పగలే వెన్నెల జగమే ఊయల…

Full-moon

శరదృతువు కదా చీకట్లు ముసరగానే చల్లని తెల్లని వెన్నెల పరుచుకుంటోంది. బాల్కనీలోంచి, కిటికీ గ్రిల్ లోంచి కురుస్తున్న వెన్నెలకాంతి మనసుని కూడా నింపేస్తోంది. నిశీధివేళ బస్సులో వెళ్తూంటే నా సీటు పక్కనున్న కిటికీలోంచి తొంగి చూస్తూ నాతో పాటే ప్రయాణిస్తూ వచ్చేస్తోంది చంద్రకాంతి. మామూలురోజుల్లో వెన్నెలకీ ఈ శరత్కాలపు వెన్నెలకీ ఎంత తేడానో! ఇంత వెలుగు ఎక్కడ్నుండి తెస్తాడో చంద్రుడు తెలీదు కానీ చూసేకొద్దీ చూడాలనిపించేలా మనోల్లాసాన్ని పెంచి, తన కౌముదిలో మనల్ని ముంచిపోతాడు. ఊ..ఊ.. తెలిసిపోయిందా ఈనాటి గీతనేపథ్యం ఏమిటో… అవును.. అదే… తెల్లని చల్లని “వెన్నెల”!

“కార్తీకమాసపు రాత్రివేళ
కావాలనే మేలుకున్నాను
చల్లని తెల్లని వెన్నెల
అంతటా పడుతోంది
మెత్తని పుత్తడి వెన్నెల
భూమి ఒంటిని హత్తుకుంది…”
అంటారు తిలక్ మహాశయులు తన ‘వెన్నెల’ కవితలో!
కవిత మధ్యలో వెన్నెల ఎలా ఉందో వర్ణిస్తూ ఎన్ని ఉపమానాలు చెప్తారో…

“చలి చలిగా సరదాగా ఉంది వెన్నెల
చెలి తొలిరాత్రి సిగ్గులా ఉంది
విరిసిన చేమంతిపువ్వులా ఉంది
పడకగదిలో వెలిగించిన
అగరొత్తుల వాసనలా ఉంది
పడగిప్పిన పాములు తిరిగే
పండిన మొగలి వనంలాగుంది
పన్నీరు జల్లినట్టు ఉంది
విరహిణి కన్నీరులా ఉంది
విరజాజుల తావితో కలిసి
గమ్మత్తుగా ఉంది
విచిత్రమైన మోహమణి
కవాటాలను తెరుస్తోంది
యౌవన వనంలోని కేళీ సరస్సులా ఉంది
దవుదవ్వుల పడుచు పిల్లలు
పకపక నవ్వినట్టుంది
దాపరికంలేని కొండజాతి
నాతి వలపులాగుంది…”
(తిలక్ గళంలో ఈ కవిత ‘ఇక్కడ’ వినవచ్చు)

ఇన్ని ఉపమానాలు చెప్పేసాకా, ఇంకా వెన్నెల అందాలను వర్ణించటానికి ఎవరికైనా పదాలూ, అక్షరాలూ ఏం మిగులుతాయి :) అంతలోనే ఇంకోలాగ కూడా అనిపిస్తుంది.. ఎవరెంత పొగిడినా, ఎన్ని అక్షరాల నగిషీలు చెక్కినా వెన్నెల అందం తరగదు.. మనకు తనివీ తీరదు.. అంతటి సౌందర్యం వెన్నెల సొత్తు మరి! అందుకే, సినీకవులు వర్ణించిన మరిన్ని వెన్నెల సోయగాలను కళ్ళలో నింపుకుందాం… నాతో రండి మరి…

వెన్నెల పాటలు అనగానే నాకు గుర్తొచ్చే మొదటిపాట సాక్షి చిత్రంలో బాపూ బొమ్మలాంటి అందమైన పాట..

1) “అటు ఎన్నెల ఇటు ఎన్నెల
ఎటు సూస్తే అటు ఎన్నెల
ఓరందగాడా బంగారుసామీ…” అంటూ మొదలుపెట్టి

“ఏరులాగ ఎన్నెలంతా జారిజారి పారిపోతే ఏటికెడద అడ్డమేసెదరా..
నిన్ను చూస్తే మనసు నిలవదురా..”
అని కవ్విస్తుంది ఓ నాయిక!

“మల్లెమొగ్గల నవ్వు నవ్వకురా నీ నవ్వులోనే తెల్లవారునురా” అంటున్న ఈ గుమ్మ పాడే మొత్తం పాట ఇక్కడ:
1) http://www.youtube.com/watch?v=SniweKKmOCo

2) “కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా
మెరిసే గోదారిలో విరబూసిన నురగలా.. ” అంటూ తెల్లని చీరలో మెరిసిపోతున్న నాయికని చూసి ఆశ్చర్యపోతాడొక కథానాయకుడు. ఈ అందాలరాముడి సంగతేమిటో, ఆ చిన్నదాని వలపుపాట ఏమిటో ఇక్కడ చూడండి..
2) http://www.youtube.com/watch?v=UFoqzbG2gnw

3) ఒంటరివాళ్ళు ఓపనిదీ
జంటకు చాలీచాలనిదీ
చెలి కన్నులలో వెలిగేదీ
చిలిపిపనులు చేయించేది…ఈ వెన్నెలేట! మీకు తెలుసా?

“ఈ వెన్నెల.. ఈ పున్నమి వెన్నెల..
ఈనాడూ ఆనాడూ.. అదే వెన్నెల..”
అంటూ వెన్నెల వర్ణాలను వివరిస్తారు నాయికానాయకులు ఈ పాటలో.
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=576

4) “మధురమైన రేయిలో
మరపురాని హాయిలో
పండూవెన్నెలే నేడు
పాడేనేలనో…”
అని ‘తోబుట్టువులు’ చిత్రంలో ఓ మనోహరమైన వెన్నెల పాట ఉంది.. హాయిగా ఉయ్యాలలో ఊగుతున్నట్లుంటుంది ఈ పాట వింటుంటే..

3) https://www.youtube.com/watch?v=tJinQfhfCm0#t=119

5) “చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో
అందమే నాలో లీనమాయెనే ఆనందమే నా గానమాయెనే” అంటున్న ఈ ప్రేమికుడి ఆనందమేమిటో కాస్త విందురూ…
(చిత్రం: సంసారం, సంగీతం: దక్షిణామూర్తి)

6) “మెరిసిపోయే ఎన్నెలాయే
పరుపులాంటి తిన్నెలాయే
నన్ను ఇడిసి ఏడ పోతివిరా.. బంగారు సామీ
రేతిరంతా ఏమిసేతునురా”
అని వగలుబోతుంది ఓ చిన్నది. ఈ చిన్నదాని అలుకలేమిటో.. ఫిర్యాదులేమిటో క్రింద లింక్లో వినేయండి…

http://www.song.cineradham.com/player/player.php?song[]=1627

7) ” వెన్నెల పందిరిలోన
చిరునవ్వుల హారతులీనా
పండు వెన్నెల మనసు నిండా వెన్నెలా
కొండపైనా కోనాపైనా కురిసే వెన్నెలా…విరిసే వెన్నెలా ”
అంటూ వెన్నెలను చూసి మురిసిపోయే ఈ పాట ‘దేవులపల్లి’ రచన ! ‘అద్దేపల్లి రామారావు’ స్వరపరిచిన ఈ పాటను ‘బంగారు పాప’ చిత్రానికి ఎ.ఏమ్.రాజా,సుశీల పాడారు…
http://www.oldtelugusongs.com/newsongs/vintage/BangaruPapa_1954-AMRaja&Suseela-VennelaPandiriLona_Devulapalli_AddepalliRamaRao.mp3

8) “చల్లని వెన్నెలలో నా ఒడిలో నిదురపో
అల్లరి మానుకుని నా మదిలో ఒదిగిపో..”
అంటూ సాగే ఈ పాట వెన్నెలంత చల్లగా, శాంతంగా ఉంటుంది..
(శ్రీమంతుడు /టి.వి.చలపతిరావు)

9) “నవమినాటి వెన్నెల నేను
దశమినాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయి
కార్తీక పున్నమి రేయి..”
ఎన్నిసార్లు విన్నా దాహం తీరని పాట కదూ ఇది! వేటూరి మాత్రమే రాయగలిగిన పాట అంటే అతిశయోక్తి కాదు..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7236

10) వెన్నెల పాటల్లో తప్పనిసరిగా గుర్తుచేసుకోవాల్సిన వేటూరి రచన “చంద్రకాంతిలో చందన శిల్పం ..”
నాయిక సోయగాన్ని నదులతో పోలుస్తూ..
..తుంగభద్రవో
..కృష్ణవేణివో
..గౌతమివో
..వంశధారవో
అంటూ వేటూరి వర్ణిస్తూంటే వినటానికి రెండుచెవులు చాలవు…అద్భుతమైన రచన!
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6017

11) “అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని తూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి
కోమలీ…ఓ జాబిలీ.. ” అంటాడో చినవాడు
“వాడేవీడు” చిత్రంలోని ఈ పాట ఇక్కడ..

12) “పూవై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేల బేలా..” అంటూ తొలిరేయిన ముచ్చటగా పాడుకుంటాడో కొత్త పెళ్ళికొడుకు. ఆతని తొందర, వధువు సిగ్గుదొంతరలు.. ఈ పాటలో..
(శ్రీతిరుపతమ్మ కథ, ఘంటసాల)

13) “విరిసిన వెన్నెలవో
పిలిచిన కోయిలవో
తీయని కోయిలవో
చెలీ.. చెలీ.. నీవెవరో”
అంటూ చెలిని పలురకాలుగా వర్ణించే ఈ పాట ‘బందిపోటు దొంగలు’ చిత్రంలోది…

14) “ఈ పాల వెన్నెల్లో నీ జాలి కళ్ళల్లో ఇద్దరూ ఉన్నారూ.. ఎవ్వరూ వారెవరూ?” అనడుగుతుంది ప్రియురాలు
“ఈ పాల వెన్నెల్లో నా జాలి కళ్ళల్లో.. ఇద్దరు ఒకరేలే.. ఆ ఒక్కరూ నీవేలే..” అంటాడు ప్రియుడు.
ఈ ప్రేమికుల గుసగుసలూ ఉసులూ, బాసలూ ఏమిటో ఇక్కడ చూసేయండి..

15) లవకుశ చిత్రంలో రాముడు అయోధ్యకు వచ్చాకా జనావళి ఆనందోత్సాహాలతో పాడుకునే ఈ పాట సంగీతంలో కూడా వెన్నెలలు కాయించారు ఘంటసాల…
(విరిసె చల్లని వెన్నెల )

16) “విరిసే వెన్నెలలో వెంట జంట ఉండాలోయ్ ” అంటూ హాస్యనటుడు రేలంగి పాడిన ఓ పాట ఉంది.. ‘ధర్మ దేవత’ చిత్రంలో!
పాడినది: రేలంగి, జిక్కీ; సాహిత్యం: సముద్రాల రాఘవాచారి, సంగీతం: సి.ఆర్.సుబ్బరామన్.
(6th song in the link)
http://www.sakhiyaa.com/dharma-devata-1952-%E0%B0%A7%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%A4/

ఇలా వెన్నెల రేయిలో ప్రేయసీప్రియులు పరవశించే పాటలే కాక పగటిపూట కూడా తమ రచనలతో వెన్నెలలు పూయించారు మన సినీకవులు.. అటువంటి ఓ రెండు పాటలు…

* ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ
వింత కాదు నా చెంతనున్నది వెండివెన్నెల జాబిలీ నిండుపున్నమి జాబిలీ..” అని చమత్కరిస్తాడు ఓ చెలికాడు. అతని కధేమిటో కనుక్కుందామా?

** “ఆధా హై చంద్రమా…” అనే ప్రఖ్యాత హిందీ పాట నుండి ప్రేరణ పొందింది పూజాఫలం చిత్రంలోని “పగలే వెన్నెల జగమే ఊయల…”! హిందీ ట్యూన్ ని కొద్దిగా స్లో చేస్తే ఈ పాట పోలికలు తెలుస్తాయి మనకి..

ఈసారికి ఇవేనండీ.. మరి బాగున్నయా వెన్నెలగీతాలు…?! మరో గీతనేపథ్యంతో మరోసారి కలుద్దామేం…

మీ మాటలు

  1. gorusu jagadeeshwar reddy says:

    వెన్నెల్లో తడిసిపోయాం సుమండీ …
    5 వ పాట సంసారం కాదండి … సంతానం .
    3 వ పాట శభాష్ సూరి అనుకుంటా .
    లంబాడోళ్ళ రాందాసు ( ఈ పాల వెన్నెల్లో ) పాట అంత మెలోడీ గా ఉందంటే కారణం సాలూరి సంగీతమే !
    – గొరుసు

    • @gorusu jagadeeshwar reddy : అవునండి యూట్యుబ్ లింక్ లో కూడా రాసారుగా..టైపింగ్ మిస్టేక్ :)
      మూడవపాట ‘శభాష్ సూరి’ లోదే. కొన్నింటికి సినిమాపేర్లు రాయలేదండి..
      వ్యాసం నచ్చినందుకు ధన్యవాదాలు.

  2. వేణూశ్రీకాంత్ says:

    వెన్నెల పాటలు బాగున్నాయండీ.. కొన్ని కొత్తపాటలు తెలిసాయి :-)

  3. ఎన్నెల says:

    ఇన్ని ఎన్నెల పాటలెట్టేస్తే ఎన్నెల ఉక్కిరిబిక్కిరైపొదా చిన్నమ్మా

  4. వెన్నెలా మత్తులా కమ్ముకుని మగతలోకి తోసేసేలా వ్రాశారండీ! పాటల పరిచయంలోనూ (వాకిలిలో), పాటలన్ని కలిపి గుత్తిలా అందివ్వడంలోనూ మీకు సాటి లేరనిపించేలా వ్రాస్తున్నారీ మధ్య

  5. వెన్నెలే ఆనందం . ఇక ఇలా అక్షరాల వెన్నెట్లో తడవడం ఇంకా ఆనందం . పండు వెన్నెల్లో తిరిగి వచ్చినంత
    హాయిగా ఉంది తృష్ణ గారు . ”నవమి నాటి వెన్నెల నీవు దశమి నాటి జాబిలీ నేను ”అంటే అర్ధం ఏమిటి ?

  6. @శశికళగారూ, ఈ పాట ఒకసారి ప్లస్ లో నేను పెట్టినప్పుడు సురేష్ కొలిచాల గారు, మరికొందరు మిత్రులు కొన్ని అర్థాలు చెప్పారు. లింక్ ఇస్తున్నా.. చూడండి..
    https://plus.google.com/u/0/105619739024237568961/posts/ట్6వ్క్షృఝ్V6ప్74

    Thank you :)

మీ మాటలు

*