అవ్యక్తం

భాస్కర్ కొండ్రెడ్డి

భాస్కర్ కొండ్రెడ్డి

1

 ఎదురుచూస్తునే వుంటాం మనం,

కళ్లువిప్పార్చుకొని, ఇంకొన్ని ఆశలు కూర్చుకొని,

ఆ చివరాఖరి చూపులు

మళ్లీ తెరుచుకోకుండా, మూసుకొనేదాకా.

 

2

ఎన్ని కష్టాలు తలలకెత్తుకొని తిరుగాడిన దుఃఖాలనుంచి

విముక్తినొందే సమయాలను మళ్లీమళ్లీ తలుచుకుంటూ

వదిలిపోయిన చిరునవ్వుల చివరిస్పర్శల పలకరింతలను

పదిలంగా దాచుకొని, దాచుకొని

పగలకుండా, ఓదార్చుకుంటున్న

ఓ పురా హృదయాన్ని, కొత్తగా పునర్మించుకోలేక

వదలని వేదనను, హత్తుకొని సముదాయుంచుకొంటూ

 

3

ఎన్నెన్ని ఆలోచనలు సమసిపోయాయో

ఏ ఏ అనుభూతులు వదలిపోయాయో

ఎన్ని జీవితకాంతులు,అలా చూస్తుండగానే ఆరిపోయాయో

లెక్కలకందని,లెక్కించలెన్నన్ని తారకల్లా తెల్లారిపోయాయో

ఒక హృదయసాక్షానికి, తార్కాణంగా మిగలడానికి కాకపోతే

ఎందుకిలా, ఇక్కడే చూస్తుండిపోతాం.

దేన్నీవదలకుండా, ఎటూ కదలకుండా.

4

మొదలుకావడంలో మన ప్రమేయమే లేనట్లు

పయనమంతా మనమే చేసినట్లు, భరించినట్లు

ఇహలోకబంధాలు వదిలించుకొని,

ఇకరా అని, ఎవరో పిలిచినట్లు,

 

ఒక్కొక్క అంశాన్ని ఎంత జాగ్రత్తగా,

పునఃసమీక్షించుకుంటుంటామో కదా, మనం.

 

మనకు మనమే ఒక వైభోగవంతమైన వలయాన్ని,

కందకంలా నిలుపుకొని, కనులముందు

ఎంతగా విలపిస్తామో మరి,  దాన్నిదాటలేక.

– భాస్కర్ కొండ్రెడ్డి

మీ మాటలు

  1. balasudhakarmouli says:

    వొక తాత్విక విలక్షణత .. మీరు కనిపించారు

  2. balasudhakarmouli says:

    వొక తాత్విక విలక్షణత కవిత్వం నిండా ..

  3. మనకు మనమే ఒక వైభోగవంతమైన వలయాన్ని,

    కందకంలా నిలుపుకొని, కనులముందు

    ఎంతగా విలపిస్తామో మరి, దాన్నిదాటలేక…

    నిజమే.. అవ్యక్తం కాని భావాన్ని కవిత్వీకరించి కనుల ముందు నిలిపారు. అభినందనలు భాస్కర్జీ..

  4. బాగుంది. we are traveling in the same boat.

  5. కవితలో కవి ఇంకా తన్నుకుంటూనే ఉన్నాడు గొంతు విప్పుకోవడంకోసం.

    చివరాఖరి అనే ప్రయోగం కథల్లో మాండలికానికీ బాగుంటుందేమో గాని కవితలో బాగాలేదు.

    అవును ఈ మధ్య కాలంలో ప్యూర్ పొయట్రీ విరివిగా వస్తూ ఉంది. శుభం.
    పులికొండ.

    • :),. ఏదో వచ్చీరాని కవిత్వం సర్,.. ఒక రకంగా గొంతుపెగలని కవిత్వం,.. నేర్చుకునే ప్రయత్నం,. ధన్యవాదాలు సుబ్బాచారి గారు, మీ ఆదరపూర్వక వ్యాఖ్యకు.,.

  6. mohan rishi says:

    వొక తాత్విక విలక్షణత. మీరు కనిపించలేదు! :-)

    • ఏదో మీ విలక్షణత కొద్ది మీరు కవిత్వాన్ని చూడగలిగారు,. నన్నొదిలి,. రుషి,. ధన్యవాదాలు,.

  7. మొదలుకావడంలో మన ప్రమేయమే లేనట్లు

    పయనమంతా మనమే చేసినట్లు, భరించినట్లు

    ఇహలోకబంధాలు వదిలించుకొని,

    ఇకరా అని, ఎవరో పిలిచినట్లు, బాగుందండి

మీ మాటలు

*