మళ్లా మళ్లా చదివించే ఖండకావ్యం బుచ్చిబాబు కథ

manognaచాలా మంది కథలు రాసారు, రాస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలిలో సాగిపోతుంటాయి. వీటిలో కాలగమనంలో నిలిచిపోయే కథలు మాత్రం కొన్నే ఉంటాయి. అలాగే కథకులు కూడా కొందరే ఉంటారు. శ్రీపాద, రావిశాస్త్రి, కొకు……ఇలా మన తెలుగులో అద్భుతమైన కథలు రాసినవాళ్ళు చాలా మందే ఉన్నారు. ఈ కోవకు చెందిన కథా రచయితే బుచ్చిబాబు.

మళ్లా మళ్లా చదివించే ఖండకావ్యంలా కొనసాగాలంటాను కథానిక’ అంటారు బుచ్చిబాబు ‘కథా, దాని కమామీషు’ అన్న వ్యాసంలో.  సరిగ్గా ఇదే పంథాలో సాగుతాయి బుచ్చిబాబు కథలు. విభిన్నమైన శైలితో, పాఠకులను ఆలోచింపజేసే విధంగా కథలు రాయడం  బుచ్చిబాబు అలవాటు.

కథలోని ప్రతి కోణమూ, ప్రతి పదమూ కొత్తగా ఉంటూ, పాఠకులు చర్చించుకునే విధంగా ఉండేది బుచ్చిబాబు కథన శైలి.  స్వానుభవం నుంచి జారిపడ్డ కథనాలు, విశ్లేషణ, పరిశోధన, సగటు మనిషి లో కనిపించే ఆశావాదం, స్వార్ధం లాంటి  భావోద్వేగాలు …….వెరసి బుచ్చిబాబు కథలు. చాలా మంది కథల్లో విశ్లేషణ, పరిశోధన మనకు కనిపించవు. కాని బుచ్చిబాబు కథల్లో అది మనకు స్పష్టంగా తెలుస్తుంటుంది.

‘నిరంతరత్రయం’, ఎల్లోరాలో ఏకాంత సేవ’ వంటి కథలు చదువుతుంటే అబ్బ అని  అనిపించకమానదు. ఒక కథ రాయడానికి బుచ్చిబాబు ఎంత పరిశోధన చేసారో అన్న ఆశ్చర్యానికి గురికావలసి వస్తుంది. ప్రతీ విషయం పట్ల ఆయనకున్న సూక్ష్మ అధ్యయనం, అవగాహనలకు తార్కాణం పైన చెప్పిన కథలు. మనుషుల మనస్తత్వాలను సరిగ్గా  అంచనా వేయగల సామర్ధ్యం బుచ్చిబాబు సొంతం. కథా వస్తువు గురించి ఈయన ఎక్కడికో పరిగెట్టరు. తన చుట్టూ జరుగుతున్న విషయాలనో లేక తాను ఇతరుల ద్వారా విన్న అనుభవాలనో తీసుకుని రాసినవే.

buchi-baabu-kathalu-2-500x500బుచ్చిబాబు కథల్లో అన్నింటికన్నా ముందుగా చెప్పుకోవలసింది ‘నన్ను గురించి కథ వ్రాయవూ’ అన్న కథ గురించి.  మొదట్లో ఈ కథ అంతగా నాకు అర్ధం  కాలేదు. ఏముంది ఈ కథలో అనిపించింది. కానీ రెండు, మూడు సార్లు చదివేసరికి కథలోని పస తెలిసి  వచ్చింది. బుచ్చిబాబు కథ రాసిన , తీర్చిదిద్దిన విధానం అవగతమైంది.  అలాగే కథలో పాత్ర ద్వారా చెప్పించే మాటలు బట్టి ఈయన కథా వస్తువును ఎన్నుకునే విధానం కూడా అర్ధం అవుతుంది.  ”బాగా చిన్నప్పుడు నన్ను గురించి కథ వ్రాయవూ? అని అడిగింది.  తర్వాత ఆ అమ్మాయి ఏమయింది నేనెరుగను. పదిహేను సంవత్సరాల తర్వాత ఆ ప్రశ్న ఓ కథకు వస్తువూ, పేరు కూడా అయింది”.

కథ విషయానికి వస్తే…..  ఆ కథలో నాయకి చాలా సామాన్యమైన ఇల్లాలు. పెండ్లవుతుంది. సంతానం కలుగుతుంది.  పెద్దదవుతుంది. వ్యాధికి గురై చనిపోతుంది. కథ చెప్పే వ్యక్తి ‘ఆమె చాలా సాధారణమైన మనిషే’ అంటూ ఉంటాడు పదేపదే.  వ్యాధిగ్రస్తురాలై ఆమె హాస్పిటల్‌లో ఉండగా చూట్టానికి వెడతాడు.

‘‘ఇంత జబ్బు చేసిందని నాకు చెప్పలేదేం?’’ అని అంటాడు.

‘‘ఇది మామూలు జబ్బే’’ అంటుంది కథానాయికి కుముదం.

దుప్పటిపైన ఉన్న ఆమె చేతిని సానుభూతితో తాకబోతాడు. చెయ్యి లాగేసి, దుప్పటిలో పెట్టుకుంటుంది. ఇది తప్ప ఇంకేమీ జరగదు ఆ కథలో.

‘‘నువ్వు నా కోసం పెండ్లి చేసుకోలేదు. అవునా?’’ అని కన్నుమూస్తుంది. కథ అక్కడితో ముగుస్తుంది. పై నుంచి చూస్తే కథలో ఏమీ కనిపించదు. కాని తరచి చూస్తే జీవితంలో జరిగే అన్ని సంఘటనలూ కనిపిస్తాయి. కుముదం బాల్యం, తొలి యవ్వనం, పెళ్ళి  జరగడం, పిల్లలను కనడం, జబ్బు పడడం, చనిపోవడం ఇలా అన్ని. ఆయా ఘటనలు జరిగే సందర్భాలలో కుముదం ఎదిగిన విధానం, ఆమె ఆలోచనలలో పరిపక్వత మనకు స్సఫ్టంగా తెలియజేస్తారు. అదే స్థాయిలో రచయిత ఎదుగుదల, భావజాలం లాంటివి  కూడా మనకు స్సష్టంగా కనపడుతుంటాయి. కుముదం, రచయిత వ్యక్తిత్వాల మధ్య సంఘర్షణ కథలోని ప్రధాన అంశం. వ్యక్తుల మనోభావాలు, ఆలోచనా విధానాలు పరిపక్వత పాఠకులను ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. బుచ్చిబాబు కథల్లోని ఈ అంశాలే  గొప్పవిగా కనిపిస్తాయి. పాఠకులను ఆలోచనలో పడేసే కథలే కాలగమనంలో నిలబడతాయి. తరాలు మారుతున్నా సాహిత్యసంపదలుగా నిలిచిపోతాయి.

కుముదం మొదటి నుంచీ రచయితను ప్రేమిస్తుంది. కానీ రచయిత కుముదాన్నీ ఎప్పటికీ ప్రేమించడు. ఈ సందేహంతోనే కథంతా సాగుతుంది. కానీ కుముదానికి జీవితం పట్ల ఒక అవగాహన, అభిప్రాయం మాత్రం ఉన్నాయని రచయిత తెలుసుకుంటాడు. అందులో  నుంచి పుట్టినదే ఈ కథ అని అనిపిస్తుంది.   కుముదం అందమైంది కాదు. అసాధారణ స్త్రీ కాదు. పదే పదే ఈ వ్యాఖ్య చేయబడి కనిపిస్తుంది కథలో. సారాంశం – ఆరోజులలో (1945-46) మధ్యతరగతి తెలుగిళ్ళలో కనిపిస్తూండిన సాధారణ గృహిణి ఆమె. అయితే,  కొన్ని సందర్భాలలో మాత్రం చాలా స్థిరప్రజ్ఞత కనిపిస్తంది ఆమె మాటలలో. అందుకే కుముదం గురించి రచయిత ఒకచోట ఇలా చెప్తాడు. ‘తన వ్యక్తిత్వాన్ని గుర్తించుకుని, దాని ప్రభావాన్ని ఇతరులకి తెలియచెయ్యాలన్న స్త్రీని మొట్టమొదట కుముదంలో  చూడగలిగాను. ఆమె ఒక జీవి. ప్రత్యేకమైన ఉనికి గలది. ఆమెని తొలగిస్తే ప్రపంచంలో కొంత పవిత్రమైన ఖాళీ ఏర్పడుతుంది’ అని వ్యాఖ్యానిస్తాడు అతను, కుముదం ఆ కోరిక గురించి. కుముదం ప్రభావం రచయితపై ఎప్పుడు పడిందనేది స్పష్టంగా చెప్పలేము కానీ  కథారచనకు ప్రేరణగా మాత్రం నిలిచిందని చెప్పవచ్చును.

‘బాహ్య జగత్తులోని విషయాలు అంతరంగంలోకి ప్రవేశించి, ఒకమూల నక్కి ఉండి ఎప్పుడో ఒకసారి బైటపెట్టమని ఒత్తిడి జరిగినప్పుడే అవి కథగా అంతరిస్తాయి’ అని అంటారు బుచ్చిబాబు. అలా అంతరంగ జగత్తులో నుండి పుట్టుకొచ్చినదే ‘దేశం నాకిచ్చిన సందేశం’  కథ. మనుషుల ప్రవర్తనలు చాలా విచిత్రంగా ఉంటాయి. వారి గురించి వారు పట్టించుకోకపోయినా ఇతరులు ఏమి చేస్తున్నారనే ఆతృతను మాత్రం విడిచిపెట్టరు. మనకు చాలామందిలో ఇటువంటి వైచిత్రి కనిపిస్తుంది. దీనినే కథాంశంగా తీసుకుని రాసిన కథ ఈ ‘దేశం  నాకిచ్చిన సందేశం’. చదువు పూర్తిచేసుకున్నాక కొన్ని సంవత్సరాలు బుచ్చిబాబును అందరూ అడిగిన ప్రశ్న తాలూకా పర్యవసానం ఈ కథ. అప్పటికీ ఆ కథ రాస్తానని, రాయాలని ఆయనకూ తెలియదు. కానీ కథలు రాసే సమయానికి మాత్రం బయటకు వచ్చి కథై కూర్చుంది.

ఎదుటివాడి జీతం ఎంతో తెలుసుకోవాలన్న కుతూహలం ఎవరెవరికి ఎన్నిరకాలుగా వుంటుందో వివిధ సందర్భాల్లో చూపిస్తూ ఆ ప్రశ్నకి సమాధానంగా, కథా నాయకుడు చమత్కారంగా, వ్యంగ్య భరితంగా, హాస్యయుక్తంగా అసలు సంగతి చెప్పకుండా ఎలా  తప్పించుకున్నాడో చెప్పిన కథ ఇది. ఇందులోని ప్రతి సంభాషణా చదివి ఆనందించదగినది. ప్రతి వాక్యం ఉదహరిచేందుకు యోగ్యమైనదే. లోకం పోకడ తెలుస్తుంది ఈ కథ చవిదితే. ‘జీతం’, ‘జీవితం’-ఒక్క అక్షరం అదనంగా ఉండడంలోనే అర్ధం అంతా వుంది అంటాడు  కథకుడు. తన చుట్టూ వున్న సమాజంలోని ధన సంస్కృతి మీద విరక్తి కలిగి, సన్యాసం పుచ్చుకుందామని ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తే, చివరికి ఆయన కూడా ప్రాథమిక ప్రశ్నలు అడిగాక, ఉద్యోగంలో ‘‘ఏమిస్తారు’’? అని అడుగుతాడు. కథానాయకుడికి ‘దేశం  తనకిచ్చిన సందేశం’ గురించి ఏవిధమైన జ్ఞానోదయం కలుగుతుందో కథ ముగింపులో తెలుస్తుంది!

అలాగే బుచ్చిబాబు రాసిన మరో మంచి వ్యంగ్య కథ ‘సౌందర్యాన్వేషణ’. అందం గురించి తెగ పట్టించుకుని, దాని గురించే తాపత్రయం పడే వారి కథ ‘సౌందర్యాన్వేషణ’. అందం రెట్టింపు చేసే సాధనం అనగానే వెర్రి వాళ్ళల్లా గంటలు గంటలు వరుసలో నిలబడి చివరకు అది  కేవలం ఇంగువ కోసం అని తెలిసి, చచ్చినట్టు దాన్నే కొనుక్కొచ్చిన పరంధామయ్య, అతని భార్యల కథ. ఎలాంటి కథలు రాసినా అందులో ఏదో ఒక విషయాన్ని సూక్ష్మంగా చర్చించడం బుచ్చిబాబు ప్రత్యేకత. అలాగే ఇందులో కూడా సౌందర్యం గురించి, దాని మీద  ప్రపంచం యెక్క భావన గురించి ఇలా వివరిస్తారు.

”వారి జీవితాల్లో ఆనందం, సౌందర్యం లేవు. శారీరక సౌందర్యం అంత ముఖ్యమైంది కాదంటారు. మరేదో శీలంలో సౌందర్యంట – మనస్సులో ఉంటుందంట.  బాహ్య సౌందర్యం ఉంటేనే ఆ మిగతావి కూడా ఉంటాయి.  అనాకారులైన కొందరు పెద్దలు, సుందరాకారులు విర్రవీగుతుంటే చూసి ఓర్వలేక, ఈ సిద్ధాంతం ప్రతిపాదించి అమాయక ప్రజపై రుద్దారు. ధనికవర్గం రోగం కుదర్చాలని బీదతనంలో ఆనందాన్ని పొగిడి పారెయ్యమని కవులను ప్రోత్సహించారు. సూది రంధ్రంలో ఒంటె  దూరడం ఎంత కష్టమో, భాగ్యవంతుడు స్వర్గద్వారం గుండా దూరటం అంత కష్టంట. ఇదంతా వెనక. ఈ రోజుల్లో ఈ దగా అంతా బయట పడిపోయింది. ప్రతివాడికి తిండి, బట్ట, కొంప, విశ్రాంతి, భార్య, పిల్లలు కావాలి. నలుగురూ కూడబలుక్కుని నిర్ణయించుకుంటే  శాంతియుతంగా పరిష్కారమయ్యే పని ఇదంతా. నేటి దేశాలు ఈ పనికి పూనుకున్నాయి.”

మామూలు జీవితాన్ని జీవిస్తూ ఏదో కావాలని కలలు కనే మధ్య తరగతి ప్రజలకు ఉదాహరణ ఈ కధ. వీరికి బుర్రలో చాలా ఆలోచనలు ఉంటాయి. ఏదో చేసేయాలని, ఎన్నో  పొందాలని తాపత్రయం ఉంటుంది. కానీ వారు ఏమీ చేయలేరు. ఎండమావుల వెంట పరుగులు తీస్తుంటారు. ఇదే ఈ కథలోని సారాంశం.

బుచ్చిబాబు మరో అద్భుతమైన కథ ‘ఎల్లోరాలో ఏకాంత సేవ’. మనుషుల ఆకర్షణలు, మనస్తతత్వాలు వాటి మధ్య చెలరేగే భావనల సమాహారం ఈ కథ. మూడు వైరుధ్యమైన పాత్రల మధ్య నడుస్తుందీ కథ. జ్ఞానసుందరి, మధుసూదనం, నాగరాజ్యలక్ష్మి అనే  ముగ్గురు వేరు వేరు మనస్తత్వాల మానసిక సంఘర్షణ ఎల్లోరాలో ఏకాంత సేవ. నాగరాజ్యలక్ష్మి, మధుసూదనం భార్యాభర్తలు అయితే జ్ఞానసుందరి నాగరాజ్యలక్ష్మి అక్క. వీరు ముగ్గురూ కలిసే ఉంటుంటారు. కానీ ఒకరితో ఒకరు ఇమడలేని పరిస్థితుల్లో తప్పక కలిసి  జీవిస్తుంటారు. ఇందులో చిన్నతనంలోనే వైధవ్యం పొంది, చెల్లెలి భర్త మీద ఆకర్షణ ఉన్నా అణుచుకుని కాలం వెళ్ళదీస్తూ…..తన యవ్వనాన్ని తలుచుకుని మధనపడుతుండే పాత్ర జ్ఞానసుందరిది. ఇక అన్నీ ఉన్నా అంటే భర్త, అనుభవించే వయసూ, మనసు ఇలా  అన్ని ఉన్నా అనుభూతుల్ని పంచుకోకుండా బాధ్యతలంటూ పరుగులు తీసేది నాగరాజ్యలక్ష్మి. బాధ్యతలు, భావుకతలూ, ఇష్టాలూ….వాటిని సాధించుకోలేని పరిస్థితుల మధ్య ఊగిసలాడుతూ ఏకాంతంలోకి పారిపోవాలని చూసే పాత్ర మధుసూదనానిది.  చాలా  మంది మనుషులు ఇలాగే ఉంటూ ఉన్నవాటిని వదులుకుంటూ, లేని వాటి కోసం పరుగులు పెడుతూ హాయిగా జీవించలేక సతమతమౌతూ జీవితాన్ని వెళ్ళదీస్తుంటారు. ఉన్నదాని విలువ కొందరు తెలుసుకోలేరు, లేని దాన్ని మరి కొందరు తెచ్చుకోలేరు. పైకి  ఆనందంగానే కనపడుతుంటారు. కానీ లోలోన మనోవ్యధకు లోనవుతుంటారు. ఈ భావాన్నే అందమైన కథగా మలిచారు బుచ్చిబాబు.

కట్టె కొట్టె తెచ్చె అన్నట్టు కథ రాయడం బుచ్చిబాబుకు నచ్చదు. ఏది రాసినా విపులంగా లోతుగా రాయడం ఆయన అలవాటు. అది ఒక్కోసారి ఉపన్యాసంలా అనిపించినా తప్పదు అంటారు.  కథలో చెప్పదలుచుకున్నది అందంగా, శక్తివంతంగా, స్పష్టంగా కనిపిస్తూ  రచయితకు నచ్చాలి అంటారు బుచ్చిబాబు. ఆయన కథలన్ని ఆయనకు అలా అనిపించాకే రాసారు. బుచ్చిబాబుకే కాదు పాఠకుడికి కూడా అలానే అనిపించే విధంగా రాసారు అంటాను నేను. ‘ఎల్లోరాలో ఏకాంత సేవ’ కథలో ఆయన విశ్లేషణ తీరు చదివిన ఏ  పాఠకుడికి అయినా ఆశ్చర్యపరచకమానదు.   ఈ కథలో ప్రపంచానికీ, ప్రకృతికీ మధ్య సమన్వయం కుదర్చడానికి చేసిన ప్రయత్నంలా అనిపిస్తుంది నాకు. ఒక పక్క మానవసంబంధాలు – వ్యక్తిత్వాలూ, సంఘర్షణలూ వాటి గురించి చెబుతూనే ప్రకృతి  గురించి చెబుతూ ప్రకృతి గురించి కూడా వర్ణనలు చేస్తారు బుచ్చిబాబు ఇందులో.  ప్రకృతిలో జీవం ఉంటుంది అంటారు ఈయన. అందుకే దాని గురించి ఆయన ఇలా వర్ణిస్తారు కథలో.

”చెట్ల వెనుక నుంచి సంధ్య వెలుగులో అతిశయోక్తిగా పరిభ్రమిస్తూ వున్న పొడుగాటి నీడలు పల్చబడి, రాళ్ళ రంగుల్ని వెలిగించి, ఆకృతుల్ని మార్చి దిగజారుతున్నాయి. ఆకుల మధ్య కిరణాలు వనదేవత కుట్టు పనిలో సూదులలా వెనక్కీ ముందుకీ  కదుల్తున్నాయి. గాలి జోరు తగ్గిన తర్వాత అగ్నిదేవుడు వేసిన గాలి పటం కిందకు పడిపోతున్నట్లు వెనక్కి వెనక్కి నడుస్తున్నాయి. ఆ దూరపు కొండ ముసుగు తీసినట్లయింది. కొండ మళుపులో పచ్చిక బయళ్ళు వొస్తూ ఉన్న జుట్టులా కనిపిస్తున్నాయి. కన్ను  మెదిపినట్లు సూర్యబింబం గుహల వెనుక జారుకుంది. చివరి కిరణాలు, అలిసి పరున్న ప్రకృతిని, జలపాతం నీటిని, మేఘాలని, రాళ్ళ సమూహాలని వొక్కసారి వెన్నుచరిచి లేపినట్లు, బంగారం కరిగి, ఎర్రరాళ్ళ మొహాన జారిన కుంకుమ బొట్టులా మారి, మందారం  మధ్యలో ముదిరిన ఎరుపులో నలుపులా ఇంద్రజాలికుడు పరికరాల్ని బుట్టో వేసుకుని వెళ్ళిపోతుంటే వీడ్కోలివ్వడం ఇష్టంలేక సంధ్యాకాంత ముసుగు బిగతన్ని పరున్నట్లనిపించింది.”

ఇది కొంచెం సుదీర్ఘమైన వర్ణనగానే చెప్పుకోవాలి. కథల్లో ఇంతంత వర్ణనలు ఉండడం చాలా అరుదు. కానీ చూడండి బుచ్చిబాబు చేసిన ఈ వర్ణన ఎంత అందంగా ఉందో…..ప్రకృతికీ, మనిషికీ – ప్రపంచానికీ పోల్చిన వైనం ఎంత సమంజసంగా ఉందో. ఇలాంటి వర్ణనలు  పెద్దవి అయినా కథలో మిళితమై….అంతర్లీనంగా సాగిపోతుంటే అందంగా అనిపిస్తాయి. సాఠకులను ఆహ్లాదంగా చదివిస్తాయి.

అలాగే మనుషుల గురించి, వారి మనస్తతత్వాల గురించి ఈ కథలో బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యానాలు కూడా కొన్ని అద్భుతంగా ఉంటాయి. మచ్చుకకు కొన్ని ఇక్కడ.

“శరీరం పట్ల మనకు గౌరవం పోయింది. శివలింగ పూజలోని ప్రాధాన్యతని పూర్వులు పొగిడినా, ఈనాడు శరీరశక్తి పట్ల ఆదరణ లేదు. ప్రతిభాశాలులైన ఒకరిద్ధరు శిల్పులు రాయిద్వారా యీ సూత్రం చాటుతున్నారు. ఆధునిక శిల్పానికి మొహం ఉండదు – స్ఫుటమైన  ఆకారంలో ముఖ్యమైన కోణాలుంటాయి. అట్లా ప్రదర్శిస్తే, కళ్ళు తెరచి శరీరం చూస్తారని. కాని చూడ్డంలేదు. ఎగ్జిబిషన్లో పెడుతున్నారు. శిధిలాలకింద జమగట్టి, పురావస్తుశాఖవారికి వప్పగించేస్తారు. మరొకి శరీరం చూడలేనివారు, తమ శరీరాలు చూసుకోలేరు.”

“మామూలువాళ్ళకి నీతీ మంచీ వుండాలి – కాని ఏఒకరిద్ధరో అసాధారణ వ్యక్తులుంటారు. ప్రతి సంఘంలోనూ వారికి స్వేచ్చ ఉండాలి. ఉంటేనే ఏదోఒక ఘనకార్యం చెయ్యగలుగుతారు. సంస్కృతీ, నాగరికతా వారివల్లనే వృధ్ధిచెందుతాయి”.

“స్త్రీని ఆటవస్తువుగా,ఆస్తిలో ఒకభాగంగా, బానిసగా వాడుకుంటున్నారు ఈ మొగాళ్ళంతా అంటారుగానీ, వీళ్ళెవరికీ అసలువిషయం తెలీదు. స్త్రీయే పురషుణ్ణి పెద్దహాల్లో మధ్య బల్ల మీద పూలతొట్టి లాగా చూసుకుంటుందని ఎవరూ పైకనరేం? ఆ తొట్టిలో రోజూ కొత్తకొత్త  పూలుపెట్టి వాసన చూసుకుంటూ,— హాల్లో చోటులేక బల్ల జరినిపినప్పుడు, ఆపూలతొట్టిని దూరంగా దొడ్లొ పడెయ్యటం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా కోపమొస్తే దాన్ని నేలకేసి కొట్టడం- అది ముక్కలవడం. డబ్బున్న స్త్రీ కొత్త తొట్టిని కొనుక్కుంటుంది.”  మొదటిసారి ఈ వ్యాఖ్యానాన్ని చూసినప్పడు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంటీ బుచ్చిబాబు ఇలా రాసారు అనుకున్నాను. కానీ తరచి చూస్తే భార్యా – భర్తల మధ్య ఇదొక కోణం కూడా ఉండొచ్చు అనిపించింది. కొంతమంది విషయంలో ఇదే నిజం కావచ్చు  ఒప్పుకోవడానికి మనసు రాకున్నా.

ఇలా చెప్పుకుంటే పోతే మొత్తం కథంతా ఇక్కడ నేను మళ్ళీ రాసేయాల్సి వస్తుంది. అలాగే అన్ని కథల గురించి కూడా చెబుతూ పోతే మరో పుస్తకమూ తయారవుతుంది. కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నా…..కానీ బుచ్చిబాబు కథలు ఇంచుమించుగా అన్నీ మంచి కథలే.   కచ్చితంగా చదవాల్సిన కథలే. మొదటిసారి చదివినప్పుడు నచ్చకపోవచ్చును, అర్థం కాకనూపోవచ్చును. అలాని అక్కడితో వదిలేయకండి, మరొకసారి చదవండి. తప్పకుండా నచ్చుతాయి.

రచయితలు చేసిన రచనల్లో బాగున్నవీ ఉంటాయి, బాగోలేనివీ ఉంటాయి. అలాగే బుచ్చిబాబు కథల్లో కొన్ని మంచి కథలు కానివి కూడా ఉన్నాయి. కొన్ని కథలు అస్సలు నచ్చలేదు. కానీ నచ్చని వాటి కంటే నచ్చినవే ఎక్కువ ఉన్నప్పుడు, నచ్చని వాటిని వదిలేయచ్చు అని నా భావం. పైగా బుచ్చిబాబు కథల్లో నచ్చనివి చాలా తక్కువగా, లెక్కింపతగనివిగా ఉన్నాయి. కాబట్టి వాటి గురించి పెద్దగా చర్చించడం లేదు.

మీ మాటలు

  1. తెలుగులో అత్యధ్బుతమైన కథలు రాసినవాళ్లలో బుచ్చిబాబు ఖచ్చితంగా ఒకరు. మీరు ఉదహరించిన అన్ని కథల్నీ ఒక ట్రెజర్ లా చూసుకుంటూ, చదువుకుంటూ, నేర్చుకుంటూ ఉంటాను నేను.

  2. buchibabu kadhalu mano visleshanaku addam padataayi. manogna garu annatlu oka sari chadivite ardham kaavu. mallee mallee chadavaali. konchem lotugaa aalochincha galagaali.

మీ మాటలు

*