ఓ త్రికోణ ప్రణయ కథ

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

వాడి మయూఖముల్ గలుగువా డపరాంబుధి గ్రుంకె, ధేనువుల్

నేడిట వచ్చె నేకతమ, నిష్ఠమెయిన్ భవ దగ్నిహోత్రముల్

పోడిగ వేల్వగాబడియె, బ్రొద్దును పోయె, గచుండు నేనియున్

రాడు, వనంబులోన మృగ రాక్షస పన్నగ బాధ నొందెనో!            

                                                            -నన్నయ

 (శ్రీ మదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)

వాడి కిరణాలు కలిగిన సూర్యుడు పశ్చిమసముద్రంలో మునిగాడు. గోవులు ఒంటిగా ఇంటికి చేరాయి. నిష్ఠతో నీ అగ్నిహోత్రాలు వేల్చబడ్డాయి. పొద్దు కూడా పోయింది. అయినా కచుడింకా రాలేదు. అడవిలో మృగాలు, రాక్షసులు, పాములవల్ల అతనికి హాని కలిగిందో, ఏమో!

రాక్షసుల గురువు శుక్రాచార్యునితో అతని కూతురు దేవయాని ఈ మాటలు అంటుంది…

                 ***

kachadevyani (1024x742)

క్షమించాలి, నా ప్రణాళిక మరోసారి దారి తప్పుతోంది. నిజానికి నేనిప్పుడు కోసల, మగధరాజుల కాలానికి వెళ్ళాలి. కానీ కిందటి వ్యాసంలో, గణనిర్బంధాల నుంచి బయటపడడం గురించిన ప్రస్తావన వచ్చింది. క్షత్రియుల కన్నా ముందు బ్రాహ్మణులు గణ నిర్బంధాలనుంచి బయటపడ్డారని కూడా అన్నాను. అనుకోకుండా జరిగిన ఈ ప్రస్తావన, నాకు ఎంతో ఇష్టమైన కథలలో ఒకటైన యయాతి-దేవయాని-శర్మిష్టల కథవైపు నా మనసును అయస్కాంతంలా గుంజేసింది. ఫలితమే ఈ ప్రణాళికాభంగం.

ఇదో త్రికోణ ప్రణయ కథ. పై ముగ్గురిలోనూ శర్మిష్ట పాత్ర నన్ను విశేషంగా ఆకర్షిస్తుంది, ఆ పేరుతో సహా! శర్మిష్ట గురించి తలపోసేటప్పుడు నాకు తెనాలి రామకృష్ణుని పాండురంగమాహాత్మ్యంలోని నిగమశర్మ గుర్తొస్తాడు. అయితే, ఆ పోలిక కేవలం మితభాషిత్వం దగ్గర మాత్రమే. నిగమశర్మ అంత కాకపోయినా శర్మిష్ట కూడా మితభాషిగానే రూపుగడుతుంది. తెనాలి రామకృష్ణుడు నిగమశర్మ చెడు తిరుగుళ్ళ గురించీ,  చుక్క తెగి పడినట్టు అతనో రోజున ఇంటికి వచ్చినప్పుడు అతని అక్క (ఆమె నిగమశర్మ అక్క, అంతే… పేరు లేదు) అతని శరీరానికీ, బుద్ధికీ కూడా ‘తలంటడం’ గురించీ, అంతా విని ఆ ప్రబుద్ధుడు అక్కగారి ముక్కెరతో సహా ఇంట్లోని నగా నట్రా మూటగట్టుకుని ఉడాయించడం గురించీ, కాపుకోడల్ని లేవదీసుకుపోవడం గురించీ ఓ ఇంటింటి కథలా ఎంతో సహజంగా హాస్యస్ఫోరకంగా చిత్రించుకుంటూ వెడతాడు తప్ప, నిగమశర్మ నోట ఒక్క మాట కూడా పలికించడు. కాపు కోడలి తర్వాత ఇంకో ‘కడజాతి’ స్త్రీతో కాపురం చేసి పిల్లల్ని కన్న నిగమశర్మ, ఆమె చనిపోయిన తర్వాత ఆమెను తలచుకుని శోకిస్తూ మొదటిసారి నోరువిప్పుతాడు. ఆ పద్యం కూడా నాకు ఇష్టం:

ఎల్లరు నెల్లచో ధనములిచ్చి మృగాక్షుల గొండ్రు గాని యో

పల్లవపాణి యే బరమపావనవంశము నిచ్చికొంటి నీ

నల్లని రూపు నిక్కమని నమ్మి! ధ్రువంబది గాక నేడు వి      

ద్యుల్లతికాధికాభినయ ధూర్వహమౌట నెరుంగ నింతయున్

విశేషమేమిటంటే, కవి ఈ పద్యంలో కరుణ, హాస్యాలను రెండింటినీ మేళవిస్తాడు. అంతా డబ్బిచ్చి అందమైన స్త్రీలను కొనుక్కుంటారు కానీ నేను నా పరమపావనమైన బ్రాహ్మణవంశాన్ని వెలగా చెల్లించి నిన్ను కొనుక్కున్నానని నిగమశర్మ అంటాడు. ఇందులో కులాతిశయం ఉన్నమాట నిజమే కానీ, నిగమశర్మకు ఆమెపై ఉన్న గాఢమైన అనురక్తీ, ఆమె మృతి కలిగించే దుఃఖతీవ్రతా ఆ కులాతిశయాన్ని కప్పేస్తున్నాయి. ఇక ‘నీ నల్లని రూపు నిజమని నమ్మాను తప్ప మెరుపు తీగ అవుతుందని తెలుసుకోలేకపోయా’ ననడంలో కవిత్వమూ + వికటత్వమూ రెండూ ఉన్నట్టున్నాయి.

నిగమశర్మతో శర్మిష్టను పోల్చడంలోని అనౌచిత్యం ఇప్పటికీ నా మనసును పీకుతూనే ఉంది. ఆ పోలిక కేవలం మితభాషిత్వంలో మాత్రమే సుమా అని మరోసారి సంజాయిషీ ఇచ్చుకుంటున్నాను.

శర్మిష్ట మితభాషిత్వం నిగమశర్మ మితభాషిత్వం లాంటిది కాదు. అది సమాజం, ఇంకాస్త వివరంగా చెప్పాలంటే పితృస్వామ్య సమాజం ఆమెపై రుద్దిన మితభాషిత్వం. నిజానికి పితృస్వామ్యసమాజంలో స్త్రీ అతిభాషిత్వమూ, మితభాషిత్వమూ రెండూ ఒకలాంటివే. ఆమె మాటకీ మౌనానికీ ఒకే విలువ ఉంటుంది. రేకు డబ్బాలో గులకరాళ్ళు చప్పుడు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. విలువ మారదు. పితృస్వామ్యం స్త్రీకి తనదైన భాష లేకుండా చేసింది. పితృస్వామ్యంలో స్త్రీ పురుషుడి భాష మాట్లాడుతుంది, పురుషుడిలా ఆలోచిస్తుంది, పురుషుడి హృదయంతో స్పందిస్తుంది.

ఈ మాటలు అంటున్నప్పుడు, నాకు ఎంతో ఇష్టుడైన ఒక కథకుడూ, ఆయన రాసిన ఒక కథా గుర్తుకొస్తున్నా(రు-యి). ఆ కథకుడు, చెఖోవ్…ఆ కథ పేరు, The Lady.

పురుషస్వామ్యంలో స్త్రీకి సొంత గొంతు లేదు, సొంత సమస్యలు లేవు; ఆమె పురుషుడి గొంతునూ, పురుషుడి సమస్యలనూ వినిపించే సౌండ్ బాక్స్ మాత్రమే నన్న సత్యాన్ని ఇంత గొప్పగా చెప్పిన మరో రచన ప్రపంచసాహిత్యంలో  ఉందని నేను అనుకోను. నా ప్రపంచసాహిత్య పరిచయం ఏమంత గొప్పది కాదనుకుంటే, కనీసం వేళ్ళ మీద లెక్కించదగిన అలాంటి రచనల్లో ఇదొకటి అంటాను. ఆ కథ ఇదీ:

భార్యా, భర్త… భర్త ఒక నాటకశాలను నడుపుతూ ఉంటాడు. రోజూ సక్రమంగా నాటకశాల నిండితేనే అతనికి ఆదాయం. కానీ నాటకాలకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. నాటకశాల నిర్వహణ ఇబ్బందిగా మారుతుంది. భర్త తన సమస్యలను భార్య దగ్గర వెళ్లబోసుకుంటాడు. జనంలో కళాభిరుచి తగ్గిపోతోందని బాధపడతాడు. భర్త ఆవేదనలో భార్య పాలు పంచుకుంటుంది. అవును నిజమే, జనంలో ఎంతసేపూ సంపాదన యావే తప్ప; ఓ నాటకం, ఓ వినోదం అంటూ ఏమీ లేకుండా పోయాయనుకుంటుంది. భర్త వినిపించే సమస్యలనే పరిచయస్తుల దగ్గర తనూ వల్లిస్తూ  ఉంటుంది.

అలా ఉండగా, కొంతకాలానికి భర్త చనిపోతాడు. ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. అతడు ఓ కిరాణాకొట్టు యజమాని.  కొట్టు నిర్వహణలో ఆమె భర్తకు సాయపడుతూ ఉంటుంది. ఆ వ్యాపారంలో ఉండే సమస్యలు ఆ వ్యాపారంలోనూ ఉన్నాయి. భర్త వాటిని ఏకరువు పెడుతుంటే, అవును కదా అనుకుంటూ సానుభూతి చూపిస్తుంది. తను కూడా పూర్తిగా కొట్టుకే అంకితమైపోతుంది. పరిచయస్తులెవరైనా కొట్టుకు వచ్చినప్పుడు యథావిధిగా భర్త సమస్యలనే వాళ్ళతో పంచుకుంటూ ఉంటుంది. ‘ఏమమ్మా, ఎంతసేపూ కొట్టును పట్టుకుని వేళ్లాడడమేనా?  ఓ వినోదమూ, వేడుకా ఉండద్దా? ఏ నాటకానికైనా వెళ్లచ్చు కదా!’ అని ఎవరైనా అంటే, ‘నాటకాలకు వెళ్ళేలానే ఉంది నా పరిస్థితి… మీకేం మీరేమైనా చెబుతారు. కొట్టు నడపడం మాటలు కాదు. ఎన్ని సమస్యలో!’ అంటుంది.

రెండో భర్త కూడా చనిపోతాడు. ఆమె మరో పెళ్లి చేసుకోదు. తోడుంటారని ఓ యువజంటకు తన ఇంట్లో వాటా అద్దెకిస్తుంది. వాళ్ళకొక కొడుకు. ఇక ఆమెకు ఆ అబ్బాయే లోకం అయిపోతాడు. నీళ్ళు పోయడం, అన్నం తినిపించడం, దుస్తులు వేయడం, స్కూల్లో దింపడం వగైరాలన్నీ ఆమే చేస్తుంది.  ఆ అబ్బాయి సమస్యలన్నీ ఆమె సమస్యలే అయిపోతాయి. ఆ కుర్రాడు బండెడు పుస్తకాలు మోసుకెళ్ళడం చూసి ఆమె కడుపు తరుక్కుపోతుంది. ‘స్కూలు వాళ్ళకు బుద్ధి లేదు, పసివాడి చేత ఇన్ని పుస్తకాలు మోయిస్తారా?!’ అనుకుంటుంది. కనిపించినవాళ్లు అందరితోనూ అంటుంది.

కథ అయిపోతుంది… జ్ఞాపకం మీద ఆధారపడి రాసిన ఈ కథాసంగ్రహంలో కొన్ని వివరాలు లోపిస్తే లోపించవచ్చు.

ప్రస్తుతానికి వస్తే, యయాతి-దేవయాని-శర్మిష్టల కథలో దేవయాని చాలా ఎక్కువగా మాట్లాడుతుంది, సాధికారంగా కూడా మాట్లాడుతుంది. శర్మిష్ట చాలా తక్కువగా మాట్లాడుతుంది. వారిరువురి సామాజిక నేపథ్యాలలోనూ, సామాజిక దశలలోనూ ఉన్న తేడాయే అందుకు కారణం. బ్రాహ్మణులు అప్పటికి గణనిర్బంధాలనుంచి బయటపడ్డారు. తమ గణం వెలుపల ఎవరికైనా వారు పురోహితులు కావడం, ఎవరినుంచైనా దక్షిణలు తీసుకోవడం ఇందుకు సూచన అని కోశాంబీ అంటాడు. అలాగే, వృత్తి జీవనులుగా బ్రాహ్మణులకు సంచారజీవనమూ ఎక్కువ. ఆవిధంగా వారు నాలుగు ప్రదేశాలు చూస్తారు, ఎక్కువ లోకజ్ఞానాన్ని పొందుతారు. దేవయాని బ్రాహ్మణకన్య కనుక శర్మిష్టతో పోల్చితే ఆమెకు స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, తెలివి ఎక్కువ. అవి కలిగించే ఆత్మవిశ్వాసం, అహంకారాల పాలు కూడా ఎక్కువే. శర్మిష్ట అలా కాదు, ఆమె రాచకన్య, తండ్రి చాటు బిడ్డ, గణం కట్టుబాట్లకు బందీ, అవసరమైతే తండ్రి రాజకీయ ప్రయోజనాలకు పావుగా మారక తప్పదు. నగరంలో పుట్టి పెరిగి, చదువుకుని ఉద్యోగం చేసే అమ్మాయికీ, పల్లెటూరిలో పుట్టి పెరిగిన అమ్మాయికీ ఉన్న తేడా లాంటిదే దేవయానికీ, శర్మిష్టకీ ఉన్న తేడా.

కథలోకి వెడుతున్న కొద్దీ ఈ వ్యత్యాసాలు మరింత స్పష్టంగా అర్థమవుతాయి.

శుక్రుడు దైత్యదానవ గణాలకు ఆచార్యుడిగా ఉన్నాడు. అతని దగ్గర మృతసంజీవిని అనే విద్య ఉంది. దేవతలతో జరిగే యుద్ధంలో చనిపోతున్న రాక్షసులను ఆ విద్యతో అతను బతికిస్తున్నాడు. దాంతో దేవతల పక్షంలో చావులూ, ఓటమీ సంభవిస్తున్నాయి. దేవతలు బృహస్పతి కొడుకైన కచుని దగ్గరకు వెళ్ళి, నువ్వు ఎలాగైనా శుక్రుని  మెప్పించి మృతసంజీవినీ విద్యను సాధించాలని కోరారు. శుక్రునికి, కూతురైన దేవయానిపై మమకారం ఎక్కువ, నువ్వు ఆమె మనసు గెలుచుకుంటే నీ పని తేలికవుతుందని కూడా చెప్పారు. కచుడు అంగీకరించి శుక్రుని దగ్గరకు వెళ్ళాడు. శుక్రుడు అతనిని శిష్యునిగా స్వీకరించడమేకాక, అతనికి ఆతిథ్యం ఇవ్వడం స్వయంగా బృహస్పతికి ఆతిథ్యం ఇవ్వడమే ననుకుని సంతోషించాడు. శత్రువైనాసరే, ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వడం ఆనాటి మర్యాద.

శిష్యులు గురువుగారి గోవులను కాచడంతో సహా ఇంటిపనులు చక్కబెట్టడం ఆనాటి గురు-శిష్య సంబంధంలో భాగం. కచుడు ఇంటి పనులు చేస్తూ అటు శుక్రునీ; పువ్వులూ, ఫలాలూ తెస్తూ ఇటు దేవయానినీ మెప్పిస్తూ వచ్చాడు.  కచుడు తమ విరోధులైన దేవతల గురువు బృహస్పతికి కొడుకు కనుక, అతడు ఇలా శుక్రుని ఇంట్లో పాగా వేయడంలో  రాజకీయమైన కుట్రను రాక్షసులు పసిగట్టడం సహజమే. ఓ రోజు కచుడు గోవులను తోలుకుని అడవికి వెళ్లినప్పుడు రాక్షసులు అతన్ని చంపేసి, మృతదేహాన్ని ఓ చెట్టుకు కట్టేసి వెళ్ళిపోయారు. కచుడు వెంట లేకుండా గోవులు ఒంటిగా ఇంటికి చేరుకోవడం చూసి, దేవయాని కీడు శంకించింది. అప్పుడు తండ్రితో అన్న మాటలే పై పద్యం.

శుక్రుడు దివ్యదృష్టితో జరిగింది తెలుసుకుని మృతసంజీవినీ విద్యను కచుని వద్దకు పంపించి అతన్ని బతికించాడు. కచుడు ఇంటికి వచ్చాడు. కొన్ని రోజులు గడిచాయి. మరోసారి రాక్షసులు అడవిలో కచుణ్ణి పట్టుకుని చంపేసారు. ఈసారి అతన్ని బతికించే అవకాశం ఇవ్వకూడదనుకుని మృతదేహాన్ని కాల్చి బూడిద చేసి, దానిని సురలో కలిపి శుక్రునికి ఇచ్చారు. శుక్రుడు ఆ సురను తాగేశాడు.

కచుడు ఇంటికి రాకపోయేసరికి రాక్షసులే అతన్ని చంపేసి ఉంటారని దేవయాని ఊహించింది. శోకించడం ప్రారంభించింది. అప్పుడు శుక్రుడు, ‘రాక్షసులు అతని మీద పగబట్టారు. ఎలాగైనా అతన్ని చంపేస్తారు. అతనికి ఉత్తమలోకాలు కలుగుతాయి. ఎందుకు దుఃఖించడం?’ అన్నాడు.  ఆ మాటకు దేవయాని తండ్రిపై తాచులా లేచింది. ‘మహానుభావా, నువ్వూ ధర్మం తెలిసినవాడివే కదా; ఎంతో బుద్ధిశాలి అయిన అంగిరసుని మనవడు, నీకు ఆశ్రితుడు, నీ శిష్యుడు, బృహస్పతికి కొడుకు, అందగాడు, బ్రహ్మచారి అయిన కచుణ్ణి రాక్షసులు అన్యాయంగా చంపేస్తే, నేను దుఃఖించకుండా ఎలా ఉంటాను? అతను నా కంట పడితే తప్ప నేను అన్నం తిన’ నని, ఎత్తిపొడుపూ, ఏడుపూ, మొండితనమూ దట్టిస్తూ తండ్రిపై మాటల మేకులు చెక్కింది.

ఇక్కడ తండ్రీ, కూతుళ్ల మధ్య అనుభవంలోనూ, పరిణతిలోనూ ఉన్న వ్యత్యాసాన్ని పౌరాణికుడు అద్భుతంగా సూచిస్తాడు. కచుని మరణానికి దేవయాని భావోద్వేగంతో స్పందిస్తే; శుక్రుడు రాజకీయ వివేకంతో స్పందిస్తాడు. కచుణ్ణి రాక్షసులు బతకనివ్వరని అతను అప్పటికే గ్రహించాడు. అది రాజకీయంలో భాగం. దాని వెనుక రాక్షసరాజు వృషపర్వుని ఆదేశం తప్పనిసరిగా ఉంటుంది. ఒక హద్దును మించి తను అందులో జోక్యం చేసుకోలేడు. చేసుకోకూడదు కూడా. చేసుకుంటే తన స్థానం ప్రమాదంలో పడడం అలా ఉంచి, నీతి కూడా కాదు. రాక్షసుల గురువుగా వారి రాజకీయ వ్యూహాలకు, ప్రయోజనాలకు తను కలసి రావలసిందే. మరి కచుని శిష్యునిగా ఎలా స్వీకరించాడన్న ప్రశ్న వస్తుంది. దానికి జవాబు ముందే చెప్పుకున్నాం. శత్రువైనా సరే, దేనినైనా కోరి, అతిథిగా వచ్చినప్పుడు అన్నివిధాలా ఆదరించడం వ్యక్తిగత స్థాయిలో అనుసరించవలసిన ధర్మమూ, మర్యాదా. అతిథి మర్యాద గురించి ఆ కాలంలో ఉన్న పట్టింపును సూచించే కథలు చాలా ఉన్నాయి. అలాగే, కచునిపై తన కూతురు మనసు పడుతోందనీ శుక్రునికి తెలుసు. అయితే, అది ధర్మబద్ధం కాదనో, లేక పొసగదనో భావన అతనికి ఉన్నట్టు కథాగమనం సూచిస్తుంది.

అయితే, శుక్రునిలో కూతురిపై  ఉన్న మమకారం వీటన్నిటినీ మించినది. అది అతనిలోని రాజకీయ వివేకంతో పోటీపడుతోంది. ఎట్టకేలకు మెత్తబడ్డాడు…

 

 

 

 

 

కిరాయి సేనగా మారిన క్షత్రియ యోధులు

 

కృష్ణుడు: (అభిమన్యుని మరణానికి శోకిస్తున్న అర్జునునితో)  నీకిది తగునా? శూరులంతా పోయేది ఇలాగే కదా? ఎందుకు దుఃఖిస్తున్నావు? సేనలను సమీకరించుకుని ఆయుధమే జీవనంగా చేసుకోవడం వీరధర్మమని నీకు తెలియదా? శత్రువులను చంపి, భూమిపై కీర్తిని నిలిపి నీ కొడుకు ఒంటరిగా స్వర్గాన్ని అందుకోవడం ప్రియమే తప్ప అప్రియ మెలా అవుతుంది?

                                                                                                                         –తిక్కన

(శ్రీ మదాంధ్ర మహాభారతం, ద్రోణపర్వం, ద్వితీయాశ్వాసం)

***

ఆయుధోపజీవుల విషయంలో అలెగ్జాండర్ తెచ్చుకున్న అపకీర్తి గురించి రాద్దామనుకునేసరికి, ఆయుధోపజీవులు లేదా ఆయుధోపజీవనం అనే మాటలు మహాభారతంలో అనేకచోట్ల వాడిన సంగతి గుర్తొచ్చింది. నోట్సు తిరగేస్తుంటే, ఆ మాటలు వాడిన రెండు సందర్భాలు అప్పటికప్పుడు కనిపించాయి. పైన చెప్పింది మొదటిది.

రెండోది, కర్ణపర్వం, తృతీయాశ్వాసంలో దుర్యోధనుడు తన సేనను ఉద్దేశించి మాట్లాడిన సందర్భం. శౌర్యమూ, బలమూ కలిగిన మీరంతా యుద్ధభారమంతా ఒక్క కర్ణుని మీదే వదిలేసి, అర్జునుని ఎదుర్కోకపోవడం ఆయుధోపజీవుల పద్ధతేనా అని దుర్యోధనుడు నిష్టుర మాడతాడు.

మహాభారతకాలంనుంచీ, ఇంకా అంతకంటే చాలా ముందునుంచీ ఉన్నఆయుధోపజీవనం; చరిత్రకాలం మీదుగా నేటి కాలం వరకూ నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉండడం ఇక్కడ ప్రధానంగా ఆకర్షించే అంశం. ఆయుధోపజీవనం ఒక  సమస్యగా మారిందని కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. మహాభారతం ఎలాంటిదో చెప్పే ఒక ప్రసిద్ధ పద్యం ఉంది. ధర్మశాస్త్రజ్ఞులు ధర్మశాస్త్రమనీ, అధ్యాత్మవేత్తలు వేదాంతమనీ, నీతివిచక్షణులు నీతిశాస్త్రమనీ, కవులు మహాకావ్యమనీ, లాక్షణికులు అనేక లక్ష్యాల సమాహారమనీ, ఐతిహాసికులు ఇతిహాసమనీ, పౌరాణికులు బహు పురాణాల సముదాయమనీ మహాభారతాన్ని భావిస్తారని ఆ పద్య సారాంశం. వీటన్నిటికీ అదనంగా నేను ఆయుధోపజీవన కోణాన్ని జోడిస్తాను!

మరో అడుగు ముందుకు వేసి ఇంకో మాట కూడా అంటాను…నా ఉద్దేశంలో ఆయుధోపజీవనం సృష్టించిన సమస్యలను, సంక్షోభాలను చిత్రించి చర్చించడమే మహాభారతంలో ఆద్యంతమూ వ్యాపించిన ప్రధానవస్తువు. మహాభారత ప్రారంభమే క్షత్రియులనే ఒక యోధజాతి అంతరించడం గురించీ, క్షత్రియసతులు అందుబాటులో ఉన్న పద్ధతుల్లో ఆ జాతికి ఎలాగో ప్రాణం పోయడం గురించీ చెబుతుంది. అంతేకాదు, క్రమంగా రాజ్యాధికారం క్షత్రియేతరుల చేతుల్లోకి వెళ్లిపోవడం గురించీ చెప్పి ముగుస్తుంది. ఆవిధంగా చూసినప్పుడు, మహాభారతం ఒక జాతి  క్షీణతను చెప్పే విషాదాంత ఇతిహాసం.

ఇలా ఆయుధోపజీవన కోణం నుంచి చేసే మహాభారత పునర్వ్యాఖ్యానం ఒకటి, రెండు వ్యాసాలకు లొంగేది కాదు. కనుక ఆ లోతుల్లోకి ఇప్పుడే వెళ్లకుండా క్లుప్తంగా చెప్పుకుంటే, మహాభారత పాత్రలనేకం ఆయుధోపజీవనాన్ని, అంటే హింసను ఒక సమస్యగా గుర్తిస్తాయి. దానినుంచి బయటపడడానికి పెనుగులాడతాయి. ఆ పెనుగులాటలో అవి ఓటమీ చెందుతాయి. కొన్ని పాత్రలు హింసకు అనుకూలంగా, కొన్ని ప్రతికూలంగా చీలిపోయి చర్చించుకోవడం కనిపిస్తుంది. ఆ చర్చ చాలాచోట్ల హింసా, అహింసావాదాల రూపం తీసుకుంటుంది. పురా కాలంనుంచి చరిత్ర కాలం వైపు సాగుతున్న కొద్దీ  హింసా-అహింసల మధ్య సాగే ఈ అంతర్మథనం ఒక స్పష్టతను తెచ్చుకుంటున్నట్టూ కనిపిస్తుంది. క్రమంగా అది  మహావీరుడు, బుద్ధుడు అనే ఇద్దరు ప్రవక్తలకు; జైన, బౌద్ధాలనే రెండు మతాలకు జన్మనిచ్చింది. అయినాసరే, ఆయుధోజీవనం ఇప్పటికీ ఒక సమస్యగానే ఉందంటే, అజ్ఞాతకాలంలో మొదలైన హింసా-అహింసావాదాల చర్చ నేటికీ అసంపూర్ణంగానే  మిగిలిపోయిందన్నమాట.

Draupadi_s_presented_to_a_parcheesi_game

స్థూలంగా చెప్పుకుంటే; మహాభారతంలో భీముడు, ద్రౌపది, కృష్ణుడు హింసావాదంవైపు మొగ్గు చూపినట్టు కనిపిస్తారు. చావు ఎప్పటికైనా తప్పదు, చచ్చేలోపల శత్రువుపై పగతీర్చుకోని జన్మ వృథా అనేది భీముని సిద్ధాంతం. ఆ విషయంలో అతనికి ఎలాంటి సందిగ్ధతా లేదు. అలాగే, శత్రువును ఎంత క్రూరంగానైనా చంపడం రాజధర్మమని కృష్ణుని సూత్రీకరణ.  ధర్మరాజుకు అహింస వైపు మొగ్గు ఉన్నా హింసను నివారించలేకపోయిన నిస్సహాయత అతనిది. అర్జునుడి పాత్ర మరింత విలక్షణం. అతను హింస-అహింసల మధ్య సందిగ్ధాన్ని ఎదుర్కొంటాడు. అతనిపై ఇటు ధర్మరాజు ప్రభావమూ, అటు కృష్ణుడి ప్రభావమూ రెండూ ఉంటాయి. తండ్రి, తాతలను, అన్నదమ్ములను ఎలా  చంపనని యుద్ధప్రారంభంలో ప్రశ్నించిన అర్జునుడే; సముచిత హింస అహింసే అవుతుందని ఆ తర్వాత ధర్మరాజుతో వాదిస్తాడు. శత్రువులనుంచి సంపదను గుంజుకుని బంధుమిత్రసహితంగా అనుభవించడమే రాజధర్మమంటాడు. హింస-అహింసల మధ్య సంఘర్షణను ఎదుర్కొన్న మరో పాత్ర అశ్వత్థామ. ‘నేను విప్రకులంలో జన్మించి కూడా దురదృష్టం కొద్దీ రాజోచిత ధర్మాన్ని అనుసరించాను, ఇప్పుడు మధ్యలో విప్రధర్మానికి మళ్ళలేను’ అని ఉపపాండవులను చంపడానికి వెళ్లబోయేముందు కృప, కృతవర్మలతో అంటాడు.

వ్యాస, భీష్మ, ద్రోణులలో కులధర్మం గురించిన పట్టింపు ఎక్కువగా కనిపిస్తుంది. తరాల మధ్య అంతరం కూడా  అందుకు  కారణం కావచ్చు. నువ్విక వానప్రస్థానికి వెడితే మంచిదని ధృతరాష్ట్రునికి వ్యాసుడు సలహా ఇస్తూ, ‘రాజులు యుద్ధంలోనైనా చావాలి, దృఢ సమాధితోనైనా శరీరాన్ని విడిచిపెట్టాలి. అంతే తప్ప, వృద్ధులై రోగంతో మంచం పట్టి చావడం మేలా, ఓ భరతముఖ్యా?’ అంటాడు. ‘భరతముఖ్యా’ అనడంలో ఉద్దేశం, భరతులు ఆయుధోపజీవులు సుమా అని గుర్తుచేయడమే.  భీష్ముడు కూడా అర్జునుడిలానే ఒక దశలో హింస-అహింసల మధ్య సందిగ్ధతను ఎదుర్కొన్నట్టు కనిపిస్తాడు. అయితే, ఇద్దరి సందిగ్ధతా ఒకలాంటివి కావు. భీష్ముడు  హింసపట్ల విసుగు ప్రకటిస్తూనే, రాజుల హింసను కులధర్మంగా నొక్కి చెబుతాడు. ‘పది రోజుల్లో ఉత్తమ క్షత్రియుల నెందరినో వాడి బాణాలతో చంపేశాను. విసుగుపుట్టింది. ఇక ఈ శరీరం విడిచి పెట్టడం మంచి’దని అనుకుంటాడు. ‘పుట్టినప్పటి నుంచీ క్రౌర్యంతో రాజులను చంపడంలోనే నా కాలం గడచిపోయింది, విసుగుపుట్టింది, ఇక నేనీ రాక్షస కృత్యం చేయలే’నని ధర్మరాజుతో అంటాడు. అర్జునుడిలో హింసా వైముఖ్యం వ్యవస్థాగతమైనదైతే, భీష్ముడి వైముఖ్యం వ్యక్తిగతం.  భీష్ముని మాటల్లో హింస పట్ల విచారాన్ని మించి, ఉత్తమ క్షత్రియులు అంతరించిపోతున్నారే నన్న ఆవేదన కనిపిస్తుంది. ఇదే భీష్ముడు అంపశయ్య మీద అంతిమక్షణాలకు ఎదురుచూస్తున్న సమయంలో కూడా ; ‘విప్రులకు అధ్యయనం ఎలాగో, రాజులకు యుద్ధం అలాగ. పాపపరులైనప్పుడు తల్లిదండ్రులను, పుత్రపౌత్రులను, గురువులనైనా సరే; యుద్ధంలో చంపడం ధర్మమే. రాజులకు యుద్ధాన్ని మించిన ఉత్తమధర్మం లే’దని ధర్మరాజుతో అంటాడు. అంతేకాదు, యుద్ధాన్ని యజ్ఞంతో పోల్చుతూ, ‘ఏ యజ్ఞమూ సంగ్రామయజ్ఞానికి సాటిరావు’ అంటాడు.

ఇక ద్రోణుడి విషయానికి వస్తే, అభిమన్యుని వధలో ముఖ్యపాత్ర పోషించిన సైంధవుడు; అర్జునుడు  తనను చంపుతానని చేసిన ప్రతిజ్ఞకు భయపడి ద్రోణాచార్యుని కలసుకున్నప్పుడు, ‘కులధర్మం శిథిలం కాకుండా వెళ్ళి యుద్ధం చేయి’ అని ద్రోణుడు అతనితో అంటాడు. మరి విప్రుడైన ద్రోణుడు కులధర్మం తప్పలేదా అన్న ప్రశ్న రావచ్చు కానీ దానిని వ్యక్తిగత దోషంగానే చూడాలి. తను చేసిన తప్పు పట్ల  స్పృహతోనే అతను సైంధవుడికి ఆ సలహా ఇచ్చి ఉండచ్చు.

ఇంతకీ చరిత్రకందని ఆ కాలంలోనే హింస-అహింసల మధ్య ఇంత అంతర్మథనం, ఇంత చర్చ ఎందుకు సంభవించాయన్నది మరో కీలకమైన ప్రశ్న. దానికి సంక్షిప్తంగా చెప్పుకోదగిన సమాధానం ఏమిటంటే, హింస సామాజిక పురోగమనానికి తీవ్ర ఆటంకంగా మారే పరిస్థితులు ఆనాటికే తోసుకువస్తున్నాయి. రాజకీయార్థిక రూపంలో మౌలికమైన మార్పు వస్తోంది. అన్న పుష్కలత్వాన్ని సాధిస్తూ పెరుగుతున్న జనాభాను ఆదుకుంటున్న అభివృద్ధికర సాధనంగా వ్యవసాయం నానాటికీ బలం పుంజుకుంటోంది. దానికితోడు ఇనుము లభ్యత అటు వ్యవసాయానికి సాయపడుతూనే, విచిత్రంగా ఇటు హింసా విజృంభణకూ దారితీయిస్తోంది. వ్యవసాయవిస్తరణకు గణసమాజమూ, ఆయుధోపజీవనమూ అడ్డంకిగా పరిణమించడమే అందుకు కారణం. చరిత్రకాలానికి వస్తున్న కొద్దీ వ్యవసాయ శక్తులకూ, యథాతథవాదులకూ మధ్య సంఘర్షణ మరింత తీవ్ర రూపం ధరించబోతోంది.

దానిని అలా ఉంచి ప్రస్తుతానికి వచ్చే ముందు, ఒక మాట చెప్పుకోవాలి. భీష్ముడు యుద్ధాన్ని ‘సంగ్రామయజ్ఞం’ అన్నాడు. ఆ మాట నాకు ఇప్పటి ‘జిహాద్’ లా ధ్వనిస్తుంది!

మహాభారతంలో ఆది నుంచి అంతం వరకూ  వ్యాపించిన క్షత్రియ క్షీణత, అధికారచ్యుతి అనే దారాలను పట్టుకుని నేరుగా అలెగ్జాండర్ దగ్గరికి వద్దాం. మనదేశంలో క్రీ. పూ. నాలుగైదు శతాబ్దాలకు చెందిన సాహిత్యం కానీ, ఇతర పత్రాలుకానీ, స్పష్టమైన తేదీ గల శాసనాలు కానీ ఏవీ లభ్యం కావని కోశాంబీ అంటూనే; కాకపోతే ఈ కాలం మనకు మొదటిసారి ఒక కచ్చితమైన చారిత్రక పరిణామం తాలూకు తేదీని నమోదు చేసి అందించిందని అంటాడు. అదే, పంజాబ్ పై అలెగ్జాండర్ చేసిన దాడి(క్రీ. పూ. 327). నాటి గ్రీకు కథనాలలోంచి ఆనాటి భారతీయ దృశ్యాన్ని చరిత్ర అనే కొత్త కళ్ళద్దాలతో వీక్షించే అవకాశాన్ని ఈ దాడి మనకు ఇచ్చిందని కోశాంబీ అంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, పౌరాణిక భారతం అలెగ్జాండర్ రాకతో చారిత్రకదశలోకి అడుగుపెట్టింది.

అప్పటికి పర్షియన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న ప్రాంతాలను అలెగ్జాండర్ అవలీలగా జయించుకుంటూ వాటిలో చివరిదైన సింధునదీ ప్రాంతం దాకా వచ్చాడు. సింధుకు పశ్చిమంగా ఉన్న ప్రధాన వర్తక నగరం పుష్కరావతి(నేటి పేరు, చరసద్ద) ముప్పై రోజుల ముట్టడితో చేజిక్కింది. ఆ విజయం కలిగించిన ఉత్సాహంతో అలెగ్జాండర్ సింధు నదిని దాటి గాంధార జనపదంలోకి వచ్చాడు. అక్కడ మరో ప్రసిద్ధ వర్తక, సాంస్కృతిక నగరం ఉంది. అదే, తక్షశిల(ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది). తక్షశిల రాజు అంభి యుద్ధం చేయకుండానే లొంగిపోయి, కప్పం చెల్లించుకున్నాడు. అంతేకాదు, ఇద్దరం పంచుకోవడానికి కావలసినంత ఉంది, ఎందుకొచ్చిన యుద్ధమని కూడా ప్రశ్నించాడు. పైగా, ఇక్కడి నుంచి నీళ్ళు మళ్లించుకునే ఉద్దేశం నీకు లేనప్పుడు మనం యుద్ధం చేయడంలో అర్థమేముందని కూడా అన్నాడు. తక్షశిల రాజు ఇలా నీళ్ళ ప్రస్తావన చేయడం వెనుక చాలా చారిత్రక వారసత్వం ఉంది. నీళ్ళ కోసమే ఈ ప్రాంతంలో ఋగ్వేదకాలం నుంచీ యుద్ధాలు జరిగాయి. దశరాజ యుద్ధం గురించి ఇంతకుముందు ప్రస్తావించుకున్నాం.

Alexander_the_Great_Founding_Alexandria

అలెగ్జాండర్ కు ఇక్కడి నుంచి నీళ్ళు మళ్లించుకునే ఉద్దేశం ఎలాగూ లేదు. అయితే, అంభిని అతను విడిచిపెట్టడానికి అదొక్కటే కారణం కాదు. సైనిక ప్రాముఖ్యం లేని వర్తక నగరాలు అన్నిటివిషయంలోనూ అతను అదే విధానాన్ని అనుసరించాడు.

ఆ తర్వాతే అలెగ్జాండర్ కు అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి. స్వేచ్చా, స్వాతంత్ర్యాలు అనుభవిస్తున్న గణ నగరాలు ఒకటొకటిగా కుప్పకూలినా,  గణయోధులనుంచి అలెగ్జాండర్ తీవ్ర ప్రతిఘటననే ఎదుర్కోవలసివచ్చింది.  ఉమ్మడి శత్రువును కలసి ఎదుర్కొనే ఐకమత్యం గణయోధులలో లేకపోవచ్చు కానీ, యుద్ధం వాళ్ళకు మంచినీళ్ళ ప్రాయం.

ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యవివరం ఏమిటంటే, ఈ గణయోధులకు ఆనాడు క్షత్రియయోధులు సహకరించారు. వారప్పటికి తమవి కాని నగరాల తరపున కూడా పోరాడే కిరాయిసైనికుల స్థాయికి దిగజారిపోయారు. అలెగ్జాండర్ పాలిట ఈ వృత్తి యోధులే సింహస్వప్నమయ్యారు. ప్లూటార్క్ ఇలా రాస్తాడు:

భారతదేశంలోని ఈ అత్యుత్తమ యోధులు (తక్షశిల సమీపంలోని)కిరాయి సైనికులుగా మారి ఆయా నగరాల రక్షణకు బాధ్యత వహిస్తూ వచ్చారు. ఆ పనిలో సాటిలేని శౌర్య సాహసాలు ప్రదర్శిస్తూ అలెగ్జాండర్ ను ముప్పుతిప్పలు పెట్టారు. ఒక దశలో అలెగ్జాండర్ వీళ్లతో సంధి చేసుకున్నట్టే చేసుకుని; వారు విజయగర్వంతో వెనుదిరిగి వెడుతుంటే వెనకనుంచి  దాడి చేయించి ఊచకోత కోయించాడు. ఈ ఒక్క నమ్మకద్రోహమే అతని యుద్ధ విజయాల కీర్తికి ఒక కళంకంగా మిగిలిపోయింది.

ఈ వృత్తి యోధులను ప్రాణాలతో విడిచిపెడితే, రేపు తీవ్ర ప్రతిఘటన కేంద్రంగా మారతారన్న భయంతోనే అలెగ్జాండర్ విశ్వాసఘాతుకానికి పాల్పడ్డాడు. ఇలా క్షత్రియులు గణనిర్బంధాలనుంచి బయటపడి కిరాయి సైనికులుగా మారి ఏ నగరరక్షణకైనా సిద్ధపడడం, అప్పటికీ కొన్ని ఋగ్వేద గణాలు మిగిలి ఉన్న ఆ ప్రాంతంలో ఒక నూతన పరిణామమని కోశాంబి అంటాడు. గణనిర్బంధాలనుంచి బయటపడడం కూడా ఒక ఆసక్తికరపరిణామం. నిజానికి గణనిర్బంధాలనుంచి క్షత్రియులకన్నా మొదట బయటపడినది  బ్రాహ్మణులు. అందు గురించిన విశేషాలను మరో సందర్భానికి వాయిదా వేస్తే…

ఒక మల్ల విలుకాడు వేసిన బాణం అలెగ్జాండర్ కాయానికి పెను గాయం చేసిందని గతంలో చెప్పుకున్నాం. అలాగే,  వృత్తి యోధులను నమ్మించి వెన్నుపోటు పొడవడం అతని కీర్తికాయానికి తూట్లు పొడిచింది. అదలా ఉంచితే, మహాభారత కాలంనుంచీ క్షీణతనూ, అధికారచ్యుతినీ ఎదుర్కొంటున్న క్షత్రియులు; అలెగ్జాండర్ కాలానికి వచ్చేసరికి కిరాయి సైనికుల స్థాయికి జారిపోవడంలో ఒక ఆశ్చర్యకరమైన  చారిత్రక అవిచ్చిన్నత కనిపిస్తుంది.  అంతేకాదు, అది మహాభారతకాలాన్ని నేరుగా చరిత్ర కాలంలోకి తీసుకొస్తుంది.

 – కల్లూరి భాస్కరం

 

అర్జున, అశోకుల మీదుగా అమెరికా దాకా…

భీష్ముడు:  ధర్మరాజా, విను. ఒకే ఇంటికి చెందిన జనాలు ఉన్నారు. వాళ్ళలో ధనార్జన చేసేవారు, కార్యనిపుణులు, ఆయుధోపజీవులు, ఇంకా రకరకాల పనులు చేసేవారూ ఉన్నారు. వారే గణాలు. రాజు వాళ్ళతో కలసిమెలసి ఉంటూ వాళ్ళ నడకను కనిపెట్టుకుని ఉండాలి. వాళ్ళను సంతోషపెడుతూ వలలో వేసుకోవాలి.

గణజనాలలో ఓరిమి ఉండదు. బుద్ధిలో, ప్రతాపంలో అవతలివాళ్లు ఎంత గొప్పవాళ్ళైనా సరే, లెక్క చేయరు. వారిలో ఎవడైనాసరే, ఇంకొకడితో శత్రుత్వం వహించగలడు. దాంతో వాళ్ళ మధ్య చీలికలు వస్తాయి. అప్పుడు శత్రురాజులు వాళ్ళలో కొంతమందిని తమవైపు తిప్పుకుంటారు. అది రాజ్య మూలాన్ని తొలిచేస్తుంది. కనుక రాజు ముందే జాగ్రత్తపడాలి. వాళ్ళను మాటనేర్పుతో వశం చేసుకోవాలి. గణముఖ్యులను ఆదరిస్తూ వాళ్ళ చేత పనులు చేయించుకోవాలి. గణజనాలలో ఐకమత్యం చెదిరిపోతే రాజ్యం నాశనమవుతుంది. గణజనాలు ఒక్కమాట మీద ఉంటేనే రాజుకు సిరీ, సంపదా.  కనుక గణపద్ధతులను గమనించుకుంటూ మెలగాలి,

                      -తిక్కన     

(శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, తృతీయాశ్వాసం)

***

కురుక్షేత్రంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు గణజనాల గురించి ధర్మరాజును పైవిధంగా హెచ్చరిస్తాడు. దాని నేపథ్యం ఏమిటంటే…

సాముదాయిక అధికారంలో ఉండే గణవ్యవస్థ అప్పటికే శిథిలమవుతోంది. ఏకవ్యక్తి అధికారానికి క్రమంగా దారి ఇస్తోంది. కానీ ఆ పరివర్తన అనుకున్నంత తేలిక కాదు. వ్యవస్థ శిథిలమైనంత వేగంగా వ్యక్తుల జీవనవిధానం శిథిలం కాదు. గణజనాలు తమవైన ప్రత్యేక పరిస్థితులకు అలవాటుపడ్డారు. వారిలో ప్రతి ఒకడూ స్వతంత్రుడు. గణంలోని ప్రతి ఒకడితోనూ సమానుడు. ఎవరో ఒకరి అధికారానికి తలవంచడం వాళ్ళకు తెలియదు. దానికితోడు, గణమనస్తత్వంలో పగ, ప్రతీకారదాహం అనేవి అతి సహజంగా కలసిపోయి ఉంటాయి. వారిలో శత్రువుపై పగ దీర్చుకోవడం కేవలం   క్షణికోద్రేక చర్య కాదు. ఎంతో ప్రణాళికాబద్ధంగా, ఒక మతవిధిగా, ఒక కర్తవ్యంగా, కాలపరిమితితో సంబంధం లేకుండా అమలు జరిగే ప్రక్రియ.

దీనికితోడు వాళ్ళ చేతుల్లో ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధాన్ని ఉపయోగించుకునే స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళు ప్రధానంగా ఆయుధోపజీవులు.

bhismaarrowbed

గణవ్యవస్థా, గణజనాలూ అనగానే ప్రపంచమంతా మొట్టమొదటగా తలచుకుని మొక్కవలసిన పండితుడు, లూయీ హెన్రీ మోర్గాన్. ఆయన రాసిన Ancient Society  పురామానవ చరిత్రకారులకు ఓ బైబిలూ, ఓ భగవద్గీతా. అది గణజీవనసూత్రాలను దండగుచ్చిన వ్యాకరణం. మోర్గాన్ కు మహాభారతంతో పరిచయం ఉందని చెప్పలేం. తన పుస్తకంలో ఆయన మహాభారతాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. అయినాసరే, ఆయన సూత్రీకరణలకు మహాభారతంలోనే ఎన్నో ఉదాహరణలు దొరకుతాయి. ఆసక్తిగొలిపే ఆ విశేషాలను మరో సందర్భానికి వాయిదా వేయక తప్పడం లేదు.

గణజనాలు ఒక ‘సమస్య’ అని భీష్ముడికి తెలుసు. ఆయననుంచి మూడో తరానికి చెందిన ధర్మరాజుకు తెలుసు. అందులోనూ అర్జునుడికి మరింత అనుభవపూర్వకంగా తెలుసు. ధర్మరాజునుంచి రెండో తరానికి చెందిన జనమేయజయునికి తెలుసు. అక్కడినుంచి ఒకింత చరిత్ర కాలంలోకి వస్తే కోసల, మగధ రాజులకు తెలుసు.  అలెగ్జాండర్ కీ, మౌర్యరాజు అశోకుడికీ, గుప్తరాజులకూ తెలుసు. ఆ తర్వాతి రాజులకు బహుశా తెలియదు, తెలియవలసిన అవసరం లేదు. ఎందుకంటే, మహాభారతకాలంలో ప్రారంభమైన గణజనాల ఊచకోత గుప్తరాజులతో ఒక కొలిక్కి వచ్చింది. గణసమాజమూ, సంస్కృతుల జ్ఞాపకాలు మనదేశంలో ఏ మేరకు మాసిపోయాయంటే; మన ప్రాచీన సారస్వతంలోనూ, ధర్మశాస్త్రాలలోనూ ఉన్న గణసమాజలక్షణాలనూ, వాటి అవశేషాలనూ కవులూ, ఇతర బుద్ధిజీవులూ పోల్చుకోలేనంతగా!  నన్నయభారతం నుంచే ఇందుకు అనేక ఉదాహరణలు ఇవ్వచ్చు.

ఆధునిక కాలానికి వస్తే, మోర్గాన్ వెలుగులోనే మనం మళ్ళీ గణసమాజం తీరుతెన్నుల గురించి సాధికారంగా తెలుసుకోగలుగుతున్నాం.

మహాభారతకాలం నుంచి చరిత్రకాలం మీదుగా మనం నేటికాలానికి వచ్చి ఒకసారి మనదేశపు పశ్చిమవాయవ్యాలవైపు వెడదాం. నేటి పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ సరిహద్దులలో కొన్ని గిరిజనప్రాంతాలున్నాయి. అప్ఘానిస్తాన్ వర్తమానం మన గతం అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆధునిక కాలంలో తన ప్రాంతంలోని ఆయుధోపజీవుల స్వైరవిహారం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనే ఒక ఫక్తూన్ నాయకుడిని తీవ్రంగా కలతపెట్టిందనీ, గాంధీ అహింసావాదానికి ప్రభావితుడైన గఫార్ ఖాన్ తన జాతీయులను హింసామార్గం నుంచి తప్పించడానికి కృషి చేశాడని కూడా చెప్పుకున్నాం.

అప్ఘానిస్తాన్ ను ఆనుకుని ఉన్న వాయవ్య సరిహద్దు రాష్ట్రం (నేటి పాకిస్తాన్ వాయవ్య ప్రాంతాన్ని బ్రిటిష్ రోజుల్లో అలా పిలిచేవారు)లోని గిరిజనుల జీవనవిధానం పట్ల గాంధీకి ఎంతో ఆసక్తి ఉండేదని ఆయన జీవితచరిత్ర చదివితే అర్థమవుతుంది. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు పఠాన్ల హింసా పార్శ్వం ఆయనకు స్వయంగా అనుభవంలోకి వచ్చింది కూడా. మీర్ ఆలమ్ అనే ఒక పఠాన్ ఓ వివాద సందర్భంలో గాంధీ మీద దాడి చేశాడు. గాంధీ కొన్ని రోజులు ఆసుపత్రిలో గడపవలసివచ్చింది. గఫార్ ఖాన్ తనను మొదటిసారి కలసినప్పుడే ఇద్దరూ సరిహద్దు రాష్ట్రంలోని గిరిజనుల గురించి ఎంతో ఇష్టంగా మాట్లాడుకున్నారు. కాబూల్ వరకూ వెళ్ళి, సరిహద్దులకు అతీతంగా జీవించే గిరిజనులతో కలసిపోయి గడుపుతూ వారి మనస్తత్వాన్ని అర్థంచేసుకోవాలని ఉందని అప్పుడే గాంధీ గఫార్ ఖాన్ తో అన్నారట. ఆయన మూడుసార్లు సరిహద్దు రాష్ట్రానికి వెళ్ళి గఫార్ ఖాన్ ఆతిథ్యం అందుకున్నారు. తరచు స్థిరజనావాసాలపై దాడులు చేస్తూ హిందూ, సిక్కు అల్పసంఖ్యాకవర్గాలకు సమస్యగా మారిన గిరిజనులను సంస్కరించాలన్న కోరిక ఆయనకు ఉండేది.

కోశాంబి

కోశాంబి

మహాభారతం, కోశాంబీల పరిచయంతో ఆయుధోపజీవులను పరిశీలిస్తున్న నాకు గఫార్ ఖాన్, ఫక్తూన్ తెగల గురించిన వివరాలు; సరిహద్దురాష్ట్రంలోని గిరిజన తెగలపై గాంధీ ఆసక్తి  ప్రత్యేక కుతూహలం కలిగించడం సహజమే.  గాంధీ ఆసక్తికి కారణం, భారతదేశ ప్రధానజీవనస్రవంతి లోంచి ఆయుధోపజీవనం అదృశ్యమైపోవడమే నని నాకు అనిపిస్తుంది.

మహాభారతంతో మొదలుపెట్టి, చరిత్రకాలం మీదుగా అప్ఘాన్ పరిణామాలను అర్థం చేసుకుంటున్న నన్ను,  ఓరోజు ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ప్రముఖ పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడు, రాజకీయనాయకుడు ఇమ్రాన్ ఖాన్ అంటున్న మాటలు ఆకర్షించాయి. పాక్-అప్ఘాన్ సరిహద్దుప్రాంతాలలో అమెరికా, దాని మిత్రదేశాల సైనికచర్యను ఆయన ప్రస్తావిస్తూ “అలనాటి బ్రిటిష్ ప్రభుత్వం వందేళ్లు పోరాడినా ఆ ప్రాంతాలపై ఆధిపత్యాన్ని సాధించలేకపోయింది. ఎందుకంటే, అక్కడ ఉన్న పదిలక్షలమందిలో ఒక్కొక్కడు ఒక్కొక్క సైనికుడు. ప్రతి ఒకడి చేతిలోనూ ఆయుధం ఉంటుంది. కనుక సైనికమార్గంలో వాళ్ళను లొంగదీసుకోవడం అసాధ్యం. అమెరికా మరో ఓటమినే మూటకట్టుకుంటుంది” అన్నాడు. ఇమ్రాన్ ఖాన్ మాటలు నా అవగాహనను ధ్రువీకరిస్తున్నాయి.

అంటే, మహాభారతకాలంతో ప్రారంభించి గుప్తరాజుల వరకూ పైన ఇచ్చిన జాబితా, అక్కడితో పూర్తి కావడం లేదన్నమాట. అందులోకి నాటి బ్రిటిష్ ప్రభుత్వమూ, మధ్యలో కొంతకాలం అప్ఘానిస్తాన్ లో చేతులు కాల్చుకుని తప్పుకున్న నాటి సోవియట్ యూనియన్, తాజాగా అమెరికా; దాని మిత్రదేశాలు చేరుతున్నాయన్న మాట. అయితే, ఆయుధోపజీవులతో అర్జునుడు, అశోకుడు తలపడడం; భౌగోళిక హద్దులను దాటుకుని నాటి బ్రిటిష్ ప్రభుత్వం, సోవియట్ యూనియన్, అట్లాంటిక్ ను దాటివచ్చి అమెరికా తలపడడం ఒక లాంటివే కాకపోవచ్చు. తెగలు, దేశాల స్వయంనిర్ణయాధికారంలో జోక్యం చేసుకునే అగ్రరాజ్య దురహంకారంగానో, ప్రపంచశాంతి స్థాపన యత్నంగానో ఎవరి కోణం లోంచి వారు చెప్పుకోవచ్చు. ఆ చర్చను అలా ఉంచి, ఈ సందర్భంలో నన్ను ఆశ్చర్యపరిచేది, చరిత్ర అవిచ్ఛిన్నత!

భారతదేశం వెలుపలికి వెళ్ళి చెప్పుకుంటే, క్రూసేడ్ల పేరుతో చరిత్రకెక్కిన మతయుద్ధాల కొనసాగింపుగా కూడా ఇరాక్, ఇరాన్, అప్ఘానిస్తాన్ లలో పాశ్చాత్య దేశాల జోక్యాన్ని చెప్పుకోవచ్చు. ఈ రోజున  ‘సంస్కృతుల మధ్య యుద్ధం’గా దీనిని చిత్రిస్తున్నా, అది మతయుద్ధాలకు ముసుగు వేసే ప్రయత్నమే. ఈ కోణంలో చూసినప్పుడూ ఇది చరిత్ర అవిచ్చిన్నతకు సాక్ష్యమే. ఒక్క మాటలో చెప్పాలంటే, తమవైన అజెండాతో క్రీస్తుశకంలోకి అడుగుపెట్టిన శక్తులు, క్రీస్తు పూర్వ దశలోనే ఇప్పటికీ ఉన్న సమాజాలను క్రీస్తుశకంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ సమాజాలలో భారతీయ సమాజమూ ఉంది. ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందన్నది ప్రస్తుతానికి శేషప్రశ్న. అదే కనుక ఫలిస్తే అప్పుడు ఏర్పడే ఏకరూప ప్రపంచపు ఉక్కుపాదాల కింద ఎంత వైవిధ్యం, ఎన్ని అస్తిత్వ కాంక్షలు, ఎంత సంస్కృతి, ఎంత చరిత్ర అణగారిపోతాయో ఊహించుకోవలసిందే. అలాగని ఈ సమాజాలను క్రీస్తు పూర్వ దశలోనే ఉంచాలా అని అడిగినా వెంటనే సమాధానం తోచదు. చెప్పొచ్చేదేమిటంటే, చారిత్రక ఘర్షణలు కాలాల హద్దులను అధిగమిస్తాయి. వర్తమానానికి మాత్రమే మన చూపుల్ని కుదించుకుంటే చరిత్ర అవిచ్చిన్నత ఎప్పటికీ అర్థం కాదు.

పైన ఉటంకించిన భీష్ముడి మాటల్ని స్మరించుకుంటూ వర్తమానంలోకి వద్దాం. పాకిస్తాన్-అప్ఘానిస్తాన్ ల మధ్య ఉన్న గిరిజనప్రాంతాలు అర్థ-స్వయంపాలితాలు. వాటిని Federally Administered Tribal Areas (FATA) అంటారు. వీటిలో ఏడు గిరిజన జిల్లాలు, ఆరు సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. Frontier Crimes Regulations (FCR) అనే ప్రత్యేక నిబంధనల ద్వారా ఇవి నేరుగా పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం కింద ఉంటాయి. తెగల ముఖ్యు(nobles)లకు వీటిలో పలుకుబడి ఉంటుంది. మూడు ఆంగ్లో-అప్ఘాన్ యుద్ధాలతో తల బొప్పి కట్టిన బ్రిటిష్ ప్రభుత్వం తన అవసరాలకు కలసివచ్చే షరతుపై ఈ తెగల ముఖ్యులకు కొన్ని పాలనాధికారాలు ఇచ్చింది. ఇప్పటికీ ఇదే ఏర్పాటు కొనసాగుతోంది.

ఈ వివరాలలో, చరిత్రకందని కాలానికి చెందిన భీష్ముని మాటల ప్రతిధ్వనులు స్పష్టంగా వినిపిస్తాయి. ఎంతటి వాళ్ళనూ లెక్క చేయని గణజనాలను మంచి మాటలతో మచ్చిక చేసుకోవాలని భీష్ముడు అనడంలో ఉద్దేశం, వాళ్లపై కత్తి కడితే ప్రయోజనం లేదనే.  అప్ఘాన్లతో మూఢు యుద్ధాలు చేసిన నాటి బ్రిటిష్ ప్రభుత్వమూ,  నిన్నటి సోవియట్ యూనియన్, నేడు అమెరికా నేర్చుకున్న గణపాఠం కూడా అదే.  తన అవసరాలకు కలసివచ్చే షరతుపై గణముఖ్యులకు కొన్ని పాలనాధికారాలు ఇచ్చి బ్రిటిష్ ప్రభుత్వం రాజీ పడడం, గణముఖ్యులను ఆదరించి వారితో పనులు చేయించుకోవాలన్న భీష్ముని సూచనకు అనుగుణమే.

ఇంకా విశేషం ఏమిటంటే, పైన చెప్పుకున్న FATA లాంటి ఏర్పాట్లే మన పురాణ ఇతిహాస కాలం లోనూ ఉండడం! ఉదాహరణకు, ‘పౌరజానపద పరిషత్తు’. ఆనాటికి రాజు సర్వస్వతంత్రుడు కాడు. కొన్ని అధికారాలను పౌర జానపదులతో పంచుకునేవాడు. రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్న దశరథుడు పౌరజానపదపరిషత్తును సమావేశపరచి అనుమతి కోరాడు. పౌర జానపదులలో మ్లేచ్చులు, ఆర్యులు, వనశైలాంతవాసులు; అంటే అడవుల్లోనూ, కొండల్లోనూ ఉండేవాళ్లు కూడా ఉన్నారు. మహాభారతంలో యయాతి తన చిన్నకొడుకు పూరునికి పట్టం కట్టాలనుకుని పౌరజానపదపరిషత్తును సంప్రతించినప్పుడు, పెద్ద కొడుకు యదువు ఉండగా చిన్నకొడుక్కి పట్టం ఎలా కడతావని పౌర జానపదులు ప్రశ్నించారు. అప్పుడు యయాతి వారిని సమాధానపరచి అనుమతి తీసుకున్నాడు. భీష్ముడు పేర్కొన్న గణముఖ్యులను వాల్మీకి గణవల్లభులన్నాడు.

పైన Frontier Crimes Regulations అనే ప్రత్యేక నిబంధనల ద్వారా గిరిజన ప్రాంతాలు పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం కింద ఉంటాయని చెప్పుకున్నాం. అంటే ఒకానొకప్పుడు రాజుతో సమాన ప్రతిపత్తినీ, రాచ మర్యాదలనూ అందుకున్న గిరిజనులు రాజ్యం పట్టు బిగుసుకుంటున్న కొద్దీ నేరస్థ జాతులుగా, నేరశక్తులుగా ముద్రపడుతూ వచ్చారన్నమాట. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు మన పురాచరిత్రలోనూ, చరిత్రలోనూ కూడా  కొల్లలు.

ఖాండవ వన దహనం ద్వారా అర్జునుడు నాగులనే ఆదివాసీ తెగతో తెచ్చుకున్న శత్రుత్వం గురించీ, ఆ తెగవారు దానికి ప్రతీకారం తీర్చుకోడానికి చేసిన ప్రయత్నాల గురించీ, చివరికి అవి అర్జునుడి మనవడైన పరీక్షిత్తు కాలంలో ఫలించడం గురించీ, దానిపై ప్రతీకారంగా పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు నాగులను ఊచకోత కోయడం గురించీ 21 వ్యాసాలలో ఇప్పటికే వేరొక చోట చర్చించాను. కనుక అందులోకి ఇప్పుడు వెళ్ళకుండా; కోసల, మగధ రాజుల కాలంలోనూ, ఆ తర్వాతా జరిగిన విషయాలకు పరిమితమవుతాను.

దానికంటే ముందు ఆయుధోపజీవుల విషయంలో అలెగ్జాండర్  అపకీర్తిని మూటగట్టుకున్న ఒకానొక చర్య గురించి  చెప్పుకోవాలి….

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

–కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

శల్యుడు చెప్పిన కాకి-హంస కథ

కర్ణుడు: నువ్వు పాపదేశంలో పుట్టావు. దుర్బుద్ధి తప్ప నీకు సద్బుద్ధి ఎలా వస్తుంది? క్షత్రియాధముడివి. నీచుడివి. లోకంలో ఆబాలగోపాలం చెప్పుకునే వాక్యం ఒకటుంది.  మద్రదేశంవాడు కుటిలబుద్ధి, దేనికీ కలసిరాడు, స్నేహానికి అపకారం చేస్తాడు, చెడే మాట్లాడతాడు, దుష్టుడు, అతి కష్టుడు.  ఆ వాక్యం ఇప్పుడు ప్రత్యక్షంగా రుజువవుతోంది.

మీలో ఆడా, మగా  వావీ వరసా లేకుండా కలుస్తారు. అది మీకు తప్పుకాదు. మీరు మొదట కల్లు, ఆ తర్వాతే తల్లిపాలు తాగి పెరుగుతారు. మీ రెంత గుణవంతులో ప్రత్యేకించి చెప్పాలా?

అనేకమందికి పుట్టి, కల్లు తాగుతూ పెరిగే మీకు శీలమూ, సభ్యమైన మాటా ఎలా అబ్బుతాయి? మాటలు కట్టిపెట్టి యుద్ధానికి పద.

(మరికొంత సంభాషణ జరిగాక)

శల్యుడు: ఈ పనికిమాలిన మాటలెందుకు? విను కర్ణా…వేయి మంది కర్ణులైనా సరే, కిరీటిని గెలవగలరా?

కర్ణుడు: (కోపంతో ఎర్రబడిన కళ్ళతో నవ్వుతూ) ఒకసారి ధృతరాష్ట్రుని కొలువులో ఉత్తములైన పండితుల గోష్ఠిలో సకల దేశాచారాలూ తెలిసిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు చెప్పగా విన్నాను. బాహ్లిక దేశీయులు గోమాంసం నంజుకుంటూ మద్యపానం చేస్తూ అసందర్భ ప్రేలాపన చేస్తూ నగ్నంగా తిరుగుతూ ఉంటారట. ఇలా అనేకవిధాలుగా బాహ్లిక దేశీయులను నిందిస్తూ ఆయన మాట్లాడాడు. నువ్వు అలాంటి బాహ్లికులకు దగ్గరివాడివి. కనుక వాళ్ళు చేసే పుణ్యపాపాలలో ఆరోవంతు నీకు సంక్రమిస్తుంది. వాళ్ళ అనాచారాన్ని నువ్వు వారించలేదు కనుక పూర్తి పాపం నిన్నే చుట్టుకుంటుంది. బాహ్లికుల కంటే మద్రదేశీయులు మరింత అనాగరికులని పెద్దలు చెబుతుంటారు. నీ గురించి చెప్పేదేమిటి? నోరుమూసుకో.

శల్యుడు: బలాబలాలను, రథ, అతిరథ సంఖ్యను నిర్ణయించే సందర్భంలో భీష్ముడు (నీ గురించి) చెప్పలేదా? ఆ మాటలు ఓసారి గుర్తు చేసుకో. కోపమెందుకు? అంగదేశం వాళ్ళు డబ్బు కోసం ఆప్తుల్ని, బంధువుల్ని కూడా విడిచిపెట్టేస్తారు. కులకాంతల్ని అమ్ముకుంటారు. అలాంటి జనానికి రాజువైన నువ్వు ఇంకొకళ్ళ ప్రవర్తనను ఎంచడం దేనికిలే…                                                                                                             

                                                                                                                        -తిక్కన

(శ్రీమదాంధ్ర మహాభారతం, కర్ణపర్వం, ద్వితీయాశ్వాసం)

          ***

నేను కేవలం మహాభారతం గురించి మాత్రమే రాస్తున్నానని పాఠకులు ఈపాటికి ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటారు. నిజానికి మహాభారతం గురించి మాత్రమే రాయడానికి ఈ వ్యాసపరంపర ప్రారంభించలేదు. గొలుసుకట్టుగా ఒక విషయంలోంచి ఒక విషయంలోకి వెళ్లవలసిరావడంతో మహాభారతం చుట్టూనే ఈ వ్యాసాలు పరిభ్రమిస్తున్నట్టున్నాయి.  ఇప్పటికే అనేకఅంశాలను ప్రస్తావించి విడిచిపెట్టడం చూసే ఉంటారు. వాటిని పూరించుకుంటూ వెడితే ఎక్కడ తేలతానో నాకే తెలియడం లేదు. మహాభారత కథనం కూడా ఇలాగే ఉపాఖ్యానాల మీదుగా సాగడం ఓ విచిత్రమైన యాదృచ్ఛికత కావచ్చు. నాకు ఇంకోటి కూడా అనిపిస్తూ ఉంటుంది. నా జన్యువులలో బహుశా ఒక పౌరాణికుడు దాగి ఉన్నాడు!

అంతకంటే ముఖ్యమైన ఒక వివరణ ఇచ్చుకుంటాను. కేవలం మహాభారతానికీ లేదా గతానికీ పరిమితం కావడం నా ఉద్దేశం కాదు. పురా కాలం, నేటి కాలాల కొసలు రెండూ ముడి వేయడం మీదే ప్రధానంగా నా ఆసక్తి. రెండు కాలాల మధ్య గొప్ప గుణాత్మక విభజన ఉందని నేను అనుకోను. ఊహాప్రాయాలైన  విభజనలను చీల్చుకుంటూ రెండు కాలాల మధ్యా ఒక పొడవైన సరళరేఖను గీయడానికే నా ప్రయత్నం. ఈ ప్రయత్నం ఎంతవరకు విద్వజ్జనాలను ఒప్పించి మెప్పిస్తుందో ఈక్షణాన నాకు కూడా తెలియదు.

విషయానికి వస్తే, బాహ్లిక, మద్ర జనాలకు అంత మంచి పేరు లేదన్న వాక్యంతో కిందటి వ్యాసం ముగించాను కనుక అక్కడినుంచి ఈ వ్యాసాన్ని ఎత్తుకున్నాను.

కర్ణుడు అంగరాజు. అంగరాజ్యం నేటి బీహార్ తూర్పున కొంతభాగం. చంపానగరం దాని రాజధాని. నేటి భాగల్పూర్ ను అంగరాజ్యంలోదిగా గుర్తించారు. ఇక శల్యుడు మద్రదేశీయుడు, క్షత్రియుడు, పాండురాజు రెండో భార్య మాద్రికి సోదరుడు. గమనించే ఉంటారు, పైన ఉటంకించిన సంభాషణలోని కులనింద, ప్రాంత నిందల ఘాటు నసాళానికి అంటేలా ఉంది. అందులోనూ కర్ణుని మాటలు మరింత పరుషంగా ఉన్నాయి. అయితే, వాస్తవంగా నింద ప్రారంభించింది శల్యుడు. అతని మాటలు ఇంకా పరుషంగా ఉంటాయి. అంటే, కర్ణుని నింద ప్రతినింద మాత్రమే.

కర్ణుడు యుద్ధానికి బయలుదేరగానే శల్యుడు నిందకు తెరదీశాడు. కర్ణుని కులాన్ని ఎత్తి చూపి మాటి మాటికీ ‘సూతపుత్రుడి’గా అతనిని సంబోధిస్తూ తూలనాడాడు. అర్జునుడి పరాక్రమాన్ని అదేపనిగా ఆకాశానికి ఎత్తి ఈసడింపు మాటలతో కర్ణుని కుళ్లబొడిచాడు. ఎంగిళ్లు తిని కొవ్వెక్కిన కాకితో అతనిని పోల్చుతూ కాకి-హంస కథ చెప్పాడు.  ఉబికి వచ్చే కోపాన్ని కర్ణుడు మొదట్లో బలవంతాన అణచుకున్నాడు కానీ,  శల్యుడు ఎంతకీ తగ్గకపోవడంతో తనూ నోరు చేసుకున్నాడు. మొత్తానికి ఇద్దరూ కలసి కుల, ప్రాంత విద్వేష భారతస్వరూపాన్ని అత్యంత నగ్నంగా ఆవిష్కరించారు.

కులనింద, ప్రాంత నింద చరిత్ర పొడవునా జరుగుతూనే ఉన్నాయి. వాటి బీజాలు ఒకనాటి సామాజికమైన అమరికలోనే కాక, నాటి నిరంతరాయమైన వలస జీవితంలోనూ ఉన్నాయి.  మనదేశంలో పశ్చిమ, వాయవ్యాల నుంచి తూర్పుకు వలసలు జరుగుతూ వచ్చాయి. ఆ వలసల క్రమంలోనే వర్ణ లేదా కులవ్యవస్థ; రాజ్యం; నాగరికత, సభ్యత, సంస్కారం, శీలం, గుణగణాల గురించిన భావనలు వృద్ధి చెందుతూ వచ్చాయి. ఇంకొంచెం అర్థమయ్యే పోలికతో చెప్పుకోవాలంటే, నేడు పల్లె నుంచి పట్నానికి మారడం లాంటిదే ఇది కూడా. పట్న జీవితంలోని నాజూకును, వేషభాషలను అలవరచుకున్న కొద్దీ పల్లె జీవితం మోటుగా, అనాగరికంగా కనిపిస్తుంది. పల్లె జనాన్ని పల్లెటూరు బైతులని వెక్కిరించడం ఇప్పటికీ చూస్తుంటాం.

అందరూ కట్ట కట్టుకుని వలసపోరు. కొంతమంది ఉన్నచోటే ఉండిపోతారు. అప్పుడు వలస పోయేవారికీ, వీరికీ మధ్య భౌగోళిక దూరమే కాక; జీవనవిధానాలలో కూడా దూరం పెరుగుతుంది. శల్యుడు ఇంకా బాహ్లిక, మద్రదేశాల దగ్గరే ఉంటే, సాటి క్షత్రియులతో సహా అనేకమంది జనాలు తూర్పుకు వచ్చేశారు. బాహ్లిక, మద్ర దేశాలలో అప్పటికింకా వెనకటి సామాజిక రూపమే కొనసాగుతోంది. కర్ణుడు దానినే ఎత్తిచూపి ఆక్షేపించాడు. అది మాతృస్వామ్య సామాజిక రూపం కావచ్చునా అనే చర్చను ప్రస్తుతానికి పక్కన పెడితే, శల్యుడు కులం రీత్యా ఉన్నతస్థానంలో ఉండగా, కర్ణుడు ప్రాంతం రీత్యా ఉన్నతస్థానంలో ఉన్నాడు. శల్యుడు కర్ణుడి కులాన్ని ఎత్తి కించపరిస్తే; శల్యుని క్షత్రియాధమునిగా కర్ణుడు సంబోధిస్తూ అతని ప్రాంతాన్ని ఎత్తి కించపరిచాడు.

కులదర్పం ఇంతగా కరడుగట్టిన శల్యుడు కర్ణునికి రథసారథి కావడానికి అసలెందుకు ఒప్పుకున్నాడు? అదెలా జరిగిందంటే, శల్యుని తనకు సారథిని చేయమని కర్ణుడే దుర్యోధనుని అడిగాడు. అది కూడా శల్యుని పట్ల ప్రశంసా భావనతోనే. కృష్ణుని సారథ్యంలో అర్జునుడు మరింత అజేయుడవుతున్నాడు కనుక, అశ్వజ్ఞానంలో కృష్ణునికి సాటి వచ్చే శల్యుని నాకు సారథిని చేస్తే అర్జునుని అవలీలగా గెలుస్తానన్నాడు. దుర్యోధనుడు కర్ణుని వెంటబెట్టుకుని శల్యుని దగ్గరకు వెళ్లాడు. అతన్ని అనేకవిధాలుగా ఉబ్బేసి కర్ణునికి రథసారథ్యం చేయమని కోరాడు.

ఆ కోరిక శల్యునిపై ఎంత పిడుగుపాటు అయిందో తిక్కన అద్భుతంగా చిత్రిస్తాడు.  అప్పుడు శల్యుని కళ్ళు కోపంతో జేవురించాయి. నుదుట చెమటలు పట్టేశాయి. ఇంత నీచమైన పనికి నన్నెలా నియోగిస్తావు, నీకు వర్ణధర్మాలు తెలియవా, మూర్ధాభిషిక్తులైన రాజులు ఎన్నడైనా శూద్రులకు పరిచర్యలు చేశారా అని దుర్యోధనుని నిలదీశాడు. సూతపుత్రుడైన కర్ణుని దొరగా చేసుకుని నన్ను సారథ్యం ఎలా జరపమంటావు, అదీగాక కర్ణుడు నాకన్నా బలవంతుడా అని ప్రశ్నించాడు. తెలియక నువ్విలా కోరి ఉంటావు, ఒకవేళ తెలిసీ కర్ణుని మీద పక్షపాతంతో నన్నిలా అవమానించదలచుకుంటే ఇప్పుడే మా దేశానికి వెళ్లిపోతానంటూ రాజుల మధ్యలోంచి చివాలున లేచి బయటకు నడిచాడు. అప్పుడు దుర్యోధనుడు అతనిని ఆపి బుజ్జగించాడు. ఒక్క కర్ణుడే దేనికి, నిన్ను మించిన వీరులు ఎక్కడా లేరు; అశ్వహృదయం తెలియడంలో కృష్ణుని కన్నా కూడా నువ్వు ఎక్కువ కనుకే ఈ కోరిక కోరానన్నాడు. ఆ మాటతో శల్యుడు చల్లబడ్డాడు. ఇంతమంది రాజుల మధ్య నన్ను కృష్ణుడికంటే ఎక్కువన్నావు కనుక ఒప్పుకుంటున్నాను; అయితే ఒక షరతు, నేను కర్ణునితో విచ్చలవిడిగా, తోచినట్లు మాట్లాడతాను, నన్ను తప్పుపట్టకూడదు అన్నాడు.

శల్యుని కులనిందా ప్రతిధ్వనులు ఇప్పటికీ భారతదేశమంతా వినిపిస్తూనే ఉండడం చరిత్ర అవిచ్ఛిన్నతకు సాక్ష్యం. కులనింద; కులం, ప్రాంతం, మతం, ఆచారాలు, విశ్వాసాల పట్టింపు; ఆ పట్టింపుతో ఎంతటి అమానుషానికైనా తెగించడం-ఇవన్నీ ఒకే మానసికప్రవృత్తికి చెందినవి. ఈ మానసిక ప్రవృత్తి కొన్ని ప్రాంతాలలో, కొన్ని వర్గాలలో చాలా ఎక్కువగా, కొన్ని ప్రాంతాలలో సాపేక్షంగా తక్కువగా వ్యక్తమవుతుంది. ఇందుకు చారిత్రక, భౌగోళిక కారణాలు ఉన్నాయి. దక్షిణభారతంతో పోల్చితే ఉత్తరభారతం, అందులోనూ పశ్చిమ, వాయవ్య ప్రాంతాలే చరిత్రకు అసలైన వారసులు. ఉత్తరభారతమే ఈ దేశానికి అన్నివిధాలుగా ప్రయోగశాల. ఈ దేశంపై జరిగే దాడులను తట్టుకున్నవీ, ప్రతిఘటించినవీ ప్రధానంగా ఆ ప్రాంతాలే. అందుకే అక్కడినుంచే వీరులూ ఉద్భవించారు; అక్కడే రకరకాల మౌఢ్యాలూ  పెద్ద మోతాదులో తిష్టవేశాయి. ఆడశిశువుల భ్రూణ హత్యలూ, పరువు హత్యలూ, మతకల్లోలాల చిరునామా ఇప్పుడు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఇండియా-భారత్ అని రెండు ఉన్నాయంటారు. నా ఉద్దేశంలో వాటికి మరో రెండు కలుపుకోవాలి: ప్రైవేట్ భారతం, పబ్లిక్ భారతం. భారతదేశ వాస్తవికత ప్రైవేట్ భారతంలోనూ, ప్రైవేట్ సంభాషణల్లోనే ఉంది.

అదలా ఉంచితే, శల్యుడు చెప్పిన కాకి-హంస కథ వేరే కారణంతో అపురూపంగానూ, ఆసక్తికరంగానూ అనిపిస్తుంది. ఆ కథ ఇదీ:

సముద్రంలో ఒక గొప్ప ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో ధర్మవర్తి అనే రాజు పురంలో ఒక సంపన్న వైశ్యుడు ఉండేవాడు. అతనింట్లోకి ఓ రోజు ఓ కాకి ప్రవేశించింది. ఆ వైశ్యుని కొడుకులు ఎంగిళ్ళు తినిపించి దానిని పోషిస్తూ వచ్చారు. దాంతో దానికి  కొవ్వెక్కింది. ఎలాంటి పక్షి అయినా తనకు సాటి రాదన్న అహంకారం పెరిగిపోయింది.  అంతలో ఒకనాడు కొన్ని హంసలు ఆ సమీపంలో కనిపించాయి.  ‘తారతమ్యం తెలియని’ ఆ వైశ్యపుత్రులు వాటిని కాకికి చూపించి, పక్షులలో నీ అంతవారు లేరు కనుక ఆ హంసలతో పోటీ పడి ఎగిరి వాటిని ఓడించు అన్నారు. అప్పుడు కాకి వాటి దగ్గరకు వెళ్ళి, ఓ హంసను గుర్తించి, తనతో సమానంగా ఎగరమని సవాలు చేసింది.  అప్పుడా హంసలన్నీ నవ్వుతూ, మేము మానససరోవరం దగ్గర ఉండేవాళ్లం, మా బలాన్ని వేగాన్ని అన్ని పక్షులూ పొగడుతాయి. మేము ఎక్కడికైనా, ఎంతదూరమైనా వెళ్లగలం, మాకు ఎలాంటి అలసటా రాదు, హంసలను పోటీకి రమ్మని కవ్వించిన కాకిని మేమింతవరకూ చూడలేదు, పైగా మా అందరిలోనూ బలశాలినే ఎంచుకున్నావు, అన్నాయి.

అప్పుడా హంసతో  కాకి, నూటొక్క గతుల్లో నేను ఎగరగలను, ఒక్కొక్క గతిలో వందయోజనాలు వెళ్లగలనంటూ తను చేయగల విన్యాసాలను వర్ణించింది. దానికా హంస, నాకా మార్గాలన్నీ తెలియవు, పక్షులన్నీ ఎగిరే ఒక్క మార్గమే తెలుసు, ఎగురుదాం పద, అంది. రెండూ సముద్రం మీద ఎగరడం ప్రారంభించాయి. చూస్తుండగానే కాకి హంసను దాటిపోయింది. ఇక హంస పని అయిపోయిందని నిర్ణయానికి వచ్చేసి గాలిలో తన విన్యాసాలను మొదలుపెట్టింది. మధ్య మధ్య మళ్ళీ వెనక్కి వచ్చి హంసను వెక్కిరించింది. హంస మాత్రం నిబ్బరంగా సమగతిలో సాగిపోయింది.

కొంతసేపటికి కాకి అలసిపోయింది. వేగం తగ్గిపోయింది. మనసులో అలజడి మొదలైంది. కాలు మోపడానికి ఎక్కడా ఓ చెట్టూ, పుట్టా లేవే అనుకుని కలవరపడింది.  దైన్యం ఆవహించింది. ఎరక్కపోయి ఇరుక్కున్నాననుకుంది. క్రమంగా కిందికి దిగిపోవడం ప్రారంభించింది. అది గమనించిన హంస, ఎన్నో గతులు తెలుసన్నావుగా, ఇది ఏ గతి అని పరిహాసమాడింది.  చివరికి ఎగిరే ఓపిక పూర్తిగా నశించి సముద్రంలో మునిగిపోయే దశలో, ఎంగిళ్ళు తిని కొవ్వెక్కి నీతో పోటీపడ్డాను, బుద్ధొచ్చింది, నన్ను కాపాడి కాకుల్లో కలుపు అని కాకి ఆ హంసను ప్రార్థించింది. అప్పుడు హంస తన కాళ్లమధ్య కాకిని ఇరికించుకుని పైకిలాగి తన వీపున ఎక్కించుకుని తెచ్చి ఒడ్డున పడేసింది.

సరే, శల్యుడు ఈ కథ చెప్పడంలో ఉద్దేశం కర్ణుని ఎంగిలి కూడు తినే కాకి తోనూ, అర్జునుని హంసతోనూ పోల్చడమని తెలిసిపోతూనే ఉంది. దానినలా ఉంచితే, ఇక్కడ కుతూహలం కలిగించే అంశం, పరుగు పందెంలో పాటించే ఒక ముఖ్యసూత్రాన్ని ఇది వెల్లడించడం. ఒలింపిక్స్ లో చూసే ఉంటారు, ముందే వేగంగా పరుగెత్తినవారి కన్నా పరుగులో వెనకబడిన వారిలోనే ఒకరు అంతిమంగా ముందుకొచ్చి పతకం గెలుచుకుంటూ ఉంటారు. అంటే సమగతిలో మొదట పరుగెత్తి, తద్వారా శక్తిని కాపాడుకుంటూ చివరి అంచెల్లో దానిని ఒడుపుగా వాడుకుంటారన్నమాట. కాకి-హంసల పరుగులో కనిపించినది ఆ తేడాయే.

ఇంతకీ ప్రశ్న ఏమిటంటే,  భారతదేశంలో కూడా ఆనాడు పరుగుపందేలు ఉండేవా? ఉంటే, అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? లేక శల్యుని కథనం వెనుక నాటి గ్రీసు ఒలింపిక్స్ గురించి విన్న ముచ్చట్ల ప్రభావం ఉందా? నాడు భౌగోళికంగా అది సాధ్యమే కూడా.

పరిశీలించవలసిన కోణమే…

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

—కల్లూరి భాస్కరం

 

 

 

 

                                      

గాంధారి పెళ్లి

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

అంగములలోన మే లుత్తమాంగ మందు

నుత్తమంబులు గన్నుల యుర్విజనుల

కట్టి కన్నులు లేవను టంతె కాక

యుత్తముడు గాడె సద్గుణయుక్తి నతడు

                                  -నన్నయ

(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, పంచమాశ్వాసం)

అవయవాలు అన్నింటిలోనూ ఉత్తమం శిరస్సు, ఆ శిరస్సులోనూ ఉత్తమాలు కన్నులు. అలాంటి కన్నులు లేకపోవడం ఒక్కటే లోటు కానీ, సద్గుణసంపదలో అతడు ఉత్తముడు కాడా ఏమిటని ఈ పద్యం చెబుతోంది. సందర్భమేమిటంటే, గాంధారరాజు సుబలుడు తన కూతురు గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశానని బంధువుల మధ్య ప్రకటించాడు. అప్పుడు బంధువులు ఇలా అనుకున్నారు.

***

మన వివాహ సంబంధాలు బోర్లించిన గోపురం ఆకారంలో ఉంటాయి. పైన ఉండే వైశాల్యమూ, చుట్టుకొలతా కిందికి వెడుతున్న కొద్దీ తగ్గిపోతాయి. పై భాగాన అంతర్జాతీయస్థాయి వివాహాలు ఉంటే, అట్టడుగున ఒకే కుటుంబంలో ఇచ్చి పుచ్చుకునే వివాహసంబంధాలు ఉంటాయి. ఈ మధ్యలో జాతీయం, రాష్ట్రీయం, ప్రాంతీయం, గ్రామం వగైరా  ఉంటాయి. అంతర్జాతీయస్వభావం కలిగిన వివాహాల సంఖ్య తక్కువే అయినా వాటి  భౌగోళిక వైశాల్యం చాలా ఎక్కువ.

రాజీవ్ గాంధీ, సోనీయా గాంధీల వివాహం అంతర్జాతీయం. అలాగే, చాలాకాలంగా ప్రచారంలో ఉన్నట్టు రాహుల్ గాంధీ కొలంబియా అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే జరిగితే అది కూడా అంతర్జాతీయం అవుతుంది.  జాతీయ వివాహాలకు ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వచ్చు. ఇందిరాగాంధీ-ఫిరోజ్ గాంధీల వివాహం జాతీయం. అలాగే, ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ ల వివాహం. కిందికి వెడుతున్న కొద్దీ ఒకే స్వభావం కలిగిన వివాహ సంబంధాల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది కానీ, ఎంపిక స్వేచ్ఛ తగ్గిపోతూ ఉంటుంది. కులం, ప్రాంతం వగైరాలకు చెందిన ప్రాధాన్యాలు, పట్టింపులు అందుకు కారణమవుతాయి. ఒకే కుటుంబంలో ఇచ్చి పుచ్చుకోవడం బహుశా వివాహసంబంధాల సంకుచిత, కనిష్ట రూపం.

కులాల పరంగా చూస్తే, బ్రాహ్మణులు, క్షత్రియుల వంటి రెండు మూడు అగ్రవర్ణాల వారి వివాహ సంబంధాలకు జాతీయస్వభావమూ, ఎంపిక స్వేచ్ఛ ఎక్కువ ఉండడానికి సూత్రరీత్యా అవకాశం ఉంది. శూద్రులకు కూడా ఆ అవకాశం ఉండేది కానీ, వారు అనేక కులాలుగా చీలిపోవడం వల్ల అది తగ్గిపోయింది. వెనకటి సంగతి ఎలా ఉన్నా ఈ రోజున కులాంతర వివాహాలతో పాటు  అంతర్ బ్రాహ్మణ వివాహాలు జాతీయస్వభావాన్ని తెచ్చుకుంటున్నాయి. పైగా అవి ఆక్షేపణీయం కావడం లేదు. నేనీ మధ్య అలాంటి ఓ పెళ్ళికి వెళ్ళాను. వరుడు తెలుగబ్బాయి, వధువు అరవమ్మాయి. వరుని అన్న ఒక మరాఠీ అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ఆ అమ్మాయి అన్నయ్య ఓ గుజరాతీ అమ్మాయిని చేసుకున్నాడు. ఒకే కులం మధ్య వివాహసంబంధాలు అలా నాలుగు రాష్ట్రాలను, నాలుగు భాషలను ముడి పెట్టాయి.

కులం, శాఖ, ప్రాంతం, భాష వగైరాలతో గిరిగీసుకునే వివాహసంబంధాలే సహజమైనవనీ, శాస్త్రసమ్మతాలనీ, సర్వత్రా అదే ఆనవాయితీ అనే భ్రమ మనలో ఇప్పటికీ చాలామందిలో ఉంది. కానీ ఉన్నతవర్గాలలో వివాహసంబంధాలు ఇప్పుడే కాదు, ఎప్పుడూ  గిరిగీసుకుని లేవు. ఉదాహరణకు, రాజకీయనాయకులు, సినీ నటులు, ఇతర సెలెబ్రటీల వివాహాలు. ఇతరేతర అంశాలు వారి వివాహనిర్ణయాలకు కొలమానం అవుతుంటాయి. వివాహం వ్యక్తిగతం అనుకుంటాం. కానీ వెనకటి రాచకుటుంబాల కాలంలో వివాహం వ్యక్తిగతం కన్నా ఎక్కువ రాజకీయసంబంధి.

రాజకీయ అవసరాలు, ఒప్పందాలలో భాగంగా ఆ వివాహాలు జరగడం సర్వసాధారణం. గజపతుల యువరాజును చెరపట్టిన కృష్ణదేవరాయలు రాజకీయసంధిలో భాగంగా అతని సోదరిని వివాహం చేసుకున్నాడు. అన్నపట్ల క్రూరంగా ప్రవర్తించిన రాయలను ఆమె ఎంత మనస్ఫూర్తిగా ప్రేమించిందో, ఎంత మనోవ్యధ అనుభవించిందో మనకు తెలియదు. తండ్రి రాజకీయ చదరంగంలో పాచికలుగా మారిన రాచకన్నెలు చరిత్ర పొడవునా ఉన్నారు. వాళ్లలానే వాళ్ళ కన్నీళ్లు కూడా అసూర్యం పశ్యలై అంతఃపుర రహస్యాలుగానే మిగిలిపోయి ఉంటాయి. రాచకుటుంబాలలో వివాహ సంబంధాలకు కులీనత, స్థాయి మొదలైనవి గీటురాళ్ళుగా ఉంటాయి కనుక  భాష, ప్రాంతం తదితరాలను అధిగమించడం అనివార్యమవుతుంది. విజయనగరం మహారాజు పాటియాలా మహారాజుతో వియ్యమందడం లాంటివి సహజంగా జరిగిపోతాయి.

మహాభారతానికి వస్తే, కురురాజుగా అభిషిక్తుడైన ధృతరాష్ట్రునికి భీష్ముడు పెళ్లి చేయాలనుకున్నాడు. ఈడు వచ్చిన యువకునికి పెళ్లిచేయాలనుకోవడంలో విశేషమేముంది కానీ, ఆ సమయంలో భీష్ముని ఊహాల్ని ప్రధానంగా మరొకటి ఆక్రమించుకుంది. అప్పటికి కొన్నేళ్ళ క్రితమే కురువంశం ఆగిపోయే ప్రమాదం భయపెట్టింది. వ్యాసుని జోక్యంతో ఆ గండం గడిచింది. ఆ అనుభవం ఇప్పటికీ భీష్ముని ఆలోచనల్లో పచ్చిగానే ఉంది.  కనుక ధృతరాష్ట్రుని పెళ్లిని మించి, ఆ పెళ్లితో కులం నిలిచే అవకాశమే అతనికి కొట్టొచ్చినట్టు కనిపించింది. విదురునితో ఆలోచనలను కలబోసుకున్నాడు. ఇక వధువు ఎవరన్న విషయానికి వస్తే, గాంధారరాజు సుబలుని కూతురు గాంధారి మంచి రూపమూ, లావణ్యమూ, శీలమూ, ఆభిజాత్యమూ కలిగిన కన్య అని బ్రాహ్మణుల ద్వారా విన్నాడు. పైగా వందమంది కొడుకులు కలిగేలా ఆమె వరం పొందిందని తెలిసి మరింత ముచ్చటపడ్డాడు. సుబలునితో మాట్లాడి రమ్మని కొంతమంది వృద్ధులను పంపించాడు.

ధృతరాష్ట్రుడు పుట్టంధుడు. అయినాసరే, సుబలుడు భీష్ముని కోరికను కాదనే అవకాశం లేదు. ఎందుకంటే, రాజు ధృతరాష్ట్రుడే కానీ, రాజ్యరక్షకుడు భీష్ముడే. అతడు పరాక్రమవంతుడే కాక, కాశీ రాజు కూతుళ్లను రాక్షసవివాహ పద్ధతిలో ఎత్తుకు వెళ్ళి, తన తమ్ముడు విచిత్రవీర్యునికి ఇచ్చి పెళ్లి చేసిన చరిత్ర అతనికి ఉంది. కనుక ఆ ప్రతిపాదనకు  ఒప్పుకుని మర్యాద నిలుపుకోవడమే మంచిదని సుబలుడు అనుకొని ఉండచ్చు. దాంతో, ‘గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశా’నని బంధువుల మధ్య ప్రకటించేశాడు. గాంధారి ఆ మాట వింది. తండ్రి అలా మాట ఇచ్చిన క్షణం నుంచే ధృతరాష్ట్రుని తన భర్తగా భావించింది. ఈ కళ్ళతో ఇక పరపురుషుని చూడరాదనుకుని నేత్రపట్టం కట్టుకుంది. ఓ రోజున సోదరుడైన శకుని గాంధారినీ, గొప్ప సంపదనూ వెంటబెట్టుకుని హస్తినాపురానికి విచ్చేశాడు. గాంధారీ-ధృతరాష్ట్రుల వివాహం వైభవంగా జరిగిపోయింది.

నిజానికి అప్పుడు ధృతరాష్ట్రుడు ఒక్క గాంధారిని మాత్రమే పెళ్లిచేసుకోలేదు. ఆమెతోపాటు ఆమె చెల్లెళ్ళు పదిమందిని పెళ్లాడాడు. మహాభారతం వాళ్ళ పేర్లను కూడా ఇచ్చింది. అంతేకాదు, కులం, రూపం, శీలం కలిగిన మరో వందమందిని తెచ్చి ధృతరాష్ట్రునికి ఇచ్చి భీష్ముడు పెళ్లి చేశాడు. ఆ లెక్కన ధృతరాష్ట్రుని భార్యలు నూటపదకొండుగురు అవుతారు. అప్పుడు అతనికి వందమంది కొడుకులు ఉండడంలో ఆశ్చర్యం లేదు. అయితే వారందరినీ  గాంధారి సంతానంగానే చెబుతారు.  గతంలో ఒకసారి చెప్పుకున్నట్టు, మహాభారతంలో కొన్ని వివరాలు ప్రచారంలో లేవు. అలాగే, అనేక సందేహాలకు అందులో తగిన సమాధానం ఉండదు. నూటొక్క మందిని గాంధారి సంతానంగా చెప్పడం అలాంటిదే. గాంధారి చెల్లెళ్ళకు, ఇతర భార్యలకు కలిగిన సంతానాన్ని కూడా పట్టమహిషి అయిన గాంధారికే ఆపాదించి ఉండచ్చు. నూటొక్కరు (కూతురు దుశ్శలతో కలిపి) కౌరవులలో పదిహేడుమందే గాంధారికి పుట్టినవారని ఎస్.ఎల్. భైరప్ప తన ‘పర్వ’ నవలలో అంటారు. అయితే, చిక్కుముడులుగా కనిపించే ఈ సంతానం లెక్క లన్నింటికీ శాస్త్రపరమైన ఇతర వివరణలు లేకపోలేదు. వాటి గురించి తర్వాత చెప్పుకుందాం.

సుబలుడు ‘గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశా’ననడం, కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లు ‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావం’డనడంలా ధ్వనిస్తుంది. మహాభారత కాలం నుంచీ నేటి వరకూ అప్రతిహతంగా సాగుతున్న పితృస్వామ్యం పదునును ఈ రెండు వాక్యాలూ పట్టి చూపుతాయి. ముక్కుపచ్చలారని తన కూతురును ముసలివాడికిచ్చి పెళ్లి చేసే అఘాయిత్యాన్ని సహించలేక అగ్నిహోత్రావధాన్లు భార్య ప్రతిఘటించడం భోజనాల దగ్గర పెద్ద సీను సృష్టిస్తుంది. మరి సుబలుని నిర్ణయాన్ని అతని భార్యా, పిల్లలు వాస్తవంగా ఎలా తీసుకున్నారో తెలియదు. విశ్వనాథ సత్యనారాయణగారు నన్నయ ప్రసన్న కథా కలితార్థయుక్తికి ఉదాహరణగా ఈ ఘట్టాన్ని పితృస్వామ్య కోణం నుంచి వ్యాఖ్యానించారు.  ‘గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చేశా’ననగానే బంధువులు మారు మాట్లాడక పోగా, కళ్ళు లేకపోతేనేం గుణవంతుడు కాడా ఏమిటని సరిపెట్టుకోవడం; తండ్రి ఆ మాట అన్న క్షణం నుంచీ గాంధారి ధృతరాష్ట్రునే తన భర్తగా భావించి నేత్రపట్టం కట్టుకోవడం -బంధువర్గంలోనూ కుటుంబసభ్యుల్లోనూ సుబలుని మాటకు గల  తిరుగులేని లక్షణాన్ని, గాంధారి పాతివ్రత్యాన్ని సూచిస్తాయని విశ్వనాథవారు అంటారు.  ఇరావతీ కార్వే తన ‘యుగాంత’లో స్త్రీ కోణం నుంచి ఈ ఘట్టాన్ని చూస్తూ గాంధారి నేత్రపట్టం కట్టుకోవడం తండ్రి నిర్ణయంపట్ల నిరసన సూచకంగా అనుమానిస్తారు. కాలంతోపాటు కలిగే దృష్టిభేదం ప్రతి కాలంలోనూ పురాగాథల్ని సరికొత్తగా వ్యాఖ్యానించుకునే అవకాశం కల్పిస్తుంది. ఆ విధంగా ఆ కథలు నిత్యనవీనత్వాన్ని సంతరించుకుంటూ ఉంటాయి.

అంధత్వాన్నే కాదు, ఏ వైకల్యాన్ని అయినా వేలెత్తి చూపించడం ఇప్పుడు కుసంస్కారం అవుతుందని మనకు తెలుసు. అదలా ఉంచి, ధృతరాష్ట్రునిపై సానుభూతినుంచి కలిగిన ప్రేమతోనే గాంధారి అతనిని భర్తగా అంగీకరించీ ఉండచ్చు.  నిజంగా ఆమె ఆంతర్యం ఏమిటో మనకు తెలియదు. తెలిసే అవకాశం లేదు.

birth-kaurava-gandhari-mahabharat-indian-mythology

చెప్పుకుంటూ వెడితే ఈ ఘట్టంలోని విశేషాలకు అంతే ఉండదు. ధృతరాష్ట్రునికి వధువుకోసం గాంధారం దాకా వెళ్ళారంటే, సమీపంలో సుక్షత్రియకన్య దొరకలేదనుకోవాలి.  గాంధారి రూపలావణ్య శీలాల గురించి భీష్ముడు బ్రాహ్మణుల ద్వారా వినడం ఇంకో విశేషం. బ్రాహ్మణుల ద్వారానే ఎందుకంటే, వాళ్లే ఆనాడు క్షత్రియ కుటుంబాలకు, బయటి ప్రపంచానికి మధ్య వారధులుగానూ, వార్తాహరులుగానూ ఉన్నారు. అంటే, నాలుగు గోడల మధ్య ఆభిజాత్యాన్ని కాపాడుకునే క్షత్రియులకు బహిరంగ అభివ్యక్తి లేదా బయటి ప్రపంచాన్ని చూపించే కిటికీ బ్రాహ్మణులే. అది మళ్ళీ బ్రాహ్మణ-క్షత్రియ అన్యోన్యత గురించిన చర్చలోకి తీసుకువెడుతుంది. దానినలా ఉంచితే, ఎక్కడికైనా యధేచ్చగా వెళ్లగలిగే అవకాశమూ, బహుశా అధికారమూ ఆనాడు బ్రాహ్మణులకే ఉండి ఉండాలి. అది మళ్ళీ నాటి సామాజికమైన అమరికవైపూ, గణసమాజపు తీరు తెన్నులవైపు మనల్ని మళ్లిస్తుంది. అలాగే, ధృతరాష్ట్రుడే గాంధారదేశం వచ్చి గాంధారిని పెళ్లాడకుండా, గాంధారే అతని దగ్గరకు తరలి వెళ్లడమూ విశేషమే.

అంతకు మించి గమనించవలసిన విశేషం ఇంకొకటి ఉంది. అది కుంతి- పాండురాజుల వివాహం. ధృతరాష్ట్రునికి వధువు కోసం గాంధారదేశం దాకా వెళ్లవలసివచ్చింది కానీ, పాండురాజుకు వధువు దగ్గరలోనే, యాదవుల ఇంట దొరికింది. ఆ వధువు కూడా అప్పటికే కొడుకును కన్నది. అన్నదమ్ములే అయినా రాజ్యాధికారం ఉన్న వ్యక్తికీ, లేని వ్యక్తికీ వధువును ఎంపిక చేయడంలో ఉండే తరతమ భేదాలకు ఇది సూచన కావచ్చు. అయితే, ఆ తర్వాత పాండురాజు భీష్ముని అనుమతితో మద్రదేశపు రాచకన్య మాద్రిని కూడా పెళ్లిచేసుకున్నాడు.  మొదటి పెళ్లికీ, ఈ పెళ్లికీ మధ్య ఏం జరిగిందో తెలియదు. కుంతికి సంతానం కలగకపోవడం ఒక కారణంగా కనిపిస్తుంది. లోపం పాండురాజులోనే ఉన్నా దానిని కప్పి పుచ్చడానికి  మాద్రిని ఇచ్చి చేశారని ఎస్.ఎల్. భైరప్ప ఊహిస్తారు. కుంతి చరిత్ర యాదవ-క్షత్రియుల మధ్య నున్న సామాజిక అంతరాన్ని సూచిస్తోందనుకుంటే, అదే కురు-పాండవ శత్రుత్వానికీ అంతిమంగా యుద్ధానికీ దారితీయించిందా అన్నది అన్నింటికంటే ఆసక్తికరమైన ప్రశ్న.

Kunti_Gandhari_Dhrtarashtra

కిందటి వ్యాసం ఆగిపోయిన చోటికి మళ్ళీ వెడదాం.  మధ్య ఆసియాలో ఉన్న నేటి అప్ఘానిస్తానే నాటి గాంధారదేశం. అంటే ధృతరాష్ట్రునికి వధువును మధ్య ఆసియా నుంచి తెచ్చుకున్నారన్నమాట. అంతేకాదు, మాద్రి కూడా అక్కడిదే. మద్రదేశం గాంధారదేశాన్ని ఆనుకునే ఉంటుంది. అది మళ్ళీ ఉత్తర మద్ర, తూర్పు మద్ర అనే రెండు జనపదాలుగా ఉండేది.  ఉత్తరమద్రను ఉత్తర కురుభూములని, బాహ్లిక దేశమని కూడా అనేవారు. గ్రీకులు దానినే బాక్ట్రియా అన్నారు. పురాణ, ఇతిహాస కాలం నాటి భౌగోళిక రేఖా పటాన్ని గీస్తే అది అప్ఘానిస్తాన్ నుంచి  ఉత్తరభారతం వరకూ ఒకే నడవగా ఉన్నట్టు చూపిస్తుందని చెప్పుకున్నాం. అంటే,  మధ్య ఆసియా, భారత ఉపఖండ జనపదాల మధ్య బాంధవ్యాలు, ఇచ్చి పుచ్చుకునే సంబంధాలు, యుద్ధాలలో పరస్పర సహకారం ఉండేవన్నమాట.

క్షత్రియ వధువుల కోసం గాంధార, మద్రదేశాలవరకూ వెడితే వెళ్లచ్చు కానీ, నిజానికి మద్ర (లేదా బాహ్లిక) జనాలకు మంచి పేరు లేదు. ఆ విషయం కూడా మహాభారతమే చెబుతోంది. దాని గురించి తర్వాత…

 

ప్రకృతి గీసిన రేఖా పటాలు

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

పరశురాముడు భీకర కోపాగ్నితో ఉగ్రరూపం ధరించి ఇరవై యొక్కసార్లు దండెత్తి భూమిమీది క్షత్రియులను తుడిచిపెట్టాడు. అప్పుడు ఆ క్షత్రసతులు ఋతుకాలాలలో ధర్మం తప్పకుండా మహావిప్రుల వల్ల కూతుళ్లను, కొడుకులను కని క్షత్రధర్మాన్ని నిలబెట్టారు…

వైవస్వతుడనే మనువుకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులైన మానవులు పుట్టారు. మరియు అతనికి వేనుడు మొదలైన యాభై మంది రాజులు పుట్టి, వంశాలను వృద్ధి చేసారు. వారు తమలో తాము యుద్ధాలు చేసుకుని మరణించారు.

                                                                 –శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం

విడి విడిగా ఉటంకించిన పై రెండు వివరాలు ఒక  ఉమ్మడి విషయాన్ని చెబుతున్నాయి. అది క్షత్రజాతి నిర్మూలనం కావడం గురించి, దానిని నిలబెట్టడం గురించి. నాటి ఆయుధోపజీవులైన క్షత్రియగణాలకు చంపడం, చావడం ఒక నిత్యకృత్యంగా, ఆటగా ఉండేదనీ; అది అనేక సంక్షోభాలకు, అవ్యవస్థకు దారితీయించేదనీ, వాటిని అధిగమించడానికి అందుబాటులో ఉన్న మార్గాలను వెతుక్కున్నారనే సంగతిని గుర్తుపెట్టుకుని ముందుకు వెడదాం.

    ***

మనిషి ఊహలు అలవాటుగా మారి, విశ్వాసంగా ఘనీభవించి గిరి గీసుకునే తీరు నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఒకటి చూడండి, భారతదేశపు రేఖాపటాన్ని (చాలావరకు) ఇప్పుడున్న స్థితిలోనే చూడడానికి దశాబ్దాలుగా అలవాటు పడిపోయాం. ఈ రేఖాపటం ఒకప్పుడు మరోలా ఉండేదనీ, రేపు ఇంకోలా ఉండే అవకాశం ఉందనే ఊహ మనకు రానే రాదు. ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రేఖాపటాన్ని 58 ఏళ్లుగా చూస్తున్నాం. గతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రాంతాలు కలసి ఉన్నప్పటి రేఖాపటమూ;  నేటి మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు కొన్ని కలసి ఉన్న నిజాం రాజ్యం తాలూకు రేఖాపటమూ మరపు పుటల్లోకి జారిపోయాయి. ఇప్పుడవి మన ఊహకు కొత్తగా అనిపిస్తాయి. 1947 కు ముందు భారతదేశ రేఖాపటంలో నేటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు భాగంగా ఉండేవి. కాలంలో ఇంకా వెనక్కి వెళ్ళండి, నేటి అఫ్ఘానిస్తాన్ కూడా భారతఖండంలో ఉండేది. ఇంకా చాలా వెనక్కి వెళ్ళండి. పశ్చిమాసియా నుంచి వాయవ్య భారతం వరకూ మొత్తం ఆర్యావర్తం గా ఉండేదనిపిస్తుంది. మరింత వెనక్కి వెళ్ళండి, రాంభట్ల కృష్ణమూర్తి గారి ప్రకారం యూరప్ కూడా కలసి ఉన్న ప్రదేశాన్నే భారతవర్షం అనేవారు.

చరిత్ర పొడవునా రేఖాపటాలు మారిపోతూనే వచ్చాయి. పదమూడో శతాబ్ది నాటి మంగోలియన్ పాలకుడు చెంగిజ్ ఖాన్ ఏలిన మహాసామ్రాజ్యాన్ని రేఖాపటంలో చూపిస్తే, అది చైనాలోని పెకింగ్ (నేటి బీజింగ్) తో ప్రారంభించి వాయవ్యభారతం మీదుగా హంగరీ వరకూ వ్యాపించి కనిపిస్తుంది. చెంగిజ్ ఖాన్ డీ.ఎన్.ఏ ను పంచుకున్న వారసులు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారో చెబుతూ ఆమధ్య ఒక ఆసక్తికర కథనం వెలువడింది. అలాగే, ఒకనాటి మౌర్య సామ్రాజ్యపు రేఖాపటంలో అఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణభారతం వరకూ చేరి ఉండేవి. అశోకుడి నాయనమ్మలలో ఒకామె గ్రీకు సెల్యూకస్ కూతురు.

అయితే, మనిషి ఎప్పుడూ అధికారిక రేఖాపటాలను ఉల్లంఘిస్తూనే ఉన్నాడు. తనవైన ఊహాపటాలను రాసుకుంటూనే ఉన్నాడు. నదీ నాగరికత వర్ధిల్లిన కాలంలో నది నడిచిన దారి వెంట మనిషి రేఖాపటాలను నిర్మించుకున్నాడు. ఇప్పటికీ ఆదివాసులు కొండలు, గుట్టలు, అడవులు, సెలయేళ్ల వెంబడి తమ రేఖాపటాలను గీసుకుంటూనే ఉంటారు. దూరాలను పెంచిన నాగరికమైన దారులకంటే అతి తక్కువ కాలంలో గమ్యం చేర్చే దారులు వారికి కరతలామలకంగా ఉంటాయి. దండకారణ్యాన్ని రేఖల్లో బంధించడానికి ప్రయత్నించి చూడండి, అది నేటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను విజయవంతంగా ధిక్కరించి వెక్కిరిస్తుంది.  దండకారణ్యాన్ని ఒక రాష్ట్రం చేసి ఆదివాసులకు ఇవ్వకుండా, యధేచ్చగా దోచుకోమని చెప్పి నాలుగు రాష్ట్రాలకు పంచిపెట్టడం; సమన్యాయ రాజ్యాంగం వెలుగులో అమలుచేసే పరమ దురన్యాయంగా అనిపిస్తుంది.  ఆ అన్యాయం  మూలాలు వేల సంవత్సరాల చరిత్రలో ఉన్నాయి. అంటే, కొన్ని అన్యాయాలు ప్రజాస్వామ్యం, సమానత్వం, సమాన హక్కుల వంటి ఆధునిక భావాలను కూడా ధిక్కరించి కొనసాగుతున్నాయన్న మాట.

నేనోసారి నరసాపురం(ప.గో.జిల్లా) వెళ్లినప్పుడు తెలిసిన ఓ సంగతి నన్నెంతో విస్మితుణ్ణి చేసింది. మత్స్యకారులు నరసాపురానికి దగ్గరలో ఉన్న సముద్రతీరం వెంబడే సైకిళ్ళమీద కృష్ణా జిల్లాలోని మచిలీపట్నానికి వెళ్ళి సాయంత్రానికి తిరిగొస్తారట!  సైకిల్ కంటే వేగంగా పయనించే ఏ వాహనం మీద వెళ్ళినా అది సాధ్యం కాదు. మా ఊరి గోదావరి గట్టు మీద నిలబడి చూస్తే, ఎదురుగా నదికి ఆవలి గట్టున తూర్పు గోదావరి జిల్లా ఊళ్ళు ఉంటాయి. కరణంగారు పొద్దుటే గొడుగు పుచ్చుకుని బయలుదేరి పడవలో గోదావరి దాటి తూ.గో. జిల్లా ఊళ్ళకు వెళ్ళి సాయంత్రం చీకటి పడే లోపల తిరిగొస్తూ ఉండేవారు.

భౌగోళిక రేఖాపటాలతో నిమిత్తం లేకుండా నదీతీర గ్రామాల వాళ్ళు ఒకే గుండెతో స్పందించడం నాకు ప్రత్యక్షంగా తెలుసు. పాపికొండలలో పేరంటపల్లి అనే ఓ గిరిజన గ్రామంలో బాలానంద స్వామి అనే ఒక సాధువు ఉండేవారు. పాపికొండలు నేడు మనం కొత్తగా గీసుకున్న ఖమ్మం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడలి కావడం నాకో అద్భుతంగా తోస్తుంది. బాలానంద స్వామి గిరిజనులకు ఎంతో సేవ చేశారు. గోదావరి జిల్లా గ్రామాల వారందరికీ ఆయనమీద భక్తి. ఆయన వృద్ధాప్యంలో అస్వస్థులై రాజమండ్రిలో కాలం చేసినప్పుడు భౌతికకాయాన్ని లాంచీలో రాజమండ్రి నుంచి పేరంటపల్లి తీసుకెళ్లారు. లాంచీ వస్తున్న సంగతి తీరగ్రామాల వాళ్ళందరికీ తెలిసింది. ప్రతి ఊరి రేవులోనూ లాంచీ ఆపారు. ఊళ్ళకు ఊళ్ళు పిల్లా పాపాతో గోదావరి గట్టుకు కదలి వెళ్ళి భౌతికకాయాన్ని దర్శించుకుని కన్నీటి తర్పణం విడిచి వచ్చాయి. లాంచీ మా ఊరి రేవుకి వచ్చినప్పుడు గోదావరి గట్టుకు పరుగెత్తిన జనంలో నేను కూడా ఉన్నాను.

బమ్మెర పోతనామాత్యుడు చంద్రగ్రహణం రోజున తన ఊరి గోదావరిలో స్నానం చేసి, జపతపాలు పూర్తి చేసుకుని భాగవతాంధ్రీకరణకు శ్రీకారం చుట్టారని అంటారు. చాలా ఏళ్లక్రితం చంద్రగ్రహణం రోజునే నేను మా ఊళ్ళో గోదావరి స్నానానికి వెళ్లినప్పుడు ఈ సంగతి గుర్తొచ్చి ఆ సన్నివేశాన్ని ఊహల్లో చిత్రించుకోడానికి ప్రయత్నించాను. పోతనగారు సరిగ్గా ఇలాగే, ఇలాంటి పరిసరాలలోనే; గోదావరి గాలులు మోసుకొచ్చే శీతలస్పర్శ దేహాత్మలను పునీతం చేస్తున్న ఘడియల్లోనే భాగవతాంధ్రీకరణ ప్రారంభించి ఉంటారనిపించింది. ఈ చంద్రగ్రహణం రోజున మా ఊరి గోదావరి దగ్గరి సన్నివేశం నాటి పోతనగారి సన్నివేశానికి అచ్చమైన ప్రతికృతి అయుంటుందనే ఊహ నన్నెంతో ఉత్తేజితుణ్ణి చేసింది. పోతన భాగవత పద్య పరిమళాన్ని మా తీరగ్రామాల వాకిట గోదావరి గాలులే వెదజల్లి వెళ్ళాయనిపిస్తుంది.

ప్రకృతి గీసిన రేఖాపటాలు భిన్నంగా ఉంటాయి.

మనిషి ఉల్లంఘించినది భౌగోళిక రేఖాపటాలను మాత్రమేనా… కాదు. గణం, తెగ, వర్ణం, కులం, జాతి వగైరా చట్రాలను కూడా పురాకాలం నుంచి, నేటి కాలం వరకూ ఉల్లంఘిస్తూనే ఉన్నాడు. ఆదిమ కాలం నుంచి ఆధునిక కాలం వరకూ జాతుల సాంకర్యం ఎంత పెద్ద ఎత్తున జరిగిపోయిందో చెప్పుకోవడం ప్రారంభిస్తే దానికదే ఒక మహాగ్రంథం అవుతుంది. మనిషి అనుభవం ఇరుకునుంచి వైశాల్యానికి ఎదిగిందని మనం సాధారణంగా అనుకుంటాం. కానీ వైశాల్యం నుంచి ఇరుకులోకి కుదించుకుపోయిందని నాకు అనిపిస్తుంది. పురాచరిత్ర-చరిత్రలతో నా పరిచయం గొప్పదని చెప్పను కానీ, నాకొకటి గాఢంగా అనిపిస్తూ ఉంటుంది. మన పూర్వులు మనకన్నా విశాలమైన ప్రపంచాన్ని చూశారు. విశాలమైన అనుభవాలు పొందారు. వాటిని కొత్త కొత్త సమూహాలతో పంచుకున్నారు. సరిగ్గా ఇదే ఊహను హెచ్. జి. వెల్స్ (A SHORT HISTORY OF THE WORLD) కూడా ప్రకటించడం ఓ అపురూపమైన భావసారూప్యం . దూరాలను జయించడం అతి కష్టంగా ఉండే పురాకాలంలో మనిషి విశాల ప్రపంచాన్ని చూడగలితే, దూరాలను జయించిన నేటి గ్లోబల్ కుగ్రామంలో మనిషి అస్తిత్వం ఇరుకై పోతుండడం నాకు ఆశ్చర్యం గొలుపుతుంది.

మనం దేశాలు, ప్రాంతాలు, మనుషులు, మతాలు, భాషల మధ్యా; కాలాల మధ్యా కృత్రిమంగా కట్టుకున్న ఆనకట్టల మీదుగా, మన కళ్ళు కప్పి చరిత్ర ప్రవహిస్తూనే ఉంటుంది. తన అవిచ్ఛిన్నతను చాటిచెబుతూనే ఉంటుంది.  ఆమధ్య ఓసారి ఓ టీవీ చానెల్ పెట్టగానే అందులో ఓ చర్చ నడుస్తోంది. కొంతమంది యువతీ యువకులు రెండు పక్షాలుగా విడిపోయి ఆవేశంగా వాదించుకుంటున్నారు. అది కాశ్మీర్ గురించిన చర్చ అని వెంటనే తెలిసింది కానీ వారిలో ఒక పక్షం కాశ్మీరీ పండిట్లనీ, ఇంకో పక్షం కాశ్మీరీ ముస్లిం లనే విషయం కొంతసేపటికి కానీ తెలియలేదు. ఎందుకంటే, వారి ఆకృతులు, వేషభాషలు, హావభావాలు ఒక్కలానే ఉన్నాయి. ఒకే కుదురుకు చెందిన జనం అలా మతం కారణంగా విడిపోయి రెండుపక్షాలుగా చీలిపోయి తీవ్రంగా వాదించుకుంటున్న దృశ్యం నాకు విస్మయం కలిగించి ఆలోచన రేకెత్తించింది. నా ఊహల్ని చదివాడా అన్నట్టుగా ఆ చర్చలో పాల్గొన్న ఓ ముస్లిం యువకుడు “మీరూ మేమూ రక్తబంధువులం, మీ మీద మాకు వ్యతిరేకత ఎందుకుంటుంది, మనం ఎప్పటికీ సహజీవనం చేయవలసినవాళ్ళమే” అన్నాడు. ఎవరు ఏమనుకున్నా సరే, కాశ్మీరీలను మతాల లేబుళ్లతో గుర్తించకూడదని అప్పటికప్పుడు నేనొక వ్యక్తిగత నిర్ణయానికి వచ్చాను. మతం మధ్యలో వచ్చింది. వాళ్ళలో ప్రవహించే రక్తం తాలూకు గతం మతం కన్నా చాలా పురాతనం.

mahabharata1

నేటి భౌగోళిక రేఖాపటాలను. మతాలు తదితర ముద్రలను కాసేపు మరచి పోయి పైన పేర్కొన్న మహాభారత కథనానికి తిరిగి వెడదాం. చంపడం, చావడం నిత్యకృత్యంగా మారిన ఆయుధోపజీవులైన క్షత్రియగణాల గురించి అది చెబుతోందనుకున్నాం. మన చూపుల్ని మనదేశం నుంచి మరికొంత వాయవ్యంగా విస్తరించుకుని చూస్తే, అటు అప్ఘానిస్తాన్ నుంచి ఉత్తరభారతం వరకు అంతా ఆయుధోపగణాల నడవగా ఉండేది. అతి ప్రాచీనకాలంలో ఒక యుద్ధం జరిగింది. దశరాజ యుద్ధంగా అది ఋగ్వేదానికెక్కింది.  జలవనరులపై ఆధిపత్యం కోసం జరిగిన యుద్ధం అది. పది గణాలకు చెందిన రాజులు పరూష్ణీ(నేటి రావీ నదిలో కొంతభాగం) నదీజలాలను మళ్లించడానికి ప్రయత్నించారు. భరతులలో త్వష్టృ అనే ఉపగణానికి చెందిన సుదాస్ దీనిని ప్రతిఘటించాడు. దాంతో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సుదాస్ గెలిచాడు. సుదాస్ తో పోరాడిన పది గణాలలో ‘ఫక్తు’లు ఒకరు( మిగిలిన తొమ్మిది: సిమ్యు, తుర్వస, యక్సు, మత్స్య, భృగు, దృహ్యు, భలాన, అలీన, విశానిన్). ఫక్తులను అలెగ్జాండర్ కాలం నాటి గ్రీకులు Pakthyes అన్నారు. ఈ పక్తూన్లనే ఇప్పుడు పఠాన్లు అని కూడా అంటున్నారు. వీరికే పష్టూన్లనే పేరు ఉంది. అప్ఘానిస్తాన్ కు చెంది, గాంధీజీకి అనుయాయిగా మారి సరిహద్దుగాంధీగా ప్రసిద్ధుడైన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఈ తెగకు చెందినవారే.

ఈ ఆయుధోపజీవులను అంతమొందించే కార్యక్రమం మనదేశంలో కోసల, మగధ రాజులతో ప్రారంభమై గుప్త రాజుల వరకూ దాదాపు వెయ్యి సంవత్సరాలపాటు సాగింది. అందుకే అప్ఘానిస్తాన్ నుంచి ఉత్తరభారతం వరకూ ఒకప్పుడు ఆయుధోపజీవుల నడవ (కారిడార్)గా ఉండేదన్న మాట మనకిప్పుడు వినడానికి వింతగా ఉంటుంది.  ఈ ఆయుధోపజీవుల స్వైరవిహారమూ , వారి ఊచకోతా మనదేశంలో బుద్ధుడనే ఒక దార్శనికునీ, అహింస అనే ఒక  ఆదర్శాన్నీ సృష్టించాయి. మౌర్యరాజు అశోకుడికి ఈ ఆయుధోపజీవులే పెద్ద సవాలుగా మారారు. ఆ సవాలును ఎదుర్కొనే క్రమంలో అశోకుడు తీసుకున్న చర్యలు నేటికీ కొనసాగుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అవతరింపజేశాయి. మనదేశానికి గతంగా మారిపోయిన ఈ ఆయుధోప జీవన వ్యవస్థ అప్ఘనిస్తాన్ లో వర్తమానం. అప్ఘానిస్తాన్ కు చెంది, సరిహద్దు గాంధీగా ప్రసిద్ధుడైన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఫక్తూన్ తెగకు చెందినవారే. గాంధీ అనే మరో అహింసావాది ప్రేరణ తో ఆయన ఆయుధోపజీవులను శాంతి మార్గం లోకి మళ్ళించడానికి కృషి చేసారు. కానీ ఆయన కృషి ఫలించిన జాడ లేదు. చరిత్ర అవిచ్ఛిన్నత కు నేటి ఆఫ్ఘనిస్తాను ఒక ఉదాహరణ.

— కల్లూరి భాస్కరం

 

 

ఎవరి రహస్యం వాళ్ళదే…ఎవరి భాష వాళ్ళదే!

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ఆ దుష్యంతు డనంతసత్త్వుడు సమస్తాశాంతమాతంగమ

ర్యాదాలంకృతమైన భూవలయ మాత్మాయత్తమై యుండగా

నాదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాళితో

నాదిక్షత్రచరిత్ర నేలె నజితుండై బాహువీర్యంబునన్

-నన్నయ

(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, చతుర్థాశ్వాసం)

దుష్యంతుడు మహాబలవంతుడు; దిక్కుల చివర నున్న ఏనుగులతో అలంకృతమైన భూమండలమంతా తన అధీనంలో ఉండగా; సూర్యకిరణాలూ, గాలీ కూడా చొరలేని మహారణ్యాలను, దేశాలను అజేయ పరాక్రమంతోనూ తొలి క్షత్రియుల నడవడితోనూ ఏలాడని ఈ పద్యం చెబుతోంది.

ఇందులోని భాషా పటాటోపం చూసి ‘మహోగ్రారణ్యా’లతో సహా భూమండలాన్ని ఏలిన దుష్యంతుడు ఎంత పెద్ద రాజో అనుకుంటాం కానీ, కాదు. అలా పటాటోపంగా చెప్పడం పౌరాణిక శైలి. సంపదకూ, అధికారానికీ అప్పటికింకా భూమి కొలమానం కాలేదు. సంపదను గోవులతోనే  కొలిచేవారు. అంటే, నాటికి రాజు గోపతే తప్ప భూపతి కాలేదు.  అసలు సంగతేమిటంటే, నాటి ఉగ్రారణ్యాలను పాలించడాని కంటూ ఏమీలేదు. అప్పటి రాజులకు అవి ఆరో వేలు లాంటివి. పైగా వారి పాలన అరణ్యాలలో చెల్లదు. అక్కడ ఆదివాసులున్నారు. తొలి రాజులు ఆదివాసులను స్వతంత్రజీవనులుగా గుర్తించి వారితో కొంతవరకు సఖ్యంగానే ఉన్నారు. వ్యవసాయ ప్రాధాన్యం పెరిగి, అడవుల్లోకి చొచ్చుకు వెళ్లవలసిన అవసరం ఏర్పడ్డాకే రాజులకూ, ఆదివాసులకూ మధ్య ఘర్షణలు ముదిరాయి. ఆనాటికి మహారణ్యాలను ఛేదించడానికి చాలినంత ఇనుము అందుబాటులోకి రాలేదు. పోడు వ్యవసాయమే ఆధారం. ఇనుము పుష్కలంగా లభించడానికి మరికొన్ని వందల సంవత్సరాలు ఆగాలి. ఇనుము కొరత తీరడంతోనే చాలా మార్పులు జరిగిపోయాయి. జనపదాలు రాజ్యాలు అయ్యాయి. గణాలు జనాలుగా, మహాజనాలుగా మారాయి. అరణ్యాలను పెద్ద ఎత్తున ఛేదించదానికి శ్రామికవర్గం అవసరమై వర్ణవ్యవస్థ బిగుసుకుంది. చివరికి మగధ, కోసల రాజ్యాలతో ఈ సామాజిక పరివర్తన ఒక కొలిక్కి వచ్చింది. అదంతా వేరొక అధ్యాయం.

dushyanta

కాకపోతే, దుష్యంతుడు మహోగ్రారణ్యాలను  ఏలాడన్న కవి, అప్పటికి దేశం అరణ్యమయమనీ, అరణ్యాలు ఇంకా లొంగి రాలేదనే ఒక ముఖ్య చారిత్రక వివరాన్ని అందిస్తున్నాడు.  అదలా ఉంచితే, దుష్యంతుడు ‘ఆదిక్షత్ర చరిత్ర’ తో ఏలాడన్న మాట ఈ వ్యాసానికి ప్రధాన వస్తువు.

నన్నయకు ఇలా ఆదిక్షత్రియులను స్మరించుకోవడం చాలా ఇష్టం. రాజరాజ నరేంద్రుడి గురించి చెబుతూ, అతడు “ఆదిరాజ నిభు డత్యకలంకచరిత్ర సంపదన్’“అంటాడు. “…ఆదిరాజులెల్ల నధిక ధర్మ సత్యయుక్తి జేసి సకల లోకంబులు వడసి భాగదేయ భాగులయిరి” అని అరణ్యపర్వం, ప్రథమాశ్వాసంలో మార్కండేయమునితో ద్రౌపదికి చెప్పిస్తాడు.  ఆది క్షత్రియుల గురించి నన్నయ కలవరింత వెనుక పురాచారిత్రక వారసత్వం చాలా ఉందని నేను అనుకుంటాను. ఎప్పుడో చరిత్రకు అందని కాలంలో (సు)క్షత్రియజాతి క్షీణించిపోయింది. అప్పటినుంచీ సాంప్రదాయిక వర్గాలలో క్షత్రియ క్షీణత ఒక విషాదస్మృతిగా మిగిలిపోయింది. ఒక అఖండగ్రహంలోంచి అర్థభాగం విడిపోయి అదృశ్యమైపోతే, రెండో అర్థభాగం దాని కోసం పరిభ్రమిస్తూ, పరితపించడం లాంటిదే ఇది కూడా. క్షత్రియులు-విప్రులు ఆనాడు ఒక నిరంతరద్వయం. ఒకరి ఉనికికి ఇంకొకరు ఆధారం. ఈ జంట ఒక దశలో సమాజగతిని శాసించింది. మహాభారతంలో అంగారపర్ణుడనే గంధర్వుడు క్షత్రియ-విప్ర అన్యోన్యత గురించి అర్జునుడికి బోధిస్తాడు.  ఎంతో అపురూపమైన ఆ సంభాషణ గురించి మరోసందర్భంలో చెప్పుకుందాం.

అజ్ఞాత కాలానికి చెందిన ఆ విషాదస్మృతి ఒక ఆకాంక్షగా మారి, అంతే అజ్ఞాతంగా వందలు, వేల సంవత్సరాలను దాటుకుంటూ వచ్చి నేటి కాలపు సాంప్రదాయిక వర్గాలలోనూ గుప్తంగా ఉండిపోయింది. అదే ఇక్కడ ఆసక్తికరం.  ‘క్షత్రియులు పరిపాలన చేయా’లనే ఆ ఆకాంక్ష ఈ వర్గాలలో నేటికీ వ్యక్తమవుతుంటుంది. అయితే, మారిన కాలమాన పరిస్థితులలో దానిని యథాతథంగా బయటపెట్టే అవకాశం లేదు కనుక, అది భిన్నరూపాలలో వ్యక్తమవుతుంది.

పాశ్చాత్య ప్రపంచంతో పోల్చితే భారతదేశం ప్రత్యేకత ఇదే. ఇక్కడ పురావారసత్వం పూర్తిగా అంతరించలేదు. దానినే గణసమాజ అవశేషంగా చెప్పుకుంటే, ఆ అవశేషం నేటికీ ఈ దేశంలో పదిలంగానే ఉంది. భారతదేశం వైవిధ్యవంతం అనిపించుకోడానికి అదీ ఒక కారణం. వైవిధ్యవంతం అనే మాట అందరినోటా నలిగి, అరిగి ఇప్పుడు అర్థస్ఫూర్తిని కోల్పోయి ఉండచ్చు కానీ, లోతుల్లోకి వెడితే అది చిత్రవిచిత్ర వాస్తవాలను ఆవిష్కరిస్తుంది. ఒకరకంగా చెప్పుకుంటే, భారతదేశం నేటికీ మహాభారత కాలంలోనూ, మహాభారత సమాజంలోనే ఉంది. దీనినే మరోలా చెబితే, భారతదేశం ఇప్పటికీ క్రీస్తు పూర్వ దశలోనే ఉంది తప్ప క్రీస్తుశకంలోకి అడుగు పెట్టలేదని నాకు అనిపిస్తుంది. క్రీస్తు శకానంతర పరిణామాలు ఇక్కడ సాంకేతిక ప్రాయాలు మాత్రమే.  పాశ్చాత్య సమాజం దృష్టిలో భారతదేశం ఇప్పటికీ ఒక ‘రహస్య’ ప్రదేశం. ఈ ‘రహస్య’ భారతం ఎంతోమంది పాశ్చాత్యులను అన్వేషణకు పురిగొల్పడం (In Search of Secret India- Paul Brunton)  మనకు తెలుసు. నిజానికి భారతదేశం గురించి చెప్పుకునే వైవిధ్యం ఒప్పుడు పాశ్చాత్యంతో సహా ప్రపంచమంతటా ఉంది.  పాశ్చాత్యసమాజం తన వైవిధ్యాన్ని పనిగట్టుకుని తుడిచిపెట్టుకుంది. ఏకశిలా సదృశమైన సమాజాన్ని నిర్మించుకోడానికి ప్రయత్నించింది.  అదో పెద్ద చరిత్ర.  ప్రస్తుతానికి దానిని పక్కన పెట్టి చెప్పుకుంటే,  భారతదేశపు వర్తమానం పాశ్చాత్యసమాజానికి గతం. అది వారిలో ఏవో పురాస్మృతులను రేపుతుంది. భారత్ పట్ల దాని ఆసక్తి, ఆకర్షణల రహస్యం అదే.

ఈ రహస్య భారతంలో, ఏ సమూహానికి ఆ సమూహానికే తమవైన తంతులు, విశ్వాసాలు, సాంస్కృతిక అభివ్యక్తులు, ఆకాంక్షలు ఉన్నాయని గుర్తించినప్పుడు; ఆ సమూహాలను నేను రహస్య సమాజాలు, రహస్య ప్రపంచాలు అంటాను. మళ్ళీ ఈ రహస్య సమాజాల ఉనికి కూడా ఒకప్పుడు ప్రపంచవ్యాప్తమే. ఆ మధ్య డావిన్సీ కోడ్ అనే నవల వచ్చింది. అంతవరకూ పుస్తక పఠనం అలవాటు పెద్దగా లేని యువత కూడా ఆ నవలను విరగబడి చదివింది. అందులోని సస్పెన్స్, థ్రిల్లర్ మసాలా వాళ్ళను ఆకట్టుకుని ఉండచ్చు. వేరే అంశాలు నన్ను ఆకర్షించాయి. అది రహస్య సమాజాల గురించి, గుప్తలిపుల గురించి మాట్లాడుతుంది. అందులో పాశ్చాత్య సమాజాల పురాచరిత్ర ఉంది. ఆ కోణం నుంచి ఆ నవలను ఎవరైనా చర్చించారో లేదో నాకు తెలియదు. అప్పట్లోనే దానిపై నేనొక వ్యాసం రాశాను.

ఇప్పటి సంగతి చెప్పలేను కానీ, నిన్న మొన్నటి వరకు మనదేశంలో ఊరి శివార్లలో కొన్ని రహస్యప్రదేశాలు ఉండేవి. వాటిని పవిత్రమైన తోపులు (sacred groves) అంటారు. మొదట్లో ఆ తోపుల్లో స్త్రీలకు మాత్రమే ప్రవేశం ఉండేది. పురుషుడు వాటిలోకి అడుగుపెడితే విపరీత పరిణామాలుంటాయనేవారు. మన పురాణాలలోనే కాదు, ప్రపంచ పురాణాలలో కూడా ఇందుకు సంబంధించిన కథలున్నాయి. స్త్రీల రహస్య ప్రదేశం లోకి అడుగుపెట్టిన నారదుడు స్త్రీ అయిపోయాడని ఒక పురాణ కథ. ఇటువంటివే జానపద కథల్లోనూ ఉన్నాయి.  ‘జగదేకవీరుని కథ’ అనే సినిమాలో దేవకన్యలు జలక్రీడలాడుతుండగా చూసిన నాయకుడు శిల అయిపోతాడు. పైన చెప్పిన తోపులు క్రమంగా పురుషుల రహస్య ప్రదేశాలుగా మారిపోయాయనీ, వాటిలోకి స్త్రీల ప్రవేశాన్ని నిషేధించారనీ కోశాంబి అంటాడు. మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి జరిగిన పరివర్తనకు అది సూచన.

స్త్రీ, పురుషులు ఒకే కుటుంబంలో, ఒకే ఇంట్లో పక్క పక్కనే ఉంటున్నా ఎవరి రహస్య ప్రపంచాలు వారికి ఉన్నాయనిపిస్తుంది. కొన్ని తంతులలో మా అమ్మ పాటించే గోప్యత, చేసే పనులు నాకు చిన్నప్పుడు విస్మయం కలిగిస్తూ ఉండేవి. స్త్రీలు చేసే నోములు, వ్రతాలు, పేరంటాలు ఒక రహస్య ప్రక్రియలా  అనిపిస్తాయి. వాటి ఆనుపానులు పురుషునికి ఎప్పుడూ పూర్తిగా అర్థం కావు. వాళ్ళు పాడే పాటలు, వాటిలో దొర్లే పలుకుబడులూ పురుషునికి ఎప్పుడూ కొత్తగానే వినిపిస్తాయి. శుభకార్యాలప్పుడు ఆడవాళ్ళు అందరూ చేరి చెప్పుకునే ముచ్చట్లు, చేసే పనులు  పురుషునికి వ్యతిరేకంగా జరిగే ఏదో ‘కుట్ర’ను తలపిస్తాయి. ఈ రహస్య ప్రపంచ వారసత్వం తల్లినుంచి కూతురికి అతి సహజంగా అందిపోయే తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.  ఇక ఉపనయనం తంతు పురుషుల రహస్య ప్రపంచానికి చెందినది. అందులో తల్లి పాత్ర కన్నా, తండ్రి పాత్ర కీలకం.  ఉపనయనం ఒక విధంగా తల్లి ప్రభావాలనుంచి కొడుకును దూరం చేసి, అతనికి పెద్దరికం కల్పించే ప్రక్రియ. ఈ ఉపనయన విధి మన దేశంలోనే, అందులోనూ కొన్ని కులాలలోనే ఉందనేది అపోహ మాత్రమే. ఉపనయనం ప్రపంచమంతటా పురాసమాజాలన్నిటా ఏదో ఒక రూపంలో ఉంది.  దాని గురించి మరెప్పుడైనా చెప్పుకుందాం.

నా చిన్నప్పటినుంచి పోలాల అమావాస్య అనే మాట వింటూ ఉండేవాడిని. మా అమ్మ పోలాల అమావాస్యనాడు కందపిలకను పూజించేది. అది కడుపు చలవకు ఉద్దేశించిన తంతు అని చాలాకాలానికి తెలిసింది. ఆడపిల్లను అత్తవారింటికి పంపేటప్పుడు ఒడి కట్టులో కందపిలకను వేస్తారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఒకానొకప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు అందరూ ఒకే రహస్య ప్రపంచాన్ని పంచుకోవడం! పసిఫిక్ మహాసముద్రంలో టోబ్రియాండ్ దీవులున్నాయి. అక్కడి ఆదివాసుల సౌభాగ్య దేవత పేరు ‘పోలేరు’. వారి ప్రధాన ఆహారం యాం అనే దుంప. పిల్లలు లేని పడతులు ఒక వృద్ధ వనితను ఆశ్రయిస్తారు. ఆమె కడుపు చలవ గల తల్లి కట్టి విడిచిన గడ్డి లంగాను తెచ్చి ఆ పడుచు తల మీద కప్పి, “ఓ పోలేరూ, ఈ పడుచు కడుపు పండించు” అంటూ మంత్రాలు చదువుతుంది. మనకు కూడా పొలి, పోలి, పోలెరు సౌభాగ్య దేవతలే (జనకథ-రాంభట్ల కృష్ణమూర్తి).

images

చెప్పొచ్చేదేమిటంటే, విశ్వాసాలు, ఆచారాలు, ఆకాంక్షలు కాలానికి లొంగినట్టు కనిపిస్తూనే కాలాన్ని ధిక్కరిస్తాయి. కాలాన్ని ఏమార్చడానికి అవి రహస్యాల ముసుగులు ధరిస్తాయి. గుప్తలిపులుగా మారి రహస్య సమాజాలను సృష్టిస్తాయి. ఆదిక్షత్రియుల గురించిన కలవరింత అలాంటిదే నని నేను అనుకుంటాను. అదలా ఉంచి, ఈ దేశంలో ఒకే భాష మాట్లాడుతూ, ఒకే ప్రాంతానికి చెందినవారి మధ్య కూడా నిగూఢత అనే ఇనప తెరలు ఉన్నాయనీ, ఒకరికొకరు తెలియనితనం ఉందనీ ఛళ్ళున చరచి చెప్పిన ఒక ఘటన ఈ సందర్భంలో గుర్తుకొస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలు-కొవ్వూరు రైలుమార్గంలో బ్రాహ్మణగూడెం అనే ఊరు, నిజానికి బాపన్న గూడెం అనే పేరుకు అది సంస్కృతీకరణ. ఓ శీతాకాలం సాయంత్రం కొవ్వూరు వెళ్ళడం కోసం బ్రాహ్మణగూడెం స్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తున్నాను.  అదో చిన్న స్టేషన్. రైలు లేటు. క్రమంగా చీకట్లు ముసురుకున్నాయి. చలి ప్రారంభమైంది. అంతలో స్టేషన్ ను ఆనుకునే ఉన్న ఓ విశాల ప్రదేశంలో కొంతమంది చెరుకు పిప్పి పోగేసి మంట పెట్టారు. బతుకు జీవుడా అనుకుంటూ నేను కూడా  ఆ మంట దగ్గరికి చేరాను. చూస్తూ ఉండగానే ఆ పరిసరాలలో ఉన్న ఆడా, మగా; చిన్నా పెద్దా అంతా వచ్చి వాలిపోయారు. ఆ వెచ్చదనం ఉల్లాసం నింపినట్టుంది, కబుర్లు ప్రారంభమయ్యాయి. మాటలు ఒకరినుంచి ఒకరికి అంత్యాక్షరిలా ప్రవహించసాగాయి. అవి క్రమంగా సరసాలుగా మారాయి. సరసాలు ఒకరి ‘సంబంధాలు’ ఒకరు కెలుక్కునే వరకూ వెళ్ళాయి. ఆ సమయంలో వాళ్ళ ముఖాలలో విరబూసిన  తుళ్లింతలు, ఇకిలింతలు, చిరునవ్వులు, సిగ్గు దొంతరల కాంతులు  ఆ చలిమంటతో పోటీ పడ్డాయి. పోటాపోటీగా మాటలు రువ్వడంలో ఆడా, మగా ఎవరూ ఎవరూ ఎవరికీ తీసిపోవడం లేదు.

నేను అప్రతిభుడినైపోయాను. నా చెవులను నేను నమ్మలేకపోయాను. సభ్యత గురించి, సంస్కారం గురించి  ‘నా ప్రపంచం’ నాలో నూరిపోసిన నమ్మకాలు ఆ క్షణంలోనే ఆ చలిమంటలో దూకి ఆత్మాహుతి చేసుకుంటున్నట్టు అనిపించింది. ఈ దేశంలో భిన్న సమాజాలు, భిన్న ప్రపంచాల ఉనికి అర్థమయింది.

కోశాంబి అంటాడు:

Better-known religious observances can also be traced back into the primitive or prehistoric past. The holi spring festival, an obscene and nowadays rather  depraved saturnalia, has dancing around a great bonfire as its central feature. …it is always followed the next day by a great deal of vociferous public obscenity; in out-of-the-way places by sexual license and promiscuity as well. In prehistory the diet was poor, life hard, procreation none too easy. The obscenity was then necessary as a stimulus. (The Culture & Civilization of Ancient India-in Historical Outline)

ఇప్పుడు తలచుకుంటే, శీతవేళ దేహానికి గిలిగింతలు పెట్టే ఆ వెచ్చని అనుభవం, మనిషి జన్యుసంపుటిలో లోతుగా ఇంకిపోయిన ఏవో ఆదిమస్మృతులను అప్రయత్నంగా రెచ్చగొట్టిందనిపిస్తుంది. ఎప్పుడో ఊహ కందని కాలంలో రాజుకున్న ఆ చలినెగడు అప్పటినుంచీ అలాగే నిలిచి మండుతోందనిపిస్తుంది.

 

 – కల్లూరి భాస్కరం

 

 

నేటికీ ‘పురి’ విప్పుతున్న వంశం

 Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)హిమకరు దొట్టి పూరు భరతేశు కురుప్రభు పాండుభూపతుల్

క్రమమున వంశకర్తలనగా మహి నొప్పిన యస్మదీయ వం

శమున బ్రసిద్ధులై విమల సద్గుణశోభితులైన పాండవో

త్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్ట మెంతయున్

-నన్నయ

(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, ప్రథమాశ్వాసం)

(చంద్రునితో మొదలు పెట్టి, పూరుడు, భరతుడు, కురువు, పాండురాజు క్రమంగా వంశకర్తలైన నా వంశంలో ప్రసిద్ధులు, సద్గుణవంతులు అయిన పాండవోత్తముల చరిత్ర నాకు ఎప్పుడూ వినాలనే ఉంటుంది)

నన్నయభట్టారకునితో రాజరాజనరేంద్రుడు అన్న మాటలివి.  క్రీ.శ. 11 వ శతాబ్దిలో రాజమహేంద్రవరం రాజధానిగా వేంగీ రాజ్యాన్ని పాలించిన తూర్పు చాళుక్య రాజు -రాజరాజ నరేంద్రుడు తనను పాండవ వంశీకునిగా చెప్పుకుంటున్నాడు! అదెలాగో తెలియదు. ఋషి వంటి నన్నయ ఈ అభూతకల్పనను ఆమోదించి దానికి పద్య రూపం ఇవ్వడం, ఇప్పటి చరిత్ర ప్రమాణాలతో చూస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. వాస్తవం ఏమిటంటే, నన్నయ ఋషితుల్యుడే, అవిరళ జపహోమ తత్పరుడే. కానీ, ‘కుసుమాస్త్రుండైన(మన్మథుడైనా) జొన్న కూడే కుడుచున్’ అంటూ ఒకప్పటి పలనాటి పరిస్థితుల గురించి శ్రీనాథుడు అన్నట్టుగా; ఎంతటివాడైనా దేశకాల పరిస్థితులకు లొంగి ఉండక తప్పదు.

కనుక, నన్నయ తప్పేమీలేదు. తప్పు ఉంటే గింటే మనకు చరిత్ర గురించిన స్పృహ, పట్టింపు, క్రమశిక్షణ లేకపోవడంలో ఉంది. కల్పనను చరిత్రగా చలామణీ చేయడం, చరిత్రను కల్పనగా మార్చడం మొదటినుంచీ మన సంప్రదాయంలో ఉన్నదే. అభూతకల్పన (myth making) అనేది ప్రపంచమంతటా మనిషి స్వభావంలో ఆదిమకాలంనుంచీ ఉందనీ, అది సానుకూల పాత్రను కూడా పోషించిందనీ A SHORT HISTORY OF MYTH లో కరేన్ ఆర్మ్ స్ట్రాంగ్ అనే రచయిత్రి అంటారు. ఘటనాక్రమంతో కూడిన చరిత్రను నమోదు చేసే క్రమశిక్షణ అభివృద్ధి చెందిన తర్వాత myth making కు ఆదరణ తగ్గి, అపహాస్యానికి లోనవుతూ వచ్చిందని ఆమె అంటారు. కాకపోతే, ఈ అభూత కల్పన ప్రక్రియ మన దేశంలో మరింత ఎక్కువ కాలం కొనసాగి, ఇప్పటికీ చలామణిలోనే ఉంది. ఈ రచయిత్రి పరిశీలన గురించి మరిన్ని విషయాలు చెప్పుకునే అవకాశం ముందు ముందు రావచ్చు కనుక ప్రస్తుతానికి వద్దాం.

యయాతి, దేవయాని, శర్మిష్టలు మహాభారత ప్రసిద్ధులు. యయాతికి దేవయాని వల్ల యదు, తుర్వసులనే ఇద్దరు కొడుకులు; శర్మిష్ట వల్ల ద్రుహ్యుడు, అనువు, పూరుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు. పై పద్యంలో పేర్కొన్నది ఈ పూరుడినే. అతనిని తన వంశకర్తలలో ఒకడిగా రాజరాజ నరేంద్రుడు చెప్పుకుంటే;  మనుచరిత్రలో అల్లసాని పెద్దన  శ్రీకృష్ణ దేవరాయలను యయాతి మరో కొడుకైన తుర్వసునితో ముడిపెట్టాడు.  1509-1529 మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణ దేవరాయలు ‘తుళువ’ వంశీకుడు.  పెద్దనగారికి తుర్వస-తుళువల మధ్య పోలిక కనిపించింది. అంతే, రాయలవారిని తుర్వస వంశీకుని చేశాడు. పెద్దనను ఒరవడిగా తీసుకుని నంది తిమ్మన కూడా పారిజాతాపహరణములో రాయలవారిని తుర్వస వంశీకునిగా పేర్కొనడమే కాక, మరో అడుగు ముందుకు వేసి యాదవుడైన శ్రీకృష్ణుడే శ్రీకృష్ణ దేవరాయలుగా అవతరించారడంటూ శ్లేషయుక్తంగా పద్యాలు రాశాడు.

Krishna3

ఎందుకిలా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోవడం ప్రారంభిస్తే, అది చాతుర్వర్ణ్య(నాలుగు వర్ణాల) చరిత్ర మొత్తంలోకి మనల్ని తీసుకువెడుతుంది.  క్లుప్తంగా చెప్పుకుంటే, నిజానికి నాలుగు వర్ణాలు అనే చట్రం సూత్రరీత్యానే కానీ ఆచరణలో ఉన్నది తక్కువ.  వర్ణవిభజనతో ప్రారంభమై వృత్తి విభజనగా పరిణమించిన ఈ నాలుగు వర్ణాల చట్రాన్ని పకడ్బందీగా ఉంచే ప్రయత్నం ఏనాడూ ఫలించలేదు. వర్ణసాంకర్యంతో పాటు వృత్తి సాంకర్యమూ పెద్ద ఎత్తున జరిగిపోయింది.  దక్షిణభారతానికి వచ్చేసరికి నాలుగు వర్ణాల చట్రం మరింత సడలి పోయింది. అయినాసరే, రాజ్యాధికారం క్షత్రియుడిదనీ, లేదా రాజ్యాధికారం కలిగిన వారు అందరూ క్షత్రియులేననే భావన సాంప్రదాయిక వర్గాలలో నిన్నమొన్నటి వరకూ  ఉండిపోయింది.  రాజ్యాధికారం క్షత్రియేతర వర్ణాల చేతుల్లోకి వెళ్లడం చరిత్రపూర్వ కాలంలోనే మొదలై, చరిత్ర కాలంలో సంపూర్ణమైనట్టు కనిపిస్తుంది.  క్షత్రియుల్లో చరిత్రకాలానికి ముందే హెచ్చు, తగ్గులు వచ్చి; వన్నె తక్కువ క్షత్రియులను వ్రాత్య క్షత్రియులనడం ప్రారంభించారు. శాక్య వంశీకుడైన బుద్ధుడు, లిచ్ఛవీ తెగకు చెందిన మహావీరుడు వ్రాత్యక్షత్రియులే. మనదేశంలో నేడు మనకు తెలిసిన అర్థంలో రాజ్యం వ్యవస్థీకృతం కావడం మగధ, కోసల రాజ్యాలతో(క్రీ.పూ. 6వ శతాబ్దం) ప్రారంభమైంది. అయితే ఈ రెండు రాజ్యాల పాలకులనూ హీన జాతి క్షత్రియులనీ, క్షత్ర బంధువులనీ అన్నారే తప్ప సుక్షత్రియులుగా గుర్తించలేదు. ఎలా పిలిచినా అందులో క్షత్రియ పదం ఉండడం, రాచరికానికీ-క్షత్రియత్వానికీ ముందునుంచీ ఉన్న ముడిని సూచిస్తుంది. మగధ, కోసల రాజులు తమను క్షత్రియులుగా గుర్తింపజేసుకోడానికీ, క్షత్రియులతో వివాహసంబంధం ద్వారా తమ సామాజిక స్థాయిని పెంచుకోడానికి చేసిన ప్రయత్నాలు కొన్ని ఆసక్తికర ఘట్టాలను సృష్టించాయి. వాటి గురించి త్వరలోనే చెప్పుకుందాం. దక్షిణ భారతానికి వచ్చేసరికి రాజ్యాధికారానికీ, క్షత్రియత్వానికీ ఉన్న సంబంధం మరింత పలచబారి చతుర్థ కులస్థులు(శూద్రులు) రాజులు కావడం మొదలైంది. అయినా సరే, క్షత్రియులన్న ముద్ర కోసం వారు కూడా  ఆరాటపడడం; సూర్య, చంద్ర రాజవంశాలతో ఏదో ఒక వంశంతో తమను ముడి పెట్టుకోవడం కొనసాగింది. ఇందులో భాగంగా ‘హిరణ్యగర్భ’ క్రతువుల వంటివీ పుట్టుకొచ్చాయి. రాజ రాజనరేంద్రుడు తనను పాండవవంశీకునిగా చెప్పకోవడం, కృష్ణ దేవరాయలను తుర్వస వంశీకునిగా పెద్దన పేర్కొనడం వెనుక ఇదీ అసలు విషయం.

శూన్యం నుంచి పుట్టిన వర్ణ/వృత్తి విభజన మొదట రెండు వర్ణాలతో మొదలై ఆ తర్వాత మూడు, నాలుగు వర్ణాలుగా మారి క్రమంగా అసంఖ్యాక కులాల అవతరణకు దారితీయించింది. వర్ణవ్యవస్థా పరిణామ క్రమాన్ని, ముఖ్యంగా క్షత్రియులనుంచి  వైశ్యవర్ణం ఏర్పడిన తీరును రొమీలా థాపర్ From Lineage to State అనే రచనలో చాలా ఆసక్తికరంగా చర్చించారు. దాని గురించి ముందు ముందు చెప్పుకుందాం. భారతీయ సమాజంలోనూ, రాజకీయాలలోనూ కులం ఇప్పటికీ పాత్ర పోషిస్తూనే ఉంది. అయినా సరే, కుల/వర్ణ పరిణామక్రమం గురించిన చరిత్ర చర్చలో లేదు. వాటి గురించి అపోహలు, అపార్థాలే ప్రచారంలో ఉన్నాయి తప్ప స్పష్టత లేదు. ఆమధ్య జనగణనతోపాటే కులగణన కూడా చేపట్టాలని పార్లమెంటులో కొన్ని రాజకీయపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వం గుండెల్లో రాయి పడింది. కులగణన అంటే కందిరీగల తుట్టను కదపడమేనని అది భావించింది. దేశవ్యాప్తంగా కులాలు వేల సంఖ్యలో ఉండడం అందుకు ఒక కారణం. సాంప్రదాయికంగా చూస్తే, ‘పంచ’ములను కలుపుకుని వర్ణాలు అయిదే. ఇప్పటి భాషలో అగ్ర/అగ్రేతరాలుగా చెప్పుకుంటే, అవి రెండే. జరిగింది ఏమిటంటే, చతుర్థ వర్ణమే వేల కులాలుగా చీలిపోయింది. వాటన్నిటినీ చతుర్థవర్ణంగా గుర్తిస్తే మిగిలేది సాంప్రదాయికమైన పంచమవర్ణ వ్యవస్థే.

కులం గురించిన ఈ పరిశీలన చారిత్రక దృష్టినుంచి చేస్తున్నదే తప్ప మరొకటి కాదని మనవి చేస్తూ ముందుకు వెడతాను.

క్షత్రియేతర వర్ణాలనుంచి రాజులు అవతరించడం ప్రారంభమయ్యాక, వారు సాంప్రదాయిక విభజనలోకి రారు కనుక ప్రారంభంలో వారిని వన్నె తక్కువ క్షత్రియులనీ, క్షత్ర బంధువులనీ అంటే; చరిత్రకారులు వారిని అస్పష్ట మూలాలు కలిగినవారుగా చెప్పడం ప్రారంభించారు. నేడు మనకు తెలిసిన అర్థంలో రాజ్యం వ్యవస్థీకృతం కావడం వీరితోనే మొదలైంది. దక్షిణభారతానికి వచ్చేసరికి సాంప్రదాయిక వర్ణ విభజన మరింత పలచబారి, స్థానిక తెగలనుంచి రాజులు ఆవర్భవించారు. శాతవాహన రాజులతో ప్రారంభించి, చాళుక్యులు, విజయనగర రాజుల వరకూ దాదాపు అందరినీ చరిత్రకారులు అస్పష్ట మూలాలు కలిగినవారుగానే చెప్పారు. సాంప్రదాయిక విభజన ప్రకారం వీరంతా చతుర్థవర్ణంలోకే వస్తారు. క్షత్రియత్వం వీరిపై కృత్రిమ ఆపాదన మాత్రమే.

ఇంకా విశేషం ఏమిటంటే, ఒక కోణం నుంచి చూసినప్పుడు మహాభారతం ప్రధానంగా రెండు విషయాలు చెబుతోంది. మొదటిది, సాంప్రదాయిక క్షత్రియులు అంతరించిపోవడం గురించి! హోమర్ చెప్పిన ‘ఇలియడ్’ లానే మహాభారతం కూడా ఒక గొప్ప వంశం అంతరించిపోవడంపై విచారం వ్యక్తం చేస్తూ ప్రారంభమవుతుందని కోశాంబి అంటాడు. రెండోది, రాజ్యాధికారం క్షత్రియేతర వర్ణాల చేతుల్లోకి వెళ్ళడం గురించి! ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్న ఈ చర్చను వాయిదా వేసి ప్రస్తుతానికి వస్తే…

కోశాంబి మౌలికంగా గణితశాస్త్రజ్ఞుడు. ఆయన నిర్ధారణలు చాలా చోట్ల గణిత సూత్రాలలా ముక్తసరిగా ఉంటాయి. వాటి ఆధారంగా ఒక్కోసారి మనం లెక్కలు చేసుకోవలసిందే. గట్టి ఆధారాలు లేకుండా ఊహల మీద ఆధారపడి నిర్ధారణకు రావడానికి ఆయన ఒప్పుకోడు. అటువంటి వ్యక్తి, అలెగ్జాండర్ తో పోరాడిన పోరస్ పురువంశపు చివరి రాజు అనడమే కాదు, పంజాబ్ లో ఈ రోజున ‘పురి’ అనే ఇంటిపేరు ఉన్న వారు పురువంశీకులే కావచ్చునని అంటాడు. ఆవిధంగా ఇతిహాస కాలాన్ని ఆధునిక కాలానికి తీసుకొచ్చి రెంటి మధ్యా అవిచ్ఛిన్నత ను కల్పిస్తున్న కోశాంబి పరిశీలన పురాచరిత్రాన్వేషకులకు ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది. ఆయన ప్రకారం చూసినప్పుడు, పదకొండో శతాబ్దికి చెందిన రాజరాజనరేంద్రుడు పూరుని తన వంశకర్తలలో ఒకడిగా చెప్పుకున్నా అది కల్పన మాత్రమే. 21వ శతాబ్దికి చెందిన ప్రసిద్ధ సినీ నటులు అమ్రీష్ పురి, ఓం పురి; పాత్రికేయుడు, రచయిత బలరాజ్ పురి; రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ కె.ఆర్. పురి; వ్యాపారవేత్త, ఇండియా టుడే ఎడిటర్-ఇన్-చీఫ్ అరుణ్ పురి తదితరులు అసలు సిసలు పురు వంశీకులు అవుతారు. పురు వంశీకులు వేద కాలం నుంచి నేటి కాలం వరకూ పంజాబ్, దాని చుట్టుపక్కలే ఉన్నారు.
ఓం పురి

ఓం పురి

ఇక యయాతి కొడుకైన తుర్వసునితో కృష్ణ దేవరాయలను పెద్దన ముడిపెట్టాడని చెప్పుకున్నాం. దీని వివరాలలోకి వెళ్ళడం మరింత ఆసక్తిదాయకం.  రాంభట్ల కృష్ణమూర్తి(వేద భూమి) ప్రకారం, యయాతి తండ్రి నహుషుడు పశ్చిమాసియాకు చెందినవాడు. మ్లేచ్ఛ భాషలో నహుషుడు అనే మాటకు కొండచిలువ అని అర్థం. ఆనాడు వైదికార్యులకు పశ్చిమాసియాతో దగ్గరి సంబంధాలు ఉండేవి. పశ్చిమాసియా నుంచి వాయవ్య భారతం వరకూ ఆనాడు ఆర్యావర్తంగా ఉండేదనిపిస్తుంది.  వేదార్థ నిర్ణయం చేసేటప్పుడు కొన్ని మాటలకు ఆర్యభాషల్లో అర్థం దొరకనప్పుడు మ్లేచ్ఛ భాషార్థాన్ని చూడమని పూర్వమీమాంసా సూత్రకర్త జైమిని చెప్పడాన్ని రాంభట్ల ఉదహరిస్తారు. యయాతి కొడుకు తుర్వసుని పేరులోని ‘తురు’ అనే మాటకు మ్లేచ్ఛ భాష అయిన సుమేరులో ‘పల్లం’ అని అర్థం. తుర్వసును సుమేరులు ‘తుర్కీ’ అంటారు. నేటి టర్కీ యే ఈ తుర్కీ. సుమేరు భాషలో ‘కీ’ అంటే భూమి అని అర్థం. తుర్కీ అంటే పల్లపు భూమి. తుర్వసు అనే మాటలోని వసువుకూ భూమి అనే అర్థం. ‘తురుష్కులు’ అనే మాట కూడా తురు నుంచే పుట్టిందని ఎక్కడో చదివిన జ్ఞాపకం. ఆవిధంగా చూసినప్పుడు, పదిహేనో శతాబ్దికి చెంది, దక్షిణ భారత రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలను కేవలం తుళువ/తుర్వసుల మధ్య ఉన్న స్వల్పమైన ఉచ్చారణ సామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తుర్వస వంశీకునిగా చెప్పడం myth making లో మన కవుల ప్రావీణ్యానికి మచ్చు తునక.

 –కల్లూరి భాస్కరం

 

 

 

శ్రాద్ధమూ, దాని ఎకనమిక్సూ !

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)వైశంపాయనుడు జనమేజయునితో ఇలా అన్నాడు: బంధుమిత్ర జనాలు అందరికీ పాండవులు ఉదకకర్మ నిర్వర్తించాక మైలదినాలను గంగాతీరంలో గడపడానికి, అక్కడ ఎత్తుపల్లాలు లేని చోట కుటీరాలు నిర్మింపజేశారు. ధృతరాష్ట్రుడు, విదురుడు మొదలైన పెద్దలతో; యుద్ధంలో మృతులైన భరతవీరుల భార్యలతో సహా నెలరోజులు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో వ్యాసుడు, నారదుడు మొదలైన మునులందరూ శిష్యులను వెంటబెట్టుకుని ధర్మరాజును చూడడానికి వచ్చారు…

                                                                                  (శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, ప్రథమాశ్వాసం)

మహాభారతంలోని అనేక ఘట్టాలు, విశేషాలు ప్రచారంలో లేవు. ఎన్నో ఆసక్తికర విషయాలు మరుగున పడిపోయాయి. వాటిలో శ్రాద్ధకర్మ గురించిన ముచ్చట్లు ఒకటి. ‘పాండవుల ఆదాయం కౌరవుల తద్దినానికి ఖర్చైపోయిం’ దనే నానుడి ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది.  కథలోకి వెడితే, ఇది సహజోక్తే తప్ప ఏమాత్రం అతిశయోక్తి కాదని అనిపిస్తుంది.

యుద్ధపర్వాల తర్వాత శాంతిపర్వం  పైన పేర్కొన్న వైశంపాయనుని కథనంతో ప్రారంభమవుతుంది. అది ఒకవిధంగా మృతవీరుల ‘ఆత్మశాంతి’పర్వం కూడా.  భరతవంశీకులు మైల పాటించిన ఆ నెలరోజులూ గంగాతీరం లోని ఆ ప్రాంతం ఒక మినీ హస్తినాపురం అయిపోయిందని పై వివరాలను బట్టి అర్థమవుతుంది. పాండవులు, ధృతరాష్ట్రాది పెద్దలూ, మృతవీరుల కుటుంబాలూ  ఉండడానికి ఎన్ని కుటీరాలు నిర్మింపజేసి ఉంటారో, అందుకు ఎంత శ్రామికశక్తిని వినియోగించి ఉంటారో, వంటలూ-వార్పులూ, ఇతర సేవలూ అందించడానికి ఏ సంఖ్యలో సిబ్బందిని నియమించి ఉంటారో ఊహించుకోవచ్చు. దీనికితోడు, పరామర్శకు  శిష్య, పరివార సమేతంగా వచ్చే మునులు, ఇతర రాజబంధువుల వసతికీ, భోజన, సత్కారాలకూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగే ఉంటాయి. ఇక చనిపోయిన వీరులకు వారి వారి స్థాయిని బట్టి నిర్వహించే పరలోక క్రియలలో సువర్ణదానం, గోదానం, భూదానం వగైరాలు విధిగా ఉండి తీరతాయి. ఇలా లెక్కిస్తే కురుపాండవవీరులు, బంధుమిత్రుల అంత్యక్రియలకు పాండవులు వెచ్చించిన సంపద అనూహ్య ప్రమాణంలో ఉండడంలో ఆశ్చర్యం లేదు.

09balikakka_large

ఇదిగాక ధర్మరాజుకు ఇంకో నైతిక బాధ్యత కూడా ఉంది.  కౌరవుల అంత్యక్రియలకు తను లోటు చేశాడనే భావన  పెదతండ్రి ధృతరాష్ట్రునికీ, పెత్తల్లి గాంధారికే కాక; ఇతరులకూ కలగకుండా చూసుకోవాలి.  శ్రాద్ధ దినాలలో ధృతరాష్ట్రుడు భారీగా గోవులను, బంగారాన్ని దానం చేసి తన నూరుగురు కొడుకులకూ ఘనంగా పరలోక క్రియలు నిర్వహించే ఏర్పాటు ధర్మరాజు చేశాడని మహాభారతం చెబుతోంది. పైగా ధర్మరాజు రాజ్యాధికారాన్ని చేపట్టే సమయానికి ఖజానా ఖాళీ అయిపోయింది.  అశ్వమేధయాగం చేయమని ధర్మరాజుకు వ్యాసుడు సూచించినప్పుడు; నా మీద ఈర్ష్యతో దుర్యోధనుడు అనేకమంది రాజులను, సేనలను కూడగట్టుకునే ప్రయత్నంలో భూమినీ, ఖజానాను ఖర్చుపెట్టేశాడనీ, ఇప్పుడు ధనం లేదనీ ధర్మరాజు అంటాడు. అదలా ఉంచి,  ధర్మరాజు పాలనలో కొన్నేళ్ళు గడచిన తర్వాత,  ధృతరాష్ట్రుడు వానప్రస్థానికి  వెళ్లాలని నిర్ణయించుకుంటాడు.  ధర్మరాజును పిలిచి ఆ సంగతి చెబుతూ; ఇప్పటికే నా కుమారులకు అనేకసార్లు శ్రాద్ధం పెట్టావు కనుక, వారి కోసం ఇంకేమీ చేయవద్దని అంటాడు. ధృతరాష్ట్రుడంతటి వాడు అలా మొహమాట పడడానికి కారణం, శ్రాద్ధకర్మలు కోశాగారాన్ని చాలావరకూ హరించివేయడమే.  అయితే, శ్రాద్ధకర్మ విశ్వాసానికే కాక, వైభవానికీ కొండగుర్తుగా మారిన ఆ రోజుల్లో తను వానప్రస్థానికి  వెళ్లబోయేముందు చివరిసారి కొడుకులకు వైభవోపేతంగా శ్రాద్ధం నిర్వహించాలనే కోర్కెను ధృతరాష్ట్రుడు  అణచుకోలేకపోయాడు. ధర్మరాజు ముందు నేరుగా దానిని బయటపెట్టడానికి మొహమాటపడి విదురునితో చెప్పించాడు. విశేషమేమిటంటే, భీముడు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించగా అర్జునుడు అతణ్ణి మందలించి తన వాటాలోంచి ఆ ఖర్చు భరించడానికి ముందుకు వచ్చాడు. అప్పుడు ధర్మరాజు అర్జునుని మనసులోనే మెచ్చుకున్నాడని మహాభారతం చెబుతోంది.

మహాభారతంలోని ఈ ‘శ్రాద్ధనామిక్స్’ కోణాన్ని ఎవరైనా చర్చించారో లేదో నాకు తెలియదు. అయితే, ప్రపంచమంతటా ఉన్న ఈ అంత్యక్రియల ఆచారం(cult of dead) మిగులు సంపదనే కాక, తెగలకు తెగలనే అంతరింపజేసిందని కోశాంబి అంటాడు. ఉదాహరణకు, మృతసముద్రం సమీపంలోని జోర్డాన్ నదీలోయలో క్రీ.పూ. 3800-3350 మధ్యకాలంలో నివసించిన ఘాసూలియన్లు.  వీరు మృతులను పూడ్చిపెట్టిన చోట రాకాసి గుళ్ళు నిర్మించేవారు. మతపరమైన  సంక్లిష్ట అలంకరణలకు వీరు ప్రసిద్ధులు. బ్రిటన్, ఐబీరియా(స్పెయిన్, పోర్చుగల్, అండోరాలను ఐబీరియా దేశాలంటారు), దక్షిణ భారతదేశాలలో ఇంతకంటే భారీగా రాకాసిగుళ్ళ నిర్మాణం జరిగింది. ‘సామాజిక ప్రగతికి ఏమాత్రం దోహదపడని ఈ పితృకర్మలకు ఉన్న కొద్దిపాటి మిగులునూ ఖర్చు పెట్టేశా’రని కోశాంబి అంటాడు.  ఇటలీకి దక్షిణంగా, లిబియాకు ఉత్తరంగా మధ్యధరా సముద్ర మధ్యంలో మాల్టా దీవులున్నాయి. రాతి యుగం అంతానికి మాల్టా ఒక పవిత్రద్వీపంగా పేరుతెచ్చుకుంది.  ఆ దీవులనుంచి అప్పట్లో భారీ ఎత్తున వ్యాపారం జరుగుతూ ఉండేది. 1930లలో అక్కడ జరిగిన తవ్వకాలలో ప్రతిచోటా అలంకృత అస్థికలశాలు బయటపడ్డాయి. అంటే, వ్యాపారం తాలూకు మిగులునంతటినీ అంత్యక్రియల సంస్కృతి  హరించివేసిందన్నమాట. ఇదే ప్రక్రియను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన మెసపొటేమియా, సింధు నాగరికతలు ఇలాగే అభివృద్ధికి దూరంగా స్తంభించిపోయాయి. ఆహారోత్పాదనకు అవసరమైన మెరుగైన సాధనాలు, పద్ధతులు తమకు అందుబాటులో ఉన్నాసరే,  సింధు నగరాల నిర్మాతలు వాటిని వాడుకోలేకపోయారు. ఇక ఈజిప్టు తన వద్ద ఉన్న భారీ మిగులునంతటినీ, గడియారాలను తయారుచేసేవారు చూపించేటంత సునిశితదృష్టితో(with watch-maker’s accuracy) బ్రహ్మాండమైన పిరమిడ్లను నిర్మించడానికి ఖర్చు పెట్టేసింది. క్రమంగా అంత్యక్రియల సంస్కృతీ, పురోహిత వర్గం దేశం మొత్తాన్ని తినేశాయి.

sraddham

పురా కాలం నుంచి మన కాలంలోకి వద్దాం. ఇంగ్లీష్ లో పేట్రియార్క్(patriarch), పేట్రియార్కీ(patriarchy) అనే మాటలు ఉన్నాయి. పేట్రియార్కీ ని పితృస్వామ్యంగా అనువదించి మనం వాడుకుంటున్నా, పేట్రియార్క్ అనే మాట మన దగ్గర పెద్దగా వినియోగంలో లేదు. అయితే, (ఉమ్మడి)కుటుంబ యజమానిని సూచించే ఆ మాట ఇప్పటికీ ఇంగ్లీష్ లో తరచు వినిపిస్తూనే ఉంటుంది. ఈ మాటకు సమానార్థకం మన పురాణ,ఇతిహాసాలలో కనిపిస్తుంది. అది, ‘ప్రజాపతి’. మన కశ్యపుడు, దక్షుడు మొదలైనవారు; యూదుల అబ్రహాం ప్రజాపతులు. దీని గురించి మరిన్ని వివరాలను వాయిదా వేసి ప్రస్తుతానికి వస్తే…

పేట్రియార్క్ గా చెప్పదగిన ఒక వ్యక్తి మా దగ్గరి బంధువులలో ఒకాయన ఉండేవారు. ఆయనది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. ఆయనకు పదిమంది కొడుకులూ, ముగ్గురు కూతుళ్ళు. వీరు కాక చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన అక్క కొడుకులిద్దరిని కూడా ఆయనే పెంచి పెద్దజేశారు. కొడుకులకు ఉద్యోగాలు వచ్చి, పెళ్లిళ్లు అయి, పిల్లలు కలిగి వారికి పెళ్లీడు వచ్చిన తర్వాత కూడా ఆ ఇంట్లో ఉమ్మడి కుటుంబవ్యవస్థే కొనసాగుతూ ఉండేది. కొడుకులు వేరే ఊళ్ళో ఉద్యోగాలు చేస్తున్నాసరే, తండ్రిపట్ల భయభక్తులూ, ఉమ్మడి కుటుంబ సంప్రదాయమూ వారిని నీడలా అంటిపెట్టుకునే ఉండేవి. ఆయన ఇంట్లో తగు మాత్రం పాడి-పంట ఉండేవి. గోసేవ విధిగా జరుగుతూ ఉండేది. కుటుంబ సభ్యులకు అదనంగా వచ్చిపోయే సాధు, సంతులతో; అతిథి అభ్యాగతులతో ఇల్లు కళకళలాడుతూ ఉండేది. ఆయన ఉదయమే స్నానసంధ్యలూ, పూజాదికాలూ ముగించుకుని చావిడిలో పెద్ద కుర్చీలో గంభీరంగా, సింహంలా కూర్చుని నామ జపం చేసుకుంటే ఉండేవారు. అయినా సరే, ఇంటి వ్యవహారాలు ఏవీ ఆయన కనుసన్నలను దాటిపోయేవి కావు.

శ్రాద్ధకర్మ శాస్త్రోక్తంగా జరపడం పట్ల ఆయనకు ఎంత పట్టింపు అంటే, తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఆయన గోవును కొని మరీ దానం చేశారు. అంతేకాదు, దానిని ఎట్టి పరిస్థితులలోనూ అమ్మబోనని దానం పుచ్చుకున్న బ్రాహ్మణుని నుంచి హామీ తీసుకునేవారు. అప్పటికీ నమ్మకం కుదరక, గోవు ఉందో లేదో, గోసేవ సక్రమంగా జరుగుతోందో లేదో చూసిరమ్మని కొన్ని రోజులపాటు ఆ బ్రాహ్మణుని ఇంటికి కొడుకుల్ని పంపించి ఆరా తీసేవారు.

అలా ఉండగా, ఆయన అర్థాంగి కాలం చేశారు. ఆరుగురు కొడుకులు ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉన్నారు. మాసికాలు ఉమ్మడిగా, అందులోనూ నరసాపురంలో పెట్టవలసిందే కనుక సంవత్సరం పొడవునా ప్రతి నెలా కొడుకులు, కోడళ్ళు రైల్లో టికెట్లు రిజర్వు చేసుకుని హైదరాబాద్ నుంచి నరసాపురం బయలుదేరి వెళ్ళేవారు. ఇలా ఏడాది గడిచిచింది. తల్లికి సంవత్సరీకాలు జరిగాయి. విచిత్రంగా ఆ మరునాడే పెద్దాయన కాలం చేశారు. దాంతో ఆరుగురు కొడుకులూ-కోడళ్లూ హైదరాబాద్ నుంచి నరసాపురానికి నెల నెలా వెళ్ళే ఆవృత్తి, మధ్యలో ఎక్కడా విరామం లేకుండా, పునఃప్రారంభమైంది. శ్రాద్ధకర్మలకు ఎటూ వ్యయం భారీగానే జరుగుతుంది. దానికి, రెండేళ్లపాటు జరిగిన ఈ శ్రాద్ధయాత్రా వ్యయం ఏ మేరకు తోడయిందో నన్న ప్రశ్న, దీనిని తలచుకున్నప్పుడల్లా నాలో ఆసక్తిని రేపుతూ ఉంటుంది.

నేను ఆర్థికవేత్తను కాదు. ఒకరి వ్యయం ఇంకొకరికి ఉపాధి అవుతుందనే సాధారణ అవగాహనతో చూసినప్పుడు దీనినంతటినీ దుర్వ్యయం అని చటుక్కున తీర్పు చెప్పే సాహసం చేయలేను. అయితే, ఆ వ్యయం వల్ల కలిగే లాభం  అన్ని వర్గాలకూ సమానంగా పంపిణీ కాకుండా, ఏ ఒక్క వర్గం దగ్గరో పోగుబడితేనే సమస్య. మనిషి ఆర్థికజీవి అంటారు. అంతకంటే ఎక్కువగా విశ్వాసజీవి అనీ; మతంలోనూ, క్రతువులోనే మనిషి పురా కాలం నుంచి ఆధునిక కాలం వరకూ తన అస్తిత్వానికి అర్థం వెతుక్కున్నాడనీ నాకున్న పరిమిత చారిత్రిక జ్ఞానంతో స్థూలంగా ఒక అభిప్రాయానికి వచ్చాను. వివాదాస్పదమైన ఈ అంశంలోకి ఇప్పుడు లోతుగా వెళ్ళను కానీ; కోశాంబి అన్నట్టు అంత్యక్రియల సంస్కృతి తూకం తప్పి అభివృద్ధిని అడ్డుకుని దేశాలకు దేశాలనే కబళించి వేసే పరిస్థితికి దారితీయిస్తే తప్పక ఆలోచించవలసిందే.

గొప్పింటి పెళ్లిళ్లలో, ముఖ్యంగా రాజకీయనాయకుల ఇళ్ళల్లో జరిగే పెళ్లిళ్లలో ఆడంబర వ్యయం తరచు సంచలనాత్మకంగా వార్తలకు ఎక్కడం చూస్తూ ఉంటాం. ఎందుకో శ్రాద్ధకర్మల వార్తలు ఆ స్థాయిలో వెలుగు చూడడం లేదు. అలాగే శ్రాద్ధానికి చెందిన ఆర్థిక కోణాన్ని కూడా ఎవరూ పరిశీలిస్తున్నట్టు లేదు. ఒకనాటి శ్రాద్ధ కర్మల వైభవప్రదర్శన ఇప్పుడు తగ్గుముఖం పట్టిందా, లేక దీనికి మరో కారణం ఉందా అన్నది తెలియదు. పురా కాలంలో బహుశా పెళ్లి కంటే ఎక్కువగా చావే వైభవోపేతం అనిపిస్తుంది.

–కల్లూరి భాస్కరం

 

“దేవదాసు” ఇంకో ప్రేమ కథ కాదు!

మరునాడు పొద్దుటే ఆ వీరజనులు తమ తమ లోకాలకు వెళ్లడానికి గంగానదిలోకి ప్రవేశించారు. అప్పుడు వ్యాసుడు తను కూడా గంగలో మునిగి, తమ భర్తను అనుసరించి వెళ్లదలచుకున్నవారు గంగలోకి దిగండని వీరుల భార్యలతో అన్నాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, ధర్మరాజుల అనుమతి తీసుకుని వారు గంగలో మునిగారు. మనుష్యదేహం వదిలేసి, దివ్యదేహం ధరించి, దివ్యాలంకారాలతో భర్తను కలుసుకున్నారు. ఈ విశేషాన్ని చూసిన జనం ఆశ్చర్యానందాలు చెందారు.

                                                           -(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆశ్రమవాసపర్వం, ద్వితీయాశ్వాసం)

కురుక్షేత్ర యుద్ధానంతరం ఒకరోజు, చనిపోయిన వీరులను వ్యాసుడు తన మహిమతో భూలోకానికి రప్పించాడు. వారు తమ భార్యలతో, బంధుమిత్రులతో రోజంతా ఆనందంగా గడిపిన తర్వాత తమ లోకాలకు తిరిగి వెళ్లడానికి గంగలో మునిగారు. మీరు కూడా భర్తతో వెళ్లదలచుకుంటే గంగలోకి దిగండని వీరుల భార్యలతో వ్యాసుడు అన్నాడు. వారు అలాగే చేశారు. దీనిని సహగమనం అనాలో, అనకూడదో మీ ఊహకే వదిలేస్తాను. అక్కడినుంచి బయలుదేరి మన కాలానికి వద్దాం.

***

శరత్ సాహిత్యం నేను ఎక్కువగా చదవలేదు. ఏవో కొన్ని నవలలు, అది కూడా చిన్నతనంలో చదివాను. చదవాలనే కోరిక మాత్రం ఉండేది. కానీ వృత్తిపరమైన కారణాల వల్ల తగిన తీరిక దొరకలేదు. క్రమంగా నా అధ్యయన ఆసక్తులు మారడం వల్ల కూడా ఆ వైపు దృష్టి పెట్టలేకపోయాను. రేపటి సంగతి చెప్పలేను.

అయితే, శరత్ నవల ఆధారంగా తీసిన దేవదాసు సినిమా చాలాసార్లు చూశాను. ఇన్నేళ్లలో ఆ సినిమా మీద సమీక్షలూ, స్పందనలూ చాలానే వచ్చి ఉంటాయి. ఆ సినిమా ఎప్పుడు చూసినా ఒక సన్నివేశాన్ని మాత్రం కళ్ళు ఆర్పకుండా చూస్తాను. ఆ తర్వాత కొన్ని రోజులపాటు అదే నా ఆలోచనలను నీడలా వెంటాడుతూ ఉంటుంది. అది నాలో విషాద విభ్రమాలు కలగలసిన ఒక విచిత్రానుభూతిని నింపుతూ ఉంటుంది. నిజానికి ఆ సినిమా దర్శకుడు వేదాంతం రాఘవయ్య, దర్శకుడుగా గొప్ప పేరున్న వ్యక్తి కాదు. కానీ ఆ సన్నివేశాన్ని అత్యద్భుతంగా పండించినందుకు  ఆయనకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. నా ఉద్దేశంలో ఆ సన్నివేశం సినిమా మొత్తానికి ఆయువుపట్టు. శరత్ హృదయమంతా అందులోనే నిక్షిప్తమైనట్టు అనిపిస్తుంది. సినిమా చివరిలో వచ్చే ఈ సన్నివేశమే నా అంచనాలో పతాకసన్నివేశం.

ఇదీ ఆ సన్నివేశం…దేవదాసు తన అంతిమ క్షణాలలో పార్వతి అత్తవారి ఊరు చేరుకుంటాడు. బండివాడు అతనిని పార్వతి ఇంటి అరుగు మీదికి చేరుస్తాడు. ఈ సంగతి తెలిసిన పార్వతి అతణ్ణి కలుసుకోడానికి మేడ మీదినుంచి పరుగు పరుగున కిందికి బయలుదేరుతుంది. అప్పుడు “తలుపులు మూసేయండి” అనే గావుకేక వినిపిస్తుంది. అది ఆమె జమీందారు మొగుడి గొంతు. భళ్ళున తలుపులు మూసుకుంటాయి. అప్రమత్తుడైన పార్వతి సవతి కొడుకు “వద్దు, వద్దమ్మా” అని బతిమాలుతూ ఆమెకు మెట్టు మెట్టునా అడ్డుపడతాడు. వినిపించుకోని పార్వతి మెట్లు దిగే తొందరలో దొర్లిపడి తలకు గాయమై ప్రాణాలు కోల్పోతుంది. అదే సమయంలో, వీధి అరుగుమీద పడున్న దేవదాసు ప్రాణాలు కూడా గాలిలో కలుస్తాయి.

410757

జ్ఞాపకం మీద ఆధారపడి ఈ సన్నివేశం గురించి రాశాను. కొన్ని వివరాలు, వాస్తవాలు తప్పిపోయి ఉండచ్చు. అయితే, పార్వతి దేవదాసును కలసుకోడానికి పరుగు పెట్టడం, భర్త “తలుపులు మూసేయండి” అని గావుకేక పెట్టడం, సవతి కొడుకు బతిమాలుతూ అడ్డుపడడం-ఇవే ఈ సన్నివేశంలో కీలకాలు. ఇద్దరు ప్రేమికులూ ఒకే క్షణంలో కన్నుమూసే ఈ ఘట్టంలో సినిమా అనూహ్యమైన ఉరవడిని, నాటకీయతను తెచ్చుకుని; ఉధృతంగా దూకే జలపాతం మధ్యలోనే స్తంభించిపోయినట్టుగా ఒక్కసారిగా ముగిసిపోతుంది.

ఈ మొత్తం సన్నివేశం ప్రతీకాత్మకం. దీని వెనుక పందొమ్మిదీ, అంతకు ముందు శతాబ్దాలకు చెందిన కరడుగట్టిన బెంగాల్ సాంప్రదాయిక సమాజపు అభివ్యక్తి మొత్తం ఉంది. ముసలి భర్త పార్వతి పట్ల దయ, సౌజన్యం ఉన్నవాడే. కానీ “తలుపులు మూసేయండి” అనే అతని గావుకేకలో నాటి కులీన సమాజపు కర్కశత్వం చెవులు హోరెత్తేలా ప్రతిధ్వనిస్తుంది. “తలుపులు మూసేయండి” అనే ఆ పెనుకేకలో, ఇంటి గౌరవ మర్యాదలనే గుండెలమీది కుంపటిని మౌనంగా, పంటిబిగువున మోయడం తప్ప స్త్రీకి మరో జీవితం లేదన్న చండశాసనం ఉంది.

సవతి కొడుకు కూడా పార్వతి పై భక్తి, మర్యాద, గౌరవం ఉన్నవాడే. కానీ తండ్రి కులీన వ్యవస్థా కాఠిన్యానికి కూడా అతను వారసుడు. కనుక సవతి తల్లిని సగౌరవంగానే కట్టడి చేయక తప్పదు.

ఈనాటికీ దేవదాసు సినిమాపై స్పందనలు, వ్యాసాలు కంటబడినప్పుడల్లా ఈ సన్నివేశ ప్రాముఖ్యం గురించి ఎవరైనా రాసారా అని ఆశగా వెతుకుతూ ఉంటాను. నాకైతే ఒక్కరూ కనిపించలేదు. నా కంటబడనివీ ఉండచ్చని ఒప్పుకుంటున్నాను.

దేవదాసు ఒక మామూలు ప్రేమకథ కాదు. సినిమా వంటశాలలో వండి వార్చే రొటీను ప్రేమకథ అసలే కాదు. దేవదాసు ఒకనాటి సమాజపు విషాదాంత భీభత్స చరిత్ర. అందులోనూ ఆ సమాజాన్ని బ్లాక్ అండ్ వైట్ లో చూపించిన చరిత్ర. నలుపు-తెలుపులు ఆ కథలో విడదీయలేని పాత్రలు. నలుపు-తెలుపుల నేపథ్యంలోనే ఆ సినిమా చూడాలి. ఒక చరిత్రకారుడి చూపుతోనూ చూడాలి. అప్పుడే ఆ సినిమాకు న్యాయం జరుగుతుంది. ఆమధ్య రంగుల్లో అట్టహాసంగా దేవదాసు సినిమాను పునర్నిర్మించినప్పుడు ఆ అఘాయిత్యాన్నీ, అపచారాన్నీ, నీచాభిరుచినీ ఎవరైనా ప్రశ్నించారో లేదో తెలియదు. టీవీలో ఆ సినిమా ప్రసారమవుతున్నప్పుడు ఎప్పుడైనా పొరపాటున కంటబడితే టీవీ కట్టేసి బ్లాక్ అండ్ వైట్ దేవదాసు దర్శనానుభూతిని కాపాడుకోవడం నేను అదృష్టంగా భావిస్తాను.

ఇప్పుడిక అసలు విషయానికి వస్తాను. ఈ వ్యాసపరంపరలో కోశాంబి తదితరులతోపాటు తరచు ప్రస్తావనకు రాబోతున్న పురామానవ చరిత్రకారులలో రాంభట్ల కృష్ణమూర్తి ఒకరు. నిజానికి రాంభట్లవారిని with a bang ప్రవేశపెట్టాలని నేను కొన్ని రోజులుగా ప్రణాళిక వేసుకుంటున్నాను. కానీ నా ప్రణాళిక తలకిందులై ఇప్పుడే ప్రవేశపెట్టాల్సి వస్తోంది. అప్పుడప్పుడు, మనం ఒకటి తలిస్తే మన కలం (ఇప్పుడు కంప్యూటర్ కీబోర్డ్ అనాలి కాబోలు)ఇంకొకటి తలుస్తుంది.

రాంభట్లవారిని తరచు కలసుకుని గంటల తరబడి ఆయన చెప్పే విషయాలు వినే మహదవకాశం నాకు కలిగింది. ఆ వివరాలను వాయిదా వేసి ప్రస్తుతానికి వస్తే, అనేక విశేషాలతోపాటు ఒకనాటి బెంగాల్ కులీన సమాజం గురించీ, శరత్ సాహిత్యం గురించీ, శరత్ సాహిత్యం  తెలుగులోకి తర్జుమా అయిన నేపథ్యం గురించీ ఎన్నో ఆసక్తికర వివరాలు ఆయన చెబుతుండేవారు. నాకు తెలిసినంతవరకు వాటిని ఆయన కాగితం మీద పెట్టినట్టు లేదు.  కాగితం మీద పెట్టే ఆయన సమాచారానికి కొంత మండించే స్వభావం ఉంది. బెంగాల్ కులీన సమాజం గురించి తను చెప్పేవి కూడా అటువంటివేననుకుని వాటిని నోటికే పరిమితం చేసుకున్నారేమో తెలియదు. నా విషయానికి వస్తే, ముందు చూపు లోపించడం వల్ల ఆయన చెప్పిన అనేక విషయాలను నేను కూడా భద్రపరచలేకపోయాను. అందుకు ఇప్పుడు విచారిస్తున్నాను.

నాకు గుర్తున్నంతవరకు ఆయన చెప్పినవి క్రోడీకరిస్తే… నాటి బెంగాల్ సమాజంలో కొన్ని కులీన కుటుంబాలు ఉండేవి. ప్రతి ఆడపిల్ల తండ్రీ కూతురిని కులీనుడికి ఇచ్చి పెళ్లి చేయాలని తహ తహ లాడేవాడు.  ఎక్కడో దూరంగా ఉండే ఆ కులీన వరుడికి అప్పటికే ఎన్నో పెళ్లిళ్లు అయుంటాయి. అయినా అభ్యంతరం లేదు. అతను అప్పటికే కాటికి కాళ్ళు చాచే వయసులో ఉంటాడు. అయినా అభ్యంతరం లేదు. ఇంకా విచిత్రం ఏమిటంటే, అతడు సాధారణంగా పెళ్లి మంటపానికి వచ్చి స్వయంగా తాళి కట్టడు. అయినా అభ్యంతరం లేదు. ఆడపిల్ల తండ్రి వరుని కలుసుకుని పెళ్ళికి అనుమతి తెచ్చుకుంటాడు. వరుని పరోక్షంలో పెళ్లి జరిగిపోతుంది. పెళ్లి తర్వాత ఒక్కసారైనా అల్లుడు అత్తింటికి రాకపోతే ఎలా? ముఖ్యంగా శోభనానికైనా రావాలి కదా?! కనుక, అల్లుడు తన ‘ప్రతినిధి’గా ఒక యువకునికి తగినంత ‘కిరాయి’ ఇచ్చి పంపిస్తాడు. ఆ యువకుడు ఒక్క విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో అల్లుడి పాత్ర పోషిస్తూ మూడు రోజులు గడిపి వెళ్ళిపోతాడు.

ఒక్కోసారి కథ మరోలా కూడా పరిణమిస్తుంది. ఆ అమ్మాయి కిరాయి అల్లుడినే భర్తగా భావించి అతనిపై మనసు పడుతుంది. ఆ యువకుడి నుంచి  అనుకూల స్పందన వస్తే ఇద్దరూ కూడబలుక్కుని వెళ్లిపోతారు. అయితే, ఎక్కడికి వెళ్ళినా సమాజం వేటకుక్క లా తరుముతూనే ఉంటుంది కనుక వారు బతికి బట్ట కట్టడం కష్టం. దాంతో ఇద్దరూ మతం మారిపోతారు.

దీనికితోడు, ఒక ముస్లిం మతస్తుని చేయి పొరపాటున తగిలినా చాలు, ఆ స్త్రీని నాటి సమాజం వెలి వేసేది. దాంతో ఆమె మతం మారి మనుగడను కాపాడుకోవడం అనివార్యం అయ్యేది. బెంగాల్ లో ముస్లిం జనాభా పెరగడానికి ఇటువంటివన్నీ దోహదం అయ్యాయని రాంభట్ల అనేవారు. దరిమిలా నాటి ఆంగ్లేయ పాలకులు బెంగాల్ విభజన ఆలోచన చేయడం, తూర్పు బెంగాల్ ఏర్పడడం, ఆ తర్వాత అదే బంగ్లాదేశ్ గా అవతరించడం చరిత్ర. మతవిశ్వాసం, లేదా ఛాందసం చరిత్రను తిప్పిన మలుపుకు ఇదొక ఉదాహరణ.

ఒళ్ళు జలదరింపజేసే మరిన్ని దారుణాలు రాంభట్ల వారి కథనంలో దొర్లుతూ ఉండేవి. బెంగాల్ సమాజంలో  వితంతువుల సంఖ్య విపరీతంగా ఉండేది. వారి పోషణ తలకు మించిన భారమయ్యేది. యాత్ర పేరుతో వారిని కాశీకి తీసుకెళ్ళేవారు. పడవ ఎక్కించి గంగ నడిమధ్యకు తీసుకెళ్లి నీళ్ళలోకి తోసేసేవారు! గంగమ్మ తల్లి అలా వితంతువులను తన ఒళ్లోకి తీసుకుని శాశ్వతంగా నిద్రపుచ్చే ప్రక్రియ మహాభారతకాలం నాటికే ఉందనుకుంటే, అది ఇటీవలి వరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉందనుకోవాలి.  కాశీ, బృందావనాలు నేటికీ ఎందరో వితంతువులకు అంతిమగమ్యాలు కావడం తెలిసినదే.

saratchandra

బెంగాల్ సమాజంలో ఇలా అన్నివిధాలా అన్యాయమైపోయి దిక్కుమాలిన జీవితం గడిపే స్త్రీలో నిబ్బరాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపడమే లక్ష్యంగా సాహిత్యసృష్టి చేసినవాడు శరత్. రాంభట్ల ప్రకారం, తెలుగునాట కూడా, మోతాదు తేడాలో అటువంటి పరిస్థితులే ఉండేవి. శరత్ సాహిత్యం తెలుగులోకి తర్జుమా అవడానికి అదీ నేపథ్యం. ఆ కృషికి ప్రధానంగా ఇద్దరు దంపతులు కంకణ కట్టుకున్నారు. వారు: బొందలపాటి శివరామకృష్ణ, శకుంతలాదేవి. “మో”గా మనందరికీ తెలిసిన కవి వేగుంట మోహన ప్రసాద్, నేను విన్నంతవరకు, వీరి అల్లుడు. నా చిన్నప్పుడు విజయవాడలో విజయా టాకీస్ పక్క సందులోంచి సత్యనారాయణపురం వెడుతుంటే వంతెనకు ఇవతల కుడి పక్కన ఒక గేటుకు “దేశి కవితా ప్రచురణలు” అనే బోర్డ్ వేలాడుతూ ఉండేది. అదే బొందలపాటివారి నివాసం అనుకుంటాను.

మోసపోయో, మరో విధంగానో కాలుజారిన ఆడపిల్లలు ఆ రోజుల్లో కాలువలో పడి ఆత్మహత్య చేసుకునేవారు. వారిని కాపాడే కర్తవ్యాన్ని ఆ రోజుల్లో ఒక ప్రముఖ రచయిత కొంతకాలం మీద వేసుకున్నాడు. ఆయన గుడిపాటి వెంకటచలం. విజయవాడలో ఉన్న రోజుల్లో ఆయన మరికొందరితో కలసి రాత్రిళ్ళు కళ్ళు కాగడాలు చేసుకుని కాలువ గట్టున మకాం పెట్టేవాడు. అంతా కలసి ఆడపిల్లల్ని ఆఘాయిత్యం నుంచి ఒడ్డెక్కించేవాళ్లు. చలంగారి వదిన డా. రంగనాయకమ్మగారు వారిని తన దగ్గర ఉంచుకుని వైద్యసేవలు అందించేవారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో విజయవాడ ప్రముఖుని పేరు కూడా రాంభట్ల వారు చెబుతుండేవారు. దురదృష్టవశాత్తూ ఆ పేరు నేను మరచిపోయాను.

 

గాంధీజీ హత్య-పోలీసు ‘శ్రాద్ధం’

Gandhi_Assassinationవర్షరుతువులో ప్రయాణాలను, యుద్ధాలను నిషేధించే మతవిశ్వాసమే పురురాజు ఓటమికి ఒక కారణం కావచ్చుననుకున్నాం. ఒకవేళ పురురాజే ఆ యుద్ధంలో గెలిచి ఉంటే భారతదేశచరిత్ర ఏ మలుపు తిరిగేదో!? అదలా ఉంచి, మతవిశ్వాసం లేదా మతఛాందసం చరిత్రను తిప్పిన మలుపులు ఇంకా ఉన్నాయి.  నాకు అర్థమైనంతవరకు గాంధీజీ హత్యోదంతం వాటిలో ఒకటి. ఎంతో కాలంగా నన్ను వెంటాడుతున్న ఆ కథనాన్ని మీతో పంచుకోడానికి ఇంతకంటె తగిన సందర్భం రాకపోవచ్చు. విషయమేమిటంటే, గాంధీ హత్యను నివారించలేకపోయిన అనేక వైఫల్యాలకు తోడు, ఒక పోలీస్ అధికారి మతవిశ్వాసం కూడా కొంత పాత్ర పోషించింది.

గాంధీజీ హత్యకు ఎలా పథక రచన జరిగిందో, దానిని ఎలా అమలు చేశారో, పోలీస్ దర్యాప్తు ఎలా సాగిందో పూసగుచ్చినట్టు వివరించిన రచనలు చాలానే వచ్చాయి. వాటిలో నేను చదినవి రెండు: మొదటిది, The men who killed Gandhi (మనోహర్ మల్గోంకర్). ఈ రచన ఆధారంగా త్వరలో సినిమా కూడా రాబోతోంది. రెండోది, Freedom at Midnight (Larry Collins and Dominique Lapierre).

మొదటగా గాంధీ హత్యలో పాల్గొన్న కుట్రదారుల పేర్లు చెప్పుకుని ముందుకు వెడదాం: 1. నాథూరాం గాడ్సే 2. నారాయణ్ ఆప్టే 3. విష్ణు కర్కరే 4. గోపాల్ గాడ్సే 5. మదన్ లాల్ పహ్వా 6. దిగంబర్ బడ్గే 7. శంకర్ కిష్టయ్య (బడ్గే దగ్గర పనివాడుగా ఉన్న ఇతను తెలుగువాడు)

1948, జనవరి 30న గాంధీ హత్య జరగడానికి పది రోజులముందు, జనవరి 20న గాడ్సే బృందం ఆయనను హతమార్చడానికి ఒక విఫలయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో ఢిల్లీలోని బిర్లా హౌస్ లో గాంధీ ప్రసంగ వేదిక సమీపంలో బాంబు పేల్చిన మదన్ లాల్ పహ్వా పోలీసులకు పట్టుబడ్డాడు. అంటే, గాంధీ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తుల వివరాలు సేకరించి, ఇంకోసారి ఆ ప్రయత్నం జరగకుండా నివారించే గట్టి ఆధారం పోలీసులకు దొరికిందన్న మాట. పైగా పది రోజుల వ్యవధి కూడా ఉంది. అయినా నివారించలేకపోవడం భారత పోలీస్, పాలనావ్యవస్థలను శాశ్వతంగా సిగ్గుతో తలవంచుకునేలా చేసిన ఒక హాస్యాస్పద విషాదాధ్యాయం.

జనవరి 20 ప్రయత్నంలో కూడా ఒక మతవిశ్వాసం ప్రభావం చూపడం ఆసక్తికరం. ముందస్తు పథకం ప్రకారం, దిగంబర్ బడ్గే గాంధీ ప్రసంగ వేదిక వెనకనున్న సర్వెంట్స్ క్వార్టర్స్ లోకి వెళ్ళి ఒక గది కిటికీ లోంచి గాంధీ మీద కాల్పులు జరపాలి. తీరా అతను అక్కడికి వెళ్ళేసరికి ఆ గది గుమ్మంలో ఒక ఒంటి కన్ను మనిషి కనిపించాడు! బడ్గే గిరుక్కున వెనుదిరిగి వచ్చేశాడు. ఒంటి కన్ను మనిషి కనబడడం పెద్ద అపశకునం కనుక నేను ఆ గదిలోకి వెళ్ళనని చెప్పేశాడు. ఆ తర్వాత, ఆ కిటికీ లోంచి గాంధీ పై బాంబు విసిరే పని గాడ్సే సోదరుడు గోపాల్ గాడ్సేకు అప్పగించారు. కిటికీ చాలా ఎత్తుగా ఉండడంతో అతను ఆ పని చేయలేకపోయాడు. అంతలో మదన్ లాల్ బాంబు పేల్చడం, పోలీసులకు పట్టుబడడం జరిగిపోయాయి.

Nathuram

కూర్చున్నవారు-ఎడమనుంచి కుడికి: నారాయణ్ ఆప్టే, సావర్కర్, నాథూరాం గాడ్సే, విష్ణు కర్కరే.
నిలబడినవారు-ఎడమనుంచి కుడికి: శంకర్ కిష్టయ్య, గోపాల్ గాడ్సే, మదన్ లాల్ పహ్వా, దిగంబర్ బడ్గే.

ఆ రోజు 103 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్న డిప్యూటీ పోలీస్ ఇన్ స్పెక్టర్ జనరల్ డీ.డబ్ల్యూ. మెహ్రాకు సమాచారం అందింది. మదన్ లాల్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగానికి ఆయన ఆదేశించాడు. అంతలో, “ఈ కేసు దర్యాప్తు నేను స్వయంగా పర్యవేక్షిస్తాను, దాని గురించి పట్టించుకోకు” అని, ఆ సమయంలో ఢిల్లీ పోలీస్ అధిపతిగా కూడా ఉన్న సెంట్రల్ ఇంటెలిజెన్స్ చీఫ్ డీ.జే. సంజీవి ఆయనకు చెప్పాడు. ఏడు గంటలసేపు జరిగిన ఇంటరాగేషన్లో మదన్ లాల్ నుంచి మూడు ముఖ్యమైన క్లూలు దొరికాయి.  వాటి ప్రకారం, కుట్రదారులు ఏడుగురు. మదన్ లాల్ సహా ఏడుగురూ హత్యాయత్నానికి ముందు సావర్కర్ సదన్ కు వెళ్ళి ఆయనను దర్శించుకున్నారు. కుట్రదారులలో ఒకరి పేరు ‘కిర్క్రీ’( కర్కరే పేరు అలా చెప్పాడు). ఇంకొకరు(గాడ్సే) రాష్ట్రీయ లేదా అగ్రణి అనే మరాఠీ వార్తాపత్రికకు ఎడిటర్ గా ఉన్నాడు(ఆ పత్రిక పేరు నిజానికి ‘హిందూ రాష్ట్ర’). ఇంటరాగేషన్ జరుగుతుండగానే కొంతమంది పోలీసులు హిందూ మహాసభ కార్యాలయానికీ, మెరీనా హోటల్ కూ పరుగుతీశారు. హోటల్ లో రూమ్ నెం.40లో వారికి నాలుగో క్లూ దొరికింది. అది హిందూ మహాసభ నాయకుడు అశుతోష్ లాహిరి సంతకంతో ఉన్న ఒక పత్రం.  గాడ్సే, నారాయణ్ ఆప్టేలు ఎనిమిదేళ్లుగా ఆయనకు తెలుసు. హిందూ రాష్ట్ర అనే పత్రికకు గాడ్సే ఎడిటర్ అని కూడా తెలుసు.

ఆ రోజు అర్థరాత్రికి మదన్ లాల్ ఇంటరాగేషన్ ముగించిన పోలీసులు, తొలి నాటి దర్యాప్తు వివరాలు నమోదుచేసి కేసు డైరీని మూసేశారు. ఆ ఏడుగంటల దర్యాప్తులో సేకరించిన వివరాలు పోలీసులకు ఎంతైనా సంతృప్తి కలిగించి ఉంటాయని Freedom at Midnight రచయితలు అంటారు. గాంధీ హత్యాయత్నం వెనుక ఒక పథకం ఉన్నట్టు పోలీసులకు అర్థమైంది. కుట్రదారుల సంఖ్య తెలిసింది. వారు, అప్పటికి కొన్ని మాసాలుగా పోలీసు నిఘాలో ఉన్న వీర సావర్కర్ అనుయాయులన్న సంగతి తెలిసింది. తమకు లభించిన సమాచారం ఆధారంగా కొద్దిపాటి ప్రయత్నం చేసి ఉంటే గాడ్సే, నారాయణ్ ఆప్టే లను వారు ఇట్టే గుర్తించి ఉండేవారు. వాళ్ళిద్దరూ ఢిల్లీ విడిచి పూణేకు బయలుదేరే లోపలే అరెస్ట్ చేసి ఉండేవారు. కానీ అది జరగలేదు. కొన్ని గంటల వ్యవధిలో అంత విలువైన సమాచారం సేకరించిన ఆ దర్యాప్తు, ఆ తర్వాత ఆశ్చర్యం కలిగించేంత నత్త నడక నడిచింది. అది ముప్పై ఏళ్ల (1976 నాటికి ) తర్వాత కూడా వివాదం రేకెత్తిస్తూనే ఉందని పై రచయితలు అంటారు.

 

కుట్రదారులు బొంబాయి రాష్ట్రానికి చెందినవారని తెలిసింది కనుక, కేసు బాధ్యతను ఎవరైనా ఒకరికి  అప్పజెప్పవలసిందిగా బొంబాయి పోలీసులను సంజీవి కోరాడు. వారితో దర్యాప్తును సమన్వయం చేయడానికి ఢిల్లీ సీ.ఐ.డీ అధికారు లిద్దరిని బొంబాయి పంపించాడు. అయితే, ఆ ఇద్దరూ మదన్ లాల్ ఇచ్చిన ప్రాథమిక సమాచార పత్రాన్ని కానీ, గాడ్సే ఎడిటర్ గా ఉన్న పత్రికకు సంబంధించిన ఉజ్జాయింపు సమాచారాన్ని కానీ తీసుకెళ్లకుండా చేతులూపుకుంటూ బొంబాయి చేరారు. వాళ్ళ దగ్గర ఉన్నది ‘కిర్క్రీ’ అనే పేరు రాసుకున్న చిన్న కాగితం ముక్క మాత్రమే.

ఆ సమయంలో బొంబాయి రాష్ట్రంలో భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయి హోం మంత్రిగా ఉన్నారు. అప్పటికి వారం రోజుల క్రితం, గాంధీని హత్య చేయబోతున్నామని ఒక వ్యక్తితో మదన్ లాల్ అన్నట్టు వేరే మార్గంలో ఆయనకు సమాచారం అందింది. బొంబాయి సీ.ఐ.డీ స్పెషల్ బ్రాంచ్ కి ఇన్ చార్జిగా ఉన్న డిప్యూటీ పోలీస్ కమిషనర్ నగర్వాలాకు దర్యాప్తు బాధ్యత అప్పగించిన హోం మంత్రి, ఈ సమాచారం కూడా ఇచ్చాడు. అహమ్మద్ నగర్ కు చెందిన విష్ణు కర్కరే పేరు ఆ సమాచారంలో ఉంది.  అంటే, ఢిల్లీ అధికారులు తనను కలసుకునే సమయానికే నగర్వాలా వద్ద వారి దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ, మెరుగైన సమాచారం ఉందన్న మాట.

కర్కరేను గుర్తించడానికి నగర్వాలా వెంటనే సిబ్బందిని రంగంలోకి దించాడు. మదన్ లాల్ వారం క్రితం సావర్కర్ ను కలసిన భోగట్టా కూడా తన వద్ద ఉండడంతో సావర్కర్ ను అరెస్ట్ చేయడానికి అనుమతించమని మొరార్జీ దేశాయిని కోరాడు. దేశాయి కోపంతో మండిపడుతూ “నీకేమైనా పిచ్చా? ఈ రాష్ట్రం మొత్తం భగ్గున అంటుకు పోవాలని నీ ఉద్దేశమా?” అన్నాడు. నగర్వాలా దాంతో అరెస్ట్ ఆలోచన విరమించుకుని సావర్కర్ ఇంటి దగ్గర నిఘా పటిష్టం చేశాడు. కొన్నిగంటల్లోనే అతనికి విష్ణు కర్కరే గురించి సమాచారం అందింది. అంతలో పూణేకు చెందిన చిన్నపాటి ఆయుధ వ్యాపారి దిగంబర్ బడ్గే, కర్కరే సహచరుడన్న సంగతి ఒక పోలీస్ ఇన్ ఫార్మర్ ద్వారా తెలిసింది. ఆ భోగట్టాతో పూణే పోలీసులు బడ్గే దుకాణానికి వెళ్లారు. బడ్గే వారికి కనిపించలేదు. విచిత్రం ఏమిటంటే, ఆ తర్వాత పూణే పోలీసులు బడ్గే ఆచూకీ కోసం మళ్ళీ ప్రయత్నించలేదు. తనకోసం పోలీసులు వచ్చి వెళ్ళిన కొన్ని గంటలకే పూణే చేరుకున్న బడ్గే తర్వాత పది రోజులపాటు తన దుకాణంలో కూర్చుని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అల్లుకుంటూ తీరుబడిగా గడిపాడు.

ఢిల్లీ సీ.ఐ.డీ నుంచి వచ్చిన ఇద్దరు అధికారుల వద్దా పనికొచ్చే సమాచారం ఏమీ లేకపోవడంతో వాళ్ళ సాయం తనకు అక్కర్లేదనుకున్న నగర్వాలా తన వద్దనున్న సమాచారం వారికిచ్చి ఢిల్లీ పంపేశాడు.

జనవరి 24 కల్లా మదన్ లాల్ తనకు తెలిసిన మొత్తం సమాచారాన్ని కక్కేశాడు. ముఖ్యంగా గాడ్సే ఎడిటర్ గా ఉన్న పత్రిక పేరును హిందూ రాష్ట్రీయ గా దాదాపు కరెక్టుగా చెప్పి, అది పూణే నుంచి వెలువడుతుందని కూడా చెప్పాడు. ఢిల్లీ లోని హోం శాఖకు గానీ, సమాచార-ప్రసార శాఖకు కానీ ఒక్క సబ్ ఇన్ స్పెక్టర్ ను పంపితే, ఆ పత్రిక వివరాలు అన్నీ క్షణాలలో తెలిసిపోయేవి. కానీ ఢిల్లీ పోలీస్ చీఫ్ సంజీవి ఆ పని చేయలేదు. గాడ్సే, ఆప్టే లను ఎనిమిదేళ్లుగా ఎరిగున్న అశుతోష్ లాహిరి అనే హిందూ మహాసభ నాయకుని సంతకం ఉన్న పత్రం మొదటి రోజే దొరికినా ఆయనను ప్రశ్నించలేదు. మదన్ లాల్ ఇచ్చిన తాజా సమాచారాన్ని బొంబాయిలోని నగర్వాలాకు అత్యవసరంగా పంపే ఏర్పాటు కూడా చేయలేదు. పూణే పోలీసులకు ఒక్క ఫోన్ కాల్ చేసి హిందూ రాష్ట్ర ఎడిటర్ గురించి అడిగినా చెప్పేవారు. అదీ చేయలేదు.

ఇప్పుడిక ఆయన కంటే ఘనుడైన పోలీస్ అధికారి గురించి చెప్పుకుందాం. ఆయనే నిజానికి మన కథానాయకుడు.  పేరు యూ.హెచ్. రాణా. డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ హోదాలో ఆయన పూణేలో నేర దర్యాప్తు విభాగం ఇన్ చార్జిగా ఉన్నాడు. జనవరి 25వ తేదీన ఒక కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చాడు. పూణేలో ఆయన దగ్గర ఉన్న ఫైళ్లలో గాడ్సే, ఆప్టే, బడ్గే, కర్కరేల గురించిన మొత్తం సమాచారం ఉంది. కర్కరే, ఆప్టేల ఫోటోలు కూడా ఉన్నాయి.  వెంటనే చేయవలసింది, ఆ ఫోటోలను బిర్లా హౌస్ లో గాంధీకి కాపలాగా ఉన్న పోలీసులకు పంపడం. అది జరగలేదు.

రాణాను సంజీవి  తన కార్యాలయానికి పిలిపించాడు. 54 పేజీలు ఉన్న మదన్ లాల్ వాఙ్మూలంలో ఒక్కొక్క పేజీనే  రెండుగంటలపాటు ఇద్దరూ పరిశీలించారు. అందులోని ప్రతి వాక్యానికీ రాణా అప్రమత్తుడు కావలసిందే. ఎందుకంటే కుట్రదారులలో కనీసం ఇద్దరు ఆయన అధికార పరిధిలోకి వస్తారు. హిందూ రాష్ట్ర  అనే పత్రిక పేరు ఆయనకు తెలియక పోయే ప్రశ్నే లేదు. ముందు సంవత్సరం జూలై లోనే ఆ పత్రిక మూసివేతకు ఉత్తర్వులిచ్చారు. ఆ పత్రిక పై ఉంచిన పోలీస్ నిఘాను నవంబర్ లో రాణా స్వయంగా రద్దుచేశాడు. అంతకుముందు పూణేలో జరిగిన ఒక బాంబు పేలుడుకు ఆప్టే బాధ్యుడన్న సమాచారమూ ఆయన దగ్గర ఉంది.

తన అధికార పరిధిలోకి వచ్చే ఇన్ని కీలక వివరాలు దొరికినా, రాణా కనీసం తన కింది అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వలేదు. తక్షణమే దర్యాప్తు ప్రారంభించమని ఆదేశాలు ఇవ్వలేదు. తనైనా హుటాహుటిన విమానంలో బయలుదేరి వెళ్లాలనుకోలేదు. విమాన ప్రయాణం ఆయన ఆరోగ్యానికి పడదట. రైలులో బొంబాయికి బయలు దేరాడు. అది కూడా చుట్టుదారిలో వెళ్ళే ఒక లంఖణాల బండిని ఎంచుకున్నాడు. దాంతో 36 గంటలు పట్టే ప్రయాణకాలానికి మరో 6 గంటలు జమయ్యాయి. అదలా ఉండగా, Freedom at Midnight ఇవ్వని ఒక అదనపు సమాచారాన్ని, నాకు గుర్తున్నంతవరకు, The men who killed Gandhi ఇచ్చింది.  అది బాధనూ, నవ్వునూ కూడా తెప్పించే సమాచారం. రాణా మార్గ మధ్యంలో (గయలో?) దిగి పితృదేవతలకు పిండప్రదానం చేశాడు!

జనవరి 20 న గాంధీ పై జరిగిన హత్యా ప్రయత్నం పై దర్యాప్తు ఇలా నత్త నడకన సాగుతుండగానే అక్కడ పూణేలో గాడ్సే బృందం మరో ప్రయత్నానికి శరవేగంతో సన్నాహాలు చేసుకుంటూ పోయింది. తన శ్రాద్ధ కర్మ ముగించుకుని రాణా మళ్ళీ లంఖణాల రైలెక్కి బొంబాయిలో దిగే లోపలే గాడ్సే, ఆప్టే లు ఢిల్లీ విమానం ఎక్కేశారు. జనవరి 30 న వారు తమ పథకాన్ని అమలు చేయడం… చరిత్ర.

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)—కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

మూడు అద్భుతాలు

kalluri-1 మహాభారతంలో అశ్వత్థామ చాలా విలక్షణ పాత్ర.  ద్రోణ, శల్య, సౌప్తికపర్వాలలో తిక్కన ఆ పాత్రను అత్యద్భుతంగా పండిస్తాడు. నిజానికి శల్య, సౌప్తికపర్వాలు రెండింటిలో కథానాయకుడు(లేదా ప్రతినాయకుడు) అశ్వత్థామే. యుద్ధమనే ఒక మహోద్రిక్తఘట్టంలో, అందులోనూ పరాజిత పక్షానికి చెందిన ఒక వీరుడు ఎదుర్కొనే ఆత్మసంక్షోభాన్నీ, మనస్సంఘర్షణను, భావోద్వేగాలను అశ్వత్థామ ముఖంగా తిక్కన ఎంతో లోతుగా, గాఢంగా చిత్రిస్తాడు. ఆ లోతును, గాఢతను తడిమి చూసి ఎవరైనా విశ్లేషించారో లేదో నాకు తెలియదు. చదువుతూ తిక్కన మహాకవికి మనసులో పాదాభివందనం చేసుకొన్న ఘట్టాలలో ఇది ఒకటి. అశ్వత్థామ చిత్రణపై నా హృదయస్పందనను పూర్తిగా వెల్లడించాలని మనసు ఉత్సాహపడుతున్నా, బలవంతం మీద ఆపుకుని విషయానికి వస్తాను.

అశ్వత్థామను కళ్ళారా చూసిన ఒక వ్యక్తి ఉన్నారనీ, ఆయన ఆ విషయం చెప్పగా విన్న వ్యక్తిని నేను ఎరుగుదుననీ మా నాన్నగారు అంటుండేవారు. అశ్వత్థామనేమిటి, చూడడమేమిటనుకుని మీరు విస్తుపోతూ ఉండచ్చు. చిరంజీవులలో ఒకడైన అశ్వత్థామ ఇప్పటికీ జీవించే ఉన్నాడని ఒక విశ్వాసం. ఇంతకీ విషయమేమిటంటే, హిమాలయ ప్రాంతంలో కొంతకాలం ఉన్న ఆ వ్యక్తి ఓ ఉషఃకాలాన నదికి స్నానానికి వెళ్లారు. అంతలో ఓ భారీకాయుడు నదిలోకి దిగబోతూ కనిపించాడు. ఆయన శరీరమంతా తూట్లు పడి చర్మం వేలాడుతోంది. జడలు కట్టి ఉన్నాయి. నదిలోకి దిగబోతున్న ఆ వ్యక్తిని చేతితో వారించాడు. దిగ్భ్రమతో గట్టుమీద నిలబడి పోయిన ఆ వ్యక్తి ఆయన స్నానం ముగించుకుని వెడుతుంటే, “తమరెవరు స్వామీ?” అని సంస్కృతంలో ప్రశ్నించారు. “ నేను ద్రోణపుత్రుడను, అశ్వత్థామను” అని ఆయన సంస్కృతంలోనే సమాధానం చెప్పి వెళ్లిపోయాడు.

ఈ ముచ్చట గుర్తొచ్చినప్పుడల్లా ఇందులోని అద్భుతత్వాన్ని ఇప్పటికీ  నేను ఆస్వాదిస్తూ ఉంటాను. ఇది సాధ్యమా అన్న హేతువాదంతో ఆ అద్భుతత్వాన్ని చిత్రవధ చేయడానికి నాకు మనసు రాదు. సంప్రదాయం ఏమిటంటే, వీరులు, లేదా ఇతర కారణాలతో జనహృదయాలకు దగ్గరైనవారు ఎప్పటికీ మరణించరు. జనం జ్ఞాపకాలలో చిరంజీవులుగానే  ఉండిపోతారు.  అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు మనకు బాగా తెలిసిన ఇటీవలి ఉదాహరణలు. నిజానికి ఈ సంప్రదాయం మనలోనే కాదు ప్రపంచమంతటా ఉంది. ఆ వివరాలను ప్రస్తుతానికి పక్కన పెట్టి అశ్వత్థామ విషయానికి వస్తే, ఆయన చిరంజీవిత్వానికి వివిధ కారణాలను ఊహించవచ్చు. ఒకటి, రెండు చెప్పుకోవాలంటే, యుద్ధం ముగిసిన తర్వాత కౌరవపక్షంలో మిగిలిన ముగ్గురు వీరులలో(మిగతా ఇద్దరూ కృపుడు, కృతవర్మ) ప్రముఖుడు అశ్వత్థామే. అంతేకాదు, ఒకవిధంగా ఆయన కురు, పాంచాల జనపదాలు రెండింటికీ ఉత్తరాధికారి. కనుక ఆ రెండు జనపదాల ప్రజలూ ఆయనను సజీవస్మృతిగా నిలుపుకోడానికి కారణం ఉంది. అలాగే. అంతటి మహాయుద్ధం నుంచి ప్రాణాలతో బయటపడడం కూడా అతనిని ‘చిరంజీవి’ని చేసి ఉండచ్చు.Mahabharata04ramauoft_1395

 

అశ్వత్థామ ఉదంతం నమ్మలేని అద్భుతం అయితే, నమ్మదగిన అద్భుతం ఒకటి చెబుతాను.  అది: అలెగ్జాండర్-పురుషోత్తముల యుద్ధసమాచారం. ఆ యుద్ధం గురించి చరిత్రపాఠాలలో చదువుకున్నాం కానీ, ప్రత్యక్షకథనాన్ని తోపించే అదనపు సమాచారం మనకు తెలియదు. పురుషోత్తముని గ్రీకులు ‘పోరస్’ అన్నారు. అతని అసలు పేరు పురుషోత్తముడేనా అని నా సందేహం. అతను పురాణ ప్రసిద్ధమైన పురు వంశీకుడు. ఆ వంశంలో చివరి రాజు అని కోశాంబి అంటాడు.  ప్లూటార్క్ అనే చరిత్రకారుడు అలెగ్జాండర్ స్వయంగా రాసిన లేఖలనుంచి సంగ్రహించినదిగా చెబుతూ, ఆ యుద్ధం గురించి కొంత ఆసక్తికర సమాచారం అందించాడు:

(పురు రాజు ఓడిపోయినా) ఆ యుద్ధం అలెగ్జాండర్ సైన్యంలో ధైర్యాన్ని హరించేసింది. వెనకడుగు వేయించింది. కేవలం ఇరవై వేల పదాతిదళంతో, రెండువేల ఆశ్వికదళంతో వచ్చిన పురురాజును ఓడించడానికే వారికి తల ప్రాణం తోకకొచ్చింది. తూర్పు దిశగా ఇంకా ముందుకు వెడితే ముప్పై రెండు ఫర్లాంగుల వెడల్పు, వంద నిలువుల లోతు ఉన్న గంగానదిని దాటవలసివస్తుంది. నదికి అవతల భారీ సంఖ్యలో శత్రుసేనల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. గంగానదీ ప్రాంతరాజులూ(Gangaridans), ఇంకా తూర్పున ఉన్న రాజులూ(Praesians-ప్రాచ్యులు) ఎనభైవేల ఆశ్వికదళంతో, రెండులక్షల పదాతిదళంతో, ఎనిమిదివేల రథికబలంతో, ఆరువేల గజబలంతో తమను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉంటారని అలెగ్జాండర్ సేనకు తెలిసింది. కనుక వాళ్ళు అలెగ్జాండర్ ప్రణాళికను వ్యతిరేకించడం సహేతుకమే.

ఇది అలెగ్జాండర్ సైన్యాన్ని భయపెట్టడానికి చేసిన ప్రచారం కాదని ప్లూటార్క్ అంటాడు. ఆ సమీపకాలానికే చెందిన చంద్రగుప్తుడు ఆరులక్షల పదాతిదళంతో భారతదేశాన్ని లొంగదీసుకోవడమే కాక, సెల్యూకస్ కు ఒక్కసారిగా అయిదువందల ఏనుగులను బహూకరించిన సంగతిని ఉదహరిస్తాడు.  అలాగే, గంగానది గురించి చెప్పినదీ అతిశయోక్తి కాదని కోశాంబి అంటూ;  అలెగ్జాండర్ వచ్చే సమయానికి వర్షాకాలం మొదలైంది కనుక గంగ అంత వెడల్పూ, లోతూ ఉండడంలో ఆశ్చర్యం లేదంటాడు. రెండువేల సంవత్సరాల తర్వాత అహ్మద్ షా దురానీ వర్షాకాలంలోనే దండయాత్రకు దుస్సాహసం చేసి సగం సైన్యాన్ని యమునకు అర్పించుకున్నాడు. ఇంకా ఆసక్తికరం ఏమిటంటే, పురురాజు ఓటమికి ఒక మతవిశ్వాసం కూడా కారణం. వర్షరుతువులో ప్రయాణాలను, యుద్ధాలను అది నిషేధిస్తోంది. దాంతో పురురాజు తగినన్ని బలగాలను సమీకరించుకోలేకపోయి ఉండచ్చు.

ఇంకొకటి ఏమిటంటే, భారతీయ ఆశ్విక సేనకన్నా ఉత్తమశ్రేణికి చెందిన గ్రీకు ఆశ్వికసేన ముందు పురురాజు రథికసైన్యం తేలిపోయింది. అయితే, పురురాజు తన గజబలాన్ని సక్రమంగా వినియోగించుకుని ఉంటే యుద్ధం గెలవడానికి అవకాశం ఉండేదనీ, కానీ యుద్ధంలో ఆరితేరి శరవేగంతో కదిలే శత్రుసేనను ఎదుర్కోడానికి మరింత లోతైన వ్యూహనైపుణ్యం ఉండాలనీ, అప్పటి పంజాబ్ గణ వ్యవస్థలో అది అభివృద్ధి కాలేదనీ కోశాంబి అంటాడు.

alexander

గజసైన్యంతో ఒక ఇబ్బంది ఏమిటంటే, సక్రమంగా వాడుకోకపోతే అది శత్రుసైన్యాన్ని చంపేబదులు, సొంత సైన్యాన్నే చంపుతుంది. పురుసేనలో గ్రీకు దాడిని సమర్థంగా తిప్పికొట్టగల సత్తా ఉన్నవారు విలుకాండ్లు. అయితే వారినీ సక్రమంగా వాడుకోలేకపోగా, వర్షాలు పడుతున్నప్పుడు శరయుద్ధం ప్రభావం తగ్గుతుంది. భారతీయ విలుకాని దెబ్బను ఏదీ అడ్డుకోలేదనీ, పొడవైన ఆ బాణం డాలునూ, కవచాన్నీ కూడా చీల్చి వేస్తుందనీ, భారతీయ ధనువు ఆరడుగుల పొడవు ఉంటుందనీ ఆరియన్ అనే చరిత్రకారుడు రాస్తాడు. ఇది స్వయంగా అలెగ్జాండర్ అనుభవం కూడా. మూడు వేళ్ళ వెడల్పు ఉన్న సూచితో ఒక మల్ల విలుకాడు ప్రయోగించిన బాణం అలెగ్జాండర్ కవచాన్ని చీల్చుకుంటూ వెళ్ళి, పక్కటెముకకు గుచ్చుకుపోయింది. అతి కష్టం మీద దానిని తీయగలిగారు. అతను ఎదుర్కొన్న అతి తీవ్ర గాయం ఇదే.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, భారతదేశచరిత్రను మలుపు తిప్పిన ఒక యుద్ధం గురించిన ఈ మాత్రం సమాచారాన్ని కూడా మనవాళ్ళు ఎక్కడా నమోదు చేయలేదు. గ్రీకు రాతలే ఆధారం. గ్రీకులే కాదు, పశ్చిమాసియా దేశాలు కూడా వేల సంవత్సరాలనాటి చారిత్రక ఘటనలను వివిధ రూపాలలో భద్రపరిచాయి. పురాతనఅస్తిత్వం ఎంతో ఉన్న మనదేశంలోనే ఈ జాగ్రత్త లోపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.  దానికితోడు, ఉన్న చారిత్రక సమాచారంపై కూడా ఇతరేతర అన్వయాల ముసుగులు కప్పి మాయం చేయడానికి ప్రయత్నించడం మరింత ఆశ్చర్యకరం. ఎంతో ఆసక్తిని కలిగించే ఈ విషయాలను ముందు ముందు చెప్పుకుందాం. చెప్పొచ్చేదేమిటంటే, మన చరిత్రాదారిద్ర్యం నుంచి చూస్తే పురు-అలెగ్జాండర్ యుద్ధవివరాలు అపురూపంగానే కాక అద్భుతంగా అనిపిస్తాయి.  పురాణానికి, చరిత్రకు మధ్యనున్న హద్దులను చెరిపేసి అవి మనల్ని మహాభారత సమాజానికి దగ్గరగా తీసుకువెడతాయి.

హేలీ రెండువందల ఏళ్లనాటి సమాచారాన్ని సేకరించగలగడం కూడా ఒక అద్భుతమే. చరిత్రను భద్రపరిచడంపై పాశ్చాత్యులలో ముందునుంచీ ఉన్న ఆసక్తికీ, జాగ్రత్తకూ అది నిదర్శనం.

***

మేరీ ల్యాండ్ గెజిట్, అక్టోబర్ 1 సంచికలోని ఆ ప్రకటన పురాతన అచ్చు అక్షరాలలో ఉంది.  JUST IMPORTED  అనే శీర్షికతో అందులో ఉన్న సమాచారం, కెప్టన్ డేవిస్ సారథ్యంలో గాంబియానుంచి వచ్చిన లార్డ్ లిగొనీర్ లోని సరకును అక్టోబర్ 7న విక్రయించబోతున్నట్టు చెబుతోంది. ఆ సరకులో CHOICE HEALTHY SLAVES కూడా ఉన్నారు. విచిత్రంగా ఆ ప్రకటన హేలీ కంటపడిన తేదీ సెప్టెంబర్ 29, 1967. లార్డ్ లిగొనీర్ అన్నాపొలిస్ రేవుకు చేరి అప్పటికి సరిగ్గా రెండువందల సంవత్సరాలు అయింది. ఆ రోజున అన్నాపొలిస్ రేవులో సముద్రజలాలలోకి నిర్మించిన నడవ మీద తప్ప ప్రపంచంలో మరెక్కడా ఉండాలని తనకు అనిపించలేదనీ, అలాగే ఉన్నాననీ హేలీ అంటాడు. ఆ నడవ మీద నిలబడి, తన పూర్వీకుడు కుంటా కింటేను తీసుకొచ్చిన సముద్రజలాలవైపు చూస్తూ మరోసారి దుఃఖం ఆపుకోలేకపోయానని అతను అంటాడు.

1766-67 నాటి ఆ పత్రం గాంబియాలోని జేమ్స్ దుర్గంలో తయారైంది. దాని ప్రకారం లార్డ్ లిగొనీర్ 140 మంది బానిసలతో బయలుదేరింది. వాళ్ళలో ఎంతమంది బతికి బయటపడ్డారు? హేలీ రెండోసారి మేరీల్యాండ్ హాల్ ఆఫ్ రికార్డ్స్ కు వెళ్ళాడు. అక్కడ ఆ ఓడలో రవాణా అయిన సరకుల జాబితా దొరికింది: 3,264 ఏనుగు దంతాలు, 3,700 పౌండ్ల తేనెటీగల జిగురు, 800 పౌండ్ల ముడి నూలు, 32 ఔన్సుల గాంబియా బంగారంతోపాటు 98 మంది “నీగ్రో’’లు ఆ జాబితాలో ఉన్నారు. అంటే మార్గమధ్యంలో 42 మంది చనిపోయారు.

అమ్మమ్మ, కజిన్ జార్జియా తదితరులు కూడా తమదైన పద్ధతిలో గాథికులే నన్న సంగతి అప్పటికి హేలీకి అర్థమైంది. అంతలో, అన్న జాన్ వేలర్ నుంచి తమ్ముడు డా. విలియం వేలర్ కుంటాను కొన్నాడు కనుక అందుకు సంబంధించిన రాతకోతలేవైనా జరిగి ఉండచ్చని అతనికి స్ఫురించింది. వెంటనే వర్జీనియాలోని రిచ్ మండ్ కు వెళ్ళాడు. స్పాట్ సిల్వేనియా కౌంటీలో  1767 సెప్టెంబర్ తర్వాత రాసుకున్న దస్తావేజుల మైక్రోఫిల్మ్ ను గాలించాడు. సెప్టెంబర్ 5 తేదీతో పాతకాలపు రాతలో ఉన్న ఒక పొడవైన దస్తావేజు కనిపించింది. అందులో, జాన్ వేలర్, అతని భార్య ఆన్ 240 ఎకరాల వ్యవసాయభూమిని, కొంత సామగ్రిని విలియం వేలర్ కు బదిలీ చేసినట్టు మొదటి పేజీలో ఉంది. రెండో పేజీలో-“and also one Negro man slave named Toby” అని ఉంది!  అతనే కుంటా కింటే!

హేలీ అన్వేషణ ముగిసింది. ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే, రొసెట్టా శిల నుంచి పొందిన ప్రేరణతో అతను అన్వేషణ ప్రారంభించి అప్పటికి పన్నెండేళ్ళు గడిచాయి! హేలీ లానే మూలాలనుంచి నిర్దాక్షిణ్యంగా నరికివేయబడి బానిసలుగా అమ్ముడుపోయిన నల్లజాతి పూర్వీకుల వారసులు బహుశా ఇప్పుడు కోట్లలో ఉంటారు. శూన్యంలో ఈదుతున్న వారి  మూలాల అన్వేషణ  ఎప్పటికీ ముగిసే అవకాశం లేదు. అసలా అన్వేషణ ప్రారంభం కాకపోయినా ఆశ్చర్యం లేదు.

కాలానికి బానిసలైన మనదేశంలోని సామాన్యుల జీవితాలూ ఇందుకు భిన్నం కావు.

                                                                                                             -భాస్కరం కల్లూరి

 

 

 

 

ఎవరీ ‘సామాన్యుడు’? ఎప్పటి వాడు?!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

నైలు నదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది?

తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు?

సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుని సాహసమెట్టిది?

ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీ లెవ్వరు?

                                                          -శ్రీశ్రీ

                                (మహాప్రస్థానం, దేశచరిత్రలు)

ఇవి ప్రసిద్ధ పంక్తులే కానీ, ఇందులో చెప్పిన ‘సామాన్యుడు’ ఎప్పుడు, ఎందుకు, ఎలా అవతరించాడో ఎప్పుడైనా గమనించారా?

మనిషికి ‘నరుడు’ అనే పర్యాయపదం ఉంది. పురాణ, ఇతిహాసాలు దేవ, దానవ, సిద్ధ, సాధ్య, యక్ష, రాక్షస, వానరాల మధ్య నరుని ఇరికించి చెప్పాయి. నేటి అవగాహనతో దేవ దానవాదులను కూడా నరులుగానే గుర్తిస్తే, లేదా ఆ మాటలు నరుని గుణ, స్వభావాలను; లేదా తెగ నామాలను తెలిపేవి అనుకుంటే ఆ జాబితాలో చెప్పిన ‘నరుడు’ ఎవరనే ప్రశ్న వస్తుంది. ఇంకో విచిత్రం చూడండి: మహాభారతం అర్జునుని నరునిగా పేర్కొంటూనే, అతనిని నరుడనే ముని అవతారంగా చెప్పి మహాత్ముణ్ణి చేసింది. నరుని… అంటే మామూలు మనిషిని గుర్తించడంలో మహాభారతానికి ఏదో ఇబ్బంది ఉంది. మహాభారతానికే కాదు, ప్రపంచ పురాణ కథలన్నిటికీ ఆ ఇబ్బంది ఉంది.

కీచకుడు తన వెంటపడి వేధిస్తున్నప్పుడు ద్రౌపది ఏకాంతంగా భీముని కలిసి తన దుఃఖాన్ని వెళ్లబోసుకుంటుంది. ఆవేశం పట్టలేక, ఆ జూదరి వల్ల ఇన్ని కష్టాలు పడుతున్నామని ధర్మరాజును తూలనాడుతుంది. అప్పుడు భీముడు ఆమెను మందలించగా తప్పు దిద్దుకుంటూ ధర్మరాజు గొప్పతనాన్ని కీర్తిస్తుంది. ఆ సందర్భంలో “…కేవల మర్త్యుడే ధర్మసుతుడు?”  అంటుంది. ధర్మరాజు మామూలు మనిషి కాదు, మహాత్ముడని చెప్పడం అందులో ఉద్దేశం. ఇలా మహాత్ముడు-మర్త్యుడు అనే విభజన మహాభారతంలో ఇంకా చాలా చోట్ల వస్తుంది.  అజ్ఞాతవాసం గడపడానికి విరాటనగరానికి వెళ్లబోయేముందు, ‘ఇంతటివాడు ఒక మర్త్యుని ఎలా సేవించుకుంటాడు’ అంటూ ధర్మరాజును తలచుకుని అర్జునుడు బాధపడతాడు. ఇంద్రునితో అర్థసింహాసనం అధిష్టించిన అర్జునుడు ఒక మర్త్యుని కొలువు ఎలా చేస్తాడని ధర్మరాజు విచారిస్తాడు. మామూలు మనుషులను సూచిస్తూ మహాభారతం ప్రయోగించిన మరో మాట: ప్రకృతిజనులు. “పుడుతూనే కవచ, కుండలాలతో పుట్టిన కర్ణుడు ఒక ప్రకృతి కాంతకు పుట్టడం ఎలా సాధ్యం?” అని దుర్యోధనుడు ప్రశ్నిస్తాడు. సారాంశం ఏమిటంటే, మహాభారత కాలానికి మనుషుల్లో సామాన్యులు-అసామాన్యులన్న తేడా వచ్చేసింది.

అటువంటి మహాభారత సమయానికీ, “నైలు నదీ నాగరికతలో సామాన్యుని జీవన మెట్టిది?” అని ఆధునిక మహాకవి ప్రశ్నించే నాటికీ మధ్య చాలా కాలం ప్రవహించింది. చాలా చరిత్ర గడచింది. విచిత్రం ఏమిటంటే, ప్రజాస్వామ్య రాజకీయాలు తనకు సరికొత్త అసామాన్యతను కల్పించి అందల మెక్కించి ఊరేగిస్తున్నా ‘సామాన్యుడు’ ఇప్పటికీ సామాన్యుడి గానే ఉన్నాడు. వాస్తవంగా అసామాన్యతను చలాయిస్తున్న నాయకుల నోట మంత్రంగా మారాడు. అదలా ఉంచితే, మనదేశంలో ‘సామాన్యుడు’ తన ఉనికిని చాటుకోవడం ఎప్పటినుంచి ప్రారంభమైందో తెలిపే చారిత్రక అంచనాలను ఎవరైనా నమోదు చేశారో లేదో ఇప్పటికిప్పుడు చెప్పలేను కానీ; యూరప్ లో ఆ పరిణామం ఎప్పుడు, ఏ ఘట్టంలో జరిగిందో చరిత్రకారుడు హెచ్.జి. వెల్స్ షార్ట్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్  లో రాశాడు.

A_Short_History_of_the_World_(H.G._Wells)

పదకొండవ శతాబ్ది చివరిలో టర్కులు జెరూసలెంను ఆక్రమించుకుని, క్రైస్తవులందరూ పవిత్రయాత్రాస్థలిగా భావించే  హోలీ సెపుల్చర్ చర్చిని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. దాంతో టర్కులపై మతయుద్ధానికి  సిద్ధపడవలసిందిగా అప్పటి పోప్ అర్బన్-II పాశ్చాత్య క్రైస్తవ ప్రపంచానికి పిలుపు నిచ్చాడు. ఆ యుద్ధాలే క్రూసేడ్ లుగా, శిలువకోసం జరిగిన యుద్ధాలుగా ప్రసిద్ధికెక్కాయి. అప్పుడు పీటర్ అనే ఒక చింకి పాతల సన్యాసి పెద్ద శిలువను మోస్తూ చెప్పులు లేని కాళ్లతో గాడిద మీద జర్మనీ, ఫ్రాన్స్ వీధుల్లో తిరుగుతూ క్రూసేడ్లకు అనుకూలంగా ప్రజలను ఉద్బోధించాడు. అప్పటికి శతాబ్దాలుగా క్రైస్తవ బోధలకు ప్రభావితమవుతున్న యూరప్, క్రూసేడ్ల పిలుపుకు ఎంతో ఉద్విగ్నపూరితంగా స్పందించింది.  క్రైస్తవజనసామాన్యం ఒక ప్రజాశక్తిగా అవతరించి తన ఉనికిని చాటుకోవడం ప్రారంభించారు. ఒక పిలుపును అందుకుని సామాన్యప్రజానీకం అలా ఉవ్వెత్తున విరుచుకుపడడం మానవాళి చరిత్రలోనే కొత్త పరిణామమనీ;  వెనకటి రోమన్ సామ్రాజ్య, భారత, చైనా చరిత్రలలో దీనితో పోల్చదగిన దేదీ కనిపించదనీ వెల్స్ అంటాడు. ఆధునిక ప్రజాస్వామ్య ఆవిర్భావానికి ఇది నాంది అని పూర్తిగా అనలేకపోయినా, ఇందులో కచ్చితంగా ఆధునిక ప్రజాస్వామ్య ఉత్ప్రేరకాలు ఉన్నాయని ఆయన అంటాడు.

అంతకుముందు మనిషి చరిత్రలో వేల సంవత్సరాలు కొనసాగిన గణవ్యవస్థకు వెడితే, అందులో సామాన్యుడు, అసామాన్యుడన్న విభజనే లేదు. గణంలోని ప్రతి సభ్యుడూ సామాన్యుడే, లేదా అసామాన్యుడే. గణసభ్యులు కలసికట్టుగా ప్రకృతితో సంఘర్షించినంత కాలం వారిలో తారతమ్యాలు లేవు. మనిషి సాటి మనిషితో సంఘర్షించడం ప్రారంభమయ్యాకే తారతమ్యాలు వచ్చాయి. సామాన్యులు, అసామాన్యులనే విభజన వచ్చింది. గణవ్యవస్థలో  ప్రతి మనిషీ ముఖ్యుడే. ఏ ఒక్కరూ అనామకులు కారు. ప్రతి ఒక్కరి ఉనికీ చరిత్రలో నమోదు అయింది. కుంటా కింటే తన మూలాలనుంచి వేరుపడి తనది కాని నేలపై, తనది కాని భాష మధ్య అనామకంగా బానిస జీవితం గడిపినా; తను పుట్టిన గడ్డపై అతను అనామకుడు కాడు. అతని స్మృతిని  అది తరం నుంచి తరానికి భద్రంగా అందిస్తూనే వచ్చింది. విచిత్రాన్ని మించి,  విషాదం ఏమిటంటే; లిఖితచరిత్ర లేని కాలంలో కూడా ప్రతి మనిషి ఉనికీ నమోదయింది, లిఖితచరిత్ర వచ్చాక మనిషి చరిత్రహీనుడయ్యాడు.  గణంనుంచి జనానికి మారగానే సామాన్యుడి పేరుతో అనామక సముద్రంలో అజ్ఞాతంగా కలసిపోయాడు. తాత ముత్తాత పేరు కూడా తెలియని చారిత్రక అజ్ఞానిగా మిగిలిపోయాడు.

***

తమ పూర్వీకుడు కుంటా కింటేను బానిసగా పట్టుకుని ఓడలో ‘నేప్లిస్’ అనే చోటికి తీసుకొచ్చారని చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పగా హేలీ విన్నాడు. మేరీల్యాండ్ లో ఉన్న అన్నాపోలిస్ కు భ్రష్టరూపమే నేప్లిస్. గాంబియానది నుంచి బానిసలతో ఏయే ఓడలు అన్నాపొలిస్ కు ప్రయాణించాయో లండన్ వెళ్ళి శోధించడం ప్రారంభించాడు. “రాజుగారి సైనికులు వచ్చిన సమయంలో కుంటా కింటే అదృశ్యమయ్యా”డని జఫూరు గాథికుడు ఇచ్చిన సూచనే అతనికి చుక్కాని.  ‘రాజుగారి సైనికులు’ మరెవరో కాదు, 1760లో జేమ్స్ ఐలండ్ లోని బానిస దుర్గానికి రక్షణగా కల్నల్ ఒహేర్స్ నాయకత్వంలో వచ్చినవారేనని తేలింది. ఆ సమాచారంతో హేలీ లండన్ లోని లాయిడ్స్ కు వెళ్ళి, ఇంగ్లీష్ సముద్రయాన పత్రాలను గాలించడం ప్రారంభించాడు. ఆరువారాలు గడిచాయి. ఏడో వారంలో దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఒక వెడల్పాటి పత్రం కనిపించింది. 1766-1767 మధ్యకాలంలో గాంబియా నది నుంచి ప్రయాణించిన 30 ఓడల వివరాలను అది నమోదు చేసింది. అతని చూపు ఓడ నెం. 18 దగ్గర ఆగింది.

1767లో… అంటే ‘రాజుగారి సైనికులు వచ్చిన’ ఏడాది… జూలై 5న లార్డ్ లిగొనీర్ అనే ఆ ఓడ గాంబియా నదిలో బయలుదేరింది. దాని గమ్యస్థానం అన్నాపొలిస్!  కెప్టెన్ పేరు థామస్ ఈ. డేవిస్…

ఎందుకో తెలియదు కానీ, ఆ వివరాలకు తను స్పందించడంలో ఆలస్యం జరిగిందనీ, యాంత్రికంగా ఆ సమాచారాన్ని రాసుకుని, పత్రాలను మూసేసి బయటకు నడిచాననీ హేలీ అంటాడు. వీధి మలుపులో ఉన్న చిన్న టీ షాప్ కు వెళ్ళి టీ తెప్పించుకున్నాడు. టీ చప్పరిస్తుండగా, కుంటా కింటేను తీసుకొచ్చిన ఓడ అదే కావచ్చని అతనికి మెరుపులా స్ఫురించింది. ఆ టీ ఇచ్చిన ఆమెకు ఎంతో రుణపడ్డాననుకున్న హేలీ అప్పటికప్పుడు బయలుదేరి న్యూయార్క్ వెళ్లడానికి నిర్ణయించుకుని, సీటుకోసం పాన్ అమెరికన్ ను సంప్రదించాడు. చివరి సీటు ఉందని అది జవాబిచ్చింది. తను దిగిన హోటల్ కు వెళ్లడానికి కూడా సమయం లేదు. ట్యాక్సీ చేసుకుని నేరుగా హిత్రో ఎయిర్ పోర్ట్ కు వెళ్లిపోయాడు. విమానంలో ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపాడు. వాషింగ్టన్ లోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ లో తను చూసిన పుస్తకమే అతని కళ్ళముందు కదులుతోంది. అది గోధుమరంగు అట్టతో ఉంది. దానిమీద Shipping in the port of Annapolis అనే నల్లని అక్షరాలు ఉన్నాయి. రచయిత వాఘన్ డబ్ల్యు బ్రౌన్.

న్యూయార్క్ లో దిగీ దిగగానే మరో విమానంలో వాషింగ్టన్ వెళ్లిపోయాడు. ట్యాక్సీ చేసుకుని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ కు వెళ్ళాడు. పుస్తకం తెప్పించుకున్నాడు. ఆతృతగా పుటలు తిరగేస్తూపోయాడు. తను వెతుకుతున్నది కనిపించింది! లార్డ్ లిగొనీర్  అన్నాపొలిస్ లో 1767,సెప్టెంబర్ 29న కస్టమ్స్ క్లియరెన్స్ పొందింది…హేలీ అక్కడినుంచి బయలుదేరి కారు అద్దెకు తీసుకుని అన్నాపొలిస్ కు వెళ్ళాడు. నేరుగా మేరీల్యాండ్ హాల్ ఆఫ్ రికార్డ్స్ కు దారితీశాడు. 1767 అక్టోబర్ మొదటివారంలో ప్రచురితమైన స్థానిక వార్తాపత్రికల సంచికలు కావాలని అడిగాడు. సిబ్బంది మేరీల్యాండ్ గెజిట్  సంచికలున్న మైక్రో ఫిల్మ్ చుట్టలు తీసుకొచ్చి అతని ముందు ఉంచారు. వాటిని మిషన్ లో ఉంచి తిప్పుతుండగా  అక్టోబర్ 1 సంచికలో ఒక ప్రకటన కనిపించింది…

హేలీ అన్వేషణలో చివరి అంకం, తర్వాత…

 

-భాస్కరం కల్లూరి

 

 

 

అగ్నిని జయించిన….వాళ్లు!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

చతురంబోధిపరీత భూవలయమున్ సద్వీప సారణ్య స

క్షితిభృత్కం బగుదాని భూరిభుజశక్తిం జేసి పాలించుచున్

గ్రతువుల్ నూరొనరించి కీర్తి వెలయంగా దిక్కులన్ నిర్జితా

హితుడై యా నహుషుండు దా బడసె దేవేంద్రత్వముం బేర్మితోన్

                                                            -నన్నయ

                (శ్రీమదాంధ్రమహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం) 

( నాలుగు సముద్రాలూ చుట్టుకున్న భూమండలాన్ని ద్వీప, అరణ్య, భూభాగాలతో సహా తన గొప్పదైన భుజశక్తితో పాలిస్తూ నూరు యాగాలు చేసి, తన కీర్తి దిగంతాలకు వ్యాపించగా శత్రువులందరినీ జయించిన ఆ నహుషుడు ఇంద్రపదవిని పొందాడు)

 అక్కథకుడు శౌనకాది మహామునులకు చెప్పాడు…అటువంటి నహుషునికి ప్రియంవద అనే ఆమె వల్ల యతి, యయాతి, సంయాతి, ఆయాతి, అయతి, ధ్రువులనే ఆరుగురు కొడుకులు కలిగారు. వారిలో యయాతి రాజై అనేక యాగాలు చేశాడు. శుక్రుని పుత్రిక అయిన దేవయాని వల్ల అతనికి యదు, తుర్వసులనే ఇద్దరు కొడుకులు; వృషపర్వుని పుత్రిక అయిన శర్మిష్ట వల్ల దృహ్యుడు, అనుడు, పూరుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు. శుక్రుని శాపంతో వృద్ధాప్యభారం మీదపడగా కొడుకుల నందరినీ పిలిచి అన్నాడు…

***

“—and so-and-so took as a wife so-and-so, and begat…and begat…and  begat…”

ఆ వృద్ధ గాథికుని కథనం వింటున్న హెలీకి బైబిల్ శైలి గుర్తొచ్చింది. కుంటా కింటే ముస్లిం మతస్థుడు. అతని నుంచి ఏడో తరానికి చెందిన హేలీ దగ్గరికి వచ్చేసరికి  ఒంటి రంగు, కారు నలుపు నుంచి గోధుమవర్ణానికి మారిపోవడమే కాదు, మతమూ మారిపోయింది. హెలీకి బైబిల్ ఒక్కటే తెలుసు. మహాభారతంతో అతనికి పరిచయం ఉండుంటే  గాథికుని కథనం మహాభారత శైలిలా ఉందని కూడా అనుకుని ఉండేవాడు. అంతేకాదు, మౌఖిక సంప్రదాయానికి చెందిన ప్రపంచ పురాణ కథకులందరూ తమ వీరపురుషుల గాథలనూ, వంశచరిత్రలనూ, కుల పురాణాలనూ ఈ శైలిలోనే చెప్పుకుని ఉండచ్చన్న సంగతి అతనికి స్ఫురించి ఉండేది.

గాథికుడు కింటే వంశ వివరాలు చెప్పుకుంటూ వెడుతున్నాడు. నాటి ముఖ్యమైన కొన్ని ఘటనల ద్వారా సంవత్సరాలను, తేదీలను సూచిస్తున్నాడు. ఉదాహరణకు, అప్పుడు “భారీగా వరదలు వచ్చాయి”… “అతను ఓ దున్నపోతును వధించాడు”…

గాథికుడు చెప్పిన కింటే వంశ వివరాలను సంగ్రహీకరిస్తే…

కింటే వంశం ఓల్డ్ మాలి అనే దేశంలో మొదలైంది. వారు వృత్తిరీత్యా కమ్మరులు. “అగ్నిని జయించినవాళ్లు”. కింటే తెగలోని ఆడవాళ్లు కుమ్మరిపనీ, నేతపనీ చేసేవారు. కింటే వంశంలోని ఒక శాఖ మారెటేనియా అనే మరో దేశానికి తరలిపోయింది. అక్కడినుంచి ఆ వంశస్థులలో ఒకడైన కైరాబా కుంటా కింటే అనే ముస్లిం గాంబియాకు వలసపోయాడు. మొదట పకాలి ఎన్డిగ్ అనే గ్రామంలో కొద్ది కాలం ఉండి  ఆ తర్వాత జఫరాంగ్ అనే ఊరికి, అక్కడినుంచి జఫూరుకు మారాడు. అక్కడ సిరేంగ్ అనే మాండింకా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె వల్ల అతనికి జానే, సలౌమ్ అనే ఇద్దరు కొడుకులు కలిగారు. ఆ తర్వాత అయిసా అనే అమ్మాయిని రెండో భార్యగా స్వీకరించాడు. ఆమెకు ఒమొరో అనే కొడుకు పుట్టాడు.

తర్వాత కొంత కాలానికి కైరాబా పెద్ద కొడుకులిద్దరూ ‘కింటా కుండా జానేయా’ అనే కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడికి  వెళ్ళిపోయారు. ఒమొరో జఫూరులోనే ఉండిపోయాడు. తనకు “ముప్పై వర్షాలు” వచ్చిన తర్వాత బిట్టా కెబ్బా అనే మాండింకా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కెబ్బా వల్ల అతనికి ఉజ్జాయింపుగా 1750-1760 మధ్య కాలంలో నలుగురు కొడుకులు పుట్టారు: కుంటా, లామిన్, సువాడు, మాది…

అప్పటికి వృద్ధ గాథికుడు తన కథనం మొదలుపెట్టి రెండుగంటలయింది. తను పేర్కొన్న వ్యక్తుల గురించి మధ్య మధ్య వివరాలు అందిస్తూ కథనం కొనసాగిస్తున్నాడు. అలాగే, ఒమొరో నలుగురు కొడుకుల గురించిన వివరాలను చెప్పడం ప్రారంభించాడు. దుబాషీ వాటిని అనువదిస్తున్నాడు-

“రాజుగారి సైనికులు వచ్చిన సమయంలో”… “ఆ నలుగురు కొడుకుల్లోనూ పెద్దకొడుకు కుంటా కలప నరికి తెచ్చుకోడానికి ఊళ్ళోంచి అడవికి వెళ్ళాడు…అతను మళ్ళీ కనిపించలేదు…” గాథికుడు చెప్పుకుంటూ పోతున్నాడు.

తను చెక్కిన శిలలా కూర్చుండిపోయాననీ, తనలో రక్తం గడ్డకట్టుకుపోయినట్టు అనిపించిందనీ హేలీ అంటాడు. తన జీవితమంతా ఈ మారుమూల ఆఫ్రికన్ గ్రామంలో గడిపిన ఈ పెద్దమనిషి; టెన్నెస్సీ లోని తమ హెన్నింగ్ ఇంటి వసారాలో తను అమ్మమ్మ నోట చిన్నప్పుడు విన్న సంగతులే చెబుతున్నాడు! ఆ అప్రతిభస్థితిలోనే ఎలాగో బ్యాగు లోంచి ఒక నోటుబుక్కు తీశాడు. దాని మొదటి పేజీలలో అమ్మమ్మ చెప్పిన కథ ఉంది. దానిని ఒక దుబాషీకి చూపించాడు. ఆశ్చర్యచకితుడైన ఆ దుబాషీ వెంటనే గాథికుని దగ్గరకు వెళ్ళి ఆ నోటుబుక్కులోని పేజీలను చూపిస్తూ గబగబా ఏదో చెప్పాడు. గాథికుడు ఆందోళన చెందాడు. వెంటనే లేచి నిలబడి దుబాషీ చేతిలోని నోటుబుక్కు చూపిస్తూ జనానికి ఏదో వివరించాడు. దాంతో వాళ్ళు కూడా ఆందోళన చెందారు. ఎవరూ ఎలాంటి ఆదేశామూ ఇవ్వకుండానే అంతా తక్షణమే హేలీ చుట్టూ మానవవలయంలా ఏర్పడ్డారు. వ్యతిరేక దిశలో కదులుతూ; ఒకసారి మంద్రస్వరంలో, ఇంకోసారి ఉచ్చస్వరంలో ఏదో వల్లిస్తూ; మధ్య మధ్య మోకాళ్ళను పైకెత్తుతూ; ఎర్రని ధూళి పైకిలేచేలా ఒత్తి ఒత్తి అడుగులేస్తూ ప్రదక్షిణం చేయసాగారు…

అంతలో ఒక మహిళ ఆ వలయంలోంచి బయటకు వచ్చి, నగ్న పాదాలతో నేలను తన్నుకుంటూ హెలీవైపు బాణంలా దూసుకువెళ్లింది. తన వీపున వేలాడదీసుకున్న జోలెలోంచి పసిబిడ్డను తీసి దాదాపు మొరటుగా అతని చేతుల్లో ఉంచి “తీసుకో” అన్నట్టు చూసింది. హేలీ ఆ బిడ్డను హత్తుకున్నాడు. ఆ తర్వాత ఆమె బిడ్డను తీసేసుకుంది. మ్రాన్పడి చూస్తున్న హేలీ చేతుల్లో అలా ఓ డజను మంది మహిళలు తమ పసిబిడ్డల్ని ఉంచారు. వాళ్లందరినీ అతడు హత్తుకున్నాడు. వారు అలా ఎందుకు చేశారో అతనికి ఒక ఏడాది తర్వాత కానీ తెలియలేదు. అటువంటి విషయాలలో నిపుణుడైన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. జెరోమ్ బ్రూనర్ తో మాట్లాడినప్పుడు, “నీకు తెలియకుండానే మానవాళికి చెందిన అతి పురాతనమైన ఒక తంతులో నువ్వు పాల్గొన్నావు. దానిని ‘చేతులు వేయడం’ అంటారు.  “ఈ మా శరీరం ద్వారా మేము నువ్వే, నువ్వు మేమే” నని వారు నీకు చెబుతున్నారు” అని ఆయన  హెలీతో అన్నాడు.

తర్వాత మగవాళ్ళు హేలీని వెదురు కర్రలతో, పూరితో నిర్మించిన మసీదులోకి తీసుకెళ్లారు. అతనిని మధ్యలో ఉంచుకుని అరబిక్ లో నమాజు చేశారు. వాళ్లతోపాటు మోకాళ్ళ మీద కూర్చుని నమాజులో పాల్గొన్న హేలీ, తన మూలాలు ఏమిటో తెలిసినా, వాళ్ళు మాట్లాడేది ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదనుకున్నాడు. వారి ప్రార్థన సారాంశాన్ని ఆ తర్వాత దుబాషీ అనువదించి చెప్పాడు: ఎప్పుడో తాము పోగొట్టుకున్న వ్యక్తిని తిరిగి తమకు అప్పగించినందుకు అల్లాకు వారు కృతజ్ఞతలు ప్రకటించుకున్నారు.

kinta

తిరుగు ప్రయాణమైన హేలీ ఈసారి రోడ్డు మార్గంలో బయలుదేరాడు. జఫూరు కంటె పెద్దదైన ఓ గ్రామానికి చేరుకునేసరికి ఆ ఊళ్ళో జనం, ఆడా మగా, చిన్నా పెద్దతో సహా అంతా రోడ్డు మీదికి చేరుకుంటూ కనిపించారు. తను అక్కడికి రావడానికి ముందే జఫూరులో ఏం జరిగిందో వారికి తెలిసిపోయింది. వారు అతన్ని చూసి చేతులు ఊపుతున్నారు. “మీస్టర్ కింటే! మీస్టర్ కింటే!” అంటూ ఒక్క గొంతుతో కేకలు పెడుతున్నారు. వారి ముఖాలు సంతోషంతో వెలిగి పోతున్నాయి. ఆ సమయంలో నా చీలమండల దగ్గరినుంచి దుఃఖం అలలు అలలుగా ప్రారంభమై క్రమంగా పైకి తన్నుకుంటూ వచ్చిందనీ, చేతులతో ముఖం కప్పుకుని బాల్యం తర్వాత మొదటిసారిగా భోరున ఏడవడం ప్రారంభించాననీ హేలీ అంటాడు.

హేలీ న్యూయార్క్ చేరుకునేసరికి కొన్ని టెలిఫోన్ వర్తమానాలు అతనికోసం ఎదురుచూస్తున్నాయి. వాటిలో ఒకటి కన్సాస్ సిటీ నుంచి వచ్చింది. ఎనభై మూడేళ్ళ కజిన్ జార్జియా కన్నుమూసినట్టు అది చెబుతోంది. హేలీ టైమ్ జోన్ సవరించుకుని చూసుకుంటే సరిగ్గా తను జఫూరులో అడుగుపెట్టిన క్షణాలలోనే ఆమె చనిపోయినట్టు అర్థమైంది. అమ్మమ్మతో తమ ఇంటి వసారాలో ముచ్చట్లు పంచుకున్న చివరి మనిషిగా ఆమె, తనను ఆఫ్రికాకు పంపించే బాధ్యత నెరవేర్చి, ‘పైనుంచి చల్లగా చూసే’ పెద్దలలో కలసిపోయిందని హేలీ అనుకున్నాడు.

***

హేలీకి మహాభారతంతో పరిచయం ఉండుంటే, జఫూరు గాథికుని కథనం బైబిల్ శైలినే కాక మహాభారత శైలిని కూడా గుర్తుచేసేదని పైన చెప్పుకున్నాం. అంతేకాదు, మన ఇతిహాస, పురాణ కథలు అతనికి తెలిసుంటే, శైలినే కాక ఒకేవిధమైన అభివ్యక్తిని, పదాలను, పదచిత్రాలను కూడా ఒకనాటి ప్రపంచ గాథికులు పంచుకున్నారని అతడు గ్రహించి ఉండేవాడు. కుంటా కింటే తండ్రి ఒమొరో తనకు ముప్పై ‘వర్షాలు’ (హేలీ  thirty rains అన్నాడు) వచ్చాక పెళ్లిచేసుకున్నాడు. మనం కూడా సంవత్సరాలను ‘వర్షాలు’ అంటాం. వసంతాలతో సంవత్సరాలను చెప్పుకున్నట్టే వర్షాలతో చెప్పుకోవడం వ్యవసాయ సంస్కృతి ప్రపంచానికి అందించిన వారసత్వం.  అలాగే, కింటే వంశీకులు ‘అగ్నిని జయించారు’ అని వినగానే మన పురాణ కథనాల తీరు ఒక్కసారిగా  తళుక్కుమంటుంది. అరణి మథించి నిప్పు చేయడంలో నేర్పరులైన అంగిరులను కూడా మన పురాణాలు అగ్నిని జయించిన వారుగానే పేర్కొంటాయి. మన అగస్త్యుడు ‘సముద్ర జలాలను తాగేస్తాడు’. పై పద్యంలోని నహుషుడు క్షత్రియవీరుడు కనుక నిర్జితాహితుడు- అంటే శత్రువులను జయించినవాడు. కింటే వంశీకులు కమ్మరులు కనుక ‘అగ్నిని జయించిన’వాళ్ళు!

హేలీ అన్వేషణ అంతటితో పూర్తి కాలేదు. అనంతర కథ తర్వాత…

 

 

అవన్నీ ‘చెప్పినవే’ తప్ప ‘రాసినవి’ కాదు!

 Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)పాదబద్ధోzక్షరసమః తంత్రీలయసమన్వితః

శోకార్తస్య ప్రవృత్తోమే శ్లోకో భవతు నాన్యథా

శిష్యుడు భరద్వాజుడితో కలసి వాల్మీకి తమసానదికి స్నానానికి వెళ్ళాడు. అంతకుముందే ఆయన నారదుని నోట  సంక్షిప్తంగా రామాయణ కథ విన్నాడు. దానినే భావన చేస్తున్నాడు. స్నానానికి దిగబోతుండగా క్రౌంచ పక్షి జంట కనిపించింది. మగపక్షి కామపరవశస్థితిలో ఉంది. అంతలో ఒక కిరాతకుడు బాణం వేసి దానిని నేలకూల్చాడు. ఆడపక్షి శోకించసాగింది. వాల్మీకిలోనూ కరుణశోకాలు ఉబికివచ్చాయి. అప్రయత్నంగా ఆయన నోట కొన్ని మాటలు వెలువడ్డాయి:

మా నిషాద ప్రతిష్ఠామ్ త్వ మగమ శ్శాశ్స్వతీస్సమాః

యత్ క్రౌంచ మిథునా దేకమ్ అవధీః కామమోహితమ్

(ఓ కిరాతుడా! క్రౌంచ మిథునంలో కామపరవశంగా ఉన్న ఒక పక్షిని చంపావు. అందువల్ల నువ్వు ఎక్కువ కాలం జీవించవు [శాశ్వతంగా అపకీర్తిని మూటగట్టుకుంటావు])

ఆశ్చర్యపోయిన శిష్యుడు అప్పటికప్పుడు ఆ మాటల్ని కంఠస్థం చేశాడు. స్వయంగా వాల్మీకికీ ఆ మాటలు విస్మయం కలిగించాయి. నేను ఏం పలికానన్న ఆలోచనలో పడ్డాడు. ” చూశావా, నేను పలికిన ఈ మాటలు సమాక్షరాలతో పాదబద్ధంగా ఉన్నాయి. వాద్యయుక్తంగా, లయబద్ధంగా పాడుకోడానికి వీలుగానూ ఉన్నాయి. శోకార్తితో నేను అన్న ఈ మాటలు శ్లోకమే తప్ప మరొకటి కావు” అని శిష్యుడితో అన్నాడు.

ఆశ్రమానికి తిరిగి వెళ్ళిన తర్వాత కూడా వాల్మీకి దాని గురించే ఆలోచిస్తున్నాడు. శిష్యుడు తను కంఠస్థం చేసిన మాటల్ని సహాధ్యాయులతో పంచుకున్నాడు. వారు కూడా ఆశ్చర్యానందాలలో తలమునకలవుతూ వాటిని కంఠస్థం చేశారు. అంతలో బ్రహ్మదేవుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి అతిథి సేవలు అందించి ఆయనతో మాట్లాడుతున్నాడే కానీ మనసంతా తన నోట వెలువడిన మాటల మీదే ఉంది. బ్రహ్మ ఆయన పరధ్యానాన్ని గమనించి చిరునవ్వు నవ్వాడు. “నీ నోట వెలువడింది శ్లోకమే. ఈ ఛందస్సులోనే నువ్వు రామాయణం చెప్పు” అన్నాడు. వాల్మీకి రామాయణం చెప్పాలని సంకల్పించుకున్నాడు. అయితే, ఇంకొక చింత ఆయనను వేధించడం ప్రారంభించింది. దీనిని కంఠస్థం చేసి ఎవరు మధురంగా గానం చేస్తారనుకున్నాడు. అంతలో ఆశ్రమంలోనే ఉంటున్న కుశలవులు ఆయనను దర్శించుకున్నారు. వారిని చూడగానే వాల్మీకి చింత తీరింది. వీరే తన రామాయణ గానానికి అర్హులనుకున్నాడు. కుశలవులు రామాయణం నేర్చుకున్నారు. వీధులలో, రాజమార్గాలలో తిరుగుతూ దానిని గానం చేయడం ప్రారంభించారు.

కవిత్వం పుట్టుక గురించీ, అది కలిగించే సంభ్రమాశ్చర్యాల గురించీ చెప్పే ఈ ఘట్టంలో చెప్పుకోవలసిన విశేషాలు అనేకం ఉన్నాయి. మరో సందర్భానికి వాటిని వాయిదా వేసి ప్రస్తుతానికి వద్దాం. వాల్మీకి రామాయణం ‘రాశా’డన్న మాట మూలంలో ఎక్కడా లేదు. ఆయన రామాయణం ‘చెప్పాడు’, లేదా ‘చేశాడు’. శిష్యులు ఆయన చెప్పిన శ్లోకాన్ని రాసుకోలేదు, కంఠస్థం చేశారు. రామాయణం చెప్పడం పూర్తి అయిన తర్వాత దీనిని ఎవరు ‘కంఠస్థం చేసి గానం చేస్తా’రనే వాల్మీకి అనుకున్నాడు. కుశలవులు దానిని కంఠస్థం చేసి గానం చేయడం ప్రారంభించారు. విచిత్రం ఏమిటంటే, నేను చూసిన రామాయణ ప్రతిలో తెలుగు తాత్పర్యం కూర్చిన పండితుడు, వాల్మీకి రామాయణం చెప్పాడు, చేశాడు అని ఉన్న ప్రతిచోటా ‘రచించాడు’ అనే మాట ఉపయోగించారు!

కాలం మన ఆలోచనలను, అలవాట్లను ఎలా నియంత్రిస్తుందో గ్రహించడానికి ఇదొక ఉదాహరణ. అంతేకాదు, మన చరిత్రశూన్యతకూ నిదర్శనం. లిఖితసంప్రదాయం చివరికి సంప్రదాయ పండితులలో కూడా ఎంత అలవాటుగా  జీర్ణించుకుపోయిందంటే, ఒకప్పుడు మౌఖిక సంప్రదాయం ఉండేదనీ; వ్యాసవాల్మీకులు మౌఖిక సంప్రదాయానికి చెందినవారనే స్ఫురణ వారికీ లేదు.

భారతీయులు, గ్రీకులు, ఆఫ్రికన్లు అనే తేడా లేకుండా ప్రాచీన కవి, కథకులందరూ కవిత్వం లేదా కథ చెప్పారు, రాయలేదు. తమ కవిత్వం తంత్రీలయబద్ధంగా ఉండాలనుకున్నారు. తాము చెప్పే కథలకు, వీరగాథలకు, వంశచరిత్రలకు తంత్రీలయ నేపథ్యం ఉండేలా చూసుకున్నారు.  ఇంతకీ విషయమేమిటంటే, కుంటా కింటే వంశచరిత్రను చెప్పే గాథికుని గుర్తించి హేలీకి తెలియజేసిన గాంబియా మిత్రులు ఒక హెచ్చరిక కూడా చేశారు: సంగీత నేపథ్యం లేకుండా గాథికులు నోరు విప్పరట! దాంతో హేలీ ఆ ఆఫ్రికన్ వాల్మీకిని కలుసుకోడానికి ముగ్గురు దుబాషీలు, నలుగురు సంగీతకారులతో సహా పద్నాలుగు మందిని వెంటబెట్టుకుని వెళ్ళాడు.

గాంబియాకు వెళ్ళేముందు కన్సాస్ సిటీకి వెళ్ళి కజిన్ జార్జియాను ఓసారి చూసిరమ్మని ఎందుకో అతని మనసు చెప్పింది. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. తను అంతవరకు తెలుసుకున్నవీ, ఇకముందు తెలుసుకోబోయేవీ చెప్పగానే ఆమె సంభ్రమం పట్టలేకపోయింది.  మరోసారి దీవెనలు అందించింది.  గాంబియా చేరుకున్న హేలీ, “గాథికుడు ఏడీ, ఎక్కడ” అని ఆతృతగా మిత్రులను అడిగాడు. వాళ్ళు అతని వైపు వింతగా చూసి, “గాథికుడు ఇక్కడెందుకుంటాడు? ఊళ్ళో ఉంటా”డని చెప్పారు.  హేలీ ఆ ఊరికి ప్రయాణమయ్యాడు.  తను గాంబియా నది మీదుగా వెళ్లాలని నిర్ణయించుకుని ఒక లాంచీని అద్దెకు తీసుకున్నాడు. చుట్టుదారిలో సరకులు చేరవేయడానికి ఒక లారీని, ఒక ల్యాండ్ రోవర్ ను కుదుర్చుకున్నాడు. దుబాషీలు, సంగీతకారులతో సహా పద్నాలుగుమందిని వెంటబెట్టుకున్నాడు. మార్గమధ్యంలో జేమ్స్ ఐలండ్ లో ఆగాడు. అక్కడినుంచే బానిసల ఎగుమతి జరుగుతూ ఉండేది. దానిపై ఆధిపత్యం కోసం ఫ్రాన్స్, ఇంగ్లండ్ లు రెండువందల ఏళ్లపాటు ఘర్షణపడ్డాయి. అక్కడి శిథిలాల మధ్య కాసేపు తచ్చాడాడు. ఆనాడు బానిసలను బంధించడానికి ఉపయోగించిన పురాతనమైన గొలుసు అవశేషం లాంటివి  ఏవైనా దొరుకుతాయేమోనని ఆశగా వెతికాడు. ఏదీ దొరకలేదు. చిన్న గచ్చుముక్కను, ఇటుక ముక్కను తీసుకున్నాడు. తిరిగి లాంచీ ఎక్కబోయేముందు, ఎక్కడో అట్లాంటిక్ ఆవల వర్జీనియాలో ఉన్న తన పూర్వీకుడు కుంటా కింటే తన కూతురుకు ‘కాంబీ బొలోంగో’ పేరుతో పరిచయం చేసిన ఆ నదిని ఒకసారి తేరిపార చూశాడు. అక్కడినుంచి అల్ బ్రెడా అనే ఓ చిన్న ఊరికి చేరుకున్నాడు. ఆ తర్వాత కాలినడకన అంతకంటే చిన్నదైన మరో ఊరు చేరాడు. ఆ ఊరు పేరు జఫూరు. గమనించారో లేదో, జఫూరు అనే మాటలో ‘ఊరు’ ఉంది, అచ్చంగా మన తెలుగు ‘ఊరే’. ఆఫ్రికాలోనే కాక, పశ్చిమాసియాలో కూడా ఊళ్ళ పేర్లలో తెలుగు ‘ఊరు’ కనిపిస్తుంది. దీని గురించి మరోసారి చెప్పుకుందాం.

valmiki

జీవితంలో మరే దశలోనూ అందుకోలేని ‘భావోద్వేగపు పరాకాష్ట’స్థితిని పశ్చిమాఫ్రికాలోని ఆ మారుమూల పల్లెలో తను గడిపిన తొలిరోజున అందుకున్నానని హేలీ అంటాడు.

జఫూరుకు వాళ్ళు కనుచూపు మేరలో ఉండగానే బయట ఆడుకుంటున్న పిల్లలు చూసి  పెద్దవాళ్ళకు చెప్పారు. అంతా బిలబిల్లాడుతూ పూరి గుడిసెల్లోంచి బయటకు వచ్చారు. ఆ ఊరి జనాభా 70 మందిని మించి ఉండదు. ఎన్నో మారుమూల గ్రామాల్లానే ఈ ఊరు కూడా రెండు శతాబ్దాల క్రితం ఎలా ఉందో అలాగే ఉంది. అన్నీ మట్టితో నిర్మించిన గుండ్రటి పూరిళ్ళు. కప్పులు గోపురాకారంలో ఉన్నాయి.  జనం అంతా ఒక వృద్ధుని చుట్టూ చేరడం ప్రారంభించారు. ఆ వృద్ధుడిది చిన్నపాటి ఆకారం. తెల్లని అంగరఖా వేసుకున్నాడు. నెత్తిన ఒక పెట్టె లాంటి టోపీ పెట్టుకున్నాడు. చూడగానే ‘ఒక ముఖ్యమైన వ్యక్తి’ అనే భావన కలిగించేలా ఉన్నాడు.

తను ఎవరిని కలసుకోడానికీ, ఎవరిని వినడానికీ ఆ ఊరు వచ్చాడో ఆయనే ఈయన అని హేలీకి దుబాషీలు చెప్పారు. ఆయనే గాథికుడు కెబ్బా కంజీ పొఫానా!

దుబాషీలు ఆయనతో మాట్లాడుతుండగా, జనం గుర్రపు నాడా ఆకారంలో హేలీకి దగ్గరగా నిలబడి ఆసక్తిగా అతనినే గుచ్చి గుచ్చి చూస్తున్నారు. ఒక అమెరికన్ నల్లజాతీయుని చూడడం వారికి ఇదే మొదటిసారి. ఆ కారు నలుపు మనుషుల మధ్య కొట్టొచ్చినట్టు కనిపించే తన గోధుమవర్ణాన్ని తలచుకుని హేలీ సిగ్గుపడ్డాడు. కాసేపటి తర్వాత జనాన్ని దాటుకుంటూ ఆ వృద్ధుడు హేలీని సమీపించాడు. అతని ముఖంలోకి నిశితంగా చూశాడు. నా మాండింకా భాష నీకు అర్థమవుతుందా అన్న ప్రశ్న ఆ చూపుల్లో కనిపించింది. తర్వాత అతనికి ఎదురుగా కూర్చున్నాడు.

శతాబ్దాలుగా, తాతముత్తాతల కాలం నుంచీ మౌఖికంగా జాలువారుతున్న కింటే వంశ చరిత్రను చెప్పడం ప్రారంభించాడు. అది కేవలం సంభాషణ రూపంలో లేదు. తాళపత్రాలను చదువుతున్నట్టు ఉంది. జనం నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. గాథికుడు మధ్య మధ్య ఛాతీనుంచి ముందుకు వంగుతున్నాడు. మిగతా దేహం స్థాణువులా ఉండిపోయింది. కంఠనాళాలు ఉబ్బి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఒకటి రెండు వాక్యాల తర్వాత దుబాషీలకు అవకాశమిస్తూ వెనక్కి వాలుతున్నాడు. ఆయన మాటలు దాదాపు భౌతిక వస్తువులను రూపుకడుతున్నాయి. సంక్లిష్టమైన కింటే వంశచరిత్ర ఆయన నోటినుంచి అలవోకగా ప్రవహిస్తోంది. ఎవరు ఎవరిని పెళ్లాడారు, వారి పిల్లలు ఎవరు, వారు ఎవరిని పెళ్లాడారు, వారి పిల్లలు ఎవరు…

తన చెవులను తనే నమ్మలేనట్టుగా హేలీ అప్రతిభుడవుతున్నాడు. గాథికుని నోట దొర్లే విస్తారమైన వివరాలే కాదు, ఆయన శైలి కూడా బైబిల్ శైలిని తలపిస్తోంది.

మిగతా కథ తర్వాత…

 

 

ఆఫ్రికన్ వ్యాసవాల్మీకులు

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)శిశువు చిత్రనిద్రలో ప్రాచీనస్మృతులూచే చప్పుడు

అన్న శ్రీశ్రీ కవితా వాక్యం నాకు ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది.  పురాచరిత్రలో, పురావస్తువులలో ‘ప్రాచీనస్మృతులూచే చప్పుడు’ వినగలిగే చెవి ఉన్నవారందరికీ ఎలెక్స్ హేలీతో చుట్టరికం కలుస్తుంది.  అతని కథ సొంత కథలానే అనిపిస్తుంది. రోసెట్టా శిలను చూసినప్పుడు అతని కళ్ళలో తళుక్కుమన్న మెరుపునూ, అతని హృదయస్పందననూ వారు పోల్చుకోగలరు. న్యూయార్క్ లో అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీకి వెళ్ళినప్పుడు, వేల సంవత్సరాల క్రితం శిలగా ఘనీభవించిపోయిన ఒక వృక్షఖండాన్ని చూసి నేను అటువంటి సంచలనానికే లోనయ్యాను. అక్కడే బాబిలోనియా చక్రవర్తి హమ్మురాబి శిక్షాస్మృతిని చెక్కిన శిలను చూశాను. ఆధునిక చరిత్రకారులను ప్రామాణికంగా తీసుకుంటే హమ్మురాబి(క్రీ.పూ. 1750) మన మహాభారత కాలానికి కూడా వెనకటి వాడన్న సంగతి గుర్తొచ్చి కన్నార్పకుండా దానినే చూస్తూ ఉండిపోయాను.

ఇప్పటికీ ఎలెక్స్ హేలీ మన బంధువే నన్న విశ్వాసం మీకు కలగకపోతే ఇంకో విషయం చెబుతాను.  అతను తన పూర్వీకుడైన కుంటా కింటే జన్మస్థలాన్ని వెతుక్కుంటూ వెళ్లింది ఎక్కడికో కాదు; మనమూ, మనతోపాటు ప్రపంచమంతా ఒకనాడు జీవించిన గతంలోకి! గణసంస్కృతిలోకి!  గణదశలో ప్రపంచ మానవాళి ఒకే అనుభవాలను, ఒకే విధమైన సెంటిమెంట్లను, చివరికి ఒకే విధమైన పురాణగాథలను పరస్పరం పంచుకున్నారు.

ఇంకో విషయం చెబుతాను, ఆశ్చర్యపోకండి… ఎలెక్స్ హేలీ  తన పూర్వీకుని జన్మస్థలానికి వెళ్ళి అక్కడ దర్శించినది మరెవరినో కాదు;  మన వాల్మీకినీ, వ్యాసునీ, వైశంపాయనునీ; గ్రీకుల హోమర్ ను, హెసియాడ్ నే! పశ్చిమ ఆఫ్రికాలోని ఒక మారుమూల గ్రామంలో 1966లో అతను దర్శించిన ఆ వ్యాస/వాల్మీకి/ హోమర్ పేరు:  కెబ్బా కంజీ పొఫానా!

విషయంలోకి వద్దాం.

కుంటా కింటే నుంచి ఏడు తరాలుగా అందుతున్న ఆఫ్రికన్ పదాలు నిర్దిష్టంగా ఏ ఆఫ్రికన్ భాషకు చెందినవో కనిపెట్టగలమా అన్న ప్రశ్న తన ముందు వేళ్లాడుతున్న దశలో, కన్సాస్ నగరంలో ఉంటున్న కజిన్ జార్జియా ఏండర్సన్ ను హేలీ కలుసుకున్నాడు. తన చిన్నప్పుడు హెమ్మింగ్ ఇంటి వసారాలో అమ్మమ్మ ముచ్చట్లలో పాల్గొన్నవారందరిలో ఆమె చిన్నది. ఎనభై ఏళ్ల వయసులో అనారోగ్యంతో మంచం పట్టింది. హేలీ తన ఆలోచన చెప్పగానే సంభ్రమాశ్చర్యాలతో  ఒక్కసారి లేచి కూర్చుంది. “మంచి పని చేస్తున్నావు బిడ్డా,  పైనుంచి మీ అమ్మమ్మ, మిగితా పెద్దలూ నిన్ను చల్లగా చూస్తారు” అంటూ దీవించింది.

ఆ తర్వాత హేలీ వాషింగ్టన్ డీ,సీ. లో ఉన్న జాతీయ పురాపత్ర ప్రదర్శనశాలకు వెళ్ళి,  అమెరికా అంతర్యుద్ధం(1881-1885) తర్వాత నార్త్ కరోలినాలో సేకరించిన జనాభా వివరాలు కావాలని అడిగాడు. క్షణాలలో అతనిముందు మైక్రోఫిల్మ్ చుట్టలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని మిషన్ లో ఉంచి తిప్పడం ప్రారంభించాడు. 1800 ల నాటి పాతకాలపు రాత పద్ధతిలో రాసిన పత్రాలవి. ఒక చోట అతని కళ్ళు మంత్రించినట్టు ఆగిపోయాయి. ‘టామ్ ముర్రే, బ్లాక్, బ్లాక్ స్మిత్- ఇరేన్ ముర్రే, బ్లాక్, హౌస్ వైఫ్-…’ అనే పేర్లు కనిపించాయి. వాటి కిందే అమ్మమ్మ అక్కల పేర్లు ఉన్నాయి. హెన్నింగ్ ఇంటి వసారాలో చిన్నప్పుడు విన్న పేర్లే అవి! అప్పటికి అమ్మమ్మ పుట్టనే లేదు.

న్యూయార్క్ లో ఉంటున్న హేలీ వాషింగ్టన్  పురాపత్ర ప్రదర్శనశాలకు, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ కు, డాటర్స్ ఆఫ్ అమెరికన్ రివల్యూషన్ లైబ్రరీకి తరచు వెళ్ళడం ప్రారంభించాడు. ఇంతకీ ఆ ఆఫ్రికన్ పదాలు ఏ భాషకు చెందినవన్న ప్రశ్న మాత్రం చిక్కుముడిగానే ఉంది. ఆఫ్రికాలో అనేక తెగలు మాట్లాడే భాషలున్నాయి. తమ పూర్వీకులది ఏ భాషో తెలుసుకోవడం ఎలా? న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితిలో అనేక భాషలవారు ఉంటారు. సాయంత్రం అంతా ఇళ్లకు వెళ్లిపోయే సమయంలో సమితి కార్యాలయానికి వెళ్ళి కనిపించిన ప్రతి ఆఫ్రికన్ కూ ఆ మాటలు వినిపించి అవి ఏ భాషవో చెప్పమని అడుగుతూ వచ్చాడు. అలా వారం రోజుల్లో పాతికమందిని అడిగాడు. ఎవరూ చెప్పలేకపోయారు. అప్పుడు ఒక మిత్రుడి సాయంతో డా. జాన్ వాన్సినా అనే పేరు సంపాదించాడు. బెల్జియంకు చెందిన వాన్సినా కొంతకాలం ఆఫ్రికన్ గ్రామాలలో తిరిగి మౌఖిక సంప్రదాయం గురించి పుస్తకం రాశాడు. విస్కాన్సిన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. హేలీ ఆయన అపాయింట్ మెంట్ తీసుకుని మ్యాడిసన్ వెళ్ళాడు. హేలీ నోట విన్న ఆ ఆఫ్రికన్ మాటలూ, అమ్మమ్మ ద్వారా అవి తనకు అందాయని అతను చెప్పడం మౌఖిక చరిత్రకారుడైన వాన్సినాను ఆకర్షించాయి. మరో ఆఫ్రికన్ నిపుణుడితో మాట్లాడి, అవి మాండింకా భాషాపదాలని తేల్చాడు. మాండింగో జనం ఆ భాష మాట్లాడతారు. ‘కాంబీ బోలోంగో’ అనే మాటలోని ‘కాంబీ’ గాంబియా నదిని సూచిస్తుందన్నాడు. ఆ తర్వాత అనుకోకుండా హెలీకి ఎబౌ మాంగా అనే ఆఫ్రికన్ విద్యార్థి గురించి తెలిసింది. అతను న్యూయార్క్ కు అరగంట దూరంలో ఉన్న హామిల్టన్ కాలేజీలో చదువుకుంటున్నాడు. అవి మాండింకా పదాలేనని అతను కూడా ధ్రువీకరించాడు.

హమ్మయ్య, తమ పూర్వీకులు ఎక్కడివారో తెలిసింది! వారు గాంబియా నది ప్రవహించే గాంబియా అనే దేశానికి చెందినవారు. ఇక నిర్దిష్టంగా ఏ గ్రామానికి చెందినవారో తెలియాలి. ఎబౌ మాంగాతో కలసి హేలీ సెనెగల్ రాజధాని డాకర్ కు, అక్కడినుంచి గాంబియాకు వెళ్ళాడు. అదో చిన్న దేశం. రాజధాని బంజూల్. ఆ దేశచరిత్ర తెలిసినవారిని కొందరిని కలుసుకున్నాడు. మా దేశంలో పాత ఊళ్ళ పేర్లు, శతాబ్దాల క్రితం ఆ ఊళ్ళలో మొదట స్థిరపడిన కుటుంబాల పేర్లతోనే ఉంటాయని వారు చెప్పారు. ఒక మ్యాప్ తెప్పించారు. అందులో ‘కింటే కుండా’ అనే ఊరు పేరు, దానికి దగ్గరలోనే ‘కింటా కుండా జానేయా’ అనే ఊరు పేరు కనిపించాయి.

ఆ తర్వాత, తను కలలో కూడా ఊహించని ఒక విషయం వారు చెప్పారని హేలీ అంటాడు. వందల ఏళ్ళకు విస్తరించిన వంశచరిత్రలను చెప్పే గాథికులు ఇప్పటికీ మారుమూల గ్రామాలలో ఉన్నారనీ, వారు మౌఖిక చరిత్రను వల్లించే సజీవ పురావస్తు పత్రాలని వాళ్ళు చెప్పారు. అదో వ్యవస్థ. గాథికులలో పెద్ద, చిన్న తేడాలు ఉంటాయి. పెద్ద గాథికునికి సాధారణంగా అరవై, డెబ్భై ఏళ్ళు ఉంటాయి. అతని కింద శిష్య గాథికులు ఉంటారు. నలభై, యాభై ఏళ్ల తర్వాత వాళ్ళు పెద్ద గాథికుని హోదాను అందుకుంటారు. వీరు కొన్ని ప్రత్యేక సందర్భాలలో గ్రామ-తెగ-కుటుంబ-వీర గాథలను గానం చేస్తారు.  నల్లజాతీయులు నివసించే ఆఫ్రికా అంతటా ఈ మౌఖిక గాథికులు ఉన్నారనీ, పునరుక్తి లేకుండా మూడు రోజులపాటు ఆఫ్రికా చరిత్రను చెప్పగలిగినవారు కూడా వీరిలో ఉంటారనీ వారు హెలీకి చెప్పారు. చివరగా, కింటే తెగ గాంబియాలో ప్రసిద్ధమే కనుక ఒక గాథికుని గుర్తించి తెలియజేస్తామని హామీ ఇచ్చారు. న్యూయార్క్ కు తిరిగొచ్చిన హేలీ ఆఫ్రికా చరిత్రను నమిలి తినడం ప్రారంభించాడు.

DeniseArt

గాథికుల దగ్గర కాసేపు ఆగుదాం. హేలీ వారిని griot  అనే మాటతో సూచించాడు. ఆ మాటకు, ‘A storyteller in Western Africa who perpetuates the oral tradition and history of a village or family’ అని ఒక నిఘంటువు అర్థం చెప్పింది. ఫ్రెంచ్ guiriot, బహుశా పోర్చుగీస్ criado, లాటిన్ creatus లకు ఆ మాటతో సంబంధం ఉన్నట్టు చెప్పింది. criado అనే మాటకు ‘ఇంటి పనివాడు’ అనే అర్థమూ, creatus అనే మాటకు పెంచబడినవాడు లేదా శిక్షణ పొందినవాడు అనే అర్థాలు ఇచ్చింది. అలాగే, సృష్టించడం అనే అర్థం ఉన్న create అనే మాటకు, creatus కు సంబంధం ఉంది. అదే నిఘంటువు griot అనే మాటకు, ‘(In Western Africa) a member of a caste responsible for maintaining an oral record of tribal history in the form of music, poetry and storytelling’ అని మరికొంత వివరణ ఇచ్చింది.  జార్జి థాంప్సన్ తన ‘Studies In Ancient Greek Society’ అనే రచనలో ‘Ritual origins of Greek Epic’ గురించి రాస్తూ ministrel అనే మాట ఉపయోగించాడు.

మన విషయానికి వస్తే, పురాణ ఇతిహాసాలలో ‘సూతుడు’ అనే మాట ఉంది. రెండు భిన్న కులాలవారికి పుట్టిన సంకీర్ణవర్ణంగా సూతులను పేర్కొంటారు. వాల్మీకిని బోయగా, వ్యాసుని బెస్తకన్యకు పుట్టినవాడుగా చెప్పడం వారి సంకీర్ణవర్ణానికి సూచన. పోర్చుగీస్ criado అనే మాటకు ‘ఇంటి పనివాడు’ అనే అర్థం కూడా ఇవ్వడం ఇక్కడ ఆసక్తికరం. కులవ్యవస్థలో పనివాళ్లు కింది కులానికే చెందుతారు. గ్రీకు పురాణ కథకులు హోమర్, హెసియాడ్ లను జార్జి థాంప్సన్ ministrels అన్నాడు. griot అనే మాటతో సహా ఈ మాటలన్నీ స్థూలంగా ఒకే అర్థం చెబుతున్నాయి. స్వల్ప భేదాలు ఉండచ్చు కానీ వీరంతా గణసమాజం సృష్టించిన ఒకే వ్యవస్థకు చెందినవారు. గణపురుషులు, గణ వీరుల గాథలను; వంశచరిత్రలను సంగీత, కవిత్వయుక్తంగా గానం చేయడం వీరి వృత్తి. మళ్ళీ మనదేశంలో ప్రతి కులానికీ ఆశ్రిత కులాలు అనే వ్యవస్థ ఉంది. ఆశ్రిత కులాలవారు తమను పోషించే కులస్థుల చరిత్రను, కుల పురాణాలను గానం చేస్తారు. వీరందరినీ ఏ పేర్లతో పిలిచినా,  ప్రస్తుతానికి ‘గాథికులు’ అనే ఒకే మాటతో పిలుచుకుందాం. ఆఫ్రికన్ గాథికులకు ఉన్నట్టే మన గాథికులకూ శిష్యపరంపర ఉంది. వ్యాసుని శిష్యులు:  సుమంతుడు, జైమిని, పైలుడు, శుకుడు, వైశంపాయనుడు. వ్యాసుడు ఈ అయిదుగురికీ భారత కథనంలో శిక్షణ ఇచ్చాడు. అయితే వైశంపాయనుని కథనమే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక వాల్మీకి కుశలవులకు రామాయణ కథనంలో శిక్షణ ఇచ్చాడు.

అంతలో, కింటా కుంటే వంశచరిత్ర చెప్పే గాథికుని గుర్తించామనీ, గాంబియా కు రావలసిందనీ హేలీకి కబురు వచ్చింది.   అనంతర కథ తర్వాత.

-కల్లూరి భాస్కరం

అమ్మమ్మలు బతికించిన చరిత్ర

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

నలుగురు కూచుని నవ్వే వేళల, నా పేరొకపరి తలవండి’ 

గుర్తొచ్చిన ప్రతిసారీ ఈ పంక్తి మాటల కందని మహా విషాదాన్ని మోస్తున్నట్టు, ఆ విషాదాన్ని చుక్క చుక్కలుగా మన గుండెల్లోకి జార్చుతున్నట్టు అనిపిస్తుంది. లోపల ఎక్కడో కలుక్కుమంటుంది. గురజాడవారి పూర్ణమ్మ కథలోని పంక్తి ఇది. తనను ఒక ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నందుకు మనస్తాపం చెందిన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ ఆత్మహత్యకు సిద్ధపడుతుంది. దుర్గగుడికి వెళ్ళే నెపంతో బయలుదేరుతూ తోబుట్టువులను చుట్టూ కూర్చోబెట్టుకుని అప్పగింతలు చెబుతుంది. ఆ సందర్భంలో పై మాట అంటుంది.

ఏళ్ల తరబడి మన మధ్య గడిపిన రక్తబంధువులు హఠాత్తుగా తిరిగిరాని లోకాలకు తరలిపోయి కనుమరుగు కావడం ఆదిమదశనుంచీ మనిషిలో విషాదాన్ని గిలకొట్టుతూనే వచ్చింది. వారి స్మృతిని సజీవం, చిరంజీవం చేసే ఆలోచనలు అప్పుడే పుట్టాయి. అందులో భాగంగానే పితృదేవతలు అనే భావనా, పితృకర్మలూ విశ్వాసంలో భాగమయ్యాయి. ప్రపంచ పురాణగాథల కెక్కాయి. రక్తబంధువులందరూ ఏకశరీరంగా జీవించిన గణసమాజంలో ఈ విషాదవిశ్వాసాలు మరింత బలీయంగా ఉంటాయి. లిపి ఏర్పడని, లేదా లిఖిత సంప్రదాయం వేళ్లూనుకోని కాలంలో గణబంధువుల జ్ఞాపకాలను, చరిత్రను తరం నుంచి తరానికి అందించే బాధ్యతను మనిషి గళమే నిర్వహించింది. అలా అందించడం ఒక వ్యవస్థగా అభివృద్ధి చెందింది. ఇది ఏ ఒక్కచోటో కాదు, ప్రపంచమంతటా జరిగింది.

పైన పేర్కొన్న గురజాడ పంక్తిలోని విషాదం గణహృదయపు లోతుల్లోంచి పలుకుతున్న విషాదంలా నాకు అనిపిస్తూ ఉంటుంది. గణసమాజపు నుడికారం గురజాడ రచనల్లో ఎక్కువగా కనిపిస్తుందని  రాంభట్ల కృష్ణమూర్తి అనేవారు. కన్యాశుల్కం నుంచి అనేక ఉదాహరణలు ఎత్తి చూపేవారు.

అదలా ఉంచి ప్రస్తుతానికి వస్తే, నలుగురూ కూర్చుని తమ పూర్వీకులను స్మరించుకునే గణ సంప్రదాయం రూట్స్ రచనలో రెండువందల ఏళ్ల క్రితం నాటి వంశ మూలాలను, మూలస్థానాన్ని కనిపెట్టే ఉత్కంఠభరిత ప్రయత్నానికి దారితీయించింది. స్థూలంగా కథ ఇదీ:  కుంటా కింటే అనే నల్లజాతి యువకుడు పశ్చిమ ఆఫ్రికాలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందినవాడు.  అతడు ఓ రోజున గిటార్ లాంటి వాయిద్యాన్ని తయారుచేసుకోడానికి కలప కోసం అడవికి వెళ్ళాడు. హఠాత్తుగా కొంతమంది అతనిపై దాడి చేసి వలేసి పట్టుకుని గొలుసులతో బంధించి ఓడలో అట్లాంటిక్ మీదుగా అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి తీసుకుపోయారు. అక్కడ మాసా జాన్ వేలర్ అనే తోటల యజమానికి బానిసగా  అమ్మేశారు. అతను కుంటా కింటేకు టోబీ అని పేరుపెట్టాడు. కుంటా కింటే తప్పించుకుని పారిపోవడానికి నాలుగుసార్లు విఫల యత్నం చేశాడు. అతనింక ఆ ప్రయత్నం చేయకుండా ఒక పాదాన్ని నరికేసారు. వైద్యవృత్తిలో ఉన్న వేలర్ సోదరుడు విలియం వేలర్ కొంత మానవత్వం ఉన్నవాడు. అతడు సోదరుడి చర్యను గర్హిస్తూ కుంటా కింటేకు వైద్యం చేసి అతడి ప్రాణాలు కాపాడాడు. సోదరునినుంచి తనే అతణ్ణి కొనుక్కుని గుర్రపు బండి నడపడానికి నియోగించాడు. తను ఏ విధంగానూ తన జన్మస్థానానికి వెళ్లలేనని గ్రహించిన కింటే పరాయి నేలలో ప్రవాసజీవితంతో క్రమంగా రాజీపడ్డాడు.

విలియం ఇంట్లో వంటమనిషిగా ఉన్న మరో బానిస బెల్ ను అతను పెళ్లి చేసుకున్నాడు. వారికి కూతురు పుట్టింది. ఆమెకు కిజ్జీ అని పేరుపెట్టారు. ఆమెకు వయసు వచ్చాక  మాసా లీ అనే మరో బానిస యజమానికి విలియం అమ్మేశాడు. మాసా లీ బలాత్కారంగా తనను అనుభవించడంతో కిజ్జీ గర్భవతి అయింది. ఆమెకు కొడుకు పుట్టాడు. అతని పేరు చికెన్ జార్జి. అతను పెరిగి పెద్దయ్యాక మటిల్డా అనే మరో బానిసను పెళ్లిచేసుకున్నాడు. అతని మూడో కొడుకు టామ్. అతనికి ఇరేన్ అనే అమ్మాయితో పెళ్లయింది. వారి కుమార్తెలలో ఒకరైన సింథియాకు విల్ పామర్ అనే అతనితో  వివాహం జరిగింది. వారి కూతురు బెర్తా, సైమన్ అలెగ్జాండర్ హేలీ అనే అతన్ని పెళ్లిచేసుకుంది. వారి కొడుకే రూట్స్ రచయిత ఎలెక్స్ హేలీ. కుంటా కింటేనుంచి అతనిది ఏడో తరం.

ఏడువందల పుటల ఉద్గ్రంథంలోని కథను పది పదిహేను వాక్యాలలో సంక్షేపించడం నిజానికి ఆ రచనకు తీరని అన్యాయం చేయడమే. సొంత మూలాలనుంచి వేరుపడి ఒక మహా సముద్రానికి ఆవల తమది కాని నేలపై తమది కాని భాషా సంస్కృతుల మధ్య బానిసజీవితం గడిపిన ఒక జాతి దుఃఖ విషాదాలకు అద్దంపట్టే రూట్స్ కు ఒక ఇతిహాసానికి ఉండే లక్షణాలు అన్నీ ఉన్నాయి. రెండువందల ఏళ్ళకు విస్తరించిన ఆ కథాగమనంలో అనేక మలుపులున్నాయి, మెరుపులున్నాయి. కరుణ భీభత్స భయానకాది రసాలను ఆవిష్కరించే ఘట్టాలు ఉన్నాయి.  సొంత అస్తిత్వాన్ని కోల్పోయి పరాయి అస్తిత్వంలో అనామకంగా కలిసిపోయిన ఒక జాతి పరిణామచరిత్ర ఉంది. మనిషిని పశువుగా, ఆస్తిగా పరిగణించి అతని పేగు బంధాన్ని నిర్దాక్షిణ్యంగా తెంచేసి ఇంకొకరికి అమ్మేసే బానిసవ్యవస్థలో చివరికి యజమానికీ బానిసకూ ఉన్న రక్తసంబంధాన్ని కూడా కాలరాసే కర్కశత్వం ఎంతగా రూపుకట్టిందో రూట్స్ చెబుతుంది. విచిత్రమేమిటంటే, దీని సామ్యాలు బానిసత్వం లేదా అర్థ బానిసత్వం కొనసాగిన మనదేశంతో సహా అనేక దేశాల బానిసవ్యవస్థలలో ఉన్నాయి. ఆసక్తికరమైన ఆ చర్చను మరో సందర్భానికి వాయిదా వేసి ప్రస్తుతానికి వద్దాం.

యజమాని పెట్టిన పెట్టుడు పేరును నిరాకరించిన కుంటా కింటే తన ఆఫ్రికన్ వారసత్వాన్ని కూతురు కిజ్జీకి అందించడానికి ప్రయత్నిస్తాడు. తన పేరుతోపాటు కొన్ని ఆఫ్రికన్ పదాలను ఆమెకు నేర్పుతాడు. ఉదాహరణకు, వర్జీనియాలో ప్రవహించే మట్టపోని అనే నదిని చూపించి ‘కాంబీ బొలోంగో’ అంటాడు. గిటార్ లాంటి ఒక వాయిద్యాన్ని చూపించి ‘కో’ అంటాడు. ఆ మాటలు రెండువందల ఏళ్లపాటు తరం నుంచి తరానికి అందుతూ ఉంటాయి. కిజ్జీ తన కొడుకు చికెన్ జార్జికి తాత, అమ్మమ్మల పేర్లు; తండ్రి తనకు చెప్పిన ఆఫ్రికన్ పదాలు అందిస్తుంది. తమ కుటుంబంలో బిడ్డ పుట్టిన ప్రతిసారీ కుటుంబ సభ్యులందరూ కూర్చుని కుంటా కింటేను, ఆ వంశం లోని మిగిలినవారిని తలచుకోవడం;  కుంటా కింటే అందించిన ఆఫ్రికన్ పదాలను గుర్తుచేసుకోవడం ఒక ఆనవాయితీగా మారుతుంది. ఇవే పేర్లు, పదాలు ఏడో తరానికి చెందిన రచయిత హేలీకి కూడా అందుతాయి. చిన్నప్పుడు టెన్నేస్సీ రాష్ట్రంలోని హెమ్మింగ్ పట్టణంలో తమ ఇంటి వసారాలో కూర్చుని అమ్మమ్మ సింథియా, మరికొందరు స్త్రీలు చెప్పుకునే  ముచ్చట్లనుంచి ప్రవహించిన ఆ పదాలు అతడు పెద్దయిన తర్వాత కూడా గుర్తుండిపోయాయి.

roots-vol-i-DVDcover

హేలీ తన పదిహేడో ఏట, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యు.ఎస్. తీర రక్షక దళంలో వంటశాలలో సహాయకుడిగా  నియమితుడయ్యాడు. ఓడలో ప్రయాణించేటప్పుడు తీరిక సమయంలో రచనాభ్యాసం చేస్తూ క్రమంగా రచయితగా మారాడు. ఇరవయ్యేళ్ల తర్వాత ఉద్యోగం మానేసి రచననే పూర్తికాలవృత్తిగా చేసుకున్నాడు. రీడర్స్ డైజెస్ట్ లాంటి మ్యాగజైన్లు అతనికి రాత పనులు అప్పగించాయి. అలాంటి సందర్భంలోనే అతనొకసారి లండన్ వెళ్ళాడు. అక్కడ ప్రతిచోటా కనిపించే చారిత్రక సంపద చూసి ముగ్ధుడయ్యాడు. ఒక రోజు బ్రిటిష్ మ్యూజియంకు వెళ్ళి అక్కడ ‘రొసెట్టా శిల’ ను చూశాడు. ఎందుకో అది నా కళ్లను కట్టి పడేసిందని అతను అంటాడు. అప్పటికప్పుడు మ్యూజియం లైబ్రరీలో దాని గురించి రాసిన పుస్తకం సంపాదించి చదివేశాడు.

ఈజిప్టులో నైలు నదీతీరంలో దొరికిన ఆ శిలపై మూడు వేర్వేరు లిపుల్లో చెక్కిన అక్షరాలు ఉన్నాయి. మొదటివి తెలిసిన గ్రీకు అక్షరాలు . రెండోవి ఒక అజ్ఞాతలిపిలో ఉన్నాయి. మూడోవి ప్రాచీన చిత్రలిపిలో ఉన్నాయి. జీన్ చంపోలియన్  అనే ఒక ఫ్రెంచి పండితుడు తెలిసిన గ్రీకు అక్షరాలతో మిగతా రెండు లిపుల్లోని ఒక్కొక్క అక్షరాన్నే పోల్చి చూసి ఆ మూడు  రకాల అక్షరాలూ ఒకే విషయం చెబుతున్నాయని తేల్చాడు. ఆవిధంగా మానవాళి పురాతన చరిత్రను నమోదు చేసిన చిత్రలిపిని అతను ఛేదించగలిగాడు.

అలా గతం తలుపులు తెరచిన ఆ తాళంచెవి తనను మంత్రముగ్ధం చేసిందనీ, దాంతో తనకు ప్రత్యేక వ్యక్తిగత సంబంధం ఏదో ఉన్నట్టు అనిపించిందనీ, అయితే ఆక్షణంలో అది ఎలాంటిదో పోల్చుకోలేకపోయాననీ హేలీ  అంటాడు. న్యూయార్క్ కు తిరిగివెడుతూ విమానంలో కూర్చుని ఉండగా అతనికి ఒక ఊహ తట్టింది. ఆ ఫ్రెంచి పండితుడు, తెలిసిన గ్రీకు అక్షరాల సాయంతో ఛేదించిన ఆ అజ్ఞాత లిపులకూ; తన చిన్నప్పుడు హెన్నింగ్ లో తమ ఇంటి వసారాలో కూర్చుని అమ్మమ్మ సింథియా, మిగతా ఆడవాళ్ళు చెప్పుకున్న మౌఖికచరిత్రనుంచి దొర్లిన విచిత్ర, అజ్ఞాత ఆఫ్రికన్ పదాలకూ చూచాయగా ఏదో పోలిక కుదిరిందనిపించింది. వాటి గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు. విమానం న్యూయార్క్ లో దిగబోతూ గాలిలో చక్కర్లు కొడుతున్న సమయానికి ఆ ఆలోచనలకు ఒక స్పష్టత వచ్చింది.   ఆ పదాలు నిర్దిష్టంగా ఏ ఆఫ్రికన్ భాషకు చెందినవి, ఆ భాషను కనిపెట్టగలమా అన్న ప్రశ్నలు అతని ముందు వేళ్లాడసాగాయి.

అక్కడినుంచి హేలీ చేసిన ప్రయత్నాలు అడుగడుగునా ఆసక్తిరేపే అపరాధపరిశోధక నవలను తలపిస్తాయి. చివరికి తన పూర్వీకుడు కుంటా కింటే జన్మస్థలాన్ని వెతుక్కుంటూ వెళ్ళి, రెండువందల ఏళ్లక్రితం ఆగిపోయిన అతని పూర్వచరిత్రను ఒక గాథికుని నోట ప్రత్యక్షంగా వినడం ఈ ఉత్కంఠభరిత గాథలో పతాక సన్నివేశం. దాని గురించి తర్వాత.

–కల్లూరి భాస్కరం

 

 

 

తాత ముత్తాత పేరేమిటి?!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

తాత ముత్తాత పేరేమిటి?!

మీ తాత ముత్తాత పేరేమిటి?!

మీ వంశవృక్షం గురించి మీకు ఎంత తెలుసో పరీక్షించడం కోసం ఈ ప్రశ్న వేశానని దయచేసి అపార్థం చేసుకోకండి. మా తాత ముత్తాత(అంటే మా తాతగారి ముత్తాత అన్నమాట) పేరు నాకు తెలియదని చెప్పడానికే ఇలా ప్రారంభించాను. నాలానే ఈ దేశంలో చాలామందికి తాత ముత్తాత పేరు తెలిసి ఉండదని నేను అనుకుంటున్నాను. తన పుట్టినతేదీ ఏమిటో చెప్పలేని వాళ్ళు కూడా ఈ దేశంలో చాలామందే ఉన్నారు. బహుశా మీకు కూడా అలాంటివారు తారసపడే ఉంటారు.

మా తాత ముత్తాత పేరు నాకు తెలియదన్న వాస్తవం గుర్తొస్తే  సిగ్గుతో చితికి పోతూ ఉంటాను.  ఈ దేశం వేల సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, సాహిత్యం ఉన్న ఒక గొప్ప దేశమనీ; ఈ సంపదకు నేను వారసుడిననే భావన  ఆ క్షణాలలో ఒక పెద్ద మిథ్యగా నాకు అనిపిస్తుంది. ఈ దేశం నాకు ఏదీ కానట్టు, వేళ్ళు తెగిపోయిన ఒక చెట్టులా నేను శూన్యంలో వేలాడుతున్నట్టు అనిపిస్తుంది. తాత ముత్తాత పేరు (అంటే కనీసం అయిదు తరాలు) కూడా తెలియని వాళ్ళం  ఈ దేశం నాదని ఎలా గర్విస్తామో, వేల సంవత్సరాల ఈ దేశ గతంపై హక్కు ఎలా చాటుకుంటామో నాకు అర్థం కాదు.

ఈ నేల అనే చెట్టుతో మన బతుకులనే తీగలు గాఢంగా అల్లుకున్నాయనడానికి తాత ముత్తాత పేరు తెలియడం ఒక సాక్ష్యం అని నేను భావిస్తాను.

అదృష్టం కొద్దీ మనకు మన తాత పేరు, ముత్తాత పేరు తల్లిదండ్రుల ద్వారా తెలుస్తాయి. ఆపైన తద్దినం తంతు వారి పేర్లను విధిగా గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. అయితే, మన తాత ముత్తాత ఎవరో అదీ చెప్పదు. తద్దినంలో మనం ముగ్గురికే పిండప్రదానం చేస్తాం. తండ్రి-తాత-ముత్తాత. అలాగే, తల్లి-నాయనమ్మ-ముత్త నాయనమ్మ. తండ్రిని వసురూపంలో, తాతను రుద్ర రూపంలో, ముత్తాతను ఆదిత్యరూపంలో తద్దినం మంత్రాలు పేర్కొంటాయి. పద్ధతిగా తద్దినాలు పెట్టని  కులాలలో, కుటుంబాలలో ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటే తప్ప తాత ముత్తాతల పేర్లు కూడా గుర్తుండే అవకాశం లేదు.

మా తాతగారి గురించి నాకు కొంత తెలుసు. అది కూడా స్పష్టాస్పష్టంగా. ఆయన మంచి రంగులో ఉండేవాడట. మేము వైదికులమైనా మాకు కరణీకం ఉండేది. మా తాతగారు హాస్యప్రియుడు. కొంటె కోణంగి అనేవారు. ఇంటిముందు ప్రత్యేకంగా నిర్మించిన కచేరీ సావిట్లో కూర్చుని వీధిలో వచ్చి పోయేవారిని ఆట పట్టిస్తూ, వాళ్ళకీ వీళ్ళకీ ముడులు పెడుతూ ఉండేవాడట. ఆయన రసికత గురించి కూడా చాలా కథలున్నాయి. ఆయన చనిపోయేనాటికి మా నాన్నగారి వయసు పన్నెండేళ్లే.  ఎప్పుడైనా వాళ్ళ నాన్న గురించి ఆయన గొప్పగా చెప్పడం ప్రారంభిస్తే మా అమ్మ అడ్డు తగిలి ఆయన రసికపురాణం గుంభనంగా విప్పుతూ ఉండేది. ఆయన  వడ్డిగూడెం ‘పరిచయాలు’ ప్రస్తావనకు వస్తుండేవి. మా తాతగారు మా పక్క ఊళ్ళో ఒకామెచేత  ‘సంతానవ్రతం’ చేయిస్తే ఆమెకు సంతానం కలిగిన సంగతిని నర్మగర్భంగా చెప్పి మా అమ్మ ఆట పట్టిస్తూ ఉండేది. నాన్నగారు ముసి ముసి నవ్వులతోనే చికాకు ప్రదర్శిస్తూ సంభాషణకు తెరదించేవారు.

విశేషమేమిటంటే, చిన్నప్పుడు ఏమీ అర్థంకాని వయసునుంఛీ అమ్మ నోట వింటూ వచ్చిన ఆ పేరుగల మనిషిని పెద్దయ్యాక నేను చూసే అవకాశం కలగడం! ఏదో పని మీద ఆ ఊరికి వెళ్లినప్పుడు ఆ ఇంటికి వెళ్ళాను. తొంభై ఏళ్ళు దాటిన వయసులో ఆమె మంచం మీద ఉంది. నేను ఫలానా అని చెప్పేసరికి ఆమె కళ్ళల్లో ఏదో వెలుగు  తళుక్కుమంది. నా చెయ్యి అందుకుని మంచం మీద తన పక్కన కూర్చొబెట్టుకుంది. కన్నీళ్ళు పెట్టుకుంటూ మా నాన్న గురింఛీ, బాబయ్యల గురించీ పేరు పేరునా అడిగింది. ఏ నాటి జ్ఞాపకాలు కన్నీళ్ళ రూపంలో అలా ఉబికి వచ్చాయోనని ఆ దృశ్యం గుర్తొచ్చినప్పుడల్లా నాకు అనిపిస్తుంది.

భమిడిపాటి కామేశ్వర రావు గారు

భమిడిపాటి కామేశ్వర రావు గారు

మా తాతగారికి  హాస్యప్రవృత్తి  ఎవరి నుంచి సంక్రమించిందో, దాని వెనుక నున్న జన్యుచరిత్ర  ఏమిటో నాకు తెలియదు. ఆ జన్యు లక్షణమే హాస్యబ్రహ్మ బిరుదుతో భమిడిపాటి కామేశ్వరరావు అనే రచయితను సృష్టించిందని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. భమిడిపాటి కామేశ్వరరావుగారి తల్లి మన ఇంటి ఆడబడుచు అని నాన్నగారు చెబుతుండేవారు. నా చిన్నప్పుడు భమిడిపాటి కామేశ్వరరావుగారి భార్యకూ మా నాన్నగారికి మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతూ ఉండేవని జ్ఞాపకం. మా నాన్నగారు ఆకివీడు(పశ్చిమ గోదావరి జిల్లా)వెళ్లినప్పుడు ఆమెను చూసి వస్తూ ఉండేవారు. కామేశ్వరరావు గారి కొడుకు, ప్రసిద్ధ నాటక, సినీ రచయిత రాధాకృష్ణ.  మా నాన్న, బాబయ్య ఎప్పుడైనా చెన్నై వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెడితే నెత్తిన పెట్టుకునేవాడు. ఆయనకు జ్యోతిష్యంలో ప్రవేశం ఉండేది. జాతకచక్రాలు వేసి ఇచ్చేవాడు. ఆయనకు మా కుటుంబంతో వియ్యమందాలని ఉండేది. కానీ ఎందుకో అది సాధ్యపడలేదు.

మళ్ళీ రాధాకృష్ణగారికీ హాస్యవారసత్వం ఉంది. ఆయన రాసిన ‘కీర్తిశేషులు’ నాటకంలో కవిగారి అన్న, తాగుబోతు అయిన మురారికీ; గంప శంకరయ్య అనే పాత్రకూ మధ్య జరిగిన ఒక సంభాషణ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే హాస్యగుళిక. గంప శంకరయ్య కవికి సన్మానం చేస్తానంటూ వస్తాడు. మక్కికి మక్కి కాకపోయినా ఆ సంభాషణ మొత్తంమీద ఇలా సాగుతుంది:

మురారి: ఓహో, అలాగా! అయితే, మీది సన్మానాల వ్యాపారం అన్నమాట?

గంప శంకరయ్య: భలేవారండీ. నాకు పొలం పుట్రా గొడ్డు గోదే ఉన్నాయండీ!

మురారి: అయితే ఇంకేం, బాగా లాభాలు గడించారన్నమాట!

ఇక మా ముత్తాతగారి గురించి ఒకే ఒక్క విషయం తప్ప ఇంకేమీ తెలియదు. మా అమ్మగారి తండ్రి కూడా మా ఇంటి మరో ఆడబడుచు కొడుకు. వారిది నిడదవోలు దగ్గర పురుషోత్తపల్లి. ఇంటిపేరు ఈమనివారు. మా అమ్మ తండ్రి కడుపులో ఉన్నప్పుడు మా ముత్తాతగారు పురిటిమంచం నెత్తిన పెట్టుకుని పొద్దుటే చీకటితోనే మా ఊరు ప్రక్కిలంకలో బయలుదేరి గోదావరి గట్టు వెంబడే కొవ్వూరు, వాడపల్లి, మద్దూరు మీదుగా మధ్యాహ్నానికి పురుషోత్తపల్లి చేరుకున్నారట. దాదాపు నలభై కిలోమీటర్ల దూరం.  ఆయన మోసుకెళ్లింది నిజానికి పురిటి మంచం కాదు, దాదాపు ప్రపంచవ్యాప్తంగా వేల సంవత్సరాలు కొనసాగిన గణవ్యవస్థా వారసత్వం. గణవ్యవస్థలో  స్త్రీ పోషణ, బాగోగుల బాధ్యత భర్తది కాదు; పుట్టింటిది, అంటే అన్నదమ్ములది.

బహుశా తన నాయనమ్మ నుంచి మా అమ్మకీ హాస్యజన్యువు సంక్రమించినట్టుంది. ఆమెలోనూ హాస్యధోరణి ఉండేది. మొత్తంమీద మా ఇంట్లో ఆడా, మగా అందరికీ హాస్యం జీవలక్షణంగా మారింది.

మా ముత్తాతనుంచి ఇంకా వెనక్కి వెడితే అంతా శూన్యం. ఎవరి గురించీ ఏమీ తెలియదు. ఎంత చరిత్ర, ఎన్ని విశేషాలు, ఎన్ని ఆకర్షణీయ వ్యక్తిత్వాలు కాలగర్భంలో సమాధి అయిపోయాయో తెలియదు. తాత, ముత్తాతల గురించి తెలిసింది కూడా అంతంత మాత్రమే. ఇలా నా వంశ చరిత్రాశూన్యత నిలువునా వెక్కిరిస్తూ నాలో ఒక శూన్యాన్ని నింపిన ఘడియల్లో ఈ దేశం గురించీ, ఈ దేశ వారసత్వం గురించీ చెప్పే గొప్ప గొప్ప మాటలన్నీ నాకు అబద్ధాలుగా ధ్వనిస్తాయి. అఘాయిత్యాలుగా తోస్తాయి.

రెండు తరాల చరిత్ర కూడా తెలియని మన చారిత్రకదారిద్ర్యం అలా ఉండగా, ఒక ఆఫ్రో-అమెరికన్ రచయిత కొన్ని ప్రత్యేకపరిస్థితులలో తన వంశమూలాలు వెతుక్కుంటూ వెళ్ళి ఒక అత్యద్భుత గ్రంథాన్ని రచించాడు. అతని పేరు ఎలెక్స్ హేలీ. ఆ పుస్తకం పేరు ‘రూట్స్’. తెలుగులో సహవాసి అనువాదంతో ‘ఏడు తరాలు’ పేరుతో వెలువడిన ఆ రచన పాఠకులకు సుపరిచితమే. తెలిసిన రచనే అయినా దాని గురించి నేను ప్రస్తావించడానికి నా అధ్యయన సంబంధమైన ప్రత్యేక కారణాలు ఉన్నాయి. వాటి గురించి తర్వాత.

 – కల్లూరి భాస్కరం

 

చరిత్రే అన్నిటినీ మించిన ఉత్కంఠభరితమైన కథ!

“నాకు కథ అంటే చాలా ఇష్ట”మని అన్నాననుకోండి, “కథ అంటే ఎవరికి ఇష్టం కా”దని మీరు వెంటనే అనచ్చు. నిజమే, కథ అంటే ఇష్టపడని వారు ఉండరు. కనుక, చిన్నపాటి ఆత్మకథకు ఉపక్రమణికగానే ఈ వాక్యాన్ని తీసుకోవాలి. అలాగని దీనిని ఆత్మకథగానూ  తీసుకోవద్దని మనవి.

కథ అంటే నాకు ఎంత ఇష్టమంటే, నన్నయభట్టు తనతో రాజరాజనరేంద్రుడు అన్నట్టుగా చెప్పిన ఈ పద్యం నాకు తరచు గుర్తొస్తుంటుంది.:
ఇవి యేనున్ సతతంబు కరం బిష్టంబులై యుండు బా
యవు భూదేవుకులాభితర్పణ మహీయఃప్రీతియున్ భారత
శ్రవణాసక్తియు బార్వతీపతి పదాబ్జ ధ్యాన పూజామహో
త్సవమున్ సంతత దానశీలతయు శశ్వత్సాధుసాంగత్యమున్

అయిదు విషయాలు నాకు చాలా ఇష్టమైనవంటూ, రాజరాజనరేంద్రుడు అవేమిటో చెప్పాడు. వివాదాస్పదమైన మొదటి దానినీ, మరో మూడింటినీ అలా ఉంచితే ఆయన తనకు ఇష్టమైన వాటిలో భారతశ్రవణాసక్తి ఒకటన్నాడు. నాకెందుకో ఆ మాటను నన్నయ యథాలాపంగా ఉపయోగించి ఉండడనిపిస్తూ ఉంటుంది. ఇంగ్లీష్ లో infatuation, passion, obsession;  తెలుగులో తమకం , మోహం(నిజానికి తెలుగు మాటలేవీ నాకు సంతృప్తి కలిగించలేదు)వగైరా మాటలతో  చెప్పుకునే వల్లమాలిన ఆసక్తి భారతకథపై రాజరాజనరేంద్రుడికి నిజంగానే ఉండేదేమో ననిపిస్తుంది. కథ అనగానే మనిషిలో సహజంగా ఉండే చెవికోసుకునే గుణాన్నే ఆ మాట సూచిస్తోందేమో.

కథ నాకు ఇష్టమన్నానా… అందులోనూ అపరాధపరిశోధక కథలన్నా, కొసమెరుపు కథలన్నా, మానవస్వభావంలోని వైచిత్రిని ఆశ్చర్యస్ఫోరకంగా చిత్రించే కథలన్నా మరీ ఇష్టం. కథ అంటే అంత ఇష్టపడే నేను ఎన్ని కథలు రాశానని మీకు  సందేహం కలగచ్చు. పట్టుమని పది కూడా ఉన్నట్టు లేవు. నేను లెక్క పెట్టలేదు. అసందర్భం అనుకోకపోతే చిన్న ముచ్చట. గోదావరిగట్టునే ఉన్న మా ఊళ్ళో ఓ రోజున, రోజంతా నాకు ఎంతో ఇష్టమైన మపాసా కథలు చదువుతూ క్రమంగా ఒకవిధమైన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను. గాలిలో తేలిపోతున్నట్టు అనిపించింది. ఒక ఆహ్లాదకరమైన అస్థిమితం నన్ను ఆవరించింది. సాయంత్రమయ్యేసరికి అది తార స్థాయికి వెళ్లింది. క్షణం కూడా ఇంట్లో ఉండలేననిపించింది. పుస్తకం పక్కన పెట్టి సైకిలు మీద గోదావరి గట్టు మీదికి బయలుదేరాను. ఒక గమ్యం అంటూ లేకుండా యాంత్రికంగా సైకిలు తొక్కుతూ కొంత దూరం వెళ్లిపోయాను. అప్పుడు నాకో కథ స్ఫురించింది. కొన్ని రోజులు మనసులో నానిన తర్వాత దానిని కాగితం మీద పెట్టాను. అప్పుడే ఆంధ్ర సచిత్రవార పత్రిక దీపావళి కథల పోటీ ప్రకటించింది. నా కథను పోస్ట్ చేయడానికి వెడుతుంటే ఒక మిత్రుడు నాతో వచ్చాడు. కవరు మీద స్టాంపులు అంటిస్తూ, “ఈ కథకు బహుమతి వస్తుంది” అన్నాను. వచ్చింది. ఆ కథ పేరు ‘దూరం’. ఇది జరిగింది ఎనభైదశకం ప్రారంభంలో.  చిన్న వివరణ: ఆ కథ మపాసా కథలు వేటికీ కాపీ కాదు.
ఆ తర్వాత మరో అనుభవం ఎదురై ఉండకపోతే బహుశా నేను కథారచనకు ‘దూరం’ అయేవాణ్ణి కాదేమో ననిపించినా, ఆ మాట కచ్చితంగా చెప్పలేను. ఇప్పుడాలోచిస్తే అందువల్ల నాలో ఎలాంటి విచారమూ లేదు. ఎందుకంటే, కల్పన కన్నా అద్భుతమైన కథాప్రపంచంలోకి ఆ అనుభవం నన్ను తీసుకెళ్లింది. ఓరోజు హైదరాబాద్, చిక్కడపల్లి కేంద్రగ్రంథాలయంలో పుస్తకాలు గాలిస్తుంటే డీ.డీ. కోశాంబి రాసిన Myth and Reality కనిపించింది. అందులో కొన్ని పురాణాసంబంధమైన రేఖాచిత్రాలు, చరిత్ర సంబంధమైన ఫోటోలు ఉన్నాయి. చదువుతూ ఉండిపోయాను. ‘చకచ్చకిత’ స్థితి అంటారే, అలాంటి స్థితిలోకి జారిపోయాను. ఆశ్చర్యం, ఉద్విగ్నత లాంటి అనేకానేక అనుభూతులు ఒక్కసారిగా కమ్ముకున్నాయి. పురాణకథకూ, వాస్తవికతకూ; మరీ ముఖ్యంగా పురాణకథకూ, చరిత్రకూ మధ్య అడ్డుగీతలు చెరిగిపోతూ కళ్ళముందు ఒక అద్భుత స్వాప్నిక ప్రపంచం ఆవిష్కృతం కావడం ప్రారంభించింది. అంతవరకు కల్పనగా కనిపించిన పురాణపాత్రలు రక్తమాంసాలు నిండిన మన లాంటి వాస్తవిక వ్యక్తుల్లా కనిపించ సాగాయి. అనేక నమ్మకాలు, స్థిరాభిప్రాయాలు కూకటివేళ్ళతో కూలి పోవడం ప్రారంభించాయి.

కొన్ని రోజులపాటు నేను మామూలు మనిషిని కాలేకపోయాను. నడుస్తున్నా గాలిలో తేలిపోతున్న అనుభవం. నిజానికి ఇప్పటికి కూడా నేను మామూలు మనిషినయ్యానని చెప్పలేను. కోశాంబిని మొదట చదివినప్పుడు కలిగిన మానసికస్థితిలోనే ఇప్పటికీ ఉన్నాను. ఇది జరిగింది కూడా ఎనభై దశకం ప్రారంభంలో.
బహుశా ఒక ప్రత్యేక కారణం వల్ల కోశాంబి నాలో ఇంత సంచలనం కలిగించాడని నేను అనుకుంటాను(నా ఊహ తప్పైనా కావచ్చు. కోశాంబిని చదివిన అందరిలోనూ ఇదే సంచలనం కలిగి ఉండచ్చు). ఆ కారణం ఏమిటంటే, పురాణం మా ఇంటి విద్య. నేను పురాణ, రామాయణ, మహాభారతకథల మధ్య పెరిగాను. మా నాన్నగారు అష్టాదశపురాణాలను తెలుగులోకి అనువాదం చేసిన కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు. సంస్కృత, ఆంధ్రాలలో కవిత్వం చెప్పినవారు. దేవీ నవరాత్రులలో రామాయణ ప్రవచనం చేసేవారు. ముఖ్యంగా పురాణాలపై పరిశోధన చేసినవారు.  నేను ఒకవిధంగా మా నాన్నగారికి ఆధునికరూపాన్ని. మా పినతండ్రి వీరభద్రశాస్త్రిగారు పౌరాణికులుగా ప్రసిద్ధులు. భాగవతంలో నిష్ణాతులు.
కోశాంబిని  నా పురాణ, ఇతిహాసపరిజ్ఞానానికి అన్వయించుకోవడం, నాకుగా నేను సరికొత్త అన్వయాలను వెలికి తీయడం ఎనభై దశకంలోనే ప్రారంభించాను. నాకూ, మా నాన్నగారికీ మధ్య సంభాషణ జరుగుతూ ఉండేది. ఆయన సాంప్రదాయిక పరిజ్ఞానంతో నా ఆధునిక అవగాహనను బేరీజు వేసుకోడానికి ప్రయత్నించేవాడిని.

[box  title=”‘పురా’గమనం – కల్లూరి భాస్కరం కొత్త కాలమ్” color=”#333333″] Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5) మనకు వేల సంవత్సరాల చరిత్ర ఉందంటుంటాం;  కానీ అదేమిటో, ఇప్పుడే స్వయంభువులుగా పుట్టినట్టు వర్తమానంలో గిరి గీసుకుని బతికేస్తూ ఉంటామంటారు భాస్కరం కల్లూరి. ఆయన అభిప్రాయంలో మన కథలు, కావ్యాలు, అవి చిత్రించే వస్తువు లేదా సమస్యలు చాలావరకు వర్తమానం చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి. మన రాజకీయాలూ అంతే. అయిదొందల సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉన్న అమెరికన్లు తమ చరిత్రను అత్యద్భుతంగా చూపించుకుంటుంటే, వేల సంవత్సరాల చరిత్ర ఉన్నా చరిత్రశూన్యుల్లా కాలం దొర్లించే ప్రత్యేకత మనదేనేమో నంటారాయన.

“ఒక్కసారి గతమనే గవాక్షం తెరవండి, మీ ముందు మీకు తెలియని అద్భుతప్రపంచం పరచుకుంటుంది. కాలం వెంబడి నడచివచ్చిన మన అడుగుజాడలు అందులో కనిపిస్తాయి. మన నమ్మకాలను, నిశ్చితాభిప్రాయాలను తలకిందులు చేసి షాకిచ్చే గుప్తసత్యాలు ఎన్నో బహిర్గతమవుతాయి. పురాణకథలు కొత్త రూపం తీసుకుంటాయి. గణం నుంచి జనంగా మారిన మన వైనాన్ని పూసగుచ్చినట్టు చెబుతా” యని ఆయన అంటారు.

చరిత్ర సంపద ఉన్నా లేమిని అనుభవించే మన విలక్షణతను గుర్తు చేస్తూ, చరిత్ర అట్టడుగున పడి కాన్పించని కథలను, విశేషాలను తడుముతూ వ్యక్తిగతస్పర్శతో భాస్కరం కల్లూరి ప్రారంభిస్తున్న కాలమ్ ఇది!  [/box] ఓ రోజు నేనో సందేహాన్ని వ్యక్తం చేశాను.
“తండ్రి తర్వాత పెద్ద కొడుకుదే రాజ్యాధికారం అంటారు కదా, చిన్న కొడుక్కి రాజ్యం అప్పగించిన ఉదాహరణలూ కనిపిస్తున్నాయి కదా?”
నాన్నగారు సాలోచనగా నా వైపు చూశారు.
“మహాభారతంలో యయాతి తన చిన్నకొడుకు పూరునికి రాజ్యం ఇచ్చాడు. ప్రతీపుడు పెద్దకొడుకు దేవాపిని కాకుండా చిన్నకొడుకు శంతనుని రాజును చేశాడు. కారణం ఏదైనా శంతనుని పెద్ద కొడుకు భీష్మునికి బదులు చిన్నకొడుకు విచిత్రవీర్యుడు రాజయ్యాడు. కురుపాండవులలో పెద్ద అయిన ధర్మరాజుకు, చిన్న అయిన దుర్యోధనుడికి మధ్య రాజ్యాధికారవివాదం ఏకంగా కురుక్షేత్రయుద్ధానికే దారితీసింది. పెద్దకొడుకైన రామునికి బదులు తన కొడుకు భరతుని రాజును చేయమని కైక దశరథుని అడగడం, రాముడి కథను మహాకావ్యంగా మలుపుతిప్పింది.” అన్నాను.
“ధర్మశాస్త్రాల ప్రకారం తండ్రి తర్వాత పెద్ద కొడుకుదే రాజ్యాధికారం. చిన్న కొడుకు రాజైతే దానిని మినహాయింపుగానే చూడాలి తప్ప సార్వత్రిక నియమంగా చూడకూడదు” అని నాన్నగారు అన్నారు.
“చిన్నకొడుకు రాజైన ఘటనలు ఉన్నప్పుడూ, కొడుకుల మధ్య అధికారవివాదం ఘర్షణ సృష్టించినప్పుడూ వాటిని మినహాయింపులుగా ఎందుకు చూడాలి? సార్వత్రిక నియమంగా ఎందుకు చూడకూడదు?” అన్నాను.
నాన్నగారికి ఆ ప్రశ్న అర్థవంతంగానే కనిపించినట్టుంది. కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయి, తర్వాత అన్నారు:
“వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ‘మహాభారతతత్త్వకథనం’ ఒకసారి చూడు. అందులో నీ సందేహానికి సమాధానం దొరకచ్చు”.
అందులో కచ్చితంగా సమాధానం దొరకదని నాకు అనిపించింది. సంప్రదాయపండితులకు అలాంటి సందేహం కలిగే అవకాశం లేదని నా నమ్మకం.  నాన్నగారితో ఆ మాట అనకుండా అప్పటికి మౌనం వహించాను.

rajasthani_phad_painting_pb40

కొన్ని రోజుల తర్వాత చిక్కడపల్లి గ్రంథాలయంలోనే రొమీలా థాపర్ రచించిన పుస్తకం ఒకటి కనిపించింది. అందులో మహాభారత వంశానుక్రమణిక(Genealogy of Mahabharata) గురించి ఆమె చర్చించింది. ఒక చోట నా కళ్ళు ఆశ్చర్యానందాలతో మెరిసిపోయాయి. మాతృస్వామ్యంలో చిన్న కొడుకుదే పెత్తనం అని ఆమె రాసింది.
మరోసారి అసందర్భం అనుకోకపోతే, మా నాన్నగారి గురించి మరికొంత చెప్పాలి. ఆయనలో ఒక కవీ, పౌరాణికుడు, పండితుడే కాక; కవి పండిత పౌరాణికులలో చాలా అరుదుగా కనిపించే పరిశోధకుడు, జిజ్ఞాసి ఉన్నారు. అంతకన్నా ఆశ్చర్యంగా సాంప్రదాయిక పాఠానికి సరికొత్త అన్వయాలను గుడ్డిగా నిషేధించని ఆలోచనావైశాల్యం ఆయనలో ఉండేది. కొత్త విషయం, కొత్త అన్వయం తన దృష్టికి వచ్చినప్పుడు ఆశ్చర్యాద్భుతాలను ప్రకటించే ఒక పసితనం ఉండేది. నా దగ్గర ఉన్న తెలుగు పుస్తకాలను చదివి “ఇది పూర్తిగా చదివాను. అద్భుతం, ఆశ్చర్యకరం” అని లోపలి పుట మీద రాసి సంతకం పెట్టేవారు. ఆయన దగ్గర ఎప్పుడూ ఒక అట్లాస్ ఉండేది. పురాణాలలో చెప్పిన ద్వీపాలను అందులో గుర్తించడానికి  ప్రయత్నించేవారు. సరిగ్గా మన నేలకిందే అమెరికా ఉందనే వారు.

సగరచక్రవర్తి కొడుకులు అరవై వేలమంది తండ్రి యజ్ఞాశ్వాన్ని వెదుకుతూ భూమిని తవ్వి కపిలారణ్యానికి వెళ్ళిన కథ పురాణాలలో ఉంది. ఆ కపిలారణ్యమే కాలిఫోర్నియా అని నాన్నగారు అనేవారు. పితృదేవతలు చంద్రమండలంలో ఉంటారని చెప్పేవారు. తద్దినం రోజున పిండ ప్రదానరూపంలో పితృదేవతలకు పెట్టే ఆహారాన్ని సారంగా మార్చి కొన్ని కిరణాలు వారికి అందిస్తాయనేవారు. ఇవన్నీ నిరూపణకు అందేవి కాకపోవచ్చు. కానీ తన విశ్వాసాల పరిధిలో వాటికి అర్థం చెప్పడానికి ప్రయత్నించేవారు. ఆయన సంస్కృత కళాశాల అధ్యాపకులుగా పనిచేసిన కొవ్వూరు(పశ్చిమ గోదావరి జిల్లా)లో గంధం రామారావు అనే అడ్వకేట్ ఉండేవారు. నాన్నగారి ప్రవచనాలకు, ప్రసంగాలకు ఆయన తప్పనిసరిగా హాజరయ్యేవారు. చివరిలో ఆయనను కలసి, “ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం చెప్పకుండా ఉండరు కదా!” అని అభినందించి వెళ్ళేవారు.
నా ‘జన్యులక్షణా’న్ని ఈపాటికి మీరు పోల్చుకుని ఉంటారు.
మళ్ళీ కథ దగ్గరికి వద్దాం. అపరాధపరిశోధక కథ నాకు ఇష్టమని చెప్పాను. కాలగమనంలో మన పురాణకథలు, ఇతిహాసాలు, పురాచరిత్ర, చరిత్రా అపరాధపరిశోధక కథలుగా మారిపోయాయి. కాలమనే హంతకుడు అసలు అర్థాన్ని, లేదా వాస్తవికతకు దగ్గరగా ఉండే అర్థాన్ని హత్య చేశాడు. అయితే కొన్ని క్లూలు విడిచిపెట్టి వెళ్ళాడు. ఆ క్లూలలోనే ఉంది అసలు కథ అంతా. వాటి వెంబడే వెడితే అద్భుతావహమైన నూతన కథా ప్రపంచంలోకి అడుగుపెడతాం. నేటి కథలను తిరగరాసే కొత్త కథలు అనేకం అక్కడ దొరుకుతాయి. నా ఉద్దేశంలో చరిత్ర, కథను మించిన ఉత్కంఠభరితమైన కథ!
అయితే, ఒక గమనిక: చరిత్ర అనే కథలో అద్భుతత్వాన్ని దర్శించాలంటే, భారతశ్రవణంపై రాజరాజనరేంద్రుడికి ఉన్నంత infatuation చరిత్రపై ఉండాలి. అలాగే ఒక హెచ్చరిక: ఈ infatuation కు తగిన మూల్యం చెల్లించుకోవాలి. అంటే, మీరు మ్యూజియంలోని పురావస్తువుగా మారిపోవాలి!

-భాస్కరం కల్లూరి