కథా నిర్మాణంపై శ్రద్ధ తక్కువ – సాయి బ్రహ్మానందం గొర్తి

కొత్త సంవత్సరం వస్తోందంటే గడచిన ఏడాదిలో జరిగిన సంఘటనలూ, నిర్ణయాలూ, సంతోషాలూ, బాధలూ అవలోకనం చేసుకోవడం చాలామందికి ఒక రివాజు. ఒకరకంగా రాబోయే ఏడాదికి అవి పాఠాలు కావచ్చు; మంచైనా, చెడయినా. సాహిత్యం కూడా జీవితంలో భాగం కాబట్టి ఈ రివాజు దానికీ వర్తిస్తుంది.  డిసెంబరు ఆఖరి వారంలో 2015లో వచ్చిన తెలుగు కథల మీద చెప్పమని ఎనిమిది ప్రశ్నలు పంపించారు సారంగ సంపాదకులు.
రాయాలా, వద్దా అన్న మీమాంసలో పడ్డాను. ఏటా  వెయ్యికి పైగా కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమవుతాయి.  నేను అన్ని కథలూ చదవలేదు. చదవడం అసాధ్యం కూడా. అలా అని చదవకుండానూ లేను. నా దృష్టికి వచ్చినవన్నీ చదివాను. కనుక ఈ ప్రశ్నలు వారివే అయినా ఇవి నా పరిశీలనలే తప్ప కథా విమర్శ కాదు.
 
నేను చదివినదాంట్లో కొన్ని కథలు గురించి ప్రస్తావిస్తాను. అంతకు ముందు ఏడాదితో (2015) పోలిస్తే గడచిన సంవత్సరంలో(2016) వచ్చిన కథలు వస్తుపరంగా, నాణ్యత పరంగా చాలా తక్కువగా వున్నాయి. నాణ్యత అంటే కథా వస్తువు కొత్తదై వుండాలి. నిర్మాణమూ, కథనమూ బావుండాలి. ముఖ్యంగా వాటిలో వాడిన భాష. సహజంగా ఉండాలి. చివర వరకూ పాఠకుల జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి చదివించాలి. ఇవీ నేనెంచుకున్న కొలమానాలు. 
 
1) 2016లో వచ్చిన కథల పై వస్తు పరంగా, శిల్ప పరం గా మీ అభిప్రాయాలు
 
ఇక్కడొక విషయం చెప్పాలి. చాలా కథలు వస్తువు చుట్టూతానే తిరుగుతున్నాయి. కథనం, భాష, నేపథ్యం వంటి విషయాలపై ఎవరికీ ఆసక్తి లేదు. ఎంతో ఇబ్బంది పెడుతున్న అంశం ఒకటుంది. అది – కథల్లో వాడే భాష. అసంపూర్తి వాక్యాలూ, అసంబద్ధ ప్రయోగాలూ చికాకు తెప్పిస్తున్నాయి. 
 
2. మీకు నచ్చిన లేదా నచ్చని కథల గురించి కొంచెం వివరంగా-
 
బావున్న కథలు:
 
బౌండరీ దాటిన బాలు (వాకిలి) – మధు పెమ్మరాజు
భేతాళుడితో శైలజ (ఆంధ్ర జ్యోతి) – పి.వి.సునీల్ కుమార్
రాక్షస గీతం (సారంగ) – అనిల్ రాయల్
వలపల గిలక (కొత్తావకాయ ఘాటుగా బ్లాగు) – రచయిత్రి
ఆమ్మ (ఆంధ్రజ్యోతి) – కె.వి.గిరిధర రావు
ఎం. ఎస్.కె. కృష్ణజ్యోతి – (ఆంధ్రజ్యోతి) – నా నేల నాకు ఇడిసిపెట్టు సారూ
కస్తూరి పూలు (ఆంధ్ర జ్యోతి) – వెంకట్ సిద్ధారెడ్డి
ఒరాంగుటాన్ (వాకిలి) – మెహర్ 
సెల్ఫీ – మెట్రో కథలు – (సాక్షి) – ఖదీర్‌బాబు
అతనో అద్భుతం – (స్వాతి) – వంశీ
దుర్గారావు -(స్వాతి) – వంశీ 
రిసరక్షన్ – (సాక్షి) – వెంకట్ సిద్ధారెడ్డి (వస్తువు బర్నింగ్ ఇష్యూ అయినా కట్టిపడేసే కథనం ఉంది.)
 
 
ఎత్తుగడ బావుండి నిరాశ పరిచిన కథలు:
 
ఒక తలుపు వెనుక – అంధ్రజ్యోతి – అఫ్సర్
అశోకం – ఆంధ్రజ్యోతి – ఓల్గా
కొన్ని ముగింపులు – (సారంగ) – చంద్ర కన్నెగంటి 
 
 
నచ్చిన కొన్ని అనువాద కథలు: 
 
కసబ్.గాంధీ @ యారవాడ.ఇన్ – (సారంగ) – శాంతసుందరి 
కాపరి భార్య – (ఈమాట) – శారద
మా చిన్న చెల్లెలు – (సారంగ) – ఆరి సీతారామయ్య
(మల్లాది వేంకట కృష్ణ మూర్తి ఒక కథ అనువాదం చేసారు. ఆంధ్రభూమిలో వచ్చింది. పేరు గుర్తుకు రావడం లేదు.)  
 
3. మీ దృష్టికి వచ్చిన కొత్త కథకులు-
 
అపర్ణ తోట, చందు తులసి, మానస ఎండ్లూరి ఈ మధ్యనే కనిపించే రచయితలు. వీళ్ళకి రాయగలిగిన సత్తా ఉంది. 
 
కానీ వేరే అంశాలపైన శ్రద్ధ పెట్టడం వలన చెప్పదల్చుకున్న విషయం, ముఖ్యంగా కథా ప్రక్రియలో, ఇమడడం లేదు. 
 
ఎవరైనా సీనియర్ రచయితలు మార్గదర్శకం చూపిస్తే వీళ్ళు మంచి కథలు రాస్తారన్న ఆశ అయితే ఉంది. 
 
4. తెలుగు కథా సాహిత్యం లో 2016 లో వచ్చిన కథలు ఎలాంటి మార్పులని సూచిస్తున్నాయి? వ్యక్తిగతంగా, సాంఘికంగా, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులని తెలుగు కథలు ఏమైనా స్పృశించ  గలిగాయా?
 
పైన చెప్పినట్లు వస్తువుని దాటి కథ ముందుకెళ్ళడం లేదు. ఆ వస్తువుకి ప్రేరణ కూడా వార్తా కథనాలే. 
ఇవి దాటి సమాజంపైనా, జీవితాలపైనా పరిశీలన అన్నది కనిపించడం లేదు.   
ఇంగ్లీషుకథల్లో – ముఖ్యంగా అమెరికాలో – కథ చెప్పే పద్ధతి చాలా మారింది. వైవిధ్యమైన రీతుల్లో కథలు వస్తున్నాయి. ఉదాహరణకి పెంపుడు కుక్క ఇంట్లో వాళ్ళ కథ చెబుతుంది, తనదైన కోణంలో. అమెరికన్ కథతో తెలుగు కథని పోల్చడం కష్టం. 
 
5. మంచి కథలు మీరు ఎక్కువగా ఎక్కడ చదువుతున్నారు?
ఇక్కడా అక్కడా అని లేదు.  ఎక్కడ కథ పడితే అక్కడే.
ఈ పత్రికలోనే మంచి కథలు వస్తాయి అన్న నమ్మకం ఎప్పుడూ లేదు. బ్లాగులో కూడా మంచి కథలు రావచ్చు.
పేరున్న పత్రికల్లో కూడా చెత్త కథలు వచ్చాయి. 
 
6.  కథావిమర్శ-2016 మీకు తృప్తినిచ్చిందా?
తెలుగులో  కథా విమర్శ దాదాపుగా మృగ్యం. ఎవరైనా చెప్పాలనుకున్నా వినడానికి రచయితలు సిద్ధంగా లేరు. 
కథల బాగోగులు చెప్పే అలవాటు మనకి లేదు. వెబ్ పత్రికలు వచ్చాక కథకుడికీ, పాఠకుడుకీ తేడా పోయింది. 
వెబ్ పత్రికల్లో పాఠకులకంటే రచయితల కామెంట్లే ఎక్కువుగా ఉంటున్నాయి. 
రచయితలకి కామెంట్ల వ్యాధి సోకినట్లుంది. 
 
7.  కథాసంకలనాలు తెలుగు కథా ప్రయాణానికి ఏవిధంగా దోహద పడుతున్నాయి?
రచయితల దృష్టంతా వీటిపైనే. తమ కథకూడా ఈ సంకలనాల్లో రావాలన్న తహతహ అయితే రచయిత్ల్లో బాగా కనిపిస్తోంది. 
అందులోకి ఎక్కడానికే అన్నట్లు కథా వస్తువులు కూడా ఎంచుకుంటున్నారు. కథా సంకలనాల్లో అచ్చైన కథల బాగోగులు 
ఏటా అచ్చేసే వారే చెప్పరు. అందులో వస్తే చాలు తమ కథ గొప్పది అన్న ధోరణికి ఈ సంకలనాలు నాంది పలుకుతున్నాయి. 
 
8.  మీరు చదువుతున్న ఇతర భాషల కథలకు, తెలుగు కథలకు తేడా కనిపిస్తోందా? అయితే అది ఎలాంటి తేడా? 
నేను ఎక్కువగా ఇంగ్లీషు కథలు చదువుతాను. అమెరికన్ కథలకీ, మన కథలకీ చాలా వ్యత్యాసం ఉంది. 
ఉదాహరణకి – కథని ఒక దృశ్యంలా చూపిస్తూ రాస్తారు తప్ప, ఎక్కడా రచయిత పాత్రల్లోకి చొరబడడు. 
అనవసరమైన వర్ణనలూ, కవితాత్మకంగా వాక్యాలు రాయడం వంటివి ఉండవు. 
అలాగే కథల్లో వాడే భాష కూడా ఎంతో సరళంగా ఉంటుంది. భాషా పటాటోపం కనిపించదు.  
కథ చెప్పడానికి ఎన్నుకున్న కాన్వాసు కూడా ఎంతో మారింది. 

మీ మాటలు

 1. విలాసాగరం రవీందర్ says:

  బ్రహ్మానందం గారు మంచి పరిశీలన తో రాసారు. నేనైతే చాలా విషయాలు నేర్చుకున్నాను.

 2. సారంగ వాళ్ళు అడిగారని మీఅభిప్రాయాలు చెప్పారు .బానే ఉంది. కానీ కథల పేర్లు సరిగ్గా గుర్తు పెట్టుకుని చెప్పి ఉంటే మీరు నిజాయితీ గా మీ అభిప్రాయం వెలిబుచ్చినట్లు నేను నమ్మేవాడిని. అది కస్తూరి పూలు కాదు.కస్తూరి నీడలు.

  • Gorti Sai Brahmanandam says:

   కొన్ని వందల కథలు చదివాను. పేరు పొరపాటుగా పడింది. తప్పే. అంత మాత్రం చేత నిజాయితీ లోపించినట్లేనా? మల్లాది ఒక కథ అనువాదం చేశారు. అది గుర్తులేదనే రాసాను.

 3. చందు తులసి says:

  బ్రహ్మానందం గారు… మీ సూచనలు బాగున్నాయి. కొత్త కథకులకు ఉపయోగకరం.

 4. “నవ్య” వీక్లీ లో ఒక్క కథ కూడా నచ్చలేదా?
  లేక మీరు ఆ పత్రిక చదవరా?
  లేక ‘ఆంధ్ర జ్యోతి ‘అంటే మీ ఉద్దేశ్యంలో ‘నవ్య ‘ నేనా?

  నేను మీతో చాలా విషయాల్లో ఏకీభవించలేక పోతున్నాను.

  • Gorti Sai Brahmanandam says:

   ప్రభాకర్ గారూ: నేను నవ్య రెగ్యులర్ గా చదువుతాను. కథలో నే చూసిన కొలమానాలు చేప్పాను. అన్ని కథలూ చదవడం అసాధ్యం. చదివినంత మేరకూ నా అభిప్రాయాలు అవి. మీకు తెలిసిన మంచి కథలు చెప్పండి. నేనూ తెలుసుకుంటాను.

 5. బ్లాగులనీ, బ్లాగుల్లో కథల్ని ప్రస్తావించినందుకు ధన్యవాదాలు, సాయి బ్రహ్మానందం గారూ.

 6. సాయి బ్రహ్మానందం గొర్తి గారు !
  మీరు అమెరికన్ కథల గురించి రాసిన వాక్యాలు (8 వ పాయింటు లో) నాకు బాగా నచ్చాయండి – ముఖ్యంగా రచయిత పాత్రల్లోకి జొరబడక పోవడం గురించి.

మీ మాటలు

*