కొందరు స్త్రీలు, కొన్ని సమయాలు!

konninakshtralu-cover-page

 

నేనెన్నో పుస్తకాలను పరిచయం చేశాను. నాకు నచ్చిన పుస్తకాలను చదవమని చాలామందికి చెబుతుంటాను. కాని ఓ పుస్తకం నాకు బాగా నచ్చినా – దాన్ని చదవమని నేను అందరికీ ధైర్యంగా రికమెండ్ చేయలేకపోతున్నాను. అయినప్పటికీ… చదవాల్సిన ఆ పుస్తకం – విమల గారి కథల సంకలనం కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్ళు‘. ఎందుకంటే ఈ పుస్తకం చదువరులను ఓ రకమైన నిర్వేదంలో ముంచుతుంది. వాళ్ళ మనసులను వ్యథాభరితం చేస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో సమస్యలుంటాయి, కాని మరీ ఇన్నా అని అనిపిస్తుంది. పరిష్కరించలేని, జటిలమైన సమస్యలు ఎందరి జీవితాలను ఊపిరాడకుండా చేస్తున్నాయో ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది.

స్త్రీలు, బాలికలు, ఆసరా కోల్పోయినవాళ్ళూ, నిరాశ్రయులూ, చాలీ చాలని ఆదాయాలు సంపాదించేవాళ్ళూ, కుల మత లింగ భేదాల ఆధారంగా వివక్షకు గురైనవారూ… ఇలా ఎందరెందరివో దుఃఖాలు, వెతలు… భద్రజీవుల మొద్దుబారిన మనసును కదిలిస్తాయి. స్పందించే గుణం ఉన్నా ఏ రకంగానూ సాయం చేయలేని సానుభూతిపరుల నిస్సహాయత… ఇవన్నీ కలగలిసి మన మీద మనకే ఓ రకమైన రోత కలుగుతుంది. మనసులోని కల్లోలాన్ని అదుపు చేసుకుని, గుండెని దిటవు చేసుకుని ఈ పుస్తకాన్ని చదవాలి, ఇతరులతో చదివించాలి కూడా. అభద్రతా వలయంలో బతుకుతున్న అనేకానేక జీవులకు మనమీయగలిగే కనీసపు ఊతం – ఈ పుస్తకం చదివి – వాళ్ళని కాస్తయినా అర్థం చేసుకోవడం! అలాంటివాళ్ళూ తారసపడినప్పుడు తలవంచుకుని తప్పుకునిపోకుండా – కాస్త సాంత్వన కలిగేడట్టు పలకరింపుగా ఓ చిరునవ్వయినా నవ్వగలగడం!

ఇక ఈ పుస్తకంలోని కథలను పరిచయం చేసుకుందాం.

***

నాలుగేళ్ళపాటు భరతనాట్యం నేర్చుకుని, నృత్య కళాకారిణి అవ్వాలనుకున్న ఓ యువతి ఆశలు ఎలా తారుమారయ్యాయో “నల్లపిల్ల నవ్వు” కథ చెబుతుంది. అయినా ఆమె జీవన పోరాటం ఆపదు. ఏం చేసైనా బ్రతకాలనుకుంటుంది. ఇద్దరు పిల్లల్ని పోషించాలి. గత్యంతరం లేక సినిమాల్లోనూ/టీవీ సీరియళ్ళలోనూ గ్రూప్ డాన్సర్‌గా మారి జీవిక కల్పించుకుంటుంది. జీవిక కోసం కష్టపడే వ్యక్తుల ధైర్యాన్ని చాటుతుంది ఈ కథ.

ఉద్యమంలో పనిచేసేవారి అవసరాలు, ప్రాధాన్యతా క్రమాలు వేరు. లక్ష్యం కోసం వ్యక్తిగత ఆసక్తులను/ఆకాంక్షలను అణుచుకుంటారు. విప్లవ నేపథ్యం నుంచి రాసిన ప్రేమ కథ “కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్ళు“. జీవితం పట్ల ప్రేమ కథ ఇది. ఒకే ఊరిని కథ ఆరంభంలోనూ, చివర్లోనూ రెండు కోణాలలో చూపించి; మారని జీవితాలనీ, మారిన ఊరుని పరిచయం చేస్తుందీ కథ.

యాభై నాలుగేళ్ళ వయసున్న మాధవి అనే లెక్చరర్‍ మొబైల్‌కి వేళాపాళా లేకుండా ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడుతుంటారు కొందరు. అత్యంత జుగుప్సాకరంగా వర్ణనలు చేస్తూ ఆమెని వేధిస్తూంటారు. విసిగి వేసారిన ఆమె పోలీస్ కంప్లయింట్ ఇస్తే, ఆ కాల్స్ ఎవరు ఎక్కడి నుంచి చేస్తున్నారో ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకుంటారు పోలీసులు. తీరా వెళ్ళి చూస్తే, అందులో ఇద్దరు ఆమె స్టూడెంట్సే! “నీ వయసెంతయినేం, నువ్వెవరైతేనేం..?” అంటూ తన అవయవాల గురించి మాట్లాడిన పిల్లల్ని ఏం చేయాలో ఆమె కర్థం కాదు. పోలీసులు వాళ్ళని తిట్టినా… ఆ తిట్లు కూడా స్త్రీలకే తగులుతున్నాయని గ్రహిస్తుంది. ఆ రాత్రి ఎవరెవరు “దేహభాష“ను మాట్లాడబోతున్నారో… అని అనుకుంటూ ఒకానొక అచేతన స్థితిలో ఉండిపోతుందామె.

విడివిడిగా మంచివాళ్ళయిన ఇద్దరు స్త్రీ పురుషులు ఎందుకు మంచి భార్యాభర్తలు కాలేకపోతారో చెబుతుంది “వదిలెయ్” కథ. పురుషాహంకారంతో భార్యపై చేసే కామెంట్లు, హేళనలు, విసుర్లు – వారినెంత ఆవేదనకి గురి చేస్తాయో, అటువంటి స్త్రీలు తమలోని సృజనాత్మకతని ఎలా కోల్పోతున్నారో చెబుతుందీ కథ. ఇటువంటి పరిస్థితులలో తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకుని, మరి కొంతమందికి స్ఫూర్తినిచ్చిన ఓ మహిళ కథ ఇది.

మనని వద్దనుకున్న మనిషితో కలసి జీవించాల్సి రావడం ఎంత దుర్భరమో “మా అమ్మా, ఆమె దోస్త్ మల్లి” కథ చదివితే అర్థమవుతుంది. మానసికంగా ఒంటరిగా ఉండడం ఎంత వేదన కలిగిస్తుందో, ఎంత క్రుంగదీస్తుందో తెలుస్తుంది. భౌతికంగా అందరితో కలిసి ఉన్నా, జీవితానందం కోల్పోయిన మహిళ కథ పాఠకులని కదిలిస్తుంది.

ఆడపిల్లల శరీరమే కాదు, వాళ్ళ ఆలోచనలూ ఎందుకో ఒక్కసారిగా ఎదిగిపోయినట్లనిపించిన ఓ తల్లికి – తన కూతురిక లేదనే వాస్తవం జీర్ణించుకోడం కష్టమవుతుంది “దౌత్య” కథలో. ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకునే ముందు తల్లిదండ్రులకీ, అన్నయ్యకీ ఓ ఎస్.ఎమ్.ఎస్. పంపుతుంది. చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడిన క్షణాల్లో తాము ఆమె దగ్గర లేమని విలవిలలాడిపోతాడా తండ్రి. స్త్రీల హృదయ భాషని అర్థం చేసుకోలేని వ్యక్తిని ప్రేమించి మోసపోయినందుకు బలవంతంగా తనువు చాలించి తల్లిదండ్రులకు క్షోభని మిగిల్చిన ఆ అమ్మాయి లేవనెత్తిన ప్రశ్నలకు ఎవరు జవాబిస్తారు?

అరణ్యంలోకి నిస్సంకోచంగా వెళ్ళిన ఓ మహిళ అడుగులు జనారణ్యంలోకి వచ్చేసరికి ఎందుకు తడబడ్డాయి? తాము నమ్మిన నమ్మకాలపైనే నమ్మకం ఎందుకు సడలిపోయిందామెకు? దేన్నయినా, ఎవరినైనా ప్రశ్నించగల ధైర్యాన్ని, ఒంటరి పోరాటాలలో కోల్పోయిన “కనకలత” జీవితం విషాదమయం!

‘జీవితాన్ని రకరకాల దారులలో తిప్పి, అలసి సొలసి, లోలోన విధ్వంసమై, చివరికి వీధుల పాలై, దేశద్రిమ్మరులై….’ బ్రతుకుతున్న వారితో ఒక రాత్రి గడిపేందుకు ప్రయత్నించిన బృందానికి – కలవరం కలిగించే ప్రశ్నలు ఎదురవుతాయి. “చుక్కల కింది రాత్రి” మనలో ఓ పెనుగులాటకి కారణమవుతుంది.

విశాలమైన ప్రపంచంలో, తానెక్కడో ఒక ఇరుకు మధ్య కూలబడి బ్రతుకుతున్నానని అనుకున్న ఓ యువతి, మిత్రుడి సహాయంతో కొత్త రెక్కలు తొడుక్కుంటుంది. అతని ప్రభావంతో ఉద్యమాలలోకి అడుగుపెడుతుంది. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుంటారు. ఇద్దరూ కలసి కొన్నేళ్ళు పని చేశాకా, అతన్నీ మరి కొంతమందిని అరెస్టు చేస్తారు. విచారణ అనంతరం అతనికి యావజ్జీవ శిక్ష పడుతుంది. ‘ఎవరో ఒకరికి ఎడబాటు శాశ్వతమైన చోట, మరొకరు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి’ అంటూ ఓ ఉత్తరం ద్వారా ఆమెకి సూచిస్తాడు. ఉద్యమాలలో పని చేసే ఆప్తుల్ని కోల్పోవడం ఎంత విషాదంగా ఉంటుందో “మార్తా ప్రేమకథ” చెబుతుంది.

‘మన చిరునవ్వును, అందాన్ని చూపితే మోజుపడతారే తప్ప, మన మనసు గాయల్ని చూపితే బాధపడి బాధ్యత తీసుకునే వాళ్ళెవరూ ఉండర’న్న వాస్తవాన్ని ముగ్గురు మహిళల జీవన నేపథ్యంతో చెప్పిన కథ “వాళ్ళు ముగ్గురేనా?“. పులిస్వారీ ఆటలో పులి తనని తినేయకుండా కాచుకుని కాచుకుని అలసిపోయిన ఓ స్త్రీ గొప్ప మనోనిశ్చయంతో తనకిష్టమైన జీవన విధానంలోకి మారడానికి ప్రయత్నిస్తుంది.

బయటకి తక్కువగా మాట్లాడుతుందని అనిపించే నీల – తన లోలోపల, తనతో తానే ఎడతెగని సంభాషణ సాగిస్తుంది. జీవితం సంక్లిష్టమైన, పూరించడం కష్టమైన గళ్ళ నుడికట్టులా మారిన యువతి కథ “నీలా వాళ్ళమ్మ, మరి కొందరు“. భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే దాని ఆనవాళ్ళు భార్య ముఖంపైనే ఎందుకు కనబడతాయని ఈ కథ ప్రశ్నిస్తుంది. తమకి శారీరకంగా బలం తక్కువ అనీ, పురుషులనే అహంకారంతోనూ భార్యలపై భర్తలు చేసే దాష్టీకాన్ని ఒక్క వాక్యంలో చెప్పారు రచయిత్రి. చావంటే మనుషులు హఠాత్తుగా మాయమైపోవడం’ అని రచయిత్రి మరణం గురించి చెప్పిన మాటలు చదువుతుంటే అప్రయత్నంగానే ఒళ్ళు జలదరిస్తుంది.

‘కలలకీ కన్నీళ్ళకీ కాలం కాదిది’ అని భావించే విరాళి తనిష్టపడిన వ్యక్తితో జీవితం పంచుకోలేకపోతుంది. మనసులో తడి ఆరి, బీటలువారి బండరాయిలా ఘనీభవించిపోతుందామె. ‘మాడుగ వాసన వేస్తున్న జీవితం నాది’ అని అనుకుంటుంది. పాతమిత్రులు కలసినప్పుడు, “ఒక్కోసారి ఒడ్డున కూర్చుని మనం నదిలా ప్రవహించడాన్ని మనమే చూసుకుని నవ్వుకోవాలి” అంటూ ఓ మిత్రుడు చెప్పిన మాటలు ఆమెలో జీవితేచ్ఛని మళ్ళీ రగిలిస్తాయి. మనకి ఇష్టమున్నా లేకున్న మన జీవితాలలోకి చొచ్చుకువచ్చే మార్పులని అధిగమించి ముందుకు సాగాలని సూచిస్తుంది “సూర్యుడి మొదటి కిరణం” కథ.

***

ఇంతమంది స్త్రీల బాధలను మన గుండెల్లోకి పంపి మనల్ని సున్నితం చేయబూనుకున్న విమల కథలను ఇష్టపడటం మొదలుపెడతాం. విమల కథలను ఇష్టపడటం అంటే బాధను అర్థం చేసుకోవడం. బలహీనులను అర్థం చేసుకోవడం. బలహీనులుగా కనిపించేవారిలో బాధితులుగా కనిపించేవారిలో ఉన్న బలాన్ని అర్థం చేసుకోవడం” అంటారు ఓల్గా. ఈ కథలు చదివాక, ఓల్గా గారి అభిప్రాయంతో ఏకీభవించని పాఠకులు ఉండరని నా ఉద్దేశం.

చినుకు ప్రచురణలు, విజయవాడ వారు ప్రచురించిన ఈ 215 పేజీల పుస్తకం వెల 120/- రూపాయలు. ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది.

మీ మాటలు

  1. amarendra dasari says:

    బావుంది సోమశంకర్ గారు…నేను మాత్రం నిస్సంకోచం గా అందరిని ఆ బాధ అనుభవించామని చెపుతాను

  2. Your Analysis ..bhagundhi,Thanks

మీ మాటలు

*