సిరివెన్నెల శివదర్పణ గీతం!

 siva

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు గొప్ప గీతరచయితలే కాక గొప్ప శివభక్తులు కూడా. తమ గురువు గారైన సద్గురు శివానందమూర్తి గారి ఆశీస్సులతో శివునిపై వేయి గీతాలు రాయాలని సంకల్పించారు. ఈ గీతాలలో కొన్ని “శివదర్పణం అనే పుస్తకంగా వచ్చాయి. ఈ పుస్తకంలోని పాటలు కొన్ని  రెండు ఆడియో క్యాసెట్లుగానూ వచ్చాయి. ఈ గీతరచనా సంకల్పం గురించి “శివదర్పణం”లో సిరివెన్నెల ఇలా చెప్పారు –

“అడగకుండానే, శ్రమించి సాధించకుండానే, మాటల్ని పాటల పేటలుగా కూర్చే చిన్ని విద్దెను పుట్టుకతోనే ఇచ్చిన పరాత్పరుడి కరుణాకటాక్ష వరానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, బతుకుని అర్థవంతం చేసుకుని తరించే అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అనిపించడమే శ్రీకారంగా, ఈ గీతాయజ్ఞం 1990లో ప్రారంభించాను. వెయ్యి పాటల్నీ వెయ్యి యజ్ఞాలుగా చేసి, సహస్రమఖ పూర్తి సిద్ధి పొంది, తద్వారా లభించే దేవేంద్రత్వాన్ని, దేవదేవుని సేవేంద్రత్వంగా మలచుకోవచ్చని అత్యాశ కలిగింది!”

ఆయన అత్యాశ మన పాలిటి వరమై, అద్భుత సాహితీ యజ్ఞమై నిలిచింది! ఈ పుస్తకంలో ఉన్న ప్రతిపాటా ఆణిముత్యం. భక్తిగా సిరివెన్నెల తనని తాను శివునికి అర్పించుకున్న విధానం మనసుని స్పందింపజేస్తుంది. ఈ పాటల్లో ఆయన వాడిన భాషని చూస్తే సిరివెన్నెల ఎంత పదసంపద కలవారో తెలుస్తుంది. సినిమా పాటల కోసం తనని తాను భోళాశంకరునిగా మలచుకున్నారే తప్ప ఆయనో మహోన్నత కైలాస శిఖరమని అర్థమవుతుంది!

“శివదర్పణం” అంటే శివుణ్ణి చూపించే అద్దం. అయితే సిరివెన్నెలకి శివుడంటే క్యాలెండర్ లో కనిపించే దేవుడు కాదు. శివుడంటే మనం, శివుడంటే సమస్తం! ఆయన మాటల్లోనే చెప్పాలంటే –

“జగత్తు మొత్తాన్నీ త్రికాలసమేతంగా సాకల్యంగా సజీవంగా సంక్షిప్తంగా ప్రతిబింబించే అద్దం మనం! అలాగే మనకీ ప్రపంచం అద్దమవుతుంది. అయితే మనలా సూక్షంగా లేదే? మన భౌతిక తత్త్వాన్ని సరిగ్గా మన పరిమాణంలోనే ప్రతిబింబించేలా ప్రపంచాన్ని కుదించగలమా? అలా కుదిస్తే ఆ అద్దం శివుడు అవుతుంది. శివుడంటే ప్రపంచమే! శివుడంటే మనమే! శివుణ్ణి సరిగ్గా చూడగలిగితే మనని మనం సరిగ్గా, సజీవంగా, సంపూర్ణంగా, చూడగలం. అలాంటి శివదర్పణాన్ని చూపించడమే నా ఉద్దేశ్యం!”

ఆయనిలా చక్కగా చూపించినా, అర్థమయ్యేలా వివరించినా, శివతత్త్వాన్ని గ్రహించడానికి చాలా సంస్కారం, జ్ఞానం ఉండాలి అనిపిస్తుంది. అయినప్పటికీ ఈ సిరివెన్నెల గీతధారలో తడిసే ఆనందం దక్కాలంటే మాత్రం హృదయం ఉంటే చాలు. అందుకే ఈ పుస్తకంలోని ఒక పాటని పరికించి పులకిద్దాం!

sirivennela

“తొలిజోత” అనే పేరుతో రాసిన ఈ గీతం పుస్తకంలో మొదటిది. శివదర్పణ యజ్ఞాన్ని మొదలుపెడుతూ వినాయకునికి ప్రార్థనగా రాసిన గీతం.

పల్లవి:

 

అగజాసూనుడు అందునట అఖిలజగమ్ముల తొలిజోత

ఆ గజాననుని ఆదిపూజగొను అయ్యకు అంకిత మౌగాత

నా తలపోత! కైతల సేత!

 

చరణం 1:

హేరంబుని కాద్యభివందనమిడి ఆరంభించుట చేత ప్రతిచేత

ఆ లంబోదరు ఆలంబనతో అవిలంబితమౌనంట!

అందుచేత నేనందజేతునా చంద్రజేత చేత శతవందనముల చేత

అవిఘ్నమ్ముగా చేర్చునంట గణపతి తన అంజలి వెంట

ఈ నా తరగని యద చింత, నా ఈశుని పదముల చెంత!

 

చరణం 2:

శంభుని సన్నుతి సంకల్పించితి గణుతించిక స్వీయార్హత ఒక రవ్వంత

స్కందపూర్వజుని శరణు వేడితిని అందించడ దయచేత చేయూత

అజాతుడు అచింత్యుడు అనంతుడు అమేయుడౌ పరమాత్ముని ప్రభుత ప్రకటించే నా అల్పజ్ఞత

శర్వసర్వమంగళాశంసనకు అర్హమయే ఆశంతా

తీర్చును ఆ గణనేత తన అపారమౌ కృపచేత

 

చరణం 3:

సంచిత సుకృత సంభూతమ్మౌ సుసంకల్ప సంకలిత శివకవిత

కవింకవీనామను గణననుగల సిద్ధి వినాయకు చేత పరిపూత

శివాజ్ఞ ఎరుగని నా అవజ్ఞ ఆ విద్యాదినాధునిచేత అవనతమొందును గాత

సింధురాస్యునికి స్వాధీనమ్మై సిద్ధి సాధకమ్మవుగాత

అఘమర్షణమై అలరారుత ఈ శివకీర్తనముల సంహిత!

 

అగజాసూనుడు అందునట అఖిలజగమ్ముల తొలిజోత

ఆ గజాననుని ఆదిపూజగొను అయ్యకు అంకిత మౌగాత

నా తలపోత! కైతల సేత!

 

విఘ్నేశ్వర స్తుతిలోనూ తెలివిగా శివుణ్ణి ప్రస్తుతించారిక్కడ సిరివెన్నెల! “అగజాసూనుడు” అంటే పార్వతీ (అగజా) తనయుడైన (సూనుడు) వినాయకుడు! అఖిల జగాలూ ఏ పని చేసినా ముందుగా దణ్ణం పెట్టుకునేది వినాయకునికి! మరి ఆ వినాయకుడు భక్తిగా తొలిపూజ చేసేది ఎవరికి అంటే శివుడికి! ఆ శివుడికి సిరివెన్నెల తన గీతాలను అంకితం ఇస్తున్నారు. ఈ శివదర్పణ కృతి సిరివెన్నెల మేధలోంచి జాలువారిన  కవితామృతధార! ఆ తలపోత, కైతలసేత పొందే ధన్యత మనది!

 

హేరంబుని కాద్యభివందనమిడి ఆరంభించుట చేత ప్రతిచేత

ఆ లంబోదరు ఆలంబనతో అవిలంబితమౌనంట!

అందుచేత నేనందజేతునా చంద్రజేత చేత శతవందనముల చేత

అవిఘ్నమ్ముగా చేర్చునంట గణపతి తన అంజలి వెంట

ఈ నా తరగని యద చింత, నా ఈశుని పదముల చెంత!

 

వినాయకుడికి (హేరంబుడు) తొలి వందనాలు చేసి మొదలుపెట్టిన ఏ పనైనా ఆయన ప్రాపు (ఆలంబన) వల్ల విఘ్నాలు లేకుండా వేగంగా (అవిలంబితము) సాగుతుంది. ఇక్కడ సిరివెన్నెలకి అవ్వాల్సిన పని వేయి గీతాలు పూర్తిచెయ్యడం కాదు. ఆ గీతాల ద్వారా తాను చేసిన శత వందనాల చేష్టని (శత వందనముల చేత) ఆ శివుని చెంతన చేర్చడం!  ఇది తన వల్ల అయ్యేది కాదు కనుక చంద్రజేత అయిన వినాయకుని శరణుకోరుతున్నాను అంటున్నారు! ఆ వినాయకుడు శివుడికి రోజూ అర్పించే వందనాల (అంజలి) వెంట సిరివెన్నెల యొక్క  హృదయభారాన్నీ తీసుకెళ్ళి ఆ పరమేశ్వరుని పాదాల చెంత అర్పించాలట! ఎంత చక్కని భావం!  చేత/జేత వంటి పదాలతో శబ్దాలంకారాలు చేస్తూనే గొప్ప అర్థాన్నీ సాధించారిక్కడ సిరివెన్నెల!

 

శంభుని సన్నుతి సంకల్పించితి గణుతించిక స్వీయార్హత ఒక రవ్వంత

స్కందపూర్వజుని శరణు వేడితిని అందించడ దయచేత చేయూత

అజాతుడు అచింత్యుడు అనంతుడు అమేయుడౌ పరమాత్ముని ప్రభుత ప్రకటించే నా అల్పజ్ఞత

శర్వసర్వమంగళాశంసనకు అర్హమయే ఆశంతా

తీర్చును ఆ గణనేత తన అపారమౌ కృపచేత

 

అల్పత్వ భావన లేనిదే భక్తి లేదు. ఆ భగవంతుని ముందు నేనెంత, ఆయన్ని స్తుతించడానికి నా అర్హతెంత అనుకున్నప్పుడే  ఆయన కటాక్షం వలన గొప్ప కృతులు పుడతాయి! ఇదే ఇక్కడ సిరివెన్నెలలో కనిపిస్తోంది.  “నా అర్హత ఏమిటో కొంచెం కూడా తెలుసుకోకుండానే (గణుతించక) ఆ శివుణ్ణి స్తుతించాలనుకున్నాను! అందుకే స్కందపూర్వజుడైన ఆ వినాయకుడిని శరణు వేడుకుంటున్నాను! ఆయనే దయతో నాకు చేయూత నివ్వాలి! పుట్టుకలేనివాడూ (అజాతుడు), ఆలోచనకి అందనివాడూ (అచింత్యుడు), అంతము లేనివాడూ (అనంతుడు), పరిమితులు లేనివాడూ (అమేయుడు) అయిన ఆ పరమేశ్వరుడి గొప్పతనాన్ని ఈ శివకీర్తనల ద్వారా ప్రకటించడానికి ప్రయత్నిస్తోంది నా అల్పత్వం. ఈ అల్పత్వం శర్వుడైన ఆ శివుణ్ణి సర్వమంగళంగా ప్రస్తుతించే అర్హతగా మారాలి అన్నది నా ఆశ.  ఈ నా ఆశని ఆ వినాయకుడే తన అపారమైన దయతో  తీర్చాలి!” అని వేడుకుంటున్నారు సిరివెన్నెల! ఇంత భక్తితో వేడుకుంటే వినాయకుడు తీర్చకుండా ఉంటాడా?

 

సంచిత సుకృత సంభూతమ్మౌ సుసంకల్ప సంకలిత శివకవిత

కవింకవీనామను గణననుగల సిద్ధి వినాయకు చేత పరిపూత

శివాజ్ఞ ఎరుగని నా అవజ్ఞ ఆ విద్యాదినాధునిచేత అవనతమొందును గాత

సింధురాస్యునికి స్వాధీనమ్మై సిద్ధి సాధకమ్మవుగాత

అఘమర్షణమై అలరారుత ఈ శివకీర్తనముల సంహిత!

శివకవిత రాయాలంటే భక్తీ ప్రతిభతో పాటూ సుకృతమూ ఉండాలి! పరమాత్ముని కీర్తనం పుణ్యులకే సాధ్యపడుతుంది. అందుకే సిరివెన్నెల – “మంచి సంకల్పాలతో కూర్చబడిన (సంకలిత) ఈ శివకవిత, కూడబెట్టబడిన (సంచిత) నా సుకృతాల వలనే పుట్టింది (సంభూతము)” అంటున్నారు. పుణ్యాత్ములకే గొప్ప సంకల్పాలు కలుగుతాయి మరి!

ఈ సంకలనం “కవులలో కవి” అని ప్రస్తుతించబడిన సిద్ధివినాయకుని స్తోత్రం (గణన) వలన పవిత్రతను పొందింది (పరిపూత). అంటే తన గీతాలలో గొప్పతనమేదైనా ఉంటే అది కేవలం తన సుకృతం వల్ల, వినాయకుని దయ వల్ల, శివుని విభూతి వల్ల సాధ్యపడిందే తప్ప నాదంటూ ఘనత ఏమీ లేదని వినమ్రంగా సిరివెన్నెల చెప్పుకుంటున్నారు! “కవిం కవీనాం” అన్న వినాయక స్తుతిలో కవి అంటే కవిత్వం రాసేవాడు అని కాక జ్ఞాని, మేధావి అన్న అర్థం చెప్తారు. గొప్ప కవిత్వాన్ని కలిగిన ఈ శివదర్పణ సంకలనపు తొలిగీతంలో  “కవులలో కవి” అంటూ వినాయకుణ్ణి స్తుతించడం ఎంతైనా సముచితం!

ఆ శివుని ఆజ్ఞని ఎరుగని తన తిరస్కార (అవజ్ఞ) ధోరణిని ఆ విద్యాదినాధుడైన వినాయకుడే వంచుతాడు అంటున్నారు!  అంత భక్తితో, వినమ్రతతో ఉన్న సిరివెన్నెలకి తిరస్కారం ఎక్కడ నుంచి వచ్చింది? శివుని గురించి ఏమీ తెలియని అజ్ఞానం నాదని ముందు చరణంలో చెప్పుకున్నారు కదా, అలాంటి అల్పత్వం ఉన్నా లెక్కపెట్టక శివుణ్ణి స్తుతించే సాహసం చెయ్యడమే ఈ తిరస్కార ధోరణి! ఇలాంటి తిరస్కారం చూస్తే శివుడు కోప్పడడు సరికదా, కరిగిపోతాడు!

ఇలా ఆ వినాయకుని అండ వలన సింధురాస్యుడైన ఆ శివునికి అర్పితమైన ఈ శివకీర్తనలు పావనమై సిద్ధిని సాధిస్తాయి! “సర్వపాపాలూ నశింపజేసే మంత్ర” (అఘమర్షణము) సంహితలై అలరారుతాయి!

భక్తితో సిరివెన్నెల అర్పించిన పుష్పాలీ గీతాలు. పూజ ఆయనది, పుణ్యం మనందరిదీ! భక్తి ఆయనది, ఆ భక్తికి పులకించే హృదయం మనది. ఇన్ని గొప్ప గీతాలు రాసిన సిరివెన్నెలా ధన్యులే, ఈ గీతాలను విని ఆనందించే భాగ్యం కలిగినందుకు మనమూ ధన్యులమే! సిరివెన్నెల గారికి సహస్ర వందనాలు.

శశిప్రీతం సంగీతంలో బాలు ఆర్తిగా ఆలపించిన ఈ గీతాన్ని

 వినొచ్చు!

 

మీ మాటలు

  1. మంగళంపల్లి మరణం గరళకఠునికైన మింగుడుపడని గరళం,
    మంగళాశాసనంగ వినిపించే ఆయనగళం, సంగీత సాహిత్యాలు
    రెంటికి సమాన న్యాయంచేస్తు రామదాసుబాణైన త్యాగరాజు తీరైన,
    వాటిలొని భక్తి,సంగీత,సాహిత్యసౌరభాల మురళీరవమాసుస్వరమే
    ఓ గులుకు రాణి

  2. చొప్ప.వీరభధ్రప్ప says:

    ఉర్రూత లూగించే భక్తి గీతంలో పరవశించితి .

మీ మాటలు

*