జన్నెకిడిశిన గిత్తగుండెల ప్రేమజనించింది

 

 

-కందికొండ

~

 

ఒక్క తల్లి గర్బంల నా బుజం మీద వాడు వాని బుజం మీద నేను శేతులేసుకోని ఉమ్మనీరులో తేలాడుకుంట, నేను ముందు వాడు ఎనుక అముడాళోళ్ళమై(కవలపిల్లలు) పుట్టినట్టు వాడు నన్ను అన్న.. అన్న… అని మస్తు ప్రేమతోని పిలిశెటోడు. నోట్లె అన్నను బయటికి తీశెటోడు కాదు. గుండెకే గుండె వుంటే ఆ గుండెకే పెదవులుంటే ఆ పెదవులు అన్న.. అని పిలుస్తె ఎంత డెప్త్‌గుంటది. ఎంత ప్రేమగుంటది. ఎంత పావురంగుంటది అట్లుండేది. ఒక్క ముక్కల జెప్పాల్నంటే వాడు అన్న. అనంగనే ఆ మాట నా కర్ణభేరిని తాకంగనే నా చెవులల్ల అమురుతం(అమృతం) పోషినట్టుండేది. వాని పేరు రాజు. వాంది మా పక్కిల్లు. వాడు మా అవ్వోడో, అయ్యోడో గాదు. మా కులపోడో, తలపోడో గాదు కాని మేం ఒకలంటే ఒకలకు మస్తిష్టం. ఎంతిష్టమంటె గుండె కోషి ఇచ్చుకునేంత ఇష్టం. మేము ఈ ఫేసులే తెలువని ఫేస్‌బుక్కు ఫ్రెండ్సు గాదు, మాకు తెలువులచ్చి, ఊహ తెలువకముందు నుంచెల్లే మేము ఒకలకొకలం తెలుసు.

వాళ్ళ అవ్వ, మా అవ్వ మా ఊరి పొలాలల్ల నాటేసెదానికి, కలుపు తీసెదానికి పోయెటప్పుడు మమ్ముల్నిద్దర్ని ఒక ముసలవ్వకు అప్పజెప్పి ఆ ముసలవ్వకు ఎంతో కొంత పైసలిచ్చి మా ఇంటి ముందు యాపశెట్టు కిందనన్నా, వాళ్ళింటి ముందు చింతశెట్టు కిందనన్నా వాకిట్ల ఇడిషిబెట్టి పోయెటోళ్ళట. నేను, రాజుగాడు అంబాడుకుంట (పాకుకుంట), పడి లేసుకుంట, నవ్వుకుంట, తుళ్ళుకుంట పొద్దుగూకెదాక మా అవ్వలు నాటుకు, కలుపుకుబోయి వచ్చెదాక వాకిట్ల ఆడుకునెటోళ్ళమట. అగో… మేము అప్పడిసంది ఫ్రెండ్స్..

మాది వరంగల్ జిల్లాల చిన్న కుగ్రామం. మా ఊళ్లె మాకత్తు పోరగాండ్లం శానామందిమె వుండెటోళ్ళం కని మేం ఇందరమే మంచి సాయితగాండ్లం (ఫ్రెండ్స్) అయినం..మా ఊరి బడిల ఐదో తరగతి వరకే వుండేది. మేము 1978ల బడికి పోవుడు మొదలుబెట్టినం. ఒక పెద్ద తాటాకు కమ్మల కొట్టంల ఏక్లాసోల్లను ఆక్లాసుల లెక్కన కొంచెం దూరం దూరంగా కూసుండబెట్టేటోళ్ళు. రాజుగాడు నేను పక్కపక్క పొంటి కూసునెటోళ్ళం. అప్పుడు షాబద్ బండలా… ఏమన్ననా.. న్యాల(నేల)మీద మట్లె(మట్టి)నె కూసోవాలే. లాగులు రాకిరాకి పిర్రలకాడ శినిగిపోయేటియి. లాగులు షినిగిపోకుంట వుండాల్నని యూరియ పిండి బస్తాల సంచులు తీసుకపోయి ముడ్డికిందేసుకోని కూసునెటోళ్ళం. అట్లా అందరు ఎవ్వల బస్తా వాళ్ళేసుకొని కూసుంటాంటె రాజుగాడు మాత్రం అన్న.. మన రొండు బస్త సంచులు ఒకదానిమీద ఒకటేసుకుని కూసుందమే అనెటోడు. కూసున్నంక నాకు ఎక్కువ జాగిచ్చి  వాడు సగం మట్టిల్నే కూసునెటోడు “ఎహె బత్తమీద కూసోర రాజుగా మట్టంటుతాందికాదుర నీ కాళ్లకు” అని నేనంటే “ఎహే నాకేంగాదు లేవె నువ్వు మంచిగ గూకో”అనెటోడు. పిచ్చి గాడిది రాజుగానికి నేనంటె శాన ప్రేమ.

ఎండకాలంల మా ఊరి చెరువులకు ఈతకు బోయెటోళ్ళం. మాకు ఈత ఎవ్వలు నేర్పలే. మాకు మేమే నేర్చుకున్నం. మేము నీళ్ళల్ల ముంచుకునుడు ఆట ఆడుకునెటోళ్ళం. ఎవ్వల వంతచ్చినప్పుడు వాళ్ళు  తతిమ్మోళ్ళను (మిగతావాళ్లను) ముంచాలె. ముంచుతాంటె తతిమ్మోళ్ళు తప్పిచ్చుకోవాలె. నావంతు వచ్చినప్పుడు రాజుగాడు దొరికినా నేను వాణ్ణి ముంచకపోయేది. వాని వంతచ్చినప్పుడు వాడు నన్ను ముంచకపోయేది.

మేము తాడిచెట్టు అంత ఎత్తునుంచెల్లి చెరువుల దునుకెటోళ్ళం. రాజుగాడైతే డై కొట్టెటోడు. ఇప్పటి పోరగాడ్లను సూతె నవ్వత్తది. స్విమ్మింగు పూల్లకు నడుముమంటి లోతులకు దిగెదానికి కూడా నడుము సుట్టు ట్యూబ్ వుండాలె. అంత నాపగాండ్లు బాయిలర్ కోడీ బతుకులయిపోయినయ్. “జిసం మే తాకత్ నియే దిల్‌మే దమ్ బీ నియే”. మా కత్తు (వయసు) పోరగాండ్లం అందరం గలసి తలా (ఒక్కొక్కరు) పది పైసలు కలేసుకొని టౌన్‌కుబోయి ఒక లబ్బరు  శెండు(బాల్)కొనుకచ్చుకున్నం. పెంకాసులు ఒకదాని మీద ఒకటి పెట్టి పల్లి ఆట ఆడెటోళ్లం.శెండుతోని కొట్టుకునుడు ఆట ఆడుకునెటోళ్లం. నన్ను రాజుగాడు, రాజుగాణ్ని నేను చిన్నగ కొట్టుకునెటోళ్ళం. వేరేటోళ్ళనయితే ఈడిషికొట్టేటోళ్ళం. తతిమ్మా పోరగాండ్లందరూ మమ్ములిద్దరిని తొండి బాడుకావ్‌లు అని తిట్టెటోళ్ళు.

మా ఊళ్ళె ఐదో తరగతి అయిపోంగనే మాకు T.C.లిచ్చిండ్లు. మేము వరంగల్‌కు పోయి U.P.S. బళ్ళె శేరికయినం. దీంట్లె 6th, 7th సదవాలె తరవాత హైస్కూల్ అది వేరే బడి మళ్ళా.

ఏడు గంటలకే ఒత్తుల వేడినీళ్ల తోటి తానం జేసి(స్నానం) రాజుగాడు, నేను తయారయ్యెటోళ్ళం. అప్పుడు మా అవ్వలు కట్టెల పొయ్యి మీద అన్నం, కూర వండతాంటెనే ఓ పక్క(వైపు) ఒత్తుల (కుండ)నీళ్లు కాగేటియి. ఏడుగంటలకే బువ్వ తిని రాతెండి టిపిని గిన్నెల (లంచ్ బాక్స్)అన్నం బెట్టుకొని ఐదు కిలోమీటర్లు కంకరరోడ్డు మీద చెప్పులు లేకుంట వట్టికాళ్లతోటి నడుసుకుంట బోయెటోళ్ళం. సాయంత్రం నాలుగ్గొట్టంగ  బడి ఇడిషిబెట్టేది. నాలుగునుంచెల్లి నాలుగున్నర దాక డ్రిల్లు (ఆటలు) పీరియడ్. బడి ఇడిషిబెడుతరు కాని గేటుదాటి బయటికి పోవద్దు. అక్కణ్ణె ఆడుకోవాలే. రాజుగాడు నేను గోడ దునికి ఇంటిబాట బట్టేది. టౌన్ నుంచెల్లి మా ఊరికి ఐదు కిలోమీటర్లు నడువాలే. అక్కడ ఆటలాడుకుంట కూకుంటే మాకు కుదురది గదా. ఎండకాలంల బుజాలమీద వయ్యిలు(పుస్తకాలు) పెట్టుకొని పోతాంటే చేతుల చెమట వయ్యిలకంటి (బుక్స్‌కు అంటి) చేతుల పదను(తడి)తోటి పుస్తకాలు కరాబయ్యేటియి. అప్పుడు వయ్యిలకు (బుక్స్‌కు) అట్టలేసుకుందామంటే న్యూస్‌పేపర్లు దొరుకకపోయేటియి. ఇట్లయితే కుదరదని మా ఊళ్ళె టైలర్”ఖాదర్” దగ్గర యూరియా పిండి బస్తాల సంచులతోటి చెరో (ఒక్కొక్కరం) వయ్యిల సంచి కుట్టించుకున్నం. ఇగ వయ్యిలు, కాపీలు,ఆ సంచులల్ల ఏసుకోని సంచి బుజానికేసుకోని పోయెటోళ్ళం. ఇప్పటి పొట్టెగాండ్లకు అన్ని సౌలతులు(సౌకర్యాలు) వున్నా సదివి సావరు. “సదువు సారెడు బలుపాలు దొషెడు” అయిపోయింది ఇప్పటి సదువు. యాసంగి సదువులు.

మా అప్పర్ ప్రైమరీ స్కూల్  హెడ్ మాస్టర్ పేరు బాలయ్య సారు. మేం ఆ బడిల శెరీకయ్యినప్పుడే ఆ సారు ఓ కొత్త ఇల్లు కట్టుడు సురువు జేషిండు(మొదలు చేశారు). ఆ కొత్తింటికాడ శానా చిల్లర పనులుండెటియి. మిగిల్న కంకర ఒక దగ్గర నుంచెల్లి ఇంకోదగ్గర కుప్పబోసుడు. ఇంటిముందు పోషిన మొరం కుప్పల  నేర్పుడు (సమాంతరంగ చేయడం), ఇటుకలు ఇరిగిన ముక్కలు ఒక దగ్గర, మంచి ఇటుకలు ఒక దగ్గర పేర్సుడు, గిలాబు కోసం దొడ్డు వుషికెను(లావు ఇసుకను) సన్నగ జల్లెడబట్టుడు, పదను(క్యూరింగు) కోసం గోడలకు, స్లాబ్‌కు నీళ్లుగొట్టుడు, అర్రలల్ల (రూమ్స్) బోసిన మట్టి అణుగాల్నని “దిమ్మీస”గుద్దుడు ఇసొంటియి.

మేం పల్లెటూరోళ్ళం మంచిగ పనిజేత్తమని తెల్లబూరు (White Hair) చెప్రాశి(ప్యూన్) యాకుబ్‌ని పంపిచ్చి మమ్ముల పిలిపిచ్చెటోడు బాలయ్య సారు. మేము సంకలు గుద్దుకుంట సంబురంగ సారు కడుపు సల్లగుండ అనుకొని సారు కొత్తింటి పని జేసెటానికి పోయెటోళ్ళం. మా లెక్కల (మాత్స్) సారు చెయ్యబట్టి మాకు బడంటె బయ్యమయ్యేది. లెక్కలేమో అర్ధం గాకపోయేది. a2+b2=2ab..అని ఏందేందో శెప్పేది. ఇంటి పనిచ్చేది(హోం వర్క్).  చేసుకరాకపోతే మా శేతులు తిర్లమర్ల జేపించ్చి బ్లాక్‌బోర్డ్ తుడిసేటి చెక్క డస్టర్‌తోటి పటపట కొట్టేది. ఒక్కొక్కసారి మాకు మస్తు కోపమచ్చి అరె.. మాకు అర్ధమైతలేవు సారు ఏంజెయ్యాలే అనాల్ననిపిచ్చేది. నోటిదాకచ్చేది కని ఆపుకునేది. అందుకే ఆ దెబ్బలకన్నా ఈ పనే నయ్యమనిపిచ్చేది.

మాకు కష్టం జేసుడంటే సంబురం. మేము పల్లెటూరోళ్లం, ఉత్పత్తి కులాలోళ్లం గదా,మా బతుకుల నిండా కష్టముంటది, కన్నీళ్లుంటయి, ఆకలుంటది, అవమానముంటది, పోరాటముంటది. అందుకే గద్దరన్న పాట రాయలే. “కొండ పగలేసినాం, బండలను పిండినాం, మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు గట్టినాం, శ్రమ ఎవడిదిరో సిరి ఎవడిదిరో” అని.. మేం బిచ్చగాండ్లకు ఎక్కువ, మధ్య తరగతోళ్లకు తక్కువ. దిగువ మధ్య తరగతోళ్లం. బతుకు దినదిన గండమయినోళ్లం, దిగులే బతుకయినోళ్ళం ఇప్పటికి కూడా అట్లనే వున్నయ్ మా బతుకులు. పనిజేసి పగటాల్ల   కాంగనే కాళ్లు రెక్కలు కడుక్కొని మా రాతెండి టిపిని గిన్నెలల్ల తెచ్చుకున్న  అన్నం తినెటోళ్ళం.

తింటాంటె బాలయ్య సారు భార్య మాకు రొండు బొక్క పిలేట్లిచ్చి (పింగాణి ప్లేట్స్) వాళ్ల ఇంట్ల కూరలు తెచ్చిచ్చేది. ఆమె చేతికి మొక్కాలే. ఏమేషి వండేదో ఏమోగాని, మస్తు రుసుండేటియి. అప్పుడప్పుడు ఆమె “సాంబార్” బోశేది. మాకు పప్పుశారు, పచ్చి పులుసు తెలుసుకని ఈ సాంబార్ తెల్వది. మా ఇండ్లళ్ల అప్పుడు సాంబార్ శెయ్యకపొయ్యేది. దాని పేరు సాంబార్ అని కూడా మాకు సరిగ్గ తెల్వది. ఆ సాంబర్ పోసుకొని తింటాంటే శానాసార్ల రాజుగాని తోటీ నేననేది “అరె రాజుగా ఈ సాంబారేందిరా గింత రుశి పాడుబడ్డది” అని వాడనేది అన్న.. ఇంకింత బోసుకోవే…. పోసుకో అని మొత్తం నా పల్లెంల కుమ్మరించెటోడు లంగగాడు. నేనంటె వాణికి సచ్చేంత ఇష్టం. మొత్తం నాకే పోషినవేందిర పిచ్చిగాడిది అని తిడితే నవ్వేది. అన్న నువ్వు పిచ్చిగాడిది అంటె నాకు మంచిగనిపిస్తదన్న అని మళ్ళా తిట్టిపిచ్చుకునేటోడు.

మా ఊరినుండి టౌనుకు పోతాంటే కుడిచెయ్యిరోకు (రైట్ సైడ్)”లంజపుట్నాల” చెట్టుండేది. ఈ చెట్టు ప్రత్యేకతేందాటంటే ఆ చెట్టు పుట్నాలు (పండ్లు) సప్పుడు జెయ్యకుంట, మాట్లాడకుంట, సైలన్స్‌గా, చీమె చిటుక్కుమన్నంత సప్పుడుగూడ జెయ్యకుంట తెంపుకొని తింటె మస్తు తియ్యగ వుంటయంట. తెంపుకుంట మాట్లాడినా, నోట్లెబోసుకొని నమిలేముందు మాట్లాడినా, గుసగుస పెట్టినా, నవ్వినా, దగ్గినా, తుమ్మినా, చేదు అయితయట. అందుకే వాటికి లంజపుట్నాలు అని పేరొచ్చిందట అని ప్రచారంల వుండేది. ఇసొంటి చెట్లు చానా ఊళ్లల్ల వుంటయ్. ఈ ఇత్తునం (విత్తనం) ఇప్పుడు శానా తగ్గింది. ఇప్పటి పొట్టెగాండ్లకు తెల్వకపోవచ్చుకని మా కత్తోళ్ళ (వయసు)కు తెలుసు.

రాజుగాడు నేను ప్రతిరోజు బడికిపోయెటప్పుడు వచ్చెటప్పుడు తప్పకుంట “లంజపుట్నాల” శెట్టు పుట్నాలు(పండ్లు) తెంపుకునెటోళ్లం. రాజుగాడు వుస్తు కోతిగాడు, ఎచ్చిడోడు, వుచ్చిలి మనిషి. తెంపుతానంటెనన్న నవ్వేది, లేకపోతే దగ్గేది, తుమ్మేది. నోట్లెబోసుకోని నవులేముందన్న నవ్వేది, గుసగుసబెట్టేది. ఏదో ఒకటి మాట్లాడేది. రోజులు, నెలలు, సంవత్సరాలు వాంది ఇదే కత. “అరె రాజుగా నీకు దండం బెడుత ఈ రోజన్నా మాట్లాడకురా, ఇగిలియ్యకురా, దగ్గకురా, తుమ్మకురా అని వాణి గదువపట్టుకోని బతిలాడెటోణ్ణి (రిక్వెస్ట్) సరే.. అన్న.. అనేటోడు.. తీరా…పుట్నాలు తినేముందు మళ్లా ఏదో ఒకటి చేశెటోడు.

అప్పుడు మా దగ్గర పైసలు అసలే వుండేటియి కాదు. మాకు మా అవ్వనాయినలు కూడా పైసలిచ్చెటోళ్ళు గాదు. పాపం వాళ్ల దగ్గరకూడా వుండేటియిగాదు. మాయి మస్తు లేమి కుటుంబాలు కని మాకు తొవ్వ ఖర్సులు, శేతి ఖర్చులుంటయిగద, మాకు కోముటోళ్ళ దుకాండ్ల కొబ్బరి శాకిలేట్ళు, ఉప్పు బిస్కీట్లు కొనుక్కోవాల్నని వుండేది. సిన్మాలు సూడాల్నని వుండేది. మేం పైసలు సంపాయించుడు కోసం “పెంట బొందలమీద  సీసవక్కలు ఏరుకునెటోళ్ళం” చెరో యూరియా బస్తసంచి పట్టుకొని మా ఊరంత తిరిగి ఏరుకునెటోళ్ళం. అప్పుడు మా ఊళ్ళె ఖాళీ జాగాలల్ల  ఎక్కువ చిలుక పర్రాకు చెట్లు, ఎంపలిచెట్లు, బోడసరం చెట్లు, జిల్లేడు శెట్లు, శెవుకచెట్లు వుండేటియి.

ఎంపలి చెట్లల్ల ఎక్కువ సీసవక్కలు దొరికేటియి. మా బస్తాలు నిండంగనే తువ్వాలలు  సుట్టబట్ట చేసుకొని నెత్తిన బెట్టుకోని టౌన్‌కు బోయేటోళ్ళం. రాజుగానికి నేనంటె ఎంత ప్రేమంటే పెద్ద సీసవక్కల బస్త వాడెత్తుకొని చిన్న సీసవక్కల బస్త నాకు ఎత్తెటోడు.” అరె… పెద్దది నేనెత్తుకుంటరా అని నేనంటె ఎహె.. ఊకో అన్న.. నీది సుకాశి పాణం(సుకుమారమైన). నువ్వు నా అంత కష్టం జెయ్యలేవే. నేనే పెద్దది ఎత్తుకుంటలే అనెటోడు. అంతంత బరువులు ఎత్తుకొని పోతాంటె కూడా ఆ “లంజపుట్నాల” చెట్టుకాడ మాత్రం ఆగెటోళ్లం. పుట్నాలు తెంపుకొని తినేముందు మళ్లా రాజుగాడు నవ్వుడో, తుమ్ముడో, దగ్గుడో చేసెటోడు. అరెయ్… రాజుగా లుచ్చ బాడుకావ్ గిట్ల జేసేదనికేనార ఆపింది అని నేను తిడితె ఏం జెయ్యాల్నన్నా నవ్వు ఆగుతలేదే అని మళ్లా కిలుక్కున నవ్వెటోడు. టౌన్‌కుబోయి సీసవక్కలు జోకి(తూచి) అమ్మి వచ్చిన పైసలు చెరిసగం పంచుకునెటోళ్లం. కని ఇప్పటి శాతగాని దొంగనాకొడుకులు ఆడోళ్ళ మెడలల్ల బంగారు గొలుసులు తెంపుకపోతాండ్లు. మళ్ళ వాళ్లకు ఈ పోలీసోళ్ళు మస్త్ పోష్(Posh)గా స్టైల్‌గా ఓ పేరు బెట్టిండు చైన్ స్నాచర్లట.. చైన్ స్నాచర్లు.

ప్రతిరోజు ఈ పది పన్నెండు కిలోమీటర్లు బడికి నడువలేక మేం సాంఘిక సంక్షేమ హాస్టల్ల  చేరినం. మాకు పొద్దున 8.30కు పప్పుతోని, మళ్లా సాయంత్రం 5.30 గంటలకు కూరగాయలతోటి అన్నం బెట్టేటోళ్ళు  పొద్దున, సాయంత్రం. పచ్చిపులుసు మాత్రం రొండు పూటల వుండేది. మేము లైన్ల నిలబడి రాతెండి పల్లాలల్ల అన్నం బట్టుకోని తినెటోళ్ళం. అప్పుడప్పుడు అన్నంల పురుగులత్తె పక్కన పారేశి తినేటోళ్ళం. వారానికోసారి మాకు హాస్టల్ల ఉడుకబెట్టిన కోడిగుడ్డు బెట్టేటోళ్ళు. రాజుగాడు వాణి గుడ్డు గూడ నాకేసెటోడూ. అరె లంగగాడిది నీది నువ్వు తినరాదురా అని నేనంటే “అన్న… నువ్వొకటి నేనొకటానే” అనెటోడు. బళ్లెగాని రాజుగాణ్ని ఎవ్వలన్న కొడితె ఉరికచ్చి నాకు శెప్పెటోడు.

రాజుగాడు జెర దైర్నం (ధైర్యం) తక్కువ మనిషి. నా అంత మొండోడుగాదు. నేను మోర్‌దోపోణ్ణి. రాజుగాణ్ణి కొట్టినోణ్ణి రాజుగాడు నాకు సూపియ్యంగనే నాకు సింహాద్రి సిన్మాల NTRకు వత్తదిగదా కోపం BP, BP అని కుడిశెయ్యితోని తలకాయ కొట్టుకుంటడు సూడుండ్లి గట్లచ్చేది కోపం.  వాని గల్లబట్టి తెరి బహెన్ కీ, అని గిప్ప… గిప్ప… గుద్దెటోణ్ణి మళ్లా రాజుగాడే ఏ వద్దు ఇడిషెయన్న ఇడిషెయ్ అని బతిలాడేటోడు నన్ను గుంజుకపొయెటోడు. అరాజుగాడు చానా ప్రేమ మనిషి ఎదుటోళ్లు బాధపడితే సూడలేదు. మేం హాస్టల్ల ఒకటే రూంల పక్కపక్కన ఇనుప సందూగలు పెట్టుకొని ప్యాన్లులేని రూంల పండుకొని సదువుకునెటోళ్ళం… అట్లా.. పదో తరగతికి వచ్చినంక వాణికి సదువు అబ్బలే పది పేలయ్యిండు. ఎవుసం (వ్యవసాయం) పనులల్లబడ్డడు. నేను పది పాసై ఇంటర్‌ల మళ్ళా  ఇంటర్ డిగ్రీల చేరిన. రోజు ఊళ్ళె కలుసుకునుడు, తిరుగుడు… అన్నీ మామూలే…

రాజుగాడు శిన్నప్పుడు కర్రెగ, పొట్టిగ, బక్కగ, మట్టసన్నంగ వుండెటోడు కని ఇరవై సంవత్సరాలు దాటినంక మంచి ఎత్తు పెరిగిండు. మంచి శలీరం(శరీరం) వచ్చింది. మా ఊళ్ళె రాజుగాణికి సుజాత అనే పిల్లతోని జత కుదిరింది. ఆ పిల్లకు ఓ పదిహేడు సంవత్సరాల వయసుంటది. వాళ్ళిద్దరికి ఎట్లా కుదిరిందో ఏమోగాని ఇద్దరు గలిసి బాగ తిరిగెటోళ్ళు. ఒకల్ను సూడకుంట ఒకలు వుండేటోళ్ళుగాదు. రాజుగాడు రోజూ రాత్రి నా దగ్గరికచ్చి ఆ పిల్లతోణీ ఎక్కడెక్కడ తిరిగింది ఏమేం తిన్నది ఏమేం జేసింది అన్ని శెప్పెటోడూ. ఆఖరికి ఎన్నిసార్లు సెక్స్‌లో పాల్గొన్నది ఎట్లెట్ల పాల్గొన్నది, ఎక్కడెక్కడ పాల్గొన్నది కూడా శెప్పెటోడు. మా ఇద్దరి మధ్య శిన్నప్పన్నుంచి పెద్ద దాపరికాలుండేటియి కావు. వాడు ఇవ్వన్ని శెప్పంగనే నేను అఫ్సోస్(ఆశ్చర్యం) అయ్యెటోణ్ణి కాదు. అట్లాంటియి వాడు నాకు గతంల శానా జెప్పిండు. వాణి అక్రమ సంబంధాల గురించి.

ఇది ఏడవది. ఈ ఏడుగురిల నలుగురు పెండ్లయినోళ్ళు.. ముగ్గురు పెండ్లిగానోళ్ళు.ఈ సుజాతకు కూడా ఇంకా పెండ్లిగాలే. రాజుగాడు సిన్నప్పుడు మస్తు అమాయకుడు. వాణికి ఈ పాడు గుణం ఎక్కణ్ణుంచి వచ్చిందో ఏమోగాని ఆడోళ్ళను బెండుగాలాలు ఏషి మొట్టపిల్ల( బురుద మట్టలు) చాపల పట్టినట్టు పట్టెటోడు. ఒకరోజు పగటీలి ఎండల వగిరిచ్చుకుంట(ఆయాసపడుకుంటా) ఉరికచ్చి అన్న.. కొంచెం మంచినీళ్ళియ్యె దూపయితాంది అని చెమటలు తుడుసుకుంట నా పక్క పొంటి గాడంచల కూసున్నడు. నేను ఇంట్లకుబోయి శెంబుల నీళ్లు తెచ్చిచ్చిన. ఏందిర రాజుగ మొత్తం చెమటతోని తడిసిపోయినవ్ అంటే ఆ గంగ లేదా అన్న … ఆమెతోని సెక్స్‌ల పాల్గొంటాంటె ఆమె మొగడచ్చిండు. సైకిల్ సప్పుడు ఇనబడంగనే దన.. దన ఎనుక తలుపు తీసుకొని నిమ్మలంగ రౌతుల గోడ దునికి వచ్చిన అని ఒకటే నవ్వుతాండు. “అరె ఒకవేళ వాడు సూత్తె ఏందిరా పరిస్థితి అంటే  ఎహె.. నా జాగర్తల నేనుంటా అన్న.. ఏడుగురిని ఎట్ల మెంటన్ జేత్తాననుకుంటానవ్ అని జెరంత గర్వంగ నవ్వెటోడు.

ఒకరోజు రాజుగాడు నేను మా ఊరి చెరువు కట్టకు పోయినం. అక్కడ కల్లు తాగినం. మాకు మంచిగ కిక్కెంకింది. ఏవేవో ముచ్చట్లు మాట్లాడుకుంట నడుసుకుంట వత్తానం. “అన్న.. గామధ్య ఒక సిత్రం జరిగిందే శెప్పనా” అన్నడు. “నీ గురించి నాకు తెలువని శిత్రమేందిరో అని నేనన్నా. టౌన్‌ల “నవత” లేదా అన్న.. అన్నడు. ఆ పిల్ల ముచ్చట నాకు తెలుసుకదరా అన్నా. ఎహె.. ఇనన్నా శెప్పెదాక అన్నడు. సరె శెప్పరా అన్నా. మొన్న ఆ పిల్ల వాళ్ల అమ్మను లైన్లకు తెచ్చి సెక్స్‌ల పాల్గొన్న అన్నడు.

నాకు ఎంటనే చలం మైదానంల నవలల నాయకుడు అమిర్ గుర్తుకచ్చిండు. ఇంక నయ్యం అమిర్‌కు నచ్చిన  తుర్కోల్ల పిల్లను నాయిక రాజేశ్వరితోనే మాట్లాడించి ఒప్పిచ్చినట్టు, పిల్లను పంపిచ్చి తల్లితోని మాట్లాడిచ్చి ఒప్పియ్యలె అనుకున్న మనసుల. మరి నవతకు తెలుసార అని అడిగిన. అన్న. నేను పిచ్చోనిలెక్క  కనిపిస్తాన్నానె నీకు అన్నడు. నాకు కొంచెం ఇబ్బందిగా బాధగా అనిపిచ్చింది.నేను రాజుగాణి మీద చానా కోపం జేసిన అరెయ్ రాజుగా నువ్వు జన్నెకు ఇడిషిన కొల్యాగవు అయిపోయినవ్‌రా ఊళ్ళె. ఏందిరా ఈ ఆంబోతు చేష్టలు. మనిషివా, పశువువురా అన్న. అరె ఏందన్న కోపంజెత్తవ్ అన్నడు. లేకపోతే ఏందిరా జన్నెకిడిషిన కోడె ఊరిమీద పడి దొరికిన శేను దొరికినట్టు మేసి బాగ బలిసి “మదం”బట్టి కంట్లెబడ్డ ఆవునల్లా ఎక్కినట్టు (సెక్స్ చేసినట్టు) శేత్తాన్నవ్ ఎట్లుండెటోనివి ఎట్లయ్‌నవ్‌ర అన్నా. అరె ఊకో అన్న.. శిన్నశిన్న ముచ్చట్లను పెద్దగజేత్తవ్ సప్పుడుజేకపా అని హ..హ..హ… అని నవ్వుతాండు. అరె! నేనింత సీరియస్‌గా తిడుతాంటె నవ్వుతానవేందిరా అంటె నువ్వు కోపంజెత్తె నాకు నవ్వత్తదన్న అనెటోడు.

అరెయ్ రాజుగా నీకు మాంసం ముద్దల రాపిడిల వున్న మజా తగిలింది. అది నిన్ను మాయజేసింది. ఏదో ఓ రోజు అది నిన్ను మాయంజేసి నీ పేరు మాపుంది. కత్తిపట్టినోడు కత్తితోనే పోతడు. మందు తాగెటోడు మందుతోనె పోతడు. అక్రమ సంబంధాలు పెట్టుకునెటోడు అక్రమ సంబంధాలతోనే పోతర్రా అన్నా.. అన్న..నువ్వు చీమను గూడ బూతద్దములబెట్టి సూత్తవ్. ఏంగాదుకని పావే అన్న.. అని నాలును తిప్పిండు.. లైట్ తీసుకో అన్న .. అన్నట్టుగ..

ఇంటికచ్చినంక ఇంతంత బువ్వతిని మా  యాపశెట్టు కింద గాడంచ వాల్చుకోని పడుకున్నా. కల్లుతాగి ఇంత తింటే మస్తు నిద్రస్తది. పొద్దాటి కల్లయితే ఇంకా మస్తు నిద్రస్తది. ఆ రోజు తాగింది పొద్దాటి కల్లే. బలిమీటికి కండ్లు మూసుకున్న నిద్రత్తలేదు. రాజుగాని మాటలే యాదికత్తానయ్. పిచ్చిగాడిది గిట్ల తయారయ్యిండేంది అని బాదనిపిచ్చింది. శిన్నప్పటినుంచెల్లి వాడంటె నాకు బొచ్చడంత పావురం. మెల్లంగ నా మనసు సెక్స్ గురించి ఆలోసించుడు మొదలుబెట్టింది. అవును సెక్స్‌ల ఏమున్నది. ఆడోళ్ళ యోనిల మాంసం ముద్దలు, మొగోళ్ళ అంగంల మాంసం ముద్దలు ఓ ఐదు నిమిషాలో, పది నిమిషాలో , మా అంటె ఓ అర్ధగంట ఒకదానికోటి రాపిడి చేసుకునుడే గదా. దీనికి రాజుగాడు ఎందుకు ఇంత బరితెగిచ్చిండు.

రాజుగాని తోని పండుకునే ఆడోళ్ళు ఒకలా, ఇద్దరా, ఇయ్యాల కట్టమీద జెప్పిన నవత తల్లితోని గలిపి ఎనమిది మంది వాళ్ళవాళ్ల తల్లితండ్రులను ఆడిపిల్లలు, భార్యలు భర్తలను, తల్లి పిల్లలను ఎందుకు మోసం జేత్తాండ్లు అని ఆలోసిత్తే నా బేజ గరమెక్కి గుండె గాబరయ్యింది. మరి ఈ పెద్దపెద్ద సార్లు, మేధావులు, సిన్మాలల్లా, కథలల్ల, మీటింగులల్ల, ప్రేమే గొప్పది, సెక్స్‌ది ఏముది అని సెక్స్‌ను గంజిల ఈగను తీసి పారేషినట్టు తీసిపారేత్తరేంది అనిపిచ్చింది. ప్రేమ గొప్పదే కాని సెక్స్‌కు జిందగిల ప్రాముఖ్యతే లేదనుడు ఏ గలత్ బాత్‌హై ఎందుకంటె ఇంట్ల ముసలి అత్తమామలుంటె, అమ్మ నాయినలుంటె సెక్సువల్ జీవితానికి ఇబ్బందిగ వుంటాందని “ప్రైవసి” మిస్సయితాందని వృద్ధాశ్రమాలల్లకు  అత్తమామలను, అమ్మనాయినలను తోలిన కోడండ్లను, కొడుకులను నేను జూసిన.

పసి పోరగాండ్లను హాస్టలల్ల పారేసిన తల్లితండ్రులను జూసిన, మొగుడు నాపగాడని, ఆడిబట్ల శెకల్ ఎక్కువున్నయని సెక్స్‌గ్యానం (గ్నానం) సరిగ్గలేదని మొగోళ్లనొదిలేసి లేచిపోయిన పెండ్లాలను జూసిన. పెండ్లం పెయ్యిల (ఒంట్లో) చెటాక్ మాంసం లేదని, సెక్స్ సుఖం సరిగ్గా ఇత్తలేదని అమాయకమైన ఆడిపోరగాండ్లకు ఇడుపు కాయితాలిచ్చిన మొగండ్లను జూసిన, కొందరు బీద తల్లితండ్రులయితే అల్లుని కాళ్లమీదపడి ఆడిపొల్ల బతుకుమీద మచ్చపడుతది మళ్ళ ఎవరు పెండ్లి జేసుకోరు అని ఏడిషిన ఇనకపోయేది. నాకయితె మస్తు కోపం, దుఃఖమచ్చి వాణిగల్లబట్టి అరె.. ఓ మాకే.. అర కిల మాంసం అటో ఇటో ఎందుకురా పొల్ల బతుకు ఆగం జేత్తాన్నవ్  అని అడుగాల్ననిపిచ్చేది. “కండకావురం గుండె పావురాన్ని” డామినేట్ చేస్తాంది. చానాదిక్కుల  చానాసార్ల ప్రేమ గొప్పదే, సెక్స్ కూడా గొప్పదే అది మనుషుల బతుకులల్ల బలమైన రోల్‌ను ప్లేజేత్తాంది. నాకనిపిస్తది. పెండ్లం మొగల బతుకు సర్కస్ అయితే సెక్స్ రింగ్ మాస్టర్ అసొంటిది. అది కనిపియ్యది. కనిపించకుంట కథ నడిపిత్తాంటది. రింగ్ మాస్టర్ లేకపోతే సర్కస్ ఆగిపోద్ది. అక్కణ్ణే వున్నది అసలు కథ. “ఏడేడు సముద్రాల అవుతల మర్రిశెట్టు తొర్రల మాయల ఫకీరు పాణం వున్నట్టు” కని బయిటికి ఒప్పుకోరు ఎవలు. పెద్ద పెద్ద సార్లు.

చిన్నగ మెల్లగ రాజుగాడు ఎక్కువ టయిము(టైం) సుజాతతోనే గడుపుతాండు. వాళ్ల బంధం రోజురోజుకు బలపడుతాంది అన్ని విధాలుగా, ఒక దినం వీళ్ల ముచ్చట సుజాతోళ్ళ ఇంట్ల తెలిసింది. ఆ పొల్లోల్ల అవ్వ, అయ్య ఆ పొల్లను బాగ తిట్టి కొట్టిండ్లట ఎందుకంటె సుజాత గర్భవతి అయిందట. ఇంక ఆ ముచ్చట బయటికి పొక్కలే (రాలేదు). సుజాత అవ్వ, అయ్యకె తెలుసు”నా కడుపుల శెడబుట్టినవ్ కదనే, ఇంతంత పురుగుల మందు తాగి సావరాదే” అని సుజాతోల్ల నాయిన అన్నడట.

ఇజ్జతికి సుజాత నిజంగనె పురుగుల మందు తాగింది. టౌన్‌కు  తీసుకపోతే సర్కారు దవాఖాండ్ల సచ్చిపోయింది. సుజాతను కోతకాండ్ల (పోస్ట్‌మార్టం రూం) ఏషిండ్లు. మా ఊరు ఊరంతా దవాఖాన కాన్నే వున్నది. డాక్టర్లచ్చి సుజాతను కోషి పోస్ట్ మార్టం జేషిండ్లు. సుజాత కడుపుల సచ్చిపోయిన ఏడు నెలల పిండం ఎల్లింది. ఆడిపిల్లో, మొగపిలగాడో తెల్వది ఎవలం అడుగలేదు. మళ్లా కడుపుల్నే పెట్టి కుట్లేషిండ్లు. పాపం పదిహేడేండ్ల సుజాత ఇంకా లగ్గం గూడా కాని సుజాత, సూడసక్కని గుండ్రని మొఖపు సుజాత బతుకే సూడని సుజాత మస్త్ బౌషత్(ఫ్యూచర్) వున్న సుజాత సచ్చిపోవుడే భరించలేని బాధ అయితే సుజాత కడుపుల ఇంక కండ్లు తెరిశి లోకమే సూడని ఏడు నెలల పసిగుడ్డు కూడా సచ్చిపోవుడు మా ఊరోళ్ళు తట్టుకోలేకపోయిండ్లు. అందరి గుండెలు అవిషిపోయినయ్. ఆడోళ్ళయితే రొంబొచ్చెలు గుద్దుకుంట ఏడిషిండ్లు. మా ఊరోళ్ళ కండ్లు కట్టలు తెగిన కరిమబ్బులయినయ్. ఒక్కొక్కల ఒక్కొక్క కన్ను ఒక్కొక్క నయగార జలపాతమైంది. మా ఊరు కన్నీటి బంగాళాఖాతమైంది. సుజాత శవాన్ని తీసుకపోయి మా ఊరి చెరువాయకు బొందబెట్టిండ్లు.

సుజాత సచ్చిపోయిందని తెల్వంగనే రాజుగాణ్ణి  ఊళ్ళకు రావద్దని వాళ్ల సుట్టాల(బంధువుల) ఇంటికి వాళ్ళోళ్ళు పంపిచ్చిండ్లు. రొండు రోజుల తరువాత రాజుగాడు మళ్లా ఊళ్ళెకు వచ్చిండు సుట్టాలింట్ల వుండలేక. పాపం సుజాత అవ్వ, అయ్య రాజుగాని మీద కేసుపెట్టలే. రాజుగాని ఇంటిమీదికచ్చి లొల్లిగూడ చెయ్యలే. రాజుగాణ్ణి తిట్టలే, కొట్టలే. నల్లా అండ్లె తెల్లా అండ్లే మా సుజాత అవుసు(ఆయుస్సు)గాడికే వున్నది గాడికే బతికింది. అవుసు గూడి సచ్చిపోయింది అన్నరు ఊకున్నరు.

రాజుగాడు నాదగ్గరకొచ్చి నన్ను అమురుకొని బాగ ఏడిషిండు. ఊకోర రాజుగ ఊకో దైర్నం (ధైర్యం) చెడకు అని ఊకుంచిన. సుజాత కడుపుల ఏడు నెలల పిండం ఎల్లిందట అన్న. అనుకుంట ఒకటే ఏడుసుడు, ఊకోర పిచ్చిగాడిది ఊకో అన్ని తలుసుకోకు, తలుసుకుంటాంటె ఏడుపు ఎక్కువైంది. మరిషిపో అని మళ్ళా ఊకుంచిన. ఏడిషి ఏడిషి ఆగి కొంచెం సేపటికి కడుపుల ఏడు నెలల పిండం ఎల్ల్లిందట అన్న. రొండు పాణాలు తీసినట్టయ్యిందే అని మళ్ళా ఏడిషెటోడు. అట్లా ఐదు రోజులు ఏడిషి ఊకున్నడు. బాయికాడికి బోయి ఎవుసం (వ్యవసాయం) పనులు చేసుకుంటాండు. జెర మామూలు మనిషయ్యిండు.

సుజాతోళ్ళ అవ్వ, అయ్య రాజుగాణ్ణి ఒక్క మాటనకపోవుడు, పోలీస్ కేసుబెట్టి జెయిల్ల ఏపియ్యకపోవుడు,  కండ్లు మొత్తె, కండ్లు తెరిత్తె సుజాత గుండ్రని మొఖం రాజుగానికి గుర్తుకచ్చుడు, తిరిగిన జాగాలు , సూశిన సిన్మాలు, శేషిన షికార్లు, మాట్లాడుకున్న ముచ్చట్లు, ఏసుకున్న జోకులు, చేసుకున్న బాసలు, తిన్న తిండి, తిరిగిన బండి, బరిబాత(నగ్నంగ) కావలిచ్చుకొని (కౌగిలించుకొని) పట్టెమంచం మీద పండుకున్న రాత్రులు అన్నిటికన్నా ముఖ్యంగా సుజాత కడుపుల కండ్లు తెరువకుంటనే కండ్లు మూసిన ఏడునెలల పిండం అన్ని కలెగలిసి రాజుగాణి గుండెను యాక్సా బ్లేడై(Acsa Blade) రప్ప్రరప్ప… రప్పరప్ప.. రప్పరప్ప కోశినయ్.

సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు కోత్తాంటే… కోత్తాంటె… కొత్తాంటె.. ఇనుప పైప్‌ను ఆక్సాబ్లేడ్ కొత్తాంటె నిప్పులెట్ల చిల్లుతయ్ అట్లా.. సుజాత సచ్చిపోయినంక ఏడో రోజున ఆ పిల్ల జ్ఞాపకాల యాక్సాబ్లేడ్ (Acsa Blade) కోతకు, రాపిడికి జన్నెకిడిషిన కోల్యాగ(గిత్త) అసొంటి రాజుగాణి గుండెల ప్రేమాగ్ని జనించింది. అది పశ్చాతాపమై ప్రజ్వరిల్లి వాణి గుండెకు అగ్గంటుకున్నది. ఎండకాలం మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండల రాజుగాడు  వాళ్ళ చెలుకకాడ “నవక్రాన్” పురుగుల మందు డబ్బా మూత తీసి గటగట గటగటా తాగిండు.

అదే సర్కార్ దవాఖాండ్ల సుజాత సచ్చిపోయిన సర్కార్ దవాఖాండ్ల మూడు రోజులు సావుతోని కొట్లాడి, కొట్లాడి, అవస్థ  అవస్థ.. అవస్థయితాంది, కడుపుల మండుతాంది అనుకుంట ఏడిషి, ఏడిషి, ఇనుప మంచం మీద తండ్లాడుకుంట, తండ్లాడుకుంట.. మూడోరోజు తలకాయ కుడిపక్కకు వాల్చి కండ్లల్లకెల్లి కన్నీళ్ళూ కార్సుకుంట సచ్చిపోయిండు. “లంజపుట్నాలల్ల” చేదును నాకు మిగిలిచ్చి తీపిని వాడు తీసుకొని తిరిగిరాని లోకాలకు మా రాజుగాడు పిచ్చిగాడిది నన్ను ఒంటరిని జేసి బయిలెల్లిపోయిండు.

*

మీ మాటలు

 1. venu udugula says:

  న్యాచురలిజం వల్ల కథ లో అద్భుతమైన వాతావరణం క్రియేట్ అయింది. రా ఫుల్ నేరేషన్ తో ఆసాంతం ఆసక్తిని రేకెత్తిస్తూ నిజాయితీ గా కథ నడపటం ప్రశంసనీయం …. ముఖ్యంగా కథలో వాడిన టెక్స్ట్ వల్ల మనకు ఒక nostalgic ఎక్సపీరియెన్స్ కలుగుతుంది.ఇంకొంచం నిడివి తగ్గించి ఉంటే ఇంకా ఎఫెక్టీవ్ గా ఉండేది . ఓవరాల్ గా its a heart wrenching short story !

 2. కందికొండ says:

  వేణు udugula కు ధన్యవాదాలు

 3. KVR MAHENDRA says:

  గొప్పగ రాశినవన్న …
  కండ్ల ముంగట జీవితం కనవడ్డది….
  అప్పుడప్పుడు రాయన్నా…..

 4. లంజపుట్నాలల్ల చేదును నాకు మిగిలిచ్చి తీపిని వాడు తీసుకొని తిరిగిరాని లోకాలకు మా రాజుగాడు పిచ్చిగాడిది నన్ను ఒంటరిని జేసి బయిలెల్లిపోయిండు.ఇది కథో స్వగతమో ఏమో కానీ తెలంగాణా బాల్యం చిత్రిక పట్టినట్టు ఉంది. తెలంగాణా లో కొన్ని మాటలు మిగతా ప్రాంతాలకు బూతులాగా అనిపించినా కుట్రా కుతంత్రం లేని స్వచ్చమయిన మాటలు ఈ కథనం లో ఉన్నాయి. ఖదీర్ బాబు, నామిని మాటల్లో బూతును ఆహ్వానించిన సాహితీ లోకం తెలంగాణా బాషలో ఉన్న నుడికారం ను తదానుభూతి తో ఆహ్వానించే అంత గొప్ప సంస్కారం తెలుగు సాహితీ సామాజానికి లేదు, దాని మూలాలు ‘తెలంగాణా లో కవులు పూజ్యం’ అన్న అహంకారం లో ఉన్నాయి. బూతు రాసినా సరసం రాసినా కేవలం ఒక ప్రాంతానికి చెందిన కొందరు పెట్టి పుట్టిన మగానుభావులకే సాధ్యం అనే లా ఉంది. ఇక పోతే వచనం బ్రాకెట్ లో స్టాండర్డ్ అనే బ్రమలో ఉన్న పర్యాయాలు తీసేస్తే మంచిది. ఇకపోతే “కొండ పగలేసినాం, బండలను పిండినాం, మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు గట్టినాం, శ్రమ ఎవడిదిరో సిరి ఎవడిదిరో” చెరబండరాజు రాసాడు. మొత్తంగా ఈ మధ్య కాలం లో గొప్ప వ్యదాత్మక జీవిత కావ్యం ఇదే ఒరవడిలో నవల రాస్తే గొప్ప నవలగా మిగిలే అనుభవాల బ్రతుకు చిత్రం ఈ కథనం లో ఉంది సారంగలో ఇంతమంచి కథనాన్ని ఇచ్చిన సారంగ బాధ్యులకు ధన్యవాదాలు :)

 5. కందికొండ says:

  గుర్రం సీతారాములన్న కు ధన్యవాదాలు మీ సూచనలు చాలా బాగున్నాయి చెర బండ బదులు గద్దర్ రాసా క్షమించాలి

 6. కందికొండ says:

  Kvr మహేంద్ర గారికీ ధన్యవాదాలు

 7. కె.కె. రామయ్య says:

  కధ మస్త్గుంది. గుండెకు అగ్గంటుకున్నది కందికొండ గారు. ధన్యవాదాలు.

  ‘తెలంగాణాలో కవులు పూజ్యం’ అన్న మూర్ఖులేవరు సీతారాములు తమ్మీ. పాలకుర్తి సోమనాథుడు, ఓరుగల్లు బమ్మెర పోతన, నుండి సుద్దాల హనుమంతు, దాశరధి, సి. నారాయణరెడ్డి, దిగంబర కవితోద్యమ చెరబండరాజు, ప్రజావాగ్గేయకారులు గద్దర్, గూడ అంజయ్య గారు ఇంకా అనేకానేకులు.

  తెలుగు సాహిత్యంలో ఆదికవి ‘బసవపురాణం’ రాసిన పాల్కురికి సోమనాథుడు (1160-1240) తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు. కాళిదాసు, భారవి లాంటి మహాకవులకు సమానంగా ప్రశంసలు పొందిన భవభూతి ( ఉత్తర రామ చరిత ) తెలంగాణ ప్రాంత నాటి సుప్రసిద్ధ కవి. సంస్కృతంలో ‘కథా సరిత్సాగరం’ గ్రంథం రచించిన పదకొండవ శతాబ్దానికి చెందిన సోమదేవసూరి.

  తెలుగులో తొలి రామాయణం, రంగనాథ రామాయణం ద్విపద కావ్యం రాసిన గోన బుద్ధారెడ్డి (1210-1240),
  ‘నీతిశాస్త్ర ముక్తావళి’ గ్రంథకర్త బద్దెన, దాశరథీ శతకం రాసిన భక్తరామదాసు కంచర్ల గోపన్న (1650) తెలంగాణ ప్రాంతం వారు.

  భారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయం లోని తిక్కన కాకతీయుల గణపతిదేవుడి ఆస్థానంలో ఉన్నారు.

  ( ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా, యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్నా )

 8. కందికొండ says:

  Kk రామయ్య గారికి ధన్యవాదాలు

 9. అక్షర కుమార్ says:

  పాట తోటి కాలు ఎగిరెల జెసి కథ రాశి ఏడ్పించుడు జేసినవు కందికొండ అన్నో …

 10. “జన్నె కిడిశిన గిత్త ” రాజు కేవలం “సెక్స్ ” కోసమే తిరిగి ఉంటె చచ్చిపోక పోయేది – జీవితమంతా సెక్స్ కోసమే బతికేవాడు – వాడి మనసులో ప్రేమ జనించింది కాబట్టె , తన వల్ల ఒక అమాయకురాలు చనిపోవడం తట్టుకోలేక చావే ప్రాయశ్చిత్తం అనుకున్నాడు. వాణ్ణి చంపింది సెక్స్ కాదు – ప్రేమ. దీన్నిబట్టి సెక్స్ కంటె ప్రేమ పవర్ ఫుల్ అనేది అర్థమయ్యింది. కందికొండ గారూ తేనె లూరే మాండలీకం రాస్తూ మధ్యలో “ప్రజ్వరిల్లే ” వంటి పసలేని పదజాలం ఎందుకండీ :) కథ టైటిల్ లోనే “జనించింది ” అని వాడారు.
  కథలో జీవం ఉందని మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా – మీది జీవ భాష. అభినందనలతో –

 11. కె.కె. రామయ్య says:

  తేనెలూరే మాండలీకం మధ్యలో “ప్రజ్వరిల్లే ”, “జనించింది ” వంటి పదజాలం?! అన్నా.. నువ్వు చీమను గూడ బూతద్దములబెట్టి సూత్తవ్. ఏంగాదుకని పావే అన్నా.

  “మా ఊరోళ్ళ కండ్లు కట్టలు తెగిన కరిమబ్బులయినయ్. మా రాజుగాడు పిచ్చిగాడిది నన్ను ఒంటరిని జేసి బయిలెల్లిపోయిండు.” అసుంటువి సాలవా.

 12. Jilukara says:

  నిజంగా కథ చాలా బాగుంది. కథనం గొప్పగా ఉంది. స్క్రీన్ ప్లే స్టయిల్ కూడా బాగుంది. చాలా మంది రాజులు ఇలాగే ప్రాణాలిచ్చారు. కథలు మంచివి రాయటం లేదనే విమర్శకు జవాబు ఇది.

 13. కందికొండ says:

  Akshara ku dhanyavaadhalu

 14. కందికొండ says:

  గొరుసు గారికి ధన్యవాదాలు

 15. కందికొండ says:

  జిలుకర శీనన్న కు ధన్యవాదాలు

 16. కందికొండ says:

  అక్షరకు ధన్యవాదాలు

 17. గోర్ల says:

  కథ టేకింగ్ లోనే జీవితం కనబడుతుంది. ఈ స్టోరీ సాంతం సద్విన తరువాత కండ్లపోంటి నీళ్లు గార్తనే ఉన్నయి. కాళ్లకు చెప్పుల్లేని రోజులు. బడిల పంతులు చెప్పే పాఠం అర్థం కాక…. టీచర్ కొట్టే దిబ్బలకు కన్నీళ్లు…. ఆకలి రెండూ దిగమింగి కూసున్న రోజులు. రయ్యిన కండ్ల ముందులకెల్లి ఉర్కినట్లైంది. ఒకటి కాదు రెండు తరతరాల కన్నీటి బాధ కందికొండ కలం నుండి కిందికి దుంకింది. గిట్లా కథలుంటే సద్వేటోనికి ఇగో గిదే మా జీవితం అనుకుంటడు. రప్పున నెత్తికి ఎక్కుతది.
  ఇగ గీ స్టోరి ముచ్చటకొస్తే తెలంగాణ జీవితం మరీ ముఖ్యంగా ఉత్పత్తి కులాల జన జీవితాన్ని అక్షరాల్లకు ఒంపి దాన్నో ముద్ర రూపంలో తీస్తే గిట్లనే ఉంటది గావొచ్చు. ఇప్పుడు ఎదిగొచ్చిన అంటరాని కులాలు, ఇతర బిసిల్లోనని కింది కులాల వారు పడిన యాతన కన్పిస్తున్నది. ఈ మధ్య కాలంలో కొన్ని కథల్లో మానవ సంబంధాల చిత్రణ ఉంది. కానీ ఇందులో మానిషే కాదు ప్రకృతి, మనిషిలో భోళాతనం… ఏ మనిషి అంటే భూమి మీద కాళ్లు నిలిపిన వాని గురించి…. వాని జీవితం గురించి. చెప్పింది. ఈ మధ్య కాలంలో జూపాక సుభద్ర, వినోదిని వంటి వారు తమ జీవితాలను ఉన్నదున్నట్లుగా అందరి ముందల కథల రూపంలో చెప్తున్నారు. చెప్పడమే కాదు ఇగో ఇదీ మా జీవితం అంటున్నారు. కంది కొండ కూడా అట్లాగే జీవితాన్ని పరిచి, తెరిచి చూపించారు.
  ఆకలి మాడే జీవితం, కన్నీళ్లను కవచ కుండలాలుగా పెట్టుకున్న జీవితం.దు:ఖం నిండా పరుచుకున్న జీవితం. కింద కులాలకు భవిష్యత్తు అనే పదం అంతు తెలియని పదార్ధం…. అలాంటి సామాజిక వ్యవస్థ నుండి పుట్టిన వారు సహజంగానే తమ జీవితాలను అద్దం ముందు పట్టి చూపిస్తారు. చదువరులు మనస్సు పెట్టి చదివితే అక్షరాలు కారుస్తున్న కన్నీళ్లు మిమ్మల్నీ తాకి కిందికి పారుతాయి. తెలంగాణలోని పల్లే జీవితపు ముఖాన్ని చూపించిన కంది కొండకు శనార్థులు.

 18. కందికొండ says:

  గోర్ల అన్న… కథ రాత్తానప్పుడు శానా సార్ల ఏడిషిన మీ కామెంట్ సదివి మళ్ళా ఏడిషిన అప్పుడప్పుడనిపిస్తది బతికెదానికి ఇంత అవస్థ పడాల్నా.. అని

 19. Nirmala Nandigama says:

  సారంగ లో కందికొండ గారి ‘జిన్నెకిడిసిన గిత్త’ ఈ మధ్య కాలం లోవచ్చిన అరుదయిన స్వగతం. గ్రామీణ జీవితం లో అరమరికలు లేని స్నేహాలు,ద్వేషం లేని ప్రేమలు, కామం లేని సాంగత్యాలు, నిండుఅయిన జీవితాలు, దాపరికాలులేనిస్వగతాలు,మోసాలులేని మోహాలు ఒకటా రెండా కథ అంతా విస్తృతమయిన జీవిత అనుభవాల కలబోత. ఈ కథలో ప్రతి ఒక్కరూఏదో దశలో ఈ అనుభూతులను కలిగే ఉంటారు. మీ జీవిత సన్నని సందుల్లో దాగిన జ్ఞాపకాలు మరోసారి నేమరేసుకోడానికి అయినా ఈకథను చదవండి

 20. కందికొండ says:

  నిర్మల నందిగామ గారికీ ధన్యవాదాలు

 21. ముందుగా కథా రచయిత కందికొండను గట్టిగా కౌగిిలించుకోవాలని ఉంది. ఈ కథలో చాలా విషయాలను దాపరికంలేకుంట చెప్పావు. దీన్ని కథ అనేందుకు వీలులేదు అసలు సిసలైన పల్లెటూరి జీవితం…38 ఏండ్లకింద తెలంగాణలోని ఓ కుగ్రామంలో దిగువమధ్య తరగతి జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించావు. ఈ జననరేషన్ కు తెలీని చాలా విషయాలను కల్లకు కట్టినట్టు చూపించావు. పేదరికంలో ఉన్న ఆనందాన్ని, దు:ఖాన్ని, మానవసంబందాల్ని, ఫ్ఱెండ్ షిప్ కు ఇచ్చే విలువను గుర్తుచేశావు.
  కథ చదవటం ప్రారంభించినప్పుడు మూడు పేరలు చదవగానే… ఆపేసి రాజు ఇప్పుడు ఎక్కడుండో తెలుసుకోవాలి అనుకున్న..కాని కథ పూర్తయ్యాక అతని ఫోటో అయినా చూడాలని ఉంది. వాడు పది పాసయ్యుంటే తప్పకుంటా నీతోపాటే ఉండుగావచ్చు కాని వాడు పెయిల్ అవ్వుడుతోటి వ్యవసాయంలో పడ్డడు..చుట్టు ముట్టు ఉన్న పరిస్థితులు రాజును ఆడమాంసం రుచికి అలవాటు చేశాయి. కానీ చివరి అంకంలో వాడిలో కూడా ప్రేమ పుట్టింది…తను పోగొట్టుకున్న మనిషి విలువ తెలసింది…కడుపులోనే పోయిన తన బిడ్డ కదిలించింది…భాదకంటే చావే సులువు అనుకునే పరిస్థితి వచ్చింది….
  కథ అయిపోగానే కండ్లనిండ నీళ్లు వచ్చాయి…మరిచిపోయిన ఊరి జ్నాపకాలు, నా చిన్న నాటి స్నేహితులు, మూడు కిలోమీటర్ల దూరం నేను హైస్కూలుకు నడుస్తూ వెళ్లిన గుర్తులు, చిన్న ప్పుడు కాలుజేతులకు తాగిన దెబ్బల గుర్తులు తడిమి చూసుకున్నాను. ఈ కథలో ప్రతీ అక్షరంతో నాకు సంబంధం ఉన్నట్టుంది… నా బాల్యాన్ని చూసుకున్నట్టుంది.
  ఒక మరపురాని స్నేహితుుని జీవితాన్ని ఎలాంటి దాపరికంలేకుండా అద్భుతంగాకంటే స్వచ్చంగా ఆవిష్కరించిన కందికొండ అన్న నీకు హృదయపూర్వక అభినందనలు.
  ………………………….
  దాము
  వి6 న్యూస్
  క్రియేటీవ్ హెడ్

 22. కందికొండ says:

  దాము అన్నకు ధన్యవాదాలు

 23. డా.పసునూరి రవీందర్ says:

  ఇది క‌థ‌కాదు మా బ‌తుకు.
  బ‌తుకును క‌థ‌ల‌కు వొంపాల్నంటె స‌చ్చిపుట్టాలే.
  Simply Its a classic
  గిది రాసినైన‌ది ధైర్నంగ‌ల్ల గుండె.
  గందుకే రందిని ర‌కుతం మ‌రిగెట‌ట్టు రాసిండు.
  సిన్మ‌ల‌ల్ల వెయ్యిపాట‌లు రాసినోడు,
  గింత పాణ‌మున్న క‌తెట్ల రాసిండో..ఆ చేతుల‌కు మొక్కాలె.
  రాజుగా యాడున్న‌వో…నువ్ మ‌ల్ల బ‌తికిన‌వ్ పో!!

 24. కందికొండ says:

  సద్దితిన్న తావును మరువని ఇమందారి తనం నాదని నువ్వే అన్నవుగదనే పసునూరి అన్నమర్శిపోయినవా…నీ గుండెకు మొక్కాలే ఏమి స్పందనే నీది.

 25. గా లంజపుట్నాల చెట్టు కాడ ఎన్నడన్న సప్పుడ గంట ఉన్నాడానే రాజుగాడు….symbolic గా శెప్పినడేమో…జీవితంల శేదును మిగుల్స్తానని…..డా.పసునూరి రవీందర్ గారు చెప్పినట్టు రాజుగా యాడున్న‌వో…నువ్ మ‌ల్ల బ‌తికిన‌వ్ పో!! what a comment

మీ మాటలు

*