన్ని చూశాను. రవీంద్రభారతిలో కీబోర్డు ప్లెయర్ ను తీశాను. ఇట్లా చాలామందిని.

అన్నీ వ్యాపకాలే. ఒకరి తర్వాత ఒకరిని. కనిపించినప్పుడల్లా ఒక వెలుగును నీడలో. ఒక నీడను వెలుగులో…
అంతదాకా తెలియనివి తెలిసి ఆశ్చర్యంతో చూసి చిత్రీకరించడం అలవాటు చేసుకున్నాను.

చూడగా చూడగా చూస్తే, అదొక సిరీస్. జీవితపు ఆసరా.
నిర్వ్యాపకంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చూడాలనుకుంటే మా ఇంటికి రండి.

– కందుకూరి రమేష్ బాబు

ramesh

జాపరయ్య ఒనుం

japarayya onum pic

నాకు అప్పుడు పదేండ్లుంటయ్ …మా సొంతూరు కలసపాడు లోని చర్చి కాంపౌండ్ లో ఉంటిమి…అప్పట్లో చర్చి కాంపౌండు లో పది ఇండ్లు ఉన్నెయి. స్కూలు హెడ్ మాస్టర్ కిష్టపర్ సార్ కుటుంబం …ఇంగా ఇద్దరు ముగ్గురు టీచర్ల ఇండ్లు …కుశిని పని చేసే వాళ్ళ ఇండ్లు ఒకటి ఉన్నెది. మాఇండ్లు  చర్చికి దగ్గరగా ఉన్నెది. అదే కాంపౌండులో మిషన్ హాస్పిటల్ లో పని చేసే డాక్టర్ పెద్దీటి దేవభూషణం సార్ వాళ్ళ ఇండ్లు …పాస్టర్ ఇండ్లు పక్క పక్కనే ఉన్నెయి. మా చర్చికాంపౌండు పక్కనే సగిలేరు పార్తది. ఇది పరమట పక్కఉంటది. తూర్పు పక్క పంట పొలాలు మాడి వనాలు ఉన్నెయి. కలసపాడు ఊరిలో నుండి చర్చికాంపౌండు కు వచ్చే దావలో ఎడం పక్క రెండు మాడి తోటలు వరసగా ఉన్నెయి. ఇంగో పక్క దాన్ని ఆనుకుని ఇంగోక మాడి ఒనుం ఉండేది. ఇది ఇప్పటికీ ఉంది. గాని ఆ రెండు వనాలు ఇప్పుడు లేవు.
మా శిన్నతనాన మాడికాయల సీజన్ వచ్చే పొద్దన లేచ్చానే మాడి తోటల కాడికి పోతాంటిమి..రాత్రిపూట రాలిన మామిడి కాయలు ఏరుకోవడానికి. మిషన్ కాంపౌండుకు ఆనుకుని ఉన్న ఒనుం పేరు జాపరయ్య ఒనుం. ఆ ఒనుంలో ఒకప్పుడు శీని శెట్లు…సపోటా శెట్లు ఇంగా ఏంటేంటియో ఉన్నెయంట.. నాక మతికి వచ్చారక మాత్రం టెంకాయ శెట్లు…మాడి శెట్లు  ఉన్నెయి. ఒక వరస మాడిశెట్లు ఎనిమిది ఉన్నెయి. వాటిని వేరే ఊర్లలో ఎట్ట పిలుచ్చరో తెలియదు గాని నాకు తెలిసి ఒక్కో చెట్టుకు ఒక్కో పేరు ఉంది.
మొగదాల ఉన్నె శెట్టు పేరు కొబ్బెర కాయ. ఆ శెట్టుపచ్చి కాయలు తింటే కొబ్బెర ఉన్నెట్టు ఉంటది అందుకని ఆ పేరు పెట్టింటరు అనుకుంటి.

 

దాని ఆనుకుని ఉన్నె శెట్టు పేరు దబ్బకాయ..దాని ఆనుకుని ఒక పెద్ద శెట్టు …ఉన్నెది. దాని పరవాత ఓ నాలుగైదు శెట్లు తరవాత ఒకపెద్ద మేడి శెట్టు ..దాని తరువాత వాటిలో ఒకటి పచ్చడి కాయ అని ఇంగో దానికి ఇంగోపేరు …అయితే ఆ గేరిలో శివరాకరి శెట్టు పేరు పసుపు గాయ శెట్టు.. ఆ శెట్టు కాయలు పసుపు వాసన వచ్చాంటయి..అది మాగితే మధురంగా ఉంటాన్నెది. అంద మధురం మళ్ళీ జీవితంలో ఏ మాడి పండులో గూడా సూడలేదు. దానికి ఒక్కరవ్వ దూరంగా అంటే మాడి ఒనుం మధ్యలో ఒక పక్క మహారాజులాగా బేనీసా శెట్టు ఉన్నెది. దాని ముందు ఒక పాడు పడ్డ దిగుడు బావి ఉండేది.దాంట్లో పెద్ద పెద్ద జర్రిపోతులు నీళ్ల పాములు, తాంబేళ్ళు ,, గోందురు కప్పలు ఉండేటివి. మిషను కాంపౌండును అనుకని ఉండే వరసలో రెండు మాడి శెట్లు ఉండేవి. ఒకటేమో పచ్చడి కాయ…కట్టవ నానుకుని ఒకపెద్ద శెట్టు ఉండేది. ఆ శెట్టు కాయలు మాగితే అందులో పీసు ఉండేది కాదు ఉత్త కండ ఉండేది. ఒనుమంతటికీ ఒక సపోటా శెట్టు ఉండేది. దానికి జాపరయ్య కాపలా ఉండేవాడు.
జాపరయ్య గురించి చెప్పాలంటే ఆ మనిషి ఆరుడుగులుంటాడు. తూకమైన మనిషి.

జాపరయ్య వాళ్ళన్న పోలీసు. ఆయన కర్నూలు లో ఉండేవాడు.

ఆయన  వాడిన పాత కాకి నిక్కర్లు జాపరయ్యకు పంపితే అవి ఏసుకునే వాడు. జాపరయ్యను నిక్కర్లో తప్ప సలవ గుడ్డల్లో ఎప్పుడూ సూడలేదు.

ఆ మిషన్ కాంపౌండులో చదివిన వాళ్ళకు వాళ్ళ టీచర్లు ఎంత గుర్తో జాపరయ్య కూడా అంతే… ఆడ చదివిన వాళ్ళందరూ దాదాపుగా జాపరయ్య మామిడి కాయల  దగ్గర కాతా పెట్టిన వాళ్లే . మాడి కాయలు మాగక ముందు బేనిశా,,, కొబ్బరి కాయలు రాలి పడినోటియి అమ్మేవాడు.. పండ్లయినంక వాటిని కూడా అమ్మేవాడు. అయితే ఆయన కాడ శానా  మంది అప్పు పెట్టేవాళ్ళు … వాళ్ల చదువు అయిపోయి పొయ్యేప్పుడు కొందరు అప్పు తీర్చి పొయ్యే వాళ్ళు. కొందరు ఇవ్వకుండా పోయే వాళ్ళు ..అట్ట పోయినోళ్ళు పదేండ్ల తరువాత తిరిగి వచ్చినా కూడా ఆయన వాళ్ళ పద్దు పుస్తకంలో రాసి పెట్టుకుని అడిగే వాడు. ఎప్పుటికి అప్పుడు పద్దు బుక్కు మార్చి బడి పిల్లోళ్ళతో రాయించుకునే వాడు.అట్ట కనపడినప్పుడు  కొందరు ఇచ్చే వాళ్లు కొందరు ఎగ్గొట్టే టోళ్లు . అయినా ఆయన అడిగినోళ్ళకు కాదనకుండా మాడికాయలు ఇచ్చేవాడు.
ఆయన తెల్లారతానే ఒనుం కాడికి వచ్చేవాడు. రాత్రి శీకటి పన్నెంక తిరిగి ఇంటికి పొయ్యేవాడు. ఉదయం వచ్చా వచ్చా సద్దిబువ్వ తెచ్చుకుని పైటాల కల్లా ఒనుం కాడనే తినేటోడు. మద్ధానం అయ్యార్కల్లా జాపరయ్య ఇంటికాడ నుండి ఓ బేసిన్ కు ఎర్రగుడ్డ కప్పి రాగి సంగటి వచ్చేది.మాడికాయల సీజన్ అయితే రోజూ మాడికాయ కారెమే వచ్చేది. లేకుంటే ఏదన్నా పప్పు…ఇంగేదన్నా కూర వచ్చేది. దాన్ని ఆయన ఒనుం లో ఏడబడితే ఆడ నేల మీదనే కూచ్చోని గబ  గబా తినేటోడు. ఆదోవన పల్లెలకు పొయ్యేటోళ్ళు ఎవురన్నా కాసేపుఆయన కాడ గొంతు కూకోని ఎవ్వారం జేసి పోయేటోల్లు.
ఎవురన్నా కోతి నాయళ్ళు చెట్ల మీద రాళ్ళు ఏచ్చే జాపరయ్య కు కోపం వచ్చేది.

Kadha-Saranga-2-300x268

వాళ్ళను కుత్తేగా… పప్పు చారు పడ్తది అని తిట్టేటోడు.. ఆరెండు మాటలు తురక యాసలో తెలుగులో తిట్టేవాడు…

అయి బో సోగ్గా ఉండేవి. కొందరు ఆయనకు కోపం తెప్పిచ్చి తిడతా ఉంటే తిట్టించుకున్న వాళ్ళతో సహా అందరూ నవ్వుకునే వాళ్ళు . అట్టాటి మనిషి జాపరయ్య.
ఆయన ఒనుం ఇడ్సి యాడికి పోయినట్టు నాకు గుర్తు లేదు. ఊర్లో వాళ్ళ కులమోళ్ళ పెండ్లిండ్లు జరిగినా పెద్దగా పోయేటోడు కాదు. ఏదైనా పెద్ద పండగ ఉంటేనే మజీద్ కు నమాజ్ కు పోయేటోడు. ఆయన అట్ట పోయినపుడు ఆయన భార్య బూమ్మ నెత్తికి గుడ్డ కట్టుకుని ఒనుంకు కాపలా ఉండేది. ఆమె ఒనుం కాడ కూకోని ఉంటే ఆ దావన పోయేటోళ్ళు అందరూ “ఏం బూమ్మా జాపరయ్య యాడికి పోయినాడు” అని అడిగే వాళ్ళు.
బంగళాలో ఏదైనా పండగా పబ్బం వచ్చే భూషణం సారు వాళ్ళు ఆయనకు ఇంట్లో ఒండిన బువ్వ కూరాకు పంపించే వాళ్లు ..జాపరయ్యకు ఏదైనా జరమొచ్చినా.. పుండు లేసినా భూషణమయ్య లెక్క తీసుకోకుండా మందులు ఇచ్చేవాడు. అట్ట ఆయనకే కాదు వారి కుటుంబానికి మొత్తానికి లెక్క తీసుకోకుండా చూసేవాడు. దాంతో జాపరయ్యకు భూషణమయ్య అంటే గౌరవం ఉండేది.భూషణమయ్య డైనిమా ఉన్నె హీరో సైకిల్ మీద ఆసుపత్రికి బయలు దేరి ఒనుంమీద పొయ్యేటప్పుడు జాపరయ్య కూచ్చున్నోడల్లా లేసి సలాం సార్ అనేవాడు. ఆయన అలేకుం సలాం జాపరపయ్యా అనుకుంటా పోయేటోడు.

ఆయనకు తన తోటలో కాసే మాడికాయలు, టెంకాయల ఇచ్చేవాడు. ఒకేల శెట్టుమీద మాడికాయ మాగిఉంటే అది కావాలంటే కోసిచ్చేటోడు. భూషణమయ్య పిల్లోల్లు ఒనుం లోకి పోతే ఏమనేవాడు కాదు. పురుగో పుట్టో ఉంటది బద్రంగా పోండి అని చెప్పేవాడు. మా లాంటి పిల్లనాయాల్లను పోనిచ్చే వాడు కాదు. అందుకని మాకు సందు దొరికినప్పుడల్లా దొంగతనంగా మాడికాయలు తెంచే వాళ్ళం.
మా మిషన్ కాంపౌండ్ లో మిషనరీలు కట్టిన పెద్ద బంగళా ఉండేది. కాంపౌండు నిండా చెట్లు ఉండేవి. ఎండా కాలం సెలవులు వచ్చే సాలు అక్కడ సంసారం ఉండే వాళ్ళ పిల్లోళ్ళమంతా రక రాకాల ఆటలు ఆడుకనే వాళ్ళం. మద్యానం దాకా సగిలేట్లో ఈత కొట్టి మద్యానం నుండి బంగళాలో డీండార్.. కోతికొమ్మచ్చి ఆటలు ఆడుకనే వాళ్ళం..మాకంటే పెద్దోళ్లు బంగళా వరండాలో కూకోని అచ్చన గాయలు …బారకట్టా ఆడుకునే వాళ్లు. అంతా ఒకటే జాతి అయనా అక్కడ డబ్బు ఉన్న వాళ్ళ లేనోళ్ళుతేడాఉండనే ఉండేది. సాయంకాలం వనాల కాడికి పోయే వాళ్ళం భూషణమయ్య పిల్లోళ్ళు మాత్రం ఒనుం లోపలికి పోయేటోళ్ళు మేము ఒనుం కట్టవంబడి బయట తిరిగి కంపలో రాలి పడిన కాయలు ఏరకచ్చుకునే వాళ్ళం. అట్ట రాలిన కాయలు మాగేచ్చే బో కమ్మగా ఉండేయి.
ఒక రోజు మద్యాన్నం నుండే ఆకాశం ఎర్రబడతా ఉంది. ఉక్క పోత్సాంది..ఆకు కదలడం లేదు. సగిలేట్లో ఈత కొడతా ఉంటే ఎప్పుడూ సల్లగా ఉండే నీళ్ళు ఆ రోజు ఉడుగ్గా ఉండాయి. ఒక్కో సాటయితే జౌకుల మాదిరి ఉండాయి. నేను ఎప్పుడూ ఏటికి ఆనుకుని ఉండే తుమ్మ శెట్టు కిందికి పోయి నీళ్ళలో మునిగే వాడిని .. ఆ రోజు ఎందుకో ఆడికి పోడానికి భయమేసింది. ఆడికి అందరూ పోలేరు. నేను సోమయ్యగాడు ఒకరిద్దరు తప్ప ఎందుకటే ఆడ నీళ్ళలో కంప ఉంటది. అది యాడుంటదో ఆడికి ఎట్ట బోవాల్నో మాకు తెలుసు. సోమయ్య గాడు ఒక్కడే పోయినాడు గాని శానా శేపు ఉండలేక బయటికి వచ్చినాడు. ఆ రోజు ఏట్లోనుండి బెరీన ఎనిక్కి తిరుక్కుంటిమి.

రెండు మూడు రోజులయితే శనక్కాయ కట్టె పీకుతారనంగా కయ్యలకు నీళ్ళు కడతారు. అట్ట కట్టిన శేను ఒకటి గుడి ఆనుకుని ఉంటే ఆ శేలేకి కాపలా ఉండే వాళ్ళకు కనపడకుండా కంపలో కంత ఒకటి జేచ్చిమి. దాని గుండా పొయి పెరక్కజ్జామనుకుంటే…ఆ శేనుగలోళ్లు ఆన్నే ఉండారు. దాంతో ఉసూరుమంటా బంగళా లోకి వచ్చిమి. ఆడ అచ్చనగాయలు బారకట్టా ఆడే వాళ్ళ కాడ కూకోని వాళ్ళు ఆడుకుంటా మాట్లాడుకుంటా ఉంటే సూచ్చాంటిమి.
ఎండ పలపలా కాచ్చాంది. ఒకటే ఉక్కపోత.. ఆట ఆడే వాళ్ళలో గడ్డమీద దేవరాజన్న తువ్వాలతో మెడమీద ఉన్నె శెమట తుడ్సుకుంటా..”అబ్బ ఏందిరా నాయనా ఇంత మిడ్సరంగా ఎండ కాచ్చాంది. ఊపిరి ఆడ్డంలేదు”అన్నాడు. బంగళానిండా శెట్లుఉన్నా గూడా ఆకు అల్లాడ్డంలేదు. ఉగ్గ దీసుకున్నెట్టు ఉండాయి. మేము పిల్ల నాయాళ్ళం కాబట్టి మాకు ఏమి అనిపియ్య లేదు. గేటు కాడుండే శింత శెట్టు కాడికి పోతిమి.ఆడాడ శింత బోట్లు ఉండాయి. ఈ శెట్టు కాపు లేటు అయినట్టు ఉంది శిగురు కాచ్చాన్నా ఆడాడా శింత బోట్లు ఉండాయి.

అవి కింద పడ్నాయేమో అని ఎతుకుతాంటిమి. ఇంతలో ఉన్నెట్టు ఉండి శింత శెట్టు మెల్లగా ఊగడం తిరుక్కున్నెది. ఆ ఊగడం కాసేపటికి ఎక్కువయినాది. ఆ ఊగడం ఎట్టుందంటే దెయ్యం పట్టినోళ్ళు ఊగినట్టు శింత శెట్టు ఊగడం దిరుక్కున్నెది. అట్ట గాలి లేచ్చాంటే భూషణమయ్య పిల్లోళ్ళు ఒనుంతట్టి పరిగెట్టిరి మంచి మాగిన కాయలు గాలికి పడతాయని…వాళ్ళు ఒనుం కాడికి శేరుకునారకల్లా గాలి ఇంగొక్కరవ్వ ఎక్కువయింది. మాన్లన్నీ ఎట్టుండయంటే ఎప్పుడన్నా మా నాయనకు కొపమొచ్చి మా యమ్మను కొడితే ఆ దెబ్బలకు మా యమ్మకు కోపమొచ్చి మా నాయన్ను ఏమి అనలేక కోపంతో ఎట్ట ఊగుతదో అట్ట ఊగుతాండయి.
నేను సోమయ్యగాడు శింతశెట్టు తొర్రలో ఒదుక్కోని కూకుంటిమి. ఇంతలో గోలీ కాయలంత సైజులో వడగండ్ల వాన పడ్డం దిరుక్కున్నెది. మేము శెట్టు తొర్రలో దాక్కున్న దాన మా మీద ఏమి పడ్డంలేదు.మేము తొర్రలో కూచ్చోని బితుకు బితుకు మంటా సూచ్చాంటిమి. శింతశెట్టు కొమ్మలు నేలకు తగిలేట్టు ఊగుతాండయి. ఇంతలో ఆకాశంలో మెరపులు మెరుచ్చాండయి రెండు పెద్ద బండరాళ్ళు రాసుకున్నెట్టు ఉరుము తాఉంది.

కాసేపటికి శిమ్మ శీకటి అయింది ఆకాశం కిందపడ్తదా అన్నెంత గా ఉంది పరిస్థితి. ఆకాశం నుండి ఓ మేఘంజారి కింద పడిందేమో అన్నెట్టు వాన అట్ట కురిసింది. శింత శెట్టు కింద నిండి వాన నీళ్ళు పోతాండయి. శెట్ల కింద ఉన్నె శింత శిదుగు కొట్టుకోని పోతాంది. గర గర మంటూ ఒక్కసారిగా భూమి మీద ఆకాశం ఊడి పడినట్టు పెద్ద శబ్దం జేచ్చా ఒక్క పిడుగు పడింది. అంత సేపటి వరకు ఇదల గొట్టిన వాన ఎవురో ఆపినట్టు ఆగి పోయింది. అట్ట ఆగుతానే నేను సోమయ్య గాడు శింత శెట్టు తొర్రలో నుండి బయటకు దూకితిమి..ఎండిన శింతాకు…యాపాకు…రెండూ తడిచ్చే వచ్చే వాసన వచ్చాంది. అప్పటి దాంకా పొగలు కక్కుతా ఉన్నె నేల మీద ఒక్క సారి వాన పడ్డంతో నేల లోపల బొక్కల్లో దాక్కోని ఉన్న సీమలు ..పురుగులు బయటకు వచ్చి నేల మీద పాకుతాండయి. నేలంతా తడి తడిగా ఉంది.
అప్పుడే నీళ్ళు పోసుకున్న దయ్యం మాదిరి ఉన్నె శెట్ల మీద ఆకుల మీద పడి నిలబడి పోయిన వాన శినుకులు ఒక్కొక్కటి నేల మీద పడతా ఉండాయి. నేను సోమయ్య తడిసి సన్నగా నీళ్ళు పారతా ఉన్నె నేల మీద మునిగాళ్ళ మీద నడుచ్చా జాపరయ్యా ఒనుం తట్టు దావబడ్తితిమి.

మేము ఉరుకుతా పోయ్యేప్పటికే ఆడ జనం గుమి కూడి ఉండారు . కొందరు ఆదలా బాదలా అట్టిట్ట పరిగెడ్తా ఉండారు. మాకు ఆడేం జరుగుతాందో…… ఎందుకు అందరూ అట్ట ఉరుకుతాండరో ఒక బంగిట అర్ధం కాక పాయ. ఎట్టయితే నేని గుమికూడినా జనం కాడికి పోతిమి? ఎవురు మాట్లాడం లేదు. మమ్మల్ని జూసి కుసిని పని జేసే మనిషి, ఇంటికి పాండి నాయాళ్ళారా ఎప్పుడూ శెట్లంబడే ఉంటారు. అని మమ్మల అదిలిచిన్నాడు.

ఏమైంది మామా అని అడిగితే మేడి శెట్టు ఇరిగింది. దానికింద భూషణమయ్య పెద్ద కొడుకు పడి సచ్చిపోయినాడు అని అన్నాడు. మాకు అర్ధం కాలేదు.
భూషణమయ్య పెద్ద కొడుకు పేరు దాస్ అయినప్పటికీ అందరూ శిట్టిబాబు అని పిలుచ్చాంటారు. మేము గూడా అట్టనే పిలుచ్చాంటిమి.

మా కంటే ఓ ఐదారేండ్లు పెద్దోడు అయినా కూడా బో తులవ. ఎప్పుడూ మాతో పాటు ఈతకు వచ్చాన్నడు. సగిలేట్లో ఈత కొడతా మునిగాట ఆడేవాళ్ళం ఆ ఆటలో ఎవురన్నా మునిగితే ఆ మనిషి గూడా వాళ్ళకంటే లోతులో మునిగి వళ్ళ కాళ్ళు పట్టి లాగి వాళ్ళకు కనపడకుండా పోయేవాడు.

లాగించకున్నోళ్ళు ఓ యమ్మా ఏదో దెయ్యం నీళ్ళలో నా కాళ్ళు పట్టుకోని గుంజినాది అని ఆయాస పడతా గడ్డకు చేరేవాళ్ళు శిట్టిబాబన్న మాత్రం ఏమి ఎరగనట్టు ఏమైందిరా అని అడిగే వాడు. .. కాసేపయినంక నేనే గుంజింది అని శెప్పి అందరినీ బాగా నవ్వించేవాడు. అంతే గాని ఎవురితో కొట్లాడంగా నేను సూడలేదు.
నేను ఇసయం ఇనంగానే ఉరుకుతా మా ఇంటికి పోయినాను. మా యమ్మ గాలివానకు శెదిరిపోయిన మా ఇంటి పైకప్పు బోదను సరిజేచ్చా ఉంది. నేను ఉరుకుతా పొయి గస పెడతా ఉంటే….. ఏంది నాయనా అన్నట్టు జూసింది మాయమ్మ. యమా….అంటూ ఆయాస పడతా… శిట్టిబాబన్న… జాపరయ్య తోటలో శెట్టిరిగి పడి సచ్చిపోయినాడు అని శెప్తి. అది ఇనడం… ఇనడం మా యమ్మ నా శెంపకేసి శెల్లుమని ఒక్కటి పీక్కింది. ఎంత కోతిపని చేసినా ఎప్పుడన్నా ఊరికే అట్ట గొట్టే మాయమ్మా తొట్టతొలిగ నాశెంప కేసి కోపంగా పీకింది.
నేను దెబ్బనుండి తెరుకుండార్కల్ల జాపరయ్య తోటకాన్నుండి జనం బాబు ఇంటిముందుండే గిలకరాయి నుండి శిట్టిబాబన్ను ఎత్తుకొని ఇంటికాడికి తీసకపోతాండరు. అదిజూసి మాయమ్మ పరుగులందించుకున్నెది.
నేను గూడా మాయమ్మ ఎంటంబడిపరిగెత్తి భూషణమయ్య భార్య ఏమైంది ఏమైంది అనుకుంటా ఎదురొచ్చె  ఇంతలో ఎవురో మంచమేసిరి ఇంగెవరో దప్పటి కప్పిరి. గబ గబా అందరూ అన్నీశేయ్యబట్టిరి ఆసుపత్రి కాన్నుండి ఇంటికి వచ్చిన భూషణమయ్య కొడుకు శవాన్ని జూసి గుండెల బాదికోని ఏడ్సినారు . అందరూ ఏడుచ్చాండారు మాయమ్మ గూడా ఏడుచ్చానే ఉంది.
మా ఊరోల్లే గాకూండా సుట్టుపక్కల పల్లెలోలు గూడా తిర్నాలకు వచ్చినట్టే  వచ్చిరి.
ఎట్ట జరిగిందబ్బా అని అందరూ మాట్లాడుకుంటాండిరి.
మామూలుగా అయితే ఎంతగాలి వచ్చినా మేడిశెట్టు పడదు. అట్టాటి శెట్టు అదీ గూడా శెట్ల మద్య శెట్టు ఎగిరి పన్నెది అంటా.. ఈ సావు మాములుదిగాదు.
ఈ మద్య భషణమయ్య వాళ్ళ శేనికాడ బాయి తవ్వంచినారంట… ఆ బాయి బలిగోరితే ఇయ్యలేదంట.. కనీసం మేకనో పోట్టేలినో ఇయ్యలేదంట అందుకని ఆయన పల్లొన్ని బలి తీసకున్నాది అని తేల్చిరి.
ఇంగా కొందరు ఇంగొక రకంగా చెప్పుకునిరి కాలం గిర్రునా తిరిగిపోయ కొన్నీ ఏండ్ల తరువాత నేను మా ఊరికి పోతి అక్కడ ఒనుం  లేదు.అయితే జాపరయ్యాకి గుర్తుగా ఓ టెంకాయ శెట్టు మసలిదై ఊగుతా కనిపిచ్చింది.
అదే ఈ కతను నడిపిచ్చింది.

-బత్తుల ప్రసాద్

prasad

సామూహిక జ్ఞాపకంతో సాహిత్యానికి కొత్త ఊపిరి!

venu

“సాంఘిక చరిత్ర వ్రాయుట కష్టము. దీని కాధారములు తక్కువ. తెనుగు సారస్వతము, శాసనములు, స్థానిక చరిత్రలు (కైఫీయత్తులు), విదేశీజనులు చూచి వ్రాసిన వ్రాతలు, శిల్పములు, చిత్తరువులు, నాణెములు, సామెతలు, ఇతర వాజ్ఞ్మయములలోని సూచనలు, దానపత్రములు, సుద్దులు, జంగము కథలు, పాటలు, చాటువులు, పురావస్తు సంచయములు – ఇవి సాంఘిక చరిత్రకు పనికి వచ్చు సాధనములు” అని సాంఘిక చరిత్రకూ సాహిత్యానికీ మధ్య సంబంధాన్ని సురవరం ప్రతాపరెడ్డి ఒక కోణం నుంచి చెప్పారు. ఆయన 1940ల చివర ప్రారంభించిన ఆ కృషి ఆ తర్వాత ఏడు దశాబ్దాలకైనా అవసరమైన స్థాయిలో, సమర్థంగా కొనసాగలేదని, కొనసాగడం లేదని గుర్తించక తప్పదు.

సాంఘిక చరిత్రకూ సాహిత్యానికీ మధ్య సంబంధం గురించి లోతుగా ఆలోచించినకొద్దీ ఆశ్చర్యకరమైన, అద్భుతమైన సంగతులెన్నో కనబడతాయి. ప్రతాపరెడ్డి చూసినట్టుగా గత సాంఘిక చరిత్ర గత సాహిత్యంలో ప్రతిఫలించిన తీరును మాత్రమే కాదు, గత సాంఘిక చరిత్ర వర్తమాన సాహిత్యంలోకి ప్రవహించగల అవకాశాన్ని, గతంలోనైనా, వర్తమానంలోనైనా ఇటునుంచి అటుగా సాహిత్యం సాంఘిక చరిత్ర మీద వేయగల ప్రభావాన్ని చూస్తే చరిత్రకూ సాహిత్యానికీ కూడ ఎన్నో కానుకలు దొరుకుతాయి, గతం, వర్తమానం, నిన్నటి సాహిత్యం, ఇవాళ్టి సాహిత్యం అనే ఈ నాలుగు భుజాల చతురస్రం లోపల ఎన్నెన్ని పరస్పర సంబంధాలకూ సమ్మేళనాలకూ వియోగాలకూ మార్పులకూ చిక్కుముడులకూ పరిష్కారాలకూ వికాసానికీ అవకాశం ఉందో ఊహిస్తే నిజంగా దిగ్భ్రాంతి కలుగుతుంది.

సాంఘిక చరిత్రకూ సాహిత్యానికీ పరస్పర అన్యోన్య సంబంధం ఉందని గుర్తించి దానితో సవ్యంగా వ్యవహరిస్తే అటు చరిత్ర రచనా ఇటు సాహిత్యమూ కూడ విస్తృతినీ లోతునూ సంతరించుకుంటాయి. సాహిత్యం నుంచి సాంఘిక చరిత్రను తవ్వితీయడానికి ప్రతాపరెడ్డి చేసిన ప్రయత్నం గురించీ, దాన్ని కొనసాగించవలసిన అవసరం గురించీ మరోసారి మాట్లాడుకుందాం గాని, ఇప్పుడు చరిత్రనుంచి సాహిత్యం ఏమి తీసుకోవచ్చునో, తీసుకుంటే ఎట్లా సంపన్నమవుతుందో, తీసుకుంటున్నదో లేదో కొన్ని ఆలోచనలు పంచుకోవడానికి ప్రయత్నిస్తాను.

సాంఘిక చరిత్ర అంటే అక్షరాస్యులకు, విద్యావంతులకు ఒక ప్రచురిత పుస్తకం అనే పరిమిత అర్థమే స్ఫురించవచ్చు గాని, అక్షరాస్యులకూ, నిరక్షరాస్యులకూ, సమాజం మొత్తానికీ అది సామూహిక జ్ఞాపకంగా, తరతరాల వివేక సంచితంగా ఉంటుంది. నిజానికి సాంఘిక చరిత్రకు ప్రతాపరెడ్డి ప్రస్తావించిన పదిహేను ఆకరాలలో ఆరు మాత్రమే లిఖిత, అక్షర ప్రమాణాలు. మిగిలినవాటికి అక్షరాస్యతతో సంబంధం లేదు. ఆయన చెప్పినవాటికి గ్రామ గాథలు, జానపదగాథలు, వీరగాథలు, చిన్నపిల్లలకు చెప్పే కథలు, మాటలు, ఆచారాలు, ఊహల మీద, ప్రగల్భాల మీద నిర్మాణమై క్రమంగా వాస్తవమేమో అనిపించేలా పెరిగి మిగిలిపోయే భ్రమలు వంటి ఎన్నిటినో కూడ కలుపుకోవలసి ఉంది. అవి వస్తురూపంలో ఉన్నా, శబ్దరూపంలో ఉన్నా, అలవాటు రూపంలో ఉన్నా అటువంటి సాంఘిక చరిత్ర ఆకరాలన్నిటినీ గ్రహించడం, వాటిని విశ్వసనీయ, మానవీయ సన్నివేశాలలో అక్షరీకరించడం సాహిత్యానికి చాల ఉపయోగపడుతుంది. ఎందుకంటే అవన్నీ మానవ ఆలోచనా ప్రపంచంలో ఆయా సమాజాలలో సామూహిక జ్ఞాపకంగా నిలిచి ఉన్నాయి. ఒక రకంగా చూస్తే సామూహిక జ్ఞాపకం ఏ ఒక్క రచయితకూ ఆపాదించడానికి వీలులేని సామూహిక రచన అనుకోవచ్చు. సరిగ్గా సాహిత్యసృజనలో లాగనే సామూహిక జ్ఞాపకంలో కూడ జరిగినది జరిగినట్టుగా కాక, నివేదికగా కాక, వడకట్టిన, జల్లెడ పట్టిన, కాలక్రమంలో మార్పుచేర్పులకు గురైన జ్ఞాపకాల రాశిగా ఉంటుంది. దానిలో వాస్తవమూ ఉంటుంది, కల్పనా ఉంటుంది. విశ్వసనీయతా ఉంటుంది, ఐంద్రజాలికతా ఉంటుంది.

1891055_10202661894681481_1753979965_n

ప్రపంచంలో సుప్రసిద్ధమైన సాహిత్య రచనలు వేటిని పరిశీలించినా అవి ఈ సామూహిక జ్ఞాపకం మీద ఆధారపడ్డాయని అర్థమవుతుంది. నిజానికి మౌఖిక సాహిత్యం మొత్తానికీ దాదాపుగా సామూహిక జ్ఞాపకమే ఇతివృత్తం. ఆ సామూహిక జ్ఞాపకం మనిషిని ఎప్పుడైనా ఆకర్షిస్తుంది గనుకనే మౌఖిక సాహిత్యానికి ఆకర్షణ ఇప్పటికీ తగ్గలేదు. కాని రాజాస్థానాల సాహిత్యం, లిఖిత సాహిత్యం క్రమక్రమంగా ఈ సామూహిక జ్ఞాపకం నుంచి దూరమై వ్యక్తి ప్రధానంగా, వ్యక్తి జ్ఞాపకంగా పెరుగుతూ వచ్చాయి. ఇవాళ వ్యక్తి ప్రధానమైన ఆధునిక సమాజపు ప్రతిఫలనంగా ఆధునిక సాహిత్యం ఆ మేరకు సామూహికత నుంచి, ముఖ్యంగా ఇతివృత్తంలో సామూహిక జ్ఞాపకం నుంచి దూరమై మిగిలింది. సామూహిక జ్ఞాపకం ఇతివృత్తాన్ని స్వీకరించి దాని మీద అభివృద్ధి చేసే అవకాశం స్వాభావికంగానే కొన్ని ప్రక్రియలకు ఎక్కువా, కొన్ని ప్రక్రియలకు తక్కువా ఉన్నదనిపిస్తుంది. సామూహిక జ్ఞాపకాన్ని వినియోగించుకో గలిగిన శక్తి ఆధునిక ప్రక్రియలలో మిగిలిన ప్రక్రియల కన్న నవలకే ఎక్కువ ఉన్నదని అనిపిస్తుంది.

ఇలా ఆలోచించినప్పుడు తెలుగు నవల ఎదగకపోవడానికి సామూహిక జ్ఞాపకం నుంచి, సాంఘిక చరిత్ర నుంచి దూరం కావడమే, తీసుకోవలసినంత తీసుకోకపోవడమే ఒక కారణం కావచ్చునా అని అనుమానం కలుగుతుంది. నవల మొత్తంగా చారిత్రక నవల కానక్కరలేదు, అప్టన్ సింక్లెయిర్ ను ఉదాహరణగా పెట్టుకుని రాశానని మహీధర రామమోహనరావు స్వయంగా చెప్పుకున్న చారిత్రక నవలల పరంపర లాంటిది కూడ అవసరం లేదు. వ్యక్తి ప్రధానమైన, కొన్ని పాత్రలే ప్రధానమైన ఏ ఇతివృత్తపు నవల అయినా సామూహిక జ్ఞాపకం దానికి జవసత్వాలను ఇవ్వగలుగుతుందని నాకనిపిస్తుంది. పాఠకులకు ఆ సామూహిక జ్ఞాపకంతో సంబంధం ఉంటుంది గనుక నవల వికసించడానికి మాత్రమే కాదు, పాఠకులు దానితో తాదాత్మ్యం చెందడానికి కూడ అది దోహదం చేస్తుంది.

సామూహిక జ్ఞాపకంలో మరొక అంశం కూడ అంతర్గర్భితంగా ఉంటుంది. ఎన్నో ఘటనలు, క్రమాలు జరిగి, ఆ ఘటనలు, క్రమాలు చరిత్రకు ఎక్కకపోయినా, గుర్తు లేకపోయినా, ఎక్కడా మౌఖికంగా గాని, లిఖితంగా గాని నమోదు కాకపోయినా వాటి అంతిమ ఫలితమైన ఒక అవగాహన, ఒక స్వభావం, ఒక అమూర్త భావన ఆ సమూహపు జ్ఞాపకంగా మిగిలి ఉంటుంది. ఒక సాహిత్య రచన ఆ స్వభావానికి సరిపోయే సన్నివేశాన్ని చరిత్రనుంచి తీసుకుని మెరుగుపెట్టినప్పుడు, లేదా ఊహాశాలితతో సృష్టించగలిగినప్పుడు ఆ సన్నివేశం నిజమైనా కాకపోయినా, పూర్తిగా కల్పనే అయినా పాఠకులు దాన్ని తమ సామూహిక జ్ఞాపకానికి ఒక నిదర్శనంగా, వ్యక్తీకరణగా చూస్తారు. తద్వారా అది పూర్తి కల్పనే అయినా విశ్వసనీయతను సంతరించుకుంటుంది. బి. ట్రావెన్, గాబ్రియెల్ గార్షియా మార్కెజ్, ఎడువార్డో గలియనో, ఇసబెల్ అయెండి, మాన్లియో అర్గెటా, ఎరియెల్ డార్ఫ్ మన్, చినువా అచెబె, గూగీ వా థియోంగో, బుచి ఎమిచిటా వంటి లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ రచయితల శక్తి తమ సమాజాలలోని సామూహిక జ్ఞాపకాలకు కళారూపం ఇవ్వడంలో, లేదా తమ రచనలలో ఆ జ్ఞాపకాలను సమర్థంగా వినియోగించుకోవడంలో ఉందనుకుంటాను.

చరిత్రనుంచీ, జీవితచరిత్రల నుంచీ కొన్ని ఉదాహరణల ద్వారా తెలంగాణ జీవితంలోని అటువంటి సామూహిక జ్ఞాపకాలు సాహిత్యానికి ఎంత మేలు చేయగలవో చూపడానికి ప్రయత్నిస్తాను. ఆధిపత్యం పట్ల ధిక్కారం, పోరాటం తెలంగాణ సామూహిక జ్ఞాపకంలో భాగం. కనీసం వెయ్యి సంవత్సరాల చరిత్రలో ఈ సామూహిక జ్ఞాపకాన్ని బలపరిచే నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, పాల్కురికి సోమన, పోతన, సర్వాయి పాపన్న, రాంజీ గోండు, తుర్రెబాజ్ ఖాన్, బందగీ, కొమురం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, షోయెబుల్లా ఖాన్ వంటి అనేక చిహ్నాలు ఈ సామూహిక జ్ఞాపకాన్ని సృష్టించాయి, పునరుత్పత్తి చేశాయి. బలోపేతం చేశాయి. ప్రత్యక్షంగా ఈ ప్రతీకలను గాని, ఈ ప్రతీకల ద్వారా వ్యక్తమైన ధిక్కార భావనను గాని ఇతివృత్తంగా తీసుకునే సాహిత్యానికి తప్పనిసరిగా ఆదరణ ఎక్కువగా ఉంటుంది.

పైన చెప్పిన సామూహిక జ్ఞాపకపు ప్రతీకలన్నీ సుప్రసిద్ధమైనవే, ఇటీవలి కాలంలో మళ్లీ మళ్లీ స్మరణకు వచ్చినవే. కాని తెలంగాణ చరిత్ర సూక్ష్మంగా అధ్యయనం చేస్తున్నప్పుడు ఇటువంటి మరెన్నో ఘటనలు, పరిణామాలు, ప్రతీకలు ఉన్నాయని స్పష్టమయింది.

ఉదాహరణకు పాలకుర్తి గ్రామాన్ని తీసుకొండి. పాల్కురికి సోమన ఆ గ్రామం నుంచి వచ్చి శివకవిగా, ప్రచారకుడిగా, సామాజిక చింతకుడిగా తన కాలం కన్న చాల ముందుకు చూశాడు. మార్గ సంప్రదాయాన్ని ధిక్కరించి దేశి పద్ధతి చేపట్టాడు. ఉరుతర గద్య పద్యోక్తులను, సంస్కృత సమాస భూయిష్ట రచనను తిరస్కరించి జానుతెనుగులో, ద్విపదలో రచించాడు. అప్పటికి ఉన్న ఆనవాయితీని కాదని బసవపురాణం రాశాడు. జాతిభేదాన్ని, స్త్రీపురుష భేదాన్ని, కులగోత్రాలను, కలిమిలేములను గుర్తించని వీరశైవాన్ని అనుసరించాడు. ఆయన జీవితకాలంలో ఒక చాకలి స్త్రీకి శివదీక్ష ఇచ్చాడని ఆధారాలున్నాయి. అదే గ్రామంలో ఏడు వందల సంవత్సరాల తర్వాత ఒక చాకలి స్త్రీ దొరతనాన్ని ధిక్కరించడం సంబంధం లేనిదనీ, యాదృచ్ఛికమనీ అనిపించవచ్చు గాని నేను దాన్ని సామూహిక జ్ఞాపకపు పునరుత్పత్తి అనుకుంటాను. సోమన ధిక్కారం భాషలో, సాహిత్యంలో, సంస్కృతిలో, మతాచారాలలో జరిగితే, ఐలమ్మ ధిక్కారం భూమి మీద, శ్రమ ఫలితం మీద, అధికారం మీద, చట్టం మీద జరిగింది. ఈ రెండు ధిక్కారాలూ వేరువేరు అనుకునే దృక్పథం కూడ ఉంది గాని, నా ఉద్దేశంలో ఈ రెండూ పరస్పరాశ్రితాలు. సోమన ధిక్కారాన్ని బలోపేతం చేయగలిగిందీ, అర్థవంతం చేయగలిగిందీ, సుస్థిరం చేయగలిగిందీ ఐలమ్మ ధిక్కారమే. ఈ అన్యోన్య సంసర్గం, ఇంత సుదీర్ఘకాలపు కొనసాగింపు తప్పనిసరిగా సాహిత్యానికి అద్భుతమైన ముడిసరుకు అవుతుంది.

అలాగే కడివెండి గ్రామాన్ని చూడండి. విసునూరు రామచంద్రారెడ్డి అధీనంలోని గ్రామంగా, కర్కోటకురాలని పేరు తెచ్చుకున్న ఆయన తల్లి స్వయంగా పాలించిన గ్రామంగా ఆ ఊరు సహజమైన ప్రతిఘటనను ప్రకటించింది. ఆ ప్రతిఘటన క్రమంలో తగినంత మిగులులేని గ్రామ రైతుల దగ్గరినుంచి బలవంతంగా వసూలు చేస్తున్న యుద్ధపు లెవీ, గుమ్ములు పొర్లిపారుతున్న దొర గడీకి ఎందుకు వర్తించదని ప్రశ్న తలెత్తింది. ఆ ప్రశ్న ఊరేగింపు రూపం ధరించింది. ఆ ఊరేగింపు మీద కాల్పులలో దొడ్డి కొమరయ్య మరణించాడు. ఆ తర్వాత ఆరు దశాబ్దాలకు అదే గ్రామానికి చెందిన పైళ్ల వెంకటరమణ గాని, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి గాని మరొక ఐదారుగురు గాని మరొక ప్రజావిముక్తి సమరంలో అటువంటి ప్రశ్నలే వేసి ప్రాణత్యాగాలు చేశారు. ధిక్కార, త్యాగ చరిత్ర ఆ గ్రామపు సామూహిక జ్ఞాపకంలో మాత్రమే కాదు, మొత్తంగానే ఈ ప్రాంతపు, తెలంగాణ సామూహిక జ్ఞాపకంలో, సాంఘిక చరిత్రలో భాగమైంది. ఇది సాహిత్యంలోకి అనువాదమైతే ఎంత రోమాంచకారి ప్రభావం కలగజేయగలుగుతుంది!

ఇలా వెతుకుతూ పోవాలే గాని, తెలంగాణ చరిత్ర నిండా, ఆమాటకొస్తే ఎక్కడైనా ప్రజల చరిత్ర నిండా ఎన్నెన్నో అద్భుతమైన ఘటనలు, పరిణామాలు దొరుకుతాయి. ఆ సామూహిక జ్ఞాపకాన్ని, సాంఘిక చరిత్రను తవ్వితీసి సాహిత్యరూపం ఇవ్వడం సాహిత్యకారుల బాధ్యతలలో ఒకటనుకుంటాను. ఈ తవ్వితీయడానికి గనులుగా ప్రతాపరెడ్డి చెప్పిన ఆకరాలు మాత్రమే కాదు, మరెన్నో ఆకరాలున్నాయి.

వరంగల్ లో భాగమైన వడ్డెపల్లి భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చి సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాగా ఎదిగిన పింగళి జగన్మోహన రెడ్డి తన ఆత్మకథలో ఒక ఉదంతం రాశారు. అది తన ముత్తాత కాలం నాటిదని, అందువల్ల దానిలో వాస్తవం ఎంతో చెప్పలేమని ఆయనే రాశారు. హనుమకొండలో ఇప్పటికీ రాగన్న దర్వాజ అనే పేరుతో ఒక ప్రాంతం ఉంది. ఆ రాగన్న జగన్మోహనరెడ్డికి పూర్వీకుడు. ఆ రాగన్నను హత్య చేసిన నేరం మీద ఒక వ్యక్తికి మరణశిక్ష విధించారట. ఆ శిక్ష అమలు చేయబోయే సమయానికి ఆ వ్యక్తి తమ్ముడు వచ్చి, ‘మా అన్న భార్యాబిడ్డలు ఉన్నవాడు. మరణశిక్ష అమలుచేస్తే వాళ్లు దిక్కులేనివారైపోతారు. నాకు వెనుకాముందూ ఎవరూ లేరు. అందువల్ల మా అన్నకు వేసిన శిక్షను నాకు బదిలీ చేసి, నన్ను ఉరితీయండి’ అని కోరాడట. నిజంగానే ఆ తమ్ముడికే శిక్ష అమలు చేశారట. వాస్తవం కల్పన కన్న అద్భుతంగా ఉంటుందనడానికి ఇంతకన్న నిదర్శనం ఉంటుందా?

తెలంగాణ చరిత్రకు సంబంధించి ఇటువంటి ఆశ్చర్యకరమైన, అద్భుతమైన ఘటనల వనరులలో ‘హైదరాబాద్ అఫెయిర్స్’ ఒకటి. అసలు ఆ ‘హైదరాబాద్ అఫెయిర్స్’ కథే తెలుసుకోవలసిన కథ. హైదరాబాదు రాజ్యంలో పందొమ్మిదో శతాబ్దం చివరిలో జరిగిన విశేషాలగురించిఅప్పటి పత్రికలలో వచ్చిన వార్తలన్నిటినీ నిజాం ప్రభుత్వంలో ఆర్థిక కార్యదర్శిగా ఉండిన మౌల్వీ సయ్యద్ మహదీ అలీ ‘హైదరాబాద్ అఫెయిర్స్’ పేరుతో పన్నెండో, పదమూడో పెద్ద సంపుటాలుగా సంకలనం చేసి 1880లలో ప్రచురించాడు. అవి ఫూల్ స్కేప్ సైజులో ఒక్కొక్కటి మూడు వందల పేజీల నుంచి తొమ్మిది వందల పేజీల దాకా ఉంటాయి. ఆ సంపుటాలు చదువుతుంటే నూట యాభై సంవత్సరాల వెనుకటి హైదరాబాద్ రాజ్యం, సమాజం, పాలన, సంస్కృతి కళ్లముందర కదలాడుతాయి. (అయితే దురదృష్టమేమంటే అన్ని సంపుటాలూ ఒక్కచోట ఇంతవరకూ నేను చూడలేకపోయాను. బ్యూరో ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లోనూ, డిస్ట్రిక్ట్ గెజెటీర్స్ కార్యాలయంలోనూ చాల సంపుటాలు ఉండేవి. ఇప్పుడు మొదటి దాంట్లో అన్నీ లేవు, రెండో కార్యాలయమే లేదు. ఇక్కడ కనబడని సంపుటాలు కొన్ని నాకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ గ్రంథాలయంలో కనబడ్డాయి గాని అవి ఫొటోకాపీ చేయించుకోవడం కుదరలేదు. ఆ తర్వాత చార్మినార్ దగ్గర ఒక అద్భుతమైన పాత పుస్తకాల ఫోటోకాపీల అమ్మకందారు దగ్గర ఆరేడు సంపుటాలు సంపాదించాను గాని అన్నీ దొరకలేదనే లోటు అలాగే ఉంది.) ఆ సంపుటాలు తెలంగాణ సాంఘిక చరిత్ర గురించి ఎన్నో అరుదైన, ఆశ్చర్యకరమైన విషయాలను, సాహిత్యంలోకి పరావర్తనం చెందగల, ప్రతిఫలించడానికి అవకాశం ఉన్న విషయాలను ఇస్తాయి. అవన్నీ ఏదో ఒక స్థాయిలో మన సామూహిక జ్ఞాపకంలో భాగమయ్యాయనే అనుకుంటాను. ఇక్కడ మచ్చుకు ఒకటి చెపుతాను:

కలకత్తా నుంచి వెలువడుతుండిన ఇంగ్లిష్ మన్ పత్రికలో 1859లో వచ్చిన వార్త ప్రకారం హనుమకొండకు పన్నెండు కోసుల దూరంలో రూపా అనే ఒక లంబాడీ పెద్ద మరొక తండా పెద్దతో వచ్చిన ఘర్షణలో ఆయననూ, ఆయన కుటుంబ సభ్యులనూ మొత్తం ముప్పైతొమ్మిది మందిని నరికేశాడట. ఆ నేరానికి నిర్బంధించి న్యాయస్థానానికి తీసుకొచ్చినప్పుడు, “నాకూ మా అన్నకూ తగాదా వచ్చి నేను ఆయనను చంపేస్తే విచారించడానికి మధ్యలో ఈ అదాలత్ ఎవరు? శిక్ష విధించడానికి సర్కారు ఎవరు? నేనేమన్నా సర్కారు సొమ్ము తిన్నానా? దోపిడీ చేశానా” అని అడిగాడట.

ఇది చదివినప్పుడు నాకు సరిగ్గా ఇటువంటి జ్ఞాపకాలనే లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ సాహిత్యకారులు ఎలా కాల్పనీకరించి, అద్భుతమైన దృశ్యాలుగా, ఆలోచనాస్ఫోరకమైన సన్నివేశాలుగా మలిచారుగదా అనిపించింది.

చిట్టచివరిగా, ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంలో తెలంగాణ ప్రజల స్వాభిమానాన్ని వ్యక్తీకరించే సాహిత్య రూపాలు విరివిగా వెలువడుతున్నాయి. నిజానికి ప్రత్యేక రాష్ట్ర వాంఛ తెలంగాణ ప్రజల స్వాభిమాన కాంక్షకు ఒకానొక వ్యక్తీకరణ మాత్రమే. సాంఘిక చరిత్రలో కొంచెం వెనక్కి వెళితే, 1950లో రైతాంగ సాయుధ పోరాట ప్రాంతాలలో పర్యటించిన అమెరికన్ విలేఖరి తాయా జింకిన్ ఒక జీపు డ్రైవర్ మాటల్లో వెలువడిన ఆనాటి ఆకాంక్షను నమోదు చేసింది. నువ్వే ప్రభుత్వమైతే ఏం చేస్తావు అని ఆమె అడిగిన ప్రశ్నకు ఆ డ్రైవర్ “జనానికి బాగా అప్పులిస్తాను. బోలెడన్ని బళ్లూ ఆస్పత్రులూ కట్టిస్తాను. దున్నేవాడికే భూమి పంపిణీ చేస్తాను. ఉర్దూ రద్దు చేస్తాను. తెలుగువాళ్లను అధికారులుగా నియమిస్తాను. గ్రామాల రక్షణకు స్వచ్ఛంద సాయుధ దళాలను ఏర్పాటు చేస్తాను…” అన్నాడట. ఈ కోరికలలో రెండిటిని ఇప్పుడు సవరించుకోవలసిన అవసరం ఉందేమో గాని, మౌలికంగా మిగిలిన కోరికలకు కాలం చెల్లలేదు. ఆరున్నర దశాబ్దాల తర్వాత కూడ వాటిలో ఏ ఒక్కటీ తీరలేదు.

గతమూ వర్తమానమూ జ్ఞాపకమూ జీవితమూ కలగలిసిన సమాజం ఇది. ఈ చరిత్రనూ, సామూహిక జ్ఞాపకాన్నీ, ఊహనూ అద్భుతమైన సృజనగా రసాయనిక సంయోగం సాధించగల గాబ్రియెల్ గర్సియా మార్కెజ్ వంటి సృజనకర్త కోసం ఈ నేల ఎదురుచూస్తున్నదనుకుంటాను.

-ఎన్. వేణుగోపాల్

చిత్రం: అన్నవరం శ్రీనివాస్

బాగా చిన్నప్పుడు ..భలేగా ఉండేది కాబోలు!

నా చిన్నప్పటి ఫోటో

నా చిన్నప్పటి ఫోటో

వారం, పది రోజుల పాటు ఎంత బుర్ర గోక్కున్నా, గీక్కున్నా నాకు పదేళ్ళ వయస్సు దాకా జరిగిన సంఘటనలు గుర్తుకు రావడం అంత తేలిక కాదు అని తెలిసిపోయింది. ఇక మెదడులో సరుకుని పూర్తిగా నమ్ముకుంటే లాభం లేదు అనుకుని ఆధారాలు ఏమైనా దొరుకుతాయా అని వెతికితే అలనాటి ఫోటోలు మూడంటే మూడే దొరికాయి. ఇందులో నా అత్యంత చిన్నప్పటి ఫోటో ఈ క్రిందన పొందుపరిచాను. ఇది ఖచ్చితంగా మా పెద్దన్నయ్యే తీసి ఉంటాడు. అప్పుడు నాకు రెండు, మూడు ఏళ్ళు ఉంటాయేమో….గుర్తు లేదు. కానీ ఫోటో చూడగానే “భలే క్యూట్ గా “ ఉన్నాను సుమా అని ఇప్పటి వాడుక మాటా”, “చంటి వెధవ ముద్దొస్తున్నాడు సుమా” అని ఆ రోజుల నాటి ప్రశంసా నాకు నేనే చెప్పుకున్నాను.

ఆ రోజుల్లో యావత్ కాకినాడ నగరం మొత్తానికి బహుశా పదో, పదిహేనో “డబ్బా” కెమెరాలు ఉండి ఉంటాయి. కలర్ ఫోటోలు, విడియోలు, టీవీలు, కంప్యూటర్లు వగైరా వస్తువులే కాదు, ఆ పదాలే ఆంద్రులకి, ఆ మాట కొస్తే భారతీయులకే తెలియవు. “అప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న కంప్యూటర్ పవర్ అంతా కలిపితే ఈ నాడు ఒక చిన్న పిల్లాడు ఆడుకునే బొమ్మ లో ఉంది” అని నేను పుట్టిన సంవత్సరం గురించి ఎక్కడో చదివి సిగ్గు పడ్డాను. నమ్మండి, నమ్మక పొండి, సరిగ్గా నేను పుట్టిన నాడే జపాన్ వాళ్ళు చేతులెత్తేసి, అమెరికాతో యుద్ధ విరమణ ఒప్పందం మీద సంతకాలు పెట్టేసి రెండవ ప్రపంచ యుద్ధం అంతం చేశారు. బహుశా ఈ “క్యూట్” ఫోటో తీసిన ఏడే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ ఎప్పటికీ నా వయస్సు పదహారే!

ఇది కాక మరొక ఫోటో కూడా ఉంది. అది కూడా ఇక్కడ జత పరుస్తున్నాను. కానీ ఇందులో ఉన్న పిల్లాడు నేనో, మా తమ్ముడో (ఆంజి అనబడే హనుమంత రావు, కేలిఫోర్నియా నివాసి) ఖచ్చితంగా తెలీదు. కవల పిల్లలం కాక పోయినా, అలాగే పెరిగాం కాబట్టి మా ఇద్దరిలో ఎవరైనా పరవా లేదు కానీ ఆ ఫోటో ఉన్నది నేనే అవడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం రెండు ఫొటోలలోనూ ఆ మెడలో ఉన్న మూడు పేటల చంద్ర హారం. మా అమ్మ ఎప్పుడూ ఆ హారం వెయ్యకుండా నన్ను ఎక్కడికీ పంపించేది కాదుట. మరొక క్లూ ఏమిటంటే ఆ పక్కన నుల్చున్న అమ్మాయి మటుకు మా “దొంతమ్మూరు బేబీ” యే.

దొంతమ్మూరు బేబీతో

దొంతమ్మూరు బేబీతో

నా వయసుదే అయిన ఆ అమ్మాయి అసలు పేరు “వెంకట రత్నం” అని బహుశా తనకి కూడా గుర్తు ఉంది ఉండదు ఎందుకంటే ఇప్పటికీ తనని అందరూ “బేబీ” అనే పిలుస్తారు. ఈ బేబీ మా మూడో మేనత్త కుమార్తె బాసక్క (వరసకి వదిన కానీ బాసక్క అనే పిలిచే వాళ్ళం) పెద్ద కూతురు. పిఠాపురం లో రాయవరపు వారి దౌహిత్రురాలు అయినప్పటికీ బేబీ పుట్టుక, పెంపకం అన్నీ కాకినాడలో మా ఇంట్లోనే జరిగాయి. చిన్నప్పటి నుంచీ కలిసి మెలిసి పెరిగిన మేం ఇద్దరం ఐదో తరగతి దాకా ఒకటే క్లాసు లో చదువుకున్నాం. అందుచేత మా ఇద్దరికీ కలిపి ఒక ఫొటో మా పెద్దన్నయ్య తీసి ఉంటాడు. ఈ ఫోటోలో కూడా ‘చతికిల పడినా క్యూట్” గా ఉన్నాను అనే అనుకుంటున్నాను.

 

నా పుట్టువెంట్రుకలు

నా పుట్టువెంట్రుకలు

ఇక నాకు ఏ మాత్రం గుర్తు లేక పోయినా, నా చిన్నప్పటి ఫోటోలలో చాలా అపురూపమైనది నా పుట్టువెంట్రుకల నాటి ఫోటో. ఆ “పండగ” మా తాత గారు బతికుండగానే జరిగింది. అప్పుడు నా వయసు ఐదారేళ్ళు ఉండ వచ్చును. నా వెనకాల నుంచున్నది మా అక్క మాణిక్యాంబ. మా అక్కకి ఒక పక్కన ఉన్నది మా అమ్మమ్మ బాపనమ్మ, రెండో పక్కన మా రెండో మేనత్త హనుమాయమ్మ గారు. వారిద్దరి తోటీ నాకున్న ఏకైక ఫోటో ఇదే! ఇక నాకు “మొదటి క్షవరం “ చేస్తున్న వాడు మా ఆస్థాన మంగలి రాఘవులు. కాకినాడలో ఎవరికీ క్షవర కల్యాణం కావాసి వచ్చినా, పండగలూ, పబ్బాలకీ రాఘవులు దొంతమ్మూరు గ్రామం నుంచి రావలసినదే! బహుశా 1950-51 నాటి ఆ ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను. ఇలాంటిదే మరొక ఫోటో కూడా ఉండేది కానీ ఇప్పుడు కనపడడం లేదు. అందులో వెనకాల మా తాత గారు చుట్ట కాల్చుకుంటూ నా పుట్టు వెంట్రుకల పండగ చూస్తూ ఉంటారు.

ముందే మనవి చేసుకున్నట్టు, ఏవేవో పండగలు, పురుళ్ళు, వ్రతాలు, వచ్చే పోయే బంధువులతో ఇల్లంతా ఎప్పుడూ హడావుడిగా ఉండేది అని తప్ప నాకు పదేళ్ళ లోపు జ్జాపకాలు ఎక్కువ లేవు. అలా గుర్తు చేసే ఆధారాలూ ఎక్కువ లేవు. ఆఖరికి నాకు అక్షరాభ్యాసం జరిగిన సంగతి కూడా గుర్తు లేదు కానీ నేను ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ చదువుకున్న “ఆనంద పురం ఎలిమెంటరీ స్కూలు” వివరాలు బాగానే గుర్తున్నాయి. ఆ స్కూలు గాంధీ నగరం పార్కుకి నైరుతి వేపు ఎల్విన్ పేట లో ఉంది. మా ఇంటి నుంచి రోడ్డు మీద నడిచి వెడితే పదిహేను నిముషాలు పడుతుంది కానీ, మా చిన్నప్పుడు ఎదురుగుండా గిడ్డీ గారి సందు లో, మా భాస్కర నారాయణ మూర్తి తాతయ్య గారి ఖాళీ స్థలం (కపిలేశ్వరపురం జమీందారులు, రాజకీయ ప్రముఖులు ఎస్..పి.బి.పి పట్టాభి రామారావు & సత్యనారాయణ రావు ల ఇంటి వెనకాల) ,     ప్రహరీ గోడ మధ్య కన్నం లోంచి దూరి వెడితే ఐదు నిముషాలు మాత్రమే పట్టేది.

నేనూ, ఆంజీ, బేబీ ప్రతీ రోజూ, బిల బిల లాడుతూ, కబుర్లు చెప్పుకుంటూ హాయిగా స్కూలికి వెళ్ళేవాళ్ళం. ఎప్పుడూ “నేను వెళ్ళను” అని భీష్మించుకుని కూచున్నట్టు అంతగా జ్జాపకం లేక పోయినా, కొన్ని సందర్భాలలో మా “సున్నారాయణ” గాడు బలవంతాన భుజాల మీద మోసుకుని స్కూల్ లో నేల మీద కూచోబెట్టినట్టు లీలగా గుర్తు ఉంది ఇప్పటికీ. నా ఐదో ఏట 1950 లో ఆ “ఆనంద పురం పురపాలక ప్రాధమిక పాఠశాల లో ఒకటో తరగతిలో ప్రవేశించి, ఐదో తరగతి దాకా చదువుకున్నాను.

ఆనందపురం ఎలిమెంటరీ స్కూల్

ఆనందపురం ఎలిమెంటరీ స్కూల్

అవును…..అప్పుడు ఆ స్కూల్ లో బెంచీలు లేవు. రెండు గదులు. రెండు వరండాలు. అంతే! వెనకాల అంతా ఇసక పర్ర. ఒకటి నుంచి ఐదో తరగతి దాకా అందరూ నేల మీదే కూచుని చదువుకోవల్సినదే! అత్యంత విచారకరం ఏమిటంటే, ఇప్పుడు పరిస్థితి అంత కంటే అన్యాయం గా ఉంది. ఇప్పటికీ అందరూ నేల మీద కూచునే చదువు కుంటున్నారు. అది తప్పు అని కాదు కానీ ఆ చిన్న భవనమూ, మొత్తం వాతావరణం ఇప్పుడు దయనీయంగా ఉంది అని ఇటీవల నేను కాకినాడ వెళ్లినప్పుడు గమనించిన విషయం. ఇటీవల నేను తీసుకున్న రెండు ఫోటోలు ఈ క్రింద పొందుపరిచాను. ఒకటి ఇప్పటి హెడ్ మాస్టర్ సుబ్బారెడ్డి గారూ, కొందరు పిల్లలతో. ఇంకొకటి నేను స్కూలు గుమ్మం దగ్గర భయం, భయం గా నుంచొని ఉన్న ఫోటో.

ఇప్పటి సంగతి నాకు తెలియదు కానీ, మా చిన్నప్పుడు ఆ ప్రాధమిక పాఠశాల లో టీచర్లు అందరూ క్రిస్టియనులే! దీనికి బహుశా ఎల్విన్ పేట లో ఒక చర్చి ఉండడం , ఆ పేటలో క్రైస్తవ జనాభా ఎక్కువ ఉండడం ప్రధాన కారణం. పైగా అందరూ ఆడవాళ్లే. అందరి పేర్లూ మేరీ, సుగుణ, కరుణ లాంటివే! మేం అందరం “జాని జోకర్ బజా, బజాతా, రీ,రీ, రీ,రీ సితార్ బజాతా”, “జాక్ అండ్ జిల్ వెంటప్ ది హిల్” లాంటి పాటలు ఎంతో హుషారుగా నేర్చుకునే వాళ్ళం. “వందే మాతరం” ఇంచు మించు జాతీయ గీతం స్థాయి పాటలా ప్రతీ రోజూ పాడే వాళ్ళం.

దసరా సమయంలో “పప్పు బెల్లాలకి” లోటుండేది కాదు. రిపబ్లిక్ డే కి, స్వాతంత్ర్య దినోత్సవానికి మ్యునిసిపల్ ఆఫీసు ప్రాంగణంలో జండా వందనం తరువాత బిళ్ళలకీ లోటు ఉండేది కాదు. “ఆ గిడ్డీ వెధవ” ని –అంటే కిరస్తానీ వాడిని అనమాట ….తోటలోకి తప్ప ఇంట్లోకి రానివ్వకండిరా అని ఎప్పుడైనా మా ఇంట్లో ఎవరైనా అరిచినా, ఎవ్వరూ లక్ష్యపెట్టే వారు కాదు. ఎటువంటి మత, కుల తారతమ్యాలూ అంటని ఆ వయసు అటువంటిది. మనిషి ఎదిగిన కొద్దీ కుల, మత కల్మషం పెరుగుతుందేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నమ్మండి, నమ్మక పొండి, నా మటుకు నాకు అమెరికా వచ్చే దాకా ఈ కులాల ప్రభావం, ప్రాంతాల ప్రాబల్యం మన వారిలో ఇంత ప్రస్ఫుటంగా జీర్ణించుకు పోయింది అని తెలియ లేదు. ఇప్పుడు తెలిసినా చెయ్యగలిగింది ఏమీ లేదు అని కూడా తెలిసింది.

ఆనందపురం ఎలిమెంటరీ స్కూల్ హెడ్  మాస్టర్ తో

ఆనందపురం ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ తో

ఆఖరి అంశంగా ….నాతో సహా, ఆ రోజు చూసిన వాళ్ళందరికీ ఇంకా కళ్ళకి కట్టినట్టు ఉన్నదీ, చూడని వాళ్ళకి కళ్ళకి కట్టినట్టు చూసిన వాళ్ళు వర్ణించి పదే, పదే చెప్పి నవ్వుకునేది నా బాగా చిన్నప్పుడు కేవలం ఐదు నిముషాలలో అయిపోయిన ఒక దీపావళి పండగ. అప్పుటికి మా తాత గారు, బామ్మ గారు బతికే ఉన్నారు. నాకు మహా అయితే ఆరేళ్ళు ఉంటాయి కానీ ఆ దీపావళి ఇంకా జ్జాపకమే! యధాప్రకారం మా అన్నయ్యలు, స్నేహితులు ఇంట్లోనే ఒక నెల పాటు చిచ్చుబుడ్లు, మతాబాలు, తారా జువ్వలు తయారు చేసే వారు. అవి తయారు చేసే పద్ధతీ, కావలసిన వస్తువులు అన్నీ మా తాత గారి స్వహస్తాలతో ఉన్న ఒక పెద్ద తెలుగు పుస్తకంలో ఉండేవి.

నేను పెద్దయ్యాక కూడా కొనసాగిన ఆ తయారీలో రసాయనాలు, వస్తువులలో నాకు బాగా గుర్తున్నవి భాస్వరం, పచ్చ గంధకం, బొగ్గు, సూర్యాకారం, అభ్రకం ముక్కలు, గన్ పౌడర్, ఎర్ర పువ్వులు రావడానికి రాగి రవ్వ, ఇనప రవ్వ, జిల్లేడు బొగ్గు, ఆముదం, జిగురులావాడే మెత్తటి అన్నం, చిన్న, చిన్న ముక్కలుగా చింపేసిన చెత్త కాగితాలు, న్యూస్ పేపర్లు మొదలైనవి. ఆ రోజు ఇంట్లో చేసినవి కాకుండా బజారు నుంచి ఇంట్లో చెయ్య లేని, చెయ్యనివ్వని టపాసులు, సిసింద్రీలు, కాకర పువ్వొత్తులు ఇంటి నిండా ఉన్న యాభై మంది చిన్నా, పెద్ద లకీ సరిపడా బాణ సంచా సామగ్రి కొనుక్కొచ్చారు. వీటిల్లో బాంబులు, తారాజువ్వల లాంటి యమా డేంజరస్ సామాగ్రి పిల్లలకి అందకుండా ఎక్కడో దూరంగా పెట్టి, మిగిలిన సరదా మందు గుండు సామాగ్రి అంతా మా తాత గారు కూచునే నవారు మంచం క్రింద జాగ్రత్తగా పేర్చి పెట్టారు. అక్కడికి దగ్గరగా పది, పదిహేను బిందెలలో నీళ్ళు తోడి రెడీగా ఉంచారు ప్రతీ దీపావళి కీ లాగానే!

ఇక పిల్లలు అందరూ వత్తులు కట్టిన గోంగూర కట్టలు తీసుకుని, వత్తులు వెలిగించి, “దిబ్బూ, దిబ్బూ, దీపావళీ” అని నేల కేసి మూడు సార్లు కొట్టి వత్తులు ఆర్పేసి మా తాత గారి దగ్గరకి పరిగెట్టగానే ఆయన ఒక మతాబా యో, కాకర పువ్వోత్తో వాళ్ళ సైజు ని బట్టి ఇచ్చే వారు. అందరిలోకీ అగ్ర తాంబూలం అప్పటికీ, ఇప్పటికీ మా అక్కదే. మా అక్కని “అమ్మరసు” అనీ “చిన్న అమ్మరసు” అనీ పిలిచే వారు. పదేళ్ళ మా అక్క వెళ్ళగానే మా తాత గారు ఒక మతాబా ఇచ్చారు. అది వెలిగించి మహోన్నతంగా, అత్యంత మనోహరంగా వెదజల్లుతున్న ఆ పువ్వుల మతాబాని మా అక్క అనుకోకుండా, ఏదో అంటూ మళ్ళీ మా తాత గారి మంచం దగ్గరకి వెళ్లింది…అంతే……ఆ నిప్పు రవ్వలు మంచం కింద పెట్టిన మొత్తం దీపావళి సామాగ్రి మీద పడి అన్నీ ఒకే సారి అంటుకుని మంటలు, పేలుళ్లు, సిసింద్రీలు పరిగెట్టడాలు… ఒకటేమిటి అన్ని రకాల వెలుగులూ, చప్పుళ్ళతో అంతా అరక్షణం పట్ట లేదు…దీపావళి హడావుడికి.

అప్పటికే ఎనభై ఐదేళ్ళ మా తాత గారు మంచంమీద నుంచి చెంగున గంతేసి ఆయన గది లోకి పరిగెట్టారు. మా చిట్టెన్ రాజు బాబయ్య, హనుమంత రావు బావ, మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య మిగిలిన పెద్ద వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బిందె తీసుకుని మంచం క్రిందకి నీళ్ళు విసిరేసి మొత్తానికి మంటలు అదుపు లోకి తెచ్చారు. ఆ ఏడు మొత్తం దీపావళి పండుగ అంతా ఐదు నిముషాల లోపే అయిపోయింది. మా కుటుంబంలో ఎప్పుడైనా అందరం కలుసుకున్నప్పుడు దీపావళి టాపిక్ వస్తే ఈ అంశం అందరం తల్చుకుని నవ్వుకుంటూ ఉంటాం.

అన్నట్టు “అమ్మరసు” అనే ఆ తెలుగు పిలుపు, అందులోని ఆప్యాయత అంటే ఎంత ఇష్టమో. మా అక్క “చిన్న అమ్మరసు” ఎందుకు అయిందంటే .. …మా ఆఖరి మేనత్త రెండో కూతురుని “పెద్దాపురం అమ్మరసు” అనీ పెద్దమ్మరసు” అనీ పిలిచే వారు. అసలు పేరు నాకు తెలియదు కానీ నేను నా చిన్నప్పుడు ….నవంబర్ 19, 1953 నాడు “అమ్మరుసొదిన” పెళ్ళికి పెద్దాపురం వెళ్లాను. నాకు భలేగా గుర్తున్న ఆ పెళ్లి జ్జాపకాలూ, పెళ్లి మేళం (???) గురించీ మరో సారి వివరిస్తాను…..

– వంగూరి చిట్టెన్ రాజు

వెబ్‌ పత్రికలతో ఒక బెంగ తీరింది, కానీ…!

samvedana logo copy(1)

 

సీరియస్‌ సాహిత్యాన్ని ప్రచురించే పత్రికలు తగ్గిపోయాయి అనే మాట తరచుగా వినిపిస్తున్నది. కథలు రాస్తాం సరే, వేదిక ఏదీ అని ఆందోళన వ్యక్తమవుతున్నది. కథకుల సమావేశాల్లో ఈ సమస్య గురించి చర్చ జరుగుతున్నది. ఆ లోటు తీర్చడానికి వెబ్‌ మ్యాగజైన్లు వచ్చేశాయి. పత్రికల్లో వచ్చిందాంతో సమానం కాదు అనే మాట ఉండనే ఉంటుంది. అది వేరే సంగతి.

వెబ్‌ మ్యాగజైన్లు వస్తూ వస్తూ చాలామంది కొత్త రచయితలను వెంట తీసుకొచ్చాయి. కొన్ని పాత బెంగలను తీర్చేశాయి. తెలుగు చచ్చిపోతోందని కొందరు రచయితలు బోలెడంత ఆవేదన చెందేవాళ్లు. తమ బాధను ప్రపంచం బాధ చేయడానికి విశ్వప్రయత్నం చేసేవాళ్లు. కొత్త తరంలో సాహిత్యం రాసేవాళ్లే లేరని ‘మన’ తరంతోనే ఈ సాహిత్య వ్యాసంగం చచ్చిపోతుందేమో అని ఆందోళన వ్యక్తమయ్యేది. ముఖ్యంగా సింగమనేని నారాయణ లాంటి పెద్దమనుషులయితే రేపట్నించే తెలుగు మాయమైపోతుందేమో, మన గోడు పంచుకోవడానికి మనుషులను వెతుక్కోవాలేమో అన్నంత దిగులు అందరికీ పంచేవారు. ఆ బెంగను  వెబ్‌ మ్యాగజైన్లు తీర్చేశాయి.

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల మీద బోలెడన్ని అపోహలుండేవి. ఐటి అనగానే తాగుడు, తినుడు, తిరుగుడు అని తా గుణింతం ఒకటి తెలుగులోకంలో ప్రచారంలో ఉండేది. వాళ్లు ఏమీ చదవరని, తమ తీపి బాధలు తప్ప ప్రపంచం బాధలు పట్టవని, వాళ్లవల్లే తెలుగునేల మీద తెలుగుదనం అంతరిస్తోందని ప్రచారం సాగుతుండేది. వెబ్‌ మ్యాగజైన్లు వచ్చాక ఈ అపోహను యథాతథంగా ప్రచారం చేసే అవకాశం పోయింది.

అంతకుముందు పత్రికల్లో కూడా అడపా దడపా సాఫ్ట్‌వేర్‌ రచయితలు కనిపించినా ఇపుడు కొత్త తరం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ వారితో పాటు చాలా రంగాల్లో పనిచేస్తున్న యువత సాహితీ ప్రపంచంలోకి దూసుకొస్తున్నది.

కాకపోతే ఏ మార్పు అయినా సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా రాదు. అతి విస్తరణ, ఏం చెప్పాలనుకుంటున్నారో స్పష్టత లేకపోవడం అనే ముఖ్యమైన సమస్యలైతే ఉన్నాయి. రెండోది చాలా లోతైన వ్యవహారం.రచయితల ఎక్స్‌పోజర్‌ దగ్గర్నుంచి మన చుట్టూ ఉన్న సామాజిక వాతావరణం దాకా చాలా అంశాలతో ముడిపడిన వ్యవహారం. సాహిత్యంపై లెఫ్ట్‌-లిబరల్‌ ప్రభావం పలుచబడడం స్పష్టంగా కనిపిస్తున్నది.

కేవలం సాహిత్యానికే పరిమితం కానటువంటి విస్తృతమైన రాజకీయార్థిక కోణాలున్నటువంటి ఆ సమస్యను పక్కనబెట్టి తొలి సమస్య వరకే పరిమితమవుదాం. స్థలానికి సంబంధించిన నియంత్రణ లేకపోవడం అనేది ఒక అర్థంలో రచనకు అవసరమే కావచ్చు. కథ ఇన్ని పేజీలే ఉండాలంటే ఎలా, సృజనకు హద్దులు గీస్తారా అనే హూంకారంలో కొంత న్యాయముండొచ్చు. ప్రశ్నలో న్యాయం కనిపించినంత మాత్రాన ప్రతి ప్రశ్న వెనుక న్యాయమైన ఉద్దేశ్యమే ఉన్నట్టు భావించనక్కర్లేదు.

ప్రశ్నించినవారందరూ కోరుకుంటున్న పరిష్కారం న్యాయమైనదే అయిఉండనక్కర్లేదు.  ఫలానా పార్టీ బిసిలకు తగినన్ని సీట్లు ఇవ్వడం లేదు అనే ప్రశ్న న్యాయంగానే కనిపించొచ్చు. కానీ దగ్గరగా పరిశీలిస్తే ఆ వ్యక్తికి సీటు ఇవ్వకపోవడం వల్ల ఆతని వైయ్యక్తిక బాధకు సామాజిక కోణాన్ని ఆపాదించాడని అర్థమవుతుంది. ఫలానా సంకలనంలో నా కవిత, నా కథ ఎందుకు రాలేదు, ఫలానా అవార్డు నాకెందుకు రాలేదు అని ప్రశ్నించే బదులు  ఏదో ఒక సామాజిక వివక్షారూపాన్ని ఆపాదించేసుకుని దళితులకు అన్యాయం జరిగిందనో, స్ర్తీలకు అన్యాయం జరిగిందనో, మైనారిటీలకు అన్యాయం జరుగుతుందనో, తెలంగాణకు అన్యాయం జరిగిందనో చర్చను లేవదీసి అవతలివారిని బోనులో నిలబెట్టవచ్చును.

ఎందుకొచ్చిన గొడవ, ఇతని కథ అందులో పడేస్తే పోలా, ఒక అవార్డు ఇతని మొకాన కొడితే పోలా అనే స్థితిని కల్పించవచ్చును. వివక్షకు గురైన శ్రేణుల న్యాయమైన ప్రశ్నలు, ఆందోళనతో పాటే ఆ సమూహ శక్తిని వైయక్తికమైన ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే శక్తులు ఎల్లప్పుడూ ఉంటాయి. అది కేవలం ఈ శ్రేణులకే పరిమితమైనది కాదు  కానీ వైయక్తికమైన ప్రయోజనాలు తీర్చుకోవడానికి న్యాయమైనదిగా కనిపించే సాధారణ అంశాల్ని ముందుపెట్టడమనే పెడధోరణి ఇటీవల పెరిగిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఆ ఊబిలోకి దిగితే బయటపడలేం. ఏదో రకమైన అధికారాన్ని ఆశించని, అధికారంలో ఆనందాన్ని వెతుక్కోని వ్యక్తుల సంఖ్య స్వల్పం. అధికారం లేని రాజకీయాలు ఆశావహంగా కనిపించనపుడు ఆ రాజకీయాలతో ముడిపడిన వారిలో సైతం మార్పు కనిపిస్తుంది.

Book and internet

అదెలాగూ సాధ్యం కాదు కాబట్టి ఉన్న రాజకీయాల్లో అధికారం కోసం పోటీపడదాం అనే ధోరణి తొంగి చూస్తుంది. అది కొన్ని సందర్భాల్లో పచ్చిగా కనిపిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో సోఫిస్టికేటెడ్‌గా కనిపిస్తుంది. మళ్లీ స్థల నియంత్రణ దగ్గరకు వద్దాం. నియంత్రణ అనేది  లేకపోతే ఏం జరుగుతుందో వెబ్‌మ్యాగజైన్లలో వచ్చే కొన్ని కథలను చూస్తే అర్థమవుతుంది. ఎటు తీసుకుపోతున్నారో తెలీని సుదీర్ఘప్రయాణాలు కనిపిస్తున్నాయి. చెలాన్ని ఇతరత్రా విషయాల్లో గుర్తుచేసుకుందాం కానీ ఇకానమీ ఆఫ్‌ వర్డ్స్‌ అండ్‌ థాట్స్ మాత్రం మర్చిపోదాం అనే వారు కనిపిస్తున్నారు.

వెబ్‌ అనేది బ్లాక్‌హోల్‌ అని తెలిశాక ఎంతైనా అందులో తోసెయ్యొచ్చు అనిపిస్తుంది. ఏం ఎడిట్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. దానికితోడు సైబర్‌ ప్రపంచం లైకుల మీద కామెంట్లమీద నడుస్తుంది. సీరియస్‌ విమర్శకు అవకాశం తక్కువ. బాగుందండీ, చాలా బాగుందండీ దగ్గర్నుంచి అద్భుతమండీ వరకూ  భుజతాడనాలు ఎక్కువ. రచనకు అప్పటికప్పుడు స్పందన చూసుకొని ఆ చర్చలో భాగం పంచుకోవడమనే అవకాశము ఇందులోని సానుకూల కోణమైతే మన ఉనికి బయటపడకుండా కామెంట్‌ విసరగలిగే అవకాశం ఇందులోని లోపం. అజ్ఞాతంలో మనిషి స్వైరుడయ్యే అవకాశం ఎక్కువ. ఇది ఆరోగ్యకరమైన చర్చను పక్కదారిపట్టించే ప్రమాదం ఉంటుంది.
సాధారణంగా తాను రాసిన ప్రతివాక్యం సామాజిక శాసనం వంటి భావన కొందరు రచయితల్లో ఉంటుంది. పత్రికల్లో సాహిత్య పేజీల నిర్వాహకులు అపుడపుడు ఈ గాలిబుడగను సూదితో గుచ్చేవాళ్లు. వెబ్‌ మ్యాగజైన్ల నిర్వాహకులు తమ సాహిత్య సామాజిక ఆసక్తికొద్దీ శ్రమను వెచ్చించువారు. స్వయంగా సాహిత్యజీవులు. మార్పులు సూచించో, తిరస్కరించో రచయిత మోరల్‌ను దెబ్బతీయడమెందుకులే అనే సంశయం ఉండొచ్చు. అందులోనూ పత్రికల్లో అయితే స్థలాభావం పేరుతో అయినా ఎడిటింగ్‌ సూచించవచ్చు. కానీ ఇక్కడ స్థలాభావం అని చెప్సడానికి లేదు. ఫలితం, భుజబలం బుధ్దిబలాన్ని అధిగమించిన కథలు కనిపిస్తున్నాయి.

నిజమే, దిన పత్రికల సాహిత్యపేజీల నిర్వాహకుల్లో కొందరు దాన్ని బెత్తంగానో, కిరీటంగానో భావించి ఉండొచ్చు. ఏదో ఒక అధికార సాధనంగా మార్చుకుని ఉండొచ్చును. కానీ వ్యక్తులను పక్కనబెడితే స్థలనియంత్రణ అనేది రచయితలోని ఎడిటర్‌ను వెలికి తీసేందుకు ఉపయోగపడేది. సాంద్రతకు ఉపయోగపడేది. గాఢతకు ఉపయోగపడేది. స్వయం నియంత్రణ ఉన్న రచయిత కథ వేరు. ఖదీర్‌ తన కథను ఎన్నిసార్లు పునర్లిఖిస్తాడో ఎంతగా శ్రమిస్తాడో నాకు బాగా తెలుసు. తన శక్తి కథకు తప్ప మరోదానికి పెట్టాల్సిన అవసరం లేనంతగా పరిసరాలను ఏర్పరుచుకుంటాడు కూడా. అతన్ని దగ్గరగా చూసినందువల్ల సాధికారంగా ఉటంకిస్తున్నాను తప్పితే అతనొక్కడే అని కాదు. సీనియర్‌ కథకులు చాలామందిలో మనకు వారు పడిన శ్రమ అర్థమవుతుంది. ఆయా కథల మీద మనకు వేరే రకమైన విమర్శలు ఏవైనా ఉండొచ్చును కానీ వారు కథను బాధ్యతగా తీసుకుంటారు.  ఇపుడది కాస్తలోటుగా అనిపిస్తున్నది.  రాసిన ఇంకు ఆరకముందే అచ్చులో పడితే బాగుంటుందనే ఆత్రం పెరిగినట్టు అనిపిస్తోంది.
వెబ్‌ పత్రికలు చేసిన మరోమేలు భాషకు సంబంధించింది. ఆయా సందర్భాల్లో పాత్రలు పలికే సంభాషణల్ని కూడా యథాతథంగా రాయకుండా బూతుఫోబియా అడ్డుపడేది. మన సాహిత్య సంప్రదాయంలో ఇదొక అనవసరమైన అడ్డుగోడ. ఈ గోడను బద్దలు కొట్టిన రచనలు అరుదు. వసంతగీతం లాంటివి ఒకటో రెండో చెప్పుకోవచ్చు.పత్రికా మర్యాదలయితే చాలానే ఉండేవి. అతను ఆమెలోకి ప్రవేశించాడు అని మాగజైన్‌ మధ్యపేజీలో రాయొచ్చు. కానీ లంజె అని అతను తిట్టిన మాట మాత్రం వాడరాదు. బూతును భావనగా కాకుండా భాషకు పరిమితం చేసే వ్యవహారం మనకు ఎక్కువ.  ఎబికె లాంటివాడు దాన్ని బద్దలు చేసి పచ్చనాకు సాక్షిగా కొత్తగాలికి తెరలేపినా అది తెలుగు సమాజానికి నామిని అనే అద్భుతమైన రచయితను ఇచ్చింది కానీ పత్రికల్లో ఒక ధోరణిగా స్థిరపడలేదు.

గతంలో ఉమామహేశ్వరరావు ఆంధ్రజ్యోతి సండే ఇన్‌ చార్జిగా ఉన్నపుడు గాడిద ప్రస్తావనతో ఉన్న చిన్న కథను యథాతథంగా అచ్చేస్తే పత్రికలో పనిచేసే మర్యాదస్తులైన సీనియర్‌ ఉద్యోగులు ఎంత గొడవ చేశారో ఇంకా గుర్తుంది. నేను ఒక పద్యంలో కొన్ని హాండ్‌ షేకులను బురదమట్టలతోనూ, రత్యానంతర శిశ్నంతోనూ పోలిస్తే అదే సీనియర్లు ఎంత గొడవ చేశారో గుర్తుంది. ఇపుడు వెబ్‌ మ్యాగజైన్ల వల్ల ఆ మర్యాదలు తొలిగిపోయే అవకాశం వచ్చింది.

ఐరోపా, పశ్చిమదేశాల్లోని సీరియస్‌ రచయితలు సైతం ఫలానా ఫలానా వ్యక్తీకరణలను యధేచ్ఛగా వాడుతున్నారు. మనం ఎందుకు సంభాషణల్లో ఇంత మర్యాదగా అసహజంగా వ్యవహరిస్తున్నాం అనే వారు పెరిగారు.ఈ ఎరుక శుభసూచకం. అది మరీ ఫ్యాషన్‌గా మారిపోయి దానికదే ఒక విలువగా మారిపోతే ప్రమాదమనుకోండి. అది వేరే విషయం. సాధారణంగా సీరియస్‌ రచయితలు రచన తర్వాత వచ్చే స్పందన కంటే రచనను ఎక్కువ ప్రేమించారు  అనే వాస్తవాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే మనం ఒక పద్యమో, కథో అచ్చేశామనుకోండి. మనకు పరిచయమున్న వారు, లేనివారు  ఓ యాభై మంది లైక్‌ చేస్తారు.  బాగుందండీ అనేస్తారు. పత్రికలో ఫోన్‌ నెంబర్‌ ఇచ్చామనుకోండి. ఓ వందమంది ఫోన్‌ చేసి బ్రహ్మండమండీ అనేస్తారు. నెట్‌లో అయితే ప్రశంస ఒక క్లిక్‌ దూరం కాబట్టి చేసేస్తారు. అదే నిజమైన స్పందన అని తృప్తి పడితే బోల్తా పడే ప్రమాదం ఉంది. అక్కడే ఆగిపోయే ప్రమాదం ఉంది.

-జి ఎస్‌ రామ్మోహన్‌

ప్రాణస్నేహాన్ని పోగొట్టుకున్న బాధ…ఈ కవిత!

varavara.psd-1

అవి నేను వరంగల్ లో బి.ఎ. చదువుతున్న రోజులు. హనుమకొండ చౌరస్తాలో అశోకా ట్రేడర్స్ ముందరి సందులో మా కాలేజి స్నేహితుడు కిషన్ వాళ్ల పెద్దమ్మ ఇల్లు ఉండేది. నేనెక్కువగా అక్కడే గడిపేవాణ్ని. రాత్రిళ్లు అక్కడే పడుకునేవాణ్ని. వాళ్లింట్లో ఒక కుక్కపిల్ల ఉండేది. వాడ కుక్కల్లోనే ఒక కుక్కను మచ్చిక చేసుకొని పెంచుకున్నారు. దానితో ఆడుకోవడం, దానికి బిస్కెట్లు పెట్టడం, అది మా రాక కోసం ఎదురుచూడడం.

అకస్మాత్తుగా ఒకరోజు ఆ కుక్కపిల్ల చచ్చిపోయింది. అంటే దాని చావును గానీ, చనిపోయిన ఆ కుక్కపిల్లను గానీ నేను చూడలేదు. ఆరోజు, ఆ తర్వాత ఆ ఇంట్లో అది కనిపించలేదు. పెద్దమ్మ కళ్లనీళ్లు పెట్టుకొని కుక్కపిల్ల చనిపోయిందని చెప్పింది.

ప్రాణస్నేహాన్ని పోగొట్టుకున్న బాధ. వెలితి. చేతులు ఏదో వెతుక్కున్నట్లు. వెతుకులాట మనసుకు. ‘కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?!’ కవిత ఆ వేదననుంచి వచ్చింది.

11hymrl01-RDF_G_HY_1235147e

అప్పటికే నాకు కవిగా కొంచెం గుర్తింపు వచ్చింది. 1950లలో ‘భారతి’లో కవిత్వం అచ్చయితే కవి. ‘తెలుగు స్వతంత్ర’లో అచ్చయితే ఆధునిక కవిగా గుర్తింపు వచ్చినట్లే. రష్యా రోదసిలోకి స్పుత్నిక్ లో లైకా అనే కుక్కపిల్లను పంపించినపుడు నేను రాసిన ‘సోషలిస్టు చంద్రుడు’ (1957) ‘తెలుగు స్వతంత్ర’లో అచ్చయింది. ఆ తర్వాత ‘భళ్లున తెల్లవారునింక భయం లేదు’, ‘శిశిరోషస్సు’. ‘హిమయవనిక’ అనే కవితలకు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించిన వచనకవిత్వ పోటీల్లో, ఆంధ్రాభ్యుదయోత్సవాల్లో బహుమతులు వచ్చి సాహిత్య విద్యార్థులు మొదలు సి నారాయణరెడ్డి గారి దాకా అభిమానం చూరగొన్నవి.

varavara_rao.gif

‘భళ్లున తెల్లవారునింక భయం లేదు. కుళ్లు నల్లదని తెలుస్తుంది నయంగదా’, ‘ఇనుని అరుణ నయనాలు’ వంటి పాఠ్యపుస్తకాల ప్రభావం ఎక్కువే ఉన్నా, ‘వానిలో ఎన్నిపాళ్లు ఎర్రదనం, ఎన్నిపాళ్లు ఉడుకుదనం ఉందో రేపు కొలుస్తాను, రేపు మంచిరోజు ఎర్రని ఎండ కాస్తుంది, రేపు వసుధైక శాంతి ఎల్లెడల నిండుతుంది’ వంటి ఆశావహ ఆత్మవిశ్వాస ప్రకటనలతో నాకు ‘ఫ్రీవర్స్ కవులలో సామాజిక ప్రగతివాద’ ప్రతినిధిగా ఒక గుర్తింపు వచ్చింది.

శకటరేఫాలు మొదలు ప్రబంధ కవిత్వ భాష, వర్ణనలు, ఊహలు, ఉత్ప్రేక్షలు, ఇమేజరీ ఉన్నా ప్రగతివాద భావజాలానికి చెందిన కవిగా నాకొక ఇమేజ్ ఈ కవితలతో ఏర్పడింది. రాత్రి, మంచు వంటి సంకేతాలతో స్తబ్దతను, భయాందోళనలను, సూర్యుడు, ఉషస్సు వంటి సంకేతాలతో భవిష్యదాశావహ ఆకాంక్షను వ్యక్తం చేసే కాల్పనిక ఆశావాదం అట్లా మొదలై 1968 తర్వాత ఒక విస్పష్ట ప్రాపంచిక దృక్పథంగా స్థిరపడింది. అట్లా చూసినప్పుడు కవితాసామగ్రి, భాష, వ్యక్తీకరణలకు సంబంధించినంతవరకు ‘కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?!’ ఒక డిపార్చర్. ఒక ప్రయోగం. పై నాలుగు కవితల్లో ఊహ, బుద్ధి, రచనా శక్తిసామర్థ్యాల ప్రదర్శన ఉంటే ఇందులో ఫీలింగ్స్ సాధారణ వ్యక్తీకరణ ఉంటుంది.

‘నా రెక్కల్లో ఆడుకునే కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?’ మనుషులు వెళిపోతారంటే నమ్మగలను. వాళ్లకోసం, అందులోనూ మగవాళ్ల కోసం ఒక స్వర్గలోకం ఉంది. అందుకని వాళ్లు ఇహంలో అన్ని అనుబంధాలూ వదులుకొని వెళ్లగలరు. ‘కాని కుక్కపిల్ల వెళిపోవడమేమిటి?’‘అంత నమ్మకమైన జీవం ఎక్కడికని వెళ్లగలదు? ‘ఎవడో స్వార్థంకై, నేను లేనపుడు ఏమిటో దొంగిలించడానికి వస్తే మొరుగుతూ తరమడానికి వెళ్లి ఉంటుంది. ప్రలోభాలు నిండిన వాళ్లను ఆ లోకందాకా తరిమి తెలవారేవరకు తెప్పలా ఇలు వాకిట్లో వాలుతుంది.’

అయినా దానికా స్వర్గంలో ఏముంది గనుక

అక్కడుంటుంది?

స్వర్గంలోని వర్గకలహాలు

రేపు దాని కళ్లల్లో చదువుకుంటాను’.

నేను సికెఎం కాలేజిలో పనిచేస్తున్నపుడు 1969లో పి జి సెంటర్ లో ఇంగ్లిష్ ప్రొఫెసర్ గా ఉన్న మిత్రుడు పార్థసారథి ఈ కవితను హిందీలోకి అనువదించగా, జ్ఞానపీఠ్ సాహిత్య పత్రికలో అచ్చయింది. నండూరి రామమోహనరావుగారు ‘మహాసంకల్పం’ కవితాసంకలనం వేసినపుడు ఈ కవిత ఇవ్వమని కోరాడు. ఏ కవిత ఇవ్వాలో నేను నిర్ణయించుకోవాలి గానీ, మీరు నిర్ణయిస్తే ఎట్లా అని నిరాకరించాను. సంపాదకునికి, సాహిత్య విమర్శకునికి కవి కవితల్లో తనకు ఇష్టమైనవి ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని ఆలస్యంగా గుర్తించి ఆయనకు క్షమాపణలు చెప్పుకుంటూ ఉత్తరం రాసాను. అట్లని నేను 1964లో నెహ్రూ మీద రాసిందో, 65లో పాకిస్తాన్ తో యుద్ధం గురించి రాసిందో ఇపుడు ఆ భావాల ప్రచారానికి ఎవరైనా వాడుకుంటే అది మిస్చిఫ్ అవుతుంది.

ఇప్పుడు అఫ్సర్ ‘సారంగ’లో నా కవితలను నేనే ఎంచుకుని పరిచయం చేయాలని కోరినపుడు నా ఇమేజ్ కు కొండగుర్తులుగా నిలిచిన కవితలు కాకుండా తాత్విక స్థాయిలో, కవి హృదయాన్ని పట్టి ఇవ్వగల కవితగా కూడ ‘కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?!’ నే ఎంచుకోవాలనిపించింది.

–          వరవరరావు

-ఏప్రిల్ 30, 2014

 

కనువిప్పు

DSC_0421
చాలా కష్టంగా ఉంటుంది కొన్నిసార్లు. ఫొటో తీయాలంటేనే కాదు, చూడాలంటేనూ.

కానీ, వాస్తవం ఏమిటంటే, చూడగా చూడగా తెలుస్తుంది, కష్టమేమీ లేదని!నిజం.
ఈ తల్లి మాదిరి, ఇలా ఒక కన్నో ఒక కాలో లేదా ఏదో ఒకటో రెండో బాలేవని తెలిసి, చూడాలంటే బాధ.
కానీ, ఏదో ఒక వైకల్యమో మరో దురదృష్టమో వెంటాడిన కారణంగా ఆ మనిషిని చూడ నిరాకరిస్తే మరి ఆమె సంగతేమిటి?
ఆమెను కళ్లారా చూస్తే కదా! అసలు దృష్టిలోపం అన్నది తనకున్నదో లేదో తెలిసేది!
ఒక కన్ను లేకపోతే కానవస్తుందా రాదా అన్నది తెలిసేది?

చూడటం అన్న మౌలిక విషయం గురించి లోతైన చింతన నాది.
వారినుంచి తప్పించుకు పోవడమేనా పరిష్కారం అన్న బాధ నుంచే ఇదంతా?
కాదనే ఈ దృశ్యాదృశ్యం.

+++

నిజానికి ఛాయాచిత్ర లేఖనంలో ఒక కన్ను మూసి మరో కన్ను తెరిచి దృశ్యబద్దం చేయడమే సిసలైన కళ.
చూడగా చూడగా దృష్టి నిశితం అవుతుంటుంది. లోకమంతా కన్ను మూయగానే అంతర్లోకాలు తెరుచుకుంటయి. ద్వారాలను కాసేపైనా మూయగానే విశాలంగా తెరుచుకుంటుంది వాన. ఈదురుగాలి. విషాదం. అలాగే ఆనందమూనూ.

కళ్లు ఆర్పకుండా చూడటంలో కాసేపైనా అలా దృక్పథాన్ని పట్టుకుని ఈదులాడినప్పుడే జీవన నావ గురించిన అలుపు సొలుపు లేదంటా విశ్రాంతి అవిశ్రాంతి కాదంటే చేతనం అచేతనం…ఇవన్నీ తెలిసి వస్తయి.
అప్పటిదాకా అవగాహనకు రానివెన్నో కానవస్తూ ఉంటయి. మరింత విస్తృతంగా లోవెలుపలా కనెక్ట్ అయి నిదానంగా అవలోకనంలోకి వస్తూ ఉంటయి.

మనోఫలకంపై పడే చిత్రలేఖనంలో కెమెరా ఉండకపోవచ్చు. కానీ, నేత్రాలున్నయి కదా మనకు.
వాటిలోంచి ఒక జత మనవైన ఒక జత గురించి ఒకమాట.

నిజానికి ఒక కన్ను మూసి, మరొక కన్ను తెరిచి కెమెరా గుండా చూస్తున్నప్పుడు ఆ జతలో ఒకటి పనిచేయడం మరొకటి పనిచేయక పోవడం ఏమీ లేదు. తెరవడం ఒక పని, మూయడం ఒక పని. అలా రెండూ పనిలోనే ఉండగా మరొక కన్నూ ఉంటుంది.
అదే వ్యూ ఫైండర్. దానితో కలిసి చూపును సవరించుకుంటేనే అవతలినుంచి ఇవతలికి ఒక ప్రసరణ. తెలిసీ తెలియక లోన ఏర్పడిన గ్రహణాలన్నీ తొలిగే ఒకానొక జీవస్పర్శ. అదే చిత్రణం. కెమెరా ఉన్నా లేకపోయినా, కళ్లుంటే చాలు. ఆ మాటకంటే చూపుంటే చాలు దర్శనం అవుతుంది.

ఇక్కడా అంతే.
వెలుగునీడల్లో ఉన్న ఆమెను చూడండి.
ఒక వైపు ఆమెను చూస్తే తెరిచి ఉన్న జీవితం. మరొక పక్క చూస్తే తెలియని జీవితం.
కానీ, ఈ పక్కే తన బిడ్డ తల్లి ఆసరాతో తన అమాయకపు కుతూహలపు కళ్లతో ప్రపంచాన్ని చూస్తు ఉండటం నిజంగా ఒక ఆసరా.
తల్లికే.

అవును. నా వరకు నాకు ఒక మనిషి తన పాలిటి జీవన సాహచర్యంతోనో లేదా రక్త సంబంధం తాలూకు కన్నపేగుతోనో లోకాన్ని పరిశీలిస్తరని!
ఆ లెక్కన ఆమె తెరిచిన కన్ను, మూత కన్నూ, బిడ్డ తాలూకు వ్యూ ఫైండరూ కలిసి ఆమె ఎంత చూపరో కదా, జీవితానికి అనిపించి ఒక చెప్పనలవి కాని ఆత్మవిశ్వాసం.

నిజానికి ఈమె కూడా అంతే. ఒక విశ్వాసం. ఒక ధీమా.
అసలైతే తాను భాగ్యవంతురాలు.

ఒక వైపు మెరుస్తున్న ముక్కెర చూడాలి. మెరుపంటే అదే కాదు, ఇటువైపు కూడా ఉంది. అది సూర్యరశ్మి.
అదంతా కూడా ఆమె మొహంపైన.

అదీ వెలుగునీడల రహస్యం.
తానూ పూర్తిగా వెలుతురులోనే ఉందన్న ఆత్మవిశ్వాసం తాలూకు అవగాహన.

సూర్యోదయంతో పనికి బయలుదేరి సూర్యాస్తమయానికి ఇంటికి చేరడంలో ఆమె కన్నుపైనే ఆధారపడి లేదు.
సూర్యుడినీ కళ్లు చేసుకుంది. ఆ సంగతి తెలిస్తే కలిగే విశ్వాసం మహత్తరమైంది.

+++

నాకా అదృష్టం కలిగించే మహిళ తాను.
తానే కాదు, ఎందరో మహానుభావులు…విధి వక్రించి జీవితంలో గాయపడి ఎందరెందరో మనకు కనిపిస్తూనే ఉంటరు.
వారిని చూసి తప్పుకోకుండా అలాగే నిలిస్తే వారు నిజంగా అపూర్వంగా కనిపిస్తరు. అనివార్య  జీవన ప్రస్థానంలో వారు తమకున్నదాంతో అలాగే లేనిదాంతో జీవిస్తూ మెరిసిపోతూ ఉంటరు.
మనకు అంతుపట్టని లోపాలతోనే వాళ్లు జీవితాన్ని అలవోకగా జీవిస్తూ సామాన్యశాస్త్రాన్ని అర్థవంతం చేస్తూ అగుపిస్తరు.

అనిపిస్తుంది, కాసేపు మన కంటికి పని చెబుతేనే లోకం రహస్యంగా తన అపరిమిత రహస్యాలను మన పరిమితులను చెదరగొడుతూ చూపిస్తుందే!
మరి తన కంటిని సంపూర్ణంగా వాడుకునే ఇలాంటి నేత్రధారులను గనుక పదే పదే చూస్తే మనమెంతగా కళ్లు తెరుచుకుంటామని!
ఎవరు సంపూర్ణం, మరెవరు అసంపూర్ణం అని తెలిసిపోతుంటే కళ్లు తెరుచుకోవూ!

అదే ఆశ్చర్యం నాకు. ఆ ఆశ్చర్యంనుంచే తనను పలుసార్లు చూస్తూ ఉంటాను. ఒకసారి నేరుగా కన్ను కన్నూ కలిపితే చిర్నవ్వింది. ఫొటోలు తీస్తుంటే నా శ్రద్ధకు ఆమె సహకరించింది. ఆ సమయంలో బిడ్డ ధిలాసాగా చంకలో ఒదిగి ఉన్నది.

తనలో ఏమాత్రం తడబాటు లేదు. ఇటు నా వైపు నుంచి. ఒక శాంతి.
ఆమెలో మరే మాత్రం న్యూనతా లేదు. ఇరువైపులా అదే అయింది. దాంతో ఒక ఆనందం.
అంతకుమించి ఒక హృదయపూర్వకమైన ఆలింగనం. దాంతో వైకల్యం అన్నమాట దేవుడెరుగు. ఒక చిద్విలాసంగా ఒక తీయటి పండును పంచుకున్నట్టు శుభ్రమైన ఆనందం. కల్మషం లేని ఆ చిరునవ్వు చూడండి. కళ్లు నవ్వినట్టు.

అనుకుంటాం గానీ, ఆ బిడ్డ కనులూ పనిచేస్తున్నయి.
అదొక గమ్మత్తు. అదొక తన్మయత్వం.

చిత్రమేమిటంటే, చంకలో ఉన్న బిడ్డకు ఊహ లేదు. కానీ, ఉనికి తెలుసు.
అదీ నిజంగానే ఒక చూపు. అందుకే ఈ చిత్రం చిత్రమే.

+++

మనం చూడగా చూడగా అన్నీకనపడుతూ ఉంటయి.
అందుకే అభ్యర్థన. దయుంచి మనుషులను తప్పించుకోవద్దు. వైకల్యం పేరిట వికల మనస్కులు కానేవద్దు. వాళ్లు మీరనుకున్నది కాదు. వాళ్లు జీవించిందే జీవితం. అదెట్లో తెలుసుకునేందుకే మన కళ్లు. రెండు చాలకపోతే ఒక కన్ను మూసుకుని చూద్దాం.
అదే కళ. జీవకళను చూపించే కళ.

నేరుగా చూడండి.
ఒక రకంగా ఇదీ సాహిత్య పఠనమే.
మానవేతిహాసాన్ని చదవడానికి చూపూ అవసరం అని చెప్పే సాహిత్య అవలోకనం, ఛాయాచిత్ర లేఖనం.

~  కందుకూరి రమేష్ బాబు

ramesh