ఒక్కసారిగా చైతన్యం..

seetaram

ఫోటో: దండమూడి సీతారాం

 

 • కలల పయనమింకా పూర్తికాకుండానే వేకువ పరిమళమొచ్చి వెన్ను తట్టినా హేమంతపు చలిపాటకి మదిలో గూడు కట్టుకున్న ఊహలూగుతున్నా రెప్పలు మాత్రం వెచ్చని బరువుని వీడనంటున్నాయి

  మూతబడ్డ కన్నుల మాటు నీలినీడలు కవిత్వాన్ని కురిపించాలని చూసినా శబ్దంలేని భాషను రాయడం చేతకాక మిగిలిపోయిన ఏకాకితనంలా పూలగాలికి బద్దకం తోడై మరోసారి పులకింతను సవరించుకుంది మేను

  విశ్వశూన్యం ఆవరించిన సుషుప్తిలో నవోదయం ఆలపిస్తున్న రసాత్మక గీతం ఆనాటి లక్ష్యాన్ని వశీకరించగానే ఒక్కసారిగా చైతన్యం ఉరకలెత్తింది కృతిగా ప్రకృతిని పలకరించాలని..

 • ప్రకృతి గీసిన వర్ణచిత్రం స్మృతిపధంలో మెదిలిన వేళ మనసులో పచ్చని అనుభూతి పెదవంచుని తాకింది చిరునవ్వుగా

  మౌనంగా నిలబడ్డ తరువులు తల ఊచి సుప్రభాతాన్ని వీయగా ఊహల తెమ్మెర తొణికింది మధురిమగా గగనపు నీలిమ నారింజను పూసుకొని తొలికిరణాన్ని ముంగిట్లో జార్చినప్పుడు కాలం పరవశించింది గోరువెచ్చగా

  మునుపెరుగని రంగులవలలో చిక్కిన మది పుప్పొడి గంధాలను తాగి చైత్రగీతిని మొదలెట్టి నిశ్శబ్దానికి రాగాలను పరిచయించింది రోజూ చూసే ఉషోదయమైనా ఈరోజెందుకో సరికొత్తగా పురి విప్పినట్లుంది..

 • నిశ్శబ్దం నిద్దురలేచి పక్షుల కిలకిల ఓంకారాలతో స్వప్నం నుండి మనసుని వేరు చేసినప్పుడే ఆవిరైన హిమబిందువు వీడుకోలు మాదిరి కన్నుల్లో నిదురమబ్బు కరిగిపోయింది మంచుతెరల నడుమ సూర్యోదయం భూపాల రాగాల మాధుర్యం ఒంపుకొని ఒక్కో కిరణం వెల్లువై పుడమిని తడిమింది

  సౌందర్యాన్వేషణలోని మలయ సమీరం ఎన్ని కల్పాలను చుట్టొచ్చిందో తిమిరాన్ని చల్లగా తరిమింది ఊహలకి రెక్కలొచ్చి ఎగిరిన చందం తనువంతా వ్యాపించింది మైమరపు గంధం మనసుకు కళ్ళున్నట్లు గుర్తించిన మధురక్షణం సుదీర్ఘ కవనమొకటి రాయమంది తక్షణం..

   -లక్ష్మీ రాధిక 

మీ మాటలు

 1. సాయి.గోరంట్ల says:

  చక్కని ఊహకు రెక్కలు వచ్చినట్లు ఉంది
  ఈ కవిత💐💐
  లక్ష్మి రాధిక గారు అభినందనలు..

 2. Vijayaramgopal says:

  అద్భుతం నేస్తం. అనితర సాధ్యం మీ శైలి.

 3. NC Krishna Kumar says:

  చాలా బాగుంది రాధికా…
  విశ్వశూన్యం ఆవరించిన సపషుప్తిలో…..
  …….. కృతిగా ప్రకృతిని పలకరించాలని

  వవెరీ నైస్

 4. Suparna mahi says:

  …చాల చక్కని పదచిత్రాలూ, గొప్ప భావుకతా కలసిన ఓ అందమైన పోయెమ్ మా… అభినందనలు…🌼🌸🌼…

 5. లాస్య ప్రియ says:

  మంచుతెరల నడుమ సూర్యోదయం భూపాల రాగాల మాధుర్యం ఒంపుకొని ఒక్కో కిరణం వెల్లువై పుడమిని తడిమింది..అద్భుతమైన లైన్స్ అక్కా

మీ మాటలు

*