గోదావరి మళ్ళీ లేటు

చిత్రం: రాజశేఖర్

చిత్రం: రాజశేఖర్

 

-ఆర్. శర్మ దంతుర్తి

~

విశాఖపట్నం రైల్వే స్టేషను. సాయింత్రం ఐదింటికి ఇంకో అరగంటలో బయల్దేరబోయే గోదావరి ఎక్స్ ప్రెస్ ని సాగనింపడానికి సిద్ధమౌతోంది. ప్లాట్ ఫాం ని ఆనుకుని ఉన్న తూర్పు రైల్వే విద్యుత్ ఇంజినీరు వారి కార్యాలయం పక్కనే ఎస్ సిక్స్ కోచ్ ఆగి ఉంది. కోచ్ దగ్గిర నిల్చున్న కుర్రాళ్ళు గోల గోలగా కబుర్లు చెప్పుకుంటూంటే లోపల కూచున్న అమ్మాయిలు వాళ్ళ గోలలో వాళ్ళున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ కుర్రాళ్ళు వేసుకున్న ఇండస్ట్రియల్ టూర్ కి ఎస్ సిక్స్ అంతా నిండిపోయి ఉంది. ఇద్దరు ముగ్గురు కుర్ర లెక్చరర్లు కూడా వస్తూండడంతో కుర్రాళ్ళకి అమ్మాయిల్తో మాట్లాడ్డానికి అంత వెసులుబాటు లేదు. బయటనుంచుని దొంగచూపులు చూడ్డమే.

కుర్ర ఇంజినీర్లకి చూపించడానికి ఇండస్ట్రియల్ టూర్ లో భాగంగా హైద్రాబాదులో మహీంద్రా వారి ఫేక్టరీ, రిఫ్రిజిరేటర్లు చేసే మరో కంపెనీ, పటాన్ చెర్వులో ఉన్న ఒక కెమికల్ కంపెనీ చూసుకుని మర్నాడు సాఫ్ట్ వేర్ కంపెనీ లన్నీ ఓ చుట్టు చుట్టాలి. ఇదీ ప్లాను. హోటళ్ళూ అవీ ముందే ఆన్ లైన్లో బుక్ చేసుకోవడం అయిపోయింది. ఇంటర్నెట్టా, మజాకా? ఇంకా ఫోన్లు వాడేది ఎవడు? గూగిలమ్మని అడిగితే క్షణంలో పదోవంతు చాలు ఎక్కడ హొటల్లో ఖాళీ ఉందో తెలుసుకోడానికి.  అయినా కుర్రాళ్ళు అమ్మా నాన్నలు లేకుండా బతగ్గలరు కానీ ఫోనూ, లేప్ టాపూ లేకుండా బతగ్గలరా? అందులోనూ లేప్ టాప్ చేత్తో పట్టుకుని ట్రైన్ ఎక్కితే పక్కనున్న జనాలు, రైతు బిడ్డలూ డంగై పోరూ? పని ఉన్నా లేకపోయినా ట్రైన్ బయల్దేరగానే ఓ సారి లేప్ టాప్ బయటకి తీస్తే చుట్టూ ఉన్న జనాలు కళ్ళు విప్పార్చి చూడరూ? ముక్కూ మొహం తెలియని వాళ్ళు లేప్ టాప్ కేసి అలా చూస్తే ఒరిగేదేమిటని అడుగుతారేం? అందరి ముందూ ఎంత గొప్ప! మొన్న మొన్నటి దాకా ఇంజినీరింగ్ లో అప్లైడ్ మెకానిక్స్ లోనూ, థర్మో డైనమిక్స్ లోనూ డింకీ కొడితే మాత్రం ఇప్పుడు కుర్రాళ్లందరికీ విజువల్ బేసిక్కూ, జావా వచ్చును కదా? అవి చాలవూ లక్షలు తెచ్చే ఉజ్జోగాలు రావడానికి? పోదురూ మీ బడాయి, ఏదో ఈ ఇంజినీరింగ్ డిగ్రీ అంటారు కానీ ఈ అప్లైడ్ మెకానిక్సూ, లాప్లాసు రూల్సూ, ఫోరీయర్ ట్రాన్స్ ఫార్మూ, కార్నో సైకిలూ తిండిపెట్టేవేనా? వాళ్ళు పాఠాలు చెప్పాలి కనక అలా చెప్తారు, మనకి కావాల్సింది కంప్యూటర్ ప్రోగ్రామింగు. ఎలెక్ట్రికల్ ఇంజినీరింగూ, వాళ్ళు చెప్పే ఆ ఇన్వర్టర్లూ, కన్వర్టర్లూ చదువుతూ కూచుంటే ఉజ్జోగాలు చేసినట్టే.

బయటనుంచున్న కుర్రాళ్ళలో ఒకడన్నాడు గట్టిగా “ఒరేయ్ అందరూ ఫోన్లూ, లేప్ టాప్ లూ తెచ్చుకున్నారా? వాటికి ఛార్జర్లు లేకపోతే మనం ఎందుకూ పనికిరాం మరి.”

పక్కనున్న లక్ష్మీ పుత్రొడొకడు సమాధానం చెప్పేడు, “ఓరి నాయనో చిన్న వైరు ముక్కలకే ఇంత రాద్ధాంతం ఎందుకురా? అవి తెచ్చుకోకపోతే హైద్రాబాదులో ఏ కొట్లో అయినా కొనుక్కోవచ్చు. యాభై రూపాయలు పారేస్తే చవకబారు ఛార్జరు దొరకదూ? నేను ఈ మధ్యనే రెండు మూడు కొన్నాను ఇంట్లో రూముకొకటి ఉంచుకోవడానికి. మన వాడకానికి అవి చాలవూ? పుట్టె మునిగిపోయిందేమీ లేదు.” నవ్వులు సాగాయి. కోచ్ లో కూర్చున్న అమ్మాయిలు కూడా నవ్వు కలిపేసరికి లక్ష్మీ పుత్రుడి ఛాతీ నాలుగంగుళాలు పెరిగింది.

“ఉన్న డబ్బై బెర్తుల్లో దాదాపు అందరం ఫోన్లూ, లేప్ టాపులు తెచ్చేసుకున్నట్టేనన్నమాట.”

“ఒరేయ్ నాయనా గట్టిగా అనకు. మన ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గారు వింటే వీటన్నింటికీ ఎంత పవర్ అవుతుంది ఎన్ని ఏంపియర్లు ఖర్చౌతాయ్ అన్నీ చెప్పమని క్లాసు పీకుతాడు. అసలే మనం వెళ్ళేది జాలీ ట్రిప్పుకి”.

మళ్ళీ నవ్వులు.

ఈ కబుర్లన్నీ దూరంగా నుంచుని వింటూ వీళ్ళనే గమనిస్తున్న రైల్వే లైన్ మేన్ అప్పన్న లోపలకి పరుగెత్తుకుని వెళ్ళి ఏదో చెప్పాడు.  అక్కడే ఉన్న రామారావు క్షణంలో పదోవంతు ఆలోచించి లేచి నిల్చుని ఎదురుగా ఉన్న ఇంజినీర్ తో చెప్పాడు. “బండి కాసేపు ఆలస్యం చేయమని స్టేషన్ మాస్టర్ కి ఫోన్ చేసి చెప్పండి. నేను వెళ్ళి బండి విజయవాడ చేరేలోపుల వీళ్ల సంగతి చూస్తా,” అంటూ ఆఫీసు లోపల ఉన్న బాత్రూంలోకి దూరేడు బట్టలు మార్చుకోవడానికి, సమాధానం కోసం చూడకుండా.

టేబిల్ దగ్గిరున్న ఇంజినీరు “సరేనండి,” అంటూ కంగారుగా స్టేషన్ మేస్టర్ కి ఫోన్ చేసి చెప్పాడు. వెంఠనే ఒక ప్రకటన వెలువడింది ప్లాట్ ఫాం మీద. “దయచేసి వినండి. ఈ రోజు సాయింత్రం 5:30 కి బయల్దేరవల్సిన హైదరాబాదు వెళ్ళే గోదావరి ఎక్స్ ప్రెస్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొన్ని నిముషాలు ఆలస్యం అవుతోంది.” మళ్ళీ అదే ప్రకటన ఇంగ్లీషులోనూ, హిందీలోనూ చెప్పబడింది యధావిధిగా.

Kadha-Saranga-2-300x268

బాత్రూంలోంచి బయటకొచ్చిన రామారావు చెప్పేడు లైన్ మేన్ అప్పన్నతో “రావోయ్, వీళ్ళ సంగతి చూద్దాం. మళ్ళీ నాతోబాటు పొద్దున్నలోపులే వెనక్కి వచ్చేయవచ్చు,” స్టేషన్ ఎలెక్ట్రికల్ ఇంజినీర్, అప్పన్నల మొహాలలో కనబడే ఆశ్చర్యం పట్టించుకోకుండా బయటకి నడిచేడు కోచ్ ఎస్ సిక్స్ వేపు రామారావు.

రామారావు రైల్వే కూలీ అవతారం చూసి స్టేషన్ ఇంజినీర్ నోరు వెళ్ళబట్టి అసంకల్పితంగా సరే అన్నాక, ఆఫీసులోంచి రామారావు బయటకి రావడం, లైన్ మేన్ అప్పన్న తో బాటు ఇంజినీరింగ్ కాలేజీ కుర్రాళ్ళ కోచ్ కేసి కదలడం చూసాడు.

అప్పన్నా, రామారావు కోచ్ లోకి ఎక్కబోతూంటే ఒకరిద్దరు కుర్రాళ్లు వారించేరు – “ఇది మేం రిజర్వ్ చేసుకున్న కోచ్. ఇందులో ఎక్కడానికి లేదు.”

“బాబు, ఇక్కడకేనండి. రాజమండ్రీ రాగానే దిగిపోతాం” అప్పన్నా, రామారావు బతిమాలుతున్నట్టూ అడిగేరు.

ఓ కుర్రాడు, “పోనియ్ గురూ” అనడంతో ఏ కళనున్నారో, వద్దనలేకపోయేసరికి ఎస్ సిక్స్ లోపలకి దూరిపోయేడు రామారావు అప్పన్నతో.

మరో పది నిముషాలకి, గంట లేటుగా – ఇటువంటి ఆలశ్యాలు సర్వసాధారణం అన్నట్టూ గోదావరి నత్తలాగా కదిలింది ముందుకి.

 

*****

 

బండి ఇంకా దువ్వాడ చేరకుండానే కుర్రాళ్ళందరూ ఏదో కొంపలు మునిగిపోతున్నట్టూ లేప్ టాపులూ, ఫోన్లూ బయటకి తీసి ఛార్జ్ చేయడం కోసం కోచ్ లో ఉన్న ఎలెక్ట్రికల్ సాకెట్లకి కనెక్షన్లు పెట్టేసి కీ బోర్డులు టకటకలాడించడం మొదలుపెట్టేరు. ఇదంతా చూస్తున్న రామారావుకి ఒళ్ళు మండింది. ఓ కుర్రాడి పక్కనే కూర్చుని అప్పన్న చూస్తూండగా మాటలు కలిపేడు, “ఎక్కడెకెళ్తన్నారు బావూ?”

సీరియస్ గా ఏదో టైప్ చేస్తున్న కుర్రాడు తలెత్తి చూసాడు – నోట్లోంచి తాయిలం ఎవరో లాగేసుకున్నట్టు మొహం పెట్టి స్టైలుగా చెప్పేడు, “హైద్రాబాద్”

“ఏం చదూకుంటన్నారు బాబు?”

“ఇంజినీరింగు.”

“అబ్బో, కరెంటు వింజినీర్లాండి? లేకపోతే బిడ్జీలు కట్టేవోరా?”

“అవన్నీ పనికొచ్చేవి కాదోయ్, మేం ఏం చదివినా చేసేదొక్కటే ఉజ్జోగం – కంప్యూటర్ ప్రోగ్రామ్మింగు.” ఈ సరికి చుట్టూ చేరిన మిగిలిన కుర్రాళ్ళు గట్టిగా నవ్వేరు.

“మీ ఒళ్ళో ఉండేది ఏటండి అది?” రామారావు ఎప్పుడూ లేప్ టేప్ చూడనివాడిలా అడిగేడు.

“లేపీ అంటారోయ్ దీన్ని”

“ఏటండి? లేపయ్యడవేనా?”

“లేపీ అంటే లేప్ టాప్!”

“అమ్మో అంటే దాంతో టాపు లేచిపోద్దాండి?” రామారావు నోరు వెళ్ళబట్టేడు. అప్పన్న నవ్వురాకుండా నోటికి తువ్వాలు అడ్డంబెట్టుకోవడం చూసి కుర్రాడు చెప్పాడు అందరికీ వినబడేటట్టూ “ఒరేయ్ వినండ్రా ఈ బైతు ఏవంటున్నాడో.”

ఒక్కసారి మరో పది పదిహేనుమంది రామారావు చుట్టూ చేరేరు. “నాను తప్పు ఏటన్నాను బావూ?”

“అబ్బే, నువ్వు టాఫు లేచిపోద్దా అంటే నవ్వొచ్చింది. దీన్ని టాపులు లేపడానిక్కాదు వాడేది. ఇదో కంప్యూటరు. ఏదో ఒక ప్రోగ్రామింగ్ చేస్తాం దీంతో.”

“పోగ్గామింగా? అంటే ఏటంటారు?”

మళ్ళీ నవ్వులు. ఓ కుర్రాడు ముందుకొచ్చి చెప్పేడు, “ఎప్పుడన్నా సినిమా చూసేవా?”

“ఎప్పుడో ఓ సారి చిన్నప్పుడు మా నాయన చూపిత్తే ఎళ్ళానండి. అదేం చిన్మా? ఆ! సిరంజీవి చిన్మా. జగదేక ఈరుడు, ఏదో అతి బువన సుందరి కాబోల్ను.”

కొంతమంది అమ్మాయిలు ఆసక్తిగా చూడ్డంతో సమాధానం చెప్పే కుర్రాడు రెచ్చిపోయాడు, “ఆ సినిమా వెయ్యాలంటే వెనకనుంచి ఓ డిస్కులో సినిమా ఉంచి అది తిప్పుతారు. అలా తిప్పితే అందులో ఉన్న సినిమా బొమ్మలన్నీ మనకి తెరమీద కనిపిస్తాయ్. అలా కనిపించాలంటే ఆ డిస్కు తిరగడానికి ఇలాంటి ఓ కంప్యూటరు లాంటిదే అనుకో ఒకదాన్ని వాడతారు…..”

“చినిమాకీ ఈ పోగ్గామింగుకీ ఏటండి లంకె? చినిమా కనబడేటప్పుడొచ్చే మిసి మిసి బల్బు ఈ కంపూట్రా?”

“అదే కదూ చెప్తూంటా? మరి డిస్కు తిరుగుతుంటే ఆ బొమ్మలన్నీ తెర మీద కనిపించడానికి కొంత కష్టపడాలి. కంప్యూటర్ అంటే ఒక మెషీన్. దానికి డిస్కుని ఎలా తిప్పాలో అనేది చెప్పాలి. ఇలా డిస్కు తిప్పూ, అలా బొమ్మ చూపించు, అలా పాట బయటకి తీయ్ అంటూ. ఇవన్నీ ఓ వరుసలో పెట్టి చెప్పడాన్నే ప్రోగ్రామింగ్ అంటారు. ఇలా డిస్కు తిప్పడం బదులు మరో పని కూడా చేయించొచ్చు. అంటే ఉద్యోగాలు చేసే కుర్రాళ్ళకి జీతం ఎంతివ్వాలి? ఎన్ని రోజులు శెలవ ఉంది, ఎన్ని రోజులు వాడుకున్నారు, అనేవన్నీ కాయితం మీద ప్రింట్ చేయొచ్చు. అంటే కంప్యూటర్ ఒకటే కానీ రకరకాల పనులు దాంతో చేయించుకోవచ్చు. అది మనం ఎలా చెప్తే అలా చేస్తుంది. మరి దానికొచ్చిన బాషలో ఇదిగో ఇలా డిస్కు తిప్పు, ఇలా వారానికోసారో నెలకోసారో జీతం ఎంతివ్వాలో చూపించు అనేవి రాసి ఉంచుతాం. అలా రాయడాన్నే ప్రోగ్రామింగ్ అనడం. అర్ధం అయిందా?”

“ఆ, ఏటో బావు. డిస్కు తిప్పడం, డబ్బులివ్వడం అంతా కలబెట్టేసినారు.” బుర్ర గోక్కున్నాడు రామారావు. అప్పన్న కిసుక్కున నవ్వేడు.

ఆంధ్రా యూనివర్సిటీ మళ్ళీ నవ్వులు.

ఈ సారి లేప్ టాప్ పక్కనే ఉన్న ఛార్జర్ కేసి చూపించి, “ఇదేటండి ఈ నల్లగా ఉన్న ఇటుకముక్క” అడిగేడు రామారావు.

“దాన్ని ఛార్జరంటారు. ఇటుకముక్కకాదు.”

“అద్దేనికండి?”

“మన గోదావరి ఎక్స్ ప్రెస్సు ఎలా నడుస్తుందో తెలుసా?” కాసేపు ఆలోచించి అడిగేడు కుర్రాడు

“అంత తెల్దుగానండి, పైన ఏవో తీగలున్నాయి. అందులోచి వింజను కరెంటు లాగుతాది. ఆ కరెంటే బండిని నడుపుతాదంటారు మరి” అంటూ అప్పన్న కేసి తిరిగి అన్నాడు రామారావు, “అప్పన్నా నేంజెప్పింది రైటేనా?” అప్పన్న తలూపేడు అవునన్నట్టూ.

వేగం పుంజుకుంటూ గోదావరి అనకాపల్లె దాటింది.

“అప్పన్న మీ తమ్ముడా?” ఓ రంధ్రాన్వేషి అడిగేడు.

“లేదండి, నాతో పనిజేస్తాడు ఈ రైల్వేలోనే”

“ఓ, నువ్వు రైల్వేలోనా ఉద్యోగం?” హాశ్చర్యపడిపోయింది ఆంధ్రా యూనివర్సిటీ బృందం.

“సరే విను అయితే. పైన తీగల్లో కరెంటు ఉంటుంది కదా? గోదావరి అంత పెద్ద బండి నడవాలంటే మరి పెద్ద పెద్ద లావు తీగలుండాలి. మన కంప్యూటర్ చిన్నది కాబట్టి అంతపెద్ద కరెంటు దీనిమీద వదిల్తే ఏమౌతుందో తెలుసా?”

“కాలిపోదండీ?” రామారావు కళ్ళు పెద్దవిచేసుకుని చెప్పేడు.

“కరెక్టు.” అప్పటిదాకా ఇదంతా వింటూ జోక్యం చేసుకోకుండా ఉన్న ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ చెప్పేడు. ఈయనెప్పుడొచ్చాడ్రా అనుకుంటూ కుర్రాళ్లు ఆయనకేసి చూసారు.

“ఆ లావు తీగలమీదనుంచొచ్చే కరెంటు ఈ కంప్యూటర్ కి సరిపోడానికి దాన్ని తగ్గించి ఇందులో వదిలేదే ఈ ఛార్జరు.” మొదట్నుంచే అన్నీ ఓపిగ్గా చెప్తున్న కుర్రాడు చెప్పేడు.

“ముట్టుకోచ్చాండి?” అంటూ రామారావ్ ఛార్జర్ మీద చెయ్యేసాడు. వేడిగా తగిలింది. “అమ్మో చెయ్యి కాల్తన్నాదండి.”

తుని రాబోతూండగా రామారావు లేచి అప్పన్నతో కంపార్ట్ మెంట్ తలుపు దాకా వెళ్ళి చెవిలో ఏదో చెప్పేడు. అప్పన్న సరే అన్నట్టూ తలూపి తలుపు దగ్గిరే నిలబడ్డాడు. బండి తునిలో ఆగింది. తలుపు దగ్గిరే నుంచుని ఎవరో వస్తే వాళ్లతో మాట్లాడ్డం సాగించేడు. లోపలకి ఎక్కేవాళ్ళని అక్కడే వారించి వాళ్లందర్నీ వదిలేసి తలుపు లాక్ చేశాడు అప్పన్న.

మూడు నిముషాల హాల్టుని పదిహేను నిముషాలకి ఏ కారణం లేకుండానే పొడిగించాక గోదావరి బయల్దేరింది తునిలోంచి బయటకి.

*****

 

కుర్రాళ్లందరూ సమోసాలూ, టీలు కానిచ్చేక బండి కదుల్తుంటే రామారావు వెనక్కొచ్చి మళ్ళీ కుర్రాళ్లతో కబుర్లు మొదలెట్టాడు, ఈ సారి ఎలెక్ట్రికల్ ఇంజీనీరింగు ప్రొఫెసర్ తోటీను. “బావూ, మరి ఇన్నేసి లేప్ టాపులు, ఆ ఫోన్లూ అలా తగిలించేస్తే తీగలు కాలిపోవండీ?”

కుర్రాళ్ళూ, కుర్రమ్మలూ ఈయనేం సమధానం చెప్తాడా అని ఆసక్తిగా చూసేరు ప్రొఫెసర్ వైపు.

ఎలెక్ట్రికల్ ఇంజిరీంగ్ ప్రొఫెసర్ రెండేళ్ల క్రితమే ఉద్యోగంలో జేరేడు, ఇదే కాలేజీలో చదువుకుని, పాసయ్యి నాన్నగారి రికమండేషన్ తోటీ, అక్కడో ఉత్తరం ఇక్కడో దక్షిణా సమర్పించుకుని. సమాధానం చెప్పకపోతే ఈ బైతు ముందూ, ఆత్రంగా చూసే ఈ పిల్లల ముందూ పరువుపోదూ? వెంఠనే చెప్పేడు, “మంఛి ప్రశ్న అడిగావయ్యా, నీ పేరేంటన్నావ్?”

“రామారావండి.”

“సర్లే, పైన ఉన్న కరెంటు తీగలు ఎంత లావున్నాయో చూసావా? గోదారి ఎక్స్ ప్రెస్సు ఎంత కరెంటు లాగుతోందో దానిముందు ఈ కంప్యూటర్ లాగేది ఏ మాత్రం? మరో వంద కంప్యూటర్లు వాడినా ఏమవదు.”

“ఆయ్, బాగా చెప్పేరండి. మరైతే ఆ పైనుంచొచ్చే కరెంటు ఈ లేపుటాపు లోకి తిన్నంగా రాకుండా ఈ ఇటుకముక్క అడ్డుకుంటే ఇదే వేడెక్కిపోతన్నాది. అది కాలిపోదండీ?”

ఈ సారి కాస్త విసుగ్గా అన్నాడు కుర్ర ప్రొఫెసర్, “మరేం ఫర్లేదయ్యా. నేను చెప్తున్నాను కదా? అయినా ఆ తీగల్లో కరెంటు డైరక్టుగా ఇందులోకొచ్చెయ్యదు. మధ్యలో కన్వర్టర్లు అని ఉంటాయి. అవిలేకపోతే ఈ లైట్లూ, పేన్లూ ఏవీ పనిచెయ్యవు.”

“అంటే మద్దెలో మరో ఇటుకముక్కలాటిదున్నాదంటారా? ఎక్కడుంటాదో మరి. అందుకే గదండన్నారు ఈ రైలింజన్లూ, ఈ ఇమానాలు, అంతా తెల్లోడి బిస అనీ. ఆఖరికా తెల్లోడు చంద్రుడిమీదకెళ్ళి కుందేల్ని తడిమాడంట. అబ్బో”

అందరూ నవ్వడంతో వాతావరణం తేలిక పడింది. రామారావు మళ్ళీ నస కంటిన్యూ చేసాడు, “మరి మేష్టారు, ఈ నల్ల ఇటుకముక్కలు ఫోన్లకి వేరేగా ఉంటాయండీ?”

“ఆ ఉంటాయి కాని కాస్త చిన్న సైజులో,” అంటూ ఓ కుర్రాడు ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి వాడే చిన్న ఛార్జర్ చూపించాడు.

“మరో మాటండి, ఈ ఇటుకముక్కలు ఏడెక్కుతూంటే….”

“ఎన్నిసార్లు చెప్పాలోయ్, ఇటుక ముక్క కాదు ఛార్జర్ అనలేవూ?”

“పోనీండి బావ్, ఇయన్నీ ఏడిక్కిపోతే అక్కడే ఉన్న కాయితమో, గుడ్డముక్కో అంటుకుంటే పెమాదం కాదూ?”

“మరీ అంత వేడేక్కిపోదులే. కొంచెం వెచ్చగా ఉండొచ్చు. కానీ నాసి రకం ఛార్జర్లైతే అంటుకుంటాయ్”

“తవరికెలా తెలుద్దండీ ఇయి నాసిరకంవో కావో?”

“దానిమీద పేరు చూసావా? మంచి పేరున్నవి వాడతాం.”

“అలా అంటారేటి బావు, ఈ దేశంలో ఎంత కల్తీ ఉందో తెల్వదా? పేరుదేవుంది అచ్చుగుద్దటవే కదా?”

రామారావ్ ప్రశ్నకి ఈ సారి మొత్తం ఆంధ్రా యూనివర్సిటీ అదిరిపడింది. దీనికి సరైన సమాధానం ఎవరి దగ్గిరా లేదు.

కెమికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ చప్పట్లు కొట్టి అన్నాడు, “అదండి అద్భుతమైన ప్రశ్న. బైతు, బైతు అని మనం వెక్కిరిస్తూన్న ఇతనే వేశాడు మనం సమాధానం చెప్పలేని ప్రశ్న”

 

*****

 

బండి పిఠాపురం దాటి సామర్లకోటకి దగ్గిరౌతూండగా రామారావు లేచి బాత్రూంలో దూరేడు.

వెళ్లేటప్పుడు తాను కూర్చున్న చోటునుంచి దగ్గిర్లో ఉన్న బాత్రూంలోకి కాక దూరంగా అటువైపు ఉన్న లావెట్రీ వైపుకి నడిచేడు. వెళ్తూ దారిలో ఎన్ని కంప్యూటర్లున్నాయో ఎన్ని ఫోన్లు ఉన్నాయో ఉరమరగా లెక్కపెట్టేడు. 74 బెర్తులకి ఈ కుర్రాళ్ళు దాదాపు 70 లేప్ టాపులు తెచ్చారు. ఫోనులేని కుర్రాడు కానీ కుర్రమ్మ కానీ లేనేలేదు. మరో కొంతమంది దగ్గిర ఒళ్ళో పెట్టుకుని సినిమాలు చూసే డివిడి ప్లేయర్లుండడం గమనించేడు.

బాత్రూంలోకి దూరిన రామారావు జేబులోంచి సెల్ ఫోన్ బయటకి తీసి సామర్లకోట స్టేషన్ మాస్టర్ నెంబరికి కనెక్టు చేయమని అడిగేడు. రెండునిముషాల్లో అవతలాయన లైన్లోకొచ్చాక చెప్పేడు, “బోగీల దగ్గిర ఎలెక్ట్రికల్ రిపేర్లు చేసే వాళ్లెవరైనా మీదగ్గిర ఉన్నారా సామర్లకోట స్టేషన్లో?”

“లేదండి. మా దగ్గిర చిన్న చిన్న రిపేర్లు చేసేవాళ్లే. ఏదో ఓ లైటూ, ఫేనూ తిరగకపోతే చూడగలరు అంతే గానీ మరీ పెద్ద పన్లు చేయలేరు. మాకు ఆర్డర్లన్నీ రాజమండ్రి నుంచి రావాల్సిందే.”

“అలాగా, రాజమండ్రి ఫోన్ చేసి నేను ఇక్కడ ఎస్ సిక్స్ కోచ్ లో ఉన్నాననీ ఇద్దరు స్పెషలిస్ట్ ఎలెక్ట్రీషిన్లని పంపించమనీ చెప్పండి. బండి రాజమండ్రి లో ఆగాక నేను మళ్ళీ ఫోన్ చేసేవరకూ కదలడానికి లేదు. కాస్త స్తేషన్ కి దూరంగా ఉన్న ప్లాట్ ఫాం మీద కానీ, లూప్ లైన్లో కానీ అపమని చెప్పండి.”

“సరేనండి. ఏదైనా ప్రమాదమా బండికి?”

“ఇంకా ఏమీ లేదు, కానీ ప్రమాదం వస్తే మళ్ళీ ఫోన్ చేస్తాను ఈ సారి ట్రేక్ పక్కనున్న ఫోన్ వైర్ల మీదనుంచి.”

“భోజనం, అవీ… మీకేం కావాల్సినా ఇప్పుడు చెప్పేయండి, నేను చూసుకుంటాను.” కాస్త ఎక్కువగా ఉత్సాహపడిపోయేడు సామర్లకోట స్టేషన్ మాస్టరు.

“ఏమీ వద్దు. చెప్పినది చేయండి చాలు.” మృదువుగానే అన్నా చురుక్కుమని తగిలింది సమాధానం స్టేషన్ మాస్టరికి.

 

****

 

బండి సామర్లకోట వదిలి అనపర్తి దాటుతూండగా ఓ బెర్తు దగ్గిర్నుంచి కేకలు వినిపించేయి. రామారావు ఎంత పరుగెట్టుకుంటూ ముందుకెళ్ళినా కుర్రాళ్ళందరూ అడ్డుండడంతో లోపలకి వెళ్ళే వీలు లేకపోయింది. అరుపుల్లో, కేకల్లో “చైన్ లాగు” అని ఒకరంటూంటే, “నీళ్ళు పోయండి” అని మరొకరు అరుస్తున్నారు. ముందుకెళ్ళే రామారావు అప్పన్నతో చెప్పేడు, “ఆ పక్కన ఎలెక్ట్రికల్ బాక్సు ఆఫ్ చేయగలవేమో చూడు.”

అప్పన్న అటువెళ్ళగానే రామారావు తోసుకుంటూ ముందుకెళ్ళేసరికి మంటలు కనిపించేయి. ఒక లేప్ టాప్ దగ్గిరే ఉన్న బెర్తుమీద ఉన్న దుప్పటి అంటుకుని మంటలు వస్తున్నాయి. వైర్లు ఇంకా కాలుతూనే ఉండడంచేత అది ముట్టుకోడానికెవరికీ ధైర్యం లేనట్టుంది. రామారావు ముందుకెళ్ళి వేసుకున్న హవాయి చెప్పులు రెండు చేతులకీ తగిలించుకుని ఒక్క ఉదుటున కాలుతున్న వైరుని సాకెట్లోంచి బయటకి లాగేడు. కాలిపోయిన వైరు తెగి వచ్చింది.

మంటలు తగ్గడానికి మరో దుప్పటి వేసి పొగ పోవడానికి కిటికీల తలుపులు తీసాక, కుర్రాళ్లందరూ తలో చేయి వేసేసరికి మంటలన్నీ అదుపులోకొచ్చాయి. అప్పన్న ఏదో చేసినట్టున్నాడు, అప్పుడే చిన్న శబ్దంతో కోచ్ అంతా కరెంటు పోయింది. అంతా నిశ్శబ్దం. కంప్యూటర్ల గురించి అనర్గళంగా మాట్లాడిన కుర్రాళ్ళూ, జబ్బలు చరుచుకుని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అంటే ఏమిటో చెప్పిన ప్రొఫెసర్ కీ నోటమ్మట మాటలేదు.

మొత్తానికి రెండు దుప్పట్లు కాలడం, ఇద్దరబ్బాయిలకి చిన్నపాటి గాయాలూ, ముగ్గురమ్మాయిల చుడీదార్ల పైన వేసుకున బట్టలూ కాలాయి అంతే. ప్రాణ నష్టం లేదు; అదో అదృష్టం. రామారావు, అప్పన్నా ఏమీ మాట్లాడకుండా దిగే గుమ్మం దగ్గిరకి పోయి నుంచున్నారు. చిక్కబడుతున్న చీకట్లో గోదావరి పరిగెడుతూనే ఉంది.

కడియం దాటి బండి కాసేపటికి రాజమండ్రిలో ఆగింది.

తలుపుతీసి దగ్గిరలోనే నుంచుని విష్ చేసిన అందర్నీ చూసి రామారావు చెప్పేడు, “ఈ కోచ్ ఖాళీచేయించి మరోటి చూడండి వీళ్లని ఎక్కించడానికి. ఆ తగిలించే కోచ్ కి వెనుకనున్న సర్క్యూట్ బ్రేకర్స్ అన్నీ చూసి చార్జింగ్ పాయింట్స్ అన్నింటినీ స్విచ్ ఆఫ్ చేయండి. ఈ కోచ్ ని రిపేర్లకి పంపించే ఏర్పాట్లు చేయండి.  చిన్న చిన్న దెబ్బలు తగిలిన వీళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయండి. ఓ గంటలో చేయగలిగితే మంచిది. బండి బయల్దేరే ముందు అన్నీ తనిఖీ చేసిన రిపోర్ట్ నేను చూస్తాను.” చకచకా ఆర్డర్లు వేసి అప్పన్నతో ముందుకి కదిలేడు రామారావు.

ఇదంతా చూస్తున్న ఆంధ్రా యూనివర్సిటీ నోర్లు వెళ్లబెట్టింది. సామాన్లులన్నీ దింపుకున్నాక వేరే కోచ్ లోకి ఎక్కడానికి మరో నలభై నిముషాలు పట్టింది. ఈ కంగార్లో ఎవరి లేప్ టాపులు పోయాయో ఎవరి ఫోన్ ఎక్కడ తగలబడిందో ఎవరికీ గుర్తులేదు. గుర్తున్నదంతా బైతులా రామారావు వేసిన నాటకం, ఆయన రాజమండ్రీలో రైల్వే వాళ్లకి వేసిన ఆర్డర్లూను.

“మనతో మాట్లాడినాయన పెద్ద రైల్వే ఆఫీసర్లాగున్నాడే?” ఎవరో కుర్రాడు గొంతు పెగుల్చుకుని అన్నాడు.

“ఏమో? ఏం చెప్పగలం?” అంటూ భుజాలు ఎగరేసారు మిగతావాళ్ళు.

*****

దాదాపు గంటా రెండు గంటలు గడిచేక బండి ఎప్పుడు కదులుతుందా అని చూస్తూంటే రామారావు మళ్ళీ అప్పన్నతో కలిసి రావడం కనిపించింది. ఈ సారి వచ్చిన రామారావు హుందాగా ఉన్నాడు బట్టలు మార్చుకుని; ముందు చూసిన బైతు రామారావు కాదు.

చుట్టురా మరో నలుగురున్నారు – రాజమండ్రీ స్టేషన్ మాస్టర్ తో సహా టైలు కట్టుకుని. రామారావు మాట్లాడ్డం మొదలుపెట్టేడు.

“మీరందరూ భవిష్యత్తులో కాబోయే ఇంజినీర్లు. మీరు నేర్చుకోవల్సినది ఇంజినీరింగ్. క్లాసులో పాఠాలు బట్టి పట్టేసి పరీక్షల్లో ఉమ్మేస్తే మార్కులొస్తాయేమో కానీ ఇంజినీరింగ్ ఉజ్జోగాలు రావు. ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి ఇంజినీరింగ్ అనవసరం. ఈ ట్రైన్లో నాతో మాట్లాడిన కుర్రాళ్ళకి కానీ మీ ప్రొఫెసర్ కి కానీ ఏమాత్రం ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ కానీ కంప్యూటర్ల గురించి కానీ తెలిసినట్టు లేదు. కోచ్ కి ఉన్న సర్క్యూట్ బ్రేకర్స్ అంటే ఏమిటో మీకు తెలియదని నాకు అనిపిస్తూంది. ఒక్కో లేప్ టాప్ ఛార్జరూ ఎన్ని ఏంపియర్లు లాగుతుందో తెలుసా? అన్నీ ఒకేసారి కనెక్ట్ చేస్తే ఏమౌతుంది? నాది కెమికల్ ఇంజినీరింగూ, నాది సివిల్ ఇంజినీరింగూ అని తప్పించుకోవడానికి చూడకండి. ఈ బేసిక్ ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ అన్ని బ్రాంచ్ ల కుర్రాళ్ళూ చదవవల్సిందే. అవన్నీ ఒక ఎత్తు అయితే ఒక ప్రశ్న అడుగుతున్నాను సమాధానం చెప్పండి. మీరు విశాఖపట్నంలో ఎక్కి దువ్వాడ వచ్చేలోపు లాప్ టాప్ లు కనెక్ట్ చేసి ఏం చేద్దామని? పదినిముషాలు లేప్ టాప్ స్క్రీన్ కేసి గానీ, ఫోన్ స్క్రీన్ కేసి గానీ చూడకుండా ఉండలేరా?

ఒక్కొక్క లేప్ టాప్ మూడు నుంచి నాలుగు ఏంపియర్లు కరెంటు లాగుతుందనుకుంటే మీరు తగిలించిన వాటికి మొత్తం ఎంతైంది? అదీ కాక మీరు పట్టుకొచ్చిన చార్జర్లు అన్నీ సరైనవా? నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఇది – మీరు తెచ్చినవాటిలో ఎన్ని సరైన మంచి ఛార్జర్లు? ఎన్ని చవకబారువి? మీరే చూసారు కదా ఒక ఛార్జర్ వేడెక్కగానే మంటలు అంటుకున్నాయి. ఆ ఛార్జర్ ఎంత చవకబారుదో మళ్ళీ చెప్పక్కర్లేదనుకుంటా. మంటలు వచ్చే సమయానికి మనందరం నిద్రలో ఉండి ఉంటే? రోజుకో ట్రైన్ కి ఏక్సిడెంటు అవుతోంది. ఏది ఎలా జరిగినా అందరూ మా రైల్వేదే తప్పు అంటారు. మీరు చేసే వెధవ పనులు ఎవరికీ చెప్పరూ, మేము చూపిస్తే ఒప్పుకోరూ.  ఇంతకీ నేనెవర్నో తెలుసా మీకు?”

డభ్భై ఆరు తలలు అడ్డంగా ఊపబడ్డాయి తెలీయదన్నట్టూ.

“నా పేరు వంగపల్లి రామారావు. నేను సౌత్ ఈస్టర్న్ రైల్వే కి సీనియర్ డివిజినల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ని. మీలాగే ఇంజినీరింగ్ చదివి యూ పి ఎస్ సి వారు రాసిన పరీక్షలో పాసై డైరక్ట్ గా ఇక్కడకొచ్చాను…”

నాన్నారి రికమండేషన్తో ఉజ్జోగంలో చేరిన ప్రొఫెసర్ మొహంలో కత్తివాటుకి నెత్తురుచుక్కలేదు. ఒకప్పుడు తాను ఈ యూ పి ఎస్ సి పరీక్ష రాయడం గుర్తొచ్చింది. ఇంటర్వ్యూ మాట దేవుడెరుగు మొదట అసలు రాత పరీక్షే పాసవ్వలేదు.

“…ఎన్నేళ్ళు కష్టపడ్డారు ఒక్కొక్కరూ ఇంజినీరింగులో సీటు రావడానికి? ఇదేనా మీ ప్రతాపం? మీకు కంప్యూటర్ ఉద్యోగమే కావలిస్తే ఇంత కష్టపడడం దేనికీ?  బి.ఎస్సీ చదివి ప్రొగ్రామింగ్ నేర్చుకుంటే చాలదూ? ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివేమని చెప్పుకుంటున్నారు కదా? మీ ప్రొఫెసర్ గారు చెప్పారే? ఇంకో వంద లేప్ టాప్ లు కనెక్ట్ చేసినా ఏమీ అవదూ, పైన పెద్ద లావుపాటి వైరు ఉంది కరెంటుకి అన్నారే? ఏమి చదువులండీ మీవి? వైర్లు అంటుకుని మంటలొస్తుంటే నీళ్ళు పోయమనీ, చైను లాగమనీ అరుస్తున్నారే? ఏదీ ఆ ప్రొఫెసర్ గార్ని ఇలా రమ్మనండి ముందుకి…”

కాలిపోయిన లేప్ టాప్ ఛార్జరులా మాడిపోయిన మొహంతో ప్రొఫెసర్ ముందుకొచ్చాడు. తలెత్తి చూడ్డానికి ధైర్యం చాలలేదు. కుర్రాళ్ళ సంగతి సరేసరి.

“…. ఏమిటి సార్, పైనున్న కరెంటుని ఇష్టం వచ్చినంత లాగేసుకోవచ్చా? మరి పైనున్న ఏ. సి. హై వోల్టేజ్ కింద మీకు డి.సి. లో కావాలంటే మధ్యలో కన్వర్టరు కి కెపాసిటీ అనేది ఉంటుందా? లేకపోతే నూటొక్క లేప్ టాప్ లన్నింటికీ కరెంటు సప్లై చేయగలదా? పవర్ సప్లై కి లోడ్ కి ఉన్న సంబంధం తెలుసా మీకు? బోగీ కి ఉన్న కన్వర్టర్ నలభై ఏంపియర్లు సప్లై చేయగలదేమో. ఒక్కో లేప్ టాప్ మూడు ఏంపియర్లు లాగితే – అదీ మధ్యలో ఉన్న చవకబారు ఛార్జర్ తో – ఏమౌతుంది? ఇలాగేనా మీరు చదువుకున్నదీ, చదువులు చెప్పేదీ? పేరుకి పెద్ద కాలేజీల్లో చదువుకున్నట్టు కబుర్లా. ఇదా మీ ప్రతాపం? మనం ఇలా ఉండబట్టే మన దేశం ఇలా ఉంది. ఆలోచించారా?”

ఎవ్వరి దగ్గర్నుంచీ సమాధానం రాకపోవడంతో రామారావే మళ్ళీచెప్పేడు, ఈ సారి కాస్త కరుగ్గా – “వెళ్ళండి. ప్రాణాలతో ఉన్నందుకు సంతోషించండి. ఇండస్ట్రియల్ టూర్లు అంటే తల్లితండ్రులు కొనిచ్చిన సెల్ పోన్లూ, లేప్ టాపులూ టకటక లాడించుకుంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు సంపాదించడం కాదు.  మీరు ప్లాట్ ఫారం మీద మాట్లాడేవన్నీ విని మా ఆఫీసులో పనిచేసే లైన్ మేన్ అప్పన్న చెప్పాడు మీ గురించి. మీరెలాగా ఇలాంటి పని చేస్తారని ఊహించి వెంఠనే బయల్దేరాను. అసలు మీకేం తెలుసో చూద్దామని పల్లెటూరి బైతులాగా ఓ నాటకం ఆడాను. విశాఖపట్నం నుంచి దువ్వాడ కేవలం ఇరవై ఐదు కిలోమీటర్లు దూరం. బుద్ధి అనేది ఉన్న ఎవరైనా ట్రైన్ ఎక్కిన మూడు నిముషాల్లో లేప్ టాప్ తీస్తారా? ఏమిటా అర్జెంటు అవసరం? ఏదో అవతల వాళ్లకి చూపించాలనే తాపత్రయం తప్ప? ఏమిటి మీకొచ్చే శునకానందం ఆ చూపించడంలో? రెండు ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలు రాగానే గొప్పవాళ్ళైపోతారా? మీ బుర్రల కన్నా మా లైన్ మేన్ అప్పన్న నయం. మిమ్మల్ని విశాఖపట్నం స్టేషన్ లోనే గమనించి నాకు చెప్పాడు.

మీరు ఎక్కబోయే వేరే బోగీలో ఛార్జ్ చేసుకునే సాకెట్లు అన్నింటినీ ఆఫ్ చేయమని చెప్పాను. అవి పని చేయవు. కేవలం లైట్లు, ఫేన్లు పనిచేస్తాయి.  ఒళ్ళు దగ్గిర పెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళి రండి. హైదరాబాదు వెళ్ళేలోపుల మళ్ళీ నేను కనుక్కుంటాను మీ కోచ్ గురించి. ఏమైనా తేడాలొస్తే ఇప్పుడు రాత్రి అవుతోంది కనక పోతే మీ ప్రాణాలే పోతాయి. రోజువారీ ఎలాగా ఫోనుల్లో టెక్స్ట్ మెసేజీలు పంపించుకుంటూ మొహం మొహం చూసుకోవడం మర్చిపోతున్నారు కనక కనీసం ఈ ట్రైన్లో అయినా అవన్నీ పక్కన పడేసి టూర్ లో ఏదో ఒకటి నేర్చుకోండి.”

ఆంధ్రా విశ్వవిద్యాలయం కోచ్ లోకి ఎక్కుతూంటే రామారావు చెప్పినది విని చుట్టుపక్కలనున్న రైల్వే స్టాఫ్ అందరూ చప్పట్లు కొట్టారు. ఆఖరిగా బండి ఎక్కబోయిన ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ రామారావు దగ్గిరకొచ్చి “సారీ సర్, మీకేమీ తెలియదనుకుని అలా అన్నాను…” అంటూ నీళ్ళు నవిలేడు.

రామారావు స్టేషన్ మాస్టరు తీసుకొచ్చిన రిపోర్టు చూసి తలాడించి సరేనన్నాక బండి బయల్దేరడానికి పచ్చజండా ఊపేరు. ఇంక మాట్లాడ్డానికేవీ లేదన్నట్టూ రామారావు ప్రొఫెసర్ తో కరుగ్గా చెప్పేడు, “వెళ్ళండి, అప్పుడే సిగ్నల్ ఇచ్చారు.” ప్రొఫెసర్ బండిలో ఎక్కేక వెనకనే అప్పన్నా మిగతా ఒక్కొక్కరూ చేతులుకట్టుకుని నడుస్తూంటే రామారావు రాజమండ్రీ స్టేషన్ ఆఫీసుల వేపు కాలు సాగించేడు. గోదావరి ఎక్స్ ప్రెస్ మొత్తానికి మూడు గంటలు ఆలశ్యంగా తనకి పెట్టిన పేరు సార్ధకం చేసుకోవడానికి ఆ నదిమీద కట్టిన బ్రిడ్జీ వైపు కదిలింది.

గోదావరి ప్రతీరోజూ లేటౌతున్నందుకు ఎప్పుడూ ప్రభుత్వం మీద అరిచే జనం ఈ సారి మూడు గంటలు లేటైనా మర్నాడు పేపర్లో రాబోయే వార్త చూసి ప్రాణాలు కాపాడినందుకు సీనియర్ డివిజినల్ ఎలక్ట్రికల్ ఇంజినీరు రామారావుకీ, భారతీయ రైల్వేకీ, ప్రభుత్వానికీ ధన్యవాదాలర్పించడానికి సమాయత్తమౌతోంది. ప్రాణాల్తో పోలిస్తే బండి లేటైన మూడు గంటలో లెక్కా?

*

మీ మాటలు

 1. Neelima says:

  మంచి వస్తువు. ఇంజినీరింగ్ అంటే ఎంసెట్ లు, మార్క్ లు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మాత్రమే కాదు అని చక్కగా చెప్పారు.

 2. డా.సుమన్ లత రుద్రవఝల says:

  గోదావరి లేట్ అయినా మీ కథ మాత్రం సమయానికే వచ్చిందని చెప్పాలి .కాలేజీ లలో ప్రాక్టికల్ పరిజ్ఞానం లేక అడుగులు తడబడుతున్న విద్యార్ధులకు .తల్లి తండ్రులకు ,బోధకులయే ప్రబుద్ధులకు ఇలా దారి చూపించే ఎందరు రాముళ్ళు (రామారావులు ) అవతరిస్తే ఈ మాయ తెరలు తొలగుతాయో కదా !వేర్లకు నీరు పోయక చిగురులను /ఆకులను పై పైన తడిపి ఫలాలు పొందాలన్న దురాశ లాటిదే ఈ చదువు ‘కోనటాలు’కూడా ! ప్రవేశాల సమయానికి ప్రచురించిన సారంగ కు అభినందనలు .
  డా .సుమన్ లత రుద్రవఝల

 3. మీ కథ చాలా బావుందండీ !

  చదువులంటే ఇంజినీరింగ్ కాలేజుల్లో “కొనుక్కునేది” లేక పుస్తకాలలో చదివేది మాత్రమే కాక – నిప్పొస్తే ఎలా ఆర్పాలి అని , ఫ్లాష్ ఫ్లడ్ వచ్చిన నదిలో నీళ్ళొస్తుంటే ఒడ్డు పక్కనే కదా అని రాయి మీద నిల్చుని చూస్తూ ఆ నది లాగేస్తే ఓ ముప్పై మందికి పైగా యువతీ యువకులు ఆ నీటిలో కొట్టుకుపోకూడదని, సెల్ఫీలు తీసుకుంటూ నదిలో పడిపోతే ఒకరి తరవాత ఒకరు వరసగా ఆరుగురు నదిలో గల్లంతై పోకుండా ఎవరినైనా చటుక్కున సహాయానికి పిలవాలని – ఇదిగో ఇలాంటి కనీసపు లైఫ్ స్కిల్ల్స్ నేర్పే కామన్ సెన్స్ అనే పాఠ్యాంశం ఒకటి వుంటే ఎంత బాగుంటుంది ?

  ~ లలిత

 4. శర్మ దంతుర్తి says:

  కామెంట్ పెట్టిన ముగ్గిరికీ పేరుపేరునా ధన్యవాదములు. ఈ కధ బుర్రలో చాలా కాలం నుంచీ నలుగుతోందండీ. ఆ మధ్య ఇండియా వెళ్ళాక ఒకసారి ఎయిర్ పోర్టులోనూ, మామూలు రైళ్ళలోనూ అటూ ఇటూ తిరిగాక ఇంకా బాగా తెలిసి వచ్చింది. అసలు మన ప్రమేయం లేకుండా, మనని అడక్కుండా మన ఫోటోలు సెల్ ఫోనుల్లోనూ ఐ పేడ్ లలోనూ ఇష్టం వచ్చినట్టూ తీస్తారు. ట్రైనులో కిటికీ దగ్గిరున్న పెద్దమనిషి ఇటువేపు వచ్చి (ఆడవాళ్ళు, పిల్లలూ ఉన్నా సరే) ఫోను ఛార్జ్ చేసుకోవడం ఇటుపక్క సాకెట్లో. పోనీ ఛార్జ్ చేసుకోవడానికి అలా వదిలేస్తాడా అంటే అది కాదు. అలా ఛార్జ్ చేస్తూ ఎవరితోటో గంటల తరబడి కబుర్లు. మరి ఇటు కూర్చున్న ఆడవాళ్ళు వాళ్ళూ వీణ్ణి వదిలించుకుని బాత్రూం లోకి వెళ్ళాలన్నా, కాళ్ళు కదపాలన్నా కుదరదు. ఆయన అలా కాల్ మీద కాల్ చేస్తూనే ఉంటాడు సీట్ల మధ్యలో నుంచుని. నాకు చిరాకొచ్చి ఆ సాకెట్లోంచి వైరు లాగి అటు వేపు ఛార్జ్ చేసుకోండి అని చెప్పాను. అది పనిచేయట్లేదు అందువల్ల ఇక్కడే చేస్తాను అని దెబ్బలాట. నేను దిగే ఊరు వచ్చేదాకా ఇదే గొడవ. అసలు ప్రైవసీ అనేదాకి అర్ధం లేదు. లేప్ టాప్ ఎందుకో రాత్రి తీయడం. పోనీ అంత బిజీ పెద్దమనిషైతే రాత్రి వెళ్ళే బండిలో లో ఎక్కడం ఎందుకో? పోనీ కాసిని ప్రశ్నలు అడిగి చూడండి ఇలా లేప్ టాప్ లు తెచ్చి మనకి చూపించే వాళ్ళని. అసలు ఈ ఛార్జర్లు ఎంత కరెంట్ లాగుతాయి అనికానీ, షాడో మెమరీ అంటే ఏమిటి, విండోస్ లో స్వాప్ ఫైల్స్ అంటే అనిగాని. ప్రోగ్రామింగూ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగూ గొప్పవే, ఎవరూ కాదనటం లేదు. కానీ ఈ లేప్ టాప్ లు తెచ్చే కుర్రాళ్ళు రెంటికీ చెడ్డరేవడి. ఈ కుర్రాళ్ళని నేను రెండు మూడు సార్లు ఉద్యోగాలకి ఇంటర్వ్యూ చేసాను కూడా. ఏ పేపర్లో చూసినా ఇంజినీరింగ్ క్వాలిటీ దిగజారిపోతోందని మొత్తుకునేవారే కానీ దాన్ని ఎలా బాగుచేద్దామా అనే ధ్యాసే లేదు. కుప్పలు తెప్పలుగా వచ్చిన కాలేజీలవల్ల క్వాలిటీ గంగలో కలిసిపోయినట్టుంది.

  అసలు ఈ కధ రాయడానికి కారణం ఇవన్నీ చూసి వళ్ళుమండాక వచ్చిన కోపం. లలిత గారు మీరు చెప్పినది నిజమండి, నేను కూడా ఆ పిల్లలు నీళ్ళలో కొట్టుకుపోవడం వీడియోలో చూసాను. కట్టెదుట జనం చచ్చిపోతూంటే వీడియో తీయడానికి, అది తీసి ఇంటర్నెట్లో పెట్టడానికీ అసలు బుద్ధి అనేది ఉండాలి. ఇంత నీచంగా ఎలా ప్రవర్తిస్తారో మరి. కొట్టుకుపోయేవాళ్లలో తన తండ్రో తమ్ముడో ఉంటే అలా వీడియో తీస్తారా?

  మరో విషయం. నేను ఆంధ్రాలో చదువుకునే రోజుల్లో మా జిల్లా కలెక్టర్ గారు ఇలా బైతు వేషాలు వేసి దాదాపు జిల్లా అంతట్నీ ఆరు నెలలు గుండెలు బేజారెత్తించాడు అని చెప్పుకున్నారు కధలు కధలుగా. మన పెద్దమనుషులు ఆయన్ని అక్కడ్నుండి ట్రాన్స్ ఫర్ చేసేసారు. ఆ కలక్టర్ ని దృష్టిలో పెట్టుకుని రామారావుని సృష్టించాను కధలో. ఆ మధ్య ఒక ట్రైన్ లో ఇలాగే చవకబారు ఛార్జర్ అంటుకుంటే మంటల వల్ల జనం చచ్చిపోయారు. గూగిలిస్తే ఈ ట్రైన్ ఏక్సిడెంట్ కధలన్నీ కోకొల్లలుగా దొరుకుతాయి.

  మరోసారి ధన్యవాదములు

 5. డా.సుమన్ లత says:

  శర్మ గారూ ! గమనించార? ముగ్గురమూ మహిళలమే వెంటనే స్పందిచేము .మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ అనుభవాలే .చార్జింగ్ చేస్తూ మాట్లాడుతున్న పెద్దమనిషిని ఈ మధ్యనే అడిగితె ముఖ్యమైన కాల్స్ అన్నాడు .కాస్త ఛార్జ్ అయేక మాట్లాడుకుంటే నేను కూడా ఆమధ్య వ్యవధి లో చేసుకోవచ్చుకదా అంటే కిమన్నాస్తి .ఇది ac బోగీ లో .జరిగింది
  మనుషులు చస్తూ ఉంటే సంకర భాష లో మైకు మొహం మీద పెట్టి వివరాలు /ఆరాలు.సహాయం చేస్తే బతుకుతారన్న బుద్ధి ఉండదు .అటు పైన అంతర్జాలాల్లో విహారాలు .
  మీ కధకు మరోసారి అభినందనలు .యదార్థం తో కాస్తంత ఇలా జరిగితే బాగుండునన్న భావాన్ని చొప్పించేరు .విక్రమార్కుడు .భోజరాజుల్లాగ మరింతమంది అధికారులు రంగం లోకి దిగితే బాగుంటుంది..మీరు చెప్పిన అజ్ఞాత కలెక్టర్ గారికి అభినందనలు . డా .సుమన్ లత రుద్రావఝల

 6. కె.కె. రామయ్య says:

  ఇండియాలో పుట్టగొడుగుల్లా వఛ్చిన ఇంజినీరింగ్ కాలెజీలల్లో పడిపోతున్న విద్యాప్రమాణాల నేపథ్యంతో వఛ్చిన మరో కధ … ‘వాకిలి’ అంతర్జాల పత్రికలో వఛ్చిన రామా చంద్రమౌళి గారి “గడ్డి తాడు” కధ మీ దృష్టికి తేవాలనుకుంటున్నా ప్రియమైన శ్రీ ఆర్. శర్మ దంతుర్తి గారు. ( బమ్మెర పోతన, శ్రీశ్రీ అంటూ ఇంతకు ముందు మీతో వాదులాటకు దిగాను. మన్నించవలసినది. )

  http://vaakili.com/patrika/?p=11422

 7. శర్మ దంతుర్తి says:

  రామయ్య గారు
  ఆ కధ చదివాను. శ్రీ శ్రీ మీదా, పోతనమీదా అన్నారు. ఇదేమిటబ్బా అనుకుంటూ నేను రాసిన అన్ని కధలూ చుసుకుంటే గానీ అర్ధం కాలేదు. ఈమాట లోనా? అదెప్పుడో మర్చిపోయాను. అయినా ఎవరి అభిప్రాయాలు వారివి. ముఖే ముఖే సరస్వతి అని కదా. అవన్నీ మనసులో పెట్టుకోకండి.
  ధన్యవాదములు
  శర్మ దంతుర్తి

 8. కె.కె. రామయ్య says:

  ప్రియమైన శ్రీ ఆర్. శర్మ దంతుర్తి గారు,

  నాటి ‘ఈమాట’ అంతర్జాల పత్రికలోని వాగ్వివాదం ఘటనతో సిగ్గుపడిన నేను పోతన భాగవతం సంకలనాలని కొండమీది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రచురణ కార్యాలయం నుండి భుజాన పెట్టుకుని మోసుకు తెచ్చుకున్నాను; ఎప్పుడు చదువుతానో ఎలా ఆస్వాదిస్తానో తెలియదు కానీ.

  ఈటీవీ ‘పాడుతా తీయగా’ ( అమెరికా ప్రోగ్రామ్ ) లో దంతుర్తి మాధవ్ అనే చిన్న కుర్రాడు ‘నడుమెక్కడే నీకు నవలామణి’ అనే పాటని చిలిపిగా పాడిన కార్యక్రమం చూసినప్పుడు కూడా మీరు గుర్తుకు వచ్చారు.

  ధన్యవాదములు,
  కె.కె. రామయ్య

 9. శర్మ దంతుర్తి says:

  రామయ్య గారు, పోతన భాగవతం చదవాలని నేను చిన్నప్పటి నుండీ అనుకునేవాడిని. మీ లాగే తి.తి.దే వారి పుస్తకాలు కొని చదవడం మొదలు పెట్టాను. అయితే ఇవి చదవడానికి సమయం కుదర్లేదు మొదట్లో. దీనికో చిన్న ఉపాయం కనిపెట్టాను. పూజ గదిలో పుస్తకాలు పెట్టి, రోజూ పూజ చేసుకునే సమయంలో కనీసం ఒక్క పేజీ అయినా చదువుతున్నాను. అలాగ ఒక్కొక్కటి చదవడం అలవాటు అవుతోంది. కౌముది పత్రికలో దీనిమీద వ్యాసాలు రాస్తున్నాను నా మట్టి బుర్రకి అర్ధమైనంతలో; వీలుంటే చూడండి.

  పోతన భాగవతంలో రసగుళికలు మొత్తం అన్నీ – పేజీ కిందన లింకు ఉంది చూడండి; నెల వారీగా. ప్రతీ నెలా సంచికలో “వ్యాస కౌముది” లో చూడవచ్చు. 2014 జనవరి నుండి అన్నీ ఉన్నాయి.

  పోతన భాగవతంలో రసగుళికలు (scroll down and see month by month) http://www.koumudi.net/library.html

  ప్రస్తుతానికి 31వ భాగం నడుస్తోంది. “జలధర నినద శంఖ శార్గ్య సుదర్శన, గదాదండ ఖడ్గాక్షయ బాణ తూణీర విభ్రాజితుండునూ, కిరీట మకర కుండల కేయూర హార కటక, కంకణ, కౌస్తుభ మణి మేఖలాంబర వలమాలికా విరాజితుండు” ఎంతకాలం నడిపిస్తాడో చూడాలి మరి.

  ఈమాటలో కూడా దానవోద్రేక స్థంభకుడు (http://eemaata.com/em/issues/201309/2202.HTML) అనే కథ ఒకటి ఉంది. ఈమాటలో లోకి వెళ్ళి నా పేరు మీద నొక్కితే అన్నీ బయటకి వస్తాయి. అక్కడ రాసిన కధల్లో నాకు బాగా నచ్చినది – వెడలెను కోదండపాణి అనేది. సొంత డబ్బా అనుకునేరు సుమా, పోతన భాగవతం గురించి మాట్లాడేరు కనుక ఇలా ఆ పద్యాల గురించి చెప్పాను. మీరు అవి చదవకపోయినా నేను ఏమీ అనుకోను. స్వస్తి.
  శర్మ దంతుర్తి

 10. శర్మ దంతుర్తి says:

మీ మాటలు

*