తేరే ఆహటే నహీ హై…

pirsigbike
“హర్ ములాకాత్ కా అంజామ్ జుదాయీ హై క్యోం, అబ్ తో హర్ వక్త్ యహీ బాత్ సతాతీ హై హమే”

 ఎడబాటు, సెపరేషన్, జుదాయీ … భాష ఏదైనా ప్రభావం ఒక్కటే, కానీ కారణాలు మాత్రం అనేకం.  మనుగడ కోసం తప్పని మార్పులూ, తెగిపోయిన స్నేహాలూ, వీడిపోయిన మోహాలూ, తప్పించుకోలేని మృత్యువూ … ఒక్కో వేదన వెనుకా ఒక్కో కారణం. అన్నిటినీ కూడా జీవిత పయనంలో ఓ భాగం అనుకుని తేలిగ్గా తీసుకోగలిగిన వాళ్ళూ ఉన్నట్టే,  ఎమోషనల్ ఎటాచ్మెంట్ సిండ్రోంతో నలిగిపోయే వాళ్ళం కూడా ఉంటాము.

ఈ చిన్నజీవితంలో ఎన్ని మజిలీలో. ఎన్ని వీడుకోళ్ళో.  జీవితంలో దశలు మారి, ఇల్లు, ఉద్యోగం, వూరు, స్నేహం … వదలాల్సింది ఏదైనా గానీ తప్పని, తప్పించుకోలేని ఒక సంధికాలం. ఊరు వదిలి, ఇల్లు వదిలి వెళుతున్నప్పుడు బెంగ. ఉన్న ఇంటి మీదా,  పెరట్లో  పెంచుకున్న పూలమొక్క మీదా, జామ చెట్టు మీది చిలక మీదా, గుడి గోపురం మీది పిచ్చుకల మీదా.. మళ్ళీ అన్నీ ఏదో ఒక రూపంలో కొత్తగా నేస్తాలవుతాయని తెలిసినా కూడా, వదులుకున్న వాటి మీదా, వదిలి ఉండాల్సిన వాటి మీదా బెంగ. రోజూ తిరిగే దార్లూ, దారి పక్క కాఫీ షాపులూ,  రోజూ నడిచే పార్క్ లోని గుబాళించే హనీ సకిల్ పొదలూ, రోజూ చూసే మనుషులూ, ప్రాణం ఉన్నవీ లేనివీ అన్నీ అలాగే ఉంటాయి, కానీ రేపటి నుండీ మనం మాత్రమే అక్కడ ఉండం అన్న బెంగ. మనం అక్కడ ఉండము అన్నదా, లేక మనం లేకపోయినా అన్నీ అలానే ఉంటాయి అన్నదా ఎక్కువ బాధ పెట్టేది అనేది నాకెప్పుడూ ఓ పెద్ద అనుమానం.

 ఎప్పటికీ విడిపోవనుకున్న స్నేహాలు వీడిపోతే బెంగ.  ప్రాణస్నేహం అనీ, ఎప్పటికీ విడిపోమనీ  మురిసిపోతాం.  కానీ కాలం ఓ మాయల మరాఠీ. అది చేసే మాయలో అన్నీ భ్రమలే అని తేలిపోతాయి. విడిపోక తప్పని పరిస్థితులు వస్తాయి. మనం వాళ్ళని ప్రతీ జ్ఞాపకానికి  ముడిపెట్టి తలుచుకుంటున్నట్టు, వాళ్ళూ మనల్ని ఎపుడైనా గుర్తు చేసుకుంటారా అని బెంగ. మన మనసు మీదే మనకి అదుపు ఉండదు కానీ వేరేవరి మనసునో నియంత్రించాలన్న తపన.  మరిచిపోలేమూ, వదిలి ఉండలేమూ. అయినా సరే ఒక్కోసారి చెయ్య గలిగిందేమీ ఉండదు.

 ఓ మనిషి ఈలోకం నుంచే నిష్క్రమించినపుడు, వాళ్ళ చుట్టూ అల్లుకున్న జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయి. వాళ్ళతో  పెనవేసుకున్న జ్ఞాపకాలు మనసుని అల్లకల్లోలం చేస్తాయి. వాళ్ళెక్కడికి పోతారు? ఏమైపోతారు? అసలు అలా కళ్ళ ముందు ఉన్నట్టున్నవాళ్ళు హఠాత్తుగా మాయమవడం ఎలా సాధ్యం?  అసలు ఈ అనుబంధాలకి కేంద్రం ఎక్కడుందో?  అశాశ్వతమైన మనిషి అస్తిత్వం తోనా?  ఆ వ్యక్తి  చుట్టూ అల్లుకున్న మన లోకంతోనా? ఆ వ్యక్తితో గడిపిన జ్ఞాపకాలతోనా? లాంటి ప్రశ్నలు వేధిస్తాయి. అచ్చం ఇలాంటి ప్రశ్నలే కొడుకుని పోగొట్టుకున్న ఓ తండ్రికీ కలిగాయి. సమాధానం దొరకని ప్రశ్నలు తనని కుదిపేశాయి. దొరికిన సమాధానాలతో శాంతి దొరకక తల్లడిల్లిపోయాడు. ఆ అశాంతి నుండీ చేసిన అన్వేషణలో హటాత్తుగా జ్ఞానోదయం  అయ్యింది. జీవితంలో ముందు చూడని కొత్త కోణాలు కనిపించాయి. తనని వేధిస్తున్న అశాంతి తొలగిపోయింది. 

 దాదాపు ఓ ఏడాది క్రితం చదివిన పుస్తకం Zen and the Art of Motorcycle Maintenance: An Inquiry into Values by Robert M. Pirsig.  ఓ గొప్ప క్లాసిక్ గా పేరుపొందిన పుస్తకం. ప్రచురణకి ముందు 121 పబ్లిషర్ చేత తిరస్కరించబడి, ప్రచురణ తర్వాత దాదాపు 5 మిల్లియన్ కాపీలు అమ్ముడుపోయిన  ఘన చరిత్ర కలిగింది.  పుస్తకంలో రచయిత మాట్లాడిన metaphysics, philosophy, knowledge, quality, Virtue of Values  లాంటి అంశాలు  అర్ధం చేసుకోవాలంటే  నాకు బహుశా  ఓ వంద పారాయణాలు అవసరమేమో. అసలు కన్నా కొసరు ముద్దు అన్నట్టు, నాకు  25th ఎడిషన్లో పుస్తకం చివర చేర్చిన ఒక భాగం నాకు బాగా ఇష్టమయినది. రచయిత తన జీవితం లో ఎదురైన విషాదాన్ని, అది కలిగించిన శూన్యాన్ని అధిగమించే ప్రయత్నంలో, తనకి కలిగిన సందేహాలకీ వేదనకీ జవాబులు వెతుక్కుంటున్న సమయంలో, తనకి కలిగిన అవగాహన ఎలా ఊరటనిచ్చిందో వివరిస్తారు.

 ఈ పుస్తకం లోని అంశం రచయిత తన పదమూడేళ్ళ కొడుకు క్రిస్ తో కలిసి ఒక సెలవుల్లో చేసిన 17 రోజుల మోటర్ సైకిల్ యాత్ర.  ఆ ప్రయాణంలో కొడుకుకి జీవితంలో చేసే ఏ పనిలో అయినా పాటించాల్సిన విలువలు, వాటి ప్రాముఖ్యత, సహనం అన్న అంశాల గురించి ప్రాక్టికల్గా నేర్పుతూ, తన అశాంతిపూరితమైన  గతాన్ని నేమరేసుకుంటూ స్వగతంలా చెప్పుకున్న కథ  ఇది జరిగిన తర్వాత పదేళ్లకు క్రిస్ మరణించాడు. ఆ విషాదాన్ని జీర్ణం చేసుకొనే ప్రయత్నంలో ఎదుర్కొన్న సంఘర్షణ, తను వెదుక్కుంటున్న ప్రశ్నలకి దొరికిన  సమాధానాలను రచయిత పుస్తకం చివరిలో ఇలా వివరిస్తారు. ఆ భాగం యధాతధంగా ఇంగ్లీష్ లో ఇచ్చాను. దానికి నా స్వేఛ్చానువాదం ఇది.  (రచయిత నివాసం ఇంగ్లాండ్ లో. క్రిస్ చనిపోయింది అమెరికాలో)

 “క్రిస్ చనిపోయాడు. క్రిస్ శాన్ ఫ్రాన్సిస్కోలో స్టూడెంట్గా ఉండేవాడు.నవంబర్ 17, 1979  రాత్రి జెన్ సెంటర్ లోంచి బయటకి వచ్చి ప్రక్క వీధిలో ఉన్న స్నేహితుడి ఇంటికి నడిచి వెళుతున్న సమయంలో,  కొంచెం డబ్బుకోసం ఇద్దరు ఆఫ్రికన్ అమెరికన్ మనుషుల చేత హత్య చెయ్యబడ్డాడు. క్రిస్ మరణం తర్వాత జీవితం నా ప్రయత్నం లేకుండానే యాంత్రికంగా సాగిపోతుంది.  క్రిస్ చనిపోకుండా ఉంటే ఓ రెండు వారాల్లో తన ఇరవై మూడో పుట్టినరోజు జరుపుకుని ఉండేవాడు. క్రిస్ చనిపోయిన రోజు ఉదయమే ఇంగ్లాండ్ రావటానికి టికెట్ కొనుక్కున్నాడని తెలిసింది.  కొన్నిరోజులకి క్రిస్ రాసిన ఒక ఉత్తరం వచ్చింది. అందులో తను తన 23 వ పుట్టినరోజు చూస్తానని ఎపుడూ అనుకోలేదు అని రాసాడు. తన అంత్యక్రియల తర్వాత క్రిస్ సామాన్లన్నీ ఓ ట్రక్లో వేసుకొని, పదేళ్ళ క్రితం క్రిస్ నేనూ కలిసి ప్రయాణం చేసిన దారుల్లోనే ప్రయాణించి మిన్నేసోటాలోని తన తాతగారి ఇంట్లో అటక మీద దాచిన తన సామాన్లన్నీ ఇంకా అలానే భద్రంగా ఉన్నాయి. ఎన్నో జవాబు తెలీని చిక్కు ప్రశ్నలు నన్ను వదలకుండా వేధించసాగాయి. ఆ అంతులేని సమాధానం దొరకని  ప్రశ్నల వలయం నన్నో పిచ్చివాడిగా చెయ్యసాగింది. చివరికి “క్రిస్ ఎక్కడికి వెళ్ళిపోయాడు?” అన్న ఒకే ఒక్క ప్రశ్న అతితీవ్రంగా నన్ను బాధించడం మొదలు పెట్టింది. 

క్రిస్ ఎక్కడికి వెళ్లి పోయాడు? ఆ ఉదయమే ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నాడు. తన బేంక్ అకౌంట్, బీరువా నిండా బట్టలూ, షెల్ఫ్ నిండా పుస్తకాలూ అలానే ఉన్నాయి. ఒకప్పుడు ఈ భూమి మీద సజీవంగా ఉన్న మనిషి, అర్ధాంతంగా ఎక్కడికి మాయమయిపోయాడు?  దహనవాటిక లోని ఆ గొట్టాల నుండీ ఎగసి పోయాడా? తన అస్థికలతో  ఇచ్చిన చిన్నడబ్బాలో  ఉన్నాడా? లేక ఆ కనిపించే మేఘం అంచున ఉన్న వెండి మెరుపులో దాగున్నాడా? ఈ ఆలోచనలేవీ  నాకు సరైనవిగా అనిపించలేదు.  అసలు నేను ఇంతగా ఎటాచ్మెంట్ పెంచుకున్నది  దేనితో  అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. క్రిస్ అనేవాడు ఒక భ్రమ మాత్రమేనా? మరి తను భ్రమ కాకపోతే, క్రిస్ అనేవాడు ఒకప్పుడు ఉండడం నిజమే అయితే ఇప్పుడెక్కడికి పోయాడు. భౌతికమైనవి  అలా ఎలా మాయమైపోతాయీ ? ఒకవేళ అలా మాయమయిపోవటం నిజమైతే భౌతికశాస్త్ర  పరిరక్షణ సూత్రాలు చిక్కులో పడవూ? ఒకవేళ అవే నిజమైతే క్రిస్ ఉండటం , హటాత్తుగా మాయమయిపోవడం అనేది  అబద్ధం అవాలి కదా. చిన్నప్పుడు అల్లరికి పారిపోయి కనిపించకుండా దాక్కుని, కొంతసేపటికి తనే వచ్చేవాడు. ఇప్పుడెక్కడి నుండి వస్తాడు? అసలింతకీ ఎక్కడికి పోయాడు?

 ఈ అంతులేని ప్రశ్నల వలయం హటాత్తుగా ఓ క్షణం ఆగింది.  క్రిస్ ఎక్కడికి పోయాడు అని కాకుండా, క్రిస్ కి  సంబంధించి ఏం మాయమయింది అని ప్రశ్నించుకోవాలేమో అని అనిపించింది. మనిషి అంటే కేవలం రక్తమాంసాలతో నిండిన భౌతికశరీరం మాత్రమే అని అనాదిగా మనలో పాతుకు పోయిన నమ్మకాన్నే పట్టుకు వేలాడినంత  కాలం ఈ ప్రశ్నకి సమాధానం దొరకదని నాకు అర్ధమయిపోయింది.  మండి బూడిదగా మారిన క్రిస్  పార్ధివశరీరం నుండి వెలువడిన వాయువులు దహనవాటిక లోని వెంట్స్ లోంచి పైకి పోయాయి. కానీ క్రిస్ అంటే అదొక్కటేనా? కాదు. నేను ఇంత మానసిక బంధం ఎర్పరుచుకున్నదీ, ఆ లోటుని అనుభవిస్తున్నదీ  కేవలం  క్రిస్ శరీరంతో  మాత్రమే  కాదనీ, దాన్ని మించింది ఇంకేదో ఉందనీ అర్ధం కాసాగింది.  అది \మా ఇద్దరినీ కలుపుతూ ఏర్పడ్డ , ఏఒక్కరికీ   ఏమాత్రమూ అవగాహనా, నియంత్రణా లేని ఓ కొత్త మానసిక ప్రపంచపు నమూనా.  అందులో నేనూ క్రిస్ కేవలం భాగస్వాములం  మాత్రమే.  ఇపుడు ఆ నమూనా లోంచి అతి ముఖ్య భాగమైన క్రిస్ శరీరం నిష్క్రమించింది.  నిష్క్రమణలో భాగంగా   ఆ నమూనాని  మాత్రం  అలానే వదిలేసి, మధ్యలోంచీ ఓ పెద్ద భాగం  పెకలించుకుపోగా  ఓ రంధ్రం మిగిలిపోయింది. ఇపుడా రంధ్రాన్ని పూడ్చడానికి చేసే ప్రయత్నంలో ఆ మనిషికి సంబంధించినది  ఏమీ దొరకక నా మనసు అల్లాడిపోతుంది. నాకు కలిగే వేదనంతా అందువల్లనే. అందుకేనేమో తన వారిని కోల్పోయిన దుఃఖంలో ఉన్నవాళ్ళు స్వాంతన కోసం, పోయినవారి  తాలూకా ప్రాపంచికమైన వస్తువుల / సమాధుల ఆసరా తీసుకుంటారు. వాళ్ళకి ఆ ప్రపంచాన్ని తిరిగి కన్నేక్ట్ చేసుకోడానికీ ఆ పోయిన మనిషికి సంబంధించినది ఏదో ఆసరా  కావాలేమో .

 నా ఆలోచనలు ఇలా క్రొత్తరూపం తెచ్చుకోడం మొదలైన కొంతకాలానికి కొన్ని  ప్రాచీన సంస్కృతులలోని నమ్మకాలతో సారూప్యం కనిపించడం మొదలయ్యింది.  ఆ నమ్మకాలని నిశితంగా పరిశీలిస్తే ఆత్మ అనేది ఒకటి ఉంటుందనీ, అది భౌతిక శరీరం కన్నా భిన్నమైనదీ, నాశనం లేనిదీ  అని తెలుస్తుంది. ఆ నమూనాలోని  శూన్యానికి కారణాలయిన  క్రిస్ భౌతిక శరీరాన్ని మినహాయిస్తే మిగిలినది  క్రిస్ ఆత్మ అనుకుంటే, అది ఈ లోకంతో  తిరిగి సంబంధం ఎర్పరుచుకోడానికి ఓ కొత్త శరీరాన్ని వెదుక్కుంటుందని అనుకోవచ్చు.  సాధారణంగా ఇలా ఆత్మ లాంటి కాన్సెప్ట్స్ విన్నప్పుడు అవన్నీ మూఢ  నమ్మకాలని కొట్టి పడేస్తూ ఉంటాము. 

 కొన్ని నెలల తర్వాత  నా  భార్య గర్భం దాల్చింది. అప్పటికే నా వయసు యాభై దాటటం తోనూ,  పిల్లల విషయంలో కలిగిన చేదు అనుభవాలతోనూ మేము ఇంకో బిడ్డని ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్నాము. ఆ నిర్ణయాన్ని అమలుపరిచే భాగంగా  డాక్టర్ ఆఫీసులో కూర్చుని పిలుపు కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఏదో అసౌకర్యమయిన భావం మనసుని ఆక్రమించడం మొదలెట్టింది. హటాత్తుగా నా మనసుకి తెలిసింది, అది క్రిస్ ఆత్మ వెదుక్కుంటున్న ఇంకో భౌతిక శరీరం రాబోతున్నదేమో అని.  వెంటనే మా నిర్ణయాన్ని మార్చుకుని మా చిన్నారి కూతుర్ని ఈ లోకంలోకి ఆహ్వానించాము. మా జీవితంలో మళ్ళీ వెలుగు నిండింది. క్రిస్ తో మాకు సంబంధించిన నమూనాలోని రంధ్రం  నెమ్మదిగా మూయబడుతోంది.   మా నిర్ణయాన్ని  అమలుపరిఛి ఉంటేగనక మా జీవితాల్లో ఏం కోల్పోయి ఉండేవాళ్ళమో తలుచుకుంటేనే  వొళ్ళు జలదరిస్తుంది.  వేలకొద్దీ క్రిస్ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతో ఉంటాయి, కాకపోతే ఎప్పటికీ తిరిగి రాని, రాలేని భౌతికశరీరంతో  పెనవేసుకుని మమ్మల్ని చిత్రవధ చేసేవిగా మాత్రం కాదు.  పేర్లు మారొచ్చు, శరీరాలు మారొచ్చు, కానీ అందరినీ కలిపి ఉంచే ఆ మానసిక ప్రపంచం మాత్రం ఓ నిరంతర స్రవంతి అని  మాత్రం నాకు బాగా అర్ధం అయ్యింది.”

 (Excerpt from the book as it is)

Chris is dead.  He was murdered. At about 8:00 P.M. on Saturday, November 17, 1979, in San Francisco, he left the Zen Center, where he was a student, to visit a friend’s house a block away on Haight Street.

 According to witnesses, a car stopped on the street beside him and two men, black, jumped out. One came from behind him so that Chris couldn’t escape, and grabbed his arms. The one in front of him emptied his pockets and found nothing and became angry. He threatened Chris with a large kitchen knife. Chris said something which the witnesses could not hear. His assailant became angrier. Chris then said something that made him even more furious. He jammed the knife into Chris’s chest. Then the two jumped into their car and left.  Chris leaned for a time on a parked car, trying to keep from collapsing. After a time he staggered across the street to a lamp at the corner of Haight and Octavia. Then, with his right lung filled with blood from a severed pulmonary artery, he fell to the sidewalk and died.

 I go on living, more from force of habit than anything else. At his funeral we learned that he had bought a ticket that morning for England, where my second wife and I lived aboard a sailboat. Then a letter from him arrived which said, strangely, “I never thought I would ever live to see my 23rd birthday.” His twenty-third birthday would have been in two weeks.

 After his funeral we packed all his things, including a secondhand motorcycle he had just bought, into an old pickup truck and headed back across some of the western mountain and desert roads described in this book. At this time of year the mountain forests and prairies were snow-covered and alone and beautiful. By the time we reached his grandfather’s house in Minnesota we were feeling more peaceful. There in his grandfather’s attic, his things are still stored. 

 I tend to become taken with philosophic questions, going over them and over them and over them again in loops that go round and round and round until they either produce an answer or become so repetitively locked on they become psychiatrically dangerous, and now the question became obsessive: “Where did he go?”

 Where did Chris go? He had bought an airplane ticket that morning. He had a bank account, drawers full of clothes, and shelves full of books. He was a real, live person, occupying time and space on this planet, and now suddenly where was he gone to? Did he go up the stack at the crematorium? Was he in the little box of bones they handed back? Was he strumming a harp of gold on some overhead cloud? None of these answers made any sense.

 It had to be asked: What was it I was so attached to? Is it just something in the imagination? When you have done time in a mental hospital, that is never a trivial question. If he wasn’t just imaginary, then where did he go? Do real things just disappear like that? If they do, then the conservation laws of physics are in trouble. But if we stay with the laws of physics, then the Chris that disappeared was unreal. Round and round and round. He used to run off like that just to make me mad. Sooner or later he would always appear, but where would he appear now? After all, really, where did he go?

 The loops eventually stopped at the realization that before it could be asked “Where did he go?” it must be asked “What is the `he’ that is gone?” There is an old cultural habit of thinking of people as primarily something material, as flesh and blood. As long as this idea held, there was no solution. The oxides of Chris’s flesh and blood did, of course, go up the stack at the crematorium. But they weren’t Chris.

 What had to be seen was that the Chris I missed so badly was not an object but a pattern, and that although the pattern included the flesh and blood of Chris, that was not all there was to it. The pattern was larger than Chris and myself, and related us in ways that neither of us understood completely and neither of us was in complete control of.

 Now Chris’s body, which was a part of that larger pattern, was gone. But the larger pattern remained. A huge hole had been torn out of the center of it, and that was what caused all the heartache. The pattern was looking for something to attach to and couldn’t find anything. That’s probably why grieving people feel such attachment to cemetery headstones and any material property or representation of the deceased. The pattern is trying to hang on to its own existence by finding some new material thing to center itself upon.

 Some time later it became clearer that these thoughts were something very close to statements found in many “primitive” cultures. If you take that part of the pattern that is not the flesh and bones of Chris and call it the “spirit” of Chris or the “ghost” of Chris, then you can say without further translation that the spirit or ghost of Chris is looking for a new body to enter. When we hear accounts of “primitives” talking this way, we dismiss them as superstition because we interpret ghost or spirit as some sort of material ectoplasm, when in fact they may not mean any such thing at all.

 In any event, it was not many months later that my wife conceived, unexpectedly. After careful discussion we decided it was not something that should continue. I’m in my fifties. I didn’t want to go through any more child-raising experiences. I’d seen enough. So we came to our conclusion and made the necessary medical appointment.

 Then something very strange happened. I’ll never forget it. As we went over the whole decision in detail one last time, there was a kind of dissociation, as though my wife started to recede while we sat there talking. We were looking at each other, talking normally, but it was like those photographs of a rocket just after launching where you see two stages start to separate from each other in space. You think you’re together and then suddenly you see that you’re not together anymore.

 I said, “Wait. Stop. Something’s wrong.” What it was, was unknown, but it was intense and I didn’t want it to continue. It was a really frightening thing, which has since become clearer. It was the larger pattern of Chris, making itself known at last. We reversed our decision, and now realize what a catastrophe it would have been for us if we hadn’t.

 So I guess you could say, in this primitive way of looking at things, that Chris got his airplane ticket after all. This time he’s little girl named Nell and our life is back in perspective again. The hole in the pattern is being mended. A thousand memories of Chris will always be at hand, of course, but not a destructive clinging to some material entity that can never be here again. We’re in Sweden now, the home of my mother’s ancestors, and I’m working on a second book which is a sequel to this one.

 Nell teaches aspects of parenthood never understood before. If she cries or makes a mess or decides to be contrary (and these are relatively rare), it doesn’t bother. There is always Chris’s silence to compare it to. What is seen now so much more clearly is that although the names keep changing and the bodies keep changing, the larger pattern that holds us all together goes on and on. In terms of this larger pattern the lines at the end of this book still stand. We have won it. Things are better now.

మనం పెంచుకున్న అనుబంధాలు భౌతికమైన వాటితో కన్నా, వాటి చుట్టూ మనం సృష్టించుకున్న ఓ మానసిక ప్రపంచంతోనూ, వాటి జ్ఞాపకాలతోనూ అనే ఆలోచన కొన్ని సార్లు కొంత ఉపశమనం కలిగిస్తుందేమో.  మన ప్రపంచంలో తాత్కాలికంగా కలిగిన లోటుని పూడ్చే కొత్త బంధాలేవో ఎదురవుతాయనే నమ్మకమే మనలని నడిపిస్తుంది.  నెమ్మదిగా క్రొత్త పరిసరాలకు అలవాటు పడతాం, వాటితో ప్రేమలోనూ పడతాం. క్రొత్త స్నేహాలూ చిగురిస్తాయి.  మెల్లమెల్లగా పాత జ్ఞాపకాలు మనసు మూలఅరల్లో విశ్రాంతి తీసుకుంటాయి. కాలం గడుస్తున్న కొద్దీ బాధ తీవ్రత తగ్గుతుంది. దూరమయిన వారి జ్ఞాపకాలు మెల్లగా బాధ నుండీ, తీపిగుర్తుల జాబితాలోకి చేరతాయి. ఇదో నిరంతర వెలుగు నీడల వలయం. మార్పు తప్పదనీ, క్రొత్త బంధాలొచ్చి పాతగాయాలని మరిపిస్తాయని తెలిసికూడా తప్పని తపనా, వేదనా మనసు మనుగడకి ఓ ఆనవాలు. 

అన్ని పరిచయాలూ జ్ఞాపకాలుగా మిగలనట్టే, అన్ని జ్ఞాపకాలూ దుఃఖాన్ని కలిగించవు. కొన్ని జ్ఞాపకాలు గుర్తోచ్చినపుడు గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టూ, సన్నని దారంతో కోస్తున్నట్టూ ఉంటే, కొన్ని జ్ఞాపకాలు సంపెంగల పరిమళం చుట్టినట్టూ, విరజాజుల వానలో తడిసినట్టూ  మైమరుపు కలిగిస్తాయి. అందుకని జ్ఞాపకాలు మొత్తంగా చెడ్డవేమీ కావు. 

అయితే  ఏ నమూనాల్లోనూ ఇమడని, ఏ సమీకరణాలకీ లొంగని బంధాలు కొన్నుంటాయి. కాలం యొక్క ఏ మాయలూ,  ఇంద్రజాలాలు వాటి ప్రభావాన్ని మన మీద తగ్గించ లేకపోవొచ్చు. అటువంటి బంధాలను సజీవంగా ఉంచుకోగలిగిన వాళ్ళు అందరికన్నా అదృష్టవంతులు. లేనినాడు ఆ బంధంలో పదిలపరుచుకున్న అనుభూతుల్ని మాలగా చేసి మెడలో అలంకరించుకోగలితే, ఆ పరిమళం మన జీవితాన్ని కొత్తగా గుబాళింప చేయ్యగలిగితే వాటికి కొంతైనా సార్ధకత చేకూరినట్టే.  కానీ అంతటి స్థితప్రజ్ఞత  అందరికీ సాధ్యమేనా?  “సబ్ కుచ్ వహీ హై, ఫిర్ కుచ్ కమీ హై, తేరే ఆహటే నహీ హై” అని నిట్టూర్చడం  తప్ప మనసుకి వేరే మార్గం లేదు.

ఒక అడుగు ముందుకీ…రెండడుగులు వెనక్కీ…గోపీచంద్!

AnnaiahTripuraneniGopichand (1)

‘ఎంత గుండె గలవాడికి గుండెపోటు’ అని గోపీచంద్ మరణించినప్పుడు నార్ల వెంకటేశ్వరరావు ‘ఆంధ్రజ్యోతి’లో సంపాదకీయం ఎత్తుగడగా ప్రస్తావించారు. గోపీచంద్ 52 సంవత్సరాలకే చనిపోయారు. అప్పటికే ఆయన రచనల ప్రభావం తెలుగు పాఠకులపై బాగా ఉన్నది.
స్వాతంత్రోద్యమం ముమ్మరంగా 1940 ప్రాంతాలలో సాగుతుండగా గోపీచంద్ కొత్తదారులు తొక్కి రాజకీయ చిన్న కథలు ప్రవేశపెట్టారు. అవి రష్యాలో చెకోవ్ కథలవలె ఆకర్షించాయి. కాంగ్రెసు వారిని సోషలిస్టు కమ్యూనిస్టు వర్గాలను వినూత్నంగా విమర్శిస్తూ రాడికల్ ప్రజాస్వామిక పద్ధతులలో చిన్నకథలు రాశారు. ఎంతో విషయాన్ని కుదించి కార్టూన్ లో చూపినట్టే గోపీచంద్ చెప్పదలచుకున్న విషయాన్ని చాకచక్యంగా చిన్న కథలలో చెప్పారు.
త్రిపురనేని గోపీచంద్ తెలుగులో ఈ పక్కీని అనుసరించిన తొలి రచయిత అనవచ్చు.  ‘భార్యల్లోనే ఉంది’., ‘దేవుడి జీవితం’ వంటి కథల్ని రాసి 1940 ప్రాంతాలలో ఎందరికో ఉత్తేజాన్ని కలిగించిన భావ ప్రచారకుడు. త్రిపురనేని రామస్వామి ఆయన తండ్రి. 1930 నాటికే తండ్రి రచనల, భావ వికాస ఉద్యమాల ప్రభావంతో గోపీచంద్ కాలేజీ చదువులు సాగించారు. గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బి.ఎ. చదువుతుండగా ‘శంభుక వధ’ ఇతివృత్తంతో కళాశాల మేగజైన్ లో పదునైన వ్యాసం రాశాడు.
కొప్పరపు సుబ్బారావు రాసిన ‘శాస్త్ర దాస్యం’ అనే విమర్శనాత్మక గ్రంథానికి గొప్ప పీఠిక రాశాడు. రాజకీయోపన్యాసాలు చేస్తూ అధ్యయన తరగతులలో ఎందరినో సుశిక్షితులను చేశారు.
గందరగోళం పడిన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో చూపడానికి ఒక కథలో రైల్వే ప్లాట్ ఫారం మీద బండి వచ్చి ఆగినప్పుడు జనం హడావుడిగా వున్న సన్నివేశంలో ఒక వృద్ధుడు కాసేపు తన చుట్టను గొడుగు కర్ర అనుకుని, గొడుకర్రను చుట్ట అనుకోవటం గోపీచంద్ చమత్కారంగా వర్ణిస్తాడు. మానసిక విశ్లేషణ చేయడంలో ఆయన చెయ్యి తిరిగిన వ్యక్తి.
“భగవంతుడు లేడు. సంఘంలోని ఈ హెచ్చు తగ్గులు భగవంతుడు సృష్టించాడని చెప్పటం మోసం. నీతి నియమాలు ప్రకృతిలో నియమబద్ధతకు సంబంధించినవే” అనే తార్కిక అంశాలు మానవవాద శాస్త్రవేత్త ఎమ్. ఎన్. రాయ్, తన తండ్రి రామస్వామి వలన ఆయనకు సంక్రమించాయి. (పుటలు : సత్యాన్వేషణ. పేజీ- 145,149) అంతటితో ఆగక గోపీచంద్ ఇంకా ముందుకు వెళ్ళి ఇలా రాశాడు. “ఆధ్యాత్మిక నాగరికత అనే మత్తులో పడిఉండటం విదేశీ ప్రభుత్వానికి మంచిది కనుక అదే ప్రోత్సహిస్తుంది”. (ప్రాచ్య పాశ్చాత్య నాగరికత – 1938 ప్రజామిత్ర – పేజీ-70). గూడవల్లి రామబ్రహ్మం సంపాదకత్వాన వెలువడిన ప్రజామిత్రలో గోపీచంద్ అలాంటి వ్యాసాలు రాయడం వల్ల అనేకమంది యువకులపై ఆయన ప్రభావం పడింది.  “ఏ దృక్పధమైనా మానవుడి పరిణామానికి దోహం ఇచ్చేదిగా ఉండాలి. అతని మీద పెత్తనం చెలాయించేదిగా ఉండకూడదు” (పేజీ-171). 1939లో  గూడవల్లి రాంబ్రహ్మం తీసిన రైతుబిడ్డకు గోపీచంద్ డైలాగు రాశారు. అందులో శక్తివంతమైన సంస్కరణాయుతమై ధోరణి వ్యక్తమైంది.  ఇది 1938 నాటికి మద్రాసులో ఆరంభమైన చైతన్య దశ.
“పదార్థం తనకు తానే పరిణామం చెందుతుంది. ప్రకృతి నియమ బద్ధత గలది” (సత్యాన్వేషణ, పేజీ-145). గోపీచంద్ కు సంక్రమించిన తాత్విక ధోరణి. శాస్త్రీయ దృక్పథం కూడా. త్రిపురనేని గోపీచంద్ రచయితగా రంగప్రవేశం చేసే నాటికి (1930 ప్రాంతంలో) ఉన్నవ లక్ష్మీ నారాయణ ‘మాలపల్లి’, అప్పుడే వెలుగు చూచింది. ఆచార్య రంగా ఆరోజుల్లోనే ‘హరిజన నాయకుడు’ పేరిట అంటరాని తనాన్ని వ్యతిరేకిస్తూ నవల రాశారు.   త్రిపురనేని రామస్వామి అప్పట్లో జస్టిస్ పార్టీ  ప్రభావంలో వుండేవారు. ‘సూతపురాణం’, ‘శంబుక వధ’, ‘భగవద్గీత’, వంటి రచనలతో తెలుగువారిలో కదలిక తెచ్చిమార్పులకు పునాది వేశారు. పెళ్ళిళ్ళలో సంస్కృత మంత్రాలు బదులు తెలుగులో ప్రమాణాలు ప్రవేశపెట్టారు. గోపీచంద్ నేపథ్యం అది.
అటువంటి కీలక దశలో రెండో ప్రపంచ ఆరంభ సమయంలో పునర్వికాసోద్యమ కర్త మానవేంద్రనాథ్ రాయ్ ఆంధ్రలో ప్రవేశించాడు. కాంగ్రెస్ విధానాలకు మార్గాంతరంగా రాడికల్ ప్రజాస్వామిక పార్టీ పెట్టారు. శాస్త్రీయ ఆలోచనలు ప్రజలు తమ స్వామ్యాన్ని నిలదొక్కుకునే ధోరణులు రాయ్ స్టడీ క్యాంపుల ద్వారా వెలుగులోకి తెచ్చారు. అవి గోపీచంద్ ను ఆకట్టుకున్నాయి. అప్పుడే పట్టాభి సోషలిజం వంటి రచనలు గోపీచంద్ చేశారు. రాడికల్ డెమోక్రటిక్ పార్టీకి రాష్ట్ర కార్యదర్శి అయ్యాడు. మార్క్సిజాన్ని ఔపోశనం పట్టి ‘మార్క్సిజం అంటే ఏమిటి?’ అనే పుస్తకం రాశారు. ఆనాడు సోషలిస్టు భావాలు కూడా యువతను ఆకట్టుకుంటుండగా సోషలిస్టు ఉద్యమ చరిత్ర రాశారు.
ఎ.సి. కాలేజీ నుండి వివాహ జీవితంలో అడుగిడిన గోపీచంద్ న్యాయవాద వృత్తి కోసం లా చదివారు. కాని ఆ వృత్తిలో ఆయన రాణించలేదు. అయితే మద్రాసులో వుండగా గూడవల్లి రాంబ్రహ్మం గారితో పరిచయమైంది. అదొక మలుపు. రాంబ్రహ్మం కృష్ణాజిల్లా నుండి మద్రాసు వచ్చి, ‘ప్రజామిత్ర’ పత్రిక నడిపారు. సినిమా రంగంలో సంస్కరణ చిత్రాలు తీశారు. మరోపక్క ఎం.ఎన్. రాయ్ ను ఆహ్వానించి, ఆయన వ్యాసాలు, వార్తలు తన పత్రిక ద్వారా జనానికి అందించారు. అప్పుడే గోపీచంద్  ఎం.ఎన్. రాయ్ వ్యాసాలు కొన్ని తెలుగులోకి ‘ప్రజామిత్ర’ ద్వారా అందిచారు.
ఆనాడు ఎం.ఎన్. రాయ్ రచనలు పత్రికలు ప్రచురించేవికావు. ఆయన కొత్త విశేషాలు, శాస్త్రీయ పంథా రాజకీయాల్లోకి తెచ్చారు. భారతీయ చరిత్రను వైజ్ఞానిక పంథాలో రాసి, పుక్కిటి పురాణాలు ఆధారాలు లేని గాథలు దూరంగా పెట్టాలన్నాడు. కాంగ్రెస్ పార్టీని అట్టడుగు నుండీ బలోపేతం చేసి, ప్రజలు పాల్గొనేటట్లు చేయాలన్నాడు. దేశానికి పునర్వికాసం అవసరమన్నాడు. స్వాతంత్ర్యం రాకముందే రాజ్యాంగాన్ని ముసాయిదా రూపొందించుకోవాలన్నాడు. ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తూ, మతాల్ని వ్యక్తిగత స్థాయిలో అట్టెపెట్టుకోవాలన్నాడు. రాజకీయాలలో శాస్త్రీయ పంథా సాధ్యమేనన్నాడు. గాంధీని విమర్శించటం, మితవాద కాంగ్రెస్ ను వ్యతిరేకించటం కారణంగా ఎం.ఎన్. రాయ్ ను, ఆయన పెట్టిన పునర్వికాస ఉద్యమాన్ని నాటి మీడియా కూడా ఆదరించలేదు. ఆ భావాల్ని తెలుగులో రాసిన గోపీచంద్ వ్యాసాలు కూడా చిన్న పత్రికలకే పరిమతమయ్యాయి.
తెనాలిలో ప్లీడర్ గా గోపీచంద్ ఏమంత పేరులోకి రాలేదు. కాని రాడికల్ హ్యూమనిస్ట్ గా ఖ్యాతి ఆర్జించాడు.
ఎం.ఎన్. రాయ్ ఉత్తరోత్తరా తెనాలి వచ్చినప్పుడు త్రిపురనేని రామస్వామి, చలం గార్లతో చర్చా సమావేశం జరిగింది (1941-42). గోపీచంద్, ఆవుల గోపాలకృష్ణ మూర్తి యీ సమావేశ కర్తలు. ఆ తరువాత కొద్ది కాలానికే త్రిపురనేని రామస్వామి చనిపోయారు (1943 జనవరి) గోపీచంద్ పూర్తి స్థాయిలో ఎం.ఎన్. రాయ్ భావ ప్రపంచంలో నిమగ్నమయ్యారు. చాలా లోతుకు వెళ్ళారు.
గోపీచంద్ మిత్రులలో సహచరులలో అబ్బూరి రామకృష్ణారావు, జీవి కృష్ణారావు, ఆవుల గోపాలకృష్ణమూర్తి, కోగంటి రాధాకృష్ణమూర్తి, పాలగుమ్మి పద్మరాజు, ఆలపాటి రవీంద్రనాథ్, పి.వి.సుబ్బారావు మొదలైన వారు ఉండేవారు.
ఆనాటి గడ్డు రాజకీయ సాంఘిక వాతావరణంలో గోపీచంద్ గట్టిగా నిలిచాడు. ఒకవైపు రచనలు చేస్తూ, మరో పక్క అధ్యయన తరగతులలో పాల్గొంటూ, పార్టీని పటిష్ట పరచాడు. రెండో ప్రపంచ యుద్ధం మొదట్లో కమ్యూనిస్టులు “సామ్రాజ్య వాదయుద్ధం” అంటూ దానిని వ్యతిరేకించారు. చరిత్ర తెలిసిన ఎం.ఎన్. రాయ్, బి.ఆర్. అంబేద్కర్ లు యుద్ధ స్వభావాన్ని వివరించారు. జర్మనీ, జపాన్, ఇటలీలు కలసిన నేపధ్యంలో చూడాలన్నారు. వారు గెలిస్తే ఫాసిజం, నాజీయిజం మళ్ళీ ప్రపంచాన్ని ఏలుతాయని, ఇండియా మరో 200 ఏళ్ళు పరాయి పాలనలోకి పోతుందన్నారు. యుద్ధంలో ఇంగ్లండ్ గెలిస్తే, యుద్ధానంతరం దేశాన్ని విడిచి వెళ్ళవలసిన పరిస్థితి తప్పని సరిగా వస్తుందన్నారు. కనుక బ్రిటన్ ను యుద్ధంలో సమర్థించాలన్నారు. కమ్యూనిస్టులు దీనిని వ్యతిరేకించి, ఎం.ఎన్. రాయ్ ను తిట్టారు.
అప్పట్లో హిట్లర్ తో సంధి రాయబారం నడిపిన రష్యా నియంత స్టాలిన్, భజనలో కమ్యూనిస్టులు నిమగ్నమయ్యారు. కాని అచిర కాలంలోనే రష్యాపై జర్మనీ దండెత్తడంతో కమ్యూనిస్టులు గుక్క తిప్పుకోలేక పోయారు. సామ్రాజ్యవాదయుద్ధం కాస్తా ప్రజా యుద్ధంగా మారింది. రష్యా ఎలా చెబితే అలా నడచిన కమ్యూనిస్టులు, సొంత ఆలోచన చేయలేక పోయారు. గుడ్డిగా దేశంలో ఎం.ఎన్. రాయ్ ను, వ్యతిరేకించారు.
మరో వైపు కాంగ్రెస్ వారు దూర దృష్టి లేకుండా ప్రవర్తించారు. సుభాష్ చంద్ర బోస్ ఉద్రేకంగా హిట్లర్ ను వెనకేసుకొచ్చాడు. రాయ్ అందులోని లోపాన్ని చూపి హెచ్చరించాడు.
అలాంటప్పుడు ఎం.ఎన్. రాయ్ రాడికల్ డెమోక్రటిక్ పార్టీ పెట్టారు. శిక్షణ తరగతులు నడిపారు. అంతర్జాతీయ రాజకీయాల విడమరచి చెప్పారు. రచనలు చేసి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, శాస్త్రీయ ధోరణి తెచ్చారు. గోపీచంద్ ఆ పంధాలో తెలుగులో రచనలు చేశారు.
ఆనాడు బలంగా వున్న సోషలిస్టు ఉద్యమాన్ని పరిశీలించి, చరిత్ర రాసి అందించారు. జయప్రకాశ్ నారాయణ, రాం మనోహర్ లోహియా, మధు లిమాయే, అశోక్ మెహతా, అరుణా అసఫ్ అలీ వంటి వారు ప్రముఖ పాత్ర వహించిన సోషలిస్టు పార్టీ, ఉద్యమ చరిత్రను గోపీచంద్ విశ్లేషించారు.
మరో వైపు గాంధీ అనుచరుడుగా పట్టాభిసీతారామయ్య 1938లో కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. బోస్ ను ఓడించారు. పట్టాభి  సీతారామయ్య కాంగ్రెస్ పార్టీ చరిత్ర రాశారు. గాంధీకి సన్నిహితుడుగా బందరు నుండి ఇంగ్లీషులో పత్రిక నడిపారు. ఆయనకు వంట బట్టని సోషలిజం గురించి గోపీచంద్ విమర్శనాత్మక రచన చేశారు.
అటు కమ్యూనిస్టులకూ ఇటు కాంగ్రెస్ వారినీ ఎడాపెడా ఎదుర్కొన్ని, విమర్శలు చేస్తూ, వ్యంగ్య రచనలు చేసిన గోపీచంద్ తొలి సారిగా తెలుగులో రాజకీయ కథలు రాశారు. సిద్ధాంతాలను అతి తేలిక భాషలో విడమరచిచెప్పారు. రాడికల్ డెమొక్రటికీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మూఢనమ్మకాలను ఎదుర్కొన్నారు. కవితలు, సాహిత్య రంగంలో విశ్వనాధ సత్యనారాయణ వంటి తిరోగమన వాదుల్ని బాగా తిప్పి కొట్టారు.
బెజవాడ నుండి బండి బుచ్చయ్య నడిపిన ‘ములుకోల’ పత్రిక, తెనాలిలో ప్రారంభమైన ‘రాడికల్’ పత్రిక, గూడవల్లి రాంబ్రహ్మం ‘ప్రజామిత్ర’ మాత్రమే గోపీచంద్ రాజకీయ రచనలు ప్రచురించేవి.  దిన పత్రికలు ‘ఆంధ్రప్రభ’,   ‘ఆంధ్రపత్రిక’,  మిగిలిన పత్రికలు ‘కృష్ణా పత్రిక’ వంటివి గోపీ చంద్ రాడికల్ విమర్శలు ప్రచురించేవిగావు. ఆ మాట కొస్తే వార్తలు సైతం వేసేవి కావు.
1942లో ‘ప్రజామిత్ర’ ఆగింది. 1943 జనవరిలోనే త్రిపురనేని రామస్వామి చనిపోయారు. ఆయన తుది వరకూ పురాణాల్ని, ఛాందసాల్ని, మూఢనమ్మకాల్ని ఎదుర్కొంటూ పోయారు. రాను రాను కులతత్వం పై ధ్వజం ఎత్తి, తన పేరులో ‘చౌదరి’ కూడా చివరలో తొలిగించుకున్నారు. కాని ఆయన 50 సంవత్సరాలకే చనిపోయారు. ఆయన భావ ప్రభావం మాత్రం గోపీచంద్ పై ముద్ర వేసింది. ఆ తరువాత ఎం.ఎన్. రాయ్ రావడంతో గోపీచంద్ భావ పరిణితి బాగా విస్తరించి, ఆలోచనా పరిధిలోతు పాతుల్ని చవిచూచింది. శాస్త్రీయ పంథా అంటే ఏమిటో గోపీచంద్ గ్రహించారు.
తెనాలిలో గోపీచంద్ సూతాశ్రమంలో ఒక ఆకర్షణీయ వ్యక్తి అయ్యారు. ఆయన చుట్టూ రచయితలు, కవులు, కళాకారులు, ఎందరో కొలువు తీర్చేవారు.  గోపీచంద్ తెనాలిలో పీఠాధిపతి అయ్యారు. ఇది 1945 వరకూ సాగింది. ఈలోగా రాడికల్ డెమొక్రటిక్ పార్టీ మేధావులలో కొందరిని ఆకట్టుకున్నది. కొందరు రచయితలు పదునైన పుస్తకాలు వెలువరించారు. వారిలో కోగంటి రాధా కృష్ణమూర్తి, పి.వి. సుబ్బారావు వంటి వారి రచనలకు గోపీచంద్ పీఠికలు రాశారు.
గోపీచంద్ స్థానంలో గుత్తి కొండ నరహరి రాష్ట్ర రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శి అయ్యారు. తెనాలిలో ఆనాడు ఆవుల గోపాలకృష్ణమూర్తి రాడికల్ హ్యూమనిస్ట్ గా, ఎం.ఎన్. రాయ్ అనుచరుడుగా చాలా ప్రాముఖ్యత వహించాడు. ఆయన వ్యాసోపన్యాసకుడు, అడ్వకేట్. అనువాదాలు కొన్ని చేసి రాయ్ భావ ప్రచారం గావించాడు. ఎం.ఎన్. రాయ్ ను త్రిపురనేని రామస్వామికి, చలానికి పరిచయం చేసిన కీలక వ్యక్తి, ఆయన చుట్టూ ఎందరో యువకులు, కవులు, గాయకులు, కళాకారులు, విద్యార్థులు వుండేవారు. ఆకర్షణీయమైన ఉపన్యాసాలు, పదునైన ఘాటైన విమర్శలు ఎజికె బలం.
గోపీచంద్ కు యిదంతా యిష్టం వుండేది కాదు. తన పీఠాధిపత్యానికి ఎదురుండరాదని ఆయన అభిమతం. కాని ఎజికె ఆకర్షణముందు గోపీచంద్ పనికిరాలేదు. చివరకు గోపీచంద్ తమ్ముడు గోకుల్ చంద్ కూడా ఎజికె అంటే విపరీత అభిమానం చూపేవాడు. ఎందరో రచయితలు తమ పుస్తకాలకు ఎజికె చేత పీఠికలు రాయించుకున్నారు. ఎజికె అంటే గోపీచంద్ కొంత బెరుకుగా వుండేవాడు. ఎదుటబడి ధైర్యంగా మాట్లాడే వాడు కాదు.
అఖిలభారత రాడికల్ హ్యూమనిస్ట కాంప్ లలో సైతం ఎం.ఎన్. రాయ్ ను ఎదుర్కొగలిగిన ఎజికె తన పీఠాధిపత్యానికి ముప్పు అని గోపీచంద్ భావించాడు.
1946  మళ్ళీ సినిరంగంలో ప్రవేశించడానికి మద్రాసు వెళ్ళారు. అదొక పెద్ద మలుపు. గోపీచంద్ సినీరంగంలో అన్ని పాత్రలు నిర్వహించారు. అంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్, సంభాషణలు యిలా వివిధ కోణాలు చూశారు. సినీరంగం భిన్నలోకానికి చెందినది. అక్కడ తళుకు బెళుకులూ, ఆకర్షణలు, రామణీయకతలు, కష్ట నష్టాలు, రసవత్తర రమ్యతలు అన్నీ గోపీచంద్ ను చుట్టుముట్టాయి. డబ్బు రాలేదు. శృంగార సుడిగుండాలు సరేసరి. ‘లక్ష్మమ్మ’ సినిమాతో గోపీచంద్ సాధారణ జీవితం గడపడం కష్టమైంది. మద్రాసులో సినీ కళాపోషణ రామణీయకతల నుండి గోపీచంద్ ను బయటపడేయడానికే ఆయన్ను పాండిచేరి అరవిందాశ్రమం ఆచంట జానకీ రాం తీసుకెళ్లారు. అంతటితో కొన్నాళ్ళు అరవిందుడి ఆధ్యాత్మిక అయోమయంలో పడిపోయాడు. దానిని సమర్థించడానికి పూనుకున్నాడు. కాని బ్రతుకు దెరువు ఆధ్యాత్మికతలో కష్టం, సంసారం యీదాలిగదా. కనుక కర్నూలులో రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ డైరెక్టర్ గా చేరారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వంలో ఆకాశవాణి ఉద్యోగిగా హైదరాబాద్ లో వున్నారు.
వయస్సు వచ్చేకొద్దీ కొందరు మెదడుకు పదను పెడతారు. ఎదుగుతారు. బెర్ట్రాండ్ రస్సెల్ అందుకు ఆదర్శం. మనమధ్యలో నార్ల వెంకటేశ్వరరావు ఉదాహరణ. గోపీచంద్ అందుకు భిన్నంగా మానవ హేతువాదం నుండి ఆధ్యాత్మిక అంధ విశ్వాసంలోకి దిగజారి పోయాడు. అది సమర్థించుకోడానికి రాతలు చేబట్టాడు. పాత జ్ఞాపకాలు, అనుభవాలు యితివృత్యాలుగా తీసుకొని, తన రచనా పాటవంతో, సమర్థించుకున్నాడు. అలా వెలువడిన వాటిలోనే పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, మెరుపులు మరకలు పేర్కొనవచ్చు.
తెనాలిలో తన సహచరులుగా రాడికల్ డెమొక్రటిక్ పార్టీలో వున్న వారిని, తన తండ్రిని, తనను పాత్రలుగా చిత్రించి రాసిన పుస్తకమే పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. అదంతా అరవింద పూర్ణయోగం చేబట్టిన కారణంగా, దానిని వెనకేసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా రాసిందే. దానికి తోడు తన పీఠాధిపత్యం ఆరు పువ్వులు మూడు కాయలుగా తెనాలిలో వెలగకపోడానికి అడ్డొచ్చిన వారిని దుష్ట పాత్రలుగా పెట్టారు. జి.వి. కృష్ణారావు, ఆలూరి బైరాగి, కోగంటి రాధాకృష్ణమూర్తి, ఆవుల గోపాలకృష్ణమూర్తి ప్రభృతులు పాత్రలు కాగా, తనను ఉత్తమ వున్నత ఆదర్శపాత్రగా సమర్దించుకున్నాడు.
వడ్లమూడి గోపాలకృష్ణయ్యను ‘సజ్జలు’ అని ఎద్దేవ చేస్తూ చిత్రించాడు. అయితే తను అంతగా చెప్పేదేమీ లేదని ఉన్నది ఉన్నట్లే కక్కేస్తాడనే అర్థంలో అలా రాశాడు.  ఆద్యాత్మిక వాదిగా గోపీచంద్ లో రాగ ద్వేషాలు రోజు రోజుకూ పెరిగిపోగా తన సహచరులపై మరొక నవల ‘మెరుపులు మరకలు’ రాశాడు. ‘రేడియో కేంద్రంలో పాత్రలు ఎందుకు మౌనం వహిస్తాయి?’ ఆ నవలకు దీటుగా మళ్ళీ నవలలు వెలువరించి, బాగా తిప్పికొట్టారు.
అలా దిగజారుతూ పోయిన గోపీచంద్ చివరి దశలో సాయిబాబా భక్తుడుగావడం పరాకాష్ఠ. ఆలోచన చచ్చిపోయిన దశ అది.
గోపీచంద్ ప్రతిభావంతుడైన తెలుగు రచయిత. బాగా చదివాడు. బాగా చదివించగలడు. అటువంటి గొప్ప తనం అతని తత్వవేత్తలు రచనలో చూడవచ్చు.  గోపీచంద్ తాత్మిక విద్యార్థికాదు. బి.ఏ చదివి, లా ప్రాక్టీసు చేసిన వ్యక్తి. సొంతగా   తత్వశాస్త్రాలు చదివాడు. అంత వరకూ బాగానే వుంది. చివరి దశలో అరవింద్ ఆధ్యాత్మిక పులుముడు సుడిగుండంలో పడి కొట్టుమిట్టాడాడు. దానిని సమర్థించడానికి తత్వవేత్తలు లో ప్రయత్నించడం దారుణం.
ఇక అరవిందో ఒక కల్ట్ శాఖాధిపతి. నమ్మకాలు ప్రచారం చేసిన వ్యక్తి. ఆయన చెప్పే అడ్డదిడ్డమైన పూర్ణయోగం, క్రమం అన్నీ మూఢనమ్మకాలే. వీటిని తెగబలిసిన భాషలో యిమిడ్చాడు. కాని తత్వం ఏదీ లేదు. అందుకే తాత్వికులలో ఆయన యిమడడు. అయితే గోపీచంద్ అరవిందో భక్తుడుగా ఆయన్ని సమర్థిస్తూ పుస్తకాన్ని ముగించాడు.
గోపీచంద్ సన్నిహితులు ఆయనవలె, రాడికల్ డెమొక్రటిక్ పార్టీలో ఆ తరువాత మానవ వాద ఉద్యమంలో కృషి చేసిన వారు రావిపూడి వెంకటాద్రి, ఎన్.వి. బ్రహ్మం. వారిరువురూ వివిధ సందర్భాలలో గోపీచంద్ ను మద్రాసులో హైదరాబాద్ లో కలిశారు.
పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాలో పాత్రల్ని గురించి, తెనాలిలో కొందరిని దృష్టిలో పెట్టుకొని రాసిన తీరు గురించి ప్రశ్నించారు. గోపీచంద్ దాటేశారు. ఎన్.వి. బ్రహ్మం పట్టు విడవక, ఆవుల గోపాలకృష్ణమూర్తి గురించి నవలలో రాసింది  విఫలమైందని కూడా ఎత్తి పొడిచారు. గోపీచంద్ తప్పించుకోడానికే ప్రయత్నించారు. అంతకు మించి ఆయన బయట పడలేక పోడానికి కారణం ఆయన గిల్టీ మనస్తత్వమే. బాపు చేత వేయించిన ముఖ చిత్రంలో ఎ.జి.కె, జి.వి.కె, రామస్వామి, గోపీచంద్ పోలికలు వున్నాయి.
ఆద్యాత్మిక వాదానికి, హేతువాదానికి సమన్వయం చేయటానికి గోపీచంద్ రచనలు ఉద్దేశించాయని కొందరు సందర్ధించబోవటం అపహాస్యమైన విషయం. ఆధ్యాత్మిక వాదంలో ఆలోచన తాకట్టు పడుతుంది. అందులో మనిషి పెరగడు. హేతువాతం అనంతం. నిరంతర శాస్త్రీయ దృక్పదంతో సాగిపోతూ కొత్త విషయాలను స్వీకరిస్తూ తమ పాత విషయాలను సరిదిద్దుకుంటూ పోతుంటుంది. ఇది అభ్యుదయ విధానం. ఇలాంటిది ఆధ్యాత్మికతలో ఉండదు.
ఇలా సాగిపోయిన గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’ రచన చేశారు (ఇది ఆలూరి భైరాగి కవిని ఉద్దేశించినది అనే అభిప్రాయం లేకపోలేదు).
‘తత్వవేత్తలు’   రెండు భాగాలుగా మార్క్స్ తో మొదలెట్టి అనిబిసెంట్ తో ముగించాడు. అరవిందో తో ముక్తాయింపు పలికాడు. ఇంగ్లీషులో విల్ డ్యురాంట్ రాసిన ‘దిస్టోరీ ఆఫ్ ఫిలాసఫి’ ప్రధాన ఆధారం చేసుకున్నాడని, దీనితొలి ప్రచురణ కర్త, బొందలపాటి శివరామకృష్ణ సదుద్దేశ్యంతోనే నాతో చెప్పారు. ఎవరైనా సరే ఆధార గ్రంథాలను స్వీకరించక తప్పదు. గొప్ప తత్వవేత్తలు-బెర్ట్రాండ్ రస్సెల్, దాస్ గుప్త, ఎం.ఎన్. రాయ్ వంటి వారు తమ రచనలకు ఆధారాలు చూపి, తరువాత తమసొంత అభిప్రాయాలు చెప్పారు. గోపీచంద్ తత్వవేత్తలలో అలాంటి చిత్త శుద్ధిలోపించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రాసినట్లున్నది.
చాలామంది తత్వవేత్తల గురించి అతి సులభశైలిలో చెప్పారు. అది హర్షించదగింది. అయితే గోపీచంద్ కు ఏది తత్వశాస్త్రం,  ఏది కాదు అనే విచక్షణ లేదు. అందుకు తగిన అకడమిక్ జ్ఞానం, క్రమశిక్షణ లేదుగనుక యీ దోషం వచ్చింది.
రష్యాలో బయలుదేరిన ఒక మూఢనమ్మకాల మాత బ్లా వెస్కీ చెప్పిన అంశాలే దివ్య జ్ఞాన సమాజం అయింది. ఆమె భక్తురాలుగా అనిబిసెంట్ చివరలో ఇండియా వచ్చి ఆ ప్రచారం చేసింది. కథలు అల్లింది. అలాంటి ఆమెను తత్వవేత్తలలో చేర్చడం తత్వశాస్త్రానికి అవమానం.
ఆర్య సమాజం హిందూ మతానికి సంస్కరణ వాదంగా బయలుదేరి కొంత వరకు వ్యాపించి, ఆగిపోయింది. దీనికి వేదాలు ప్రమాణ గ్రంథం. అది తప్ప మిగిలినవి పక్కన బెట్టాలన్నారు. దానిలో భాగంగా అనేక సంస్కరణలు అమలు పరచడంలో దయానంద సరస్వతి కృషి చేశారు. వివాహ పద్ధతి కూడా ఒకటి వున్నది. అయితే వీరికి తత్త్వ శాస్త్రం ఏదీ లేదు. కాని గోపీచంద్ వీరిని చేర్చడం అసంబద్ధం.
ఇక చివర చివరకు పేరా సైకాలజీ పేరిట అతీంద్రియ శక్తుల విషయాలు ప్రచారంలోకి తెచ్చిన డా. జె.బి. రైన్ ప్రభావంలోకి గోపీచంద్ కూరుకుపోయాడు. చైతన్యం కాని మరి కొన్ని స్థాయిలున్నాయని, మహర్షులు ఆ స్థాయికి చేరుకున్నారని వారి అనుభవాలే వేదాలని రాశాడు. అంతేకాక వేదాలను ప్రశ్నించటానికి వీలు లేదని  కూడా గోపీచంద్ అన్నాడంటే, అతని ఆధ్యాత్మిక ధోరణి ఏ స్థాయికి తీసుకు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. మనం కింది స్థాయిలో ఉన్నామని, మహర్షులు పై స్థాయిలో ఉన్నారని కనుక వారిని ప్రశ్నించరాదని గోపీచంద్ నమ్మాడు.
ఉత్తరోత్తరా జె.బి. రైన్ వంటి వారి పేరా సైకాలజీ అశాస్త్రీయమని, స్పష్టంగా రుజువైంది. ఆయన అమెరికా యూనివర్సిటీలో దుకాణం మూసివేసి తాను చేసిన పనికి క్షమాపణ కూడా చెప్పుకున్నాడు. అప్పటికి గోపీచంద్ లేడు. మొత్తం మీద శాస్త్రీయ ఆలోచనకు దూరమైంతర్వాత గోపీచంద్ సొంత ఆలోచన అంటూ చేయలేదని స్పష్టమైంది. “దారి తప్పిన మానవుడు” అనే వి.ఎస్. రమాదేవి నవలలో గోపీచంద్ పాత్ర కనిపిస్తున్నదని పరిశీలకులు అంటారు. ఇది పరిశోధన చేయవలసిన అంశం.
మాకూ ఉన్నయి స్వగతాలు అనే శీర్షికన రిక్షా కార్మికుడు మొదలు అనేకమందిని ఇతివృత్తంగా తీసుకుని రాయటం చాలా బాగుంది. (గోపీచంద్ శత జయంతి (1910-2010) సందర్భంగా ఆయన రచనలు సాధ్యమైనన్ని కూర్చి, 10 సంపుటలుగా, కమిటీ వెలువరించింది. ఇవి విజయవాడలోని అలకనంద ప్రచురణల వారందించారు. చలసాని ప్రసాద్, కృష్ణాబాయి కూర్పు చేసి, చిన్న పరిచయ పీఠిక రాశారు. అయితే 1937 నుండి 1945 వరకు ఎం.ఎన్. రాయ్, మానవ వాద ప్రభావంలో గోపీచంద్ రాజకీయ రచనలు, విమర్శలు అనువాదాలు యీ సంపుటాలలో లేవు. మార్క్సిజం అంటే ఏమిటి? సోషలిస్ట్ ఉద్యమ చరిత్ర అనేవి లభించలేదని అన్నారు. ఈ వ్యాసంలో ఉదహరించిన విషయాలు, చూపిన పేజీలు పైన పేర్కొన్న సంపుటాలలోనివే. గోపీచంద్ రాడికల్ డెమోక్రటిక్ పార్టీ రోజులలో రాసిన రచనలు కావాలనే సంపుటాలలో చేర్చలేదని అంటారు.
narisetti
నరిసెట్టి ఇన్నయ్య

మళ్లా మళ్లా చదివించే ఖండకావ్యం బుచ్చిబాబు కథ

manognaచాలా మంది కథలు రాసారు, రాస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలిలో సాగిపోతుంటాయి. వీటిలో కాలగమనంలో నిలిచిపోయే కథలు మాత్రం కొన్నే ఉంటాయి. అలాగే కథకులు కూడా కొందరే ఉంటారు. శ్రీపాద, రావిశాస్త్రి, కొకు……ఇలా మన తెలుగులో అద్భుతమైన కథలు రాసినవాళ్ళు చాలా మందే ఉన్నారు. ఈ కోవకు చెందిన కథా రచయితే బుచ్చిబాబు.

మళ్లా మళ్లా చదివించే ఖండకావ్యంలా కొనసాగాలంటాను కథానిక’ అంటారు బుచ్చిబాబు ‘కథా, దాని కమామీషు’ అన్న వ్యాసంలో.  సరిగ్గా ఇదే పంథాలో సాగుతాయి బుచ్చిబాబు కథలు. విభిన్నమైన శైలితో, పాఠకులను ఆలోచింపజేసే విధంగా కథలు రాయడం  బుచ్చిబాబు అలవాటు.

కథలోని ప్రతి కోణమూ, ప్రతి పదమూ కొత్తగా ఉంటూ, పాఠకులు చర్చించుకునే విధంగా ఉండేది బుచ్చిబాబు కథన శైలి.  స్వానుభవం నుంచి జారిపడ్డ కథనాలు, విశ్లేషణ, పరిశోధన, సగటు మనిషి లో కనిపించే ఆశావాదం, స్వార్ధం లాంటి  భావోద్వేగాలు …….వెరసి బుచ్చిబాబు కథలు. చాలా మంది కథల్లో విశ్లేషణ, పరిశోధన మనకు కనిపించవు. కాని బుచ్చిబాబు కథల్లో అది మనకు స్పష్టంగా తెలుస్తుంటుంది.

‘నిరంతరత్రయం’, ఎల్లోరాలో ఏకాంత సేవ’ వంటి కథలు చదువుతుంటే అబ్బ అని  అనిపించకమానదు. ఒక కథ రాయడానికి బుచ్చిబాబు ఎంత పరిశోధన చేసారో అన్న ఆశ్చర్యానికి గురికావలసి వస్తుంది. ప్రతీ విషయం పట్ల ఆయనకున్న సూక్ష్మ అధ్యయనం, అవగాహనలకు తార్కాణం పైన చెప్పిన కథలు. మనుషుల మనస్తత్వాలను సరిగ్గా  అంచనా వేయగల సామర్ధ్యం బుచ్చిబాబు సొంతం. కథా వస్తువు గురించి ఈయన ఎక్కడికో పరిగెట్టరు. తన చుట్టూ జరుగుతున్న విషయాలనో లేక తాను ఇతరుల ద్వారా విన్న అనుభవాలనో తీసుకుని రాసినవే.

buchi-baabu-kathalu-2-500x500బుచ్చిబాబు కథల్లో అన్నింటికన్నా ముందుగా చెప్పుకోవలసింది ‘నన్ను గురించి కథ వ్రాయవూ’ అన్న కథ గురించి.  మొదట్లో ఈ కథ అంతగా నాకు అర్ధం  కాలేదు. ఏముంది ఈ కథలో అనిపించింది. కానీ రెండు, మూడు సార్లు చదివేసరికి కథలోని పస తెలిసి  వచ్చింది. బుచ్చిబాబు కథ రాసిన , తీర్చిదిద్దిన విధానం అవగతమైంది.  అలాగే కథలో పాత్ర ద్వారా చెప్పించే మాటలు బట్టి ఈయన కథా వస్తువును ఎన్నుకునే విధానం కూడా అర్ధం అవుతుంది.  ”బాగా చిన్నప్పుడు నన్ను గురించి కథ వ్రాయవూ? అని అడిగింది.  తర్వాత ఆ అమ్మాయి ఏమయింది నేనెరుగను. పదిహేను సంవత్సరాల తర్వాత ఆ ప్రశ్న ఓ కథకు వస్తువూ, పేరు కూడా అయింది”.

కథ విషయానికి వస్తే…..  ఆ కథలో నాయకి చాలా సామాన్యమైన ఇల్లాలు. పెండ్లవుతుంది. సంతానం కలుగుతుంది.  పెద్దదవుతుంది. వ్యాధికి గురై చనిపోతుంది. కథ చెప్పే వ్యక్తి ‘ఆమె చాలా సాధారణమైన మనిషే’ అంటూ ఉంటాడు పదేపదే.  వ్యాధిగ్రస్తురాలై ఆమె హాస్పిటల్‌లో ఉండగా చూట్టానికి వెడతాడు.

‘‘ఇంత జబ్బు చేసిందని నాకు చెప్పలేదేం?’’ అని అంటాడు.

‘‘ఇది మామూలు జబ్బే’’ అంటుంది కథానాయికి కుముదం.

దుప్పటిపైన ఉన్న ఆమె చేతిని సానుభూతితో తాకబోతాడు. చెయ్యి లాగేసి, దుప్పటిలో పెట్టుకుంటుంది. ఇది తప్ప ఇంకేమీ జరగదు ఆ కథలో.

‘‘నువ్వు నా కోసం పెండ్లి చేసుకోలేదు. అవునా?’’ అని కన్నుమూస్తుంది. కథ అక్కడితో ముగుస్తుంది. పై నుంచి చూస్తే కథలో ఏమీ కనిపించదు. కాని తరచి చూస్తే జీవితంలో జరిగే అన్ని సంఘటనలూ కనిపిస్తాయి. కుముదం బాల్యం, తొలి యవ్వనం, పెళ్ళి  జరగడం, పిల్లలను కనడం, జబ్బు పడడం, చనిపోవడం ఇలా అన్ని. ఆయా ఘటనలు జరిగే సందర్భాలలో కుముదం ఎదిగిన విధానం, ఆమె ఆలోచనలలో పరిపక్వత మనకు స్సఫ్టంగా తెలియజేస్తారు. అదే స్థాయిలో రచయిత ఎదుగుదల, భావజాలం లాంటివి  కూడా మనకు స్సష్టంగా కనపడుతుంటాయి. కుముదం, రచయిత వ్యక్తిత్వాల మధ్య సంఘర్షణ కథలోని ప్రధాన అంశం. వ్యక్తుల మనోభావాలు, ఆలోచనా విధానాలు పరిపక్వత పాఠకులను ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. బుచ్చిబాబు కథల్లోని ఈ అంశాలే  గొప్పవిగా కనిపిస్తాయి. పాఠకులను ఆలోచనలో పడేసే కథలే కాలగమనంలో నిలబడతాయి. తరాలు మారుతున్నా సాహిత్యసంపదలుగా నిలిచిపోతాయి.

కుముదం మొదటి నుంచీ రచయితను ప్రేమిస్తుంది. కానీ రచయిత కుముదాన్నీ ఎప్పటికీ ప్రేమించడు. ఈ సందేహంతోనే కథంతా సాగుతుంది. కానీ కుముదానికి జీవితం పట్ల ఒక అవగాహన, అభిప్రాయం మాత్రం ఉన్నాయని రచయిత తెలుసుకుంటాడు. అందులో  నుంచి పుట్టినదే ఈ కథ అని అనిపిస్తుంది.   కుముదం అందమైంది కాదు. అసాధారణ స్త్రీ కాదు. పదే పదే ఈ వ్యాఖ్య చేయబడి కనిపిస్తుంది కథలో. సారాంశం – ఆరోజులలో (1945-46) మధ్యతరగతి తెలుగిళ్ళలో కనిపిస్తూండిన సాధారణ గృహిణి ఆమె. అయితే,  కొన్ని సందర్భాలలో మాత్రం చాలా స్థిరప్రజ్ఞత కనిపిస్తంది ఆమె మాటలలో. అందుకే కుముదం గురించి రచయిత ఒకచోట ఇలా చెప్తాడు. ‘తన వ్యక్తిత్వాన్ని గుర్తించుకుని, దాని ప్రభావాన్ని ఇతరులకి తెలియచెయ్యాలన్న స్త్రీని మొట్టమొదట కుముదంలో  చూడగలిగాను. ఆమె ఒక జీవి. ప్రత్యేకమైన ఉనికి గలది. ఆమెని తొలగిస్తే ప్రపంచంలో కొంత పవిత్రమైన ఖాళీ ఏర్పడుతుంది’ అని వ్యాఖ్యానిస్తాడు అతను, కుముదం ఆ కోరిక గురించి. కుముదం ప్రభావం రచయితపై ఎప్పుడు పడిందనేది స్పష్టంగా చెప్పలేము కానీ  కథారచనకు ప్రేరణగా మాత్రం నిలిచిందని చెప్పవచ్చును.

‘బాహ్య జగత్తులోని విషయాలు అంతరంగంలోకి ప్రవేశించి, ఒకమూల నక్కి ఉండి ఎప్పుడో ఒకసారి బైటపెట్టమని ఒత్తిడి జరిగినప్పుడే అవి కథగా అంతరిస్తాయి’ అని అంటారు బుచ్చిబాబు. అలా అంతరంగ జగత్తులో నుండి పుట్టుకొచ్చినదే ‘దేశం నాకిచ్చిన సందేశం’  కథ. మనుషుల ప్రవర్తనలు చాలా విచిత్రంగా ఉంటాయి. వారి గురించి వారు పట్టించుకోకపోయినా ఇతరులు ఏమి చేస్తున్నారనే ఆతృతను మాత్రం విడిచిపెట్టరు. మనకు చాలామందిలో ఇటువంటి వైచిత్రి కనిపిస్తుంది. దీనినే కథాంశంగా తీసుకుని రాసిన కథ ఈ ‘దేశం  నాకిచ్చిన సందేశం’. చదువు పూర్తిచేసుకున్నాక కొన్ని సంవత్సరాలు బుచ్చిబాబును అందరూ అడిగిన ప్రశ్న తాలూకా పర్యవసానం ఈ కథ. అప్పటికీ ఆ కథ రాస్తానని, రాయాలని ఆయనకూ తెలియదు. కానీ కథలు రాసే సమయానికి మాత్రం బయటకు వచ్చి కథై కూర్చుంది.

ఎదుటివాడి జీతం ఎంతో తెలుసుకోవాలన్న కుతూహలం ఎవరెవరికి ఎన్నిరకాలుగా వుంటుందో వివిధ సందర్భాల్లో చూపిస్తూ ఆ ప్రశ్నకి సమాధానంగా, కథా నాయకుడు చమత్కారంగా, వ్యంగ్య భరితంగా, హాస్యయుక్తంగా అసలు సంగతి చెప్పకుండా ఎలా  తప్పించుకున్నాడో చెప్పిన కథ ఇది. ఇందులోని ప్రతి సంభాషణా చదివి ఆనందించదగినది. ప్రతి వాక్యం ఉదహరిచేందుకు యోగ్యమైనదే. లోకం పోకడ తెలుస్తుంది ఈ కథ చవిదితే. ‘జీతం’, ‘జీవితం’-ఒక్క అక్షరం అదనంగా ఉండడంలోనే అర్ధం అంతా వుంది అంటాడు  కథకుడు. తన చుట్టూ వున్న సమాజంలోని ధన సంస్కృతి మీద విరక్తి కలిగి, సన్యాసం పుచ్చుకుందామని ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తే, చివరికి ఆయన కూడా ప్రాథమిక ప్రశ్నలు అడిగాక, ఉద్యోగంలో ‘‘ఏమిస్తారు’’? అని అడుగుతాడు. కథానాయకుడికి ‘దేశం  తనకిచ్చిన సందేశం’ గురించి ఏవిధమైన జ్ఞానోదయం కలుగుతుందో కథ ముగింపులో తెలుస్తుంది!

అలాగే బుచ్చిబాబు రాసిన మరో మంచి వ్యంగ్య కథ ‘సౌందర్యాన్వేషణ’. అందం గురించి తెగ పట్టించుకుని, దాని గురించే తాపత్రయం పడే వారి కథ ‘సౌందర్యాన్వేషణ’. అందం రెట్టింపు చేసే సాధనం అనగానే వెర్రి వాళ్ళల్లా గంటలు గంటలు వరుసలో నిలబడి చివరకు అది  కేవలం ఇంగువ కోసం అని తెలిసి, చచ్చినట్టు దాన్నే కొనుక్కొచ్చిన పరంధామయ్య, అతని భార్యల కథ. ఎలాంటి కథలు రాసినా అందులో ఏదో ఒక విషయాన్ని సూక్ష్మంగా చర్చించడం బుచ్చిబాబు ప్రత్యేకత. అలాగే ఇందులో కూడా సౌందర్యం గురించి, దాని మీద  ప్రపంచం యెక్క భావన గురించి ఇలా వివరిస్తారు.

”వారి జీవితాల్లో ఆనందం, సౌందర్యం లేవు. శారీరక సౌందర్యం అంత ముఖ్యమైంది కాదంటారు. మరేదో శీలంలో సౌందర్యంట – మనస్సులో ఉంటుందంట.  బాహ్య సౌందర్యం ఉంటేనే ఆ మిగతావి కూడా ఉంటాయి.  అనాకారులైన కొందరు పెద్దలు, సుందరాకారులు విర్రవీగుతుంటే చూసి ఓర్వలేక, ఈ సిద్ధాంతం ప్రతిపాదించి అమాయక ప్రజపై రుద్దారు. ధనికవర్గం రోగం కుదర్చాలని బీదతనంలో ఆనందాన్ని పొగిడి పారెయ్యమని కవులను ప్రోత్సహించారు. సూది రంధ్రంలో ఒంటె  దూరడం ఎంత కష్టమో, భాగ్యవంతుడు స్వర్గద్వారం గుండా దూరటం అంత కష్టంట. ఇదంతా వెనక. ఈ రోజుల్లో ఈ దగా అంతా బయట పడిపోయింది. ప్రతివాడికి తిండి, బట్ట, కొంప, విశ్రాంతి, భార్య, పిల్లలు కావాలి. నలుగురూ కూడబలుక్కుని నిర్ణయించుకుంటే  శాంతియుతంగా పరిష్కారమయ్యే పని ఇదంతా. నేటి దేశాలు ఈ పనికి పూనుకున్నాయి.”

మామూలు జీవితాన్ని జీవిస్తూ ఏదో కావాలని కలలు కనే మధ్య తరగతి ప్రజలకు ఉదాహరణ ఈ కధ. వీరికి బుర్రలో చాలా ఆలోచనలు ఉంటాయి. ఏదో చేసేయాలని, ఎన్నో  పొందాలని తాపత్రయం ఉంటుంది. కానీ వారు ఏమీ చేయలేరు. ఎండమావుల వెంట పరుగులు తీస్తుంటారు. ఇదే ఈ కథలోని సారాంశం.

బుచ్చిబాబు మరో అద్భుతమైన కథ ‘ఎల్లోరాలో ఏకాంత సేవ’. మనుషుల ఆకర్షణలు, మనస్తతత్వాలు వాటి మధ్య చెలరేగే భావనల సమాహారం ఈ కథ. మూడు వైరుధ్యమైన పాత్రల మధ్య నడుస్తుందీ కథ. జ్ఞానసుందరి, మధుసూదనం, నాగరాజ్యలక్ష్మి అనే  ముగ్గురు వేరు వేరు మనస్తత్వాల మానసిక సంఘర్షణ ఎల్లోరాలో ఏకాంత సేవ. నాగరాజ్యలక్ష్మి, మధుసూదనం భార్యాభర్తలు అయితే జ్ఞానసుందరి నాగరాజ్యలక్ష్మి అక్క. వీరు ముగ్గురూ కలిసే ఉంటుంటారు. కానీ ఒకరితో ఒకరు ఇమడలేని పరిస్థితుల్లో తప్పక కలిసి  జీవిస్తుంటారు. ఇందులో చిన్నతనంలోనే వైధవ్యం పొంది, చెల్లెలి భర్త మీద ఆకర్షణ ఉన్నా అణుచుకుని కాలం వెళ్ళదీస్తూ…..తన యవ్వనాన్ని తలుచుకుని మధనపడుతుండే పాత్ర జ్ఞానసుందరిది. ఇక అన్నీ ఉన్నా అంటే భర్త, అనుభవించే వయసూ, మనసు ఇలా  అన్ని ఉన్నా అనుభూతుల్ని పంచుకోకుండా బాధ్యతలంటూ పరుగులు తీసేది నాగరాజ్యలక్ష్మి. బాధ్యతలు, భావుకతలూ, ఇష్టాలూ….వాటిని సాధించుకోలేని పరిస్థితుల మధ్య ఊగిసలాడుతూ ఏకాంతంలోకి పారిపోవాలని చూసే పాత్ర మధుసూదనానిది.  చాలా  మంది మనుషులు ఇలాగే ఉంటూ ఉన్నవాటిని వదులుకుంటూ, లేని వాటి కోసం పరుగులు పెడుతూ హాయిగా జీవించలేక సతమతమౌతూ జీవితాన్ని వెళ్ళదీస్తుంటారు. ఉన్నదాని విలువ కొందరు తెలుసుకోలేరు, లేని దాన్ని మరి కొందరు తెచ్చుకోలేరు. పైకి  ఆనందంగానే కనపడుతుంటారు. కానీ లోలోన మనోవ్యధకు లోనవుతుంటారు. ఈ భావాన్నే అందమైన కథగా మలిచారు బుచ్చిబాబు.

కట్టె కొట్టె తెచ్చె అన్నట్టు కథ రాయడం బుచ్చిబాబుకు నచ్చదు. ఏది రాసినా విపులంగా లోతుగా రాయడం ఆయన అలవాటు. అది ఒక్కోసారి ఉపన్యాసంలా అనిపించినా తప్పదు అంటారు.  కథలో చెప్పదలుచుకున్నది అందంగా, శక్తివంతంగా, స్పష్టంగా కనిపిస్తూ  రచయితకు నచ్చాలి అంటారు బుచ్చిబాబు. ఆయన కథలన్ని ఆయనకు అలా అనిపించాకే రాసారు. బుచ్చిబాబుకే కాదు పాఠకుడికి కూడా అలానే అనిపించే విధంగా రాసారు అంటాను నేను. ‘ఎల్లోరాలో ఏకాంత సేవ’ కథలో ఆయన విశ్లేషణ తీరు చదివిన ఏ  పాఠకుడికి అయినా ఆశ్చర్యపరచకమానదు.   ఈ కథలో ప్రపంచానికీ, ప్రకృతికీ మధ్య సమన్వయం కుదర్చడానికి చేసిన ప్రయత్నంలా అనిపిస్తుంది నాకు. ఒక పక్క మానవసంబంధాలు – వ్యక్తిత్వాలూ, సంఘర్షణలూ వాటి గురించి చెబుతూనే ప్రకృతి  గురించి చెబుతూ ప్రకృతి గురించి కూడా వర్ణనలు చేస్తారు బుచ్చిబాబు ఇందులో.  ప్రకృతిలో జీవం ఉంటుంది అంటారు ఈయన. అందుకే దాని గురించి ఆయన ఇలా వర్ణిస్తారు కథలో.

”చెట్ల వెనుక నుంచి సంధ్య వెలుగులో అతిశయోక్తిగా పరిభ్రమిస్తూ వున్న పొడుగాటి నీడలు పల్చబడి, రాళ్ళ రంగుల్ని వెలిగించి, ఆకృతుల్ని మార్చి దిగజారుతున్నాయి. ఆకుల మధ్య కిరణాలు వనదేవత కుట్టు పనిలో సూదులలా వెనక్కీ ముందుకీ  కదుల్తున్నాయి. గాలి జోరు తగ్గిన తర్వాత అగ్నిదేవుడు వేసిన గాలి పటం కిందకు పడిపోతున్నట్లు వెనక్కి వెనక్కి నడుస్తున్నాయి. ఆ దూరపు కొండ ముసుగు తీసినట్లయింది. కొండ మళుపులో పచ్చిక బయళ్ళు వొస్తూ ఉన్న జుట్టులా కనిపిస్తున్నాయి. కన్ను  మెదిపినట్లు సూర్యబింబం గుహల వెనుక జారుకుంది. చివరి కిరణాలు, అలిసి పరున్న ప్రకృతిని, జలపాతం నీటిని, మేఘాలని, రాళ్ళ సమూహాలని వొక్కసారి వెన్నుచరిచి లేపినట్లు, బంగారం కరిగి, ఎర్రరాళ్ళ మొహాన జారిన కుంకుమ బొట్టులా మారి, మందారం  మధ్యలో ముదిరిన ఎరుపులో నలుపులా ఇంద్రజాలికుడు పరికరాల్ని బుట్టో వేసుకుని వెళ్ళిపోతుంటే వీడ్కోలివ్వడం ఇష్టంలేక సంధ్యాకాంత ముసుగు బిగతన్ని పరున్నట్లనిపించింది.”

ఇది కొంచెం సుదీర్ఘమైన వర్ణనగానే చెప్పుకోవాలి. కథల్లో ఇంతంత వర్ణనలు ఉండడం చాలా అరుదు. కానీ చూడండి బుచ్చిబాబు చేసిన ఈ వర్ణన ఎంత అందంగా ఉందో…..ప్రకృతికీ, మనిషికీ – ప్రపంచానికీ పోల్చిన వైనం ఎంత సమంజసంగా ఉందో. ఇలాంటి వర్ణనలు  పెద్దవి అయినా కథలో మిళితమై….అంతర్లీనంగా సాగిపోతుంటే అందంగా అనిపిస్తాయి. సాఠకులను ఆహ్లాదంగా చదివిస్తాయి.

అలాగే మనుషుల గురించి, వారి మనస్తతత్వాల గురించి ఈ కథలో బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యానాలు కూడా కొన్ని అద్భుతంగా ఉంటాయి. మచ్చుకకు కొన్ని ఇక్కడ.

“శరీరం పట్ల మనకు గౌరవం పోయింది. శివలింగ పూజలోని ప్రాధాన్యతని పూర్వులు పొగిడినా, ఈనాడు శరీరశక్తి పట్ల ఆదరణ లేదు. ప్రతిభాశాలులైన ఒకరిద్ధరు శిల్పులు రాయిద్వారా యీ సూత్రం చాటుతున్నారు. ఆధునిక శిల్పానికి మొహం ఉండదు – స్ఫుటమైన  ఆకారంలో ముఖ్యమైన కోణాలుంటాయి. అట్లా ప్రదర్శిస్తే, కళ్ళు తెరచి శరీరం చూస్తారని. కాని చూడ్డంలేదు. ఎగ్జిబిషన్లో పెడుతున్నారు. శిధిలాలకింద జమగట్టి, పురావస్తుశాఖవారికి వప్పగించేస్తారు. మరొకి శరీరం చూడలేనివారు, తమ శరీరాలు చూసుకోలేరు.”

“మామూలువాళ్ళకి నీతీ మంచీ వుండాలి – కాని ఏఒకరిద్ధరో అసాధారణ వ్యక్తులుంటారు. ప్రతి సంఘంలోనూ వారికి స్వేచ్చ ఉండాలి. ఉంటేనే ఏదోఒక ఘనకార్యం చెయ్యగలుగుతారు. సంస్కృతీ, నాగరికతా వారివల్లనే వృధ్ధిచెందుతాయి”.

“స్త్రీని ఆటవస్తువుగా,ఆస్తిలో ఒకభాగంగా, బానిసగా వాడుకుంటున్నారు ఈ మొగాళ్ళంతా అంటారుగానీ, వీళ్ళెవరికీ అసలువిషయం తెలీదు. స్త్రీయే పురషుణ్ణి పెద్దహాల్లో మధ్య బల్ల మీద పూలతొట్టి లాగా చూసుకుంటుందని ఎవరూ పైకనరేం? ఆ తొట్టిలో రోజూ కొత్తకొత్త  పూలుపెట్టి వాసన చూసుకుంటూ,— హాల్లో చోటులేక బల్ల జరినిపినప్పుడు, ఆపూలతొట్టిని దూరంగా దొడ్లొ పడెయ్యటం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా కోపమొస్తే దాన్ని నేలకేసి కొట్టడం- అది ముక్కలవడం. డబ్బున్న స్త్రీ కొత్త తొట్టిని కొనుక్కుంటుంది.”  మొదటిసారి ఈ వ్యాఖ్యానాన్ని చూసినప్పడు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంటీ బుచ్చిబాబు ఇలా రాసారు అనుకున్నాను. కానీ తరచి చూస్తే భార్యా – భర్తల మధ్య ఇదొక కోణం కూడా ఉండొచ్చు అనిపించింది. కొంతమంది విషయంలో ఇదే నిజం కావచ్చు  ఒప్పుకోవడానికి మనసు రాకున్నా.

ఇలా చెప్పుకుంటే పోతే మొత్తం కథంతా ఇక్కడ నేను మళ్ళీ రాసేయాల్సి వస్తుంది. అలాగే అన్ని కథల గురించి కూడా చెబుతూ పోతే మరో పుస్తకమూ తయారవుతుంది. కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నా…..కానీ బుచ్చిబాబు కథలు ఇంచుమించుగా అన్నీ మంచి కథలే.   కచ్చితంగా చదవాల్సిన కథలే. మొదటిసారి చదివినప్పుడు నచ్చకపోవచ్చును, అర్థం కాకనూపోవచ్చును. అలాని అక్కడితో వదిలేయకండి, మరొకసారి చదవండి. తప్పకుండా నచ్చుతాయి.

రచయితలు చేసిన రచనల్లో బాగున్నవీ ఉంటాయి, బాగోలేనివీ ఉంటాయి. అలాగే బుచ్చిబాబు కథల్లో కొన్ని మంచి కథలు కానివి కూడా ఉన్నాయి. కొన్ని కథలు అస్సలు నచ్చలేదు. కానీ నచ్చని వాటి కంటే నచ్చినవే ఎక్కువ ఉన్నప్పుడు, నచ్చని వాటిని వదిలేయచ్చు అని నా భావం. పైగా బుచ్చిబాబు కథల్లో నచ్చనివి చాలా తక్కువగా, లెక్కింపతగనివిగా ఉన్నాయి. కాబట్టి వాటి గురించి పెద్దగా చర్చించడం లేదు.

హేతువాదం లోతుల్లోకి … “ఏది నీతి, ఏది రీతి”?

గత 30 ఏళ్ళుగా రావిపూడి వెంకటాద్రి సంపాదకత్వాన వస్తున్న ‘హేతువాది’ మాసపత్రిక లో నరిసెట్టి ఇన్నయ్య రాసిన వ్యాసాలన్నిటినీ ఇసనాక మురళీధర్ సేకరించి, క్రోడికరించి “ఏది నీతి, ఏది రీతి” అనే పేరుపై e-book గా వెలువరించారు. ఇది ఇంకా పుస్తకంగా రావలసి ఉంది.

ఈ ఇ-పుస్తకంలో 50 వ్యాసాలున్నాయి. కొందరు ప్రముఖ హేతువాద నాయకుల దృక్పథాల గురించిన వ్యాసాలతో పాటు హేతువాద సమస్యలు, ఎదుర్కొంటున్న చిక్కులు, వైజ్ఞానిక దృక్పథంతో సూచిస్తున్న మార్గాంతరాలూ ఇందులో ఉన్నాయి.

జ్యోతిష్యం, సెక్యులరిజం, హోమియోపతి, మెస్మరిజం వంటి సమస్యలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. కొన్ని సమస్యలు కేవలం భారతదేశానికి చెందినవి. ఉదాహరణకు అయ్యప్ప, రామకృష్ణపరమహంస, వివేకానందుడు, అరవిందాశ్రమం ఇందులో పేర్కొనదగినవి. గాంధీజీ గురించిన వ్యాసం ప్రత్యేక కోణంలో చూపిన తీరు గమనార్హం. ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ గురించి శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషణ చేశారు. అమెరికాలో జేమ్స్ రాండీ వలె, ఇండియాలో ప్రేమానంద్ నిర్వహించిన పాత్ర, బాబాల, మాతల మోసాలను వెల్లడించిన తీరు, జ్యోతిష్యాన్ని, దివ్యశక్తులను ఛాలెంజ్ చేసి ఎండగట్టిన తీరు విశిష్టమైనది.

మరణించిన తరువాత ఆత్మ ఉన్నదని, స్వర్గానికి పోతుందని నరకానికి పోకుండా అడ్డుపడే పూజలూ, క్రతువులూ ఉన్నాయని నమ్మించి వ్యాపారం చేసే ధోరణి వైజ్ఞానికంగా ఎంత భ్రమపూరితమైనదో చూపడం కనువిప్పు కలిగిస్తుంది. త్రిపురనేని గోపీచంద్ హేతువాదిగా విజృంభించి, ఆధ్యాత్మిక వాదిగా దిగజారిపోయిన ధోరణి గురించి చదువుతుంటే చాలా ఆసక్తి గా వుంటుంది. భారతదేశంలో సెక్యులరిస్టు ఉద్యమాన్ని ఎంతో కట్టుదిట్టంగా ప్రారంభించి నిలదొక్కుకునేటట్లు చేసిన ఎ.బి.షా పాత్ర గమనార్హం. ర్యాడికల్ హ్యూమనిస్టు నాయకుడిగా మల్లాది రామమూర్తి దేశంలో నిర్వహించిన పాత్ర వెలుగులోకి తెచ్చిన వ్యాసం ముఖ్యమైనది . ఎమ్.ఎన్.రాయ్ సాహిత్యాన్ని పరిష్కరించి ప్రచురించిన శిబ్ నారాయణ్ రే గొప్ప చరిత్రకారులుగా మిగులుతారు. పోస్ట్ మోడరనిజం పేరిట కొందరు ఆధునికులు వేస్తున్న వెర్రితలల ధోరణి ని కూడా ఈ వ్యాసాల్లో నరిసెట్టి ఇన్నయ్య చర్చించారు .

కులం భారతదేశానికి ప్రత్యేకమైనది. అది మతం ద్వారా వచ్చింది. దాన్ని హేతువాదులు ఎలా చూస్తారు అనే విషయం కొత్త ఫక్కీలో నడిచింది. మూఢనమ్మకాలలో మనకు ఏమాత్రం తీసిపోని అమెరికా ఎన్ని వక్ర మార్గాలను అనుసరిస్తున్నదో గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాలో చదువు, విజ్ఞానం, సంస్కారం ఏమయ్యాయని ఆశ్చర్యపోయేవిధంగా అక్కడ మూఢనమ్మకాలు అమలులో ఉన్నాయి. చదువుకున్నవారిలో ఇలాంటి నమ్మకాలుండటానికి మూలకారణాలేంటి? అనేది లోతుగా పరిశీలించిన దానిని బట్టి ఇండియాకూ, అమెరికాకూ పోలికలు కనిపిస్తాయి.

అంబేద్కర్ పేరిట అన్ని రాజకీయపక్షాలూ ఓట్లకోసం, సీట్లకోసం పడుతున్న పాట్లు, వేస్తున్న ఎత్తుగడలు చూపటం ఈ పుస్తకంలో మరొక విశేషం. వెంకటేశ్వర సుప్రభాతంలో తెలుగు ఎందుకు ఉండదు? సంస్కృతంలోనే ఎందుకు అనే విషయాన్ని వెనిగళ్ళ సుబ్బారావు రాసిన అంశం వెలుగులోకి తెచ్చింది.

పిల్లల విషయాల్లో కూలంకషంగా అన్ని కోణాలను పరిశీలించటం ఈ గ్రంథంలో మకుటాయమానం. అలాగే సెక్యులరిజం గురించిన అంశం కూడా చాలా నిశితంగా పరిశీలించటం గమనించవచ్చు. సెక్యులరిజాన్ని గురించి అందరూ భజన చేస్తుండగా అసలు విషయం ఏమిటి? అని చూడటం గమనార్హం. మొత్తం మీద చర్చను పురికొల్పే అంశాలు, వైజ్ఞానిక ధోరణిని పరిశీలించాల్సిన ఆవశ్యకత, గ్రంథం యావత్తూ అంతర్లీనంగా వ్యాపించి వుంటుంది.

భావ స్వాతంత్ర్యం విలువ మాటలలో చెప్పలేనిది. ఈ విలువ ప్రాణం కంటే తక్కువేమి కాదు. ఆస్తికుడిగా ఉండాలా లేక నాస్తికుడిగానా అనేది ఎవరికివారు నిర్ణయించుకోవలసిన విషయం. అయితే కొన్ని మొహమ్మదీయ దేశాలలో ఇలాంటి హక్కు లేదు. అఫ్గనిస్తాన్, ఇరాన్, మాల్దీవులు,మౌరిటానియ, పాకిస్తాన్, సౌది అరేబియ ఇంకా సూడాన్ దేశాలలో నాస్తికత్వం నిషేధింపబడ్డది . ఇక్కడి వ్యక్తుల నమ్మకాలు వారిని మరణదండనకు గురిచేసే ప్రమాదముంది. ఇది ఖచ్చితంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన మానవహక్కుల ఉల్లంఘనే. డా.ఇన్నయ్య పెక్కువిషయాలలో తన అభిప్రాయాలను నిర్భీతిగా వెల్లడించటం ఈ వ్యాసాలలో గోచరమవుతుంది. రచయిత ఇన్నయ్య అమెరికా లోని మేరీలాండ్ లో నివాసముంటున్నారు.

ఈ ఇ-పుస్తకాన్ని ఇక్కడ చదవవచ్చు లేక ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు.

సచిన్ లా ఆడలేకపోవచ్చు… అతని లా ఉండొచ్చు

kolluriసచిన్ టెండూల్కర్… పరిచయం అక్కర్లేని పేరు.  పసిపిల్లల నుంచీ పండుముదుసలుల వరకూ అందరికీ తెలిసిన పేరు. క్రీడకన్నా క్రీడాకారుడు ఎక్కువ అభిమానం సంపాదించుకున్న దృష్టాంతం సచిన్ టెండూల్కర్.

క్రికెట్లో ప్రవేశించిన రోజు నుంచీ నేటి దాక ఎందరినో తన ఆటతీరుతోనూ, వ్యక్తిత్వంతోను ఆకట్టుకున్న వ్యక్తి టెండూల్కర్. మన దేశంలో సచిన్‌ని వేలంవెర్రిగా అభిమానించేవారున్నారు, ఆరాధించేవారున్నారు. సచిన్ ఒక ఐకాన్.

సచిన్ టెండూల్కర్ రికార్డులు, ఆటతీరు గురించి ఎన్నైనా పుస్తకాలు వచ్చివుండచ్చు, కానీ సచిన్ అంతటి గొప్పతనం ఎలా సాధించాడో, పొందిన ఔన్నత్యాన్ని ఎలా నిలుపుకున్నాడో చెప్పే పుస్తకాలు తక్కువ. అటువంటి పుస్తకమే “దేవుడిని మర్చిపోదామిక”. సచిన్ ఆట కన్నా అతని వ్యక్తిత్వమే అతనికి ప్రపంచవ్యాప్తంగా మన్ననలను అందిస్తోందని రచయిత రేగళ్ళ సంతోష్ కుమార్ అంటారు. టెండూల్కర్‌లా అయిపోవాలనుకునేవాళ్ళేమీ తక్కువ లేరు మన దేశంలో. “మనకన్నా చిన్నవాళ్ళు మంజ్రేకర్‌ టెండూల్కర్ లూ లేరా మనకెగ్జాంపులు…..” అనుకుని ముందుకు దూకేవాళ్ళుంటే, “బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్తు ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు ” అని ప్రోత్సాహించేవాళ్ళూన్నారు.

అయితే టెండూల్కర్ ఆటలో అంత నిలకడగా రాణించడానికి రహస్యం టాలెంట్‍తో పాటుగా, సాధన, ఆట పట్ల మమకారం, వివాదరహితమైన వ్యక్తిత్వమే కారణాలు. టెండూల్కర్‌తో పాటు జట్టులోకి వచ్చి, ఒక వెలుగు వెలిగి ఆరిపోయిన ఆటగాళ్ళెందరో ఉన్నారు. వారికి, టెండూల్కర్‌కీ ఉన్నతేడా ఏమిటో ఈ పుస్తకం చెబుతుంది. మనలో చాలామంది చేసే పొరపాటుని ఈ పుస్తకం సున్నితంగా ఎత్తి చూపుతుంది. మనం గొప్ప వ్యక్తులను ఆరాధిస్తాం, వారిలా ఆ ఘనతని సాధించాలనుకుంటాం. వారి సుగుణాలను అలవర్చుకోకుండా, వ్యక్తి ఆరాధనకి, అనుకరణకి పూనుకుంటాం. సినిమా హీరోల నుంచి ఆటగాళ్ళ వరకూ చాలా మంది విషయంలో జరిగేది ఇదే.  ఈ తప్పునే చేయద్దంటున్నారు రచయిత.

టెండూల్కర్‌ని వ్యక్తిగా ఆరాధించద్దు, అతని సుగుణాలను గ్రహించి వాటిని మన జీవితాల్లోకి ఆహ్వానించాలని సూచిస్తున్నారు. స్వామి వివేకానంద కూడా  “Learn Everything that is Good from Others, but bring it in, and in your own way absorb it; do not become others.” అంటూ ఇదే విషయాన్ని చెప్పారెప్పుడో.

సచిన్‌లో బాల్యంలో ఉన్న నెగెటివ్ లక్షణాలను కుటుంబం పాజిటివ్ లక్షణాలుగా మార్చిన విధానాన్ని మనం గ్రహించాలి. మనలో బోలెడన్ని నెగటివ్ లక్షణాలుంటాయి. కానీ వాటిని నెగటివ్ గానే ఉంచుతున్నామా… పాజిటివ్‌గా మలచుకుంటున్నామా? బలహీనతగా నిలిచిపోతున్నామా? బలంగా మలచుకుంటున్నామా అనేది కీలకం అని అంటారు రచయిత.

తన అభిమాన హీరో జాన్ మెకన్రోలోని దూకుడుని ఇష్టపడ్డ సచిన్, దాన్ని మక్కీకి మక్కీ కాపీ కొట్టలేదు, మెకన్రో తీరుని ఆస్వాదించిన సచిన్ దాన్ని ఉన్నదున్నట్లుగా అనుకరించలేదు. తన హీరోలా ఆవేశాన్ని హావభావాల్లో కాకుండా… తన ఆటలో చూపించాడు. అభివృద్ధికి అనుకరణ తొలిమెట్టవ్వాలే కానీ, రెండో మెట్టూ… చివరి మెట్టూ కూడా కాకుడదూ అని అంటారు రచయిత.

“ఉన్నచోటనే ఉండాలంటే శాయశక్తులా పరిగెత్తాలి, మరింత ముందుకు వెళ్ళాలంటే…. రెట్టింపు వేగంతో పరుగెత్తాలి!” అనే లూయిస్ కరోల్ వాక్యాల్ని ఉటంకిస్తూ… “అలా రెట్టింపు వేగంతో పరిగెట్టిన వారే ఛాంపియన్లవుతారు! చదువులోనైనా…. ఆటల్లోనైనా… ఉద్యోగంలోనైనా… జీవితంలోనైనా!” అని చెబుతారు రచయిత. అది సచినైనా, మీరైనా, నేనైనా…ఎవరైనా అంటూ హామీ ఇస్తారు.

“చెడిపోయే వాతావరణంలో ఉంటూ కూడా… చెడిపోకుండా ఉండగలిగేవాడే గొప్పవాడు” అంటూ బాహ్య ప్రపంచపు ప్రభావాలకు బానిసవకుండా నిలబడేవాడే సచిన్‌లా నిలుస్తాడు అంటారు రచయిత. ఒత్తిడిని జయించేందుకు సచిన్‌ని ఉదాహరణగా చూపుతారు రచయిత. లక్షల మంది మధ్యలో ఉన్నా…. తానొక్కడే ఉన్నట్లు…. తాను ప్రపంచ ప్రభావంలో పడకుండా…. ప్రపంచాన్ని తన తన్మయత్వంలో మునిగేలా చేయలాంటే…. నా కోసం నేనాడుకుంటున్నానన్నట్లు ఆడాలి. ఉదాహరణలను, పోలికలను పట్టించుకోకుండా, మీ పని మీరు చేసుకుపోవాలి, పట్టుదలతో చేసుకుపోవాలి. ఎదుగుదలకి మొదటి పాఠం నిరంతరం సాన… అనుక్షణం పోటీ… పోటీ ఎవరితోనో కాదు… తనతో తనకే పోటీ. మొన్నటికీ నిన్నటికీ తేడా ఏమైనా ఉందా అని పోటీ…! నిన్నటికీ, నేటికీ ఏమైనా మెరుగయ్యానా అని పోటీ…. ఎందుకంటే మొన్న ఏం ఘనత సాధించామో నిన్నకి అక్కర్లేదు. నిన్న ఏం కీర్తి గడించామో నేడీ లోకం పట్టించుకోదు. నేడు ఏం చేస్తున్నామనేదే ముఖ్యం.

పుస్తకం చివర్లో సచిన్‍తో రచయిత జరిపిన ఇంటర్వ్యూ ఉంది. అందులో ఒక ప్రశ్నకి సమాధానంగా “అంకితభావం, ఆత్మగౌరవం, విజయేచ్ఛ” – విజేతల లక్షణాలని సచిన్ చెబుతాడు. ఏ రంగంలోనైనా రాణించాలనుకునేవారికి ఇవి థంబ్ రూల్స్ లాంటివి.

క్రికెట్ దేవుడిగా కంటే మాములు మనిషిగా సాధించిన ఘనతలెన్నో సచిన్ జీవితంలో ఉన్నాయి.  మనం అతనిలా ఆడలేకపోవచ్చు…. కానీ అతనిలా ఉండొచ్చు…. అతనిలా పరుగులు తీయలేకపోవచ్చు…. కానీ అతనిలాగానే పడకుండా నిలబడొచ్చు…! అతనిలా రికార్డులకెక్కలేకపోవచ్చు…. కానీ అతనిలా పైకెదగొచ్చు…..! అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి.

ప్రచురణకర్తల వివరాలు:

ప్రచురణ: సహృదయ సంతోషం ఫౌండేషన్

ప్లాట్ నెం. 68, లయన్స్ టౌన్ కాలనీ, హస్మత్ పేట, ఓల్డ్ బోయినపల్లి,

సికిందరాబాదు- 500009

sahrudayasanthosham@gmail.com

ఏకబిగిన చదివించే “దేవుణ్ని మర్చిపోదామిక, సచిన్‌ని గుర్తుంచుకుందాం” అనే ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఇక్కడ  చూడండి.

పదేళ్లుగా వెంటాడుతున్న ప్రళయ కావేరి!

ramasundari

అమ్మంటే కన్నతల్లి మటుకే కాదు. అమ్మంటే అమ్మబాస కూడా. అమ్మంటే అమ్మనేల కూడ.

-స.వెం.రమేశ్ Quote

ప్రళయ కావేరి కథలు…

ఈ కధలు పదేళ్ళ క్రితం నా ఆదివారపు ఉదయాలను సమ్మోహపరిచేవి. ఆ కధన సుగంధాలను రోజంతా ఆస్వాదించి, సోమవారం కాలేజ్ లో హరిత, నేను మళ్ళీ నెమరేసుకొనే వాళ్ళం. ఆ నాలుగు నెలలు ఈ కధలు మమ్మల్ని నవ్వించి, ఏడిపించి, కోపించి, స్నేహించి, బోధించి, గాలించి, గాయపరచి, నయం చేసి, చిరునవ్వుతో మాయమయ్యాయి. పదేళ్ళ తరువాత ఆ కధలు ఈ మధ్య నన్ను వేటాడటం మొదలుపెట్టాయి. దానికి కారణం  నాకు పక్షుల మీద పెరిగిన ఆసక్తి  ఒక్కటే కాదు. ఆ కధల సమ్మోహనత్వాన్ని మరింత కావలించుకోగలిగిన మనః పరిణితి పెరగటం కూడా అనుకొంటాను.

ఇటీవల మళ్ళీ ప్రాచుర్యం లోకి వచ్చిన శ్రీ రమణ ‘మిధునం’ కధ కూడ ఈ పుస్తకాన్ని నాకు గుర్తు చేసింది. ఈ కధలను రాసిన  కాలమాన, భౌగోళిక, చారిత్రక నేపధ్యంలో ఉన్న భిన్నత్వం, ఆయన కధావస్తువుగా ఎన్నుకొన్నసామాజికవర్గం, అన్నిటికి మించి ఆయన కధాస్థలాన్ని, కధలలోని పాత్రలను ప్రేమించి రాసిన వైనం నాకు పలు సార్లు గుర్తుకు వచ్చి మళ్ళీ ఈ కధలను చదవాలనే కోరిక పెరిగింది. ప్రళయ కావేరి ప్రాంతానికే (ఇప్పటి పులికాట్) పరిమితమైన  ప్రత్యేక మాండలికం, పక్క జిల్లావాసిగా నేను అర్ధం చేసుకోగలటం కూడా నన్నీ కధలలో మమేకం చేయగలిగింది .

ఈ పుస్తకం కోసం నేను ప్రయత్నం చేస్తూనే పులికాట్ కు గత డిశంబర్ లో ప్రయాణం కట్టాను. పక్షులను చూడాలనే వంక పెట్టాను కాని ప్రళయ కావేరి  దీవులను చూడచ్చు అనే కోరిక కూడా ఉండింది. నేను పులికాట్ వెళుతున్నవిషయం విని మా అమ్మ “మీ తాతలు అక్కడ నుండే వలస వచ్చారట” అని చెప్పింది. అయితే పరిమితమయిన సమయం, వనరులు మమ్మల్ని శ్రీహరి కోట వరకు మాత్రమే తీసుకొని వెళ్ళ గలిగాయి. ఊరుకోలేక  రోడ్డు దిగి పులికాట్ లో అడుగు పెట్టాను. అడుగు, అర అంగుళం మేర కూరుకు పోయింది. “మే బద్రం! మీ గెట్టి నేలోళ్ళు మా అడుసు నేలలో నడవటం చెతురు కాదమ్మే!” అని వెంకన్న తాత సైగ్గా నుల్చుని చెప్పినట్లనిపించింది.

ఈ పుస్తకం నాకు దొరికి, పుస్తక పరిచయం రాయాలని అనుకొన్నప్పుడు; పరిచయం కాదు ఈ కధలు మీద ఒక పరిశోధనే జరగొచ్చని అనిపించింది.  నిజానికి ఈ పుస్తకం ఒక నడిచిన చరిత్ర. ఒక పర్యావరణ శాస్త్రం. పరిణామ క్రమాన్ని, సామాజిక శాస్త్రం తో కలబోసి మనకు అందించిన విజ్ఞానం. ముఖ్యంగా ఈ ప్రాంత మాండలికానికి చెందిన సొగసు చదువరులకు గిలిగింతలు పెడుతుంది.  ‘ఉత్తరపొద్దు’ ప్రచురణ కాగానే మొదటి స్పందన దాశరధి రంగాచార్య నుండి వచ్చిందట. “ఉత్తరపొద్దు  తెలుగు పున్నమి వెన్నెల్లో దిశాంబరంగా సాగిపోతున్న బతుకు చక్కదనం, కలుపు మొక్క లేని తెలుగు పంట” అని స్పందించారు. కలుపు మొక్కలేదు అనటం లో ఆయన అర్ధం ఒక్క ఇంగ్లీష్ ముక్క కూడ ఈ కధల్లో వాడక పోవటం కూడా  అనుకొంటాను.

అంతరించిపోతున్న చాలా తెలుగు పదాలని ఈయన ఈ కధలలో నిక్షిప్తం చేసారు. ఇక సామెతలు, ఉపమానాలు, నుడికారాలు పుష్కలంగా; తెలుగు సాహిత్యాభిమానులకు మనసు నిండుగా ఉన్నాయి. అక్బర్ గారు, చిదంబరం గార్ల స్కెచ్ లు మనలను కధలలోకి నేరుగా లింక్ చేస్తాయి. ఆ మాండలికంలో మనకు అర్ధం కాని పదాలకు ఫుట్ నోట్స్ లో అర్ధాలు ఇచ్చారు.

kaveriప్రళయ కావేరి దీవుల్లో నడిచే ఈ కధలన్నీ ఒక బాలుడి భాష్యంతో నడుస్తాయి. ఈ దీవుల్లో ఒకటైన ‘జల్లల దొరువు’లో ఉంటున్న తాతా, అవ్వల దగ్గరికి సెలవల్లో గడిపి, అక్కడి సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక జీవనాన్నిరచయిత  ఆకళింపు చేసుకొని పెద్దయ్యాక తన భాషాపరిజ్ఞానంతోను, సామాజిక సృహ తోనూ రాసిన కధలివి. శంకరంమంచి ‘అమరావతి కధలు’, వంశీ ‘పసలపూడి కధలు’ ఖదీర్ బాబు ‘దర్గామిట్ట కధలు’, నామిని ‘పచ్చ నీకు సాక్షిగా’.. ఇవన్నీ ఒక ప్రాంతానికీ, రచయితకి ఉన్న అనుబంధానికి చెప్పిన అందమైన భాష్యాలే. కాని ప్రళయ కావేరి కధల్లో అనుబంధంతో పాటు ఆ ప్రాంత భౌసర్గిక స్వరూపం,  ఆహారపు అలవాట్లు, వారి సాంస్కృతిక జీవనానందాలు ,వాళ్ళ పంటలు, పిల్లల ఆటపాటలు, స్రీల జానపదాలు, పొడుపు కధలు….వీటన్నిటి వర్ణన ఉంటుంది. ఇదంతా ఎంత హృద్యంగానంటే గుండె మార్పిడి జరిగినట్లు; రచయిత అనుభవం, అనుభూతి సంపూర్తిగా పాఠకుడికి బదిలీ అవుతుంది.

రచయిత జీవితాన్ని అన్ని ముఖాల్లోంచి దర్శిస్తాడు . ప్రళయ కావేరి కధల రచయిత స.వెం.రమేశ్ అందులో పూర్తిగా సఫలీకృతం అయినట్లు నాకు అనిపించింది. ఈయన తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణ కోసం పూర్తి కాలం పని చేస్తున్న కార్యకర్త.  చదివిన చదువు మానవ సమాజ పరిణామ క్రమం, తెలుగులలో రెండు ఎమ్మేలు.

రచయితకు తన తాతే బోధకుడు, తాత్వికుడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని   పదాడంబరంతో కాకుండా సహజమైన సహవాసం, సాన్నిహిత్యంతో మనకు అర్ధం చేయిస్తాడు రచయిత. “అమ్మంటే కన్నతల్లి మటుకే కాదురా. అమ్మంటే అమ్మబాస కూడా. అమ్మంటే అమ్మనేల కూడ.” అని నేర్పిన తాత రుణం ఈ కధలు రాసి తీర్చుకొన్నాడు రచయిత.

ఈ కధల నాయకుడు వెంకయ్య తాత మన రచయితను తన భుజాలమీద ఎక్కుంచుకొని లెక్కలు నేర్పాడు. “అబ్బయా! సేరుకి రెండు అచ్చేర్లు. ఒక అచ్చేరుకి రెండు పావుసేర్లు. పావుసేరుకి రెండు చిట్లు. రెండు బళిగలయితే ఒక చిట్టి. దాని కన్న చిన్నది ముబ్బళిక. అన్నింటి కన్న చిన్న కొలత పాలాడ. మూడన్నర సేరు ఒక ముంత. నాలుగు ముంతలు ఒక కుంచాము. రెండు కుంచాలు ఒక ఇరస. రెండు యిరసలయితే ఒక తూము. ఇరవై తూములు ఒక పుట్టి. రెండు తూములయితే యిద్దుము. మూడు తూములయితే ముత్తుము….పది తూములయితే పందుము.” (పుబ్బ చినుకుల్లో)

” ముక్కు కింద సంచి మాదిరి యాలాడతుండాదే అది గూడబాతు. బార్లు దీరి నిలబడుండేటివి కాళ్ళ ఉల్లంకులు, వోటి పక్కన గుంపుగా యీదతావుండేటియి గుండు పుల్లంకులు. అద్దో! ఆ జత తెడ్డుమూతి కొంగలు. ఆ బూడిద వన్నె రెక్కలది నారాయణ కొంగ. దాని పక్కన మూరెడు ముక్కుతో, పసురువన్నె రెక్కతో సొగసుగా వుండేది  ఎర్రకాళ్ళ కొంగ…….” ఇలా పక్షిశాస్త్రాన్ని భోదిస్తాడు. (కొత్త సావాసగాడు)

ఇక చేపల రకాల గురించి చెబుతూ  “ఆ తట్టు యెండి మాదిరి మెరుస్తుండాయే, అయ్యి వంజరం చేపలు. అల్లా సప్పిటి మూతియి వాలగలు. వాలగ బలే వాతపు చేప. నాలుగునాళ్ళు వరుసగా తిన్నామంటే, కాళ్ళు, కీళ్ళు కదలవు. వుల్లంకుల వన్నెవి కానాగంతలు.   తెడ్డు అమ్మిడ మూరెడు పొడుగు ఉండాయే, అవే మాగ చేపలు. సముద్ర చేపల్లో మాగంత రుసి యింకేది వుండదు. అయి తుళ్ళు సేపలు. వొట్టి ముళ్ళ కంపలు. పాము మాదిరి సన్నంగా వుండేటివి మొలుగులు, నోట్లో యేసుకొంటే యెన్న మాదిరి కదిరి పోతాయి.” (సందమామ యింట్లో సుట్టం)

కోస్తా తీరం వెంబట  పెరిగిన నేను ఈ చేపలన్ని రుచి చూసాను.

ఈ కధలలో ప్రధాన పాత్రలను పక్కన బెడితే, కొద్ది సేపున్నా నన్ను అత్యంత ప్రభావితం చేసిన పాత్ర గేణమ్మ. (కత్తిరి గాలి) వెంకన్న తాత అక్క కాశెమ్మవ్వ కూతురు. “గేణమ్మవ్వ మంచిది” అని తనలోని బాలుడి చేత చెప్పించి, గేణమ్మ ఎంత పని చేసేదో రచయత తన ఎదిగిన మెదడుతో చెబుతాడు. “ఇల్లంతా బూజులు గొట్టి చిమ్మింది. పాలవెల్లి దించి శుద్దం చేసింది. పరంటింట్లో, సుట్టింట్లో యాడన్న గుంటలు పడుంటే బంకమట్టి పూసి సదరం చేసింది. పేడేసి యిసిరంగా అలికింది. పరంటింటికి సున్నం గొట్టి యెర్రమట్టి వోరు తీసింది. బొట్టల క్రింద కలుకుల్లో పొగపెట్టి యెలికల్ని తరిమింది. మునగ చెట్టుకు పట్టిన కమ్మిటి పురుగుల్ని యెదురు కర్రకు మసేలిక సుట్టి గబ్బుసమురుతో ముంచి మంట కాల్చి చంపింది. మల్లి గుబురుకి పాది చేసి, ఆకు దూసి నీళ్ళు పోసింది. ”

ఇలా రెండు పేరాలు రాసి చివర్లో “ఇరవై కాళ్ళు, ఇరవై చేతుల్తో వొంటి మనిషి వొకటే మాపన కత్తిరి యెండల్ని లెక్కబెట్టకుండా పన్లన్నీ చేసింది గేణత్త” అంటూ ముగిస్తాడు. ఈమెలో మనకు మానవపరిణామక్రమంలో నాగరికత అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన ఆదిమకాలంనాటి స్త్రీ మూర్తి ఆవిష్కరిస్తుంది. ఒక్క గేణమ్మే కాదు, మండుటెండలో దాహంతో అల్లాడుతున్న బాలుడికి తన చనుబాలుతో బతికించిన వసంతక్కలో కాని, దిగులుతిప్పలో కూరుకుపోయిన బాలుడ్ని రక్షించటానికి తన ఎనిమిది గజాల కోకను ఇప్పేసి బిత్తలిగా నిలబడిన సుబ్బమ్మవ్వలో కాని; భుజానికి బిడ్డలను కట్టుకొని వేటాడి కడుపులు నింపిన మాతృసామ్య మహిళలే కనబడతారు కాని, అనుక్షణం స్త్రీత్వం ఆపాదించి రొమాంటైజ్ చేయబడిన నేటి సాహిత్యంలోని దౌర్భాగ్య స్త్రీ పాత్రలు కనబడవు.

ఇంకొక ఆసక్తికరమైన పాత్ర వసంతక్క. అడవిలో నల్లబావతో కలిసి రాత్రంతా కాపలాకాసి పట్టిన చెవుల పిల్లులను (కుందేళ్ళు) నల్లబావ భోంచేస్తాడని  “అకా! ఇంత కష్టపడి పట్టుకొనింది సంపేసేదానికా” అని బాలుడు కన్నీళ్ళు పెట్టుకోగానే వాటిని వదిలిపెట్టి నల్లబావకు “సందమామ ఇంట్లో మా సుట్టముండాడు, సూసేసొస్తాము అంటే కట్టుముళ్ళు యిప్పినాము. అమావస కాలం కదా సందమామను యెదుకుతా యెట్నో పోయినట్లు ఉండాయి.” అని ముసిముసిగా నవ్వుతూ జవాబు చెబుతుంది. (సందమామ యింట్లో సుట్టం)

ఈ కధా కాలం ఎనభైవ దశకం అనుకొంటాను. అప్పటికీ ప్రళయకావేరి దీవుల్లో భాగాతాలు, నాటకాలు, వాటిని చూడటానికి పక్క దీవుల నుండి చుట్టాలు బండ్లెక్కి రావాటాలు ఇవన్నీ ఉండేవి. పల్లెల్లో సాంస్కృతిక కాలుష్యం గురించి రచయిత తన ఆవేదనను కధలో జొప్పించాడు. “మా కడగళ్ళు దేనికి అడగతావులే సోమి! పేటలో సినిమా ఆటంట, పెద్ద కొట్టాం కట్టి , దాంట్లో దినానికి రొండాట్లు ఆడతా వుండారు. పేట చుట్టు పక్కల వూళ్ళల్లో యిప్పుడు భోగాతాలు సూసే వాళ్ళే లేరు. నెమిలాటలు లేవు. పామాటలు లేవు. కీలు గుర్రాలు లేవు. మరగాళ్ళు లేవు. యీరదాళ్ళు లేవు, పంబజోళ్ళు లేవు.యానాది చిందుల్లేవు, యీరబద్ర పూనకాలు లేవు.” (కాశెవ్వభోగోతం) ఇక్కడ ఒక సమాజంగా బ్రతికిన కులాలు పెద్దీటి గొల్లలు, యానాదులు, తూరుపు రెడ్లు, వెలమలు, బేరిశేట్లు, పట్టపు కాపులు, దేశూరి రెడ్లు.

రచయితలోని భావుకుడు కధకొక సారైనా తొంగి చూస్తాడు.

“సలికాలం సాయబోయిన అమ్మ నేతకోక, వానాకాలం చిక్కంగా అల్లిన జమ్ముగూడ, యెండాకాలం సల్లని కానగమాను నీడ; యీటిల్లోమునిగి, ముదుక్కొని, వొదిగి, వొళ్ళిరుసుకోని బతుకు దేనికి?”

“ఆకాసం నుండే సుక్కలన్నీ అడివిలోకి వొచ్చేసినుండాయి. సుట్టూ వుండే చెట్ల ఆకాకు మిస మిస మెరిసి పోతుండాది. అడివమ్మ ఒల్లంత తళుకులు అంటుకొనీ తళతళమంటా వుండాయి.” (మిణిగురు పురుగుల వర్ణన).

“నీలమంటే అట్టాంటిట్టాంటి నీలం కాదు, కావేరమ్మను పలకరించను మిన్ను దిగొచ్చినట్లు, మిన్నువన్నె మన్నువన్నె కలిపి మిసమిస లాడే నీలం”.

“సడీ, సందటి లేకుండా సందకాడ సల్లంగా కురిసి పోయ్యింది వాన. తల్లాకిట అవ్వేసిన సంద ముక్కర్ర, వానతో పాటు వీధి పెత్తనానికి పొయ్యింది. దడి పక్కన ముడుసుకొని కూసున్న మల్లి గుబురు, పుట పుట చినుకులు రాలతోనే వొళ్ళు ఇరుసుకొని, తెల్ల పూల కోక కట్టుకొనింది. మల్లె గుబురు పైనుంచి వొచ్చిన వానగాలి, సల్లటి వాసనతో నాకు సక్కలిగిల్లి పెట్టి, పరమటింట్లో పటాలకు మొక్కను పొయ్యింది.”

ఇలాంటి గిలిగింతలు పెట్టే పదలాలిత్యం పుస్తకమంతా తొణికిసలాడుతూ ఉంటుంది.

అక్షరాలతో నోరూరించగలిగాడు ఈ కధకుడు.

“వొంగొగురు, యిసిక మెత్తాళ్ళు. కలిపి యెగరేసుకొంటే, సట్టిడు కూడు సడీ సప్పుడు లేకుండా లోపలికి ఎల్తాది.”

“అటికి మామిడాకులో పెసల పప్పేసి యెణిపినబయా”

“ పెసర పొప్పులో పుట్ట కూడేసి యిగరేసుకొంటే, ఆ రుసి చెప్పబళ్ళే!”

ఇక అవ్వ చేతి చిరుతిళ్ళు చూడండి. “తంపటేసిన గెణుసు గడ్డలు, యేంచిన చెనక్కాయలు, సద్దనిప్పట్లు, ఉడకేసిన బెండలం గెడ్డలు. నిప్పట్లు, మణుగుబూలు, పులుసన్నం, రవ్వుంటలు, చెనగుంటలు, బొరుగుంటలు, మూసుంటలు, చిమ్మిరుంటలు, తైదుంటలు, పెసలుంటలు, నువ్వుంటలు, సాపట్లు, దూపట్లు, దిబ్బట్లు, చీపిరొట్లు, తెదురొట్లు, పాకం పోరలు, కమ్మరట్లు, అలసందొడలు, పులిబంగరాలు, సియ్యాళ్ళు, కారామణి గుగ్గిళ్ళు”

ప్రళయ కావేరి వాసుల ప్రధాన పంట తమదలు (రాగులు). (ఏడాదికి రెండు వానలు పడితే పండే తమదలను వదిలేసి దండిగా నీరు కావాల్సిన వరిపంటను పండించటం గురించి రచయత బాధ పడ్డాడు.) చిక్కని మజ్జిగ కలిపిన అంబలి చిన్నతపీలుడు తాగటం, నెల్లి చెట్టు కింద కూసోని దోసిట్లో వేసిన సద్ది కూడు కిచ్చరగాయ(నారింజ కాయ) ఊరగాయతో తినటం,,,నా ఊహ తెలిసాక మా అమ్మమ్మ చెబుతుంటే యిలాంటివి విన్నాను.

ఇక అవ్వ “యాడ్నించి తెస్తాదోగానీ, అటిక మావుడాకు, నాసరజంగాకు, పొప్పాకు, యెన్నముద్దాకు, చెంచులాకు, బచ్చలాకు, కోడి జుట్టాకు, ముళ్ళ తోటాకు, చామాకు, బొక్కినాకు, దొగ్గిలాకు, కాశాకు, తుమ్మాకు, మునగాకు, అవిశాకు,….యిట్టా ఎన్నో రకాల ఆకులు తెచ్చి కూరలు చేస్తుంటాదవ్వ. ఆ పొద్దు కూడ చెంచలాకు కూర చేసుండాది.” ప్రళయ కావేరి దీవుల్లో  ఫల సంపద పాలపండ్లు, కలిగి పండ్లు, బీర పండ్లు, బిక్కిపండ్లు, నిమ్మటాయలు, ఊటి పండ్లు, గొంజి పండ్లు, బలిజ పండ్లు, ఎలిక చెవులు, పిల్లొట్టాలు, చిట్టీతకాయలు, అత్తిపొండ్లు, నుంజలు (ముంజలు). ఈ ఆహారాలతో పెరిగిన మన రచయత అంత ఆరోగ్యమైన రచనలను మనకందించాడు.

ఈ పిట్టల పేర్లు మీరెప్పుడైనా విన్నారా! “చిలుకలు, గోరింకలు, బెళవాయిలు, జీని వాయలు, గోరింకలు, చిలవలు, చింతొక్కులు, టకు టకు పిట్టలు, జిట్టి వాయిలు, పాల పిట్టలు, వూరికాకులు, జెముడుకాకులు, పందిట్లో పిచుకలు, యింట్లో కోళ్ళు, గిన్నె కోళ్ళు. యింటి ఆవరణంతా ఒక తూరి తిరిగితే, యెన్ని వన్నెల యీకలు దొరకతాయో చెప్పలేము.”

ప్రళయ కావేరి పిల్లల బాల్యాన్ని పండిచిన ఆటలు: మగపిల్లల ఆటలు కోతికొమ్మచ్చి, కోడుంబిళ్ళ, వుప్పరపిండి, పిళ్ళారాట, వొంటి బద్దాట, రెండు బద్దీలాట. ఆడపిల్లల ఆటలు వామన గుంటలు, అచ్చంగాయలు, గెసిక పుల్లలు, గుడుగుడు గుంజెం, చికు చికు పుల్ల, బుజ్జిల గూడు, బుడిగీలాట, కుందాట, కుర్రాట, మిట్టాపల్లం, వొత్తిత్తి సురొత్తి. (ప్చ్. మన పిల్లలు ఎంత దురదృష్టవంతులో!)

రచయితకి ప్రాచుర్యం అవార్డుల ద్వారా రాదు. ఆయన సృష్టించిన పాత్రలలో పాఠకులు ఎంత మమేకం అయ్యారో అనే దాని మీదే వస్తుంది . ఆ రకంగా ఈ రచయత ధన్యత చెందినట్లే. ఒక పాఠకుడు కధలోని పాత్రలు నిష్క్రమించటం మీద కోపం  ప్రకటిస్తూ ఉత్తరం రాసారు. ఎప్పుడైనా ‘జల్లల దొరువు ‘ వెళితే ఆ పాత్రలు తమను ఆహ్వనించాలట. ఒక పాఠకుడు “నేను తప్పిపోయిన లోలాకులగాడ్ని” అంటూ ఉత్తరం రాసారు. ఒక పాఠకురాలు “నేను గుండుపద్నను రా” అంటూ.  అంతగా పాఠకులు ఈ కధలలో ఇన్వాల్వు అయ్యారు. పాఠకులందరూ కోరుకొన్నట్లుగా స.వెం.రమేశ్ గారి  నుంచి ఇంకా ఎంతో మంచి సాహిత్యాన్ని నేనూ కోరుకొంటున్నాను.

ప్రతులకు:

http://kinige.com/kbook.php?id=478&name=Pralayakaveri+Kathalu

 

ఈ ఇందిర ‘కాలాతీత వ్యక్తే!’

vanaja vanamaliస్వాతంత్ర్యానంతరం వచ్చిన నవలలన్నింటిలోనూ కొన్ని నవలలను పంచ కావ్యాల్లాంటివని సాహితీ కారులు పేర్కొన్నారు.  అందులో డా ॥ పి.శ్రీదేవి రాసిన “కాలాతీత వ్యక్తులు ”  ఒకటి.

స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్ళకి రాసిన నవల ఇది. గోరా శాస్త్రి గారి సంపాదకత్వం లోని “తెలుగు స్వతంత్ర”  లో  21 వారాల పాటు దారావాహికంగా వచ్చిన సీరియల్ ఇది.  దేశ స్వాతంత్ర్యానంతరం పాశ్యాత్య నాగరికత ప్రభావంతో స్త్రీలలో  వచ్చిన మార్పులకి,   వారి  ఆలోచన విధానానికి, మధ్య తరగతి మనుషుల మనస్తత్వానికి  ఈ నవల అద్దం  పట్టింది. ఈ నవల ఇప్పటికీ సమకాలీనమనే చెప్పవచ్చు.  ఇందిర లాంటి స్త్రీలని ఇప్పటికీ మనం అంగీకరిచలేకపోతున్నామనేది వాస్తవం.

55 సంవత్సరాల క్రితం డా ॥ పి  శ్రీదేవి రాసిన   ఈ నవల లోని “ఇందిర”పాత్ర ఇప్పటి కాలం లోని చాలా మంది స్త్రీ పాత్రలకీ దర్పణం. స్త్రీ స్వతంత్రంగా ఆలోచించడం,సమాజం ఏమి అనుకున్నా పట్టించుకోకుండా తను బ్రతకాలి అనుకున్నట్లు బ్రతికీ తీరడం, తనదైన వ్యక్తిత్వం కల్గి ఉండటం, దానిని  కాపాడుకోవాలని ప్రయత్నించడం ఇవన్నీ ఆ నవలలో గోచరిస్తాయి.
అసలు కాలాతీత వ్యక్తులు నవలలో ప్రధాన పాత్రధారిణి ఎవరు  అనే విషయం పై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. “కల్యాణి” పాత్ర  ఆ నవల లో మరొక ముఖ్య పాత్ర.

ఈ నవల లోని పాత్ర లన్నింటి కంటే ఇందిర పాత్ర పాఠకులని ఆకర్షిస్తుంది. నవలలోని మిగతా పాత్రలన్నీ కూడా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటాయి.  అసలు ఈ పాత్ర లేకుంటే ఈ నవల ఇంత ప్రసిద్ది చెంది ఉండేది కాదు . చాలా మంది కాలానికి అనుగుణంగా కాలగమనంలో ఒదిగిపోయి కాల ప్రవాహంలో కలసి పొతారు. కానీ అలాంటి వ్యక్తి కాదు ఇందిర. చిన్న తనం లోనే తల్లి మరణించినా తండ్రి దురలవాట్లు బాధ్యతా రాహిత్యం మధ్య స్వశక్తితో చదువుకుని ఉద్యోగం సంపాదించుకుంటుంది.  చాలీ చాలని జీతం మధ్య అన్నీ అవసరాలు తీరక పోవడం, తండ్రిని కూడా తానే  పోషించాల్సి  రావడం వల్ల కొన్ని సాంఘిక కట్టుబాట్లుని లోక మర్యాదలని ఎదిరించింది . తనకి నచ్చిన రీతిలో హాయిగా జీవించడం నేర్చుకుంది.  ఒక విధంగా కాలానికి లొంగకుండా  తనకి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా చలించకుండా మనిషి కృంగకుండా వాటిని ఎదిరించి అవసరం అయితే ఇతరులని  మోసం చేయడం  వారిని నిర్దాక్షిణ్యంగా ప్రక్కకి నెట్టించి పరిస్థితులని తనకి అనుకూలంగా మార్చుకుంటుంది .

అందుకే ఇందిర పాత్ర  చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ ఈ నవలలో ప్రధాన పాత్ర ఇందిర.   కాలాతీత వ్యక్తిగా కూడా ఆమెనే పేర్కొనవచ్చు ప్రకాశంతో స్నేహం చేస్తుంది  షికారుగా అతనితో బీచ్ కి వెళుతుంది. ప్రకాశం స్నేహితుడు కృష్ణమూర్తి తో సెకండ్ షో సినిమాకి వెళుతుంది తన సరదాలు,అవసరాలు తీర్చుకోవడం కోసం  వారితో చనువుగాను మెలుగుతుంది. పక్షి లా ఎగిరి పోయే స్వేచ్చ కావాలని తనకి ఆ స్వేచ్చ ఉనప్పటికి తన రెక్కలు పేదరికం అనే తడితో బరువెక్కి ఎగరలేకపోతున్నాను అని చెప్పుకుంటుంది .

తానూ ఉంటున్న ఇంటి పై భాగంలో అద్దెకి ఉంటున్న ప్రకాశం తనతో పాటు తన గదిలో పేయింగ్ గెస్ట్ గా ఉంటూ  కాలేజ్ లో ఆన్సర్ చదువుకుంటున్న కల్యాణి ల మధ్య చనువు పెరగడాన్ని గమనించిన ఇందిర ఈర్ష్య పడుతుంది మగవారి దగ్గర కష్టాలు అన్నీ ఏకరువు పెట్టి సానుభూతి సంపాదించుకోవడం చేస్తుంది అనుకుంటుంది .ఇందిర పాత్ర  ముక్కు సూటి దనం ఇలా ఉంటుంది. “ఏమిటి ఆలోచిస్తున్నావ్” ప్రకాశం అని అడుగుతుంది ఇందిర. కల్యాణి గురించి అంటాడు అతను.  “అస్తమాను కల్యాణి కల్యాణి అంటావ్? నా గురించి ఆలోచించు.  నేను అంత కన్నా ఎక్కువ బరువు ఈడ్చుకొస్తున్నాను. నా చదువుని మధ్యలో వదిలేసి ఉద్యోగం వెతుక్కోవలసి వస్తుంది నాన్న సంగతి నీకు తెలుసు. అయినా గడియ గడియకు కాళ్ళు జాపి కూర్చుని ఏడవడం నాకు చేత కాదు, విశాలమైన కళ్ళు తిప్పి వల వలా  ఏడ్చే స్తే నీ లాంటి జాలి గుండె కల మగ వాళ్ళు ఆదుకుంటారు వాళ్లతో  నేను కాలక్షేపం చేయలేను.  ఆమెలా జాలిగా కళ్ళు తిప్పడం నాకు చేత గాదు. అంత  నంగనాచి తనం నాకు లేదు. నా బరువుతో ఇంకొకరి పై ఒదిగిపోయి కాలక్షేపం చేద్దామన్న దురాశ నాకు లేదు .నేను బలపడి ఇంకొకరికి బలమివ్వాలనే తత్త్వం నాది ” అంటుంది.

kalateeta vyaktulu

ఇందిర గురించి చదువుతున్నప్పుడు ఆ పాత్రపై అయిష్టం కల్గుతూ ఉంటుంది. ఆమెలో ఈర్ష్య ని గమనిస్తాం. ప్రకాశం కల్యాణి  కి ఆకర్షితుడవుతున్నాడని తెలుసుకుని అతనిని తనవైపు మళ్ళించు కుంటుంది . పైగా కల్యాణి పై దుష్ప్రచారం చేసి ఆమె తన దారికి అడ్డురాకుండా చేసుకుంటుంది.  అలాగే వసుంధర కృష్ణ మూర్తి పై ఇష్టాన్ని పెంచుకుంటుందని గమనించి అతనిని తెలివిగా తను దక్కించుకుంటుంది. తనకి కావాల్సినదానిని బలవంతంగా అయినా దక్కించుకునే మనస్తత్వం ఆమెది.

ప్రపంచంలో ఒకరి కోసం ఒకరు ఏదీ చేయరు ఎవరి కోసం వాళ్ళే చేసుకుంటారు .. అదినాకు చేతనవును అనుకునే వ్యక్తి ఇందిర.

ప్రకాశం మేనమామ కుదిర్చిన పెళ్లి సంబంధాన్ని వదులుకుని ఆమె కోసం వచ్చినప్పుడు అతనిని తిరస్కరిస్తూ ఇలా అంటుంది సాధారణంగా పిల్లలకి తల్లి దండ్రులు గార్డియన్ లాగా ఉంటారు నా దగ్గరకి వచ్చేసరికి తల్లక్రిండులై నేనే నాన్నకి గార్డియన్ కావాల్సి వచ్చింది ఆడదాని మనసు నీకు తెలియదు ప్రకాశం ! నేను నీకు ఉన్నాను ..నీ సమస్యలు,నీ బరువులు అన్నీ  నా మీద పెట్టు అని అనగల్గే మగవాడు అవసరమైతే నా కోసం అన్నీ వదిలేసే మొగవాడు  కావాలి  . ప్రేమ కోరిన త్యాగం చేయలేనివాడు ప్రేమకి అనర్హులు. నీ మీద నేను చాలా మమకారం పెంచుకున్నాను నోవ్వొక వెన్నుముక లేని మనిషివని నాకు తెలుసు. తోమగా తోమగా కొంత గట్టిపడతావు అనుకున్నాను. కొన్ని అనుభవాల తర్వాత అయినా ఒక మనిషి లా ప్రవర్తిస్తావనుకున్నాను పుట్టుక నుండే నువ్వో సగం మనిషివి బీటలు వారిన వ్యక్తిత్వం. బాగు చేయాలని ప్రయత్నించాను కాని అది నావల్ల కాదు.నీకు నాకు కుదరదు అని నిర్మొహమాటంగా చెపుతుంది .

ఇదంతా చదువుతున్న పాఠకుడికి ఆమె పాత్ర పట్ల సరి అయిన అభిప్రాయమే కలుగదు. ఇందిర కొలీగ్ వైదేహి  అన్నదమ్ములు ఆమెకి ఇష్టం లేని వాడిని చేసుకోమని బలవంతం చేస్తుంటే ఇల్లు విడిచి వచ్చేసి ఇందిరా ఇంట్లో ఉంటుంది  . ఆమె ఇందిరతో ఇలా అంటుంది అమ్మాయిలు యాబై సార్లు   సంతలో పశువుల బేరంలా నన్ను కూర్చోబెట్టి  మాట్లాడటం నాకు ఇష్టం లేదు అంటే  ఇందిరా ఇలా అంటుంది .పశువు కాకపొతే మరో నందికేశుడు జీవితమే పశువుల సంత లా అయినప్పుడు అమాయకంగా సుమతీ శతకం లో నీతులన్నీ వల్లే వేస్తే మనలని వెనక్కి నెట్టడం ఖాయం ఎలాగోలా తీర్ధంలో జనాన్ని నెట్టు కుని ముందుకు వెళ్ళడమే అంటుంది.

కావాలని కృష్ణ మూర్తికి దగ్గరవుతుంది తన జీవితం సుఖంగా సాగి పోవాలి అంటే కృష్ణ మూర్తి లాంటి వాడే తగిన వ్యక్తి అనుకుంటుంది అతనికి తగిన చదువు సంధ్యలు లేకపోయినా వెనుక ఉన్న ఆస్తి పాస్తులు ఉండటమే కాదు ఆ అస్తిపాస్తులే అతనిని నాశనం చేసాయి అనుకుంటుంది  మనిషి లోని మంచి తనాన్ని గుర్తించి అతనితో జీవితాన్ని పంచుకోవడానికి ఒప్పుకుంటుంది. ఇందిర ఏ పని అయినా మంచి అయినా చెడు అయినా తెలిసే చేస్తుంది మొహమాట పడటం అనేది అసలు ఉండనే ఉండదు తన బ్రతుకు తను బ్రతకాలి అనుకున్నపుడు ఇతరులకి ఇబ్బంది కల్గించినా పట్టించుకోకుండా బ్రతకడం నేర్చుకుంటుంది.  ఆమె అతన్ని  ఎప్పుడూ ఇష్టపడదు.  అతి ప్రేమ చూపించినా,అతిగా గౌరవించినా ఆమెకి ఇష్టం ఉండదు ఆమె ప్రవర్తన తెలిసి కూడా  ఆమెని పెళ్లి చేసుకుంటానికి ముందుకు వచ్చిన  కృష్ణ మూర్తి కూడా ఆ విషయాన్నే చెపుతుంది తానూ అతనికి లొంగి ఉండలేనని, తన వ్యక్తిత్వాన్ని  చంపుకుని ఉండలేనని బ్రతుకంతా నిర్భయంగా బ్రతుకుతానని అంటుంది.

పురుషాధిక్య సమాజంలో  మధ్య తరగతి కుటుంబం లో  డుర్వ్యసనాల తండ్రికి కూతురిగా ఉండి సమాజ పోకడల్ని బాగా అర్ధం చేసుకుని తనని తానూ నిర్మించుకుంటూ అవసరం అయితే తనని తానూ తగ్గించుకుంటూ కొందరి బలహీనతలని తనకి అనుకూలంగా మలుచుకుంటూ నచ్చినట్లు ఉండగల్గే ఇందిర  ఎక్కడా కూడా తొట్రుబాటు లేకుండా ఎలాంటి ముసుగు వేసుకోకుండా  నిర్భయంగా, స్వేచ్చా ప్రవృత్తి తో  కనిపిస్తుంది జీవిస్తుంది  ఇందిర లాంటి  స్త్రీని సమాజం హర్షించక పోవచ్చు  సమాజం లో  కల్యాణి లు లాంటి వారితో పాటు కానీ ఇందిరలు కూడా ఉంటారని  చెప్పడమే కావచ్చు స్త్రీల ఆలోచనా విధానం మారుతుందని చెప్పడం కూడా ఈ రచనలో గోచరిస్తుంది .

మనుషులు ఏ లోపాలు లేకుండా ఉండరు .మనుషులు మనుషుల్లాగానే ఉండాలి తమలో ఉన్నలోపాలు ని సవరించుకుంటూ చైతన్యంగా ఆలోచించుకుంటూ ముందుకు సాగిపోవడమే మంచిదని “కాలాతీత వ్యక్తులు” నవల చెపుతుంది.

పాశ్చత్య నాగరికత ప్రభావంతో చదువులభ్యసించి  ఉద్యోగాలు చేస్తున్న స్త్రీల లో ఆలోచనా పరిణితి పెరిగి వారి వారి  అభిరుచి ల మేరకు, ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా జీవించాలనుకోవడం తప్పు కాదు జీవితం ని జీవించడం కోసమే అనుకుంటూ ముందుకు సాగే వ్యక్తి ఇందిర పాత్ర.  కాల గమనం లో అందరూ మరుగున పడిపోతారు .కాలానికి విభిన్నంగా నడుచుకుని తనదైన  వ్యక్తిత్వం తో తన చుట్టూ ఉన్న వారి జీవితాలనీ  కూడా ప్రభావితం చేస్తూ సాగగల్గితే వారు మరి కొంత కాలం గుర్తుండిపోతారు అది నవలలో పాత్రలు కావచ్చు నిజ జీవితంలో మనుషులు కావచ్చు.

ఈ నవల లోని ఇందిర పాత్ర ని నేడు  అధిక సంఖ్యలో నిత్యం  మన సమాజంలో చూస్తుంటేనే ఉంటాము . కానీ ఇప్పటికి కూడా “ఇందిర ” ని  హర్షించలేక పోతున్నాం  ఇంకా నవలలో మిగిలిన పాత్రలు కల్యాణి,వసుంధర, వైదేహి  లాంటి స్త్రీల మధ్య “ఇందిర ” కాలాతీత వ్యక్తి  తానూ చీకటిలో ఉండాల్సి వచ్చినా వెరువని ధీరువు . చీకటిని చీల్చుకుంటూ వెలుగుతూ వచ్చిన ఇందిర.