రెక్క చాటు గెలుపు

art: Tilak

art: Tilak


 

గాల్లో చేతులు చాపి నిరాధారంగా నిల్చున్నపుడు
నా కడుపులోంచి మొలిచిన చిరు నక్షత్రానివి నువ్వు
నిన్నెత్తుకుని నడిచిన ప్రతీ అడుగూ
దాటొచ్చిన ప్రతీ క్షణమూ
దు:ఖ పూరిత బెంబేలు హృదయాన్ని
గొంతు చివర అణిచిపెట్టి
ముసుగు చిర్నవ్వుల్ని పూసుకున్నదే
ఇవేళ్టి క్షణం కోసం
ఎప్పుడూ అర్థరాత్రి మెలకువలో
ప్రార్థనా పూరిత పెదవులేవో కదులుతూండేవి
కంటి చివర ధారాపాతంగా
ఏవో జ్ఞాపకాలు సలుపుతూ ఉండేవి
ఇరవై రెండేళ్లుగా
నిన్ను మోస్తున్న
బరువేదో ఎక్కడైనా
కాస్త భుజమ్మార్చుకోవాలనిపించేది
గుర్తున్నాయా నాన్నా-
నెలకొక్కసారే కొనగలిగిన చాక్లెట్టు
నెలకొక్కసారే తినగలిగిన ఐసుక్రీము
ఇరవై రెండేళ్లు త్వరగా గడవలేదు
అనుక్షణం దు:ఖాల్ని
మొయ్యలేక పాషాణమై పోయిన
కనురెప్పల మీదుగా
జారని గతమై
వెకిలి ప్రపంచం వెంట
విరిగిపోయిన హృదయాన
విదిలించుకోలేని ముళ్ళై
దారి పొడవునా
బండరాళ్లనే పరిచి
గతుకుల్నే మిగిల్చి
రోజొక పరీక్షగా
ఇరవై రెండేళ్లు  ఇట్టే గడవలేదు
అయినా బతికుండాలనిపించేది
ఇవేళ్టి నీ కోసం
రెండు పిడికిళ్లూ బిగించి
గుండె నిండా ఊపిరి పీల్చి
ఏ దారైనా నడవాలనిపించేది
అలసట తీరదు
దు:ఖం ఆగదు
అయినా ముందు తప్ప వెనుక
చూడని  కాలమై ప్రవహించాలనిపించేది
నీ ముఖమ్మీద ఈ నిశ్చింత చూడడానికీ
నీ కళ్లల్లో గెలుపు కాంతిని గుండె నింపుకోవడానికీ
ఇరవై రెండేళ్లుగా
నీ వెనుక మేరు పర్వతమై నిలబడాలనిపించింది
అవును నాన్నా!
నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలిగే
ఈ రోజు కోసం
సప్త సముద్రాలు
విరిగిన రెక్కల్తోనే ఈదాలనిపించింది
ఇన్నాళ్లుగా ఎప్పుడూ ఆగకుండా
అలిసిపోయిన మస్తిష్కం
డస్సిపోయిన శరీరం
ఇపుడిక విశ్రమిస్తున్నా
నీ రెక్క చాటు గెలుపునై
నీతో పరుగెత్తుతూనే ఉంటాను
నీ శమైక స్వేదాన్నై
ఎప్పుడూ నీ కంఠాన్ని కౌగలించుకునే ఉంటాను
——

 

మీ మాటలు

 1. అమ్మ ఆక్రోశం చాలా బాగుంది.

 2. కందికొండ says:

  చిన్న కవిత! ఎంత గొప్ప జీవితం!!
  ఇరవై రెండేళ్ల జీవితం!!!
  కవిత అంతటా అమ్మతనం పరుచుకుంది
  ప్రతి అక్షరంలో ఒకటే వాత్సల్యపు వాసన
  అమ్మ మునివేళ్ళ స్పర్శ
  మా అవ్వ(అమ్మ) యాదికచ్చింది
  కవిత చదువుతున్నంతసేపూ
  ఒకటే కన్నీళ్లు…
  అమ్మంటే ఎన్ని త్యాగాలు!!!
  “నెలకు ఒకసారే తినగలిగిన ఐస్క్రీమ్
  కొనగలిగిన చాక్లెట్స్”
  “నీ రెక్క చాటు గెలుపునై
  నీతో పరుగెత్తుతూనేఉంటాను”
  “ఇవాళ్టి కోసం…
  రెండు పిడికిళ్లు బిగించి
  గుండెల నిండా ఊపిరి పీల్చి
  ఏ దారైనా నడవాలనిపించేది”
  “ఇవేళ్టి క్షణం కోసం
  ప్రార్థనా పూరిత పెడవులేవో కదులుతుండేవి
  కంటి చివర దారాపాతంగా
  ఏవో జ్ఞాపకాలు సలుపుతుండేవి”
  రచయితకు పాదాభివందనం…

 3. Suparna mahi says:

  హృద్యమైన కవిత..చాలా అనుభవాల్ని గుర్తు చేసే పద చిత్రాలతో చాలా బావుంది…

 4. syed sabir hussain says:

  ఇరవైరెండేళ్ల బరువు. నెలకొక్కలారే కొనగలిగే చాకోలెట్లు .. నెలకొక్కసారే తినగలిగిన ఐస్క్రీములు ..ఎంతబాగుంది వర్ణన. ప్రతిఒక్క తల్లీదండ్రీ హృదయాన్ని మీటింది. కవయిత్రి గీత గారికి అభినందనలు.

మీ మాటలు

*