విరుగుతున్న రెక్కల చప్పుడు – ఉడ్తా పంజాబ్

alia-bhatt-udta-punjab-trans

 

‘ఫ్లైయింగ్ హై’ అనేది ఒక మెటాఫర్.  ఇది ఒక విజయవంతమైన ఆనందమనే కాదు, ‘ఒక మత్తు మందు ప్రభావంతో ఆకాశంలో విహరిస్తున్న అనుభూతిని పొందడం’ అనే అర్థాన్ని కూడా కలిగి ఉంది. మన దేశంలో సాధారణంగా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతుంటే ‘తాగున్నావా?’ అనడుగుతారు. అదే డ్రగ్స్  వాడకం అధికంగా ఉన్న దేశాల్లో అయితే ‘ఆర్ యు హై?’ అని అడగటం పరిపాటి. దానికి అర్థం, ‘నువ్వు డ్రగ్స్  గానీ తీసుకుని ఉన్నావా?’ అని అడగటం. ‘ఉడ్తా పంజాబ్’ అంటే ఇక్కడ, పంజాబ్ ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిపోయిందనీ, ఉన్నతమైన స్థితికి చేరుకుంటోందనీ అర్థం కాదు. డ్రగ్స్  మత్తులో మునిగి తేలుతోందని చెప్పడం. పేరుతో సహా అన్ని రకాలుగా ఈ సినిమా, పంజాబ్ లోని డ్రగ్ మాఫియా గురించి మాట్లాడబోతున్నట్టుగా

ముందుగానే ప్రచారం పొందింది. బాలీవుడ్ లో ఇప్పటివరకూ డ్రగ్స్  వాడకం కథాంశంగా కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ, అవేవీ పూర్తి స్థాయిలో ఈ సమస్య  గురించి చర్చించలేదు.

ఈ సినిమా ఒక రాక్ స్టార్ (షాహిద్ కపూర్), ఒక బీహారీ అమ్మాయి (ఆలియా భట్), ఒక సబ్ ఇన్స్పెక్టర్(దిల్జీత్ దోషన్జ్), ఒక డాక్టర్(కరీనా కపూర్) లు ప్రధాన పాత్రలుగా నడుస్తుంది. సినిమా మొదలవడమే రాక్ స్టార్ ‘గబ్రూ’ హోరెత్తించే పాటతో మొదలవుతుంది. పంజాబ్ లో చాలా మంచి రంగు కలిగిన అమ్మాయిలని ‘గోరీ చిట్టీ’ అని పిలుస్తారు. చిట్టా అంటే తెలుపు రంగని అర్థం. “ఓ చిట్టా వే” అంటూ మొదలయ్యే ఈ పాట తెల్లని డ్రగ్ పౌడర్ గురించి మాట్లాడుతుంది. మొత్తం పాటంతా ఒక తెల్లని అందమైన అమ్మాయికో లేక డ్రగ్ పౌడర్ కో, ఎలా అన్వయించుకున్నా సరిపోలే విధంగానే ఉంటుంది. డ్రగ్స్, వాటిని వాడినవారి నరాల్లో రేపేటంతటి హుషారూ, ఈ పాటకున్న సంగీతం కూడా రేపుతుంది.

లండన్ నుండి ఇండియాకు తిరిగి వచ్చి రాక్ స్టార్ గా మారిన ఒక గ్రామీణ పంజాబీ యువకుడు టామీ సింగ్. అప్పటికే పూర్తి స్థాయిలో డ్రగ్స్ మత్తులో కూరుకుపోయిన ఇతడు, డ్రగ్స్ తీసుకునేందుకు యువత ఉత్ప్రేరితమయ్యే  విధంగా పాటల్ని రాసి పాడుతుంటాడు. బాగా ప్రాచుర్యాన్ని కూడా పొందుతాడు. అలాగే అక్కడికి దగ్గరలో మరోచోట ఒక బీహారీ అమ్మాయి(ఆలియా భట్)కి దొరికిన 3 కిలోల హెరాయిన్ ఆమెకి తీవ్రమైన సమస్యల్ని తెచ్చిపెట్టి, డ్రగ్ మాఫియా చేతిలో చిక్కుకుపోయేలా చేస్తుంది. వీరిద్దరూ ఒకరికొకరు అనుకోకుండా ఎదురుపడటం, టామీ సింగ్, బీహారీ అమ్మాయి ప్రేమలో పడటం, అప్పటికే తను చేస్తున్నది తప్పన్న ఆలోచనలో ఉన్న అతడు, ప్రేమ డ్రగ్స్  కంటే ఎక్కువ మత్తుని కలిగిస్తుందని భావించడం, ఆమెని డ్రగ్ మాఫియా బారి నుండి కాపాడి పోలీసులకి లొంగిపోవడం ఒక స్టోరీ.

ఇక అదే గ్రామానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ సర్తాజ్ సింగ్, తన తమ్ముడు డ్రగ్ ఎడిక్ట్ గా మారి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం వల్ల జ్ఞానోదయం పొంది, అప్పటికే యాక్టివిస్ట్ గా పని చేస్తున్న డాక్టర్ ప్రీత్ సాహ్నీతో కలిసి ఆ ముఠా గుట్టు రట్టు చేసే ప్రయత్నం చేస్తాడు. కథ ఏవేవో మలుపులు తిరిగి చివరికి ఆ డాక్టరమ్మాయీ, ఇంకా కొందరి డ్రగ్ మాఫియా సభ్యుల మరణాలకి దారి తీస్తుంది. మొత్తానికి వీరి ప్రయత్నాల కారణంగా ప్రభుత్వంలో, ప్రజలలో కొంత ఉత్తేజంగా కలిగినట్టుగా భావించమనే విధంగా సినిమా ముగుస్తుంది.

సినిమా మొత్తానికి ప్రధానంగా చెప్పుకోవాల్సింది బీహారీ అమ్మాయిగా నటించిన ఆలియా భట్ గురించి. పూర్తిగా డీ గ్లామరైజ్ చేయబడిన పాత్రలో ఆమె నిజంగా చక్కని నటనను ప్రదర్శించింది. బీహార్ లో పనులు దొరకని కారణంగా చాలామంది అక్కడినుండి సంపన్న రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, జమ్మూ వంటి ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. అక్కడ దొరికిన పనులు చేసుకుంటూ ‘జుగ్గీ’లనబడే తాత్కాలికమైన గుడారాల్లో కాలాన్నివెళ్లదీస్తుంటారు. అటువంటి ఒక పదిహేను, పదహారు సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి పాత్రలో ఆలియా భట్ చక్కగా ఇమిడిపోయింది. వేషభాషలు, మాట్లాడే యాసా, బాడీ లాంగ్వేజ్ ఆమెకు సరిగ్గా సరిపోయాయి. (నాకైతే మేం జమ్మూలో ఉన్నప్పుడు, వీధి చివరి జుగ్గీలో ఉండే ఉషా అనే బీహారీ అమ్మాయే గుర్తొచ్చింది). అంతే కాక అధికమైన విల్ పవర్, ధైర్యం కలిగిన అమ్మాయిగా ఆమె పాత్ర సినిమాకు మంచి బలాన్ని చేకూర్చింది. మాఫియా ముఠా సభ్యులు ఆమెని డ్రగ్ ఎడిక్ట్ గా మార్చినప్పటికీ, తన నోట్లో తనే గుడ్డలు కుక్కుకుని ఆ కోరికని అణుచుకునే ప్రయత్నం చేయడం, ఇంకా ఆమె పాత్రకు చెందిన కొన్ని ఇతర సన్నివేశాలూ  చాలా సహజంగా, మనసుని కదిలించేవిగా ఉన్నాయి. సంగీత దర్శకుడు అమిత్ త్రివేదీ అందించి హిప్ హప్ సంగీతం కూడా సినిమాకు చెందిన బలమైన విషయాలలో ఒకటిగా చెప్పుకోవాలి. దాంతోపాటుగా డ్రగ్స్  ప్రపంచానికి చెందిన ఆ చీకటి వాతావరణాన్ని సృష్టించడంలో సినెమాటోగ్రాఫర్ రాజీవ్ రవి సఫలమయ్యాడు

అయితే, మొదలవడం బాగానే మొదలైనప్పటికీ, ఎక్కడ తప్పిందో తెలీకుండానే కథ దారి తప్పి ఎటో వెళ్లిపోతుంది. ఒక జటిలమైన సమస్యకి కొంత కామెడీని కూడా కలిపి సినిమాను డార్క్ కామెడీగా ప్రజెంట్ చేద్దామనుకున్న దర్శకుడి ఆలోచన ఎక్కువై, అసలు విషయం పక్కకి తప్పుకుంది. ఈ సినిమా ద్వారా ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇండియాలో, ముఖ్యంగా పంజాబ్ లో చాలా సులువుగా డ్రగ్స్  లభ్యమవుతున్నాయి. అవి కూడా ప్రాంతీయంగా తయారుచేయబడి

చాలా తక్కువ ధరలకే అన్ని మందుల దుకాణాలలోనూ దొరుకుతున్నాయి. ఇందుకు రాజకీయ నాయకుల, పోలీసుల అండాదండా పుష్కలంగా లభిస్తోంది. ఈ విషయాన్ని చెప్పడం కోసం దర్శకుడు ‘అభిషేక్ చౌబే’ ఎంచుకున్న కథలోనే కొంత తడబాటు ఉంది.

ఒక సమస్య  ఉందని చెప్పినప్పుడు, అది ఎందుకు ఎలా మొదలైందో మూల కారణాలను వెదకడం, అది ఇంకా ఏ విధంగా విస్తరిస్తోందో గమనించేలా చేయడం, అవకాశం ఉంటే ఆ సమస్యకు తోచిన పరిష్కారాన్ని సూచించడం ఒక పధ్ధతి. లేదూ, ఆ సమస్యని కథలో భాగంగా తీసుకున్నప్పుడు, కథను ప్రధానంగా నడిపించి సమస్యను అందులో సహజంగా లీనం చెయ్యడం రెండో పధ్ధతి. కానీ ఈ సినిమా రెండు పడవల మీదా కాళ్లు పెట్టి ప్రయాణించే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. అలాగే సెన్సార్ సమస్యని తీవ్రంగా ఎదుర్కొన్న చిత్రంగా కూడా ఈ సినిమా వార్తలకెక్కింది. నిజానికి కథకు అంతగా అవసరం లేని అశ్లీల పద ప్రయోగాలు సినిమాలో ఎక్కువగా ఉన్న మాట వాస్తవం.

ఇప్పటికే ధూమపానం, మద్యపానం కారణంగా అన్ని విధాలుగా నాశనమయిపోతున్న మన దేశం, సరైన పద్ధతిలో ఆలోచన చేసి ఈ సమస్య  మరింతగా విస్తరించిపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం మంచిది.  అలా చెయ్యని పక్షంలో, ఈ సినిమాలోనే చెప్పినట్టుగా మన దేశం డ్రగ్స్ విషయంలో మరో మెక్సికోగా మార్పు చెందే సమయం పెద్ద దూరంలో ఉన్నట్టుగా కనిపించడం లేదు. పాబ్లో ఎస్కబార్ అనే డ్రగ్ మాఫియా డాన్, 1970,80 లలో అమెరికన్ రాష్ట్రాలకి డ్రగ్స్  అక్రమంగా రవాణా చేసి, అక్కడి యువతను మత్తుపదార్ధాలకి బానిసలుగా చేసాడు. ఒకవేళ అవే మత్తు పదార్ధాలు ప్రాంతీయంగా తయారుచేయబడితే, తక్కువ ధరకే లభ్యం కావడంతో పాటుగా మన దేశంలోని అవినీతి కూడా తోడై అతి సులువుగా వ్యాపించిపోతాయి. ఒక్క సారి గనక జనం, ముఖ్యంగా యువతరం వాటికి అలవాటు పడితే, మానడమనే విషయం చాలా కష్ట సాధ్యమైపోతుంది. అందువల్ల ఇటువంటి ప్రాథమిక దశలో ఉన్నప్పుడే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ కి చెందిన అసలైన చీకటి కోణాల గురించీ, వీడ్ అనీ పాట్ అనీ పిలవబడే మార్జువానా గురించీ, మెథ్, కొకైన్, హెరాయిన్ వంటి మత్తు పదార్ధాల తయారీ, వాటి అక్రమ రవాణాల గురించీ, అవి కలిగించే దుష్ఫలితాల గురించీ, ఆ మాఫియా గ్రూప్ ల గురించీ సవివరంగా తెలుసుకోవాలంటే నెట్ఫ్లిక్స్  ఒరిజినల్ సీరిస్ అయిన “నార్కోస్” చూస్తే సరిపోతుంది. ఇది యథార్థ గాథ. అదికాక డ్రగ్స్ ప్రపంచానికి చెందిన కల్పిత గాథ ‘బ్రేకింగ్ బాడ్”. బాగా ప్రాచుర్యం పొందిన ఈ టీవీ సీరీస్ కూడా నెట్ఫ్లిక్స్ లో ఉంది.

మనిషికి వెన్నెముకా, పక్షికి రెక్కల వంటి వారు దేశానికి యువత. ఇప్పుడవి డ్రగ్స్ మూలంగా పటపటా విరుగుతున్న చప్పుడు పంజాబ్ అంతా వినిపిస్తోందని ఈ సినిమా చెప్తోంది. మిగిలినవన్నీ పక్కన పెట్టి చూస్తే,  ‘డ్రగ్స్  విషయంలో పూర్తిగా ఆలస్యమైపోక ముందే మేలుకోవాల్సిన అవసరం ఉందంటూ’ దేశానికీ, సమాజానికీ ఈ సినిమా ఒక హెచ్చరికని జారీ చేసిందన్న విషయాన్ని మాత్రం ఒప్పుకోవాలి.

***

 

మీ మాటలు

 1. బాగుంది భవానీ. రాయాల్సిన సినిమా గురించి వివరంగా రాశారు. ఈ సంవత్సరం నాకు బాగా నచ్చిన సినిమాల్లో ఇదొకటి. కానీ మీరన్నట్టు కథ దారి తప్పలేదు ఈ సినిమాలో. ఇదొక సమకాలీన విషాదాన్ని లాటిన్ అమెరికన్ సినిమాల పద్ధతిలో ప్రెజెంట్ చేసింది. గబ్రూ, పేరు కూడా లేని బీహారీ పిల్ల డ్రగ్స్ ని గెలిచి ఆశ పెంచుతారు. డ్రగ్స్ కి లొంగిపోయిన అమాయకపు పిల్లవాడు సమాజానికి ఎంతో అవసరమైన మనిషిని ఇట్టే చంపేస్తాడు. మెయిన్ స్ట్రీం లో ఇంత బాగా సినిమా కుదిరి డబ్బు కూడా సంపాదించటం గట్టి విజయమే.

  • Bhavani Phani says:

   అయితే కథను నేనర్థం చేసుకోవడంలోనే పొరపాటు జరిగినట్టుంది లలిత గారూ. లాటిన్ అమెరికా సినిమాల గురించి నాకంతగా అవగాహన లేదు. చూస్తాను అవి కూడా. ఏదేమైనప్పటికీ, మీరన్నట్టుగా ఈ సినిమా తీసిన ఉద్దేశ్యం అభినందనీయం. అది విజయవంతం కావడం కూడా గొప్ప విషయం. మీ స్పందనకు చాలా చాలా ధన్యవాదాలు

 2. కందికొండ says:

  భవాని ఫణి గారు ఊడ్తా పంజాబ్ పై మీ విశ్లేషణ చాలా బావుంది ధన్యవాదాలు

  • Bhavani Phani says:

   చదివి అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు సర్!

 3. భవానీ ఫణిగారూ,
  నాది నిజానికి సినిమా రివ్యూ కాదు, సామాజిక సమస్యల కోణం నుంచి రాసినది. అదీ-పాతది.
  ఎవరైనా చదువుతారేమోనని ఇక్కడ లింకిస్తున్నాను. మీరు ఏమీ అనుకోరని ఆశ.

  http://vihanga.com/?p=17360

  • Bhavani Phani says:

   కృష్ణ వేణి గారూ, డ్రగ్స్ కి సంబంధించి ఎంతో విలువైన సమాచారాన్ని అందించారు వ్యాసంలో. నిజానికి డ్రగ్స్ గురించి నాకంత వివరంగా తెలీదు. తెలిసిన మటుకు రాసాను అంతే. మీ వ్యాసం చాలా బావుంది. షేర్ చేసినందుకు ధన్యవాదాలు.

మీ మాటలు

*