గ్రంథాలయాల గతి చూడండి!

 

 

-కె. శ్రీనివాస్‌

~

(ఇది “ఆంధ్ర జ్యోతి” దిన పత్రికలో అచ్చయిన వ్యాసం. ప్రస్తుత పరిస్థితులలో ఈ  విషయం మీద చర్చ జరగాల్సిన అవసరం ఉందంటూ చాలా మంది  చదువరులు కోరడం వల్ల ఈ వ్యాసాన్ని పునర్ముద్రిస్తున్నాం. ఈ  వ్యాసం మీద చర్చని ఆహ్వానిస్తున్నాం. ఈ వ్యాసం పునర్ముద్రణకి అనుమతించిన కె. శ్రీనివాస్ కి కృతజ్ఞతలు)

~

నాలెడ్జ్‌ సొసైటీ అన్న మాట ఓ రెండు దశాబ్దాల క్రితం నుంచి బాగా ప్రచారంలోకి వచ్చింది. ఏ శామ్‌ పిట్రోడా లాంటివారో మన దేశంలో ఈ సమాస పదాన్ని ప్రవేశపెట్టి ఉండాలి. ఐటి రంగాన్ని తెలుగు వారిలో వ్యాప్తిచేయడానికి తానే కీలకదోహదం చేశానని భావించే చంద్రబాబు నాయుడు కూడా మొదటి హయాం తొమ్మిదేళ్ల కాలంలో ఈ మాటను విరివిగా వాడేవారు. సమాచార సాంకేతిక రంగాల్లో తెలుగువారు విస్తృతంగా పనిచేయడం, దాని కారణంగా కొన్ని శ్రేణుల వ్యక్తుల ఆదాయాల్లోనూ, కొన్ని స్థలాల్లోనూ వృద్ధి కనిపిం చడంవల్ల, అదే క్రమాన్ని మరింతగా ముందుకు తీసుకు వెళ్లడమే జ్ఞానసమాజాన్ని ఆవిష్కరించడం అన్న అభిప్రాయం ఏర్పడింది.

నిర్వచనం ప్రకారం జ్ఞానసమాజం అంటే, తాను ఉత్పత్తి చేసే జ్ఞానాన్ని అందరూ పంచుకుని, అందరికి అందుబాటులో ఉంచుతూ, మానవ పరిస్థితులను మెరుగు పరచడానికి వీలుగా దానిని వినియోగించే సమాజం. మానవసమాజాలు పూర్వ కాలం నుంచి జ్ఞానాన్ని సమకూర్చుకుంటూ, ఏదో ఒకరీతిలో కొందరిమధ్య అయినా పంచుకుంటూ, ముందుకు వెడుతున్నాయి. కొత్తగా ఈ మధ్య ఈ పద ప్రయోగం ప్రాచుర్యంలోకి రావడానికి నేపథ్యం సమాచారసాంకేతికశాస్త్రం అవతరణే. ఈ పరి ణామం కారణంగా, సమాచారం క్రోడీకరణకు, విశ్లేషణకు, వినిమయానికి అనేక కొత్త వేగవంతమయిన అవకాశాలు ఏర్పడ్డాయి. కేవలం సమాచారమే ఉత్పత్తి అవు తుంటే, అది జ్ఞానం కాదు. సమాచారం జ్ఞానంగా పరివర్తనం చెందడంలో మానవ వివేచన, మానవీయశాస్త్రాలు అందించిన పరికరాలు చాలా అవసరం. అదే విధంగా, సమాచారం అంటే కేవలం వర్తమాన సమాజాల అవసరాలకు సంబంధించినది మాత్రమే కాదు, చారిత్రక సమాచారం, భవిష్యత అంచనాలూ ఆకాంక్షలూ కూడా. సమాచార సాంకేతికత మానవుల యాంత్రికమైన చాకిరీని తప్పించగలగడమే కాక, అతి తక్కువ స్థలాన్ని, కాలాన్ని డిమాండ్‌ చేస్తుంది. ఈ వెసులుబాటు కారణంగా, మానవ వివేచన, అవగాహన, శాసీ్త్రయదృష్టి మరింతగా ఉన్నతస్థాయిలో వినియో గించుకోగలుగుతాము. ఒకవైపు జ్ఞానసమాజాన్ని ఫ్యాషనబుల్‌గా కోరుకుంటూనే, మరోవైపు మానవీయశాస్త్రాల అధ్యయనం అనవసరమని భావించడం హ్రస్వదృష్టినే సూచిస్తుంది. అట్లాగే, ఐటీ కంపెనీలతో ఎంవోయూలు చేసుకుని, నూతన ఆవిష్కరణలకు ఆరంభసదుపాయాలూ హబ్బులూ నెలకొల్పడం వల్ల బంగారు సమాజం ఏర్పడుతుందనుకోవడం అమాయకత్వం అవుతుంది.

విద్యారంగంలో వచ్చిన మార్పులను, ప్రపంచమార్కెట్‌కు అవసరమైన శ్రమశక్తిని ఎగుమతిచేయడానికి మాత్రమే వినియోగించుకుంటే సమాజాలు తాత్కాలికంగా లబ్ధి పొందవచ్చును కానీ, దీర్ఘకాలికంగా అజ్ఞానసమాజాలుగా మారతాయి. గత పాతికేళ్లుగా మన దేశం నుంచి అత్యంత ప్రతిభావంతులైన వృత్తినిపుణులను, సాంకేతిక ప్రజ్ఞావంతులను ఉత్పత్తి చేయగలిగాము. విద్యార్జన వయస్సులో ఉన్న పిల్లలలో చదువుమీద తీవ్రమయిన అభినివేశం, కష్టపడే తత్వం చూస్తున్నాము. అనేక దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి కుటుంబాలు అనూహ్యమైన రీతిలో తమ ఆదాయాలను పెంచుకున్నాయి. మరోవైపు, ఆ విజయాలకు తగిన నిష్పత్తిలో మేధో వికసనం, సాంస్కృతిక అభిరుచులు, జీవితనైపుణ్యాలు అభివృద్ధి చెందకపోవడం కూడా గమనిస్తున్నాము. మాతృభాష మీద ఆదరణ తగ్గిపోతున్నది. పాఠశాల స్థాయి నుంచే క్రీడలకు, కళలకు, సాహిత్యపఠనానికి విద్యార్థులు దూరమవు తున్నారు. మార్కులు, ర్యాంకుల వేటలో, చదువు తప్ప మరి దేనికీ సమయం, ప్రోత్సాహం లేకుండా పోతున్నది. పోటీపరీక్షలకోసం తప్ప, వర్తమాన రాజకీయ, సామాజిక పరిణామాల గురించి చదవడమే గగనమై పోతున్నది. ఇందుకు తగ్గట్టుగా, ప్రభుత్వ విద్యాసంస్థలు సదుపాయాల్లోనూ ప్రమాణాల్లోనూ వెనుకబడి పోతున్నాయి. జీవనకళలను పోషించే వ్యవస్థలన్నీ ఆదరణ లేక కునారిల్లుతున్నాయి. పబ్లిక్‌ లైబ్రరీలు అటువంటి బాధిత సంస్థల్లో ముఖ్యమైనవి.

తెలుగు రాషా్ట్రలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ- ఈ రెండింటి చరిత్రలోనూ గ్రంథా లయాల పాత్ర అమోఘమైనది. నైజాం పాలనలో ఉన్న తెలంగాణ తనను తాను తెలుసుకుని ఎలుగెత్తడానికి చాలా కాలం పట్టింది కానీ, ఆ ప్రయాణంలో తొలి అడుగు శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషానిలయం (1901) స్థాపనతోనే జరిగింది. రాయల సీమలో 1870లలోనే ఒక బుక్‌క్లబ్‌ ఏర్పడి, మరోదశాబ్దానికి నాలుగైదు చోట్ల గ్రంథాలయాలు వెలిశాయి. రావిచెట్టు రంగారావు, మాడపాటి హనుమంతరావు మొదలయినవారు తెలంగాణలో గ్రంథాలయాల స్థాపనకు ఆద్యులయితే, అయ్యంకి వెంకటరమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు వంటివారు ఆంధ్రలో ఉద్యమ నేతలు. వీరంతా తెలుగుసమాజాల వికాసానికి బహుముఖమైన కృషి చేశారు. రాజమండ్రి గౌతమీ గ్రంథాలయం, వేటపాలెం సారస్వతనికేతనం, విజయవాడ రామమోహన గ్రంథాలయం- బ్రిటిషాంధ్ర జనజీవనంలో అవిభాజ్య అంగాలు. పాఠ శాలలో చదువుతో పాటు, ఇతరుల జీవితానుభవాన్ని, సృజనను చదవడం కూడా నాటి వికాసయుగానికి అవసరమయింది. గ్రంథాలయం కేవలం చదువరుల వసతి మాత్రమే కాదు. చైతన్యవంతుల కూడలి. సమావేశ స్థలి. తెలంగాణలో అయితే, అది భూస్వాముల గడీకి ప్రజా ప్రత్యామ్నాయం.

సమాజానికి అవసరమైన మేధాశక్తిని, వివేచనను అందించే మౌలికవసతి అయిన గ్రంథాలయం, స్వాతంత్ర్యానంతరం కొన్ని దశాబ్దాలపాటు సగౌరవంగానే జీవించింది కానీ, ఇప్పుడు దాపురించిన పాడుకాలంలో అది శిథిలమవుతున్నది. ఆర్జించలేని ఏ సంస్థ అయినా పనికిమాలినదనే దృష్టి పెరిగిపోయింది. సంపన్న దేశాలలోని ఆకాశహర్మ్యాలను చూసి అదే అభివృద్ధి అనుకుని అనుకరిస్తూ, ఆ దేశాలలోని ఇతర విలువలను ఖాతరు చేయకపోవడం కూడా మన పాలకులకే చెల్లింది. అభివృద్ధి ‘కాముకుల’ందరికీ ఆరాధ్య దేశమైన అమెరికాలో లక్షా ఇరవైవేల పబ్లిక్‌ లైబ్రరీలున్నాయి. అక్కడ జనాభా మన దేశంలో మూడోవంతు కన్నా తక్కువ, 32 కోట్లు. 2015 సంవత్సరంలో ఆ దేశంలోని లైబ్రరీలలో నమోదైన వ్యక్తిగత సందర్శనల సంఖ్య 150 కోట్లు. లైబ్రరీలలో జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరయిన వారి సంఖ్య 10 కోట్లు. ఏటా అక్కడ 1150 కోట్ల డాలర్ల ప్రజాధనం లైబ్రరీల మీద ఖర్చు పెడతారు. భారతదేశంలో జనాభా 120 కోట్లు అయితే, పబ్లిక్‌ లైబ్రరీల సంఖ్య 55వేలు. ఇక రెండు తెలుగు రాషా్ట్రలూ ఎంతో పరవశించిపోయే ధనికదేశం సింగపూర్‌. ఆ చిన్నదేశంలో 26 పబ్లిక్‌ లైబ్రరీలు, నాలుగైదు జాతీయస్థాయి లైబ్ర రీలుఉన్నాయి. అక్కడ జనాభా 56 లక్షలు. అక్కడి జాతీయ లైబ్రరీ బోర్డు (ఎన్‌ఎల్‌బి)కు ఏటా 38 కోట్ల సింగపూర్‌ డాలర్ల (సుమారు 1900 కోట్ల రూపాయలు) బడ్జెట్‌. 3 కోట్ల ఆదాయం. తక్కినదంతా గ్రాంట్ల రూపంలో వస్తుంది. అక్కడ పఠనాభిరుచి క్రమక్రమంగా పెరుగుతోంది. 7-12 సంవత్సరాల మధ్య వయస్కులు నూటికి 91 మంది లైబ్రరీలు సందర్శిస్తున్నారు. ఈ సంవత్సరం ఆ దేశం పఠనోద్యమాన్ని ప్రారంభించింది. ‘ఎక్కువ చదవండి, విస్తృతంగా చదవండి, కలసి చదవండి’ అన్న నినాదంతో పాఠకుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నది.

మరి మన తెలుగు రాషా్ట్రలలో పరిస్థితి ఎట్లా ఉన్నది? తెలంగాణలో సుమారు 1225 గ్రంథాలయాలున్నాయి. ఇందులో ఐదువందల దాకా బుక్‌ డిపాజిట్‌ సెంటర్లు (ఇతరులు ఏర్పరచి, నిర్వహించి, తరువాత ప్రభుత్వానికి బదిలీ అయినవి), 562 బ్రాంచి లైబ్రరీలు, 165 గ్రామీణ లైబ్రరీలు. ఇవి కాక రెండు ప్రాంతీయ లైబ్రరీలు (నిజామాబాద్‌, వరంగల్‌) ఉన్నాయి. ఈ అన్నిటికీ కలిపి కేవలం 466 మంది గ్రంథపాలకులున్నారు. ఒక్కొక్కరు రెండు మూడు లైబ్రరీల బాధ్యత నిర్వహిస్తున్న పరిస్థితి. 1987 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క లైబ్రరీ కూడా కొత్తది స్థాపించ లేదు. 1993 నుంచి గ్రంథాలయాల్లో ఒక్క కొత్త నియామకమూ జరగలేదు. ఆంధ్ర ప్రదేశ్‌లో పరిస్థితి కొంచెం మెరుగు కానీ, మొత్తం మీద పెద్ద తేడా లేదు. 624 బ్రాంచి లైబ్రరీలు, 249 గ్రామీణ లైబ్రరీలు, 600 బుక్‌డిపాజిట్‌ కేంద్రాలున్నాయి. 562 మంది ఉద్యోగులున్నారు. ప్రభుత్వాలు కొత్త పుస్తకాలు కొని ఎన్ని సంవత్సరాలైందో లెక్కలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక వట్టికోట ఆళ్వారుస్వామి పేరు పెట్టిన హైదరాబాద్‌ నగరకేంద్ర గ్రంథాలయంలో మంచినీళ్లు లేవు, మూత్రశాల ఉండదు. ఏటా జాతీయస్థాయి రామమోహన గ్రంథాలయ సంస్థ తానే కొన్ని పుస్తకాలను కొని అన్ని లైబ్రరీలకు పంచిపెట్టేది. రాష్ట్రవిభజన కారణంగా, ఉమ్మడి జాబితాలో ఉన్న గ్రంథాలయసంస్థ మూడు సంవత్సరాల నుంచి రామమోహన లైబ్రరీకి ప్రతిపాదనలే పంపలేదు. పుస్తకాలు ఇస్తామన్నా, తీసుకునే గతి లేదు. వంద సంవత్సరాలు పైబడిన గ్రంథాలయాలకు జాతీయసంస్థ నుంచి పదికోట్ల దాకా నిర్వహణా గ్రాంటువస్తుంది. శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషానిలయం, రాజరాజనరేంద్రాంధ్రభాషా నిలయం- ఈ రెండూ ఆ గ్రాంటుకు అర్హమైనవే అయినా, ప్రతిపాదనలు పంపే ప్రభుత్వాధికారిలేడు.

పుస్తకం పాతబడిపోయింది, డిజిటల్‌ యుగం వచ్చింది- అంటూ గ్రంథాలయా లను ఆధునీకరించడమే తక్షణ కర్తవ్యం అన్న వాదనా వినిపిస్తోంది. డిజిటల్‌ పరి ణామాలు నిజమే. కానీ, భౌతికమయిన పుస్తకానికి కాలం చెల్లలేదు. అమెరికాలోనూ, సింగపూర్‌లోనూ భౌతిక గ్రంథాలయాలతో పాటు అనుబంధంగా ఆధునిక విభాగాలూ అభివృద్ధి చెందుతున్నాయి. అక్కడ డిజిటల్‌ పఠనవనరులు పెరుగు తున్నాయి. కానీ, మన దేశంలో ఇంకో నూరు సంవత్సరాల వరకు ముద్రిత అక్షరా నికి, భౌతిక పుస్తకానికి అవసరం ఉంటుంది. లైబ్రరీలను ఆధునీకరించవలసిన అవసరమూ ఉన్నది. లైబ్రరీ వ్యవస్థను, ఆర్కైవ్స్‌ వ్యవస్థను సంధానం చేయవలసి ఉన్నది. ప్రభుత్వ విభాగాలలో ఉండవలసిన ఇన్‌ఫర్మేషన్‌ అధికారులు ఎప్పటి కప్పుడు వర్తమాన గణాంక సమాచారాన్ని క్రోడీకరించి డిజిటల్‌ సామగ్రి కింద ప్రజలకు అందుబాటులోకి తేవలసి ఉన్నది. పాఠకుల కోసం కంప్యూటర్లు, దృశ్య, శ్రవణ సమాచారం, సంపుటులు, ఈ బుక్స్‌, జర్నల్స్‌, చలనచిత్రాలు, డాక్యు మెంటరీలు- ఇవన్నీ లైబ్రరీలలో కొత్త విభాగాలుగా రావడం నేటి అవసరం. అన్నిటికి మించి, గ్రంథాలయాల్లో నూతన నియామకాలు చేయడం, కనీస వసతులు కల్పిం చడం అవసరం. అలక్ష్యం బారిన పడి శిథిలమవుతున్న చారిత్రక పత్రాలను, పుస్త కాలను కాపాడుకోవలసిన అవసరం ఉన్నది.

రెండు రాషా్ట్రల ముఖ్యమంత్రులూ పోస్టుగ్రాడ్యుయేట్‌ విద్యావంతులే. నీళ్లు విద్యుత ఎంత అవసరమో విజ్ఞానం కూడా అంత అవసరమని తెలుసుకోగలిగిన వాళ్లే. గ్రంథాలయాల విషయంలో కూడా తెలుగు రాషా్ట్రలను సింగపూర్‌ చేయమని వారిని కోరడం దురాశ అవుతుందా?

*

 

మీ మాటలు

 1. Buchireddy gangula says:

  అసలు పాలన భాష. తెలుగు కానప్పుడు ???
  దేవాలయాలకు. కోట్లు మంజూరు—పుష్కారాలకు కోట్లుఖర్చు—-
  అన్ని చెప్పడం వరకే– నీతులు–?? చేతల్లో. జీరో
  రాజుల పాలన—???
  ———————————————-బాగుంది. శ్రీనివాస్ గారు
  Buchi రెడ్డి గంగుల

 2. కె.కె. రామయ్య says:

  సమాజానికి అవసరమైన మేధాశక్తిని, వివేచనను అందించే మౌలిక వసతి అయిన గ్రంథాలయాలను ఆధునీకరించి అభివృద్ధి చేసి, ఆర్కైవ్స్‌ వ్యవస్థతో అనుసంధానం చెయ్యాల్సిన గురుతర బాధ్యతను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలేనే కాకుండా కార్పొరేట్ రంగం, మీడియా మొఘల్ ల సాయంతో కూడా ఆశించవచ్చా. ఎప్పటిలాగే అద్భుతహా మీ వ్యాసం ఆంధ్రజ్యోతి కె. శ్రీనివాస్ గారు.

  ” గత పాతికేళ్లుగా మన దేశం నుంచి అత్యంత ప్రతిభావంతులైన వృత్తినిపుణులను, సాంకేతిక ప్రజ్ఞావంతులను ఉత్పత్తి చేయగలిగాము. కానీ ఆ విజయాలకు తగిన నిష్పత్తిలో మేధో వికాసం, సాంస్కృతిక అభిరుచులు, జీవితనైపుణ్యాలు అభివృద్ధి చెందకపోవడం కూడా గమనిస్తున్నాము. మాతృభాష మీద ఆదరణ తగ్గిపోతున్నది.” ~ ఇది ఎంతో బాధాకరమైన వాస్తవం. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రజలు, ప్రభుత్వాల మీద ఉన్నది.

  అమెరికాలో 1150 కోట్ల డాలర్ల ప్రజాధనం లైబ్రరీల మీద ఖర్చు పెడతారు. సింగపూర్‌ జాతీయ లైబ్రరీ బోర్డు వార్షిక బడ్జెట్‌ సుమారు 1900 కోట్ల రూపాయలు. మరి జీవనకళలను పోషించే వ్యవస్థలైన మన ప్రభుత్వ విద్యాసంస్థలు, పబ్లిక్‌ లైబ్రరీలు, ఆదరణ లేక కునారిల్లుతుంటే వీటి పట్ల ప్రభుత్వం శ్రద్ద తీసుకోవాలి.

 3. డా.సుమన్ లత రుద్రావఝల says:

  గ్రంథాలయాల దీనావస్థ కళ్ళముందు చూసిన -చూస్తున్న వాళ్ళందరి మనోభావాలకు ,వ్యథకు మీవ్యాసం అద్దం పట్టింది .64 ఏళ్ల దానిని నేను .చిన్నప్పటినుండీ పుస్తకాలు చదువుతూ ,జీవితానికి అన్వయించు కుంటూ పెరిగిన తరానికి చెందిన దానిని .నాకు చదువు కుందికి ఉపయోగ పడిన గ్రంథాలయాల దుస్థితి ఈనాడు చూస్తూ ఉంటే నాకు ఒక రకమయిన —డయాస్పోరా భావం కలుగుతుంది .బహుశా చాలామందికి కలగొచ్చు కూడా !ఇప్పుడు మనం మంచి పుస్తకాలు ఇస్తామంటే అధికారులు పెద్దగా ఇష్టపడటం లేదు.నేను క్యుపర్టినో వెళ్లి నప్పుడు అక్కడి గ్రంథాలయం లో ఎక్కువ రోజులు కూర్చుని ఆనందించేను .
  మాపిల్లల్ని శలవు లలో చిక్కడపల్లి తీసుకు పోయి రోజంతా చదువు కుని,లావు పుస్తకాలను తెచ్చుకుని గడిపేసిన రోజులు వాళ్ళుకూడా చాలా ఇష్టంగా తలుచుకుంటారు .ఇప్పుడు పాతికేళ్ళ కిందటి పుస్తకాలే లేవు ,ఇక ప్రాచీన గ్రంథాల సంగతి అడిగితె అర్థం చేసుకునే స్టాఫ్ ………….ఎందుకులెండి !డిజిటల్ అంటున్నారు గాని వివరాలు వాళ్ళకీ తెలియవని బాగా మనకు తెలుస్తుంది .గ్రాంట్ ఇస్తామంటే తెచ్చుకోవటానికి ఆలసత్వం ;దానిని కప్పుకుందికిఎన్నో సాకులు ……ఇలాటి వ్యాసాలు వస్తే నయినా యంత్రాంగం మేలుకుంటుం దేమోనని ఆశ తో ——-డా. సుమన్ లత రుద్రావఝల

 4. shashidhar says:

  ప్రభుత్వ అజెండా లో గ్రంధాలయాలు లేవు.. ఏదో మొక్కుబడి వ్యవహారం లాగా కొన్ని నిధులను కేటాయిస్తున్నారు… అసలు గ్రంధాలయాలు ఎక్కడ వున్నాయి వాటి పరిస్థితులు ఏమిటో వ్యవస్థలో ఎవరికైనా అవగాహన ఉందా అన్నది అనుమానమే..

మీ మాటలు

*