సైంటిఫిక్ మిస్టీరియస్ “అగ్నిగీతం”

 

 

 

పాత కాలపు మాస పత్రికలకు, ఒక మంచి అలవాటుండేది. ఇప్పుడూ ఉందేమో తెలీదు. బుల్లి బుల్లి అనుబంధ నవలలను పత్రికతో పాటు అందించడం. అప్పటి మాస పత్రికల్లో వినూత్నంగా చాలా యేళ్ళు నడిచింది విజయబాపినీడు సంపాదకత్వం లో “విజయ”! నాలుగు విభాగాలుగా (కథ, సినిమా,హాస్యం, అనుబంధ నవల) ఉండి, ఏ పార్టు కి ఆ పార్టి విడదీసి చదువుకోడానికి వీలుగా ఉండేది . ఎప్పుడు మూత పడిందో గుర్తు లేదు కానీ మా ఇంట్లో చాలా రోజులు పాత కాపీలు ఉండేవి. వాటిలో దొరికింది ఈ అగ్నిగీతం నవల అప్పట్లో! ఆ తర్వాత కాల క్రమేణా అది ఎవరో తీసుకుని ఇవ్వడం మర్చి పోయి వాళ్ల లైబ్రరీలో దాచుకున్నారని లేటుగా గ్రహించాము. డాక్టర్ ముదిగొండ శివ ప్రసాద్ రాసిన అనేక నవలలు మార్కెట్లో దొరుకుతున్నాయి గానీ ఇది మాత్రం దొరకలేదు. విజయ అనుబంధ నవలగా రెండు భాగాలు గా వచ్చాక, ఎప్పుడో మీనా పబ్లిషర్స్ అనే వాళ్ళు దీన్ని డైరెక్ట్ నవలగా వేశార్ట గానీ అది ప్రస్తుతం ఎక్కడా అందుబాటు లో లేదు. నిజానికి నాకు ఒక మూడేళ్ళ క్రితం ఈ నవల మిత్రుల సాయంతో PDF గా దొరికింది. ఒకసారి మళ్ళీ చదివితే, పరిచయం చేయదగిన మంచి పుస్తకమేననిపించింది.

ఈ నవల రెండు దారుల్లో నడుస్తుంది. ఆశయ సాధనకు మార్గం కూడా ఉత్తమంగా ఉండాలా లేక సాధనే గమ్యం కాబట్టి ఏ మార్గమైనా పర్లేదా అనే అంశం ఒక వైపూ, ధ్వని కాలుష్యం వల్ల మనుషులు చిత్త చాంచల్యానికి లోనై ప్రవరిస్తారనే సైంటిఫిక్ (అదే సమయంలో మిస్టీరియస్ కూడా) అంశాన్ని మరో వైపు చర్చిస్తూ కథ నడుస్తుంది.

కథ మొత్తం 70 ల్లోని హైద్రాబాద్ నగర వాతావరణం లో! వేణుగోపాల రావనే మామూలు ఉద్యోగి భార్య, అణకువ, అమాయకత్వాలే ఆభరణాలుగా కల అతని భార్య దమయంతి సడన్ గా ఒక చల్లని సాయంత్రం దెయ్యం పట్టిన  అవతారం ఎత్తడం తో నవల మొదలు!

సాయంత్రం సినిమాకెళ్దామనే ఊహల్లో ఇంటికొచ్చిన వేణు కి ఇదొక షాకు! కిటికీ ఎక్కి కూచుని నానా గోలా చేసిన దమయంతి సొమ్మసిల్లి నిద్ర పోతుంది. ఆ తర్వాత ఒక గంటకి లేచి కూచుని “కథ చెప్తా వింటావా వేణు గోపాల్రావ్?” అని అడగటం తో వణికి పోతాడు!

కథేంటి ? ఎవరి కథ ? వింటాననాలా వొద్దా ?

ఇతడి అవును, కాదులతో సంబంధం లేకుండా దమయంతి ఒక కథ చెప్పడం మొదలు పెడుతుంది. ఆ కథని ప్రతి రోజూ ఎపిసోడ్స్ వారీగా చెప్పడం కొనసాగిస్తుంది దమయంతి.

కథలో నాయిక కామేశ్వరి! కామేశ్వరి స్వీయ కథే అది !

అసలా కథ ఎవరిది, దమయంతికెలా తెలుసు? రోజంతా మామూలుగా ఉండే దమయంతి ఇలా రాత్రిళ్ళు ఇలా ట్రాన్స్ లోకి పోయి కథ చెప్పడమేంటో అంతు బట్టదు వేణుకి! దమయంతి అన్న డాక్టర్ త్రిమూర్తికి కబురంపి రమ్మంటాడు. త్రిమూర్తి ఈ కథలో లేక పోతే నవల సగానికి సగం చప్పబడి పోయేదేనేమో! అనుక్షణం ఛలోక్తులు చమత్కారాలు వేస్తూ త్రిమూర్తి నవల మొత్తం నవ్విస్తూ ఉంటాడు.

త్రిమూర్తి వచ్చాక అతనికీ ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఏమిటి ఇంతకీ?

ఏదైనా దెయ్యం పట్టుకుందా? దెయ్యాలున్నాయా నిజంగానే ? లేక దమయంతే కామేశ్వరా ? తన పూర్వకథనే చెప్తోందా అనే సందేహాలు వదలవు వేణుని

కథలో పాత్రలన్నీ నిజమా లేక కల్పితాలా? ఈ కథ దమయంతికెవరు చెప్పారు?

వేణుకీ , త్రిమూర్తికీ మనకీ కూడా సందేహాలే

Agni001

స్వయంగా త్రిమూర్తే డాక్టర్ కనుక వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలనే ఆలోచన మానుకుని తార్కికంగా ఆలోచించడానికి పూనుకుంటారు. మొత్తానికి దమయంతి మానసికారోగ్యం కొంత సంతులనం లేకుండా ఉంది,  విహార యాత్రలు చేసి వస్తే వాతావరణం లో మార్పు వల్ల ఏదైనా గుణం కనిపిస్తుందేమో అన్న ఆలోచనతో గుళ్ళూ గోపురాలే కాక ప్రకృతి రమణీయకత ఉండే ప్రాంతాలు తిరగడానికి బయలు దేరతారు. ఐతే అడపా దడపా దమయంతి ఆ యాత్రల్లో సైతం పగలు మామూలుగానే ఉన్నా రాత్రిళ్ళు మాత్రం అలౌకికావస్థకు గురై కథ చెప్తూనే ఉంటుంది.  నవలలో ఈ కథంతా ముక్కలు ముక్కలుగా నడుస్తుంది.నవలా గమనం కొంత వర్తమానం లోనూ, మరి కొంత దమయంతి చెప్పే కథలోనూ నడుస్తుంది.

దమయంతి చెప్పే కథ! కథ పేరు అగ్నిగీతమని దయమంతే చెప్తుంది.

తల్లి లేని కామేశ్వరిని తండ్రి గారాబంగా పెంచగలుగుతాడే తప్ప సంఘంలో ఉన్న పరిస్థితులని తనకు తోచిన విధంగా అవగాహన చేసుకునే తీరుని ప్రభావితం చెయ్యలేక పోతాడు. దానికి తోడు యుక్తవయసు కి వచ్చాక కామేశ్వరికి ఎదురైన పరిస్థితులు కూడా ఆమెను మరింత గందర గొళానికి గురి చేసేవే ! దగ్గరిగా చూసిన ఇద్దరు స్త్రీల జీవితాలు ఆమె కళ్ళ ముందే కాలి బూడిద అవుతాయి ! అందుకు వాళ్ల భర్తలే ప్రధాన కారణం. టాంక్ బండ్ మీదనుంచి దూకి ఆత్మ హత్య చేసుకోబోయిన జానకీ, స్త్రీలోలుడైన ప్రొఫెసర్ తీరుని సహించలేక ఆత్మ హత్య చేసుకున్న అతని భార్య నీరజా, కామేశ్వరిలో రేగే జ్వాలకు ఆజ్యం పోసిన వాళ్ళవుతారు ! పురుషుల పట్ల, సమాజం పట్లా కసిని పెంచుతారు. నీరజ మరణం తో కదిలి పోయిన కామేశ్వరి లో నీరజ మరణం ప్రతికారాన్ని రగిలిస్తుంది

ఎంత తీవ్రంగా అంటే నీరజ చితా భస్మాన్ని ధరించి నేటి నుంచీ మగ పశువు నా పాదాల వద్ద బానిస. నా కాళ్ల కింద నలిగే పురుగు!పతితుడు , ఇదే నా ప్రతిజ్ఞ ! నీకు ఆత్మ శాంతి కల్గించే ప్రతిజ్ఞ” అని ప్రతిజ్ఞ పూనుతుంది. తీవ్రమైన దుఃఖం , వేదన ఒత్తిడి నుంచి ఆమె  గమ్యాన్ని నిర్దేశించుకుంటుంది అందులో వివేచన తక్కువ.

మగవాళ్ల మీద పగబడుతుంది! పగ తీరాలంటే హై సొసైటీ తో పరిచయాలు పెంచుకుని, అక్కడి మగవాళ్ళను వీధికి ఈడ్చాలి! అందుకే పరిచయాలు పెంచుకోడానికి పేరున్న సంగీత కారుడు వైణికుడు పుండరీకాక్షుణ్ణి రిజిస్టర్ వివాహం చేసుకుంటుంది

కథలో మరో పాత్ర పుండరీకాక్షుడి తమ్ముడు దయానంద్! ఆర్య సమాజ్ సంప్రదాయాలకు ఆకర్షితుడై వాళ్ల గురుకులంలోనే చదువుకుంటాడు. సమాజంలో నేర ప్రవృత్తి, మనుషుల దృక్కోణాలు, ప్రవర్తన మారాలంటే ఆత్మ సంస్కారం అవసరమని, మూలాల నుంచి ప్రక్షాళన అవసరమనీ భావిస్తాడు ! అది సరైన విద్య ద్వారానూ, శారీరక మానసిక సంతులనం ద్వారానూ మాత్రమే సాధ్యమవుతుందని ఆ విధంగా సంఘం లో సత్ప్రవర్తనను పెంచి తద్వారా ప్రక్షాళన జరగాలని ఆకాంక్షిస్తూ విద్య పూర్తి చేసి, హైద్రాబాద్ నగరంలో అడుగు పెడతాడు.

సమాజంలో ఎటు చూసినా కుళ్ళు, దుర్మార్గం, అవినీతి, దౌర్జన్యం, హింస ! నిజానికివి ఎప్పటికపుడు సమాజంలో వివిధ స్థాయిల్లో ఉంటూనే ఉంటాయి కదా ! ఎలా వీటిని ఎదుర్కొని దారిలో పెట్టాలో తీవ్రంగా ఆలోచిస్తూ ఒక పార్కులో కూచుని ఉండగా అతనికి పరిచయమవుతాడు అగ్ని మిత్రుడు.

ఎలాగ? లంచం తీసుకోమని భర్తను వేధిస్తున్న ఒక స్త్రీ మీద దౌర్జన్యం చేసి చేయి,చేసుకుంటూ!

నివ్వెర పోయిన దయానంద్ అదేమని ప్రశ్నిస్తే, కురుపు లేస్తే దాన్ని కత్తిరించి తొలగించి పారేయాలనే జవాబు వస్తుంది.  ఆ తర్వాత సినిమా హాల్లో ఒక ఆడపిల్లను వేధిస్తున్న అబ్బాయిలను కూడా చితగ్గొడుతూ అగ్నిమిత్రుడు  దయానంద్ కళ్ళబడతాడు. అతడి గమ్యం ఏమిటో తెలుసుకోవాలని అతడిని కల్సి దయానంద్ తన ఇంటికి తీసుకెళ్తాడు

“ఆశయం ఉత్తమం కావొచ్చు, కానీ దాని ఆచరణ మార్గం మాత్రం ఇది కాకూడదు” అని ఎంత చెప్పినా అగ్నిమిత్రుడు నిర్లక్ష్యంతో ” నీ దారిన నువ్వు వెళ్ళు, నా దారిన నేను వెళ్తాను.” అంటాడే తప్ప దయానంద్ మార్గంలోకి రావడానికి ఇష్ట పడడు. “నీ హృదయాన్ని ప్రేమిస్తున్నాను! కానీ నీ మస్తిష్కాన్ని వ్యతిరేకిస్తున్నాను “అని స్నేహ హస్తాన్ని చాస్తాడు దయానంద్

“నాది అగ్ని ప్రకృతి! నన్ను నేను దహించుకుంటూ వేడినిస్తూ ఉంటాను” అని అగ్నిమిత్రుడంటే “నాది చందన ప్రకృతి. నన్ను నేను అరగదీసుకుంటూ ఉపయోగపడతాను” అంటాడు దయానంద్!

“నా దృష్టి లో మనుషులంటే శిలలు! కొన్ని కొండలలోని బండలు. కొన్ని గనులలోని రత్నాలు.మరి కొన్ని నదీ పరివాహక ప్రాంతాల సాలగ్రామాలు.దేని గౌరవం దానిదే! ఇలాటి గౌరవాలను పొందలేని గ్రానైట్ రాయి సైతం భవనాల పునాదుల్లో పడి భవనాన్ని నిలబెడుతోంది .రత్నం ఎంత గొప్పదో, గ్రానైట్ రాయి అంతకంటే లక్ష రెట్లు త్యాగమయమైందే.ఎవరూ జన్మిస్తూనే గొప్పవారు కాలేరు” ఇదీ దయానంద్ ఫిలాసఫీ

మార్గాలు వేరైనా గమ్యాలు ఒకటే కాబట్టి ఇద్దరికీ స్నేహం కలుస్తుంది.

మరిది దయానంద్ ని, అతని ఆశయ కార్యాచరణను చూసి కామేశ్వరి ఎద్దేవా చేస్తుంది. పాదాలకు నమస్కారం చేస్తే “మగ వెధవలు, ఆ వంకతో ఐనా ఎక్కడో ఒక చోట తాకొచ్చనే ఆశ” అని మండి పడుతుంది! కానీ అతనంటే చెప్పలేని ఆకర్షణ ఏదో ఆమె లోలోపల కలుగుతుందనే విషయాన్ని గ్రహించలేక పోతుంది.

స్త్రీలకు అనాదిగా జరుగుతున్న అన్యాయాల గురించి ఇద్దరికీ వాదోపవాదాలు జరుగుతాయి. కామేశ్వరి దయానంద్ మీద క్రోధం పెంచుకుంటుంది. ఆమె క్రోధాన్నిదయానంద్ శాంతం తో ఎప్పటికప్పుడు జయిస్తూ ఉండటం వల్ల కాబోలు ,ఆమె లోలోపల ఎక్కడో ఆ ఆకర్షణ ఎంత వద్దనుకున్నా పెరుగుతూ పోతుంది

హైద్రాబాద్ లో దయానంద్ తన ఆశయ సాధనకు విద్యా కేంద్రాలు నెలకొల్పుతాడు. “సమాజం నేడు చెట్టు కొమ్మల వంక చూసి పళ్ళు లేవే” అని నిరాశ చెందుతోంది. నేను చెట్టు కొమ్మల మీద గాక,వేళ్ళ మీద దృష్టి పెట్టాను. సమాజ వృక్షపు వేళ్లకు ఎరువులు వేస్తాను.ఫలాలు నేడు కాక పోతే రేపటి తరానికి అందుతాయి! కురుపు ఉన్న చోట మందు వేయడం కాదు, లోపలకి పడాలి మందు” అంటాడు దయానంద్!

యోగా, ప్రకృతి వైద్యం, మార్షల్ ఆర్ట్స్,వంటివి అతని విద్యా కేంద్రంలో కొన్ని బోధనాంశాలు!

రాను రాను అతని విద్యా కేంద్రానికి ఆదరణ పెరిగి ఆర్థికంగా కూడా సహాయం అందుతుంది.ఏ యే దేశాల నుంచో హైద్రాబాద్ వచ్చి యోగా, ధ్యానం వంటి వాటిని డబ్బు పోసి నేర్చుకుంటున్న వాళ్లెందరో దయానంద్ విద్యాకేంద్రం వైపు మళ్ళుతారు!

Agni222

నగరంలోని ఒక ప్రముఖ వ్యాపారి కోట్నీస్ ఇంటికి పాద పూజానంద స్వామి అనే స్వామీజీ వస్తాడు. అక్కడ కచేరీ కోసం పుండరీకాక్షుడూ, అతని ద్వారా గొప్ప వాళ్ల గోత్రాలు సేకరించాలని కామేశ్వరీ, అతడిని అల్లరి చేయాలని అగ్ని మిత్రుడూ, అతనేమి చెప్తాడో విందామని దయానందూ అంతా ఎవరి కారణాలతో వాళ్ళు వస్తారు. దయానంద్ కీ   పాద పుజానంద స్వామి కీ జరిగిన వాదం లో దయానంద్ ది పై చేయి అవుతుంది. దాంతో కోట్నీస్ అనుచరులు అతన్ని “నీకేం తెలీదు, కూచో !స్వామిజీ దేవుడు” అని దౌర్జన్యం చేయడానికి ప్రయత్నిస్తారు.అప్పటికే సభలో ప్రేక్షకుల రూపంలో ఉన్న తన అనుచరులతో అగ్నిమిత్రుడు అందర్నీ చితగ్గొట్టి భీతావహ పరిస్థితులు సృష్టిస్తాడు.ఆ తర్వాత కోట్నీస్ నల్ల వ్యాపారాల గురించీ, కళావని అనే సాంస్కృతిక సంస్థ ముసుగులో ఆడపిల్లని ఇతర దేశాలకు అతని సహకారంతో ఎగుమతి జరుగుతున్న సంగతినీ వివరిస్తాడు దయానంద్ కి!

మర్నాడు కామేశ్వరి కళావని మీటింగ్ కి వెళ్ళి దాన్ని నడిపే జాకబ్ తో కొద్ది పాటి చనువు వెలగబెట్టి, అతడికీ అతడి భార్య కీ గొడవ వచ్చేలా చేసి వాళ్లిద్దరి చేతా వాగించి అది మొత్తం ఆడియో రికార్డ్ చేస్తుంది. ఒక్కొక్కటిగా ఆ విషయాలన్నీ బయటకు వచ్చేలా చేయాలని ఆమె పథకం

కామేశ్వరి, దయానంద్, అగ్ని మిత్రుడు.. వీళ్ల ముగ్గురి ప్రయాణాలూ నిజానికి ఒక చోటికే అని ప్రారంభిస్తారు వేర్వేరు దారుల్లో! ఒకరి దారంటే ఒకరికి గిట్టదు. అసలు గమ్యాల పట్ల , దారుల పట్ల ఎవరికి స్పష్టమైన అవగాహన ఉందనే విషయం నవలలో చర్చనీయాంశం !

అనుకోని పరిస్థితుల్లో కోట్నీస్ ని హత్య చేస్తాడు అగ్నిమిత్రుడు! విషయం దయానంద్ కి చెప్పి తాను లొంగి పోదల్చలేదనీ, ఇంకా చేయాల్సిన పనులున్నాయనీ చెప్పి పారి పోతాడు! నేరం తన మీద వేసుకుని శిక్షకు సిద్ధమవుతాడు దయానంద్! చివర్లో అగ్నిమిత్రుడు వచ్చి నిజం చెప్పి తన నేరాన్ని అంగీకరించడం తో అతనికి ఉరి శిక్ష అమలవుతుంది.

ఆ తర్వాత కామేశ్వరి దయానంద్ ల జీవితాల్లో ఒక నాడు పెను మార్పు సంభవిస్తుంది. ఆ మార్పు పర్యవసనాలేమిటి? కామేశ్వరి ఏమైంది? దయానంద్ జీవితం ఏ మలుపు తిరిగిందనేది నవలలో చదివితేనే బావుటుంది.

వర్తమానానికి వస్తే, పుణ్య క్షేత్రాలన్నీ తిరుగుతున్న త్రిమూర్తి కామేశ్వరి ఆ కథ అంతా ఒక ప్రత్యేక వాతావరణ పరిస్థితిలో చెపుతున్నదని గ్రహిస్తాడు. గుడిలో భజనలూ, మంగళ వాద్యాలూ, డోళ్ళూ, దరువులూ లేదా రోడ్డు పక్కనే వెళ్తున్న రణ గొణ ధ్వనులూ ఇవన్నీ ఉన్న నేపథ్యంలోనే ఆమె ఈ కథ చెప్తున్నదని గ్రహిస్తాడు. అరగొండలోని ఒక స్నేహితుల ఇంటికి వెళ్ళినపుడు ఆ రాత్రిని వాళ్లు చల్లని పౌర్ణమి వెన్నెలను ఆస్వాదిస్తూ చెరకు తోటల మధ్య సన్నగా ప్రవహిస్తున్న నదీ తీరంలో ప్రశాంతంగా గడిపిన రాత్రి ఎంత ఎదురు చూసినా దమయంతి కథ చెప్పదు.

అప్పుడు అర్థమవుతుంది త్రిమూర్తిలోని డాక్టర్ కి , ఆమెకు శబ్ద కాలుష్యం వల్ల మెదడు మీద ఏర్పడిన వత్తిడి ఆమెలో ఎక్కడో దాగి ఉన్న భావాలను, అణచి పెట్టిన విషయాలను వెలికి తీసి బయటికి పంపేస్తోందని!

అప్పుడు గుర్తు చేసుకుంటారు, రామ నగర్ గుండు దగ్గర నివసించే వేణుగోపాల రావు ఇంటి ముందే మెయిన్ రోడ్డూ, వస్తూ పోతూ ఉండే వాహనాల ధ్వనులే కాక, ఇంటి పక్కనే ఉన్న కమ్మరి కొలిమి నుంచి నిరంతరం పరిమితి మించిన ధ్వనుల్ని, శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తూనే ఉంటాయని! 150 డెసిబెల్స్ దాటిన ఆ ధ్వనులు దమయంతి మెదడును బాగా డిస్టర్బ్ చేశాయని అర్థమవుతుంది వాళ్లకి

సరే, అంత వరకూ బాగానే ఉంది.మరి ఈ కామేశ్వరి ఎక్కడి నుంచి వచ్చింది?

దమయంతి చెప్పే కథలో చివర్లో చెప్తుంది “ఆ తర్వాత డైరీలో కొన్ని లైన్లు కొట్టి వేయబడి ఉన్నాయి. కొన్ని పేజీలు చింపేశారు! అంతా గజిబిజిగా ఉంది”

త్రిమూర్తి దీన్ని మొత్తం విశ్లేషించి ఆ డైరీ తన సవతి సోదరిదని గ్రహిస్తాడు. తన తండ్రి మొదటి భార్యకు పుట్టిన సంగీతే కామేశ్వరి అని, ఆమె డైరీని తండ్రి దమయంతికి ఇచ్చి ఉంటాడని వేణుతో చెప్తాడు.

తర్వాత వాళ్ళు కామేశ్వరి కి ప్రకృతి చికిత్స చేయించే ఉద్దేశంతో వికారాబాద్ సమీపంలోని అడవుల్లో ఉన్న ఒక ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ పెద్ద శబ్దాలన్నీ నిషిద్ధం! ఉన్నదల్లా మొక్కలూ చెట్లూ ప్రకృతీ, సేంద్రియ వ్యవసాయమూ, సంగీతంతో పెరిగే మొక్కలూ, ఆముదం దీపాలూ, చెరువులూ, కలువలూ బాతులూ ఇవే!

అక్కడ అందరూ ఎలాటి కల్మ్షమైన ఆలోచనలూ లేని సోదర సోదరీ బంధాలే . మానవత్వపు బంధాలు తప్ప ఇంకే రకమైన సంబంధాలూ లేని ఆశ్రమం అది! అక్కడ దమయంతికి ప్రకృతి వైద్యం జరుగుతుంది. కామేశ్వరి డైరీ గురించి అందులోని పాత్రల గురించి చెప్పినపుడు ఆ ఆశ్రమానికి పెద్దన్నయ్యగా వ్యవహరిస్తున్న వ్యక్తి నివ్వెర పోతాడు. తాను అగ్ని మిత్రుడి ప్రథమ అనుచరుడిగా ఎన్నో హత్యలు చేశాననీ,దొంగనని , అగ్ని మిత్రుడి ఉరి తర్వాత, గమ్యమే కాక మార్గం కూడా ఉత్తమంగా ఉండాలనే విషయం గ్రహించి అందరం దయానంద్ శిష్యులుగా మారి పోయామనీ చెప్తాడు.

ఆ ఆశ్రమాన్ని స్థాపించి నడిపిస్తున్నది కూడా కామేశ్వరి కథలోని ప్రధాన పాత్రే! ఆ పాత్ర ఎవరు, ఆ కథలో చివరికి జరిగిందేమిటి?

ఇవన్నీ నవలలో చదివి తెలుసుకుంటే కొంత ఉత్కంఠ గా ఉంటుంది.

ఈ నవల రెండు భాగాలుగా వచ్చినపుడు విజయ పాఠకులు ఉర్రూతలూగి పోయారట.

ఇక రచన విషయానికొస్తే నవల పూర్తిగా పాత్రల ప్రమేయంతోనే నడుస్తుంది తప్ప ఎలాటి స్థితి లోనూ రచయిత ఎక్కడా కథను తన చేతిలోకి తీసుకుని నడిపించడు. నవల్లో త్రిమూర్తి పాత్ర చాలా సహాయకారిగా ఉంటుంది. కథాగమనాన్ని కొంత వరకూ సపోర్ట్ చేసే పాత్ర ఇది. త్రిమూర్తి వాగుడూ జోకులూ అక్కడక్కడ చివరికి మిగిలేది లో జగన్నాధం పాత్రని తలపిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడూ తనలో తను మాట్లాడుకుంటూ ఉండటమూ,కొన్ని కల్పితాలను నిజ జీవితంలో జరిగినట్టు గా వేణుకి చెప్పడమూ  చేస్తుంటాడు. . నగరంలో ధనికురాలైన ముంతాజ్ బేగం వైద్యం కోసం తను వెళ్ళినపుడు ఆమె తనను ప్రేమించిందనీ, త్వరలో తామిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నామనీ చెప్తాడు వేణుకి. కానీ చివర్లో అదంతా కల్పితమని తేలుతుంది. ఇలాటి చిత్త చాంచల్యాలు అనువంశికంగా సంక్రమిస్తాయని ఆశ్రమంలో వైద్యులు వివరించినపుడు దయమంతి తాను చదివిన డైరీని కథగా చెప్పడానికీ, త్రిమూర్తి కథల్ని సృష్టించడానికీ మధ్య రక్త సంబంధపు లింకు దొరుకుతుంది.

దమయంతి చెప్పే కథ కు బ్రేక్ వచ్చి వర్తమానంలోకి నవల వచ్చినపుడల్లా పాఠకుడికి త్రిమూర్తి పాత్ర చాలా రిలీఫ్. అలవోకగా , ఆశువు గా వేసే  త్రిమూర్తి చలోక్తులు కథకు అడ్డు రాకపోగా కామేశ్వరి కథకు బ్రేక్ వచ్చిందనే విషయాన్ని గుర్తించకుండా చేస్తాయి. సంబంధం లేని సందర్భాలను, వ్యక్తులనూ కలేసి మాట్లాడే త్రిమూర్తి చమత్కారాలు మంచి ఎంటర్టైన్మెంట్

త్రిమూర్తి జోకుల్లో సమకాలీన పరిస్థితుల మీద సెటైర్లు బాగా పడతాయి. బాసర కు వెళ్ళినపుడు అక్కడి సరస్వతిని త్రిమూర్తి సమకాలీన కవిత్వం మీద మంటతో ఇలా ప్రార్తిస్తాడు

 

“అంత్య ప్రాసే కవిత

అని భ్రమించే నేటి

తెలుగు కవి గొర్రె తల

తొలగించు మా తల్లి

ఓ బాసరమ్మా ”

“సంబంధం లేకుండా మాట్లాడతావేం” అని విసుక్కుంటే “సంబంధం ఉండక్కర్లేదు. మాట్లాడే దానికి వ్యాకరణ సూత్రాలు కూడా ఏమీ ఉండక్కర్లేదు. బస్సులో కూచుని భగవంతుడిని గురించి, శోభనం గదిలో చార్వాకుడిని కూడా గురించి మాట్లాడవచ్చు. “సంభాషణా క్రమంలో ఒక్కొక్కప్పుడు కాంటాక్ట్స్ లేకుండా మాట్లాడ్డమే గొప్ప ఆర్ట్” అని నాట్యముని  భరతుడు తన వాత్సాయన కామ సూత్రాల్లో నిర్వచించాడు, కావాలంటే చూసుకో” అని వింత కాంబినేషన్స్ సృష్టిస్తాడు

“అన్నయ్యా ఇహ నీ కవిత్వాలూ అపుతావా” అని దమయంతి నవ్వితే “ఇది నాది కాదమ్మా, వేములవాడ భీమకవి తన క్రీడాభిరామం లో రాశాడు” అంటాడు నిర్వికారంగా!

కామేశ్వరి తీవ్ర స్వభావాన్ని కూడా ముదిగొండ అలవోకగా చిత్రిస్తూ పాఠకుడికి కొంత హింట్ కూడా ఇస్తారు. కామేశ్వరికి తల్లి చిన్నప్పుడే చనిపోయి, తండ్రి చేతుల్లో పెరుగుతుంది. అందువల్ల ప్రకృతి లోని , సమాజం లోని కొన్ని సున్నితమైన విషయాలను అర్థం చేసుకునే కోణం పూర్తిగా మారి పోయి, extremist గా మారుతుంది. తల్లి ఉండి ఉంటే “ఇది కాదు బతికే విధానం” అని ఇందిర ప్రకాశానికి చెప్పినట్టు మందలించి “ఇది కాదు ఆలోచించే విధానం, ఇది కాదు నువ్వు ఫలానా విషయాన్ని అర్థం చేసుకునే రీతి” అని అర్థమయ్యేలా చెప్పగలిగేదేమో అనిపిస్తుంది!

చిన్నపుడు తండ్రి ముద్దు పెట్టుకుని చాక్లెట్ ఇస్తే, తర్వాత స్కూల్లో ఒక కుర్రాడికి “పోనీ ముద్దు పెట్టుకుని చాక్లెట్ ఇవ్వు, మా నాన్న అలాగే చేస్తాడు”అంటుంది.  సెక్స్ కోసం మగాళ్ళు దేన్నైనా సరే ఎర వేసి సాధించుకుంటారనే ఆలోచన రాను రాను ఆమె లో పెరుగుతుంది. సినిమాలు చూసి బోల్డు ప్రశ్నలొస్తాయి కామేశ్వరికి చిన్నపుడు.అర్థ నగ్నంగా పొలాల్లో డ్యూయెట్లు పాడే హీరో హీరోయిన్లను చూసి ” వాళ్ళు రైతులా నాన్నా,ఎందుకు పొలాల్లో పరిగెడుతున్నారు?” అనడుగుతుంది. లాభం లేదని పౌరాణిక సినిమాలకు తీసుకు పోతే దేవతా స్త్రీలంతా వక్ష స్థలాలు ప్రదర్శిస్తూ వేష ధారణలు! వాటి మీద కామేశ్వరికి ప్రశ్నలు!!

కాలేజీ రోజుల్లో అష్ట విధ నాయికల గురించి పాఠం విని “ఈ నాయికలు చేసే పన్లని తెలుగులో చెప్తే మొరటుగా ఉంటుంది. సంస్కృతం లో చెప్తే కావ్యాలై కూచుంటాయి”అని తెలుగు మాష్టారిని ప్రశ్నలు వేస్తుంది.

“ఇదంతా రస సిద్ధాంతం, పవిత్రం” అని చెప్తే ” ఓహో ,సెక్స్ పరమ పవిత్రం” అనుకుంటుంది ఎదిగీ ఎదగని కామేశ్వరి.

ఎటూ కాని సందిగ్ధ పరిస్థితుల్లో కొట్టు మిట్టాడుతున్న ఆమెకు ఎదురైన మనుషులూ వాళ్ల కష్టాలూ కూడా ఆమెలో ఎక్కడో రగులుతున్న అశాంతిని ఎగదోసేవిగానే ఉంటాయి తప్ప సమాధాన పరిచేవిగా ఉండవు.

అందుకే కామేశ్వరి గమ్యమూ అస్పష్టమే , అందుకు ఆమె ఎంచుకున్న దారి కూడా అస్పష్టమూ ఆమోద యోగ్యమూ కానిదిగానే ఉంటుంది.

ఈ నవల గురించి విశేషాలేమైనా చెబుతారేమో అని రచయిత ముదిగొండ ని కదిలించాను. చాలా కాలం నాటి నవల కావడం తో ఆయన నవలకు దారి తీసిన నేపథ్యం గురించి ఏమీ గుర్తు చేసుకోలేక పోయారు. అయితే కామేశ్వరి పాత్ర గురించి ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

“కొందరికి ఆశయమూ గొప్పదే, ఆచరణా గొప్పదే అయి ఉంటాయి. మరి కొందరికి ఆశయం గొప్పదైనా, ఆచరణ మార్గం ఉత్తమమైంది ఎంచుకోరు. కొందరికి ఆశయం పట్లా స్పష్టత ఉండదు, అందుకు ఎంచుకునే మార్గం పట్లా స్పష్టత ఉండదు, ఉదాహరణ కామేశ్వరి” అన్నారు.

అప్పట్లో ఈ నవల బాగా ప్రజాదరణ పొందిందని చెపుతూ ఆ రోజుల్లో తాను ఆర్య సమాజ్ కార్య కలాపాల పట్ల కొంత ఆకర్షితుడిని కావడం వల్ల దయానంద్ పాత్రను ఆ ప్రేరణ తోనే సృష్టించానని వివరించారు.

దయానంద్ పాత్ర మాత్రం మొదటి నుంచీ ఒక స్పష్టతతో సాగుతుంది. ఆత్మ పరిశీలన, బుద్ధి వికాసం అనే రెండు లక్ష్యాలతో పని చేసే అతడు ఏ క్షణం లోనూ నియంత్రణ కోల్పోకుండా ప్రవర్తిస్తాడు. అగ్ని మిత్రుడు చేసిన హత్య  అమాయకత్వంతో తొందర పాటుతో చేసిందిగా భావించి ఆ నేరం తన మీద వేసుకోడానికి కూడా వెనుకాడనంత పరిణతి చూపిస్తాడు. చివరికి కామేశ్వరి వలన అతను ఆత్మ త్యాగం చేసి కామేశ్వరిలో సైతం పశ్చాత్తాపాన్ని రగిలిస్తాడు.

గమ్యం దాదాపుగా ఒకటే అయినా ముగ్గురు వ్యక్తుల జీవితాలు మూడు రకాలుగా ముడివడి చివరికి ఏమయ్యాయో ఉత్కంఠ భరితంగా చిత్రిస్తుందీ నవల.

శబ్ద కాలుష్యం , మనిషి మెదడు మీద అవి చూపించే ప్రభావం వంటి సైన్స్ కోణం పక్కన పెడితే,  కామేశ్వరి డైరీ చదివిన దమయంతి ఆ కథను ట్రాన్స్ లో ఉండి పాఠకుడికి చెప్పడం నవలను మిస్టీరియస్ గా  చివరి వరకూ ఉంచుతుంది. అయితే దమయంతి, త్రిమూర్తి,కామేశ్వరి ల మధ్య బంధాలు ఎలా ఉండేవి అనేది రచయిత ఎక్కడా చెప్పడు. కామేశ్వరి డైరీలో కూడా దమయంతి ప్రస్తావన గానీ, త్రిమూర్తి ప్రస్తావన గానీ ఉండదు.

ముదిగొండ శివ ప్రసాద్ గారు రాసిన చారిత్రక నవలలో కొన్ని చదివినా ఎందుకో ఈ నవల ప్రత్యేకత దీన్ని ఏళ్ళుగా గుర్తుండి పోయేలా చేసింది.

సామాజిక దృక్పథం తో సినిమాలు కొత్తగా పరిచయమవుతున్న ఆ రోజుల్లో మంచి దర్శకుడి చేతిలో పడితే ఇదొక మంచి సినిమా గా కూడా తయారైఉండేదేమో!

మంచి చర్చకు దారి తీసే టాపిక్ తో రాసిన మంచి నవల. ఆశయాలుండగానే సరి కాదు, వాటితో వాస్తవాలను బేరీజు వేసుకుని వాటికనుగుణంగా నడవలేక జీవితాలను నాశనం చేసుకున్న ముగ్గురు యువతీ యువకుల కథ గా ఈ నవల నాకు చాలా ఇష్టమైనది . చారిత్రక నవలా చక్రవర్తి గా పేరొందిన రచయిత రాసిన సైంటిఫిక్ మిస్టీరియస్ సాంఘిక నవలగా దీన్ని చెప్పడం బాగానే ఉంటుందనుకుంటాను

నవలలోని ప్రధాన పాత్రలు మూడింటిలోనూ ఉన్నది అగ్ని ప్రవృత్తే! వెలుగునివ్వడానికీ దహించి సర్వం బూడిద చేయడానికీ కూడా అగ్నే మూలం! ఈ అగ్నిలోనే వాళ్ల జీవితాలు ఎలా ఆహుతి అయిపోయాయో సూచించేందుకే అగ్నిగీతం అని ఈ నవలకు పేరు పెట్టి ఉంటారు బహుశా!

“మీ పుస్తకాలన్నీ మళ్లీ వేశారు కదా , ఇది మాత్రం ఎందుకు వేయలేదు ” అని అడిగితే డాక్టర్ ముదిగొండ “దానిదేముందమ్మా , ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయొచ్చు కొన్ని కాపీలు ” అన్నారు. శ్రీలేఖ, శ్రావణి వంటివి రీ ప్రింట్ అయ్యాయి గానీ ఇది మాత్రం 3 దశాబ్దాలుగా ప్రచురణకు రానే లేదు.

ఆయన ఎప్పుడు వేస్తారో తెలీదు కాబట్టి , అందుబాటులో ఉన్న సోర్స్ వెదకడం మంచిది. ఈ నవల దగ్గర ఉన్న వాళ్లలో నేనొకరిని :-)

 

peepal-leaves-2013

 

 

 

 

మీ మాటలు

 1. sreeram velamuri says:

  చాలా బాగా రాసారండీ .. నాకు ముదిగొండ గారి స్వప్నకిరీతం బాగా గుర్తు .. ఎక్కడయినా దొరకవచ్చా ?

 2. Sujatha Bedadakota says:

  మార్కెట్లో ఉంటే సరే, లేదంటే ప్రయత్నిద్దాం శ్రీరాం గారూ! దొరికితే తప్పక షేర్ చేస్తాను

 3. Srernivas Chandragiri says:

  చక్కటి విశ్లేషణ.. సుజాత గారూ..
  ముదిగొండ శివప్రసాద్ గారు హరళయ్య, బసవేశ్వరుల పై వ్రాసిన నవల గూర్చి వివరాలు మీరేమయినా తెలుపగలరా..?

 4. Rajamouli says:

  Sujatha garu.I badly want to read this novel “agni geethika” hope I may plan for make movie… If u agree plz give me this novel on return basis…wait for ur reply. Rajamouli ( producer) +919959178927.

  • విశ్వజ says:

   రాజ మౌళి గారూ , మీరు ఇదే రచయిత రాసిన “ఆవాహన”, “అనుభవ మండపం ” నవలలు చదవండి. మీకు మరింత ఉపయోగ పడే అవకాశం ఉంది ( ఈ రెండు కూడా విజయ బాపినీడు గారి “విజయ ” మాసపత్రికలో వచ్చినవే.

 5. a bhaskar chandra says:

  దయచేసి
  నవల మెయిల్ చేయగలరు

 6. నవల గురించి చదువుతుంటే చదవాలని పిస్తుంది. కొంచం రజనికాంత్ చంద్రముఖి సినిమా కు ప్రేరణ ఈ నవల కావచ్చు…..? అల అనిపిస్తుంది అంతే…

 7. Bhavani Phani says:

  మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు . thank You సుజాత గారూ

 8. నాకు ఈ పుస్తకం చదవాలని అనిపించి చాలా చోట్ల వెదికాను కాని దొరకలేదు . మీరు కొంచెం పిడిఎఫ్ షేర్ చేయండి.

 9. siva kumar says:

  బుక్ పిడిఎఫ్ ని షేర్ చేయండి. ప్రతీ ఒక్కళ్ళు చదివి నేర్చుకోవలిసింది చాలా ఉన్నట్టుండి ఈ నవలలో. మీరు పిడిఎఫ్ షేర్ చేస్తే నాలాంటి వారికీ చాలా ఉపయోగపడుతుంది.
  నా మెయిల్ ఇద: siva.imp.documents.@gmail.com

మీ మాటలు

*