సౌందర్యమంతా సంద్రమై..

1_Sripathi Letter

             శ్రీపతి,     బి-22  రవీంద్రనగర్,    హబ్సిగూడా,      హైద్రాబాదు – 500 007

                                                                                      డిసెంబర్ 30, 1988

 

ప్రియమైన త్రిపుర గారూ,

 

నమస్కారం.  కొత్త సంవత్సరం కధా కాంక్షలు !

ఈ మధ్య కధలు చదువుతున్నాను.  కొంత వరకు వరదరాజేశ్వర రావు గారు  కారణం.

మార్తాండం ( శ్రీనివాస్ రాయప్రోలు )  పెంగ్విన్ వాళ్లకు కధలు అనువాదం చేస్తున్నాడు.

మీకు నచ్చిన కొన్ని కధలు ఇవ్వండి అని పని అప్పజెప్పారు. దాంతో కధా సంపుటాలన్నీ తిరగేసినప్పుడు మిత్రులు అత్తలూరి ఇచ్చిన ‘త్రిపుర కధలు’ చదవటం – మరోసారి జరిగింది.

అట్లాంటి కధలు చదివినప్పుడల్లా, ఆ రచనల్లోని సృజనాత్మక కళాసౌందర్యం సముద్ర ప్రమాణంలో ప్రత్యక్షమై ఆ సంతోషంతో తన్మయులం అయిపోతాము.  నాకు దొరికిన కొద్ది కధలు ఆయనకు అందజేశాను.  వాటిలో మీ ‘జర్కన్’ కధ ఆయనకు నచ్చి దాన్ని అనువాదం చేసారు.  ఆ సందర్భంగా మీ వివరాలు తెలుసుకుని ఎంతో ఆసక్తి చూపించారు.

త్రిపుర, అజంతా, రాయప్రోలు శ్రీనివాస్ – ఒక కోవ కళాకారులనిపించింది.  వారం దినాల క్రితమే అజంతా దర్శనం అయిందిక్కడ.  ఈ సరికి ఆయన విశాఖ లోనే ఉండాలి.

నా వరకు కధా రచన కొనసాగింపు మొదలయినట్టే అనిపిస్తోంది. ఢిల్లీ   నేపధ్యంలో ఓ చిన్న నవల ప్రస్తుతం మెల్లగా సాగుతోంది. నాలుగైదు  కధలు – తిప్పి రాసి – పత్రికలకు ఇవ్వాలనుకుంటున్నాను.  పాత కధలు పునర్ముద్రిస్తుంటే సిగ్గొచ్చి కొత్త కధలు రాయాలనిపిస్తోంది.

మీ ఆరోగ్యం బాగుందా?  జవాబు రాస్తే సంతోషం.

 

మీ

 

శ్రీపతి

2_Sripathi Letter

మీ మాటలు

  1. కె.కె. రామయ్య says:

    విప్లవ రచయితల సంఘం (విరసం) వ్యవస్థాపక కార్యవర్గ సభ్యుడు, ప్రముఖ కధకుడు శ్రీపతి గారు (పుల్లట చలపతి రావు) మేధావి రచయిత త్రిపుర ( రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు ) గారికి 1988 వ సంవత్సరంలో రాసిన యీ ఉత్తరం యీ వారం సారంగ లేఖాయణం లో చూడటం చాలా ఆనందానిచ్చింది.

    త్రిపురను డిస్కవర్ చేసి తెలుగు పాఠకకోకానికి పరిచయం చేసిన డా. అత్తలూరి నరసింహ రావు గారి ప్రస్థావన;
    నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు గారి తనయుడు రాయప్రోలు శ్రీనివాస్ ( మార్తాండం కలం పేరుతో కవిత్వం రాసిన ) గారి ప్రస్థావన; పేర్గాంచిన త్రిపుర జర్కన్ కధ ఆంగ్లంలోకి అనువదించబడటం గురించిన ప్రస్థావన; కవనకుతూహలం అబ్బూరి వరదరాజేశ్వర రావు, కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం పొందిన స్వప్నలిపి కవితాసంకలనం కవి అజంతాల ప్రస్థావనల తో కూడిన ఓ అపురూపమైనదీ యీ ఉత్తరం.

మీ మాటలు

*