ఈ కవితకి యే వ్యాఖ్యానమూ అక్కరలేదు. ప్రపంచపు పోకడలకీ కవయిత్రి పసి మనసుకి జరిగిన సంవాదమిది. అతి సులభంగా ప్రతి సున్నిత హృదయమూ తనని తాను చూసుకునే అద్దం. అందుకే యే వివరణ ఇవ్వకుండా – సూటిగా కవితనే ఇక్కడ పొందు పరుస్తున్నాను. అద్దం లో నెలవంక శీర్షికని తిరిగి మొదలు పెడదామని గత మూడు నెలలుగా చాలా ప్రయత్నిస్తున్నాను. రఫ్ స్కెచెస్ రాసుకున్న కవితలున్నాయి. కానీ తనను తాను గా ప్రవహింప చేసుకున్న చిక్కని భావాన్ని, తేట దనపు ప్రవాహాన్నీ ఒకే చోట చూసిన యీ కవిత చదవాక యీ కవితా సంపుటి గురించి తప్పక రాయాలి అనిపించింది. పరిమళానికి చిరునామాలు అవసరం లేదు. వ్యాపించడమే దాని పని. రాజేశ్వరి పరుచుకుంటూ వెళ్ళీన అక్షరాల వెంటా మన కళ్ళు పరుగెత్తిస్తే చాలు, అనేక అమూర్త భావాల మల్లెల పారిజాతాల పరిచయాలవుతాయి, నైట్ క్వీన్ డాఫోడిల్స్ ఆమె వెన్నెల ఏకాంతాల రహదారుల్లో సాక్షాత్కరిస్తాయి. వేదనా భరితమైనా, ఏకాంతమే స్వాంతన ఆ కవితాత్మక మూర్తికి! ఆలస్యం గా నైనా ఆమె కవితలు ఇలా ఒక సంకలనంగా చదువరుల చేతికి అందించిన విషయమై తెలుగు కవితాత్మక ప్రేమికులు నామాడి శ్రీధర్ గారికి ఋణపడివుంటారు!
అక్షరాల నిండా పరుచుకున్న రాజేశ్వరీదేవి వేదనాత్మక ప్రణయ పూరిత భావాల గాలుల్ని మనస్ఫూర్తిగా శ్వాసించిన మనసులన్నీ ఆమెతో యీ విషయంలో ఏకీభవిస్తాయి…
“ఊరికేనే”
కవితా సంకలనం: సత్యం వద్దు స్వప్నమే కావాలి
ఆమోద యోగ్యం కాని తన జీవన శైలికి లోక ఆమోదం ఆశించని, దేబిరించలేని ఐచ్ఛిక ఒంటరి రాజేశ్వరీదేవి. తన నిర్ణయ పర్యవసానాలు తెలిసిన వివేకా, వాటిని ఎదుర్కొనేందుకు సమాయత్తం కాని పసిపిల్లా ఏక కాలంలో ఆమే.
ఇదే ఆమె కవితల్లో, కవితల్లాంటి డెస్పరేట్ సంభాషణల్లో, ప్రబల తాత్విక ప్రతిపాదనల్లాంటి బలమైన ప్రకటనల్లో, ఇంకా పూర్తి కాక మిగిలిపోయిన స్కెచెస్ లాంటి కవితా పాదాల్లోనూ వెల్లడి అవుతుంది.
డియర్ జయశ్రీ ఆమె కవిత్వం, స్వభావం పైన మీ అంచనా చాలా ఆత్మీయంగా వుంది.
ఇలాంటి ఒక్క చప్పట్లయినా ఆమె బతికి వున్నప్పుడే ఆమెకు అంది, దక్కి వుంటే ఎంత బాగుండేది కదా అని తరుక్కు పోయే తీవ్ర బాధతో గుండె కళుక్కుమంటోంది.
మీరు ఆమె కవితలని మీకై చదువుకున్న తీరు నన్ను చాలా ఆకట్టుకుంది.ఆ తీరును చెప్పిన పద్ధతీ నచ్చింది.
థాంక్ యూ వెరీ మచ్!
సాహిత్యం మనకోసం మనం పోషించుకోవలసిన అంశం. అదీ ఇలాంటి ఆత్మిక కవిత్వం విషయం లో మరీ తప్పని సరి. మీ ఆత్మీయ స్పందనకు మరో సారి ధన్యవాదాలు ANTU