Archives for January 2015

గుర్తుందా?

పెరట్లో నందివర్ధనం చెట్టు ప్రక్కన
నా ఎదురుగా నిలబడిన నువ్వు
నీ మొహాన కొంటెదనం కలగలిసిన
పెదాలు విచ్చని ఓ చిరు నవ్వు
నా కళ్ళలోనికి మాత్రమే చూస్తూ 
నీ పయోధరాల కోమలత్వానికి హత్తుకుంటూ 
నా చేయిని నొక్కి పట్టిన నీ చెయ్యి
నాకు మాత్రమే వినబడేంత మంద్రంగా
నీకే వినిపించనంత లలితంగా …
మెల్లగా ముందుకు వంగి
నా చెవిలో నీ పెదాలతో
యేమని వేణుగానం ఊదావు?
 
నువ్వో సగం నేనో సగం 
అన్లేదూ?
 
గాలి తన అలికిడిని, అల్లరిని ప్రక్కకు పెట్టి 
కళ్ళు, పెదవుల ఉనికిని లెక్క చేయకుండా
తమకంతో చేసుకుంటున్న మూగ బాసల సాక్ష్యాన్ని
ఎలాగైనా సరే నమోదు చెయ్యాల్సిందే అని నిశ్చలంగా
ఎదురు చూపులు చూస్తున్న వేళ …
 
జరిగింది నాకు తెలిసే లోపే
తటాలున నా చెయ్యి వదిలి
రెండు చేతుల్తోనూ నన్ను పెనవేస్తూ
నాతో పాటు చుట్టూరా వున్నా చెట్టూ చేమల్నీ,
కలం విదుల్చుకుంటూ దొంగ చూపులు 
చూస్తున్న వాయు దేవుడ్ని,
నిశ్చేష్టుల్ని చేస్తూ   
ఘాడంగా
అమృత మధనాన్ని అర క్షణం లో 
జ్ఞప్తికి తెస్తూ
చేసిన మోహినీ చుంబనం …
 
ఆలంబన లేక తొట్రుపడిన నా తనువుకు
నీ లేత తనువు ఆలంబనను 
అప్పటికప్పుడే అరువిస్తూ …
 
గుర్తుందా ???
 
ఎన్నేళ్ళు గడిచింది కాలం ???
ఒంటరితనం ప్రతిధ్వనిస్తూనే వుంది నీ వెచ్చని తలపు …
 
 
లీలగా, కల చెదురుతూ వినబడింది ‘తాతయ్యా’ అంటూ 
మళ్ళీ మనవరాలిగా తిరిగి వచ్చి, 
నువ్వు చెవిలో ఊదిన పిలుపు …
కంటి మసకను భుజాలకు అద్దుకుంటూ
చేతుల్లోకి తీసుకున్నాను …
నిన్ను … నా మనవరాల్ని …
అచ్చం నువ్వు నన్ను పొదువుకున్నట్లుగానే …

-ఎన్ ఎం రావ్ బండి
bsr

అణచినవాడే శూరుడు! లొంగిపోతే పతివ్రత!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)నలదమయంతులు, ఓడిసస్ పెనెలోప్ ల కథల మధ్య పోలికల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామంటే, తేడాలు కూడా ఉన్నాయి కనుకే. అంటే, తేడాల మధ్యనే పోలికలను గుర్తిస్తున్నామన్నమాట. ఆ సంగతిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు సుసూక్ష్మమైన పోలికలను చూద్దాం:

మొదటి పోలిక

రెండు కథలూ ఎటువంటి దేవతారోపాలూ లేని ఇద్దరు మానవుల గురించి, అందులోనూ ఇద్దరు పురుషుల గురించి చెబుతున్నాయి. ఆ చెప్పడంలో మళ్ళీ ఒక తేడా ఉంది. నలుని ఉదాసీనంగానూ, విధి లేదా ఒక అదృశ్యశక్తి అతని కష్టాలకు కారణమైనట్టుగానూ కథకుడు చిత్రిస్తున్నాడు. అతణ్ణి విధి చేతిలో పావుగానే తప్ప, కష్టాల నుంచి గట్టెక్కడానికి పురుష(మానవ) ప్రయత్నం చేసినవాడిగా చూపించడం లేదు. ఇందుకు భిన్నంగా, ఇంతకుముందు చెప్పుకున్నట్టు, దమయంతి క్రియాశీలగా కనిపిస్తుంది. అంటే, దమయంతి అనే స్త్రీకి గల క్రియాశీల స్వభావాన్ని కథకుడు బహిర్గతం చేస్తూనే, దానిమీద పలచని తెర వేసి, నలుడు అనే పురుషుడి ముఖంగా కథ చెబుతున్నాడన్న మాట.

స్త్రీ, పురుష స్వామ్యాల కోణం నుంచి చూస్తే, భారతీయ తాత్వికతకు గల ప్రత్యేకతను ఇది వెల్లడిస్తుంది. ఎలాగంటే, సామాజిక స్థాయిలో స్త్రీ స్వామ్యం మీద పురుషస్వామ్యాన్ని ప్రతిష్టించడమే ఇక్కడ జరిగింది కానీ, తాత్విక స్థాయిలో స్త్రీస్వామ్యాన్ని పూర్తిగా అణగదొక్కలేదు. అంతర్లీనంగా రెండు స్వామ్యాల మధ్య ఒక రాజీసూత్రం కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం భారతీయ స్వభావంలోనూ, చరిత్రలోనూ ఉంది. మనది నేటికీ బహుళ దేవీ, దేవుల ఆరాధనా రూపంలో బహురూప ఆస్తికత కొనసాగుతున్న దేశమని చెప్పుకున్నాం.

ఓడిసస్ నలుడికి భిన్నం. నలుడిలో ఉదాసీనత కనిపిస్తే, ఓడిసస్ లో క్రియాశీలత కనిపిస్తుంది. నలుడు ఎంత యోధుడో మనకు తెలియదు. కథకుడు ఆ కోణానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ ఓడిసస్ ను యోధుడిగా చూపించడానికి కథకుడు ప్రాధాన్యం ఇస్తున్నాడు. అతను ట్రాయ్ యుద్ధంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత పన్నెండు ఓడలలో సహచరులను వెంటబెట్టుకుని సాహసయాత్ర ప్రారంభించాడు. ఒక పట్టణం మీద పడి జనాన్ని చంపి స్త్రీలను, సంపదను సహచరులతో కలసి పంచుకున్నాడు. యోధలక్షణంతోపాటు ఇది అతని పురుష, లేదా మానవ ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత అతనికి పరీక్షలు, కష్టాల పరంపర ప్రారంభమవుతుంది. నలుడు ఎదుర్కొన్న పరీక్షలు, కష్టాల వెనుక ప్రతికూల(కలి), అనుకూల(కర్కోటకుడు) శక్తులు ఉన్నట్టే, ఓడిసస్ వెనుక కూడా (జియస్, పోసిడియన్, అయోలస్, హెర్మెస్) ఉన్నారు. అయితే, నలునికి భిన్నంగా ఓడిసస్ మానవీయమైన తెలివితోనూ, వీరత్వంతోనూ, పురుషకార్యంతోనూ కష్టాలనుంచి గట్టెక్కడానికి ప్రయత్నిస్తాడు. నలుని విషయంలో కథకుడు విధిపాత్రను ప్రముఖంగా సూచిస్తున్నట్టు కనిపిస్తే; ఓడిసస్ విషయంలో పురుషయత్నాన్ని ప్రముఖంగా సూచిస్తాడన్నమాట.

ఓడిసస్ ఒంటి కన్ను రాక్షసుడైన పోలిఫెమస్ బారినుంచి బయటపడిన తీరే చూడండి. అతని చేత మద్యం తాగించి నిద్రపుచ్చడంలో, అతని కన్ను పొడిచేసిన తర్వాత పొట్టేళ్ళ కడుపుకు వేలాడుతూ తప్పించుకోవడంలో ఓడిసస్ బుద్ధిబలాన్ని ఉపయోగించుకుంటాడు. ఆ తదుపరి ఘట్టంలో అయోలస్ అనే వాయుదేవుడినుంచి సహాయం పొందుతాడు. అయితే సహచరులు చేసిన తప్పువల్ల మళ్ళీ కష్టాల్లో పడతాడు. ఆ తర్వాత నరమాంసభక్షకులు ఉండే దీవికి చేరుకుని అక్కడ ఒక అందమైన యువతిని చూసి సమ్మోహితుడవుతాడు. పదకొండు ఓడలను, ఎంతోమంది సహచరులను కోల్పోవడం రూపంలో అందుకు ప్రతిఫలం చెల్లించుకుంటాడు.

download

అక్కడినుంచి సిర్సే అనే అప్సరస ఉండే దీవికి చేరుకుని, తన సహచరులను ఆమె పందులుగా మార్చివేసినట్టు తెలిసి ఆమెను శిక్షించడానికి ఒక కత్తి తీసుకుని బయలుదేరతాడు. అప్పుడతనికి హెర్మెస్ అనే దేవుడి సాయం లభిస్తుంది. సిర్సేను లొంగదీసుకుని సహచరులను రక్షించుకోవడమే కాక, ఆమెతో పడకసుఖం కూడా పొందుతాడు. ఆమె సూచనపై అధోలోకానికి వెళ్ళి పితృదేవతలకు తర్పణం ఇస్తాడు. ఆ తర్వాత సౌరద్వీపానికి వెడతాడు, మరోసారి తుపానులో చిక్కుకుని, ఉన్న కొద్దిమంది సహచరులనూ, ఓడనూ కూడా కోల్పోతాడు. ఒంటరిగా ఇంకో దీవికి చేరి అక్కడ కలిప్సో అనే అప్సరసతో ఎనిమిదేళ్ళు కాపురం చేస్తాడు. మళ్ళీ తెప్ప మీద బయలుదేరి విధ్వంసానికి గురై ఈదుకుంటూ వెళ్లి కొందరు బాలికల సాయంతో ఫేషియన్లను కలుస్తాడు. వారు అతణ్ణి ఓడలో క్షేమంగా స్వస్థలానికి పంపిస్తారు. అక్కడ అతను పెనెలోప్ స్వయంవరపరీక్షను వీరోచితంగా ఎదుర్కొని తిరిగి ఆమెను గెలుచుకుంటాడు.

ఇలా అనుకూల శక్తులనుంచి సాయం పొందుతూనే ప్రతికూలశక్తులను బుద్ధిబలంతోనూ, భుజబలంతోనూ ఎదుర్కొంటూ అనేక కష్ట నష్టాలనుంచి పురుషప్రయత్నంతో బయటపడిన మానవమాత్రుడిగా ఓడిసస్ ను చిత్రించే కథకుని వ్యూహం అడుగడుగునా స్ఫురిస్తూ ఉంటుంది. ఇందుకు భిన్నంగా నలదమయంతుల కథలో ఇటువంటి బుద్ధిబలాన్ని సమయస్ఫుర్తిని దమయంతి ప్రదర్శిస్తుంది. రెండు కథల్లోనూ దేవతలపై మనిషిది పైచేయిగా చూపడం కనిపిస్తుంది. ఇంకొక విధంగా, చెప్పాలంటే దేవతల మధ్యలోంచి క్రియాశీలుడైన నరుడు ఆవిర్భవించడం గురించి ఈ కథలు చెబుతున్నాయి.

రెండవ పోలిక

ఇది మరింత సుసూక్ష్మంగా అర్థం చేసుకోవలసిన పోలిక. ఇక్కడ జోసెఫ్ క్యాంప్ బెల్ తన విశ్లేషణలో పేర్కొన్న female principle అడుగుపెడుతుంది. ఆ మాటను ‘స్త్రీ సూత్రం’ గా అనువదించుకుందాం. ఓడిసస్ కథలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది కనుక ముందు దాని గురించి చెప్పుకుందాం. ఓడిసస్ కు– నీళ్ళు పట్టుకుంటున్న ఒక అందమైన యువతి; సిర్సే, కలిప్సో అనే అప్సరస,లు నౌసికా అనే బాలిక, ఎథెనా అనే అనుకూల దేవత వరసగా తారసపడతారు. అందమైన యువతి రూపంలో అతనికి ఎదురై, సమ్మోహన పరచిన తొలి అనుభవం నరమాంసభక్షకుల రూపంలో పెద్ద ప్రమాదాన్ని కొనితెచ్చింది. ఆ తర్వాత ప్రతికూలశక్తిగా ఓడిసస్ కు ఎదురైన సిర్సే చివరికి అతనికి లొంగిపోయి అనుకూలశక్తిగా మారిపోయింది. అతను ఆమె పొందును అనుభవించడమే కాక ఆమె నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుని మార్గదర్సనం కూడా పొందాడు. సిర్సే దగ్గరే అతని నగ్నత్వం గురించిన ప్రస్తావన వస్తుంది.

ఇక కలిప్సో మొదటినుంచీ అనుకూలత పాటించిన అప్సరస. ఆమెతో అతను ఎనిమిదేళ్ళు కాపురం చేయడానికి కారణం, మోహపాశంతో తనను బంధించివేసింది కనుకనే. ఆమెకు ఇష్టంలేకపోయినా ఆ పాశాన్ని తెంచుకుని బయటపడ్డాడు. సిర్సే దగ్గర ఎదురైన నగ్నత్వ భయానికి భిన్నంగా కలిప్సో దగ్గర అతనికి వస్త్రం లభించింది. మళ్ళీ నౌసికా అనే బాలిక తారసపడిన సందర్భంలో నగ్నత్వప్రస్తావన వచ్చింది. అప్పుడతను పూర్తి నగ్నంగా మారాడు. అయితే, ఆ బాలిక అతనికి వస్త్రం కూడా ఇచ్చి రాజభవనానికి తీసుకువెడుతుంది. చివరగా అతను కొడుకును, భార్యను కలసుకోడానికి ఎథెనా సాయపడుతుంది. ఈ ‘స్త్రీ సూత్రా’నికి కీలకమైన తాత్వికమైన వివరణ ఉంది. దాని గురించి త్వరలోనే చెప్పుకోబోతున్నాం.

నలదమయంతుల కథకు వస్తే; ఈ స్త్రీ సూత్రం అన్నది ఓడిసస్ కథలో కనిపించినంత స్పష్టంగానూ, వివరంగానూ కాక, లీలగా ధ్వనిస్తూ ఉంటుంది. ఈ కథలో ప్రధాన స్త్రీపాత్ర దమయంతి ఒక్కతే. ఆమె అప్సరసో, లేక అందమైన అపరిచిత యువతో కాదు, నలునికి అర్థాంగి. కాసేపు ఆ సంగతిని పక్కన పెట్టి ఓడిసస్ కథలోని స్త్రీ సూత్రాన్ని ఆమెకు అన్వయించుకుని చూద్దాం. దమయంతిని వివాహమాడాకే నలునికి కష్టాలు మొదలయ్యాయి. ఆమెతో ఉన్నప్పుడే అతడు నగ్నంగా మారాడు. ఆమె చీరలోని అర్థభాగంతోనే తన నగ్నత్వాన్ని కప్పుకున్నాడు. చివరికి ఆ చీరను తెంచుకుని బయటపడ్డాడు. తిరిగి దమయంతిని కలసుకున్న సందర్భంలోనే పోగొట్టుకున్న తన వస్త్రాన్ని మళ్ళీ సంపాదించుకుని, ధరించి నలుడిగా మారాడు. ఓడిసస్ కథలోనూ, ఈ కథలోనూ కూడా స్త్రీ సమక్షంలో పురుషుడి నగ్నత్వానికీ, వస్త్రానికీ ఏదో ప్రతీకాత్మక, తాత్విక ప్రాముఖ్యం ఉన్నట్టు అనిపిస్తుంది.

oedipus

ఈ నగ్నత్వ ప్రస్తావన వచ్చే మరో ప్రసిద్ధ కథ ఊర్వశీ-పురూరవులది. ‘నువ్వు ఎప్పుడైతే నాకు నగ్నంగా కనిపిస్తావో అప్పుడే నిన్ను విడిచి వెళ్లిపోతాను’ అని ఊర్వశి పురూరవుడికి షరతు పెడుతుంది. ఒకరోజున పురూరవుడు నగ్నంగా కనిపించేసరికి అతణ్ణి విడిచి వెళ్లిపోతుంది. ఈ కథకు వేరే అన్వయాలు ఉన్నాయి. వాటి గురించి తర్వాత చూద్దాం.

ఇక్కడ ఇంకొక విషయం గుర్తుచేసుకోవాలి. పైన చెప్పిన స్త్రీ సూత్రమూ, లేదా స్త్రీ స్వామ్య, పురుష స్వామ్యాలలో గ్రీకు తాత్వికతకు, భారతీయ తాత్వికతకు తేడా ఉందని చెప్పుకున్నాం. గ్రీకు తాత్వికతలోనే కాక సామాజిక స్థాయిలో కూడా స్త్రీ-పురుష స్వామ్యాల మధ్య తీవ్ర ఘర్షణా, ఒకదానిపై ఒకటి పై చేయిని చాటుకునే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో పురుషుడు విజయం సాధించి వీరుడిగా, క్రియాశీలిగా ఆవిర్భవించడం ఉన్నాయి. భారతీయ తాత్వికతలో స్త్రీ-పురుష స్వామ్యాల మధ్య ఘర్షణతోపాటు సర్దుబాటు, సయోధ్య ఉంటూనే; సామాజిక స్థాయిలో స్త్రీ స్వామ్యంపై పురుషస్వామ్యం పై చేయిని చాటుకోవడం ఉంది. అయితే, పురుషుని నరుడిగా, వీరుడిగా, క్రియాశీలిగా అవతరింపజేయడం భారతీయ, గ్రీకు సందర్భాలు రెండింటిలోనూ ఉమ్మడి అంశం.

ఈ కోణంలోకి వెళ్లినప్పుడు భారతీయ, గ్రీకు పురాణ కథలలోనే కాక; ప్రపంచ పురాణ కథలు అనేకంలో ఆశ్చర్యకరమైన పోలికలు కనిపిస్తాయి. ఉదాహరణకు ఒక బాబిలోనియా పురాణ కథలో మర్దుక్ అనే దేవుడు తియామత్ అనే స్త్రీశక్తిని, లేదా దేవతను చంపుతాడు. తియామత్ పై రాక్షసి అన్న ముద్ర పడుతుంది. అది, స్త్రీ స్వామ్యం నుంచి పురుషుడు వీరత్వంతో బయటపడి క్రియాశీలి అవడానికి ప్రతీక. మన రామాయణానికి వస్తే, రాముడు తాటక అనే రాక్షసిని చంపుతాడు. లక్ష్మణుడు శూర్పణఖ అనే రాక్షసి ముక్కు చెవులు కోస్తాడు. కృష్ణుడు పూతన అనే రాక్షసిని చంపుతాడు. ఇంద్రుడు ఉష అనే దేవతను చంపుతాడు. నరుడిగా ప్రత్యేకమైన గుర్తింపు పొందిన అర్జునుడు పులోమ, కాలక అనే రాక్షసస్త్రీలను కాకపోయినా వారి సంతానాన్ని చంపుతాడు. ఊర్వశి అనే అప్సరసతో పొందుకు నిరాకరిస్తాడు. ఓడిసస్ సిర్సేను చంపకపోయినా ఆమెపై కత్తి దూస్తాడు.

అర్జునుని నరుడు అన్నట్టుగానే రామాయణంలో రాముని నరాంశను నొక్కి చెప్పడం కనిపిస్తుంది. ‘నేను దశరథ మహారాజు కొడుకుని, మనిషిని మాత్రమే’ నని రాముడు ఒక సందర్భంలో చెప్పుకుంటాడు. అలాగే రాముని ‘పురుషోత్తముడు’ అన్నారు. అంటే ప్రపంచ పరిణామంలో ఒక దశలో స్త్రీ స్వామ్యంపై పురుష స్వామ్యాన్ని స్థాపించి వీరుడు, సాహసి, క్రియాశీలుడైన నరుని ఆవిర్భవింపజేయవలసిన అవసరం కలిగిందని ఈ కథలన్నీ సూచిస్తున్నాయన్న మాట.

స్త్రీపై రాక్షసి అన్న ముద్ర వేయడమే కాక, పురుషుడి కష్టాలకు, అతడు ఆత్మన్యూనతలోకి, నిష్క్రియత్వంలోకి జారిపోవడానికి స్త్రీయే కారణమన్న సూచనను ఉద్దేశపూర్వకంగానో, అనుకరణప్రాయంగానో ఆయా పురాణ కథలు అందిస్తున్నట్టు కనిపిస్తుంది. కొన్ని పోలికలు చూడండి…నలదమయంతుల కథలో నలుడు దమయంతిని పెళ్లాడిన తర్వాతే రాజ్యం కోల్పోయి కష్టపరంపరలో చిక్కుకుంటాడు. ప్రవాస జీవితం గడుపుతూనే బాహుకుడనే పేరుతో, వికృత వేషంలో, అంటే మారువేషంలో దమయంతి ‘పునస్స్వయంవరా’నికి వెడతాడు. పెనెలోప్ తో వివాహం అయిన తర్వాతే ఓడిసస్ యుద్ధానికీ, అక్కడినుంచి సముద్రంలో సాహసయాత్రకు బయలుదేరి వెళ్ళి పదేళ్లపాటు అనేక కష్టానష్టాలకు గురై చివరికి నోమన్ అనే మారుపేరుతో బిచ్చగాడి వేషంలో పెనెలోప్ పునస్స్వయంవరానికి వెడతాడు.

రాముడు విశ్వామిత్రుని వెంట అడవికి వెళ్ళి అక్కడినుంచే నేరుగా సీతాస్వయంవరానికి వెళ్ళి సీతను వరిస్తాడు. ఆ తర్వాత పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేస్తాడు. అలాగే, పాండవులు ద్రౌపది స్వయంవరానికి వెళ్లే ముందు బ్రాహ్మణ వేషాలలో అరణ్యవాసమే చేస్తున్నారు. ద్రౌపదితో వివాహం తర్వాతే వారు అర్థరాజ్యం పొందారు, ఆ రాజ్యాన్ని కోల్పోయి ఈసారి ద్రౌపదితోపాటు మళ్ళీ అడవుల పాలయ్యారు. వారు రాజ్యం కోల్పోవడం వెనుక ద్రౌపది పాత్ర కూడా ఎంతో కొంత ఉంది.

అయితే, ఈ పోలికలు అన్నీ అచ్చు గుద్దినట్టు ఒకే సూత్రాన్ని అనుసరించడంవల్ల కాకపోవచ్చు. కొన్ని కథానిర్మాణంలో అనుకరించిన స్థూలమైన పోలికలు కావచ్చు. స్త్రీ స్వామ్యంపై పురుష స్వామ్యాన్ని స్థాపించే ప్రయత్నం మాత్రం అన్నింటిలోనూ సమానం. ఉదాహరణకు, నలదమయంతులు, ఓడిసస్ పెనెలోప్ ల కథల నిర్మాణం స్థూలంగా ఒకలానే ఉంటుంది. కానీ నలదమయంతుల కథలో వాస్తవంగా క్రియాశీల అయిన దమయంతి ముఖంగా కాక, ఉదాసీనుడైన నలుని ముఖంగా కథ చెబుతుంటే; ఓడిసస్ కథలో ఓడిసస్ నే క్రియాశీలుడిగా చూపిస్తూ అతని ముఖంగా కథ చెబుతున్నాడు. స్త్రీ స్వామ్యంమీద పురుష స్వామ్యం పైచేయిని నొక్కి చెప్పడం రెండింటా సమానం. అదే మిగతా ఉదాహరణలలోనూ కనిపిస్తుంది.

రామాయణకథ తెలిసిన వారికి ఒక సందేహం కలిగితీరాలి. అదేమిటంటే, తాటక, పూతన తదితరులే కాక, రావణుని చెల్లెలు అయిన శూర్పణఖ కూడా రాక్షసి అయినప్పుడు రావణుని భార్య అయిన మండోదరి ఎందుకు కాలేదన్నది. పౌరాణిక సంప్రదాయం మండోదరిని పతివ్రతగానూ, ఉత్తమురాలిగానూ గుర్తిస్తుంది. దీనికి మనం చెప్పుకోగలిగిన తార్కిక సమాధానం బహుశా ఒక్కటే: స్త్రీస్వామ్యంలో ఉన్న స్త్రీలు రాక్షసులు, పురుష స్వామ్యాన్ని, పురుషుడి ఆధిపత్యాన్ని అంగీకరించిన వారు ఉత్తమురాళ్ళు, పతివ్రతలు అయ్యారన్నమాట!

అదలా ఉంచితే, ఇక్కడినుంచి మనం మరిన్ని తాత్వికపు లోతుల్లోకి వెళ్లవలసి ఉంటుంది. అది తర్వాత…

 -కల్లూరి భాస్కరం

ఈమె ‘చేతల’ సరస్వతి…

సరస్వతి

 

“ప్రగతి, పురోగమనం ఎందుకు సాధించాలి? ఆర్థిక ప్రగతి అయిదు శాతమో పది శాతమో ఉంటే సంతోషం రెట్టింపు అవుతుందా? సున్నా శాతం ఎదుగుదల ఉంటే ఏమవుతుంది? ఇది ఒక రకంగా స్థిరమయిన ఆర్థిక విధానం కాదా? సాధారణమైన జీవనం గడుపుతూ అన్నిటినీ తేలికగా తీసుకోగలగటం కంటే మించినది మరేదైనా ఉందా?” — మసనోబు ఫుకుఒకా.

ఈరోజు కొంతమంది మాట్లాడే ఈ మాటలు జపాన్ ప్రకృతి సేద్యకారుడు ఫుకుఒకా నలభై ఏళ్ల కిందటే చెప్పాడు.

మేడిన్ చైనా విశ్వరూపం చూసి మురిసి , అమెరికన్ డాలర్ మెరుపు కలల్లో తూగి, మేక్ ఇన్ ఇండియా సంస్కృతిలోకి రాకెట్ వేగంతో “ఆ విధంగా ముందుకు పోతున్న” మనకు, ఫుకు ఒకా ఓ ఆదిమానవుడిలా కనిపిస్తాడు. కొన్ని వేల సంఖ్యలో మాత్రమే ఉన్న పర్యావరణ వాదులనబడే జీవులు కూడా అలాగే కనిపిస్తారు. మనమే చేతులారా పెంట పోగులా తయారు చేసుకున్న భూమ్మీదనుంచి, పోగేసుకున్న డబ్బుతో సహా పారిపోయి (బడుగు జీవాత్మలను ఇక్కడే వదిలేసి) ఏ గాలక్సీ ల్లో ఇళ్ళు కడదామా అనేంత ప్రగతి యుగంలో ఉన్నప్పుడు ఒక్క అడుగు వెనక్కు వెయ్యడమంటేనూ, ఒక్క రోజైనా ఎండని గానీ చలిని గానీ భరించడమంటేనూ డబ్బు చేసుకున్నవాళ్ళలో చాలా ఎక్కువమందికి ఎంతో కష్టం. ఆర్ధిక ప్రగతి రాల్చే చుక్కలు సరిగ్గా ఇంకని బతుకుల్లో మాత్రమే మిగిలిన పంచభూతాల తీవ్రతను నిజానికి అందరూ సమానంగా అనుభవించాలని చెప్పే పర్యావరణ వాదులను దూరం పెట్టేవాళ్ళే ఎక్కువ.

***

‘సరస్వతి కవుల’ అసలైన పర్యావరణ వాది. పర్యావరణ సంరక్షణ గురించిన చర్చలు పూర్తయిన తరువాత ఆ విషయాలు మాట్లాడేవాళ్ళ లో ఒక్కరు కూడా ఆ మీటింగ్ గదిలో ఫ్యాన్లూ లైట్లను ఆపకుండా వెళ్ళిపోతే ఎంతో చిరాగ్గా ‘ఇదేం అన్యాయం?’ అంటూ వ్యాసం రాసేసే సున్నితమైన మనసున్న మనిషి. రకరకాల సంస్థల్లో పనిచేసేవాళ్ళలో, చెప్పిన విషయాన్ని తమ జీవితంలో చేసి చూపించేవాళ్ళు అరుదు. చెప్పిందే చేసే సరస్వతి అందువల్లేనేమో, సంస్థల్లో కంటే ఒంటరిగానే తనపని తను చేసుకుంటూ పోతోంది.

నర్సీపట్నం దగ్గర రంగురాళ్ళ కోసం తవ్వకాలు విపరీతంగా జరిగే రోజుల్లో ధైర్యంగా అక్కడికి ఓ కామెరా పట్టుకుని వెళ్ళిపోయి ఆ విషయం మీద, అక్కడ జరిగే అన్యాయాలమీద 2004 లో చిన్న డాక్యుమెంటరీ తీసింది. దీనితో ఆమె చాలామంది దృష్టిలో పడింది. కొన్నేళ్ళపాటు ఆ ప్రాంతం మీద జరిగిన రేప్ ను కొద్ది రోజుల్లోనే ఒక్క విషయమూ వదలకుండా రికార్డ్ చేసింది. ఆ రోజుల్లో పత్రికలూ బాగానే రాశాయి. కానీ సరస్వతి కామెరాతో రికార్డ్ చేసింది కాబట్టి ఆ విషయమేమిటో పూర్తిగా తెలుసుకోవాలనుకునే భవిష్యత్తుకి అది ‘కుప్పుసామయ్యర్ మేడీజీ’… ఈ మేడీజీ లు డాక్యుమెంటరీల వల్లే సాధ్యమౌతున్నాయి కాబట్టే మనం బతుకుతున్న కాలంలో ఇవి గొప్పవి. విషయంతో బాటు ‘కలాపోసన’ కూడా చేయగల్గితే డాక్యుమెంటరీలను మించినవి ఏముంటాయి ? హోషంగ్ మర్చంట్ మీద “My  Dear Gay Teacher” అంటూ సరస్వతి తీసిన డాక్యుమెంటరీ లో కాస్త కళాపోషణ కూడా కనిపిస్తుంది. సరే ఇదిలా ఉంచితే, “Behind The Glitter” అనే రంగురాళ్ళ కథ ఏమిటో సరస్వతి డాక్యుమెంటరీ ద్వారా గుర్తు చేసుకుంటే …

తొంభైల్లో విశాఖ దగ్గర, నర్సీపట్నం దాపునున్న కొండల్లో వజ్రాల్లాంటి రంగురాళ్ళు దొరుకుతున్నాయని తెలియగానే నెమ్మదిగా తవ్వకాలు మొదలయ్యాయి. 2000 సం. లో alexandrite అనే మరీ విలువైన, నగల్లో వాడే రాయి దొరుకుతోందని తెలియగానే అక్కడి ఘరానా మనుషులే కాకుండా పక్క రాష్ట్రాలవాళ్ళు కూడా దిగిపోయేరు. అక్కడే ఉండే చిన్న చిన్న గూండాలు, అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, అందరూ సిండికేట్లు గా తయారైపోయి తవ్వకాలు జోరు చేశారు. అక్కడే బ్రతికే కొండవాళ్లకు, ఎక్కడినుండో కూలిపనికి వచ్చిన వాళ్లకు ఆ రాళ్ల విలువేమిటో తెలీదు; దొరికిన రాళ్ళను యజమానులకు అప్పచెప్పటం, రెండొందలో మూడొందలో తీసుకుంటూ, వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన బందెల దొడ్లలో బతకటం తప్ప… నిదురలో ఆదమరుపుగా వున్న ఆ కొండ పల్లెల్లోకి ఒక్కసారిగా ప్రైవేటు బస్సులూ, గుళ్ళూ గోపురాలూ, జీన్ పేంటులూ, కాస్మెటిక్స్, సెక్స్ అవసరాలు తీర్చే ఆడవాళ్ళూ, ఎయిడ్స్ రోగాలూ, అన్నీ బారులు తీరాయి. కాస్త డబ్బులు కళ్ళ చూసిన వాళ్ళు ఆ గ్రామాల్లోనే పక్కా ఇళ్ళు కట్టుకుంటే, ఎక్కువమంది వెర్రివాళ్ళు కూలోళ్లుగానే మిగిలారు. ఈ వరసనంతా అక్కడి జనం పూర్తిగా ఎరుక పరిచారు సరస్వతి డాక్యుమెంటరీలో.

“మా పరంటాన వజ్రాలు పడ్డాయి. మా కుర్రోలు ఓ పదిమంది ఎల్నారు. ఎల్తే ఒకో పదిమంది నాలుగు ఉజ్జీలు కట్టుకొని ఆలే తవ్వుకుంటన్నారు గానీ ఈలని తవ్వనివ్వలేదు” – అంటాడు అమాయకంగా ఓ మనిషి.

“ఇదంతా అయిపోయేక మా బాధలేటి? మొత్తానికి అడివి పీకేస్తుంటే మా పిల్లలకేముంటదక్కడ?” అనెంతో బాధగా అడుగుతుంది మరో కొండ మనిషి.

ఇంకో ఆడమనిషి భర్త అనుమతితోనే తను కుటుంబ కష్టాలు తీర్చటం కోసం అక్కడికొచ్చి వ్యభిచారం చేస్తున్నట్టు సామాన్యంగా చెప్తుంది.

ఎర్ర చందనం స్మగ్లర్లు రాయలసీమ అడవుల్లో చేసిన ప్రకృతి భీభత్సం లాటిదే ఇదీ అయినా, సరస్వతికి కాస్త జాగ్రత్తగానైనా ధైర్యంగానే ఈ డాక్యుమెంటరీ తీసే అడ్డంకులు లేని వెసులుబాటు 2004 లో దొరికింది. ఫారెస్టు అధికారుల్ని కూడా చంపి పారేసేంత క్రౌర్యం చందనం స్మగ్లర్లు చూపిస్తే, అంత అవసరం లేకుండా అమాయకుల్ని ఉపయోగించి ‘కరక’ లాంటి గ్రామాల్లో రంగురాళ్ళు తవ్వేసుకున్నారు పెద్దమనుషులూ వ్యాపారులూ. ఎవడికో ఆ రాళ్ళను ఇవ్వటం కోసం కొండ తవ్వుతూ కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.

సరస్వతి ఇంకా రకరకాల సమస్యల మీద NGOల కోసం పది పన్నెండు డాక్యుమెంటరీలు తీసింది. వీటిలో ఆమె రైతుల సమస్యలు చర్చించింది. రసాయనిక వ్యవసాయంతో రైతు పడే పాట్ల లోతులను తాకింది. సేంద్రీయ వ్యవసాయం మంచిదని హితబోధ చేసింది. మూసీనదిని పాడు చేసిన మనుషుల, అధికార్ల మురికితనాన్ని బైటపెట్టింది. చేపలు పట్టేవాళ్ళ జీవితాల్లో మరపడవలు రేపిన కల్లోలాన్ని కాస్త చూడమంది. ఈమధ్య పోలవరం బాధితుల గోడును రికార్డు చేసింది. థర్మల్, అణు విద్యుత్ కేంద్రాలకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజలు చేసే నిరసనల్లో పాల్గొంది. కొవ్వాడలో రాబోయే అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా జనాన్ని కూడగట్టడానికి ప్రయత్నం చేసింది.

ప్రజల బాధల్ని డాక్యుమెంటరీలుగా చేస్తూ సంపాదించే ఆ కాస్తడబ్బుమీద బతకటం కూడా సరైనపని కాదని భావించేంత రొమాంటిక్ సరస్వతికి సమస్య తమ ఇంటి గుమ్మం దాకా వచ్చేవరకూ మనుషులు ఎందుకు మాట్లాడరో అర్థం కాదు. ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ బతికే భద్ర జీవితాలను ఉతికి ఆరేసే తత్వంతో ఎదుటి మనిషి ఇబ్బందిగా అటూ ఇటూ చూసి నత్తగుల్లలా ముడుచుకుపోయే పరిస్థితి కల్పిస్తుందీమె. అయినా ఆమె నిజాయితీకి మాత్రం ఎవరూ వంక పెట్టలేరు.

***

“నీ స్నానానికి ఒక్క బకెట్ నీళ్ళు మాత్రం ఇవ్వగలను” – అంది సరస్వతి.

ఆమె ఇప్పుడు ఓ కొండరాళ్ళ వరుస నానుకున్న చిన్న పొలంలో వ్యవసాయం చెయ్యటానికి ప్రయత్నిస్తోంది. ఇది అన్ని సౌకర్యాలతో ఫార్మ్ హౌస్ లు కట్టుకుని పచ్చిగాలి పీల్చటం కోసం చేసే డబ్బున్న హాబీ వ్యవసాయం కాదు. పట్నాల్లో పరుగులతో విసుగెత్తి పల్లెస్వర్గానికి వెళ్ళిపోవాలని కలలు కనే మధ్యతరగతి రొమాన్స్ కూడా కాదు. అసలైన రైతు తత్వాన్ని ఇంకించుకుని, ఆధునికత్వాన్ని వదిలించుకుని, నేలతో మనసును ముడేసుకోవాలనుకునే ఆలోచన నుండి పుట్టిన ఆచరణ. పొలంలోనే ఓ రెండు గదులూ, చిన్న వరండా, పైన రేకుల కప్పు. మట్టి, ఇటుక, పైన సన్నని సిమెంట్ పూతతో కట్టిన ఆమె చిన్న ఇంటి ముందు వేప, సీతాఫలం చెట్లు, వంటింటి వాడకం నీళ్ళతో పచ్చగా మెరిసే అరటి చెట్లు… మెరిసే మూడు సోలార్ పానెల్స్ నుంచీ వచ్చే శక్తి ఓ రెండు బల్బులూ, ఓ ఫ్యాన్ వాడుకుందుకు సరిపోతుంది. ఈ చక్కటి నిరాలంకారమైన దృశ్యం అమరేముందు ఆమె పడిన పాటు తక్కువేమీకాదు.

ఆ ఉదయపు పచ్చి గాలుల్లో వరండా ముందు ఏపుగా ఎదిగి చిన్నగా ఊగుతున్న కంది మొక్కలు. కొన్నేళ్లలో తప్పక చెట్లయి నీడా, పళ్ళూ ఇస్తామని చెప్తున్న మామిడి మొక్కలు. ఎప్పటికీ నీ తోడు వదలం అంటున్న మొండి ఆముదం చెట్లు. ట్రాక్టర్ చాళ్ళ వెంట పురుగుల్ని హుషారుగా ఏరుకుంటున్న కొంగల వయ్యారి నడకలు … చిన్న హైకూ కవితలా బతికేస్తే సరిపోదా?

ముందురోజు రాత్రి దబదబా తలుపులు కొడుతున్న చప్పుడయి ఉలిక్కి పడ్డాను. ఊరికి దూరంగా ఉన్న ఆ పొలంలో ఇద్దరమే ఉన్నామన్న ధ్యాస టకీమని నెత్తిమీద కొట్టింది నన్ను. ఇంతకీ అది ఉడతలు చేసే హంగామా అట. రేకులమీదా తలుపులమీదా కొడుతూ సరస్వతి ప్రపంచంలో మేమూ సభ్యులమే అని ప్రకటన చేస్తూ ఉంటాయట. దూరంగా ఉన్న నల్లటి ఎత్తయిన రాళ్ళ వరుసలో ఉన్న రంగులున్న, రంగుల్లేని పిట్టలూ, నెమళ్ళూ అలా ఓ సారి పొలాన్ని పరామర్శించి, పాట కచేరీలు కూడా చేసి వెళ్తూ ఉంటాయి.

ఆ కొండలో ఎన్నో పక్షులూ జీవాలూ ఉన్నాయని, దానిని అలాగే వదిలెయ్యమని సరస్వతి అధికారులతో, కోర్టుతో ఎంత మొత్తుకున్నా విదేశాలకు సమాధిరాళ్ళు పంపించి డబ్బు చేసుకునే మనుషులు దాన్ని వదలలేదు. ఆ రాళ్ళ అదృష్టం బాగుండి అవి ఆ విదేశీ సమాధుల షోకుకు పనికిరాక పోవటంతో కాంట్రాక్టర్ ఆ పని వదిలి వెళ్ళాడు. ఇంకే నరుడి దృష్టికి ఆ నల్ల రాళ్ళు మళ్ళీ పగులుతాయో చెప్పలేం.

వర్షాధారపు భూముల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ నిలబడటానికి అమ్మ సాయంతో నడుం వంచి తను చేస్తున్న ప్రయత్నం ఒక్కో సంవత్సరం ఒక్కో రకం ఫలితాన్ని ఇస్తోంది. ఆ ఊళ్ళో ఉన్న రైతులంతా కొర్రలు, జొన్నలు వంటి పంటలు ఉంటాయని కూడా మర్చిపోయిన గ్రీన్ రెవల్యూషన్ తరం. వాళ్ళంతా నీళ్ళ కోసం తాపత్రయపడుతూనే మందులు జల్లి జోరుగా వరి మాత్రమే పండిస్తూ ఉన్నపుడు సరస్వతి కొర్రలు పండించింది. “మా దేశానికి కొర్రలు మల్ల తెచ్చినవా బిడ్డా” అని అనుభవాల ముడతలతో మొహాన్ని సింగారించుకున్న ఓ పండు ముసలామె మురిస్తే, ఆ మొహంలోని ముడతలన్నీ సాగి ఆనందంతో మెరవటం మరవలేను.

ఏదెలా ఉన్నా, ఏ శక్తులు ఎంత భయపెట్టినా, తను సమాజంలో కోరుకుంటున్న మార్పే తానయి బతికే ఇలాంటి సరస్వతులు చేస్తున్న పనే వృధా పోకుండా ఎప్పటికైనా భూమిని బతికిస్తుంది.

సరస్వతి డాక్యుమెంటరీల కోసం ఇక్కడ చూడండి.

http://saraswatikavula.weebly.com/

-ల.లి.త.

lalitha parnandi

 

 

 

 

 

 

 

 

‘పాత్రో’చితంగా…

images

నిన్న ఆహుతి ప్రసాద్
ఇవ్వాళ గణేష్ పాత్రో…మొన్నటి బాలచందర్ విషాదం నించి కోలుకోకముందే…!
మృత్యువు ఎంత గడుసుదీ!
అది మనతోనే పుట్టింది. మనతోటే పెరుగుతుంది. వుండీ వుండీ మనకీ తెలియకుండా ‘మన’ని ‘తన’లోకి లాగేసుకుంటుంది.
పొద్దున్నే ఒకరు ఫోన్ చేసి, “సార్, గణేష్ పాత్రో గారూ…” అని నానిస్తే, “ఏమైందీ” అని అడిగాను.
“అహ! వారి ఫోన్ నంబరు తెలిసేమోననీ…” అన్నారు. వెంటనే ఫోన్ పెట్టేశారు.
గంట తరవాత హైదరాబాద్ నించి ఓ ఫోను. “GP…మరి లేరు!” అని.
మరో గంటకి వరసగా ఫోన్లు.
“సారీ…బాడీ హాస్పిటల్లో ఉందా? ఇంటికి తెచ్చారా?” అని.
ఎంత విచిత్రం!

శ్వాస ఉన్ననాళ్ళూ యీ శరీరం ‘శివం’
శ్వాస ఆగిన మరుక్షణం ‘శవం’
అప్పటిదాకా మనిషికి అన్ని పేర్లూ, బిరుదులూ, లాంచనాలూ అన్నీ పోయి కేవలం “బాడీ” అనే పదం మాత్రం మిగుల్తుంది. అప్పుడెప్పుడో శోభన్ బాబు గారు పోయినప్పుడూ అంతే!
“సార్…బాడీ హాస్పిటల్లో ఉందా? ఇంటికి తెచ్చారా?” అని ఇది సర్వ సహజం. ఈ ఒక్కదాన్నీ మించిన వేదాంతం ఎక్కడుంది? ‘బాడీ’ కేవలం body…! పేరెత్తరు! తెచ్చుకున్న పేరూ, పెట్టుకున్న పేరూ, పెట్టిన పేరూ అన్నీ శ్వాస ఆగగానే క్షణంలో మాయమవుతాయి.
సరే…

ఎక్కడో పార్వతీపురం దగ్గిర పుట్టారు. నాటకాలు రాశారు. నటించారు, స్పురద్రూపి కనుక! మధ్యతరగతీ, దిగువ మధ్య తరగతి జీవితాల్ని ఆపోశన పట్టారు. చెన్నపట్నం గమ్యం అయింది. ‘రాజీ పడడం’ అనే మాట గణేష్ పాత్రోకి తెలీదు.
మాట మనిషిని చంపుతుంది.
మాట మనసుని చంపుతుంది.
మాటే- మనిషినీ మనసునీ కూడా బతికిస్తుంది.
మాట నిన్ను గెలిపిస్తుంది. నిన్ను చిత్తుగా ఓడిస్తుంది. మాటే నిన్ను హిమాలయ శిఖరం మీద కూడా నిలబెదుతుంది. ఆ ‘మాట’ ని ఎలా వాడాలో, ఎంత వాడాలో, ఎప్పుడు వాడాలో తెలిసిన రచయిత – మాటల రచయితా, కథా రచయితా గణేష్ పాత్రో గారు.

ఈ చలనచిత్ర పరిశ్రమలో సముద్రాల వంటి సీనియర్ల ‘యుగాన్ని’ అలాగే ఉంచితే (వారిని జడ్జ్ చేయడం సముద్రాన్ని చెంచాతో కొలవడం లాంటిది గనక) ఆ తరవాత మనకి కొందరు మాటల మాంత్రికులు కనపడతారు- పింగళి నాగేంద్ర రావు, ఆచార్య ఆత్రేయ, ముళ్ళపూడి రమణ- ఇలాంటి మహానుభావులు.
వారికంటూ వారొక ‘పంధా’ ను సృష్టించి మనకి ‘సంభాషణా రచన’ ఎలా చేయాలో పాఠాలుగా బోధించారు. గణేష్ పాత్రో కూడా నిస్సందేహంగా ఆ కోవకి చెందినవాడే.
ఓ అక్షరం ఎక్కువుండదు.
ఓ అక్షరం తక్కువుండదు.
తూచినట్టు వుంటాయి మాటలు.
తూటాల్లా వుంటాయి మాటలు.
ఏ పాత్రకి ఏ భాష వాడాలో, స్పష్టంగా తెలిసిన రచయిత గణేష్ పాత్రో. అందుకే, ఆయన మాటలు ‘పాత్రో’చితంగా – ఒక ఎక్స్పర్ట్ టైలర్ కొలతలు తీసి కుట్టిన వస్త్రాల్లా వుంటాయి.
నటుడి హావభావాల్ని బాగా అబ్సర్వ్ చేస్తారు.

ఏ పదాలు ఆ నటుడి ముఖతా వస్తే పండుతాయో పరకాయ ప్రవేశం చేసి మరీ రాస్తారు.
అందుకే- ఆయన సంభాషణలకి అలవాటు పడ్డ నటులందరూ అనేది ఒకే మాట- “ఆయన డైలాగులే ఎలా నటించాలో మాకు నేర్పుతాయని”
ఇంతకంటే గొప్ప మెప్పుదల ఏముంటుందీ?
ఆ మెప్పుని వందల సార్లు పొందారు పాత్రో.

ఆయన కెరీర్లో ఒక్క పాటే రాశారు – “హలో గురూ ప్రేమ కోసమే” అని- నేననే వాడ్ని “పాత్రో గారు ఇంకొన్ని పాటలు రాయచ్చుగా” అని- ఆయన నవ్వి, “మీరూ ఇంకొన్ని సినిమాలకి సంభాషణలు రాయొచ్చుగా? మరెందుకు రాయలేదూ? మీరు డైలాగ్స్ రాస్తే, నేను పాటలు రాస్తా!” అనే వారు. (‘అలజడి’ అనే ఏకైక సినిమాకి నేను మాటలు రాసా. దర్శకత్వం: తమ్మారెడ్డి భరద్వాజ)

గ్రాఫ్ చూస్తే-
రుద్రవీణ, సీతరామయ్య గారి మనవరాలు, మరో చరిత్ర, గుప్పెడు మనసు, ముద్దుల కిట్టయ్య, ముద్దుల మావయ్య (భార్గవ్ ఆర్ట్స్ అన్ని సినిమాలకి ఆయనే మాటలు రాసారు)- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు – ఇలా ఎన్నెన్ని హిట్స్! మధ్యతరగతి, కింది తరగతి వాళ్ళ ప్రతి కదలికనీ గమనించారు. ప్రతి ఉద్వేగాన్నీ అక్షరాలుగా మలిచారు. మనని మనకి కొత్తగా చూపించారు. వాడిన డైలాగ్ వాడలేదు. సన్నివేశాలు ఒక్కోసారి ఒకేలా వున్నా “డైలాగ్స్”లో వైవిధ్యాన్ని చూపించి “శభాష్” అనిపించుకున్నారు.

వ్యక్తిగా ఆయనది ప్రత్యేకమైన వ్యక్తిత్వం.
ఆయన “సంభాషణ”లకి కూడా తనదైన “వ్యక్తిత్వం’ వుంది. ఇది స్పష్టంగా మనం చూడొచ్చు. ఇదో విచిత్రమైన లక్షణం. మరొకరి దగ్గిర కనబడదు. ఎవరినీ అడగరు, ఎవరినీ పొగడరు. ‘పని’ కోసం- వస్తే, ప్రాణం పెట్టి రాయడం, లేకపొతే హాయిగా చదువుకోవడం. ఆయనతో అనేక సాహిత్య చర్చల్లో పాలు పంచుకునే భాగ్యం కలిగింది. మంచి వక్త.
ఏమని చెప్పనూ? నాలుగేళ్ళుగా మెల్లమెల్లగా నీరసపరుస్తున్న కేన్సర్ తో పోరాడి- ఇక దాని ‘బాధ’ నన్నేం చేయలేదంటూ, శరీరాన్ని ఇక్కడే వదిలేసి మరో నూతన ‘వస్త్రం’ ధరించడానికి ఎక్కడి నించి వచ్చారో ఆ పుట్టింటికి వెళ్లిపోయారు.

“జో జాయేగే ఉస్ పార్ కభీ లౌట్ కే …న ఆయే…” (ఆ వొడ్డుకి వెళ్ళిన వారెవరూ ఈ వొడ్డుకి తిరిగి రాలేరు)
“ఓ జానే వాలో …హో సకే తో లౌట్ కే ఆనా” (వీలుంటే మా కోసం మరో సారి తిరిగి వస్తారా?”)
బస్…

‘రాం తేరి గంగా మైలీ’ చిత్రంలో ఓ అద్భుత దృశ్యం వుంది.
ఓ పెద్ద మంచు గడ్డ పాక మీంచి కింద పడుతుంది. ఆ క్షణమే ‘కెవ్వు’ మన్న బిడ్డ ఏడుపు – అప్పుడే పుట్టింది- వినిపిస్తుంది. రాజ్ కపూర్ ఎంత గొప్ప సింబాలిజం చూపించాడూ..
మన జీవితం అనేది పెద్ద మంచు ముద్ద.
అది క్షణక్షణం కరిగిపోతూనే వుంటుంది. (జీవితంలాగే చివరంటా)
గాలి గాలిలో, మట్టి మట్టిలో, నిప్పు నిప్పులో నీరు నీటిలో ఆత్మ ఆకాశంలో-
గణేష్ పాత్రోజీ, మీ పాత్రని ఈ భూమ్మీద అద్భుతంగా పోషించారు. మాకివాల్సింది అక్షరాల రూపంలో అద్భుతంగా ఇచ్చేసారు.

అందుకే, అల్విదా.

మీ ఆత్మ పరమాత్మలో లీనమగు గాక
అనంత శాంతి మీకు లభించు గాక.

– భువన చంద్ర

bhuvanachandra (5)

నగ్నదేహాలతో నలుడూ, ఓడిసస్…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఓడిసస్, అతని సహచరులు మళ్ళీ యాత్ర ప్రారంభించారు. ఈసారి సౌర(సూర్య)ద్వీపం వారి గమ్యం. అక్కడికి వెళ్లడానికి సిల్లా(Scylla), చరిబ్దిస్(Charybdis) అనే రెండు పరస్పర విరుద్ధాల మధ్య నుంచి సాగే ఒక మార్గం ఉంది. ఓడిసస్ దానిని ఎంచుకున్నాడు. ఈ మార్గాన్ని మనకు తెలిసిన భాషలో ‘ద్వైతమార్గం’ అందాం.

సౌరద్వీపం చేరుకున్నాక ఓడిసస్ నిద్రపోతుండగా అతని సహచరులు మానవ సహజమైన ఆకలితో ఆ ద్వీపంలోని అనేక పశువులను నరికి వండుకు తిన్నారు. ఆ తర్వాత అక్కడినుంచి తిరిగి ప్రయాణం ప్రారంభించారు. అంతలో ప్రచండమైన పడమటి గాలి వీచి పెనుతుపాను సృష్టించింది. ఓడనూ, ఓడిసస్ సహచరులనూ కూడా ముంచి వేసింది. ఓడ స్తంభానికి వేల్లాడి ఓడిసస్ ఒక్కడే ప్రాణాలు దక్కించుకున్నాడు.

అతని యాత్రలో ఇది పతాకఘట్టం!

ఓడిసస్ నీళ్ళ మీద తేలుతూ సిల్లా, చరిబ్దిస్ ల మధ్యగా తొమ్మిదిరోజులపాటు ప్రయాణించి పదో రోజున ఒగీగియా అనే దీవికి చేరుకున్నాడు. అక్కడ లేత పచ్చిక బయళ్ళు, పూతోటలు, ద్రాక్షతోటలు, పక్షుల కిలకిలారావాల మధ్య ఒక గుహలో కలిప్సో అనే అప్సరస నివసిస్తోంది. ఆమె తియ్యని గొంతుతో పాటలు పాడుతూ తన మగ్గం ముందు అటూ ఇటూ తిరుగుతూ బంగారపు కండెతో వస్త్రం నేస్తోంది.

ఓడిసస్ కు ఆమె ఆతిథ్యమిచ్చి తిరిగి అతను శక్తిని పుంజుకునేలా చేసింది . ఆమెతోనే అతను ఎనిమిదేళ్లు గడిపేశాడు. సిర్సే నేర్పిన పాఠాలను కలిప్సో సాహచర్యంలో మరింత ఒంటబట్టించుకున్నాడు. ఎట్టకేలకు ఆమెను విడిచి వెళ్ళే సమయం వచ్చింది. త్వరగా అతన్ని తదుపరి యాత్రలోకి ప్రవేశపెట్టమని హెర్మెస్ ద్వారా జియస్ కలిప్సోకు కబురుచేశాడు. ఆమె అయిష్టంగానే అంగీకరించింది. ఓడిసస్ ఒక తెప్పను నిర్మించుకుని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఆమె అతనికి స్నానం చేయించి చక్కటి దుస్తులు కట్టబెట్టింది. అతను వెడుతుంటే ఆమె ఒడ్డున నిలబడి వీడ్కోలు చెప్పింది.

అయితే, తన కొడుకు పోలిఫెమస్ కన్ను పొడిచేసినందుకు ఇప్పటికీ ఓడిసస్ మీద పోసిడిన్ కోపంగానే ఉన్నాడు. ఒక పెను తుపానును ప్రయోగించి ఓడిసస్ ఉన్న తెప్పను ధ్వంసం చేయించాడు. ఓడిసస్ రెండు పగళ్ళు, రెండు రాత్రులు ఈదుకుంటూ వెళ్ళి, ఫేషియన్లు అనే నౌకా నిపుణులు ఉండే ఒక దీవికి చేరుకున్నాడు. అప్పుడతను పూర్తి నగ్నంగా ఉన్నాడు. అదే సమయంలో నౌసికా అనే రాచబాలిక తన నేస్తాలతో కలసి ఆడుకోడానికి సముద్రతీరానికి వచ్చింది. వాళ్ళు ఆడుతున్న బంతి నీళ్ళలో పడిపోయింది. దాంతో అంతా కేకలు పెట్టారు. ఒక గుబురు మాటున ఉన్న ఓడిసస్ ఆ కేకలు విని, చెట్టుకొమ్మతో తన నగ్నత్వాన్ని కప్పుకుంటూ ఇవతలకు వచ్చాడు. అప్పుడా బాలికలు అతనికి కట్టుకోడానికి వస్త్రమిచ్చి రాజప్రాసాదానికి తీసుకెళ్ళారు.

ఆరోజు రాత్రి ఫేషియన్లు అతనికి విందు ఇచ్చారు. ఆ పదేళ్ళలో తను చేసిన సాహసయాత్రల గురించి, పడిన కష్టాల గురించి ఓడిసస్ వాళ్లకు చెప్పాడు. అతనిపై సానుభూతి చూపిన ఫేషియన్లు, అతను స్వస్థలానికి వెళ్ళడానికి ఒక ఓడను, సిబ్బందిని ఏర్పాటుచేశారు. అతను ఒళ్ళు మరచి సుఖంగా నిద్రపోయేవిధంగా ఓడను తీర్చిదిద్దారు. ఓడ కెరటాలపై ఊయలలూగుతూ సాగిపోతుంటే ఓడిసస్ తీయని గాఢనిద్రలోకి జారిపోయాడు. అదెంత గాఢనిద్ర అంటే, చావుతో సమానమైనంత! అంటే, ఓడిసస్ ఇప్పుడు మార్మిక జగత్తు నుంచి బాహ్యప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడన్నమాట. ఈ దశలో అతనికి మార్గదర్శనం చేసే బాధ్యతను ఎథెనే అనే దేవత స్వీకరించింది.

ఇలా ఉండగా, అక్కడ ఓడిసస్ భార్య పెనెలోప్ కు పునస్స్వయంవరం ఏర్పాటైంది. ఎంతోమంది వీరులు వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ పెనెలోప్ ప్రాసాదంలో ఆతిథ్యం పొందుతున్నారు. దాసీలతో వాళ్ళు కామకలాపాలలో మునిగి ఉన్నారు. దాంతో ఆ ప్రాసాదం ఓ వ్యభిచారగృహంగా మారిపోయింది. ఓడిసస్ కొడుకు తెలెమాకస్ వాళ్ళ మధ్య బరువెక్కిన హృదయంతో నిట్టూర్పులు పుచ్చుతూ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో ఎథెనా మారువేషంలో వెళ్ళి తెలెమాకస్ కు కనిపించింది. అతనామెకు స్వాగతం చెప్పాడు. రాత్రి భోజనాలు అయిన తర్వాత, ‘నీ తండ్రి వస్తున్నాడు. అతనికి ఎదురువెళ్ళు’ అని ఎథెనా అతనికి సలహా ఇచ్చి ఫలానా మార్గంలో వెళ్ళమని చెప్పింది. అలా తండ్రీ-కొడుకు కలసుకునే ఏర్పాటు చేసింది.

untitled

 

ఆ తర్వాత ఆమె ఒక అందమైన రాకుమారుని వేషంలో సముద్రపు ఒడ్డున ఓడిసస్ కు కనిపించింది. ఆమె చేతుల్లో ఒక పొడవాటి ఈటె ఉంది. ఆమెను చూడగానే ఓడిసస్ కు ఎంతో సంతోషం కలిగింది. ఎథెనా అతన్ని ఒక బిచ్చగాడి రూపంలోకి మార్చేసింది. తండ్రీ, కొడుకులు ఒక పందుల కాపరి గుడిసెలో కలసుకున్నారు. ఆ తర్వాత ఓడిసస్ స్వగృహంలోకి అడుగుపెట్టాడు. అతన్ని అతని కుక్క, ఒక వృద్ధదాది తప్ప ఇంకెవరూ గుర్తుపట్టలేదు. అతని మీద గూఢచర్యం సాగించిన వృద్ధ దాది అతని మోకాలి మీద ఒక పంది చేసిన గాయాన్ని చూసి గుర్తుపట్టింది. ఓడిసస్ ఆమెను చూపులతోనే వారించి, అక్కడి అతిథులు దాసీలతో నిస్సిగ్గుగా సాగించే కామకలాపాలను కాసేపు గమనిస్తూ ఉండిపోయాడు.

ఆ తర్వాత స్వయంవరఘట్టం మొదలైంది. ఓడిసస్ కు చెందిన అత్యంత శక్తిమంతమైన వింటిని ఎత్తి పన్నెండు గొడ్డళ్లను ఎవడైతే ఛేదిస్తాడో అతన్ని పెనెలోప్ వరిస్తుంది… అదీ పరీక్ష! లక్ష్యాన్ని ఛేదించడం కాదు సరికదా, కనీసం వింటికి నారి కూడా బిగించలేక అంతా తెల్ల మొహం వేశారు. అప్పుడు బిచ్చగాడి రూపంలో ఉన్న ఓడిసస్ ముందుకు వచ్చాడు. అవలీలగా వింటిని పైకెత్తి నారి బిగించి పన్నెండు గొడ్డళ్ళనూ ఛేదించాడు. అతనికి దేవతల సహకారం కూడా లభించింది. ఆ తర్వాత అతను స్వయంవరంలో పాల్గొన్న వీరులను కూడా అంతం చేశాడు.

అతనే ఓడిసస్ అన్న సంగతి తెలిసిపోయింది. పెనెలోప్ భర్తను సమీపించి, ’శయ్యాగారం సిద్ధమవుతోం’దని చెప్పింది. ఆపైన, ‘ఇలాంటి రోజు వస్తుందని నేను అనుకుంటూనే ఉన్నాను. మీ యాత్ర గురించీ, మీరు పడ్డ కష్టాల గురించీ అన్నీ నాకు చెప్పాలి’ అంది.

download

ఎథెనా

 

***

జోసెఫ్ క్యాంప్ బెల్ తన Occidental Mythology లో విశ్లేషించిన ఓడిసస్ కథ చదువుతున్నప్పుడు నలదమయంతుల కథ గుర్తొచ్చి ఆశ్చర్యంతో తలమునకలయ్యాను. సరే, పరిమిత స్థాయిలో సీతా, ద్రౌపదీ స్వయంవరాలను కూడా ఈ కథ గుర్తు చేస్తున్న సంగతి తెలుస్తూనే ఉంది. ఇంకో ఆశ్చర్యమేమిటంటే, నేను గమనించినంతవరకూ, మన పండిత లోకం ఈ పోలికలను గుర్తించి విస్తృతంగా చర్చించిన దాఖలా లేకపోవడం!

కేవలం స్థూలమైన పోలికలకే ఇంత ఆశ్చర్యపోవాలా, అవి యాదృచ్ఛికం కావచ్చు, లేదా మన కథలనే వాళ్ళు తీసుకుని ఉండచ్చని పాఠకులలో కొందరైనా ఈపాటికి అనుకుంటూ ఉంటారు. కానీ నాకు అర్థమైనంతవరకూ ఈ పోలికలు అంత ఆషామాషీ వ్యవహారం కావు. వాటి వెనుక కొన్ని సిద్ధాంతాలు, సూత్రీకరణలూ ఉన్నాయి. అంతకన్నా విశేషంగా కొన్ని తాత్విక సామ్యాలు ఉన్నాయి.

ఆ రకంగా చూసినప్పుడు నలదమయంతులు-ఒడిసస్ పెనెలోప్ ల కథలలో ఉన్న పోలికలను మూడు అంచెలలో చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అవి: 1. స్థూలమైన పోలికలు. 2. సూక్ష్మమైన పోలికలు. 3. సుసూక్ష్మమైన పోలికలు.

స్థూలమైన పోలికలు

రెండు కథల్లోనూ భార్యాభర్తల మధ్య వియోగం సంభవించింది. భర్త ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. రెండు కథల్లోనూ దేవతల ప్రమేయం ఉంది. రెండింటిలోనూ భార్య పునస్స్వయంవరం ఉంది. కాకపోతే, దమయంతి పునస్స్వయంవరం భర్తను తన దగ్గరకు రప్పించుకోడానికి అనుసరించిన ఒక చిట్కా మాత్రమే. కానీ పెనెలోప్ స్వయంవరం నిజంగా జరిగింది. అదొక్కటే తేడా. భర్త ఏళ్ల తరబడి దేశాలు పట్టిపోయి భార్యకు దూరమైనప్పుడు భార్య పునర్వివాహం చేసుకోవచ్చునన్న సామాజిక నీతిని రెండు కథలూ ప్రతిబింబిస్తూ ఉండచ్చు కానీ, నలదమయంతుల కథలో కథకుడు దమయంతి పునర్వివాహప్రయత్నాన్ని ఒక చిట్కాగా మార్చేసి దమయంతి పాతివ్రత్యానికి ప్రాధాన్యమిచ్చాడు. ఓడిసస్-పెనెలోప్ ల కథలో ఇందుకు భిన్నంగా జరిగింది. నిజానికి పెనెలోప్ కూడా పునస్స్వయంవరాన్ని ఒక చిట్కాగానే ప్రయోగించి ఉండచ్చు, ఆమె కూడా దమయంతిలానే పతివ్రత కావచ్చు. అలా అనుకున్నప్పుడు మహాభారత కథకుడు కథనంలో చూపిన ఒడుపును హోమర్ (పెనెలోప్ కు నిజంగా పున్స్స్వయంవరం జరిపించడం ద్వారా) చూపించలేకపోయాడనాలి. మొత్తానికి రెండుకథల్లోనూ భార్యాభర్తలు చివరికి ఒకటయ్యారు. కథ సుఖాంతమైంది. కథాచట్రానికి సంబంధించినంతవరకూ ఇవీ రెండుకథల మధ్య ఉన్న స్థూలమైన పోలికలు.

సూక్ష్మమైన పోలికలు

రెండు కథల వివరాలలోకి వెడితే తేడాలు కొట్టొచ్చినట్టు కనిపించే మాట నిజమే. కానీ సూక్ష్మంగా చూస్తే పోలికలూ కనిపిస్తాయి. ఉదాహరణకు, నలుడి కష్టాలకు అడవి వేదికైతే, ఓడిసస్ కష్టాలకు సముద్రం వేదికైంది. బహుశా ఉభయుల ప్రాదేశిక నేపథ్యంలో ఉన్న తేడా ఇందుకు కారణం కావచ్చు. విస్తారమైన అడవులు ఉన్న భారతదేశ నేపథ్యం నలుడిది. గ్రీకులకు ఉన్న నౌకాయాన నేపథ్యం ఓడిసస్ ది.

ఇక రెండు కథల్లోనూ నగ్నత్వం, వస్త్రాల ప్రస్తావన ఏదో ఒక రూపంలో రావడం ఒక పోలిక. నలుడు పక్షులను పట్టుకోడానికి తన కట్టుబట్టను తీసి వాటిపై విసురుతాడు. అవి వస్త్రంతో సహా ఎగిరిపోతాయి. అప్పుడు నలుడు నగ్నంగా అయిపోతాడు. దమయంతి చీరలో అర్థభాగాన్ని కట్టుకుని నగ్నత్వాన్ని కప్పుకుంటాడు. కథ చివరిలో దమయంతిని తిరిగి కలసుకునే సందర్భంలో, తను దావానలం నుంచి కాపాడిన కర్కోటకుని తలచుకోవడం, పోయిన తన వస్త్రం తిరిగి అతని వద్దకు రావడం, దానిని కట్టుకోగానే నలునిగా మారిపోవడం జరుగుతాయి.

K11.11Hermes

హెర్మెస్

ఓడిసస్ కథకు వస్తే, అతడు సిర్సే అనే అప్సరస దగ్గరకు బయలు దేరినప్పుడు హెర్మెస్ అనే దేవుడు ఎదురై, ‘సిర్సేతో నువ్వు నిరభ్యంతరంగా పడకసుఖం అనుభవించు కానీ, ఆమె నిన్ను నగ్నంగా మార్చడానికి మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోకు’ అని హెచ్చరిస్తాడు. ఓడిసస్ కలిప్సో అనే మరో అప్సరస దగ్గరికి వెళ్లినప్పుడు ఆమె బంగారు కండెతో వస్త్రం నేస్తూ ఉంటుంది. ఎనిమిదేళ్లపాటు తనతో కాపురం చేసి ఓడిసస్ తిరిగి యాత్ర ప్రారంభించబోయే ముందు కలిప్సో అతనికి స్నానం చేయించి చక్కని వస్త్రం కట్టబెడుతుంది. పోసిడిన్ తను ప్రయాణించే తెప్పను ధ్వంసం చేయించినప్పుడు సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళిన ఓడిసస్, ఫేషియన్ల దీవికి నగ్నంగానే చేరుకుంటాడు. అక్కడ బాలికల కేకలు విని చెట్టు కొమ్మతో నగ్నత్వాన్ని కప్పుకుంటూ గుబురులోంచి బయటకు వస్తాడు. అప్పుడా బాలికలు అతనికి వస్త్రమిచ్చి రాజప్రాసాదానికి తీసుకువెడతారు.

పేరు మార్పులోనూ నలునికీ, ఓడిసస్ కూ పోలిక ఉంది. కర్కోటకుడు నలుని రూపాన్ని వికృతంగా మార్చివేయడమే కాకుండా అతని పేరు బాహుకుడిగా మార్చివేస్తాడు. ఓడిసస్ ఒంటికన్ను రాక్షసుడైన పోలిఫెమెస్ ను కలసినప్పుడు తన పేరు ‘నోమన్’ అని చెబుతాడు.

కథ చివరిలో దమయంతిని కలవబోయే ముందు నలుడూ, పెనెలోప్ ను కలవబోయే ముందు ఓడిసస్ మారువేషంలోనే ఉండడం ఇంకొక పోలిక. కర్కోటకుడు నలుని వికృతరూపిగా మార్చివేస్తే, ఎథెనా అనే దేవత ఓడిసస్ ను బిచ్చగాడిగా మార్చివేస్తుంది. బాహుకుడే నలుడు కావచ్చుననే అనుమానంతో దమయంతి కొడుకును, కూతురినీ కేశిని అనే పరిచారికతో బాహుకుని దగ్గరకు పంపించినట్టే, ఎథెనా ఓడిసస్ దగ్గరికి అతని కొడుకు తెలెమాకస్ ను పంపిస్తుంది. నలదమయంతుల కథలో కేశిని అనే పరిచారిక నలుని గుర్తించే ప్రక్రియలో భాగస్వామి అవుతుంది. అలాగే ఒక వృద్ధదాది ఓడిసస్ ను గుర్తుపడుతుంది. ఇది వేరొక పోలిక.

సుసూక్ష్మమైన పోలికల గురించి తర్వాత…

 -కల్లూరి భాస్కరం

ఈమె…అలిశెట్టి ప్రభాకరూ…

drushya drushyam-alisetti

అదృష్టమో దురదృష్టమో నగర జీవితంలో ఉంటూ ఉండటం వల్ల ఎన్ని చిత్రాలని!
కానైతే, ఉంటున్నఈ ‘సిటిలైఫ్’ ని ఎంత చూసినా, మరెంత చదివినా, ఎన్నెన్ని దృశ్యాదృశ్యాలుగా చేసినా ఒకరు మాత్రం రోజూ గుర్తుకు వస్తూనే ఉంటారు.

ప్రతి ఛాయాచిత్రం ముగింపులో ఆయన్ని తల్చుకుంటూనే ఉంటాను.
ఆయనే ప్రభాకర్. అలిశెట్టి ప్రభాకర్.

‘మరణం నా చివరి చరణం కాదు’ అన్న కవి కావడం వల్ల కాబోలు, జీవితంలోని ఏ ఘడియను చిత్రించినా, సామాన్యుడి స్థితీ, గతీని ఎలా చిత్రికపట్టినా ఆయన గుర్తుకు వస్తూనే ఉంటాడు.

ఇదొకటే కాదు, ఇలాంటి నా దృశ్యాదృశ్యాలను జీవితంగా చదువుకోవడానికి నేను చాలు.
కానీ, ఇవే చిత్రాలను విప్లవీకరించడానికి మాత్రం అలిశెట్టిని మించిన దృశ్యకారుడిని తెలుగు నేల ఇంకా కనలేదు. చూడనూ లేదు.

నిజానికి అతడు ఒకరే.
పేరుకు కవీ, చిత్రకారుడూ. ఫొటోగ్రాఫరూ.
కానీ, ఆయన పనంతా ఒకటే. ఒక దృశ్యం పరచడం.

కవిత్వంలోనూ, చిత్రాల్లోనూ, తీసిన ఛాయాచిత్రాల్లోనూ ఒకే ఒక అంశం అంతర్లీనం.
అదేమిటీ అంటే కళ్లకు కట్టడం. మంట పెట్టడం. మన లోవెలుపలి నెగడు ఆవరణ అంతా కూడా కాలిపోయేటట్టు అందులోంచి మన ఆత్మలు లేచి శత్రువు మెడను పట్టుకునేటట్లు చేయడం.

దృశ్యాన్ని విప్లవీకరించడం.
మనలో జీవితాన అదృశ్యంగా ఉన్న విప్లవశక్తిని చేతనలోకి తేవడం.
అవును మరి. ఆయన ఒక దృశ్య పాతర.

చిత్రమేమిటంటే, తీస్తున్న నా ప్రతి చిత్రంలో జీవితాన్ని మించి విప్లవం కనిపిస్తే నేను చిత్రించడం ఆపేస్తాను.
ఎందుకూ అంటే అది వేరు. అది ఆయన పని. ప్రతి ఒక్కరూ విప్లవకారులు కాలేరు. నిజం.
alisetti photo frame ion his home
ఇంకో విషయం. ఎవరు కూడా ఆయనంత ఆరోగ్యంగా ఉండలేరు. నమ్మండి.
కావాలంటే ఆయన కవిత్వాన్ని చదవండి. బొమ్మలు చూడండి. తీసిన ఫొటోలనూ గమనించండి.
అతడొక లైఫ్. రెడ్ సల్యూట్.

నిజానికి తెలుగు నేలపై ఒక మనిషి విప్లవాన్ని జీవితం స్థాయిలో బతికించాడూ అంటే అది ఆయనే. ఆయనకు నా దృశ్యాంజలి.

ఒక్కమాటలో ఆయన సామాన్యత విప్లవం
నా పరిమితి సామాన్యతే.
అందుకే దృశ్యాదృశ్యం వేరు. ఒక విప్లవ దృశ్యాదృశ్యం వేరు.
అది ఆయన.

క్లుప్తంగా చెప్పాలంటే…ఎర్ర పావురాలు. మంటల జెండాలు. చురకలు. రక్తరేఖ, సంక్షొభగీతం, సిటీలైఫ్. మరణం నా చివరి చరణం కాదు- ఇవన్నీ ఆయన కవితా సంపుటులు. చిత్రలేఖనాలు. ఛాయా చిత్రణలు.

ఒక పరంపరగా ఆయన రచనా దృశ్యాలు ఒక శర పరంపర.

+++

తాను ఒక కవిత రచించినా, చిత్రం గీసినా, ఛాయాచిత్రం చేసినా దాన్ని కొల్లోజ్ చేసి మరొకటి చేసినా ఒకటే చేశేవాడు. ఆ వస్తువు ఇతివృత్తం మార్చేవాడు. దాన్నికొత్త అర్థాలతో విప్లవీకరించేవాడు. అందుకే అనడం, నేను చిత్రిస్తున్న ప్రతి చిత్రం ప్రభాకర్ ను గుర్తు చేస్తుందని!  కానీ ఆయన దాన్ని ఎంత గొప్ప కవితగా మలిచేవాడూ అంటే అది చదివితే మళ్లీ నేను చూపే దృశ్యాదృశ్యాలను పదే పదే చూడాల్సిన అవసరమే లేదు.

ఉదాహరణకు వేశ్య గురించి ఆయన రాసింది ఎవరైనా మర్చిపోయారా?
లేదు.

నిజం.
ఎందుకంటే ఆయనది విజువల్ మీడియం.
చలనగీతం.

నాది జీవితం.
నిశ్చలన చిత్రం.

+++

చిత్రం ఒకటి చేస్తుంటే ఆ చిత్రంలో జీవితం యధాతథంగా ప్రతిఫలించడమే పనిగా పెట్టుకుని రచన గావిస్తుంటే అది దృశ్యాదృశ్యం. నేను.

కానీ, అదే దృశ్యాన్ని విప్లవీకరిస్తే అది వేరు. ఇక్కడే మనిషికీ విప్లవకారుడికీ ఉన్న తేడా అవగతం అవుతుంది. అది అలిశెట్టి ఫ్రభాకర్.

ఇద్దరిదీ జీవితమే.
కానీ, ఆయనది కల. నావంటి వారిది ఇల.

మొహమాటం లేదు. గులాంగిరీ లేదు. భద్రజీవి కానేకాదు.
అందుకే అతడు లేడు. ఉంటాడు. బతికే చరణం.

సమాజంలో వర్గకసిని ఆయన అంత తీవ్రంగా చెప్పనోడు మరొకడు కనిపించడు.
అట్లే, జీవితంలోని ద్వంద స్వభావాన్ని ఆయన అంత నిశితంగా ఎద్దేవా చేసినవాడూ మరొకడు లేడు.
అయినా ఆయన ఎంచుకున్నది మాత్రం సామాన్యమైన వస్తువును. మనిషిని. అధోజగత్ సహోదరులను.

జనవరి 12 న ఆయన జయంతీ, వర్థంతి.
ఒకటే రోజు చావు పుట్టుకల మనిషాయన.
ఆయన్ని గుర్తు చేసుకోవాలి.

జీవితాంతం తన వాక్యాన్ని, చిత్రాన్ని, ఛాయాచిత్రాన్ని పూర్తిగా దృశ్యాదృశ్యాల పరంపరగా రచించాడని చెప్పడానికి కూడా ఆయన్ని గుర్తు చేసుకోవాలి.

కొత్త సంవత్సరమే. కానీ, ప్రతి కొత్త చిత్రం తీస్తున్నప్పుడూ ఆయనుంటాడని చెబుతూ, దినదినం మరణించకుండా జీవిస్తున్న ప్రతి చిత్రంలోనూ ఆయనుంటాడని గుర్తుచేస్తూ, ఆయన సారస్వతాన్ని దృశ్యాదృశ్యంగా భావించడం నాకు ఎప్పటినుంచో తెలుసని కూడా మనవి చేస్తూ ఈ మహిళ ఛాయా చిత్రం ఈ వారం.

చూస్తూనే ఉండండి.
దారికి ఇరుపక్కలా ఇలాంటి చిత్రాలను చూస్తూనే ఉండండి.
అవి విప్లవిస్తే అలిశెట్టి లేకపోతే ఇవే. ఇంతే.

కానీ, ఈ వేళ, ఈ మహిళా మూర్తిని చూస్తూ ఉంటే, ‘మరణం నా చివరి చరణం’ కాదన్న అలిశెట్టి ప్రభాకర్ ఆమెనే కాబోలనే అనిపిస్తుంది.

ఒక నిద్ర. దీర్ఘనిద్ర.
ఎర్రగా మేలుకొలుపే చిత్రం.

కందుకూరి రమేష్ బాబు

(షొటో క్యాప్షన్…అలిశెట్టి ఇంట్లో అలిశెట్టి ప్రభాకర్ ఫొటోఫ్రేం)