Archives for 2013

ఎక్కడి నుండి ఎక్కడి దాకా…? -మొదటి భాగం

rama intro

ముప్పది ఐదు సంవత్సరాల పరిపూర్ణ స్త్రీ లీల ఒంటిపైనున్న మెత్తని ఉన్ని శాలువను సున్నితంగా సవరించుకుంది. విమానం నిండా గంభీర నిశ్శబ్దం..మేఘాలను చీల్చుకుంటూ దూసుకుపోతున్న గర్జనవంటి మౌనధ్వని..గాత్రం ప్రవాహంలా సాగుతూంటే ఒక అంతర్లీనంగా వినిపించే ప్రాణప్రదమైన శృతివలె.

                ఫస్ట్‌క్లాస్‌ కేబిన్‌లో..అతి సౌకర్యవంతంగా..ఏర్‌హోస్టెస్‌ల కన్నుసన్నలలో..ముప్పదిఆరువేల ఫీట్ల ఎత్తులో, గంటకు తొమ్మిదివందల కిలోమీటర్ల వేగంతో..,

                అతివేగం..అతి అతిక్రమణ..అతి దూసుకుపోవడం..ఇవన్నీ ఎంత నిశ్శబ్దంగా, ఎంత నిశ్చలంగా,ఎంత గంభీరంగా ఎంత ఉత్సుకతతో నిండి ఉంటాయో…తన జీవితంలోవలె.

                ఎదురుగా ఇరవైమూడు అంగుళాల ఎల్‌సీడీ కంప్యూటర్‌ కం టి.వి. తెరపై ‘దోహా’ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువకాబోతున్న తమ విమానం ఏరియల్‌ వ్యూ కనబడ్తోంది..నాలుగ్గంటల క్రితం హైద్రాబాద్‌ ఏర్‌పోర్ట్‌లో ఐదు గంటలకు విమానంలోకి ఎక్కిన తర్వాత..బాంబే మీదుగా అరేబియా సముద్రం..సముద్రంపై వందల కిలోమీటర్ల ప్రయాణం..

                మనిషి ఒదిగి ఒదిగి, వంగి వంగి, నంగి నంగి తలవంచుకుని నిలబడి ఉన్నంతసేపు ఈ ప్రపంచం నీపై స్వారీ చేస్తూనే ఉంటుంది. నీపై ఉక్కుపాదాన్ని మోపి తాడనం చేస్తూనే ఉంటుంది. ఒక్కసారి తల విదిలించి, నిక్కి నిలబడి ప్రశ్నించడం, ఎదురుతిరగడం, ఎదురొడ్డి నిలబడడం, బిగించిన పిడికిలితో సమాజంపై స్వారీ చేయడం మొదలెట్టిన తర్వాత..ప్రపంచం చిన్న బొచ్చు కుక్కపిల్లలా మనిషికి స్వాధీనమైపోవడం, లొంగిపోవడం, వెంట అతి వినమ్రంగా నడిచివస్తూండడం.. ఇదంతా తెలుస్తూంటుంది విజ్ఞులకు.

ప్రపంచం నువ్వు జవాబు చెప్తున్నంతసేపు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఒక్కసారి నువ్వే ప్రశ్నించడం ప్రారంభిస్తే అది ఖంగుతిని తనే జవాబుదారీగా మారి జవాబులు చెబుతూనే ఉంటుంది. స్వారీ సమర్థవంతంగా చేస్తే గుర్రం నీకు లొంగిస్వాధీనమౌతుంది. అసమర్థంగా ఉంటే కింద నేలపై పడేసి పెక్కపెక్క తన్ని తరిమేస్తుంది.

అందుకే సమర్థుడైన నిర్వాహకుడు ఎప్పుడూ పగ్గాలను తన దగ్గర, తన అధీనంలో ఉంచుకుంటాడు.  ఎవరో చెబితే తను వినడం వేరు.. తను చెబుతూంటే ప్రపంచం వినయంగా విని విధేయంగా ఉండడం వేరు,

ఎందుకో లీల హృదయం వర్షించబోయేముందు, ఉరిమే ముందు ఆకాశంలా గంభీరంగా, ఆవేశంగా, ఉద్విగ్నంగా ఉంది.

ఒంటరితనం..మనిషిని వెంటాడ్తుంది.. గతాన్ని తవ్వి తవ్వి గాలివానలా ధ్వంసించి ధ్వంసించి, చిలికి చిలికి.. ఒక్కొక్కప్పుడు పుండును కాకిలా పొడిచి పొడిచి రక్తసిక్తం చేసినట్టు ..నొప్పి..హృదయంలో నొప్పి..అంతరాంతరాల్లో గుప్తమై రగిలే నొప్పి..బాధ..కసి..క్షోభ.. కన్నీళ్ళు..అపజయాలు..ఆకలి..దిక్కులేనితనం, నిస్సహాయత…అవమానాలు..తలవంచుకుని రాత్రులు రాత్రులు ఏడ్వడాలు..,

కాలేజిలో.. గణితం సబ్జెక్టులో ఎప్పుడూ క్లాస్‌ ఫస్ట్‌ తనే..కాలుక్యులస్‌..సంకలీకరణ..ఇంటిగ్రేషన్‌..రెండు అవధులు.. లోయర్‌ లిమిట్‌.. అప్పర్‌ లిమిట్‌..జీరోనుండి ఇన్‌ఫినిటీ..విస్తరణ. శూన్యంనుండి ప్రారంభమై విస్తరిస్తూ విస్తరిస్తూ..ఎదిగి ఎదిగి..వ్యాపించి వ్యాపించి..అనంతానంతాల పర్యంతం ఒక క్షేత్రమై.,

విస్తరణ..విస్తరణ.,

జీవితాన్ని ఎవరికి వారు నిర్మించుకుంటూ, కూలిపోతూ, ఓడిపోతూ, పాఠాలను నేర్చుకుంటూ మళ్ళీ మళ్ళీ పునర్నిర్మించుకుంటూ..జీవించడమంటే నిజానికి ఒక అంతులేని నిరంతర నిర్మాణక్రియను కొనసాగించడమే కదా.

నిజానికి..జీవితాన్ని నిర్మించుకోవడం..తన దృష్టిలో ఒక ఇసుకగూడును కట్టడం వంటిది..కాలు తీయగానే కూలిపోవడం..మళ్ళీ సరిగ్గా మెత్తి, మరమ్మత్తులు చేసుకుని..ఒక రూపాన్ని, ఒక ఆకారాన్ని, ఒక భౌతిక ఉనికిని..ఒక స్వప్నాన్ని ఆకృతీకరించడం..గూడు అందంగా కట్టడం ఒక అధ్యాయమైతే దాన్ని అలా కొనసాగించడం, కాపాడుకోవడం, రక్షించుకోవడం..ఆ క్రమంలో గూడును ఆనందించడం మరో అధ్యాయం. నిజానికి ఈ రెండవ అధ్యాయమే కీలకమైంది.. ప్రధానమైందికూడా.

అరేబియా సముద్రంపై విమానం ఎగురుతున్నపుడు..తన హృదయం ఎంత ఉద్విగ్నమైపోయిందో.

సముద్రం లోతైందా..మనిషి హృదయం లోతైందా..సముద్రం విశాలమైందా. మనిషి హృదయం విశాలమైందా..అనంతమైన అలజడితో, కల్లోలంతో నిత్యం ప్రళయగర్భయై భాసిల్లే మహాసముద్రం నిజానికి నిత్యపోరాటంతో జీవించే నిజమైన మనిషితో పోల్చినపుడు..ఒక సమాంతర ప్రతీకగా,

మనిషి..సముద్రం – సముద్రం..మనిషి.

ఎర్నెస్ట్‌ హెమింగ్వే నవలతో రూపొందిన సాహసోపేతమైన ‘ది ఓల్డ్‌మాన్‌ అండ్‌ ది సీ’ సినిమా జ్ఞాపకమొచ్చింది లీలకు.

పోరాటం.. పోరాటం.. నిరంతరం ఎడతెగని పోరాటం..అంతులేని పోరాటం. బ్రతకడానికి.. ఆకలి తీర్చుకోడానికి.. డబ్బు సంపాదించడానికి .. అధికారంకోసం.. పేరు ప్రతిష్టలకోసం.. శాశ్వతమైన తన అహంతో నిండిన ఆత్మతృప్తి కోసం.. పోరాటం.. కుట్రలు..కుతంత్రాలు.. పెనుగులాటలు.. వ్యూహాలు.. పాచికలు.. మందుపాతరలు..పెదవులపై చిరునవ్వులు.. మోసపూరిత పథకాలు.. ఎన్నో,     విమానం మెల్లగా ఆగడం..కాబిన్‌ లగేజ్‌నుండి అటెండెంట్‌ చేతికందివ్వగా తన అతి ఖరీదైన సామ్‌సొనైట్‌ బ్యాగ్‌ను తీసుకుని లేచి.. ఒకడుగు వేయబోతూండగా..హోస్టెస్‌ మిస్‌ హాస్టలర్‌ వినమ్రంగా తల పంకించి.. అంతా మౌనమే..కాని చిరునవ్వులు చిందే పెదవులు..పలకరించే కళ్ళు..ముకుళించే ముఖాలు..వ్యాపారమే ఐనా పరిమళించే మానవ సౌరభాలు..,

 

లీల ప్రీమియం ఎంట్రీలోకి ప్రవేశిస్తూ, తన బ్లాక్‌బెర్రీ సెల్‌ఫోన్‌ను స్విఛాన్‌చేసి ‘మెమో’ షీట్‌ తెరిచింది.

15 మే అపాయింట్‌మెంట్స్‌.

స్టే ఎట్‌ గ్రాండ్‌ రీజన్సీ ఇంటర్‌కాంటినెంటల్‌ హోటల్‌ రూం. నంబర్‌ 206. మహమ్మద్‌ రఫీక్‌ ఏర్పాట్లు పర్యవేక్షిస్తాడు.

మూడు అపాయింట్‌మెంట్స్‌. భారత జాయింట్‌ సెక్రటరీ టు డిపార్ట్‌మెంటాఫ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ అండ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌, రాంసక్సేనా, మినిస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ వర్క్స్‌, గవర్నమెంటాఫ్‌ అస్సాం అరుణ్‌ ఉజ్లేకర్‌, నీరజారావ్‌ కౌన్సిల్‌ ఎట్‌ ఫ్రాన్స్‌..మొత్తం రెండు గంటల నలభై నిముషాలు ఇంటరాక్షన్‌. నాల్గువందల ముప్పయి రెండు కోట్ల రూపాయల డీల్‌. తర్వాత దోహా స్థానిక ఇండస్ట్రియలిస్ట్‌ మహమ్మద్‌ బిన్‌ ఉసామాతో డిన్నర్‌..నాలుగు గంటలు నిద్ర..ఉదయం ఆరుగంటల పది నిముషాలకు ఎమిరేట్స్‌ విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం.

ఎందుకో ఒకసారి తనవైపు తనే చూచుకుంది లీల..ఏర్‌కండిషన్డ్‌ బస్‌ దిగుతూ మక్‌మల్‌ మడతల మధ్య ధవళవర్ణంలో ధగధగా మెరుస్తున్న మంచిముత్యంలా ఉంది తను.

ప్రపంచాన్ని మొట్టమొదట ఆకట్టుకునేది మనిషి బాహ్యరూపు..అందం..ఆకర్షణ. ఆ తర్వాత ఆ మనిషి వ్యక్తీకరణ, ప్రతిభ, తెలివితేటలు..ఆ తర్వాత ఆర్థిక, అధికారిక, వ్యాపారాత్మక లావాదేవీలు – ఇవన్నీ ఎంతో స్పష్టంగా తెలుసు లీలకు.

లీలకు మనుషుల మూలతత్వాల గురించి చాలా విపులమైన లోతైన అవగాహన ఉంది. ఆమె ఎదుటి వ్యక్తులతో చాలా తక్కువగా, అవసరమైనపుడు మాత్రమే మాట్లాడ్తుంది. ఎక్కువగా చూపులతో అధ్యయనం చేసి మొదట ఎదుటి మనిషిలోని బలహీనతలను కనిపెడ్తుంది. ప్రతి మనిషికీ ఏదో ఒక బలహీనత ఉంటుందని బలంగా నమ్ముతుందామె. అది డబ్బు కావచ్చు, కాంతా కనకాలు కావచ్చు, అధికార వ్యామోహం కావచ్చు, పేరు ప్రతిష్టలు కావచ్చు..ఏదో ఒకటి. ఏదో ఒక వ్యామోహం ప్రతి మనిషికీ ఉంటుంది. ఆ బలహీనతను గ్రహించి సరిగ్గా అక్కడ దెబ్బకొట్టగలిగితే వాడే విజయుడు.

భారతదేశంలో ఎంత పెద్దమనిషైనా తప్పకుండా ఏదో ఒక ప్రలోభానికి లొంగుతాడు. ఎంత ఉన్నతస్థానంలో ఉన్నవాడైనా తప్పకుండా ఏదో ఒకదానికి అమ్ముడుపోతాడు. దాసోహమై తనను తాను కోల్పోతాడు. నిశ్శబ్దంగానే మనుషులను, వాళ్ళ దిక్కుమాలిన వ్యామోహ వివశతలను పసిగట్టి చెస్‌ ఆటలో పావులను కదిపినట్టు ఒక్కో వ్యూహాత్మక కదలికతో జయిస్తూ వస్తున్న తను గత థాబ్దకాలంపైగా సాధించిన విజయాలు తనకు ఒక నిషానూ, మత్తునూ కలిగించే అనుభవాలుగా మిగిలిపోయాయి. ఇంత పెద్ద మనుషులు ఇంత సుళువుగా చిత్తయిపోతారా అని ఆశ్చర్యంతో తాను బిత్తరబోయిన సందర్భాలెన్నో.,

ఐతే..చాలా సమయాల్లో అవసరానికి మించి అతిగా మాట్లాడ్డం అనే అతిపెద్ద బలహీనతని లీల ఎంతో ప్రధాన విషయంగా గమనించింది. నిజానికి ఒక ఎగ్జిక్యూటివ్‌ యొక్క వ్యూహాత్మక మౌనం ఎదుటి మనిషిలో ‘భయం’ కల్గిస్తుంది.

first week fig-1

‘ఎగ్జిట్‌’ దగ్గరికి రాగానే తనూహించినట్టుగానే రఫీక్‌ వడివడిగా ఎదురొచ్చి ఒక అందమైన, విలువైన పూలబొకే అందించి, ఆమె చేతుల్లోని బ్యాగ్‌ను అతి వినయంగా అందుకున్నాడు.

”వెల్కం మేడం” అన్నాడు ముద్దముద్దగా.

ఆమె మాట్లాడలేదు. ఒక చిర్నవ్వు చిలకరించి మౌనంగా, గంభీరంగా అతని వెంట నడిచింది. అలా నడుస్తున్నపుడు విరజిమ్ముతున్న విద్యుత్‌కాంతుల నడుమ చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో ఆసక్తిగా అవాక్కయి తనను గమనిస్తున్నట్టు ఆమె గమనించింది.

రఫీక్‌ డోర్‌ తెరుస్తూండగా బయట సిద్ధంగా ఉన్న బిఎండబ్ల్యు కారు వెనుక సీట్లోకి చేరిందే తడవ..కారు మెత్తగా.. సర్రున నల్లని త్రాచుపాములా కదిలింది.

వేగం.. గాజుపలకపై ఇనుప గోళీలా..దూసుకుపోయే వేగం.,

తన ప్రతి క్యాంప్‌ ఏర్పాట్లను తన అత్యంత అంతరంగిక కార్యదర్శి నిర్మల స్వయంగా పర్యవేక్షిస్తుంది..మినట్‌ టు మినట్‌ కదలికలు, ప్రాంతాలు, వ్యక్తులు, వ్యవహారాలు, రక్షణ, బాధ్యతల అప్పగింతలు..అన్నింటినీ మించి ఫాలోఅప్‌, మానిటరింగ్‌.. వీటి విషయంలో నిర్మల నిజంగా సుపర్బ్‌.

‘యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌…’ఇంగ్లీష్‌లో ప్రకటన..ఎన్ని వందలసార్లు విన్నదో తను విమానాల్లో పయనిస్తూ..ఇక విమానం భూమిపైకి దిగబోతోంది. సీట్‌ బెల్ట్స్‌ పెట్టుకోండి, సీట్లను నిటారుగా ఉంచుకోండి. సెల్‌ఫోన్లను స్విచాఫ్‌ మోడ్‌లోనే ఉంచండి..వంటి అంశాలు..చివరికి పైలట్‌ ‘దయతో ప్రయాణంలో సహకరించినందుకు మీకందరికీ ధన్యవాదాలు..’అని ఓ సాంప్రదాయ వినమ్ర నివేదన.

ర్ర్‌ర్‌ర్‌మని ..విమానం టైర్లు నేలను తాకిన మ్రోతతో కూడిన భీకర ధ్వని.. కుదుపు. విడిచిన బాణంవలె దూసుకుపోతున్న గాలిధ్వని..ఒక పెద్ద సంరంభం.

ప్రక్కనున్న కిటికీలోనుండి చూచింది లీల. దోహా నగరం విద్యుత్‌కాంతులతో మిలమిలా మెరిసిపోతోంది. కతార్‌ ఎయిర్‌వేస్‌ ప్రధాన స్థావరం. అరబ్‌ దేశాల గుండెలా ఎదుగుతున్న అంతర్జాతీయ విమానయాన క్షేత్రం. ఇస్లాం సాంప్రదాయాలను పాటిస్తూనే వడివడిగా అంతర్జాతీయ స్థాయిని అందుకుంటున్న అత్యాధునిక విమానయాన సంస్థ కతార్‌.

తన ఆల్‌ గోల్డ్‌ వాచ్‌ చూచుకుంది లీల.

ఎనిమిది గంటల పన్నెండు నిముషాలు..’ఇప్పుడు నిర్మల తనతో మాట్లా..’అని మనసులో అనుకుంటూండగానే ఆమె సెల్‌ఫోన్‌ మోగింది.

”గుడీవినింగ్‌ మేడం..మీ కారు దోహా మాల్‌ దాటి అల్‌ ఖలీషా రోడ్‌లోకి ప్రవేశిస్తోందా..”

”ఎస్‌ నిర్మలా..”

”ఇంకో పన్నెండు నిముషాల్లో మీరు హోటల్‌ గ్రాండ్‌ రీజన్సీలో ఉంటారు. ఫ్రెషప్‌ కాగానే..సరిగ్గా తొమ్మిది గంటలకు రాంసక్సేనా ఐఎఎస్‌ మీ గదికొస్తాడు. అతను ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌లో ‘పరిశ్రమలు – పర్యావరణ కాలుష్యం..నివారణ’ అంశంపై మాట్లాడ్డానికి రెండ్రోజుల క్రితమే ఫ్రాన్స్‌లో ఉన్నాడు. మీతో మాట్లాడి ఆ ఎనభైకోట్ల రూపాయల ఎబిటు జీరోఫైవ్‌ బాపతు డీల్‌ను ఫైనల్‌ చేస్తాడు. అందుగ్గాను మనం అతనికి ఆరుకోట్ల క్యాష్‌ను స్విస్‌ బ్యాంక్‌ హిడెన్‌ కాతాకు బదిలీ చేస్తాం.. మేడం ఒకసారి మీ లాప్‌టాప్‌లో రెండు నిముషాల క్రితం నేను మీ జడ్‌ మెయిల్‌కు పంపిన ఫోల్డర్‌లో చూడండొకసారి. ఓవర్‌ వ్యూ వస్తుంది.. సి యు మేం..”గడగడా, స్పష్టంగా, పొల్లుపోకుండా చెప్పుకుపోయింది నిర్మల.

ఎందుకో లీల చిన్నగా నవ్వుకుని..లాప్‌టాప్‌ను తెరిచింది. ప్రపంచంలోనే అతి సన్నని లెనోవా 0.9 ఇంచ్‌ కంప్యూటర్‌ అది. చకచకా రిడిఫ్‌ మెయిల్‌ తెరిచి తన రహస్య పన్నెండవ ఇ మెయిల్‌ క్లిక్‌ చేసింది. నిముషమున్నర క్రితం వచ్చిన నిర్మల మెయిలది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాం ఇన్ఫోటెక్‌ అనే సంస్థ ప్రవీణ్‌రెడ్డి నేతృత్వంలో ప్రపంచ వ్యాప్తంగా పద్దెనిమిది సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కంపెనీ వ్యాల్యూ ప్రైస్‌వాటర్‌ కూపర్‌ మదింపుద్వారా నాల్గువేల కోట్లుగా నిర్దారించబడింది. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెజ్‌ల ఏర్పాటుక్రింద భారత ప్రభుత్వానికి భూమి కేటాయింపు గురించి ధరఖాస్తు పెట్టుకుంది. నూటా యాభై ఎకరాలను కనీస నామమాత్రపు ధర క్రింద రాం ఇన్ఫోటెక్‌కు కేటాయిస్తే నాల్గు సంవత్సరాలలో స్థలాన్ని అభివృద్ధిపర్చి, పరిశ్రమను స్థాపించి, మూడు వేలమందికి ఉపాధి..,

..ఇలా ఉంది ఫైల్‌-

‘అంతా ట్రాష్‌.. చెత్త…’అనుకుని వాస్తవస్థితిని ఉజ్జాయింపుగా అంచనా వేసింది లీల. నూటా యాభై ఎకరాలను ఎకరానికి యాభైవేల చొప్పున కొనుక్కుని ఏడున్నరకోట్ల పెట్టుబడితో నాల్గుసంవత్సరాల తర్వాత మూడువందల కోట్ల ఆస్తిగా మార్చుకోవాలని దుష్టమైన ప్రణాళిక. అందులో ముఖ్యమంత్రి బామ్మర్ధి కొడుకు పేరుమీద ఇరవైకోట్ల నగదు లంచం, భారీ పరిశ్రమల మంత్రి ఉంపుడుగత్తెకు పదికోట్లు.. మిగతా తతంగమంతా ప్రవీణ్‌రెడ్డి చూచుకోవాలి. ఆ పరంపరలో క్లియరెన్స్‌కోసం ఒక క్లెయింట్‌గా తమను ఆశ్రయించాడు ప్రవీణ్‌రెడ్డి. ‘లీలకు కేస్‌ అప్పజెప్పి కూచుంటే అంతా నిశ్చింత. బేఫికర్‌. ముందే కన్సల్టెన్సీ ఫీ మాట్లాడుకుని డాక్యుమెంట్లన్నీ ఇస్తే యిక అన్ని లెవెల్స్‌లో లీల తనే మేనేజ్‌ చేసుకుని పనిని సాధించిపెడ్తుంది.. బ్లాక్‌ యాక్టివిటీస్‌ చేయడానికి లీల హైలీ రిలయబుల్‌ వైట్‌ ఏజెంట్‌. ముందే అంతా స్పష్టం..’

లంచాల కింద ఇరవైరెండు కోట్లు..తన ఫీ ఐదు కోట్లు..టైం పీరియడ్‌ మూడు నెలల పదిరోజులు-

కేస్‌ స్టేటస్‌.. స్టేట్‌ గవర్నమెంట్‌నుండి అన్నీ క్లియరై..అనుకూలమైన రిమార్క్స్‌తో ఫైల్‌ భారత ప్రభుత్వ భారీ పరిశ్రమలు మరియు పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు పంపబడింది..పద్నాల్గు రోజుల క్రితం. ఫైల్‌ నంబర్‌ ఎఫ్‌ఫోర్‌ / టు త్రీ ఫైవ్‌ సిక్స్‌ / ఇండస్ట్రీస్‌ / 09 తేది 6 జూన్‌ రెండువేల తొమ్మిది.

అంతా అర్ధమైంది లీలకు.

తమకు అప్పటికే రెండుకోట్ల అరవై లక్షల అడ్వాన్స్‌ ముట్టింది. లంచాలు ఎనిమిది కోట్ల చిల్లర ఖర్చయింది.. ఇప్పుడు జాయింట్‌ సెక్రటరీ రాంసక్సేనా స్వయంగా ‘సెజ్‌’ శాంక్షన్‌ కాగితాలను తన దగ్గరకు తెచ్చిస్తాడు. అదీ ఏర్పాటు.

ఈ పనిని సాధించడానికి తన ఆధీనంలో పనిచేసే ఎందరో రిటైర్డ్‌ ఐఎఎస్‌ ఆఫీసర్లలో ఫార్మర్‌ హోం సెక్రటరీ రాజన్‌ పిళ్ళై ఎంతో సహకరించారు. పిళ్ళై, రాంసక్సేనా యిద్దరూ బాటిల్‌మేట్స్‌..రూట్‌ దొరికింది. సరియైన పనికి సరియైన నైపుణ్యంగల మనిషిని వెదికిపట్టుకుని ఆ పనిని అప్పజెప్పి నిర్విఘ్నంగా సాధించడమే ఒక మంచి మేనేజర్‌ లక్షణం.

నవ్వొచ్చింది లీలకు..ఈ ప్రపంచంలో ఎవడైనా డబ్బుకు లొంగేవాడేకదా..ఒకడు ఎక్కువకు, మరొకడు ఇంకా ఎక్కువకు.. కాని లొంగడం మాత్రం ఖాయమైన వర్తమానంలో మనిషి ‘మార్కెట్‌’గా మారి…వ్చ్‌, క భ్రాంతిమయ అనుభూతి ఆమెను ఆకస్మాత్తుగా ఆవహించింది. ఎక్కడి ఆంధ్రప్రదేశ్‌లో తూఫ్రాన్‌ వద్ద వెంకట్రావ్‌పల్లె దగ్గరి సెజ్‌..ఎక్కడి ఢిల్లీ…ఎక్కడి ప్రవీణ్‌రెడ్డి, ఎవరీ లీల..ఎక్కడి దోహా..ఎవరీ రాంసక్సేనా..ఆ భూమి తాలూకు కాగితాలను యిక్కడ..ఈ అరబ్‌ గడ్డపైకి తెచ్చి తనకు యివ్వడమేమిటి..?

వ్యాపారం..అంతా వ్యాపారం..డబ్బు..డబ్బు..,

మార్క్స్‌ అన్నట్లు..మానవ సంబంధాలన్నీ వ్యాపారాత్మక ఆర్థిక సంబంధాలేనా?

కారు ట్రాఫిక్‌ను చీల్చుకుంటూ డి- రింగ్‌రోడ్‌, అల్‌ సౌదన్‌, ఫరీజ్‌ అల్‌ అమిర్‌ రోడ్‌ మీదుగా..గ్రాండ్‌ రీజెన్సీ హోటల్‌ చేరుకుని..పొర్టికోలో ఆగి-

మెరుపులా రఫీక్‌ కిందికి దిగి..డోర్‌ తెరిచి.,

అద్భుతమైన హోటల్‌ అది. రోజుకు రెండువేల యాభై యుఎస్‌ డాలర్స్‌. గేట్‌ దగ్గర ఆరున్నర అడుగులఎత్తు ఓ షోమ్యాన్‌ వినయంగా వంగి సలాం చేసి..,

డబ్బు.. డబ్బు..డబ్బుతో హోదా..హోదాతో గౌరవం..గౌరవంతో తృప్తి, అహం..అహం ఒక ఎడతెగని నిషా.. రాజ్యాలూ, రాజ్యాధికారాలూ అన్నీ అహంతో సంభవించిన దర్పంతోనే ధ్వంసమైపోయినట్టు అరుస్తూ చెప్పే మానవ చరిత్ర.,

రఫీక్‌ అప్పటికే రిసెప్షన్‌లోనుండి లేజర్‌ మానిటర్‌ను తీసుకుని, పెద్ద హాల్‌కు ఒక ప్రక్కన ఉన్న కాంతులీనే లిఫ్ట్‌ దగ్గరికి తోడ్కొనిపోయి,

…రెండు వందల ఆరు..ఎగ్జిక్యూటివ్‌ సూట్‌..చుట్టూ గాజు తలుపుల్లోనుండి.. స్విమ్మింగ్‌ పూల్‌.. దూరంగా సముద్రం.. ఇటు ప్రక్క గార్డెన్‌..సన్నగా సంగీతం..వాతావరణం నిండా ఏదో భాషకందని మత్తు..శరీరాన్ని వీణతంత్రులను మీటినట్టు పులకింపజేసే పరిమళం., గాలినిండా ఏదో మహత్తరమైన వివశత.

”మేడం ..షలై టేక్‌ లీవ్‌.. మై డ్యూటీ ఈజోవర్‌..మార్నింగ్‌ మిస్టర్‌ నాయర్‌ విల్‌ కం ఎట్‌ ఫైవ్‌ థర్టీ.. టు టేక్‌ యు టు ఏర్‌పోర్ట్‌..’రఫీక్‌.,

”ఓకే..థ్యాంక్యూ.”

రఫీక్‌ వంగి..సలాం చేసి..అతను దృఢంగా..కండలు నిండిన శరీరంతో అరబ్‌ గుర్రంలా ఉన్నాడు. వీళ్ళందర్నీ ఇండియా నుండి నిర్మల ఏర్పాటు చేస్తుంది. రఫీక్‌కు వెళ్ళేప్పుడు రిసెప్షన్‌లో ఐదువందల డాలర్ల టిప్‌ ముడ్తుంది. అతని రోజుకూలీ వేయి డాలర్లు కాకుండా. ఊహకందని పేమెంట్స్‌. ప్రతి రహస్య కార్యకలాపం చాలా ఖరీదుగానే ఉంటుంది మరి.

రఫీక్‌ వెళ్ళగానే..వెన్నెల ముద్దలా ఉన్న డబుల్‌ బెడ్‌పై ఒక్క క్షణం ఒరిగి కళ్ళు మూసుకుంది లీల.

‘కన్ను తెరిస్తే ఒక ప్రపంచంలో నువ్వు ,

కన్ను మూస్తే నీలోనే ఒక గర్జించే ప్రపంచం..’ఎవరివో కవితాపంక్తులు.

వేగం.. వేగం..ఒక అతివేగవంతమైన ప్రపంచంలో కాలాన్ని వేటాడ్తూ తను..తనను వెంటాడ్తూ కాలం..ఊపిరి సలపని పరుగులో పూర్తిగా మృగ్యమైపోయిన విచక్షణ..తనలోకి తను తొంగి చూచుకోలేని తీరికలేనితనం..నిజానికి ఒక్కసారైనా ఆత్మలోకి అవలోకించుకోడానికి తనకే తెలియని ఏదో భయం.

అసలేంచేస్తోంది తను..ఎక్కనినుండి మొదలై ఎక్కడికి కొనసాగుతోంది తన గమనం..అసలు తనకు ఒక గమ్యం అనేది ఉందా..తన అంతిమ లక్ష్యం ఏమిటి?

సుడిగాలిలోని కాగితం ముక్కకు ఒక థ, దిశ ఉంటుందా.?

ఎందుకో ఒక్కసారిగా ఒళ్ళు జలదరించినట్టయి..దిగ్గున లేచి..బాత్‌రూంలోకి వెళ్ళింది. అన్నీ స్వర్గాన్ని మరిపించే ఏర్పాట్లు. మంచుతుంపరలు కురుస్తున్నట్టు కాంతి. తెల్లని వెండి మేఘాల తరగలపై నడుస్తున్నట్టు నేల..సన్నగా ఏదో మృదుధ్వని..పరిమళం.,

స్నానం కానిచ్చి..బట్టలను మార్చుకుని..డ్రైయర్‌కింద ఆరబెట్టకున్న జుట్టును విరబోసుకుని..డ్రెస్సింగ్‌ టేబుల్‌ముందు ..బంగారు చెంపలకు ఓలె క్రీం కొద్దిగా పూసి..,

‘ఎంత అందంగా ఉంది తను’ అనుకుంది లీల ఎదుట అద్దంలో తనను తాను చూచుకుంటూ..నాల్గడుగులు వెనక్కునడచి., బెడ్‌పై వాలి.,

టైం ఎనిమిదీ యాభై ఐదు.,

సెల్‌ఫోన్‌ మ్రోగింది.. నిర్మల.

”మేం. రాం సక్సేనా ఈజ్‌ ఆన్‌ద వే. వితిన్‌ ఫైవ్‌ మినట్‌ హి విల్బీ..”

ఫోన్‌ కట్‌ చేసింది ఏమీ మాట్లాడకుండానే

‘జిన్హే హమ్‌ భూల్‌నా చాహే..ఓ అక్సర్‌ యాద్‌ ఆతీహై..’అనూహ్యంగా ముఖేశ్‌ గీతం వినబడింది చానల్‌ మ్యూజిక్‌లో..సన్నగా.,

కత్తితో వెన్నముక్కను ఎవరో కోస్తున్నట్టు..సర్‌ర్‌ర్‌మని ఏదో..చటుక్కున సముద్రమై పొంగిన దుఃఖం..ఆకాశమంత ఎత్తున్న అల విరిగి పైనబడ్డట్టు ఏదో బీభత్స విధ్వంసం..

ఒక్కపాట..ఒక్క చరణం..మనిషిని ఇంతగా కకావికలు చేస్తుందా..?

వ్చ్‌.,

సరిగ్గా అప్పుడే..బయట బజర్‌మ్రోగింది.

లీలకు తెలుసు..వచ్చింది రాం సక్సేనా అని..చేతిలోని లేజర్‌ రిమోట్‌తో బయటి డోర్‌ తెరిచింది.

ఔను రాంసక్సేనానే..”గుడీవినింగ్‌ మేడం” అన్నాడు వస్తూనే.

‘ప్లీజ్‌’ అంది..ఎదుట ఉన్న సోఫా చూపిస్తూ.

రెండు నిముషాల మౌనం..నిశ్శబ్దం..తర్వాత..అతను తన బ్రీఫ్‌కేస్‌ను తెరిచి ఒక అందమైన ప్లాస్టిక్‌ ఫోల్డర్‌ను ఆమెకు వినయంగా అందించాడు.

సక్సేనా యిదివరకు ఢిల్లీలో జరిగిన ఒక పెళ్ళివిందులో తనకు పరిచయం. పిళ్ళై చేశాడు.

”శాంక్షన్‌ ప్రోసీడింగ్సాఫ్‌ దట్‌ సెజ్‌..మిస్టర్‌ ప్రవీణ్‌రెడ్డీస్‌..”

”ఊఁ..”కాగితాన్ని పరిశీలనగా, మెరుపుపాటుకాలంలో చూచి,

”హౌమచ్‌ యుహావ్‌ రిసీవ్డ్‌ సోఫార్‌”

”టు క్రోర్స్‌ మేడం. మిస్టర్‌ పిళ్ళై కన్‌సెంటెడ్‌ దిస్‌ అసైన్‌మెంట్‌ యాజె ప్యాకేజ్‌ ఫర్‌ ఫోర్‌ క్రోర్స్‌..”అని అర్ధాంతరంగా ఆగి.,

”ఐనో..ఐనో..”

”ఆల్‌రెడీ.. దిస్‌సెజ్‌ శాంక్షనీజ్‌ పబ్లిష్డ్‌ ఇన్‌ ఎస్టర్‌డేస్‌ గెజిట్‌”

”ఓకే..”

లీల చకచకా తన లాప్‌టాప్‌ను తెరిచి..ఏదో అకౌంట్‌లోకి వెళ్ళి ఇ-ట్రాన్స్‌ఫర్‌ ఆపరేషన్‌ ప్రారంభించి.,

”యు వాంట్‌ దిస్‌ మనీ టు బి క్రెడిటెడిన్‌ యువర్‌ జడ్‌ టు జడ్‌..హిడెన్‌ అకౌంట్‌..ఈజిట్‌”

”యస్‌ మేం..”

”నౌ దిసీజ్‌ డన్‌..యు కెన్‌ వెరిఫై..”

”నాట్‌ నెసెసరీ మేం..ఐ బిలీవ్‌”

దొంగల మధ్య నిజాయితీ, క్రమశిక్షణ, వృత్తిధర్మంపట్ల నిబద్ధత ఎక్కువగా ఉంటుంది. హవాలా లావాదేవీలన్నీ ప్రపంచవ్యాప్తంగా కాగితంముక్కకూడా ఆధారంలేకుండా అందుకే నిక్కచ్చిగా జరుగుతున్నాయి..కోట్లకు కోట్లుగా.

రాంసక్సేనా లేచి..” ఐ టేక్‌లీవ్‌ మేం..ఆల్వేస్‌ వుయ్‌ విల్‌బీ ఎట్‌ యువర్‌ డిస్పోజల్‌” అని వినయంగా తలపంకించి,

డబ్బు ముందు..వాడు ఐ ఎ ఎస్సా..ఆర్మీ ఆఫీసరా..రాజకీయ నాయకుడా..అన్న మీమాంస లేదు. లొంగిపోవాల్సిందే.. రేటు మారుతుందంతే.

అతను వెళ్ళిపోయాడు.

కాగితాన్ని బ్రీఫ్‌కేస్‌లో పెట్టింది. ఈ ఫైల్‌ క్లోజ్‌. హైద్రాబాద్‌ పోగానే ఇంకో యాభై లక్షల రూపాయలను పంచిపెడితే ఈ సెజ్‌ ప్రవీణ్‌రెడ్డి పరమైపోతుంది. భూమి వానివశమైపోయే కాగితాలన్నీ చకచకా తయారౌతాయి. ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ింద మిగిలిన రెండు కోట్ల నలభై లక్షలు తన బినామీ అకౌంట్‌లో జమైపోతుంది.

అన్నీ అంకెలు…ఒక అంకెప్రక్కన ఎన్నో ఎన్నో సున్నాలు.

అంకె లేకుంటే ప్రక్కనున్న సున్నాల విలువ సున్న. ప్రక్కన సున్నాలు లేకుంటే ఒంటరి అంకె విలువ విలువ లేనిదే.,

తను ఒక అంకెనా..ఒక సున్నానా..వాటి సమ్మేళనమా.,

అస్సాం పవర్‌ మినిస్టర్‌ అరుణ్‌ ఉజ్లేకర్‌ అపాయింట్‌మెంట్‌ తొమ్మిదీ యాభై నిముషాలకు..ఇంకా అరగంట టైముంది.

చకచకా లిక్కర్‌ ర్యాక్‌ తెరిచింది..మాకల్లన్‌ విస్కీ బాటిల్‌. సోడా సీసా, ఐస్‌క్యూబ్స్‌.. క్రిస్టల్‌ గ్లాస్‌లో మిలమిలా మెరుస్తూ స్వర్ణద్రవం.

‘జిన్హే హమ్‌ భూల్‌నా చాహే..’

ఏవైతే మరిచిపోవాలనుకుంటూంటామో..ఆ జ్ఞాపకాలే ఎందుకో మళ్ళీ మళ్ళీ వెంటాడ్తూంటాయి మనిషిని.

జ్ఞాపకాలు ముఖంపై వర్షపు చినుకుల్లా..శిరసుపై చిరుజల్లు ముసురులా, మూసిన కళ్ళపై ముసిరే తూనీగల్లా.. ఒంటరిగా నడుస్తున్నపుడు తలపై రాలే పొన్నపూల జల్లులుగా,

ఎక్కడో వీణతీగ మ్రోగి..రాగాలను చిందించి..మైమరపించి..చటుక్కున తెగి..అతికి..మళ్ళీ తెగి..,

అతను జ్ఞాపకమొచ్చాడు..అతను..పన్నెండేండ్లక్రింద పరిచయమై, ఒక మానవ పరిమళమై..ఒక స్పర్శించే వీచికై..ఒక అర్థంకాని ఏదో ఐ..అతను..అతను..అతను.,

మనసు నిండా ఒక సముద్ర గంభీర నిశ్శబ్దం.. స్తబ్ద ప్రళయం..మౌన అలజడి.,

అస్సాం మంత్రి అరుణ్‌ రావడానికి..ఇంకా పదినిముషాలు.

తెలుసు..ఆ కేస్‌ వివరాలన్నీ లీలామాత్రంగా మేథోపథంలో ఉన్నాయి. డిబ్రూగడ్‌లో స్థాపించబడ్తున్న రెండు వందల తొంబయ్‌ మెగావాట్ల పవర్‌ప్లాంట్‌లో రెండు గ్యాస్‌ టర్బయిన్ల నిర్మాణ కాంట్రాక్ట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ‘మిత్రా కన్‌స్టక్షన్‌’కు యిప్పించాలి. నూటా ఎనభై కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌. మిత్రా కన్‌స్ట్రక్షన్‌ కాకతీయ గ్రూప్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన దామెర లక్ష్మయ్యది. స్వంత రాష్ట్రంలో కాంట్రాక్ట్‌లు చేస్తే బద్‌నాం ఔతున్నామని ఇతర రాష్ట్రాలకు ఎగబాకుతున్న కంపెనీ. పదికోట్ల డీల్‌. గ్యాస్‌ రేట్‌ ఒడంబడికలో తను చేస్తున్న రేటు పెంపుదలతోనే ఎనిమిది కోట్ల లాభం వాడికి. చిన్న వెంట్రుకవాసి రేటు తేడా కొన్ని కోట్ల రూపాయల ఫలిత ప్రభావాన్ని చూపిస్తుంది.

సరిగ్గా పది నిముషాల తర్వాత కాలింగ్‌ బజర్‌ మ్రోగింది. తెలుసు లీలకు ఆ వచ్చింది అరుణ్‌ అని.

బెడ్‌పై కొద్దిగా సర్దుకుంటూనే.. లేజర్‌ రిమోట్‌తో డోర్‌ తెరిచి..

‘రాజకీయ నాయకులు, మంత్రులంటే పచ్చి లంజలకంటే కడహీనులు’ అనుకుంటూండగానే,

”గుడ్‌ మార్నింగ్‌ మేడం…”

వీడికి మార్నింగ్‌..ఈవినింగ్‌., నైట్‌ ..తేడాలు తెలియట్లేదనుకుని.,

”బోలియే ఉజ్లేకర్‌ సాబ్‌..కైసేహై ఆప్‌” అంది.

”బహుత్‌ మజేమే..”

”హమ్‌ ఆప్కో..”

”పూరా యాద్‌ హై..ఇస్‌ హఫ్తామే ఓ లక్ష్మయ్య సాబ్‌కా కాగజ్‌ దస్తకత్‌ కర్కే బేజ్‌దేంగే…పూరా కామ్‌ హోగయా.. బేఫికర్‌..”

”కామ్‌ హోతేహీ..ఆప్‌కా కిసీ ఆద్మికో ఢిల్లీమే 9390109293 నంబర్‌ మే కాంటాక్ట్‌ కర్లేకే పూరా దో కరోడ్‌ క్యాష్‌.. దౌజంట్‌ నోట్స్‌ లేజానా..ఓ ఆర్డర్‌లేకే హమ్‌కో ఫాక్స్‌ కర్‌దేనా..ఠీక్‌ హై”

”ఠీక్‌ హై మేడమ్‌..ఏక్‌ దమ్‌..పూరా క్యాష్‌ మిలేగా క్యా”

”హా..వోహీ చాహియేనా ఆప్‌కో”

”హా”

అతను లేచాడు.. మరో రెండు నిముషాల్లో ఆమెవైపు భయం భయంగా, కొద్దిగా ఆశగా ఆకలిగా చూచి..నీళ్ళు నములుతూ.., బై” అంది లీల.

ఖేల్‌ కతమ్‌..తాలీ బజావ్‌.,అరుణ్‌ ఉజ్లేకర్‌ నిష్క్రమించాడు.

లీలకు అస్సాం గ్యాస్‌ పవర్‌ ప్లాంట్‌లో జపాన్‌ ప్రభుత్వం పరస్పర అభివృద్ధి పథకాల, పరస్పర సహకార ప్రణాళికల కింద ముప్పయి ఎనిమిది మిలియన్ల ఎన్స్‌ అప్పు..ఆ తతంగమంతా జ్ఞాపకమొచ్చింది.

అప్పు అంతా ప్రజలవంతు..ఆనంద తాండవాలన్నీ, అనంత సుఖాల భోగాలన్నీ ప్రభుత్వాధికారులదీ, రాజకీయ నాయకులదీ ఐన ఈ వర్తమానం దేశాన్ని ఎవరికెవరికి, ఎంత దారుణంగా కుదువ బెడ్తోందో తలుచుకుంటే..అయ్యో పాపమనిపించి, నిట్టూర్చి.,

ఆకలి అనిపించింది లీలకు..అకస్మాత్తుగా.,

ముందరున్న స్క్రీన్‌పై చికెన్‌ టిక్కా, ఖలీఫా తందూరి ముర్గా ఆర్డర్‌ చేసింది.

ఎదురుగా..పల్చని బంగారు మాకల్లన్‌ విస్కీ ద్రవం..తెల్లని మంచుపూల వలె ఐస్‌.,

ఒక సిప్‌ చేసి.,

ప్రపంచం యావత్తు ఆనంద సముద్రంలో తేలిపోతున్నట్టనిపించి,

ఏ మనిషికైనా తన దుఃఖమే ప్రపంచదుఃఖం..తను అనభవిస్తున్న తన ఆనందమే చుట్టూ ఉన్న ప్రపంచ మానవాళి అందరి ఆనందమనుకుంటూ..ఒక భ్రాంతిలో బ్రతుకుతూ..ఒక మార్మిక ఆత్మవ్యంజనలో..,

ఇంకా గంట సమయం ఉంది..ఆ రోజు మూడవ కేస్‌ నీరజా రావ్‌తో. ఒక జర్మనీ కంపెనీ భారతదేశంలో స్థాపించాలనుకుంటున్న ఆటోమొబైల్‌ కంపెనీ తాలూకు అన్ని క్లియరెన్స్‌లు, ల్యాండ్‌ అలాట్‌మెంట్‌.. వగైరా ఏర్పాట్లన్నీ.. మూడువేల కోట్ల ప్రాజెక్టు. అందులో స్పెషల్‌ గ్రేడ్‌ రోవర్‌ వెహికిల్స్‌ను ఆరేళ్ళపాటు ఇండియన్‌ డిఫెన్స్‌ కోసం కొనుగోలు చేసేందుకు యంఓయూపై అడ్మిరల్‌ కులకర్ణీతో ఒప్పందం..డీల్‌-

‘అబ్బా..యిప్పుడు ఓపిక ఉందా..ఇదంతా చేయడానికి..’అనుకుంది లీల.

లేదు.. అని గోముగా జవాబొచ్చింది లోలోపల్నుండి.

వెంటనే నిర్మలకు ఫోన్‌ కలిపింది లీల..

‘నిర్మలా..కెన్‌ యు గెట్‌ నీరజారావ్‌ ఆన్‌ లైౖన్‌ ఫర్‌ డిస్కషన్‌..ఐ కాంట్‌ మీట్‌ హర్‌ పర్సనల్లీ నౌ..ఐ షల్‌ డిస్పోజ్‌హర్‌ ఓవర్‌ ఫోన్‌ ఓన్లీ.’

‘యస్‌ మేం. ఐ విల్‌ బి బ్యాక్‌ టు యు ఆఫ్టర్‌ టెన్‌ మినట్స్‌’

లైన్‌ తెగిపోయింది.,

ఒక దేశపు సైనిక శిబిరాల్లోనైనా తన సంస్థలో ఉన్న క్రమశిక్షణ ఉంటుందా. నిబద్ధత ఉంటుందా. బాధ్యతలపట్ల ఇంత అంకితభావముంటుందా అని అనిపించింది లీలకాక్షణంలో.

ఈ రోజు లీల ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ. భారతదేశం కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఏ పనంటే ఆ పని.. రాజకీయ, ఆర్థిక, వ్యాపార, సైనిక, రాయబార సకల రంగాల్లో ఏదైనా సరే.. ఆ పనిని అతి విశ్వసనీయంగా నిర్వహించగల ఏకైక శక్తి.. లీల.

లీల అంటే..నమ్మకం..గ్యారంటీ..లీలంటే ఒక ఓటమి ఎరుగని విజయం..లీలంటే ఒక వ్యూహాత్మక కార్పొరేట్‌ ఎత్తుగడ.. ఒక ఆధిపత్య ప్రతీక.

మొబైల్‌ సన్నగా ప్రకంపించింది.

”హలో”

” మేడం. నేను నీరజా రావ్‌ని..”

”హై..హలో నీరజా..చెప్పు..”

”మీరు చెప్పిన పనులన్నింటినీ విజయవంతంగా ముగించాను మేడం. రిపోర్ట్స్‌న్నీ నా దగ్గరున్నాయి. జర్మనీ ఆటోమొబైల్‌ జెయింట్‌ రోవర్‌కు ఆదిలాబాద్‌ దగ్గర వందా యాభై ఎకరాల స్థల కేటాయింపు, వాళ్ళు తయారుచేసే డిఫెన్స్‌ యుటిలిటీ వెహికిల్స్‌కు ఆరేళ్ళపాటు పర్చేజ్‌ గ్యారంటీ ఒప్పందం..అంతా ఓకే..సంబంధిత అధికారులు, నాయకులు, మంత్రులు..అందరూఓకె. పద్దెనిమిది కోట్ల లంచాలు..మిసలేనియస్‌ ఖర్చులు ఇంకో రెండు కోట్లు. వెరసి మీరు ఈ డీల్‌ను ముప్పయికోట్లకు ఓకే చేసుకోవచ్చు. మేడం, రోవర్‌వాళ్ళు ఐదుకోట్లు మన కువైట్‌ అకౌంట్‌లో రేపు వేస్తామంటున్నారు. మీరు ఓకే అంటే.. ఐ విల్‌ వెయిట్‌ ఫర్‌ యువర్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌.”

నీరజా రావ్‌ ఐఐఎమ్‌ బెంగళూర్‌ యంబిఎ క్వాలిఫైడ్‌. మెరుపులాంటి మేధ.. చూపితే కొండ ప్రాకే తత్వం. తన కన్‌సెల్టెన్సీలో మిడిల్‌ ఈస్ట్‌ ఇంచార్జ్‌. కాని పైకి మాత్రం ఫ్రాన్స్‌లోని రోవర్‌ కంపెనీలో రెసిడెంట్‌ కన్‌స్టలెంట్‌..

అంతా బినామి..

ఎక్కడా..తమ పేరు ఉండదు బాహాటంగా..అంతర్గతంగా మాత్రం అంతటా తమ పేరే ఉంటుంది.

ఉండీలేనట్టుగా..లేకా ఉన్నట్టుగా అనిపించేదే లీల కదా.

లీల ఒక మిథ్య…ఒక సత్యం..ఒక స్వప్నం..ఒక సందిగ్ద సందర్భం..భయంకొల్పే వాస్తవం..అంతిమంగా ఒక ఓటమి ఎరుగని విజయం.

చటుక్కున ఏదో తోచినట్టు ఉలిక్కిపడి..నీరజారావ్‌కు ఫోన్‌ కలిపింది క్షణంలో. ఆమెతో డైరెక్ట్‌ కాంటాక్ట్‌ డ్యూటీలో ఉన్న తమ ఇన్నర్‌ సర్కిల్‌ అసోసియేట్స్‌ లీల స్పెసిఫిక్‌ టూర్‌లోఉన్నప్పుడు హై అలర్ట్‌లో హాట్‌లైన్‌పై అందుబాట్లో ఉండి క్షణాల్లో ఆన్‌లైన్‌లో కొస్తారు పిలవగానే. లీల కంపెనీ పనిసంస్కృతి అది.

‘వెల్‌ నీరజా..రోవర్‌తో డీల్‌ పక్కా చెయ్‌’. మనం లాస్ట్‌ డిస్కషన్‌లో మెక్సికన్‌ కంపెనీ రిచర్డ్‌సన్‌ పవర్‌ సిస్టమ్స్‌ గురించి చర్చించాం. గుర్తుందా. కువైట్‌లో మన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కూరపాటి అండ్‌ సన్స్‌ గ్లోబల్‌ టెండర్‌కు అడ్డుతగుల్తున్నాడు వాడు. వాళ్ళ బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ వచ్చే ఇరవై ఎనిమిదిన ఫ్రాంక్‌ఫర్ట్‌ వస్తున్నాడు. డిటెయిల్స్‌, ఫ్లైట్‌ నంబర్‌, హోటల్‌..వివరాలన్నీ నీకు మెయిల్‌లో వస్తాయి. వాణ్ణి టాకిల్‌ చేయాలి. వినకుంటే వాటర్స్‌ హాలో రోడ్‌లో ఆరోజు రాత్రి ఒక రోడ్‌ యాక్సిడెంట్‌పేర వాణ్ణి లేపెయ్యాలి. వాడు ఆరోజు జాన్సన్స్‌ రిక్రియేషన్‌ క్లబ్‌లో ఒక పార్టీలో పాల్గొంటాడు. ఆపార్టీనుండి వస్తూండగా..ప్లీజ్‌ నోట్‌’

”ఓకే మేం..”

”గెట్‌ బ్యాక్‌ టు మీ..ఆన్‌ ట్వంటీ నైన్త్‌ ఈవినింగ్‌ ఎట్‌ సిక్సోక్లాక్‌ పాజిటివ్లీ”

”యస్‌ మేం..”

ఫోన్‌ పెట్టేసి..టకటకా ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలోని ఒక సీనియర్‌ మంత్రి విశ్వనాథరెడ్డికి లైన్‌ కలిపి..”మీరు రేపు ఉదయమే..ఎనిమిది గంటలలోపు ప్రెస్‌మీట్‌ పెట్టి ముఖ్యమంత్రి పనితీరుపై, అసమర్థతపై మండిపడ్తూ తీవ్రపదజాలంతో ఒక స్టేట్‌మెంట్‌ ఇవ్వండి. చదరంగం ప్రారంభమైంది. ఒక పావు కదపాలిప్పుడు మనం. మీకది ఉపయోగకరంగా ఉంటుంది..”అని ఆదేశించింది.

”యస్‌ మేడం..”

గుండెల్లో ఏదో ఉద్వేగం..ఒకని మరణశాసనం..ఒక ప్రభుత్వ పతనానికి ముహూర్తం.,

కళ్ళు మూసుకుంది..అలసటగా.

ఎదురుగా..విశాలమైన గాజుతలుపుల కారిడార్‌లోనుండి..చొచ్చుకొచ్చి నిరీక్షిస్తున్న నీలి సముద్రం. అలల ఎడతెగని చప్పుడు..లయబద్ధంగా..నిరంతరంగా..వింటోంది..వింటూనే ఉంది..,

ఆమెకర్ధమౌతోంది.. ఆమె బయట.. ఎదుట మాత్రమే కాదు.. తన లోలోపలకూడా ఒక నిశ్శబ్ద సముద్రం గర్జిస్తోందని,

టైం చూచుకుంది లీల కొద్దిసేపైన తర్వాత. రాత్రి రెండూ యాభై నిముషాలు.

ఈ దిక్కుమాలిన ప్రపంచంలో రాజకీయాల్లోగానీ, ఇతరేతర ఏ కీలక రంగాల్లోగానీ అతిప్రధానమైన నిర్ణయాలన్నీ రాత్రుళ్లే జరిగిపోతాయి. రాత్రుళ్ళు వ్యూహించుట..పగళ్ళు అమలు..ఒక రేయింబవళ్ళు వేట,

ఎందుకో ఆమెకు తన ఇష్టమైన ‘ఎర్త్‌’ బ్లూరే డివిడి చూడాలనిపించింది. లాప్‌టాప్‌లోనుండి ఎదుట ఉన్న శాంసంగ్‌ హోం థియేటర్‌ సిక్ట్సీ ఫోర్‌ ఇంచెస్‌ టి.విలోకి డిస్ని నేచర్‌ ‘ఎర్త్‌’ ఫైల్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసి ‘ప్లే’ నొక్కింది.

‘ఎర్త్‌’..అంటే..భూమి..ఫృథ్వి..పుడమి..ధరణి.,

స్త్రీ.. అంటే అన్నింటినీ భరించేది..ధరించేది..ధరణేకదా., టి.వి. తెరపై విశాలంగా ఒక ఎడారి విచ్చుకుని పరుచుకుంది. ఒక ఒంటరి గ్రద్ద..విశాలంగా విప్పుకున్న రెండు రెక్కలు.. పరుగెత్తుతోంది..పైన ఆకాశం..క్రింద భూమి,

లీల అలసిపోయిన ప్రతిసారీ ఈ ‘ఎర్త్‌’ డివిడిని చూస్తుంది..చూడగానే హృదయం రీచార్జ్‌ ఔతుంది. తను పునరుత్తేజిత ఔతుంది. ఈ భూమిపై చిగురించి, ఎదిగి, ఒదిగి, వికసించి, నశించి, దహించుకుపోయి, శిథిలమై, ఒట్టి అవశేషంగా మిగిలి..స్తబ్దమై..నిర్జీవమై..మళ్ళీ చిగురించి..,

‘వలయం వలయేతి..’

చక్రం.. కాలచక్రం..ఋతుచక్రం.. జీవచక్రం..జ్ఞానచక్రం..జగమంతా ఒక అవ్యవస్థిత చక్రగమనం.. చక్రభ్రమణం,

ఏనుగు శరీరం ఎంతో పెద్దది. కళ్ళు ఎంత చిన్నవో,

పక్షి ఏదైనా..రెక్కలు రెండు..ఎంత చిన్నవో..ఈదవలసిన ఆకాశం ఎంత విశాలమైందో..

గుర్రం కాళ్ళు ఎంత  సన్ననివి..కాని, దాని వేగం ఎంత ప్రచండమైంది. ఐతే జీవితమంతా పరుగే..పుట్టి భూమిపైన పడ్డ మరుక్షణం నుండి చచ్చేవరకు గుర్రం నిరంతరం రేయింబవళ్ళు ఎప్పుడూ నిలబడి ఉండడమే. అలసట ఎరగకుండా.. విధేయంగా, సహనంగా..ఎంత శిక్ష..జీవితకాల శిక్ష.

రెక్కలు మొలుస్తున్నపుడు ప్రతి పక్షీ ఎంత పులకించిపోతుంది,

పుడ్తున్నపుడు ఏ మొక్కయినా ఎంత అందంగా ఉంటుంది జీవకాంతితో.

ప్రతి జలపాతం..క్రింద పడి..పతనమై..చితికి…చింది..స్థూల ప్రవాహం ఒక సూక్ష్మ విస్తరణగా, వ్యాప్తిగా మారి..ఉత్థానం..పతనం..శృంగం, ద్రోణి – శిఖరం..లోయ..చీకటి, వెలుగు..ఉదయం, అస్తమయం..ప్రక్కప్రక్కనే, వెంటవెంటనే,

ఒక జింకను ఒక పులి వేటాడ్తోంది.. ఆకలిగా, కసిగా, దీక్షగా..తెరపై .,

ఆ క్షణం ముందు పులి పొడ జింకకు తెలియదు.. జింక ఉనికి పులికి తెలియదు..ఒకదానికి మరొకటి తటస్థపడగానే.. ఆత్మరక్షణ..వేట..వేటాడబడ్డం.,

భూమ్మీది ఈ సకల చరాచర జీవరాశులన్నీ జీవించడానికి పోరాడ్తూనే, ఆత్మరక్షణ కోసం వ్యూహాత్మకంగా బ్రతుకంతా యుద్ధం చేస్తున్నాయి..కదా.

యుద్ధం..యుద్ధం..జీవితమంటే..యుద్ధం..పోరాటం.,

ఎవరితో..?

సముద్రాలు..ఎడారులు..అడవులు..ఆకాశం..ఈ సమస్త జీవజాలం..,

అంతా ఏనాడూ ఎవరికీ అర్ధంకాని ఒక వ్యవస్థ..ఒక పాఠం..ఒక సజీవ బోధన..అంతా ఉండి చివరికి ఏదీ ఉండదని నిరంతరం ఒక సత్యాన్ని ప్రవచించే ప్రజ్వలిత చేతన.,

లీల మనసునిండా ఒక ఛాయామాత్రంగా సమస్త సృష్టి.. క్రమంగా వ్యాపించి..అల్లుకుపోతూ..ఎక్కడో తెలిపోతూ.,

గాలి కనబడ్తుందా..?ప్రశ్న.

కనబడదు కాబట్టి గాలిలేనట్టు కాదుగదా.

కనబడనివన్నీ లేనట్టా.. కనబడేవన్నీ ఉన్నట్టా..,ప్రతి మనిషికీ తెలిసే ‘ఆకలి’ ఉన్నట్టా లేనట్టా.

ఎందుకో ఆమె హృదయపు లోపొరల్లో అన్నమయ్య కీర్తన కదిలి సన్నగా వినిపించడం మొదలైంది.

‘అంతర్యామీ..అలసితి..సొలసితి..’

లీల కళ్ళు మూసుకుంది.

ఎందుకో ఆమె కళ్ళనిండా నీళ్ళు నిండి..దుఃఖం పొంగి పొంగి,

అప్పుడామె తీరాన్ని చేరబోతున్న సముద్రపుటలలా..కల్లోలంగా ఉంది.

(సశేషం)

ఉహూ ….కారణాలేమయినా ?

జిందగీ మౌత్ నా బన్ జాయే సంభాలో యారో :

శరత్కాలం ఆకుల్లా కలలన్ని రాలిపడుతున్నపుడు
జ్ఞాపకాల వంతెన పగుళ్ళు పాదాలని
సుతిమెత్తగానే అయినా కోస్తూ ఉంటే
గుండె మంటలను చల్లార్చే మేజిక్ నైపుణ్యాలు
నిశ్శబ్దం గా నిద్ర పోతూనప్పుడు
తడి ఆరని కళ్ళు రాత్రి పాటల నైటింగేల్ లా
రెప్పలు అలారుస్తూ

ప్రపంచాన్ని ప్రేమించాల్సిన  చిన్న హృదయం
ఒకే వ్యక్తి ప్రేమ కోసం మరింత చిన్నబోతుంటే
నైతికతల జలదరింపు లో శూన్యమైన
ఆకుల గుస గుస లలో ఒక ఉత్కంఠభరితమైన నిట్టూర్పుతో
శరదృతువు ఇంకోసారి ఎర్రబడినప్పుడు
ఒంటరి రాత్రుల నిదురలనెందుకు లేపటం ?

ఎన్నిసార్లో

చీకటి కి మెలుకువకి మద్య మగతల్లో
జీవితాన్ని ఇంకో సారి దగ్గర కి తీసుకొవాలని
గుండెల్లో దాచుకొని హత్తుకోవాలని
మునివేళ్ళతో  తన బుగ్గలను మృదువుగా సృశించాలని ,
తన చెంపల మీద కన్నీటి మచ్చలను నెమ్మదిగా తుడవాలని
తన కి మాత్రమే వినపడేటట్లు సుతిమెత్తగా
మృదు స్వరం లో లాలి పాడి నిద్రపుచ్చాలి

అని ఎన్ని సార్లు మనసు కొట్టుకుంటుంది
బహిష్కరించలేని బాధలు భూమ్మీద
ప్రతి ప్రాణికి విజయపు ఓటములంత నిజం
అని చెప్పాలని ఎన్నిసార్లు అనుకుంటాను

అలాగే

ఉదయపు ఎండలు శరీరం తో ఆటలడుతున్న వేళ
ఊహల ఉచ్చుల ఇమేజ్ అద్దం లో ఉండదని
ఫెయిరీ టేల్ కవిత్వం కనులముందు కనిపించదని
నిజం అబద్ధం కి మధ్య గీతలు చిన్నవని
మనసుకు గోలుసులేసి అవి తమతో
లాగుతూ ఉంటాయని
గుండె చప్పుడు స్థిరంగానే ఉంటుంది
కాని (వి)శ్వాసలే విరిగి ముక్కలవుతాయని
మనసుకు మనసుకు మద్య  ద్వేషాల చైనా వాల్
స్థిరంగా , బలంగా ఉండిపోతుందని
స్మైల్స్ మద్యలో మైళ్ళ దూరం దాగుందని
చెప్పాలి అని గుండె విప్పాలి అని  అనుకుంటాను

Van_Gogh-09

ఉహూ ….కారణాలేమయిన ?

విరిగిన అద్దం ముక్కల ను అతికించి
పైన  ఎంత gloss పెయింటింగ్ చేసినా
నవ్వుతున్న పగిలిన పెదవుల లా
గాయాల వికృతత్వం కనిపించకుండానే
కనిపిస్తూ ఉన్నంతవరకు
వర్షించని నల్ల మబ్బుల్లో నీళ్ళు ఉంటాయని
కనిపించని ఆకాశం ఉక్రోషంలో గర్జిస్త్తే
వర్షం పడుతుంది అని
ముసుగుల వెనక దాగిన
గుండెల్లో ఎక్కడో వినిపించని
మానవత్వం చిరుమువ్వలు సవ్వడి చేస్తూంటాయని
నమ్మని  , నమ్మించలేని వెక్కి వెక్కి ఏడ్చే వెర్రి గుండె
మౌలా మేరి లేలే మేరి జాన్ పాడే  పాటల్లో
కష్టం వెనక మిగిలిన నిజం ఒక్కటే

అబ్సొల్యూట్ ట్రూత్స్ అంటూ  లేని జీవితం లో
వందలు గా వేలుగా కూడి చేరి
గూడు కట్టిన నిస్పృహల ప్రయాణం
దేవుడి మేనిఫెస్టో నుండి
రొమాంటిక్ మేనిఫెస్టో దార్లను వెతుకుతూ
కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కి చేరి ఓడిపోయినపుడు
కన్నీళ్ళకు తప్ప యూనివర్సల్ ఈక్వాలిటీ  ఎవరికీ సాధ్యం ?

జిందగీ తో జి తే జి మౌత్ బన్ గయా
అబ్ క్యా సంభాల్నా మేరె దోస్త్ ?

నిశీధి 

చిత్రరచన: వాంగో

నదీమూలంలాంటి ఆ యిల్లు!

 

యాకూబ్

యాకూబ్

చాలాచోట్లకు చాలా సందర్భాల్లో , అసందర్భాల్లో వెళ్ళలేకపోయాను
వెళ్ళినందువలన ,వెళ్ళలేకపోయినందున
అంతే ;అంతేలేని ,చింతే వీడని జ్ఞాపకంఊళ్ళో ఇప్పుడెవరూ లేరు
వృద్ధాప్యంలో ఉన్న యిల్లు తప్పఇల్లంటే చిన్నప్పటినుంచీ నాలోనే నిద్రిస్తున్న ద్వారబంధం;
చిన్నిచిన్ని కిటికీలు రెండు;
కొన్ని దూలాలు;
వాకిట్లో ఎదుగుతున్న కొడుకులాంటి వేపచెట్టు
బెంగగా వుంటుంది దూరంగా వచ్చేసానని .
కలల్లోనూ అవి సంచరిస్తున్నప్పుడు ఏడుస్తూలేచి ,పక్కలో తడుముకుని దొరక్క
వాటిని కన్నీళ్ళతో సముదాయిస్తానుఅప్పటికవి ప్రేమిస్తాయి
ఇంకా నాలో మిగిలిఉన్నందుకు అవి నన్ను క్షమిస్తాయి.
1
ఇంతున్నప్పుడు

నన్ను సాకిన రుణంతో వాటిని మోస్తున్నాను; అవి నన్ను మోస్తున్నాయి
ఒళ్ళంతా పాకిన గజ్జికురుపులమీద చల్లుకుని పేడరొచ్చులో ఉపశమించాను
వేపాకు నూరి పూసుకుని కురుపుల్లా మాడి చేదెక్కాను
కాలిబొటనవేలి దెబ్బల్నిఒంటేలుతో కారుతున్న రక్తానికి అభిషేకం చేసాను
ఎర్రటి ఎండలో బొబ్బలెక్కిన కాళ్ళ మీద ఆవుమూత్రం రాసుకుని
ఆనందంతో గంతులేశానుఋణమేదో అంతుబట్టని రహాస్యమై కలల్ని ముట్టడిస్తుంది;
గాయాల సౌందర్య రహాస్యమేదో చిక్కని ప్రశ్నగా వెంటాడుతుంది
picasso-paintings-17-575x402

2
అక్కడున్నది ఖాళీ ఖాళీ నేలే కావొచ్చు;
ఎవరూ సంచరించని ,నిద్రించని,
గంతులేయని ఉత్తి భూమిచెక్కే కావొచ్చు
అక్కడొక జీవితం వుంది ,జీవించిన క్షణాలున్నాయి,
నిత్యం సంఘర్షించిన సందర్భాలున్నాయి ,
పెంచి పోషించిన కాలం వుంది
వెళ్ళలేక చింతిస్తున్న ,
దు;ఖిస్తున్న కల ఇంకా నాలోనే వుంది
చాలా చోట్లకు వెళ్ళలేక పోవడం క్షమించలేని నేరమే
మరీముఖ్యంగా నదీమూలంలాంటి ఆ యింటికి.
-యాకూబ్

అవ్యక్తం

భాస్కర్ కొండ్రెడ్డి

భాస్కర్ కొండ్రెడ్డి

1

 ఎదురుచూస్తునే వుంటాం మనం,

కళ్లువిప్పార్చుకొని, ఇంకొన్ని ఆశలు కూర్చుకొని,

ఆ చివరాఖరి చూపులు

మళ్లీ తెరుచుకోకుండా, మూసుకొనేదాకా.

 

2

ఎన్ని కష్టాలు తలలకెత్తుకొని తిరుగాడిన దుఃఖాలనుంచి

విముక్తినొందే సమయాలను మళ్లీమళ్లీ తలుచుకుంటూ

వదిలిపోయిన చిరునవ్వుల చివరిస్పర్శల పలకరింతలను

పదిలంగా దాచుకొని, దాచుకొని

పగలకుండా, ఓదార్చుకుంటున్న

ఓ పురా హృదయాన్ని, కొత్తగా పునర్మించుకోలేక

వదలని వేదనను, హత్తుకొని సముదాయుంచుకొంటూ

 

3

ఎన్నెన్ని ఆలోచనలు సమసిపోయాయో

ఏ ఏ అనుభూతులు వదలిపోయాయో

ఎన్ని జీవితకాంతులు,అలా చూస్తుండగానే ఆరిపోయాయో

లెక్కలకందని,లెక్కించలెన్నన్ని తారకల్లా తెల్లారిపోయాయో

ఒక హృదయసాక్షానికి, తార్కాణంగా మిగలడానికి కాకపోతే

ఎందుకిలా, ఇక్కడే చూస్తుండిపోతాం.

దేన్నీవదలకుండా, ఎటూ కదలకుండా.

4

మొదలుకావడంలో మన ప్రమేయమే లేనట్లు

పయనమంతా మనమే చేసినట్లు, భరించినట్లు

ఇహలోకబంధాలు వదిలించుకొని,

ఇకరా అని, ఎవరో పిలిచినట్లు,

 

ఒక్కొక్క అంశాన్ని ఎంత జాగ్రత్తగా,

పునఃసమీక్షించుకుంటుంటామో కదా, మనం.

 

మనకు మనమే ఒక వైభోగవంతమైన వలయాన్ని,

కందకంలా నిలుపుకొని, కనులముందు

ఎంతగా విలపిస్తామో మరి,  దాన్నిదాటలేక.

– భాస్కర్ కొండ్రెడ్డి

రాలిపోయిన కాలం

ఎమ్వీ రామిరెడ్డి

ఎమ్వీ రామిరెడ్డి

మిగిలిపోయిన గాయాల గురించి

బెంగలేదు

పగుళ్లిచ్చిన కలల గురించి

పశ్చాత్తాపం లేదు

ముళ్లను కౌగిలించుకోబట్టే

పాఠాలు బోధపడ్డాయి

కళ్లు నులుముకున్న ప్రతిసారీ

నిప్పులకుంపట్లు బయటకు దూకేవి

అధ్యాయాల్ని ఔపోసన పట్టడానికి

తెల్లవారుజాముల్లో ఎన్నెన్ని మరణాలు

చీకటితెరల్ని చించుకుంటూ

వెలుగుపొరల్ని కౌగిలించుకుంటూ

చచ్చుబడిన కణాలను నిద్రలేపిన గుర్తులు`

అక్షరాలు అలసిపోయేదాకా

పరుగుపందెం ఆపబుద్ధి కాదు

pablo-picasso-paintings-0004

గుండెలమీద రెపరెపలాడే పేజీలు

దేహాత్మలోకి వెన్నెలదృశ్యాల్ని దించుతున్నప్పుడు

చుట్టూ సూర్యకిరణాల పరిభ్రమణం

ఎటు చూస్తే అటు ఓ విశాల బాట

మైలురాళ్ల వెంట ఆహ్వానతోరణాలు

తీరం చేరిన ప్రతిసారీ ఒక విజయోత్సవం

పరుగెత్తే మోహంలో

ఏమేం పోగొట్టుకున్నానో గుర్తించలేక

రాలిపడుతున్న చంద్రుళ్లను ఏరుకుని

మళ్లీ ఒంటికి అతికించుకోలేక

ధ్వంసమైన క్షణం మళ్లీ కొరడా ఝళిపిస్తుంది

రాలిపోయిన కాలాన్ని ఏ రూపంలో ఏరుకోవాలి

వెంట నిలబడటమా

వెన్నెముకను వదులుకోవటమా

అంటిపెట్టుకుని అంటకాగటమా

ఆరిపోయిన దీపాలను వెలిగించటమా

 గాయాల్లోంచి సన్నగా వేణుగానం

కలల కారడవుల్లో హరితకాంతి

పాఠాల పునశ్చరణలో నూతనశకం

– ఎమ్వీ రామిరెడ్డి

ఉరిమిన మబ్బు

అనువాదకులు ఎల్. ఆర్. స్వామి

అనువాదకులు ఎల్. ఆర్. స్వామి

ఫోను మాట్లాడిన నాకు ఎగిరి గంతేయాలని అనిపించింది. రోడ్డు మీద దొరికిన టికెటుకి లాటరీ తగిలినంత ఆనందం కలిగింది. అగ్ని కర్తీరిలో చల్లని వాన కురిసినట్లు తోచింది.

ఒక ఊదటున లేచి ‘సేల్స  బ్యాగు ‘చంకకి తగిలించుకున్నాను. షూ లెసు ముడి వేసుకుంటూ వుంటే ,మా ఆవిడ

కేకేసింది. ‘’ఏమండోయ్   ,టిఫిను రెడి. తిని వెళ్ళండి.మళ్ళీ ఎప్పుడు ఇల్లు చేరుతారో ,ఏమూ —–‘’

వాచీ చూశాను. టైం పావు తక్కువ తొమ్మిది !

కచ్చితంగా తొమ్మిది గంటలకు రమ్మన్నాడు అతడు. తొమ్మిది దాటుతే అతడు  ఉండడట !

గేటు వైపు నడిచాను. చాలా ఉక్కగా వుంది. ఆకాశం నిండా నల్లని మబ్బు. చినుకు రాల్చని ఆ నల్లని మబ్బు ఆర్డర్లు రాల్చని కస్టమర్లను గుర్తు చేసాయి.

‘’ఏమండోయ్  —‘’ మళ్ళీ కేకేసింది మా ఆవిడ.

పట్టించుకోలేదు. మగడికి తిండి పెట్టె విషయంలో ఆడది చూపే ప్రేమ మరే విషయంలోనూ చూపదు కదా !

బైకు ఎక్కాను. టైముకి వెళ్ళాలి. వెళ్తే ఒక ఆర్డరు రావచ్చు.

ఆర్డరే కదా ,మాలాంటి ‘సేల్స్ మేను’ల ఉద్యోగానికి ప్రాణవాయువు !

మా మేనేజర్ కూడా అదే మాట అన్నాడు. ‘’ఎలాగోలా ఆర్డర్లు సంపాదించాలయ్యా.రెండు నెలలుగా ఒక ఆర్డరైనా తేలేదు నువ్వు’’

నిజమే !తల దించుకున్నాను.

‘’ఈ నెలలోనైనా ఆర్డరు తేలేకపోతే —–‘’

ఏమవుతుందో నాకు తెలుసు.’సేల్స్  బ్యాగు ‘ తిరిగి ఇచ్చేయాలిసిందే.

‘’ఒక పని చేయి ‘’మేనేజర్ సానుభూతితో అన్నాడు. ‘’నేను ఒక వెయ్యి  కరపత్రాలు అచ్చు వేయిస్తాను. అవి పంచు.గోడల మీద ,స్తంబాల మీద అంటించు. మన కంపెనీ గురించి జనానికి తెలియాలి కదా ‘’

అలాగే చేసాను. ఊరిలోని ప్రహారి గోడలు నిండా మా కరపత్రాలే !

మాది అంతర్జాలం అద్దికిచ్చే కంపెని . వెంటనే ఫలితం కనబడింది. ఫోను వచ్చింది.

నవ్వుతూ ఆత్మీయంగా స్వాగతం పలికాడు అతడు. ఇంటిలోపలకి తీసుకొని వెళ్ళి కూర్చోమని చెప్పాడు

అరవై సంవత్సరాలు దాటిన మనిషి అతడు. వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అతని మాట తీరు చూస్తువుంటే ఆర్డరు ఇస్తారనే అనిపించింది. హాయిగా ఊపిరి పీల్చాను.

‘’సరే ,వెంటనే కనెక్షన్ ఇచ్చేస్తావు. ‘’అతడు అన్నాడు ‘’మరి ఏదైనా సమస్య వస్తే —-‘’

‘’నేను ఈ ఊరిలోనే ఉంటాను కదండీ సార్.ఒక ఫోను కొట్టండి.చాలు వెంటనే స్పందిస్తాను ‘’

‘’కచ్చితంగా ——‘’

‘’కచ్చితంగా స్పందిస్తాను సార్ ‘’

‘’అయితే సరే ఫోను చేస్తాను ,ఈ రోజే ‘’

నాతో పాటు గేటు దాకా వచ్చాడు అతడు.

‘’మా ప్రహారీగోడ మీద అంటించిన కరపత్రం మీదే కదా —‘’

‘’అవును ,సార్ ‘’

‘’శుభ్రంగా పైంటు చేసి వుంచిన గోడ పాడు చేసారెమిటి ? ‘’అతని గొంతు మారింది ‘’ఆ కరపత్రం పీకెసి గోడ శుభ్రం చేసి వెళ్ళండి ‘’

నేను ఖంగు తిన్నాను. ఒక నిమిషం పోయాక అన్నాను ‘’అలాగే సార్ . కుర్రవాడ్ని పంపుతాను ‘’

‘’ఈ మాత్రం దానికి కుర్రవాడేందుకు ?’’

నేను మాట్లాడలేదు.

‘’అంటే మీరు చెయరన్న  మాట. అంతేగా. –ఇప్పుడేగా చెప్పారు సమస్యకి వెంటనే స్పందిస్తారని. ఇదేనా మీ స్పందన—‘’

ఇరకాటంలో పడ్డాను.

గోడ మీద కరపత్రం చించి గోడ శుభ్రం చేసి బైకు ఎక్కాను.

ఆకాశం నిండా మబ్బే !కాని మబ్బు కురవలేదు ;ఉరిమింది.

    –ఎల్. ఆర్ . స్వామి

*

 

 

 

అడుక్కునే ఆ వేళ్ళల్లో…ఒక హరివిల్లు!

DRUSHYA DRUSHYAM-8
నిజాం కాలేజీ గ్రౌండ్స్ వద్ద తరచూ అనేక రాజకీయ పార్టీల బహిరంగ సభలు జరుగుతూ ఉంటై. సామాజిక ఉద్యమకారులూ పెద్ద పెద్ద సభలూ నిర్వహిస్తరు. దగ్గర్లోనే విద్యుత్ ఉద్యమకారులపై చంద్రబాబు ప్రభుత్వం కాల్పులు జరపగా అప్పటి అమరుల స్మతి చిహ్నమూ అక్కడే ఉంది. నక్సలైట్ల మందుపాతరలో మరణించిన మాధవరెడ్డి ప్రతిమా ఉన్నది. ప్రెస్ క్లబ్బూ ఉంది. పోలీస్ కంట్రోల్ రూమూ ఉన్నది. ఇంకా చాలా ఉన్నయ్. విద్యార్థులున్నారు. మేధావులున్నారు.  అక్కడే ఈ మనిషీ ఉన్నడు.

ఇతడు కుష్టు వ్యాధిగ్రస్థుడు. వీధి భిక్షువు. అందరూ ఉన్న అనాథ.

తనను తాను తోలుకునే ఒక వీల్ చెయిరు వంటి ప్రపంచంలో తానొక అర్భకుడు…
ఊరూ పేరూ కులమూ మతమూ ప్రాంతమూ దేశమూ ఎముకలూ చీమూ నెత్తరూ ఆత్మా ఉండి కూడా ఏమీ లేని మనిషి. అభాగ్యుడు. అపరిచితుడు. పాపి.

అవును. ఎవరున్నా లేకున్నా…కొత్తగా ఎన్ని లేచినా ఏమున్నది గనుక అన్నట్టు, మట్టికొట్టుకుపోతున్న దేహమూ, దేనిపైనా ఆశలేని విరాగమూ, ఎండకు ఎండి, వానకు తడిసి, శీతలానికి తట్టుకోలేని నిస్సహాయ ప్రాణమూ, దాన్ని తనంతట తాను వదలలేక ఆ శిలువ వేసిన క్రీస్తును తలుచుకుంటూ కానవచ్చే పాపి.

అతడు వినా ఏదీ ఆ వీథిలో నన్ను ఆకర్షించదేమీ? అని చింతిస్తూ, నిర్దయగా నా నగరమూ ప్రజలూ అని వాపోతూ బతుకును చిత్రిక పడుతూ పోవడం పరిపాటయింది నాకు!

తెలుసునా?..ఒక దృశ్యం చిత్రించేటప్పుడు గుండె కలుక్కుమంటుంది. ఆ దృశ్యం చెంత నుంచి చప్పున అదృశ్యం కావాలనిపిస్తుంది. కానీ అది మెదడు.

గుండె వేరుగా పనిచేస్తుంది. ఆగిపోతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య ఆ జీవితాన్ని శ్వాసించినాకే అడుగు ముందుకు వేయనిస్తుంది.

ఆ క్షణంలో ఏదీ గుర్తుకు రాదు. కానీ ముందూ వెనకా మనసు పరిపరివిధాలా పోతుంది.
ఆ వృధ్దుడి దీనావస్థకు మనసు కలికలి అవుతుంది. కలకలా అనిపిస్తుంది.

కళ కళ కోసమేనా, కాసుల కోసమేనా అన్న చర్చకాదు గానీ మనిషి మనిషి కోసమేనా? కాదా అన్న బాధతో కడుపు రగిలిపోతుంది.

కవులైతే కవిత్వం, గాయకులైతే పాట, తాత్వికులైతే మీమాంస, రాజకీయ నేతలైతే హామీలవుతున్నారు. ఇక దేవుండ్లయితే బద్మాష్ లే అవుతూ తప్పుకుంటున్నారని వాపోతుంది.
ఇదంతా ఆలోచన. కానీ, అంతకన్నా విలువైనది తాదాత్మికత.

అందువల్లే చిత్రం మహత్తరం అవుతుంది.
అందలి జీవితం గురించి స్పందించేలా చేసి మనుషుల్ని మహానుభావుల్ని చేస్తుంది.

unsung unwept unnoticed unhonored  అని భావించే ఎన్నిటిపైనో ఆ మనిషి మనసును లగ్నం చేసేలా చేస్తుంది.
అందుకే ఆస్కార్ వైల్డూ, నువ్వన్నది నిజమే!జీవితం చిన్నదైనా కళ అపూర్వం. art is long.

ఆటా రచనల పోటీలు

ata

మెరికా తెలుగు సంఘం వారు పదమూడవ ఆటా మహాసభల సందర్భంగా ప్రచురించే ప్రత్యేక సంచిక కోసం రచనల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు  రచయితల నుండి ఈ క్రింది సాహితీ ప్రక్రియల్లో రచనలు ఆహ్వానిస్తున్నారు:

1. కథలు

2. కవిత్వం (వచన కవిత్వం, ఛందోబద్ధమైన కవిత్వం)

3. వ్యాసాలు/గల్పికలు/వ్యంగ రచనలు/లేఖలు/పేరడీలు

పోటీల నిబంధనలు, రచయితలకు సూచనలు:

• రచయితలు పైన పేర్కొన్న ఏ విభాగానికైనా తమకు నచ్చిన ఇతివృత్తం ఎన్నుకోవచ్చును. తెలుగు సంస్కృతి సంప్రదాయాన్ని, అన్ని తరాల విభిన్న ఆలోచనా రీతుల్ని , సమాజ, ఆచార వ్యవహార స్థితిగతుల్ని ప్రతిబింబిస్తూ రాసే రచనలకు పెద్దపీట వేయబడుతుంది.

• ఉత్తమ రచనలకు $116 బహుమతితో పాటు ఆటా జ్ఞాపిక అందజేయబడుతుంది. బహుమతి ప్రధానం  జూలై 3, 4, 5 తేదీలలో ఫిలడెల్ఫియాలో జరగబోయే ఆటా వార్షికోత్సవ మహాసభలలో జరుగుతుంది.

• బహుమతి పొందిన రచనలు, సాధారణ ప్రచురణకు ఎంపిక చేయబడిన రచనలను ఆటా ప్రత్యేక సంచికలో ప్రచురించడం జరుగుతుంది.

రచనలు చేరవలసిన ఆఖరి తేదీ మార్చి 30, 2014. ఈ తేదీలోపు కంటే ముందే, వీలైనంత త్వరగా పంపగలిగితే మరీ మంచిది.

• కథలు: కథల నిడివి చేతి వ్రాతలో పది పేజీల లోపు, టైపింగ్ లో ఐదు పేజీల లోపు ఉంటే బావుంటుంది.

• కవిత్వం: కవిత చేతి వ్రాతలో ఐదు పేజీల లోపు, టైపింగ్ లో రెండు పేజీల లోపు ఉంటే బావుంటుంది. ఆదునిక కవిత, ఛందోబద్ధమైన పద్యకవిత్వం, ఇతర కవితా ప్రక్రియలూ అన్నీ ఆమోదయోగ్యమే.

• వ్యాసాలు, గల్పికలు, వ్యంగ రచనలు, పేరడీలు, లేఖలు: చేతి వ్రాతలో ఐదు పేజీల లోపు, టైపింగ్ లో రెండు పేజీల లోపు ఉంటే బావుంటుంది.

• రచయితల యొక్క అముద్రిత స్వీయ రచనలు మాత్రమే స్వీకరించబడతాయి. అనువాదాలు, అనుసరణలు, అనుకరణలు అంగీకరించబడవు. బ్లాగులు, వెబ్ సైట్స్, వెబ్ పత్రికలు మొదలైన వాటిల్లో ప్రచురించబడ్డ రచనలు పరిగణింపబడవు. ఈ విషయాలను ధృవీకరిస్తూ హామీపత్రం జత చేయాలి.

• రచనలపై సర్వాధికారాలు రచయితకే చెందుతాయి. కాని, రచయితలు తమ రచనలను ఆటా ప్రత్యేక సంచికలో ప్రచురించే లోపు ఇంకెక్కడా ప్రచురించవద్దని మనవి.

• రచనల్ని యూనికోడ్ ఫాంట్స్ లో పంపాలి. ఒకవేళ మీకు యూనికోడ్ లో టైప్ చేసే సౌకర్యం లేకపోతే మీరు మీ రచనలను స్కాన్ చేసి PDF ఫైల్స్ పంపించవచ్చు. దయచేసి వీలైనంత వరకు యూనికోడ్ లో టైప్ చేసి పంపించగలరని కోరుతున్నాం. రచనను ఈమెయిలులో రాసి పంపవచ్చు, లేదా ఈమెయిలుకు జోడింపుగా టెక్స్ట్ ఫైళ్ళ రూపంలో కూడా పంపవచ్చు. రచనలు పంపే విషయంలో మీకు ఎలాంటి సందేహాలున్నా ఈ క్రింది ఈమెయిల్ అడ్రసుకు మీ ప్రశ్నలు పంపించండి. మేము సాధ్యమైనంత త్వరలో మీకు సమాధానం ఇవ్వటానికి ప్రయత్నిస్తాం.

• కనీసం ఐదుగురు న్యాయనిర్ణేతలు విజేతలను నిర్ణయిస్తారు. న్యాయనిర్ణయం అంతా తగిన నిబద్ధత, కొలబద్దల ఆధారంగానే జరుగుతుంది. విజేతల నిర్ధారణలో అన్ని విషయాలలోనూ నిర్వాహకులదే అంతిమ నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.

• రచనలు పంపవలసిన ఈమెయిలు: souvenir@ataconference.org. ఈమెయిలులో మీ పూర్తి పేరు, కాంటాక్ట్ నెంబర్, చిరునామాల తో పాటు ఒక పేజీకి మించకుండా మీ నేపద్యం కూడా పంపించడం మరిచిపోవద్దు.

వీలునామా – 21 వ భాగం

శారద

శారద

[su_quote] (కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)  [/su_quote]

 అంతగా విద్యా గంధం అంటని మనిషి రాసినట్టుంది ఆ ఉత్తరం.

మెల్బోర్న్

20 ఏప్రిల్

 ప్రియామైన ఫ్రాన్సిస్,

నీకీ మధ్య బాగా డబ్బొచిందటగా? ఆ పెద్ద మనిషికి మాబాగా అయిందిలే. మనిద్దరినీ రోడ్డు మీద  పడేయాలని బాగా ఆశపడ్డాడు, కానీ పాపం ఏం లాభం? అమ్మని మర్చిపోకు నాయనా. ఎంత బలవంతంగా నిన్ను నానుండి లాక్కున్నాడు! నీకు నా మొహం కూడా గుర్తులేదేమో.

పోయేవరకూ నాకు యేడాదికి నూటాయాభై పౌండ్లు పంపే వాడులే! అది ఆగిపోయేసరికి ఏమైందా అని వాకబు చేసా. అప్పుడు తెలిసింది, ఆయన పోయి ఆస్తంతా నీ చేతికొచ్చిందని. నాకొక్క మాటైనా చెప్పలేదెవ్వరూ. అయినా నా గతి ఎప్పుడూ అంతేలే. నా మొహం చూసి కష్టసుఖం పట్టించుకున్నదెవరు?

కనీసం నువ్వైనా ఈ అమ్మని కొంచెం కనిపెట్టి వుండు. నేను నిన్ను వదిలిపెట్టలేదు. ఆ పెద్దమనిషే నిన్ను లాక్కొని  నన్ను ఆస్ట్రేలియా పంపించాడు. ఇప్పటికిప్పుడు నిన్ను చూడాలని వుంది కానీ, రానూ బోనూ ఖర్చుల మాట? అందుకే ఏమనుకోకుండా కొంచెం డబ్బు పంపావంటే, నిన్ను చూడ్డానికొస్తా. ఏమంటావ్?

ఈ పాడు ప్రపంచకం రోజు రోజుకీ నాశనమవుతూందిలే. నన్ను కనిపెట్టి వుండడం నీకే మంచిది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. కనిపెట్టి వుంటావులే, ఇహ మళ్ళీ నేను చెప్పేదేమిటి!

ఈ కింద చిరునామ కి ఒక ఉత్తరం రాసి కొంచెం డబ్బు పంపించు. శ్రీమతి పెక్ అంటే ఎవరో అనుకునేవు. నేనే, ఆ పెద్దాయన నన్ను నా పేరూ వుంచుకోనివ్వలేదు, తన పేరూ ఇవ్వలేదు. నా ఖర్మ, ఏం జేస్తాం!

వుంటా నాయనా,

మీ అమ్మ,

ఎలిజబెత్ హొగార్త్.

శ్రీమతొ పెక్.

హెన్రీ టాల్బోట్.

వకీలు.

మెల్బోర్న్.

 

తా.క. వెంటనే డబ్బంపుతావుగా? నాకు చాలా కష్టం గా  వుంది చేతిలో డబ్బు లేక.

జేన్ ఉత్తరాన్ని శ్రధ్ధగా ఒకటికి రెండు సార్లు చదివింది. తపాలా ముద్రలూ, చిరునామా అన్నీ పరిశీలించింది.

“ఏమంటావ్ జేన్? ఆ ఉత్తరంలో వున్నది నిజమేనంటావా?”

“మన వకీలు, మెక్ ఫర్లేన్ గారికి చూపించావా? మావయ్య వ్యవహారాలన్నీ ఆయనే చూసేవాడు. ఆయన ఏమన్నాడు?”

“ఆయన ఇంతవరకూ మా అమ్మ ఫోటో కానీ, చేతి వ్రాత కాని చూడలేదట. అందుకే చెప్పలేనన్నాడు.”

“యేడాదికి నూట యాభై పౌండ్లు పంపిన సంగతి ఆయనకి తెలిసుండాలి కదా?”

“అదీ తెలియదట, అయితే ఆ డబ్బు ఆవిడ నోరు మూయించడానికి నాన్న గారు వాడి ఉండొచ్చనుకున్నాడు.”

“మావయ్య బాంకు పాస్ బుక్కులు చూడకపోయావా? ఆయన క్రమం తప్పకుండా డబ్బు చెల్లిస్తూ వచ్చి వుంటే ఆ సంగతి బాంకు పాస్ బుక్కులో వుంటుంది కదా?”

“హయ్యో జేన్! నాన్న గారెంత ఆశ్రధ్ధగా లెక్కలు రాసారనుకున్నవు? ఒక్క దానికీ సరైన వివరణలే లేవు. డబ్బు బాంకు నించి తెచ్చిన సంగతి రాసారు కానీ, అది ఎలా ఖర్చయిందో మాత్రం ఎక్కడా రాయలేదు. ఎలా కనిపెట్టడం?”

“సరే, అయితే వకీలు గారి సలహా ఏమిటి?”

“ఏముంది? ఆ ఉత్తరం పట్టించుకోకుండ వదిలేయమన్నారు. ఎందుకంటే ఆ ఉత్తరం రాసింది నిజంగా నన్ను కన్న తల్లేనో కాదో తెలియదు. ఆయన ఒకసారి నాన్నగారితో అన్నారట, ‘ఫ్రాన్సిస్ తల్లికీ ఏదైనా డబ్బు ఏర్పాటు చేయి, ఆవిడ ఎక్కడుందో, ఎలా వుందో,’ అంటూ. దానికి నాన్నగారు చాలా చిరాకు పడి, ‘ఆవిడ నా భార్య అని నిరూపించడానికి ఒక్క ఆధారమూ లేదు, ఆమెకి చిల్లి గవ్వ ఇవ్వాల్సిన పని లే’దంటూ మండి పడ్డారట. డబ్బు అర్హులైన వారికే ఇవ్వాలని అన్నారట. వకీలు గారి ఊహ ఏమంటే, ఆమెకి డబ్బిచ్చి నాతో సహా తమ సంబంధాన్ని గురించిన అన్ని ఆనవాళ్ళూ నాన్నగారు కొనేసుకున్నారని. ఆవిడ అందినంత డబ్బు తీసుకొని నా గురించి కానీ, నా పెంపకం గురించి కానీ పట్టించుకోవడం మానేసింది.”

“సరే, మరైతే ఇప్పుడీ ఉత్తరం గురించి ఏమైనా వాకబు చేయిస్తావా, లేదా ఊరికే వదిలేస్తావా?”

“అసలు నాకు ఇదంతా ఆలోచించాలంటేనే చిరాగ్గా వుంది. అయితే ఈవిడ నిజంగా మా అమ్మేనా కాదా అన్న సంగతి తెలుసుకోవాలన్న కుతూహలం కూడా వుందనుకో. నువ్వేమంటావు జేన్? నీ సలహా ఏమిటి?”

“ఇలాటి సున్నితమైన విషయాన్ని గురించి నేనేం సలహా ఇవ్వగలను ఫ్రాన్సిస్? నీకెలా తోస్తే అలా చేయి.”

“నా పరిస్థితిలో నువ్వుంటే ఏం చేస్తావ్?”

“అదెలా చెప్పగలం? మనిద్దరం వేర్వేరు మనుషులం, మన వ్యక్తిత్వాలూ, మనస్తత్వాలూ వేర్వేరు. ఒకే పరిస్థితిలో ఇద్దరం వేర్వేరుగా ఆలోచిస్తాం. అందువల్ల నేను చెప్పేది నీకు పనికిరాకపోవచ్చు.”

“కానీ, నీ వ్యక్తిత్వం నాకంటే వెయ్యి రెట్లు మెరుగు జేన్. అందుకని నా ఆలోచన కంటే నీ ఆలోచనే సబబుగా వుండే అవకాశం ఎక్కువ. నాకైతే ఏం చేయాలో తోచడంలేదు. ఒకవేళ ఆ విల్లులో, నేను అమ్మకి సాయపడకూడదు అని వుంటే, అప్పుడు ఈ ఉత్తరం రాసినావిడని చూడాలనీ, డబ్బివ్వాలనీ కోరిక బలంగా కలిగేదేమో.  నాకీమధ్య ఆ వీలునామాని వీలైనంతగా ఉల్లంఘించాలని కోరిక పుడుతోంది. అసలా వీలునామా నా జీవితాన్ని నాశనం చేసింది జేన్! ఆ డబ్బు నాకెందుకూ పనికి రాదు. నాకెంతో ఇష్టమైన మనిషికి సాయపడకుండా అడ్డంపడే ఆ విల్లంటే నాకెంత కోపమో చెప్పలేను.”

ఫ్రాన్సిస్ మొహంలో ఆవేదనా, కంఠంలో ఆవేశమూ చూసి జేన్ చాలా ఆశ్చర్యపోయింది. ఉన్నట్టుండి జేన్ కి అతనీ మధ్య ఉత్తరాలెందుకు తగ్గించాడో అర్థమైనట్టుంది. ఆమె గుండె ఉద్వేగంతో వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయింది.

“సరే ఫ్రాన్సిస్, నువ్వంతగా నా సలహా అడుగుతున్నావు కాబట్టి చెప్తా.  ఈ ఉత్తరం రాసిన స్త్రీ గురించి వాకబు చేయి. ఆ తరవాత ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. అదృష్టవశాత్తూ, ఈ ఉత్తరం మెల్బోర్న్ నించి వచ్చింది కాబట్టి మనం వాకబు చేయడం చాలా తేలిక. స్టాన్లీ ఫిలిప్స్ గారికో,  బ్రాండన్ గారికో తప్పక ఈ వకీలు టాల్బోట్  తెలిసే వుండలి. సరిగ్గా గుర్తు రావడం లేదు కానీ, ఈ పేరెక్కడో విన్నట్టే వుంది! ఒకవేళ అలా కాకపోతే, బ్రాండన్ గారు ఇంకొద్ది రోజుల్లో మెల్బోర్న్ తిరిగి వెళ్తున్నారు. అప్పుడు వాకబు చేయమందాం! ఒక విషయం గుర్తుంచుకో, మావయ్య రాసిన వీలునామా గురించీ, నీ గురించీ అక్కడక్కడా పత్రికలలో వచ్చింది. ఎవరైనా ఆ వార్తలు చదివి ఇలా ఊరికే ఓ రాయి వేసి చూద్దాం అని ఈ ఉత్తరం రాసి వుండొచ్చు. ఈ ఉత్తరం లో ఇంగ్లాండు యాస వుంది. కానీ మావయ్య మీ అమ్మ స్కాటిష్ యువతి అన్నట్టు గుర్తు. అందుకే మనం ఈ విషయాన్ని కొంచెం క్షుణ్ణంగా పరిశిలిద్దాం.”

“సరే!”

“నువ్విక్కడే వుండు. స్టాన్లీ గారిని నువ్వు పిలుస్తున్నావని చెప్పి ఇక్కడికి పంపుతాను,” జేన్ లేచి వెళ్ళింది.

జేన్ దగ్గరి బంధువని ఫ్రాన్సిస్ ని స్నేహంగా పలకరించాడు స్టాన్లీ ఫిలిప్స్.

కొద్దిసేపు మామూలు కబుర్లు అయ్యాక అడిగాడు ఫ్రాన్సిస్ ఆయనని.

“మీకు మెల్బోర్న్ లో వుండే హెన్రీ టాల్బోట్ అనే వకీలు తెలుసా?”

 

veelunama11

“తెలుసు! ఆయన మెల్బోర్న్ లో పెద్ద పేరు మోసిన వకీలు. అయితే ఆయనతో నాకు పెద్దగా పరిచయం మాత్రం లేదు. మన బ్రాండన్ కి ఆయన బాగా పరిచయం. పెగ్గీ వ్యవహారాలు కూడా ఆయనే చూసేవారనుకుంటా.”

“అలాగా? అయితే మీకు వారింట్లో వుండే పెక్ అనే స్త్రీ తెలుసా? ఆవిడ పూర్తి పేరు ఎలిజబెత్ పెక్ అనుకుంటా…” ఇంకేదో చెప్పబోయిన ఫ్రాన్సిస్, స్టాన్లీ మొహం చూసి ఆపేసాడు.

“ఆవిడ సంగతి ఎవరికి తెలీదు? ఆవిడ నుంచి దూరంగా వుండండి ఫ్రాన్సిస్. ఆవిడ ఎంత దుర్మార్గురాలో చెప్పలేను. ఆమెగురించి మీరెందుకు అడుగుతున్నారు?”

“ఆమె నా తల్లినని చెప్పుకుంటుంది!”

“ఏమిటీ? అయితే నేను చెప్పేది వేరే స్త్రీ అయి వుండొచ్చు! నాకేం అర్థం కావడం లేదు.” స్టాన్లీ లేచి అలజడిగా గదంతా పచార్లు చేయడం మొదలు పెట్టాడు.

“ఆవిడ మీకేమైనా ఉత్తరం రాసిందా? ఆవిడ చేతి రాత చూపిస్తారా?”

చేసేదేమీ లేక ఫ్రాన్సిస్ మౌనంగా ఉత్తరాన్ని ఆయనకి అందించాడు.

“ఈ ఉత్తరాన్ని మీకభ్యంతరం లేకపోతే చదువుతాను. భయపడకండి. నేను ఇంకెవ్వరితోనూ ఈ విషయాన్ని గురించి మాట్లాడను.”

ఫ్రాన్సిస్ ఇబ్బందిగానే ఒప్పుకున్నాడు. స్టాన్లీ ఉత్తరాన్నంతా చదివి తిరిగి ఇచ్చేసాడు.

“ఈ ఉత్తరం లో ఆమె మీ అమ్మనంటుంది. ఆమె ఎంత అబధ్ధాలకోరంటే, ఆమె చెప్పే ఒక్క మాటైనా నిజం కంటే అబధ్ధం అయ్యే అవకాశం ఎక్కువ. నా మాట వినండి ఫ్రాన్సిస్. ఆమెకి ఎంత దూరంగా వుంటే మీకంత మంచిది. ఆమెకి మీరు జవాబూ ఇవ్వవద్దు, డబ్బూ పంపవద్దు. ఉత్తరంలో చెప్పినంత పేదరాలేమీ కాదు. ఉత్త అబధ్ధాలకోరు!”

“ఆమె ఎవరు? మీకెలా తెలుసు?” ఎన్నో పశ్నలు అడగాలనుకున్నాడు ఫ్రాన్సిస్, కానీ స్టాన్లీ మొహం లో కోపం చూసి ఏదీ అడగలేకపోయడు. కొంచెం సేపయాక కూడదీసుకొని,

“మిమ్మల్ని అడగమని జేన్ అంది!” అన్నాడు.

“ఏమిటీ? ఈ సంగతి జేన్ తో కూడ చెప్పావా? ఎంత పని చేసావయ్యా!”

“అసలు నేను వచ్చిందే ఆమెతో ఈ విషయం గురించి మాట్లాడడం కోసం. జేన్ ఈ సంగతి ఎవ్వరితోనూ అనదు. నాకా నమ్మకం వుంది. అసలింతకీ జేన్ ఏది?”

స్టాన్లీ జేన్ ని పిలిపించాడు.

లోపలికొచ్చిన జేన్ స్టాన్లీ మొహంలో చిరాకూ అసహనమూ చూసి ఆశ్చర్య పోయింది  .

“జేన్! ఫ్రాన్సిస్ ఇప్పుడే మెల్బోర్న్ లో వుండే ఒక స్త్రీ గురించి అడిగాడు. నాకు తెలిసినంతవరకూ ఆవిడ  ఒక మోసగత్తె. ఈ ఉత్తరం లో వున్న ప్రతీ మాటా అబధ్ధమే అని నా అభిప్రాయం. నువ్వూ, ఫ్రాన్సిస్ ఈ విషయం గురించి ఇక్కడే మరిచిపోవడం మంచిది. నువ్వు ఈ విషయాలేవీ ఎల్సీతో కుడా అనొద్దు. నేనలా బయటికెళ్ళొస్తాను. ఫ్రాన్సిస్, రేపు రాత్రి మీ భోజనం మా యింట్లోనే. సరే మళ్ళీ కలుద్దాం!” అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు స్టాన్లీ ఫిలిప్స్.

“జేన్! మా అమ్మ గురించి మా నాన్న గారు వెలిబుచ్చిన అభిప్రాయాలే సరిగ్గా ఈ పెక్ గురించి స్టాన్లీ గారంటున్నారు. దాన్ని బట్టి చూస్తే ఆవిడే మా అమ్మయి వుండొచ్చు కదా? సరేలే, ఆయన అన్నట్టు ఈ విషయం ఇక్కడే వదిలేయడమే మంచిదేమో. మనం ఇంకా పొడిగిస్తే స్టాన్లీ గారికి కోపం రావొచ్చు. నిన్నింతగా గౌరవించి నీకు ఉద్యోగం ఇచ్చిన మనిషికి మనం కోపం తెప్పించటం అంత అవసరమా? అది సరే, ఆయనకి ఎప్పుడూ ఇలాగే కోపం వస్తూ వుంటుందా?”

“అదే నాకూ అంతు బట్టటం లేదు. చాలా నెమ్మదిగా సౌమ్యంగా వుంటాడాయన. ఇంత కోపం రావడం నేనైతే ఎప్పుడూ చూడలేదు.”

“నీతో ఎల్సీతో బానే ప్రవర్తిస్తాడు కదా?”

“ఆయన బానే వుంటాళ్ళే! లిల్లీ గారే, కొంచెం గయ్యాళి.”

“ఎందుకు ?నీతో ఎప్పుడైనా దెబ్బలాడుతుందా?”

“నన్నేమీ అనదు కానీ ఎల్సీనే చాలా ఏడిపిస్తుంది. అందులోనూ ఎల్సీ ఆత్మ విశ్వాసంతో ఎదుర్కోదు. భయం భయం గా ఒణికిపోతూ, తననెవ్వరు ఏ తప్పు పడతారో అన్నట్టు ఒదిగి ఒదిగి ఉంటుంది. ఆలోచనా, తెలివితేటలూ, మంచితనమూ ఏ కోశానా లేని ఒక మూర్ఖురాలికింద నోరూ వాయీ లేని మెతక మనిషి పని చేస్తే ఏమవుతుంది?”

“ఇప్పుడు ఇక్కడ ఎల్సీ పనిని కూడా నువ్వే పర్యవేక్షించాలి కదా? నీకిబ్బందిగా లేదూ?”

“అవును, కొంచెం ఇబ్బందిగానే వుంది. అయితే ఎల్సీ చాలా ఆత్మ న్యూనతతో బాధ పడుతూంది. దానిని ఎలా సరిచేయాలో నాకర్థం కావడం లేదు. నేను దేన్నైనా తట్టుకోని నిలబడగలను. కానీ, ఎల్సీ పాపం సున్నిత మనస్కురాలు. చిన్న చిన్న విషయాలకే మొహం చిన్న బుచ్చుకుంటుంది.”

“కవితలు ప్రచురించే ప్రయత్నం ఎలా వుంది?”

“ఇక్కడ లండన్ లో కూడా ప్రయత్నించా, కానీ కాలేదు.”

“ఈ మధ్య మళ్ళీ ఏమన్నా రాస్తుందా?”

“ ఇక్కడ లిల్లీ, హేరియట్ ఇద్దరి పరిచర్యలతో దానికి సమయం ఎక్కడుంది? అసలు వాళ్ళకి దాన్ని నాతో మధ్యాహ్నం కాసేపు నడవడానికి పంపడం కూడా ఇష్టం వుండదు. నేనే డాక్టరు గారు కోప్పడతారని వాళ్ళిద్దర్నీ బెదిరించి నాతో పాటు కాస్త నడకకి తీసుకెళ్తాను! అన్నట్టు ఆ డాక్టరు గారు మావయ్యకి మంచి స్నేహితులట తెలుసా? నువ్వు ఒక్కసారి డెర్బీషైర్ వెళ్ళి ఆయనని కలిసి రారాదూ?”

“అలాగే. బ్రాండన్ ఇక్కడికొస్తూ వుంటాడా? అతన్ని చూస్తే అతనికి ఎల్సీ మీద ప్రత్యేకమైన అభిమానం వున్నట్టు అనిపించింది నాకు! అదేమైనా ముందుకెళ్ళిందా?”

జేన్ తల అడ్డంగా ఊపింది.

“ఇప్పుడు ఆయన హేరియట్ ఫిలిప్స్ మీద ప్రత్యేకమైన అభిమానాన్ని పెంచుకున్నాడు.”

“అయ్యో! నేనింకా ఆయన ఎల్సీని పెళ్ళాడతాడని ఆశ పడ్డాను.”

వాళ్ళిద్దరూ మాటల్లో వుండగానే ఎల్సీ వచ్చింది. లిలీ పన్లన్నీ చేసి అలసిపోయినా ఆమె మొహం ప్రశాంతంగా వుంది. ఫ్రాన్సిస్ ఆమెని ప్రేమగా పలకరించాడు. జేన్ కానీ, ఫ్రాన్సిస్ కానీ ఆమెకి ఆస్ట్రేలియా నించొచ్చిన ఉత్తరం గురించి ఏమీ చెప్పలేదు.

  ***

(సశేషం)

రామా చంద్ర మౌళి కలం నుంచి కొత్త సీరియల్ వచ్చే వారం నుంచి ప్రారంభం!

Saranga_1

 

నిత్య నూతనం అన్నమయ్య పాట !

కాలంతో పాటు పాత బడేవి ఉంటాయి. కాని కాలంతో పాటు నడచి వస్తూ ఎప్పుడూ సరికొత్తగా కనిపిస్తూ ఆనందాన్ని కలిగించేవి కొన్ని ఉంటాయి. సూర్యుడు ఎంత పాత వాడో ఎప్పుడూ అంత సరికొత్త వాడు కూడా. నేను ఇటీవలే ఒక మంచి పాట విన్నాను. అందులోని భావ సౌకుమార్యం, కొత్తదనం చూస్తే ఇది ఆరువందల ఏండ్ల నాడు కట్టిన పాటా, కాని ఇంత సరికొత్తగా ఉందే అని ఆనందం ఆశ్చర్యం కలిగాయి. అది అద్భుతమైన భావనా శక్తిని దాచుకున్న పాట అనిపించింది. పరమానందం కలిగింది అదీ గొప్ప గాయనీమణుల నోట వింటుంటే. ముందు పాటను ఇక్కడ చూపి దాన్ని గురించి రాస్తా.

పొద్దిక నెన్నడు వొడచునే పోయిన చెలి రాడాయెను

నిద్దుర కంటికి దోఁపదు నిమిషంబొక ఏడు                   || పొద్దిక ||

 

కన్నుల నవ్వెడి నవ్వులు, గబ్బితనంబుల మాటలు

నున్నని ఒయ్యారంబులు, నొచ్చిన చూపులును

విన్నఁదనంబుల మఱపులు, వేడుక మీరిన వలపులు

సన్నపు చెమటలు దలచిన, ఝల్లనె నా మనసు                     || పొద్దిక ||

 

ఆగిన రెప్పల నీరును, అగ్గలమగు పన్నీటను

దోగియు దోగని భావము, దోచిన పయ్యెదయు

కాగిన దేహపు సెగలును, కప్పిన పువ్వుల సొలపులు

వేగిన చెలి తాపమునకు, వెన్నెల మండెడిని                || పొద్దిక ||

 

దేవశిఖామణి తిరుమల, దేవునిఁ దలచిన బాయక

భావించిన ఈ కామిని భావము లోపలను

ఆ విభుడే తానుండిక ఆతడె తానెరుగగవలె

ఈ వెలదికి గల విరహంబేమని చెప్పుదము.               || పొద్దిక ||

 

పైన పాట నిర్మాణాన్ని చూస్తేనే ఇది అన్నమయ్య పాట అని తెలిసిపోతుంది. పైన చెప్పిన పాటలో ప్రత్యేకతని గురించి ఇందులోని నేటికీ కనిపించే కొత్తదనాన్ని గురించి చెప్పే ముందు. అన్నమయ్యపాటను గురించి నాలుగు మాటలే చెప్పాలి.

annamayya-telugu-movie1

అన్నమయ్య పాటలో రెండు పాదాల పల్లవి ఉంటుంది. మూడు చరణాలు ఉంటాయి ప్రతి చరణంలో నాలుగు పాదాలుంటాయి వాటిలో యతి మైత్రి ఉంటుంది, కాని ఎక్కడ అనే నియమం లేకుండా ఏదో ఒకచోట తప్పని సరిగా ఉంటుంది. అంతే కాదు పాదాలు నాలుగింటిలో ప్రాసనియమం ఉంటుంది. ఎంచుకున్న ఈ పాట నిర్మాణం పాడడానికి చాలా బాగా ఒదిగి పోతుంది. లయ సాధ్యం అవుతుంది. అయితే మూడు చరణాలకంటే ఎక్కువ ఉన్నవి లేదా తక్కువ ఉన్నవి ఎక్కడో ఒకటి కనిపిస్తాయి. కాని సాధారణంగా అన్నమయ్య పాటలు అత్యధికంగా ఒక పల్లవి మూడు చరణాలు పెన చెప్పిన పద్ధతిలో ఉంటాయి.

ఇది సుమారు ఆరు వందల ఏండ్ల నాడు కట్టిన పాట.  ఇక్కడ నేను రాసిన పాట అని అనలేదు. కారణం అన్నమయ్య కూర్చుని పాటలు రాయలేదు. ఆయన పాటకట్టి పాడుకుంటూ పోయాడు. తర్వాత వాటిని ఆయన కుమారులు శిష్యులు రాసారు. అంతే కాదు వాటిని రాగిరేకుల మీద చెక్కించారు. ఈ కీర్తి ఎక్కువ ఆయన మనవడికి దక్కుతుంది. అన్నమయ్య 32 వేల పాటలు కడితే నేటికి మనకు పద్నాలుగు వేలకు పైగా దొరుకుతున్నాయి. వీటిలో ఏ పాటను పట్టుకున్నా తియ్యదనం జలజలలాడుతుంది.

పై పాటలో ఒక స్త్రీ దూరంగా వెళ్ళిన చెలికాని గురించి బాధపడుతూ విరహాన్ని అనుభవించే ఘట్టాన్ని వర్ణించాడు. ఇందులో పోయిన చెలి రాడాయెను అని అన్నాడు. ఇక్కడ చెలి అనే మాటను చెలికాడు ప్రియుడు భర్త అనే అర్థంలో వాడాడు. చెలి అనగానే స్త్రీ అని అనుకుంటాము. పురుషుని కూడా చెలి అనిడం ఉందని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ స్త్రీ తన భర్త దూరంగా వెళ్ళి ఉన్నాడు అతనినే తలుస్తూ ఉంది ఈమె. ఆమె ఈ స్థితిలో ఉన్న బాధని లోతైన భావాన్ని వర్ణిస్తున్నాడు కవి.

రాత్రి సమయంలో ఉన్న ఆమెస్థితిని చెబుతూ  పొద్దిక (పొద్దు ఇక) ఎన్నడు వొ (పొ)డచునో పోయిన చెలి రాడాయెను. ఈ పొద్దు ఎప్పుడు పొడుస్తుందో రాత్రి ఎలా ఎప్పటికి గడుస్తుందో పోయిన చెలికాడు రాలేదు అన్నాడు పల్లవి లో, తర్వాత ఏ మంటాడో చూడండి. నిద్దుర కంటికి తోపదు నిమిషంబొక ఏడు. నిద్ర రావడం లేదు నిముషమే ఒక ఏడాదిగా గడుస్తూ ఉంది.

మొదటిపాదంలో  కన్నుల నవ్వెడి నవ్వులు గబ్బితనంబుల మాటలు. నవ్వులు ఆమె నోటి తో కాకుండా కన్నులతో నవ్వుతూ ఉంది అనడం అన్నమయ్య కాలంనాటికి ప్రచలితంగా కావ్య ప్రబంధ వర్ణనలలో ఎక్కడా కనిపించదు. పాటలో సరికొత్తగా కన్నులతో నవ్వడం అని చెప్పాడు. ఇది ఈనాటికీ కొత్తగా కనిపిస్తూ ఉంది. గబ్బితనంబుల మాటలు అంటే పైకి గంభీరంగా పలికే పలుకులు అని ఇక్కడి భావం. గబ్బితనం అంటే కపటపు మాటలు అనే అర్థం కూడా ఉంది వీరోచితమైన మాటలు అని కూడా ఉంది. కాని ఇక్కడ లోపలి బాధను వ్యక్తం చేయకుండా పైకి గంభీరంగా చెప్పే మాటలు అనే భావం. నున్నని ఒయ్యారంబలు నొచ్చిన చూపులను అనే పాదంలో రెండూ కొత్త భావనలే ఒయ్యారం అంటే అందం దాని హొయలు.  నున్ననిది అని చెప్పడం అంతే కాదు రెండిండిని తెలుగు పదాలను వాడడం తర్వాత చూపులు గురించి చెబుతూ నొచ్చిన చూపులు అని అనడం బాధను అంటే విరహాన్ని వ్యక్తం చేసే కళ్ళను గురించి చెప్పడం ఆనాటికి సాహిత్యంలో చాలా కొత్త భావన. తర్వాత విన్నతనంబుల మఱపులు వేడుక మీరిన వలపులు అనే పాదం గురించి స్పష్టం. దీని తర్వాతి చరణంలోని నాలుగో పాదం చూడండి సన్నపు చెమటలు దలచిన ఝల్లనె నామనసు. అన్నాడు. సన్నపు చెమటలు. అవి ధారగా కారుతున్న చెమటలు కావు. సన్నగా ఆ విరహస్థితిని చూపే చెమటలు వాటిని తలచుకుంటే మనసు ఝల్లుమందట.

తర్వాతి చరణం మరింత బాగుంటుంది. మొదటి పాదంలో ఆగిన రెప్పల నీరును అగ్గలమగు పన్నీటను దోగియు దోగని భావము, దోచిన పయ్యెదయు అని రెండుపాదాలలో ఒక భావాన్ని చెప్పాడు. కన్నీరు రెప్పల వెనుకే ఆగింది కాని చెక్కిలి మీదికి జారలేదు. చాలా అధికమైన పన్నీటిలో చల్లదనం కోసం మునిగినా అంటే దోగినా తన లోపలి విరహం ఆ పన్నీటిలో మునగలేదు అంటే ఆమె భావన  చల్లారలేదు. ఆతర్వాత చూడండి. కాగిన దేహపు సెగలు కప్పిన పువ్వుల సొలపు, దేహం కాగుతుంటే పువ్వులను కప్పారట ఇది ఆనాటి ప్రబంధ ధోరణి వర్ణనే కాని తర్వాత వేగిన చెలి తాపమునకు వెన్నల మండెడిని అన్నాడు. వెన్నెల చల్లదనాన్ని ఇవ్వకుండా వేడి సెగలు పుట్టిస్తున్నాడు అని చెప్పడం ప్రబంధాలలో ఆయన కాలానికి ఉన్నది. కాని వేగిన చెలి తాపానికే వెన్నల మండుతూ ఉంది అని చెప్పడం మరొక తీరు. ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది.

దోచిన పయ్యెద అని చెప్పడం అద్భుతం. ఆమె పయ్యెదను అంటే పైటను దోచుకున్నాడట. ఇక్కడ దోచుకున్నది పైటను కాదు మరేదో అని  ఎంత సున్నితంగా శృంగారాన్ని వర్ణించడో గమనించవచ్చు. ఇప్పటికి ఎంత మంది చేస్తున్నారు ఇలా. అదృష్టవంతులు అనే సినిమాలో చింతచెట్టు చిగురు చూడు అనే పాటలో ఒక సినిమా కవి (ఆత్రేయ) పాలవయసు పొందు కోరి పొంగుతున్నది, నా పైట కూడ వాడి పేరే పలవరిస్తది. అని చరణంలో రాసాడు. వింటే వాహ్ ఎంత అద్భుతంగా చెప్పాడు అని అనిపిస్తుంది. ఇక్కడ అన్నమయ్య పాట కూడా దోచిన పయ్యెద అని అనగానే వాహ్ ఎంత అద్భుతం అని అనిపిస్తుంది.

ఇక చివరి చరణంలో అన్నమయ్య తన ముద్రను వేంకటేశ్వరుని పేరిట ఏదో ఒక తీరులో వేస్తాడు. దాన్ని దేవశిఖామణి తిరుమల దేవుని తలచిన బాయక, భావించిన ఈ కామిని భావము లోపలను ఆవిభుడే తానుండి అతడే తనను  గురించి తెలుసుకోవాలని అని అనడమే కాకుండా ఈ వెలదికి కమ్మిన ఈ మాయను ఏమని చెప్పాలి అని అంటాడు.

ఇక్కడ ఏ స్త్రీవిరహాన్ని గురించీ అన్నమయ్య వర్ణించలేదు. ఇక్కడ కవే స్వయంగా ఆ స్త్రీ అన్నమయ్య వేంకటేశ్వరుని పరమ పురుషుడుగా తన నాథుడుగా భావించడం ఆ విరహంలో (భక్తికి చెందిన విరహం)  తనను తాను ఒక స్త్రీగా భావించి వర్ణించడం ఉంది. భగవంతుడే పురుషుడు అని తమను తాము భగవద్విరహంలో ఉన్న స్త్రీ అని చెప్పుకోవడం భక్త కవులు అన్నమయ్యలా చెప్పినవారు ఇంకా ఉన్నారు. ఈయన కూడా ఇంకా వేరే పాటల్లో చెప్పడం ఉంది. కాని ఈపాటలో చేసిన వ్యక్తీకరణలు తెలుగు పదాల సొంపు సరికొత్త సమాసచాలనం గమనిస్తే దీనిలో ఈనాటికీ నిలిచిన కొత్త దనం కనిపిస్తుంది.

ఈ నాటి వచన కవులు భావించేలా అతి నవ్యమైన తాజాగా ఉండే భావనలు ఈ పాటలో ఉన్నాయి. కన్నులతో నవ్వే నవ్వులు, నున్నని ఒయ్యారాలు, విన్నతనంబుల మరపులు, సన్నని చెమటలు, ఆగిన రెప్పల నీరు, దోచిన పయ్యెద అని చెప్పడం అన్నీ కూడా వాహ్ వాహ్ అనే అద్భుతమైనవే కాదు, ఆనాటికి లేనివి తాజావి. తర్వాత ఈనాటికి ఇలాంటివి సరికొత్త సృజనకు ప్రతీకలుగా ప్రతిభావంతంగా కనిపించిడం ఈ పాటలోని విశేషం. ఇటీవల హైదరాబాదులోని ఒక సంగీత కార్యక్రమంలో ప్రియ సోదరీమణలు (ప్రియసిస్టర్స్ అని పిలిచే హరిప్రియ షణ్ముఖ ప్రియలు) ఈ పాటని పాడారు. పాటలోని విరహాన్ని అత్యంత మధురంగా పాడి కొన్ని వందలమందిని మంత్రముగ్ధుల్ని చేశారు. విన్నవారికి ఆ పరవశంలోనుండి బయటికి రావడానికి చాలా సేపు పట్టింది. ఆరువందల ఏండ్లనాడు కట్టిన అచ్చతెలుగు పాటకి మాటకి ఇంత శక్తి ఇంత కొత్త దనం ఉందా అని ఆశ్చర్యపోవడం, దాని ఫలితమే ఈ వ్యాసం.

పులికొండ సుబ్బాచారి

చిత్రరచన: బాపు (తాడేపల్లి  పతంజలి గారి పుస్తకానికి వేసిన బొమ్మ)

లెక్కల చిక్కు “రుణం”

మరో వుత్తమ కథ చూద్దాం. ఇదో అప్పు కథ. విలువల కథ. వంశగౌరవాల కధ. పరువు-ప్రతిష్టల కథ.

సారధి అనే కథకుడు తను పని చేస్తున్న ఒక ప్రభుత్వరంగ సంస్థ తను ప్రభుత్వం దగ్గర తీసుకున్న అప్పుని తీర్చగలిగే స్థితిలో వుండి కూడా  వాయిదాకోసం ప్రయత్నించడం గురించి ఆవేదన చెందిన కథ. తను చిన్నప్పుడు బూట్లు ఎరువు తీసుకుని అవి పాడైపోతే వాటి ఖరీదు కట్టి ఇవ్వలేక పడ్డ ఆవేదన కథ. ఆ మిత్రుడు  మాధవరావుని కలిసి, దాదాపు ముప్పయ్యేళ్ల తర్వాత, క్షమాపణ కోరి తన “విలువల్ని” కాపాడుకున్న కథ. క్షమాపణ తర్వాత సారధి “మనస్సు ఉతికిన బట్టలా తేలిక అయ్యింది” అనుకుంటాడు. వెంటనే “కుటుంబాల నుండి, వంశాలనుండి,  వాటికంటూ ఒక ధారలాంటిది ఉంటుంది” అంటాడు. “విలువలు మారుతూనే ఉంటాయి. అయితే మారకూడని విలువలు కూడా వుంటాయి” అంటాడు. కథ చదివిన తర్వాత మనకొక ప్రశ్న వస్తుంది. ఎన్ని కష్టాలైనా పడి అప్పు తీర్చి తీరాలన్నది ఎలా “మారకూడని విలువ” అవుతుంది? దీనికి సమాధానం దొరకాలంటే మనం “అప్పు” పునాదిని పరిశీలించాలి. అప్పుకి మూలం అసమానత.  అవసరానికి మించిన డబ్బు, కేవలం మారక మాధ్యమం(Exchange Medium) ఒక చోట, అవసరాలకి సరిపోని ఆదాయం ఒక చోట వుండడం వల్ల అప్పు ఒక అవసరంగా వచ్చి ఆయుధంగా తయారౌతుంది.

జీవనోపాధికి అవసరమైన భూమి కొద్దిమంది చేతుల్లో వుండిపోవడంతో ఎంతోమంది కూలీలుగా, బీదవారుగా మిగిలిపోయేరు, కనీస అవసరాల కోసం వారు ఆదాయం చాలక, అప్పుపై ఆధారపడ్డారు. వాడకం సరుకుల వ్యాపారంతో పాటు మారకం సరుకు వ్యాపారం కూడా మొదలైంది. మొదటి దాంట్లో మిగులు ని “లాభం” అంటే రెండో దాంట్లో మిగులుని “వడ్డీ” అన్నారు. సాధారణంగా, అప్పులు తీసుకొనేది బీదవారు కాబట్టి వారి దగ్గర గోళ్లూడగొట్టి వసూలు చేసుకోవడం అవసరమైంది. దండోపాయం ప్రతీసారి కష్టమూ, ఖర్చూ  కాబట్టి

భేదోపాయంగా, అప్పు తీర్చి తీరాలన్న దాన్ని ఒక ఆదర్శంగా, విలువగా ప్రచారం చేసారు. ఈ “విలువ” పూర్తిగా “మిగులు” వున్న శ్రేణులకి, మధ్య తరహా శ్రేణికి వుపయోగపడేదే. భూస్వామ్య సమాజంలో అది ఒక నీతి. ఒక విలువ. ఒక ఆదర్శం. పతిభక్తి, రాజభక్తి, వర్ణాశ్రమ ధర్మం, కుల కట్టుబాటు వగైరా ఎన్నో విషయాల్లాగే ఇదీ ఒక భేదోపాయం.

వ్యవసాయం మీద ఎక్కువమంది ఆధారపడినప్పుడు సమాజం చిన్న సమూహాలుగా (గ్రామాలుగా) వుంటుంది. అక్కడ భూస్వామ్య సమాజపు నీతులు, ఆదర్శాలు, విలువలు చలామణి అవుతాయి. ఎన్ని కష్టాలు పడి అప్పు తీరిస్తే అంత నీతిమంతుడుగా,  పరువుగలవాడుగా సాగే ప్రచారం. చిన్న సమూహంలో ఈ విషయాన్ని మరింత ఘనీభవింప చేసి సంఘ భయాన్ని సృష్టిస్తుంది. సారధి తండ్రి కూడా ఆ సమాజంలోనే  జీవించారు. ఆ విలువల మధ్యనే పెరిగేడు అందుకే షావుకారుకి మళ్లీ నోటు రాశాడు. అప్పు తీర్చేడు. మనం కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే సారధి తండ్రితో పాటు చాలామంది అలా నోట్లు రాసి ఇచ్చే వుంటారు. షావుకార్లు సారధి తండ్రితో పాటు ఇంకా ఎంతో మందికి  అప్పులిచ్చే వుంటారు. అది వాళ్ల వృత్తి. వాళ్లలో మిగిలిన వాళ్లు కూడా నోట్లు ఇచ్చే వుంటారు. లేకపోయి ఉంటే, ఆ చిన్న సమూహంలో కొంత అల్లరి,అలజడి. ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగే వుండాలి. షావుకార్లు అంత తొందరగా వూరుకోరు. అగ్నిప్రమాదం జరిగినపుడు కేవలం సారధి తండ్రి నోటు ఒక్కటే కాలిపోవడం అనేది మనం నమ్మగలిగే విషయం కాదు. దీన్నేదో చాలా గొప్ప విషయంగా”కుటుంబాలు, వంశాలు” అని రాయడం కొంత ఆదర్శరీకరణే. పౌరాణిక పద్ధతే. దీంట్లో వంశాలు, కుటుంబాలు, గౌరవాలు ఏమీ లేవు. కొన్ని కుటుంబాలు , వంశాలు నీతి గలవనీ గొప్పవనీ కొన్ని కావనీ అర్దం వచ్చేలా రాయడం అంటే వర్ణ వర్గ వ్యవస్ఠని సమర్ధించడమే.

60ల్లో  శ్రీకాకుళంలోని గిరిజన ప్రాంతాల్లో అప్పులు తీర్చ  వద్దంటూ కమ్యూనిస్టు పార్టీ ప్రచారం చేసింది. పార్టీని అనుసరించిన గిరిజనులందరూ సొండీల, శావుకార్ల అప్పుని తీర్చారు. పార్టీ ప్రచారం  కంటే సంఘభయం ఎక్కువ పని చేసింది. ఈ రోజుకి కూడా అడవులు, కొండల్లో వుండే గిరిజనులు అప్పులు తప్పక తీరుస్తారు. “మళ్లీ ఇస్తాడు కదా షావుకారు” అనేది వాళ్ల సమాధానం. ఇప్పటికి కూడా, వ్యాపార సమాజపు నియమాలు పూర్తిగా ఎక్కని కొన్ని శ్రేణులు, స్త్రీలు, కూలీవారు, వగైరాలు అప్పులు తప్పక తీరుస్తారన్నది డ్వాక్రా అప్పులు, ఇందిరమ్మ ఇళ్ల అప్పులు చరిత్ర చదివిన వారికి స్పష్టమౌతుంది. సారధి పని చేసే ప్రభుత్వరంగ సంస్ధకి ఈ నీతి వర్తించదు. ఈ సూత్రాలు పనికి రావు. అదొక వ్యాపార సంస్థ. పెట్టుబడిదారీ సమాజ సూత్రాలు వేరు. అక్కడ లాభం ఒక్కటే ప్రధానం.  మిగతావేవీ వర్తించవు. కథలో చూస్తే ప్రభుత్వం ఇచ్చినది వడ్డీలేని అప్పు. ఈ డబ్బు సంస్థలో వున్నంత కాలం దాన్ని మదుపుల్లో పెట్టడానికి(Investments) వాడుకోవచ్చు. ఎక్కువ సరుకు (Stock) వుంచి డీలర్లపై రుద్ది అమ్మకాలు పెంచి లాభం గడించొచ్చు. అరువులు ఎక్కువ ఇచ్చి (Debtors) దానిపై వడ్డీ రాబట్టవచ్చు. ధర (Pricing) తమ అదుపులో వుంచుకోవచ్చు. సరఫరాదార్లకి  తక్షణమే ఇస్తామని చెప్పి (Creditors) బేరాలాడి  ధర తగ్గించుకోవచ్చు. స్థిర, చరాస్థులు (కార్మికులకి ఇళ్ళు కట్టడం, బస్సులు కొని రవాణా సౌకర్యం ఏర్పరచడం) కొని జీతాల బిల్లుల్లో కొంత మిగల్చవచ్చు. యంత్రాలు  వగైరా కొనేటప్పుడు DPGలు, LCలు వగైరా కాకుండా నేరుగా నగదు ఇచ్చి బాంకు ఖర్చులు మిగుల్చుకోవచ్చు. ధరలు తగ్గించుకోవచ్చు. ఏదీ కాకుంటే వుద్యోగులకే రకరకాల అప్పులిచ్చి వడ్డీతో సహా జీతాల్లో కోసుకోవచ్చు. ఇలా ఎన్నో రకాలుగా వాడుకునే ప్రతి చర్యా సంస్థ లాభాల్ని పెంచేవే. అందుకే సంస్థ పెద్దలు అప్పు చెల్లింపుని  వీలైనంత కాలం  పొడిగించడానికి ప్రయత్నించడం ఎలా తప్పు అవుతుందీ?. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే కథకుడు మాట్లాడుతున్నది ఒక ప్రభుత్వరంగ సంస్థ గురించి. వాటిల్లో వచ్చిన “లాభం” అంతా తిరిగి ప్రభుత్వానికే బదిలీ చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య తేడా అదే. లాభాలు తిరిగి ప్రభుత్వ పరం కావడమే. నేను చెప్పినవి అస్థి అప్పుల పట్టీ (balance sheet) మీది కనీసపు విషయాలు. నా అవగాహన అంతే. లోతుల్లోకెళ్లి చెప్పగలిగే వాళ్లెంతోమంది వున్నారు. MBAలూ, CA లూ చదివిన వాళ్లు. ఇది అర్ధం చేసుకోలేని సారధి పాతకాలం తూకపు రాళ్లతో విషయాన్ని చూసి వేదన చెందుతాడు.

“ప్రైవేటు రంగానికి ఇచ్చిన రాయితీలు లేదా రుణ మాఫీలతో పోలిస్తే మనలాంటి పబ్లిక్ సెక్టారు పొందేది లెక్కించ దగిందేం కాదు” అన్న సీ.ఎఫ్.ఓ మాటలు సారధికి అర్ధం కాలేదు. అతని ఆలోచనలూ, ఫైనాన్స్ రంగ సూత్రాలకు వ్యతిరేకం. సంతోష్‌కి అతను, నిరాసక్తంగా చెప్పిన కారణాలు. “కొత్త వేతన ఒప్పందం వల్ల  పెరిగే వేజ్ బిల్లు, ఈ ఆర్ధిక సంవత్సరంలో మొదలయ్యే శివరామపూర్ ప్రాజెక్టుకు మూలధన అవసరాలు, వచ్చే రెండు, మూడు సంవత్సరాలలో మూతబడబోయే ప్రాజెక్టులవల్ల తగ్గే రాబడి” ఇవేవీ సూత్రాలకి సరిపోవు. వేజ్ బిల్లు లాభనష్టాల ఖాతా వ్యవహారం. అప్పు ఆస్థి అప్పుల వ్యవహారం. కరెంటు బిల్లులు. మొబైల్ బిల్లులు, ఆదాయం (జీతం)లోంచి కడతాం. కొత్త ప్రాజెక్టుకి మూలధనం, ప్రభుత్వంనుంచో లేదా ప్రజలనుంచో తెస్తాం(shares). మూడు సంవత్సరాల తర్వాత రాబడి తగ్గుతుంది కాబట్టి ఈ అప్పు వాయిదా కూడా అప్పుడే కడతాం అనడం హాస్యస్పదం. మూడేళ్లలో నేను రిటైర్ అవుతాను. నా జీతంలోంచి కట్టలేను. పెన్షన్లోంచి కడతాను. కాబట్టి EMIలు అప్పటినుంచి ఇవ్వండి అని బాంకువాళ్లని అడిగి చూడండి. అప్పు వాయిదా కట్టేది నగదు రాబడుల్నించి. అది కేవలం అమ్మకాలు, లాభాలే కానక్కరలేదు. ఇందాక మనం అనుకున్న అనేక మార్గాలున్నాయి. “ఫండ్స్ ఫ్లో స్టేట్‌మెంట్‌లో చూపించాం” అన్న సారధి  సరిగ్గా ఆలోచించలేదు. సారధి తయారు చేసిన నోట్‌ని సి.ఎం.ఓ తప్పక మార్చి వుంటాడు. క్లుప్తంగానే చెప్పాను. అవసరం అనుకుంటే చర్చిద్దాం.

ఈ సారధి ఆలోచనల్ని “మానవ సంబంధాలకుండే ఆర్ధిక కోణాన్ని కార్పోరేట్ వాతావరణానికి అన్వయించి  చెప్పటం వల్ల మేధను తాకే కథగా రూపొందింది” అని ప్రశంసించడం బృహదాశీర్వచనం. సంస్థకీ,  ప్రభుత్వానికీ మానవ సంబంధాలుండవు. సారధి ఆలోచనల్లో మేధస్సూ లేదు.

ఇంతకీ కథలో ముఖ్యవిషయం. వ్యవసాయ రుణాల మాఫీ. “రెండేళ్ళ క్రితం స్థోమత వుండి అప్పు, వడ్డీ కట్టకుండా, మాఫీతో లాభం పొందినోళ్ళు ఎందరో. ఇదిగో వీడే రెండు లక్షల దాకా మిగుల్చుకున్నాడు” అన్న మాధవరావు తండ్రి మాటలో వున్నది. అవి వాస్తవానికి రచయిత మాటలే. రచయిత ఆవేదనా అదే. 2008లో ప్రభుత్వం వ్యవసాయ రుణాల మాఫీ ప్రకటించినపుడు గోలగా ఒక ప్రచారం జరిగింది. అప్పులు ఎగ్గొట్టే అలవాటుని ఇది తీసుకొచ్చిందనీ, దేశ సంపదనంతా దోచి పెట్టుతున్నారనీ పత్రికలూ, టీవీలూ వగైరా అంతా గగ్గోలుగా చెప్పిన విషయాలు రెండు. దేశంలో కౌలు రైతులు ఎక్కువ వుండడం, కౌలు రికార్డు కాకపోవడం వల్ల  ఈ ౠణమాఫీ కేవలం భూముల యజమాన్లకే సాయపడిందనీ,  నిజంగా వ్యవసాయం చేసిన కౌలు రైతులకి ఏం దక్కలేదనీ. రెండోది రుణం రద్దు వల్ల పెద్ద రైతులకే  లాభం జరిగిందనీ, అర్హత లేనివాళ్లు రద్దు వల్ల లాభపడ్డారనీ. ప్రచారం చేసేవాళ్లు వ్యూహాత్మకంగా చిన్న రైతుల్ని తోడు తెచ్చుకుని వాళ్లకేం దక్కలేదని చెప్పారు.

[su_note] మొదటి దాని గురించి కథలో ఏమి లేదు కాబట్టి రెండు వాక్యాల్లో ముగిద్దాం. కౌలు రైతులు ప్రధానంగా వ్యవసాయ  ఎంట్రప్రెనూర్ లు వాళ్లు చేసేది వ్యవసాయ నిర్వహణ (organisation) పొలంలోకి దిగకుండా, భూమి(Land) కౌలుకు తీసుకొని కూలీల్తో, అవకాశం వున్నచోట యంత్రాల్తో పని చేయించి (Labour), పెట్టుబడి (Capital)  పెట్టి వ్యవసాయం నిర్వహిస్తారు. (Organisation). కూలీల విషయంలో వీళ్లు యజమాని కంటే ఎక్కువ ఘోరంగానే ప్రవర్తిస్తారు. కారణం లాభాపేక్ష. తొందరతొందరగా ఎక్కువెక్కువ లాభం సంపాదించాలన్న ఆకాంక్ష. ఎరువులు కుమ్ముతారు. కూలీల్ని పిండుతారు. పురుగుల మందు విషాన్ని చల్లుతారు. పర్యావరణాన్ని , ప్రజల్ని నాశనం చేసి లాభాలు దండుకుంటారు. ఇదంతా పెట్టుబడిదారీ వ్యవహారం. ఆ సూత్రాలే వీరికీ వర్తిస్తాయి. ఇక కథలో వున్నదీ, రెండోదీ అర్హత లేనివాళ్లు స్థోమత వున్నవాళ్లు రుణం రద్దు పొందారన్నది. నిజంగా ఇది ఆలోచించవలసిన అంశమే. చర్చించవలసినదే. అయితే రచయిత పొసగని అంశాల మధ్య కత్తు గట్టి కథ రాయడం వల్ల కథా శిల్పం, ప్రయోజనం రెండూ దెబ్బతిన్నాయి. విషయమేమిటంటే 2008లో రుణమాఫీ పెద్దలకి పూర్తిగా దోచిపెట్టలేదు. బోల్డు ఆంక్షలు పెట్టింది, రద్దు మొత్తాన్ని ఒక లక్షరూపాయలకు కుదించింది. ఆసక్తి వున్నవాళ్లు రిజర్వు బ్యాంకు సర్కులర్ RB1/2007-08/373 Dt. 19/6/2008 చూడవచ్చు.[/su_note]

నిజమే నష్టాలన్నీ ప్రజల పరం చేసి లాభాలు వ్యక్తుల పరం చెయ్యడం పెట్టుబడిదారీ మనుగడకి అవసరం. వాళ్ల ప్రతినిధిగా వున్న ప్రభుత్వం అదే చేస్తుంది. అమెరికాలో ఫ్రెడ్డీ, ఫానీ, లేమాన్ బ్రదర్స్ లాంటి ఎన్నో సంస్థలు కూలిపోతే, పెద్ద పాక్ఖేజీలు ప్రకటించి వాళ్ల కొమ్ము కాసింది ప్రభుత్వం. కోట్ల కోట్ల డాలర్లతో విదేశీ కంపెనీలు కొన్న కింగ్‌ఫిషర్ కంపెనీ యజమాని, ఎయిర్‌లైన్స్ వుద్యోగులు జీతాలడగితే ‘నా దగ్గర డబ్బుల్లేవ్’ అని నిస్సిగ్గుగా  ప్రకటించి విదేశాల్లో విలాసంగా గడిపేడు. మోడీ, గోయెంకాల్లాంటి ఎన్నో కంపెనీలు అప్పులు ఎగ్గొట్టి వుద్యోగుల జీతాలు ఎగ్గొట్టి BIFR వెనక ఆశ్రయం తీసుకున్నాయి. మన డెక్కన్ క్రానికల్ కథ చూడండి. కనీసం రోజుకొక్క కంపెనీ కథ వస్తుంది పేపర్లో. చాలా చిన్న అక్షరాల్తో. అప్పులు ఎగ్గొట్టడం, దివాలా తియ్యడం పెట్టుబడిదారీలో ఒక సూత్రం. ఒక విధానం

అర్హత లేని స్థోమత వున్న రైతులు రుణం రద్దు వాడుకోకూడదన్న ఆదర్శ ప్రకటన ఎవరి నుద్ధేశించి చేస్తున్నాడు రచయిత. ఆదర్శాల వల్ల, నీతిబోధల వల్ల, ఈ కథలు ఏనాటికీ చదవని పెట్టుబడిదార్లు “ఆత్మప్రబోధం” చేసుకుంటారా?రుణం రద్దు లేకపోయి వుంటే ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ యంత్రాలు, విత్తనాలు వగైరా వ్యవసాయాధారిత వ్యాపారం ఎంత దెబ్బ తిని వుండేది. బాంకుల డబ్బు ఆగిపోతే వాళ్లు రుణాలివ్వకపోతే కన్స్యూమర్ వస్తువులు ఇనుము, సిమెంటు, గృహనిర్మాణ రంగ పరిశ్రమలు, కార్లు, రకరకాల వాహనాలు తయారు చేసే కంపెనీలూ ఏమై పోతాయి?

ఈ కథ పేరు రుణం.

రచయిత శ్రీ ముళ్లపూడి సుబ్బారావు.

ప్రచురణ: ఆదివారం ఆంధ్రజ్యోతి, 8 మే.2011

 

[su_box title=” Banks wrote off over Rs 1 lakh cr in last 13 yrs: Chakrabarty (BUSINESS LINE, BUSINESS STANDARD 19.11.13)”]

RBI Deputy Governor K.C. Chakrabarty has said banks have written off a whopping Rs 1 trillion in the past 13 years and criticised the lenders because as much as 95% of these write—offs were for large borrowers. He said that over 95% of such write—offs have been observed in the case of big accounts and expressed anguish that public discourse focuses only on the government’s agri debt waiver scheme of 2008. “We only talk about the debt waiver of the agricultural borrowers, we don’t say big players and of this (Rs 1 lakh Cr) 95% are all big borrowers and it has been written off,” he said. Chakrabarty was particularly critical of the system of a “technical write-off” by the lenders, saying he does not understand the system. [/su_box]

 

—చిత్ర

అంతులేని వేదన, అద్భుత సంరంభం లెయొనార్దొ ద వించి గాథ

 

ఇది లెయొనార్దొ ద వించి అనే పదిహేనో శతాబ్దపు ఇటాలియన్ చిత్రకారుడి జీవిత గాథ. రచయిత మోహన్ కవి, చిత్రకారుడు, చింతనాపరుడు. కవికి ఉండే ఊహాశాలిత, చిత్రకారుడికి ఉండే సమతౌల్య వర్ణదృష్టి, చింతనాపరుడికి ఉండే హేతుబద్ధత ఈ పుస్తకానికి మూలధాతువులు. ఆ మూడు లక్షణాలూ ఈ పుస్తకంలో అడుగడుగునా కనిపిస్తాయి. వస్తువూ పరిశీలకుడూ సౌందర్య సమన్వితాలైనప్పుడు ఫలితం ఎలా ఉంటుందో చూపడానికి ఈ పుస్తకం ఒక ఉదాహరణ. లెయొనార్దొ చిత్రాలన్నీ కళాఖండాలే. ఆ ఒక్కొక్క చిత్రం గురించీ మోహన్ రాసిన కవితాత్మక, ఆలోచనాస్ఫోరక వాక్యాలు అప్పటికప్పుడు ఆ చిత్రాన్ని చూడాలనీ, మోహన్ వివరణను ఆస్వాదిస్తూ కొత్త అర్థాలు అన్వేషిస్తూ ఉండాలనీ అనిపించేలా చేస్తాయి.

ప్రపంచానికంతా తెలిసిన మహానుభావులమీద ఉద్వేగభరితమైన నవలలు రాసిన ఇర్వింగ్ స్టోన్ తన కథానాయకుల జీవితం సమస్తాన్నీ కళ్లకు కట్టే పదబంధాలను సృష్టించి ఆ నవలల శీర్షికలుగా మలిచాడు. ఆ నవలలో ఒకటి పదహారో శతాబ్దపు చిత్రకారుడు మైకెలాంజెలో జీవితకథ అగొనీ అండ్ ఎక్ స్టసీ. ఆ పదబంధం ఆ నవలానాయకుడు మైకెలాంజెలోకు ఎంతగా సరిపోతుందో గాని, ఆయన కన్న ఇరవై ఏళ్లు పెద్దవాడు, చిత్రకళలో ఆయనకు ప్రత్యర్థి, డా విన్సీ అనే పొరపాటు పిలుపుతో ప్రఖ్యాతుడైన లెయొనార్దొ ద వించి కి అక్షరాలా సరిపోతుంది. లెయొనార్దొ జీవితమంతా అంతులేని వేదన, అద్భుత సంరంభం.

వివాహేతర సంబంధపు సంతానంగా, దాదాపు అనాథగా, ఎప్పటికప్పుడు ఏదో ఒక అవాంతరం తోసుకువచ్చి ఎక్కడా నిలకడగా ఉండనివ్వని నిరంతర జీవన అస్థిరత. చిన్నచిన్న రాజ్యాల మధ్య యుద్ధాలతో ఆ ప్రభువులను నమ్ముకున్న కళాకారుడిగా ఉత్థాన పతనాలు. బాల్యంలో కోల్పోయిన తల్లిదండ్రుల ప్రేమను, సోదరుల ప్రేమను పొందడానికేమో శిష్యులతో మెలగిన తీరుకు తప్పుడు వ్యాఖ్యానాలతో స్వలింగ సంపర్క నేరారోపణలు, విచారణలు, ఖైదు. తనకందిన పనుల్లో అనేకం బద్దకం వల్లనో, పరిపూర్ణతా భావనతోనో పూర్తి చేయలేకపోయిన అసంపూర్ణ ప్రజ్ఞ,…. ఆయన జీవితమంతా అంతులేని వేదనే.

మరొకపక్క చిన్ననాటి నుంచే ఆయన వేళ్లకొసలనుంచి జాలువారిన అద్భుత కళానైపుణ్యం. దేశదేశాల రాజుల, మతాధిపతుల, కళాభిమానుల, కళా విమర్శకుల ఆదరణ చూరగొన్న ప్రతిభా వికాసం, ఎప్పుడూ చుట్టూరా ఎంతో మంది శిష్యులు, అభిమానులు, ఒక్క చిత్రకళ మాత్రమే కాదు, దాదాపు ఆధునిక విజ్ఞానశాస్త్ర అన్వేషణలెన్నిటికో బీజరూప వ్యక్తీకరణలు – ఆయన జీవితమే అద్భుత సంరంభానికి ఎత్తిపట్టిన పతాక.

ఏదో ఒక శాస్త్రంలో, ఒక రంగంలో, ఒక చిన్న శాఖలో నైపుణ్యంతో మహా మేధావులుగా పేరు తెచ్చుకోగలుగుతున్న వర్తమాన స్థితితో పోల్చినప్పుడు యూరప్ లో భూస్వామ్యం నుంచి పెట్టుబడిదారీ విధానానికి సమాజం పరివర్తన పొందుతున్న యుగంలో మేధావులు ఎన్ని శాస్త్రాలలో, ఎన్ని రంగాలలో, ఎంత లోతయిన కృషి చేశారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. లెయొనార్దొ ఆ నాటికి శాస్త్రవేత్త, కళావేత్త. ఇవాళ్టి శాస్త్రాల, కళల పరిభాషలో చెప్పాలంటే గణితశాస్త్రజ్ఞుడు, నిర్మాణశాస్త్ర నిపుణుడు, మానవ శరీరశాస్త్రవేత్త, భూభౌతిక శాస్త్రవేత్త, భూ పటాల చిత్రకారుడు, వృక్షశాస్త్రవేత్త, చిత్రకారుడు, శిల్పి, వాస్తుశిల్పి, నీటిపారుదల వ్యవహారాల నిపుణుడు, సంగీతకారుడు, రచయిత. పునరుజ్జీవన యుగపు మానవుడికి మూర్తీభవ రూపం అని, అతనిది తీరని కుతూహల దాహం అనీ, అతనంత సర్వవ్యాపిత బహుముఖ ఆసక్తులు, ప్రజ్ఞా కలవారు లేరనీ ఎన్నెన్నో విశేషణాలున్నాయి. లెయొనార్దొను అర్థం చేసుకోవాలంటే ఆయన జీవించిన స్థల కాలాలను అర్థం చేసుకోవాలి.

Da Vinci

పద్నాలుగో, పదిహేనో శతాబ్దపు ఇటలీ తొలి పునరుజ్జీవన సంస్కృతికి వేదిక. అప్పుడప్పుడే పుట్టుకొస్తున్న పెట్టుబడిదారీ విధానం భూస్వామ్యపు కరడుగట్టిన విలువలను తోసి రాజంటూ, రాజకీయ స్వాతంత్ర్యం, పట్టణ జీవితం, కళారాధన వంటి వ్యక్తి ప్రధాన, హేతుబద్ధ జీవిత విధానాలను ప్రవేశపెడుతోంది. రోమన్ సామ్రాజ్యం కూలిపోయిన ఐదో శతాబ్ది నుంచీ ఈ కదలికలు మొదలయిన పద్నాలుగో శతాబ్దం దాకా దాదాపు ఒక సహస్రాబ్ది యూరప్ చీకటిలో మగ్గిపోయిందని ఆ నాటి మేధావులు భావించారు. వాటిని మధ్యయుగాలు అని పిలిచారు. రోమన్ సామ్రాజ్యంలో గొప్ప కళా వికాసం పరిఢవిల్లిందని, అది మళ్లీ తలెత్తుతోందని, అది పునరుజ్జీవనమని వాళ్లు భావించారు. ఇదంతా సంప్రదాయం నుంచి ఆధునికతకు, బర్బరత్వం నుంచి నాగరికతకు ప్రయాణమని అనుకున్నారు. రోమన్, గ్రీక్ నాగరికతలలో లాగ మళ్లీ ఒకసారి పట్టణాలకు ప్రాధాన్యత వస్తున్నదని వాళ్లు వాదించారు. పూర్వీకులు వించి అనే గ్రామం నుంచి వచ్చినప్పటికీ, లెయొనార్దొ పుట్టినదీ, ఎక్కువకాలం గడిపినదీ ఫ్లారెన్స్ నగరంలోనే. ఆ నగరం 1460 నాటికే వర్తక కేంద్రం. అప్పటికే అక్కడ ముప్పై మూడు బ్యాంకులు ఉండేవి. బట్టల వ్యాపారం జోరుగా సాగేది. 270 ఉన్ని దుకాణాలు, ఎనబై ఎనిమిది వడ్రంగి దుకాణాలు, ఎనబై మూడు పట్టుబట్టల అంగళ్లతో యాభైవేల జనాభాతో అలరారుతుండిన నగరం అది.

ఈ చారిత్రక నేపథ్యమే లెయొనార్దొ జీవితాన్ని నిగూఢమూ చేసింది, సుసంపన్నమూ చేసింది. అప్పుడప్పుడే ఒక పెట్టుబడిదారీ వర్గం తలెత్తుతూ, అంతకు ముందరి భూస్వామిక రాచరిక మత కట్టుబాట్ల స్థానంలో లిఖితపూర్వక ఒప్పందాలు, ఆస్తి ఘర్షణలు మొదలవుతున్నప్పుడు పుట్టుకొచ్చిన నోటరీల, న్యాయవాదుల కుటుంబానికి చెందినవాడు లెయొనార్దొ. ఆయన తాత వ్యవసాయంలోకి దిగాడు గాని అంతకు ముందు మూడు తరాలు నోటరీలే. ఆయన తండ్రీ నోటరీయే, అలా ఆయన ఇంట్లోనే కొత్తవిలువల బతుకుకు పునాది ఉంది.

ఇక బైట సమాజంలో, కనీసం ఆలోచనాపర వర్గాలలో ఒక గొప్ప మేధో మథనం, సామాజిక సంచలనం సాగుతున్నది. అదంతా పునరుజ్జీవనమని ఆ నాటి మేధావులు భావించారు గాని మోహన్ అన్నట్టు “నిజానికి సామాన్య మానవుల విషయంలో మధ్యయుగాలకు, పునరుజ్జీవనానికి మధ్య ఎలాంటి తేడా లేదు. కేవలం కవులు, కళాకారులు, మేధావులకు మాత్రమే ఈ విభజన రేఖ పనికొస్తుంది. …పునరుజ్జీవన భావన కేవలం గుప్పెడు మంది కళాకారులకు, ధనిక వ్యాపార, కులీన, పాలక వర్గాలకు సంబంధించిన ఒక తాత్విక లోకం మాత్రమే.”

అయితే పునరుజ్జీవన భావన శిష్ట వర్గాలదే అయినా, పునాదిలో వస్తున్న మార్పులు గాలిలో కొత్త భావాలను వీచాయి. తూర్పు భళ్లున తెల్లవారింది, పాతలోకం కదలబారింది. వ్యక్తి వికాసం మొదలయింది. మానవచరిత్రలో ఇదివరకెన్నడూ లేనట్టుగా, వ్యక్తికి తన సామర్థ్యంపై తనకు అపార విశ్వాసం మొదలయింది. తన శక్తి సామర్థ్యాలు భగవద్దత్తమో, విధిలిఖితమో కాదని, తాను తలచుకుంటే తన భవిష్యత్తును తానే రూపుదిద్దుకోగలనని మనిషికి ఆత్మవిశ్వాసం మొదలయింది. సకల కళల్లో ఆరితేరిన విశ్వనరులు రూపొందాలని మనుషులు తలపోశారు. భూస్వామ్యం, మతం, సంప్రదాయం విధించిన బంధనాలను కూలదోసే వ్యక్తి స్వేచ్ఛా భావనలు తలెత్తాయి. లెయొనార్దొ చనిపోయినాక యాభై ఏళ్లకు పుట్టిన ఇంగ్లిష్ తత్వవేత్త ఫ్రాన్సిస్ బేకన్ “సమస్త జ్ఞానాన్నీ నా అధీనంలోకి తీసుకున్నాను” అని వ్యక్తీకరించిన ఆత్మవిశ్వాస ప్రకటన ఈ పునరుజ్జీవన భావనకు, ఆ భావన విస్తరణకు సూచికే.

సామాజిక పరివర్తన జరుగుతున్న ఆ పునరుజ్జీవన యుగం గొప్ప సంచలనాలకు, ఉద్వేగాలకు, అన్వేషణలకు ఆలవాలమైన కాలం. ఈ పునరుజ్జీవనం పారిశ్రామిక విప్లవానికి మూలమూ విస్తరణా కూడ. ఆ ప్రవాహంలో నుంచే ఆధునికత, వ్యక్తి ప్రాధాన్యత, హేతుదృష్టి, శాస్త్రవిజ్ఞానం, కాల్పనికత, ప్రకృతి సౌందర్యారాధన, మనిషి కూడ యంత్రమేననే ఆలోచన వంటి ఎన్నో కొత్త భావనలు, ధోరణులు పుట్టుకొచ్చాయి. పారిశ్రామిక విప్లవం యంత్రంలో చలనాన్ని సాధించింది. సమాజంలో చలనానికి కారణమైంది. ఆ కొత్తగాలులు వీచడం చూసిన మనుషులు తమ చుట్టూ చలనంతో పాటు తమ లోలోపలి చలనాల్ని కూడ గుర్తించారు. ఈ మూడు స్థాయిల చలనాలు పరస్పర అన్యోన్య ప్రభావాలతో మరింత విస్తృతమయ్యాయి. అందువల్లనే యూరప్ లో ఆ యుగం అత్యంత ప్రతిభావంతులైన, బహుముఖ ఆసక్తులు, ప్రజ్ఞలు కలిగిన మేధావులెందరినో సృష్టించింది. ఆ మేధావుల సుదీర్ఘ జాబితాలో తొలి తరం నాయకులలో ఒకరు లెయొనార్దొ.

చిన్నతనంలో లాటిన్, రేఖాగణితం, గణితం నేర్చుకున్న లెయొనార్దొ పద్నాలుగో ఏట చిత్రకళను అభ్యసించడానికి వెరాకియో స్టుడియోలో చేరాడు. అక్కడ సైద్ధాంతిక శిక్షణతో పాటు ఆచరణాత్మకంగా వైవిధ్యభరితమైన కళానైపుణ్యాలు నేర్చుకుని ఉంటాడని, ఆ సాంకేతిక నైపుణ్యాలలో రచన, రసాయనశాస్త్రం, లోహశాస్త్రం, లోహ వస్తువుల తయారీ, నమూనాల తయారీ, తోలు పని, యంత్రశాస్త్రం, వడ్రంగం, చిత్రకళ, శిల్పకళ వంటివి ఉండి ఉంటాయని చరిత్రకారులు రాస్తున్నారు. అలా ఇరవయో ఏట లెయొనార్దొ ఆనాటి వైద్యుల, కళాకారుల గిల్డ్ అయిన గిల్డ్ ఆఫ్ సేంట్ లూక్ లో సభ్యుడయ్యాడు. ఇటువంటి కళాకారుల, చేతివృత్తిదారుల గిల్డ్ లే  భూస్వామ్య బందిఖానా నుంచి శ్రామికులను విడుదల చేసి, పట్టణాలలో వారికి పని కల్పించాయి. నవనవోన్మేష అన్వేషణకూ, ఇతోధిక ఉత్పాదకతకూ మార్గం సుగమం చేసి చరిత్ర గమనానికి గొప్ప చోదకశక్తిగా అత్యద్భుతమైన పాత్ర నిర్వహించాయి.

అలా ఇటు సొంత ఇల్లు, పట్టణం కల్పించిన వాతావరణం, అటు సమాజంలో చెలరేగుతున్న సంచలనాలు కలిసి లెయొనార్దొ అనే వ్యక్తి వికాసానికి తగిన వనరులను సృష్టించిపెట్టాయి. అయితే, లెయొనార్దొ వంటి అపురూప వ్యక్తి రూపు దిద్దుకోవడాన్ని అర్థం చేసుకోవాలంటే ఇవి మాత్రమే సరిపోవు. ఆయన బహుముఖ ప్రజ్ఞకు ఆనాటి సామాజిక జీవనం పునాది అయితే, ప్రత్యేకించి కళా ప్రతిభకు కారణమేమై ఉంటుందని ఈ నాలుగు శతాబ్దాలలో చాల అన్వేషణ జరిగింది. కళా చరిత్రకారుల నుంచి కాల్పనిక రచయితల దాకా, రసాయన శాస్త్రవేత్తల నుంచి నేరపరిశోధనా శాస్త్రవేత్తల దాకా, మనస్తత్వశాస్త్రవేత్తల నుంచి సామాజిక శాస్త్రవేత్తల దాకా ఎందరెందరో ఇటు తొంగిచూశారు. లెయొనార్దొ ఫలానా చిత్రంలోని ఫలానా రేఖ, రంగు ఇందుకు సూచన అన్న దగ్గరి నుంచి, ఆయన బాల్యంలో అనుభవించిన ఫలానా సంఘటన, ఆయన బాల్యం నుంచి గుర్తున్న ఫలానా సన్నివేశం, ఆయన రచనలోని ఒక ఖండం ఆయనను ఎలా తీర్చిదిద్దాయో చాల వివరణలు వచ్చాయి.

ఆయన “…బాల్యం సంక్లిష్ట, సంఘర్షణాత్మక అనుభవాలతో గడిచింది. పల్లెలో తల్లి పెంపకం, వించీలో పెంపుడు తల్లి ఆలనా పాలనా, ఏ లోటూ రానివ్వకుండా చూసుకునే తండ్రి, అన్ని కష్టాలతో సతమతమయ్యే తల్లి, సవతి తండ్రి, సమాజంలో అక్రమ సంతానమనే ముద్ర, మరోపక్క గుండెలపై ఆనించుకునీ, భుజాలపై కూర్చోబెట్టుకునీ ముద్దుచేసే చిన్నాన్న. పెరిగి పెద్దయ్యే వయసులో కారుమబ్బులా ఆవరించిన ఒంటరితనం. ఈ అనుభవాలే అతని భావి జీవితానికి, కళకు ధాతువులయ్యాయి. అతని వ్యక్తిత్వ నిర్మాణానికి బాటలు పరిచాయి” అని మోహన్ అంటాడు.

నానమ్మ లూసియా వైపు కుండలు తయారు చేసేవాళ్లు. ఆ కుండల మీద చక్కని లతలు, జ్యామితీయ ఆకృతులు ఉండేవి. లెయొనార్దొకు ఆ కళావారసత్వం వచ్చి ఉంటుందనీ మోహన్ అంటాడు. “డావిన్సీది పక్కా జానపదుడి హృదయం. ప్రకృతి అతని ఆరాధ్య దేవత” అని బాల్యంలో వించీ చుట్టుపక్కల చూసిన జీవులు, రైతులు, వ్యవసాయ కూలీలు, వడ్రంగులు, పశువుల కాపర్లు ఎట్లా లెయొనార్దొ చిత్రాలలోకి ఎక్కారో వివరిస్తాడు. పల్లెల్లోని నూనె గానుగలను బాల్య కుతూహలంతో కళ్లింత చేసుకుని చూసిన లెయొనార్దొలో ఆ యంత్రాలే బీజం వేశాయనీ అతని నోటు పుస్తకాల్లో వందలకొద్దీ మొక్కలు, చెట్లు, పళ్లు కనిపిస్తాయనీ లెయొనార్దొ అనే అద్భుత వ్యక్తి తయారయిన మూల కారణాల సంక్లిష్టతను అర్థం చేయించడానికి మోహన్ ప్రయత్నిస్తాడు.

“దేన్నయినా సరే చూసి, విని, తాకి, శోధించి నిర్ధారణకు రావడం డావిన్సీ సిద్ధాంతం” అటాడు మోహన్. ఇది మొత్తంగానే పునరుజ్జీవన యుగపు సిద్ధాంతం. పెట్టుబడిదారీ అన్వేషణలకు మూలమైన సిద్దాంతం. బైబిల్ చెప్పిందనో, చర్చి చెప్పిందనో దేన్నీ అంగీకరించకు. పంచేంద్రియాలు ఉపయోగించి, హేతుబుద్ధిని ఉపయోగించి అర్థం చేసుకో అని మనిషి మీద మనిషికి విశ్వాసం కలిగించిన విలువలు అవి. మనిషిని విధి చేతిలోని కీలుబొమ్మలా కాక క్రియాశీల, సృజనాత్మక  ఉత్పత్తి శక్తిగా చూడకపోతే పెట్టుబడిదారీ విధానం లేచి నిలవడమే సాధ్యమయ్యేది కాదు. ఆ తొలిరోజుల, విప్లవాత్మక పెట్టుబడిదారీ ఆలోచనలు అందుకే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అని నినదించాయి. కాని అతి త్వరలోనే ఆ ప్రగతిశీల, ఉదాత్త, సర్వమానవ సౌభ్రాతృత్వ ధోరణి అంతా మణగిపోయింది. పెట్టుబడిదారీ విధానం మనిషిని విడుదల చేయదని, మనిషిని మనిషి దోపిడీ చేసే, పీడించే సాంఘికధర్మాన్ని బలోపేతం చేస్తుందని అర్థమయింది. పెట్టుబడిదారీ విధానం, పునరుజ్జీవన ఆధునికత ఈ వైరుధ్యాల పుట్ట.

పెట్టుబడిదారీ విధానం ఎదుగుతున్న క్రమంలో ఈ వైరుధ్యాలు అంతకంతకూ ఎక్కువగా బహిర్గతం కావడం మొదలయింది గాని ఒక సున్నిత సునిశిత మేధావిగా లెయొనార్దొ జీవితంలోనే ఈ వైరుధ్యాల బీజాలు గోచరిస్తాయి. “…యుద్ధంలో సైనికులను ఊచకోత కోయడానికి చరిత్ర ఎరుగని మారణ యంత్రాలను కూడా ఊహించి వాటికి కాగితాలపై రూపమిచ్చాడు. గుర్రాల వెన్నుతట్టి వాటి హృదయంతో సంభాషించిన డావిన్సీ, వాటిని పొడవాటి పదునైన కత్తుల రథానికి పూన్చి బొమ్మ వేయడానికి వెనుకాడలేదు. రంగుల్లో ప్రేమ జీవననాదాన్ని హృద్యంగా పలికించిన అతడు మనుషుల ఉసురు తీసే రోమాంచిత ఊహల్లోనూ తేలిపోయాడు….” అనీ, “పూలను, గడ్డిపోచలను ముగ్ధమనోహరంగా చూపిన డావిన్సీ ఈ కుత్తుకలు తరిగే మారణ యంత్రాలకు ఊపిరిపోయడం పెద్ద వైచిత్రి” అనీ అంటూనే “ఈ వైరుధ్యం, వైచిత్రి డావిన్సీ వైయక్తికమైంది మాత్రమే కాదు, నాటి సమాజం, రాజకీయాలు సృష్టించిన పరిస్థితులది కూడా” అంటాడు మోహన్.

అయితే లెయొనార్దొ జీవితంలో అణువణువునా కనిపించేది ప్రగాఢమైన అన్వేషణ. అది ప్రకృతి గురించీ కావచ్చు, జంతువుల గురించీ కావచ్చు. నీటి ప్రవాహాల గురించీ కావచ్చు.  కొత్త యంత్రాల గురించీ కావచ్చు, మానవ శరీరం గురించీ కావచ్చు, సమూహంలో వైవిధ్య భరితమైన మానవ ప్రవర్తన గురించీ కావచ్చు. మత భావనల చిత్రీకరణలలోనూ, మనుషుల చిత్రీకరణలోనూ ఆయన ఆ అన్వేషణా ఫలితాలన్నీ రంగరించాడు, రంగుల్లోకి దించాడు. రంగుల్లో కుదించాడు. ఆరు దశాబ్దాలు దాటిన ఆ మహాద్భుత వర్ణమయ జీవితాన్ని మోహన్ ఈ పుస్తకంలో అంతే వర్ణమయంగా అక్షరాలకెక్కించాడు.

నిజానికి ఇది ముందుమాట గనుక, దీనికి నిడివి పరిమితి ఉంది గనుక ఇంక ఎక్కువ రాయను, ఎన్నెన్నో భాగాలను యథాతథంగా ఉటంకించాలనే కోరికను అణచుకుంటున్నాను.

మిలాన్ పాలకుడు లుడొవికో దగ్గర కొలువు కోసం తనకు ఏయే కళలు వచ్చునో లెయొనార్దొ రాసిన లేఖ, లెయొనార్దొ మిగిల్చి పోయిన దాదాపు ఆరువేల పేజీల నోట్స్, లెయొనార్దొ వేసిన చిత్రాలలో చాల భాగం చెడిపోవడంలో కాలం పాత్ర, మనిషి పాత్ర, మిలాన్ సమీపంలో ఆల్ప్స్ పర్వతాలలో నదుల గురించి లెయొనార్దొ చేసిన అన్వేషణలు, లెయొనార్దొ రాసిన చిత్రకళా బోధిని, చేసిన యంత్రాలు, యంత్ర భాగాలు, మానవ శరీర నిర్మాణం గురించి తెలుసుకోవడానికి మృతదేహాలపై లెయొనార్దొ చేసిన ప్రయోగాలు, ప్రకృతి, ఖగోళ శాస్త్ర అన్వేషణలు, అద్దాలపై, కటకాలపై అన్వేషణలు, మతభావనలు, వృద్ధాప్యపు కల వంటి అనేక సందర్భాలలో మోహన్ రచన పాఠకులను సమ్మోహితులను చేస్తుంది, ఐదువందల ఏళ్ల వెనక్కి, ఆ నాటి సామాజిక సాంస్కృతిక వాతావరణంలోకి తీసుకుపోతుంది. ఇక చిత్రాల గురించి – మరీ ముఖ్యంగా జినిర్వా, జెరోమ్, సెయింట్ ఆన్, ఆంగియారి, మోనాలిసా, సెయింట్ జాన్, సిసిలియా, లుక్రీజియా వంటి ఎన్నో చిత్రాల – వివరణలైతే ఒక వచన రచయిత, కళా విమర్శకుడు మాత్రమే చేయగలిగేవి కావు. స్వయంగా చిత్రకారుడు, రంగుల, రేఖల స్వభావ స్వరూపాలు కూలంకషంగా తెలిసిన కళా మర్మజ్ఞుడు మాత్రమే రాయగలిగినవి.

“డావిన్సీ చిత్రకళా సృజనను పక్కనపెడితే అతడు ఇంజనీరింగ్, వాస్తు వగైరా రంగాల్లో కంటే అనాటమీలోనే ఘన విజయాలు సాధించాడు. సుతిమెత్తని కుంచెలు పట్టుకున్న చేతుల్తోనే కరకు కత్తులు పట్టుకుని మృత మానవ దేహాలను రక్తమంటిన చేతులతో శోధించాడు. మానవ గుండెను కుడిచేత్తో పట్టుకుని రక్తపు మరకలంటిన కాగితంపై ఎడమ చేత్తో దాని రూపాన్ని చిత్రించాడు… మనిషి బయటి, లోపలి నిర్మాణాన్ని స్పష్టంగా, విశ్లేషణాత్మకంగా, నిర్దుష్టంగానే కాకుండా కళాత్మకంగా కూడా చూపిన తొలి అనాటమీ కళాకారుడు డావిన్సీనే. అతడు తన అనాటమీ చిత్రాలతో కళాకారుడికి, శాస్త్రవేత్తకు మధ్య ఉన్న తేడాను చెరిపేశాడు…. అతని జ్ఞానపిపాసను మతం అడ్డుకోలేకపోయింది” అనీ, “కళ్ల కదలికలకు కారణమేంటి? కనుబొమలు ఎలా ముడిపడతాయి? కనురెప్పలు ఎందుకు మూతపడతాయి? ముక్కుపుటాలు, నోరు, పెదవులు తెరచుకోవడం, మూసుకోవడం వెనుక ఉన్న యంత్రాంగమేమిటి? ఉమ్మడం వెనుక మతలబేంటి? ఎందువల్ల నవ్వుతున్నాం, ఆశ్చర్యపోతున్నాం అని డావిన్సీ ప్రశ్నించుకున్నాడు. ఈ ప్రశ్నలను ఓ పుర్రెబొమ్మ వేసిన కాగితం వెనక రాసుకున్నాడు. చీదడం, ఆకలి, నిద్ర, మైథునం, చెమట, కండరాల కదలికలకు కారణమేంటో తెలుసుకోవాలని రాసుకున్నాడు” అనీ అంటాడు మోహన్.

నిజానికి మోహన్ రచనలో ఇటువంటి ఆర్ద్ర, సున్నిత, కాల్పనిక, కళాత్మక వ్యక్తీకరణలను ప్రేరేపించగల శక్తి లెయొనార్దొ జీవితంలోనే ఉంది. స్వయంగా లెయొనార్దొ మనకోసం వదిలిపెట్టిపోయిన రచనలలో కూడ ఉంది. ఉదాహరణకు, “ఆత్మికోద్వేగాలను భంగిమల ద్వారా చెప్పగలిగితేనే చిత్రానికి విలువ ఉంటుంది”, “నా శ్రమతో ప్రకృతిలోని రహస్యాలు బట్టబయలవుతాయి”, “ఒకసారి అధ్యయనం చేసిన వాటి గురించి రాత్రిపూట ఆలోచిస్తే మంచిదని స్వానుభవంతో చెబుతున్నా. మనం పడుకున్నప్పుడు రాత్రి నిశ్శబం వల్ల ఆలోచన పదునెక్కుతుంది. దాంతో మనం సృజించిన వాటిని మరింత పరిపూర్ణంగా తీర్చిదిద్దగలం”, “పోషకులు మొదట్లో నిన్ను ఆకాశానికెత్తేస్తారు. తర్వాత కష్టమైన పనులు అప్పగిస్తారు. ఆ తర్వాత విశ్వాసహీనంగా ప్రవర్తిస్తారు. ఆపై నిన్ను నిందిస్తారు”, “అచ్చేసిన పుస్తకాల మాదిరి చిత్రాలకు పెద్దసంఖ్యలో నమూనాలు ఉండకూడదు. ఒక చిత్రం ఒక చిత్రంగానే ఉండాలి. పిల్లల్ని పుట్టించగూడదు. అప్పుడే అది ప్రత్యేకంగా, మిగతా వాటికంటే గొప్పగా భాసిల్లుతుంది”, “పక్షి గణిత సూత్రాల ఆధారంగా పనిచేసే యంత్రం. ఆ యంత్రాన్ని మనిషి తయారు చేయగలడు. అయితే అతని యంత్రానికి పక్షికున్నంత శక్తి ఉండదు. పక్షి హృదయమూ ఉండదు. కనుక మనిషి ఆ లోపాన్ని యంత్రానికి తన హృదయాన్ని అందించి అధిగమించాలి” వంటి ఆణిముత్యాలెన్నో లెయొనార్దొ రచనల్లో ఉన్నాయి.

“చిత్రకారుడు సమస్త జీవజాలపు, ప్రకృతి సారాంశం. జంతువులు, మొక్కలు, పళ్లు, మైదానాలు, శిఖరాలు, భయం గొల్పే ఆవరణలతో పాటు ఆహ్లాదకర ప్రాంతాలు, గాలి వాలుకు తూలిపోయే రంగురంగుల పూలతో కూడిన పొదలు, ఎత్తయిన పర్వతాల నుంచి బలంగా కిందికి దూకే నదులు, వాటిలో కొట్టుకుపోయే రాళ్లు, చెట్ల వేళ్లు, మన్ను, నురగ, ఝంఝామారుతంతో ఎదురొడ్డి పోరాడే తుపాను కడలి సారాంశం… చిత్రకారుడు… మానవుల్లోని సౌందర్యం నశిస్తుంది. కాని కళలోని సౌందర్యం నశించదు” అన్నాడు లెయొనార్దొ ద వించి.

ఆ చిత్రకారుడు మరణించి ఐదువందల సంవత్సరాలు గడిచింది. ఆయన కళలోని సౌందర్యం చిరంజీవిగా వర్ధిల్లుతోంది. ఆ నిరంతర నవనవోన్మేష సౌందర్యానికి ఎలుగెత్తిన మోహన గానం ఈ పుస్తకం. చదవండి.

Da Vinci – 1/8 demy, 264+8 pages, Rs. 150, Kaki Prachuranalu

For copies: All leading book shops/
Kaki Prachuranalu, Plot No. 304, H.No. 3-5-118/15, Second Floor, GPR Nilayam, Krishnanagar, Hyderguda, Rajendranagar, Hyderabad 500048, Ph: 9949052916

–          ఎన్ వేణుగోపాల్

ఋతుకాలోచితం –స్త్రీ కి ప్రకృతి వరం !!

అసదృశయౌవనం బిది యనన్యధనం బగునొక్కొ! నాకు ని

క్కుసుమ సముద్గమంబును నగోచర దుర్గమ దుర్గ వల్లరీ

కుసుమ సముద్గమం బగునొకో! పతిలాభము లేమి జేసి; యొ

ప్పెసగగ దేవయాని పతి నేమి తపం బొనరించి కాంచెనో!

                                                       -నన్నయ

   (శ్రీ మదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)

సాటిలేనిది కదా ఈ యవ్వనం! ఈ సంపద అన్యధనం అవుతుందో కాదో! నాకు కలిగిన ఈ కుసుమ(రజో)దర్శనం, భర్త లేకపోవడం వల్ల, ఎవరూ ప్రవేశించలేని కోటలోని తీగకు పూసిన పూవు చందమైపోతుందేమో!  భర్తను పొందడానికి దేవయాని ఏమి తపస్సు చేసిందో ఏమో!?

***

అమ్మలకు, అమ్మలగన్న అమ్మలకు, అక్క చెల్లెళ్లకు ముందుగా భక్తిపూర్వకంగా నమస్కరించి ఈ వ్యాసం ప్రారంభిస్తున్నాను…

స్త్రీ-పురుష సంబంధాల పరిణామక్రమాన్ని ఒక చరిత్రకారుని దృష్టితో పరిశీలించినప్పుడు, ఆ ప్రయత్నం నేటి విశ్వాసాలకు, మనోభావాలకు నొప్పి కలిగించవచ్చు. అశ్లీలంగానూ తోచవచ్చు. కనుక, ఇది తటస్థబుద్ధితో చేసే విశ్లేషణ మాత్రమే సుమా అని ప్రత్యేకంగా వివరణ ఇచ్చుకుంటున్నాను.

ఇంతవరకు మౌననాయికగా పొడగట్టిన శర్మిష్ట,  పై  పద్యంలోని మాటలు అనుకుంటుంది.

[su_note]పురుషుడు స్త్రీకి సొంతభాష లేకుండా చేసి వంచించవచ్చు. తన ప్రతిధ్వనిగానే ఆమెను మలచి ఉండవచ్చు. కానీ ప్రకృతి కరుణామయి. తను స్త్రీని వంచించలేదు. స్త్రీకి తనదైన భాష నిచ్చింది. యవ్వనమనే వశీకరణ సాధనాన్నీ, పునరుత్పత్తి అనే హక్కునూ ప్రసాదించింది. స్త్రీకి తన శరీరంలో వచ్చే మార్పుల గురించిన భాష తెలుసు. స్త్రీకి తన శరీరంతో మాట్లాడడం తెలుసు. అది ప్రకృతి దత్తమైన వరం.

శర్మిష్ట ఇక్కడ తన శరీరంతో మాట్లాడుతోంది. ఇది ఎంత గొప్ప యవ్వనం అనుకుంటోంది. ఇతరులకు అనుభవయోగ్యమైన సంపద కాకుండా, ఎవరూ చొరలేని కోటలోని తీగకు పూసిన పూవులా ఇది వాడి పోతుందా అనుకుని బాధపడుతోంది. భర్తను పొందడానికి దేవయాని ఏమి తపస్సు చేసిందో ఏమో అనుకుంటోంది.

శర్మిష్ట హృదయంలో గూడు కట్టుకున్న ఆ గుబులు శతాబ్దాలుగా, బహుశా సహస్రాబ్దాలుగా స్త్రీనుంచి స్త్రీకి ప్రవహిస్తోంది కాబోలు. ఈ సందర్భంలో, శారద అనే కలం పేరుతో ఒక పురుష రచయిత (నటరాజన్) రాసిన ‘మంచి-చెడు’ నవలలోని పద్మ పాత్ర గుర్తుకొస్తోంది. ఆ నవల గురించి ఎలాంటి విశ్లేషణలు వచ్చాయో నాకు గుర్తులేదు. ప్రకృతిధర్మం అనే కోణం నుంచి నేను ఆ నవలను విశ్లేషించాను(కాలికస్పృహ: మరికొన్ని సాహిత్యవ్యాసాలు). ప్రకృతిధర్మాన్ని పై కెత్తి చూపించిన ఆ నవల నాకు ఓ అద్భుతంగా, అసాధారణంగా తోస్తుంది. పద్మను వయసు మళ్లిన ఒక సంపన్న వ్యాపారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. యవ్వన సహజమైన కోరికలు తీరక పద్మ చిత్రవధ అవుతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఆమె అనుకున్న మాటలు నాకు గొప్ప కవిత్వంలా తోస్తాయి:

వసంతకాలాలూ, చలిరాత్రులూ, వర్షపు రోజులూ ఏటేటా వస్తూనే ఉంటాయి. ప్రకృతిధర్మం ఒక్కలానే ఉంటోంది- దశాబ్దాల తరబడి. కానీ వ్యక్తి జీవితంలో అనుభవనీయమైన రాత్రులు కొన్నే! అవి ఇట్లా మానవకల్పితమైన నీతులకు, కట్టుబాట్లకు లోబడి వ్యర్థం కావలసిందేనా? [/su_note]

సమవయస్కుడైన సవతి కొడుకుపై ఆమె దృష్టి పడుతుంది. సంఘభయంవల్ల వెనకడుగు వేస్తుంది. అంతలో వ్యాపారంలో భాగస్వామి వంచన వల్ల భర్త ఆస్తి హరించుకుపోతుంది. భర్త కూడా చనిపోతాడు. పూట గడవని పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్తి ఉన్నంతకాలం శరీరసౌఖ్యం కోసం పరితపించినా, ఆమె నీతి తప్పే ధైర్యం చేయలేకపోతుంది. ఆస్తి కరిగిపోగానే అంతవరకూ తనను బంధించిన భయాలనుంచి ఆమెకు విముక్తి లభించినట్లవుతుంది. శారీరకవాంఛను ఎలాగో అణచుకున్నా, ఆకలి అనే ప్రాకృతికధర్మాన్ని అణచుకోవడం ఆమెకు అసాధ్యమవుతుంది. చివరికి అయిదు రూపాయిలకు శీలాన్ని అమ్ముకుని కడుపాకలినీ, శరీరపు ఆకలినీ కూడా తీర్చుకుంటుంది. అప్పుడామె శారీరక, మానసిక స్థితులను రచయిత ఇలా వర్ణిస్తాడు:

నునుపుగా, ఎన్నడూ లేనంత అందంగా కనబడుతోంది ఆమె మొహం. అది ఈ రెండురోజుల నుంచి కలిగిన సౌఖ్యప్రాప్తి వల్ల, ఇష్టం వచ్చిన తిండి తినడం వల్ల ఏర్పడ్డ నునుపేమో…పద్మ మనస్సు లేడిలా, పంజరం నుంచి విడిపించుకున్న చిలకలాగా ఎగురుతోంది. తన ప్లాను వీళ్ళకు తెలియడం అసంభవం. తెలిస్తే అది వ్యభిచారమని అంటారు. కానీ ఏవిధంగా తన క్షుద్బాధను తీర్చుకోగలదు? తన తృష్ణను న్యాయమైన విధాన చల్లబరచుకోవడానికి అవకాశం ఎక్కడ?…

సవతి కొడుకు పాత్ర మరో అపురూప సృష్టి. అతడు సంఘనీతికి బద్ధుడు. అయినాసరే, సాక్షి మాత్రుడుగా ఉంటూనే సంఘనీతికీ, ప్రకృతిధర్మానికీ మధ్య పద్మలానే అతను కూడా నలిగిపోతాడు. పద్మ నడవడిని అతను గమనిస్తూనే ఉంటాడు. తప్పుపట్టకపోగా ఆమెపై సానుభూతితో కరిగి నీరైపోతాడు. ఇలా అనుకుంటాడు:

నిజానికామె ఈ యవ్వనకాలాన్ని ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో హాయిగా గడపవలసింది. సహజవాంఛల్నీ, ఆకలినీ తీర్చుకోవడంలో కలిగే ఆనందాన్ని, ప్రకృతిదత్తమైనదిగా, సమాజ శుభాశీస్సులతో అనుభవించవలసింది. కానీ నేడామె ఆ ఆనందాన్ని రహస్యంగా, దొంగలాగా అనుభవించవలసివస్తోంది.

ప్రకృతిధర్మం అనే గీటురాయి మీద లైంగికవాంఛను పరిశీలిస్తున్న ఈ వాక్యాలు ప్రకృతి అంత సహజంగానూ, సూటిగానూ, స్వచ్ఛంగానూ  నా చెవులకు ధ్వనిస్తాయి. ఎంతో సాంద్రమైన ఆర్ద్రతా, అనుకంపల లోతులనుంచి ఇవి పలుకుతున్నట్టుంటాయి. లైంగికవాంఛను ఇలా వ్యాఖ్యానించిన రచయిత ఇంకెవరైనా ఉన్నారా అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేకపోతున్నాను.

ప్రస్తుతానికి వస్తే…

sarmishta

దేవయానికి ఇప్పుడు ఇద్దరు కొడుకులు. వారి పేర్లు, యదువు, తుర్వసుడు. అశోకవనం దగ్గరలో శర్మిష్ట రోజులు మాత్రం శోకపూరితంగానూ భారంగానూ నడుస్తున్నాయి. దాస్యభారం కన్నా ఎక్కువగా యవ్వనభారం ఆమెను కుంగదీస్తోంది. అనుభవించేవాడు లేక ఇంత గొప్ప యవ్వనమూ కొమ్మ మీదే వాడిపోయే పూవు కావలసిందేనా అనుకుని దిగులు పడుతోంది. ఏ ఆడదైనా కోరుకునేది భర్తనూ, కొడుకులనూ పొందాలనే, ఆ రెండూ దక్కిన దేవయాని అదృష్టమే అదృష్ట మనుకుంటోంది.

యయాతి తొలిసారి తనను చూసినప్పుడే ఆ చూపుల్లో తన మీద ఉట్టిపడుతున్న ఇష్టాన్ని శర్మిష్ట పోల్చుకుని ఉంటుంది. అప్పుడే నిశ్శబ్దంగా తన హృదయంలో అతనిని నిలుపుకుని ఉంటుంది.  అతనిమీదే నా హృదయం ఎప్పుడూ లగ్నమై ఉంటుందని ఇప్పుడు కూడా అనుకుంటున్న శర్మిష్ట, ‘నన్నీతడు గరము  కారుణ్యమున  బ్రీతి గలయట్ల జూచు…’ ననుకుంది.

సామాజిక స్థాయీ భేదాలు మానవసంబంధాలలోనే కాక; వాటి వ్యక్తీకరణకు ఉపయోగించే మాటల్లో కూడా తేడా ఎలా తీసుకొస్తాయో పౌరాణికుడు ఇక్కడ అలవోకగా సూచిస్తున్నాడు. యజమాని ఒక దాసిపై  చూపించే అనురక్తిని ప్రేమ అనో, అనురాగమనో అనకూడదు; కారుణ్యం అనాలి. దాసి కూడా యజమాని నుంచి కారుణ్యాన్ని మాత్రమే ఆశిస్తుంది. పై వాక్యం శర్మిష్ట దాసిత్వాన్నే కాక ప్రస్తుత సందర్భంలో ఆమె దయనీయతను కూడా వెల్లడిస్తోంది.

దేవయానిలానే నేను కూడా ఇతనినే భర్తను చేసుకుంటానని శర్మిష్ట అనుకుంది. సరిగ్గా అప్పుడే అశోకవనాన్ని సందర్శించే కుతూహలంతో యయాతి ఆవైపు వచ్చాడు. ఒంటరిగా ఉన్న శర్మిష్టను చూశాడు. శర్మిష్ట తత్తరపడింది. వినయంతో తలవంచి మొక్కింది. రాజు తనపట్ల ప్రసన్నంగా ఉన్నట్టు గమనించి తనే చొరవతీసుకుంది. ‘నా యజమానురాలైన దేవయానికి నువ్వు భర్తవు కనుక నాకు కూడా భర్తవే. ఇదే ధర్మమార్గం. భార్య, దాసి, కొడుకు అనేవి విడదీయలేని ధర్మాలు. నువ్వు దేవయానిని చేపట్టినప్పుడే ఆమె ధనమైన నేను నీ ధనం అయిపోయాను. కనుక కరుణించి నాకు ఋతుకాలోచితం ప్రసాదించు’ అంది.

‘పడక ఒక్కటి తప్ప మిగతా విషయాలలో నిన్ను బాగా చూసుకోమని శుక్రుడు ఆదేశించాడు. నేనప్పుడు ఒప్పుకున్నాను. ఇప్పుడు మాట ఎలా తప్పను?’ అని యయాతి అన్నాడు.

‘ప్రాణాపాయం సంభవించినప్పుడు, సమస్త ధనాలనూ అపహరించే సమయంలోనూ, వధ కాబోతున్న బ్రాహ్మణుని రక్షించడానికీ, స్త్రీ సంబంధాలలోనూ, వివాహ సందర్భంలోనూ అబద్ధమాడినా అసత్యదోషం అంటదని మునులు చెప్పారు. నువ్వు వివాహసమయంలో శుక్రునికి మాట ఇచ్చావు కనుక దానిని తప్పిన దోషం నీకు రాదు’ అని శర్మిష్ట అంది.

యయాతి అంగీకరించాడు. శర్మిష్ట కొంతకాలానికి గర్భవతి అయింది.

[su_note note_color=”#ff6696″] శర్మిష్టకు శరీరంతో మాట్లాడే భాషే కాదు, దానికి కావలసినవి సాధించుకునే తర్కమూ తెలుసు. అందుకు అవసరమైన పాండిత్యమూ ఆమెకు ఉంది. మగవాడి బలహీనతపై ఒడుపుగా గురిచూసి కొట్టి లొంగదీసుకునే నేర్పూ ఉంది. ప్రకృతి ప్రతి ప్రాణికీ ఆయాచితంగా ప్రసాదించిన నేర్పు అది. ప్రకృతి సిద్ధమైన ఆమె బలవత్తర వాంఛ ఆ క్షణంలో దేవయానిపట్ల భీతిని కూడా జయించింది.

శర్మిష్టను, యయాతిని కాసేపు పక్కన ఉంచి కథకుని దగ్గరకు వద్దాం. నిజానికి వాళ్ళ ఇద్దరి ముఖంగా కథకుడే శ్రోతలతో ఇక్కడ సంభాషిస్తున్నాడు. వారిద్దరి సంబంధానికి సమర్థన అందించే వ్యూహంతో ఈ ఘట్టాన్ని నిర్మిస్తున్నాడు. ఎలాగంటే, శర్మిష్టతో యయాతి సుఖించడానికి ఎలాంటి సమర్థనలూ అవసరం లేదు. దాసీతో సంబంధం ఆనాడు తప్పు కాదు. కాకపోతే, దేవయానికి ఇష్టం లేదు కనుక అది రహస్య సంబంధంగా పరిణమించి ఉండచ్చు. శుక్రునికి ఇచ్చిన మాట ఎలా తప్పనని  యయాతి అన్నప్పుడు, కొన్ని సందర్భాలలో మాట తప్పవచ్చునని శర్మిష్ట గుర్తుచేయడంలో అర్థముంది. కానీ, నా యజమానురాలికి భర్తవు కనుక నాకు కూడా భర్తవే ననీ; భార్య, దాసి, కొడుకు అనేవి విడదీయరాని ధర్మాలనీ విడమరచి బోధించడంలో అర్థం లేదు. ఎందుకంటే, రాజూ, యజమానీ అయిన యయాతికి ఆ విషయం తెలియకుండా ఉండదు. కనుక, ఆ బోధ శర్మిష్ట యయాతికి చేస్తున్నది కాదు; కథకుడు శ్రోతలకు చేస్తున్నది! కారణం, ‘భార్య-దాసి-కొడుకు’ అనే విడదీయలేని ధర్మాలకు చెందని, భిన్న సామాజిక దశలోని శ్రోతలకు కథకుడు ఆ విషయం చెబుతున్నాడు!

అయితే, భిన్న సామాజిక దశకు చెందిన శ్రోతలను ఉద్దేశించడంలో కథకుడు  తెలిసో, తెలియకో అంతకంటే కీలకమైన ఒక అంశాన్ని కలగా పులగం చేస్తున్నాడు. అది, తనకు ఋతుకాలోచితాన్ని ప్రసాదించమని శర్మిష్ట అడిగిన సందర్భం.[/su_note]

ఋతుమతి అనే మాట ఉంది. దాని అర్థం మనకు తెలుసు. అది మొదటిసారి పెద్దమనిషి కావడాన్ని సూచిస్తుంది. ఋతుకాలం వేరు. అది నెల నెలా సంభవిస్తుంది. ఋతుకాలం సంతానం పొందడానికి యోగ్యమైన కాలం. శర్మిష్ట తనకు ఋతుకాలోచితాన్ని ప్రసాదించమని అడుగుతోంది. అంటే, తనిప్పుడు ఋతుకాలంలో ఉన్నాననీ, సంతానం ఇవ్వమనీ అడుగుతోంది. ఇలా ఆయా స్త్రీలు ఋతుకాలోచితం ప్రసాదించమని అడగిన సందర్భాలు మహాభారతంలో ఇంకా చాలా ఉన్నాయి. వాటి ప్రస్తావనను ప్రస్తుతానికి వాయిదా వేస్తే; కథకుడు తెలివిగానో, లేక అతి తెలివితోనో, నిజంగానే తెలియకో ఋతుమతి-ఋతుకాలోచితం అనే రెండు మాటలనూ ఒకే అర్థంలో ప్రయోగిస్తున్నాడు. ఆ ప్రయోగించడంలో ఒక వాస్తవాన్ని కప్పిపుచ్చి సందేహాలకు తావిస్తున్నాడు.

ఎలాగంటే, దేవయానికి ఇద్దరు కొడుకులు కలిగిన తర్వాత, శర్మిష్ట-యయాతుల మధ్య సమాగమం గురించి చెబుతూ,  ‘శర్మిష్ట సంప్రాప్తయవ్వనయు, ఋతుమతియు అయిం’ దని అంటున్నాడు! అంటే, కొత్తగా ఆమె ఋతుమతి అయిందనే భావన కలిగిస్తున్నాడు. అంతవరకు జరిగిన కథను గమనిస్తే, దేవయానికి ఇద్దరు కొడుకులు కలిగిన తర్వాతే శర్మిష్ట యవ్వనవతి, ఋతుమతి అయిందనడం నమ్మశక్యంగా ఉండదు. దేవయానికీ, శర్మిష్టకూ స్పర్థ ఉంది కనుక వారిద్దరూ ఇంచుమించు సమవయస్కులే అవుతారు. మహా అయితే, ఇద్దరి మధ్యా ఒకటి రెండేళ్ల అంతరం ఉండచ్చు. వయసులో తేడా ఎలా ఉన్నా; శర్మిష్ట దేవయాని పెళ్ళికి ముందే యవ్వనవతి అయుండాలి. ‘అతిశయ రూప లావణ్య సుందరి’ అయిన శర్మిష్టను దేవయాని పక్కన చూసి యయాతి ఆమె ఎవరో తెలుసుకోగోరాడని చెప్పడం ద్వారా అతడు ఆమెవైపు ఆకర్షితుడయ్యాడని కథకుడు అప్పుడే సూచించాడు. కనుక అప్పటికే ఆమె యవ్వనవతీ, ఋతుమతీ అయుండాలి.

మరి కథకుడు ఎందుకీ  కల్పన చేసినట్టు?! ఎందుకంటే,ఋతుమతి, ఋతుకాలోచితం అనే మాటల మధ్య ఉన్న అర్థభేదాన్ని అతడు గమనించి ఉండకపోవచ్చు. శర్మిష్ట ఋతుకాలోచితం ప్రసాదించమని అడుగుతోంది కనుక అప్పుడే ఆమె ఋతుమతి అయిందని పొరబడి ఉండచ్చు. ఇంకొకటి జరగడానికీ అవకాశముంది. కథకుడు ఉద్దేశపూర్వకంగానే ఋతుకాలోచితం అనే మాటకు ఉన్న భిన్నార్థాన్ని మరుగుపుచ్చే ప్రయత్నం చేసి ఉండచ్చు. ఎందుకంటే, ఋతుకాలోచితం ప్రసాదించమని అడగడం కూడా ఒకానొక సామాజిక దశకు చెందిన ప్రయోగం. కానీ, కథకుడు వేరొక సామాజిక దశకు చెందిన శ్రోతలకు కథ చెబుతున్నాడు…

మిగతా విశేషాలు తర్వాత….

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

–కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

 

 

సంస్కృతీ విరాట్ స్వరూపాన్ని అద్దం లో చూపగలమా?

ఆట సంస్కృతిలో భాగం, వేట సంస్కృతిలో భాగం, మాట సంస్కృతిలో భాగం, పోట్లాట సంస్కృతిలో భాగం, వివాహం సంస్కృతిలో భాగం, వివాదమూ సంస్కృతిలో భాగమే. మడిగట్టుకోవడం సంస్కృతిలో భాగం. అమ్మవారికి వేట వెయ్యడమూ సంస్కృతిలోని భాగం. బొట్టు పెట్టుకోవడం, కత్తిపట్టుకోవడం, మట్టి కాల్చి కుండలు చెయ్యడం అన్నీ అన్నీ సంస్కృతిలో భాగాలే. ఒక జాతి చేయగల మంచి, చెడూ సంస్కృతిలో భాగాలే. తెలుగునాట ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఎలా నోములు నోచుకుంటారు. ఎలా భిక్షాటన చేస్తారు. ఎలా పెళ్లి చేస్తారు. ఏ విధంగా విడాకులు తీసుకుంటారు. యుద్ధాల్లో ఎలా పాల్గొంటారు. ఓటమిని ఎలా ఎదుర్కొంటారు. వృద్ధాప్యంలో ఎలా ఉంటారు. యౌవనాన్ని ఎలా ఆస్వాదిస్తారు ఇలాంటివన్నీ సంస్కృతిలో భాగమే. దొంగలు, దొరలు, పూజారులు, వేశ్యలు, అధికారులు, సామాన్యులు, వీరులు, భిక్షకులు, విద్యావేత్తలు, నిరక్షరాస్యులు ఇలా ఎందరుండే వీలుందో అందరూ సంస్కృతిలోనే ఉండగలరు. ఏం చేసినా సంస్కృతిలోనే చెయ్యగలరు. తెలుగు దొంగలు ఎలా జేబులు కొడతారు, తెలుగు వేశ్యలు ఎలా విటులను ఆకర్షిస్తారు,  తెలుగు పిల్లలు ఎలాంటి ఆటలాడుకుంటూంటారు వగైరా అన్నీ ఆ పేద్ధ వృత్తంలొ భాగం. ఇది సంస్కృతి గురించి నా అనుకోలు, అవగాహనానూ. “కాలుమోపితే ఎండిపోయిన కందిచేను పూత పెట్టే లచ్చుమమ్మ”, “ఎద్దోలె ఎనుకాకు  ఒక్కొక్క అడుగేసి నాట్లేసి నాట్లేసే లచ్చుమమ్మ” సంస్కృతిలో భాగమైతే అణాకాసంత బొట్టు పెట్టుకుని పేరంటాలిచ్చిన వాయినాలతో నోము నుంచి తిరిగొస్తున్న సోమిదేవమ్మా సంస్కృతిలోని భాగమే. “శిలువ  మోస్తున్న ఏసుక్రీస్తులా నాగలి భుజాన వేసుకున్న” రైతూ, ఇవాళ్టికేమైనా వస్తుందేమోనని చూసి చూసి ఇంటికి వెళ్లి భార్య ఇచ్చిన తులసి ఆకుల తాంబూలం తృప్తిగా తిని వెర్రినవ్వు నవ్వుకునే పూజారీ సంస్కృతిలోనివారే.
ఇక సాహిత్యం అంటే టీషర్టుల మీద రాసిన రాతలు మొదలుకొని జనుల నాల్కలు తాటియాకులుగా లిఖింపబడ్డ పద్యాల వరకూ అంతా సాహిత్యమే. దాని ప్రయోజనమూ వేర్వేరు పద్ధతుల్లో ఉంటుంది. ఉదాహరణకు ఒక చక్కని ఊహ చదివితే ఒళ్లు పులకించింది అది సాహిత్య ప్రయోజనమే. ఒక చిన్న జోకు చదివితే పేద్ద నవ్వు కాకున్న చిరునవ్వు పొటమరించిందీ అదీ ప్రయోజనమే. ఒక రచన చదివి జీవితంపై మనకుండే అవగాహనే మారిపోయిందనుకోండి అదీ ప్రయోజనమే. ఐతే వాటి మధ్య చాలా అంతరువులున్నాయి. కానీ ఒక స్తరంలో చూస్తే లక్ష్యసిద్ధి ఉన్న సాహిత్యమే అవి మూడూను. ఆ సాహిత్యానికి ఎన్నో రూపాలుండవచ్చును. సామెతగా లోకరీతులు చెప్పినా, పేదరాశి పెద్దమ్మకథగా మరోలోకాల్లోకి తీసుకుపోయినా అవి చక్కని సాహితీప్రక్రియలే. సరే నాకు సాహిత్యం పట్ల ఉన్న అవగాహన ఇది.(అటు ఇటుగా మిగిలిన సృజనాత్మక ప్రక్రియలకు కూడా ఇంత పరిధీ ఉంటుంది)
ఇప్పుడు ఒక సృజనాత్మక ప్రక్రియ సంస్కృతిని ప్రతిబింబించింది అన్నమాటకు అర్థమేమిటి చెప్పండి? నా అవగాహన వరకైతే సంస్కృతి అన్న పేద్ద కాంపౌండును ఒక రచనలో ప్రతిబింబించడం ఎలా సాధ్యపడుతుంది? సంస్కృతిలోని చాలా అంశాలను చక్కగా వివరించొచ్చు. పైగా ఎన్నో ప్రాంతాల, వృత్తుల సంస్కృతులని(పైన నేను చెప్పుకున్న వివరణనే సంస్కృతి విషయంలో గుర్తుతెచ్చుకోండి) కలగలిపితేనే ఒకనాటి తెలుగువారి సంస్కృతి ఏర్పడుతుంది. అందువల్ల ఆ విరాట్ స్వరూపాన్ని మనం ఎంతవరకూ దర్శించగలమో అంతవరకే కనిపిస్తుంది. బ్రాహ్మణుల జీవన విధానం రూపుకడితే సంస్కృతిలోని కొన్ని విశేషాల్ని ఎట్టేదుట పరిచినట్టే, ఐనంత మాత్రాన తెలుగు సంస్కృతినంతా ఆవిష్కరించంచినట్టు అవదు. అంత పని చేయాలంటే మహాభారతమంత లోతూ, విస్తృతీ కలిగిన ఉద్గ్రంథం అవసరమవుతుంది తప్ప చిన్న కథ, కవిత, నవలికలకు కుదరదు. విస్తృతీ, లోతూ ఒనగూడినా సంస్కృతి అంతటి మహా సాగరాన్ని మొత్తంగా ప్రతిబింబిస్తాయా అంటే కాదనే చెప్పాలి. ఆ పని ఎలాంటిదంటే ఆకాశమంతటినీ ఒక అద్దంలో చూపడం లాంటిది. ఆకాశాన్ని అద్దంలో చూపగలమా? చూపగలం. ఆకాశమంతటినీ ఒకే అద్దంలో చూపగలమా? ఏమో ఇప్పటివరకూ ఆ ప్రయత్నం చేసి విజయం సాధించినవారు ఉన్నట్టు నాకు తెలియదు. ఐతే సంస్కృతిని అనే ఆకాశాన్ని సాహిత్యమే సాగరం అత్యంత అరుదైన సందర్భాల్లో ప్రతిబింబించి ఉండొచ్చు. కాని మన చిన్న స్కేళ్లు దాన్ని నిరూపించలేవు.
మరి చేయగలిగింది ఏమిటంటే ఎవరి స్థాయిలో వారు సంస్కృతి విస్తృతిని అర్థం చేసుకుని తమ తమ స్థాయిల్లో ప్రతిబింబించగలగడమే. అలా చేస్తూన్నారు కూడా. అందుకే తెలుగు వారి సంస్కృతిని ప్రతింబింబించే సృజనగా దేన్నైనా చెప్తున్నారు అంటే వారు దాన్ని వాచ్యార్థంగా చెప్పలేదనో, సంస్కృతి అన్న పదానికి ఉన్న విస్తృతి వారికి తెలియదనో అర్థం చేసుకోవాలి.
ఇక మరో అంశం. ఎవరైనా సంస్కృతిని ప్రతిబింబించే సృజన అని అన్నప్పుడు సంస్కృతిలో భాగాన్ని ప్రతిబింబించి సారస్వతాన్ని సంపన్నం చేస్తోందన్న అర్థం స్వీకరించడం మాని ఇదే తెలుగు సంస్కృతా అని ప్రశ్నించి అంతటితో ఆగక ఇది జనాభాలో ఇంతశాతం మాత్రమే ఉన్నవారి అనుభూతులు, అనుభవాలు, ఆశలు, ఆశయాల సమాహారం మాత్రమే కనుక ఇది తెలుగు సంస్కృతి కాదని తిరస్కరిస్తున్నారు. ఐతే వారు కూడా తెలియకుండానే సంస్కృతి అనే విశాలమైన బంజరును కంచె వేసి సంకుచితం చేసేస్తున్నారు. ఫలానా వారి రుచులు, అభిరుచులు మాత్రమే సంస్కృతి కాదు అని చెప్పేప్పుడు అది ఫలానావారి సంస్కృతి అని దాన్ని సృజనాత్మకంగా చెప్పగలగడం వారి హక్కు అని మరచిపోతున్నారు.
నిజంగా సంస్కృతీ అన్వేషకులు చేయాల్సిన పని అది కాదు. ఏ అంశాలను తెలుగు సారస్వతం విస్మరించిందో పట్టుకోవాలి. సృజన గలవారైతే దాన్ని సృజనాత్మకంగా వ్యక్తీకరించాలి. డబ్బున్నవారు అలాంటి విషయాన్ని సాహితీకరించడమో, తెరకెక్కించడమో చేసేవారికి దన్నుగా నిలవాలి. ఇవేవీ లేనివారు అలాంటివారిని కనీసం ప్రోత్సహించాలి. అప్పుడే సాహిత్యం సుసంపన్నమవుతుంది. ఆకాశం అరచేతిలో ఇముడుతుంది.
“జయంతి తే సుకృతినోః రససిద్ధా కవీశ్వరః
 నాస్తి తేషాం యశఃకాయే జరామరణజం భయం”
santhosh—సూరంపూడి పవన్ సంతోష్

బౌద్ధం… యుద్ధం… తవాంగ్ దృశ్యం

1

టూరిజం ఓ పెద్ద పరిశ్రమ అయిపోయాక మన మైదానాల సౌకర్యాలన్నీ మనతోపాటే  కొండలెక్కేశాయి. మంచి హోటళ్ళూ, బీరు బాటిళ్ళూ, ఫాస్ట్ ఫూడ్స్, మన ట్రాఫిక్ జాంలూ… చక్కగా వేటినీ వదలకుండా ప్రకృతి వొడిలోకి తెచ్చేసుకుని సెలవుల్ని ఆనందిస్తున్నాం. డార్జిలింగ్, నైనిటాల్, సిమ్లా, మసూరీ, ఊటీ, కొడైకెనాల్ లాంటి కొండ ప్రదేశాలకు పెద్ద పట్నాల వైభవం వచ్చేసి చాలా కాలమైంది.  కష్టపడి ఈ ఊళ్లకు వెళ్తే, ప్రకృతి పారవశ్యాల మాట అటుంచి, మన హైదరాబాద్ కో  ఢిల్లీకో కాస్త చల్లదనాన్ని పూసి, పాత సినిమాల్లో లాగా ఓ రెండు మంచు కొండలూ, ఓ సరస్సూ బ్యాక్ ప్రొజెక్షన్ పెట్టినట్టు ఉంటోంది. వీపున ఓ మూట వేసుకుని ఎవరూ పోని ప్రాంతాలకు ట్రెక్కింగ్ కి పోవటం ఉత్తమమే కానీ అది అన్నిసార్లూ కుదరదు.

మే లో మా కుటుంబం గువాహతి (అస్సాం) వెళ్లాం. అస్సాం వాతావరణం మేలో మన కోస్తా ప్రాంతాల మల్లే ఉంది.  షిల్లాంగ్ చల్లగా ఉన్నా అదీ ఓ పట్నమే కాబట్టి వద్దనుకున్నాం. అంతగా టూరిజం కోరల బారిన పడని అరుణాచల్ ప్రదేశ్ వెళ్తే బాగుంటుందేమో అని తవాంగ్ కు బయలుదేరాం. ఈ ప్రయాణంలో మార్గం కూడా గమ్యం అంత అందంగా ఉంటుందని విని  దీనిని ఎంచుకున్నాం.

బయలుదేరిన రోజున పొద్దున్నే ఏడు గంటలకల్లా ‘బొలెరో’ తో మా వాహనచోదకుడు సిద్ధం. ఈశాన్య రాష్ట్రాల్లో సూర్యోదయం వేసవిలో తెల్లారుజామున మూడున్నరకే అయిపోతుంది. అయినా మా వాళ్ళందరికీ ఒంట్లోని గడియారాలు ఆరుదాకా గంటలు కొట్టలేదు. బైటకొచ్చి చూస్తే,  పూబాలల్ని సున్నితంగా తడుతూ చిరుజల్లులు… మొత్తానికి ఎనిమిదికల్లా బయలుదేరాము.  ఎర్రటి నేలా,  లేత, ముదురాకుపచ్చ ఆకుల పరదాల మధ్యగా  సారవంతమైన పల్చని బూడిదరంగు నీటితో బ్రహ్మపుత్ర పరవళ్ళు… వీటిమధ్యలోంచి బద్ధకంగా ఆవులిస్తూ నిద్రలేస్తున్న గువాహతి ఊరిలోంచి మా ఎర్ర బొలెరో ప్రయాణం మొదలు పెట్టింది.

 

2

3

ఒక చిన్న ఫలహారశాల, బ్రహ్మపుత్ర

 

ఊరు దాటాక ఒక చిన్నపాటి భోజనశాలలో అల్పాహారం.  నన్ను చిన్నతనంలోకి ఒక్కసారిగా గిరాటు వేశాయి  బల్లమీద పెట్టిన ఇత్తడిపళ్ళెం, దానిలో అరిటాకులో పూరీలూ, ఒక చిన్న ఇత్తడి గిన్నెలో పల్చని శెనగపప్పు, ఆలుగడ్డ కూరా..  మా ఊళ్ళో నా చిన్నప్పుడు వాడకంలో ఉండిన కంచు, ఇత్తడి పాత్రలగురించి పిల్లలకు ఆనందంగా వర్ణిస్తూంటే, కాసేపు ఆ వస్తువులేంటో ఊహకందక,  వింత చూపులు ప్రసరించారు వాళ్ళిద్దరూ.

దారంతా అలాగే ఓ ముప్ఫై ఏళ్ల క్రితం మన పల్లెటూళ్ళు ఎలా ఉండేవో అలా కనపడింది.  అస్సాం అభివృద్ధి చెందలేదని అక్కడి ప్రజల బాధ. టాటాలూ అంబానీలూ అక్కడికి వెళ్ళరు. ఫలితం స్వచ్చమైన నీరూ, గాలీ, పంటా, పైరూ..   చమురు రిఫైనరీలు ఉన్నచోట అస్సాం అభివృద్ధి ఎలా ఉందో నేను చూడలేదు.  ఈ దారిలో కేవలమైన పచ్చదనంతో కూడిన పైర్లూ, గుబురు చెట్లూ,  వెదురుతోనూ, మట్టితోనూ కట్టిన ఇళ్ళూ.. అక్కడక్కడా సిమెంట్ ఇళ్ళు కూడా దిష్టిబొమ్మల్లా ఉన్నాయనుకోండి. మరీ ముఖ్యంగా ఎక్కడా వెదికినా కనబడని ప్లాస్టిక్ లూ, పాలితిన్లూ..  సైకిళ్ళమీద పాఠశాలకు వెళ్ళే పిల్లలు.. తేయాకు తోటలూ..  చక్కని రహదారికిరుపక్కలా ఈ అపురూప దృశ్యాలు తీరిగ్గా రాగాలాపన చేస్తుంటే మా వాహనం ఆ రాగాన్ని మింగేసే మెటల్ బ్యాండ్ హోరులా ఎనభై కిలోమీటర్ల వేగంతో పరుగెత్తడం మహా అసంబద్ధ దృశ్యం. ఇవాళ దేశమంతటా కూడా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్  అంటేనే అదో గగన కుసుమం.  మన సమయాన్ని ఆదా చేస్తూ ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళే ప్రైవేట్ ఆపరేటర్లు ప్రతీచోటా.

అస్సాం బాటకిరువైపులా...

అస్సాం బాటకిరువైపులా…

దారిలో దిరాంగ్ జిల్లా ఖరుపేటియాలో జనపనార బాగా కనిపించింది. ఈ జిల్లాలో ముస్లిం జనాభా కూడా ఎక్కువగా ఉంది. రౌతల్ గురి  చేరాక, ఇక్కడ బోడోలాండ్ ప్రభావం ఎక్కువని చెప్పాడు మా డ్రైవర్ రాజేష్. ‘బంగ్లాదేశ్ నుంచి  చొరబాట్లు ఈ ప్రాంతంలో సాధారణం’ అన్నాడు.  చొరబాట్ల మీద అదుపు, కాందిశీకులకు సరైన గుర్తింపు, స్థానికులకు సరైన భరోసా ఇవ్వని ప్రభుత్వాల వల్లనే కదా వేర్పాటువాదాలు!

మధ్యాన్నానికి తేజ్ పూర్ దాటి భాలుక్ పాంగ్ చేరుకున్నాం. ఇక్కడినుండి  అరుణాచల్ ప్రదేశ్ మొదలవుతుంది. అరుణాచల్ లో తిరగటానికి అక్కడి ప్రభుత్వపు అనుమతి పత్రం (inner line pass) ఈ వూరిలో తీసుకోవాలి.  భాలుక్ పాంగ్ నుంచి కొండ ఎక్కటం మొదలయింది. కొండ పక్కనే కామెంగ్ నది పరవళ్ళు తొక్కుతూ మా వాహనధ్వని తో జుగల్ బందీ సాగిస్తోంది.  ‘ఇది సతత హరితారణ్యం సుమా’ అంటూ పరచుకున్న పోక, అరటిచెట్లు, వెదురు పొదలు. కామెంగ్ నది చేస్తున్న గాన కచేరీకి పక్క వాద్యాల్ని అందిస్తున్నట్టు చిన్నా పెద్దా జలపాతాల ఝరీ నాదాలు.  ఈ పచ్చసముద్రాన్ని ఈదుకుంటూ టెన్గా లోయ చేరుకున్నాం. అదంతా మన సైన్యం నివసించే ప్రాంతం. చాలా పెద్ద సెటిల్మెంటు. టెన్గా దాటాక ఇంకో గంటలో బొమ్ దిలా చేరుకున్నాం. అప్పటికి చీకటి పడింది. మేము చేరేసరికి ఈ వూరిలో బజారంతా వస్తువులతో, విద్యుద్దీపాలతో వెలిగిపోతోంది. బస వెదుక్కుని, కిందకు భోజనం చేద్దామని వచ్చేసరికి అంతలోనే కర్ఫ్యూ పెట్టినట్టు అంతా నిర్మానుష్యం. అప్పటికి సమయం రాత్రి ఎనిమిదే అయింది. కష్టంమీద రొట్టెలూ, రాజ్ మా  సంపాదించి తినటం అయిందనిపించాం.

అరుణాచల్ అందాలు

అరుణాచల్ అందాలు

 

రెండో రోజు ఉదయాన్నే బయలుదేరాం. దారంతా ఒకటే వాన. మెత్తటి మట్టిలో ఇరుక్కుపోతున్న వాహనాలు. సరిహద్దు రహదారుల సంస్థ (బీ ఆర్ ఓ) ఇరవై నాలుగ్గంటలూ పని చేస్తున్నట్టు కనిపించింది. చాలా చోట్ల ప్రోక్లైనర్ లతో పని చేస్తున్నారు.  చంటి పిల్లల్ని వీపున కట్టుకుని పని చేస్తున్న ఆడవాళ్ళు కొంతమంది.  దారి విశాలంగానే ఉందిగానీ రాళ్ళు, బురదతో నిండి మా వాహన వేగానికి బాగానే కళ్ళెం వేసింది. అలా నెమ్మదిగా 13,700 అడుగుల ఎత్తులో ఉన్న సెలా పాస్ చేరుకున్నాం. అక్కడో పెద్ద సరస్సు. ఓ పక్క ప్రశాంతంగా గడ్డి మేస్తున్న జడల బర్రెలూ… కఠిన శిలా సదృశమైన కొండ కొమ్ము పక్కనే పసుపుపచ్చని పూలతో నిండిన లోయ.  హిమాలయాల్లో ఈ ఎత్తులో rhododendron పూలకోసం అప్రయత్నంగా వెదుకుతాయి నా కళ్ళు.   ‘నీకెప్పుడూ నిరాశ కలిగించలేదు కదూ’ అంటూ నవ్వుతున్న నేస్తాల్లా ఎర్రని, తెల్లని, రోజా రంగుల్లోని rhododendrons సమృద్ధిగా…

6

సెలా పాస్ దివ్యత్వం

సెలా పాస్ దివ్యత్వం

సాయంత్రానికల్లా కొండ దిగి జాంగ్ జలపాతం దగ్గరకు వచ్చాం. చాలా పెద్దదైన ఈ జలపాతం దగ్గర 3X2 మెగా వాట్ల జలవిద్యుత్ కేంద్రం ఉంది. ఉత్తరాఖండ్ లో, హిమాచల్ ప్రదేశ్ లో బోలెడంత సిమెంటూ, ఇనుమూతో చాలా పెద్ద పెద్ద జలవిద్యుత్ కేంద్రాలు కనిపిస్తాయి. ఇక్కడ ఇంకా ఆ జాడ్యం అంటుకోకముందే ప్రభుత్వాలు సౌరశక్తి మీద పడితే బాగుంటుందని అనిపించింది.

జాంగ్ జలపాతం,                             కొండ దారుల వలయాలు

జాంగ్ జలపాతం, కొండ దారుల వలయాలు

చీకటి వేళకు తవాంగ్ చేరుకున్నాం.  ప్రయాణం మొదలైన దగ్గరనుంచీ ఒక ‘దీదీ’  రాజేష్ తో మొబైల్ ఫోనులో తెగ మాట్లాడుతూనే ఉంది. మమ్మల్ని తన హోటల్ లోనే దింపాలని ఆవిడ బాధ. ఇతనేమో ‘ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం’ అంటూ హామీలు ఇచ్చేస్తున్నాడు. మొత్తానికి అతని సలహా ప్రకారమే ఆ హోటల్ లోనే దిగాము.  ఈ రకం ప్రయాణాలలో చాలా వరకూ  క్యాబ్ డ్రైవర్ ల ఇష్టానుసారమే మనం నడిచేస్తూ ఉంటాం. మరో మార్గం ఉండదు. క్యాబ్ లో ద్రైవరయ్యకు నచ్చిన టపోరీ పాటల్ని భరించక తప్పదు. మధ్యలో వినయంగా విన్నవించి కాసేపు మనకి నచ్చిన  సంగీతాన్ని పెట్టబోయినా మొహం ముడిచేస్తాడు.  ‘ఏ పాటలూ వద్దు  ప్రకృతి సంగీతాన్ని విని లయించిపోదామ’ని  ప్రయత్నిస్తూ నేను  మా అమ్మాయితోనూ  క్యాబ్ డ్రైవర్ లతోనూ  ప్రత్యక్ష, ప్రచ్చన్న యుద్ధాలు చేస్తోంటాను.  అదో ఆట.

మొత్తానికి హోటల్ గది శుభ్రంగా కళాత్మకంగా ఉంది. తవాంగ్ హోటల్ లో వంట, వడ్డన, పాత్రలు శుభ్రం చేయటం, అతిథుల సామాను మోయటం కూడా ఆడపిల్లలే చేస్తున్నారు.  ‘ఇదేం బాధ?’ అనుకుని మా సామాన్లు మేమే పట్టుకున్నాం.  ఇక్కడ మగవాళ్ళకంటే ఆదివాసీ ఆడవాళ్లే ఎక్కువ కష్టపడతారని ఒకరిద్దరు చెప్పారు. బైటి పనుల్లో ఆడవాళ్ళు మునిగిఉంటే కొంతమంది మగవాళ్ళు ఇంటినీ, పిల్లలనూ చూసుకుంటారట.

పని పాటలు మన వంతేనప్పా!

పని పాటలు మన వంతేనప్పా!

 

10

తవాంగ్ టూరిస్టు ప్రాంతం అన్నదానికి గుర్తుగా ఊరంతా అక్కడక్కడ చిన్న ఝరుల మధ్య ఖాళీ  ప్లాస్టిక్ సీసాలూ, పాలితిన్ సంచులూ కనిపించాయి. ఘనీభవించిన  పచ్చదనాన్ని చేదిస్తూ రంగుల దుస్తుల్లో మనుషులు కనిపించాలి కానీ రంగుల చిరుతిళ్ళ రేపర్లు కాదుగదా!   ప్రకృతి పట్ల ఈ నిర్లక్ష్యాన్ని మనం ఎప్పటికైనా వదుల్చుకోగలమా?

మరునాడు ఎడతెగని వాన వల్ల అక్కడున్న ఒకటి రెండు సరస్సులు చూడాలన్న మా ప్రయత్నం నెరవేరలేదు. అరుణాచల్ ప్రదేశ్ లో  ఎత్తైన కొండలమీద వెయ్యి దాకా చిన్నా పెద్దా సరస్సులు ఉన్నాయట. తవాంగ్ మొనాస్టరీ అంతా తిరిగి చూసాం. మేము వెళ్లేసరికి బుజ్జి బుజ్జి అయిదేళ్ళ పిల్లల నుండి పదిహేనేళ్ళ పిల్లల వరకూ ఉదయపు అసెంబ్లీ లో ఉన్నారు. గురువుగారితో పాటు ప్రార్ధన అయాక అందరూ వరుసగా తరగతి గదులకు వెళ్ళిపోయారు.  మహాయాన బౌద్ధంతో పాటు, కాసిన్ని లెక్కలూ, హిందీ, సమాజ శాస్త్రం కూడా పిల్లలకు నేర్పిస్తామని ఒక గురువు చెప్పారు. తవాంగ్  మొనాస్టరీ  మన దేశంలోనే పెద్దది. చాలా పెద్ద గ్రంథాలయం ఉంది ఇక్కడ.  అయిదు వందల మంది దాకా బౌద్ధ సన్యాసులు ఇక్కడ ఉండి చదువుకుంటున్నారు. ప్రార్ధనాలయం గోడల మీద ఉన్న చిత్రాలు (murals) పాడవుతూ తమను కాస్త పట్టించుకోమంటున్నాయి. అయిదవ దలైలామా ఆధ్వర్యంలో ఈ మొనాస్టరీని పదహారవ శతాబ్దంలో నిర్మించారట. తవాంగ్ ఆరవ దలైలామా జన్మస్థలం కూడా.

11

తవాంగ్ మొనాస్టరీ

తవాంగ్ మొనాస్టరీ

ప్రార్ధనాలయం

ప్రార్ధనాలయం

ప్రార్ధనాలయంలో...

ప్రార్ధనాలయంలో…

తవాంగ్ లో మోంపా తెగకు చెందిన ఆదివాసీలు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ బౌద్ధం ఎక్కువ. బౌద్ధులు కాని మిగతా వారంతా ప్రకృతి ఆరాధకులే.  ఒకప్పుడు టిబెట్ లో భాగమైన తవాంగ్, బ్రిటిష్ వారు మెక్ మోహన్ లైన్ ను సరిహద్దుగా నిర్ణయించాక భారతదేశానిదయింది. 1962 చైనా-భారత్ యుద్ధం తరువాత ఒక ఆరునెలల పాటు చైనా ఆధీనంలోనికి వెళ్ళింది తవాంగ్ .  1962 లో తవాంగ్ దాటి, అస్సాంలోని తేజపూర్ దాకా చైనా సైన్యం వచ్చేసిందట. మొత్తానికి  ఆరు నెలల తరువాత చైనా దీనిని విడిచిపెట్టింది.  ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ టిబెట్ లో భాగమేననీ, తద్వారా అది తమకు చెందినదే అన్న భావం చైనా వారికి ఉంది. ఇక్కడుండే బౌద్దులకూ, ఆదివాసీలకూ చైనామీద ప్రత్యేక ఆసక్తి సహజంగానే లేదు. పైగా టిబెటన్లను అణిచివేసే చైనా విధానాలవల్లా, దలైలామా మన దేశంలోనే ఆశ్రయం తీసుకోవటంవల్లా, బౌద్ధులకు చైనావాళ్ళంటే గిట్టకపోవటమూ, మన దేశం అంటే కాస్త ఇష్టం ఉండటమూ కూడా సహజమే. తవాంగ్ భారతదేశంలో భాగంగా ప్రశాంతంగానే కనిపిస్తుంది. అయినా ఎటువంటి పొరపాట్లకూ, చొరబాట్లకూ ఆస్కారం ఇవ్వకుండా భారీగా మన సైన్యం అడుగడుగునా పహారా  తిరుగుతూ ఉంటుంది.

1962 లో చైనా మెరుపుదాడిని ఎంత మాత్రం ఎదుర్కోవటానికి సిద్ధంగా లేని భారత్  ఆదరా బాదరాగా దేశం  అన్ని మూలలనుంచీ సైన్యాన్ని తవాంగ్ కు పంపిందట. ఆ యుద్ధంలో సుమారు రెండు వేల మంది దాకా మన సైనికులు మరణించారు. వారందరి స్మృతి చిహ్నాన్ని తవాంగ్ లో కట్టిన  వార్ మెమోరియల్ లో చూసాం. జస్వంత్ సింగ్ రావత్ అనే సైనికుడు మరో ఇద్దరి సాయంతో  చైనా సైన్యాన్ని నిలువరించి, వారి మెషిన్ గన్ ను ఎత్తుకురావటం, చివరకు వారి చేతిలో మరణించటం వంటి సంఘటనలను వివరించే ఆయన స్మృతిచిహ్నం (జస్వంత్ గడ్)  కూడా తవాంగ్ వెళ్ళే దారిలో ఉంది.  ఇక్కడ యుద్ధంలో చనిపోయిన చైనాసైనికుల సమాధులు కూడా ఉన్నాయి.  ‘They also died for their country’ అని అక్కడ బోర్డు పెట్టారు.  మనసు బరువెక్కించే ఆ యుద్ధం ఆనవాళ్ళు నిండా నింపుకుంది తవాంగ్.

జస్వంత్ గడ్ స్మృతి చిహ్నం,                              చైనా సైనికుల సమాధులు

జస్వంత్ గడ్ స్మృతి చిహ్నం, చైనా సైనికుల సమాధులు

 

 

జస్వంత్ సింగ్ రావత్ సమాధి,     ఆవరణ

జస్వంత్ సింగ్ రావత్ సమాధి, ఆవరణ

 

 

తవాంగ్ వార్ మెమోరియల్,                                  ప్రార్ధనాలయంలో సైనికుల సేవ

తవాంగ్ వార్ మెమోరియల్, ప్రార్ధనాలయంలో సైనికుల సేవ

మరునాడు తిరుగు ప్రయాణం.  వరుణుడు తన ఆశీస్సులతో దారంతా ముంచెత్తాడు. సెలా పాస్ దగ్గరకొచ్చేసరికి ఎదురుగా అయిదడుగుల దూరంలో ఏముందో కనిపించటం లేదు. అక్కడ దిగి కాసేపు అటూ ఇటూ పరుగులు తీసి, అక్కడున్న ఒకే ఒక చిన్న ఫలహారశాలలో దూరాం. బయటి వర్షపు పొగలూ, లోపల వేడిగా మోమోలూ, నూడుల్స్ నుండి వస్తున్న పొగలూ… వణికించే చలిలో వేడి పొయ్యి సెగలలో సేదదీరి మోమోలూ, చాయ్ ఆస్వాదించాం.  ఈ షాప్ నడుపుతున్నదీ ఇద్దరు స్త్రీలే. అక్కచెల్లెళ్ళు.  పొయ్యి చుట్టూ అక్కడికి వచ్చిన వారంతా  చేరి  వాతావరణంగురించీ, బురదలో ఇరుక్కున్న వాహనాల గురించీ, ఒకనాటి  యుద్ధం గురించీ కబుర్లు చెప్పారు.  ఆ వర్షంలో రాజేష్  నిదానంగా బండి పోనిస్తుంటే, రోడ్డు విశాలంగానే ఉంది  గనుక ఎదురుగా ఏమీ కనిపించకపోయినా నిశ్చింతగానే కూర్చున్నాం.

సెలా పాస్ దగ్గరున్న చిన్ని ఫూడ్ జాయింట్ లో  సేద తీరుతూ మేము.

సెలా పాస్ దగ్గరున్న చిన్ని ఫూడ్ జాయింట్ లో సేద తీరుతూ మేము.

సెలా పాస్ ఎత్తుల్లో ఇవీ ఇళ్ళు

సాయంత్రానికి వర్షం నెమ్మదించి, కొండా లోయల అందాలు బయటపడ్డాయి.  దారిలో  ‘కివి’ పండ్ల చెట్లు చూపించి ఇది మంచి వాణిజ్య పంట అని చెప్పాడు రాజేష్.  ఏమయినా డబ్బు, వ్యాపారం పెద్దగా తెలియని మనుషులు వీళ్ళు.  టెన్గా లోయలో వచ్చేటప్పుడు బస. ఆ హోటల్ లో పని చేసే నేపాలీ అతను అక్కడ హోటల్ వ్యాపారం ఎంత కష్టమో వివరించాడు. ఇక్కడ బయటినుంచి వచ్చి వ్యాపారం చేసేవాళ్ళే ఎక్కువ. స్థానికులు చాల మంది హోటల్ కు వచ్చి డబ్బులివ్వకుండా ఊరికే తిని వెళ్ళిపోతారట. వ్యాపారపు విలువలు వీరికి చాలా తక్కువగా అర్థమవుతాయేమో!  ఆ విలువలే తెలిసిన మనకు,  కొంత కాలం అక్కడ గడిపితే కానీ వీళ్ళ జీవితం అర్ధం కాదు.

మొత్తం అరుణాచల్ ప్రదేశ్ లో అయిదారు కళాశాలల కంటే ఎక్కువ లేవుట.  భారీ ఎత్తున టూరిజం పరిశ్రమా, పెద్ద తరహా వ్యాపారమూ అడుగు పెట్టని చోట ఆదివాసీ తెగలు ఎంత ప్రశాంతంగా బ్రతుకుతాయో కదా అనిపించింది తవాంగ్ ను ఇలా బయటినుంచి చూస్తే!  కానీ ఆ సమాజాలలో ఉండే అంతర్గత సమస్యలు వారితో కలిసి గడిపితే కానీ అర్ధంకావు కదా!

టూరిస్టుల కోసం దారంతా  స్త్రీల ఆధ్వర్యంలో చిన్న చిన్న భోజనశాలలున్నాయి. శుభ్రమైన సాదా సీదా భోజనం దొరికింది. మోమోలు, తూక్పా(మోంపాల సంప్రదాయ వంటకం), నూడుల్స్, గోధుమ రొట్టెలు, అన్నం, కూరలు వేడిగా దొరుకుతున్నాయి. పదహారు జిల్లాలతో విశాలంగా పరుచుకున్న అరుణాచల్ ప్రదేశ్ లో వ్యవసాయమే ముఖ్యమైన పని.  వాళ్ళ ఇళ్ళు నన్ను చాలా ఆకర్షించాయి.  గట్టి కలపతో చట్రాలు కట్టి, మధ్యలో వెదురు తడకలు బిగించి వాటిపై మట్టి పూసిన ఇళ్ళు కట్టటం వీరి సాంప్రదాయం.  ఉన్న చోటే దొరికే కలపతో కట్టిన ఇళ్ళూ, ఉన్నచోటే పండించుకునే తిండీ, అచ్చమైన గాలీ, స్వచ్చమైన నీటి గలగలలూ…

ఇంతకంటే ఇంకేం కావాలి జీవితానికి? అని కాసేపైనా అనిపిస్తుంది, మళ్ళీ మన నగరాలకు వచ్చేసేముందు.

కొంత సమాచారం :  గువాహతి నుంచి తవాంగ్ కు బొలెరోలలో వెళ్ళటం ఎక్కువ. కఠినమైన ఆ రోడ్లకు ఈ వాహనం బాగా సరిపోతుంది.  తేజ్ పూర్ నుంచి బస్సులు ఉన్నాయంటారు కానీ మేము వెళ్ళిన వర్షా కాలంలో ఏ బస్సులూ కనిపించలేదు. ఆరు రోజుల ఈ ప్రయాణానికి బొలెరో కి  Rs.25,000/- వరకూ తీసుకుంటారు. సైన్యం సులువుగా మసలటం కోసం వేసిన విశాలమైన రోడ్లు. దారంతా కన్నుల పండుగే.  సెప్టెంబరు నుంచి నవంబరు అనువైన సమయం. ఫిబ్రవరి, మార్చిలో కూడా సెలా పాస్ దగ్గర మంచూ, గడ్డ కట్టిన సరస్సులూ చూడవచ్చు. ఏప్రిల్ నుంచి ఇక వర్షాలే. తవాంగ్ నుంచి చైనా సరిహద్దు బూమ్ లా పాస్ కూడా  చూడాలంటే మొత్తం ప్రయాణానికి కనీసం ఆరు రోజులు పడుతుంది.     

జ్ఞాపకాల నీడలో వసుంధర

bhuvanachandra (5)“తాగి తాగి చచ్చింది. చచ్చి బతికిపోయింది..!” నిట్టూర్చి అన్నాడు శీను. ‘శీను’ అనే పేరు సినిమా పరిశ్రమలో చాలామందికి ఉంది. ప్రొడక్షన్ వాళ్లలో ‘శీను’లే ఎక్కువ. అలాగే ప్రసాద్‌లు. ఈ ‘శీను’ మాత్రం కాస్ట్యూమర్. వయసు అరవైకి  పైమాటే.

“అదేంటి మావా అలా అంటావూ? ఆవిడకేం మూడిళ్ళు. లెక్కలేనంత ఆస్థి, మొగుడు, పిల్లలు. ఇంకేం కావాలి?” ఆశ్చర్యంగా అన్నాడు సూరిబాబు.

“అందుకే మరి జనాలు నిన్ను వెర్రివెలక్కాయనేది. ఒరే సూరి! ఏది ఎంతున్నా, మనశ్శాంతి లేని బతుకు బతుకవుతాదిట్రా? గంజినీళ్లు తాగినా మనశ్శాంతి వుంటే ఆరోగ్యం ఉంటాది. ఆరోగ్యం వుంటే ఆనందం వుంటాది. ఏవుందా అమ్మకి? ఒరే! గొప్ప గొప్ప హీరోయిన్ల దగ్గర్ పన్జేశా. అందరి ‘కొలత’లూ నాకు తెల్సురొరే! కొలతలంటే జాకెట్టు కొలతలూ, బాడీ కొలతలు కాదు. ఆళ్ల మనసు లోతులూ అన్నీ తెలుసు. కానీ వసుంధరమ్మంత పిచ్చి ముండ ఇంకోతి వుండదు” చెబుతూ చెబుతూ సైలెంటైపోయాడు శీను.

‘ఫ్లాష్‌బాక్, ఫ్లాష్ ఫార్వార్డ్ ల్ని సినిమాల్లో చూపిస్తారు. ‘అదెలా?’ అని అనుకుంటామేగానీ, ప్రతీ మనిషీ రోజుకి కనీసం వందసార్లయినా ‘గతం’లోకి వెళతాడని గ్రహించలేం. ఏం.. మీగురించే మీరు ఆలోచించుకోండీ. రోజుకి ఎన్నిసార్లు గతంలోకి పయనిస్తున్నామో మీకే తెలుస్తుంది.

శీను కూడా గతంలోకి పోయుండాలి. అతనికా హక్కూ, అవకాశం రెండూ వున్నాయి. ఎందుకంటే సగానికి పైగా అతని జీవితం వసుంధరకి పర్సనల్ కాస్ట్యూమర్‌గానే గడించింది. ఆ అమ్మాయి పదహారేళ్లప్పుడు మొదటిసారి బాబూరావు (ఈ మధ్యే చనిపోయారు.  ఓ రెండేళ్ళవుతుంది) దగ్గర పనిచేసేవాడు. బాబూరావు చాలా పనిమంతుడు. టాప్ హీరోయిన్లు అతన్ని పర్సనల్ కాస్ట్యూమర్‌గా కోరుకునేవారు. ఆయన కింద కనీసం ఓ ఇరవైమంది టైలర్లుండేవారు. పగలూ రాత్రి అదే పని. బాబూరావులో వుండే ఒకే ఒక డిఫెక్టు అతని చిరాకు. నిద్రలేవడం దగ్గర్నించీ, నిద్రపోయేదాకా పచ్చి బూతులే. సాయంత్రం కాగానే ‘మందు’ తప్పనిసరి. ఆ  టైంలో ఎవడ్నో ఓకడిని నానా తిట్లూ తిట్టి హేళన చేస్తే గానీ అతని మనసు శాంతించేది కాదు. అయితే అదృష్టవశాత్తు ఓ రోజున ఓ మహానుభావుడు అతని చేత ‘మందు’ మాన్పించాడు. దాంతో శాడిజమూ తగ్గింది.

సినిమా పరిశ్రమలో ‘గురువు’ ఎప్పుడూ గురువే. ఎంత తిట్టినా, కొట్టినా, నోటికి తొంభైమంది ‘గురువు’ని ఏనాడూ తప్పుబట్టరు. తూలనాడరు. శీనుకీ, బాబూరావంటే గౌరవం అందుకే మిగిలుంది. మనిషి ఎలాంటివాడైనా ‘పని’లో మాత్రం కింగ్. అందుకే బాబూరావు శిష్యులు సరదాగా ఇప్పటికీ అంటారు.. “మా గురువారికి ‘టేపు’ అక్కర్లేదండి.. చూపుల్తోనే కొలతలు తీస్తాడు!” అని.

వసుంధరకి పదహారూ, శీనుకి  ఇరవై రెండూ. వసుంధర తల్లి  బ్రాహ్మణ స్త్రీ. తండ్రి అరవచెట్టియార్. వసుంధరకాక ఇంకో మగపిల్లాడు. సెయింట్ జాన్స్‌లో చదువుతుండగా వసుంధరకి హీరోయిన్‌గా అవకాశం వచ్చింది.

“నేను స్కూల్ డ్రామాలో యాక్ట్ చేస్తుండగా డైరెక్టర్ బాలకిషన్ అంకుల్ చూసి ‘హీరోయిన్’గా చేస్తావా అమ్మా అనడిగారు” అని వసుంధర తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేది. నిజం మాత్రం అది కాదు. వసుంధర తల్లి ‘బాలకిషన్’ని చాలా నెలలు ‘అలరించాకే’ వసుంధరకి హీరోయిన్ చాన్స్ వచ్చిందని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.

“నీకు సినిమాల్లో ‘కేరక్టర్’ కావాలా? అయితే నీ ‘కేరెక్టర్’ నా దగ్గర వొదిలేసెయ్!” అని పరిశ్రమ అంటుందిట. ఇదో జోక్ గాని జోక్.

వసుంధర నిజంగా అందగత్తె. పాలల్లో మంచి పసుపూ, గులాబి రంగూ కలిసిన దేహచ్చాయ. ముత్యాల్లాంటి పలువరుస. అయిదడుగుల నాలుగంగుళాల ఎత్తు. చక్కని బిగువైన ఒళ్ళు. చూడగానే పిచ్చెక్కించే చిరునవ్వు. ఇంకేం కావాలి? ‘గ్లామర్ డాల్’ అన్నారు.

“ఏంది మావా ఆలోచనా?” అడిగాడు సూరిబాబు.

“నావల్ల కావటంలేదురా…!” కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అన్నాడు శీను.

“పోనీ వెళ్ళి చూసొద్దాం పద!” లేచాడు సూరిబాబు.

“ఊహూ! చూళ్ళేను. చూస్తే గుండె పగిలి పోతుంది…!”

రెండు చేతుల్తో మొహం కప్పుకున్నాడు శీను. మళ్లీ ఏవో జ్ఞాపకాలు.

 

***********

 

కొత్తగా వచ్చిన హీరోయిన్ ‘కొలత’ ఎంత ‘సినిమాటిక్‌’గా కొలవాలో అంత ఘోరంగానూ తీశాడు బాబూరావు.. చూస్తూ ‘గురువు’గారు చెప్పిన కొలతల్ని నోట్ చేస్తున్న శీనుకే కంపరం పుట్టింది. వసుంధర సిగ్గుతో చచ్చిపోతోంది.

“అదేంటమ్మాయ్! సిగ్గుపడితే ఎలా? కెమెరామన్ దగ్గరా, కాస్ట్యూమర్ దగ్గరా ‘వొళ్ళు’ దాచుకోకూడదు. దాచుకుంటే తెరమీద ‘గ్లామర్’ కనిపించదు. ఇంకో రెండు సినిమాలయ్యాక నువ్వే చెబుతావు మాకు. ఎక్కడ ఎత్తులూ, ఎక్కడ వొంపులూ పెట్టి కుట్టాలో…!” ఫకాల్న నవ్వి వసుంధర ‘సీటు’ మీద చరిచి అన్నాడు బాబూరావు.

కళ్ళనీళ్ల పర్యంతమైన  వసుంధరని చూడగానే తన చిన్న చెల్లెలు జ్ఞాపకం వచ్చింది శీనుకి. మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్టు. అయితే వసుంధర ‘బిడియాన్ని’ చిదిమేసి ‘కసి’ని పెంచింది మాత్రం బాబూరావులాంటి ధీరులే. రెండో సినిమాని వెంటనే వొప్పుకోలేదు వసుంధర తల్లి. టాప్ రెమ్యూనరేషన్ ఆఫరయ్యేదాకా ఆగింది. సినిమా సంతకం చెయ్యగానే వసుంధర  డైరెక్టుగా ప్రొడ్యూసర్‌తో అన్నది. “సార్.. నాకు కాస్ట్యూమర్‌గా బాబూరావు వొద్దు. అతని అసిస్టెంట్ శీను కావాలి. యీ సినిమా నించి అతనే నా పర్సనల్ కాస్ట్యూమర్” అని .. అంతే శీను దశ తిరిగింది.

వసుంధర  బాబూరావుని వొద్దన్న సంగతి జనాలకు తెలిసింది. ఒక్కొక్క సినిమాలో వసుంధర  పైకి వెళ్తున్న కొద్దీ, బాబూరావు కిందకి దిగిపోవాల్సి వచ్చింది. టాప్ హీరోయిన్  ‘వద్దన్న’వాడిని పనిలో  పెట్టుకోవడానికి గుండా చెరువా?

రెండే రెండేళ్ళలో బాబూరావు దగ్గరి అసిస్టెంట్లందరూ శీను దగ్గర చేరిపోయారు. బాబూరావ్ ‘సినీ’ టైలర్స్ కాస్తా బోర్డు తిప్పి కోడంబాకంలో మామూలు టైలర్‌గా మిగిలిపోయాడు. బాబూరావే కాదు, మొదటి సినిమా కెమెరామాన్ వైద్యలింగాన్ని, నానా తాగుడూ తాగి చిత్రహింసలు పెట్టిన  డైరెక్టర్ బాలకిషన్‌ని కూడా నిర్ధాక్షిణ్యంగా ‘తొక్కేసింది’. వసుంధర. ప్రొడ్యూసర్ మంచివాడు గనక బతికిపోయాడు. మేకప్ సుబ్బరామన్ అప్పటికే వయసుమీరినవాడు. అయితే గొప్ప పనిమంతుడు. ఆ సుబ్బరామన్ రిటైరయ్యాక కూడా నెలకి కొంత డబ్బులు పంపి ఆదుకుంది వసుంధర. హాస్పిటల్ ఖర్చులూ ఆమే భరించేది. దాంతో వసుంధరకి ‘గొప్ప మానవతావాది’ అన్నపేరు వొచ్చింది. ‘కరోడా’ అన్న పేరు ఎలాగూ వచ్చిందనుకోండి..

***

 

“శీనూ… నువ్వూ మన మేకప్‌మేన్ నరసింహులూ నా తరఫున సాక్షి సంతకాలు పెట్టాలి” ఇరవై ఆరో ఏట శీనుని తనున్న హోటల్ రూంలోకి పీల్చి చెప్పింది వసుంధర. అప్పటికామె నందకుమార్ (హీరో) ప్రేమలో పూర్తిగా మునిగిపోయిందని పరిశ్రమలో అందరికీ తెల్సు.. “అదికాదమ్మా.. నందకుమార్‌గారికి ఆల్రెడీ పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూదా. ఇప్పుడు…”చెప్పబోయాడు శీను.

“నాకు తెలుసు శీను! ఇప్పటివరకూ సంపాదించింది మొత్తం మా అమ్మా, తమ్ముడు వాళ్ల పేరు మీద దాచేసుకున్నారు. ఇప్పటికైనా ఆ వూబిలోంచి బయటపడకపోతే జన్మలో ఎప్పటికీ బయటపడలేను. నందకుమార్ ఎలాంటివాడైనా నిజంగా నేనంటే ప్రేమ వున్నవాడు. ఇంకొకటి ఏమంటే అతను భార్యని ఒప్పించాడు. ఆమె అనుమతితోటే మా పెళ్ళి జరుగుతోంది. అతన్ని కాదనుకున్నా రేపు ఇంకొకడెవడో  వచ్చి ఏం వొరగబెడతాడూ?” మనసులోని మాట శీనుకి చెప్పింది వసుంధర. అప్పటితో ‘ఆపటం’తనకీ మంచిదని మౌనం వహించాడు శీను.

***

‘ఆరువళ్లూరు’ వీరరాఘవస్వామి గుళ్ళో గుట్టుగా  పెళ్లి జరిగింది. విషయం తెలిసిన వసుంధర తల్లి లబోదిబోమన్నది. శీనునీ, మేకప్‌మేన్ నరసింహుల్నీ నానాబూతులు తిట్టింది. పరిశ్రమలో పెద్దల దగ్గరకు వెళ్లి మొత్తుకుందిగానీ వాళ్ళేం చెయ్యగలరు?

నెలరోజులు ‘హనీమూన్’ ట్రిప్ కానిచ్చాక మళ్ళీ బిజీ అయింది వసుంధర. వసుంధర అదృష్టమేమోగానీ ‘మంచి’ సినిమాలు పడ్డాయి. అన్నీ ‘హీరోయిన్’ ఓరియంటెడ్ సినిమాలే. పెళ్ళయ్యాక గ్లామర్ డాల్ కాస్తా ‘అభినయ సరస్వతి’గా పేరు తెచ్చుకుంది. కుప్పతెప్పలుగా డబ్బు. నందకుమార్ ఎప్పుడూ ఏవరేజ్ హీరోనే. ఈ దెబ్బకి అతను వసుంధర పేరున మూడు బంగళాలూ, తన పేరున మూడు బంగళాలూ కొనడమేగాక చెన్నై చుట్టూపక్కల వందల ఎకరాలు స్థిరాస్థి కొనేశాడు. కాలక్రమేణా వసుంధరకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. మొత్తం కుటుంబం అంతా కలిసే వుండేవారు. నందకుమార్ భార్యా వసుంధర అడుగులకి మడుగులొత్తేది. వసుంధరా అంతే ప్రేమగా ఆవిడ్ని చూసేది. తను ఏ నగలసెట్టు కొనుక్కున్నా ఆవిడకీ కొనాల్సిందే. తన పిల్లలకి ఏది కొన్నా ఆవిడ పిల్లలకీ కొనాల్సిందే.

కాలగర్భంలో ఓ దశాబ్దం కలిసిపోయింది. కొత్త నీరు వచ్చింది. పాతనీరు కొట్టుకుపోయింది. ఇవ్వాళ వచ్చిన హీరోయిన్ రేపు టాపు. ఎల్లుండి ఫ్లాపు. కేరళ నించీ, ముంబై నించీ, డిల్లీ, గుజరాత్‌ల నించీ హీరోయిన్ల దిగుమతి పెరిగింది. ఆల్ హేపీ. సినిమా రంగానికి కావాల్సిన ‘పట్లు’ పూర్తిగా నేర్చుకుని ముంబై నించి వస్తున్నారు గనక హీరో ఖుష్… డైరెక్టర్ ఖుష్.. ప్రొడ్యూసర్, మేకప్‌మేన్, డిస్ట్రిబ్యూటర్ అందరూ ఖుష్. బయ్యర్లతో సహా. ‘కేరక్టర్’ వదులుకోవడమంటే షేక్‌హాండ్ ఇచ్చినంత తేలిక. ఉన్నంతలో ఇల్లు చక్కబెట్టుకో. కమర్షియల్స్ అయినా, అయిటం సాంగ్ అయినా ఏదైనా ఒకటే.. హార్డ్ కేష్.. అంతే!

చప్పట్లకీ, పచ్చనోటు రెపరెపలకీ అలవాటు పడ్డ హీరోయిన్లు రిటైరై ఇంట్లో కూర్చోలేరు. అలాగని తల్లి వేషాలు వెయ్యలేరు. కానీ వసుంధర అన్నింటికీ సిద్ధపడింది. కూతుళ్లు ‘వయసు’కి వచ్చారు. వాళ్లని కథానాయికలుగా చెయ్యాలంటే డబ్బు కావాలి. ఆ మాటే నందకుమార్‌తో అన్నది. నందకుమార్ తన స్వంత కూతురి పెళ్లి చేసేశాడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో. వసుంధర డబ్బుతో కొడుకుని (స్వంత కొడుకుని) హీరోగా పెట్టి సినిమా తీశాడు. అది బిగ్గెస్టు ఫ్లాపు. సినిమాకి చూపినవన్నీ దొంగలెక్కలే. మూడొంతులు వసుంధర ఆస్థిని నందకుమార్ ‘నొక్కేశాడు’, ఆ విషయం మొదట గ్రహించింది శ్రీను.

“అమ్మా .. జాగ్రత్తపడండి. సినిమాని ‘చుట్టేసారు’ ఖర్చులు మాత్రం చూపించారంట. మీ మధ్య గొడవలు పెడదమన్న ఉద్ధేశ్యంతో కాదు. మీ  ఉప్పు తిన్న విశ్వాసంతో చెబుతున్నా.!” చాలా కష్టం మీద వసుంధరని వొంటరిగా కలిసి చెప్పాడు శీను.

నందకుమార్ హయాంలోనే శీనుకు ఉద్వాసన పలికాడు. శీనుకి అప్పటికే మంచి పేరుంది గనక త్వరలోనే వేరో ఒక అప్‌కమింగ్ హీరోయిన్‌కి పర్సనల్ కాస్ట్యూమర్‌గా వెళ్ళిపోయాడు. బాగా సంపాదించాడు కూడా. ఒక విషయం నిజం. వసుంధర శీనుని సొంతమనిషిలానే చూసింది. శీను పెళ్లికి కూడా బోలేడంత డబ్బు ఖర్చు పెట్టింది. “నాకు తెలుసు శీను.. ఇప్పుడు ఏమీ చెయ్యలేను. ఆస్థి ఆయన చేతుల్లో ఉంది. కానీసం ‘మల్లిక’ అయినా హీరోయిన్‌గా నిలదొక్కుకుంటే…” నిట్టూర్చింది వసుంధర. అప్పుడు సమయం ఉదయం పది. అప్పటికే వసుంధర ‘తీర్థం’ సేవించి మత్తులో ఉంది.

మాట్లాడకుండా బయటికొచ్చాడు సీను. “అన్నా.. ఆ అరవ ముండాకొడుకు వసుంధరమ్మని తాగుడికి అలవాటు చేశాడు. తెల్లార్లూ మందే…!”శీనుతో గుసగుసగా అన్నది ముత్తులక్ష్మి. ముత్తులక్ష్మి మొదట్నించీ వసుంధరకి ‘టచప్ వుమన్’ వసుంధరతోటే వుంటుంది. నిట్టూర్చాడు శీను.

“అంతేకాదు శీనయ్యా.. హీరో అయ్యుండీ అమ్మాయిల్ని తెచ్చి వ్యాపారం చేయిస్తున్నాడు. నేనూ రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నాను.”చెప్పింది ముత్తులక్ష్మి. ఆ విషయం పరిశ్రమలో అందరికీ తెలుసిందే. ‘మాజీలు’ కొందరు  యీ వ్యాపారం మీదే జీవనం సాగిస్తుంటారు. అదే తప్పుగా అనిపించకపోవటమే విచిత్రం. కుటుంబంలో మగపిల్లలకి కూడా ఇదంతా మామూలుగా అనిపించడం మరో విచిత్రం. అక్కో, చెల్లెలో వ్యభిచారం నేరం మీద పట్టుబడ్డా ఆ మగధీరులు మాత్రం మామూలుగానే తిరగేస్తుంటారు. అక్కచెల్లెళ్ల మీదే బతికేస్తూ వుంటారు.

వసుంధరకీ, నందకుమార్‌కీ జరిగిన ‘డిస్కషన్స్’ చెప్పాలంటే ఓ పెద్ద నవల అవుతంది. ఎందుకంటే నందకుమార్ గోతికాడ నక్క. అతని మొదటి పెళ్ళాం ‘బాగా’ తెలివైంది. ‘కాదు’ అని బయటపడకుండా ‘అవును’ అని అన్నీ దక్కించుకుంది.

ఏ రేంజికంటే తరవాత్తరవాత వసుంధర ‘కూతుళ్ల’ మీద సంపాదించేంత. తన కూతురు, కొడుకూ మాత్రం సేఫ్. సవతి కూతుళ్లనీ బిజినెస్’లోకి దించి, సవతి కొడుకుని ‘వెధవ’ని చేసింది. తనకి పుట్టినవాళ్లనే ‘బిజినెస్’లోకి దించిన ఘనత ది గ్రేట్ కేరక్టర్ ఆర్టిస్ట్ నందకుమార్‌ది.

నేలమీదనించి ఓ కొండ శిఖరానికి ఓ ‘రాయి’ని చేర్చాలంటే చాలా కష్టం. అక్కడ్నించి ఆ రాయిని కిందకి తోసెయ్యాలంటే క్షణం పట్టదు.

వసుంధర పతనమూ అలాగే అయింది. సంస్కారం వున్న వసుంధర జరుగుతున్న దాన్ని చూస్తూ సహించలేకపోయింది. అలాగని పిల్లల్ని తండ్రికి దూరమూ చెయ్యలేకపోయింది. అందరూ చేసే పనే తనూ చేసింది. అన్నీ మర్చిపోవడానికి అది దగ్గరి మార్గం ‘తాగుడు’. ఆ తాగుడికి బానిసైంది. లేవగానే మందు.. ఇంకా ‘కిక్కు’ కోసం మందుతోపాటు గుట్కా. ముత్యాల్లాంటి పలువరస పుచ్చిపోయింది. వొళ్లు ఏభయేళ్ళకే బండగా తయారైంది. కూతుళ్లు సినిమాల్లో  రాణీంచలేకపోయారు. ఒకతి మాత్రం ఓ మళయాళం వాడిని దొంగతనంగా పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. రెండోది ఎప్పుడు ఎవరితో ఉంటుందో దానికే తెలీదు. కొడుక్కి చదువబ్బలా. తండ్రి కారుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. తాగి తాగి చివరకు చచ్చిపోయిన వసుంధర. మంచం మీదనించి కిందపడి చనిపోయిందని ఒకరంటే, గుండె ఆగి చచ్చిపోయిందని మరొకరు అన్నారు. ఏమైతేనేం మరో దుఃఖజీవికి ‘విముక్తి’ లభించింది. సర్వాంతర్యామి వున్నది అందుకేగా..

 

***

 

వసుంధర ‘పెద్ద కర్మ’ చాలా అట్టహాసంగా జరిగింది. నిలువెత్తు ఫ్లెక్సీలు, అన్ని పేపర్లలోనూ శ్రద్ధాంజలి. అన్ని చానల్సులోనూ ఆవిడ గురించిన వార్తలూ, కటింగ్సే. నందకుమార్ నటనకి జోహార్లు..  గ్లిజరిన్ లేకుండా టీవీ కెమెరాల ముందు ‘భార్యపోయిన దుఃఖాన్ని’ రక్తి కట్టించాడు. చూస్తున్న ప్రేక్షకులు అతని ప్రేమకి చలించిపోయారు. నందకుమార్ భార్య ఇంకా అద్భుతమైన నటనని ప్రదర్శించింది. ‘వసుంధర నాకు దేముడిచ్చిన చెల్లి, నా ప్రాణంలో ప్రాణం” అంటూ వలవలా ఏడ్చింది. వసుంధర కూతుళ్లూ, కొడుకు మాత్రం నిర్వికారంగా నిలబడ్డారు.

“నేను బ్రతికుండీ ఆమెకి ఏమీ చెయ్యలేకపోయాను గురువుగారూ.. చెయ్యగలిగిందింతే!” కళ్లనీళ్లతో అన్నాడు శీను. డాబా హోటల్లో ఓ చిన్న సంతాప సభ జరిగింది. మేం మొత్తం పదిమందిమి. ఏర్పాటు చేసింది కాస్ట్యూమర్ శీను. (DATA UDIPI HOTEL). ఓ రెండు నిమిషాలు మౌనం పాటించాం. (దానివల్ల ఎవరికి ఉపయోగం? అడక్కంది. అదో వెర్రి సంప్రదాయం).

“వసుంధర పిల్లల పరిస్థితి ఏమిటి?” ఇదో మిలియన్ డాలర్ ప్రశ్న. స్వంత తండ్రి వున్నాడు. కానీ ఆ తండ్రే కూతుళ్లని (అంటే వసుంధర కూతుళ్లని మాత్రమే) బిజినెస్‌లోకి దించి ‘కొడుకు’ని డ్రైవరుగా వాడుకుంటున్నాడు. ఆయన అసలు కొడుకూ, కూతురూ చాలా చాలా గొప్ప స్థితిలో వున్నాడు. మరి వీళ్లు పిల్లలు కారా? ఇంత పక్షపాతం ఎందుకూ? అదీ వసుంధర సర్వస్వాన్నీ కొల్లగొట్టాక కూడా”

జావాబు దొరకని ప్రశ్నల్లో ఇదొకటి. వసుంధరని తల్చుకుంటే నాకో పాట గుర్తొస్తుంది.. “తేరి దునియాసే దూర్ చలేఁ హోకె మజ్‌బూర్ హమే యాద్ రఖ్‌నా…” అన్నది

జ్ఞాపకాలు తప్ప వసుంధర గురించి ఇంకేం మిగిలాయి..

 

భువనచంద్ర..

 

 

చిక్కని జీవితానుభవాల్లోంచి పుట్టిన ” న్యూయార్కు కథలు”

పారుపల్లి శ్రీధర్

పారుపల్లి శ్రీధర్

 

పశ్చిమ తీరంలో మనకు తెలిసిందనుకున్న ప్రపంచంలో తెలియని లోకాలను చూపించే యత్నం కూనపరాజు కుమార్ కథా సంపుటం ‘న్యూయార్కు కథలు’.   పన్నెండు కథలతో గుదిగుచ్చిన ముత్యాలహారమిది. అమెరికా కలల సౌధాలను కూల్చిన టెర్రరిస్టుల ఘాతుకానికి  ఎందరో బలయ్యారు. సెప్టెంబర్  తొమ్మిది  కి నివాళే మొదటి కథ ఊదారంగు తులిప్ పూలు.

లవ్ కెమిస్ర్టీ తోటే రంగుల కెమిస్ర్టీని ఆవిష్కరించారు రచయిత. బూడిదైన బతుకుల్లో ఒక పాత్ర జూలీ. ఆమె విషాదాంత గాధను ఒక ప్రత్యేక టెక్నిక్ తో చెప్పటం ఈ కథలోకొసమెరుపు. చంద్రమండలానికి వెళ్లినా మనవాళ్ల ప్రవర్తన మారదంటూ సునిశిత హాస్యంతో జాలువారిన కథనం గెస్ట్ హౌస్. ఉన్నత శిఖరాలను చేరటానికి రెక్కలు కట్టుకుని డాలర్ల దేశంలో వాలిన ఆశాజీవులు పడే పాట్లను, గెస్టు హౌస్ లో వీరి జీవన శైలిని చక్కగా చెప్పారు కుమార్. బ్రాడ్ వే నాటకాలను చూసి  భీమేశ్వర తీర్ధంలో నాటకాల నాటి నాస్టాలజియాలోకి వెళ్లిపోయారు రచయిత. వియత్నాం యుద్ధం రేపిన కలకలం నుంచి బయటపడిన మిత్రులు కొందరు ఎలా తమ జీవితాలను పునరుద్ధరించుకున్నారో వివిరించే మూవ్ ఇన్ నాటకాన్ని పరిచయం చేశారు.కళ కళకోసం కాదని, సామాజిక ప్రయోజనం కోసమేనని జాన్ పాత్ర ద్వారా చెప్పారు. జీవన వైవిధ్యాన్ని వివరించిన తీరు బాగుంది. పరిశోధనలంటే ప్రాణమిస్తూ, కొత్త కొత్త ఆవిష్కారాల కోసం తపించే అమ్మాయి  దీప. టచ్ మి నాట్ మొక్కతో ఆమె కనుగొన్న అద్భుతం వైజ్ఞానిక లోకాన్ని ఆకట్టుకుంది.  ప్రకృతిలోనే మనిషికి కావలసినవి అన్నీ ఉన్నాయన్న సందేశంతో రిసెర్చ్ చేసి, తనఆవిష్కారాలతో  ప్రతిష్ఠాత్మక ఇంటెల్ ప్రైజ్ సాధించింది దీప. రాబోయే కాలంలో కాబోయే యువ సైంటిస్టులకు ఎంతో స్ఫూర్త్తినిచ్చే కథ మిమోసా పుదీకా.

 

న్యూయార్క్ కథల్లో కదిలించే కథ..మంచు కురిసిన ఆదివారం.  ఘనీభవించిన హృదయాలను కరిగించే హృద్య గాధతో కుమార్ అద్భుతంగా రాసిన కథాకథనమిది. ఓ కవి మిత్రుడన్నట్లు.. కంటికి తడి అంటకుండా జీవితాన్ని దాటిందెవరు? ఘనీభవించిన మంచు వెనుక ద్రవీభవించిన ఒకానొక అరవిందు అంతరంగ ఆవిష్కరణ ఇది. ఆ మధ్య ఓ సినామాలో మన్ హాటన్ పై ఓ పాట వినే వుంటారు. నిజానికి ఆ పాటలో మన్ హాటన్ ఆత్మ కనపడదు. మన్ హాటన్ లో మానవతాపరిమళాలను, సేవా సదనాల్లో ప్రేమానురాగాల్లోబందీలైన కొందరి గాధలు ఈ కథలో కదిలించే శైలిలో రాశారు రచయిత కుమార్ కూనపరాజు. బౌరి స్ర్టీట్ లో ప్రవహించిన ఎన్నారై మిత్రుల ప్రేమను కొలవటానికి ఏ పదాలు సరిపోతాయి? గోడవారగా చేగగిలబడి పిచ్చి చూపులు చూస్తున్న అతడిని చూశాక అరవింద్ హృదయ స్పందన తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి. పేజీలన్నీ తిరగేశాక కళ్లు చెమర్చని వారెవరైనా వుంటే దయచేసి వారి అడ్రస్ చెప్పండి. పరిశోధన సాగిద్దాం కరకు హృదయాల మీద.

కొంచెం ఛీజ్ వేస్తావా అని అడిగిన ఆ వ్యక్తి చరిత్ర ఏమిటి? ఈ  ఆశ్రమాల ఆశ్రయించిన (చేరిన) నేపథ్యమేమిటో చదివి తీరాలి. మానసిక చురుకుదనంతో మతి కోల్పోయిన  నల్లజాతి  పాటల రచయిత మైకేల్ రాబర్ట్ అండర్సన్ ను వీరి సేవలు ఎంతగా కదిలించాయో చెప్పటానికి మాటలక్కరలేదు. అరవిందుకు ఆస్తిని రాసేయటం, మైకేల్ చివరి చూపుదక్కకపోవటం,ఇటువంటి మరికొందరు అభాగ్యులను ఆదుకోవటానికి అరవిందు దంపతులు ముందుకు రావటాన్ని హృద్యంగా చిత్రించారు రచయిత. ఎంత సేపటికీ మనీ కల్చర్ లో, మన ప్రపంచంలో బతికే మనం ఇటువంటి లోకాలను చూసి జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలి. పరమార్ధం గ్రహించాలి. ఎవరికి ఎవరు? చివరికి ఎవరు? ప్రేమించే హృదయమే వుండాలి.  ఆ హృదయ స్పందనకు సరిహద్దులతో పనేముంది అంటే మైకేల్ తనవీలునామా లేఖలో రాయటం గొప్ప సందేశం.

NY Book Title 3 copy copy

గడ్డ కట్టిన మంచులో ఎర్ర పిచుకలు ఏమైపోయాయోఅంటూ అరవింద్ స్పందించటం అతడి సున్నితత్వాన్ని, స్వభావానికి నిదర్శనం. మన్ హాటన్ కాంక్రీట్ జంగిల్ సొరచేప కింది దవడలా వుందంటూ రచయిత చెప్పటం ఆయనలో అంతర్లీనంగా అలజడి చేసే వామపక్ష వాదిని మనముందుంచుతాయి. డాలర్ల దేశంలో రెక్కలు కట్టుకుని వాలిన ఆశాజీవుల కష్టాలను ఆవిష్కరించే యత్నం వెంకోజీ ..కథ. ఉద్యోగం కోసం వెంకోజీ పడిన పాట్లు.. చివరికి  ఎలాగో స్థిరపడి ఇంటికి డబ్బు పంపిస్తే..  ఏం మిగిలింది? వెంకోజీ ట్రాజెడీని న్యూయార్క్ బ్యాటరీ పార్క్ లో శిల్పంతో పోల్చటం బాగుంది. మాన్యుమెంట్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ తో సాపత్యం చక్కగా వుంది. న్యూయార్క్ కథల సంపుటిలో గుర్తుండిపోయే మరో కథ లిటిల్ బుద్ధాస్. బుద్ధుడి జీవిత క్రమం, జ్ఞానోపదేశాల ఆధారంగా బాలవికాస్ పిల్లలు వేసిన బుద్ధా నాటకం…వారి జీవితాలనెలా మార్చిందన్నది ఈ కథ సారాంశం. నాటకంలో ఒక పాత్ర ధరించిన దీక్షిత, శిష్యుడి రోల్ లో కన్పించిన రాబర్ట్ లు బుద్ధుని బోధనలతో ఎలా మారిపోయారు?  నాటకాన్ని డైరెక్ట్ చేసిన సుధీర్ మనోభావాలేమిటి? తదితర అంశాలను  ఆకట్టుకునే శైలిలో చెప్పారు రచయిత కుమార్.

మసక లాడుకుంటున్నాయి లాంటి పదాలు కొన్ని మనం మరచిపోతున్న తెలుగును గుర్తు చేస్తాయి. స్వేచ్ఛా, సౌభాతృత్వాల ప్రతీక..స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. స్టాచ్యూ కథ వాల్డ్ ట్రేడ్ సెంటర్.. జంట శిఖరాలను కూల్చకముందు మనసులో వుంచుకుని తర్వాత రాసినది. స్టీమర్ లో స్టాచ్యూ ఉన్న ఐలెండ్ కు వెళుతుంటే మన్హాటన్ అందాలను అభివర్ణించారు. మన్హాటన్  నీళ్లలోంచి వచ్చిన కాంక్రీట్ జంగిల్లా ఉంది. ఆ భవనాల మధ్యలో ఉన్న ఎత్తయిన ట్విన్ టవర్స్ గుమ్మం ముందు నిలబడ్డ నవదంపతుల్లా ఉన్నాయంటూ వర్ణించారు రచయిత.

న్యూయార్క్ కథల సంపుటిలో మరో విశిష్ట కథ గురు పౌర్ణమి.  గురువు జీవన విషాదానికి చలించిన ఓ శిష్యుడి అంతరంగ ఆవిష్కరణం, మోదం, ఖేదం, సందేశాల సమాహారం కథనం. మేక్ బెత్ నాటకాన్ని విశ్లేషించిన గురువు గారు ఇంత చిన్న పల్లెటూరులో ఎందుకు ఉండిపోయారో తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం. ప్రపంచాన్ని బాగుచేసే గురువులు తమ జీవితాన్ని బాగుచేసుకోలేరు. ఊరంతా ప్రేమించి,అంతటి శిష్యగణం ఉన్నా.. మాస్టారు చనిపోయినప్పుడు అంతిమ సంస్కారాలు సరిగ్గా జరగలేదు. అనుబంధం,ఆత్మీయత అంతా ఒక బూటకమన్న సినీ కవి వాక్కులు గుర్తుకొస్తాయి. ఆషాఢభూతుల్లాంటి శిష్యులు కొందరి నైజం లోకం పోకడకు దర్పణం పడుతోంది. సున్నిత మనస్కుడైన కథానాయకుడు..మనిషి అమెరికాలో ఉన్నా..మనసంతా తను పుట్టి పెరిగిన ఊరిమీదనే ఉంటుంది. మాస్టారి కూతురి ఉత్తరంతో కదిలిపోయి..ఇండియా వచ్చి వారి కుటుంబ దురవస్థకు చలించి పోతాడు. బుద్ధుడి బోధనలనే మాస్టారు ఆదర్శంగా తీసుకున్నారేమో అన్పిస్తుంది.  బుద్ధ భగవానుడి పుట్టిన రోజు, నిర్యాణం చెందిన రోజూ పౌర్ణమే. గురువు గారు ప్రైవేటు పాఠశాలలో శిష్యులకు వీడ్కోలు సందేశం లో బుద్ధుని బోధనలను గుర్తుచేయటం ఆయన ఔన్నత్యానికి నిదర్శనం. కథకు గురుపౌర్ణమి అని పేరుపెట్టడం సందర్భోచితంగా ఉంది. పూర్వం పల్లెల్లో  ప్రైవేటు బడులు, బడి ఎగ్గొట్టే పిల్లలను మాస్టారు పంపించిన భటులు (క్లాసులీడర్లు) వచ్చి తీసుకెళ్లటం..లాంటి స్మృతుల్ను రచయిత సునిశిత హాస్యంతో రాశారు. చంద్ర మండలం వెళ్లినా మన వాళ్లకు హూందాగా ప్రవర్తించరేమో! కథా సంపుటిలోని మనమింతేనా..అనే కథ ఇదే అర్ధంలో సాగిన సెటైర్. మువ్వల సవ్వడి వినిపిస్తోంది రచయిత కళాభిరుచికి నిదర్శనం.

చిక్కని జీవితానుభవాల్లోంచి పుట్టిన కథలు. ఒక మధ్యతరగతి మానవుడు అమెరికా వెళ్లి గుండెల నిండా నింపుకొన్న అనుభూతులను, అద్దుకున్న పరిమళాలను హృద్యంగా ఆవిష్కరించారు రచయిత కుమార్. తొలి ప్ర యత్నంలోనే ఇంత మంచి కథా సంపుటి వెలువరించటం అభినందనీయం. ఎక్కడా భాషా భేషజాలు లేకుండా..అందరికీ అర్ధమయ్యే సరళ శైలిలో రాశారు.

-పారుపల్లి శ్రీధర్

శివలీల

drushya drushyam-7...

చాలా సామాన్యమైనవే. మామూలు ముఖాలే. ఎక్కడ పడితే అక్కడ కానవచ్చే మనుషులే అయి ఉండవచ్చు.

రాలిపడ్డ ఆకులు, చితికిన టమాట పండు, తెగిపోయిన చెప్పు, వాకిట్లో కురిసిన పారిజాతాలు, చెట్ల కొమ్మల్లో చిక్కిన గాలిపటం, ఈల వేస్తున్న యువకుడు, చింగులు సర్దుకుంటున్న మగువ, చుట్టను చప్పరిస్తున్న ముదుసలి, బీడీలు చుడుతున్న నాయినమ్మ, ఈదురుగాలికి చెల్లాచెదురైన గుడిసెలు, ఏం కానున్నదో తెలియక నవ్వుతున్న పిల్లలూ…

ఇవన్నీ మామూలు విషయాలే కావచ్చును. కానీ, ఒక కుతూహలంతో చూడటం, ఒక అవ్యాజమైన అనురాగంతో చేయి చాచడం, అభిమానంతో ఆలింగనం చేసుకోవడం, ఒక అనురాగ చేష్ట, ఛాయా చిత్రలేఖనం. కానీ, నమ్ముతారో లేదో, ఒక్కోసారి అసంకల్పితం ఈ లేఖనం. ఒక్కోసారీ కాదు, అనేకసార్లూ మన అలక్ష్యమే లక్షణం. అపుడే దృశ్యం మనల్నిఆకట్టుకుంటుంది. ఇక ఆ లేఖనం మహత్త్తు అపూర్వం. అందులోనిదే ఈ తట్టా పారా…ఒక లిప్త.

+++

భాగ్యనగరంలో పార్సీగుట్ట నుంచి ముషీరాబాద్ చౌరస్తాకు వెళ్లే దారిలో, చౌరస్తాకు చేరుకోక మునుపే కుడివైపు, ఈ చిత్రం జీవం పోసుకుని కానవస్తుంది. అది ఇసుక అమ్మే స్థలం. ‘తట్టకు ఇంత’ అని అమ్ముతూ ఉంటారు. ఇండ్లళ్లో చిన్న చిన్న రిపేర్లు చేసుకోదలచిన వాళ్లు, లేదంటే వీథి మేస్త్రీలు ఆ ఇసుకను ఖరీదు చేసుకుని వెళుతుంటారు. అందుకు సౌకర్యం కల్పించే ఒక వీథి అమ్మకం స్థలం ఇది.

ఇక్కడ ఎప్పుడూ ఒక ఇద్దరు కూర్చుని ఉంటారు. ఒక మహిళ, ఒక పురుషుడు. వాళ్లు ఎప్పుడు అమ్ముతారో తెలీదుగానీ ఆ ప్లాస్టిక్ కుర్చీలో కూచుని ఏవో ముచ్చటించుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అక్కడికి రాగానే, ఈ చిత్రం తీసిన స్థలానికి చేరుకోగానే, హాయిగా నవ్వుకునే ఆ జంట కూడా ఒక ముచ్చటైన చిత్రం. వారిద్దరినీ ఒక ఎండపొడ వాలున, ఒకే గొడుగు నీడన ముచ్చటిస్తూ ఉండగా మరో నాడు తీసిన చిత్రమూ ఒకటుంది నా వద్ద!  అయితే, వారిరువురి జీవన వ్యాపారంలోని అతి కీలకమైన విషయమూ, ఒకానొక decisive moment, దాని స్థల మహత్యమూ, అందలి పురాణ కాలక్షేపమే ఈ చిత్రం.

+++

చిత్రమేమిటంటే, ఇక్కడే నా భవిష్యత్తు కళా ప్రదర్శన తాలూకు ముఖచిత్రం నమోదైంది, మూడేళ్ల క్రితం.

అంటే గతంలోనే నా భవిష్యత్తు నమోదై, అది సరిగ్గా ఆ నిర్ణయాత్మక క్షణంలో వర్తమానమూ అయి మళ్లీ ఇప్పుడు గతమూ అయి, ఎప్పటికీ చెదరని ఛాయా చరిత్రా అయింది. ఇదంతా తెలియకుండానే…అదొక విచిత్రం.
అయితే, ఛాయాచిత్రలేఖనం అన్న ప్రక్రియలో చిత్రకారుడు లేదా రచయితా ప్రేక్షకుడే అవడం మరో చిత్రం!

+++

మళ్లీ మూడేళ్ల క్రితానికి వస్తే, ఆ రోజు సన్నగా వర్షం కురుస్తూ ఉన్నది.
కొంచెం తెరపి ఇచ్చాక బయలుదేరాను. ఇక్కడకు చేరుకున్నానో లేదో అకస్మాత్తుగా నా దృష్టి పామరశాస్త్రంపై…ఈ తట్టా పారలపై పడింది. ఒక “కనికట్టు’ అనే అనిపిస్తుంది.  విస్మయమే! ఎందుకు ఏ దృశ్యం మనల్ని లోబర్చుకుంటుందో ఏమో తెలీని స్థితి! నేను ఆగిపోయాను. ఆ దృశ్యంలోకి చూశాను. చూడగా వర్షం వెలిసినాక ఆ తడి తడి ఇసుక, పైనా…కిందా… కొంచెం గాఢ గోధుమ వర్ణంలో ఆ ఇసుక …రేణువులూ…అవన్నీ ఎంత సౌందర్యాత్మకం అంటే ‘పిండారబోసిన వెన్నెల’ అన్న సమాసం కూడా బహుశా తక్కువే. లేదా ‘ఇష్టమైన పిండి పదార్థం నైవేద్యం’గా పెట్టడం అన్నా వృథాయే!
ఆ దృశ్య సమాసం నన్ను సుతారంగా లోబర్చుకున్నది.

బండి ఆపేశాను. దిగలేదు. భూమిపై కాళ్లు ఆనించుతూ ఉన్నానో లేదో…ఒడుపుగా నేను కెమెరాకోసం చేయి చాచానో లేదో…కెమెరా అన్నది బ్యాగులోంచి ఎప్పుడు ఎలా బయటకు వచ్చిందో, అది నా కెమెరా కంటికి ఎప్పుడు ఆనిందో, వ్యూ ఫైండర్ నుంచి ఎప్పుడు చూశానో ఏమీ తెలియదు. ‘క్లిక్’ మన్న సవ్వడీ లేదు. కానీ, ఒకే ఒక షాట్ ఎక్స్ పోజ్ చేశాను.
ఆ తర్వాత చూశాను, కెమెరా స్కీన్లో…అప్పుడు కనిపించాయి. నిగనినగలాడుతున్న పనిముట్లు..వాటి బలిమి… ఇసుకలో దాచుకున్న వాటి లావణ్యం,…అంతకు మించి ఒక పారపై అమర్చినట్టున్న తట్ట. దానిపైన ఎరుపు పూవు….అంతా అలౌకికం…

పైనా కిందా కన్ను తడుముతూ ఉంటే, చెట్టుపై నుంచి వర్షంతో జాలువారిన లేత ఆకుపచ్చ ఆకులూ, ఎర్రెర్రెని పువ్వులు రెమ్మలు అంతా దళాలూ…రేణువులూ…

+++

అన్నీ ఆశ్చర్య పర్చినవే.
they are in the world but not worldly…అనిపిస్తుంటే …
ఒక physical… metaphysical…అంతా ఒక సంయోగం…లీనం…ధ్యానం…
పువ్వులూ రెమ్మలూ పనిముట్లూ…తడితడి పూజా ద్రవ్యమూ…అంతా ఒక గర్భగుడిలోని దివ్య మంత్ర పుష్ఫ సంచయం.ఆ దృశ్యంలో అవన్నీ కెమెరా స్ర్కీన్ పై ఎంత భావ గర్భితంగా లాస్యమాడుతున్నాయి అంటే తెలియక రాసిన కవితలా ఏదో ఒక కవితాన్యాయం…”అబ్బ! దర్శనం’ అనుకున్నాను. మానవుడి అవిశ్రాంత యానంలో ఒక శాంతి ఉంటుందే అదే ఇది అని తృప్తిల్లాను. ఒకానొక రుతువులో ప్రకృతి శోభ ఉంటుందే అదే ఇదేమో అని కూడా అనిపించింది.
ధ్యానం చేయడానికి యోగ్యం లేని పామరులుంటారే, వారికి ఇదే శివాలయం…గర్భగుడి…లింగధారణా అనిపించింది.
ఆ చిత్రానికి లోబడి ఇక మళ్లీ మరొక చిత్రం ప్రయత్నించలేదు. దొరికింది చాలనుకుని మళ్లీ నా లౌకిక జీవనంలోకి పయణమయ్యాను.+++ఈ చిత్రాన్ని తర్వాత చక్కటి ప్రింటు తీసుకున్నాను. ఎంతదనుకున్నారు! పే…ద్దది. ముప్పయ్ ఇంటూ నలభై అంగుళాల చిత్రం అచ్చువేయించాను. దానికి మరింత అందం పెరిగేలా చుట్టూ జాగా వదిలి మరింత మంచిగా ఫ్రేం చేయించాను. నా తొలి చిత్ర కళా ప్రదర్శనలో మకుటామయమైన చిత్రంగా దీనిని ప్రదర్శించాను. అంతేకాదు, నా బ్రోచర్ పైనా ముఖచిత్రంగా దీనినే అచ్చు వేయించాను. ‘ఎందుకో తెలుసా’ అని అడిగితే చెప్పలేను.
+++

చాలా మంది అడిగారు కూడా, ‘ఇదేమిటీ?’ అని.
నవ్వి ఊరుకున్నాను.
ఇంకా చాలామంది అడగలేదు కూడా, ‘ఏమిటేమిటీ’ అని!
అందుకూ చాలా సంతోషించాను.
అయితే, ఇదొక్కటే కాదు, ప్రదర్శించే ప్రతి చిత్రానికీ ఒక ప్రాధాన్యం ఉంటుంది. అప్రయత్నమూ ఉంటుంది.
బహుశా దీనికి కారణం ఆ చిత్రం ‘మనం తీయనిది’ అయి వుండటం!
ఆ రచన మనం వాంచితంగా “చేయనిది’ అవడం!

 

+++

 

నిజమే మరి.
చిత్రాలు రెండు రకాలు. ఒకటి, మనం తీసుకునేవి. రెండు, మన చేత తీయించుకునేవి.
నా చిత్ర కళా ప్రదర్శనలో నేను ఎంచుకున్న రచనా పద్ధతి కూడా ఇదే. నేను తీయని చిత్రాల ప్రదర్శనే అది!
అందులో ఎన్నో…

ఒక రాలి పడిన ఆకు. బెలూను ఊదుతున్న మనిషి. అఖండదీపం ముందు ఒక భక్తురాలు.
ఇంకా…ముందు చెప్పిన చిత్రాలెన్నొ. అందులో ఈ దేవాలయం కూడా ఒక అప్రయత్నం.

 

+++

 

చిత్రమేమిటీ అంటే, దీన్ని ఎందరో దర్శించుకున్నారు…
ఒకరికి తెలిసి, మరొకరికి తెలియక. తెలిసీ తెలియక, సేమ్, నాలాగే ~ ఒకానొక కనికట్టుకు లోబడి.

అంతిమంగా అంతా ఒక ప్రేక్షకపాత్ర. మానవుడి నిమిత్తం లేని నిర్ణయానిదే తొలిపాత్ర.
తట్టా పారలకు వందనం అభివందనం.

~కందుకూరి రమేష్ బాబు

పెళ్లి ఒకరితో…ప్రేమ ఒకరిపై…

శర్మిష్టను కోరి దేవయానికి తాళి

 

నన్ను వివాహమై నహుషనందన! యీ లలితాంగి దొట్టి యీ

కన్నియలందరున్ దివిజకన్యలతో నెన యైనవారు నీ

కున్నతి బ్రీతి సేయగ నృపోత్తమ! వాసవు బోలి లీలతో

ని న్నరలోకభోగము లనేకము లందుము నీవు, నావుడున్

                                                       -నన్నయ

(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)

నహుషుని కుమారుడవైన ఓ యయాతీ! నన్ను వివాహం చేసుకుని, దేవకన్యలకు సాటివచ్చే ఈ సుందరి(శర్మిష్ట)తోపాటు ఈ కన్యలందరూ నీకు ఘనతను, ప్రీతిని కలిగిస్తుండగా నరలోకంలో అనేక భోగాలు అనుభవించు…

   ***

  దేవయాని పరంగా చెప్పిన కథలా కనిపిస్తున్నా నిజానికిది శర్మిష్ట కథ అన్నాను. ఈ కోణం నుంచి ఈ కథను  ఇంతకుముందు ఎవరైనా పరిశీలించారో లేదో నాకు తెలియదు. సంప్రదాయం అలాంటి పరిశీలనలకు సాధారణంగా అవకాశం ఇవ్వదు. అది పురాణ, ఇతిహాసాల చుట్టూ ఒక బలమైన ఊహా చట్రాన్ని నిర్మించి దానికి కాపలా కాస్తూ ఉంటుంది. తను అనుమతించిన మేరకే స్వతంత్ర పరిశీలనకు స్వేచ్ఛ నిస్తుంది. సంప్రదాయం నిర్మించే చట్రం ఎంత, బలంగా ఉంటుందంటే, ఆ చట్రం లోపలే ఆలోచించడం ఒక అసంకల్పిత చర్యగా మారిపోతుంది.  అనేక సందేహాలు, అసంబద్ధాలు ఆ చట్రం కింద అణిగిపోతాయి.  వాటిపై మౌనం ఒక ఉక్కు తెర వేలాడుతూ ఉంటుంది. మహాభారతం లోంచే ఇందుకు అనేక ఉదాహరణలు ఇవ్వచ్చు. యయాతి-దేవయాని-శర్మిష్టల కథే ఒక గొప్ప ఉదాహరణ.  

అదే సమయంలో ప్రతికాలంలోనూ, ప్రతి తరమూ తన జ్ఞానవారసత్వాన్ని నూతన విజ్ఞానం వెలుగులో సరికొత్తగా దర్శిస్తూనే ఉంటుంది.  మానవ అనుభవానికీ, జ్ఞానానికీ నిత్య నవీనత్వాన్ని, తాజాదనాన్ని సంతరిస్తూనే ఉంటుంది.  దీనిని నేను అదనపు విలువను జోడించడం అంటాను. ఇలా అదనపు విలువను జోడించడం కూడా వాటి అస్తిత్వాన్ని పొడిగించే కారణాలలో ఒకటని నేను భావిస్తాను.  అలాగని సంప్రదాయపాఠాన్ని తక్కువ చేయకూడదు. శతాబ్దాలుగా సంప్రదాయ పఠన పాఠనాలు పురాణ, ఇతిహాసాలను కాపాడుకుంటూ వస్తున్నాయి కనుకే, వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకోగలుగుతున్నాం. అందుకు సంప్రదాయ కవి పండితులకు, పౌరాణికులకు కృతజ్ఞతా వందనాలు అర్పించుకోవలసిందే!

ఇక్కడే ఇంకొక వివరణ కూడా ఇచ్చుకోవాలి. అదనపు విలువ జోడించే ప్రయత్నంలో ప్రతిసారీ ప్రమాణాలూ, ఆధారాలూ, కచ్చితమైన అన్వయాలూ ఇవ్వలేకపోవచ్చు. గ్రంథస్థ విషయాలనుంచి పక్కకు జరగచ్చు. ఊహల మీద ఆధారపడవలసి రావచ్చు. పురాణ, ఇతిహాసాలలో వాస్తవాలను పట్టుకోవడం సాధారణంగా గడ్డిమేటలో సూదిని వెతకడంలా పరిణమిస్తుంది. అయినాసరే, ఊహకు ఉండే విలువ ఊహకూ ఉంటుంది. వాస్తవాల అన్వేషణలో  ఒక్కోసారి ఊహ తొలి అడుగు కావచ్చు.

ప్రస్తుతానికి వస్తే…

ఇప్పుడు దేవయాని యజమానురాలు, శర్మిష్ట దాసి!

ఈసారి దేవయాని తన కొత్త హోదాలో శర్మిష్టను, ఇతర దాసీకన్యలను వెంటబెట్టుకుని వనవిహారానికి వెళ్లింది.

మళ్ళీ యయాతి వచ్చాడు. వేటాడి అలసిపోయాడు. అంతలో గాలి అనే దూత రకరకాల సువాసనలు నిండిన ఆడగాలిని అతని దగ్గరకు మోసుకొచ్చింది. యయాతి వారిని సమీపించాడు. మొదట తమ చంచలమైన చూపులనే పద్మదళాలను అతనిపై చల్లిన ఆ యువతులు ఆ తర్వాత పూలమాలలతో సత్కరించారు.

దేవయాని అతనికి ముందే తెలుసు. ఆమె పక్కనే ఉన్న ’అతిశయ రూప లావణ్య సుందరిఅయిన శర్మిష్టపై  ప్రత్యేకంగా అతని చూపులు వాలాయి. ఆమె ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. ‘నువ్వెవరి దానివి, నీ కులగోత్రాలేమిటి?’ అని అడిగాడు. అతని చూపుల్లో శర్మిష్టపై వ్యక్తమైన ఇష్టాన్ని దేవయాని వెంటనే పసిగట్టింది. శర్మిష్టకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండా తను జోక్యం చేసుకుని, ‘ఈమె నాకు దాసి, వృషపర్వుడనే గొప్ప రాక్షసరాజు కూతురు, ఎప్పుడూ నాతోనే ఉంటుంది, దీనిని శర్మిష్ట అంటారు’ అంది.

ఆ వెంటనే, ‘నన్ను నూతిలోంచి  పైకి తీసినప్పుడే ఆ సూర్యుని సాక్షిగా నీ కుడి చేతితో నా చేయిపట్టుకున్నావు. అది నన్ను పెళ్లాడడమే. ఆ సంగతి విస్మరించడం నీకు న్యాయం కాదు’ అని హెచ్చరించింది. ఆపైన, ‘నహుషుని కొడుకువైన  యయాతీ, నన్ను పెళ్లి చేసుకుని ఈ సుందరాంగితోపాటు, దేవకన్యలకు సాటి వచ్చే ఈ కన్యలందరూ నీకు ఘనతను, ప్రీతిని కలిగిస్తుండగా దేవేంద్రుడిలా ఈ నరలోకంలో అన్ని భోగాలూ అనుభవించు’ అంది. దేవేంద్ర భోగాలు అనుభవించమనడంలో తెలివిగా ‘ఓ నహుషనందనా’ అని సంబోధించింది. నహుషుడు కొంతకాలం ఇంద్రపదవిలో ఉన్నాడు.

01Kach

దేవయాని ప్రతిపాదనకు యయాతి అభ్యంతరం చెప్పాడు. క్షత్రియకన్యలను బ్రాహ్మణులు వివాహం చేసుకోవచ్చు కానీ, బ్రాహ్మణకన్యలను క్షత్రియులు వివాహం చేసుకోవడం ఎక్కడైనా ఉందా, వర్ణాశ్రమధర్మాలను కాపాడవలసిన రాజునైన నేనే ధర్మం తప్పితే ప్రపంచం నడక అస్తవ్యస్తమైపోదా అన్నాడు. అప్పుడు దేవయాని, ‘గొప్ప బాహుబలం కలవాడా’ అని అతన్ని సంబోధించి, ‘ధర్మాధర్మాలు నిర్ణయించే లోకపూజ్యుడైన శుక్రుడు ఆదేశిస్తే నన్ను పెళ్లిచేసుకుంటావా?’ అని అడిగింది. ‘బాహుబలం కలవాడా’ అనడంలో, రాజ్యపాలనే నీ బాధ్యత తప్ప ధర్మాధర్మనిర్ణయం కాదు, అది శుక్రుడు చేయవలసిన పని అనే మెత్తని చురక ఉంది. అంతేకాదు, తండ్రిని తను ఒప్పించగలనన్న ధీమా కూడా ఆ మాటల్లో ఉంది.

ఆ మహాముని ధర్మవిరుద్ధం కాదంటే నిన్ను వివాహమాడతానంటూ యయాతి ఆ సంభాషణకు అంతటితో తెర దించాడు. దానిని పొడిగించడం వల్ల అతనికి నష్టమే తప్ప లాభం లేదు. ఎందుకంటే, అప్పటికే అతను శర్మిష్టవైపు ఆకర్షితుడయ్యాడు. దేవయాని ఆమెను తన దాసిగా పరిచయం చేసింది కనుక, ఆమెను నేరుగా తను పొందగల అవకాశం లేదు. దేవయానిని తను పెళ్లిచేసుకుంటేనే శర్మిష్ట తన దవుతుంది. బహుశా నేరుగా ఆమెను తను స్వీకరించడానికి సామాజిక స్థాయికీ, హోదాకూ చెందిన అభ్యంతరాలు కూడా ఉండి ఉండచ్చు. దేవయాని మాట నేర్పు, స్వభావం అప్పటికే అతనికి అర్థమయ్యాయి. ఆమె తనతో పెళ్ళికి తండ్రిని ఒప్పించగలదన్న నమ్మకమూ అతనికి కలిగి ఉంటుంది. దేవయానితో పెళ్ళికి అంగీకరిస్తేనే శర్మిష్ట  తనకు దక్కుతుంది కనుక దేవయానితో తన పెళ్లి ధర్మమా, కాదా అన్న చర్చ తనకు అనవసరం. అది తేల్చే బాధ్యత దేవయాని తీసుకుంది.

జాగ్రత్తగా గమనించండి…యయాతి దేవయాని పట్ల ఆకర్షితుడు కాలేదు. ఇంతకుముందు ఆమెను నూతి లోంచి పైకి తీసిన తర్వాత అతను తన దారిన తను వెళ్లిపోయాడని చెప్పడం ద్వారా కథకుడు ఆ సూచన చేయనే చేశాడు. ప్రస్తుత సందర్భంలో, ‘అతిశయ రూపలావణ్యసుందరి’ అయిన శర్మిష్ట గురించి తెలుసుకో గోరాడని అనడం ద్వారా ఆమె వైపు అతను ఆకర్షితుడయ్యాడన్న సూచన అంతకంటే స్పష్టంగా ఇచ్చాడు.

దేవయాని, యయాతి ల మధ్య నడిచినది ఒకవిధమైన మైండ్ గేమ్. ఇద్దరిలోనూ లౌక్యమూ, గడుసుదనమూ ఉన్నాయి. ఇద్దరికీ తమవైన వ్యూహాలు ఉన్నాయి. దేవయానికి రాజును పెళ్లాడడం ముఖ్యం. తద్వారా లభించే రాచవైభవం ఆమెకు కావాలి. యయాతికి రూపలావణ్య సుందరి అయిన శర్మిష్ట కావాలి. శర్మిష్ట మనసులో ఆ క్షణంలో ఎటువంటి ఆలోచనలు చెలరేగాయో మనకు తెలియదు. అప్పటికామె ఎటు వంచితే అటు వంగవలసిన మైనపు బొమ్మ!

దేవయాని అప్పటికప్పుడు తండ్రిని రప్పించింది. ‘ఈ రాజు ఇప్పటికే నా పాణిగ్రహణం చేశాడు కనుక వివాహ సంబంధంగా ఇంకొకరు నా చేయి పట్టుకోవడం ఎలా ధర్మమవుతుంది? కనుక ఈ జన్మలో ఇతడే నా భర్త. నువ్వు ఒప్పుకుంటే నన్ను పెళ్లాడతానని ఇతడు కూడా మాట ఇచ్చాడు. ఇందులో ధర్మవిరోధం లేకుండా చూడు’ అని తండ్రితో అంది. గమనించండి…దేవయాని ఈ పెళ్లి ధర్మబద్ధమో, కాదో చెప్పమని అడగలేదు. ఇందులో ధర్మవిరోధం లేకుండా చూడమని మాత్రమే అడిగింది. అంటే తన terms and conditions ను స్పష్టంగా నిర్దేశించిందన్నమాట. శుక్రుడు వాటిని దాటి మాట్లాడే ప్రశ్నే లేదు. ఈ వివాహంలో ఎలాంటి ధర్మోల్లంఘనా లేదన్న ఒకే ఒక వాక్యంతో ఆమోదం తెలిపేశాడు. ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది.

ఆ తర్వాత శుక్రుడు శర్మిష్టను యయాతికి చూపించి, ’ఈమె వృషపర్వుని కూతురు. ప్రేమతో ఈమెకు అన్నపానాలు, వస్త్రాభరణాలు, సుగంధలేపనాలు వగైరాలు సమకూర్చి సంతోషపెట్టు. అయితే ఈమెతో నువ్వు పడక సుఖానికి మాత్రం దూరంగా ఉండాలి’ అన్నాడు. యయాతి శుక్రుని వద్ద సెలవు తీసుకుని దేవయానినీ, శర్మిష్టతో సహా దాసీకన్యలనూ  వెంటబెట్టుకుని రాజధానికి వెళ్లిపోయాడు. అక్కడ అంతఃపురంలో ఒక చక్కని మేడలో దేవయానిని ఉంచి; ఆమె అనుమతితో శర్మిష్టనూ మిగిలిన కన్యలనూ అశోకవనం సమీపంలోని ఒక గృహం లో ఉంచాడు.

యయాతితో శుక్రుడు అన్న పై మాటలు అతని స్వభావాన్నీ, దేవయాని స్వభావాన్నీ కూడా మరోసారి వెల్లడిస్తున్నాయి. దేవయానిలో అహమూ, అసూయే కాక; అవకాశవాదమూ, స్వార్థమూ కూడా హెచ్చుపాళ్లలోనే ఉన్నాయి. యయాతిని తనతో పెళ్ళికి ఒప్పించే ముందు; శర్మిష్టనూ, మిగిలిన దాసీ కన్యలనూ చూపించి దేవతాస్త్రీలకు సాటివచ్చే ఈ సుందరాంగులందరూ నిన్ను సుఖపెడతారని ఆశపెట్టింది. తీరా యయాతి పెళ్ళికి ఒప్పుకున్నాక మాట మార్చింది. యయాతిని శర్మిష్టతో కలసి పంచుకోవడం ఆమెకు ఇష్టం లేదు. ఆ మాట యయాతితో తను నేరుగా చెప్పకుండా తండ్రితో చెప్పించింది. తండ్రి ఆదేశాన్ని ఉల్లంఘించే సాహసం యయాతి చేయడని ఆమె ధీమా.

శుక్రుడు కూతురి అభిమతాన్ని కాదనే ప్రసక్తే లేదు కనుక, శర్మిష్టను పడక సుఖానికి  మాత్రం దూరంగా ఉంచమని యయాతికి ప్రత్యేకించి చెప్పాడు. అయితే, వృషపర్వుని కూతురైన ఈమెకు అన్నీ సమకూర్చి సంతోషపెట్టు అని కూడా అంతే ప్రత్యేకంగా చెప్పాడు. అలా చెప్పడంలో శర్మిష్టపై అతనికున్న పుత్రికావాత్సల్యమూ, సుకుమారంగా సుఖాల మధ్య పెరిగిన ఆమెను కష్టపెట్టవద్దని చెప్పే ఔదార్యమూ, ధార్మికతా వ్యక్తమవుతూ ఉండచ్చు.

ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ, శర్మిష్టకు అన్ని వసతులూ కల్పించి పడక సుఖానికి మాత్రం దూరంగా ఉంచమని శుక్రుడు చెప్పడంలో, ఆమెనుంచి పడక సుఖం కూడా పొందమన్న ధ్వని ఉండడానికీ అవకాశముంది. దాని గురించి వివరించుకోవడం ప్రారంభిస్తే, ఆ వివరణ ఇంతకుముందు చెప్పినట్టు, దేవయాని పరంగా చెప్పిన కథను శర్మిష్ట పరంగా మార్చివేస్తుంది. శర్మిష్టనే కథానాయికగా మనముందుకు తీసుకొస్తుంది.

ఎలాగంటే, యయాతికి శర్మిష్టను చేపట్టడమే ప్రధాన లక్ష్యం. అందులో వ్యక్తిగత ఆకాంక్షే కాక, రాజకీయ అవసరం కూడా ఉండచ్చు. తను రాజు కనుక రాచకన్యద్వారానే వారసుని కనవలసి ఉంటుంది.  అప్పుడే దానికి సమాజం నుంచి హర్షామోదాలు లభిస్తాయి. దేవయానికి కలిగే సంతానానికి సమాజం ఆ ప్రతిపత్తి ఇవ్వదు. వారసుని ఎంపికలో ఆనాటి రాజుకు స్వతంత్ర నిర్ణయాధికారం లేదు. అది సమాజమూ, రాజూ కలసి తీసుకోవలసిన సమష్టి నిర్ణయం. యయాతికీ, శుక్రుడికీ కూడా ఆ అవగాహన ఉంది. అయితే, ఇక్కడ మధ్యలో దేవయాని ఉంది. ఇంతవరకు శుక్రుడికి నెత్తి మీద దేవతగా ఉన్న దేవయాని ఇకముందు యయాతికి చిక్కుముడిగా మారబోతోంది. బహుశా యయాతి-శర్మిష్టల మధ్య కలగబోయే సంబంధం శుక్రుని ఊహలో ముందే ఉండి ఉండవచ్చు. ఇంకా చెప్పాలంటే, అందుకు సంబంధించిన రాజకీయ ప్రణాళికలో శుక్రుడు కూడా భాగస్వామి అయుండచ్చు.

కూతురిపై అపరిమిత మమకారం ఉన్న శుక్రుడు ఆమె కాపురంలో చిచ్చు పెట్టే పాత్ర నిర్వహించాడంటే వినడానికి విడ్డూరంగానూ, విపరీతంగానూ ఉండే మాట నిజమే. అయితే, కాసేపు దేవయాని పరంగా చెప్పిన కథ అన్న సంగతి మరచిపోయి శర్మిష్ట పరంగా చెప్పిన కథగా ఊహించుకోండి. యయాతి అసలు శర్మిష్టనే చేపట్టాలనుకున్నాడు. అయితే, ఆమె దేవయానికి అప్పటికే దాసిగా మారిపోయింది కనుక యజమానురాలిని పెళ్లాడితేనే శర్మిష్ట తనకు దక్కుతుంది. యయాతి వైపునుంచి ఈ మొత్తం వ్యూహానికి సంబంధించిన అవగాహన లోకజ్ఞుడైన శుక్రుడికి పూర్తిగా ఉంది. దేవయానికి లేదు. ఎందుకంటే, ఆమెది పూర్తిగా వైయక్తికమైన అజెండా. అందులో ఇతరేతర అంశాలకు చోటులేదు.

  అసలు శర్మిష్ట కథను దేవయాని వైపునుంచి కథకుడు ఎందుకు చెప్పినట్టు? రెండు కారణాలను ఊహించవచ్చు. మొదటిది, దాసిగా ఉన్న శర్మిష్టను రాజమార్గంలో చేపట్టడానికి యయాతికి అవకాశంలేదు. అందుకు సామాజిక నిర్బంధాలు అడ్డువస్తాయి. రెండవది, కథకుడికి దేవయానిని ప్రధానం చేసి కథ చెప్పడమే ఇష్టం. ఎందుకంటే, ఆమె భృగువంశీకురాలు. కోశాంబీ ప్రకారం మహాభారత పరిష్కరణలో భృగులు ప్రధాన భూమిక పోషించారు. భృగులను విశిష్టులుగా చిత్రించే ఘట్టాలు మహాభారతంలో చాలా ఉన్నాయి. పరశురాముడు ఇంకో ఉదాహరణ.  

కథలోకి వస్తే, ‘దేవయాని అనుమతి’తో శర్మిష్టను ఇతర దాసీ కన్యలతోపాటు యయాతి అశోకవన సమీపంలో ఒక గృహంలో ఉంచాడని కథకుడు చెబుతున్నాడు. ఆ సమాచారంతో యయాతి-శర్మిష్టల మధ్య జరగబోయే సమాగమాన్ని  సూచిస్తున్నాడు. అంటే, ఎంత దేవయాని వైపునుంచి కథ చెప్పినా కథకుడు శర్మిష్ట ప్రాధాన్యాన్ని కప్పిపుచ్చలేకపోతున్నాడన్నమాట!  అదలా ఉంచితే, ‘దేవయాని అనుమతితో’ శర్మిష్టను (తను తరచు విహరించే) అశోకవన సమీపంలో ఉంచాడని చెప్పడం  ద్వారా, అనేకమందితో రహస్య ప్రణయాలు సాగిస్తూ, భార్యపట్ల అతి విధేయతను ప్రదర్శించే దక్షిణనాయకుడిగా యయాతిని కథకుడు మన ముందుకు తెస్తున్నాడు.

అనంతర కథ తర్వాత…

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 –కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

 

 

 

 

సాహసానికి ఇంకో పేరు: రంగవల్లి!

3

(విప్లవోద్యమ నాయకురాలిగా తెలుగు నేలకు సుపరిచితమైన రంగవల్లి 1999 నవంబర్ 11 న ములుగు అడవుల్లో బూటకపు ఎంకౌంటర్ లో పోలీసుల చేత హత్య చేయబడింది. హత్యచేయబడ్డప్పుడు ఆమె పేరు జ్యోతక్క. అంతకు ముందు ఉమక్క గా కూడా చాలా మందికి చిరపరిచితురాలే! PDSU (ప్రగతిశీల విద్యార్థి సంఘం) మాస పత్రిక విజృంభణ సంపాదక కమిటీ నాయకురాలిగా, మహిళా ఉద్యమ నాయకురాలిగా, పల్నాడు భూపోరాటాల నాయకురాలిగా, గోదావరీ లోయ విప్లవోద్యమ నాయకురాలిగా రంగవల్లి జీవితాన్ని పీడిత ప్రజల కోసం త్యాగం చేసిన మహోన్నత మానవతామూర్తి  రంగవల్లి. ఆమెతో ఉద్యమంలో కలిసి పనిచేసిన పరిచయాన్నీ , నా అనుభవాల్నీ , మర్చిపోలేని జ్ఞాపకాల్లా  చెప్పే ప్రయత్నం ఇది).

 

1987 ఆగస్టు నెలలో ఒక రోజు… వర్షా కాలం.. సాయంత్రం 8:55… బయట భోరుమని వర్షం – భీకరమైన ఈదురు గాలులు – ముసురుకున్న  చీకట్లు – మధ్య మధ్యలో ఆకాశం కసిగా నవ్వినట్టు మెరుపులు ….

కిటికీ రెక్కలు విరిగి పోయేటంతగా కొట్టుకుంటుంటే ఒకటొకటే అతి కష్టం మీద మూస్తూ ‘ఈ తుఫాను వానలో ఈ రాత్రి తను ఇంక రాదు ఈ పూటకు మన సమావేశం లేనట్టే ‘ అన్నాన్నేను చారి తో. ‘అవును నిజమే ఈ వానకు  ఆటోలు కూడా నడవడం కష్టం.. తనెట్లా వస్తుంది? సమావేశం మరో రోజు పెట్టుకోవాల్సిందే! కనీసం మనం యేదైనా వండుకునైనా తిందాం’ అని చారి వంటగది వైపు నడిచాడు. ఈ లోపల ఠపీ మని లైటు కూడా పోయింది. గాలివానకు యెక్కడో కరంటు తీగ తెగిపోయి ఉంటుంది. మెల్లగా వెతికి దీపం వెలిగించాం. రూం లోపలికి గాలివాన తోసుకొస్తోందా అన్నట్టు దీపం వణికిపోతోంది.

హైదరాబాదులో మెహ్దీ పట్నం దాటాక కాకతీయ నగర్ నుండి ఒక మూడు  కిలోమీటర్ల దూరంలో గుడిమల్కాపూర్ కి పోయే దారిలో,  అప్పటికింకా యిళ్ళూ కాలనీలూ యేమీ లేని చోట విసిరేసినట్టుగా ఉండేది నా రూం. అపుడప్పుడే కాలేజీ లో లెక్చరర్ గా చేరాక దగ్గరగా ఉంటుందని అక్కడ కిరాయకు తీసుకున్నా! 118టి అని కోటి నుండి ఒకే ఒక బస్సు ఉండేది – అదీ యెప్పుడు వస్తుందో తెలియదు – ప్రతిసారీ కాకతీయ నగర్ దగ్గర బేర్బన్ బస్టాప్ లో దిగి నడిచేది రూం కి. వచ్చే వాళ్లంతా విసుక్కునే వాళ్లు సెంటర్కి యింత దూరం తీసుకున్నావేమిటంటూ – అయితే సెంటర్ కి దూరంగా ఉండడం వల్లనూ జనసంచారం పెద్దగా లేకపోవడం వల్లనూ నా రూం అనేక సమావేశాలకు అనువైన ప్రదేశంగా ఉండేది. యెప్పుడు పడితే అప్పుడు, నేనున్నా లేక పోయినా రూం లో సమావేశాలు నడుస్తూనే ఉండేవి. ఇంటికి పార్టీ ప్రదాన నాయకత్వం అంతా నిరభ్యంతరంగా వస్తూ పోతూ ఉండే వారు.  అప్పుడు నేను యితర అనేకానేక సాహిత్య సాంస్కృతిక బాధ్యత ల్లో భాగంగా విజృంభణ పత్రిక ప్రచురణ కూడా చూస్తూ ఉండేది.

మా టీం లో చారి ప్రధాన సభ్యుడు. అట్లా ఆ సాయంత్రం నా రూం లో యేర్పాటైన సమావేశం 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండింది. అంత భయంకరమైన వానలో, తుఫాను హోరుగాలిలో మానవమాత్రులెవరూ రారు రాలేరని నిర్ధారించుకుని ఇంక వంట కార్యక్రమం మొదలుబెడదామనుకున్నాం. యింతలో టక టక ఇంటి తలుపు చప్పుడు. భీకరమైన గాలి పెద్ద చేతులు చాపి తలుపులు బాదుతుందిలే అనుకున్నామిద్దరం. ఈ సారి మరింత పెద్దగా తలుపు చప్పుడు. ఆశ్చర్యపోయాం. ఖచ్చితంగా పోలీసులే సమావేశం వివరాలు తెలిసి దాడిచెయ్యడానికి వచ్చారు అనుకుని కొయ్యబారిపోయాం. వెనక తలుపు నుకంచి పారిపోదామా అంటే బయట పరిస్థితి బీభత్సం. అయినా పోలీసులైనా మనుషులే కదా యింత వానలో రావడం అసంభవం అనుకున్నాం. యేదో మళ్ళీ గాలివానే కావచ్చులే  అనుకుంటుండగానే మళ్ళి తలుపు టక టక … ఇంక ఇద్దరికీ పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. ధైర్యం చిక్కబట్టుకుని కిటికీ రెక్క కొద్దిగా తెరవబోతే విసురుగా వాన చెళ్ళుమని చరిచింది.

యింక లాభం లేదని ‘యెవరూ ‘ అని అరిచాం … మా గొంతు మాకే వినబడలేదు … తలుపులు తీయాలా వద్దా పెద్ద మీమాంస.. మళ్ళి టక టక … యేమయితే అయింది అనుకుని మెల్లగా తలుపు తీసాం … బయట తను .. గాలి వానకు విరిగిపోయిన చెత్రీ తో పూర్తిగా తడిసి ముద్దై పోయి వణుకుతూ … ‘అక్కా మీరా….’ నిర్ఘాంత పోయాం చారీ నేనూ  –  ఈ రాత్రి ఈ వానలో మీరొక్కరే యెట్లా వచ్చారు అసలెందికింత సాహసం చేసారు మీకేమనా అయితే? యేమిటీ పిచ్చిపని ?”

ప్రశ్నల వర్షం … అసలు లోపలికి రానిస్తారా లేదా అంటూ లోపలికి తలుపు తోసుకుని వచ్చింది ఒక పెద్ద నీళ్లమూటలా … వెంటనే పరిగెత్తుకెళ్ళి తువ్వాల తెచ్చిచ్చా – తను అంతకు ముందు అడపా దడపా సమావేశాలు వస్తూ ఉండేది గనక తనవి మరో జత బట్టలున్నటు గుర్తుకొచ్చి అదే చెప్పా తనకు .. అవును కదూ అంటూ లోపలికి వెళ్ళింది తను…. నేనూ చారీ ముఖాలు చూసుకున్నాం గొప్ప సంభ్రమాశ్చర్యాలతో… అసలు ఊహించలేదు కదా తను వస్తుందని .. ఈ వానలో బస్సు లుండవు ఆటొ వాడు కూడా ఇటువైపు రావడానికి సాహసించడు.. యెట్లా వచ్చి ఉంటుంది? ఈ చీకట్లో ఈ భయంకరమైన ఈదురుగాలిలో ఈ  తుఫాను వానలో ఇంతదూరం యెట్లా వచ్చింది తను?

నేనూ చారి యిట్లా ప్రశ్నించుకుంటుండగా యేమిటీ యేదొ గునుగుతున్నరు? అనుకుంటూ లోపలినుండి పొడి బట్టలు కట్టుకుని తలార బెట్టుకుంటూ బయటికొచ్చింది.

‘అక్కా! యేమిటీ పిచ్చి పని – అసలెట్లా వచ్చిండ్రు మీరు? ఈ తుఫానులో ఈ చీకట్లో ఒక్కరే?  యేమైనా అయితే?’ ‘యేం యేమవుతుంది? ఈ ప్రాంతమంతా సేఫేలే’ ‘అట్లా అని కాదు – ఈ పూట బస్సులు కూడా ఉండవు కదా’  …. అవును బస్సులు లేవు ఆటోలూ లేవు –

‘ ‘మరి యేట్లా వచ్చారు?’

‘ నడుచుకుంటూ- ‘ ‘యెక్కడ్నుండి?’  ‘మెహిదీ పట్నం నుండి’ అంటే దాదాపు ఆరు కిలోమీటర్లు .. వానలో చలిలో క్రూరంగా విసిరి కొట్టే ఈదురు గాలిలో – యెందుకక్కా యింత సాహసం?’

‘మరి సమావేశం కదా ముఖ్యం కాదూ? ఈ పూట మనం కలవక పోతే నాకు మళ్ళా వారం దాకా కుదరదు – ఈ సమావేశం జరగక పోతే పత్రిక ఆలస్యం అవుతుంది – ఇప్పుడిప్పుడె పత్రికకు ప్రచారం లబించి యెక్కువ మంది చదువుతున్నారు – ప్రతి నెల మొదటి తారీకున పుస్తకాల షాపుల్లో అడిగి మరీ కొనుక్కుంటున్నారు – పత్రికకు క్వాలిటీ తో పాటు రెగులారిటీ కూడా చాల ముఖ్యం’  అంది తను మిణుకు మిణుకుమంటూ వణుకుతున్న దీపంవెలుగులో మిలమిలా  మెరిసే నిర్మలమైన కళ్లతో..

పదండి కూర్చుందాం!!  వచ్చే నెల పత్రికలో యేమేమి వస్తే   బాగుంటుందో అనుకుందాం – యేమైనా తిని మొదలు పెడదామా అక్కా? ‘ఆకలిగా ఉందా సర్లే యింత అన్నం కుకర్ లో పడేస్తే యేదయినా పచ్చడి తో తినొచ్చు – అన్నమయే లోపల పత్రిక వ్యాసాలు చర్చించుకోవచ్చు – చారీ ఇంత అన్నం కుకర్ లో పెట్టు – స్వామీ పత్రిక మీటింగ్ మినట్స్ బుక్ తీయి’  అంటూ చారిని నన్నూ పురమాయించింది తను.

2

ఆ రోజు అట్లా ప్రకృతికి వ్యతిరేకంగా యుద్ధం చేసి పి డి యెస్ యూ విజృంభణ పత్రిక సకాలంలో రావడానికి అవసరమైన నాయకత్వాన్నిచ్చిన ఆ అక్కే రంగవల్లి.

కల్సినప్పుడల్లా గొప్ప  ఉత్తేజాన్నిచ్చేది. మమ్మల్ని  చాల మంది ‘నాయకులు’ కల్సే వారు. యెన్నెన్నో చర్చించే వారు, తాత్విక, రాజకీయ, సామాజిక సాంస్క్టృతిక అంశాల మీద తమ విశ్లేషణ చేసి , అనేక సూచనలు చేసే వారు. సంస్థ యెట్లా నడవాలో, దాన్ని ఇంకా మేము యెంత సమర్థవంతంగా నడపవచ్చునో, యింకా మేము యెంత కృషి చేయవచ్చునో – తదితర అంశాల గురించి అనర్గళంగా ఉపన్యాసాలిచ్చే వారు. కానీ సంస్థ లో పనిచేసే కాడర్ కూడా మామూలు మనుషులేనని, వారికి అనేక సాధక బాధకాలుంటాయని పూర్తికాలం పనిచేసే వాళ్లు తమ జీవితాలని మొత్తంగా యేమీ ఆశించకుండా గొప్ప త్యాగనిరతితో సంస్థ కోసం పనిచేస్తున్నారనీ వారిని మానవీయ దృక్పథం తో చూడాలని ఆలోచించే అతి తక్కువ నాయకుల్లో రంగవల్లి ఒకరు.

అట్లే, సంస్థ కోసం part-time పని చేస్తూ తమ చేతనైనంత సహాయ సహకారాలని అందించే సానుభూతి పరుల సాధక బాధకాలని యెంతో ఆత్మీయంగా అడిగి పట్టించుకుని  వీలైనంత సహాయం చేసేది రంగవల్లి. ముందు తనెవరింటికి వెళ్ళీనా యే పని మీద వెళ్ళీనా ముందు అందరి గురించీ, ఇంట్లో పరిస్థితుల గురించీ ముందు అడిగి తెలుసుకుని, బాగోగులు పట్టించుకునేది. యింట్లో వారికి యేమేమి కావాలో అడిగి తెల్సుకుని వీలైనంత సహాయం చేసి కానీ తర్వాత పార్టీ పనుల గురించి సంస్థ పనుల గురించీ మాట్లాడేది కాదు.

తన దగ్గర యేమున్నా అది వెనుకా ముందూ చూడకుండా,   ఆలోచించకుండా అడగ్గానే ఇచ్చేసేది. యెంత డబ్బు ఉంటే అంత, బట్టలేవయినా ఉంటే తనకంటూ చూసుకోకుండా యిచ్చేసేది. ఇది తనది అంటూ యెన్నడూ చెపుకోని అపురూపమైన మానవి రంగవల్లి.  తను యెవరింటికి వెళ్ళినా ముందు వారు కడుపునిండా తిన్నారా లేదో కనుక్కుని అప్పుడు తినడానికి యేమైనా ఉందా అని అడిగేది. యేది ఉంటే అది, యేది పెడితే అది తినేది. యెప్పుడూ మాయని మల్లెపూవు లాంటి చిరునవ్వు తో, యేనాడూ అలసట యెరుగని ఉత్తేజ పూరితమైన ముఖంతో, భేషజాలు, పట్టింపులూ లేని నిష్కల్మషమైన పలకరింపుతో గొప్ప మానవీయతకు ప్రతిరూపంలా ఉండేది రంగవల్లి.

మొదటి సారి తనని చూడడం చాలా చిత్రమైన పరిస్థితుల్లో జరిగింది. నేను యింజనీరింగ్ రెండవ సంవత్సరంలో అప్పుడప్పుడే PDSU కార్యక్రమాల్లో పాల్గొంటున్న క్రమంలో సెక్రటేరియట్  ముందు పెద్ద దర్నాలో పాల్గొన్నాం. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ముందువరసలో ఉన్న నాయకులతో ఇద్దరు ముగ్గురు పోలీసు ఇన్స్పెక్టర్లు పెద్ద పెద్దగా అరుస్తున్నారు, బెదిరిస్తున్నారు, తోసేస్తున్నారు – విద్యార్థి నాయకుల్లో ముందువరసలో ఉన్నవాళ్లలో ఒక అమ్మాయి కూడా ఉంది. సన్నగా రివటలా బక్క అలచగా ఉన్న ఆ అమ్మాయి గొంతెత్తి సమాధానం చెప్తోంది, నినాదాలిస్తోంది. మొరటుగా క్రూరంగా కర్కశంగా ఉన్న మగ పోలీసు ఆఫీసర్లని యెదిరించి ధైర్యంగా మాట్లాడుతోంది.

నిండా 17 యేండ్లున్న నాకు అది గొప్ప అచ్చెరువునొందించిన సందర్భం. యిప్పటికీ దాదాపు 30 యేండ్ల తర్వాత కూడా చాలా వివరంగా గుర్తుంది. నిన్న గాక మొన్న జరిగినంత తాజా గా ఉంది జ్ఞాపకాల్లో! యింతలో పెద్ద కోలాహలం చెలరేగింది. మేము చూస్తుండగానే పోలీసులు ఆ అమ్మాయిని తోసేసి కొట్టబోయారు. ఆమె వెంటనే ఆడ పులిలా లంఘించి ఆ ఇన్స్పెక్టర్ ని లాగి ఓ చెంపకాయ కొట్టింది. అప్పటిదాకా క్రూరంగా అధికారం ప్రదర్శిస్తూ చెలరేగిన  రాజ్య , పోలీసు అహంకారాల తల మీద మేమెవవరమూ కొట్టలేని దెబ్బ కొట్టింది. ఉద్యమిస్తున్న విద్యార్థులకు పెద్ద ఊపునిచ్చింది. సంభ్రమాశ్చర్యాలతో నాకు  చాలా సేపు నోటమాట రాలేదు. అప్పటిదాకా శ్రీ శ్రీ ని దిగంబర కవులనీ, తిరగబడు కవులనీ చదివి తీవ్రమైన ఆవేశంతో అన్యాయాల మీద వాటిని సమర్థించే అధికారం మీద దెబ్బ వేయాలని వువ్విళ్ళూరుతున్నా – నా కళ్ళ ముందే యే మాత్రం ఊహించని విధంగా ఆ అమ్మాయి అట్లా పోలీసుని కొట్టే సరికి బిత్తరపోయాను. తర్వాత మా ధర్నా మీద పెద్ద యెత్తున లాఠీ చార్జీ జరిగింది. అంతా చెల్లాచెదురయ్యారు. నేను పక్కనే ఉన్న పెద్ద గోతిలో పడి (ఇప్పుడక్కడ వెలసి ఉన్న పెద్ద హోటల్ కట్టడానికి తీసిన గోతి) చీకటి పడేదాకా నక్కి తర్వాత కాళ్ళీడ్చుకుంటూ హాస్టల్ కి వెళ్ళిపోయాను.

కానీ ఆమె యెవరో యెక్కడుంటుందో క్ర్రూరమైన అధికారాన్ని అంత నిర్భయంగా యెదిరించే ధైర్య సాహసాలు ఆమెకెట్లా వచ్చాయో తెల్సుకోవాలని చాలా ఉత్సుకతగా ఉండేది. తర్వాత తెలిసింది ఆమె రంగవల్లి అనీ, PDSU నాయకురాలనీ, OU లో విద్యార్థిని అనీ. ఒకసారయినా ఆమెని కలవాలనీ ఆ ధైర్యాన్ని కొంచెమైనా పొందాలనీ అనుకుంటున్న సందర్భం లో PDSU లో మరింత చురుకుగా పాల్గొంటున్న సందర్భంలో ఒక సారి యెవరో దూరం నుండి చూపించారు – అదిగో ఆమే రంగవల్లి అక్క అని. క్రమేణా తాను మరిన్ని సంస్థాగత బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా పనిచేస్తుందని  తెల్సింది. నేనూ సాహిత్యం, సాంస్కృతికరంగం లో పని చేస్తూ విరసం కార్యక్రమాల్లో తలమునకలైపోయాను. మళ్ళీ యెప్పుడూ బహిరంగంగా తనని చూసే అవకాశం కలగలేదు.

సాహిత్యరంగం లో నాకున్న ఆసక్తి కారణంగా PDSU పత్రిక విజృంభణ పత్రిక బాధ్యతలు చూసుకొమ్మన్నారు. విజృంభణ పత్రిక సంపాదక వర్గంలో మాధవస్వామి (నా ప్రియ మిత్రుడూ, కవీ  – కర్నూల్ లో డాక్టర్ గా పనిచేస్తూ ఈ మధ్యే ఆకస్మికంగా కనుమూసాడు) , చారీ, మధుసూధన్ రెడ్డి, ప్రకాష్  , కిరణ్ , నేనూ ఉండే వాళ్లం. ప్రకాష్ ,  కిరణ్ నాకు జే యెన్ టీ యూ కాలేజీ రోజుల్నుంచీ అత్యంత ప్రియ మిత్రులూ ఉద్యమంలోనూ జీవితం లోనూ చాలా సన్నిహితులూ. మాకు పైనుంచి మార్గదర్శకత్వం వహించడానికి యెవరో ఒకరు వచ్చే వారు. అట్లా మా కమిటీ కి నాయకురాలుగా , ఒక అక్క రాబోతుందని చెప్పారు. యెవరో తెలియదు. ఒకానొక సమావేశానికి తాను రానే వచ్చింది. గుడ్డి వెలుతురు చీకట్లో ఆమెను ముందు పోల్చుకోలేదు. నిజమైన పేరు తెలియదు కాబట్టి ఆమె యెవరో ఊహిస్తూ ఉన్న సందర్భంలో చారి అనుకుంటా చెప్పాడు – ఆమెనే రంగవల్లి అక్క అని.

నోట్లో మాట పెగల్లేదు చాలా సేపు. యెంత సౌమ్యంగా మాట్లాడింది? యెంత అణకువా, యెంతా intellectual humility? యెంత ప్రేమా యెంత అనునయమూ – ఈమె నేనా ఆరోజు సెక్రటేరియట్ ముందు పోలీసు ఇన్స్పెక్టర్ ని చాచి లెంపకాయ కొట్టింది అని పదే పదే అనుకున్నా. తర్వాత తర్వాత రోజుల్లో చాల సన్నిహితంగా కల్సిపోయింది మాతో! తానో నాయకురాలు అని యెప్పుడూ అనుకునేది కాదు. కానీ తన మాటలతో, జ్ఞానంతో, పరిశీలనా విశ్లేషణలతో మమ్మల్ని ఆశ్చర్యపరిచేది. మా నుండి గొప్ప గౌరవాన్ని పొందేది. తనకు తెలిసిన విషయాలపట్ల యెంత command తో మాట్లాడేదో తనకు తెలవని విషయాల పట్ల చిన్న పిల్లల అమాయకత్వంతో ఉత్సుకత ప్రదర్శించేది. యెప్పుడూ తనకు తెలిసింది చెప్పుకుని ప్రదర్శించాలనే దుగ్ధ కన్నా తెలియంది నేర్చుకోవాలనే తపనే యెక్కువ తనకు. అట్లా మా విజృంభణ కమిటీ సమావేశాలకు (మాధవ స్వామి కర్నూల్ కి, మధుసూధన రెడ్డి భోనగిరి దగ్గర తన స్కూల్ కి, కిరణ్ వేరే బాధ్యతలకూ  వెళ్ళిపోయాక మిగిలిన మా యిద్దరితో కలవడానికి) క్రమం తప్పకుండా గొప్ప పట్టుదలతో క్రమశిక్షణతో హాజరయేది. అట్లా తర్వాత కాలంలో మాకు అత్యంత సన్నిహితమైంది.

 

Rangavalli2

1989 తర్వాత నా పెళ్ళయాక విద్యతో పద్మనాభ నగర్ లో మొదటి యిల్లు కిరాయకు తీసుకున్నాం. ఆ యింటికి ఒక మహిళా సమావేశం కోసం యితర మహిళా నాయకురాళ్లతో కలవడానికి వచ్చింది. అదే చెక్కు చెదరని చిరునవ్వు, నిష్కల్మషత్వం, నిర్మలత, సౌమ్యత – ప్రేమగా పలకరించే ఆత్మీయత – విద్య కు వెంటనే నచ్చేసింది. తను యెప్పుడు వచ్చినా విద్య తో ప్రత్యేకంగా యెంతో సేపు యెన్నో విషయాలు మాట్లాడేది. యిద్దరూ మంచి స్నేహితులైపోయారు అతి త్వరలోనే! క్రమ క్రమంగా తాను విభిన్న సంస్థాగత బాధ్యతలవల్లా పనుల వత్తిడి వల్లా రావడం తగ్గింది. మేమూ నానా యిండ్లూ నానా కారణాల వల్ల మారి చివరకు దోమల్ గూడ గగన్ మహల్ వెనుక ఒక బస్తీ లో యిల్లు తీసుకున్నాం. అప్పుడు యింక మా యిల్లు ఒక పార్టి కార్యాలయంలా ఉండేది. పార్టి తో పాటు అనేక సంస్థల కార్యాలయం కూడా! అనేక మంది వస్తూ పోతూ ఉండే వారు. అజ్ఞాతంలో ఉన్న నాయకులు కూడా వచ్చే వాళ్ళు. వాళ్లలో తానూ ఒకరు.

యెంత మంది వచ్చి పోయినా తాను వచ్చిందంటే నాకూ విద్యకూ యెంతో సంబరం. ఒక ఆత్మీయురాలు, ఒక ఆత్మబంధువు, సన్నిహితురాలు యింటికొచ్చినట్టు – మననుండి యేమీ (యేమంటే యేమీ) ఆశించకుండా యెప్పుడూ తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి వెళ్ళాలనే తపనతో ఉండేది. మాట్లాడినంత సేపూ ‘మీరెట్లా ఉన్నారు, యేమి ఇబ్బందులున్నాయి మీకు, యేమయినా కావాలా బట్టలు కానీ, వస్తువులు కానీ’  అంటూ ‘యింట్లో అది లేదా ఇది లేదా’  అని అడిగి తీసుకునే అనేక మంది నాయకులకు పూర్తి విరుద్ధంగా భిన్నంగా గొప్ప మానవీయత ప్రదర్శించేది.

బహుశా తను వచ్చినప్పుడల్లా ఒకే ఒక favor అడిగేది – ‘స్వామీ వీధి చివరదాకా వెళ్ళి యెవరైనా అనుమానాస్పదంగా ఉన్నారో లేక follow అయ్యారో చూసి రావా’ అంటూ పురమాయించేది.  అట్లా చేయడంలో  తనకేమైనా అవుతుందో అనే ఆత్రుత  కన్నా తాను వచ్చినందుకు మాకూ, ఫలితంగా విప్లవోద్యమానికీ యేమైనా నష్టం జరుగుతుందో అనే భయమే యెక్కువ కనబడేది నాకు. అజ్ఞాత జీవితంలో ఉన్న వారికి అది తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్త. అందుకే ఆమె అంటే విద్యా నేనూ అంత యిష్టపడేవాళ్లం. కించిత్తు అహంకారం కానీ, భేషజం కానీ లేకుండా, నిష్కల్మషంగా  ఒక నిర్మలమైన ప్రవాహం లాంటి రంగవల్లిని ప్రేమించకుండా ఉండడం అసాధ్యం!

వాసవీ కాలేజీ లో పనిచేస్తున్న రోజుల్లో ఒక రోజు,  ఒక రెండవ సంవత్సరం చదువుతున్న అజిత అనే ఒక అమ్మాయి నా ఆఫీసుకి వచ్చి మీకు రంగవల్లి ఆంటీ తెలుసట కదా అని అడిగింది. అవునూ యెందుకు అని అడిగాన్నేను. ఆంటీ నాకు బంధువు. నాకు పిన్నమ్మ అవుతుంది అని చెప్పింది. ఆ అమ్మాయి సామాజిక నేపథ్యం తెలిసిన నేను నివ్వెరపోయాను. నోట మాట రాలేదు నాకు. యేమిటీ రంగవల్లి నీకు పిన్నమ్మనా? నిజమా? అంటూ అజిత ను పదేపదే అడిగాను. తర్వాత తెలిసింది రంగవల్లి నాన్న, కుటుంబమూ, బంధువులూ బాగా ఉన్నత వర్గానికి చెందినవాళ్లనీ, తెలుగు నేలని శాసిస్తున్న రాజకీయార్థిక, ధనిక సామాజికవర్గానికి చెందిన వాళ్ళనీ తెలిసాక మరింత ఆశ్చర్య పోయాను.

అటువంటి నేపథ్యం నుండి వచ్చిన వారు విప్లవోద్యమంలోకి వచ్చినాక  కూడా యెట్లా ప్రవర్తించారో, యెంత అహంకారాన్ని, దర్పాన్ని, అధికారాన్ని, భేషజాన్ని ప్రదర్శించారో, ప్రదర్శిస్తున్నారో యెన్నో సార్లు నాకు అనుభవం – అట్లాంటి ప్రవర్తనని బహుశా కలలో కూడా యేనాడూ ప్రదర్శించని రంగవల్లిది ఒక అరుదైన వ్యక్తిత్వం. నిరంతరం విప్లవోద్యమం గురించీ పీడిత ప్రజల విముక్తి గురించీ, అన్యాయాలని వ్యవస్థీకృతం చేసిన అధికారం మెడలు వంచడం గురించి మాత్రమే తీక్షణంగా ఆలోచిస్తూ, విప్లవోద్యమంలో , పార్టీలో, సంస్థల్లో పనిచేసే వాళ్లని మానవీయ కోణంతో ఆత్మీయంగా అక్కున చేర్చుకున్న గొప్ప నాయకురాలు! పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు పార్టికి యేమి పని చేస్తారో, యెట్లా ఉపయోగపడతారో, యేమిస్తారో అని కాకుండా వారిని విప్లవోద్యమంలో సజీవమైన భాగం చేయడానికి పార్టీ నాయకురాలిగా, ఒక మనిషిగా ముందు వారికోసం తానేమి చేయగలనో , వారికి యేమి ఇవ్వగలనో అని నిరంతరం ఆలోచించే మహోన్నత వ్యక్తి రంగవల్లి,  చిరస్మరణీయురాలు!

1997 లో ప్లీనం  సమావేశాల తర్వాత, ఒక్క సారి కలిసింది! ‘యేమిటి స్వామీ అమెరికా వెళ్తున్నావట – శాశ్వతంగా అటేనా మళ్ళా వస్తావా? యెప్పుడొస్తావు మళ్ళీ’ అంటూ కళ్ళల్లో కదిలీ కదలని సన్నని నీటి పొరతో అడిగింది – నాకూ కండ్లల్ల నీళ్ళు తిరిగినయి – నా ఆత్మీయుడు మారోజు వీరన్నా అదే ప్రశ్న అడిగాడు.

ఆయనకీ, రంగవల్లికీ  యే సమాధానమూ చెప్పే ధైర్యం లేదప్పుడు. తర్వాత 1999 లో యిద్దరూ వెళ్ళిపోయారు. క్రూరమైన రాజ్యం అధికారం కోరలకు  బలైపోయారు.. యిప్పుడు సమాధానం నేను చెప్పాలనుకున్నా, నేను మళ్ళీ తిరిగి వచ్చినా,  యెన్నడూ కలవలేని, తిరిగి రాని లోకాలకు తరలిపోయారిద్దరూ. కానీ వారిద్దరి చిర్నవ్వూ, ఆత్మీయతా, నిష్కల్మషత్వమూ, అన్నింటికన్న మించి అద్భుతమైన మానవత్వమూ నన్నెప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. కలల్లోనూ వాస్తవంలోనూ….

 నారాయణస్వామి

నారాయణస్వామి వెంకట యోగి

నారాయణస్వామి వెంకట యోగి

వీలునామా – 20 వ భాగం

శారద

శారద


[su_quote] (కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

ఎల్సీ కొత్త ఉద్యోగం [/su_quote]

డాక్టర్ ఫిలిప్స్ గారు ఎల్సీని బాధ పెడుతున్న దగ్గు గమనించి, ఆమెని అన్ని రకాలా క్షుణ్ణంగా పరీక్షించారు.

“నిజం చెప్పండి డాక్టరు గారూ! ఆ దగ్గు ఏదో ప్రాణాంతకమైందనిపిస్తుంది నాకైతే. నేనింకెన్నాళ్ళో బ్రతకను కదూ? భయపడకుండా చెప్పండి. బ్రతకాలన్న ఆశ కూడా నాకేమీ పెద్దగా లేదు!” అన్నది ఎల్సీ డాక్టరుతో.

“భలే దానివే! నీకే జబ్బూ లేదు. నాకర్థమైనంతవరకూ, శారీరకంగా నీకే సమస్యా లేదు. మనసులోనే అంత బాగా లేదు. పైగా, ఎక్కువ పనీ, తక్కువ తిండీ! దాంతో నీరసించి పోయావు. అందులోనూ, ఈ యేడాది స్కాట్ లాండ్ లో చలి కని వినీ ఎరగనంతగా వుంది. దాంతో సూర్య రశ్మి సోకక మొహం బాగా పాలిపోయింది. అంతకంటే ఎక్కువేమీ లేదు. అక్క మీద బెంగా, ఆహార లోపమూ, భయంకరమైన చలీ, విశ్రాంతి లేని పనీ, అన్నీ కలిపి నీ మీద దాడి చేసాయి. నాలుగు రోజులు ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకొని, కడుపునిండా తిండి తిను! అన్ని  మంత్రం వేసినట్టు మాయమౌతాయి,  ” అన్నాడాయన.

“జేన్! మీ చెల్లెలి ఆరోగ్యం కుదుట పడాలంటే ఒక్కటే మార్గం. ఆమెని నీతోపాటు లండన్ లో వుంచుకో. కాస్త పది మందితో సావాసమూ, వెచ్చటి వాతావరణమూ, విశ్రాంతీ, ఆహారమూ, ఇవన్నీ వుంటే తను తేలిగ్గా కోలుకుంటుంది,” జేన్ తో అన్నారు.

ఆయన మాటలు విని ఎల్సీ నిట్టూర్చింది.

“నేనిలా అంటున్నానని ఏమీ అనుకోకండి డాక్టర్! నాకైతే నేను బ్రతుకుతానన్న ఆశకానీ, బ్రతకాలన్న ఉత్సాహం కానీ లేనే లేవు. బ్రతుకు మీద తీపి లేకపోవడం తప్పే అనుకోండి,”

“ఎల్సీ! బ్రతుకు మీద తీపి లేకపోవడం అనారోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యం కుదుటపడితే బ్రతుకు మీద ఆశ దానంతటదే పుట్టుకొస్తుంది. అది సరే కాని, లేచి బట్టలు మార్చుకురా పో! ఇద్దరం అలా బయట తిరిగొద్దాం.”

పెద్దాయన ఎల్సీని బలవంతంగా బయట తిప్పడం మొదలు పెట్టాడు.

తర్వాత జేన్ డాక్టరు గారిని ఒంటరిగా కలిసి నిలదీసింది, ఆయన మాటల్లో నిజమెంతో చెప్పమని.

“నేను నిజమే చెప్తున్నా జేన్. మీ చెల్లాయికి వ్యాధి అంటూ యేమీ లేదు. కొంచెం అశ్రధ్ధా, ఒంటరితనం అంతే! అయితే నువ్వు మాత్రం ఆమెని ఎడిన్ బరో పంపే ప్రయత్నం చేయకు. ఎలాగైనా లండన్ లో నీ దగ్గరే వుండే ఏర్పాటు చేయి. ఆ కుట్టు షాపులో పని కంటే ఇంకొంచెం తేలికైన పని ఏదైనా దొరుకుతుందేమో చూడు! ”

“పనా! ఆ పని దొరకకే కదా ఇన్ని కష్టాలు. నాకు మీ అబ్బాయి స్టాన్లీ ఇంట్లో మంచి ఉద్యోగం దొరికింది. అలాటి ఉద్యోగం ఎల్సీ కి వచ్చే అవకాశం ఎంతుంది చెప్పండి?”

“మా అబ్బాయికి నీలాటి మంచి ఉద్యోగి దొరికే అవకాశం మాత్రం తక్కువ కాదూ? నువ్వేం భయపడకు. ఎల్సీ కొంచెం కోలుకున్నాక  తన కి లండన్ లోనే నీ దగ్గరే వుండేటట్టు ఏదో ఏర్పాటు నే చేస్తాగా?” అభయమిచ్చారు డాక్టరు గారు.

 

***

 

బ్రాండన్ ఎల్సీ నిరాకరణకి పెద్దగా నొచ్చుకున్నట్టో, ఆశాభంగం చెందినట్టో అనిపించలేదు. ఏ మాత్రం నిరాశ చెందకుండా ఆయన డాక్టరు ఫిలిప్స్ గారి చిన్న అమ్మాయీ, స్టాన్లీ చెల్లెలూ అయిన హేరియట్ ఫిలిప్స్ ని ఆకర్షించే ప్రయత్నం లో పడిపోయాడు. అంత త్వరగా మారిపోయే అతని మనసు చూసి ఎల్సీ కొంచెం ఆశ్చర్య పడింది కూడా. అయితే ఆమె ఆశ్చర్యం అతని మనసు మారినందుకు కాదేమో.

అతను తనని ప్రేమించానన్నాడు, పెళ్ళి చేసుకొమ్మనీ అడిగాడు. తను ఒద్దనగానే, హేరియట్ వెంట పడ్డాడు. అందులో పెద్ద వింతేమీ లేక పోవచ్చు. ఆమెకి వింతగా తోచిన విషయమేమిటంటే, తనని ప్రేమించానన్న మనిషి, రెండ్రోజుల్లోనే, తనకి మొత్తంగా విభిన్న ధృవం లాటి హేరియట్ ని ప్రేమించడం. పరస్పరం రెండు వ్యతిరేకమైన వ్యక్తిత్వాలని కొద్ది కాలం లోనే ప్రేమించడం ఎలా సాధ్యం, అనుకొందామె.

తన వెంట పడ్డ బ్రాండన్ ని చూసి హేరియట్ పెద్దగా మురిసిపోలేదు. అదేదో తన జన్మ హక్కుగా తీసుకొందామె. కన్నె మొహంలో దోబూచులాడే సిగ్గు దొంతరలూ, చిరు నవ్వులూ లేవు కానీ, ఒక గర్వంతో కూడిన దరహాసం మాత్రం ఆమె మొహం లో మెరిసేది, బ్రాండన్ తో మాట్లాడేటప్పుడు.

తన అభిప్రాయాలూ, ఆలొచనలూ అన్నీ నిర్భయంగా, నిర్మొహమాటంగా వెలిబుచ్చగలదామె. తన తెలివి తేటల మీదా, విఙ్ఞానం మీదా అపారమైన నమ్మకముంది ఆమెకి. తను బ్రాండన్ కంటే అన్ని విధాలా ఉన్నతమైన దానినని ఆమె భావం.

సంఘంలో హోదా, డబ్బూ, చదువూ, సంస్కారం, తెలివి తేటలూ, ఏ రకంగా చూసినా తాను బ్రాండన్ కంటే అన్ని విధాలా గొప్పది. బ్రాండన్ తో సహా మగవాళ్ళెవ్వరి నీతి నియమాల మీదా ఆమెకి నమ్మకం లేదు కాబట్టి, ఆ రకంగా నైనా తానే ఉన్నతురాలినని ఆమె విశ్వాసం.

దానికి తోడు బ్రాండన్ తన తెలివితక్కువతనాన్ని ఆమె ముందర అనేక సార్లు బయటపెట్టుకున్నాడు. తన గొప్ప తానెన్నడూ చాటుకోలేదు సరికదా, ఆమెకి చాలా నచ్చిన చర్చి ఫాదరు ప్రసంగం లో ఎన్నో తప్పులు పట్టుకున్నాడు. ఆస్ట్రేలియా ఎడారుల్లో తిరిగే అనాగరికుడికి విద్యాధికుడైన ఫాదరు ప్రసంగం అంత కంటే ఎక్కువ అర్థం కాదనుకుంది హేరియట్.

ఏదెలావున్నా, బ్రాండన్ అడిగితే పెళ్ళికొప్పుకోవాలనే అనుకుంది హేరియట్. ఎందుకంటే, అన్ని రకాలా తన కు సరిపోయే మగవాడెటూ కనిపించడు. అయినప్పుడు ఎవరో ఒకర్ని పెళ్ళాడడమే మంచిదనుకుంది.  బ్రాండన్ కి హేరియట్ పెద్దగా నచ్చలేదు కానీ, ఎవర్నో ఒకర్ని పెళ్ళాడి ఆస్ట్రేలియా తీసికెళ్ళాలని ఉంది అతనికి.

ఇలాటి పారిస్థితిలో ఎల్సీ,  స్టాన్లీ భార్య లిల్లీ దగ్గర పని మనిషిగా ఉద్యోగాని కొప్పుకుందని తెలిసి నివ్వెరపోయాడు.

 

పెద్ద కుటుంబం లోని ఆడవాళ్ళలా, కేవలం తన పన్లు మాత్రమే చూసే పని అమ్మాయిని పెట్టుకోవాలని లిల్లీ కెప్పణ్ణించో ఉబలాటంగా వుంది.  ఎల్సీకి బట్టల ఎంపికా, బట్టల నాణ్యతల గురించిన ఙ్ఞానమూ, రకరకాల గౌన్లు తయారు చేయడంలో వున్న నేర్పూ చూసి, ఎల్సీని తన పన్ల కోసం నియమించుకోవాలనుకుంది. దాంతో ఆ అమ్మాయికి సహాయపడినట్టు కూడ వుంటుంది, అనుకొంది.

“ఎలాగైనా పెద్దింటి స్త్రీలా చలామణి అవ్వాలని మా వదినకి ఆశ,” హేళనగా నవ్వుతూ అంది హేరియట్.

ఇంకో పని అమ్మాయికి జీతమా, అని కొంచెం వెనుకాడాడు స్టాన్లీ ఫిలిప్.

“ఇప్పుడు అంత అవసరమా!” అన్నాడు భార్యతో. ఎట్టకేలకు ఒప్పుకోక తప్పలేదతనికి. సాంఘికంగా పిల్లల బాగోగులు చూసే గవర్నెస్ కన్నా, అమ్మగారి బట్టలు వెతికి పెడుతూ, తల దువ్వే పని అమ్మాయి హోదా, జీతమూ చాలా తక్కువ. అయినా అక్కకి దగ్గరగా వుండొచ్చనే ఆశతో ఎల్సీ వెంటనే ఒప్పుకుంది.

జేన్ ఒక్కర్తే, ఎల్సీ లాటి నెమ్మదస్తురాలు, లిల్లీ గయ్యాళి తనంతో నెగ్గుకురాగలదా అని భయపడింది. పెగ్గీ తో చెప్తే, ఆమె కూడా,

“ఆలోచించుకోండి అమ్మాయిగారూ! ఇద్దరికిద్దరూ లిల్లీ మీద ఆధారపడటం మంచిది కాదేమో, మీకు చెప్పేంత దాన్ని కాదనుకోండి!” అన్నది.

ఎల్సీ ఆరోగ్యం కొంచెం కుదుటపడగానే, స్టాన్లీ కుటుంబమూ, జేన్, ఎల్సీ అందరూ కలిసి లండన్ తిరిగొచ్చేసారు. డాక్టరు గారూ, చిన్నబ్బాయి వివియన్ ఇల్లంతా బోసిపోయిందనీ, వాళ్ళ కబుర్లు వినే వాళ్ళేవరూ లేరనీ కొద్ది రోజులు బాధ పడ్డారు.

 

***

 

   ఫ్రాన్సిస్ కొచ్చిన లేఖ

 

లండన్ తిరిగొచ్చిన కొద్ది వారాల తర్వాత అనుకోకుండా ఫ్రాన్సిస్ కనబడ్డాడు జేన్ కి. జేన్ ని కలవడానికే లండన్ వచ్చానని చెప్పాడు.

“నిన్ను కలవడానికి ఎడిన్ బరో పెగ్గీ ఇంటికెళ్ళాను. మీరిద్దరూ ఇక్కడున్నారని చెప్పింది పెగ్గీ. తాతయ్య థామస్ లౌరీ చాలా జబ్బున పడ్డాడు. ఈ చలి కాలం స్కాట్ లాండు దుర్భరంగా వుంది. మీరిద్దరూ అక్కణ్ణించి వొచ్చేసి మంచి పని చేసారు జేన్! అన్నట్టు, ఎల్సీకి ఉద్యోగం బాగుందా?” అడిగాడు ఫ్రాన్సిస్.

“ఉద్యోగం పర్వాలేదులే! అయితే ఆమె ఆరోగ్యం మాత్రం చాలా బాగుపడింది. ”

“నువ్వు కూడా మునుపటికంటే ఇప్పుడు కొంచెం ఆరోగ్యంగా కనిపిస్తున్నావు జేన్.”

“అది సరే కానీ, ఫ్రాన్సిస్, నువ్వు అక్కడ ఎస్టేటులో తల పెట్టిన పన్లెలా వున్నాయి? తీరుబడి లేనట్టుంది. ఈ మధ్య నువ్వు ఉత్తరాలే సరిగ్గా రాయడం లేదు. రాసినవి కూడా ఒకటి రెండు వాక్యాలకంటే మించి ఉండడంలేదు.”

“తీరుబడి లేకపోవడమేముంది జేన్! ఏదో బధ్ధకం, అంతే!”

జేన్ కి ఉత్తరాలు క్లుప్తంగా రాయడానికి ఫ్రాన్సిస్ చాలా కష్టపడాల్సొస్తుంది, నిజానికి. ఆమె రాసే ఉత్తరాల నిండా ఉత్సాహమూ, ఆసక్తికరమైన స్నేహితుల విశేషాలూ, పిల్లల చదువులూ మొదలైనవి వుంటున్నాయి. అవి చూసినప్పుడల్లా అతనికి అనిర్వచనీయమైన నొప్పీ, తనకిక ఆమె దక్కదేమోనన్న నిరాశా కమ్ముకుంటున్నాయి. అదెక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఉత్తరాలు వీలైనంత క్లుప్తంగా రాసుతున్నాడు.

“అంత బాధ పడకు ఫ్రాన్సిస్. మగవాళ్ళకెవరికీ పెద్ద ఉత్తరాలు రాయడం చేత కాదట. గాలి పోగేసి కబుర్లతో పేజీలు నింపడం మా ఆడవాళ్ళకి మాత్రమే చేతనైన విద్య. అందుకే నేను రాసే ఉత్తరాలు పెద్దవి,” నవ్వుతూ అంది జేన్.

“అంతే కాదు! నువ్వు చుట్టూ వున్న మనుషులనీ, సంఘటనలనీ, చక్కగా ఆకళింపు చేసుకోగలవూ, వాటి  గురించీ ఆసక్తికరంగా రాయనూ గలవు. పైగా ఈ లండన్ మహా నగరం లో చాలా మంచి స్నేహితులని కూడా సంపాదించుకున్నావు. మన ఊళ్ళో ఏముంటయి విశేషాలు?”

“అవును ఫ్రాన్సిస్. నువ్వు లండన్ లో, నేను మన వూళ్ళో ఉంటే మన ఇద్దరి ఉత్తరాలూ ఇటుదటు అయేవన్నమాట! అది సరే, ఎలా వున్నారు మన వూరి జనం? అందరినీ కలిసావా?”

“కలిసాను.అందరికంటే నాకు మిస్ థాంసన్ బలే నచ్చింది. చాలా మంచిదావిడ. బలే కష్టపడి పని చేస్తుంది కదూ? ఆ మధ్య ఎడిన్ బరో లో డూన్ గారి దర్జీ దుకాణంలో ఎల్సీ కనిపించిందట కదా? ఎల్సీని చాలా మెచ్చుకుంది.”

“అయితే ఈ సంగతి మనం ఎల్సీతో చెప్పాలి. ఎప్పుడూ మొహం ముడుచుకుని నిరాశగా వుంటుంది.”

“అవన్నీ అలా వుంచు జేన్. నాకొక విచిత్రమైన ఉత్తరం వచ్చింది. ఈ ఉత్తరం చూపించడానికే వచ్చాను నేను.”

ఫ్రాన్సిస్ ఒక ఉత్తరం ఆమె చేతిలో పెట్టాడు. కుతూహలంగా ఉత్తరం చదవసాగింది జేన్.

( సశేషం)

గోవర్ణం

ravinder

Pasunoori Ravinder 1‘‘కట్టుబట్టల కోసమార నువ్‌ పట్నంలున్నది? సిగ్గుండాలె! నీకంటే చిన్నచిన్నోల్లు ఎంత ఎదిగిన్రు!  ఓ సర్కారీ నౌకర్‌ లేదాయే! ఇంత యిల్లుపొల్లు ఉన్నట్టన్న లేదాయే. మా బతుకేదో ఇట్లా బతుకుతున్నం. పదేండ్ల కిందట పట్నం పోతివి. ఏం సంపాదించనవ్‌ రా?! పెండ్లం పిల్లలతో కలిసి ఊరు మీద పడి తిరుగుడుకే సరిపోతున్నట్టున్నది నీ సంపాదన. థూ…నువ్‌ మారవురా!’’ తల్లి మాటలు మళ్లీ మళ్లీ యాదికొస్తున్నయి నగేష్‌కు.

తన తల్లి అలా ఫోన్‌లో గత మూడు నాలుగేండ్లుగా.. ఎప్పుడూ కాకపోయినా, అప్పుడప్పుడైనా తిడుతూనే ఉంది. నగేష్‌కు ఈ తిట్లన్ని తినీతినీ అలవాటైపోయినై.

కానీ, ఏం చేస్తడు? తిట్టినప్పుడల్లా తల్లికి ఎదురు చెప్పలేక, తల్లి చెప్పినట్టు నడుచుకోలేక తనలో తానే అంతర్మథనం చెందుతున్నాడు!

అయినా ఏ తల్లి అయినా బిడ్డల మేలుకోరే కదా తిడుతది! ఈ విషయం నగేష్‌కు కూడా తెలుసు! కానీ, పట్నంలో ఒక సొంతిల్లు ఉంటే తల్లికోపం చల్లారి శాంతిస్తదని తెలుసు తనకు. చూస్తుంటే భూముల రేట్లకు రెక్కలొస్తున్నయి! అందుకే ఇక ఆలస్యం చేయకుండా, అర్జంటుగా ఓ ఫ్లాటు కొనాలనుకున్నాడు. కొందాంలే, తీసుకుందాంలే అని ఇంతకాలం లైట్‌ తీసుకున్నాడు. కానీ, ఎప్పుడూ తిట్టే దానికన్నా ఇవాళ డోసు మరింత పెరిగిపోయే సరికి నగేష్‌కు పొద్దుపొద్దున్నే తిట్ల సుప్రభాతంతో నగేషుకు జ్ఞానోదయమైంది.  ఇక ఆగేదేలేదనుకున్నాడు. దాచుకున్న పైసలకు, కొంత బ్యాంక్‌ లోన్‌ తీసుకుంటే సరిపోతుందనుకున్నాడు. కానీ, ‘‘కట్టింది కొనడమా, లేక తన అభిరుచికి తగ్గట్టు సొంతంగా కట్టించుకోవడమా’’ అన్న మీమాంసతో ఇంతకాలంగా ఊగిసలాడుతున్నాడు. ఈ సంగతి తల్లికి చెప్పాలనుకున్నడు. కానీ, చెప్పే  టైమిస్తేనా…

అసలే ఇప్పుడు  హైదరాబాద్‌లో ఫ్లాటు కొనడమంటే మాటలా?! రియలెస్టేట్‌ బూమ్‌ పెరిగిన తర్వాత తనలాంటి మిడిల్‌ క్లాస్‌ సంసార జీవులకు, సొంతిల్లు కలలా కాదు, అరికాలులో ముల్లులా తయారైంది.

అందుకే చాలాసార్లు  ‘‘మనుషులకు  ఇల్లు అనే నాలుగుగోడల నరకం లేకుండా ఉంటే బాగుండు’’ అనుకున్నాడు నగేష్‌. ఇల్లు లేకుండా జీవించే సంచార జీవుల్లాగా మనుషులందరూ హాయిగా, ఊళ్లు తిరుగుతూ గడిపితే ఎంత బాగుండు. అయినా తిరగడంలోనే జ్ఞానమున్నదని ఎక్కడో చదివిన జ్ఞాపకం నగేష్‌కు. మనుషులందరూ అట్లా చెట్టు, పుట్టులు పట్టుకొని తిరుగుతుంటే ఈ రెంట్ల బాధలు, కరెంట్ల బాధలు ఎందుకుంటయి? ముఖ్యంగా తన తల్లితో ఇట్లా రోజూ తిట్లుపడే బాధ ఎందుకుంటది?!  సొంతింటి బాధ ఎక్కువైనప్పుడు ఓ పెగ్గుకొడితే గానీ నిద్రపట్టని పరిస్థితి నగేష్‌ది! తాగినప్పుడైతే ఇంటి గురించి నగేష్‌కు పూనకమే వస్తది! ‘‘అసలు భూముల రేటెందుకు పెరిగింది? రింగురోడ్డు ఎవడెయ్యమన్నడు? రియలెస్టేట్‌కు రెక్కలు ఎవడు తొడిగిండ్రా ఆఆఆఆఆఆ….’’అంటూ ఊగిపోతూ లోలోపల రగులుతున్న ఆవేదన్నంతా తన ‘గ్లాస్‌మేట్స్‌’తో పంచుకుంటాడు.

ఈ మధ్య తన ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలన్నా భయపడుతున్నాడు. నగేష్‌ ఉండే కాలనీలో  అపార్ట్‌మెంట్‌లు,  ఎండిపెండెంట్‌ హౌస్‌లు మొదలుకొని రోడ్డు పొడుగునా ఏ అందమైన బిల్డింగ్‌ కనపడినా ఇక తనకు మూడినట్టే!

‘‘అబ్బా ఈ బిల్డింగ్‌ చూడండి! ఎంత బాగుందో’’ అని భార్యంటే,

‘‘మనమూ ఇంత పెద్ద యిల్లు కట్టుకుందాం డాడీ’’ అని, పదంతస్థుల అపార్ట్‌మెంటును చూపిస్తూ తన కూతురు అనన్య అనే మాటలు విన్నప్పుడల్లా కారులోంచి దూకి పారిపోదామనుకుంటాడు నగేష్‌!.

భార్య, కూతురు గోల సరిపోనట్టు, ఇక తన ఆరేళ్ల ముద్దుల కొడుకు అన్వేష్‌ ఎక్కడ ఖాళీ ప్లేస్‌ కనిపిస్తే చాలు… ‘‘డాడీ ఈ ప్లేస్‌ సూపర్బ్‌ కదా, ఇక్కడే మనమొక ఇల్లు కట్టుకుంటే మస్తుంటది’’ అంటాడు. ఆ క్షణంలో నగేష్‌కు కొడుకులో ఒక కబ్జాకోరు కనిపిస్తాడు! ఎక్కడ ల్యాండ్‌ కనపడితే అక్కడ ఇండ్లు కట్టుకుంటూ పోవాలనే కోరిక చిన్నపిల్లలకు కూడా ఎలా అలవాటైందో తనకు ఎంతకూ అంతుపట్టదు. కాలమే అట్లున్నదని, లోలోపలే చిన్నగా నవ్వుకుంటాడు.

ఇట్లా ఇంటిపోరు తనకు కంటిమీద కునుకే కాదు, ఒంటిమీద సోయిని కూడా తగ్గిస్తున్నది. ఏం తింటున్నాడో, ఎంత తింటున్నాడో తెలుస్త లేదు. ఎలాగైనా సరే ఓ యిల్లు కొనుక్కోవడమో, కట్టుకోవడమో చెయ్యాలని బలంగానే అనుకున్నాడు. ఇక ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తెలిసిన వాళ్లని, ఫ్రెండ్స్‌ని, ఆఫీసులో తన బాసుల్ని అందరినీ వాకబు చేయడం మొదలుపెట్టాడు. తన ఫ్రెండ్స్‌, కొలిగ్స్‌ అయితే ‘‘పిల్ల పుట్టకముందే, కుల్లకుట్టినట్టు’’  ఫ్లాట్‌ కొనకముందే పార్టీలడుగుతున్నారు. నగేష్‌కు వాళ్ల గొంతెమ్మ కోర్కెలు వింటే, ఓవైపు ఒళ్లుమండినా చిరునవ్వుతోనే ‘‘సరే ష్యూర్‌’’ అంటూ సమాధానాలు చెప్తున్నాడు.

ఇలాంటి పరిస్థితుల నడుమ ఓ రోజు లంచ్‌టైమ్‌లో, ఆఫీసులున్న టీవీలో ఓ ప్రకటన కనిపించింది.

‘‘సులభ వాయిదా పద్దతిలో మీ సొంతింటి కలని నిజం చేసుకోండి. ఇవాళే మీ ఫ్లాట్‌ని బుక్‌ చేసుకోండి! గమనిక ముందుగా బుక్‌ చేసుకున్నవాళ్లకి ఒక గోల్డ్‌కాయిన్‌ కూడా ఫ్రీ, త్వరపడండి. మంచి అవకాశం మించినా దొరకద’’ని సినిమాస్టార్లు కూడా అందులో హొయలుపోతూ చెప్తున్నారు.

ఆ యాడ్‌ చూసి నగేష్‌, ఒక్కసారిగా బంపర్‌ ఆఫర్‌ దొరికిందనుకున్నాడు. పైగా తన భార్యకు  కూడా బంగారమంటే పీకల్లోతు పిచ్చి. ప్రతీనెల క్రమం తప్పకుండా బంగారం కొందామంటూ పోరుతూనే ఉంటది. సరే బంగారం ముచ్చట ఎలా ఉన్నా, ఒకసారి ఆ వెంచర్‌ చూసొద్దామనుకున్నాడు. వెంటనే తన ఫ్రెండ్‌ మురళికి కాల్‌ చేసి, ఇద్దరం వెళ్ళి రేపొకసారి వెళ్లి  ఆ వెంచర్‌ చూసొద్దామన్నాడు.

రాత్రి ఇంటికి చేరగానే కనీసం షూస్‌ కూడా విప్పక ముందే, సోఫాలో కూర్చొని తన భార్యకు టీవిలో కనిపించిన యాడ్‌కు సంబంధించిన వెంచర్‌ గురించి చెప్పాడు. నగేష్‌కు ఇది అలవాటే! ఆఫీసు నుండి వచ్చి రావడంతోటే ఆ రోజు జరిగిన సంగతులన్నీ భార్య సౌమ్యతో పంచుకుంటాడు. నవ్వుకునే విషయాలకు నవ్వుకొని, ఫీలయ్యే అంశాలకు ఫీలవుతూ షేరు చేసుకుంటారు! అసలే ఓ వైపు సౌమ్య కూడా అత్తపాటకు కోరస్‌ కలిపి ఇంటి గురించి పోరుతూనే ఉంది. అందుకే నగష్‌ ఫ్లాట్‌ కొనక ముందే కొన్నంత ఉత్సాహంతో సౌమ్యకు చెబుతున్నాడు! అన్నీ లైట్‌ తీసుకుంటారని తనపై నిందలేసే సౌమ్య ముందు తన శీలాన్ని నిరూపించుకునే పనిలో పడ్డాడు.  ‘‘ఇన్‌స్టాల్‌మెంట్‌ వీలు కూడా ఉంది తెలుసా?’’ అని ఉత్సాహంగా చెప్పాడు.

‘‘హమ్మయ్య పోన్లేండి,  ఇదైనా కన్‌ఫార్మ్‌ అయితే అంతే చాలు’’ అంది. ఫ్రెష్‌ అయిన తర్వాత భోజనం చేస్తున్నా మనసంతా వెంచర్‌ చుట్టే తిరుగుతోంది నగేష్‌కు. అన్ని  ఇంటి గురించే ఆలోచనలు. ‘‘కొంచెం మెయిన్‌ రోడ్డుకు దగ్గర ఉండేలా చూసుకుంటే మంచిది. యిల్లు మాత్రం మన టేస్టుకి తగ్గట్టు కట్టించుకోవాలబ్బా! వెంటిలేషన్‌   బాగా ఉండేలా చూసుకోవాలి. ఇంటిముందు లాన్‌లో రకరకాల పూలమొక్కలు పెంచుకోవాలి. ఇన్ని రోజులు ఈ కిరాయి కొంపల్లో ఏ చెట్లు పెంచుకుందామన్నా వీలే కాలేదు’’ అనుకున్నారు.

ముఖ్యంగా తన కొడుక్కి మామిడి చెట్లంటే ఎక్కడలేని ప్రేమ! వాడికి ఎండాకాలమంటే మామిడిపండ్లు తప్ప మరొకటి కాదు. అందుకే వాడికోసం మంచి రసాలూరే పళ్లనిచ్చే మాంచి మామిడిచెట్లు తెచ్చి నాటుకోవాలనుకున్నాడు. ఇక హాల్‌ విషయానికొస్తే కొంచెం విశాలంగా ఉండాలి. కనీసం ఓ పదిమంది ఫ్రెండ్స్‌ వచ్చినా కంపోర్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. గదిలో పెద్దపెద్ద అందమైన పెయింటింగ్స్‌ పెట్టుకోవాలనుకున్నాడు నగేష్‌. అంతేకాదు హాల్‌లో  అల్ట్రా మాడ్రన్‌ సోఫాసెట్‌ ఉంటే ఆ హుందాయే వేరనుకున్నాడు.

అలా బెడ్‌ మీద నడుంవాల్చాడో లేదో, నగేష్‌ భార్య సౌమ్య నెమ్మదిగా నోరువిప్పి…

‘‘ఏమండీ నాదొక చిన్నకోరిక! మీరు కోప్పడొద్దు మరి..’’ అని వరమడుగుతున్నట్టే అంది.

ఏంటన్నట్టు చూశాడు నగేష్‌.

‘‘ఏం లేదు. ఎలాగు మనం ఓపెన్‌ ఫ్లాట్‌ తీసుకోబోతున్నం కదా, యిల్లు కట్టించేటపుడు పైన రూఫ్‌గార్డెన్‌ ఉండేలా ప్లాన్‌ చేయాలండీ’’  అని కొంచెం సిగ్గుపడుతూ గారంగా చెప్పింది.

సౌమ్య కోరిక విన్న నగేష్‌కు ఆ క్షణంలో భార్యను చూస్తే ఫ్లాట్‌ కొనకముందే, పార్టీ అడిగిన ఫ్రెండ్స్‌లాగే కనిపించింది.  అసలే ఓ వైపు తన పరెషాన్‌ తనకున్నది. ఎన్ని లక్షలంటారో, దానికి జీహెచ్‌ఎంసీ లే అవుట్‌ ఉందో లేదో, డౌన్‌లోడ్‌ పేమెంట్‌ కింద ఎంత కట్టమంటారో అని ఏవేవో ఆలోచిస్తుంటే…రూఫ్‌గార్డెనట, రూఫ్‌గార్డెన్‌ అని లోలోపలే అనుకున్నాడు. కానీ, ఆ ఫీలింగ్‌ బయటికి కనిపించకుండా కవర్‌ చేసుకున్నాడు.

పడుకునే ముందు పంచాయితీలెందుకని ‘‘సరేలే చూద్దామన్నాడు’’.

 story picture

 

* * * * *

 

 

ఈలోపు ఆఫీసులో నగేష్‌ పోస్ట్‌ కంటే పై పోస్టుకు ప్రమోషన్‌ ఆఫర్‌ ముందుకొచ్చింది! దీంతో నగేష్‌ ఫ్లాట్‌ కలను మరికొన్ని రోజులకు పోస్ట్‌పోన్‌ చేసుకోక తప్పలేదు! జీవితమంటే ఇంతే. దేని ప్రియారిటీ దానిదే! ఇది తప్ప మరేది ముఖ్యం కాదనిపిస్తది! కానీ, అంతలోనే మరేదో అత్యవసరం దూసుకొని వస్తది. మనముందే నిలబడి తేల్చుకొమ్మని సవాల్‌ విసురుతయి పరిస్థితులు. ఇప్పుడు నగేష్‌కు కూడా ఈ పరిస్థితే ఎదురైంది.  కానీ, కార్పోరేట్‌ కంపెనీలో ప్రమోషన్‌ అంటే మాటలా?! సాలరీకి సాలరీ, హోదాకి హోదా కలిసిసొస్తయి కదా అనుకున్నాడేమో నగేష్‌. అందుకే ప్రమోషన్‌కు కావాల్సిన ఎక్సిపీరియెన్స్‌ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకున్నాడు. అసలే ఆ పోస్ట్‌కు తనతో పాటు ఓ పదిమంది వరకు కాంపిటేషన్‌లో ఉన్నారు! పైగా తన బ్యాక్‌గ్రౌండ్‌ వేరు! మిగిలిన సోషల్‌ స్టేటస్‌ వేరు! అందుకే లోపలెంత టెన్షన్‌ ఉన్నా  కాన్ఫిడెంట్‌గా  ఇంటర్వ్యూకి అటెండయ్యాడు నగేష్‌! ఇంటర్వ్యూస్‌ అయిపోయాయి, రిజల్ట్స్‌ రాకముందే కొలిగ్స్‌ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

‘‘ఖచ్చితంగా ప్రమోషన్‌ నీదే బాస్‌’’అంటున్నారు కొలిగ్స్‌.

కానీ, నగేష్‌కు అన్ని అర్హతలు ఉన్నా, ఉండాల్సిన మరో అదనపు అర్హతొకటి లేదు!  కొలిగ్స్‌ మాటలు ఎలా ఉన్నా, నగేష్‌కు మాత్రం ఏదో ఓ మూలన అనుమానం కలుగుతూనే ఉంది. పైగా ఇంటర్వ్యూ పానెల్‌ హెడ్‌ సుబ్రహ్మణ్యంకు తనపట్ల పెద్దగా సాఫ్ట్‌ కార్నర్‌ ఏమీలేదు! ఎంత డెడికేషన్‌తో పనిచేసినా నగేష్‌ను ఏనాడు పట్టించుకోలేదు!

అయినా కొలిగ్స్‌ ఊదరగొడుతున్న తీరుకు నగేష్‌లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

తరతరాల నుండి పుట్టెడు పేదరికం అనుభవించిన చీకటి గతం! లైఫ్‌లో కొత్త పొద్దుకోసం వెయ్యికళ్లతో ఎదురుచూపు. ఈ ప్రమోషన్‌ వస్తే ఇంటికల కూడా తీరిపోతుందనుకున్నాడు.

సరే రిజల్ట్స్‌ తెలిసేలోపు ఫ్లాట్‌ సంగతి పట్టించుకోవాలనుకున్నాడు! వెంచర్‌కు వెళ్ళొచ్చాడు!

వెహికిల్‌ స్టార్ట్‌ చేశాడు. ప్రపంచం ఇవాళ వింతగా కనిపిస్తోంది. వదిలిపోయిందనుకున్న చీకటినీడ తనను తరుముతూనే ఉంది. అయినా దాని ఉనికి నుండి తప్పించుకొని, రోజులు దాటిస్తున్నాడు నగేష్‌!

కానీ, ఈ రోజు అనుభవం తన గతాన్ని మరోసారి కళ్లముందుకు తెచ్చింది.

ఇందులో తన తప్పేంటి?

సాటి మనిషిలాగే తాను జీవించాలనుకోవడం తప్పా?!

కానీ, తనకే ఈ ప్రత్యేకమైన వలయాలు ఎందుకు అడ్డమొస్తున్నయో అర్థం కావడం లేదు!

ఆ వలయాన్ని దాటే కదా ఈ పట్నానికి వచ్చింది. కానీ, ఇంత పెద్ద సిటీలో కూడా మరోసారి తనని ఆ ముళ్ళకంచె గాయపరిచింది. కుదుట పడుతున్న జీవితంలో కొత్త అలజడి రేపింది.

మనసులో లక్షల ఆలోచనలు సుడులు తిరుగుతున్నయి. మనసంతా ఏదోలా ఉంది. అవమానభారంతో హృదయం అల్లాడుతోంది. ఔను ఆఫీసులో ఎన్ని లెక్చర్లు! సైన్స్‌ విత్‌ హ్యూమన్‌ ఫేస్‌ అంటూ ప్రజెంటేషన్‌లు. అయినా తనకు ఎదురైన ఈ పరిస్థితి ఏ టెక్నాలజి దూరం చేయగలదు. ఏ  శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు ఏ పరిష్కారం చూపగలవు. కాలం మారుతోంది. టెక్నాలజి కొత్తపుంతలు తొక్కుతోంది.

కానీ, మళ్లీ ఎక్కడికి పరుగులు తీస్తున్నట్టు?

ఇక తమకు విముక్తే లేదా? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఆలోచనలు గింగిర్లు కొడుతున్నాయి.

నగేష్‌ మనసు ఆత్మీయుల అంత్యక్రియలకు వెళ్ళొచ్చినట్టయ్యింది! ఏడ్చి ఏడ్చి నీరసించిన మనిషిలా ఇంటికి చేరుకున్నాడు నగేష్‌.

ఏ రూట్లోకెళ్లి వచ్చింది? ఎంత ట్రాఫిక్‌ని ఫేస్‌ చేసింది మరిచేపోయాడు.

మదినిండా ఆ అనుభవం తాలూకూ ఆలోచనలు అంతగా నిలిచిపోయాయి.

అప్పటికే సౌమ్య పిల్లల్ని పడుకోపెట్టి నగేష్‌ కోసం ఎదురుచూస్తోంది.

నగేష్‌ ముఖంలో ఏదో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది!

కళ్లు ఎర్రగా మారాయి. ప్రశాంత మనసు సముద్రంలో అకాల సునామేదో చెలరేగినట్టున్నడు.

ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంది. కానీ, డోర్‌ దగ్గరే అడగడం ఎందుకనుకుంది.

డిన్నర్‌ కూడా చేయకుండానే బెడ్‌ మీద నడుంవాల్చి కళ్లు మూసుకున్నాడు నగేష్‌.

ఏమైందని మెల్లగా కదిలించింది సౌమ్య.

‘‘ఏం చెప్పాలబ్బా?! మనమంటే మారుమూల గ్రామం నుండి వచ్చినం.

అక్కడంటే ఏదోలా బతికనం. అవమానాల్ని  గుండెకిందే దాచుకున్నం. కానీ, ఇక్కడైనా తలెత్తుకొని ఆత్మగౌరవంతో జీవిద్దామంటే వీలైత లేదు.’’ అన్నాడు నగేష్‌

సౌమ్యకు అయోమయంగా ఉంది. నగేష్‌ ఏం మాట్లాడుతున్నాడో, దేని గురించి ఇంతలా బాధపడుతున్నాడో అర్థం కాలేదు.

‘‘ఆఫీసులో ఏదైనా గొడవ జరిగిందా?!’’

‘‘గొడవేం లేదు’’

‘‘మరి ఏం జరిగింది’’

ఇద్ధరి మధ్య మాటలు కరువైతున్నయి. నగేష్‌కు అప్పటికే గొంతు పూడుకుపోయింది.

అయినా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతటి బాధనైనా, చిన్న చిన్న సంతోషాలనైనా తను ముందు చెప్పుకునేది సౌమ్యతోనే.

అలాంటిది ఇవాళ్టి ఆ అనుభవం సౌమ్యకు చెబితే బాధపడుతుందేమో అని కాసేపు మౌనంగా ఉండి పోయాడు. కానీ, భరించలేని బాధను మిత్రులతోటో, కుటుంబ సభ్యులతోటో పంచుకుంటేనే కదా, సగం బరువు దిగిపోయేది. పైగా ఇది మరెవ్వరికో చెప్పుకోలేడు! అయినా ఈ మహానగరంలో సౌమ్యకంటే ఆత్మీయులెవరు తనకు? అందుకే కష్టంగానైనా నోరువిప్పాడు.

‘‘మనం ఫ్లాట్‌ తీసుకుందామనుకున్న వెంచర్‌ ఆఫీసుకు వెళ్ళొచ్చాను సౌమ్య.

‘‘గోవర్ణధాత్రి’’ అని భారీ హోర్డింగ్‌లు పెట్టి ఉన్నాయి. చాలా పెద్ధ వెంచర్‌ కదా అని  లోలోపలే ఆనందపడ్డాను. వెహికల్‌ ఒక పక్కన పార్క్‌ చేసి, వెంచర్‌ లోపలికి వెళ్లాను.  ఆఫీసు అంతా సంప్రదాయబద్ధంగా ఉంది. ఆఫీసు బయట అన్నీ హిందూ దేవతల ఫోటోలే దర్శనమిచ్చాయి. ఏ ఫోటోలు ఉంటే, ఏముంది? మనకు కావాల్సింది ఫ్లాట్‌ అనుకొని ఆఫీసులో అడుగుపెట్టాను.

అగరొత్తుల ధూమం ఆలయానికి తక్కువ, ఆఫీసుకు ఎక్కువలా ఉంది!

నిలువుబొట్టు పెట్టుకున్న పెద్దాయన అద్ధాలు సవరించుకుంటూ కనిపించాడు. ఓ చిరునవ్వు చిందించి, ఆయన టేబుల్‌కి ముందున్న కుర్చీలో కూర్చున్నా. ఆఫీసులో ఎవరిపనిలో వారున్నారు.

పరిచయం చేసుకొని. ‘‘వెంచర్‌ డీటెయిల్స్‌ చెప్తారా ఒకసారి’’ అని అడిగాను.

నిలువుబొట్టు ఒక్కో విషయాన్ని పూసగుచ్చినట్టుగా వివరించింది.

‘‘ఒక్క మాటలో చెప్పాలంటే, ఇక్కడ ఫ్లాట్‌ కొనుక్కోవడం పూర్వజన్మ సుకృతం అనుకోండి!’’ అన్నాడు.

నిజంగా అంత బాగుంటుందా?! అయితే అమ్మ తిట్లకు ఇక తెరపడ్డట్టే అనుకున్న.

ముందు చెల్లించాల్సిన మొత్తంతో పాటు 18నెలల్లో చెల్లించాల్సిన మొత్తం అన్నీ లెక్కలేశాడు నిలువు బొట్టతను. నేను ఔనా అన్నట్టు చూస్తుండిపోయాను. వివరాలన్ని విని ‘‘హమ్మయ్య, ఇక ఇంటిబాధ తీరబోతుందని ఒక దీర్ఘశ్వాస తీసుకున్నా.

‘‘సరేనండీ రేపొకసారి మా ఆవిడతో పాటు వచ్చి స్పాట్‌ చూసి చేరుతామండీ’’ అని చెప్పిన.

‘ఓకే’ అన్నది నిలువుబొట్టు.

సరే అని ఇక రిటర్న్‌ అవుదామనుకున్న.

అంతలోనే నాకు వాళ్ల యాడ్‌లో ప్రకటించిన గోల్డ్‌ కాయిన్‌ విషయం గుర్తొంచింది.

‘‘మరిచేపోయాను గోల్డ్‌కాయిన్‌ విషయం చెప్పనే లేదు’’ అన్న ఓ చిరునవ్వుతో.

‘‘కాయినెక్కడికి పోతుందిగాని…మరో ముఖ్యమైన విషయం నగేష్‌ గారు..’’ అని సంశయిస్తున్నట్టే అన్నది నిలువుబొట్టు!

మళ్ళీ ఏం చెప్తాడోనని ‘చెప్పండి’ అని కుర్చీలోనుండి లేవబోయేవాణ్ణి ఆగిపోయాను!

‘‘ఏమీ లేదండీ. మీరు బ్రాహ్మలే కదా?’’ అని నిలువుబొట్టు అనుమానంగా అడిగింది.

అప్పటిదాకా నాలో ఉన్న ప్రశాంతత ఒక్కసారి చెరిగిపోయి, గాలిదుమారమేదో మొదలైనట్టనిపించింది.

నాకు కాసేపు మాటలు రాలేదు. ఆ ప్రశ్న అసందర్భంగా అనిపించింది.

అయినా నీకు తెలుసు కదా, కులం విషయంలో ఔట్‌రైట్‌గా మాట్లాడడమే యిష్టం నాకు.

కులాన్ని దాచిపెట్టి, దాని గుట్టును కాపాడడం నాకు ఎంతమాత్రం ఇష్టముండదు.

అందుకే వెంటనే ‘‘లేదండీ….మేం ఎస్సీలం’’ అని సమాధానం చెప్పిన.

ఆ సమాధానానికి నిలువుబొట్టు ముఖం చిట్లించుకున్నది!

‘‘సారీ అండీ… ఈ గోవర్ణధాత్రి వెంచర్‌లో ‘‘కేవలం బ్రాహ్మణులకు మాత్రమే’’ ఫ్లాట్లు అమ్ముతున్నాం. అదర్‌ కమ్యూనిటీస్‌ వాళ్లకు కాదండీ!’’ అన్నది నిలువుబొట్టు!

నాకు ఒక్కసారిగా షాక్‌ అనిపించింది.

సిటీల్లో కూడా కులముంటదని ఇల్లు కిరాయికి వెతుకుతున్నప్పుడే అనుభవం అయ్యింది.

కానీ, అది ఇంత వెర్రిపోకడ పోతుందని ఇన్ని రోజులు తెలియలేదు.

ఇలా బిజినెస్‌లల్లో కూడా ఒక కులానికే ఫ్లాట్లమ్ముతున్నారని ఇవాళే తెలిసొచ్చింది. ఆ వెంచర్‌ మీదే కాదు, మొత్తం క్యాస్ట్‌ సిస్టమ్‌ మీద నాకు ఉమ్మేయాలనిపించింది. ఇట్లా సపరేటుగా ‘‘అగ్రహార అపార్ట్‌మెంట్‌లు’’ కట్టి, కులాన్ని మరింత పెంచి పోషించడం దారుణం అనిపించింది. మనం ఎటు పయనం చేస్తున్నం? 21వ శతాబ్దమేనా ఇది? సిటీ అంతా కులాల బేస్‌డ్‌గా కాలనీలు ఏర్పడితే, ఇంకేమైనా ఉందా?! అనిపించింది.

అంటే మనలాంటి కిందికులాలను మళ్లీ ఊరవతలో, సిటీ అవుట్‌ స్కట్స్‌కో పరిమితం చేయడానికి గోవర్ణధాత్రి  వెంచర్‌ల రూపంలో ‘‘మనువు మరోసారి పుట్టాడని’’ అర్థం అయ్యింది.

రక్తం సలసల ఉడికిపోయింది. ఊపిరి వేగం పెరిగింది…అందుకే నిలువుబొట్టును  నిలదీయకుండా ఉండలేకపోయిన.

‘‘బ్రాహ్మలకు కాకుండా వేరే కులాలకు ఫ్లాట్లు అమ్మం అని మీరు ముందే చెప్పాలి కదా!  మీ ప్రకటనలో ఉండాలి. లేకుంటే ఇక్కడికి వచ్చినవాళ్లనైనా మొదటే ఆ  ప్రశ్న అడగాలి. పూర్వజన్మ సుకృతమని. . తొక్కాతోలు అని పనికిరాని మాటలన్ని చెప్పి, ఇట్లా మోసంచేయడమెందుకు? అయినా ఒక్క కులం వాళ్లకే అమ్మడం ఏంటండీ దారుణం కాకపోతే..’’అని చెడామడా తిట్టిన.

నిలువుబొట్టు మాత్రం ఇదంతా రోజూ జరిగేదే అన్నట్టు, చప్పుడు చేయకుండా తేలుకుట్టిన దొంగలా  కూర్చుంది కాసేపు. ‘‘మమ్మల్నేం చెయ్యమంటారండీ మా మేనేజ్‌మెంట్‌ ఎట్లా చెప్పితే, అలాగే కదా చెప్పాలి మేం’’ అన్నది నిలువుబొట్టు. దాంతో నాకు మరింత కోపమొచ్చింది. ‘‘మీ మేనేజ్‌మెంట్‌కే చెప్పండి, కార్పోరేట్‌ కాలంలో కూడా కులాన్ని పట్టుకొని వేళాడాలనుకుంటే వేళాడమనండీ. కానీ, అనవసరంగా మిగిలిన కులాలవాళ్లు  ఇక్కడిదాకా వచ్చే విధంగా రాంగ్‌ డైరక్షన్‌ ఇవ్వకండి! ఛీ ఇంతకంటే అనాగరికం మరొకటి లేదు’’ అని బయటికొచ్చిన.

ఇలా నగేష్‌ తనలో రగులుతున్న బాధనంతా ఆవేదనతో చెబుతుంటే సౌమ్య కూడా విస్తుపోయింది.

ఇద్ధరూ కాసేపు సైలెంట్‌ అయిపోయారు.

సౌమ్య నిశ్చేష్టురాలైంది.

పిల్లల వైపు చూసి, రేపు వీళ్లు కూడా ఎన్నిసార్లు ఇలా కుల అవమానాలు పడాలో అని ఆలోచనలో పడ్డది. ఐదో క్లాస్‌ చదువుతున్న తన కూతురు మొన్న ఈ మధ్యే  ‘‘మన కాస్ట్‌ ఏంటిమమ్మి? అసలు కాస్ట్‌ అంటే ఏంటి మమ్మి’’ అని అడిగింది.

ఎందుకురా అంటే, స్కూళ్లో మా టీచర్‌ ఒకాయన అడిగారు , అలాగే క్లాస్‌మెట్స్‌ అడుగుతున్నారు మమ్మీ అంది!

మళ్ళీ నగేష్‌ చెప్తున్నాడు.

గోవర్ణధాత్రి వెంచర్‌లో జరిగిన ఈ అవమానం చాలనట్టు, ఆఫీసులో ప్రమోషన్‌ కూడా, పేరు చివర తోకలున్న వాడికే ఇచ్చారట! మురళి కాల్‌ చేసి చెప్పాడు’’ అని కళ్లు మూసుకున్నాడు నగేష్‌.

కాలం మారింది కదా అనుకుంటే పొరపాటే!

పరాయి గ్రహాలకు వెళ్లడం కాదు, మనుషులు మళ్లీ మధ్యయుగాలకు ప్రయానిస్తున్నట్టుగా అనిపించింది!!

కులం పోయిందని, కులం లేదని మూర్ఖంగా వాదించే వాళ్లను, ఈ ‘‘గోవర్ణధాత్రి వెంచర్‌’’కు తీసుకొచ్చి రుజువు చేయాలనుకున్నాడు నగేష్‌.

డా.పసునూరి రవీందర్‌

 చిత్రరచన: బంగారు బ్రహ్మం,అక్బర్ 

రియలిజం నుంచి వర్చువల్ రియలిజంకి…!

మీ చేతుల్లో ఉన్న మూడు కథలకీ ఒక ప్రత్యేకత ఉంది. ఇవి ఫోను కథలు. అది కూడా మొబైలు ఫోను. ఒక విధంగా చెప్పాలంటే ఇవి సాహిత్యాన్ని రియలిజం నుంచి వర్చువల్ రియలిజంకి తీసుకువెళ్తున్నాయని కూడా చెప్పవచ్చు. అంతేనా? అంత మాత్రమే అయితే వీటి గురించి మాట్లాడడానికి నాకేమంత ఉత్సాహముండేది కాదు. పైకి పూర్తిగా ఇప్పటి కథల్లా కనిపిస్తున్నప్పటికీ, వీటిలో కాలానికి అతీతమైన కొన్ని మూల్యాల ప్రతిపాదన వుందనిపించింది. అదేమిటో నాకు నేను అర్థం చేసుకునే ప్రయత్నంలోంచే ఈ నాలుగు మాటలూ.

2
స్కైబాబ గురించి నాకట్టే తెలియదు. ఆయన రచనలు కూడా నేనేమంత పెద్దగా చదవలేదు. ఈ కథలు చదవమని ఇచ్చినప్పుడు ఆయన తక్కిన రచనలు కూడా ఇమ్మని అడిగాను. ‘జగనే కీ రాత్: ముస్లిం కవిత్వం’ (2005), ‘అధూరె: ముస్లిం కథలు’ (2011)తో పాటు అతడు సంకలనం చేసిన ‘వతన్ : ముస్లిం కథలు’ (2004) పుస్తకాలు ఇచ్చాడు. అతడి కవిత్వం, కథలతో పాటు వాటిమీద నేటికాలపు తెలుగు కవులూ, రచయితలూ, విమర్శకులూ రాసిన అభిప్రాయాలన్నీ చదివాను. ముఖ్యంగా వతన్ సంకలనానికి రాసిన విపులమైన సంపాదకీయం కూడా చదివాను. ఇవన్నీ ఆయన ఆవేదననూ, అభిప్రాయాల్నీ చాలా సూటిగా వివరిస్తున్నవే. అయితే ఈ సంకలనంలో ఉన్న మూడు కథల్నీ అర్థం చేసుకోవడానికి ఇవేవీ నాకు చాలవనిపించింది.
నాకు స్కైబాబ గురించి మరింత తెలుసుకోవాలనిపించింది. జగనే కీ రాత్ సంపుటిలో ఖదీర్‌బాబు రాసిన ఒక వ్యాసముంది. అందులో ఖదీర్ ఇలా రాసాడు:
”స్కైబాబది నల్గొండ. అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే కేశరాజుపల్లి. దారుణమైన పేదరికం. ఏదైనా పని చేసి ఇంటికి సాయపడదామనుకుని స్నేహితుడితో కలిసి బట్టల వ్యాపారం చేసాడు. కిరాయి సైకిళ్లు తిప్పాడు. సోడాలు కొట్టాడు. పీర్‌లెస్ ఏజెంట్ అయ్యాడు. అద్దె పుస్తకాల షాపు నడిపాడు. పాన్‌లు కట్టాడు… ఎక్కడా ఆదాయం రాలేదు. పైగా ఎదురు నష్టం, అప్పులోళ్ళకు మొఖం చూపించలేక దాక్కుని తిరగడం, ఇంటికెళ్ళడానికి మొఖం చెల్లకపోవడం.
ఈ పేదరికం కంటే కూడా స్కైబాబను ఎక్కువ బేచైనీకి గురి చేసింది తమ ఇళ్ళల్లో ఉండే ఆడబిడ్డలు. వీళ్ళందరూ చదువుల్లేక జ్ఞానం లేక తినడానికి తిండి లేక చేయడానికి కుదురైన పనిలేక పెళ్ళిళ్ళు లేక ఈసురోమంటూ ఉండేవాళ్ళు. వాళ్ళను చూసే కొద్దీ స్కైబాబలో దుఃఖం సుడి తిరిగేది. దానిని బలంగా వ్యక్త పరచాలని అనిపించేది..”
ఈ నేపథ్యం స్కైబాబమీద నాకెంతో గౌరవాన్ని కలగచేసింది. ఇటువంటి నేపథ్యాలు ఎంతోమందికి ఉన్నా అందరూ రచయితలు కాలేరు. కొద్దిమంది మాత్రమే గోర్కీలూ, భరద్వాజలూ, స్కైబాబలూ కాగలుగుతారు.
ఇటువంటి నేపథ్యం ఉన్న రచయిత రాసిన కథలు కావడంతో ఈ మూడు కథలూ నాకెంతో విలువైన కథలనిపించాయి. ఆ విలువ కేవలం సాహిత్య విలువ కాదు, లేదా అతడి కథలమీదా, కవిత్వం మీదా అభిప్రాయాలు రాసిన రచయితలు భావిస్తున్నట్టుగా సమకాలీన ముస్లిం జీవిత సందర్భాన్ని చిత్రించడంలోని వాస్తవికత వల్ల మాత్రమే కాదు.
అసలు ఏ రచయిత అయినా తనకు తెలిసిందీ, తన అనుభవంలోకి వచ్చిందీ రాసినప్పుడు మాత్రమే విశ్వసనీయంగా ఉంటాడు. అది రచయిత ప్రాథమిక కర్తవ్యం. కాబట్టి అటువంటి వాస్తవికతకి నేనెటువంటి అదనపు విలువనూ ఆపాదించలేను. మన సమాజంలో అల్పసంఖ్యాకులుగా, బీదరికంలో, సామాజికంగా అప్రధానీకరణకు లోనవుతున్న తెలుగు ముస్లిం జీవితాల్ని ఆ సమాజం నుంచే వచ్చిన ఒక రచయిత స్వానుభవంతో చిత్రించడం మనం రెండు చేతుల్తోనూ స్వాగతించదగ్గ విషయమే కానీ, ఆ ఒక్క కారణం వల్లనే ఆ సాహిత్యం ప్రీతిపాత్రం కానేరదు.
రచయిత ఏదైనా చెప్పనివ్వు. ఏదైనా చిత్రించనివ్వు. కాని ఒక కథ వార్తా కథన స్థాయిని దాటి సాహిత్య స్థాయిని అందుకోవడానికి నిలబడవలసిన ప్రమాణాలు వేరే ఉన్నాయి. ఆ ప్రమాణాల్లో అందరూ మాట్లాడేది శిల్పం గురించి. శిల్పమంటే, ఒక కథలో ఉండే వివిధ అంశాలు ఒకదానికొకటి ఎంత సౌష్టవంగా అమరాయన్నది. సాంకేతికంగా ఆ కథ ఎంత శక్తివంతంగా ఉందనేది. నిస్సందేహంగా తక్కిన కథల్నుంచి గొప్ప కథకుల్ని వేరు చేసేది, ఈ శిల్ప సామర్థ్యమే, సందేహం లేదు. కాని గొప్ప కథలన్నీ మనల్ని ముగ్ధుల్ని చేయాలని లేదు. మంచి కథలన్నీ మనని వెంటాడే కథలు కాలేవు. ఒక కథ మనల్ని మరీ మరీ మరీ వెన్నాడుతోందంటే అందులో ఏముందన్నట్టు?
ఒక కథ మనల్ని వెంటాడుతోందంటే, ఆ కథ చదివినప్పుడు మనలో ఏదో జరిగినట్టు. అది మనలో ఏదో సున్నితమైన రసాయనాల్ని విడుదల చేస్తుంది. దాన్నే జాయిస్ ‘ఎపిఫనీ’ అన్నాడు. ఎపిఫనీ యథార్థానికి మతపరమైన, ఆధ్యాత్మికమైన అర్థంలో వాడబడే పదం. దానికి జాయిస్ ఒక లౌకిక, సాహిత్యార్థాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాడు. ‘..అది మనిషిలో అకస్మాత్తుగా సంభవించే ఆత్మిక పరివర్తన’ అన్నాడతడు.
మరో విధంగా చెప్పాలంటే దాన్ని సాక్షాత్కారం అనవచ్చు. మానవ సంబంధాల్లోనో, జీవిత గమనంలోనో ఒక సంఘటన లేదా ఒక సంభాషణ మనల్ని అకస్మాత్తుగా జీవిత మూలాలకు చేరువగా తీసుకుపోతుంది. దాన్నే జాయిస్ The whatness of a thing  అన్నాడు. అతడిట్లా రాసాడు:
This is the moment which I call epiphany.. when the relation of the parts (of an art object) is exquisite…its soul, its whatness leaps to us from the vestment of its appearance. The soul of the commonest object, the structure of which is so adjusted, seems to us radiant. The object achieves its epiphany.
ek kahaani ke theen rang
స్కైబాబ మనముందుంచిన మూడు కథల్లోనూ ఇటువంటి ఎపిఫనీనే మనం పొందుతున్నామని అర్థమవుతుంది. ‘మౌసమీ’ లో కథకుడు ఆఫ్రీన్‌ను చూసినప్పుడూ ‘జమీలా’ లో జమీలా కథకుడితో తన జీవితం మళ్ళా చిగురిస్తోందని చెప్పినప్పుడూ, ‘మిస్ వహీదా’లో వహీదా కూతురు ఫొటోలో ఉన్నామె తన తల్లి వహీదా అని చెప్పినప్పుడూ కథకుడు ఏ సాక్షాత్కారానికి లోనయ్యాడో ఆ సాక్షాత్కారానికి మనం కూడా లోనవుతాం.
కథల్లో ప్రధానంగా ఉండవలసింది ఇది. తక్కిన ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల గురించిన చర్చ, ఆవేదన కథకి అదనపు బలాన్నివ్వగలవు తప్ప నేరుగా మనలో అటువంటి హృదయ పరివర్తనను తేలేవు.
3
ఇక అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పవలసిన విషయమొకటి ఉంది. అది ఈ కథల్లో కనవచ్చే ఆదర్శలక్షణం. ఈ కథలు చదవగానే నాకు వెంటనే ప్రేమ్‌చంద్ రాసిన ‘సాల్ట్ ఇన్సపెక్టర్’ (1910) గుర్తొచ్చింది. దుర్భరమైన జీవిత వాస్తవం ఎదట దాన్ని ఉన్నదున్నట్టుగా చిత్రించవలసిన బాధ్యత తెలిసినవాడై కూడా ప్రేమ్‌చంద్ ఆ కథని ఎంతో ఆదర్శవంతంగా ముగించాడు. ఎందుకని? బహుశా అది రచయిత జీవస్వభావం వల్ల అనుకోవలసి ఉంటుంది. మానవుడి పట్ల అపారమైన ప్రేమ, దయ ఉన్నందుకు వాళ్ళు ఆ కథల్ని మరోలా రాయలేదు.
గోర్కీ రాసిన ‘ఇరవయ్యారు మంది పనివాళ్ళూ, ఒక స్త్రీ’ (1899) కథ చూడండి, అది భయంకరమైన జీవిత వాస్తవం మనుషుల్నెట్లా మృగాలుగా మారుస్తుందో చెప్పిన కథ. కాని ప్రేమ్‌చంద్ అట్లా రాయలేకపోయాడు. ఎందుకని? గోర్కీకి మనుషుల పట్ల ప్రేమ, దయ తక్కువేమీ కాదే! నేనేమనుకుంటానంటే, గోర్కీ వ్యక్తుల్ని ద్వేషించకుండా వ్యవస్థని ద్వేషిండమెట్లానో నేర్చుకున్నాడు. ప్రేమ్‌చంద్ వ్యక్తుల్ని ద్వేషించలేక పోతున్నాడు కాబట్టి వ్యవస్థను సంస్కరించడమెట్లా అని ఆలోచిస్తున్నాడు.
ఈ కథల్లో స్కైబాబ చేసింది కూడా ఇదే. ఇప్పటి సమాజంలో మొబైల్ ఫోను మనుషుల్లోని అతృప్త ఆకాంక్షలను చల్లార్చే ఒక కన్స్యూమరిస్టు సాధనం. కాని చాలామందికి అది విముక్తి సాధనం కూడా. అది నువ్వున్నచోటే, నీ పరిమితుల్ని దాటి విశాల ప్రపంచంతో కనెక్ట్ కాగలిగే అవకాశాన్నిస్తుంది. అటువంటి అవకాశాల్లో రిస్క్ కూడా ఉంటుంది. మౌసమీ, జమీలా, వహీదాలతో మాట్లాడే అవకాశం దొరికిన ప్రతి ఒక్కరూ ఈ కథల్లో కథకుడు ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తారన్న హామీ ఏమీ లేదు. కాని కథకుడు ఆయా అభాగ్య స్త్రీల పట్ల తన ప్రవర్తనలో అపారమైన ఆదర్శభావాన్ని చూపడమే ఈ కథల్లోని అత్యంత విలువైన అంశం. శతాబ్దం కిందట ప్రేమ్‌చంద్ కనపరచిన ఆదర్శవాదమే ఇప్పటి సమాజంలో ఎదట కూడా కథకుడు కనపర్చడం నన్నెంతో విస్మయపరిచిన మాట నిజమే కాని అంతకన్నా ఎక్కువ సంతోషమే కలిగించిందనాలి.
                                    వాడ్రేవు చినవీరభద్రుడు

వైవిధ్యానికి ప్రతిబింబం శారద ” నీలాంబరి ” కథలు !

Neelambari Cover

నాకు ముందుమాటలు రాసే అలవాటు లేదు. ఇదివరకోసారి రాసేను కానీ ప్రచురణకర్తలు అంగీకరించ లేదు  దాన్ని (చిత్రంగా ఉంది కానీ ఇలా కూడా జరగగలదని నాక్కూడా అప్పుడే తెలిసింది!). అంచేత, శారద నన్ను ముందుమాట రాయమని అడిగినప్పుడు నేను సంకోచించాల్సివచ్చింది. కానీ శారద తప్పకుండా రాయమని మరీ మరీ అడగడంతో ఒప్పుకోక తప్పలేదు.

శారదతో నాపరిచయం నాసైటు www.thulika.net ద్వారానే. గత ఐదారేళ్ళలో దాదాపు పదికథలవరకూ అనువాదం చేసి ఇచ్చేరు. ఆమె నా సైటుధ్యేయం శ్రద్ధగా పరిశీలించి తదనుగుణంగా కథలు ఎంపిక చేసి. అనువాదం చెయ్యడం, అవి కూడా అనువాదాలవిషయంలో నా అభిప్రాయాలకి సానుకూలంగా ఉండడంచేత నాకు శారదయందు ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది. అంచేత ఈ ముందుమాట రాయడానికి అంగీకరించేను.

ఆ తరవాత ఈ ముందుమాట రాయడానికి కూర్చుంటే, సంకలనాలపుట్టుక గురించిన ఆలోచనలు కలిగేయి. అసలు సంకలనాలు ఎందుకు వేస్తారు, అవి ప్రత్యేకంగా సాధించే ప్రయోజనం ఏమిటి అని.

మన దేశంలో ముద్రణాలయాలు 1675లో వచ్చినా, దక్షిణానికి ఆ యంత్రాలు 1711లో వచ్చేయి. మొదట్లో ప్రచురించినవి ఎక్కువగా క్రైస్తవ మతప్రచారానికే. రెండవదశలో తెలుగు సాహిత్యాభిలాషులు తెలుగుసాహిత్యానికి ప్రాధాన్యతని ఇస్తూ పత్రికలు ప్రచురించడం మొదలు పెట్టేరు. గోదావరి విద్యాప్రబోధిని (1800కి పూర్వం), మితవాది 1818లో వచ్చాయి. సుజనరంజని (1862-1867), పురుషార్థప్రదాయిని (1872-1878) లాటి పత్రికలతో పాటు  వీరేశలింగంగారి వివేకవర్ధిని (1874-1885), కొక్కొండ వెంకటరత్నం పంతులుగారి ఆంధ్రభాషా సంజీవని (1871-1892; 1892-1900) లాటి పత్రికలు పుట్టేయి. (సమగ్రాంధ్ర సాహిత్యం. సం. 2. పు. 620-621, తెలుగు ఎకాడమీ ప్రచురణ). ఆరుద్ర సమకూర్చిన పట్టికలో 102 పత్రికలపేర్లు ఉన్నాయి. వాటిలో భారతి, గృహలక్ష్మి, ఆంధ్రపత్రికలాటి ఏ నాలుగయిదు పత్రికలో తప్పిస్తే, పైన ఇచ్చినతేదీలు కాక, మిగతాని పదేళ్ళపాటైనా మనలేదు. ఈ పత్రికలలో సమకాలీన సామాజికసమస్యలూ, సాహిత్యచర్చలూ విరివిగా జరిగేయి. వాటితోపాటు ప్రతి సంచికలోనూ ఒకటో రెండో కథలు కూడా ప్రచురించేరు. కానీ ఈ పత్రికలేవీ అట్టే కాలం నిలవకపోవడంతో, బహుశా ఆ యా రచయితలో సాహిత్య శ్రేయోభిలాషులో ఆ కథలని సంకలనాలుగా ప్రచురిస్తే, భావితరాలకి అందుబాటులో ఉంటాయన్న అభిప్రాయంతో సంకలనాలు ప్రచురించడం మొదలు పెట్టినట్టు నాకు తోస్తోంది. నేనిలా అనుకోడానికి ప్రమాణాలేమీ లేవు. నాకు చూడడానికి అట్టే పుస్తకాలు దొరికే అవకాశం లేదు కనక నేను ఈవిషయం ఇతర పరిశోధకులకి వదిలేస్తున్నాను.

ఈరోజుల్లో ఆధునికకథలు అనిపించుకుంటున్న కథలు సంకలనాలుగా 20వ శతాబ్దం ప్రథమపాదంలోనే వచ్చేయి. అప్పట్లో పత్రికలప్రచురణ బాగానే అభివృద్ధి చెందినా, చాలా పత్రికలు పుబ్బలో పుట్టి మఖలో మాడిపోడంతో రచయితలు తమ కథలని సంకలనాలుగా ప్రచురించడం మొదలెట్టి ఉండొచ్చు. ఆ తరవాత వేరు వేరు రచయితలకథలతో సంకలనాలు వచ్చేయి.

మనం స్మరించుకోవలసిన మరొక విభాగం జానపదసాహిత్యం. మనకి ఆనోటా ఆనోటా చెప్పుకుంటున్న జానపదసాహిత్యం చాలా ఉంది. అయితే ఈ చెప్పుకోడంలో పరిధి చాలా తక్కువ. ఇంట్లోవాళ్లూ, ఇరుగూ పొరుగూ, ఇంటికొచ్చినవాళ్ళూ – వీళ్లే ఆ చెప్పుకునే కథలకి శ్రోతలు. ఇది గమనించిన సాహిత్యాభిమానులు ముద్రణాలయాలొచ్చేక కథలని అచ్చొత్తించి భావితరాలకి అందించాలనే కోరికతో ఆ కథలని సేకరించి ప్రచురించడం ప్రారంభించేరు.  “కుంఫిణీయుగంలో పాతకథలకి కొత్త గిరాకీ వచ్చిందం”న్నారు ఆరుద్ర (సమగ్రాంధ్ర సాహిత్యం 2. 47). 1819లో రావిపాటి గురుమూర్తి విక్రమార్కునికథలు సంకనలంగా ప్రచురించేరని ఆరుద్ర సమగ్రాంధ్రసాహిత్యంలో రాసేరు. (2. 268). 1830 మేలో ఏనుగు వీరాస్వామి కాశీయాత్రకి బయల్దేరి, దారిలో తాను చూసిన వింతలూ, విశేషాలూ …కి ఉత్తరాలలో రాసేరుట. … గారు వాటిని ఆ తరవాత ప్రచురించేరు. ఇది కథ కాదు కానీ కేవలం పుస్తకాలు అచ్చేయడంలో మనవారికి గల ఆసక్తి తెలియజేయడానికి చెప్పేను. కథలమాటకొస్తే, పంచతంత్రం 1834లో, పాటూరి రామస్వామి శాస్త్రులుగారి శుకసప్తతికథలు 1840లో ప్రచురించేరు (కె.కె. రంగనాథాచార్యులు. తొలినాటి తెలుగు కథానికలు. 1840 చాలా ప్రాముఖ్యత గల సంవత్సరం అంటారు ఆరుద్ర (స.సా. 2. 55). తెలుగు సాహిత్యంలో విస్తృతంగా ప్రచురణ మొదలయిందప్పుడే కాబోలు. ఈ సంకలనాల్లో మనం ప్రత్యేకంగా గమనించవలసింది ఏకసూత్రత. అన్నీ జానపదసాహిత్యంలో అంటే నోటిమాటగా చెప్పుకుంటున్న కథలే అయినా, సంకలనాలుగా ప్రచురించినప్పుడు “మాకిష్టం అయినకథలు” అని గాక, ఒక నిబద్ధత పాటించేరు. భట్టి విక్రమార్కుడి కథలలో చిక్కు ప్రశ్నలు, శుకసప్తతికథల్లో శృంగారం, నీతి, తెనాలి రామలింగడికథల్లో హాస్యం, చమత్కారం, కాశీమజిలీకథల్లో దారిపొడునా ఊరూరా ఆ గురుశిష్యులు గమనించిన వింతలు, విశేషాలు – ఇలా ఏకసూత్రత కనిపిస్తుంది.

ఆతరవాత అంటే 1910 దాటేక, ఒక రచయిత తాను ఎంచుకున్న కథలు, కానీ ఒకే రచయిత కథలు గానీ ప్రచురించడం మొదలయింది. కె.కె. రంగనాథాచార్యులు గారి తొలినాటి తెలుగు కథానికలు పుస్తకంలో మొత్తం 15 సంకలనాలు 1917 నించి 1928మధ్య ప్రచురించినట్టు ఉంది. వీరిలో మనకి ఇప్పుడు తెలిసినవారు పానుగంటి లక్ష్మీనరసింహారావు – సువర్ణలేఖా కథావళి (తేదీ లేదు), మాడపాటి హనుమంతరావు – మల్లికాగుచ్ఛము (1915), పానుగంటి లక్ష్మీనరసింహారావు – కథాలహరి (1917), గుడిపాటి వెంకట చలం – కన్నీటికాలువ, మునిమాణిక్యం నరసింహారావు – కాంతం కథలు, గురజాడ అప్పారావు – ముత్యాలసరాలు చిన్నకథలు, వీటితోపాటు మరుగున పడిపోయిన రచయితలు – వెదురుమూడి శేషగిరిరావు – మదరాసు కథలు (1911?), రాయసం వెంకటశివుడు – చిత్రకథామంజరి (1924), పోదూరు రామచంద్రరావు – కథావళి (1928) లాటి పేర్లు కూడా కనిపించేయి. (పు. 28-29). ఈ సంకలనాలలో ఏవి ఒకే రచయిత కథలు, ఏవి వివిధరచయితలో కథలు అన్నది రచయిత స్పష్టం చేయలేదు. నామటుకు నాకు రెండు రకాలూ అయి ఉండవచ్చని తోస్తోంది.

నలభై, యాబై దశకాలలో సంకలనాలు విరివిగా వచ్చేయి. మొదట్లో ఏదో ఒక సంస్థ పూనుకుని ప్రచురించడం జరుగుతూ వచ్చింది. సంకలనకర్తని ఆ సంస్థే ఎంచుకోవచ్చు. లేదా ఎవరో ఒకరు సంకలించడానికి పూనుకుని సంకలనం తయారు చేసి ప్రచురణసంస్థలని ప్రచురించమని అర్థించవచ్చు. ఈ సంకలనాలకి ఆదరణ కూడా బాగానే లభించింది. అందుకు కారణం ప్రధానంగా రచయితలపేర్లు పత్రికలద్వారా ప్రచారం కావడం. ఆ తరవాతి దశలో ప్రచురణకర్తలు నవలలకి ప్రాధాన్యం ఇచ్చి చిన్నకథలని చిన్నచూపు చూడడంతో రచయితలు తమకథలు తామే సంకలనాలుగా వేసుకోడం ప్రారంభించేరు. కాలక్రమంలో ఇది 90వదశకంలో వచ్చిందనుకుంటున్నాను.

ఇప్పడు, అంటే గత 40 ఏళ్ళగా డయాస్పొరా కథలు రావడం మొదలయింది. సంకలనాలు ఇంకా ఆలస్యంగా అంటే గత ఇరవై ఏళ్ళలో వస్తున్నట్టుంది. ఈ సంకలనాలు ఎక్కువభాగం అమెరికాలో ఉన్న తెలుగువారికలంనుండి వస్తున్నవే. శారదలా ఆంధ్రదేశానికీ, అమెరికాకీ దూరంగా ఉండి రచనలు సాగిస్తున్నవారు తక్కువే నాకు తెలిసి. ఇంతకీ ఏ కథలు డయాస్ఫొరా కథలు అంటే నేను సమాధానం చెప్పలేను. ప్రధానంగా డయాస్ఫొరా కథలు ఎలా ఉంటాయి అన్నవిషయంలో నాకు అవగాహన లేదు. వేలూరి వెంకటేశ్వరరావు వ్యాసం(http://www.eemaata.com/em/issues/201003/1547.html) చూసేక నాకు అర్థమయిన విషయం – ఈనాడు డయాస్ఫొరా కథ అంటే అటు పుట్టినదేశానికి దూరమై అక్కడిజీవితాన్ని మళ్ళీ మళ్ళీ తలబోసుకోడమో (నోస్టాల్జియా), ఇటు మెట్టినదేశంలో సాంస్కృతికసంఘర్షణలలో ఈతిబాధలు కలబోసుకోడమో అనిపిస్తోంది. ఆవిధంగా ఆలోచిస్తే శారదగారి సంకలనాన్ని డయాస్ఫొరా అనడానికి నాకు మనసొప్పడం లేదు. ఈకథల్లో ఇతివృత్తాలు ఈ డయాస్ఫొరా నిర్వచనంలో ఇమడవు అనిపించింది నాకు. ఈవిషయానికి మళ్లీ వస్తాను.

ప్రస్తుతం ఆధునిక, సమకాలీన, సామాజిక కేంద్రంగల కథలు అంటే ఒక సందేశమో ఇతివృత్తమో ఏకసూత్రంగా ఉన్నవి అనుకోవాలి. అంటే స్త్రీలకథలు, దళితకథలు, ఆకలి కథలు, ఏదో ఒక ఊరి కథలు … ఇలా ఆ సంకనలకర్త అభిరుచులని బట్టి, ఇష్టాయిష్టాలని బట్టి సంకలనాలు వస్తున్నాయి. ఎనభై దశకంలో స్త్రీవాదం, దళితవాదంలాటి వాదాలు ప్రబలడంతో, ఏదో “వాద“ కథలనే అంటున్నా, వీటన్నిటికీ సాంఘికప్రయోజనం అన్న మరో ధర్మసూత్రం కూడా గొడుగు పట్టడంతో సంకలనాలలో వైవిధ్యం అదృశ్యమయిపోయే ప్రమాదం కనిపిస్తోంది. రెండు దశాబ్దాలుగా ప్రచురిస్తున్న కథ ????(ఏదో సంవత్సరం) తీసుకోండి మనకి కొట్టొచ్చినట్టు కనిపించేది ఇదే.

ఒకే రచయిత రాసినకథల్లో వైవిధ్యం వస్తువులో, శైలిలో, శిల్పంలో, పాత్రచిత్రణలో, భాషలో, సందర్భాలలో, సంఘర్షణలలో, మనస్తత్వ చిత్రణలో కనిపిస్తాయి. ఆ ఒక్క రచయిత యొక్క అనుభవాలు గానీ, తన చుట్టూ ఉన్న సమాజంలో గమనించిన విశేషాలూ, సంఘర్షణలూ ఉంటాయి. శారద కథల్లో ఈ వైవిధ్యం చూస్తాం. ఈకథల్లో హాస్యం ఉంది, వ్యంగ్యం ఉంది. సమాజంలో జరిగే అకృత్యాలమీద వ్యాఖ్యానం ఉంది. మనస్తత్వచిత్రణ ఉంది. ఈ సంకలనంలో ప్రతికథమీద నేను వ్యాఖ్యానించను కానీ ఉదాహరణకి కొన్ని కథలు పరిశీలిస్తాను.

మొదటి కథ రాగసుధారసపానము ఎత్తుగడలో హాస్యరసస్పోరకంగా ఆషామాషీగా ఉన్నా, ముగింపులో మన శాస్త్రీయసంగీతం భవిష్యత్తుగురించిన తపన కనిపిస్తుంది. దీనికి భిన్నంగా ఈరచయిత్రే రాసిన మాయింట్లో మర్డర్లు చదివినప్పుడు, రచయిత్రి ఒకే అంశానికి భిన్నకోణాలు ఆవిష్కరించడం కనిపిస్తుంది. (చూ. నీలంబరి బ్లాగు, http://sbmurali2007.wordpress.com/).

యుద్ధసమయంలో బతికుంటే బలుసాకు తినొచ్చు అనుకుని పడవెక్కి  మరో దేశానికి పారిపోతే, అక్కడ ఎదుర్కొనే దుస్థితిగురించి చెబుతుంది పడవ మునుగుతోంది కథ. ఇది దేశం వదిలి పోయినవారి కథ కనక ప్రవాసాంధ్రులకథ అనుకోవచ్చేమో కానీ రచయిత్రి కథ మలిచినతీరులో డయాస్ఫొరా ఎల్లలు దాటి, మానవీయకోణం ఆవిష్కరించడం చూస్తాం. ఒక మనిషి పరిచయమయిన తరవాత ఆ మనిషితత్వాన్నిగురించి, వ్యక్తిత్వాన్నిగురించి ఊహలు కలగడం సహజం. నిజానికి మనఊహలకీ ఆశలకీ ఒక అవినాభావసంబంధం ఉంది. ఆ రెంటినీ సమన్యపరుచుకుని సమాధానపడడం ఎలా అన్న ప్రశ్నకి సమాధానం ఊహాచిత్రం. ఇందులో వాచ్యం కాని మరొక అంశం ఎవరి ఊహలు ఎంతవరకూ నిజం అన్నది. అది పాఠకులఊహలకి వదిలిపెట్టడం రచయిత్రి నేర్పుకి ఉదాహరణ.

అతిథి కథలో విశేషం అతిథిసత్కారాలు మన జీవితంలో ఒక భాగం. ఆ ఆగంతుకుడు ఒక చిలుక అయినప్పుడు ఆ చిలుక పొందిన అతిథిసేవ హృద్యంగమంగా చిత్రించిన కథ. ఈ కథలో చిలుక ప్రసక్తి రాగానే నాకు గుర్తొచ్చిన రెండు కథలు భద్రాచల రామదాసుకథ, ఆచంట శారదాదేవిగారి పారిపోయిన చిలుక. ఈ రెండు కథలకీ భిన్నంగా శారద తనకథలో మానవుడికీ మానవేతర జీవులకీ మధ్య ఉండగల సౌమనస్యం, సౌజన్యం చిత్రించేరు. నాకు ఈ అభిప్రాయం ఏర్పడడానికి కారణం కథలో ప్రధానపాత్ర చిలుకే అయినా కథ కుక్కపిల్ల, పిల్లిపిల్లతో మొదలవడం. సాధారణంగా ఆధునికకథల్లో కథాంశం ఎత్తుగడలోనే చెప్పాలంటారు విజ్ఞులు. అలా అనుకుంటే ఈ కథ చిలుకతోనో, ప్రధానపాత్ర అయిన గృహిణితోనో మొదలవాలి. కానీ మరో రెండు జీవాలని పరిచయం చేయడంతో, కథకురాలు కథని విస్తృతం చేసేరు.

నేనెవర్ని కథలో వస్తువు సర్వసాధారణమే అనిపించినా, ఈకథకి నేనెవర్ని అని శీర్షిక ఇవ్వడం పెట్టడం రచయిత్రి సూక్ష్మదృష్టికి తార్కాణం. పాఠకులదృష్టిని ఆకట్టుకోగల శీర్షిక అది. ఎందుకంటే మనలో చాలామందికి ఏదో ఒక సమయంలో ఆ ప్రశ్న, నేనెవర్ని, అనిపించకమానదు. కథమాటకి వస్తే, “స్త్రీ ఎవరు?” అంటే మనకి అనూచానంగా వస్తున్న నిర్వచనం “కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా, అని. కానీ ఈ శాస్త్రాలు పుట్టినకాలంలో పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఈనాటి స్త్రీ వ్యక్తిత్వం వేరు. ఈనాటి ధర్మపత్ని బయటికి వెళ్ళి బయటిపనులు కూడా చేస్తోంది. పైగా తన అస్తిత్వాన్ని గురించిన స్పృహ కొత్తగా వచ్చింది. ఆ దృష్టితో చూస్తే ఇది స్త్రీవాదకథ అనుకోవచ్చు. కానీ తరిచి చూసే పాఠకులకి మరికొన్ని ఆలోచనలు స్ఫురించగలవు. ఉదాహరణకి ఈకథలో ప్రధానపాత్ర మగవాడయితే, ఆఫీసులో అధికారికి సలాములు చేసినా, ఇంటికొచ్చేక, ఇంట్లో యజమాని, పిల్లలకి తండ్రి, భార్యకి భర్త, తల్లిదండ్రులకి సుపుత్రుడు – ఇలా అనేక పాత్రలు పోషిస్తాడు. మనిషి సంఘజీవి, కుటుంబజీవి కనక వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు పాత్రలు నిర్వహించడం సహజమూ, అవసరమూను. ఈ రెండు కోణాలూ పక్క పక్కన పెట్టి చూసినప్పుడు, సమాజంలోనూ, కుటుంబంలోనూ వ్యక్తికి గల బాధ్యత ప్రస్ఫుటమవుతుంది. తద్వారా సాటి మనిషిని ఎక్కువ అర్థం చేసుకోగలుగుతాం. రచయిత్రి ధ్యేయం ఇదీ అని నేను చెప్పడంలేదు. కానీ పాఠకుడు ఇలా కథని విస్తరించి చదువుకున్నప్పుడు కథకి మరింత బలం చేకూరగలదు అని నా నమ్మకం. కథకులకీ, పాఠకులకీ కూడా దీనివల్ల లాభమే.

అలాగే పడగనీడ కూడా పాఠకులని ఆలోచింపజేయగలకథ. లోకంలో హింస, దౌర్జన్యం, దుర్మార్గం విపరీతంగా పెరిగిపోతున్నాయి. పిల్లలకి రక్షణ లేకుండా పోతోంది. పాము పడగనీడ వసించు కప్పల్లా పిల్లలబతుకులు దినదినగండం అయిపోతున్నాయి. ఇది అందరికీ తెలిసినవిషయమే. అయితే, అలా జరగడానికి కారణం ఏమిటి? ఒక కారణమేనా, అనేక కారణాలున్నాయా? ఉంటే అవేమిటి? ఇలా ఆ దౌర్జన్యానికి వెనక కారణాలు వెతకడం ఒక దారి. మరి రేపటిమాట ఏమిటి? ఆ హింస, దౌర్జన్యం జరగకుండా చెయ్యాలంటే, ఎక్కడెక్కడ మనం ఏ ఏ మార్పులు చెయ్యాలి, చెయ్యడానికి పాటు పడాలి అని ఆలోచించుకోడం మరో దారి. ఇన్ని కోణాలు చిత్రించడంలో రచయిత్రి విజయం సాధించేరు. కథలు పాఠకులని ఆలోచింపజేయాలి. అనేక కోణాలు స్పశించి ఆలోచించుకోడానికి అవకాశం ఇవ్వాలి. ఒక వాదాన్ని ఆశ్రయించి రాసే కథకీ, ఒక కోణాన్ని ఆవిష్కరించే కథకీ అదే వ్యత్యాసం.

స్థూలంగా, కథ నడపడంలో మంచి నేర్పు ఉంది రచయిత్రికి. ఎక్కడా అధిక ప్రసంగాలూ, అర్థరహితమైన ఉపన్యాసాలూ లేని కథలివి. అలాగే కథలకి శీర్షికలు పెట్టడంలో, వస్తువు ఎంచుకోడంలో, ఆ అంశాల్లో తనకి గల అవగాహన స్పష్టం చేయడంలో, కథ నడపడంలో శారద కృతకృత్యులయేరని చెప్పడానికి నేను సందేహించను. అది మంచి రచయిత లక్షణం. ఎక్కడా విసుగు పుట్టకుండా చకచక చదువుకుంటూ పోవడానికి కావలిసిన పటుత్వం ఉంది శైలిలో.

భాషవిషయం నాకు ప్రత్యేకించి అభిమానవిషయం. అంచేత ప్రత్యేకించి ఈ సంకలనానికి ఇది వర్తించకపోయినా, ఈ విషయం కాస్త వివరంగా రాస్తున్నాను (అందుకు శారద, సురేష్ కొలిచాల అనుమతిస్తారని ఆశిస్తూ). గిడుగు రామ్మూర్తి పంతులు, గురజాడ అప్పారావు వంటి ప్రతిష్ఠాత్మకరచయితలు వందేళ్ళకి ముందే వ్యావహారిక భాషోద్యమం ప్రారంభించేరు. ఇప్పుడు మనం అందరం వ్యావహారికభాషలోనే రాస్తున్నాం. అయితే, ఇది అప్పారావు గారూ, రామ్మూర్తిపంతులు గారూ చూసి ఆనందించి, అభినందించే వ్యావహారికమేనా? అంటే నాకు అనుమానమే. ఆనాడు మనతెలుగుకథలు సంస్కృతంలో రాస్తే, ఇప్పుడు ఇంగ్లీషులో రాస్తున్నట్టుంది. కొన్ని కథలు చూస్తే ఇది తెలుగుకథ అని నాకు అనిపించడం లేదు. ఇంగ్లీషుమాటలు కూడబలుక్కుని చదువుకుని, మనసులో మళ్ళీ నాతెలుగులోకి తర్జుమా చేసుకుని చదవాల్సివస్తోంది. ఈవిషయంలో బెంగాలీ రచయితలు కృషి చేస్తున్నట్టు గురజాడకి జ్ఞానేంద్రమోహన్ దాసు 1914లో రాసిన జాబువల్ల తెలుస్తోంది. (గురజాడ అప్పారావు. గురజాడ జాబులు, దినచర్యలు. సం. సెట్టి ఈశ్వరరావు. పిడియఫ్ లో పు. 58.). ఆయన ఇలా రాసేరుః

“విజయనగరం, విశాఖపట్టణాలలో నేను వున్న ఆ స్వల్పకాలంలో, నేనొక విషయాన్ని గ్రహించగలిగాను. అక్కడి పండితులు రెండు వర్గాలు. మొదటివర్గంవారి పద్ధతి అతి ప్రాచీనం. సాహిత్యరచనలో ఏ మాత్రపు ప్రాచీన పద్ధతులు సడలినా వారు సహించరు. మార్పుకు వారు విముఖులు. రెండవర్గంవారు సుముఖులు. కనక ఈ ఇరు తెగలవారికి అన్నిటా చుక్కెదురు.

ఒకొప్పుడు బెంగాలీభాష పరిస్థితి ఇలాగే వుండేది. పదాడంబరంతో పడికట్టు రాళ్ళవంటి శబ్దాలతో సమాసపు బిగింపులతో వచనరచన అధ్వాన్నంగా తయారయింది. విభక్తిప్రయ్యాలను మాత్రం మార్చి అనుస్వార విసర్గ క్రియారూపాలను సర్దుబాటు చేసుకుని, సంస్కృత శబ్దాలను ఠస్సాకు ఠస్సాయించి పండితులు భాషను కృతకం కావించారు. ఈ క్రియాపదాలు సైతం సంస్కృతవ్యాకరణసూత్రాలకు విరుద్ధంగా కటువుగా సృష్టి అయేవి. పండితులు వ్రాసే కృతకవచన శైలి ఇటు ప్రజలకు అటు విద్యావంతులకు అర్థం కాక కొరకరాని కొయ్యగా రూపొందింది. కాగా ఎవరి ఆదరణ లభించక, గ్రంథాలలో మేట వేసుకుపోయింది. ఇలాటి పరిస్థితులలో రాజా రామమోహన్‌రాయ్ చదవతగ్గ వచనాన్ని సృష్టించాడు. దానిని విద్యాసాగరుడు అనుసరించి, వ్యాప్తిలోకి తెచ్చారు. అయితే ఈయన స్వతంత్రకల్పనలకు యోచనకు ఆస్కారం లేక అనువాదాలతోనే గడిచిపోయింది. … …

టేక్ చంద్ సర్వస్వతంత్రుడు, అత్యంత సాహసి. … ఆయన భాషాప్రవాహాన్ని తనకభిముఖంగా తిప్పుకుని, దానిని పండితులపై తిప్పికొట్టేడు. … ఈనాడు మీరు ఆంధ్రసాహిత్యంలో బహుశా ఏయే పరిణామాలను కోరుతున్నారో వాటిని ఆయన వంగసాహిత్యంలో సాధించాడు.

… … వ్రాసే, మాటలాడే, గ్రంథములలో పత్రికలలో వాడే భాషలనుగురించి వివాదం జరుగుతూనే వుంది. వాదప్రతివాదాలు, ఖండనమండనలు సాగుతూనే వున్నాయి. వాడుకభాషను గ్రామ్యమని, నింద్యమను పండితులు నేటికీ అంటూనే ఉన్నారు. ఇంతవరకూ ఏ నిర్ణయమూ జరగలేదు.

మీరూ, నేనూ, మనమంతా జవమూ, జీవమూ గల భాషను కావాలని వాంఛిస్తున్నాము. అంటే ఆ భాష పరిపూర్ణమైనదిగా వుండాలని మన ఆశయం. (అ) ప్రజలకు సాధారణజ్ఞానాన్ని కలిగించే, (ఆ) పారిశ్రామిక, వైజ్ఞానిక, కళారంగాలలో కృషి చేస్కున్న విద్యార్థులకు సాంకేతికజ్ఞానాన్ని ప్రబోధించే, (ఇ) పండితులకు ఉదాత్తభావాలను, ఆదర్శాలను జ్ఞానాన్ని ప్రబోధించే, (ఈ) ప్రసన్న గంభీర మధుర కావ్యసృష్టికి దోహదపడే అన్నివిధాలా అర్హమైన భాషను, భాషాశైలిని సృష్టించుకోవాలని మనం కృషి చేస్తున్నాము. … … దైనందిన జీవితంలో నిత్యమూ చెవిని పడుతున్న మాటలను, సులభంగా అర్థమయే సరళపదాలను, నుడికారాన్ని సాహితీపరులు స్వీకరిస్తున్నారు. … ఇప్పుడు బెంగాలులో రచయితలు సరళ సుబోధకశైలిని అనుసరిస్తున్నారు. మామూలు మాటలలో అర్థగాంభీర్యాన్ని సాధిస్తున్నారు. … సొగసయిన పదాలను ఎంచుకోడంలో, వాటిని అర్థవంతంగా ప్రయోగించడంలో రచయితకున్న నేర్పునుబట్టి అతనిశైలికి అందం అమరుతుంది. ఆఖరికి నింద్యమని అపభ్రంశమని పండితులు ఈసడించే శబ్దాలను సైతం, అశ్లీలతాదోషం అంటనీయకుండా, సమర్థుడైన రచయిత ప్రయోగించవచ్చు.

భాష నాజూకుగా, ఠీవిగా వుండాలి. ఆడంబరం అందమీయదు. జటిలపద ప్రయోగంవల్ల భాషాసౌకుమార్యం కలగదు. తేటమాటలతో నాగరికమైన అనుభవాలను, ఉదాత్తభావాలను వ్యక్తపరచాలి. శైలి సహజప్రవాహంవలె ఉరకలెత్తుతూ, అనుభూతులను కలిగిస్తూ హృదయంపై చెరగని ముద్రలను వేయాలి. శైలి అందం ఇలా ఇలా వుండాలని సిద్ధాంతీకరించి చెప్పడం సులభమే. కానీ ఈ అందాన్ని అలరించడం కష్టం. అక్కడే వస్తుంది అడ్డు.

నిఘంటువుల, పండితుల, వైయాకరణులసహాయం, అవసరం లేకుండా, చదవగానే అందరికీ అర్థమయే విధంగా భాషను సంస్కరించవలెనని మీఆశయం. అదే నేటి సమస్య. మనమంతా భాషాసంస్కరణను కోరుతున్నాము. అంటే దాని అర్థం భాషాగాంభీర్యాన్ని, స్నిగ్ధసౌందర్యాన్ని మనం పోగొట్టుకుంటున్నామని కాదు. పైగా దాని సౌకుమార్యాన్ని ఇనుమారు తెచ్చుకుంటున్నాము (పు. 58-59).

నేను ఈ ఉత్తరంలో భాగాలను ఇంత విస్తృతంగా ఉదహరించడానికి కారణం – ఈ వ్యావహారికభాషావాదం ఎప్పటినించి ఎంత ప్రబలంగా ఉందో ఎత్తి చూపడానికి. ఈ అనువాదంలో సంస్కృతం బాగానే ఉండడం గమనార్హం. బహుశా జ్ఞానేంద్రమోహన్ దాసు ఇంగ్లీషులో అదే స్థాయి శైలిలో రాసేరేమో. అప్పారావుగారు వ్యావహారికంలో రాయాలని ఉద్యమం మొదలు పెట్టినా, ఆయన రాసిన భాష ఈనాడు మనకి వ్యావహారికంలా అనిపించదు. తిరగరాసిన దిద్దుబాటు కథలో కూడా నాకు పాతవాసనలే కనిపించేయి. కానీ ఇప్పుడు ఆస్థాయి అధిగమించి, నిజంగా మనం రోజూ మాటాడుకునే మాటల్లో కథలు రాయడం వచ్చింది. అయితే దానిలో తెలుగు తగ్గిపోతోంది. నేను కథలు రాయడం మొదలుపెట్టిన రోజుల్లో పేజీకి రెండో మూడో ఇంగ్లీషు మాటలు కనిపించేయి (నాకథల్లో కూడా). ఇప్పుడు వాక్యాలకి వాక్యాలే ఇంగ్లీషులో ఉంటున్నాయి. సరే అనడానికి ఓకే అంటున్నాం. ఆదివారం, సోమవారం అనడానికి బదులు సండే, మండే అంటున్నాం. నేను నాస్నేహితురాలితో మాటాడుతున్నప్పుడు, “ఆదివారం వస్తాను” అంటే “ఓకే, సండే రా,” అంటుంది. అంటే అలా తెలుగుమాటని ఇంగ్లీషులోకి మార్చుకుంటే తప్ప తలకెక్కని పరిస్థితికి వచ్చేం. ఇది దారుణం.

శారదగారి కథలలో చాలావరకు మంచి తెలుగు నుడికారం ఉంది. కానీ కొన్ని కథల్లో మాత్రం ఇంగ్లీషు కొంచెం ఎక్కువే అనిపించింది. ఈభాషకే అలవాటు పడినవారు “ఇప్పుడు ఇలాగే మాటాడుతున్నాం, ఆ వాక్యాలు వాస్తవంగా ఉన్నాయి” అని వాదించవచ్చు. కాదనను కానీ, సాంఘికప్రయోజనంలాగే తెలుగుభాషనీ, నుడికారాన్నీ నిలబెట్టి పటిష్టం చేసే బాధ్యత కూడాఈనాటి రచయితలకి ఉందనీ, లేదనుకుంటే, మనసు మార్చుకుని ఆ బాధ్యత చేపట్టాలనీ నేను గాఢంగా నమ్ముతున్నాను. నాకథలని అభిమానించేవారు నాకథలద్వారా మరచిపోతున్న మాటలు మళ్ళీ గుర్తుకి తెచ్చుకోడం, కొత్తగా తెలుసుకోడం కూడా జరుగుతోందన్నారు. అంటే మంచి తెలుగు నుడికారం గల కథలని పాఠకులు ఆదరిస్తున్నారు.

ఈ ముందుమాట రాయడానికి నాకు అవకాశం కల్పించిన శారదకీ, నేను రాసింది వంకలు పెట్టకుండా ప్రచురించుకుంటామంటూ ప్రోత్సహించిన సురేష్ కొలిచాలకీ ధన్యవాదాలు.

వర్ధమానరచయిత్రి శారద  ముందు ముందు ఇలాగే మంచి కథలు అందించగలరని ఆకాంక్షిస్తూ, అభినందిస్తూ,

నిడదవోలు మాలతినిడదవోలు మాలతి

సెప్టెంబరు 2, 2012.

తెలుగు సినిమాకు మడి కట్టిన మిథునం

midhunam3

ఇంత ఆలస్యంగా ఇపుడెందుకు అనేది ముందుగా మాట్లాడుకోవాలి. మిధునం తెరపై చేసిన హడావుడి కంటే తెరవెనుక చేస్తున్న హడావుడి ఎక్కువ. అదిప్పటికీ తెగట్లేదు. ఇంకా  తెలుగు సినిమా ప్రేక్షకుల అభిరుచి లోపం గురించి బాధపడుతున్నవారూ, ఇంతటి సంస్కారవంతమైన సినిమాను ఆదరించలేని మన దౌర్భాగ్యం గురించి వగచుతున్న వారూ   ఇంటర్‌నెట్లో కనిపిస్తూనే ఉన్నారు. కాస్తో కూస్తో ఆరోగ్యంగా ఆలోచిస్తారని భావించేవారు కూడా ఈ శోకగీతంలో తమవంతుగా గొంతు కలుపుతున్నారు. మిధునం గురించి ఎవరో ఏదో  విమర్శనాత్మకంగా మాట్లాడారని తెలిసి ఇంత మంచి సినిమాను మెచ్చుకోవడానికి సంస్కారం ఉండాలి అని ఒక్కవాక్యంలో తిట్టిపోశారు ఒక కవిమిత్రుడు. ఆ మధ్య పాలపిట్ట అనే  మ్యాగజైన్‌లో ఇంకొక వ్యాఖ్య చేసి ఉన్నారు. ఇంత గొప్ప సినిమాను విమర్శించడానికి అసలు ఎవరికైనా నోరెలా వస్తుంది అన్నది సారాంశం. అభిరుచి కలిగిన మరికొందరు సాహితీ  మిత్రుల ధోరణి కూడా అలాగే ఉంది. ఒక సినిమా గురించి ఇన్ని తప్పుడు అభిప్రాయాలు అచ్చోసి వదిలేస్తా ఉంటే చూస్తూ ఊరుకోవడం సామాజికుల పని కాదు. బెటర్‌ లేట్‌ దెన్‌ నెవర్‌.

మిధునం గురించి తరచుగా వినపడే మాటలేమిటి? అది సంస్కారవంతమైన సినిమా.  మానవసంబంధాలను ఉన్నతీకరించిన సినిమా. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య  అనుబంధాన్ని అపురూపంగా చిత్రించిన సినిమా. నగరజీవనంలో మృగ్యమైపోతున్న సున్నితమైన అంశాలను ఎత్తిపట్టిన సినిమా. ఎక్కడికి పరిగెడుతున్నామో ఎందుకు  పరిగెడుతున్నామో తెలీని మ్యాడ్‌ రష్‌లోంచి బయటకు వచ్చి మనలోపలికి మనం తరచి చూసుకునేలా చేసిన సినిమా. కొంచెం అటూ ఇటూగా ఇలాంటివే. సంస్కారం అనే పదం  వినిపించినంతగా సెన్సిబిల్‌ సినిమా అని వినపడదు. సెన్సిబిల్ అనేది సాధారణంగా విలువలకు సంబంధించిన పదంగా వాడుతున్నాం. అస్తిత్వ్‌ సెన్సిబిల్‌ సినిమా, షిప్‌ ఆఫ్‌ థీసెస్‌  సెన్సిబిల్‌ సినిమా అంటాం. కానీ సంస్కారం కథ వేరు. ఎలాగైనా వాడుకోదగిన ఎలాస్టిసిటీ ఉన్న పదం.  సంస్కారం, సంప్రదాయం, ధర్మం స్టేటస్‌ కోయిస్టులకు ఇష్టమైన పదాలు. అవి  వ్యవస్థీకృత విలువలకు సాంస్కృతికపరమైన ఔన్నత్యాన్ని కట్టబెట్టే పదాలు. అందరూ కావాలని అదే అర్థంతో వాడతారని కాదు. కానీ వాడుకలో స్థిరపడిన రూఢి అర్థమైతే అదే.

ఇంతకూ ఏమిటీ సినిమా? శ్రీరమణ గారి మిధునం కథకు  తెరనుకరణ. ఒక పల్లెటూరులో విశాలమైన  పెరడు, చేద బావి, లతలు, తీగలు, చెట్లు చేమలు, గొడ్డూ గోదాతో  పెనవేసుకున్న ఆలుమగల అనుబంధం. సంప్రదాయంగా వస్తున్న ప్రచారానికి అనుగుణంగా కనిపించే స్టీరియోటైప్‌ తిండిపోతు అప్పదాసు, బుచ్చిలక్ష్మి దంపతుల కథ.  సోమయాజి,  సోమిదేవమ్మలకు ఆధునిక రూపమన్నమాట. ముగ్గులు వేయడాలు, ఇల్లు అలకడాలు, నోములు, పూజలు, ఆలుమగల మధ్య అలకలు, చిలిపి సరదాలు, అప్పలస్వామి  తిండియావకు సంబంధించిన రుచులూ, సంప్రదాయ జీవనవిధానానికి సంబంధించిన అభిరుచులూ అన్నీ కలగలిపి కట్టిన ఇంగువ మూట ఈ సినిమా. ఇద్దరే పాత్రలు. లంకంత కొంప.  అందులో చెప్పన్నారు తీగలు, చెట్లు. అన్నీ నేరుగా కోసుకుని తినేయడమే. అప్పదాసు తన పనులన్నీ చేసుకోవడమేకాదు, ఇతరులు చేసే పనులను కూడా నశ్యం పీల్చినంత వీజీగా  చేసేస్తూ ఉంటాడు. దూది ఏకుతాడు. కుండలు చేస్తాడు. బంగారం పని చేస్తాడు. చెప్పులూ కుడతాడు. సినిమాలో విశ్వనాధ్‌ ఎక్కువగానే కనిపిస్తారు. బాపు అపుడపుడు కనిపిస్తారు.  సంప్రదాయ జీవనవిధానాన్ని ఆకాశానికెత్తుతూనే ఆధునికతతో భాగంగా వచ్చిన పర్యావరణ స్పృహను, ప్రైవసీ భావనను కలిపి కొట్టడం తెలివైన ఎత్తుగడ.

timthumb.php

60దాటిన అమ్మానాన్నల ప్రేమ కథ అని ఒకట్యాగ్ లైన్‌ ప్రచారం చేశారు. ఈ అమ్మ “కాలుమోపితే ఎండిపోయిన కందిచేను పూత పెట్టే లచ్చుమమ్మ” కాదు. “ఎద్దోలె ఎనుకాకు  ఒక్కొక్క అడుగేసి నాట్లేసి నాట్లేసే లచ్చుమమ్మ” కాదు.   ఎకరాలకెకరాల చెట్లను, గొడ్డుగోదలను చిరునవ్వు తొణక్కుండా పోషించే సూపర్‌మామ్‌ బుచ్చిలక్ష్మి. ఆ నాన్న కూడా “శిలువ  మోస్తున్న ఏసుక్రీస్తులా నాగలి భుజాన వేసుకున్న” రైతో మరొకరో  కాదు. శిష్ట జీవనం సాగిస్తూనే సహస్రవృత్తుల సమస్త చిహ్నాలను తనలోనే ప్రదర్శించే సూపర్‌మాన్‌ అప్పదాసు.   శ్రమైక జీవన సౌందర్యం అని శ్రీశ్రీ అన్నాడు కదాని శ్రమను మరీ ఇంత అందంగా చూపిద్దామంటే ఎలాగండీ భరణి గారూ! శారీరక శ్రమ మరీ అంత గ్లామరస్‌గా ఏమీ ఉండదండి! అది  కష్టజీవులకందరికీ తెలుసండీ. శ్రమను గౌరవించడమంటే దాన్ని గ్లామరైజ్‌ చేసిచూపడం కాదండీ! ఆధునిక పరిశ్రమ వృత్తులు అనే బానిసత్వంలో మగ్గిపోయిన మనుషులకు కొత్త  వెలుగు చూపించింది. శ్రమచేసే కులాలకు వెసులుబాటునిచ్చింది. “వేల సంవత్సరాలుగా చలనం లేకుండా పడి ఉన్న” భారతీయ సామాజక వ్యవస్థలో ఆధునిక పరిశ్రమ కుదుపు  తెచ్చింది. రైళ్ల ప్రవేశంతో ఏమేం జరుగుతాయని విశ్వనాధ సత్యనారాయణ బెంగటిల్లాడో అవన్నీ ఇపుడు జరుగుతున్నాయి. చెప్పుల గూటాల నుంచి, మగ్గం గుంతల నుంచి కొలిమి  మంటలనుంచి బయటపడడం వల్లే ఇవాళ అలాంటి కులాల పిల్లలు చాలా మంది అంతకుముందెన్నడూ చూడని రీతిలో డాక్టర్లు, లాయర్లు, కంప్యూటర్‌ ఇంజనీర్లు అయి సామాజిక  సంపదలో తమవంతు వాటా అందుకునే ప్రయత్నంలో ఉన్నారు. అంతకు ముందు తమను చిన్నచూపు చూసినవారి సరసన కూర్చోగలుగుతున్నారు.  మళ్లీ ఇపుడు వృత్తులను  ఆరాధించే పద్ధతిలో  వాటి చిహ్నాలను చూపిస్తే  అబ్బో, మమ్మల్ని గౌరవించాడు అని ఎగబడి చూడాలా! ఏమియా ఇది! ఏమి మాయయా ఇది!

 

అప్పదాసు స్వర్గానికి సెంటీమీటర్‌ దూరంలో అని వర్ణించే రుచులు తెలుగునాట కేవలం ఐదు శాతం లోపువారి రుచులు. ఆ వ్రతాలు, నోములు, వగైరా కూడా మైనార్టీ వ్యవహారమే.  అయినా సరే, ఇది తెలుగువారు సగర్వంగా ఎగరేసిన పతాకం, తెలుగుదనానికి అచ్చమైన చిరునామా, తెలుగోడి సత్తా లాంటి మాటలు బోలెడన్ని వినిపించాయి. వినిపిస్తూనే  ఉన్నాయి. కేవలం ఐదు శాతం లోపు ఉన్నవారిలోని సంప్రదాయవాదుల ఆచార వ్యవహారాలు, వారి గోములు, అలకలు, చిలిపితనాలు మొత్తం తెలుగుదనానికి పర్యాయపదంగా  చాటగలిగిన ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది? ఆ ప్రచారాన్ని నోరుమూసుకుని చూసే దశకు  మనం ఎందుకు చేరుకున్నాం? ఒక కులం చిహ్నాలు కనిపించినంత మాత్రాన దాన్ని  వ్యతిరేకించాలా, అందరికీ వర్తించే కొన్ని అనుభూతులుంటాయి కదా అనే ప్రశ్నలు తలెత్తొచ్చు. అంతవరకే ఉంటే సమస్య లేదు. సినిమాను సినిమాగా చూసి మంచిచెడ్డల గురించి  మాట్లాడొచ్చు. కానీ ఇది తెలుగు సంస్కృతి,సంస్కారం అనడంలోనే అసలు సంగతి దాగిఉంది. కొలకలూరి ఇనాక్‌ కథనో, నాగప్పగారి సుందర్రాజు కథనో, వేముల ఎల్లయ్య కక్కనో ఇలాగే  సినిమా తీసి ఇది తెలుగు సంస్కృతి అంటే ఇలాగే ఆమోదించి ఉండేవారా? గ్రామీణజీవితాన్ని నిజాయితీగా చిత్రించిన నామిని, బండినారాయణస్వామి కథలను సినిమాలుగా తీస్తే  ఇలాగే తెలుగు సంస్కృతి అని నెత్తిన పెట్టుకునే వారా? ఇలాంటి ప్రశ్నలు వేసుకోకపోవడంలోనే బానిసత్వం ఉంది. సమాజంలో ఆధిపత్యంలో ఉన్నవారి సంస్కృతే మొత్తం సమాజపు  సంస్కృతిగా ప్రచారంలో ఉంటుంది. ఇతరులది ఇతరంగానే ఉంటుంది. పట్టణీకరణతో ఆధిపత్య ప్రదర్శనకు అవకాశం లేకుండా పోయిన కులాలు ఏదో రూపంలో తిరిగి తలెగరేయడానికి  ప్రయత్నిస్తా ఉన్నాయి. తెలుగు సమాజంలో ఆర్థిక రాజకీయ ఆధిపత్యం కోల్పోయి చాలాకాలమే అయినా సంస్కృతి విషయంలో పట్టు నిలుపుకోవడానికి బ్రాహ్మణవాదులు  పెనుగులాడుతూ ఉన్నారు. ఇదే సమయంలో కొంతమంది ఇతర అగ్రవర్ణ లిబరల్స్‌లో కూడా నగరీకరణ మీద విసుగు కనిపిస్తోంది. నగరజీవితపు పరుగుపందెంపై నిరసనా,  పల్లెజీవితంతో పాటు కోల్పోయిన ఆనందాలపై వలపోత ఇతరత్రా సమూహాలకు పాకుతున్నది. ముఖ్యంగా పట్టణీకరణవల్ల ప్రయోజనాలు పొందడంలో ముందున్న సమూహాల్లో.  ఆయా కుటుంబాల్లో రెండో అర్బన్‌తరం కూడా వచ్చేసి ఉంటుంది. ఇతరత్రా ఆధిపత్యాన్ని సవాల్ చేయలేనపుడు ఈ రకంగా ఆమోదనీయమైన మార్గంలో ముందుకు రావాలని ఆ  సమూహం ప్రయత్నిస్తోంది. భాష పేరుతో సంస్కృతి పేరుతో ముందుకొస్తున్న బృందాలను, వారి భాషను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఇరవై యేళ్ల క్రితం హైదరాబాద్‌  శంకర్‌మఠ్‌, విద్యానగర్‌ లకు చెందిన వృద్ధులు సాయంత్రాల్లో ఆర్ట్స్‌ కాలేజీ రైల్వేస్టేషన్‌ బెంచీలమీద సాయంత్రం కూర్చుని అమెరికాలోని సంతానం గురించి బెంగగా గోముగా చిరుకోపంగా  మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. ఇపుడు అలాంటి వృద్ధులు అన్ని ప్రాంతాల్లో అన్ని కులాల్లో పెరిగిపోయారు.

వాళ్లు పిల్లలను అడగాల్సిన అవసరం లేకుండా ఖర్చు చేసుకునే స్వ్చేఛ్చ ఉండాలనుకుంటారు. పట్నవాసపు ఉద్యోగ జీవితాలు, నెలవారీ పెన్షన్లు, అద్దెలు మధ్యతరగతి వృద్ధులకు  అలాంటి అవకాశాన్ని కల్పించాయి. అలాగే ఆధునికతతో పాటు వచ్చిన ప్రైవసీ అనే భావన పల్లెటూరి వృద్ధులకు లేని ఒక అదనపు సౌకర్యాన్ని వారికి కల్పించింది.  అదే సమయంలో  పల్లెటూరి మాదిరి(ఇది కూడా భ్రమే) కొడుకు కోడళ్లపై కొంతైనా పెద్దరికం చెలాయిద్దామని ఉంటుంది.  మనమడు, మనుమరాలు కంప్యూటర్లతోనో ఫ్రెండ్స్‌ తోనో కాకుండా తమ ఒడిలో  కబుర్లు చెప్పుకుంటూ, కొడుకు కోడళ్లు అన్ని విషయాల్లో సలహాలడుగుతూ ఉంటే బాగుండునని కూడా ఉంటుంది. వృద్ధులనే కాదు, పల్లె, పట్టణ జీవితం రెండూ తెలిసిన తరంలో  చాలామందికి రెంటిలోని సానుకూలమైన అంశాలను అందుకోవాలని ఉంటుంది.  రెండు జీవన విధానాలకు మధ్య వైరుధ్యం ఉన్నదని తెలిసినప్పటికీ ఒకదాన్ని వదులుకోవడానికి  మనసు అంగీకరించదు. ఆచరణలోనేమో ఆర్థికాభివృద్ధికి అవసరమైన వలసబాటలో పయనిస్తారు.  గ్రామీణ జీవనంలో కోల్పోయిన ‘ఆనందాల’ కోసం గొణుగుతూ ఉంటారు. ఎన్‌ఆర్‌ఐల్లో  ఈ వలపోత మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆకలి తీరిన మనిషి ఆనక తనదైన సొంత అస్తిత్వం కోసం ఆరాటపడతాడు. అక్కడ సొంత అస్తిత్వాన్ని  విజువల్‌గా చూపించుకోవడానికి భరతనాట్యాలు, బతుకమ్మలు ఆడుతుంటారు. పర్వాలేదు. మనకు తెలుగు భాషా సంస్కృతుల రక్షణ గురించి ఉపన్యాసాలు ఇవ్వనంత వరకూ అది  అర్థం చేసుకోదగిన ఆరాటమే.. పల్లెటూరి జీవన విధానం పట్ల ఉన్న గ్లామర్‌ను, పట్టణాలకు మాత్రమే పరిమితమైన ప్రైవసీ అనే కాన్సెప్ట్‌ని కలిపి వడ్డించింది ఈ సినిమా. రెండూ అతకని  విషయాలు. అందుకే ఈ సినిమా శిల్పారామంలో ప్రదర్శించే పల్లెలూరి ఇల్లులాగా ఉంది తప్పితే సహజంగా లేదు. పట్టణీకరణ ఆరంభదశలో అంటే 60, 70ల కాలంలో తెలుగుసినిమా  “రెక్కలు వచ్చి పిల్లలు వెళ్లారు, రెక్కలు అలిసి మీరున్నారు, పండుటాకులమై మిగిలేము” అని పాడుకుంది. పట్నపు కోడలనగానే మిడ్డీనో గౌనో వేసి నోట్లో సిగరెట్‌ పెట్టి నానా యాగీ  చేసింది. నాటి పల్లె నేటి పట్నమయ్యింది. నాటి పట్నం ఇపుడు అమెరికా అయ్యింది.  కాకపోతే పల్లె పట్టణాన్నిఆడిపోసుకున్నంత ఈజీగా ఆడిపోసుకోవడం కష్టం. సంపదను  చాలామందే అనుభవిస్తున్నారు. దగ్గరి బంధువో, స్నేహితుడో ఎవరో ఒకరు అమెరికాలో లేని మధ్యతరగతి ఇల్లు ఒక్కటి కూడా కానరాని స్థితి.  అందువల్ల ఆ భాష వదిలేసి దాని  బదులు ఉమ్మడి మిత్రుడు గ్రామం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు.  ప్రాక్టికల్‌గా మనం వెళ్లకపోయినా అలా అనుకుంటూ ఉండొచ్చు. అదొక అందమైన కలగా చూసుకుంటూ  ఉండొచ్చు. ఈ దశకు చాలామందే చేరుకున్నారు. ఈ పరిణామమే ఈ సినిమాకు ప్రేరణ.

ఇందులో సోమయాజుల వారు భార్య చీర ఉతకడం, ఆ సందర్భంగా ఏమిటండీ ఇది అని ఆమె కంగారుపడిపోతే ఆయనగారు రోమాంటిక్‌ డైలాగులు కొట్టడం లాంటి లిబరల్‌ షో  చేశారు. కానీ సోమయాజివారు తూగుటుయ్యాలలో పవ్వలిస్తుంటే సోమిదేవమ్మ గడపమీద కొంగుపర్చుకుని తలవాల్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఎవరెక్కడుండాలో అక్కడే  ఉండాలమ్మా! సరదాగా ఒక పూట రోల్‌ ఛేంజ్‌ చేసుకుంటాం కానీ పూర్తిస్థాయిలో మార్చుతామంటే ఊరుకోము! అంతేనా భరణిగారూ! “వంటావార్పూ, పిండిరుబ్బడం, బట్టలుతకడం,  ముగ్గువేయడం లాంటివన్నీ చేస్తా ఉంటే జబ్బులెందుకొస్తాయి” అని సోమయాజి ఉరఫ్‌ అప్పదాసు ఉరఫ్‌ భరణి గారు ఒక ఉపన్యాసమిస్తారు. ఈ పనులన్నీ ఎవరు చేసేవి? ఈ  ఉపదేశం ఎవరికిస్తున్నట్టు? ఒకసారి కాళ్లు పట్టిచ్చి, మరోసారి జడవేసి నాలుగు రొమాంటిక్‌ డైలాగులు చిలకరించినంత మాత్రాన సారం మారుతుందా!   ఏ సంప్రదాయ  జీవనవిధానమైనా స్ర్తీలను అణచివుంచేదే. ఆడవాళ్లను ఆడిపోసుకోవడమొక్కటే కాదు. ఇందులో మూఢనమ్మకపు ప్రచారమూ దాగి ఉంది. మనం కెమికల్స్‌ కూడు తిని అనారోగ్యంగా  తయారయ్యామని, గ్రామాల్లో  రోగాలు రొస్టులు లేకుండా ఇంతకంటే ఆరోగ్యంగా జీవిస్తారని  మేధావులకునేవారు కూడా నమ్మేస్తూ ఉంటారు. ఇది కూడా పల్లెజీవితం తెలీని గ్లామర్‌  వ్యవహారమే. పల్లెల్లో కనీసం రోగం పేరుకూడా తెలీకుండా రాలిపోతూ ఉంటారు. అది కేన్సర్‌ అని గుండెపోటు అని తెలీకుండా హఠాత్తుగా పోతే కాటికి మోసుకుపోతా ఉంటారు. చివరికి  మలేరియాతో కూడా చచ్చిపోవడమే. అక్కడ అరవై దాటితే కృష్ణా రామా అని మూలన కూర్చోవాల్సిన వయసుకు చేరుకున్నట్టే. వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి ఈ వయసు కొంచెం  అటూ ఇటూగా ఉంటుంది. పెరిగిన ఆరోగ్యస్పృహతో మెరుగైన వైద్యసౌకర్యాలతో హెల్త్‌ చెకింగులతో, ఇన్సూరెన్స్‌లతో మనం వారికంటే మెరుగైన పరిస్థితుల్లో ఉన్నాం.  70ల్లో కూడా  టింగురంగా అంటూ టీషర్ట్‌, నిక్కరూ వేసుకుని తిరుగుతూ పల్లెలు మనకంటే ఆరోగ్యంగా ఉండేవని ఆడిపోసుకోవడం లేదా చొంగకార్చడం ‘అత్యాధునిక’ మాయ.

mithunam2

ఇదంతా రాజకీయమండీ, సినిమా గురించి మాట్లాడతారనుకుంటే ఇవన్నీ చెబితే ఎలాగండీ అనబోదురేమో! ఏది రాజకీయం కాదండీ!  మేమొక సినిమా తీశాం, మంచి సినిమా  తీశాం, అందమైన సినిమా తీశాం అని చెప్పుకోవచ్చు. ఎవరిది వారికి ఇంపుగానే ఉంటుంది కాబట్టి చెప్పుకోవడం వరకూ తప్పులేదు. చాలామంది చెపుతూనే ఉంటారు. కానీ తెలుగు,  సంస్కృతి, సంప్రదాయం వగైరా మాటలేటండీ! అది రాజకీయం కాదా అండీ!  అందులో సున్నితమైన అనుభూతులున్నాయి కదా వాటిమాటేమిటి, ఆ వరకు తీసుకుని సినిమాను  ప్రశంసించవచ్చుకదా అందురేమో! ఆ అనుభూతులను చూపించడంలో  నిజాయితీ కావాలి. ఈ సినిమాలో ఏ మాత్రం అలసట లేకుండా ఇద్దరు వృద్ధులు ఆ లంకంత కొంపను అన్ని  చెట్లను మెయిన్‌టెయిన్‌ చేస్తా ఉంటారు. చెప్పనలవి కానన్ని వంటలు చేసుకుంటా  ఉంటారు. ఆవులను గేదెలను పోషిస్తా ఉంటారు. మూడో మనిషి కనిపించడు. సాధ్యమా  ఇది?మామూలు మసాలా సినిమాలో ఒక హీరో వందమందిని కొట్టేయడానికి దీనికి తేడా ఏమైనా ఉందా! అంతేనా! ఆ ముసలాళ్లిద్దరూ ఉష్ర్టపక్షుల్లా మరో మనిషి అంటూ సొంటూ  లేకుండా జీవిస్తా ఉంటారు. ఇది ఏమి సామాజికత స్వామీ! ప్రైవసీ పేరుతో సాటి మనుషులకు దూరంగా బతికేయడం గొప్ప సంస్కృతా! వృద్ధులకు ఇతరుల మాదిరే ప్రైవసీ కచ్చితంగా  అవసరం. కానీ ఇలానా! అసలు మనిషి అనేవాడు(రు) ఇంత అన్‌సోషల్‌గా జీవించగలడా(రా)! చేదబావిని చూపించి నీళ్లు తోడుకోవడం అనేది ఆరోగ్యానికి అవసరమైన శ్రమ అని డైలాగ్‌  కొట్టించితిరి కదా, మరి గ్యాస్‌ స్టవ్‌ ఎందుకు వాడితిరి? అక్కడ కూడా నిప్పుల కుంపటి పెట్టి ఊదుతూ ఉంటే ఊపిరితిత్తులకు ఎక్సర్‌సైజ్‌ అని చెప్పించకపోయారా! అక్కడ కంఫర్ట్‌  కావాల్సివచ్చింది. అంటే దర్శకుడు చూపించదల్చుకున్న సింబాలిజమ్‌ మేరకు సంప్రదాయాన్ని, ఆధునికతను, సౌకర్యాలను టైలరింగ్‌ చేసుకున్నారని అర్థమవుతుంది. చేదబావి,  బాదం చెట్టు లాంటివి శిష్ట సంప్రదాయ జీవులు తమను తాము ఐడెంటిఫై చేసుకునే సింబల్స్‌. వాటిని డిస్ట్రబ్‌ చేయడం డైరక్టర్‌కు ఇష్టం లేదు. పైకి అభిరుచిప్రధానమైనదిగా  కనిపించినప్పటికీ సారాంశంలో ఈ సినిమా అందించేంది వేరు. ఇది పర్ణశాలలో విహరిస్తున్న జింకకాదు. మాయారూపంలోని మారీచుడు.

” రిటైర్‌మెంట్‌ తర్వాత ఊర్లో ఒక రిసార్టు లాంటిది కట్టుకుని అక్కడికి వెళ్లిపోవాలని చాలామందికి ఉంటుంది. వెళ్లరు. కానీ అలాంటి కల అయితే ఉంటుంది. వెళ్లినా వెళ్లకపోయినా  ఈ సినిమా ద్వారా అలాంటి వారికి ఆ అనుభూతిని క్రియేట్‌ చేసి పెట్టాం” అని భరణి ఒక ఇంటర్య్వూలో చెప్పారు. కరెక్ట్‌గా చెప్పారు. ఇది వారి సినిమానే. ఆచరణతో సంబంధం లేని  సంపన్న కోరికలు కాబట్టే ఇది హాలీవుడ్‌ ఏలియన్స్‌ సినిమాల మాదిరి ఉంటుంది. కాకపోతే అందులో అన్నీ అంతరిక్షపు హైటెక్‌ సామాగ్రి, ఇందులో ముగ్గులూ దప్పళాలున్నూ!

జి ఎస్‌ రామ్మోహన్‌

 

బువ్వగాడు

కాశిరాజు

కాశిరాజు

“ఒలేయ్ ఆడికి అన్నమెట్టు” అన్నప్పుడల్లా
నాకు ఆకలేయదేందుకు ?
అన్నమంటే అమ్మా, నాన్నే అనిపిస్తుందెందుకు!

ఒరేయ్ బువ్వగా
ఇంతకుముందెప్పుడో ఇలాగే  అన్నం తింటన్నప్పుడు
రొయ్యల సెరువు కోసం ఇసకలంకని ఎవరికో ఇచ్చేసారని
కంచంలో కూడు అలాగే వొదిలి పరిగెట్టినపుడు
నీకూడా నేనొచ్చుండాల్సింది
ఆపూట నువ్వొదిలెల్లిన కూడు తినకుండా
నువ్వు తిన్న దెబ్బలని నేను కూడా తినుండాల్సింది.
నీ ఒళ్ళు సూత్తే నేతొక్కి తిరిగిన నేలలాగే ఉంది
ఒరేయ్ మట్టంటుకున్నోడా మురికి నిన్ను వదలదేరా

****
ఇంకోసారి
ఒలేయ్ ఆడికి అన్నమెట్టని
కాళ్ళు కడుక్కుని కంచంముందు కుచ్చున్నావు
కాపుగారు పిలిచారనీ
వారం రోజుల్లో పెల్లుందనగా
పదిరోజుల ముందెళ్ళి పందిరేసావ్
విందులో సందడికి నోచుకోక విస్తళ్ళు తీసావ్
ఒరేయ్ ఆకలిదాచుకు నవ్వేవాడా
అందరూ నీకు బందువులేరా !

la
****
మరోసారి
శీతాకాలం పొద్దున్నపూట సూరీడుకంటే ముందులెగిసి
ఒలేయ్ ఆడికి అన్నమెట్టని
నువ్వేమో కొరికిన ఉల్లిపాయ్ అలాగే వొదిలి
సద్దన్నం సకం కొల్లకేసి
పంచినుంచి రుమాలకి , రుమాలనుంచి గోసీకి మారి
శ్రమని చేలో చల్లడానికెల్లావ్
ఆ పూట నా బాక్సులో రొయ్యల గోంగూర బడికట్టికెల్లకుండా బండాడ దిబ్బకి తెవాల్సింది
ఒరేయ్ చేనుకు నీరైనోడా ! నువ్ చల్లిన మెతుకులే మొలుస్తున్నాయ్

****
బెమ్మోత్సవాలపుడు
మళ్ళీ ఒలేయ్ ఆడికి అన్నమెట్టని
అమ్మోచ్చేలోపే రధానికి రంగులేయడానికెల్లావ్
చెక్రాలు సుబ్బరంగా  తుడిసి, సీలల్లో నూనె పోసావ్
బగమంతుడు బద్దకిస్తాడని రధాన్ని నువ్వేలాగావ్
బతుకంతా మెతుక్కిమొకమాసినా బాగవంతుడుకంటే  గొప్పయ్యావ్

ఒరేయ్ బువ్వగా!
గెడ్డం మాసిన సూరీడా
బతుకంటే మెతుకులేనా?
అన్నమంటే  అమ్మా, నాన్నేనా
అన్నం ముందు కుచ్చుంటే
కంచం నిండినా , నువ్వు గుర్తొచ్చాకే కడుపునిండేది.

(నా బతుక్కీ , నా మెతుక్కీ, నా బంగారానికి , అంటే మా నానకి )

-కాశి రాజు

చిత్ర రచన: ఏలే లక్ష్మణ్

గ్రావిటీ

 

1

భూమి నుదుట తడిముద్దు పెట్టి

గుట్టుచప్పుడు కాకుండా ఇంకిన చినుకు

ఎదో ఓ రోజు ఊటనీరై ఉవ్వెత్తున ఉబుకుతుంది.

 

2

తల్లికొమ్మలోంచి తలపైకెత్తి

కరుగుతున్న కాలాలన్నీటినీ ఒడిసిపట్టిన ఆకు

నేల రాలాకే గలగలా మాట్లాడుతుంది.

 

3

తొడిమెపై తపస్సు చేసి

లోకాన్ని తన చుట్టూ తిప్పుకున్న పువ్వు   

మట్టి పాదాలు తాకడానికి

ఏ గాలివాటానికో లొంగిపోతుంది.

 van_gogh_almond_tree

4

అనంతమైన ఆకాశాన్ని సాగు చేసి    

చుక్కల మొక్కలు నాటిన చంద్రుడు

చిన్న నీటిబిందువు కోసం కిందికి చేతులు సాచి

అలల తలలను దువ్వుతాడు.

 

5

ఎప్పుడూ

కళ్ళనిండా కలల వత్తులేసుకుని  

ఆలోచనకీ అక్షరానికీ మధ్య తచ్చాడే నాకు      

 

ఆకులా  

పువ్వులా

చినుకులా 

అలను తాకే వెన్నెలలా

 

నిన్ను హత్తుకోవడమే ఇష్టం.

అపురూపం … ఆ… స్వరసంగమం

bhuvanachandra (5)

“సంగీత సాహిత్య సమలంకృతే…” అని వాగ్దేవిని కీర్తించారు సి.నా.రె.గారు. 29.10.2013న రామోజీ ఫిలిం సిటీలో ఆ ‘పాట’ని గుర్తు తెచ్చుకోనివారు లేరు. ఆ రోజున అక్కడ సాక్షాత్తు ‘సంగీత సాహిత్య సరస్వతి’ కొలువైంది. 80 సంవత్సరాల తెలుగు చలన చిత్ర సంగీత, సాహిత్యకారులకు స్వరాభిషేకం ఆ శారదాదేవి సాక్షిగా జరిగింది. ‘కన్నుల పండువ’ అనే పదానికి అర్ధం ఆనాడు ‘కళ్ల’కి తెలిసింది. ‘వీనులవిందు’ అనే పదంలోని విందుని శ్రవణేంద్రియాలు, ఆస్వాదించాయి. అక్కడ వున్న ప్రతి మనిషీ ‘మానసికోల్లాసం’ అనుభవించారు.
మరోసారి అటువంటి ‘మహాసభ’ జరుగుతుందా? ఏమో! జరిగిన మహోత్సవాల్ని తలుచుకుని ఆనందం. ‘మళ్ళీ ఎప్పుడు?’ అని ప్రశ్నించిన గుండెకు ‘మౌనమే’ సమాధానంగా మిగిలింది.
సృష్టికర్త రామోజీ, రధసారధి ‘బాపినీడు’గారు చిరునవ్వుతో ఆహుతుల్ని ఆహ్వానిస్తుండగా, అతిరధ మహారధులు ఆ ‘స్వరమండపాని’కి విచ్చేశారు.
అరుగో.. ఎనభైలు దాటిన సంగీత చక్రవర్తులూ, సాహిత్య సామ్రాట్‌లూ. దర్శకేంద్రులూ, దర్శకరత్నలూ, గాయక, గాయనీ శ్రేణులు,, అబ్బా.. కెమెరాలు పులకించిపోయాయి.
దక్షిణ భారత చలన చిత్ర సంగీతానికి ఓ చిరునామా ఇచ్చిన శ్రీ ఎం.ఎస్. విశ్వనాధన్‌గారు. అరుగో.. చేతులు జోడించి నమస్కరిస్తూ… ఎన్నెన్ని అద్భుతమైన పాటలాయనవీ.
అరుగో… కర్ణాటక సంగీతాన్ని వినీలాకాశంలో నిలబెట్టిన అచ్చ తెలుగు వాగ్గేయకారుడు శ్రీ బాల మురళీకృష్ణ.. “సాక్షాత్తూ శ్రీ కృష్ణుని వేణువే భువిలో బాలమురళియై అవతరించిందా..! అనిపించేంత మహోన్నత సంగీత విద్వాంసుడూ, నవరాగాల సృష్టికర్తా.. మెల్లగా నడిచి వస్తున్నారు. చిరునవ్వుతో వాహ్.. ‘పంచెకట్టు’ని తన కవిత్వంతో ప్రపంచవేదిక మీద నిలబెట్టిన ‘విశ్వంభరుడు’ జ్ఞానపీట్ అవార్డు అందుకున్న సుజ్ఞాన మూర్తి.. ఆచార్య ‘సి.నా.రే’ మెల్లమెల్లగా వస్తున్నారు. ఆ మహనీయులందరికీ పాద నమస్కారాలు చెయ్యని మనిషి ఆ మహోత్సవంలో లేరు. ఎవరు చెప్పారు? . ఆ మహానుభావులు పాదాల మీద వాలమని?

b2
ఆహా నిలువెత్తు మనిషి! పదహారు భాషల్లో ఏభైవేలకి పైగా పాటలు పాడి ‘గిన్నీస్’ బుక్కులో ధృవతారలా మెరుస్తున్న ఆ బిగ్‌బాస్ డా.కె.జె.ఏసుదాస్ కాక ఇంకెవరూ… పక్కనే విజయ్ యేసుదాస్.. వర్ధమాన్ గాయకుడూ, తండ్రికి తగ్గ తనయుడూ..
తెలుగు సినిమాకి నాలుగున్నర దశాబ్దాల పాటు వారే ‘దిశానిర్దేశకులు’.. నేటికీ ‘పెద్ద దిక్కు’ వారే.. శ్రీ దాసరి నారాయణరావుగారూ. శ్రీ కె.రాఘవేంద్రరావుగారూ, వారే … కృష్ణార్జునుల్లా నడిచొస్తున్నారు. ప్రేక్షకుల జేజేలు అందుకుంటూ..
ఎనభైకి దగ్గరవుతున్న ఆయన గుర్తున్నారా… ‘రాజన్ – నాగేంద్ర’ జంటలో నాగేంద్రగారు. ఎన్ని మధురమైన పాటల్ని ‘స్వరించారు’ నిటారుగా నడుస్తూ ‘కాలపు వీణ’కి స్వరాలందిస్తూ వస్తున్నారు.
అట్నుంచి వాణీ, జయరాంగార్లు.. భార్యభర్తలిద్దరూ ఆకూవక్కల్లాగా వస్తున్నారు. వాణీజయరాంగారి ‘బోలీరే పపీ హరా’ గుర్తున్నదా? ఇప్పటికీ అదే ‘గుడ్డీ’వాయిస్.
బి.వసంతగారు. మనకున్న మంచి గాయనీమణుల్లో ఆమె ఒకరు. ఏ ‘హిందీ’పాటని ‘కూనిరాగం’ తీసినా BGMతో ఆ పాటు పూర్తి లిరిక్స్‌తో పాడగల తెలుగు గాయని. ఇక అరుగో సుశీలమ్మ.. దక్షిణ భారత ‘లతా’ మంగేష్కర్. పాడేటప్పుడు ‘శ్వాస’ శబ్దం రానివ్వని ఏకైక గాయనీమణి. అదెలాగో ఇప్పటికీ సీక్రెట్టే.. దక్షిణ భారత దేశపు భాషలన్నీ సుశీలగారిని ‘ఆసరా’గా చేసుకుని తమ గీతాల్ని పల్లవించాయి.
అమ్మయ్యా.. వస్తున్నది చిత్రగారు. ‘వేణువై వచ్చాను భువనానికీ’ అంటూ శ్రోతల్ని కన్నీళ్లు కార్పించక మానదు. చెరగని ‘నవ్వు’ఆవిడకి దేముడిచ్చిన వరం. అందుకే ఆవిడకి ‘ప్రిన్సెస్ ఆఫ్ స్మైల్స్’ అని పేరు పెట్టాను.
చల్లగా నవ్వుతూ వస్తున్నారు ఎస్.పి.శైలజగారు. ఎస్.పి చరణ్ (బాలూగారి అబ్బాయి) ఎస్.పి శైలజ బాలూగారికి చెల్లెలుగా పుట్టకపోతే ‘డ్యూయట్లు’ అన్నిటిమీదా ఆమె పేరే రాయబడి వుండేదేమో.. ‘నాంపల్లీ టేసనుకాడ రాజాలింగో’ ఎవరు మరువగలరు? వాహ్.. ప్రణవి.. టిప్పూ.. టిప్పూగారి భార్య హరిణి.. సందీప్ ఇంకా ‘లిటిల్ చాంప్స్’ లోనూ ‘పాడుతా తీయగా’ లోనూ పాడిన యువ, చిన్నారి గాయకులు.. అదుగో గాయని విజయలక్ష్మి. అరుగో సాంగ్ పహిల్వాన్ ఎస్.పి.బాలూగారు. ఆ పక్కన ‘మనో’.. ఇంకేం కావాలి.. గాలి వాయులీనమైంది. గుండె ‘స్వరస్మృతుల’తో నిండిపోయింది. ఎందుకు నిండదూ? విద్యాసాగర్.. రాజ్.. రమణీ భరద్వాజ్.. ఎస్.ఏ.రాజ్‌కుమార్. గంగై అమరన్, మాధవపెద్ది సురేష్.. చైతన్య ప్రసాద్, దేవిశ్రీప్రసాద్, మణిశర్మ, సాలూరి వాసూరావు. ఆర్.పి. పట్నాయక్, అనూప్ రూబెన్స్, లాంటి సంగీత దర్శకులు తమ శ్వాసల్నే స్వరాలుగా పేరుస్తూ వుండగా.. అరుగో. సిరివెన్నెల సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, వెన్నెలకంటి రాజేశ్వర (ప్రసాదు) భాస్కరభట్ల రవికుమార్, జాతీయ పురస్కార గ్రహీత సుద్దాల అశోక్‌తేజ, వాచస్పతి సాయికుమార్.. ఓహ్.. మాటలే పాటలై పరవశిస్తున్నాయా..

ph 1
పరస్పర ఆలింగనలు
పాదనమస్కారాలు
ఆటోగ్రాఫులు
ప్రేక్షకులతో ఫోటోలు
అవిశ్రాంతంగా అందర్నీ, అన్నింట్నీ ‘తమలో’ ఇముడ్చుకుంటున్న వీడియో కెమేరాలు. నవ్వులు. అక్కడక్కడా భావోద్రేకంలో కన్నీళ్లు
ముఖాన తగిలించుకున్న ‘ముసుగు’ లన్నీ తొలగిపోయి స్వచ్చమైన మానవత్వం పరిమళించింది.
హృదయాల్లో స్నేహం పెల్లుబికింది.
బాలమురళీకృష్ణగారు, ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా’ అన్న ‘గుప్పెడు మనసు’ చిత్రంలోని పాటని అందుకోగానే అందరి కళ్లల్లో ఆనంద భాష్పాలు, ఎనభై మూడేళ్ల వయసా ఆయనది? మరి, ‘సలలిత రాగ సుధారస సారం’ పాటకి ఎలా పాడగలిగరబ్బా? నేటి బుల్లి గాయని ప్రణవితో..
“ఆకాశదేశానా… ‘ అని జేసుదాసుగారు పాడుతుంటే ఏమిటీ. యీ స్వరమందిరం పులకించిపోతోందేం..
మళ్లీ చిత్రగారు “వేణువై వచ్చాను భువనానికీ’ అని పాడుతుంటే, ‘గాలినైపోతాను గగనానికీ’ అంటూ వేటూరిగారు గాలిలా మారి అందరి గుండెల్ని సృశించారు.
జ్ఞాపకాల కన్నీళ్లు. స్వర వర్షంతో కలిసి పాటల వరదలయ్యాయి. ‘చినుకులా మారి’ అంటూ బాలుగారు వాణీజయరాంగారూ, ఎస్.పి.శైలజ కురిపించిన మధువుల్ని మనసునిండా నింపుకున్నాం.
అయ్యా.. ఇదో మరపురాని, మరువలేని స్వర సంగీత సాహిత్య సంగమం. ఎంత మైమరచిపోయానంటే, చెన్నై చేరుకున్నాక గుర్తొచ్చింది. మనసుతో తప్ప కెమేరాతో ఒక్క ఫోటో కూడా తీయలేకపోయానని.
అన్ని విషయాలూ, చలోక్తులూ, చమక్కులూ, చెప్పను. ఎందుకంటే నా గుండె మారుమూలల్లో ఓ పాట (రాజ్ కపూర్‌ది, ముఖేష్ పాడింది) వినిపిస్తోంది.
“కల్ ఖేల్ మే.. హం హో న హో” లో
గర్దిష్ మే తారే రహేంగే సదా
భూలోగే హమ్ భూలేంగే తుమ్
పర్ హమ్ తుమ్హారే రహెంగే సదా
రహెంగే యహీ.. ఆప్నీ నిశాన్
ఇస్ కె సివా జానా కహా..
జీనా యహా.. మర్‌నా యహా..
అంటూ ‘రేపటి ఆటలో మనముంటా’మో ఉండమో.. కానీ ఆ నీలాకాశంలో నక్షత్రాలు అక్కడే ఉంటాయి. అంతట్నీ చూస్తూ సాక్షులుగా, నువ్వు మర్చిపోవచ్చు, వారూ, మీరు అందరూ మర్చిపోవచ్చు. కానీ నేను మాత్రం సదా మీ మనిషినే! ఇవిగో.. నా జ్ఞాపకాల నీడల్ని ఇక్కడే వదిలి వెళ్తున్నాను. జీవించడమూ ఇక్కడే.. మరణించడమూ ఇక్కడే. వెళ్ళేది వేరెక్కడికీ..”
ఈ పాట నా గుండెని పిండేస్తోంది. మరోసారి అందరం కలుస్తామా… పోనీ ఏప్పుడో కలిసినా అందరం ఉంటామా? ఎందర్ని తల్చుకుని కన్నీళ్లు కార్చాలో.. ఎందరి జ్ఞాపకాల నీడల్లో నిట్టూర్పులు విడవాలో.. భగవాన్.. ‘కాహెకో దునియా బనాయీ? ఎందుకు సృష్టించావయ్యా యీ లోకాన్ని?

b1(1)
పోనీలే..
“ఇక్ దిన్ హై మిల్‌నా..
ఇక్ దిన్ హై బిఛడ్‌నా,
దునియా హై దో దిన్ కా మేలా…!” అని కదూ ముఖేష్ తన ‘దర్ద్ భరీ’ స్వరంతో పాడింది.. నిజమే రెండు రోజుల పాటు కలిసుండి తర్వాత ఎవరికి వారు విడిపోవలసిన ‘తిరునాళ్లే’గా జీవితమంటే..
‘చల్‌నా జీవన్ కీ కహానీ
రుక్‌నా మోత్ కి నిషానీ
(నడవడమే జీవితం అంటే.. ఆగటం అంటే మరణించడమే)
అందుకే భయ్యా.. చల్.. చల్తే చల్..
“చల్ అకెలా చల్ అకెలా చల్ అకేలా..”
మనుషుల్నీ, మమతల్నీ, మనుషుల్నీ కలుపుకుంటూ, విడిపోతూ జ్ఞాపకాల మూటల్ని మోసుకుంటూ, ప్రకృతి గీతం వింటూ సాగిపోదామా .. పదండి మరి..

ప్రేమతో
మీ భువనచంద్ర

(ఇంతటి మహాకార్యం అద్భుతంగా నిర్వర్తించి అసాధ్యాన్ని ‘సాధ్యం’ చేసిన శ్రీ రామోజీరావుగరికి పాదాభివందనం చేస్తూ..)

పగలే వెన్నెల జగమే ఊయల…

Full-moon

శరదృతువు కదా చీకట్లు ముసరగానే చల్లని తెల్లని వెన్నెల పరుచుకుంటోంది. బాల్కనీలోంచి, కిటికీ గ్రిల్ లోంచి కురుస్తున్న వెన్నెలకాంతి మనసుని కూడా నింపేస్తోంది. నిశీధివేళ బస్సులో వెళ్తూంటే నా సీటు పక్కనున్న కిటికీలోంచి తొంగి చూస్తూ నాతో పాటే ప్రయాణిస్తూ వచ్చేస్తోంది చంద్రకాంతి. మామూలురోజుల్లో వెన్నెలకీ ఈ శరత్కాలపు వెన్నెలకీ ఎంత తేడానో! ఇంత వెలుగు ఎక్కడ్నుండి తెస్తాడో చంద్రుడు తెలీదు కానీ చూసేకొద్దీ చూడాలనిపించేలా మనోల్లాసాన్ని పెంచి, తన కౌముదిలో మనల్ని ముంచిపోతాడు. ఊ..ఊ.. తెలిసిపోయిందా ఈనాటి గీతనేపథ్యం ఏమిటో… అవును.. అదే… తెల్లని చల్లని “వెన్నెల”!

“కార్తీకమాసపు రాత్రివేళ
కావాలనే మేలుకున్నాను
చల్లని తెల్లని వెన్నెల
అంతటా పడుతోంది
మెత్తని పుత్తడి వెన్నెల
భూమి ఒంటిని హత్తుకుంది…”
అంటారు తిలక్ మహాశయులు తన ‘వెన్నెల’ కవితలో!
కవిత మధ్యలో వెన్నెల ఎలా ఉందో వర్ణిస్తూ ఎన్ని ఉపమానాలు చెప్తారో…

“చలి చలిగా సరదాగా ఉంది వెన్నెల
చెలి తొలిరాత్రి సిగ్గులా ఉంది
విరిసిన చేమంతిపువ్వులా ఉంది
పడకగదిలో వెలిగించిన
అగరొత్తుల వాసనలా ఉంది
పడగిప్పిన పాములు తిరిగే
పండిన మొగలి వనంలాగుంది
పన్నీరు జల్లినట్టు ఉంది
విరహిణి కన్నీరులా ఉంది
విరజాజుల తావితో కలిసి
గమ్మత్తుగా ఉంది
విచిత్రమైన మోహమణి
కవాటాలను తెరుస్తోంది
యౌవన వనంలోని కేళీ సరస్సులా ఉంది
దవుదవ్వుల పడుచు పిల్లలు
పకపక నవ్వినట్టుంది
దాపరికంలేని కొండజాతి
నాతి వలపులాగుంది…”
(తిలక్ గళంలో ఈ కవిత ‘ఇక్కడ’ వినవచ్చు)

ఇన్ని ఉపమానాలు చెప్పేసాకా, ఇంకా వెన్నెల అందాలను వర్ణించటానికి ఎవరికైనా పదాలూ, అక్షరాలూ ఏం మిగులుతాయి :) అంతలోనే ఇంకోలాగ కూడా అనిపిస్తుంది.. ఎవరెంత పొగిడినా, ఎన్ని అక్షరాల నగిషీలు చెక్కినా వెన్నెల అందం తరగదు.. మనకు తనివీ తీరదు.. అంతటి సౌందర్యం వెన్నెల సొత్తు మరి! అందుకే, సినీకవులు వర్ణించిన మరిన్ని వెన్నెల సోయగాలను కళ్ళలో నింపుకుందాం… నాతో రండి మరి…

వెన్నెల పాటలు అనగానే నాకు గుర్తొచ్చే మొదటిపాట సాక్షి చిత్రంలో బాపూ బొమ్మలాంటి అందమైన పాట..

1) “అటు ఎన్నెల ఇటు ఎన్నెల
ఎటు సూస్తే అటు ఎన్నెల
ఓరందగాడా బంగారుసామీ…” అంటూ మొదలుపెట్టి

“ఏరులాగ ఎన్నెలంతా జారిజారి పారిపోతే ఏటికెడద అడ్డమేసెదరా..
నిన్ను చూస్తే మనసు నిలవదురా..”
అని కవ్విస్తుంది ఓ నాయిక!

“మల్లెమొగ్గల నవ్వు నవ్వకురా నీ నవ్వులోనే తెల్లవారునురా” అంటున్న ఈ గుమ్మ పాడే మొత్తం పాట ఇక్కడ:
1) http://www.youtube.com/watch?v=SniweKKmOCo

2) “కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా
మెరిసే గోదారిలో విరబూసిన నురగలా.. ” అంటూ తెల్లని చీరలో మెరిసిపోతున్న నాయికని చూసి ఆశ్చర్యపోతాడొక కథానాయకుడు. ఈ అందాలరాముడి సంగతేమిటో, ఆ చిన్నదాని వలపుపాట ఏమిటో ఇక్కడ చూడండి..
2) http://www.youtube.com/watch?v=UFoqzbG2gnw

3) ఒంటరివాళ్ళు ఓపనిదీ
జంటకు చాలీచాలనిదీ
చెలి కన్నులలో వెలిగేదీ
చిలిపిపనులు చేయించేది…ఈ వెన్నెలేట! మీకు తెలుసా?

“ఈ వెన్నెల.. ఈ పున్నమి వెన్నెల..
ఈనాడూ ఆనాడూ.. అదే వెన్నెల..”
అంటూ వెన్నెల వర్ణాలను వివరిస్తారు నాయికానాయకులు ఈ పాటలో.
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=576

4) “మధురమైన రేయిలో
మరపురాని హాయిలో
పండూవెన్నెలే నేడు
పాడేనేలనో…”
అని ‘తోబుట్టువులు’ చిత్రంలో ఓ మనోహరమైన వెన్నెల పాట ఉంది.. హాయిగా ఉయ్యాలలో ఊగుతున్నట్లుంటుంది ఈ పాట వింటుంటే..

3) https://www.youtube.com/watch?v=tJinQfhfCm0#t=119

5) “చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో
అందమే నాలో లీనమాయెనే ఆనందమే నా గానమాయెనే” అంటున్న ఈ ప్రేమికుడి ఆనందమేమిటో కాస్త విందురూ…
(చిత్రం: సంసారం, సంగీతం: దక్షిణామూర్తి)

6) “మెరిసిపోయే ఎన్నెలాయే
పరుపులాంటి తిన్నెలాయే
నన్ను ఇడిసి ఏడ పోతివిరా.. బంగారు సామీ
రేతిరంతా ఏమిసేతునురా”
అని వగలుబోతుంది ఓ చిన్నది. ఈ చిన్నదాని అలుకలేమిటో.. ఫిర్యాదులేమిటో క్రింద లింక్లో వినేయండి…

http://www.song.cineradham.com/player/player.php?song[]=1627

7) ” వెన్నెల పందిరిలోన
చిరునవ్వుల హారతులీనా
పండు వెన్నెల మనసు నిండా వెన్నెలా
కొండపైనా కోనాపైనా కురిసే వెన్నెలా…విరిసే వెన్నెలా ”
అంటూ వెన్నెలను చూసి మురిసిపోయే ఈ పాట ‘దేవులపల్లి’ రచన ! ‘అద్దేపల్లి రామారావు’ స్వరపరిచిన ఈ పాటను ‘బంగారు పాప’ చిత్రానికి ఎ.ఏమ్.రాజా,సుశీల పాడారు…
http://www.oldtelugusongs.com/newsongs/vintage/BangaruPapa_1954-AMRaja&Suseela-VennelaPandiriLona_Devulapalli_AddepalliRamaRao.mp3

8) “చల్లని వెన్నెలలో నా ఒడిలో నిదురపో
అల్లరి మానుకుని నా మదిలో ఒదిగిపో..”
అంటూ సాగే ఈ పాట వెన్నెలంత చల్లగా, శాంతంగా ఉంటుంది..
(శ్రీమంతుడు /టి.వి.చలపతిరావు)

9) “నవమినాటి వెన్నెల నేను
దశమినాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయి
కార్తీక పున్నమి రేయి..”
ఎన్నిసార్లు విన్నా దాహం తీరని పాట కదూ ఇది! వేటూరి మాత్రమే రాయగలిగిన పాట అంటే అతిశయోక్తి కాదు..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7236

10) వెన్నెల పాటల్లో తప్పనిసరిగా గుర్తుచేసుకోవాల్సిన వేటూరి రచన “చంద్రకాంతిలో చందన శిల్పం ..”
నాయిక సోయగాన్ని నదులతో పోలుస్తూ..
..తుంగభద్రవో
..కృష్ణవేణివో
..గౌతమివో
..వంశధారవో
అంటూ వేటూరి వర్ణిస్తూంటే వినటానికి రెండుచెవులు చాలవు…అద్భుతమైన రచన!
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6017

11) “అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని తూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి
కోమలీ…ఓ జాబిలీ.. ” అంటాడో చినవాడు
“వాడేవీడు” చిత్రంలోని ఈ పాట ఇక్కడ..

12) “పూవై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేల బేలా..” అంటూ తొలిరేయిన ముచ్చటగా పాడుకుంటాడో కొత్త పెళ్ళికొడుకు. ఆతని తొందర, వధువు సిగ్గుదొంతరలు.. ఈ పాటలో..
(శ్రీతిరుపతమ్మ కథ, ఘంటసాల)

13) “విరిసిన వెన్నెలవో
పిలిచిన కోయిలవో
తీయని కోయిలవో
చెలీ.. చెలీ.. నీవెవరో”
అంటూ చెలిని పలురకాలుగా వర్ణించే ఈ పాట ‘బందిపోటు దొంగలు’ చిత్రంలోది…

14) “ఈ పాల వెన్నెల్లో నీ జాలి కళ్ళల్లో ఇద్దరూ ఉన్నారూ.. ఎవ్వరూ వారెవరూ?” అనడుగుతుంది ప్రియురాలు
“ఈ పాల వెన్నెల్లో నా జాలి కళ్ళల్లో.. ఇద్దరు ఒకరేలే.. ఆ ఒక్కరూ నీవేలే..” అంటాడు ప్రియుడు.
ఈ ప్రేమికుల గుసగుసలూ ఉసులూ, బాసలూ ఏమిటో ఇక్కడ చూసేయండి..

15) లవకుశ చిత్రంలో రాముడు అయోధ్యకు వచ్చాకా జనావళి ఆనందోత్సాహాలతో పాడుకునే ఈ పాట సంగీతంలో కూడా వెన్నెలలు కాయించారు ఘంటసాల…
(విరిసె చల్లని వెన్నెల )

16) “విరిసే వెన్నెలలో వెంట జంట ఉండాలోయ్ ” అంటూ హాస్యనటుడు రేలంగి పాడిన ఓ పాట ఉంది.. ‘ధర్మ దేవత’ చిత్రంలో!
పాడినది: రేలంగి, జిక్కీ; సాహిత్యం: సముద్రాల రాఘవాచారి, సంగీతం: సి.ఆర్.సుబ్బరామన్.
(6th song in the link)
http://www.sakhiyaa.com/dharma-devata-1952-%E0%B0%A7%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%A4/

ఇలా వెన్నెల రేయిలో ప్రేయసీప్రియులు పరవశించే పాటలే కాక పగటిపూట కూడా తమ రచనలతో వెన్నెలలు పూయించారు మన సినీకవులు.. అటువంటి ఓ రెండు పాటలు…

* ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ
వింత కాదు నా చెంతనున్నది వెండివెన్నెల జాబిలీ నిండుపున్నమి జాబిలీ..” అని చమత్కరిస్తాడు ఓ చెలికాడు. అతని కధేమిటో కనుక్కుందామా?

** “ఆధా హై చంద్రమా…” అనే ప్రఖ్యాత హిందీ పాట నుండి ప్రేరణ పొందింది పూజాఫలం చిత్రంలోని “పగలే వెన్నెల జగమే ఊయల…”! హిందీ ట్యూన్ ని కొద్దిగా స్లో చేస్తే ఈ పాట పోలికలు తెలుస్తాయి మనకి..

ఈసారికి ఇవేనండీ.. మరి బాగున్నయా వెన్నెలగీతాలు…?! మరో గీతనేపథ్యంతో మరోసారి కలుద్దామేం…