గోడకో కిటికీ!

 

 

– రాధ మండువ

~

 

1.

సూర్యోదయం అయి చాలా సేపయింది.  పిల్లలంతా మామిడి చెట్ల మీదకి చేరి గోల చేస్తున్నారు.

ఈ రోజు మా ఆవిడ – కొత్త వధువు, నెల రోజుల క్రితమే నా భార్య అయిన శ్రావణి వస్తోంది.  ఆమెని గురించిన ఆలోచనలతో రాత్రి సరిగ్గా నిద్రపట్టకనో,  ఈరోజు ఎలాగూ సెలవు పెట్టాను కదా అనో ఆలస్యంగా నిద్ర లేచాను.

లేచి నిలబడ్డానో లేదో మామిడి చెట్టు మీద నుండి కిటికీ వైపుకి చూస్తూ “గోవిందన్నా,  ఇన్నికి ఆఫీసుకు పోలియా?”  అని అరిచాడొకడు.  నేను నవ్వి చెయ్యి ఊపి బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయాను.

ఈ పిల్లలు తెల్లవారనివ్వరు కదా!  శని ఆదివారాలైతే మరీ గోల.  కాస్త పొద్దెక్కేటప్పటికే  చెట్ల మీదకి చేరి ఆటలు ఆడుతుంటారు.  చేరితే చేరారు కిటికీలో గుండా తొంగి తొంగి చూస్తూ మధ్య మధ్యలో నన్ను వెక్కిరిస్తూ ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు.  ఏం మాట్లాడుకుంటారో!?  ఆ కబుర్లకి ఓ అంతూ దరీ ఉండదు.

నేనుండే ఆ రేకుల ఇంటికి ఆ కిటికీ ఒక్కటే ఉంది.  అదంటే నాకు చాలా ఇష్టం.  రాత్రింబవళ్లు అది తెరిచే ఉంచుతాను.  దాన్ని ఈరోజు సాయంత్రం మూసేయాలి,  పూర్తిగా కాదులే అప్పుడప్పుడూ మూసేయాల్సిందే ఇక…   ఆవిడ వస్తుంది కదా?  ఇంట్లో ఆవిడతో కబుర్లు చెప్తూ పక్కన నిలబడితేనో,  ఆమె పక్కన కూర్చుంటేనో – ఈ పిల్లలు చూస్తే ఇంకేముందీ!  ఇక పగలబడి నవ్వుతారు ఎగతాళిగా చూస్తూ.  నాలుక బయటపెట్టి వెక్కిరిస్తారు కూడా!

నేను ఆంధ్రానుండి చెన్నైలో తాంబరంలో ఉండే ఈ ఇంటికొచ్చి దాదాపు నాలుగేళ్ళవుతోంది.  ఇంటి ఓనర్స్ ముందు భాగంలో ఉన్న పెద్ద ఇంట్లో ఉంటారు.  వెనుక ఉన్న రెండు ఇళ్ళల్లో రేకుల ఇల్లు నాది.  మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ ఫెన్సింగ్ కి ఆనుకుని ఉంటుంది.  రెండో వైపు ఖాళీ స్థలం.  ఎవరో ఇల్లు కట్టుకోవడానికి ఆ స్థలం కొనుక్కున్నారు.   దాన్లో రెండు మామిడి చెట్లు వేశారో పడి మొలిచాయో మరి – ఉన్నాయి.   స్థలం ఓనర్లు ఎవరో తెలియదు.  చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని ఎవరూ లోపలకు రాకుండా జాగ్రత్త మాత్రం చేసుకున్నారు.   లోపలున్న చెట్లకి కాసిన్ని నీళ్ళు పోయడం, కాయలు కాస్తే కోసుకుని తినడం,  వాళ్ళకిష్టమైన వాళ్ళకి కాయలు ఇవ్వడం అన్నిటికీ హక్కుదార్లు ఈ చుట్టుప్రక్కల ఉండే ఇళ్ళల్లోని పిల్లలే.  వీళ్ళు నాకు సంతోషాన్ని కలిగించే పిల్ల స్నేహితులు.

మా ఆఫీసు ఉండేది మరైమలైనగర్లో.  తాంబరం నుండి రోజూ ఉదయాన్నే లోకల్  ట్రైన్   పట్టుకుని ఆఫీస్ కి వెళతాను.  బావుంటుంది ఆ ప్రయాణం.   ఉదయం రైల్లో వచ్చే జనమంతా ఫ్రెష్ గా ఉంటారు.  పూలోళ్లు, కూరలోళ్ళు, పాలోళ్ళు, వస్తువులు అమ్మేవాళ్ళతో రైలు బండి కళకళలాడుతుంటుంది.  ప్రతి ఆడామె తల్లో పూలు ఉండాల్సిందే.  ముఖాన ముచ్చటగా కుంకుమ బొట్టు,  పైన అడ్డంగా విభూది.  మగాళ్ళ నుదుటన అడ్డంగానో, చుక్కగానో విభూది ఉంటుంది.   అన్నం, సాంబార్ వారి భోజనంలో నిత్యం ఉండాల్సిందే –  కనుకనేనేమో దాదాపు అందరూ లావుగా ఉంటారు.  అయితేనేం లావుగా ఉన్నా హుషారుగా…  తమిళంలో చెప్పాలంటే సురుసురుపుగా ఉంటారు.

ఎందుకో ఇవాళ పొద్దున్నే వీళ్ళని తల్చుకుంటున్నాను.  ఇవన్నీ నా భార్యకి చెప్పాలనే ఆలోచన వల్ల కలుగుతున్న తలపులేమో!  ఆలోచనల్లోంచి బయటపడి లేచి ఇల్లంతా సర్దాను.  టేబుల్ మీదున్న పుస్తకాల వెనక్కి చేరిన పెళ్ళి ఫోటో గాజు ఫ్రేమ్ నిండా దుమ్ము చేరింది.  నాలుక్కరుచుకుని గబగబా తుడిచి కనపడేట్లు ముందుకి పెట్టాను.

కిటికీ లో నుండి ఓ తల లోపలకొచ్చింది.  “హే గోవిందన్నా ఆఫీసుకి పోలా?”  అంది ప్రక్క పోర్షన్ లో ఉండే వాళ్ళ పిల్ల.  ఏం పేరబ్బా…  ఈ పిల్ల పేరు!?  ఎప్పుడూ మర్చిపోతుంటాను.  “ఇల్లె. పోలా.  ఆంటీ వరాంగో”  అన్నాను.

“ఆంటీ యారూ?”

“ఆంటీ”.

“ఆంటీ అన్నా యారు?”  చిరాకు ఆ పిల్ల గొంతులో.  నాకేం చెప్పాలో అర్థం కాలేదు.  చెప్పినా ఎనిమిదేళ్ళ పిల్లకేం అర్థం అవుతుంది?  గభాల్న ఫోటో తీసి చెయ్యి పైకెత్తి కిటికీలో నుంచి చూపిస్తూ “ఈ ఆంటీ”  అన్నాను.

“ఓ ఉంగళ పొండాటీయా?”  అంది నోరు అంతా తెరిచి నవ్వుతూ.

‘ఓయమ్మ ఈ పిల్ల భలేదే!’  అనుకుని నేను సిగ్గుపడేలోపు ఆ పిల్ల అక్కడనుండి తుర్రుమంది.

హమ్మయ్య ప్రశ్నలతో చంపకుండా వెళ్ళిపోయింది అనుకుని ఫోటో టేబుల్ మీద పెట్టి కిటికీ రెక్కలు వేసేశాను.  అలా వేశానో లేదో “గోవిందూ,  గోవిందూ”  అంటూ కిటికీ మీద కొట్టారు – ప్రక్కింటి బామ్మ…  ఆ పిల్ల నాయనమ్మ.  అబ్బ!  ఆ పిల్ల పేరేంటో గుర్తే రాదు అనుకుంటూ “ఆఁ ఆఁ”  అంటూ కిటికీ రెక్కలు తీశాను.  ఎవరూ లేరు.  ఈలోపే చుట్టుతిరిగి వచ్చి గది తలుపు మీద బాదుతూ ఆమె పిలుస్తోంది.  తెరిచిన కిటికీ రెక్కలని అలాగే వదిలేసి ముందు గదిలోకి ఒక్క గెంతేసి వాకిలి తలుపు తీశాను.

“మనోజ్ఞ సొల్లరా…  ఉంగ పొండాటి ఇన్నికి వరాంగ్లామే!?”  అంది.

ఆఁ…  ఆ పిల్ల పేరు మనోజ్ఞ.  “అవును మామీ!”  అన్నాను.

“సరి సరి నాకు చెప్పొద్దా?  ఎన్ని గంటలకి వస్తున్నారు?”  అంది తమిళంలో.

“సాయంకాలం ఆరుకి రైలొస్తుంది,  ఇంటికి వచ్చేప్పటికి ఏడు అవుతుందేమో”

“పర్వాలేదు,  ఎంత సమయమైనా కానీయ్ లే.  నేరుగా ఇంట్లోకి తీసుకురాకూడదు.  గేటు దగ్గర ఆపి నాకొచ్చి చెప్పు.    దిష్టి తీసి,  హారతిచ్చి లోపలకి తీసుకురావాలి, బ్రాహ్మణుల పిల్లాడివి అయినా ఏమీ తెలియదు ఏమిటో!?”  అంది.  నేను నవ్వుకున్నాను.  ఈ తమిళియన్స్  ఆచార వ్యవహారాలు పాటించడానికి ఎంత శ్రమకైనా ఓరుస్తారు, సహాయం చేస్తారు

“సరే మామీ”  అని నేనంటుండగానే ఆవిడ గబగబా గుమ్మం దాటి గది మలుపు తిరిగింది.  తలుపేసుకుంటుండగా కిటికీలోకి తలపెట్టి చూస్తా “గోవిందూ మీ మామగారు కూడా వస్తున్నారా?” అంది ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి.

“లేదు ఆయనకి ఆరోగ్యం బాగాలేదు మామీ.  ఈవిడ ఒక్కత్తే వస్తోంది”

“అయ్యో,  భద్రంగా వస్తుంది కదా?”  అంది.

“ఆఁ రాగలదులెండి,  అక్కడ రైలెక్కిస్తే ఇక్కడ నేను దించుకుంటాను,  భయమేమీ లేదు”  అన్నాను.

“సరీ…  వరుంబోదు పూలు పళం వాంగికోంగో”  అని ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది తనింటికే చుట్టం వస్తుందన్నంత హడావుడిగా.

 

2.

 

గడియారం పది గంటలు కొట్టింది.  గంటల శబ్దానికి పిల్లలంతా చెట్ల కొమ్మల మీద నుండే కిటికీ వైపుకి చూశారు.  ఆ పురాతన గడియారం అంటే పిల్లలకి చాలా మక్కువ.   అది గంటలు కొట్టినప్పుడంతా దాన్ని చూడటానికీ,  తమ ఇంటికొచ్చిన కొత్త పిల్లలకి దాన్ని చూపించడానికీ ఆ చువ్వలు లేని కిటికీ లోంచి తలలు లోపలకొస్తూనే ఉంటాయి.  దాన్ని ఈరోజు సాయంత్రం అర్జంటుగా మూసేయాలి అనుకోగానే నవ్వు వచ్చింది.

బజారుకెళ్ళి ఇంట్లోకి కావలసినవి కొనుక్కుని వస్తుంటే మా వీధి వాళ్ళంతా పలకరించారు.  అప్పటికే న్యూస్ వీధి చివరి వరకూ చేరింది.  ఇంట్లోకి వచ్చానో లేదో మూసిపెట్టిన కిటికీ రెక్కల మీద పిల్లలు బాదుతూనే ఉన్నారు.   నేను పట్టించుకోకుండా వంట పనిలో పడిపోయాను – వాళ్ళే కొట్టి కొట్టి పోతార్లే అనుకుంటూ…  నవ్వుకుంటూ…

సమయం నిదానంగా గడుస్తున్నట్లనిపించింది.  మధ్యాహ్నం అన్నం తిని ఎన్నో గంటలయినట్లుంది.  టైమ్ చూస్తే ఇంకా రెండు కూడా కాలేదు.

“గోవిందన్నా,  ఓ గోవిందన్నా”  కిటికీ బాదుతోంది గట్టిగా.  వదలకుండా అరుస్తూనే ఉంది.  ఏం పేరు ఈ పిల్ల పేరూ!!?  ఆఁ మనోజ్ఞ – మనసుకి ఉల్లాసం కలిగించేదా?  ఉత్తేజం కలిగించేదా!?  ఏమోగాని ఇప్పుడు మాత్రం ‘తలుపు తీస్తావా తీయవా’ అని నా గుండెల్ని అదరగొడుతోంది.  లేచి కిటికీ రెక్కలు తీశాను.  గభాల్న ఇద్దరు పిల్లలు లోపలకి తల పెట్టగానే వెనక్కి గంతు వేశాను – నా తల వాళ్ళకి ఢీ కొట్టుకోకుండా…

ఎదురింటి నాడార్ గారి అబ్బాయి కృష్ణని తీసుకోనొచ్చింది.   నాడార్ గారు మా ఫ్యాక్టరీలోనే అకౌంట్స్ క్లర్క్.  ఈ ఇల్లు ఆయన వల్లే దొరికింది నాకు.   “హహహ గోవిందన్నా!  ఎనక్కూ ఉంగ పొండాటి ఫోటో కామింగో” అన్నాడు.

“ఏంటిరా గోల?”  అన్నాను విసుక్కుంటూ…

“నాకు తెలియదు,  నేను కూడా మీ పెళ్ళాం ఫోటో చూడాలి.  మనోజ్ఞ అందరి దగ్గరా ఎచ్చులు కొడుతోంది – ‘నేను గోవిందన్న పెళ్ళాం ఫోటో చూశా’  అని.  నాక్కూడా చూపించు”  అన్నాడు.  వాడు మాట్లాడుతుంటే డబ్బాలో గులకరాళ్ళు పోసి ఊపినట్లుంటుంది.

“అబ్బబ్బ!  ఇరుప్పా,  చెవులు నొప్పి పుడుతున్నాయి, అరవొద్దుండు చూపిస్తా”  అంటూ ఫోటోని తీసి చూపించాను.  చూస్తున్న వాడు కాస్తా గభాల్న నా చేతుల్లోంచి ఫోటో లాక్కుని పరిగెత్తాడు.

“అరేయ్,  ఆగు ఆగు!  ఆగు కృష్ణా!”  అంటూ ముందు గదిలోకి దూకి తలుపు తీసుకుని తిరిగి వెళ్ళే లోపు మామిడి చెట్టు మీదికి చేరారు.   శనివారం కదా,  పెద్దపిల్లకోతి మూకంతా కూడా చెట్ల మీద ఉంది.  ఫోటో ఒకళ్ళ చేతిలోంచి మరొకళ్ళ చేతుల్లోకి మారుతోంది.

‘ఫోటోని ఇవ్వమనీ,  జాగ్రత్తనీ, చిన్నగా – చిన్నగా అనీ’   చెట్ల కింద నిలబడి అరుస్తున్నాను.  ఉన్నట్లుండి ఫోటో అంతెత్తునుండి కింద పడింది.  “అయ్యో!”  అని నేనూ పిల్లలు అందరం ఒక్కసారిగా అరిచాం.  పరిగెత్తి ఫోటోను చేతిలోకి తీసుకున్నాను.  గాజు ఫ్రేము ముక్కలైంది.  అప్పటికే పిల్లలు నా చుట్టూ గుమిగూడారు.  అప్పటి దాకా నవ్వులతో అరుపులతో హోరెత్తిన ఆ ప్రదేశం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది.   బిక్క ముఖాలేసుకుని నిలబడి ఉన్న పిల్లల్ని చూస్తూ చిన్నగా నవ్వాను.  నేను నవ్వగానే ‘హిహిహి’ అంటూ ఇబ్బందిగా ఇకిలించారు.

“ఫరవాలేదులే,  బజారుకి తీసుకెళ్ళి కొత్త గ్లాస్ వేపించేస్తాను”  అన్నాను.

“కృష్ణా నీదే తప్పు.  వద్దు వద్దు అంటే వినకుండా గోవిందన్న చేతిలోంచి ఫోటో లాక్కొచ్చావు”  అంది మనోజ్ఞ నిష్టూరంగా.

కృష్ణ నా దగ్గరికి వచ్చి “సారీ గోవిందన్నా!”  అన్నాడు.

“సరేలే,  ఈ విషయం ఎవ్వరకీ పెద్దవాళ్ళకి చెప్పొద్దు, సరేనా!?”  అన్నాను వేలు చూపిస్తూ.

ఈ సంగతి మామీకి తెలిస్తే ఇక ‘నేను కాదు గోవిందు నా పని గోవిందు’ అవుతుంది.  పెళ్ళి ఫోటో పెళ్ళికూతురు వచ్చే రోజు పగిలిందని తెలిస్తే ఇక జాతకాలనీ, గుడులనీ, శనిగ్రహపూజలనీ తిప్పుతుంది…  అమ్మో!

పిల్లల ముఖాలు విప్పారాయి.   ‘పిచ్చోడా,  నువ్వెక్కడ మా పెద్దోళ్ళకి చెబుతావోనని మేము భయపడుతుంటే నువ్వే మమ్మల్నిచెప్పొద్దంటున్నావే!?’  అని అనుకుంటున్నట్లు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుని నవ్వుకున్నారు.

గోవిందన్నా “ఇందా మాంపళం,  ఉంగ పొండాటికి కుడుంగో”  అని ఓ పిల్లోడు నాలుగు మామిడి పళ్ళు ఇచ్చాడు.  దూరంగా కంచె దగ్గరికి వెళ్ళి గాజుపెంకులు పారేసిన తర్వాత ఆ మామిడికాయలు తీసుకుని లోపలకి వచ్చాను.

అప్పటికి టైమ్ నాలుగయింది.    గబగబానే నీట్ గా తయారై  ఆమెని సెంట్రల్ స్టేషన్ నుండి తీసుకురావడానికి తాంబరం స్టేషన్ కి వెళ్ళి లోకల్ ట్రైన్ ఎక్కాను.

radha

3.

 

 

ఆమె వచ్చాక ఆ కిటికీ పూర్తిగా మూతబడిపోయింది.  నేనెప్పుడైనా తీసినా ఆవిడ ఒప్పుకోదు.  వెంటనే మూసేస్తుంది.

“అబ్బ,  ఏమిటండీ ఈ పిల్లరాక్షసులు పడుకోనివ్వకుండా ఒకటే గోల.  పిల్లల్నంటే బెదిరించి పంపించెయ్యొచ్చు,  ఈ మామీకి ఎక్కడనుంచొస్తుందో ఇంత ఓపిక పొద్దస్తమానం ‘ఎన్నాడీ శ్రావణీ,  ఎన్నా పణ్ణరే!?’ అంటా వస్తుంటుంది.  ఇక వీధిలో వాళ్ళు సాయంత్రమైతే చాలు వచ్చే కూరలోళ్ళనీ, పాలోళ్ళనీ,  పూలోళ్ళనీ, పండ్లబళ్ళనీ – ఒక్కట్ని పోనివ్వరు.  అన్నీ కొనాల్సిందే…  కొన్నా కొనకపోయినా ఆపి బేరాలు చేయాల్సిందే.  పైగా రోడ్డంతా రొచ్చురొచ్చుగా నీళ్ళు చల్లి ముగ్గులేయడం,  ఏం పొద్దునేసిన ముగ్గు చాలదా!?  నేను ఏ పుస్తకమో చదువుకుంటా లోపలుంటానా ‘ఎన్నా శ్రావణీ,  పువ్వు వేణుమా,  కొత్త పెళ్ళికూతురివి పూలు కావొద్దా!?’  అని పిలుస్తానే ఉంటారు”  అని అందరినీ వీధిలో వాళ్ళని ఒక్కళ్ళని వదలకుండా విసుక్కుంటోంది.

సరే, చుట్టుప్రక్కలోళ్ళ  రామాయణం ఇదైతే,  బయటికి ఎక్కడికి తీసుకుపోయినా జనాన్ని తిడుతుంటుంది.  పసుపుకుంకుమలూ, విభూదీ గుళ్ళో స్తంభాల మీద,  అరుగుల మీద, వీధుల్లో ఎక్కడంటే అక్కడ పోయడం,  ప్రదక్షిణాలంటూ మురికిలోనే పొర్లు దండాలు పెట్టడం,   పెళ్ళి ఊరేగింపునుండి,  శవాల ఊరేగింపు దాకా ఏ ఊరేగింపు జరిగినా బజార్లు నిండేట్లు పూలు చల్లడం,  ఏ పని మొదలు పెట్టాలన్నా వారం, వర్జ్యం అనడం,  మూఢనమ్మకాలు, అనవసరమైన ఆచారాలు,  ఆ ఆచారల కోసం విపరీతంగా ఖర్చు పెట్టడాలూ – అబ్బా!  ఒకటని కాదు అన్నీ ఈమె కళ్ళకే కనిపిస్తున్నాయి.

రోజులు యాంత్రికంగా – ఇదీ నాకు తక్కువ అని చెప్పలేను కాని – ఏదో చప్పగా గడిచిపోతున్నాయి.  నేను వీధిలో కనపడితే చాలు “విశేషం ఒన్నూ ఇల్లియా గోవిందూ,  కల్యాణం ఆయి ఇవళా నాల్ ఆయెచ్చి!” అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఆరోజు…  మా మామగారికి ఆరోగ్యం బాగాలేదని ఫోన్ వచ్చింది.  ఓ నెల్లాళ్ళు ఉండి ఆయనకి బాగయ్యాకే రమ్మని చెప్పి శ్రావణిని  రైలెక్కించి వచ్చాను.

ఇంట్లోకి రాగానే  ఆ కిటికీ దగ్గరకి దూకినట్లుగా వెళ్ళి రెక్కలు తీశాను.  యుగాల క్రితం దేన్నో కోల్పోయినంత ఆత్రం నా చేతులకి.  కిటికీ అవతల నా కోసం ఎవరో ఉంటారన్న నా భావాన్ని లాగిపడేస్తూ కిటికీ బోసిగా చూసింది నా వైపు.  నిస్సత్తువగా మంచం మీదకి చేరి అలాగే కిటికీ వైపే చూస్తూ పడుకుండిపోయాను.

తమలాగా ఇతరులు బ్రతకడం లేదని ఎందుకీ ఆగ్రహం?  అలవాట్లలో,  ఆచార వ్యవహారాల్లో తేడాలుంటాయేమో కాని సుఖదుఃఖాల భావనల్లో మనిషికీ మనిషికీ ఏమీ తేడా ఉండదని ఈమె ఎప్పటికైనా గ్రహిస్తుందా?  తనలోని రెక్కలని విశాలత్వం పేరుతో మూసుకుంటూ ఉండకుండా తెరిచి వెలుపలకి చూడగలుగుతుందా!?  – నిట్టూరుస్తూ ప్రక్కకి బాగా ప్రక్కకి ఒత్తిగిల్లి పడుకున్నాను.

“గోవిందన్నా,  హాయ్ గోవిందన్నా,  కిటికీ తీశావే,  భలే”  కృష్ణ గొంతు విని లేచాను.  “ఇంగ వాయే,  వెలియవాయే”  అరుస్తున్నాడు హడావుడిగా.  వాడిని చూడగానే భలే ఆనందం.  నేనంతకంటే వేగంగా కిటికీ దగ్గరకి వెళ్ళి  “ఎన్నా ఆయిచ్చి!?” అన్నాను.

“మా చెల్లి కిటికీలో గుండా లోపలకి చూడాలంట,  నీ గడియారం కూడా చూడాలంట,  చైర్ తెచ్చి ఇక్కడెయ్యవా?  ఎక్కి చూస్తుందంట,  తొందరగా వెయ్యి,  ఏడుస్తుంది వెయ్యి”

“అబ్బబ్బ!  ఉండురా,  నీ అరుపులకి చెవి నొప్పి పుడుతోంది”  అన్నాను కాని వాడి మాటలు నా చెవుల్లో అమృతం ఒలికినట్లుగా ఒదిగిపోతున్నాయి.   కృష్ణ చెల్లి  రోజాకి చైర్ వేయగానే ఆ పిల్ల పైకెక్కి కిటికీలో నుండి తొంగి చూసి “గోవిందన్న ఎంగా!? కానమే”  అంది.  పక్కనున్నా ఎక్కడున్నాడని అడుగుతుందే ఈ పిల్ల?…   లోపల నేనుంటే ఈ పిల్ల బయటనుండి నన్ను చూడాలనమాట.   ఇంకాసేపాగితే ఏడ్చేసిద్దేమో కనపడలేదని –  నేను పరిగెత్తి లోపలకి వెళ్ళాను.  నన్ను చూసి ఆ పిల్ల నోరు పెద్దది చేసి నవ్వింది – అప్పుడే వస్తున్న ఆమె పాల పళ్ళు రెండు తళతళగా మెరిశాయి.

రోజా ఇప్పుడు పిల్లలందరికీ పెద్ద హీరోయిన్ అయిపోయింది.  అంతా తమకే తెలుసన్నట్లు పిల్లలు ఆ పిల్లని చెట్టూ పుట్టా ఎక్కిస్తున్నారు.  ఎక్కడున్నా గడియారం గంటలు మోగితే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఆ పిల్ల.

మామగారికి ఆరోగ్యం బాగానే ఉండటంతో శ్రావణి వచ్చేసింది.

మళ్ళీ ఆ కిటికీ మూతపడింది.    రెండు మూడు సార్లు కిటికీని బాదింది రోజాపిల్ల నేనున్నప్పుడు.  ఇక నేను ఆఫీస్ కి వెళ్ళనప్పుడు ఎన్ని సార్లు బాదిందో మరి,  ఆ పిల్లని మా ఆవిడ తిట్టుకుంటూనే ఉంది.

ఈసారి ఎందుకో నాకు ఆ కిటికీ మూసేయడం గురించి అస్సలు ఇష్టంగా ఉండటం లేదు.  ఆఫీస్ నుండి రాగానే వచ్చి తెరవాలని ప్రయత్నించాను రెండు మూడు సార్లు.  తెరుస్తుంటేనే శ్రావణి పెద్దగా ‘వద్దు వద్దు’ అని అరుస్తుంది.  ఏమైనా అంటే అలగడం వాదనలు.   ఇంట్లో శాంతి ఉండదు.  నేను కిటికీ కోసం ఎందుకులే తగాదాలు అని ఊరుకుంటున్నాను.   జీవితాన్ని సంతోషంగా గడపాలని ఉంటుంది నాకు.   రోజూ సాయంకాలాలు పిల్లలతో బయటే కాసేపు ఆడుకుని అందర్నీ పలకరించుకుని వస్తున్నాను కాని ఆ కిటికీ వైపు చూస్తే అసంతృప్తి కలుగుతూనే ఉంది.

 

 

4.

 

రెండేళ్ళు గడిచినా మాకు పిల్లలు కలగలేదు.   ఇద్దరిలోనూ అనాసక్తి.  ఆరోజు సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి కృష్ణ ఇంటి ముందు పెద్ద గుంపు.  లోపల నుండి ఏడుపులు వినిపిస్తున్నాయి.  కృష్ణ అమ్మకి మూడోబిడ్డ ప్రసవం కోసం నిన్ననే హాస్పిటల్ లో చేర్పించారని తెలుసు.  ఏమయిందో ఏమో అనుకుంటూ వాళ్ళింటి లోపలకి పరిగెత్తాను.  ఆవిడా, పుట్టిన బిడ్దా ఇద్దరూ చనిపోయారు.

“ఇద్దరు బిడ్డలు చాలదా?  మూడో బిడ్డ ఎందుకు దేశానికి భారం తప్ప”  అన్న శ్రావణి మాటలు గుర్తొచ్చాయి.  ఆమె వచ్చిందేమోనని చూశాను.  బజారు బజారంతా అక్కడున్నారు కాని ఆమె మాత్రం లేదు.  ఈ దుఃఖం ఓ ప్రక్క నన్ను కృంగదీస్తుంటే ఇంత జరిగినా ఆమె రాలేదు అన్న ఆలోచనతో జీవితమంటేనే అసహ్యం వేసింది.

కాళ్ళీడ్చుకుంటూ  గేట్ తీసుకుని మా ఇంటి వైపు నడిచాను.  లోపల నుండి మాటలు వినపడుతున్నాయి.  ఎవరొచ్చారా అని ఆశ్చర్యపడుతూ తలుపు కొట్టాను.  రోజాని ఎత్తుకోని శ్రావణి తలుపు తీసింది.

నన్ను చూడగానే ఆ పిల్ల “గోవిందన్నా”  అంటూ నా మీదకి దూకింది.

పిల్ల ఆకలితో గుక్కపట్టి ఏడుస్తుంటే ఒక్కళ్ళు పట్టించుకోలేదండీ.  తీసుకోని వచ్చి స్నానం చేయించి అన్నం పెడితే గబగబా తినేసింది.  పాపం ఎంత ఆకలయిందో ఏమో!”  అంది దిగులుగా.  మానవత్వం లేదని ఆమెని అసహ్యించుకున్నందుకు బాధపడుతూ నా మీదకి దూకిన రోజాని ముద్దుపెట్టుకుని మా ఆవిడని కూడా దగ్గరకి తీసుకున్నాను.

రోజాని తీసుకోని నాడార్ గారి ఇంటికి వెళ్ళి కార్యక్రమాలన్నీ పూర్తయిందాకా అక్కడే ఉన్నాం.

రోజులు ఎవరి కోసమూ ఆగవన్నట్లు గడుస్తున్నాయి.   నాడార్ గారిని నేనే పెద్దవాడినై సముదాయించి ఆఫీసుకు తీసుకెళుతున్నాను.  కృష్ణని,  రోజాని వాళ్ళ పాటీ (నాయనమ్మ) నే చూసుకుంటుంది.   మా ఆవిడకి రోజా బాగా చేరికయింది.  ఈ పిల్ల అల్లరిని ఎంతైనా భరిస్తుంది కాని మిగతా పిల్లల్ని మాత్రం దగ్గరకి చేరనివ్వడం లేదు.  పిల్లలు మాత్రం పాపం రోజాని పిలవాలనో,  రోజా లోపల ఏం చేస్తుందో చూడాలనో వచ్చి కిటికీ తలుపుని,  ఒక్కోసారి తిరిగొచ్చి ఇంటి తలుపుని  కొడుతున్నారు.   వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఈమె వాళ్ళని ఇంట్లోకి చేర్చుకోలేదు.  కిటికీ తలుపు తియ్యనే లేదు.

ఆ వారం శనివారం నాడు రోజాకి జ్వరం వచ్చింది.  ఆదివారం శా్రవణి, కృష్ణ నాన్నమ్మ ఇద్దరూ హాస్పిటల్ కి తీసుకెళ్ళి పిల్లని చూపించుకొచ్చారు.   ఆ రాత్రి రోజా ఇంటికి వెళ్ళనని మారాం చేసి మా ఇంట్లోనే పడుకుంది.  సోమవారం సాయంత్రం నేను ఆఫీస్ నుండి ఇంటికెళ్ళేప్పటికి  పిల్ల స్పృహలో లేనట్లుగా ఒకటే కలవరిస్తోంది.  మా ఆవిడ,  మామి,  పాటీ, నాడార్ గారు, కృష్ణ మంచం చుట్టూ కూర్చుని ఉన్నారు.

ఆ రాత్రి పన్నెండు దాకా పిల్ల నుదురు మీద తడిబట్ట వేస్తూ ఒకరం,  అరికాళ్ళకి పసుపు రాస్తూ ఒకరం అందరం మేలుకునే ఉన్నాం.  మామీ అప్పటి దాకా ఉండి ఇంటికెళ్ళిపోయింది.  కృష్ణని తీసుకోని నాడార్ గారు కూడా వెళ్ళిపోయారు.  గోడకి చేరగిలబడి అలిసిపోయిన  పాటీ అక్కడే పడుకుంది.

పన్నెండవుతుండగా  “శ్రావొదినా”  అని అరిచింది రోజా.  శ్రావణి గభాల్న లేచి రోజా మీదకి వంగి “ఏంటమ్మా?  ఏం కావాలి?  తన్నీ వేణుమా?”  అని అడిగింది.

పాప కళ్ళు తెరిచి కిటికీ వైపు చూపిస్తూ “కిటికీ తియ్యవా?  ఫ్రెండ్స్ ని చూస్తాను”  అంది.  నేను ఆ పిల్ల చెయ్యి పట్టుకుని ఇప్పుడు చీకటిగా ఉందమ్మా,  రేపు తీస్తాను,  పొద్దున్నే అందరూ కనపడతారు”  అన్నాను.

“తీసి చూపించు చీకటిని”  అంది.

కిటికీ రెక్కలు తెరిచాను.  చల్లని గాలి లోపలకి తోసుకొచ్చింది.  పుచ్చపువ్వులా వెన్నెల కురుస్తోంది.  మామిడి చెట్లు  రెండూ మరింత పచ్చబడినట్లుగా కనిపిస్తున్నాయి.  రోజా కొంచెంగా నవ్వింది.  నేనూ నవ్వి “పడుకో”  అన్నాను.  కళ్ళు మూసుకుంది కాని ఏవేవో కలవరింతలు.  “గోవిందన్నా నన్ను చెట్టెక్కిస్తావా?  కి్రష్నన్నా నాకు మామిడి కాయలు కావాలి,  నేనేరుకుంటా,  నేనేరుకుంటా.  గోవిందన్నా,  శ్రావొదినకి పిల్లలంటే ఇష్టం లేదా?  కిటికీ ఎందుకు తెరవదు? మేమంటే అస్సలు ఇష్టం లేదా?  పాటీ చెప్పింది – మేము వేరే కులమని రానివ్వదంటగా!?   మా అమ్మేమో  ‘అన్ని కులాలూ ఒకటే’  అనీ, పాపం శ్రావొదినకి తెలియదనీ’ చెప్పింది,  కి్రష్నన్నని మామిడి కాయలు తెమ్మనవా గోవిందన్నా?” –  రోజా కలవరింతలకి శ్రావణి ముఖంలో నెత్తురు చుక్క లేదు.  దిగులుగా చూస్తున్న ఆమె చెయ్యిని నా చేతిలోకి తీసుకున్నాను.

ఏ తెల్లవారు ఝాముకో  ఆ పిల్ల గాఢంగా నిద్రపోయింది.

 

 

5.

 

తెల్లవారింది.  పాటీ లేచి “అబ్బాయిని తీసుకోని వస్తా”  అంటూ  ఇంటికి వెళ్ళింది.  మేము యాంత్రికంగా పనులు చేసుకున్నాం.  నాడార్ గారు  కృష్ణని తీసుకుని వచ్చారు.   “ఈరోజు మళ్ళీ హాస్పిటల్ కి తీసుకెళితే మంచిదా గోవింద్?”  అన్నాడు.

“ఈరోజు జ్వరం దిగిపోతుందిలే అన్నయ్య గారూ,  తగ్గకపోతే సాయంత్రం తీసుకెళతాం”  అంది శ్రావణి.

మా మాటలకి లేచిన రోజా వాళ్ళ నాన్నని ఎత్తుకోమని చేతులు చాపింది.  ఆయన పాపని ఎత్తుకున్నాడు.  “నాన్నా,  నాకు మామిడి కాయలు కావాలి,  కి్రష్నన్నని కోసుకురమ్మను”  అంటోంది కిటికీ వైపు చెయ్యి పెట్టి చూపిస్తూ.

“మామిడికాయలు ఇప్పుడుండవు”  అన్నాడు కృష్ణ.

“మామిడి కాయలు ఇప్పుడు ఉండవమ్మా” అన్నాడు వాళ్ళ నాన్న.

“ఆఁ ఉండవా?  నాకు కావాలి,  నాకు కావాలి”  అని పెద్దగా హిస్టీరియా వచ్చిన దాన్లా ఏడవడం మొదలుపెట్టింది.   వాళ్ళ నాన్న ఎంత నచ్చచెప్పినా వినకుండా అతని భుజం మీద నుండి జారి క్రిందపడి కాళ్ళూచేతులూ నేలకేసి కొడుతూ ఏడుస్తోంది.  ఆ ఏడుపు హృదయవిదారకంగా ఉంది.

నేను గభాల్న రోజాని ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టి “నాన్నకి తెలియదులేమ్మా…  ఎందుకుండవు?  ఉంటాయి,  కాని నీకు జ్వరం కదా?  నువ్వు తినకూడదు”  అన్నాను.

ఒక్కసారిగా ఏడుపాపేసి నన్నే చూస్తూ “పోన్లే తిననులే ఊరికే చూపించు.  పళ్ళు చూపించు గోవిందన్నా”  అంది.  ఇంకా వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి.  మంచినీళ్ళు తెమ్మన్నట్లుగా శ్రావణికి సైగచేసి “అవి నీ దగ్గరకి రాకూడదమ్మా ఆ వాసనకే జ్వరం ఎక్కువవుతుంది”  అన్నాను.

“అయితే దూరం నుండి చూపించు”  అంది.

“సరే,  చూపిస్తాలే,  చెట్టెక్కి కోసుకొచ్చి చూపిస్తా”  అన్నాను.

వెక్కిళ్ళు ఆపుకుంటూ “ఆరు కాయలు కోసుకురా గోవిందన్నా,  కి్రష్నన్నకి చెప్పు కోసిస్తాడు”  అంది.

“సరే సరే,  కాసిన్ని నీళ్ళు తాగు”  అని నీళ్ళు తాగించాను.  తాగేసి  పడుకుని నీరసంగా కిటికీ వైపే చూస్తోంది.    పిల్లకి పాలు తీసుకోనొస్తానని మా ఆవిడ లోపలకెళ్ళింది.

“క్రిష్నన్నా,  పో,  కాయలు కోసుకురా పో”  అని కృష్ణకి చెప్తోంది రోజా.  నేను, నాడార్ గారు ముఖముఖాలు చూసుకున్నాం.  ఏం చేయాలో మాకు అర్థం కాలేదు.  కృష్ణ బయటికి పరిగెత్తాడు.  పాలు తాగి కాస్త నిద్రపోతే మర్చిపోతుందిలెండి అన్నాను నేను గుసగుసగా ఆయనతో.   కాసేపు కూర్చుని “అమ్మని పంపిస్తా”  అంటూ ఆయన వెళ్ళిపోయారు.

రోజా పాలు తాగి నిద్రపోయింది.  కిటికీలో గుండా ఎండ రోజా ముఖం మీద పడుతోందని రెక్కలు దగ్గరగా వేశాను.

ఎనిమిదవుతుండగా పిల్లలు కిటికీ దగ్గర తచ్చట్లాడుతుంటే ఏమయిందో చూద్దామని బయటికి వెళ్ళాను.  పిల్లలందరూ గోడకానుకుని నిలబడి ఉన్నారు నిశ్శబ్దంగా.  కిటికీకి కింద నేలమీద  ఆరు మామిడికాయలు కనిపించాయి!  ఆశ్చర్యపడుతూ దగ్గరకి వెళ్ళి చూశాను.  మామిడికాయల్లాగా అట్టముక్కలని అతికించి రంగు వేసి తెచ్చారు.  కొన్ని పూర్తి పసుపు రంగుతో,  కొన్ని అక్కడక్కడా ఆకుపచ్చ రంగుతో!  అచ్చం మామిడికాయల్లాగే!!

“గోవిందన్నా!  వెళ్ళి చెల్లిని లేపి కూర్చోపెట్టు కిటికీలో గుండా వీటిని చూపిస్తాం”  అన్నాడు కృష్ణ.

నాకు కడుపులోంచి ఏమిటో ఇదీ అని చెప్పలేని ఓ ఉద్యేగం కదిలిపోతోంది.  మాట రాని మౌనంతో కళ్ళల్లో తడి వచ్చి చేరింది.   అలాగే నిశ్చేష్టుడినై నిలబడిపోయాను.

మనోజ్ఞ “ఫో, ఫో త్వరగా ఫో,  చూపించి మళ్ళీ బడికి పోవాల”  అంది నా చెయ్యి పట్టి గుంజుతూ.

తెప్పరిల్లి,  మనోజ్ఞని, కృష్ణని పొదువుకుని పిల్లలందరినీ రమ్మన్నట్లుగా చేతులు రెండూ పెద్దగా చాపాను.  అందర్నీ నా కౌగిలిలోకి చేర్చుకున్నాను.    కిటికీ దగ్గరకి వచ్చి రెక్కలు తీసి మా వైపు తొంగి చూస్తున్న శ్రావణి  కళ్ళ నిండా కన్నీళ్ళు.

 

 

6.

 

ఆ తర్వాత ఆ కిటికీ ఎప్పుడూ మూతపడలేదు.  రాత్రుళ్ళు కాదండీ…  పగలు!

*****

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

 1. గుడ్ స్టోరీ – ఓ హెన్రీ స్టోరీ లాస్ట్ లీఫ్ గుర్తుకొచ్చింది

 2. Manohar says:

  చాలా బాగుంది. పిల్లలు ఎంత కటినమైన హృదయాన్నైనా కరిగించగలరు. మంచి కథను అందించినందుకు కృతజ్ఞతలు.

 3. కథ చాలా ఆర్ద్రంగా ఉంది. బావుంది.

 4. BHUVANACHANDRA says:

  చాలా చాలా బాగుంది రాధ మండువ గారూ. నేను IAF లో వున్నప్పుడు తాంబరంలోనే ఉండేవాడిని. క్రిస్టియన్ కాలేజ్ కాంపౌండ్ కి ఆనుకునే మా ఏర్ ఫోర్సు స్టేషన్ వుండేది …ఆ రోజులనన్నింటినీ గుర్తుకు తెచ్చారు ….సో నైస్
  ధన్యవాదాలతో ……BC

 5. గోర్ల says:

  రాధా మండువ గారు.

  నమస్కారం.

  కథ చాలా బాగుంది. చిన్న పిల్లల మనస్తత్వాన్ని అద్భతంగా రాశారు. అంతే కాదు పిల్లలు ఏం కోరుకుంటారు. ఏం చేయాలని అనుకుంటారనే విషయాలు బాగా చెప్పారు. ఒక కిటీకి నుండి మనుషుల సంబంధాలను చూపించారు. అంతే కాదు శ్రావణి ఏ ప్రభావంతో పిల్లలను దగ్గరికి రానీయలేదో పసిపిల్ల పాత్ర ద్వారా చెప్పించారు. చివరికి శ్రావణీ కూడా కరిగిపోతుంది కదా. కాకపోతే ఈ తరం పిల్లలూ కులాన్ని మోయాల్సి వస్తున్నది. అట్లా అనే కంటే మోపిస్తున్నారు. అయితే శ్రావణి కళ్లల్లోనే కాదు కథ చదివిన తరువాత నాకూ అలాగే అన్పించింది. శ్రావణి గోవిందు దంపతులను, పిల్లలను అందర్నీ అడిగినట్లు చెప్పగలరు.

  ధన్యవాదాలు
  గోర్ల.

 6. కె.కె. రామయ్య says:

  “అలవాట్లలో, ఆచార వ్యవహారాల్లో తేడాలుంటాయేమో కాని సుఖదుఃఖాల భావనల్లో మనిషికీ మనిషికీ తేడా ఏమీ ఉండదని”
  ఇంటి కిటికీలు కానీ, హ్రదయం కవాటాలు కానీ తెరవటంలో పసిపిల్లలు మెరుగని ఓ మంచి కథ ద్వారా చెప్పిన రాధ మండువ మేడం గారి హ్రదయపూర్వక ధన్యవాదాలు. ( ఒరు అరిమియాన కథకై నండ్రిగళ్ ). ఇరుగుపొరుగు తమిళ కుటుంబాల మరిచిపోలేని ఆప్యాయతలను పొందే అదృష్టం నాకూ కలిగిందండి మద్రాసు నగరంలో.

 7. veerabhadrappa.choppa says:

  కథ బాగుంది మనస్తత్వ చిత్రణ పొందికగా అమరింది .

 8. రాధ says:

  Thank you so much!

 9. ఖైసర్ మహ్మద్ says:

  నిజంగా అధ్బుతం, నేను చెన్నైలో గడిచిన రోజులు మళ్లీ గుర్తుచ్చోయి.. ముఖ్యంగా ఆ పాప నిద్రలో కలవరించిన మాటల్లు కన్నీరు తెప్పించింది. మీకు ధన్యవాదాలు.

 10. కధని చాలా చక్కగా నెరేట్ చేసారు..అభినందనలు..

మీ మాటలు

*