భగవంతుని భాష

(శ్రీమతి గన్నవరపు సరోజినీ సత్యనారాయణమూర్తిగారి స్మారక కథలపోటీలో రెండో బహుమతి గెల్చుకున్న కథ )

తనది పేరుకి చిన్న కాకా హోటల్లాంటిదే అయినా ఇక్కడ టిఫిన్లు బావుంటాయని  వండుకోవడానికి సమయం, ఓపిక చాలని సాఫ్ట్ వేర్  యువత వస్తుంటారని టేబుళ్లన్నీ అద్దంలా తుడిపిస్తూ ఎంతో నీట్‌గా ఉంచుతాడు  ఆ హోటల్‌  ఓనరు బలరాం. ఆర్డరిచ్చిన పావుగంటలోకల్లా పొగలు  కక్కుతూ టిఫిన్‌ టేబుల్‌మీదకి రావడమూ అక్కడ ప్రత్యేకతే.

నోట్లో పెట్టుకోకుండానే అల్లం  చెట్నీతో పెసరట్టు రోస్టు కరకరలాడున్నట్టు ఊరించేస్తూ దానిమీద వేసిన బటర్‌ నెమ్మదిగా కరిగిపోతోంటే టిఫిన్‌ ప్లేటు దగ్గరకు జరుపుకుంటున్న జీవన్‌కు భార్య మందార గుర్తుకొచ్చి నవ్వొచ్చింది.

తను  పెసరట్టు తింటున్నాడని తెలిస్తే ఇంకేమన్నా ఉందా?ఇంటికెళ్లాక మీదపడి కరిచేస్తుంది.అసలే ఒంట్లో బాగాలేదని సెలవుపెట్టింది ఇవాళ.తను డ్యూటీకి వచ్చేసాక వండుకోవడానికి కూడా బద్ధకం వేసి  మునగదీసుకుని పడుకుని ఉంటుంది.ఆకలితో కరకరలాడుతున్న మనిషికి తనకు ఎంతో ప్రాణప్రదమైన పెసరట్టును మొగుడుగారు లొట్టలేసుకుంటూ ఆరగిస్తున్నాడని తెలిస్తే మండదా?మందార ఆఫీసు దగ్గర్లో స్టార్‌ హోటళ్లేగాని ఇలాంటి కాకా హోటల్‌ లేదు.ప్యాక్‌ చేయించి తీసికెళ్దామంటే ఇంత అందమైన పెసరట్టూ ఇంటికెళ్లేసరికి మెత్తబడిపోయి పిసపిసలాడుతుంది.

జీవన్‌ జేబులో సెల్‌ సంకేతమిచ్చింది ఎత్తమని.ఇంకెవరు? మందారే…

‘హలో జీ! ఎక్కడున్నావ్‌?’ ముద్దుగా మొగుడిని ‘జీ’ అని పిలుస్తుంది మందార.

‘నేనా? ఎక్కడంటే….’నీళ్లు నములుతున్న జీవన్‌ పల్స్‌ పట్టేసింది మందార.

‘ఇంట్లో దిక్కులేకుండా పడివున్న బెటర్‌ హాఫ్‌కు పెట్టకుండా రోస్టెడ్‌ పెసరట్టుకేసి లొట్టలేస్తూ చూస్తున్నావుకదూ!’

‘అబ్బెబ్బే  నేను ఇంటికి వచ్చే దారిలో ఉన్నాను మందారా?’ ‘వారిజాక్షులందు వైవాఇకములందు….’ఎపుడెపుడు ఆపద్ధర్మానికి అబద్ధమాడవచ్చో చెప్పే చిన్నప్పటి పద్యం గుర్తొచ్చి అనవసర రభస ఎందుకని చిన్న అబద్ధమాడేసాడు జీవన్‌.

‘కోతలు కొయ్యకు. అయితే సర్వర్‌ కాఫీ ఆర్డర్లు వినబడుతున్నాయేం? ఇదిగో నేను నీ పక్కన లేకపోయినా నువ్వెక్కడ ఉన్నావో ఏంచేస్తున్నావో చెప్పేయగలను తెలుసా?’ తర్జనితో బెదిరిస్తున్నట్టుగా కళ్లముందు  మెదిలింది మందార.

‘సరే మహాతల్లీ నీ ఊహాశక్తికి జోహార్లుగాని నీకోసం మంచి చెక్కవడలు పార్శిల్‌ చెప్పానులే. అది రాగానే ఆఘమేఘాలమీద నీ ఒళ్లో వాలనా?ఆ తర్వాత మనిద్దరమూ…లలలలా…’

‘ష్‌…చుట్టుపక్కల చూసుకోకుండా ఏమిటా పైత్యం?అవతల బలరాం నవ్వుతున్నాడు చూడవయ్యా మగడా!’

జీవన్‌ చప్పున కౌంటర్‌ దగ్గరున్న బలరాంకేసి చూస్తే అతను అటుగా తల తిప్పుకుని నవ్వుతున్నాడు.

‘మైగాడ్‌ నీకేమన్నా పరకాయప్రవేశ శక్తి ఉందా?లేక  ఇక్కడ ఏ పావురంలోనైనా దూరి చూస్తున్నావా ?’

‘అదంతా నీకనవసరం. అయ్యో పెళ్లాం సిక్‌లీవ్‌ పెట్టింది. పెందరాళే ఇంటికొచ్చి వండిపెట్టాలని లేదుగాని ఒక్కడివీ గుటుకూ గుటుకూమంటూ మింగడానికి అసలు నీకు ప్రాణమెలా ఒప్పుతోంది జీ?’నుదురు కొట్టుకున్నాడు జీవన్‌…

‘ఎక్కువ కొట్టుకోకు బొప్పికొడుతుంది.త్వరగా ఆరగించి నాకోసం వడలు  మోసుకుని గీత్‌ థియేటర్‌కి రా. మంచి రొమాంటిక్‌ సినిమాకి టికెట్లు బుక్‌ చేసివుంచాను.నేను గేటుదగ్గరే వెయిట్‌ చేస్తూ ఉంటాను. జల్దీ.’జీవన్‌ ఇంకేం చెప్పేందుకు తావివ్వకుండా ఫోన్‌ ఆఫ్‌ చేసేసింది మందార.

‘మహా చిలిపి…ఇవాళ రణధీర్‌ కొత్త సినిమా రిలీజన్నమాట. అందుకే సిక్‌లీవ్‌ పెట్టేసింది.పెళ్లయి పుష్కరం దాటిపోయినా మందారలో తాజాదనం తగ్గలేదు. పెళ్లయిన కొత్తలో ఎలా అల్లరి చేసేదో ఇప్పటికీ అలాగే తనను హమేషా కవ్విస్తుంటుంది.’

‘జీవన్‌బాబూ! టిఫిను చల్లారిపోయినట్టుంది. వేరేది పంపిస్తానుండండి.’  అలవాటయిన కస్టమర్‌ని బలరాం వినయంగా అడుగుతుంటే ఈలోకంలోకి వచ్చి ‘వద్దులే టైమయిపోతుంది.’అంటూ జీవన్‌ పెసరట్టు తుంచి గబగబా నోట్లో పెట్టుకోబోతున్నవాడల్లా ఎవరో తన సీటు పక్కనేవున్న  కిటికీ వెనకనుంచి తనకేసే చూస్తున్నట్టనిపించి తలెత్తి చూసాడు.

ఓ ఏడేళ్ల కుర్రాడు ఆకలి కళ్లతో దోసెను ఆశగా చూస్తున్నాడు.జీవన్‌ మనసు విచలితమైపోయింది.ఆ కుర్రాడే…తను ఇందాక రోడ్డు పక్కగా చెట్టుక్రింద బైక్‌ పార్క్‌ చేస్తోంటే ఆశగా దగ్గరకు రాబోయాడు.తను జేబులోంచి డబ్బు తీసేలోగా ఎదర పెద్ద షాపు తాలూకు గార్డు వాడిని తరిమేసాడు. అందుకే జీవన్‌ గబగబాలేచి బయటకు వెళ్లి వాడిని లోపలికి తీసుకొచ్చి తన పక్కనే కూర్చోబెట్టుకుంటూంటే బలరాం వాడిని అదిలించి బయటకు నెట్టేయబోయాడు.

‘బలరాం!ఈ కుర్రాడికి  ఏంకావాలో ఎంతకావాలో పెట్టించు. నేను డబ్బులిస్తాను’అన్నాడు జీవన్‌. దాంతో బలరాం ఏమీ అనలేక సర్వర్‌ను పిలిచాడు.

‘నీకేం భయంలేదు. ఎంత కావాలో తిను. తన ముందున్న పెసరట్టును ముందుకు తోస్తూ జీవన్‌ ఇచ్చిన ధైర్యంతో ఆ కుర్రాడు దానిని ఆబగా తినేసాడు.‘ఇంకా ఏం తింటావ్‌?’

‘ఆరు ఇడ్లీలు…’ భయంభయంగా బలరాంవైపు చూస్తూ చెప్పాడు కుర్రాడు.

‘ఒరేయ్‌ తేరగా వస్తోందని తింటే అరక్క చస్తావ్‌రా.’

‘తినను. పొట్లం కట్టుకుంటాను.’ బెదిరిపోయిన లేడిపిల్లలా వాడు వణుకుతూ అంటూంటే       ‘బలరాం?’ జీవన్‌ కంఠంలో కోపం చూసి తగ్గాడు బలరాం.

‘మీకు తెలియదుబాబూ! వీడి తండ్రి ఏడాది క్రితం ఎటో వెళ్లిపోయాడు.వీళ్లమ్మకు కళ్లు కనిపించవు. వీడికో చిన్న తమ్ముడున్నాడు. ఈ కుర్రాడే అదిగో ఆ వీధి చివర షెడ్డులో మొన్నటిదాకా పనిచేసి పోషించేవాడు. ఏమయిందో ఏమో ఈమధ్యనే పని పోయినట్టుంది. ఇలా తల్లికి తమ్ముడికి పెట్టడంకోసం వచ్చేపోయేవాళ్లను జిడ్డులా వదలకుండా దేవిరిస్తుంటాడు.’

ఆకుర్రాడు పార్సెల్‌ చేసిన ఇడ్లీను భద్రంగా గుండెకు హత్తుకుని తనకు దణ్ణం పెట్టి వెళ్లిపోతుంటే జీవన్‌ మనసు కలతపడిపోయింది.తమలాంటివాళ్లు పార్టీలని పబ్బాలనీ హోటళ్లకెళ్లి తినీతినక వదిలేసి వృధా చేస్తుంటే ఈ కుర్రాడు తనకు జన్మనిచ్చిన తల్లికోసం ఎంత తపన పడుతున్నాడు? మందారకు ఈ విషయం చెప్పి తీరాలి.కడుపున పుట్టిన కొడుకు విలవ తెలిసి తప్పకుండా తనదారికొస్తుంది.లేకపోతే రోజూ రాత్రిళ్లు  ఈ మధ్యకాలంలో తరచూ ఇదే వాదన రగులుతోంది.

బలరాం కు బిల్లు  కట్టి బయటకు రాగానే మందార నవ్వుతూ వెక్కిరించింది జీవన్‌ను.

‘ఇక బయలుదేరు. షో  మొదలయిపోతుంది.’

‘అమ్మదొంగా! అయితే ఇందాకటినుంచి ఇక్కడినుంచే నన్ను గమనిస్తూ ఫోన్‌ చేస్తున్నావన్నమాట.’చెవి మెలేయబోతే తప్పించుకుని‘అంతేగా మరి.’ అంటూ మందార బైక్‌ వెనక తనను హత్తుకుని కూర్చోగానే అంతదాకా బరువెక్కి వున్న మనసు తేలికయిపోయింది జీవన్‌కు.

ఇంటికెళ్లగానే జీవన్‌ చటుక్కున మందారను వాటేసుకుని తన బలమైన బాహువుల మధ్య  బంధించాడు.‘నిన్ను హాల్లో అల్లరి పెట్టకుండా నీకిష్టమయిన హీరో సినిమాను చూడనిచ్చినందుకు బహుమతిగా నువ్వు నాకోసం అబ్బాయినే కనాలి.సరేనా?’ జీవన్‌ కళ్లముందు గుండెకు పదిలంగా ఇడ్లీ పార్సెల్‌ను పట్టుకున్న కుర్రాడు కదిలాడు.

‘ఊహూ! అమ్మాయినే కంటాను.’ అల్లరిగా నవ్వింది మందార.ఆమె కళ్లముందు లేత దొండపండులాంటి పెదాలు కదుపుతూ టీవీ స్క్రీన్‌ మీద అలవోకగా అద్భుత స్వరాలు వెలయిస్తున్న అందాల పాప మెదిలింది.

జీవన్‌  చటుక్కున సోఫాలోకి కూలబడ్డాడు.‘నీకంత పట్టుదల ఎందుకు మందారా!’

‘నీకు తెలియదు జీ!అమ్మాయికే  తండ్రిమీద బోలెడు ప్రేమ ఉంటుంది.నాకన్నా నిన్ను ప్రేమించే పాప కావాలి నాకు.’

‘అబ్బో నువ్వెంత ప్రేమగా మా మావగారితో కబుర్లు చెబుతావో నేను చూడడం లేదా?’

‘నువ్వుమాత్రం మా అత్తయ్యగారితో రోజూ మాట్లాడగలుగుతున్నావా?ఆదివారాలు స్కైప్‌లో ఆవిడ కాయలు కాచిపోయిన కళ్లను చూస్తే తెలియదా?పాపను కనేందుకు మనస్ఫూర్తిగా నువ్వు ఒప్పుకునేవరకు నేనిలాగే వాదిస్తుంటాను. సరేనా?’

ఇంకా ఏదో చెప్పబోతున్న మందారను ఒళ్లోకి లాక్కుని నవ్వాడు జీవన్‌. ‘అబ్బో ముప్ఫయి దాటిపోయినా ఎంత ముద్దొస్తున్నావో’లేవబోతున్న మందార నుదుట అతని పెదవుల ముద్రపడగానే ఆమె మనసు ఎటో తేలిపోయింది.

జీవన్‌ మందార ప్రేమించి పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.అయితే ఇద్దరూ సాఫ్ట్ వేర్  ఉద్యోగులవడంతో రోజూ కరువుతీరా కబుర్లు చెప్పకునేందుకే తీరిక దొరకదు.క్రమంగా ఆ జీవితానికే అలవాటు పడిపోయినా రోజు గడుస్తున్నకొద్దీ  వాళ్లలో ఏదో వెలితి తపన… ముఖ్యంగా ఏడాదిగా…అదేమిటో వాళ్లకు తెలియక కాదు….సంతానం….

కానీ  కెరీర్‌కు ఆటంకమని ఇన్నాళ్లుగా వాయిదా వేసుకుంటూ వచ్చారు.ఇద్దరూ కళ్లు తెరిచేసరికి పుణ్యకాలం కాస్తా హరించుకుపోతోందని అర్ధమయింది. ఎందుకంటే ఇద్దరూ ముప్ఫయి దాటిపోయి నాలుగేళ్లు దాటిపోయింది.వెంటనే డాక్టర్ల దగ్గరకి పరిగెట్టారు.ఆధునికకాలానికి అసాధ్యమేముంది?డాక్టర్లు ఇద్దరినీ పరీక్షచేసి కౌన్సిలింగ్‌ ఇచ్చి వాళ్లమీద రకరకాల ప్రయోగాలు చేసారు. ప్రయత్నాలు  విఫమవుతున్నకొద్దీ ఇద్దరిలోను అపుడు మొదయింది మరింత ఒత్తిడి….తపన…

జీవితమంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమేకాదు… ఇంకేదో ఉంది…సంతానం కావాలి.

కళ్లముందు పెరిగే సంతానాన్ని చూసే భాగ్యం తప్పిపోతున్నందుకు స్త్రీ అయిన మందారకంటేకూడా జీవన్‌ ఎక్కువ డీలా పడిపోయాడు ఇద్దరూ ఆలోచించుకుని టెస్ట్ ట్యూబ్ బేబీకి సంసిద్ధమయ్యారు.అయితే రిజల్టు  తెలుసుకునేందుకు భయంగా ఉంది ఇద్దరికీ…పెద్దలకు …అంటే జీవన్‌ తల్లికీ మందార తండ్రికీ మాత్రం ఇంకా ఏదో నమ్మకం…ముఖ్యంగా గంగానదీ స్నానం, తీర్ధయాత్రలు చేస్తే  సంతానం కలుగుతుందని…అందుకే ఏడాదిగా డాక్టర్లతో విసుగెత్తిన జీవన్‌ మందార కూడా జలవిహారం చేసే ప్రాంతాలకు వెళ్తే ఒత్తిడి అయినా తగ్గుతుందని హరిద్వార్‌కి వచ్చారు.

కిటికీ తెరిస్తే చాలు  రాత్రంతా గంగ హొయలుపోతూ నిర్విరామంగా అలా గలగలమంటూ చేసే సవ్వడిలో ఏదో సందేశం…అర్ధం కాకపోయినా  మందారను ఎంతో ముగ్ధురాలిని చేస్తోంది.అనంత జలరాశి కళ్లముందు కదులుతుంటే ఇద్దరికీ ఎంతో సంబరం. ఉదయం సాయంత్రం హిమాలయానుండి జాలువారుతున్న ఆ చల్లని గంగా ప్రవాహంలో ఉదయం సాయంత్రం చల్లని గంగాఝరిలో  సరిగంగస్నానాలు చేస్తుంటే మనసులోని ఒత్తిడి అంతా చేత్తో తీసేసినట్టు మాయమయిపోతోంది.

హరిద్వార్‌లో  అంతా కాలినడకనే తిరిగారు.మూడు నిలువుల ఎత్తు సాంబసదాశివుని మూర్తి తన మౌనభాషతో ఏదో చెబుతున్న అనుభూతి కలిగినా జీవన్‌కు అదేమిటో అర్ధం కాలేదు.

గంగ ఒడ్డున పర్వతంమీద వెలిసిన మానసాదేవిని దర్శించేందుకు రోప్‌వేమీద …అంత ఎత్తు నుండి ఆ  తొట్టెలో కూర్చుని కిందకు చూస్తుంటే పచ్చని కొండలు లోయలు అంత లోతున కళ్లముందు కదులు తుంటే కళ్లు తిరిగి జీవన్‌ను గట్టిగా పట్టుకుంది మందార.‘బాప్‌రే ఇదంతా భయమే?’చెమట పట్టిన ఆమెచేతిని తన అరచేతితో రుద్దుతూ జీవన్‌  ఆటపట్టించాడు.

‘నువ్వుండగా నాకేం భయం?’

‘అవునవును. ఝాన్సీలక్ష్మీబాయివి కదూ’     పొద్దుటే ఋషీకేశ్‌ బయలుదేరి అక్కడ మళ్లీ గంగలో మునకతో … ప్రయాణ బడలిక అంతా హుష్‌మని ఎగిరి పోయింది.

తిరిగి హరిద్వార్‌చేరేసరికి గంగామాతకి ఆరతి ఇచ్చే సమయం …ఏమి జన సమూహమో…ఒడ్డునే ఎంతో పురాతనమైన గంగామాత ఆలయం…పూజారి ఎంతో నిష్టగా హారతి ఇస్తుంటే భక్తులతో గొంతు కలిపి ఆకుదొన్నెలో రంగురంగు పూలమధ్య పిండితో చేసిన గిన్నెలో ఒత్తిని వెలిగించి నీళ్లలో మంత్రపూర్వకంగా వదలడం భలే అనుభవం ఇద్దరికీ.మరునాడు ఉదయమే గభాలున ఏదో గుర్తొచ్చినట్టు లేచింది మందార.అప్పటికే బాగా తెల్లవారిపోయింది.రెండురోజులుగా ఆ గంగా తీరంలో ఆమె ఒక దృశ్యం చూస్తోంది.దానిని భర్తకు చూపాలని ఆరాటంతో అంది.‘జీ!లే…ఇవాళయినా నువ్వు  ఆదృశ్యం చూసి తీరాల్సిందే…’

జీవన్‌ మూడంకె వేసేసి,‘ అబ్బా నన్ను వదిలెయ్‌ మందారా! రాత్రంతా నీమూలాన ఒకటే ఒళ్లు నొప్పులు’

‘చుప్‌…సిగ్గులేదు.ఏంటా మాటలు…లేలే…మళ్లీ వాళ్లు వెళ్లిపోతారు.’

‘ఏ భారీ శరీరమో నీటిలో మునగలేక అవస్థ పడుతోందా?’

‘ఛ కాదు కాదు..లే’  జీవన్‌ను జబ్బ పట్టి బలవంతంగా లేపింది.

‘ఏముంది అక్కడ? అందరూ స్నానం చేస్తున్నారు అంతేగా. అసలు నువ్వు ఆడదానివేనా? భర్తకి అలా అందరి ఆడవారి దేహాలు చూపిస్తావా?’జీవన్‌ నెత్తిన గట్టిగా మొట్టింది

‘ఎపుడూ అదే దృష్టేనా? అదిగో హృదయం తెరిచి చూడు…’

‘అక్కడ నువ్వేగా ఉన్నావు…ఆ సరెసర్లే…ఏముంది అక్కడ? గున్న ఏనుగులా ఉన్న ఆ బాల పహిల్వాన్‌ను బక్క ప్రాణుల్లా ఎలక   పిల్లల్లా ఉన్న వాళ్లమ్మా నాన్నా ఎంతో భయంగా పట్టుకుని ప్రవాహంలో స్నానం చేయిస్తున్నారు. వాడు మదించిన ఏనుగులా నీళ్లను చెల్లాచెదురుచేస్తూ వీళ్లను కంగారుపెడుతూ అల్లరి చేస్తున్నాడు.’

‘అదికాదు ఆ ప్రక్కన చూడు.’ జీవన్‌కి ఈసారి గది కిటికీలోంచి స్పష్టంగా కనిపిస్తోంది…ఎంతో అపురూపమైన ఆదృశ్యం.

తల్లి, తండ్రి, కొడుకు కోడలు…ముద్దులు మూటకట్టే ఇద్దరు పిల్లలు…      వారిమధ్య ఎంతో అపురూపమైన ప్రేమబంధం…

పిల్లల తలలు తుడిచి బట్టలు వేసి ఒడ్డున వృద్ధురాలిదగ్గర కూర్చోబెట్టాక ఆయువతి యువకుడు కలసి తల ముగ్గుబుట్టలా నెరిసిపోయిన ఆ పెద్దాయనను  ఎంతో పదిలంగా  ఒక్కొక్క మెట్టూ దింపుతూ ప్రవాహంలో కూర్చోబెట్టారు. ఆ యువకుడు ఆయనను ఎంతో అపురూపంగా పట్టుకుని తలమీద పాత్రతో గంగా జలాన్ని పోస్తూ వీపు రుద్దుతూ స్నానం చేయిస్తోంటే ఆయువతి అతనికి సాయం చేస్తోంది.స్నానమయ్యాక ఆ యువకుడు ఆయన చెవిలో ఏదో చెబుతూ తూర్పుదిక్కుకు ఆయనను బలవంతాన తిప్పి ఆయన చేత  జలతర్పణం చేయిస్తున్నారు.‘పాపం ఎలా వణికిపోతున్నాడో మందారా? వృద్ధాప్యం…దానికి తోడు చలి…ఆ చేతులు చూడు.’

‘అవును. వాళ్లెంత బ్రతిమాలినా ఆయన ఓ అరగంటవరకు ఆ ఇనుప రాటకు ఆనుకుని ఆ గొలుసును పట్టుకుని అలాగే ఏవో మంత్రాలు చదువుతూ ఆనందంలో తేలిపోతుంటాడు. నేను నిన్నకూడా చూసాగా.అదిగో ఇపుడు ఆ పెద్దామెను నెమ్మదిగా చేయి పట్టుకుని తీసుకువచ్చి పైమెట్టుమీదే కూర్చోబెట్టి స్నానం చేయిస్తారు చూడు.’జీవన్‌  మందార తదేకంగా వాళ్లనే చూస్తున్నారు.

ఆయువతి కాసేపయాక ఆయనను గడ్డం పట్టుకుని బ్రతిమాలితే ఆయన తలూపాడు. ఆమె భర్తను పిలిచి ఎంతో కష్టంమీద ఇద్దరూ ఆయనను ఎత్తుకుని బయటకు తెచ్చారు.     ‘అదేమిటి? ఆయన నడవలేరా అలా మోసుకొస్తున్నారు?’

హోటలు కుర్రాడు చక్రాల కుర్చీని ఒడ్డుకు తోసుకొచ్చాడు.‘అరె…చూడు ఆయనకు ఒక కాలు లేదు.’

ఆయువకుడు ఆయనకు పంచెమార్చాడు. ఆయువతి తల గబగబా తుడిచేస్తోంది.తర్వాత అత్తగారికి తలతుడుచుకునేందుకు సాయం చేసింది.‘ఇదంతా చూస్తుంటే నీకేమనిపిస్తోంది జీవన్‌?’

‘కుటుంబ విలువలు కనుమరుగైపోతున్న ఈసమాజంలో అవి మిగిలే ఉన్నాయని చూపిస్తోంది ఈ దృశ్యం?. అంతేగా మందారా!ఆయన చాలా అదృష్టవంతుడు.మంచి కొడుకు కోడలు…’

‘ఊహూ మంచి కూతురు అల్లుడు …అయివుండవచ్చుగదా!’

‘ఓహో నువ్వు ఆ దారిన వచ్చావా?పోనిద్దూ ఏదో ఒకటి…’

చలిగాలికి కాబోలు ఆయన  వణికిపోతున్నారు.ఆయువకుడు  ఆయనను చక్రాల కుర్చీలో ఎత్తుకుని తీసికెళ్లి కూర్చోబెట్టి హోటలు వైపు తీసికెళ్తున్నాడు. ఆయువతి పెద్దావిడకి టవలు కప్పి నడిపించుకుని వస్తోంది.

‘వాళ్లూ ఈ హోటలు రూంలోనే దిగారు జీవన్‌…తెలుగువాళ్లల్లానే ఉన్నారని వాళ్లను పలకరిద్దామనుకున్నానుగానీ  మనం బయటకు వెళ్లిపోతున్నమూలంగా ఈ రెండ్రోజులూ కుదరనే లేదు.ఇవాళ కలుద్దామా?’అంది మందార.

‘అలాగేగానీ, మరి మనం సరిగంగతానాలాడద్దా?’ జీవన్‌ కళ్లు ఆనందంతో మెరిసాయి.

మందార గాఢంగా నిట్టూర్చింది.ఈ ట్రిప్‌లో ఎలాగైనా జీవన్‌కు అసలు విషయం చెప్పి ఒప్పించాలి.ఎందుకోగాని జీవన్‌ ఎంత డబ్బయినా ఖర్చుపెట్టి ఎన్ని పరీక్షలకయినా నిలబడి తమ యిద్దరి రక్తం పంచుకున్న చిన్నారికోసమే ఎదురు చూస్తున్నాడు .

కాకతాళీయంగా అన్నట్టు మందార ‘ దీని బదులు పెంచుకుంటే బాగుంటుందికదా జీ!’ అంటే ‘ రక్తం పంచుకు పుట్టినవాళ్లకు మనమీద ఉన్నంత ప్రేమ పెంచిన సంతానానికి ఉండదని నా ప్రగాఢ నమ్మకం మందారా!అయినా మనకేమీ వయసు అయిపోలేదుగా.’ అనేసాడు జీవన్‌.

మాధురి మందారకు డాక్టరేకాదు స్నేహితురాలు కూడా…క్రిందటి నెలలో ఇద్దరూ టెస్ట్‌ శాంపిల్స్‌ ఇచ్చినపుడు సూచనాప్రాయంగా చెప్పింది. ‘ప్రయత్నాలు చేద్దాంగాని ఎక్కువ హోప్స్‌ పెట్టుకోవద్దు మందారా!ఇలా అన్నానని నిరాశపడిపోకు. ఒక్కోసారి శాస్త్ర ప్రపంచంలో అద్భుతాలు కూడా జరగొచ్చు.’ అందుకే జీవన్‌ను ఒప్పించాలని మందార ఆరాటం.

దంపతులిద్దరూ లంచ్  చేసి వచ్చాక రిసెప్షన్‌లో ఆ కుటుంబం గురించి అడిగారు.‘ వాళ్ల ఫామిలీని చూసి ఎంతో ముచ్చటయింది.పైగా తెలుగువాళ్లుకదా అని పరిచయం చేసుకుందామనుకున్నాం.’

‘ఓ చక్రవర్తి గారా…వాళ్లు ఇందాకే ఖాళీ చేసి వెళ్లిపోయారు.ఈరోజు రాజధానికే హైదరాబాద్‌ వెళ్తున్నామని మాటల్లో చెప్పారు.మీలాగే వాళ్లూ ఏటా వస్తారు. మా హోటల్లోనే మకాం చేస్తారు.’ ‘

‘అలాగా! కాని పాపం కాలు లేని ఆపెద్దాయనతో వాళ్లకు కష్టమే కదా!’

‘కష్టమేగాని గంగారాంగారిని వారి భార్యను ఏటా తప్పకుండా ఇక్కడికి తీసుకు రావసిందే మరి.’

‘అదేం ఆయనకు గంగామాత అంటే అంత ఇష్టమా?’

‘అదో పెద్ద కథ సార్‌!నాలుగేళ్ల క్రితంవరకు గంగారాం దంపతులు మతి స్థిరంలేని కొడుకుతో కలిసి మా హోటలు పక్క వీధిలోని సత్రంలో తలదాచుకుని యాత్రికులకు భోజనాలు  వడ్డిస్తూ పొట్టపోసుకునేవారు.’

‘మరి ఈ కొడుకుకోడలు కూడా వీళ్లతోనే ఉండేవారుకాదా?’

‘చక్రవర్తి సుజనగార్లు వాళ్ల కొడుకు కోడలు కాదు దీదీ!వాళ్ల అసలు పెద్దకొడుకు తమ పల్లె తప్ప అన్నెం పున్నెం తెలియని ఈ దంపతులను తీర్ధయాత్ర పేరుతో ఆరేళ్ల క్రితమే ఇక్కడ వదిలేసి వెళ్లిపోయాడట.గంగారాం దంపతులు మతిలేని కొడుకుతో నానా అవస్థలూ పడేవారు.’ వింటున్న యిద్దరికీ పలమారింది ఒక్కసారిగా.

‘అదేమిటి?మరి చక్రవర్తిగారు  వీళ్లకి స్వంత తల్లిదండ్రుల్లా సేవ చేయడం రెండురోజుగా మేం కళ్లారా …???.’

‘అది గంగారాం దంపతుల అదృష్టం.అవును దీదీ! పెళ్లయి ఏడేళ్లయినా పిల్లలు కలగని చక్రవర్తిగారు ఏటా గంగా దర్శనానికి వచ్చినపుడల్లా మా హోటలులోనే దిగేవారు.అప్పుడప్పుడు భోజనానికి సత్రానికి వెళ్లేవారు.నాలుగేళ్లక్రితం చక్రవర్తిగారు వచ్చివెళ్లిన నాలుగురోజులకు హిమాలయాలో పడిన భారీ వర్షాలకు గంగకు అకస్మాత్తుగా పెద్ద వరదలు వచ్చాయి.అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు తీసాం. కానీ ఆ రాత్రివేళ  ఊళ్లను ముంచెత్తేసింది గంగమ్మ తల్లి . అందరూ ఒకటే హాహా కారాలు. ఎవరు ఎక్కడికి పోతున్నామో తెలియలేదు.దుకాణాలు మనుషులు అందరూ తలోపక్కకు కొట్టుకుపోయినా ఎలాగో కొంతమందిమి మాత్రం ప్రాణాలు దక్కించుకున్నాం.అప్పుడే ఈ గంగారాంగారి మతిలేని కొడుకు  గల్లంతయిపోయాడు.  వారం తర్వాత చాలా దూరంగా బురదలో కూరుకుపోయి దొరికాడు.వరదలు తగ్గాక మేమంతా క్రమంగా సాధారణ జీవితానికి వచ్చినా ఈవృద్ధ దంపతులు మాత్రం ఏదో పొగొట్టుకున్నట్టు ఆ కొడుకుకోసం అహోరాత్రాలు తపించిపోతూ గంగ ఒడ్డునే వెతుక్కునేవారు. యాత్రికలు ఎవరైనా జాలితలచి తినడానికి పెడితే తినడం లేకపోతే ఏ చెట్టుకిందో పడుకోవడం.గంగ మెట్లమీదనుంచి జారిపోయి ఓసారి గంగారాంగారికి కాలు ఫ్రాక్చరయిందికూడా అప్పుడే…వెంటనే వైద్యం జరగక పోవడంతో ఆతర్వాత ధర్మాసుపత్రిలోనే ఆయనకి కాలు తీసేసారు.’

‘మరి పెద్దకొడుకు?’

‘ఏమోసార్‌!ఇష్టంలేకనో, లేక నిజంగానే అడ్రసు తెలియకనో గంగారాంగారు ఏమీ చెప్పేవారు కాదు.వరదలొచ్చిన ఆర్నెల్ల  తర్వాత చక్రవర్తి సుజనగార్లు మళ్లీ గంగా దర్శనానికి వచ్చినపుడు వీళ్లను గంగ ఒడ్డున అనాధలుగా చూసి  చలించిపోయారు.ఎందుకంటే వాళ్లు గతంలో సత్రంలో భోజనానికి వెళ్లినపుడల్లా  వీళ్లు ఎంతో అభిమానంగా మాట్లాడేవారుట.పిల్లలు  లేరని బెంగపెట్టుకోవద్దని మహాదేవుని కృపతో తప్పక సంతానం కలుగుతుందని సుజనగారిని ఎంతగానో ఓదార్చేవారుట.’

‘ఇక్కడి వాళ్లెవరూ వీళ్లని ఆదుకోలేదా?’

‘అంతా కడుపు చేత్తో పట్టుకుని బ్రతుకుతున్నవారేకదాసార్‌!దయనీయస్థితిలో ఉన్న  వీళ్లిద్దరిని చక్రవర్తిగారు  తమతో తీసుకుపోయి వైద్యం చేయించడమేగాక మీరూ చూసారుగా కన్న తల్లిదండ్రుల్లా చూసుకుంటున్నారు.సరిగ్గా ఈ నెలలోనే వరదల్లో గంగారాంగారు చిన్న కొడుకుని  పోగొట్టుకున్నారు కనుక ఇక్కడకు తీసుకువచ్చి ఆయనచేత తర్పణాలు ఇప్పిస్తూ ఉంటారు.’

‘ కన్నకొడుకులే తల్లిదండ్రులను అనాథుగా వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్న ఈ రోజుల్లో చక్రవర్తిగారు ఇంత బాధ్యత తీసుకోవడం రియల్లీ ఫెంటాస్టిక్‌!’   కళ్లలో నీరు తిరుగుతూంటే  జీవన్‌ అన్నాడు.

‘ కడుపున పుట్టిన బిడ్డలు తల్లిదండ్రులను చూస్తారనే నమ్మకం ఎక్కడుందిలెండి. అయినా చక్రవర్తిగారికి ఆ పుణ్యం ఊరికే పోలేదు సార్‌! ఈ నాలుగేళ్లలో ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.’

‘అవును పిల్లలు  ముద్దులు  మూటకడుతున్నారు.ఏమయినా గంగారాంగారు అదృష్టవంతులు.’

‘కాని చక్రవర్తిగారు మాత్రం అనాధాశ్రమంలో పెరిగిన తమ దంపతులకు గంగారాంలాంటి తల్లిదండ్రులు దొరకడం అంతా గంగామాత యాత్రాఫలం అంటారు సార్‌!’  అదివిన్న జీవన్‌ దంపతులకు కొంతసేపు నోట మాట రాలేదు.

తిరిగొచ్చాక ఎందుకోగానీ ‘అమ్మూ!భగవంతుని భాష అర్ధంచేసుకోగలిగితే చాలు అనందం కళ్లెదుటే ప్రత్యక్షమవుతుందమ్మా!’ అనే తండ్రిమాటలు గుర్తొచ్చాయి మందారకు.

హరిద్వార్‌నుంచి వెనక్కి వచ్చిన రెండోరోజున  క్లినిక్‌లోకి అడుగు పెట్టిన వెంటనే డాక్టర్‌ మాధురి చిరునవ్వుతో ఎదురయింది.‘కంగ్రాట్స్‌ మందారా! మొన్న మీరిచ్చిన శాంపిల్స్ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి.మన శ్రమ ఫలించబోతోంది.మరొక్కసారి మీరు శాంపిల్స్ ఇస్తే చాలు.మీరు అమ్మానాన్నయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి.’

డాక్టరు మాధురికి థాంక్స్‌ చెప్పాడు జీవన్‌.‘చాలా థాంక్స్‌  డాక్టర్‌! కాని మేం అనాధాశ్రమంనుంచి ఒక పాపని  బాబును తెచ్చి పెంచుకోవానుకుంటున్నాం. హరిద్వార్‌నుంచి వచ్చిన రోజే రిజిస్టరు చేయించుకుని వచ్చాం.అది చెప్పాలనే ఇక్కడకు వచ్చాం.’

డాక్టర్‌ మాధురి కళ్లు ఆశ్చర్యంతో విచ్చుకోవడం గమనించి చిరునవ్వు నవ్వింది మందార. చక్రవర్తిగారి ప్రభావం బాగానే పడింది  జీవన్‌మీద…‘అవును డాక్టర్‌! ఈ ప్రపంచంలో కడుపు కట్టుకుని పెంచిన కన్నబిడ్డలే తల్లిదండ్రులను అనాధలుగా వదిలేయడం చూస్తున్నాం.మరోవైపు  ప్రకృతి ఉత్పాతాల వలన తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలు కోకొల్లలుగా ఉన్నారు. అందుకే మేం కొత్తగా ఎంతో శ్రమపడి మా సంతానాన్ని ఈలోకంలోకి తేవడంకంటె  నా అనేవాళ్లు లేని ఇద్దరు పిల్లలకు తలిదండ్రులుగా వాత్సల్యాన్ని పంచాలని నిర్ణయించుకున్నాం.’

‘వెరీనైస్‌!ఇంత మంచి ఆలోచన వచ్చిన వెంటనే ఆచరణలో పెడుతున్నందుకు నేను మీ ఇద్దరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.’   మందార  చేయి బలంగా నొక్కిన డాక్టర్‌ మాధురి కళ్లల్లో అంతులేని ఆనందం.

ఆ రోజు రాత్రి మందార చెంపలు నిమురుతూ అన్నాడు జీవన్‌!‘మందారా! నేను ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నాను.దానికి నువ్వు తప్పకుండా సహకరించాలి.’

‘బాప్‌రే! ఒక్కసారిగా ఇన్ని నిర్ణయాలా? అసలు నువ్వు నా జీవన్‌వేనా?’నిర్ణయాలు తీసుకోవడంలో జీవన్‌ జీళ్లపాకంలా రోజులు సాగదీస్తాడని ఆమె ఎప్పుడూ ఆటపట్టిస్తూ ఉంటుంది మరి.

‘అవును నీ జీవన్‌నే. నాకు ఓ పరిపూర్ణ కుటుంబం కావానుకుంటున్నాను. అందుకే ఈ నెలాఖరు వరకు నీకు టైమిస్తున్నాను.ఆ పల్లెను వదిలి రాననే మీ అత్తగారికి ఏం చెప్పి ఒప్పిస్తావో నాకు తెలియదు. ఇకమీదట మా అమ్మ  జీవితాంతం మన దగ్గరే ఉండాలి. ఇంక మా మావగారిని ఇక్కడకు వచ్చేలా ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు.’

జీవన్‌ ముక్కు పట్టుకుని ఊపింది మందార.‘నాకూ బాగా తెలుసు జీ! అల్లుడి మనసుని ఆయన ఎన్నడూ నొప్పించరు.’

గంగాఝరిలా  ఇద్దరు పిల్లలు ఇంటికొస్తున్నందుకు మనసులోనే నిలువెత్తు సాంబసదాశివమూర్తికి  ‘భగవంతుడా నీభాష ఇప్పటికి అర్ధమయింది మాకు.’ అనుకుంటూ మౌనంగా నమస్కరించింది మందార.

***

పి.వి. శేషారత్నం

మీ మాటలు

  1. sujalaganti says:

    అద్భుతమైన కధ బహుమతికి అర్హమైన కధ. మళ్ళీ చాలా రోజుల తరువాత హరిద్వార్,హృషీకేశ్ లలో విహరింప చెసిన కధ

  2. G.S.Lakshmi says:

    మనసుకు హత్తుకున్న కథ. రచయిత్రికి అభినందనలు…

  3. చాలా మంచి కథ , కథనం. Congratulations శేషారత్నం గారు .

మీ మాటలు

*