Archives for 2016

డియర్ జిందగీ

zindagi

ఏక్టర్లు: అలియా భట్, షా రుఖ్ ఖాన్.
కేమియో పాత్రల్లో-కునాల్ కపూర్, అలీ జఫర్, అంగద్ బేదీ, ఈరా డూబే.
రిలీస్ తేదీ-నవెంబర్ 25, 2016.

రెడ్ చిల్లీస్, ధర్మా ప్రొడక్షన్స్, హోప్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద- గౌరీ షిండే దర్శకత్వంలో, గౌరీ ఖాన్ ప్రొడ్యూస్ చేసిన సినిమా. కరణ్ జోహార్ కో-ప్రొడ్యూసర్.
లక్ష్మణ్ ఉతేకర్ ఫోటోగ్రాఫర్.

బాల్యంలో జరిగిన ఒక సంఘటనో, ఏదో అనుభవమో, పెద్దయ్యాక జీవితాలమీద ఏదో దశలో ప్రభావం చూపించకుండా ఉండదు. ఇది సామాన్యంగా ప్రతీ ఒక్కరూ, ఎప్పుడో అప్పుడు ఎదురుకునేదే. ఈ పాయింటునే ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని, తీసిన సినిమా ఇది.

కథ: సినిమా ప్రారంభంలో, క్రేన్ మీద కూర్చుని ఒక సీన్ షూట్ చేస్తూ కనిపించిన కైరా(అలీయా భట్ )-ఉర్ఫ్ కోకో 20లలో ఉన్న ఒక సినిమాటోగ్రఫర్. ముంబయిలో ఆమె గడిపే జీవిత విధానాన్నీ, ఈ తరపు యువత కష్టపడి పనిచేసి, అంతే ఉల్లాసంగా పార్టీలలో పాల్గొనడమూ అవీ చూస్తాం. కైరాకి జీవితంలో ఎంతో సాధించాలన్న ఆశ ఉంటుంది. కాకపోతే, వృత్తివల్ల పొందగలిగే సంతృప్తి దొరకదు. తనకి తారసపడిన యువకులతో ప్రేమలో పడుతూ కూడా, ఏ బంధానికీ కట్టుబడి ఉండలేకపోతుంది.
మొండి స్వభావం, ముక్కుమీదుండే కోపం. డిప్రెషన్‌కి గురై- స్నేహితులయిన ఫాతిమా, జాకీతోనే గడపడంతోనూ, ఈ బే లో షాపింగ్ చేయడంలోనూ ఓదార్పు వెతుక్కుటూ ఉంటుంది. బోయ్ ఫ్రెండ్‌కి ఇంకెవరితోనో ఎంగేజ్‌మెంటవుతుంది.

ముంబాయిలో, తనున్న అపార్టుమెంటులో పెళ్ళవని వాళ్ళని ఉండనివ్వనని ఇంటి యజమాని చెప్తాడు. వీటన్నిటివల్లా, ఇన్సొమ్నియక్‌గా తయారవుతుంది. దిక్కు తోచక, అయిష్టంగా, తల్లితండ్రులుంటుండే తన స్వంత ఊరైన గోవా వెళుతుంది. వాళ్ళతో సంభాషణ అన్నా, కలిపి ఉండటం అన్నా విముఖత. తన హోమోసెక్స్యువల్ స్నేహితుని మాట విన్న తరువాత, ఒక మెంటల్ అవేర్‌నెస్ కాన్ఫెరెన్సులో సైకోలొజిస్ట్ జహంగీర్ ఖాన్ (బ్రెయిన్ డాక్టర్- షా రుఖ్ ఖాన్, కైరా మాటల్లో-జగ్)మాట్లాడుతుండగా విని, అతని క్లినిక్కి వెళుతుంది.
ఒక థెరపీ సెషన్లో కోకో- తను బాల్యంలో అనుభవించిన వేదనా, నిస్పృహా, ఆశాభంగాన్నీ అతనికి వెల్లడిస్తుంది. తన చిన్నప్పటి అనుభవాలని బట్టి, వదిలివేయబడటం అంటే కలిగిన భయం వల్ల తానే ఏ బంధాన్నీ నిలుపుకోలేకపోతోందని జగ్ చెప్పి, కైరా తన తల్లితండ్రులని క్షమించనవసరం లేదు కానీ వారిని ఒక తప్పు చేసిన, సామాన్యమైన మనుష్యులుగా మాత్రం చూడమని సూచిస్తాడు.

ఈ సినిమాలో ఖాన్‌కీ, ఆలియాకీ ఈ సినిమాలో ఏ శృంగారపరమైన సంబంధమూ ఉండదు. కాబట్టి ఖాన్ సినిమా అనుకుంటూ చూద్దామని వెళితే కనుక, నిరాశకి లోనయే అవకాశం ఉంది.
“నీ గతం నీ వర్తమానాన్ని బ్లాక్‌మైల్ చేసి, అందమైన భవిష్యత్తుని నాశనం చేయకుండా చూసుకో” అన్న జగ్ సలహా ప్రకారం, కన్నవాళ్ళతో రాజీపడి ఎన్నాళ్ళగానో వెనకబడి ఉన్న తన షార్ట్ ఫిల్మ్ పూర్తి చేస్తుంది.
బీచ్ మీద తన జీవితంలో భాగం అయిన వారందరిముందూ ఫిల్మ్ స్క్రీన్ చేసినప్పుడు- వారిలో, త్వరలోనే తను ప్రేమలో పడబోయే ఆదిత్య రోయ్ కపూర్ కూడా ఉంటాడు.
నిజానికి, సినిమాకి ప్లాటంటూ ఏదీ లేదు. కథనం సాగేది కొన్ని సంఘటనల, కదలికల, భావోద్వేగాలవల్లే.

కైరాకి సినిమాటోగ్రఫీలో సామర్థ్యం ఉందని మొదటి సీన్లోనే చూపించినప్పటికీ, తన వృత్తిలో ఆమె పడే శ్రమకానీ ప్రయాస కానీ కనపడవు. నిజానికి, ఆమె ఆకర్షణీయమైన జీవితం గడుపుతున్నట్టుగా కనిపిస్తుంది. అందమైన అపార్టుమెంటూ, ఆర్థిక ఒత్తిడి లేకపోవడం, మద్దత్తుకి ఇద్దరు స్నేహితురాళ్ళూ, రొమాన్సుకి ముగ్గురు అందమైన అబ్బాయిలూ.

కైరా పాత్రకీ, ‘హైవే’ సినిమాలో చివర సీన్లలో ఆమె చూపిన కొన్ని లక్షణాలకీ బాగా పోలిక ఉంది. అవే అణిచివేయబడిన అనుభూతులూ, వేదనాభరితమైన జ్ఞాపకాలని వదిలిపెట్టి, ముందుకు సాగాలన్న సందేశాలూ. అయితే, దీనిలో మట్టుకు వీటిని చూసినప్పుడు మనకి అంత బాధ కలగదు.
ఖాన్ ట్రేడ్ మార్కులయిన శరీర భంగిమలు, పెదవి విరుపులూ అవీ ఈ సినిమాలో కనబడవు. సూపర్ స్టార్‌గా కాక, ఆలియా పాత్రకే ప్రాముఖ్యతని వదిలి, తను పక్కకి తప్పుకున్నాడు. పూర్తి ఫోకస్ ఉన్నది ఆలియా భట్ మీదనే.
గోవా వీధులూ, సముద్రం, ప్రామాణికతని కనపరుస్తాయి. ఆలియా వేసుకున్న బట్టల డిసైన్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి ఉంటాయన్నదాన్లో సందేహం ఏదీ లేదు.

పెద్ద హిట్ అయిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాని డైరెక్ట్ చేసిన గౌరీ షిండే, మరి ఎందువల్లో కానీ ఈ సినిమాలో అంత ఎక్కువ వ్యక్తీకరించలేకపోయిందనిపిస్తుంది.
2.5 గంటల నిడివి కొంచం ఎక్కువే అనిపించినప్పటికీ, 4 ఏళ్ళల్లోనే 10 సినిమాల్లో నటించి, ఆలియా ఒక ఏక్టర్గా ఎంత ఎదిగిందో అని చూడటానికి ఈ అదనపు టైమ్ వెచ్చించడం సమంజసమే.

అమిత్ త్రివేదీ సంగీతం తేలిక్గా ఉంది. ‘గో టు హెల్’ అన్న పాట, హర్టుబ్రేక్ తర్వాత కలిగే నొప్పిని చక్కగా వర్ణిస్తుంది. ‘లవ్యు జిందగీ’ పాట వింటే, జీవితాన్నీ అది కలిగించే అనుభూతులన్నిటినీ అంగీకరించాలనిపిస్తుంది. కౌశార్ మున్నీర్ లిరిక్స్ ఇంపుగా ఉండి, అర్జీత్ సింగ్ పాడిన ‘ఏ జిందగీ’’ పాట, ఇప్పటికే అందరి నాలికలమీదా ఆడుతోంది.

ఖాన్‌తో థెరపీ సెషన్స్ అయిన తరువాత తప్ప, కైరా చిరాకెందుకో మనకకర్థం అవదు. తన తల్లితండ్రులతో, బంధువులతో కఠినంగా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలియదు.

ఒక యువతి అంతర్గత జీవితాన్ని ఇంత విశదంగా అన్వేషించిన బోలీవుడ్ సినిమాలు చాలా తక్కువ.
ఈ ఫిల్మ్ ఉద్దేశ్యం కేవలం ప్రేక్షకులకి ఒక కథ అందించడమే అనీ, ఏ సామాజిక సందేశాలనీ ఇవ్వడం కాదనీ షిండే, భట్, ఖాన్ ముగ్గురూ-ఇంటర్వ్యూల్లో చెప్పినప్పటికీ, ఈ మధ్యే కొంతమంది సెలెబ్రిటీలు తాము తమ డిప్రెషన్తో ఎలా పోరాడారో అని పబ్లిక్గా చెప్పిన వెనువెంటనే, మానసిక ఆరోగ్య థెరపిస్టులని విసిట్ చేయడం అంటే ఏ పిచ్చిలాంటిదో ఉన్నప్పుడే, అన్న భ్రమని డియర్ జిందగీ కొంతలో కొంతైనా తొలిగించగలుగుతుందేమో!

సినిమా చూసిన తరువాత ప్రతీ ఒక్కరికీ బి డి (బ్రెయిన్ డాక్టర్) అవసరం తప్పక ఉంటుందనీ, దాన్లో తప్పేమీ లేదనీ మనం అంగీకరిస్తాం.
ఒక సీన్లో, కైరా బోయ్ ఫ్రెండ్‌కి ఇంకెవరితోనో ఎంగేజ్‌మెంటయిందని స్నేహితురాలైన ఫాతిమా( ఇరా డూబే) చెప్పినప్పుడు, పచ్చిమిరపకాయొకటి కొరికి నమిలి మింగేసి, ఎగపీలుస్తూ, ‘అది మిరపకాయవల్లే’ అని ఫాతిమాతో అని, తప్పించుకుంటున్న ఆలియా మొహంలో చూపిన షాక్, అపనమ్మకం లాంటి ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే, ఒక ఏక్టర్గా ఈ మధ్య తనకి ఇంత చిన్న వయస్సులోనే, ఇంత పేరెందుకు వస్తోందో అర్థం అవుతుంది.

ఇకపోతే, షిండే చాలా భారీ పాఠాలన్నిటినీ ఒకే స్క్రిప్టులో కూరడానికి ప్రయత్నించిందేమో అనిపించక మానదు.

కైరాని, ఆమె అంకుల్ తను ‘లెస్బియనా?’ అని అడగడానికి బదులు ‘లెబనీసా?’ అని అడగడం హాస్యం అనిపించదు.
సినిమాకి అతకకపోయిన కొన్ని ఇలాంటి చెదురుమదురు సీన్లు తప్పితే, డియర్ జిందగీ తప్పక చూడవలిసిన ఫిల్మ్.
*

 

 

వాయిదా వేయ్

painting: Rafi Haque

painting: Rafi Haque

 

ఈ క్షణాన్ని

వాయిదా వేయ్

మళ్ళీ మళ్ళీ యుగాల కాలాన్ని

బంధిస్తా

 

అసమ్మతి సందర్భాన్ని

వాయిదా వేయ్

సమ్మతించిన కలయికలని

గుమ్మరిస్తా

 

మూసిన కలలను

వాయిదా వేయ్

తెరిచిన నిజాలను

నీ ముందు నిలుపుతా

 

తక్షణ మోహాలను

వాయిదా వేయ్

అచిర కాల ఆరాధననై

నిలుస్తా

 

కరచాలన పలకరింపులను

వాయిదా వేయ్

హృదయం విప్ప

పూయిస్తా

 

ముసురు కప్పిన మునిమాపులను

వాయిదా వేయ్

వెలుతురు పిట్టల ఉషస్సులను

ఎగుర వేస్తా

 

ఆకలి గొనన్న దాహాలను

వాయిదా వేయ్

మధుశాలలో చషకాన్నయి

అందివస్తా

 

నుదుట ముడిచిన సందేహాలను

వాయిదా వేయ్

కంటి చివర ఆనంద ధారలు

కురిపిస్తా

 

రగులుతున్న దేహాన్ని

వాయిదా వేయ్

శీతల గంధమై

హత్తుకుంటా

*

సహజత్వ ప్లానిటోరియం

 

నిన్నో మొన్నటిలా…

satya1

Art: Satya Sufi

ఫిడెల్ కో గీతం

Art: Nivas

Art: Nivas

  • చేగువేరా

~

నీవు సూర్యుడుదయిస్తాడని చెప్పావు.

వెళ్దాం పద

ఆ గీయని దారుల వెంట

నీవు ప్రేమించే ఆ ఆకుపచ్చని మొసలిని విడిపించేందుకు.

 

పద వెళ్దాం,అవమానాల్ని

చీకటి విప్లవ తారల నుదురులతో ధ్వంసం చేస్తూ.

విజయాన్నే పొందేద్దాం లేదా మృత్యువునే దాటేద్దాం.

 

మొదటి దెబ్బకే అడవంతా

క్రొత్త ఆశ్చర్యంతో మేల్కొంటే

అప్పటికపుడే ప్రశాంత సమూహమై

మేమంతా నీ పక్కన నిలిచేస్తాం.

 

ఎప్పుడు నీ గొంతుక

భూమి, న్యాయం, తిండి, స్వేచ్ఛ ల

నాలుగు గాలులనూ చుడుతుందో

అపుడే నీ సరి మాటలతో

నీ పక్కన నిలిచేస్తాం.

 

ఎప్పుడు సాయంత్రానికి

నియంత పై పని ముగుస్తుందో

అప్పటికపుడే కడపటి కదనానికి

మేమూ నీ పక్కన నిలిచేస్తాం.

 

 

ఎప్పుడు క్యూబా బాణపు దెబ్బను

క్రూర మృగం చవిచూస్తుందో

అపుడే పొంగే గర్వపు గుండెలతో

నీ పక్కన నిలిచేస్తాం.

 

ఆ ఎగురుతూ బహుమతులతో ఆకర్షించే

అందమైన గోమారులు మా ఐక్యతను ధ్వంసం చేస్తాయనుకోకు.

మాకు వారి తుపాకులు కావాలి, వారి తూటాల రాయి కావాలి

యింకేమీ వద్దు.

 

అమెరికా చరిత్ర కు పయనించేప్పుడు

మా దారిన అడ్డంగా ఆ ఇనుమే నిలుచుంటే

మా గెరిల్లా ఎముకలు కప్పుకునేందుకు

క్యూబా కన్నీటి తెరలనడుగుతాం

ఇంకేమీ అడగం.

(అనువాదం : విజయ్ కోగంటి )

మీటితే చాలు, పలికే మురళి!

balamurali

మంగళంపల్లి బాల మురళి గారు పరమపదించారు అన్న వార్త నేను కాకినాడలో మా ఇంటి ముందు వరండాలో వాలు కుర్చీలో కూచుని మా మామిడి చెట్టుని చూస్తూ  అమితమైన ఆనందాన్ని అనుభవిస్తున్న సమయంలో నాకు చెప్పిన ఆ మానవుడిని లాగి లెంపకాయ కొట్టాలనిపించింది. ఎందుకంటే అబద్ధాలాడే వారంటే నాకు అయిష్టం.

కానీ, వెనువెంటనే అప్పుడే వచ్చిన రోజు వారీ పత్రికలూ, నేను ఇండియాలో అరుదుగా చూసే టీవీల వలన ఆ వార్త  నిజమే అని తెలియగానే నా మనసు 1968, జనవరి మూడో వారానికి వెళ్ళిపోయింది. అప్పుడు నేను బొంబాయి I.I.T లో M. Tech చదువుకుంటున్నాను. ఆ రోజుల్లో మా కేంపస్ లో “స్వరాంజలి” అనే శాస్త్రీయ సంగీత అభిమానుల గుంపు ఉండేది. మహమ్మద్ షేక్ అనే అతను ప్రధాన నిర్వాహకుడు. సమస్య అల్లా.. ఆ గుంపు లో ఉన్న వారందరికీ భారతీయ శాస్త్రీయ సంగీతం అంటే కేవలం హిందూస్థానీ మాత్రమే. బెంగాలీ వారి రబీంద్ర సంగీత్, మరాఠీ వారి సంగీతం మొదలైన కచేరీలు కూడా ఏర్పాటు చేసే వారు..కానీ కర్నాటక సంగీతం అనగానే చిన్న చూపుతో ఒక్క కార్యక్రమం కూడా జరగ లేదు. అప్పటికి చాలా చిన్న వయసులో ఉన్న నా దృష్టిలో వారి అవగాహనా రాహిత్యం ఒక కారణం అయితే, కేంపస్ లో ఉన్న దక్షిణ భారతీయులు కొందరు బెంగాలీ, మరాఠీ, హిందూస్థానీ సంగీతాలని ఆస్వాదించడం ప్రగతి పథంలో పయనించి తమ విశాల దృక్పథం ప్రదర్శించుకోవడంగా భావించుకునే వారు. కర్నాటక సంగీతాన్ని పట్టించుకునే వారు కాదు.

సరిగ్గా ఆ తరుణంలో మంగళంపల్లి వారు సయాన్-మాటుంగాలో ఉన్న షణ్ముఖానంద వేదికలో కచేరీ చేస్తున్నారు అనే వార్త వచ్చింది. నేనూ, నా ఆప్త మిత్రులు భాగవతుల యజ్ఞ నారాయణ మూర్తీ,  పులపాక రామకృష్ణా రావు (గాయని పి. సుశీల తమ్ముడు) ఆ కచేరీకి టిక్కెట్లు కొనేసుకున్నాం. కానీ మా కేంపస్ లో విశ్వనాథన్ గారూ (చిట్టి బాబు సహాధ్యాయిగా మంచి వీణా విద్వాంసులు), AIR మొదటి గ్రేడ్ లో అద్భుతమైన గాయని నాగరాజ మణీ నటరాజన్, ఇతర కర్నాటక సంగీతాభిమానులూ పట్టుపట్టి “స్వరాంజలి” వారిని ఒప్పించి బొంబాయి IIT కేంపస్ లో మొట్టమొదటి శాస్త్రీయ కర్నాటక సంగీత కచేరీ…బాల మురళి గారిచే చేయించే ఏర్పాట్లు చేశారు.  ఐ ఐ టి లో అనగానే బాలమురళి గారు తక్షణం అంగీకరించారు.

కానీ ఒక సమస్య వచ్చింది. ఏ కారణానికో ఇటువంటి సంగీత కార్యక్రమాలు జరిగే “లెక్చర్ థియేటర్” అనే 300 మంది పట్టే ఆడిటోరియం దొరక లేదు. అందుచేత  మా మైన్ బిల్డింగ్ లో నాలుగో అంతస్తులో ఒక సర్వ సాధారణమైన హాలులో ఈ కచేరీ ఏర్పాటు చేశారు. అంటే పెద్ద స్టేజ్ , హంగులూ, ఆర్భాటాలూ లేకుండా ఒక చాంబర్ కాన్సెర్ట్ లా అనమాట. ఒక వేపు హిందుస్థానీ పద్దతిలో రొజాయిలూ. దిండ్లు పెట్టి పాడే వాళ్లూ, వినే వాళ్లూ అందరూ నేల మీదే కూచోడమే! రాత్రి భోజనాల తర్వాత 9 గంటలకి బాలమురళి కొలువు తీరారు. ఇప్పుడు 90 సంవత్సరాల అన్నవరపు రామస్వామి గారు వయోలిన్, దండమూడి రామ్మోహన రావు గారు మృదంగం. సుమారు వంద మంది విద్యార్థులు, ప్రొఫెసర్లు…అంతే…ఆ రోజు బాలమురళి రెచ్చి పోయారు. రాత్రి 9 గంటల నుంచి తెల్లారగట్ట  ఒంటి గంట వరకూ..

ఆ రోజు ఆయన చేయని సంగీత విన్యాసం లేదు. చెయ్యని ప్రయోగం లేదు. పాడని కృతి లేదు. అలుపూ, సొలుపూ అసలు లేనే లేదు. మా…లేదా మన దురదృష్టవశాత్తూ ఆ రోజుల్లో కెమేరాలూ, విడియోలూ లేవు. అరా కోరా ఉన్నా ఎవరికీ అందుబాటులో లేవు. అదృష్టవశాత్తూ …నా మనోఫలకం అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ తెరిచే ఉంటుంది..నాకు నేనే ఎప్పడు కావాలంటే అప్పుడు ఆవిష్కరించుకుంటూ ఉంటాను. గత వారం రోజలుగా నేను నలభై ఏళ్ల నా బాలమురళీ పరిచయాన్ని ఆవిష్కరించుకుంటున్నాను. ఆయనతో నా తొలి పరిచయం 1968 లో బొంబాయి లోనే!

ఆ తరువాత గత నలభై ఏళ్లుగా ..ఒకటా రెండా .కనీసం పాతిక సార్లు ఆయన కచేరీలు వినడం కానీ, నిర్వహించడం కానీ జరిగాయి. ఆ మహానుభావుడితో వ్యక్తిగత అనుబంధం పెంచుకోవడం నా పూర్వ జన్మ సుకృతం. ఆయన హ్యూస్టన్ ఎన్ని సార్లు వచ్చినా ఆయనతో కచేరీలు ఆనందించడమే కాకుండా ఆయనతో కాలం గడపడం, విహారాలకి తీసుకెళ్లడం, ఆయన చిద్విలాసంగా చెప్పే కబుర్లు వింటూ ఆనందించడం ..అవన్నీ తీపి గుర్తులే! ఆయన పోయిన మర్నాడు మా కాకినాడ సరస్వతీ గాన సభ -సూర్య కళామందిరంలో జరిగిన సంతాప సభలో నా జ్ఞాపకాలు నెమరువేసుకున్నాను. ఆయన ఆ సభకి బాలమురళి గారు గౌరవాధ్యక్షులు. అలనాటి సూర్య కళా మందిరాన్ని ఆధునీకరణ చేసి 2003 లో బాలమురళి గారే పున:ప్రారంభం  చేశారు. ఆ వేదిక బాలమురళిగారికి అత్యంత ఆత్మీయమైన వేదిక. ఆ సభలో స్థానిక ప్రముఖులు, మునుగంటి శ్రీరామముర్తి గారి కుమారులు వెంకట్రావు గారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

కాకినాడ-సూర్య-కళా-మందిరంలో-బాలమురళి-గారి-నివాళి

కాకినాడ-సూర్య-కళా-మందిరంలో-బాలమురళి-గారి-నివాళి

బాలమురళీ గారి సంగీత ప్రాభవం గురించి మాట్లాడే అర్హత నాకు లేదు కానీ, ఒక వ్యక్తిగా ఆయన హాస్య ప్రవృత్తి గురించి నేను విన్నవీ, స్వయంగా తెలిసినవీ  కొన్ని మాటలు చెప్పగలను. ఒక సారి ఒక పెద్దాయన మృదంగం నేర్చుకున్న తన కొడుకు బాల మురళి గారితో ఒక కచేరీలో వాయిస్తే చాలు. అతని కెరీర్ కి ఉపయోగపడుతుంది అని బతిమాలితే ఆయన ఒప్పుకున్నారు. కచేరీ అయ్యాక ఈ తండ్రి బాలమురళి గారిని “మా వాడికి తన్యావర్తనం అవకాశం కూడా ఇస్తారు అనుకున్నాను. అంటే కచేరీ మధ్యలో మృదంగం ప్రతిభ చూపించుకునే అవకాశం. దానికి బాలమురళి గారు “ఇవ్వకేం ..మొత్తం మూడు గంటలూ తను చేసింది తన్యావర్తనమేగా. నేనేదో పాడుతున్నాను. అతనేదో వాయించుకు పోయాడు. అంత కంటే ఏం కావాలి” అని చురక అంటించారుట.

అలాగే ఒక సారి ఆయనా, మరి కొందరూ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం మీద రైలు కోసం ఎదురుచూస్తూ ఉంటే “ఫలానా రైలు రెండు గంటలు ఆలస్యంగా నడుచుచున్నది” అని స్పీకర్ల లోంచి ఒకావిడ మెసేజ్ వినపడింది. అందరూ విసుక్కుంటూ ఉంటే బాలమురళి గారు “పాపం ఆ ఏనౌన్సర్ ని ఏమీ అనకండి. ఆవిడే ఒప్పుకుందిగా రైలు నడుచుచున్నదీ అని. రైలు పరిగెడితే సమయానికి రాగలదు కానీ నడుస్తుంటే ఆలస్యం అవదూ” అని వాతావరణాన్ని తేలిక పరిచారు.

ఆయనకీ వచ్చిన బిరుదులు కేవలం యాదృచ్చికం. ఆయనకీ అవసరం లేనివి. ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ “నేను ఒక వాయిద్యం లాంటి వాడిని, మృదంగం మీద చిన్న దెబ్బ వేస్తే ఆ దరువు వినపడుతుంది. వీణ మీటితే నాదం వినిపిస్తుంది. అలాగే నన్ను మీటితే సంగీతం వస్తుంది. నాకు ఎక్కువ సాధన అక్కర లేదు. నా సహ వాయిద్యం వారికోసం సాధన చేస్తాను” అన్నారు.

అపర త్యాగరాజు, కర్నాటక సంగీతానికి, యావత్ భారతీయ సంగీతానికి రారాజు శ్రీ మంగళంపల్లి బాల మురళి గారి కి ఇదే నా ఆత్మీయ నివాళి.

*

 

 

రెక్క చాటు గెలుపు

art: Tilak

art: Tilak


 

గాల్లో చేతులు చాపి నిరాధారంగా నిల్చున్నపుడు
నా కడుపులోంచి మొలిచిన చిరు నక్షత్రానివి నువ్వు
నిన్నెత్తుకుని నడిచిన ప్రతీ అడుగూ
దాటొచ్చిన ప్రతీ క్షణమూ
దు:ఖ పూరిత బెంబేలు హృదయాన్ని
గొంతు చివర అణిచిపెట్టి
ముసుగు చిర్నవ్వుల్ని పూసుకున్నదే
ఇవేళ్టి క్షణం కోసం
ఎప్పుడూ అర్థరాత్రి మెలకువలో
ప్రార్థనా పూరిత పెదవులేవో కదులుతూండేవి
కంటి చివర ధారాపాతంగా
ఏవో జ్ఞాపకాలు సలుపుతూ ఉండేవి
ఇరవై రెండేళ్లుగా
నిన్ను మోస్తున్న
బరువేదో ఎక్కడైనా
కాస్త భుజమ్మార్చుకోవాలనిపించేది
గుర్తున్నాయా నాన్నా-
నెలకొక్కసారే కొనగలిగిన చాక్లెట్టు
నెలకొక్కసారే తినగలిగిన ఐసుక్రీము
ఇరవై రెండేళ్లు త్వరగా గడవలేదు
అనుక్షణం దు:ఖాల్ని
మొయ్యలేక పాషాణమై పోయిన
కనురెప్పల మీదుగా
జారని గతమై
వెకిలి ప్రపంచం వెంట
విరిగిపోయిన హృదయాన
విదిలించుకోలేని ముళ్ళై
దారి పొడవునా
బండరాళ్లనే పరిచి
గతుకుల్నే మిగిల్చి
రోజొక పరీక్షగా
ఇరవై రెండేళ్లు  ఇట్టే గడవలేదు
అయినా బతికుండాలనిపించేది
ఇవేళ్టి నీ కోసం
రెండు పిడికిళ్లూ బిగించి
గుండె నిండా ఊపిరి పీల్చి
ఏ దారైనా నడవాలనిపించేది
అలసట తీరదు
దు:ఖం ఆగదు
అయినా ముందు తప్ప వెనుక
చూడని  కాలమై ప్రవహించాలనిపించేది
నీ ముఖమ్మీద ఈ నిశ్చింత చూడడానికీ
నీ కళ్లల్లో గెలుపు కాంతిని గుండె నింపుకోవడానికీ
ఇరవై రెండేళ్లుగా
నీ వెనుక మేరు పర్వతమై నిలబడాలనిపించింది
అవును నాన్నా!
నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలిగే
ఈ రోజు కోసం
సప్త సముద్రాలు
విరిగిన రెక్కల్తోనే ఈదాలనిపించింది
ఇన్నాళ్లుగా ఎప్పుడూ ఆగకుండా
అలిసిపోయిన మస్తిష్కం
డస్సిపోయిన శరీరం
ఇపుడిక విశ్రమిస్తున్నా
నీ రెక్క చాటు గెలుపునై
నీతో పరుగెత్తుతూనే ఉంటాను
నీ శమైక స్వేదాన్నై
ఎప్పుడూ నీ కంఠాన్ని కౌగలించుకునే ఉంటాను
——

 

కొండలూ, మబ్బులూ…నా ఇల్లు!

seetaram1

కొండల నడుమ

మబ్బుల  పందిరి కింద

అందే ఆకాశపు అందాల దారిలో

నా  ఇల్లు

*

 

దండమూడి  సీతారాం చూసిన  ఈ  దృశ్యాన్ని మీ  అక్షరాల్లోంచి  చూసి  ఇక్కడ మీ మాటల్లో చెప్పండి.

 

అతడు ఈ తరం

painting: Rafi Haque

painting: Rafi Haque

నా సెల్ మోగుతోంది.  కంప్యూటర్ ముందు కూర్చుని ఫేస్ బుక్ లో ఎవరికో కామెంట్ రాస్తున్న నేను లేచి వెళ్ళి మాట్లాడాలనీ,  కనీసం వంటింట్లో పని చేసుకుంటున్న మా పని అమ్మాయి హేమని ఫోన్ తియ్యమని అందామనీ లోలోపల అనుకుంటున్నాను కాని నోట్లోంచి మాట రావడం లేదు.  మెదడు పూర్తిగా ఫ్రెండ్ టైమ్ లైన్ మీద రాస్తున్న కామెంట్ మీద ఉంది.

హేమ ఫోన్ తీసుకున్నట్లుంది “హల్లో వినతక్కా బావుంటివా?”  అంటోంది.

‘ఓ,  అక్కా!?’  అనుకున్నాను.  ఫోన్ తీసుకురా హేమా అని అందామనుకునే లోపు నా కామెంట్ కి సమాధానం వచ్చింది.  మళ్ళీ ఇక దానికి సమాధానం రాయడం లో పడిపోయాను.

“ఆఁ ఉంది”  అంటోంది హేమ.   అక్క ఆ వైపునుండి  ‘ఏం చేస్తుంది?’  అని అడిగినట్లుంది “ఇంకేముందీ!!?  ఎప్పుడు చూసినా ఆ కంప్యూటర్ ముందే కూర్చుని ఏందేందో రాసుకోవడమేగా!  ఉండు లైన్లో.  ఫోన్ తీసుకెళ్ళి ఇస్తా”  అంటూ నా రూమ్ లోకి వచ్చి ఫోన్ నా చేతిలో పెట్టింది మా హేమ.

‘వాస్నీ,  అందరికీ నేనంటే తమాషా అయిపోయింది.  అసలు ఇదిగో ఈ ఫేస్ బుక్కే నా పరువు తీస్తోంది”  అనుకుని నవ్వుకుంటూ ఆ పిల్ల చేతిలోంచి ఫోన్ తీసుకున్నాను.

“చెప్పక్కాయ్,  ఎప్పుడు బయలుదేరుతున్నారు?”  చెవిలో ఫోన్ ఉంది కాని కళ్ళు మాత్రం కంప్యూటర్ స్కీ్రన్ మీదే ఉన్నాయి.

“రేపే కదా!?,   మేము పొద్దునే్న బయలుదేరతాం.  నువ్వు మూడుకి బయలుదేరితే సరిపోదా?  నేరుగా దిగువ తిరుపతిలోని  శ్రీనివాసం కి రా.   సాయంత్రం ఆరుకి అక్కడకి చేరేట్లు వస్తే మంచిది, చీకటి పడకముందే.   రాత్రికి శ్రీనివాసం లో ఉండి ఎల్లుండి వేకువఝామున్నే తిరుమలకి బయలుదేరదాం.   దర్శనం అయ్యాక పిల్లలు బెంగుళూరికి వెళ్ళిపోతారు,  నేను బావ తిరిగొస్తాం”  అంది.

అక్క మనవరాలికి తిరుమలలో పుట్టెంటు్రకలు తీయిస్తున్నారు.  మదనపల్లి నుండి తిరుపతికి మూడు గంటల ప్రయాణమే.  వెళ్ళొచ్చు కాని ‘దాని కోసం వెళ్ళాలా,  అబ్బా!’  అనిపించింది.   దాని కోసం అని కాదు కాని నాకెందుకో ఎక్కడకీ వెళ్ళాలనిపించడం లేదు ఈమధ్య.  నాకు మొదటి నుండీ కూడా ఫేస్ బుక్ లో గడపడం ఇష్టం.   మా అబ్బాయి రాహుల్ ఢిల్లీ యూనివర్సిటీలో చేరినప్పటి నుండీ  ఒంటరితనంగా ఉన్నట్లనిపించి ఫేస్ బుక్ లోకి మరీ ఎక్కువగా వెళ్ళడం అలవాటయింది.  ఇక అది అలవాటయ్యాక ఏమిటో మరి ఎక్కడకీ వెళ్ళాలనిపించడం లేదు.  ఇంత పిచ్చి మంచిది కాదని తెలుస్తోంది కాని కంప్యూటర్ ని వదలలేకపోతున్నాను.

“వద్దులేక్కాయ్  నేను రాలేను,  నాకు ఓపిక లేదు.  పెద్దోడి సెల్ కి ఫోన్ చేసి ‘నేను రావడం లేదురా’ అని చెప్తాలే”  అన్నాను.   మా పెద్దోడు అంటే మా అక్క కొడుకు. చిన్నోడు అంటే నా కొడుకు రాహుల్.

“సరేలే  అయితే,  కోడలు ఏమన్నా అనుకుంటుందేమో..   వాళ్ళకి నువ్వే ఫోన్ చేసి చెప్పు”  అంది.

“సరే”  అని  “తిరుపతి నుండి నువ్వు ఇక్కడకి వచ్చి పోరాదా?”  అన్నాను.

“వద్దమ్మాయ్,  బావకి జ్వరం బాగా తగ్గలేదు.  బర్రెలకి మేతా నీళ్ళూ….   చాలా పని ఉంటుళ్ళా”  అంది.

“ఊ,  సరే,  బై”  అన్నాను.

2.

తిరుపతిలో అక్కకి జ్వరం వచ్చిందిట.  బావది తనకి అంటుకోని ఉంటుంది.  వెనక్కి అంతదూరం ప్రయాణం చేయలేదని  బావని ఊరికి పంపి అక్కని వాడి కార్లో నా దగ్గరకి తీసుకు వచ్చాడు పెద్దోడు.    పెద్దోడు,  కోడలు,  మనవరాలు ఆ పూట ఉండి సాయంత్రానికి బెంగుళూరు వెళ్ళిపోయారు.

అక్కకి నా దగ్గరకి వస్తే విశా్రంతి.  హేమ అన్నీ చేసిపెడుతుంది చక్కగా.  రెండు రోజుల్లోనే అక్కకి జ్వరం తగ్గింది.  జ్వరం తగ్గగానే వద్దంటున్నా వినకుండా ఇల్లు సర్దుతానని కూర్చుంది.  నా దగ్గరకి ఎప్పుడొచ్చినా ఇల్లంతా శుభ్రం చేసి పెడుతుంది.  నాకు సుఖం ఆమె వస్తే.  నేను మరింత సేపు నేను నా సాహిత్య సేవలో అంటే ఫేస్ బుక్ లో,  వాట్సప్ లో పడిపోవచ్చు.

నాకు కబుర్లు చెప్తూ హాలంతా శుభ్రం చేసి,  మా అబ్బాయి రాహుల్  రూమ్ శుభ్రం చేయడానికి వెళ్ళింది.  దాదాపు పది అవుతుండగా “అమ్మాయ్, ఇటు రా”  అని పెద్దగా కేకేసింది.  ఆమె గొంతులో కంగారు.  ‘ఏదో తేలునో పామునో చూసినట్లుగా ఏంటి అలా అరిచింది?’  అనుకుంటూ పరిగెత్తాను.

అక్క చేతిలో ఏవో కాగితాలు!!

“చూడు,  నీకు తెలుసా ఈ సంగతి?”  అంది కాగితాలు నాకు అందిస్తూ.  నేను నిలబడే “ఏమిటివీ” అంటూ తీసుకుని చూశాను.

రాహుల్ క్లాస్ మేట్ మధుర అనే అమ్మాయి వీడికి రాసిన లవ్ లెటర్స్!!!

ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అని నాకు తెలుసు కాని ఇలా వాళ్ళ మధ్య లవ్ అని నాకు తెలియదు.   ఎన్నోసార్లు ఆ అమ్మాయి ఫ్రెండ్స్ తో కలిసి మా ఇంటికి వచ్చింది కూడానూ.  నాకసలు అనుమానమే కలగలేదు.  ఆ ఉత్తరాలు చూసిన నా ముఖం మాడిపోయింది.  నా ముఖాన్ని,  దానిలో కదలాడుతున్నా భావాల్ని చూస్తున్న మా అక్క ఇక నస మొదలుపెట్టింది.

“పిల్లాడు ఏం చేస్తున్నాడు,  ఏం రాస్తున్నాడు అని కూడా చూసుకోకుండా ఎప్పుడూ ఆ ఫేస్ బుక్కు లో పడిపోతే ఎట్లా?  కాలేజీకి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పి రావడం,  వచ్చాక  ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా  కంప్యూటర్ ముందు కూర్చోవడం – పనులన్నీ ఆ హేమ మీదేసి.  తెలియనోళ్ళకైతే చెప్పొచ్చు పెద్ద చదువులు చదువుకున్నదానివి నీకు మేము ఏం చెప్పగలం”  గొణుక్కుంటూ సర్దుడాపి గోడ వైపుకి జరిగి జారగిలబడి తల పట్టుకుంది.

నేను కూడా అక్క ఎదురుగ్గా కింద కూలబడి ఉత్తరాలు చదవసాగాను.

అవి ఆ పిల్ల రెండేళ్ళక్రితం పన్నెండో తరగతిలో ఉన్నప్పుడు వీడికి రాసిన ఉత్తరాలు.  వీడు ఆ అమ్మాయికి రాసిన లెటర్స్ కూడా ఉన్నాయి.  ఇక్కడే దాచమని మళ్ళీ వీడికే ఇచ్చినట్లుంది.

యూనివర్సిటీకి వెళ్ళేముందు వాటినన్నింటినీ ఈ అట్టపెట్టెలో పెట్టేసి వెళ్ళాడనమాట.  నేను వాడి అలమరా చూడను కాబట్టి అవి నా కంటపడలేదు.

“ఏం చేద్దామే,  వాళ్ళ నాన్నకి చెప్తావా?”  అంది అక్క.

చందుకి చెప్తే నన్ను ఎన్ని మాటలంటాడో!  అక్క కాబట్టి నాలుగు తిట్టి ఊరుకుంది.  వాడు అలా ఉత్తరాలు రాయడానికీ,  నేను ఎక్కువసేపు ఫేస్ బుక్ లో గడపడానికీ సంబంధం లేకపోవచ్చు – పోనీ ఉందా!?  ఏమో!! –  ఏది ఏమైనా ఈ పరిస్థితి నాకు చాలా ఇబ్బందిగా ఉంది.

Kadha-Saranga-2-300x268

అక్క వైపు బ్లాంక్ గా చూసి ఏమీ సమాధానం చెప్పకుండా మళ్ళీ ఉత్తరాలు చూడసాగాను.  రాహుల్ ఆ అమ్మాయిని చాలా డీప్ గా లవ్ చేస్తున్నాడులా ఉంది.  కొన్ని ఉత్తరాల్లో కవితలు కూడా రాశాడు.  వాటిని చూస్తుంటే నవ్వు రావలసింది పోయి నిస్తా్రణ వచ్చేసింది.

అదే నా స్టూడెంట్స్ రాసిన ఉత్తరాలైనట్లైతే పగలబడి నవ్వి ఉండేదాన్ని ఆ రాతలకి.  మరి అదే సమస్య నాకొస్తే పిల్ల చేష్టలులే అని నేనెందుకు తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను!?  –  ఇలా ఆలోచిస్తే బాధ తగ్గుతుందేమో అనుకుంటే,  అబ్బే,  ఏ మాత్రమూ తగ్గకపోగా ఎక్కువయింది.  ఎంత విచిత్రం!!

ఫేస్ బుక్ నిండా రమణుడు, జిడ్డు కృష్ణమూర్తి,  తత్త్వం,  నిన్ను నువ్వు తెలుసుకో,  ఏమీ అంటకుండా ఉండాలి అంటూ పోస్టులు పెట్టే నేను,  చాలా ఎదిగాను అనుకున్న నేను –  సమస్య నాకు వచ్చేప్పటికి ఏమిటి ఇలా కృంగిపోతున్నాను!?  చెప్పడం అంత ఈజీ కాదు ‘నిజ్జంగా తెలుసుకోవడం’  అన్న సంగతి స్పష్టంగా అర్థమవుతోంది.

అక్క లేచెళ్ళి కాఫీ కలుపుకోని తెచ్చింది.  అక్క వైపు చూస్తే మళ్ళీ ఏం ప్రశ్నలు అడుగుతుందో అనుకుని కాఫీ తాగుతూ ఉత్తరాలు చదువుతున్నట్లుగా తల వాటిల్లోకి దూర్చాను.  ఆలోచనలు తల నిండా…

వాడిని ఎంత పద్ధతిగా పెంచుకున్నాను?  వాడికి ఊహ వచ్చినప్పటి నుండే ఎన్ని కథలు చెప్పానో.  నాలుగేళ్ళకే కూడపలుక్కుంటూ తెలుగు ఇంగ్లీష్ రెండూ చదివేవాడు.  అదేమంటే పెన్ తీసుకుని రాసేవాడు.  ఎంత ఇష్టంగా రాస్తాడో ఇప్పటికీ…  ‘ఈ రాయడం ఎట్లా నేర్పించావు తల్లీ మా పిల్లల చేత చదివించగలుగుతున్నాం కాని రాయించడమంటే తల ప్రాణం తోకకి వస్తోంది’  అనేవారు నా ఫ్రెండ్స్.

కొత్త డైరీలు వస్తే  ముందు పేజీలో ఓ మంచి కవిత రాస్తాడు.  అసలు వాడికి  తెల్ల పేపర్ కనిపిస్తే చాలు పెన్నో పెని్సలో తీసుకుని ఏదో ఓ విషయం రాయకపోతే నిద్రపట్టదు.

“ఎంత సేపు చూస్తావమ్మాయ్,  ఇంక లే,  అన్నీ సర్దుతాను”  అంది అక్క.

“అదేమంటే పెన్ను తీసుకుని రాసే అలవాటు వల్ల ఇలా రాసి ఉంటాడా!?  కాని చూస్తుంటే సీరియస్ గానే ఉందక్కా వ్యవహారం”  నాలో నేనే అనుకున్నట్లుగా అన్నాను.

“రాసేదేమిటే ప్రేమించానంటుంటే!!”  అని “ఇంతకీ ఆ పిల్ల నీకు తెలుసా?  మీ కాలేజీలోనే చదివినట్లుందిగా?”  అంది అక్క.

“ఆఁ”  అన్నాను క్లుప్తంగా.

“ఇప్పుడెక్కడ చదువుకుంటందీ,  అక్కడ కూడా మనబ్బాయి చదువుతున్న యూనివర్సిటీలోనేనా?”

“లేదు హైదరాబాద్ లో ఏదో కాలేజీలో”  అన్నాను.

“ఊఁ సరేలే అయితే బతికించింది.  ఒకే కాలేజీ అయి ఉన్నట్లైతే  చదువూ సంధ్యా లేకుండా తిరుగుతా ఉండి ఉంటారు,  విషయం చందూకి చెప్తావా?”  అంది.

“చెప్తే ఈయన ఏమంటాడో అక్కాయ్,  ఫస్ట్  రాహుల్ కి సాయంత్రం ఫోన్ చేసి అడిగేదా?”  అన్నాను.

“భలేదానివే తల్లా,  అసలే పిల్లలు ఉబిద్రంగా ఉన్నారు.  ఏం అడిగితే ఏం చేసుకుంటారో అని భయంగా ఉంటే.  ఈ సంగతి మనకి తెలిసిందని తెలిస్తే పరీక్షలు కూడా సరిగ్గా రాయడు ఊరుకో”  అంది.

“ఊఁ”  అన్నాను.  అక్క మాటలకి నాకు మరింత దిగులేసింది.

అలమరలో నుండి తీసిన వస్తువులు పైపైన సర్దేసి అక్క వంటింట్లోకి వెళ్ళిపోయింది.  అక్క కళ్ళ నిండా నిస్సహాయతతో కూడిన దిగులు స్పష్టంగా కనిపిస్తోంది.  నేను మాత్రం గంభీరంగా ఉన్నాను – దిగులు కనపడనివ్వకుండా.   మధ్యాహ్నం ఇద్దరం ఏదో తినాలి కాబట్టి అన్నట్లు భోంచేశాం.   గదిలోకి వచ్చి పడుకున్నాక ఆ పిల్ల గురించీ,  వాళ్ళ తల్లిదండ్రుల గురించీ విషయాలన్నీ అడిగి చెప్పించుకుంది అక్క.

ఇక ఆ పిల్లనే పెళ్ళి చేసుకుంటానంటే వాళ్ళెలాంటి వాళ్ళో తెలుసుకోవాలని అక్క ఆత్రం.  ఆ పిల్ల మా కులం కాదు అని తెలిసేటప్పటికి నోటికొచ్చినట్లు నన్నూ నా ఫేస్ బుక్ నీ కాసేపు ఆడిపోసుకుంది.  నేనేమీ మాట్లాడలేదు.  అలసి పోయిన అక్క మాట్లాడుతూ మాట్లాడుతూనే నిద్రపోయింది.

కులం గురించి నాకేమీ పట్టింపులేదు కాని ఇదెక్కడికి దారి తీస్తుందో అనిపించింది.   ఆలోచించుకుంటూ నేను కూడా కళ్ళు మూసుకున్నాను కాని కళ్ళు,  కనుబొమలు ముడుచుకుపోతున్నాయి ప్రశాంతత లేకుండా.   ఎందుకు నాకింత ఆందోళన?  ఈరోజుల్లో ప్రతి వాళ్ళూ ప్రేమించే కదా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు?  ‘నాకే కులమైనా ఒకటే’ అని పైకి అనుకుంటున్నాను కాని లోలోపల నాకు కూడా మన కులం పిల్లైతే బావుండేది అన్న కోరిక ఉందా?   ఏమీ అర్థం కాలేదు.  ముందు అసలు ఈ విషయం చందూకి చెప్పాలా వద్దా అని కూడా నిర్ణయించుకోలేకపోతున్నాను.  ఇదీ అని చెప్పలేని ఉద్వేగంతో కూడిన బాధ నన్ను ఓ చోట నిలవనివ్వడం లేదు.  లేచి గదిలో అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాను –  మధ్యాహ్నం మూడుకి హేమ వచ్చిందాకా.

సాయంత్రం ఆరుకి చందూ ఆఫీస్ నుండి రాగానే అక్క వంటింట్లోకి దూరిపోయింది.  ఆయనకి టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చాను.  కాఫీ తాగేసి ప్రతిరోజూ తను వెళ్ళే ఆధ్యాత్మిక చర్చకి వెళ్ళిపోయాడు.  ఆయన అటు పోగానే అక్క గభాల్న బయటికొచ్చి “చెప్పావా? ,  ఏమన్నాడు?”  అంది.

“లేదక్కాయ్,  చెప్పలేదు.  భయంగా ఉంది”  అన్నాను.

భయం అని అంటే అక్క ఊరుకుంటుంది రొక్కించకుండా.  కాని నాకు అసలు ఆయనతో ఎలా చెప్పాలో తెలియడం లేదు.  చెప్తే ఆయన ఈ విషయాన్ని నాకంటే కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయగలడు.   వాళ్ళ నాన్నతో చాలా స్నేహంగా, గౌరవంగా ఉండే రాహుల్ ఈయన అడిగితే ఇబ్బంది పడొచ్చు.    ‘ముందు నువ్వు నన్ను అడగకుండా నాన్నకి ఎందుకు చెప్పావు?’  అని నన్ను అనొచ్చు.  పైగా నా అలమరా అసలెందుకు చూశావు అని నా మీద ఎగిరి ఏడ్చి గోల చేస్తాడేమో కూడా…

ఏం మాట్లాడకుండా నన్నే చూస్తున్న అక్కతో “ఓ వారంలో సెలవలకి వస్తాడుగా  అప్పుడు వాడిని అడుగుదాం,  వాడినే వాళ్ళ నాన్నకి చెప్పమని చెబ్దాంలే అక్కాయ్”  అన్నాను.

“సరేలే అదే మంచిది”  అంది అక్క.

3.

రాహుల్ చాలా తెలివైనవాడు.  అన్నీ తెలిసినవాడు.  వాడికి ఏ బాధ వచ్చినా, సంతోషమొచ్చినా నాకు చెప్తాడు.  నాకేదైనా సమస్య వచ్చినా కూడా  నా పక్కనే కూర్చుని విని నెమ్మదిగా పరిష్కారం గురించి మాట్లాడతాడు.  నాదే తప్పైతే ఎంత నిదానంగా చెప్పి ఒప్పిస్తాడో!  అలాంటి వాడు ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచాడో మరి.  తల్చుకుంటున్న కొద్దీ బాధ ఎక్కువవుతోంది కాని తగ్గడం లేదు.

ఈ ఆలోచనలతో కొట్టుకుంటున్న నాకు ఫేస్ బుక్కే గుర్తుకు రాలేదు.  వారం రోజులు భారంగా గడిచిపోయాయి.  నా కాలేజీకి కూడా సెలవలు కాబట్టి సరిపోయింది కాని ఉన్నట్లైతే పిల్లలకి పాఠాలు చెప్పగలిగి ఉండేదాన్ని కాదేమో!  అనిపించింది.

ఆరోజే అబ్బాయి వచ్చే రోజు.  బెంగుళూర్ ఏర్ పోర్ట్ కి డ్రైవర్ ని పంపాడు చందు.   రాహుల్  రాత్రి ఫోన్ చేసి ‘రెండు రోజులు అన్నాయ్ దగ్గర ఉండి రానా?’  అని మమ్మల్ని అడిగాడు కాని నేను ‘వద్దంటే వద్దనీ,  నాకు వాడిని చూడాలని ఉందనీ’  చెప్పాను.  ‘ఏమిటీ మొండిపట్టు?’  అన్నాడు చందు – నన్ను ఆశ్చర్యంగా చూస్తూ…  ఫోన్ లో మాట్లాడుతున్న రాహుల్ కూడా ‘ఏంటి మమ్ ఇలా మాట్లాడుతోంది?’ అని అనుకుని ఉంటాడు.

‘పోనీలే నాన్నా,  అమ్మ దిగులు పెట్టుకుందేమో,  నేరుగా ఇంటికే వస్తాలే’  అన్నాడుట.

ఎండాకాలం సూర్యుడు ఉదయం తొమ్మిది కాకుండానే చిటపటలాడిపోతున్నాడు.   హేమ కిటికీలకి కట్టిన వట్టి వేళ్ళ కర్టెన్స్ ని కిందికి దించి నీళ్ళతో తడుపుతోంది.   వాటి మీద నుండి చల్లని గాలి కిటికీలో నుండి లోపలకి వస్తోంది.  అక్క వంటింట్లో అబ్బాయికి ఇష్టమైన గుత్తి వంకాయ కూర చేస్తోంది.  ఇల్లంతా కమ్మని వాసన అలుముకుని ఉంది.

దాదాపు పదకొండు అవుతుండగా కార్ వచ్చింది.  రాహుల్ నవ్వుకుంటూ లోపలకి వచ్చాడు.  లగేజీనీ డ్రైవర్ కి అస్సలు ఇవ్వడు,  ఎప్పుడూ తనే మోసుకొచ్చుకుంటాడు.  బ్యాగ్స్ కింద పెట్టి “మమ్,  హౌ ఆర్ యు?”  అని వాటేసుకున్నాడు.  నా వెనుక గబగబా వస్తున్న అక్కాయ్ ని చూసి నన్ను వదిలేసి “అరె!  ఆమ్మా,  నువ్వెప్పుడొచ్చా!!?”  అని అక్క దగ్గరకి పరిగెత్తి చేతులు పట్టుకుని ఊపేశాడు.

“పది రోజులైందబ్బాయ్ వచ్చీ,  నన్ను చూసి నువ్వు థ్రిల్లవ్వాలని నేనొచ్చినట్లు నీకు చెప్పొద్దన్నా.  సరేగాని ఏందిట్లా నల్లబడ్డా?  సరిగ్గా తినడం లా?”  అంది అక్క నోరంతా తెరిచి నవ్వుతూ.

“హహహ,  ఇంత లావుంటే.  నువ్వూ, అమ్మమ్మా ఎప్పుడూ ఇదే వాక్యం మాట్లాడతారు – తేడా లేకుండా.  ఎట్లుంది అమ్మమ్మ?”  అన్నాడు.

“బాగుంది” అని అక్క అంటుండగానే “భలే వాసనొస్తుందే వంకాయ కూర చేశావా?”  అన్నాడు.

“అవును,  స్నానం చేసిరా.  వేడివేడిగా అన్నం తిందువుగాని” అంది.

ఆ సంభాషణ అంతా విననట్లుగా నేను సూట్ కేసులు గదిలోకి చేరేస్తున్నాను.   నా వైపు చూసిన వాడు “మమ్,  ఆర్ యు ఆల్ రైట్?  ఏమిటి అలా ఉన్నావు?”  అన్నాడు.

వాడు పరీక్షలెలా రాశాడైనా అడగాలనిపించలేదు నాకు,  ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ “నువ్వు చేసిన పనికి ఇలాగాక ఎలా ఉంటాను?”  అన్నాను.

వాడు అర్థం కానట్లు ఆశ్చర్యంగా చూస్తూ “ఏంటి ఆమ్మా?”  అని అక్కాయ్ కి చేత్తో సైగ చేసి అడుగుతూ నా వెనకే గదిలోకి వచ్చాడు.

అక్కాయ్ కూడా వాడి వెనకే లోపలకి వచ్చి “వాడు వచ్చీ రాగానే అడగాలా?  అన్నం తిన్నాక అడగ్గూడదా?  ఇంతలోనే ఏం పోయిందని తొందరా?”  అంది.

“ఏంటి మమ్?  ఏమైంది?”  అన్నాడు వాడు.  వాడి కళ్ళు ఏం జరిగిందా అన్నట్లుగా కంగారుగా కదులుతున్నాయి.  కంప్యూటర్ టేబుల్ డెస్క్ లాగి లోపల పెట్టిన లెటర్స్ ని తీసి “ఏంటివి?”  అన్నాను.   వాడు నా చేతిలోని ఉత్తరాలు తీసుకుని చూస్తున్నాడు.

నా గొంతులోని తీవ్రతకి నాకే అసహ్యం పుట్టింది.  ‘ఏమిటిది?’ –  అనుకుని గొంతుని సర్దుకుని “నాకు ఎందుకు చెప్పలేదు రాహుల్?  ఆమ్మ నీ అలమరా సర్దుతుంటే బయటపడ్డాయి”  అన్నాను.

ఒక్కసారిగా తీవ్రస్థాయి నుండి కిందికి దిగిన నా స్వరం వినేప్పటికో,  ‘ఇదీ’ అన్న విషయం వాడికి తెలిసేప్పటికో మరి వాడు తేలిగ్గా నవ్వేస్తూ “వీటిని చూసేనా ఇంత బాధపడ్డావూ?”  అన్నాడు.

“బాధపడరా మరి?”  అన్నాను.

నా మాట వినిపించుకోకుండా “ఊరికే రాశావా అబ్బాయ్!  అయితే ప్రేమా గీమా ఏమీ లేదా?”  అంది అక్కాయ్.  ఆమె ముఖం ‘హమ్మయ్య’  అనుకున్నట్లు సంతోషంగా వెలిగిపోతోంది.

“ప్రేమ లేదని కాదు ఆమ్మా,  మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం.  ఒకళ్ళంటే ఒకళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి”  అన్నాడు కాస్త చిరాకుగా.

“ఆఁ  అదేందిరా?  అయితే మీ అమ్మకెందుకు చెప్పలా?”  అంది.

ఏం చెప్తావు సమాధానం అన్నట్లుగా వాడి వైపు చూశాను.  “ఆఁ  ఎందుకు చెప్పడం?  చెప్పాల్సొచ్చినప్పుడు చెప్తాం”  అన్నాడు.

“అంటే?  వాట్ డు యు మీన్ బై దట్?”  అన్నాను అసహనంగా.

“అది కాదు మమ్,  ఇప్పుడే ఎందుకు చెప్పడం – సెటిల్ అయ్యే విషయమైతే చెప్పాలి కాని”  అన్నాడు.

“నువ్వేమంటున్నావో నాకర్థం కావడం లేదు రాహుల్,  మీ ఇద్దరి మధ్యా ఫీలింగ్స్ ఉన్నాయి అంటున్నావు,  ప్రేమించుకుంటున్నాము అంటున్నావూ…  కదా!?”

“అవును మమ్,  నిజమని చెప్తున్నా కదా!?”  అన్నాడు.

ఇంతలో అక్క కలుగచేసుకోని “ఏందబ్బాయ్,  మీ మాటలు నాకు అర్థం కావడం లేదు.  తక్కువ కులపు పిల్లని పెళ్ళి చేసుకుంటావా?”  అనగానే రాహుల్ ఆమెని కోపంగా చూశాడు.  వాడి చూపుకి భయపడ్డ అక్కాయ్ “సరే నీకిష్టమైంది,  చేసుకుంటావనుకో,  అయితే మీ అమ్మకి చెప్పబన్లే,  వారం నుండి తిండి కూడా తినకుండా మనసులో ఏడ్చుకుంటంది”  అంది తత్తరతత్తరగా ఇప్పుడే ఏదో పెళ్ళయిపోతున్నట్లు.

నేను అక్కని  “అక్కాయ్,  ఊరుకో,  చెప్పనీయ్ వాడిని”  అన్నాను.   కోపంగా ఉంది నాకు.  ఈ చర్చంతా చీదర కూడా పుట్టిస్తోంది.

“మమ్,  ఇప్పుడు ఫీలింగ్్స ఉన్నంత మాత్రాన తర్వాత పెళ్ళి చేసేసుకుంటారు అని అనుకుంటే ఎలా?”  అన్నాడు.

అక్క వైపు చూస్తున్న నేను వాడి మాటలకి అమితాశ్చర్యపోయాను.   గభాల్న తల తిప్పి వాడి వైపు చూస్తూ “వ్వాట్,  అయితే పెళ్ళి చేసుకోరా!?”  అన్నాను.

“అది కాదు,  దాన్ని గురించి ఇప్పుడు ఎందుకు అంటున్నాను”

“ప్రేమించానంటూ లెటర్స్ రాశావు కదా?  కవితలని గుప్పిస్తూ…   ప్రేమించుకునేది పెళ్ళి చేసుకోవడానికి కాదా?”  అరిచాను.   ప్రేమ పేరుతో అవసరాలు తీర్చుకుని మోసం చేసి వెళ్ళిపోయిన కొంతమంది నాకు తెలిసినవాళ్ళు  ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలారు.    ‘వీడు కూడా అంతేనా?  నా బిడ్డని నేను అలా పెంచానా?’ అన్న ఆలోచనతో బిపి వచ్చినట్లుగా వణికిపోయాను.

వాడు నాకెలా చెప్పాలా అన్నట్లు తల అటూ ఇటూ ఊపుతున్నాడు.

నేనే మళ్ళీ “అయితే ఇవన్నీ కాలక్షేపం కోసం రాసుకున్న ఉత్తరాలని అనుకోమంటావా?”  అన్నాను లెటర్స్ వైపు చూపిస్తూ.

“ఊఁ  నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు మమ్,  ప్రస్తుతం మేమిద్దరం ఒకళ్ళంటే ఒకళ్ళం ఇష్టపడుతున్నాం.  పెళ్ళి చేసుకుంటామేమో కూడా.  కాని పెళ్ళి గురించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోకూడదని అనుకున్నాం”  అన్నాడు.

నన్ను అనునయిస్తున్నట్లుగా చెప్తున్న వాడి ఆంతర్యం నాకంతు పట్టకపోయినా ఆ మాటల్లో సత్యం దాగి ఉందని అర్థమైంది.  మౌనంగా వాడి వైపే చూస్తున్నాను.  అక్క అయితే దిమ్మెరపోయినట్లుగా చూస్తూ వింటోంది.

“ఇప్పుడు మధురకి నేనంటే ఇష్టం,  నాకు మధుర అన్నా ఇష్టమే.  అయితే మేము ఇంకా చాలా చదువుకోవాలి.   ఎంతో మందిని కలుసుకోవాలి.  ఈ ప్రయాణంలో మాకు వేరెవరైనా దగ్గరవొచ్చు.  పోనీ మా ఇద్దరిలో ఎవరికైనా ఇప్పుడున్న ఇష్టం ఉండకపోవచ్చు.  పోనీ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఏదైనా ప్రమాదం జరగొచ్చు – ఏ జబ్బో,  యాక్సిడెంటో”

“ఊరుకోబ్బాయ్,  తంతా!  ఏమిటా మాటలు?”  అక్క పెద్దగా అరిచింది.

నేను రాహుల్ ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం.   వాడు చెప్తున్నది అర్థం అవగానే నాలో నిస్సత్తువ.   వెళ్ళి మంచం మీద కూర్చున్నాను.

రాహుల్ నా పక్కకి వచ్చి కూర్చుని నా భుజం మీద చెయ్యేసి నన్ను ఆనుకుని “ముందున్న జీవితంలో ఏం జరుగుతుందో తెలియనప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మంచిదా మమ్?  ఆ నిర్ణయానికి అసలు అర్థం ఉంటుందా? అందుకే నేను నీకు చెప్పలేదు,  అంతే”  అన్నాడు.

నేనేమీ మాట్లాడలేదు.

సమాజంలో నిరంతరం చొచ్చుకుని వస్తున్న  మార్పుల వల్ల  ఈ కొత్త తరం పిల్లల జీవితాల్లో  పెరామీటర్స్ ఎక్కువై  వాళ్ళ ఆలోచనా విధానాలూ,  వాటిని ప్రేరేపించే కారణాలు రెండూ కూడా డైనమిక్ గా ఉంటున్నాయి.  కాని రాహుల్,  నా కోడలు అవుతుందో లేదో తెలియదు గాని మధుర –  ఇద్దరూ ఇంత క్లారిటీగా ఉన్నందుకు నాకు చాలా సంతోషం కలిగింది.  నా శిష్యురాలిగా ఆమె,  ఆమెతో పాటు ఉన్నతమైన ఆలోచనలతో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన నా బిడ్డ ఇద్దరూ నాకు గర్వాన్నే కలిగించారు.

రాహుల్ ని తలని దగ్గరకి తీసుకుని హత్తుకున్నాను.   నా కళ్ళల్లోంచి రెండు వెచ్చని కన్నీటి బిందువులు జారి వాడి గుబురు తలలో ఇంకిపోయాయి.

*****

 

ఎల్లలు దాటిన అద్భుతం – ఎల్లోరా!

ellora1

~

మా ఎలోరా యాత్ర చాలా అకస్మాత్తుగానే జరిగింది. ‘ఈ సారైనా దసరా సెలవులకు ఎటైనా వెళ్దామా?’ అంటూ మా అమ్మాయి కావ్య అడిగిన ప్రశ్న కొంచెంగా కుదిపిందనే చెప్పాలి. చాలా స్తబ్ధంగా విరామం లేకుండా పరిగెట్టి ఒక్క తెరిపి చిక్కే సరికి ‘అవును ఎందుకెళ్ళగూడదు?’ అనే ప్రశ్నే సమాధానమనిపించింది. కొల్హాపూర్ లో వున్న తమ్ముడి కుటుంబాన్ని పలకరించి అలా షిర్డీ, పండరి, అజంతా – ఎలోరా లలో ఒకటైనా సరే చూసి వద్దామని బయలుదేరాం.

నేరుగా కొల్హాపూర్ కు రైలు లేకపోవడంతో  డబుల్ డెకర్ ట్రైన్ లో హైదరాబాదు సాయంత్రానికి చేరి నకోడా స్లీపర్ సర్వీస్ లో మర్నాడు వుదయానికి  దట్టంగా పొగమంచులో కిటికీ నుంచీ వరుసగా దాటిపోతున్న  గ్రామాలు, మనుషులను చూస్తూ సాంగ్లీ చేరేసరికి వుదయం 6.45 అయింది.  పొద్దున 7 .30 కల్లా కొల్హాపూర్ లోకి ప్రవేశించాం. నేనూహించిన సాంప్రదాయకమైన మహరాష్ట్ర దుస్తులలో మనుషులు ఎక్కడో ఒకటి, రెండు చోట్లలోనే కనిపించారు. బహుశా ఇంకా లోపలి వూళ్ళ కెళితే కనిపిస్తారు కాబోలు అనుకున్నాం. గ్లోబలైజేషన్ పుణ్యమా అని వేషం, భాష కట్టుబాట్లు మారుతున్నాయి గదా. భాషలు పేరులే మార్పు కానీ ప్రదేశాలన్నీ ఒకటే.

ellora4

తమ్ముని కుటుంబంతో ఓ రోజు గడిపి ఆ సాయంత్రం కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయాన్ని సందర్శించాం. గోకుల్ పాలెస్ లో భోజనాల సమయంలో ‘కేవలం ఈ దేవాలయమే  కాక కొల్హాపూర్ లో పంచగంగా ఘాట్, శ్రీ ఛత్రపతి సాహు మ్యుజియం గా మలచబడిన రాజ సౌధం, టౌన్ హాల్ మ్యుజియం కూడా సందర్సించ దగినవి. కొల్హాపూర్ చెప్పులకు, బెల్లానికి కూడా ప్రసిద్ధి’ అని కూడా తెలిసింది. ఆ రాత్రే షిర్డీ కి బయలుదేరి తెల్లారేసరికి చేరాము.

మొదటి సారి షిర్డీ లో అడుగుపెట్టగానే అంతా గందరగోళంగా అనిపించింది. భక్తీ అంటే వాణిజ్యమనే నానుడి (నా గొణుగుడు) నిజమనిపించింది. ఇలా వాణిజ్యం లేకుండా మనుషులు జీర్ణించు కోలేరేమో. చుట్టుముట్టిన ఆటో వాలాలు, గదులు కావాలా, హోటల్స్ కావాలా, చాలా చవక అంటూ దళారీలు- ఓ నిముషం ఉక్కిరి బిక్కిరి అయ్యాము. అందర్నీ తప్పించుకు కొంత దూరం నడిచి ఊపిరి పీల్చుకు ఓ మాదిరిగా  మంచి హోటల్ లో రూమ్ తీసుకున్నాము. స్నానం , బ్రేక్ ఫాస్ట్ తర్వాత దర్శనానికి వెళ్ళడం మరో అధ్యాయం.

భక్తి అంటే  పెరిగిన ప్రేమ, అభిమానమే. దైవం మానుష రూపం లో అన్నట్లు గా తన సమాజంకోసం, తనను నమ్మిన వారికోసం కులమతాల కతీతంగా జీవించిన షిరిడీ బాబా పై ప్రత్యేక మైన ప్రేమ. అయితే ఈ ప్రేమను కూడా ఇలాటి చోట్ల, డబ్బు చేసుకునే వ్యాపారుల వల్లే కొంచెం పుణ్య క్షేత్రాలకు వెళ్ళాలంటే జంకు. అనవసరమైన వన్నీ భక్తులకు అంటగట్టాలని దారి మళ్ళించే వ్యాపార దళారీలను తప్పించుకొని మొబైల్ వగైరాలు బయటే జమచేసి దర్సనానికి వెళ్ళి వచ్చాం .  షిరిడీ ఆలయం చుట్టూరా ఉన్న గ్రామమంతా హోటళ్ళు, లాడ్జి లతో నిండిపోయింది. మా కారు డ్రైవర్ చెబితే విని ఆశ్చర్య పోయాము, ‘వీటిలో ఎక్కువ భాగం తెలుగు వారివే నట’. నిజమైన మహారాష్ట్ర గ్రామీణ వాతావరణం చూడాలంటే గుర్రపు జట్కా లో పక్కనున్న పల్లెలను చూడాల్సిందే. షిర్డీ వెళితే బళ్లపై అమ్మే ఎర్రటి జామపళ్ళు తినాల్సిందే.

మర్నాడు ఉదయమే బయలుదేరి ఎలోరా వెళ్ళాము. చాలా ఆహ్లాదకరంగా కొండలు, కోనలు, చెరువులు గల దారిమధ్యలో ఘ్రుష్ణేశ్వర ఆలయాన్ని దర్శించాము. పెద్ద స్తంభాలు, చుట్టురా ఎత్తైన అరుగులు కలిగి విశాలమైన ప్రాంగణం కల చాలా పురాతన ఆలయం. ఈ రహదారి నేరుగా వెళితే ఔరంగాబాద్ కు, ఎడమకు వెళితే అజంతా కు తీసుకెళ్తుంది.

ఈసారి  ఎల్లోరా నే చూద్దామనుకున్నాం.  ఎప్పటినుంచో  వేరుల్, లేక ఏలపుర, లేక ఏలుర – అదే మన ఎలోరా గురించి విని, చదివి ఉండడంతో చాల్ల ఉత్సుకత నిండిన మనస్సులతో చేరుకున్నాం. కొండలను గుహలలా, ఆలయాల్లా మలిచి సృష్టించిన మహాద్భుతం ఈ ఎల్లోరా గుహల సముదాయం. బౌద్ధ, హిందూ జైన సంప్రదాయాలకు సంబంధించినవీ గుహలు. ఈ గుహలనన్నీ  చరణాద్రి పర్వత సానువుల్లో (600 – 1000 C.E)  తొలిచి నిర్మించినవి.

ellora2

మనం అక్కడికి చేరుకోగానే గైడ్ లు మనల్ని అనుసరిస్తారు. ముందుగానే వివరాలన్నీ దగ్గరుంచుకుని లేదా మంచి అనుభవజ్ఞు దిన గైడ్ ను ఎంచుకుని దర్శించవచ్చు. బయట ఎలోర కు సంబంధించిన పుస్తకాలు అమ్ముతూ కొందరు అనిపిస్తారు. వీరి వద్ద కంటే లోపల ప్రభుత్వం వారి టూరిజం కౌంటర్ లో ధర తక్కువగా లభిస్తాయి.

ఇక్కడ దాదాపు వంద గుహలున్నాయి. అయితే 34 గుహలు మాత్రమే దర్శించడానికి అనుమతిస్తారు. వీటిలో 12 (1-12) బౌద్ధ గుహలు, 17 (13-29) హైందవ గుహలు, 5 (30-34 ) జైన గుహలు. ప్రతి గుహా వారి వారి పురాణాలకు సంబంధించిన గాధలను తెలిపే శిల్పాలను ఆవిష్కరిస్తుంది. ఇవన్నీ  కూడా రాష్ట్రకూటులు, యాదవ వంశస్తులు నిర్మించినట్లు చరిత్ర, శాసనాలు తెల్పుతున్నై. ఒకప్పుడివి ప్ర్రార్ధనాలయాలుగా భాసించ బడ్డా, కాలక్రమంలో శత్రువుల దండయాత్రలలో దెబ్బతిని, ప్రాభవాన్ని కోల్పోయి ప్రస్తుతం పురాతన సందర్శనా స్థలాలుగా నిలిచిపోయాయి.

16 వ నంబరు గుహ అత్యద్భుత సాక్షాత్కారం. ప్రపంచంలోనే అతిపెద్ద, మొదటి ఏకశిలా కైలాస దేవాలయం. కైలాసాన్ని తలపించే ఒక పెద్ద దేవాలయాన్ని , చుట్టురా ఉండే ప్రాకారం, రెండు ధ్వజ స్తంభాలు, ఎదురుగా రెండు పెద్ద ఏనుగులు , ఆలయ పాలకుడి మందిరం, ప్ర్రార్ధనాస్థలం, గర్భాలయం, దాని చుట్టూ బయటగా ఐదు చిన్న ఆలయాలు – ఇవన్నీ ఒకే పర్వతం లో ఒక మహా దేవాలయంలా నిలువెత్తు , అంటే దాదాపు పది పదిహేను అడుగుల ఎత్తుగల శైవ వైష్ణవ గాధలను ప్రతిబింబించే శిల్పాలు కనులముందు నిలిచి మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి ఒడలు గగుర్పొడిచి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రవేశద్వారానికి అటూ ఇటూ పురాణేతిహాసాలకు సంబంధించిన శిల్పాలు దర్సనమిస్తాయి. లోనికి ప్రవేశించగానే గణపతి, మహా శివుడు, మహావిష్ణువు, గజలక్ష్మి , శిల్పాలు కనుల విందు చేస్తాయి.

ఈ ఆలయాన్ని దాదాపు 200,000 టన్నుల  రాతిని తొలిచి శిల్పులు నిర్మించారు. అంత కొండ ని తొలచి ఆ శిలా వ్యర్ధాన్ని తరలించి అంత పెద్ద ఆలయాన్ని నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు కష్టించారో నన్న ఊహే మనలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.

గర్భ గుడి ముందరి ప్రార్ధనా మందిరం విశాలంగా పెద్ద పెద్ద స్తంభాలతో తీర్చిదిద్దబడి  ఉంటుంది. మామూలుగా నేలపై నిర్మించిన దేవాలయంలో ఉన్న అనుభూతి కలిగిస్తుంది. ఆలయం చుట్టూ మరియు ఇతర గుహలలో దశావతారాలు, శివ పార్వతుల కళ్యాణ అంశాలు, నరసింహ, రామ, కృష్ణ అవతార విశేషాలు ప్రముఖంగా కనిపిస్తాయి.

ellora3

అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ ప్రదేశాన్ని తిలకించడానికిమంచి కాలం. అంత ఎండా అంత చలీ కాకుండా కుటుంబ సభ్యులతో కులాసాగా వెళ్ళి రావచ్చు. ఎలోరా పూర్తిగా చూడడానికి మూడు రోజుల సమయం కేటాయిస్తే బాగుంటుంది. ఒక రోజులో ఐదారు గంటలలో రెండు గుహలను మాత్రమే చూడగలం.  విహార యాత్రలు చేస్తూ, భారత దేశంలో పుట్టి అజంతా ఎల్లోరా లను చూడకపోవడం మహా ద్రోహమే ననిపిస్తుంది. మానవుని సృజనాత్మక శక్తికి, విధ్వంసపుటాలోచనా విధానానికీ ఎల్లోరా ఒక సజీవ చిహ్నం.

తిరిగి వస్తుంటే కావ్య ఒక ప్రశ్న అడిగింది. ‘ నైట్ ఎట్ ది మ్యుజియం’ సినిమా లో లాగా ఈ శిల్పాలకు రాత్రి సమయాలలో ప్రాణం వస్తే ఎలా ఉంటుందీ?’ అని. అవును, ఆ ఊహే చాలా విచిత్రం. అంతటి మహారూపాలు సజీవంగా సంచరిస్తే ? ఆ సంగీత ధ్వనులు, ఆభరణాల సవ్వడులు, నృత్యాలు, ఏనుగులు, గుర్రాలు, శరభాలు, సింహికలు, యక్షులు, యుద్ధశబ్దాలు ,.. ఓహ్, ఓ అద్భుత దృశ్య కావ్యం! అయితే నాకు ఇంకో కోరికా కలిగింది. వెన్నెల్లో స్నానించే ఎల్లోరా ను చూడాలని!

ఫోటోలు: శ్రీ కావ్య,కోగంటి

నిశ్శబ్దసంకేతం

కౌముది-రచన కథల పోటీ

kathalapotee

అసంతృప్తి  

satya2

art: satya sufi

 

అతనంటే నాకిష్టం లేదు, నాకతన్ని చూసినప్పుడు భగభగమండే ఎండలో చెప్పుల్లేకుండా నడుస్తున్నంత మంటగా వుంటుంది. అతనంటే నాకిష్టం లేదు, అతను నా పక్కనుంటే, నాకు – పులి పక్కన వినయంగా నడుస్తున్న దొంగనక్కలా, మంత్రిగారికి ఒంగొంగి నమస్కారాలు పెడుతున్న అవినీతి ఆఫీసర్లా, ఎస్పీ దొరగారికి సెల్యూట్ చేస్తున్న సస్పెండైన ఎస్సైలాగా, అమెరికా సూటుబాబు పక్కన సిగ్గుతో చితికిపోతూ నించున్న ఆఫ్రికా గోచిగాళ్ళా చిన్నతనంగా వుంటుంది. యెందుకు? అతను నాకన్నా చదువుకున్నాడా? లేదు. నాకన్నా ధనవంతుడా? కాదు. నాకన్నా పైస్థాయిలో ఉన్నాడా? కాదు.. కాదా? లేదు.. లేదా? ఏమో!

అతను నా చిన్ననాటి స్నేహితుడు. మా ఇద్దరిదీ వొకే వీధి, వొకే స్కూలు. ఆ వీధిలోకెల్లా మా ఇల్లే అతిపెద్ద ఇల్లు, ఆ వీధిలోకెల్లా అతన్దే అతిచిన్న ఇల్లు. మేం ధనవంతులం, నా తండ్రి నగరంలో టాప్ క్రిమినల్ లాయర్. అతని తండ్రి వారానికోసారి మాత్రమే అన్నం తినేవాళ్ళా బక్కగా, బలహీనంగా వుండేవాడు. ఆయనకేదో చిన్నఉద్యోగంట, జీతం కూడా సరీగ్గా ఇవ్వర్ట. ఆయన అస్తమానం దగ్గుతూ, మూలుగుతూ ఉండేవాడు. నీరసంగా కూడా ఉండేవాడు.. ఆయనకేదో జబ్బుట!

స్కూలు లేనప్పుడు విశాలమైన మా ఇంటి ఆవరణలో ఆడుకునేవాళ్ళం. అతను బిడియస్తుడు, భయస్తుడు, తనదికాని ఈ ప్రపంచంలో టిక్కెట్టులేని రైలు ప్రయాణికుళ్ళా బెరుగ్గా వుండేవాడు. నేనెక్కువగా నాకిష్టమైన క్రికెట్ ఆట ఆడేవాణ్ని, అతను నేను షాట్లు కొట్టేందుకు వీలుగా బౌలింగ్ చేసేవాడు. అతను నాతో క్రికెట్ ఆడటమే గొప్ప ఎచీవ్మెంట్లా భావించేవాడు. అతను నేనడక్కుండానే నాకో ఉన్నత స్థానం ఇచ్చేశాడు.

అతను మా ఇంటిని కలలో కనబడే ఇంద్రభవనంలా ఆశ్చర్యంగా చూసేవాడు. ‘భౌ’మనే మా టామీని చూసి భయపడ్డాడు, కయ్యిమంటూ మోగే మర్ఫీ రేడియో చూసి ఆనందపడ్డాడు. భొయ్యిమని చల్లగాలి వెదజల్లే ఎయిర్ కూలర్ చూసి ముచ్చటపడ్డాడు. ఫోన్ ‘ట్రింగ్ ట్రింగ్’ మన్నప్పుడు సంబరపడ్డాడు. ఇలా – నన్నూ, నా ఐశ్వర్యాన్నీ అతను ఎడ్మైరింగ్గా చూడ్డం నాకు చాలా ఆనందం కలిగించేది.

కానీ – నా ఆనందం, నా ఈగో అంతలోనే ఆవిరైపొయ్యేవి. అందుక్కారణం – చదువులో అతని ప్రతిభ. మునిసిపాలిటీ కుళాయి నీళ్ళుపట్టి మోసుకెళ్ళడం, వంట చెయ్యడం, బట్టలుతకడం.. ఇలా అన్నిపనుల్లో తల్లికి సాయం చెయ్యడంలో అతను బిజీగా వుండేవాడు. పరీక్షల్లో మార్కులు మాత్రం అన్నీ ఫస్ట్ మార్కులే. నేను కష్టపడి ఒక్కోమార్కు సంపాదిస్తే, అతను అలవోకగా పుంజీడు మార్కులు తెచ్చేసుకునేవాడు – యెలా సాధ్యం!

అతను మంచివాడు. అతని మాట నిదానం, మనిషి నిదానం. చదువు తప్ప మిగిలిన విషయాల్ని పట్టించుకునేవాడు కాదు. నాకు కష్టంగా అనిపించిన పాఠాల్ని అర్ధమయ్యేలా చక్కగా వివరించేవాడు. ఆ రకంగా అతని వల్ల నేను చాలా లాభపడ్డాను. కష్టమైన పాఠ్యాంశాల్ని కూడా సులువుగా అర్ధం చేసుకునే అతని ప్రతిభకి ఆశ్చర్యపొయ్యేవాణ్ని, లోలోపల రగిలిపొయ్యేవాణ్ని. అతను నాతో యెంత స్నేహంగా వున్నా, అతని చదువు మాత్రం నాకు ముల్లులా గుచ్చుకుంటూనే వుండేది.

మన్చేతిలో ఏదీ ఉండదు. అరిచేత్తో సూర్యకాంతిని ఆపలేం, నదీప్రవాహాన్నీ ఆపలేం. జనన మరణాలు ఆగవు, అన్యాయాలు ఆగవు, మానభంగాలు ఆగవు, రాజకీయ నాయకుల అవినీతీ ఆగదు. ఇవేవీ ఆగకపోయినా, కుటుంబ సమస్యల్తో చదువు మాత్రం ఆగిపోతుంది. ఈ విషయం నాకతని తండ్రి మరణంతో అర్ధమైంది. కుటుంబాన్ని పోషించడం కోసం అతను స్కూల్ ఫైనల్తో చదువాపేసి ఏదో చిన్న ఉద్యోగంలో చేరాడు. ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతున్న నా జీవితానికి అతని గూర్చి పట్టించుకునే తీరిక లేకపోయింది.

ఆ తరవాత నా చదువు చక్కగా ‘కొన’సాగింది. ఈ ప్రపంచంలో డబ్బుతో అన్నీ కొన్లేమంటారు గానీ చదువుని మాత్రం ఖచ్చితంగా కొనొచ్చు. కేవలం డబ్బువల్లే ఉన్నత చదువులకి గోడమీద బల్లిలా ఎగబాకాను. నా ఉన్నత చదువులకి, ఉన్నత సిఫార్సులు కూడా జతవడం చేత, ఉన్నత ఉద్యోగం కూడా వచ్చింది. ఇన్ని ఉన్నతమైన అర్హతలున్నందున, ఉన్నతమైన కుటుంబం నుండి ఉన్నతమైన ఆస్తిపాస్తుల్తో భార్య కూడా వచ్చి చేరింది.

ఇప్పుడు నాకేం తక్కువ? ఏదీ తక్కువ కాదు, అన్నీ ఎక్కువే! పెద్దకంపెనీలో పెద్దకొలువు, తెల్లటి మొహం మీద ఎర్రటి లిప్స్టిక్తో అందమైన భార్య, కాంప్లాన్ బాయ్ల్లాంటి ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఆడుకోడానికి రెండు బొచ్చుకుక్కలు. మూడు కార్లు, నాలుగు బిల్డింగులు, పెద్దవ్యాపారాల్లో భారీపెట్టుబళ్ళు, ఏడాదికి రెండు ఫారిన్ ట్రిప్పులు, పెద్దవాళ్ళ స్నేహాలు.. నా జీవితం వడ్డించిన విస్తరి.. కాదు కాదు.. బంగారు పళ్ళెంలో పోసిన వజ్రాలరాశి. కానీ – అతను నాకు గుర్తొస్తూనే ఉంటాడు. అతని జ్ఞాపకాలు నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి.

మా ఊళ్ళో మా కుటుంబానికున్న పొలాలు, స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపొయ్యాయి. కొన్నికోట్ల విలువైన ఒక స్థలం రిజిస్ట్రేషన్ కోసం నేను యెన్నో యేళ్ళ తరవాత మా ఊరికి వెళ్ళాల్సివచ్చింది. వెళ్ళేప్పుడు అతన్ని పలకరించడం కూడా ఒక పనిగా పెట్టుకున్నాను. రిజిస్ట్రేషన్ పని లంచ్ సమయానికి పూర్తైపోయింది. కారు వెనుక సీట్లో కూలబడి డ్రైవర్కి అతని ఇంటి ఎడ్రెస్ చెప్పాను.

మా ఊరు ఒకవైపు అందంగా సుందరంగా పొడవాటి బిల్డింగుల్తో ‘అభివృద్ధి’ చెంది కుర్రకళతో తళతళల్లాడుతున్నా, పాత ఊరు మాత్రం ముసలి పేదరాశి పెద్దమ్మలా అలాగే వుండిపోయింది. అతనా ముసలి ప్రాంతంలో వొక ఇరుకు వీధిలో అద్దెకున్నాడు. ఇంతకీ నే వెళ్తుంది అతన్ని పలకరిద్దామనేనా? కాకపోవచ్చు, ఇన్నేళ్ళ తరవాత అతని యోగక్షేమాలు కనుక్కోవడం ద్వారా నేను సాధించేదేమీ లేదు. అతన్ని చూడటం ద్వారా నాలో గూడు కట్టుకున్న అసంతృప్తి కొంతైనా తగ్గచ్చొనే ఆశతో వెళ్తున్నాను.

ఆ వీధి ఇరుగ్గా వుంది, మురిగ్గా వుంది. అమెరికావాడి అప్పుకోసం ఇండియావాడు షోకేస్ చేసే దరిద్రపుగొట్టు వీధిలా వుంది. అంతర్జాతీయ అవార్డు కోసం ఆర్ట్ సినిమాల డైరక్టర్ వేసిన అందమైన పేదవాడి వీధిలా వుంది. నా లక్జరీ కారు ఆ ఇరుకువీధిని ముప్పాతిక భాగం ఆక్రమించింది. చుట్టుపక్కల వాళ్ళు ఆ ఖరీదైన కారుని అందమైన దయ్యప్పిల్లని చూసినట్లు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

అది రెండుగదుల పెంకుటిల్లు. రోడ్డువైపుకు ఓ చిన్నగది, లోపల ఇంకో చిన్నగది. ఆ ఇంటి గోడల వయసు షుమారు వందేళ్ళుండొచ్చు, ఆ గోడలకి సున్నం వేసి ఓ అరవయ్యేళ్ళు అయ్యుండొచ్చు. కింద నాపరాళ్ళ ఫ్లోరింగ్ ఎగుడు దిగుడుగా అసహ్యంగా ఉంది. ఆ మూల దండెంమీద నలిగిన, మాసిన బట్టలు పడేసి ఉన్నాయి. ఆ గదిలో వొక పాతకుర్చీ, మూలగా ఒక చింకిచాప. మై గాడ్! వొక ఇల్లు ఇంత పేదగా కూడా వుండగలదా! ఈ కొంప కన్నా ఆ వీధే కొద్దిగా అందంగా, రిచ్చిగా ఉంది!

ఆ కుర్చీలో ఎవరో పెద్దాయన కూర్చునున్నాడు. పాత కళ్ళజోడూ, మాసిన గడ్డం, నెత్తిన నాలుగు తెల్ల వెంట్రుకలు.. వార్ధక్యంలో, పేదరికంలో ఆ గదికి అతికినట్లు సరిపోయ్యాడు. ఆయన బక్కగా ఉన్నాడు, ముందుకు ఒంగిపోయున్నాడు. పొట్ట లోపలకి, బాగా లోపలకి పోయుంది. ఎప్పుడో ఏదో జబ్బు చేస్తే డాక్టర్లు పొట్టకోసి పేగులన్నీ తీసేసి ఖాళీపొట్టని మళ్ళీ కుట్టేసినట్లున్నారు. ఆయన వాలకం చూస్తుంటే చాలాకాలంగా ఈ ప్రపంచాన్ని పట్టించుకోటం మానేసినట్లుంది.

ఆయన.. ఆయనకాదు.. అతను! అతను.. నా స్నేహితుడు! ఇలా అయిపొయ్యాడేంటి! నా అలికిడి విని నిదానంగా తలెత్తి నావైపు చూశాడు. నన్ను పోల్చుకున్నట్లుగా లేదు. మళ్ళీ తల దించుకుని మౌనంగా, శూన్యంలోకి చూస్తున్నట్లుగా అలా వుండిపొయ్యాడు. యేంచెయ్యాలో తెలీక పొడిగా దగ్గాను. తలెత్తి మళ్ళీ నావైపు చూశాడు. అతనికి నేనెవరో తెలుసుకోవాలనే ఆసక్తి వున్నట్లు లేదు.

“నేనెవరో గుర్తు పట్టావా?” ముందుకు వొంగి అడిగాను.

“క్షమించాలి, నాకు చూపు సరీగ్గా ఆనదు.” నెమ్మదిగా అన్నాడు.

“నేను.. నీ చిన్ననాటి స్నేహితుణ్ణి.” అన్నాను.

కళ్ళు చిలికించి చూస్తూ నన్ను పోల్చుకున్నాడు. అతని కళ్ళల్లో కనీసం వొక చిన్నమెరుపైనా కనిపిస్తుందని ఆశించాను, కానీ – అతని చూపులో జీవం లేదు. నెమ్మదిగా లేచి యెదురుగానున్న చాపమీద కూర్చున్నాడు. నేనా డొక్కుకుర్చీలో కూలబడ్డాను. నా ప్రశ్నలకి అతను నెమ్మదిగా, అతిచిన్నగా సమాధానం చెప్పాడు. కొద్దిసేపు మాట్లాడాక అతని గూర్చి కొద్దివివరాలు తెలిశాయి.

తండ్రి చనిపొయేప్పటికి అప్పులు తప్పితే ఆస్తులేమి లేవు. అతని కొద్దిపాటి జీతంతోనే అప్పుల్ని నిదానంగా తీరుస్తూ, అప్పులకి మళ్ళీ అప్పులు చేసి ఇద్దరి చెల్లెళ్ళ పెళ్ళి చేశాడు. కొన్నాళ్ళకి తల్లి చనిపోయింది. అతనికి జీతం తప్ప వేరే ఆధారం లేదు, దరిద్రం తప్ప వేరే సంతోషాల్లేవు. అతని జీతం అప్పుల మాయం, జీవితం దుఃఖమయం. అంచేత భార్య అతన్ని అతని పేదరికానికి వదిలేసి కొడుకుని తీసుకుని పుట్టింటికెళ్ళిపోయింది. ప్రస్తుతం ఒక్కడే ఇలా జీవితాన్ని వెళ్ళబుచ్చేస్తున్నాడు. నాకతను దిగాలుగా భారంగా జీవిస్తూ, చావు కోసం ఆశగా ఎదురుచూసే నిరాశాజీవిలా కనిపించాడు.

నాకు ఆ వాతావరణం చాలా ఇరుకుగా, ఇబ్బందిగా అనిపించసాగింది.

ఒక్కక్షణం ఆలోచించి అడిగాను – “నీకిన్ని ఇబ్బందులున్నప్పుడు నాకెందుకు చెప్పలేదు?”

సమాధానం లేదు.

“నీకు తెలుసా? ఇప్పుడు నేను నీకు యే సహాయమైనా చెయ్యగల స్థాయిలో వున్నాను.” అన్నాను.

అతనొక క్షణం నా కళ్ళల్లోకి సూటిగా చూశాడు. చిన్నప్పుడు నాకర్ధం కాని పాఠాలు చెప్పేప్పుడు కూడా నన్నలాగే చూసేవాడు. నాకు సిగ్గుగా అనిపించి తల దించుకున్నాను. ఆ తరవాత కూడా అతనేమీ మాట్లాడలేదు. అతనికి నాతో మాట్లాడే ఆసక్తి లేదని గ్రహించాను. ఆ గదిలో ఆ డొక్కుకుర్చీకీ, అతనికి పెద్ద తేడాలేదు. ఇక అక్కడ వుండటం అనవసరం అనిపించి లేచి బయటకి వచ్చేశాను.

నన్ను గమనించిన డ్రైవర్ హడావుడిగా కారు వెనుక డోర్ తీసి వినయంగా నించున్నాడు, నిట్టూరుస్తూ కార్లో కూలబడ్డాను. ఇప్పుడు నాకు మరింత అసంతృప్తిగా వుంది. నాదికాని రాజ్యంలో ముసలి రాజుని చంపి ఆ సింహాసనంపై అక్రమంగా కూర్చున్న కుట్రదారుగా.. సింహం తినగా మిగిలిన వేటలో ఎముకలు కొరికే నక్కలాగా.. ఆకలితో ఏడుస్తున్న పాపడి పాలు తాగేసిన దొంగపిల్లిలాగా.. యాజమాన్యంతో కుమ్ముక్కై కార్మికుల పొట్టగొట్టిన కార్మిక నాయకుళ్ళాగా.. తీవ్రమైన అసంతృప్తి.

నా అసంతృప్తి క్రమేపి కోపంగా మారింది. అతని పరిస్థితి బొత్తిగా బాలేదు, నేను చాలా ఉన్నత స్థానంలో వున్నాను. నాగూర్చి అతనికి తెలీకుండా యెలా వుంటుంది? అతనికి నా ఎడ్రెస్ తెలుసుకోవడం క్షణం పని. నా దగ్గరకొచ్చి – ‘మిత్రమా! నా పరిస్థితేం బాలేదు, సాయం చెయ్యి.’ అని అడగొచ్చుగా? అతనికి యేదోక కంపెనీలో మంచి ఉద్యోగం ఇప్పించడం నాకెంతసేపు పని! కానీ.. అతను నన్నడగడు. అతనిది మొహమాటం కాదు – పొగరు, నా పొజిషన్ చూసి ఈర్ష్య! శ్రీకృష్ణుణ్ణి కలవడానికి కుచేలుడికి అహం అడ్డు రాలేదు, తన స్నేహితుడి ఉన్నతిని కుచేలుడు మనస్పూర్తిగా కొనియాడాడు. మరి అతనో? శ్రీకృష్ణుణ్ణే తిరస్కరించాడు!

నేనెంత స్థాయిలో వున్నాను? యెంతో బిజీగా వుంటాను? అయినా కూడా నా చిన్ననాటి స్నేహితుడి పట్ల అభిమానంతో వెతుక్కుంటూ వచ్చాను, కానీ అతను నా ఉనికినే గుర్తించకుండా పోజు కొట్టాడు! ఇంతకీ అసలతను తెలివైనవాడేనా? అయితే ఆ జానాబెత్తెడు జీవితంతో యెందుకు మిగిలిపొయ్యాడు? చిన్నప్పుడు యేవో నాలుగు పాఠాలు గుర్తుంచుకున్నంత మాత్రాన నాకన్నా తెలివైనవాడైపోతాడా?

యుద్ధరంగంలో యుద్ధం కడదాకా చేస్తేనే గెలుపోటములు తెలిసొచ్చేవి. కానీ – అతను మధ్యలోనే తప్పుకున్నాడు. కడదాకా యుద్ధం చేసినట్లైతే నేనతన్ని ఓడించేవాణ్నేమో! యేమో కాదు.. ఖచ్చితంగా ఓడించేవాణ్ని. శత్రువుని యుద్ధరంగంలో ఓడిస్తే ఆ గెలుపు సంతృప్తినిస్తుంది, కానీ – శత్రువుకి ఏదో రోగమొచ్చి ఆస్పత్రిలో రోగిష్టివాడిలా మిగిలిపోతే యెంత అసంతృప్తి!

జీవితంలో గెలుపోటములు నిర్ణయించేది చదువు, తెలివితేటలే కాదు.. అదృష్టం, అవకాశాలు కూడా. అక్కరకు రాని తెలివి అడవి గాచిన వెన్నెల వంటిది. నేను అనవసరంగా అతిగా ఆలోచిస్తున్నాను. నేనిలా ఆలోచించడం నాలోని మంచితనానికి మాత్రమే నిదర్శనం. నన్నిలా ఇబ్బంది పెడుతున్న నా సున్నితత్వాన్నీ, ఉదారగుణాన్నీ తగ్గించుకోవాలి.

ఇలా నన్ను నేను సమర్ధించుకునే ప్రయత్నంలో యేదో వొకరోజు విజయం సాధిస్తానని నాకు తెలుసు.. కానీ – ఆ రోజేదో త్వరగా వచ్చేస్తే బాగుణ్ణు!

*

  ఎద లయలో ఇళయ”రాగం”

 ilaya1

           సంగీతం ఏమీ చెప్పదు. సంగీతం అస్తిత్వపు మాధుర్యాల్ని చూపిస్తుంది. అదే అందులోని సౌందర్యం.

సంగీతం వింటున్నప్పుడు అది సత్యమా? అసత్యమా? అన్న తాత్విక మీమాంస మనలో ఉదయించదు. పూర్తిగా మమేకమై వింటాం.సంగీతం మనల్ని వశ్యం చేసేసుకుంటుంది.మనకి తెలియని మరో లోకాలకు తీసుకుని వెళుతుంది.మనం ఉన్న వాస్తవిక ప్రపంచానికి అతీతంగా మరో దృశ్య రూపాన్ని చూపిస్తుంది. అప్పుడింక మనం మామూలు ప్రపంచం లో ఉండలేము. సంగీతం మనల్ని  ఆప్యాయంగా వేలుపట్టుకుని అస్తిత్వపు అత్యున్నత రహస్యాల వైపుకి  తీసుకుని వెళుతుంది” .

అందుకే మార్మిక జ్ఞానులు సంగీతాన్ని “దైవం” అన్నారు. దైవం అంటే ఒక వ్యక్తి కాదు. ప్రకృతి లో ఉండే అత్యున్నత సామరస్యా పూర్వక అనుబంధం. అది ఒక ఆర్కెస్ట్రా లాంటిది. ప్రతీది ప్రతిదానితో సంబంధం కలిగి ఉంటుంది. వృక్షాలు భూమి తో అనుబంధం కలిగి ఉంటాయి. భూమి కి , గాలి తో అనుబంధం కలిగి ఉంటుంది. గాలికి ఆకాశం తో అనుబంధం , అలాగే ఆకాశానికి నక్షత్రాలతో అనుబంధం ఉంటుంది.

క్రమానుగత శ్రేణి అన్నది ప్రకృతి లో ఉండదు. చిన్న గడ్డి పరక కి కూడా అతి పెద్ద నక్షత్రానికి ఉన్న విలువే ఉంటుంది. అని సంగీతం గురించి అంటారు ఓషో.

ఇది ఇళయరాజా విషయంలో అక్షర సత్యం. తన సంగీతం మనకి తెలియని లోకాలని పరిచయం చేస్తుంది.

ఆ లోకాల్లోనే శ్రోతలకు శాశ్వత స్థానం ఇచ్చి తన సంగీతం తో మనసుని, ఆత్మ ని రంజింపజేస్తాడు.

నేను స్కూల్ కి వెళ్లే రోజుల్లో రేడియో లో, టేప్ రికార్డర్ లో పాటలు వినటం అలవాటుగా  ఉండేది. అప్పటికి ఇంకా టీవీల ప్రభావం అంతగా లేదు.  నాన్నగారికి  ఉన్న సంగీత, సాహిత్య అభిరుచి వల్ల  నాకూ  చిన్నతనంలోనే సంగీత-సాహిత్యాలతో అనుబంధం ఏర్పడింది.

సినిమాల గురించి కానీ , సంగీత దర్శకుల గురించి కానీ నాకు అంతగా అవగాహన లేని రోజులు అవి . అప్పుడు బహుశా ఐదు-ఆరు సంవత్సరాలు ఉంటాయేమో. అమ్మ కి ఉన్న సంగీత ప్రవేశం వల్ల తాను కొన్ని పాటల్ని అప్పుడప్పుడు పాడటం వల్ల , రేడియో లో కానీ టేప్ లో కానీ వింటున్నప్పుడు మాత్రం కొన్ని పాటలు చాలా బాగా అనిపించేవి.మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించేట్టుగా ఉండేవి ఆ పాటలు.

ఆ తరువాతి రోజుల్లో , హైస్కూల్ స్థాయికి వచ్చాక సినిమాల మీద ఇష్టం ఏర్పడి విపరీతంగా సినిమాలు చూడటం మొదలైన తరువాత, అంతకుముందు నేను విని, నాకు నచ్చిన పాటలు ఏ సినిమా లోవి? ఎవరు సంగీత దర్శకులు ? అని తెలుసుకున్నతరువాత ఆశ్చర్యం అనిపించేది .ఆ పాటల్లో 95% వరకు అన్నీ ఇళయరాజా బాణీలు సమకూర్చిన పాటలే!

ఒకసారి బాగా ధైర్యం చేసి ఒంటరిగా సినిమా కి వెళ్లాలని అనిపించింది. బహుశా అప్పుడు నాకు 10 సంవత్సరాలు ఉంటాయేమో. థియేటర్ లో రష్ చూసి భయపడ్డా. టికెట్ కౌంటర్ దగ్గర జనాలు తొక్కి చంపేస్తారేమో అనిపించింది. అది చిరంజీవి సినిమా, అదే రోజు రిలీజ్. మొత్తానికి ఒక రిక్షా అతనికి డబ్బులు ఇచ్చి టికెట్ సాధించి, అతను అడిగితే అతనికీ సినిమా టికెట్ కొనుక్కుమ్మని డబ్బులు ఇచ్చి హ్యాపీ గా సినిమా చూసి వెళ్ళాను.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే , ఒంటరిగా, నాకున్న ఇష్టం తో సినిమాలకి వెళ్ళటం అప్పుడే మొదలయింది.మా ఊరిలో 6 సినిమా టాకీసులు ( థియేటర్ అని అనకపోయేది అప్పట్లో, టాకీస్ అనే అనేది ) ఉండేవి. ప్రతీ వారం సినిమాలు మారిపోయేవి ఏదో ఒకదాంట్లో.

ప్రతీ శనివారం స్కూల్ నుండి రాగానే అమ్మ దగ్గర్నుండి డబ్బులు తీస్కొని నాకు నచ్చి , కనెక్ట్ అయిన పోస్టర్ ని చూసి, దాని మీద నేను ఇష్టపడే పేర్లు చూసుకుని ఇంకో ఆలోచన లేకుండా ఒక్కడినే వెళ్లిపోయేవాడ్నిఆ సినిమాకి. అలా నచ్చి ఇష్టపడి వెళ్లే  వాళ్లలో “ఇళయరాజా” ఒకరు.

ఇళయరాజా పేరు పోస్టర్ మీద చూస్తే చాలు ఏదో తెలియని ఆనందం. అలా ఎన్ని డబ్బింగ్ సినిమాలు చూశానో లెక్కలేదు. సినిమా కొంచం అటూ ఇటుగా ఉన్నా , నేపథ్య సంగీతం తో సంబరపడేవాడ్ని.

ఈ ఇష్టం మెల్లి మెల్లిగా ఆరాధనగా మారి, ఇళయరాజా భక్తుడిగా మారిపోయా.

“నాయకుడు-గీతాంజలి-అంజలి”, సినిమాల తరువాత ఆ ఆరాధన మణిరత్నం మీదా మొదలయింది. అది తరువాతి రోజుల్లో ఎంతవరకు వెళ్లిందంటే. మణిరత్నం MBA  చేశాడన్న కారణం తో నేనూ MBA చేసే విధంగా ప్రేరేపించింది.సరే అది వేరే విషయం అనుకోండి.

“ఇళయరాజా-మణిరత్నం” కాంబినేషన్ లోని సినిమాలు ఇళయరాజా సంగీతం మీద ఉన్న అభిమానాన్ని ఇంకో స్థాయికి తీసుకు వెళ్లాయి. అలా కాంబినేషన్ తో అద్భుతమైన పాటలు “భారతీరాజా-ఇళయరాజా”, “కే విశ్వనాధ్ -ఇళయరాజా”,”బాలచందర్-ఇళయరాజా”, ” వంశీ-ఇళయరాజా” ,”బాలుమహేంద్ర -ఇళయరాజా”, “కోదండరామిరెడ్డి -ఇళయరాజా”, “గీతాకృష్ణ-ఇళయరాజా” , ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా గొప్ప కాంబినేషన్స్  ఉన్నాయి.

అతిశయోక్తి అనిపించవచ్చేమో కానీ ఇళయరాజా బాణీలు సూటిగా “అనాహత చక్రం “(హృదయ స్థానాన్ని) తాకుతాయేమో అనిపిస్తుంది. లేదంటే అంత లోతుగా మన భావోద్వేగాలని కదిలించటం కష్టమే.

ఇళయరాజా సంగీతమూ, పాటలు , ,మన హృదయాల్ని తాకుతూ , మనలోని “అరిషడ్వార్గాలని”, “నకారాత్మక భావనల్ని” నెమ్మదిగా దహనం చేస్తుంటాయేమో అనిపిస్తుంటాయి.ఆయన సంగీతానికి ఉన్న శక్తి అలాంటిది. డిప్రెషన్ లో ఉన్న సమయం లో ఐతే ఆయన సంగీతమే ఒక మంచి థెరపిస్ట్ లా పని చేస్తుంది. ఇది వ్యక్తిగతంగా నా అనుభవం.

సంగీతం గురించి ఇళయరాజా ఏమంటారంటే ” ఏ సంగీతమైనా ప్రేక్షకుడిని (శ్రోతని) మరో ప్రపంచానికి తీసుకెళ్లాలి. శ్రోత మనసంతా ఆ సంగీత మధురిమలతో నిండి పోవాలి. ఈ సంగీతానికి నాకు ఏమైనా సంబంధం ఉందా? ఇది నా మనసుకు ఎందుకు ఇంత దగ్గర ఎందుకు అవుతుంది? అని శ్రోత అనుకోవాలి. ఆ సంగీతం అలా ఉండాలి. భావాన్ని వ్యక్తీకరించటానికి అనేక మార్గాలున్నాయి. అందులో సంగీతం ఒకటి, మాటల్లో చెప్పలేని భావాల్ని సంగీతం ద్వారా ఆవిష్కరించవచ్చు. అందుకే సంగీతానికి ట్రెండ్ లేదు.” అని అంటాడు.

ఇక్కడ నేను ఇళయరాజా నేపథ్య సంగీతాన్ని గురించి ప్రస్తావించదలుచుకున్నాను. ఆయన పాటలు గురించి మాట్లాడాలంటే అదొక మహాసముద్రం. పాటల గురించి దాదాపుగా అందరికి అవగాహన ఉంటుంది అన్న ఉద్దేశ్యం తో కేవలం “నేపథ్య సంగీతాన్ని”  ఇక్కడ నేపథ్యంగా తీసుకుంటున్నాను. వీలయితే మరోసారి కేవలం ఇళయరాజా పాటల గురించి ప్రస్తావనతో రాస్తాను. ప్రస్తుతానికి మాత్రం నేపథ్య సంగీతం లో కొన్ని సినిమాల గురించి ప్రస్తావిస్తాను.

నేపథ్య సంగీతం

చాలా తక్కువమంది సంగీత దర్శకులు మాత్రమే నేపథ్య సంగీతం తో ఒక సన్నివేశాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లగలరు. ఇంకా చెప్పాలంటే అలా తమ సంగీతం తోనే సంగీత దర్శకులు కొన్ని సినిమాలని ఆడించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిలో ఇళయరాజా స్థానం శిఖరాగ్రం.

దర్శకుడి ప్రతిభ  ఎంత ఉన్నా, ఇళయరాజా నేపథ్య సంగీతం లేకుంటే ఆ సన్నివేశం అంతగా రక్తికట్టదు అనిపిస్తుంది. టీవీ ని మ్యూట్ లో ఉంచి చూస్తే ఆ విషయం తెలిసిపోతుంది. దర్శకుడి ప్రతిభ ని తక్కువ చేయటం నా ఉద్దేశం ఎంత మాత్రం కాదు. దర్శకుడు ఎప్పటికి “కెప్టెన్ అఫ్ ది షిప్”. అందులో ఇంకో ఆలోచనే లేదు.

నేపథ్య సంగీత పరంగా కొన్ని సినిమాల్ని ఇక్కడ ప్రస్తావిస్తాను..

గీతాంజలి సినిమా (నాగార్జున, గిరిజ), మణిరత్నం దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా కి నేపథ్య సంగీతం ప్రాణం. మణి రత్నం చెప్పాలని అనుకున్న విషయాన్ని అదే స్థాయిలో ఇళయరాజా తన నేపథ్య సంగీతం ద్వారా  విశదీకరిస్తూ వెళ్తుంటాడు. గీతాంజలి సినిమా ని నేను 100 కంటే ఎక్కువ సార్లు చూసాను. సంభాషణలే కాకుండా BGMs కూడా కంఠతా వచ్చు. సినిమా లో చాలా సందర్భాల్లో నేపథ్య సంగీతం సూటిగా హృదయాన్ని తాకి , దాని తాలూకా ప్రకంపనలు శరీరం మొత్తం వ్యాపించినట్టు అనిపిస్తుంది. సన్నివేశం తో పాటుగా ఆయన సంగీతం తనదైన భాషలో ఆ నేపథ్యాన్ని ప్రేక్షకుడికి విడమరచి చెపుతున్నట్టు అనిపిస్తుంది.

గీతాంజలి క్లైమాక్స్ లో నాగార్జున ఊరికి వెళ్లిపోయే సమయం లో గిరిజ తాను నాగార్జున ని కలవాలని అంటుంది. గిరిజ ని తీస్కుని అంబులెన్సు లో రైల్వే స్టేషన్ కి వెళ్లే సీన్ లో డైలాగ్స్ పెద్దగా ఉండవు. దాదాపు 5 నిమిషాల పాటు ఉండే నేపథ్య సంగీతం ఆ సన్నివేశం లోని ఆంతర్యాన్నిఆవిష్కరిస్తూ ఉత్కంఠగా ప్రేక్షకుడిని ప్రకాష్ , గిరిజ ల మానసిక సంఘర్షణ ఏ స్థాయి లో ఉందొ తెలుపుతుంది.

నాగార్జున, గిరిజ ని ఊరికి దూరంగా వదిలేసి, నడుచుకుంటూ రమ్మంటూ వచ్చేస్తాడు.ఆ  తరువాత గిరిజ చెల్లి నాగార్జున ఇంటికి  వెళ్లి బయట చలిగా ఉంది, అక్క ఇంకా రాలేదు భయంగా ఉంది అని చెపుతుంది. అప్పుడు నాగార్జున, గిరిజ ని వెతకడినికి వెళ్తాడు. తాను ఎంత వెదికినా దొరకకపోవడం తో ఆందోళన ఒక వైపు తను ఏమైందో అన్న భయం ఇంకో వైపు,  ఆ తరువాత గిరిజ దొరగ్గానే ఆనందంగా గిరిజాని లాలించే సన్నివేశం లో పైన చెప్పిన మానసిక స్థాయిలన్నీ నేపథ్య సంగీతం లో కని(విని)పిస్తాయి

సంతోషం, బాధ, దుఃఖం, ప్రేమ , వైరాగ్యం, నిరాశ,ఆకర్షణ, కరుణ, రౌద్రం, భయం..ఇలా ప్రతీ భావోద్వేగానికి సరిపోయే నేపథ్య సంగీతం, కథకి అనుగుణంగా, పాత్రల్లో, సన్నివేశాల్లో కరిగిపోయి, మిళతం అయ్యేలా చెయ్యటం ఇళయరాజాకే సాధ్యం.

ఇళయరాజా కి ముందు గాని ఆ తరువాత వచ్చిన సంగీత దర్శకులు కానీ(కొందరు) , కొన్ని సన్నివేశాలకి రెడీమేడ్  BGMs ఇచ్చేవారు .చాలా మూసగా ఉండేవి అవి.

ఉదాహరణగా చెప్పాలంటే విలన్ కనిపించే సన్నివేశంలో, కామెడీ సన్నివేశాల్లో బాగా ఉపయోగించిన BGM లనే వాడేవారు. కొత్తగా మళ్ళీ కంపొసిషన్ కి టైం దొరక్కో, అవసరం లేదు అనుకునో , అన్ని సినిమాల్లో దాదాపుగా అవే BGMs ఉండేవి అప్పట్లో.

కానీ ఇళయరాజా ఆ కథకి, పాత్ర స్థాయి కి అనుగుణంగా నేపథ్య సంగీతాన్ని ఇచ్చేవాడు. ఆ తపన మనకి తెర మీద కనిపించేస్తుంది. ఒక హోమియో వైద్యుడిలా,” పొటెన్సీ” ఎంత అవసరమో అంతే డోసెజి ఉంటుంది తాను ఇచ్చే నేపథ్య సంగీతం.అంతలా తపన పడతాడు రాజా.

రుద్రవీణ సినిమా లోని ఒక సన్నివేశం లో చిరంజీవి కోపంగా తన తండ్రిని నిలదీస్తాడు. తాను ఒప్పుకుని ఉంటే ఒక నిండు ప్రాణాన్ని కాపాడి ఉండేవాళ్ళం అని చెపుతూ, ఆ చావుకి కారణం “మీరే” అంటాడు. ఆ మాట విని చిరంజీవి వదిన సుమిత్ర, చిరంజీవి ని చెంపదెబ్బ కొట్టి తండ్రిని అనేంత గొప్పవాడివి అయ్యావా? అని మందలిస్తుంది.ఆ తరువాత చిరంజీవి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు.ఆ సందర్భంలోనిది ఇది.

హృదయం సినిమా లో మురళి, హీరా ని ప్రేమించి తనతో చెప్పేస్తాడు. తరువాత క్లాస్ లో కూర్చుని వెళ్లిపోయేముందు హీరా తనతో మాట్లాడుతుందేమో అని ఆశగా ఎదురు చూస్తూ బెంచ్ మీద తల పెట్టి ఆలోచిస్తూ ఉంటాడు. హీరా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తుంది.తన దగ్గరికే వస్తుండటంతో తనతోనే మాట్లాడటానికి వస్తుందేమో అని ఆశగా చూస్తున్నంతలో హీరా, ” పర్సు మర్చిపోయా”, అని తీస్కుని వెళ్లి పోతుంది”.ఇక్కడ నేపథ్య సంగీతం మురళి మానసికంగా పడే వేదనని తెలియపరుస్తుంది. హృదయం సినిమాలో నేపథ్య సంగీతం మొత్తం చాలా అద్భుతంగా  ఉంటుంది.

శివ సినిమా లో ఒక సందర్భం లో నాగార్జున , జె డి చక్రవర్తి ని కొట్టే సన్నివేశం లో ఇళయరాజా bgm రెగ్యులర్ గా ఫైట్ కి ఇచ్చేట్టుగా కాకుండా ,  పాథోస్ BGM ఇస్తే,  రాంగోపాల్ వర్మ కి అర్థం అవలేదట. “ఏంటి రాజా గారు ఇలా పాథోస్(విషాదం) బిట్ ఇచ్చారు?” అని అడిగితే అని అడిగితే  సమాధానంగా ఇళయరాజా ” ఎంతో కష్టపడి చదువుకొమ్మని తల్లిదండ్రులు పంపిస్తే వీళ్ళు ఇలా గొడవల తో భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు కదా అందుకని, పాథోస్ ఇచ్చాను” అని చెప్పారట ఇళయరాజా .ఈ విషయం రాంగోపాల్ వర్మే ఒకసారి ప్రస్తావించాడు.

శ్రీరామరాజ్యం సినిమా, ఒక దృశ్య కావ్యం.బాపు గారి కుంచె కి ఇళయరాజా సంగీతం తోడై , అవి సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాయి. లైవ్ ఆర్కెస్ట్రా తో ఇళయరాజా సృష్టించిన సంగీతం మహాద్భుతం గా ఉంటుంది. ఈ సినిమాకి సంగీతాన్ని ఒక తపస్సులా భావించి చేశారనిపిస్తుంది. పాశ్చాత్య సంగీతకారులతో, సింఫనీ తో శ్రీరామరాజ్యం లాంటి పౌరాణిక సినిమా కి ప్రాణప్రతిష్ట జరిగింది. అందులోని సన్నివేశాలు..

సీతాదేవి రాముని అంతఃపురానికి అదృశ్య రూపంలో వాల్మీకి పంపినప్పుడు , సీతమ్మ తన బంగారు విగ్రహాన్ని చూసే సన్నివేశం.

భూదేవి సీతాదేవి ని తనతో పాటు తీసుకువెళ్లే సన్నివేశం. సీతాదేవి రాముడికి చివరి వీడ్కోలు పలికే ఈ సన్నివేశం లోని నేపథ్య సంగీతం మన కన్నులు చెమర్చేలా చేస్తుంది. చాలా హృద్యంగా ఉంటుంది.

ఇలా చూపుతూ వెళితే కొన్ని వందల సినిమాల గురించి చెప్పుకోవచ్చు . కానీ అన్నిటినీ ప్రస్తావించాలంటే ఒక మహాగ్రంథమే అవుతుంది. ఇక్కడ సమయాభావం వల్ల కొన్నిటిని మాత్రమే తీసుకున్నాను. నేను  ప్రస్తావించని సినిమాలు చాలా ఉన్నాయి, అంతమాత్రం చేత ఆ సినిమాలు గొప్పవి కాదని కాదు. సందర్భానుసారంగా నాకు తెలిసినవి కొన్నిటిని గురించి చెప్పాను.అర్థం చేసుకుంటారని ఆశిస్తాను

(మళ్ళీ వచ్చే వారం!)

ధర్మారావు గెలిచాడు!

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-4

 

sudrarsanam‘వేయిపడగలు’పై సుదర్శనంగారి విశ్లేషణ తీరును రెండు ఉపమానాలతో చెప్పుకోవచ్చు. రెండూ పరస్పర విరుద్ధమైనవి.

మొదటగా, ఇంగ్లీషు చదువుల శిక్షణ నుంచి లభించిన  సునిశితమైన తర్కమూ, హేతుత్వమూ అనే సూది మొనను దానికి తాకించి చూశారు. దాంతో అది గాలిబుడగలా పేలి పోయింది. అయితే, అలా పేలిపోతే ఎలా?  ధర్మారావు అనే పాత్రను సనాతన ధర్మాన్ని దర్శించిన జ్ఞానిగానూ, వ్యవస్థాధర్మానికి సాధికార వ్యాఖ్యాతగానూ, అతనిది ఆజన్మ సిద్ధమైన జ్ఞానమార్గంగానూ రచయిత చెబుతున్నాడే! కనుక రచయిత ధర్మారావు గురించి చెప్పిన దానికీ, ధర్మారావు నడవడికీ మధ్య నున్న వైరుధ్యంలో మన అవగాహనకు అందనిది ఏదైనా ఉందేమో!

తీరా అదేమిటో చూద్దామనుకునేసరికి నవల గుండ్రాయిగా మారి సూదిమొనే వంగిపోయింది.

ఈ పరిస్థితిలో, తనకు సైతం సానుకూల దృక్పథం ఉన్న హైందవ ధర్మమూ, తాత్వికతా అనేవి నవలలో ధర్మారావు మనస్తత్వంలోని వక్రత నుంచీ, సంకుచితత్వం నుంచీ వ్యక్తమవుతున్నాయి కనుక అవే నిజమైన హిందూ ధర్మమూ, తాత్వికతా  కావన్న నిర్ధారణకు రావడమే మార్గం.  రచయిత చిత్రించదలచుకున్నది నిజమైన హిందూధర్మ, తాత్వికతలు కాక;; వాటికి ఆలంబనంగా తనను తాను భావించుకునే ధర్మారావు అనే, వక్రత, సంకుచితత్వం మూర్తీభవించిన వ్యక్తి ఆత్మకథను! ఆపైన, అసలు రచయిత చిత్రించదలచుకున్నది హైందవ వ్యవస్థను, తాత్వికతను కాదు, తెలుగు దేశాన్ని, తెలుగుదనాన్ని!

హైందవ ధర్మమూ, తాత్వికతా, ధర్మారావులోని వైరుధ్యాలు…ఈ గంద్రగోళాన్ని అంతటినీ పక్కన పెట్టేసి, కేవలం సాహిత్య కోణం నుంచి ఒక రచనగా ‘వేయిపడగ’లను అంచనా వేయడం అంతకన్నా సురక్షితమైన మార్గం. ఆ విధంగా చూసినప్పుడు అందులో గొప్ప పఠనీయత ఉంది. అద్భుతమైన పాత్రపోషణ ఉంది, తెలుగుదనం ఉంది. ఆధునికత తెలుగువారి జీవితంలో తీసుకొచ్చిన అనేకానేక పరిణామాలను ఒక చిన్నసైజు విజ్ఞాన సర్వస్వం స్థాయిలో చిత్రించడం ఉంది. అది, కాల్పనికోద్యమకాలంలో వెలువడిన ఆత్మాశ్రయకవిత్వ శాఖలో ఒక అపురూపమైన కావ్యం!

ఈవిధంగా సుదర్శనంగారి వేయిపడగల పరిశీలన అందులోని హైందవ ధర్మ, తాత్వికతల పరిశీలనతో ప్రారంభించి అది సంతృప్తి కలిగించకపోవడంతో, దానిని తెలుగుదేశమూ, తెలుగుదనాలకు కుదించి ఒక ఉత్తమ సాహిత్య సృష్టిగా నిలబెట్టడంతో ముగుస్తుంది.

ధర్మారావు గురించి రచయిత చెప్పిన దానికీ, ధర్మారావు నడవడికీ మధ్యనున్న వైరుధ్యం ఎలాంటిదన్నది పరిశీలించకపోవడం –విశ్వనాథ ప్రాతినిధ్యం వహించే భావజాలానికి బాహ్య మిత్రుడిగా ఆయనకు గల పరిమితి.

***

అసలు ఆ వైరుధ్యంలోనే హిందూ ధర్మ, తాత్వికతలు ఉన్నాయని ఎందుకు అనుకోకూడదు? ధర్మారావు, అతని తండ్రి రామేశ్వరశాస్త్రే ఆ  హైందవ ధర్మానికి, తాత్వికతకు అసలు సిసలు ప్రతినిధులు ఎందుకు కాకూడదు? వాటికి భిన్నమైన, నిజమైన హైందవధర్మమూ, తాత్వికతా వేరే ఉంటాయని ఎందుకు అనుకోవాలి?

ఎందుకంటే, వాటిలో తనూ ఒక వదులైన భాగమే అయినా, వాస్తవంగా వాటి జన్మస్థానంతోనూ, అక్కడి జీవితాలతోనూ, వారి తలపులతోనూ  గాఢమైన పరిచయం లేని బాహ్యుడు కనుక!

దూరం నుంచి చూసినప్పుడు అదొక గొప్ప రొమాంటిక్ అడ్మిరేషన్ కలిగిస్తుంది. అందులో భాగమై చూసినప్పుడు భిన్నంగా కనిపిస్తుంది. అందుకే దాని తలుపులు చాలావరకు మూసి ఉంటాయి. తెరచుకున్నప్పుడు కూడా బయటినుంచి చూసినప్పుడు కలిగే రొమాంటిక్ అడ్మిరేషన్ ను నిలబెట్టే మేరకే ఓరగా తెరచుకుంటాయి.

విశ్వనాథ దృష్టిలో రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల గురించి తను చెప్పినదానికీ, వారి నడవడికీ మధ్య ఎలాంటి వైరుధ్యం ఉండడానికి వీలులేదు. అంత పెద్ద లోపాన్ని ఆయనకు ఎలా ఆపాదిస్తాం? కనుక ఆ వైరుధ్యం బయటినుంచి చూసినప్పుడు కలిగే భ్రాంతి. అంతర్గతంగా చూసినప్పుడు అందులో వైరుధ్యం ఉండడానికి అవకాశం లేదు. అది రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల దృష్టిలో కూడా వైరుధ్యం ఎప్పుడవుతుంది? వారు కూడా దానిని, గుర్తించి అంగీకరించినప్పుడు. వారు గుర్తించే అవకాశం లేదు కనుక అది వైరుధ్యం కానే కాదు. ఆపైన అది  వైరుధ్యమా, కాదా అన్నది నిర్ధారించవలసిన అధికారం కూడా వారిదే కనుక; ఇంకొకరు అలాంటి ఆరోపణ చేయడం చెల్లదు.

కనుక రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల ముఖంగా హైందవ వ్యవస్థా, తాత్వికతలను చిత్రించడంలో విశ్వనాథ నిజాయితీని పాటించారు. వారు అలా తప్ప ఇంకోలా ఉండే అవకాశమే లేదు. ఒక వ్యక్తి జీవన సరళే అతని తాత్వికతను అభివృద్ధి చేస్తుందని అనుకుంటే, రామేశ్వర శాస్త్రి, ధర్మారావుల జీవితమే వారి తాత్వికత. వారే హైందవ ధర్మ, తాత్వికతలకు నిర్ణేతలు, భాష్యకారులు, హక్కుదారులు కనుక వారి జీవితమే హైందవధర్మ, తాత్వికతలకు ప్రతిబింబం.

విశ్వనాథ అజాగ్రత్త ఉంటే ఎక్కడ ఉంటుందంటే, హైందవధర్మ, తాత్వికతలను చిత్రించడానికి ఆధునిక ప్రక్రియ అయిన నవలను స్వీకరించడంలో. ఆపైన దానిని ఇంగ్లీషు చదువుల శిక్షణనుంచి సంక్రమించే తార్కికతా, హేతుత్వాల ఉపకరణాలతో చూసినప్పుడు అది ఎలా పరిణమిస్తుందన్న సంగతిని విస్మరించడంలో. ఆధునిక నవలా ప్రక్రియలో వ్యక్తుల జీవిత చిత్రణ విధిగా వాస్తవికతను అనుసరిస్తుంది. అలాగే, హైందవ వ్యవస్థా, తాత్వికతలను వస్తువుగా తీసుకున్నప్పటికీ  రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల జీవితచిత్రణలో ఆయన వాస్తవికతను అనుసరించారు. తీరా చూస్తే ఆ వాస్తవికత ఆయనకు తెలియకుండానే వస్తువుకీ, పాత్రలకూ మధ్య వైరుధ్యాన్ని ఎత్తిచూపి రెండింటి పట్లా అపోహలకు దారితీయించింది.

సుదర్శనంగారే దీనిని గుర్తించి మిల్టన్ పారడైజ్ లాస్ట్ తో పోలిక తెచ్చారు. ఆయన ఇలా అంటారు:

“మిల్టన్ తన పారడైజ్ లాస్ట్ (Paradise Lost)లో సృష్టించిన సైతాన్ (Satan)పాత్ర కవి ఉద్దేశానికి భిన్నంగా, అంటే వీరోచితంగా, ఆకర్షణీయంగా రూపొందడం వల్ల, “He was of the Devil’s party without knowing it” అనే విమర్శ వచ్చింది. కొంతవరకు ఈ విమర్శ విశ్వనాథ ఈ మూడు నవలలకూ(ఏకవీర, వేయిపడగలు, చెలియలికట్ట)వర్తిస్తుంది.”

హైందవ ధర్మ, తాత్వికతలు ఎంత విశిష్టమైనవి, లోతైనవి అన్నది వేరే పరిశీలన. రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల ముఖంగా  వాటి ప్రతిఫలనం ఎలా ఉందన్నదే ఇక్కడ విచారణ.

viswanatha

విషాదం ఏమిటంటే, రామేశ్వరశాస్త్రి, ధర్మారావులు తమ ప్రతిబింబం ఎలా ఉందో చూసుకోడానికి ఎదురుగా వేరే అద్దం ఏదీ లేదు. తామే అద్దం. తాము ఎలా ఉన్నారో చెప్పడానికి, లేదా ప్రశ్నించడానికి వేరొకరికి తాహతు లేదు, అధికారం లేదు, జ్ఞానం లేదు. తాము ఉన్నదే జ్ఞానకాంతులు విరజిమ్మే లోగిలిలో. గడప దాటితే అవతల అంతా అజ్ఞానాంధకారం. అంతిమ పర్యవసానం…తులనాత్మకంగా చూడడానికి అవతల మరొకటి లేని స్థితిలో, ఉన్నా చూడదలచుకోని స్థితిలో, తమ విశ్వాసాలను, కోరికలను, లౌల్యాలను, తమ జీవన సరళిని, అందులో ఇతరులకు వైరుధ్యాలుగా కనిపించేవాటితో సహా అన్నిటినీ ధర్మబద్ధం చేసి, తాత్వికీకరించి చివరికి తాము సైతం అవే నిజమనుకునే భ్రమలో గూడులో రెక్కలు ముడుచుకుని ఉండిపోవడం!

తాత్విక స్థాయిలో బ్రహ్మం ఎలా అనిర్వచనీయమో, ఎలా కంటికి కనిపించదో, ఎలా ద్వంద్వాలకు, ప్రశ్నలకు, సందేహాలకు అతీతమో జీవనస్థాయిలో రామేశ్వరశాస్త్రి, ధర్మారావుల నడవడి కూడా అంతే. రామేశ్వరశాస్త్రి యోగి, వర్ణాశ్రమధర్మాల ముద్ద కట్టిన మూర్తి. కానీ పైకి భోగిలా, రసికుడిలా కనిపిస్తాడు. ఆయన నాలుగువర్ణాల స్త్రీలనూ పెళ్లి చేసుకున్నాడు. ఒక భోగాంగనను చేరదీశాడు. నాలుగువర్ణాల వారినీ పెళ్లిచేసుకునే అర్హత ఆయనకు తప్ప ఇంకొకరికి లేదు. ఎందుకులేదని ప్రశ్నించడానికి వీల్లేదు. ధర్మశాస్త్రం ఆయనకు ఒక్కడికే ఆ అర్హత కల్పించింది. మళ్ళీ ఆ ధర్మశాస్త్రానికి కర్త ఆయనే.

ధర్మారావూ అంతే. అయితే, అతని దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి మారింది. ఆధునికత విజృంభిస్తోంది. ఇంగ్లీషు చదువులు రాటుదేలుతున్నాయి. తాము ముడుచుకుని ఉన్న భ్రమల గూడుమీదే దెబ్బలు పడుతున్నాయి. అంతవరకు తమకు ఆశ్రయమూ, అధికారమూ ఇచ్చిన  జమీందారీ వ్యవస్థా, దానితోపాటే తమ ఆశ్రయమూ, అధికారమూ కుప్ప కూలుతున్నాయి. ధర్మారావు తమ జ్ఞాన కాంతుల లోగిలి నాలుగు గోడల మధ్య నుంచి అప్పుడప్పుడు ఆజ్ఞానాంధకారపు బాహ్య పరిసరాలలోకి రావలసి వస్తోంది. ఇంగ్లీషు చదవవలసివస్తోంది. కానీ భౌతికంగా అతను బాహ్య పరిసరాలలోకి వస్తున్నా అతని ఆత్మ మాత్రం తన భ్రమల గూడును విడిచి రావడంలేదు. దాని మీద దెబ్బలు పడుతున్న కొద్దీ అతను మరింతగా అందులో ముడుచుకుంటున్నాడు. బాహ్య పరిసరాలు ఎంత మారుతున్నా, వాటికి అనుగుణంగా తానూ ఎంతో కొంత  మారుతున్నా అతని ఆత్మలో మార్పు లేదు. అది ఎప్పటిలానే తన భ్రమల గూడును పట్టుకుని వేలాడుతూనే ఉంది. శిథిలమవుతున్న  ఆ గూడును తలచుకునే అతనిలో నిస్పృహా, నిర్వేదం. అదే వేయిపడగలు.

మారిన పరిస్థితిలో, బహుశా తండ్రి రామేశ్వరశాస్త్రికి అదనంగా, ధర్మారావు జీవితంలో అస్తిత్వం తాలూకు అభద్రత ప్రవేశించింది.  ఆ అభద్రత రెండు రకాలు. మొదటిది వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అభద్రత. ఇంగ్లీషు చదువుకుని ఉద్యోగం వైపు మళ్లి ఆ అభద్రతను జయించవచ్చు. ధర్మారావు కాకపోయినా ధర్మారావు వారసులు అదే చేయబోతున్నారు. రెండవది, తమ సాంస్కృతిక, మత, తాత్విక, ధార్మిక, రాజకీయ ఆధిపత్యానికి కలుగుతున్న అభద్రత.

ధర్మారావు వైపునుంచి చెప్పుకుంటే  ఈ రెండు రకాల అభద్రతలకు అంతస్సంబంధం ఉంది. సమాజంలో తను అల్పసంఖ్యాకవర్గం. శ్రమ చేయలేడు. బలిష్టుడు కాదు. ఈ బలహీనతలనే బలంగా మార్చుకోవడం, అవి కల్పించే అభద్రతనుంచే భద్రతను నిర్మించుకోవడం –ఇదీ అతని తాత ముత్తాతలనుంచీ జరుగుతూ వచ్చింది. ఈ ప్రయత్నంలోంచే అతని మతం, తాత్వికత, ధర్మశాస్త్రం, సాహిత్యం, సమస్త వాఙ్మయం పుట్టాయి.  ఇప్పుడు వీటన్నిటితో కూడిన వ్యవస్థకే అభద్రత వాటిల్లింది. ఇందుకు ధర్మారావుకు కనిపించిన పరిష్కారమేమిటంటే, ఆ అభద్రతను ఎదుర్కోవడానికి, అలాంటి అభద్రత నుంచే పెంపొందించిన వ్యవస్థలోనే తిరిగి భద్రత వెతుక్కోవడం!

ఒక కోణం నుంచి చూస్తే ధర్మారావు పాత్ర జాలిగొలుపుతుంది. అతనిలో తాను సర్వాధికుడినన్న భావన. అది అతనిలో అధికారాన్ని, అహాన్ని మాత్రమే కాదు; తన ఊహలను, అభిప్రాయాలను సమానఫాయీలో ఇంకొకరితో పంచుకోలేని ఒంటరితనాన్నీ అతనిపై విధిస్తుంది. అతను వ్యాఖ్యానించని విషయం ఉండదు. కానీ అవతల ఉన్నది ఎవరు? అతని వ్యాఖ్యలపై  ప్రతిస్పందించడానికి అతనితో సమానమైన జ్ఞానమూ, స్థాయీ లేని మూగ శ్రోతలు. వక్తా, శ్రోతా కూడా తనే. తన గొంతు ప్రతిధ్వని తనకే వినిపిస్తుంది. గోడకు కొట్టిన బంతి తిరిగి తన దగ్గరకే వచ్చినట్టుగా తన అభిప్రాయాలూ, వ్యాఖ్యలూ మళ్ళీ తన దగ్గరకే వస్తాయి.

veyi

అతని మాట, ప్రజాస్వామికమైన డైలాగ్ కు అవకాశం లేని, ఒక మోనోలాగ్. అక్కడ ప్రైవేట్, పబ్లిక్ అన్న తేడా  చెరిగిపోతుంది. డైలాగ్ కు అవకాశం లేని స్థితిలో అతని ప్రైవేట్(వైయక్తిక)ఊహాప్రపంచమే పబ్లిక్ గా మారిపోతుంది. డైలాగ్ కు అవకాశం లేనప్పుడు అక్కడ తర్కం, హేతుత్వం ఉండవు. పైగా అవి అక్కర్లేదన్న అహం ఉంటుంది. చరిత్ర ఉండదు. అది అక్కర్లేదన్న అహం ఉంటుంది. సాలె పురుగు తనలోంచే దారాన్ని సృష్టించుకుని, దానితో గూడు కట్టుకుని అందులో ఎలా ఉండిపోతుందో; తన ఊహల దారాలతో తనే అల్లుకున్న గూడులో తను ఉండిపోవడం…ఇదీ అతని బౌద్ధిక జీవితం.

తనే లోకానికి గురువు. కనుక వేరెవరికీ, ఎప్పటికీ శిష్యుడు కాలేని పరిస్థితి అతనిది. దాంతో అతనికి కొత్తగా నేర్చుకునేది ఏమీ ఉండదు. ఋష్యశృంగుడు ఉన్నచోట అనావృష్టి ఉండదు. అలాగే, తన ఉనికే లోకకళ్యాణం కోసం!

తీరా  సుదర్శనంగారు తర్కమూ, హేతుత్వమూ అనే తూనిక రాళ్ళతో వేయిపడగలను తూచబోయేసరికి అది తేలిపోయింది. అందులో బరువైన సరకు బదులు డొల్ల కనిపించింది. అయితే ఆ డొల్లను పట్టుకుని ఉన్న మనిషి నిజం. తన భ్రమల గూడుపై పడుతున్న దెబ్బలకు అతను పడుతున్న కలవరం, అస్తిత్వ భయం, అవి కలిగించే హృదయభారం నిజం. అవి నవలలో ప్రతిభావంతంగా వ్యక్తమయ్యాయి.

***

ముందే చెప్పినట్టు, ధర్మారావును తెలుగుదనం మూర్తీభవించిన వ్యక్తిగానూ, వేయిపడగలను ఆధునికత  తెలుగునాట తెచ్చిన  మార్పుల చిత్రణగానూ కుదించడం ధర్మారావు బౌద్ధిక జీవితానికి ‘బాహ్యు’నిగా సుదర్శనంగారికి గల పరిమితి. నిజానికి ధర్మారావు భారతదేశమంత వైశాల్యం కలిగిన పాత్ర. అతని సంఘర్షణ మూలాలు భారతీయ సమాజం తాలూకు అతి పురాతనపు లోతుల్లో ఉన్నాయి. భారతదేశపు సామాజిక, సాంస్కృతిక, మత, రాజకీయ స్థితిగతులకు అతను శాసనకర్త. ఇంత వైవిధ్యవంతమైన దేశాన్ని తన దృష్టికోణం అనే మూసలో ఇరికించడానికే అతని నిరంతర ప్రయత్నం. ఆ ప్రయత్నంలో అతనికి విజయాలూ ఉన్నాయి, అపజయాలూ ఉన్నాయి. అతని పెనుగులాట ఎంత వైయక్తికమో, అంత వ్యవస్థాగతం. చరిత్ర పొడవునా జరుగుతున్నఅతని పెనుగులాటా, అందులో అతని గెలుపు, ఓటముల చరిత్రే ప్రధానస్రవంతికి చెందిన భారతీయ వాఙ్మయం.  పాశ్చాత్య నాగరికతా ప్రభావమూ, అవైదిక ధోరణుల విశృంఖలత్వమూ నేపథ్యంగా వేయిపడగలులో చిత్రితమైనది– అతని అనేకానేక పెనుగులాటలలో ఒకటి మాత్రమే.

వేయిపడగలు అతని ఒకానొక తాత్కాలికమైన  ఓటమిని చెబుతుంది. అది అతనికి కలిగించిన నిర్వేదాన్ని, నిస్పృహను చెబుతుంది. అయితే తన చరిత్రలో అనేకసార్లు జరిగినట్టుగా , అంతులేని నిరీక్షణ తర్వాత అతను మళ్ళీ గెలిచాడు. ఇప్పుడు కనుక ధర్మారావు చరిత్రను తిరగరాస్తే, అది ఒక విజేత చరిత్ర అవుతుంది. ఇప్పుడతనిలో నిస్పృహా, నిర్వేదం లేవు. వాటి స్థానంలో అతని ముఖం నిండా విజయదరహాసం!

(సశేషం)

 

 

 

వాగర్థాలు కలిసి మురిసిన మురళి!

mangalam

ఆయన  తల్లి గారి పేరు సూర్యకాంతమ్మ గారు.  కృతుల సంకలనానికి ఉంచిన పేరు ‘ సూర్య కాంతి ‘ . ఆయన మాత్రం చల్లని వారు –  మేలుకొలుపులు పాడినప్పుడూ వెన్నెట్లోకి రమ్మన్నట్లే ఉంటుంది. చూడలేక కళ్ళు చిట్లించుకోవలసినది అందులో ఏవేళ లోనూ లేదు.  అమ్మ ఒళ్ళో కూర్చున్న పిల్లాడు ” దా ! దా ! ” అన్నట్లు. అమ్మ ఆయన కి సొంతం కనుక మనందరినీ అలాగే చూస్తుందనే పసి నమ్మిక అది – నిజమెందుకు కాదు ,  ఆయన ఉండగా. అరటి పండు ఒలిచిపెట్టిన వెండిపళ్ళెం మనకే.

  అపండితులకూ ” ఆహా , సంగీతం వింటున్నామ ” న్న గర్వాన్ని ఆయన సృష్టిస్తారు.  ప్రాసాదాల నడవా లలోకీ  సాదా పెంకుటిళ్ళ  పంచల లోకీ ఒక్కలాగే  కురిసిన చంద్రిక ఆయన పాట. అరుదుగా –  సమయా సమయాలున్నాయేమో కాని వృద్ధి క్షయాలు లేవు.

ఎటువంటి సంగీతజ్ఞానమూ లేని మాడ్రైవర్ ,  పాతిక ముప్ఫై ఏళ్ళ యువకుడు – రోజూ కార్ లో వినబడే రామదాసు కీర్తనలని వినీ వినీ గొంతు కలపేసేవాడు. వినకుండా  ఉండలేకపోయేవాడు. ఆ పని   మరింకొక విద్వాంసుల వలన కాదు ,  నాకు తెలియదు. తన స్వరూప స్వభావాలనేమీ మార్చుకోకుండానే వసంతం తరలి వచ్చింది .   దిగి రాలేదు. ఆ పైన నువ్వు అందిస్తే నీ చేయి పుచ్చుకుని తీసుకుపోతుంది – మరింకా వేర్వేరు చోట్లకి. నాతో సహా ఇంకెంతెంత మందికో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు చేసిపెట్టిన ఉపకారం అది.

  ఖంగున మోగే గొంతులూ సర్కస్ చేసే  పాటలూ తెలుగువారికి ఇష్టం . చలం గారెన్నడో అని ఉన్నట్లు , కష్టమైన సంగతుల విన్యాసానికి  మాత్రమే చప్పట్లు కొట్టే మోటుతనం మనది. సహజ ప్రశాంతమైన మాధుర్యం చప్పున లాగదు  . అటువంటి గుండెల్లోకీ చొరబడగలగటం ఆయనకి చేతనయిన ఒక విద్దె. సంగీతాన్ని దాని అన్ని రూపాలలోనూ ఆయన కౌగలించుకోగలరు , సినిమా పాటలతో సహా. దేన్నీ చిన్నబుచ్చగలిగే నిర్దయ అక్కడ ఉండే అవకాశం లేదు.

ఈ వైపునుంచి  –  సమస్త  ప్రపంచం లోని అన్ని విధాలైన పద్ధతులనూ కర్ణాటక సంగీతం తనలో ఎలాగ ఇముడ్చుకోగలదో చేసి చూపించిన పని అది. మీరూ నేనూ మాట్లాడుకునే మాటలకీ స్వరాల ఆధారాన్ని ఇవ్వగలరు . లయ సమంగా ఉందో లేదో తేల్చగలరు.  నాదం , దాని వెనుక శబ్దం – అది సర్వవ్యాప్తమైన ఆకాశలక్షణం గా చెప్పబడే భారతీయత – మన కాలానికి ఎంచుకొని ధరించిన రూపమది , ఇంతకాలమూ. భాష తెలియనివారికీ భావమేదో స్ఫురించేలాగా , తెలిసినవారికి తెలిసివచ్చేలాగా – వాగర్థాలు కలిసి ఉండటానికి బ్రహ్మాండమైన నమూనా  .

  అరే, అదేమి నవ్వు , అదెంతటి ఉల్లాసం !!! స్మితమో మందహాసమో మొహాన కనిపించకుండా పాడటం ఎప్పుడన్నా ఉందా ? ఒక కొత్త కల్పనను వేదిక మీద అప్పటికప్పుడు చేశాక వచ్చే దరహాసం- ఆ   బంగారపు జరీ అంచుల తళతళ…  ఎవరన్నా పలకరించి మాట్లాడినా ఆహ్లాదమే తిరిగి వచ్చేది. ఇంకొందరు ఉన్నతులలో లాగే ఆ హాస్య స్ఫూర్తి  ” అబ్బే. తూచ్ ! ఇందులో ఏమీ లేద ” నే ఎరుక. మనుషుల పైన అనురాగం ప్రతి చేత లోనూ కవళిక లోనూ చిందిపోవటం అదొక దివ్యమైన బహూకృతి – ఆయనకూ మనకూ. బహుశా కళ మనిషిలో లీనమైతే రాగల బహిఃఫలం.

ఉత్సాహం పోకుండా, ఫిర్యాదులు రాకుండా –  అంతా తెలిసిందనీ లక్ష్యాలు లేవనీ అనకుండా – అది గొప్ప పుట్టుక !

” మా రోజుల్లో అయితేనా ..” అన్న మాటలు రాలేదు కడదాకా.

వినా దైన్యేన జీవనం.

   ఏ వ్యక్తిగత పరిచయమూ లేని ఎన్నో లక్షల మందికి ఆయన తమవాడు – నాకూనూ.  రోజూ చూడని వాడైనా మళ్ళీ కనిపించని బాధ అందరిదీ , నాది కూడా. మాట్లాడే అర్హత ఉందీ లేదూ కాదు – ఒక చంద్రుడు సమస్త జీవులకు తానొక్కొకడయి తోచును గనుక, నూలుపోగును  తప్ప ఇవ్వలేను గనుక.

     వేయికి పైనే పున్నములు గడిచినాయి గానీ చాలదు.  అద్దం లోనూ నీళ్ళలోనూ  పట్టి దాచుకున్నదే  చాలుతుండాలి ఇక మీదట .  

      అంతే.  

          *                                     

 

నేను నేనే నేను!

samvedana logo copy(1)నోట్ల రద్దుమీద కొంతమంది మిత్రుల అభిప్రాయాలు చూశాక ఇది రాయాలనిపించింది. నోట్ల రద్దు ఫలానా ఫలానా కంపెనీలకు లాభం చేకూర్చడానికి అని మోదీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఫలానా ఫలానా వారికి ముందే తెలుసు అని ఆరోపిస్తున్నారు. రిజర్వ్‌బ్యాంక్‌గవర్నర్‌భార్య ముఖేశ్‌అంబానీ భార్య ఇద్దరూ సిస్టర్స్ అని కొత్త కోణాలు వెలుగులోకి తెస్తున్నారు. ఇవన్నీ నిజమా కాదా అనేది అంతగా ప్రాధాన్యమున్న అంశం కాదు. సమస్య తీవ్రతను తక్కువగా చూస్తున్నారు. మోదీ పాలనను కాంగ్రెస్‌స్థాయికి కుదించే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ అవినీతిపరుడు అయినా కాకపోయినా అది పెద్ద సమస్య కాదు. అంతకంటే పెద్ద సమస్య భావజాల పరమైనది. హిట్లర్‌తో సమస్య అవినీతి కాదు.

నేను, నేనే, నేను మాత్రమే అనేది సమస్య. ఈ దేశాన్ని నేను మాత్రమే దారిలో పెట్టగలను అని ఒక మనిషి అనుకోవడం సమస్య. తాము అనుకున్న లక్ష్యాలు చేరడానికి వ్యవస్థ-నిర్మాణాలు-నిబంధనలు అడ్డంకి అనుకోవడం సమస్య. వ్యవస్థ కంటే తాను పెద్ద వాడిననుకోవడం సమస్య. నేనే నిజాయితీపరుడిని, ఇంకెవరూ కాదు అనుకోవడం సమస్య. తాను కోరుకున్నట్టుగా వ్యవస్థను మార్చే ముళ్లకిరీటాన్ని తన మీద తానే పెట్టుకున్నవాడు అధికారంలో ఉండడం సమస్య. మన పూర్వీకుల సాంకేతికతకు పుష్పక విమానమనే పురాణ ఉదాహరణలు చూపగలిగే మనిషి, గణేశుడి తలని శస్త్రచికిత్స పరిజ్ఞానానికి ఉదాహరణగా సైన్స్‌కాంగ్రెస్‌లోనే ప్రకటించగలిగిన మనిషి అటువంటి స్థితిలో ఉండడం అసలు సమస్య.

మోదీ నిజంగానే బ్లాక్‌మనీని ఈ విధంగా అరికట్టాలని అనుకున్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. అతనికి ఆ చిత్తశుధ్ది ఉన్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఎలుకను చంపాలనుకున్నవాడు అందుకోసం ఇల్లు తగులబెడితే అతనికి ఎలుక విషయంలో చిత్తశుధ్ది లేదు అనగలమా! సమస్య అతను అవినీతిపరుడా కాదా అనేది కాదు. ఆ మాట కొస్తే కేంద్ర కేబినెట్లోనూ అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులుగానూ వ్యక్తిగతంగా అవినీతి జోలికి పోనివారు అనేకులున్నారు. సో వాట్‌!

మోదీ నిర్ణయం చూస్తే కనీసం ఆర్థికమంత్రి, రిజర్వ్‌బ్యాంక్‌గవర్నర్‌లనైనా విశ్వాసంలోకి తీసుకున్నారా అని అనుమానం వస్తుంది. వాళ్లకి తెలీకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నేను నేనే నేను మాత్రమే అనుకునే మనిషి ఏమైనా చేయగలరు? ఇంత పెద్ద వ్యవస్థను నడిపే ఆర్థిక వేత్తలకు ఎటిఎంలలో కొత్త నోట్లు పెట్టడానికి ఎంతకాలం పడుతుంది అనే విషయం తెలీకుండా ఉంటుందని అనుకోలేం. 86 శాతం కరెన్సీ పోతే సిస్టమ్‌ఎలా కుప్పకూలుతుందో తెలీకుండా ఉంటుందని అనుకోలేం. కోరి కోరి ఇంత వ్యతిరేకతను మూటగట్టుకుంటారని అనుకోలేం. భావజాలపరంగా విభేదించొచ్చు కానీ పరిజ్ఞానంలో వారి స్థాయిని తక్కువగా అంచనా వేయలేం. 90 లతర్వాత పెరిగిన కరెన్సీ ప్రాధాన్యం గురించి ఏ కాస్త ఆర్థిక పరిజ్ఞానం ఉన్నవాళ్లైనా సులభంగా చెప్పేయగలరు అది ఎంత అల్లకల్లోలమో! దేశభక్తికి 56 ఇంచీల ప్రతినిధి అయిన ప్రధానుల వారు వాళ్లను సంప్రదించారా అనేది సందేహమే.

అవినీతిని దాటి ఆలోచించకపోతే చాలా విషయాల్లో బోల్తాపడే ప్రమాదం ఎక్కువ. బలమైన భావజాలమున్న శత్రువుపై ఆ అస్త్రం పూచికపుల్ల లాంటిది. చావల్‌బాబా రమణ్‌సింగ్‌అవినీతిపరుడు కాకపోవచ్చు. ఆ మనిషి నవ్వు చూస్తే ఇతను చీమకైనా హానితలపెట్టగలడా అనిపించొచ్చు. కానీ చత్తీస్‌గఢ్లో ప్రభుత్వ బలగాలు వారి వత్తాసు ఉన్న బలగాలు ఆదివాసీలపై కొనసాగించిన అరాచకాలు మాటలకందనివి. నవీన్‌పట్నాయక్‌క్లీన్‌, ఎడ్యుకేటెడ్‌, శావీ అనిపించే పెద్దమనిషి కావచ్చు. కానీ ఆయన పాలనలో ఉన్న నేలమీద జరిగిన మారణకాండ,అంతకుమించి అక్కడనుంచి బయటకొస్తున్నకోణాలు మనిషి అనే పదం సిగ్గుతో తలవంచుకునేవి. నిజాయితీ-వ్యక్తిగత అవినీతి అనేవి ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ప్రమాదం ముందు చిన్నవి. అవి కాంగ్రెస్‌స్థాయి వ్యవహారాలు.

500-rupees
అసలు సమస్య నోట్లకోసం క్యూలో ఉండడం దేశభక్తి అనే మాటలో ఉంది. తానేం చేసినా దానికి దేశభక్తి అనే పేరుపెట్టడంలో ఉంది. దీన్ని వ్యతిరేకించే వారంతా దేశద్రోహులు అనే భావజాలంలో ఉంది. మా వైపు లేకపోతే ఉగ్రవాదుల వైపు ఉన్నట్టే, మే చేసిన దాన్ని ప్రశ్నిస్తే దేశభక్తి లేనట్టే అనే వాదనలో ఉంది. ప్రతీదీ దేశభక్తే. ఎనిమిది మంది అండర్‌ట్రయల్స్‌ని చట్టవిరుద్ధంగా చంపేస్తే దేశభక్తి. చట్టం, రూల్‌ఆఫ్‌లా, మనమే ఏర్పరుచుకున్న నిబంధనలను ఇలా ఉల్లంఘిస్తూ పోతే ఎలా లాంటి ప్రశ్నలు మామూలుగా వేయగలిగే వారిమీద కూడా ఈ దేశభక్తి అనే మాట పనిచేస్తుంది,. ఇంతకుముందు ప్రభుత్వాలు చేసిన సర్జికల్‌స్రయిక్సే చేసినప్పటికీ బహిరంగంగా ప్రకటించడం అనే పని చేసినందుకు అది దేశభక్తి అవుతుంది. అదేంటి, ఎలా జరిగింది, నిజంగా మీరు చెప్పినట్టే జరిగిందా అనిప్రశ్నిస్తే మళ్లీ ఈ దేశభక్తి అనే అస్త్రం ముందుకొస్తుంది.

ఎవరో హేతువాదులపై దాడులు చేస్తారు. ఇంకెవరో బీఫ్‌తినడం దేశద్రోహం అంటారు. విశ్వవిద్యాలయాల్లో అంబేద్కర్‌-మార్క్స్‌వాదులను ఎవరో పనిగట్టుకుని వేధిస్తూ ఉంటారు. రోజూ ఎక్కడో ఏదో జరుగుతూనే ఉంటుంది. అదేదో విడిఘటనలాగా ఉండదు. మన హేతుబద్ధత, మన లాజిక్‌, మన ప్రజాస్వామికత ఓడిపోయినట్టుగా పదే పదే అనిపిస్తుంది. రాజ్యం మన అందరిమీదా కత్తికట్టినట్టుగా అనిపిస్తుంది. మనకు తెలీకుండా మన వెంటనీడలాగా వెంటాడుతున్నట్టుగా అనిపిస్తుంది. మన నెత్తిమీదే ఒక కెమెరా పెట్టినట్టుగా మన చుట్టూ ఒక కంచె వేసినట్టుగా అనిపిస్తుంది. బాలగోపాల్‌సంస్మరణ సభలో రత్నం చాలా చక్కని మాట వాడారు. విశ్వవిద్యాలయాలను గ్రామాల స్థాయికి తీసుకువెళ్లాలనుకుంటున్నారు అని. ఈ మధ్య ఒక జర్నలిస్టు పెద్దాయనతో మాట్లాడుతుంటే ఒక పదం వాడారు. ఇతను వచ్చినప్పటినుంచి రోజూ టెన్షన్‌ఉంటోంది అని. అదీ సరైన అవగాహన. ప్రమాదాన్ని గుర్తించడమంటే అదీ.

ప్రతి సందర్భంలోనూ ఈ దేశభక్తి అనే పదాన్ని ముందుకు తేవడం అత్యంత ప్రమాదకరమైన సంకేతం. తాము చేసే ప్రతిపనిని సమర్థించుకోవడానికి భావజాలంతో ముడిపెట్టడం సిద్ధాంతం అనేది ఉన్న ప్రతి పార్టీ చేసే పనే. ఈ పని కమ్యూనిస్టు పార్టీలు కూడా తాము అధికారంలో ఉన్న దేశాల్లో వేరే కోణంలో చేస్తాయి. భావజాలం కూడా దానికది సమస్య కాదు. కాకపోతే అది మనుషులందరికీ ఒకే విలువ ఉంటుందని నమ్మే భావజాలమా, సమానత్వాన్ని నమ్మే భావజాలమా దానికి విరుద్ధమైన భావజాలమా అనేది ముఖ్యమైనది. ఇపుడు మన దేశాన్ని పాలిస్తున్న భావజాలం మనుషులందరూ సమానమని నమ్మేదికాదు. పేదలు-దళితులు-మైనార్టీలు- ఆదివాసీలు -మహిళల హక్కులను గుర్తించేది కాదు.

పైగా ఆర్థికరంగంలో పెట్టుబడీదారీ విధానాలను పాలనా వ్యవహారాల్లో ఫ్యూడల్‌భావజాలాన్ని కలిపి కొట్టే వింత మృగం. దేశాన్ని పాలిస్తున్న మనిషి తాను అన్నింటికీ అందరికీ అతీతుడనని తానే సర్వం అని నమ్మేమనిషి. తాను కోరుకున్నట్టుగానే అందరూ ఉండాలని తాను ఆలోచించినట్టుగానే అందరూ ఆలోచించాలని కోరుకునే మనిషి. తాను చేస్తున్న పని దాని ప్రయోజనాల గురించి పరిధి గురించి వాజ్‌పేయికి కనీసం కొన్ని సందేహాలైనా ఉండేవి. ఇతనికి అలాంటివేవీ ఉన్నట్టు కనిపించడం లేదు. రిజర్వ్‌బ్యాంక్‌గవర్నర్‌ప్రకటించాల్సిన నిర్ణయాన్ని ప్రధాని తనంతట తాను ప్రకటించడంలోనే చాలా విషయం ఉంది. మనుషుల కంటే, మనం ఏర్పరుచుకున్న వ్యవస్థీకృత నిర్మాణాల కంటే నిబంధనల కంటే దేశం గొప్పదనేదేదో ఉంది. దేశం కోసం అంటూ నిర్ణయం తీసుకుంటున్నపుడు మిగిలినవాటిని పట్టించుకోనక్కర్లేదు అనే భావన నిలువునా జీర్ణించుకుపోతే అది అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అది కూడా జాతి లాంటిదే. దేశభక్తి అనేదాన్ని నాటి యూదు జాతీయత అనే స్థాయికి తీసుకువస్తున్నారు. అరవై డెబ్భై ఏళ్లుగా సిస్టమ్స్ ఎంతో కొంత ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఇంకా ఏమయిపోయి ఉండేదో అని భయం వేస్తుంది.

కాంగ్రెస్‌మీద గురిపెట్టినట్టుగా బిజెపి మీద అవినీతి అస్ర్తాన్ని ప్రధానం చేయలేం. మోదీ అధికారంలోకి వచ్చినపుడు ఆ అస్ర్తాన్నే ఎలా తన అధికారం కోసం ఉపయోగించుకున్నారో ఒకసారి గుర్తుచేసుకోవాలి. కాంగ్రెస్‌అవినీతి మన దైనందిన జీవితాలను ప్రభావితం చేస్తుంది. కానీ బిజెపి మన మెదళ్లను కంట్రోల్‌చేయాలని చూస్తుంది. నీ ఆలోచనలు భిన్నంగా ఉన్నా సహించనంటుంది. నీ మెదడు మీద నీ ఆలోచన మీద, నీ హేతుబద్ధత మీద, నీ నాస్తికత్వం మీద నీ హక్కుల ప్రకటన మీద, నీ వస్ర్తధారణ మీద, నీ తిండి తిప్పల మీద యుద్ధం చేస్తుంది. ఇవన్నీ తాను కోరుకున్న పద్ధతిలో ఉండాలని భిన్నంగా ఉంటే సహించనని అంటుంది. అక్కడ ఉంది అసలు ప్రమాదం. నోట్ల రద్దులో ఉన్నది అవినీతే అయితే అదంత పెద్ద సమస్య కాదు. అపుడు ఇంత భయానక వాతావరణం ఉండదు. ఇది అహంకారం-అజ్ఞానం-అధికారం కలగలిసిన మనిషి సృష్టించిన బీభత్సం. నేను అనుకుంటే ఏదైనా చేయగలను అనే మనిషి అహంకారానికి అడ్డుకట్ట వేయడం ఎలా అనేదే ఇవాళ మన ముందున్న ప్రశ్న.

*

అర్థాన్ని వెతికిన ప్రయాణం!

                                         Mythili

   సంతెశివర లింగణ్ణయ్య భైరప్ప గారు తెలుగువారికి బాగా పరిచయమైన కన్నడ రచయిత . నవోదయ, నవ్య, నవ్యోత్తర – ఏ కన్నడ సాహిత్య విభాగం లోనూ ఆయనను చేర్చటం వీలవదు గానీ , 2007 కు ముందు ప్రగతిశీలులందరూ ఏటవాలుగానే అయినా [ చాలా ‘ పాపులర్ ‘ రచయిత కనుక ] అక్కున చేర్చుకున్న రచయిత. ఆ ఏడు ‘ ఆవరణ ‘ నవల విడుదలయాక ‘’నవల రాయటమే రాదని ‘’ అనిపించుకున్నరచయిత కూడా . ఎవరన్నారు, ఎందు వలన అనేది చాలా పెద్ద చర్చ. మొత్తం మీద అదొక betrayal  గా తీసుకోబడింది.

బి.వి.కారంత్, గిరీష్ కర్నాడ్ లు – భైరప్ప రాసిన వంశవృక్ష, తబ్బలియు నీనదె మగనె నవలలని  సినిమాలు గా తీసుకున్నంత మాత్రాన  వారు అనుకున్నవన్నీ భైరప్ప లో అప్పటివరకూ ఉండినాయా ? ఉంటే వారు అనుకున్న పద్ధతి లోనే ఉండినాయా ?

కాకపోవచ్చు.

పరిమాణం లొనూ నేపథ్యం లోనూ మాత్రమే కాదు – తాత్వికం గా కూడా భైరప్ప గారి సరిహద్దులు పెద్దవి. ఆ సంగతి నాకు ‘ వంశవృక్ష ‘ నవల చదినప్పుడు అర్థమైంది. అందరి మాదిరే ఆ కథ ను నేను 1980 లో బాపు గారు సినిమా తీస్తేనే తెలుసుకున్నాను. మళ్ళీ వివాహం చేసుకున్న సరస్వతి [ నవలలో ఆమె పేరు కాత్యాయని ] వైపుకి మొగ్గిందన్నది స్పష్టమే. అందులో ఏమీ అన్యాయం అప్పుడు తట్టలేదు, ఇప్పుడు అంతకన్నా తట్టదు. కాని కథ లో కొన్ని ఖాళీ లు కనిపించినాయి సినిమా చూస్తుంటే. సరస్వతి ఇంటికి రాని రోజున మామ గారు ‘ చీకటి పడింది కదా, దారి తప్పి ఉంటుంది ‘ అంటాడు. అది చాలా లోతయిన వాక్యమని అప్పట్లో చెప్పుకోవటం గుర్తు.   సినిమా కథ పరం గా అది తప్పు ధోరణి.   అయినప్పుడు ఆ మాటలను అంత గంభీరం గా అనిపించటం లో ఔచిత్యం ఏముంది ? శంకరాభరణం లో వేసి జె. వి. సోమయాజులు గారు దొరికారని కాకపోతే, సినిమా లో బాపు గారు తేల్చినదానిలో    పెద్దాయన కు ఔన్నత్యాన్ని ఆపాదించేందుకు చోటు ఎక్కడ ?  ఆ పాత్ర చాలా linear గా ఉంటుంది సినిమా లో. చివరకు ‘ కనువిప్పు ‘ కలిగాకా అంతే. ఆ తర్వాత సరస్వతి కి బిడ్డలు దక్కకపోవటం ఒక విషయం. అందుకు  ఆమె అపరాధ భావనతో కృశించటం లో నాకు  అర్థమూ అగత్యమూ కనిపించలేదు.

 మరొక ఇరవై ఏళ్ళ తర్వాత – ‘ ఆ. ఎందుకులే ‘ అనుకుంటూనే చదివిన నవల నాకు మరి కొన్ని కిటికీలను తెరిచింది.

” ఇది జీవితం. ఇలాగే ఉంటుంది. ఇంత కర్కశం గా, నిర్దాక్షిణ్యం గా ఉంటుంది ” – అది రచయిత చెప్పదలచినది. ఏ పాత్రనూ సమర్థించలేదు, విమర్శించ లేదు. విభిన్నమైన ధర్మాల , కామన ల సంఘర్షణ ను చాలా నిజాయితీ గా చిత్రీకరించారు.భైరప్ప లో సర్వదా , సర్వత్రా ఒకటి కన్న ఎక్కువే దృక్కోణాలు ఉంటాయి . ఒక వృద్ధ బ్రాహ్మణ పండితుడి disillusionment  కనుక దానికి ఒక్క వైపు భాష్యమే ప్రసిద్దికెక్కింది. ఆ యేడు సితార పత్రిక అవార్డ్ లు ఇచ్చింది – వంశవృక్షం అత్యుత్తమ చిత్రం, శంకరాభరణం ద్వితీయ ఉత్తమ చిత్రం.

   భైరప్ప గారివి నేను  చదివినవి ఆరు నవలలు.  వంశవృక్ష, గృహభంగ, దాటు , పర్వ – తెలుగు లో; ఆవరణ , సార్థ ఇంగ్లీష్ లో. మొత్తం ఇరవై నాలుగింటి లో ఈ సంఖ్య కొద్దిదే. కాని అవన్నీ వేర్వేరు దశలలో రాసుకున్నవి కనుక రచయిత చేసిన ప్రయాణం ఏ మాత్రమో అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ అవగాహన లో నా అంతస్సూత్రాలు పనిచేయలేదని అనను. ఎన్ని సూత్రాల అన్వయానికైనా భైరప్ప గారి సంకీర్ణత లో వీలుంది.

 ” మృత్యువు నాకు అత్యంత  సన్నిహితం గా, అతి అనివార్యమైనది గా కనిపిస్తుంది. ఆ రహస్యానికి దగ్గరవుదామనే , అన్వేషణ లో భాగం గా  తత్త్వ శాస్త్రాన్ని  అధ్యయనం చేశాను ” అని ఆయన చెప్పుకున్నారు. ఎనిమిదేళ్ళ వయసు లో తల్లినీ, ఇద్దరు సోదరులనూ ఒక అక్కనూ ప్లేగు వ్యాధి వల్ల పోగొట్టుకున్న నిర్వేదం , నిర్లిప్తత , భీతి – ప్రాణమున్నంత వరకూ పోవు , మరిక ఎన్నటికీ ‘ మామూలు ‘ అయేది లేదు. చిన్న పనులు చేసీ ఒకోసారి బిచ్చమెత్తీ చదువుకున్నారు. ఫిలాసఫీ లో ఎం. ఏ, ఆ తర్వాత పి. హెచ్. డి ‘ సత్యం- సౌందర్యం ‘ [Truth and Beauty ] అన్న విషయం లో. ఇటువంటి మనిషి ఏ వాదం లోనైనా ఎట్లా ఇముడుతారు ?

ఆ దుర్భరమైన బాల్యాన్నంతా ‘ గృహభంగం ‘ లో రాస్తారు. లేదు. ఏమీ నిష్కృతి లేదు. నివృత్తి లేదు. ఇచ్చేందుకు రచయితకు మనసొప్పలేదు. ప్రపంచపు మహా విషాద కృతులలో చోటు చేసుకోదగిన నవల అది – వివరించేందుకు నాకూ చేతులు రావు.

 ‘ దాటు’ లో  ఒక బ్రాహ్మణ అమ్మాయి వక్కళిగ అబ్బాయిని ప్రేమిస్తుంది. కర్ణాటక లో వక్కళిగులు ఆర్థికం గానూ రాజకీయం గానూ బలమైనవారు. ఆ వివాహం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని అబ్బాయి తండ్రి కొంచెం ఊగుతాడు, అమ్మాయి తండ్రి ఒప్పుకోక పోయాక మరింకొక వివాహ పథకాన్ని వేసుకుంటాడు కొడుకుకి. అబ్బాయి

తండ్రిని ఎదిరించలేనివాడు. అమ్మాయి  తీవ్ర స్వభావ. ఆమె  తండ్రి అంత కన్నా తీవ్రుడు – ప్రతిగా తనని తను హింసించుకుంటాడు.  ఎవరికీ ఆ పల్లెటూరు వదిలిపోయేందుకు లేదు. అదీ నలుగుబాటు.

    భైరప్ప గారి నవలలో కాలం ఒక ముఖ్యమైన పాత్ర – అది సాగే కొద్దీ ప్రవృత్తులు కాస్త కాస్త గా మారుతూ ఉండటాన్ని అతి దగ్గర గా చూపించగల శక్తి ఉంది ఆయనకు.  బ్రాహ్మణుడిని    ‘ మచ్చ లేనివాడు ‘ గా ఏమీ చూపించలేదు. ఉందనే చెబుతారు, కావాలనే – అయితే అది గతం లోనే  ముగిసిపోయిన సంబంధం . అతను  గానీ ఆ నిమ్నజాతి స్త్రీ గానీ దాన్ని ఎప్పటికీ కొనసాగించాలనో దాని వల్ల తమ జీవితాలు మారిపోవాలనో అనుకోరు. ఎందుకంటే ఆ కాలానికి అది సహజం కాదు. ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి అభిమానమైతే ఉంటుంది ఆ తర్వాత కూడా – వారు జంతుసములు కారు. అంతకు మునుపే వచ్చిన ‘ సంస్కార ‘ లో అటువంటి సంబంధానికే ఇచ్చిన నాటకీయతను భైరప్ప గారు ఇవ్వదలచుకున్నట్లులేదు.

 పర్వ.   దీనికి చాలా ప్రశంసలు వచ్చాయి . మహా భారత ఇతిహాసాన్ని మరొక వైపునుంచి చూడటం కన్న సరదా పని ఇంకేముంటుంది ? ఇందులో గాంధారి నిస్పృహ తో కళ్ళ గంతలు కట్టుకుంటుంది. పాండురాజు ఇంచుమించు నపుంసకుడు. కుంతి అతనిని ఆకర్షించలేకపోతుంది. ఆమె శారీరకం గానూ మానసికం గానూ కూడా  ‘ పృథ ‘ – ఆమె ముందు పాండురాజు కు తను తక్కువవాడిననిపిస్తుంటుంది. మాద్రి ని డబ్బు ఇచ్చి తెచ్చుకుంటారు. పాండవులు దేవతలకు కాక హిమాలయ ప్రాంతాల లోని కొందరు ఉన్నత వ్యక్తులకు జన్మిస్తారు.

  భీమసేనుడి తండ్రి కుంతిని నిజంగా ప్రేమిస్తాడు, తన తో వచ్చేయమని బ్రతిమాలుతాడు. అతని వేదన, కుంతి నిస్సహాయత  నొప్పిస్తాయి. ధర్మరాజు, దుర్యోధనుడు, కర్ణుడు, అర్జునుడు – వీళ్ళలో రక రకాల ఛాయలు తెలుగుపౌరాణిక చలన చిత్రాలలో మనం చూసి ఉన్నవే, ఆశ్చర్యం కలిగించవు. భీముడిని మాత్రం పరిపూర్ణమైన వాడిగా , గొప్ప ప్రేమికుడిగా, మత్సరం లేని వాడి గా చూపిన తీరు నిండుగా ఉంటుంది. [ ‘ పర్వ’ భీముడి కోసం ఇంకా వెతుకుతూ భీముడే నాయకుడు గా ఎం.టి. వాసు దేవన్ నాయర్ ‘ రండా మూళ్జం ‘ వెతికి చదివాను – ఊహూ. ]

ద్రౌపదీ అర్జునుల మధ్య  అనురాగం, దాని లోని నెరసులు, విసుగులు – ఆమె మీద కక్ష తో సుభద్ర ను పెళ్ళాడితే – ద్రౌపది ముందు సుభద్ర ధూపానికి కూడా ఆగకపోవటం – గొప్ప చాతుర్యం తో రాస్తారు. అది అందం ప్రసక్తి కాదు , వ్యక్తిత్వం- ముఖ్యం గా తెలివితేటలు, ఆసక్తి కరమైన సాహచర్యం. సుభద్ర నిద్రపోతుంది అర్జునుడు మాట్లాడుతూండగానే – బుర్ర తక్కువదా అనిపించేలా [ పద్మవ్యూహాన్ని వివరించేప్పుడు సుభద్ర నిజం గానే పాపం నిద్ర పోయింది ] .

పర్వ లో గొప్ప న్యాయాన్ని చూపించింది కృష్ణుడి పాత్ర లో. నరకుడి చెర నుంచి విడిపించిన స్త్రీ లందరినీ ఆయన పెళ్ళాడిన కారణం వారికీ వారి సంతానానికీ సమాజం లో గౌరవాన్ని కల్పించాలని . ఆ కోణం భైరప్ప గారికి కనిపించటం విశేషం. అందరి తో ఒక్క రోజయినా  కృష్ణుడు గడపగలడని కాదు, అతి జాత్యుడని కాదు.

యుద్ధం – దాని భీకరత్వం, మిగిల్చే సర్వనాశనం – వీటిని అతి బిగ్గరగా వినిపించిన నవల ‘ పర్వ ‘ .అందులో ఉన్నది కేవలమైన పురాణవైరం కాదు

   నేను చదివినవాటిలో ‘ సార్థ ‘ కాలానుసారం ఆ తర్వాతది.నేను చదివిన వరస లో ఆఖరిది . వర్తకులను సార్థవాహులంటారు . వారి వెంట పంపబడిన నాగభట్టు అనే బ్రాహ్మణుడి కథ ఇది. సార్థ అన్న మాట లో  ఉన్న శ్లేష నవలంతా కనిపిస్తూనే ఉంటుంది

కథాకాలమైన ఎనిమిదవ శతాబ్దం లో వేద, జైన, బౌద్ధ మతా ల సంఘర్షణలు పతాక  స్థాయిలోకి చేరాయని రచయిత అంటారు. ఆదిశంకరుడు, కుమారిలభట్టు, మండనమిశ్రుడు, ఉభయ భారతి, రాజు అమరుకుడు – ఇందులో పాత్రలు గా వస్తారు. ఎక్కడికక్కడ న్యాయాన్ని  ప్రశ్నిస్తూ నవల నడుస్తుంది. ఎక్కడా నిలిచి stagnate  కాదు, అతి చలనశీలం గా ఉంటుంది. [ అలా రచయిత చెబుతూ ఉన్నది మనకు నచ్చుతోందా లేదా అన్నది కాదు ప్రశ్న .  ఆ ‘ నచ్చటం ‘ అనేది చాలా ప్రాథమికమైన చదువరుల లక్షణమని నేను అనుకుంటాను- ఉద్దేశపూర్వకం గా అలాగే ఉండదలచిన వారిది కూడానేమో, తెలియదు ] .

 రాజు అమరుకుడు నాగభట్టు భార్య ను కామించి అతని అడ్డు తొలగించేందుకు వర్తకుల రహస్యాలు తెలుసుకొనే మిష తో అతన్ని పంపించి వేస్తాడు. దారి లో ఎదురయిన బౌద్ధ విహారాలు. వాటిని నిర్మిస్తుండే శిల్పులలో ఒకరు నాగభట్టు తో మొర పెట్టుకుంటాడు – ‘ ఇదేమిటి ? వైదిక  దేవతల వర్ణన లకు తగినట్లు వారి దేవతల శిల్పాలు చెక్కమంటున్నారు ? ” – అని. బుద్ధుడు చెప్పివెళ్ళిన వర్ణరహిత  విరాగం లో ఎన్నెన్ని రంగులు – కొత్త కొత్త అవసరాల మేరకు చేరిపోయాయో రచయిత నిర్మొహమాటం గా రాస్తారు. ధనం, ఆధిపత్యం – వాటినే అవి ఎట్లా పెంచుకుంటూ పోతాయో

, వాటికి ఏమి పేర్లు తగిలిస్తారో కూడా.  ఒక నాటక సమాజం వారు అతని చేత కృష్ణుడి వేషం వేయిస్తారు – అక్షరాలా కృష్ణుడే అయినట్లు అతని రూపం సరిపోతుంది. అప్పుడు అతను అనుకుంటాడు – ” నిజం గా నేను అంత అందగాడినే అయితే నా భార్య రాజునెందుకు వలచింది ”- అని. ఈ ప్రశ్న ఆధునికానంతర కాలానికీ వచ్చి తగులుతుంది – అందం ఒకటీ చాలదు, అసలు ఏ ఒక్కటీ చాలకపోవచ్చు – ఎంచుతూ పోతే.

ఒక నాట్యగత్తె తో అతని స్నేహం , ఆమె దైహిక సంబంధానికి ఒప్పుకోకపోవటం – చివరికంటా నడుస్తుంది. ఒకే యోగి దగ్గర ఇద్దరూ ధ్యానాన్ని అభ్యసిస్తారు. ఆమె మున్ముందుకు వెళుతుంది, అతను అల్ప సిద్ధులను ఉపయోగించుకోబోయి పతితుడవుతాడు. తర్వాత కాపాలికుడయే ప్రయత్నం చేస్తాడు – ప్రయాణం సాగుతూనే ఉంటుంది.

నలందా విహారం లో – బౌద్ధుల రహస్యాలు తెలుసుకుందుకు మహా పండితుడైన కుమారిల భట్టు మారు వేషం లో చేరటం చరిత్ర లో ఉన్న విషయమే. పట్టుబడిన తర్వాత ఆయన ‘ గురు ద్రోహం ‘ [ బౌద్ధాచార్యుడి పరంగా ] చేసినందుకూ ఇటువైపున  లక్ష్యం  లో విఫలుడైనందుకూ తనకి తాను శిక్ష  విధించుకుంటాడు. వడ్ల పొట్టును పేర్చి మధ్యలో నిలుచుని దానికి నిప్పు అంటించటం ఆ శిక్ష. ఆ తీక్షణత్వం భైరప్ప రచన లో  చాలా చోట్ల కనిపిస్తుంది . సనాతన ధర్మం లో దేహం ప్రధానం కాకపోవటాన్ని అలా తీసుకొస్తారో లేక  కన్నడ దేశం లో ప్రబలిన జైనుల ఆత్మహింస [self molestation]  ఛాయ లో మరి …

 ఆ సంఘటన తర్వాత , కుమారిల భట్టు చెల్లెలు భారతీ దేవి [ ఉభయ భారతి ] కి వర్తమానం చెప్పేందుకు తిరిగి  నాగభట్టు స్వదేశం వెళతాడు. ఆమె భర్త మండనమిశ్రుడు ఒకప్పుడు తనకు గురువు. వారి ఇల్లు, గృహస్థ జీవనం, విద్యాదానం, అతిథులకు సత్కారం, అభ్యాగతులకు ఆశ్రయం – ఇది జీవిత పరమ ధర్మం గా రచయిత నిరూపిస్తారు.

కాని –

కర్మ యోగానుసారి అయిన మండనమిశ్రుడు జ్ఞాన యోగాన్ని వ్యాప్తి చేసిన ఆది శంకరుల చేతిలో ఓడిపోతాడు.  గృహస్థ వానప్రస్థ ఆశ్రమాలు దాటకుండా బ్రహ్మచారి సన్న్యాసం తీసుకోవటం వేద విరుద్ధమని మండన మిశ్రుడు వాదించినా ఉపయోగం ఉండదు. బౌద్ధులకు విరుగుడు గా శంకరులు బలపరచిన మాయా వాదాన్ని ఒప్పుకోలేకపోతాడు. మధ్యస్థం వహించిన ఉభయభారతి కామశాస్త్రం లో ప్రశ్న లు అడగటమూ శంకరులు రాజు అమరుకుడి దేహం లో ప్రవేశించటమూ – ఇక్కడ , శిష్యులు వెళ్ళి హెచ్చరిస్తే గాని ఆ దేహాన్ని వదిలి రావాలని శంకరులకు తోచదు. మాయాబద్ధులయినారు కద.

    శంకరులు యువకుడు, ఎక్కువ జవసత్త్వాలున్నాయి. మండన మిశ్రుడి శరీరానికీ బుద్ధికీ కూడా వార్థక్యం వస్తోంది – అతను ఓడిపోతాడు. అలా అని భారతీ దేవే ప్రకటించవలసి వస్తుంది. మాట ఇచ్చిన మేరకు ఆయన సన్న్యాసి అయి శంకరులకు శిష్యుడవుతాడు.ఆ తర్వాత శంకరులు ఉభయభారతి ని శృంగేరి శారదాంబ గా ‘ ప్రతిష్టించారనే ‘ ఐతిహ్యం ఉంది. ఈ నవల లో భారతీ దేవి భర్త సగం లో వదిలేసి వెళ్ళిన పనిని నిబ్బరం గా పూర్తిచేసేందుకు సిద్ధమవుతుంది, అంతే.

  అనేకమైన కారణాల వలన ఒక వాదం  ఒక చోట, ఒక సమయం లో  వీగిపోవచ్చును – గెలిచినదే సత్యం అయి తీరాలని లేదు. ఈ విషయం బాహాటం గానే ప్రకటిస్తారు  రచయిత.

   అందరూ భిక్షుకులైతే భిక్ష పెట్టేవారెవరు ? అందరూ సన్న్యాసులైతే బిడ్డలను కని ప్రపంచాన్ని నడిపించేవారెవరు ? అలా కాక కొందరికే అది వర్తిస్తుందంటే దానికి ప్రచారమూ పోటీలూ దేనికి ? మేధా శక్తి ఎక్కువ ఉన్నవారిని ఆ వంక తో లోపలికి లాగితే తమ వాదం బలపడుతుందనా ? నిర్భయం గా రచయిత వేసిన ప్రశ్నలు ఇవి.

 నవల చివర లో అరబ్ ల దండయాత్ర. బలవంతపు మత మార్పిడులు జరుగుతుంటాయి. నాగభట్టూ అతని స్నేహితురాలూ ఇద్దరూ పట్టుబడతారు . అరబ్ సేనాని నాగభట్టు తో వాదిస్తాడు. ఇతను అంటాడు – ” నేను భగవంతుడున్నాడని నమ్ముతున్నానో లేదో నాకే తెలియదు. అలా కూడా ఉండేందుకు మా ధర్మం లో వీలుంది. ఎవరూ ఎందుకూ బలవంతపెట్టరు ” అని. అరబ్ ముందు ఆశ్చర్యపోయి తర్వాత హేళన చేస్తాడు – ” మీది అసలు మతమే కానట్లుందే ” అని.

  అవును.  అనాదిగా ఈ దేశంలో మతం లేదు – ధర్మం మాత్రమే ఉంది. బల ప్రయోగాలూ ప్రలోభపెట్టటాలూ ఇక్కడ పుట్టినవారూ బయటినుంచి వచ్చినవారూ  కూడా ఆ పిదపనే  చేసుకుపోయారు.

 ముగింపులో నాగభట్టును రక్షించేందుకు స్నేహితురాలు అరబ్ సేనానికి లోబడిపోయి  గర్భవతి అవుతుంది, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది.  ఇద్దరూ తప్పించుకోగలిగి గురువు దగ్గరికి వెళతారు. గురువు వారిని   వివాహం చేసుకొని గృహస్థాశ్రమం లో ప్రవేశించమనీ ఆ బిడ్డ ను నాగభట్టు బిడ్డ గానే పెంచమనీ ఆదేశిస్తాడు.

    సార్థ 1998 లో వచ్చింది. ఆవరణ ఆ తర్వాత తొమ్మిదేళ్ళకి వచ్చింది .

      స్వ స్తి.

*

                              

శకలాలూ, విడి శిబిరాలూ వద్దు: శిఖామణి

yanam1శిఖామణి.

ఆధునిక తెలుగు కవిత్వంలో వొక ప్రత్యేకమైన గొంతు. తొలి కవితా సంపుటి ‘మువ్వల చేతికర్ర’ నుంచి నిన్నటి ‘పొద్దున్నే కవిగొంతు’ కవితాసంపుటి వరకు వొక గొప్ప సాహితీయానం ఆయనది. అతనిలానే అతని కవిత్వమూ అతని కవిత్వంలానే అతనూ వుంటారు. శిఖామణి గారి కవిత్వం వివిధ భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన అనేక విమర్శనాగ్రంధాలూ వెలువరించారు. సంపాదకత్వ బాధ్యతలనూ అంతే ధీటుగా నిర్వహించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తులనాత్మక అధ్యయనకేంద్రం డైరెక్టర్ గా ఇటీవల పదవీవిరమణ చేసిన శిఖామణి గారి పర్యవేక్షణలో అనేక మంది పి.హెచ్.డి, ఎం.ఫిల్ పట్టాలు పొందారు.

ఈ నవంబర్ 26,27 తేదీలలో యానాంలో పొయిట్రీ ఫెస్టివల్ జరగనుంది. ఈ సందర్భంగా కవిసంధ్య యానాం ఫెస్టివల్ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ వుంటుంది. ఆ మొత్తం కార్యక్రమం గురించి ఆయనతో కొద్దిసేపు :

 యానాం పోయిట్రీ ఫెస్టివల్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ? ఈ ఆలోచనకు మూలం ఏమిటి ?

హైదరాబాద్ వంటి ఒకటి రెండు చోట్ల జరిగిన లిటరరీ ఫెస్టివల్స్ / పొయిట్రీ ఫెస్టివల్స్ లో తెలుగు సాహిత్యానికి గానీ కవిత్వానికి గానీ అవకాశం లేకపోవడం, వున్నా అవి ప్రాతినిధ్యం వహించేవి కాకుండా నామమాత్రంగా వుండటం చూసి బాధ కలిగించింది. కేవలం కవిత్వానికే మనమే ఒక ఉత్సవం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుండి పుట్టిందే యానాం పొయిట్రీ ఫెస్టివల్.

 యానాం పొయిట్రీ ఫెస్టివల్ అన్న పేరే ఎందుకు పెట్టారు ?

నిన్నటి వరకూ ఉమ్మడిగా ఉన్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలుగా విడిపోయింది. ఎవరి అస్థిత్వాలు, మూలాల అన్వేషణలో వారున్నారు. దీని ప్రభావం సాహిత్యంపైనా తీవ్రంగా పడింది. ఈ నేపథ్యంలో నేను పుట్టిన ఊరు యానాం పేరుతో కవితోత్సవం జరపాలని మిత్రులం అనుకున్నాం ! యానాంలో జరుగుతుంది కనుక యానాం కవితోత్సవం అనేది పేరుకే గానీ నిజానికి ఇది తెలుగు కవితోత్సవం. ఆ మాటకొస్తే భారతీయ కవితోత్సవం !

ఈ ఫెస్టివల్ నిర్వహణ ప్రధాన ఉద్దేశం ?

 లలితకళల్లో కవిత్వానిదే ప్రథమ స్థానం. తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లోనూ సమాజం పట్ల, సంఘటనల పట్ల కవిత్వానిదే ప్రథమ స్పందన. దురదృష్టవశాత్తు అస్థిత్వ ఉద్యమాల పేరుతో కవిసమూహం శకలాలు శకలాలుగా విడిపోయివుంది. ఈ శకలాలు ఎప్పటికైనా ఒకటి కావాల్సి వుంది. అందరి స్వప్నమూ ఒక సర్వోన్నత మానవుడే కనుక అది సాధ్యమే ! అందుకు ఇటువంటి ఫెస్టివల్స్ దోహదం చేస్తాయినుకుంటున్నాను.

 ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు ?

‘మానవ నాగరికత – కవిత్వం’ అనే అంశంపై ప్రముఖ కవి కె. శివారెడ్డి గారు ఫెస్టివల్ ని ఉద్దేశించి కీలకోపన్యాసం చేయబోతున్నారు. ఈ అంశం మీద ఆయన్ని మాట్లాడ్డానికి ఆహ్వానించినప్పుడు ఇంత వరకు ఇటువంటి విషయంపై మాట్లాడమని ఎవ్వరూ అడగలేదని ఆయన ఒకింత ఆనందం ఆశ్చర్యానికి లోనయ్యారు. ఒకప్పుడు తెలుగునాట ఏ పుస్తకం ముఖచిత్రం చూసినా ప్రముఖ చిత్రకారులు శీలా వీర్రాజు గారి బొమ్మ వుండేది. చిత్రకారులు సాహిత్యానికి పరోక్ష ప్రచారకులు. కానీ వారిని సాహిత్యరంగం పెద్దగా గుర్తించినట్టు కనబడదు. ఈ ఉత్సవంలో శీలా వీర్రాజు గారి చిత్ర కళా ప్రదర్శన ఏర్పాటుచేయడం జరిగింది. ప్రధానంగా సమకాలీన భారతీయ కవిత్వంపై సదస్సు – బహు భాషా కవిసమ్మేళనం, సమకాలీన తెలుగు కవిత్వంపై సదస్సు – తెలుగు కవిసమ్మేళనం నిర్వహిస్తున్నాం !

 రెండు రోజుల కార్యక్రమానికి ఎవరెవరు, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ?

 రెండు రాష్ట్రాల నుండి, తెలుగేతర రాష్ట్రాల నుండి ప్రసిద్ధులయిన కవులు, రచయితలు, విమర్శకులు చాలా మందే హాజరవుతున్నారు. కొలకలూరి ఇనాక్, మృణాళిని, తనికెళ్ల భరణి , దేవరాజు మహారాజు ( హైద్రాబాద్ ), నలిమెల భాష్కర్ ( కరీంనగర్ ), బన్న ఐలయ్య ( వరంగల్ ), మేడిపల్లి రవికుమార్ ( తిరుపతి ), ఎన్. వేణుగోపాల్, దర్భశయనం శ్రీనివాసాచార్య, యాకూబ్ ( తెలంగాణ ), తుర్లపాటి రాజేశ్వరి ( బెర్హంపూర్ ), మువ్వా శ్రీనివాసరావు, సీతారాం ( ఖమ్మం ), ఖాదర్ మొహియుద్దీన్ ( విజయవాడ ), రసరాజు రాజు, కొప్పర్తి ( తణుకు ), జి. లక్ష్మీనరసయ్య, వినోదిని, ఎం. సంపత్ కుమార్, చందు సుబ్బారావు, ఎల్. ఆర్. స్వామి, రామతీర్ధ, సుధామ వంటి అనేక మంది హాజరవుతున్నారు

 ఇతర భాషా కవులు…. ?

 నిజానికి ఇతర భాషా కవులు సదానందశాలీ, గురుమూర్తి పెండేకురు, గౌరీ కృపానందన్, డేనియల్ నెజెర్స్, జయంత్ పర్మార్, సంతోష్ ఎలెక్స్ వంటి వారిని ఆహ్వానించడం జరిగింది. అయితే ఫెస్టివల్ అనివార్యంగా నవంబర్ 19 నుండి 26 కి వాయిదా పడటం వల్ల వీరిలో ఎంత మంది హాజరవుతారో చెప్పలేను.

 ఈ కార్యక్రమంలో ఇంకేవైనా ప్రత్యేకతలు…. ?

 లేకేం ! చాలనే వున్నాయి. ‘ కవిసంధ్య – కవిత్వపత్రిక – యానాం కవితోత్సవ ప్రత్యేకసంచిక ‘ సుమారు 125 పేజీలలో వెలువడుతోంది. ఇది ఫెస్టివల్ కు ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. నా మొత్తం కవిత్వంలోంచి దళిత కవితలను ఎంచి ఒక సంకలనంగా ముద్రించి ఉత్సవ వేదిక మీద ఆవిష్కరిస్తున్నాం ! ఇంకా కవులు ప్రసాదమూర్తి, విన్నకోట రవిశంకర్, జి. వి. రత్నాకర్, నేతల ప్రతాప్ కుమార్, నేలపూరి రత్నాజీ, రఘుశ్రీ వంటి వారి కవితా సంపుటులు ఆవిష్కరించబడుతున్నాయి.

 కొత్తగా శిఖామణి సాహితీ పురస్కారం ఏర్పాటు చేసారు కదా ? దాని గురించి.. !

 గత 30 ఏళ్లుగా కవిత్వంలో వున్నాను. ఎందరో కవిత్వాభిమానుల్ని సంపాదించుకున్నాను. వారి మాటలను విన్నప్పుడు ఈ జీవితానికిది చాలు అన్నంత గొప్ప తృప్తి కలుగుతుంది. తెలుగు నాట వున్న దాదాపు అన్ని సాహితీసంస్థలు నా కవిత్వాన్ని పురస్కారాలతో సత్కరించాయి. నాకు ఇంత యిచ్చిన కవిత్వానికి నేను కూడా ఏమైనా యివ్వాలని చంద్రునికో నూలుపోగు చందాన ఈ ఏడాది నుండి ‘శిఖామణి’ సాహితీ పురస్కారం, పదివేల రూపాయల నగదు బహుమతిగా ప్రారంభించాను.

 మొదటి పురస్కారం ఎవరికిస్తున్నారు ?

 పురస్కారం ఏర్పాటు వరకే నా ప్రమేయం ! ఎంపిక కమిటీ చూసుకుంటుంది. ఈ సంవత్సరం పురస్కార కమిటీ సభ్యులుగా సుప్రసిద్ధ సాహితీవేత్తలు డా. సి. మృణాళిని, ప్రముఖ కవి యాకూబ్, కవి – కథారచయిత దాట్ల దేవదానం రాజులు ఏకగ్రీవంగా ప్రముఖ కవి కె. శివారెడ్డి గారిని ఎంపిక చేసారు. ‘శిఖామణి’ సాహితీ పురస్కారానికి ప్రధమంగా ఎంపికైన శివారెడ్డి గారికి శుభాకాంక్షలు.

 కవిసంధ్య నిర్వహణ బాధ్యత, సంచారం, వొక కొత్త పాత్రలోకి ప్రవేశం ఎలాంటి అనుభూతికి లోనవుతున్నారు ?

పాతికేళ్లుగా కవిసంధ్యను నిర్వహిస్తూ వస్తున్నాను. అయితే అది సాహిత్య సంస్థ – ఇది కవిత్వ పత్రిక. ఇష్టంగా చేసే ఏ పని అయినా కష్టం అనిపించదు. ఇదీ అంతే. ఉగాది నుండి పత్రికను తెస్తున్నాం ! మారుమూల యానాం నుండా అని సందేహించినవాళ్లు, సంశయించినవాళ్లు వున్నారు. దాన్ని పటాపంచలు చేయడానికి పత్రికను క్షేత్రస్థాయి కవిత్వ పాఠకుల వద్దకు తీసుకెళ్లడానికి ఈ ఆరునెలలూ పెద్ద సంచారమే చేసాను. సభలకు పిలిచిన చోటల్లా అడిగి మరీ కవిసంధ్య ఆవిష్కరణ పెట్టించాను. అభిమానించారు. ఆదరించారు. ఇలాంటి పత్రిక అవసరం వుందన్నారు. గోరంత పూనికతో మొదలు పెట్టిన ప్రయత్నానికి కొండంత అండనిచ్చారు. నాక్కొంచెం నమ్మకమిచ్చారు. వారందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను – ఒక రకంగా ఇది కొత్త అనుభూతి. నిన్నటి వరకు పత్రికలకు పంపి ఎదురుచూసే నాకు కవిత్వాన్ని ఎంపిక చేసి, అచ్చేసే అరుదైన అవకాశం రావడం గొప్ప ఆనందాన్ని అనుభూతిని యిచ్చింది. కవిత్వం రాయడం ఎలా కవుల బాధ్యతో, దాన్ని అచ్చేయడం పత్రికల బాధ్యత. కారణాలు ఏమైనా సరే సుదీర్ఘ నిరీక్షణ, సహనాన్ని పరీక్షించడం, కవులను ప్రమోట్ చేస్తున్నాం వంటివి తొలగిపోవాలి. కవిసంధ్య ఇటువంటి వాటికి దూరంగా వుంటుంది.

 ఆధునిక వచన కవిత్వంలో కవిసంధ్య ఎలాంటి పాత్రని నిర్వహించబోతోంది ?

 ఇప్పుడే స్పష్టంగా చెప్పలేను గానీ నాకు కొన్ని ఖచ్చితమైన ఆలోచనలున్నాయి. వచనకవిత్వం మొదలై 75 సంవత్సరాలు పూర్తి కావొస్తుంది. ఈ సందర్భంగా ప్రాతినిధ్య రచనలతో 75 సంవత్సరాల వచన కవిత సంకలనం తీసుకురావాలని వుంది. వచనకవితా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి ! అలాగే కవిత్వంలో ఒక పెద్ద తరం నెమ్మదిగా తరలి వెళ్లిపోతోంది. ఎవరో ఒకరిద్దరు తప్ప తమ రచనానుభవాలను నమోదు చేయలేదు – ‘ నా కవిత్వానుభవాలు ‘ పేరుతో ప్రముఖ అనుభవాలను రాయించాలనే ఆలోచన వుంది. ఇవి కొత్త తరం కవులకు పాఠ్యాంశాలుగా ఉపయోగపడతాయి. రకరకాల పేర్ల మారు వేషాల్లో అకవిత్వం కవిత్వంగా చలామణి అవుతోంది – విషాదం ఏమిటంటే కవితాతత్వం తెలిసిన వాళ్లే ఇటువంటి దుశ్చర్యలను ప్రోత్సహించడం – అచ్చమైన కవిత్వాన్ని పట్టి చూపడం, నిలబెట్టడం కవిసంధ్య చేయబోయే పని !

మున్ముందు కవిసంధ్య నిర్వహణలో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ?

 చాలానే వున్నాయి. కవితోత్సవం సందర్భంగా చాలా మంది ఫోను చేసి మేం రావచ్చా, పాల్గొనవచ్చా అని అడిగారు. నేను వాళ్లను అడిగిన ప్రశ్న వినడానికా ? అని – దానికి వాళ్లు ఇక్కడ శతాధిక సమ్మేళనంలో, అక్కడ 36 గంటల సమ్మేళనంలో పాల్గొన్నాం అని సమాధానం. కానీ కవి సమ్మేళనాలు కవిత్వాన్ని ప్రాక్టీసు చేసే వేదికలు కావు. వాటికి శిక్షణా శిబిరాలు అవసరం – అలాగే – అనువాద వర్క్ షాపులు నిర్వహించడం, ఆధునిక కవిత్వ పారిభాషిక పదాలతో వివరణిక రూపొందిచడం, ఎంపిక చేసిన కవుల రచనల నుండి కవితలతో ప్రాతినిధ్య కవితా సంఫుటాలను వెలువరించడం వంటి ప్రణాళికలు వున్నాయి – కాలం కలిసొస్తే ఒక్కటొక్కటి పూర్తి చేయాలని వుంది.

*

yanam

రాజ్యమా ఉలికిపడకు

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

యే దిక్కునుండో
నోట్లు రాలుతున్న శబ్దం

కన్నీళ్లు
కరెన్సీనోట్ల ముందు
మంచుగడ్డలై మౌనం వహిస్తుతుంటే
కుబుసం విడిచిన రాజ్యం
కొత్త నవ్వులు నవ్వుతుంది

గుండెల్లో
లాండ్మైనింగ్ జరుగుతున్నట్టు
కరెన్సీ నోట్ల బాంబులు

అక్కడో సగటు మనిషి
తలగడ కింద నోట్లతో
శూన్యంలోకి చూస్తూ
తిరగబడ్డ ఆకాశానికి
శాపనార్థాల రాళ్లు విసురుతున్నాడు

ఆశలని మోసిన భుజాలు
ATM ల ముందు
కనబడని శిలువతో కూలబడుతుంటే
అచ్చేదిన్ స్టాంపును వీపులపై ముద్రిస్తూ
కాషాయపు చువ్వలు

రాజ్యమా ఉలికిపడకు
నీ వోటే అది కళ్లు పెద్దవి చేసిచూడు

యే దిక్కునుండో
నోట్లు రాలుతున్న శబ్దం
కాళ్లు భూమిలో దిగబడుతుంటే
వినిపిస్తున్న దేశభక్తిగీతం.

*

వాళ్ళు ..

Art: Satya Srinivas

Art: Satya Srinivas

 

 

*

 

ఇన్నాళ్లూ ఏమైపోయావ్‌?

 

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

 

 

ఇన్నాళ్లూ ఏమైపోయావ్‌

ఒకరి స్వేదాన్ని

ఒకరు చిందిస్తున్నవేళ అడుగుతుందామె

చేపలా మెలికలు తిరుగుతాడతను

నాకు పెద్ద చేపలంటే ఇష్టం, కానీ ఆర్నెళ్లే

తర్వాత రుచి ఉండవు అంటుందామె

ఎందుకలా

పాత్రలతో అనవసరమైన చప్పుళ్లు అంటాడతను

కాపీకప్పులో అలసటను ఊదేస్తూ

ఇది

నాజీవితానికి సింబాలిజం అంటుందామె

ఫోన్‌ పక్కనపడేస్తూ

గాంధీని చదవాలోయ్‌ …

అబద్ధమెంత రుచికరమో తెలుస్తుంది-

లౌక్యంగా నవ్వేస్తుందామె.

 

 

వేయి ప్రశ్నల ‘పడగలు’

 ‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-3

 

sudrarsanamవిశ్వనాథ భావజాలానికి ఆర్.ఎస్ సుదర్శనం ‘బాహ్యమిత్రు’డే కాక’, ఇంగ్లీషు చదువుతో భారతీయేతర గవాక్షం నుంచి దానిని చూసి అర్థం చేసుకోడానికి ప్రయత్నించిన వ్యక్తి అన్న సంగతిని మరోసారి గుర్తుచేసుకుని ‘వేయిపడగల’కు వద్దాం.

వేయిపడగలు ఆయనకు పెద్ద పజిల్ గా మారింది. అనేక ప్రశ్నలు, సందేహాలతో పాటు చికాకునూ కలిగించింది. ‘ఏకవీర’లో కనిపించిన తాత్విక పటిమ కానీ, స్పష్టత కానీ ఆయనకు అందులో కనిపించలేదు.

‘నేతి నేతి’ అనే పద్ధతిలో ఆయన పరిశీలన ఇలా సాగుతుంది:

“వాఙ్మయమనగా నేమి?” అని ప్రశ్నించి చివరగా, “కావ్యాత్మయే కాక, కావ్యశరీరము, కావ్యస్వరూపము కూడా నీ జాతి సిద్ధాంతముల మీద నాధారపడియుండును…” అన్న విశ్వనాథ వారి వివరణను తీసుకుని, కావ్య శరీరము, కావ్యాత్మ వేయిపడగలులో ఎలా అనుసంధింపబడ్డాయో సుదర్శనం పరిశీలించారు. ముందుగా కావ్యాత్మను తీసుకుంటే, నవలలోని పాము- అంటే కథాస్థలమైన సుబ్బన్నపేటలో జమీందారు కట్టించిన ఆలయంలో,  బ్రాహ్మణుడు ప్రతిష్టించిన సుబ్రహ్మణ్యేశ్వరుడు హిందూ వ్యవస్థాధర్మానికి ప్రతీక.  దానికి అతీతమైన, మౌలికమైన సనాతన ధర్మానికి అక్కడే ప్రతిష్టితమైన శివలింగం, లేదా నాగేశ్వరస్వామి ప్రతీక. కథా ప్రారంభంలో రచయిత ఈ ఇద్దరు దేవుళ్ళకు(అంటే వ్యవస్థాధర్మానికీ, సనాతన ధర్మానికీ)భేదం పాటిస్తాడు. కానీ ఆ వెంటనే మొదలుపెట్టి, రచన అంతటా రెంటికీ మధ్య అభేదాన్ని పాటించాడు. ఈ విధంగా, ఏకవీరలో ఉన్న తాత్విక స్పష్టత వేయిపడగలులో ముందే లోపించింది.

పోనీ వ్యవస్థాధర్మంతో అభేదం పొందిన ఆ సనాతనధర్మ నిరూపణే కావ్యాత్మ అవుతుందా? ఆ నిరూపణ ఇందులో చిత్రితమైన పాత్రల ద్వారా జరగాలి. ఇందులోని ముఖ్యపాత్ర ధర్మారావు. అతను ధర్మానికి ప్రతినిధి అని రచయిత ఉద్దేశం. అయితే, ధర్మారావు ఏ ధర్మానికి ప్రతినిధి; వ్యక్తి ధర్మానికా, వ్యవస్థాధర్మానికా, సనాతనధర్మానికా అని ప్రశ్నించుకుంటే  సంతృప్తికరమైన సమాధానం దొరకదు.  రచయితేమో, అతను సనాతనధర్మాన్ని దర్శించిన జ్ఞాని, వ్యవస్థాధర్మానికి సాధికారవ్యాఖ్యాత, లోకవ్యవహారానికి సాక్షీభూతుడు అంటాడు. అతనిది ఆజన్మ సిద్ధమైన జ్ఞానమార్గమనీ; భక్తి, కర్మమార్గాలను అనుసరించేవారికి కూడా అతను గురువనీ అంటాడు.

కానీ అతని నడవడి చూద్దామా అంటే ఇవేమీ కనిపించవు. అతను ఏకవీరలా సాధకుడు కాడు. అతనిలో సందేహాలూ, సంఘర్షణలూ లేవు. అయినా అతన్ని సనాతనధర్మాన్ని దర్శించిన జ్ఞాని అని రచయిత ఎలా (పూర్వజన్మ సుకృతం వల్ల కాబోలని సుదర్శనంగారి వ్యంగ్యం)అన్నారో? ఇక లోకవ్యవహారానికి సాక్షీభూతుడు అయ్యే నిర్లిప్తత అతని మనస్తత్వంలోనూ లేదు, దానిని సాధించే పరిస్థితులు అతని జీవితంలోనూ లేవు. ఆపైన అతనిలో ఎంతసేపూ లోకవిమర్శ తప్ప ఆత్మవిమర్శ లేదు. స్వోత్కర్ష మాత్రం కావలసినంత. జ్ఞానమార్గంలో అతను పొందిన పరిణామ మేమిటో రచయిత ఎక్కడా చెప్పలేదు. పైగా అతనిలో హిందూ వ్యవస్థా ధర్మానికి తనే వ్యాఖ్యాతా, సొంతదారు ననే విపరీత అహంకారం.

ధర్మారావు కర్మయోగి, జ్ఞానయోగి అయితే, కొత్త కొత్త పద్ధతుల మీద; జీవిత విధానాల మీద అంత ద్వేషభావం దేనికి? అది జిజ్ఞాసువు లక్షణం కాదు. అతనిలో సమన్వయ దృష్టిలేదు. అతనికి కొత్త ఒక రోత పాత ఒక నీతి. మారుతున్న పరిస్థితులలో కూడా హిందూధర్మం సృజనాత్మక శక్తే నని నిరూపణ చేసే ఉద్దేశమే నవలకు ఉన్నట్లైతే ధర్మారావు సృష్టి మరొక విధంగా ఉండేదన్న సుదర్శనం, ఇక్కడ కూడా ‘మాలపల్లి’తో పోలిక తెస్తారు. ధర్మారావుకు భిన్నంగా ‘మాలపల్లి’ నవలలోని సంగదాసు, రామదాసులు పాత కొత్తల సంగమస్థానంగా, మేలు కలయికగా కనిపిస్తారు.

కనుక కావ్యాత్మ సనాతనధర్మ నిరూపణ కాదు. సనాతన, వ్యవస్థా, వ్యక్తి ధర్మాల మధ్య స్పష్టమైన తేడాను పాటిస్తూ వీటి మధ్య సంబంధాన్ని నిరూపించే తాత్వికదృష్టిని వస్తు విన్యాసంలో రచయిత పాటించలేదు.

పోనీ  వ్యవస్థాధర్మనిరూపణ కావ్యాత్మ అవుతుందా? రచయిత చెప్పినట్టు వ్యవస్థ నాలుగు స్తంభాల ధర్మమంటపం. స్వామి(భగవంతుడు), రాజు, బ్రాహ్మణుడు, గణాచారి(కాలం)…ఈ నలుగురూ నాలుగు స్తంభాలు. స్వామి, ప్రభువు, ధర్మారావు(ధర్మం)ల మధ్య అభేద తాదాత్మ్యం.  ధర్మాచరణ రాజు కర్తవ్యం, ధర్మప్రచారం బ్రాహ్మణుని కర్తవ్యం. పసరిక పైరుపచ్చకు ప్రతీక, దేవదాసి శృంగారయుతమైన భక్తిమార్గం, హరప్ప వైదిక కర్మానుష్ఠానం, గోపన్న సేవావృత్తి. ఇదీ వ్యవస్థకు చెందిన అవయవ విభాగం. ఈ వ్యవస్థకు కేంద్రంలో ధర్మారావు. ఈ ధర్మారావు ఎటువంటి వ్యక్తో పైన కొంత చెప్పుకున్నాం. మరికొన్ని విషయాలు తర్వాత చెప్పుకుందాం.

జమీందారు, అంటే రాజువైపునుంచి, ధర్మాచరణలో జరిగిన ఒక లోపంతో నవల ప్రారంభమవుతుంది. ధర్మారావు తండ్రి రామేశ్వరశాస్త్రి మాసికాన్ని జమీందారు నిర్లక్ష్యం చేస్తాడు. ధర్మారావు రుణగ్రస్తుడైనట్టు సేవకుడు గోపన్న వెళ్ళి చెప్పిన తర్వాతే తండ్రి మాసికానికి ధర్మారావుకు జమీందారు డబ్బు ఇస్తాడు. ముందే తెలుసుకోకపోవడం జమీందారు ధర్మాచరణలో జరిగిన లోపం. అందుకే అతనిని కలలో వేయిపడగల పాము కాటువేసి శిక్షిస్తుంది.  ఇక్కడ ధర్మాచరణ సమ్యక్ స్వరూపం మనకు ఏం తెలిసినట్లు అని సుదర్శనంగారి  ప్రశ్న.

రచయిత చిత్రీకరణ ప్రకారం, “రామేశ్వరశాస్త్రి వర్ణాశ్రమధర్మముల ముద్దకట్టిన మూర్తి, భారతదేశము యొక్క ఆత్మ, త్రయీధర్మవిద్య కొక వ్యాఖ్యానము.” మరోవైపు, రామేశ్వరశాస్త్రి అందగాడు, రసికుడు, దేశము నాలుగుమూలలా తిరిగివచ్చినవాడు. ఆయన వితరణ బుద్ధి హద్దులేనిది. జమీందారు తర్వాత జమీందారు. నాలుగువర్ణాల ఆడబడుచుల్నీ పెండ్లాడి ఒక భోగాంగనను చేరదీసినవాడు.  ఇలాంటి వాడు భోగి కానీ యోగి ఎలా అవుతాడని సుదర్శనంగారి ఆక్షేపణ. “వర్ణాశ్రమధర్మాల ముద్ద కట్టిన మూర్తి” గా రచయిత  చిత్రించిన రామేశ్వరశాస్త్రి గృహస్థుగానే మరణించాడే, మరి ఆయన పాటించిన ఇతర ఆశ్రమధర్మాలు ఏమిటన్నది ఆయన లేవనెత్తిన మరో ప్రశ్న. అలాగే రామేశ్వరశాస్త్రి చేసుకున్న వర్ణాంతరవివాహాలపైనా అనేక ప్రశ్నలు. అవి వర్ణధర్మాన్ని సమర్థిస్తున్నాయా అంటే, సమర్ధించడంలేదు. అవి నేటి వర్ణవిభేదాలకు పరిష్కారం సూచిస్తున్నాయా అంటే ఆ పరిష్కారం ఎంతమందికి నచ్చుతుంది? దాని యథార్థ స్వరూపం ఏమిటి? ఇలా వ్యవస్థా నిరూపణ ‘ఆదర్శం’ నుంచి ‘యాథార్థ్యం’లోకి దిగివస్తుందంటారు సుదర్శనం.

veyi

ధర్మారావు ‘బ్రాహ్మణత్వం’ అన్న ఆదర్శానికి ఎటువంటి సమర్థన అన్నది ఆయన సంధించిన మరో ప్రశ్న. బ్రాహ్మణత్వం అంటే కేవలం ‘ధర్మప్రచార’మేనా? ఈ విధంగా తర్కిస్తే నవలలో వ్యవస్థా ధర్మ నిరూపణం అసంతృప్తినే కలిగిస్తుంది. ఆకృతి(Form)కి తగిన పుష్టి(Substance) జరగలేదని అనిపిస్తుంది. అంతిమంగా చెప్పాలంటే,  నవలలో రచయిత సమర్థించబూనుకున్న వ్యవస్థకు అసలు ఉనికే లేదు– ఇదీ సుదర్శనంగారి నిర్ధారణ.

మొత్తానికి ఆయనకు ఇదొక  పెద్ద చిక్కుముడి. విశ్వనాథవారి మాటలను పట్టుకుని ఇందులో కావ్యాత్మ సనాతన ధర్మమా, లేక హిందూవ్యవస్థా ధర్మమా అన్నది వెతకబోతే ఆ దారి ఇలా మూసుకుపోయింది. “ఏతావాతా తేలే దేమిటంటే: హిందూ వ్యవస్థ యొక్క ఆదర్శాన్నీ, దాని పటుత్వాన్నీ నిరూపించే ఉద్దేశమే ‘వేయిపడగల’ కావ్యాత్మ అనటానికి, పాత్రచిత్రణమూ, కథాగమనమూ, దాని స్ఫూర్తీ  అందుకు భిన్నంగా ఉన్నా” యన్న నిర్ధారణకు వచ్చారు.

మరి ఇప్పుడేం చేయాలి? దారి మార్చుకోవాలి!

రామేశ్వరశాస్త్రి ‘వర్ణాశ్రమ ధర్మాలు ముద్దకట్టిన మూర్తి’ కాకపోతేనేం, అతనొక ఉత్తముడైన మానవుడే. ఆయన కానీ, ధర్మారావు కానీ ఆనాటి బ్రాహ్మణవర్గానికి ఏవిధంగానూ ప్రతినిధులు కాకపోతేనేం, తమలోని మానవత్వానికీ(సుదర్శనంగారు ఈ మాటను మానుషత్వం అనే అర్థంలో వాడినట్టుంది), దాని విశిష్టతకూ ప్రతినిధులు. అలాగే, అందులోని మిగిలిన పాత్రలు కూడా. “వారిలో ప్రకాశితమవుతున్నది వ్యక్తిగతమైన విశిష్టతే! ఇటువంటి వ్యక్తుల ద్వారా సమకాలీన సమాజంలోని వర్ణవిభేదాలను, వర్గీకరణను సమంజసమని సమర్థించడం ఎట్లా? నవలలో ధర్మారావు ద్వారా జరిగే వ్యాఖ్యానానికి, సమర్థనకూ ఈ దోషం సర్వత్రా ఉంది. అందువల్ల నవలలో వాచ్యముగా జరిగినంత మేర వ్యవస్థ నిరూపణము యాథార్థ్యం దృష్ట్యా జరగలేదనే చెప్పాలి” అని సుదర్శనంగారి తీర్మానం.

ఇలా ‘వేయిపడగలు’ కావ్యాత్మ సనాతన ధర్మ నిరూపణమా, లేక వ్యవస్థా ధర్మ నిరూపణమా అన్న విచికిత్స నుంచి బయటపడిన సుదర్శనంగారు, చివరికి అది ‘ధర్మారావు జీవిత చరిత్ర’ అని తేల్చారు. అది అతని మనస్థితికీ, ఆ మనస్థితికి కారణాలైన సాంఘికపరిస్థితులకూ దర్పణం అన్నారు. కనుక నవల కావ్యాత్మ ధర్మారావు వ్యక్తిత్వమే! సనాతనధర్మమో, హిందూ వ్యవస్థా ధర్మమో కావ్యాత్మ అనుకోవడం వల్ల వాటి నిరూపణ అసంతృప్తిని కలిగించి విమర్శలను రేకెత్తిస్తోంది కానీ, ఇలా దృష్టి మార్చుకుని, నవల కావ్యాత్మ ధర్మారావు వ్యక్తిత్వమే అనుకుని చూసినప్పుడు చిక్కుముడి విడిపోతుంది…. సనాతనధర్మం, హిందూ వ్యవస్థా ధర్మం అనేవి ఇందులో గౌణమే తప్ప ప్రధానం కావు. అవి ధర్మారావు అనే వ్యక్తి మనస్తత్వం ద్వారా మనకు దృశ్యమానమవుతున్నాయి. ఆ మనస్తత్వంలోని వక్రత, సంకుచితత్వం వాటిలోనూ దృశ్యమానమవుతున్నాయి…

ఇలా అనుకున్న సుదర్శనంగారు, ఇక్కడ చేసింది ఒకవిధమైన శస్త్రచికిత్స. తల్లి ప్రాణాన్ని కాపాడలేకపోయినా కనీసం బిడ్డనైనా కాపాడే ప్రయత్నం లాంటిది. విశ్వనాథ లక్షించిన వ్యవస్థాధర్మ నిరూపణ లేదా స్వీయ భావజాలం అనే ‘తల్లి’ నుంచి, ‘పాత్రలు’ అనే బిడ్డను వేరు చేసి వాటిని స్వతంత్ర జీవంతో నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో తల్లిని పక్కన పెట్టేశారు. అప్పుడిక ఆ పాత్రలలో ఎలాంటి వైరుధ్యాలు, వైపరీత్యాలు ఉన్నప్పటికీ అవి వ్యక్తిగతమైనవే తప్ప వ్యవస్థకు సంబంధించినవి కావు. ఇలా పాత్రల ముఖంగా చూసినప్పుడు విశ్వనాథ ఆదర్శం సార్వత్రిక హిందూ వ్యవస్థాధర్మాన్ని చిత్రించడం కాదు, తెలుగు దేశాన్ని, తెలుగుదనాన్ని చిత్రించడం!

ఇలా సుదర్శనంగారి ప్రకారం, నవలలో సుబ్బన్నపేటే తెలుగుదేశం. సుబ్బన్నపేట అంటే ధర్మారావు. ఇది కావ్యశరీరం. ధర్మారావు పాత్ర సమర్థించినది క్రమంగా అదృశ్యమవుతున్న గ్రామీణమైన తెలుగుదనాన్ని. ఆంగ్లభాషా, పాశ్చాత్య నాగరికతా సోకని తెలుగుదనం నిలబడలేదనే అతని ఆవేదన. అందులో లోటుపాట్లు అతనికి కనిపించవు. అదంతా హిందూధర్మ స్వరూపమే నని అతను భ్రమపడతాడు. దాని సమర్థనకోసం తను అహంభావం పెంచుకున్నా ఫరవాలేదనుకుంటాడు. తరచు భావం కంటే అహంభావమే అతనిలో ముందుకు వస్తుంది. రైలు మార్గాలు, ఎలక్ట్రిసిటీ, ఫ్యాక్టరీలు, డబ్బు చలామణి, శారదా చట్టం, వితంతు వివాహాలు, హరిజనుల ఆలయప్రవేశం సహా అన్నిటినీ వ్యాఖ్యానిస్తాడు. అన్నిటినీ వ్యతిరేకిస్తాడు. ఇంగ్లీషు చదువుకుంటాడు, కానీ ఇంగ్లీషును ద్వేషిస్తాడు. తండ్రి మాసికానికి జమీందారు దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు, “నేను యాచించలేదు…ఆయనయే ఇచ్చెను” అని, భంగపడిన ఆహాన్ని సమర్థించుకుంటాడు. “అతనిలో స్వాభిమానము మెండు, దానికి బాధాకరమైన సత్యాన్ని దర్శించే చొరవ, సాహసం అతనిలో లేవు. ఆ పరిస్థితిలో సత్యరూపాన్ని భిన్నంగా తనకు అనుకూలంగా దర్శించే ప్రయత్నం చేస్తాడు. అందువల్లనే అతని ప్రవర్తన కూడా సమయానుకూలంగా ఉంటుంది” అని సుదర్శనంగారి వ్యాఖ్య.

ధర్మారావు అబద్ధం ఆడడానికి కూడా వెనుకాడడు. తను చదువుతున్న కళాశాలలో క్రైస్తవ విద్యార్థులు హిందూ మతాన్ని అవమానించినప్పుడు హిందూ విద్యార్థులు చేసిన సమ్మెలో అతను పాల్గొనడు. “ఎదిరించి నీ వేమైన చేయగలవా?”అని ఉపదేశిస్తాడు. ఇక్కడ సుదర్శనంగారి వ్యాఖ్య ఇలా ఉంటుంది: “ఇక్కడ ధర్మరక్షణ కంటే ఆత్మరక్షణ ప్రధానమైనది! ధర్మారావునకు హిందూ ధర్మముతో తాదాత్మ్యము, అది తనకు ఉపయోగపడునంతవరకే. దానికి తాను ఉపయోగపడవలసి వచ్చినప్పుడు వాగ్వాదము, వ్యాఖ్యానము కావలసినంత! ఇక్కడ అసలు విషయం, జమీ లేకపోయినా ధర్మారావు జమీందారు బిడ్డ. కష్టములను ఎదుర్కోవడం కంటే వాటిని తప్పించుకోవడమే అతని స్వభావం.”

ధర్మారావు కవి, భావుకుడు కూడా. తను కష్టపడి సాధించగలిగినదేమీ అతనికి మిగిలినట్లే తోచదు: ధర్మార్థకామమోక్షాలనే పురుషార్థాలలో ధర్మారావు ఇటు అర్థం కోసం కానీ, అటు మోక్షం కోసం కానీ ప్రయత్నం చెయ్యడు. తనే ధర్మావతారం. పెళ్లి చిన్నతనంలోనే జరగడంవల్ల కామానికి ఇబ్బంది లేదు. ఇక సాధించవలసిందేమిటి? లోకానికి గురువు కావడం! ధర్మారావు గురుత్వం వహించని, సలహా ఇవ్వని అతనితో సంబంధం లేని పాత్రలేదు. ఏ విధంగానైనా అతనికి సమవుజ్జీయో, అధికుడో అయ్యే పాత్ర కనిపిస్తే అతనికి నవలలో చరిత్రే లేదు. వాదంలో ధర్మారావు ముందు ఓడిపోనివారు లేరు. తన గొప్పదనాన్ని గుర్తించని వారి మీద రౌడీలను పురిగొల్పడానికి వెనుదీయడు. ఇక అతని పనేమిటన్నది చూస్తే, స్వామికి ఉత్సవాలు జరిపించడం తప్ప ఏమీ చేయడు. ధనవంతురాలు, ‘పతిత’ అయిన మంగమ్మతో అతనికి ‘రహస్య’ సంబంధం. భార్య అనారోగ్యంతో ఉన్నా, మంగమ్మ ఇంటికి వెళ్ళి ఆలస్యంగా ఇంటికి వస్తుంటాడు.

సుదర్శనంగారి ప్రకారం, తులనాత్మకంగా చూస్తే, ధర్మారావుతో పోల్చగల పాత్ర రవీంద్రుని గోరా. కానీ ఇద్దరి వ్యక్తిత్వాలలో ఎంతో తేడా. ధర్మారావులానే హైందవవాది అయిన గోరా, చివరికి ‘సర్వ ధర్మాన్ పరిత్యజ్య ‘ అన్నట్టుగా, “నేనీరోజున భారతీయుడిని. హిందువు, ముస్లిము, క్రైస్తవుడు…ఎవరైనా కానీ, నాలో ఇప్పుడు ఎలాంటి మతఘర్షణా లేదు. ఈ రోజున భారతదేశంలోని అన్ని కులాలూ నా కులమే” అనుకునే స్థితిని చేరుకుంటాడు. కానీ ధర్మారావుకు సర్వధర్మాలూ తనే నన్న భావము. అతను అసలు పయనించనే లేదు, గమ్య స్థానం చేరుకోవడమెక్కడ? ఈ భేదమే రవీంద్రుని విశ్వకవిని చేస్తే, ఆయన కంటే ప్రతిభావంతుడైన విశ్వనాథను తెలుగు కవిసమ్రాట్ గానే నిలిపిందని సుదర్శనంగారి వ్యాఖ్య. “‘నౌకాభంగము’ నుంచి ‘గోరా’వరకు రవీంద్రుడు ఎన్ని మెట్లు పైకి ఎక్కెనో, ‘ఏకవీర’నుంచి ‘వేయిపడగల’వరకు విశ్వనాథ అన్ని మెట్లు క్రిందికి దిగెను” అన్నది ఆ వెంటనే ఆయన చేసిన మరో కీలకమైన వ్యాఖ్య.

ఇలా ధర్మారావులోని లక్షణాలను సుదర్శనంగారు ఎత్తి చూపుతూనే, అతను ఆదర్శప్రాయుడు కాకపోతేనేం, “రాగద్వేషాలూ, రక్తమాంసాలూ, కష్టసుఖాలూ కలిగిన మనిషి. అచ్చమైన తెలుగువాడు. వ్యవస్థా ధర్మానికి, యోగమార్గానికి ప్రతినిధిగా తృప్తి కలిగించకపోయినా తెలుగుదనం ముద్దకట్టిన మూర్తి ధర్మారావు” అంటారు. ఆయన దృష్టిలో, (‘ఏకవీర’కు ఉన్నట్టు)’వేయిపడగలు’కు ఒక తాత్విక దృక్పథం ఆలంబనంగా లేకపోవచ్చు, కానీ అది కాల్పనికోద్యమకాలంలో వెలువడిన ఆత్మాశ్రయకవిత్వ శాఖలో ఒక అపురూపమైన కావ్యం. తెలుగుదేశంలో శిథిలమై అదృశ్యమవుతున్న పూర్వ నాగరికత చివరి మెరుగుల్ని చూచిన విశ్వనాథ హృదయం సంక్షోభించి వెలువడిన సుదీర్ఘ నిశ్వాసమే వేయిపడగలు. అది ఒక వైయక్తిక హృదయోద్వేగం. అంతేకాదు, సుదర్శనంగారి దృష్టిలో వేయిపడగలు, డి. హెచ్ లారెన్స్ నవల The Rainbow తో పోల్చదగింది కూడా.

***

ఈవిధంగా సుదర్శనంగారు వ్యవస్థాధర్మ నిరూపణం అనే ‘తల్లి’ నుంచి ‘పాత్రలు’ అనే బిడ్డను వేరు చేయడమే కాదు; రచనను  వైయక్తిక హృదయోద్వేగాన్ని చాటే గొప్ప సాహిత్యప్రతిపత్తి కలిగిన ఆత్మాశ్రయకావ్యస్థాయికి ఎత్తి సహృదయతను నిరూపించుకున్నారు. నవలలో ప్రకటితమైనది ధర్మారావు అనే వ్యక్తి మనస్తత్వంలోని వక్రత, సంకుచితత్వాల మూసలోంచి వ్యక్తమవుతున్న  హైందవవ్యవస్థా ధర్మమే తప్ప అదే అసలు హైందవధర్మం కాదన్న భావనను ధ్వనింపజేశారు. అంటే, ఇందులో ప్రకటితమైన హైందవ ధర్మ, తాత్వికతలకు భిన్నమైన హైందవ ధర్మమూ, తాత్వికతా వేరే ఉన్నాయని ఆయన భావించారన్నమాట.

అలా భావించడంలో సుదర్శనంగారి ‘బాహ్యతా’, ‘మిత్రతా’ కూడా వ్యక్తమవుతున్నాయా?!

(సశేషం)

సిరివెన్నెల శివదర్పణ గీతం!

 siva

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు గొప్ప గీతరచయితలే కాక గొప్ప శివభక్తులు కూడా. తమ గురువు గారైన సద్గురు శివానందమూర్తి గారి ఆశీస్సులతో శివునిపై వేయి గీతాలు రాయాలని సంకల్పించారు. ఈ గీతాలలో కొన్ని “శివదర్పణం అనే పుస్తకంగా వచ్చాయి. ఈ పుస్తకంలోని పాటలు కొన్ని  రెండు ఆడియో క్యాసెట్లుగానూ వచ్చాయి. ఈ గీతరచనా సంకల్పం గురించి “శివదర్పణం”లో సిరివెన్నెల ఇలా చెప్పారు –

“అడగకుండానే, శ్రమించి సాధించకుండానే, మాటల్ని పాటల పేటలుగా కూర్చే చిన్ని విద్దెను పుట్టుకతోనే ఇచ్చిన పరాత్పరుడి కరుణాకటాక్ష వరానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, బతుకుని అర్థవంతం చేసుకుని తరించే అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అనిపించడమే శ్రీకారంగా, ఈ గీతాయజ్ఞం 1990లో ప్రారంభించాను. వెయ్యి పాటల్నీ వెయ్యి యజ్ఞాలుగా చేసి, సహస్రమఖ పూర్తి సిద్ధి పొంది, తద్వారా లభించే దేవేంద్రత్వాన్ని, దేవదేవుని సేవేంద్రత్వంగా మలచుకోవచ్చని అత్యాశ కలిగింది!”

ఆయన అత్యాశ మన పాలిటి వరమై, అద్భుత సాహితీ యజ్ఞమై నిలిచింది! ఈ పుస్తకంలో ఉన్న ప్రతిపాటా ఆణిముత్యం. భక్తిగా సిరివెన్నెల తనని తాను శివునికి అర్పించుకున్న విధానం మనసుని స్పందింపజేస్తుంది. ఈ పాటల్లో ఆయన వాడిన భాషని చూస్తే సిరివెన్నెల ఎంత పదసంపద కలవారో తెలుస్తుంది. సినిమా పాటల కోసం తనని తాను భోళాశంకరునిగా మలచుకున్నారే తప్ప ఆయనో మహోన్నత కైలాస శిఖరమని అర్థమవుతుంది!

“శివదర్పణం” అంటే శివుణ్ణి చూపించే అద్దం. అయితే సిరివెన్నెలకి శివుడంటే క్యాలెండర్ లో కనిపించే దేవుడు కాదు. శివుడంటే మనం, శివుడంటే సమస్తం! ఆయన మాటల్లోనే చెప్పాలంటే –

“జగత్తు మొత్తాన్నీ త్రికాలసమేతంగా సాకల్యంగా సజీవంగా సంక్షిప్తంగా ప్రతిబింబించే అద్దం మనం! అలాగే మనకీ ప్రపంచం అద్దమవుతుంది. అయితే మనలా సూక్షంగా లేదే? మన భౌతిక తత్త్వాన్ని సరిగ్గా మన పరిమాణంలోనే ప్రతిబింబించేలా ప్రపంచాన్ని కుదించగలమా? అలా కుదిస్తే ఆ అద్దం శివుడు అవుతుంది. శివుడంటే ప్రపంచమే! శివుడంటే మనమే! శివుణ్ణి సరిగ్గా చూడగలిగితే మనని మనం సరిగ్గా, సజీవంగా, సంపూర్ణంగా, చూడగలం. అలాంటి శివదర్పణాన్ని చూపించడమే నా ఉద్దేశ్యం!”

ఆయనిలా చక్కగా చూపించినా, అర్థమయ్యేలా వివరించినా, శివతత్త్వాన్ని గ్రహించడానికి చాలా సంస్కారం, జ్ఞానం ఉండాలి అనిపిస్తుంది. అయినప్పటికీ ఈ సిరివెన్నెల గీతధారలో తడిసే ఆనందం దక్కాలంటే మాత్రం హృదయం ఉంటే చాలు. అందుకే ఈ పుస్తకంలోని ఒక పాటని పరికించి పులకిద్దాం!

sirivennela

“తొలిజోత” అనే పేరుతో రాసిన ఈ గీతం పుస్తకంలో మొదటిది. శివదర్పణ యజ్ఞాన్ని మొదలుపెడుతూ వినాయకునికి ప్రార్థనగా రాసిన గీతం.

పల్లవి:

 

అగజాసూనుడు అందునట అఖిలజగమ్ముల తొలిజోత

ఆ గజాననుని ఆదిపూజగొను అయ్యకు అంకిత మౌగాత

నా తలపోత! కైతల సేత!

 

చరణం 1:

హేరంబుని కాద్యభివందనమిడి ఆరంభించుట చేత ప్రతిచేత

ఆ లంబోదరు ఆలంబనతో అవిలంబితమౌనంట!

అందుచేత నేనందజేతునా చంద్రజేత చేత శతవందనముల చేత

అవిఘ్నమ్ముగా చేర్చునంట గణపతి తన అంజలి వెంట

ఈ నా తరగని యద చింత, నా ఈశుని పదముల చెంత!

 

చరణం 2:

శంభుని సన్నుతి సంకల్పించితి గణుతించిక స్వీయార్హత ఒక రవ్వంత

స్కందపూర్వజుని శరణు వేడితిని అందించడ దయచేత చేయూత

అజాతుడు అచింత్యుడు అనంతుడు అమేయుడౌ పరమాత్ముని ప్రభుత ప్రకటించే నా అల్పజ్ఞత

శర్వసర్వమంగళాశంసనకు అర్హమయే ఆశంతా

తీర్చును ఆ గణనేత తన అపారమౌ కృపచేత

 

చరణం 3:

సంచిత సుకృత సంభూతమ్మౌ సుసంకల్ప సంకలిత శివకవిత

కవింకవీనామను గణననుగల సిద్ధి వినాయకు చేత పరిపూత

శివాజ్ఞ ఎరుగని నా అవజ్ఞ ఆ విద్యాదినాధునిచేత అవనతమొందును గాత

సింధురాస్యునికి స్వాధీనమ్మై సిద్ధి సాధకమ్మవుగాత

అఘమర్షణమై అలరారుత ఈ శివకీర్తనముల సంహిత!

 

అగజాసూనుడు అందునట అఖిలజగమ్ముల తొలిజోత

ఆ గజాననుని ఆదిపూజగొను అయ్యకు అంకిత మౌగాత

నా తలపోత! కైతల సేత!

 

విఘ్నేశ్వర స్తుతిలోనూ తెలివిగా శివుణ్ణి ప్రస్తుతించారిక్కడ సిరివెన్నెల! “అగజాసూనుడు” అంటే పార్వతీ (అగజా) తనయుడైన (సూనుడు) వినాయకుడు! అఖిల జగాలూ ఏ పని చేసినా ముందుగా దణ్ణం పెట్టుకునేది వినాయకునికి! మరి ఆ వినాయకుడు భక్తిగా తొలిపూజ చేసేది ఎవరికి అంటే శివుడికి! ఆ శివుడికి సిరివెన్నెల తన గీతాలను అంకితం ఇస్తున్నారు. ఈ శివదర్పణ కృతి సిరివెన్నెల మేధలోంచి జాలువారిన  కవితామృతధార! ఆ తలపోత, కైతలసేత పొందే ధన్యత మనది!

 

హేరంబుని కాద్యభివందనమిడి ఆరంభించుట చేత ప్రతిచేత

ఆ లంబోదరు ఆలంబనతో అవిలంబితమౌనంట!

అందుచేత నేనందజేతునా చంద్రజేత చేత శతవందనముల చేత

అవిఘ్నమ్ముగా చేర్చునంట గణపతి తన అంజలి వెంట

ఈ నా తరగని యద చింత, నా ఈశుని పదముల చెంత!

 

వినాయకుడికి (హేరంబుడు) తొలి వందనాలు చేసి మొదలుపెట్టిన ఏ పనైనా ఆయన ప్రాపు (ఆలంబన) వల్ల విఘ్నాలు లేకుండా వేగంగా (అవిలంబితము) సాగుతుంది. ఇక్కడ సిరివెన్నెలకి అవ్వాల్సిన పని వేయి గీతాలు పూర్తిచెయ్యడం కాదు. ఆ గీతాల ద్వారా తాను చేసిన శత వందనాల చేష్టని (శత వందనముల చేత) ఆ శివుని చెంతన చేర్చడం!  ఇది తన వల్ల అయ్యేది కాదు కనుక చంద్రజేత అయిన వినాయకుని శరణుకోరుతున్నాను అంటున్నారు! ఆ వినాయకుడు శివుడికి రోజూ అర్పించే వందనాల (అంజలి) వెంట సిరివెన్నెల యొక్క  హృదయభారాన్నీ తీసుకెళ్ళి ఆ పరమేశ్వరుని పాదాల చెంత అర్పించాలట! ఎంత చక్కని భావం!  చేత/జేత వంటి పదాలతో శబ్దాలంకారాలు చేస్తూనే గొప్ప అర్థాన్నీ సాధించారిక్కడ సిరివెన్నెల!

 

శంభుని సన్నుతి సంకల్పించితి గణుతించిక స్వీయార్హత ఒక రవ్వంత

స్కందపూర్వజుని శరణు వేడితిని అందించడ దయచేత చేయూత

అజాతుడు అచింత్యుడు అనంతుడు అమేయుడౌ పరమాత్ముని ప్రభుత ప్రకటించే నా అల్పజ్ఞత

శర్వసర్వమంగళాశంసనకు అర్హమయే ఆశంతా

తీర్చును ఆ గణనేత తన అపారమౌ కృపచేత

 

అల్పత్వ భావన లేనిదే భక్తి లేదు. ఆ భగవంతుని ముందు నేనెంత, ఆయన్ని స్తుతించడానికి నా అర్హతెంత అనుకున్నప్పుడే  ఆయన కటాక్షం వలన గొప్ప కృతులు పుడతాయి! ఇదే ఇక్కడ సిరివెన్నెలలో కనిపిస్తోంది.  “నా అర్హత ఏమిటో కొంచెం కూడా తెలుసుకోకుండానే (గణుతించక) ఆ శివుణ్ణి స్తుతించాలనుకున్నాను! అందుకే స్కందపూర్వజుడైన ఆ వినాయకుడిని శరణు వేడుకుంటున్నాను! ఆయనే దయతో నాకు చేయూత నివ్వాలి! పుట్టుకలేనివాడూ (అజాతుడు), ఆలోచనకి అందనివాడూ (అచింత్యుడు), అంతము లేనివాడూ (అనంతుడు), పరిమితులు లేనివాడూ (అమేయుడు) అయిన ఆ పరమేశ్వరుడి గొప్పతనాన్ని ఈ శివకీర్తనల ద్వారా ప్రకటించడానికి ప్రయత్నిస్తోంది నా అల్పత్వం. ఈ అల్పత్వం శర్వుడైన ఆ శివుణ్ణి సర్వమంగళంగా ప్రస్తుతించే అర్హతగా మారాలి అన్నది నా ఆశ.  ఈ నా ఆశని ఆ వినాయకుడే తన అపారమైన దయతో  తీర్చాలి!” అని వేడుకుంటున్నారు సిరివెన్నెల! ఇంత భక్తితో వేడుకుంటే వినాయకుడు తీర్చకుండా ఉంటాడా?

 

సంచిత సుకృత సంభూతమ్మౌ సుసంకల్ప సంకలిత శివకవిత

కవింకవీనామను గణననుగల సిద్ధి వినాయకు చేత పరిపూత

శివాజ్ఞ ఎరుగని నా అవజ్ఞ ఆ విద్యాదినాధునిచేత అవనతమొందును గాత

సింధురాస్యునికి స్వాధీనమ్మై సిద్ధి సాధకమ్మవుగాత

అఘమర్షణమై అలరారుత ఈ శివకీర్తనముల సంహిత!

శివకవిత రాయాలంటే భక్తీ ప్రతిభతో పాటూ సుకృతమూ ఉండాలి! పరమాత్ముని కీర్తనం పుణ్యులకే సాధ్యపడుతుంది. అందుకే సిరివెన్నెల – “మంచి సంకల్పాలతో కూర్చబడిన (సంకలిత) ఈ శివకవిత, కూడబెట్టబడిన (సంచిత) నా సుకృతాల వలనే పుట్టింది (సంభూతము)” అంటున్నారు. పుణ్యాత్ములకే గొప్ప సంకల్పాలు కలుగుతాయి మరి!

ఈ సంకలనం “కవులలో కవి” అని ప్రస్తుతించబడిన సిద్ధివినాయకుని స్తోత్రం (గణన) వలన పవిత్రతను పొందింది (పరిపూత). అంటే తన గీతాలలో గొప్పతనమేదైనా ఉంటే అది కేవలం తన సుకృతం వల్ల, వినాయకుని దయ వల్ల, శివుని విభూతి వల్ల సాధ్యపడిందే తప్ప నాదంటూ ఘనత ఏమీ లేదని వినమ్రంగా సిరివెన్నెల చెప్పుకుంటున్నారు! “కవిం కవీనాం” అన్న వినాయక స్తుతిలో కవి అంటే కవిత్వం రాసేవాడు అని కాక జ్ఞాని, మేధావి అన్న అర్థం చెప్తారు. గొప్ప కవిత్వాన్ని కలిగిన ఈ శివదర్పణ సంకలనపు తొలిగీతంలో  “కవులలో కవి” అంటూ వినాయకుణ్ణి స్తుతించడం ఎంతైనా సముచితం!

ఆ శివుని ఆజ్ఞని ఎరుగని తన తిరస్కార (అవజ్ఞ) ధోరణిని ఆ విద్యాదినాధుడైన వినాయకుడే వంచుతాడు అంటున్నారు!  అంత భక్తితో, వినమ్రతతో ఉన్న సిరివెన్నెలకి తిరస్కారం ఎక్కడ నుంచి వచ్చింది? శివుని గురించి ఏమీ తెలియని అజ్ఞానం నాదని ముందు చరణంలో చెప్పుకున్నారు కదా, అలాంటి అల్పత్వం ఉన్నా లెక్కపెట్టక శివుణ్ణి స్తుతించే సాహసం చెయ్యడమే ఈ తిరస్కార ధోరణి! ఇలాంటి తిరస్కారం చూస్తే శివుడు కోప్పడడు సరికదా, కరిగిపోతాడు!

ఇలా ఆ వినాయకుని అండ వలన సింధురాస్యుడైన ఆ శివునికి అర్పితమైన ఈ శివకీర్తనలు పావనమై సిద్ధిని సాధిస్తాయి! “సర్వపాపాలూ నశింపజేసే మంత్ర” (అఘమర్షణము) సంహితలై అలరారుతాయి!

భక్తితో సిరివెన్నెల అర్పించిన పుష్పాలీ గీతాలు. పూజ ఆయనది, పుణ్యం మనందరిదీ! భక్తి ఆయనది, ఆ భక్తికి పులకించే హృదయం మనది. ఇన్ని గొప్ప గీతాలు రాసిన సిరివెన్నెలా ధన్యులే, ఈ గీతాలను విని ఆనందించే భాగ్యం కలిగినందుకు మనమూ ధన్యులమే! సిరివెన్నెల గారికి సహస్ర వందనాలు.

శశిప్రీతం సంగీతంలో బాలు ఆర్తిగా ఆలపించిన ఈ గీతాన్ని

 వినొచ్చు!

 

సాయేనా?

Art: Rafi Haque

Art: Rafi Haque

 

1

భేటీ ముగిసింది.

https://www.youtube.com/watch?v=XIMLoLxmTDw

2

సరిగ్గా అదే వేదిక ఎ.కె. జన్మస్థలం.

(ఎ.కె. అలియాస్ 47. ఉరఫ్ కలల గేరి అమర్. కె.ఎ. NRI అయిన తర్వాతే  పేరులో ఈ తారుమారు.)

అదే వేదికపైన ఎ.కె. షష్ఠి పూర్తి కూడా జరగడం నిజంగా ఒక ——-.

‘కానీ ఇలా పుట్టిన రోజు వేడుకలూ, షష్టిపూర్తి వేడుకలూ ఒకే భేటీలో, పైగా అదే వేదికపైన ఏ నాకొడుక్కయినా జరగడం కేవలం యాధృచ్చికమే సుమా’ అని వాదించిన సవాలక్షమందిలో జనగామ శంకరయ్యకూడా లేకపోలేదు.

నిజానికి ఈ వర్గం వాళ్ళే కోకొల్లలు.

“అసలు ఈ సన్నాయి నొక్కు నొక్కిన మీడియా వాళ్ళెంత మంది?’’ అని బాగా తాగిన తర్వాత సహజంగానే ఊగి కొట్టబోయిన బోయ రాముడిని జాగ్రత్తగా గుడ్డి మల్కాపూర్ పంపించారు పదిమంది పాత కామ్రేడ్స్ ప్రయాసపడి ఓలా  క్యాబ్ లో 8X కి.

“ఈ సన్నాయి నొక్కు నొక్కిన మీడియా వాళ్ళెంత మంది? నిజంగా?”  నెంబరు పట్ల చాలా పట్టింపు వున్న ఇడుపుల పాయ మోహన్ తన టేక్ టులో మళ్ళీ నిలదీసాడు… గద్దించాడు.

కానీ ఇదమిద్దంగా వీరినీ అని తెలియదు.

దాంతో కథ మళ్ళీ 69వ సారి మొదటికే అచ్చింది.

అదే పాత…  అదే పదిమంది… అదే కామ్రేడ్స్… మళ్ళీ తమ తాగిన మైక వినోదానికి కొనసాగింపుకు  గురికాబోతూండగా ఈ గద్దింపు రెట్టింపయింది.

ఈ సారి అనుకోని మూలల నుంచీ.

“నంబరుదేముందిలే కామ్రేడ్ ఇక్కడ పార్టీ కొనసాగుతుంటే రంజుగా.’’  గసగుసగా బోయ రాము-2 కూ నచ్చచెప్పిన బెజవాడ మల్లి తక్కువదేమీ కాదు.

(ఆమె బాగా మల్టీ టాస్కర్. పార్టీలో అందుకే ఆమె పేరు ఎం.టి.)

తన సహజ నైపుణ్యంతోనే ఇడుపుల పాయ మోహన్  రెండు బుగ్గలను తన రెండు చేతులతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషను లోగోలోలా రాపాడింది అలాంటి దీపం సెగే తగులుతుండగా మల్లి.

(ఆమె మల్టీ టాస్కింగ్ నిపుణతకి ఇదో చిరు మచ్చు తునకే.

అందుకే అందరూ అంటారు బెజవాడ మల్లి ‘పైకి కనిపించేంత పప్ప’ కాదూ… అని.

మల్లి ఏంచేసిందో తెలిస్తే మీకే తెలుస్తుంది ఆమె ఎంత—– అని.)

తను మనసులో అనుకున్న ఆ నంబరు మాత్రం ఇడుపుల పాయ మోహన్ మొఖం మీదే చెప్పాయాలని డిసైడ్ అయ్యింది మల్లి.

అంతే ఆమెలోని పాత కమురు కసి కొత్త మొగలి కుబుసం విడిచింది ఆ ఆకుపచ్చని రూం నెంబరు 206 లో.

ఆమెను దళ కమాండర్ కాకుండా ఆపిన (ఆపుతూవున్న లేదా ఆపేసిన) మోహన్ పైన పేరుకుపోయిన కసి మల్లిలో ముంగిసకు ఎదరు నిలిచిన రాములస్ విటేకర్ నాగరాజాలా బుసకొట్టింది అచ్చం ఎనిమల్ ప్లానెట్ ప్రైమ్ టైంలో లాగా.

పైగా “రేపు పొద్దునకు నెంబరు గుర్తుంటేగా’’ అనే ధీ/బీమాతో బాబా రతన్ ప్రభాత్ జర్దా (కత్తేమే, చున్నా కమ్) పాన్  నములుతున్న తన నోటికొచ్చినదంతా మాట్లాడేసింది బెజవాడ మల్లి ఇలా :

“సన్నాయి నొక్కు నొక్కిన మీడియా వాళ్ళ లెక్క …థూ….(కింది లెక్క చెప్పేముందు తన నోరు ఖాళీ చేసుకుంటూ…)

“42 లక్షలా 27 వేలా 47 మంది.”

మల్లి తెగువ మనకేం(!) కొత్తా?

“నీకు కాబట్టి ఇదైనా చెప్తున్నా. ఇది మన పార్టీ లోపలి నెంబరు. కొంచెం అటు ఇటుగా ఇదే నిజం.  బయట కూడా ఇదే పుకారు. చాలా మోహన్… ఇంకేమైనా కావాలా?” జారిపోతున్న తన పైట చెంగు అంత మత్తులోనూ సుతారంగా సర్దుకున్న మల్లి… మల్లే!

మల్లి మాత్రమే ఆత్మ గౌరవ సూచిక. పతాక.

నిజమైన మల్టీ టాస్కర్ బెజవాడ మల్లి కాక లంపకలోవ శ్యామల ఎలా అవుతుంది బుద్దుండాలి? ఛ!

“42 లక్షలా 27 వేలా 47 మంది” ఎవరైనా సరే ఎలాగైనా కొరికేయాలనిపించే మల్లి క్యుపిడ్ బౌ దాటి వచ్చిందా సుమధుర లెక్క.

ఏం సంఖ్య? మారు మోగింది ఆ ఆవరణమంతా!

మల్లి అక్యురసీ కి కారణం ఎడమ జేబులో వున్న తన ఫోను లోంచి వచ్చే రికార్డెడ్ వాయిసే.

ఇడుపుల పాయ మోహన్  తో ఆ వేళే కాదు… అలాంటి  వేళ కాని వేళ ఎన్నడు ఇలాంటి గణాంకాలు చెప్పినా తనకు నచ్చిన మీట నొక్కుతుంది మల్లి.

బస్! అంతే.

అప్పుడు  ర్యాండమ్ గా 42 లక్షలా 27 వేలా 47 మంది అని రిపీటెడ్ గా వస్తుంది.

అంతే. బస్!

మల్లి మెమరీ వెనుక వున్న కోడ్ ని ముందు

http://www.engineersgarage.com/sites/default/files/imagecache/Original/wysiwyg_imageupload/1/BarCode-Image_0.jpg

అని గుర్తించగలిగారు.

తర్వాత పుణెకి పంపించి కిందిదే ఫైనల్ అన్నారు.

http://androidforacademics.com/wp-content/uploads/2010/05/GradeRubricQR.png

దీని వెనుక వున్న ఆ జాదూని మాత్రం జ్యోతి సండే కవర్ పేజీ కథనంగా అచ్చోసేవరకు అసలు విషయం అందరికీ అందుబాటులోకి రాలేదు.

ఆ ప్రతులు మల్లి కన్నా హాట్… కేకుల్లాగా అమ్ముడుపోయాయి.

అప్పట్లో అదో రికార్డు.

ఆహా! మల్లి సమాధానం మనకు తెలిసిపోయింది.

కానీ ఇక తెలియాల్సింది మోహన్ కే.

మల్లి జర్దా పాన్ నోటి నుంచి వచ్చిన ఆ జబర్దస్త్ సమాధానం శబ్ద తరంగాలుగా ఆ గదిలో ఇంకా పయనిస్తుండగానే…

ఆ పౌనఃపుణ్యంలో… ఆ తరంగ దైర్ఘ్యంలో…

ఆ మార్గ మధ్యంలో మనం ఈ పైవన్నీ మాట్లాడుకోగలిగామని తెలుసుకోవాలి మీరు.

(మీరు అంటే?!)

మల్లి నోటి నుంచి వెలువడిన మాట అదిగో ఇంకో అరసెకనులో చేరబోతోంది మోహన్ చెవికి.

చేరిందహో!

మల్లి చెప్పిన ర్సమాధానం మనకి పోయిన వారం ఎపిసోడ్ లో తెలిసిందే.

కానీ మోహన్ ఉత్సుకత, ఉత్కంఠ ముందు మనమెంత? (?)

Kadha-Saranga-2-300x268

ఇంతకీ మల్లి సమాధానం!

మి

ది?

(ఇంతకీ మల్లి సమాధానం మోహన్ కి చేరిందా? రేపటి ఎపిసోడ్ లో మీ… మా… మా… జీ… టీవిలో సాయంత్రం 12 గంటలనుంచే… డోంట్ మిస్… పైగా మల్లి ఇప్పుడు మిసెస్ కూడా.)

(ఈ కార్యక్రమ సహసమర్పణ…

జాన్సన్స్ బేబీ పౌడర్ … మీ స్పర్శ తన భవిష్యత్తును చక్కబరుస్తుంది. అభి బుక్…అభి గో…. అభి బస్ డాట్కామ్…

ఇప్పుడు సంతూర్ బేబీ సోప్ … ఇది మీ పిల్లల పార్లర్… బ్రిటానియా గుడ్ డే.. గో స్మైల్….ఐడియా … ఏక్ ఐడియా జో బదల్ దే ఆప్ కీ దునియా… నో ఉల్లూ బనావింగ్… ఆదిత్య బిర్లా గ్రూప్… ఖజానా జువలరీస్… స్నేహంతో మెరిసే బంధం…గుండు గుండు యమ్మి యమ్మి ఆచి గులాబ్ జామూన్….

మరియూ

బోర్న్ విటా … తయ్యారీ జీత్ కీ

పవర్డ్ బై

సులేఖా … గో # ఆంటీ జుగాడ్… కోకా కోలా… ఓపెన్ హాపీ నెస్… టేస్ట్ జో హర్ దిల్ చాహే.)

మల్లి సీరియల్ కి వున్న ఫాలోయింగ్ ప్రధానంగా మల్టీ నేషనల్ కంపినీల ఫాలోయింగే.

*

(మరుసటి రోజు ఎపిసోడ్ మిట్ట మధ్యాహ్నానానికే యూట్యూబ్ లో లీకయ్యింది.)

(బాధ్యులు ఎవరు?)

ఇంతకీ మల్లి సమాధానం!

మి

ది?

“తూచ్!”

ఈ సమాధానం  మనం అంతా ముందే అనుకుందే.

(మనం అంటే మీరు కాదు.)

కాని ఒక రోజు ఉత్కంఠ తప్పదు మరి.

కానీ ఇడుపులపాయ మోహన్ మల్లి వాయిస్ ని యాజిటీజ్ గా తన ఐ ఫోన్ లో రికార్డు చేసి 1gbps లో బోయ రాముడు -3 కి అంత అపరాత్రీ వాట్సప్ చేసేసాడోచ్!

ఇంకేముంది మరునాటి మీడియాలో బ్యానర్ అదే.

బ్రేకింగ్ అదే. థర్టీ మినిట్స్ అదే. స్టోరీ బోర్డూ అదే. అందరి నోటా, మాటా ఇదే. అదే. అదే. అదే.

National Informatics Center ప్రకారం కూడా మల్లి చెప్పిన లెక్క 47 లక్షలా 72 వేలా 42 మందే.

గురువారం రాత్రి 11.45 వరకు అందరికీ అందిన సమాచారం ఇదే.

కానీ ఇది ‘మరో 15 నిమిషాల్లో డేటుతోపాటు మారే అవకాశం వుంది’ అని మల్లికి మరో మెసేజ్ వచ్చింది ఎఫ్ బి మెసెంజర్ లో.

End of scene no 14-a

(Director notes : @ scene no 17, forest/ interiors.

Shoot pending.

Reason :  non availability of Combo dates of two shooting camps.)

https://www.youtube.com/watch?v=WKB0JUkksJg

*

(వాట్సాప్ మెసేజ్ బై సారా.)

anatu1

 

Last seen at 23.59, Friday, 1947.

 

(సారా…ఈమె అమ్మమ్మే మనకు(?) సీన్ నెంబర్ 13 లో కాసేపు కనిపించి బులిపించిన ఎం.టి అలియాస్ మల్టీ టాస్కర్ మల్లి. కన్ఫ్యూజ్ కావాలన్నా కాలేరు మీరు(?) అని మరీ మరీ చెప్పేందుకే ఈ వివరం పొందుపరచాం. —  హీబ్రూ, థాయ్, ఇంగ్లీషు హక్కుల ప్రచురణ కర్తలు.)

సారా నుంచి ఈ మెసేజ్ రాగానే ఇక రెడ్ ట్యూబ్.కామ్ లో రేవన్ అలెక్సిస్ “shoot… shoot right now” అని అరుస్తున్నా ఆ అవసరం లేదనుకున్నాడు కోనేటి కట్ట సుబ్బారాయడి పిన్నమ్మ కొడుకు చిన ఉరుకుందు.

 

అయితే  నేనూ, సారా ఒకరికొకరం పంపించుకున్న సవాలక్ష వెరీ పర్సనల్ మెసేజులల్లో హౌండ్స్ కి దొరికీ వారికీ అర్థం కాకుండా మిగిలిన మెసేజ్ ఇదే అని నాకు మేమిద్దరం చనిపోయిన తర్వాత అర్థం అయ్యింది :

anatu2

 

*

చారిత్రక సత్యం-1

మహా భేటీ మొదలైన తొలిరోజు…

మొదటి భోజనానంతర సెషన్.

రంజుగా నడిపిస్తున్నప్పుడు సరాసరి వేదికపైనే… సరిగ్గా కామ్రేడ్ చారుపల్లి కమ్మయ్య ప్రసంగం మధ్యలో, ప్రేక్షకుల మధ్యలోంచి తెగించి తన ఫేస్ బుక్ లో తనే బ్లాక్ చేసిన ఓ రహస్య మిత్రుడిని తక్షణం అన్ బ్లాక్  చేసేసింది గౌసియా.

గౌసియా చాలా సెక్సీగా వుంటుంది.

కానీ ఇప్పుడు కాదు బ్లాక్ చేయక ముందు.

అంటే ఆప్పుడు.

గౌసియా ఆ నెంబరు అన్ బ్లాక్ చేయడానికీ ఎ.కె. పుట్టుకకీ ఎలాంటి సంబంధం లేదంటే మీరు మాత్రం నమ్మగలరా?

(మీరు అంటే అందరూ కాదు కేవలం ఒక వర్గంలోని సామాజిక వర్గం పాఠకులు మాత్రమే –  గదబ అనువాదకుడు.)

గౌసియా అన్ బ్లాక్ చేసిన తన ఏలినాటి స్నేహితుడి ప్రొఫైల్ పిక్ మాంచి కసిగా వుంది.

అంతే కామ వడితో గౌసియా మెసేజ్ టైప్ చేసేసింది.

నిజానికి చాలా కాలం కిందే టైప్ చేసి పెట్టుకుని వుంచుకుంది గౌసియా దాన్ని.

వాట్సాప్ లో సెండ్ బటన్ నొక్కిన తర్వాతా… దానికి సమాధానంగా బ్లూ డబల్ క్లిక్ వచ్చేలోపు గౌసియా మనసంతా ఈ కింది కీర్తనతో దద్దరిల్లి కాసేపు మార్మోగింది కూడా.

“ఏ మూలన దాచిన ఏ వివరంబేనాడో

నిన్నూ కడతేర్చేనూ నిక్కంబిదియే మనసా

చిరు కడు నిడు కానలలో ఒకే తీరు కాల వలెన?

కడు నిడు చిరు వనములలో అదే దారి రాల వలెన?

కానవె జన మది త్రోవల కనవే పదవే వయసా

మనము కెరలి మరలి తరలి మురళి పాటతో మనసా”

(పేపర్ బ్యాక్ ఎడిషన్ లో కీర్తన చేర్చలేదుకొంకణి, డోగ్రీ ప్రతుల జమిలి సంపాదకులు.)

(గౌసియా సెండ్ చేసిన మెసేజ్ చేరవలసిన వారికి చేరిన తక్షణం బ్యాక్ గ్రౌండ్లో ఈ కీర్తన ఫేడవుట్ అయ్యింది.

అదీ టైమింగ్ అంటే! గుడ్ జాబ్ ఖాసీం.)

అయితే ఆ మెసేజ్ ని మోస్తున్న ఆ సిగ్నల్ చేసిన ట్రావెల్ కడు వీరోచితం సుమా!(ఏ యాంకర్ ని ఉద్దేశ్యించింది కాదు.)

చేరవలసిన వారికి ఇంకనూ మెసేజ్ చేరేలోపు…. గౌసియా ఫోన్ బఫర్ అవుతోంది.

ది

4g  కాదు.

(ఫోనెహే!)

అలా ఆ వీక్ సిగ్నల్ దయతో తరలిపోబోతోన్న ఆ మెసేజ్  ఆ కాళరాత్రి కరుడుగట్టిన దట్టమైన కారడవిలో పయనించాలి.

అదే అడవిలో తన కడపులో పడ్డ తన రాబోవుతున్న బిడ్డకు కాబోవుతున్న బయలాజికల్ డ్యాడీ కి ఆమె మెసేజ్ వెళ్ళాలి సేమ్ అదే రాత్రి.

మనం ఎంత ఔటాఫ్ కాలింగ్ ఏరియా అయినా మీడియాకి ముందే పోతా… వుంటాయి అన్ని మెసేజ్ లు.

అందులో ఇదోటి.

అడవికి చేరే ముందే  ఈ తతంగం పేపరు గుద్దేసింది.

ఇందులోని పసందైన న్యూస్ ని మొదట క్యా చ్ చేసిందిమాత్రం ఈ… నాడు.

(క్యాష్ చేసుకుంది టివి 10 మైనస్ 1 అని వేరే చెప్పాలా?- TAM report 2020)

“ఈ తెగింపే కావాలి.  ఈ మిలిటెన్సీ సహజాతంగా వుండాలి. ఇర్షాద్! కానీ కలలగేరి అమర్ లాంటి వారికే ఈ మిణుగురు గుణం పరిమితమై… మరీ మితమై

పో…

తూ…

వుం…

ది…”

ఇదీ ఆ…నాడు ట్యాబ్లాయిడులో వచ్చిన సింగిల్ కాలమ్ ఐటమ్ సారాంశం. ఇది కూడా రాసి తగు జీతం మరియా గీతం పొందిన సదరు స్ట్రింగరు ప్రబుడాష్ కి ప్రభువు స్తోత్రములు.

(పై వాక్యంలో మరియూ బదులు మరియా అని అచ్చయ్యంది. గమనించగలరు – Men Again Rape and Damn,  M.A.R.D. స్వచ్ఛంద సంస్థ.)

తమ్ముడు తమ్ముడే… ప్యాకాట… ప్యాకాటే అని ఎవరికి ఎవరు నేర్పించాలి ఈ లోకంలో.

కాబట్టే గౌసియా ప్రసవించింది.

ఇక ఎట్టకేలకు తన పదకొండవ గర్భం నిలిచింది. గుణదల మేరికి స్తోత్రములు.

ఎండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ -9

*

పుట్టిన పసి బిడ్డ తన కళ్ళ ముందే వుండి, బిడ్డకు తండ్రి అతనే అని చెప్పుకోలేని కామ్రేడ్ చారుపల్లి కమ్మయ్య వేదికమీదే వుండటం చాలా అరుదు.

(ఏదయినా 69 ఏళ్ళ పైబడి జరుగుతూనే వుంటే అది అరుదు కాక మరేమౌతుంది బే? – సంచాలకులు, స్వచ్ఛ భారత్ సంఘటన్.)

*

ఇక ఇప్పుడు కీలకమైన సీన్ నెంబరు 72.

Int/day for night

అమావాస్య…నడి రేయి… చల్లని గాలి స్క్రీన్ ఎడమ వైపు నుంచి కుడి వైపుకు సుతారంగా వీస్తూవుంది… స్క్రీన్ కుడి వైపు కింద… ఆమె బుగ్గపైన తాకిన పిల్ల గాలి  అలా ఎ.కె. పిర్రలపైన సల్సా నాట్యం చేసింది.

(“కానీ చీకటిలో ఈ వివరాలు కనీ కనిపించనట్టు వున్నాయి.”  – రేట్ ఆంధ్రా డాట్ కామ్ (విసుగు.))

ఇదే చారిత్రక సత్యం-2

Cut forest to plane.

*

కానీ చారిత్రక సత్యం-3 కన్నా ఎక్కువ అరుదయినది గౌసియా కాన్పు.

“ఇంతకీ పుట్టింది ఎవరు?“ అలవాటయిన గర్వంతో గౌసియా ఆలోచనల చూపు వేదికపైనుంచి మురిపెంగా టిల్ట్ డౌన్ అయ్యింది తన ఒడిలోకి.

(ఎ.కె. … రివీల్.)

పుట్టింది ఎవరికి?

“ఇప్పుడవన్నీ ఎందుకూ?” అనుకుని చారిత్రక సత్యం – 4 ని తనతోనే బలంగా సమాధి చేయాలని గట్టిగా నిశ్చయించుకుంది గౌసియా.

*

భేటీ ముగిసిపోయింది.

కానీ National Informatics Center చెప్పిన 47 లక్షలా 72 వేలా 42 మంది కానీ, పార్టీ చెప్పిన లెక్క 42 లక్షలా 27 వేలా 47 మంది కానీ అంతా భోగస్ అని తేలింది.

“ఈ క్యామిడీ, ఈ ఇగో, ఈ గొడవలను, ఈ గన్ లనూ ఇక పక్కన పెట్టాల కాసేపు.” తన మనసులో మాట కక్కేసాడు అరవిందరావు.

అప్పుడు మొదలు పెట్టారు అసలు లెక్క. ఎప్పుడూ అలాగే మొదలవుతుంది నిజానికి అసలు లెక్క.

*

సీన్ నెంబర్ 16 a/ insert

Ext/forest/night for an awaiting day

“మొత్తం 34…. దొరా…” ఎవరో అరిచారు.

వినీ వినిపించకుండా అందరికీ వినిపించింది ఆ గాత్రం.

https://www.youtube.com/watch?v=Ot18ReoYyn4

“ప్యాకప్” ఎవరు అరవాలో వారే అరిచారు.

కానీ ఈ గొంతు ఎవరికీ వినిపించకున్నాఅర్థం మాత్రం అందరికీ అయింది.

(అంటే వర్గ సమాజంలోని ఒక సామాజిక వర్గానికి తప్ప! – The Shining Path. (review by Christian Parenti.)

(ఎండ్ టైటిల్స్ స్క్రోల్ అవుతోంటే అమితాబ్ బచ్చన్ వాయిస్ …)

“మహా అయితే ఇంకో రెండు లేదా మూడో …..(బీప్ సౌండ్.)

తమాషా ఏమిటంటే వచ్చాక వాటినీ… గుర్తూ… పట్టాలీ.”

(బ్లాక్ అవుట్)

https://www.youtube.com/watch?v=Zx3xyBMiung

*

PS-1

(Post Shoot)

“బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల అస్తవ్ కొడుకో…” అనే డబ్ స్మాష్ మల్లికీ, గౌసియాకూ చాలా ఇస్టమని సారా చెప్పింది మా ఇద్దరి పార్టీ  గ్లెన్ లెవిట్ లోంచి పొర్లి తెలవారుతుండగా.

*

P.S. 2:

(police station- 2 town)

(దండ..కారుణ్యం రెంటి నుంచి వెలువడకుండా కాలగర్భంలో కలిసిపోయిన కోయతుర్  ప్రవచనాలని పరాయి భాషల్లోనికి విచ్చలవిడిగా చేసిన అనువాదాలలో మిగిలిన, చిరిగిన, విరిగిన తాళపత్రాలకు ఇది సాధికారిక తర్జుమా.

(గౌసియా మనవరాలు సారా సౌజన్యంతో.)

*

P S 3:

(Parti Socialiste – 3)

సాయేనా అంటే  ఖాళీ చేసి వెళ్ళి పోండి … పరిహారం అందుతుంది అని అనువాదం చేసారు మోదిక్షనరీలో.

కానీ అది శుద్ధ తప్పు అని మీకే (?) తెలియాలి ఈపాల్టికి.

సాయేనా అంటే కోయల వాడుకలో కుశలమా?

(ఉమ్మడివరం కోయ యువకుడు సోడి చిన ముత్తేల్ పంతులేర్ సౌజన్యంతో.)

Naqoyqatsi

 

*

 

విరుగుతున్న రెక్కల చప్పుడు – ఉడ్తా పంజాబ్

alia-bhatt-udta-punjab-trans

 

‘ఫ్లైయింగ్ హై’ అనేది ఒక మెటాఫర్.  ఇది ఒక విజయవంతమైన ఆనందమనే కాదు, ‘ఒక మత్తు మందు ప్రభావంతో ఆకాశంలో విహరిస్తున్న అనుభూతిని పొందడం’ అనే అర్థాన్ని కూడా కలిగి ఉంది. మన దేశంలో సాధారణంగా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతుంటే ‘తాగున్నావా?’ అనడుగుతారు. అదే డ్రగ్స్  వాడకం అధికంగా ఉన్న దేశాల్లో అయితే ‘ఆర్ యు హై?’ అని అడగటం పరిపాటి. దానికి అర్థం, ‘నువ్వు డ్రగ్స్  గానీ తీసుకుని ఉన్నావా?’ అని అడగటం. ‘ఉడ్తా పంజాబ్’ అంటే ఇక్కడ, పంజాబ్ ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిపోయిందనీ, ఉన్నతమైన స్థితికి చేరుకుంటోందనీ అర్థం కాదు. డ్రగ్స్  మత్తులో మునిగి తేలుతోందని చెప్పడం. పేరుతో సహా అన్ని రకాలుగా ఈ సినిమా, పంజాబ్ లోని డ్రగ్ మాఫియా గురించి మాట్లాడబోతున్నట్టుగా

ముందుగానే ప్రచారం పొందింది. బాలీవుడ్ లో ఇప్పటివరకూ డ్రగ్స్  వాడకం కథాంశంగా కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ, అవేవీ పూర్తి స్థాయిలో ఈ సమస్య  గురించి చర్చించలేదు.

ఈ సినిమా ఒక రాక్ స్టార్ (షాహిద్ కపూర్), ఒక బీహారీ అమ్మాయి (ఆలియా భట్), ఒక సబ్ ఇన్స్పెక్టర్(దిల్జీత్ దోషన్జ్), ఒక డాక్టర్(కరీనా కపూర్) లు ప్రధాన పాత్రలుగా నడుస్తుంది. సినిమా మొదలవడమే రాక్ స్టార్ ‘గబ్రూ’ హోరెత్తించే పాటతో మొదలవుతుంది. పంజాబ్ లో చాలా మంచి రంగు కలిగిన అమ్మాయిలని ‘గోరీ చిట్టీ’ అని పిలుస్తారు. చిట్టా అంటే తెలుపు రంగని అర్థం. “ఓ చిట్టా వే” అంటూ మొదలయ్యే ఈ పాట తెల్లని డ్రగ్ పౌడర్ గురించి మాట్లాడుతుంది. మొత్తం పాటంతా ఒక తెల్లని అందమైన అమ్మాయికో లేక డ్రగ్ పౌడర్ కో, ఎలా అన్వయించుకున్నా సరిపోలే విధంగానే ఉంటుంది. డ్రగ్స్, వాటిని వాడినవారి నరాల్లో రేపేటంతటి హుషారూ, ఈ పాటకున్న సంగీతం కూడా రేపుతుంది.

లండన్ నుండి ఇండియాకు తిరిగి వచ్చి రాక్ స్టార్ గా మారిన ఒక గ్రామీణ పంజాబీ యువకుడు టామీ సింగ్. అప్పటికే పూర్తి స్థాయిలో డ్రగ్స్ మత్తులో కూరుకుపోయిన ఇతడు, డ్రగ్స్ తీసుకునేందుకు యువత ఉత్ప్రేరితమయ్యే  విధంగా పాటల్ని రాసి పాడుతుంటాడు. బాగా ప్రాచుర్యాన్ని కూడా పొందుతాడు. అలాగే అక్కడికి దగ్గరలో మరోచోట ఒక బీహారీ అమ్మాయి(ఆలియా భట్)కి దొరికిన 3 కిలోల హెరాయిన్ ఆమెకి తీవ్రమైన సమస్యల్ని తెచ్చిపెట్టి, డ్రగ్ మాఫియా చేతిలో చిక్కుకుపోయేలా చేస్తుంది. వీరిద్దరూ ఒకరికొకరు అనుకోకుండా ఎదురుపడటం, టామీ సింగ్, బీహారీ అమ్మాయి ప్రేమలో పడటం, అప్పటికే తను చేస్తున్నది తప్పన్న ఆలోచనలో ఉన్న అతడు, ప్రేమ డ్రగ్స్  కంటే ఎక్కువ మత్తుని కలిగిస్తుందని భావించడం, ఆమెని డ్రగ్ మాఫియా బారి నుండి కాపాడి పోలీసులకి లొంగిపోవడం ఒక స్టోరీ.

ఇక అదే గ్రామానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ సర్తాజ్ సింగ్, తన తమ్ముడు డ్రగ్ ఎడిక్ట్ గా మారి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం వల్ల జ్ఞానోదయం పొంది, అప్పటికే యాక్టివిస్ట్ గా పని చేస్తున్న డాక్టర్ ప్రీత్ సాహ్నీతో కలిసి ఆ ముఠా గుట్టు రట్టు చేసే ప్రయత్నం చేస్తాడు. కథ ఏవేవో మలుపులు తిరిగి చివరికి ఆ డాక్టరమ్మాయీ, ఇంకా కొందరి డ్రగ్ మాఫియా సభ్యుల మరణాలకి దారి తీస్తుంది. మొత్తానికి వీరి ప్రయత్నాల కారణంగా ప్రభుత్వంలో, ప్రజలలో కొంత ఉత్తేజంగా కలిగినట్టుగా భావించమనే విధంగా సినిమా ముగుస్తుంది.

సినిమా మొత్తానికి ప్రధానంగా చెప్పుకోవాల్సింది బీహారీ అమ్మాయిగా నటించిన ఆలియా భట్ గురించి. పూర్తిగా డీ గ్లామరైజ్ చేయబడిన పాత్రలో ఆమె నిజంగా చక్కని నటనను ప్రదర్శించింది. బీహార్ లో పనులు దొరకని కారణంగా చాలామంది అక్కడినుండి సంపన్న రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, జమ్మూ వంటి ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. అక్కడ దొరికిన పనులు చేసుకుంటూ ‘జుగ్గీ’లనబడే తాత్కాలికమైన గుడారాల్లో కాలాన్నివెళ్లదీస్తుంటారు. అటువంటి ఒక పదిహేను, పదహారు సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి పాత్రలో ఆలియా భట్ చక్కగా ఇమిడిపోయింది. వేషభాషలు, మాట్లాడే యాసా, బాడీ లాంగ్వేజ్ ఆమెకు సరిగ్గా సరిపోయాయి. (నాకైతే మేం జమ్మూలో ఉన్నప్పుడు, వీధి చివరి జుగ్గీలో ఉండే ఉషా అనే బీహారీ అమ్మాయే గుర్తొచ్చింది). అంతే కాక అధికమైన విల్ పవర్, ధైర్యం కలిగిన అమ్మాయిగా ఆమె పాత్ర సినిమాకు మంచి బలాన్ని చేకూర్చింది. మాఫియా ముఠా సభ్యులు ఆమెని డ్రగ్ ఎడిక్ట్ గా మార్చినప్పటికీ, తన నోట్లో తనే గుడ్డలు కుక్కుకుని ఆ కోరికని అణుచుకునే ప్రయత్నం చేయడం, ఇంకా ఆమె పాత్రకు చెందిన కొన్ని ఇతర సన్నివేశాలూ  చాలా సహజంగా, మనసుని కదిలించేవిగా ఉన్నాయి. సంగీత దర్శకుడు అమిత్ త్రివేదీ అందించి హిప్ హప్ సంగీతం కూడా సినిమాకు చెందిన బలమైన విషయాలలో ఒకటిగా చెప్పుకోవాలి. దాంతోపాటుగా డ్రగ్స్  ప్రపంచానికి చెందిన ఆ చీకటి వాతావరణాన్ని సృష్టించడంలో సినెమాటోగ్రాఫర్ రాజీవ్ రవి సఫలమయ్యాడు

అయితే, మొదలవడం బాగానే మొదలైనప్పటికీ, ఎక్కడ తప్పిందో తెలీకుండానే కథ దారి తప్పి ఎటో వెళ్లిపోతుంది. ఒక జటిలమైన సమస్యకి కొంత కామెడీని కూడా కలిపి సినిమాను డార్క్ కామెడీగా ప్రజెంట్ చేద్దామనుకున్న దర్శకుడి ఆలోచన ఎక్కువై, అసలు విషయం పక్కకి తప్పుకుంది. ఈ సినిమా ద్వారా ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇండియాలో, ముఖ్యంగా పంజాబ్ లో చాలా సులువుగా డ్రగ్స్  లభ్యమవుతున్నాయి. అవి కూడా ప్రాంతీయంగా తయారుచేయబడి

చాలా తక్కువ ధరలకే అన్ని మందుల దుకాణాలలోనూ దొరుకుతున్నాయి. ఇందుకు రాజకీయ నాయకుల, పోలీసుల అండాదండా పుష్కలంగా లభిస్తోంది. ఈ విషయాన్ని చెప్పడం కోసం దర్శకుడు ‘అభిషేక్ చౌబే’ ఎంచుకున్న కథలోనే కొంత తడబాటు ఉంది.

ఒక సమస్య  ఉందని చెప్పినప్పుడు, అది ఎందుకు ఎలా మొదలైందో మూల కారణాలను వెదకడం, అది ఇంకా ఏ విధంగా విస్తరిస్తోందో గమనించేలా చేయడం, అవకాశం ఉంటే ఆ సమస్యకు తోచిన పరిష్కారాన్ని సూచించడం ఒక పధ్ధతి. లేదూ, ఆ సమస్యని కథలో భాగంగా తీసుకున్నప్పుడు, కథను ప్రధానంగా నడిపించి సమస్యను అందులో సహజంగా లీనం చెయ్యడం రెండో పధ్ధతి. కానీ ఈ సినిమా రెండు పడవల మీదా కాళ్లు పెట్టి ప్రయాణించే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. అలాగే సెన్సార్ సమస్యని తీవ్రంగా ఎదుర్కొన్న చిత్రంగా కూడా ఈ సినిమా వార్తలకెక్కింది. నిజానికి కథకు అంతగా అవసరం లేని అశ్లీల పద ప్రయోగాలు సినిమాలో ఎక్కువగా ఉన్న మాట వాస్తవం.

ఇప్పటికే ధూమపానం, మద్యపానం కారణంగా అన్ని విధాలుగా నాశనమయిపోతున్న మన దేశం, సరైన పద్ధతిలో ఆలోచన చేసి ఈ సమస్య  మరింతగా విస్తరించిపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం మంచిది.  అలా చెయ్యని పక్షంలో, ఈ సినిమాలోనే చెప్పినట్టుగా మన దేశం డ్రగ్స్ విషయంలో మరో మెక్సికోగా మార్పు చెందే సమయం పెద్ద దూరంలో ఉన్నట్టుగా కనిపించడం లేదు. పాబ్లో ఎస్కబార్ అనే డ్రగ్ మాఫియా డాన్, 1970,80 లలో అమెరికన్ రాష్ట్రాలకి డ్రగ్స్  అక్రమంగా రవాణా చేసి, అక్కడి యువతను మత్తుపదార్ధాలకి బానిసలుగా చేసాడు. ఒకవేళ అవే మత్తు పదార్ధాలు ప్రాంతీయంగా తయారుచేయబడితే, తక్కువ ధరకే లభ్యం కావడంతో పాటుగా మన దేశంలోని అవినీతి కూడా తోడై అతి సులువుగా వ్యాపించిపోతాయి. ఒక్క సారి గనక జనం, ముఖ్యంగా యువతరం వాటికి అలవాటు పడితే, మానడమనే విషయం చాలా కష్ట సాధ్యమైపోతుంది. అందువల్ల ఇటువంటి ప్రాథమిక దశలో ఉన్నప్పుడే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ కి చెందిన అసలైన చీకటి కోణాల గురించీ, వీడ్ అనీ పాట్ అనీ పిలవబడే మార్జువానా గురించీ, మెథ్, కొకైన్, హెరాయిన్ వంటి మత్తు పదార్ధాల తయారీ, వాటి అక్రమ రవాణాల గురించీ, అవి కలిగించే దుష్ఫలితాల గురించీ, ఆ మాఫియా గ్రూప్ ల గురించీ సవివరంగా తెలుసుకోవాలంటే నెట్ఫ్లిక్స్  ఒరిజినల్ సీరిస్ అయిన “నార్కోస్” చూస్తే సరిపోతుంది. ఇది యథార్థ గాథ. అదికాక డ్రగ్స్ ప్రపంచానికి చెందిన కల్పిత గాథ ‘బ్రేకింగ్ బాడ్”. బాగా ప్రాచుర్యం పొందిన ఈ టీవీ సీరీస్ కూడా నెట్ఫ్లిక్స్ లో ఉంది.

మనిషికి వెన్నెముకా, పక్షికి రెక్కల వంటి వారు దేశానికి యువత. ఇప్పుడవి డ్రగ్స్ మూలంగా పటపటా విరుగుతున్న చప్పుడు పంజాబ్ అంతా వినిపిస్తోందని ఈ సినిమా చెప్తోంది. మిగిలినవన్నీ పక్కన పెట్టి చూస్తే,  ‘డ్రగ్స్  విషయంలో పూర్తిగా ఆలస్యమైపోక ముందే మేలుకోవాల్సిన అవసరం ఉందంటూ’ దేశానికీ, సమాజానికీ ఈ సినిమా ఒక హెచ్చరికని జారీ చేసిందన్న విషయాన్ని మాత్రం ఒప్పుకోవాలి.

***

 

‘మనిషి’ కేవలం ‘మనిషి’ కాదు!

photo-1

 

 

కొన్ని కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి.

ఉదాహరణకు మనిషి.

ఎందుకో చెప్పలేను. మనిషి వినా మరే ప్రపంచమూ పట్టనట్టు, మనుషుల గాథలు, వాళ్ల అనుభవాలు, వాళ్ల సృజనాత్మకత, జీవితంలో స్వయంగా వాళ్లు ఆర్జించిన జ్ఞానము, వివేకము, కొన్నిప్రత్యేక సందర్భాల్లో వాళ్లు అనుసరించే విధానమూ, విధి అని అంగీకరించిన తీరుతెన్నులు, ఇవ్వన్నీ తెలిసో తెలియకో, ప్రయత్నంతోనో అప్రయత్నంగానో సాధారణంగా తెలుసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా నా వరకు నేను ఈ జగత్తులో మనుషులందరి గురించి ఒక లైబ్రరీ తెరవాలన్నంత కుతూహలంతో ఇదే పని ఇష్టంగా చేస్తూ ఉంటాను. ఆ పని లో భాగంగా పరిచయ వ్యాసాలు, పరిచయ నవలికలూ రాస్తూ ఉంటాను. అచ్చు వేస్తూ ఉంటాను కూడా.

అయితే, ఎవరు కొత్తగా పరిచయమైనా ఒక చెట్టును చూస్తున్నట్టు, చెట్టును కావలించుకున్నట్టు… పిదప ఆ చెట్టుమీద వాలిన పక్షిలా నేను ఆ చెట్టు గురించి తనపై ఎంతో కొంత ఆశ్రయం పొంది తెలుసుకుంటూ ఉంటాను. క్రమంగా ఆ చెట్టు కొమ్మల్ని, ఊడల్నీ, రెమ్మరెమ్మనూ ఫీలయి వేర్లనూ తడిమి దాని జీవన దారుడ్యానికి తన్మయమై, ఇరుగు పొరుగు చెట్లనుంచి సేకరించిన అనుభవ ఫలాలతో ఈ చెట్టునూ భేరీజు వేసుకుని మెలమెల్లగా వీలైనప్పుడల్లా వాటి ఒక్కో ఆకూ గురించి, ముందే చెప్పినట్టు శాఖల గురించీ, వాటిని సజీవ గాథలుగా, పరిచయ గాథలుగా రాసుకుంటూ పోతాను. ఇదొక జీవనశైలి.

అదృష్టవశాత్తూ వృత్తీ, ప్రవృత్తీ రచనే కావడం వల్ల పాత్రికేయ రచయితగా నాదైన శైలితో పనిచేస్తూ, నాకు నచ్చిన ఉద్యోగం చేసుకుంటూ ఉన్నందున కల్పన జోలికి వెళ్లకుండా- వాస్తవ గాథలను, మనుషుల గాథలను రాయడమే ఇష్టమైన కార్యంగా పెట్టుకున్నాను. జీవితాలతో నా జీవితం అలా గడిచిపోతున్నది, మనుషుల్లో మనిషిగా మసులుకుంటూ ఉన్నాను.

మధ్యలో ఒక చిన్న ఉదయం. అది కెమెరా వల్ల జరిగిందనిపిస్తున్నది.

చాలా ఏళ్ల క్రితం వదిలేసిన కెమెరాను మళ్లీ పట్టుకున్నాను. అది కూడా ఒక మనిషి గురించి పుస్తకం రాసే ప్రయత్నంలో ఉండగా, ఆ మనిషి ఫొటోగ్రాఫరే అయినందువల్లా, ఆ కెమెరా మళ్లీ అలవోకగా నా భుజంపైకి వచ్చి చేరింది. ఇప్పుడు extended arm అయింది కూడా. ఎం.ఎస్. నాయుడు మాటల్లో ‘అది వేలాడే కన్ను’ అయింది కూడానూ.

photo-2

ఎప్పుడైతే, అంటే ఆరేళ్ళ క్రితం ఇలా మళ్లీ కెమెరా ప్రపంచంలోకి అడుగుపెట్టానో -అప్పట్నుంచీ మనిషి రహస్యం మనిషి మాత్రమే కాదన్న విషయం అవగతమవుతూ ఉన్నది. ‘మనిషి’ కేవలం ‘మనిషి’ కాదని ధ్రువపడుతున్నది.

మనిషితోసహా పరిసర ప్రపంచం …తెలియకుండానే …ఆ మనిషితో నను చేరుకొని మనిషిఫై మరింత అవగాహన  కలిగిస్తున్నాదీ అనిపిస్తున్నది. ఒక సరికొత్త మార్పును ఏర్పాటు చేస్తూ ఉన్నాను.

క్లిక్ బై క్లిక్  – తీస్తున్నది మనిషి ఛాయనే. కానీ ఆ ఛాయ అన్నది మనిషిదే కాదన్నవిషయం ఒక్కో ఎక్సపోజ్ తో  బోధపడుతూ ఉన్నది.

మనిషి ప్రధానంగా రచన చేసే మనిషి ఫోటోగ్రఫీ కి వచ్చే వరకు మనిషి ని మాత్రమే తీయడం లేదన్న బోధనా ఒక అబ్యాసంగా మారింది. చిత్రంగానే అనిపిస్తుందిగానీ నిజానికి నేను మనిషిని మాత్రమే ఫొటో తీస్తూ ఉన్నాను. కానీ మనిషితో పాటు అటూ ఇటుగా అతడి పరిసర ప్రపంచమూ ఒక ఛాయలో చాయగా అనేక శ్రేణుల్లో బంధితం అవుతూ ఉన్నది. “ఇందులో ఏం ఆశ్చర్యం’ అని మీరు అడగవచ్చు. కానీ తెలిసింది అక్షరాలా పంచుకోవడం ఆశ్చర్యం. అది పంచుకోవడం లో ఒక ఆనందం ఉందని  ఈ చిన్న తలపోత, వాపోవడమూనూ!

+++

అప్పటిదాకా మనిషి మాత్రమే నా ఇతివృత్తం. కెమెరా కన్నులతో చూడగా ‘మనిషిని చూస్తున్నాననే’ అనుకున్నాను. అతడు పెరుగుతున్నాడు. అతడి ఆవరణా పెరుగుతున్నది. మీదు మిక్కిలి, అతడున్న ఆవరణ పట్ల స్పృహా కలుగుతున్నది. కానీ రచయితగా దర్శించినప్పటిలా కాకుండా- కెమెరాతో చూసినప్పుడు ఆ మనిషి ఫొటో నేను ఇదివరకు గమనించినట్టు, నేను అనుకున్నట్టు రాలేదు. అదొక ఆశ్చర్యం!

బహుశా అందుకే ‘చిత్రం’ అంటామా? అనిపిస్తోంది.

అంటే -నేను భావించినట్లు కాకుండా-ఉన్నది ఉన్నట్టుగా- వచ్చింది. అప్పుడనిపించింది, ఆలోచన కన్నా చూపు మరింత సత్యమేమో అని. అటు తర్వాత అనిపించింది, ఇందుకు కారణం ఆ మనిషిని సరిగ్గా చూపించే మాధ్యమంతో -ఫొటోగ్రఫీ మీడియం తో పనిచేస్తున్నాను కదా అన్న గ్రహింపు వచ్చింది, క్రమక్రమంగా. ఇది నిజం. వాస్తవం అనిపించేలా ఫోటో రచనలు చేయడం మొదలింది.

అంతకు ముందరి రచన నాది. అది సృజన. కానీ ఇది నా నుంచి ప్రతిఫలనము మాత్రమే అని అర్థమైనది. నా విశ్వాసాలకు భిన్నమైన జీవన ఛాయలు రచించడం మొదలయింది.

photo-3

ఒక మనిషి మనకు బాగా పరిచితుడే అనుకుంటాం. కానీ అతడిని ఫొటో తీసినప్పుడు ఆ మనిషిలోని అనేకానేక మార్పులు, ఛాయలు కనిపిస్తయ్. అంతకు ముందు మనం చూడలేనివి, బహుశా చూడ నిరాకరించినవీ కనిపించడమూ అగుపించి, ఆశ్చర్య చకితులం అవుతాం. నేను అదే అయ్యాను. ఇదే విశేషం అనుకుంటే మరో విశేషం, ఆ మనిషితో పాటు చుట్టుముట్టున్న విషయాలన్నీ స్పష్టంగానో అస్పష్టంగానో నమోదయ్యాయి. ఇంకా ఇంకా ఫొటోలు తీసుకుంటూ పోతుంటే, ఇంకా ఇంకా… విషయాలు అనుభవ గ్రాహ్యం కావడం మొదలైంది. ఇది రచనా వ్యాసంగంలో కంటే ఈ వెలుతురు రచనలో, కెమెరా ప్రపంచం కారణంగా, ప్రస్ఫుటంగా నా వరకు నాకే అర్థమవుతూ ఉన్నది. చూడటం వేరు అని, దర్శనం వేరు అని.

ఈ తారతమ్యమూ ఒక ఆశ్చర్యం!

ఎట్లా అంటే, ఒక మనిషిని లాంగ్ షాట్లో ఫొటో తీస్తూ ఉన్నప్పుడు ఆ మనిషి తీరు వేరు. బస్టు సైజులో ఫొటో తీస్తూ ఉన్నప్పుడు ఆ మనిషి వేరు. ఆ మనిషి ఏదైనా పనిలో -అంటే యాక్షన్లో ఉన్నప్పుడు అతడు అగుపించే విధానం మరీ వేరు. ఇక అతడు నలుగురిలో ఉన్నప్పుడు మరీ భిన్నం. పదుగురిలో ఉన్నప్పుడు తన అస్తిత్వం ఒక్కటే ప్రాధాన్యం వహించని కారణంగా బృందంలో ఒకడిగా, ఒక్కోసారి ‘గుంపులో గోవిందయ్య’గా అతడి వ్యక్తిత్వం అప్రధానం కావడమూ జరిగి -అతడు వేరుగా అగుపించసాగాడు. ఒక మనిషిని జూమ్ చేయడమూ, క్లోజపులో చూపడమూ కాకుండా లాంగ్ షాట్లో, వైడాంగిల్లో తీయడమూ చేస్తూ ఉండగా ఆ మనిషి తాలూకు మనిషితత్వం విడివడుతూ అంతకు ముందు పరిచయమైన మనిషి కాకుండా సరికొత్త మనిషి ఆవిష్కారం అవడమూ మెలమెల్లగా అర్థమైనది.

మీరూ గమనించే ఉంటారు. మీ ఫొటోలు మీకే కొత్తగా ఉండటం!

photo-4

అట్లే ఒక్కరు గ వేరు, ఇద్దరు ఉన్నప్పుడు వేరు, గుంపు లో మనస్తత్వం వేరు అని.

ఏకాంతం లో మీరు మరీ వేరు. ప్రకృతి లో మీరు కావడము అప్పుడు ఉండదూ!

ఆలా వేరువేరు చెట్లు వేరు వేరు.

అంటే మరోలా చెబితే, అతడున్న స్థానం అతడిదే కావచ్చు. కానీ కెమెరాకు స్థలమూ కాలమూ విశ్వమూ ఉండి అతడ్ని భిన్న కోణాల్లో నమోదు చేయడమూ జరుగుతున్నది. కావున మనిషిని చూడటంలో కన్నుకు ఉన్న పరిధి కెమెరా కన్ను దాటింది, దాటి చూపుతున్నదనీ కూడా నా గ్రహింపు!

మరీ చిత్రం ఏమిటంటే- ఆ మనిషి పెదవులు ముడుచుకుని ఇచ్చిన ఫోజుకు, పెదవులు తెరచి ఉండగా తీసిన ఫొటొకూ జీవన వ్యాకరణంలోనే పెద్ద తేడా కనిపించింది. ఒక రకంగా- పెదవులు ముడిచినప్పుడు అతడు అతడుగా అంటే ఒక నామవాచకంగా, ఒక ప్రత్యేక అస్తిత్తంలో ఫ్రీజ్ అయిన మానవుడిగా ఉండటం గమనించాను. కాగా,  పండ్లు కనిపిస్తూ ఉండగా తీసిన ఫొటోలో అతడు సహజంగా అగుపించి, ఒక క్రియలాగా తోచడమూ మొదలైంది. అది అతడికి తెలియకుండా జరిగ చర్యలాగూ ఉన్నది.

ఇంకా, ప్రత్యేకంగా అతడిని ఒక స్థలంలో ఆరెంజ్ చేసి, తగిన వెలుగు నీడల్లో అందంగా, విశిష్టంగా ఫొటో తీసుకోవడం ఉందే – ఫోటో షూట్ – అది ఒక విశేషణంగా తోచింది. మనిషి ఒక్కడే – అక్షరమాలలోని పదం మామూలే. కానీ అతడితో కర్తకర్మక్రియలన్నీ మారిపోతూ ఉన్నవి, అక్షరం- పదం -వాక్యం కావడం -కొన్ని సార్లు కావ్యం కావడము ఉన్నదీ. అయితే ఇదంతా తనతో కాకుండా తనతోటి పరిసర ప్రపంచంలో ఆ మనిషి మార్పు నాకు అవగతం అవుతూ ఉండటం -‘మనిషి’ ‘మనిషి మాత్రమే కాదు’ అన్న అవగాహనకు బీజం అనిపిస్తోంది.

+++

photo-5

ఇదంతా ఒకెత్తయితే నేను సూటిగా చెప్పదలచుకున్న విషయం, అదే- ఈ మనిషి కేవలం నా సాహిత్య వస్తువుగా ఉన్నప్పుడు చీమూ నెత్తురూ రక్తమాంసాలు మూలుగు ఆత్మా ఉన్న వాడుగా, అనుభవాల సెలయేరుగా, ముందు చెప్పినట్టు ఒక చెట్టులా ఉన్నాడు. కనిపించాడు, నేను అలా ఆవిష్కరించాను కూడా. కానీ, ‘ఇది పరిమితమే’ అని ఇప్పుడు అనిపిస్తున్నది. ఎందుకంటే, ఛాయాచిత్రలేఖనానికి వస్తే ఆ మనిషి ఒక ఉమ్మడి అంశంగా ఉన్నాడు. ఆ చెట్టు వేరుగా ఉన్నది. అతడు అడవి లోని  మానుగా ఉన్నాడు. లేదా జనారణ్యంలోని ఇనుప రజనుగా ఉన్నాడు.

ఆ వెలుగు నీడలు, ఆ ఆకుపచ్చ గానమూ, లేదా గాఢమైన ముదురెరుపూ తనవే కావచ్చును, కానీ, అతడు పంచభూతాల్లో ఒకడిగా ప్రతిబింబించసాగాడు. అతడి ప్రపంచం అన్నది లేదు. విశ్వంలో అతడున్నాడు. అంతే.

దాన్నే ఇలా చెబితే, అతడు ఫొటోగ్రఫి కారణంగా ప్రకృతిలో భాగంగా శోభిల్లడం నాకు దర్శనమిస్తూ ఉన్నది.  అదే ఈ వ్యాసానికి ఉపోద్గాతము, ముగింపునూ…

+++

చివరగా, మనిషి పంచభూతాల్లో ఒకడిగా, నేలా నింగితో, నీరూ నిప్పు గాలితో ప్రాణిగా ఉన్నాడు. వీటన్నిటి ప్రయోజనంగా, సంక్షిప్తమై ప్రత్యేక అస్తిత్వంగా సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. అందుకే అతడిని చూస్తే, తన స్థిరమైన లక్షణాన్ని గమనిస్తే మట్టిలా పరిమళంలా ఉంటాడు. ఆ సజల నేత్రాలను చూస్తే అది నీరు… ఆవేశకావేశాలతో ఎగిరిపడే అతడి హృదయం నిప్పు… ఆహ్లాదంతో తేలియాడినప్పుడు గాలి…. తన ఊహా ప్రపంచం, కల్పానమయ జగత్తును చూస్తే అది ఆకాశమో స్వర్గమో అనిపించసాగింది.

ఇలా పంచభూతాల సమాహారంగా అతడు లేదా ఆమె. వారి పరిసరాలు, ప్రతీదీ తన వ్యక్తిత్వంతో కాక ప్రాకృతిక జీవి గా వ్యక్తం కావడమూ ఉన్నది. అయితే అది స్వయంకృతం కాదని, మనిషంటే మనిషొక్కడే కాదనీ నాకు తీయగా తీయగా అనిపిస్తూ ఉన్నది. ఛాయలు చేయగా చేయగా అనిపిస్తోంది. మనిషి అంటే మనిషొక్కడే కాదని, ఇలా రాయాలనీ అనిపించింది.

ఈ రకంగా బోధపడ్డ అంశాలతో నేను మరింత నిలకడగా, లోతుగా ఛాయాచిత్ర లేఖనాన్ని అనుసరిస్తూ నాదైన సాహిత్య సృజన నుంచి మనిషిని చూసి అటు పిమ్మట కెమెరా గుండా  ‘మనిషి’ని -‘ప్రకృతి’ ని భాగం చేసుకునే, చూసుకునే ప్రయత్నం చేస్తూ మనిషి గా విస్తృతం అవుతున్నాను.

ఇలాంటి భావనలు పంచుకోవడంతో మిమ్మల్ని మీరు కూడా గమనిస్తారని, ఈ అందమైన సృష్టిలో ఒకరిగా, ఒక నిరంతర ప్రవాహంలో భాగంగా, soul of the universe గా గమనిస్తారన్న చిరు ఆశ. లేకపోతే నా ఫొటోగ్రఫి మాత్రమే కాదు, ఎవరి ఫోటోగ్రఫీ ఐనా అవిశ్రాంతం. మళ్లీ మనిషి ఉనికి ‘మనిషంతే’ అవుతుందన్న భయమూ కలుగుతుంది.

కావున, కృతజ్ఞతలు.

~

అమ్మా! ఇదిగో నీ కుమారుడు

rafi

Art: Rafi Haque

 

అవునమ్మా!

నీ కొడుకే దొరుకుతాడు

హంతకుల చేతికి ఉరి తాడు

నిజమేనమ్మా !

నీ కొడుకు ఏం నేరం చేసాడని

పొట్టనపెట్టుకున్నారు ?

నీ విలాపాల వాక్యాల నిండా

నీ కడుపుకోత కనిపిస్తూనే వుంది

నీ గొంతు ఘోష లోంచి

అరణ్య హింస వినిపిస్తూనే వుంది

నీ కొడుకేమైనా

యువ రాజకీయ నాయకుడా

సినిమా కథా నాయకుడా

నిలువెత్తు  ఫ్లెక్సీలలో

నిలబడి కనబడడానికి

నీ కుమారుడేమైనా వీధి రౌడీ నా

నెంబర్ వన్  కేడీనా

బలిసిన మంత్రిగారి కుమారుడా

తెలిసిన కుర్రకారు కుబేరుడా

ఏం చేసాడని

మగత నిద్రలో మట్టుపెట్టారు

ప్లాస్టిక్ సంచిలో కలిపికుట్టారు

నీ కొడుకు మాన భంగం చెయ్యలేదే

నిర్భయ కేసులో  ఇరుక్కోలేదే

తాగి వాహనం నడపలేదే

కారు చక్రాల కింద ఎవరినీ చంపలేదే

బాల చంద్రుడిలాంటి వాణ్ణి

బలితీసుకున్నారు  కదా

నువ్వు నెత్తీ నోరు బాదుకొని

గుండె బావిలోంచి నెత్తుటి కన్నీళ్ళని చేదుకొని

ఎంత ఏడిస్తే మాత్రం

కొడుకొస్తాడా తల్లీ

వేట గాళ్ళ ఉచ్చుల్లో

ప్రాణం పోయిన పసికూన

రెండు పదులు దాటకుండానే

తెగిపోయిన అడవి వీణ

న్యాయం ఇక్కడ అమ్ముడవుతుంది

ధర్మం ధరకు లొంగిపోతుంది

దీన్ని ధిక్కరించిన వాడే  నీ కొడుకు

కొత్త సమాజం కోసం

గొంతెత్తిన వాడు

కొత్త సర్కారుని స్వప్నించిన వాడు

శిరీష కుసుమం లాంటి కుమారుణ్ణి కోల్పోయిన దుఖ్ఖితు రాలా

నిజంగా నీ కొడుకు

చనిపోలేదమ్మా!

అడవి తల్లి కడుపులో

దాచుకుంది చూడు

తునికాకు పచ్చదనంలో ఉన్నాడు

తుడుం మోతలో వున్నాడు

కొమ్ము బూర లో ధ్వనిస్తున్నాడు

తూర్పు వనంలో వికసిస్తున్నాడు

పాల పిట్టలా నవ్వుతున్నాడు

పూల బుట్టలా పరిమళిస్తున్నాడు

తేనె తుట్టె లో వున్నాడు

అగ్గి పెట్టెలో వున్నాడు

రేపటి వాగ్ధానం కోసం

వసంత కాల మేఘమవుతున్నాడు

భూమి పుత్రుల నాగేటి చాళ్ళ కోసం

రేపటి  భూపాల రాగమవుతున్నాడు

తట్టుకో తల్లీ

కడుపు ఒడిని పట్టుకో తల్లీ

రేపటి కాలం మరో కొత్త కొడుకుని ప్రసాదిస్తుంది

కొత్త ఉద్యమ సూర్యుణ్ణి ప్రసవిస్తుంది

కొత్త నక్షత్రమై ప్రభవిస్తుంది

×××××

 

ముందడుగు ఇది…

suneeta2

అక్టోబర్ 19న నేను పనిచేసే అన్వేషి సంస్థ భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ సభ్యురాలు జకియా సోమన్ని వారు మూడు తలాక్ లకి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారోద్యమం గురించి మాట్లాడమని ఆహ్వానించింది. ఇది ఆ విషయం పైన గత మూడు నెలల్లో సంస్థ పెట్టిన మూడవ చర్చ. అంతకు నెల క్రితం ముంబై కి చెందిన ప్రముఖ లీగల్ ఆక్టివిస్ట్ ఫ్లేవియా ఆగ్నెస్ కూడా అన్వేషి కి వచ్చి ఈ విషయంపై తన అభిప్రాయాలని చర్చకి పెట్టారు. ఆవిడ బి ఎం ఎం ఏ చేస్తున్న ప్రచారోద్యమం అనవసరమని, ఇది హిందూత్వ వాదులకి ఉపయోగ పడుతుందని బలంగా వాదించారు.

మామూలుగా 20  మంది మించకుండా హాజరయ్యే ఇటువంటి చర్చలకు జకియా మాట్లాడే రోజు సమయానికి ముందే హాలు నిండేటంత అంతకు ముందు ఎప్పుడూ రాని ముస్లిం స్త్రీలు హాజరయ్యారు. ఆమె అహ్మదాబాద్ లో తన నేపధ్యం, తన అమ్మమ్మ ఇల్లు ఎన్ని సార్లు మత కలహాల్లో దగ్ధ మయింది, తన వైవాహిక జీవితంలో పడిన హింస, గుజరాత్ మారణ కాండతో తానెలా ముస్లిం కమ్యూనిటీ కోసం పని చెయ్యటం ప్రారంభించారో చెప్పారు. తాను గుజరాత్ ఊచ కోత బాధితులకి సహాయం చేసే పనిలో నిమగ్నమయిన తరువాతే తనని తాను ఒక ముస్లిం గా భావించుకోవటం ప్రారంభించానని చెప్పారు. ఆ అవగాహన తన జీవితాన్ని మార్చిందని కూడా చెప్పారు.

ఇదంతా చెప్పిన తరువాత తాము చేపట్టిన ప్రచారోద్యమం గురించి, తాము షరియత్ పరిధిలో, ఖురాన్లో చెప్పినట్లు మాత్రమే భర్తలు భార్యలకు తలాక్ ఇచ్చే విధంగా ముస్లిం కుటుంబ చట్టాలని మార్చాలని, వాటిని క్రోడీకరించమని అడిగామని చెప్పారు. దీనికి తమ వద్దకి వచ్చిన అనేక మంది బాధిత ముస్లిం స్త్రీల జీవిత పోరాటాలే కారణమని కూడా చెప్పారు. నల్ల జాతి ఇస్లామిక్ స్త్రీవాది అయిన అమీనా వదూద్ నుండి, షరియత్ పరిధిలో ముస్లిం స్త్రీలు తమ హక్కులు సాధించుకోవాలనే  ముసావా అనే అంతర్జాతీయ ఇస్లామిక్ మానవ హక్కుల నెట్ వర్క్ నుండి తాము స్ఫూర్తి పొందామని చెప్పారు.

అయితే హాజరయిన ముస్లిం స్త్రీలు జకియా మాట్లాడటం ప్రారంభమైన దగ్గరినుండి ప్రతి నిముషం ఆమెని అడ్డుకున్నారు. ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించారు. ఆవిడకి ఖురాన్ లో, హదీస్ లో ఏమి తెలుసో ప్రశ్నించారు. ఆవిడ హిందూ పురుషుడిని పెళ్లి చేసుకున్నందు వల్ల ముస్లిం కాదని, ముస్లిం లకి ప్రతినిధిగా ఉండటానికి అర్హత కోల్పోయిందని వాదించారు. కొంత మంది మూడు తలాక్ లనేవి కేవలం ముస్లింల వ్యతిరేక ప్రచారం మాత్రమే నని, తాము ఎక్కడా వినలేదని, చూడలేదని అన్నారు. ముస్లిం స్త్రీలకి సరయిన చదువు ఉంటే ఇటువంటి వాటికి బలి కాకుండా ఉంటారని వాదించారు. జమాత్ ఏ ఇస్లాం లో పని చేసిన ఖలీదా పర్వీన్, ముస్లిం స్త్రీలకి పేదరికం, చదువు లేకపోవటం, పితృస్వామ్యం వల్ల సమస్యలు ఉన్నాయని అయితే వీటిని కమ్యూనిటీ లోపలే చర్చించుకోవాలని, కోర్టుకి, ప్రభుత్వం దగ్గరికి వెళ్లి చట్టాల్లో మార్పుల కోసం అడగటం అనవసరమని అన్నప్పుదు అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తరువాత అందరూ బయటికి వెళ్లి పది నిమిషాల పాటు జకియా సోమన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసి వెళ్లిపోయారు. వీరందరూ ముస్లిం గర్ల్స్ అసోసియేషన్ అనే సంస్థకి చెందిన వారని తరువాత తెలిసింది. మర్నాడు సాయంత్రం ఆల్ ఇండియా మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ కార్యాలయం దారుస్సలాం లో జరిపిన సభలో కొంత మంది ముస్లిం స్త్రీల దుర్భర పరిస్థితుల గురించి ప్రసంగిస్తే మరి కొంత మంది జకియా సోమన్  పైన ఇదే రకమైన విమర్శలు గుప్పించారు. ఆమెకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిని ప్రశంశించారు. తాము గనక ఉండి ఉంటే ఆమెకి తస్లీమా నస్రీన్ కి పట్టించిన గతే పట్టించి వుండే వారమని కూడా కొందరు అన్నారని వినవచ్చింది. ఇటువంటి వారిని పిలిచిన వారిది కూడా తప్పే నని అభిప్రాయ పడ్డారు మరి కొంత మంది.

అన్వేషి సంస్థ స్త్రీలకి సంబంధించిన కుటుంబ చట్టాలు, వాటిలో మార్పుల గురించి గత ముప్ఫయి ఏళ్ల లో అనేక చర్చలు నిర్వహించింది. 1990 ల మధ్యలో షాబానో వివాదం తరువాత వుమ్మడి పౌర స్మ్రితి వుండాలని అనేక స్త్రీల సంస్థలు వాదించి, దాని నమూనాలు తయారు చేసిన సమయంలో రెండేళ్ల పాటు చట్టం, చట్ట సవరణల గురించి సామూహిక అధ్యయనం జరిపి, వుమ్మడి పౌర స్మ్రితి గురించి మాట్లాడే ముందు కుటుంబ చట్టాల విభిన్నత గురించి తగినంత అవగాహన వుండాలని, స్త్రీలకు న్యాయమంటే ఏకరూప ఉమ్మడి చట్టం అవసరం లేదని, వివిధ చట్టాలలో సంస్కరణలు చేసే విధంగా కృషి చెయ్యాలని వాదించి, ముంబై కి చెందిన మజ్లీస్ తో కలిసి స్త్రీవాద సంస్థ లన్నింటికీ ఒక అప్పీల్ ని పంపించింది – వుమ్మడి పౌర స్మ్రితి ముస్లింలని టార్గెట్ చెయ్యటానికి హిందూత్వ వాదులు వాడుకుంటున్నారు కాబట్టి, దాని గురించి మాట్లాడటానికి ఇది సమయం కాదని, స్త్రీ వాద సంస్థలు ఈ ప్రయత్నం మాను కోవాలని అడిగింది. గత ఇరవై ఏళ్లలో అఖిల భారత ప్రజాస్వామిక స్త్రీల సంస్థ తో సహా అందరూ స్త్రీలకి న్యాయం కోసం ఉమ్మడి పౌర స్మృతి  మార్గం కాదని, ఆయా కుటుంబ చట్టాలలో తగిన మార్పులు చేసుకోవాలనే ప్రజాస్వామిక అవగాహనకి వచ్చారు.

suneeta1ఇదంతా వర్ణించటం ముస్లిం గర్ల్స్ అసోసియేషన్ కి చెందిన స్త్రీలని విలన్లు గా, జకియా సోమన్ని హీరోయిన్ గా చూపించటానికి లేదా అన్వేషి సంస్థ గొప్పతనం చెప్పుకోవటానికి కాదు. నా ఉద్దేశంలో జకియా సోమన్ పట్ల అక్కడ వ్యక్తమైన వ్యతిరేకత – భారతీయ ముస్లిం సమాజాల్లో కుటుంబ చట్టాల గురించిన చర్చ మెజారిటీ హిందూత్వ వాద నీడలో జరగటం వల్ల జరుగుతున్న దుష్ఫరిణామాలకి ఒక చిహ్నం తప్ప మరేమీ కాదు. ముస్లిం గర్ల్స్ అసోసియేషన్ మరియు భారతీయ ముస్లిం మహిళా అందోళన్ రెండూ కూడా 1990 ల తరువాత, ఇంకా చెప్పాలంటే 2002 లో గుజరాత్ ఊచ కోత తరువాత పుట్టినవే. రెండూ కూడా బలంగా ఇస్లాం తమకు కావలిసిన హక్కులు, అధికారాలు ఇస్తాయని నమ్ముతాయి. ఇది కేవలం ఈ రెండు సంస్థల, సంఘటనల అవగాహనే కాదు. హైద్రాబాదు లో పని చేసే అనేక చిన్న ముస్లిం స్త్రీల సంస్థలు, తమ స్త్రీలకి సరయిన చదువు – ముఖ్యం గా ఇస్లాం గురించి – ఉంటే తమ హక్కులు తామే సాధించుకోగలరని, కుటుంబ సమస్యలని పరిష్కరించు కోగలరని, హింసకు వ్యతిరేకంగా పోరాడగలరని భావిస్తాయి.

అయితే ఏది సరయిన ఇస్లామిక్ అవగాహన, షరియత్ అంటే ఏమిటి, ముస్లిం పర్సనల్ చట్టాలంటే ఏమిటి, ఏ ఏ హక్కులు, అధికారాలు స్త్రీలకి వున్నాయి, అవి ఎవరి ఆధ్వర్యంలో సాధించుకోవాలి, ఎలా సాధించుకోవాల్సిన పద్ధతులపై మాత్రం తీవ్ర బేధాభిప్రాయాలు వున్నాయి. ఇస్లాం మత చట్టాలు మత విశ్వాసాలలో భాగమైనవి కాబట్టి అవి అచంచలమైనవి అని ముస్లిం గర్ల్స్ అసోసియేషన్ వారు వాదిస్తే, వాటిని చారిత్రిక సందర్భం బట్టి అర్ధం చేసుకోవాలని బిఎంఎంఎ భావిస్తుంది. ముస్లిం పర్సనల్ చట్టాలు షరియత్ నుండే పుట్టాయి కాబట్టి వాటిని ఎవరూ మార్చలేరని, మార్చ కూడదని ఎంజిఎ వాదిస్తే, అవి షరియత్ స్ఫూర్తి తో రూపొందింన భారత దేశ రాజ్యాంగ చట్టాలని, మారుతూనే వస్తున్నాయని, కాబట్టి వాటిని మార్చుకోవచ్చని బిఎంఎంఎ అంటుంది. పితృస్వామ్యం వల్ల ముస్లిం స్త్రీలు తమకి రావాల్సిన అధికారాలు సాధించుకోలేక పోతున్నారని ఖలీదా పర్వీన్ మరియు జకియా సోమన్ ఇద్దరూ అంగీకరించినప్పటికీ, ఖలీదా తమ సమాజంలోనే పోరాడి సాధించుకోవాలని భావిస్తే జకియా ప్రభుత్వ సహాయం తీసుకోవాలని భావిస్తున్నారు.

స్త్రీలు ముస్లిం సమాజంలో ఉంటూ పోరాడాలి అనే భావన సాంప్రదాయక ధోరణిగా అనిపించి నప్పటికీ ప్రజాస్వామ్యం కరువైన లౌకికత చేసే చేటు గురించి 1985 తరువాత కలిగిన అవగాహన లో ఇది కొత్త రాజకీయ అర్ధం సంతరించుకుంది. ఈ విషయాన్ని చర్చించిన పార్థ ఛటర్జీ వంటి రాజకీయ సిద్ధాంత కర్త మైనారిటీ సమాజంలో స్త్రీల పోరాటం గురించి చర్చిస్తూ ముస్లిం స్త్రీలు ఒక పక్క తమ సమాజాలని బయటి సమాజ దాడి నుండి రక్షించుకుంటూ ఇంకో పక్క తమ హక్కుల కోసం పోరాడాల్సి వస్తుందని అన్నారు. గత ముప్ఫయి ఏళ్ల ముస్లిం స్త్రీల పోరాటాలని అర్ధం చేసుకోవటానికి ఈ చట్రం చాలా ఉపయోగ పడుతుంది. ఈ ప్రక్రియలో స్త్రీలు కూడా తమ సమాజ ప్రతినిధులుగా ఎదుగుతున్నారు, అంగీకరించ బడుతున్నారు. ముస్లిం స్త్రీలు తమ హక్కుల గురించి మాట్లాడే స్థాయికి చేరుకోక ముందే తమ సమాజాలలో – విద్య లేక ఆరోగ్యం గురించి – లేదా సమాజాలపై దాడులు – హిందూత్వ దాడులు, పోలీసుల దాడుల గురించి – అనేక సంవత్సరాలు పని చేసి వుంటారు. ఉదాహరణకి భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ గుజరాత్లో ఊచకోతకు గురయిన ముస్లిం ల కోసం పని చెయ్యటమే కాక, ఆ తరువాత కుటుంబ సమస్యల పరిష్కారం కోసం షరియత్ అదాలత్ లని స్థాపించారు. అలాగే వివాహ సమయంలో భార్యా భర్తలిద్దరూ సంతకం చెయ్యాల్సిన నిఖానామా లో స్త్రీల హక్కులు కూడా స్పష్టం గా పొందుపరచి వాటిని ప్రచారం చేసి అనేక పెళ్లిళ్లలో వాటిని వాడుకునేలా కృషి చేశారు. ఈ ప్రక్రియలో సమాజం మొత్తం, పురుషులతో సహా, వారిని కొంత మేరకు తమ ప్రతినిధులుగా ఒప్పుకుంటుంది.  తమిళ నాడు లో షరీఫా ఖానం తో సహా అనేక మంది ముస్లిం స్త్రీలు నడిపే తమిళ్ నాడు ముస్లిం స్త్రీల జమాత్ దీనికి మంచి ఉదాహరణ. ఇది పుదుకోట్టై లోని పేద ముస్లిం స్త్రీలు కుటుంబ సమస్యలని ఖురాన్ పరిధిలో పరిష్కరించు కుంటూ దురాచారాలకు వ్యతిరేకంగా సామూహికంగా పనిచేస్తున్న క్రమంలో ఏర్పడింది. మొదట్లో పురుష జమాత్ లు వ్యతిరేకించినా క్రమేణా వాళ్ళే కుటుంబ సమస్యల కేసుల్ని వీరికి పంపించటం మొదలు పెట్టారు.

హిందూత్వ వాదులు ముస్లిం సమాజాలలో జరిగే పోరాటాలని తమ స్వప్రయోజనాల కోసం వాడుకోనంత వరకూ ఈ విషయాలపై పోరాడే స్త్రీలని ఆయా సమాజాలు కష్టం గా నైనా అంగీకరిస్తాయని గత ఇరవయి ఐదేళ్ల ముస్లిం సమాజాల చరిత్ర మనకి అర్ధం చేయిస్తోంది. భారతీయ ముస్లిం మహిళా ఆందోళన పట్ల హైద్రాబాదుతో సహా కొన్ని చోట్ల వ్యక్తమవుతున్న తీవ్ర వ్యతిరేకత దీని నుండే పుడుతోంది. వారు నరేంద్ర మోడీ వద్దకి వివాహ చట్టాల మార్పు కోసం వెళ్ళటం అనేది కొందరికి కోపం తెప్పిస్తే, కోర్టుకి వెళ్ళవలసిన అవసరం ఏముంది అన్నది మరి కొందరి బాధ. ‘దీనితో భారతీయ జనతా పార్టీకి జుట్టు అందించినట్లు కాలేదా? ముస్లిం సమాజాల పట్ల వ్యక్తమయ్యే అనేక అపోహలని – పురుషులు ఒకరి కన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటారు, ఎప్పుడు పడితే అప్పుడు భార్యలకు తలాక్ ఇచ్చేస్తారు, అసలు వుమ్మడి పౌర స్మ్రితి రావడమే దీనికి పరిష్కారం – బల పరిచినట్లు అవుతోంది కదా?’ అనేవి వారికి వస్తున్న విమర్శ. ‘అయితే మరి తమతో మాటైనా చెప్పకుండా భర్తలు తమకి తలాక్ నామా పంపిస్తున్నారని మా దగ్గరకి వస్తున్న ముస్లిం స్త్రీల సంగతేమిటి? ముస్లిం స్త్రీలు తమ వివాహ చట్టాల్లో మార్పుల కోసం ఎంత కాలం ఆగాలి? కాంగ్రెస్ వున్నప్పుడు చెయ్యదు, బిజెపిని అడగ కూడదు, సమాజ పెద్దలుగా అంగీకరించబడిన ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆ బాధ్యత ఎందుకు తీసుకోదు?’ అని బి ఎం ఎం ఏ వేస్తున్న అన్న ప్రశ్నలు ముస్లిం సమాజాల్లో, బయటా కావాల్సినంత చర్చని లేవదీస్తున్నాయి. అంతే కాక ‘ముస్లిం స్త్రీలు తమ సమాజంలో ఉంటూ తమ హక్కుల కోసం పోరాడాలి’ అన్న సూత్రీకరణకి  ‘ముస్లిం వివాహ చట్టాలలో షరియత్ ననుసరించి తగిన మార్పులు చెయ్యాలి’ అనే అర్ధాన్నిచ్చి కొత్త సవాలు విసురుతున్నాయి.

భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ మూడు తలాక్ లకి వ్యతిరేకంగా జరుపుతున్న ప్రచారోద్యమం, సుప్రీమ్ కోర్టులో వేసిన కేసు మళ్ళా తలెత్తిన ఉమ్మడి పౌర స్మ్రితి గురించిన అనవసర చర్చలో తేలిపోవచ్చు. వారి సర్వేలలో అసమగ్రత, వారి సభ్యత్వం లో లోపాలు, వారికి చట్టాల గురించిన అవగాహనా లేమి పరిశీలన లో ముందుకి రావచ్చు. ముస్లిం సమాజాలపై యుసిసి పేరుతో జరిగే దాడిని తిప్పి కొట్టటంలో భాగంగా మనలో కొంతమందికి వీరిని వ్యతిరేకించాల్సి కూడా రావచ్చు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల తరువాత భారతీయ జనతా పార్టీ నే ఈ వివాదాన్ని పక్కన పడెయ్యచ్చు. కానీ తమ సమాజంలో ఎప్పటి నుండో నలుగుతున్న సమస్యని అందరి దృష్టికి తెచ్చి తమ పెద్దలతో సహా అందరూ చర్చించేలా చేసారని మాత్రం ఒప్పుకోవాల్సి ఉంటుంది. సుప్రీమ్ కోర్టు తీర్పులకన్నా ఇటువంటి చర్చలే సామాజిక మార్పు కి దారి తీస్తాయి. ఇది ముస్లిం సమాజాల అంతర్గత మార్పులకి, ముస్లిం స్త్రీలు తమ సమాజ ప్రతినిధులుగా ఎదిగే ప్రక్రియకి చిహ్నం. దీనిని తమ స్వప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్న హిందూత్వ వాదుల అవకాశ వాదమే ముస్లిం సమాజాలని ఆత్మ రక్షణ లోనికి నెట్టి ముస్లిం స్త్రీల గొంతుని పైకి రాకుండా, మార్పుకి అవకాశమివ్వకుండా చేస్తోంది.

 

References

 

Voice of the voiceless (Status of Muslim Women Part II) Report prepared by Syeda Hameed in 1999 for National Commission for Women: http://ncw.nic.in/pdfReports/vov-part-2.pdf

Faizan Mustafa ‘The debate on triple talaq must be based on proper research and data’,  http://thewire.in/77923/muslim-personal-law-reforms-bmma-studies/

 

Anveshi Law Committee “Is gender justice only a legal issue?: Political stakes in UCC debate’, Economic and Political Weekly, Vol. 32, No.9- 10,

http://www.epw.in/journal/1997/9-10/perspectives/gender-justice-only-legal-issue.html

 

A.Suneetha “Muslim women and marriage laws: the debate on the model nickhanama”, Economic and Political Weekly, No.43, 2012

http://www.epw.in/journal/2012/43/review-womens-studies-review-issues/muslim-women-and-marriage-laws.html

A.Suneetha “ Between haquq and taleem: Muslim women’s activism in contemporary Hyderabad”, Economic and Political Weekly, No. 34. 2012 http://www.epw.in/journal/2012/34/special-articles/between-haquq-and-taaleem.html

 

 

 

 

 

 

పరాయీకరణ తర్కం

image2-1

పొగ నిప్పుకు సూచకం కాదు
నిప్పు లేకుండా పొగ సాధ్యమే
పొగ మంచు పొగా కాదు మంచూ కాదు
కాగితప్పడవలు నీటికి సూచకం కానక్కరలేదు
గాలిలో దీపాలు ఆరిపోనక్కర లేదు
గాలిలో దీపాలు కాగితప్పడవలు కాదు
కాగితప్పడవలు పడవలే కాదు

సినిమా హీరోలు మావోయిస్టులు కాదు
మహేష్ బాబు వర్గ శత్రు నిర్మూలన చెయ్యడు
అందంగా కనిపిస్తాడు ఉత్సాహంగా చంపుతాడు
మహేష్ బాబు  చంపడం నిజం కాదు
మహేష్ బాబు ఉత్సాహంగా చంపడం అబద్ధం కాదు

నిజం అబద్ధం కాదు
అబద్ధం నిజం కాదు
కాల్పులు వేరు బూటకపు యెదురు కాల్పులు వేరు
పోలీసులు వేరు సినిమా హీరోలు వేరు
సినిమా హీరోలు వేరు మావోయిస్టులు వేరు
హింస వేరు ప్రతి హింస వేరు

తాడు పాము కాదు
పామూ తాడు కాదు
సినిమా చూడటం వేరు చూపించడం వేరు
చూడ్డాన్ని చూపించటం వేరు
చూపించడ్డాన్ని  చూడ్డం వేరు
హింస వేరు చిత్ర హింస వేరు

మావోయిస్టులు సినిమా హీరోలు కాదు
కాగితప్పడవలు పడవలే కాదు
మావోయిస్టులు  వేరు సినిమా హీరోలు వేరు

image1-4

కొండ మీది కార్తీక దీపం కొండెక్కదు
అవునూ : దీపాన్ని కొండెక్కించిందెవరు?

జనం విష్ణుమాయలో వుండరు
జనం వేరు విష్ణుమాయ వేరు
జనం వేరు మనం వేరు
జనం మావోయిస్టులు కాదు
సినిమా వేరు శత్రు సంహారం వేరు
హీరో వేరు విలన్ వేరు సినిమా హీరో వేరు
సినిమా హీరో హల్లోనే కొడతాడు
బయటకి వస్తే  హీరోకి జనం విలన్ ల్లవుతారు

కాల్పులు వేరు ఎదురు కాల్పులు వేరు
దీపాలు వేరు పాపాలు వేరు
జనం వేరు సినిమా హీరోలు వేరు
మావోయిస్టులు వేరు కాగితప్పడవలు వేరు
విప్లవం వేరు విప్లవ తంత్రం వేరు
నీతి వేరు ద్రోహం వేరు
దీపాలు వేరు పాపాలు వేరు
దీపాలు చీకట్లను తరిమేసే పుణ్యాలు

( యస్.ఆర్. శంకరన్, డా.కె.బాలగోపాల్, కె.జి.కన్నాభిరన్ల స్మృతికి…photos: HRF fact finding team )

image1-3