అనువాదాల అవసరం

 

 

-వేలూరి వేంకటేశ్వర రావు

~

(జూలై 3 వతారీకున ఆటా సాహిత్యసదస్సులో ఇచ్చిన ఉపన్యాసం)

తెలుగు వాళ్ళు  అమెరికాలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున  సాంస్కృతిక సంబరాలు చేసుకోవటం 1977 లో మొదలయ్యింది. కొన్నేళ్ళపాటు రెండేళ్ళకోసారి ఈ పండుగ చేసుకొనేవారు.  మరి పండుగలు ప్రతిఏడూ జరుపుకోవాలిగదా! అందుకనో, మరెందుకనో, ప్రతిఏడూ ఈ సాంస్కృతిక సంబరాలు జరుపుకోవటం పాతికేళ్ళక్రితం మొదలయ్యింది. నా శ్రీమతి  ఇంగ్లీషు పుట్టింరోజు, తెలుగు పుట్టింరోజూ చేసుకుంటుంది; అంటే సంవత్సరంలో రెండు పుట్టింరోజులు!  అల్లాగే ఈ మధ్యకాలంలో తెలుగు వాళ్ళు ఈ సాంస్కృతిక సంబరాలు ఏడాదికి రెండుసార్లు జరుపుకుంటున్నారు.

తెలుగు సినిమా మన సంస్కృతిలో ప్రథానమైనది.  అందుకని, సంస్కృతి పేరుతో తెలుగు సినిమాల వాళ్ళు ముమ్మరంగా వస్తారు, అమెరికాకి!  సంస్కృతి పేరుతో రాజకీయనాయకులు కూడా వస్తారు; సంస్కృతికి రాజకీయానికీ ఉన్న సంబంధం  నాకు ఇంతవరకూ అర్థం కాలేదు.  నాకు ఇకముందు అర్థం అవుతుందన్న ఆశకూడా లేదు.

ఈ సాంస్కృతిక సంబరాలలో సాహిత్యానికి ప్రత్యేకంగా ఒక చిన్ని పీట ఎప్పుడూ ఉంటుంది. ఒక్కక్కప్పుడు అది ముక్కాలిపీట అవుతుంది కూడా!  తెలుగు నాడు నుంచి, కవులు, కథకులు, నవలా రచయితలు. విమర్శకులు, పత్రికలవాళ్ళు వగైరా వగైరా ఆహ్వానితులుగా వస్తారు. వారికి తోడుగా చిన్న తమ్ముళ్ళుగా అమెరికా రచయితలు కూడా పిలిపించుకుంటారు, –“ డయాస్పోరా”  రచయితలం అనుకుంటూ!

(కథలో కథ చెప్పాలి, పిట్టకథలాగా! 1985 లో నారాయణరెడ్డి గారిని అడిగాను; మీకు ఇప్పటివరకూ వచ్చిన కీర్తి చాలదూ? ప్రతిఏడూఒక కవితా సంకలనం అచ్చువెయ్యాలా?  మా బ్రాహ్మలు సంవత్సరీకాలు పెట్టినట్టు, అన్నాను. ఆయన మృదువుగా తనశైలిలో చెప్పారు: అలా ప్రతిఏడూ ఒక సంకలనం అచ్చువెయ్యకపోతే జనం మనని  మరిచిపోతారు” అన్నారు.)

పోతే, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది  ముక్తకంఠంతో మనభాష ఎంతగొప్పదో, మనసాహిత్యం ఎంతగొప్పదో, మన సంస్కృతి  ఎంత పురాతనమైనదో మనకి మరీమరీ నూరి పోస్తారు. ఇక్కడి వాళ్ళు—అంటే అమెరికా డయాస్పోరా రచయితలు  “ మమ మమ” అని అర్ఘ్యమ్  పుచ్చుకుంటారు.  పునః పునః.  ఏడాదికి రెండు సార్లు!

నిజమే! మనభాష, సాహిత్యం, సంస్కృతీ గొప్పవే! కాదనం.

అయితే ప్రపంచ సాహిత్యంలో మన సాహిత్యానికి  ఉన్న స్థానం ఏమిటి? మనని ఎవరు గుర్తిస్తున్నారు? మనం ఎంతవరకూ గుర్తింపబడ్డాం? పాశ్చాత్య సాహితీ వేత్తలు, పాఠకులు, అసలు ఎవరైనా  మనని గుర్తిస్తున్నారా? మన ఘోష వింటున్నారా?

సరేనయ్యా!  వాళ్ళు మనని గుర్తించవలసిన అవసరం ఏముంది? లేదా వాళ్ళు గుర్తించనంతమాత్రాన మన ఘనత తగ్గుతుందా? అని అనే వారితో నాకు పేచీ లేదు. వారితో నాకు వాదించే ఓపిక కూడాలేదు.  అంతర్జాతీయంగా తమతమ సాహిత్యాలు గుర్తించబడాలని ప్రతి భాషలో రచయితలు, సాహితీపరులూ కోరుకుంటారు.  వాళ్ళ ఆలోచనలు, అనుభవాలు  మనకి, మన ఆలోచనలు మన అనుభవాలు వాళ్ళకీ పరస్పరం తెలుపుకోవటం అవసరం అనుకునే వాళ్ళల్లో నేను ఒకణ్ణి. ఈ విషయమై నాతో ఏకీభవించేవాళ్ళు ఉన్నారని అనుకుంటాను.

మన సాహిత్యం గురించి ఇక్కడ అమెరికాలో గాని, యూరప్‌ లోగాని ఎంతమందికితెలుసు, అని మనని మనం ప్రశ్నించుకున్నప్పుడు, మన భవిష్యత్ కర్తవ్యం బోధపడుతుంది.

మనసాహిత్యం, — సంప్రదాయ సాహిత్యం, ఆథునిక సాహిత్యం ముందుగా ఇంగ్లీషులోకి తర్జుమా  చేసుకోవలసిన అవసరం ఉన్నది.  ఆ తరువాత ఇతర యూరోపియన్ భాషలలోకి అనువదించేచే ప్రయత్నాలు మనం చేసుకోవాలి.  ఇంగ్లీషులోకి అనువదించటం కేవలం వాళ్ళకోసం కాదు; నిజం చెప్పాలంటే మనకోసమే! మనపిల్లలకి తెలుగు చదవటం రాదు;  తరువాతి తరం వారికి  తెలుగు అంటే ఏమిటోకూడాతెలియని పరిస్థితి రాకూడదు. భాష రాకపోయినంతమాత్రాన, ఆ భాషలో సాహిత్యం, ఆ సాహిత్యానికున్నప్రత్యేకత, మన వారసులకి తెలియవలసిన అవసరం ఉన్నdi. ఇంగ్లీషులోకి అనువదించటం మూలంగా,  You kill two birds at one shot.

veluri

ఆటా సాహిత్య సదస్సులో…

ఒక ఉదాహరణ:  “#Zoque#” అనే భాష కేవలం 70,000 మంది మాత్రమే మాట్లాడుతారు.  ఆ భాషలో కవిత్వం ఇవాళ ఇంగ్లీషులోకి అనువదించబడుతున్నది.

తెలుగు ప్రాచీన సాహిత్యం, ఏవో ఒకటి రెండు ప్రబంధాలనో, కావ్యాలనో తీసివేస్తే నిజంగా అంతా అనువాద సాహిత్యమేకదా! ఇప్పటికే మనకి, ఇంగ్లీషునుంచి, ఫ్రెన్‌చ్‌ నుంచి, రష్యను నుంచి కొల్లలుకొల్లలుగా అనువాద సాహిత్యం వచ్చింది. ఇప్పటికీ, దక్షిణ అమెరికను సాహిత్యాన్ని, స్పానిష్ సాహిత్యాన్ని మన రచయితలు విరివిగా అనువదిస్తున్నారు. అది వద్దనను.  అయితే, అదే బిగిలో  మనసాహిత్యం వారిభాషల్లోకికూడా వెళ్ళేటట్టు చేయగలగాలి.

#Quid Pro Quo# అనండి.

మన దురదృష్టం ఏమిటంటే, మన భారతీయభాషల సాహిత్యమే ఒకభాషనుంచి మరొకభాషలోకి  ఎక్కువగా అనువదించబడలేదు. ఎక్కడో ఒకటో రెండో కవితలు, కొన్ని కథలూ అడపా తడపా ఒకటో అరో నవల ఇతరభాషలలోకి వెళ్ళాయి. అది చాలులే అని సమర్థించుకొని సంతృప్తి పడే మంచి లక్షణం నాకు లేదు.

అయితే ఈ పని ఎవరుచేస్తారు?  ఈ దేశంలోను, ఇతర యూరోపియన్‌ దేశాలలోనూ యూనివర్శిటీలు పురమాయించో, ప్రోత్సహించో ఈ పని చేస్తాయి. ఆంధ్రలో గాని, తెలంగాణాలో గాని ఉన్న విశ్వవిద్యాలయాలు ఇటువంటి పని ఇప్పట్లో చేస్తాయని నేను అనుకోను. అక్కడ వాళ్ళకున్న ఈతి బాధలు వాళ్ళవి. వాళ్ళ సాహిత్యరాజకీయాలు వాళ్ళవి.  మరి, ఇక్కడి సాంస్కృతిక సంస్థలు పూనుకోగలవా?  ఈ సంస్థలు తమంతతామే చేయలేకపోయినా,  ఊతం ఇవ్వగలvu.  అందుకు డయాస్పోరా కమ్యూనిటీ యే పూనుకొని, సంస్థలని ప్రోత్సహించాలి.

ఈ సందర్భంలో నారాయణరావుగురించి ప్రస్తావించాలి. అతను ఒక్కడూ, మరొకరిద్దరి   సహకారంతో, ఎన్నో సంప్రదాయసాహిత్యగ్రంధాలని ఇంగ్లీషులోకి అనువదించాడు. ఇంగ్లీషులో కవితా సంకలనాలు తెచ్చాడు. శ్రీనాథుడి సాహిత్యచరిత్ర (#Literary Biography#) రాసాడు. A first of its kind. ఆథునికుల కవితలు, కథలూ  కూడా అనువదించాడు.  వ్యాఖ్యానాలు రాసాడు. అవి ఓపికగా, జాగ్రత్తగా చదవకండా  తెలివితక్కువ విమర్శలు చేసే బదులు, అంతకన్నా మంచి అనువాదం తేవాలన్న అభిలాషతో, నిష్పాక్షికంగా పనిచేయాలి.  ఆ పని అసాధ్యం కాదనుకుంటున్నాను.

నాకు ఈ కోరిక 2002-2003 లో 20th Century Telugu Poetry, Hibiscus on the Lake, —  ఈ రెండుపుస్తకాలు వచ్చిన తరువాత కలిగింది. నా స్వంత అనుభవం: మా మేనకోడలికి ఇస్మాయిల్‌ కవితల అనువాదాలు చదివి వినిపించాను. ఆ పిల్ల అప్పట్లో ఇక్కడ కాలేజీలో పేపర్‌కి సబ్-ఎడిటర్‌. ఆ అనువాదాలు విని ఇవి, elijabeth barret browning పద్యాల్లా వినపడుతున్నాయి అన్నది.  ఆహా!  That’s it అనిపించింది.  అంటే ఇక్కడి పాఠకుల “ఇడియం “ పట్టుకొని అనువదించాలన్నమాట!

1960 లో #UNESCO# రెండు తెలుగు పుస్తకాలు ఫ్రెన్‌చ్‌ లోకి అనువదించమని  ఆంధ్రా యూనివర్సిటీకి ఒక “ఆల్బర్ట్” ని పంపింది. మొదటిది వేమన శతకం. అతను అనువదించాలి. అది జరిగిందోలేదో తెలియదు కాని, అతనితో స్నేహం పట్టిన మాకు వైన్‌ తాగటం మాత్రం అలవాటయ్యింది.  రెండో పుస్తకం కళాపూర్ణోదయం.  అది నారాయణరావు ఈ మధ్యనే అనువదించాడు, ఏ అంతర్జాతీయ సంస్థయొక్క ప్రమేయం లేకుండానే! అప్పుడప్పుడు UNESCO సాహిత్య అకాడమీ తో షరీకయి భారతీయ భాషల పుస్తకాలు అనువదింపజేస్తుంది. తెలుగు పుస్తకం ఒక్కటికూడా వాళ్ళ జాబితాలో లేదు.

ఇక్కడ పదవశతాబ్దపు లాక్షణికుడు  రాజశేఖరుడి శ్లోకం గుర్తుచెయ్యటం అవసరం.

ఏకస్య తిష్ఠతి కవేర్గృహ  ఏవ కావ్యమ్

అన్యస్య గచ్ఛతి సుహృద్భవనాని యావత్,

న్యస్యా విదగ్ధవదనేషు పదాని శశ్వత్

కస్యాపి ఞ్చరతి విశ్వకుతూహలీవ. –  రాజశేఖరుని కావ్య మీమాంసా, 4:10

 

ఒక కవిరచించిన కావ్యము అతని ఇంటిలోనే పడి ఉంటుంది. మరొకడురాసిన కావ్యము మిత్రుల ఇంటి వరకూ పోతుంది. ఒక్కొక్కని కవిత్వము, ప్రపంచయాత్ర చేయుటకు కుతూహలము చూపిస్తూ ఎల్లప్పుడూ సంచరించుతుంది. ( అంటే,  సామాన్య విద్యావంతులు కూడా చదువుతూ ప్రచారము చేస్తారు, అని భావం)

ఈ కాలంలో,  మనసాహిత్యం ప్రపంచయాత్ర చేయడానికి  మనప్రేరణ, ప్రయత్నం  ఉండాలి.

ఆఖరిగా ఈ మాట చెప్పాలి.

ఇజం నిజం కాదు; నిజం ఇజంలోకి పోదు.  ఇజాల గందరగోళంలో పడకుండా మనం ఉమ్మడిగాఏమిచేయగలం అన్న విషయంపై నాకుకొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అవి మరొక వ్యాసంలో పొందు పరుస్తాను.

ఇప్పుడు మీ ప్రశ్నలకి సమాధానం చెప్పటానికి ప్రయత్నిస్తాను.

శలవ్‌

 

మీ మాటలు

  1. g b sastry says:

    నీళ్ల లాగే నాగరికత దానిని ఆంటీ పెట్టుకునుండే కళలూ కూడా ఎత్తు నుండి కిందకే ప్రవహిస్తాయి.ఆర్ధికంగా,రాజకీయంగా,చారిత్రకంగా చెప్పుకో దాగిన చరిత్రలోని నిత్యం తమలో తాము కొట్టుకుంటూ అనైక్యతకి పెట్టింది పేరుగా,తమకన్ను పోయినా సరే తోటి తెలుగువాడి కళ్ళు పోతే చాలనుకుని అసలు తెలుగు వాళ్లమని కలలో కూడా అనుకోని తెలుగు వాళ్లే కొని చదవని సాహిత్యాన్ని మరింకెవరు చదువుతారు ?
    ఆంధ్రా సాహిత్యం,తెలంగాణ సాహిత్యం,తూర్పాన్ద్రా సాహిత్యం,రాయలసీమ సాహిత్యమని ఎవరికి వారు గిరిగీసుకుని కూచుండె భాషకి ఆభాషా సాహిత్యానికి విలువేముంటుంది ఇంత గెలవలేని వాళ్ళం రచ్చ గెలుపన్న మాటెక్కడుంటుంది
    ఇలాగే కొట్టుకుంటూ తిట్టుకుంటూ తెలుగుతనాన్ని మరిన్ని ముక్కలు చేసుకు భాషని చంపుకోడమే తెలుగులు చక్కగా చేయగలిగింది.
    విడివడిన రెండేళ్లలో జ్ఞాతులిద్దరు ఢిల్లీ కాళ్ళు పట్టుకుని తిరుగుతున్న తీరు చాలు రాబోతున్న రోజుల తీరు తెలపడానికి
    తెలుగు జాతి మనది నిత్యం కొట్టుకు చస్తుండు జాతి మనది !
    తా.క. ఇది వెయ్యరు వెయ్యలేరు అని తెలిసే పంపుతున్నాను

  2. డా.సుమన్ లత రుద్రావఝల says:

    అనువాదం లేనిదే మరొకరి భాష ,భావాలు అర్థముకావు అన్నది అందరికీ తెలు.సు మన భారతీయ భాషల లో ఎంతమంది సాహిత్య కారులను ఎంతమంది తెలుసు కుందికి ప్రయత్నిస్తున్నారు?చెప్పాలంటే ఆపాటి -ఈపాటి ఇంగ్లీష్ ,బెంగాలీ కవులను గురించి తెలుసేమో కాని తెలుగు వారికే తెలుగు సాహిత్యకారుల గురించి తెలియదు.భాష చూస్తే రోజు రోజుకీ సంకరం గా మారి పోతోంది .ప్రతీదీ ఇజాల చట్రం లో బిగించి సాహిత్యాన్ని మింగేస్తున్నామేమో !అందుకు అనువాదాలు బలి అవుతున్నాయి .అంతేకాదు అనువాద కులని రెండో శ్రేణి గా పరిగనించటం కూడా కారణం కావచ్చూ ! చేస్తే చదివే వారు లేరని బాధ !.అయినా పని నడుస్తోందని సంతోషించాలి .
    అన్నమయ్య చెప్పినట్లు ఎండ లో నడిస్తేనే నీడవిలవ తెలుస్తుంది కదా .అలా దేశం వదిలితేనే మన గురించిన ఆలోచన వస్తుందేమో !మీరు అంర్జాతీయ వేదిక పైన సమస్యలని ,నిజాలను చెప్పినందుకు అభినందనలు.మీరు చెప్పినట్లు తెలుగు సాహిత్యం వెళ్ళవలసినంత పరిమాణం లో ఇతర భాషల లోకి పో లేదు .
    డా.సుమన్ లత రుద్రావఝల

  3. Veluri Venkateswara Rao says:

    Suman lata gaaroo:
    In the West neither editors nor the reading public think that translators are second rate writers. As a matter of fact they seek good translators into English. Even in India it is no more true. Thanks for your comment.

    Regards, — Veluri Venkateswara Rao

  4. అనువాదం కాకపోతే అనేక గొప్ప కావ్యాలు,నవలలు ప్రపంచంలో బహుకొద్దిమందికే తెలిసి ఉండేవి. అనువాదం కాకపోతే భారతం, భాగవతం వంటివి మనకి ఎప్పుడు తెలిసేవి? అలాగే ఆధునిక సాహిత్యంలో కూడా అనూదితం కాకపోతే మనకి ప్రేమ్చంద్ తెలిసేవాడా, టాగోర్ తెలిసేవాడా? ఆంగ్ల సాహిత్యం ఎంతమందికి పరిచయమయ్యేది?
    అలాగే మన తెలుగు కూడా. అనువాదం కాకపోతే మన సాహిత్యంలోని ఎన్నో అనర్ఘ రత్నాలు రచయిత ప్రాంతాల్లోనే మగ్గుతూ ఉండిపోతాయి. అసలే మన భాషకి ప్రపంచవ్యాప్తి చాలా తక్కువ.
    అసలు రచయిత భావాన్ని సరిగ్గా ఆకళింపు చేసుకొని, మరో ప్రాంతపు భాషలో చెప్పగలగడం కత్తిమీది సాము వంటిది. ఈ విషయం నేను టాగోర్ గీతాంజలిని అనువాదం చేస్తున్నప్పుడు బాగా నాకు తెలిసి వచ్చింది.
    అనువాదకుడి శ్రమ ఒకవిధంగా అసలు రచయిత కంటే అధికంగానే ఉంటుంది.

  5. గమనిక: సాంకేతిక కారణాల వల్ల ఈ వ్యాఖ్య వేణు ఈమెయిలు నించి ఇక్కడ అందిస్తున్నాం,

    వేలూరి వేంకటేశ్వర రావు గారూ,
    చాల చాల కృతజ్ఞతలు.
    అప్పుడెప్పుడో అభిప్రాయభేదంతో మీమీద పరుషంగా రాసినప్పటికీ (భిన్నాభిప్రాయం ఉన్నంతమాత్రాన అంత దురుసుగా రాయనక్కరలేదని వయసుతో కాస్త జ్ఞానోదయం అయిందనుకోండి!) మీ విద్వత్తు మీద, తెలుగు భాషా సాహిత్యాల పట్ల మీ ప్రేమ మీద నాకెప్పుడూ గౌరవమే.
    ప్రస్తుతం చాల అవసరమైన ఒక రంగం మీద పాఠకుల, రచయితల, అనువాదకుల, ఔత్సాహికుల దృష్టి మళ్లించడానికి ఈ వ్యాసంలో మీరు చేసిన ప్రయత్నానికి కృతజ్ఞతలు, అభినందనలు. మరొకరెవరో గుర్తించాలనీ, ఆమోదించాలనీ కాదు గాని (అలా అనుకోవడం కూడ తప్పేమీ కాదు), ప్రతి ఒక్క మానవానుభవమూ, ప్రతి ఒక్క వ్యక్తీకరణా ప్రతి ఒక్కరికీ భాషావధులు దాటి చేరాలి. అందుకు ఇప్పటికైతే దాదాపు ఒకేఒక్క తెరిచిపెట్టిన కిటికీ ఇంగ్లిష్ మాధ్యమం మాత్రమే. అందువల్ల ఇంగ్లిష్ లోకి వెళ్లక తప్పదు. ఇప్పటివరకూ ఇంగ్లిష్ లోకి వెళ్లిన తెలుగు సాహిత్యంలో అతి తక్కువ మాత్రమే ప్రామాణికంగా వెళ్లాయి. కన్నడ, మలయాళ భాషా సాహిత్యాలను, ఆ భాషలలో రచయితలు కూడా అయిన ఇంగ్లిష్ అధ్యాపకులు చాల మంది ఇంగ్లిష్ లోకి అనువదించి అంతర్జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టారు. మన తెలుగు రచయితలలో ఇంగ్లిష్ వచ్చినవారు, ఇంగ్లిష్ అధ్యాపకులు ఆ పని చేసినవారు ఒక్క చేతివేళ్ల లెక్కకు సరిపోతారేమో. అసలు మనకు ఎందువల్లనో ఆ పూనికే లేకుండా పోయింది. అయితే ఇది ఎవరో ఒకరు వ్యక్తిగతంగా చేయవలసిన పని అని కూడ అనుకోవడం లేదు. ఇంగ్లిష్ నుడికారం, మాండలికాలు, ముఖ్యంగా నిత్య వ్యవహార ప్రయోగాలు తెలిసిన చాల మంది బృందంగా ఏర్పడి సమష్టిగా చర్చతో, సంభాషణతో, సంప్రదింపులతో, ఆదానప్రదానాలతో చేయవలసిన పని ఇది. మీవంటి విద్యావంతులు, విదేశాలలో స్థిరపడి అనివార్యంగా ఇంగ్లిష్ వ్యవహార ప్రయోగంతో సంబంధంలోకి వచ్చినవారు, “డయస్పోరా” రచయితలు పూనుకుని ఒక బృందాన్ని ఏర్పరచి ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తే ప్రయోజనకర ఫలితాలు రావచ్చు. ఏది ఏమైనా ఒక అత్యవసరంగా ఆలోచించవలసిన రంగం మీదికి దృష్టి మళ్లించినందుకు కృతజ్ఞతలు, అభినందనలు.
    ఎన్ వేణుగోపాల్

  6. Veluri Venkateswara Rao says:

    Sri N. Venugopal writes:

    — ఎవరో ఒకరు వ్యక్తిగతంగా చేయవలసిన పని అని కూడ అనుకోవడం లేదు. ఇంగ్లిష్ నుడికారం, మాండలికాలు, ముఖ్యంగా నిత్య వ్యవహార ప్రయోగాలు తెలిసిన చాల మంది బృందంగా ఏర్పడి సమష్టిగా చర్చతో, సంభాషణతో, సంప్రదింపులతో, ఆదానప్రదానాలతో చేయవలసిన పని ఇది. ………. విదేశాలలో స్థిరపడి అనివార్యంగా ఇంగ్లిష్ వ్యవహార ప్రయోగంతో సంబంధంలోకి వచ్చినవారు, “డయస్పోరా” రచయితలు పూనుకుని ఒక బృందాన్ని ఏర్పరచి ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తే ప్రయోజనకర ఫలితాలు రావచ్చు —

    Thanks for your letter.

    In principle,I do not disagree with you.

    But, the $64,000 question is this: Who will bell the cat?

    Even before that one should address a more fundamental issue. There is a very valid complaint from reputed publishers. We, the immigrant Telugus do not buy books, like the other immigrant communities in the USA from the West. Some time back, I heard from one reputed university publishing house that If we give them a guarantee that our community will buy at least 300 copies, they would be willing to publish a well-edited, reasonably translated scholarly work from our language. If we can truthfully address that task, I believe that more than half of our problem is solved.

    Afterwards, one can of organizing training translators from our own community, say the “diaspora” writers. Our national organizations ( at the last count I was told there are 4 or 5 of them!) can take an initiative of inviting people who show interest and who are sincerely prepared to shed their “literary – political” colors for this exclusive purpose.

    Nothing is impossible if we prioritize our “cultural” interests.

    Please keep in touch.

    Thanks and regards.

    Veluri Venkateswara Rao

  7. D Subrahmanyam says:

    మంచి అర్ధవంతమయిన ఉపన్యాసం. వేణు చెప్పినట్టు ఈ మంచి పని జరగాలి. నిజమే పిల్లి మెడలో గంటేవారు కడతారు. మన తెలుగు రాష్ట్రాల అధినేతలకు ఇవన్నీ అంత త్వరగా అర్ధమయ్యే మాటలు కాదు.

  8. V. Krishna Moorthy, Mysore says:

    Sri Venkateswarsa Rao Garu,

    I read with lot of interest your article on translations and the subsequent comments from the readers. As Mr. Venu suggested there should be institutional effort in translating good works of other languages and into our own and ours into other sister languages, including foreign languages. While I agree that our good works should get translated into English and other foreign languages like French, Spanish, Italian, but how many readers would be there for such translations? That does not mean we should not translate our works into foreign languages. But the quality of translation should be such that the reader in English should feel that it is a translated work. There are many Spanish works translated into English and when we read them we never feel it is a translation. It is for this reason that there should be institutional effort as suggested by Mr. Venu, though there may be writers or translators who would take up works that interest them to translate into English or any other foreign or our own sister language.

    In Karnataka, there is a government supported institution called KUVEMPU BHASHA BHAARATI which brings eminent writers together and entrusts them to translated other language works into Kannada and vice versa. While there may be some shortcomings and politics there still they are doing excellent work and making available good translations at affordable prices and of very good quality.

    As far as I am concerned, I came to Mysore for my college studies way back in 1962 and spent about eight years for studies and teaching before moving to banking profession, which took me all metros except Hyderabad and I had no occasion to work in any town in combined Andhra Pradesh. Yet my love for the language keeps me in touch with it through magazines and books. Having settled in Mysore for over 15 years, and having known Kannada very well (except writing well) and knowing the idiom, I thought I can attempt translations and have been doing it. I have done translations of eight Kannada novels into Telugu which I consider good for Telugu readers both from the point of theme and importance of the subject. This I have been doing purely out of my love for both the languages. While I have published a few translated pieces and a few independent pieces in MISIMI, PRASTHANAM and BHUMIKA to get a publisher for novels is difficult. That does not stop me from doing the work that interests me.

    While lot of novels of popular writers like Yandamuri, Madhubabu etc. get translated into Kannada, but not the good works from our language. Similarly from Kannada to Telugu. Those woks winning Central Sahitya Academy Awards that get translated into Teluguas a matter of duty, the quality is very poor. I have read Byrappa’s PARVA translated into Telugu and Pratibha Roy’s YAGNASENI. The translations could have been far better for easy reading than they have been.

    The point I want to make is, after Sharvani who is to translate Triveni’s works into chaste Telugu there are not many good translators from Kannada to Telugu to my reckoning. Other than Byrappa, UR Ananthamurthy, Shivaram Karanth etc. there are very good works coming in Kannda which need translation into Telugu to make our people understand the quality of their works and the themes they have taken up in recent years.

    I hope our two governments (AP and Telangana) wake up to this need and establish an institution combining their resources at a a central place like Hyderabad. There should be a movement for such an effort from literary circles. Is it possible at all for such an effort?

    Veloori Krishna Moorthy

మీ మాటలు

*